కలవరపెట్టే అతి సంచయేచ్ఛ … “సర్ ప్లస్”

నేను తృప్తిగా, సాదా సీదాగా  జీవితం గడపాలనుకుంటున్నాను

“జనం అందరూ ఒక్కసారిగా మారిపోతారు.  వాళ్ళ నోటివెంట , “నాకు పెద్ద పెద్ద కార్లు వద్దు. నాకు ఇంకో పెద్ద Mac కంప్యూటర్ అక్కర్లేదు. నేను డీజల్ బ్రాండ్ జీన్స్ వేసుకోవాలనుకోవటం లేదు” అనే రోజులు వస్తాయి”.

ఏ వర్యావరణవేత్త నోటివెంటనైనా ఇలాంటి మాటలు వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ, ప్రపంచంలోని 80 శాతం సంపదను తింటూ కూర్చున్న 20 శాతం అగ్ర రాజ్యాల్లో ఒకటైన అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వస్తే?   ఊహించటానికే ఇదెంతో బాగుంది కదా!!

‘సర్ ప్లస్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ‘ఎరిక్ గాండినీ’,  జార్జ్ బుష్  చేత గమ్మత్తుగా పై మాటల్ని పలికిస్తాడు. పైగా ఈ ఇటాలియన్ ఫిల్మ్ మేకర్  ‘మనమంతా  వినిమయ సంస్కృతి అనే ఉగ్రవాదం నీడన బ్రతుకుతున్నాం’  అని కూడా భయపెడుతున్నాడు ట్యాగ్ లైన్ పెట్టి మరీ !!   ఇతని సినిమా “సర్ ప్లస్ ” – ‘టెర్రరైజ్ డ్  ఇన్ టు బీయింగ్ కన్స్యూమర్స్’  – 2003 లో తయారయింది.

వస్తు వ్యామోహ తత్వం విశ్వరూపమెత్తి, ప్రకృతి ఇచ్చిన ఆస్తుల్ని కొల్లగొట్టి మనుషుల్ని డొల్లలుగా మార్చిందని చాలా మంది కళాకారులూ, పర్యావరణ వేత్తలూ  ఏనాటి నుంచో  చెప్తూనే ఉన్నారు. సంపద అనే అమృతాన్ని పంచిపెట్టే తీరులో ప్రభుత్వం మోహినీ అవతారమెత్తి,  కార్పొరేట్  దేవతలకే అంతా ధార పోసి, 90 శాతం సగటు దానవులకు ఏమీ లేకుండా చెయ్యటమే ఈ నాటి మాయ అని కూడా చాలామంది గుర్తించారు. ఈ మాయను మన కళ్ళముందు డాక్యుమెంటరీ రూపంలో విప్పి చూపే ప్రయత్నం చేసిన కొద్దిమందిలో గాండినీ ఒకరు.

ఈ ఫిల్మ్ లో జార్జ్ బుష్  సొంత మాటలూ ఉంటాయి. ఇంకా అతని నోట చాలామంది వినాలనుకునే ఒప్పుకోళ్ళనూ, సామ్యవాదపు మాటల్ని కూడా “అనిపిస్తాడు” ఫిల్మ్ మేకర్.  మార్కెట్ ఎకానమీని బుజాన మోసే నాయకుల చేత, అందులో ఉన్న మోసాన్ని గురించి నిజాలు మాట్లాడించటం మంచి హాస్య స్ఫోరకంగా కూడా ఉంటుంది.

2001 లో ఇటలీ లోని జెనోవాలో జరిగిన జి-8 సమావేశం, అక్కడ,  నిండా అస్త్ర శస్త్రాలు ధరించి, ఏ మాత్రం గొడవ అయినా అణచటానికి సిద్ధంగా ఉన్న పోలీస్ బలగాలు… దీనితో ఫిల్మ్ మొదలవుతుంది. ఏ నిముషం ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత మనలో మొదలవుతుంది.  అంతర్జాతీయ వ్యాపార సంస్థ  వ్యవహారాలు నచ్చని కొంతమంది పర్యావరణ వేత్తలు, ఆందోళనకారులు రాళ్ళు విసిరి, షాపుల అద్దాలు విరగ్గొట్టి, వాహనాలను తగలేస్తారు.  పోలీస్ ఫైరింగ్ లో ఒక యువకుడు చనిపోతాడు.

