ఇల్లాలి అసహనం

 

-వనజ తాతినేని

~

 

మేమెలాగూ నిద్ర పోలేదు, మిమ్మల్ని మాత్రం ప్రశాంతంగా నిద్ర పోనిస్తామా  అన్నట్టు ఊరంతా మేల్కొనేలా సినిమా పాట పాడుకుంటూ వెళ్ళే వాహనం, దాని వెనుకనే  రోడ్డు మీద దబుక్కుమన్న శబ్దం. ఉలికిపడి లేచాను.  ఇంటద్దె  ఇరవై శాతం పెంచానని ఓనరమ్మ చెప్పినప్పుడు ఉలికి పడ్డట్టుగా.  అన్యాయం!  చానల్ సాక్షిగా తాడిగడపలో ఇంతిల్లు  పదివేలే అంటున్నారన్నా ! చానల్స్ లో ఎవరూ నిజం చెప్పరని మీకు తెలియదా అంది. నిజమే కదా! అనుకున్నాను వీలైనంత ఏడుపు గొంతుని సరి చేసుకుని. అన్నీ పెరుగుతున్నాయి. ఆయుష్షు కూడా పెంచి ఇక్కడ నరకమెందుకు చూపిస్తావ్ దేవుడా !? మనసులో తిట్టుకున్నాను.

రాత్రంతా నిద్ర లేదు. కలలకి కూడా పొంతన లేదు  ఆలోచనలాగానే ఎడ్డె మంటే తెడ్డె మంటున్నాయి. కాసేపు  నాలుగు రింగుల కారు, కలర్ ఫుల్ పోలీ వీవెన్ చీరలు, కొంకణ్తీర్  డైమండ్ నగలు, ఇవే కనబడతాయి. కాసేపాగాక   ప్రకృతంతా  వసంతగానం చేస్తుంటే  ఎండలేమో తొందరపడి ముందే సచిన్ బాదినట్టు  బాదుతున్నాయి.  ఒంట్లో  నుండి చెమట చుక్క బయటకి రానీయమని కంకణం కట్టుకున్నవారు వర్సెస్  తాగడానికి చుక్క నీళ్ళ కోసం అలమటించేవారు.ఇదీ భారతం. భవతు భారతం. అక్షరాల అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఆకలి, నిరుద్యోగం, అవినీతి, లంచగొండితనం  వగైరా వగైరా లన్నింటికి ఒకే ఒకే విశ్వసనీయమైన  మందు దేశభక్తి. అసలా ప్లేవర్ కి ఏ ప్లేవర్ పోటీ  రాదు.   అందులో పడి మునిగిపోవాలని రాసి పెట్టి ఉందని తెలుస్తూనే ఉంది. ఆకలి ఉంటే  సరిపోయిందా దేశభక్తి ఉండొద్దూ … అడుక్కుని పరువు తీయకు పో … దూరంగా పో ! లాంటి నిజాలు చెప్పే కలలు వచ్చినందుకూ  అసహనంగా ఉంది.

వాకింగ్ పేరుచెప్పుకుని  మగవాళ్ళు ప్యాంట్ జేబులో క్యారీ బేగ్  ని వేసుకొస్తున్నారు.  పరులు  పెంచుకున్న మొక్కల, చెట్ల పూలతో పూజ చేస్తే మంచిదని దేవుడు చెప్పాడు కాబోల్సు. శ్రద్దగా తెగ పాటించేస్తున్నారు. కామన్ ప్లేస్ లో కుండీలలో పెట్టిన మొక్కలకి కూడా ఒక్క పూవ్వు మిగల్లేదు. నా హృదయపుష్ఫం ఎవరూ దోచుకోలేరులే అనుకున్నా అంతకన్నా వేరే దారిలేక. ఉపన్యాస చక్రవర్తి భర్త పాదాలు  పిసికి, మొల మీద గుడ్డ ఉతికి ఆరేసి పుణ్యం తెచ్చుకోండి అని సెలవిస్తున్నాడు. అర్ధభాగంకి ఆయనెప్పుడైనా అలా చేసాడో లేదో ! అమ్మ కన్నా చేసాడో లేదో ! ఒరేయ్ ఒరేయ్ ..కాస్తైనా మారండి రా ..బాబూ!  ఈ శతాబ్దపు ఆడవాళ్ళకి ఎందుకసహనం తెప్పిస్తారు ?

బిల్డింగ్ లో ఉన్నవాళ్ళందరి పైనా పెత్తనం చెలాయించే సుధీర్  ” నా  పట్టు చొక్కా అంతా కాల్చేసావ్ ! ఇస్త్రీ చేయడం కొత్తని చెప్పొచ్చుగా. పొలాల్లో పనిచేసుకుని బతికినవాళ్ళు టౌన్ లోకి వచ్చి దోబీ అవతారమెత్తితే ఇదిగో ఇలాగే  ఉంటుంది. మూడేలు రూపాయల కొత్త షర్ట్. ఈ షర్ట్ నువ్వే ఉంచుకో ..డబ్బులు నీ జీతంలో కట్ చేసుకుంటా !  ఉదార అసహనం ఒలికిస్తున్నాడు. పాపం! కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని చిందులు తొక్కుతున్న ఆయన్ని చూస్తూ నిలుచున్నాడు కొత్తగా వచ్చిన వాచ్మెన్ నాగేశ్వరరావు.

 

పొద్దుటి నుండి ఒకటే మెసేజ్ పదిసార్లు.  ఎవరో అన్నయ్య  యు వీ ప్యాలెస్ కి వస్తున్నాడట. అందులో ప్రత్యేకత ఏముందీ ? జనాలు  వీసా లేకుండా ఎన్నో దేశాలకి వెళ్లి వస్తున్నారు . స్వదేశంలో ఎక్కడ తిరిగితే ఏమైంది? ఎవరి పనులు వారివి. దానికంత ప్రాధాన్యం ఎందుకివ్వాలి? అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్నీ.  డబ్బులు పుచ్చుకుని మీటింగ్ కెళ్ళే వాళ్లకి అలాంటి మెసేజ్ వెళ్ళినా ఫలితం భారీగా దక్కును. నాకెందుకంటా!  పదకొండో మెసేజ్. అసహనం రాదుమరి. ఇక ఒర్చుకోవడం నావల్ల కాలేదు.ఆ నంబర్ బ్లాక్ చేసి పడేసాను.

 

హాల్లో టీవి , బెడ్ మీద లాప్ టాప్. డైనింగ్ టేబుల్ మీద ఎడమ చేతిలో మొబైల్. మనుషులు మనుషులతో మాట్లాడుకోరు.  తెరమీద మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది.తెరల మీద చూసి చూసి ఈ మధ్య మా ఇంట్లో కూడా శాంతి సామరస్యం అస్సలు కుదిరి చావడంలేదు. ప్రతి దానికి అసహనం ప్రదర్శించడం అలవాటైపోయింది. రోజూ వంట చేసినట్టే,రోజూ ఇంటి పని చేసినట్టే రోజూ టీవి సీరియల్స్ చూసినట్టే రోజూ అసహనం ప్రదర్శించకపోతే ఏమీ బాగోలేదు.   మొన్నట్టాగే అత్తగారు చుట్టంలా వచ్చింది వచ్చినట్టు ఊరుకోకుండా..  ఎందుకా సీరియల్స్ అదే పనిగా చూస్తావ్ ! పిల్లలతో హోం వర్క్ చేయించవచ్చు కదా అంది. మా ఆయన్ని వరించినందుకు భరించక తప్పదని ఊరుకుంటున్నా కానీ  పక్కింటి వాళ్ళ కోడలు వేసినట్టు ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నో వేసేస్తే  పీడా పోద్ది  అనుకున్నాను

అమ్మ గారు డస్ట్ బిన్, అమ్మ గారు పోస్ట్, అమ్మగారు కరంట్ బిల్, అమ్మగారూ నెట్ బిల్, అమ్మాయి గారు సపోటాలు బాగున్నాయి రండి …  డజను నలబై రూపాయలే ! అయ్యని ఎవరూ పిలిచే  అలవాటులేదు, పాపం ఆర్ధిక భారం ఆయనకేమి తెలుసని జాలి కాబోలు.

పక్కింటమ్మాయికి పెళ్ళైతే నీకెందుకు  కొత్త పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్ !? చంపుతున్నావ్ కదే ! ఎదురింటాయన ఆక్రోశం.  ఆ మైనా వాడి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ నగలమ్మినట్టు చీరలు బ్లౌజ్ లు కూడా అద్దెకిచ్చే వాళ్ళుంటే  ఎంత బావుండునో ! మగాడికి అధిక సంపాదన కోసం బల్ల క్రింద చేయి పెట్టడమో,  హార్ట్ ఎటాక్ రిస్క్ రెండూ తప్పుతుంది. అరెరే ! ఇదేదో మంచి ఐడియానే ! మనమే  అలాంటి షాప్ పెట్టేసుకుంటే పోలా ఇలా ఖాళీగా కూర్చునే బదులు!

 

మేడమ్!  ఉదయం సార్  తో మాట్లాడాను హవా టెల్ లో మంచి ప్లాన్స్, ఆఫర్స్ ఉన్నాయి పోర్టబిలిటీ చేయించుకుంటానన్నారు అంది కంఠంలో బహుతీపిని ఒలకబోస్తూ ఓ పిల్ల .   ఎవరమ్మా .. ఆ సార్ !? ఏ సార్ తో మాట్లాడావో నువ్వు?  ఈ నెంబర్ గల  ఫోన్  ఎప్పుడూ నాదగ్గరే ఉంటుంది . ఇంకో విషయం తల్లీ ఈ నెంబర్ మీ హవా  టెల్ లోకి మారి రెండేళ్ళు అయింది  కదా ! అన్నాను టక్కున పెట్టేసింది.  మా ఆయన మొన్నెప్పుడో ఇలాంటి కాల్  అటెండ్ అయి   వేషాలు బాగానే వేస్తున్నారు   ఫ్యాన్సీ నెంబర్లని ఎన్నుకుని  ఇదోరకం వ్యాపారం !  సిగ్గు లేదూ..  చావండహే! అన్నది గుర్తుకొచ్చింది.

అక్కా!  అక్కా !! పక్క అపార్ట్మెంట్ అమ్మాయి పిలిచింది నన్నేనా ..? నేను అక్కనెప్పుడయ్యా నబ్బా ! పెళ్ళైన మర్నాటి నుండే అందరికీ ఆంటీ నే కదా ! అలా పిలవద్దని స్మూత్ గా చెప్పి కూడా  అందరితోనూ యాంటీ అయిపోయా ! ఓపికపోయి మూలుగుతూ కూర్చున్న నాకు ఈ  అక్కా అన్న పిలుపు కవితా కృష్ణమూర్తి భైరవి రాగంలా  తోచింది . గబుక్కున బయటకెళ్ళి ఏంటమ్మా ..సత్యా అనడిగా! ఒక కరిపాకు రెమ్ముంటే ఇవ్వక్కా ! అయ్యో ! కూరలో కరివేపాకులా మనుషులని తీసి పారేస్తున్నారని మనుషులకి కోపం వచ్చి కరివేపాకు తోటలని  పెంచడం మానేసారటమ్మా!  కావాలంటే కొత్తిమీర కట్ట ఇస్తా ! మాడిన కూరని కూడా గార్నిష్ చేసి మీ ఆయనతో లొట్టలేసుకుంటూ తినేటట్టు చేయొచ్చు అన్నాను. నవ్వి సరేనంది. ఇలాగే అక్కా అని పిలుస్తూ..  నీకేమి కావాల్సినా అడగమ్మా ! మొహమాటపడకు. పక్క పక్క బిల్డింగ్ లలో ఉన్నాం, మనం మనం  సాయం చేసుకోకపోతే ఎలా !  అంటూ కాస్త అతిగానే స్పందించాను.  మా చిన్నోడికి అర్ధమయ్యిందనుకుంటా.. ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు. పిల్లలు పెద్ద ముదుర్లు అయిపోయారు.వాళ్లకీ అన్ని విషయాలు   తెలుస్తున్నాయి.  ఆ సంగతి మొన్నెవడో కథల గ్రూప్ లలో  పోర్న్ వీడియో పోస్ట్ చేసి  మరీ చూపిచ్చాడు. ఝడుసుకుని చచ్చాను. ప్చ్ ..

raja

లోకం  తెగ పాడై పోయింది. నేను పాడవకుండా ఏదన్నా రహస్యముంటే ..చెప్పరా..  భగవంతుడా ! ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటా, ఎంత కడుపు నొప్పి వచ్చినా సరే ! మాటిస్తున్నానుగా, నమ్మొచ్చు కదా !అసలు ఆడాళ్ళకి కడుపు నొప్పి ఎందుకొస్తుందో తెలుసా !  అవునులే … హ్యాపీ బ్లీడ్ సంగతి నీకేం  తెలుసు ..నీకు అమ్మున్టేగా?  అమ్మతోడు ! అవకాశం కోసం నేను మతం మార్చుకోలేదు గనుక నువ్వు  అమ్మ లేని భగవంతుడని గుర్తుకొచ్చిందంతే! నిన్నిలా తిట్టడం ఎవరైనా వింటే మా దేవుడికి అమ్మ ఉంది అని యుద్దానికొచ్చే మిత్రులున్నారు. సైలెన్స్ సైలెన్స్ .అదివరకంటే మాటలని ముంతలో పెట్టి దాపెడితే సరిపోయేది ఇప్పుడు  నోట్లో మాట నోట్లోనే దాచి  పెదవులు కుట్టేసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి.బయటకి పొక్కాయా ..బ్లాక్ చేసి పడేస్తారు.  భావ స్వేచ్ఛ జిందాబాద్ !

పెద్దోడిని స్కూల్ లో దించడానికెళ్ళా ! ఆ ఎర్ర చీర మిస్ మీ క్యాస్ట్ ఏమిటీ అనడిగిందమ్మా,  క్యాస్ట్ అంటే ఏమిటమ్మా అన్నాడు వాడు.  కడుపు రగిలిపోయింది . ఆమె పక్కనే బండి ఆపాను . గుడ్ మార్నింగ్ మేడం ! మీ బాబు సో చీట్ అంది. స్వీట్ అందా చీట్ అందా ఇంటర్నెట్ భాష జనంలోకి వరదలా వచ్చేసాక ప్రతి చోటా  కన్ప్యూజే ! ఛీ… దీనెమ్మ జీవితం అనబోయి గబుక్కున ఆపుకున్నా ! ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నా ! మీరేం కేస్ట్ మేడం అడిగింది నన్ను. కోపమొచ్చి నాలుగు పీకుదామనుకున్నా ! ఎలాగో తమాయించుకుని నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదమ్మా ! ఏదో ప్రయోజనం ఆశించి సడన్ గా నా కులమేమిటో ప్రకటించుకోడానికి. కాస్త ప్రశాంతంగా బ్రతకనీయండి తల్లీ  అంటూ దణ్ణం పెట్టా ! మీ ఫీలింగ్స్ దెబ్బతీయాలని కాదండీ  జస్ట్  తెలుసుకోవాలని అడిగానంతే! మోహంలో అసంతృప్తి దాచుకుని వెళ్ళిపోయింది.

ఈ విషయం అర్జంట్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసి కుల నిర్మూలన కోసం పోరాడాలి . ఒక నాలుగువందల లైక్ లు, ఎనబై షేర్ లు గ్యారంటీ ! లైక్ లంటే గుర్తొచ్చింది .. ఆ పెద్ద రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఇంకో పెద్ద రచయిత్రికి కోపం . ఈ రచయిత్రి పోస్ట్ కి లైక్ కొడితే ఆ  రచయిత్రికి కోపం . భగవంతుడా ఈ పెద్ద పెద్ద వాళ్ళ మధ్య నన్నెందుకు ఇరికించావయ్యా ! నా మనసు చెప్పినట్టే వింటానని నీకు తెలియదూ ! నారీనారీ నడుమ మురారి నీది నాది వేరే దారి ఏఎన్నార్ డాన్స్, ఇరువురి భామల కౌగిలిలో అంటున్న  యువరత్నవేడుకోలు ఒకేసారి గుర్తొచ్చాయి మరి. స్నేహం చేద్దామంటే ఒక్క మంచి మనిషి దొరకరు. బోల్డ్ కాంటెంపరరీ  స్టైల్స్ షాప్ లలో అయితే దొరుకుతాయి కానీ మనుషుల్లో మంచి మనిషి భూతద్దం పెట్టి వెదికినా దొరకరు. అన్నీ ఆ తానులో ముక్కలే ! దొరికే దాకా వెతుకు వెతుకు .. వెతకవమ్మా . కష్టపడనిదే ఎవరికీ దొరకదని చెపుతున్నాగా! చత్!! అంతరాత్మ హిత బోధ ఎక్కువైపోయింది.

మన్ కీ బాత్.  మన్ కీ బాత్ . వినలేక చచ్చిపోతున్నా. అసలు మనసుంది ఎందరికీ ? కళ్ళముందు భగ భగ మంటలు, కస కస కోస్తున్న కత్తులు, టన్నులు కొద్దీ కన్నీరు.  ముందు  మన్ తీసేసి మాట్లాడటం నేర్చుకోవాలి.  నేర్పేందుకు ఎవరైనా ఉండారో లేదో అన్న సందేహం అసలొలదు. కోచింగ్ సెంటర్స్ కోసం కాళ్ళరిగేలా తిరిగే కష్టం కూడా వద్దు.  ఇప్పుడందరూ ఆ విద్యలో అవధానం చేసినవాళ్ళే  కదా ! ఓ చిలిపి పంజేయాలని బుద్దిపుట్టి   అనవసరంగా పృచ్ఛక  అవతారమెత్తితే అసహనానికి గురికాగలరు. జాగ్రత్తగా ఉండాలి పెద్దోళ్ళతో మాటలుకాదు మరి.

