స్త్రీ విద్య మొదలు ‘తన్హాయి’ వరకు

vasaదేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యమందు మహిళ లెస్స.

మృదు మధురమైనది తెలుగు భాష. అందుకే తేనెవలె తీయనైనది తెలుగు భాష అంటారు. 11వ శతాబ్దము పూర్వం గురించి అనగా నన్నయ్య పూర్వము నుంచి తెలుగు భాష జానపద భాషగా తెలుగుదేశంలో వాడుకలో ఉంది. నన్నయ్య కాలం నుంచి ప్రధానంగా సాహిత్యము ప్రారంభమయింది. 19వ శతాబ్దము నుంచి ఆధునిక యుగం ప్రారంభమయింది.
ఆధునిక యుగంలో ప్రధానమైన ప్రక్రియలలో కవిత్వము, వ్యాసము, కథానిక, నవల, నాటకము, ప్రసిద్ధి వహించాయి. అందులో కథానిక, నవలా రంగాలలో స్త్రీలు మరింత పేరు గడించారు. అందులో 1960 మొదలు 1980 వరకు రచయిత్రుల స్వర్ణయుగము అన్నారు. ఎందరో  కథానిక, నవలాకారులు. అందుకే “తెలుగు సాహిత్యమందు మహిళ లెస్స” అన్న నానుడి ఏర్పడింది. నదిలో పాతనీటిని ముందుకు తోస్తూ కొత్త నీరు వచ్చి చేరుతున్నట్లుగానే పాత సాహిత్యము వెంట కొత్త సాహిత్యము వస్తూ ఉంటుంది. అది సహజము.
మనిషి ఆలోచన కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనిషి ఆలోచన మారినప్పుడు సాహిత్యమూ మారుతూ ఉంటుంది. ఆ కొత్త సాహిత్యము సమాజానికి శ్రేయోభిలాషి కావచ్చు. ఒకొక్కప్పుడు అనర్ధదాయకమని కొందరు భావించవచ్చు. ఏదైనా సాహిత్యంతో మార్పు మాత్రము సహజము. దానిని బట్టి ఎవరు ఒకలా ఉండాలని శాసించలేరు. మార్పుతో పాటు మానవ విలువలు మారుతూ ఉంటాయి. అందుకే సమాజంలో రచయిత్రులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. పోషిస్తున్నారు.
అప్పటివరకు ఉన్న సమాజానికి మేలుకొలుపుగా ఆధునిక యుగం ప్రారంభమయింది. ఓ పక్క రాజా రామ్ మోహన్ రాయ్ బెంగాలులో సతీసహగమన నిషేధానికి పూనుకొన్నాడు. ఆ ప్రభావంతో బానిసత్వంతో అన్ని విధాల మగ్గుతున్న భారతదేశంలో తిరుగుబాటు ధోరణి ప్రారభమయింది.

ఝాన్సీ లక్ష్మీ బాయి పరాయి పాలకులపై మొదటిసారిగా యుద్ధం ప్రకటించి పోరాటం ప్రారంభించింది. దాని ఫలితంగా క్రమంగా భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రారంభము, ఆంగ్ల ప్రభుత్వముపై తిరుగుబాటు ధోరణి ప్రారంభమయింది. మరొక పక్క విదేశీ పాలనా ప్రభావం వల్ల భారతదేశంలో ఆంగ్ల భాషా చదువులు ప్రారంభమయ్యాయి. పురుషులు చాలా మంది ఆంగ్లేయుల వద్ద ఉద్యోగాలు చేయడం  ప్రారంభించారు.మరొకపక్క వీరేశలింగం పంతులు సమాజం బాగుపడాలంటే స్త్రీ విద్య ప్రాధాన్యతకై, అనాధ స్త్రీల రక్షణకై కృషి ప్రారంభించారు. ఈ వీరేశలింగం పంతులు గారి సాంఘిక తిరుగుబాటు మూలంగా స్త్రీలలో చైతన్యం ప్రారంభమయింది.