“నా ఉద్దేశ్యంలో బ్యాంకులు,  చెయిన్ మార్కెట్ లు, ఖరీదైన షాపుల వంటి కార్పొరేట్ ఆస్తులను గురి పెట్టి ధ్వంసం చెయ్యటం చట్టబద్ధమైన పనే.  మనుషుల ప్రాణాలు తియ్యకుండా ఆస్తుల మీద రాళ్ళు వెయ్యటంలో తప్పేముంద”ని ప్రశ్నిస్తాడు జాన్ జేర్జాన్. ఈయన ఒక రచయితా, అరాచక వాదీనూ.

 జాన్ జేర్జాన్.

‘ఆస్తి ధ్వంసం చెయ్యటం’ అనే దానిని పోరాట రూపంగా గుర్తిస్తాడు ఈ రచయిత. అలాగని ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఆస్తులు ఆశించ లేదు. సృష్టించ లేదు. ఎవరి ఆస్తులూ ధ్వంసం చెయ్యనూ లేదట. చాలా కాలం తన రక్తాన్ని అమ్ముకుంటూ అతి తక్కువలోనే జీవించాడట. “అసలు జనం ఎందుకు  ఆస్తి ధ్వంసం చేస్తారని ప్రశ్నించుకోకుండా ఇదంతా అర్ధంపర్ధం లేని హింస అని తేల్చేస్తే ఎలా?” అంటాడు జేర్జాన్.

“నా దృష్టిలో టీవీ ముందు కూర్చోవటం, మత్తు మందు కొట్టటం, పనికిమాలిన ఉద్యోగాలు చేస్తూపోతుండటం.. ఇదీ అర్ధం పర్ధం లేని హింసంటే ! అదేపనిగా పని చెయ్యటం, అదేపనిగా వస్తువుల్ని వినియోగిస్తూ ఉండటం .. ఇదీ హింస స్వరూపం.”  అని తేల్చేస్తాడు.  “చాలా సౌకర్యవంతమైన జీవితం, మంచి ఉద్యోగం, అంతులేని భౌతిక సుఖాలు.. ఇదంతా పరమ శూన్యమైన వ్యవహారమని కొంతమందికైనా అర్ధం అవుతుంది. వాళ్ళు తృప్తికీ స్వేచ్ఛకీ ఉన్న హద్దుల్ని చెరిపేస్తారు.” . ఇవీ జేర్జాన్ అభిప్రాయాలు.

‘స్వాంటే’  ఒక MNC లో పని చేసిన వ్యక్తి. చిన్న వయసులోనే  మిలియన్ల డాలర్లు సంపాదించిన ఇతనికి ఆ డబ్బంతా ఏమి చేసుకోవాలో అర్ధం కాలేదు. చవకైన చక్కని జీవితాన్ని కోల్పోతున్నట్టు అనిపించిందట అతనికి. ఆరుబయట మూడు రాళ్ళతో పొయ్యి  పెట్టుకుని సూర్యాస్తమయ వేళలో వండుకుని స్నేహితులతో తినటాన్ని ఆనందిస్తాడు. “డబ్బంటే మనసు మూలల్లో నాకు అసహ్యం. ఇప్పుడిక నాకు దానిగురించి ఆలోచించే అవసరం లేదు.  ఖర్చు పెట్టాలంటే ఎటు చూసినా ఎన్నో మార్గాలు. కానీ నేనా పని  అంత సులభం గా చెయ్యలేను. నిరంతరంగా సంపాదిస్తూ పోతుంటే,  కొన్నాళ్ళకు  ఎక్కువ డబ్బుకు మనం అలవాటు పడతాం.  డబ్బు ఒక రంగుల రాట్నం.  అది అదుపుతప్పి తిరిగేస్తోంది.  ఒక ఇల్లు, భార్య, పిల్లలు .. ఎంత సంపాదించినా జీవితంలో ఇంతకంటే ఏముంది?” …  అంటాడు.  వస్తు వ్యామోహ తత్వానికి ఇలాంటివాళ్ళు సవాళ్లు.