కొత్తలోకం చూపిన బ్లాక్ మార్కెట్స్ 

santhi1

డిసెంబర్ 4వ తేదీ .

నేను బ్లాక్ మార్కెట్స్ కు  వెళ్లినరోజు .

బ్లాక్ మార్కెట్ అంటే నల్ల ధనపు లేదా దొంగడబ్బు మార్కెట్లు అనుకునేరు  .

నల్లవారి మార్కెట్లు .  అయితే  అక్కడ అంతా నల్లవారే కనబడరు .  నల్లవారు అంటారు కానీ వారంతా నలుపు రంగులో ఉండరు . వారి పూర్వికులది నలుపు రంగే కావచ్చు . కానీ ఇప్పుడన్ని రంగుల్లోనూ కనిపిస్తారు . ఎప్పుడైతే వారి  అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడడం మొదలయిందో అప్పటి నుండి వారి రంగూ రూపు  మారడం మొదలయింది .  బ్లాక్ మార్కెట్స్ లోకి వెళ్లేముందు వాళ్ళ చరిత్ర ఏంటో విహంగ వీక్షణం చేద్దాం .

ఒకప్పుడు ఆ భూభాగమంతా వారిదే.  ఏ సమూహానికి ఆ సమూహం వారి పరిసరాలు , భౌగోళికంగా ఉన్న పరిస్థితులు  అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు రూపొందించుకున్నారు .  ఆదిమ మానవుడు పుట్టిన దక్షిణాఫ్రికా నుండి  అన్వేషణలో ఆసియా దేశాల మీదుగా 60 మైళ్ళు ప్రయాణించి ఇప్పటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా భుభాగం చేరారట . అలా వచ్చిన వీరు  ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై సహజీవనం చేశారు.

కానీ ఇప్పుడు ఆ భూభాగమంతా వారిది కాదు . వారి జనాభా 3% పడిపోయింది . 50 నుండి  65 వేల (ఆంత్రోపాలజిస్టులు కొందరు 50 వేలని , కొందరు 65 వేల ఏళ్ళని రకరకాలుగా చెప్తున్నారు . ఏదేమైనా 50 వేల ఏళ్ళక్రితమే మానవుడు నిరంతర అన్వేషి అని తెలుపుతూ  మానవుల పుట్టినిల్లయిన ఆఫ్రికా ఖండం నుండి ఖండాంతరాలలోకి మొదట వలసలు ప్రారంభం చేసి  ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బాటలువేసింది వీరే.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని పెన్ రిత్ సమీపంలో 1971 ముందు మట్టిదిబ్బలలో లభ్యమైన   రాతి పనిముట్లు  50 వేల ఏళ్ల  క్రితం ఉన్న మూలవాసులవిగా గుర్తించారు .

 ఆస్ట్రేలియాలోని మూలవాసుల బంధువులే మొట్టమొదటి వాస్తవమైన మానవ అన్వేషులు . మన పూర్వీకులు ప్రపంచమంటే భయపడుతూ ఉన్న సమయంలోనే వీరు అసాధారణంగా సముద్రమార్గంలో ఆసియా వరకు ప్రయాణించారు విల్లెర్స్ లేవ్ , కోపెన్ హెగెన్ యూనివర్సిటీ , డెన్మార్క్ కు చెందిన పరిశోధకుని అభిప్రాయం

ఆస్ట్రేలియా , పపువా న్యూ గినియా దీవుల్లో  ల్లో నివసిస్తున్న జనాభా డిఎన్ఏ పరీక్షచేసిన తర్వాత ప్రాచీన మానవుని జీవన యానాన్ని పసిగట్టారు . వారే సముద్రాన్ని దాటిన మొదటి మానవులని విశ్లేషించారు .

వారెవరో కాదు అబోరిజినల్స్ .. అంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ . ఒకప్పుడు 270 నేటివ్ ఆస్ట్రేలియన్ భాషలతో విలసిల్లిన నేలపై ఇప్పుడు 145 మాత్రమే ఉంటే, అందులో 18 భాషలు మాత్రమే వాడకంలో ఉన్నాయి . అంటే కుటుంబంలో అందరూ మాట్లాడేవి . మిగతా భాషలు కొద్దిమంది  ముసలీ ముతకా తప్ప మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడరు.  50 వేల ఏళ్ళకి తక్కువ కాని ఘనచరిత్ర కలిగిన మూలవాసుల సంస్కృతి ఆచారవ్యవహారాలు, భాషలు , జ్ఞానసంపద , వనరులు ,వారి జీవనం అన్నీ ఆపదలో ఉన్నాయి . ఆ విషయాన్ని గమనించి తమ తాతముత్తాతలు తిరుగాడిన తావుల్ని , నింగిని , నేలని మాత్రమే కాదు వారి అందించిన అపారజ్ఞానాన్ని, కళలని , నైపుణ్యాలని పదిలపరుచుకోవాలని నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు.  అందుకు తగిన కృషి చేస్తున్నారు .

santhi2

నేను అబోరిజన్స్ ని కలవాలనుకోవడానికి కారణం ఏమిటంటే .. 

అబోరిజినల్స్ ని కలవాలని నేను సిడ్నీ వచ్చిన దగ్గర నుండి అనుకుంటూనే ఉన్నాను .  కారణం , బ్లాక్ టౌన్ హాస్పిటల్ ఉద్యోగాల్లో మిగతా ఆస్ట్రేలియన్స్  లాగే అబోరిజినల్స్ ని కూడా సమానంగా చూస్తామని ప్రత్యేకంగా తెలుపుతూ రాసిన దాన్ని చదివాను .   అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.   అదే  అడిగాను.  మా వాళ్లేమో ,  ఆమ్మో అబోరిజినల్స్ చాలా అగ్రెసివ్ అట అన్నారు.  కొందరు ఆస్ట్రేలియన్లని అడిగితే వాళ్ళు మూలవాసుల గురించి మాట్లాడ్డానికే ఇష్టపడలేదు .   వాళ్ళని హాస్పిటల్ లో , షాపింగ్ మాల్స్ లో, మార్కెట్ ప్రదేశాల్లో , స్టేషన్స్ ఎక్కడబడితే అక్కడ  చాలా చోట్ల చూశాను . వాళ్ళు ఖచ్చితంగా అబోరిజినల్స్ అని చెప్పలేను . మాట్లాడి తెలుసుకునే  అవకాశం లేదు .  మాట్లాడినా మాములు విషయాలు మాట్లాడగలం కానీ వారి పూర్వీకుల గురించి గానీ , మీరు అబోరిజనల్సా అని గానీ సూటిగా  అడగలేం కదా .. అసలు అలా అడగకూడదు కూడాను.  అడిగితే ఇక్కడ చాలా పెద్దతప్పు .  వివక్ష చూపిస్తున్నారని , లేదా వాళ్ళని వేలెత్తి చూపుతున్నారనో మీద కేసు పెట్టినా పెడతారు అన్నారు మావాళ్ళు.    మనదేశంలో లాగా ఇక్కడ అట్రాసిటీస్ ఆక్ట్ ఉందేమో అనుకున్నా .  మనం అడిగేది అర్ధం చేసుకోలేక పోయినా, మనం సరిగ్గా అడగలేక పోయినా ఇబ్బందే అని గమ్మున ఉన్నా.   వారిని మాత్రం పలకరించలేదు కానీ రోజు రోజుకీ వారిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి , తపన పెరిగిపోయింది .

చివరికి  కలవడం కోసం బ్లూ మౌంటెన్స్ దగ్గర ఉన్న అబోరిజినల్ హెరిటేజ్ టూర్ కి వెళ్లిరావాలని అనుకున్నాం .  కానీ అంతలో బ్లాక్ మార్కెట్ గురించి తెలిసింది .  డిసెంబర్ 4 బ్లాక్ మార్కెట్ డే (నల్ల వాళ్ళ లేదా అబోరిజినల్ ).  ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మార్కెట్ అంటే మన అంగడి లేదా సంత లాంటిది నిర్వహిస్తారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది .  ఆయా తెగల ప్రజలు అంతా కలసి ఓ చోట చేరి తమ నైపుణ్యాలని , కళల్ని , జ్ఞానాన్ని , సంస్కృతిని, ఆహారాన్ని , వైవిధ్యభరితమైన జీవితాన్ని  మనకు పరిచయం చేస్తారు . ( మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కోవచ్చు ).  విషయం తెలవగానే వాళ్ళని కలవడానికి ఇంతకంటే మంచి అవకాశం నా ఈ పర్యటనలో రాదనుకున్నా .  ఆ రోజు ఎన్నిపనులున్నా వెళ్లాలని నిశ్చయం జరిగిపోయింది .

2013 నుండి బ్లాక్ మార్కెట్స్ ని నిర్వహిస్తోంది ఫస్ట్ హ్యాండ్ సొల్యూషన్స్ అబోరిజల్స్ కార్పొరేషన్ .  ఆపదలో లేదా రిస్క్ లో ఉన్న యువతని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఉపయోగిస్తారట .  బోటనీ బే తీరంలోని లే పెరౌస్ లో ఈ సంస్థ కార్యాలయం , మ్యూజియం ఉన్నాయి . దీన్ని అబోరిజినల్స్ బిజినెస్ సెంటర్ అనొచ్చు .  ఇక్కడనుండి బేర్ ఐలాండ్ కి టూర్లు నిర్వహిస్తుంటారు .  అబోరిజినల్ రోల్ మోడల్స్ ని యువతకి పరిచయం చేస్తారు . యువతలో లీడర్ షిప్ పెంచడం , పబ్లిక్ తో మాట్లాడడం వంటి జీవన నైపుణ్యాలు అందిస్తున్నారు.   వాటితోపాటే బ్లాక్ మార్కెట్స్ నిర్వహణ .  మొదట్లో ప్రతినెలా నిర్వహించినప్పటికీ 2015 నుండి ప్రతి మూడునెలలకొకసారి నిర్వహిస్తున్నారు .   ఆయా స్టాల్స్ లో తాయారు చేసిన వస్తువులుకొని అబోరిజినల్ యువతను ప్రోత్సహించమని చెప్తుంది ఆ సంస్థ .

మా పూర్వీకుల వారసత్వ జ్ఞానం విపత్కర పరిస్థితుల్లో కొట్టుకిట్టాడుతోంది . వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే  అంటాడు ఫస్ట్ హ్యాండ్ సోలుషన్స్ డైరెక్టర్ పీటర్ కూలీ .

ఆధునిక ఆస్ట్రేలియా పుట్టింది లే పెరౌస్ లోనే .  అంటే ఆస్ట్రేలియాని కనుగొన్న  కెప్టెన్ కుక్ 1770లో మొదట అడుగుపెట్టింది ఈనేలపైనే.  ఆ తర్వాతే బ్రిటిష్ వారి కాలనీలు 1788లో వెలిశాయి =. స్థానికులైన ఆస్ట్రేలియన్ల భూముల్ని , వనరుల్ని దురాక్రమించడంతో పాటు వేల ఏళ్ల సంవత్సరాలుగా నివసిస్తున్న వారి జీవనాన్ని , తరతరాలుగా పొందిన జ్ఞానాన్ని, రూపొందిచుకున్న సంస్కృతిని , భాషల్ని, చరిత్రని సర్వనాశనంచేశారు  జాత్యాహంకారులు . తమ నేలపై తాము పరాయివారుగా తిరుగాడుతూ వివక్షతో బతుకీడ్చడం కాదు.  కోల్పోతున్న తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ పూర్వీకులు కొందరు జాత్యహంకారులపై పోరాడారు .  వారి స్పూర్తితో హక్కుల్ని,  సంస్కృతిని పునరుజ్జివింపచేసుకుంటూ తమ వారసత్వసంపదని కాపాడుకుంటూ ఏకీకృతం అవుతున్నారు నేటి నేటివ్ ఆస్ట్రేలియన్లు . అందులో భాగంగా ఏర్పడిందే బ్లాక్ మార్కెట్ ..

పదండి అలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లి చూసోద్దాం 

మేముండే బ్లాక్ టౌన్ నుండి బారంగారో రిజర్వ్ లో ఉన్న బ్లాక్ మార్కెట్స్కి కారులో వెళ్లడం కంటే ట్రైన్ లో వెళ్లడం మంచిది అనుకున్నాం .( కారులో వెళ్తే పార్కింగ్ వెతుక్కోవాలని ) .  బస్సు , ఫెర్రీ సౌకర్యం కూడా ఉంది .  ఏది ఎక్కినా opeal కార్డు స్వైప్ చేయడమే .  ప్రయాణ సదుపాయం చాలా బాగుంది .   బారంగారో రిజర్వ్ టౌన్ హాల్ కి , సిడ్నీ హార్బరుకి దగ్గరలో ఉంది . వెతుక్కునే పనిలేకుండా సులభంగానే వెళ్లిపోయాం.

ఉదయం 9. 30 కే బ్లాక్ మార్కెట్స్ లో దుకాణాలు తెరిచారు .  హిక్సన్ రోడ్డులోని  బారంగారో రిజర్వు లోని బ్లాక్  మార్కెట్స్  చాలా సందడిగా కనిపిస్తున్నాయి .  చుట్టూ స్టాల్స్ 30 పైగా ఉన్నాయి  మధ్యలో ఉన్న ఖాళీలో  ఇసుకపోసి ఉంది .  అందులో సాంప్రదాయ నృత్యాలు సాగుతున్నాయి . చుట్టూ జనం గుమి గూడి చూస్తున్నారు .  Ngaran Ngaran డాన్స్ ట్రూప్ వారి ఆధ్వర్యంలో ఆ నృత్య ప్రదర్శన జరిగుతోంది.  మైకులోంచి ఆ నృత్య రీతిని వివరిస్తున్నారు .  వారి డాన్సు చూస్తుంటే నాకు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన గుస్సాడీ , చత్తిస్గఢ్ గిరిజనుల మోరియా నృత్యాలు గుర్తొచ్చాయి .  ఆహార్యం ఒకేలా లేకపోవచ్చు గానీ కాళ్ళు చేతుల కదలికలు ఒకేలా అనిపించాయి .  వీవర్స్ చేసే నృత్యం , ఫిషింగ్ కమ్యూనిటీ చేసే నృత్యం , వేటాడేవారి నృత్యం ఇలా వారు చేసే పనులను బట్టి వారి నృత్యాలు ఉన్నాయి . ఆ ట్రూపులో ఉన్న చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు . ఆ విషయమే అడిగినప్పుడు-  ఆదిమ కాలంనాటి వారి నృత్యం కనుమరుగై పోతున్న నేపథ్యంలో అది కాపాడుకోవడానికి వారసత్వ సంపదగా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పటి తరానికి తమ పూర్వీకుల సనాతన నృత్యాన్ని నేర్పుతున్నామని చెప్పాడు ఆ ట్రూప్ లీడర్ మాక్స్ హారిసన్ .  నాకు వాళ్ళ నృత్య రీతులు చూశాక కలిగిన భావాన్ని వారితో పంచుకున్నప్పుడు ‘ఇండియాకు మాకు కొన్ని పోలికలు ఉంటాయట’ అన్నాడు ట్రే పార్సన్ అనే మరో కళాకారుడు .

santhi4

ఏ స్టాల్ నుండి చూడ్డం మొదలు పెడదామా అనుకుంటూ  మొదటి స్టాల్ దగ్గరకి వెళ్ళాం .  అక్కడ ఆదిమ జాతుల గురించి సమాచారం చాలా ఉంది . దాంతో ఆసక్తి ఉన్నవారు అబోరిజినల్ కల్చరల్ టూర్ చూసే ఏర్పాటు ఉందని చెప్పారు .  వెంటనే మేమూ మా పేర్లు రిజిస్టర్ చేసుకున్నాం . 11 గంటలకు ఆ టూర్ మొదలయింది .  బారంగారో రిజర్వ్ లో దాదాపు గంటసేపు సాగింది మా టూర్ . ఆదిమకాలంనాటి వీవర్స్ కమ్యూనిటీ కి చెందిన జెస్సికా మాకు గైడ్ గా వచ్చింది . ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ లో పనిచేస్తోంది (సెలవుల్లో తమ జాతి ఉన్నతి కోసం సేవలు అందిస్తూ ఉంటుందట. మరో సందర్భంలో అడిగిన ఓప్రశ్నకు జవాబుగా చెప్పింది ).  ఆవిడతో కలసి మాతో పాటు జపాన్ , చైనా , ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశస్తులతో పాటు కొంతమంది యూరోపియన్ దేశాల వారు కూడా వచ్చారు .

బారంగారో కొండ అంచున నడుస్తూ , ఆగుతూ ఆమె చెప్పిన విషయాలు ఇవే . 1788లో 1100 మంది నేరస్థులు , మరో రొండొందలమంది సిబ్బందితో మొదటి యూరోపియన్ కాలనీ వెలిసిన సమయంలో క్యాంమెరగల్ , కడిగళ్  జాతి బారంగారో లో ఉండేది . ఆ సమయంలో దాదాపు 1500 జనాభా  బోటనీ బే నుండి బ్రోకెన్ బే వరకూ ఉన్న సిడ్నీ తీరప్రాంతంలో చిన్న చిన్న సమూహాలుగా  నివసించేవారని గవర్నర్ ఆర్థర్ ఫిలిప్ అంచనా . పారామట్టా నదిలోనో , సముద్రంలో చెట్టు బెరడుతో చేసిన తెప్పలపై తిరిగి చేపలు పట్టడం , వేటాడడం , వండుకోవడం , తినడం ఇదీ వారి దినచర్య.

యూరోపియన్ సెటిల్మెంట్ తర్వాత కూడా కొంతకాలం అబోరిజినల్స్ కి , వలసవచ్చిన తెల్లవాళ్లకి డార్లింగ్ హార్బర్ సమీపంలో సముద్రపు కాకల్స్ అనే గవ్వలు  , ఆయిస్టర్ లు ప్రధాన వనరుగా ఉండేవి . బ్రిటిష్ కాలనీలతో పాటే వచ్చిన మశూచి చాలామంది మూలవాసుల్ని మింగేసింది . దాంతో వారు తమ నివాసాల్ని శ్వేతజాతీయులకి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు .  కాలనీలు పెరిగాయి . 1900 నాటికి సిడ్నీ హార్బర్ నుండి ప్రధాన వ్యాపార కేంద్రంగా మారింది . న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇరవయ్యో శతాబ్దం నుండి ఇరవయ్యో శతాబ్దంలోకి మాత్రమే కాదు ప్రపంచంలోని  అత్యాధునిక నగరాల్లో ఒకటిగా  ఈ ప్రాంతపు రూపురేఖలు మారిపోయాయి .  అభివృద్ధిని మేం కాదనడంలేదు . కానీ మా అస్తిత్వాల్ని, మా వారసత్వ సాంస్కృతిక సంపదను మేం కోల్పోవడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే మాకు తీరని నష్టం జరిగింది అని స్పష్టం చేసింది జెస్సికా  ఓ ప్రశ్నకు సమాధానంగా .

బ్రిటిష్ కాలనీలు వెలసిన కొత్తలో “బారంగారో” అనే  చేపలు పట్టే ఓ శక్తివంతమైన మూలవాసీ మహిళ ఉండేది.  ఆమె  తెల్ల జాతీయుడైన అధికారికి ఒకే రోజు  200 వందల చేపలు ఇచ్చిందట. అందుకే అతను ఆ ప్రాంతానికి ఆమె పేరుపెట్టాడట.  మూలజాతుల వారు పెట్టుకున్న పేర్ల స్థానంలో ఇంగ్లీషు వారి ఊరి పేర్లు , పట్టణాల పేర్లు కనిపిస్తాయి .  సిడ్నీ మహానగరం ఉన్న న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం పేరు కూడా యూరోపియన్లు మొదట వచ్చి రాగానే తామున్న ప్రాంతానికి న్యూ సౌత్ వేల్స్ అని పేరు పెట్టారట . అదే విధంగా ఆస్ట్రేలియాలో పేర్లన్నీ మార్చేశారు. కొద్ది తప్ప. బ్రిటిష్ వారితో స్థానిక ఆస్త్రేలియాన్స్ కి ఉన్న సంబంధాలను బట్టి అక్కడక్కడా ఇప్పటికీ అబోరిజినల్స్ పేర్లు కనిపిస్తాయి.   బారంగారో కొండకి ఒక వైపు అంతా నీరు మరో వైపు భూభాగం .  ఆ కొండపై 75,858 రకాల మొక్కలు పెరుగుతున్నాయి . అవన్నీ కూడా సిడ్నీ ప్రాంతంలో పెరిగే మొక్కలూ , చెట్లూ .  అవి బ్రిటిష్ కాలనీలు రాకముందూ – వచ్చిన తర్వాత మా  జాతీయుల చరిత్రలు చెబుతాయి అంటుంది జెస్సికా . అక్కడ  కనిపించే గడ్డిని చూపి దీనితో మా పూర్వీకులు తమ అవసరాలకు కావాల్సిన పాత్రలు , సంచులు , బుట్టలు తాయారు చేసుకునేవారు . ఆ గడ్డి గెలలు వచ్చాక ఆ గెలనుండి వచ్చే నారతో నులక నేసి మంచాలకు చుట్టేవారు.  చెట్టు బెరడు ఎన్నో విధాలుగా వాడేవారు . నార, పీచు , పళ్ళు , ఫలాలు , వాటి గింజలు , దుంపలు ప్రతిదీ తమచుట్టూ ఉన్న అడవినుండి తమ అవసరాలకు మాత్రమే తెచ్చుకునేవారు . చెట్లను నరకడం మా పూర్వీకులకు తెలియదు . వాళ్ళు చెట్టు మొదలు నుండి పైకి  నిలువుగా ఒక గాటు పెట్టి  బెరడు తొలిచేవారు .  ఆ బెరడును చాలా రకాలుగా అవసరాలకు మలుచుకునేవారు . ఎన్నెనో ఔషధమొక్కలున్నాయి  ఈ కొండపై అంటూ మాకు వివరించింది .  తను మాకు చూపిన గడ్డితో చేసిన బాగ్ లోంచి తీసి తమ పూర్వీకులు వాడిన పరికరాలు , వస్తువులు చూపింది .

అదే విధంగా కనిపించే ఆ నీటిలో ఎంతో చరిత్ర సమాధి అయింది .   అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో సముద్రపు నీటిమట్టం పెరిగి అప్పుడున్న జనాభాతో పాటు రాతిని తొలిచి చేసుకున్న వారి నివాసాలు , సొరంగ మార్గాలు జల సమాధి అయ్యాయి . ఇక్కడ దొరికే ఈ ఇసుక రాళ్ళూ , నత్తలు , గవ్వలు , చేప పొలుసులు అన్నీ మూలవాసుల ఆనవాళ్ళని , ఆనాటి చరిత్రని పట్టిస్తాయి అని ఎంతో ఉద్వేగంగా చెప్పిందామె .

santhi3

కొద్దీ దూరంలో అంటే 500 మీటర్ల దూరంలో కనిపిస్తున్న ఆకాశహార్మ్యాలను చూపుతూ అభివృద్ధి దృష్టి ఎప్పుడూ మా స్థలాలపైనే .. అటుచూడండి ఆ కట్టడాలన్నీ అబోరిజినల్స్ స్థలాల్లోనే జరిగేది . మేం గట్టిగా అడ్డుకుంటున్నాం . అయితే మా జనాభా తక్కువ . ఉన్నవాళ్లు కూడా ఎక్కడెక్కడో ఎవరికి వారుగా ఉన్నారు . అందరం సంఘటితమయ్యి మా సమస్యలని ఎదుర్కొంటూ పోరాడడమే కాదు మా హక్కుల్నీ కాపాడుకోవడం కోసం మిగతా వాళ్ళకంటే మేం మరింత కష్టపడాల్సి వస్తోంది  అంటుందా మూలవాసీ మహిళ .

ఒక్క బారంగారో లోనో , సిడ్నీ లోనో , న్యూసౌత్ వేల్స్ లోనో మాత్రమే కాదు దేశమంతా అబోరిజినల్స్ టోర్రెస్ స్ట్రైట్ ఐలాండర్స్ పరిస్థితి ఇదే  అంటూ వివరించింది జెస్సికా . మధ్య మధ్యలో మేం అడిగే ప్రశ్నలకు , సందేహాలకు ఓపిగ్గా జవాబు చెప్పింది . ఇప్పటికీ ఈ దేశంలో మా పట్ల వివక్ష ఉంది . విద్య , ఆరోగ్యం , ఉద్యోగం,  అన్ని చోట్లా వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పింది . అందుకు సంబంధించిన వివరాలు మరోచోట ప్రస్తావిస్తాను .  అదే విధంగా  స్టోలెన్  జనరేషన్స్ గురించి విన్నానన్నపుడు జెస్సికా చాలా ఉద్వేగానికి గురయింది . అవును , ఇప్పటికీ తమ కుటుంబాన్ని కలుసుకోలేని పిల్లలూ , పిల్లల్ని కలవలేని తల్లిదండ్రులు కొల్లలు .  ఇలాంటి మార్కెట్స్లోనో , మీట్స్ లోనో , ఉత్సవాల్లోనో కలిసినప్పుడు తమవారెవరైనా కనిపిస్తారేమోనని వారి  పేర్లను బట్టి బంధుత్వాలు వెతుక్కుంటూ ఉంటారు . (స్టోలెన్ జనరేషన్స్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం . ) అని చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది .

అలా ఓ గంట నడకతో సాగిన ఆ టూర్ అయ్యేసరికి కడుపులో కొద్దిగా ఆకలి మొదలయింది .  మేం ఇంటినుండి తెచ్చుకున్న పదార్ధాలున్నప్పటికీ అక్కడున్న ఫుడ్ స్టాల్స్ వైపు చూశాము .  మూలవాసులు ఏమి తినేవారో ఆ ఆహార పదార్ధాలు అక్కడ కనిపించాయి .  ఈము పక్షి మాంసం , కంగారూ ల మాంసం పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చి (ఇప్పుడు మనం అనే BBQ ) చేపలు , పీతలు,  వోయిస్టర్ చెరుకు ఆకులాంటి ఓ ఆకులో చుట్టి కాలుస్తున్నారు .  నత్తలు , ఆల్చిప్పలు ఒలిచి అరటి మొక్క పొరల్లాంటి పొరల్లో చుట్టి కొద్దిగా కాల్చి ఇస్తున్నారు .  ఒకరకం నీచు వాసన .  ఉప్పు కారం మసాలా  లాంటివేమీ లేకుండా  ఎలా తినేవారో అలా ..

మేం ఈము మాంసం తో చేసిన స్కీవర్స్ తీసుకున్నాం .

నేటివ్ అబోరిజినల్స్ జీవిత వీర గాథలు చెప్పింది టకీ కూలీ అనే మహిళ.   ఆ తర్వాత ఆ మహిళ పామిస్ట్రీ చెప్తోంది.  ఒక్కక్కరి నుండి $10, 20, 30 తీసుకొంది. తమ హస్త రేఖలను బట్టి , ముఖ కవళికలను బట్టి ఆమె జాతకం చెప్తోంది . చాలా మంది క్యూ లో కనిపించారు.

అద్భుతమైన కళా నైపుణ్యాలు వారివి . రేగు పండ్ల గింజల్లాంటి గింజలతో వారు చేసిన ఓ  ఆభరణం నా మనసుని బాగా ఆకట్టుకుంది. కొందామనుకున్నాను కానీ అది అప్పటికే అమ్మేశానని చెప్పింది నిర్వాహకురాలు .   మా పూర్వీకులు రంగులు వాడేవారు కాదు . మేం వాడుతున్నాం అని చెప్పింది మేరీ . ఆవిడ ఆర్ట్స్ స్టూడెంట్ ననీ బహుశా వచ్చే ఏడాది ఇండియా వస్తానని చెప్పింది . అయితే ఇండియాలో ఏ యూనివర్సిటీ కి వచ్చేది తెలియదట . కల్చరల్ ఎక్స్చేంజి ప్రోగ్రాంలో భాగంగా వస్తానని చెప్పింది . దాదాపు 50 ఏళ్ల వయసులో ఉన్నావిడ ఇప్పుడు ఈ వయస్సులో యూనివర్సిటీ కి వెళ్లి చదువుతున్నందుకు అభినందించాను . ఆవిడ నవ్వుతూ   మేం చదువుల్లోకి వెళ్ళేది చాలా ఆలస్యంగా .  నాన్ అబోరిజినల్స్ కి ఉన్న అవకాశాలు మాకు లేవు . మేం అవతలి వారి నుండి ఎగతాళి ఎదుర్కొంటూ పై చదువులకు రావడం సాహసమే అని చెప్పింది .  అందుకే కాలేజీల్లో ,యూనివర్సిటీ లో మిగతా వాళ్ళకంటే నేటివ్ ఆస్ట్రేలియన్స్ వయసులో పెద్దవాళ్ళయి ఉంటారు అంటూ కొబ్బరి పూసలతో  బ్రేస్ లెట్ తాయారు చేస్తూ  వివరించింది .  ఇంకా ఎదో మాట్లాడ బోతుండగా కస్టమర్స్ రావడంతో బిజీ అయిపొయింది .  వాళ్ళతో చాలా చాలా మాట్లాడాలి . ఎంతో తెలుసుకోవాలన్న ఉత్సాహం నాది . కానీ వాళ్ళకి ఉన్న సమయం ఉదయం 9. 30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే . అంతలోనే తమ వస్తువులు వీలయినంత ఎక్కువ అమ్మి సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం .  అలా వాళ్ళు తాయారు చేసిన హస్త కళలు , ప్రకృతి సహజమైన వస్తువులతో తాయారు చేసిన సబ్బులు , షాంపూలు , పురుగుమందులు , కొన్ని రకాల మందులు  ఒక స్టాల్లోఉంటే మరో స్టాల్ లో కిందరగార్డెన్ స్కూల్ పిల్లలకోసం స్టడీలెర్నింగ్ మెటీరియల్ అతి తక్కువ ధరల్లో .  ఒక స్టాల్ లో పురాతన ఆస్ట్రేలియన్ వాడిన సామగ్రి ,పనిముట్లు ,వాళ్లకు సంబంధించిన ఫోటోలు, ఆర్ట్ , వగైరాలతో పాటు ఆస్ట్రేలియా దేశంలో ఆదిమ మానవుడు నివసించిన రాతి గుహలు , సొరంగాలు , వారి పవిత్ర స్థలాలు, ఆదిమ కాలంనాటి మానవుల శిలాజాలు , జంతువుల శిలాజాలు వంటివన్నీ చూపడానికి ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీల వివరాలు ..  మందమైన నారవంటి బట్టపై ప్రాధమిక రంగులతో వేసిన కళాకృతులు , పెయింటింగ్స్, మనం ఎందుకూ పనికిరావని పడేసే షెల్స్ , సీడ్స్  తో ఎన్నో ఎన్నెన్నో .. కళాకృతులు , ఆభరణాలు . అద్భుతంగా ..