స్త్రీలు చదువుకోవటంతో పాటు రచనలు చేయటం, స్త్రీ జనోద్ధరణకై మహిళా సంస్థలు కూడా ప్రారంభం చేసారు. అట్టివారిలో మొదట పేర్కొనదగినవారు శ్రీమతి బండారు అచ్చమాంబగారు. ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇంట్లోనే గురువు వచ్చి, చదువుకుంటుంటే ఆవిడకూడా పక్కన చేరి విద్య నేర్చుకున్నారుట. వివాహమైన తరువాత భర్తతో పాటు వెళ్లి హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో కూడా ప్రావీణ్యం సంపాదించారు.స్త్రీ విద్య, ధనత్రయోదశి, బీద కుటుంబం, దంపతుల మొదటి కలహం మొదలగు 12 కథలు రచించారు. స్త్రీ విద్య ప్రచురణ 1902లో జరిగింది. వరాహమిహిరుని భార్య ‘ఖానా’ బెంగాలీలో దానిని తెలుగులో రచించారు. ఆబాల సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంధం కూడా ప్రచురించారు.”బృందావనం” పేరుతో మచిలీపట్టణంలో స్త్రీ జనోద్ధరణకై సమాజం స్థాపించారు.అప్పటికి ఇంకా వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభం కాలేదు. అందుచేత ఈవిడ సాహిత్యం గ్రాంధికంలోనే సాగింది. అందుచేత అవి కథలు కావని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ‘స్త్రీ విద్య’ ఒక రచయిత్రి రచించిన మొదటి కథ. అది భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ అయినా కథగానే పేర్కొనవచ్చు. అప్పటివరకు ఇంటి పనులలోనే స్త్రీలు జీవిస్తున్న కాలంలో ‘స్త్రీ విద్య’ ఒక తిరుగుబాటుగా ప్రారంభమయినదిగా పేర్కొనవచ్చు. “ఆవిట స్త్రీ హితైషిణీమండలి” స్థాపన కూడా ఆ కాలంలో చెప్పుకోదగిన సామాజిక సేవారంగాలలో చెప్పుకోదగిన కృషి.

తదుపరి కాలంలో చెప్పుకోదగిన రచనలు, సంఘసేవ చేసిన మహనీయురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ. అప్పటికి వీరేశలింగం పంతులుగారి సాంఘిక తిరుగుబాటు చైతన్యంతో పాటు గాంధీ స్వరాజ్య ఉద్యమం ప్రారంభమయింది. అప్పటికి ఆంధ్రపత్రిక వారపత్రిక, గృహలక్ష్మి పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈవిడ చిన్నతనంలోనే రాసిన శారద లేఖలు  గృహలక్ష్మి పత్రికలో ప్రసారమయ్యాయి. మా చెట్టు నీడ ముచ్చట్లు ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఆనాటి సాంఘిక, దేశ  పరిస్థితికి చిహ్నాలు అవి. ఆవిడ రచనలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. ఆవిడ కథానికలలో కుటీర లక్ష్మి  కుటీర పరిశ్రమలపై వెలువడిన కథ, పెన్షన్ పుచ్చుకున్ననాటి రాత్రి, 5 మాసాల 20 రోజులు మొదలగు కథానికలు చెప్పుకోదగినవి. 1925లో వెలువడిన ‘వసుమతి’ ఆవిడ మొదటి నవల. ఆనాటి సాంఘిక దేశ, కాల పరిస్థితులను తెలియచేసిన నవల. గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్న మొదటి రచయిత్రి . ఈవిడ రచనలు వ్యవహారిక భాషలోనే రచింపబడ్డాయి.