 

మధ్యాహ్నం 12:55 అయింది ప్రియా కూతేసింది కాకి అలవాటుగా గోడమీద వచ్చి కూర్చుని  కావ్ కావ్  మంటుంది . ఎదురింటి తలుపు తప్పనిసరై తెరుచుకుంది. గుప్పిట్లో తెచ్చిన ముద్దని గోడమీద పెట్టి వెళ్ళిపోయింది కాకి అత్తమామ ఆరగించడానికి రెడీ అయిపొయింది. బతికి ఉన్నప్పుడు పెట్టారో లేదో కాని కళ్ళు మెరుస్తుండగా తృప్తిగా చూసుకుంటూ వెళ్లి ఠపీమని తలుపేసుకుంది . కాకి తిన్నంత తిని నేలమీద పడ్డ మెతుకులని  వదిలేసిపోయింది.ముక్కుతో ఏరేరుకుని తినే శ్రమ ఈ కాకికి లేదు కాబట్టి  హాయిగా ఎగిరి పోయింది గానీ  పాటు నాకొచ్చి పడింది.   గేటులోకి వచ్చి పడ్డ అన్నం మెతుకులని తొక్క కూడదనే సెంటిమెంట్ ఏడ్చింది కాబట్టి చీపురు తీసుకుని బర బరా ఊడ్చి పారేసా ! ప్రక్కనే పక్కిన్టామె  పెట్టిన కుండీలో తులసి మొక్కకి  చీపురు తగిలిందేమో! పుణ్యం వాళ్లకీ  పాపం నాకు.

మధ్యాహ్నం భోజనం చేసాక టీవి తదేకంగా చూస్తూ “దొండపండు పెదవులేసుకుని ఆ కాప్రా చూడు ఎంత బావుందో … నువ్వు ఉన్నావ్ ఎందుకూ !? సిటీకొచ్చి ఆరేల్లైంది,గోరింటాకు మానేసి నెయిల్ పాలిష్ వేయించలేకపోతున్నా. ఎంతైనా ఊళ్లోళ్ళు  మారరని రుజువుచేసుకున్నావ్” అన్నాడు మా ఆయన. కడుపు మండిపోయింది. ఊళ్లోళ్ళు అని గడ్డిపరక లెక్క తీసేస్తున్నాడు. వాళ్ళు లేకపోతే తింటానికి గడ్డి కూడా దొరకదని తెలియదు.ఏంటో పెద్ద పట్నం గొప్ప? నీళ్ళు కూడా కొనుక్కుంటూ అని లోలోపలే తిట్టుకుంటుండగానే ఒక ఆలోచన పుటుక్కుమని పుట్టింది, ఆయన్ని ఏడిపించాలని.  బాగుంది కానీ…  మరీ తొమ్మిది గజాల గుడ్డ నేలపై జీరాడడమే అస్సలు బాగోలేదు అన్నా.  అది అంతర్జాతీయ  ఫ్యాషనే పిచ్చిమొహమా  అన్నారు.  వాళ్ళ ఒంటి నిండా కట్టినా డబ్బులే, కట్టకపోయినా డబ్బులే అంట,  నాక్కూడా అలాంటి అంతర్జాతీయ  ఉద్యోగమేమన్నా దొరికితే బావుండును అన్నాను అమాయకంగా. రిమోట్ విసిరి పడేసి  బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు పిచ్చి నా మొగుడు. సినిమా వాళ్ళతో పెళ్ళాన్ని పోల్చడం మొగుడికి తెలిసినట్టు పెళ్ళానికి తెలియదనే అజ్ఞానమైతే ఎట్టాగబ్బా  మరి.

 

ఇలా రాసేసాక చాలామందిని  టార్గెట్ చేసినట్టు రాసేవేమో బంగారూ అంది అంతరాత్మ.  బాబోయ్ నేనేమన్నా నల్లకళ్ళద్దాల వృద్దనారీ రచయితనా ఏమిటీ ఇప్పటిదాకా జనాల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోవడానికి. ఒక అక్షరం ఎగర గొట్టేసిన  పేరుతో కథ రాసేసి విషం కక్కినట్టు ఇంక్ కక్కడానికి. రాసే ప్రతిదీ నిజమని ఏ పాఠక వెధవాయ్ నమ్మడని తెలిసినట్టు లేదు. అంత వయసొచ్చాక  కాస్త ఇంగితం ఉండాలి తల్లోయ్ !  అభిమానిస్తున్నారు కదా అని చెవుల్లో  ఇంగ్లీష్ కాలీ  ప్లవర్ పువ్వెట్టకుమాతా ! చెప్పులో రాయి గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు కొందరు అని చెప్పాలనుకుంటున్నా ! అయినా నా మాట వినడానికి ఆమెకి తీరిక ఉందో  లేదో !  చెవులు సరిగా పని చేస్తున్నాయో లేదో !

 

టీపాయ్ మీద పెట్టిన  మా ఆయన ఫోన్ కి ఏదో మెసేజ్ కూత.  యధాలాపంగా చూసా. బి ఎఫ్/జి ఎఫ్ కావాలా? కాంటాక్ట్ నెంబర్ పదంకెలు !ఇన్బాక్స్ లో బోలెడు ప్రేమ రుతువుల పైత్యాలు పచ్చిగా వార్మప్ చేసేవిగా ఉన్నాయి. ఇలాంటి వాటితో కాపురాలు కూలిపోమ్మంటే కూలి పోవూ ! అసహనం హద్దులు దాటింది. మా ఆయన ఫోన్ బాల్కనీ  గోడకెళ్లి టప్పున కొట్టుకుంటుంది. టీవీ,మొబైల్,ఇంటర్నెట్ ఇవన్నీ లేనప్పుడు అమ్మల కాలం ఇప్పటికన్నా కొద్దిగా బాగుండేదేమో! అప్పుడు  ఇన్ని విచ్చలవిడితనాలు లేవు. అయినా ఈ మాత్రం దానికే అంత అభద్రతాభావం ఎందుకో ? అంతరాత్మ మళ్ళీ  ఎదురుగా నిలబడి చెప్పింది  “ఎందుకంటే పెంపుడు కుక్కని నమ్మినట్టు, కొట్టంలో పశువుని నమ్మినట్టు మొగుడిని నమ్మడానికి వీలులేదే పిచ్చిదానా “అని. పోదూ …ఎల్లకాలం మోసం చెయ్యాలనుకున్న వాడికి ఎప్పుడైనా బై బై చెప్పే తెంపరితనం కూడా ఉందిలే నాలో అని సముదాయించుకున్నా.

 

కోపం తగ్గాక మొబైల్ ముక్కలేరి చెత్త కుప్పలో పోద్దామని బయటకొచ్చా.  పుస్తకాలు ముందేసుకుని కూడబలుక్కుని చదువుకుంటున్న లక్ష్మిని చూసి ముచ్చటేసింది. పగలల్లా పదిళ్ళల్లో పాచి పని, అంట్ల పని చేసుకుని, ఇల్లు సర్దుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం, చదువుకోవడం. అలా ఉండటం  అస్సలు నచ్చలేదట లక్ష్మి మొగుడికి.  ఆమె పుస్తకాల్ని  చించి  పోగులు పెడుతుంటే  లక్ష్మి రాక్షసిలా మొగుడి మీద తిరగబడింది. నీ యబ్బ ! నీకేంటిరా నచ్చాల్సింది, నా సదువు నా ఇట్టం.  నోరు మూసుకుని ఇంటో  ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బు అంది . నోరు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తూ లక్స్ నా సౌందర్య రహస్యం, బికినీ వేసుకుని బీచ్ లలో పరిగెత్తడం లాంటివే  కాదమ్మా  స్వేచ్చంటే .. అచ్చమైన  స్త్రీ స్వేచ్చంటే ఇది గదా ! అనుకున్నాను. లక్ష్మీ సెహబాష్ .

లక్ష్మిలా ఇలా తనని తానూ కాపాడుకోకపోతే అసలాడవాళ్ళని బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా ! పిండంగా ఉండగానే ముక్కలు ముక్కలు చేసి   డ్రైనేజీలో గుమ్మరించేయడం లేదా   వావి వరుస వయసు చూడకుండా అత్యాచారం చేయడం.  అయితే అటు కాకపొతే ఇటూ … బేటీ బచావో, ఔరత్ బచావో … గొంతు పగిలిపోతుంది ఎవరికీ చెప్పాలి, యేమని చెప్పాలి ?  వినే నాధుడే లేడాయే !  ఏమి శిక్షరా … బాబూ ! పొగిలి పొగిలి  ఏడ్వక ఏం మిగిలింది ? నెట్ న్యూస్ లో కూడా  అప్డేట్  చేసినప్పుడల్లా  ప్రపంచ దేశాలలో  ఎక్కడైనా సరే .. ఎప్పుడు., ఎలా రేప్ జరిగిందో వివరంగా చెప్పే కథనాలు ఎక్కువైపోయాయి.   మొన్నెప్పుడో కలలో రెండు కాళ్ళ మధ్య భూగోళాన్ని ప్రసవిస్తున్న స్త్రీ కనబడింది. ఏమిటో దానర్ధం? ఈ  అవాంఛితాల వార్తలు కళ్ళబడటం, వినబడటం వల్ల స్పందించే గుణం కూడా పోయింది. సున్నితత్వం కూడా పోతుంది. మెదడు మొద్దుబారిపోతుంది.

 

చీకటి పడబోతుండగా మధ్యాహ్నం నిద్ర నుండి మా ఆయన మేలుకున్నాడు.  రోడ్డు పక్కనే ఉన్న కల్యాణ మండపంలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది … చెవులు బద్దలయ్యే మేళం మోగుతుంది.  పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగుతూ నిన్నా కుట్టేసినాది, మొన్నా కుట్టేసినాది గండు చీమ అనే పాటకి తెగ ఎంజాయ్ చేస్తూ మండపానికి వెళుతున్నాడు. అతనుకూడా యువరాజులాగానే ఉన్నాడు.పెద్దలు కుదిర్చిన పెళ్ళంట.  భారీ కట్నం,పుత్తడిబొమ్మ అమ్మాయి. మా ఆయనకి దక్కినట్టే !  అంతకి ముందు ఎన్ని చీమలు కుడితే  కంగారుగా దులిపేసుకున్నాడో అమ్మా అయ్యా   ఏడుపు ముఖాలు చూడలేక.

నా ఫోనేది … ఆయన ప్రశ్న. ఏమో నాకేం తెలుసూ … అన్నా అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ముఖంలో అసహనం. నాకది చాలా సింపుల్ గా అనిపించింది.  చూస్తున్నారుగా . వేకువఝాము నుండి   నేనెన్ని అసహనాలు భరించాను. ఆయనా ఒక్క అబద్దాన్ని సహించకపొతే ఎట్టాగబ్బా!

  పిడికిట్లో పూలు

– వనజ తాతినేని

vanajaబస్ దిగి రేడియో స్టేషన్ వైపు అడుగులు వేసాను . గేట్ ప్రక్కనే  కొబ్బరి బొండాల బండి.   దాహంగా ఉందని అటువైపు అడుగులు వేసాను

ప్రక్కనే  కమలాలు అమ్ముతున్న సైకిలిస్ట్.

లోపలినుంచి  ఇద్దరు మహిళలు వచ్చి  “కమలాలు  ధర ఎంత ?” అడిగారు

” కేజి నలబై రూపాయలండీ”

” అంతకన్నా తక్కువకి రావా ?”

“ముప్పై తొమ్మిదికి కూడా రావండీ ! ”

“చూడు..  జనం ఎంత డిమాండ్ గా ఉన్నారో ! ఛీ .. మనకే  ఏమి చేతకాక చస్తున్నాం . తెల్లవారుఝామునే లేచి  రోడ్డున పడొచ్చి డ్యూటీలు చేసినా నాలుగైదునెలలకి కూడా  జీతాలు పడవు. అందులో పది శాతం కటింగ్” నిసృహగా అంది పచ్చ చీరామె

అలా వెళ్ళి క్యాంటిన్లో కూర్చుందాం పద .. అంటూ అటువైపు అడుగులేసారు. నేను కలవాల్సిన వ్యక్తి  కూడా అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పడంతో   నేను వారి వెనుకనే క్యాంటిన్ లోకి వెళ్ళాను. వాళ్ళు  మూలగా ఉన్న ఓ టేబుల్ ని వెదుక్కుని కూర్చున్నారు

వినాలని కాకపోయినా కాలక్షేపం కోసం వారి మాటల్ని వినడంపై దృష్టి పెట్టాను .

“అవును మరి ! తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలన్నట్టు..  ప్రెవేట్ చానల్స్ తో పోటీ పడి ఈ 04:53 కి ప్రసారం మొదలెట్టినా వారితో దీటుగా విషయాన్ని అందించే విషయంలో వెనుకబడే ఉన్నామన్నది  మనవాళ్ళకెప్పుడర్ధం అవుతుందో ! వార్తలు తప్ప రెండు గంటలు పాటు భక్తి గీతాలు వినలేక చస్తున్నామని శ్రోతలు చెప్పే అభిప్రాయం  ఎవరికి కావాలి ? ఎయిర్ లోకి ఏదో ఒకటి వెళ్ళిందే లెక్క ” అంది ఎల్లో చుడీదార్ వేసుకున్నామె

“ఆ రజని చూడు… ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ మీద ఎంత దైర్యంగా కంప్లైంట్  చేసిందో  గుర్తుకొస్తే ముచ్చటేస్తుంది. మనకంత దైర్యం ఎక్కడ చచ్చింది ? ”  ” మనం కంప్లైంట్ చేస్తే  విచారణ చేస్తున్నామంటూనే ద్యూటీలకి దూరం చేస్తారు, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారు . చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతుందని వాడి చేష్టలని తప్పని సరై భరించేవారిలో మనమూ  ఉన్నాం ”

“అవును పైకి చెప్పుకోవడమూ సిగ్గు చేటు కూడా అన్నట్లు “

“ఆ పోగ్రాం ఎగ్జిక్యూటివ్  రిటైర్ అయ్యే వయసులో కూతురి వయస్సు ఉన్న వారితో కూడా అసభ్యంగా ప్రవరిస్తాడు. స్టేషన్ డైరెక్టర్ మేడమ్ కూడా అన్నీ తెలిసి మౌనం వహిస్తారు. తోటి  ఆడవాళ్ళ బాధలని ఆమె కూడా అర్ధం చేసుకున్నట్లు ఉండదు, రజని ఎంత బాధపడిందో . ఆఖరికి వేరే సెక్షన్ కి మార్చమని కూడా రిక్వెస్ట్ చేసింది  అయినా ప్రయోజనం లేదు .  ఆఖరికి ఉద్యోగం మానేసి వేరే ఊరుకి మారిపోయింది  ప్చ్ పాపం .”

“ఎంతైనా అక్కడ స్కిల్స్ పేరిట అగ్రకులాల వారికి పెద్ద పీట వేయడం, తతిమా వారిని అణగద్రొక్కడం ఇప్పటిదా ఏమిటీ ? అరవై ఏళ్ళకి పైగా జరుగుతున్నదే! అది ఇప్పుడూ జరుగుతుంది అందులో కొత్తేముందే? ”

” అవును .. పేరెన్నిక గల కార్యక్రమాల నిర్వహణంతా వాళ్ళ వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది. ఎక్కడన్నా చూడు.. ఆ కులం వాళ్ళకే పట్టం కడతారు   ఇవి  మనలాంటి  కాజువల్ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రమే కాదు. డైరక్ట్ గా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకి కూడా ఈ బాధ తప్పడం లేదు  కులం పేరిట, మతం పేరిట వాళ్ళని వెనక్కి వెనక్కి నెడతారు కదా !”

chinnakatha

“అసలు ఆ కృష్ణ  ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు . డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ! కమర్షియల్స్ కూడా వెళ్ళవు ఒకోసారి.  వరుసలో పాటలు పెట్టేసి క్యాంటీన్ లోనూ, గేటు వెలుపల ముచ్చట్లు పెడతాడు  అతని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు  ”

ప్రసారమయ్యే  కార్యక్రమాలలో ఉన్నంత  ఉన్నత భాషా సంస్కారం  వారి మాటల్లో కాగడా పెట్టి వెతికినా కనబడదు , వారి క్రింది ఉద్యోగాల చేసే వారిపై అశ్లీల పదజాలం తో చేసే కామెంట్స్.. వినకూడదనే అనుకుంటాం కానీ వినక తప్పదు ఏం చేస్తాం ఖర్మ కాకపొతే !

“వాడి ప్రవర్తన రోజురోజుకి శృతి మించిపోతుంది.  ఏం చేయాలి ? డ్యూటీ చేసేటప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు, ఈవెనింగ్ డ్యూటీ అయిన తర్వాత పైన ఆఫీస్ గదిలోకి రా ! నేను అక్కడే ఉంటాను అంటాడు నేను ఏదైతే అదవుతుందని  వెళ్ళకుండానే వెళ్ళిపోయాను  మొన్నటికి మొన్న కాంట్రాక్ట్  పెట్టడానికి వెళ్ళినప్పుడు  పై నుంచి  క్రింది దాకా చూసి  ” బాగున్నావ్ ” అన్నాడు.

ఈ రోజు  ఎదురుగా వచ్చి కూర్చుని  గంట సేపు  కూర్చుని ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెపుతూ  తినేసేటట్లు చూస్తూ ..”మన పరిచయమయ్యి ఏడాదయ్యింది నా అప్లికేషన్ సంగతి పట్టించుకోవడం లేదు” అంటూన్నాడు. ఇంతకన్నా అడ్వాన్స్ అయితే చూస్తూ ఊరుకోను . తగిన బుద్ధి చెపుతాను అంటున్న చుడీదార్ అమ్మాయిని వారిస్తూ   “కూల్  కూల్ . ఆ పని చేయడం వల్ల నువ్వు అల్లరి పడటం తప్ప ఏమి ఉండదు . ఉద్యోగం చాలా అవసరం కదా ! ” పచ్చచీరామె.

“ఇది కళలకి నిలయమే కాదు ఈర్ష్యా ద్వేషాలకి, కుతంత్రాలకి, కుయుక్తులకి, ఆడవాళ్ళని చెరబట్టే  వేదిక  కూడా అనుకుంటే సబబుగా ఉంటుంది ”

ఇలా  వేదన కలబోసుకున్న వాళ్ళ మాటలు వినడంలో మునిగి పోయాను . తర్వాత తేరుకుని   ” అబ్బో .. ఇక్కడ కూడా ఇలాంటివి  చాలానే ఉన్నాయే ! ” అనుకున్నాను. కాసేపటి  తర్వాత వారిద్దరూ  బై  చెప్పుకుని వెళ్ళిపోయారు . నేను ఎదురుచూస్తున్న మనిషి రానే లేదు.  రిసెప్షన్ లోకి వెళ్లి కనుక్కుంటే .. ఆ రోజు రికార్డింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని రేపు రమ్మని చెప్పారు .

