“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  9

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు మద్రాసులో పొట్టి శ్రీ రాములు గారు నిరాహార దీక్ష చేస్తూ  మరణించారు. ఆయన ఎవరో, ఎందుకు నిరాహార దీక్ష చేసారో ఆ వయసులో నాకు తెలియదు. నాకు తెలిసినందల్లా ఆ రోజు కాకినాడ అంతా భగ్గుమంది. మా “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” అర్జంటుగా మూసేసి మమ్మల్ని ఇంటికి పంపించేసారు. అన్ని కాలేజీలూ, దుకాణాలూ మూత పడి మొత్తం నగరం అంతా స్తంభించి పోయింది.  కొన్ని వేల మంది విద్యార్ధులు సైకిళ్ళమీదా, కాలి నడకనా ఊరేగుతూ మా ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి, పార్కు కేసి నినాదాలు చేస్తూ వెడుతుంటే, అసలు విషయం తెలిసిన మా నాన్న గారూ, మా అన్నయ్యలతో బాటు కుర్ర కుంకలం అందరం కూడా మా గుమ్మం దగ్గర నుంచుని ఆ “ఊరేగింపు” చూస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ నాకేసి దూసుకొచ్చి, సరదాగా ఒక టెంకి జెల్ల కొట్టి, చేతిలో ఉన్న పెద్ద బొగ్గు కణికెతో మా గోడ మీద ఒక వేపు  “CR చావాలి” “CR కి ఉరికంబం” అనీ, రెండో వేపు “నెహ్రూ డౌన్, డౌన్” అనీ పెద్ద అక్షరాలతో రాసేసి ఊరేగింపు లో కలిసి పోయాడు. రాబోయే సంక్రాంతి కి మా నాన్న గారికి చాలా ఇష్టమైన గోపీ చందనం రంగుతో అప్పుడే వెల్ల వేసి, ఎంతో అందంగా ఉన్న ఆ గోడ ని మసి పూసి మారేడు కాయ చేసెయ్య గానే వేల సంఖ్యలో ఆవేశంలో ఉన్న ఆ స్ట్యూడెంట్స్ ని ఏమీ అన లేక మా నాన్న గారు, మిగిలిన వారూ నిస్సహాయంగా ఉన్న సమయంలో నేను ఆ గోడ కేసి చూసి భోరు మని ఏడుపు లంకించుకున్నాను. నేను ఎవరు ఎంత చెప్పినా, ఆ గోడ మీద రాతల కేసి చూపిస్తూ ఏడుపు స్థాయి పెంచుతూ ఉండగా ఎవరో “ఎందుకురా అంత ఏడుస్తున్నావు. ఆ మాత్రం చిన్న జెల్ల కాయ కొట్టి నందుకే అనీ” “పరవా లేదు రా మళ్ళీ వెల్ల వేయిస్తాం” అనీ అనగానే “అందుకు కాదు నా ఏడుపు. అసలు నేను ఎందుకు చావాలి? నన్ను ఉరికంబం ఎందుకు ఎక్కించాలి?” అని గగ్గోలు పెట్టాను. అప్పుడు అందరికీ అర్ధం అయింది. “ఓరి వెర్రి వెధవా, అదా సంగతీ. వాళ్ళు ‘చావాలి’ అన్నది CR ..అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి….నిన్ను కాదు. ” అని నాకు చాక్లేట్లు పెట్టి నా ఏడుపు ఆపారు. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా మిత్రులు కొంత మంది నన్ను “CR” అని పిలవడంతోటీ, మద్రాసులో ఉండే ఈ CR ఎవరో నాకు తెలియకా నా ఏడుపుకి కారణం. అదంతా తల్చుకుంటే నాకు అప్పటి ఏడుపు గురించి కాదు కానీ, ఇప్పడు నాకు మరో కారణానికి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం విషయంలో అసలు సమస్యలు పరిష్కరించుకోలేక ఏవేవో , కారాణాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం మళ్ళీ వెనక్కి పోతున్నాం.  అన్నట్టు ఆ రాజగోపాలాచారి ప్రసంగం కొన్నేళ్ళ తరువాత కాకినాడలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాను. ఆయనతో మాట్లాడాను కూడా.

ఇక ఆ వీధి గుమ్మం కాక ఆ గోడలోనే మా పొలం నుంచి వచ్చే బళ్ళు లోపలి రావడానికి మరొక పెద్ద రేకుల గుమ్మం, అక్కడే వాయవ్యం మూల మా పాడి పశువులు ఉండే పాక ఉండేది. అక్కడి నుంచీ మా 3600 గజాల స్థలంలో మా చిన్నపుడు ఉండే “తోట విహారం” మొదలు పెడితే వాయవ్యం నుంచి ఈశాన్యం మూల దాకా ఉండే ప్రహారీ గోడని ఆనుకుని నేను ఎప్పుడూ ఎక్కని పెద్ద ములగ చెట్టు, అప్పుడప్పుడు ఎక్కే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి చెట్లూ, జీడిమామిడి, చిన్న మామిడి పళ్ళ చెట్టు, పొడుగ్గా ఉండే యూకలిప్టస్ చెట్లు, తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లు ఉండేవి. ఏడాది పొడుగునా కింద రాలిపోయే ఈ పత్తి కాయలని పోగేసి ఒక గుట్టగా పడేసే వాళ్ళం.  ఆరు నెలలకో సారి మా దూదేకుల సాయబు వచ్చి, మా ఇంటి వరండాలో దుకాణం పెట్టి వారం రోజుల పాటు నానా కంగాళీ చేసి, పదో, పదిహేనో తలగడాలూ, రొజాయిలు అనే పరుపులూ చేసే వాడు. అతనున్న వారం రోజులు మా ముక్కుల్లోను, చెవుల్లోనూ, నోట్లోనూ, ఇల్లంతానూ. ఆఖరికి ఎంతో మడిగా ఎక్కడో మూలా ఉన్న వంటింట్లో చేసిన అన్ని వంటకాల్లోనూ సిల్కు లా ఉండే ఈ దూది పింజలే! ఇక యూకలిప్టస్ ఆకులు కొయ్యడానికి కష్టపడినా, నలిపి చూస్తే భలేగా ఖరీదైన సెంటు వాసన వచ్చేది. ఇక ఈ ఈశాన్యం మూల ఉండే  ఆకుపచ్చ సంపెంగ చెట్టు మా గాంధీ నగరం అంతటికీ సువాసనలు వెద జల్లేది. ఆ సంపెంగ పువ్వులు, ఆకుల్లో కలిసిపోయి ఎప్పుడైనా మా అక్కా వాళ్ళూ కోసుకోడానికి కంటికి కనపడేవి కావు.  అ సంపెంగ మొక్క ఉంటే పాములు వస్తాయని మేము ఎప్పుడూ చీకటి పడ్డాక అటు వేపు వెళ్ళడానికి హడిలిపోయే వాళ్ళం.  నిజంగానే అక్కడ ఒకటి, రెండు పాము పుట్టలు ఉండేవి. మా పేటలో నాగుల చవితి హడావుడి అంతా అక్కడే. అందరూ ఆ పుట్టలలోనే పాలు పోసే వారు.

తోటలో మా నాన్న గారు

తోటలో మా నాన్న గారు

ఇక ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం వేపు గోడ వారన నడుస్తూ ఉంటే ఓ ఉసిరి చెట్టు, కరివేపాకు మొక్కలూ, పులా మొక్కలు ఉన్నా, అన్నింటి కన్నా ప్రత్యేకమైన ఒక చిన్న, చిన్న పళ్ళు కాసే ఉసిరి చెట్టు లాంటి పెద్ద మొక్క ఉండేది. దాన్ని “పుల్ల, పుల్ల చెట్టు” అనే వాళ్ళం. అసలు పేరు ఎవరికీ తెలియదు. అది చిన్న ఉసిరి కాయల సైజులో పళ్ళు కాసినప్పుడు అవి తింటే విపరీతమైన పుల్లగా ఉండి అస్సలు తినలేక పోయే వాళ్ళం. కానీ అవి పండాక, వయొలెట్ రంగులో కి వచ్చాక అద్భుతమైన తీపి రుచి ఉండేవి. మా దురదృష్టవశాత్తూ, ఇరవై ఏళ్ల క్రితమో ఎప్పుడో, ఏదో తుఫానుకో , మరెందుకో మాయం అయిపోయింది. ఆ తరువాత ఆ మొక్క కోసం మా సుబ్బన్నయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి మొక్కలకి ప్రసిద్ధమైన కడియం గ్రామం లో ఉన్న అన్ని నర్సరీలో కూడా తను వాకబు చేసినా ఆ మొక్క ఏమిటో, ఎక్కడ దొరుకుతుందో ఎవరూ చెప్పలేక పోయారుట.  నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆ మొక్క ఉండే చోటి దగ్గర నుంచుని ‘నివాళులు’ అర్పిస్తూ ఉంటాను.

ఇక మా స్థలం నైరుతి నుంచి ఆగ్నేయం వేపు ఉండే గోడని ఆనుకుని ఒక పెద్ద నేరేడు చెట్టూ, మా డాబా  మీదకి అందేలా పళ్ళు కాచే సీతా ఫలం చెట్టూ ఉండేవి. నాకు తెలియదు కానీ మా పెద్దన్నయ్య, ముఖ్యంగా చిన్నన్నయ్య కోపం వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా ఆ నేరేడు చెట్టు పై దాకా ఎక్కేసి దూకేస్తానని బెదిరించే వాడుట. పాపం మా బామ్మ గారు, తాత గారు వెళ్లి రక రకాల “లంచాలు” ఇచ్చి అతన్ని క్రిందకి దింపే వారుట. అప్పటికి నాకు ఐదేళ్ళు కూడా లేక పోయినా మా బామ్మ గారు మా చిన్నన్నయ్యకి ఇచ్చే లంచం పేరు “బంగారం పులుసు”. “ఒరేయ్, ఇవాళ నీ కోసం బంగారం పుసులు చేశాను రా. ఇంకెవరికీ అది పెట్టను. క్రిందకి దిగిరారా” అని ఆవిడ చేసిన గుమ్మడి కాయ పులుసు కి పెట్టిన స్పెషల్ పేరు ఆ బంగారం పులుసు. మా బామ్మ గారు ఎప్పుడూ వంద కాసుల పేరు పెట్టుకునే ఉండే వారు.  అవైనా ఇప్పటి లాగా చిన్న సైజువి కాదు. పూర్వకాలపు పెద్ద సైజు కాసులే!

ఇక మిగిలిన స్థలంలో అన్ని రకాల కూరగాయలు, పాదులూ ఒక ఎత్తయితే బొడ్డు మల్లి తొ సహా డజన్ల కొద్దీ పెద్ద మల్లె పొదలు, ఇంచు మించు అన్ని రంగుల మందారాలు, కనకాంబరాలు, డిశంబర్ పువ్వులు, దర్జాగా ఉండే ఒక పారిజాతం చెట్టు (ఆ పారిజాతానికి ఎప్పుడూ గొంగళీ పురుగులు అంటిపెట్టుకుని ఉండేవి) , ఐదారు నంది వర్ధనాలు, మొగలి రేకుల పొదలు రెండు,  నైట్ క్వీన్లూ, మెట్ట తామరా, రెండు బాదం చెట్లూ, ఒక పెద్ద సపోటా, ఒక చిన్న సపోటా, డజను పైగా కొబ్బరి చెట్లూ, దబ్బ చెట్టూ, రెండు నారింజలూ, నిమ్మ చెట్లూ,  ఒక దానిమ్మా,  నీరు బాగా పారే పెద్ద నూతి దగ్గరా, స్నానాల గదుల దగ్గరా అరటి చెట్లూ, ఒక పెద్ద జామ చెట్టు, ఒక చిన్న చిన్న తీపి కాయలు కాచే జామ చెట్టూ యింకా ఎన్నెన్నో మొక్కలతో మా తోట ఒక “ఆర్గనైజ్డ్ అరణ్యం” లా ఉండేది.

విశేషం ఏమిటంటే మా స్థలానికి సరిగ్గా మధ్యలో రెండు చాలా పొడుగైన తాటి చెట్లు ఉండేవి. ఇవి సాధారణంగా పొలం గట్ల మీదే ఉంటాయి కానీ ఇళ్ళ స్థలాలలో ఉండవు. ప్రతీ రోజూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ తాటి చెట్ల మీద వాలి సేద దీర్చుకోడానికి  రెండు రాబందులు వచ్చి వాలేవి. మేము స్కూల్లో “జంతు శాస్త్రం” లో గెద్దలకీ, రాబందులకీ ఉండే తేడాలు చదువుకునే రోజుల్లో వాటిని చూస్తూ మేము చదివిన పుస్తకాలలో ఉండే ముక్కులలా వాటి ముక్కులు సూదిగా, వంకర గా ఉన్నాయా, లేవా అని చూసే వాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఒక సారి మా నాన్న  గారూ, మేమూ వరండాలో కూచుని ఆ రాబందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా చెల్లెలు హఠాత్తుగా “బాబయ్య గారూ, రాబందులు కూడా కాకి రెట్టలు వేస్తాయా?” అడిగింది అమాయకంగా. “లేదమ్మా, రాబందులు రాబందు రెట్టలు వేస్తాయి. కాకి రెట్టలు అవి వెయ్య లేవు” అని మా నాన్న గారు ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పారు.

అన్నట్టు, మా వీధి గుమ్మం పక్కనే ఉన్న బొగడ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను. మా చిన్న బొగడ పువ్వులూ, పళ్ళు కాసేది. మా చిన్నప్పుడు ఒక సారి ఏమయిందంటే, ఓ రోజు చీకటి పడ్డాక, ఎవరికీ కనపడకుండా నేనూ, ఇంకో ఇద్దరు, ముగ్గురు స్నేహితులూ కలిసి ఆ బొగడ చెట్టు పై దాకా ..అంటే కనీసం యాభై అడుగులు ఎక్కేసి, పండిన బొగడ పళ్ళు కోసేసుకుని బొక్కుతూ ఉంటే, మా నాన్న గారో, మా దొడ్డమ్మో , మరెవరో “ఎవరా అక్కడా?” అని అరిచారు. నేను హడిలి చచ్చి పోయి ధబీమని కిందకి దూకేయ్యగానే,  మిగిలిన వెధవలు కూడా హర్రీ, బుర్రీగా గా దూకేసి, ఇంకెక్కడా చోటులేనట్టు నా మీదే పడ్డారు. ఇంకే ముంది మొత్తం “బొగడ పళ్ళ దొంగలం” అందరం దొరికిపోయాం. “వెధవల్లారా, ఏవో కాస్తో కూస్తో కోసుకుని తినాలి కానే వందల కొద్దీ బొగడ పళ్ళు తింటే కడుపు నొప్పి తో చస్తారు, మమ్మల్ని చంపుతారు” అని మా పెద్దలు చీవాట్లు వేసి, ఏవేవో ద్రవ్యాలు కలిపి తాగించి, మమ్మల్ని బతికించారు.

ఇక మా ఇంటికి ఆగ్నేయం మూల వంటింటికి వెనకాల మరొక మామిడి చెట్టు కూడా ఏకాకి గా ఉండేది. ఈ చెట్టు మా వెనకాల వీధిని ఆనుకుని వేపు ఉండడంతో, అది కాయలు కాసే వేసవి కాలంలో ఆ వీధిలో కుర్ర కుంకలు రాళ్ళు విసిరి మామిడి కాయలు రాల గొట్టి, గోడ దూకేవారు. ప్రతీ ఏడూ ఎన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాళ్లు యింకా రెచ్చి పోయేవారు. ఒక ఏడు అలా ఒక రాయి మా అమ్మకి తగలబోయింది. అసలే కోపిష్టి మనస్తత్వం ఉన్న మా చిన్నన్నయ్య కి ఆవేశం కట్టలు తెంచుకుని వెనకాల గోడ దూకి దొరికిన ఒక కుర్రాణ్ణి నాలుగు వాయించి  వాడి అమ్మకి అన్వయించదగ్గ తిట్లు కూడా తిట్టాడు. దాంతో ఆ వీధిలో వాళ్ళంతా ఏకమై పోయి మా ఇంటి వీధి గుమ్మం వేపు వచ్చి నానా గొడవా చేశారు. పోలీసులని పిలిచే దాకా వచ్చింది ఆ తగాదా. అప్పుడు బాగా తన్నులు తిన్నది ఆ ఇంటి పని వాడు సూన్నారాయణే పాపం!

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

సుమారు నలభై ఏళ్ళు మా తోట అంతటినీ మానాన్న గారితో సమానంగా ఎంతో ఆప్యాయంగా చూసుకుని, రోజు నీళ్ళు పెట్టి, ఎరువులు వేసి అన్ని విధాలుగానూ మా కుటుంబానికి అన్ని విధాలుగానూ సేవ చేసిన ఆ సూన్నారాయణ ఎనభై ఏళ్ళు దాటినా రెండు నెలల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకోడానికి ముచ్చట పడ్డాడు కానీ పాపం ఒక కన్ను కనపడకా, నేను తీవ్రంగా వారించబట్టీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అతణ్ణి తీసుకుని మిత్రుడు చంద్రశేఖర్ నిర్వహించే సంకురాత్రి ఫౌండేషన్ లో కంటికి ఆపరేషన్ చేయించాను. అంతకు ముందే మొదటి కంటికి మా సుబ్బన్నయ్య (డా. సుబ్రహ్మణ్యం) దగ్గరుండి ఆపరేషన్ చేయించాడు.  ఆ సూన్నారాయణ తో తాజాగా మా “ఇలవేల్పు”  మామిడి చెట్టు నీడలో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

మా నాన్న గారికి కూరగాయలు పండించడం చాలా ఇష్టం.  ఖాళీ స్థలం ఉన్న వారందరూ వేసుకునే వంగా, బెండ, బీర, గుమ్మడి, ఆనప, పొట్ల మొదలైనవే కాక కాలీ ఫ్లవర్, కేబేజీ లాంటి వి కూడా వేసే వారు. మొక్క జొన్న మొక్కలని మా వీధి గుమ్మం నుంచి ఇంటి దాకా..అంటే సుమారు వంద గజాలు దారికి రెండు వేపులా వేసి పొలంలోనో, బొటానికల్ గార్డెన్ లో నడుతున్న భావన ఇంటికొచ్చిన వాళ్లకి కలిగేలా  చేసే వారు. పైగా మా నాన్న గారికి గార్డెనింగ్ తో బాటు తేనెటీగలని పెంచి తేనె తయారు చెయ్యడం మంచి హాబీగా ఉండేది.  సామర్ల కోట లో ఉన్న అగ్రికల్చరల్ ఫారం నుంచి తేనెటీగలు పెరిగే బీ-హైవ్ తెప్పించుకుని, అందులో “రాణీ తేనెటీగ” ని పెట్టగానీ వందల కొద్దీ ఉన్న ఆ తేనెటీగల కుటుంబం అందులో బస చేసేది. మాకున్న తోటలో అన్ని రకాల పువ్వులూ ఉండేవి కాబట్టి ఆ తేనెటీగలకి పుప్పొడి కోసం వేరే తోటల్లోకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఆశ్చర్యం ఏమిటంటేమ మా కుర్ర వెధవలం అక్కడే ఆడుకుంటున్నా విశ్వాసం గల ఆ తేనెటీగలు  మాలో ఎవరినీ ఎప్పుడూ కుట్టిన జ్జాపకం లేదు నాకు. మానాన్న గారు మా తోట మధ్యలో నుంచుని మా సూన్నారయణకి ఆదేశాలిస్తున్న ఒక అపురూపమైన ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య ఇది రహస్యంగా తీశాడు. ఈ ఫోటో తీస్తున్నట్టు అప్పుడు ఆయనకీ తెలియదు. తెలిసాక “వెధవల్లారా, నేను చొక్కా వేసుకోకుండా, కనీసం బనీను అయినా వేసుకోకుండా ఉన్న ఫోటో తీస్తారా, బుద్ది లేదూ” అని మమ్మల్ని చెడా, మడా తిట్టారు. ఆయన పోయి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఆ ఫోటో పబ్లిక్ గా బయట పెడుతున్నాను.  మా తోటలో అన్ని రకాల మొక్కలు వెయ్యడానికీ, వాటిని మా కుర్ర కుంకలం తొక్కేసి తగలెయ్యకుండా ఆడ సింహం లా కాపలా కాసేది మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. మాతో సహా ఆవిడని అందరూ దొడ్డమ్మ అని పిలిచే వారు. ఆవిడకి పెళ్లి అయినా, పిల్లలు లేరు. భర్త తో సత్సంబంధాలు లేక నాకు తెలిసీ యాభై ఏళ్ళు ఆవిడ మా ఇంట్లోనే ఉండి, అక్కడే పోయారు. మంచి సంస్కృత పండితురాలు.  మొక్కల విషయంలో ఆవిడ అంటే మాకు సింహ స్వప్నమే!

హ్యూస్టన్ లో చంద్రకాంతం

హ్యూస్టన్ లో చంద్రకాంతం

ఒక విశేషం ఏమిటంటే అన్ని కూరగాయలలోనూ కాలీ ఫ్లవర్ పువ్వు పూయగానే  మొత్తం తోట అంతా  ఘాటుగా వాసన వేసేది. అదేమిటో తెలియదు కానీ నేను అమెరికాలో మా ఇంటి వెనకాల వేసినప్పుడు చూడడానికి షోకే కానీ కాలీ ఫ్లవరే కాదు, అస్సలు ఏ పువ్వుకీ ఎటువంటి వాసనా ఉండదు. కానీ ఎటువంటి సువాసనా లేకున్నా చాలా అందంగా ఉండే పువ్వు చంద్రకాంతం పువ్వు. పదేళ్ళ క్రితం నేను కాకినాడ  వెళ్ళినప్పుడు మా తోటలో మా చిన్నప్పటి నుంఛీ ఇప్పటి దాకా ఉన్నవి మా మామిడి చెట్టు, బొగడ చెట్టు, చంద్రకాంతం మొక్కలు మాత్రమే.  మా మామిడి చెట్టునీ, బొగడ చెట్టునీ అమెరికా తెచ్చుకోలేను కాబట్టి, ఆ చంద్రకాంతం విత్తనాలని ఆప్యాయంగా కోసుకుని హ్యూస్టన్ లో మా తోటలో వేసుకున్నాను.. ఆ మొక్కలు ఇప్పటికీ ప్రతీ ఏడూ ఎన్నెన్నో పూస్తున్నాయి. ఎప్పుడైనా మా చిన్నతనం గుర్తుకి వస్తే మా తోటలోకి వెళ్లి ఆ చంద్రకాంతాలని పలకరిస్తూ ఉంటాను.  హ్యూస్టన్ లో మా తోటలో ఉన్న ఆ చంద్రకాంతాల ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. వాటి పూర్వీకులు నాలాగే కాకినాడ వారు. ఇప్పుడు మా నాన్న గారి గార్డెనింగ్ వారసత్వాన్ని,  నా పై వాడైన మా సుబ్బన్నయ్య పుణికి పుచ్చుకున్నాడు. అతను ఇటు కాకినాడలోనూ, అటు మా పొలంలోనూ అన్ని రకాల పూల మొక్కలు వేసి, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలే మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు (లాస్ ఏంజెలెస్ నివాసి) మా మామిడి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి, మా స్థలాన్ని నందన వనం లా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

..మా చిన్నప్పుడు నేను నిజంగానే “తోటలో నా రాజు” ని.. ఒకటేమిటి, మా తోటలో లేని పూల మొక్కలు కాని, పళ్ళ చెట్లు కాని, కూరగాయలు కానీ లేవన్నా, ఆ సకల సంపదల మధ్యా నా చిన్నతనం గడిచింది సుమా అని నాకు ఇప్పటికీ నమ్మ బుద్ది కావడం లేదు. ప్రపంచంలో అందరికీ ఇలాంటి “బాల్య సంపద” ఉంటుంది. దాన్ని నెమరు వేసుకునే యోగం కొందరికే ఉంటుంది ఆ రోజుల్లో అది గుర్తించే బుద్ది నాకు అప్పుడు లేకపోయినా, ఇప్పుడు గుర్తు చేసుకుని అక్షరబద్ధం చేసుకునే అదృష్టం నాకు కలిగింది.

chitten rajuవంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  8

Fountain(1)

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ మహానుభావుణ్ణి ఎంత మర్చిపోయామో గుర్తు చేసుకోడానికే ఇప్పుడు ఈ విగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిదైనా సరే విగ్రహం పెట్టించడం నాయకత్వ లక్షణం గా పరిగణించబడుతోంది కదా! ఇది ఖచ్చితంగా నా అప్రస్తుత ప్రసంగమే కానీ  ఆఖరికి మా హ్యూస్టన్ లో కూడా కొందరు గాంధీ గారి విగ్రహం పెట్టించి “స్వయం ప్రకటిత సంఘ నాయకులు” గా పేరు తెచ్చుకున్నారు.

కానీ మా కాకినాడలో మా ఇంటికి వంద గజాలు అటూ, ఇటూ కూడా ఉన్న గాంధీ గారి విగ్రహాలు ప్రతిష్టాపించడానికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. కాకినాడలో 1923 లో 38వ కాంగ్రెస్ మహా సభలు ముగిశాక సుమారు మూడు ఎకరాల ఆ ప్రధాన వేదిక ప్రాంగణాన్ని అత్యంత సుందరమైన పార్కుగా తీర్చి దిద్దారు. ఆ మహా సభలలో మహాత్మా గాంధీ పాల్గొన్న కారణంగా అక్కడికి వంద గజాల దూరంలో కాకినాడలో ఉన్న ఏకైక “ఐదు రోడ్ల కూడలి” లో గాంధీ గారి విగ్రహం పెట్టారు. మా పేట పేరు కూడా గాంధీ నగరం గా మార్చారు. చుట్టుపక్కల పేటలు రామారావు పేట, సూర్యారావు పేట, ఎల్విన్ పేట మొదలైనవి.  ఇవన్నీ కళా, సాంస్కృతిక రంగాలకి పట్టుగొమ్మలు. అసలు కాకినాడ అంటేనే భాష, సాహిత్యం, సంగీతం, కళ, నృత్యం, విద్యాలయాలు, ఒకే వీధిలో అన్ని సినిమా హాళ్లు వగైరాలతో ఒక తెలుగు సాంస్కృతిక నగరం అనే ఇప్పటికీ పేరు.  మా చిన్నప్పుడు మా పేటలో నివసిస్తున్న సాధారణులైనా అత్యంత అసాధారణ సహృదయులు చాలా మంది నాకు యింకా బాగా జ్జాపకం ఉన్నా,  ఎంతో గొప్పవారైన హేమా హేమీల గురించి ఏదో యాదాలాపంగానే తప్ప ఎక్కువగా తెలియదు.  అంతటి మహానుభావులకి సన్నిహితంగా ఉన్నా, ఆ అమూల్యమైన అవకాశాలని అప్పుడు గుర్తించ లేక పోవడం ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్త్తుంది.

