వాళ్ళు ముగ్గురేనా ?

Kadha-Saranga-2-300x268

‘‘ పులిమీదికెక్కి సవారిజేసుడు రాకుంటె, దాని ముంగటి కెందుకు పోవాల్నంట నేను. నిన్ను జూసి అది అయ్యో పాపం అని దయదల్చి తినకుంట ఊకుంటద’’ మసాజ్‌ టేబుల్‌ పై పడుకుని కళ్ళుమూసుకున్న చిత్రకళ ఈ మాటకి కళ్ళు తెరిచి చూసింది. యాదమ్మ చేతి వేళ్ళు చిత్రకళ వంటిపై, తమాషాగా నాట్యం చేస్తుండగా, నోటినిండా పాన్‌ నములుతూ, కొంచం గమ్మత్తుగా అందీ మాటలు యాదమ్మ. ఈ మాటలే కాదు వాటికన్నా ముందు ఆమె అప్పుడప్పుడూ చెబుతూ వుండే సరస జీవితం కూడా ఆమెనీ మధ్య నిలవనీయడం లేదు.  ఆ మసాజ్‌ టేబుల్‌ పై గంటో గంటన్నరో అట్లా వళ్ళంతా క్రీముపూసిన శరీరాన్ని ఆమెకి అప్పగించాక, ఆమె చేతి వేళ్ళ భాషనే కాదు, ఆమె మాటల హోరును కూడా విని మెల్లిగా అర్ధం చేసుకోవడం మెదలు పెట్టింది చిత్రకళ.
‘‘ యాదమ్మా! ఇట్లానే అందరితో మాట్లాడుతుంటావా?’’ అడిగిందోసారి.
‘‘ అందరు నీ లెక్కనే వుంటర? నేను జెప్తున్న. నువ్వింటున్నవ్‌. నా మాటలు నీకు సమజవుతున్నయి గాబట్టే నాకుబీ చెప్పబుద్దయితది.’’ అంది యాదమ్మ.
వట్టిమాటలే కదా అనుకుంటాం కానీ, మనకేం సంబంధం లేని మాటలు కూడా మన అంతరాంతరాళ లోకెళ్ళి, మనల్ని కల్లోల పరుస్తాయి.
దాదాపు నాలుగేళ్ళుగా ఆ జిమ్‌కి క్రమం తప్పకుండా వస్తుంది చిత్ర. దాన్లోనే వుండే స్పాలో తన అందానికి మెరుగులు దిద్దుకోవటంతో పాటూ , మసాజ్‌
చేయించుకుంటుంది. అందుకేనేమో ముఫ్పఏడేళ్ళ వయసులోనూ, ఇంకా యవ్వనపు మెరుపు ఆమెలో తగ్గలేదు.
యాదమ్మలోనూ ఏదో తెలీని ఆకర్షణ వుందనుకుంటుంది చిత్రకళ. రెండు చేతులకీ నిండుగా మట్టిగాజులు, చెవులకి పెద్ద దిద్దులు, ముక్కుపుడక, కాళ్ళకి
గంటీలు, గోళ్ళకి రంగు, అరచేతుల్లో అప్పుడప్పుడు ఎరట్రి గోరింటాకు, మధ్యమధ్య మెరిసే తెల్ల వెంట్రుకలతో ముడేసిన వత్తయిన జుట్టు, చామనచాయ
రంగు, వయసుతో పాటూ పెరిగిన శరీరపు బరువు, కళకళలాడే నవ్వు మొఖంతో పలకరించే యాదమ్మ,  సూటిగా, జంకుగొంకూ లేకుండా మాట్లాడటం చిత్రకళకి ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఆమెలా తను మాట్లాడగలనా, ఆమెలా నాజీవితం నా ఇష్టం మీకెందుకని అనగలనా? పైకి ఖాతరు లేనట్లుగా కనపడే, తనలోపల నిత్యం సుళ్లుతిరుగ్నుతూ వుండే ఆత్మనిందని ఆపగలనా? అనిపిస్తుంది యాదమ్మని చూసినప్పుడల్లా.

యాదమ్మ మొన్నామధ్యే కొడుక్కి పెళ్ళి చేసింది. వెంటనే కొడుకునీ, కోడల్నీ వేరుకాపురానికి పంపింది.
‘‘ అదేం, నీకొక్క కొడుకే కదా! ’’ అంది చిత్ర కొంచం ఆశ్చర్యంగా.
‘‘ గా రెండు అర్రల ఇంట్ల, తల్లి ముంగట పెండ్లాంతో సరసమేం జేస్తడు. అత్త ఆరడి బెడ్తదన్న నింద నాకెందుకు. కిందబడ్డ, మీదబడ్డ ఎవరి సంసారం వాల్లు
ఎల్లదీసుకొనుడు ఒక్కసిత్తం’’  అంది యాదమ్మ. ఆ మాటొక్కటే అంటే  చిత్రకళకి ఏమనిపించేది కాదు.

‘‘ నా కోసం నా ఇంటికొచ్చెటోడు నాకున్నడు. కోడలి పోరి ముందు నేనెందుకు నెత్తిదించుకొనుడు’’ అని కొంటెగా కన్నుగీటి నవ్వింది.

యాదమ్మది మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట దగ్గరి పల్లెటూరు. పురిటిలోనే ఐదారుగురు పిల్లలు చనిపోయాక, లేక లేక పుట్టిన పిల్లేమో, చిన్నప్పుడు
గారాబంగానే పెరిగింది. కూలిచేసుకు బతికే కుటుంబం కాబట్టి కాయకష్టం ఆమెకి కొత్తకాదు. యాదమ్మ పెళ్ళి నాటికే తల్లిదండ్రులిద్దరూ ముసలివాళ్ళయి
పోయారు. మరో కూలివాడితో ఆమె పెళ్ళయింది. అందరిలానే ఆమెకూడా భర్తతో పాటూ,  ఊరువిడిచి పెట్టి, కూలి పనులకోసం హైదరాబాద్‌ నగరానికొచ్చింది. అక్కడే ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు పనిచేసే భవంతులవద్దే, రేకులు, ప్లాస్టిక్‌ పట్టాలతో కట్టిన షెడ్లలో ఆమె కాపురం సాగింది. తొమ్మిదో అంతస్తు వద్ద, మోకులు కట్టిన ఉయ్యాలపై కూర్చొని పనిచేస్తున్న యాదమ్మ భర్త ఎట్లా  పడ్డాడో, కిందపడి అక్కడిక్కడే చనిపోయాడు ఓరోజు. ఏడాది కొడుకును వొళ్ళోవేసుకుని, గుండెలు అవిసేలా తలుచుకొని, తలచుకొని  ఆమె ఏడ్చింది. యాభయి వేలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నాడు కాంట్రాక్టరు.
యాదమ్మ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి  చేరింది. ఇప్పుడు కొడుకుతో పాటూ ముసలివాళ్ళిద్దరినీ పోషించే భారం ఆమె మీదే పడిరది. కూతురు బతుకు
బండలైపోయిందన్నదిగులు తో  యాదమ్మ తండ్రి ఏడాది తిరక్కుండానే చనిపోయాడు. ఉన్న ఊర్లో బతుకులేక, ఊర్లోవాళ్ళతో పాటూ ఆమె మళ్ళీ వలసకూలీ అయింది. తట్టలు మోసింది. రోడ్లు ఊడ్చింది. ఇండ్లలో పాచిపనులుచేసింది. రోజుకూలీగా రాజకీయపార్టీల మీటింగుల కెళ్ళింది. అట్లా అనేక పనులు చేసి, చివరికి ఎవరి కాళ్ళో పట్టుకుని, ప్రకృతి వైద్యశాలలో ఊడ్చే పని సంపాదించుకుంది. కొన్నాళ్ళకి  మసాజ్‌ చేయడం నేర్చుకుని, చివరికి నెల జీతం సంపాదించుకునే ఉద్యోగాస్తురాలైమ్ది. . తలలో తెల్లవెంట్రుకలు మెరిసే గడసరిగా, ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ వుండే యాదమ్మగా మారే క్రమంలో ఏ ఆనంద విషాదాలు ఆమెలో ఏ పెనుతుపానులను సృష్టించి వుంటాయి? తనలా కాకుండా, వాటిగురించి ఆమె సంకోచం లేకుండా మాట్లాడగలదేమో నని అనుకునేది చిత్రకళ.

‘‘ మంచి బందోబస్తు గుంటది పోరి. కష్టంజేస్తది. మొగోడు తోడు లేనిదే అది వుండుడు కష్టమని పిస్తది.’’ అంది సరస గురించి ఒకసారి యాదమ్మ. సరస
తమిళ పిల్ల. కానీ తమిళ యాసతో తెలుగు బాగానే మాట్లాడుతుంది. మద్రాసు నుండి తిరుపతికి వాళ్ళ కుటుంబం వలస వచ్చింది. తండ్రి తోపుడు బండి
పెట్టుకొని, ఇడ్లీలు, దోసెలు అమ్ముకుని సంసారం వెళ్ళదీసే వాడు. తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ ఎగిరి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో కానీ ఎనిమిదేళ్ళ
క్రితం ఆమె యాదమ్మ వాళ్ల బస్తీ కొచ్చింది. పాతికేళ్ళ యవ్వనంతో తళతళలాడుతూ హుషారుగా వుండే సరస, యదమ్మ ఇంటి పక్క గది అద్దెకు తీసుకుంది. ఒకటి, రెండు గదులతో ఏడు పోర్షన్లు వుండే ఆ కాంపౌండులో సరస అందరి ఆకర్షణకీ కేంద్రమైంది. ఎత్తుచెప్పులు, చేతికి హ్యాండ్‌బ్యాగు, గోళ్ళరంగు, చెవులకి కొత్త కొత్త జుంకాలూ తగిలించుకుని ఏదో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసేందుకెళ్లేది. అద్దె వసూళ్లకి వచ్చే ఇంటి ఓనరుకి ఠంచనుగా అద్దె ఇచ్చేది. అందరితో కలుపుగోలుగా వున్నా తనగురించి ఎవరైనా  అడిగితే మాట దాటేసేది. చేబదుళ్ళనో, యాభయ్యో, వందో అప్పనో ఎవరైనా అడిగింతే, అడిగిందే తడవు, కాదనకుండా ఇచ్చేది. గదిముందు రెండు గులాబీ పూల కుండీలు, గది తలుపుకు నీలం, తెలుపు పూల కర్టెను వేలాడే ఆ ఇంటి లోపల కూడా ఎంతో పొందికగా వుండేది. పనిపాటలు చేసుకు బతికే ఆ కుటుంబాల మధ్య ఆమె కాస్త భిన్నంగా వుండేది. అందుకేనేమో చుట్టు పక్కల వాళ్ళు ఆమె పట్ల కాస్త, ఆదరంగానే వుండే వాళ్ళు. అందర్లోకీ యాదమ్మ దగ్గరే  సరసకి ఎక్కువ దగ్గరితనం, చనువు ఏర్పడ్డాయి. తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నాడనీ, ఆ వచ్చినామె చాలా గయ్యాళిదనీ, నానా హింసలూ పెట్టేదనీ, కొన్నేళ్ళు పిన్ని దగ్గరున్నాననీ, బాబాయి ప్రవర్తన మంచిది కాదనీ, అక్కడ వుండలేక, ఒక స్నేహితురాలి సహకారంతో, హైదరాబాద్‌ వచ్చానని యాదమ్మకి చెప్పుకుంది.

ఓ ఏడాది తరువాత, ఆమె వయసే వుండే ఒక అబ్బాయి ఆమె ఇంటికి రావడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ సినిమాలకీ షికార్లకీ తిరుగుతూ వుంటే
యాదమ్మే ఓరోజు పెద్ద మనిషిలా ‘‘ పోరడు చక్కగున్నడు. ఇద్దరికి ఈడూ జోడు కుదిరింది. పెళ్ళి చేసుకోరాదు’’ అంటూ సరసకి సలహా ఇచ్చింది. యాదమ్మ మాటలకి నవ్వి ఊరుకుంది సరస. కానీ, మరోమూడు నెలలకి ఆ పిల్లవాడు సరస గదికే తన సామాన్లు పట్టుకొచ్చుకున్నాడు. సరస మెడలో కొత్తగా పసుపుతాడు వచ్చి చేరింది. యాదమ్మే వాళ్ళిద్దరినీ తనింటికి భోజనానికి పిలిచి, సరసకి చీర పెట్టింది. నిజం చెప్పాలంటే సరసకన్నా ఆ పిల్లవాడు అందగాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతను అమలాపురం నుండీ సినీ అవకాశాలను వెతుక్కుంటూ వచ్చాడని సరస చెప్పింది. ఆరు నెలల తరువాత అతని స్టూడియోలకి దూరమవుతుందని అంటూ, సరసా వాళ్లు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వీలు చేసుకొని అప్పుడప్పుడూ యాదమ్మ దగ్న్గరకి రావడమో, ఫోన్‌ చేయడమో చేసేది సరస. ఆ తరువాత మెల్లిగా ఆమెతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఏడాది తరువాత, మూడు
నెలల పసిబిడ్డని ఎత్తుకుని, యాదమ్మ ఇంటికొచ్చింది సరస. పిల్లవాడికిపాలిస్తూ, ఏడుస్తుంటే, ఆమె కన్నీళ్ళు వాడి నుదిటి మీదా, బుగ్గలపైనా
పడ్డాయి. ఆమె ఎక్కువ వివరాలు చెప్పకుండానే  అర్ధమైంది యాదమ్మకి. వాడు ఆమెని వదిలి పెట్టి వెళ్ళిపోయాడని. ఎక్కడుంటాడో తెలియని వాడ్ని వెతకలేక, కనీసం ఆమె తండ్రి వివరాలన్నా చెప్పమని అందరూ కలిసి సరసని వత్తిడిచేసారు.
చివరికా తండ్రి, తనకా పిల్లతో ఎలాంటి సంబంధం లేదని, తన కూతురు ఎన్నడో చచ్చిందనుకున్నానని, తేల్చి చెప్పేసాడు. ‘‘ నాకెవ్వరూ లేరు’’ అంటూ,
గుండెలు పగిలేలా ఏడుస్తున్న సరసని ఓదార్చటం ఎవరితరం కాలేదు.  పాత సామాన్లు పెట్టుకునే తడికెల పాకని శుభ్రంచేసి, సరస వుండేందుకు చోటు
కల్పించాడు ఇంటి ఓనరు. చుట్టు పక్కల వాళ్ళంతా తలా కాస్త చందాలేసుకుని, అద్దె కట్టి, రెండు, రెండు,మూడు నెలలకి సరిపడేలా బియ్యం, పప్పులు
కొనిచ్చారు. సరస తన మెడలో పసుపు తాడుకు వేలాడుతున్న బంగారపు మంగళసూత్రపు బిళ్ళ  ఇస్తే, పక్కింటి వాళ్ళు అమ్మిపెట్టి, ఆమె చేతిలో
డబ్బులు పెట్టారు. ఇప్పుడా కాంపౌండులో సరసకి ఇంతకు ముందులా ప్రత్యేకమైన గుర్తింపేమీ లేదు. పగిలి నెర్రలుబారిన పాదాల గురించి, మట్టిచేరినవేలి గోళ్ళగురించి పట్టించుకునేంత తీరిక ఆమెకి లేదు. ఇప్పుడా ఇంటి వాకిలికి నీలం పూల కర్టెన్‌ వేలాడటంలేదు. పూల కుండీల ఊససలే లేదు.
పక్కింట్లో వుండే ఓ ముసలమ్మకి నెలకి ఆరొందలిచ్చి , ఆమె దగ్గర  కొడుకును వదిలి పెట్టి, పనికెడుతుంది సరస. యాదమ్మ తనకు తెలిసిన మేస్త్రీతో మాట్లాడి, తట్టలు మోసే పని ఇప్పిచ్చింది. కానీ ఆ పని ఎక్కువ కాలం చేయలేక, ఇళ్ళలో పాచి పనులు, వెతుక్కుంది. కొడుకు మూడేళ్ళ వాడయ్యాడు. సరస జీవితం కాస్త తెరిపిన బడ్డట్లయింది.

‘‘ ఉప్పుకారం తిన్న శరీరమాయె. ఊకోమంటే అది ఊకుంటద? శివసత్తులు సిగమూగినట్లు, వయసు మనల దుంకులాడిస్తది.’’ అంది యాదమ్మ. అట్లా ఆమె, సరస కూడా దుంకులాడిన వైనాన్ని, చిత్రకళకి తమాషాగా చెప్పిందొక సారి యాదమ్మ.

ఆవిరి పొగలు కక్కుతున్న అద్దాల గదిలో కూర్చుని స్టీమ్‌బాత్‌ చేస్తున్న చిత్ర, తన అర్ధనగ్న్న శరీరం వైపోసారి చూసుకుంది. దేహం అంటే ఏమిటి? దాని చుట్టూ ఇంత మంది పోగవుతారెందుకు? మనసెందుకు ఎప్పుడూ, గాలిలో పెట్టిన దీపంలా రెపరెప లాడుతుందెందుకు? దేహమూ, బుద్థీ, మనసు మనిషి జీవించినం కాలం ఎన్నడూ కలవని సమాంతర  రైలుపట్టాల్లా  సాగ్తాయని పిస్తుంది చిత్రకి. ఈ అందమైన వంపులు తిరిగిన శరీరాన్నీ, మనసును, చురుకైన బుద్దినీ తన స్వాధీనం లోకి తెచ్చుకునేందుకు తను ఎలా ప్రయాసపడేదో గుర్తుకొచ్చింది చిత్రకి. శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా వుంచుకోవడం, పెదవులపైన చిరునవ్వును ఎన్నడూ చెదరనీయక పోవడం, కించిత్‌ విసుగు, దిగులు, విషాదాలు, ఏవీ కూడా మెఖం పైన కనబడనీయక పోవటం, చలాకీగా, ఆకర్షణీయంగా మాట్లాడటం ఇవన్నీ, అనేక ఏళ్ళుగా కృషి చేసి సాధించిన విద్యలు. తన ఆలోచనలు ఇప్పుడెందుకో నియంత్రించలేని నయాగారా జలపాతంలా లోలోపల ఎగిసి పడటాన్ని గమనిస్తోంది చిత్ర.

ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో పదోతరగతి వరకూ చదువుకుంది చిత్ర. తండ్రి, ఓ స్కూల్లో డ్రాయింగ్‌ టీచరుగా పనిచేస్తూ, ఆ జీతం చాలక మరో
స్నేహితుడితో కలిసి, పెళ్ళిళ్ళలో వీడియోలు తీస్తూవుండే వాడు. ఎంసెట్‌ కోచింగ్‌ కోసం, విజయవాడలో ఓ పేరున్న కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు
తండ్రి. ఇంజనీరింగులో సీటు సంపాదించి, ఏ అమెరికాకో వెళ్ళి బాగా సంపాదించాలనీ, అలా తమ ఆర్ధిక స్థితి మెరుగు పడాలనీ, తల్లి ఆశ పడేది.
నిరాడంబరత్వం, ఆదర్శాలు మాట్లాడే నెమ్మదైన తండ్రిని తల్లి ఎప్పుడూ ఈసడిస్తూ మాట్లాడుతుండటం చిత్ర మీద కూడా ప్రభావాన్ని చూపించింది. అతని
చాత కాని తనం వల్లే, పెదనాన్నలు తాతగారి ఆస్తి తమకి దక్కనివ్వలేదని, తల్లిలా ఆమె కూడా అనుకునేది.

విజయవాడలో తనతో పాటూ చదువుకుంటున్న డబ్బున్న అమ్మాయిల్ని చూస్తే, చిత్రకళకి లోలోపల ఈర్ష్యగా అనిపించేది. అప్పటిదాకా గుర్తించలేదు కానీ, వాళ్ళకు లేనిది, తనకున్నది అందం అని మొదటి సారి తెలుసుకుందామె. డబ్బుంటే ఆ అందానికి మరిన్ని మెరుగ్నులు దిద్దుకోవచ్చని, అందాన్ని కూడా పదిమందీ గుర్తిస్తారని, తల్లిదండ్రుల అదుపాఙ్నలు లేకపోతే, చాలా స్వేచ్చగా వుంటుందని తెలుసుకున్న ఆ రెండేళ్ళ విజయవాడ హాస్టల్‌ జీవితమంటే ఆమెకి ఇప్పటికీ ఇష్టమే. ఇరుకు ఇరుకుగా, పొదుపుగా, భయం భయంగా, అన్నిటికీ కటకటలాడుతూ బతికే తన ఇంటి పరిస్థితి చిత్రకి ఎప్పుడూ నచ్చేది కాదు. ఆమె ఆలోచనల్లో కొంచం వికాసం వచ్చిందేమో కానీ,  ఎంసెట్‌ పరీక్షల్లో ఆమె చివరాఖరికి చేరుకుంది.

ఎట్టి పరిస్ధితుల్లో సీటు రాదని అర్థమయ్యాక, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించావన్న తల్లి సాధింపుల్ని భరించ లేక, ఇక చచ్చినా మరోసారి ఎంట్రన్స్‌ పరీక్ష రాయనని మొండికేసి, ఒంగోలులో  బికాంలో చేరింది. చదువు పూర్తి      కాగానే, ఆరువేలకి ఎకౌంటెంటుగా హైదరాబాదులో ఉద్యోగం సంపాదించుకొని, ఇంట్లో వెళ్ళద్దని అన్నా వినకుండా వచ్చేసింది. అమీర్‌పేటలో ఓ లేడీస్‌ హాస్టల్లో, చేరింది. దగ్గర్లోనే వున్న ఒక కంఫ్యూటర్‌ సెంటర్‌ లో తన రూంమ్మెంట్‌తో పాటూ చేరింది. ఇరుకు గదుల్ని, సామాన్లని, చిరుతిళ్ళనీ, అప్పుడప్పుడూ దుస్తుల్నీ హాస్టల్‌ మిత్రులతో పంచుకుంటూ, కొత్తకొత్త కలల్ని వెతుక్కుంటూ , కొత్త జీవితాన్ని ప్రారంభించింది చిత్ర. రకరకాల అమ్మాయిలు. చిత్రకళలానే కొంచం అమాయకంగా, మరెంతో ఆశగా జీవితంలో పైకెదగాలన్న ఆశతో బయలుదేరిన వాళ్ళు. వలలను, నిచ్చెనలను తయారుచేసుకోవడం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళలో కొందరే.

తనలానే వుండే కొందరమ్మాయిలు కొంత కాలం గడిచాక ఖరీదైన దుస్తులు,సెల్‌ ఫోన్‌లతో, విలాసవంతగా వుండటం, వాళ్ళ కోసం     వీధి మలుపుల వద్ద మగపిల్లలు నిలబడటం, వాళ్ల వెనుక వాళ్ళ గురించి మిగిలిన అమ్మాయిలు చెవులు కొరుక్కోవడం చిత్రకళ గమనించింది. అలా తనకి బాగాదగ్గరైన  తన రూంమ్మెంట్‌ సునీత గురించి కూడా, గుసగుసలుండేవి. తనతో పాటూ మొదటిసారి కొన్ని పార్టీలకి వెళ్ళినప్పుడు, అక్కడికొచ్చిన వాళ్లలో ఎక్కువ మంది ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవడం, మంచినీళ్ళు తాగినంత సహజంగా అందరూ మద్యం తాగటం, కొందరమ్మాయిలు సిగిరెట్లు కూడా కాల్చటం, మొదటి సారి చూసింది చిత్రకళ. అలాంటి చోట కూడా తన అందం తనకో గుర్తింపు నిస్తోందని ఆమెగుర్తుపట్టగలిగింది . అందంతో పాటూ చొరవ, చుట్టూ జరుగుతునున్న విషయాలు, కొంచం పుస్తకాలు, సినిమాల వంటివాటి గురించి తెలియడం, ముఖ్యంగా ఇంగ్లీషు బాగా రావడం అవసరమని అనుకుందామె. జీవితంలో ఆర్ధికంగా ఎదగటానికి మనకున్న అందం, శరీరం సాధనమైతే అందుకు చింతించాల్సిన  అవసర మేమీలేదని ఆమెని ఒప్పించగలిగింది సునీత.

‘‘ ఒకటి పొందాలంటే, మరొకటి కోల్పోక తప్పదన్న’’ కొత్త సత్యాన్ని కనుగొన్న విభ్రాంతితో, లెక్కలేని తనంతో గడిపే కొందరు అమ్మాయిల జాబితాలో ఇప్పుడు చిత్రకళ కూడా చోటు సంపాదించుకుంది. ‘‘ శరీరానిదేం వుంది. కొద్ది నిమిషాలు నీవి కావనుకుంటే సరి’’ అందామె స్నేహితురాలు ఓ సారి. అట్లా అనుకోవడానికి చిత్రకి నాలుగేళ్ళ కాలం పట్టింది.

స్నానం ముగించి, అక్కడే తయారయి బయటకొస్తుంటే, చల్లటిగాలి తగిలి శరీరం ఎంతో తేలిగ్గా అనిపించింది. మాదాపూర్‌ దాటుతుండగా హరాత్తుగా పెద్దపెద్ద
చినుకులతో వాన మొదలైంది. కారు కిటికీ అద్దాల మీద జారుతున్న వర్షపు చినుకుల్ని చూస్తుంటే గుర్తొచ్చింది. నోవాటెల్‌ లో రాత్రి వెళ్లవలిసిన
డిన్నర్‌. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వచ్చే అలాంటి పార్టీలను ఆమె ఎప్పుడూ మిస్‌ కాదు. కానీ ఈ రోజెందుకో ఎక్కడికీ వెళ్లాలని
లేదామెకి. దిగులు దిగులుగా, దు:ఖం బయటకు రాకుండా లోన లుంగలు చుట్టుకుంటూ, ‘‘ పులిని తను నిజంగా స్వారీ చేయగలిగిందా? కనీసం అది తనని పూర్తిగా తినేయకుండా చూసుకో గలిగిందేమో? లేకపోతే తన జీవితం కూడా సరస జీవితంలానే అయ్యేదేమో?’’ ఈ తలపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడిరది చిత్రకళ.

మనిషి లోపలి కోర్కె బహుశా, బహుపురాతనమైంది కావచ్చు. అదుపు లేని శరీరానికి ఎన్నెన్ని అడ్డు కట్టలో. అయినా అది గట్లు తెంచుకు పారే నదిలా
ప్రవహిస్తుంది. యాదమ్మ అన్నట్లు అది శివాలెత్తుతుంది.
‘‘సరస కూలికి బోయినప్పుడు, గాడమెకొక మేస్త్రీగానితో సోపతైనది. ఆడు అప్పుడప్పుడు పైసలిచ్చెటోడు. ఆనితో తిరుగుడు బెట్టిందీ పోరి. వానికి
పెండ్లాం బిడ్డలున్నరు. ఎన్నటికన్న నిన్ను ఇడిసిపెడతడే దేడ్‌దిమాక్‌దాన. ఇంక చిన్నదానివే. ఇంకెవలన్న జూసుకుని, పెండ్లి జేసుకోవే అని ఎంత చెప్పిన
ఇన్నదా అది’’ అంది యాదమ్మ.

సరసకీ, తనలాంటి వాళ్ళకీ ‘‘ నీ తాలూకు గతంతో నాకు పనిలేదు. ఇప్పటి నువ్వు మాత్రమే నాకు కావాలి. నిన్ను ప్రేమించాను. మనం పెళ్లి చేసుకుందాం’’ అనే వాడు ఎక్కడ దొరుకుతాడు. శరీరపు కోర్కె తీర్చుకునే ఆటకీ, పెళ్ళనే ఆటకీ, బహుశా వేరు వేరు సూత్రాలు, నిబంధనలూ వుంటాయి కామోలు అనుకుంది  చిత్రకళ.

సరసకి ఒక కాలేజీలో ఊడ్చే పని దొరికింది. పొద్దుట ఇళ్ళలో పని చేసుకుని, కాలేజీ పనికెడుతుంది. సరసకి కొత్తగా జర్దా అలవాటైంది. రోజూ
వండుకునేందుకు బద్దకిస్తుంది. చేతిలో డబ్బులుంటే బిరియానీ పొట్లం తెచ్చుకుంటుంది.
‘‘గట్ల డబ్బులు ఆగం చేయకు. పోరడున్నడు. పానం బాగలేన్నాడు కర్సుల కన్నా అస్తయని అంటే, రేపటి సంగతి రేపు. రేపటికి బతికుంటమో సస్తమో? ఎవలకి ఎర్క అనేది ’’ అంది యాదమ్మ.

సరసకి అంతకు ముందున్న శుభ్రత, పొందిక ఎక్కడ పోయాయో తెలీదుగట్టిగా మాట్లాడుతూ, నీళ్ళ దగ్గరో, ఉమ్మడి స్నానాల గదుల వద్దో, ఇరుగు
పొరుగు వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ చివరికి ‘‘ అమ్మో, దాని జోలికి పోవద్దమ్మ’’ అన్నట్లు తయారైంది. ఒక్క యాదమ్మంటేనే, కాస్త భయమూ, భక్తీ
రెండూ వున్నాయా పిల్లకి.

‘‘ ఎట్ల దాచి పెట్టిందో దాచిపెట్టిందో పెట్టిందమ్మ. ఐదోనెల కడుపు, జర ఎత్తుగ కనపడబట్టె. ఏందే సరస, గట్లున్నవ్‌. అంటె సప్పుడు జేయలే. అదేం సిత్రమో గాని కక్కుడన్న మాట లేకుండె దానికి. ఒకపారి, నేనే దాన్ని బెదిరించిన. అప్పుడొప్పుకున్నది. ఎన్నో నెలనే అంటె తెల్వదంటది. దావఖానకు బోలె. పరీక్ష సేయించుకోలే. నేను తోల్క పోత, పోదం రాయే అంటే, నేను రానుపొమ్మని జిద్దుజేసింది. మా వాడకట్టు పెద్దమనుష్యు లంత పోగయ్యిన్రు.
కడుపు జేసినోని పేరు జెపితే, వాన్నిగుంజుకొస్తం అన్నరు. ఈ పోరి నోరిప్పలే. ఒకని తానికే బోతె ఎర్కయితి. ఇది ఎందరితానికి బోయిందో అన్నరు
గాపెద్ద మనుష్యులు.. మా అందరికి తిట్టి తిట్టి యాష్టకచ్చిన గాని, అది నోరిప్పలే. కాన్పు ఎప్పుడైతదన్నది కూడ దానికి ఎర్కలేదు’’

సరస రోజూ పనికి వెడుతూనే వుంది. ఆమెను పట్టించుకునేంత తీరిక, బాధ్యత అక్కడ ఎవరికీ లేదు.

‘‘ ఏనిమిది గంటల రాత్రి, దాని ఇంటిగలమకాడ కూసోని ఓ అక్కో నొప్పులొస్తున్నయి. నాకు వశపడ్తలేదు అంట, ఏడ్సుడు, వొర్లుడు షురుజేసింది.
అందరు జేరిసూస్తున్నరు. మా వాడల పెద్దమనిషి ‘ కట్టుదప్పిన బాడుఖావ్‌. దానితానికి ఎవలు పోకుండ్రి’ అన్నడు. ఎవరిండ్లల్లోకి ఆల్లు బోయిన్రు
అందరు. పన్నెండు గంటల రాతిరి, దాని కొడుకు ఏడ్చుకుంట మా తలుపు కొట్టబట్టిండు. ఆడజన్మమంత అన్నాలం లేదమ్మ. నేను ఉర్కిన. నేనుబోయెతల్కి, నేల మీద పడుండుకోని లాష్‌గా వొర్లుతున్నదిగసబెడుతున్నది. దాన్ని చూసెతలికి, నాకు సల్లసెమటలు బట్టినయి. ఏమైతెగదైతది తీయని, మా వాడకట్టు నుండేటి, మంత్రసానిని తోల్కొచ్చిన. పక్కింట్ల కెల్లి ఇంకొక దయగల అమ్మగ్గూడ సాయానికొచ్చింది. దావఖానకు తీస్కపోనీకి టయం లేకుండె. బిడ్డ బయట కచ్చిండు గాని, మాయ బయటపడలె. ఇదేందిర దేవుడ. లేనిపోనిది నెత్తిన బెట్టుకున్న. పెద్దపానానికే ముప్పు అస్తదేమో, దేవ అని గజ్జగజ్జ అనికిన. ఆ బగమంతుని దయ తల్లీ! మెత్తం మీదగండం గడిసింది. పిండం బయటవడ్డది తల్లి.’’

యాదమ్మ ఇంటికొచ్చి వేడినీళ్ళతో స్నానం చేసేసరికి తెల్లవారుజామున నాలుగైంది. మంత్రసాని చేతిలో మూడొందలు పెట్టి, తన పాత చీరెలు రెండిచ్చి
సాగనంసింది. నెత్తుటి మరకతో, నీచుకంపు కొడుతున్న ఆ ఇంట్లోకి మళ్ళీ ఉదయం యాదమ్మ తప్పా, మరెవరూ తొంగి చూడలేదు. హోటల్‌ నుండి ఇడ్లీలు తెప్పించి, ఇంట్లో టీ చేసుకొని సరస గుడిసెలోకి వెళ్లేసరికి నెత్తుటి మరకలంటినగచ్చుపైన నీళ్ళుపోసుకుని కడుక్కుంటున్నారు సరస, ఆమెకొడుకు. పాత నూలు చీరెలో చుట్టిన పసిబిడ్డ, ఆ గదిలోనే ఓ మూల ఆదమరిచి నిద్రపోతున్నాడు. స్నానానికి నీళ్ళుపెట్టుకున్నట్లుంది. స్టవ్‌ మీద అవి సలసలా
మరుగుతున్నాయి.

‘‘ నీది పచ్చి వళ్ళే. రెండురోజులు నేనే వండిపెడత నన్న యినలేదది. ఇంటి కిరాయి రెండు నెలల సంది కట్టలేదని కొట్లాడేందు కొచ్చిన ఇల్లుగలాయన దాని
గతి జూసి ఏమనలేక గమ్మునున్నడు. చుట్టుముట్టోల్లందరం, తలా ఇన్ని పైసలేసుకుని, దానికిచ్చినం. ఏడ్చుకుంటనే తీసుకున్నది.’’ అంది యాదమ్మ.

చిత్రకళ తన పొట్టకేసి చూసుకుంది. చదునుగా, చిరుబొజ్జ కూడా లేదు. వంపు తిరిగిన నడుం కింద చీరమడతల వెనక దాగిన పొట్టపైకి  ఆమెచేతి వేళ్ళు పాకాయి.
కొన్నేళ్ళు గడిస్తే పిల్లల్ని కనగలిగిన శక్తికూడా తనకి లేకుండా పోతుందేమో? తనకి పిల్లలుంటే బావుంటుందా? ఏమో? అప్పుడప్పుడూ వాళ్ళతో
కబుర్లు చెప్పటం, ఆడుకోవడం బాగానే వుంటుంది. పిల్లల్ని కనగల శక్తి ఆడవాళ్ళ శరీరాలకి వున్నా, కనాలంటే మాత్రం తప్పకుండా పెళ్ళిచేసుకో
వల్సిందేనేమో? మల్లెపూల జడేసుకొని, పూలతో అలంకరించిన మంచం పక్కన, చేతిలో పాల గ్లాసుతో, సిగ్గుతో తలవంచుకుని, కాలిబొటన వేలితో నేలమీద చిత్రాలు గీస్తూ, గర్భదానం కోసం ఎదురుచూస్తూ, అట్లాంటి దృశ్యం లో  తనని ఊహించుకోగానే చిత్రకళకి ఫక్కున నవ్వొచ్చింది. నాకెందుకో చిన్నప్పటి నుండీ
పాలంటే అసలు ఇష్టంలేదనుకుంది చిత్ర.

తనజీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాక, ఇంట్లో వాళ్ళ నుండి చాలానే ఘర్షణల్ని ఎదుర్కోవలసి వచ్చింది చిత్ర. కొంతకాలానికి వాళ్ళు
ఆమెను, ఆమె వాళ్లని వదిలేసుకునేదాకా  వచ్చాక, తమకి ఇక కూతురు లేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ చిత్ర పూర్తిగా అలా అనుకోలేక
అప్పుడప్పుడూ అందరూ గుర్తొచ్చి బాధపడుతూ వుంటుంది.‘‘ ఆట ఆడాలనుకున్నప్పుడు ఆ ఆటకి సంబంధించిన సూత్రాలు మొదట నీకు
తెలిసుండాలి. దెబ్బ కొట్టడం, దెబ్బ కాచుకోవడమే కాదు దెబ్బ తగిలితేతట్టుకోవడంకూడా నేర్చుకొవాలి. ఎవర్నీ నమ్మకు. నమ్మినట్లు కనిపించు చాలు.
దేనిలోనైనా సరే నీకు నష్టం జరుగుతుందని అన్పించినప్పుడు, తక్కువ నష్టంతో జాగ్రత్తగా వెనక్కి రావడం ఎలాగో తెలుసుకో’’ అంది ఒకసారి వినీతా
రాధోడ్‌.  మధ్యతరగతి  సంకోచాల్ని వదులుకుంటే తప్ప , హైక్లాస్‌ సొసైటీలో రాణించటం కష్టమని, ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవాలని, ఆమె చెప్పిన మాటల్ని  చిత్రకళ ఎప్పుడూ మర్చిపోదు. మన చిరునవ్వును, అందాన్నీ చూపితే మోజు పడతారే తప్పా, మన మనసు గాయల్ని చూపితే బాధపడి, బాధ్యత తీసుకునే వాళ్లెవరూ వుండరన్న సత్యాన్ని, ఆటాడే క్రమంలో, పడి లేస్తూ తన స్వంత అనుభవంతో నేర్చుకుంది చిత్ర. ఆర్ధిక స్థితి, మంచి ఉద్యోగం వల్ల మనకి సమాజంలో గౌరవం, హోదా ఆపాదించ బడతాయని తెలుసు కాబట్టే, చిత్రకళ ఏదోక ఉద్యోగం చేయటం ఎప్పుడూ మానేయలేదు. ఒక్కప్పటిలా కాదిప్పుడు. ఏంచేయాలో వద్దో ఎంచుకోగల స్థిమితం అన్ని రకాలుగా తనకి వచ్చిట్లనిపిస్తుంది చిత్రకి.