ఒక స్టాల్ లో పురాతన నేటివ్ ఆస్ట్రేలియన్ వాడిన పనిముట్లు, సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు వాళ్ళు కప్పుకున్న గొంగళి కనిపించింది . ఆ స్టాల్ నిర్వాహకుడు జోసెఫ్  ఆ గొంగళి గురించి చెప్పాడు . ఆదిమ మానవులు బిడ్డ పుట్టిన తర్వాత కూలమన్  (అంటే దోనె ఆకారంలో ఉన్న చెట్టు బెరడు )లో గొర్రె ఉన్నితోలు వేసి ఆ బిడ్డను పడుకోబెట్టి అదే కప్పేవారట . ఎటన్నా పోయినా అట్లాగే  తీసుకెళ్లేవారట .  అలా బిడ్డ పెరిగిన కొద్దీ ఆ ఉన్ని ముక్కకి మరో ముక్క అతికేవారట . అలా ఆ బిడ్డ పెద్దయ్యేసరికి పెద్ద గొంగళి అయ్యేదట . అలా అతుకులు అతుకులుగా ఉన్న గొంగళి భలే ఉంది . కూలమన్ ను వంట పాత్రగాను , వస్తువులు వేసుకునే పాత్రగాను  ఎన్నోరకాలుగా వాడేవారట .  మహిళలయినా , పురుషులయినా వాళ్ళ చేతిలో చేతికర్ర కన్నా చిన్నదిగా సూదంటు మొనతో ఉన్న కర్ర ఉండేదట . అది వారిని వారు కాపాడుకోవడం కోసం , కందమూలాలు తవ్వుకోవడం కోసం వంటి వివిధ పనులకోసం వాడేవారు . అలా వారి వస్తువులు , పనిముట్లు ఒకటి కంటే ఎక్కువ పనులకోసం ఉపయోగించేవారు .

ఉదయం 9. నుండీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నారతో వివిధ రకాల వస్తువులు , సముద్రంలో దొరికే వివిధ రకాల గవ్వలతో వస్తువులు , అలంకరణ సామాగ్రి తాయారు చేయడం , అదే విధంగా ఆభరణాలు తాయారు చేయడం , పెయింటింగ్స్ , వంటి వర్క్ షాప్స్ కొనసాగాయి .  95 సంవత్సరాల మహిళ ఎంతో ఉత్సాహంతో ఓ స్టాల్ లో కనిపించింది తన కూతురితో పాటు . ఆమె తాను నేర్చుకున్న పూర్వీకుల జ్ఞానాన్ని వారసత్వంగా తరువాతి తరాలకు అందించే ప్రతినిధిగా అక్కడ కనిపించడం అపురూపంగా తోచింది .

ఓ పక్క ఎండ మండుతున్నా వచ్చే జనం పోయే జనంతో కిటకిటలాడాయి బ్లాక్ మార్కెట్స్ .  అక్కడ వారు చాలా షాపింగ్ చేశారు . మేం మాత్రం ఓ కొత్త లోకంలోకి వెళ్ళివచ్చినట్లుగా భావించాం .  మనకు తెలియని మూలవాసుల జీవితాల గురించి ఆలోచిస్తూ తిరుగు ముఖంపట్టాం.

ఆస్ట్రేలియా పర్యటించేవారు ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కైటవర్  వంటివి చూడ్డమే కాదు అబోరిజినల్స్ జీవనానికి సంబంధించిన టూర్లు చేయొచ్చు . మూలవాసుల జీవనం గురించి ఎంతో తెలుసుకోవచ్చు .  అదే విధంగా అలలపై తేలియాడే చేపల్ని, నీటిఅడుగున ఉన్న సముద్రపు జీవాల్ని  గురించి తెలుసుకోవచ్చు.  చేపల్ని  వేటాడడం , వివిధ రకాల సముద్ర జీవుల్ని అక్కడే కాల్చుకు తినడం , బూమెరాంగ్ ఎలా విసరాలో నేర్చుకోవడం ,   మంచుయుగం , రాతియుగాల్లోను  జాత్యహంకారులు అడుగుపెట్టక ముందున్న నేటివ్ ఆస్ట్రేలియన్ల జీవనం , టెక్నాలజీ ని , వారి ఆర్ధిక వ్యవస్థని , మార్కెట్ పద్దతులను  తెలుసుకోవడం వంటివన్నీ మనకు కొత్త ఉత్సాహాన్నివ్వడమే కాదు జీవితంపై కొత్త అన్వేషణలకు పునాదులేస్తాయి .

ఆస్ట్రేలియాలో ఏ  మూలకు పోయినా ప్రాచీనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచేసే ప్రయత్నమే ..  ఎతైన ఆకాశహర్మ్యాలు , స్కై టవర్స్, స్కైవేలు , ఫోర్ వేలు, మైనింగ్ ప్రాజెక్ట్స్ వంటి  మరెన్నో అభివృద్ధి పథకాల  కింద నలిగిపోయిన మూలవాసుల గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది .  అతి పురాతనమైన చరిత్ర కలిగి కేవలం మూడుశాతం జనాభాగా మిగిలిన మూలవాసులు కోరుకునేదొకటే . అభివృద్ధి భూతం తమని మింగకూడదనే . ఇప్పటివరకూ జరగకూడని విధ్వంసం జరిగిపోయింది . ఇక  జరుగకూడదనే  వారి తపనంతా .   వారే కాదు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు కోరుకునేది అదే కదా ..

*

 

 

తేలియాడే మేఘాల్లో  … తనూజ  

 

సోలో ట్రావెలింగ్ 

 

వి. శాంతి ప్రబోధ

~

ఒక్కదాన్నే .. నేనొక్కదాన్నే..

ఇదే మొట్టమొదటిసారి ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ప్రయాణం..
బెంగుళూర్ కో,  చెన్నైకో, పూనేకో   కాదు.  చిన్ననాటి నుండి కళ్ళింతలు చేసుకుని బొమ్మల్లో చూసి మురిసిన  హిమాలయాలలో తిరుగాడడం తనను చూసి తనే ఆశ్చర్యపోతోంది తనూజ.

 

అద్భుతంగా .. కొత్తగా గమ్మత్తుగా.. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి నాకు నన్నే ప్రత్యేకంగా నిలబెడుతూ .. బయటి ప్రపంచం తెలియకుండా పెరిగిన నేను నేనేనా…  అనే విస్మయాన్ని వెన్నంటి వచ్చిన ఆనందం ..  ఆశ్చర్యం మనసు లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి .

 

నా కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తుంటే నేను ఉన్నది ఇండియాలోనేనా ..అనేంత  వైవిధ్యం .. ఆ చివర నుండి ఈ చివరికి ఎంత వైరుధ్యం …?

ఒకే దేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మనిషి ఏర్పాటు చేసుకున్న సంస్కృతీ సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు , భాషలు మాత్రమే కాదు ప్రకృతి కూడా విభిన్నంగానే . విచిత్రంగానే ..  ఆ భిన్నత్వమే.. నూతనత్వం వైపు పరుగులు పెట్టిస్తూ..  కొత్తదనం కోసం  అన్వేషిస్తూ.. భావోద్ద్వేగాన్ని కలిగిస్తూ.. మనసారా  ఆస్వాదిస్తూ… తనువంతా ఉత్సాహం నింపుతుందేమో .. ???  ఒంకర టింకర ఎత్తుపల్లాల గతుకుల రోడ్డులో కదులుతున్న మహీంద్రా జీప్ లాగే ఆమె ఆలోచనలూ .. ఎటునుండి ఎటో సాగిపోతూ ..
తననే పట్టి పట్టి చూస్తున్న బాయ్ చూపులు, హోటల్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళ చూపులూ  గుర్తొచ్చాయామెకి .  రూం బాయ్ మొహమాటంలేకుండా హైదరాబాదీ అమ్మాయిలు చాలా ధైర్యవంతులా..  ఆశ్చర్యంగా మొహం పెట్టి మనసులో మాట అడగడం,  విదేశీ మహిళలు ఒంటరిగా రావడం తెలుసు కానీ భారతీయ మహిళలు ఇలా రావడం తానెప్పుడు చూడలేదనడం జ్ఞాపకమొచ్చి ఆమె  హృదయం ఒకింత  గర్వంగా ఉప్పొంగింది. తనకిచ్చిన గొప్ప  కాంప్లిమేంట్ గా ఫీల్ అయింది.

 

దేశంలో ఏ మూలకెళ్ళినా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల స్థానం ఎక్కడో తెలిసిందే కదా.. ఎంత మిస్ అయిపోతున్నారు అమ్మాయిలు అని ఒక్క క్షణం మనసు విలవిలలాడింది. కానీ, కళ్ళ ముందు తగరంలా మెరిసే మంచు కొండల  సుందర దృశ్యాలు కదిలిపోతుంటే  వాటిని మదిలో ముద్రించుకుంటూ మళ్లీ ఆలోచనల్లో ఒదిగిపోయింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ.
మనసులోంచి ఎగిసివచ్చే ఆలోచనల్ని అనుభూతుల్ని ఎక్జయిట్ మెంట్ ని ఎప్పటికప్పుడు పంచుకునే మనషులు లేరనే చిన్న లోటు ఫీలయింది ఆ క్షణం.

వెంటనే హ్యాండ్ బాగ్ తెరిచి ఫోన్ అందుకుంది. సిగ్నల్స్ లేవు.
ప్చ్..  నా పిచ్చిగానీ ఈ హిమపర్వత శిఖరాలపైకి నేను వచ్చానని ఫోన్  సిగ్నల్స్ నాతో పాటు పరుగెత్తుకొచ్చేస్తాయా ? తనలో తనే  చిన్నగా నవ్వుకుంది.  ఆత్మీయనేస్తం మనోరమ ఇప్పుడుండి ఉంటే .. ప్చ్ .. యూ మిస్స్డ్  ఎ లాట్ మనో .. అవును, నిజ్జంగా  మనో .. మనని ఒక వ్యక్తిగా కాకుండా ఆడపిల్లగా చూడ్డం వల్ల ఎంత నష్టపోతున్నామో ..
నీతో చాలా చెప్పాలి మనో.  చూడు నా జీవితంలో ఇంతటి అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయని అసలెప్పుడయినా అనుకున్నానా .. అనుకోలేదే.  కానీ ఆ క్షణాలను మనవి చేసుకునే చొరవ ధైర్యం మనలోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాటిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణాలిచ్చిన వెలుతురులో మన జీవితపు బండిని మనమే నడుపుకోవాలి.

నువ్వు  నా మాటల్ని చిన్న పిల్లల మాటల్లా తీసుకోకుని నవ్వుకుంటావని తెలుసు .  అయినా చెప్తున్నాను , మన జీవితపు  పగ్గాలు మన చేతిలోకాకుండా మరొకరి చేతిలో ఉంటే ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.  నాలో పొరలు పొరలుగా కప్పడిపోయిన ఊగిసలాటల పొరలు రాలిపోతూ.. కరిగిపోతూ ఉన్నాయి.

 

ఈ ప్రయాణం జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన  ఇచ్చింది… అది తెల్సుకోలేకపోతే .. ఎంత మిస్సవుతామో, ఎంత కోల్పోతామో నాకిప్పుడు స్పష్టమవుతోంది.
అవును మనో .. నివ్వెంత మిస్ అయ్యావో మాటల్లో చెప్పలేను మనసులోనే మాట్లాడేస్తోంది తనూజ మిత్రురాలు మనోరమతో.  నీలాకాశంలో తేలిపోతున్న మేఘాల్లో ఒక మేఘమాలికలా తనూ తేలిపోతున్నట్లుంది ఆమెకు .

ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి వాహనంలో  గ్యాంగ్ టక్ నుండి ఎత్తు పల్లాల గతుకుల రోడ్డులో కొన్ని గంటల ప్రయాణం.

నేను ఒక్కదాన్నే .. థ్రిల్లింగ్ గా .  ఆ  తర్వాత వచ్చింది చాంగు లేక్.

 

నెత్తి మీద నుండి తేలిపోయే మేఘాల్లోను , కళ్ళముందు పొగమంచులా కదిలిపోయే  మబ్బుల్లోంచి ఈ మూడు గంటల ప్రయాణం.. ఓహ్ .. అమోఘం. అద్బుతం.  ముందున్నవి కన్పించనంతగా మేఘం కమ్మేసి .. ఓ పక్క ఎత్తైన కొండలు మరో వైపు లోతైన లోయలు. వాటి అంచులో ప్రయాణం ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లే సుమా..!.  వాహనం ఏమాత్రం అదుపు తప్పినా , డ్రైవర్ ఏ కొద్ది అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.  ప్రతి టర్నింగ్ లోనూ హరన్ కొడుతూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ .. కమ్మేసిన మేఘం కింద దాగిన సరస్సు ను  చూసి నాలో నిరాశా మేఘం.

 

అంత కష్టపడి వచ్చానా..  లేక్ కన్పించలేదు.  పన్నెండు గంటలయినా సూర్యకిరణాల జాడలేదు.  నిస్పృహతో నిట్టుర్చాను.

అది గమనించాడేమో .. దగ్గరలో  బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉందని డ్రైవర్ చెప్పాడు.

అక్కడికి బయలు దేరా.  పాత టెంపుల్ నుండి  కొత్త టెంపుల్ కి వెళ్ళే దారిలోనే  టాక్సీ డ్రైవర్ ఇల్లు ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఆహ్హాహ్హ.. నాకు వినిపిస్తోందిలే నువ్వేమంటున్నావో .. నీకు బుద్దుందా అని అచ్చు  మా అమ్మలాగే .. తిట్టేస్తున్నావ్ కదూ..? నువ్వు అట్లా కాక మరోలా ఆలోచిస్తావ్ .. ?

కానీ ఇప్పుడు చూడు, నేను ఒంటరి ఆడపిల్లననే భావనే కలుగలేదు తెలుసా ..?!.

 

జనసంచారం లేని కొత్త ప్రాంతం.  డ్రైవర్ వాళ్ళింటికి రమ్మనగానే వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను కానీ అది భయంతో కాదు.  శరీరాన్ని చుట్టుకున్న మేఘాల అలల ఒడిలో ప్రయాణం ఎక్కడ మిస్ అవుతానో అన్న మీమాంసతోనే సుమా .  నాకిక్కడ పగటి  కాపలాలు రాత్రి కాంక్షల విచారాలు అగుపించలేదబ్బా …

 

ఇంతటి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు ఎలా ఉంటారో .. అనుకుంటూ  డ్రైవర్ తో మాటలు కలిపాను.

ప్రకృతి సౌందర్యం గొలుసులతో కట్టేసినట్లుగా ఉన్న నేను ఇప్పటివరకూ అతని వాహనంలోనే ప్రయాణించానా .. కనీసం అతని  పేరయినా అడగలేదన్న విషయం స్పృహలోకొచ్చి అడిగాను .
అతని  పేరు గోవింద్.  చిన్న పిల్లవాడే. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో . చురుకైనవాడు.   చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడి వారి జీవితం గురించి చెప్పాడు.
మేం వెళ్లేసరికి వాళ్ళమ్మ చేత్తో ఏదో కుడుతోంది.  చేస్తున్న పని ఆపి లేచి తల్లి మర్యాదగా లోనికి  ఆహ్వానించింది.  తండ్రి పగటి నిద్రలో ఉన్నాడు.

నేను మాట్లాడే హిందీ ఆమెకు అర్ధం కావడం లేదు.  ఆమె మాట్లాడే టిబెటియన్ సిక్కిం భాష నాకు తెలియదు.

 

పేదరికం ఉట్టిపడే చెక్క ఇల్లు వారిది. చాలా చిన్నది కూడా . లోపలికి వెళ్ళగానే  రూం హీటర్ వల్ల వెచ్చగా ఉంది.   వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి వెళ్లి పొగలు కక్కే టీ చేసి తీసుకొచ్చింది.  నేను టీ తాగనని నీకు తెలుసుగా .. వాళ్ళు నొచ్చుకుంటారనో లేక  ఆ కొంకర్లు పోయే చలిలో వేడి వేడి టీ తాగితే హాయిగా ఉంటుందనో  గానీ ఆ నిముషంలో వారిచ్చిన టీకి నో అని చెప్పలేకపోయాను .

daari 2

వారిచ్చిన హెర్బల్ టీ  ఆస్వాదిస్తూ పాడి ఉందా అని ఆడిగా.  నాలుగు జడల బర్రెలు ఉన్నాయని అవి టూరిస్ట్ సీజన్ లో వారికి ఆదాయాన్ని తెచ్చి పెడతాయని చెప్పారు. ఎలాగంటే ప్రయాణ సాధనంగా జడల బర్రెని వాడతారట .  నాకూ అలా ప్రయాణించాలని కోరిక మొదలైంది.

 

పాలు, పెరుగు కోసం జడల బర్రె పాలే వాడతారట. చనిపోయిన దాని చర్మంతో చాల మంచి లెదర్ వస్తువులు ప్రధానంగా షూ చేస్తారట .  వాళ్ళింట్లో తయారు చేసిన రకరకాల చేతి వస్తువులు చాలా ఉన్నాయి .  అన్ సీజన్ లో వాళ్ళు ఇల్లు కదలలేరు కదా .. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని తమ దగ్గరున్న వస్తువులతో హండీ క్రాఫ్ట్స్ చేస్తారట.  టూరిస్ట్ సీజన్ లో వాటిని టూరిస్ట్ లకు అమ్ముతారట .  వాళ్ళమ్మ చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. వేటికవి కొనాలనిపించినా రెండు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కొన్నాను. నీ కొకటి , నాకొకటి .

 

తర్వాత గోవిందు వాళ్ళ నాన్నను లేపి నన్ను పరిచయం చేశాడు. తమ భాషలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాతావరణం కాస్త అనువుగా మారుతుండడంతో మేం చాంగులేక్ కేసి వెళ్ళిపోయాం.

 

టూరిస్టులు ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఎత్తైన పర్వతాలు తప్ప .  దగ్గరకు వచ్చేవరకూ అక్కడ ఒక లేక్ ఉన్న విషయమే తెలియదు. అలాగే వేచి చూస్తున్నా .. గాలికి కదలాడే సన్నని ఉల్లిపొర తెరల్లా నెమనెమ్మదిగా మేఘం తరలి పోతూ .. వెలుతురు పలచగా పరుచుకుంటూ ..

 

చుట్టు ముట్టు ధవళ కాంతులతో మెరిసే పర్వతాల నడుమ దోబూచులాడే మేఘపు తునకల కింద చంగూలేక్ . నా కళ్ళను నేనే నమ్మ లేకపోయానంటే నమ్ము.  అప్పటివరకూ ఈ అందాలను మేఘం చీకటి దుప్పటిలో దాచేసిందా..  కళ్ళ గుమ్మం ముందు అద్భుత సౌందర్యం కుప్ప పోసినట్లుగా .. రెప్పవాల్చితే ఆ సౌందర్యమంతా కరిగి మాయమవుతుందోనని ఊపిరి బిగబట్టి చూశాను .
తెల్లటి మేఘ విహంగాల  మధ్యలోంచి నడచి వస్తున్న జడల బర్రె  మసక మసకగా అగుపిస్తూ . అది ఎక్కవచ్చా.. మనసులోంచి ప్రశ్న పైకి తన్నుకొచ్చింది.  డ్రైవర్ విన్నట్లున్నాడు . మీ కోసమే దాన్ని నాన్న తీసుకొస్తున్నాడు. ఎక్కి సరస్సు చుట్టూ తిరిగి రావచ్చని చెప్పడంతో ఎగిరి గంతేసింది మనసు.
పొట్టి మెడతో నల్లగా పొడవైన జుట్ట్టు చిన్న చెవులు, రంగు కాగితాలు చుట్టి అలంకరించిన కొమ్ములు ,  దాని వీపుపై వేసిన దుప్పటి మన గంగిరెద్దులపై వేసినట్లుగా వేసి ఉంది . కాకపొతే బలంగా కనిపిస్తోంది .

 

మేఘం పోయి వెలుతురు బాగా పరుచుకుంది.  గంట క్రితం ఇక్కడ ఎంత చీకటి .?  పది అడుగుల దూరంలో ఉన్నది అస్సలు కన్పించనంతగా ..
నెమ్మదిగా జడలబర్రె మీద ఎక్కుతుంటే కొంచెం భయమేసింది . ఎక్కడ పడేస్తుందోనని.  నా కెమెరా గోవింద్  కిచ్చి ఫోటోలు తీయించుకున్నా. వాళ్ళ నాన్న యాక్ కి కట్టిన ముకుతాళ్ళు పట్టుకొని ముందు నడుస్తూ లేక్ చుట్టూ తిప్పుకోచ్చాడు .  అప్పుడు నా మనసులో కలిగిన ఉద్వేగాన్ని, అనుభూతుల్ని, అద్వితీయ భావాన్ని  నీకు సరిగా అనువదించగలనో లేదో .. సందేహం ..
వింతగా అనిపిస్తోందా మనో .. చిన్నప్పుడెప్పుడో యాక్ ఫోటో పుస్తకాల్లో చూడడం , చదవడం గుర్తొస్తోందా .. ఆ యాక్ పై కూర్చొని చంగూలేక్ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చా .

 

అక్కడి బోర్డ్ ఇంగ్లీషు, టిబెటియన్ భాషల్లో ఉంది. మనవాళ్ళు  చంగూ లేక్ అంటే ట్సొంగు లేక్ అని టిబెట్ వాళ్ళు అంటారట.   ఈ సరస్సు  సిక్కిం -టిబెట్ బార్డర్ కు దగ్గరలో తూర్పు దిశలో  ఉంది.  ఆ లేక్ కి వెళ్ళే దారి  కొన్నిచోట్ల బాగుంది. కొన్ని చోట్ల కనస్ట్రక్షన్ లో ఉంది. అక్కడ కొండ చరియలు విరిగి పడడం తరచూ జరుగుతూ ఉంటుందట.  కాబట్టి రోడ్లు తరచూ పాడయి పోతుంటాయట.  కంగారు పడకు తల్లీ .. నేను వెళ్ళిన సమయంలో కొండచరియలు విరిగిపడడం జరగలేదులే. అందుకే  ప్రతి మూడు నెలలకొకసారి రోడ్డు వేస్తూనే ఉంటారట. జీప్ కుదుపుతో కొన్ని సెకన్ల పాటు ఆమె ఆలోచనలకు చిన్న అంతరాయం.  ఆవెంటనే మళ్ళీ మనో వీధిలో ఆప్తమిత్రురాలు మనోతో ముచ్చట్లాడుతూ .

 

మనో తిట్టుకుంటున్నావా ..  ఎంత తిట్టుకుంటావో తిట్టేసుకో .. ఇప్పుడు హోటల్ చేరగానే ఫోన్ చేస్తాగా ..  గాంగ్ టక్ లో దిగగానే చేశాను .  అంతే.  నువ్వు నా కాల్ కోసం ఎంత ఆత్రుతపడుతున్నావో ఉదయం నీ మిస్డ్ కాల్స్ చూస్తే అర్ధమవుతోంది.  నిన్న గురుడాంగ్ మార్ లేక్ నుండి రాగానే చేద్దామనుకున్నా .. సిగ్నల్స్ లేక చేయలేకపోయాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేస్తాలేవే ..

 

ఆ .. అన్నట్టు , నా పర్యటనలో  ముందటి రోజుల  విశేషాలు చెప్పలేదు కదూ .. నేను గ్యాంగ్ టక్ లో ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరానా .. హోటల్ రూంలోంచి దూరంగా కనిపిస్తూ రా రమ్మని ఆహ్వానిస్తున్న హిమాలయాలు, వాటి చెంత చేరాలని ఉవ్విళ్ళూరుతున్న మనసును కొన్ని గంటలు ఆపడం ఎంత కష్టమయిందో..అప్పటికప్పుడు వెళ్లిపోలేను కదా .. !

 

నిరంతరం వచ్చే టూరిస్టులతో నిండి ఉండే హోటల్ వారికి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయనిపించింది.  ఎటునుండి ఎటు వెళ్ళాలి అని మ్యాప్  పరిశీలించా .
నేనున్న హోటల్ లోని టూరిస్టులతో పిచ్చాపాటి మాటలు కలిపాను . వాళ్ళలో బెంగాలీ టూరిస్టులతో పాటు  కొద్దిమంది  విదేశీయులు  ఉన్నారు.   మరుసటి రోజు ఉదయం బయలుదేరి  త్రికోణంలో ఉండే గురుదాంగ్ మార్  లేక్, లాచుంగ్  ఆ తర్వాత యుమ్మాంగ్ ల ప్రయాణం పెట్టుకున్నామనీ , వాళ్ళ వాహనంలో మరో ఇద్దరికి చోటుందని మాటల్లో  చెప్పారు వాళ్ళు.  ఆ హిమపర్వతాల యాత్ర మహాద్బుతంగా ఉంటుందని విని వున్నాను కదా .

daari 9

వెంటనే ట్రావెల్ డెస్క్ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు టూరిజం డిపార్టుమెంటుతో  కాంటాక్ట్  ఏర్పాటు చేశారు . అదే రోజు నా ఫోటోలు, వివరాలు తీసుకుని మరుసటి రోజు నా ప్రయాణానికి పర్మిట్ వచ్చేలా చేశారు. ఇది  ఏప్రిల్ మూడో వారం కదా .. టూరిస్టులు మరీ ఎక్కువగా లేరు. ఇకనుండీ రోజు రోజుకీ పెరుగుతారట.  అదే టూరిస్టులు ఎక్కువగా ఉండే సమయాల్లో  పర్మిట్ రావడంలో ఆలస్యం కావచ్చట.  నేను వెళ్ళింది పీక్ టైం కాదు కాబట్టి నాకు వెంటనే పర్మిట్ వచ్చేసింది.   నేనూ వాళ్లతో జత కలిశాను . నలుగురు బెంగాలీలు, ఒక విదేశీ నేనూ వెళ్ళాం. ఖర్చు తగ్గుతుంది కదాని అందరం కలసి ఒకే వాహనంలో వెళ్ళే ఏర్పాటు.  మొత్తం మూడురోజుల ప్రయాణం.

 

వింటున్నావా మనో .. ఆ ప్రయాణం ఆద్యంతం అత్యద్భుతం . ఉదయం 11 గంటల సమయంలో గ్యాంగ్ టక్  నుండి మా ప్రయాణం ఆరంభమైంది. ఎత్తైన మంచు కొండలు , లోతైన లోయలు , దట్టమైన అడవులు దాటుతూ  అద్భుత అందాలతో అలరారే గ్రామాలను పలకరిస్తూ   సాయంత్రం 6 గంటలకి లాచుంగ్ చేరాం.

 

లాచుంగ్ 10వేల అడుగుల ఎత్తులో ఉన్న చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళే దారిలో మంచు కరిగి ప్రవహిస్తూ  కొండలపై నుండి కిందకు సవ్వడి చేస్తూ జారిపోయే జలపాతాలు .. ఆ రోజు రాత్రి బస లాచుంగ్ లోనే. అక్కడి నుండి యుమ్తంగ్ లోయ చూసి పాములాగా మెలికలు మెలికలు తిరిగి షార్ప్ కర్వ్స్ తో ఉండే  రోడ్డులో  జీరో పాయింట్ కు చేరాం .. అదంతా మంచుతో నిండి ఉంది. మంచు కరుగుతూ  పాయలు పాయలుగా రాళ్ళను ఒరుసుకుంటూ పల్లంకేసి జారిపోతూ చేసే గలగలలు .. తీస్టా నదిలోకి పరుగులుపెడుతూ చేసే సవ్వడులు ..

