నామినీ ఏమిటీ పని?

10256494_783790284967578_2755423526937258553_nనామినికి  తను గొప్ప రచయితనని నమ్మకం. అది నిజం కూడా!

గోర్కీలాగా తెలుగులోరాయగల రచయిత ఎవరు? అని ఎవరయిన ప్రశ్నిస్తే  నూటికి డెభ్భైమందిసాహిత్య పాఠకులయిన సందేహం లేకుండా నామిని పేరు  చెపుతా  రు అది కూడా నిజమే! నామిని తాజా సృజన  ‘‘మూలింటామె’’ చదివిన తరువాత ఎవరికైనా  పైన వివరించినవన్నీ ప్రశంశలు కాదు అతిశయోక్తులు అనిపిస్తే  బహుశా తప్పే మీ  వుండకపోవచ్చు.

నామిని ఇంతకు  ముందుకు రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు, ఈ మూలింటామె ఒక్కటి ఒక ఎత్తు. పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టురోడి  కతలు, ఇస్కూలుపిల్లకాయల కతలు, ముని కన్నడి  సే ద్యం ఇవన్నీ నామిని  బాల్యం చుట్టూ, నామిని  నోస్టాల్జియా చుట్టూ తిరిగితే, మూలింటామె మాత్రం అందుకు  విరుద్ధంగాసమాజం మీద అందున సమకాలీన సమాజం మీద, ఒక పదునయిన వ్యాఖ్యానం  చేయడానికిప్రయత్నం చేసింది. అంటే నామిని  రచయితగా సమాజం తనను గుర్తించిన జానర్‌నుండి వేరే జానర్‌ లోకి ప్రవేశించాడ న్నమాట  మాట. ఒక ఉత్తమ శ్రేణికి చెందిన రచయిత సమాజంతో పాటు తనూ మారుతూ, రూపాన్నీ , సారాన్నీ  మార్చుకుంటూ, పదే పదే అంతర్‌ బాహిర్  రంగాలతో యుద్ధం చేయటాన్ని అభిలషించవలసిందే! అది సమాజానికి అవసరం కూడా !

కానీ ఆ పని సమర్ధవంతంగా చేయకపోతే, అప్పటిదాకా పేరుకు  ముందు వున్న విశేషణాలు అన్నీ కేవలం అవశేషాలుగా మారిపోయే ప్రమాదం వుంది. నామినికి ఇప్పుడా ప్రమాదం ఎదురయింది.

‘‘మూలింటామె’’ ఒక కథ కాదు. రెండు కథల సమాహారం. మొదటి భాగాన్ని మూలింటామె నడిపిస్తే  రెండవ భాగాన్ని మూలింటామె కోడలు పంది వసంత, లేదూ పందొసంత నడిపిస్తుంది.

మిట్టూరులో ఒక మూలమీద విశాలమయిన ఇంట్లో మూలింటామె వుంటుంది. మూల మీద ఇంట్లో వుంటుంది కనుక ఆమె మూలింటామె అయింది  కానీ ఆమె పేరు  కుంచమమ్మ.
మూలింటామెకు భర్త చిన్న వయసులోనే చనిపోతే, కొడుకునీ, కూతురునీ, రెండెకరాల పొలాన్నీ ఒంటి చేత్తో  సాకుతూ వస్తుంది. కొడుకుకి యుక్త వయసు వచ్చాక , మనవరాలు రూపావతిని ఇచ్చి పెళ్ళి చేస్తుంది. మూలింటామె, ఆమె కూతురు నడిపామే , మనవరాలు  రూపావతి, కొడుకు నారాయుడు  ఇదీ ఆ కుటుంబం. నారాయుడుతో  కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నాక  రూపావతి, ఒకరోజు చెప్పా పెట్టకుండా ఒక అరవ మాదిగాయనతో వెళ్ళిపోతుంది. రూపావతి నే కొనమ్మి అనికూడా పిలుస్తారు.

కొనమ్మి వెళ్ళిపోయిందన్నవార్త  నడిపామేకి,, మూలింటామెకి తెలియడంతో నవల మొదలవుతుంది. మొదటి భాగమంత , రూపావతి కనపడకుండా కథను నడిపిస్తుంది.

ఊరుఊరంతా, రూపావతి కన్నతల్లి నడిపామే తో సహా, కొనమ్మిని నానా  మాటలు అంటున్నా అసహ్యించుకుంటున్నా  మూలింటామెకు మాత్రం మనవరాలు  మీద  ప్రేమ  తగ్గదు. ఆమె కోసం  తపన పడుతూ ఉంటుంది.

కొనమ్మి వెళ్లిపోయిన పది రోజులు  తిరగకుండానే,నడిపామే,, నడిపామే  పెద్దమ్మ ఎర్రక్క కలసి నారాయుడికి  కి రెండో పెళ్ళిచేస్తారు. నిండా ఇరవై ఏళ్లులేని పందొసంత మూలింటామె ఇంట్లోకి కోడలు రూపంలో అడుగుపెడుతుంది.

పందొసంత  అడుగు పెట్టాక కథ వేగాన్ని అందుకుంటుంది. వ్యవసాయం దండగని గ్రహించిన వసంత ఇంటిముందు కిరాణా  షాపు పెడుతుంది. అత్తింటింకి వచ్చీరాకుండానే  భర్తకు వరుసకు తమ్ముడయ్యే రంగ బిళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. ఆ సంబంధం నెల రోజులు కూడా నిలవదు. మూడు ట్రాక్టర్లున్న చంద్రారెడ్డితో సంబంధం పెట్టుకుంటుంది. చంద్రారెడ్డి  అండతో వడ్డీవ్యాపారం మొదలుపెడుతుంది. చిట్టీలు నడుపుతుంది.

విశాలమైన ఇంటిచుట్టూ ఉన్న చింత, సీమ చింత లాంటి చెట్లన్నీ అమ్మేస్తుంది. పనిలో పనిగా నారాయుడికి  కి సిగరెట్‌ త్రాగడం  నేర్పుతుంది. మందు కొట్టడం నేర్పుతుంది. ప్యాంట్‌ షర్టూ  వేసుకొని మోపెడ్‌ నడపడం నేర్పుతుంది.
అన్నింటినీ  మించి తన ప్రియుడిని   తమ్ముడు అనడం నేర్పుతుంది.

చివరకు నారాయుడికి  ఉన్న బండిని , ఎడ్లను, రెండేకరాలని  అమ్మేస్తుంది. రెండెకరాలు  కొనుక్కున్న వారికి  పొలం రిజిష్టరు చేయడానికి మూలింటామెను రమ్మంటే, మూలింటామె రానంటే  రానని  మొండి  కేస్తుంది.
మూలింటామెను బెదిరించడానికి ఆమె ఇష్టంగా పెంచుకొనే నాలుగు  పిల్లుల్లో రెండింటిని  చంపేసి  రిజిస్ట్రేషన్ కి  రాకపోతే  ఏం జరుగుతుందో అన్యాపదేశంగా చెప్తుంది. మూలింటామె విషపు ఆకుతిని చనిపోతే ఇంట్లోనుండి  శవం లేచీ లేవకుండానే రెండెకరాల  పొలం రిజిస్ట్రేషన్  చేసేస్తుంది.

Mulintame600

ఇది మూలింటామె కథ. ఈ కథ ద్వారా  నామిని  రెండు విషయాలను పదునుగా వ్యాఖ్యానించాలి  అనుకున్నాడు . ఒకటి సమాజంలో నీతి, నైతికత అనే రెండు బ్రహ్మ పదార్ధాలను  వర్ణం, వర్గం ఆధారంగా సమాజం ఆమోదించడమో, తిరస్కరించడమో
చేస్తుంది. రెండు అభివ ద్ధి అనే జగన్నాధ  రధ చక్రాల క్రింద అన్ని రకాల విలువలూ పడి  నలిగిపోయి నశించి పోతాయి . నిజానికి ఇవేమి కొత్త విషయాలు కావు.
ప్రపంచీకరణ దుష్పలితా లు భారత, మరీ ముఖ్యంగా తెలుగుదేశ గ్రామీణ సమాజాన్ని కబళించడం మొదలైన దగ్గర్నుండీ   ఎంతో మంది చెప్తువస్తున్నవే కానీనామిని  ఈ సబ్జెక్టును ఎన్నుకోవడమే కొత్త.

ఈ కథ 1984 లో జరుగుతుంది. మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు భారతదేశంలో మొదలుకావడానికి కనీసం అర్థ దశాబ్దం ముందు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు  చెప్పడానికి కనీసం పదేళ్ళముందు. 2014 కళ్ళతో 1984 నాటి  సమాజాన్ని వ్యాఖ్యానించడం లోని కాలిక స్ప హ గురించి చెప్పుకోవలసింది ఏం ఉంటుంది?
కొనమ్మి అనే కమ్మ సామాజిక వర్గానికి  చెందిన స్త్రీ  కళాయి పోసుకొనే అరవ మాదిగ పురుషుడుతో వెళ్ళిపోతే మిన్నూ , మన్నూ  ఏకంచేసి గొడవ చేసిన సమాజమే,అదే సామాజిక వర్గానికి  చెందిన మరొక స్త్రీ , మరో బలమైన రెడ్డి  సామాజిక
వర్గానికి  చెందిన పురుషుడుతో సంబంధం పెట్టుకొని సరాసరి  ఇంటికే రప్పించుకుంటే కిక్కురుమనదు పైగా ఆ స్త్రీ కి అండగా నిలుస్తుంది.అటువంటి సమయంలో బాధ్యత గల రచయిత ఏం చేయాలి?

సమాజంలోని అవలక్షణాలను, దుర్నీతిని ఎండగడుతూనే సమాజానికి దిశా నిర్దేశం చేయాలి. మామూలు మనుషులు లాగా ఒక తప్పును మరొక తప్పుతో సరిచేయాలి. అనుకోకూడదు. కానీ నామిని  చేసింది అదే. పందొసంతను సమర్ధించడానికో, కొనమ్మిని విమర్శించడానికో, సమాజం యొక్క దుర్నీతిపైన యుద్ధం ప్రకటించి పొయెటిక్‌ జస్టిస్‌ సాధించడానికో  ఆ సమాజం మొత్తం కలుషితమైపోయిందని చెప్పి ఒక జీవం లేని నవ్వు నవ్వాడు.

జీవితంలో త్వర త్వరగా పైకి ఎదగడానికి అడ్డువచ్చిన ప్రతి దాన్నీ తొక్కేస్తూ వెళ్లిపోవడం అనే ఆధునికి జీవన వ్యాపార  సూత్రాన్ని  కరతలామలకం చేయడానికి పందొసంతను సృష్టించిన , నామినికి  ఆ పాత్ర పట్ల  ఉన్న  ప్రేమ  మిగతా పాత్రలకు అన్యాయం  చేసింది. సమర్ధుడైన రచయితకు ఇది తగదు.
చివరకు మిగిలేదిలో బుచ్చిబాబుకి కోమలి పట్ల, కాలాతీత వ్యక్తుల్లో పి. శ్రీదేవికి ఇందిర పట్ల రవ్వంత  ప్రేమ  ఎక్కువగా ఉంది అన్న విషయం. పాఠకుడికి తెలుస్తూనే ఉంటుంది. బుచ్చిబాబు కానీ, పి. శ్రీదేవి ,కానీ మిగత పాత్రలకు అన్యాయం చేయలేదు .

రచయిత ఒక ప్రపంచాన్ని  సృష్టించాక  పాత్రలను వాటి  మానాన  వాటిని ఎదగనిస్తే ,వాటి  సంతోషాలను, వాటి  దు:ఖాలనువాటిని  అనుభవించనిస్తె మంచి నవల పుడుతుంది.
రచయిత ఎప్పుడైతే తన పాత్రలను నియంత్రించడం మొదలుపెడతాడో  అప్పుడు అవి తమ సహజ సిద్దమైన పరిమళాన్ని కోల్పోతాయి . బుచ్చిబాబు దయానిధి, విశ్వనాధ ధర్మారావు , గోపీచంద్‌ అసమర్ధుడు ఇన్నాళ్ళు  బతికి వున్నారంటే  వారి  మీద ఆయా రచయితల నియంత్రణ లేదు.

ఇందులోని నారాయుడు  పాత్ర రచయిత నియంత్రణ ఉంటే ఎలా నిష్క్రియాపరంగా  తయారవుతాయో  తెలియజేయటానికి ఒక మంచి ఉదాహరణ. ప్రతి పాత్ర ప్రవర్తన  వెనుక ఉన్న కార్య కారణ సంబంధాలు తెలివైన పాఠకుడి  కి ఛాయా మాత్రంగానైన గోచరమౌతూఉండాలి.

అప్పుడు మాత్రమే ఆ పాత్రలను పాఠకుడు సానుకూల దృక్పధంతో  హృదయంలోకి తీసుకుంటాడు. అలా కానప్పుడు నవలలో పాత్ర అయితే  ఉంటుంది కానీ, అందులో ఆత్మ ఉండదు.
మొదటి భార్య కొనమ్మి అరవ మాదిగ ఆయనతో వెళ్ళిపోయినప్పుడు నారాయుడు  ప్రతి స్పందన మనకు తెలియదు. రెండో భార్య ప్రియున్ని ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంటే అతని స్పందన  ఏంటో కూడా మనకు తెలియదు. నారాయుడి  మౌనానికి , నిష్క్రియా పరత్వానికి  ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. లేక పోతే మామూలు మనుషులు లాగే అతడి కి కోపం, దు:ఖం, నిస్ప హ లాంటి భావోద్వేగాలు ఎందుకు కలగలేదు. అనే సంశయం పాఠకుడి  ని వేధిస్తుంది. దురదృష్టం  ఏమిటంటే ఇక్కడ బలమైన కారణం రచయితే.

రచయిత దృష్టి  ఎంత సేపటికి  పందొసంత మీద ఉంది తప్పిస్తే  నారాయుడి  మీదకు మళ్ళలేదు. పందొసంత పాత్ర చదువుతుంటే నాకు  రావూరి  భరద్వాజ పాకుడు రాళ్ళు నవలలోని మంజరి గుర్తుకొచ్చింది. మంజరి కార్యస్థానం వేరు. పందొసంత కార్యస్థానం వేరు. చిత్రసీమలో తప్పనిసరి పరిస్థితులలో తన లక్ష్యాన్ని చేరడం కోసం అందరికి శరీరాన్ని  అప్పగించి అత్యున్నత స్థాయికి వెళ్ళి అధమ స్థాయికి పడి  పోతుంది మంజరి. కానీ, ఈ నవలలో పందొసంతకి శరీరాన్ని  రంగ బిళ్ళకి, చంద్రారెడ్డికి అప్పగించాల్సినంత  బలీయమైన కారణాలను పాఠకుడి  కి రేఖామాత్రంగానైనా నామని చెప్పలెదు. పాకుడు రాళ్ళూ నవలలో  భరద్వాజ చెప్పాడు కనుక మంజరి పట్ల పాఠకుడ కి సానుభూతో, సహానుభూతోకలుగుతుంది. పందొసంత విచ్చలవిడి  తనానికి , విశృంఖలత్వానికి ఉండవలసిన తాత్త్విక   భూమిక ఏదీ నవలలో కనిపించదు. పోనీ ఆతాత్త్విక  భూమిక గ్లోబలైజేషన్‌ అనుకోవాలనుకున్నా , ఈ కథ నడ చింది మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు మొదలుకావడానికి దశాబ్దం ముందు. పాతికేళ్ల క్రితం ఆంధ్రదేశంలోని పల్లెటూళ్లు ఇప్పుడు కలుషితమైనంతగా అప్పుడైతే కాలేదు. కనుక పొయెటిక్‌ లిబర్టీ ఇక్కడ అస్సలు అన్వయించదు.

ఈ నవల అంత కామంతో నిండి  పోయిన చీకటి పాఠకుడి  ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానికి తోడు రచయిత ధారాళంగా , యధేచ్ఛగావాడిన  బూతు, అశ్లీల పదజాలం కొంచెం కఠిన మైన మాటేమోకానీ, రోత కలిగిస్తుంది. ఈ బూతు వాడటం  ఏ శిల్ప సౌందర్యం కోసమో నాకయితే  అర్ధంకాలేదు. ఈ బూతు పురాణం  గురించి నామిని ఏమంటున్నాడో  చూడండి.
‘‘నా  పుస్తకంలో బూతులుంటాయనే మాట గురించి. కొన్ని కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు. నేను పల్లెటూరోడి  ని, యం.ఎస్సీ దాకా చదువుకున్న . మళ్ళా కతలు రాసేసిన  . అదే ఊళ్ళో వాళ్ళ  మింద. మా ఊళ్లో పి.జీ. చేసిన మా ఎత్తిరాజులు  బావ తమ్ముడు జయ చంద్ర నాయుడు  అని ఎకనమిక్స్‌ లెక్చరర్‌గా ఇప్పుడు ఉండాడు. మరేదస్తుడు. ఒక్క బూతు పదం మాట్లాడంగా ఎవరూ ఇనిండరు. నేను మా మేనత్త అయిన వాళ్ళమ్మను  జుట్టుకు ముడేసుకున్న గుడ్డ పీలికను  పెరికేసి ‘‘నువ్వు బోయే లంజా’’ అనే వాడిని . మా జయచంద్ర బావకు మా అమ్మ మేన మామ పెండ్లాం కదా. అత్తా , చిన్నత్తా  అని మరేదగా పిలిచేవోడు.
ఎమ్మేస్సీ చదవంగానే నేను ఊళ్లో ఆడోళ్ళందరి దగ్గర మరేదలు పొందుతా, వాళ్ళకు పిలుపుల్లో మరేదలిస్తా, వుండా ననుకోండి  , నేనేంది పుస్తకం  రాసేది  బొచ్చులో కొంచెం’’

ఇవి నా  మాటలు కావు. నామిని  ఆత్మకథ.  నామిని  నెం. 1 పుడింగి  అనే పుస్తకంలోవి. పుస్తకం నిండా బూతులురాయడానికి  చెప్పిన కారణమేమీ నాకు కన్విన్‌సింగ్‌గా లేదు. కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు అనే బుకాయింపు ఒకటి.
‘‘మొగోడన్నాక , మొగోడి  గా పుట్టినాక  మొగోడి  ఆటలే ఆడాల. మొగోడు తిరక్కపోతే, తిరక్కపోతే  ఏరిగే ఆడది కూడ ముడ్డినట్టా  పైకి లేపదు. నువ్వు తాగితే  చూడాలని, ఒక లంజని పెట్టుకుంటే చూడాలని ఉండాది. నువ్వియ్యాళకు ఒక లంజని పెట్టుకునేది కూడా నేర్వలేదని ఊరంత నవ్వుకుంటుండారు’’ ఇలాంటి మాటలు ఈ నవల నిండా కోకొల్లలు. వీటిని ఏవో కొన్ని మాటలు అని నామిని  అంటే నామినికో నమస్కారం.

ఈ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో సమీక్షిస్తూ జి.ఎస్‌.రామ్మోహన్  ‘‘నామిని మూలింటామెను కావ్య నాయిక  చేశారు. ధర్మారావు , ధయానిధి ప్రక్కన పీట వేసి కూర్చోబెట్టారు.’’ అని చెప్పారు. ధర్మారావు  అంటే నాకు  వేయి పడగలలోని ధర్మారావే  గుర్తుకొచ్చాడు . వేయి పడగలు నవల ఇలా ముగుస్తుంది.
చివరకు ఏమి మిగిలింది?
నీవు మిగిలితివి. నేను మిగిలితిని అంటూ చిన్న ధర్మారావు , చిన్న అరుంధతి వైపు చూస్తాడు.
విశ్వనాధ  ఎంత అభివ ద్ధి నిరోధకుడు అయినా కానీ , ఒక సంప్రదాయ వ్యవస్థను నిలబెట్టడం కోసం చిన్న ధర్మారావుని  నిలిపాడు.
మరి నామిని  ఏ విలువలను కాపాడటం కోసం మూలింటామెను చంపేశాడు ?
‘‘ఒక పుస్తకం చదివాక , మనలో మంచి రసాయన ఊరాల ’’ అని నామిని  తన ఆత్మ కథలో అన్నాడు . నాలో  అయితే ఈ పుస్తకం చదివాక  ఏ రసాయనము ఊరలేదు. కాముకత్వపుచీకటిలో దారీ తెన్నూ  కనపడక కూలపడి  పోయాను.
నామినీ  ఏమిటీ పని?

