సరళత్వమే మహాస్వప్నం: మైథిలి

Mythili1

ఒక వాక్యం వెంట మరొక వాక్యం…  ఆర్ద్ర మేఘాల వలె కమ్ముకుంటాయి. చదువుతూ ఉండగానే ఎప్పటి నుంచో స్పందన లేని గుండెల లోపల చిన్న తుంపర మొదలవుతుంది. ఆ పై మనసారా తడిసి ముద్దయ్యి చినుకు చినుకునీ ఆస్వాదించి ఆ సంతోషాన్నీ, ఆ సంతోషాన్నిచ్చిన సాహిత్యాన్నీ ప్రపంచానికి పంచే పనిలో ‘నిమగ్న‘మైపోతాం, ఉప్పొంగే మనసులమైపోతాం! కాస్త చదివాక ఆ మాధుర్యం అర్ధమైపోతుంది, ఇక ఆ వాక్యాన్ని అలా కాక మరొకలా ఊహించలేము,  ఇది ఇలానే పలుకుతుందని తెలిసిపోతుంది. ఇన్నాళ్ళూ అతి సహజంగా మన ముందు నుంచీ దాటిపోయిన విషయాలే .. ఒక ప్రత్యేకమైన శైలిలో, ఆసాంతం కనుబొమ్మలెత్తుకొని చదివేలా వ్రాస్తారు ఈమె! 

    తెలుసుకున్నదీ, చదివినదీ, విన్నదీ అలానే కాగితం మీద కుమ్మరించేయరు .. పూర్తిగా తనలోకి తీసుకున్నాక తాను అనుభూతి చెంది గీసిన  పెయింటింగ్ తెచ్చి వ్యాసంగానో  అనువాదంగానో  కథగానో మన ముందు ఉంచుతారు.  మన లోపల ఉండిన మునుపటి జ్ఞానమేదో అందంగా ఇప్పుడు ఈ అక్షరాల భావంలోకి, ఈ భాషలోకి, తర్జుమా అయి  తెలుస్తుంది… లో లోనే !!

mythili2

   ఏమిటి పట్టి లాగుతుంది ముందుగా దూరం నుంచే.. అక్కడ మెరిసే ‘టైటిల్స్’ ! అదేమిటి … ‘గాజుకెరటాల’ మీద ప్రతిఫలించే వెన్నెలేమిటి? ‘నక్షత్రధూళి’ మీద నీరెండ అందమేమిటి? ‘ఈ లోకపు పొలిమేరలు ‘ .. ‘కొంచం విచ్చిన కిటికీ ‘, ‘పన్నెండు రూపాల ప్రేమ’, ‘నీలిపూల రహస్యం’ ఇలా ఈ టైటిల్స్ చూడగానే  మోహన మేలుకుంటుంది పెదవులపై చిరునవ్వై !  ‘క్షీర సాగరం’, ‘పత్రహరితం ‘ , ‘మహా శ్వేత’, ‘నియతి’ వంటి కథలూ..  అందులోని పాత్రలు, పరిసరాలూ ఎప్పటికైనా మరచిపోగలమా ! ఈ మధ్య వచ్చిన ‘రాజహంస’ , ‘ద్వారబంధం’, ‘సంజీవరాయడు’ కథలు పరిమళం వీడని పూర్వజన్మపు అత్తరులలోనో  లేక నిజానికీ, ఊహకీ మధ్య కనబడని సన్నటి గీత మీదనో  నిలబడిపోయిన నేపథ్యాల నడుమ సాగుతాయి. 

    గడిచిన మూడేళ్ళలో వచ్చిన సాహిత్య వ్యాసాలనూ ఫేస్ బుక్ నోట్స్ నూ కలిపి ఇటీవలే చినుకు పబ్లికేషన్స్ వారు ‘నిమగ్న’ సంకలనాన్ని తీసుకువచ్చారు. ‘సారంగ’ సాహిత్య వారపత్రిక, ‘వాకిలి’ సాహిత్య మాసపత్రికలకు తరచుగా రాస్తూ, అంతర్జాలం గ్రూపు ‘సాహిత్యం’ అడ్మిన్ గా వ్యవహరిస్తూ, బాధ్యతగల డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ జీవనోత్సాహానికి ఉదాహరణగా విరగబూస్తున్న ఈ వయొలెట్ పూల తోటతో ముఖాముఖి ..

peepal-leaves-2013

 1. 2013 కి ముందు మీరు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఎందుకని రాయటం మొదలు పెట్టారు?  రాసి ఉండకపోయినా కూడా comfortable  గానే ఉండి ఉండేవారా ?