మా ఇల్లు సరిగ్గా పార్కుకీ, గాంధీ బొమ్మకీ మధ్యలో ఉంటుంది. మా చిన్నప్పుడు ఆ పార్కుకి సరిగ్గా మధ్యలో బంగారం చేపలు ఆనందంగా, హడావుడిగా ఈదుతూ ఉండే  ఒక అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ (దీనికి తెలుగు మాట నాకు గుర్తుకు రావడం లేదు…నీళ్ళు చిమ్మే యంత్రం?????), దానికి అనుబంధంగా పార్కు నాలుగు మూలలా చిన్న ఫౌంటెన్లూ ఉండేవి. రామారావు పేటలో ఉండి, మా చుట్టు పక్కల కొన్ని వేల ఇళ్ళకి నీటి సదుపాయం చేసే “కుళాయి చెరువు” నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం సూచిస్తూ ఫేక్టరీ సైరన్ మోగేది.  వెనువెంటనే వందలాది ఆ పార్కుకి చేరుకునే వారు. ఎందుకంటే, ఆ వాటర్ ఫౌంటెన్ మధ్యలో 50 అడుగుల “ఏక స్తంభం”  మీద నాలుగు స్పీకర్లతో ప్రతీ రోజూ మ్యునిసిపాలిటీ వారు నిర్ణీత సమయాలలో రేడియో కార్యక్రమాలు ప్రసారం చేసే వారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే రేడియోలు ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు 1960 ప్రాంతాలలో వచ్చినా, టీవీ అనే మాటే డిక్షనరీ లో లేదు.   ఆ రేడియో ప్రసారాలలో ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకి “ఆకాశ వాణి, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథ రావ్ “ అనే ఖంగు మనే గొంతు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చే వారు. గంభీరమైన ఆ గొంతు, చదివే విధానం తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆఫ్ కోర్స్ , ఈ రోజుల్లోనూ టీవీలో వార్తలు చూస్తుంటే ఇతర కారణాలకి ఒళ్ళు “గిగుర్పొడుస్తుంది”…అంటే చికాకుతో ఒళ్ళు  “గోకేసుకునే” భావన కలుగుతుంది.  అయ్యో అని జాలి కూడా వేస్తుంది ! ఉదాహరణకి ఇటీవల మాలతీ చందూర్ గారు పోయినప్పుడు వార్తలు “చదువుతున్న” ఒక ఏంకరమ్మాయి “మాలతీ చందూర్ గారి ‘ప్రమాద వనం’  చాలా పాప్యులర్ అని ప్రవచించింది. “ప్రమదా వనం” కి వచ్చిన ప్రమాదం అది!

నమ్మండి, నమ్మక పొండి. 1957 లో రష్యా వాళ్ళు మొట్టమొదటి స్పుట్నిక్ ఉపగ్ర్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన వార్త రేడియోలో పన్యాల రంగనాథ రావ్ గారు చదవగా విని కొంత అర్ధం అయీ, కొంత అర్ధం అవకా గంగవెర్రులెత్తిపోయి ఈ స్పుట్నిక్ ఎక్కడ కనపడుతుందా, ఎంత జోరుగా ఆకాశంలో ఇటునుంచి ఘుం ఘుం అను దూసుకు పోతుందా అని ఆ రాత్రి అంతా మా డాబా మీద కళ్ళలో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాను. ఆ రోజుల్లో ఆకాశంలో రాత్రి పూట అరుదుగా వెలుగుతూ, ఆరిపోతూ కనపడే విమానం లైటు చూసి, అదే రష్యా వారి స్పుట్నిక్ అనుకుని ఎగిరి గంతులు వేసాను. కేవలం రేడియో వార్తలు విని తలక్రిందులు అయిపోయిన ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను.

కేవలం వార్తలే కాకుండా ప్రయాగ నరసింహ శాస్త్రి గారి బుర్ర కథలు, “ఏమండోయ్ బావ గారూ” అనే రాజకీయ విశ్లేషణ కార్యక్రమం, సీత-అనసూయ జానపద గేయాలు ఒకటేమిటి అనేక జీవిత కాలాలకి సరిపడా అద్భుతమైన రేడియో కార్యక్రమాలు వినే అదృష్టం నాకు కలిగింది.  నా  బాగా చిన్నప్పుడు..అంటే ఆటస్థలం కావాల్సిన క్రికెట్, ఫుట్ బాల్  వగైరాలు ఆడుకునే వయస్సుకి ఎదగని వయస్సులో ఆ పార్కులో ఆడుకోవడమే మా జీవిత ధ్యేయం. అక్కడ సిమెంటు జారుడు బల్ల మీద పోటీ లు పడి జారి, నెలకి అర డజను చెడ్డీలకి చిరుగులు పెట్టుకుని మా ఇంట్లో తిట్లు తినే వాడిని.  ఇప్పుడు ఎక్కడా చెడ్డీ చించుకుని ఆనందించే ఆటలే లేవు!  ఇటీవల నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా మా పార్కుకి వెళ్లి, అదే జారుడు బల్ల మీద చెడ్డీ చిరక్కుండా ఒక్క సారే పై నుంచి కిందకి జారి, ఆనందించి వచ్చేశాను. ఆ రోజు అక్కడ నేనొక్కణ్ణే కుర్రాణ్ణి. మిగిలిన పిల్లలు బహుశా ఇళ్ళలో కంప్యూటర్లలో తుపాకీ ఆటలు ఆడుకుంటున్నారు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆ వాటర్  ఫౌంటెన్, రేడియో స్తంభం తీసి పారేసి యాభై అడుగుల గాంధీ గారి విగ్రహం పెట్టారు. ఇందుతో ఆనాటి ఫౌంటెనూ, ఈ నాటి గాంధీ గారి విగ్రహం ఫోటో జతపరుస్తున్నాను. ఆ పార్కులో ఇప్పటికీ ఉన్న కొన్ని వందల మొక్కలూ చెట్లలోకీ నాకు బాగా నచ్చేదీ, ప్రపంచంలో ఇంకెక్కడా నేను చూడనిదీ బాడ్మింటన్ బంతి చెట్టు. ఇది పార్క్ లో ఒక మూల (ఇప్పుటికీ స్టేట్ బేంక్ కి ఎదురుగుండా ఉంటుంది) వంద అడుగుల ఎత్తున ఉండి అచ్చు పసుపు రంగులో ఉండే బాడ్మింటన్ బంతి సైజు లో పువ్వులు పూస్తుంది. అవి ముట్టుకుంటే ఆ బంతి లాగే చాలా సున్నితంగా పట్టు తివాసీ నిమిరినట్టుగా ఉంటుంది.

554_Voleti  Parvateesam

ముందుగా నాకు జ్జాపకం ఉన్న కొందరి గురించి చెప్పుకోవాలంటే … మా చిన్నపుడు మా ఇంటికి వీధి వేపు కాక. మిగిలిన మూడు పక్కల ఇళ్ళకీ మాకూ మధ్య గోడలు ఉండేవి కాదు.   ఒక పక్కన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి ఇల్లు. ఆయన పెద్ద కొడుకు అచ్యుత రామ చంద్రమూర్తి గారి భార్య భాస్కరం పిన్నీ , మా అమ్మా ఒకే సారి కాపరానికి వచ్చారు. దాన్ని “కీర్తి” వారి ఇల్లు అనే వాళ్ళం. వారి కుటుంబమూ, మేమూ ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. మా మామిడి చెట్టు మీద వాళ్ళ పిల్లలూ (లేట్ నారాయణ, పార్వతీశం, లేట్ భాస్కరరావు ఎట్సేటారా), వాళ్ల నూతి దగ్గర జామచెట్టు మీద మేమూ ఎక్కి ఘంటసాల  పుష్ప విలాపం పాడుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటే “వెధవల్లారా, నూతిలో పడి మమ్మల్ని చపకండి రా” అని మా నలుగురు పక్కింటి వాళ్ళూ అరుస్తూ మమ్మల్ని తిడుతూ ఉంటే “వాళ్ల కోరిక ప్రకారం వాళ్ళని చంపకుండా”, “మేము చావకుండా”  మా చిన్నతనం హాయిగా గడిపాం. విశేషం ఏమిటంటే ఆనాటి  ఓలేటి పార్వతీశం అనే గొప్ప కవి గారి గురించి నాకు అప్పుడు తెలియదు కానీ మా ఇంటి ఎదురుగుండా గిడ్డీ గారి సందులో ఉండే ఆయన రెండో కొడుకు శశాంక చాలా మంచి కవి అని ఖచ్చితంగా తెలుసును. ఎప్పుడూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వేషధారణలో ఉండే ఆయనా, ఆయన భార్యా (కందుకూరి వారి ఆడబడుచు. పన్యాల వారి తరువాత న్యూస్ రీడర్ గా మంచి  పేరు తెచ్చుకున్న కందుకూరి సూర్యనారాయణ గారి సహోదరి. ఆవిడ తమ్ముడు నటరాజ్ నాకు బొంబాయి లో సహాధ్యాయి) చాలా అందమైన జంట. వారి కొడుకే ఈ నాడు హైదరాబాద్ లో దూర్ దర్శన్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్న ఓలేటి పార్వతీశం. (ఈయనని రెండేళ్ళ క్రితం మొదటి సారిగా విజయనగరం లో చాసో గారి స్పూర్తి సభలో కలిశాను.) భావ కవిగా ఎంతో పైకి వస్తున్న రోజులలో చిన్న వయసులో హఠాత్తుగా శశాంక పోయిన రోజులు నాకు యింకా బాగా గుర్తు. ఇక పార్కుకి ఒక మూలగా అప్పటి జిల్లా పరిషత్ సెక్రటరీ పుల్లెల రమణయ్య గారు (ఆయన సతీమణి అద్వితీయమైన సంగీత విద్వాంసురాలు.) ఉండేవారు.

Gandhi_Nagar_Park,Kakinada(1)

ఇక మా ఇంటి వెనకాల మా బంధువులైన తాళ్లూరి సుబ్బారావు గారు , అతని బామ్మ గారు, మా నారాయణ తాతయ్య గారు (మా బామ్మ గారి తమ్ముడు), మరొక పక్క రాచకొండ వారు, గిడ్డీ గారి సందులో టేకుమళ్ళ దుర్గా ప్రసాదరావు గారు (షావుకారు జానకి, కృష్ణకుమారికి పిన తండ్రి వరస అని గుర్తు), అప్పలాచార్య గారు, ఎదురు గుండా ఇంట్లో విఠాల సుబ్రమణ్యం గారు, పక్కనే చీమలకొండ వారు ఉండే వారు. ఆ రోజుల్లో మా వీధి కల్లా పెద్ద జోకు విఠాల సుబ్రమణ్యం గారు రాత్రి భోజనం అయ్యాక తేన్చే  తేనుపు తాలూకు శబ్దానికి అక్కడికి వంద గజాల దూరంలో పార్కులో మధ్యలో ఉన్న వాటర్ ఫౌంటెన్ లో బంగారం చేపలు ఉలిక్కిపడి ఈదడం మానేసి బయటకి గెంతేస్తాయిట! ఇక కాస్త దూరం వెడితే, పార్కుకి ఒక పక్క సినీ నటి జమున భర్త రమణారావు కుటుంబం ఉండే వారు. జమున తమ్ముడు గిరిధర్ , అతని పిల్లలు మాకు ఆత్మీయులే.  పార్కుకి వెనకాల వేపు నేను చదువుకున్న ప్రాధమిక పాఠశాల అనే “దుంపల బడి”, పురపాలకోన్నత పాఠశాల, అటుపక్క ఒంటి మామిడి జంక్షన్ దగ్గర ఈ నాటి వైఎస్సార్ పార్టీ నాయకుడు , సినీ నటుడు విజయ చందర్ కుటుంబం ఉండేది. అతను ఎప్పుడూ మా ఇంటికి వచ్చి, మా చెల్లెళ్ళని పార్కుకి తీసుకెళ్ళే వాడు, ఆడించడానికీ, రేడియో వినడానికీ. ఇక  ఆ ప్రాంతాలలోనే  అలనాటి స్వాతంత్య సమరయోధులు, పార్లమెంట్ మెంబర్ మరియు గవర్నర్ గా చేసిన మొసలికంటి తిరుమల రావు గారు ఉండేవారు. ఆ వీధిలో శంకరం గారు, టీకాల ఇన్ స్పెక్టర్ గారు (ఏడిద వారు), కరణం వారూ, దిగుమర్తి గోపాల స్వామి గారూ మొదలైన వారు ఉండే వారు. ఇందులో శంకరం గారు “సకల విద్యా పారంగతులు” ..అనగా ఆయనే మా హోమియోపతీ వైద్యులు, ఇన్సూరెన్స్ ఏజెంటు, మా వార్డు కి మ్యునిసిపాల్ కౌన్సిలరు, జైలు కెళ్ళిన గాంధేయ వాది….నిరంతరం తెల్ల ఖద్దరు వస్త్రదారి. ఇక సుప్రసిద్ద రాజకీయ నాయకులూ, మా కుటుంబానికి బాగా సన్నిహితులూ, కపిలేశ్వరపురం జమీందారులు, అయిన స్వర్గీయులు ఎస్.పి.బీ.కె. సత్యనారాయణ రావు గారు (కేంద్ర మంత్రి), ఎస్. పి. బి. కె. పట్టాభి రామారావు గారు (రాష్ట్ర మంత్రి) వారి నివాసం సరిగ్గా మా ఇంటికి ఎదురుగానే.  అందులో పట్టాభి రామారావు గారి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికలకి మా చిన్నన్నయ్య ఎలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరించి నప్పుడు ఆయన నెగ్గగానే, మా అన్నయ్యని హెలికాప్టర్ లో  తిరుపతి తీసుకెళ్ళి ఎంతో గౌరవం చేశారు. మా నాన్న గారికి ఎంతో సన్నిహితులైన సత్యనారాయణ రావు గారు నా పెళ్లి విందుకి వచ్చి నన్నూ, మా ఆవిడనీ ఆశీర్వదించారు.  ఆ ఇద్దరు జమీందారులూ, మా నాన్న గారూ, మా చిన్నన్నయ్యా కూడా స్వర్గస్తులే అయినా కులాలకతీతంగా ఉన్న ఉన్న ఆ అనుబంధాల గురించి నాకు ఉన్న కొన్ని జ్జాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అలాగే అప్పటి ఎమ్మెల్యే ఎం.వీ. శాస్త్రి గారి కుటుంబం మాకు ఎంతో ఆప్తులు. వీళ్ళలో నేను చెప్పనిది కాకినాడలో మొట్టమొదటి సినిమా హాళ్ళు (పేలస్ టాకీస్, క్రౌన్ టాకీస్) కట్టిన గొలగాబత్తుల రాఘవుల గారి రెండో కొడుకు, మాకు అత్యంత సన్నిహితుడూ అయిన స్వామి నాయుడి గురించి. అతని గురించి ఎప్ప్పుడో చెప్పితీరతాను.  అసలు మా చిన్నప్పడు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..ఇప్పుడు అక్కడ కాకినాడ లోనూ, ఇక్కడ హ్యూస్టన్ లోనూ మా నైబర్స్ ఎవరో నాకు చూచాయగానే  తెలుసును. ఇప్పుడు ఇక్కడా కూడా అన్ని ఇళ్ళలోనూ ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటాయి. అంతా గూఢుపుఠాణీయే. ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చిప్!

ఇక అవకాశాలు ఉన్నా, అదృష్టానికి నోచుకోక నేను ఎప్పుడూ చూడని దేవులపల్లి కృష్ణశాస్త్రి, నటి సూర్యాకాంతం, పాలగుమ్మి పద్మరాజు, దుర్గాబాయమ్మ గారు, నేను చూసిన వారూ,  పెద్దయ్యాక బాగా పరిచయం ఉన్నవారిలో కొందరైన ఈమని శంకర శాస్త్రి , చిట్టి బాబు, పాలగుమ్మి విశ్వనాథం, బులుసు వేంకటేశ్వర్లు సోదరులు, హాస్య నటుడు నల్ల రామ్మూర్తి, ఎస్. వి. రంగారావు, మొదలైన లబ్ధ ప్రతిష్టులు మా ప్రాంతాలలోనే ఉండే వారు.  అన్నట్టు నటి సూర్యాకాంతానికీ, మా కుటుంబానికీ ఉన్న పెద్ద కనెక్షన్ ఆడారివాడిలా నడిచే తమ్మయ్య లింగం అనే టైలర్. తాను ఎప్పుడు తమ్మయ్య లింగం చేత గౌను కుట్టించుకున్నా  “సరిగ్గా కుట్టాడా, చూసి చెప్పండి” అని రింగు, రింగులుగా తిరుగుతూ సూర్యాకాంతం మా ఇంటికి వచ్చి మా అమ్మని సలహా అడిగేదిట!

ఇక బులుసు సోదరులు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పండితులు. కానీ వారి వేషదారణని బట్టి  వారిద్దరినీ “దలైలామా- పంచెన్ లామా” అనీ, “పెద్ద బులుసూ-చిన్న బులుసూ” అని కుర్రాళ్ళు పిలిచేవారు.  అందులో పెద్ద  బులుసు గారు రామారావు పేటలో మా సెకండరీ స్కూల్ కి, ఈశ్వర పుస్తక భాండాగారానికీ ఎదురుగుండానూ మేడలో ఉండే వారు. తన “వ్యాస పీఠం” మీద ఆయన నేల మీద కూచుని చదువుకుంటూనో, వ్రాసుకుంటూనో ఉండే ఆయన్ని ప్రతీ రోజూ చూసే వాడిని కానీ తొలికేంద్ర సాహిత్య గ్రహీతలలో ఒకరు అయిన ఆయన గురించి నా చిన్నప్పుడు నాకు తెలిస్తే ప్రతీ రోజూ ఆయనకీ శిరస్సు వంచి పాదాభివందనం చేసే వాణ్ణి.  ఇక ఆ వీధిలో మరొక నాలుగు అడుగులు వేస్తే , వీణ చిట్టి బాబు-ఈమని-పాలగుమ్మి వారి ఇళ్ళు. రోజూ అలాగే వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ ఆగి  నమస్కారం పెట్టుకునే “బుద్ది” నాకు ఆ చిన్నతనంలో లేదు.  అయితే నేను “పెద్దయ్యాక” వీణ చిట్టి బాబు గారు ఇండియాలోనూ,  అమెరికా వచ్చినప్పుడూ బాగా పరిచయం అయ్యారు.

వీరందరిలో ఇప్పటికీ తలచుకుంటే నాకు “భయం” వేసేది మహా నటుడు ఎస్వీ రంగారావే. ఆయన్ని చూసింది కూడా అరగంటే! ఆయన మా ఇంటి దగ్గరే ఉండే కోకా నరసింహా రావు గారు అనే ఎముకల డాక్టర్ గారికి బంధువు. ఒక సారి రంగారావు గారు వారింటికి వచ్చినప్పుడు కాకినాడ దగ్గర చింతపల్లి అడవులలో వేటకి వెళ్లి, ఒక పెద్ద పులిని చంపి, పెద్ద లారీలో దాన్ని తీసుకొచ్చి మా గాంధీ బొమ్మ దగ్గర ప్రదర్సనకి పెట్టి ఆర్భాటం చేసారు. అది చూడడానికి నేను వెళ్లినప్పుడు రంగారావు గారు పెద్ద తుపాకీతో ఆ పులి తలదగ్గర నుంచుని ఫోటో తీయించుకుంటున్నారు. చుట్టూ ముగిన జనం మోకాళ్ళ మధ్య లోంచి ముందుకు వెళ్లి ఆయన్నీ, తుపాకీనీ, చచ్చిపడున్న ఆ పది అడుగుల పెద్ద పులినీ చూసి  హడిలి చచ్చిపోయాను. ఇప్పటికీ ఆ సీను తలచుకుంటే ..వావ్! ఇదంతా “పాతాళ భైరవి” సినిమా తరువాత అని వేరే చెప్పక్కర లేదు.

_2008_Bulusu_Sambamurty

ఆఖరి అంశంగా … నాకు పదమూడు ఏళ్ల వయస్సులో .. ఒక రోజు కాకినాడ నగరం అంతా “విషాదం” లో ములిగి పోయింది. ఆ రోజు “మహర్షి” బులుసు సాంబమూర్తి గారు కేవలం 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో, ఏకాకిగా, దరిద్ర నారాయణుడిగా “జీవించ” లేక మరణించారు. ఆ రోజు “ఎవరో పెద్దాయన పోయారు” అని మా స్కూల్ కి శలవు ఇవ్వగానే క్రికెట్ ఆడుకోడానికి వెళ్ళిపోయిన “చిన్నతనానికి” ఇప్పటికీ నాకు ఇప్పటికీ సిగ్గేస్తుంది. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం గారి తో సమాన స్థాయిలో క్రిమినల్ లాయర్ గా ఆ రోజుల్లోనే లక్షాధికారి అయిన సాంబమూర్తి గారు అన్నీ త్యాగం చేసి , గాంధీ గారి కంటే ముందే కొల్లాయి కట్టిన దేశభక్తులు.  1923 లో కాకినాడ లో కాంగ్రెస్ సభలు జరగడానికి ప్రధాన కారకులు, నిర్వాహకులు ఆయనే. నేను చిన్నప్పుడు విన్న విషయం ఏమిటంటే ఆయన ఆ కాంగ్రెస్ సభలో ప్రసంగం మొదలు పెట్టగానే ఎవరో ఒక చిన్న చీటీ ఆయన చేతిలో పెట్టారుట. అది చదివి, మడిచి జేబులో పెట్టుకుని సాంబమూర్తి గారు తన ప్రసంగం పూర్తి చేసి సభాస్థలాన్ని విడిచి మర్నాడు తిరిగి వచ్చారుట. “మీ కొడుకు అరగంట క్రితం మరణించాడు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి” అన్నదే ఆ చీటీలో ఉన్న వాక్యం. ఒక కర్మయోగిగా “మహర్షి” అనే పేరుతో సాంబమూర్తి గారు అప్పటినుంచీ లబ్ధప్రతిష్టులయ్యారు.  ఆ తరువాత  ఆయన 1926 లో దేశం లో తొలి సారిగా “మనకి డొమినియన్ స్టేటస్ కాదు. “పూర్ణ స్వరాజ్యం” కావాలి అని ప్రతిపాదించిన మహానుభావుడు కూడా ఆయనే. మద్రాసులోని సాంబమూర్తి గారి గృహంలోనే మరొక మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకి ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం, స్వరాష్ట్రం కోసం ఆ ఇద్దరూ చేసిన త్యాగాలు ఈ నాడు “దౌర్భాగ్యుల” సంక్షేమం కోసమేనేమో అని నాకు అనిపిస్తోంది.

ఇందులో “నీతి” ఏమిటంటే చిన్నప్పుడు తెలియక నా చుట్టుపక్కల ఉన్న “అదృష్టాలని” గుర్తించలేక పొరపాట్లు చేసినా, “ఇప్పటికైనా మించిపోలేదు సుమా, అసలు జీవితం ఇపుడే కదా మొదలయ్యిందీ: అని నాకు నేనే  అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉంటాను….నా అదృష్టాలని వెతుక్కుంటూ…ఆనందపడుతూ!

…..వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

 

chitten rajuమా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు. అప్పటి నుంచి, ఇప్పటి దాకా ఆ స్థలం మా అధీనంలోనే ఉంది. కాకినాడ మొత్తం మీద సుమారు తొంభై సంవత్సరాలకి పైగా ఒకే కుటుంబం అధీనంలో ఉన్న అతి కొద్ది గృహాలలో మాది ఒకటి అని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.

మా తాత గారు ఆ స్థలం కొన్నాక అక్కడ ఒక పెద్ద మేడ కట్టుకోడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా  1923 లో 38 వ కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. ఆ మహా సభల ఆహ్వాన సంఘం కార్యదర్శి, స్వాతంత్ర్య సమార యోధుడు, మా తాత గారి తోటి లాయర్ అయిన మహర్షి బులుసు సాంబ మూర్తి (పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు లో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు.—పాపం.) గారి అభ్యర్ధన మీద మా ఇంటి స్థలం అంతా పెద్ద పందిళ్ళు వేసి ఆ కాంగ్రెస్ సభలకి భోజన శాలగా మార్చారు. అక్కడికి వంద గజాల దూరం లోనే ప్రధాన వేదిక. ఆ వేదిక మీద నుంచి మహాత్మా గాంధీ గారు డిశంబర్ 24, 1923 నాడు ప్రసంగించారు.  . ఆ మహా సభల తరవాత ఆ పేట  పేరు గాంధీ నగరం గా మార్చారు. ఇప్పటికీ అది గాంధీ నగరమే! ఆ కాంగ్రెస్ సభలలోనే  జవాహర్లాల్ నెహ్రూ అనే 35 సంవత్సరాల యువకుడు మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ ఆలీ పేరే ఇప్పటికీ మా రోడ్డు పేరు. మా రోడ్డు పేరు “వంగూరి వారి వీధి” అని మారుస్తామని మ్యునిసిపాలిటీ వారు కొన్ని సార్లు అడిగినా ఒక అలనాటి ముస్లిం నాయకుడి పేరు తీసేసి మా పేరు పెట్టడం సమంజసం అనిపించక మేమే వద్దన్నాం.  అతిశయోక్తి అయినా ఇప్పటి మా ఇంటి ప్రాంగణం అప్పటి భోజన ప్రాంగణం కాబట్టి గాంధీ గారు, నెహ్రూ గారు మా “ఇంటి” కి భోజనానికి వచ్చారు అని నేను చెప్పుకోవడం నాకు సరదా.

ఇక్కడ నేను విన్న ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఆ ప్రధాన ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సరి అయిన బేడ్జ్ పెట్టుకోవాలి. నెహ్రూ గారు అది మర్చి పోయి హడావుడి గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు 13 ఏళ్ల వాలంటీర్ గా ఉన్న దుర్గాబాయమ్మ గారు ఆయన్ని అడ్డగించి ఆయన ఎంత చెప్పినా, ఆఖరికి సాంబ మూర్తి గారు స్వయంగా వచ్చి చెప్పేదాకా లోపలికికి వెళ్ళనియ్యకుండా అడ్డుకున్నారట.  ఆ విధంగా వారిద్దరికీ పరిచయం అయి జీవిత కాలం నిలిచింది.

