బతుకంత సమస్యకి ప్రతిబింబం – ‘చావు’ కథ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

చస్తే సమస్యలన్నీ తీరిపోతాయనుకొంటారు కొంతమంది. కానీ ‘చావు’ కూడా చచ్చే చావు కొందరికి. చచ్చిపోయాక కనీస అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని శుష్క శరీరాల సమస్య మరింత జటిలమైనది. బతికినన్ని రోజులు సరైన తిండిగానీ, బట్ట కానీ, సరైన జీవితం కానీ, సుఖం కానీ, ప్రశాంతత కానీ కనీస గౌరవం కానీ లేని జీవితాలను చావు తరువాత కూడా ఇవే సమస్యలు వెంటాడం ఎంత దుర్భరం ?

దళితులకు బతుకే కాదు, చావు కూడా అత్యంత సమస్య అని చెప్పిన కధ ‘చావు’. కాళీపట్నం రామారావు గారు రాసిన ఈ కధ సృజన మాస పత్రికలో 1971 మార్చి సంచికలో అచ్చు అయ్యింది.

రెండు మూడేళ్ళనుంచి వర్షాలు సరిగా లేని కారణంగా పంటలు, పనులు లేక మాలపేట వాళ్ళంతా ఇంటికి ఇద్దరు ముగ్గురు పసిపిల్లలను, ముసలి వాళ్ళను వదిలేసి కోతలు, కుప్పలు, నూర్పిడి వంటి పనుల కోసం పక్క ఊళ్ళకు వెళ్ళారు. ఎరకయ్య, సావాలు కూడా అలా వెళ్ళినవాళ్ళలో ఉన్నారు. ఎరకయ్య తన ముసలి తల్లిని , ఇద్దరు చిన్నఆడ పిల్లలు సిమ్మాద్రి, దాలిని చిన్న కొడుకును ఇంటి దగ్గర వదిలేసి, ఇద్దరు కూతుళ్ళు కొడుకుని తీసుకొని పక్క ఊరికి పొలం పనికి వెళ్ళగా ఇంటి దగ్గర ముసలమ్మ నారమ్మ చనిపోతుంది. పిల్లలు ఎట్లాగో ఎరకయ్యకు కబురు చేరవేస్తారు. ఎరకయ్య, సావాలు మిగతావాళ్ళు ఆ రాత్రి నానా తిప్పలు పడి వస్తారు. ఎముకలు కొరికే చలి రాత్రిలో చనిపోయిన నారమ్మ వడిలి, శుష్కించి పోయిన ముసలమ్మ.

“.. ముక్కూ నోట బొక్కలన్నీ నీళ్ళు కారేసి, ఇనాగ – ముట్టుకుంటె పొట్ల పండు నాగ ఇచ్చిపోతాది శవం.” ఎక్కువ సేపు నిలబడే శవం కాదు. పైగా రాత్రికి కాల్చక పోతే పొద్దున్నే పనికి వెళ్ళలేరు. పేట అందరికీ పనిపోతుంది. కాబట్టి రాత్రికి శవాన్ని ఎలాగైనా తీసెయ్యాలి. తీసేయ్యాలంటే కావిడో – రెండు కావిళ్ళో కర్రలు కావాలి. ఎండాకాలమైతే ఏ వైపు వెళ్ళినా కర్రో, కంపో దొరుకుతుంది. కానీ పొయ్యి మీదకు దొరికే చలి రోజుల్లో పొయ్యి కిందకు దొరకటం కష్టమైన కాలం .. పంటల కాలం. ఇలాంటి స్థితిలో కాల్చటానికి వూళ్ళోవాళ్లను కర్రలు అడిగి తేవాలని కొందరు బయలుదేరతారు. అక్కడే ఉన్న సూరయ్య చనిపోయిన నారమ్మ గురించిన చిన్నప్పటి జ్ఞాపకాలను అందరికి చెబుతాడు.