-వంశీకృష్ణ

 

 

నిర్మల నది

 vamsee krishna

ఆమె ముందు మోకరిల్లాను
అపరిమితమైన  అనుకంపతో
ఆమె నా తలను స్పర్శించింది
నా లోలోపలి  పురా పాప భారమంతా
ఆమె స్పఅల్లకల్లోలమైంది ర్శలో  లయించింది
నీటి మీద పడవ  నడుస్తున్నట్టుగా
ఆమె కరుణ నన్ను నడుపుతోంది
జ్ఞాన చక్షువు తెరుచుకుని
శరీరం తనకు తానే  వెళ్ళిపోయింది
పడవ  లోకి నీళ్లు  చేరాయి
తెరచాప దిశను మార్చుకుంది
పడవ  ముందుకూ  వెనుకకూ  ఊగిసలాడుతోంది
ఉన్నట్టుండి
పెనుతుఫాను  చుట్టు ముట్టింది
నది అల్లకల్లోలమైంది
పడవ తిరగబడుతోంది
“భయమేస్తుందా ?” అన్నదామె
“ఉహూ , నువ్వు  వున్నావు కదా ” అన్నాను
ఆమె నవ్వి
హృదయంలోకి  నన్ను తీసుకుంది
నది  నిర్మలంగా  మారింది
– వంశీకృష్ణ

అతడు – ఆమె – ఓ బొల్లిగిత్త !

కేశవరెడ్డి మేజిక్‌ రియలిజమ్‌

ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు? మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే. మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

   తెలుగులో రచనని, సామాజిక మార్పుకోసం ఒక పరికరంగా మార్చుకున్న సృజనకారులలో కేశవరెడ్డి ప్రముఖుడు. అధోజగత్‌ సహోదరుల వ్యదార్ధ జీవితాఇన్న కేశవరెడ్డి ఎన్నో నవలల్లో ప్రతిభావంతంగా చిత్రీకరించారు. కేశవరెడ్డి తాజా నవల ‘మునెమ్మ’ మిగతా నవలల కంటే కొంత భిన్నమయినది. సహజంగానే కేశవరెడ్డి రచనలలో విజువల్‌ ఇమేజ్‌ ఎక్కువ. దీనికి మేజిక్‌ రియలిజమ్‌ కలగలవడంతో, మునెమ్మ ఒక అద్భుతమయిన పఠన, దృశ్య కావ్యంగా మారింది.
శైలి, శిల్పము, వస్తువు ఈ మూడూ పడుగు పేకల్లా కలిసిపోతేనే ఏ రచనకయినా జవమూ, జీవమూ! ఈ మూడిరటిలో ఏది బ్యాలెన్స్‌ తప్పినా రచనలో ఏదో లోపించినట్లుగా వుండి పాఠకుడికి మేధోపరమయిన అసంతృప్తి ఏర్పడుతుంది.
అసలు రచన అంటే ఏమిటి? రచయిత స్థల కాలాలకి అతీతుడా లాంటి ప్రశ్నల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎవరయినా రచన జీవితానికి రెండో వైపు అని చెప్పగలరు. ‘మునెమ్మ’లో కేశవరెడ్డి చూపిస్తున్న ‘రెండో వైపు’ ఎలా వుందో పరిశీలించడమే ఈ వ్యాసం.
‘‘స్థలకాల బద్దుడయిన సామాజిక వ్యక్తి కాకుండా రచయిత రచన చేయలేడు. అందుకనే రచయిత వ్యక్తిగానే రచన చేస్తున్నట్టు కనిపించినా సమిష్టి జీవితపు వేళ్ళు లేకుండా రచనా వృక్షం మొలకెత్తడానికి కూడా అవకాశం లేదు. రచయిత చుట్టూ వున్న సామాజిక జీవితం రచయిత మెదడులో ఆవేశ భావ రూపాల స్థితని పొంది క్రమబద్ధంగా రూపొందుతుంది. ఈ క్రమాన్నే సృష్టి అంటాం. మనిషి అంతరింద్రియ వ్యాపార క్రమాలకు, సామాజిక క్రమాలకు వుండే సంబంధం అవగాహన చేసుకోకపోవడం వలన సాహిత్య సృజన విషయంలో అనేక తప్పుడు అభిప్రాయాలు ప్రపంచానికి వచ్చాయి’’
ఇది కేశవరెడ్డి ‘‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’’ నవలకు ముందు మాట రాస్తూ త్రిపురనేని మధుసూధనరావు వెలిబుచ్చిన అభిప్రాయం. ఆయన యింకా యిలా అంటున్నారు.
‘‘ మానవులు తమ సంకల్ప శక్తితో తమ యిష్టం వచ్చినట్టు మానవ సంబంధాలు పెట్టుకుంటారా? అలాగే కనిపించవచ్చు కానీ అది వాస్తవం కాదు. చచ్చిపోయిన వాళ్ళతో కానీ, పుట్టబోయే వాళ్ళతో కాని మానవులు యిష్టం వున్నా సంబంధం పెట్టుకోవడం కనీసం ప్రస్తుతానికి సాధ్యం కాదు. జీవించే వ్యక్తుల మధ్యన సంబంధాలు వుంటాయనేది వుల్లంఘించడానికి వీల్లేని సత్యం. ఎప్పుడో చచ్చిపోయిన ముత్తాతతో ముని మనుమడు సంబంధం పెట్టుకున్నట్టు ఎవరయినా రాయెచ్చు.

చచ్చిపోయిన తన పెళ్ళాం ఎక్కడో పుట్టి వయసొచ్చి ఏ బస్సులోనో కనపడినట్టు పూర్వజన్మ స్మృతితో ఆ పిల్ల ముసలాడిని పట్టుకుని నువ్వే నా మొగుడివి వదలను గాక వదలను అన్నట్టు రాయెచ్చు. కానీ అది నవల కాదు. అవి మానవ సంబంధాలు కావు. అది పురాణం, ఆ సంబంధాలు భ్రమాజనితాలు. భ్రమలకు కూడ పరిమితులుంటాయి. మానవ సంబంధాలను పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ఠ రూపంలోనే పెట్టుకునేది మానవులే! అయితే ఆ సంబంధాలని నిర్ధిష్ట దశలో, నిర్ధిష్ట రూపంలోనే పెట్టుకోగలుగుతారు. ఆ సంబంధాలు స్థల కాల మార్పులకు ఆధీనంగా వుండలవసిందే’’.

munemma
మునెమ్మ నవలలో స్థలము, కాలము రెండు వున్నాయి. రచయితకు మాత్రమే కాలిక స్పృహ లోపించింది. అయితే కేశవరెడ్డి తన కధన చాతుర్యంతో ఏ అంశాన్నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. ‘అతడు అడవిని జయించాడు’, ‘ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌’, ‘మూగవాని పిల్లనగ్రోవి’, ‘మునెమ్మ’ ఇలా ఏ నవల నయినా పురాణం స్థాయికి తీసుకెళ్ళగలడు. పాఠకుడి తను చదువుతున్నది వాస్తవమా, పురాణమా అన్న సంశయం కలుగుతూ వుంటుంది పదే పదే. మూగవాని పిల్లనగ్రోవి నవలలో బక్కిరెడ్డి చనిపోయినప్పుడు ప్రకృతి యావత్తు భోరు భోరుమని విలపించడమూ, మునెమ్మలో తరుగులోడిని సంహరించే సన్నివేశంలో బొల్లిగిత్త ఎవరెవరికి ఎలా ఎలా కనిపించింది అన్న సన్నివేశాన్ని చిత్రీకరించడం లాంటి లక్షణాలు కేశవరెడ్డి కధనాపటిమకు మెచ్చుతునకలు.
మేజిక్‌ రియలిజమ్‌ తోడ్పాటుతో కేశవరెడ్డిలోని ఈ లక్షణం మునెమ్మలో తారాస్థాయిని అందుకుంది. గాబ్రయేల్‌ గార్షియా మార్కుజ్‌ లాంటి నోబుల్‌ బహుమతి గ్రహీతలు తమ భావాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని వ్యవస్థలో మేజిక్‌ రియలిజమ్‌ మాటున దాక్కున్నారు. తెలుగులో మేజిక్‌ రియలిజమ్‌ కొత్తదేమీ కాదు. మునిపల్లె రాజు మేజిక్‌ రియలిజమ్‌ కథల పేరుతో ఒక కథా సంపుటాన్నే ప్రచురించాడు. వి. చంద్రశేఖరరావు చాలా కథలలో మేజిక్‌ రియలిజమ్‌ పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మునిపల్లె రాజులో మేజిక్‌ రియలిజమ్‌ పరాకాష్ట నందుకుంటే కేశవరెడ్డి మునెమ్మలో ఇది తేటనీటి అడుగు చేపపిల్లల కదలికల్లాగా కనిపించీ కనిపించకుండా కనిపిస్తూ పాఠకుడిని సంభ్రమాశ్చర్యచకితులని చేస్తుంది. నిజానికి ఈ కధన పద్దతిని కనుక కేశవరెడ్డి కనుక ఎన్నుకోక పోయినట్లయితే యిది ఒక సాదా సీదా క్రైమ్‌ థ్రిల్లర్‌లాగా, షాడో ఇనవెస్టగేషన్‌లాగా మిగిలిపోయేది.
కథ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చిత్తూరు జిల్లాలోని ఒంటిల్లు అనే కుగ్రామంలో మునెమ్మ, జయరాముడు అనే పడుచు జంట. వీళ్ళ బతుకు రధాన్ని లాగడానికి ఆధారమయిన ఓ బొల్లిగిత్త. బొల్లిగిత్తకి మునెమ్మపైన లైంగికపరమయిన ఆకాంక్ష కలగిందన్న ఒక చిన్న అనుమానం జయరాముడిలో మొదలయి, బొల్లిగిత్తను కసిదీరా చావ బాది, ఆ తర్వాత మద్దిపాలెం పరసలో అమ్మెయ్యాలని నిశ్చయించుకుంటాడు.
బొల్లిగిత్తను మద్దిపాలెం పరసకు తోలుకుపోయిన తర్వాత, ఒంటరిగా బొల్లిగిత్త తిరిగివస్తుంది. కానీ జయరాముడు రాడు. ఆ రాత్రి మునెమ్మకి కలలో తన భర్త జయరాముడిని ఎవరో హత్యచేశారన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత జయరాముడి హంతకుల కోసం మునెమ్మ వేట/ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో మునెమ్మకి సినబ్బ తోడవుతాడు. సినబ్బకి ఆమెకి ఒక వరుసలో తమ్ముడు. ఒక వరుసలో మరిది. మునెమ్మ సినబ్బను మరిదిలాగా భావిస్తుంది. సినబ్బ మునెమ్మని తమ్ముడులాగా భావించుకుంటాడు. సినబ్బ ద్వారానే పాఠకుడికి కథను రచయిత చెప్తాడు. ఒక రకంగా రచయితకు సినబ్బ ప్రతినిధి.
ఒంటిల్లు నుండి మద్దిపాలెం దాకా, అక్కడినుండి రామినాయుడిపల్లె మీదుగా కాణిపాకం తిరగి ఒంటిల్లు దాకా సాగిన ఈ ప్రతీకార యాత్ర యావత్తు మునెమ్మ అతీంద్రీయ, తార్కిక, జ్ఞానశక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మునెమ్మ అనే ఈ సాధారణ వ్యకిలోని అసాధారణ తత్వానికి సినబ్బ అడుగడుగునా ఆశ్చర్య చకితుడు అవుతూ వుంటాడు.
తనకు వచ్చిన కల ఆధారంగా జయరాముడు ‘మరిక లేడు’ అన్న నమ్మకం మునెమ్మలో బలపడుతుంది. ఆ నమ్మకాన్ని సినబ్బకి చెపితే ‘‘అది ఆమెలో వున్న మూర్ఖత్వానికి పరాకాష్ట’’ అని భావించిన సినబ్బ నాలుగు రోజుల తరువాత అది మూర్ఖత్వం కాదని, ‘‘అంతర్‌దృష్టి’’అనీ అవధువుల లేని ఆవేదన ద్వారా పొందిన యోగమే ‘‘అంతరదృష్టి’’ అనీ అర్ధం చేసుకుంటాడు.
ఈ నవలలో కేశవరెడ్డి వదిలేసిన లూస్‌ ఎండ్స్‌ ఎన్నొ. జయరాముడి వ్యక్తిత్వంలో వస్తున్న ప్రతి మార్పుకి ఒక ఆధారభూతమయిన అంశాన్ని వివరిస్తూ, జయరాముడి కూడా తండ్రిలాగే తయారయ్యాడన్న వాస్తవానికి ఒక లాజికల్‌ రీజనింగ్‌ యిచ్చిన కేశవరెడ్డి, జయరాముడి హత్య వరకు అతి సాధారణ గృహిణిలాగా వ్ను మునెమ్మలో ఆ తర్వాత అద్భుతమయిన, ప్రేరణ, అతీంద్రీయ శక్తులకు మించిన జ్ఞానం కలగడం కావలసిన తాత్విక భూమికను ఏదీ చూపించలేదు. జయరాముడి వ్యక్తితవ్వంలో మార్పులకు ఇన్‌హెరిడిటీ/ జన్యుపరమయిన అంశాలు కారణం అయినట్లుగా మునెమ్మ అంతర్‌దృష్టికి ఏ రీజన్‌ లేదు.
వ్యవసాయక సమాజంలో పశువులకు, మనుషులకి మధ్య సన్నిహిత సంబంధాలు వుండటం సహజమే. పల్లె పట్టులలో వుండే ఎవరికయాని, తమతో సన్నిహితంగా వుండే మనుషులను పశువులను నాలుకతో నాకడమూ, మొహం మీదకు ముట్టె సాచి ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటి అంశాలు అనుభవంలోకి వచ్చేవే. మనుషుల స్పర్శను పశువులు కోరుకోవడంలో లైంగిక పరమయిన కాంక్ష వుంటుందా? నాలుగు కాళ్ళ జంతువులా కనిపించిన మునెమ్మ మీదికి బొల్లిగిత్త రెండు కాళ్ళు ఎత్తి నడుము మీద వేయడం యితరేతర పశువుల ప్రవర్తన కంటే భిన్నమయినదా? వ్యవసాయిక సమాజమునుండి వచ్చిన జయరాముడికి పశువుకి, మనిషికి మధ్య వుండే సంబంధం గురించిన అవగాహన లేశ మాత్రమయిన లేదా!
కథాకాలం స్వాతంత్య్రానికి  పూర్వం. అప్పటికి మనుషులు యింకా యింతగా కలుషితం కాలేదు. అలాంటప్పుడు తరుగులోడు , నాటువైద్యుడి సహాయంతో జయరాముడిని హత్యచేయండ కేవలం డబ్బుకోసమే అనుకుంటే అందులో సమంజసత్వం వుందా! హత్యకి మోటివ్‌ ఏం లేదు?
జయరాముడి హత్యకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం వెనుక మునెమ్మలో అపరాధ భావం వుండా? జయరాముడి బొల్లిగిత్తను చావబాదడానికి కారణం అది తనను కామించడమే అయితే, దాన్ని యాక్సెప్ట్‌ చెయ్యడం ద్వారా జయరాముడికి అన్యాయం చేశానన్న భావం/గిల్టీ మునెమ్మలో వుందా? మునెమ్మకి జయరాముడి పైన వున్న ప్రేమకి, బొల్లిగిత్తపైన వున్న ప్రేమకి వున్న సాంద్రతలో తేడాలున్నాయా? ఒక మనిషి ఏక కాలంలో మనిషిని, పశువుని ప్రేమించడం సాధ్యంకాదా? అది నేరమా?
జయరాముడి స్థానంలో బొల్లిగిత్తను అంగీకరించడం ద్వారా పోయటిక్‌ జస్టిస్‌ జరిగిందన్న సురేంద్రరాజు మాటలో కేశవరెడ్డి ఏకీభవిస్తున్నారా? ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌కి త్రిపురనేని మదుసూధనరావు రాసిన ముందు మాటని ‘‘నవలలోని కొన్న అంశాలను గురించి రచయిత పునరాలోచించవలసి వుందని’’ పేర్కొన్నారు. ‘‘కానీ అనాటి పరిస్థితులలో అలా పునరాలోచించాల్సిన అవసరం వుందని నేను భావించలేదు’’ అంటూ ఖండిరచిన కేశవరెడ్డి సురేంద్రరాజు మాటను ఖండిరచలేదు అంటే తన జస్టిస్‌గా అదే అనే కదా అర్ధం. అలాంటప్పుడు సింగిల్‌ ఉమెన్‌ సమస్యల పట్ల కేశవరెడ్డి దృక్పధం ఎలాంటి సంకేతాలని ఇస్తుంది.
ఫ్రాయిడిన్‌ సిద్ధాంతాల ఆధారంగా మనిషులకు, పశువులకి మధ్య లైంగిక సంబంధాల ఆధారంగా కొంత ఆంగ్ల సాహిత్యం యిప్పటికే వచ్చింది. అయితే అదంతా ఒక అసాధారణ మానవ ప్రవృత్తిని గురించి విశ్లేషించేదే, కానీ కేశవరెడ్డి ఈ అసాధారణ మానవ ప్రవృత్తికి ‘‘అంతర్‌ దృష్టి’’ అనీ, అవధులు లేని వేదన ద్వారా పొందిన యోగమని భ్రమింపచేయడం ఎంతవరకు సబబు?
మానవ సంబంధాలలోని కాంప్లెక్స్‌టీస్‌ లేదూ, బహుళత్వాన్ని, సంక్లిష్టతలను చిత్రించాలనుకుని మేజిక్‌ రీయలిజమ్‌ మంత్రనగరిలో తనను తాను కోల్పోయిన మునెమ్మలో ఆధునిక స్త్రీ లక్షణాలని చూసిన జయప్రభ మునెమ్మ స్వాతంత్య్రపు పూర్వపు స్త్రీ అనే కాలిక సృహను ఎలా మరిచారు? ఈ మరపుకూడా మేజిక్‌ రియలిజమ్‌ మాయేనా? మునెమ్మ ఒక్కసారి కూడా దైవాన్ని స్మరించుకోలేదని ఇలాంటి చైతన్యం ఆ కాలంలోనే మునెమ్మకు ఉండటం అసాధ్యం కనుక ఆవిడ ఖచ్చితంగా కేశవరెడ్డి మానస పుత్రికే అని సంబరపడ్డ జయప్రభకి మునెమ్మ చైతన్యానికి మునెమ్మ అంతర్‌దృష్టికి మధ్య వున్న విరోదాభాస అర్ధం కాక పోవడం విచిత్రమే.
మళ్ళీ మనం త్రిపురనేని మదుసూధనరావు దగ్గరకు వస్తే భ్రమాజనిత సంబంధాలు పురాణాలు అవుతాయే తప్పితే నిజమయిన మానవ సంబందాలు కావు. కేశవరెడ్డి లాంటి ఇంటలెక్చువల్‌ రచయిత మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను సమగ్రమయిన అవగాహనతో సరళతరం చేయ్యాలి తప్పితే పురాణాల స్థాయికి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాశ్చర్యచకితులను చేయడం తగదు.

– వంశీకృష్ణ

పున్నాగపూల పరిమళం !