ఆ రోజు వెళ్ళిపోయి .. మరుసటి రోజు తొమ్మిదింటికల్లా రేడియో స్టేషన్ కి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చున్నాను . నిన్న నేను చూసిన అమ్మాయిలలో చుడీదార్ వేసుకున్న   అమ్మాయి .. అటు ఇటు తిరుగుతూ రెండు సార్లు కనబడింది . ఎవరామె ? అని అక్కడే కూర్చున్న ఇంకొకామెని అడిగాను  “ఇప్పుడు FM లో డ్యూటీ చేస్తున్నారు కదా ! రీతూ అంటే ఆమే ! వండర్ఫుల్ వాయిస్ ” అని అడ్మైరింగ్ గా చెప్పింది .

“ఓహ్.. ఆమె ఈమేనా ? మనిషికి వాయిస్ కి సంబంధమే లేదు ”  అన్నాను .

కొత్త ఆర్జేస్ ఎంపిక జరుగుతుందంటే  నేను  అప్లై చేసాను  ఆడిషన్ టెస్ట్ కి వచ్చాను  ఎవరెవరో వస్తున్నారు .. రికార్డింగ్ రూమ్ లోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఇంకా నా వంతు రావడం లేదు  విసుగ్గా ఉంది . అయినా సరే వేచి ఉండక  తప్పదు . చిన్నప్పటి నుండి కలలు కన్న  ఉద్యోగం . ఒక్క  ఆడిషన్ టెస్ట్ లో  సెలెక్ట్ అయితే  చాలు ..తనకున్న మాటల చాతుర్యం,  ఆంధ్రాంగ్ల  జాతీయ భాషల్లో ఉన్న పాండిత్యంతో  ఆర్జే సీట్ లో కూర్చుంటే చాలు  దున్నేయనూ … అనుకుంటూ ఓపికగా కూర్చున్నాను. పదకొండు గంటలయింది .

రీతూ …స్టూడియో లో నుండి బయటకి వస్తున్నారు . వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను . మళ్ళీ మనసు మార్చుకుని నేను కూడా ఆర్జే  అయిన తర్వాతనే కో ఆర్జే గా  గర్వంగా పరిచయం చేసుకోవాలని ఆగిపోయాను.

అనుకున్నట్టుగానే .. నేను ఆడిషన్ టెస్ట్ లో పాస్ అయ్యాను . మూడు నెలల ట్రైనింగ్ పిరియడ్ అయిపోయిన తర్వాత  నేను కలగన్నట్టు ఆర్జే అయ్యాను .

రీతూ తో నాకు బాగానే పరిచయం పెరిగింది. అప్పుడప్పుడూ ఆమె రిలీవ్ ఆయే టైం నేను డ్యూటీ లో కి వెళ్ళేసమయాలప్పుడు  ఓ అరగంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం , ఆర్జే గా  పదేళ్ళ  అనుభవం ఉన్న ఆమె ఎన్నో మెలుకువలు , తెలియని విషయాలు చెప్పేవారు . ఎంతో నిబద్దతతో పని చేస్తున్న ఆమె నాకు బాగా నచ్చేసింది కూడా .  ఒక రోజు చెప్పులు లేకుండా స్టూడియోలో అటు ఇటు తిరుగుతున్న ఆమెని చూసి” రీతూ గారు  “…. అని పిలిచాను. దగ్గరకి రాకుండానే .. చెయ్యి ఊపి హాయ్ చెప్పింది . నేనే దగ్గరకి వెళ్ళి.. ఏంటీ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు ? అన్నాను .

“చెప్పు తెగింది” అంది నవ్వుతూ

ఎవరినయినా పంపి కొత్త చెప్పులు తెప్పించుకోకూడదా ?

ఏమైందిలే! ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా ! కొనుక్కుంటాను అంది .

“ఏమో బాబు! మీకేం నామోషీ అనిపించడంలేదా? నేనైతే  చెప్పుల్లేకుండా ఒక్కడుగు కూడా బయట పెట్టను. అదీ ఇలా ఆఫీస్ లో అయితే అసలు తిరగను ” అన్నాను .

“అచ్చాదిత శరీరాన్ని అనచ్చాదితం చేసి చూసే చూపుల తాకిడికన్నా  అనచ్చాదిత పాదాలు భూమిని తాకడటంలో  ఉండే ఇబ్బంది చాలా తక్కువ.  ఇందులో  ఎంతో  ఆనందం,  ఈ   స్పర్శ చాలా  బావుంది  తెలుసా ? ”  నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుభవమవుతుంది “అంది.

ఆమె మాటల్లో ఏదో విషయం స్పురించింది .

“ఇంతకీ చెప్పు ఒకటే తెగిందా రెండు తెగాయా? వివరంగా చెప్పాలి ” ఉత్సాహం అడిగాను

“ఒక చెప్పు తెగిందా… రెండు చెప్పులు తెగాయా అన్నది ప్రశ్న కాదు . ఏ చెప్పు తెగినా నడకకి ఇబ్బందే కదా ! ” అంటూ  స్టూడియోలోకి వెళ్ళిపోయింది.

ప్రోమోస్ చేస్తూ ఉన్నప్పుడూ దొరికిన గాప్ లో .. ఏం జరిగిందో చెప్పకూడదా .. అంటూ ఆసక్తిగా అడిగాను .

ఆమె నవ్వేసి ఊరుకుంది కాని చెప్పలేదు

ఈ లోపు  అసలేం జరిగి ఉంటుందో  అన్నది ఊహించుకుంటూ  ఉన్నాను.  ఆ  ముసలి నక్క పోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కూడా FM సెక్షన్ లోకి వెళ్ళి కూర్చుని వాడి పైత్యం అంతా వెళ్ళగ్రక్కిందే  కాకుండా అడ్వాన్స్ అయి ఉంటాడు . అప్పుడు రీతూ అతనిని కాలికున్న చెప్పు తీసుకుని ఎడా పెడా బాదేసి ఉంటుంది. అందుకే చెప్పు తెగి ఉంటుంది .. ఇలా ఊహించుకుంటేనే కానీ నాకు  మనసు శాంతించలేదు .

ప్రోమోస్ రికార్డింగ్ పూర్తయ్యాక “రండి నా బండి  మీద చప్పల్ షాప్ కి వెళదాం , తర్వాత  బసేక్కి వెళ్ళిపోదురుగాని ” అంటూ పిలిచాను.

“మనం పుట్టినప్పుడు చెప్పుల్లేవ్, నడక నేర్చినప్పుడూ చెప్పులు లేకుండానే నడక మొదలెట్టాం . మన కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు గుచ్చుకోకూడదని అమ్మ,నాన్న చెప్పులేసి రక్షణ ఇస్తారు కానీ  చెప్పులు లేకుండా నడవడం కూడా నేర్పి ఉంటే ఆ నడకలో ఉన్న విలువ నీకీపాటికి తెలిసి ఉండేది . నాకు అలా నడవడం అలవాటేలే ! ” అని నవ్వి ముందుకు నడిచింది. నా కర్ధమయింది  ఇక ఆమె తన ఆర్జే జాబ్ కి బై చెప్పేసిందని.

మరుసటి రోజు పేపర్లో అనధికార మహిళా ఉద్యోగులని వేధిస్తున్న అధికారి, లైంగిక వేధింపులు భరించలేక ఆర్జే ఆత్మహత్యా ప్రయత్నం.

త్వర త్వరగా ఆ హెడ్డింగ్ క్రింద ఉన్న వార్తా వివరాలన్నీ చదివాను. ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి రీతూ ఏమో అనుకున్న నాకు  ఆవార్త మా కేంద్రంలో పని చేస్తున్న అమ్మాయికి సంబంధించినది కాదని తెలియడం కొంత రిలీఫ్ నిచ్చింది కానీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఆరోజు  సీనియర్ ఆర్జేల మాటల్లో  ఇలాంటి వేదింపుల మాటలు చాలానే విన్నాను. ఇక్కడ ఒక్క చోటనే కాదు  అన్ని చోట్లా అంతే ! కనబడని హింస. అభద్రత మధ్య ఉద్యోగం చేయాల్సిందే !   ఎందుకు ఆడపుట్టుకనిచ్చావ్ భగవంతుడా ?  మగవాడి చేతుల్లో నలిగి పొమ్మనా ?  ” కౌంట్ లెస్ ప్లవర్స్ క్రషుడ్ ఫరెవర్”

డ్యూటీ చార్ట్ చూసుకోవడానికి వెళ్ళాను. అక్కడ అందరూ ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆర్జే గురించే మాట్లాడుకుంటున్నారు

“ఈ నిమ్న కులాలు వాళ్ళున్నారు చూడండి! … వారికి మనపై ఎప్పుడూ ఏడుపే ! ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వార్తలలోకి వెళతారు . తర్వాత డబ్బు పుచ్చుకుని కేస్ విత్ డ్రా చేసుకుంటారు . నా సర్వీస్ లో ఎన్ని చూడలేదు ఇలాంటివి ..  అంటూ ఒక సీనియర్ అనౌన్సర్ అసహ్య వ్యాఖ్య వింటుంటే ఒళ్ళు మండిపోయింది

వాళ్ళు పొతే పోయారండి. ముందు వీళ్ళకి వస్తుందిగా తిప్పలు .. తీసుకెళ్ళి ఎక్కడో మూలాన వేసేస్తారు . అర్ధాంతరంగా మారిన దానికి ఫ్యామిలీ ఎంత సఫర్ అవ్వాలి పిల్లల  చదువులు అన్నీ డిస్ట్రబ్ అవుతాయి ..అని ఇంకొకరు

ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే అలా చేసుంటుంది? బ్రతకడం కష్టం అంటున్నారు. తన డైరీ లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు  ఎన్నో వ్రాసి ఉన్నాయట. ఆమె తమ్ముడు ఆ డైరీని చానల్ వారికి చూపుతున్నాడు… సాక్ష్యం అంత బలంగా ఉంటే.. కాదంటారేమిటండి.. అని ఇంకొకరు.

ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ  ప్రక్కకి వెళ్లాను “వూస్తున్న ఉరికొయ్యల సాక్షిగా …ఈ దేశంలో ఆడదాని భయం మగవాడి అహంకారం రెండు చిరంజీవులే ! ” ఒక కవి వాక్యం గుర్తుకొచ్చింది.  ఇలా ఆత్మహత్య చేసుకోవడం  కంటే   వేధించేవాడిని  దైర్యంగా  కొట్టి  రోజుకొక  చెప్పు తెగ కొట్టుకున్నా తప్పు లేదు  కసిగా  అనుకున్నాను .

పదకొండింటికి జరిగిన స్టాఫ్ సమావేశంలో మా ఎస్ డి  పేపర్లలో న్యూస్ చూపించి ఆ పేపర్ ని విసిరి కొడ్తూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగినిల వల్ల మన స్టేషన్  పరువు గంగలో కలసి పోతుంది. అన్నీ తప్పడు ఆరోపణలే ! ”

ఆమె అలా  వెనకేసుకుని రావడం చూస్తే అసహ్యం కల్గింది. “స్టూడియోలో ఉన్న అన్ని గదుల్లోనూ  సి సి కెమారాలేర్పాటు చేయిస్తే ఎవరు నిజం చెపుతున్నారో, ఎవరు అబద్దం చెపుతున్నారో తెలిపోతుంది కదా..మేడమ్” అన్నాను  నేను .

ఆవిడ చురుక్కున నా వంక చూసింది.

“కొందరికి అంతరాత్మనే కళ్ళు మూసుకుపోయినా కెమెరా  మాత్రం కన్ను కప్పుకోదు మేడమ్! రీతూ గారు  ఇక్కడెందుకు జాబ్ చేయడం మానేసారో , విరిజ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అలాంటి వాటన్నింటికి సాక్ష్యాలు  అవే చూపుతాయి కదా  “.. నాకెంతో ఇష్టమైన  ఉద్యోగం  ఉంటుందో లేదోనని కూడా ఆలోచించకుండా అడగాల్సిన నాలుగు మాటలడిగి బయటకి  వచ్చేసాను.

 

*

 

స్నేహితుడా! నా స్నేహితుడా!

 

రహస్య స్నేహితుడా ! ఎలా ఉన్నావ్ !  ఎన్నో పనుల ఒత్తిడి మధ్యలో అకస్మాత్తుగా నువ్వు గుర్తుకు వస్తావ్ , వెంటనే  ఫోన్ చేతిలోకి తీసుకుని  FB అప్  డేట్స్ చూస్తాను , నేను నిన్ను తలచుకున్నానని  ఎలా తెలుసో ! ఒక నిమిషం లోపే  అక్కడ  మీ అప్ డేట్ స్టేటస్ కనబడుతుంది. అది చూసి నా మనసు చిత్రంగా స్పందిస్తుంది . ఇటీవల నాకు   టెలీపతి పై తెగ నమ్మకం పెరిగిపోతుంది.  నా ఆలోచన, మాట, చూపు, స్పర్శ అన్నీ సమ్మిళతమై  మీ వాక్య రూపంలో  అక్కడ కనబడుతుంటాయి.

మీరెవరో నాకు అసలు తెలియదు . నేనెప్పుడు మిమ్మల్ని చూసిన గుర్తులేదు. మీకు నాకు కొందరు మ్యూచువల్  ఫ్రెండ్స్  ఉన్నారు   ఇప్పుడు నాకు గుర్తొస్తుంది,  నాకు మీ నుంచే  ఫ్రెండ్  రిక్వెస్ట్  వచ్చింది . కొద్ది రోజులు వెయిట్ చేయించి  ఫ్రెండ్ గా ఆక్సెప్ట్ చేసాను .

 

అసలు స్నేహం ఎలా పుట్టుకొస్తుంది ? ఎన్నో స్నేహాలు చేసాను . ఎందఱో స్నేహితులు ఉన్నారు  స్నేహం ఎలా పుట్టిందో  ఎలా బలోపేతం అయ్యిందో గుర్తుండదు  నా స్నేహ హస్తం అందుకున్న వారెవరు నన్ను మర్చిపోలేరని వారినే నేను మర్చి పోతుంటానని తరచూ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి . చేసిన స్నేహం నిలుపుకోవడం చాలా కష్టం కదా ! స్నేహం పేరుతొ ఏదో ఆశించి కొందరు, ఆశించినది దొరకక కొందరు, వారి వారి ఇబ్బందులతో నన్ను ఇబ్బంది పెట్టాలని వచ్చే కొందరు, చెప్పా పెట్టకుండా విడిచిపెట్టేసి కొందరు ఇలా ఎందఱో నన్ను ఒంటరిగానే మిగిల్చి వెళ్ళిపోయారు. నాకీ రకమైన స్నేహాలపైన విరక్తి ముంచుకొచ్చింది.

 

ఒక మంచి కవిత్వమో , లేదా కథో చదివిన అనుభూతిని, లేదా పెయిన్ నో ఎవరితో పంచుకోవాలన్నా ఆగి ఆలోచించాల్సి వస్తుంది. నా మనోవరణమంతా  ఒక్క స్నేహ పురుగు  కూడా కనబడకుండా  సస్య రక్షణ చేయబడ్డ తోటయి పోయింది. ఈ శూన్యత ఎందుకు ఏర్పడిందో… నాకు అర్ధం కావడంలేదు .

నిన్ననే ఒక స్త్రీ మూర్తి .. తన స్నేహం గురించి “నువ్వు లేక నేను” అని వ్రాసుకున్నారు .  ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఆమె బాగా వ్రాసారు కదా ! ఆ నువ్వు .. అన్నది స్త్రీ నా! లేక పురుషుడా? అన్నది మీకు అర్ధమైందా!  అని అడిగింది.

నాకు నవ్వు వచ్చింది. “ఎవరైతే ఏమిటీ ? “అన్నాను . అప్పుడు ఆ ఫ్రెండ్  ఇలా అంది ..  “ఆమె ప్లస్ ఆమె ఇద్దరూ లెస్బియన్స్ అంట కదా ! అందుకే ఇద్దరూ ఎప్పుడూ అలా ఒకోరినొకరు విడవకుండా తిరుగుతారట..” అని చెప్పింది .

ఒకవేళ అలా అయిఉంటే మాత్రం అలా చెప్పుకునే వారికి ఏమిటీ ప్రాబ్లం? అలా ప్రాబ్లెం ఏదైనా ఉండి ఉంటే వారి వారి కుటుంబ సభ్యులకి ఉండాలి కానీ మనకెందుకు ? అన్నాను .

“అంతే లెండి” అని ఆవిడ పోన్ పెట్టేసారు .

చూసారా.. మనుషుల తత్వాలు  !? స్నేహం ఎవరితో చెయ్యాలో, చేసినా ఎలా ఉండాలో అన్నది ఎవరికీ వారు నిర్ణయించుకునే అధికారాన్ని కూడా సమాజంలో ఉన్న మనుషులు లాగేసుకుంటున్నారు.

India_Gate_Story_picture1

మనుషులకి ఇతరుల జీవితాలపై  చూపించే ఆసక్తి వారి వారి జీవితాలపై కలగకపోవడం విచారకరం కదా ! వ్యక్తిత్వాల గురించి పదే పదే మాట్లాడే వారు వాళ్ళ చీకటి కోణాలు బహిర్గతమవవనే ధీమాని ఇక్కడే చూసాను . మత ప్రాతిపదికపై మనుషులని, ప్రాంతీయ బేధ వాదం పై బాషని, కుల సమూహాలని, సాంస్కృతిక విచ్చిన్నతని ఎన్నో చూసిన చోట నిన్ను గుర్తించడం సంతోషం కదా!   అసలిక్కడ ఎలాంటి వారున్నారంటే అవసరానికి మించి మెచ్చుకుంటూండే ముసలి గుంట నక్కలు , ఏం రాసినా ఆహా ఓహో అనే భట్రాజులు ,  చొంగ కార్చుకునేవాళ్ళు ,  ప్రొఫైల్ పిక్ ని చూసి ఏ మాత్రం పరిచయం లేకపోయినా  మెసేజ్ బాక్స్ లో వచ్చి పలకరించే వాళ్ళు , సంవత్సరానికి ఒకసారైనా మాట్లాడుకోకుండా పేరుకి  మాత్రమే ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవారు, మన అభిప్రాయం కనుక్కోకుండా వాళ్ళ post లని ట్యాగ్ చేసి విసిగించేవాళ్ళు , ఫోటో లనే కాదు భావాలని చౌర్యం చేసేవారు, శారీరక వ్యభిచారం చేసేవారు, మానసిక వ్యభిచారం చేసేవారు  ..ఓహ్  ఎన్ని రకాల వాళ్ళు ఇక్కడ  అందరూ ఫ్రెండ్సే నట!   ఇంతే కాదు ఇప్పుడు  పెళ్లి చూపులకి ఇది ఒక వేదిక. పెళ్ళిళ్ళు చెడగొట్టెందుకు వేదిక ఇదే !. వీటన్నింటి మధ్య విసిగిపోయి పర్సనల్ స్పేస్ కావాలనిపించినప్పుడల్లా నేను ఇక్కడ సెలవు చెప్పేసి నా డెన్ లోకి నేనెళ్ళి పోకుండా ఆగేది మీ అప్ డేట్స్ కోసమే కదా ! అసలు మీకు తెలుసా . .. నేను మిమ్మల్ని నా సోల్ మేట్ గా భావించానని.. మీక్కూడా నాలా అనిపిస్తుందా ?