 

ఆ నదితో పాటే ఉరకలు వేస్తూ కొండా కోనల్ని పలుకరిస్తూ అలా వెళ్లిపోవాలనిపించింది ఆ క్షణం.. తీస్టా నది బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించి  బ్రహ్మపుత్ర నదిలో ఐక్యం అవుతుందట. తిరుగు ప్రయాణం  మళ్లీ లాచుంగ్,  చుగ్తాంగ్ మీదుగానే లాచన్ చేరి అక్కడే బస చేశాం. మూడో రోజు  తెల్లవారు జామున 3గంటలకే  బయలుదేరి  8 గంటలకి  గురుడాంగ్ మార్  లేక్ కి చేరాం. మార్గ మధ్యలో తంగు వ్యాలీ లో ఆగి బ్రేక్ పాస్ట్ చేసాం.

 

లాచన్ నుండి దాదాపు ఐదు గంటల ప్రయాణం అత్యద్భుతంగా … ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో రెండోదట గురుడాంగ్ మార్ లేక్  చేరాం.  భూమికి 17100 అడుగుల ఎత్తులో ఉన్నాం.

 

ఏయ్ నీకు తెలుసా .. ?

ఎంత హిమపాతం ఉన్నప్పటికీ  వాతావరణం ఎంత మైనస్ డిగ్రీలలో ఉన్నప్పటికీ  గురుడాంగ్ మార్ లేక్ లోని  నీరు కొంత ప్రాంతంలో  గడ్డకట్టదట.  బుద్దిస్ట్ మాంక్ గురు పద్మసంభవ అక్కడి నీళ్ళు ముట్టుకొని తాగి దీవించడం వల్లే ఆ నీటికి పవిత్రత వచ్చిందనీ, అందుకే ఆ ప్రాంతంలోని నీరు గడ్డకట్టదని సిక్కిం ప్రజల నమ్మకం అని నాతో కలసి ప్రయాణం చేసిన బెంగాలీలు చెప్పారు.  చలికాలంలో అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. చూడలేరు కదా ..? వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే కదా .. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో నీరు గడ్డ కట్టిందో లేదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు ?

 

గురుడాంగ్ మార్ లేక్ నీరు  తిస్టా నదికి ప్రధాన సోర్స్ ల్లో ఒకటి అట. ఈ లేక్ కి చుట్టు పట్ల మరో రెండు లేక్స్ ఉన్నాయి. వాటికి మేం  వెళ్ళలేదు. ఇండో – టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ  మూడు సరస్సులను చూడాలంటే  ఆర్మీ పర్మిషన్ తప్పని సరి అవసరం. తీస్టా నదిలో దిగి ఆ స్వచ్ఛమైన నీటిలో కాసేపు ఆడుకున్నాం. ఆ నీటి అడుగున ఉన్న గులక రాళ్లు నునుపుదేలి ఎంత స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయో .. నువుంటే ఆ రాళ్ళన్నీ మూటగట్టుకు వచ్ఛేదానివి . నీ కాక్టస్ ల చుట్టూ అలంకరించడానికి .
అక్కడ ఉన్నంత సేపూ నేను నా దేశంలోనే ఉన్నానా అనే సందేహం.  కానీ ,   సిక్కిం ఉన్నది మనదేశంలోనే కదా ..  ఈశాన్య రాష్ట్రాలు దేశ సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి  సరిహద్దు ప్రాంతాల్లోకి ఎటు వైపు వెళ్ళాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరట .  సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో పొటోలు నిషేధం.  లేక్ దగ్గర పొటోలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.  ఫోటోలు .. వీడియోలు నీకోసం సిద్దం చేస్తున్నాలే ..

 

ఆ చెప్పటం మరిచాను మనో ..  ఆర్మీ కాంపస్ ఉన్న దగ్గర చాలా నిబంధనలు.  బార్దర్స్ కి వెళ్ళే కొద్దీ మిలటరీ వాళ్ళ భద్రత చాలా ఎక్కువ. జీబ్ డ్రైవర్ చెప్పినా వినకుండా నేనెళ్ళి ఫోటో తీయబోయాను ఎక్కడనుండి చూసాడో ఏమో జవాను ఆరిచేశాడు .

 

గురుడాంగ్మార్ లేక్ కు 5 కిలోమీటర్ల ఆవల చైనా సరిహద్దు తెలుసా .. ? ఇవన్నీ చూస్తుంటే .. నాలో ఓ కొత్త శక్తి ఊటలు పుట్టుకొచ్చి ప్రవహిస్తున్నట్లుగా .. పుస్తకాలు ఎన్ని చదివితే ఈ అనుభవం వస్తుంది ..? ఆ..,  చెప్పు ?  ఎన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటే ఈ అనుభూతి వస్తుంది ? నాతో వఛ్చిన వాళ్లంతా ఎంతో మర్యాదగా స్నేహంగా ఉన్నప్పటికీ  నా అనుభవాలు, అనుభూతులు పంచుకుందామని నీకు ఫోన్ చాలా సార్లు  ట్రై చేశా .. ప్చ్ ..  సిగ్నల్స్ లేవు . ఎయిర్ టెల్ వాళ్ళ యాడ్ మనని మోసం చేసింది కదూ .. బియస్ యన్  యల్ నెట్వర్క్  కాస్త ఫర్వాలేదు . బెంగాలీ మిత్రులు అదే వాడుతున్నారులే .

నేనేం చేయనూ … నన్ను తిట్టుకోకు మనో . నెట్వర్క్ ని తిట్టుకో .. సరేనా …మనో
అటుచూడు .. ఉదయం వెండిలా మధ్యాహ్నం బంగారంలా మెరిసి సాయంత్రం ఎర్రగా  మారిపోయిన ఈ పర్వతశిఖరాలు చీకటిలో కరిగిపోతున్నాయ్ .. ఎంత అద్భుతమయిన దృశ్యమో ..

 

ఈ రోజు వెళ్ళివచ్చిన  చంగూ లేక్  టూర్ కి కూడా అప్పుడే  ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నా కదా..  ఉదయమే లేచి  ప్రయాణం కోసం మాట్లాడుకున్న వాహనం కోసం ఉద్వేగంతో ఆత్రుతతో ఎదురుచూపులు .  నీకు నవ్వు వస్తుందేమో .. చెప్తే ..  తనూజ మొహంలో సన్నని నవ్వు మొలిచింది . ఈ పనుల్లో పడి నీకు గానీ అమ్మ నాన్నలకు గానీ రాగానే ఫోన్ చేయలేక పోయాను.  ఈ రోజు రూం కి వెళ్ళగానే అమ్మా నాన్నలకి నీకు ఫోన్ చెయ్యాలి అనుకుంటూ హ్యాండ్ బాగ్ లో ఉన్న మొబైల్ తీసి మళ్లీ చూసింది.  ఊహు..  నెట్వర్క్ లేదు.

 

అమ్మ నాన్న గుర్తు రాగానే  కొద్దిగా నెర్వస్ గా ఫీలయింది ఆమె. ప్రస్తుతం నేనెక్కడ ఉన్నానో అమ్మకో నాన్నకో తెలిస్తే …చెప్పేస్తే .. అమ్మో..  ఇంకేమన్నా ఉందా ..?!
వాళ్ళని అంత ఇబ్బంది పెట్టొద్దని, మనసులో చేరి రొదపెడ్తున్న తపనని, కోరికని కాదనలేని సంఘర్షణ .  నాలో నేను ఎంతో సంఘర్షణ పడ్డ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అని సర్ది చెప్పుకోనే  ప్రయత్నం చేసింది తనూజ.  కానీ, నన్నింత చేసిన తల్లిదండ్రులకు చెప్పకుండా రావడం తప్పు అనే ఫీలింగ్ ఆమెను వదలడం లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు గిల్టీగా అనిపిస్తూ .. వాళ్ళని ఒప్పించుకుని వస్తే ఈ గిల్టీనెస్ ఉండేది కాదేమో .. ఇంకా ఎక్కువ ఆనందించే దాన్నేమో ..అనుకుందామె.
హిమాలయ సోయగాల లోయలల్లోకి జారిపోతూన్న తనూజ మనస్సులోకి, కళ్ళ ముందుకి అన్న ట్రావెల్ చేస్తానన్నపుడు ఇంట్లో జరిగిన సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి.

***                          ***                            ***
అన్న ఒంటరిగా ట్రావెలింగ్ చేస్తానంటేనే అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఇంటా వంటా లేదు , ఏమిటీ తిరుగుళ్ళు  అని గోల చేసింది.   లేకపోవడమేంటి .. మా నాన్న ఆ రోజుల్లోనే కాశీ యాత్ర కాలినడకన చేసోచ్చాడని గొప్పగా చెప్పింది నాన్నమ్మ.  చివరికి ఎట్లాగో నాన్నమ్మ సహకారంతో అన్న  పెద్ద వాళ్ళని ఒప్పించుకోగలిగాడు.  అదే నేనయితేనా  చాన్సే లేదు. అస్సలు ఒప్పుకోరు. అందుకే గదా ఈ సాహసం చేసింది.

 

నా కోరిక చెప్తే నవ్వి తీసి పడేసేవారు . అది తనకి తెలియనిదా ..? అంతగా చూడాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలసి వెల్దువులే అంటారు. లేదా ఫామిలీ ట్రిప్ ప్లాన్ చేద్దాంలే అంటూ నన్ను బుజ్జగించ చూస్తారు . కాని ఒక్క దాన్ని పంపడానికి ససేమిరా అంటారు.  ఉద్యోగం కోసం బెంగుళూరు పంపడానికే అమ్మ చాలా ఆలోచించింది.  అతికష్టం మీద ఒప్పించుకోవాల్సి వచ్చింది. . ఏమన్నా అంటే ఆడపిల్లలకి భద్రత లేదు. పెళ్లిచేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది  అంటూ మొదలుపెడుతుంది. నాన్నదీ అదేమాట. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడాను. పెళ్లి అయితే భద్రత ఎలా వచ్చేస్తుందో .. ? వచ్చేవాడికి ఇవేమీ నచ్చకపొతే … ? నచ్చిన పని చేయలేకపోతే వచ్చే నిస్పృహ , నిరాశ లతో  నిస్తేజంగా ఉండే మెదడు ఆలోచించడం మానేసి రాజీ పడిపోతుందేమో..మిగతా అమ్మాయిల్లాగే తన జీవితమూ పరిమితం అవుతుందేమో .. ఎన్నెన్నో  సందేహాలూ ప్రశ్నలూ కలవరపరిచాయి.

 

ఉద్యోగం కోసం విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక చాలా చదువుతోంది, తెలుసుకుంటోంది. తనను తాను విశాలం చేసుకుంటోంది ..తనలోని చీకటిని, నిశబ్దాన్ని బద్దలు చేస్తూ కలలను చిగురింపచేసుకునే ప్రయత్నమేగా  ఈ ప్రయాణం. జీవితమంటే ఖరీదైన ప్రాంతాల్లో  తిరగడం, డబ్బుతో సంతోషం కొనుక్కోవడమా కానే కాదు.  నిజమైన  జీవితాన్ని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే , ఆనందించాలంటే మారుమూల గ్రామాలోకి  ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని ప్రదేశాలకు వెళ్ళాలి. వారి జీవితాన్ని పరిశీలించాలి  . వాళ్లతో కరచాలనం చేసి వాళ్ళలో ఒకరుగా కలసిపోవాలి . అప్పుడే కదా జీవితం తెలిసేది .   మొదటి ప్రయాణం టూరిస్టులా వెళ్లి రావాలి.  ఆ తర్వాతే ట్రావెలర్ అవతారం ఎత్త్తాలని ఎన్నెన్ని ఆలోచనలో ..    తన ఆలోచనల ఆచరణ  సాహసమో.. దుస్సాహసమో.. కాలమే చెప్పాలి.
తన ఆలోచనలు చిన్ననాటి  మిత్రురాలు , కొలీగ్ అయిన మనోరమతో చెప్పినప్పుడు చెడామడా తిట్టింది. ఇవ్వాళా రేపు బస్టాపులోనే ఒంటరిగా నిల్చోలేని పరిస్థితి . ఇంట్లో ఉన్న ఆడదానికే భద్రత కరువైన పరిస్థితుల్లో సోలో ట్రవేలింగా .. వెధవ్వేషాలు మాని బుద్దిగా పెద్దలు చెప్పినట్టు నడుచుకోమని లేదంటే ఇప్పుడే  అమ్మతో చెప్తానని బెదిరించింది. చుట్టూ ఉన్న అద్భుతాలని అనుభవించాలన్న ఒకే ఒక కోరికతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారతీయ మహిళ మెహర్ మూస్ గురించి చెప్పాను.

 

అప్పుడు చెప్పింది మనసులో మాట.

తనకీ ఇలాంటి ప్రయాణాలంటే ఇష్టమే అయితే అవి ఊహల్లోనే  కానీ ఆచరణ సాధ్యంకాదని కొట్టిపారేసింది.  అందుకే ఆచరణ సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడం అనవసరమని తేల్చేసింది మనోరమ .

 

తనకేమో అన్న సోలో ట్రావెలింగ్ స్పూర్తి. అన్న వెళ్ళినప్పుడు తను ఎందుకు వెళ్ళకూడదు అన్న పంతం. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనన్న ధీమా .

 

ఆడపిల్లలు ఎవరైనా ఇలా వెళ్ళారా అని ఇంటర్నెట్ లో వెతికా . మెహర్ మూస్ , అంశుగుప్త, షిఫాలి , అనూషా తివారి వంటి మహిళా బ్యాక్ పాకర్స్  చెప్పిన విశేషాలు విపరీతంగా ఆకర్షించాయి.  మరి నేను అలా ఎందుకు వెళ్ళలేను అనే ప్రశ్న .. నాలో నన్నే తినేస్తూ .. నా జీవితానికి నేనే కర్తని , కర్మని, క్రియని  అని నా ఆలోచనలు స్థిరపరచుకున్న తర్వాతే మనోతో విషయం చెప్పింది. చర్చించింది.   ప్రతి రోజూ నా  కదలికలు ఎటునుండి ఎటో చెప్పాలన్న ఒప్పందం మీద  మనో ఒప్పుకుంది. అలా చెప్పడం నాకు చిరాకనిపించినా సరే అనక తప్పలేదు.    బయలుదేరేటప్పుడు , తనుండే  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అమ్మాయిలు ఇదేం పాడు బుద్ది అని గుచ్చుకునే చూపులు  పిచ్చిదాన్ని చేసి వెటకారపు వ్యాఖ్యానాలు    దీనికి స్క్రూ లూజు అని నవ్వుకోవడం  అన్నీ గుర్తొచ్చాయి
***                       ***                     ***
ఆలోచనల్లో ఉండగానే హోటల్  వచ్చేసింది. ఫ్రెష్ అయి వచ్చి టీ తాగుతూ బయటికి చూస్తే చిక్కటి చీకటి మూసిన కిటికీ .. ఈ నాలుగు రోజులుగా  జరిగిందంతా తలచుకుంటే మళ్ళీ ఆశ్చర్యం ఆమెలో. ఇది కలా .. నిజంగానే ఇదంతా జరిగిందా .. చెయ్యి గిల్లుకుంటూ నవ్వుకుంది .

 

అమ్మకి ఫోన్ చేసి పలుకరించాలి.  నాలుగు రోజులైంది వాళ్ళతో మాట్లాడి మొబైల్ అందుకుని రింగ్ చేసింది. లైన్ కలిసింది.  కుశల  ప్రశ్నల వర్షం కురిపించింది.  కూతురి  గొంతులో నిండిన ఉత్సాహం అమ్మకి ఆమెను చూసినంత ఆనందం తృప్తి  కలిగినట్లనిపించింది.  కూతురికి అమ్మని నాన్నని  చూసినంత సంతోషం.  ఒకసారి స్కై ప్  లోకి వస్తావా అమ్మ ప్రశ్న.
అమ్మని స్కై ప్ లో చూడాలని మనసు తొందర పెట్టింది. కాని వెంటనే తనను తను సర్ది చెప్పుకుంటూ ఇప్పుడా .. రేపెప్పుడయినా వస్తాలే అమ్మా .. ఇంటర్నెట్ సరిగ్గా లేదు అని చెప్పి అప్పటికి తప్పించుకుంది.   వాళ్ళని మోసం చేస్తున్నానా ..  కళ్ళు మూసుకుని ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న  తనూజ ఫోన్ మోగడంతో ఉలిక్కి పడి లేచి ఫోన్ అందుకుంది. అవతలి వైపు మనోరమ .

Kadha-Saranga-2-300x268
‘అసలు నీకు బుద్దుందా … ప్రతిరోజూ కాల్ చేయమని ఎన్ని సార్లు చెప్పాను. ‘ గద్దించింది.
‘ నేనేం మాట్లాడను .. పో ..’  ,
‘తనూ .. ఆ మాట అనకే తల్లీ.. అసలు విషయం చెప్పు ఎలా ఉన్నావ్? నీ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నానో తెల్సా .. అవుటాఫ్ రీచ్ అని వస్తోంది. అసలు ఏ పని చేయలేకపోయాను. ఏదన్నా జరగరానిది జరిగితే .. అమ్మావాళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను మనసంతా గుబులు గుబులుగా .. భయం భయంగా … నీ గొంతు విన్నాక ప్రాణం లేచొచ్చింది’.
‘ చుట్టూ అడ్డుగోడలు కట్టేసుకుని అది దాటితే ఏమవుతుందోనన్న భయంతో రోజూ చచ్చే వాళ్లతో నేను వేగలే .. ‘
తనూజని పూర్తి కానివ్వకుండానే, ‘ అంత వద్దులేవే  .. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేసెయ్యి ..సరేనా,  నన్ను డిస్ట్రబ్ చేస్తున్నానని ఏమాత్రం అనుకోకు.  ఇంతకీ అసలు నీ ట్రిప్లో ఎలా ఉన్నావో చెప్పనే లేదు ‘
‘ తేలిపోతున్నట్లుందే .. మేఘాల్లో తేలిపోతున్నట్లుందే .. ‘రాగయుక్తంగా తనూజ గొంతు
‘ జోరుమీదున్నావు  తుమ్మెదా.. ఆ జోరెవరికోసమే తుమ్మెదా .. ‘ చిరునవ్వుతో మనో అందుకుంది.
‘ఎవరికోసమో ఏంటి ? నాకోసం. అచ్చంగా నా కోసమే .  అంబరాన్ని అందే సంబరంలో ఉన్నా,  ఈ మజా ఏంటో అనుభవిస్తే గానీ అర్ధం కాదులే .. ఎంత కాన్పిడెన్స్ బిల్డప్ అవుతుందో ..

నా వెనుకో ముందో ఎవరో ఒకరు ఉండి నన్ను పోలీసింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లేదు.  రొటీన్ వర్క్ నుండి ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని నిశ్చయించేసుకున్నా ..

కొత్త ప్రాంతాలు , కొత్త మనుషులు, కొత్త విషయాలు నా ఆలోచనల్లో .. నన్ను నా విధానాల్ని మార్చేస్తూ .. ప్రకృతిలో ఒదిగిపోయి పోయి చేసే ప్రయాణాలు .. జీవితం పట్ల కొత్త ఉత్సహాన్నిస్తున్నాయి తెలుసా … ‘
అవతలి వైపు నుండి ఏ చప్పుడూ రాకపోవడంతో ‘ వింటున్నావా .. ‘

‘ ఆ .. వింటున్నా నే .. నీ ఉద్వేగాన్ని .. ‘ మనోరమ  పూర్తి చేయకుండానే అందుకుని

‘ఇక్కడేమో సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఒక్కోసారి బాగానే  లైన్ కలుస్తుంది. ఒక్కోసారి కలవదు ‘

ఆ తర్వాత కొద్ది మౌనం
‘ ఊ.. ఇప్పుడు చెప్పు . బయటికొచ్చి నడుస్తూ మాట్లాడుతున్నా .. బయటేమో చలి గిలిగింతలు పెడ్తూ .. ‘
‘దూది పింజల్లా ఎగిరిపోయే మేఘంలా కేరింతలు కొట్టే నీ స్వరం చెప్తోంది నీవెలా ఉన్నావో ..నీవింత ప్రత్యేకంగా..భిన్నంగా ఎలా ఆలోచిస్తావ్ ? నికార్సైన నిన్ను చూస్తే చాలా గొప్పగా ఉంది ‘
‘ఆ చాలు చాలు మునగ చెట్టెక్కియ్యకు..డ్హాం డాం అని పడిపోతా ..

అది సరేగానీ, వింటున్నావా మనో ..

ఈ రోజు సిల్క్ రూట్ లో ప్రయాణించా తెలుసా ..?’
‘వాట్..  సిల్క్ రూట్.. ? అంటే, పరవస్తు లోకేశ్వర్ గారి “సిల్క్ రూట్‌లో సాహస యాత్ర“ గుర్తొస్తోంది. నువ్వూ  ఆ రూట్లో ప్రయణించావా .. రియల్లీ ?’ సంబ్రమాశ్చర్యంతో  అడిగింది మనోరమ
‘అవునే, చంగూలేక్ నుండి నాథులా పాస్ కి బయలు దేరాను. 17 కి . మీ. దూరమే కానీ ప్రయాణం చాలా సమయం తీసుకుంది. ఘాట్ రోడ్లో ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను చుట్టేస్తూ అగాధాల లోతులను అంచనా వేస్తూ మేఘాలను చీల్చుకుంటూ సాగే ప్రయాణం అత్యద్భుతం అంటే అది చిన్న మాటేనేమో.. శ్వాసించడం మరచి చూస్తుండి పోయా ..
‘ నాదులాపాస్ అంటే ఇండియా చైనా బార్డర్ క్రాసింగ్ ప్రాంతం అనుకుంట కదా ‘
‘ఓ నీకూ కాస్త ప్రపంచ జ్ఞానం ఉందే .. ‘ నవ్వుతూ  తనూజ
‘ఆ.. నా బొంద , ఏదో నీ ప్రయాణం పుణ్యమాని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నాలే .. కానీ , అసలు విషయాలు చెప్పు ‘
‘అవును దేశ సరిహద్దు ప్రాంతమే ఇది,  ప్రయాణ సాధనాలేమీ లేని రోజుల్లో ఈ రూట్లోనే వర్తక వ్యాపారాలు జరిగేవట.’
‘ రియల్లీ .. గ్రేట్.. చెప్పు చెప్పు నీ సాహస యాత్ర గురించి చాలా చాలా వినాలని ఉంది ‘ ఉత్సుకతతో మనోరమ
‘ చెప్తూంటే ఏమిటే నీ తొందర .. ఈ రూట్ 1962 యుద్ధం తర్వాత మూసేసారట. మళ్లీ 2006లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత తెరిచారట. ఏడాదిలో ఆరునెల్లకు పైగా మంచుతో గడ్దకట్టుకుపోయే  ఈ రూట్లో ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలిసి ఆశ్చర్యపోయాను.

 

ఇప్పుడయితే  విదేశీయులకి  నాధులాపాస్ లో ప్రవేశం ఉండదట.  అక్కడ సిక్కిం , టిబెట్ ప్రజలు తమ ఉత్పత్తులు తెచ్చి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు.   వాళ్ళు వ్యాపారం సాగించే ప్రదేశంలో మన మార్కెట్ యార్డ్ లో ఉన్నట్లుగా షెల్టర్స్ ఉన్నాయి. అవి ఈ మధ్యనే కట్టారట.  సోమ , మంగళ వారాల్లో వారి వ్యాపారాలకు సెలవు. అందుకే నాదులాపాస్ మూసేసి ఉంది. నేను వెళ్ళింది మంగళవారం కదా. నాకు ముందుగా  ఆ విషయం తెలియదు .  అందుకే  అక్కడ నుండి బార్డర్ క్రాస్ చేయలేకపోయా.    చైనా టిబెట్ ని ఆక్రమించాక చాలామంది టిబెటియన్లు , ఇండియా, నేపాల్ దేశాలకు వచ్చేశారని చాలా విషయాలు  గోవింద్ చెప్పాడులే .’
‘రేపు ఎక్కడికెళ్తున్నావ్ ..? ‘

‘రావంగలా  ప్రపంచంలో అక్కడ మాత్రమే కనిపించే పక్షుల్ని చూడాలి. అక్కడి నుండి పెల్లింగ్ వెళ్ళాలి . అక్కడ ట్రెకింగ్ చేయాలనుకుంటున్నా ‘
‘  కీర్తి శిఖరాల కోసం కాదు, ఆడపిల్లల విశ్వాసానికి రెక్కలు తొడిగి వెలుగును వెతుక్కుంటూ వేసే అడుగులో అడుగు వేయలేకపోయినా నిన్ను చూస్తే గర్వంగానూ .. ‘ మనోరమ మాటలకడ్డు వచ్చి

‘ భయంగాను ఉంది.అదేగా నువ్వు చెప్పాలనుకున్నది.  ఇదిగో ఇలా అమ్మమ్మ అవతారం ఎత్తావంటే ఫోన్ పెట్టేస్తా .. ‘ నవ్వుతూ బెదిరించిన తనూజ.

 

మళ్ళీ  తానే ‘  స్వచ్చమైన నీలాకాశంలో పొదిగిన పచ్చదనపు కౌగిలిలో పరవశిస్తూ మంచు బిందువులను ముద్దాడుతూ సాగిన ప్రయాణం,   తారకలతో స్నేహం .. ఎంత అద్భుతంగా ఉంటుందో  నీకెలా చెప్పగలను ..? ‘ నిశబ్దంగా మెరిసే తారకల్ని కొత్త ఆకాశం కింద నిలబడి చూస్తూ తనూజ
‘కవిత్వం వచ్చేస్స్తున్నట్లుందే .. మనసు పలికే భావాల్ని అక్షరాల్లో పరిచేస్తే బాగుంటుందేమో ..తనూ ‘ ఆమె ఎగ్జయిట్ మెంట్ ని గమనించి అంది మనోరమ

‘అహహా హ్హా .. జోక్ చేస్తున్నావా .. నీ మొహం..  నాకు కవిత్వం రావడం ఏమిటి ? ‘
కొద్దిగా ఆగి ‘ మనసులోని భావాల్నివెంటనే  పంచుకొనే నేస్తం లేదనే దిగులు.

ఆహ్హః లేకపోవడమేంటి.. నీతో నేనున్నాగా  నీ మనోకి  పోటీగా  అంటోంది నా లాప్ టాప్.’
‘ఏమిటీ ఆ బుల్లి పెట్టె నేను ఒకటేనా .. ?’ వేగంగా తోసుకొచ్చ్చిన మనోరమ ప్రశ్న
‘కాకపోతే మరి’ అంటూ కాసేపు మనోరమని  ఉడికించింది తనూజ
ఆ తర్వాత ‘ఏ రోజుకు ఆ రోజు నా అనుభవాల్ని పంచుకునేది ఈ ఎలక్ట్రానిక్ డైరీ తోనే కదా .. ఒకరోజు చెప్పకపోతే మరుసటి రోజు వచ్చే అనుభవాలు ముందటి రోజు అనుభూతుల్ని , ఉద్వేగాల్ని ఎక్కడ కప్పి వేస్తాయో .. ఏ మూలకు తోసేస్తాయో అన్న సంశయంతో హృదయ భాషని అక్షరాలుగా నిక్షిప్తం చేసేస్తున్నాను. ఏదేమైనా నా పర్యటన ఆద్యంతం అద్బుతంగా ..ఆహ్లాదకరంగా .. సాగుతోంది. ‘

‘ఆ.. అన్నట్టు నేనిచ్చిన  పెప్పర్ స్ప్రే , స్విస్ నైఫ్ , విజిల్ నీ బాగ్లోనే ఉన్నాయిగా ‘ ఏదో గుర్తొచ్చిన దానిలా సడెన్గా అడిగింది

‘ఊ .. ఉండక అవెక్కడికి పోతాయి ?  భద్రంగా ఉన్నాయిలే …’

‘నీకో విషయం తెల్సా .. గురుడాంగ్ మార్ లేక్ వెళ్ళిన మూడు రోజుల యాత్రలో నా సహా పర్యాటకుల్లో కొత్తగా పెళ్ళయిన ఓ జంట తప్ప అంతా పురుషులే .  అంతా చాలా మర్యాదగా వ్యవహరించారు.  సిక్కిం లో పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు కాల్చడం గానీ , పాన్ మసాలాలు తినడం గానీ నేను చూడలేదు. కొద్దిగా ఆశ్చర్యం అనిపించి స్థానికుల్ని అడిగాను .  బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారట. అదే విధంగా గుట్కాలు , పాన్ మసాలాలు అమ్మనే అమ్మరు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం’

‘రియల్లీ ..గ్రేట్ కదా .. మరి మన దగ్గర అలా ఎప్పుడు చూస్తామో ..?,,
‘నిజమేనే ..పరిసరాలే కాదు మనుషులూ స్వచ్చంగానే అగుపిస్తున్నారు’ అంటూ తలకు చుట్టిన స్కార్ఫ్ వదులు చేసుకుంటూ రూం లోకి అడుగుపెట్టింది తనూజ .
‘నీ  గొంతులోని ఉత్సాహం , ఉద్విగ్నత అనిర్వచనీయమైన నీ ఆనందాన్ని తెల్పుతోంది. మన ఇళ్ళలో స్త్రీల తెలివి, ధైర్యం , ఆత్మవిశ్వాసం మండే పోయ్యిలో వండే వంటకే అంకితమయిపోతున్నాయి ..’ మనోరమ మాటలకి అంతరాయం కలిగిస్తూ లైన్ కట్ అయింది.