ప్రాథమికంగానూ ప్రధానంగానూ నేను చదువరిని. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ప్రశ్న ఒకటి నా చేత మొదటి కథ ‘నియతి’ ని రాయించింది, 2001 లో. ఆవిడే ఫెయిర్ చేసి పంపారు. [ నియతి తెలుగు యూనివర్సిటీ వాళ్ళ ‘ తెలుగు కథ 2001’ లో కూడా వచ్చింది.]  తర్వాత 2003 లో ‘పత్రహరితం’. రెండూ వార్త ఆదివారం సంచికలలో వచ్చాయి. అప్పటి ఎడిటర్ గుడిపాటి గారు చాలా సార్లు రాయమని అడిగినా, చెప్పవలసినది ఉందనిపించక రాయలేదు. పిల్లలు పై చదువులకి వెళ్ళాక దిగులేసి ఫేస్ బుక్ లో చేరాను. 2013  లో శ్రీవల్లీ రాధిక గారు అంతర్జాలంలోని  సాహిత్య సమూహాలకి నన్ను పరిచయం చేశారు. అప్పుడే ‘ నిమగ్న’ అనే బ్లాగ్ తెరిచి చిన్న వ్యాసం రాశాను అందులో. రెండో రోజుకి అఫ్సర్ గారు నాకు మేసేజ్ ఇచ్చారు – సారంగ కి ఏమైనా రాయమని. ‘కౌమారపు పూల తోట’ నా మొదటి వ్యాసం అందులో. ఆ రకంగా  పత్రికలకు  రాయటం మొదలుపెట్టించినదీ అఫ్సర్ గారే. వాకిలి ఎడిటర్ లలో ఒకరైన  రవి వీరెల్లి గారు బోలెడంత స్వేచ్ఛని ఇచ్చారు. ఫేస్ బుక్ లో – అనిపించేవి మిత్రులతో పంచుకోవటం లోని ఆనందం గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చేది, ఇప్పటికీ ఇస్తోంది.

రాయకపోయినా కూడా హాయిగానే ఉండి ఉండేదాన్నేమో , అన్నాళ్ళూ ఉన్నానుగా [నవ్వు] మరిన్ని పుస్తకాలు చదువుకునేదాన్ని.

 1. మీ నేపథ్యం ఏమిటి? చదవటాన్ని ఎవరు ప్రోత్సహించారు?

మా నాన్నగారు గవర్న్ మెంట్ డాక్టర్. తీరిక ఉన్నప్పుడు హాయిగా తెలుగు నవలలు చదువుతుండేవారు. అమ్మ తెలుగు మెయిన్ గా బి.ఏ చేశారు . ఆవిడ బాగా ఎక్కువగా, వేగంగా చదివేవారు. మా అత్త కథలు చదివి చెప్తుండేది. ఉన్న కథలని ఇంకాస్త పొడిగించి, మార్చి చెప్పేది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు – పిల్లల పత్రికలన్నీ కొనేవారు. టాగూర్ నవలల అనువాదాలన్నీ జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు వేసేవారు అప్పుడు – అవన్నీ అమ్మమ్మ సంతోషంగా కొనిపెట్టేవారు. పన్నెండేళ్ళు నిండేప్పటికి అవన్నీ అయిపోయాయి, అర్థమైనా కాకపోయినా.  తర్వాతి రోజుల్లో ఏది దొరికితే అది చదివాను – ఎవరూ అడ్డు పెట్టేవారు కారు. విద్యాగంధం ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అప్పుడు అలాగే ఉండేవి.

 1. వ్యాసం, అనువాదం, కథ – మూడిట్లో ఏది ఎక్కువ ఇష్టం? ఏది ఎక్కువ కష్టం? భవిష్యత్తులో నవలేదైనా రాస్తారా?

