ఇక్కడ లేని  సగం…

రేఖాజ్యోతి 
~
Rekha
నువ్వు నీ జ్ఞాపకాలను తవ్వేటప్పుడు

నా లోపల కలుక్కుమంటోంది ,

ఇంకా తెమలని కొన్ని ప్రశ్నలు,
వీడని కొన్ని ముడులు 
అలాగే వున్నాయేమో పునాదిగా !!
 
ఇవాళ కూడా రెండు విస్తళ్ళలో వడ్డించాను,  
ఒంటరితనం అలవాటు కాలేదింకా !
 
నిన్నెవరో పిలుస్తుంటే నేను పలుకుతున్నాను, 
సగం ఇక్కడ లేదన్న సంగతి స్పృహకు రాలేదింకా !
 
మెలకువలోనే పంచుకున్నామా ఆకాశాన్ని, నీది నాది అని
బహుశా మనకు తెలుసేమో, ఆ విభజన రేఖ ఎప్పటికీ కనబడదని ! 
 
ఆ రోజు నువ్వు వెనుదిరిగి వెళ్ళే సూర్యుడ్ని చూశావు 
నీతో కలిసి అదే ఆకాశంలో గూటికి చేరే పక్షుల్ని చూశాను !
 
నేను నీ గమ్యం కాలేదని ఎందుకు నింద చేస్తాను?
మజిలీ అయినందుకు గొప్పగా ఋణపడి ఉంటానే కాని !!
 
ఎంత శ్రద్ధకదా నీకు నా మీద ,
ఒక్కసారిగా వదిలేస్తే పగిలిపోతానని
 
కంటిపాప చెంపమీదకు ఒక కన్నీటి చుక్కను విడిచినంత నెమ్మదిగా విడిచావు కదా?
 

పోనీరా కళ్ళలో నీళ్ళకేం, కొదువా,
పోనీ
వాటి వెనుక ఆ చివార్న మెరిసే నా ఆనందబాష్పానివి కదా నువ్వు ఎప్పటికీ !! 
 
*

 వర్షం వెలిశాక…

రేఖాజ్యోతి

 

Rekhaచెరొక ఊర్లో పనిచేసే అమ్మకీ, నాన్నకీ  అస్తమానం బదిలీలే అప్పుడు . వేరే దారి లేక   పదోతరగతి చదవడానికి నన్ను మా పిన్నివాళ్ళ ఊరికి పంపారు… ఆవిడ అక్కడ టీచర్.  నెల్లూరు నుంచి 24 కి.మీ. దూరం, మొదటిసారి ఆ ఊర్లో బస్సు దిగగానే ‘ఆకాశం విశాలంగా వున్నట్టు’ అనిపించింది. ఊరి నిండా కొబ్బరి చెట్లూ, చింత చెట్లూ, మట్టి రోడ్లూ, పాతకాలంనాటి ఆర్చీలున్న కిటికీలు, అరుగుల వాకిళ్ళు, అంతస్తులే లేని ఇళ్ళు, అన్నింటికీ మించి బస్సు వెళ్ళే మెయిన్ రోడ్డు మీద నుంచి కనిపించే పెద్ద వాగు, ఆ వాగులోకి ఎప్పుడోగాని నీళ్ళు రావట.. నీళ్ళు లేకపోతేనేం, బంగారు రంగు ఇసుక కనుచూపు మేరంతా!  

వాగుకి ఆవలి వైపున దూరంగా వున్న తాటి చెట్లతో అదంతా ఒక పెద్ద పెయింటింగ్ లా కనిపించింది.  పిన్ని, నేనూ ఉండబోయే ఇల్లు, మొత్తం ఇంటిలో నాలుగో వంతు పోర్షన్, ఒకే ఒక గది, దాన్నే వంట కోసం విభజిస్తూ పాతకాలంనాటి చెక్కపెట్టె లాంటి అల్మారా. టేకుగుంజలతో వసారా. ప్రహరీగోడ ముప్పావు కూలిపోగా అక్కడక్కడా నిలబడిన ఇటుకలు. కాంపౌండ్ లో  కొబ్బరిచెట్లూ వాటికి బలంగా అల్లుకున్న మనీ ప్లాంట్ తీగలు, మందారం, కస్తూరి … వేరేలోకం లోకి వచ్చినట్టు కళ్ళు పెద్దవి చేసుకొని చూడడమే సరిపోయింది. ఆ ఊరిలో ఒకే ఒక గుడి- అక్కడే రాముడూ, కృష్ణుడూ, వినాయకుడూ,నవగ్రహాలూ అందరూ వుంటారట . మేముండే వీధి చివర ‘సితార ‘ సినిమాలో భానుప్రియ బంగ్లా లాంటి ఇల్లు. ఆ రోజు రాత్రంతా ఆరుబయట నవారా మంచం వేసుకొని పిన్నీతో మాటలే మాటలు.