కర్రల కోసం వెళ్ళిన వాళ్ళు కర్రలు లేకుండానే వెనక్కి వస్తారు. రాత్రిపూట కర్రలు అడిగిన వాళ్ళను కొందరు పొద్దున రమ్మని పంపిస్తారు. కొందరు తిట్టి పంపిస్తారు. ఏం తేకుండా తిరిగి వచ్చిన వాళ్ళను అప్పారావు తన ఆవేశంతో, ప్రశ్నలతో నిలదీస్తాడు. కాల్చటమా, పూడ్చటమా కాదు- అసలు ఏడ్వాల్సింది చచ్చిన శవాలకోసం కాదు – బతికున్నశవాల కోసం అంటాడు. చివరకు పూడ్చాలని నిర్ణయం తీసుకుంటారు కులపెద్దలు. కానీ యువకులు ఆలోచనలో పడతారు. చివరి నిమిషంలో కొందరు యువకులు ఊళ్ళో నుండి కర్రలు దొంగతనంగా ఎత్తుకొస్తారు. శవాన్ని కాలుస్తారు. ఇదీ కధ.

దళితుల జీవితంలోని ఘర్షణనూ దళిత సమాజాన్నీ నిరంతరం నియంత్రించే వ్యవస్థీకృత కుల అణచివేతనూ ఈ కథ ప్రతిబింబించింది.

స్వాతంత్ర్యం దళితుల జీవితంలో పెద్ద మార్పేమీ తేలేక పోయిందనేది సత్యం. గ్రామీణ రాజ్యం ఇంకా కుల పెత్తందారుల చేతిలోనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చింది దేశానికే కానీ, గ్రామాలకు కాదు. గ్రామాల్లో దళితులుగా పుడితే కష్టం! జీవితాంతం బానిసత్వం అనుభవించాల్సిందే! దళితులుగా మరణిస్తే కూడా కష్టమే! శవాన్ని తగలబెట్టటానికి – పూడ్చటానికి కూడా – సమస్యే. ఈ కథలో కాళీపట్నం రామారావుగారు శతాభ్థాల అణచివేతను ‘చావు’ కేంద్రంగా ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. ఈ చావు కధ దళిత వాడల్లో పేరుకొని పోయి ఉన్న “దళిత అబలత్వా”న్ని ప్రశ్నిస్తుంది. దళిత వాడలోని ప్రజలు నిరంతరం ఎదుర్కొనే సమస్యల్లో మచ్చుకు ఒక సమస్య నారమ్మ మరణం.

పని కోసం, డబ్బుకోసం, ప్రతి అవసరం కోసం దళితవాడ జనం గ్రామం మీదే ఆధార పడాలి. ఆఖరికి మనిషి చచ్చిపోతే తగలపెట్టాటానికి కావలిసిన కట్టెల కోసం కూడా! కొంచెం అసంబద్ధంగా అనిపించినా ఇలాంటి స్థితిని దళితులు ఎదుర్కోవడం – ఈ దేశ దుస్థితికి నిదర్శనం.

ఎక్కడా కర్రలు దొరికే కాలం కాదు కాబట్టి ఊళ్ళో ఎవరినో ఒకరిని అడిగి తేవాలని అనుకొంటారు. ఊరంతా తిరిగి అడిగారు. పెదనాయుడి ఇంట్లో ఆయన భార్య కానీ, సుబ్బారాయుడు కానీ అతని భార్య కానీ ఎవరూ కర్రలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. అట్లాగని ఊరివాళ్ళ ఇళ్ళ ముందు “నిల్వ” ఉంచుకొన్న కర్రలు వాళ్ళు కష్టపడి కొట్టి తెచ్చుకొన్నవి కావు. అవన్నీ దళిత శ్రమే. కాని వాళ్ళకు వాటి మీద హక్కు లేదు. పెద్ద కులాల వాళ్ళు చిన్న కర్ర ముక్క ఇవ్వటానికి కూడా సిద్ధంగా లేరు.

కులం దళితులకు అంటరానితనంతో బాటు లేనితనాన్ని, భావ బానిసతనాన్ని అంటగట్టింది. చిన్న అవసరం నుంచి పెద్ద అవసరం దాకా ఎవరో ఒకరి ముందు చేయి చాపాల్సిందే. ఇదీ యువతరానికి నచ్చలేదు. దళిత వాడల్లో పాత తరానికీ, కొత్త తరానికీ మధ్య నిరంతరం ఒక ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. యువతరం – అణచివేతనూ, బానిస బ్రతుకునూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. యువతరానికి వచ్చే సందేహాలనూ, ఆవేశాన్నీ, వాళ్లలోని తిరుగుబాటునూ – వయసు మళ్లిన తరం “అనుభవం” పేరు చెప్పి అణచివేస్తుంది. అప్పారావు యువతరానికి ప్రతినిధి. నిరంతర లేమి నుండి బయట పడాలనీ ఇతరుల మీద ఆధారపడే బానిసత్వం నుండి బయట పడి సొంత కాళ్ళ మీద నిలబడాలనీ ఆత్మ గౌరవంతో బతకాలనే యువతరం ఆలోచనలకు ఇతడు ప్రతినిధి. చదువు లేకున్నా ఆలోచన ఉన్నవాడు. ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను మూఢంగా ఎందుకు విశ్వసించాలని ప్రశ్నించిన వాడు.