నెహ్రూ గారి మంత్రివర్గంలో దుర్గాబాయమ్మ గారి భర్త దేశ్ ముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా పని చేశారు. వారు జీవించినంత కాలం మా బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు (హై కోర్ట్ సీనియర్ అడ్వోకేట్)  ఎంతో ఆత్మీయులుగా ఉండి,  లీగల్ సలహా దారుగా వ్యవహరించే వారు. అన్నట్టు, మా అక్కా, బావ గారూ ఉండేది హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీ లోనే!

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

ఆ కాంగ్రెస్ మహా సభల హడావుడి అంతా అయ్యాక మా తాత గారు మేడ కట్టడం ఆలస్యం అవుతోంది అనుకుని 1925 లో స్థలానికి ఆగ్నేయం మూల ఐదు గదులతో తాత్కాలింగా ఒక ఔట్ హౌస్ కట్టి, గృహ ప్రవేశం చేసారు. అది ఏ ముహూర్తాన చేసారో కానీ ఆ ఇల్లే మూడు తరాలకీ సొంత ఇల్లు అయిపోయింది.  అంత పెద్ద స్థలంలో పెద్ద మేడ కట్టుకుందామనుకున్న మా తాత గారి ఆశ నెరవేర లేదు. ఆయన పోయిన ఏడాది తరువాత 1952 లో మా పెద్దన్నయ్య ఆ మేడ నమూనా ని అగ్గిపెట్టెలతో తయారు చేసి ప్రతీ బొమ్మల కొలువు లోనూ పెట్టేవాడు. ఆ మేడ నమూనా ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  నాకు పదిహేనేళ్ళు వచ్చే దాకా కూడా పకడ్బందీగా కొండ రాళ్లతో వేసిన  ఆ మేడ పునాదులు స్థలం మధ్యలో ఉండేవి. మా నాన్న గారు కూడా ఆ మేడ ఇక కట్టలేం అని నిర్ణయించుకుని ఆ పునాదులు తీసేయించి ,  మొత్తం 3600 గజాల స్థలాన్నీ పూల మొక్కలతో, చెట్లతో నందన వనంగా మార్చారు.

1925  లో మా తాత గారూ, బామ్మ గారూ గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజులలో ఒక విచిత్రం జరిగింది. ఒక మండు వేసవి నాటి మధ్యాహ్నం ఒక ముసలాయన లోపలి వచ్చి “అమ్మా, దాహంగా ఉంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి” అని అడిగాడు. మా బామ్మ గారు ఆయన్ని చూడగానే “అయ్యో పాపం ఈయన భోజం కూడా చెయ్య లేదేమో” అని అడిగి అరిటాకు వేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, కాస్సేపు విశ్రమించి లేచి వెళ్తూ తన చేతి సంచీ లోంచి ఒక్కటంటే ఒక్క మామిడి పండు తీసి “అమ్మా, ఈ పండు తిని, ఆ టెంక ఎక్కడైనా పాతండి. అది చెట్టుగా ఎదిగి, దాని పళ్ళు మీ మనవలు, ముని మనవలూ కూడా తింటారు” అని మనసారా ఆశీర్వదించి, ఆ మామిడ పండు ఆవిడ చేతిలో పెట్టి మాయమై పోయారు. అంటే మళ్ళీ ఎప్పుడూ కనపడ లేదు.

మా తాత గారు, బామ్మ గార్లలో ఆ పండు ఎవరు తిన్నారో లేక అప్పటికి చిన్న పిల్లలయిన మా నాన్న గారు, ముగ్గురు మేనత్తలలో ఎవరు ఆ పండు ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినేసి ఆ టెంక ఇంటి ముందు విసిరేసారో తెలియదు కానీ….అ బంగిన పల్లి మామిడి టెంక వేళ్ళూనుకుని, చెట్టుగా ఎదిగి ఇప్పటికీ గత 88 సంవత్సరాలగా అద్భుతమైన పళ్ళు కాస్తూ, వంద మంది పైగా ఉన్న మా బృహత్ కుటుంబం అస్తిత్వానికి నీడ పడుతూ వయోభారంతో కుంగినా గంభీరంగా, దర్జాగా, నిరంతరం కూసే మూడు తరాల కోయిల వంశానికి పట్టుగొమ్మగా నిలుస్తూ, ఇది వ్రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ మామిడి చెట్టు కిందే నా ఇరవై ఏళ్ల చిన్న తనం అంతా గడిచింది. నాదే ఏమిటి, మా అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉండి చదువుకున్న నాలుగు తరాల బంధువులు అందరికీ ఆ మామిడి చెట్టే ఆయువు పట్టు. కేరమ్స్, చెస్,  పేకాట ఏ ఆట, ఆడుకున్నా ఆ చెట్టు నీడనే. రాత్రి టీ తాగుతూ గుడి దీపాల వెలుగులో పరీక్షలకి చదువుకున్నా ఆ చెట్టు కిందే! అది చిన్న చిన్న పిందెలు వేసి ఆ మాత్రం బరువుకే కిందకి వాలగానే కుర్చీ పీట వేసుకుని పెన్నుతో ఆ పిందెల మీద మా పేర్లు రాసేసుకుని , అవి పెద్దయ్యే దాకా రోజూ, కొలుచుకుంటూ అంటే ఆరాధించడమే కాదు, ఎవరి పిందె ఎంత పెరిగిందీ అని సైజు కూడా కొలుచుకుంటూ, మొత్తం వేసవి శలవులకి మరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నా అదంతా  ఆ చెట్టు మహిమే! ఆ చెట్టు కొమ్మలోంచి తెల్లవారు ఘాము నుంచీ మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా వినపడే కోకిలారావానికి మేము తిరిగి “కోయ్, కుహూ” అని అరవ గానే ఆ కోకిల రెచ్చి పోయి యింకా గట్టిగా సమాధానంగా చెప్పడం, “ఏమిట్రా ఈ వెధవ కాకి గోల”  అని మా పెద్ద వాళ్ళు కోప్పడడం ఎంత హాయిగా ఉండేదో! ఆ చెట్టు కిందే నా మొట్ట మొదటి ఇంగ్లీషు నవల (పెర్రీ మేసన్) చదివాను. చేతికందిన ప్రతీ వార, దిన పత్రికలూ పెద్ద వాళ్ళు కోప్పడుతున్నా డిటెక్టివ్  నవలలూ అక్కడే చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సాహిత్యంలో సేద తీరింది ఆమామిడి చెట్టు నీడ లోనే!

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

సుమారు ముఫై ఏళ్ల క్రితం కాకినాడ లో వచ్చిన పెను తుఫానులో మా మామిడి చెట్టు మా ఇంటి మీద పడి కూల్చి పారెయ్యకుండా, నిట్ట నులువుగా గంభీరంగా ఉండేదల్లా, సొగసుగా మరొక పక్కకి వాలి మా మీద యింకా ఎంతో దయ, ప్రేమ కురిపిస్తూనే ఉంది. రెండు, మూడేళ్ళ కొకసారి కాయలు కాస్తూనే ఉంది. నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా ఆ మూడో తరం కోకిలారావం రోజుకి ఐదారు గంటలు వింటూనే ఉంటాను. నన్నూ, నా చాదస్తాన్నీ చూసి మా వాళ్ళు అందరూ చాటుగా నవ్వుకుంటూ ఉంటూనే ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

మా చిన్నన్నయ్యకి పెళ్ళయి ఐదుగురు పిల్లలు పుట్టాక, ఇల్లు చాలక అప్పటికి వేరే ఇల్లు కట్టుకున్నాడు. దానికి అమెరికా లో ఉన్న మా తమ్ముడూ, నేనూ ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ చేసిన సహాయం గురించి తెలిసిన మిత్రులు, కాకినాడ బార్ రూమ్ (కోర్ట్ ప్రాంగణంలో లాయర్ల విశ్రాంతి గది) సహాధ్యాయులు దాన్ని డాలర్ హౌస్ అని వేళాకోళం చేసే వారు. ఆ తరవాత నా పై వాడు సుబ్బన్నయ్య మణిపాల్ లో ఎం.. బీ. బీ. యస్ తరువాత  ప్రతిష్టాత్మకమైన పాండిచ్చేరి జిప్మెర్ లో మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసి కాకినాడ రంగరాయ  మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేరి, ఇంటి తో బాటు అతని భార్య (మా వదిన ) డా. శేషమాంబ గారి కోసం గైనకాలజీ క్లినిక్ కూడా కట్టుకున్నాడు. సుమారు పదేళ్ళ క్రితం 80 ఏళ్ల ‘వయస్సు” వచ్చి మా పెద్దన్నయ్య ఉంటున్న మా ఇంటికి చిన్నా, పెద్దా రిపేర్లు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మా తమ్ముడు  (వాడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెయ్యడానికి 1970 లో అమెరికా వచ్చాడు) వాడి వాటా స్థలంలో మేడ కట్టుకున్నాడు.

ఆ తరువాత బాగా పాత పడిపోయి అవసాన దశలో ఉన్న మా ఇంటిని మనసు దిటవు చేసుకుని, నిర్దాక్షిణ్యంగా నేల కూల్చి చదును చేసేశాం. మా ఇల్లు పడగొట్టి ‘స్మశానానికి’ తరలించడానికి వారం ముందు తీసిన ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఆ ముందు నుల్చుని ఆ ఇంటికి ‘ఆఖరి చూపులు’ చూడడానికి వచ్చిన వాడు తన పదో ఏట మా ఇంట్లో పని వాడి గా ప్రవేశించి, అరవై ఏళ్ళకి పైగా మాతోనే ఉండి, మమ్మల్ని ఎత్తుకుని మోసిన ‘సూన్నారాయణ’.  వాడి ఎడం పక్కన ఉన్న రెండు కిటికీల గది  మా ఇంట్లో శాశ్వతంగా ఉన్న “పురిటి గది”. ఆ గదిలోనే నేను పుట్టాను. మొక్కై వంగక పోయినా, తుఫాను ధాటికి మానై వంగిపోయిన మా మామిడి చెట్టు ఇంకా ఇంటి ముందు గంభీరంగానే ఉంది.  అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం.

మా ఇంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి…

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ” అనే అపురూపమైన అనుబంధాన్ని తనివి తీరా అనుభవించిన తరం మాది. ముఖ్యంగా నా చిన్నప్పుడు ..అంటే 1950-60 దశకాలలో బంధువుల రాకపోకలతో, వాళ్ళు రాగానే సినిమా ప్రోగ్రాములతో, అడ్డాట, ఇస్పేటు మదాం లాంటి అచ్చ తెలుగు పేకాటలతో, కేరమ్స్, చదరంగాలతో, తెల్లారాదేకా అస్సలు ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ ఏ మాత్రం జ్జాపకం లేక పోయినా చిన్నా, పెద్ద కలిసీ, ఎవరి వయస్సు  గ్రూప్ వారూ రాత్రి తెల్ల వార్లూ డాబా మీద పడుకుని కబుర్లు చెప్పేసుకుకోవడం మొదలైన వ్యాపకాలతో మా తరం వారి అందరి జీవితాలూ సరదాగా గడిచి పోయేవి. ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే మరీనూ.

“ఆ పోదురూ, మీరు మరీనూ….మీ తరువాత “ఎర్ర త్రికోణం” రోజులు వచ్చేసి, చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తరవాత్తరవాత కంప్యూటర్లూ, గ్లోబలైజేషన్లూ వచ్చేసి ఎవరి కుటుంబం చుట్టూ వాళ్ళు  చుట్టూ గీతలు గీసేసుకున్నారు. “ అని చాలా మంది  అంటుంటారు. నా పాయింటు కూడా సరిగ్గా అదే. మా చిన్నతనం గడిచినంత ఆనందంగా ఈ తరం వారి చిన్నతనం లేదు అని మా బోటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్ద వాళ్ళయి వారి ఆత్మ కథ వ్రాసుకున్నప్పుడు వారు కూడా సరిగా అలాగే అనుకుంటారు!

అన్నట్టు మా బంధువుల గురించి నేను చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో ఉండే ఒక తమాషా అలవాటు గురించి ముందే చెప్పుకోవాలి. అదేమిటంటే అసలు బంధుత్వం ఏదైనా ఒక వ్యక్తిని పిల్లలందరరం ఒకే రకం గా పిలిచే వాళ్ళం. ఉదాహరణకి మా నాలుగో మేనత్త కొంత మందికి అక్క, మాకు మేనత్త, మరో కొంత మందికి పిన్నీ అయినా మా బంధువులకీ, స్నేహితులకీ ప్రపంచంలో  అందరికీ ఆవిడ  రంగక్కే.  ఈ వ్యాసం లో కూడా ఆ పద్ధతే పాటించాను. లేక పొతే ఎవరి గురించి వ్రాస్తున్నానో తెలియక గందర గోళం పడిపోతాను. “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కనక వారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తాను.

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

నా జీవితం  మీద  సాహిత్య పరంగా కాకపోయినా,  వ్యక్తిత్వ పరంగా చెరగని ముద్ర వేసి ఆత్మీయత విలువని చెప్పకనే చెప్పిన వారిలో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన లని మొట్టమొదటగా చెప్పుకోవాలి. వరసకి మేనరికం అయిన ఆ దంపతులు అన్ని శుభ కార్యాలకీ పది హీను రోజులు ముందే వచ్చి, అవాంతరాలకి తక్షణమే వాలి పోయి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మూడు-నాలుగు తరాల అన్ని కుటుంబాలకీ “మూల స్తంభం” లా నిలిచారు. వారికి పిల్లలు లేరు కానీ డజన్ల కొద్దీ బంధువుల పిల్లలందరినీ సొంత పిల్లల లాగానే చూసుకునే వారు. మా ఆఖరి మేనత్త సూర్య భాస్కరం (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం), & పండ్రవాడ సుబ్బారావు (పెద్దాపురం మామయ్య గారు)  దంపతుల పెద్ద కూతురు మా జయ వదిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జయ వదినని చూడకుండా ఉండను. మా చిట్టెన్ రాజు బాబయ్య మా నాన్న గారికి వరసకి పెద్ద తమ్ముడు. అంటే…మా తాత గారి సవితి తమ్ముడి పెద్ద కొడుకు. కాకినాడలోనే పుట్టి, అక్కడే చదువుకుని , చాలా సంవత్సరాలు మిలిటరీ లో పని చేసి కో- ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయాడు.  వైజాగ్ లో చదువుకునప్పుడు (1961-62)  మా బాబయ్య పనిచేసిన కశింకోట, విజయ నగరం, శృంగవరపు కోట మొదలైన అన్ని ఊళ్ళూ వెళ్ళి, అక్కడ కూడా వారు స్థానికంగా అందరికీ తలమానికంగా ఉండడం నేను స్వయంగా చూసాను.  ఒక సారి  తనే స్వయంగా అంధ్ర విశ్వవిద్యాలయం లో మా హాస్టల్ కి వచ్చి, భోజనం చేసి “రాజా గాడి హాస్టల్ భోజనం బాగా ఉంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి” అని కాకినాడ మా అమ్మకి ఒక కార్డు రాసాడు.  ఆత్మీయతకి, అభిమానానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

1951 లో మా తాత గారు, బామ్మ గారు ఒకే రోజున పోయినప్పుడు, మా నాన్న గారు, అమ్మా పోయినప్పుడూ వారిద్దరే దగ్గరుండి కర్మకాండలు నిర్వహించడంలో సహాయం చేశారు. మా ఇంట్లో అందరి పెళ్లిళ్ల నిర్వహణ, మా తమ్ముడి పెళ్లి కుదర్చడం మొదలైన శుభ కార్యాలకి వారే సూత్రధారులు. మా బాబయ్య ఆదేశాలతో పది రోజులకి సరిపడా కూర గాయలు కొనడానికి నేను కూడా మా బాబయ్యతో ఎడ్ల బండ్ల మీద కాకినాడ సంత చెరువు దగ్గర పెద్ద మార్కెట్ కి వెళ్ళే వాడిని. రాత్రి పడుకోడానికి మా మామిడి చెట్టు కింద మడత మంచం నేనే వేసే వాడిని. కొంచెం పెద్ద వాడిని అయ్యాక , ఆయనతో పేకాట కూడా ఆడే వాడిని.  నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పడూ కూడా గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది. అది ఎప్పుడు చూసినా ఠకీమని తన వేళ్ళు నా నోటి దగ్గర పెట్టి “నా గోళ్ళు కొరకరా. యింకా రుచిగా ఉంటాయి రా” అని ఆ అలవాటు మాన్పించడానికి సరదాగా ప్రయత్నాలు చేసే వాడు.  మా చిట్టెన్ రాజు బాబయ్య పోయి పదేళ్ళు దాటింది. ఇందుతో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన ఫోటో జతపరుస్తున్నాను. అలాగే ఆయన తమ్ముళ్లు శంకరం బాబయ్య, రామం బాబయ్య కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. వారిద్దరూ కూడా దివంగతులే.

నాకు ఐదుగురు మేనత్తలు. ముగ్గురు మేన బావలు- అంటే మా మేనత్తల కొడుకులు. వాళ్ళని అమలాపురం బావ, దొంతమ్మూరు బావ, పెద్దాపురం బావ అనే వాళ్ళం అప్పుడప్పుడు. అందులో అమలాపురం బావ ..పెద్ద బావ..మా పెద్ద మేనత్త (ఆవిడని నేను చూడ లేదు)- పెద్ద మామయ్య గారి (గిడుగు వెంకట రత్నం గారు) కొడుకు. పేరు సూర్య ప్రకాస రావు..అంటే మా తాత గారి పేరే. అతను చామన చాయలో పొడుగ్గా భలే తమాషాగా ఉండే వాడు. ఆయన భార్య సుందరక్క , ఆరుగురు ఆడ పిల్లలు (నా మేనగోడళ్ళు) చాలా అందమైన వారు. వృత్తి రీత్యా అడ్వొకేట్ అయిన మా పెద్ద బావ ఎప్పుడు వచ్చినా మాట్లాడడం తక్కువ కానీ ప్రతీ మాటా, చేతా సరదాగానే ఉండేవి.

ఆ తరువాత రెండో మేనత్త (ఆవిడని కూడా నేను చూడ లేదు)  ని  తనని పెంచి పెద్ద చేసిన మేనమామ గారి కొడుకు కుంటముక్కుల కామేశ్వర రావు గారికి ఇచ్చి పెళ్లి చేసారు మా తాత గారు. మా బాసక్క (వరసకి వదిన), హనుమంత రావు బావ వారి పిల్లలే. ఆ మేనత్త పోయిన తరువాత ఆవిడ చెల్లెలు, మా నాలుగో మేనత్త అయిన రంగనాయకమ్మని (ఆవిడ నే రంగక్క అని పిలిచే వాళ్ళం) ఇచ్చి ద్వితీయ వివాహం చేసారు.  హనుమంత రావు బావ మా పెద్దన్నయ్య కంటే చిన్న, మా చిన్నన్నయ్య కంటే పెద్ద. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండే వారు. కలిసే అల్లరి చేసే వారు. కాకినాడలో మా ఇంట్లోనే చదువుకుని నగరంలో సోషల్ సర్కిల్ లో బాగా తిరిగే వాడు. అలనాటి సినీ నటుడు రామశర్మ కి మంచి మిత్రుడు . అతనితో సినిమా తియ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ మా నాన్న గారు ఒప్పుకో లేదు. మా కామేశ్వర రావు మామయ్య గారు  హఠాత్తుగా గుండె పోటు తో పోయినప్పుడు మా బావ చిన్న వాడు కాబట్టి మా నాన్న గారు వారి 400  ఎకరాల మిరాసీ పొలాన్ని ని తనే స్వయంగా వ్యవసాయం చేసి తరువాత మా చిట్టెన్ రాజు బాబయ్య మధ్యవర్తిగా మొత్తం ఆస్తి మా బావకి అప్పజెప్పారు.

ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ…మా గాంధీ నగరం పార్కుకి మా హనుమంత రావు బావ ట్రస్టీ గా ఉండే వాడు. ఒక సారి నేను, కొంత మంది కోతి మూకతో కలిసి రాత్రి చీకటి పడ్డాక మట్టి తవ్వేసి పార్కులో ప్రతీ మూలా కలువ పువ్వులతో కళకళ లాడుతూ ఉండే చెరువు కప్పెట్టేసే ప్రయత్నంలో ఉండగా పెద్దులు అనే తోటమాలికి దొరికి పోయాను. ఆ పెద్దులు గాడు మా ఇంట్లో పాలు పితికే గొల్ల వాడే అయినా, చీకట్లో గుర్తు పట్టక నన్నూ, మిగిలిన కుర్రాళ్ళనీ  తాళ్ళతో కట్టేసి అక్కడే లైబ్రరీ లో ట్రస్టీ మీటింగ్ అవుతుంటే అక్కడికి లాక్కుని పోయి నిలబెట్టి “ఈ రౌడీ కుర్ర నాయాళ్ళు సెరువు కప్పెట్టేసి సింద్ర వందర సేసారండి. తవరు ఊ అంటే సంపేత్తానండి, ఆయ్య..” అనేసి పెర్మిషన్ కోసం చూస్తూ ఆ వెలుగులో నా మొహం చూసాడు. ఆ తరువాత మా బావ మొహం చూశాడు. అంతే సంగతులు. నేను చావు తప్పించుకుని మా బావ ధర్మమా అని బయట పడ్డాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అరవై ఏళ్ళ  పాటు ఏ చెరువూ, ఆఖరికి అతి చిన్న గుంట కూడా కప్పెట్టే ప్రయత్నం చెయ్య లేదు. చేసినా పెద్దులు గాడి మొహము, మా బావ మొహమూ గుర్తుకు వస్తాయి. మా హనుమంత రావు బావ ఏకైక కుమార్తె లక్ష్మి కి పెళ్లి చేసిన  16  రోజుల పండగ నాడు ఊరేగింపులో గుండె పోటుతో మరణించాడు. మేనల్లుడి మరణాన్ని తట్టుకో లేక కాబోలు మరాక రెండు నెలలలో మా నాన్న గారు ఆ కూడా పోయారు. అప్పుడు నేను అమెరికాలో ఇరుక్కుపోయాను. మా హనుమంత రావు బావ ఎప్పుడూ తన సంగతి చూసుకోకుండా అందరికీ ఎంతో మంచి చేసే వాడు. అలా ఆయన దగ్గర సహాయం పొందిన ఒకాయన ఎవరో పిఠాపురం “హనుమంతరాయ కళాశాల” అని ఒక కాలేజ్ కి అతని పేరు పెట్టి ఆ ఋణం తీర్చుకున్నారు.

ఇక మా పెద్దాపురం  అబ్బులు బావ (ఆఖరి మేనత్త కొడుకు, జయ వదిన తమ్ముడు ) నా కంటే రెండేళ్ళు పై వాడయిన మా సుబ్బన్నయ్య వయసు వాడు. అతని పేరు కూడా (సత్య) సూర్య ప్రకాశ రావే. అబ్బు-సుబ్బు అని వాళ్ళిద్దరూ, రాజా-అంజి అని నేను, మా తమ్ముడూ కవల పిల్లల లాగే  పెరిగాం. అతను కూడా కాకినాడలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. మా గేంగ్ అందరం పొద్దుట మా పెద్ద నూతి దగ్గర పంపు తో ఆదరా బాదరాగా నీళ్ళు కొట్టుకుని..అవును చన్నీళ్ళే…. స్నానాలు చేసేసి, తరవాణీయో మరోటో తినేసి ఎవరి స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్లి పోయి, సాయంత్రం క్రికెట్ ఆడేసుకుని, శివాలయానికి వెళ్లి పురాణాలో, హరికథలో వినేసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ లో ప్రవేశించే దాకా మా అబ్బులు బావ టీ=స్క్వేర్ మరియు , స్లైడ్ రూల్ అనే ఇంజనీరింగ్ పరికరాలు భుజాన్న వేసుకుని సైకిల్ మీద వెడుతూ అందరిలోకీ హీరోలా కనపడే వాడు. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలలో ఉంటాయేమో! అబ్బులు బావ ఎప్పుడూ గలగలా నిష్కల్మషంగా నవ్వే వాడు. పేకాట లో అయినా, కేరమ్స్ లో అయినా ఏ ఆటలో అయినా మా అబ్బులు బావ ఉంటేనే ఆటలు రక్తి కట్టేవి. అతను మా కుటుంబం మీదా, మా నాన్న గారి మీద అభిమానంతో వైజాగ్ లో రామలింగేశ్వర స్వామి దేవాలయం (మా నాన్న గారి పేరు) కట్టించడంలో ఎంతో సహాయం చేసాడు. అమెరికా ఎప్పుడు వచ్చినా హ్యూస్టన్ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండే మా అబ్బులు బావని విధి నిర్దయగా రెండేళ్ళ క్రితం పొట్టన పెట్టుకుంది. ఇందుతో చిన్నప్పుటి (బహుశా 1955) మా అబ్బులు బావ, మా హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య (ముగ్గురూ దివంగతులే) ఏడిద కామేశ్వర రావు, మరొక మిత్రుడితో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ఎంత మంది మేన బావలు ఉన్నా, మా అబ్బులు బావదే అగ్ర తాంబూలం.

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

ఇక మా నాన్న గారి తరంలో అతిముఖ్యమైన, అతి దగ్గర అయిన బంధువులలో మా సూరీడు బాబయ్య గారే  (రాజమండ్రి) మొదటి వారు. ఆయన మా నాన్న గారి పిన తల్లి (చెల్లంబామ్మ గారు) ఏకైక కుమారులు. ఆయనా, మా నాన్న గారూ చిన్నప్పటి నుంచీ  ఇద్దరూ న్యాయవాదులయ్యే దాకా కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మద్రాసు లా కాలేజ్ లో చేరినా, మా నాన్న గారు త్రివేడ్రం లో డిగ్రీ పూర్తీ చేస్తే , మా సూరీడు బాబయ్య గారు మొత్తం మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికే  మొదటి వాడి గా నిలిచి మద్రాసు లా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేను యింకా చూడ లేదు కానీ ఆయన పేరు ఇప్పటికీ ఆ కాలేజ్ లాబీ లో చెక్కబడి ఉంటుందిట. ఆయన పూర్తీ పేరు అయినంపూడి సూర్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రాక్టీస్ రాజమండ్రిలోనే కానీ దక్షిణ భార దేశం లో ఆయన అతి పెద్ద సివిల్ లాయర్ ఐఎనెన్ మూర్తి గా నాలుగైదు దశాబ్దాలు పేరు పొంది నేను అమెరిక రాక ముందే చనిపోయారు. మా చిన్నన్నయ్య ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నా వయసు వాడే అయిన అయన కొడుకు (రమణ మూర్తి తమ్ముడు)  ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సూరీడు బాబయ్య గారి భార్య (స్వర్హీయ మాణిక్యం అక్కయ్య)  మా  అమలాపురం బావకీ తోబుట్టువే!