ట్యూషన్లు, ఎక్స్ ట్రా క్లాసులు లేని కాలం … సుదీర్ఘమైనసాయంత్రాలు. పిన్ని తప్పించి ,  స్కూల్లో పనిచేసే టీచర్లంతా నెల్లూరు నుంచి పొద్దున ఎనిమిదిగంటల బస్సుకి వచ్చి అయిదు గంటల బస్సుకి వెళ్ళే వాళ్ళు. స్కూల్లో స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఆసక్తికర విషయం ఆ ‘సితార’ సినిమా లాంటి బంగ్లాలోని ఆడవాళ్ళని ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదట, లోపలికీ బయటకీ తిరిగే కార్లు చూడడమేనట!

ఆ రోజు తెల్లవారేటప్పటికే మొక్కలూ, నేలా, గోడలూ అన్నీ తడిచి ముద్దయిపోయి ఉన్నాయి, రాత్రి ఎప్పటి నుంచి పడుతోందో వాన! తలుపు తీసుకొని వసారాలోకి వస్తే వాకిలి ముందంతా బురదమయం. ఇంటి ఓనరు ఆయన భార్యా ఇద్దరూ గొడుగు వేసుకొని ఆ బురదలో ఇటుకలు వేస్తున్నారు ‘అవసరంగా రోడ్డు మీదికి పోవలసి వస్తే పడి  ఉంటాయి’ ముసలి వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పని పూర్తి చేశారు.

‘అమ్మాయ్,  నీకు స్కూల్ లేనట్లే, ఊర్లో వాన పడితే ముందు మునిగేది మీ స్కూలే, మెయిన్ రోడ్డుకి పది అడుగుల దిగువున కట్టాడు’ హౌస్ ఓనర్ సిద్ధి రామాచారి గారు చెప్పుకు పోతూనే ఉన్నారు.

‘’పాపాయ్, పాలవాడు రాలేదు వేడి నీళ్ళలో హార్లిక్స్ కలిపాను’’ పిన్ని నాకొక గ్లాస్ ఇచ్చి తనూ తెచ్చుకుంది.’ ‘పొద్దుట్నుంచీ బస్సులు రాలేదంటే స్కూల్ లేనట్లే’’- ‘ పిన్ని సెలవు డిక్లేర్ చేసి పుస్తకం పట్టుకుంది, తను ఇక ధ్యానం లోకి వెళ్ళినట్లే ! మధ్యాహ్నం నాలుగు వరకూ వర్షం తగ్గలేదు. దీపాలు పెట్టుకోవలసినంత చీకటి. వాకిట్లో హౌస్ఓనర్ వేసిన రాళ్ళు మునిగిపోయి చాలాసేపయ్యింది. కాంపౌండ్ లో బాగా రెండడుగుల ఎత్తు నీళ్ళు వచ్చేశాయి. వసారాలోనే కూర్చొని నేనూ పిన్ని చూస్తున్నాం. ఎవరో గొడుగులో వెళ్తూ

“ఆశారి గోరూ, యేరు ఆ పాట్నే పొంగతా ఉండాది, ఇంకో నాలుగడుగులు ఎక్కిందో, ఊరు మునిగిందే, నా మాటిని ఎగవన నీ కొడుకు ఇంటికి ఫో. సీకటి పడితే నువ్వు ఈదలేవు. మేవు ఏటి కాడికి పోతావుండాము. మునిగే దంకా రానీమనుకో! ఏమి? నేనొ చ్చేదా!” అంటూ ఆ రోడ్డు మీదికి చేరిన నీళ్ళలో హడావిడిగా వెళ్లి పోయాడు .