2(1)

ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి.
‘‘కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలేయాలి. కొన్ని పుస్తకాలని చదివి జీర్ణం చేసుకోవాలి.’’  అని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న జ్ఞాపకం. అలా చదివి జీర్ణం చేసుకోవల్సిన పుస్తకం ఎదురైతే మనం మనలాగా ఉండలేము కదా! అందుకే మరో వైపు మిత్రులతో ఈ సంభాషణ.
‘‘దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి తన అవసరాల కోసం వస్తువులను సృష్టించుకొన్నాడు. వస్తు మయ ప్రపంచంలో మనిషి మస్తుగా కూరుకుపోయిన తరువాత సాటిమనుషులను తనను సృష్టించిన దేవున్ని ప్రేమించడం మానేసి వస్తువులను ప్రేమించడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మనిషి మనిషిలాగా లేకుండా ఒక వస్తువులాగా మారిపోయాడు.’’ అని తరచూ ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఉపన్యసిస్తూఉంటారు.
ఒక వస్తువుగా మారిన మనిషి మరలా మనిషిగా మారాలంటే ఏం చేయాలి? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆహ్లాదంగా ఉంచడానికి మనిషిలో ఎలాంటి మెటామార్ఫసిస్‌ జరగాలి? అతడి అంతరంగంలో ఎన్ని యుద్ధాలు జరగాలి? ఈ సంగ్రామంలో ఎన్ని సార్లు క్షతగాత్రులవ్వాలి?
”The Greatest Discovery of My Generation is that Human beings by changing the inner attitudes of their needs can change the outer aspects of their lives”    అని కదా హెన్రీజేమ్స్‌ అన్నది. తమ తమ సోకాల్డ్‌ అవసరాల అంతర్గత దృక్పధాలను ఎలా మార్చుకోవాలి. అలా మార్పును పరిపూర్ణంగా పొందే ప్రాసెస్‌ ఎంత హృద్యంగా, ఎంత సహజంగా జరగాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే నేను ఇటీవల చదివిన పుస్తకం. ఆ పుస్తకం పేరు పున్నాగపూలు. ఒక తెలుగు నవల. రచయిత్రి జలంధర.Jalandhara Garu
పున్నాగపూలని ఒక నవల అనడం కంటే అనేకానేక బాధిత వ్యక్తిత్వాలు అనే పున్నాగపూలను మార్పు కోసం చేసే ప్రయత్నం అనే దారంతో గుదిగుచ్చి పాఠకుడి మెడలో వేసిన వసివాడని హారం అంటే బాగుంటుంది.
రాధ ఒక అందమైన మంచి అమ్మాయి. మంచి ఇల్లాలు. మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్‌ రోల్‌ లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారయిపోతారు. అట్లా రూపుదిద్దుకున్న ఇల్లాలు రాధ.
సదరు రాధ తన భర్త రాజారావుకి జబ్బుచేస్తే జి.కె. హాస్పిటల్స్‌లో చేర్పించడానికి వెళుతుంది. అక్కడ హాస్పటల్‌ లో తనను తాను పూర్తిగా కనుగొని, సంపూర్ణమైన వ్యక్తిగా తయారు కావడం ఈ నవల యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇలా మారడం అనేది ఒక రోజులోనే, ఒక రాత్రిలోనో, ఒక క్షణం లోనో జరిగిన మెటామార్ఫసిస్‌ కాదు. హాస్పిటల్‌కి వచ్చే రక రకాల వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళకు ఎదురైన సమస్యలు, వాళ్ళు ఎన్నుకున్న పరిష్కారాలు ఇవన్నీ రాధను సంపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా రాధ ఆలోచించడం నేర్చుకుంటుంది.
ఈ క్రమంలో జలంధర తనదైన స్వరంతో చాలా విషయాలు మాట్లాడింది.
‘‘పిల్లలను పెంచుతూ మాటలు నేర్పిస్తాము. పాటలు నేర్పిస్తాము. టేబుల్‌ మేనర్స్‌ నేర్పిస్తాము. ఆలోచించడం మాత్రం చాలా తక్కువ సార్లు నేర్పిస్తాము. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగిచూడగలమో, ఆ తలపు తీయడమెలాగో మాత్రం నేర్పించము. తెలివితేటలు నేర్పించే చదువు వేరు. వివేకము జీవితానికి అది ఇచ్చే ఎరుక వేరు. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. కాని నేర్పించము’’. అంటుంది జలంధర.
నిజమే! మన పిల్లలకి మనం ఆలోచించడం నేర్పిస్తున్నామా? గర్భస్త పిండంగా ఉండగానే కార్పోరేట్‌ స్కూలుకి డొనేషన్‌ ఇచ్చి సీటు రిజర్వు చేసుకొంటాము. 3వ ఏట నుండే, వీలుంటే ఇంకా ముందే ప్రీ స్కూల్‌లకి పంపిస్తాము. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించడమే నాణ్యమైన విద్య అందించడం అనుకుంటాము. కానీ ఆ విద్య పిల్లలను మరమనుషులుగా మారుస్తున్నదని గుర్తించము. తీరా వాళ్ళు మనం ఆశించినట్లుగా తయారవకపోతే నింద మాత్రం మొత్తం వ్యవస్థ మీద వేస్తాము.
ట్రూత్‌ కెనాట్‌ బి టాట్‌
టీచింగ్‌ మీన్స్‌ హెడ్‌ టు హెడ్‌
ట్రూత్‌ ఈజ్‌ ట్రాన్స్‌మిషన్‌
ఫ్రం హార్ట్‌ టు హార్ట్‌
అన్న విషయం మనకే తెలియదు. మనం పిల్లలకి ఏం అనుభవం లోకి తీసుకొనివస్తాము. పై పెచ్చు మన మిడి మిడి జ్ఞానంతో వాళ్ళ ఆకుపచ్చటి లోకాన్ని పాడుచేస్తాము. శరీర శాస్త్రం ప్రకారం మనిషికి ఒక మెదడు ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా మనిషికి హెడ్‌ బ్రెయిన్‌, బాడి బ్రెయిన్‌ అని రెండు రకాల మెదడులు పనిచేస్తాయి.ఈ రెండిరటిని సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరు వేరని కొంతమందిని చూస్తే తెలుస్తుంది. మన లోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచనా స్రవంతులు తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల మెదడులు, వాటి ప్రభావం మన మర్చిపోకూడదు.
పసిపిల్లలు సాధారణంగా తమ బాడీ బ్రెయిన్‌ చెప్పిన మాటను వింటారు. వాళ్ళకు ఇష్టం లేనివి వద్దు అనుకుంటారు. నచ్చని పిల్లలను దగ్గరకు రానివ్వరు. మనం మన పెంపక దోషంతో ముందు పిల్లల ఇష్టా ఇష్టాలను అర్ధం చేసుకోకుండా మనకు మంచిది అన్నది. వాళ్ళమీద రుద్దుతారు. మన ప్రవర్తన, మన మాట వలన ఎదుటివాళ్ళు ఏం అనుకుంటారో, నిజం చెప్తే అంటూ మెల్లగా పిల్లలను ఆ బాడి బ్రెయిన్‌ విస్మరించి హెడ్‌ బ్రెయిన్‌తో ఆపరేట్‌ చేయించడం నేర్పిస్తాము.
మన బాడీ బ్రెయిన్‌ మన గురించి నిజాలు చెప్తుంది. మన హెడ్‌ బ్రెయిన్‌ నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్‌ అవుతుందో నీ నుండి ఏం కోరుకుంటుందో చెప్తుంది. మన అసలు భరించలేని మనుషులను ఒప్పుకొని భరిస్తే మిగతా ప్రపంచం మనల్ని సహన శీలి అని, మంచి వ్యక్తి అంటారనే ఆలోచనతో వాళ్ళను భరిస్తాము. ఈ భరించడం వెనుక హెడ్‌ బ్రెయిన్‌ ఉంటుంది. కానీ మన బాడి బ్రెయిన్‌ అనుక్షణం సన్నటి గొంతుకతో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది కాదు నీకు కావలసిందీ అని. బాడీ బ్రెయిన్‌ని ఎంత త్వరాగా మనం గుర్తిస్తే మనకది అంత త్వరగా మంచి గైడ్‌ అవుతుంది.
ఠాగూర్‌ అనే తెలుగు సినిమాలో శవాన్ని హాస్పిటల్‌కు తీసుకొని వస్తే నానా హడావుడి చేసి డబ్బు సంపాదించే డాక్టర్ని మన చూశాం. కాని ఈ జి.కె. హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్‌ కృష్ణ అలాంటి డాక్టర్‌ కాదు. ఒక పేషెంటు తన సంతోషం కొద్దీ కోటి రూపాయలు తెచ్చిఇస్తే ఆ డబ్బును తీసుకోకుండా చెడుమార్గంలో వచ్చిన డబ్బు చెడు వైబ్రేషన్స్‌ని కలుగజేస్తుందని తిప్పి పంపిస్తాడు. ప్రతి మనిషి ఇలాంటి హాస్పిటల్‌ ఒకటి మన దగ్గర ఉంటే ఎంత బావుంటుంది అనుకునేంత బావుంటుంది ఈ హాస్పిటల్‌. లోపలికి వెళ్ళగానే కనిపించే మొదటి బోర్డు మీదే ఇలా వుంటుంది.
Here the Patient understands that body heals, and not the Therapy  ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటానికి హాస్పిటల్‌లో రక రకాలు పద్దతులు అవలంభిస్తారు. ధ్యానం నుండి చిత్రలేఖనం దాకా. ఈ పద్దతులను చదువుతున్నపుడు మనం మొదట్లో ఆశ్చర్యపోతాం. కాని వాటి వెనుక ఉన్న రీజన్‌, తర్కము తెలిస్తే అద్భుతం అనిపిస్తుంది.
19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కేవలం నొప్పి తగ్గించడానికి మందు వేసుకొనే పద్దతి అమలు లోకి రాగానే వీలయినంత వరకు నొప్పికి కారణాలను అన్వేషించడం మనిషి మానేశాడు. ఎప్పుడైతే ఫిజికల్‌ పెయిన్‌ కి ఫిజికల్‌ లెవల్‌లో మాత్రమే కారణాలు వెతికి అంతర్లీనమైన కారణాలను కొంపలు అంటుకుపోతే తప్ప వెతకడం అనవసరం అనే స్థితికి వైద్యుడు, పేషెంటు ఇద్దరూ వచ్చేశారో అప్పుడే వైద్య రంగంలో మందులు పెరిగి నిజమైన వైద్యం తగ్గుముఖం పట్టింది. మనిషిలోగల అంతర్గమమైన శక్తికి ప్రాముఖ్యం తగ్గిపోయింది.
ఈ అంతర్గతమైన శక్తిని పునరుత్తేజితం చేయడానికే ధ్యానం. ఎఫర్మేషన్స్‌. ఎఫర్మేషన్స్‌ అనగానే మనకు మంత్రోపదేశం గుర్తుకొస్తుంది కదా. జలంధర ఇలా అంటోంది. ‘‘అర్దం చేసుకొని చదివితే అవన్ని ధ్యాన శ్లోకాలు. విజువైలేజేషన్‌ టెక్నిక్స్‌. సంకల్పాలు, స్తోత్రాలు, ఫల స్తుతులు, అఫర్మేషన్స్‌!’’ న చమాత్సార్యం, న లోభో, నాశుభామతి:’’ అని రోజు చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. వాటికి అర్దంతో పాటు సౌండ్‌, వైబ్రేషన్‌ కలిపి ప్రాక్టీస్‌ చేసినపుడు మన లోపల, మన ఆరాలోను, చుట్టుప్రక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది. అలా నీ వైబ్రేషన్స్‌కి తగిన మంత్రం ఇచ్చి నీ వైబ్రేటరీ లెవెల్స్‌ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం. కొంత మంది గురువులు తాము సిద్ది పొందిన మంత్రం ఇవ్వగలరు. కాని నీ జన్మకు ఏది కావాలో తెలుసుకొని, నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి, తన ఆత్మ శక్తితో నిన్ను నిరంతంర గైడ్‌ చేస్తూ జన్మ జన్మలకు కాపాడుకుంటూ వచ్చే గురువు దొరికితే అద్భుతం’’
నిజం. శ్రీ చక్రార్చన నిత్యం చేసేవాళ్ళు, గురువు దగ్గర మంత్రోపదేశం పొంది నిత్యం ధ్యానించేవాళ్ళ చాలామంది మొహాల్లో కనపడవలసినంత ప్రశాంతత కనపడదు. కొద్ది మంది బాబాలు గురుదేవులు కూడా ఇందుకు మినహాయింపుకాదు.
ఇక్కడ నా వయక్తిక అనుభవాన్ని ఒక దానిని చెప్తాను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు పనిచేస్తున్న బ్రాంచికి బదిలీ అయి వచ్చాను. మొదటి వారం రోజులలోనే ఒక వంద మంది దాకా నన్ను బాబాగారి దర్శనం అయిందా అని ప్రశ్నించారు. అప్పటిదాకా ఒక బాబా ఆ ఊళ్ళో ఉన్నాడని తెలుసును కాని, అంతగా జనాన్ని ప్రభావితం చేశాడని నాకు తెలియదు. పైగా ఆ బాబాగారు నిత్యాన్నదానం కూడా చేస్తారు. అప్పటికే పాల్‌ బ్రంటన్‌తో మొదలుపెట్టి చాలా పుస్తకాలు చదివి ఉండటం చేత బాబా అంటే అంతర్గతంగా ఉన్న ఉత్సుకతతో, ‘‘సత్సంగత్‌యే, నిత్సంగత్వం, నిత్సంగత్వవే నిర్మోహత్వం’’ అని భజగోవిందం శ్లోకం చదువుకుంటూ బాబా గారిని దర్శించుకుందామని ఒక మధ్యాహ్నం వేళ వెళ్ళాను. నేను వెళ్ళే సరికే అన్న దానం కార్యక్రమం జరుగుతోంది. అది అయిపోయింతర్వాత బాబాగారి దర్శన బాగ్యం కలిగింది. బాబా అంటే ఆశ్రమ వాతావరణం ఉంటుందనుకున్నాను. కాని అది మూడంతస్తుల బిల్డింగు. ఏదో కనస్ట్రక్షన్‌ వర్కు జరుగుతున్నది. బాబాగారు పనివార్లకు సూచనలు ఇస్తున్నారు. ఆయన కుడిచేతి రెండు వేళ్ళ మధ్య నిత్యాగ్ని హోత్రంలాగా రగులుతున్నది సిగరెట్టు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బాబాగారి కాళ్ళమీద పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న సాయిరాం స్వీట్స్‌ ప్యాకెట్టులోనుండి తీసి తలా ఒక లడ్డూ ఇచ్చారు. దాన్నే మహా ప్రసాదం అనుకొని అందరూ తీసుకొన్నారు.
బాబా అన్న మాట వినగానే, ఆశ్రమానికి వెళుతున్నపుడు, నా మనసులో కౌపీనం కట్టుకొని కూర్చొని మౌన ముద్రలో ఉంటే, చుట్టూ చేరిన కోతులు అల్లరి చేస్తూ మహా చిరాకు పెడుతున్న ధ్యాన ముద్ర చెదరని మహా మౌని ముద్ర ఉంది. ఈ బాబా రూపు చూడగానే నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. ఇలాంటి బాబా ఎలాంటి ఎఫర్మేషన్స్‌ ఇస్తాడు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను మొదటి సారి కలిసిన బాబా ఉదంతం ఇది.
ఇప్పుడు మంత్రోపదేశం గురించి జలంధర రాసిన ఈ మాటలు చదువుతుంటే నాకు అనివార్యంగా ఈ బాబా గుర్తుకొచ్చారు.
ఐ లవ్‌ మై సెల్ప్‌, ఐ యాక్సెప్ట్‌ మై సెల్ప్‌. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ బలహీనతలు బలాలు అన్నింటితోనూ నిన్ను నీవు ఒప్పుకోగలగటం ఎంత కష్టమో ప్రాక్టీసు చేస్తుంటే కాని అర్ధంకాదు. ఎదుటి వారిని ప్రేమించగలిగిన వాళ్ళు చాలా మంది త్యాగాలు చేస్తూ అనాధలకు సేవలు చేస్తూ త్యాగమూర్తులుగా కనపడేవాళ్ళు చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు. తమను తాము భరించలేరు. అన్నింటిలోకి తనను తాను భరించడమే కష్టం అంటుంది జలంధర.
ఇలా ఈ నవల గురించి ఎంతయినా చెప్పవచ్చు. ఏ కథతో అయితే జీవింతంలోని ఒక భాగం అర్ధం అయినట్లు ఉంటుందో అది మంచి కథ అని పెద్దిభొట్ల  సుబ్బరామయ్యగారు ఒక సారి అన్నారు. అది నవలకు కూడా వర్తిస్తుంది. ఈ పున్నాగ పూలు ఒక సారి చదవండి. మీ మానసిక ప్రపంచంలో ఏదో ఒక తలుపు తప్పక తెరుచుకుంటుంది.
ఈ వ్యాసంలో చాలా మాటలు నావి కాదు. అవన్నీ జలంధరవి. అందుకే ఈ వ్యాసం జలంధరతో కలసి వంశీరాసిన వ్యాసమని మీరనుకుంటే నాక్కొంచెం తృప్తి.

—వంశీ

ఇప్పుడు మనవి రాతి మొహాలు….మొరటు ఊహలు!

‘‘సౌందర్యం ఇటు వైపు నుండి చూస్తే సరిగ్గా కనిపించకపోతే, అటు వైపు దగ్గరగా వెళ్ళి కళ్ళతో ముట్టుకుని చూడాలి’’ అన్నాడు వారెన్‌ స్టీవెన్‌సన్‌ అనే ఆంగ్ల కవి.
‘‘జీవితంలో సౌందర్యాన్ని మించిన ఆనందమూ, సౌందర్యాన్ని మించిన విషాదమూ లేనే లేదు’’ అన్నాడు బుచ్చిబాబు అనే తెలుగు రచయిత.
‘‘సౌందర్యం’’ అంటే ఏమిటి? అని అడిగితే ఎవరికి తోచిన జవాబు వారు చెబుతారు. నైఘంటికార్ధం వేరే ఏదో ఒకటి వుండే వుంటుంది. కానీ చాలా సందర్భాలలో నైఘంటిక అర్ధాలకు, జీవన అనుభవాలకు పొత్తు కుదరదు. పొంతన జరగదు. ఉదాహరణకి ‘‘ఇల్లు’’ అంటే నిఘంటువుల్లో నాలుగు గోడలు, ఒక కప్పు కలిగి వుండి మనుషులు నివసించే ప్రదేశము అని వుంటుంది. కానీ ఇల్లంటే మనుషులు నివసించే ప్రాంతం మాత్రమే కాదు. ఆ మనుషుల మధ్య సజీవమయిన బంధం ఒకటి వుండాలి. అది నిరంతరం కాంతులీనుతూ వుండాలి. ప్రాకృతిక శక్తులకు ఎదురొడ్డి నిలిచే ధైర్యాన్ని ఆ బంధం ఇవ్వాలి. దు:ఖ సమయాలలో ఓదార్పు నివ్వాలి గుండె దిగులుగా కొట్టుకుంటున్నప్పుడు ‘‘నేనున్నాను’’ అనే సాంత్వన వీచిక అవ్వాలి. మనిషిలోపల రాక్షసత్వం మొగ్గతొడుగుతున్నప్పుడు దాన్ని సంహరించే సింహవాహని కావాలి. అందంగా, ఆనందంగా, స్వచ్ఛ సుందర శుభ్ర నీలంలాగా మనుషులు ఆనంద యాత్ర సాగించే పరిమళ భరిత తరుచ్ఛాయ కావాలి. ఈ లక్షణాలు అన్నీ వుంటేనే అది ఇల్లు అవుతుంది. హృదయాల నిలయం అవుతుంది.
నైఘంటిక అర్ధాలు వేరు జీవన అవసరాలు వేరు. అలాగే ‘‘సౌందర్యం’’ అంటే ఏదో ఒక నైఘంటిక అర్ధం వుంటుంది. కానీ అది జీవన వ్యాపారానికి సరిపోదు.  జనన మరణాల భ్రమాన్విత లోకంలో లోలకంలాగా తిరిగే, మనిషికి అన్ని అయి సేద తీర్చే సర్వరోగ నివారిణి అవదు. ‘‘సౌందర్యం ఏమిటన్న మొదటి ప్రశ్న దగ్గరికే వస్తే, సౌందర్యం అంటే సౌందర్యమే అని జవాబు చెప్పి తప్పించుకునే చమత్కారం వద్దు కానీ… ‘‘ప్రేమలాగే సౌందర్యం కూడా ఒకే భావన, ఒక అనుభూతి, ఒక పరవశగానం, ఒక పరిమళ ప్రవాహం’’. ఈ భావనని మాటల్లోకి అనువదించలేము. మౌనంలోకి కుదించనూ లేము. వేగుంట మోహనప్రసాద్‌ సాంధ్య భాషలో చెప్పాలంటే అది ఉండుండీ సలపరించి ఊండ్‌. అది ఒక గాయం.
సౌందర్యం ఎలా వుంటుందీ అంటే…? అది ఎలా అయినా వుండవచ్చు. ధనుర్మాసంలో, గొబ్బిళ్ళ మద్యన లయ బద్ధంగా కాళ్ళు కదులుతుంటే, చలిని చీల్చుకుని స్వరాన్ని పెకలించునప్పుడు, హరిదాసు పాటలో ధ్వనించే ‘‘జీర’’ లాగా వుండొచ్చు. తులసి ఆకుల మీద జారిపోతున్న పాదరసం లాంటి, మంచు బిందువులా వుండొచ్చు. పట్టు పరికిణీ కట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకొని ఆ పారాణి పరికిణీకి అంటకుండా ఒక చేత్తో పరికిణి ఎత్తి పట్టుకుని, మరో చేత్తో పూల సజ్జ పట్టుకుని దైవ దర్శనానికి అమ్మవెంట అడుగులో అడుగు వేసే ఆరిందాలాగా వుండొచ్చు. పచ్చికొట్టిపోయిన ప్రియురాలి లేత పెదవి ఎరుపులాగా వుండొచ్చు. సౌందర్యం ఎలా గయినా వుండొచ్చు. ఎందుకంటే సౌందర్యం ఒక భావన మాత్రమే. సౌందర్యం ఒక సున్నితమయిన ఊహ మాత్రమే. సౌందర్యం ఒక గుడి గోపురం మీద నుండి ఒక్కసారిగా పైకెగసిన పావురాల రెక్కల సవ్వడి మాత్రమే.
వంశీ ఏమిటి ఇవ్వాళ సౌందర్యం చుట్టూ గిరికీలు కొడుతున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదు. మొన్నీమధ్య ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అసంకల్పితంగా, అప్రయత్నంగా విన్న ఒక పాట కొద్దిసేపు కలవరానికి గురిచేసింది. ఆ పాట ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆ పాట గురించి తర్వాత చెప్తాను.