‘కర్రలు దొరక్కపోతే కప్పెట్టేస్తారా?’

‘ఏం కప్పెడితే పనికి రాదా?’

‘కప్పెడితే ఏటవుద్దీ?’

అని ప్రశ్నిస్తాడు అప్పారావు. దళితులు భావజాల బానిసత్వం నుంచి, మానసిక సంకెళ్ళ నుంచి విముక్తం కాకుండా దళితుల విముక్తి జరగదు. ఎప్పటి నుంచో ఇట్లా ఒక ఆచారం ఉంది కాబట్టి మనమూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే చేయాలి అనే తర్కం, వివేచన లేని మూఢత్వం నుండి దళిత సమాజం తమను తాము విముక్తం చేసుకోవాల్సి ఉంది. నిజానికి అప్పారావు కూడా పూర్తిగా విముక్తం అయినవాడు కాదు. అతనికి కూడా కాల్చాలనే ఉంది. కాకపోతే కర్రల కోసం అందరినీ బతిమిలాడడం కన్నా – ఎక్కడో ఒక చోట ఎత్తుకొచ్చి పని కానివ్వొచ్చనేది అతని వాదన.

ఒకవేళ కాల్చకుండా పూడిస్తే ముసల్ది దయ్యమై పీడిస్తుందని ఒక మూఢ నమ్మకం. అయితే తురకలు, కంసాలి వాళ్ళు పూడుస్తారు కదా అని ఎరకయ్య లాంటి వాళ్ళ సందేహం. హిందూత్వ బ్రాహ్మణీయ మూఢ విశ్వాసాల నుండి దళితులు బయట పడకుండా విముక్తి సాధ్యం కాదు. దళిత సమాజంలో హిందుత్వపు గీతలు దాటని వాళ్ళు బానిస సంకెళ్ళ భావజాలం నుండి ఊహలో కూడా బయటపడలేరు. చైతన్యవంతులైన అప్పారావులాంటి వాళ్ళు కూడా లోలోపల అంధ విశ్వాసాల బంధాలను పూర్తిగా తెంచుకోలేరు.

వంద తరాలు గడిచాయో, వెయ్యి తరాలు గడిచాయో కానీ – వాళ్ళు అట్లాగా వీళ్ళు ఇట్లాగా ఉండటానికి కారణం కానీ, కారణం వెనుక దాగి ఉన్న కుట్ర కానీ తెలిసిందనుకొన్న అప్పారావులాంటి వాళ్ళు చట్రం లోపల నిలిచి అయినా కొన్ని ప్రశ్నలు వేసుకొంటారు. తమ దుస్థితికి కారణాలను అన్వేషిస్తారు.

ప్రతిసారీ Human Development Index భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెబుతుంది. సంపద పెరిగిందనీ కోటీశ్వరుల సంఖ్య పెరిగిందనీ చెబుతుంది. కానీ – “ .. సూజ్జూస్తండగే గొల్లలు, శగిడీలు, మాల, మాదిగలు సిన్నసిన్న రైతులందరు దుల్లిపోనారు. ఎవ్వరికీ సెంటు ముక్క మిగల్నేదు. కాపోళ్ళు బాగునేరు, అందల పెద్దనాయిళ్ళకీ సావుకోర్లకే సెందిపోయింది యీ బూదేవతంతా?” అన్న మాటలు వాస్తవ పరిస్థితికి నిదర్శనాలు. ప్రభుత్వాలు మాత్రం అబద్ధాల నివేదికల్ని అంతర్జాతీయ చిత్రపటం పై ఆవిష్కరిస్తూనే ఉన్నాయి. నానాటికీ దిగజారిపోయే దళిత జీవితాలు నివేదికలకూ లెక్కలకూ ఎక్కకుండా మిగిలి పోతున్నాయి.