Kadha-Saranga-2-300x268

హౌస్ ఓనర్, ఆయన భార్యా ఇంటికి బోలెడు తాళాలు పెట్టి రెండు గోడుగుల్లో తయారయ్యారు, సిమెంట్ తో కట్టిన వారి కొడుకు ఇంటికి. “అమ్మాయ్.. మా తండ్రి గారి కాలంలో కట్టిన మట్టి ఇల్లు, మీరూ జాగ్రత్త, వస్తాం” అనేసి ఆ నీళ్ళలో వాళ్ళు బయల్దేరారు.

అప్పటివరకూ వారి మాటల సందడితో ప్రకృతి బీభత్సం అంత స్పృహకు రాలేదు కానీ, ఇప్పుడేమిటో గాలి గట్టిగా శబ్దం చేస్తున్నట్టు, మెరిసే మెరుపులు ఇక్కడే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కాస్త భయం మొదలైంది. అప్పుడే ఒక్కసారిగా మా కాంపౌండ్ కి ఆనుకొని ఉన్న కరెంటు స్తంభం పెద్దగా శబ్ధం చేస్తూ మా వసారాకి రెండు అడుగుల దూరంలో పడింది. ఇక భయం నా ముఖం మీదికి స్పష్టంగా వచ్చేసింది.

“పిన్నీ, మన మీద పడి ఉంటే?? ”

‘పడలేదు కదరా !’  పిన్ని స్థిమితంగానే వుంది ఇంకా.

ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు గుంపులు గుంపులుగా గొడుగులు, లాంతర్లు, టార్చిలైట్లు పట్టుకొని ఆ గాలీ వానలో పెద్ద పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నారు ఏటి వైపుకు.

“పెద్దిరెడ్డి గోడౌన్ లో ఇసుక మూటలున్నాయి, ఓ నలుగురు నాతో రండ్రా!”

“ఒరేయ్ మీరు ఏటికాడికి పోయి ఉండండి మేము ఎనకాల్నె వస్తాం” చీకట్లో ఆ గొంతులు భయంతో వణుకుతున్నాయని తెలుస్తోంది.

మళ్ళీ వర్షం పుంజుకుంది. పిన్ని అప్పుడప్పుడూ వెళ్ళి సర్దడం గమనించాను. సూట్కేస్ లోని డబ్బులు, తనవీ నావీ సర్టిఫికేట్లు హాండ్ బ్యాగ్ లోకి, మరో కవర్ లో కాండిల్స్,అగ్గిపెట్టెలు , ఫస్ట్ ఎయిడ్ కిట్, తనవి పాత కాటన్ చీరలు  సర్దింది. మరి కాసేపట్లో వసారాలోకి కూడా నీళ్ళు వచ్చేశాయి. వసారాలోని నవారా మంచం గదిలో వేసుకున్నాం. ఆకాశంలో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు  ఉరుములు, మెరుపులు. అప్పుడే మా మీదికి ఎవరో టార్చ్ లైట్ వేసి చూస్తున్నట్టున్నారు,

“టీచరమ్మా,టీచరమ్మా…ఉండారా లోగా!! ” స్కూల్లో పనిచేసే అటెండర్ శీనయ్య అరుస్తూన్నాడు వర్షంలో నుంచి .

పిన్ని ఎలాగో వసారోలోకి వెళ్ళింది

‘ఆ ఆ ఉన్నాం, ఏంటి పరిస్థితి? ‘

‘ఏటికి గండి ఆనలేదు, నీళ్లొస్తున్నాయమ్మా ఈడుంటే కష్టం, నాతో గూడా రండి పాపను తీసుకొని, రామిరెడ్డి ఇంట్లోనే ఉన్నారు ఊరి జనమంతా, రాండి,రాండి ‘ వాన కంటే జోరుగా ఉంది శీనయ్య మాట.