‘‘ కడుపు జేసినోడు కాన్పు కర్సులకన్నా ఇచ్చినోడు గాదు. కంసేకం దావఖాన కర్సులన్నా ఎల్లేటివి గాదా అన్నరు. సుట్టుముట్లోల్లు. సంపి సావు కర్సులకి
ఇస్త గానీ, ఊకోమన్నట్లున్నది యవ్వారం.’’ అంది యాదమ్మ. ఆడదాని మీద అత్యాచారం చేసి, దానికి వెలగట్టి,గర్భవతిని చేసి, ఆ
గర్భానికి వెలకట్టి, ఎన్నెన్ని బేరసారాలమధ్య ఆడవాళ్లున్నారు? ఊర్లో పొలాని కెడుతున్నప్పుడు, జులాయిగా తిరిగే ఆ ఊరి పెద్దమనిషి కొడుకు, తన
మేనమామ కూతురిపై అత్యాచారం చేశాడు. పంచాయితీ పెట్టి,ఊరి పెద్దమనుష్యులు,కుటుంబం అందరూ కలిసి నిర్ణయిస్తే, కన్నీళ్ళతో తలవంచుకుని పీటలపై
కూర్చుంటే, ఆ రేపిస్టే భర్తయి మెడలో తాళి కట్టాడు. ఆమె బెదురుకళ్ళ దిగులు మొఖం చిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు.

యాదమ్మకున్న తెలివితేటలు, ధైర్యం సరసకి లేవనుకుంటాను అనుకుంది చిత్ర.

రెండోసారి నగరానికొచ్చిన యాదమ్మ వెంట ఇప్పుడు ఆమె తల్లి, నాలుగేళ్ళ కొడుకు వున్నారు. వాళ్ళను పోషించే భారం ఆమెదే. ఆడపని, మగపని అని
లేకుండా ఏ పనైనా ధైర్యంగా చేయటం అలవాటైంది. ఒకసారి కూరల మండీలో పనికి పోతే, ఊర్లనుండి కూరగాయలు ట్రాక్టర్లో వేసుకొచ్చే, ఒక డ్రైవరుతో స్నేహం కుదిరింది. శరీరం మరింత దగ్గరితనాన్ని కోరుకుంది. ఆమె అక్కడ పని మానేసినా వాళ్ళు కలుసుకుంటూ వుండేవాళ్ళు. అతనేమీ ఆమెకి పెళ్ళి
చేసుకుంటాన్నా హామీ లివ్వలేదు. తనుగర్భవతినయ్యానా లేదా, అని ఆమె సందేహ పడుతున్న కాలంలోనే, తట్టమోస్తూ, మెట్లెక్కబోయి కళ్ళుతిరిగి, జారిపడిరది. గర్భస్రావమయి వారంపాటు ఆసుపత్రిలో వుండాల్సి వచ్చింది. తల్లి ముందు, బంధువుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
‘‘ పోరగాన్ని ఎవలకన్న సాదుకునేందు కిచ్చి, మల్ల పెండ్లి జేసుకోయే అంటె ఇనలేదానాడు. నాకొడుకుని నేనే సాదుకుంట నని పట్టుబడితివి. ఇప్పుడు
లేనిపోని కతలు జేయవడ్తివి. అంత ఒపలేకుంటే ఎవన్నోకన్ని మేమే జూస్తుండె’’ అని తిట్టారంది యాదమ్మ. ఆమెతో ప్రేమగా మాట్లాడి, ఆమె శరీరాన్ని కోరుకున్న వాడు ఆమె అట్లా నలుగురి ఎదుటా అవమాన పడుతుంటే ఆమె పక్కన లేడు. అప్పుడే కాదు, మరెప్పుడూ అతడామెకి కనపడలేదు. నా జీవితంలో ఏ కష్టవచ్చినా ఎవరినీ చేయిచాచి సాయమడగనని అప్పుడే యాదమ్మ నిర్ణయించుకుంది. కొడుకును బడిలో చేర్చింది. మరో మూడేళ్ళకి తల్లి చని పోయింది. మరి కొన్నేళ్ళ వరకూ ఆమె జీవితంలోకి ఏ మగవాడూ ప్రవేశించలేదు. పేదవాళ్ళకి ఇండ్ల పట్టాలిస్తున్నరంటే, బస్తీవాళ్లతో కలిసి, ఓ గల్లీ లీడర్‌ నర్సింహని కలవటానికెళ్ళింది యాదమ్మ. రేషన్‌ కార్డు, ఫోటోలు, దరఖాస్తులు అంటూ అతని చుట్టూ, మండలాఫీసుల చుట్టూ, నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. కలెక్టరాఫీసు ముందు అందరితో పాటూ ధర్నాకి కూర్చుని తన్నులు కూడా తింది. ఉండేందుకు తనకంటూ ఒక చోటుంటే ఎలాగోలా బతకచ్చన్న ఆశ ఆమెది. చివరికి ఆమెకి ఇళ్ళపట్టా శాంక్షనయింది. దానితో పాటూ నర్సింహతో పరిచయం కూడా పెరిగిందామెకి.

ఎన్నికలు, ప్రచారాలు, బహిరంగ  సభలంటూ బయటి ఊర్లకి రమ్మని ఆమెని పిలిచే వాడు. అట్లా ఒకటి రెండుసార్లు యాదమ్మ, ఢల్లీిలో జరిగిన మీటింగులకు కూడా వెళ్లింది. ఈ తిరగటాలు, కొత్త పరిచయాలు, చుట్టు పక్కల వాళ్ళలో ఆమెకొకగుర్తింపును తెచ్చాయి. ఆపనీ, ఈపనీ చేసి పెట్టమనీ, సలహాలనీ ఎవరోకరు ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళు. నర్సింహతో ఆమె సంబంధం బహిరంగమే. పదేళ్ళ కొడుకుని పెంచి పెద్దచేసి, ప్రయోజకుడ్ని చేయడం తన పననుకుంది యాదమ్మ. ఆమె అతడ్ని పెళ్ళి చేసుకోమని ఎన్నడూ ప్రాధేయపడలేదు. అతనే ఓ సారి ఆ ప్రస్ధావన తెస్తే, ‘‘ ఇయ్యాల బాగ్ననే వున్నవు. రేపు నీకో పోరన్నో, పోరినో కంట. అటెన్క, నీ బుద్ధి తిరిగి, నాకు పెండ్లాం, బిడ్డలున్నరు, ఇగ నీతో కాపురం చేయలేనే యాదమ్మ అన్న వనుకో, నా గతి ఏం గావాలె. ఉన్నొక్క కొడుకును సాదలేకనే, నా బతుకిట్లయ్యె. ఇంకొక బిడ్డ నా మెడలెందుకయ్య. నీ పెండ్లికి, నీకో దండమయ్య సామి’’ అంది యాదమ్మ.
అతనొక సారి, నీ ఖర్చులకు డబ్బులు నేనిస్త. పని మానేయమన్నప్పుడు యాదమ్మ కస్సుమంది.

‘‘ నా తిండి నేను సంపాదించుకుంట. నా పోరన్ని నా రెక్కల కష్టం మీద సాదుకుంట. నా యింట్ల నేను బాజాప్త పంట. పని బందు పెట్టి, రేపటికెల్లి,
కుక్క తీర్గ, నువ్వెన్నడు బొచ్చల కూడేస్తవో అన్నట్లు ఎదురుసూడాల్నా? నువ్వు జూజూ అని బుదగరిస్తే, తోకూపుకుంట దగ్న్గరికి రావలె. నీకు
కోపమెచ్చి ,నీ యెడ్మ కాలితో లాష్‌గ ఒక్క లాత్‌ తన్నితే ఏడ్చుకుంట బోవాల్నా? ఎవరి మీద ఆధారపడి బత్కదీ యాదమ్మ. నెలల పోరన్ని, నడుముకు
గట్టుకుని ఒక్కదాన్ని ఎద్దోలె కాయకష్టం జేసిన. ఏమనుకున్నావో. చూసినవా ఈ సేతులు, నా సేతులు ఎట్లున్నయో?’’ అంటూ నిటారుగా నిలబడి, రెండు అరచేతుల్నీ అతని ముందుకు చాచింది. అతను మరింకేం మాట్లాడలేదు.

చిత్రకళ ఇంటికి చేరుకునే సరికి ఏడుకావస్తోంది. వర్షం వెలిసింది. తడిసిన మొక్కలు మరింత పచ్చగా అగపడుతున్నాయి. కాఫీ కలుపుకొని మెల్లిగా తాగ్తూ బాల్కనీలో నిలబడి , తడిసిన ఆకుల నుండి చినుకుల్ని రాలుస్తున్న పారిజాతపు చెట్టును చూస్తుంటే, ఆమెకి ఎందుకో హఠాత్తుగా నాన్నా గుర్తుకొచ్చాడు.
ఇంట్లోవాళ్ళు, ముఖ్యంగా అమ్మా, మావయ్యలూ తన విషయమై  గొడవ చేసారు కానీ , నాన్న ఎక్కువగా మౌనంగానే వున్నాడని ఎందుకో అనిపించింది చిత్రకి. బహుశా, తన జీవితం తనది అని ఆయన ఒప్పుకున్నాడేమో తెలీదు. తెల్లటి దేహంతో నేలను ముద్దు పెట్టుకుంటూ నారింజ రంగ్ను చేతుల్ని ఆకాశంకేసి చాచి ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లున్నాయి రాలిన పారిజాతపు పూలు. ఆయన ఎంతో ఇష్టంగా తనకి చిత్రకళ అని పేరు పెట్టాడు. చిన్నప్పుడు నాన్న తనకి బొమ్మలేయటం నేర్పటం గుర్తొచ్చింది. రకరకాల రంగులు తెల్లటి కాగితంపై పరుచుకొని, అందమైన బొమ్మలుగా మారటం ఎంతో అద్భుతంగా వుండే దామెకి. తను బొమ్మలేస్తుంటే, చేతుల్లోంచి కాగితాలు లాగేసి ‘‘ ఎందుకీ బొమ్మలు, కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా’’  అంటూ  అమ్మ తననీ, నాన్ననీ తిట్టడం కూడా గుర్తుంది చిత్రకి.

‘‘ ఇంతకీ నేను పులిని స్వారీ చేయడం నేర్చుకున్నానా’’ అని తనని తాను ప్రశ్నించుకుంది చిత్ర.
సరసకి అలాంటి విద్యొకటి ఉందన్న విషయం కూడా తెలిసుండదు. కనిపించిన వాడినల్లా గుడ్డిగా నమ్మటం తప్ప ఏమీ తెలీదు.
‘‘ గీ పోరగాల్లను పుట్టించే పని దేముడు మన ఆడోల్లకే ఎందుకు బెట్టిండో తెల్వదు. అదే లేకుంటే మన బత్కు ఇంత అన్నాలం లేకుండు. మన తాన పైసలేక పాయె, పవరు లేక పాయ ఇగ ఆగ్నమాగ్నం గాక ఏమైతమమ్మ’’ అని నవ్వింది యాదమ్మ. పులి ఆమెను మింగేందుకు వాడే సాధనాలన్నిటినీ ఆమె ఒక్క తాపు తన్నినట్లనిపించింది చిత్రకళకి.

దూరంగా హాల్‌లో నుండి సెల్‌ఫోన్‌ మోగుతోంది. ఎత్తి మాట్లాడాలనిపించక దానికేసి అలాగే చూస్తోంది. రెండు మూడు సార్లు మోగాక, చిన్న చప్పుడుతో
మెసేజ్‌ వచ్చింది. అప్పుడు మెల్లిగా ఆ మెసేజ్‌ని తీసి చూసింది చిత్ర. సునీతా రాధోడ్‌ నుండి . ‘‘రాత్రి నోవాటెల్‌ కి వస్తున్నావ్‌ కదా! లెటజ్‌
హావ్‌ గ్రేట్‌ ఫన్‌’’ అనుంది.ఆమె కెందుకో పులిస్వారీ ఆటలో అది తనని తినేయకుండా కాచుకొని, కాచుకొని అలసి పోయినట్లనిపించింది. ఎంతో నిస్సత్తువగా కూడా వుంది. పర్సు తీసుకొని, ఇంటికి తాళం వేసి కిందికి దిగి వెడుతుంటే, కారు తలుపు తీసి పట్టుకొని, డ్రైవరు పిలిచాడు. అతడ్ని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పి, వీధి లోకొచ్చింది చిత్ర. ఆగి ఆగి కురుస్తున్న ఆ సన్నటి వాన చినుకుల మధ్య నడుస్తూ , వీధి చివరనున్న స్టేషనరీ షాపుకెళ్ళింది. డ్రాయింగ్‌ షీట్లు,
రంగులు, బ్రష్‌లు కొనుక్కొని, ఇంటికి తిరిగి వస్తుంటే చిత్రకళ కెందుకో శాంతంగా అనిపించింది.

vimala1విమల
19.03.2014

కిటికీ బయటి ఆకాశం – వెన్నెలలోని వికాసం

veeralakshmi (2)వాడ్రేవు వీరలక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. ప్రకృతిని, సంగీతాన్నీ ప్రేమించే భావుకురాలు. అంతేకాదు లలిత గీతాల్ని మధురంగా పాడతారు. ఒక అధ్యాపకురాలిగా రెండు తరాల విద్యార్ధుల్ని ప్రభావితం చేసిన చక్కటి ఉపన్యాసకురాలు.

ఇప్పటికే వీరలక్ష్మిగారి కధలు ఉత్సవ సౌరభం, కొండ ఫలం అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. వెల్లువ అనే నవల రాసారు. పత్రికల్లో ఆవిడ రాసిన కాలమ్స్‌ ఆకులో ఆకునై, మా ఊర్లో కురిసిన వాన గా వెలువడ్డాయి. ఆవిడ రాసిన సాహిత్యానుభవం వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం పరిశోధనా గ్రంథం అనేక ప్రశంసలనీ, పురస్కారాలని అందుకున్నాయి. భారతీయ నవలల్లోని ఉత్తమ నవలల్ని వరుసగా పరిచయం చేస్తూ ఒక కాలమ్‌ని ఆవిడ నిర్వహించారు.

ఇటీవల ఆవిష్కరించిన ‘‘ కిటికీ బయటి వెన్నెల’’ ఆవిడ మూడో కధా సంకలనం. వీరలక్ష్మి గారు ఈ కధా సంకలనం గురించి సభలో మాట్లాడ మన్నప్పుడు ఇష్టంగా ఒప్పుకున్నాను. ఆవిడ రచనల్లోని భావుకత, మెరుపు మెరిసినట్టు తటాలున చమక్కుమనే జీవిత సత్యాలు బావుంటాయి నాకు. నదీ మూలాలు ఎప్పుడూ ఒక సన్నటి జలధారగా ప్రారంభమయి క్రమంగా విస్తరించి, అనంత జలరాశి అయి నిత్యం ప్రవహిస్తాయి. చాలా కాలం క్రితం ఒక సారి ప్రళయకావేరి నది నుండి మొదలై, దాని మూలాల్ని వెతుక్కుంటూ వెళ్ళి చూసినప్పుడు, నా కెందుకో విచిత్ర భావన కలిగింది. మనిషి జీవితం కూడా అట్లాంటిదే కదా! మూలాల్ని గుర్తుంచుకుని, నడిచి వచ్చిన దారుల్ని, నిలబడ్డ నేలనీ మరిచిపోకుండా విస్తరించటం తెలియాలి. వీరలక్ష్మి గారి రచనల్ని చదివినప్పుడు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అలాంటి వారేనేమో అనిపించింది. తన బాల్యం గడిచిన ఆదివాసీ పల్లెల పచ్చదనాన్నీ, ప్రేమల్నీ, సంఘర్షణలను, జీవన కాంక్షల్నీ, తనలో నింపుకుంటూ, రకరకాల అస్ధిత్వ వేదనల్నీ, మారుతున్న ప్రపంచం పోకడల్నీ, విలువల్నీ, మానవ సంబంధాల్నీ అర్ధం చేసుకుంటూ, తన సాహితీ ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్న ప్రవహిస్తున్న, నిత్య నూతన నదిలాంటి వారు ఆమె.

వీరలక్ష్మి గారి కధల గురించి మాట్లాడు కోవడమంటే, మన రోజువారీ జీవితాల్లో, నిత్యం తారసపడే అనేకానేక మంది మనుష్యుల గురించి మాట్లాడుకోవడమే. మానవత్వం, దయ, మనుష్యుల పట్ల అపారమైన ప్రేమ వున్న, సరళంగా, సూటిగా, గుండె నిబ్బరంతో బతికే మనుష్యుల గురించి మాట్లాడు కోవడమే. మనలో వుండే ఉక్రోషాలు, కోపాలు, నిస్సహాయతలు, నిర్భీతులు, లెక్కలేని తెంపరితనాలు, ఈర్ష్య, అసూయలు, ఆనందాల గురించి మాట్లాడు కోవడమే. ఎదురు దెబ్బలు తగిలినా, పడితేచే కెరటాల్లా, జీవితంపైన గొప్ప ఆశతో, కాంక్షతో ఎలా బతకొచ్చో తెలుసుకోవడమే. ఇవి సహజ కధలు.

kitike-196x300

మంచికో చెడుకో రచనలకి ప్రేరణ మనిషి జీవితం. మనిషి లోపల, బయటా జరిగే విధ్వంసం, అందుకుగల కారణాలను అన్వేషించేపని సాహిత్యం చేస్తుంది. జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అతి సాధారణమైన మనుష్యులు పడే పెనుగులాటలు, ప్రయత్నాలు, సమాజపు అంచులకు నెట్టి వేయబడ్డ వివిధ సమూహాలు ఎదుర్కొంటున్న వివక్షత, హింస, అణిచివేతలు, జీవితంలోని అస్థవ్యస్థలు, ఆశ నిరాశలు, కలలు ఈ నేపధ్యమంతా, కధలుగా, కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. వీరలక్ష్మి గారి కొత్త కధల సంకలనం కిటికీ బయటి వెన్నెలలోనూ, మనిషి తాలూకు వేదనలు, కలలు, ఆశలు వున్నాయి. ఆవిడ కధలన్నీ స్త్రీలను కేంద్రంగా చేసుకొని, బహుముఖ రూపాల్లో పితృస్వామ్యం ఎలా ఆపరేట్‌ అవుతుందో చెబుతాయి. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా జీవించగలిగితే మనిషి జీవితం మరింత సరళంగా, మానవీయంగా వుంటుందో చెబుతాయి. ఈ కధల్లోని పాత్రలు గొప్ప జీవకాంక్షతో, భవిష్యత్తు పట్ల చెదరని విశ్వాసంతో మనల్ని పలకరిస్తాయి.