ఇక్కడ మరొక పిట్ట కథ…..మా సూరీడు బాబయ్య గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా పదేళ్ళప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు వాళ్ళబ్బాయి అంటే ..మా రమణ మూర్తి తమ్ముడు కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. నేనూ, మా నాన్న గారు వాణ్ణి చూడడానికి రాజమండ్రి వెళ్లాం బస్సులో. నాకు తెలిసీ నేనూ, మా నాన్న గారూ మాత్రమే కలిసి చేసిన ఒకే ఒక్క బస్సు ప్రయాణం అదే! అప్పుడు నేను ఒక్కడినీ ఇంట్లో ఉండగా ఎవరో ఒక పెద్దాయన కూడా మా తమ్ముణ్ణి చూడడానికే ఇన్నీసు పేటలో మా సూరీడు బాబయ్య గారి ఇంటికి వచ్చాడు. అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు అని నేను చెప్పగానీ “నీకు ఆసుపత్రికి దారి తెలుసా?” అని అడిగారు. “మాది కాకినాడ సార్, రాజమండ్రి నాకు తెలీదు” అని వెర్రి మొహం వేసాను. ఆయన చతికిల పడి పోయి “ఓరి నాయనోయ్ ఇప్పుడు ఎలాగా?” అని బెంగ పడిపోతూ ఉంటే నా బుర్రలో ఒక వెలుగు వెలిగి “రిక్షా వాడిని పిలిచి జనరల్ హాస్పిటల్ కి పోనీ అంటే వాడే తీసుకేడతాడు గదా” అన్నాను ఆయనతో. ఆయన “అవును” సుమా…హాస్పత్రి దారి నాకెందుకూ తెలియడం. రిక్షా వెధవకి తెలిస్తే చాలుగా “ అని ఆశ్చర్య పడిపోయి ఆ నాటి నా “తెలివి తేటలని” ఊరంతా టాం టాం చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అదిగో అప్పటి నుంచీ మా సూరీడు బాబయ్య గారికీ మా కుటుంబంలో మిగిలిన వారికీ నేను తెలివైన వాడి కింద లెక్క. నాకైతే ఆ మాట మీద అంత నమ్మకం లేదు.

ఇలా మా చిన్నతనంలో నన్ను ప్రభావితంచేసిన బంధు కోటిలో మా అమ్మ వేపు వారైన  మా సుబ్బారావు  రావు నాన్న, లక్ష్ముడక్కయ్య, సీతక్క, జనార్దనం బావ, సీతారమణ మావయ్య,  సుబ్బారావు తాతయ్య గారు,  అటు తణుకు నుంచి తాళ్లూరి లక్ష్మీపతి తాతయ్య గారు మొదలైన వారందరూ దివంగతులే. వీలున్నప్పుడు వారి గురించి ప్రస్తావించి  వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న బంధువులు చాలా మంది ఉన్నా, ఇప్పుడు “ఉన్నోళ్ళందరూ తీపి గుర్తులే” అయినా  అప్పటికీ, ఇప్పటికీ “బందు ప్రేమ” డిపార్ట్మెంట్ లో చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ముందుగానీ “కాల్చేసి” , ఉత్తరం “తగలేసి” అప్పుడు రావడాలు ఎక్కువ అలవాటు లేదు. ఏకంగా పెట్టె, బేడాతో ఎప్పుడు పడితే అప్పుడు దిగిపోవడమే! ఇప్పుడు నేను తాత, మామయ్య, బాబయ్య, బావ మొదలైన ఏ హోదాలోనైనా సరే  “కాల్” చేసి మా బంధువుల ఇంటికి “ఎప్పాయింట్ మెంట్” తీసుకుని వెడితే ముందు పది నిముషాలు అందరూ చుట్టూ కూచుని పలకరిస్తారు. “ఎప్పుడొచ్చావు?, ఏ హోటల్ లో ఉన్నావు? ” అనే ప్రశ్న లోనే “ఎప్పుడు వెళ్తున్నావు?” అనే ధ్వని వినపడుతుంది. అరగంట తరవాత మెల్ల, మెల్లగా కొందరు ఎవరి గదులలోకి వారో, బయటకో జారుకుంటారు ”సీ యు లేటర్” అనుకుంటూ.  ఇక కూచోక తప్పని వారు వాచీలు చూసుకోవడం, టీవీ ఆన్ చెయ్యడం లాంటి చేష్టలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మండపాల్లోనే అన్ని మంతనాలూనూ.  అమెరికాలో బంధువులు అయితే ఆరు నెలలకో ఏడాదికో ఫోన్ లోనే మాటా, మంతీనూ. ఏం చేస్తాం. అమెరికా ఫ్రీ కంట్రీ కాబట్టి మనం ఎవరి ఇంటికీ వెళ్ళక్కర లేదు, వాళ్ళు రావక్కర లేదు. ఖర్చు తగ్గింది కదా అని ఆనందిస్తాం అందరూ “అమెరికూపస్థ మండూకాలే”.

chitten raju— వంగూరి చిట్టెన్ రాజు

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది పెద్ద “ప్రస్త్హానం” కానే కాదు. ఏదో మామూలు జనతా క్లాసు ప్రయాణమే అయినా ప్రస్థానం లాంటి పెద్ద, పెద్ద మాటలు వాడితే  నా భుజాలు నేనే తట్టుకోడానికి బావుంటుంది కదా అని తంటాలు పడుతున్నాను. ఇక ఎవరయినా ఒక రచయిత అవడానికి వారసత్వం కారణం కానక్కర లేదు. ఆ మాట కొస్తే నాకు తెలిసీ చాలా మంది సాహితీవేత్తలు తమ పిల్లలని . “మా లాగా కథలు, కవిత్వాలు రాసుకుంటూ అవస్థ పడకుండా హాయిగా చదువుకుని ”పైకి” రమ్మని ప్రోత్సహించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ “పైకి” రావడం అంటే డబ్బు సంపాదించుకోవడం అని అర్ధం. అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్తల సంతానం చాలా మంది అమెరికాలో పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ  వాళ్ళల్లో చాలా మంది గోప్యంగానే ఉంటారు. నా విషయంలో మా బంధువులకి  “రాజా గాడు చదువుకున్నాడు కానీ కథలూ, కమామీషులలో పడిపోయి  పైకి రాలేక పోయాడు” అనేదే చాలా మందికి ఉన్న బాధ. నాకు తెలిసీ  నా ముగ్గురు అన్నయ్యలకీ, తమ్ముడికీ, అక్కకీ, ముగ్గురు చెల్లెళ్మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ లలో ఎవరికీ రచనావ్యాసంగం లేదు.

కానీ మా పెద్దన్నయ్య అందరి లాగా కాదు. కొంతమంది పెద్దన్నయ్యలు నిజంగానే పెద్దన్నయ్యలాగా ఉంటారు. నాకే కాదు….మా చుట్టాల్లో కూడా వరసకి ఏమైనా కానీ, అందరికీ మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! అందరూ ఉహించినట్టుగానే  అతని పేరు మా తాత గారి పేరే….సూర్య ప్రకాశ రావు. మా కుటుంబంలో ‘కలాపోసన కీ కళాకౌశల్యానికీ కూడా ఆయనే పెద్దాయన. ఉదాహరణకి, మా చిన్నప్పుడు, ముఖ్యంగా మా అక్క పెళ్లి కాక ముందు, ప్రతీ ఏడూ సంక్రాంతి, దసరా మాకే కాక కాకినాడ మొత్తానికే పెద్ద పండుగలు. అందుకు ప్రధాన కారణం, ఆ పెద్దన్నయ్య వారాల తరబడి అతి జాగ్రత్తగా అధ్బుతమైన ఊహాశక్తితో మా అక్క పేరిట ఒక సినిమా సెట్టింగ్ లా నిర్మింఛే బొమ్మల కొలువులే!

rajuఇందుతో జతపరిచిన ఫోటో ఒక్కటే మా దగ్గర ఆ నాటి పండుగ రోజులకి గుర్తుగా మిగిలింది. ఈ ఫోటో అస్పష్టంగా ఉన్నా, అందులో ప్రతీ అంగుళమూ నాకు గుర్తే! చుట్టూ రెండు లెవెల్స్ లో ఆర్చీలు మా అన్నయ్య డిజైన్ చేసేవాడు. అంటే అంగుళం వెడల్పు, మిల్లిమీటర్ మందం ఉండే పొడుగాటి ఇనప బద్దీలని గుండ్రంగా, పలకలగా, త్రికోణాలుగా వంచి బొమ్మల కొలువు మందిరం చుట్టూ జాగ్రత్తగా, పడిపోకుండా పెట్టేవాడు. వాత్తికి సరిగ్గా రంగు రంగుల ఉలిపిరి కాగితాలు, ముచ్చి రేకులూ కత్తిరించి జిగురుతో అతికించి సినిమాలో గుమ్మాలకి తోరణాలలా ధగ ధగ మెరిసేలా అతికించేవాడు. అన్నం ఉడకేసి, గంజి వార్చేసి మెత్తటి ఆ జిగురు తయారు చేసి, సుతిమెత్తగా ఉండే ఆ కాగితాలు ముడుచుకుపోకుండా  జాగ్రత్తగా పులిమి, మా పెద్దన్నయ్య పీట మీదో, నిచ్చెన మీదో నుంచుని రెడీగా ఉన్నప్పుడు అందించే అతి ముఖ్యమైన పని  రాజా-అంజీ లు చేసే వారు. అందులో రాజా అంటే నేను. ఆంజి అంటే  నా తమ్ముడు హనుమంత రావు. మేమిద్దరం ఆ పేర్లతో కావాలా పిల్లలలా పెరిగాం. అమెరికాలో కూడా ఇంకా అలాగే ఉన్నాం. ఇక అసలు బొమ్మలకి ముందు ముఫై, నలభై చతురపు అడుగుల వైశాల్యంలో నేల మీద ఒక పువ్వుల తోటా, పర్వతాలు, జలపాతాలు, మధ్యలో మా అగ్గిపెట్టెలతో తనే తయారు చేసిన మా దొంతమ్మూరు లో  మా తాత గారు పెరిగిన మేడ నమూనా వగైరాలు ఉండేవి. అంతా అయ్యాక  బొమ్మల కొలువు అంతా దేదీప్యమానంగా నూనె దీపాలు,  క్రిస్మస్ లైట్ల తో కళ్ళు జిగేలుమనేట్టు ఉండేది. అంతే కాదు, దీపావళి సమయంలో అయితే, మా స్థలం వీధి గుమ్మం నుంచీ ఇంటి ముందు వరండా దాకా సుమారు రెండు వందల అడుగుల దూరం అటూ, ఇటూ స్తంభాలు పాతి, వాటి మీద దీపాలు పెట్టి మంచి రహదారి ఏర్పాటు చేసే వాడు మా పెద్దన్నయ్య. ఈ వింతలన్నీ చూడడానికి కాకినాడలో అందరే కాక, చుట్టూ పక్కల గ్రామాల నుంచి ఎద్దు బళ్ళు కట్టుకుని వచ్చే వారు.  మా రోడ్డు మీద ఆ నాటి ఎద్దు బళ్ల పార్కింగ్ లా ఇక్కడ అమెరికాలో చేస్తే, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.  మా పెద్దన్నయ్య ఎంత సరదా మనిషి అంటే మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరం వ్రాసినా “ఒరేయ్ తుమ్మ జిగురూ” అనే సంబోదించే వాడు. ఎందుకంటే మా స్కూలు ప్రాజెక్ట్స్ అన్నింటికీ మా పొలం గట్ల మీద ఉండే తుమ్మ చెట్లకి గాట్లు పెట్టి, జిగురు ఊరాక దాన్ని సీసాలో పెట్టి నాకు తనే పంపించే వాడు. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా, ఏ సాహిత్య సభ లో పాల్గొన్నా,  వీలైనంత వరకూ  అన్ని సభలకీ వచ్చి మొదటి వరస లో ఆనందిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ కూచునే మా పెద్దన్నయ్య గత ఏడాది (అక్టోబర్ , 2012) లో తన 80 వ ఏట సహజ మరణం పొందాడు.

raju1

2001  లో, కాకినాడలో మాలో చాలా మంది పుట్టిన ఇంటి ముందు తీసిన ఈ ఫోటోలో మా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళు, వారి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు  వెరసి మా  సన్నిహిత  కుటుంబం.

ఇక మా చిన్నన్నయ్య ప్రభాకర ముర్తిరాజు గారు మద్రాసులో తను ప్రెసిడెన్సీ కాలేజీ లోను, లా కాలేజ్ లోను చదువుకునేటప్పుడు  మరో విధంగా “కలాపోసన” రంగంలో ఒక వెలుగు వెలిగాడు. అప్పటి ప్రపంచ సుందరి టంగుటూరి సూర్య కుమారి నాయిక పాత్ర ధరించిన నౌకా చరిత్ర దృశ్య నాటకానికి సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రచన, దర్శకత్వం వహిస్తే, మా అన్నయ్య సహకార దర్శకుడిగా వ్యవహరించాడు.  టంగుటూరి సూర్య కుమారి లండన్ వెళ్ళక ముందు మద్రాసులో ఉండే ఆ రోజుల్లో ఆమెకి మా చిన్నన్నయ్య అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే వారు.  పైగా మా ఉరి వారే అయిన నటులు విజయ చందర్,  రామ శర్మ,  ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (విక్టోరియా హాస్టల్ లో తన సహవాసి)  మొదలైన వారితో సాంగత్యం వలన మా చిన్నన్నయ్య ఆ సంగతులన్నీ అత్యంత రమణీయంగా, స్వతస్సిద్దమైన మాటకారితనంతో మద్రాసు నుంచి  కాకినాడ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటే రాత్రి తెల్ల వార్లూ వినేవాళ్ళం. పైగా కాకినాడ ప్రాంతాల నుండి ఆ రోజులలో ఎంతో అరుదైన విమానం పైలట్ గా శిక్షణ పొందిన వారిలో బహుశా మా చిన్నన్నయ్యే మొదటి వాడు.  నేను ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా సింగీతం గారిని కలుసుకున్నప్పుడు ఆయన మా చిన్నన్నయ్యనీ, అలనాటి సంగతులనీ గుర్తుకు తెచ్చుకుని  నాతో పంచుకున్నారు. కానీ మా చిన్నన్నయ్య మద్రాసునీ, అక్కడి జీవితాన్నీ వదులుకుని తను కూడా కాకినాడ తిరిగి వచ్చేసి లాయర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. రెండేళ్ళ క్రితం అమెరికాలో ఉన్న తన కొడుకులనీ, నన్ను, మా తమ్ముణ్ణీ చూడడానికి ఇక్కడికి వచ్చి, లాస్ ఏంజేలేస్ లో హఠాత్తుగా గుండె పోటుతో  పోయాడు. మా అమ్మా, నాన్నల తరువాత మా తొమ్మండుగురు సన్నిహిత కుటుంబంలోనూ మా చిన్నన్నయ్యదే మొదటి మరణం.  ఆ తరువాత గత అక్టోబర్,  2012 లో మా పెద్దన్నయ్య కూడా పోయాడు.

ఇందుతో బాటు ముచ్చటగా మా కుటుంబం ఫోటోలు  జతపరుస్తున్నాను. మొదటిది 1955  లో తీసినది. అప్పడు మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి యింకా మా అమ్మ కడుపులోనే ఉంది. ఆ ఫోటోలో నేల మీద ఎడం పక్కన బుద్దిగా కూచున్నది నేనే అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. రెండోది  పన్నెండేళ్ల క్రితం కాలానుగతిని వచ్చిన మార్పులతో….అంటే వయస్సు మీరిన తరువాత … మా అన్నదమ్ములం, అప్పచెల్లెళ్ళమూ ఉన్న తీసిన మరొక ఫోటో.

raju3.png

1955  లో మా ఆస్తాన ఫోటో గ్రాఫర్ అయ్యగారి సూర్య నారాయణ గారు తీసిన మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ  ఫోటో.  .

 

 

మా చిన్నప్పుడు మా అక్క కి సంగీతము, డాన్సు నేర్పించే వారు. “ఆ అదంతా పెళ్లి సంగీతము, డాన్సు” అని అందరు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాటి ధర్మమా అని నాకు కూడా వాటిల్లో కాస్త ఆసక్తి కలిగింది అనుకుంటాను. మా అక్కకి సంగీతం నేర్పే మేష్టారు భలే తమాషాగా ఉండే వారు. ఒక వేపు ఆ సంగీతం ప్రాక్టీసు జరుగుతూ ఉంటే మరొక పక్క నేను కూడా “మంధర ధారే, మోక్షము రారె..” అనుకుంటూ పాడేసుకునే వాణ్ణీ. అలాగే మా మూడో మేనత్త (దొడ్డమ్మ అనే వాళ్ళం) “ఆకడ, దూకాడ, దూకుడు కృష్ణా రారా..” అనుకుంటూ చాలా పాటలు పాడుకుంటూ ఉండేది.  ఆ పాటకి నాకు ఇప్పటికీ అర్ధం తెలియక పోయినా నా నాటకాల్లో కొన్నింటిలో దాన్ని వాడుకున్నాను. అలాగే  మా అక్క నేర్చుకున్న  పిళ్ళారి గీతాలు , మంధర దారే  వగైరాలు ఇప్పటికీ పాడుకుంటూ నే ఉంటాను…ఏకాంతంగా ఉన్నప్పుడు. నేను పాడుతుండగా ఎవరైనా వింటే కొంప ములిగి పోదూ?

టూకీగా.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండీ లేనట్టు ఉన్న “కలా పోసన” విత్తనాలు…. నాకు గుర్తున్నంత వరకు… ముందే మనవి చేసినట్టుగా నా చిన్నప్పుడు సాహిత్య పరంగా ఏ విధమైన వారసత్వాలు, ప్రగాఢమైన కుటుంబ వాతావరణమూ లేనే లేవు. అందుకే నేను “ఇలా ఎందుకు తయారయ్యానో”  అని మా వాళ్ళు కొందరు ఆశ్చర్య పడుతూ ఉంటారు.  అంటే మా కుటుంబంలో నేను “చదువుకున్న మూర్ఖుణ్ణి.”

అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

మా అమ్మ, నాన్న గారు

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. ఆ తరువాత మరొక ముఫై ఏళ్ళు మా బంధువులందరి కుటుంబ బాధ్యతలనీ ఆయనే తన సర్వశక్తులూ ఓడి, ఎక్కడా ఓడకుండా నిండు కుండలా అందరినీ గట్టెక్కించి, అందరికీ జీవితంలో మంచి బాటలు వేసి నడిపించి, ఆఖరి రోజులలో మా కళ్ళ ముందే అలసి పోయి సొలిసి…పోయారు మా నాన్న గారు. మా పెద్దమ్మాయి పుట్టిన కబురు తెలిసాక, అమెరికాలో పుట్టిన మొట్టమొదటి మనవరాలు ఎలా ఉంటుందో అనే కోరిక తీరకుండానే 1983 లో ఆయన పోయారు. అప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనే మా “బాబయ్య గారు”. మా కుటుంబంలో నాన్న గారిని బాబయ్య గారు…(బాబయ్యారు) అని పిలవడం అప్పుడు అలవాటు. మా నాన్న గారు మా పిల్లలు ముగ్గురిలోనూ ఎవరినీ చూడ లేదు. కన్న తండ్రికి కన్న పిల్లలని కూడా చూపించ లేక, ఆఖరి క్షణాలలో ఆయన్ని చూడలేని ఈ “త్రిశంకు స్వర్గం” లో నా పరిస్థితిని తల్చుకున్నప్పుడల్లా “ఈ అమెరికా ఎందుకు వచ్చాం రా” అని మధన పడుతూనే ఉంటాను.

మా తాత గారు సంపాదించిన ఆస్తిపాస్తులు, చేసిన దాన ధర్మాల వాగ్దానాలు అన్నీ ఏకైక కుమారుడిగా ఆయనకి వారసత్వ బాధ్యతలుగా రావడం, వాటిని ఆయన మన:స్ఫూర్తిగా స్వీకరించి సంపూర్తిగా నిర్వహించడమే మా నాన్న గారి జీవితానికి నిర్వచనం. ఆయన చెయ్య లేని పని ఒకే ఒక్కటి. ఆ ప్రస్తావన తరువాత తెస్తాను. మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు పుట్టినప్ప్పుడే తల్లిని పోగొట్టుకుని, బీదరికం అనుభవిస్తూ, మేనమామ కుంటముక్కల హనుమయ్య గారి ప్రాపకం, పిఠాపురం రాజా వారి ఆర్ధిక వేతనాలతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, తరువాత మద్రాసు లా కాలేజీ లో చదువుకునే రోజులలోనే మా బామ్మ గారు (కాట్రావులపల్లి) ఆది లక్ష్మి మాణిక్యంబ గారిని పెళ్ళి చేసుకున్నారు.

మా అమ్మ,, నాన్న గారి పెళ్లి సుభ లేఖ

1900  లో ఆయన కాకినాడ లో కృతివెంటి పేర్రాజు పంతులు గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేరారు. ఆలస్యంగా చదువు మొదలుపెట్టడం వలన అప్పటికే ఆయన వయస్సు ముఫై దాటింది. తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో ఆయన కాకినాడలో ఇప్పటి గాంధీ నగరంలో (అప్పటికి అది పిఠాపురం రాజా వారి పేరిట వెలిసిన రామారావు పేట.) ఒక్కొక్కటే 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు.  ఆ తరువాత ద్రాక్షారామం దగ్గర ఇంజరం గ్రామంలో 40 ఎకరాలు పొలం కొని దగ్గర బంధువు ఒకాయనకి (పండ్రవాడ గవర్రాజు) యాజమాన్యం ఇచ్చారు. కానీ, మా తాత గారికి స్వగ్రామమైన దొంతమ్మూరు గ్రామం మీద ఉన్న అభిమానంతో అక్కడ 350 ఎకరాలు ఒక్క సారిగా అమ్మకానికి రావడంతో, పైగా అది హనుమయ్య గారి మిరాసీ పక్కనే ఉన్న భూమి కావడంతో మా తాత గారు ఆ పొలం కూడా మార్చ్ 30, 1922 నాడు కొన్నారు.   బొబ్బిలి సంస్థానానికి చెందిన ఎస్టేట్ లో ఒక భాగమైన ఈ పొలానికి వారి బంధువులైన చెలికాని ధర్మారాయణం గారి దగ్గర ఈ పొలం కొన్న దగ్గర నుండీ మా తాత గారికి లాయర్ వృత్తి మీద శ్రద్ధ తగ్గి వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది.

ఆ ఆసక్తితో బొబ్బిలి రాజా గారి దగ్గర మామిడి తోటలు వెయ్యడానికి మరొక 1000  ఎకరాల బంజరు భూములకి పట్టా మా తాత గారు కౌలుకి తీసుకున్నారు.  కేవలం మూడు, నాలుగేళ్ల సమయంలో అత్యధికంగా ఆర్ధిక పెట్టుబడి పెట్టి, వ్యవసాయం లో అనుభవం లేని మా తాత గారు ఆ సమయంలో దురదృష్టశాత్తు  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యంలో—ది గ్రేట్ డిప్రెషన్ – లో తను కూడా కూరుకుపోయారు.  సుమారు 1923 మా బాబయ్య గారు నుంచి  1940  దాకా మా తాత గారు విపరీతమైన ఆర్ధికపరమైన కష్టాలు పడ్డారు.

కానీ మొండి పట్టుదలతో, అకుంఠితమైన దీక్షతో, అన్ని ఆర్ధిక లావా దేవీలనీ అధిగమించారు. కుటుంబ బాధ్యతలను అన్నింటినీ పరిపూర్తిగా నిర్వహించారు. అందులో ఏకైక కుమారుడిగా మా నాన్న గారి సహకారమూ, సమర్ధవంతమైన నిర్వహణా లేక పోతే ఈ నాడు ఆ కుటుంబాలన్నీ ఎలా ఉండేవో నేను ఉహించనే లేను.

1907 లో కాకినాడలో పుట్టిన మా నాన్న గారు అక్కడే చదువుకున్నారు.  మా తాత గారు 1921 లో కొన్న నాలుగేళ్ళకి  1925 లో స్థలంలో ముందుగా ఆగ్నేయం మూల ఒక ఐదు గదుల చిన్న ఔట్ హౌస్ కట్టుకుని ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 1926 లో పెళ్లి అయ్యాక,  మా అమ్మ ఆ ఇంటికే  1930 ప్రాంతాలలో కాపరానికి వచ్చింది. వారి పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. మా నాన్న గారు, చదువుకొంటున్నా, మా తాత గారికి నిలదొక్కుకొనడంలోనే సహాయం పడడంలోనే ఎక్కువ సమయం గడిపే వారు. కాకినాడ తరవాత, మద్రాసు, త్రివేండ్రం లలో చదువుకుని 1937 లో మా నాన్న గారు లా డిగ్రీ పూర్తి చేసి మా తాత గారికి చేదోడు వాదోడుగా ఉండడానికి కాకినాడలో ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ పెట్టారన్న మాటే కానీ. ఆయన జీవితానికి ఏకైక  ధ్యేయం మా తాత గారిని అన్ని కష్టాల నుంచీ గట్టేక్కించడమే.  అందుకు అన్ని కోర్టు తగాదాలు పరిష్కరించడం, ఆస్తి పాస్తులు నిలబెట్టుకోవడం, , మా తాత గారు బంధువులకి చేసిన వాగ్దానాలని నెరవేర్చడం , అంతే గాక, మమ్మల్ని..అంటే తన సొంత తొమ్మండుగురు పిల్లలనీ పెంచి, పెద్ద చేసి చదివించడం, పెళ్ళిళ్ళు చెయ్యడం…వీటన్నింటి తోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. అటు మా అమ్మ కూడా మా అమ్ముమ్మకీ, మూర్తి రాజు తాత గారికీ ఏకైక సంతానం కావడంతో మా అమ్మ కి సంక్రమించిన సారవంతమైన జేగురు పాడు పొలాలు కూడా మా నాన్న గారే చూడ వలసి వచ్చేది. అలాగే 1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయినప్పుడు సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. టూకీగా చెప్పాలంటే మా నాన్న గారు ఒంటి చేత్తో, మూడు దూర గ్రామాలలో (గొల్లప్రోలు దగ్గర దొంతమ్మూరు పొలాలు, ద్రాక్షారం దగ్గర ఇంజరం, రాజమండ్రి దగ్గర జేగురు పాడు) విసిరేసినట్టు ఉన్న 2000  ఎకరాల వ్యవసాయం, చేసి, అప్పులు తీర్చడానికి దూరంగా ఉన్నవి అమ్మేసి, మా తాత గారి కోరిక ప్రకారం తన ఐదుగురు అప్పచెల్లెళ్ళ కుటుంబాలని, ఇతర బంధువులకీ తానే పెద్ద దిక్కుగా ఆదుకోవడం, వారి పిల్లలని చదివించడం, అన్నింటినీ మించి మా తొమ్మండుగురినీ పెంచి పెద్ద చేసి, మా కాళ్ళ మీద మేము నిలబడేలా తీర్చి దిద్దిన మా నాన్న గారికి ఎన్ని జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తే సరిపోతుంది?  ఎన్ని నోబుల్ బహుమతులు, ఆస్కార్ లు ఇస్తే ఆయన అప్రకటిత విజయాలకి సరితూగుతాయి?