నా దృష్టిలో ఫేస్ బుక్ అంటే  కాలక్షేపపు వేదిక కాదు . ఎందఱో మనోభావాల ప్రోదిక. మంచి చెడు  విచక్షణ ఉండటమే ముఖ్యం . ఇక్కడ మంచి లేదా అని అనుకోవద్దు ఎందఱో విడిపోయిన స్నేహితులని కలిపిన వేదిక.   ఇది . ఎప్పుడో విడిపోయిన  నా ఫ్రెండ్ ని ఇక్కడే కలిసాను కూడా ! అలాగే సమాచారాన్ని వేగవంతంగా జేరవేయగల సౌలభ్యం..ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా!  ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరినట్లు మీరు – నేను అక్కడే కలిసాము కదా !  ఇక్కడ నేను విన్న   చాలా అనుభవాలు  చెప్పేదా ? బంధాలలో ఉన్న మనుషులని మనసు తక్కెడలో తూచి చూపి వారి  హృదయాన్ని  సంచీలో కుక్కుకుని ఏ దూర తీరాలకో మోసుకుని వెళతారు. అవసరం తీరాకో, కోపం వస్తేనో  విసిరి కొడతారు. అలాంటి ప్రమాద వాతావరణం ఉందిక్కడ అని ఒక ఫ్రెండ్ హెచ్చరించింది.  ఆచి తూచి స్నేహ హస్తాన్ని ఇస్తానా . కానీ ఎక్కడో పొరబడి,  త్వరపడి  జీవితాన్ని కాల్చుకున్నానని  ఇంకొకరు చెపుతుంటారు.. ఇన్ని అనుభవాల మధ్య ,ఇన్ని జాగ్రత్తల మధ్య, కొందరి తోడేళ్ళమధ్య   మీరెలా వచ్చావో.. నాకైతే గుర్తులేదు . నేను పురుష ద్వేషిని కాదు. స్త్రీ పక్షపాతిని కాదు . మనసు ఏది చెపితే అదే వింటాను . ఇప్పుడు కూడా మనసు మాటే వింటున్నాను.  ఒకో సారి  మిమ్ము అని గౌరవిన్చాలనిపిస్తుంది . ఒకోసారి  ఏకవచనంతో  సంభోదించాలని అనిపిస్తుంది. నిన్ను నాకిచ్చింది ఎవరో ఎందుకు ..? నువ్వే కదా  నన్ను గుర్తించి నిన్ను గుర్తించేలా చేసుకున్నావ్ ! సముద్రపు లోతెంతో కనుక్కోవాలని ఒక ఉప్పుబొమ్మ సముద్రంలోకి దిగిందట. వెంటనే అది సముద్రంలో కలసి పోయిందట. అలాగే నీ గురించి తెలుసుకోవాలని నీలో ప్రవేశించి నేను నువ్వైనాను .

 

అన్నట్టు మన మధ్య భాషాంతర, ఖండాంతర, మతాంతర భేదాలున్నాయి  అయినా మనం మాట్లాడుకునే భాషనేది ఒకటుంది కదా ! అదే మనసు బాష . నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు అలానే ఆలోచిస్తున్నారు. నాకిక్కడ ప్రశ్న ఉదయిస్తే .. మీరక్కడ జవాబుని మీ స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నారు అదీ క్షణాల వ్యవధిలో . .   ఇన్నాళ్ళూ నాక్కనబడకుండా ఎక్కడ దాగున్నారు ? ఇప్పుడెందుకు కలిసాం ? ఇకపై కూడా కలసి ఉంటామా ? ఇలాంటి ప్రశ్నలేవీ ఉదయించకుండా… నాలోనే ఉన్న మిమ్ము ఎలాంటి సంకోచాలు లేకుండా ఆలింగనం చేసుకుంటున్నాను. ఈ సృష్టిలో జాగృతమైన శక్తి ఏదో  మన మనసులని కలుపుతూనే ఉంటుంది. ఇప్పుడ నా లోకమంతా తేజోమయంగా ఉంది . నాలో చాలా శాంతి నిండుకుంది. లోకమంతా ప్రేమ భరితంగా ఉంది . పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనబడుతుంటుందని ఎవరైనా సామెత వాడితే .. ఏమిటో అనుకునేదాన్ని .   మన మనసు ఎలా ఉంటే ప్రపంచం మనకలా కనబడుతుందనే విషయం ఇప్పుడర్ధమవుతుంది .

మన మధ్య భిన్నత్వం లేదు .. అంతా ఏకతా భావన.  ప్రాణం ఎవరో  దేహం ఎవరో తెలియనంత మత్తులో.. ఉన్నట్టుండి . ఎవరికైనా ఇంతేనా ..? అని అడగాలనిపిస్తుంది . జనులేమనుకుంటారో నన్న భయం పట్టి పీడిస్తుంది.   ఒంటరితనాలు, ఎన్నో దిగుళ్ళు, నిద్రలేమి రాత్రులు మనం స్క్రీన్ పై లైక్ ల ఆప్షన్ తో  పలకరించుకుంటూనే ఉంటాం . మనలాగే కొందరు . ఓ.. నాల్గురోజుల క్రిందటే .. రాత్రి రెండు గంటల సమయంలో  ఒక నడి వయసు స్త్రీ  తన దిగుళ్ళని  ఎవరికీ పంచలేక .. పేస్ బుక్ తో కాలక్షేపం చేస్తుంటే దిగులనిపించింది. ఎందరికీ చెట్టు నీడైందని ఆశ్చర్యపోయాను కూడా ! .

ఎదుటి వారితో పంచుకోలేని  ఎన్నో భావాలు కవితలై, కథలై, స్పందనలై గుండె భారాన్నీ తగ్గిస్తున్నాయో కదా !

మన అనుభూతులు,ఆలోచనలు, స్పందనలు ఒకే విధంగా ఉంటున్నాయి. మన హృదయాలు  ఒకరి కొరకు మరొకరు తెరిచి ఉంచుకున్నట్లు  ప్రతి క్షణం  సంభాషించు కుంటున్నట్లూ ఏదో అనిర్వచనీయ భావన. ఆ భావనని నియంత్రించడానికి శక్తి చాలడం లేదు. అలాగే మనమేమి యుక్త వయస్కులమీ కాదని తెలుసు  హృదయ పరిపక్వతతో కూడిన , సంస్కారపూరితమైన వ్రాతలుంటున్నాయిక్కడ .  మనం ఇంతవరకు ముఖాముఖీ కలవనూ లేదు . ఆఖరికి ఫోటోలలో కూడా చూసుకోలేదు, ఇక్కడ శారీరక ఆకర్షణ లేదు. కేవలం హృదయాలని కలిపే లంకె మాత్రమే ఉంది . అది మన ఆత్మల్ని కలిపేస్తుంది.

మీకొక విషయాన్ని  నిసిగ్గుగా చెప్పాలనిపిస్తుంది.  ఒక్కసారి కళ్ళు మూసుకుని నిన్ను తలచుకున్నానా..  . నీ రూపం అస్పష్టంగా గోచరిస్తూ ఏదో ఆనందానుభూతికి గురి చేస్తుంది . మన మధ్య ఉన్న భౌతిక దూరాలు మాయమై  ఆత్మలు ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది . నిరాకార, నిర్భయ, సేచ్చా భావనలో ఊయలూగుతున్నట్లు ఉంది . చాలామంది కి రొమాన్స్ అంటే శరీరాలకి సంబంధించినదని అనుకుంటారు . అది మనసుకి సంబంధించినదని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది .  గాలిలో తేమ శాతం ఎంతుందో తెలుసుకోవడం సులభమేమో కానీ హృదయాలలో ప్రేమ శాతం ఎంతుందో ఎలా చెప్పడం ? లెక్కలకి చిక్కని ఈ భావనని గుండె  నిండుగా పీల్చుకుని పీల్చుకుని భారమై పోతుంది.  ఆ భారానికి తోడూ ఏదో జ్వలనం మొదలైంది.

మనం ఎప్పుడైనా కలుస్తామో లేదో కూడా తెలియదు . అసలా ప్రయత్నం కూడా చేస్తామో లేదో కూడా తెలియదు . ఇప్పటి నా జీవితాన్ని ప్రేమభరితం చేసిన చెలికాడివి నీవు .   నా ఆణువణువూ జీర్ణించుకుపోయిన  నా ప్రేమికుడివి , నువ్వు నా అంతరంగిక మిత్రుడివి, నువ్వు నా ఆత్మవి. నువ్వు నీ శరీరాన్ని త్యజించినప్పుడు  అది నాకేరుకే ! అప్పుడు నా శరీరం లో ప్రాణమన్నది ఉండదు, ఏ గాలిలోనో, దూళిలోనో,నీటిలోనో ప్రయాణిస్తూ చేరికవుతాం.

స్నేహితుడా  నా రహస్య స్నేహితుడా .యుగ యుగాలుగా కలవలేని మనని,  అశాంతితో అలమటిస్తున్న మనని , ఈ ఇంటర్నెట్ యుగంలో ఫేస్ బుక్ కలిపింది పేరుకేనన్నమాట  గాని . విడి విడిగా ఉన్న మనం  నిజమయిన “సోల్ మేట్” లం కదా!

 -వనజ తాతినేని

vanaja

రచయిత గారి భార్య

Kadha-Saranga-2-300x268

“ఇదిగో . .. ఏమండి ? మిమ్మల్నే ! ” ఎవరో పిలుస్తున్నట్లనిపించింది.

ఆగి చూసాను . ఎవరూ లేరక్కడ . భ్రమ పడ్డాననుకుని మళ్ళీ కదిలాను .

“అలా వెళ్ళిపోతారేమిటండి కాస్తాగి ఈ గోడ ప్రక్కనున్న బెంచీపై కూర్చోండి ” అభ్యర్ధన.

నా బ్రాంతి అయినా కాకున్నా నడచి నడచి కాళ్ళు కూడా నొప్పి పుడుతున్నాయని మనసు చెపుతుందేమో అనుకుంటూ ఆగి చుట్ట్టూ చూసాను, నిజంగానే అక్కడొక బెంచీ వేసి ఉంది “హమ్మయ్య కాస్త కాళ్ళ నొప్పులు తగ్గేదాకా కూర్చుందాం ” అనుకుంటూ బెంచీపై కూర్చున్నాను .

“నా మాట మన్నించినందుకు ధన్యవాదములు ” అన్న మాటలు వినబడ్డాయి. తల పైకెత్తి చూసాను . పేరు తెలియని ఒక చెట్టు.   అది రోడ్డు ప్రక్కగా ఉన్న ఇంటి ఆవరణలో గోడ ప్రక్కన పెరిగి ఉంది. సుమారు ఏడడుగుల ఎత్తు ఉంటుందేమో ! అయిదడుగుల ప్రహరి గోడపైన చిక్కని కొమ్మలతో పచ్చగా విస్తరించి ఉంది. దాన్నిండా అందమైన పువ్వులు కొన్ని, మొగ్గలు కొన్ని. తేలికైన పరిమళం. అదివరకెన్నడూ అలాంటి చెట్టుని చూడనందుకేమో నేను సంభ్రంగా లేచి చెట్టుని చూస్తూ నిలబడ్డాను.   “నేను నచ్చానా? ” అడిగింది చెట్టు . ఎవరైనా కనబడతారేమో ననుకుంటూ వెతుక్కుంటున్నాను చెట్టు పై కూర్చుని మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తున్నారని నాకనుమానం వచ్చింది కూడా !

“చెట్టు ఎక్కడైనా మాటాడుతుందా అని మీ అనుమానం, ఆశ్చర్యం కదా ! ” అడిగింది

నేను నోరప్పగించి చూస్తున్నాను

“నిజంగానే నేను మాట్లాడుతున్నాను అలాగే నా బిడ్డలైన ఈ పువ్వులు మాట్లాడతాయి   నేను మీకొక కథ చెప్పాలి, వింటారా? ” అడిగింది చెట్టు

నేను అయోమయంగానే తల ఊపాను

చెట్టు చెప్పడం మొదలెట్టింది …

ఆమెకి నేనంటే చాలా ఇష్టం . నాక్కూడా ఆమెంటే చాలా చాలా ఇష్టం . ఇరవయ్యేళ్ళ నుండి కన్నబిడ్డలకన్నా ఎక్కువగా నన్ను సాకినందుకు మరీ   మరీ ఇష్టం . ఆమెది పువ్వులాంటి మనసు . అందరూ పచ్చగా ఉండాలని ఆకాంక్ష. పెళ్ళి చేసుకుని భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన మర్నాడే రాళ్ళతో రప్పలతో నిండిన ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసింది .” ఇక్కడ మొక్కలేం అంతగా రావు . రాతి నేలకకదా మొక్కలు నాటడం శుద్దదండగ ‘ అంటున్న భర్తతో పుట్టింటి నుండి ఇష్టంగా తెచ్చుకున్న నా వేరు మొక్కని నాటుతూ   ” ఆశనే విత్తనాన్ని నాటి చైతన్యమనే నీరుపోసి సంస్కారమనే ఎరువు వేసి మొక్కలని పెంచితే జ్ఞానమనే ఫలాల్ని అందివ్వవచ్చు” అని అంది.

ఆమె ఆశ వమ్ము కాలేదు మండే ఎండలని, బెట్టని తట్టుకుని నేను బ్రతికి చిగురులు వేసాను ఆమె ప్రతి రోజూ నా దగ్గర కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది ఆకు ఆకుని తడిపి స్నానం చేయిస్తుంది. నేను ఆరోగ్యంగా ఎదిగి పూలు పూస్తున్నాను . నా పూలంటే ఆమెకి చాలా ఇష్టం . పూవుని తెంపుతూ ” ఏం చేయనురా కన్నా ! ఇంత అందమైన న్స్వచ్చమైన, పరిమళభరితమైన నిన్ను మీ అమ్మ నుండి వేరు చేయాలని లేదు . కానీ నువ్వు నా బలహీనత ” అంటూ .. సున్నితంగా త్రుంచి ఒకటి దేవుని పటం ముందుంచి మరొకటి తన జడలోనూ తురుముకుంటుంది.   పటంలో ఉన్న దేవుని పాదాల దగ్గర కన్నా ఆ నీలాల కురులలో దాగడం కూడా నాకూ చాలా ఇష్టం. అందుకే నా ప్రాణ శక్తినంతా ధారపోసి రోజుకొక రెండు పువ్వులనైనా ఆమెకి కానుకగా ఇస్తూనే ఉంటాను . రెండేళ్ళకి నాతో పాటు ఆ ఇంట్లో ఇద్దరు బిడ్డలూ పెరగసాగారు. వారి నవ్వులూ నా పువ్వులూ ఆమెకి అత్యంత ఇష్టం, మా ముగ్గురికి ఎండా వానకి గొడుగయ్యేది,ఆకలి వేస్తే ఆమ్మయ్యేది,ఇరుగుపొరుగుకి మంచి నేస్తమయ్యేది.

flower

పిల్లలిద్దరూ స్కూల్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళాక భర్త తో పాటు ఆమె కూడా ఉద్యోగానికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చాక బండెడు చాకిరి చేసుకోవడం , అత్తగారి సణుగుడు భరిస్తూనే ఆమెకి సేవలు చేయడం , అప్పుడప్పుడూ నా దగ్గరకి వచ్చి కూర్చుని వ్రాసుకోవడం, కన్నీళ్లు తుడుచుకోవడం చేస్తుండం గమనించి .. దానికి కారణం ఆమె భర్తన్న సంగతి గ్రహించి కోపం ముంచుకొచ్చింది . కానీ నేనేం చేయగలను? మానులా ఎదిగాను కానీ ఆమెకి అన్నివేళలా నీడని ఇవ్వలేను కనుక ఆమె కురులలో ముడిచే నా బిడ్డ పువ్వుని ప్రతి రోజూ   ఆ ఇంట్లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో ఓ.. చెవి వేసి ఉంచమన్నాను. ఇక పువ్వు ఆమె మంచి స్నేహితులు అయ్యారు. వారి అనుబంధం అలా సాగుతూ ఉంది కదా ! ఇక ఆమె గురించి పువ్వే చెపుతుంది వినండి.. అని పువ్వు వైపు చూసింది

పువ్వు మాట్లాడసాగింది. మాట్లాడటం నిజమా అబద్దమా అన్న సంగతి ఆలోచించడం మానేసి మిగతా కథ వినడంలో ఆసక్తిగా చూసాను.