తరువాత చెప్పుకోదగిన రచనలు డా.ఇల్లిందల సరస్వతిదేవిగారివి. ఆనాటి కాలంలోని అనేక సమస్యల మీద ఈ రచనలు సాగాయి. 12 నవలలు, 250 వరకు కథానికలు, వ్యాసాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. ఈవిడ కాలం నాటి స్త్రీ విద్య అంతగా ప్రాధాన్యత ఇంకా సంతరించుకోలేదు. పెళ్ళినాటికి ఎక్కువ చదువుకోలేదు. ఇల్లిందల సీతారామారావుగారితో వివాహమైన తరవాత ఆయన కనీసం మెట్రిక్ అయినా చదివించి కాపురానికి పంపండి అని పట్టు పట్టటం వల్ల ఆవిడ చదువుకుని హైదరాబాదు వచ్చి భర్త ప్రోత్సాహంతో జర్నలిజం చదివారు.ఆవిడ రచనలు కృష్ణా పత్రిక, భారతి, సుజాత మొదలైన పత్రికలలో వెలువడ్డాయి. ఈవిడ రచనలు సాంఘిక దురాచారాలపై విమర్శ ఉంది. ఈవిడ రచించిన రచనలు సంఘసేవలో ప్రధాన పాత్ర వహించాయి. హైదరాబాదులో  వనితా మండలి స్థాపకులలో ఒకరు. రాజహంసలు, పెద్ద కథలు (1962) తేజోమూర్తులు. కొందరు మహానుభావుల జీవిత చరిత్రలు పాఠకలోకానికి చైతన్యం కలిగిస్తాయని రచించారు. ఈ విధంగా ఆవిడ రచనలు పాఠకలోకానికి ఎంతగానో ఉత్తేజం కలిగించి, ఆలోచింపచేసే రచనలు చేశాయి.
తరువాత చెప్పుకోదగిన నవల కాలాతీత వ్యక్తులు. డా.పి.శ్రీదేవిగారి రచన ఇది. 1958లో ప్రచురించబడింది. తెలుగులో ‘చివరకు మిగిలేది’ రచించి గొప్ప రచయితగా పేరు పొందిన బుచ్చిబాబుగారి నవల వలె శ్రీదేవిగారు ‘కాలాతీత వ్యక్తులు’ నవల రచించి కీర్తి గడించారు. మానవ జీవితాన్ని గురించిన విషయమంతా ఇందులో పొందుపరచబడింది. విజ్ఞానవంతులైన పాఠకలోకాన్ని ఆలోచింపచేసిన నవల ఆవిడ రచించిన కాలాతీత వ్యక్తులు.

ఆచార్య బిరుదు రాజు రామరాజుగారి మార్గంలో జానపద సాహిత్యంలో కృషి చేసిన వ్యక్తి ఆచార్య నాయని కృష్ణకుమారి. ‘గౌతమి నవల’, పువ్వులన్నీ శ్రీవారికే’ వంటి కథలలో స్నేహము, ప్రేమ, ఆదరణ కనిపించేట్టు మలచిన నవలలు, కథానికలు రాసినా జానపద సాహిత్య కృషి వాసి కెక్కినది. ఆంధ్రుల కథ, జానపద గేయగాథలు, సిద్ధాంత గ్రంధము, మొదలగునవి ఎంతోమంది విద్యార్థులకు అనుసరణీయమైనవి.

పిన్నవయసులోనే రచనలు చేసి పాఠకలోకాన్ని ఆకట్టుకున్న రచయిత్రి తెన్నేటి హేమలత. లతగా ప్రసిద్ధి వహించారు. వేశ్యావృత్తిపై రచనలు చేసిన మొదటి రచయిత్రి కూడా. ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా పని చేసి శిలాహృదయం వంటి నవలలే కాదు పాఠకలోకాన్ని ఆకట్టుకున్న మోహనవంశీ వంటి నవలలు ఊహాగానం వంటి   (5 వాల్యూములు) రచించిన రచయిత్రి. ఈ కాలంలోనే పాఠకలోకంలో మార్పు వచ్చింది. స్త్రీల పాఠకలోకం కూడా పెరిగింది. స్త్రీలలో చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. రచయిత్రుల సంఖ్య కూడా పెరిగింది. 1960 నుండి 1980 వరకు రచయిత్రుల యుగమని చెప్పవచ్చు.

ఒక పక్క మాలతీ చందూర్ ఆంధ్రప్రభలో ప్రమదావనం మరొకపక్క రామలక్ష్మిగారి ప్రశ్నలు సమాధానాలు ఆంధ్రపత్రికలో స్త్రీ పాఠకలోకాన్ని మరింత పెంచింది. ఈ కాలంలోనే కృష్ణవేణి, పేకమేడలు, కూలినగోడలు, స్త్రీ, చదువుకున్న కమల, ఆకర్షణీయమయ్యాయి. ఇవే కాకుండా రంగనాయకమ్మగారి బలిపీఠం సాహితీలోకంలో సంచలనం కలిగించింది. జానకి విముక్తి పాఠకలోకంలో ఆలోచన రేకెత్తించింది. రంగనాయకమ్మగారు రామాయణ విషవృక్షం రచించి సాంప్రదాయ లోకంపై ఒక సవాలు విసిరారు. ఈ విధంగా రచనలు చేసిన రచయిత్రి మరొకరు లేరనే చెప్పాలి. నేడు హేతువాద దృష్టితోనే రచనలు చేస్తున్నారు. మాలతీచందూర్‌గారి హృదయనేత్రి నవల స్వాతంత్ర్యోధ్యమ నేపధ్యంలో వెలువడి పాఠకలోకాన్ని ఆకర్శించింది.