పునరుద్ధానం కధలో ఆదిలక్ష్మి, ఈ విషాదానికి ఈ తేనె చాలులో వింధ్య, అనురాధ, తన్మయిలో సంగీతాన్ని ప్రేమించే తాయారు, భువన, తన్మయి, బరువు భారాల్లో రాజ్యం, ఆరాత్రిలో విశాల, రజని .. ఇటాంటి వాళ్ళంతా, తమ జీవితాల్లో ఎదురైన సవాళ్ళను ఎంతో నిబ్బరంగా, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఏ హంగులు, ఆర్భాటాలు, తీర్పులు, బోధలు లేకుండా తాము నిజమని, మంచి అని నమ్మిన పద్దతుల్లో జీవించిన, జీవితాల్ని తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నించిన స్త్రీలు వీళ్ళు.

పునరుద్ధానం కధలో వ్యసనపరుడై ఆస్తులన్నింటినీ పోగొట్టడమే కాకుండా, నిత్యం హింసించే భర్తని, తన ముగ్గురు పిల్లల్ని , పేదరికాన్ని భరిస్తూ కూడా తన ఇంటి చుట్టూ, పచ్చటి మొక్కల్ని పెంచుకుటుంది ఆదిలక్ష్మి. ఇంటి అరుగులపై ముగ్న్గులేస్తుంది. తనలోని చిరునవ్వుని, ఉత్సాహాన్ని ఎన్నడూ కోల్పోకుండా, జీవితంలో తనకెదురైన ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. పిల్లల్ని పెంపకానికిచ్చి, పొట్టచేత బట్టుకుని వలస పోయిన ఆదిలక్ష్మి తిరిగి తన ఊరికి తిరిగి వచ్చి, గొప్ప ఆశతో జీవితాన్ని ప్రారంభిస్తుంది.

‘‘ బతుకు బరువైనప్పుడల్లా, ఎవరో ఒక ఆదిలక్ష్మి శిధిలాలలోనుంచి, కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ, దారిచూపుతూనే వుంటుందన్న’’ ఆశావాహ దృక్పధంతో ఈ కధని ముగిస్తారు వీరలక్ష్మి.

బరువు భారాలు కధలో రాజ్యంలా కాలాన్ని అదుపు చేయగల విద్యని ఎవరైనా మనకి నేర్పితే బావుండనిపిస్తుంది. వారసత్వంగా తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ ఆస్తుల్నే కాదు,జ్నాపకాల్ని కూడా మిగిల్చి వెడతారు. అలా పెద్దవాళ్ళు వదిలి వెళ్ళిన ఆ పాత వస్తువుల చుట్టూ అనేక జ్నాపకాలున్నా, మళ్ళీ ఎవరికి వారు కొత్త వస్తువుల్ని పోగుచేసుకుంటూ, వాటి చుట్టూ తమవైన జ్నాపకాల్ని అల్లుకుంటూ వుంటారు. ఈ పరంపర అలా కొనపాగుతూనే వుంటుంది. ఒక తరం నుండి మరో తరానికి వచ్చే సరికి ఆ ఆస్తులు, వస్తువులతో వున్న అనుబంధం సహజంగా తగ్గిపోతూ వుంటుంది. ఉతికి మడత పెట్టడానికి ఎదురు చూస్తున్న చీరెల్ని, ఇంట్లో ఎక్కడి వస్తువుల్ని ఎక్కడిక్కడే అర్ధాంతరంగా వదిలేసి సీతమ్మ జీవితం నుండి శాశ్వితంగా నిష్క్రమిస్తుంది. అట్లా వదిలేసిన ఆ ఇంటిని వీరలక్ష్మి వర్ణించిన తీరు మనల్ని చాలా కలవర పరుస్తుంది. ‘‘ రాజ్యం అంటే ఎవరు, ఒక వ్యక్తని ఎందు కనుకుంటున్నావ్‌. పోగు చేయటం నుండి పంచి పెట్టడం దాకా చేసే ప్రయాణానికి తను ఒక రోల్‌ మోడల్‌’’ అన్న గొప్ప తాత్విక సత్యాన్ని చెబుతారు రచయిత్రి. నిజానికి మనుష్యులకి పోగేసుకోవడం అలవాటైనంతగా పంచి పెట్టడం అలవాటు కాలేదు. అది అలవాటైతే పోగేసుకునే కాంక్ష మెల్లిగా కనుమరుగవుతుందన్న ఆశ కలుగుతుంది.

కిటికీ బయటి వెన్నెల కధలో మనం వుండే ఇరుకు గదుల అపార్ట్‌మెంట్‌లలోనూ, ఆకాశాన్ని, పచ్చటి చెట్లనీ, పక్షుల్నీ, కనపడటమే తప్పా వినపడని మనుష్యుల్నీ గమనిస్తూ, మనలో ఒక భాగం చేసుకుంటూ ఎలా ఉత్సాహంగా జీవించవచ్చో రాసారు. ఈ కధలోని నేను పక్కింటి వాళ్ళని ఆమె చూస్తూ వుంటుందన్న విషయాన్ని గమనించారని పనిమనిషి చెప్పాక కూడా ఆమె తన పడక గది కిటికీని మూసేయాలనుకోదు. చుట్టూ వున్న ప్రకృతిలానే ఆ తెలియని మనుష్యులు ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయారు.

‘‘ ఈ మనుష్యుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే, అంత మంచిది. ఎందుకంటే, వాళ్ళు నాకు కావాలి గనుక.’’ అనుకుంటుందామె. ఈ తూర్పు వేపు నిమ్మచెట్టులాగే, ఉత్తర దిక్కునున్న వేపచెట్టు గలగలలోంచి కదిలే ఆకాశపు నీలిమల్లాగే వాళ్లూనూ అని ఆ అపరిచిత మనుష్యుల గురించి అనుకుంటుంది. వాళ్ళని వాళ్ళలాగే ఇప్టపడగల సంస్కారం ఆమెది.

తన్మయి కధలో పాట తనకు తెలియకుండానే తన ఊపిరిలోకి వచ్చేసిన, కడుపు నిండా పాటల్ని దాచుకున్న తాయారు బడిలో, వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాటల్ని పాడేది. అలాంటి తాయారుకి బావతో పెళ్ళయ్యాక ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బరువు బాధ్యతలు, పెద్దవాళ్ళ ధాష్టికాల మధ్య గొంతు దాటి వచ్చేందుకే భయపడిన పాట అమె అంతరంగం లోని పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. పాడమని అడిగే వాళ్ళు లేక, అవకాశంలేక మూగవోయిన ఆమె గొంతు అనేక ఏళ్ళు గడిచాక, చివరికి మేనకోడలు భువన పాడమని అడిగినప్పుడు పలుకుతుంది. విశాఖ సముద్రం ఎదుట నిలబడి ఆమె పాటపాడినప్పుడు, ‘‘ చిన్నప్పుడు పిల్లల కోసం పాలు చేపుకు వచ్చిన అనుభవం లాంటి అనుభవం ’’ కలుగుతుంది తాయారుకు. అమెకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు, కంఠం లోంచి పాట కూడా బయటకు ప్రవహిస్తాయి. తాయారు తరువాతి తరానికి చెందిన భువన తన కెంతో ఇష్టమైన సంగీతాన్ని తనలో నిలుపుకున క్రమంలో, భర్త నుండి సహాయనిరాకరణను, కుటుంబంలో అశాంతిని భరించాల్సి వస్తుంది. తాయారు, భువన పొందలేని, స్వేచ్ఛని, గాయినిగా పేరు ప్రఖ్యాత్తులను ఆ తదుపరి తరానికి చెందిన తాయారు మనవరాలు తన్మయి తన జీవితపు తొలి యవ్వన కాలంలోనే సాధిస్తుంది. స్త్రీల స్వరాలను, స్వప్నాలను బంధించే పురుషాధిపత్యం, కుటుంబంలో కనబడని హింస ఎలా వుంటాయో ఎంతో ఆర్ధ్రంగా చెబుతుంది తన్మయి కధ.

ధైర్యంగా, ఆదర్శవంతంగా జీవించే ఆడవాళ్ళు కూడా ఒక్కో సారి జీవితంలో ఆకస్మికంగా ఎదురయ్యే కష్టాలకి కుంగి పోయి, బాబాలు, స్వాములవార్ల మూఢత్వంలోకి ఎలా పడతారో, చెబుతుంది ఈ విషానికి ఈ తేనె చాలు కధ. భర్తను కోల్పోయి, ఆ దు:ఖం నుండి బయట పడేందుకు, స్వాంతనను పొందేందుకు వింధ్య చేసిన ప్రయత్నంలో అది దొరక్క పోగా, అక్కడా హిందుత్వ మనుధర్మం ఆమె స్థితిని అవమాన పరచటంతో చివరికి మేల్కొని బయట పడుతుంది వింధ్య.

నీడ కధలో   కష్టాల్లో వున్న స్త్రీలని ఆదుకునేందుకు చేసే ప్రయత్నాలు చిత్తశుద్దితో ఉండాలని, ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఎమోషనల్‌గా, హృదయంతో చేయాలి తప్పా, అన్నింటికీ లాజిక్‌ను అప్లయ్‌ చేయాలనుకుంటే సాధ్యం కాదని, నలుగురు కలిస్తేనే అది సాధ్యమవుతుందని చెపుతుంది.

ఆ రాత్రి కధలో ఒక మారు రాత్రి దాడికి గురైన విశాలని ఆమె తల్లి ‘‘ లోకపు ముళ్ళు గుచ్చుకున్నా, గాయాల పాలవకుండా ’’ కాపాడుకో గలిగింది. భర్త ప్రవర్తన వల్ల కలిగిన గాయాలు విశాల తల్లికి లోకజ్నానాన్నిచ్చాయి. పెద్దగా చదువుకోని ఆ తల్లి, కాస్త చదువుకున్న విశాల సామాజిక దౌష్ట్యం కిందపడి నలిగి పోకుండా తమని తాము కాపాడుకోగలిగారు. నగరాల్లో, ఆధునికంగా జీవిస్తున్నామనుకునే ఆడపిల్లలూ మగ్నవాళ్ళ అసభ్యప్రవర్తననీ, దౌర్జన్యాన్నీ ఎదుర్కోక తప్పటంలేదు. వ్యవస్థ విఫలమైన చోట ఎవరి రక్షణని వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది అంటూనే స్వేచ్ఛతో పాటూ విచక్షణ లేక పోవడం పట్ల ఆందోళన పడుతుంది రజని. గీతల్ని చెరుపుకోవచ్చు కధ ప్రాంతాల మధ్య, మనుష్యుల మధ్య వుండే సంబంధాల గురించి చెబుతుంది. తెలియనప్పుడు, అర్ధం కానప్పుడు అపార్ధాలు మిగులుతాయి. కానీ ఒక సమయమొస్తే అందరూ మనుష్యులుగా మారతారు. అపార్దాలు కరుగుతాయి. విభజన రేఖలు, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడూ వాటిని చెరిపేసి మనుష్యుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది. వ్యక్తులకీ, ప్రాంతాలకి కూడా వర్తించే మంచి కధ ఇది.

మెత్తంమీద ఈ సంకలనంలోని కధలు క్లుప్తంగా, సరళంగా, సూటిగా వున్నాయి. వీరలక్ష్మిగారు భావుకురాలు కాబట్టి కధనానికి అడ్డుపడని కవిత్వపు జల్లులు చాలా చోట్ల కనిపిస్తాయి.

‘‘ఇల్లంటే మనకి స్థిమితాన్నీ, శాంతిని, ఇవ్వవలసిన చోటు. అది దొరక్కపోతే, ఆ ఇంటి గురించి ఆలోచించటం అనవసరం. అదసలు ఇల్లేకాదు’’ ‘‘ సౌకర్యాలు, సుఖాల ముందు జ్నాపకాలేపాటివి’’

(పునరుద్ధానం). ‘‘ నీ గురించి మితంగానూ, ప్రపంచ క్షేమం గురించి అతిగానూ ఆలోచించక పోతే, ఎందుకిలాంటి గేదరింగ్స్‌’’ (నీడ) వంటి జీవిత సత్యాలను ఈ కధల్లో చాలా అలవోకగా చెబుతుంది ఆవిడ.

కుటుంబరావు రచనల గురించి కాళీపట్న రామారావు మాష్టారు చెప్పిన మాటలు వీరక్ష్మిగారి కధలకు కూడా వర్తిస్తాయనిపించింది నాకు.

‘‘ భాషేకాక, ఆ కధ కట్టే తీరు కూడా చాలా సరళంగా, వుండేది. వాటిలోని పాత్రలు, ఆ పాత్రల తాలూకు సమస్యలు, వాటిని వారు ఎదుర్కొనే తీరు, అన్నీ నేనెరిగిన మనుష్యులకూ, జీవితాలకూ, చాలా దగ్గరగా కనిపించేవి. కధ మధ్య వారు చేసే వ్యాఖ్యలు నా అవగాహనకు చాలా అవసరంగా వుండేవి. చివరికి కధ ముగించే సరికి, నా అనుభవమో, జ్నానమో, లేక రెండూనో, ఎంతో కొంత మేరకి పెరిగినట్లుండేవి’’

వీరలక్ష్మిగారి కధల్ని చదువుతున్నప్పుడు మనకి సరిగ్గా అలానే అనిపిస్తుంది. అంచేత ఈ కధలు కాలానికి నిలుస్తాయి. ఆవిడ జీవితపు దృక్పధం మనుష్యులు సుఖంగా, మంచిగా, ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా, ఆత్మ గౌరవంతో జీవించాలని. మానవ సంబంధాల్లో వున్న సకల అమానవీయతలూ పోవాలనీ, మంచి సమాజం రావాలనీ. ఏ సమాజంలోనైనా జరగాల్సింది ఇదే. వీరలక్ష్మి గారి కిటికీ బయటి వెన్నెల కధల పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం. ఆవిడ మరిన్ని మంచి కధలు రాయాలనీ, ఆమె మాత్రమే చేయాల్సిన, అసంపూర్ణం గా మిగిలిపోయిన రచనలను ఆమె పూర్తిచేసేందుకు పూనుకోవాలనే చిన వీరభద్రుడు ఆకాంక్ష , అవిడని అభిమానించే పాఠకులందరిదీనని ఆవిడ గుర్తిస్తారని ఆశిద్దాం.

-ఎం. విమల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 ఇంకా మొదలు కానిది

vimala

ఏదో ఒకటి అట్లా మొదలెట్టేసాక
అది ఎన్నటికీ ముగియనట్లు
ఇంకేదో అసలైంది కొత్తగా మెదలెట్టడమన్నది
ఎన్నటికీ మొదలెట్టనట్లు
ఏదో నిత్యం మరిచిపోయినట్లు
అదేమిటో ఎన్నటికీ జ్నాపకం రానట్లు
రాటకు కట్టేసిన గానుగెద్దులా
అట్లా, అక్కడక్కడే నన్ను నేను తొక్కుంటూ
తలవంచుకు తారట్లాడుతున్నట్లు
దిగులు దిగులుగా తండ్లాడుతున్నట్లు

నాలోపలి నదిలో మునిగి
ఈతరాక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు
కన్నీళ్ళు రానిన దు:ఖం ఏదో లోలోన గుక్కపట్టి
కడుపులో సుడిగుండమై తిరిగినట్లు
పగ్గాలు తెంచుకోవడం, వదిలేయాల్సిన వాటిని
అట్లా వదిలేయడం ఎన్నటికీ తెలియనట్లు
పుస్తకం మూసినంత సులువుగా
అక్కడో గుర్తుపెట్టి, జీవితాన్ని మూసేయలేనట్లు
పేజీలన్నీ ప్రశాంతంగానో, అశాంతిగానో
మళ్ళీ నాకునేనో, మరెవరో తెరిచేదాకా నిద్దరోయినట్లు

మనశ్శరీరాల మహా శూన్యంలోకి ఆత్రంగా
ఎక్కడెక్కడి నుండో వెతుక్కొని
కాసిన్ని నవ్వుల్నీ, నక్షత్రాల్నీ
ఆకుపచ్చ వనాల్నీ, పక్షుల రాగాల్నీ
కొంచెం ప్రేమనీ, ఉక్రోషాల్నీ
ఆగ్రహాన్నీ, అసహాయ ఆర్తనాదాల్నీ వంపుకున్నట్లు
అయినా లోనంతా ఖాళీ ఖాళీగానే వున్నట్లు
నిజానికి మెదలెట్టాల్సిందేదో మెదలెట్టకుండానే,
మరేదో ముగియకుండానే మధ్యలోనే ఆగిపోయినట్లు

అట్లా అందరిలానే అనంతకాలంలో
లిప్తపాటు మెరిసి మాయమైపోయినట్లు
అట్లా అందరిలానే మహాసముద్రపు ఒడ్డున
చిన్న ఇసుక రేణువులా మిగిలిపోయినట్లు
ఏదో కొంచం మిగిల్చి, ఎవరెవరికో పంచివెళ్లాలన్న
చివరాఖరి కోర్కెలేమీ లేనట్లు
ఇదంతా ఇట్లా ఎప్పటికి తెలిసేట్లు?

మృత్యువు కళ్లపై సుతిమెత్తటి పెదవుల్ని ఆన్చి
ముద్దుపెట్టుకునే ఆ ఆఖరి క్షణాల్లోనా?
మెల్లిగా ముడుచుకుంటున్న కనురెప్పల మడతల్లోంచి
జీవనసత్యమేదో సుతారంగా పక్షిఈకలా ఎగిరిపోయేప్పుడా?

అప్పుడైనా నిజంగా మనం మెదలెట్టాల్సినవేవో
చిరకాల పరిచిత స్వప్నంలా లోనుండి బయటకు నడిచి వస్తాయా?

అట్లా ఆఖరిసారిగా ఆగిపోయిన అరమూసిన మనిషి కళ్ళలో
ఇంకా పూర్తికాని పద్యమేదో నిలిచిపోయినట్లు
మొదలు కాని స్వప్నాలేవో మరెవరినో వెతుక్కుంటూ వెళ్ళిపోయినట్లు…..