పదిహేను, ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన 1942 ఎ లవ్‌ స్టోరీ అనే సినిమాలో జావేద్‌ అఖ్తర్‌ అనుకుంటాను, ఒక పాట రాశాడు. ఆ పాట ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఎంత సౌందర్యాత్మకంగా వుంటుందీ అంటే ‘‘ఇంత’’ అని చెప్పలేనంత.
ఆ పాటలో కవి ఏం చెతున్నాడు? ఏమీ చెప్పడం లేదు. ఒక అందమయిన అపురూపమయిన, లేలేత మావిచిగురు లాంటి అమ్మాయిని చూసినపుడు అతడి భావనామయ దృష్టి ఎంతెంత దూరం ప్రయాణం చేసిందో అంత దూరాన్నీ అలతి, అలతి పదాలతో దండగా అల్లి మన మెడలో వేస్తున్నాడు.
‘‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా’’! అంటూ మొదలుపెట్టిన కవి మనలని తన వెంట ఎలా తీసుకెళుతున్నాడో చూడండి.
ఆ అందమయిన అమ్మాయి వికసిస్తూవున్న గులాబీపువ్వులాగా వున్నదట. భావుకుడయిన కవి రాసిన లాలిత్య పదగుంఫనాభరిత కవితలాగా, కవి కలలాగా వుందట. మెరిసేసూర్యకిరణంలాగా వుందట. అడవిలో ఛెంగు, ఛెంగుమని గెంతులేస్తున్న హరిణముద్రలాగా వుందట.
ఇంకా ఎలా వుందట? చంద్రుడు వెలిగించిన రాత్రిలాగా వుందట. సంగీతంలోని సుస్వరంలాగా వుందట. గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతిలాగా వుందట. తొలి ఉషోదయమపు చెదరని అందంలాగా వుందట. హేమంత రుతువును వెచ్చచేసిన సూర్యకిరణ సందోహంలాగా వుందట. ఒక వీణా నినాదంలాగా, ఇంద్ర ధనుస్సులోని ఆత్మలాగా.
ఇంతదాకా రాసిన కవి దాహం తీరిందా? లేదు. ఆవిడ చుట్టూ యింకా ఎన్నెన్ని ఊహాల మాలలు అల్లుతున్నాడో చూడండి. విస్తరిస్తున్న తరుఛ్చాయలాగా వుందట. విస్మయం గొలిపే అలల సయ్యాటలాగా వుందట. మలయాద్రి పవనాలు తోడ్కొని తీసుకొస్తున్న పరిమళంలాగా వుందట.
పట్టు పురుగు జారవిడిచిన సిల్కు దారంలాగా వుందట. దేవతలు పాడుతున్న సంగీతం లాగా, చందనపు చెక్కలతో వెలిగించిన అగ్నిలాగా…
నిజంగా అ అమ్మాయి అలా వుందో లేదో తెలియదు కాని, కవి ఆ అమ్మాయిని చూసినపుడు ఇన్ని భావనలు పొందాడు. ఊహ ఎంత దూరం ప్రయాణించ గలదో . అంత దూరమూ ప్రయాణించాడు. ఈ పాటనంతా ఉదహరించింది నేను కవి ఊహా పటిమను గుర్తు చెయ్యడానికో, కవిత్వ సౌందర్యాన్ని కరతలామలకం చెయ్యడానికో కాదు. కవి సంస్కారాన్ని గుర్తుచెయ్యడానికి కవి సౌందర్యాభినివేశాన్ని లేదు మరో మాటలో చెప్పాలంటే కవి ఈస్థటిక్స్‌ని గుర్తుచెయ్యడానికి.
ఒక అందమయిన స్త్రీ మూర్తిని చూడగానే కవి ఎన్ని అందమయిన ఊహాలు చేశాడు? ఒక్క ఊహలో అయిన అశ్లీలత కానీ, అసభ్యత కానీ ఉందా? లేదు.. స్త్రీ పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం అన్నింటినీ మించి రక్త మాంసాలున్న సజీవ మూర్తి అన్న గ్రహింపు వుంటే కానీ, స్త్రీని గౌరవించాలనే సంస్కారం అబ్బదు.
ఇప్పుడు బస్సు ప్రయాణంలో నేను విన్న పాట గురించి. ప్రస్తావిస్తాను.
అక్కడ కవితో అందమయిన అమ్మాయి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ యిక్కడ అందమయిన అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని ఆగ్లంంలో చెప్పి వుంటంది. అందేకేనేమో కవి.

‘‘గాల్లో తేలినట్టుందే,
గుండె జారినట్టుందే
ఫుల్లు బాటిల్‌ ఎత్తి దింపకుండా తాగినట్లుం దే ’’ అంటున్నాడు.
స్త్రీని గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతితో పోల్చిన సంస్కారమెక్కడ…? ఇంటాక్సికేషన్‌ కలిగించే ఫుల్‌బాటిల్‌తో పోల్చి చూసిన సృజన సౌందర్యమెక్కడ?
మరో కవి

‘‘అమ్మో! బాపుగారి బొమ్మో
ఓల్డ్‌ మంక్‌ రమ్మో’’ అనీ అంటున్నాడు.
ప్రేయసిని బాపూ బొమ్మతో పోలుస్తూనే ఓల్డ్‌మంక్‌ రమ్ముతోనూ కొలుస్తున్నాడు.
పైన వివరంచిన పాటలోవి కవి ఉహాలే, క్రింద చెప్పిన పాటల్లోనూ కవి ఊహలే! కానీ ఎంత వ్యత్యాసం. ఎంత అగాధం. ఈ తేడా ఎందుకువచ్చింది. ఈ పతనానికి మూలం ఎక్కడుంది? ఈ అవ్యవస్థకి కారణం ఏమిటి? వంశీ మళ్ళీ మొదటికే వస్తున్నాడు అనుకోకపోతే, దీని మూలం మన గ్లోబలైజేషన్‌లో వుంది. ఈ పతనానికి కారణం మన నూతన ఆర్థిక విధానంలో వుంది. ‘‘గదినీ, మదినీ తెర్చి అన్ని పవనాలనీ ఆహ్వానించాలని’’ అని దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అన్న మాట వాస్తవమే కానీ మనం తెర్చిన గది మనది కాకుండా పోయిన విషాద దృశ్యం యిది. పడమటి గాలుల విసురు ఇంత బలంగా వున్నపుడు మనం ‘‘నిర్భయ’’ చట్టాలు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు. నిర్భయ, అభయ, అనూహ్య ఎవరియితేనేం ఒక్కొక్కరు మన సంస్కారం అనే ధవళ వస్త్రం మీద పులిమిన కటిక కాటుక చీకటి లాంటి మరకలు.
మన సమాజంలో ఎన్ని వైరుధ్యాలు? ఎన్ని విరోధాబాసలు? మరెన్ని మానసిక వైక్లబ్యాలు? వీటన్నింటిని తల్చుకుని సమాజం తనను తాను ఎసర్ట్‌ చేసుకునే దశలో సునామీ లాగా వచ్చిన ప్రపంచీకరణ మన మూలాలను పెకిలించడం మొదలు పెట్టి దశాబ్దంకాలం పైనే అయింది.
తొంభై దశకంలో పుట్టిన ఇప్పటి కొత్త తరానికి, మన సాంప్రదాయం ఒక విలువలేవీ తెలియవు. అలా ఒక తరం నుండి మరొక తరానికి ప్రయాణించాల్సిన ఒక సత్‌ సంప్రదాయాపు ‘‘నోవా’’ ను మనకు మనమే పగుల గొట్టుకున్నాం.
బహుశా ఈ విపత్తును ముందే ఊహించాడేమో 80వ దశకంలోనే ఒక మైనారిటీ భాషా సముదాయానికి చెందిన ఒ.పి. శర్మ సారధి తన ‘‘నగర మధనం’’ అనే నవలలో, ఈ స్థితిని చిత్రవిచిత్రంగా చిత్రించాడు. ఆ నగరంలో ప్రతి మనిషికి ఒక ముసుగు వుంటుంది. వాళ్ళ చేతి సంచిలో రక రకాలు ముసుగులు వుంటాయి. అవసరార్ధం ఏ ముసుగు కావలసి వస్తే ఆ ముసుగు తగిలించుకొని జీవితం గడిపేస్తూ వుంటారు. ఈ నవల ‘‘డోగ్రి’’ భాషకి చెందినది. దీని గురించిన మరోసారి చెప్పుకుందాం.
ఇవ్వాళ మన మొహాల  మీద ముసుగు లేదుకానీ మన మొహాలు  ఉండాల్సిన రీతిలో లేవు. మన పెదవులకి నవ్వటం తెలియదు. మన నోటికి నిజం చెప్పడం తెలియదు. మన కళ్లకి కరుణ కురిపించడం తెలియదు. మన హృదయాలకి ప్రేమించడం తెలియదు. మన చేతులకి దానం చేయడం తెలియదు.
మన డ్రాయింగ్‌ రూంలో ఒక కంప్యూటర్‌, ఒక హోమ్‌ ధియేటర్‌. మన గోడలకి స్ల్పిట్‌ ఎ.సి. మిషన్‌, మన యింటి ముందు ఒక కారు. మన చెవులకి తగించుకున్న ఒక బ్లూటూత్‌.
మన ఆలోచనలన్నీ పోటీలేని పరుగులో విజయం వైపు. మన ధ్యాస అంతా మన బ్యాంక్‌ బాలెన్స్‌ వైపు. అందుకేనేమో మన మొహంలో వచ్చిన మార్పులేవీ మనకు తెలియదు. మనవి రాతి మొహాలు. మనవి మొరటు ఊహలు.
అందుకేనోమో స్తన్యమిచ్చిన అమ్మను కూడా ఫుల్‌ బాటిల్‌తో పోల్చగలిగిన సృజన మనకు అబ్బింది.

ఒక్క క్షణం ఆగి, నడచి వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూద్దామా? మన మొహాన్ని స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి నీళ్ళతో కడిగేద్దామా…?
శిశిరంలో మోడయిన తరువు, వసంతంలో తిరిగి చిగురించినట్లుగా మళ్ళీ కొత్తగా మొలకెత్తుదామా?

—  వంశీకృష్ణ

గతంలోకి ప్రయాణం

vekuvapoolu

‘‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్ళతో’’ అన్నాడు శ్రీశ్రీ. గతమంతా రణరక్త సిక్త ప్రవాహమేనా? ‘‘సదాస్మరించుకోవడానికి, తలుచుకుని పులకరించడానికే, లేశమాత్రమయిన మంచిలేదా?’’ అంటే మంచి కూడా వుంది. కానీ, ‘‘మంచి గతము కొంచేమేనోయ్‌’’ అన్నాడు గురజాడ. కవి నిరంకుశుడు గనుక దేన్నైనా ఎలాగయినా అనగలడు. కానీ మామూలు మనుషులుగా మనం అప్పుడప్పుడు గతంలోకి తొంగిచూడకపోతే, మన భవిష్యత్‌ ప్రస్థానానికి సరయిన ఆలంబన దొరకదు. గతంలో చేసిన తప్పు ఒప్పులే మన ప్రయాణానికి దారిదీపాలుగా వ్యవహరిస్తాయి.

నిద్రపట్టని ఒక అర్ధరాత్రి నా చూపుడు వేలు, నా పుస్తకాల ‘‘రాక్‌’’ లో వున్న ‘‘వేకువపూలు’’ అన్న నవలను బలంగా తాకింది. రెండు వందల పేజీల ఆ నవలను ఒక్కుదుటన తెల్లవారే వరకు చదివేసాను. ఎప్పుడో ఫిబ్రవరి 2000 సంవత్సరంలో చతుర మాస పత్రికలో సంక్షిప్తంగా ప్రచురించబడిన నవలకు విస్తృత రూపం నేను చదివిన ‘‘వేకువపూలు’’. కథాకాలం 1970 దశాబ్దం. అంటే 43 సంవత్సరాల పాత కథావస్తువు అన్నమాట. ఈ నవలను చదవడం అంటే ఇప్పటి గ్లోబల్‌ తరానికి ‘‘ఫేస్‌బుక్‌’’ లో ‘‘లైక్‌’’లు మాత్రమే పెట్టగల యువతరానికి, ‘‘టైమ్‌ మెషీన్‌’’లో గతంలోకి ప్రయాణం చెయ్యడం అన్నమాట. నిజంగా ఈ నవల చదవడం ఒక అనుభవం.

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న యువ గళానికి, ఒక తరం క్రితం తమ సహచరులు ఎలా వున్నారో, సమాజ చలన శీలతను తమ కార్యాచరణతో ఎలా ప్రభావితం చేశారో, ఆ సామాజిక గమనానికి చోదక శక్తులై ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాడో సోదాహరణంగా చెప్పగలదీ నవల. ఇప్పటి ‘‘యువతరం’’ నిస్తేజాన్ని నిర్వ్సాపారాన్ని, చైతన్యలేమిని ప్రశ్నిస్తుందీ నవల.

1947లో స్వతంత్య్రం రావడమూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటమూ, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి ఆదర్శాలన్నీ నీటి మీద రాతలయిన కరకు వాస్తవం తెలిసిన తర్వాత, 1969లో మొదటి దశ తెలంగాణా ఉద్యమం రావడమూ, అదీ అయిపోయాక శ్రీకాకుళంలో రాజుకున్న నిప్పురవ్వ, రాష్ట్రమంతటా వ్యాపించడం అనే అంశాలు నేపధ్యంగా ఈ నవలకి అమిరాయి.

నామ మాత్రపు రాజకీయ స్వాతంత్య్రం, స్వాతంత్య్రమే కాదని, ఆర్ధిక స్వావలంబన, స్వేచ్ఛ సమానత్వం, అన్ని రంగాలలో, అన్ని వర్గాల ప్రజలకి అందినప్పుడే నిజమయిన స్వాతంత్య్రమని నమ్మిన యువతీ యువకులు, తాము కలలు గన్న సమాజాన్ని సాధించాలి అనే ఆశయంతో ఒక విస్తృత విప్లపవోద్యమాన్ని నిర్మించే క్రమంలో పెద్దయెత్తున ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారు. కాలేజి, సాహితీ, సాంస్కృతిక సంఘాలలో భాగస్వాములయ్యారు. చదువునీ, జీవితాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ‘‘నెత్తురు మండే, శక్తులు నిండే’’ యువతరానికి ప్రతినిధులు వారు.

అప్పటి సాంస్కృతికోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ‘‘జతిన్‌ కుమార్‌’’ ఈ నవల రాశారు. ఉద్యమానికి ‘‘ఇన్‌సైడర్‌’’ కావటం వలన ఉద్యమ ఎత్తు పల్లాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగారు.

ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. సమత, ఝాన్సీ, రాకేష్‌. సమత ఇంటర్‌మీడియట్‌లో కాలేజీలో ప్రవేశించడంతో మొదలయ్యే నవల, సమత డిగ్రీ, పి.జీ దాటుకుని, పి.హెచ్‌.డి లో చేరి అర్థాంతరంగా మానేసి విప్లవోద్యమంలో మమేకమయి జైలు జీవితం అనుభవించి విడుదలవ్వడంతో ముగుస్తుంది.
నిత్య చైతన్యశీలి అయిన ఒక యువతి జీవితంలోని పది సంవత్సరాలను ఈ నవల చిత్రించింది. ‘‘సమత’’ నెపంగా ఆ సమయంలో సమాజంలో జరిగిన ప్రతి సంచలనాన్నీ నమోదు చేసినది. నమోదు చేయడమే కాకుండా, ఎలా ప్రతిస్పందించాలో, రకరకాల అంశాలు ఒక విషయాన్ని కప్పివేసినప్పుడు, ఆ పొరలను తొలగించి సత్యశోధన ఎలా చెయ్యాలో ఈ నవల వివరిస్తుంది.

కామినేని వెంకటరామారావు ఉరఫ్‌ కె.వి.ఆర్‌. మాస్టారు అనే ఉపాధ్యాయుడికి ముగ్గురమ్మాయిలు. స్వరాజ్యం,ఝాన్సీ, సమత. స్వరాజ్యం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మామూలు, సాదాసీదా ఆడపిల్ల. పెళ్ళయినాక భర్త ఆధిపత్యం అనే ‘ఛాయ’ లోకి వెళ్ళిపోయి, ఎప్పుటికప్పుడు పుట్టింటి నుండి ఏదో ఒకటి ఆశించే సాధారణ ఆడపిల్ల.

ఝాన్సీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, చెల్లెలను చదివిస్తూ వుంటుంది. మిత భాషి, మరోమాటలో చెప్పాలంటే ఇంట్రావర్టు. అంతర్ముఖి. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా యం.కాం చదువుతుంది.

మూడో అమ్మాయి సమత. సమత అంటే ఒక చైతన్యం. ఒక పాట పాడినా, ఒక ఆట ఆడినా, గంభీరంగా ఏదయినా చర్చ సాగించినా ఆ యింట్లో మనుషులందర్నీ కలిపి వుంచే ఒక ‘‘హబ్‌’’ సమత. జీవితం పట్ల సమ్యక్‌ దృష్టి, జీవనంలో హుందాతనం, ప్రతి పని లోనూ ఆత్మ విశ్వాసం, ప్రతి మాటలోనూ ఆలోచన సమత వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే అంశాలు.
ఝాన్సీసమత పాత్రలు, వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే పురుషులు. వీళ్ళద్వారా స్త్రీ పురుష సంబంధాలని, కేవలం సంబంధాలుగా కాక చైతన్యశీలంగా ఎలా మార్చవచ్చో జతిన్‌కుమార్‌ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఝాన్సీకి దత్తాత్రేయ శర్మ అనే సహోద్యోగితో పరిచయం అవుతుంది. మొదట్లో వున్న స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. తీరా పెళ్ళి యింకో రెండు మూడు రోజులు వుంది అనగా దత్తాత్రేయ శర్మ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. కానీ ఝాన్సీ అప్పటికే గర్భవతి.    ఈ స్థితిలో మామూలు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏం చేయాలని సమాజం ఆశిస్తుంది? గుట్టు, చప్పుడు కాకుండా ‘‘అబార్షన్‌’’ చేయించుకుని మరో పెళ్ళి చేసుకోమంటుంది సమాజం. అలా చేయమని తల్లిదండ్రులతో సహా మిగతా అందరూ ఒత్తిడి చేస్తారు. కానీ ఝాన్సీఅలా చెయ్యడానికి ఒప్పుకోలేదు. పెళ్ళి కాకుండానే తల్లి కావాలి అనుకుంది. ఆ నిర్ణయాన్ని తల్లి వ్యతిరేకిస్తుంది.

vekuva poolu-1

‘‘పెళ్ళి అని నలుగురికీ చెప్పుకుని చాటింపు వేయడం కాదమ్మా! ఏ స్త్రీ పురుషుల మనసులు యేకం అవుతాయో, వాళ్ళిద్దరూ కలసి వుండటమే దాని అంతరార్ధం. పెళ్ళి అనే తతంగం లేదు. కానీ నేను కోరుకున్న మగవాడి సంతానానికి తల్లిని అవుతున్నాను. ఇందులో తప్పు, అవినీతి ఏదీ లేదు’’.
‘‘పెళ్ళి తంతు జరగత ముందే అతను దూరం అయ్యాడు. నేను తల్లిని అవుతున్నాను. అతను దూరమయినంత మాత్రాన, మా మధ్య విరిసిన స్నేహం, ప్రేమ దాని మాధుర్యం’’ మరచిపోయి ఏమీ తెలియని దానిలా యింకో వ్యక్తికి భార్యను కాలేను.’’

అంతర్ముఖి. ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆమె అలాగే వుంటుంది. బిడ్డను కంటుంది. వాడి పేరు సుధాంశు. ఝాన్సీ పెళ్ళి కాకుండా తల్లి అయి, సింగల్‌ పేరెంట్‌లా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు సమత దాన్ని అర్ధంచేసుకోవడానికే ప్రయత్నంచేస్తుంది. ఇదే విషయాన్ని ‘‘రాకేష్‌’’తో ప్రస్తావిస్తుంది.

‘‘ఆ అమ్మాయి మనో ధైర్యాన్ని మెచ్చుకోవాలండి’’ సంఘంలోని కృత్రిమ విలువల మీద ఒక స్త్రీ తీస్తున్న దెబ్బగా దానిని గుర్తించాలి.
ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలా లేదా? అనేది ఆమె వ్యక్తిగత ఈ నిర్ణయం. పెళ్ళికాకుండా, (ఇక్కడ అయ్యే అవకాశం లేదు కనుక) తల్లి అయి ఆ బిడ్డను పెంచడంలోనే ఆనందం వుంది అనుకుంటే అభ్యంతరం పెట్టవలసింది ఏం వుంది? అయితే ఇది ఆనందకరం కాదు అనే గుర్తింపు కలిగిన నాడు, ఇంకా ఏదో కావాలని కోరుకున్ననాడు ఇలాంటి అమ్మాయి సమాజం ఏమనుకుంటుందో అని వెనుకా, ముందూ చూడదు. తనకు కావలసింది అందిపుచ్చుకుంటుంది ధైర్యంగా’’ అంటాడు రాకేష్‌.
ఝాన్సీ మనస్తత్వానికి సరిగ్గా విరుద్ధంగా మరొక పాత్ర వుంది. పేరు వసంత.