 

మళ్ళీ మళ్ళీ  ప్రయత్నించింది తనూజ . నెట్వర్క్ సిగ్నల్ దొరకడం లేదు.  బయటికి వెళ్ళాలంటే చల్లటి గాలి విసిరికొడ్తాంది అనుకుంటూ బెడ్ మీద వాలింది తనూజ.
మనోరమ చివరి మాటలే ఆమె మదిలో మెదులుతున్నాయి.

 

నిజమే .. మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వుకే అతుక్కున్న పరాగధూళిలా ఇంటికే కాదు.   నాలుగ్గోడలనుండి విశాల ప్రపంచంలోకి  సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపంచంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి.  కానీ నాలా చాటుగా కాదు.   సగర్వంగా తలెత్తుకుని..  రేపటి మహిళ గురించిన ఆలోచనల్లో  తనూజ .

కలాలన్నీ కలిసి నడిస్తే…

 

 

-వి . శాంతి ప్రబోధ

అక్టోబర్ 25 వతేదీ
మధ్యాహ్న సమయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణా ప్రజా సంస్కృతిక కేంద్రం హాలు.
రచయితలూ , కవులూ , సాహిత్యకారులూ, సాహితీ సంఘాల ప్రతినిధులు, పత్రికా సంపాదకులూ ఒకొక్కరూ అక్కడ చేరారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అయ్యారు.   విభిన్న నేపథ్యాలు, వివిధ అస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన  సాహితీ సాంస్కృతిక సృజనశీలురు  ఒకే  చోట చేరిన అపూర్వ సన్నివేశం అది. ఈ సందర్భంలో అంతా కలసి కలబోసుకున్న ఆలోచనల విషయం ఒకటే.
ప్రస్తుత సమాజంలో పెచ్చరిల్లి పోతున్న మతతత్వవాదం, అందులోంచి మొలకెత్తి నాటుకుపోతున్న విషబీజాలు,  నియంతృత్వ ధోరణులు, హింస మర్రి ఊడల్లా విస్తరిస్తూ  సామాన్య ప్రజలనుండి రచయితలు , కళాకారులు , మేధావులు అందరినీ తన కబంధహస్తాల్లో బందీ చేయాలని చూడడం, లేదంటే నామరూపాలు లేకుండా చేయడం జరుగుతోంది. పరమత సహనం నశించి మతమౌడ్యం వెర్రితలలు వేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిసి లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న పరిస్థితులు కలిగిస్తున్న  ఆందోళన అందరినీ ఒక దగ్గర చేర్చాయి. అందుకు  “వర్తమాన సామాజిక సంఘర్షణలు- రచయితల బాధ్యత” అన్న అంశంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన చర్చాగోష్టి దోహదం చేసింది.వివిధ సంఘాలుగా, సమూహాలుగా వ్యక్తులుగా విడివడి ఉన్న సృజన కారులు, సాహితీవేత్తలు ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనబయ్యో దశకంలో కొంత జరిగింది.
మారిన ఆనాటి పరిస్తితులతో సద్దుమణిగింది .  తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో. విభిన్న నేపథ్యాలతో,  అస్తిత్వాలలోని సృజన శీలురు, కలం యోధులు ఒక్కటవ్వాల్సిన  అవసరం ఇప్పుడు ఏర్పడింది.  అందుక్కారణం ఇప్పటివరకూ  ప్రజాస్వామిక, లౌకికవాదుల మౌనమే. అలసత్వమే అని చెప్పక తప్పదు.  మన శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్నా చూసి చూడనట్లు ఉండడం వల్లే  నేడీ దుస్థితి.  శత్రువు అది అవకాశంగా తీసుకుని పెచ్చరిల్లిపోవడం, ఆధిపత్య ప్రదర్శనలు చేయడం, అహంకారంతో  తన భావజాలాన్నిప్రజలపై  బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నాడు.

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమాజం అంచులలో ఉన్నవర్గాలపైన, మహిళలపైన  దాడులు జరిగేవి. ఇప్పుడు వారితోపాటు మైనారిటిలపైనా దాడులు పెరిగిపోయాయి.  వారి ఆహారం, అబిరుచులపై నియంత్రణ మొదలైంది. వ్యక్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అది అక్షీకరించే  కలంయోధులపై దాడులు ఒక పథకం ప్రకారం జరిగిపోతున్నాయి. పెరుమాళ్ మురుగన్ పై దాడి,  కల్బుర్గి హత్య, దాద్రి సంఘటన వంటివి ముందు ముందు జరగబోయే అనర్ధాలకి  మచ్చు తునకలు మాత్రమే.   మనం మౌనం వీడక పొతే , నిరసన తెలపక పొతే, శత్రువు పై యుద్ధం ప్రకటించక పొతే  పరిస్తితి మరింత విషమిస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందూత్వ ఛాందస వాదానికి, సంకుచిత్వానికి, అసహనానికి, ఉన్మాదానికి ప్రజాస్వామ్యం బలి అవుతుంటే చూడలేని ప్రజాస్వామిక వాదులు ప్రగతి కాముకులు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను నిరసనగా తిరిగి ఇవ్వడం మొదలైంది.  అది ఒక నిరసన రూపం మాత్రమే.

అంతకు మించి మరెన్నోవీలయినన్ని  మార్గాలలో మన నిరసనని తెలపాల్సిన అవసరం ఉందని సాహితీప్రపంచం అభిప్రాయపడింది.అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందో, రచయితలు అవార్డులు ఎందుకు తిరిగి ఇస్తున్నారో నేటి యువతకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నారనీ,  వాస్తవ పరిస్థితిని వివరిస్తూ భవిష్యత్తులో జరగబోయే విపత్తు గురించి, ప్రజాస్వామిక విలువల వినాశనం గురించీ, విధ్వంసం గురించీ తెల్పుతూ యువతరంలోకి నవతరంలోకి వెళ్ళాలి.  లౌకిక భావజాల వ్యాప్తి విస్తృతంగా  జరగాలి. ఆదిశగా ప్రచారం జరగాలి.  విస్తృతంగా రచనలు రావాలి.  ఎవరికి వారుగా ఉన్న వ్యక్తులపై, సంస్థలపై శత్రువు దాడి చేయడం సులువు.   కాబట్టి సంఘటితంగా ఎదుర్కోవాలని, విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం అవసరం అని ఈ చర్చావేదికలో పిలుపునిచ్చారు వక్తలు. ఒక వైపు విధ్వంసం పెద్ద  ఎత్తున జరిగిపోతోంది. దాన్ని నిలువరిస్తూ నమ్ముకున్న విలువల్ని కాపాడుకోవడానికి మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతున్నాయనీ వాటిని ఎదుర్కొంటూ నూతన సంస్కృతీ నిర్మాణం జరగాలనీ, వాదాలను , విభేదాలను పక్కన  పెట్టి ఒక్క తాటిపై ముందుకు సాగాలనీ అభిలషించారు వక్తలు.

సమాజంలో పెరిగిపోతున్న అసహనం , మత  దురహంకారం, నియంతృత్వం  అసలు సమస్యని తప్పుదారి పట్టించడం జరుగుతోంది. దేశాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది.   ప్రగతిశీల శక్తుల పై ప్రభుత్వ అనుకూల  బృందాలు దాడులు చేయడం , .ఏకీభవించని వాడి  పీక నొక్కేయడం వ్యక్తి స్వేచ్చని హరించడం సాధారణం అయింది . మతం వ్యక్తిగతం అన్న స్థితి మారింది. దాన్ని  ప్రభుత్వం స్వీకరించింది, పండుగలు పబ్బాలు నిర్వహిస్తోంది.  అందుకు ప్రజా ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది. మత దాష్టీకం కనుసన్నల్లోకి వెళ్ళిన రాజ్యం  వ్యక్తిగత ఇష్టాయిస్టాల్లోకి చొచ్చుకొచ్చి లౌకిక శక్తులపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులను చేస్తోంది, మానవహక్కులను హరించివేస్తోందని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేసే ఇలాంటి ధోరణుల్ని రచయితలూ, కవులూ , సాహితీవేత్తలు , సృజనకారులు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంలో జరిగిన  చర్చలో కార్యాచరణకు వచ్చిన నిరసన రూపాలు ఇవి:

* భిన్న నేపథ్యాల్లోని అన్ని అస్తిత్వ ఉద్యమాలు కలసి కట్టుగా  శత్రువుని ఎదుర్కోవడం

*  మౌనం వీడి కలాలకు , గళాలకు పదును పెట్టడం.
* హిందూ పాసిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా రచనలు చేయడం.
* లౌకిక వాద భావ ప్రచారం చేయడం
* కళాశాల స్థాయిలో లౌకిక వాద భావ ప్రసారం, ప్రచారం జరిగే .కార్యక్రమాలు చేపట్టడం

*  రచయితల మార్చ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరపడం

*నిరసన ప్రదర్శనలు , రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చా గోష్టులు , సభలు జరపడం
* జాతీయ స్థాయిలో రచయితలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది
*  నిరసన తెలపడానికి వివిధ రకాల టూల్స్  ఎంపిక చేసుకోవడం
* నిరసన కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేయడం
* సోషల్ మీడియాని లౌకిక వాద భావప్రసారానికి సాధనంగా వాడుకోవడం
* చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం

* కరపత్రాలు పంచడం

* వివిధ జానపద  కళారూపాల ద్వారా లౌకిక భావ వ్యాప్తితో పాటు వాస్తవ పరిస్తితుల పట్ల అవగాహన కలిగించడం
* సామూహిక స్వరం వినిపించడం
* రచయితల డిక్లరేషన్ ప్రకటించడం
* జిల్లాలలో , పట్టణాలలో నిరసన కార్యక్రమాలు జరపడం
* భావప్రకటన స్వేచ్చ కాపాడుకోవడం
* మత కలహాలు జరిగే ప్రాంతాల్లో , గ్రామాల్లో లౌకిక వాద ప్రచారం జరపడం
* ట్రేడ్ యూనియన్ ల్లోకి , విద్యార్థులలోకి , ప్రజల్లోకి వెళ్ళడం
* జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం
* ప్రజల ఆహారపు అలవాట్లని శాసించదాన్ని ధిక్కరించడం
* వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం
* ఖండనలు , ప్రకటనలకి మాత్రమె పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రణాళిక ఏర్పాటుచేసుకోవడం
* సంతకాల సేకరణ రూపంలో నిరసన తెలపడం
* రచయితల భద్రత కోరుతూ ముందే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం

రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం కోసం         ” లౌకిక, ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతిక వేదిక” ఏర్పాటైంది.  ఈ వేదిక తరపున కొండవీటి సత్యవతి, యాకూబ్ , బమ్మిడి జగదీశ్వ రావు, పసునూరి రవీందర్ కన్వీనర్లు గా ఒక కమిటీ ఏర్పాటయింది.  ఆ కమిటీ లో  వీరితో పాటు ఉష. s. డానీ, స్కై బాబా , అరుణోదయ విమల , G. S. రామ్మోహన్ , కాత్యాయనీ విద్మహే , శివారెడ్డి , తెలకపల్లి రవి , రెహనా, రివేరా  సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేసి అమలు చేస్తుంది.

దాదాపు 200 వందల మంది పైగా  కలం యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ప్రో . హారగోపాల్ , వరవరరావు , తెలకపల్లి రవి , అల్లం నారాయణ , కె. శ్రీనివాస్ , నందిని సిధారెడ్డి , రమా మెల్కోటే,  వీణ శత్రుఘ్న, విమల, అనిల్ అట్లూరి , నాళేశ్వరం శంకరం ,  N. వేణుగోపాల్ , కుప్పిలి పద్మ ,  వాసిరెడ్డి నవీన్ , కాకరాల , వేంపల్లి షరీఫ్ , కత్తి మహేష్ , దేవి , జ్వలిత , తిరునగరు దేవకీదేవి, రమాసుందరి, అరణ్య కృష్ణ, సుమిత్ర , ఇంద్రవెల్లి రమేష్ , శిలాలోలిత, తారకేశ్వర్ , రామారావు  , కృష్ణుడు , వినోదిని , యలవర్తి  రాజేంద్రప్రసాద్ , అలీ సిద్దికి , వర్మ , వనజ .C,  గోపరాజు సుధ, రజని , ధనలక్ష్మి ,రాజ్యలక్ష్మి , కందుకూరి రాము , ప్రరవే సభ్యులు కాత్యాయనీ విద్మహే , మల్లీశ్వరి , శాంతిప్రబోధ , భండారు విజయ , మెర్సీ మార్గరెట్ , పి. రాజ్యలక్ష్మి, కొండేపూడి నిర్మల ,తాయమ్మ కరుణ , కవిని ఆలూరి , కొమర్రాజు రామలక్ష్మి , బండారి సుజాత , సమతా రోష్ని , శివలక్ష్మి, , హేమలలిత, లక్ష్మి సుహాసిని  తదితరులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సహకారంతో జరిగింది

వి. శాంతి ప్రబోధ , భండారు విజయ

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక , తెలంగాణ

నాస్తికోద్యమ మేరుపర్వతం లవణం…

రాలిపోయింది.
నాస్తికోద్యమ మేరుపర్వతం నేలకొదిగి పోయింది.
ప్రజాస్వామిక విప్లవకారుడి ప్రస్థానం ఆగిపోయింది .
స్వాతంత్ర సమరయోధుడే కాదు సాంఘిక సమర సైనికుని  జీవితం ముగిసింది. కానరాని సుదూరతీరాలకు పయనమై వెళ్లిపోయింది.
నిత్యం నూతన సాధనాల అన్వేషణ చేసే ఆ శ్వాస నిలిచిపోయింది.
నవయువకుడిలా ఆలోచించే ఆయన జీవితం ముగిసిపోయింది.
మేమంతా నాన్నగారు అని గర్వంగా చెప్పుకునే, అభిమానంతో పిలుచుకునే  గోపరాజు లవణం ఇకలేరు.  మరణం అనివార్యం అని తెలుసు. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.  కానీ తప్పదుగా…భారత్‌ కే కాదు  ప్రపంచ దేశాలకు మహత్మాగాంధీజీ మార్గాలు, నియమాలు సూక్తులు సర్వదా అనుసరణీయమని నమ్మిన గాంధేయవాది,  మానవతావాది లవణం గారితో నాకున్న పరిచయం, అనుబంధం తక్కువేమీ కాదు. ఆయన్ని మేమంతా (సంస్కార్ కార్యకర్తలు )అంకుల్ అనీ,  నాన్నగారూ అని పిలుచుకుంటాం.

లవణం గారితో నా పరిచయం ఈనాటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం 1985లో మొట్టమొదటి సారి ఆయన్ని కలిశాను. అయితే , అంతకు ముందే మా నాన్న నోట ఆయన గురించి విని ఉండడం వల్లేమో మొదట చూసినప్పుడు ఒకింత ఎగ్జైట్ అయ్యాను.   తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వరవిశ్వద్యాలయం వారు అంతర్జాతీయ జాతీయ సేవాపథక కార్యక్రమం  శ్రీకాళహస్తి లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేనూ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుండి కార్యకర్తగా పాల్గొన్నాను. అది పది రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ , అంతర్జాతీయ వాలంటీర్ లనుద్దేశించి ప్రసంగించడానికి ఓ రోజు  స్పీకర్ గా వచ్చారు లవణం దంపతులు.

అంతకు కొద్దిగా  ముందే యూరోప్ లో పర్యటించి వచ్చిన లవణం యువతని ఉత్తేజితం చేసే  ప్రసంగం చేశారు. అదే రోజు సాయంత్రం నుండి పొద్దుపోయే వరకూ మా మిత్ర బృందం లవణం గారితో నాస్తికత్వంపై వాదప్రతివాదనలు. తన వదనా పటిమ, వాక్చాతుర్యంతో ఎదుటివారిని తన వాదనని ఒప్పుకునేలా చేసే అద్భుతమైన తీరు, ఏ విషయమైనా అనర్ఘళంగా మాట్లాడగల శక్తిని, వ్యక్తిని చూడడం అదే మొదటిసారి. నాస్తికత్వం గురించి చేసిన వాదనలు ఎంతోకాలం వెంటాడుతూనే ఉండేవి. ఆ తర్వాత పదేళ్ళ కాలం గడచిపోయింది. విచిత్రం ఏంటంటే నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లా వర్నికి వెళ్ళాను.  అప్పటికే అక్కడ నాస్తిక మిత్రమండలి కార్యక్రమాలు , జోగినీ దురాచార నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు లవణం దంపతులు. అదిగో అప్పుడు మళ్లీ కలిశాను. అప్పటి నుండీ కలుస్తూనే ఉన్నాను . కారణం వారి సంస్థ సంస్కార్ కార్యకలాపాల్లో నేనూ భాగస్వామిని కావడమే. లవణం గారెప్పుడూ తమ దగ్గర పనిచేసే కార్యకర్తగా  చూడలేదు. ఓ కూతురుగానే చూసేవారు.  నేను సంస్కార్ లో చేరడానికి కొద్దిగా ముందు నా కన్న తండ్రి వల్లూరిపల్లి రంగారావు గారు పోవడం వల్లేమో లవణం గారితో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తోచ్చేవారు.  బహుశా ఆ లోటు భర్తీ లవణంగారితో చేసుకున్నానేమో !

lavanam2005 అక్టోబర్ వరకూ ఆయన సంస్కార్ చైర్మన్ గానూ, నాస్తికోద్యమ నాయకుడిగానూ,  నాన్నగారిగానూ  మాత్రమే చూశాను. ఆతర్వాత CIDA/KRIS ఆహ్వానం మేరకు ఆయన నేతృత్వంలో  స్వీడెన్ , ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బృందంలో నేనూ ఉండడంతో  ఆయన్ని లోతుగా చూసే, పరిశీలించే అవకాశాన్నిచ్చింది.  సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం ఏమిటో కొద్దిగా నైనా అర్ధం చేసుకునే అరుదైన సమయం దొరికింది.

లవణం గారు  ఓ మానవతావాదిగా, నాస్తికుడిగా , దేశ గౌరవం ఏమాత్రం తగ్గకుండా చేసే ఉపన్యాసాలు , అక్కడి మిత్రులతో జరిపిన సంభాషణలు ,గాంధీ అంటే రాట్నం – మార్క్స్ అంటే తుపాకినేనా ? కాదంటూ చేసిన ప్రసంగాలు అక్కడి పత్రికలలో చోటుచేసుకోవడం, Political violence in India – A Gandhian Approach to Peace అనే అంశంపై స్వీడెన్ లోని ఐక్యరాజ్యసమితికార్యాలయంలో చేసిన ప్రసంగం, ఫిన్లాండ్ లోని  హెల్సింకి, కార్హులా, తుర్కు పట్టణాలలోను  చేసిన ప్రసంగాలు, నక్సలైట్లతో చర్చలకు సిద్దం అంటూ ఆయన వేసిన కరపత్రాలపై అక్కడిమిత్రులతో చేసిన చర్చలు ఆయనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపాయి.  నా ఆలోచన విస్తృతం కావడానికి,  విశాలమవడానికి మార్గం దోహదం చేశాయి.

విప్లవం ,ప్రజాస్వామ్యం  రెండూ ప్రజల కోసమే అయినప్పుడు రెండూ కలసి ప్రజల కోసం పనిచేసే అవకాశాలు రావాలని కోరుకున్నారు లవణం.  ప్రతి పౌరుడు ఒక ప్రజాస్వామిక విప్లవవీరుడు అయితే ప్రజాస్వామిక పద్దతిలో విప్లవాత్మక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తప్పక ఉంటాయని అయన ఆలోచన.మారుతున్న సమాజంలోని సమస్యలకు అనుగుణంగా నూతన సాంఘిక విప్లవ సాధనాలు వెతకాలన్న ఆలోచనలోంచే, కొత్తబాటలు వేయాలన్న కలల్లోంచే పదేళ్ళక్రితం  నక్సలైట్లకు బహిరంగలేఖ రాసి ఉండవచ్చు. సర్వోదయ నాయకుడిగా , గాంధేయవాదిగా ప్రపంచానికి తెలిసిన లవణం తుపాకీ తమ అవయవాల్లో అంతర్భాగంగా ప్రకటించుకున్న నక్సలైట్లతో కలసి నూతన విప్లవ మార్గాలు వెదుకుదాం అంటూ పిలుపు నివ్వడం, వారితో కలసి చర్చించడానికి వారెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుందెవారికైనా .  రెండు విభిన్న మార్గాల్లోని వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందని సందేహం కలుగుతుంది. కానీ లవణం గారు మాత్రం గాంధీ – మావోల మధ్య సమన్వయము కోరుకున్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు.
IMG_1450
గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ, నిజామాబాద్ , మెదక్ జిల్లాల జోగినీ వ్యవస్థ నిర్మూలన , పునరావాస కార్యక్రమాలతో లవణం దంపతులు స్వాతంత్ర్యానంతర సంఘ సంస్కర్తలు గానే కాక సాంఘిక విప్లవకారులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రహస్యం కంటే బహిరంగంలో ఎక్కువ శక్తి ఉందేమొనని వివిధ కార్యక్రమాలు చేసిన అనుభవంతో అంటారు లవణం గారు.  తను చైర్మన్ గా ఉన్న సంస్కార్ లో తీవ్ర  సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుటివారితో ఆయన వ్యవహరించిన తీరు మరచిపోలేనిది. ఆ సమయంలో ఆయనలో ఉక్కుమనిషిని చూశాను.
స్వీడన్ పర్యటనలోను, మనదేశంలోనూ  ఫండింగ్ ఏజెన్సీస్ తో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. తమ సంస్థలకి  విదేశీ నిధులు సంపాదించడం కోసం దేశాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశంగా , ఇక్కడి పేదరికాన్ని భూతద్దంలో చూపించి నిధుల వేట సాగించే సంస్థలు ఎన్నో ఉన్న సమయంలో తన గౌరవాన్ని , సంస్థ గౌరవాన్ని , దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టని అయన గొప్పదనం, వారితో వ్యవహరించిన ఖచ్చితమైన తీరు నన్ను అబ్బురపరిచాయి. ఆనందపరిచాయి.లవణం గారిపై తండ్రి గోపరాజు రామచంద్ర రావు గారి ప్రభావం ఎంత ఉందో అంతే ప్రభావం గాంధీ , మార్టిన్ లూథర్ కింగ్ లదీ ఉన్నట్లుగా అనిపించేది. 1966-67లలోనూ ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు మూడుసార్లు మార్టిన్ లూథర్ కింగ్ ను కలసి మాట్లాడానని చెప్పేవారు.   అహింసకు సత్యాన్వేషణ ముఖ్యమైనప్పుడు సత్యాన్వేషణ ఆస్తికుల సొంత హక్కు కానప్పుడు, నాస్తికులు కూడా సత్యాన్వేషణ చేస్తున్నారని అంగీకరించినప్పుడు తమ ఆస్తికత్వాన్ని చూసుకునే పద్ధతిలో పెద్ద మార్పు వస్తుంది. అది గాంధీజీలో వచ్చింది. గాంధీని ఆయుధంగా స్వీకరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో కూడా అటువంటి ఆలోచనే వచ్చింది. అందుకే ఆయన ప్రపంచ శాంతికొరకు నా వంటి నాస్తికులతో కలసి పనిచేయాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ కింగ్‌ హత్య వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అనడం చాలా  సార్లు విన్నాను.గత శతాబ్దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి అర్ధభాగాన్ని age of active morality అనీ, ఆ తర్వాతి ఇరవై ఎళ్ళని Age of passive morality అనీ, ఆ తర్వాతి పది పదిహేనేళ్ళ కాలాన్ని Age of passive immorality అనీ , ప్రస్తుతం మనం జీవించేది Age of  active immorality అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పేవారు.  సాంఘిక విప్లవంలో ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు . ఎంత పెద్ద త్యాగమైనా సరిపోదు . అసమర్ధతతో పెద్ద త్యాగాలు చేయలేక, అహంకారంతో చిన్న త్యాగాలు చేయక సమాజంలో అన్యాయాలు , అక్రమాలు, దోపిడీని మనమే కొనసాగిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు లవణం.

IMG_1499

కుల మత రహిత వ్యవస్థ ప్రగాధంగా కోరుకునే వారు నాన్నగారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. మానవతావాదం వైపు నడిచిన అయన వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుకే  మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.  మనం కులాల వేర్పాటు మనస్తత్వం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ప్రతి కులంలోని ధనికులని ఆ కులంలోని పేదలే రక్షిస్తున్నారు అంటే ప్రతి కులంలోని దోపిడీ దారులను ఆకులంలోని దోపిడీకి గురవుతున్నవాళ్ళే రక్షిస్తున్నారు. అదే ఈ దేశపు ముఖచిత్రం అంటూ పరిస్థితిని విశ్లేషించేవారు.

గత మే లో అనుకుంటా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ – రాజకీయాలు కార్పొరెట్‌ చేతికి వెళ్లిపోవడంతో  వాటిలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి .  రాజకీయాలలో తగ్గిపోయిన మానవ విలువలను మత విలువలతో నింపాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సాగితే  సెక్యులర్‌ వ్యవస్థ రానురాను మతవ్యవస్థగా మారిపోతుందని ఆవేదన చెందిన లవణం గారి మాటలకి అర్ధం చేసుకుంటూ పరిస్థితుల్ని అన్వయించుకుంటూ ఉన్నా .  చాలా కాలమయింది నాన్నగారితో మాట్లాడి అనుకుంటూనే ఫోన్ చేయడంలో జాప్యం. నాన్నగారికి ఫోన్ చేయడమంటే కాస్త సమయం చూసుకుని చేయాలి. ఆయన చెప్పేవన్నీ వినాలి అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయాలి . ఆయన చేసే సామాజిక విశ్లేషణల వెంట పరుగులు పెట్టాలి.

అందలోనే పిడుగులాంటి వార్త . లవణం గారి ఆరోగ్యం బాగుండలేదని. పరిస్థితి క్లిష్టంగా ఉందని. ఆ వార్త తెలియగానే గత నెల 29 న వెళ్లి చూసి వచ్చా. ICU లో ఉన్న ఆయన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అలానే అణచివేస్తూ చూస్తూ నుంచున్నా.   నా చేయి పట్టుకుని నేను బాగానే ఉన్నానురా .. మన వాళ్ళందరికీ చెప్పు. అక్కడ అందరూ బాగున్నారా .. పిల్లలు ఎట్లా ఉన్నారు కుశల ప్రశ్నలు వేసి ప్రమాదం దాటేశానులే ఇక పర్వాలేదు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.  మాట్లాడుతోంటే కొద్దిగా ఆయాసం వస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే వింటేనా మాట్లాడుతూనే ఉన్నారు.  నిత్యచైతన్య శీలి అలా మాట్లాడుతూనే ఉంటారని ఓ 15 నిముషాల తర్వాత బయటికి వచ్చేశా.  లవణంగారి చిన్న చెల్లెలు నౌ గోరా గారితో కలసి నాస్తికకేంద్రంకి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉండాలని.   లవణంగారు హాస్పిటల్ నుండి తిరిగివస్తారని  ఆశతో వెనుదిరిగా.

ఎవరికీ లేని విధంగా ఉప్పు సత్యాగ్రహసమయంలో పుట్టినందుకు ‘లవణం ‘ చాలా భిన్నంగా ఆలోచించడం చిన్నపుడే అబ్బింది. పదిపన్నెండేళ్ళ వయస్సులోనే 7వతరగతిలో ఉండగా బ్రిటిష్ విద్యావిధానంలో చదవనని బడి మానేశారు. కానీ నడుస్తున్న ఎన్సైక్లోపీడియాలాగా ఆయనకి తెలియని అంశంలేదు. ఏ విషయమైనా ధారాళంగా మాట్లాడేవారు.  పన్నెండేళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944 – 46 లో మహాత్మాగాంధీ వెంట సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. వినోభాభావే , జయప్రకాశ్ నారాయణ్ లతో కలసి భూదానోద్యమంలో పాల్గొన్న లవణం సహచరి విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలత.  ఇద్దరూ కలసి అనేక సాంఘిక సమస్యల, రుగ్మతల పరిష్కారం కోసం నూతన మార్గాల్లో పయనించారు.

ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయిన హేమలత దగ్గరకి వెళ్ళిపోయారు లవణం.  లవణం దంపతులు చేసిన కృషి వృధా పోదు. వారు నాటిన స్పూర్తి బీజాలు ఎందరిలోనో అంతర్లీనంగా  ఉన్నాయి. అవి మరెన్నో బీజాలకు ప్రాణంపోస్తాయి. లవణం గారి ఆశయాలకు జవం , జీవం ఇస్తాయి. వారి నైతిక వారసత్వాన్ని, సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోతాయి. అలా చేయడమే ఆయనకి మనమిచ్చే అసలైన నివాళి.