-విమల

కొంచెం అటు ఇటుగా

ashok3

కొంచెం అటు ఇటుగా మనమంతా ఒకటే
కొంచెం ఇటు అటుగా నువ్వూ నేనూ
మనమంతా ఒకటే
నాకు నేనెప్పుడూ ఆకాశంకేసి సగర్వంగా
కొంచెం పొగరుగా తలెత్తిన పర్వతంలా కనపడతాను

నీకు నీవెప్పుడూ నింగిన రివ్వున ఎగిరే పక్షిలా
కొంచెం నేలను వెక్కిరిస్తూ కనపడతావ్‌

శిఖరాలు కూలుతాయనీ
విరిగిన రెక్కలతో పక్షి రాలిపోతుందనీ
మనకెందుకో నమ్మాలనిపించదు

సముద్రాన్ని ఎన్నటికీ వీడని పడిలేచే కెరటాల్లా
మన లోలోపలి తీరాలకేసి తలలు బాదుకుంటాయి
మానవ సహజ సకల ఉద్విగ్నతలు

కొంచెం అటు ఇటుగా మనందరం ఒకటే
దేనినో అందుకునేందుకు చేతులు చాస్తాం
దేనినో పొందకుండా వుండేందుకు
చేతులు ముడుచుకుంటాం
ఒకే మొఖంపైన ఎనెన్నో పదచిత్రాల్ని ముద్రిస్తాం

అవే కళ్ళు అవే కళ్ళు
అవే కళ్ళు మిలమిలా మెరుస్తాయి
అవే కళ్ళు ఎడతెగని దుఖాన్ని కురుస్తాయి
అవే కళ్ళు సుర్మా అద్దిన చూపులో కవ్విస్తాయి
అవే కళ్ళు క్రోధంతో ఎర్రబడతాయి

ఒకే మొఖంపై ఉశ్వాస నిశ్వాసాల
తిరోగమన పురోగమనాలు
మీసం కింద కొద్దిగా విచ్చుకున్న చిరు పెదవులు
మోహపు మధువుల వగలమారి పెదవులు
చప్పున ముద్దు పెట్టుకునే పెదవులు
అవే పెదవులు
రెండుగా చీలిన సర్పం పెదవుల్లా
మాటల విషాన్ని చిమ్ముతాయి

కొంచెం అటు ఇటుగా మనందరం ఒకటే
మోహిస్తాం, కలహిస్తాం
నవ్వుతాం, దుఖిస్తాం
ఆగ్రహిస్తాం, అనుయయిస్తాం
తల ఎగరేస్తాం, తలవంచుతాం

చివరికి, అంతా ముగిసిపోయాక
మరేం చేయలేక
కొంచెం అటు ఇటుగా మనమంతా
ఈ లోకం మొఖంపైన వస్త్రాన్ని కప్పి
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాం
కొంచెం అటు ఇటుగా

-విమల

vimala1

పేరు తెలియని పిల్లవాడు

the three dancers-picaso

 

యవ్వనం పొద్దుతిరుగుడు పువ్వులా విచ్చుకొని తలవాల్చింది
ముసలితనమేలేని మనసు విహరిస్తోంది ఆకాశంలో
అందని ఇంద్రధనుస్సు అందుకునేందుకు

తొలియవ్వన కాంతి మేనిపై తళతళలాడేవేళ
ఎందుకు సెలఏరులా తుళ్ళిపడతావో
పురివిప్పిన నెమలిలా పరవశంతో నర్తిస్తావో
మనసును గాలిపటంచేసి ఆకాశంలోకి ఎగురవేస్తావో
నువ్వెందుకు కిలకిలా నవ్వుతావో,
నీక్కూడాతెలియదు

ఒకానొక రాత్రి
సరుగుడు చెట్లపై కురిసి జారే ముత్యాల వానని
కిటికీలోంచి తొంగి చూసే వేళ
నీ చందమామ మోముకోసం
వీధిలైట్ల క్రీనీడకింద వానలో తడుస్తూ
పేరుతెలియని పడుచువాడు నిలబడతాడు
నీకోసం మాత్రమే  నిరీక్షించే
అతడికేసి నువు విసిరేసే జలతారు నవ్వుల్ని
అతడు వొడిసి పట్టుకుంటాడు

ఎన్నో ఏళ్ళు గడిచిపోయాక, వాన వెలిసిపోయాక కూడా
అతడావేళ నీలో రేపిన అలజడి
తొలకరివాన కురిసిన
ప్రతి వానాకాలంగుర్తుకొస్తుంది

ఎవరూలేని ఓ మునిమాపువేళ
అతడిచ్చిన సంపెంగెపూలను అందుకునేందుకు
చాచిన నీ చేతివేళ్ళకు తాకిన
అతడి తడబడిన స్పర్శ తాలూకు వెచ్చదనం
చలి రాత్రులలో కప్పుకున్న రజాయిలా ఇంకా హాయిగొలుపుతుంది

దాచుకున్న పూలువాడిపోయి
జీవితపు పుటల నుండి ఎక్కడో జారిపోతాయి
ఆ పూల కస్తూర పరిమళం మాత్రం
ఏకాంత వేళల్లో
ఏకతారను మీటుతూ మనసువాకిట నిలిచి నిన్ను దిగులుగా పలకరిస్తుంది

ముసలితనమేలేని మనసును కమ్ముకుంటుంది
అతడి ఙ్నాపకం ఆకాశంలా

ఆ పడుచువాడు మళ్ళీ ఎన్నడూ తారసపడకపోవచ్చు
లేదూ తారసపడ్డా, బహుషా అతడు నిన్ను,
నువ్వు అతడ్ని గుర్తించనట్లు వెళ్ళిపొయివుంటారు
అతడి కోసం ఎదురుచూడటం మరిచిపోయినందుకే కాబోలు
ఆ పడుచువాడు ఇంకా తాజా జ్నాపకంలా నీలో మిగిలివున్నాడు.

vimala1విమల
నవంబర్‌, 2013

కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు

ramasundariకొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీ లోయా విప్లవ పోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గరిడీలు సృతిపధంలో నడచినట్లు గుర్తు. చైతన్య గనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండె గదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను కరీంనగర్ విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమల గారు. మొదట పాలపిట్ట మాసపత్రిక లో ప్రచురించబడి కధ 2012 లో కనిపిచ్చిన ఈ కధ ఒక ఆణిముత్యం.

కధా స్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంబ్భైవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన భాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలను కొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవ యువకులు. ఒకరు పెళ్ళై చంటి బిడ్డకు తండ్రి అయిన తిరుపతి, ఇంకొకరు అనాధ అయి  ప్రేమ తప్ప ఇంక ఏమి లేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమ కధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తన తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతి మీద వేయించుకొన్న  వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలి పోతుంది.

” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నా పొలంగొంటె ఏటివడ్డున ఒక రెడకరాలనా- అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్న పిల్లల కోసం ఒక మంచి స్కూల్ బెడ్తం. క్లాసులు చెట్ల క్రింత- అదేంది. ఆ(… శాంతి నికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపు కాంతి.  ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”

తెల్లవారి మసక చీకటిలో, మసక కళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య-విగత జీవిగా ఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమ కధ ఉందా? ఒక వెన్నెల రాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూంబింగ్ చేసి వస్తున్న పోలిసులను చూసి భయపడిన పారిపోతుంటే ఇద్దర్ని కాల్చి వేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను  చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.

కధ మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విఘ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న అసాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ, పెనుగులాడి, పెనుగులాడి నా లోపల నేనే పొడి పొడిగా రాలుతూ…”  అంటూ ఆ నాటి విషాదాన్ని  ధ్యానించుకొంటుంది . రచయిత్రికి  విప్లవం పట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధ పొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరో ప్రపంచం, ఎర్ర బావుటా నిగనిగలు, ప్రళయ ఘోషలు, ఝుంజా మారుతాలు, జనన్నాధ రధ చక్రాలు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? ఏవి, ఏవి తల్లి నిరుడు కురిసి హిమసమూహలు?”

ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటిత భాష్యం (అన్-టోల్డ్ టెక్స్ట్) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలోఅనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం.  సమ సమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలై పోయిన వందలాది యువతీ యువకుల మృత్యు కేళి కలిగించిన వగపు.

మాధవా కన్న కలలు భారత దేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి యువకుడు కనే ఉంటారు. చిన్న ఇల్లు, చేయటానికి పని; ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ మాధవ లాంటి వాని ఊహలలో ఈ రాజ్యహింస తాలూకూ పీడ కలలు ఉండి ఉండక పోవచ్చు. ఈ ఎన్ కౌంటర్లు అలాంటి  కనీస కోరికలు కోరే, వాటి కోసం పోరాడే వాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పేతీర్పులు. కాలే చితి పై మండుతున్న శవాల తాలూకూ పొగలు అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడు మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి, ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పు పట్టలేని అమర వీరుల కుటుంబాల ప్రతినిధి.

ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యద్భుతం గా  చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధిక జీవనాల గురించి , ముగిసి పోయిన పోయిన జమిందారీ వ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్క వాక్యంలో  దృశ్యీకరించారు.

“శిధిలమైన మట్టి గోడలు, జాజు నీలం రంగులు పూసిన దర్వాజాలు, చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్న గరిడీలు, పలకని రాతి దేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకు చేటలు….”  .

మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను కూడ ఎత్తి చూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిర్మాణం  చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.  “పెరిగిన మధ్య తరగతి మనుషులు- నీటివసతి- కొత్త వ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదది-  జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏ చేయాలో ఎలా చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”

ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తు గా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్త హస్తాలను చూసుకొంటుంది. ఉద్యమ వైఫల్యాలు, మిగిలిపోయిన కర్యవ్యాలు ఈ చివర వాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధ నంతటిని ఈ చిన్న వాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చినట్లైంది.

***

కొన్ని నక్షత్రాలు –విమల

మార్తా ప్రేమకధ

vimala1

 

మే 1, 1960లో పుట్టారు విమల. తొలికథ 1978లో అచ్చయ్యింది. చిన్నవయసు నుంచే రచనా వ్యాసాంగం కొనసాగించారు. కవయిత్రిగా ప్రసిద్ధురాలు. చాలా విరామం తర్వాత తిరిగి కథరచన మొదలుపెట్టారు.  ఇప్పటిదాక 10 కథలు రాశారు. రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. గతంలో విప్లవరచయితల సంఘం, ప్రగతిశీల మహిళా సమాఖ్యలో పనిచేసి ఇప్పుడు వివిధ రంగాల్లో సామాజిక కార్యకర్తగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.  -వేంపల్లెషరీఫ్‌

తిరుపతిలో రైలెక్కిందన్న మాటేగానీ మార్తా మనసు మనసులో లేదు. ఎప్పుడూ లేనిది, ఆమెను కలవాలని కబురు చేసాడు నాగన్న. అరవయ్యారేళ్ల ఆయన్ని చూస్తే మార్తా కి చాలా గౌరవం. అతను లెనిన్‌చంద్ర అన్నయ్యనే దానికన్నా, అతను రెక్కలు చాచి ఎట్లా, ఎందర్ని తన అక్కున చేర్చుకున్నాడో, ఎడారిలో దాహం తీర్చే ఒయాసిస్సులా అతని ఇల్లు ఎలా మారిందో చూసాక,  అతని పట్ల ఆమె గౌరవం మరింత పెరిగింది. ఆయన ఏ సంగతి, ఎవరికీ, ఎన్నడూ పెదవి విప్పి,  చెప్పలేదు. ఎవరైనా అడిగినా, నవ్వి ఊరుకుంటాడు. బక్కపలచగా, ఓమాదిరి ఎత్తుతో, నీరుగావిబట్టిన తెల్ల లుంగీ , కండువాతో, వుండే నాగన్న ఆమె కళ్ళ ముందు కదలాడాడు.

పరుగెడుతున్న రైలు కిటికీ లోంచి బయటకు చూస్తుంటే, కమ్ముకున్న చీకట్లను పరిహసిస్తున్నట్లు, పుచ్చపూల్లాంటి వెన్నెల, తనతో పాటు పరుగెడుతున్న చెట్ల వెలుగు నీడలు, చల్లగా వీస్తున్న గాలి. ఆకాశంకేసి చూసింది మార్తా. మబ్బుల మధ్య దోబూచులాడుతున్న చందమామను చూసి, ‘‘ ఇవ్వాళ పౌర్ణమి’’ అనుకుంది. ఆమెకి వెంటనే  చంద్ర గుర్తుకొచ్చాడు. అతడేం చేస్తున్నాడో ఇప్పుడు! అతడు కూడా తనలానే నిద్ర పట్టని రాత్రుళ్ళు, ఆకాశంకేసి చూస్తూ వుంటాడా? ఏం ఆలోచిస్తూ వుండవచ్చు?

అతని ఆలోచనలు గాజు పెంకుల్లా, ఆ జైలు గది గోడల్ని, కటకటాల్ని తాకి, భళ్ళున బధ్ధలై, అట్లా పొడిపొడిగా రాలి పోతాయా? తన చూపులూ, అతని, చూపులూ కలుసుకునే ఈ అనంత ఆకాశం ఎక్కడైనా ఒకటేనా? అసలతనికి ఆకాశం కనబడుతుందో లేదో? ఆకాశమే కనబడని వాళ్ళకి చందమామ గురించి కలలెలా వస్తాయ్‌? ఇక్కడి చందమామ లోంచి, ఓ చిన్ని ముక్కని దొంగిలించి, కాసిన్ని నక్షత్రాల్ని పోగుచేసి, అతని జైలు వాకిటి ముందు మల్లెపూలలా చల్లనా? మార్తా పెదవులపై, సన్నటి నవ్వు.

ఇంతవరకూ అతనితో ములాఖతే లేనిదాన్ని, అతని మొఖమే చూడని దాన్ని, ఒక పలకరింపో, ఒక కరస్పర్శో లేనిదాన్ని, అతని వాకిటి ముందు   నక్షత్రాల్ని, చందమామనీ రాశి పోద్దామనే వెర్రి కోర్కెలేమిటి అనుకుంది మళ్ళీ. పేమను మైకంతోనూ, పిచ్చితోనూ పోలుస్తారు. ప్రేమించటంలో వున్న అమాయకత్వం, తన్మయత్వం, కాసింత తిక్క, ఆ అనుభవానికి లోనైన వాళ్ళకి మాత్రమే అర్ధమవుతుంది.

ఆ ప్రేమ ముందు, ఆ అద్భుత అనుభవం ముందు, ప్రపంచంలో మరేదీ అక్కర లేదనిపిస్తుంది.

రాత్రి తలదువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటే, మరెవరో, తనకు పరిచయమేలేని, తనది కాదనిపించే, తన మొఖాన్ని చూస్తున్నట్లనిపించింది మార్తాకి. వంటిపైన కలనేత రంగుల నూలు చీర, జడవేసుకుని బిగించిన చిన్న ముడి, నుదిటిపై ఓ నల్ల చుక్క, మెళ్ళో పూసల దండ, చేతులకు మట్టి గాజులు…తానెప్పుడు నలభయి నాలుగేళ్ళ మార్తాగా ఎలా మారి పోయానో తెలియనేలేదు అనుకుందామె. హఠాత్తుగా ముసలిదాన్నయి పోయాననిపించిదామెకు.

పదోతరగతి దాకా అమ్మాయిల బళ్లో చదువుకుని, మెదటిసారి, ఇంటరులో కో ఎడ్యుకేషను కాలేజీలో , మగపిల్లలతో పాటూ కూర్చొని చదవటం కొత్తగా కొంచం భయంగా, గమ్మత్తుగా వుండేది. చంద్ర తన తరగతే అయినా, అతడ్ని గమనించటం మొదలు పెట్టింది మాత్రం, మరో మూడు నెలల తరువాతే! అతను, అతనితో పాటు మరికొందరు, కరపత్రాలేవో పంచుతూ, తరగతులు బహిష్కరిస్తున్నారు. సాంఘిక సంక్షేమ హాస్టలు పిల్లల స్కాలర్‌షిప్పుల విషయం, వారి దుస్ధితి గురించి అతను ఆవేశంగా మాట్లాడాడు.

ఏవో, ఇలాంటి పనులతోనే, ఎప్పుడూ తెగ బిజీగా వుండేవాడతను. గుంటూరులో ఆమె చదివే, కాలేజీలో కూడా విద్యార్ధులు, కులాలు,ఆర్ధిక హోదాల వారీగా, చీలిపోయి వుండే వారు. దళిత అబ్బాయిలని, అమ్మాయిల్ని అవమానించటం, వేధించటం చాలా సాధారణ విషయంగా వుండేది. నిజానికి, కారంచేడు సంఘటన తరువాతే, దళిత విద్యార్ధులు మెల్లగా ఒకటవడం మొదలు పెట్టారు.

మరికొన్ని, ఇతర విద్యార్ధి సంఘాలు కూడా చురుగ్గా పనిచేసేవి. వాళ్ళందరి మధ్య అప్పుడప్పుడూ, గొడవలు కూడా జరుగుతుండేవి.

ఎప్పుడైనా, తన క్లాస్‌మెంట్స్‌తో పాటు, పొలోమని, ఏ ఊరేగింపుకో వెళ్ళి , అందరితో పాటు అరవడం మార్తా కి కూడా సరదాగా వుండేది. ఇలాంటి వాటిల్లో చంద్రా అందరికన్నా ముందుండేవాడు. అంతే, అంతకు మించి ఆమె అతని గురించి ఎక్కువగా  ఆలోచించ లేదు మెదట్లో. కానీ ఆ తరువాత, ఆడపిల్లల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచని అతని వెంట ఆమె చూపులు, ఆమె అదుపు తప్పి పరుగెత్తే వెందుకో.  ఆ రెండేళ్ళలో వాళ్ళిద్దరూ, అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు.ఆ సంభాషణ వాళ్లిద్దరిమధ్యా సాన్నిహిత్యం పెరిగేంత దగ్గరగా  వుండేదేం కాదు.