‘‘పొందిన ఒక అనుభూతిని భద్రంగా దాచుకొని బతుకంతా మురిసిపోతాను’’ అంటుంది ఝాన్సీ.
‘‘అనుభూతుల వేటలో అందే ఆనందమంతా జుర్రుకుంటాను ఈ సమాజ నీతితో నాకు సంబంధం లేదు’’ అంటుంది వసంత. పెళ్ళికి సంబంధించినంత వరకూ వీళ్ళ ఆలోచనలు, అనుభవాలు వేరు… వేరు…

జీవిత కాలానికి మీల్స్‌ టిక్కెట్లు, కొంచెం రక్షణ తప్ప మరేది యివ్వదు కొందరికి పెళ్లి. ముసలితంలో, రోగంతో, రోష్టులో తోడుంటాడనే చిన్న ఆశ తప్ప మరేమీ యివ్వదు కొందరికి పెళ్ళి. నిజంగా పెళ్ళంటే ఏమిటి? ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ. ఈ వేద మంత్రాలకు అర్థం లేదా?
ఆ అర్థం ఏమిటో సమతా రాకేష్‌ కలసి జీవించి చూపిస్తారు.

సమత నిద్రలేచేసరికి అతను కాఫీ టిఫిన్‌ రెడీ చేస్తాడు. కూరగాయ ముక్కలు తరిగి అన్ని గిన్నెల్లో పెట్టి రెడీ చేస్తాడు. సమత లేచి కాఫీ తాగి గదులు క్లీన్‌ చేసి ఉప్పుకారం చూసి చెబితే కుక్కర్‌ పెట్టేస్తాడు తొమ్మిది గంటలకు ఇద్దరూ తయారయి బయటకి వెళ్ళిపోతారు.

సాయంత్రం పనులు సమత చేసుకుంటుంది. అతను ఎప్పుడో రాత్రి పదిగంటలకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ పని నీది, ఈ పని నాది అనే విభజన లేదు. ఎవరికి వీలుగా వుంటే వాళ్ళు చెయ్యడమే.

సమత పెళ్ళయిన ఎనిమిది నెలలకు సమత తల్లి ఒకసారి సమతను చూడటానికి వస్తుంది.

సమత కాపురం చూస్తుంటే ఆవిడకు ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. వాళ్ళ పిలుపులు, పలకరింపులు, పనులు చేసుకునే పద్దతి ఆమెకు కొత్తగా కనిపిస్తున్నాయి. ‘‘నేను అదీ కూర్చుని మాట్లాడుతూనే వున్నాం. ఎప్పుడు వెళ్ళాడో నేను గమనించనేలేదు. చటుక్కున కాఫీ తెచ్చి యిచ్చాడు. తాగాలంటే నాకెంత సిగ్గేసిందో’’.

స్త్రీ పురుష సంబంధాలలోని అన్ని కోణాలను ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరించారు జతిన్‌. అలాగే దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి జీవితాలలోని సంబంధాలలోని విలోమత్వాన్ని గూడా చిత్రీకరించారు.

సమత రాకేష్‌లది ఆదర్శ దాంపత్యమయితే, రాయుడు చంద్రావతిలది ఒకటే మాట, ఒకటే బాణం లాంటి ఏకాభిప్రాయ దాంపత్యం. స్రవంతి పురుషుడిని సాధించే స్త్రీ. వసంత పురుషుడిని ఆటవస్తువుగా ఆడుకుంటూనే అతడి మానసిక వైకల్యానికి జాలిపడే పాత్ర. ఆత్మ నూన్యతతో బాధపడుతూ భార్య జీవితంలో, తద్వారా తన జీవితంలోనూ హింసను గుమ్మరించుకునే పాత్ర గోవర్థన్‌ది.

ఈ నవల చిత్రించిన జీవితం ఇప్పటి తరానికి పూర్తిగా అపరిచితమయినది. దేశం పట్ల, సమాజం పట్ల నలభైఏళ్ళ క్రితం యువతరం చూపించిన ప్రేమ, దేశంతోనూ, సమాజంతోనూ మమేకమయిన తీరు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ, యువతలో వుండవలసిన సరి అయిన ధృక్పధం అదే.
సమతకు, రాకేష్‌కి పుట్టిన పాప పేరు ఉజ్జ్వల. ఉజ్జ్వలకి సమత, అందరు తల్లులలాగే పాఠాలు చెప్పింది. అందరు తల్లుల లాగా ‘ఎ’ ఫర్‌ యాపిల్‌, బి ఫర్‌ బాయ్‌, అని కాక ఎ ఫర్‌ ఎబిలిటీ, ‘బి’ ఫర్‌ బెటర్‌మెంట్‌, సి ఫర్‌ కమ్యూనిటీ ‘ఆర్‌’ ఫర్‌ రివల్యూషన్‌ అంటూ ఆంగ్ల అక్షరాలని పరిచయం చేసింది.

జీవితాలని వెలిగించే విప్లవం ఒక్క క్షణంలోనో, ఒక్క ప్రదర్శనతోనో రాదు. అది నిరంతరం సాధన చెయ్యాల్సిన అసిధారావ్రతం అసిధార అంచు మీద నిల్చిన తరం అది. విలువల కోసం పిడికిలి బిగించిన తరం అది.
ఇప్పుడా విలువలన్నీ మారిపోయి సమాజం కులం, మతం అంటూ భిన్న  భిన్న సమూహాలుగా మారిపోయింది. సామూహిక చైతన్యం స్థానంలో అస్తిత్వచైతన్యం వచ్చి చేరింది. కుల రహిత సమాజం కోసం పోరాటం జరిగిన ఈ నేల మీద ‘‘కుల’’ స్థిరీకరణ కోసం పోరాటాలు జరగడాన్ని మించిన విషాదం ఏం వుంది?

వర్గ చైతన్యాన్ని బోధించిన యూనివర్సిటీలు ఈనాడు కుల సంఘాలుగా మారిపోయినాయి. సమాజం నిరంతర చలనశీలి. సామాజికంగా వచ్చే ఏ మార్పు కార్యకారణ సంబంధం లేకుండా రాదు.
ఇప్పటి గ్లోబల్‌ తరం అనుభవిస్తున్న జీవితం. ఎప్పటిసామాజిక రుగ్మతల ప్రతిఫలనం..? వచ్చిన మార్పు మంచిదేనా..? ఈ మార్పు యిలా కొనసాగవలసిందేనా… ఇప్పటి తరం వేసుకోవలసిన ప్రశ్నలు. యివి

 ఈ ప్రశ్నలు వేసుకోవడానికి కావలసిన తాత్విక భూమికలు ఏవో ఈ నవలలో ఉన్నాయని నా కనిపిస్తోంది. నవల చదివితే మీరూ ఒప్పుకుంటారేమో.

— వంశీకృష్ణ

మిథునం గురించి మరో సారి

midhunam3

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది.
‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే! స్త్రీ, పురుష సంబంధాలలో వుండే అద్వైత తత్వాన్ని, అర్థనారీశ్వరత్వాన్ని మిథునం కథా నెపంగా చెప్పడానికి తనికెళ్ళ భరణి ప్రయత్నం చేశాడని అందులో నేను చెప్పాను. ఆ పత్రిక సంపాదకులు ఒక పేజీ మొత్తం ఎడిట్‌ చేయడం వలన అది పూర్తిగా వ్యక్తం కాలేదు. ఆ వ్యాసం ఇలా ముగుస్తుంది.
‘‘మిథునం సినిమా చూశారా? ఎలా వుంది?’’ అని ఒక సాహితీ మిత్రుడుని అడిగాను. అందుకు ఆయన సినిమా బావుంది కానీ కాస్త బ్రాహ్మణ వాసన వేస్తుంది?’’ అన్నారు. ‘‘అయ్యా! యిదీ మన సంస్కారం’’ అంటూ వ్యాసం ముగించాను. ‘‘అయ్యా ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం చెపితే సంస్కారం లేదని అంటే ఎలా! అని ఫోన్‌ చేసి మరీ మందలింపు ధోరణిలో కూడా మాట్లాడారు.
ఏదయినా ఒక వాక్యం రాసి అచ్చయ్యేంత వరకే రచయిత స్వంతం. ఒక సారి అచ్చులో వచ్చాక అది ప్రపంచానిదై పోతుంది. ఎవరికి నచ్చిన రీతిలో వారు దానికి వ్యాఖ్యానం చేస్తారు. ప్రతి వ్యాఖ్య రచయిత ఉద్దేశించిన రీతిలోనే వుండాలని లేదు.
‘‘అయ్యా! ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం రాయడం వెనుక నేను ఆశించిన ధ్వని వేరు. సాహితీ మిత్రుడు, కవి, బుద్ధిజీవి ఏదయితేనేం… సమాజానికి కాస్త భిన్నంగా ఆలోచించి, దిశా నిర్దేశం చేయవలసిన బుద్దిజీవులం మనం కూడా ‘‘ఎబౌ ది క్యాస్ట్‌’’ ఆలోచించకపోతే ఎలా? అనే నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, నేనాశించిన ధ్వని.
జి.ఎస్‌. రామ్మోహన్‌కి కూడా అది ‘‘తిట్టి పోయడం’’గా అర్థం అయింది. మన సంస్కారం ఉండవలసిన రీతిలోలేదు అన్నది నా బాధ. వ్యక్తులనయినా, విషయాలనయినా పరుషంగా వ్యాఖ్యానించడం నా పద్థతి కాదు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ తన వ్యాసంలో మిథునం సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తంచేసిన విషయాలు ఇవి.
1) ఇది తెలుగు సంస్కృతికాదు ఇది కేవలం 5% మైనారిటీ వ్యవహారమే.
2) మిథునంలో జంటకి సామాజిక జీవనం లేదు.
3) బ్రాహ్మణులు ఏదో ఒక రకంగా కోల్పోయిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి ప్రధానమయినవి.
తెలుగు సినిమా ‘‘కులం’’ను కౌగిలించుకుని చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 1950లలో వచ్చిన ‘‘గుండమ్మ కథ’’లోనే ఎస్వీరంగారావు ‘‘మేము పెద కాపులం’’ అంటాడు. పదేళ్ళ క్రితం వచ్చిన ఒక సినిమాలో ‘‘మేము నాయుళ్లం, మీరేమిటి? అని చక్రవర్తి. హీరో శ్రీకాంత్‌ను అడుగుతాడు. చాలా సినిమాలలోహీరోలు ఇంటి పేర్లతోసహా తమ, తమ వంశ, కుల చరిత్రలు చెప్పుకుంటున్నారు. సూర్యదేవర వీర రాఘవయ్య, పర్వతనేని తులసీరామ్‌ ప్రసాద్‌… ఇలా…
ఈ కుల వాసన మనకు అభ్యంతరకరం కానప్పుడు బ్రాహ్మణ కుల వాసన మాత్రం ఎందుకు అభ్యంతరకరం అవుతున్నది? ఒక యువ నటుడు మీసం మెలేసి, తొడ చరిచి వంశం పేరు చెప్పి, అదంతా తెలుగు వారి ఆత్మగౌరవం అని… పెడ బొబ్బలు పెడితే మనం ఎందుకు మౌనంగా వుండిపోయాం…
మిథునం కథరాసిన శ్రీరమణ కానీ, దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణి కానీ ‘‘ఇదే తెలుగు సంస్కృతి’’ అని ఎక్కడా ‘‘క్లెయిమ్‌’’ చేసుకోలేదు. ఇదీ తెలుగు సంస్కృతి అని ఎవరయినా క్లెయిమ్‌ చేసుకున్నా యివాళ్ళ తెలుగు సమాజం ఆమోదించే స్థితిలో వున్నదా…?
తెలుగు అంటే ఏ తెలుగు అని అడిగే అస్తిత్వ సందర్భంలో వున్నాం మనం. తెలంగాణా తెలుగా…? ఉత్తరాంధ్ర తెలుగా..? రాయలసీమ తెలుగా..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలుగు సంస్కృతి అంటే ‘‘ఏ తెలుగు సంస్కృతి’’ అని ప్రశ్నించడంలో తప్పులేదు.
విశాలమయిన జన సమూహాన్ని కలిపి వుంచే, అందరికీ ఆమోదయోగ్యమయిన సంస్కృతి ఎక్కడ వుంటుంది! సమాజం మొత్తం చిన్న చిన్న సమూహాలుగా, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయినప్పుడు అన్ని రకాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అస్తిత్వంలో వుంటాయి. అన్నీ కలగలసిపోవడమే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతికి మూలం అదే. ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇతర అస్తిత్వాలతో ఘర్షణ లేకుండా, సామరస్యంగా, సౌభ్రాతృత్వ పూర్వకంగా కలసి జీవించడాన్ని ఆధునిక సమాజాలు కోరుకుంటున్నాయి.
ఒక విశాలమయిన వృత్తం మధ్య కేంధ్రం ఎంత బలంగా వుండాలో, ఆ వృత్తంలో వున్న యితరేతర కేంద్రాలూ అంతే బలంగా వుండాలి. అది సమాజం కూడా ఈ విశాల తెలుగు సమాజానికి, బ్రాహ్మణ సంస్కృతి కూడా ఒక పార్శ్వంగా నిలుస్తుంది. దానినే భరణి, శ్రీరమణ చూపించాలి అనుకుంటే ఎవరయినా ఎందుకు తప్పుపట్టాలి? సోమయాజి, సోమిదేవమ్మ, ‘‘లచ్చుమ్మమ్మ’’ని విమర్శిస్తేనో, తృణీకరిస్తేనో, అగౌరవపరిస్తేనో ఖచ్చితంగా అభ్యంతరం పెట్టవలసిందే. సోమిదేవమ్మ కథలోకి లచ్చుమమ్మ రానంతవరకూ, లచ్చుమమ్మ కథలోకి సోమిదేవమ్మ రానంతవరకూ… ఎవరికయినా ఎందుకు అభ్యతరం వుండాలి..? సూర్యదేవర వీరరాఘవయ్యను యాక్సెప్ట్‌ చేసినట్లే బుచ్చిలక్ష్మీనీ అప్పదాసునూ యాక్సెప్ట్‌ చేయాలికదా…?
ఆయన ఉయ్యాల బల్లమీద శ్రీ మహావిష్ణువులాగా ఊగుతుంటే గడప మీద తలపెట్టుకుని ఆవిడ పడుకోవడం గురించి మనకెందుకు? బ్రాహ్మణ సంస్కృతిలో అమానవీయ అంశాలు వుంటే వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది వాళ్ళ సమస్య.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కందుకూరి వీరంతా బ్రాహ్మణేయ సంస్కృతిలోని లోలోపలి చీకటి అంశాలను తూర్పారా పట్టిన వారే? అది 5% మైనారిటీల సంస్కృతి అయినా సరే.. దానికొక అవిచ్ఛిన్నత వుంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది అవలక్షణాలు పరిహరించుకుంటూ సాఫ్టెన్‌ అవుతుంది.
మిథునం సినిమాలో జంటకి సామాజిక జీవనం లేదు? వాళ్ళు ఎవరితోనూ కలవరు? అన్నది మరో విమర్శ. నిజమే వాళ్ళు ఎవ్వరితోనూ కలవరు (సినిమాలో). నిజానికి ఒంటరితనం వేరు. సామాజిక జీవనం లేకపోవడం వేరు. రెండిరటికీ చాలా తేడా వుంది.