నాకు తెలిసీ మా నాన్న గారు ఎప్పుడూ ఎక్కడికీ “వెకేషన్ ‘ కి వెళ్ళ లేదు. పొలాలు చూసుకోడానికి గుర్రం మీదో, గుర్రబ్బండి మీదో వెళ్ళే వారు. రోజుల తరబడి చెట్ల కిందనే కేరేజ్ లో వచ్చిన అన్నం తిని, నిద్ర పోయే వారు. కనీసం ఒక సారి ఆయన గుర్రం మీద నుంచి కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నా చిన్నప్పుడు ఆ గురబ్బండి అవశేషాలు మా తోటలో ఉండేవి. మా తాత గారివీ, బామ్మ గారివీ అస్తికలు కలపడానికి కాశీ వెళ్ళారు కానీ, మా నాన్న గారు తన కర్తవ్యాలని విస్మరించి పుణ్యం కోసం పాకులాడడానికి సకల తీర్దాలు సేవించ లేదు. ఇంట్లో కూడా వినాయక చవితి లాంటి పండగలే తప్ప చీటికీ, మాటికీ వ్రతాలు చేసేసి దేవుణ్ణి ఎప్పుడూ ఇబ్బంది పెట్ట లేదు. కథలు, కవిత్వాలు వ్రాయ లేదు.

ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు గాంధీ గారు  1923  లో కాకినాడ వచ్చినప్పుడు, మా నాన్న గారు తన మిల్లు బట్టలన్నింటినీ నిప్పుల్లో వేసేసి, అప్పటి నుంచీ జీవితాంతం ఆయన ఖద్దరు బట్టలే కట్టారు. ఆఖరికి కోర్ట్ కి వేసుకునే నల్ల కోటు, గౌను, బౌ, పూజా, పునస్కారాలకీ, ఒకటేమిటీ, అన్నీ ఖద్దరే. ఆయన కట్టుకున్న పంచెలు, కండువాలు కొన్ని నా దగ్గరే హ్యూస్టన్ లో ఉన్నాయి.

ఆడ పిల్లలలకి ఆస్తిలో వాటాలు ఇచ్చే సాంప్రదాయం కానీ, చట్టరీత్యా కానీ లేని ఆ రోజులలో, మా నాన్న గారు తన ముగ్గురు అక్కలకీ, ఇద్దరు చెల్లెళ్ళకీ తగిన వాటాలు ఇచ్చి మా తాత గారి, బామ్మ గారి కోరిక నిలబెట్టారు. అంతే గాక వారందరినీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదివించారు. అందులో మా అమ్మ సహకారం నూటికి నూట యాభై  శాతం అని వేరే చెప్పక్కర లేదు. అలాగే మా బామ్మ గారి చెల్లెలు (మా చెల్లంబామ్మ గారు, రాజమండ్రి) కుమారుడు మా నాన్న గారికి వరస కి తమ్ముడుయిన మా సూరీడు బాబయ్య గారినీ, మా చిట్టెన్ రాజు బాబయ్య తో సహా మా తాత గారి సవితి తమ్ముళ్ళ పిల్లలందరినీ మా నాన్న గారే చదివించి, పెళ్ళిళ్ళు చేసారు.

వ్యక్తిగతంగా, మా నాన్న గారికి కొన్ని మంచి, తమాషా అలవాట్లు ఉండేవి. ఉదాహరణకి ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు  ఆ రోజు డబ్బు లెక్కలు ఆదాయం, వ్యయం అణా పైసలతో సహా చిన్న  2 “ x 3 “  కాగితాల మీద ఖచ్చితంగా రాసి చూసుకునే వారు. తేడా వచ్చిందో అయిందే అందరి పనీ! మాకు ఆయన్ని చిల్లర ఖర్చులకి డబ్బు అడగడానికి ఎప్పుడూ  భయమే! ఇప్పటి లాగా వారానికింత “అలవెన్స్” అంటూ ఉండేది కాదు. యాభై మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలవెన్సా , పాడా? మేము ఎప్పుడైనా పరీక్షలు పాస్ అయి పోయాక స్నేహితులతో సరదాగా సోడాలు తాగడానికి బేడా, పావలా కావలసి వచ్చినప్పుడు ముందు మా అమ్మ చేతో, మా చిట్టెన్ రాజు బాబయ్య చేతో అడిగించే వాళ్ళం. అత్యవసర పరిస్తితులలో ఆయన అలా తోట లోకి వెళ్ల గానే ఆయన డబ్బు పెట్టుకునే పెట్టె తీసి ఆ బేడా, పావలా తీసుకుని పారిపోయే వాళ్ళం. ఇక ఆ రాత్రి ఆయనకి  లెక్క తేలక అందరినీ అడిగి, ఆఖరికి మా దగ్గర నిజం రాబట్టి “అడిగితే ఇవ్వనా?” అని కోప్పడే వారు. అడిగితే ఇస్తారు అని తెలుసు కానీ , అడగడానికే భయం! ఆ రోజుల్లో మా చిన్న పిల్లల మనస్తత్వాలు, పెద్ద వాళ్ళంటే ఉండే భయభక్తుల గురించి మా అమెరికా పిల్లలకి నేను ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్లకి అర్ధం కాదు.

ఇక మా తాత గారు చుట్ట కాల్చే వారు కానీ మా నాన్న గారికి ఆ అలవాటు కూడా లేదు. ఆయనకున్న ఒకే అలవాటు పనులన్నీ ఆఖరి క్షణం దాకా వాయిదా వేసి వారు. నాకు కూడా అదే ‘అలవాటు’ వచ్చింది. ఆఖరికి కోర్ట్ లో వెయ్య వలసిన దావాలు, ప్రతి వాదాలు, అర్జీలు అన్నీ కూడా రేపు “కాల దోషం” పట్టిపోతుంది అనే దాకా ఆలోచిస్తూనే ఉండే వారు. ఆ ముందు రోజు రాత్రి దస్తావేజు రాసే వారు. ఇది నాకు ఖచ్చితంగా ఎందుకు తెలుసు అంటే ..నాకు వయసు వచ్చాక అర్ధరాత్రి దాకా నేను కూడా ఆయన  గదిలోనే కూచుని ఆయన వ్రాసిన దస్తావేజులు చదివి ..తప్పులు దిద్దేవాడిని. …ఎందుకంటే “రాజా గాడికి తెలుగు, ఇంగ్లీషూ రెండూ బాగా వచ్చును.” అనే వారు మా నాన్న గారు. అప్పుడప్పుడు ఆయన వాడి, నేను ప్రతివాదిగా రిహార్సల్స్ కూడా చేయించే వారు. అవన్నీ నా జన్మలో మర్చిపోలేని జ్జాపకాలు.

మా నాన్న గారికి మరొక తమాషా అయిన అలవాటు ఉండేది. అదేమిటంటే ఎప్పుడైనా ఏ బజారుకో ఇంకెక్కడికైనా వెళ్ళవలసి వస్తే, ఖద్దరు పంచ, కండువా వేసుకుని శుభ్రంగా తయారు అయి వీధి గుమ్మం దగ్గర నుంచునే వారు. ఆయన్ని చూడగానే మా పేటకి కొత్తగా వచ్చిన ఓ రిక్షా వాడు బేరం కోసం ఆగే వాడు. “బజారుకి ఎంత?” అని వాణ్ణి అడిగి, “లేదులే, నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఉత్తినే అడిగాను “ అని పంపించేసే వారు. వాడు బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయే వాడు. అలా ఆయన వీధి గుమ్మం దగ్గర కనీసం గంట నుంచుని వచ్చే, పోయే ట్రాఫిక్ నీ, జనాల్నీ చూస్తూ, ఆ తరువాత ఏ ఖాళీ రిక్షా వచ్చినా ఎక్కేసే వారు. మా గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడు ఉండే రిక్షా వాళ్లకి ఈయన అలవాటు తెలుసు కాబట్టి, ఆయన వీధి గుమ్మంలోకి వచ్చి నుంచున్న గంట దాకా దగ్గరకి వచ్చే వారు కాదు. “ఒక్క వెధవా రాడేం” అని ఆయన విసుక్కునే వారు. మా నాన్న గారు చాలా అరుదుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగే ఈ తతంగం చాటు మాటు నుంచి చూసి మేము నవ్వుకునే వాళ్లం.

అలాంటి అలవాటే ఇంకోటి ఉండేది మా నాన్న గారికి. అదేమిటంటే పని వాళ్లకి జీతాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు “పెద్దబ్బాయ్ యింకా పొలం నుంచి రాలేదు. వాడు వచ్చాక కనపడు” అనే వారు. పెద్దబ్బాయ్..అంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి దగ్గర వ్యవసాయం చెయ్యడం మొత్తం నేర్చుకున్నాక, మా నాన్న గారు రిటైర్ అయ్యారు. మా పెద్దన్నయ్యే పంటలు అమ్మాక మా నాన్న గారికి సొమ్ము అప్పజేప్పే వాడు. అన్నింటినీ పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్న మా నాన్న గారు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి కూడా మా పెద్దన్నయ్య పొలం నుంచి రాలేదు అని వంక పెట్టె వారు. ఇది అందరికీ సరదాగానే ఉండేది. కానీ, మా పొలాలన్నీ వర్షాధారం పొలాలు కాబట్టి ఒక ఏదు పంటలు పండీ, రెండేళ్ళు పండకా వాటి మీద నుంచి వచ్చే ఆదాయం నిలకడగా ఉండేది కాదు. అమెరికా నుంచి నేనూ, మా తమ్ముడూ ఆర్ధికంగా ఎంత సహాయం చేసినా మా నాన్న గారికి వేరే ఆదాయం లేదు కాబట్టి తన ఆఖరి రోజులలో మానసికంగా ఇబ్బంది పడ్డారు అని నా అనుమానం.

మరొక ఆశ్చర్య కరమైన విశేషం ఏమిటంటే, మా నాన్న గారు తన మొత్తం జీవితంలో మహా అయితే ఐదారు సినిమాలు చూసి ఉంటారు. అందులో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ఒకటే ఆయన చూసిన హిందీ సినిమా.  మా చిన్నప్పుడు ఏ కళని ఉన్నారో ఒక రోజు నన్ను, మా తమ్ముడినీ “ఒరేయ్ ఇవాళ అదేదో రోజులు మారాయ్ అనే వ్యవసాయం సినిమా వచ్చిందిట. చూద్దాం “ అన్నారు. అది వినగానే మేమిద్దరం ఆఘమేఘాల మీద తయారు అయిపోయాం. నేను ఆ రోజు స్పెషల్ కాబట్టి పొట్టి లాగు బదులు పైజామా వేసుకున్నాను. “రిక్షా కుదుర్చుకోడానికి మీకు ఎలాగా గంట పడుతుంది. మీరు వెళ్ళి వీధి గుమ్మంలో నుంచోండి. ఈ లోగా నేను తయారయి వస్తాను అంది మా అమ్మ. మొత్తానికి అందరం రిక్షా ఎక్కాం. మా అమ్మా, నాన్న గారు, మా తమ్ముడూ సీటులో కూచున్నారు. ఇంక చోటు లేక నేను రిక్షాలోనే ముందు ఉన్న ఇనప రాడ్ పట్టుకుని నుంచుని నెహ్రూ గారి లాగ ఫీలయిపోతూ క్రౌన్ టాకీస్ కి వెళ్ళాం. అక్కడ తెలిసింది . రోజులు మారాయ్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని అంతకు ముందు వారమే అది వెళ్ళిపోయి “అక్కా చెల్లెళ్ళు” అనే మరొక సినిమా ఆడుతోంది అని. ఇక తప్పక మేము ఆ సినిమా చూసాం. నేను మా నాన్న గారితో చూసిన ఒకే ఒక్క సినిమా అదే! ఆ సినిమాలో రమణా రెడ్డి చేసిన మేజిక్కులు మా నాన్న గారికి నచ్చాయి.

మా బాబయ్య గారు పోయి ముఫై ఏళ్లయినా, కుటుంబ సంక్షేమం, బంధువుల బాగోగులే తన జీవితంగా మలచుకున్న మా నాన్న గారి నుంచి నేర్చుకోవలసినది యింకా చాలా ఉంది. నేను అమెరికా రావడం వలన ఆయనకి ఎక్కువ సేవ చెయ్యగలిగానా, లేక అక్కడే ఇండియాలోనే ఉండిపోయి ఉంటే ఆయన్ని యింకా బాగా చూసుకునే వాడినా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు …

ramana

 

ముళ్ళపూడి వెంకట రమణ అనే మహానుభావుడితో నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేసి, రెండు, మూడు సార్లు  ధైర్యంగా ఎదురుపడి నమస్కారం కూడా పెట్టి, వీలుంటే ఆయన చెయ్యి ముట్టేసుకుని పవిత్రం అయిపోయి .అక్కడితో ఆగిపోకుండా ఆయనకీ, తమకీ ఎంతో అవినాభావ సంబందం ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసుకుంటూనే, కొందరు అమెరికా “ప్రముఖ ప్రబుద్దులు” నేను కూడా అలాగే నా పాప్యులారిటీ పెంచుకోవడం కోసం ఆయన పేరుని “cash” చేసుకుంటున్నాను అనుకునే ప్రమాదం పొంచి ఉంది అని నాకు తెలుసు. అటువంటి వారితో నేను “అమెరికోతి కొమ్మచ్చి” ఆడదలచుకో లేదు. అయినా ఆయన 81 వ జన్మదిన సందర్బంగా ముళ్ళపూడి గారిని తల్చుకుని, ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందిద్దామనీ, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందామనీ ఈ చిన్న వ్యాసం లో నా అతి చిన్న ప్రయత్నం.  

Bapu & Ramana releasing my book

కొంచెం సిగ్గుగానే ఉన్నా… ముందుగా ఇటీవల జరిగిన…జరగని ఒక సంగతి చెప్పుకోవాలి.

క్రిందటి మార్చ్, 2013 లో నేను ఇండియా వెళ్ళినప్పుడు, తాడేపల్లి గూడెం లో ఒక కాలేజ్ వారు కొన్ని అమెరికా వ్యాపార రహస్యాలను లో MBA విద్యార్ధులకి బోధించమని కోరగా నేను కాకినాడ నుంచి మా మేనల్లుడు అద్దంకి సుబ్బారావు తో కారులో అక్కడికి బయలు దేరాను.

నాకు ముందు తెలియదు కానీ, మేము ఒక ఊరు చేరగానే “మామయ్యా, ఇదే ధవళేశ్వరం, అదిగో అక్కడే కాటన్ దొర..” అని ఏదో అనబోతూ ఉంటే “ఆపు, కారు, ఆపు” అనేసి “ముళ్ళపూడి గారి మేడ దగ్గరకి పోనియ్ “ అన్నాను నెర్వస్ గా. ఒకే క్షణంలో అంత ఆనందము, అంత విచారము నాకు నా జన్మలో ఎప్పుడూ కలగ లేదు. “ముళ్ళపూడి రమణ గారు పుట్టిన పుణ్య క్షేత్రం ధవళేశ్వరం చూడగలిగాను.”  అని ఆనందం అయితే, “అయ్యో, కాస్త ముందు ఈ సంగతి తెలిస్తే ‘గోదావరి పక్కన గురువు గారి మేడ’ ఉందో లేదో వివరాలు కనుక్కుని కనీసం ఆ ప్రాంగణం లో అడుగు పెట్టి ధన్యుణ్ణి అయ్యే వాడిని కదా..అపురూపమైన అవకాశాన్ని అందుకోలేక పోయాను కదా” అని ఎంతో విచారించాను.

అన్నింటి కన్నా విచారం అక్కడ ఉన్న కాస్త సమయంలో ముళ్ళపూడి గారి ఇంటి గురించి ఎవరిని అడిగినా వారు వెర్రి మొహాలు పెట్టడం, కాటన్ దొర గురించి అడిగితే “అదిగో ఆ విగ్రహం దగ్గర ఫోటో దిగండి” అని సలహా ఇచ్చివ వారే!

“అలాంటివన్నీ ముందు వెబ్ లో చూసుకు రావాలి మామయ్యా, లోకల్ వాళ్లకి ఎవడికి కావాలీ?” అన్నాడు మా మేనల్లుడు. తెలుగు వారి సంస్కృతి నేల మీద వెల వెల బోతున్నా, వెబ్ లో వెలుగులు చిమ్ముతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలీ?

Mullapudi

ఇక ముళ్ళపూడి గారితో నా మొదటి పరోక్ష పరిచయం మా బావ గారు నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా జరిగింది. మా బావ గారు, బాపు-రమణలు  మద్రాసు లో కేసరి హై స్కూల్ లో చిన్నప్పుడు  సహాధ్యాయులు. ఇప్పుదు హైదరాబాద్ లో ఆయన సీనియర్ అడ్వొకేట్. నేను వ్రాసిన నా మొదటి నాటకాన్ని (బామ్మాయణం అను సీతా కల్యాణం”) మా బావ గారు చదివి, 1970 ప్రాంతాలలో “ఇలాంటి సరదా డ్రామాలంటే బాపు-రమణ లకి ఇష్టం. ఇది వాళ్లకి పంపించి అభిప్రాయం అడుగుదాం” అని అనుకుని, నాతో చెప్పకుండానే ఆ నాటకాన్ని మద్రాసు పంపించారుట. ఈ విషయం చాలా సంవత్సరాల తరువాత రమణ గారు ఏదో మాటల సందర్భంలో చెప్పారు.  “కన్నప్ప” గారి కేసులో రమణ గారు మా బావ గారిని లీగల్ సలహాకి సంప్రదించారు అని విన్నాను. అప్పటికే అంతా అయిపోయింది.

ఆ తరువాత అనేక సందర్భాలలో ముళ్ళపూడి గారితో నా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలు గానే మహదానందంగా సాగింది. అందులో పరాకాష్టగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు”  (డిశంబర్ 31, 2006- జనవరి 1, 2007,  హైదరాబాద్) లో బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి…అంటే రమణ గారి కథ కి బాపు బొమ్మ గీసి ప్రచురించబడి అప్పటికి అరవై సంవత్సరాలు నిండాయి. సన్మానాలకీ, సత్కారాలకీ ఎప్పుడూ దూరంగా ఉండే వాళ్ళిద్దరూ మొట్ట మొదటి సారిగా సతీ సమేతంగా మా సత్కార సభకి వచ్చి, రెండు రోజులూ పూర్తిగా సభలలో పాల్గొని నా మీద వ్యక్తిగతంగా ఎంతో అభిమానం చూపించారు. విశేషం ఏమిటంటే, ఇప్పటికీ ఏ టీవీ వారైనా బాపు -రమణ ల మీద  ఏ సందర్భంలో టీవీ క్లిప్స్ చూపించినా, ఆ ఇద్దరి వెనకాల back drop  ఎప్పుడూ ఆ నాటి మహా సభలదే ఉంటుంది.

ఆ సభలో వంగూరి ఫౌండేషన్ ముళ్ళపూడి గారికి “జీవన సాఫల్య పురస్కారం” అంద చేశాం. ఆ మహా సభలు పూర్తి అయ్యాక నాలుగు రోజులలో నాకే ఆయన ఐదు వేల రూపాయల చెక్కు పంపించారు. నేను ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి “ఎందుకు సార్ “ అని భోరుమని ఏడవగానే ఆయన నన్ను బుజ్జగించి “అది కాదు నాయనా…దేనికైనా ఓ పద్ధతి ఉండాలి కదా..మీ సభలకి నేను, మా ఆవిడా వచ్చినప్పుడు మా అబ్బాయి ప్రతీ రోజు మా హోటల్ కి వచ్చి మాతో బాటు భోజనం చేసాడు. వాడు నీ గెస్ట్ కాదుగా..వాడి తిండి ఖర్చు నాదేగా ..అందుకూ ఆ చెక్కు. తక్కువైతే చెప్పు. ఇంకోటి పంపిస్తాను.”  అన్నారు.అదీ ఆయన పద్ధతి.

అంతకు ముందే నా మొట్టమొదటి కథల సంపుటి “అమెరికామెడీ కథలు” అనే పుస్తకాన్ని ప్రచురిస్తే బావుంటుంది కదా అనే ఊహ నాకు కలిగినప్పుడు  తక్షణం మూడు “కోతి కొమ్మచ్చులు” నా మనసులో మెదిలాయి. మొదటిది ఆ పుస్తకం బాపు-రమణలకి అంకితం ఇవ్వాలి.  రెండోది వారి చేత ‘ముందు మాట” వ్రాయించుకోవాలి. ఇహ మూడోది బాపు గారి చేత ముఖ చిత్రం వేయించుకోవాలి. వెనువెంటనే బాపు గారిని యధాప్రకారం భయ భక్తులతో ఫోన్ చేసాను. యధాప్రకారం అభిమానంగా ఆప్యాయంగా, క్లుప్తంగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. “అంకితం” విషయం వినగానే  “వెంకట్రావ్ ఇక్కడే ఉన్నారు అడిగి చెప్తాను.” అని చెప్తాను అన్నారు. ఇక ముందు మాట . ముఖ చిత్రం గురించి కూడా వినగానే ముళ్ళపూడి గారే స్వయంగా ఫోన్ అందుకుని “అంకితానికెంతా, ముందు మాటకెంతా, ముఖ చిత్రాని కెంతా …ఒక్క అంకితానికెంతా, ముందుమాట కెంతా   ..ఏమైనా కన్సెషన్ ఉందా…” అని చమత్కరిస్తూ… హాయిగా అన్నింటికీ ఒప్పేసుకున్నారు.

నేను ఎప్పుడు మద్రాసు వెళ్ళినా రమణ గారిని చూడడం తప్పని సరి. ఆఖరి సారిగా రమణ గారు మనల్ని ఈ భూప్రపంచంలో వదిలేసి తను స్వర్గానికి వెళ్ళిపోడానికి కొన్ని నెలల ముందు నేనూ, గొల్లపూడి గారూ వారింటికి వెళ్ళి, ఆయన తోటీ, బాపు గారి తోటీ గంటల తరబడి సరదాగా సీరియస్ విషయాలు, సీరియస్ గా సరదా విషయాలు అనేకం మాట్లాడుకున్నాం.

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు … ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందించడానికి..

 

(రమణగారి రేఖాచిత్రం: అన్వర్ )

 

మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే!

chitten rajuనాకు పట్టిన అదృష్టం చాలా మందికి పట్టదు. ఎండుకంటే నేను ఒక రకంగా వికటకవినే! అంటే మా అప్పచెల్లెళ్ళూ –అన్నదమ్ములలో ఎటు నుంచి లెక్క పెట్టినా నాది ఐదో నెంబరే!. అంటే ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క వెరసి నాకంటే నలుగురు  పెద్ద వాళ్ళు, ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళూ వెరసి నాకంటే నలుగురు చిన్న వాళ్ళు. పంచ పాండవులం అయిన మా అన్నదమ్ములలో నేను నకులుణ్ణి.  వీళ్ళలో ఏ ఒక్కరూ లేకుండా ఉండే నా చిన్నతనాన్ని ఊహించలేను. ఆ రోజుల్లో యింకో పదిమంది అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఉంటే బావుండును అనిపించేది. బాగా చిన్నప్పుడు ఆ మాటే మా అమ్మతో ఒక సారి అంటే “నోర్ముయ్” అని తిట్టి “ఆ ఇద్దరికీ బతికే యోగం లేదు రా” అంది. అంటే మా అమ్మ జన్మనిచ్చిన పదకొండు మందిలో ఇద్దరు బాలారిష్టాలు దాటలేక పోయారు. అందులో ఒకడు నాతో పుట్టిన కవల పిల్లాడు. కానీ మా తాత గారూ, బామ్మ గారూ, ఆ మాట కొస్తే, మా అమ్మా, నాన్న గార్ల ఉదార స్వభావం వలన మా బంధువులనీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదువు చెప్పించడంతో ఎప్పుడూ ఇంట్లో ఉండే వాళ్లూ వచ్చే పోయే వాళ్ళతో సుమారు వంద మంది జనాభాతో కాకినాడలో మా ఇల్లు కళ, కళ లాడుతూ ఉండేది.  ప్రతీ రోజూ తెల్లారరగట్ట లేచిన మా పొయ్యిలో పిల్లి మధ్యాహ్నం అరగంట కునుకు తీసి మళ్లీ అర్ధరాత్రి దాకా పడుకునేది కాదు. అలాగే ఎంత మంది వంట వాళ్ళు ఉన్నా, పని వాళ్ళు ఉన్నా మా అమ్మ నడుము వంచిన నడుము ఎత్తేది కాదు.