*

బాల్యం మోస్తున్న విషాదం

వి. శాంతి ప్రబోధ

 

శాంతి ప్రబోధ

రాకేశ్ కి ఏడేళ్ళుంటాయి.  రెండో తరగతి చదువుతున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడుతుంటాడు.  సహజంగా ఆ వయసులో ఉండే ఉత్సాహం, ప్రశ్నించే తత్వం, కొత్తవాటి గురించి తెల్సుకోవాలన్న జిజ్ఞాస, కుతూహలం రాకేశ్ లో ఎక్కువే .. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఏవేవో ప్రశ్నలు వేస్తుంటాడు. ఎన్నెన్నో కలలు కంటుంటాడు.
విరిసే హరివిల్లు కురిసే తొలిజల్లు తనకోసమేనని సంబరపడిపోయే రకం రాకేశ్. అలాంటిది, ఈ మధ్య చాలా దిగులుగా కనిపిస్తున్నాడు. అందరితో కలవడంలేదు.  ఆడుకోవడం లేదు. ఒక్కడే వేప చెట్టు కింద ఉన్న సిమెంటు బల్లలపై కూర్చుంటున్నాడు.  గత వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నా.. దాదాపు రోజూ అదే సీను.  స్కూలు నుండి వచ్చి మిగతా పిల్లలంతా బడి బట్టలు మార్చుకుని స్నాక్స్ తిని ఆడుకుంటారు . రాకేశ్ కూడా అలాగే చేసేవాడు.  ఉయ్యాలలు ఊగడమో .. పెద్ద పిల్లలతో బాటు షటిల్, ఫుట్ బాల్ ఆడతానని పేచి పెట్టడమో చేస్తుండేవాడు.   ఒక్కచోట ఒక ఆటలో కుదురుగా ఉండేవాడు కాదు.   అలాంటివాడు ఇప్పుడెందుకు డల్ గా ఉంటున్నాడో అర్ధం కావడం లేదు.
సాధారణంగా అయితే వాడికి ఏ సందేహం వచ్చినా,  ఎవరైనా కొట్టినా తిట్టినా నా దగ్గరకి పరిగెత్తుకొచ్చి ఫిర్యాదు చేసేవాడు.  మరే .. మరే ..ఆ .. చరణ్ గాడున్నాడు చూడూ..  వాడు నన్ను కొట్టాడు .  గాయత్రి నన్ను గిచ్చింది .. పల్లవి నా ప్లేటు గుంజుకుంది  అంటూ .. సాగేవి వాడి కంప్లైంట్లు.ఇప్పుడసలు నా దగ్గరకి రావడం లేదు సరి కదా పిలిచినా పలకడం లేదు.  పెద్ద పిల్లలు ఎవరైనా వీడిని భయపెడుతున్నారా .. బెదిరిస్తున్నారా.. కొత్తగా వచ్చిన ఇద్దరు  పెద్ద పిల్లల్లో విశృంఖల ధోరణి కన్పిస్తోంది.  వారిని శ్రద్దగా గమనిస్తూనే ఉన్నాం.  మా కళ్ళుగప్పి  వారుగానీ వీడిపై ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టలేదు కదా .. ఏవేవో అనుమానాలూ .. సందేహాలూ .. ఇంకా ఏదైనా కారణం ఉందేమో పగలు రాత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా గమనించమని మూడురోజుల క్రితమే రాధకి చెప్పాను.  రాధ కేర్ టేకర్. పిల్లల్ని చాలా ప్రేమగా లాలనతో ఆదరిస్తుంది. తగిన అనురాగాన్ని అందిస్తుంది.  మంచి చెడు చెబుతుంటుంది.ఆమెకీ తన వాళ్ళంటూ ఎవరూ లేకపోవడం వల్లేమో తల్లిలాగే సాకుతుంది.   పిల్లలకీ ఆమె దగ్గర చనువు ఎక్కువే.  ప్చ్ .. లాభం లేదు అక్కా.   ఏమీ తెలియడం లేదు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటున్నాడని రాధ చెప్పింది.ఏమైంది మేడం, రాకేశ్ ఇదివరకటిలా లేడు. హోం వర్క్ చేస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు,  పిల్లలెవరితోనూ కలవడంలేదు, భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు, చాలా దిగులుగా ఉంటున్నాడని ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు.హొమ్ లో పిల్లలంతా రంగు రంగుల సీతాకోకచిలుకల్లా  గ్రౌండ్లో ఆటలాడుతూ .. రాకేశ్ తప్ప.  వాడి దగ్గరగా వెళ్లి పలకరించా .. పలకలేదు.  బెంచీ పై పడ్డ ఆకులు తుడిచి వాడి పక్కనే కూర్చున్నా.  నా వైపు లిప్తపాటు  ఓ నిర్లక్ష్యపు చూపు విసిరి చెట్టు పైకి చూస్తున్నాడు.  వాడి కళ్ళు కళా కాంతి  లేకుండా .. తెల్లగా మిల మిలా నక్షత్రాల్లా మెరిసే కళ్ళు కావిపట్టిన తెల్లటి పంచెలా .. వెలాతెలాపోతూ .. అక్కడ ఏముందా అని పైకి చూశా.  కొమ్మలపై కోతి.  తన పిల్లని వీపు మీద ఎక్కించుకొని ఆ చెట్టు మీద నుండి మరో చెట్టు పైకి గెంతుతూ ..  వాటినే తదేకంగా చూస్తున్న వాడిలో ఏదో బాధ గూడుకట్టుకుని .. చెప్పలేక సతమతమవుతూన్నట్లుగా అనిపించింది.రాకేశ్ గత రెండేళ్ళుగా మా హొమ్ లోనే  ఉంటున్నాడు. వచ్చిన మొదట్లో వాళ్లమ్మ కోసం దిగులుతో ఉండేవాడు.  వచ్చినేడాది దసరా సెలవుల్లో అనుకుంటా వాళ్ళమ్మ వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడూ  రాలేదు.  రాకేశ్ తోనూ మాతోనూ  అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేది.  నేను రాలేని పరిస్థితిలో ఉన్నానమ్మా .. పిల్లాడికి అన్నీ మీరేనమ్మా అంటూ తన ప్రేమంతా మూటగట్టి జాగ్రత్తలు చెప్పేది. రాకేశ్ కి ఇక్కడ బాగా అలవాటైయింది. బాగానే ఉంటున్నాడు. ఆ విషయమే చెప్పి ఆమెని ఓదార్చేవాళ్ళం. రాకేశ్ చంటివాడిగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు ఎయిడ్స్ తో.    అదే జబ్బుతో నాలుగు నెలల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ విషయం  మాకు తెలిసి పదిరోజులయింది.  చాలా బాధ అనిపించినా ఆ విషయం రాకేశ్ తో మేం చెప్పలేదు.  వీడికి ఆ సంగతి ఏమైనా తెలిసిందా.. సందేహం నాలో.  ఊహూ .. ఆ అవకాశంలేదు .. అంటూ నా  బుర్ర తీవ్రంగా ఆలోచిస్తోంది.    ఓ పక్క ఆలోచిస్తూనే ..

Kadha-Saranga-2-300x268

వాడి మౌనానికి భంగం కలిగించాలని ‘నేను బైకు, కారు కొన్నానుగా..  ‘ ఊరిస్తూ  అన్నాను.
కళ్ళు చిట్లించి నా మొహంలోకి నిర్లిప్తంగా కనుకొలుకుల్లోంచి చూపు విసిరి వెంటనే దృష్టి మళ్ళించేశాడు.  ఇదే మాట వారం క్రితం నేను అని వుంటే .. ఎగిరి గంతేసేవాడు. ఏది అంటూ ఇచ్చేదాకా నన్ను వదిలేవాడు కాదు.
నాకు క్లాసులో ఫస్టు వస్తే గిఫ్టు ఇస్తానన్నావుగా అని అడిగాడు పదిహేను రోజుల క్రితం.  అవును, ఇస్తాను అంటే ఏమిస్తావు ఉత్సుకతతో.. ప్రశ్న.  ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్న నన్ను చూస్తూ నాకు బండి గిఫ్ట్ గా ఇవ్వొచ్చుగా.. .అన్నాడు
ఆశ్చర్యపోతూ .. బండా .. ఏ  బండి అంటే,  నీ  బండే అంటూ నా హోండా ఆక్టివా వైపు చూపాడు.  వాడు అన్న తీరుకు భలే నవ్వొచ్చింది.  వోర్నీ వెధవా .. ! నా బండికే టెండర్ పెట్టావా .. నా బండి నీకివ్వడం ఏంట్రా .. అంటూ మురిపెంగా వాడి నెత్తిన చిన్న మొట్టికాయ వేసి,  ఇస్తే ఏం చేస్తావ్ అని అడిగా .. బండేసుకుని బుయ్ బుయ్ అంటూ  బడికెల్తా .. మా అమ్మదగ్గరకెల్తా .. అంటూ ఆక్షన్ తో చెప్పాడు.
ఓహో ..అలాగా,  బండి కావాలంటే నేనివ్వడం కాదు. నువ్వు బాగా చదువుకుని చాలా తెలివి తెచ్చుకుని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుంటే, బండి ఒక్కటే కాదు నువ్వేది కావాలంటే అది కొనుక్కోవచ్చు అన్నాను . మరి ఈ బండి నువ్వే నీ పైసలు పెట్టే  కొనుక్కున్నావా .. ? టక్కున వచ్చింది ప్రశ్న . కొంచెం ఆశ్చర్యం వెన్నెల పువ్వులా మెరిసే ఆ మోహంలో ..
నవ్వుతూ అవునన్నాను.
అయితే, అప్పుడు నీ  బండి కంటే పెద్ద బండి కొనుక్కుంటాలే.  నా మొహంలోకి అలా పరీక్షగా చూసి, కొన్ని క్షణాల తర్వాత,  ‘అప్పుడు నువ్వు ముసలయిపోతావుగా అమ్మమ్మ లాగా..  మా అమ్మని , నిన్ను నా బండి ఎక్కించుకుంటాలే … ‘ కళ్ళని నక్షత్రాల్లా మెరిపిస్తూ ముత్యాల మాటలు, తన తల్లితో పాటే నాకూ చోటు కల్పిస్తూ.. నా పట్ల సానుభూతి, ప్రేమ ప్రదర్శిస్తూ …
అబ్బురంగా వాడివంకే చూస్తున్ననాకేసి తిరిగి నా రెండు బుగ్గలని ఆ బుల్లి చేతులతో తడుముతూ ‘ఇప్పుడు నాకు బొమ్మ బండి అయినా కొనివ్వోచ్చుగా ..అబ్బా .. ప్లీజ్.. ప్లీజ్ .. ‘ అన్నాడు గోముగా.
సరేలే .. నేను షాప్ కి వెళ్ళినప్పుడు తెస్తాలే అన్నాను .
‘నిజ్జంగా..నిజ్జమ్గా .. తెస్తావా .. ‘ కళ్ళలో మెరుపు తీగలు ప్రసరిస్తుండగా తలెత్తిన సందేహంతో
ఆ నిజమంటే నిజ్జంగా తెస్తా .. సరేనా .
ఒకటి నీబండి లాంటిది , ఒకటి అంకుల్ బండి లాంటిది అంటూ రకరకాల మోడల్స్ చెప్పడం మొదలు పెట్టాడు. షాపులో ఏవి దొరికితే అవి తెస్తాలే అన్నాను.
‘నాకు తెస్తే  ఆ యూసుఫ్ గాడు లేడూ వాడూ అడుగుతాడు గద .. లేకపోతె నాది లాక్కుంటాడు. తుక్కు తుక్కు చేస్తాడు . వాడిక్కూడా  తేరాదూ..’ తోటివాడి పట్ల వాడిప్రేమతో పాటు దూరాలోచన నన్ను ఆశ్చర్యపరుస్తుండగా
‘వాడు క్లాసు ఫస్టు కాదుగా.. ,’ అన్నాను
‘ఆ … అయితే .., మూడో తరగతిలో వాడినే ఫస్టు తెచ్చుకొమ్మని చెప్తాలే ..’ పెద్దరికంగా వీడి జవాబు. అంత చనువుగా మాట్లాడే రాకేశ్, మాటలతో మురిపించే వీడిలా మౌనగీతం ఆలపించడం, అపరిచితుడిలా ప్రవర్తించడం చూస్తుంటే  నాకెంతో బాధగా ఉంది.  ఆ చిన్ని గుండెకి ఏదో పెద్ద గాయమే అయినట్లుంది  అనుకుంటూ వాడి దగ్గరగా జరిగి ..  జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తల నిమురుతూ ఎందుకురా నాన్నా .. బండి తేలేదని నాపై కోపం వచ్చిందా అన్నా. . తల వంచుకున్నాడు .  నువ్విట్లా ఉంటే నాకేం బాగోలేదురా .. ఊ.. మాట్లాడరా  నాన్నా.. బుంగ మూతి పెట్టి వాడి పద్దతిలోనే నేను.  ఊహు.. ఉలుకు లేదు, పలుకు లేదు.
‘ఊ.. సరేలే అయితే.. , నువ్వు నా దోస్త్ కచ్చా పెట్టావ్ గా .. నేనూ నీ  దోస్తు కచ్చా ..అంతే .. నేను తెచ్చిన కారు, బండి రేపు యూసుఫ్ కి, ఆనంద్ కి, మల్లేష్ కి ఇస్తాలే ..  అంటూ రెండు వేళ్ళను మడచి కటీఫ్ చెప్పాను.  మేం అక్కడ ఉండడం చూసి మిగతా పిల్లలు రాబోతుంటే  పదండ్రా నేనూ ఆటే వస్తున్నా .. మనం ఆడుకుందాం అన్నా ..
‘తెచ్చుకో .. ఇచ్చుకో .. అన్నీ తెచ్చి వాళ్ళకే ఇచ్చుకో .. చేతులు ఊపుతూ మూతి విరుస్తూ ఉక్రోషంతో వత్తి వత్తి పలికాడు.  హమ్మయ్య మొత్తానికి మౌన వ్రతం వీడాడు అనుకుంటుంటే
‘నాకవన్నీ ఏమద్దులే .. మా అమ్మ కావాలి . మా అమ్మనిస్తావా.. ?’ తలెత్తి పలికిన వాడి కళ్ళు మండే సూర్యుడిలా.   నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలదీసి అడుగుతుంటే.. నా కళ్ళలో జవాబు కోసం వెతుక్కుంటుంటే .. నా గుండెలో మెలిపెట్టి పిండేసినట్లుగా.. తోడేస్తున్నట్లుగా.. భస్మమై పోతున్నట్లుగా … వాడి కళ్ళలో నిప్పుల వేడికి నా కళ్ళలో తడి  సుడులు తిరుగుతూ . ఆ కళ్ళలో కళ్ళు కలిపి చూడలేక తప్పు చేసిన దానిలా చప్పున తలొంచుకున్నా …  ఎక్కడ నుండీ తేను వాడి కన్నతల్లిని …?

‘ఎండా కాలం సెలవుల్లో మీ అమ్మ వస్తుంది. రేపు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడిస్తాలే’ ఆ క్షణానికి ఏమి చెప్పాలో తెలియక నోటికి వచ్చినట్లుగా వాగేశా కానీ, నా గొంతు నాకే కొత్తగా .. బావిలోంచి వస్తున్నట్లు సన్నగా.. పీలగా ..అసహ్యంగా ..

నా గడ్డం పట్టుకుని కళ్ళలోకి సూటిగా తదేకంగా చూస్తూ.. జవాబు కోసం  వెతుకుతూ రాకేశ్ ..ఆ పాలమనసులోకి అబద్దపుటద్దంలోంచి  చూడలేక నేను కుంచించుకుపోతుండగా

‘ఎప్పుడూ అబద్దం చెప్పొద్దని నువ్వే చెప్తావుగా ..?!  ఇప్పుడు నువ్వెందుకు అబద్దమాడుతున్నావ్ ..?’  అని నన్నూ నా నిజాయితీని నిలదీస్తుంటే ఏమని చెప్పను ఆ చిట్టి తండ్రికి.
నాలో ఖాళీతనం ఆవరించుకు పోతుండగా ‘నాకు తెలుసు. అంతా తెలుసు.  నాకోసం మా అమ్మరాదు. ఎవ్వరూ రారు . ఎప్పటికీ.. ఇక ఎప్పటికీ రారు .  నేనూ నవీన, ఆనంద్, కార్తిక్ వాళ్ళందరిలాగే … సెలవులక్కుడా ఎక్కడికీ పోను. నా కెవరూ ఫోన్ చేయరు.  అదే నిజం కదూ .. నా కంతా తెలిసిపోయింది…’ నన్ను చుట్టుకు పోయి ఏడుస్తూ .. అప్పటి వరకూ బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచు బయటపడుతూ ..

వాడు ఏడుస్తుంటే నా కళ్ళలోంచి, హృదయం లోంచి  ఏడుపు ఉబికి ఉబికి వస్తూ.. . నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ వాడిని ఒళ్లో పడుకోపెట్టుకుని తల నిమురుతున్నా ..ఆత్మీయ స్పర్శ నందిస్తున్నా..  తల్లితో పాటే నాకూ సమ స్థానం ఇచ్చి తన స్కూటర్ ఎక్కించుకుంటానన్న రాకేశ్ కి నేను తల్లి ప్రేమను పంచగలను కదా. వాడిని చుట్టుముట్టిన కారుమేఘల్లోంచి అమృతం చిలకగలను కదా అన్న ఆలోచన రాగానే గుండెలో భారం దిగుతున్నట్లుగా అనిపించింది.  ‘ ఏడవకురా  నాన్నా .. ఏడవకు, నీకు మేమందరం లేమా .. ?!’  అంటూ వాడి కళ్ళు నా చీర చెంగుతో తుడిచి  నీకు నేనున్నా.. అనే భరోసా వాడిలో కలిగిస్తూ రెండుచేతుల్లోకి తీసుకుని భుజాన వేసుకున్నా. చిట్టి చేతులతో పాములా మెడచుట్టూ చుట్టి కప్పలా కరుచుకుపోయి  వెక్కిళ్ళు పెడుతున్న వాడిని బుజ్జగిస్తూ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్న నన్ను విస్మయంతోనూ, ఆనందంతోను చూస్తూ కేరింతలు కొడుతూ .. చప్పట్లు చరుస్తూ .. , మాకేసి పరుగెత్తుకొస్తూ యూసుఫ్ , మల్లేష్, గాయత్రీ , పల్లవి , చరణ్ మిగతా వాళ్ళూ ..

 *

మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే  లక్ష్మణ్

తేదీ గుర్తులేదు కానీ అది 1985 సంవత్సరం.
 
అప్పుడు నేను శ్రీ పద్మావతీ విశ్వ విద్యాలయం లో జర్నలిజం విద్యార్థినిగా ఉన్నాను. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి  వారి జాతీయ అవార్డులు అందుకోవడానికి ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్, ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్, ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తదితరులు అవార్డ్స్ అందుకోవడానికి తిరుపతి వచ్చారు.  
 
మా జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ శర్మ గారు, లెక్చరర్  వి. దుర్గా భవాని గారు  ఆర్కే  లక్ష్మణ్ ని మా యూనివర్సిటీ కి ఆహ్వానించారు. (అప్పట్లో మా యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజి ఆవరణలోనే ఉండేది).  అలా జర్నలిజం విద్యార్థులుగా ఆర్కే  లక్ష్మణ్ ని ఇంటర్ వ్యూ చేసే అరుదైన అవకాశం మాకు దక్కింది.

అప్పటికి  ఆర్కే  లక్ష్మణ్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ.  మాల్గుడి డేస్ రచయిత ఆర్కే  నారాయణ్ సోదరుడని మాత్రమే తెలుసు..  ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ వాతావరణం నుండి వెళ్ళిన నేను జర్నలిజం లో చేరిన తర్వాతే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక గురించి విన్నాను.  మా శర్మ గారు ఇంటర్ వ్యూ చేయడానికి సిద్దం అవ్వమన్నారు.  ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు కొత్త.   మా లైబ్రరీలో ఉన్న హిందూస్తాన్ టైమ్స్ పేపర్స్ తిరగేసి అయన కార్టూన్స్ చూసి కొంత అవగాహన చేసుకొని ఇంటర్ వ్యూ కి సిద్దమయ్యాం. జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విద్యార్థులుగా మేం చేసిన మొదటి ఇంటర్వ్యూ  ఆర్కే  లక్ష్మణ్ దే.

అతిసామాన్యంగా కనిపిస్తూన్న ఆర్కే  లక్ష్మణ్ అతని భార్య కమల గారితో కలసి మా యూనివర్సిటీకి వచ్చారు.   అతి సౌమ్యంగా కన్పిస్తున్న ఇతని కార్టూన్స్ బుల్లెట్స్ లా పేలుతున్నాయా.. రాజకీయ నాయకుల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయా.. వారిలో కలవరం కలిగిస్తున్నాయా అని ఆశ్చర్యంగా ఆయనకేసి చూశాం.
10945637_10203558629236835_6306386002277021008_n

అప్పుడు మేం ఆయనతో చేసిన ముచ్చట్ల  జ్ఞాపకాలు మీ కోసం ….

*కామన్ మాన్ సృష్టి కి కారణం

– సాధారణ పౌరుడిగా ఆలోచించడమే (చిరునవ్వుతో )

*ప్రతి రోజు కొత్త దనంతో ఎలా జనం ముందుకు రాగలుగుతున్నారు. అసలు అంత వైవిధ్యంతో కూడిన కార్టూన్స్ కు సరుకు ఎక్కడి నుండి వస్తుంది ?

– ఆయన చిన్నగా నవ్వేసి  ఇంటి నుండి ఆఫీసుకి , ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు బస్ స్టాప్ లో నుంచొని సామాన్యుడి జీవితాన్ని పరిశీలించడం.  ప్రజల ఆశలను, ఆకాంక్షలను మన రాజకీయ నాయకులు స్వార్ధంతో ఎలా కాలరాస్తున్నారో వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నాకక్కడే తెలిసేది. వారి ఆలోచనల్ని మౌనంగా పరికించడం మూలంగానే నా కామన్ మాన్ బతుకుతున్నాడు.
*అందుకే మీరు సృష్టించిన కామన్ మాన్ కూడా మౌని ..?
– ఆ మౌనంలోంచి సంధించిన బాణం కామన్ మాన్

* మీ వ్యంగ్య చిత్రాలతో ప్రముఖ నేతలందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు కదా .. ఆ రాజకీయ నాయకుల కేరికేచర్ల  వల్ల ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా .. 

– జవహర్ లాల్ నెహ్రూ ప్రతి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన గురించి కార్టూన్ ఏమైనా వచ్చిందా అని చూసుకునే వారనీ. కొందరు నాయకులు మొహాన్ని కందగడ్డలా ఎర్రబరుచుకునేవారనీ .  కొందరు నవ్వుకునే వారనీ . ఇందిరా గాంధీ మాత్రం అసహనం ప్రదర్శించే వారనీ విన్నాను.  అంతకు మించి ప్రత్యక్షంగా ఎలాంటి ఇబ్బంది పడలేదు.
* మీరు మీ వ్యంగ్య చిత్రణ లో ఏ నాయకుడినీ వదలలేదనుకుంటా .. ?
– అవును . (అంటూ ఆనాటి సంఘటనల ఆధారంగా వచ్చిన కార్టూన్లకి ప్రజల స్పందన, రాజకీయ నాయకుల ఆక్రోశం గురించి చాలా చెప్పారు కానీ అవి నాకు సరిగ్గా జ్ఞాపకం లేక రాయలేకపోతున్నా)

*మీరు హిందూస్తాన్ టైమ్స్ నుండే కార్టూనిస్టు గా జీవితం ప్రారంభించారా?

– మొదట్లో కన్నడ పత్రికకి పనిచేశాను. ( పేరు చెప్పారు. కాని నాకది గుర్తులేదు )

* మీకు స్ఫూర్తినిచ్చే కార్టూనిస్టు ఎవరు ?

– ఒక బ్రిటిష్ కార్టూనిస్ట్ ని నేను చాలా అభిమానిస్తాను.
( దాదాపు 30 ఏళ్ళ క్రితం నా  జ్ఞాపకాల మడతల్లో దాగిన విషయాలు ఇప్పుడు కొన్ని తుడుచుకుపోయాయనుకుంటా … )

*అసలు కార్టూన్స్ వేయాలని ఎందుకనిపించింది .. ?
– కార్టూన్స్ అని కాదు కానీ చిన్నప్పటి ఏవేవో గీతలు గీసేసే వాడిని.  అంతా  బొమ్మలు బాగా వేస్తున్నావ్ అనేవారు. అంతకు ముందు నుంచే బొమ్మల పుస్తకాలు బాగా చూసే వాడిని.  అలా రకరకాల బొమ్మల పుస్తకాలు చూసి చూసి బొమ్మలపై అభిరుచి నాకు తెలియకుండానే ఏర్పడింది కావచ్చు. ఎక్కడపడితే అక్కడ బొమ్మలు గిసేవాడిని. మా ఇంటి గోడల్ని, తలుపుల్ని నా బొమ్మలతో పాడుచేసేవాడిని.  మా పంతుళ్ళ బొమ్మలూ గీసేవాడిని .  నేను గీస్తున్న చిత్రాల్ని చూసి మెచ్చుకున్న మా టీచర్లు నాలో మరింత ఉత్సాహం నింపారు. ఆ తర్వాత మా అన్నయ్య  నారాయణ్ రాసిన మాల్గుడి డేస్ కి, ఇతర కథలకి బొమ్మలు వేసేవాడిని.
* మీకు పద్మ భూషణ్, రామన్ మెగ్సేసే అవార్డ్ వచ్చాయి కదా .. అభినందనలు
– ఆ పురస్కారాలు నావి కాదు నా కామన్ మాన్ వి.
సునిశిత హాస్యం, చమత్కారంతో కామన్ మాన్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చి, సామాన్య మానవుడి పక్షాన నిలిచి రాజకీయ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించే ఆర్కే  లక్ష్మణ్ భౌతికంగా మనమధ్య లేక పోయినా ఆయన సృష్టించిన కామన్ మాన్, ఆయన చిత్రాలు, వ్యాసాలూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.
-వి. శాంతి ప్రబోధ

మధుర లంబాడీలు…నిండు వసంతం వారి సొంతం!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

 

మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి.   వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది.  ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.  


ఓ రోజు, ఆశ్చర్యగొల్పుతూ వారు మా ఇంటి ముందు నుండి బారులు తీరిన  ఏండ్ల బళ్ళలో వెళుతూ ..  ఆతర్వాత ఓ రోజు మా ఇంటి దగ్గర వారి బళ్ళు ఆపుకొని మా బోరింగ్ దగ్గర కూర్చొని వారు వెంట తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినడం నాకు వాళ్ళని గమనించడానికి అవకాశం దొరికింది. వాళ్ళు అక్టోబరు మాసంలో చెరుకు కొట్టడానికి ఇళ్ళనుండి బయలు దేరి వెళ్ళిన వాళ్ళు మార్చిలో వెనక్కి వస్తున్నారట.   ప్రతి సంవత్సరం అలా పిల్లాపాపలతో, గొడ్డు గోదా తీసుకొని వెళ్తారని మా వాళ్ళు చెప్పారు. చక్కని ముఖ కవళికలతో అందంగా, మంచి రంగుతో, పొడుగ్గా ఉండే వారి నడినెత్తిపైకి  కట్టి ఉండే జుట్టు, వారి మెడలో కనిపించే పూసలు, నిండు రంగులలో ఉండే బట్టలూ  ఆసక్తితో గమనించేదాన్ని.  మా వాళ్ళందరూ  చిన్నప్పటినుండి చూస్తూ ఉండడం వల్లనేమో వాళ్ళకి ఆ జాతి వారిని ప్రత్యేకంగా చూసేవారు కాదు.   నాకు మాత్రం వారు చాలా ప్రత్యేకంగా ఆనాటికీ ఈనాటికీ… నన్ను అంతగా ఆకర్షించిన వారే మథుర లంబాడీలు.

మధుర లంబాడాలు మాములుగా మనకు కనిపించే లంబాడాలు లేదా బంజారాలు లేదా సుగాలీలు లకు భిన్నంగా కనిపిస్తారు.  వారి భాష, ఆచార వ్యవహారాలు, కట్టు అన్నింటిలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తారు 

మధుర లంబాడాలు మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా కొద్దిగా కనిపిస్తారు. వీరు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ , రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు.  గుజరాత్ లో ఎక్కువ .  వీరిని మహారాష్ట్ర, గుజరాత్ లలో మధుర బంజారా, చత్తీస్ గడ్ లో మధుర లంబాని, మధ్యప్రదేశ్ లో మధుర లబాన్, ఉత్తర ప్రదేశ్ లో మధురాలు లేదా మధూరియా అని అంటారు.  మహారాష్ట్రలో వీరిని డి నోటిఫైడ్ విముక్త జాతులుగా ప్రకటించారు.
రాజస్థాన్ లోని బికనీర్, బహాల్యాపూర్ , పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఈ జాతి ఆవిర్భవించిందాని చరిత్ర కారుల అంచనా.  రాజపుట్ వంశస్తుల అనచివేయబడిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్రకారుల అంచనా.
DSC_0002
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా ,  నిజామాబాద్ ).
నిజామాబాద్ జిల్లాలో  వీరిని  మధుర లంబాడాలు అనీ, కాయితి లంబాడాలు అనీ, కొప్పు లంబాడాలని , జుట్టు లంబాడాలని రకరకాలుగా పిలుస్తారు.   వారి భాష, వేషధారణ, నగలు ,  పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వాయిద్య పరికరాలు అన్నీ ప్రత్యేకమే.  అటవీ ప్రాంతాల్లోనే వీరి నివాసం.  మైదాన ప్రాంతాలకి వారాంతపు అంగళ్ళకి  వస్తారు. 
 