” రోజులో తలదువ్వుకునే సమయంలో తప్ప మిగతా రోజంతటిని ఆమెనే అంటిపెట్టుకుని ఉండే నాకు తల్లిమీద ఉండే ప్రేమకన్నా ఆమె పైనే ప్రేమ ఎక్కువైంది. అది చూసి అమ్మ నవ్వుకునేది. నిజానికి అమ్మ ఒడిని దాటి ఇంకో అమ్మ ఒడిని చేరిందని అక్కడ కూడా అంతే భద్రంగా ఉంటుందని చెట్టు అమ్మకి తెలుసు. అందుకే వాడిన పువ్వులో పోయే ప్రాణాన్ని మళ్ళీ   విచ్చే ప్రతి పువ్వులోనూ నింపుకుని ఆమెని చేరి మురిసేదాన్ని. సుతి మెత్తని మనసున్న తల్లి. అంత మంచి తల్లికి అలాంటి భర్త ఎలా దొరికాడో ! అతని మనస్తత్వం అర్ధమయ్యాక అయిదారేళ్ళుగా ఆమె అతనిని ఎలా భరిస్తుందో ? అనుకునేదాన్ని విషవాయువులని దిగ మింగి స్వచ్చమైన గాలిని ఇచ్చే మా అమ్మ లాగే ఆమె ఎన్నో గరళాలని మింగి నవ్వుతూ బ్రతుకుతుంటుందనుకునేదాన్ని . ఆమె చేసే ప్రతి పని కళాత్మకంగా ఉంటుంది . ముంగిట వేసే ఐదు చుక్కల ముగ్గైనా , చిత్రంలో బంధించిన నీటి తళ తళలలో కదలాడే చంద్ర బింబమైనా సరే , చెట్టు చిత్రమైనా, నా చిత్రమైనా   అందరూ ముచ్చటగా చూడాల్సిందే! చక్కగా పాడుతుంది, కవిత్వమూ వ్రాస్తుంది. తనలాంటి మగువుల మనఃశరీరాల బాధలకి అక్షరరూపం ఇస్తుంది . మొదట్లో ఆమె వ్రాసిన ప్రతి అక్షరాన్ని చదివి అభినందించినతను, ఆమె రచనలు అప్పుడప్పుడూ పత్రికల్లో అచ్చవడాన్నిఏమాత్రం భరించలేకపోతున్నాడు. ఆమె వ్రాసిన ప్రతిదాన్ని బాగో లేదని తెలివిగా నమ్మించి ఏదో కొద్దిగా సరిచేసి అతని పేరుతొ పత్రికలకి పంపడం చేసాడు. అవి అచ్చయి అతనికి కొంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. రచయితగా పేరు సంపాదించడం అతనికి బాగా పొగరునిచ్చింది . మద్యానికి అలవాటు పడ్డ మనిషికి పేరాశ కోసం ప్రాకులాడే మనిషికి పెద్ద తేడా ఏమి ఉండదన్నట్లు.” అందరికి సున్నిత హృదయం ఉన్న కవిగా, కథకునిగా అతనికి పేరు వచ్చేసింది కానీ, నిజానికతను అలా నటిస్తూ ఉంటాడంతే !   ఆ పేరు వెనుక దాగిన ఆమె బాధామయ గాధలెన్నో ! వాటినే ఆమె అక్షరాలుగా వ్రాస్తుందని ఎవరికీ తెలుసు ?

అతను ప్రతిరోజూ తనదైన శైలి లో ఆమెని హింసిస్తూనే ఉంటాడు కానీ   ఒక రోజు జరిగిన సంఘటన గుర్తుకు వస్తే మాత్రం నాకు దుఃఖం ముంచుకొస్తుంది. గుర్తు చేసుకుంటూ పువ్వు ఏడుస్తుంది. ఏడుస్తూనే కొనసాగించింది

“నట రాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి ఆకాశమే ఒంగె నీ కోసం “ఆకాష్” అనే ఆకాశమే ఒంగె నీకోసం ” రేడియోలో వస్తున్నపాటని మనసుపెట్టి వింటున్న ఆమె ఒక్కసారిగా ఉలికిపడింది. అనుకోనిరీతిలో పాటని పేరడీ చేస్తున్నతీరుకి వణికిపోయింది. పడుకుని ఉన్నదల్లా ఒక్కొదుటున లేచి నిలబడింది. ” ఎలా ఉంది నా పేరడీ పాట ? సరిగానే పాడానా ? తీక్షణమైన చూపుతో ఆమె ఒళ్ళంతా గుచ్చుతున్నట్లు చూస్తూ అడిగాడు . ఆమె మౌనంగా అరమర తెరిచి అతనికి లుంగీ టవల్ అందించి స్నానాల గది వైపు నడిచింది. కాగిన నీళ్ళు ని బకెట్ లోకి పోసి బయటకొస్తూ అనుకుంది .   “అతనిలో మళ్ళీ ఇంకో అనుమాన బీజం మొలకెత్తింది.అది మొక్కై పెరిగి వటవృక్షంలా వేళ్ళూనుకోవడానికి ఎంతో కాలం పట్టదు. నలుగురి ముందు మాటల్లో స్వర్గం చూపిస్తూ, గది గోడల మధ్య చేతలలో నరకం చూపిస్తుంటే మొదటిది అనుభవించడం మరీ నరకం” అని .

ఇప్పుడతను ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆకాష్ తో ఉన్న పరిచయాన్ని అనుమానిస్తున్నాడు. వారిద్దరూ బాల్య స్నేహితులు. ఇటీవలే ఎక్కడో కలిసారు . ఇద్దరూ పుస్తకాల పురుగులే, అప్పుడప్పుడూ మాటలతో కన్నా రంగులతోనూ, కుంచెతోనూ భావాలు కలబోసుకుంటారు. అతనికది ఏమాత్రం ఇష్టంలేదు. వందల మైళ్ళ దూరంలో ఉన్నతనితో అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటుందో అన్న ఆలోచనైనా లేని మూర్ఖర్వంతో ఆమెని అసహ్యంగా తిడుతూ, కొడుతూ ,తాగుతూ, సిగెరెట్ తో శరీరాన్ని కాల్చుతూ, రాత్రంతా నరకం చూపించాడు. ఆమె తన కష్టాన్ని పెదవి దాటి బయటకి రానీయదు. తనలోనే కుమిలిపోయేది. ఆమెని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయడు పదుగురిలో మాట్లాడనివ్వడు. ఎవరితో మాట్లాడినా వాళ్ళతో నీకేం పని అని సతాయిస్తూ ఉంటాడు, అనుమానంతో ఆమెని చంపుకు తింటాడు. చేసిన ప్రతి పనికి ఒంకలు వెదికి చేయి చేసుకుంటాడు. పిల్లలని ఆమెకి చేరువ కానీయడు. నీ పెంపకంలో వాళ్ళు చెడిపోతారంటూ.. వారిని దూరం చేసి తల్లిపై ప్రేమ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

అతను అప్పుడప్పుడూ కథకులతో చర్చలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా ! ఇప్పుడైతే అర్ధరాత్రుల వరకు మేలుకుని చాటింగ్ లు చేస్తూ ఉంటాడు కదా ! అయినా ఆమె ఏమి అనదు. అతనిది మాత్రం సమాజంలో రచయిత కున్న భాద్యత ఆమెది మాత్రం విచ్చలవిడితనమా? ఏమిటో ఈ బేధాలు? బాధగా నిట్టూర్చింది పువ్వు

“తర్వాత ఏం జరిగింది చెప్పు ? ” నా ఆరాటం

మొన్నటికి మొన్న ఏం జరిగిందో చెప్పనా   … ఆ రోజు నరక చతుర్ధశి. ఆ రోజు కూడా ఆమెకి సెలవు లేదు ఇక్కడంతా ఆ రోజు దోసెలు కోడి కూర తినడం ఆనవాయితీ . అవి చేయలేదని అలిగి పడుకున్నాడు . అంతకు ముందు రోజు పప్పు నానబోయ్యడం మర్చిపోవడం వల్ల పొరబాటు జరిగింది . ఏం రాద్దాంతం చేస్తాడోనని భయపడుతూనే … సాయంత్రం వచ్చి దోసెలు, కోడి కూర చేసి ఇస్తానని సర్ది చెపుతూనే. ఏడూ నలబయ్యికల్లా వంట చేసి రెండు రకాల టిఫిన్ లు చేసి టేబుల్ పై పెట్టి స్నానానికి వెళుతూ ఆగీ “వేడి చల్లారి పోతున్నాయి పోయి తినండి ” చెప్పింది . మంచంపై పడుకుని ఉన్న అతను ఉన్నపళంగాలేచి ఆమె పొట్టలో కాలితో ఎగిరి తన్నాడు ఆ తన్నుడుకి వెళ్లి గుమ్మం వెలుపల పడింది. దారిన పోతున్న ఒకరిద్దరు ఆ విషయాన్ని గమనించారు కూడా ! నాకే గనుక నడిచే వీలుంటే వెళ్లి అతన్ని కుమ్మి పడేయాలన్నంత కసి రేగింది .   ఇలా జరిగేటివన్నీ చూస్తుండే ఆమె చిన్న కూతురు “నాన్నకి కోపం ఎక్కువ, కోపం వస్తే విచక్షణ ఉండదు, చూసి చూడనట్టు వదిలేయమ్మా” అంది. మరి అలాంటి మొగుడిపై ఆమెకి మాత్రం కోపం రావద్దూ .. అని విసుక్కున్నాను.

“పిల్లలకేం ? అలాగే అంటారు వాళ్ళకి కూడా పెళ్ళయి ఇలాంటి భర్త వస్తేనే కదా బాధంటే ఏమిటో తెలిసేది అని అనుకుని .. ఛీ ఛీ .. నే నెందుకిలా ఆలోచిస్తున్నాను .. నా బిడ్డలకే కాదు పగవాళ్ళ కి కూడా జన్మ జన్మలకి ఇలాంటి భర్త రాకూడదు” అనుకుంటూ కారే కన్నీటిని తుడుచుకుంది . .

ఎప్పుడూ అంతే ! అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానం. ఆమె ప్రతి కదలికకి చూపుల కరవాలంతో ప్రహరా కాస్తూ ఉంటాడు అనుకున్నవన్నీ అప్పటికప్పుడు అమరకపోయినా పట్టరాని ఆగ్రహం వస్తుంది   అతని కాళ్ళు ఆమెని మట్టగిస్తాయి. గాయాలతోనే లేచి మట్టగించిన ఆ కాళ్ళనే పట్టుకుని బతిమలాడి వేడి వేడిగా వడ్డించాలి, అవసరం అతనిదైనా అతని నడుము పట్టుకోవాలి. ఆవేదనతో కంట్లో తడి ఆరక కంటిపై కునుకురాక రాత్రి తెల్లారిపోతుంది. జీవితం ఇలానే తెల్లారాలేమో… అనుకుంటూ యంత్రంలా పనిలోకి జొరబడి అన్ని అమర్చి పెట్టి ఎనిమిదిన్నరకల్లా ఆపీసుకి వెళుతుంది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడుమాత్రం బస్టాండ్ వరకు మోటారుసైకిల్ పై దిగబెడతానని తయారవుతాడు.

ప్రక్కింటి వాళ్ళు చూస్తున్నట్లనిపిస్తేనూ,ఇంకా వీధిలో ఎవరైనా నడుస్తున్నా వాళ్ళ దృష్టినాకర్షించేలా “లంచ్ బాక్స్ తీసుకున్నావా!? పర్స్ మర్చిపోయావేమో చూసుకో! మొబైల్ తీసుకున్నావా? అంటూ శ్రద్దగా అడుగుతుంటాడు. చూసే వారందరికీ ” భర్తంటే అలా ఉండాలనుకునేటట్లు నటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ నటనకి జోహారులనాలి. తప్పదనుకుంటుంది   ఒకోసారి అతని ప్రేమ నిజమనుకోవాలో నటననుకోవాలో ఆమెకే అర్ధమవదు. నేను మాత్రం రెండూ నటనే అని తీర్మానించేసుకున్నాను కూడా ! “ఎందుకలా మొహం మాడ్చుకుని కూర్చుంటావు, చూడు బైక్ ల పై వెళ్ళే వాళ్ళందరూ సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తూ వెళుతున్నారో! అభియోగం చేస్తూనే   “అయినా మొగుడితో చెప్పడానికి ఏం కబుర్లు ఉంటాయి అదే ప్రియుడితో మాటలైతే ఊటబావిలో నీళ్ళులా ఊరుతుంటాయికాని ” కత్తితో గుచ్చినట్లు మాటలు. ఆ మాటలకి ఆమె విల విల లాడిపోతుంటే చూసి ఆనందించే పైశాచికం. బస్ ఎక్కించి కదిలేటప్పుడు చెపుతుంటాడు “జాగ్రత్త ” అని. అందులో ఎన్నో హెచ్చరికలు .

నిజానికి అతనికి భార్యపై ప్రేమని అసల్నమ్మలేం, ఆమెని బస్ స్టాండ్ లో దిగబెడుతూనే   అనుమానంగా చుట్టూ గమనిస్తాడు. ఆమెకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ , స్నేహితులు కానీ ఎవరైనా ఆమెని పలకరిస్తే ఇక ఆరోజు సాయంత్రమింట్లో కన్నీటి కిటికీని తెరవాల్సిందే ! ఆ మాటల్లో నిగూఢమైన అర్ధాలేవో ఉన్నట్లు అపరాధ పరిశోదన మొదలెడతాడు.   ఇవన్నీ చూస్తున్న నాకు మాను మాకుని కానే కాను అని మనుషులు పాడిన పాట గుర్తుకొస్తుంది . ఈ మగువలకన్నా మాను లైనా ఎంతో హాయిగా ఉన్నాయనుకుంటాను . మహా అయితే   నీరందక ఎండిపోతాము ,ఏ తుఫాన్ గాలికో కొమ్మలు విరిగిపోతాయి, ఏ గొడ్డలి వేటుకో బలైపోతాం తప్ప అంత కన్నా ఏముంటాయి అనిపిస్తుంది.

ఆమె ఆఫీసుకి చేరే లోపే పది నిమిషాలకొకసారి ఫోన్ చేస్తాడు . క్షేమంగా చేరావా? పదింటికి మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగావా? అంటూ.   ఒంటి గంటకి “తిన్నావా ?”   నాలుగున్నరకి ” బయలుదేరావా? ప్రక్కన ఎవరితో మాట్లాడుతున్నావ్ ? ఇంత ఆలస్యమైనదేమి ? నువ్వు టైం కి రాకపోతే నాకు ఒకటే టెన్షన్, నువ్వంటే ఎంతో ప్రేమ, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా ?. అందుకే నా ఈ టెన్షన్, అర్ధం చేసుకో ! అంటూ ఆమెకి టెన్షన్ రుచి చూపిస్తాడు   ప్రక్క ఊరిలో టీచర్ గా పనిచేస్తున్న రమ చాలా సరదా మనిషి . జీవితంలో ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లకే చోటుంటే ఏం బావుంటుంది. వాటిని భరించడానికి నవ్వనే టానిక్ ఒకటుందని మర్చిపోయావు. రా.. ఇలా నా ప్రక్క సీట్లో కూర్చో! అంటూ చొరవచేసి చేయి పట్టుకు కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెపుతూ , హాయిగా నవ్విస్తూ ఆమె ప్రయాణ సమయాన్ని ఆహ్లాదం చేస్తూ ఉంటుంది .ఒక రోజతను ఆమె రమతో మాట్లాడుతూ ఉండటం గమనించాడు .

” అదొట్టి బిచ్ . దానితో నీకు స్నేహం ఏమిటీ ? నువ్వు దానితో తిరిగితే నేను తలెత్తుకుని తిరగలేను . నా స్నేహితులు నిన్ను కూడా ఆ గాటనే కట్టేస్తారు ”   మనసులో ఉన్నదానిని సమాజానికి అంటగట్టే చాతుర్యం అతని సొత్తనుకుంటా! అతనిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం.   ఇప్పుడామె కాస్త ఆలస్యంగా బయలుదేరి రమ టీచర్ ఎక్కే బస్ ని ఎక్కకుండా జాగ్రత్త పడుతుంది. ఇంకో రోజు దానితో స్నేహం వద్దన్నానా? నా మాటంటే లెక్క లేదే? నీ పని ఇలా కాదంటూ ఒకేసారి నోటికి, బెల్ట్ కి పని చెపుతాడు . చూస్తున్న నేను కన్నీళ్ళు కారుస్తుంటాను. మళ్ళీ అతనే గాయాలని కట్టు కడతాడు, రెండు వీధుల అవతలున్న ఆమె పెద్దమ్మని పిలుచుకు వస్తాడు. మీ అమ్మాయి చూడండి , ఎలాంటి స్నేహాలు చేస్తుందో ?   మీ అమ్మ చూడండి ఎలా వాదిస్తుందో ? అని లేనిపోనివి నూరిపోస్తూ పెద్దమ్మ, పిల్లల దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూనే వంకరగా ఆమె వైపు చూస్తూ నవ్వుతాడు .

ఆమె జీతమంతా తను తీసుకుని చిల్లర పైసలు విసిరేస్తాడు సాహిత్య సభల నిర్వహణకి , సంకలనాల అచ్చులకి అన్నింటికీ డబ్బు ఇవ్వాలి. ఇటీవలే క్రొత్తగా కట్టిన ఇంటి కోసం అయిన అప్పులు ,పిల్లల చదువుల కయ్యే ఖర్చులు ఇవ్వన్నీ అతనికి పట్టవు ప్రభుత్వ ఉద్యోగయిన అతను ఎందుకో సేలపు పెట్టి ఇంట్లో కూర్చుండటం వల్ల ఇల్లు నిత్య రణరంగంగా మారిపోయింది. ఎప్పుడూ లేంది ఆమె నన్ను కూడా పట్టించుకోవడం మానేస్తుంది. ఆమె పని చేసే ఆఫీస్ పల్లెలో ఉంటుంది. ఆమె, ఇంకో ఇద్దరు స్టాప్. ఆమెకి   సెలవు కావాలంటే రెండు రోజులు ముందు హెడ్డాపీస్ వారికి చెప్పి అనుమతి పొందాలి. హెడ్ ఆఫీస్ నుండి ఇంకొకరు వచ్చి రిలీవ్ చేస్తే తప్ప ఆమెకి సెలవు దొరకని ఉద్యోగం . కొత్త ప్రభుత్వాల హామీలతో పెన్షన్ దారుల వివరాలు కంప్యూటర్ లో పొందు పరిచే పనిలో నాలుగు రోజులు నుండి ఆమెకి ఒకటే పని ఒత్తిడి . మొన్న   ఆఫీసులో వర్క్ లోడ్ ఉండి రాత్రి ఎనిమిదిన్నర వరకు పని చేయాల్సి వచ్చింది .

సాయంత్రం నుండి అతను ఒకటే పోన్లు రాత్రి తినడానికి నువ్వు వచ్చి వంట చేస్తే కాని కుదరదని ఆజ్ఞలు , నిన్నా అంతే ! పగలల్లా ఆఫీస్ లో పని చేసి ఆమె ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి నడుం వాలుద్దామనుకుంటే చెప్పా పెట్టకుండా నలుగురి స్నేహితులని వెంటబెట్టుకుని నాన్ వెజ్ తీసుకుని వచ్చి బిర్యానీ చేయమని పురమాయింపు . అసలే పిరీయడ్స్ టైం . నడుం పీక్కూ పోతుంది. అయినా చేయక తప్పలేదు.. అతనికి స్నేహితులు సరదాలు, పార్టీలు వేటీకి లోటుండకూడదు. పాపం ! ఆమె నిన్నటి పని అలసటతోనే ప్రతి రోజు పని మొదలెట్టాలి . సూర్యుడిలా అలసిపోకుండా ఉద్యోగినికి ఏమైనా ప్రత్యేకత ఉంటే బావుండుననుకుంటాను. అతనీరోజు సాయంత్రం నాలుగున్నరకే   సతాయింపు మొదలు పెట్టాడు   ఈ రోజూ కూడా ఆలస్యంగా వస్తున్నావా? నాకు ఆకలవుతుంది అని. అప్పగించిన పని పూర్తీ కాలేదన్న సంగతి చెప్పి   “మీరు ఈ రోజుకి ఎలాగో సర్దుకోండి . బయట నుండి తెచ్చుకుని తినేయండి” అని చెప్పింది .