మా అమ్మ పేరు సర్వలక్ష్మి. అది నాకు ఎంతో ఇష్టమైన పేరు. అలాగే మా బామ్మ గారి పేరు మాణిక్యాంబ గారు. అది కూడా నాకు చాలా ఇష్టమైన స్వచ్చమైన తెలుగు పేరు.   మా అమ్మకి తన పదకొండే ఏట మా నాన్న గారితో పెళ్లి అయింది. ఆ రోజులల్లో అది బాల్య వివాహం క్రింద లెక్క కాదు. తరవాత కాపురానికి వచ్చినప్పటి నుంచీ మా బామ్మ గారి హయాంలో ఇంటి నిర్వహణ మా అమ్మ చేపట్టింది. టూకీగా చెప్పాలంటే ప్రతీ రోజూ వంద మందికి అన్నం వార్చే పెద్ద కంచు గుండిగలూ,  అంత మందికీ సరిపడా పులుసు, చారూ  కాచే గంగాళాలూ, కూరా, పచ్చడీ వగైరాలకి గిన్నెలూ, రాచ్చిప్పలూ, పాల గదిలో నిలువెత్తు కుండలో రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గ్గుల మీద వేడిగా కాగుతూ ఉండే ఆవు పాల కుండా, గేదె పాలకి మరొక కుండా, అటక మీద అరవై రకాల ఊరగాయల పింగాణీ జాడీలు, మడి బట్టలు ఆరేసుకునే దండేలు అర డజనూ, వంటింటి వెనకాల ఆడ వారి కోసం  చిన్న నుయ్యి, అక్కడికి వంద గజాల దూరంలో మగ వారి స్నానాల కోసం పెద్ద నుయ్యి, నీళ్ళు తోడుకునే చేదలూ, బకెట్ లూ, ఎవరైనా గ్లాసులో, చెంబులో నూతిలో పారేస్తే  దిగి తెచ్సుకోడానికి రెడీ గా అందుబాటులో ఉండే నిచ్చెనా, ఇంటిల్లిపాదికీ వేన్నీళ్ళు కాచుకునే నీళ్ళ పోయ్యీ, దాని మీద రాగిదో, ఇనపదో తెలియకుండా రెండు అంగుళాల మందం ఉన్న “మసి పూసిన పెద్ద డేగిసా”,  బొగ్గుల బస్తాలూ, కట్టెలూ, వేన్నీళ్ళూ, చన్నీళ్ళూ తొలకరించుకోడానికి  సిమెంటు నీళ్ళ కుండీలూ,  పసుపూ, కుంకుమా, నూనె, రెడీ స్టాకులో పొద్దున్న లేవగానే అందరికీ అందుబాటులో ఉండేలా కచికా, వేప పుల్లలు, బొగ్గు, “కోతి” మార్కు పళ్ళ పొడి, బినాకా టూట్ పేస్ట్, వెదురు బద్దలూ,  లైఫ్ బోయ్, లక్స్ వగైరా సబ్బులూ, కుంకుడు కాయలు, బట్టలు ఉతుక్కునే సబ్బూ, నీలి మందూ, పండగలూ, పబ్బాలూ వస్తే కావలసిన స్పెషల్ వస్తువులు, అర డజను కత్తి పీటలు, చిన్న, పెద్దా కత్తులూ, కొబ్బరి కోరే చేతి యంత్రమూ, పెద్ద, చిన్న, బుల్లి రుబ్బు రోళ్ళూ, కారాలు కొట్టుకోడానికి రాళ్ళూ, రోకళ్ళూ, రెండు మూడు సైజులలో పాతిక పైగా పీటలూ,  అందరికీ విడి, విడి గా వెండి కంచాలూ,  పాతిక పైగా నులక, నవారు, మడత మంచాలూ, పూజ గది సామాగ్రీ  మొదలైన కొన్ని వందల వస్తువులకీ మా అమ్మే “సప్లై చైన్ మరియు మెయింటేనెన్స్  మేనేజర్”. ఈ రోజుల్లో ఆ ఉద్యోగానికి గంటకి మూడు వందల డాలర్లు పెట్టి ఒక SAP ప్రోగ్రామర్ ని పెట్టుకున్నా మా అమ్మ కాలి గోటికి సరిపోరు అని నా అభిప్రాయం. ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. మీ అమ్మ కూడా మా అమ్మలాంటిదే కదా!

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

మా తల్లిదండ్రులు సర్వలక్ష్మి , రామలింగేశ్వర శర్మ గారు

ఈ పై లిస్ట్ ఎందుకు వ్రాశానంటే, వీటిల్లో పసుపూ, కుంకుమ లు మాత్రమే నేను అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వాడ లేదు—ఏదో డ్రామాల్లో ఆడ వేషాలు వేసినప్పుడు తప్ప. కానీ మిగిలిన వాటిల్లో వంట సామాగ్రి తప్ప మిగిలినవన్నీ చిన్నప్పుడు నా రోజు వారీ జీవితంలో భాగమే కాబట్టి, నా చిన్నతనం ఎంత పరమాద్భుతంగా గడిచిందో ఊహించుకో వచ్చును. 1996 లో కాకినాడనీ, నా చిన్నతనాన్నీ “దురదృష్టవశాత్తూ” వదిలేశాక ఆధునిక వంట సామాగ్రి ని వాడే అలవాటు అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నా జీవితం ఎలా ఉందో కూడా ఊహించుకో వచ్చును. అప్పుడప్పుడు టీవీ లలో “ఇప్పుడు మీరు క్వార్టర్ సైజ్ సాస్ పాన్ లో రెండు వంకాయ ముక్కలు ముక్కలు వేసి, ఒక చెంచాడు నూనె వేసి…  “ అనే వంటల కార్యక్రమాలు చూస్తూ మా ఆవిడ నోట్స్ రాసుకుంటూ ఉంటే నేను కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటాను. మరుక్షణం మా అమ్మని తల్చుకుని గుడ్లమ్మట నీరు తుడుచుకుంటూ గదిలోకి పారిపోతాను.

మా అమ్మకి ఏదో చిన్న సైజు మడీ, తడీ తప్ప ఎవరినీ బాధించి, సాధించే ఛాందసం ఉండేది కాదు. మా నాన్న గారు పోయిన తరువాత మా పట్టుదల మీద మా అమ్మ అమెరికా వచ్చి లాస్ ఏంజేలేస్ లో మా తమ్ముడి ఇంట్లో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరు నెలలూ ఉంది. వచ్చిన రోజే “ఈ ఫ్రిజ్ లో ఒక అర నాకు కేటాయించండి. అంతే. అందులో నా పాలూ, పళ్ళూ, తినుబండారాలు విడిగా పెట్టుకుంటాను. తక్కిన అరలలో మీరు ఏం అఘోరించినా నాకేం పరవా లేదు. మీ వెధవ అమెరికా అలవాట్లు మీవి. మీ స్నేహితుల ఇళ్ళకి వస్తాను కానీ ఎవరింట్లోనూ భోజనం చెయ్యను. కావాలంటే అందరినీ మనింటికే భోజనాలకి పిలవండి. లింగూ, లిటికూ అంటూ ఇద్దరినీ, ముగ్గురినీ పిలిస్తే నేను వంట చెయ్య లేను. కనీసం పాతిక మందిని అయినా పిలవండి. బజారుకెళ్ళి కాస్త పెద్ద మూకుడూ, గిన్నెలూ పట్టుకు రండి. పట్టుమని పది చెంచాలు కూడా పట్టవు మీకున్న గిన్నెల్లో. ఈ వెధవ దేశం ఇలా ఉంటుంది అని తెలిస్తే ఓ ఓ గుండిగా, ఓ గంగాళమూ తెచ్చుకుందును.” అంది మా అమ్మ. నాకు తెలిసీ వంట చెయ్యడానికి ఏ నాడూ ఏ ఎలెక్త్రికల్  పరికరమూ మా అమ్మ వాడ లేదు. వాడ లేక కాదు. ఇందుతో మా చిన్నప్పటి అమ్మా, నాన్న గార్ల ఫోటో ఒకటీ జతపరిచాను. మా అమ్మ అమెరికా వచ్సినప్పటి ఫోటో ఒకటి,

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

అమెరికాలో మా అమ్మతో నేనూ, మా తమ్ముడూ

మా అమ్మ జ్జాపక శక్తి అమోఘం.  ఒక సారి అమెరికాలో ఒకావిడని చూసీ చూడగానే “నువ్వు ఫలానా కదూ. నీ పెళ్లి ఫలానా తారీకున ఫలానా అబ్బాయితో ఫలానా సత్రంలో ఫలానా పురోహుతుడి గారే కదూ జరిపిస్తా. నేను నీ పెళ్ళికి వచ్చాను లే. ఆ పురోహితుడు మంత్రం తప్పు చదువుతుంటే మీ అమ్మకి చెప్పాను.” అనగానీ ఆవిడ బిత్తర పోయింది. ఈ యావత్ భూ ప్రపంచంలో మా అమ్మ ఎవరినైనా ఎప్పుడైనా కలుసుకుని ఉంటే మా అమ్మ ఎప్పుడూ మర్చిపోయేది కాదు. నాకు తెలిసీ మా అమ్మకి తన 83  సంవత్స’రాల జీవితంలో ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఏ డాక్టర్ నీ చూడవలసిన అవసరం రాలేదు. అన్నింటి కన్నా ఆశ్చర్యం .. శతాధికంగా ఉన్న మా బంధు వర్గంలో ఏ ఒక్కరి చేతా, ఏ నాడూ, ఒక్క “చెడ్డ” మాట అనిపించుకో లేదు. అలనాటి సమాజంలో ఈ రకమైన వ్యక్తిత్వం నమ్మశక్యం శక్యం కాని నిజం.

ఎవరినైనా సరే, ఆత్మీయంగానే తప్ప, ఆదరంగానే తప్ప, అన్యోన్యంగానే తప్ప, మరే విధంగానూ చూడని, చూడ లేని మా అమ్మ 1999  లో ఎవరికీ ఏ విధంగానూ ఇబ్బంది కలిగించకుండా సునాయాస మరణం పొందింది. కబురు తెలియగానే నేనూ, మా తమ్ముడూ పెద్ద కర్మ నాటికి కాకినాడ చేరుకున్నాం.  తన ఆస్తిపాస్తులన్నీ దాచుకున్న ఒక రేకు సూట్ కేస్ ని,  ఆమె కోరిక ప్రకారం అందరి సమక్షం లోనూ తెరిచి చూసాం. నాలుగో తరగతి వరకూ మాత్రమే చదువుకుని ఒక జీవిత కాలం కేవలం కుటుంబం కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టి, తన కడుపున  పుట్టిన తొమ్మండుగురు పిల్లలనీ, వారితో సరిసమానంగా వందలాది  బంధువుల్నీ తన ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో, బాధ్యతతో తీర్చిదిద్దిన (నండూరి) వంగూరి సర్వ లక్ష్మి అనే మా అమ్మ పదిలపరుచుకున్న ప్రాపంచిక ఆస్తి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం పుస్తకం, తను ఆఖరి రోజులలో కాలక్షేపం కోసం ఆడుకున్న పేక ముక్కలు, దేముడికి రోజు వెలిగించుకునే పత్తి వత్తులూ, అగరొత్తులూ వగైరా మాత్రమే!  మిగిలినదంతా మా అమ్మ పంచిపెట్టిన ప్రేమామృతమే! దానికి అంతు లేదు. ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు.

 

సూరప రాజు గారి నుంచి – నా దాకా…..!

chitten raju

ఆరేడేళ్ళ  క్రితం ఒక రోజు సాయంత్రం ఒక తొంభై ఏళ్ళ పెద్దాయన కాకినాడలో మా “వంగూరి హౌస్” అనబడే ఇంటి గుమ్మం ముందు ఆగి, లోపలికి చూసి , కాస్సేపు తారట్లాడి వెళ్ళిపోవడం మా మూడో అన్నయ్య డా. సుబ్రహ్మణ్యం) కిటికీలోంచి చూశాడు.

ఆ మర్నాడూ అదే సమయానికి ఆయన వచ్చి, తలుపు తట్టి లోపలికి వచ్చారు. తన పరిచయం చేసుకుని, తాను అసలు వంగూరి ఇంటి పేరుగలవాడే కానీ, అజ్జరపు వారికి దత్తత వెళ్ళినట్టూ, తన చిన్నప్పటి నుంచి తన పూర్వీకుల ఫొటోలు రెండు ఉన్నాయి అని చెప్పి ఆ రెండు ఫొటోలూ మా అన్నయ్య కిచ్చాడు. వంగూరి వారు తణుకు దగ్గర ఉన్న సిధ్ధాంతం గ్రామ కరణాలు అనీ, ఆ ఇంటి పేరుగల వారందరికీ అదే స్వగ్రామం అనీ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మా అన్నయ్య కి ఎవరో పేషేంట్స్ వచ్చారు.

“సారీ, సార్, మనం రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. నేనే వస్తాను” అని అన్నాడు మా అన్నయ్య.  “అలాగే, తప్పకుండా, మన వంశ చరిత్ర గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను” అని ఆయన వెళ్ళిపోయారు. రెండు, మూడు రోజుల తరవాత మా అన్నయ్య వాకబు చేస్తే ఆ పెద్దాయన అంతకు ముందు రోజే చనిపోయారు అని తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులెవరికీ ఆయన చెప్పదల్చుకున్న వివరాలు ఏమీ తెలియవు. ఇందుతో ఆయన మా అన్నయ్య కిచ్చిన ఒక ఫొటో జతపరుస్తున్నాను. అందులో ఎవరు, ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, నేను తలపాగా పెట్టుకుని, పంచెకట్టుకుంటే అచ్చు ఆ ఫొటోలో మొదటి వరస కుర్చీలలో ఎడం పక్కనుంచి మూడో పెద్దమనిషిని నేనే అని చాలా మంది భ్రమ పడ్డారు.

అదేం వేళా విశేషమో తెలియదు కానీ 2007 లో మేము మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు తణుకు నుంచి ఒకాయన ఫోన్ చేసి పదేళ్ళ వాళ్ళమ్మాయి తెలుగులో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలదని చెప్పి, ఆ మహాసభలలో తనకి అవకాశం ఇమ్మని కోరుతూ ఫోన్ లోనే ఆ అమ్మాయి చేత నాతో మాట్లాడించారు.  ఆ పాప పేరు శృతి. ఆ మహాసభలో తెలుగు భాష గొప్పతనం మీద అద్భుతంగా మాట్లాడి సతీ సమేతంగా బాపు-రమణ లనీ, సినారే లాంటి వారి పెద్దలనీ ఆకట్టుకుంది. నన్ను పిలిచిన ఆయన పేరు వంగూరి కిషోర్. తణుకులో లాయరు. మా ఇంటి పేరే కాబట్టి వారి పూర్వీకులు కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న సిద్దాంతం గ్రామం అని తెలియగానే ఆయన సహాయంతో నేను, మా పెద్దన్నయ్యా, ఆఖరి చెల్లెలు ఉషారేవతీ, యింకా ఇతర కుటుంబ సభ్యులమూ సిద్దాంతం వెళ్ళాం.

మా పూర్వీకుల స్వగ్రామం చూడడమే కాకుండా కూడా ఆ పెద్దాయన ఇచ్చిన ఫోటోలు, మా దగ్గర ఉన్న మరికొన్ని ఫోటోలూ కూడా పట్టుకెళ్ళి, అక్కడైనా మా ఇంటి పేరు గల వారు ఉంటే, వారి దగ్గర సమాచారం సేకరించి, మా వంశ చరిత్ర తెలుసు కుందామనీ, వీలయితే వ్రాసుకుందామూ అనీ నా కోరిక.  మొత్తానికి సిద్దాంతం వెళ్లి, అక్కడ వంగూరి వెంకట్రామయ్య గారు అనే ఆయన్ని కలుసుకుని ఆయనకీ, మాకూ తెలిసిన వంశ వృక్షం వివరాలనూ పంచుకున్నాం.  నాకు నిరాశ కలిగించిన విషయం అ పెద్దాయన మా అన్నయ్య కి ఇచ్చిన ఫోటో లో ఉన్నవారెవరూ ఆయనకీ తెలియకపోవడం. అన్నట్టు ఆయన కూడా లాయరే!. ఆయన కొడుకూ లాయరే!vanguri2_708400

రెండేళ్ళ క్రితం మా చిన్నన్నయ్య అమెరికా వచ్చినప్పుడు నేనూ, సియాటిల్ లో ఉండే మా రెండో చెల్లెలు అన్నపూర్ణా, లాస్ ఏంజెల్స్ లో ఉండే మా తమ్ముడు హనుమంత రావు ఇంట్లో ఒక వారం రోజులు మా వంశ చరిత్ర సమగ్రంగా రూపొందించే ప్రాజెక్ట్  మీద పని చేశాం. మా వంశ చరిత్ర తో మొదలు పెట్టి నా సొంత డబ్బా కొట్టుకునే స్వార్ధం నాదే అని ఒప్పేసుకుంటున్నాను.  మేము నలుగురం అన్ని వివరాలూ క్రోడీకరించుకుని , అందరిలోకీ నా ఒక్కడికే రచనా వ్యాసంగం మీద ఆసక్తి ఉంది కాబట్టి మా వంశ చరిత్ర కి అక్షర రూపం కలిగించే బాధ్యత నా మీదే పడింది.  వంశ వృక్షం రూపొందించడం, కొన్ని వందల ఫోటోలని ఒక ప్రణాళిక ప్రకారం సమకూర్చడం మా అన్నపూర్ణ కొడుకు..వంశీ (మా మేనల్లుడు) సాంకేతిక సహాయం తో మొదలుపెట్టాము.

కానీ మా అందరి దురదృష్టవశాత్తూ మేము లాస్ ఏంజెలేస్ లో కలుసుకున్న తరువాత నెల తిరగకుండానే అక్కడే తన పెద్ద కొడుకు ఇంట్లో ఉండగా మా చిన్నన్నయ్య హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు. మా తరంలో ఆయన మరణమే మా కుటుంబంలో మొదటిది.  మా చిన్నన్నయ్య పేరు ప్రభాకర మూర్తి రాజు. మా మాతామహుల పేరు. వృత్తి రీత్యా లాయరు. ఆ తరువాత మా పెద్దన్నయ్య గత సంవత్సరం నవంబర్ లో తన 80 వ ఏట కాకినాడలో పోయాడు. ఆయన పేరు సూర్యప్రకాశ రావు. మా పితామహుల గారి పేరు. వ్యవసాయదారుడు. వీరిద్దరూ మా వంశ చరిత్ర మీద చాలా ఆసక్తి ఉన్నవారు. ఇప్పుడు నేను వ్రాస్తున్న ఈ వివరాలు చాలా మటుకు వారిద్దరూ చెప్పినవే. వారికి ఈ వ్యాస పరంపర చూపించే అదృష్టానికి నేను నోచుకోలేదు.

ఇక, క్లుప్తంగా చెప్పాలంటే మా వంగూరి వారి వంశానికి మూల పురుషుడు సుమారు క్రీ. శ. 1650 ప్రాంతాలకి చెందిన సూరప రాజు గారు అని మా పరోశోధనలో తేలింది. ఆయన కుమారులలో ఒకరి పేరు బాపిరాజు గారు. మరొకరైన చిట్టెన్ రాజు గారి పేరే ఎనిమిది తరాలలో నిలబడి నాకు కూడా అదే పేరు పెట్టారు. ఆ చిట్టెన్ రాజు గారి కుమారులైన నందప్ప, రాజన్న, గోపన్న, మల్లప రాజు గార్లలో (సుమారు క్రీ. శ. 1750) మల్లప రాజు గారి సంతతే మేము.

నాలుగవ తరానికి చెందిన చిట్టెన్ రాజు (సుమారు క్రీ. శ. 1780), ఆయన కుమారులు వెంకట రత్నం, సర్వేశం, శంకరయ్య గార్లు. ఇందులో సర్వేశం గారి ఏకైక కుమారులు మళ్ళీ చిట్టెన్ రాజు గారే (సుమారు క్రీ. శ. 1840). ఆరవ తరానికి చెందిన ఈయన మా ముత్తాత గారు. అప్పటి నుంచీ మా వంశ చరిత్ర బాగానే తెలుస్తోంది. క్రీ. శ. 1820 ప్రాంతాలలో సిద్దాంతం గ్రామంలో విపరీతమైన క్షామం సంభవించింది. 1857  లో గోదావరి ఆనకట్ట కట్టిన తరువాత సర్వేశం గారు యానాం-తాళ్ళ రేవు ప్రాంతాలకి వలస పోయారు.  మా ముత్తాత గారు, ఆయన సోదరులు శంకరయ్య గారూ తాళ్ళ రేవు నుండి రంగూన్ కి ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు. కానీ ఆ వ్యాపారం ఫలించక, మా ముత్తాత గారు విశాఖ జిల్లా లోని తొండంగి గ్రామానికి నివాసం మార్చి అక్కడ సర్వేయర్ గా పనిచేసే వారు. ఆయన మొదటి భార్య జగదాంబ గారు 1868 లో ఒక మగ పిల్ల వాడిని కానీ పురిట్లోనే చనిపోయారు. మహాత్మా గాంధీ కూడా మా అదే సంవత్సరం పుట్టడం కేవలం యాదృచ్చికం. ఆ పిల్ల వాడి పేరు సూర్య ప్రకాశ రావు గారు. ఆయనే మా తాత గారు.

జగదాంబ గారు పోయిన తరువాత మా ముత్తాత గారు మళ్ళీ వివాహం చేసుకున్నారు. కానీ, ఆ సవితి తల్లి ఆదరంగా చూడని కారణం వలన మా తాత గారు పదేళ్ళ దాకా స్కూల్ కి వెళ్ళకుండా ఆట పాటల తోటే కాలక్షేపం చేసేవారు. అది చూసి “అయ్యో, శుభ్రంగా చదువుకోవలసిన కుర్రాడు పాడయిపోతున్నాడే” అని ఆయన మేనమామ గారైన కుంటముక్కల హనుమయ్య గారు వారి స్వగ్రామం అయిన దొంతమ్మూరు  (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర) తీసుకెళ్ళి, తాము ధనవంతులు కాక పోయినా మా తాత గారిని స్కూల్ లో చేర్పించారు. అంత ఆలస్యంగా స్కూల్ లో చేరినా, మా తాత గారు స్వతహాగా తెలివైన వారు కాబట్టి కష్ట పడి చదువుకుని , మెట్రిక్ మొదటి రేంక్ లో పాసయ్యారు.  అది చూసి పిఠాపురం రాజా వారూ మా తాత గారికి స్కాలర్ షిప్ ఇచ్చి మద్రాసు లో లా డిగ్రీ చదివించారు. చదువుకునే రోజుల్లోనే మా తాత గారికి తాళ్లూరి వారి ఇంట పుట్టిన ఆదిలక్ష్మీ మాణిక్యాంబ గారితో వివాహం జరిగింది. ఎంతో అందంగా ఉండే మా బామ్మ గారికి నల్లగా ఉండే మా తాత గారి తో పెళ్లి చెయ్యడానికి ఎంతో తర్జన భర్జన పడినప్పటికీ, ఆయనది మహర్జాతకం కాబట్టి మా బామ్మ గారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారుట.

మద్రాసులో లాయర్ డిగ్రీ పూర్తీ చేసుకుని మా తాత గారు కాకినాడలో సుమారు 1905 ప్రాంతాలలో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అతి త్వరలోనే మొత్తం తూర్పు గోదావరి జిల్లాకే ఆయన అగ్రగణ్యుడిగా నిలిచారు.

ఆ రోజుల్లో మా తాత గారు కాకినాడ దేవాలయం వీధిలో నివసించే వారు. వారింటి వెనకాలే మా మాతామహులు నండూరి మూర్తి రాజు గారు, మా అమ్మమ్మ ఉండేవారు. అందుచేత పరిచయాలు ఉండేవి.  పెళ్ళి అయి చాలా కాలమే అయినా మా అమ్మమ్మకి అప్పటికి యింకా పిల్లలు లేరు. కానీ, మా బామ్మ గారికి  అప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. (సుబ్బలక్ష్మి, వెంకాయమ్మ, హనుమాయమ్మ). మా బామ్మ గారికి నాలుగో సంతానంగా నవంబర్ 30, 1907 నాడు  మా నాన్న గారు పుట్టారు. ఆ సమయంలో మా తాత గారు కోర్ట్ లో ఉన్నారు. కొడుకు పుట్టిన కబురు తెలియగానే, ఒక తోటి లాయర్ “ఏమోయ్ , ప్రకాశ రావూ,  ముగ్గురు ఆడపిల్లల తరువాత కొడుకు పుట్టాడు కదా. ఎలా సెలబ్రేట్ చేస్తావూ ?” అని చాలెంజ్ చేసారుట. “సరే, ఈ రోజునుంచీ బారసాల నాటి దాకా నాకు వచ్చిన డబ్బంతా బారసాల కే ఖర్చు పెడతాను” అన్నారుట మా తాత గారు. ఇక చూసుకోండి…అంతవరకు ఫీజులు ఎగ్గొట్టిన వాళ్లందరూ అర్జంటుగా చెయ్యడంతో మొత్తం ఆ పది రోజుల్లోనూ పదమూడు వేల రూపాయలు రాగా, మా తాత గారు అంతా మా నాన్న గారి బారసాల నాడు వెయ్యి మందికి పైగా అన్నదానం కింద ఖర్చు పెట్టారుట. ఈ రోజుల లెక్కలో బహుశా అది కొన్ని లక్షల రూపాయలు అవుతుందేమో!

మా నాన్న గారి తరువాత మా బామ్మ గారికి మరో ఇద్దరు ఆడపిల్లలు (సూర్య భాస్కరం, రంగనాయకమ్మ) పుట్టారు.  అంటే, మా బామ్మ గారికి, తాత గారికీ మా నాన్న గారు ఒక్కరే కొడుకు. ఐదుగురు కూతుళ్ళు(మా మేనత్తలు). మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు  ఒక చిన్న విచిత్రం జరిగింది.  ఆ రోజుల్లో, ఇప్పటికీ కొంత మంది పాటిస్తున్న ఒక ఆచారం లేదా నమ్మకం ఉండేది. అదేమిటంటే, సంతానం లేని వారు బాలింత రాలి చేత తాంబూలం, కాయం తీసుకుంటే పిల్లలు పుడతారుట. ( మా చిన్నపుడు నాకు ఈ కాయం అంటే ప్రాణం. భలే రుచిగా ఉండేది. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు పురుడు పోసుకునే వారు కాబట్టి ప్రతీ రోజూ ఈ కాయం దొరికేది).  మా ఆఖరి మేనత్త పుట్టినప్పుడు , మా అమ్మమ్మ (బాపనమ్మ) మా బామ్మ (మాణిక్యాంబ) గారికి తాంబూలమూ, కాయం ఇచ్చారు.