మధుర లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి. అవి నాయక్, బామన్, బాద్రియా, కిత్రియా,లేల్యా, మాంద్యా, బర్దావల్, తిత్రియా , పెళ్యా, సాబ్ల్యా, భట్ .    నాయక్ అందరికన్నా పై స్థాయిలో ఉంటే భట్ లు అందరికన్నా తక్కువ.
రాజస్థాన్ /గుజరాత్  నుండి ఎప్పుడో కొన్ని తరాల పూర్వం  పశువుల పై సరుకులు రవాణా చేస్తూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళేవారని, అలా వచ్చి ఇటే ఉండిపోయారని చెప్తాడు 92 ఏళ్ళ మోతిలాల్ (సిద్దాపూర్ తండా , వర్ని మండలం, నిజామాబాద్ ). అయితే తమ వాళ్ళు ఎప్పుడొచ్చింది ఖచ్చితంగా చెప్పలేమని, మా ముత్తాతల ముత్తాతలది కూడా ఇదే ఊరు అంటాడు అతను.
మేం అంతా బస్సు తీసుకొని మా జాతి అంతా ఒక దగ్గర కలుస్తోంది అని తెలిసి గోకుల్ మధుర వెళ్లి వచ్చాం. అక్కడికి మాకు చూస్తే నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా .  వాళ్ళు అంతా  చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో . డాక్టర్లు , ఇంజనీర్లు , కలెక్టర్లు . కొందరు అమెరికాలో . ఇక్కడ మేం ఇంకా అడవిలోనే .  చదువు సంధ్యలకు దూరంగానే ..  మా పిల్లలను  బాగా చదివించాలని ఇప్పుడు మా తపన అన్నాడు గోకుల్ దాస్ తండాకు చెందిన నాయకుడు బారత్యానాయక్
మా ముత్తాతల ముత్తాతల ముందు తరాల వాళ్ళు వందల ఏళ్ళ  క్రితం వచ్చినప్పుడు మా జాతి ఎట్లా ఉందో అట్లానే మా జాతి లక్షణాలు మా దగ్గరే బతికి ఉన్నాయి.  అక్కడ మా జాతి కట్టు బొట్టు , వేషభాషలు ఏమీ ఇప్పుడు  కనిపించవు  అన్నాడు పదవతరగతి వరకు చదివిన సజ్జన్లాల్ .
ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ గోత్రాన్ని బట్టి వాళ్ళు మా జాతీయులు అని గుర్తించవచ్చు అంటాడు ఇంజినీరింగ్ చదువుతున్న పతేసింగ్.   వందల ఏళ్ళ క్రితం చెల్లా చెదురు అయిపోయిన మా జాతిని గుర్తించడానికి, ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అందుకు టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతోంది  అన్నాడు ఈ ప్రాంతంలో మధుర లంబడాల  జాతి నుండి కాబోయే మొదటి ఇంజినీర్.
జీవన విధానం 
ప్రకృతి ఒడిలో కొండ వాలులోనో, అటవీ ప్రాంతంలోని వాగు సమీపంలోనో ఉంటాయి మథుర లంబాడాల నివాసాలు.  మధుర లంబాడాలు ప్రధానంగా పశులకాపరులు.  వ్యవసాయం చేస్తారు. గోవుల కాపరి శ్రీకృష్ణుడి రాజధాని గోకుల మధుర మాది అని వాళ్ళు చెప్తారు.    వీరి మెడలో జంధ్యం ఉంటుంది.  గాయత్రి మంత్రంతో పవిత్ర జంధ్యం వేసుకుంటారు.  వాళ్లకు వాళ్ళు మేం క్షత్రియులం అని చెప్పుకుంటారు.  కానీ, బయట ప్రపంచం వీరిని గిరిజన తెగలకు చెందిన వారిగానే చూస్తుంది.
వీరు సంచార జీవులుగా ఉన్న కాలంలో వీరు తండాల్లో ఉండేవారు.  వీళ్ళ నాయకుడుని నాయక్ అంటారు . వంశానుగాతంగా ఆ పదవి వస్తుంది.  నాయక్ ఎప్పుడూ తమ వారి మంచి కోసం ఆలోచిస్తూ కృషి చేస్తాడు.  అందరూ అతని మాటని గౌరవిస్తారు.
illu
ఉమ్మడి కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి.  ఒక్క కుటుంబంలో అరవై డెబ్బై మంది కుడా ఉంటారు.  వ్యవసాయ పనులు, పశువుల పెంపకం అంతా కలసి చేసుకుంటారు .  పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో ఉంటారు.
ఇప్పుడు  తగ్గిపోయింది కానీ ఐదారేళ్ళ క్రితం వరకూ గోవులను మేపుతూ అలా రోజులు నెలల తరబడి వెళ్ళేవారు . ఇంటికి దూరంగా ఉండే వారు. గోవుల మందలను తోలుకెల్లి పొలాల్లో మంద పెట్టె వాళ్ళు.  అందుకు ప్రతిఫలంగా రైతులు జొన్నలు , వడ్లు ఏదో ఒక ధాన్యం ఇచ్చే వారు.  వీరి  జీవనం చాలా కష్టంగా సాగేది.  అప్పట్లో మాకు నాగరికత తెలియదు.  గత 20 ఏళ్లలో మా  జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి.  నాగరికత తెలిసింది.  మా  కట్టు-బొట్టు, ఆచార వ్యవహారాల్లోనూ మార్పు వచ్చింది అంటాడు భారత్యా నాయక్ బంధువు .
అవును, అప్పుడు మాకు  అప్పులు లేవు.  ఇప్పుడు అప్పులు వచ్చాయి. ప్రభుత్వం వారూ, బాంకు వాళ్ళు రుణాలు ఇస్తున్నారు.  అవకాశం ఉంది కదా అని  భార్య పేరున  , పిల్లల పేరా అప్పులు చేసి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు ,  పొలాలు , బోర్లు సమకూర్చుకుంటున్నాం. కానీ అప్పటి రోజులే బాగున్నాయి అప్పులు లేకుండా యాలకింత తిని కంటి నిండా నిద్ర పోయే వాళ్ళం అన్నాడు భారత్యా నాయక్.
ఇప్పటికీ వ్యవసాయంలో నాగలి, రెండు  చక్రాల ఎడ్ల బళ్ళను  ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ ఉంటారు.   ఇప్పుడిప్పుడే  ట్రాక్టర్లు , కొత్త మిషన్లు వంటి యంత్రాలు వీరి జీవనంలోకి వచ్చి చేరుతున్నాయి.  
 
ఆహారం
వాస్తవానికి వీరు శాఖాహారులు.  అయితే నేటి తరం వారు మద్యం, మాంసాహారానికి అలవాటుపడిపోయారు.   వీరి సాంప్రదాయిక ఆహారం రోటి. జొన్నలు బాగా తింటారు .   గోధుమ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము , కంది పప్పులు ఎక్కువగా తింటారు . టమాటా , వంకాయ వంటి రకరకాల కూరగాయలు వాళ్ళ పొలాల్లో పండేవి తింటారు. ఆకుకూరలు తింటారు.  వరి బియ్యం తినడం ఒకప్పుడు లేదు. తిన్నా ఎప్పుడో పండుగ సమయాల్లో మాత్రమే తినేవారు. యన్. టి. రామారావు ప్రభుత్వం ఏర్పాటైన  తర్వాత రెండురూపాయల బియ్యం ఇచ్చినప్పటి నుండి నెమనెమ్మదిగా  బియ్యం తినడం అలవాటు అయింది  అంటాడు మాజీ సర్పంచ్ భర్త మోతిలాల్.
జామ, అరటి , యాపిల్ వంటి పళ్ళన్ని వారాంతపు సంతలో తెచ్చుకుంటారు.  పెరుగు, నెయ్యి  బాగా వాడతారు.  తీపి పదార్ధాలు ఇష్టపడతారు. టీ తాగుతారు.   పల్లీలతో, కందగడ్దలతో( చిలగడ దుంప) పండుగ సమయాల్లో పాయసం చేసుకుంటారు.
వారి ఇళ్ళు 
కొండ కోనలకు సమీపంలో వీరి నివాస సముదాయాలు ఉంటాయని ముందే చెప్పాను కదా !  సమీపంలోని అడవినుండి తెచ్చిన టేకు దుంగలను గోడలుగా అమర్చుకుంటారు.  పైన వర్షాకాలపు పంటకు వచ్చే  వరిగడ్డిని తెచ్చుకుని ఇళ్ళపై  కప్పుతారు.  ఇంటి ముందు పశువుల పాకలు ఉంటాయి.  పశువులే వారి ఆస్తి. లేగ  దూడలను ఇంట్లో తమతో పాటే ఉంచుకుంటారు.  వంటకి కట్టెల పొయ్యి వాడతారు.  
గతంలో పొయ్యిలో నిప్పు ఉన్నప్పుడే అన్నం తినేవారు. ఆరిపోతే తినరు . ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఉపయోగించుకొని కొందరు పక్కా ఇళ్ళు కట్టుకున్నారు. దాదాపు అన్ని ఇళ్ళలో విద్యుత్ దీపాలు కనిపిస్తాయి.  మీటరు ఉండదు కానీ వైర్ తగిలించి విద్యుత్ దీపాలు వెలిగించు కుంటారు కొందరు.  కొందరి ఇళ్ళలో టి.వి లు కూడా వచ్చేశాయి.  నాగరిక ప్రపంచంలో కనబడే అనేక వస్తువులు అడవుల్లోనో , అటవీ అంచుల్లోనో ఉండే వారి ఇళ్ళలోకి చొచ్చుకొచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి. 
 
స్నేహానికి ప్రాణమిచ్చే మథుర లంబాడీలు కొద్దికాలం క్రితం వరకూ అటు నక్సలైట్లు ఇటు పోలీసుల మధ్య నలిగిపోయారు. 
muchchatalo
మాతృభాష 
వీరి భాష లంబానా భాష.  వీరి  భాషలో మరాఠీ , హిందీ, బంజారా భాషా పదాలు మిళితమై కనిపిస్తాయి.   నిరక్షరాస్యులైన వీరు మాతృభాషతో పాటు స్థానిక భాషలు మాట్లాడతారు.
భాషలో కొన్ని పదాలు 
లెహెంగ  (లంగా)
కచలి  (జాకెట్)
నమస్తే –  రామ్ రామ్
యా/బాయి  – అమ్మ
బా – నాన్న
దాదా – అన్న
జీజీ – అక్క
జీజొ – బావ
దండో – తాత
డంగి – నాన్నమ్మ
పుప్పీ – అత్త
పెళ్లి – బ్యహ
బాడువా – వడక లగ్గం
నాక్డా – నాయక్
పూజించే దేవతలు 
 
వీరు శ్రీ కృష్ణుడిని కొలుస్తారు.  తిరుపతి బాలాజీ , పూరి జగన్నాధ్ ని పుజిస్తారు.  
 
పండుగలు 
మథుర లంబాడాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పండుగ గోకులాష్టమి.  వీరి నివాసాలకు వెళితే శ్రావణమాసం అంతా పండుగ వాతావరణమే కనిపిస్తుంది.
DSC_0016
వస్త్రధారణ 
పెళ్ళికాని ఆడపిల్లలు లేహంగా, కచలి (జాకెట్ ) వేసుకుంటారు . పెళ్లి అయిన స్త్రీలు  చీర వాళ్లపద్దతిలో కట్టుకుంటారు.  
మగవారి ఆభరణం జంధ్యమే . దీన్ని జనువా అంటారు.  సాంప్రదాయంగా ధోతీ (బారకషి ), జుబ్బా (జహంగల ) వేసుకుంటారు. 
 
చదువు 
చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. అతి కొద్ది మంది ఇంటర్ వరకు చదివి  ఉద్యోగం చేస్తున్నారు.  ఇద్దరు మిలిటరీలోకి వెళ్ళారు.  ఆడ పిల్లల్లో చదువుకునే వారి సంఖ్యా మరీ తక్కువ.  ఇప్పుడిప్పుడే 10 వతరగతి కి వచ్చారు . ఒకరిద్దరు ఇంటర్ చదివితే , ఒకమ్మాయి మాత్రం నిజామాబాద్ లో ఉంది ప్రైవేటు కాలేజిలో ఇంగ్లిషు మీడియంలో డిగ్రీ చదువుతోంది.
పెళ్లి: 
మగవాళ్ళకి 21, వదువుకి 16 పెళ్లి వయస్సు.
మధుర లంబాడాల తండాలో నాయక్ అందరికీ పెద్దగా ఉండి గ్రామ మంచి చెడులు, గ్రామ మంచి కోసం చేసే కార్యాలు చేస్తాడు.  అలాగే భట్ గోత్రికుడి కి కూడా వంశపారంపర్యంగా బట్ పని వస్తుంది.  అతను నాయక్ కి సహాయకుడిగా ఉంటాడు. అంతే కాకుండా పెళ్లిల్లప్పుడు పెళ్లి పనులు చేస్తాడు.
అతను చేసే సేవలకు వారి వారి ఆర్ధిక స్థాయిని బట్టి కొత్త సొమ్ము ఇచ్చేవారు. మొన్నటి వరకూ పదకొండు వందల రూపాయలు ఇచ్చేవారు.  ఇప్పుడు 5 వేలు ఆరు వేలు కూడా ఇస్తున్నారు.
ఊరిలో ఎ సమాచారమయినా అందరికి చేరవేస్తాడు భట్.  పెళ్లి పిలుపులు , చావు వార్తలు అతనే చేర వేస్తాడు.
మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశాలు సహజంగానే వారినీ ప్రభావితం చేయడం కనిపిస్తుంది.  ఒక  సమాజానికి  మిగతా సమాజాల వారితో సంపర్కం ఏర్పడ్డాక, రాకపోకలకు సదుపాయాలు ఏర్పడ్డాక, సమాచార వినిమయం పెరిగాక వచ్చే మార్పులు వీరి జీవన విధానంలోకి చోచ్చుకోచ్చేశాయి.
ఇంతకు ముందు పెళ్లి పత్రికలు వేయించేవారు కాదు.  ఆకులు – పోకలు ఇచ్చి ఫలానా వారి పెళ్లి ఉందని చెప్పి పిలిచే వాళ్ళు. ఇప్పుడు పెళ్లి పత్రికలు వేయిస్తున్నారు.
ఒకప్పుడు బ్రాహ్మడు ముహూర్తం చూసి పెళ్లి సమయం నిశ్చయించే పద్ధతి లేదు.  పెళ్లి సమయాన్ని నాయకుడే నిర్ణయించే వాడు.  ఆ సమయానికే పెళ్లి జరిగేది.  ఇప్పుడు కూడా నాయక్ పెళ్లి ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు కానీ బ్రహ్మడికి కూడా చూపిస్తున్నారు.  ఆ సమయం మంచిదో కాదో చెప్పించుకుంటున్నారు.
అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందు చూసుకునే పద్ధతి కూడా లేదు.  అమ్మాయి తరపు వారు అబ్బాయి గురించీ, అబ్బాయి తరపు వారు అమ్మాయి గురించీ ముందే బంధు మిత్రుల ద్వారా తెలుసుకుంటారు.  ఆ తర్వాత ఇరువర్గాలు నాయకుడి ఇంటి దగ్గరికి వస్తారు.  ఆకులు – పోకలు ఇచ్చి పుచ్చుకుంటారు. తింటారు.  పెళ్లి చేసే విధానంలోనూ అనేక మార్పులు.
పెళ్ళైన ఆడపిల్లకి కాలిపాట్ అని నల్లపూసల మంగళసూత్రం ఉంటుంది.  రక్షడి,  కాఖడి  జుట్టులో పెట్టుకుంటారు. ఇత్తడి కాళ్ళ కడియాలు, గూటి (టో రింగ్ ), బిడ్ (మెడ , చెవుల నగలు ). ఒకసారి పెడితే అవి చని పోయే వరకూ తీయరు. భర్త చని పోయిన స్త్రీ అవి తిసివేస్తుంది.
విడాకులు తక్కువ .  పిల్లలు పుట్టకపోతేనో , భార్య చనిపోతేనో, ఆరోగ్యం బాగోలేకపోతేనో మళ్లీ పెళ్లి చేస్కోరు.  విడాకులు తీసుకున్న వాళ్ళు, భర్త చనిపోయిన మహిళలు  మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలా రెండో సారి పెళ్లి చేసుకొనే మహిళ వాళ్ళు విడాకులు తీసుకున్న వారినో , భార్య చనిపోయిన వ్యక్తినో చేసుకుంటారు.  విధవరాలిని రండ్ అంటారు.
మగవాళ్ళు విడాకులు కోరితే ఆడపిల్ల వారికి కుల పంచాయితీ పెద్దలు చెప్పిన విధంగా భరణం చెల్లించాలి.  విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత భర్తదే. పెళ్లి జరిగాక చేసే పెళ్లికి సంబంధించిన గుర్తులన్ని ఉంచుకోవచ్చు. భార్య/భర్త నడవడి బాగోలేకపోతే విడి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు.  రెండో పెళ్ళిని మొహ్తుర్ అంటారు.
కట్నం ఇచ్చి పుచ్చుకోవడం లేదు.  ఒకప్పుడు అబ్బాయి అమ్మాయికి కట్నం ఇచ్చే పద్దతి ఉండేది.  ఒలి ఇవ్వలేక అబ్బాయిలు ముదిరిపోయేవారట. ఓలి ఇచ్చి చేసుకునే వారు లేక అమ్మాయి ల పెళ్ళిళ్ళు అలస్యంగానే జరిగేవి.  అయితే ఇప్పటికీ పెళ్ళిలో అమ్మాయికి 11 రూపాయలు కట్నంగా ఇచ్చే పద్ధతి ఉంది.  ఓలి  పద్ధతి లేదు.  గురువు వచ్చాక ఆ విధంగా ఇవ్వడం మానేశారు.
 అమ్మాయి కుటుంబం పేదదయితే పెళ్లి చేసే స్తోమత లేకపొతే , ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తీసుకు వెళ్ళలనుకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు ఆబ్బాయి వాళ్ళు ఇస్తారు. పెళ్లి చేసుకొని  అమ్మాయిని తమ ఇంటికి తెచ్చుకుంటారు.
ఇంటి కోడలు పురిటికి కన్నవారింటికి వెళ్ళే ఆచారం లేదు.  అత్తవారింటిలోనే పురుడు పోసుకుంటారు. పురిటి ఖర్చు అత్తింటి వారిదే . బిడ్డ  పుట్టిన రెండు మూడు నెలల తర్వాత వెళతారు.  ఒకప్పుడు ఇంటిదగ్గరే పురుడుపోసుకునే వారు. ఇప్పుడు ఆసుపత్రి కి వెళుతున్నారు.  నెలరోజులు పురిటి మైల పాటిస్తారు. ప్రత్యేకమైన గదిలోనే ఉంటారు.  ఆసమయంలో బిడ్డపనులు, తన పనులు తప్ప తల్లి ఏ పని  చేయదు. 
vaari veedhi
 బహుభార్యాత్వం 
సాధారణంగా ఏకభార్యత్వం పాటిస్తారు.  కొన్ని సందర్భాల్లో బహుబార్యత్వం కనిపిస్తుంది.  మొదటి భార్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అలా చేసుకుంటారు.
బంధుత్వాలు
చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న పిల్లల్ని చేసుకోరు. మేనరికాల్ని చేసుకుంటారు.
అన్న చనిపోతే వదినని తమ్ముడు చేసుకోవచ్చు.  కానీ, తమ్ముడి భార్యని అన్న చేసుకోడు.
వాయిద్య పరికరాలు 
నగారా , బాజాలు , గిల్ల
మహిళల భాగస్వామ్యం 
మగవాళ్ళ లాగే మహిళలూ అనడంతో పాటు ఎత్తుగా బలంగా ఉంటారు. స్త్రీలు ఇంటిపని, పొలం పని, పశువులు పాడిపనో  ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు.  ఒకప్పుడు బట్టలు చేత్తోనే కుట్టుకునే వారు.  ఇప్పుడు వాళ్ళ బట్టలు కుట్టడానికి ప్రత్యేకంగా ఉన్న దర్జీ కుడతారు.  వాళ్ళతో మాట్లాడినప్పుడు వారెవరికీ మిషను కుట్టడం రాదన్నారు.  గతంలో తీరిక సమయాల్లో  రకరకాల చేతికుట్లు కుట్టేవారట. ఇప్పుడు కుట్టడం లేదు అంటూ ఇప్పుడు అంతా కాలం మారిపోయింది కదా ..  ఆ కుట్టినవి.   ఇప్పటి వాళ్ళు వేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించింది ఓ వృద్దురాలు.
నాలుగేళ్ళ క్రితం గుజరాత్ నుండి ఎవరో వచ్చారు.  మా తండాలన్నీ తిరిగారు. మా దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలకు ఉన్నవయినా సరే మేం చేత్తో కుట్టిన వాటిని అడిగారు. వాటికి బదులుగా మాకు ఇత్తడి సామాన్లు ఇస్తామన్నారు.  ఏమి చేసుకుంటాం అని మా దగ్గర ఉన్నవన్నీ వెతికి వెతికి వాళ్ళకి ఇచ్చేశాం అంటూ వాళ్ళు ఇచ్చిన ఇత్తడి గిన్నెలు చూపింది ఓ మహిళ.  ఇప్పుడు మా దగ్గర మేం చేసిన కుట్లు అల్లికలు లేవు. ఎక్కడో  ఒకరి దగ్గర తప్ప. అవి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు.  ఇప్పటి ఆడపిల్లలు ఎక్కడ నేరుస్తున్నారు ..? అంది జమునాబాయి .
మధుర లంబాడాల కుటుంబాల్లోనూ  మగ పిల్లవాడికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లకి ఇవ్వరు.  ఆడపిల్లలు బడికి పోయేవాళ్ళు చాలా తక్కువ.  గొడ్డు గోదా మేపడానికో, చేను కాపలాకో, ఇంటి పనులు చేయడానికో ఆడపిల్లలని బడికి పంపకుండా ఇంటిదగ్గరే ఉంచుతారు. ఏ పనులూ లేనప్పుడు  పంపినా తమ తండాలో ఉన్న బడికే. చాలా కొద్ది మంది ఆడపిల్లలు ఊరు దాటి వెళ్లి చదువుకునేది.  అదే మగపిల్లలయితే బడి ఉన్నప్పుడు ఊర్లొ కనిపించేది చాలా తక్కువ.
నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేనడిగే ప్రశ్నలకి జవాబు చెప్తూనే మా గురించి అన్ని అడుగుతున్నావ్.. నీమిటి లాభం అని ఒకరు అంటే .. సర్కారు జీతం ఇస్తుందా అని మరొకరు .. ఆ ఏమి లాభం లేకుంటే చదువుకున్నోళ్ళు మన ఇళ్ళు ఎందుకు వస్తారు అంటూ మహిళల నుండి ప్రశ్నల పరంపర.  ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.
ప్రపంచీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా శరవేగంగా  జరుగుతున్న మార్పులు, చోటు చేసుకుంటున్న ధోరణులు స్వచ్చమైన ముత్యంలా మెరిసే మథురాలలొకి వచ్చి వారినీ ప్రభావితం చేస్తున్నాయి.  ఈ క్రమంలో వారి అభివృద్ధి ఎంత వరకూ జరుగుతుందో తెలియదు కానీ మథుర లంబాడాల జాతి ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తమ అస్తిత్వాన్ని మాత్రం ఇక ఎక్కువ కాలం నిలుపుకోక పోవచ్చేమో త్వరలోనే కోల్పోతుందేమోనని నా  బెంగ.
వి. శాంతి ప్రబోధ

ఆ రోజు ఏం జరిగిందంటే

kasmir11kasmir6

మా వాహనం శ్రీనగర్ నుండి జమ్మూ వయిపుకి హైవే లో జెట్ వేగంతో దూసుకు పోతోంది.    హిమపర్వత సానువుల్లో ఒదిగి వెండి దుప్పటి కప్పుకొని మిలమిలా మెరుస్తూ ఎంతసేపైనా చూడాలనిపించే   మనసును కట్టిపడేసే ఒడుదుడుకుల  పర్వతశ్రేణులు, .. రాతి ద్రోణులు .. వాటిని వెన్నంటి ఉండే ,  హిమానీనదాలు ..స్వచ్చమైన  నీటి పాయాలూ.. ఏర్లు .. సెలయేర్లు, సరస్సులు.. జలపాతాలూ ..ఆకాశాన్ని అందుకోవాలని ఉబలాట పడుతూ ఎదిగి పోతున్న దేవదారు వృక్షాలూ, అక్కడక్కడ దట్టమైన అడవులూ, వృక్షాలు, పచ్చని తివాచీ పరచినట్లు పచ్చికబయళ్ళు .. వాటిపై అక్కడక్కడ గొర్రెలమందలతో తెల్లగా బక్కగా పాల బుగ్గల
పసివాళ్ళు .. అందమైన కాశ్మీరు లోయలో పేదరికాన్ని , వెనుకబాటు తనాన్నితెలియజేస్తూ .. నా ఆలోచనల్లో నేను.  ఎవరికి వారు కాశ్మీరు లోయ అందాలకి పరవశిస్తూ .. ఆ అద్భుత దృశ్యాలని మా మదిలోనూ, కెమెరాల్లో బంధిస్తూ..  ఆప్రాంతాన్ని వదిలి రావాలని లేక పోయినా తప్పదుగా ..అనుకుంటూ

‘కాశ్మీరు కొండల్లో అందాలకి .. కొత్త అందాలిచ్చారు
కాశ్మీరు వాగుల్లో పరుగులకి .. కొత్త అడుగులిచ్చారు ”  మౌన రాగానికి బ్రేక్ వేస్తూ రాగం అందుకుంది మృదుల .

కాశ్మీరు లోయలో .. కన్యాకుమారిలో .. ఓ సందమామ , ఓ సందమామ ‘ పోటీగా సంగీత.  ఆమెకు జత కలుస్తూ మాలిని, కవిత .

‘ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో ..’  మరో పాట అందుకుంది మృదుల

మన  కవులు  ఈ అందాలపై ఎన్ని పాటలు కట్టారు ..!  కవితలు అల్లారు ..!

అమరనాథ యాత్ర, గుర్రాలపై ప్రయాణం, నడవ లేక డోలి ఎక్కినా వైనం, గత వారం రోజులుగా అనుభవించిన అద్భుతమైన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ..అడుగడుగునా కనిపించే సెలయేటి గలగలలు .. జలపాతాల సవ్వడులు .. పక్షుల కిలకిలలు .. ప్రకృతి అందమంతా కుప్ప పోసినట్లుగా .. తడిసి ముద్దాయి పోతూ .. మేం .

“నాకయితే ఇక్కడే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తోంది’ ముందు సీటులో కూర్చొని భూతల స్వర్గం గురించి ఆలోచిస్తోన్న మాధురి.

‘ఆ..  నాకూను.   నేను మనసులో అనుకున్నా . నువ్వు పైకి చెప్పేశావ్  ‘వంత పాడింది కవిత.

‘అబ్బ ఎంత ఆశ.  మనని ఇక్కడ ఉండనిచ్చేది ఎవరట ?’ నవ్వుతూ నేను.

‘ ఉండనిచ్చేది ఏమిటి ఉండాలనిపిస్తే ఉండడమే .’ మాలిని

‘అలా ఇక్కడ ఉండకూడదు.’ నొక్కిచేప్పా

‘అదేంటి? ఎందుకు ఉండకూడదు? మనం భారతీయులం .   ఈ దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు’  తెలిసినట్లుగా మాలిని.

‘ఆ పప్పులేవి ఇక్కడ వుడకవమ్మ ‘ ఉడికిస్తూ నేను

‘ఆ ఎందుకనీ .. ‘ రవిత్రేయిని చేతిలో ఉన్న తమ  జమాఖర్చుల పుస్తకాన్ని మూసి మాలిని  చేతిలో పెడుతూ.

‘ఏం వీసా కావాలా.. ‘ మృదుల గాలికి రివ్వున ఎగురి మొహాన్ని కమ్మేస్తున్నముంగురుల్ని సవరించుకుంటూ.