ఆమెనే చూస్తున్న అసిస్టెంట్ కి “మా వారికి రెండు పూటలా వేడి వేడిగా చేసి వడ్డించాలి, ప్రొద్దున చేసినవి రాత్రికి తిననే తినడు. బయట తినడం తన వల్లకాదంటాడు. అలా అని ఇలాంటి అత్యవసర సమయాలలో కూడా మా అత్తగారు చిన్న సాయమన్నా చేయదు ” తన అసిస్టెంట్ తో చెప్పింది విసుగ్గా . ఆమెకి ఆ మాత్రం కోపం రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ మనుషులకి ఏమిటో ఈ గొప్ప ? . నాలాగా అతనుకూడా పరమ సోమరిపోతు. ఆమె వండి వార్చి వడ్డిస్తే తప్ప నోటికి పని చెప్పనని కోతలు కోస్తాడు. ఆకలవుతుంటే దానిని తీర్చుకునే వేరే మార్గమే లేదా !? ఒంక కాకపొతేనూ మరీ !   .

ఆమె ఆఫీసులో పని ముగించుకుని బయటకోచ్చేసరికి   రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది బయట జన సంచారమే లేదు . అంతలో కరంట్ పోయింది బస్ స్టాప్ లో ఉన్న మెడికల్ షాప్ ప్రక్కన నిలబడింది. ఆ షాప్ ముందుకి వెళ్లి వెలుగులో నిలబడి ఉండటం కూడా ఆమెకి ఇబ్బందే ! ఆ షాప్ ఓనర్ చూపులు త్రేళ్ళుజెర్రులు ప్రాకినట్లు ఉంటాయి.ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే చిన్న చూపు   మా ఇళ్ళల్లో ఆడాళ్ళు మగ తోడు లేకుండా కూరగాయల మార్కెట్ కి కూడా వెళ్ళరు అంటూనే కనబడిన ప్రతి ఆడమనిషిని ఒంకర చూపులు చూస్తాడు. బస్ కోసం వెయిట్ చేస్తూనే పదే పదే సమయం చూసుకుంటుంది . సెల్పోన్ లో చార్జింగ్ కూడా అయిపోవస్తుంది ఇరవై నిమిషాలు గడచిపోయాయి. అంతలో తెలిసినతను అటుగా వచ్చాడు” ఏం మేడమ్ ! ఇంతాలస్యమయింది ? ” అంటూ పలకరించాడు. సమాధానం చెపుతూండగానే.. అతను కాల్ చేసాడు. బస్ కోసం వెయిటింగ్ అని చెప్పింది మళ్ళీ బస్ వస్తున్నప్పుడు కాల్ చేస్తే “బస్ వస్తుందండీ” అని చెప్పి కట్ చేసి క్రింద పెట్టి ఉంచిన సంచీ తీసుకోవడానికి ఒంగింది . స్టాప్ లో ఎవరు లే.రనుకుని ఆ బస్ ఆపకుండా దూసుకు వెళ్ళిపోయింది. “అయ్యో ! మీరున్నది గమనించకుండానే బస్ లాగించేసాడు ఇక ఇప్పుడేమి బస్ లు కూడా రావు మేడం .. నేను డ్రాప్ చేస్తాను రండి” అని బండి వైపు దారి తీసాడు పరిచయస్తుడు.

ఇంటి దాక వచ్చి దిగబెట్టనవసరం లేదు .. వెళుతున్న ఆ బస్ ని అందిస్తే చాలని ఒకింత భయపడుతూనే అతని బండి ఎక్కి కూర్చుంది . అతను బైక్ ని ఎంత స్పీడుగా నడిపినా రాత్రి సమయం కావడం వల్ల బస్ ఎక్కేవాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఆ బస్ మధ్యలో ఎక్కడా ఆపకుండానే సిటీలోకి ప్రవేశించింది . “ఇక ఇక్కడిదాకా వచ్చేసాం కదా మేడం ..ఇల్లు దగ్గరే కదా! ఇంటి దగ్గర దింపుతాను పదండి” అని. ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు, ఆమె ఇంటికి వెళ్ళే లోపే ఆమె బస్ స్టాప్ లో ఎవరెవరితో మాట్లాడిందో ఎవరి బండి ఎక్కి వచ్చిందోనన్న సమాచారమంతా మెడికల్ షాపతనికి కాల్ చేసి తెలుసుకున్నతను   వీధి గేట్ దగ్గరే నిలబడి సెగలుగక్కుతూ ఉన్నాడు . ఇంటిదాకా వచ్చిన పరిచయస్తుడిని మర్యాద కోసం టీ త్రాగి పోదువుగాని రమ్మని లోపలి పిలిచింది . అతను వచ్చి కూర్చున్నాడు ప్రిజ్ద్ లో పాలు కూడా లేవు బయటకి వెళ్లి తెమ్మని అడిగితే ఏం విరుచుకుపడతాడోననుకుని   గ్రీన్ టీ చేసి ఇచ్చింది .

ఆతను వెళ్ళగానే ఆమె అమ్మని అమ్మమ్మని ఏడుతరాల ముందు వాళ్ళని కూడా వదలకుండా తిట్టడం ఆరంభించాడు ఆమె అవన్నీ మౌనంగానే వింటూ స్నానానికి వెళ్ళింది   ఈ లోపు బయటకి పోయి బిర్యానీ పొట్లం పట్టుకుని వచ్చి తింటూ కూర్చున్నాడు . ముద్ద ముద్దకి ఆమెని అసహ్యంగా తిడుతూ తింటే కానీ అతనికి ఆకలి తీరలేదు. చేయి కడుక్కునివచ్చాక ” ఏమండీ అంత కోపంగా ఉన్నారు ? ఏమిటీ విషయం ? ఏమైనా ఉంటే శాంతంగా మాట్లాడుకుందాం రండి ” అంది పిచ్చితల్లి . గది తలుపులు మూసేసి ” ఏం మాట్లాడతావే నువ్వు ? నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు తీయలేదు నువ్వు ” ఆ ఇరవయ్యి నిమిషాల టైం లో ఎవడితో పడుకున్నావ్ చెప్పు ? ఆ విలేఖరి గాడి తోనేనా? అంటూ బెల్ట్ తీసి వంద దెబ్బలకి తక్కువ గాకుండా కొట్టాడు. వెనక్కి తోసి పదే పదే కడుపులో కుమ్మాడు. బెల్ట్ బకిల్ తీసుకుని నుదురు పై గుచ్ఛాడు తలని మంచం కోడుకి వేసి బాదాడు.. కురులలో చిక్కుని ఉన్న నేను చిక్కని రక్తంతో తడిచి ఎర్రబడిపోయాను   దెబ్బల శబ్దానికి ప్రక్క గదిలో ఉన్న చిన్నమ్మాయి, అత్తగారు వచ్చారు .

అమ్మాయి వాళ్ళ నాన్నని బయటకి తోసి ఆమెని మంచం పై కూర్చోబెట్టి రక్తం తుడుస్తుంటే . కొడుకుని మందలించడం కూడా చేయని అత్తగారు గదంతా చిక్కగా చిమ్మిన రక్తపు మరకలని శుభ్రం చేయడం మొదలెట్టింది. ఇలా కొట్టడం ఇది మొదటి సారి కాదు ఆఖరిసారి అవదనికూడా ఆమెకి తెలుసు. తలకి తగిలిన గాయానికి కట్టు కడుతూ రక్తంతో తడిచిన నన్ను తీసి కిటికీ బయటకి విసిరేసింది ఆ పిల్ల . నేను వచ్చి చెట్టు అమ్మ ఒడిని చేరాను . “చూసావా అమ్మా ! మనకన్నా సుకుమారమైన మనసున్న ఆమె బాధలు ఎలా ఉన్నాయో ! ” అని ఏడ్చాను. “ఊరుకో తల్లీ ! ఈ లోకంలో చాలామంది మగువుల స్థితి ఇలాగే ఉంటుంది. లెక్కలేనటువంటి పువ్వులని నలిపెసినట్లే ఆడవాళ్ళ జీవితాలని నలిపేయడం ఈ మనుష్యలోకంలో సర్వసాధారణం” అని ఓదార్చింది   ఆమె కూతురు ఆమె ప్రక్కనే పడుకుని ఓదార్చుతూనే ఉంది . ఆమె రాత్రంతా తల్లిని, తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఆమెని చూస్తున్న నేనూ,నా అమ్మ కూడా ఏడుస్తూనే ఉన్నాము

ఉదయాన్నే తలకి కట్టిన కట్టు కనబడకుండా దానిపై మఫ్లర్ చుట్టుకుని బయటకి వచ్చింది . రాత్రి అన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు డ్యూటీకి హాజరవక తప్పటం లేదు. రోజూ లాగా నాదగ్గరికి వచ్చి నన్ను తుంచనూలేదు కురుల ముడవనూ లేదు . ఆమెని బస్ స్టాండ్ దగ్గర దించడానికి అతను బైక్ తీసి నుంచున్నాడు. ఆమె నావైపుకి రాకుండా అటువైపుకి వెళ్ళడం గమనించి “పువ్వు పెట్టుకోవడం మర్చిపోయావ్ !” అని గుర్తు చేసాడు. ఆమె “వద్దులెండి ” అంది . చెప్పొద్దూ … నాకు చాలా దిగులేసింది బాధలో ఉన్న ఆమెకి నేను సమీపంగా లేనందుకు , ఇంకా ఎంతో ఇష్టమైన నా పైన కూడా ఆమెకి విరక్తి కల్గినందుకు. అతను వడి వడిగా నా సమీపానికి వచ్చి నన్ను త్రుంచాడు.

మొదటిసారిగా అతని స్పర్శ చవిచూసాను “అబ్బ ఎంత మొరటుదనం ? ” అనుకున్నాను . ఆమెకి నన్నివ్వగానే మౌనంగా అందుకుని ఓ.. మారు నా వాసనని ఆఘ్రాణించి చిన్నగా పెదవులతో ముద్దాడింది. బాధ నిండిన ఆమె మోహంలో చిన్న నవ్వు విరబూసింది. మెల్లగా తలలో తురుముకుంది. ఆ మాత్రం సామీప్యతకే నేను మురిసిపోయాను. ఆఫీసుకి చేరుకొని కుర్చీలో కూర్చుని రాత్రి జరిగినదానిని గుర్తుచేసుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఓదార్చడానికి ఎవరు లేని ఆ ఆఫీసు గదిలో ఆమె రోదన అరణ్య రోదనే అయింది   . భుజంపై తట్టి స్పర్శతో నేనున్నాను అనే భరోసా కల్గించడానికి నేనొక మనిషిని కాలేనందుకు మొదటిసారిగా దేవుడ్నితిట్టుకున్నాను. ఆమె బాధల్లో సహానుభూతి చెందడం తప్ప నాకేం చేతనవును ? అయినా ఏదో చేయాలని ఆవేశం , ఆక్రోశం అతన్ని శిక్షించి తీరాలనే కోపం ముప్పేటలా నన్ను చుట్టేసాయి అయినా కురులు దాటి బయటకి రాని స్థితిలో ఉన్నాను కదా !

మధ్యాహ్నం దాకా పని చేసుకుంటూనే ఏడుస్తూ ఉంది . తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్నదానిలా కళ్ళు తుడుచుకుని పైకి లేచింది .బేగ్ తగిలించుకుని రోడ్డుపైకి వచ్చి నిలబడింది.

మెడికల్ షాపతను మిట్టమధ్యాహ్నం తలకి మఫ్లర్ చుట్టుకున్న ఆమెవంక విచిత్రంగా చూస్తున్నాడు . ఆమె మఫ్లర్ని తీసి నడిరోడ్డుపై విసిరి పడేసింది . ఎప్పుడో ఒకసారి వచ్చే బస్ కోసం ఎదురు చూడకుండా .. ఆటో ని పిలిచింది ఎక్కి కూర్చుని పోలీస్ స్టేషన్ కి పోనీయ్ ! అంది .

నాకు భలే ఆశ్చర్యంగా ఉంది . ఆటో దిగి సరాసరి ఎస్సై ముందు నిలబడింది . ఎస్సై ఆమెని గుర్తించి “మీరు ఫలానా రచయిత గారి భార్య కదా ! ఏమైంది మేడం ! ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ? చేసినవాడి గురించి చెప్పండి .. ముందు మక్కెలిరగ కొట్టి కేసు పెట్టి కోర్ట్ కి లాగుదాం. నష్టపరిహారం అడుగుదాం ” అంటూ అలవాటైన శైలి ప్రదర్శించాడు.

ముందు పెన్, పేపర్ ఇవ్వండి . నేను కంప్లైంట్ వ్రాసి ఇవ్వాలి కదా ! అంది . ఈ లోపు సార్ కి ఫోన్ చేయమంటారా ? అంటూనే అతనికి రింగ్ చేయడం మొదలెట్టాడు . మీరు ఆయనకీ కాల్ చేయకండి. నేను కంప్లైంట్ చేస్తున్నదే అతని మీద శారీరక హింస, మానసిక హింసకి గురి చేస్తున్నాడని . ఈ సాక్ష్యం చూడండి అంటూ తగిలిన గాయాన్ని చూపింది. మీరిప్పుడు గృహ హింస యాక్ట్ పై కేసు నమోదు చేసి ఎఫ్ ఐ ఆర్ నకలు ఇవ్వాలి” అంది. అతని క్రూరత్వం గురించి లోకానికి చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందని…   ఇన్నేళ్ళకైనా ఆమె సహనానికి తెరపడినందుకు నాకు చాలా ఆనందమనిపించింది. ఎస్సై చేతిలో పెన్ జారి క్రింద పడింది. ఆమె ఆ పెన్ ని అందుకోవడానికి క్రిందకి ఒంగింది. జడ ముందుకు జారింది . కురులమధ్య ఇరుక్కుని ఉన్న నేను పెనుగులాడి స్వేచ్చగా బయటకొచ్చి ఆమె పాదాల మీద పడి ఇష్టంగా ముద్దాడాను.   ఇన్నాళ్ళూ ఆమె సుతి మెత్తని భావాలని, బాధమయమైన గాధలన్నింటినీ అక్షర రూపం చేసుకుంటే వాటన్నింటిని తన రచనలుగా చెప్పుకుని రచయితగా పేరు సంపాదించుకున్నతని గురించి, ఆమె గురించి అంటే ఆ రచయిత గారి భార్య కథని చెప్పానని మీరు మనఃస్పూర్తిగా నమ్మితే చాలు.   ఇన్నేళ్ళూ కన్నబిడ్డలా సాకుతున్నందుకు కృతజ్ఞతతో నా తల్లి జన్మ, రోజూ దేవుని పాదాల వద్దకి కి చేర్చినందుకు నా జన్మ కూడా సార్ధకమైనట్లే ! ” అని కథ ముగించింది పువ్వు .

నేను పనిచేసే పత్రిక కోసం ఓ రచయిత ఇంటర్వ్యూ తీసుకుందామని ఆ వూరు వచ్చి ఆ రచయిత అడ్రెస్స్ వెతుక్కుంటుంటే ఆడబోయిన తీర్ధం ఎదురయినట్లు రచయిత భార్య కథ తెలిసాక ఇక అతని ఇంటర్వ్యూ తో పనేంటి ? అనుకుంటూ వెనక్కి తిరిగాను. తానూ చెప్పిన కథ విన్నందుకేమో చెట్టు కృతజ్ఞతగా తన పువ్వులని నాపై రాల్చింది. కథ లాంటి వాస్తవాన్ని నేను నమ్మినందుకు ఓ ..పువ్వు నా హృదయానికి దగ్గరగా ఇష్టంగా.. చొక్కా గుండీ కి చిక్కుకుంది.

-వనజ తాతినేని

10606228_828842293846066_6014391426527802181_n

సంస్కారం

vanaja vanamali 

వనజా తాతినేని (వనజా వనమాలి)  బ్లాగర్ గా అందరికీ సుపరిచితమే. బ్లాగ్ మొదలెట్టాక ఇది ఆమె వ్రాసిన  50 వ కథ.  తన  చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నుండే ఆమె  కథా వస్తువుని ఎన్నుకుంటారు  .  కథ ని వ్రాయడంలోను ,  పాఠకులని మెప్పించడంలోను తానూ  ఎంతవరకు కృతకృత్యురాలినయ్యానో వారే చెప్పాలి  అంటారు ఆమె.

  ***

ప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న  చెమటని  తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కగా విశ్రాంతిగా వాలి  రాలి పడిన పూల నుండి పరిమళాలను ఆస్వాదిస్తూ  అలవాటుగా పేపర్ కోసం కళ్ళు వెతికాయి

రోజూ అదే సమయానికి సరళ ఒక మంచి నీళ్ళ బాటిల్,ఆ రోజు దినపత్రికలని తీసుకొచ్చిచ్చి అక్కడ పెట్టి ఉంచేది . ఇంకొక పావుగంట తర్వాత సువాసలు వెదజల్లే కాఫీ  కప్పుతో పాటు పోటీగా  “అమ్మ ”  దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల  పరిమళం కలగలిపి  తన నాసికా రంధ్రాలను తాకుతూ  హాయిగా అనిపించేవి.

ఈ రోజు పావు గంట దాటినా కాఫీ కాదు కదా మంచినీళ్ళు కూడా బయటకి రాలేదు ..

“సరళా ” అని పిలుస్తూ లోపలకి వెళ్లాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు . ఇంకా నిద్ర లేవలేదా ఏమిటీ? తనకి అనారోగ్యం ఏమి లేదు కదా ! అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లి చూసాను . అక్కడ బెడ్ ఖాళీగా ఉంది .

“అమ్మా.” . అంటూ పిలుస్తూ  క్రిందకి  వచ్చాను .అమ్మ కనబడలేదు.

అంతలో అనిరుద్ద్  .. వాడి రూం లో నుండి బయటకి వచ్చి .. “నాన్నా! అమ్మా,నానమ్మ ఇద్దరూ రఘు  అంకుల్ వాళ్ళింటికి వెళ్ళారు రఘు అంకుల్ వాళ్ళ అమ్మ అదే తులసమ్మ మామ్మ చనిపోయారంట . మీరు రాగానే చెప్పమన్నారు వెంటనే అక్కడికి రమ్మన్నారు ”  అని చెప్పాడు.