అన్నీ ఇష్టంగానే రాస్తాను. అనువాదం తేలిక. నోట్స్ అలవోకగా వస్తాయి గాని వ్యాసాలకి చాలా చదవాలి. ముందు తెలిసిన సమాచారాన్నే అయినా కొత్తగా చదవకపోతే ఒక పద్ధతిలో పెట్టలేము. వాకిలి లో పెద్ద వ్యాసాలు రాసేప్పుడు శ్రమ పడి  చదవవలసి వచ్చేది… మొదటి వారం అవుతూనే తర్వాతి నెల కోసం. కథని వీలైనంతగా చెక్కుకోవాలి కనుక అది మరొకలాగా కష్టం. అయితే  – ఇవాళ్టికీ కథ వల్ల వచ్చే ప్రతిష్టే ఎక్కువ. It is the most rewarding of the three.

చిన్నప్పుడంతా చాలా నవలలకి plots ఉండేవి బుర్రలో – మెడిసిన్ చదివేప్పుడు కూడా. ఇప్పటికైతే నవల రాసే శక్తి లేదు.

 1. కుందమాలలో రాముడు, అభిజ్ఞాన శాకుంతలంలో ‘దుష్యంతుడు’, నర్తనశాల వ్యాసంలో ‘కీచకుడు ‘ .. ఇలా కథా[ప్రతి] నాయకులు కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాప పడే అరుదైన అంశాల పై మిమ్మల్ని వ్యాసాలు వ్రాసేందుకు ప్రేరేపించినవి ఏవి ?

ఏటవాలు చూపు ఒకటి ఉంటుందని మొదట చెప్పినవారు జలంధర గారు. ఆ దృష్టిని అతి సమగ్రంగా దర్శించినది విశ్వనాథ లో.

 1. విశ్వనాథ రచనల్లో మిమ్మల్ని బాగా కదిలించినది యేది? నేటి సమాజానికి ఆయన రచనలు ఎలా relevant అవుతాయో చెబుతారా?   

ఆయన రాసిన అన్ని నవలలూ నాటకాలూ గొప్పగానే ఉంటాయి. చదవకపోతే ఎంత నష్టపోతామన్న దానికి కొలత లేదు నిజంగా. ఆ భాష మొదట్లో కొంచెం బెదరగొట్టేమాట నిజమే, కాని ఆయన ఏ మాత్రం భయపడవలసిన వారు కారు. ఒక రచన లోనే మూడు నాలుగు perspectives చూపిస్తారు – ఒకటే ఒప్పుకు తీరాలని అన్నదెప్పుడని, పాపం?  దేన్నీ ఒప్పుకోకుండానే ఆయన శతధా దర్శించిన ప్రపంచాన్ని మనమూ  దర్శించి రావచ్చు, ఇంకాస్త అర్థవంతంగా జీవించవచ్చు.

mythili1

 1. మీరు విశ్వనాథతో పాటు చలాన్నీ బాగా చదివారు కదా? ఆయన రచనలకి relevance ఉందా ఇప్పుడు ? మీ పైన ఆయన ప్రభావం ఉందా?

ఎప్పటికీ ఉంటుంది.  నిజాయితీ, నాగరికమైన ప్రవర్తన, సౌందర్యదృష్టి – ఎప్పటికీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు.   నన్ను చలం ఎంత మలిచారంటే ఆ మధ్యన మా అబ్బాయి మ్యూజింగ్స్ చదువుతూ ఆ thought process  లో చాలా చోట్ల నన్ను గుర్తు పట్టాడు.

 1. తెలుగులో మిమ్మల్ని ప్రభావితులను చేసిన వేరే రచయితలు ఎవరు ?

కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన విశ్లేషణ అద్భుతం గా ఉంటుంది. ”మనిషి కష్టాలు పడచ్చు గాని రొష్టు పడకూడదు” – అంటారు ఒక చోట. ఊరికే verbal contrast  కోసం అన్న మాటలు కావు – అవి  అర్థమైతే జీవితం  తేలికయిపోతుంది. మునిపల్లె రాజు గారు, ఇచ్ఛాపురపు జగన్నాథ రావు గారు, కల్యాణ సుందరీ జగన్నాథ్ గారు , మాలతీ చందూర్ గారు,  ఇష్టం. – ఇంకొంచెం పక్కకి వస్తే భరాగో, జ్యేష్ట, అవసరాల రామకృష్ణారావు గారు  – వీళ్ళ కథలూ  నచ్చుతాయి.  చాలా ముఖ్యంగా యద్దనపూడి సులోచనారాణి గారు. ఎందుకో సరిగా తెలియకుండానే పదే పదే చదివినవారు లత, చండీదాస్.