mithunam
శ్రీరమణ కథలో అప్పదాసు బావమరిది పాత్ర ఒకటి వుంటుంది. అది సినిమా రూపంలోకి వచ్చేసరికి భరణి ఎందుకో తీసివేసాడు.
2012 కేన్స్‌ ఫిలమ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ‘అమోర్‌’’ అనే సినిమాకు, మన మిథునం సినిమాకు చాలా పోలికలున్నాయి. ఇది వృద్ధ దంపతుల కథ. అదీ వృద్ధ దంపతుల కథే. ఆ సినిమాలోను వృద్ధ జంట బయటివారిని ఎవరినీ తమ యిటికి రానివ్వరు. తాము ఎక్కడికీ వెళ్ళరు భార్యకు పక్షవాతం వస్తే చూదామని కూతురు వస్తే, కూతురును చూడటానికి కూడా వాళ్ళు యిష్టబడరు. వాళ్ళిద్దరే ఒక లోకంగా వుంటారు.
2010 అక్టోబర్‌లోవచ్చిన సుప్రసిద్ధ రచయిత వి. చంద్రశేఖర్‌రావుగారి ‘‘ఆదివారం’’ కథ గుర్తుందా? హైద్రాబాద్‌లాంటి మహానగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వుండే ఇద్దరు వృద్ధ దంపతుల కథ అది. ఉదయం నుండి సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ తలుపులు మూసుకొనే వుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుండీ రాత్రి నిద్రపోయే వరకు. కాఫీ చేసుకుని తాగుతారు. వంట వండుకుంటారు. టి.వి. చూస్తారు. విశ్రాంతి తీసుకుంటారు. కబుర్లు చెప్పుకుంటారు. ప్రొద్దున్నే ఎవరో తలుపు తట్టిన చప్పుడయితే తలుపు తీద్దాము అనుకుని తీయరు. ఆ తలుపు అలా మధ్యాహ్నం దాకా మోగుతూనే వుంటుంది. అయినా వాళ్ళు తీయరు సాయంత్రం ఎవరిదో అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసినా తలుపు తీయరు. కథ అయిపోతుంది.
మిధునం, అమోర్‌, ఆదివారం ఈ మూడు కథలలోనూ వృద్ధ జంటల ప్రవర్తన ఒకే రకంగా వుంటుంది. మిథునం తెలుగు సినిమా, అమోర్‌ ఫ్రెంచి సినిమా. భాషలు, ప్రాంతాలు సరిహద్దులు లేకుండా వృద్ధ జంటల ప్రవర్తన ఒకేలా ఎందుకు వుంది?
ఒంటరిగా వుండాలని కోరుకోవడం అంటే సామాజిక జీవనం లేకపోవడమా? ఈ మూడు జంటలూ సమాజంతో నిరంతరం సంభాషిస్తూనే వుంటారు. సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలు అన్నింటినీ గమనిస్తూ వుంటారు. ఆ సామాజిక సంఘర్షణలు ఏవీ తమ జీవితాలను ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడుతూవుంటారు. మరో మాటలోచెప్పాలంటే సమాజంలో చురుకయిన పాత్ర పోషించడానికి (యాక్టివ్‌ పార్టిసిపేషన్‌) ఇష్టపడరు. వాళ్ళది పాసివ్‌ రోల్‌. వృద్ధులకు ఈ తరహా ప్రవర్తన ఎందుకు వస్తుంది? అందుకు కారణం ఎవరు?
ఈ సమస్యలోతులలోకి వెళితే తప్పు మనదే అని మనం గుర్తించాల్సివస్తుంది. మనమెప్పుడూ వృద్ధులని మనుషులుగా గుర్తించం. వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించం. వాళ్ళ సలహాలు పాటిస్తామా లేదా! అనే విషయం పక్కన పెడదాం? అసలు వాళ్ళ మాటలు కూడా వినడానికి యిష్టపడం. చొరవ తీసుకొని ఏదయినా చెప్పపోతే అంతా చాదస్తంగా కొట్టిపడవేస్తాం.
అలాంటప్పుడు వృద్థులు ఏం చేస్తారు? తమలోకి తాము ముడుచుకుంటారు. సాధ్యమయినంత వరకు మన కంటపడకుండా ఒంటరిగా దాక్కుంటారు. మన అమ్మా నాన్నాలతో కలసి మనం ఎప్పుడయినా భోజనం చేస్తామా? వాళ్లకోసం పదినిమిషాలు కేటాయిస్తామా? మన ఉరుకుల పరుగుల జీవితం మనది. సమాజం అంటే మనమేకదా? మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మనల నుండి దూరం జరుగుతారు. వాళ్ళకి సమాజ జీవనం ఉన్నాట్టా? లేనట్టా?
సామాజికి జీవితం అంటే నిత్యం సమాజంలో సంభాషించడమే కదా! ఈ వృద్ద జంటలు నిత్యం సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ మాధ్యమం వేరు. మన మీడియం వేరు.
అమోర్‌లో భార్యకి పక్షవాతం వస్తే హాస్పిటల్‌కి తీసుకుని వెళతాడు భర్త. భార్య బట్టలు వుతికాడని ఆకతాయి పిల్లలు అల్లరి చేస్తే కర్ర పట్టుకుని అప్పదాసు వెంటపడతాడు. టి.వి. చూస్తూ రాజకీయాలు చర్చిస్తారు. ఆదివారం దంపతులు. ఇదంతా ప్రతి స్పందనే కదా… మరి సామాజికి జీవితం లేనిది ఎక్కడ.?
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావాలు, ఎదిగి వచ్చిన ఒక కొత్తతరం జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలు, బ్రాహ్మణులలో కూడా ఒక నూతన చైతన్యం తీసుకుని వచ్చాయి. వాళ్ళని వాళ్ళు అసెర్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవ్వాళ బ్రాహ్మణులు ఎంత మాత్రమూ అగ్రవర్ణం కాదు. ఉగ్రవర్ణమూ కాదు. ఎప్పుడో జరిగిన తప్పులకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలని అడుగుతున్నారు. ఇది వస్తున్న మార్పు.
1980 లలో వచ్చిన దేవత సినిమా సమయానికి 2012లో వచ్చిన దేనికైనా రెడీ సినిమా సమయానికి బ్రాహ్మణులలో వచ్చిన మార్పు గుణాత్మకమయినదే.
దేవత సినిమాలో ప్రాత: సంధ్యవేళ నదీతీరంలో సంధ్యావందనం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని మోహన్‌బాబు కాలెత్తి నడుంమీద తంతే బ్రాహ్మణులు కూడా హాస్యంగా సరిపెట్టుకున్నారు. కానీ దేనికైనా రెడీ సినిమా సమయానికి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. రాస్తారోకోలు చేశారు. బంద్‌లు చేశారు. 1980లలో మొలకు చుట్టిన యజ్ఞోపవీతాన్ని 2012లో మామూలుగా ధరించారు. ఇదంతా అస్తిత్వ ఉద్యమాల పుణ్యమే! ఇతర అస్తిత్వ ఉద్యమాలని చూసినట్లే దీనిని కూడా చూడాలి. తప్పదు.
ఇవ్వాళ సమాజంలో బ్రాహ్మణుల ఆధితప్యం లేదు. ఆర్ధికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళ చుట్టూ ఏ పరిభ్రమణనూ జరగడం లేదు. ఆధిపత్య వర్గాలు ఏవో అందరికీ తెలుసు. అటువంటప్పుడు బ్రాహ్మణులు మిధునం లాంటి సినిమాల ద్వారా కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారని అనుకోలేము. ఒక వేళ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా అది వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది.
నాగప్పగారి సుందర రాజు కథను సినిమా తీసినా, వేముల ఎల్లయ్య కక్కను సినిమా తీసినా తెలుగు సమాజం మిథునం సినిమాను చూసినట్టే చూస్తారు. సాహిత్య రూపాలుగా వాటి పేరు ప్రఖ్యాతులను ఎవరయినా అడ్డుకున్నారా? వాటికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరయినా కబ్జా చేశారా… లేదే!
సినిమా తీయడానికి అతి ముఖ్యమయిన నిర్మాత ఎవరయినా వుంటే వాటిని సినిమాలుగా తీయవచ్చు. అవార్డులు కూడా పొందవచ్చు. చోమనుడి డప్పును, కన్నడ ప్రేక్షకులు అదరించినట్లే కక్కనూ, అంటరాని వసంతాన్ని తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తారు.
ఈ వ్యాసంలో జి.ఎస్‌. రామ్మోహన్‌ ఒక మాట అన్నారు. తెలుగుదేశం నుండి అమెరికా లేదా మరే ఇతర దేశాలకయినా వలస వెళ్ళిన ప్రజలను నోస్టాల్జియా పట్టి పీడిస్తూ వుంటుంది. తెలుగు సంస్కృతికీ, సంప్రదాయానికి దూరం అయిపోయామనే బెంగ ఎక్కువగా వుంటుంది. ఆ బెంగలో నుండి సత్యనారాయణ వ్రతాలు, బతకమ్మా పండగలూ జరుపుకుంటారు. పూజలు, పున:స్కారాలు చేస్తారు. అంతవరకు మనం ఆమోదించవచ్చు. కానీ వాళ్ళు తెలుగు సంస్కృతి గురించి, చరిత్ర గురించీ ఉపన్యాసాలు, యివ్వడమో, పరిరక్షకులుగా ఫోజులెట్టడమో చేస్తేనే అసలు సమస్య.
అంటే ఏ విషయాన్ని అయిన ఆమోదించడానికి ఒక స్థాయి వుంటుందన్నమాట. ఆ స్థాయి దాటితే అది ఆమోదనీయం కాదు. యాక్సెప్టబుల్‌ స్టేజ్‌. ఆమోదనీయ స్థాయి, వ్యక్తులకీ సమాజాలకీ వేర్వేరు స్థాయిలలో వుంటుంది. స్త్రీ పురుషులు మధ్య ప్రేమ కూడా ఈ స్థాయి దాటితే బానిసత్వంగా మారుతుంది.
అప్పదాసు, బుచ్చిలక్ష్మీల మధ్య వున్న సంబంధాలను చేస్‌గా చేసుకుని స్త్రీ పురుషుల మధ్య వుండే అసమా సంబంధాలను ప్రస్తావిస్తూ ఈ సినిమా పాత విలువలని స్థిరీకరించడానికి ప్రయత్నం చేసిందంటారు రామ్మోహన్‌.
అప్పదాసు ఉయ్యాల బల్లమీద ఊగడమూ, బుచ్చిలక్ష్మీ గడప మీద తలపెట్టుకుని పడుకోవడమూ, అనే అసమం సబంధాలను అప్పదాసు బుచ్చిలక్ష్మీ బ్టటలు ఒక సారి ఉతకడం ద్వారా సరికావని, కానీ అలా చూఏపిండం ద్వారా భరణి షుగర్‌ కోటెడ్‌ ఫిల్‌ అందించి పాత విలువలను స్థిరీకరించడానికి ప్రయత్నం చేశాడు అని రామ్మోహన్‌ వ్యాఖ్య.
స్త్రీ పురుష సంబంధాలలో ఆమోదనీయ స్థాయి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క రకంగా వుంటుంది. బుచ్చిలక్ష్మీ ఆమోదనీయ స్థాయి మనకు తెలియదు. కనుక ఒక పెద్ద వ్యాఖ్య చేయడానికి ఒక చిన్న రిఫరెన్స్‌ చాలదేమో!
ప్రవాసాంధ్రులు సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడము. బతకమ్మలాడటం వరకు సంస్కృతి పరిరక్షకులుగా రామ్మోహన్‌కి పనికి వస్తారు. అది తన ఆమోదనీయ స్థాయి దాన్ని దాటితే రామ్మోహన్‌కి నచ్చదు. అలాగే తన ఆమోదనీయ స్థాయి దాటితే అప్పదాసుకూడా బుచ్చిలక్ష్మీకి నచ్చడు.
అందరూ ఆమోదించే స్థాయి స్త్రీ పురుష సంబంధాలలో వుండవు. కనుక ప్రేమ రూపంలో హింస కొనసాగుతూనే వుంటుంది. స్త్రీ పురుష సంబంధాలు స్టేటిక్‌ కాదు. డైనమిక్‌. కనుక మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకండా మారుతూ వుంటాయి. వాటిని ఎవరూ పనికట్టుకుని స్థిరీకరించనవసరం లేదు. ఇది రామ్మోహన్‌కి కూడా తెలుసు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ వ్యాసాలంటే నా కిష్టం. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘వై దిస్‌ కోల వెర్రి’’ అంటే మరీ ఇష్టం.
మిథునం లాంటి బలహీనమయిన సినిమా గురించి బలమయిన వ్యాసం రాసిన రామ్మోహన్‌కి అభినందనలు.

వంశీకృష్ణ

చేత వెన్న ముద్ద

                                  Abhowthika_swaram

కొన్ని పుస్తకాలను ఏమని పిలవాలో తెలియదు కవిత, కథ, నవల, వ్యాసం లాంటి సాంప్రదాయక ప్రక్రియా రూపాలన్ని వాటి ముందు వెలతెలా పోతాయి. హృదయాన్ని అనుభూతి సంద్రంలో ముంచి తేల్చే కవిత్వం ఉంటుంది కానీ కవిత కాదు. కధనం వుంటుంది కానీ కధ కాదు. ఆలోచనా స్పోరకమయిన వ్యాఖ్యలు వుంటాయి కానీ వ్యాఖ్యా విన్యాసం కాదు. జీవిత చిత్రణలు వుంటాయి కానీ జీవిత చిత్రాలు కాదు. ఏ ప్రక్రియా రూపంలోనూ ఒదగని ఈ రచనలను ఏమని పిలవాలి?

ఉదాహరణకు పూడూరి రాజిరెడ్డి ‘‘మధుపం’’ ఇటివలి ‘‘పలక ` పెన్సిల్‌’’ తీసుకోండి. పైకి NON – SERIOUS  వ్యవహారంగా కనిపించినా చాలా సీరియస్‌ అంశాలనే ఆ పుస్తకాలు చర్చించాయి. ‘‘మధుపం’’ ఒక మగవాడి ఫీలింగ్స్‌ అంటూ ఆమధ్య తెలుగు పాఠక ప్రపంచంలో సంచలనం సృష్ఠించిన ఈ పుస్తకం కేవలం వైయక్తిక అనుభూతినో, లేదూ సామూహిక అవ్యవస్ధనో చిత్రికపట్టలేదు. అంతకు మించింది ఈ పుస్తకంలో ఏదో వుంది.

ఒక మగవాడి ఆలోచనలు అంటూ ఇటీవల వచ్చిన పలక`పెన్సిల్‌ లో కూడా… తత్వశాస్త్ర పరిభాషలో అతి ముఖ్యమయిన ‘‘నేను’’ అనే బ్రహ్మపదార్ధాన్ని అలవోకగా చర్చించింది. ఈ పలక-పెన్సిల్‌ గురించి మరొకసారి మాట్లాడుకుందాము. కానీ ప్రస్తుత పుస్తక సందర్భం ‘‘మాధవ్‌ శింగరాజు’’ కలం నుండి వెలువడిన ‘‘అభౌతిక స్వరం’’ ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ‘‘దీనిని ఏమని పిలవాలి?’’ అనే సందేహమే నన్ను పట్టి పీడించింది.

‘‘అభౌతిక స్వరం’’ అంటే ‘‘మంద్ర స్వరం’’ అని అర్ధం. ‘‘నేను’’ అనే శీర్షికన రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్న యాభైమంది ప్రసిద్ధుల జీవితాలను కొల్లేజ్‌ చేసి చూపిన అక్షర సంచయం ఈ పుస్తకం.

సాప్రదాయిక పరిచయ వ్యాసాల లాగా వాళ్ల వాళ్ల జీవితాలలోని ప్రముఖ ఘట్టాలతో ఈ రచన నిండిపోలేదు వాళ్లు జీవితాంతం ఏ తాత్త్విక భూమిక ఆధారంగా పనిచేసి జీవితాన్ని కరిగించుకున్నారో ఆ భూమికలను పట్టుకుని వాళ్లలోకి పరకాయ ప్రవేశంచేసి, వాళ్ల స్వరంతో  పాఠకుడితో ముచ్చటలాడినట్లుగా, సంభాషించినట్టుగా మెల్ల మెల్లని మంద్ర స్వరంతో చేసిన రచన యిది. ‘‘నేను ’’ అనే శీర్షికన వెలువడిన రచనలు కనుక ఏది రచయిత స్వరమో….. ఏది అభౌతిక స్వరమో తేడా తెలియనంతగా వాళ్లతో రచయిత సంలీనం అయిపోతాడు.

ఇంట్లో మధురమయిన పాయసాన్ని అమ్మ వండి, పైపైన జీడిపప్పు, కిస్‌మిస్‌ లతో ‘‘గార్నిష్‌’’ చేసినట్లుగా ఈ రచనలు అన్నీ వుంటాయి. అందుకేనేమో ‘‘మాధవ్‌ శింగరాజు’’ వీటిని ‘‘Auto biographical vignettes of Great men and women” అన్నాడు. vignettes అంటే నిఘంటు అర్ధం ఇలా వుంటుంది. ‘‘Decoration Design or Small illustration used on the title page of  a Book or at the beginning or at the end of the chapter.”

పుస్తక సారాంశం మొత్తాన్ని ఒక వ్యాఖ్యలోనో లేక నాలుగయిదు అలతి, అలతి పదాలలోనో గుది గుచ్చి చేసే అందమయిన వ్యాఖ్య యిది. మరొక మాటలో చెప్పాలంటే అనంతమయిన సముద్రాన్ని గుప్పిటలో పట్టడం అన్నమాట.

బిజినెస్‌ గురు, మేనేజ్‌మెంట్‌ గురు, ఆధ్యాత్మిక గురు లాంటి చాలా మంది గురువుల గురించి మనం విని వుంటాము కానీ ‘‘ నో స్మోకింగ్‌ గురు ’’ అంటూ ఒకరు వున్నారు అన్న విషయాన్ని కూడా ఊహించి వుండము. అలాంటి నో స్మోకింగ్‌ గురు అలెన్‌ కరీతో మొదలు పెట్టి యూరీ గగారిన్‌ వరకు మొత్తం యాభై మంది ఒక విద్యుల్లతలాగా  ఈ పుస్తకంలో మెరిసి మనలని మైమరపిస్తారు.

మన మౌనరుషి భగవాన్‌ రమణమహర్షి, గాంధీజీ, జగదీశ్‌ చంద్రబోస్‌, జ్యోతిబసు, జ్యోతి బాపూలే, కల్పనా చావ్లా, ఎం.ఎఫ్‌ హుస్సేన్‌, ఎం.జి. రామచంద్రన్‌, ఓషో, ఆర్కే లక్ష్మణ్‌, సలీమ్‌ ఆలీ, సత్యజిత్‌ రే, సూర్యసేన్‌, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ పుస్తకంలో మనకు కొత్త రూపంలో దర్శనమిస్తారు.

కొత్తగా దర్శనమిస్తారు అని ఎందుకు అంటున్నాను అంటే ‘‘సలీమ్‌ ఆలీ’’ లాంటి పక్షి శాస్త్రవేత్తలో అంతర్గతంగా దాగివున్న ఒక గొప్ప తత్వవేత్తను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. ఆర్నిథాలజిస్టు, ఫిలాసఫర్‌ ఈ రెండిరటికి సామ్యం ఎక్కడ!

‘‘పక్షులనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తోంది. వాటికి భయం వుండదు. ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తాయి. మనషులు కూడా అలానే ఉండాలంటాను. స్వేచ్ఛలోనే క్రమబద్ధమయిన జీవితం వాటిది. వేకువతో లేస్తాయి. పరిమితంగా తింటాయి, చీకటి పడగానే గూళ్ళకు చేరుకుంటాయి. మనకెందుకు అలా సాధ్యం కాదు? అరాచకంగా, అస్తవ్యస్తంగా వుంటామెందుకు? అరుదయిన పక్షిజాతులు అంతరించి పోతున్నట్లే మనిషిలోని ఆరోగ్యకరమయిన అలవాట్లు కూడా క్రమంగా హరించుకుపోతున్నాయా?’’.

ఈ ఉటంకింపు చదివాక ఎవరికయినా ఏం అనిపిస్తుంది? THE FALL OF A SPARROW  అన్న సలీం అలీ జీవిత చరిత్ర మొత్తం చదివినా సలీం ఆలీ లోని ఈ ‘‘ఫిలాసఫర్‌’’ ను పట్టుకోవడం కష్టమేనేమో! ఈ తాత్త్విక భూమికను మాధవ్‌ శింగరాజు పట్టుకున్నాడు. రచనను గార్నిష్‌ చెయ్యడం అంటే ఇదే కదూ!.

భారతదేశపు దారిద్య్రాన్ని గ్లోరిఫై చేసి అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాడని సత్యజిత్‌ రే మీద ఒక విమర్శ వుంది చారులత లాంటి సినిమాలలో ‘‘దాంపత్య ద్రోహాలని’’ సింపుల్‌ గా తేల్చేశాడనే అపవాదు కూడా వుంది ఈ రెండు విమర్శలు సత్యజిత్‌ రే ను జీవితాంతం వెంటాడాయి. ‘‘ఎవ్రిబడి లవ్స్‌ ఎ గుడ్‌ డ్రౌట్‌’’ అని పాలగుమ్మి సాయినాధ్‌ ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ మరొకచోట అంటాడు. కానీ సత్యజిత్‌ రే…..

‘‘కరువును కరువుగా తీయలేకే ‘‘డిస్టింట్‌ థండర్‌ ’’ కోసం పన్నెండేళ్ళు ఆగాను. కరువంటే చనిపోవడం కాదు. బతికించడం. కరువు రోజుల్లో ఏ పల్లెకయినా వెళ్లండి లేదనకుండా యింత ముద్ద పెడతారు. గడపగడపలో కడుపునింపే మానవత్వం కనిపిస్తుంది. వాళ్లు తినడానికే వుండదు. పస్తులుండి, పచ్చి మంచినీళ్ళు త్రాగి తమకోసం వుంచుకున్నది పెడతారు.  ‘‘ లేక పోవడం’’ లో కరువు ఉనికి లేదు. లేకున్నా పెట్టగలిగే ఔదార్యంలో వుంది. ‘‘డిస్టింట్‌ థండర్‌’’ లో వున్న పేరడాక్సికల్‌ యాంగిల్‌ యిదే! స్వార్ధాన్ని, అహంకారాన్ని, ఆధిక్య భావనను, అంటరానితనాన్ని కాల్చి బూడిదగా చేసి మనిషిని కొత్తగా మొలకెత్తిస్తుంది కరువు.

‘‘సత్యజిత్‌ రే’’ అనే సృజనకారుడి అంతరంగాన్ని అర్ధం చేసుకోవడంలో మనం పొరపాటు పడ్డామా……?

‘‘మనమెంతో వివేకులమని పాశ్చాత్యదేశాల నమ్మకం మీరే మా చిట్టచివరి ఆశ’’ అని వారు అంటున్నప్పుడు నా తల కొట్టేసినట్టు వుంటుంది. నిజంగా మనకు అంత వివేకం వుందా? ఉంటే పాశ్చాత్య విధానాలకు ప్రభావితమై ప్రకృతికి వ్యతిరేకంగా మనపై మనం ఎందుకు ప్రయోగాలు చేసుకుంటాం?.

తన జీవితం మొత్తం ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికే వెచ్చించాడు సుందర్‌లాల్‌ బహుగుణ. బహుగుణ జీవన సారాన్ని ఈ నాలుగు వాక్యాలలో సరళంగా, సూటిగా చెప్పడమే ఈ పుస్తకం సాధించిన విజయం. సుందర్‌లాల్‌ బహుగుణ  ఇంకోమాట కూడా అన్నాడు.

‘‘గ్రామ స్వరాజ్యం అంటే స్వరాజ్యం వచ్చి, గ్రామం పోవడం కాదు, గ్రామం గ్రామంలాగా మిగలాలి గ్రామం వాకిట స్వరాజ్యం కాపలాగా పడి ఉండాలి’’

ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గ్రామాలు పట్టణాలకి కాలనీలుగా మారిపోతున్న చారిత్రక విషాద దృశ్యాన్ని మనం చూస్తూనే వున్నాం కదా: సంపాదించిన దాన్ని నిలుపుకోవడం సంపాదించడం కన్నా కష్టం. ఎంత కష్టమయినా మనగ్రామాన్ని మనం నిలుపుకోగలగాలి అప్పుడే మన స్వాతంత్య్రానికి అర్ధం వుంటుంది.

ప్రపంచం మనలని మనం సాధించిన విజయాల ద్వారా, చేసిన ప్రయత్నాల ద్వారా మాత్రమే అంచనా వేస్తుంది.

వాటి ఆధారంగానే మన స్ధానాన్ని నిర్ణయిస్తుంది. మన నిర్ణయాల వెనుక వున్న కార్యకారణాలతో కానీ, అంతర్గత భావ సంఘర్షణలతో కానీ దానికి పనికిలేదు. అది వేసే ముద్రలన్నీ, ఉపరితల అంశాల ఆధారంగానే వుంటాయి.

ఒకప్పటి జన చైనా నాయకుడు ‘‘మావో’’ పైన చివరి దశలో వచ్చిన ఆరోపణలు అన్నీ యిన్నీ కావు. మావో నియంతగా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపర్చడానికి ‘‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’’, (ఒక పెద్ద ముందడుగు) తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి సాంస్కృతిక విప్లవాన్ని అడ్డుపెట్టుకున్నాడనీ అన్నారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని ప్రశ్నించినవారూ వున్నారు.

మావో సాంస్కృతిక విప్లవాన్ని ఆలింగనం చేసుకోవడానికి కారణం ఏమిటి? చైనాలో మగవాళ్ళు మూడు ఆధిక్యతలకు  లోబడి జీవిస్తూ వుంటారు. రాజకీయం, కుటుంబం, మతం. ఈ మూడు మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక మీద కాళ్ళేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టును పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడిని చుట్టుముడతాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తూవుంటుంది. స్త్రీలయితే, ఈ మూడు ఆధిక్యతలతో పాటు, పురుషుడి దురహంకారాన్ని కూడా భరించాలి.

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట వున్న ఆధిక్యతల నిర్మూలన జరగదని మావో బలంగా విశ్వసించాడు.

విప్లవం డిన్నర్‌ పార్టీకాదు. తీరిగ్గా చదువుకునే స్పూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్‌ కాదు. ఒక విప్లవం తరువాత మరొక విప్లవం రావాలి. విప్లమం నిరంతరం పురోగమించాలి.

ఇది మావో అంతరంగం. ఈ అంతరంగాన్ని ఎంత మంది పట్టుకోగలిగారు. అందుకే ప్రపంచం ఉపరితల అంశాల మీద ఆధారపడి బ్రాండీ ఇమేజ్‌ కల్పిస్తుందనేది. మాధవ్‌ శింగరాజు ఈ అంతరంగాన్ని పట్టుకోగలిగాడు.

ఇలాంటి పుస్తకాలు రాయడం ఒక అసిధారవ్రతం. ఏమాత్రం అటూ ఇటూ అయినా రసాబాస తప్పదు. వారం, వారం ఒక స్ఫూర్తి దాయక జీవిత చిత్రణ చేయడం మాటలు కాదు. మనం మామూలుగా ఒక పుస్తకాన్ని చదివి బావుంది/ బావోలేదు అంటూ తేలికగా ఒక మాటలో తేల్చేస్తాం. కాని ఒక వాక్యం రాయడానికి ఎంత కష్టపడాలి ఎన్ని వాక్యాలని డిలీట్‌ చేయాలి ఒక్క స్ఫూర్తివంతమైన, ఒక అర్ధవంతమైన, ఒక అజరామరమైన వాక్యం రాయడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులను ఆలోచనలతో వెలిగించాలి.

అందుకేనేమో ‘‘ గీసుకున్న బొమ్మలని కసాబిసా చెరిపేయడం చూసి నన్ను సృజనాత్మక నిస్పృహ పీక్కునితింటున్నదని, దానిని తప్పించుకోవడానికి కాసేపు నేను విశ్రాంతిని కోరుకుంటున్నానని మీకు అనిపించవచ్చు. బొమ్మగీయడం, దాన్ని చెరిపేయడం రెండూ ఒక్కటేనాకు. నిర్మూలన కూడా నిర్మాణంలో భాగమే అయినప్పుడు నాకు వేరే ‘‘కప్‌ ఆఫ్‌ టీ’’ అవసరమౌతుందా’’ అంటాడు మన మగ్బూల్‌ ఫిదా హుస్సేన్‌.

అలవోకగా చేసినట్టుండే వ్యాఖ్యలలోనే ఎంత లోతు వుంటుందో ఈ పుస్తకంలో అడుగడుగునా తగిలే వ్యాఖ్యలు చెప్తాయి.

‘‘మేరీ క్యూరీ’’ని గురించి రాస్తూ ‘‘జీవితం చేసే సహాయ నిరాకరణ, ఎంత అమానుషంగా వుంటుందో’’ అని నిట్టూరుస్తాడు.  యం.జి రామచంద్రన్‌, కరుణా నిధుల స్నేహం గురించి రాస్తూ నేను సాధించిన దాని గురించే నా ప్రాణ మిత్రుడు మాట్లాడుతున్నాడు. నేను పోగొట్టుకున్న అతడి పూర్వపు స్నేహాన్ని పుష్పగుచ్ఛంతో తిరిగి యివ్వగలడా? అని నేను ఆలోచిస్తున్నాను’’. అంటూ ఎం.జి.ఆర్‌. ఆవేదనను అక్షర బద్దం చేస్తాడు.

‘‘మట్టిలో వున్న దేశభక్తిని ఏ సామ్రాజ్యవాది వచ్చి పూడ్చిపెట్టగలడు’’ అని ప్రశ్నిస్తాడు సూర్యసేన్‌ గురించి రాస్తూ మంద్రంగా వున్నా సరే..  గ్రీష్మ పరితప్త జ్వాలానల మేదిని శీతల పవనం సేద దీర్చినట్లుగా మరేదీ సేద దీర్చదు.

ఈ అభౌతిక స్వరం కూడా అంతే! మెల్లమెల్లగా మనలోకి చొచ్చుకుని పోయి మనల్ని వెంటాడుతూ వుంటుంది.

ముఖేష్‌ గొంతులోని జీరలాగా… అప్పటి దాకా వానలో తడిసివచ్చి దుస్తులు పిండుకుంటూ మాట్లాడుతున్నప్పుడు గొంతులోంచి పలికే చలి వణుకులాగా!

                                                                                               —వంశీకృష్ణ

జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి? పరమార్ధం ఏమిటి?’’
ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవక మానదు. ఒక సారి ఈ ప్రశ్న ఎదురయినాక మనిషి మనిషి గా మామూలుగా ఉండడు, ఉండలేడు. తనను తాను శోధించుకోవడం మొదలు పెడతాడు. అప్పటి వరకూ తనకు ఎదురయిన అనుభవాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తను పాల్గొన్న సందర్భాలు, తాను నడచివచ్చిన దారులు, తాను విడిచి వెళ్ళిన పాదముద్రలు, తనకు ఎదురయిన వ్యక్తులు, తను చదువుకున్న పుస్తకాలు, తాను నివసించిన భిన్న ప్రపంచాలు, వాటి ప్రభావాలు, ప్రమేయాలు, పరిధులు, పరిమితులు ఆధారంగా తనకు నచ్చిన జవాబు ఏదో వెతుక్కుని సంతృప్తి పడతాడు. అదే జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అని సమాధాన పడిపోతాడు.
కానీ, కొన్ని ప్రశ్నలు ఒకే సమాధానాన్ని ఎల్లకాలమూ అంగీకరించవు. జీవితాంతం ఒకే జవాబును మోస్తూ తిరగవు. స్థలాన్ని అనుసరించీ, కాలాన్ని అనుసరించీ జవాబులు మారుతూ వుంటాయి. ప్రశ్నలకు సార్వ కాలీనత, విశ్వ జనీనత వుంటాయి. కానీ…..జవాబులకి సర్వకాలీన సర్వామోదము వుండదు. అందుకే అవే ప్రశ్నలు మళ్ళీ, మళ్ళీ, పుడుతూ కొత్త కొత్త సమాధానాలు అన్వేషిస్తూ వుంటాయి. అందుకే ఒకసారి జీవితానికి ఇదే అర్ధము, పరమార్ధము అని నిర్ణయించుకుని సమాధానపడినా మరుక్షణంలో ఆ సమాధానం అర్ధరహితం అయ్యే ప్రమాదం వుంది. జీవితం లోతూ, విస్తృతి అర్ధం అవుతున్న కొద్దీ, దాని పట్ల క్షణక్షణం మనం నిర్మించుకొనే నిర్వచనాలు మారిపోతూ జీవితం ఒక ప్రహేళికగా, నిండీనిండని గడులతో విస్మయ పరుస్తూ వుటుంది.

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక సీల్డు కవరు ద్వారా దయానిధికి జవాబు చెపుతాడు. కవరు విప్పి చూసిన దయానిధికి అందులో స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి తెల్ల కాయితం కనిపిస్తుంది. కాయితం తెల్లగా వుంది కనుక, జీవితానికి అర్ధం శూన్యం అనుకుని, జీవితానికి అర్ధమే లేదనుకుని సమాధాన పడతాడు దయానిధి.
నిజానికి చివరకు మిగిలేది నవల మొత్తం ‘‘మనుషులు ఎందుకు ద్వేషిస్తారు?’’ అనే ప్రశ్న చుట్టూ, దయానిధి చేసుకున్న ఆత్మావిష్కరణ. సంఘ ద్వేషానికీ, తల్లి కారణంగా తనలో ఏర్పడిన అపరాధ భావానికీ, ఆకుపచ్చని పాపికొండలని, అపరిమితమయిన అనుకంపతోనూ, దయతోనూ ఆప్యాయంగా చుట్టేసిన ప్రసన్న గోదావరిలాంటి ‘‘అమృతం’’ అవ్యాజమయిన అనురాగానికీ, ఒక తుఫానులాగా, ఒక ఉప్పెనలాగా, ఒక సునామిలాగా ఉధృతంగా, ఉద్వేగంగా కల్లోల పరిచే ‘‘కోమలి’’ ప్రేమకీ నడుమ తూగుటుయ్యాల ఊగిన దయానిధి. జీవితం అనే నాణేనికి రెండు ముఖాలుగా వున్న ప్రేమనీ, ద్వేషాన్ని విస్మరించి జీవితానికి అర్ధమే లేదు అనుకునే భావనలోకి వలస వెళ్ళడం ఆశ్చర్యకరమే అయినా కఠిన కరకు వాస్తవం కూడా !

buchibabu
నది ఒడ్డున కూర్చుని నదిలో గిరికీలు కొడుతున్న చేప పిల్లను చూసినట్లుగా జీవితం ఒడ్డున కూర్చుని జీవితం అనే చేప పిల్ల గిరికీలను గమనించండి. జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అర్ధం అవుతాయి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి.
‘‘మనసు ఎప్పుడూ జీవితానికి ప్రయోజనం, పరమార్ధం కోసం వెతుకుతూ వుంటుంది. ఎందుకంటే మనుషులు జీవితాన్ని గాఢంగా పూర్తిగా అనుభవించలేరు కాబట్టి. మీరు జీవితాన్ని అనుభవించే తీరు గాఢమయినది అయితే, మీ లోంచి ఈ ప్రశ్న పూర్తిగా పోతుంది. జీవన ప్రక్రియ సంపూర్ణంగా సంతోషకరమైనది అయితే ఇక జీవితానికి ప్రయోజనం, పరమార్ధం అవసరం లేదు. ఉదాహరణకు మీరు  పనిచేస్తున్నారు అనుకుందాం. మీ ఉద్దేశ్యం డబ్బు సంపాదనో, బాధ్యతా నిర్వహణో అయి వుంటుంది. కానీ ఒక విందుకు వెళితే అక్కడ ఉద్దేశ్య మేమి వుంటుంది? ఏ లక్ష్యమూ వుండదు, కేవలం విందులో పాల్గొంటారు అంతే! జీవితం మీకు ఒక పెద్ద విందులాగా, పెద్ద ఉత్సవంలాగా మారిపోతే దాని పరమార్ధం ఏమిటని మీరు అన్వేషించరు. కేవలం అందులో పాల్గొంటారు అంతే! మీరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు అంతే! ఈ జీవితం ఎలా తయారుచేయబడిరది అంటే దానికి ఒక పరమార్ధమే అవసరం లేదు. దానికి అదే ఒక పరమార్ధం. అదే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. సంపూర్ణ స్ధాయిలో సజీవంగా వుంటే చాలు. ఎక్కడికో చేరుకోవాలన్న పరమార్ధం జీవితానికి అవసరం లేదు. అదే సృష్టి అందం’’.
ఈ మాటలు నావి కావు. దేశానికి చాలా కాలంగా ప్రేమ తత్వాన్ని బోధిస్తూ వస్తున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వి.
‘‘ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం’’ అని దేశానికి రాజకీయ చాణక్యం అందించిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లాగా ‘‘ఏ అర్ధము లేకపోవడమే జీవితానికి అసలయిన అర్ధం’’ అని జగ్గీ వాసుదేవ్‌ గందర గోళ పరుస్తున్నట్లుగా అనిపించవచ్చుకానీ, ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు.
‘‘ఒకసారి పరమార్ధం అవసరంలేదని మీరు గ్రహించగలిగితే కేవలం సజీవంగా వుండటమే గొప్పగా అనిపిస్తుంది’’.
ఆధ్యాత్మిక తత్వ వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చెప్పినదానికీ, బుచ్చిబాబు కల్పిత పాత్ర వైకుంఠం మాస్టారు చెప్పిన దానికీ పెద్ద తేడా ఏమీ లేదు.
ఒక మునిగోరింట పువ్వు అందమయిన స్త్రీ జడలో అందంగా ఇమిడిపోతుందా…..? అంతకంటే అందమయిన దేవుడి పాదాల చెంత వినమ్రంగా వాలి పోతుందా? అన్న దానితో సంబంధం లేకుండా పూచినప్పటినుండి రాలిపోయేదాకా తన సౌరభంతో ఈ సృష్టిని పరిమళ భరితం చేస్తుంది.
ఒక మలయానిలం అల్లనల్లన ప్రయాణిస్తూ జలభారంతో నిండు గర్భిణిలాగా వున్న మేఘాన్ని తాకి గ్రీష్మానల తప్త మేదినికి స్వాంతన చేకూరుస్తుందా? చండ ప్రచండ రaంరaా మారుతమయి అగ్ని రగిలిస్తుందా? అనే దానితో సంబంధం లేకుండా తనను తాను విస్తరించు కుంటూ వెళ్ళిపోతుంది.
ఈ చరాచర సృష్టిలో ఏదీ తన సహజ లక్షణాలను కోల్పోదు. ఒక్క మనిషి తప్ప. మనిషి మనిషిలాగా సంపూర్ణంగా జీవించడమే జీవితానికి అర్ధమూ పరమార్ధమూ….
వంశీ ఏమిటి? ఈ నెల అర్ధమూ, పరమార్ధమూ అనే విచికిత్స నడుమ, సత్‌సంశయముతో కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నారా? అదేమీ లేదు…

Gollapudi-Maruti-Rao-Nagireddy-Memorial-Awards
ఇటీవల సుప్రసిద్ధ రచయిత, నటుడు, ప్రయోక్త, కాలమిస్ట్‌ గొల్లపూడి మారుతీరావు గారి పన్నెండేళ్ళ పాత నవల ‘‘సాయంకాలమయ్యింది’’ ని సరికొత్తగా చదువుతున్నప్పుడు నాలో కలిగిన భావ పరంపర ఇది.
ఈ నవలలో ‘‘బత్తిన రేచకుడు’’ పేరుతో ఒక పాత్రని సృష్టించారు మారుతీరావుగారు. ఆ బత్తిన రేచకుడు ఈ ఉపోద్ఘాత మంతటికీ కారణం.
ఆంధ్రదేశం నుండి అమెరికా వెళ్ళిన తొలి తెలుగు వాడి కథ ఇది. ఇప్పుడు గాఢంగా పెనవేసుకున్న అనుబంధానికి రేఖా మాత్రంగా పరిచయం ఏర్పడిన నాటి తొలి ప్రాక్‌ పశ్చిమ సంఘర్షణ ఈ కధా సారాంశం. ‘‘ఒక సాంప్రదాయక శ్రీ వైష్ణవ కుటుంబం’’ అనే వాక్యంలోని సాంప్రదాయమూ, కుటుంబమూ ఎలా సాయంకాలంవైపు నడచి సహజ మరణం పొందాయో చెప్పడం ఈ నవలలోని విషయం. ఈ నవలలో ప్రధాన కథలో ఎక్కడా సంలీనం కానటువంటి పాత్ర ఒకటి వుంది, అదే బత్తిన రేచకుడు. ఈ నవలలోని 23వ అధ్యాయంలో ఈ పాత్ర వస్తుంది. నవల మొత్తం చదవక పోయినా, కేవలం ఆ 23వ అధ్యాయం మాత్రమే చదివినా అర్ధం అయ్యే పాత్ర ఇది. నిజానికి ఇది కేవలం ఒక రచయిత సృష్టించిన పాత్ర మాత్రమే కాదు. ఇంతకు ముందు చెప్పుకున్న అర్ధము, పరమార్ధము లాంటి తత్వ విషయాలు, ఒక భారతీయ పరిపక్వ మనస్తత్వంలో ఎలా అందంగా అర్ధవంతంగా ఇమిడిపోతాయో దృశ్యమానం చేసిన పాత్ర. భారత సమాజం, మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయక సమాజ జ్ఞానం నుండి పాశ్చాత్య సమాజం ఏం నేర్చుకోవాలో అన్యాపదేశంగా నయినా బలంగా చెప్పిన పాత్ర డెట్రాయిట్‌ లో పనిచేసే తిరుమల భారతదేశం వచ్చాక, తన మిత్రుడు విష్ణుమూర్తి తల్లితండ్రులను చూడటానికి శ్రీకాకుళం దగ్గర వున్న ‘‘గిర్‌గాం’’ అనే పల్లెకు బయలుదేరుతాడు. విష్ణుమూర్తి తండ్రే మన బత్తిన రేచకుడు.

saayamkaalamaindi
విష్ణుమూర్తి తన తల్లి కోసం కొని యిచ్చిన అత్యాధునిక గ్రైండర్‌, తండ్రి కీళ్ళ నొప్పుల కోసం రబ్బరు కణుపులున్న రెండు జతల చెప్పులు తీసుకుని రేచకుడి దగ్గరకు బయలుదేరుతాడు తిరుమల.
బత్తిన రేచకుడు ఒంటరివాడు, వృధ్ధాప్యంలో వుండి చివరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడు. ఇమాంపసందు మామిడి పండ్లంటే అతడికి మహాయిష్టం, ఒంట్లో షుగరు వున్నా పండు మీద మమకారం చంపుకోలేక పండ్లు విపరీతంగా తిని ఒక కాలుని మోకాలు వరకు పోగొట్టుకున్నాడు.
‘‘అసలు కాలు ఎలా పోయింది?’’ అని తిరుమల అడిగిన ప్రశ్నకి రేచకుడు ఏం చెప్పాడో చూడండి
‘‘మనకి ఒంటినిండా సెక్కెరే బాబు తీపి తినక్కరలేదు. సిన్నప్పటి నుండి నేను ఇమాంపసందు అంటే పీక్కోసుకుంటాను. కనిపించే మేరలో అయిదెకరాల మామిడితోపు నాదే, ఆరు వేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి తొలకరి దాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీ యవ్వ……పోతే దొర బిడ్డలాగా పోవాలి. కానీ ఏడుత్తూ బతికితే ఏం లాభం….? మా డాట్టరు పద్మనాభయ్య ‘‘ఒరే రేసు నా కొడకా! తింటే సత్తావురా!’’ అన్నాడు. నేను నవ్వి ‘‘అయితే తినే సత్తాను’’ అన్నాను. రెండ్రోజులు పనికట్టుకు తిన్నాను, పండొదిలితే ఒట్టు’’
‘‘మరి విష్ణుకి తెలియజేయలేదేం?’’
‘‘తెలిత్తే ఆడేటి సేత్తాడయ్యా: అన్నీ తెలిసిన మూర్కుణ్ణి నేను’’ ఇప్పుడు ఒక్క పండు కూడా తినలేను’’
కాలు పోయేదాకా మామిడి పండ్లు తిన్న రేచకుడు, తన మనసుకు పసందైన ఇమాం పసందును ఎందుకు మానాడు…………?
భార్యకు ఇచ్చిన మాటకోసం!
కానీ భార్య ` కొడుకు కోసం బెంగ పెట్టుకునీ, పెట్టుకునీ మంచం పాలయితే వంట చేసి పెట్టాడు. మల మూత్రాలు తీశాడు.
నీళ్ళుపోసి చీర కట్టాడు. చివరకు తల కొరివి కూడా పెట్టాడు. తప్పిస్తే భార్య చనిపోయిందన్న విషయం కొడుకు కి కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకని…….?
‘‘ఇక్కడ జరిగేదేదీ ఆడిని బాధ పెట్టకూడదు. ఆడి సుకాన్ని పాడు చెయ్యకూడదు. అందుకే ఆళ్లమ్మ బతికున్నట్టు దొంగ ఉత్తరాలని పూర్ణయ్య పంతులు రాస్తాడు. సంవత్సరం పొడవునా ఆరికి పది బస్తాల ధాన్యం, అపరాలు, మామిడీ అన్నీ నేను పంపుతాను’’ ఇదీ రేచకుడి సమాధానం.
వృధ్ధాప్యంలో చూడవలసిన కొడుకు ఎక్కడో దూరాన అమెరికాలో వున్నాడు. భార్యలేదు, ఒంటరివాడు పైగా వికలాంగుడు
‘‘మీ సంగతి ఎవరు చూస్తారు?’’ అని అడిగితే………..
‘‘మన సంగతి మరోడు చూసేదేంటయ్యా! రోడ్డు మీద కుక్కపిల్ల సంగతి ఎవరుసూత్తున్నారు, సెరువులో సేపపిల్ల సంగతులెవరు సూత్తారు? నీకు ఓపిక వుందా…….. వండుకు తిను. లేదా నాలుగుపళ్ళు తిను, ఇంకా సేత కాదా సచ్చిపో……..’’
రేచకుడి లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. వేదనలేదు. ప్రతి కష్టాన్ని తృప్తిగా మల్చుకునే అద్భుతమైన సంకల్ప బలం ఏదో వుంది.
‘‘తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకు ఇచ్చిన మాట తప్ప లేరా…..? అంటే రేచకుడు………..
‘‘కొడుకుని మోసం చేసేది ఆడిని బాధ పెట్టే హక్కు నాకు లేదని, నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిదీ దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని’’ అంటాడు.
మనిషి స్థితప్రజ్ఞుడు కావడానికి చదువుసంధ్యలతో సంబంధం లేని సంస్కార మేదో కావాలి. దాన్ని రేచకుడు సాధించాడు.
‘‘మీ అబ్బాయికి ఏమయినా  చెప్పమంటారా!’’ అని తిరుమల అడిగితే …..
ఒంటి కాలితో గెతుతూ వచ్చి ‘‘నువ్వు యిక్కడ విన్నది, సూసిందీ ఏమీ చెప్పకు. తల్లికుక్క పిల్లపుట్టగానే దాన్ని తినేత్తాది కారణం తెలుసా? తన ప్రేమ  నుండి ఆ పిల్ల దూరమయి పోతుందేమో అన్న భయం సేత. నా భయానికి ఆడి పీక కొరికీ కొరకకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతున్నాను. రెక్కలొచ్చాక పిల్లగూడులోంచి ఎగిరిపోకపోతే తప్పు తల్లిదే కానీ పిల్లది కాదయ్యా! పెపంచకాన్ని అలవాటుచేసి గూడులోంచి తోసెయ్యాల నేనా పనే సేత్తున్నాను’’
రేచకుడు ఒక్క కాలికే వంగి నమస్కారం చేస్తాడు తిరుమల. ఈ పాత్రని తరచి చూస్తే…ఎన్నో విషయాలు బయటపడతాయి!