ఇంటికి తాళం పెట్టి ఒకే గొడుగులో నేనూ పిన్ని శీనయ్య వెనకే బయల్దేరాం. నా బుర్రలో బోలెడు ఆలోచనలు, నీళ్ళు మోకాళ్ళకు తగుల్తున్నాయ్, ఒకవేళ ఈ నీళ్ళలో పాములు, కప్పలు, క్రాబ్స్ ..  వుంటే? నాలుగడుగులు వెయ్యగానే ఇక ఉండలేక అరిచాను ‘పిన్నీ’ అని, ‘ ఏమవుతుంది,ఈ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా? శీనయ్య కంటే నువ్వు పొడవుగా ఉన్నావ్ బాగా పెద్ద అడుగులు వెయ్యగలవు, నేరుగా నడువు, ఈ కాస్త , అదిగో ఆ  దీపం వెలిగే ఇంటి కే మనం వెళ్ళేది, సరేనా!’  ఎలాగో వచ్చేశాం, ఆఖరికి.  పెద్ద గేట్లు బార్లా తీసున్నాయి, అలాగే నీళ్ళలో ఉన్న ఒక ఐదు మెట్లు ఎక్కాక పొడినేల తగలగానే ప్రాణం లేచి వచ్చింది. ‘అమ్మా, అదో అటు మెట్ల పైకి వెళ్ళండమ్మా’ అని దారి చూపించి మళ్ళీ వానలోకి వెళ్ళాడు శీనయ్య, ఇంకెవరైనా ఇళ్లలోనే వుండి పోయారేమో  అని!

మెట్లెక్కి లోపలికి వెళ్తే కిక్కిరిసిన కళ్యాణ మండపంలా ఉంది. ఊరివాళ్ళంతా ఇక్కడే వున్నట్టు ఉన్నారు, అక్కడక్కడా వెలుగుతున్న కొవ్వొత్తులు, లాంతర్లు. ఏ మాటా అర్ధం కావట్లేదు ఒకరితో ఒకరు మాట్లాడుతుండడం వల్ల. పిన్నిని చూసి చాలా మంది దగ్గరకొచ్చారు

‘టీచరమ్మా, మా గుడిసె పొద్దన్నే పడిపోయింది తల్లా, ఈడనే ఉన్నాం పిల్లా జల్లా అందరం’

‘దూడని తోలుకుబోయినోడు అట్టే బోయినాడమ్మా, యాడ చిక్కు బడ్డాడో!’ పాలు పోసే శంకరయ్య అమ్మ ఏడుస్తోంది.

‘పాపాయ్, నువ్వెళ్ళి ఈ హాండ్ బ్యాగ్, కవరూ  తీసుకొని  ఆ ప్లేస్ లో కూర్చో, తడి తుడుచుకో, నేను వాళ్ళని పలకరించి వస్తాను’ అని చెప్పి పిన్ని వెళ్ళింది. ఇందాక అరుపుల్లా వినిపించినవి ఇప్పుడు ఏడుపుల్లా వినిపిస్తున్నాయి. గోడకానుకొని కవర్లోనుంచి పిన్ని పాత చీర తీసుకొని పరుచుకోవడానికీ, కప్పుకోవడానికీ కలిపి చుట్టుకొని కూర్చున్నాను. ఇక్కడికి శబ్దాలు కూడా అంతగా చొరబడట్లేదు. భయం వల్ల కలిగిన అలసటతో నిద్ర పట్టేసింది.

బాగా హడావిడిగా ఉంది, కలలోనో, నిజంగానో  అనుకుంటూ నిద్ర లేచాను. ఎదురుగా ఎవరో ఒకావిడ కళకళలాడుతూ  ఎర్రటి చీర కుచ్చిళ్ళు దోపుకొని అందరికీ బాదం ఆకుల విస్తళ్లలో వేడి వేడి ఉప్మా వడ్డిస్తోంది. ప్రతీ ఒక్కరినీ పేరుతో పిలుస్తోంది,

‘ఏమి అందరికీ వచ్చిందా! డబ్బాలేమన్నా వుంటే పెట్టుకుపొండి, చంటి బిడ్డలుంటే ఈడ వేడి నీళ్ళున్నాయ్. ఏమి గావాలన్నా పాలేరుకి  చెప్పండి. ఇచ్చి అంపుతా, ఏమి సరేనా! ‘ అందరినీ ఉద్దేశించి  అనేసి ఆవిడ మెట్లు దిగి వెళ్ళిపోయింది.