 1. ఆంగ్ల రచయితల జీవిత దృక్పథానికీ, మన తెలుగు లేదా భారతీయ రచయితల జీవిత దృక్పథానికీ యేదైనా తేడా మీరు గమనించారా? మీకు బాగా నచ్చిన ఆంగ్ల రచయిత లు ఎవరు?

దేశ కాలాల హద్దులని మినహాయిస్తే అక్కడ నాకు మన సాహిత్యంతో వైరుధ్యాలు తట్టలేదు. George Eliot చాలా సంపన్నమైన రచన చేశారు. ఆమెని చదువుతుంటే చాలాసార్లు విశ్వనాథ గుర్తొస్తారు. Late Victorian యుగం వరకూ వచ్చిన ఆంగ్ల సాహిత్యాన్నే ఎక్కువ చదివాను,  అందువల్ల కూడా నాకు ఎక్కువ తేడా కనిపించకపోయి ఉండవచ్చు.   Wilkie Collins, F.H.Burnett,  Jules Verne , Henrik Ibsen , Oscar Wilde,  Ayn Rand,  Agatha Christie   –  అలా ఒకరితో ఒకరికి పొంతన లేని రచయితలుంటారు నా జాబితా లో. [నవ్వు]  Jane Austen  గురించి పెద్ద వ్యాసమే రాసుకున్నాను కదా .  L.M.Montgomery నుంచి ఎంతో నేర్చుకున్నాను .  British horror , Gothic  genres చాలా ఆకర్షిస్తాయి . Fantasy  ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు- వారిలో Patricia A Mckillip అతి రమ్యంగా రాస్తారు….

 1. . మీ శైలి ఆపకుండా చదివిస్తుంది, దాని వెనక రహస్యం ఏమిటి? మీ వచనంకవిత్వానికి అతి దగ్గరగా – ఉంటుంది, మీకు టక్కున గుర్తొచ్చే కవి – కవిత గురించి .. ?

అవునా – పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేదాన్ని – అందుకేమో మరి. జేన్ ఆస్టిన్ ఒకచోట అన్నారు, ఉత్తరాలకీ వచనం రాయటానికీ సంబంధం ఉందని. నిజానికి నేను మరీ ఎక్కువ కవిత్వం చదువుకోలేదు. వెంటనే స్ఫురించే వాక్యాలు ఇవి.”Charm’d magic casements, opening on the foam Of perilous seas, in faery lands forlorn’’  కృష్ణశాస్త్రి గారు నాకు కవిత్వంలో గొప్ప. లిరిక్ శిల్పం అని ఒక వ్యాసం లో ఆ Keats మాటలని పరిచయం చేస్తే వెతుక్కుని చదివాను. గాజు కెరటాల వెన్నెలా జాజిపువ్వుల అత్తరు దీపాలూ – తిలక్ పదబంధాలు నోట్లో ఆడుతుంటాయి. టాగూర్ మాటలు-  Much have you given to me, Yet I ask for more …. not for the gift of love, but for the lover himself.

 1. మీ అనువాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అనువాదాల్లా కాక స్వతంత్ర రచనల్లాగా అనిపిస్తాయి.ఎలా వీలయింది అది ?

మాటకి మాట గా అనువదించకుండా భావాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాను. తెలుగులో సమానార్థకాలు ఉన్నాయేమో వెతుక్కుంటాను, కొద్దిగా స్వేచ్ఛ తీసుకుంటాను. నండూరి రామమోహనరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు చేసిన అనువాదాలు నాకు ప్రేరణ. పిల్లల కథలని అనువదించేప్పుడైతే రష్యన్ అనువాదాలు స్ఫురిస్తుండేవి. చందమామ లో కొకు వాడిన పదాలు – చావడి, వసారా – ఇలాంటివి గుర్తొచ్చేవి. ఆయన ఎన్నో జానపద కథలని తిరగరాశారు – కొన్ని రోజుల కిందట, Irish folk and fairy tales omnibus  తిరగేస్తుంటే కొకు వాటిలో కొన్నిటిని  adapt  చేశారని అర్థమై గొప్ప ఆశ్చర్యం వేసింది.

 1. . పిల్లల సాహిత్యం పెద్దవారికి కూడా అవసరమేనా ?