ఈ కాలంలోనే మరొక సంచలన రచయిత్రి యద్ధనపూడి సులోచనరాణి. స్త్రీపురుషుల లోకంలో అనురాగ లతలు సృష్టించి అర్ధవంతంగా, ఆకర్షణీయంగా రచించిన సెక్రటరీ, జీవన తరంగాలు, మౌనభాష్యం, కీర్తికిరీటాలు, సహజీవనం, మీనా, మొదలైన 80 నవలలు పాఠకలోకంలో ఆబాలగోపాలాన్ని అలరించాయి. నవలలన్నీ  సినిమాలుగా వెలువడి పాఠకలోకాన్ని పరవశింపచేసాయి. ఈ నవలలో సమాజ సమస్యలకంటే స్త్రీ పురుషుల మధ్య సుఖసంతోషాలను కలిగించే సన్నివేశాలు సృష్టించే నైపుణ్యంతో, చక్కని శైలితో, అనుచిత, అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఆకర్షణీయంగా రచనలు చేసిన నైపుణ్యం యద్ధనపూడిగారిది.

ఇదే కోవలో రచనలు చేసిన మరొక రచయిత్రి కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి. ఈవిడ నవలల నైపుణ్యం కూడా పాఠకలోకాన్ని ఎక్కువగా ఆకర్షించింది. సూర్యముఖి, కల్పవృక్షం, స్వయంసిద్ధి, మార్గదర్శి, తపోభూమి, మోహనమురళి, చక్రనేమి, ప్రేమ్ నగర్ మొదలైన నవలలు రాసి పాఠకలోకంలో ఎనలేని కీర్తి గడించారు. ఎన్నో నవలలు సినిమాలుగా వెలువడ్డాయి. వైకుంఠపాళి, వారధి, పయనం ఎక్కడికి, ఎక్కవలసిన రైలు ఎంతో దూరం, ఈ పయనం మొదలైన నవలలు రాసి పాఠకలోకాన్ని ఎక్కువగా ఆకట్టుకున్న రచయిత్రి విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్ష్మి. చక్కని శైలి, అనువైన వర్ణనలు, ఈమె నవలల్లో ప్రసిద్ధి.

ఈ కాలం రచనల్లో మరొక సంచలనం సృష్టించిన  ‘మట్టిమనిషి’ వాసిరెడ్డి సీతాదేవిగారి రచన. రచయిత్రులెవ్వరూ మట్టి, గ్రామీణ వాతావరణం, రైతు జీవితం హృద్యంగా రచించిన నవల. రాబందులు, రామచిలుకలు, రాజకీయాలపై సంధించిన మరొక నవల వాసిరెడ్డిగారిది. అరుదైన విషయాలపై నవలలు రచించిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఈ కాలంలో కుటుంబ సమస్యలపై రచన చేసిన రచయిత్రులెందరో ఉన్నారు. ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి, పోల్కంపల్లి శాంతాదేవి, ఆనందాశ్రమం, తురగా జానకీరాణి మొదలైన రచయిత్రులెందరో కథానిక, నవలా రచనలు చేస్తున్నారు. ప్రధానంగా కుటుంబ వ్యవస్థ, స్త్రీల కష్టాలు, కన్నీళ్లు వెలికి వచ్చాయి.

ఈ కాలంలోని కథానికా రచనలు చేసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి నిడదవోలు మాలతి. ఈమె చాతక పక్షులు నవల రాసారు. వందకు పైగా కథానికలు వెలువడ్డాయి. ఈమె రచనల్లో ముఖ్యంగా మానవతా విలువలు, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతరులకు చెప్పడం విశేషం. నిజానికి, ఫెమినిజానికి మధ్య కథానిక సంచలనం కలిగించింది. ఈనాడు ఈమె తూలిక పత్రిక ద్వారా అనేక వ్యాసాలు, కథానికా అనువాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రపంచ స్థాయిలో ఇతర భాషలవారికి, ఇతర దేశాలవారికి తెలియజేయడమే ప్రధానోద్ధేశ్యంగా అనువాదాలు వెలువడుతున్నాయి. అనువాద రచయిత్రులలో ప్రథమస్థానము ఈమెదే. 1952 తెలుగు స్వతంత్రలో ప్రారంభమైన ఈమె రచన కొనసాగుతూనే ఉంది.

ఈ కాలంలో ప్రసిద్ధి పొందిన రచయిత్రి ఆర్.వసుంధరాదేవి. నిజజీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా రచనలు చేసిన రచయిత్రి ఈవిడ. ఈ కాలంలో అత్తగారి కథలు వంటి హస్య రచనలు చేసి  ప్రసిద్ధి పొందిన హాస్యకథా ఏకైక రచయిత్రి శ్రీమతి భానుమతిగారు. స్త్రీవాదము రాకమునుపే స్త్రీవాద  కథారచన చేసిన రచయిత్రి శ్రీమతి అబ్బూరి చాయాదేవి. “బొన్సాయ్”వంటి స్త్రీవాద కథలకు పెట్టింది పేరు చాయాదేవి…”ఆకాశంలో సగం”వంటి నవలలు “అయోని”వంటి కథానికలు రాసి స్త్రీవాద రచయిత్రిగా 1990ల్లో ప్రసిద్ధి పొందిన రచయిత్రి ఓల్గా. సాహితీరంగంలో ఓ సంచలనం కలిగించిన స్త్రీవాద రచయిత్రి. కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, కుప్పిలి పద్మ, విమల మొదలైనవారు కవిత్వం, కథానికలు రచించి ఈ మార్గంలో నడిచారు. జయప్రభ కూడా కొన్ని కవితలు రాసి తనదైన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు.

ఈ తరం రచయిత్రులతో పాటు అనేకమంది రచయిత్రులు కుటుంబ సమస్యలు, సమాజ సమస్యలు తీసుకుని తమ రచనలు వెలువరిస్తూనే ఉన్నారు. జలంధర కొంత తాత్విక ధోరణిలో తమ రచనలు ఆకర్షణీయంగా రాస్తున్నారు. వివిధ కోణాలలో స్త్రీల సమస్యలను చిత్రించిన రచయిత్రి సోమరాజు సుశీలగారు. మానవ జీవితాలకు అద్దం పట్టే రచనలు చేసినవారిలో నందుల సుశీలాదేవి ఒకరు. పేషెంటు కథలు పేరుతో తన హాస్పిటలుకు వచ్చే రోగుల కథలను కథా రూపంలో వర్ణించే అరుదైన రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మిగారు. కొన్ని సంవత్సరాలు కృష్ణక్కగా ఆంధ్రభూమి వారపత్రికలో ప్రశ్నలు, సమాధానాలు చెప్పి మరొక పక్క కథానికలు, నవలారచన చేస్తున్న రచయిత్రి డా.కె.వి.కృష్ణకుమారి. హేతువాద దృష్టితో తనదైన శైలితో కథానికలు చేసిన రచయిత్రి డా.చాగంటి తులసి ఒకరు.  తనదైన శైలిలో వచన కవిత్వంలో దీర్ఘ కవిత, కావ్యము, కవితలు, కథానికలు రచించిన రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి ఒకరు.

1962లో కథానవలా రచన ప్రారంభించి నేటితరం వరకు “కాదేదీ కథకు అనర్హం” సుమారు 300 కథలు , 20 వరకు నవలలు రచించిన రచయిత్రి డి.కామేశ్వరీదేవి. అగ్నిపరీక్షవంటి నవలలే కాక ‘కొత్త మలుపు’ వంటి అద్భుతమైన నవల రాసి పురుషుడు మోసం చేసి అనుభవించి పెళ్ళిని దాటవేసిన వ్యక్తికి కోర్టుకు తీసికెళ్లి అబలగాకాక సబలగా కోర్టులో నెగ్గిన నాయిక పాత్రను సృష్టించిన సీతల రచించిన డి.కామేశ్వరి ఒకరు. “రెల్లు పొదలు” పేరుతో పేరుపొందిన నవల రచించిన పోలాప్రగడ రాజ్యలక్ష్మి ఎన్నో కథానికలు, నవలలు రచించారు.
స్త్రీవాదం రచనల్లో తగ్గిన తరువాత నేడు ఎంతోమంది రచయిత్రులు తమ కథానిక, నవలలు రచించి పాఠకలోకాన్ని ఆకట్టుకుంటున్నారు. “రేగడి విత్తులు” నవల రచించి రైతు జీవితానికి పట్టం కట్టిన రచయిత్రి శ్రీమతి చంద్రలత. మొదటినుంచి వార, దిన, మాసపత్రికలు రచయిత్రుల రచనలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. నేటి రచయిత్రులను కూడా దిన, వార, మాస మొదలగు ప్రసిద్ధ పత్రికలు స్త్రీ రచయిత్రుల సాహిత్యాన్ని పోషిస్తూనే ఉన్నాయి. ఒకనాడు స్త్రీల సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమని పేర్లు పెట్టారు. ఈనాడు సాహిత్యంలో రచయిత, రచయిత్రుల బేధం లేదనే చెప్పాలి. అన్ని రకాల విషయాలపై రచయిత్రులు కూడా పోటీపడి తమ రచనలు కొనసాగిస్తున్నారు. మీ రచనవల్ల మా పత్రిక అమ్మకం పెరిగిందని చెప్పే పత్రికలు కూదా ఉన్నాయి.

ముందు తరంలో కవిత్వము, కథానికలు, నవలలు  రచించిన శ్రీమతి శారదా అశోకవర్ధన్ చెప్పుకోదగిన రచయిత్రి. మంచి కథానికలు, నవలలు వ్యాసాలు రాసిన వేదుల శకుంతల, గోవింద సీతాదేవి మొదలైన రచయిత్రులున్నారు. వెండి వెలుగులు వంటి నవలలు, దేశబాంధవి వంటి ప్రసిద్ధ నాటకము , అనేక  కథానికలు, స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు స్త్రీలు వంటి వచన గ్రంధాలు, మళ్లీ మళ్లీ పుడతా వంటి కవితలు రాసి ప్రసిద్ధి పొందిన రచయిత్రి డా.వాసా ప్రభావతి.

ఇటీవలి కాలంలో ఉత్తమ కథానికలు, నవలలు రచిస్తున్న వారిలో శ్రీమతి తమిరిశ జానకి, హాస్యకథలు రాస్తున్నవారిలో పొత్తూరి విజయలక్ష్మి, చక్కని, చిక్కని కథానిక, నవలలు రాస్తున్న గంటి భానుమతి, వారణాసి నాగలక్ష్మి, ఆధ్యాత్మిక తత్వంతో కథానికలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక, వి.ప్రతిమ, మల్లీశ్వరి ముఖ్యులు. వీరే కాదు మరెందరో చెప్పుకోదగిన రచనలు చేస్తున్న రచయిత్రులు.

2011లో వెలువడిన నవల “తన్హాయి” పేరే కాదు అందులోని వస్తువు, కథా కథన శైలి చెప్పు మానవ సంబంధాలను కొత్త కోణంలో చిత్రించిన నవలా రచయిత్రి కల్పన రెంటాల. ఇటీవలి కాలంలో కొత్తకోణంతో రచించిన నవల. కల్పన రెంటాల భావస్ఫూర్తి ఇది. ఈ నవలపై విమర్శ ఇంకా వెలువడవలసి ఉంది. నవలలోని కొత్త విషయాలు అందరికీ అందాలి. కాలం ఒడిలో మానవ ఆలోచనలు, పరుధులు మారుతూనే ఉంటాయి. కాలం ఒడిలో విలువలు మారుతున్న కొన్ని రచనలు వానిలోని పాత్రలు సాహిత్రీ గమనంలో మైలురాళ్లలా నిలిచిపోతాయి. చెరిపితే చెరిగిపోయేదీ కాదు. వాటి విలువ వాటిదే!

డా. వాసా ప్రభావతి