‘ఏంటిది? ఎక్కడున్నాను, వర్షం తగ్గిపోయిందా?’ నెమ్మదిగా గుర్తుచేసుకుంటూ కిటికీ దగ్గరకి వెళ్ళి చూశాను, ఊహూ .. వర్షం ఇంకా హుషారుగా పడుతూనే ఉంది. కాస్త దూరంకి చూపు సారించి చూస్తే, అదేంటి? బూడిదరంగు ఆకాశం నేల మీద కదులుతోంది! దేవుడా, నిండిన యేరు ఇదేనా?మెలికలు తిరుగుతూ నిన్న మొన్న నేను నడిచిన వీధుల్లో ప్రవహిస్తోంది. ఎక్కడికి వెళ్తోంది ఈ యేరు ఇంత హడావిడిగా ఊరి మీదుగా, తలలు విరిగిన కొబ్బరి చెట్లూ, కూలిన కరెంటు స్తంభాలూ, ఒరిగిపోయిన ఇళ్ళూ, ఇలా అవుతుందా వర్షం పడితే !!  పిన్ని కోసం వెతుక్కుంటూ మెట్లదగ్గరకి వచ్చి నిల్చున్నాను, కింద నుంచి ఇందాక మాట్లాడిన ఆవిడ ఎవరికో చెప్తోంది ,

‘ఏరా, ఎల్లకాలం వంటోళ్ళు మాత్రమే చెయ్యాల్నా? నేను చేస్తే సయించదా! కష్టం వచ్చి మడుసులు ఎడస్తా మన పంచకొస్తే మనం సుఖం చూసుకుంటామా ఏంది? ఎవరూ బళ్లె, నా చెయ్యి సాలు, వండనియ్యండి సుద్దంగా’  అని.

ఇంతలో పిన్ని వచ్చింది సగం గొడుగులో సగం తడుస్తూ డాక్టర్ గారిని తీసుకొని,

‘గోడకూలి పడిందయ్యా, నెత్తురు సూడండయ్యా’ అని జనంలోనుంచి ఒకావిడ బిడ్డని ఎత్తుకొని వచ్చింది. పిన్ని అప్పటికే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుంది, వాడికి గాయం మీద బ్యాండ్ ఎయిడ్ వేసుంది.

పిన్నీ నన్ను పలకరించింది ‘ ఆర్ యూ ఓ కే , హోప్ యు ఆర్ …’ అని నవ్వి మళ్ళీ వెళ్ళిపోయింది వాళ్ళలోకి.

బాగా ఆకలి వేస్తోందనుకునేలోపే నాకూ ఎవరో ఉప్మా తెచ్చిపెట్టారు…తినేసి కళ్ళుమూసుకున్నాను, మళ్ళీ నిద్రపోయాను కాబోలు !

sitaram1

‘పాపాయ్, పాపాయ్’ పిన్ని పిలుపుకి  ఉలిక్కి పడి లేచాను.

‘చూడు వర్షం తగ్గింది, పై మేడ మీదకు వెళ్దాం రా, యేరు వెనక్కి వెళ్తోందట’

, వెళ్ళాం.. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు.

‘ఏరియల్ వ్యూ కదా ఇక్కడి నుంచి ?’ పిన్ని నవ్వుతూ అడుగుతోంది

నిజంగానే అన్ని వీధులూ నీళ్ళు నీళ్ళు, చూస్తుండగానే మూడు హెలికాఫ్టర్లు అటూ ఇటూ తిరుగుతూ నీరు లేని చోట్ల కొన్ని మూటలు, అట్టపెట్టెలు పై నుంచి విడిచి పెడుతున్నారు

‘అందరి ఇళ్ళూ మునిగి పోయాయి కదా, అన్నీ సెట్ అయ్యే వరకూ అవసరమైన సరుకులు గవర్నమెంట్ ఇలా ఇస్తుంది’ పిన్ని చెప్తోంది.

‘మనం ఇక ఇంటికి వెళ్లచ్చా? ‘  ప్రమాదం తప్పినట్టే కదా ??

‘చూద్దాం’ తనేటో చూస్తూ సమాధానం చెప్పింది.

మేడ మెట్లు దిగి ఆ ఇంటి గేటు వరకూ వచ్చాక కానీ తెలియలేదు మొన్నటి నుండీ ఉన్నది ఆ ‘ సితార’ సినిమాలో బంగ్లా లాంటి బంగ్లాలో  అని. లోపల భలే ఆశ్చర్యం, అంటే ఆ ఎర్రచీర ఆవిడేనా ఈ ఇంటి ఓనర్, భలే ఉన్నారు నిజంగానే చాలా మంచిది. అనుకుంటుండగానే ఆవిడ వచ్చారు.