ఆ మధ్య చదివాను – ఎవరో అమ్మాయి research చేస్తూన్న అంశం ఇది – ‘’ పిల్లల సాహిత్యాన్ని చదవటం వల్ల పెద్దవారిలో depression తగ్గుతోంది.  చాలా సంక్లిష్టతలలో చిక్కుబడిపోతున్నాం – సరళంగా ఎలా ఆలోచించాలో బాల సాహిత్యం చెప్తుంది అని నేను అనుకుంటాను. అందుకు నిదర్శనం ఎదురుగానే ఉంది – ‘గ్రీన్ గేబుల్స్ లో ఆన్’ అంటే ఫేస్ బుక్ లో అందరికీ ప్రేమే కదా!  Young  adult fiction నే కాదు, 9-11 ఏళ్ళ పిల్లల పుస్తకాలు కూడా చదువుతూనే ఉంటాను.

 1. మీ కథల్లోని వ్యక్తులకు క్షమించడం లేదా పూర్తిగా ( unconditional గా) ప్రేమించడం మాత్రమే తెలుసు, అలా నిజ జీవితంలో సాధ్యమేనా?  మీ కథల్లో పాత్రలకీ మీకూ ముడులేమైనా ఉన్నాయా ?

క్షమించటం, ప్రేమించటం అవతలివారి కోసం కాదు, మన కోసమే. ఎందుకు సాధ్యం కాదు – నేను రాసినవారి కన్నా గొప్పమనుషులు ఉన్నారు, నేను చూశాను. వాళ్ళు  ఉత్తినే, ఉట్టుట్టి – త్యాగాలు చేయరు – ఏది ఎందుకో తెలిసే చేస్తారు… నిజమైన తెలివి అది. ఉత్తమమైనదానినే ప్రతిపాదించే ప్రయత్నం సాహిత్యపు బాధ్యత అని నేను నమ్ముతాను.

కొన్ని కొన్ని ముడులు తప్పకుండా ఉంటాయి, రచయిత తన ప్రాణంలో ఒక భాగాన్ని రాసేదానిలో తప్పకుండా నిక్షేపిస్తారు. కాని మొత్తంగా నిజం ఏదీ ఉండదు, వేర్వేరు నిజాలు ఒక ధారగా కలుస్తుంటాయి కూడా.

 1. మూడుదశలు గా వచ్చాయి మీ ఏడు కథలూ. మీలో మీరు గమనించినదేమిటి ? ఆఖరి మూడింటిలోsupernatural elements ని ఎందుకు తీసుకున్నారు? ఇక మీదటా అటువంటివే రాస్తారా?

మొదటి రెండు కథలూ రాశాక తర్వాతి రెండూ పదేళ్ళ తర్వాత వచ్చాయి – ఆ లోపు ఖచ్చితంగా నాకు చాలా సందేహాలకి జవాబులు దొరికాయి. ఇటీవలి మూడు – బహుశా ప్రశ్నలు అంతమవటం వల్ల వాస్తవాన్ని దాటి వెళ్ళాలనిపించిందేమో. ఇక ముందు – చెప్పలేను. తెలుగులో కూడా genre fiction రావలసిన అవసరమైతే ఉంది.

 1. రచయిత తన రచనల్లో తప్పనిసరిగా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలని మీరు భావిస్తారా? రచన సూటిగా చదువరులపైకి దూసుకురావాలా? లేక ఆలోచించి సారాన్ని తెలుసుకునేలా ఉండాలా?

అదంతా రచయిత ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. చదువరులంతా కూడా ఒకేలాగా ఉండరు – కొందరు పాఠకులకి గోరు ముద్దలు రుచిస్తాయి, ఇంకొందరికి విద్వదౌషధాలు కావాలి. ఏమైనా, ఎలాగైనా చెప్పండి – అయోమయపు చీకట్లో వదలకూడదు. రచయిత బుర్రకి ప్రపంచం అంత కల్లోలంగా తోస్తోంది కనుక, దాన్నంతా,  అలాగే – రాసేసే హక్కు ఉంటుందనుకోను.

at-home

15 . మీ దృక్పథం ఏమిటి? దేన్ని సమర్థిస్తారు?

నేను ఆశావాదిని, స్వాప్నికురాలిని.  కుటుంబానికి సంబంధించి సంప్రదాయవాదిని. కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని నమ్ముతాను.సామాజికంగానో , స్త్రీ ని అవటం వల్లనో  నేను వ్యక్తిగతంగా వివక్షకి గురి కాలేదు –  బ్రహ్మ సమాజపు, వైష్ణవపు నేపథ్యాలు చాలా కల్మషాలను మా ఇంటికి దూరానే ఆపేశాయి. కాని ఎన్నెన్ని అపరాధాలు జరిగిపోయాయో నాకు  అవగాహన ఉంది.