‘వీసా తీసుకుని అమెరికా లాంటి దేశాల్లో పౌరసత్వం తీసుకొని స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు.  కానీ కాశ్మీరులో  మాత్రం కుదరదు. శ్రీనగర్లో మనం ఉన్నాం చుడండి  అలాంటి బోటు హౌస్ లే గతి మనలాంటి వాళ్లకి  .  ఇక్కడి చట్టాల ప్రకారం కాశ్మీరు ప్రాంతేతరులు ఇక్కడ భూమి కొనలేరట.  బోట్ హౌస్ లో మాత్రం ఉండవచ్చట.’ ఈ యాత్ర కి వచ్చేముందు   వికిపీడియా లో చుసిన విషయం చెప్పా.

kasmir5
‘అవునా! ‘ రవిత్రేయిని  ఆశ్చర్యంగా

‘బోట్ హౌస్ అయితేనేమి..? ఎంచక్కా స్వచ్చమైన నీటిలో తేలియాడుతూ ఊయలలూగే ఇల్లు..  ఆనందించక’  కవిత కంచు కంఠంతో కరచినట్లుగా

‘పర్యాటక లోకాన్ని రా రమ్మని పిలుస్తోన్న సుందర కాశ్మీరంలో ఈ అల్లకల్లోలం ఏంటో .. ‘ తమ రాకకి కొద్దిగా ముందు బారాముల్లా లో జరిగిన అల్లర్లు .. శ్రీనగర్లో కర్ఫ్యూ గుర్తొచ్చిన రవిత్రేయిని .

‘కాశ్మీరులో జరిగే అల్లర్ల గురించి మేం పుట్టినప్పటి నుండి వింటున్నాం. అసలు కారణం ఏమిటి ‘ డ్రైవర్ని అడిగింది మాధురి.

అంతా ఏమి చెబుతాడోనని ఆసక్తిగా అతని కేసి చూస్తూ .. కొద్ది క్షణాలు ఆలోచించి ‘దేశ విభజన సమయంలో కాశ్మీరు సంస్థానం మహారాజ హరిసింగ్ సారధ్యంలో  భారత దేశంలో విలీనం అయింది.  అయితే, అప్పట్లో కాశ్మీరు భూభాగం ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉండేది.  మహారాజ హరిసింగ్ భారత దేశంలో చేరే విధంగా పావులు కదపడం గిట్టని బ్రిటిష్ వారే పాకిస్తాన్ ను కాశ్మీరు దురాక్రమణకు ప్రేరేపించారట మేడం.  అంతేకాదు మేడం,  పాకిస్తాన్ తరపున భారత దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారట.  అలా తెల్లవాళ్ళ సాయంతో 1948లో కాశ్మీరులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొందట. అప్పటినుండే మాకు ప్రశాంతత లేకుండా పోయిందని మా తాతలు అంటుండేవారు మేడం’ మాధురి ప్రశ్నకి జవాబు గా తనకు తెలిసింది చెప్పాడు డ్రైవర్.

‘అగ్గిపెట్టెలో పట్టే చీరలంటే ఏమో అనుకునే దాన్ని .  నిజంగా కాశ్మీరీ సిల్క్ చీరలు నా మనసు దోచేశాయి.’ ఆ  టాపిక్ మారుస్తూ మాలిని.  నిన్నసాయంత్రం శ్రీనగర్ లో చేసిన షాపింగ్  చీరలు, శాలువాలు, వాటిపై ఉన్న
కాశ్మీరీల చేతి పనితనం, స్టోల్స్, గాజులు , కుంకుమ పువ్వు , ఆప్రికాట్స్, మొఘలుల ఉద్యానవనాలు, కోటలు   ఇలా  మాటల గలగలలు ..సాగిపోతూ..  మేం కొన్న గాజులూ, పర్సులు అందుబాటులో ఉన్న  వాటిని ఒకరికొకరం చూపుకొంటూ.. ధరలు.. బేరీజు వేసుకుంటూ..

మేం ప్రయాణిస్తున్న వాహనం  స్లో అయింది.    ఆగింది.  ఎదురుగా వచ్చే వాహనదారులు డ్రైవర్తో ఏదో కశ్మీరీలొ మాట్లాడాడు.  ఆ తర్వాత ఎవరితోనో ఫోనులో మాట్లాడాడు.  ఆ తర్వాత మా వాహనం ప్రధాన రహదారి లో కాకుండా దారి మళ్ళింది.  గ్రామాల్లో ఉండే కచ్చా రోడ్డులో మేం.  ఆ గతుకుల కుదుపులకు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాం.  అసలేం జరుగుతోంది.  శ్రీనగర్ నుంచి జమ్ముకి ఉన్న హైవే లో కాకుండా మేం ఈ రోడ్డులోకి రావడమేమిటి ..?  మాటల్లో పడి  గమనించనే లేదు.  అందరిలో తెలియని ఆందోళన.

‘భయ్యా.. ఏమిటిది ? రహదారి ఉండగా ఈ దారిలో ..? అర్దోక్తిగా హైదరాబాదీ హిందీలో మాలిని.

‘ముందు రెండు చోట్ల హర్తాల్ జరుగుతోందట’  డ్రైవర్ తల ఇసుమంతైనా కదల్చకుండా.. మా వేపు దృష్టి మరల్చకుండా

‘ఎందుకు?’ గాబరాగా సంగీత

‘మొన్న బారాముల్లా దగ్గర జరిగిన కాల్పులలో సాధారణ పౌరులేవరో చనిపోయారట. అందుకు  నిరసనగా’ చెప్పాడు డ్రైవర్. అంతా ఉలిక్కి పడ్డాం.

‘ఇది నిజమేనా .. ‘ మాలిని సందేహం

‘ఏమో.. అసలే మనమంతా ఆడవాళ్ళం  ‘ భయంగా సంగీత

‘ఇతని మాటలు నమ్మదగ్గట్టుగానే ఉంది అతని వాలకం’ మృదుల.

రకరకాల సందేహాలు మా మనస్సులో.  అప్పటివరకూ ఉన్న ఉత్సాహం .. కబుర్ల స్థానే కలవరం..  భయం .  ఏం జరగబోతోంది.. ఉత్కంట . అన్ని వైపులా తేరిపార జూస్తూ .. అప్రమత్తంగా ..
kasmir7
ప్రతికూల పరిస్థితుల్లో, ఉగ్రవాద బూచి ఉందంటూన్న సమయంలో  ఈ ప్రయాణం అవసరమా అంటూ ఇంట్లోవాళ్ళు బయటివాళ్ళు మమ్మల్ని నీరస పర్చచూశారు. భయపెట్టారు.  అయినా అవేవి లక్ష్య పెట్టక రెండునెలల క్రితమే ప్లాన్ చేసుకున్న విధంగా మా యాత్ర సాగించాం. అమరనాథుని దర్శనం చేసుకుని శ్రీనగర్ చేరాం. వైష్ణోదేవిని దర్శించాం.  అంతా అనుకున్న విధంగా సవ్యంగా సాగిందన్న ఆనందంతో ఉన్న మాకు షాక్ కలిగిస్తూ..

పది నిముషాలు కచ్చా రోడ్లో ప్రయాణం తర్వాత ఓ చిన్న గ్రామంలో ప్రవేశించాం.  వీధుల్లో కొద్ది మంది యువకులు తప్ప  ఊళ్లో   ఉండే సందడే లేదు. అకస్మాత్తుగా మా వాహనం ఆగింది.  డ్రైవర్ దిగిపోయాడు. అతడెందుకు ఆపాడో అర్ధం కాక మేం అడిగే లోపే అతను వడివడిగా అడుగులేస్తూ .. కుడి  వేపుగా ఉన్న మసీదు కేసి నడుస్తూ ..

పట్టేసిన కాళ్ళని సాగదీస్తూ మధ్యలో ఉన్న నేను, మృదుల, సంగీత దిగబోయాం. ‘ఎందుకు దిగుతున్నారు .. వద్దు.  అసలీ డ్రైవర్ మనతో ఏమీ చెప్పకుండా వెళ్ళడం ఏమిటి ?’ వారిస్తూ  మాలిని.

మేం దాటి వచ్చిన యువకులు మమ్మల్నే చూస్తూ ఏదో అరుస్తున్నారు .. మాకేం అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని మేం మా వాహనం ఎక్కబోతుండగా,  రోజాలో ఉన్నాడేమో నమాజ్ కోసం  వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న డ్రైవర్ కి ఏం కనిపించిందో  కంగారుగా పెద్ద అరుపు ఎక్కండంటూ. అంతలోనే ఆ యువకుల గుంపు నుంచి ఓ గులక రాయి మా వయిపు దూసుకొచ్చి మాకు అతి సమీపంలో పడింది.

పట్టుకోండి .. తన్నండి .. తరమండి .. రాళ్ళ వర్షం మాకు దగ్గరవుతూ .. పరుగు పరుగున వచ్చిన డ్రైవర్ బండిని ముందుకు ఉరికించాడు.  ఆ అల్లరి మూకని, రాళ్ళనీ తప్పించుకుంటూ సందులు గొందులు తిప్పి ఎలాగయితేనేం ఆ ఊరు దాటించాడు.  ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని మేం.  ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనన్న భయంతో.. మరో ఊరు .. మరో ప్రదేశం అక్కడా వాతావరణం తుఫాను వచ్చేముందు ప్రశాంతతలా .. కర్ఫ్యుని తలపిస్తూ .. మధ్య మధ్యలో మా వాహనం ఆపే BSF జవానులు.

ఏదో జరుగుతోంది.  మా ప్రయాణం ఏ మాత్రం సురక్షితం కాదని తెలుస్తోంది.  ఆపద ముంచుకొస్తోంది .. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి.

‘ క్యా భయ్యా క్యా హువా ‘  రవిత్రేయిని

‘ఏమో .. ఈ బండి జమ్మూ రిజిస్ట్రేషన్ కదా .. మనం ఉన్నది కాశ్మీర్లో .. ముందుకు వెళ్ళడం కష్టమే . ఎక్కడైనా ఆగాల్సిందే . ‘ డ్రైవర్ మధ్య మధ్యలో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడు తమ భాషలో.

‘అదేంటి .. నువ్వు ఈ రాష్ట్రానికి చెందిన  వాడివే కదా ..’ కవిత

రంజాన్ ఉపవాసంలో ఉన్న అతను నమాజ్ చేసుకోవడానికి ఎక్కడా కుదరలేదు. చివరికి కూర్చున్న చోటే నమాజ్ కానిచ్చాడు.  ఓ గ్రామంలో పరిస్థితి చెప్పి తమకి ఆశ్రయం కోరాడు.  ఎవరూ ఒప్పుకోలేదు.  చివరికి  ఓ ఇంటి పెద్ద సరేనన్నాడు.  మా వాహనం రోడ్డు మీద ఉంటే ప్రమాదమని రెండు ఇళ్ళ మధ్య ఉన్న సందులో ఎవరికీ కనపడకుండా పెట్టించాడు.  మా అందరినీ తమ ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రధాన ద్వారం మూసేశాడు. వీళ్ళంతా ముస్లింలు. ఇది ఏ తీవ్రవాదులకో సంబందించిన స్థలం కాదు కదా .. ! మమ్మల్ని ఇక్కడ బంధించారా .. ఏమో .. ఏ పుట్టలో ఏ పామున్నదో .. ఎవరికి  తెలుసు ? అసలు నిజంగా హర్తాల్ జరుగుతోందా .. ఈ డ్రైవర్ మధ్య మధ్య ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు.  తీవ్రవాదులతో కాదు కదా .. ? ఇందాక ఈ ఇంటి యజమాని చెప్పినట్లు మేము దాటి వచ్చిన ఆ గ్రామం పాకిస్తానీ ఉగ్రవాదుల్ని కాల్చివేసిన ప్రదేశమేనా ..? మదిని తొలిచేస్తూ ..

మేం క్షేమంగా ఉన్నామా .. లేక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా .. అనుమానపు చూపులతో మేం.  డ్రైవర్ జమ్ముకి చెందిన ముస్లిం, ఈ ఇల్లు కాశ్మీరీ ముస్లిం వ్యక్తిది. మేమంతా హిందువులం . తప్పదు .. ఇప్పుడు
ఏమనుకొని ఏమీ లాభం లేదు.  ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏది జరిగితే అది జరుగుతుంది అని మమ్మల్ని మేం సన్నద్మము చేసుకుంటూ .. ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతూ .. గుండె దిటవు చేసుకుంటూ ..

‘ఈ ప్రాంతంలో వాళ్లకి హిందువులంటే గిట్టదట ‘  ఏదో గుర్తొచ్చినట్లు మృదుల చెవిలో గొణిగింది సంగీత.

‘చుప్’   కళ్ళతో వారిస్తూ .. మృదుల

భారత్ -పాకిస్తాన్ ల మధ్య జరిగిన మూడు యుద్దాలకు, కాశ్మీరీ లోయలో ఉగ్రవాదానికి మా ఈ విపత్కర పరిస్థితికి మేమే కాదు మాలాంటి ఎందఱో పర్యాటకుల ఇబ్బందులకు   కారణం కాశ్మీరు వివాదమే.  కాశ్మీరు మనదేశంలో అంతర్భాగం అని మనం అనుకుంటున్నాం.  పాక్ లో ఉన్న కాశ్మీరి భూభాగాన్ని  పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం.  మన లాగే  పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ తన దంటున్నారు.  భారత్ లో ఉన్న కాశ్మిరీ భూభాగాన్ని భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. మా ఈ స్థితికి మూలాలను వెతుకుతూ  నా ఆలోచనలు
kasmir9
మా బృంద సభ్యులంతా మనసులో ఏ భయాలున్నా కనిపించనీయకుండా ఆ ఇంటివాళ్ళతో మాట్లాడుతున్నారు.  ఆ ఇంటి పెద్ద అబ్దుల్లా చాల స్నేహంగా ఉన్నాడు.  గలగలా మాట్లాడుతున్నాడు.  లోపలున్న భార్యని, కోడల్ని , కూతుర్ని పిలిచి మా విషయం చెప్పాడు. మేం హైదరాబాద్ నుండి అని చెప్పగానే చాలా ఆశ్చర్యం వారిలో.  అంత  దూరం నుండి చూడడానికి వచ్చారా.. అందులోనూ అంతా ఆడవాళ్ళు అని .  ఇంటి యజమాని తమ్ముడు హైదరాబాదులోనే  మిలిటరీ శిక్షణ తీసుకున్నాడని వచ్చేటప్పుడు చేతి గడియారాలు తెచ్చాడని చెప్పారు. వాళ్ళ మాటల్లో హైదరాబాద్ అంటే అభిమానం కనిపించింది.  అంతా కుర్చోన్నాం.  సుహృద్భావ
వాతావరణంలో సాగుతున్న సంభాషణల మధ్య నిశ్చలంగా ఉన్న బావిలో రాయి వేసి కంపనాలు సృష్టించినట్లు అయింది మా పని మాలిని కొద్దిగా పక్కకు వెళ్లి చేసిన ఫోన్ తో.

మాకు ఎదురైన క్లిష్ట పరిస్థితి, మేం తలదాచుకున్న విధం, మేమున్న ప్రదేశం, ఇంటి యజమాని పేరు అన్నీ వాళ్లయనకు  ఫోన్ చేసి చెప్పింది.  ఎందుకయినా మంచిదని.  ఆ ఇంటి వారి మొహాల్లో మారిన రంగులు. భ్రుకుటి  ముడుస్తూ పెద్దాయన.  మమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తూ .. అసహనంగా కదులుతూ .  ముక్కూ మొహం తెలియని వారికి ఆశ్రయం ఇచ్చి తప్పు చేశామా అన్న భావన వారి కళ్ళలో ప్రతిఫలిస్తూ ..
సహజమే కదా .. వారిని తప్పుపట్టలేం.  అప్పటివరకూ మాకు తెలిసిన హిందీలో మాట్లాడిన  మా మాటలు విన్న వారికి ఒక్క సారిగా తెలుగు వినడం అది వారికి అర్ధం కానిది కావడం, మధ్య మధ్యలో వారి ఉరి పేరు, ఇంటి యజమాని పేరు రావడం అకస్మాత్తుగా వారి అనుమానానికి కారణమయ్యి ఉండొచ్చనిపించింది .  పురుషులు లేకుండా మీరే వచ్చారా అని మమ్మల్ని ఆశ్చర్యంగా, అబ్బురంగా.. ఆరాధనా పూర్వకంగా చుసిన ఆ ఆడ వాళ్ళలో కన్పిస్తున్న భయం ఆందోళన…  ఈ సంకట పరిస్థితినుండి ఎలా బయటికి రావాలి..  తూటాల్లా తాకుతున్న చూపులనుంచి ఎలా తప్పించు కోవాలి

‘హైదరాబాద్ లోను ఇంకా  చాలా ప్రాంతాల్లోనూ ఉర్దూ మాట్లాడతారు.  అదే మీతో మాట్లాడాం.  మా రాష్ట్రం లో మా మాతృభాష తెలుగు. మేం ఇంట్లో మాట్లాడేది తెలుగులోనే.   ఇక్కడ అలజడుల గురించి వార్తల్లో చూస్తే మా వాళ్ళు కంగారు పడతారు కదా అందుకే మేం అంతా క్షేమంగా ఉన్నాం.  మా గురించి ఆందోళన వద్దు. ఓ పెద్ద మనిషి పెద్ద మనసుతో మాకు ఆశ్రయం ఇచ్చారని మాలిని వాళ్ళాయనకి చెప్పింది’ అని చెప్పాను .

అవునన్నట్లుగా తలలూపారు మిగతావాళ్ళు.  మా అందరినీ నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసిన ఆ ఇంటి పెద్ద, ఇతర కుటుంబ సభ్యుల మొఖాల్లో ప్రసన్నత నిదానంగా చోటు చేసుకుంటూ.. హమ్మయ్య వాళ్ళు మామూలయ్యారు అనుకున్నాం.  కాసేపు మాట్లాడిన తర్వాత అత్తా కోడళ్ళు సాయంత్రపు పనిలో నిమగ్నమయ్యారు.

ఆ పెద్దాయన కాశ్మీరీల పేదరికం, పిల్లల చదువు, పాకిస్తానీ ఉగ్రవాదులు స్థానికులను ప్రేరేపించి, డబ్బుల ఎర చూపి అక్కడి  యువతకి శిక్షణ ఇస్తున్నారని,  ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని దాదాపు 50 వేల మంది
ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు.   1990 తర్వాత తీవ్ర వాదం వల్ల హిందువులపై దాడులు పెరగడంతో హిందువులు కాశ్మీరు ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు గుప్పెట పట్టుకుని పోయారని, ఇప్పుడు 5% కూడా హిందువులు లేరనీ అన్నాడు.  ఇప్పుడు తమ గ్రామంలోనూ ఒకే ఒక కాశ్మీరి పండిట్ కుటుంబం ఉందనీ తాము ఎంతో స్నేహంగా ఉంటామని చెప్పాడు.  కాశ్మీర్ భూభాగంలో కొంత ఆక్సాయ్ చిన్ భాగం చైనా అధినంలో ఉందనీ .. పాకిస్తాన్ ఆక్రమణలో ఆజాది కాశ్మీర్ ఉందనీ, ఆ బందులు, హర్తాల్ లు.. కాశ్మీర్ లోయ దద్దరిల్లి పోవడం .. పాలకులు  ప్రజల మనో భావాల్ని పట్టించుకోకపోవడం గురించి చాలా చెప్పాడు.

భారతసైన్యం వేరు, కాశ్మీరు ప్రజలు వేరు అనే స్థాయిలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. భద్రతా బలగాలు మా  పాలిట యమకింకరులుగా తయారయ్యాయి. అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రజల మనోభావాలను పట్టించుకోరు.  మా పాలకులకి ప్రజలని సానుకూలంగా మలుచుకోవడం తెలియదు. ఉత్తర,దక్షిణ కాశ్మీరు జిల్లాల్లో మునుపెన్నడూలేని రీతిలో ప్రజలు భద్రతా బలగాలపై విరుచుకు పడుతున్నారు. మేం  ఉగ్రవాదం మినహా జీవితంలో సుఖం, సంతోషం, సమైక్య జీవనం, విద్య, విజ్ఞాన వినోదాలు వంటి వాటితోపాటు సామాజిక జీవితాన్ని కోల్పోతున్నాం.  రోడ్డుపై వెళ్ళే ఎవరికీ భద్రత లేదు. మా పిల్లల  చదువులు కొండెక్కాయి.  ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. సాయంత్రమైతే భయంగా ఇంట్లోనే ఉండిపోవాలి. అర్థ రాత్రి తలుపులు తట్టేది ఉగ్ర వాదులో, పోలీసులో తెలియదు, ఒకరికోసం ఒకరు వెతుక్కుంటూ వస్తారు. ఇద్దరివల్లా చిత్రహింసలకు మేం గురికావల్సిందే. ఇంకా చెప్పాలంటే కాశ్మీరులో మత కలహాలు లేవు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకే పోరు. ఎప్పుడో ఒకప్పుడు ఈ  మంచుపర్వతాలు బద్దలై, ఆ మంటలు ఎప్పుడు భగ్గున భారత ప్రభుత్వాన్ని చుట్టుముడతాయా ? అని పాకిస్థాన్‌ కాచుకుని కూర్చుంది ఆవేదనతో చెప్పుకోచ్చాడతను.

అక్కడి వ్యవసాయం, పంటలు మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు మినహా మేం మాట్లాడింది తక్కువ.  అబ్దుల్లా ద్వారా కాశ్మీర్ బాహ్య సౌందర్యమే కాదు. ఆ ప్రజల అంత; సౌందర్యమూ  అర్థమయింది. కల్లోల  కాశ్మీర్ ని మరో కోణంలో చూసే అవకాశం కలిగింది .      దాదాపు నాలుగైదు గంటలు ఇట్టే కరిగిపోయాయి. మా అనుమానాలు, భయాలు నీలాకాశంలో ఎగిరిపోతున్న దూది పింజల్లా ఎగిరిపోయాయి.   ఆ ఇంటావిడ ఇచ్చిన కాఫీ మమ్మల్ని తేలిక పరిచింది.   బయటకు చూస్తే చీకటి ముసుగు వేస్తోంది.

ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు.  మా వాళ్ళంతా ఉపవాసంలో ఉంటారు కదా.  ఉపవాసం వదిలేముందు నమాజ్ కి వెళతారు.  ఆ తర్వాత భోజనం వేళ .. ఇప్పుడయితేనే మిమ్మల్ని ఎవరూ  .. పట్టించుకోరు.  ఎలాంటి అవరోధం కల్గించరు  అని చెప్పాడు అప్పుడే వచ్చిన వాళ్ళబ్బాయి ఇంతియాజ్.  దాదాపు మరో రెండున్నర గంటలు  ప్రయాణం చేస్తే కాశ్మీరు లోయ వదిలి జమ్మూ ప్రాంతంలోకి అడుగు పెడతారు అని డ్రైవర్కి జాగ్రత్త గా తీసుకెల్లమని జాగ్రత్తలు జెప్పాడు అబ్దుల్లా. ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపి, నిన్న మేం కొన్న వాటిల్లోంచి గిఫ్ట్ ఇవ్వబోతే వద్దని వారించాడు పెద్దాయన. అయినా వినకుండా మాదగ్గర ఉన్న చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ , గాజులు, పర్సులు ఇచ్చాం.

మా ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చిన విషయం,  హైదరాబాద్‌లో  55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా 1980లో మత కల్లోలాల్లో జరిగిన భయంకరమైన హింసని చూసి,  ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోన్న విధం చెప్పాం.

అందరం భాయీ భాయీ గా ఉండాలనే వాదాన్ని ప్రోత్సాహిద్దాం. దేశమంతటా వ్యాపింపజేద్దాం అంటూ మరో మారు ఆ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని, వారి మానవత్వాన్ని అభినందించి బయలుదేరాం .

 

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

  వి. శాంతి ప్రబోధ

 

మన తరానికి జాషువా నేర్పిన పాఠం ఇదీ!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

“జీవితం నాకు ఎన్నో పాఠాలు  నేర్పింది.  నా గురువులు ఇద్దరు  – పేదరికం – కులమత భేదం .  ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు .  దారిద్ర్యాన్ని , కులమతాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను.  అయితే నా కత్తి కవిత ” అంటాడు జాషువా. 
అట్టడుగు జీవితాల హీన , దీన స్థితిని స్వయంగా అనుభవించి మనసులో పడ్డ ఆవేదననూ , ఆర్తినీ కవిత్వ రూపంలో ఆవిష్కరించిన ఆధునిక యుగపు మహాకవి జాషువా.  దారిద్ర్యం , అంటరానితనం , ఆర్ధిక అసమానతలు, వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ, కర్మ సిద్ధాంతాలు వీటన్నిటితో  సతమతమయిన జాషువా, తన తోటివారిని చూసి తిరుగుబాటు చేసి వ్యవస్థను నిలదీసి మానవ విముక్తికి, ఉన్నతికి కవిత్వాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్న సామాజిక దార్శనికుడు.   బిరుదులూ, పురస్కారాలూ ఎన్ని అందుకున్నా సమతా ధర్మాన్ని , సమతా భావనను దర్శించిన క్రాంతి కవి జాషువా.  ప్రాచీన భారతీయ వైభవాన్ని వేనోళ్ళ కవులు స్తుతిస్తున్న ఆ రోజుల్లో తన నిత్య జాగృత కవితలద్వారా ఎప్పటికప్పుడు వర్ణ వ్యవస్థ వైకల్యాన్ని మతాంధ మనస్తత్వాన్ని, సాంఘిక దురాచారాల్ని, స్త్రీల స్థితిని ఎత్తి చూపి ఎలుగెత్తి చాటిన నవయుగ కవి చక్రవర్తి జాషువా.
అందుకు ఆయన ఎన్నుకున్నది సంప్రదాయబద్దమైన చందం. వస్తువుగా తీసుకున్నది సార్వకాలిక సామాజిక ధర్మ ప్రతిష్టాపన.  కులమతాల కుళ్ళుకు అతీతంగా కవిత్వానికి పరమార్ధం ప్రయోజనాన్ని నిర్దేశించడం ఆయన కవితల ఉద్దేశం .  కులము , కట్టుబాట్లు క్రౌర్యాన్ని, కాటిన్యాన్ని అంతగా చీత్కరించిన కవి మనకు ఆధునిక కాలంలో కనిపించరు.  అభ్యుదయ కవితాయుగంలో శ్రీ శ్రీ గేయంతో సాధించింది జాషువా చాల ముందుగానే పద్యంతో సాధించారని ఓ సందర్భంలో అన్నారు సినారె.
“కసరి బుసగొట్టు అతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు ”  అన్నప్పుడు ఆయన వ్యక్తం చేసింది తననుభవించిన బాధనే కాదు .  ఆనాటి ఆ స్థితిపై అసమ్మతిని.  విద్యాగంధం, సంస్కార సంపద లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన జాషువా జీవితంలో తాను అనుభవించిన అవమానాల్ని , తిరస్కారాన్ని అధిగమిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే కాకుండా తన కవితకి ఆత్మాశ్రయ రూపం ఇవ్వకుండా సాధారణీకరించడం, భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో వస్తాశ్రయ కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
“ప్రతిమల పెండ్లి చేయటకు వందలువేలు వ్యయించుగాని
దుఃఖ మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్య విహీన క్షుత్తులారునే !
అంటూ గబ్బిలంలో పరమ శివునికి పంపు కున్న సందేశంలో దరిద్రులపై దయ చూపని, దైవపూజలని, హృదయ దౌర్భల్యాన్ని, భావ దారిద్ర్యాన్ని ఈ కవి క్షమించలేక పోవడం కనిపిస్తుంది.
‘గబ్బిలం’  కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో నింపుకుని చేసిన రచన.  ఇందులో నాయకుడు పరమ దరిద్రుడు.  క్షుద్భాధా  పీడితుడు.  సంఘం వెలివేసిన వాడు.  ఈ భేదం కావ్య వస్తు రూపాన్నే మార్చేసింది.  ఇంట్లో చీకట్లో కూర్చొన్న దీనుడైన , దరిద్రుడైన వ్యక్తి తలెత్తితే  ఓ మూలన గబ్బిలం కనిపించింది.  అతడు తన బాధను దానితో చెప్పుకుంటాడు.  కైలాసంలో  ఈశ్వరునికి తన కథ నివేదించమని వేడుకుంటాడు.  ఇది సాగినంతమేర కనబడే దృశ్యాలు దేశం , చారిత్రక , సామాజిక  స్థితిగతులు.  ఈ సంవిధానం ఎంతో శిల్పవంతంగా ఉంది. కరుణరసం నిండి ఉంది.  కన్నీటి కథకి ఆర్ద్ర హృదయం జత పరచిన మనోజ్ఞ కావ్యం గబ్బిలం .
సాంఘిక న్యాయసాధన నా జన్మహక్కు అనే కృత నిశ్చయంతో ఈ ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని , కావ్యలోకంలో  ‘కొత్త లోకం ‘ సృష్టించాడు జాషువా.  ఈ నీచ నికృష్ట నియంతృత్వ బందురమైన పాతలోకానికి బదులు కొత్త లోకాన్ని ప్రసాదించమని ‘కొత్తలోకం’లో ఆర్దిస్తాడు.  ఆ లోకం ఎలా ఉండాలో చూపిస్తాడు.  జాషువా ‘కొత్తలోకం’ ఒక జీవత్కార్యం.  సామాజిక కావ్యం.  అరుదైన రసవత్కావ్యం.  ఒక కొత్త సాంఘిక వ్యవస్థ కోసం ఆయన పడిన తపన, ఒక విన్నూత్న మార్పు కోసం ఆయన కన్న కళలు , సామాజిక చైతన్యం కోసం ఆయన కనబరిచిన ఆతురత ఆయన  ప్రతి పద్య పాదంలోనూ ధ్వనిస్తుంది.  నినదిస్తుంది.
hyf02VS-gurram-_HY_1537788e
ఆత్మీయాంశతో కూడిన కావ్యం ‘ఫిరదౌసి’.  తండ్రికి తగ్గ కూతురు ఫిరదౌసి కుమార్తె.  ఆమె పాత్ర చిత్రణ , స్త్రీ స్వభావ నిరూపణలో జాషువా చూపిన మెలకువ ‘ఫిరదౌసి ‘లో తెలుస్తుంది.
‘ముంతాజ్ మహల్ ‘ లో ముంతాజ్ సౌందర్య వర్ణనకి అవకాశం ఉన్నా కూడా ఆయన శృంగార వర్ణన చేయలేదు .  ముంతాజ్ – షాజహాన్ల మధుర ప్రణయాన్ని ఔచిత్యంతో, భావనా బలంతో, శబ్ద సౌందర్య వ్యంగ్య స్పూర్తితో అవసరమైనంత వరకే వర్ణించిన తీరు అనితర సాధ్యం .
జాషువా తన భావాలను ఎంత తీవ్రంగా వ్యక్తం చేసినా సమాజంలోని ఏ  వర్గానికీ దూరం కాలేదు.  పైగా అందర్నీ స్పందింప చేశాడు .  అది ఆయన చైతన్య స్థాయికి నిదర్శనం.  జాషువాకి కుల ద్వేషం లేదు.  అందుకే ఆయన ” మతపిచ్చి గాని, స్వార్ధచింతన కాని నా కృతులకుండదు ” అని చెప్పుకోగలిగారు.  జాషువా కవితా చైతన్యం సంకుచితంగా ఆగిపోకుండా ఒక విశాల పరిధిలో విస్తరించి ఒక బాధ్యతాయుతమైన పరిణామాన్ని పొందింది.
‘గబ్బిలం’ కావ్యంలో జాషువాలో ఒక హేతువాది కనిపిస్తాడు.  కాందిశీకుడు , కొత్తలోకం కావ్యాల్లోనూ ఆయన హేతుదృష్టి   కనిపిస్తుంది.  ఆయన కవిత్వంపైన ఆనాటి హరిజనోద్యమం , సహాయ నిరాకరణ , పుల్లరి సత్యాగ్రహం , ఆంధ్రోద్యమం మొదలైన వాటి ప్రభావం కనిపిస్తుంది.  అలాగే ఆయన ఆస్తికుడా, నాస్తికుడా అనే సంశయం కలుగుతుంది.  ఆయన రచనల్లో దళితవాద, స్త్రీవాద శబ్దాలు ప్రయోగించక పోయినా ఒక దళితవాదిగా, స్త్రివాదిగా అప్పుడప్పుడూ దర్శనమిస్తాడు.
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే న
న్నేవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్దులు ఘంటమమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్”
అనే జాషువా ఏనాడూ లోక విపరీత బుద్ధులకు వేరవలేదు. బెదరలేదు.  ఆయన వజ్ర సంకల్పం చెదరలేదు.  రానురాను మరింత తీవ్రమైంది.  ఆ స్వభావమే పై పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.
“యుగ యుగమ్ముల  భారతీయుడను నేను ” అంటూ సగర్వంగా చాటుకున్న జాషువా ఆ తర్వాతి కాలంలో తన పరిధిని విస్తరించుకున్నాడు.
‘కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడను నేను ‘
అంటూ తన విశ్వ జనీన దశకు చేరుకున్నాడు. ఆయనే చెప్పుకున్నట్లు   “వడగాడ్పు నా జీవితమైతే – వెన్నెల నా కవిత్వం ‘  అన్న  మాటలు అక్షర సత్యం.
 