“అరే ! ఎప్పుడు జరిగింది .. ? ఎవరు చెప్పారు ..విషయం  కన్ఫర్మ్ గా నీకు తెలుసా అనిరుద్ద్ ” .అని అడిగాను

“మీరు అలా  వాకింగ్ కి వెళ్ళగానే కాల్ వచ్చింది . తులసమ్మ  మామ్మ ని చూసుకునే హోం నర్స్ కాల్ చేసారు అమ్మ, నానమ్మ వెంటనే వెళ్ళారు . మీరు మొబైల్ తీసుకువెళ్ళలేదు కదా .. మీకు ఎలా చెప్పాలో తెలియలేదు”  అని చెప్పాడు .

“సరే నేను ఇప్పుడే వెళతాను”  అంటూ  ..నా మొబైల్ తీసుకుని సరళ కి కాల్ చేసాను .

“సరళా .. నేను విన్న విషయం నిజమేనా “?.. ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను .

“అవునండీ .. మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూసారు .. ఆవిడ చనిపోయారు .అంది  నేను రఘు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను . ఇంకా వాళ్ళ దగ్గర  బంధువులందరికీ  చెప్పాను మీరు త్వరగా రండి ” అంది .

నేను త్వర త్వరగా  డ్రస్ మార్చుకుని రఘు  కి ISD  కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెపుతున్నాడు “నేను సండే  కి  కాని రాలేను .. కృష్ణా ! మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను  అక్కడ ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి ప్లీజ్ .. ” గొంతులో దుఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు .

 

“రఘు .ఆ  విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా ! అన్నీ చూసుకునేందుకు  నేను ఉన్నానుగా నువ్వేమి వర్రీ అవకు.   ముందు టికెట్స్ సంగతి చూసుకో .. మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను .”. అని చెపుతూ .. లోపలకి వచ్చాను అప్పటికే .. మా కాలనీ వాసులు కొందరు  వచ్చి ఉన్నారు. సరళ ..పొన్స్ చేస్తూ బిజీ గా కనిపించింది .

మంచం మీదే ప్రాణం పోయింది ..ఇంకా అలా మంచం మీదే ఉంచారే ! కొందరి ప్రశ్న . .. “బాక్స్ కోసం ఫోన్ చేసాము అయిదు నిమిషాలలో బాక్స్ వస్తుంది .. బాక్స్ లో మార్చుతాం కదా .అని అలాగే ఉంచేసామండీ ” ..సరళ  చెపుతుంది.

ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రింద పరచి దానిపై ఒక దుప్పటి పరచి ఇంకో ఇద్దరి సాయం తో  తులసమ్మ పిన్ని బౌతికకాయం ని  చాప పై పడుకోబెట్టాను . ఆమె ప్రక్కనే నేలమీద చతికిల బడి కూర్చున్నాను . చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది . నా కళ్ళల్లో కన్నీరు జల జలా రాలింది . ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి జీవితమంతా బాధ పడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో .అన్నట్టుగా  ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది.  గట్టిగా నోరు విప్పి మాట్లాడటం అందరకి తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని .

రఘు వాళ్ళ నాన్న నాకే కాదు రఘుకి కూడా  అంత బాగా తెలియదు రఘుకి మూడేళ్ళు న్నప్పుడు చనిపోయాడు అంతకు ముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట  రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం  బాగా జ్ఞాపకం ఉంది .

“నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ ముదనష్టపుది తాళి , బొట్టు గాజులు తీసేసి విధవ ముండ లాగా తయారయింది. పూజ పునస్కారం ఏమిలేకుండా  కొంపని కిరస్తానీ కొంప జేసింది. సిరింటదు  కాని సీద్రం అబ్బుద్ది అని  పెద్దలు ఊరికే అనలేదు . ఈ దేష్ట మొహం చూస్తూ ఉండలేకనే  నా కొడుకు  చచ్చాడు ” అని తిడుతూ ఉండేది.

పుట్టెడు అప్పులు, అత్తా మామలు, ఆదరణ లేని పుట్టిల్లు. పొలం అంతా  అప్పుల వాళ్ళు కట్టుకు పోగా నాలుగెకరాల మెట్ట  చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీదింది. గొడ్ల  కాడి పని,  నీళ్ళు తోడే పని, చేలో పని ఆ పని ఈ పని మధ్య   ఒళ్ళు   అరగ దీసుకుని కట్టేలా బండబారి పోయి ఉండేది.

రఘు వాళ్ళిల్లు  చెరువు  కట్ట ప్రక్కనే  మంచి నీళ్ళ బావిని ఆనుకుని ఉండేది . ఊరందరికీ మంచి నీళ్ళ బావి అదే అవడంతో .అందరికి తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది  ఎవరు మాట్లాడినా క్లుప్తంగా నాలుగు మాటలు మాట్లాడేది ఎక్కువ సమయం బైబిల్  చదువుకుంటూ, ప్రార్ధన చేసుకుంటూ కనబడేది   .

మా ఊరి  బడి, గుడి, లైబ్రరీ , కోపరేటివ్ బాంక్ అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు  అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు  మనసులో మాట  పంచుకుంటూ  పదిహేనేళ్ళ పాటు  ఇద్దరం కలిసే చదువుకున్నాం.  రఘు నాతొ పాటు మా ఇంట్లో చొరవగా తిరగడం వల్ల  మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి .. “మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం ? వాళ్ళింట్లో దేవుడు గూడు ఉంది మనం అలా దేవుడు గూడు పెట్టుకుందాం పూజ చేసుకుందాం” అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు .

నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం  చెపుతుందా అని ఆసక్తిగా చూసేవాడిని

“వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు . మన  దేవుడికి అలాంటి పూజలు చెయ్యవసరం లేదు ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్దిస్తే చాలు ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే . ఆయనే అన్నీ చూసుకుంటాడు” అని చెప్పీది

“అమ్మా.. మనం కమ్మ వాళ్ళమే కదా ! “అడిగేవాడు రఘు.

“అవును ” అనేది

“అయితే కమ్మ వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామీ, రాముడు,కృష్ణుడు ,శివుడు ఇలాంటి దేవుళ్ళు  ఉన్నారు  కదా! మన  వాళ్ళందరూ శివాలయం కి, రామాలయం కి వెళుతుంటే .. నువ్వు  ఈ బైబిల్,  కనబడని దేవుడు మన దేవుడు అంటావేమిటి ? నాయనమ్మ తాతయ్య కూడా రామా కృష్ణా అంటున్నారు .. నువ్వే  ఏసయ్యే దేవుడంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటన్నావు ! నాకు నువ్వు నచ్చలేదు ..నన్ను అంటుకోబాకు “.అని దూరంగా పారిపోయేవాడు . తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించేది వాడు ఇంకా దూరంగా పారిపోతూ .. “నువ్వు నాకు అమ్మ వే  అయితే, మనం  కమ్మాళ్ళం  అయితే .. ఊరి చివర వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్ధించడం ఆపేయి.. ” అని  కోపంగా చెప్పేవాడు . వాడి కోపంలో ద్వేషం ఉండేది .. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో .. క్రమం తప్పకుండా  ప్రతి రోజూ గుళ్ళోకి వెళ్ళేవాడు . దేవుడుకి దణ్ణం పెట్టుకునేవాడు .

“ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ .. పిల్లడు మాత్రం గుడికి వస్తున్నాడు .. ఏ నీరు ఆ నీరేమ్మటే  పారతాయి కాని ఏరే నీళ్ళు కలుస్తాయా ఏమిటీ ?” అనే వారు కొందరు .

ఏడవ  తరగతి చదువుతున్నపుడు  రఘు కి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది  మా వూరి చివర సుదర్శనం మాస్టారు ఉండేవారు . ఆయన స్కూల్ మాస్టర్. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకి వెళుతూ ఉండేవాడు యేసు క్రీస్తు గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు . రఘు ఆయన్నీ విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని దేవుళ్ళని వదిలేసి యేసు క్రీస్తే ప్రభువని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునే వాడు . ఆయన కూతురు భర్త పాస్టర్ గా పనిచేసేవాడు . సువార్త సభలు పెట్టి .. మైకులు పెట్టి వారమేసి  రోజులపాటు ప్రార్ధనలు ,బైబిలు వాక్యాలు , కొత్తగా మతంలోకి చేరిన వారి అనుభవాలు వినిపించే వారు . మా వూరు చిన్నది అవడం వల్ల ఆ  సభలు మా చెవుల్లో రొద  పెడుతున్నట్లు ఉండేవి . ఆ సభలు కూడా .. సంక్రాంతి పడక్కి ముందు పెట్టేవాళ్ళు . వెంకటేశ్వర స్వామీ గుళ్ళో వచ్చే సుప్రభాతం, తిరుప్పావై వినబడకుండా .. కర్ణ కఠోరంగా  ఆ పాటలు వినాల్సి రావడం రఘు కే  కాదు మా వూర్లో చాలా మందికి అసహనంగా ఉండేది  ఈ ఊరుని భ్రష్టు  పట్టిస్తున్నారు ఈ పాస్టర్ ని ఈ వూరు నుండి వెల్ల గొట్టాలి అనుకున్నారు కూడా . వాళ్ళు అనుకున్న కొద్దీ ఆ ఫాస్టర్ ఊర్లో నిట్టాడిలా పాతుకు పోయాడు

ఆ పాస్టర్ .. పేద పిల్లలందరిని చేరదీసి  వాళ్ళు పనులకి వెళ్ళకుండా బడికి వెళ్లి చదువుకుంటే నెలకి ఒకొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమీ కాదు మూడు బస్తాల ధాన్యం  ధర .. ఆ డబ్బు మీద ఆశ తో . మా వూర్లో ఊరిచివర వాడలో వాళ్ళే కాదు మా వాళ్ళ   పిల్లల పేర్లు కూడా వ్రాయించారు . వాళ్ళందరి పేర్ల మీద బాంక్ అకౌంట్ తెరిపించి  ప్రతి నెలా వారి  అకౌంట్  లోకే  డబ్బులు జమ అయ్యే  ఏర్పాటు చేసాడు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇప్పిస్తున్నాడు కాబట్టి ఆయన “దేవుడంటి ” వారు అయిపోయారు . ఆయన స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో “రఘు ” కూడా ఉన్నాడు . రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది

Kadha-Saranga-2-300x268

” పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే .. వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను ..  అంత  డబ్బు  ఎక్కడ నుండి వస్తుంది  పంట పండితే పండే ..లేక  పొతే లేయే ! పాడి గొడ్డు మీదే సంసారం నడవాలంటే  ఎట్టా జరుగుద్ది ” తులసమ్మ పిన్ని  మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి  మరో మాట మాటాడటానికి అవకాశం ఉండేది కాదు  .

సంవత్సరానికి రెండు సార్లయినా రఘు కి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది . సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చేవారు . వారే మా వూర్లో పిల్లలందరికీ ఆర్ధిక సాయం చేస్తున్నవాళ్లని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు . వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరు పరచి వారికి పరిచయం చేసేవారు . అలా పరిచయం చేయడానికి “రఘు ” ని కూడా రమ్మనేవారు . ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంతబతిమలాడినా వెళ్ళేవాడు కాదు . విదేశీ అతిధులు వచ్చిన ప్రతిసారి రఘుకి ఆరోగ్యం బాగోలేదనో .. బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి  బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు .

తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చి కి వెళ్ళడం మొదలెట్టింది . రఘు వాళ్ళ నాయనమ్మ,తాతయ్య .మేము  బ్రతికుండగానే ఇంటావంటా లేని పనులు చేయడం చూస్తున్నాం . మనమేమిటి, మన కులమేమిటి ,మన సంప్రదాయం ఏమిటీ ? ఫలానా వాళ్ళ కోడలు వూరి చివర వాడల్లోకి వెళూతుందంటే ఎంత పరువు తక్కువ ..?

రఘు .. మీ అమ్మ అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పరా ..  అని రఘుని  సతాయించే వారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం . అని పంతం పట్టుకుని కూర్చున్నారు .

“అమ్మా ! నాయనమ్మ ,తాతయ్య ఏమంటున్నారో .. విన్నావు కదా ! నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు .. గట్టిగా ఆదేశించాడు .

రఘు  అంత  గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్ని ని మందలించారు  తులసమ్మా !బిడ్డ నీ అంత అయ్యాడు వాడికి ఇష్టం లేదని చెపుతున్నాడుగా ..  ముసలివాళ్ళు ఇంటావంటా లేని  పనులని ఏడుస్తున్నారు, వాళ్లకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు ?  ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ?మానేయకూడదు .. ఆ ప్రార్ధనేదో ఇంట్లో చేసుకోరాదు .. అని మందలించారు

ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని .. ఇక ఆ తర్వాత వూరి చివర వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు

పదవతరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయోలా కాలేజీలో చేరాము . ఆ కాలేజీలో చేరడం కూడా రఘు కి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు “ఈ కులం, మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకున్నవే ! నీకిష్టం లేకపోతే  ఆ మతం గురించి ఆలోచించకు నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో .. మతాలకి సంబంధం లేని విషయం చదువు , అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు స్కాలర్ షిప్ లు వస్తాయి ,నువ్వు బాగా చదువుకోవాలంటే నీకున్న వ్యతిరేకత అంతా  మార్చుకుని ఆ కాలేజీలో చేరు ” అని హితోపదేశం చేసాక .. అయిష్టంగానే నాతొ పాటు ఆ కాలేజీ లో చేరాడు.

ఫాస్టర్ గారు  స్కాలర్ షిప్లు ఏర్పాటు చేయడం వల్ల   మాతో పాటు మావూరి బీదబిక్కి పిల్లలు కూడా  ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు  నిర్వహించడం వల్ల  తులసమ్మ పిన్ని లాగా చాలా మంది వారి బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్ధం అయింది . మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు

baby_deer_with_mother_doe

పట్నంలో చదివేటప్పుడు రఘు కి డబ్బు  పంపడం కోసం  అవస్థ పడేది.  పంటలకి పెట్టుబడి పెట్టి  సరిగా  పంట చేతికందక,ముసలి వాళ్ళ ఇద్దరి రోగాలకి , చనిపోతే ఇద్దరి కర్మ కాండ లకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది .

చేసిన అప్పుకి ఉన్న పొలమంతా  అమ్మితే  గాని బాకీ తీరదని  లేక్కలేసుకున్నాడు రఘు .

“పూర్వికులు ఇచ్చిన ఆస్తి ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా..? నేను చదువు మానేసి ..ఎదొ ఒక ఉద్యోగంలో చేరతాను “అన్నాడు .

“ఈ నాలుగు నెలలు ఆగు ..ఎదొ ఒకటి ఆలోచిద్దాం . ముందు నీ చదువు పూర్తి చేయి” అంటూ ఆంజనేయులు మాస్టారు చెప్పారు .

ఒక నెలయ్యేసరికి ..  తులసమ్మ పిన్ని  రఘుకి ఒక ఉత్తరం వ్రాసింది ఇల్లు, ఇంటి స్థలం అమ్మేసానని ఆ డబ్బుతో అప్పులనీ తీర్చేసానని.. పొలం అమ్మనవసరం లేదని .. ఇక ఏ దిగులు లేకుండా రఘు ని బాగా చదువుకోమని ..  తానూ  ఇంటికి అవతల ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని .. ఇక ఇబ్బందులు ఏమి లేవని … అందులో సారాంశం .

మా ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు  అంత ఎక్కువ  రేటుకి ఎలా అమ్ముడయిందన్నసందేహం వచ్చింది    . ఇంతకీ ఎవరు కొన్నారొ.. ఆ ఇంటిని . అనుకున్నాం. కానీ మళ్ళీ  ఉత్తరాలలో ఆ సంగతి  గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు

మేము సంక్రాంతి సెలవలకి ఊరు వెళ్ళేటప్పటికి  రఘు  వాళ్ళింటి రూపు రేఖలే మారిపోయాయి.రోడ్డు మీదకి కనిపించే  ఇంటి చుట్టూ వెదురుబద్దలతో అల్లిన దడుల స్థానంలో    .. నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు .. ఇంటి మొత్తం కి చక్కగా రంగులు వేసారు . మిగిలిన ఖాళీ స్థలంలో రెండు మూడు రెల్లుగడ్డి తో కప్పిన చుట్టిళ్ళు  కనబడినాయి . ఇంట్లో నుండి బయటకి రావడానికి చక్కగా నాపరాళ్ళ దారి వేసారు .. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు .. ఆ తలుపు ప్రక్కనే గోడమీద రంగులతో రాసి ఉన్న అక్షరాలూ చూడగానే రఘు ముఖం నల్లబడి పోయింది .. అక్కడ ” ఏసు  సువార్త మందిరం ” అని ఉంది

చెరువు కట్ట మీదగా గడ్డివాములు వేసే స్థలం లోకి వెళ్ళాడు .  అక్కడొక ఒంటి నిట్టాడి పాక వేసి ఉంది .  రఘుని చూడలేదు  గొడ్ల  పాకలో పనిచేకుంటుంది తులసమ్మ పిన్ని.  ఆమె ముందుకు వెళ్లి .. చేతిలో బట్టల బేగ్  ని ఆమె ముందు విసిరి కొట్టి ..  “ఈ ఇల్లు నిన్ను ఎవరు అమ్మమన్నారు ? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా ! అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు  అమ్మడానికి నీకేమి అధికారం ఉంది కొనడానికి వాళ్ళకేమి అధికారం ఉంది .. వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మను ” .. అని విరుచుకు పడ్డాడు .

ఇంట్లో  పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా గుడి అరుగులమీద కూర్చున్నాడు .

“రఘు మా ఇంటికి వెళదాం .రారా “… అని బతిమలాడి మా ఇంటికి తీసుకు వచ్చాను . సాయంత్రం వాడి చుట్టూ  ఊళ్ళో  వాళ్ళు చేరి తలా ఒక మాట అనడం మొదలెట్టారు .

