కొత్త ఆలోచనలతో…

katha

 

(కథాసాహితి పక్షాన)

ఈ 26వ సంకలనంలో కొత్త ఆలోచనలు, అభిరుచులతో మీ ముందుకొస్తున్నాం.

అందులో మొదటిది సంపాదకుల మార్పు. ప్రతి సంవత్సరం మా పక్షాన ఇద్దరు సంపాదకులు ఎన్నిక చేసిన కథలతో ఈ సంకలనాన్ని ప్రచురించాలని భావించాం. ఈ ప్రయత్నంలో తొలి అడుగు ఇది. ఈ కథ 2015కి ఆడెపు లక్ష్మీపతి, ఎ.వి. రమణమూర్తి సంపాదకులు. దాదాపు వారి తుది నిర్ణయం మేరకే ఈ కథల ఎన్నిక జరిగింది. ఒకటి, రెండు విషయాల్లో మా సలహాలు తోడయ్యాయి. అడిగిన వెంటనే బాధ్యతలు స్వీకరించి, అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో చర్చలు సాగించి, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు ఉన్నా ఎంతో సంయమనంతో వ్యవహరించి, కథలను ఎన్నిక చేసిన సంపాదకులిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం మరో ఇద్దరు సంపాదకుల ఎన్నికతో కథ 2016 వస్తుంది.

ఈ సంకలనం నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రసిద్ధ కథారచయిత రాసిన ముఖ్యమైన కథను చివర్లో అనుబంధంగా ఇవ్వాలనేది మరో కొత్త ఆలోచన. ఈ తరం రచయితలు, గతకాలపు గొప్ప కథలను చదివి కథారచనలో మెళకువలను నేర్చుకోగలరని, పాఠకులు ఈ మేలు కథల్లోని గొప్పదనాన్ని ఆస్వాదించాలని ఆకాంక్ష. అందుకే ఈ సంవత్సరం తొలి ప్రయత్నంగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కలుపు మొక్కలు కథని ప్రచురిస్తున్నాం. అనితరసాధ్యమైన వారి రచనాశైలికి, కథానిర్మాణానికి మచ్చుతునక ఈ కథ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలా పట్టణాల్లో బాలోత్సవ్ లు నిర్వహిస్తున్నారు. అందుకు స్పూర్తి కొత్తగూడెం బాలోత్సవ్. ఈ ఉత్సవాల్లో తెలుగు సాహితీసృజన పై పలు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి కథారచన, అప్పటికప్పడు కథా వస్తువును ప్రకటించి, కథ రాయమని కోరితే వందలమంది బాలబాలికలు గంటలో కథ రాసి మెప్పించగలుగుతున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే వారు రాసిన కథల్లో ముఖ్యమైన వాటిని అనుబంధాలుగా ఈ సంకలనంలో చేర్చాలని ఇంకో ఆలోచన.

ఎక్కడో లోతట్టు తమిళనాడులో నివసించే తెలుగు అక్షరం రాని తెలుగువారి గోసను తెలియజెప్పే అట్ట పుట్టింది ఆ ఊరు కథను అందిస్తున్నాం. దీన్ని రాసిన మార్టూరి సంజనాపద్మం పదమూడు సంవత్సరాల వయస్సులో తెలుగు అక్షరాలు నేర్చుకుని వారి యాసలో ఈ కథను రాసింది. ఇలాంటి మరో పదిహేను కథలతో రేగడి నీడల్లా అనే సంపుటిని ప్రచురించింది. కాకినాడలోని క్రియ సంస్థ నిర్వహించిన బాలోత్సవ్ కథల పోటీలో మొదటి బహుమతి వచ్చిన తాడాల కుసుమ సాయిసుందరీ రాణి కథ దైవం మానవ రూపేణని కూడా ఈ అనుబంధంలో చేర్చాం, ఈ అమ్మాయి ఓ మారుమూల గ్రామం (మాచర) జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. పిల్లల్లో సృజనాత్మక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించి, ప్రోత్సహించాలనే ఉద్దేశ్యమే ఈ ప్రయత్నం.

ఎప్పట్లాగే ఈ సంకలనాన్నీ తెలుగు కథాప్రియులు, పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ…

 

*