కాళీపట్నం రామారావు గారు వాడ గురించి చెబుతూ “చెరువు గట్టున వెచ్చననిపించిన గాలి, వాడ మధ్య చివ్వున వెన్నులో పొడుస్తోంది. అతి యిరుగ్గా వుందా వాడలో – ప్రతి మట్టి గోడలోనూ, చలి పేరుకొని ఉండాలి. శీతాకాలపు పగుళ్ళను పెద్దవి చేసుకుంటూ చలిగాలి చావుగాలిలా వాడంతటా కమ్ముతోంది.” అంటారు. వాడ నిండా చలి ఉంది – గోడల్లో, పగుళ్ళలో పేరుకొని ఉంది. ఈ చలి భయపెడుతుంది. వణుకు పుట్టిస్తుంది. దళితుల్ని భయపెట్టించే ఈ చలి భూతం – “కుల భూతం.” నారమ్మ చనిపోయింది కూడా ఈ చలి సంకటంతోనే. బతికినన్నాళ్ళు ఈ చలితో చీదరింపబడి, అణచివేయబడి అన్ని రకాల దోపిడీకి గురై చనిపోయింది. రెండు కావిళ్ళ కట్టెల మీద కాలిస్తే కానీ ఇన్నాళ్ళ చలి నుండి నారమ్మకు విముక్తి లభించదని భావిస్తుంది కోడలు సావాలు.

కధలో “చలి” పాత్ర కీలకమయినది. “రాత్రి ముందుకు సాగిన కొద్దీ చలి అంతకంతకూ పెరిగి పోతుంది. వయసులో ఉన్న తననే గజగజలాడిస్తున్న చలి” లాంటి మాటలు కథ నిండా కనిపిస్తాయి. చలి – పెత్తందారీతనం. చలి కులం. చలి ఊరి అహంకారం. అప్పారావు “చలి సంకటం మనకి ఎన్నుబావుని పట్టీసింది. ఎవుకలు తీనేసింది. సీవూ నెత్తురు మరేటి మిగల్నేదు.” అంటాడు.

ఈ చలి నుండి దళితులు విముక్తం కావాలన్నది రచయిత కల. అదీ విప్లవం ద్వారా జరుగుతుందన్నది ఒక నమ్మకం. ఆ నమ్మకం కధలో అక్కడక్కడా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది.

చివరికి కొందరు యువకులు ఎక్కడినుంచో కట్టెలు తెస్తారు. సగం తవ్విన గొయ్యిని ఆపి శవాన్ని కట్టెల మీద కాలుస్తారు. “.. చెర్లో ములిగి వచ్చిన ఎరకయ్య తడి తలతో తడి గుడ్డల్తో తల్లి కాష్టం ముందు నిల్చున్నాడు. తక్కిన వాళ్ళు అటూ ఇటూ జరిగి అతనికి చోటిచ్చేరు. ఎర్రని మంటల వెలుగు ఆపాద మస్తకం, ముఖ్యంగా అతని ముఖం మీద ప్రతిఫలిస్తోంది.” అని రచయిత అతని అంతరంగంలో రగులుతున్న విప్లవ భావోద్వేగాన్ని, చలి నుండి విముక్తం కావాలనుకొనే అతని ఆకాంక్షను వ్యక్తీకరిస్తాడు. చలికి వణికినా – సారా తాగనంటాడు ఎరకయ్య. మత్తు లేకుండా – మైకంలో పడి వాస్తవలోకాన్ని మర్చిపోకుండా స్పృహతో ఉండి చలిని ఎదుర్కోవాలని ఎరకయ్య నిశ్చయించుకొంటాడు. తల్లి కాష్టం మంటల్లో వేడెక్కాక శీతాకాలం పట్ల తనకున్న భయం నుంచి విముక్తం కావాలనుకొంటున్నాననీ చెబుతాడు ఎరకయ్య. “.. ఈ సలీ సీకటి ఎప్పటికి తొలిగిపోతాయి? ఎర్రగా పొద్దెప్పుడు పొడుస్తాది? ఎప్పుడెండలో చేరిపోతావు” అని అంటాడు. తల్లిని గుర్తు చేసుకొంటూ చనిపోయాకైనా ఈ చలి నుండి విముక్తం కావాలని తన తల్లి కల కనేదనీ చెబుతాడు. ఆమె కల – జీవితం నుంచి విముక్తం కావడం కాదు – బానిసత్వం నుంచి విముక్తం కావడం – అన్నది – రచయిత దృక్పథం.