మార్తా కి ఐదేళ్ల వయసున్నప్పుడు, వినుకొండ నుండి గుంటూరుకు వలస వచ్చింది వాళ్ల కుటుంబం. వాళ్ళ నాన్న గుంటూరు మిర్చీ యార్డులో పనిచేసేవాడు. తల్లి ఇంట్లోనే మిషను కుట్టేది. మార్తా, పదో తరగతి చదువుతున్నప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. డిగ్రీ రెండో సంవత్సరంలో వున్న మార్తా వాళ్లక్కకి, బంధువులబ్బాయితో అప్పటికే, సంబంధం కుదిరింది. మరో ఆరునెలల్లో, ఆమెకి పెళ్ళి జరిగి పోయింది. రెండు గదుల రేకుటింట్లో, తమలానే చాలీ చాలని ఆదాయంతో, కటకటలాడుతూ, ఆశలన్నీ ఆరిపోయిన, ఇరుగుపొరుగు మధ్య పెరుగుతున్న మార్తాకి, ఆ జీవితం పైన ఏదో అసంతృప్తి. ఎవరిమీదో, ఎందుకో తెలియని కోపం. ఊపిరాడని తనం. అక్కడి నుండి బయటపడాలనే ఆరాటం. అక్కడి నుండి బయటపడాలనే ఆరాటం. ఎవడో, ఏ రాకుమారుడో, తనచేయి అలా సుతారంగా పట్టుకుని, ఆ మురికి వీధుల ఇరుకు గదుల ఇంటి నుండి, దూరంగా, తనను దూరంగా తీసుకు వెడితే బావుండన్న, పదహారేళ్ళ ప్రాయపు అమాయకపు రహస్య కల…

కుటుంబ ఆర్ధికఇబ్బందుల కారణంగా మార్తా  చదువు డిగ్రీ మొదటి ఏడాది మధ్యలోనే ఆగిపోయింది. అమ్మా,తాను, బతుకుతూ, తన కట్నం డబ్బులను తానే కూడబెట్టుకోవాల్సిన పరిస్ధితి మార్తాది. ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రూఫులు దిద్దుతూ, కంపోజింగ్‌ నేర్చుకుని, ఉద్యోగం చేయటం మొదలు పెట్టింది. జీవితం యాంత్రికంగా  ఇట్లానే అనేక ఏళ్ళుగా, తాను బతుకుతున్నట్లనిపించేదామెకి. ఆమెకి పెద్దగా స్నేహితులెవరూ లేరు. వున్న ఒకరిద్దరిని కూడా ఎక్కువగా , కలిసేది కాదు.

ఆ ఉద్యోగంలో చేరిన ఏ రెండేళ్ల తరువాతో  అనుకోకుండా, ఓ సారి వాళ్ళ ప్రెస్‌కి లెనిన్‌చంద్ర వచ్చాడు. ఏదో కరపత్రం ప్రింటు చేయించేందుకు. కాలేజీ వదిలేసాక, అతనితో ఎదురుబడి మాట్లాటడటం అదే మొదటి సారి. ఏవో కబుర్లు సాగాయి. మొదట్లో పనుల మీదే పెస్‌కి వచ్చే వాడు. మార్తా కోసం పుస్తకాలు తెచ్చేవాడు. కొంచం అర్ధమయి, అర్ధంకాక ఆమె చదివేది. వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ సాగేందుకు ఆ పుస్తకాలు మాధ్యమంగా వుండేవి. తర్వాత తర్వాత పనేం లేకపోయినా వచ్చేవాడు.

‘‘ఈ దారినే వెడుతున్నా. ఊరికే, చూసి పోదామని…’’ అంటూ బిడియంగా నవ్వే వాడు.అతడు అట్లా తన కోసమే, వస్తున్నాడన్న ఊహ ఆమెకి ఏదో తెలియని ఆనందాన్ని కలిగించేది. ఆమెకి అతడి పట్ల ఇష్టంలాంటిది కలగసాగింది. అతడికోసం ఎదురు చూడటంలో అనిశ్చిత, అతడు కనబడగానే  తనలో కలిగే కలవరపాటు, ఆమెకి కొత్తగా వుండేవి. ఒక్కోసారి వారాల తరబడి కనబడకుండా పోయేవాడు. డిగ్రీ పరీక్షలైపోయాక, ఇక అతను చదువు మానేస్తున్నా నన్నాడు. అతనితో మార్తాకి చనువు పెరిగింది. అప్పుడప్పుడూ, వాళ్ళిద్దరూ, ఏ శంకర్‌విలాస్‌ వద్దో, నాజ్‌ సెంటర్‌ వద్దో కలుసుకునే వారు. అరుదుగా, సినిమాకో, హోటలుకో వెళ్ళే వాళ్ళు.

అతనిది రేపల్లె దగ్గరి పల్లెటూరు.వ్యవసాయకుటుంబం.ముగ్గురన్నలు, ఇద్దరక్కలు. అతనే అందర్లోకీ చిన్న వాడు.

‘‘ఎందుకు నీ కట్లాటి పేరెట్టారు?’’ అంటూ నవ్వింది మార్తా.

‘‘నా పేరుకేంలే! మా నాన్న  ఓ అన్నకి చార్వాకుడు, మరో అన్నకి స్టాలిన్‌ అని పెట్టాడు.మా పెద్దక్క పేరు నాస్తిక కుమారి, ఇంకో అక్క పేరు స్వేచ్ఛాభారతి. మా పెద్దన్నకే ఎలాగో నాగన్నని పేరెట్టారు. ఆపేరు మా తాతది.’’

‘‘అయ్య బాబోయ్‌!’’ అంటూ గుండెల మీద చేయేసుకు, పడీపడీ నవ్వింది మార్తా. నవ్వినప్పుడు ఆమె బుగ్గల పై పడే చొట్టల కేసి చూస్తున్నా డతను.

‘‘నవ్వితే నువ్వు బావుంటావేం ’’ అన్నాడు తనకు తెలీకుండానే. ఆమె అదేం పట్టించుకోకుండా, ‘‘ నువ్విట్లా తిరిగితే మీ ఇంట్లో ఏం అనరా?’’

‘‘ఎందుకంటారు? రెండుతరాల కమ్యునిస్టు కుటుంబం మాది. మా తాత, నాన్నా… ఒక్క మా స్టాలిన్‌ అన్నకి తప్పా, అందరికీ పార్టీవాళ్లు ఇష్టమే. ‘ఆస్తిపాస్తులన్నీ కరిగించి మమ్మల్ని బికారెదవల్ని చేసావంటూ’ మా నాన్నతో తగువేసుకుంటాడు.’’ అతడి గొంతులో కొంచం అతిశయం ధ్వనించింది. అంత చొరవగా, ఆత్మవిశ్వాసంతో అతను కనబడేందుకు, వాళ్ళ ఇంట్లో, అతనికి దొరికిన స్వేచ్ఛే కారణమేమో అనుకుంది మార్తా.

కొంతమందితో  కలిసి పార్వతీపురం చుట్టు పక్కల గ్రామాల్లో సర్వే చేసేందుకెడుతూ. తనతోపాటు మార్తాని కూడా రమ్మని అడిగాడు చంద్ర. ‘‘నాలుగైదురోజులంటే, రాగలను’’ అంటూ బయలుదేరేందుకు సిద్ధమైందామె. అందరూ వెళ్ళినా, మార్తాని తీసుకెళ్లేందుకు ఆగిపోయాడతను. స్నేహితురాలి పెళ్ళికని అబద్ధంచెప్పి, బ్యాగు తీసుకుని చంద్రా గదికొచ్చింది.

ఆమె లెనిన్‌చంద్ర గదికి చేరుకొనేసరికి  చీకట్లు కమ్ముకున్నాయి. ఇంతకు ముందుకూడా అక్కడికి, వచ్చినా ఇలా వాళ్ళిద్దరే, ఆ గదిలో కూర్చునివుండటం మొదటిసారి. అందరబ్బాయిల గదిలానే ఎప్పుడూ చిందరవందరగా వుండే ఆ గది ఇప్పుడు కొంచం శుభ్రంగా సర్దివుండటం ఆమె గమనించింది. ఆ పని అతనే చేసాడనుకుంది.  ఆమె వస్తుందని లెనిన్‌చంద్ర  కూరముందే చేసాడు. ఆమె వచ్చాక ,బియ్యం పొయి మీద పెట్టి ‘‘ పెరుగు తెస్తా ’’ అంటూ బయటకెళ్ళాడు.

ఏవో పొట్లాలతో తిరిగి వచ్బాడు. ఈ లోగా అన్నం పొంగిపోతూ వుంటే, గెరిటతో కలిపి,  గంజి వార్చింది. భోజనాలయ్యాక, మార్తా సాయం చేయబోతే, వారించి, శుభ్రంగా గిన్నెలు తోమి, కడిగి పెట్టాడు చంద్ర.

వాళ్ళెక్కాల్సిన బస్సు రాత్రి పన్నెండిరటికి.

‘‘పుస్తకాలు తెచ్చిచ్చి,  పరీక్ష రాయమంటే, కనీసం ఫీజు కూడా కట్టలేదు నువ్వు?’’ నిష్టూరంగా అన్నాడు చంద్ర.

‘‘ ఏంచేయను? ఆ ప్రెస్‌లో, ఇంట్లో పనులతో తెమలటం లేదు చంద్రా! నాకసలు తీరిక దొరకటం లేదు. ఏం చేయమంటావ్‌ చెప్పు?’’

తెరచిన ఆ గది తలుపు ముందు పరుచుకున్న వెన్నెల చారను చూస్తూ అందామె. అతను మరేం అనలేదు. మెల్లిగా లేచి, మేకుకు తగిలించిన గుడ్డ సంచీ లోంచి, ఒక పొట్లం తీసి, ఆమె చేతుల్లో పెట్టాడు సంకోచంగా.

‘‘ప్లీజ్‌, ఏం అనద్దు’’

బాదం ఆకుల ఆ పొట్లాన్ని విప్పితే, ఆ పచ్చటి ఆకుల మధ్య తెల్లటి మల్లెపూల దండ, పరిమళాల్ని వెదజల్లుతూ… ఆ దండని చేతుల్లోకి తీసుకుని, చెంపలకానన్చుకొని ‘‘ఎందుకనను? ధ్యాంక్స్‌’’ అని నవ్వింది.

‘‘తిడతావేమోనని భయపడ్డాను. నీకు మల్లెపూలంలే ఇష్టవని అన్నావోసారి. బజార్లో కనిపిస్తే….’’ ఏ ప్రాధాన్యతా లేని సాధారణ విషయంగా, చెప్పేందుకతను ప్రయత్నించినా, అతనిలోని మృదుత్వపు కోణం అర్ధమయి, అతను మరింత దగ్గరగా వచ్చినట్లనిపించిందామెకి. ఆ పూలని ఇంకా దోసిట్లోనే పట్టుకొనివుందామె.

‘‘ప్రేమంటే ఏమిటి?నువ్వు నా పక్కనుంటే, నాకు ఆనందంగా, హాయిగా వుంటుంది రా’’ అంది దిగులుగా.

గోడకానుకుని  కాళ్ళుచాపుకు కూర్చుని మార్తాకేసి చూస్తున్న చంద్ర చూపు పక్కకు తిప్పుకొని  ‘‘ ఏమో? నాకేం తెలుసు? నాక్కూడా నీలానే అనిపిస్తుంది. నువ్వు గుర్తొస్తావ్‌ ఎప్నుడూ! నువ్వు నవ్వుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది.

సొట్ట బుగ్గల పిల్లా!’’ అతడు అన్న తీరుకి మార్తాకి నవ్వొచ్చింది.

బస్సులో కిటికీ పక్కన కూర్చుంది మార్తా. ఆమె పక్కనే కూర్చున్నాడతను. అంత దగ్గరగా, అతడి స్పర్శ ఆమెకి కొత్తగా వుంది. ఆమె తలలో విరిసిన మల్లెపూల పరిమళం, అట్లా ఆమె తన పక్కన కూర్చొని వుండటం, అతనికి  హాయిగా వుంది. తెరచిన కిటికీలోంచి, మాయమవుతూ కనిపిస్తున్న చందమామని చూస్తున్న ఆమెతో ‘‘మాట్లాడు’’ అన్నాడతను గుసగుసగా.

‘‘ఏం మాట్లాడను? ఇట్లా ఎప్పటికీ నా పక్కనే వుంటావా?’’ అడిగిందామె.

‘‘ఊ!’’ అతడామె చేతిని, తన చేతుల్లోకి తీసుకొని, మృదువుగా నిమిరాడు.

‘‘చచ్చిపోయే దాకా వుంటావా?’’

‘‘చచ్చిపోయాక కూడా వుంటాను’’  అన్నాడామె చేయి గట్టిగా పట్టుకుని. ఆమె నవ్వింది తడికళ్లతో. అతను మరింకేం మాట్లాడలేదు.

తన చేతిలోని గుడ్డ సంచీని ఆమె వడిలో పెట్టి, దానిపై తలపెట్టుకు పడుకున్నాడు. ఆ చొరవకి, ఒక్క క్షణం ఆశ్చర్చపడి,అతడ్ని సరిగ్గా కూర్చోమని చెప్పాలనుకుని, అట్లా ఆగిపోయింది. ఆమెకే తెలీదు. ఆమె చేతివేళ్ళు అతని ఉంగరాల తలవెంట్రుకల మధ్య ఎట్లా చిక్కుకొని సుతారంగా కదిలాయో! ఆ రాత్రి మాటల కందని భావాలేవో, ఆమెలో కదలాడాయి. తన వడిలో నిశ్చింతగా నిద్రిస్తున్న అతడ్ని చూస్తూ, నిద్ర లేని రాత్రిని గడిపిందామె.ఇక తామిద్దరూ వేరువేరు కాదనే, ఎరుక హఠాత్తుగా ఆమెలో  కలిగింది.

అతనితోనూ, అతని స్నేహితులతోనూ గడిపిన ఆ ఐదు రోజులూ, వాళ్ళిద్దరికీ, విడిగా మాట్లాడుకునేంత సమయం దొరకలేదు. అంత మంది మధ్యా, వాళ్ళ కళ్ళు, ఒకరికోసం ఒకరు వెతుక్కొని, సంభాషించుకునేవి.

ఆమె వెనక్కి తిరిగి వచ్చాక, ప్రెస్సు, ఇల్లు, అంటూ రోజువారీ, దిన చర్యలో పడ్డా, ఇక ఆమె ఇంతకుమునుపు మార్తా మాత్రం కాదు. ప్రపంచం విశాలమైందని, తానెక్కడో, ఒక ఇరుకు మధ్య కూలబడి, బతుకుతున్నానని ఆమెకి అనిపించటం మెదలైంది. అప్పుడామె మెల్లిగా తన రెక్కల్ని చాచి పక్షిలా ఎగరడం మొదలెట్టింది. లెనిన్‌చంద్ర చేసేలాంటి పనుల్లో ఆమె క్రమంగా ఎక్కువగా  భాగం కావటం మెదలెట్టింది. వాళ్లిద్దరి మధ్యా చిగురు తొడిగిన ప్రేమ కూడా ఆమెలానే ఎదిగింది.

‘‘నేను వచ్చేసి, నీతో పాటూ వుంటా’’ నని చంద్రతో అనే మార్తా,

‘‘నేనూ మీలానే పని చేస్తా’’ అనే వరకూ వచ్చింది.

‘‘వాళ్ళతో ఎందుకు తిరుగుతావ్‌?’’ అంటూ మార్తాని తిట్టేది వాళ్ళమ్మ. అత్తమామలకు భయపడి, తాగి, తాగి చచ్చిపోయిన మొగుడుకి భయపడి అతను పోయాక,  ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి, పెళ్ళిళ్ళు చేయలేనేమోనని భయపడి… జీవితం అతి జాగ్రత్తని, భయాన్ని, అవమానాల్ని, అనుమానాల్ని, ఆమెకి ఇచ్చింది. అలాంటి అమ్మ  మార్తా భుజానికి వేలాడుతున్న సంచీ పట్టుకు లాగుతూ ‘‘ నువ్వెళ్ళద్దే!’’ అంటూ ఏడ్చింది. ఆమె కన్నీళ్ళు తుడిచేందుకు విఫల ప్రయత్నం చేసి, చివరికి విసురుగా, సంచీ లాక్కొని, ఆ చీకటి రాత్రి కురుస్తున్న వర్షంలో తడుస్తు వెళ్ళిపోయింది మార్తా.

చర్చిలో ఏసుప్రభువుపై పాటలు పాడే మార్తా గొంతులో ఇప్పుడు నెత్తుటి పాటలు…వినేవాళ్ళ హృదయం ద్రవించేలా, కోపంతో రగిలిపోయేలా పాడేది. అలా పాడేప్పుడు ఆమెకి తెలీకుండానే పాటకి అనుగుణంగా, ఆమె మొఖంలో హావభావాలు మారిపోయేవి. అప్పుడు మార్తా అతనికి కొత్తగా కనపడేది. లెనిన్‌చంద్ర చీరాల ప్రాంతంలో, పనిచేసేందుకెళ్లి పోయాడు.
కొన్నాళ్ళకి ఆమె కూడా అటే వెళ్ళింది.ఒక రోజు వేటపాలెంలో వాళ్ళున్నప్పుడు, చుండూరులో దళితుల్ని ఎట్లా వెంటపడి వేటాడి  చంపారో, ఎవరో వార్త మోసుకొచ్చారు. వాళ్ళక్కడికి పరుగెత్తుకెళ్ళారు.

ఏం కాలం అది? ఆగ్రహంతో, రగిలిపోయిన దళితవాడ, పోలీసు క్యాంపులు, నింగినంటిన నిరసన జ్వాలలు, నినాదాలు, ఊరేగింపులు, సభలు, కాందిశీక శిబిరాలు, సామూహిక వంటశాలలు, ఆగక మోగే మాదిగ డప్పు, అగ్ని గీతాలు, నట్టనడి వీధిలో పాతిన శవాలు, దారిచూపుతున్న అంబేద్కర్‌ విగ్రహపు వేలు, వ్యూహాలు, ప్రతిఘటనలు, పోలీసుల తూటాల దెబ్బలకి, నెత్తురొడ్డి మరణించిన అనీల్‌ కుమార్‌ తెరిచివున్న కళ్ళు…. ఆ మహోద్రేకపు రోజుల్లో వాళ్ళిద్దరూ నిద్రాహారాలు మాని, గ్రామాలు కలియతిరిగారు.
అతను ఆగ్రహంతో నిలదీసి మాట్లాడుతుంటే, ప్రజలు శ్రద్ధగా వినేవారు. ఆమె అలసటలేకుండా పాడుతూనే వుండేది. కొన్ని నెలల తరువాత, ఇహ వాళ్ళక్కడ తిరగటం క్షేమం కాదనిపించాక, వాళ్ళక్కడి నుండి వెళ్ళి పోవాల్సి వచ్చింది.

మహబూబ్‌నగర్‌ చిట్టడవుల నుండి, రాయలసీమ జిల్లాలు తిరిగి, చివరికి నల్లమల అడవులకి చేరుకున్నారు వాళ్ళు. అక్కడే వాళ్ళ పెళ్ళి జరిగింది. పెళ్ళంటే మరేంలేదు. తుపాకులు, స్నేహితుల మధ్య, వాళ్ళందరి నవ్వుల మధ్య, అడవి ఆకుల, గడ్డిపూల దండల్ని మార్చుకున్నారు వాళ్ళు. ఆ తరువాత మరో రెండు గంటలకే, చంద్రా పనిమీద తన సహచరులతో కలిసి వెళ్ళిపోయాడు. మరోనెల రోజులకి కానీ, అతను తిరిగి రాలేదు. దూరంగా, చెట్ల మధ్య నుండి నడిచి వస్తున్న అతడ్ని చూస్తుంటే, ఆమె గుండెలు గుబగుబ లాడాయి.
అతను తిరిగి వచ్చిన రాత్రి  ఆ అడవిలో వెన్నెలాకాశం క్రింద అతడితో గడిపిన రాత్రి….వాళ్ళిద్దరూ, మిగిలిన వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లారు. చెట్ల చాటున గడ్డి మొలిచిన నేలపై  గులకరాళ్ళను వాళ్ళిద్దరూ కలిసి ఏరేసారు. మార్తా  ప్లాస్టిక్‌ కాగితపు పట్టాని ఆ గడ్డిపై పరిచింది.