ఏ అస్తిత్వ వాదాల పైనా నాకు ద్వేషం గానీ అయిష్టం గానీ లేదు. అన్ని వైపులా నాకు స్నేహితులు ఉన్నారు.  పడినవారికి అడిగే హక్కు ఉంది- కాని ఎవరి తప్పులకి ఎవరిని నిందిస్తామో కూడా ఆలోచించుకోవాలి… మన దేశంలో ప్రతి సామాజిక వర్గానికీ తన సొంత సంస్కృతి ఉంటుంది, దాన్ని గర్వంగానే తలచుకోవాలని నేను అనుకుంటాను. ఒకరి పట్ల ఒకరు కొత్త తప్పులు చేసుకోకూడదనిపిస్తుంది. మనిషికీ మనిషికీ మధ్యన వైవాహిక బంధుత్వాలే కాదు, ఇంకా చాలా ఉంటాయి-  ఉండచ్చు, నాకు తెలిసి.

 1. ‘పాఠకుడుఅంత లోతైన భాష చదివేందుకు సిద్ధంగా ఉండడు, కనుక వాడుక భాషలోనే రచన చేయాలి’ ఈ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారా? మీ రచనలు చదవడానికి పాఠకుడికి కాస్త లోతైన భాష తెలిసి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని మీరెలా స్వీకరిస్తారు?

వినయం గానే స్వీకరిస్తాను. అయితే ఒక్క మాట చెప్పాలి ఇక్కడ – మనకి తెలిసిన భాష లోనే చదువుతామని భీష్మించుకుంటే కొత్త మాటలూ కొత్త ప్రయోగాలూ తెలియవు. భాష పుష్టిగా అవదు. ఏది వాడుక భాష అనేది మరొక ప్రశ్న-  ఒక జిల్లా వాడుక భాష మరొకరికి కష్టంగా తోస్తుంది – చదవటం మానేయకూడదు కదా? మాది గుంటూరే గాని మా గోఖలే గారు రాసిన గుంటూరు మాండలికం మా ఇంట్లో మాట్లాడము – చదువుకోలేదా ?  నిన్న మొన్నటి  ‘గోపల్లె’ లో తమిళనాటి తెలుగు సొగసు మాట, మరి? తెలంగాణా, రాయల సీమ మాండలికాలు నేను ఇష్టంగా చదువుతాను. ఉత్తరాంధ్ర ది కొంచెం కష్టమనిపిస్తుంది గాని ప్రయత్నిస్తుంటాను. నా వరకూ వస్తువుని బట్టి రాసే భాష అప్రయత్నంగా మారిపోతుంటుంది.

17 .  ఎందరో ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగిన ప్రశ్న  “వృత్తికీ – ప్రవృత్తికీ, కాస్త సొంతానికీ”  సమయాన్ని ఎలా సంతులనం చేయగలుగుతున్నారు?

కాస్త కాదు, అంతా సొంతమే [నవ్వు]. ఇరవై ఏళ్ళకి పైబడి ఇంచుమించు నిర్విరామంగా ప్రాక్టీస్ చేశాను, అప్పుడు కూడా రాత్రి  ఒంటిగంట వరకూ చదువుకుని సర్జరీ పేషెంట్స్ ని మళ్ళీ చూసి నిద్రపోయేదాన్ని.  మా అమ్మ, మా వారు – ఇద్దరూ నాకు చాలా వెసులుబాటు ఇచ్చారు. నా పుస్తకాన్ని అందుకనే ఆ ఇద్దరికీ అంకితం ఇచ్చాను. ఇప్పుడు నేను semi retired, కావలసినంత తీరిక. అంతా కలిసే ఉంటాము,  పిల్లలిద్దరూ బాగా చదువుతారు- కొత్త ఉత్సాహం.

   ( శ్రీ వంకాయల శివరామకృష్ణారావు గారి సహకారంతో)

[ డా. మైథిలి అబ్బరాజు గారి సారస్వత వ్యాసాల సంపుటం ‘ నిమగ్న’ కినిగె లో దొరుకుతుంది.

లింక్ : http://kinige.com/kbook.php?id=7411  ,  విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ కాచిగూడ లలో కూడా ]