‘’ నమస్కారం టీచరమ్మా, సమయానికి మీరు చేసిన వైద్యం, సాయం మర్సిపోలేము. మీకు ఉండటానికి సిమెంట్ ఇల్లు పాలకేంద్రం కాడ మా తమ్ముడోళ్ళ  ఎనక పోర్షన్ ఏర్పాటయ్యింది. నేరుగా ఆడికే పోండి. ఈడ పాత ఇంట్లో పనికొచ్చే సామాను ఏమన్నా వుంటే మా పాలేరు ఆడికి తెచ్చిస్తాడు,ఏమ్మా, సరేనా!!’ ఆవిడ మొత్తం చెప్పేశాక పిన్నికి అర్ధమయినట్టుంది. నాకే లోపల పెద్ద ప్రశ్నా పత్రం!

మేము గేటు వైపు తిరిగామో లేదో, ఆవిడ ఎవర్నో పెద్దగా అరుస్తోంది

‘’ మడిసివా? ఆశబోతు పిశాచివా? ఇల్లు బోయి, బిడ్డా గొడ్డూ బొయ్యి మడుసులు అల్లాడతా ఉంటే గవర్నమెంటోళ్ళు ఏసిన బియ్యపు గింజలు ఏరుకొని తెచ్చి దాచిపెడతా వుండావే! ఎవయ్యా, మొలకా రెడ్డా, ఊరి మునిగిపోతా ఉండా కూడా నీకు బుర్రలో బుద్ది మొలవలేదే! అన్నదమ్ముడివని విడిసి పెడతావుండా, ఫో, గేటుకాడ కూర్చొని ఈ బస్తాలన్నీ పెట్టుకోని కుంచాం తో కొలిసి మడిసి మడిసికీ ఇయ్యి. ఏందీ? ఇనబడిండా, మల్లా సెప్పేదా? ‘’  ఆఖర్న ఒక్క ఉరుము ఉరిమింది అతన్ని.

పిన్ని నన్ను చెయ్యి పట్టుకొని ఆవిడ చెప్పిన అడ్రస్సుకు తీసుకొని వెళ్తోంది. అయినా అడిగాను ‘ఎక్కడికి వెళ్తున్నాం?’ అని

‘కొత్త ఇంటికి’  పిన్ని తల ఎత్తకుండా నడుస్తూ చెప్పింది

‘ఎందుకు?’

‘’ఎందుకంటే మనం ఉంటున్న ఇల్లు మొన్న రాత్రే పడిపోయింది’’’  నీళ్ళలో చూసి చూసి అడుగేస్తూ చెప్పింది.

నాకు ఒక్కసారిగా తలలో నుంచి పెద్ద ఐస్ క్యూబ్ జారినట్టు, చల్లటి నీళ్ళు మొహం మీద కుమ్మరించినట్టూ ఝల్లుమంది. ఆగిపోయాను పూర్తిగా! ఏమనాలో తెలియలేదు.

‘పిన్నీ, నా బుక్స్, నీ బుక్స్  బట్టలు .. ‘ నాముఖం ఇప్పుడు ఏ రంగులో వుందో ఖచ్చితంగా ఊహించుకోలేక పోతున్నాను.

‘పాపాయ్, మనం ఉన్నాం కదా! అవన్నీ మళ్ళా తెచ్చుకోవచ్చు’ పిన్ని వెనక్కి తిరిగి నవ్వుతూ అంటోంది.

ఆ అటెండర్ శీనయ్య వచ్చి తీసుకురాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ?? నిజమే అలా ఏమీ కాలేదు కదా, ఇంకెందుకు బాధ!!

‘మనం ఊహించలేం పాపాయ్, దేవుడు ఎలా వస్తాడు? ఏమి సహాయం చేస్తాడు? ఎలాంటి పాఠాలు నేర్పిస్తాడు? అని , ‘ప్రాణం అమూల్యం’  అని ఎన్నిసార్లు ఇంపోజిషన్ రాస్తే అర్ధం అవుతుంది? ఇప్పుడు చూడు ఇంతమందిని కూర్చోబెట్టి ఒకే పాఠం ఎంత అర్ధవంతంగా చెప్పాడో దేవుడు!! ఒప్పుకోవాలేగానీ పై వాణ్ణి మించిన గురువు లేడురా!! ‘ పిన్ని నవ్వుతూ చెప్తోంది అందంగా, హాయిగా!!