అప్పుడుమా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు)మా తాత గారు, బామ్మ గారు (సూర్య ప్రకాశ రావు గారు, మాణిక్యాంబ గారు) మా బామ్మ గారు “మీకు అమ్మాయి పుడితే మా అబ్బాయికిచ్చి చేసుకుంటాము” అన్నారుట. ఆ దేవుడి దయ వలనో, ఆ నమ్మక బలమో తెలియదు కానీ. ఏడాది తిరక్కుండానే , ఆగస్ట్ 11, 1916  నాడు మా అమ్మ పుట్టింది. అప్పటికే మా మూర్తిరాజు తాత గారు కాకినాడ వదిలి జేగురు పాడు వెళ్ళిపోయారు. కానీ, మా అమ్మకి పదకొండో ఏట పెళ్లి సంబంధాలు చూడడం మొ

దలు పెట్టినప్పుడు మా బామ్మ గారి మాటలు గుర్తుకి వచ్చి వంగూరి వారి అబ్బాయి కి పెళ్లి అయిందా, లేదా అని వాకబు చెయ్యడానికి మా అమ్మమ్మ తమ్ముడు (పేరు తెలియ

దు. అద్దంకి సూర్యనారాయణ మూర్తి గారు అని నా ఊహ) కాకినాడ వెళ్ళారు.  మా నాన్న గారు కొవ్వూరు లో ఏదో సంబంధం చూడడానికి వెళ్తూ , వెనక్కి వచ్చే దారిలో జేగురు పాడులో మా అమ్మని చూసి, సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆ విధంగా మా అమ్మ నండూరి సర్వలక్ష్మి కే, మా నాన్న గారు వంగూరి వెంకట రామలింగేశ్వర శర్మ గారికీ ఫిబ్రవరి 28, 1926  నాడు వివాహం జరిగింది. 1932  లో మా పెద్దన్నయ్య (సూర్య ప్రకాశ రావు, మా తాత గారి పేరు ) పుట్టుక తో మా తరం మొదలయింది.

ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలనది ఏమిటంటే, ఎంతో బీదరికం అనుభవించి, కేవలం స్వశక్తితో, లాయర్ వృత్తిలో రాణించి, లక్షల కొద్దీ ఆస్తి సంపాదించి, కొన్ని వందల మందిని చదివించి, శక్తికి మించి తృణప్రాయంగా  దాన ధర్మాలు చేసిన మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు, మా బామ్మ గారు మాణిక్యాంబ గారి పుణ్యం ఫలమే ఈనాడు సుమారు  150 పైగా ఉన్న మా సమిష్టి కుటుంబం అంతా అనుభవిస్తున్నాం.  1951 వ సంవత్సరం డిశంబర్ లో ఒకే రోజున పొద్దుట మా తాత గారూ, సాయంత్రం మా బామ్మ గారు సహజ మరణం పొందారు. అప్పుడు నాకు ఆరేళ్ళు. వారిద్దరి వర్చస్సూ , ఆప్యాయతా నాకు ఇప్పటికీ, ఎప్పటికీ, కలకాలం గుర్తు ఉంటుంది.  ఇందుతో వారిద్దరి ఫోటో జతపరుస్తున్నాను. జన్మ జన్మలకీ  వారికి నేను ఋణగ్రస్తుడనే.

 

అలా మొదలయింది…

chitten rajuఅప్పుడెప్పుడో. మూడు, నాలుగేళ్ళ క్రితం పట్టక, పట్టక నిద్ర పట్టినప్పుడు నాకు ఓ కల వచ్చింది. అప్పుడప్పుడు కలలు రావడం పెద్ద విశేషం ఏమీ కాదు కానీ…ఫ్రాయడ్ అనే జర్మన్ మహానుభావుడి సిధ్ధాంతం ప్రకారం ఒకే కల పదే, పదే రావడం చాలా జాగ్రత్తగా గమనించదగ్గదే. కొండొకచో భయపడ దగ్గదే.

ఎందుకో తెలియదు కానీ, పూర్వం రోజులలో లాగా  దేవుడు కలలో కనపడి “ఫలానా చోట అమ్మాయి నీ కోసం పూజలు చేస్తోందీ, వెళ్ళి వరించూ”, లేదా “నా మీద ఒక కావ్యం రాసి నాకు అంకితం ఇయ్యి”, లేదా “ఫలానా వ్రతం చేసుకుంటే నీకు మగ పిల్లాడు పుడతాడు” మొదలైన కలల గురించిన కథలు ఈ మధ్య ఎక్కడా వినడం లేదు. ఆ దేవ దేవలతలకి కూడా ఈ నాటి తెలుగు వారి కలలలోకి వెళ్ళడానికి విసుగొచ్చిందేమో అని నా అనుమానం.

నా కేసులో ఈ ఒకే ఒక కల ఎప్పుడూ తెల్లారగట్టే రావడంతో నాకు మరీ బెంగ పట్టుకుంది. దానికి హిందూ సిధ్ధాంతం ప్రకారం రెండు కారణాలు. ఒకటేమో, తెల్లారగట్టే వచ్చే కలలు నిజమౌతాయిట. అంతకంటే అన్యాయం…ఆ కలలో కనక మన జీవితం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే, ఇంక అంతే సంగతులు…అనగా….మనిషి చచ్చిపోయే ముందు వాడి జీవితం అంతా ఫ్లాష్ బేక్ లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తెర మీద చూపించినట్టు కనపడితే మనం బాల్చీ తన్నేసే సమయం వచ్చేసిందన మాట. నాకు పదే, పదే వస్తున్న ఆ కలల సారాంశం అదే. నేను కాబట్టి సరిపోయింది కానీ ఈ కలల వ్యవహారానికి మరొకరు ఎవరైనా గుండె ఆగిపోయి టపా కట్టేసే వారు.

నాకు ఇలాంటి కలలూ-వ్యక్తులపై వాటి ప్రభావమూ మొదలైన వాటి మీద ఎక్కువ నమ్మకం లేదు, పైగా నేను చెయ్యవలసిన పనులు చాలానే ఉన్నాయి. కానీ నా జీవితంలో తారసపడిన వ్యక్తులూ, జరిగిన సంఘటనలూ ఆ కలలో కనపడీ కనపడనట్టు నా ఒక్కడికీ కనపడి ఠపీమని మాయమై పోవడం నచ్చ లేదు. అంచేత కోపం వచ్చి, అవన్నీ నేనే రాసి పెట్టుకుంటే, నిద్ర పట్టనప్పుడు చదువుకుని జ్ఞాపకం తెచ్చుకోవచ్చును కదా అనే ఆలోచన వచ్చింది. మన జీవితం గురించి మనమే రాసి పారేసుకుంటే దాన్ని ఆత్మ కథ అంటారుగా, ఇంతోటి నా ఆత్మ కథ నాకు తెలిసిన ఇంకెవరికైనా కావాలా అనే ప్రశ్న నాకు నేనే వేసుకున్నాను. ఇంకెవరికీ అక్కర లేక పోయినా, నాకే అది కావాలి కదా….అసలు జీవితంలో ఏం పొడిచేశాం అని బేరీజు వేసుకోవడంలో తప్పు లేదు కదా అని కూడా అనుకున్నాను.

తీరా “ఆత్మ కథ” రాసుకుందాం అనే ఆలోచన రాగానే “ఏ ఆత్మ కథా?” అనే ప్రశ్న ముందుకొచ్చింది.

ఎందుకంటే మొదటిదేమో నేనూ అందరిలాగానే నా ప్రమేయం ఏమీ లేకుండానే పుట్టాను, పెరిగాను, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, బుద్ధిగా సంసారం చేసుకుంటున్నాను ఎట్సెటరా. మనలో 99 శాతం ఇలాంటి బాపతే. ఎందుకు పుడతారో తెలియదు. పోయాక ఎక్కడికి పోతారో అంతకంటే తెలియదు.

ఇక రెండోదేమో అందరిలో కొందరిలా నేను కూడా కాస్తో, కూస్తో చదువుకున్నాను, ముందు ఉద్యోగమూ, తరువాత వ్యాపారమూ చేసి, కాస్తో, కూస్తో డబ్బు సంపాదించి, అందరిలో కొందరిలో కొందరిలా కాకుండా ఆ డబ్బు నిలబెట్టుకోలేక పోయాను. అలా లాభసాటి వ్యాపారం చేసినా డబ్బు నిలబెట్టుకోలేకపోవడాన్ని “బేపన వ్యాపారం” అంటారుట. దానికి నేనే ఉదాహరణ. ఇక్కడో ఒక జోకు గుర్తుకొస్తోంది. ఎవరో మరొకర్ని “బ్రామ్మడి చేత ఒక మిలియన్ డాలర్ల వ్యాపారం ఎలా చేయించాలీ?” అని అడిగాడుట. “దానికేముందీ, వాడి చేతిలో బాగా నడుస్తున్న పది మిలియన్ల వ్యాపారం పెట్టి నడిపించమంటే నెల తిరక్కుండా దాన్ని ఒక మిలియన్ చేసేస్తాడు” అని చమత్కారం.

మరి మూడో ఆత్మకథేమో…అందరిలో కొందరిలో మరి కొద్ది మందే ఉండే తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టాను, కథలు వ్రాశాను, రాయించాను. వాటిని కథలు అనకూడదనే వాదనలూ విన్నాను. నాటకాలాడాను. ఆడించాను. అయినా రిటైర్ అయిపోకుండా నా సొంత సుత్తితో చాలా మందిని చావగొడుతున్నాను.

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

మా తాత గారు నండూరి మూర్తి రాజు గారు

ఇక, నేను బొంబాయి ఇండియన్ ఇన్సిస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ  (IIT, Bombay) లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారి ప్రభావంతో ప్రముఖ ఆర్ధిక శాస్త్రవేత్త ఇ. ఎఫ్. షుమాకర్ గారి “Small is Beautiful” పుస్తకంలో ప్రతిపాదించిన సిధ్ధాంతాలకి అనుగుణంగా కొందరితో కలిసి సంస్థాపించిన “Appropriate Technology Unit” ద్వారా మహారాష్ట్ర లో గ్రామ సమాజ సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఈ నాటి వరకూ కాస్తో, కూస్తో సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తున్నాను. బొంబాయిలో ఆ నాటి నా శిష్యులలో ఈ నాటి ప్రముఖులు కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్, InfOsys వారి నందన్ నిలేకానీ, మరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. ఇలాంటి వ్యాపకం మీద మాత్రమే వ్రాస్తే అది నా “నాలుగో ఆత్మ కథ” కిందకి వస్తుంది కదా!

ఇలా అనేక రకాల “ఆత్మ ఘోషలు” నాకు ఉన్నప్పుడు, దేని గురించి వ్రాయాలీ? ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం లేక, గొప్పవాళ్ళలా పెద్ద, పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా నాకు తోచిన అంశాల మీదా, వ్యక్తుల మీదా, సంఘటనల మీదా తోచినది తోచినట్టు వ్రాసుకుందామని అనుకుంటున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఏనాడూ, ఎప్పుడూ డైరీ రాయలేదు. రోజూ డైరీ వ్రాసుకున్న వాళ్ళే ఆత్మ కథ వ్రాసుకోవాలి అనే రూలూ లేదు. అందుచేత తారీకులూ, పేర్లూ, సంఘటనలూ కేవలం నా బుర్రలో ఉన్న మట్టి పదార్ధం లో అట్టడుగున జ్ఞాపకాల దొంతర్లలో ఎక్కడో దాక్కున్న వాటిని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని వ్రాస్తున్నవే కానీ…చరిత్రలో నిక్షేపించే సత్తువ లేనివే!

ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇవి కేవలం నా జ్ఞాపకాలే! నా కోసం నేను వ్రాసుకున్నవే అని స్పష్టంగానే విన్నవిస్తున్నాను. ఆ మాట కొస్తే “అశోకుడు బాటకిరుపక్కలా వృక్షములు నాటించెను” అనేది ఎవరు చూశారు? దాన్ని ఎంత నమ్ముతున్నామో, నా జ్ఞాపక శక్తిని  కూడా అంతే నమ్ముకుంటాను.

చెప్పొద్దూ, నా జీవితంలో మొట్టమొదటి పరీక్ష నేను బాగానే పాస్ అయ్యాను. అంటే, బతికి బయట పడ్డాను అనమాట. ఇదెందుకు చెప్పవలసి వస్తోందంటే, నేను పుట్టినప్పుడు కవల పిల్లలంట. పుట్టగానే కుయ్, కయ్ అనడం కానీ, కాళ్ళూ, చేతులూ తప తపా కొట్టుకోవడం కానీ మా ఇద్ద్దరు నలుసులకీ లేక పోవడంతో మా అమ్మకి మొత్తం పదకొండు పురుళ్ళు పోసిన ఎరకల సత్తెమ్మ మమ్మల్ని బతికించడానికి తనకి తోచిన పధ్ధతులు..అనగా..లాగి లెంపకాయ కొట్టడం, నోట్లో వస పొయ్యడం లాంటి చిట్కాలు ప్రయోగించింది. దాంతో నేను కేరు, కేరు మని ఏడ్చి రాగాలు పెట్టి అందరినీ సంతోషపెట్టినా, నా తోటి వాడు చేతులెత్తేసి దేవుడి దగ్గరకి పారిపోయాడు. “వాడు కూడా బతికి ఉంటే, మా జంట ధాటీకి తట్టుకోలేక ఈ లోకం ఏమైపోవునో కదా!” అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

నేను కాకినాడలో బతికి బయట పడ్డాను అని తెలియగానే అదే రోజు అక్కడ జర్మనీలో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మరొక ఆరు నెలలలో జపాన్ లో ఆటంబాంబు పేలింది. రెండో ప్రపంచ యుధ్దం ఆగిపోయింది. ఆ ఏడే రేడియో అన్నయ్య, అక్కయ్య, “చిన్న పిల్లల కోసం ఇద్దరు పెద్దలు” అనుకుంటూ “బాల” పత్రిక మద్రాసులో మొదలుపెట్టారు…ఆ “బాల” పత్రికలోనే ఆ యేడే ముళ్ళపూడి గారి మొదటి రచనా, బాపు గారి మొదటి బొమ్మా ప్రచురించబడ్డాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు తెలుగు జాతి అంతటికీ. అప్పుడే పుట్టిన నా మీద కూడా ఆ దేవతల ఆశీర్వచనం పువ్వులు ఒకటో, రెండో, కొన్ని అక్షింతలూ పడే ఉంటాయి. లేక పోతే ఇవాళ ఈ వ్యాసం వ్రాయగలిగే అదృష్టానికి నోచుకోగలుదునా.?

ఆ నెలలోనే అంతకు వందల సంవత్సరాల ముందు ఇంగ్లండ్ లో షేక్స్ పియర్ అనే ఆయన పుట్టాడు. నేను పుట్టిన పాతికేళ్ళకి, అదే తారీకున  జెర్రీ సైన్ ఫెల్డ్ అనే అమెరికన్ కమేడియన్ పుట్టాడు. ఇవన్నీ కాస్సేపు గూగుల్ చేసి చదువుకుంటే మంచి ఫీలింగే వచ్చింది. కానీ, సరిగ్గా నేను పుట్టిన నాడే, ఆంటే అదే ఏడూ, అదే తారీకున ఏ ఒక్క తలమాసిన గొప్పవాడూ పుట్ట లేదు….నేనొక్కడినే ఆ “దడిగాడు వానసిరా”. “Your birth may be common, but, death will be history” అనే నానుడి నాకు భలే ఇష్టం.

మా అమ్మ పుట్టిల్లు కాకినాడ-రాజమండ్రిల దగ్గర ఉన్న పాలతోడు గ్రామం అయినా పక్కనే ఉన్న జేగురు పాడు లో మేనమామల ఇంట పుట్టింది. ఇరవై, ముఫై ఏళ్ళ క్రితం అక్కడ గోదావరి బేసిన్ లో “గాస్” ఉన్నట్టు ప్రభుత్వం వారు కనుక్కుని, ఆ తరువాత ప్రెవేటు కంపెనీ వారు రసాయనం ఫేక్టరీలు పెట్టే దాకా ఆ ఊరి పేరు ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రం ఆ ఊరు వెళ్ళిన గుర్తు.

కానీ పదేళ్ళ క్రితం పని కట్టుకుని నేనూ, మా పెద్దన్నయ్యా, మూడో అన్నయ్యా,  చెల్లెళ్ళూ కాకినాడ నుంచి ప్రత్యేకంగా నాకు వరసకి మేనల్లుడు అయ్యే అద్దంకి సుబ్బారావు కుదిర్చిన టాటా సుమో లో జేగురు పాడు వెళ్ళాను. వెళ్ళి అనేక కారణాలకి ఆశ్చర్య పోయాను, ఆనందపడ్డాను. ఊళ్ళోకి అడుగుపెట్టగానే, ఎక్కడ చూసినా “గ్రీన్ విలేజ్” “పర్యావరణాన్ని కాపాడండి”. Save Earth” లాంటి బోర్డుల తో అమెరికాని మించి పోయిన అవగాహన, ఆచరణ నాకు ఆ చిన్న పల్లెటూరులో కనిపించాయి. మొత్తం గ్రామం చుట్టుపక్కల అంతా పచ్చటి పొలాలతో సస్యశ్యామలంగా ఉంది. ఉన్న పది రోడ్లూ చాలా చిన్నవి అయినా పూర్తిగా సిమెంట్ రోడ్లతో, అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. అక్కడ మా అమ్మ పుట్టింటికి వెళ్ళే రోడ్డు మీద మేము వెళ్ళిన కారు పట్టక, ఎక్కడో పార్క్ చేసుకుని నడిచి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వరసకి చిన్నాన్న అయే చంటి నాన్న, భార్య, కూతురు ఎంతో ఆప్యాయంగా ఆ మండువా ఇంట్లోకి ఆహ్వానించారు.

ఇంటి ముందు రెండు అరుగులూ, గుమ్మం దాటగానే చెట్ల మధ్యన మండువా…అమెరికాలో దాన్ని పెద్ద ఫేషనబుల్ గా Atrium అంటారు…వెనకాల వేపు ఒక వరండా, రెండు గదులు, పక్కనే వంటిల్లు, వెనక గుమ్మంలోంచి మా అమ్మ ఇతర బంధువులైన భాస్కర మూర్తి గారి ఇల్లు….నేను ఐదారేళ్ళప్పుడు చూసిన, ఆడుకున్న ఆ దృశ్యాలన్నీ మళ్ళీ కళ్ళకి కట్టినట్టు కనపడ్డాయి. మా చంటి నాన్న వెనకాల ఒక గదిలోకి అందరినీ తీసుకెళ్ళిన నాతో “ఒరే, అమెరికాయ్. ఇదుగో ఈ గదిలోనే మీ అమ్మ పుట్టింది” అని ఒక గదీ, అందులో ఒక నులక మంచం చూపించాడు. నేను అవాక్కయిపోయాను. అసలు ఇటువంటి సంఘటన నేను ఊహించనే లేదు.

ఎందుకంటే, ఆ గది, బహుశా ఆ మంచమూ మా అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండి ఉంటాయి. మా అమ్మ అక్టోబర్ 8, 1916 రోజున ఆ గదిలో పుట్టింది. అంటే నేను ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ మార్చ్  27, 2013 రోజుకి 97 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏప్రిల్, 1999 లో పోయింది. …అవును…నేను పుట్టిన రోజు నాడే..ఏప్రిల్ నెలలోనే…ఎనభై మూడేళ్ళ వయసులో. అప్పుడు నేను  అమెరికాలో “మహద్భాగ్యం” అనుభవిస్తున్న కారణాన్న పదో రోజుకి కానీ వెళ్ళ లేక పోయాను. కనీసం అటువంటి సమయాలలో దానిని “అమెరికాలో దౌర్భాగ్యం” అనుభవిస్తున్నాను అని అనుకోవాలి.

1916 లో మా అమ్మ పుట్టిన ఆ చిన్న గదిని చూసి నేను అదోలా అయిపోతుంటే….మా చంటి నాన్న…”ఒరేయ్ రాజా…మొన్న దేనికోసమో అటకలో వెతుకుతూ ఉంటే ., ఇదిగో ఈ కాగితాలు కనపడ్దాయి. ఇవి మీ తాత గారి చేతి వ్రాతలో ఉన్న “శ్రీ రామలింగేశ్వర శతకం” వ్రాత ప్రతి. మొత్తం 15 పేజీలు, 108 పద్యాలూ. ఇక్కడే ఇండియాలో ఉంటే చెదలు పట్టేస్తాయి. అమెరికా తీసుకుపో” అని ఆ కాగితాలు నా చేతిలో పెట్టాడు. అవి ముట్టుకుంటే నుసి, నుసిగా అయిపోతున్నాయి. ఎందుకంటే మా తాత గారు అవి వ్రాసిన సంవత్సరం సుమారు 1904 .అంటే ఇప్పటికి నూట తొమ్మిది సంవత్సరాల క్రితం. ఆ శతకంలో మొదటి పేజీ ఇందుతో జతపరుస్తున్నాను. తమ పూర్వీకుల సాహిత్య కృషిని పదిల పరుచుకునే అవకాశమూ, అభిలాషా, దేవుడి అనుగ్రహమూ ఎంత మందికి కలుగుతుందో కదా! ఆ అదృష్టం ఉన్నవారిని ఆ అపురూప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నా విన్నపం. మన సంస్కృతిని కాపాడుకోవడం అంటే అదే!

vanguri3 (2)

ఈ పై సంఘటన నిజంగానే….Deja Vu All over agian.”. ఎందుకంటే మా అమ్మ చనిపోవడానికి ఐదారేళ్ళ ముందు నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఇంచుమించు సరిగ్గా అవే మాటలు..అంటే “ఒరేయ్ ఇవి ఇండియాలో ఉంటే చెదలు పట్టిపోతాయి. నువ్వు అమెరికా పట్టికెళ్ళి దాచుకో. మన వంశంలో నా పుట్టింటివారైన నండూరి వారి వేపూ, వంగూరి వారైన అత్తారింటి వేపూ ఎన్ని తరాలు చూసినా మొదట మా నాన్న గారు..అంటే మీ తాత గారికీ, ఆ తరువాత నీకూ మాత్రమే రచనా వ్యాసంగం అబ్బింది.” అంటూ కొన్ని అచ్చు పుస్తకాలూ, కొన్ని వ్రాత ప్రతులూ నా చేతిలో పెట్టింది. మా అమ్మమ్మ పేరు బాపనమ్మ. వారికి మా అమ్మ ఒక్కర్తే సంతానం. అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఎవరూ లేరు. మా అమ్మ పేరు సర్వలక్ష్మి. కానీ పుట్టింట్లో అందరూ ’సరప్ప” అనే పిలిచేవారు. ఇప్పుడు మాకు మా అమ్మ వేపు మరీ దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. చంటి నాన్న లాంటి ఉన్న అతికొద్ది మందికీ ఇప్పటికీ నేను సరప్ప కొడుకునే!

క్లుప్తంగా చెప్పాలంటే, మా తాత గారైన నండూరి మూర్తి రాజు గారు కాకినాడ పి.ఆర్. కాలేజీలోనూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుంచి 1904 లో బి.యే. పట్టాతీసుకున్నారు. అప్పటి చెన్న పట్నం రాజధానిగా ఉన్న మొత్తం దక్షిణాది రాష్టానికి తెలుగులో ఆయనకి స్వర్ణపతకం లభించింది. తరువాత న్యాయవాదిగా చదువుకుందామనుకున్నా, అయన తండ్రిగారైన సోమరాజు గారు అది “అన్యాయ వ్యాపార వృత్తి” అని అభ్యంతర పెట్టగా నెలకి రెండు రూకల స్వల్ప జీతానికి కాకినాడ  రెవెన్యూ శాఖలో ఉద్యోగానికి కుదురుకున్నారు. తెలుగు భాషాభిమాని, గ్రాంధిక వాది కావడంతో తీరిక సమయంలో శుక్తి మతి, జపాను దేశ చరిత్ర మొదలైన గ్రంధాలు తొలి దశలో రచించారు. వివేకానందుడి ఆంగ్ల ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి గవర్నర్ గరి చేత ఐదు కాసుల బంగారం బహుమానం పొందారు. ఆర్య మత బోధిని, వివేకోదయము మొదలైన పత్రికలలో వ్యాస పరంపర, అనీబిసెంటమ్మ ఇంగ్లీషులో వ్రాసిన రామాయణం ఆంధ్రీకరణ , షేక్స్ పియర్ హేమ్లెట్ నాటకం తెలుగు అనువాదం, 28 పాత్రలతో సావిత్రీ సత్యవంతం నాటకం, 16 పాత్రలతో విమలాప్రభాకరం అనే సాంఘిక నాటకం, వనజాక్షి అనే శృంగార ప్రబంధం, అమల వర్మ ఆనే నవల మొదలైన గ్రంధాలు ఆయన సుమారు పదేళ్ళలో రచించారు. వాటిల్ల్లో కొన్ని ఆయన మరణించిన తరువాత ముద్రించబడ్డాయి. ఆయన పుస్తకాలు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని గ్రంధాలయాల్లో ఇప్పటికీ కనపడతాయి. ఆయన చేతివ్రాతలో ఉన్న రెండు వందల పేజీలూ, ఐదు ముద్రించబడిన పుస్తకాలూ ఇప్పుడు నా దగ్గర హ్యూస్టన్ లో ఉన్నాయి. అందులో నా దగ్గర శిధిలావస్థలో ఉన్న “విమలాప్రభాకరం” నాటకం ముఖపత్రం ఇందుతో జతపరుస్తున్నాను. ఆయన రచనలన్నీ గ్రాంధికాలే!

విమలా ప్రభాకరము

విమలా ప్రభాకరము

మా అమ్మ పుట్టిన తరువాత ఆయనకి ఒక మగపిల్లవాడు ఎంతో ఆరోగ్యంగానే పుట్టాడు. ఆ సమయంలో మా తాత గారికి మన్యం ప్రాంతాలకి బదిలీ అయింది. అక్కడ ఉన్నది నాలుగు నెలలే అయినా ఆయనకీ అక్కడ విషజ్వరం సోకి మళ్ళీ కాకినాడ వచ్చెయ్యగానే ఆరోగ్యవంతుడూ, దృఢకాయుడూ అయిన మూడేళ్ళ కొడుకు హఠాత్తుగా చనిపోయాడు. అది జరిగిన ఇరవై రోజులకి మా తాత గారు జేగురు పాడులో, 1920 లో అకాల మరణం పొందారు. అప్పుడు మా అమ్మ వయసు నాలుగేళ్ళు మాత్రమే. అందు చేత ఆయన ఎలా ఉంటారో మా అమ్మకి గుర్తు లేదు.

మా తాత గారు పోయినప్పటినుంచి మా అమ్మమ్మ మాతోనే ఉండి 1970 దశకంలో నేను బొంబాయిలో ఉండేటప్పుడు మరణించింది. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు, ఇంకా మా ఇంట్లోనే పెరిగిన యాభైకు  పైగా పిల్లలందరికీ ఆవిడే అమ్మమ్మ. మా మూర్తి రాజు తాత గారిది ఒకే ఒక్క ఫొటో మాత్రం మా ఇంట్లో ఉండేది. అది కూడా నిజానికి ఫొటో కాదు. తాశీల్దారు గా ఆయన పెయింటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టిన porttrait కి తీయించిన ఫొటో. దానిని ఇందుతో జతపరుస్తున్నాను. మా వంశంలో ఇంకెవరికీ లేని, రాని రచనావ్యాసంగం అబ్బిన ఆయనకీ  నాకూ భౌతికంగా పోలికలు నిజంగా ఆశ్చర్యకరమే!