కాల్చటం, పూడ్చటం అనేవి రెండు ఈ పాత్రల మధ్య జరిగిన చర్చలో కీలకాంశాలు. నిజానికి ఈ కథలో దళితులు కాల్చే ఆచారం ఉన్నవాళ్ళు. “కుల సంప్రదాయం” అదే అని బలంగా నమ్మినవాళ్ళు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, కులపెద్దలు .. అందరిదీ అదే విశ్వాసం. కర్రలు దొరక్క మధ్యలో పూడ్చాలనుకొంటారు కానీ అనేక సందేహాలూ భయాలూ. చిట్టచివరికి కట్టెలు దొరికి కాలుస్తారు. ఏ ఆచారాలను వదులు కోవటం ద్వారా విముక్తి కలుగుతుందో, అనవసరపు భారం (Drudgery) తగ్గుతుందో వాటిని వదులుకోవాలి – కర్రలు దొరకని కారణంగా కాల్చే సంప్రదాయాన్ని వదులుకోవాలనుకొంటారు. కాల్చటం హిందూ సంప్రదాయం అనీ, పూడ్చటం తురకల వంటివారి ఆచారం అనీ కూడా అనుకొంటారు. పూడిస్తే దెయ్యాలుగా మారతారనే తమ నమ్మకాన్ని తలుచుకొని భయపడతారు. హిందూ దళితులుగా ఈ ఆచారం నుండి విముక్తి కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం జరగదు. మళ్ళీ ఇంకొక ముసలమ్మ చనిపోతే ఏం చేస్తారు? కట్టెల కోసం మళ్ళీ అందర్నీ అడుక్కొంటారా? దొంగతనం చేస్తారా? తిరుగుబాటు చేస్తారా? తమను తాము కట్టడి చేసుకొన్న ఆచారాల నుండి భావజాల బానిసత్వం నుండీ విముక్తి చేసుకోకుండా – తిరుగుబాటు సాధ్యమవుతుందా? మార్పుకి అవకాశం ఉందా?

దళితులు హిందూ మత పరిధిలో ఉండీ కుల వివక్షపై పోరాటం చేసి హక్కులు సాధించుకొనే అవకాశం ఎండమావి లాంటిది. యధాతధ గ్రామీణ సమాజంలో తిరుగుబాటుకి ఆస్కారం లేదు. అణచివేతలోకి, బానిసత్వంలోకి నెట్టే ఆచారాలను ధిక్కరించకుండా విప్లవం సాధించే ఆస్కారం లేదు. కుల బానిసత్వం నించి బయట పడాలని మతం మారి క్రైస్తవం ఇస్లాం లాంటి మతాలను ఆశ్రయిస్తే కుడా హిందూత్వ పెత్తందార్లు వదలడం లేదు. ఇవాళ దేశం నిండా మత మార్పిడులపై తీవ్ర చర్చ జరుగుతోంది. “ఘర్ వాపసీ” పేరిట తిరిగి దళితుల్ని అదే మురికి గుంటలో పాతేయడానికి బ్రాహ్మణీయ హిందూ సమాజం త్రిశూలాలతో బయలుదేరింది. కుల వివక్ష నుంచి విముక్తి జరగా కుండా బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ నుంచి అది పెంచి పోషించిన ఆచార సంప్రదాయాల నుంచి భౌతికంగా మానసికంగా బయట పడకుండా ఉన్నంత కాలం దళితులకు ఈ దేశంలో విముక్తి లేదు. అదే విధంగా హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలాన్ని ధిక్కరించ కుండా – ఆ మానసిక స్థితి నుంచి అణచివేతకు గురైన సమాజాన్ని బయటికి తేకుండా ఈ దేశం విప్లవాన్నిసాధించడం జరగదు.