‘‘పిల్లలు మనలోంచే వస్తారు కానీ, మన ఆశలకీ, ఆశయాలకు వాళ్ళు వారసులు కారు. వాళ్ళదొక ప్రత్యేకమయిన లోకం’’ అనే ఖలీల్‌ జిబ్రాన్‌ గుర్తుకు రాడా……….?
‘‘జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలి’’ అన్న కృష్ణమూర్తి గుర్తుకురాడా..? ‘‘జీవితాన్ని తెల్లకాయితంతో పోల్చి చూపి ప్రేమలేఖో, మరణశాసనమో ఏదో అద్భుతంగా నువ్వే రాసుకో’’ అన్న వైకుంఠం మాస్టారి తత్వబోధ యిదే కదా…..!
‘‘మనసు ప్రతిదాన్నీ భాగాలుగానే గ్రహించగలదు. ఈ చిన్ని చిన్ని ముక్కలుని మీరు కలిపితే అది మొత్తంగా మారదు. మీ వద్ద కేవలం ముక్కలు మాత్రమే వుంటాయి. మీరు ఎంత ఎక్కువగా సేకరిస్తే మీరు అన్ని ముక్కలుగా తయారవుతారు. మీరు ఎన్ని ముక్కలు సేకరించినా అవి ఎప్పటికీ మొత్తంగా మారవు. శివుడికి ముక్కంటి అని పేరు. మూడోకన్ను తెరుచుకోవడం అంటే భౌతిక మయిన కళ్ళకి అతీతమయిన జ్ఞానచక్షువు తెరచుకుని, ఇంద్రియాతీతమైన సంపూర్ణత్వాన్నీ, మొత్తాన్నీ చూడగలగడం. జీవితాన్ని పూర్తి లోతుతో, పూర్తి ప్రమాణంతో అర్ధం చేసుకోవడమే…..అదే జీవిత పరమార్ధం’’ అంటున్నాడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌.
రేచకుడు మూడో కన్ను తెరిచాడు కదూ……!
ఆ జ్ఞాన చక్షువే ఈ జీవితానికి అర్ధమూ…….పరమార్ధమూ……!’

-వంశీకృష్ణ

ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే!

ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే ప్రేమ కు మరో పేరు బానిసత్వం. ఇది అతార్కిక ముగింపు అనిపిస్తుందేమో కానీ కొన్ని కొన్ని విషయాలు చదువుతున్నపుడు  కొంత మంది వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నపుడు ‘‘ఇది నిజమే కదా’’! అని కూడా అనిపిస్తుంది. బానిసత్వంలో ‘‘నేను బానిసను, నాకు స్వేచ్ఛ లేదు, నేను పీడింపబడుతున్నాను’’ అన్న ఎరుక, సంవేదన ఉంటాయి.  ప్రేమలోఅదేమీ వుండదు.  

‘‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే స్వర్గము’’ అనే ఆత్మార్పణ భావన ప్రేమలోవుంటుంది.  ఈ అర్పించుకోవటం అనే ప్రక్రియ, లేదూ తనని తాను త్యాగం  చేసుకోవడం అనే భావన ప్రేమ కల్పించే అనేకానేక మాయాజాలాలలో ఒకటి. సముద్రం తన మెత్తని హస్తాలతో మన అరికాళ్ళకింద గిలిగింతలు పెట్టినట్లుగా అనుభూతిని కలిగించి పూర్తిగా తనలోకి లాగేసుకుని మనలని శూన్యం చేసినట్లుగానే ప్రేమ కూడా ప్రేమలో వున్న వాళ్ళని ఖాళీమనుషులను చేస్తుంది. ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌.

ఒక రాత్రివేళ నిద్రపట్టక తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించిన సామల సదాశివ ‘‘మలయ మారుతాలు’’ వ్యాస సంపుటిలోని ‘‘ఇస్మత్‌ చుగ్తాయ్‌’’ పరిచయ వ్యాసం చదువుతున్నపుడు నాలో కలిగిన భావ సంచయం ఇది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ మాత్రమే కాదు. బేగం అఖ్తర్‌, మన రావు బాలసరస్వతీదేవి లాంటి ఉదహరించదగిన వ్యక్తుల జీవితాలలో ప్రేమ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసుకుంటే ఆసక్తికరంగా వుంటుంది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత. ఇప్పటికీ సమాజం ఆమోదించని, చర్చిండానికి యిష్టపడని ఎన్నో విషయాలను నలభై, యాభై సంవత్సరాల క్రితమే తన రచనల ద్వారా ప్రకటించి, చర్చనీయాంశం చేసి సంచలనం సృష్టించిన రచయిత్రి ఇంకా…..

231856

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కి చెందిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి కలెక్టర్‌. ఆమె పెద్దన్న అజీం బేగ్‌ చొగ్తాయ్‌, ఇస్మత్‌కి ఊహ తెలిసేవరకే పెద్ద రచయిత. ఇస్మత్‌ మనసు రచన వైపు మరలటానికి ఆమె అన్నే కారణం. మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ఆమె శర పరంపరగా కథలు రాసింది. లైంగిక విషయాలను కూడా ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా చర్చకు పెట్టింది. ఇస్మత్‌ మీద పెట్టిన కేసులు ఎన్నో… ఒక్కటీ నిలవలేదు.

ఆమెకు, బొంబాయి మహానగర పాఠశాలల విద్యాధికారిగా పని చేస్తున్నపుడు షాహీద్‌ లతీఫ్‌ అనే యువకుడితో పరిచయం అయింది. అతడు కూడా ఒక చిన్న సైజు రచయిత. సినిమాలకు స్క్రిప్టులు రాసేవాడు. ఇస్మత్‌తో పరిచయం అయ్యాక, ఆమె దగ్గర శిష్యరికం చేశాడు. తన రచనలను ఆమె చేత సరిచేయించుకున్నాడు. సలహాలు తీసుకున్నాడు.

ఒకనాడు ఉన్నట్టుండి. సాహీద్‌ లతీఫ్‌, ఇస్మత్‌తో ‘‘మనిద్దరం పెళ్ళిచేసుకుందామా?’’ అని అడిగాడు. ఆమె విస్తుపోయింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. పెద్ద పేరున్న రచయిత్రి. ఖ్యాతినీ, ప్రఖ్యాతినీ సమాన స్థాయిలో మూటకట్టుకున్న ఐకాన్‌.

‘‘మనిద్దరికీ ఎలా కుదురుతుంది’’? అన్నది ఆమె. ‘‘ఎందుకు కుదరదు’’? అన్నాడు అతను. ‘‘నేను నీకు తగిన భార్యను కాను. పురుషాధిక్యతను నేను అస్సలు సహించను. నీకు సేవలు చేయను. నేను మొండిదానిని. అనుకున్న పని చేసేదాకా పట్టు సడలించని దానిని. ఎవరు ఏమి అనుకున్నా నాకు పట్టింపు లేదు. ఇంత ఎందుకు? సంప్రదాయక గృహిణి లక్షణాలు నాలో ఒక్కటీ లేవు. అలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు?’’ అన్నదామె.

లతీఫ్‌ పట్టు విడువలేదు. కోపంతో లతీఫ్‌తో మాట్లాడటం మానేసింది ఇస్మత్‌. అయినా అతడు ఆమె దగ్గరకు వెళ్ళడం మానలేదు. ఇస్మత్‌ అన్న అజీంబేగ్‌ ఎందరు, ఎన్ని రకాలుగా చెప్పినా లతీఫ్‌ తన మొండిపట్టు వీడలేదు.

చివరకు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. అతడు చిన్న చిన్నస్క్రిప్టులు రాసుకునే మినీ రచయిత. ‘‘గతిలేని వాడికి గెజిటెడ్‌ ఆఫీసరా…? అని అతడి మిత్రులు హేళన చేస్తారని ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నా ఆమె, తన కీర్తి ప్రతిష్టలు అతడిని ఆత్మన్యూనతకి గురిచేస్తాయోమోనే ఉద్దేశ్యంతో రచనలు చేయడం మానేసింది. వాళ్ళిద్దరూ వీధిలో నడిచివెళుతున్నపుడు ‘‘ఇద్దరి ఎత్తూ సమానమే’’ అని ఎవరో అన్నారని ‘‘హై హీల్స్‌’’ వేసుకోవడం మానేసింది.

అంతేనా…?

ప్రొడ్యూసర్ల చుట్టూ చక్కర్లు కొట్టి, వెయ్యికీ, రెండు వేలకూ స్క్రిప్టులు రాసే అతడిని నిర్మాతను చేసింది. తను రాసిన నవల ‘‘జిద్ది’’ను సినిమాగా నిర్మించి అతడిని ప్రొడ్యూసర్‌ని చేసింది.

దిలీప్‌ కుమార్‌, కామినీ కౌశల్‌ లాంటి పెద్ద పెద్ద తారలు వాళ్ళ సినిమాలలో నటించారు. సినిమాలు విజయవంతం అయినాయి. సినిమాలకు రాసినా, కథలకీ, స్క్రిప్టులకీ తన పేరు వేసుకోకుండా లతీఫ్‌ పేరునే ప్రకటించేది. ఆ రకంగా అతడిని గొప్ప రచయితను చేసింది.

ఇద్దరమ్మాయిలు కలిగిన తరువాత లతీఫ్‌ మరణించాడు. అతడి అకాల మరణం ఆమెను కుంగదీసింది. కానీ పెరిగిన బాధ్యతలు ఆమెను మళ్ళీ మునుపటి ఇస్మత్‌గా మార్చాయి. తరువాత ఆమె జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా పొందింది.

మరణానికి ముందు లతీఫ్‌ తన డైరీలో ఇలా రాసుకున్నాడట. ‘‘నన్ను పెళ్ళిచేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావని ఇస్మత్‌ అన్నది. కానీ నాకు తను ఆ అవకాశాన్నే యివ్వలేదు. ఇలాంటి అదృష్టం ఎంత మందికి దొరుకుతుంది?’’

నిజమే. లతీఫ్‌ అదృష్టవంతుడే…

ఇస్మత్‌ కోసం అతడేం చేశాడు. అతడి కోసం ఆమె, ఉద్యోగాన్ని, రచననీ, అన్నింటినీ వదులుకుంది. తను నీడలాగా వెనుక వుండి అతడిని వెలుగులోకి తీసుకుని వచ్చింది. సతీ సావిత్రిని కాను అన్న ఆమె,  సతీ సావిత్రి కంటే తక్కువేమీ కాదు అనిపించుకుంది.

ఇదంతా ప్రేమ కోసమేనా…?

***

LF14_BEGUM2_1296636f

‘‘దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ ద్వారా ఎంతో మందిని పిచ్చివాళ్ళను చేసిన బేగం అఖ్తర్‌ది మరొక కథ.

అఖ్తర్‌ బాయి ఫైజాబాదీ లక్నోలోమంచి ప్రాక్టీసు గల బారిస్టరు ఇస్తెయాఖ్‌ అబ్బాసీతో  వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది.

సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పుట్టిన అఖ్తర్‌ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.

అఖ్తర్‌ బాయిగా గొప్ప పేరునూ, డబ్బునూ సంపాదించుకుంది. బారిస్టర్‌ అబ్బాసీకి భార్య అయిన తరువాత బేగం అఖ్తర్‌గా మారిన తరువాత కొన్ని సామాజిక కట్టుబాట్లకి లొంగిపోవలసివచ్చింది. బురఖా మాటున ఆమె స్వరం మూగవోయింది. అచ్చం మన రావు బాలసరస్వతిదేవి నూజివీడు జమిందారుల అంత:పురంలో మూగవోయినట్లుగా.

ఆమె సాటి గాయని గాయకులు ఎవరయినా ఇంటికి వస్తే ఆమె అసహాయంగా బేల చూపులు చూసేది. ఎవరి పాటలు విన్నా ఆమెకు ఏడుపు వచ్చేది. ఆ నరకం నుండి ఆమెకు బయట పడాలని వుండేది. కానీ భర్త బారిష్టరు అబ్బాసి పట్ల ఆమెకు వున్న ప్రేమ, భర్త గౌరవం కాపాడాలన్న తాపత్రయం ఆమెను బయటకు రానిచ్చేవి కావు.

ఆ రోజుల్లోనే లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌గా వచ్చిన సునీల్‌ బోస్‌కి లక్నో రావడానికి ముందే బేగం అఖ్తర్‌తో పరిచయం ఉంది. ఆవిడ పాడటం మానేయడం పట్ల బాధపడిన సునీల్‌ బోస్‌ ఆమెను ఎలాగయినా పాడిరచాలి అనుకున్నాడు. జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాని లక్నో రేడియో స్టేషన్‌కి తీసుకురాగలిగాడు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత లక్నో రేడియో స్టేషన్‌ ప్రసారం చేసిన బేగం అఖ్తర్‌ గజళ్ళని విని అసంఖ్యాకులయిన ఆమె అభిమానులు ఆనందపడిపోయారు.

అబ్బాసీ కూడా ఆమె పాటను కట్టడిచేయడం అన్యాయమని, అపచారమని అనుకుని ఆమెకు పాడుకునే స్వేచ్ఛను యిచ్చాడు. అప్పటినుండీ ఆవిడ తన స్వర మాధుర్యంతో ఎందరెందరు సంగీత ప్రియులను తన్మయులను చేసిందో!

***

rbs

అలాగే మన రావు బాలసరస్వతిదేవి. నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూడలేదు. స్వరాన్ని సవరించలేదు. రాజ సాంప్రదాయాల కోసం, రాజా వారి మీద వున్న ప్రేమ కోసం, బాల సరస్వతీదేవి స్వరాన్ని త్యాగం చేసింది.

పాట పట్ల ప్రేమ వుండీ, పాటే జీవితం అనుకునీ, పాడగలిగే శక్తివుండీ పాటకు దూరం కావడం అంటే పువ్వునుండి పరమళం దూరం కావడమే. మర్యాద కాదని బాలసరస్వతీదేవి బయటకు చెప్పకపోవచ్చు కానీ, పాటకు దూరమయి ఆవిడ ఎంత నరకాన్ని అనుభవించి వుంటుందో…

రాజావారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు. కానీ సమయం మించిపోయింది కదా…

ఇస్మత్‌ చుగ్తాయ్‌`

బేగం అఖ్తర్‌`

రావు బాల సరస్వతీదేవి`

వీళ్ళంతా లోకజ్ఞానం లేని మామూలు మనుషులుకారు. కానీ ప్రేమ కోసం కరిగిపోయిన కొవ్వొత్తులు. పెళ్లికి ముందు వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, పెళ్ళయిన తరువాత వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. సతీ సావిత్రిని కాను అని మరీ చెప్పిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సతీ సావిత్రిలాగే ప్రవర్తించింది. ఎందుకనీ… లతీఫ్‌ పట్ల ప్రేమకోసం…

హైద్రాబాద్‌ నిజాం రెండవ కుమారుడు ప్రిన్స్‌ మొఖరం జానే ఆత్మాభిమానం కోసం తృణీకరించి వచ్చిన బేగం అఖ్తర్‌ బారిష్టర్‌ అబ్బాసీని పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేక, మౌనంగా వుండి పోయింది ఎందుకని… ప్రేమ కోసం.

నూజివీడు రాజావారు బ్రతికి వున్నంతకాలం రావు బాల సరస్వతీదేవి కోట గుమ్మం దాటి బయటకు రాలేదు ఎందుకని…ప్రేమకోసం

ప్రేమ కోసం వాళ్ళు పరాధీనత లోకి వెళ్లిపోయారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ సహజ లక్షణాలని స్వయంగా తృణీకరించారు. పురుషుడికి నీడలాగా మారిపోయారు. అది బానిసత్వమన్న ఎరుక కూడా వాళ్లకు లేదు. అదంతా ప్రేమే అని అనుకున్నారు. నిజంగా అది ప్రేమేనా…?

ప్రేమంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి పంచుకోవాలి కదా! ఇద్దరూ ఒకే స్థాయిలో స్పందించాలి కదా! ఒకే శృతిలో ఒకే స్వరంలా కలసిపోవాలి కదా! ఒకే నాణేనికి రెండు వైపుల్లా నిల్చిపోవాలి కదా…

కానీ అలా జరగడం లేదు!

ఈ ఆధిపత్య భావజాలాన్నీ, దీన్ని అంగీకరించడాన్నీ, అంగీకరించినట్లుగా కూడా తెలుసుకోలేని అజ్ఞానాన్ని… దీన్నంతటినీ ప్రేమే…. అందామా!

 -వంశీకృష్ణ 

 

 

‘ మరో వైపు’ చూద్దామా !

Fall-Leaves

మరో వైపు’ చూపిస్తున్న వంశీకృష్ణ…వచ్చే వారం నుంచి..!

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే కండిషన్  అయింది. తన సహజమైన లక్షణాలనీ కోల్పోయి ఒక మూసలో కూరుకు పొతున్నది. సాహిత్యము, సంగీతము ఇతరేతర సృజన  రంగాలన్నీ ఇందుకు మినహాయింపు కాకపోవడము ఒక విషాదం. సామాజిక వర్గాలు,మతాలూ, ప్రాంతాలు, పేరున ఈ కండిషనింగ్ కొనసాగుతూ వస్తున్నది.

ప్రతి అంశానికి సెకండ్, థర్డ్, డైమన్షన్ ఉంటుందనే విషయాలను కూడా మనం కన్వీనియంట్ గా మరచి పోయాము. ఒక కథ చదివినప్పుడో, ఒక కవితను అనుభూతించినప్పుడో మనఃస్పూర్తి గా మెచ్చుకోవడానికి కూడా రకరకాల న్యూనతలు మనలని అడ్డుకుంటున్నాయి. ఈ విష వలయం నుండి మనం ఎంత త్వరగా బయట పడితే మన సామాజిక ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మన సాహిత్యానికి!

ఈ నేపధ్యం లోనే ‘సారంగ’ సాహిత్య వార పత్రిక లో ‘మరోవైపు‘ శీర్షిక మొదలవుతున్నది. ఈ కాలం లో సాహిత్యం, సినిమా, ప్రభావశీలురు ఐన వ్యక్తుల, సంస్థల ప్రతిభాన్విత సంఘటనలని వాటి వాటి నియమిత అర్ధం లో కాకుండా రెండో వైపు చూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఒక కధ చదివినప్పుడు అది కలిగించే వాచ్యార్ధాన్ని మాత్రమె కాకుండా మరో అంతర్గత అర్ధాన్ని అంటే లో నారసి చూసే ప్రయత్నం అన్న మాట.
సాహిత్య పత్రికలలో / సాహిత్య పుటలలో ఒక సృజనని సమీక్షించేటప్పుడు సృజన కారుడి వైయక్తిక అంశాలను, బలహీనతలను పక్కన పెట్టి, లేక పట్టించుకోకుండానూ, కేవలం రచన కు మాత్రమే పరిమితమై దాని సారాన్ని, సారాంశాన్ని మాత్రమే  పట్టించుకునే పద్ధతి ఇది. నిజానికి ఇది కొత్త విధానమేమీ కాదు. . పూర్తిగా పాతదే. మళ్లీ కొత్త గా మొదలు పెట్టడం అన్న మాట! అలా అని కళ కోసం కళ అనే పూర్తి సాంప్రదాయక వ్యవహారం కూడా కాదు.  సాహిత్య రాజకీయాలను, సాహిత్య చొరబాట్లను వదిలి స్వచ్చ శుభ్ర సాహిత్య అనుభూతిని పొందటం కోసం  చేసే ప్రయత్నం ఇది.

వంశీకృష్ణ