మరొక యాదృచ్చికమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…..మా నాన్న గారి పేరు రామలింగేశ్వర శర్మ గారు. మా తాత గారు “శ్రీ రామలింగేశ్వర శతకం” రచింఛేటప్పటికి మా నాన్న గారు పుట్ట లేదు. కానీ కాకినాడలో మా అమ్మగారి నండూరి వారికుటుంబం, మా వంగూరి కుటుంబమూ దేవాలయం వీధిలో ఉండేవారు. ఆ విధంగా ఆ రెండు కుటుంబాలకీ స్వల్ప పరిచయం.

మా అమ్మ నాలుగో తరగతి వరకూ చదువుకుంది. తెలుగు పుస్తకాలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వచ్చును. మా అమ్మమ్మకి సంతకం పెట్టడం వచ్చును. ఇదీ మా తాత గారి దగ్గరనుంచి నాకు కాస్తో, కూస్తో వచ్చిన ఆస్తి “సాహిత్య జెన్యు సంక్రమణం”.

నా సాహిత్య ప్రయాణం అను సొంత సుత్తి!

chitten rajuసుమారు నలభై ఏళ్ళు–అమ్మ బాబోయ్…అంత సీనియర్ నా???

ఆ మాట తల్చుకుంటేనే భయం వేస్తోంది…అన్నేళ్ళయిందా మొదటి రచన చేసి?

“రమణ రాత-బాపు గీత” కాంబినేషన్ లో “ఇడ్లీ కన్న పచ్చడే బావుంది ఫేమ్ మొట్టమొదటి సారిగా వచ్చిన సంవత్సరమే నేను మంచి సాహిత్య వాతావరణం ఉన్న కాకినాడలో పుట్టి పెరిగాను.  అందుకేనోమో ఇంత ఇది!

చిన్నప్పుడు తెలుగూ-గిలుగూ ఎక్కువగా పట్టించుకోక పోయినా, అక్కడ 1966లో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకుని ఆంధ్రదేశం వదిలి అక్కడెక్కడో ఉన్న బొంబాయిలో, అనగా పరాయి రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే తెలుగు భాషలో ఉన్న రుచీ, ఔన్నత్యం, సరదా అన్నీ అర్జంటుగా తెలిసొచ్చాయి. తెలుగు భాష, సాహిత్యాలపట్ల మక్కువ కూడా అంతకంటే అర్జంటుగా పెరిగిపోయింది. ఇలా లాభం లేదని కేంపస్ లో పది మంది లోపే ఉన్న తెలుగు కుర్రాళ్ళమూ,  ప్రొఫెసర్లు గా ఉన్న మరొక పాతిక మంది కుటుంబాలూ  కలిసి ఒక తెలుగు సంఘం పెట్టుకున్నాం. మొదటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా చిన్న నాటకం వేస్తే బావుంటుంది అనుకున్నాం. కానీ ఎవరి దగ్గిరా నాటకం పుస్తకాలు లేవు. అప్పుడు టి.పి. కిషోర్ గాడు “గురూ, నువ్వే ఏదో ఒక నాటకం రాసేస్తే పోలా !” అని జోక్ చేశాడు.

అది సీరియస్ గా తీసుకుని అప్పుడు (1967) వ్రాసినదే ప్రపంచంలో చాలా చోట్ల ప్రదర్శించబడిన నా మొదటి సరదా నాటిక “బామ్మాయణం అనే సీతా కళ్యాణం”. “నువ్వు రాయగలవేమో కానీ, నటించడానికి బొత్తిగా పనికి రావు” అని ఆ నాటకాన్ని డైరెక్ట్ చేసిన జె. చంద్ర శేఖర్ (చందూ) గాడు  నేను రాసిన నాటకంలోనే నాకు వేషం ఇవ్వ లేదు.  ఆ కిశోర్ హఠాత్తుగా చనిపోయి చాలా ఏళ్ళయింది. చందూ జేసీ గా ఐ.ఐ.టీ లోనే  ప్రొఫెసర్ గా రిటైర్ అయి, ఇప్పుడు గోవాలో ఉంటున్నాడు అని విన్నాను. బొంబాయిలో నా ఇతర తెలుగు సాంస్కృతిక మిత్రులు కొందరితో ఇంకా “టచ్” లో ఉన్నాను.

ఆ రోజుల్లోనే బొంబాయి I.I.T లో చాలా మంది అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నేను మటుకు “చస్తే అమెరికా వెళ్ళను” అని భీష్మించుకుని కూచునే వాణ్ణి. కానీ ఒక రోజు రామ్ కుమార్ వచ్చి, ఆ మాటా, ఈ మాటా చెప్తూ. “గురూ, ఇక్కడ సంతకాలు పెట్టూ” అని నా చేత ఏవేవో అప్లికేషన్స్ మీద దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది తను అమెరికా గ్రీన్ కార్డ్ కి అప్లికేషన్ పెడుతూ, ఇద్దరి ఫీజులూ నా చేతే కట్టించడం కోసం  మాత్రమే నా చేత కూడా అప్ప్లై చేయించాడూ అని. అతని ధర్మమా అని 1968లో నే అమెరికన్ కాన్సలేట్ వారు మా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి స్వయంగా వచ్చి, నన్ను మెచ్చి, గ్రీన్ కార్డ్ ఇచ్చినా నేను పట్టించుకో లేదు.

కానీ ఆరేళ్ళు అక్కడే లెక్చరర్ గా ఉద్యోగం వెలగబెడుతూనే 1974, అక్టోబరులో నా డాక్టరేట్ పూర్తి చేశాను. “తరవాత ఏం చేద్దాం?” అనుకోగానే, అమెరికా ఎలా ఉంటుందో చూసొస్తే పోలే? అని సరదాగా, గ్రీన్ కార్డ్ తో సహా అమెరికాలో అడుగుపెట్టాను. అప్పుడు షికాగో లో ఉన్న మా తమ్ముడి దగ్గర నాలుగు రోజులు ఉండి ” టెక్సాస్ లో  ఎకానమీ బావుంది సుమా” అనుకుని, నలుగురు మిత్రులం ఒక డొక్కు కారులో రాత్రికి రాత్రి హ్యూస్టన్ వచ్చేశాం ఉద్యోగాల కోసం.

రాగానే, ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరిపోయాను. అప్పుడు హ్యూస్టన్ లో తెలుగు అస్ఖ్హలిత బ్రహ్మచారులం అర డజను మందీ, సంసారులు పాతిక మందీ ఉండే వారు. అంటే ఈ ఇక్కడ కూడా బొంబాయి లాంటి పరిస్థితే అన్న మాట. అంటే, తెలుగు వారు తక్కువ, తెలుగు జపం ఎక్కువ. యథాప్రకారం పండగలూ, పబ్బాలూ చేసుకుంటున్నా, “శాస్త్రోక్తంగా”  ఒక తెలుగు సంస్థ ఉంటే బావుంటుంది అని అందరం ఆలోచించుకుని తెలుగు సాంస్కృతిక సమితి ని హ్యూస్టన్ లో 1977 లో మొదలుపెట్టాం. అప్పటికి అమెరికాలో న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో లాంటి ఐదారు నగరాలలో మాత్రమే తెలుగు సంఘాలు ఉండేవి.

1977 లో మేము జరుపుకున్న ఉగాది కార్యక్రమంలో నేను బొంబాయిలో రాసిన మొట్ట మొదటి నాటకం “బామ్మాయణం” ప్రదర్శించాం. నాకు తెలిసీ అమెరికాలో ప్రదర్శించబడిన తొలి తెలుగు నాటకమూ, ఇంచుమించు అమెరికాలో అన్ని నగరాలలోనూ ప్రదర్శించబడిన “సరుకు ” లేకపోయినా సరదాగా ఉన్న తెలుగు నాటకమూ అదే! అతి త్వరలోనే హ్యూస్టన్ లో నేను వ్యవస్థాపక సంపాదకుడిగా “మధుర వాణి” అనే సంస్థాగత సాహిత్య పత్రిక మొదలుపెట్టాం. ఆ పత్రిక తొలి సంచికలో ప్రచురించడానికి ఎక్కువ సాహిత్యం సరుకు లేక పోయినా నా  మొట్టమొదటి కథ “జులపాల కథ” వ్రాసాను. అనగా హ్యూస్టన్ లో అడుగుపెట్టిన తరవాతే నా మొట్టమొదటి కథ రాశానన్న మాట. ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకున్న చిన్న కథ అది. ఇటీవలే గొల్లపూడి వారు హెమ్. టీవీ. లో నిర్వహిస్తున్న “వందేళ్ళ కథకు వందనాలు” అనే శీర్షిక కోసం ఈ కథని వారు పరిచయం చేశారు. టీవీ లో అది త్వరలోనే ప్రసారం అవుతుందట.

1977లోనే న్యూయార్క్ లో జరిగిన మొదటి అమెరికా తెలుగు మహాసభలకి చిన్న సైజు నిర్వాహకుడిగానూ, అమెరికా, కెనడాలనుంచి ఏడుగురు “తానా” సంస్థాపక డైరెక్టర్లలో ఒకడిగానూ వ్యవహరించడం జరిగాయి. వెనునెంటనే స్వర్గీయ కిడాంబి గారూ, చెరుకుపల్లి నెహ్రూ గారూ “తానా పత్రిక” ప్రారంభించి, ఆ తరువాత చాలా సంవత్సరాలు నన్ను సంపాదక మండలిలో చేర్చుకున్నారు. సుమారు పదేళ్ళ పాటు నేను రాసే కథలూ, కమామీషులూ మా “మధుర వాణి” లోనూ, తానా పత్రిక లోనూ, సావనీర్ ల లోనూ ప్రచురించబడేవి. నా రచనా వ్యాసంగంలో ఒక ప్రధాన ఘట్టం 1981లో “మహాకవి” శ్రీ శ్రీ గారు మా హ్యూస్టన్ రావడం, మా ఇంట్లో ఉన్న వారం రోజులలోనూ, “సిరి సిరి మువ్వలు”, ప్రాసక్రీడలు”, “లిమరిక్కులు” అనే మూడు శతకాలను “సిప్రాలి” అనే పేరుతో తన స్వదస్తూరీతో వ్రాసి, ఆ పుస్తకాన్ని ప్రచురించే అదృష్టాన్ని నాకు కలిగించడం, అప్పటికి నేను వ్రాసిన నాలుగైదు కథలూ చదివి “నీకు సొంత శైలి ఉందయ్యా, అది కాపాడుకో, ఎవరినీ అనుకరించకు” అని హిత బోధ చెయ్యడం, అంతే కాక నేను ఎప్పటికైనా నా నాటికల సంకలనం పుస్తకరూపేణా వేస్తానని ఊహించి, “రంగం మీద శ్రీరంగం” అనే మకుటంతో ముందు మాట వ్రాసి ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు సాహిత్య స్ఫూర్తిని ఇచ్చిన గొప్ప అనుభవం.

నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 1981 నాటి “సిప్రాలి” బహుశా అమెరికాలో మొదటి పుస్తక ప్రచురణ….అది వ్రాత ప్రతి. అలాగే “రంగం మీద శ్రీరంగం” శ్రీ శ్రీ గారు వ్రాసిన నాటికల పుస్తకాలకు వ్రాసిన ఏకైక పీఠిక. ఆలాగే అనేక మంది ప్రముఖులు, కవి పుంగవులూ, రచయితలూ మా ఇంట్లోనే బస చెయ్యడం వలన ఈ సాహిత్యం వాసన నా వంటినిండా పులుము కుంది.

1975-95 నాటి ఇంటర్నెట్ ముందు యుగంలో అమెరికా సాహిత్య వాతావరణంలో ఇంచు మించు అన్ని నగరాలలోనూ ఐదారుగురు రచయితలూ, మరి కొందరు సాహిత్యాభిమానులూ ఉండే వారు. ఇంచుమించు అందరూ స్థానిక సంస్థాగత పత్రికలో కథలు, కమామీషులూ వ్రాయడం, తానా, ఆటా మహాసభల సావనీర్లకి వ్రాయడం మాత్రమే చేసేవారు. నేను కూడా ఈ కోవకి చెందిన రచయితనే. నేను వ్రాసిన మొదటి పాతిక కథలూ ఎవరో ఒక సంపాదకుడు గారు నా నెత్తి మీద కత్తి పెట్టి, డెడ్ లైన్ పెట్టి వ్రాయించినవే! కానీ అప్పటికే తానా, ఆటాలు కానీ, స్థానిక తెలుగు సంఘాల లోనూ కులప్రాధాన్యతలు పెరగడం…మెల్ల మెల్లగా అవి సాంస్కృతిక సంఘాల బదులు రాజకీయ సంఘాలుగా మారుతూ ఉండడంతో రాజకీయ నాయకులకీ, సినిమా తారలకీ ప్రాధాన్యత పెరిగిపోయి, సాహితీవేత్తలకి ఇవ్వవలసిన ప్రాధాన్యత తరిగి ఫోయింది. ఆ తిరోగమనాన్ని గమనించి, కేవలం తెలుగు సాహిత్య పోషణ ఏకైక లక్ష్యంగా 1994 లో మేము స్థాపించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక కొత్త మలుపు తిప్పిందని సగర్వంగానే చెప్పుకోగలను.

ఈ సంస్థ అమెరికా రచయితలకి మాత్రమే 1995 లో ప్రారంభించిన ఉగాది ఉత్త్తమ రచనల పోటీలు, అమెరికా తెలుగు కథానికా సంకలనం మొదటి సంకలనం, ముఖ్యంగా అట్లాంటా లో మేము నిర్వహించిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు అమెరికా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక స్పష్టతనీ, తమదే అయిన ఒక గుర్తింపునీ తెచ్చిపెట్టాయి. తొంభైలలో నడిచిన SCIT, “తెలుసా” లాంటి ఇంటర్నెట్ చర్చా వేదిక ఇంటర్నెట్ తెలిసిన రచయితలకి “సునాయాస” వేదికగా  మంచి చేసినా, నియంత్రణ లోపాల కారణంగా విలువ తగ్గిపోయింది. వంగూరి ఫౌండేషన్ స్థాపించిన కారణాలని బహుశా అపార్ధం చేసుకున్న వారి చేత ఆ వేదికలో నేను వ్యక్తిగతంగా తిన్నన్ని తిట్లు ఎవరూ తిని ఉండరు. ఆ వేదిక వలన అంచెలంచెలుగా రూపొందిన సాహిత్య సామంత రాజ్యాలే ఆ తరువాత వచ్చిన ఇంటర్నెట్ వేదికలూ, కొన్ని వెబ్ పత్రికలూ “గేటేడ్ కమ్యూనిటీ” గా రూపొందడానికి దారి తీశాయి అని నా అభిప్రాయం. ముఖ్యంగా, అమెరికాలో “మంచి విమర్శకులు ఉంటేనే మంచి రచనలు వస్తాయి” అని చిత్తశుధ్దితో నమ్మినప్పటికీ, “మేమే గొప్ప సాహితీవేత్తలం, మా విమర్శకి తట్టుకునే వారే మంచి రచయితలు” అని భావించడం మొదలు పెట్టిన సాహితీవర్గాలు పుట్టుకొచ్చాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో పరిపక్వమైన తెలుగు కథావిశ్లేషకుల, విమర్శకుల అభిప్రాయాలని ఇంకా తప్పటడుగులు వేస్తున్న అత్యధిక అమెరికా తెలుగు కథలకి అన్వయం చేసి,  కథకులని నిరుత్సాహపరచడం వలన అమెరికా తెలుగు కథలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. “అమెరికాలో ఎక్కడ సాహితీ చర్చలు జరిగినా ఇంకా కొడవటిగంటి, రావి శాస్త్రి, ఓల్గా, రంగనాయకమ్మ మొదలైన వారి గురించే మాట్లాడుకుని గర్వంగా భావిస్తూ ఉంటారు, అమెరికా తెలుగు కథకుల గురించి ఎక్కడా చర్చలు ఎందుకు జరగవు?” అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చోటుచేసుకుంటాయో అనే “భయం” ఒక కారణం అయితే, అమెరికా కథకుల కథల మీద అమెరికా సాహితీవేత్తలకే సదభిప్రాయం లేదు అనేది బహుశా ప్రధాన కారణం.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నా రచనలపైనా, కథా వస్తువుల ఎంపికపైనా కాస్తో, కూస్తో ప్రభావితం చేసిన, చెయ్యని విషయాలను ప్రస్తావించడానికి మాత్రమే. వంగూరి ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాల ద్వారా అమెరికా తెలుగు సాహితీవేత్తల ప్రత్యేకత నిలబెట్టడానికీ, ఇతరుల చేత కూడా “ఒక కాపు కాయించడానికి” నాకున్న సమయాన్ని ఎక్కువగా వెచ్చించడం తప్ప, నా రచనాసక్తిని, నా శైలినీ ఆ సంస్థ కార్యక్రమాలు ఎక్కువగా ప్రభావితం చెయ్య లేదు అని నేను నమ్ముతున్నాను.

Bapu cartoon on me 001అప్పటికీ, ఇప్పటికీ నేను వ్రాసేన శతాధిక కథలన్నీ డైస్పోరా జీవితానికి సంబంధించినవే. అసలు ఈ డైస్పోరా అనే మాట ఎవరైనా వాడడాన్నే తప్పు పడుతూ, నన్ను ఒక కథా రచయితగా గుర్తించడానికి ఇబ్బంది పడే కొందరు అమెరికా సాహితీవేత్తలు తమ అనుయాయులవి తప్ప ఇతర రచయితల కథల్ని గుర్తించక పోవడం అందరికీ తెలిసినదే. అమెరికా కథావస్తువులు ఇంకా పరిణితి చెంద లేదు, రాసి లో కానీ వాసి లో తగిన సంఖ్యలో కథలు రాలేదు అనే విమర్శలు ఎక్కడైనా వినపడితే దానికి ముఖ్య కారణాలు అమెరికా తెలుగు సంఘాల నిరాసక్తి, కొంత మంది సాహిత్యాహంభావం, రచయితల ఆత్మన్యూన్యతా భావాలు, తెలుగు నాట కూడా అమెరికా కథకుల మీద ఉండే చిన్న చూపు వగైరాలే కొన్ని కారణాలు. ఇటువంటి సాహిత్య సామ్రాజ్య సామంతుల ప్రయత్నాలు కూడా నా రచనా శైలిని ప్రభావితం చెయ్యలేదు….అప్పుడప్పుడు కథా వస్తువులని ఎంపిక చేసుకోవడానికి అంతర్గతంగా ఉపయోగపడి ఉండ వచ్చును.

ఇక నా రచనావ్యాసంగంలో మరొక ప్రధానమైన మార్పు 2004 లో జరిగింది. ఆ యేడు “సిలికానాంధ్ర” అసోసియేషన్ వారు “సుజన రంజని” అంతర్జాల పత్రిక మొదలుపెట్టినప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ గారు నన్ను పిలిచి ఆ పత్రికకి నెలకి ఒక కథ వ్రాయమని కోరారు. ఆ పత్రిక వ్యవస్థాపక   సంపాదకులు కిరణ్ ప్రభ గారు పత్రిక రూపు రేఖలు, ఆశయాలు వివరించారు. అప్పటికే నేను “ఈ మాట” అనే వెబ్ పత్రిక సంపాదకుల కోరికపై కొన్ని కథలు రాసి ఇచ్చాను. అవి వారి “ఉన్నత” ప్రమాణాలకి తక్కువ స్థాయిలో ఉన్నా నా మీద గౌరవం కొద్దీ ప్రచురించారు అని నాకు కాలక్రమేణా అర్ధం అయింది. ఇప్పుడు ఈ కొత్త వెబ్ పత్రికకి ప్రతీ నెలా రాయాలంటే “నెల నెలా భంగపాటు” తప్పదేమో అని అనుకున్నప్పటికీ, వారి కోరిక కాదన లేక, మొదట్లో అప్పుడప్పుడు క్రమం తప్పినా, నెలకి ఒక కథ వ్రాసే నిబధ్ధ్ద్తత అలవాటు చేసుకున్నాను. కిరణ్ ప్రభ గారు కౌముది.నెట్ మొదలుపెట్టిన తర్వాత క్రమం తప్పకుండా నెలకో కథ రాస్తున్నాను. అవి ఇండియాలో కూడా “రచన” మాస పత్రికలో ఏడెనిదేళ్ళ నుంచీ ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి. ఇతర పత్రికలు ఎన్ని సార్లు నన్ను అడిగినా, వాళ్ళకి ప్రత్యేక రచనలు రాయడం వీలు పడక పోవడం నా రచనావ్యాసంగంలో ఒక లోటుగానే భావిస్తాను, కానీ  “రక్షించాడు” అని నా గాఢమిత్రులూ-గూఢ శత్రువులూ” సంతోషిస్తారు కాబోలు

ఇటీవల లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నాకు లక్షాపాతిక వేల రూపాయల పురస్కారం ఇచ్చినప్పుడు, ఆ సందర్భంగా “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూట పదహారు అమెరికామెడీ కథలు” అనే నా కథల సంపుటి ప్రచురించాం. అందులో కొన్ని తప్ప మిగిలినవన్నీ ఇదివరలోనే “అమెరికామెడీ కథలు”, “అమెరికాలక్షేపం” “అమెరికామెడీ కబుర్లు”. “అమెరి”కాకమ్మ” కథలు” అనే మకుటాలతో విడి విడి సంపుటాలుగా వచ్చినవే. వీటిల్లో మీకు నచ్చిన కథలు ఏమిటీ అని చాలా మంది టీవీ  ఇంటర్ వ్యూలలోనూ, పత్రికల వారూ అడిగినప్పుడు చెప్పడం కష్టమే కానీ, నాకు బాగా పేరు తెచ్చిన కథలు నా మొట్టమొదటి “జులపాల కథ”, “రెండో జులపాల కథ”, “వాహనయోగం కథ”. “బురదావనం కథ”, చేగోడీ కంప్యూటర్ కథ”, “సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్”, “దంత వేదాంతం కథ”, ఊంఠ్ గాడీ కథ”, “మైక్రోవేవోపాఖ్యానం”,  “బుల్లితెరంగేట్రం”, మీ ఆవిడ ఎందుకు పుట్టిందీ?”, ..ఇలా చాలానే చెప్పుకోవచ్చును….నాట్ బేడ్..ఎటాల్!  నా కథా సంపుటాలకు ముందు మాటలు రాసిన వారు గొల్లపూడి, జొన్నవిత్తుల, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, రచన సాయి, కిరణ్ ఫ్రభ మొదలైన వారు.

ఇక నాటకాలలో నేను రాసిన పాతిక పైగా నాటకాలలో అమెరికాలో బాగా పేరు తెచ్చిపెట్టినవి “బామ్మాయణం”, “మగ పాత్ర లేని నాటిక” అయితే ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చినది “అసలు ప్రశ్న”. ఈ నాటిక దూర్ దర్శన్ లో ఇండియా అంతటా చాలా సార్లు చూపించబడింది అని విన్నాను. నా నాటికలన్నీ “అమెరికామెడీ నాటికలు” అని శ్రీశ్రీ గారూ, గొల్లపూడి గార్ల ముందు మాటలతో పుస్తక రూపంలో వచ్చింది.

నా కథల్లో అప్పుడప్పుడు ప్రవేశిస్తూ అనేక మంది పాఠకులని అలరిస్తున్న పాత్ర “క్వీన్ విక్టోరియా”. “ఆవిడే లేకపోతే మీ కథలు ఎవరూ చదవరు” అన్నారు ఈ మధ్యన ఒక ప్రముఖ సంపాదకులు. ఈ పాత్ర సృష్టి, నా కథలలో ఉన్న కొన్ని బారిస్టర్ పార్వతీశం ఛాయలు, సునిశితమైన హాస్యం, వ్యంగ్యం, రాజకీయ చతురోక్తులూ  మొదలైన అంశాల వలన నన్ను మొక్కపాటి, పానుగంటి, చిలకమర్తి, మునిమాణిక్యం, భమిడిపాటి, ముళ్ళపూడి మొదలైన వారితో పోల్చడం వినడానికి బాగానే ఉంటుంది కానీ, అది పూర్తిగా అతిశయోక్తే!. నేను వారిలో ఏ ఒక్కరి కాలిగోటికీ కూడా పోలను అని నాకు తెలుసు.

ఎవరు నన్ను పొగిడినా, తెగడినా..ఇటీవల నాకు మహదానందాన్ని కలిగించిన విషయం ..బాపు అంతటి మహానుభావుడు నా మీద ఒక కార్టూన్ వెయ్యడం…అది ఎమెస్కో వారు 2011 లో ప్రచురించిన “బాపు కార్టూనులు -2” లో చోటుచేసుకోవడం ( 51 వ పేజీ). అది కిందటి నెల ఇండియా వెళ్ళినప్పుడు ఆ పుస్తకం కొనుక్కుని, అమెరికా వచ్చాక చూస్తుంటే…ఈ కార్టూన్ కనపడి ఆశ్చర్య పోయాను. ఆ కార్టూన్ బహుశా స్వాతి పత్రికలో వేశారేమో నాకు తెలియదు. నేను ఎప్పుడో మా హై స్కూల్ గురించి రాసిన కథ చదివి బహుశా బాపు  గారు ఈ వ్యంగాస్త్రం సంధించి ఉంటారు. 2006 లో నా మొట్టమొదటి కథా సంపుటికి బాపు గారు ఇందుతో జత పరిచిన ముఖచిత్రం వెయ్యడం, బాపు-రమణ లు ఎంతో ఆప్యాయంగా, అద్భుతంగా ముందు మాట రాయడం, ఆ పుస్తకం అంకితం తీసుకోవడం, ఇప్పుడు బాపు గారు ఈ వ్యంగాస్త్రం సంధిస్తూ కార్టూన్ వెయ్యడం…ఈ జన్మకి ఇవి చాలు. ఇంకెవరి పొగడ్తా అక్కర లేదు

ఇలా రాసుకుంటూ పోతే…నేనే ఒక “సొంత సుత్తి: అనే వెబ్ పత్రిక పెట్టుకుంటానేమో అనే అనుమానం ఎవరికైనా వస్తే, ఆ భయం లేదు అని అభయం ఇస్తూ…శలవ్!