” అదివరకి ఊరి చివర చర్చి ఉండేది మీ అమ్మ ఇప్పుడు  వాళ్లకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చి ని తీసుకొచ్చి ఊరంతటిని సంకరం చేసి వదిలిపెట్టింది   ఎలాగైనా ఆడ మనిషి – ఆడ పెత్తనం అనిపిచ్చుకుంది . అమ్మేటప్పుడు  కనీసం నీకు ఒక మాటైనా చెప్పిందా ..? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా  అంటే అదీ…  లేదు.  బాకీలాల్లకి డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది నాలుగెకరాలు పొలం ధర పాతిక సెంటు స్థలం ఉన్న పాత ఇంటికి వచ్చిందని .   డబ్బంటే ఎంత ఆశ ఉన్నా..  ఊరిని ఇట్టా ..  సంకరం చేసి పెడతారా?  మీ అమ్మకి తోడూ ఆ ఆంజనేయులు  మాస్టారొకడు  ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో .. మనకి ఎందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పొతే మనం చిల్లికాణీ  అయినా సాయం చేసామా..? అంటూ  మీ తరపున  తరపున వకాల్తా  పుచ్చుకున్నాడు . అది మీ తాత ముత్తాతలు  సంపాయించిన ఆస్తి .. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు .పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు ..  వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు”  అని నూరిపోసారు .

 

ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు . అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై  ఆలోచిస్తూ పడుకున్నాడు , నేను వాడి ప్రక్కనే ఇంకో మంచం పై పడుకుని వాడేం  మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను .  బాగా పొద్దు పోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది ఎన్నడు ఒకరింటికి పోనీ పిన్ని  మా ఇంటికి వచ్చేసరికి అందరికి ఆశ్చర్యమయితే  వేయలేదు కాని కొడుకు కోసం వెదుక్కుంటూ వచ్చిన  తల్లి మనసు అర్ధమై .జాలి కల్గింది .

అమ్మ తులసమ్మ పిన్నిని కూర్చోమని ముక్కాలి పీట వేసింది . పిన్ని ఆ పీటని తెచ్చుకుని రఘు మంచం ప్రక్కనే వేసుకుని కూర్చుంది .

“బాబూ ..  రఘూ కోపం వచ్చిందా ? “అంటూ వాడి తలమీద చేయివేసి నిమరబోయింది ..వాడు  విసురుగా ఆ చేయిని తోసేసి ..   “నన్ను అంటుకోబాకు,  అసలు నాకు నువ్వు అమ్మవే కాదు “. అంటూ దిగ్గున లేచి నించున్నాడు  తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్ళు

“తప్పు .రఘు ..  అమ్మని అలా అనవచ్చా .?”  అమ్మ కోప్పడింది

“నేను ఏమి చేసాను .. యశోదమ్మా ..  ! వాడట్టా  మండి  పడతా ఉండాడు . నెత్తి గింజ నేల  రాలిన్నాటి నుండి  ఏష్టపు  బతుకు అయిపొయింది . ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను . ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా  అర్ధం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు ”

“నేను బైబిల్ చదవడం ఇష్టం లేదన్నాడు .. ఆ బైబిల్ ని  నేను ఎందుకు చదువుతున్నాను , యేసు ని ఎందుకు కొలుస్తున్నాను అని మీకెవరికైనా అర్ధం అయిందా? పెల్లైయిన ఏడాది లోపే మా ఆయనకీ పెద్ద జబ్బు చేసింది .. బతకడం కష్టం అని చెప్పారు . ఎన్ని హాస్పటల్ కి తిప్పినాం . ఒళ్ళు ,ఇల్లు రెండు గుల్లయి పోయాయి ఆయన అట్టా  ఉండగానే వీడికి పిట్స్ మొదలయ్యాయి ..  ఆయనకీ చూస్తే అట్టా , బతుకాతాడో లేదో నమ్మకం లేదు బిడ్డకి చూస్తే ఇట్టా .. నేను ఏంచేయాలో తోచలేదు ..  ఎన్ని మొక్కులు మొక్కాను .. ఎన్ని పూజలు చేసాను  ఈ రాళ్ళలో ఉన్న దేవుడే మైనా   మా ఆయన రోగం తగ్గించ గల్గారా ?  మా ఇంటి ప్రక్క టీచర్ చెప్పింది .. ప్రభువుని  నమ్ముకో ..  ఆయన రోగం నయం చేస్తాడని  ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసు ని నమ్ముకున్నాను   రఘుకి ఫిట్స్ రావడం తగ్గి పోయింది , వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు . నా ప్రార్ధనలు  ఫలించాయనుకున్నాను . పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి  మతం మారాలి .. హిందువుల ఆనవాళ్ళు ఏవి ఉండ కూడదని అంటే బొట్టు, గాజులు  అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను.  అప్పటి నుండి నమ్మినదానిని విడవకుండా పాటిస్తున్నాను . అది తప్పా ?  ఎన్నెన్నో మాటలన్నారు మొగుడు చావక ముందే అన్నీ తీసేసింది అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు.   బతికున్నన్నాళ్ళు మా అత్తా మామ తిట్టి పోశారు . బొట్టు పెట్టుకొని, తాళి కట్టుకోని వాళ్ళ మొగుళ్ళు చాలా మంది బ్రతికే ఉన్నారు, మరి వాళ్ళని చూపిచ్చి నేను అడగవచ్చు గా .. ?  ప్రార్ధన కెళితే నా చేతి కూడు తినని శపథం చేసారు ముసలాళ్ళని  బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను . ఈడు వేలెడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు . నా దారిన నేనే పోతన్నా గాని ఎవరినయినా ..  బైబిల్ చదవండి ,ప్రార్ధన చేయండి అని నేను బలవంతం చేసానా?

మీ అందరూ నమ్మే  దేవుడు మీకు రాళ్ళల్లో,పాముల్లో ,పశువుల్లో కనబడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో,

ప్రార్ధన లో  ఉన్నాడని పిస్తుంది . మీరు గుడికి వెళ్లినట్టు నేను చర్చి కి వెళితే అభ్యంతరం పెట్టారు  ఇదేట్టా న్యాయం అనిపిచ్చుద్దో .. మీరెవరైనా చెప్పండి”?  .సూటిగా తాకుతున్నాయి ప్రశ్నలు

వింటున్న ఎవరిమీ మాట్లాడలేదు .  పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగంది

“నిండా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నాను నాలుగెకరాలు పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని  ఇల్లు అమ్మాను  దానికి తప్పు పడతా ఉండారు  ఏ మనూర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా ? పీర్ల పండక్కి పీర్లు ఊరేగింపులో మీరందరూ ఎదురెల్లి నీళ్ళు  పోసి మొక్కట్లేదా ? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం కాదా!? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా ? నన్నెందుకు తప్పు పడతా ఉండారు ? ”

వింటున్న మాకు ఒక్కోమాట గునపంలా గుచ్చుతున్నట్టు ఉంది  . రఘు ఏమి మాట్లాడలేదు

నా వైపుకి చూస్తూ .. “కృష్ణా నీకు తెలియదా .. రఘు అంటే నాకెంత ప్రాణమో ! వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు  రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చా . ఇప్పుడు ఈడే  నన్ను అసహ్యించుకుంటూ  నన్ను వేలేసినట్లు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి .. నేను ఎందుకు బతకాలి ? ”

ఏడుస్తూ . ముక్కాలి పీట పై నుండి లేచి నిలబడింది  .

ఆ మాటలు విన్న నాకు కన్నీరొచ్చింది.  అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది .రఘు వాళ్ళమ్మని అర్ధం చేసుకోవడం లేదని   నాకు వాడిపై కోపం వచ్చింది .

అమ్మ కూడా అదే మాట అంది . ” రఘు మీ అమ్మని నువ్వే అర్ధం చేసుకోవాలి ఏ దేవుడైతే ఏమైంది ? .  ఆమెకి  కాకర కాయ నచ్చినట్టు ఆ దేవుడు, ఆ మతం  నచ్చింది నీకు గుమ్మడి కాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది .. ఏ మతమయితే ఏముందిలే .. అందరి రక్తం ఒకటే రంగయినట్లు అందరు దేవుళ్ళు ఒకటే ! అసలు కన్నతల్లి  ప్రత్యక్ష దైవం  అంటారు కదా !  . మీ అమ్మని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు ,  కష్ట పెట్టే  పనులు చేయకూడదు “.. అని సుద్దులు చెప్పింది .

“తులసమ్మా ! ఏడవబాకు నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్న పిల్లాడు , వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడలా కోపంగా ఉన్నాడు గాని వాడికి నీ పై ప్రేమ ఎందుకుండదు” .. అని అంటూ

“కృష్ణా ,నువ్వు రఘు ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు “.. .. అని చెప్పింది .

తులసమ్మ  పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే  ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు,నేను బయలుదేరాం .

ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది . వాళ్ళమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు .కాని ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది

 

తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది మేము హాస్టల్లో ఉంది  డిగ్రీ  చదువు పూర్తీ చేసాము . తర్వాత ఇద్దరికీ గుంటూరు మెడికల్ కాలేజ్ లో సీట్లు వచ్చాయి . చదువు పూర్త వుతూ ఉండగానే  రఘు కి పెళ్లి అయిపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని వియ్యాలవారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది . అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాని చూసుకుని ఆమె పరమత ఆచరణ కంత  ప్రాముఖ్యత నివ్వడం మరచిపోయారు . హైదరాబాద్  లో ఉద్యోగం చేస్తూ  తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు . కానీ తులసమ్మ పిన్ని పల్లెలోనే ఉండటానికి  ఇష్ట పడేది. రఘు  సొంత వూర్లో ఇల్లు కట్టడానికి  రామాలయం ప్రక్కనే కొంత స్థలంని  ఉన్న ఉన్న ధర కన్నా కన్నా ఎక్కువ ధర  పెట్టి  కొని   ఆ స్థలంలో  ఇల్లు కడతాను.. ఆ ఇంట్లో ఉండమని అన్నాడు . ఆమె ఆ గుడి ప్రక్కనే ఉండానికి ఇష్టపడలేదు

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు . తనతోపాటు తల్లిని తీసుకువెళతానని అంటే అందుకు ఆమె ఇష్టపడలేదు . “ఎక్కడున్నా .. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే  చాలు నేనీ వూరు వదిలి రానని చెప్పింది .   నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో  ,వీలయితే రెండుసార్లు వచ్చి   ఆ  సమయానికి తులసమ్మ పిన్ని ని అక్కడికి రప్పించుకుని అందరూ కలసి ఆనందంగా గడిపి వెళ్ళడం ..చేయసాగాడు. వెళ్ళేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్ షిప్ లు ఏర్పాటు చేసి వెళ్ళేవాడు

నాలుగేళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బ తింది.  అప్పుడు వచ్చి ఒక నెల రోజులు ఉండి  ఆమెకి స్వయంగా సేవలు చేసాడు . ఇక సొంత వూర్లో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకి సాయంగా ఉంచి వెళ్ళాడు అవసరం అయినప్పుడు సాయంగా  కొడుకు కాని కొడుకుని నేను ఎలాగు ఉన్నాను కాబట్టి రఘు కి ఎలాంటి దిగులు లేకుండా ఉంది . అమ్మ నాదగ్గరే ఉండటం తో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది

తన పనులు తానూ చేసుకుంటూ అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న చర్చి కూడా వెళ్లి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం  సూచనలు ఇవ్వకుండానే తనువూ చాలించింది. .. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ .. మౌనంగా ఉన్న నన్ను ..

సరళ తట్టి పిలుస్తుంది .. “ఏమండీ  .రఘు  అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి ”

ఏమిటన్నట్లు ఆయన వైపు చూసాను .. “ఆమె శవం ని  బాక్స్ లోకి మార్చి ఇదిగో ఈ దండలు వేయండి .. తలవైపు దీపం పెట్టండి . అలా అంత సేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు “.. చెపుతున్నారు .

దీపం .. పెట్టటమా ? అడిగాను ఆశ్చర్యంగా . అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ కృష్ణా .. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటె మనకెందుకు ? ఇప్పుడు ఆమె రఘు  తల్లి మాత్రమే! ! ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపడమే విధి . పైగా అలా చేయకపోతే కృష్ణ కి కీడు జరుగుతుంది . అది మాత్రం ఆమె కోరుకుంటుందా ? అడుగుతున్నాడాయన .  .

నేను ఆలోచిస్తూ  ఉన్నాను  బుర్ర పాదరసంలా  పనిచేసింది వెంటనే ఇలా అన్నాను . “రఘు  రావడానికి  ఎంత  లేదన్నా  ఇంకా రెండు రోజులు పడుతుంది  కాబట్టి .. బాడీని ఇక్కడ బాక్స్ లో  ఉంచడం కంటే మార్చురీ లో ఉంచడం నయం” .. అన్నాను .

నన్ను సమ ర్దిస్తూ మరి కొందరూ అలాగే చేయడం మంచిదని అన్నారు . అమ్మయ్య ..ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్ కి పోన్ చేసాను. ఒకటిన్నర రోజు తర్వాత  భార్య పిల్లలతో సహా రఘు  వచ్చాడు . ఎయిర్ పోర్ట్ కి ఎదురెళ్ళి నేనే ఇంటికి  తీసుకువచ్చాను. మేము  ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్ లో పిన్ని బౌతిక కాయం ని ఇంటికి తీసుకు వచ్చారు.రఘు తల్లి శవం ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు . పిల్లలు ఒకసారి ఆమె దగ్గరికి వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు . భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని  చెప్పాడు రఘు  .

రఘు  మామగారు స్మశాన వాటిక వాళ్లకి ఫోన్ చేసి దహన క్రియలు గురించి  మాట్లాడుతున్నారు.

నేను నిర్ఘాంతపోయాను . తల దగ్గర  దీపం పెట్టబోతున్న  రఘు  భార్యని  “కాసేపు ఆగమ్మా” .. అని వారించి  వాడిని  ప్రక్కకి తీసుకువెళ్ళాను  .

“ఏంటిరా ఇది “.. అడిగాను

“ఏముంది అన్నీ మాములేగా “అన్నాడు వాడు

“రఘు ..  నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ని వ్యతిరేకిస్తూనే ఉన్నావు . ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు . ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమి నచ్చలేదు ” అన్నాను .

“నచ్చడా నికి ఏముంది రా కృష్ణా ! ఇప్పడు నేను ఏమి చేసినా  అమ్మకి తెలుస్తుందా ఏమిటీ ! అమ్మ పుట్టుకతో క్రిష్టియన్ ఏమి కాదుగా ! హిందువుగానే పుట్టింది హిందువుగానే ఆమెని కడసాగనంపడంలో ఎవరికీ అభ్యంతరం ఉంటుంది . మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి ” .అన్నాడు

మరి నువ్వు మధ్యలోనే వచ్చావుగా ..నువ్వు పోవాలిగా ? అన్నాను కోపంగా .” వాట్ “. అన్నాడు  ఆశ్చర్యగా అర్ధం కానట్లు

“నేను అంటున్నది అదే! నువ్వు ఆమె పుట్టినప్పటినుంచి ఆమెతో ఉండలేదుగా . ఆమెని ఇప్పుడు వదిలేయి” అన్నాను .

“ఎలా వదిలేస్తాను . అమ్మ ఉన్నప్పుడు ఆమెని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను  ఆమె కి అంతిమ సంస్కారం  చేసి ఆమె ఋణం  తీర్చుకోవాలి కదా !” అన్నాడు

“మనుషులని ప్రేమించడానికన్నా ముందు వారిని  గౌరవించడం నేర్చుకోవాలి . మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా ? అదే ఆమె అభిప్రాయాలని  గౌరవించావా ? ఆమె ఇష్టపడే బైబిల్ ని ఆమె ప్రార్ధనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు.  మతం, , ఆచారం  ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవరికీ ఇష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనడానికి ఎవరికీ అధికారం లేదు. వ్యక్తి స్వేచ్చకి భంగం కల్గించమని ఏ రాజ్యాంగంలోను చెప్పబడలేదు. మన హిందూ ధర్మం  అసలు చెప్పలేదు.  ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు  ఉండొచ్చు. కానీ ఆమె అవలంభించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక . అమ్మ ఈ  దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందట . వారు వచ్చి నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు.  ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించడం అంటే ఆమెని మనం గౌరవించడమే కదా!  అది మన విధి కదా !  ఆలోచించు”  అన్నాను

” ఏమైందండీ !  అంత సీరియస్ గా చర్చించు కుంటున్నారు  .. అవతల జరగాల్సిన విషయం చూడకుండా ..” అంటూ దగ్గరికి వచ్చింది  సరళ .

“తల్లీకొడుకుల మధ్య కూడా ఈ మత  విశ్వాసాలు ఎంతటి  అగాధం సృష్టిస్తాయో అర్ధం అవుతుంటే  చాలా బాధగా ఉంది సరళా .”అన్నాను

“ఏమంటున్నారు రఘు అన్నయ్య  శవపేటిక ,ప్రార్ధన, బరియల్ గ్రౌండ్ కి వద్దంటున్నారా ?”

అవునని తలూపాను .  రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే  సిద్దం చేస్తున్నారు  పూల దండల బుట్టలు, చావు మేళం,  టపాసులు   అన్నీ వచ్చి చేరుతున్నాయి

రఘు పది నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకి రావడం లేదు .

“సరళా .. నేను వెళుతున్నాను .. ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ, నువ్వు వచ్చేయండి ” అని అంటూ బయటకి వస్తున్నాను .

“అయ్యో ! అదేమిటండి . మనకి నచ్చలేదని వెళ్ళి పోతామా ? ఇన్నేళ్ళు   ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు . ఆ కార్యక్రమం ఏదో అయినాక మనమందరం  కలిసే వెళ్ళిపోదాం . తర్వాత మీ మిత్రుడు,  మీరు ఎలా ఉండదల్చుకున్నారో అలాగే  ఉండండి ” అంటూ చేయి పట్టుకుని ఆపబోయింది .

“మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేనివాడిని  నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను . డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని   మరో మత మూడుడుగా   చూడలేకపోతున్నాను.అది డైజెస్ట్ చేసుకోవడం నావల్ల కావడంలేదు అందుకే వెళుతున్నాను “. తల విదుల్చుకుంటూ   గుమ్మం దాటి బయటకి రాబోతుండగా ..  .

“కృష్ణా .. ఎక్కడికి రా వెళుతున్నావ్ ..? అమ్మ అంతిమ సంస్కారం కి శవపేటిక  .సిద్దం చేయించకుండా .. ?. ” అంటూ వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు.

తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ  సంస్కారం రఘుని సంస్కార వంతుడిగా మార్చిందనుకుంటే నాకు  చాలా సంతోషమేసింది

వాడి చెయ్యి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకి వచ్చాను . ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు  కనిపించింది నాకు.

 .***

–వనజ తాతినేని