వి. శాంతి ప్రబోధ
హైదారాబాద్ లో ఈ వారం 26 న జాషువా జయంతి సభ జరుగుతున్న సందర్భంగా…
MaNaSu Invitation for Jashuva book release

ఈ కర్రే తమ్ముడు నా కొద్దు

prabodha

 

ది పల్లె కాదు.  అట్లాగని పట్నమూ కాని ఊరు.  ఓ చిన్నపాటి ఇంగ్లిష్ మీడియం బడి ఆవరణ.  ఆ బడి లాగే ఆ ఆవరణలో  ఎదుగుతున్న చిన్న చిన్న చెట్లూ .. వాటి నీడనో , స్కూల్ బిల్డింగ్ నీడనో వెతుక్కొని   తమతో తెచ్చుకున్న లంచ్ బాక్స్ లతో కుస్తీ పడుతూ గుంపులు గుంపులుగా పిల్లలు.   కొందరు తల్లులు తాము తెచ్చిన బాక్స్ లు విప్పుతూ.  మరి కొందరు పిల్లలకి తినిపిస్తూ.  తిననని మారాం చేసే పిల్లలని బతిమాలుతూ.. కోప్పడుతూ ..భయపెడుతూ.. అంతా కోలాహలంగా ,  సందడిగా ఉంది అక్కడి వాతావరణం.

కొందరు తమ వారి రాక కోసం ఆకలితో బిక్కమొహాలేసుకొని ఎదురుచూస్తూ .. మరి కొందరు హడావిడిగా లోనికి బాస్కెట్తో  వస్తూ …

ఎండావానా పట్టని  కొందరు  పిల్లలు ఎండలోనే కూర్చొని  తింటూ ఉంటే   నీడలో కూర్చోండి అంటూ వాళ్ళని విజిల్ వేసి లేపుతూ పి.ఇ.టి. ప్రభాకర్.

ఇంకా ఫిబ్రవరి నెల కూడా రాలేదు.   ఎండ మండి పోతోంది మనసులో అనుకోని బాదాం చెట్టు నీడన కూతురిని కూర్చో బెట్టి తెచ్చిన లంచ్ బాక్స్ తెరచింది  రేఖ.   “ఛి ..గిదేందే..గీ కూర గిట్ల కర్రెగున్నది ..? ” ముఖం చిట్లించి అసహనంగా ప్రశ్నించింది ఆరేళ్ళ హానీ.  వాళ్ళమ్మ నీ .. అమ్మ తెచ్చిన లంచ్ బాక్స్ లోని కూరనీ  మార్చి మార్చి చూస్తూ..

“ఏమయింది మంచిగనే  ఉన్నది  కద”  అంది రేఖ తను తెచ్చిన అన్నం, పుంటికూర పప్పు ప్లేట్ లో పెట్టి కలుపుతూ

“హూ..కర్రె..గ.. యాక్, నాకొద్దు” అంటూ పెదాలు బిగించి నోరు రెండు చేతులతో గట్టిగ మూసుకుంది హానీ.

“పుంటికూర  పప్పు ఇట్లనే ఉంటది రా . అయిన ఇది కర్రెగ లేదు .  పచ్చగ ఉన్నది. ఆకులు పచ్చగ ఉంటయి నీకు తెలుసు కదా..! పుంటికూర  ఆకులు ఉడికినయి కదా అందుకే ఇట్లా కనిపిస్తాంది .. దా . తిందువు” కలిపిన అన్నం ముద్ద హానీ నోటి దగ్గరకు తెస్తూ..అనునయిస్తూ చెప్పింది రేఖ.

అమ్మ అనునయిస్తూ చెబుతున్న మాటల్ని ఏ మాత్రం చెవి కెక్కించుకోని హానీ తల్లి చేతిని పక్కకు తోసేసింది.  బడి ఆవరణలో ఉన్న అందరి కేసి అటూ ఇటూ చూసింది. తన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ కుర్చున్నారో కళ్ళతో వెతికింది.  అంతలోనే  దూరంగా కూర్చొన్న మాలతిని కొడతానని చూపుడు వేలితో బెదిరిస్తూ.. చెట్టు మీద ఉన్న కాకిని రా రమ్మని చేతివేళ్ళు ఉపి  ఆహ్వానిస్తూ ..

ఈ పిల్ల ఒక్క క్షణం కుదురుగా ఉండదు మనసులో అనుకున్న రేఖ “మా హానీ గుడ్ గర్ల్ కద! మంచిగ అందరి కంటే ముందు తింటదట ” కూతురిని బుజ్జగిస్తూ .

“ఆ…  నేను తిన.  నీకు తెల్సు గద ..! కర్రెగుంటే నేను తిననని.  ఎర్క లేనట్టు మల్ల  ఈ కూర చేసినవ్?”  తల్లి కేసి కోపంగా చూస్తూ ఆమె చేతిలోని ప్లేట్ ను పక్కకు తోసేసింది హానీ .
“అది కాదురా బేటా, ఈ కూరల మస్తు బలమున్నది.  నువ్వు పెద్దగ ,  అగో ఆ చెట్టు లెక్క పెద్దగ అవుత  అంటవు కద.  అందుకె నువ్వు పెద్దగ కావాల్నని ఈ కూర చేసిన.” వస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ రేఖ.

” ఊహు .. కాదు  ..ఈ చెట్టుకంటే చా..న పెద్దగయిత” అని రెండు చేతుల్నీ ఆకాశంకేసి సాగదీసి చూపుతూ చెప్పింది.   ” కానీ గీ కూర ..కర్రే కూర అస్సస్స్ ..లుకే తిన.” ఖచ్చితంగా తల్లి కళ్ళలోకి చూస్తూ అని,   అక్కడి నుండి లేవబోయింది హానీ.

“ఏమయింది రేఖా ,   హానీ తిన్టలే.” కొంచెం ఆవలగా కూర్చున్న స్నేహ వాళ్ళ అమ్మ సరళ.  ఆ దగ్గరలో ఉన్న మిగతా పిల్లలూ, వాళ్ళ వాళ్ళు హానీ కేసి చూస్తూ

“ఈ రోజు పప్పుల కొంచెం ఆకు ఎక్కువ అయింది. కూర నల్లగా ఉందని తినదట.  పేచీ పెట్టింది” చెప్పింది తనేదో తప్పు చేస్తున్నట్లుగా లో గొంతుకతో  రేఖ.

“నల్లగానా..?” ఆశ్చర్యంగా అంది సరళ.

“అవును ..ఈ మధ్య ఇట్లనే  చేస్తాంది. ఏదయినా నల్లగ ఉన్న, ముదురు రంగుల్లో ఉన్న కర్రెగ ఉన్నయ్..  కర్రెగ వున్నయ్.. నా కొద్దు అంటది. ఎట్ల తిన బెట్టల్నో తెలుస్తలేదు ”  బాధగా విషయం చెప్పింది రేఖ.

“అవునా!” మరింత ఆశ్చర్యంగా చూసింది స్నేహ వాళ్ళ అమ్మ సరళ.

లేచి నుంచొని అటు ఇటు చూస్తూ ఉన్న హానీని చేయి పట్టి లాగి కూర్చోపెట్టి ” ఎట్లరా..తినకుంటే .. కొంచెం పెరుగన్నమన్న తిను” కొంచెం కటువుగా  అని పెరుగన్నం తినిపిస్తూ, ” నేరేడు పండు తినది. బీట్రూ ట్ దగ్గరకు రానీయది.  డార్క్ చాక్లెట్ తినది.  వాటి రంగు తనకి అంటుకుంటది అంటది”  కూతురి ప్రవర్తన గురించి బెంగతో చెప్పింది రేఖ.

“అట్లా అనద్దు.  అన్ని తినాలె.  అగొ ఆ నల్ల  కుక్క చూడు నీ కెల్లి చుస్తాంది. నీ అన్నం గుంజుక పోయి  తింటదట .  లేకుంటే అగో అటుజూడు చేట్టుమిది కాకి అన్నం కోసం కావు కావు అనుకుంట దాని దోస్తు లందరినీ పిలుస్తాంది. అవచ్చినయంటే నీ కింత గూడ తిననికి ఉండది ” సరళ

‘ఆ తినని. కర్రెగున్నయ్ తింటే నీ లెక్క, ఆ కాకి లెక్క, కుక్క లెక్క  కర్రేగనే  అయితరు.” సరళకేసి అసహనంగా చూస్తూ అని,

“నువ్వు తినకే.. ఆ .. ”  స్నేహకి  సలహా ఇస్తూ పెరుగన్నం గబగబా మింగేసింది హానీ.

ఆ మాటలకి తలకొట్టేసినట్లయింది రేఖకి.  చిన్నపిల్ల తెలియక అట్లా మాట్లాడింది ఏమనుకోవద్దని సరళకి చెప్పి అక్కడినుండి బయట పడింది రేఖ.  స్నేహితులతో కలసి ఆటల్లో మునిగి పోయింది హానీ

                                                            ***

 పిల్లలకి కాలేజ్ టైం అవుతోంది.  దోశ వేస్తోంది శారద.   ” అన్నయ్యల కంటే నేనే ముందు తయారయిన కదా ఆంటి”  అంటూ వచ్చింది  స్నానం చేసి స్కూల్ కి రెడీ అయిన హానీ.

“ఆ … ఏమి కాదు. మేమే ముందు” అంటూ శారద చిన్న కొడుకు హానీని ఉడికిస్తున్నాడు.

“ఆంటీ నేను ఎట్ల ఉన్న?” శారద చేయి పట్టి లాగుతూ అడిగింది హానీ.

“ఎట్లుంటవ్?  హానీ పాప లెక్క ఉంటవ్ ” తన పనిలో నిమగ్నమైన శారద.

” ఆ.. అట్ల కాదు మంచిగ చెప్పు గద.. ” గోముగా అన్నది హానీ శారద చీర కొంగు పట్టి లాగుతూ .

“ఓ యబ్బో!  చాలా సోగ్గా ఉన్నావ్ ” అన్నది శారద హాని కేసి చూసి నవ్వుతూ

“ఉహూ .. సోగ్గా కాదంటి, చా..నా తెల్ల..గ, అందంగ ఉన్నకద” కిటికీ అద్దంలోంచి తన రూపాన్ని అటు ఇటు తిప్పి చూసుకుంటూ హాని.

” ఆ చాలా అందంగా ఉన్నవ్, తెల్లగా ఉన్నవ్ గనీ దోశ తిన్డువ్ రా “తన పిల్లలకి దోశ పెడుతూ హానీ ముందు కూడా ప్లేట్ పెట్టింది శారద.

“ఛి..చీ గిదేం దోశ?  ఇట్ల.. గింత కర్రెగ.. చీ.. అసలు ఇది దొశనెన ? ఈ కర్రెటిది నాకొద్దు” అంటూ ప్లేట్ ను   తన దగ్గర నుండి అవతలికి తోసేసింది.  అది కాస్తా మంచి నీళ్ళ గ్లాసుకు తగిలి కింద పడింది.

“ఏయ్ దయ్యమా , నీళ్ళు పడేసి మా అమ్మకు డబల్ పని పెడతవ ?” చెయ్యి లేపి కొట్టినట్టు చేశాడు రవీంద్రనాథ్

“ఆ చూడు ఆంటీ, చిన్నన్న ఏమంటున్నడో , నేనేమన్న దెయ్యాన్న, అట్ల కర్రేగున్నన..” కోపంతో మింగేసేలా చూస్తూ

“అరె, ఎందుకుర దాన్ని ఏడిపిస్తరు. చిన్నపిల్ల ” హానికి వత్తాసుగా శారద.

“మా దోశ తెల్ల..గ మాం.. చిగ ఉంటది తెల్సా..”  తినే  వాళ్ళని  కవ్విస్తూ చేతులు ఊపుతూ, కళ్ళు తిప్పుతూ హాని.

“మా దోశ చాల బలం అందుకే నేను ఇంత పెద్దగ అయిన ” అన్నాడు శారద పెద్ద కొడుకు మంజునాథ్ .

“మీ అమ్మకి చెప్తా, మీకు కూడా మా దోశ అసొంటిదే చెయ్యమని” హానీ ని ఉడికిస్తూ చిన్న కొడుకు రవీంద్రనాథ్.

“ఆ.. మాకేమొద్దు.  గా..కర్రే దోశలు నేనసలే ముట్ట. నువ్వే తిను బగ్గ తిను. ఇంకా బగ్గ కర్రెగవ్వు” ఉక్రోషంతో హాని.

మినపపప్పు, రాగులతో చేసే దోశ దానికి కర్రేగా కనిపిస్తోంది. అదే కాదు ఏది నల్లగా ఉండడం ఇష్టపడని హానీ గురించి  స్నేహ వాళ్ళ అమ్మ నిన్న కలిసినప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శారదకు.  ఆవిడ అన్నట్లు ఇది ఒక డిజార్డరా ..! ఆలోచనలో శారద.

మంజు ఏమన్నాడో గాని..”మీరే బ్లాక్ ..మీ బాయ్స్ అంత బ్లాక్.. చూడు కర్రెగ ఆ గడ్డం”  ఉడికి పోతూన్న హానీ.

నిజానికి మంజునాథ్ తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉంటాడు కాని అది ఒప్పుకోదు ఆలోచన నుంచి బయట పడ్డ శారద.

“గర్ల్స్ వైట్ ..ఇంకా వైట్ కావాల్నని , నేనయితే రోజు పొద్దున్న, సాయంత్రం క్రీం రాసుకుంట తెల్సా..” గొప్పగా టేబుల్ ఎక్కి నుంచుంటూ హానీ .

దాన్ని ఇంకా ఆట పట్టిస్తూ “ఛీ . యాక్ ..పెండ ..  పెండ పుసుకున్నావా ..మేమట్ల పూసుకోం ”  మొహమంతా అసహ్యించుకున్నట్లు పెట్టి రవీంద్రనాథ్

“హూ..నీకేం తెల్వది…టి.వి.ల చూడలేదా? చూడు టి.వి.ల మంచిగ కండ్లు పెట్టి చూడు ఆ క్రీం రాసుకుంటే కర్రేగున్నోల్లు తెల్లగా అయితరని తెలుస్తది నీకు.  ఇంక వైట్ గ కావాల్నని నేను, మా అమ్మ రోజు పూసుకుంటమ్.  కావాల్నంటే చూస్కో..నా కాడ  ఎంత మంచి వాసన అస్తున్నదో ..” గొప్పగా చెప్పి రవీంద్ర దగ్గరికి జరిగింది హాని.

“యాక్.. పెండ కంపు.” ముక్కు మూసుకుని  అన్నాడు మరింత ఏడిపిస్తూ.

“చూడు ఆంటి .. రవి అన్నయ్య ..” కంప్లైంట్ చేస్తుండగా..

“హానీ .. ఎక్కడున్నవ్ .. బడికిపోవ..?  టైం అయితాంది. జల్ది రా ”  తల్లి కేక. బడి నుండి వచ్చాక నీ పని చెప్తానుండు అన్నట్లు మంజునాథ్, రవీంద్రనాథ్ లను చూపుడు వేలుతో బెదిరిస్తూ .. హానీ పరుగెత్తింది .

***

రేఖకి నొప్పులోస్తున్నాయి. హానిని పక్కింటి వాళ్ళ  దగ్గర ఉంచి అంతా హాస్పిటల్ కి బయలు దేరారు.   తనూ వెంట వస్తానని మారం చేసింది హాని.  పుట్టగానే తమ్ముడినో చెల్లినో  ఎత్తుకోవాలని అనుకుంది .   ఇప్పుడు కాదు బుజ్జి తమ్ముడో , చెల్లొ  పుట్టగానే తీసుకు వెళతానని తండ్రి బుజ్జగించడంతో పాటు తల్లి అలా బాధపడటం చూడలేక పోయింది హాని.  అందుకే  సరే నని  ఒప్పుకుంది.   తమ్ముడు పుట్టాడని తెలియగానే హాస్పిటల్ కి వెళ్తానని చాలా గొడవ గొడవ చేసింది.  తెల్లవారే వరకూ చూడకుండా ఉండాలా అని వాపోయింది.  ఆ రాత్రంతా తమ్ముడితో మాట్లాడుతున్నట్లు , ఆడుకుంటున్నట్లు, వాడు తనని అక్కా అని పిలిస్తున్నట్లు, తమ్ముడిని ఎత్తుకున్నట్లు కలలు కంటూ కలత నిద్ర పోయింది.  లేవడంతోనే తమ్ముడి దగ్గరకి బయలుదేరింది.  వాడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని తహ తహ లాడింది.  ప్రెండ్ నీలిమతో నీకే కాదు నాకూ తమ్ముడున్నాడని గర్వంగా చెప్పాలనుకుంది.  లేక పోతే తన తమ్ముడిని ఎత్తుకుంట అంటే పడేస్తవ్ వద్దంటదా అనుకుంది.

రేఖ ఉన్న రూం ముందు హాని ని దింపి లోపలి వెళ్ళమని చెప్పి నర్సు చెప్పిన మందులు తేవడం కోసం ఫార్మసీ కి వెళ్ళాడు హాని తండ్రి.   ఎన్నో ఉహలతో, ఆలోచనలతో పరుగు పరుగున తల్లి ఉన్న రూం లోకి వెళ్ళిన హాని అట్లానే స్థాణువై నిలబడిపోయింది.  తల్లి ఒడిలో ఉన్నది తన  తమ్ముడా ..  ఉహు ..కాదు . తన తమ్ముడు టి. వి .  లో హగ్గీస్ యాడ్ లో ఉన్నట్లు లేడు. చ్చీ .. కర్రెగా  .. ఆ మొహం మీద ఇంకా కర్రె మచ్చలు .. ఉహూ వీడు నా తమ్ముడు కానే కాదు అనుకొంది. మరి ఎవరు మదిలో ప్రశ్నలు రేగుతుండగా

‘ వీడు  నాకద్దు..  వీడు నా తమ్ముడా ..  కాదు’  అరుస్తూ  తల్లి ఒడిలోంచి పసివాడిని తోసేసింది. తల్లి వొడిలో హాయిగా, వెచ్చగా నిద్రపోతున్న ఆ పసికందు  క్యార్.. క్యార్ అంటూ  ఏడుపు.    హాని ప్రవర్తనకు షాక్ అయింది రేఖ.  తమ్ముడిని తన వొడిలో చూసి అసూయ పడుతోందేమో అనుకుంది రేఖ .

” ఒరే బేటా !  అట్ల జేస్తవెందిరా ..వీడు నీ తమ్ముడురా.. ద..  దగ్గరకు వచ్చ్చి చూద్దువు’ అంటూ దగ్గరకు తీసుకోబోయింది.  ఆమె చెయ్యి విసురుగా లాగి ‘ ఈ కర్రోడు నాకొద్దు ‘ విసురుగా అంటూ మళ్లీ తల్లి దగ్గర నుండి తోయబోయింది హాని.  కోప్పడింది రేఖ .   వీడు నా తమ్ముడు కాదు.  నా కొద్దు అంటూ  ఏడుస్తూ ఒక్క ఉదుటున బయటకు పరుగెత్తింది.  మందులతో లోపలికి రాబోతున్న ఆమె తండ్రి ఏమైందిర హాని అని పిలుస్తున్నా పలకకుండా పరుగెత్తింది.  మందులు అక్కడ పెట్టి గబగబా బయటికి వెళ్ళాడు కూతురి కోసం.   అప్పుడే టాయిలెట్ నుండి బయటికొచ్చిన హాని అమ్మమ్మకి ఏమి అర్ధం కాలేదు.  మనుమరాలి కోసం కళ్ళతో వెతికింది.  దూరంగా ఏడుస్తూ కనిపిస్తూన్న మనుమరాలికేసి తనూ కదిలింది.

హానికి  ఆశనిపాతంలా తమ్ముని రూపం మెదులుతోంది కళ్ళలో.  అది జీర్ణించుకోలేక పోతోంది. నాకీ కర్రె తమ్ముడు వద్దు.  మచ్చల కుక్కలాగా ఉన్నడు. చ్చీ…  నాకొద్దు .  ఇంటికి తేవద్దు అని గోల గోల చేస్తోంది. ఏడుస్తోంది.   తండ్రి బతిమాలుతున్నా వినడం లేదు.  ఏడుపు ఆపమని  చెప్పి చెప్పి విసిగి ఒక్కటిచ్చాడు.  రెక్కబట్టి లోనికి లాక్కెళ్ళాడు. ఎవరు  ఏమి చెప్పినా  తమ్ముడిని అంగీకరించలేకపోతోంది.   పుట్టిన పిల్లాడినిచూసిన దాని కంటే కర్రే తమ్ముడు వద్దని హానీ చేస్తోన్న  గొడవ అందరినీ ఆందోళన పరుస్తోంది.  అప్పటి వరకు, ఏదయినా సరే బ్లాక్ వద్దు. వైట్ ముద్దు అనే హానీ,  బ్లాక్ వద్దు అంటుంటే సరదాగా తీసుకున్నారు.  దాని మాటలకు నవ్వుకున్నారు. కానీ, ఇప్పుడామె ప్రవర్తన చాలా  బాధ, ఆందోళన కలిగిస్తోంది ఆ తల్లిదండ్రుల్ని.

హానీ, వాళ్ళ అమ్మ, నాన్నఅంతా  చామన ఛాయలో ఉంటారు. కానీ, పుట్టిన తమ్ముడు మాత్రం మంచి నలుపు.  శరీరం పై చాల చోట్ల నల్లటి  చిన్న బిస్కెట్ అంతవి, శనగ బద్ద అంతవి మచ్చలతో చూడడానికి ఇబ్బంది కలిగిస్తూ వికారంగా.   నుదుటి పైన కుడి వైపు, ఎడమ వైపు దవడకు  పావలా బిళ్ళ అంత నల్లటి మచ్చలు  దట్టంగా ఉన్న వెంట్రుకలతో.  మంచి రాక పోయినా ఇవి వచ్చేస్తాయి ఎవరో పిలిచినట్లు అని గొణిగింది హానిని ఎత్తుకుంటూ  అమ్మమ్మ.    మా ముత్తాత లాగ  నలుపు, మచ్చలూ వచ్చాయన్నాడు హాని తండ్రి.  పిల్లాడిని చుసిన క్షణం రేఖ కూడా నివ్వెర పోయింది .  పుట్టిన పిల్లాడి రూపం  చూసి అందరికీ బాధగానే ఉన్నా, మగపిల్లాడు ఫరవాలేదులే అని సరి పెట్టుకున్నారు.  కానీ, హానీ మాత్రం సమాధాన పడలేక పోతోంది.  ఏడుస్తోన్న హానిని తీసుకుని అమ్మమ్మ వంట చేసి తెద్దామని ఇంటికి వెళ్ళింది.

“కర్రెగుంటే ఏమయితది?  నీ తమ్ముడు కాదా ,  నిన్ను అక్కా అంటడు .. నీ ఎనక ఎన్క  తిరుగుతడు. ముచ్చట్లు చెప్తడు.  మంచిగ ఇద్దరు ఆడుకోవచ్చు”  అంటూ నచ్చ జెప్పజుశారు అంతా.

“ఆ..నాకేమొద్దు  ఆ.. కర్రె తమ్ముడు” కోపంగా హానీ

“అట్ల అనోద్దురా..బేటా ..నీ తమ్ముడు నీ దగ్గరకు రాక ఎటువోతడు.    అక్క, అమ్మ, నాన్న అనుకుంట మనతోనే ఉంటడు.  మన ఇంట్లనే ఉంటడు.” అని నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తోంది అమ్మమ్మ.

“ఆ..మరి గప్పుడు మీరే అన్నరు కద… ఆ పిల్ల కర్రెగ కాకి లెక్క ఉన్నది.  వద్దని అన్నారు కద.” అమ్మమ్మని ఎదురు ప్రశ్నించింది హానీ.

“ఎన్నడన్ననే ..నాకేం సమజ్ గాలే.” తల గోక్కుంటూ , గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మమ్మ.

“అవునే ..గా పొద్దు మనం మామ కోసం పిల్లను జూడ బోయినం గద.. అప్పుడు ఇంటికొచ్చినంక నువ్వు అన్లే..” అమ్మమ్మ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ దొంగను పట్టుకున్న పోలీసులా రెట్టించింది హానీ.

బాల్కనీలొ నిల్చొని తల దువ్వుకుంటున్న శారద చెవిన పడ్డాయి ఆ మాటలు.  హాని మాటలకి కారణం బోధపడినట్లనిపించింది శారదకి.  అయినా !  రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు,  అంతా నలుపే. అంటే  వెనుకటి రోజుల్లో నలుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కావచ్చు.  అందుకే దేవుళ్ళు నలుపు రంగులో, దయ్యాలూ -భూతాలూ తెల్లటి రంగులో …  మరి తెలుపుకు ప్రాధాన్యత ఎప్పుడు, ఎలా మొదలయిందో.. శారద ఆలోచనల్ని భంగపరుస్తూ

“ఆ నువ్వయితే నీ ఇంటికి కర్రె కోడల్ని తెచ్చుకోవు గానీ నేను కర్రె తమ్ముడ్ని తేచ్చుకోవాల్నా..” ఏడుస్తూ హానీ అమ్మమ్మ కేసిన సూటి  ప్రశ్న అందర్నీ ఆలోచింపచేస్తూ..

 

వి. శాంతి ప్రబోధ