‘‘వుండు’’ అంటూ, అతడు కొంచం పక్కకెళ్ళి, కాసిన్ని పచ్చటి కొమ్మల్ని విరుచుకొచ్చాడు.

‘‘కొంచం మెత్తగా వుంటుంది’’ అంటూ నవ్వాడు. పరచిన ఆ పట్టాని తీసి, ఆ కొమ్మల పై మళ్ళీ పరిచిందామె. దానిపై కూర్చుని ‘‘ నిజమే’’ అంటూ ఆమె కూడా నవ్వింది.

ఆ శరత్‌కాలపు రాత్రి, అడవిలో, ఆ నీరవ నిశ్శబ్దం మధ్య, అతని చేతిపై తలపెట్టుకుని, దగ్గరగా జరిగి, అతని గుండెలపై ముద్దు పెట్టుకుని ‘‘ ఇక్కడ నేనున్నానా’’ అంది గుసగుసగా. అతడామెని మరింత దగ్గరగా లాక్కొన్నాడు.

‘‘అసలు నువ్వు నాకెందుక్కలిసావ్‌ అమ్మాయ్‌! నాపాటికి నేను ఎట్లానో వుండే వాడ్ని. ఇప్పుడు నీ గురించే ఆలోచనలు….’’ ఆమె అరచేతుల్ని తన మెఖానికి ఆన్చుకున్నాడు చంద్ర. ఆ పరమ ప్రశాంతమైన నిశ్శబ్ద క్షణాల్లో, ఎక్కడో ఆగి,ఆగి అరిచే పక్షుల అరుపుల మధ్య, గాలికి, ఆకులు చేసే చిరుమువ్వల సవ్వడి మధ్య, వాళ్లిద్దరూ ఒకటైయ్యారు.
ఆకాశంలో వెన్నెల కురిపిస్తున్న చందమామని, తన వొడిలో పసివాడిలా పడుకున్న తన చంద్రుడినీ ఆ రాత్రి మేల్కొని చూస్తున్న ఆమెకి ఏదో తెలియని దు:ఖం లోలోన సుళ్ళుతిరిగి  కళ్ళు చెమర్చాయి. ఆమె బుగ్గలపై జారిన కన్నీటి తడి, అతని మునివేళ్లకు తాకి,‘‘ఏడుస్తున్నావా మార్తా!’’ అంటూ గభాలున లేచి కూర్చున్నాడు చంద్రా.

‘‘ఎందుకో చాలా దిగులుగా వుంది రా! చచ్చి పోవాల్సి వస్తే, నేనే నీకన్నా ముందు చచ్చిపోతాను. నువ్వు లేకుండా నేను బతకలేనురా చంద్రా!’’ అతని భుజం పైన తలవాల్చి, మార్తా నిజంగానే ఏడుస్తోంది నెమ్మెదిగా.

‘‘ఏడవకు మార్తా! నువ్వు ఏడిస్తే, నేనసలు భరించలేను.ప్లీజ్‌, మార్తా!’’ అతని గొంతులోనూ, దు:ఖం తారట్లాడిరది. చివరికామే, కళ్ళు తుడుచుకుని, నవ్వి,

‘‘చస్తే, ఇద్దరం కలిసే చద్దాం. ప్రామిస్‌!’’ అంటూ చేయి చాచింది. అతడామె చేతిలో చేయివేసాడు చిన్నగా నవ్వి.

అట్లా వాళ్ళు  వాళ్ల మెదటి రాత్రి, మృత్యువు గురించి మాట్లాడుకొని, నిలువెత్తు వృక్షాల నీడల జాడల నడుమ, ఒకరినొకరు పెనవేసుకుని నిద్రించారు. అట్లా వాళ్ళుకలిసి, ఐదారు రోజులకన్నా లేరు. అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. వెడుతున్న అతడికి ఆమె జాగ్రత్తలు చెప్పింది.

అది మొదలు వాళ్ళనేక సార్లు, పనుల నిమిత్తం విడిపోతూ, కలుస్తూ గడిపారు.

అడవులు, పల్లెలు, ఆదివాసీ గూడాలు, ఒక ప్రాంతం నుండి, మరో ప్రాంతం… దూసుకు పోయే తూటాలు, త్రుటిలో తప్పే ప్రాణాపాయాలు,దాడులు, చుట్టివేతలు, సహచరుల అనివార్య, అకాల మరణాలు, అనారోగ్యాల మధ్య, తామిద్దరూ ఇంకా జీవించే వుండగలగటం వాళ్ళిద్దరికీ వింతగా వుండేది. వాళ్ళ పని ఇంకా పెరిగింది. ప్రమాదకరమైన, అత్యంత కీలకమైన పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు.

అప్పుడు వాళ్ళు చిన్న, చిన్న పట్టణాలు, మహానగరాల్లోని జనారణ్యం లో రకరకాల మారు పేర్లతో. చిన్న చిన్న వృత్తులలో జీవించటం మొదలు పెట్టారు. అలాంటి కొత్త జీవితం కొంత కాలానికి బయటి రాష్ట్రంలో మొదలు పెట్టాల్సి వచ్చినప్పుడు, మార్తా పట్టుదలగా హిందీ నేర్చుకుంది. తమ రహస్య  స్ధావరం మీద ఎప్పుడు దాడి జరుగుతుందో, ఇంటి నుండి బయటకెళ్ళిన వాళ్ళు మళ్ళీ, తిరిగి వస్తారో రారో తెలియని స్థితి….ఒంటరితనం, మాట్లాడేందుకు ఎవరూ వుండకపోవటం, అనుక్షణం అప్రమత్తత, ఆందోళణ…..మార్తాకి తెలియని భయాన్ని, దిగులును కలిగించేవి. పూనా, భోపాల్‌, సూరత్‌ , అహమ్మదాబాద్‌… ఇట్లా తిరిగి,తిరిగి వాళ్ళు జలంధర్‌కి చేరుకున్నారు. ఇక్కడ లెనిన్‌చంద్ర  సంజీవ్‌గా  మార్తా అనిత గా తమ పేర్లు మార్చుకున్నారు. అక్కడొక మెకానిక్‌  షెడ్డులో, యంత్రాల విడిభాగాలు తయారుచేసే ఓ పంజాబీ యజమాని కింద పనిలోకి కుదిరాడు చంద్రా. పైకి  యజమానిగా వ్యవహరించే ఆ పంజాబీ వ్యక్తికి, ఆంధ్రా నుండి వచ్చిన మరో రెండు జంటలు కూడా  పనిలో సాయపడేవి.

మరి కొన్నాళ్ళకి  అనేక యుధ్ధముల ఆరితేరిన’ జతిన్‌దా ఈ బృందానికి నాయకుడిగా వచ్చి, వాళ్ళతో కలిసాడు. అక్కడ వాళ్ళంతా ఆయుధాల విడిభాగాల్ని తయారుచేసి, చేరాల్సిన గమ్యస్ధానాలకి రవాణా చేసేవారు. జలంధర్‌ కి వచ్చాక మార్తా తరచూ అనారోగ్యం పాలౌతోంది. మాట్లాడటం పూర్తిగా తగ్గించేసింది. డాక్టరు దగ్గరి కెడదామంటే, వద్దంటూ దాటవేసేది. చివరికి ఎలాగోలా తీసుకువెళ్లి చూపిస్తే  గర్భసంచీకి పుండు పడినట్లుందనంటూ పరీక్షలు చేయించమన్నారు. ఈమధ్య  చంద్రకి అసలు తీరికలేకుండా పోయింది. ఒక్కోసారి రాత్రింబవళ్ళూ, షెడ్డు లోనే వుండాల్సి వచ్చేది. మార్తా ముభావంగా వుండటాన్ని గమనించినా, ఆమెతో తీరిక చేసుకుని మాట్లాడాలనుకుంటున్నా, వారం రోజులుగా సమయం దొరకలేదతనికి. ఆరోజు ఎలాగైనా మార్తాతో మాట్లాడాలని తొందరగా ఇంటికొచ్చాడు చంద్రా.

ఎంతోసేపు అతనామెని బతిమాలాక,

‘‘ఇట్లా నేనిక ఉండలేను. ఈ నాలుగేళ్ళ కాలంలో పేరుకి నువ్వూ  నేనూ కలిసి వున్నట్లే కానీ, ఎంతో దూరంగా వున్నట్లనిపిస్తోందినాకు.’’ అంది మెల్లగా మార్తా.

‘‘అర్థంకాలేదు?’’

‘‘ మనిద్దరం సహచరులుగాకాక, మామూలు అర్థంలోలా, భార్యాభర్తల్లా… బయటికెళ్ళి పనిచేసే భర్తలా నువ్వూ, వంటచేసి, ఇల్లు చూసుకునే భార్యలా నేనూ.. ఎందుకిట్లా, నాకేం బాలేదు’’ అంటూ దిగులుగా నవ్వింది మార్తా.

‘‘నువ్వు చేస్తుంది కేవలం అదే కాదు కదా! నువ్వు చేస్తున్న ఇతర పనులు కూడా ముఖ్యమైనవే కదా! ’’ అంటూ అతనేదో చెప్పబోతే, మధ్యలో కల్పించుకొని

‘‘ఇంతకు మునుపు, ఇంతటి ఆందోళణ, దిగులు లేదు. ప్రతి క్షణం ఇంత భయంతో కూడిన  ఎదురుచూపులు లేవు. ఇంతకన్నా లోపలే నయం’’ అంది నిర్లిప్తంగా.

అతనికి ఏ మనాలో తోచలేదు. ఈ మానసిక స్ధితి నుండి నువ్వు బయటపడాలని చెబుదామనుకొని ఊరుకున్నాడతను  ఆ చిన్న గదిలో  గోడకి ఆనుకుని నేలపై కూర్చున్నవాళ్ళిద్దరూ మాట్లాడుకునేందు కేమీ లేనట్లు మౌనంగా వుండి పోయారు.

సూర్యుడు పడమటి ఆకాశంలోకి కుంకుతున్న ఆ వేళ  లేత ఎరుపు,నారింజ,పసుపు రంగుల వింత కాంతి కమ్ముకున్న ఆకాశాన్ని, కిటికీ ఊచల సందునుండి వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆమె అలసిపొయినట్లు అతన్ని ఆనుకుని,  భుజంపైన తలవాల్చింది. ఆమెలోని ఆ ఉదాసీనతను భరించటం అతనికి కష్టంగా అనిపించింది.

‘‘నువ్వు కొన్నాళ్ళ పాటు కనీసం, నీ ఆరోగ్యం మెరుగుపడే వరకన్నా ఎటన్నా వెళ్ళి రెస్టు తీసుకుంటే బావుంటుంది.’’
అతని చేతివేళ్ళను మూసి తెరుస్తూ ఆడుకుంటున్న మార్తా,

‘‘అప్పుడు నువ్వు నాతోపాటూ వుండవు కదా!’’

‘‘ ఇంత పొసెసివ్‌నెస్‌ పనికి రాదు మనకి. ఆ తరువాత బాధని తట్టు కోవడం కష్టం.’’

మార్తా ఏమీ మాట్లాడకుండా, అతని రెండు చేతుల్ని లాక్కుని తనచుట్టూ తిప్పి, తలకొంచం పైకెత్తి అతనికేసి చూస్తూ, బుంగమూతి పెట్టింది. ముప్ఫయి ఏడేళ్ళ మార్తా పెదవులపై చప్పున ముద్దు పెట్టాడు చంద్ర.

ఆ మర్నాడు  చంద్రకి ఇష్టమని  టమాటా పప్పు చేసింది. చంద్ర ఆమ్లేట్లేసాడు. పదింటికల్లా వాళ్ళిద్దరూ భోజనాలు చేసేసారు. అతను పనికెళ్ళిపోయాక, ఆమె డాక్టరు చేయించమన్న పరీక్షలు చేయించుకునేందుకు బయలుదేరింది.  మార్తా  ఆసుపత్రికి వెళ్ళేసరికల్లా  ముందుగా అనుకున్నట్లుగానే, శైలజ రిసెప్షన్‌ వద్ద ఎదురుచూస్తున్నది. ఆమె కూడా మార్తా వాళ్ళలానే, మరో ప్రాంతం నుండి వచ్చి, వాళ్లతో పాటు పనిచేస్తోంది.

చంద్ర పనిచేసే ఆ షెడ్డు అంత రద్దీగా లేని ఓ మైయిన్‌ రోడ్డు కి ఆనుకుని వుండే సందులో చిట్టచివరకి వుంటుంది. రేకుల షెడ్డుకి ఓ మూల వాచ్‌మెన్‌ కోసం కట్టిన రెండుగదుల్లో కాపలాదారుల హోదాలో ఆంధ్రా నుండి వచ్చిన భార్యాభర్తలు, రాజు, అరుణలు కాపురం పెట్టారు. చంద్ర లోపలికి అడుగు పెట్టేటప్పటికి  మిగిలిన వాళ్ళంతా గమ్యస్ధానానికి పంపాల్సిన సామాన్లు ప్యాకింగ్‌ చేస్తూ హడావిడిగా వున్నారు. అరుణ అందరికీ టీ తీసుకొచ్చింది. చేస్తున్న పని ఆపి, అంతా టీ తాగుతూ వుంటే, రాజు ట్రాన్సపోర్టు ఆఫీసుకెళ్ళి, ఇవ్వాళ్ళ వాళ్ళు సరుకు పంపేలా వుంటే, ట్రాలీ మాట్లాడుకొని వస్తానని వెళ్ళాడు.

పన్నెండుగంటకి జతిన్‌దా కూడా వచ్చాడు. మరో అరగంటకి గేటు దగ్గర ఏదో చప్పుడవుతూ వుంటే, చంద్రా  షెడ్డు  వాకిలి దాటి బయటకు రాబోయాడు.ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోగా కన్నుమూసి తెరిచే లోగానే  పెద్దగా అరుస్తూ, సాయుధ పోలీసులు వాళ్ళని చుట్టుముట్టారు. బూతులు, కేకలు, తుపాకులను  తిరగేసి, బూటుకాళ్ళతో తన్నుతూ వాళ్ళని బయటకు ఈడ్చుకొచ్చారు. షెడ్డుకు కాస్త ఎడంగా వున్న గదిలో వంట చేస్తున్న అరుణ  ఈ హడావిడిలో మెల్లిగా తప్పుకోవాలని చూసింది కానీ, ఓ పోలీసు ఆమెని చూసి, తన్నుతూ, జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చాడు. వాళ్ళందరినీ, ఓ మూల కూలేసారు. టాన్సపోర్టు ఆఫీసుకెళ్ళాడు కాబట్టి,  కనీసం రాజు పట్టుబడి వుండడని అనుకున్నాడు చంద్ర. కానీ అతడ్ని టాన్సపోర్టు ఆఫీసు దగ్గరే పట్టుకొని, నెత్తుర్లు కారేలా కొట్టి జీపులో కూర్చోబెట్టారన్న సంగతి  అతని తెలీదు. చంద్రా ఆలోచనలు వేగంగా పరుగెత్తుతున్నాయి. మార్తాకి, ఇతరులకి ఈ కబురు వెడుతుందా, లేక ఇక్కడికిక్కడే తమని కాల్చేస్తారా… ఆసుపత్రి నుండి వచ్చాక, మార్తాని కలుస్తానన్నాను కదా…

అక్కడి హడావిడి, పోలీసుల అరుపులకి చుట్టుపక్కల జనం గుమికూడారు.

ఎక్కువసేపు వాళ్ళని అక్కడే వుంచటం ఎందుకనుకున్నారేమో  పోలీసులు, వాళ్ళని ఆ సన్నటి ఇరుకు సందు నుండి బయటకు నెట్టుకుంటూ మెయిన్‌ రోడ్డు పైన ఆపిన వ్యాన్ల వద్దకు తీసుకు వస్తుంటే, వాళ్ళంతా గట్టిగా నినాదాలు ఇవ్వడం మొదలెట్టారు. సరిగ్గా అప్పుడే మైయిన్‌ రోడ్డు దాటి, సందులోకి వచ్చేందుకు నిలబడ్డ, మార్తా,  శైలజలకి ఆ నినాదాలు వినిపించాయి. వాళ్ళక్కడే ఆగిపోయారు. శైలజ ఆందోళనగా, మార్తా చేయిని గట్టిగా పట్టుకుంది. వాళ్ళముందు మరికొందరు పాదచారులు నిలబడి, ఆ గొడవని ఆశ్చర్చంగా చూస్తున్నారు. పోలీసు వ్యానులోకి వాళ్ళని ఎక్కిస్తుంటే, ఎందుకో వెనక్కి తిరిగిన చంద్రాకి రోడ్డుకు అవతలి పక్కన నిలబడ్డ మార్తా, శైలజలు కనపడ్డారు. మార్తా నిర్ఘాంతపడి అతడికేసి చూస్తోంది. వాళ్ళిద్దరి చూపులూ లిప్తపాటు  కలుసుకున్నాయి. మరుక్షణం శైలజ, మార్తా చేయి పట్టుకుని,అక్కడినుండి మెల్లిగా కదిలింది. ఎలాంటి ఉద్రేకం, తొందరపాటూ, ఆందోళనా, మొఖాల్లో, కనపడనీయకుండా, చేతిలో బుట్టతో, ఏ పచారీ కొట్టుకో,బట్టల షాపింగ్‌కో వెడుతున్నట్లుగా వాళ్ళు వెళ్ళారు. కొంచం దూరం వెళ్ళాక, వాళ్ళు వడివడిగా నడిచారు. నడుస్తూనే వాళ్ళు గబగబా మాట్లాడుకున్నారు.

వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఏంచేయాలి?  ఏంచేయాలి?  ఏంచేసినా నిముషాల్లో చేయాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడబడాలంటే, వాళ్ళని పోలీసులు పట్టుకున్న సంగతి వెంటనే, బయటి ప్రపంచానికి తెలియాలి. మరింత హాని జరక్కూడదంటే, వెళ్లాల్సిన చోట్లకి కబురు వెంటనే వెళ్ళాలి.దానితో పాటూ, తాము అక్కడి నుండి తప్పుకోవాలి. మాయమై పోవాలి…. కొంత దూరం వెళ్ళాక, వాళ్ళు, ఇలాంటి సందర్భాల్లో, సమాచారం ఇవ్వాల్సిన మనిషికి ఫోన్‌ చేసి అతడికి అర్ధమయ్యే రీతిలో వివరించారు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళకి  వెనక్కి వెళ్ళలేదు. ఎక్కడ ఏ రకపు నిఘాలు వాళ్ళకోసం ఎదురుచూస్తూ వుంటాయో తెలీదు. కాబట్టి వాళ్ళు బస్‌స్టాండ్‌లకీ, రైల్వే స్టేషన్‌లకి నేరుగా వెళ్ళ కూడదను కున్నారు. మార్తా వైద్య పరీక్షలకని తెచ్చుకున్న  డబ్బుల్లో మిగిలిన పదిహేను వందలు, శైలజ దగ్గర మరో ఎనిమిది వందలు, అంతే వాళ్ళ వద్ద వున్న డబ్బులు. వాళ్ళిద్దరూ సిటీ బస్సు పట్టుకుని, ఓ సెంటర్‌ లో దిగి, అక్కడి నుండి, పక్క టౌనుకు వెళ్ళే ప్రైవేటు జీప్‌ ఎక్కి, అక్కడినుండి రెండు, మూడు బస్సులు మార్చి, రాత్రి పదిగంటలకి చేరాల్సిన గమ్యస్థానానికి చేనుకున్నారు.

ఆ మరునాటి ఉదయమే వాళ్ళిద్దరినీ, వేరువేరు చోట్లకి పంపారు. గట్లుతెగి  పడ్డట్లు, మరో రెండు రాష్ట్రాలలోనూ ఏక కాలంలో పోలీసులు దాడులు చేసారనీ, పెద్ద సంఖ్యలో ఆయుధాలు, వాటి విడిభాగాలు దొరికినట్లు, ఫ్యాక్టరీలలో వాటిని తయారు చేస్తుండగా దాడిచేసి పట్టుకున్నట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. పట్టుబడ్డవాళ్ళని  చంపరిక, అని ఊపిరి పీల్చుకుంది మార్తా. మరింత పాడైన ఆరోగ్యంతో,తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మార్తాకి ఆపరేషన్‌ చేసి గర్భసంచీ తొలగించారు. ఆరునెలల విశ్రాంతి తరువాత  చిక్కిశల్యమైన మార్తా  వెన్ను నొప్పితో బాధపడుతూ, మళ్ళీ అడవిలోకెళ్ళి పనిచేయలేక, బయటవుండి పనిచేయడం క్షేమం కాక  ఏంచేయాలో తోచనిస్ధితిలో పడింది.

కొంత కాలం ఇంటికి వెళ్ళిమని సలహా ఇస్తే, ఎక్కడికి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్దం కాలేదు మార్తాకి. చివరికామె అల్లుడు, కూతురుతో పాటూ  దాచేపల్లిలో వుంటున్న వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళింది. రహస్య జీవితంలో ఆమె వాళ్ళని నాలుగైదు సార్లు కలిసినా, వాళ్ళతో గడిపిన సమయం మాత్రం కొన్ని గంటలే. ఆమె రాకకి అక్కా, అమ్మా భయపడ్డా, వాళ్ళ బావ మాత్రం స్వాగతించాడు. అతనికి మార్తా రాజకీయాల పట్ల గొప్ప గౌరవం వుంది. ఆమె ఎవరో, ఎటువంటి పనిలో ఆమె భాగం పంచుకుందో మార్తా ఎవరితోనూ నోరువిప్పి చెప్పలేదు. చంద్రతో ఆమెకి పెళ్ళయిన విషయమూ, అతను జైల్లో వున్న విషయమూ బయటి ప్రపంచంలో తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది. ఆ సంగతులు బహిరంగంగా,  ప్రస్థావించటం ప్రమాదమన్న సంగతికూడా వాళ్ళకి తెలుసు. అయినా మెదట్లో, ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చేదికాదు.

చివరికి ఓ తెలిసిన లాయరు ఎలాంటి కేసులూ ఆమె పైన  లేవు కాబట్టి,  మామూలుగా తిరగమని ఇచ్చిన సలహాని ఆమె  పాటించింది.

దాచేపల్లి గుంటూరులో జరిగిన ఒకటి, రెండు సభలకి, ఊరేగింపులకి  వెళ్లింది. అక్కడ ఆమె అనామకంగా, కొత్తగా అలాంటి చోట్లకి వస్తున్న దానిలా వుండేది. ఓసారి ఏదో సమస్యపై , మరో ముప్ఫయి మందితో పాటూ అరెస్టు కూడా అయింది.  ఆమెని పోలీసులు ఏమాత్రం   పట్టించుకోలేదు. అక్కడికి ఆమె కధ ఎవరికీ అనుమానం రాకుండా  ముగిసింది.
చివరికి మార్తా వాళ్ళ బావగారు తిరుపతిలో తెలిసినవాళ్ళ స్కూల్లో క్లర్కుగా  ఉద్యోగం ఇప్పిస్తే  చేరిపోయింది. కొంతకాలం పాటు ఆమె అట్లా వుండటమే మంచిదన్న చిన్న ఉత్తరం ఓ నాయకుడి నుండి ఆమెకి అందింది. ఇన్నాళ్ళూ బతికిన తన ప్రపంచానికి దూరమై ఇలాంటి జీవితం గడపడం ఆమెకి చాలా కష్టంగా, ఊపిరాడకుండా వుండేది. ఇక్కడి మనుష్యులు, వాళ్ళ ప్రవర్తన, ఆ కృత్రిమత్వం ఆమెకి అర్దమయ్యేవి కావు. లోలోన దు:ఖం గడ్డకట్టిన మార్తాకి, లెనిన్‌చంద్ర పక్కన లేని మార్తాకి, తనలో నుండి ఏదో ఖాళీ అయి, డొల్లలా మిగిలినట్లు బాధపడే దిగులు కళ్ళ మార్తాకి నీటి నుండి బయట పడిన చేపపిల్లలా జీవిస్తున్నట్లుగా అనిపించేది.

ఎవరి తప్పూలేకుండానే, జరిగిన ఒక చిన్న పొరపాటు, చివరికి ఎంతటి నష్టాన్ని, భీభత్సాన్ని ఎందరెందరి జీవితాల్లో నింపిందో అనుకునేది మార్తా. ఏదో అక్కడ దొరికారు కాబట్టి వాళ్ళట్లా ప్రాణాలతో మిగిలారు కానీ, అదే ఆంధ్రాలో అయితే, అందరినీ కాల్చిపడేసే వారనేవాళ్ళంతా.

జలంధర్‌  షెడ్డునుండి రెగ్యులర్‌గా విడిభాగాల బండిళ్ళు ఓ టౌను సెంటరు లోని టాన్సపోర్టు ఆఫీసుకి వెళ్ళేవి. అక్కడినుండి ఒక వ్యక్తి వాటిని తీసుకొని మరో చోటికి తరలించే వాడు. అతను అనుకోకుండా అరెస్టయినా, తనుచేసే పని తన వివరాలను బయట పెట్టలేదు. పోలీసులు అతని పై ఏదో పెట్టీ కేసు పెట్టి రిమాండుకు పంపారు. తను ఇలా ఇరుక్కుపోయానని తన వాళ్ళకి కబురు పెట్టేందుకు అతనికి వీలుకాలేదు. ఈలోగా  నెలరోజులు దాటినా తీసుకుపోని ఆ బండిళ్ళలో ఏ ముందో చూసేందుకు అందులో పనిచేసే ఇద్దరు పనివాళ్ళు  ప్రయత్నించారు. బయటపడ్డ ఆ వస్తువులేమిటో వాళ్ళెవరికీ అర్థంకాలేదు కానీ, వాళ్ళ యజమానికి అర్ధమై పోలీసులని పిలిచాడు. అవి ఎక్కడినుండి వచ్చాయో, పోలీసులు తీగలాగారు. అట్లా డొంకంతా కదిలింది.

అట్లా లెనిన్‌చంద్రని, అతని సహచరుల్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళంతా చిత్రహింసల్ని తట్టుకుని నిలిచారు. కాబట్టే మార్తా, శైలజ, ఇంకా మరెందరో కాపాడబడ్డారు. మరిన్ని నష్టాలు జరగకుండా ఆగాయి. అక్కడి పోలీసులు చంద్రా వాళ్ళ కేసులో ఇంకా దొరకని  పేర్లు తెలీని వాళ్ళకోసం వెతకటం ఆపలేదు.

చంద్రా వాళ్ళ కేసు వాదించేందుకు అక్కడి లాయర్లకు సహాయపడేందుకు  హైదరాబాదు నుండి ఓ వకీలు వెళ్ళేవాడు. విషయం కనుక్కునేందుకు  ఆ వకీలును కలిసేందుకు చంద్రా వాళ్ళన్నయ్య  నాగన్న ఎప్పుడన్నా  హైదరాబాదు వెళ్ళే వాడు. చంద్ర యోగక్షేమాలు తెలుసుకునేందుకు , విజయవాడలో వుండే చంద్రా బంథువుల ఇంటికి అప్పుడప్పుడూ వచ్చేది మార్తా. అక్కడికి చంద్రా వాళ్ళన్నయ్య నాగన్న  వచ్చి కలిసేవాడు.

చంద్ర కేసు నడిచిన ఈ ఏడేళ్ళలో, అతను జైల్లో వున్న తమ్ముడిని మూడుసార్లు మాత్రమే కలవగలిగాడు. దేశద్రోహం, అక్రమ ఆయుధాల తయారీ, సాయుధ కుట్ర వంటి తీవ్ర నేరారోపణలున్న ఆ కేసుల్లో వాళ్ళెవరికీ  బెయిలు దొరకలేదు. పోలీసుల కాపలా మధ్య, కటకటకాల జాలీ వెనుక నిలబడ్డ తమ్ముడితో అరగంట మాట్లాడేందుకు అతనికి అనుమతి దొరికేది. అందరిలోకీ చిన్నవాడైన ఆ తమ్ముడి పట్ల నాగన్నది పుత్రవాత్సల్యం. అట్లా కలిసినప్పుడు మార్తా ఎలావుందని అడిగాడు చంద్రా.

ఆమె తిరుపతిలో ఉద్యోగంచేసుకుంటూ, అనామకంగా బతుకుతుందని నాగన్న అన్నప్పుడు చంద్రా కళ్లనుండి రాలిపడ్డ కన్నీటి చుక్కలను తుడిచేందుకు చేయి చాచిన నాగన్నకి ఇనుపజాలీ అడ్డుగా నిలిచింది.

‘‘ఆయమ్మాయికేదేనా చెప్పేదా?’’

అలా అడిగిన నాగన్నకి ఏం జవాబు చెప్పాలో తోచక ఒక్కనిమిషం మౌనంగా వుండి దీర్ఘంగా నిట్టూర్చి, ‘‘ నేను బాగానేవున్నాను. తనని ధైర్యంగా వుండమని చెప్పు. తన ఆరోగ్యం జాగ్రత్తని చెప్పు.’’ అన్నాడు చంద్రా.

ఆమె పట్ల అతడి ఆదుర్దాని,  ప్రేమని, దిగులును, నిద్రపట్టని తన సుదీర్ఘరాత్రులను గురించి చెప్పేందుకు అది సమయము,సంధర్భమూ కాదని అతనికి అనిపించింది.

అతడు చెమర్చిన కళ్ళతో చెప్పిన ఆ పొడిపొడి మాటల్ని నాగన్న మార్తా కోసం మోసుకొచ్చాడు.

కలిసినప్పుడల్లా, లాయరేమన్నాడు  చంద్రా ఎలావున్నాడు అంటూ పదేపదే అడిగే మార్తాకీ తెలుసు సమాధానాలు క్లుప్తంగానే వుంటాయని. కానీ అతను నాగన్నకి చెప్పలేకపోయిన అనేక సంగతుల్ని ఆమె ఊహించుకునేది.

ఆమె అంతరాంతరాలలో అతనితో జరిపే నిరంతర సంభాషణ ఆమెకి మాత్రమే తెలుసు. తను ఏం ఆలోచిస్తుందో, అతడి కోసం కానరాని దారుల్లో ఎలా వెతుక్కుంటుందో, అతడు లేకపోవటం అంటే తనకేమిటో అతనికి ఎట్లా చెప్పను అనుకునేది మార్తా. మళ్ళీ అతను కూడా తనలాగే దిగులు పడుతుంటాడు కదా! ఆ జైలు గదిలో అలా నిర్వ్యాపకంగా, తనకే కాదు, అన్నింటికన్నా మిన్నగా తలకెత్తుకున్న ఉద్యమానికి దూరంగా…. అట్లాంటి ఆలోచన రాగానే ఆమె కళ్ళు చెమ్మగిల్లేవి.

వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లిపోయేటప్పుడు, వాళ్ళ రూపురేఖల ఆనవాళ్ళు శత్రువుకు చిక్కకూడదని, వాళ్ళ వాళ్లందరిళ్ళలోనూ వెతికి వెతికి మరీ, తమ ఫోటోలన్నీ కాల్చివేసారు. లెనిన్‌చంద్ర రూపం ఇప్పుడు ఆమె మనోఫలకం పైన తప్ప మరెక్కడా లేదు. కటకటాల వెనుకనున్న అతని ఫోటో ఎలా సంపాదించాలో ఆమెకి తెలీదు.

ఏడు సంవత్సరాల సాటు  విచారణ జరిగాక, చంద్రా, అరుణ మిగిలిన అందరికీ ఆరు కేసుల్లో, ఆరు యావజీవ శిక్షలు పడ్డాయి. ఆ వార్త విన్న రోజున మాత్రం మార్తా చాలా సేపు ఏడ్చింది.ఎక్కడో మిగిలిన చిగురంత ఆశ కూడా ఆవిరై సోయినందుకు  వాళ్లతోపాటు, తాను లేనందుకు. రైలు విజయవాడ చేరుకొంటోంది. చీకటి పలచబడుతూ, వెలుగు రేకలు విచ్చుకుంటున్న ఆ ప్రాతఃవేళ తాను ఆఖరి సారి చూసిన చంద్రని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది

రైలు దిగి, పొగమబ్బులు కమ్ముకున్న ఆ ఉదయపు చిరుచిరు చలిలో, దగ్గరలోనే వున్న చంద్రా బంధువులింటికి మార్తా నడుస్తోంది.

ఆమె అక్కడికి వెళ్లే సరికి నాగన్న ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. మామూలు పరామర్శలు, యోగక్షేమాలూ, అయ్యాక  అతను ఆమె చేతికో ఉత్తరం ఇచ్చాడు. కేసు అప్పీలు  కోసం లాయరు వెళ్లినప్పుడు  చంద్రా ఎలాగో వీలు చేసుకుని నాలుగు లైన్లు రాసి. ఆ ఉత్తరం మార్తాకి అందించమన్నాడట. అన్నేళ్లకి అతడు కష్టంమీద ఆమెకి రాసి పంపిన మెదటి ఉత్తరమది.
వణుకుతున్న చేతులలో, ఉద్వేగంగా ఆ కవరు అందుకుని, పెరట్లోని, మామిడి చెట్టు క్రింది అరుగు మీద కూర్చుని మెల్లిగా విప్పింది.

‘నువ్వు నాకోసం ఎదురుచూడటం, చాలా బాధ కలిగిస్తుంది. నేనిక ఎన్నటికీ రాలేనేమో! ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమయ్యే చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నేనిక లేననుకొని ముందుకెళ్ళు. నాకోసం నువ్వు చేసే ఏ ప్రయత్నాలైనా నిన్ను కూడా శాశ్వతంగా నాలా స్వేచ్ఛ లేని చీకటి ప్రపంచంలోకి విసిరేయవచ్చు. అది నాకెంత మాత్రం ఇష్టంలేదు. పైగా అది అనవసరం కూడా! ఇది నా ఆఖరి వీడ్కోలేమో కూడా! ఒక్క మాట. నాలోపలి స్వప్నం ఇంకా మరణించలేదు. నా కిటికీ ఊచలవెనుక కత్తిరించబడ్డ ఆకాశంలో అప్పుడప్పుడూ కాసిన్ని మబ్బుతునకలు, నక్షత్రాలు కనపడుతూనే వున్నాయి…. ఇక నేను నీకేం కాకూడదనుకునే నేను. ’’

ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. సంబోధనా, సంతకం లేని ఆ వుత్తరాన్ని  ఆమె ఎన్ని సార్లు చదువుకుందో లెక్క లేదు.

‘‘ ఎదురు చూపేందుకేమీ లేదు నాకు. కానీ నీకోసం మనం కలిసి కన్న కలకోసం,ఇంకా  నేను అలాగే వున్నానన్న ఆశ నీకు ఊరటకలిగిస్తుందో, దు:ఖ్ఖాన్నే కలిగిస్తుందో నాకు తెలియదు. చావుబతుకుల మధ్య సందేహంలా నువ్వూ  నేనూ ఇలా మిగిలున్నాం. ఈ బయటి ప్రపంచంలో నేనిలా వున్నా నంటే కారణం నువ్వు, నీ సహచరులు.
చిత్రహింసలు అనుభవించినా, మీరు నోరుతెరవక పోవడం వల్లే నాకీ స్వేచ్ఛ దొరికిదని, నేనెలా మర్చిపోగలనురా! నిన్ను నేనెట్లా వదిలేయ గలననుకున్నావ్‌? నువ్వొంటరివైనా  నాకోసం వున్నావ్‌. నేను కూడా అట్లా నీకోసం ఇక్కడ  వేచివున్నా’’ అనుకుంది మార్తా. ఆ జైలు గోడల వెనుక బందీ అయిన అతనికి తానేమననుకుంటోందో వినిపిస్తే బావుండు ననుకుంటూ ఆకాశంకేసి చూసింది.

చచ్చిపోయాక కూడా నీకోసం వుంటానన్నా అతడి కోసం, అతడి గుండెలపై తలవాల్చి, ‘ఇక్కడనేనున్నానా’ అని అడిగిన మార్తా, ఇంకా, ఎలాగోలా బతికే వున్నదనీ, అతని కోసం ఈ మార్తా  ఎప్పటికీ వుంటుందనీ… అతడికి ఎవరు చెబుతారు. ఈ  కబురు ఆ ఎతైన గోడల్ని దాటి ఏ చందమామ మోసుకెడుతుందో తెలీదు అనుకుందామె.
ఏ తలపో, గుర్తుకొచ్చి, ఆమె చిన్నగా నవ్వింది. చొట్టబడ్డ ఈమె బుగ్గలపై ముద్దుపెట్టేందుకు లెనిన్‌చంద్ర లేడు. బహుశా అతడు యెన్నడూ ఆమెను ముద్దు పెట్టుకోక పోవచ్చు.

విమల