*

పెరట్లో పుట్టింటి నకలు

 

 ‘కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అలా పెరటి తోటలోకి పరిగెత్తుతావ్ , అక్కడ మీ పుట్టింటి నకలు దాచావా శాంతీ?’ మళ్ళీ అదే ప్రశ్న. దీన్నిదెప్పిపొడుపని ఎందుకు అనుకోవాలి? ‘ ఎంతబాగా అర్ధం చేసుకున్నారో! ‘  అనుకుంటే హాయి కదూ! ‘ఈ ఒక్కసారికీ మీరూ రండి నాతో అక్కడ ఏముందో చూద్దురుగానీ’ ! 

నిజమే మరి కష్టమొచ్చినా సుఖమొచ్చినా కాస్త తీరిక దొరికినా, అలసిపోయినా, ఆలోచనేలేక వీగిపోయినా పరుగు పరుగున పెరటితోటలోకివెళ్తే , ‘ ఊతకర్ర పట్టుకున్న తాతగారి లాంటి వేపచెట్టు , మెత్తని మనసున్న నానమ్మ లాంటి అరటి చెట్లూనూ ‘ !

OLYMPUS DIGITAL CAMERA

ఈ తులసివనంలో పరిమళం ఎప్పుడూ నాన్న ముఖంమీది నవ్వు గుర్తు చేస్తుంది. మూడురకాల గన్నేరులు, మా పెద్దన్నయ్య ఉంటే ఒక్క పువ్వూ మిగల్చడు , ఆ పెళుసు కొమ్మలు విరగకుండా కోయడం వాడికే తెలుసు.ఈ రెక్క నందివర్ధనాలు కోసికోసి, ఆ చెట్టుపాలు తగిలి చిన్నఅన్నయ్య బ్రొటనవేలు రంగు కాస్తా మారిపోయి ఎంత గరుకై ఉంటుందని?

chandra-kaanthaalu

ఆ చంద్రకాంతాలు సాయంత్రాలే పూస్తాయి, తెలుపూ, ఎరుపూ, పసుపూ ,నారింజ. అమ్మకు పొద్దున్న పూలు కోసే తీరికుండదుగా ! అందుకని  కాస్త ఎండ ఉండగానే కోసి మాలలు కట్టుకుంటుంది, సాయంత్రం దీపారాధనకి . మాల కట్టేశాక ఆ పుప్పొడి వర్ణాలన్నీ అంటుకొని ఆ చేతులకు అదో అందం!

 

‘ఇక్కడ కాస్త చూసుకొని నడవండి’ , ఈ వరసంతా కనకాంబరాలే ! ఇవి మాత్రం కోయలేను , నాన్నగారి మాటలే గుర్తొస్తాయి,  ” అవి సుకుమారాలు తల్లీ , కోయగానేకమిలి పోతాయి , వాటిని వదిలెయ్ రా ! నీ జడకి ఏ పూలైనా బావుంటాయి, ఇవేనా ఏమిటి? ” అని . 

ఈ చామంతుల కాలం వస్తే అప్పుడే అంకెలు నేర్చుకున్న పసివాళ్ళలా లెక్క పెట్టుకోవడం లోనే సరి , పూల కుంపటి మొత్తం విచ్చుకోగానేచిన్నఅన్నయ్య తెచ్చి బాల్కనీలో నుంచి ఆ చామంతి కొమ్మలను క్రిందకు వ్రేలాడే లాగా వేస్తాడు, వాడికి అదో గొప్ప. మా పైమేడ మీదకు వెళ్తే ఇలాంటి సన్నజాజి తీగేఉంటుంది, కోసినన్ని పూలు.

sannajaajulu

రాధయ్య  శ్రేష్టి గారి మరదలు తెచ్చిస్తే అమ్మ విచ్చుకోకముందే కట్టేసి తడిపిన రుమాలులో చుట్టేస్తుంది . దీపాలు పెట్టే వేళకి ఏంవిరగబూస్తాయని !  అక్కడే కూర్చొని ఆస్వాదించడానికి పసుపు, ఆకు పచ్చని రంగుల్లో వెదురు గుబురూ , భూమి మీద విచ్చుకొనే నైట్ క్వీన్ నక్షత్రాలూనూ ! 

అత్తగారింట్లో ఈ చిన్న తోట  పెంచడానికి, కొన్ని అభిమానాలు కూర్చడానికి పద్నాలుగేళ్ళు పట్టింది మరి.

అయితే ఏం ! పెరట్లోకి ప్రియమైన  పుట్టింటినకలు వచ్చేసినట్టే కదా  !!

-రేఖాజ్యోతి