నిజానికి ఈ కధ వచ్చే నాటికి సాహిత్య చరిత్రను చూస్తే దిగంబర కవుల షాక్ ట్రీట్ మెంట్ నుండి సాహితీ సమాజం ఇంకా బయటపడనే లేదు. కంచికచర్ల కోటేశు కుల అహంకారుల చేతిలో దారుణంగా తగలపెట్టబడ్డాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణ ఉద్యమాల సెగ తగ్గనే లేదు. 1970ల నాటికి విరసం పుట్టుకొని వచ్చింది. మార్క్సిజం ఇచ్చిన భౌతికవాదం హల్ చల్ చేస్తోంది. ఇలాంటి సాహిత్య సందర్భంలో అప్పారావు లాంటి యువకులు ఈ ఆచార వ్యవహారాలకు కేంద్రమైన మురికిగుంట లాంటి బ్రాహ్మణీయ హిందూత్వం ఏర్పాటు చేసిన వర్ణ వ్యవస్థని గుర్తించలేక పోయారు. ఆ మురికి గుంటలోనే నిలబడి కేవలం చుట్టూ ఏర్పడిన తరంగాన్ని ఛేదించాలనుకోవటం అంటే – దీనిని హైందవ విప్లవంగానే మనం గుర్తు పట్టాల్సి వస్తుంది. ఈ దేశపు దళితుల్లో ఈ వర్ణ వ్యవస్థ అంతం పట్ల అవగాహనను పెంచేదీ, దృష్టిని సారింపచేసేదీ కేవలం అంబేడ్కరిజం మాత్రమే. 1970ల నాటికి ఈ దేశంలో అంబేడ్కరిజం చేరుకోవాల్సిన ఊరి చివరి అంటరానివాడల్లో మార్క్సిజం మాత్రమే చేరుకోవటం వలన ఈ మురికి గుంటను గుర్తించలేని అంధులయ్యారు దళితులు.

ఏది ఏమైనా కాళీపట్నం రామారావుగారే చెప్పినట్లు ఈ కధ దళితుల జీవిత సంఘర్షణ. సుదీర్ఘమైన ఈ కధలో చావు కేంద్రంగా సామాజిక ఆవిష్కరణ జరిగింది. పాత తరానికీ కొత్త తరానికీ మధ్య వున్న దృష్టి అంతరం, మార్పును కోరే తరం ఆకాంక్ష అభివ్యక్తమయ్యాయి.

 -ఎం.ఎం. వినోదిని 

వినోదినిడా. ఎం.ఎం. వినోదిని యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. బ్లాక్, ఒక విలన్ ఆత్మహత్య లాంటి సంచలనాత్మక దళిత మహిళా కేంద్రకమైన కధలు రాశారు. ఇంకా బ్లాక్ యింక్, మరియా లాంటి కధలు అనేక పత్రికల్లో వచ్చాయి. వీరి పిహెచ్ డి థీసిస్ ‘స్త్రీవాద కవిత్వం – భాషావస్తు రూప నవీనత’ చాలా యూనివర్సిటీల్లో రిఫరెన్స్ గా వాడుతున్నారు. ఈమె రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కధ ‘Parable of a Lost Daughter’ పేరుతో ఆంగ్లానికి అనువాదమై యూనివర్సిటీ కాలేజీల్లో డిగ్రీ విద్యార్ధులకు పాఠ్యాంశంగా ఉంది.   2013లో ఈమె ఆంగ్లం నుండి అనువాదం చేసిన ‘దాహం’ నాటకం (The Thirst, Oxford University press) గత తొమ్మిదేళ్ళ నుండి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ కోర్సుకు పాఠ్యాంశంగా ఉన్నది. ఈ సంవత్సరం ‘వేగుచుక్కలు, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం’ పుస్తకాన్ని హెచ్ బిటీ వాళ్ళు ప్రచురించారు.

గత కాలం రచయితల్లో కొడవటిగంటి ఇష్టమని చెబుతున్నారు. మద్దూరి, పైడి, గోగు శ్యామల, జూపాక సుభద్ర, గౌరీలతో బాటు అందరు దళిత అస్తిత్వవాద, ఇతర అస్తిత్వవాద రచయితల రచనలు ఇష్టమని చెబుతున్నారు. తన వర్గాన్ని- అందులో తను ప్రేమించే తల్లిని కూడా కుల దౌష్ట్యం కలిగి ఉండిన కారణంగా నిజాయితీగా విమర్శించి ఎండగట్టిన స.వెం. రమేశు దళితేతర రచయితల్లో ఇష్టమైన వాడని చెప్పారు. ఆయన చూపించిన దళితేతర మార్గం అత్యంత ప్రేమించదగ్గదీ, ఇతర రచయితలకు మార్గదర్శకమూ అని ఆమె అభిప్రాయం. 

వచ్చే వారం ‘హింస’ కధ గురించి బత్తుల రమాసుందరి పరిచయం

 చావు కథ ఇక్కడ: