సానుకూలం

 

వినాలని ఎదురుచూసే వెదురు కోసం

వేణునాదమవుతుంది గాలి కూడా

కమ్మని కబురులతో తెమ్మెర సమీపిస్తే

తబ్బిబ్బై తలూపుతుంది పూలతీగైనా

నిశ్చలమై తటాకం నిరీక్షిస్తే

తూనీగ కూడా చిత్రాలు రచిస్తుంది

అడ్డంకులెదురైనా ఆగిపోక

తనకోసం పరుగెత్తి వచ్చిన సెలయేటికి

అవనత వదనయై ఆకుపూజ చేస్తుంది అడివమ్మ

చినుకులుగా ప్రేమను చిందించే మేఘం కోసం

అగరు ధూపమైపోతుంది అవని సమస్తం

తన కోసం నింగి నుంచి

నేలకు జారిన వానజల్లు

తాకీ తాకగానే

తటాకం తనువెల్లా పూలవనం!

స్పందించే హృదయానికి

ఎటు చూసినా సౌందర్యమే

ఎరుకంటూ ఉంటే

లోకమంతా సానుకూలమే!

*

సరళ నిర్వచనం కోసం అన్వేషణ!

 

book-cover-oka-sarala-nirvachanam

గరిమెళ్ల నారాయణ గారు వృత్తి రీత్యా శాస్త్రవేత్త. తన తొలి కవితా సంపుటి ‘-273˚C నుండి ఒక సరళ నిర్వచనం’ లో ఈ కవి సృజించిన కవితలు చదివితే, సంక్లిష్ట సమాజంలో మానవ మనస్తత్వాన్ని నిశితంగా గమనిస్తూ ఆదర్శప్రాయమైన జీవితానికొక సరళ నిర్వచనాన్నిచ్చిన సాహసిగా ఇతను కనిపిస్తాడు. ఇతని శాస్త్రీయ దృక్పథం ఇతనిలోని కవిని ప్రేరేపించిందనీ, తద్వారా ఒక కొత్త అభివ్యక్తిని ఇతను సొంతం చేసుకునేందుకు తోడ్పడిందనీ పుస్తకం చదువుతుంటే మనకు అర్ధమవుతుంది. కవితలన్నిటిలో అంతర్లీనమైన సానుకూల దృక్పథం, ఆశావాదం, తోటి మనిషి పట్ల అమితమైన అభిమానం, మన చుట్టూ ఉన్న కుళ్ళుని మనమే శుభ్రపరచుకోవాలన్న ఆరాటం,  స్నేహశీలత, అనుబంధాలపట్ల మక్కువ కమనీయంగా కనిపిస్తాయి.

‘పర్వతుడా! నీపాదాలకునమస్కారం’ కవితలో మల్లి మస్తాన్  బాబుని  స్మృతిస్తూ

తెలియని పాఠాలేవో చెప్పి పర్వతాలని పాదాక్రాంతం చేసుకున్నావో,

లేక అవి మాత్రమే సొంతం చేసుకున్న ప్రకృతి సహజత్వానికే ప్రణమిల్లావోగాని

అనడంలో ప్రకృతీ, పురుషుడూ ఒకరినొకరు పాదాక్రాంతం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రణమిల్లుతూ పరస్పరం గౌరవించుకునే సహజీవన సౌందర్యం కనిపించి‘ వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాట గుర్తొస్తుంది.

పర్వతశిఖరాలమీదజెండాలైనిలబడిననీపాదాలకుశిరసువంచినమస్కరిస్తున్నానుఅంటూ- శిఖరాల మీద నిలబడిన పాదాలనే, పర్వతారోహకుడు తానధిరోహించిన శిఖరం మీద పాతే జెండాలుగా వర్ణించడం కవి సాధించిన అందమైన అభివ్యక్తికి అద్దం పడుతుంది.

 

నిజానికి రెక్కల విలువ తెలిసిన వారు ఇతరుల బహుమతులేవీ ఆశించరు

ఎగిరేపుడు మాత్రం ఎవరైనా తన రెక్కల టపటపల కనుగుణంగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తే బాగుండు ననుకుంటారు

‘రెక్కలనే బహుమతిగా ఇవ్వు’ అనే కవితలో పొందుపరచిన ఈ వాక్యాలు ఒక నిత్య సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. కేవలం చిన్న చిన్న ప్రోత్సాహక వాక్యాలు అందించగల శక్తిని గుర్తుచేస్తాయి.

 

‘రెక్కలుకట్టేవాడు’ కవితలో గుబురుగా పెరిగిన వృక్షాలు భూమికి వర్షాన్ని బహుమతిగా రప్పించుకుంటాయని చెప్పి  ‘ఎగరడమంటే చెట్టులా పైకెగసి, చినుకులా భూమిని ముద్దాడటమేఅంటారు.

చినుకు భూమిని ముద్దాడాలంటే చెట్టు ఎలా పైకెదగాలో చెప్పే సూచన కనిపించి మనసుపులకిస్తుంది. ఇందులో చెట్లు నరికేస్తూ వర్షాభావానికి కారణం తెలుసుకోలేని మనిషికి ఒకసున్నితమైన మందలింపు వినిపిస్తుంది.

పసిపాపల బాల్యచేష్టలని వర్ణిస్తూ ఆ ఆనందాలని,  అపురూపాలని చేతులు చాచి పట్టుకోమని చెప్పే కవితలో‘ అలా పట్టుకున్నాక మీ వయసు విరిగి బాల్యంలో పడకపోతే నన్ను నిలదీసి అడగండి‘ అంటారు!

 

‘ముద్దుల బాధ్యత ఒక రక్షణ కవచం’ లో ‘ట్రోపో, స్ట్రాటో, అయానో ఆవరణాల దుప్పట్లు కప్పుకున్న మురిపాల పాపాయిగా భూమిని వర్ణించడం ఒకకొత్తప్రయోగం.

అమ్మ అనగానే అహర్నిశలూ మన బాగోగులు చూస్తూ, ప్రేమని పంచే వ్యక్తి మన ఊహ లో సాక్షాత్కరిస్తుంది. ఆమె కి అమితమైన బాధ్యత అంటగట్టి, మన బాధ్యతని సులువుగా మరచిపోతాం.  కన్నబిడ్డ విషయంలో మాత్రం అలా అనుకోం. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో ఎంతో శ్రధ్ధ వహిస్తాం!

భూమిని తల్లిగా కాకుండా, మురిపాల పాపాయిగా వర్ణించే ఈ కవితలో ఆమె సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే ఒక హెచ్చరిక వినిపిస్తుంది! ఇది మానవాళికి చాలా ఆవశ్యకమైన హెచ్చరిక.

 

అబల, ఆ(యుధ) బల కావాలని ఆకాంక్షిస్తూ

ఆమె ఒక తుపాకి అయ్యుంటే ఎంత బాగుండేది?…

ఎక్కుపెట్టిన బాణమో, మొనదేలిన బల్లెమో, వళ్లంతా ముళ్లు నింపుకుని ఆత్మరక్షణలో ఆరితేరిన జంతువో అయ్యుంటే ఎంత బాగుండేది?’  అంటారు.

అలా అంటూనే అనవసరమైన ఆయుధీకరణని తుపాకీ ఎప్పుడూ తుపాకీయేప్రతి సమస్యకూ పరిష్కారాన్నిపేలడంలోనే కనుక్కోవాలనుకుంటుందిఅంటూ నిరసిస్తారు.

 

ఎక్కడచూడు .. రెండే..! ఒక పై చెయ్యి ..ఒక కింద చెయ్యి.. పై చెయ్యెపుడూ హుకుం జారీ చేస్తా నంటుందికిందది బానిసలా పడుండి కింద కిందనే అణిగి మణిగి ఉండాలంటుందిఅంటూ, తానెపుడూ చేతులు రెండూ కలిసి కరచాలనమయ్యే చోటుకి ప్రయాణం కడతా’ నంటూ ఒక అపురూపమైన భావాన్ని కవితగా రూపొందించారు.

 

అమ్మ తెల్లవారడాన్ని బలవంతంగా ఆవులించి నిద్రలేపుతుంది అమ్మకి ఇంత కంటే సరళ నిర్వచన మేముంది?

 

అబ్సల్యూట్జీరో (-273˚C) డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పదార్ధాలన్నీ లోపరహితస్థితిలో ఉంటాయన్న వాస్తవాన్ని కవిత్వీకరిస్తూ‘ ఒక్కసారి స్థితిలోకి పోయివచ్చేద్దాంస్వచ్చంగానవ్యనాగరికతనుమొదలెడదాం’ అంటారు.

ఆహ్లాదకరాలు, భాగ్యురాలు లాంటి పదప్రయోగాలనూ, అక్కడక్కడ దొర్లిన అచ్చుతప్పుల్నీ పరిహరిస్తే ఈ నవ యువకవి తొలిపుస్తకం మనిషిని పునరుజ్జీవింపజేసే స్వప్నాలని ఆవిష్కరించి సేదతీరుస్తుంది; ‘ఊహించడానికి ఖర్చేం కాదులేఅని ఊరడిస్తుంది.

వాసిరెడ్డిపబ్లికేషన్స్ (ph.9000528717) లో ప్రింట్పుస్తకంగానూ ,www.kinige.com లో డిజిటల్ ప్రతిగా  లభిస్తున్న ఈపుస్తకం వెల రు. 60.

*

కాన్వాస్ పై కాంతి పుంజం- అరుణా రావ్

 

                                                        Aruna (2)             

‘సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్య’మన్న కొడవటిగంటి కుటుంబరావు ఆమె మాతామహులు. సాహిత్యం సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో ఉండాలని భావించి అత్యంత సరళమైన భాషలో తన అనువాదాలు సాగిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అనేక పురస్కారాలు పొందిన శాంత సుందరి రామ వరపు ఆమె తల్లి. అదే ఒరవడిని కొన సాగిస్తూ మానవ జీవితం గురించి చెప్పే ప్రకృతి దృశ్యాలనెన్నుకుని, ఆ వెలుగు నీడల్లో కెమెరా పట్టుకోలేని రంగుల్ని నేర్పుగా పట్టుకుని, సమ్మోహకంగా కాన్వాస్ మీద ఆవిష్కరిస్తున్న అరుణారావ్ తో ముఖాముఖి, ‘సారంగ’ పాఠకుల కోసం.

* అరుణా! అంతర్జాలం లో తెలుగు సాహిత్యానికి వేదికగా నిలుస్తున్న సారంగ పత్రిక కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఒక గొప్ప సాహిత్య వాతావరణంలో పుట్టి పెరిగిన మీలో చిత్రలేఖనం మీద ఆసక్తి ఎలా వచ్చింది? ఆ ఆసక్తిని మీరే వయసులో గుర్తించారు?

అరుణ: చిన్నతనం నుంచి సహజంగానే బొమ్మలు వెయ్యటం లో ఆసక్తి ఉండేది. కానీ పాశ్చాత్య చిత్రకళ వైపు మొగ్గటానికి ఫ్రెంచ్ ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్స్ గురించిన పుస్తకాలు చదవటమే ముఖ్యమైన కారణం. కాలేజీలో చదువుతున్నప్పుడు వాన్ గో, డేగాస్, మోనే లాంటి గొప్ప చిత్రకారుల జీవితాల గురించి చదివే అవకాశం లభించింది. వాన్ గో జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన ‘లస్ట్ ఫర్  లైఫ్ ‘ అనే నవల అప్పట్లో నామీద గొప్ప ప్రభావాన్ని చూపింది. పాశ్చాత్య కళ పట్ల నాకున్న ఆసక్తికి అది  ఆజ్యం పోసింది. పదో ఏటినుంచే నాకు నచ్చిన ఏ బొమ్మ ఎక్కడ కనిపించినా దాన్ని చిత్రించేదాన్ని.

* Modernism, Impressionism, Expressionism, Cubism, Surrealism ఇలా ఎన్నో రకాల శైలులున్నాయి కదా చిత్రకళా రంగంలో? రియలిస్టిక్ పెయింటింగ్ నే మీరు ఎంచుకోవడానికి కారణం?

అరుణ: ఏదైనా ఒక శైలిని ఎంచుకోవటం అనేది వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుందని నా ఉద్దేశం. చిన్నతనంలో నామీద పడిన ప్రభావాలూ, ప్రస్తుతం నేను చేస్తున్న కోర్స్ లో నేర్చుకుంటున్న కొత్త విషయాలూ నన్ను ‘రెప్రెజెంటేటివ్ పెయింటింగ్ ‘ అంటే కళ్ళకి కనిపించే వాస్తవ దృశ్యాలని చిత్రించటం  వైపు తీసుకెళ్తున్నాయని నా నమ్మకం .

* ఆరుబయట ప్రకృతిని ప్రత్యక్షంగా చూస్తూ చిత్రించే plein air painting  బృందంలో ఉన్నారని విన్నాను. మీ బృందం గురించీ, మీరు చేసే పనుల గురించీ చెప్పండి.

అరుణ: మిషిగన్ లో ఉన్న ఒక ప్లేన్ ఎయిర్ పెయింటర్స్ బృందం లో నేను సభ్యురాలిని. వసంత ఋతువులో మొదలుపెట్టి మంచు కురవటం మొదలుపెట్టే లోపల, అంటే ఆకురాలుకాలం వరకూ మేము వారానికి ఒకసారి కలుసుకుని ఆరుబయట చిత్రాలు వేస్తాం. డిట్రాయిట్ లో పార్క్ లూ, పొలాలూ , తోటలూ, నగర దృశ్యాలూ మొదలైన నగరంలోని విభిన్నమైన ప్రదేశాలని ఎన్నుకుంటాం. ప్లేన్ ఎయిర్ లో నేనింకా ప్రారంభ దశలోనే ఉన్నానని అనాలి. ఇంతవరకూ నాకది ఒక సవాలు లాగే అనిపిస్తోంది.

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

An evening at the farm (VANGO ART అనే సైట్ లో ఇది అమ్ముడైంది)

ఇందులో లాభాలేమిటంటే, జీవితం నుంచి దృశ్యాలు చిత్రించవచ్చు. కళ్లెదుట సజీవంగా కనిపిస్తున్నవాటిని పంచేంద్రియాలతోనూ అనుభవిస్తూ చిత్రించగలగటం ఒక అద్భుతమైన అనుభూతి. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక తాజాదనం, సాన్నిహిత్యం అనుభవంలోకి వస్తాయి. అంతే కాకుండా వెలుగు నీడల్లోని రంగులు కళ్ళకి కనిపించినట్టు కెమెరా చూపించలేదు. అందుకే వాటిని ఉన్నదున్నట్టు గమనించటం సాధ్యమౌతుంది.

స్టూడియో పెయింటింగ్ తో పోలిస్తే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు. ప్లేన్ ఎయిర్ పెయింటింగ్ లో ఒక కాలపరిధిలో, అంటే 2-3 గంటల్లో, చిత్రాన్ని ముగించాలి. వెలుగు నీడలు మారిపోతూ ఉంటాయి. అందుకే చిన్న కాన్వాస్ లో చిత్రించవలసి వస్తుంది, వేగంగా చూసిన దృశ్యాన్ని రంగుల్లోకి దింపాలి. ఒక్కోసారి ఔట్ లైన్ లాగ వేసుకుని స్టూడియోలో పూర్తి చెయ్యాలి. అప్పుడు కావాలంటే వాటిని పెద్ద కాన్వాస్ మీద కూడా వేసుకోవచ్చు.

* పెయింటింగ్ లో ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్ నే ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కారణం?

అరుణ: ఇతర మాధ్యమాలతో నేను ఎక్కువగా చిత్రాలు వెయ్యలేదు. ఆయిల్ పెయింట్స్ రంగులు లోతుగా, మెరుగ్గా ఉండి చిత్రాలకి ఎక్కువ అందాన్నిస్తాయని నా నమ్మకం. అందుకే వాటిని వాడటం ఇష్టం.

* మీకిష్టమైన ఆర్టిస్ట్?

అరుణ: నాకిష్టమైన చిత్రకారుల్లో ముఖ్యమైన పేర్లు కొన్ని:  డేగాస్, మోనే , Jaoqine Sorolla, ఐసాక్ లెవితాన్, ఎడ్వర్డ్ హోపర్. వర్తమాన చిత్రకారుల్లో సీడబ్ల్యూ ముండీ, టీ అల్లెన్ లాసన్, డేవిడ్ కర్టిస్, జోన్ రెడ్ మాండ్, జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్.

1 (3)

* మీకు యూరోపియన్ ఆర్ట్ మీద ఇంత మక్కువ కలగడానికి కారణం?

అరుణ: పాశ్చాత్య కళలో ఆసక్తికి  కారణం చిన్నతనంలో ఆ సాహిత్యానికీ, చిత్రకళకీ పరిచయమవటమే. నా పదో ఏట మా అమ్మా, నాన్నా, అక్కచెల్లెళ్ళం  ఇద్దరం, మూడు వారాలు యూరప్ లో పర్యటించాం. అందులో ఒక వారం మొత్తం ఇటలీ లోనే గడిపాం. అప్పుడు ఎన్ని ఆర్ట్ గాలరీలు చూశామో లెక్కలేదు. నాకు తెలీకుండానే దాని ప్రభావం నామీద పడి  ఉండాలి. అలా అన్ని గొప్ప చిత్రాలూ, శిల్పాలూ చూడటం నాకదే మొదటి సారి.

* మీ చదువు , ఉద్యోగం వివరాలు? అమెరికాకి ఎప్పుడు వెళ్లారు?

అరుణ: పన్నెండో క్లాసు వరకు మద్రాస్ లో కాన్వెంట్ లో. డిగ్రీ , పీజీ ఢిల్లీలో. ఎలెక్ట్రానిక్స్ లో మాస్టర్స్ చేసి 1996 లో అమెరికా వెళ్ళాను. 2015 వరకు IT  లో ఉద్యోగం చేశాను.

* అంటే పదేళ్ల పైగా IT రంగంలో పనిచేసి నలభయ్యోపడిలో చిత్రకళాభ్యాసంలోకి ప్రవేశించారు. ఈ నిర్ణయం ఎలా జరిగింది?

అరుణ: కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నాను. కొంత గాప్ తర్వాత 2011 లో మళ్ళీ కేవలం ఒక హాబీ గా చిత్రాలు వెయ్యటం మొదలుపెట్టాను. నా భర్త సలహా మేరకు (అతను అమెరికాలో MS చేశారు) శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా లోని  అకాడమీ అఫ్ ఆర్ట్ యూనివర్సిటీ లో MFA  ప్రోగ్రాం కి అప్లై చేశాను. అంతవరకూ హాబీగా వేసిన నా చిత్రాలని వాళ్లకి పంపించాను. వాళ్ళు నా అప్లికేషన్ ని ఆమోదించారు. క్లాసుల్లో మంచి గ్రేడ్లూ, కామెంట్లూ రావటం నాకు  మరింత ప్రోత్సాహాన్ని అందించింది. ఇక ఆ తరవాత ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని చిత్రకళకే కేటాయించాలన్న ప్రేరణ కలిగింది. డిగ్రీలో చదివినది వేరైనా నాకు చిన్నతనం నుంచీ  కళలమీదా, సాహిత్యం మీదా ఎక్కువ అభిరుచి ఉండేది. ఇక జీవితంలో స్థిరపడ్డాక నాకు నా ప్రియమైన చిత్రకళ అభ్యసించేందుకు అవకాశం దొరికింది.

 

* ఒక వ్యక్తిని ప్రేమించడమంటే ఆ వ్యక్తి అభిరుచుల్ని గౌరవించడమంటారు! మీ అభిరుచినే మీ కెరియర్ గా ఎన్నుకోవడం వెనక మీ భర్త పాత్ర?

అరుణ: నా భర్త కూడా నేను చిత్రాలు బాగా వెయ్యాలని ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన చిత్రకళ అభ్యసించి, అందులో ప్రతిభ సాధించి నేను సంతోషించాలని అతని ఆశయం. నేను ఉద్యోగం మానేసి పూర్తి సమయం చిత్రకళకే కేటాయిస్తున్నానంటే, అది అతని ప్రోత్సాహం వల్లే.

* మిమ్మల్ని ఆకట్టుకునే ఇతివృత్తాలు ఎలాంటివి?

అరుణ: నాకు చిత్రకళలో ఆసక్తి కలిగించేవి, వెలుగు నీడలూ, రంగులూ. వస్తువు ఏదైనప్పటికీ దాన్ని  చక్కగా వేస్తే అది చూసేందుకు అందంగానే ఉంటుంది. నామటుకు నాకు మానవ జీవితం గురించి చెప్పే ల్యాండ్ స్కెప్స్, స్టిల్ లైఫ్  చిత్రించటమంటే ఇష్టం.

 

* మీ ఇతర అభిరుచులు? తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?

అరుణ: నాకు చిత్రకళ కాకుండా ఉన్న ఇతర అభిరుచులు, సినిమా, సంగీతం (ముఖ్యంగా సినిమా పాటలు), రకరకాల ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యటం.

2 (2)

* ఎలాంటి అడ్వెంచర్స్ ఇష్ట పడతారు?

అరుణ: కాలేజీలో ఉండగా రాణిఖేత్ లాంటి ప్రాంతాలకి మా లెక్చరర్లతో ట్రెకింగ్ కి వెళ్లాను. రాక్ క్లైమ్బింగ్ కూడా ఒకసారి చేశాను. అలా అరుదైన ప్రదేశాలకి వెళ్ళటం, హైకింగ్, కాంపింగ్ లాంటివి చెయ్యటమంటే సరదా.

* ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిస్టులెవరు?

అరుణ: ప్రస్తుతం నాకు ఎక్కువ నచ్చుతున్నది జెన్నిఫర్ మెక్ క్రిస్టియన్ వేసే చిత్రాలు. ఆమె చిత్రాలు  నాకు ముఖ్యమైన ప్రేరణ అని చెప్పవచ్చు. వర్తమాన కాలంలో ఇంప్రెషనిస్టిక్ చిత్రాలు వేసే కళాకారిణి. ఆమె చిత్రాలలో బ్రష్ వర్క్ , మరీ స్పష్టంగా ఉండకపోయినా దృఢంగా కనిపించే  కుంచె విన్యాసాలూ, అంచులని చిత్రించే తీరూ, ఎంచుకునే వస్తువూ నాకు చాలా గొప్పగా కనిపిస్తాయి. సామాన్యమైన దృశ్యాలని అద్భుతమైన చిత్రాలుగా తీర్చిదిద్దగల ఆమె నేర్పును నేను చాలా అభిమానిస్తాను.

* పిల్లల్ని చదువులో అద్భుతాలు చెయ్యాలని ఒత్తిడి చేసే తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒక లలిత కళలో ప్రవేశం ఉండేలా శ్రధ్ధ చూపాల్సిన అవసరం ఉందంటారా?

అరుణ: లలిత కళలపట్ల చిన్నతనంలోనే ఆసక్తి కలిగించటం అవసరమని నా నమ్మకం. ఈ పనికి తలిదండ్రులూ, అధ్యాపకులూ పూనుకోవాలి. వీటివల్ల మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవటం, స్పందించే గుణం పెంపొందుతాయి. చిన్నపిల్లలు కళలను సాధించటంలో ఒకవేళ కృతకృత్యులు కాలేకపోయినా, వాళ్లకి వాటిని  పరిచయం చేయటంవల్ల మంచే జరుగుతుంది.

* మీ ఆసక్తి  వెనక మీ తల్లిదండ్రుల పాత్ర ఉందా?

అరుణ: పెరిగి పెద్దవుతున్న వయసులో సాహిత్యం, కళలకి సంబంధించిన పుస్తకాలని చదవమని సలహా ఇచ్చి వాటిని నాకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి  మా అమ్మ. అందుచేత నా అభిరుచుల్ని ప్రోత్సహించటంలోనూ, వాటిని నేను నేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలలోనూ మా అమ్మ  పాత్ర  ముఖ్యమైనది. ప్రస్తుతం మా అమ్మా, నాన్నా ఇద్దరూ నా చిత్రకళ పట్ల ఆసక్తి కనబరచటమే కాకుండా, నా కృషిని  ప్రోత్సహిస్తున్నారు.

Aruna with parents

* మీరిప్పుడు చేస్తున్న కోర్స్ గురించి కొంచెం వివరిస్తారా?

అరుణ: నేను చేస్తున్న ఈ MFA కోర్స్ ఆన్లైన్ లో చేసేందుకు వీలుంది. ప్రపంచంలో ఏమూల ఉన్నవారైనా దీన్ని చెయ్యచ్చు. ఈ కోర్స్ లో నేను నేర్చుకుంటున్న విషయాలు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఒక్కొక్క క్లాసూ క్షుణ్ణంగా, విద్యార్థి నుంచి చాలా ఎదురుచూసేదిగా ఉంటుంది. ఆషామాషీ గా చేసేందుకు వీల్లేదు. ప్రొఫెసర్లు  చిత్రకళ గురించి మంచి పరిజ్ఞానం గలవారు. పరిమాణాలు (standards )చాలా ఉన్నతమైనవి. రాబోయే సెమెస్టర్లలో నా థీసిస్ మీద కేంద్రీకరించి పనిచేయాలి కాబట్టి నేను దానికోసం చాలా అతృతతో ఎదురుచూస్తున్నాను.

*మీ థీసిస్ స్టడీ కోసం ఎలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారు?

అరుణ: నా థీసిస్ స్టడీ ‘ప్రకృతి దృశ్యాలలో వెలుగు తాలూకు సౌందర్యా’న్ని చిత్రాలలో ప్రతిబింబించేట్టు  చెయ్యడం. దీనికోసం బైటికి వెళ్లి  దృశ్యాలని చిత్రించటం (ఫీల్డ్ స్కెచెస్),ప్లేన్ ఎయిర్ స్టడీస్ , స్వయంగా తీసిన ఫోటోల ఆధారంగా చిత్రాలు వెయ్యటం లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ల్యాండ్ స్కేప్ చిత్రాలు వెయ్యటంలో నేర్పుని మరింతగా అర్థం చేసుకుని మెరుగుపరచుకోవాలన్నది నా ఆశయం.

* మీ లక్ష్యం?

అరుణ: ప్రస్తుతం నా లక్ష్యం చిత్రకళ నేర్చుకుంటూ నాకున్న నేర్పును మెరుగుపరచుకోవడం.

ఈ డిగ్రీ పూర్తి చేశాక నాకు చిత్రకారిణిగా కళారంగంలో పేరు సంపాదించుకోవాలని ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం అద్భుతమైన చిత్రకారిణి అయితే సరిపోదు. ఇంకా ఎన్నో విషయాలలో కృషి చెయ్యాల్సి ఉంటుంది. వర్తమాన కళాకారులకి గల అవకాశాలు ఎన్నో, అవి ఎటువంటివో నేనింకా తెలుసుకోవలసి ఉంది, వాటిలో దేన్ని ఎంచుకోవాలో కూడా నిర్ణయించుకోవలసి ఉంది. ఒక చిత్రకారిణిగా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలనీ, గొప్ప చిత్రాలని అద్భుతంగా  చిత్రించాలనీ అనుకుంటున్నాను.

7 (2)

* అనువాదరంగంలో శాంతసుందరి గారు తనదైన ఒక ముద్రని గాఢంగా వేయ గలిగారు. సృజనాత్మక రచనలో మీ తాతగారు కొకు గారి శైలి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. చిత్రలేఖనంలో మీరూ అలాంటి విశిష్టతని సాధిస్తారనీ, చిత్రకళా రంగంలో అంతర్జాతీయ వేదిక మీద తెలుగువారికి సమున్నత స్థానాన్ని కల్పిస్తారనీ ఆశిస్తూ ‘సారంగ’ తరఫున అనేక శుభాకాంక్షలు!

 

*****

మూలస్వరం మూగపోకూడదు: గౌరి

 

     – వారణాసి నాగలక్ష్మి

~

 

varanasi nagalakshmi

ఈ సంవత్సరం అనువాదరంగంలో ఇద్దరు ప్రవాసులకి సాహిత్య అకాడెమీ పురస్కారాలు రావడం తెలుగువాళ్ళందరికీ సంతోషాన్నిచ్చింది. ఒకరు తెలంగాణలో పాతికేళ్లు పెరిగి చెన్నైకి తరలి వెళ్ళిన గౌరీకృపానందన్. మరొకరు కేరళలో పుట్టి పెరిగి ఆంధ్రలో స్థిర నివాసమేర్పరచుకున్న ఎల్ ఆర్ స్వామి.‘సూఫీ చెప్పిన కథ’ని తెలుగువారందరికీ చెప్పిన స్వామి గారికీ, ఓల్గా ‘విముక్త’ని ‘మీట్చీ’గా తమిళులకి పరిచయం చేసిన గౌరీ కృపానందన్ కీ,  తెలుగు రాష్ట్రాలు రెండిటికీ  సాహిత్య ఎకాడమీ పురస్కారాలు సంపాదించి పెట్టినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవలసిందే.

‘జాటర్ ఢమాల్’ అంటే ఏమిటో ఆ పిల్లల భాషని అనువదించగల ముళ్ళపూడి పుణ్యమా అని మనకి తెలిసింది గాని లేకపోతే  బుడుగు మనకి అర్ధమయ్యేవాడే కాదు.   ఉత్తర భారతీయుల్లో బెంగాలీలు మనకి అర్ధమయినంతగా మిగిలిన వాళ్ళు అర్ధంకారంటే దానికి కారణం విస్తృతంగా మనకి చేరిన బెంగాలీ సాహిత్యమే. ఒక ప్రాంతాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుందుకు దోహదం చేసేది అక్కడి సాహిత్యమే. ఒక ప్రాంత సాహిత్యం ఆ ప్రాంతానికే పరిమితమైపోకుండా నలుగురికీ అందుబాటులోకి తెచ్చే అనువాద ప్రక్రియ ప్రతిభావంతంగా సాగాలంటే మూల భాషా, లక్ష్య భాషా నేర్చుకుంటే సరిపోదు. ఆ ప్రాంతపు సామాన్య జనానీకంలో మమేకమై జీవిస్తే తప్ప ఆ అనువాదం సహజంగా పరిమళభరితంగా సాగదు.

ఇంట్లో తమిళం, గడప దాటగానే తెలుగు వాతావరణం..   గోదారి రెండు తీరాల మధ్య తిరుగాడే నావలా గౌరి  భాషాధ్యయనం ఆట పాటల మధ్య సాగింది. తెలంగాణలోని తెలుగు మీడియం పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  గౌరి, వివాహానంతరం చెన్నైకి తరలి వెళ్లినా, తెలుగుని తన మాతృ భాషగా భావిస్తూ, గత రెండు దశాబ్దాలుగా ‘చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు’ రుచిని తమిళ సోదరులకి  చవి చూపిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకోబోతున్నందుకు హార్దికాభినందనలు గౌరీ! వార్త వినగానే ఎలా అనిపించింది? మీ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

మీ అభినందనలకి ధన్యవాదాలు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని తరుణం. ‘దినమణి’ దినపత్రికలో ఉన్న ఒక సాహితీ మిత్రులు  సమాచారం వచ్చిన వెంటనే అభినందనలు తెలియ చేస్తూ ఈ మెయిల్ పంపారు. మొదట అది నిజమేనా అని సందేహం కలిగింది. వెంటనే సాహిత్య అకాడమి వారి వెబ్ సైట్ కి వెళ్లి చూసినప్పుడు అందులో ప్రెస్ నోట్ కనబడింది. ఆ తరువాతే నమ్మకం కలిగింది. వెల్లువలా వచ్చే ఫోన్లు,  సందేశాల మధ్య మా వారు, కొడుకులు, కోడళ్ళు  అనుకోని ఈ శుభ వార్తకి ఎంతగానో సంతోషించారు.

unnamed

మీకు లభించిన ఇతర పురస్కారాల గురించి చెప్పండి.

‘లేఖిని’ సంస్థలో కామేశ్వరిగారి పురస్కారం, తిరుప్పూర్ లయన్స్ క్లబ్ వారి ‘శక్తి’ పురస్కారం అందుకున్నాను.

2014 లో కుప్పం ద్రావిడ  యూనివర్సిటీకి  అతిధిగావెళ్లాను.  అనువాదరంగంలో నా అనుభవాలు పంచుకున్నాను. అదే విశ్వవిద్యాలయంలో 2015 మార్చ్ లో జరిగిన పది రోజుల వర్క్ షాప్ లో అనువాదం లో ఉన్న సాధక బాధకాలు విద్యార్దులతో ముచ్చటించాను.

మీరు పుట్టిన కుటుంబ వాతావరణం, మీరు పెరిగిన పరిసరాలు ఎలాంటివి?

మాది మధ్య తరగతి కుటుంబం. మాతృభాష తమిళమే అయినా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ లో (ఇప్పటి తెలంగాణా) ఇరవై ఏళ్ల దాకా పెరిగాను. చదువు పూర్తిగా తెలుగు మీడియం లోనే సాగింది. (హైదరాబాద్, భువనగిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వరంగల్) చిన్నప్పుడు స్కూల్ నించి ఇంటికి రాగానే అమ్మ పెట్టింది తిని వెంటనే ఆడుకోవడానికి బైటికి పరిగెత్తే వాళ్ళం. పిల్లలందరూ తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పటిలా కాన్వెంటు చదువులూ, ఇంగ్లీషు లో మాట్లాడుకోవడాలు ఆ రోజుల్లో లేవు. చదువు గురించిన వత్తిడి, మార్కుల బెడద అప్పట్లో అంతగా లేవు. ఇప్పుడు ఎల్కేజీ  చదువుతున్న పిల్లలకి కూడా తలమీద కొండంత బరువు ఉంటోంది

ఈ మధ్య తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన సాహితీ సదస్సులో దక్షిణాది భాషల మధ్య రావలసినంతగా అనువాదాలు రాలేదన్న భావన వ్యక్తమయింది. అందువల్ల ప్రాంతీయంగా సాంస్కృతికంగా ఎంతో సారూప్యతలున్నా ఒక భాషలోని సాహిత్యం గురించి మరో భాష వారికి పెద్దగా తెలియకుండా పోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా?

ఇండియాలో ఉన్నన్ని భాషలు ఏ ఒక్క దేశం లోనూ లేవు. ప్రాంతీయంగా సారూప్యతలు ఉన్నా ఒక భాషలోని సాహిత్యం మరోభాష లోని వారికి అందకుండా పోతూ ఉంది అన్నవాదనని ఒక విధం గా ఒప్పుకున్నా, దానికి మూల కారణాలను అన్వేషించి, వాటిని పరిష్కరించే మార్గాలు చూడాలి. ఎలాంటి రచనలు ఇంకో భాషలోకి వెళ్ళాలి అన్న దాంట్లో ప్రామాణికం అంటూ ఏమీ లేకపోవడం, మంచి అనువాదకులు లేకపోవడం, అనువాదాలు చేసినా ఆ రచనలు ప్రచురణ కి నోచుకోక పోవడం ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉన్నాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కొంతవరకు కృషి చేస్తున్నా పూర్తి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

అనువాద రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?

వివాహానంతరం చెన్నై వెళ్లాక తెలుగు పుస్తకాలు దొరక్క తమిళపుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా ఒకసారి తెలుగు నించి అనువదించబడ్డ నవల చదవడం తటస్థించింది. ఆ అనువాదం ఎంత హీనంగా ఉందంటే కోపం పట్టలేక వెంటనే ఆ అనువాదకులకి ఉత్తరం రాశాను. అప్పుడు మీరే అనువాదం చేసి చూడ మన్న సవాలే జవాబుగా వచ్చింది. దాన్ని స్వీకరించి నా మొదటి అనువాద రచన మొదలుపెట్టాను.

ఆ రచన ఎవరిదో చెప్తారా?

యండమూరి వీరేంద్రనాథ్ గారిది. ఆయన రచనలని నేను 1995 లో చదవడం ప్రారంభించాను. అవి ఎంతగా నన్ను ప్రభావితం చేసాయంటే, పుస్తకం చేతిలోకి తీసుకోగానే గబ గబా చదివేయాలి అనిపిస్తుంది. మళ్ళీ అలా చదువుతూ ఉంటే త్వరగా ముగిసి పోతోందే అని బాధగానూ అనిపిస్తుంది. ఇలాంటి ద్వైదీ భావం నాకు అంతకు ముందు ఎవరి రచనల పట్లా కలగ లేదు. ఆయన వ్రాసిన “పందెం” అన్నకధను వారి అనుమతితో తమిళంలోకి అనువదించాను. అది ‘కుంకుమ చిమిళ్’ అన్న పత్రికలో ప్రచురితమయింది.

మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఎవరితో? వివాహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది?

నా వివాహం 1976లో జరిగింది. మా అత్తయ్య కొడుకుతోనే. ఇరవై ఏళ్ల దాకా తెలంగాణా లో పెరిగిన నేను ఒక్క సారిగా చెన్నైకి రావడం తో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకోవడానికి తెలుగు పత్రికలు, నవలలు అందుబాటులో ఉండేవి కావు. అప్పుడే తమిళ పత్రికలు, నవలలు చదవడం ప్రారంబించాను. మాతృ భాష తమిళమే అయినా అప్పటి వరకు తమిళంలో చదవడం తక్కువ. ఉత్తరంముక్క కూడా తమిళంలో రాసింది లేదు. ఇప్పటి లాగా కంప్యూటర్లు, ఇంటర్ నెట్ అప్పుడు లేవు.

సాధారణంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక ఆ వ్యక్తికి స్ఫూర్తినో, శక్తినో, సాధించాలన్న కసినో అందించే వ్యక్తి ఒకరుంటారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరు?

ఇరవై ఏళ్ల దాకా పట్టుమని ఒక్క పేజీ కూడా తమిళం లో నేనురాసింది లేదు. అలాంటిదిడెబ్బై నవలల దాకా అనువాదం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అని ఒక్కో సారి ఆశ్చర్యం కలుగు తుంది. మన విజయాన్ని కుటుంబంలో అందరూ గుర్తిస్తే, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి ఆ గుర్తింపు దొరికితే ఆ సంతృప్తి వేరు. ఆ విషయంలో నేను అదృష్ట వంతురాలిని. మా వారికీ సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది.”విముక్త” అనువాదం లో మా వారు కంటెంట్ ఎడిటింగ్ చేసారు.”విముక్త” కధలో భాష స్థాయి వేరు. ఆ స్థాయి అనువాదంలోనూ ఉండాలని సూచించారు.

మీ గురించి మీరు గర్వపడిన సందర్భం?

గర్వపడక పోయినా, ఒకసారి బెంగళూరులో నిడమర్తి ఉమా రాజేశ్వరరావుగారింట్లో జరిగిన సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్లాను. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఆయన “అవును అవును. ఐదు గంటలకే సమావేశం మొదలవుతుంది. చీఫ్ గెస్ట్ కూడా వచ్చేశారు” అని అన్నారు. అప్పుడు హాల్లో నేనూ ఆయన మాత్రమే ఉన్నాము. ఎవరినో చీఫ్ గెస్ట్ అంటున్నారు అని నా వెనక ఒకసారి తల తిప్పి చూశాను. ఒక్క క్షణం తరువాతే నేనే అని అర్ధం అయ్యాక కాస్త సిగ్గుగా అనిపించింది. అంతకు ముందు నెలలోనే కవనశర్మ గారి “విడాకులు” తమిళ అనువాదం “Kanaiyazhi”అన్న పత్రికలో వెలువడింది. కవనశర్మ, వివిన మూర్తి గార్ల పరిచయ భాగ్యం ఆ సమావేశంలోనే కలిగింది.

నేను పంపిన అనువాద కధను ప్రచురించే ముందు, ఆయా పత్రికల సంపాదకులు నాకు ఫోన్ చేసి కధనూ, నా అనువాదాన్ని మెచ్చుకున్న సందర్బాలు రెండు మూడు ఉన్నాయి.

మీ జీవితపు మరపురాని మధుర సన్నివేశం?

తొలిసారి మాతృమూర్తి అయినప్పుడు. “అంతర్ముఖం” నవల మొదటి ప్రతిని అందుకున్నప్పుడు.

మీరు చేయాలనుకుని ఇంతవరకు చేయలేకపోయిన పని?

తమిళంలో ప్రపంచన్ గారి “vaanam vasappadum”నవలను తెలుగులో తేవాలని, అశోకమిత్రన్ గారి సికింద్రాబాద్ కధలను ఒక సంపుటిగా తెలుగులో తేవాలని.

మిమ్మల్ని గాఢంగా ప్రభావితం చేసినవ్యక్తి ఎవరు?

ప్రత్యేకించి ఒక వ్యక్తి అని చెప్పలేను. మాటలు, చేతలు ఒక్కటిగా ఉండేవాళ్ళు, ఎదుటి మనిషిని మాటలతో కూడా గాయపరచని వాళ్ళు, స్నేహ శీలులు నాకు మార్గదర్శులు.

రచన?

తెలుగులో యండమూరిగారి ‘అంతర్ముఖం’. ఓల్గా గారి ‘తోడు’ కధ.

నా రచనలు కొన్ని మీ అంతట మీరే అడిగి అనువదించారు. సాధారణంగా మూల రచనల్ని మీరే ఎన్నుకుంటారా? రచయితలే మిమ్మల్ని సంప్రదిస్తారా అనువాదాల కోసం?

సాధారణంగా, నాకు నచ్చిన కధలను ఆయా రచయితల అనుమతి తీసుకుని మరీ చేస్తాను. యండమూరి, యద్దనపూడిగారి రచనలను అన్నింటినీ తమిళంలో చేయాలని నా తపన. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ‘నిర్జనవారధి’ని తమిళంలో అనువాదంచేసి ఇవ్వగలరా అని ‘కాలచువడు’ అన్న ప్రముఖ పబ్లిషర్స్ నన్ను అడిగినప్పుడు కొంచం సంకోచించాను. ఎందుకంటే అంతవరకు నేను కధలు, నవలలు మాత్రమే చేసి ఉన్నాను. నిర్జనవారధి లాంటి ఆత్మకధను అదే స్వరంతో తేవాలి. అప్పుడే దానికి సార్థకత. ఆ పుస్తకం తమిళ అనువాదం “Alatrapalam” అన్నటైటిల్ తో వెలువడింది. పాఠకుల ఆదరణ పొందింది.

ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు అనువదించారు? ఎన్ని విడి రచనలు, పుస్తక రూపంలో రానివి, అనువదించారు?

ఇంతవరకు తమిళంలో డెబ్బై నవలలు వచ్చాయి. ప్రచురణలో పది నవలల దాకా ఉన్నాయి. తమిళంలో నుంచి తెలుగులోకి ముప్పైఐదు కధలకి పైగా అనువదించాను. ఈ బుక్ గా కినిగెలో ‘తమిళ కధలు-ఆణిముత్యాలు’ రెండు భాగాలుగా ఉన్నాయి. పుస్తక రూపంలో రావాల్సి ఉంది. అలాగే తెలుగు నుంచి తమిళంలో అనువదించిన కధలు పుస్తక రూపంలో రావలసి ఉంది.

సాహిత్య అకాడెమి వారి కోసం కు. అళగిరి సామి గారి “Anbalippu” అన్న కధా సంపుటిని తెలుగులో “బహుమతి” పేరిట అనువదించాను. స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. పుస్తకరూపంలో రావలసి ఉంది.

ఒక రచన చదివాక అది మిమ్మల్ని వెంటాడి వేధిస్తేనే అనువాదాలు చేస్తారని విన్నాను, నిజమేనా?

నిజమే. కొన్ని కథలు మనసులో ముద్రించుకుని ఉండిపోతాయి. వాటిని అనువాదం చేసేటప్పుడు కలిగే సంతృప్తి మాటలకి అందనిది.

మీ అభిరుచులు? మీ దిన చర్య?

ఎక్కువగా చదువుతాను. రోజుకి ఎనిమిది గంటలైనా కంప్యూటర్ లో చదవడం, అనువాదం చేయడం నా అలవాటు. మంచి పుస్తకం చదువుతూ ఉంటే విందు భోజనం చేసినంత తృప్తి కలుగుతుంది. నచ్చిన పుస్తకాలను కొని చదివి, నా సొంత గ్రంధాలయంలో ఉంచుకుంటాను. సాహిత్య సమావేశాలు ఎక్కడ జరిగినా నేనూ, మావారూ కలిసి వెళతాం.

IMG_3836 (2) (2)

మీ కుటుంబ సభ్యుల గురించి నాలుగు మాటలు?

మా వారు బాంక్ నుంచి రిటైర్ అయ్యారు. ముగ్గురు కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు(Seattle, US).

మీరెన్నుకున్న రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి చెప్పండి.

అనువాదం నేను ఎంచుకున్న రంగం కాదు. ఆ రంగమే నన్ను ఎంచుకుంది. తెలుగు నించి తమిళం లోకి, తమిళం నించి తెలుగు లోకి అనువాదం చేయడం నా మనస్సుకి నచ్చిన ప్రక్రియ. వృత్తి, ప్రవృత్తి ఒక్కటిగా ఉండటం నా సుకృతం.

కొన్ని రచనలను చదవగలం. కాని అనువదించడం కష్టం. అందరికీ కాక పోయినా చేయి తిరిగిన రచయితలకి ఒక స్వరం ఉంటుంది(tone). అనువాదంలో ఆ స్వరాన్ని తేగలిగితేనే ఆ అనువాదం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక భాష నుంచి నేరుగా ఇంకో భాషకి అనువాదం వెళ్ళినప్పుడే బాగా ఉంటుంది. మన దేశంలో పలు రకాల భాషలు ఉండటం వల్ల మొదట హిందీలో లేక ఆంగ్లం లో అనువాదం చేయబడి, వాటి నుంచి ప్రాంతీయ భాషలకి అనువాదం చేయడం ఆచరణ లో ఉంది. ఒక అనువాదానికి మళ్ళీ అనువాదం చేసినప్పుడు విషయం పలచబడిపోయే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ నేరుగా అనువాదాలు జరిగితే మంచిది. అనువాదకులకి మూలభాష, లక్ష్యభాషలమీద మంచి పట్టు ఉండాలి. రెండు భాషల యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన ఉండాలి.

గొప్ప స్పందన లభించిన మీ అనువాద రచన?

కథల్లో పి.సత్యవతిగారి “సూపర్ మాం సిండ్రోం”, వి.విజయలక్ష్మి గారి “మాతృత్వానికి మరో ముడి.”

మీకేవి ఎక్కువ ఇష్టం- కథలా నవలలా?

రెండూనూ.

మీ అభిమాన రచయితలు?

తెలుగులోయద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, ఓల్గా. తమిళంలో అశోకమిత్రన్, D.జయకాంతన్, ఇందిరా పార్థసారథి.

తమిళ, తెలుగు సాహిత్యాల మధ్య పోలికలూ వైరుధ్యాలూ ఎలా ఉన్నాయంటారు?

కథల విషయానికి వస్తే తమిళంలో నిడివి తక్కువగా ఉంటుంది. ఒక సమస్య గురించి మాత్రమే ఉంటుంది. తెలుగులో సంభాషణలు, వర్ణనలు కాస్త ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది. తమిళంలో చారిత్రాత్మిక నవలలు వ్రాసే రచయితలు చాలా మంది ఉన్నారు. వాటిని తీవ్రంగా అభిమానించే పాఠకులు ఉన్నారు. కల్కి వ్రాసిన “పోన్నియిన్ సెల్వన్” ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. తెలుగులో విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలను చదివి అర్థం చేసుకునే ఓపిక  కొత్త తరం పాఠకులకి కొంచెం తక్కువే. పెద్ద రచయితలను వదిలేస్తే మిగిలిన రచయితలు తమ రచనలను తామే సొంత ఖర్చులతో ప్రచురించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మంచి రచనలను ప్రోత్సహించే విధంగా పబ్లిషర్స్ ముందుకు రావాలి.

తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన వ్యక్తిగా  తెలుగు కథకులకి మీరిచ్చే సూచన?

వీలైనంత వరకు తక్కువ మాటల్లో ఎక్కువ అర్ధం వచ్చేలా చూసుకోండి. ప్రతి విషయాన్ని విపులంగా పాఠకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలివైనవాళ్ళు. అర్థం చేసుకోగలరు. కధలనువ్రాసిన వెంటనే పత్రికలకి పంపించకుండా రెండు మూడు రోజుల తరువాత మళ్ళీ మళ్ళీ చదివి చూడండి. అనవసరమైన పదాలు, వర్ణనలు తగ్గించండి. సమాజం పట్ల, మనిషి మనుగడ పట్ల బాధ్యతతో రచనలు చేయండి.

ప్రస్తుతం ఎలాంటి రచనల ఆవశ్యకత ఎక్కువగా ఉందంటారు?

ఎలాంటి సమాజం ఉండాలని ఎదురు చూస్తున్నామో, అటువంటి సమాజాన్ని రూపొందించ గలిగే రీతిలో మార్గ నిర్దేశం చేసే రచనలు.

అత్యంత శక్తివంతమైన టీవీ మాధ్యమాన్ని మెరుగైన సమాజ రూపకల్పనకి వాడుకోవాలంటే ఏం చెయ్యాలంటారు? ఇవాళ పెరిగిపోతున్న హింసకీ , సినిమాల్లో, టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాలకీ సంబంధం ఉందంటారా? 

టి.వి. సీరియళ్ళ గురించి నాకు చాలా అసంతృప్తి ఉంది. ఒక ఇంట్లో ఎలాంటి సంభాషణలు ఉండకూడదో అలాంటి డైలాగులు, వయసుకి మించిన మాటలు మాట్లాడే పిల్లలు ….. చూసే వాళ్ళ ఇంట్లో ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని నా భావన. సినిమాల్లో ఆడపిల్లలని తక్కువ చేసి చూపించడం, చులకనగా చిత్రీకరించడం.. వీటిని బహిష్కరిస్తేనే సమాజం బాగు పడుతుంది. సంస్కరణ మన ఇంట్లో నించే మొదలవ్వాలి.

                                   *

ఆలస్యం చేస్తే కథల పిట్టలు ఎగిరిపోతాయి…!

వారణాసి నాగలక్ష్మి 

 

  వందెకరాల్లో వనవాసానికనువైన తాటాకుల కుటీరం తాతగారిది. మైనింగ్ ఇంజనీరైన తాతగారు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లిన వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చాక చదువుకున్న వాళ్లంతా ఆఫీసుల్లో ఉద్యోగాలకి ప్రయత్నించకుండా సమృధ్ధి గా పంటలు పండించాలని కోరుకుని వందెకరాల అడవి చవగ్గా వస్తుంటే కొనడం, అప్పటికి వ్యవసాయ రంగంలో పట్టా పుచ్చుకున్న నాన్నగారు ఆయనకి  తోడుగా ఆ అడవికి వెళ్లడం జరిగింది. 

 ఆ అడవిలో స్వయంగా ఒక పర్ణశాల నిర్మించి, అక్కడ ఉంటూ, రాళ్ళూ రప్పలూ పొదలూ తుప్పలూ తొలగించి, నూతులు తవ్వి, కొద్ది కొద్దిగా ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా చేస్తూ వచ్చారు నాన్నగారు. వర్షాధారమైన నేలని మామిడి , నిమ్మ, జామ, సపోటా తోటలుగా, వరి పొలంగా మార్చారు. లాండ్ మార్ట్ గేజ్ బాంక్ లో పొలాన్ని కుదువ పెట్టి రకరకాల కూరగాయలు, ఇతర పంటలు పండించేవారు. నలభై సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా అక్కడ తయారయిన పచ్చని తోట, పాడి పశువుల సమూహానికి, ఎంత కట్టినా తీరని ‘బాంక్ లోను’ తోడయింది.

నాకు ఊహ తెలిసినప్పటి నించీ ఎటు చూసినా పచ్చని చెట్లూ, పశువులూ , పక్షులూ, వీచే గాలిలో తేలి వచ్చే అడవి పూల వాసనలూ. చూస్తున్నకొద్దీ మనశ్శరీరాల్ని ఆవహించే ప్రకృతి సౌందర్యం.

‘అరణ్యక’ నవల ( సూరంపూడి  సీతారాం గారు తెలుగులోకి  అనువదించిన  ‘ వనవాసి ‘ ) లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ అంటారు- ‘అరణ్య ప్రకృతి నా కళ్ళపై ఏదో మాయ కప్పి వేసింది . .. ఏకాంత స్థలం అంటే, నక్షత్ర మయమైన విశాల వినువీధి అంటే వ్యామోహం. ఇవి నన్నెంత  ప్రబలంగా ఆవహించాయంటే  కొద్దిరోజుల పాటు పాట్నా వెళ్లవలసొస్తే,  అక్కడ తారు వేసి గట్లు పోసిన రోడ్ల పరిధులు దాటి, మళ్ళీ ఎప్పటికి  ‘లవటులియా’ కానన వీధుల్లో పడగలనా అని ప్రాణం కొట్టుకు పోయింది. కప్పు బోర్లించినట్టుండే  నీలాకాశం కింద, మైదానాల తరవాత మైదానాలు, అడవుల పైన అడవులు ఎక్కడుంటాయో, ఎక్కడ మానవ నిర్మితమైన రాజ మార్గాలుండవో, ఎక్కడ ఇటుక గోడలుండవో, ఎక్కడ మోటార్ హారన్ ధ్వనులు వినబడవో, గాఢ రాత్రి నిద్రాభంగమైన సమయంలో దూరాన అంధకార వనంలో కేవలం నక్కల చీకటి ఘోషలు మాత్రమే  ఎక్కడ వినవస్తాయో, ఆ కాననాలకి ఎప్పుడు పోయి వాలుదునా అని మనస్సు కొట్టు మిట్టాడి పోయింది’ …’ దుర్బల చిత్తులైనవారు ఆ సౌందర్యం చూడకపోవడం మంచిదని నా అభిప్రాయం. దీని స్వరూపం సర్వ నాశన కరమైనది. ఈ మాయా మోహంలో పడిన వారు తప్పించుకుని బయటపడడం అసంభవం .. అయితే ఈ మాట కూడా చెప్పాలి. ప్రకృతి ఈ స్వరూపాన్ని చూడగలగడం మహా భాగ్యం. ఈ  ప్రకృతిని, నీరవ నిశీధులలో, వెన్నెలలో, చీకటిలో చూసే అదృష్టం సులభ సాధ్యమే అయితే పృధ్వి అంతా కవులతో పిచ్చివారితో నిండి పోదా?’ అని.

vnl 1

 ‘లవటులియా’ అడవులేమో గాని నేను పెరిగిన పరిసరాల్లో, చుట్టుపక్కల రెండు మైళ్ళ దూరం వరకు ఇంకొక్క ఇల్లుకూడా లేని ఏకాంతం.  పొలంగా రూపుదిద్దుకుంటున్న అడవి మధ్య, ఒంటరి ఇంట్లో, మా కుటుంబ సభ్యుల మధ్య  ఇరవయ్యేళ్ళు వచ్చేవరకు పెరగడం నిజంగా మహా భాగ్యమే. ఆ మాయా మోహం నన్నూ ఆవహించి, ఈనాటికీ వదిలిపెట్టలేదు. (నా కథలన్నీ వర్ణనాత్మకంగా, క్లుప్తతకి కొంత దూరంగా ఉండడానికి నా నేపధ్యం కారణమేమో అనిపిస్తుంది!). గీత రచన పట్ల, చిత్రలేఖనం పట్ల అభిరుచి కలగడానికి కూడా ఈ వాతావరణం దోహదం చేసిందనుకుంటాను. లోపల నిరంతరం కదిలే ప్రకృతి దృశ్యాలు చిత్రాలుగా మారాలని మారాం చేయడం, తీరా ప్రయత్నిస్తే, ఊహలో కనపడ్డ సౌందర్యం కాగితం మీద చేరేసరికి  ఆశాభంగం కలిగి మళ్ళీ కొన్నాళ్ళు కుంచెకి  దూరంగా ఉండడం….  

‘ సుమాల తాకగానే సుగంధాల సవారీ ,

వనాలు చేరగానే వసంతాల కేళీ,

పూల మ్రోల వాలి మధుపాలు మధువు గ్రోలి,

నలుదిశలా ఉల్లాసం ఊయలూగాలి

 

కోకిలమ్మ తీరి, ఆ కొమ్మ చివర చేరి, మురిపాల పూతలేరి చేసింది కచేరీ,

మామిడమ్మ తీరి, కొసరి చిగురులేరి, తేనె జాలువారే  కంఠ మాధురి-

కుసుమాల సొగసు చూసి భ్రమరాల కనులు చెదరి, ఝంకార సంగతులతో వనమెల్ల సందడి,

అందాలు జాలువారే మందార పూల చేరి , భృంగాలు తనివితీర చేసేను అల్లరి’

‘గుబులు నీ గుండెల్లో గూడు కట్టనీయకు ,

చేదు గురుతులేవి నీ మదిని చేరనీయకు

వసంతం రాలేదని వనిని వదలి పోవకు

శిశిరంలో చిగురు కోరి చింతించకు

 

మబ్బులున్న ఆకాశం మరచిందా మందహాసం?

అగ్ని మింగి కడలెపుడూ చూపలేదు నిరుత్సాహం

శీత కాలాన చిరు ఎండకు చలి కాచుకో

శ్రావణాన చినుకుల్లో చేను పండించుకో ’

… ఇలా కేవలం ప్రకృతి సౌందర్యం మీదే ఎన్నో పాటలు అల్లుకుంటూ ఉండేదాన్ని( పై పాటలకి ఇక్కడ ఒక్కొక్క చరణమే ఇచ్చాను).

అడపా దడపా వస్తూ కుదిరినంతకాలం మాతో ఉండిపోతూ ఎందరో బంధు మిత్రులు. వేసవి సెలవుల్లో వచ్చిన  పిల్లలందరితో కలిసి  పెద్ద వానర సైన్యంలా తోటలోకి  పరుగులు తీయడం,  మల్లె తోటల్లో మొగ్గలూ, మామిడి తోపుల్లో పచ్చికాయలు కోసుకుంటూ, ఆటల్లో పాటల్లో మాటల్లో పడి,  కనుచీకటి వేళ  చేల గట్ల వెంట పరుగులు తీస్తూ ఇల్లు చేరడం ఇప్పటికీ కళ్ళ ముందు కదిలే సజీవ చిత్రం.

పిల్లలందరికీ పెద్ద బావిలో ఈతలు నేర్పించి, రాత్రి పూట ఆరుబయట అందర్నీ తన చుట్టూ చేర్చుకుని, ఒంటరి ఇంటి చుట్టూ భయం గొలిపే చీకటిని తన మాటల వెన్నెలతో వెలిగించి, జీవితాన్ని ఎలా ఈదాలో శిక్షణ ఇచ్చే నాన్నగారు అందించిన  ఆశావహ దృక్పథం. (‘ఎంత ఆశావాదమండీ.. ఎలా సాధ్య మైందీ? మాక్కొంత అప్పివ్వరాదూ?’ అనడిగిన ప్రముఖ కథకులకి ఇదే జవాబు )

అంతమందినీ ఆదరించి, ఆర్ధికంగా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నా తోటలో పండిన వాటితోనే వండి వడ్డించిన అమ్మా, మామ్మా కలలా తోచే వాస్తవం.

 అంతులేని ఆకాశం నీలంగా, ఎగిరే కొంగలూ, ఎండలో మబ్బులూ  తెల్లగా, మెరప చేలూ, కారబ్బంతి తోటలూ ఎర్రగా, వరిపొలాలు లేత పచ్చగా, ఆకు పచ్చగా, పసుపు పచ్చగా … ‘ఎన్నిపూవులెన్నిరంగులెన్ని సొగసులిచ్చా’డో గమనిస్తూ, ఆస్వాదిస్తూ, రైతు జీవితంలోని  వ్యధలూ, వృధా ప్రయాసలూ, ఆశా భంగాలూ, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలూ అనురాగాలూ స్వార్ధాలూ అపార్ధాలూ అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే ఏదైనా రాయాలనే తపన మొదలైంది. ఇంట్లో సాహిత్య వాతావరణం ఎంత మాత్రం లేకపోయినా  నాకన్నా పెద్దవాళ్ళతో విభేదించినపుడు ఎదురుగా చెప్పలేని భావాలని అక్షరాల్లోకి కుదించడం అలవాటైంది. వార పత్రికలు  తప్ప గొప్ప సాహిత్యం ఏదీ అందుబాటులో లేని వాతావరణంవల్ల  నా రాతలకి మెరుగులు దిద్దుకునే వీలుండేది కాదు.

 ఆరు కిలోమీటర్ల దూరంలో నూజివీడు ఊరు. ఏడేళ్ళ ప్రాయంలో తిన్నగా మూడో తరగతిలో కూర్చోపెట్టారు సంవత్సరం మధ్యలో. చదువుకోసం అంతదూరం వెళ్ళాల్సి వచ్చేది. దారంతా నిర్మానుష్యంగా ఉండేది. అన్నలిద్దరి  సైకిళ్ళమీద వెనక కూర్చుని నేనూ మా చెల్లెలు. ఏనాడూ ఏ ఆపదా ఎదుర్కోకుండానే చదువు పూర్తి  చేసి మొదటి సారిగా ఊరు వదిలి  హైదరాబాద్ ప్రయాణం. కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పై చదువు. చిత్ర లేఖనం లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని తెలియక రసాయన శాస్త్రం లోకి   ప్రవేశించాను. చదువు కొనసాగిస్తుంటే తెలిసింది మానవ సంబంధాలకీ, రసాయనిక బంధాలకీ చాలా సారూప్యత ఉందని. 

 పదహారేళ్ళ వయసులో బడికీ, కళాశాలకీ మధ్య కనపడ్డ తేడాని నేపథ్యంగా తీసుకుని ఒక కథ రాసి నూజివీడు సాహితీసమితిలో చదవడం, తెలుగు లెక్చరర్ శ్రీ యమ్వీయల్ గారి ప్రశంస పొందడం, యూనివర్సిటీలో స్నేహితురాలి కబుర్లలో దొర్లిన ఒక సంఘటన ‘మనసు మనసుకీ మధ్య’ కథగా జ్యోతి వారపత్రిక లో అచ్చవడం, దానికి బాపూగారు మధ్య పేజీకి రెండు వైపులా విస్తరించిన బొమ్మ వేయడం యుక్తవయసు జ్ఞాపకాలు.

2 (3)

చెట్టూ పుట్టా పిట్టా ఏది కనిపించినా మనసులో కదిలే పద మాలికలు లలితగీతాలుగా రూపొంది 2003లో ‘వానచినుకులు’ గేయ సంపుటిగా రూపుదిద్దుకున్నాయి. మొదటి పుస్తకం పాటల పుస్తకమే. దాన్ని హిందూ వార్తా పత్రికకి సమీక్ష కోసం పంపితే వాళ్లు అనుకోని విధంగా నన్ను ఇంటర్వ్యూ చేసి, మెట్రో ప్లస్ లో ‘A rain song’  పేర ప్రముఖంగా ప్రచురించడం , ఆ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం నించి ఇరవై వేల నగదు బహుమతితో ‘సాహితీ పురస్కారం’ లభించడం మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలో అప్పటికి రాసిన కథలు రెండు పదులైనా లేకపోయినా వాటన్నిటినీ కలిపి ‘ఆలంబన’  కథా సంపుటిగా వేసుకున్నాను. దానికి ముందుమాట రాసిన ఛాయాదేవిగారికి ఆ కథలు నచ్చి, తన అత్తగారి పేర తానందించే ‘అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారా’నికి నన్నెన్నుకోవడంతో ‘నేనూ కథలు రాయగలను’ అనే ధైర్యం కలిగింది.

అప్పట్లో మన దేశంలోకి కొత్తగా వస్తున్న ఇంటర్నెట్ విప్లవం గురించి, అక్కడక్కడ కనిపిస్తున్న నెట్ సెంటర్ల గురించి ఆలోచిస్తుంటే కలిగిన ఆలోచనలనే  ‘ఆసరా’ కథగా మలిచి కౌముది పత్రికకి పంపితే బహుమతి లభించింది. ఆ కథ ప్రచురించ బడ్డ కొద్ది రోజులకే కథలో నేను వర్ణించిన సంఘటన నిజంగా జరగడం, ‘ప్రేమికుల్ని వంచిస్తున్న ఇంటర్నెట్ సీజ్’ పేర ఈనాడులో వార్త రావడం జరిగింది. కథకు లభించిన బహుమతి కన్నా కారా మాస్టారి పలకరింపు, స్వయంగా మా ఇంటికి వచ్చి ఆయన అందించిన ఆత్మీయమైన ఆశీస్సు గొప్ప సంతృప్తినిచ్చాయి. ‘బొమ్మలూ పాటలూ అలా ఉంచి కథ పైన ఎక్కువగా దృష్టి పెట్ట’మని ఆయనన్న  మాటలతో, స్వతహాగా చాలా తక్కువగా కథలు రాసే నేను  ఆ తర్వాత  కొంచెం  వేగం పెంచి ‘ఆసరా’ కథా సంపుటికి సరిపడా కథలు రాసి, పుస్తకాన్ని వెలువరించాను 2010లో. నా పుస్తకాలకి ముఖచిత్రాలూ, లోపల చిన్న చిన్న స్కెచ్ లూ నేనే వేసుకోవడం ఒక అలవాటయింది. కొండవీటి సత్యవతి కోరిక మీద భూమిక స్త్రీవాద పత్రికలో మూడేళ్ల పాటు కథలకి బొమ్మలు వేశాను. కొంతమంది ఇతర రచయితల పుస్తకాలకి కూడా ముఖ చిత్రాలు వేశాను.

మనో వృక్షం పై వాలే పిట్టలు ఆలోచనలు. వాటిని పట్టుకుని కథలుగా మార్చుకోవచ్చు. ఆలస్యం చేస్తే అవి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినవి ఎగిరిపోగా మిగిలిన కాసినీ  దాదాపు అరవై కథలై, నా పేరు కథకుల సరసన నిలబెట్టాయి.

మనో మందిరంలో చెల్లా చెదరుగా కదలాడే ఇతివృత్తాలు, ఆగకుండా రొద పెడుతూంటే శాంతి ఉండదు. వాటిని కథలుగానో, కవితలుగానో,పాటలుగానో మార్చి, వాటి వాటి స్థానాల్లోకి చేర్చేవరకూ ఏదో అవిశ్రాంత స్థితి. పాతవి రూపం దిద్దుకునే సరికి ఏవో కొత్త ఆలోచనల కలరవాలు మళ్ళీ మొదలవుతాయి. సాహితీ సృజన కొద్దో గొప్పో అలవాటైతే ఇక ఆ ‘మనిషికి సుఖము లేదంతే’. మబ్బులై ముసిరే సృజనాత్మక ఆలోచనలతో మనసు బరువెక్కితే అవి సాహిత్యమై కురిశాక కలిగే మనశ్శాంతి అనిర్వచనీయమైనది. ఒకసారి అలవాటైతే అదొక వ్యసనమైపోతుందేమో.

 

 

మాష్టారి కథ – అదొక యజ్ఞం, ఒక జీవధార, ఒక ఆశీర్వచనం

With Kara mastaru

2006 సంవత్సరం.

రాయకుండా ఉండలేనంతగా ఏదైనా ఇతివృత్తం మనసుని ఆక్రమించి ఉంటే తప్ప, సాహితీ వ్యాసంగం పట్ల అంతగా శ్రద్ధ పెట్టని రోజులవి. ఒకరోజు కారా మాస్టారి నించి వచ్చిన ఫోన్ నాలో ఎంతో మార్పు తెచ్చింది. అప్పటికే  ఒక గేయ సంపుటీ ‘ఆలంబన’ కథాసంపుటి వెలువరించి ఉన్నా, నాలో రచన పట్ల అనురక్తి అంతగా ఉండేది కాదు. కౌముది  జాల పత్రికలో బహుమతి పొంది, రచనలో ప్రచురితమైన నా కథ ‘ఆసరా'(http://www.siliconandhra.org/monthly/2005/oct05/index.html) చదివి మాష్టారు చేసిన ఫోన్ అది. అప్పటికి కారా మాష్టారి కథలు కూడా  నేను చదివి ఉండలేదు.

ఫోనెత్తి హలో అనగానే, “నా పేరు కాళీపట్నం రామారావు అంటారమ్మా, నేను శ్రీకాకుళం లో ఉంటాను” అంటూ పరిచయం చేసుకున్నారు మాష్టారు!

ఒక సంచిక మొత్తం ఆయనకే అంకితం చేస్తూ, రచన పత్రిక వెలువరించిన వ్యాస పరంపరని ఆ నెలలోనే, అంతకు ముందే చదివి ఉండడంతో “నమస్కారం మాష్టారు” అన్నాను సంభ్రమంగా.

ఎంతో  వాత్సల్యంగా పలకరించి,  ‘ఆసరా’  కథని మెచ్చుకుని, నా కుటుంబం గురించీ, నేపధ్యం గురించీ అడుగుతూ చాలాసేపు మాట్లాడారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ మర్నాడు ఫోన్ చేసి ” అమ్మా! నీ కథ నన్ను వెంటాడుతోందమ్మా” అని, ఒక మంచి రచయిత్రి నిలదొక్కుకోవాలంటే  అవసరమయ్యే  సహకారం గురించి నా భర్తతో మాట్లాడాలని ఉందని చెప్పినపుడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా  ఇంతా కాదు. అన్నట్లుగానే  ఒక రచయితకి ఎదురయ్యే సవాళ్ళ గురించీ, సహచరుల నించి అందవలసిన సహకారం గురించీ నా భర్తతో ఆయన చెబుతుంటే వింతగా విభ్రాంతిగా అనిపించింది.

ఆ తర్వాత ఆయన రచనల  సంగ్రహం కొని చదివాను. యజ్ఞం, మహదాశీర్వచనం, జీవధార ఒకటేమిటి మాష్టారు రాసిన ఏ కథ చదివినా, అందులో ఒక జీవధార తోణికిస లాడుతూ  కనిపించింది, తెలుగు కథ కొక ఆశీర్వచనం వినిపించింది, కథా రచననొక యజ్ఞంగా భావించిన మాష్టారి నిబద్ధత గోచరించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి ఆయన హైదరాబాద్ రావడం, నాతో  మాట్లాడడం కోసం మా ఇంటికి రావడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పుడు  నన్నుగేయ రచన, చిత్రలేఖనం వదిలిపెట్టి, కథ మీద శ్రద్ధ పెట్టమని సూచించారు. ఆ సంఘటన గురించి నేను రాసిన వ్యాసం, న్యూజెర్సీ లోని తెలుగు జ్యోతి వారి సావెనీర్ లో ‘కథ కోసం కారా మాష్టారు’ పేర ప్రచురితమైంది (http://www.tfas.net/prema/web/kathakosam_varanasi.pdf). ఆ వ్యాసంలో రాసిన విషయాలే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం సరికాదు కనుక అవి వదిలేస్తున్నాను. తర్వాత ఆయన నించి రెండు మూడు లేఖలు అందాయి. కొన్నిసార్లు ఫోన్లో కూడా మాట్లాడేవారు. నన్నే కాక ఇంకా ఎందరో కొత్త కథకులని  మాష్టారిలా ప్రోత్సహించారని విన్నాను.

 

ఆయన సృష్టించిన సాహిత్యం, ఆయనలో నాకు కనిపించిన వ్యక్తిత్వం .. దేనివల్ల నేనెక్కువ ప్రభావితమయ్యానో చెప్పడం కష్టం. తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేసిన మాష్టారి మాటలు, తెలుగు కథ సర్వతోముఖంగా వికసించడం కోసం ఆయన పడుతున్న ప్రయాస, నా మీద చూపిన ప్రభావం లోతైనది. ఆయన కలగన్న లాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో నేను సఫలం కాలేకపోవచ్చుగాని ఆయన తాపత్రయం నన్నెంతగానో  కదిలించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి భాగ్యనగరంలో, త్యాగరాయ గాన సభలో, వంగూరి చిట్టెన్ రాజు గారి అధ్వర్యంలో తెలుగు మహాసభలు మూడు రోజులపాటు జరిగాయి, ఒక పెళ్ళిలాగా, పండగ లాగా.  ఎందరో రచయితలూ, కళాకారులూ అందులో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో, అంటే మాష్టారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత,  కొన్ని కవితలూ, పాటలూ రాశాను గాని చెప్పుకోదగ్గ కథలేమీ రాయలేదు  నేను.

 

సభ మొదలవబోతుండగా హాలులో కూర్చుని ఉన్న నా దగ్గరకి ఎవరో ఒక అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొద్దిసేపటికి కారా మాష్టారు అటుగా వచ్చారు. నేను ఉత్సాహంగా ఆయన దగ్గరకి వెళ్లేసరికి చాలామంది ఆయన చుట్టూ మూగి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఒక పుస్తకంలో తన సంతకం చేస్తూ, అదే పేజీలో పైనున్న ఆటోగ్రాఫ్ చూసి, ” ఈ పిల్ల నీ కెక్కడ దొరికింది? కథల మీద దృష్టి పెట్టవమ్మా అంటే వినకుండా అన్నిట్లోనూ వేలు పెడుతుంది ? ” అని విసుక్కుంటున్నారు. ఆ మాటలు ఎవరి నుద్దేశించి అన్నారా అని చూస్తే, ఆ పుస్తకం అంతకు ముందు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నావిడది.

 

” మాష్టారూ ఇక్కడే ఉన్నా” అన్నా. “ఏమిటమ్మానువ్వు? ఒక ప్రక్రియలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానిమీదే దృష్టి పెట్టాలి. మిగిలినవన్నీ వదిలి కథ మీద శ్రద్ధ పెట్టమని చెప్పాను కదా” అన్నారు. ఆయనలో ఒక ఉద్యమకారుడి తాపత్రయం, లక్ష్య శుద్ధి కనిపించి చకితురాలినయ్యాను. నేరం చేసినట్టు ఒక గిల్ట్ ఫీలింగ్ నన్నావహించింది.

 

ఆ తర్వాత నాలో కథ పట్ల కొంత శ్రద్ధ పెరిగింది. కౌముది, ఆంధ్రభూమి కథల పోటీలలో రెండు కథలకి  ప్రధమ బహుమతి లభించింది . మాష్టారు గుర్తొచ్చారు కానీ ఫోన్ చేయలేదు. ” నీ రచనలొ శైలి ఉంది , వేగం ఉంది , సామాజిక స్పృహ ఉంది , ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనక నువ్వు బాగా రాయాలి , రాసిలో కాదు వాసిలో. ఇలా అన్నానని నువ్వేది రాసినా నాకు పంపి ‘మాష్టారూ నా కథ ఎలా ఉంది’ అని అడగకు. అది మంచి కథ అయితే నా దగ్గరకి అదే వస్తుంది ” అన్న ఆయన మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండి పోయాను.

 

మళ్ళీ కొన్నాళ్ళకి త్యాగరాయ గాన సభలో ఒక కార్యక్రమానికి ఆయన వచ్చారు. పొత్తూరి విజయలక్ష్మి నన్నెవరికో పరిచయం చేస్తూ ‘కారా మాష్టారు మెచ్చిన రచయిత్రి’ అంటుంటే ఆ పక్కనే మాష్టారు ఉండడంతో నేను మొహమాట పడిపోయి , ‘కారా మాష్టారు మెచ్చిన ఒక కథ రాసిన రచయిత్రి’అని సరి చేశాను. ఆయన మనసారా నవ్వుతూ ‘నేను కూడా ఒక్క యజ్ఞమే రాశాను తల్లీ’ అన్నారు.

 

కిందటి సంవత్సరం నవ్యలో నా కథ  ‘పుష్య విలాసం’ (http://vanalakshmi.blogspot.in/search?updated-min=2013-01-01T00:00:00%2B05:30&updated-max=2014-01-01T00:00:00%2B05:30&max-results=13)  వచ్చిన వెంటనే మాష్టారి నించి ఫోన్ వచ్చింది  “కథ బాగుందమ్మా కానీ ..” అంటూ. బాగుందన్న మాటకి ఆనందిస్తూ  ‘కానీ..’ విషయంలో ఆత్రుతగా చెవి ఒగ్గితే, ” పేరు misleading గా ఉందమ్మా. వైద్య లక్ష్మి  అని పెట్టి ఉంటే బావుండేది” అన్నారు. ” కథ మొదలవుతూనె మొదటి మూడు నాలుగు వాక్యాలలో పాఠకుడు  కథ లోకి లాగబడాలి. ఈ కథలో ఎత్తుగడ వాక్యాలలో ఉన్న పుష్యమాస వర్ణన వల్ల అలా జరగకుండా పోయింది” అన్నారు. తన రచనా సంగ్రహం లో ఉన్న కథా రచన గురించిన వ్యాసావళిని, ప్రత్యేకించి కథలో వర్ణనలకి సంబంధించిన వ్యాసాన్ని చదవమని చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తే ఒక కన్ను మాత్రమే పని చేస్తోందనీ, అయినా రోజుకి కనీసం ఎనిమిది గంటలైనా సాహిత్యం చదవకుండా ఉండలేననీ చెప్పారు. హుద్ హుద్ తుఫాను తర్వాత ఫోన్ చేసి  కుశలం అడిగితే, ప్రస్తుతం శ్రీకాకుళం వచ్చేశాననీ, తుఫాను ప్రభావం విశాఖపట్నంలో ఉన్నంతగా ఇక్కడ లేదనీ చెప్పారు.

 

కారా మాష్టారు విలక్షణమైన వ్యక్తి. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళకైనా ఆయన గొప్ప కథకులు గానే కాక, అపూర్వమైన కథా ప్రేమికునిగా గోచరిస్తారు. ఒక మంచికథ ప్రచురితమయిందంటే చాలు ఆ రచయిత గురించి తెలుసుకుని, వీలయితే స్వయంగా కలుసుకునో , లేదా ఫోను ద్వారానో ఆకథలోని మంచినంతా హృదయపూర్వకంగా మెచ్చుకుని, ఇంకా ఎన్నో మంచి మంచి రచనలు రాసేవిధంగా ఆ రచయితని ప్రోత్సహిస్తారు. ఆయన ఎంత మృదుభాషణులో అంతే నిక్కచ్చిమనిషీ, నిగర్వీ కూడా. ఎంతసేపూ ఇంకా ఇంకా మంచి కథలు రావాలనీ, అవన్నీ ఇతర భాషల్లోకి అనువదించబడాలనీ, ఇంకా కొత్త కొత్త కథకులు పుట్టాలనీ, వాళ్ళ రచనలు ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకోవాలనీ ఆయన ఆశ. తన సమస్తమూ కథానిలయానికే సమర్పించి, తెలుగులో వచ్చిన ప్రతి కథా అందులో పదిలమవాలని ఆకాంక్షించే మాష్టారికి  కథ పట్ల ఎంత మమకారమో ! తొంభయ్యవ పడిలో కూడా తన ఫోన్ లో, ఏ రచయితదైనా  మిస్డ్ కాల్ కనిపిస్తే,  చిన్నా పెద్దా అని చూడకుండా, తిరిగి ఫోను చేసి మాట్లాడే మాష్టారి సంస్కారం గురించి వేరే చెప్పేదేముంది ?

 

కారా మాష్టారి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా సారంగ జాల పత్రిక వారు ఆయన మీద ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నారనీ, మాష్టారి తో నాకున్న స్వల్ప పరిచయాన్ని పురస్కరించుకుని ఒకటి  రెండు పేజీల వ్యాసాన్ని అందించమనీ  రమాసుందరి గారు అడిగినపుడు ఇంత చక్కని ఆలోచన చేసిన సారంగ పత్రికకి మనసులో జోహార్లు చెప్పుకున్నా. మామూలుగా అయితే బతికి ఉన్న వ్యక్తుల విలువ మనకి సరిగా అర్ధం కాదు. ఎంత మహానుభావుడైనా సరే మనం గుర్తించం. అందులో ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులమీద వ్యామోహం లేకపోతే, తనంత తానుగా అందుకోసం ప్రయత్నించే లక్షణం లేకపోతే ఇంకెవరికీ ఆ సంగతి పట్టదు.

 

కారా మాష్టారు మనకిచ్చినదంతా తెలుగు వారికే సొంతమైన వారసత్వ సంపద. ఆ సంపదని  పరిరక్షించే మహత్కార్యంలొ ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చిన సారంగకి అనేక అభినందనలు.

పుట్టినరోజు పండగే అందరికీ. తను పుట్టింది ఎందుకో తెలిసిన కొందరిలొ ఒకరైన మాష్టారికి పూర్ణాయుష్షు, ఆరోగ్యం లభించాలని కోరుతూ శుభాకాంక్షలు  తెలియజేసుకుంటున్నాను.

 

  • vnl 1వారణాసి నాగలక్ష్మి

 

హిందీ వాళ్ళ కన్నా మనమే బాగా దూసుకుపోతున్నాం: శాంత సుందరి

 

శాంత సుందరి, గణేష్ రావు గారు

శాంత సుందరి, గణేష్ రావు గారు

                              

 కొంతమందికి నాలుగు మాటల పరిచయ వాక్యాలు సరిపోవు. శాంత సుందరి గారికైతే మరీ!

కొడవటిగంటి వారమ్మాయి అంటే ఆమెని కేవలం ఒక ఇంటి అమ్మాయిగానే చూడాల్సి వస్తుంది.

లేదూ, అందరి మన్ననలూ అందుకున్న స్నేహశీలి అంటే కేవలం ఆమెని ఒక వ్యక్తిగానే చూడడం అవుతుంది.

ఇటీవలి కాలంలో అనువాదాన్ని ఒక యజ్ఞంగా తీసుకొని ఒక్క చేత్తో ఎన్నో తెలుగు రచనల్ని హిందీ లోకానికి పరిచయం చేసిన ఆమె అంకిత హృదయాన్ని మాత్రమే చెప్పుకుంటే, ఆమెలోని నిజమైన సాహిత్య తృష్ణని చిన్ని చెలమలో బంధించినట్టే.

శాంతమే సౌందర్యం అనుకుంటే ఆ ప్రశాంత సౌందర్యంలోంచి జీవన తాత్వికతని వెతికి పట్టుకున్న ఆదర్శ మూర్తిత్వం శాంత సుందరి గారు. వారితో కొన్ని క్షణాలు ఎవరికైనా అమూల్యమే. మీకు కూడా! ఈ కాఫీ కప్పులో వొదిగిన సృజన లోకాన్ని చూడండి.

 

శాంత సుందరి  గారింట్లో మొదటి కాఫీ ఎన్నింటికి ? ఎవరు కలుపుతారు ? 

కాఫీ ఒకేసారి బ్రేక్ ఫాస్ట్ తో 6. 30 – 7 మధ్యలో తాగుతాం. రెండో సారి కాఫీ అనేది చాలా అరుదుగా గణేశ్వర రా వు గారు తాగుతారు. ఎన్నో ఏళ్లుగా అదే అలవాటు. కాఫీ కలిపేది నేనే.

ప్ర. కాఫీ తర్వాత ?

తరవాత రావు గారు వార్తలు చదవడం, నేను ఒక గంటసేపు ఏవైనా అనువాదం చెయ్యడం – అంటే  ఉదయం 7-30 నుంచి 8-30 వరకు. ఆ తరవాత నిత్యకృత్యాలు, వంట, భోజనం.

  ఇంతవరకు  ఎన్ని పుస్తకాలు అనువదించారు ? 

65 పుస్తకాలు – హిందీ తెలుగూ కలిపి.

  హిందీ నించి తెలుగుకెన్ని ? తెలుగు నుంచి హిందీకి ఎన్ని ? అలాగే ఇంగ్లీష్ నించి తెలుగు కెన్ని ? ప్రతి విభాగం లోనూ మీకు నచ్చిన ఒక పుస్తకం  పేరు చెప్పండి.

తెలుగు నుంచి హిందీకి అచ్చయినవి 29 ; హిందీ  నుంచి తెలుగు లోకి 11; ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి 23. ఇవికాక ఒకటి ఇంగ్లీష్ నుంచి హిందీ లోకీ, ఇంకొక పుస్తకం పిల్లల కథలు తెలుగులోనూ వచ్చాయి.

 మీకు పూర్తిగా నచ్చితే గాని ఏ  రచన కైనా అనువాదం చేపట్టరని విన్నాను. నిజమేనా ? మీకు నచ్చాలంటే రచనలో ముఖ్యం గా ఉండాల్సిన లక్షణాలు ఏవి ? 

అనువాదకులకి పుస్తకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. ఇక రెండు భాషల్లో అనువాదం చేసే నా లాంటి వాళ్లకి రెండు వైపులా నుంచీ అభ్యర్థనలు ఉంటాయి. ఒక జీవితకాలంలో ఎవరైనా చెయ్యగలిగింది కొంతే.

కానీ నేను అనువాదానికి తీసుకునే రచనలో చూసే లక్షణాలు – విషయం సార్వజనీనకంగా ఉండాలి, శిల్పంలో కొత్తదనం ఉండాలి. ఇక మూడోది సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక్కోసారి ఒక సంస్కృతి లో విశేషంగా ఉండే లక్షణాలని సంపాదకులు ఇష్టపడతారు. గిరిజనులకి సంబంధించిన ‘టిహిలికి  పెళ్లి ‘ అనే మల్లిపురం జగదీశ్ కథ హిందీ అనువాదం నా బ్లాగ్ లో పెడితే హైదరాబాద్ నుంచి కొత్తగా వెలువడే హిందీ పత్రికవాళ్ళు అడిగి మరీ తీసుకుని ప్రచురించారు.

  సమకాలీన సాహిత్యంలో ఎవరి రచనల్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు ? 

చాలామంది బాగా రాస్తున్నారు. ఒక్కరి పేరే అంటే చెప్పలేను. పెద్ద జాబితా తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం. సగటున చూస్తే హిందీ కథా రచయితలకన్నా మనవాళ్ళు కొన్ని దశాబ్దాలు ముందుకి దూసుకుపోయారనే అనాలి.

 మీకు అనువదించాలనిపించి అనువాదం చేయలేక పోయిన పుస్తకం లేదా రచన ?

కబీర్ దోహాలని తెలుగు చెయ్యాలని నేనూ, నా సాయంతో గిడుగు రాజేశ్వర రావు గారూ ఎంతో ప్రయత్నించాం. కానీ చెయ్యడం సాధ్యం కాలేదు. అలాగే శ్రీ శ్రీ కవితలని నాకు అనువాదం చెయ్యాలనిపించింది, ఢిల్లీ లో ఉండగా కొందరు పబ్లిషర్లు అడిగారు కూడా. కానీ ఆ మహాకవిని అనువదించలేకపోయాను. నాకే నా అనువాదం నచ్చలేదు. ఎందుకంటే అనువాదం అంటే పదకోశం చూసి మాటకి మాట రాయడం కాదు కదా. భావం, లయ, ఉద్వేగం, భాషా సౌందర్యం ఇన్ని విషయాలుంటాయి. ఇవన్నీ అనువాదంలో  రావాలి – ముఖ్యంగా కవిత్వం  అనువాదం లో.

  సమాజం లో సాహిత్యం పాత్ర ఏమిటి ? 

సమాజంలో సాహిత్యం పాత్ర నా ఉద్ద్దేశంలో ఎక్కువమంది చదువరులని తయారు చెయ్యగలగడం. కానీ దీనికి తల్లిదండ్రులూ , స్కూల్ యాజమాన్యం కూడా దోహదం చెయ్యాలి. ఊహ తెలిసినప్పటినుంచే సంగీతం, సాహిత్యం (వాళ్ల వయసుకి తగ్గట్టు ) పరిచయం చేస్తే ఈ నాడు సమాజం ఇంకోలా ఉండేదేమో ! మనుషులు సరిగా ఉంటే  సమాజం, దేశం, ప్రపంచం వాటంతట అవే సరైన దారిలో పడతాయి.

koku

 మీ మీద ప్రఖ్యాత రచయిత అయిన మీ నాన్నగారి ప్రభావం ఉందా ? ఉంటే ఎలాంటి ప్రభావం ? 

నాన్నగారితో గడిపింది 20 ఏళ్ళు. ఆ సమయంలో నా చదువు సంధ్యలూ, సంగీత  సాధనా, ప్రచార్ సభలో హిందీ పరీక్షలు రాయడం, ఇక ఆ రోజుల్లో పిల్లలకి ఎన్ని పనులున్నా ఆడుకోడానికి సమయం దొరికేది కాబట్టి ఆటలూ. నాన్నేమో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాత పనుల్లో నిండా మునిగి ఉండేవారు. అయినా మాతో గడిపిన ఆ కొద్ది సేపే మాకు  రకరకాల విషయాలలో ఆసక్తిని కలిగించే విధంగా కబుర్లు చెప్పేవారు. ఆయన దృష్టి ఎప్పుడూ తనూ, తన రాతలమీద కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచం మీదే ఉండేది. అదే నామీద ప్రభావం చూపి ఉండాలి. చదివినది సాహిత్యమే అయినా సైన్సు, చరిత్ర లాంటి విషయాలలో నాకు ఆసక్తి బాగానే ఉంది .

  మీ జీవితం లోకి గణేశ్వర రావు గారి ప్రవేశం ఎలా జరిగింది ? 

మా పెళ్లి పెద్దవాళ్ళు కుదిర్చినదే కానీ ఆదర్శంగా జరిగింది . గణేశ్వర రావు గారు ఢిల్లీ లో పనిచేసేవారు. మా పిన్ని కూడా ఢిల్లీలోనే ఉద్యోగం చేసేది. తన ఆఫీసులో పని చేసే ఒకావిడ మా పిన్నికి ఈయన విషయం చెపితే మా పిన్ని మా అమ్మకి చెప్పింది. ఆయన తరపున పెద్దలు సొంతవాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మకీ నాన్నకీ 1945 లోనే రిజిస్టర్ మారేజీ జరిగింది. మాదీ అంతే. మర్నాడు రిసెప్షన్ ఇచ్చారు, చిట్టిబాబు వీణ కచేరీ పెట్టించారు – అన్నట్టు ఒకప్పుడు నేను ఆయన ఏకలవ్య శిష్యురాలిని !

 అంటే ఒకప్పుడు వీణ వాయించే వారా? ఎలాంటి సంగీతాన్నిఇష్ట పడతారు? పాడతారు కూడానా ?

అవును. ఏడో ఏట వీణ నేర్చుకోడం మొదలుపెట్టాను. నా కన్నా వీణ ఎత్తుగా ఉందని మావాళ్ళు సరదాకి ఎగతాళి చేసేవాళ్ళు. ముగ్గురు టీచర్లు మారారు. ఆరేడేళ్ళు – మధ్యమధ్య గాప్స్ తో – నేర్చుకునేసరికి పదహారేళ్ళు వచ్చాయి. స్వామినాథ అయ్యర్ అనే ఆయన నా ఆఖరి గురువు. చాలా బాగా నేర్పారు, కానీ నాలో వీణ పట్ల అసలైన ఆసక్తి కలిగింది మొదటిసారి 1963 లో చిట్టిబాబు గారి వీణ కచేరీ విన్నప్పుడు. ఆయన మద్రాస్ లోనే ఉండేవారు కాబట్టి ఒక్క కచేరీ కూడా వదలకుండా అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. అలా వినికిడి జ్ఞానం తోనే చాలా పాటలు నేర్చుకున్నాను. అందుకే ఏకలవ్య శిష్యురాలిని అన్నాను.

  మీ సాహిత్య ప్రస్థానం లో, అనువాద అనుసృజనల్లో రావు గారి పాత్ర ?

నా అనువాద కృషిలో రావుగారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన సహకారమూ, ప్రోత్సాహమే కాదు, నా పని తన పనే అన్నంత మమేకం అయిపోయి సాయం చేస్తారు. సలహాలూ, విమర్శలూ (తెలుగులో అనువాదాల వరకే పరిమితం) ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పోట్లాటలూ ఉంటాయి – అంటే ఏకాభిప్రాయానికి రాకపోవడం ఉంటుంది. కానీ తన సహాయం లేకపోతే నేను ఇన్ని పుస్తకాలు రాయగలిగేదాన్ని కాదు.

  మనం వనపర్తి వెళ్ళినపుడు మీరు కనపడగానే అక్కడ తిరుగుతున్న పిల్లి పిల్లలు అమాంతం మీ ఒళ్లోకెక్కి గారాలు పోయాయి , ఎందుకని  ?

చిన్నప్పట్నుంచీ పిల్లులంటే అమితమైన ప్రేమ. చాలా కాలం పిల్లుల్ని పెంచాం – లిబియా వెళ్లినప్పుడైతే ఇంట్లో మూడు తరాల పిల్లులు ఉండేవి ! జంతువులకి ఉండే 6th sense వల్ల వాటిని ఎవరు ప్రేమిస్తారో తెలుస్తుందిట. అందుకే అవి అంత సులభంగా నా ఒళ్లోకి ఎక్కాయి .

IMG_0033

  ఇవాల్టి తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా కథానిక, కవిత, ఈ రెంటినీ జాతీయ, అంతర్జాతీయ సాహిత్యం తో పోలిస్తే మీకేమనిపిస్తుంది ? 

జాతీయ భాషలన్నిటిలోనూ నేను రచనలు చదవలేదు. అన్ని భాషలలోనూ గొప్ప రచనలూ, మంచి రచనలూ, పనికిమాలిన రచనలూ ఉంటాయి. కానీ హిందీ తెలుగు భాషల్లోనే ఎక్కువ అనువాదాలు చేస్తాను కాబట్టి మనదే పై చెయ్యి అని బల్లగుద్ది చెప్పగలను. నేను చెప్పడమే కాదు, మన కథలు హిందీలో  చదివి   హిందీ పత్రికా సంపాదకులూ, పాఠకులూ ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చిన సందర్భాలు లేకపోలేదు.

 మీ బాల్యం గురించి కొంచెం చెప్పండి. 

నా బాల్యం ఊహ తెలిసినప్పటినుంచీ చాలా హాయిగానే గడిచిపోయింది. నాన్నకి తలిదండ్రులు చిన్నప్పుడే పోయారు అందుకని అమ్మమ్మా, తాతా మాత్రమే  తెలుసు. వాళ్లకి మొదటి మనవరాలిని. మా  మేనమామ కొమ్మూరి సాంబశివరావు, ఇద్దరు పిన్నమ్మలూ, అమ్మమ్మా, తాతా అందరూ నన్ను తెగ గారాబం చేసి పాడుచేస్తున్నారని నాన్నకి కోపంగా ఉండేదని అమ్మ చెప్పింది. అమ్మాయిలు కూడా అన్ని ఒడిదుడుకులనీ  తట్టుకుంటూ, ఎదుర్కుంటూ బతకాలని అనుకునే వ్యక్తి మా నాన్న. కానీ నాకు దేనికీ లోటు లేకుండా – ప్రేమించే కుటుంబసభ్యులతో సహా – గడిచిపోయిందనే అనాలి. చదువూ, సంగీతం, ఆటలూ… పెళ్లి అయేదాకా అదే జీవితం. ఆ రోజుల్లో చదువులు, స్కూళ్ళూ concentration camps లాగ ఉండేవి కావు. పైగా మా ఇంట్లో అయితే మార్కుల విషయం (ర్యాంకులు అప్పట్లో లేవు ) పెద్దగా పట్టించుకునేవారు కాదు. All round development కే  స్కూళ్ళూ, తలిదండ్రులూ కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు.

మా అమ్మా నాన్నా మాకు మరొక పెద్ద ఉపకారం చేశారు – రిషివాలీ స్కూలు పద్ధతిలో అడయార్  theosophical society నడిపే బాలభారతి అనే స్కూల్లో మమ్మల్ని చేర్పించారు. అది స్కూలులా కాకుండా గురుకులంలా ఉండేది. ఒక్కొక్క విద్యార్థినీ వ్యక్తిగతంగా ఎలా ఎదుగుతున్నారని చూసేవాళ్ళు. మార్కులూ, ర్యాంకులూ  ఉండేవి కావు. జవాబులు తప్పయితే వాటిని  సరిదిద్దడమే. మూడో ఫారం (ఏడో తరగతి) దాకా ఇక్కడ చదివాను. ఇలాంటి స్కూళ్ళకి ఫండ్స్ దొరక్కుండా పోయి దాన్ని మూసేశాక రామకృష్ణ మిషన్ వాళ్ళ శారదా విద్యాలయం లో చేరాను.

చిన్నతనం లో నాకు తగిలిన అతిపెద్ద దెబ్బ నా పదో ఏట ఆరేళ్ళ మా తమ్ముడు హఠాత్తుగా చనిపోవడం – మృత్యువుని చూడడం అదే మొదటిసారి !

  ‘ఇంట్లో ప్రేమ చంద్’ ని మీరు హిందీ నించి అనువదించారు.’ఇంట్లో కుటుంబరావు’ గారి గురించి ఏమైనా చెప్పండి.

ఇంట్లో కుటుంబరావు గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఇంటా బయటా ఆయన ఒకే రకంగా ఉండేవారు. హిపోక్రసీ, అనవసరమైన మొహమాటాలూ ఉండేవి కావు. ఎవరి జోలికీ వెళ్ళేవారు కాదు – అసలు దానికి సమయమే ఉండేది కాదు. ఎవరి గురించైనా చులకనగా కాని, వెటకారంగా గాని మాట్లాడడం నేనెప్పుడూ వినలేదు. అసలు ఇంకొకళ్ళ గురించి gossip చేసే స్వభావం కాదు ఆయనది. ముందే చెప్పినట్టు, చివరి కొన్నేళ్ళు తప్ప ఎప్పుడూ బోర్లా పడుకుని రాసుకుంటూనో, కూర్చుని ఏదైనా పుస్తకం చదువుకుంటూనో కనిపించేవారు. మా అమ్మా నాన్నలకి ఉన్న పుస్తకాలు చదవడమనే అలవాటే వారసత్వంగా మాకు కూడా వచ్చింది. A child learns by imitating elders  అంటారు కదా !

ఇక నాన్నకి వంట చెయ్యడం హాబీ. రాసి రాసి అలసిపోతే వంటింట్లోకి వచ్చి ఏవైనా ఐటమ్స్ చేసేవారు. బండ పచ్చడి కూడా చేసేవారంటే ఆశ్చర్యపోతారేమో !

 మీకు ఎంత మంది పిల్లలు? ఏం  చేస్తున్నారు ? వాళ్ళని పెంచే క్రమంలో మీకు గర్వంగా లేదా గొప్ప సంతోషంగా అనిపించిన క్షణాలేవైనా గుర్తుంటే చెప్పండి. 

మాకు ఇద్దరు అమ్మాయిలు – అరుణ, సత్య. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. సొంత పిల్లలు పైకొచ్చినా, ఏమైనా సాధించినా సంతోషమే తప్ప గర్వం ఉండదనుకుంటా. ఇద్దరూ బాగా చదువుకుని ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళు పాతికేళ్ళ తరవాత అమెరికా వెళ్ళడం వల్ల అనుకుంటా, జీవిత విలువలని కోల్పోలేదు. ఆచరణలో భక్తీ, పూజలూ అవీ లేకపోయినప్పటికీ, నిజాయితీగా ఉండడం, ఎవరికీ హాని చెయ్యకపోవడం, వీలైనంత సహాయం చెయ్యడం, డబ్బుకీ, హోదాకీ, చివరికి తాము సాధించిన వాటికి కూడా గర్వపడక పోవడం ఇంట్లో నేర్చిన గుణాలే.

  అరుణ, సత్య ఏ రంగాల్లో స్థిరపడ్డారో చెప్తారా? ఇద్దరిలో ఎవరికైనా సాహిత్య సృజనలో గాని, పఠనం లో గాని ఆసక్తి  ఉందా ?

అరుణ మోటరోల కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేసి జూన్ చివర్లో resign చేసింది. ప్రస్తుతం చిత్రకళ లో పోస్ట్ graduate కోర్స్ చేస్తోంది. మంచి చిత్రకారిణి కావాలన్నది తన లక్ష్యం. పదో ఏటినుంచే చిత్రాలు వెయ్యడంలో ఆసక్తి ఉండేది తనకి .

సత్య ఒక palliative care సంస్థలో పనిచేస్తోంది. అమెరికా వెళ్ళాక హాస్పిటల్ management లో MBA , ఇంకా కొన్ని కోర్సులూ చేసింది. ఇండియా లో  తను బయాలజీ లో పోస్ట్ graduation  చేసింది. భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం కూడా చేసింది.

ఇద్దరూ పుస్తకాలు చదువుతారు. సత్య ఒకప్పుడు ఇంగ్లీష్ లో నెట్లో ఏవో ఆర్టికల్స్ రాసేది .

  మనకు మంచి అనువాదకుల కొరత ఉందన్నది తెలిసిన విషయమే. మీకు  వచ్చే రెండేళ్ళ దాకా తీరిక దొరకని పని ఉందని చెప్పారు. ఇంత  ఎడతెగని పని ఉండగా, ఇంటినీ, సాహిత్య వ్యాసంగాన్నీ ఎలా సంభాళించగలుగుతున్నారు ? 

నిద్ర లేవడం దగ్గర్నుంచి నిద్రపోయే దాకా – భోజనం , విశ్రాంతి తీసుకోవడం, టీవీ చూడడం  – సమయపాలన పాటిస్తే మనకి పని చేసుకునేందుకు బోలెడంత సమయం చిక్కుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రస్తుతం బాధ్యతలు తగ్గాయి కాబట్టి ఇంటినీ, రచనా వ్యాసంగాన్నీ సంబాళించుకోవడం అంత  కష్టమనిపించడం లేదు. పధ్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతే అది సులభమే. చిన్నప్పట్నుంచి  క్రమశిక్షణ అలవాటు. రావుగారిది కూడా అదే పధ్ధతి కాబట్టి సులువుగా అమలు చెయ్యగలుగుతున్నాం.

  ఇంట్లో ఉండి  అనువాద వ్యాసంగం కొనసాగిస్తున్నా మీరు ఖచ్చితమైన పని వేళలు పాటిస్తారంటారు? 

అవును. నేను పొద్దున్నే 5. 30 – 6 మధ్య లేస్తాను. 7 లోపల బ్రేక్ ఫాస్ట్ అయిపోతుంది. ఆ తరవాత దాదాపు గంట, గంటన్నర తీరుబాటే. మళ్ళీ మధ్యాన్నం 3 గంటలనుంచీ సాయంత్రం 6 వరకూ పనేమీ ఉండదు. ఆ సమయం చక్కగా సరిపోతుంది. భోజనం తరవాత, అది లంచ్ అయినా, డిన్నర్ అయినా సామాన్యంగా ఇక కలం పట్టుకోను. ఆ సమయం చదువుకోడానికే కేటాయిస్తాను. రోజుకి 4-5 గంటలు రాస్తే సరిపోదా? అన్నట్టు ఆదివారం కలానికి పూర్తి సెలవు !

  చిత్తు  ప్రతి లేకుండా మీరు తిన్నగా ఫెయిర్ కాపీ రాసేస్తారని విన్నాను. నిజమేనా ? 

కథలూ, నవలలూ  లాంటి వచన రచనలైతే తిన్నగా ఫెయిర్ రాస్తాను. తరవాత ఒక రీడింగ్ ఇస్తే తప్పులు దిద్దుకోడం వీలవుతుంది. అదే కవిత్వం అయితే ముందు రఫ్ రాస్తాను. మళ్ళీ ఫెయిర్ చేసేప్పుడు కూడా మెరుగులు పెట్టాల్సి వస్తుంది చాలాసార్లు. తెలుగులో నేను చేసే అనువాదాలకి రావు గారు ఎడిటర్, విమర్శకులు. ఒక్కోసారి ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరదు. అప్పుడు కొంచెం ఆగి ఆలోచించి ముందుకు సాగుతాను. ఇద్దరిలో ఎవరిదీ రైట్ అనిపిస్తే అదే ఫైనల్.

  ఇంతవరకు పొందిన పురస్కారాలు ?

ఇంతవరకూ అందుకున్న పురస్కారాలు మూడు.

మొదటిది 2005 లో ఢిల్లీ లోని సంస్థ – భారతీయ అనువాద్ పరిషద్ వారు ఇచ్చిన, ‘డా . గార్గీ గుప్త ద్వివాగీశ్ పురస్కార్.’ రెండు భాషల్లో తగినన్ని అనువాదాలు చేసినవాళ్లకి ఈ పురస్కారం ఇస్తారు.

రెండోది సలీం రాసిన ‘కాలుతున్న పూలతోట ‘ నవలకి నేను చేసిన హిందీ అనువాదానికి గాను ఢిల్లీ లోని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి అందజేసింది (వార్తా పత్రికల్లో  మానవ హక్కులకి సంబంధించిన విషయాల పై చేసిన అనువాదాలను పురస్కారానికి గాను ఆహ్వానించారు). ఇది 2009 లో వచ్చింది .

మూడోది మన రాష్ట్రం ఇచ్చిన పురస్కారం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2011 లో నా అనువాద కృషికి ఇచ్చిన పురస్కారం.

  మీలో మీకు నచ్చనిదేమిటి ?

నాలో నాకు నచ్చనిది చొరవ తీసుకోలేక పోవడం. కొత్తవాళ్ళని చూస్తే కొద్దిగా జంకుతాను. పరిచయం పెరిగి వేవ్ లెంగ్త్ కుదిరితే జీవితాంతం ఆ స్నేహాన్ని వదలను. అలాగే ఇంట్లో వాళ్ళ విషయంలో నాకు ఓర్పు తక్కువ. చటుక్కున కోపం వస్తుంది – కానీ అంతే త్వరగా పోతుంది కూడా. ఈ విషయంలో  కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను.

  ఇన్నేళ్ళ జీవితం లో మర్చిపోలేని అనుభవం ?

ఎప్పటికీ మర్చిపోలేనిది బాధాకరమైన సంఘటన – మేము లిబియా లో దాదాపు అయిదేళ్ళు ఉండి ,1980 జూలై 31 న ఇండియా కి తిరుగు ప్రయాణం అయాం. మూడు వారాలు యూరప్ లో పర్యటించి 23 న వెనక్కి చేరుకోవలసి ఉంది. మేము ఢిల్లీ లో 22 రాత్రి దిగాం. మర్నాడు మద్రాసు ప్రయాణం. మద్రాసు ఎయిర్ పోర్ట్ లో దిగగానే నాన్న ఎలా ఉన్నారని మా తమ్ముణ్ణి  అడిగాను. వాడు నా చెయ్యి గట్టిగా పట్టుకుని తల అడ్డంగా ఆడించాడు. అంతే, విషయం అర్థమైనా ఇంటికి చేరుకొని అమ్మని చూసేదాకా ఒక్క చుక్క కన్నీళ్లు రాలేదు. నాన్న 17 ఆగస్టు సాయంత్రం పోయారు. మాకు కబురు పెట్టేందుకు మార్గం లేదు. యూరప్ లో మేం ఎక్కడున్నామో కూడా ఎవరికీ తెలీదు. 1979  సెప్టెంబర్లో చివరిసారి చూశాను నాన్నని ! ఆయన కోసం ఏవేవో పట్టుకొచ్చాను .

 అమితమైన సంతోషాన్నిచ్చిన క్షణం ?

B. A . రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు హిందీ మాతృభాష కాని విద్యార్థులకి తమిళనాడులో అన్ని విశ్వవిద్యాలయాలూ వ్యాసరచన పోటీ నిర్వహించాయి. ప్రశ్నపత్రం లో వ్యాసాలతో బాటు హిందీ వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అందరితోబాటు నేనూ రాశాను. ఎందుకో గాని పని చెయ్యడమే తప్ప ఫలితాలకోసం ఎదురుచూడడం అనేది నాకు చిన్నప్పట్నించీ లేదు.

మే లో కాలేజీ సెలవలు. ఒకరోజు నా క్లాస్ మేట్, గీత అనే అమ్మాయి అంత ఎండలో మా ఇంటికి పరిగెత్తుకుని వచ్చింది. తనకి ఎలా తెలిసిందో అడగలేదు కానీ ఆ పరీక్షా ఫలితాలు తెలిశాయనీ, నాకు ప్రథమ బహుమతి వచ్చిందనీ అమితానందంతో చెప్పింది. తను అరవ అమ్మాయి. తను కూడా పరీక్ష రాసింది. తనకి ఏ  బహుమతీ  రాలేదు. అయినా నాకు వస్తే తనకే వచ్చినట్టు సంబరపడిపోయింది! అప్పుడు ఆ విషయం గమనించానో లేదో కాని 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంగతి ఇంకా గుర్తుండిపోయింది. అది స్నేహం గురించి నాకొక గొప్ప సత్యాన్ని కూడా తెలియజేసింది.

ఇది నాకు జీవితంలో వచ్చిన మొట్టమొదటి బహుమతి !

దీనికి కొనసాగింపుగా , బహుమతి ఇచ్చేవారి షరతుల ప్రకారం 500 రొక్కం ఇచ్చి, మిగతా 500 రూపాయలూ ఉత్తరదేశ యాత్ర చేసి వచ్చి టికెట్ చూపిస్తే ఇస్తామన్నారు. అప్పుడు ఢిల్లీ , బెనారస్ వగైరా పర్యటించి వచ్చాం. ఢిల్లీలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి –

మొదటిది  నాకు ఇష్టమైన హిందీ కవులని కలుసుకున్నాను. రామ్ ధారీ సింహ్ దినకర్, హరివంశ్ రాయ్ బచ్చన్ , జినేంద్ర కుమార్ , విష్ణు ప్రభాకర్ – ఈ నలుగురినీ కలుసుకున్నాను. వీరి నలుగురికీ మద్రాసు వచ్చాక ఉత్తరాలు రాసి కృతజ్ఞతలు తెలిపాను. ఒక్క బచ్చన్ మాత్రమే జవాబు రాశారు (ఆ ఉత్తరం నా దగ్గర ఇంకా భద్రంగా ఉంది !).  పైగా నా హిందీ చాలా బావుందనీ, అనువాదాలు చెయ్యమనీ సూచించారు అందులో. రెండోది … మొదటిదాని కన్నా ముఖ్యమైనది ఇది. ఆ సందర్భం లోనే రావు గారితో నా పెళ్లి దాదాపు నిశ్చయమైంది !

 Any regrets ?

పెద్దగా regrets  అంటూ ఏమీ లేవు కానీ 63 లో botany లో సీట్ రాలేదని 3 నెలలపాటు మనోవ్యాధికి గురయి చాలా బాధపడ్డాను. అది కాకపొతే ఏదైనా పరవాలేదు అనే ఉద్దేశంతో నాన్న సలహాతో హిందీ లిటరేచర్ తీసుకున్నాను. కానీ చూడండి అదే నాకు ఎంతో మేలు చేసింది ! అప్పట్నుంచీ  లేనిదానికోసం బాధపడేకన్నా ఉన్నదాన్ని వీలైనంత బాగా ఉపయోగించుకోవాలి  అనేది నా సిద్ధాంతం అయింది. అయినా శ్రమ, కృషి తోబాటు సరైన అవకాశాలు కూడా దొరకాలి. నువ్వు నమ్ముతావో  లేదో, అనువాదం చేసేప్పుడూ, M.A. చదువుకునేప్పుడూ  ఎందరో నా అనువాదాన్ని విమర్శిస్తూ  సమస్యల్ని సృష్టించారు. కానీ ఒక్కసారి కూడా మహాకవి బచ్చన్ రాసిన ఉత్తరం చూపించి, ‘ఇప్పుడేమంటారు? ‘అని అడగాలన్న ఆలోచనే రాలేదు నాకు ! అసలు హైదరాబాద్ వచ్చాకే దాన్ని బైటికి తీసి కొంతమంది స్నేహితులకి చూపించాను. అంత  అమాయకంగా, మూర్ఖంగా అనాలేమో, ఉండేదాన్ని.

  మీరేది కోరితే అది తీరే అవకాశం వస్తే ఏం  కోరుకుంటారు ?

పిల్లలకి చిన్నప్పట్నుంచే సంతోషంగా, సంతృప్తిగా బతకటం నేర్పించాలి. అటువంటి మార్పు సమాజంలో రావాలి. నా ఉద్దేశంలో ఈరోజు చిన్నపిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. దాన్ని వాళ్లకి తిరిగి అందజేయాలి. అలాంటి అవకాశం వస్తే ఇదే కోరుకుంటాను.

 అడిగిన ప్రశ్నలన్నిటికీ స్పష్టంగా, వివరంగా జవాబులుచ్చిన శాంత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ  “శాంత సుందరి గారూ, ప్రతిభావంతులైన తెలుగు అనువాదకుల్లో ఒకరైన మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ ! తెలుగు సాహిత్యాన్ని జాతీయ వేదిక మీద ప్రదర్శిస్తూ అనువాద ప్రక్రియలో మీరు చేస్తున్న నిరంతర కృషికి కేంద్ర సాహిత్య అకాడెమీ, పురస్కారమిచ్చి మిమ్మల్ని గుర్తించాలనీ , తెలుగువారందరి తరఫునా కోరుకుంటూ సెలవు !” అన్నాను. 

 చిరునవ్వుతో “నాగలక్ష్మీ, నా రచనలకి ఇంత ప్రాముఖ్యాన్నిచ్చి సారంగ తరపున నా ఇంటర్వ్యూ తీసుకున్న నీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు! ” అన్నారు నన్ను సాగనంపుతూ.  

 ముఖాముఖి:

వారణాసి నాగలక్ష్మి

vnl photo

 

 

 

 

 

 

 

 

 

నేనూ అమ్మనవుతా !

vnl photo

వారణాసి నాగలక్ష్మి

      

  పుట్టింది పెరిగిందీ నూజివీడు దగ్గర ప్లీడర్ గారి తోటలో. ఆలంబన కథా సంపుటి 2005 లోనూ , ఆసరా కథా సంపుటి 2010 లోనూ వెలువడ్డాయి .రచయిత్రిగా లేఖిని నించి ‘కథ’ పురస్కారం, స్వర్గీయ యమ్వీయాల్ సాహితీ సత్కారం వంటి కొన్ని ప్రోత్సాహకాలు లభించాయి. కారా మాస్టారు , ఛాయా దేవి గారు , మునిపల్లె రాజు గారు వంటి సాహితీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంస, పురస్కారాల కన్నా ఎక్కువ సంతోషాన్ని , ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.  కారా మాస్టారు చెప్పినట్టు ప్రముఖుల ప్రశంస , రచయితని గొప్ప కథలు మాత్రమే  రాయాల్సిన పరిస్థితిలోకి నెట్ట కూడదని నమ్ముతాను . మామూలు కథలు కూడా హాయిగా రాసుకోగలిగే  స్వేచ్చని రచయిత కాపాడుకోవాలని, పాఠకులు  expectations  లేకుండా రచయితని స్వీకరించాలనీ నా అభిప్రాయం, నా ఆకాంక్ష  !– వారణాసి నాగలక్ష్మి 

***

హాల్లో ఫోను మోగుతోంది.రోజూలా ఆయన తీస్తారేమో అని ఆగకుండా గబా గబా వెళ్లి రిసీవర్ తీశా. విజయ్ నించీ నీలిమ  నించీ ఇంకా ఫోను రాలేదు. వాళ్ళ నించే అనుకుంటూ హలో అన్నా. అటునించి నవీన పలికింది.

” ఏం తల్లీ? “అన్నా మళ్ళీ చేసిందేమిటా  అనుకుంటూ.

” అమ్మా ! ఎలా గడిపావు ఈ రోజు ?”అంది.

” చెప్పారు గదమ్మా నాన్న. ఐస్ క్రీం తెచ్చారు మధ్యాహ్నం .ఇవాల్టికి షుగరు మాట మర్చిపోయి తినేశా. అన్నం లోకి నాన్నకిష్టమని కొబ్బరి పచ్చడీ, నాకిష్టమని పులిహారా చేశా…” ఇంకా నా మాటలు పూర్తి కాకుండానే

“ఊ .. అంతే మీరు !  పుట్టినరోజు పూటా వండుకుంటూ కూర్చున్నావా? ఇన్నాళ్ళూ మా చడువులనీ, పరీక్షలనీ, నాన్నకి ఆఫీసులో కుదరకా, చుట్టా లొచ్చారనీ  ఏదో ఒక కారణం తో ఇంట్లోనే గడిపేదానివి. ఇప్పుడైనా హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు కదా ” కోప్పడుతూ అంది నవీన.

” ఇప్పుడేం కష్ట పడుతున్నా తల్లీ? హోటలు భోజనం నిండా ఉప్పు కారాలూ ,నూనెలూ ఎక్కువ. దాని బదులు ఇంట్లో సింపుల్ గా చేసుకుని ఇలా ఐస్ క్రీమో, స్వీటో తెచ్చుకుంటే నయం కదా!” అన్నా .

” సర్లే  ..ఏదో ఒకటి చెప్తావు. సాయంత్రం అయినా ఎటైనా వెళ్తున్నారా?” అంది నిష్ఠూరంగా  .

దాని బుంగమూతి ఊహించుకుంటూ ” ఊ.. కాలనీ గుడిలో ఏదో పురాణ కాలక్షేపం ఉంది. ఇద్దరం వెళ్తున్నాం ” అన్నాను .

“నీకింకా అరవై కూడా రాలేదే బాబూ!  చక్కగా ఆదివారం నాడొచ్చింది  పుట్టినరోజు! కాస్త ఓ సరదా సినిమాకో, పార్కుకో వెళ్లకూడదూ ? నాన్న కివ్వు ఫోను ” అంది విసుక్కుంటూ.

“నాన్న భోంచేసి  పడుకున్నారమ్మా. నువ్విలా అన్నావని చెప్తాలే.. అలాగే వెళతాంలే.. .  సినిమాకి కాదుగాని ఏదైనా పాట కచేరీ ఉంటే వెళ్తాం ” అన్నా.

“నాన్నకి నీ ఇష్టాయిష్టాలేవీ పట్టవు. నేనక్కడ జాబ్ చేసినన్నాళ్ళూ ఎలా వెళ్ళేవాళ్ళం మనిద్దరం?..అలా గుర్తొచ్చినపుడల్లా వెనక్కి వచ్చెయ్యాలనిపిస్తుంది…. కానీ ఇక్కడి జీవితం అలవాటు పడ్డాక అలా వెనక్కి రాలేం..” అంది.

నవీన మాటలకి నా మనసు పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అప్పట్లో విజయ్ అమెరికా లో ఎమ్మెస్ చేస్తుండేవాడు . నవీన చదువై ఉద్యోగంలో చేరింది. రెండేళ్ళ పాటు దాదాపు ప్రతీ సాయంత్రం సరదాగా ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళం. దానికి పెయింటింగ్  అంటే ఇష్టం. నాకు సంగీతం ప్రాణం. ఇద్దరం కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ కో, సంగీత కచేరీకో నవీన స్కూటీ మీద వెళ్ళిపోయేవాళ్ళం.

అప్పట్లో ఆయన ఇంటికొచ్చేసరికి దాదాపు ఎనిమిదయ్యేది. మేమూ సాధారణంగా ఆ సమయానికి ఇల్లు చేరేవాళ్ళం. ఎప్పుడైనా కచేరీ చాలా బావుంటే ఇంకా లేటయ్యేది. అప్పటికాయన స్నానం చేసి టీవీ చూస్తూ ఉండేవారు. ముందుగానే వంట పూర్తి చేసి భోజనాల బల్ల మీద పెట్టి వెళ్ళేవాళ్ళం గనక రాగానే కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసేవాళ్ళం. నా జీవితంలో ఆ రెండేళ్ళూ చాలా  స్పెషల్ !

నవీన పెళ్లి చేసి పంపాక నాకు చాలా కాలం పట్టింది తేరుకోడానికి. ఆయనకి లలిత కళల మీద అభిరుచి లేదు. అలిసిపోయి ఇల్లు చేరేవారేమో నాతో మళ్ళీ బయటికి  రావడానికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు.మిత భాషి కావడంతో మా ఇల్లు ఎక్కువ సేపు నిశ్శబ్దం గానే ఉంటుంది. పిల్లలతోపాటు పరుగులు పెట్టే రోజులు ఎలా గడిచాయోగాని ఇప్పుడు మాత్రం తరచుగా విసుగనిపిస్తోంది జీవితం. ఆయన  రిటైరయినా పెద్ద  తేడా  ఉండక పోవచ్చు. ఈ యాంత్రికజీవనం లో  విజయ్ నించీ, నవీన నుంచీ వచ్చే ఫోన్ కాల్స్ , వాళ్ళు పంపించే ఫోటోలు, ఈ మెయిల్స్ , ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వాళ్ళ రాక …ఇవే నా జీవితంలో మెరుపు తునకలు !

ఇవాళ నా పుట్టిన రోజు. చాలా మందికి లాగే నాకూ పుట్టిన రోజు నాడు నా ఆప్తులు కొద్దిమందీ నన్ను పలకరించాలనీ, నా పట్ల వారి ప్రేమ వ్యక్తమయ్యేలా ఏవో చిట్టి పొట్టి బహుమతులో, శుభాకాంక్షలో అందించాలనీ ఎదురు చూడడం అలవాటు. పిల్లలకి  జ్ఞానం  రాక ముందు, ఆయనకి గుర్తుకూడా ఉండక, నా పుట్టినరోజులన్నీ చప్పగా గడిచి పోయేవి. పిల్లలకీ, మా ఆయనకీ  వాళ్ళ పుట్టినరోజులన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసి, కొత్తబట్టలు కుట్టించి పండుగలా సెలబ్రేట్ చేసినా, నా పుట్టినరోజు ఎవరికీ గుర్తుండక ఉక్రోషం వచ్చేది.  నవీన కొంచెం  పెద్దదైనప్పటి నుంచీ అమ్మ పుట్టినరోజు అంటూ గుర్తు పెట్టుకుని ఆ రోజు అన్న తో కలిసి రహస్యంగా చర్చించి ఏవో సర్ప్రైజులు ఏర్పాటు చెయ్యడం , ఇంట్లో అన్ని పనుల్లో సాయం చెయ్యడం మొదలు పెట్టింది….అవన్నీ మధుర స్మృతులు !

ఇద్దరినీ ఒకలాగే పెంచినా విజయ్ కి ప్రేమ ప్రకటన చేతకాదు. వాడి భార్య నీలిమ  కూడా మంచి అమ్మాయే. కానీ పెళ్లవుతూనే విజయ్ తో  కలిసి విదేశాలకి వెళ్లిపోవడంతో నాతో పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. ఎప్పుడైనా  వాడు ఫోన్ చేసి నాతో మాట్లాడమని ఇస్తే మాట్లాడుతుంది. ఈ విషయంలో నాకెంతో బాధగా ఉంటుంది. నవీన మాత్రం దాదాపు రోజూ ఫోన్ చేసి పలకరిస్తుంది. తరచూ ఈ మెయిల్స్ కి పిల్లల ఫోటోలు జతచేసి పంపుతుంది. పుట్టినరోజు పెళ్లిరోజులకి ఏవో బహుమతులు పంపిస్తుంది . ఒక్కోసారి డబ్బు పంపి ” ఆ డబ్బు దాచిపెట్టి మళ్ళీ నాకే ఏదో ఒకటి కొంటావు..అలా చెయ్యకు. ఏదైనా మంచి చీర కొనుక్కో. పని మనిషి ఎక్కువ డబ్బిచ్చి పనులన్నీ చేయించుకో ” అంటూ తాపత్రయ పడుతుంది . పనితో ఎంత సతమతమౌతూ  ఉన్నా పిల్లలచేత మాట్లాడిస్తుంది. వాళ్ళు’ అమ్మమ్మా తాతా’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. నా జీవితంలో నవీన పంచే ఆనందం వర్ణన కందనిది.

Kadha-Saranga-2-300x268

కిందటి వారం విజయ్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇప్పుడు బహుశః వెనక్కి కాలిఫోర్నియా ప్రయాణంలో ఉండుంటాడు. ప్రయాణం హడావిడిలో మెయిల్స్ చెక్ చేసుకుని ఉండడు. నవీన వాడికి గుర్తు చేసే వుంటుంది !!

పిల్లలు మరీ చిన్న వాళ్లవడంతో ప్రస్తుతం నీలిమ  ఉద్యోగం చెయ్యడం లేదు. ఒక్కసారి ఫోన్ చేసి  మాట్లాడకూడదూ? చివుక్కుమనిపించింది. మా అత్తగారిని నేనెంత  బాగా చూసుకునే దాన్ని! పెద్ద కోడలిగా ఎన్ని బాధ్యతలు నెరవేర్చాను! మరుదులూ, ఆడపడుచులూ అందరి పెళ్ళిళ్ళూ,చదువులూ అన్ని విషయాల్లోనూ అందిపుచ్చుకుని ఎలా నిభాయించాను? అందులో పావు వంతైనా తన నించి ఆశిస్తే తప్పు కాదు కదా! మనసు చిన్నబోయింది.

మళ్ళీ ఫోను మోగింది. ఈ సారి తప్పకుండా విజయ్ నించో, నీలిమ నించో అనుకుంటూ రిసీవర్ తీశాను. అబ్బే.. ఆయన కోసం ఆఫీసు వాళ్ళెవరో చేసారు. లేచారో లేదో చూసి కార్డ్లెస్ ఫోనందించి వంటింట్లోకి నడిచా కాస్త టీ పెడదామని. జీవితం చప్పగా ఉంది పోనీ టీ లోనైనా కాస్త మసాలా వేద్దామనిపించింది. యాలకులా ,దాసించెక్కా, సోంపా అని అలోచించి చివరికి అల్లం దంచి వేశా. రెండు కప్పుల్లో వేడి టీ పోసి పది చదరపు అడుగుల బాల్కనీ లోకి తెచ్చేసరికి ఆయన కూడా లేచి వచ్చారు, పొద్దుటి పేపరు చేతిలో పట్టుకుని.

టీ తాగుతూ అమ్మాయి ఫోన్ చేసిన విషయం చెప్పి ,”చూశారా విజయ్ గాని, నీలిమ గాని ఫోనే చెయ్యలేదు.వాళ్ళకసలు నా పుట్టిన్రోజన్న విషయమే గుర్తులేదు!” అన్నాను ఉక్రోషంగా .

తలాడించారు మౌనంగా.

” నేనెంత చేసేదాన్ని అత్తయ్య కోసం ?ఆవిడ కనుసన్నల్లో తిరుగుతూ,ఆవిడ చెప్పినట్టుగా నడుచుకుంటూ , ఇంటి బాధ్యతలన్నీ ఎంత పట్టించుకున్నాను? ఆఖరి వరకూ ఆవిడ అవసరాల్లో ఎంత వెన్నంటి ఉన్నాను? ” అన్నాను బెంగగా.

ఆయన నా కళ్ళలోకి చూసారు.

నా బాధ తనకి అర్ధమైనట్టే అనిపించింది.

చెయ్యి చాచి నా చేతిని నొక్కుతూ “నవీన మళ్ళీ ఫోన్ చేసిందన్నావ్?”అన్నారు.

నా కళ్ళు మెరిసి ఉండాలి. దాని ఫోను వివరాలు చెప్పాను.

ఆయన కొంత సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారు .

తర్వాత గొంతు సవరించుకుని “చూశావా భానూ! నీ కూతురు నీకు చేస్తున్న దానిలో పావు వంతైనా మీ అమ్మ గారికి నువ్వు చేసావా? ఆవిడకి డెబ్భై దాటినా ఇప్పటికీ పుట్టింటికెళ్ళి అంతో ఇంతో చేయించుకుని వస్తావు! ఈ నాటికీ వాళ్ళనించి పెట్టుపోతలు అందుకుంటూనే ఉన్నావు. అదే మరి నవీన పుట్టింటికి వచ్చినపుడల్లా నీకు పనికొచ్చేవీ, నచ్చేవీ ఏవేవో తెస్తూనే ఉంటుంది. దాని డెలివరీలకి మీ అమ్మ గారు నీకు చేసిన దాంట్లో పావువంతు కూడా నువ్వు దానికి చెయ్యలేదు. అక్కడికి మనని తీసుకెళ్ళి అమెరికా అంతా తిప్పి చూపించింది. ఇప్పటికీ మన పుట్టినరోజులకీ, పెళ్లిరోజులకీ ఏవేవో బహుమతులూ, చెక్కులూ పంపుతుంది. అటువైపు ఆలోచించావా?”అన్నారు మృదువుగా.

ఒక్కసారిగా నాకు కళ్ళు తెరుచుకున్నట్టయింది. నిజమే .. మా అమ్మ కు ఇంతవరకూ  నేను చేసిన సేవ ఏమీ లేనట్టే! పాపం ఇవాల్టికీ మేం వెళితే పక్కన కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంది. వద్దన్నా వినదు. వంటకి వంట మనిషీ, పనికి పని మనిషీ ఉన్నా , ఏవో పచ్చళ్ళూ, పొడులూ ,చేసి ‘నీకిష్టమని చేసానే’ అంటుంది. ‘ వంకాయ కారంపెట్టి చేస్తే అతనికిష్టం కదే! ..కొబ్బరి పచ్చడి చేస్తే మళ్ళీ వేయించుకుంటాడు’ అంటుంది!

నేనూ ‘ఆవిడకి అలానే తృప్తి ‘ అని హాయిగా అనుభవించి ఊరుకుంటాను. రాత్రి పడుకునే ముందు జండూ బామ్  వాసన వస్తుంది. అమ్మ రాసుకుంది కాబోలు అని నిట్టూరుస్తాను. రెండు రోజులుండి మళ్ళీ మా ఊరు చేరుకుంటాను. అమ్మ మా ఇంటికి వస్తే ఆవిడకిష్టమని ఎక్కడికీ తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. ఏదో పెళ్లి ళ్ల కీ, పేరంటాలకీ ,తప్పనిసరి అయిన చోట్లకీ తప్ప. అదే నవీన మాకోసం ఎంత ప్లాన్ చేస్తుందో. ఎంత ఆలోచిస్తుందో!

ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ శ్రీవారి మాటలు వినిపించాయి…

“అప్పటి కోడళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కావడంతో అనుబంధం గాఢంగా  ఏర్పడేది. ఎదిగే చెట్టు మట్టిలో వెళ్ళు విస్తరించుకున్నట్టు కనపడకుండా అత్తింటితో బంధం బలపడేది.. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలున్నా కష్ట సమయాల్లో, అనారోగ్యాల్లో, పిల్లల పెంపకంలో అత్తా కోడళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నడవడంతో ఒకరి లోపాలొకరు అర్ధం చేసుకుని తేలిగ్గా తీసుకోగలిగేవారు. ఒకరి మీదొకరు మానసికంగా ఆధారపడేవారు! ఇప్పుడు పెళ్లవుతూనే విదేశాలకి  వెళ్లిపోవడంతో పెద్దగా అనుబంధం ఏర్పడక పోవడం, ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో టైము దొరక్క పోవడం, అయిన వాళ్ళు లేని చోట భార్యా భర్తలిద్దరే కష్ట సుఖాలన్నీ ఎదుర్కోవడంతో అత్త మామలతో అంత ఇంటరాక్షన్ లేకుండా పోతోంది.” అన్నారు.

నిజమే ! కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో నేనూ అత్తగారి సహకారం , మాట సాయం  పొందాను. అనేక సందర్భాలలో ఆవిడ ప్రేమాభిమానాలు, ప్రశంసలూ పొందాను. చిన్న తనం నించీ ఆవిడ దగ్గరే  ఉండడంతో ఆవిడతో ఎంతో అనుబంధం ఏర్పడింది. తరవాత్తరవాత ఈయన ఉద్యోగ రీత్యా  వేరే రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా  ఆవిడా వస్తూ ఉండేవారు, అవసరాలకి  నేనూ పిల్లలతో వచ్చి ఆవిడ దగ్గరుంటూండే దాన్ని. ఆయనొకరే ఎలాగో మానేజ్ చేసుకునేవారు………

ఆలోచనల్నించి బయట పడుతూ ” సరే లెండి… ఇప్పటి తరం తమకు సమ్మత మయిందే చేస్తారు గాని ఇతరులేమనుకుంటారో అనో , ఇతరులు ఆశిస్తారనో  ఏదీ చెయ్యరుగా !” అన్నాను నవ్వుతూ.

“అవును సరిగ్గా చెప్పావు! ఇంకో విషయం చెప్పనా ? ఇప్పటి పిల్లలకి,  చాలా కాలం…. అంటే దాదాపు పాతికేళ్ళ పాటు  చిన్న  కుటుంబంలో తల్లీ తండ్రీ, ఒక తోబుట్టువూ మధ్య పెరగడం, బాగా చదువుకుని ఉద్యోగం లో చేరి, కొన్నాళ్ళు సంపాదించాక పెళ్లిళ్లు జరగుతున్నాయి. వాళ్ల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర అర్ధమై, వాళ్లతో అనుబంధం గాఢమై,  అదే వాళ్ళ మనసులో నిలిచిపోతోంది. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం కలుగుతోంది ! దానికి  తోడు సొంత సంపాదన ! ఏమంటావు?”అన్నారు.

ఏమంటాను? నిజమే..

మళ్ళీ ఆయనే ” పెళ్ళైన వెంటనే దూర దేశానికి వెళ్ళడం, అన్ని కష్ట సమయాల్లోనూ ఇరుగు పొరుగుల సహకారం అవసరమై, వాళ్ళతోనే  అనుబంధం ఏర్పడడం ! దూరంగా ఉన్న అత్త మామలు బాధ్యతలుగానే గాని, తీయని బంధాలుగా అనిపించే ఆవకాశం ఏదీ?

“నీలిమ విషయంలో  తను చెయ్యక పోయినా నువ్వే చెయ్యి. … ఆశించకుండా అందిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నువ్వూ తల్లిలా కనిపిస్తావేమో!!” అన్నారు నవ్వుతూ.

అన్నీ వింటూ ‘ అవును .. నీలిమకి నేనూ అమ్మనవాలి ‘ అనుకున్నా.

 

***

 –  వారణాసి నాగలక్ష్మి