బతకాలి

 

రెడ్డి రామకృష్ణ

~

 

అన్నా! నువ్వు బతకాలి

వ్యవసాయం వ్యాపారమైపోయి

లాభాల వెన్నెలంతా నగరాల్లో పూస్తున్నప్పుడు

పగలుకుంపటిని గుండెలపై మోస్తూ

ఇంకా

పొలంగట్టే సింహాసనం

గ్రామమే సామ్రాజ్యం

కల్లమే కోట

ఇల్లే స్వర్గం

కడుపే కైలాసమనుకుంటూ… కూర్చుంటావా!

వద్దన్నా వద్దు

కాలం చెల్లిన భావాలు వద్దు

ఆ భ్రమలూ వద్దూ

నువ్వు బతకాలి

 

బతుకు జూదగాడి చేతిలో పేక ముక్కైపోయి

సంపదంతాఓపక్కనే పోగైపోతున్నప్పుడు

నాలుగు మడిగట్ల మధ్య మనసు

నాపరాయై మిగులుతున్నా

మదుపుకి మదుం తీసి

కాసులకొద్దీ కాలువ

కన్నీరు పారిస్తూ

ఇంకా

ఊరు పై ఆశలెందుకు

ప్రభుత్వ పంచాంగాల పై నమ్మకాలెందుకు

 

తెల్లదోమ పచ్చపురుగు

పసుపుముడత,ఎర్రమచ్చలు

ఏవైతేనేం

తెగుళ్లే అధికారంలో వుండి

చేలపైన చేతలపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు

కరువులూ ఎరువులై వాటికే సహకరిస్తున్నప్పుడు

నువ్వు కొన్నపురుగుమందు దృష్టిలో

నువ్వే ఒక పురుగైపోతున్నావు

 

అప్పు పురుగు వేరుకు పట్టి కాయాన్ని(కాండాన్ని) తొలిచేస్తుంటే

నువు కూడా పురుగుమందే పెరుగన్నం అనుకునేసరికి

నీ కుటుంబానికి బూడిదతెగులు ఆశ్రయిస్తోంది

వద్దన్నా!వద్దు

ఆవేశాలొద్దు

ఆలోచనా రాహిత్యాలొద్దు

 

అన్నా!

పట్టణం పరాయిదేం కాదు

అలాగే స్వయంభువు కాదు

తండ్రులనాడో తాతల నాడో

చేరుకున్నవాళ్లమే మేమంతా!

శ్రామికులుగా కార్మికులుగా..

 

నగరము నిషేధిత ప్రాంతము కాదు

భయమెందుకు

భయపడితే తాడైనా పామవుతుందని ఎరుగవా!?

శ్రమను నమ్ముకున్న వాళ్లం

అమ్ముకోవాల్సిన వాళ్లం

సంపదకు ఎల్లలు లేనట్టే

శ్రమకూ  సరిహద్దులు లేవుగదా!

చెల్లినచోటే సరుకు ఆమ్ముకోవటం వ్యాపార నీతి

మనము బతుకుతున్నది వ్యాపార ప్రపంచములోనే

మరిచిపోకు

అన్నా! నువ్వు బతకాలి….

నేనూ బతకాలి

సమస్త శ్రామికులూ బతకాలి

గ్రామమా..పట్టణమా..నగరమా

ఆంధ్రానా అమెరికానా ఆఫ్రికానా

ఎక్కడ బతకాలి

ఎక్కడ బతుకుంటే అక్కడ బతకాలి

మనల్నిఈ స్థితికి పడగొట్టిన వాన్ని

పడగొట్టడానికి

తొడగొడుతూ బతకాలి

***

అతడొక వీస్తున్నపూలతోట

రెడ్డి రామకృష్ణ

రెడ్డి రామకృష్ణ

ముప్ఫై ఏళ్లగా

అతన్ని చూస్తూనే ఉన్నాను

ఎక్కేబండి దిగే బండిగా

ప్రయాణమే…

జీవితంగా మలుచుకున్నట్టున్నాడు

తలకు చిన్నగుడ్డ  తలపాగాచుట్టి

మొలను నిక్కరు ధరించి

చేతుల్లోని పినలిగర్రను మూతికి ఆనించి

ఏకకాలంలో వందలమందిని శిశువులుగా చేసి

సమ్మోహ పరిచే మంత్రగాడు

ఎన్నేళ్లుగా అతడలా గాలికి గంధం పూస్తున్నాడో

తన వూపిరితో మురళికి ప్రాణంపోస్తూన్నాడో

తనెక్కిన రైలును ఉయ్యాలగా చేసి ఊపుతున్నాడో

తెలియదు కానీ

తన శరీరంలో ఎన్నో చిల్లుల వెదురుగొట్టాలు

చర్మం చాటున దాచుకున్నట్టున్నాడు

అతడు  మురళి వూదితే చాలు

లోపలి వేణువులన్నీ ఒక్కసారిగా మ్రోగినట్టుంటాయి

అతనిలోనేనా!…

మనలోకూడా…

ఒక్కోసారి అతడు కనిపించడు

నేను బండి ఎక్కిన కాన్నుంచి

అతని ఉనికి కోసం వెతుకుతూనే వుంటాను

కనులతో  చెవులతో

ఎక్కడా కానరాక కళ్ళు మూసుకుంటానా

ఏచివరనుంచో ఒక సమ్మోహన మంత్రం

“నామది నిన్ను పిలిచింది గా..నమై… వేణు..గానమై..”

నేనక్కడే కూచుంటాను

నామది  మాత్రం స్వాధీనం తప్పి

ఆ రాగపు కొసను పట్టుకొని

అలా..అలా.. అతన్ని చేరుకుంటుంది

అతడు నెమ్మెదిగాదగ్గరౌతూ

మనపిల్లల పుణ్యం కోసమని

చెయిచాచి

మనపాపాన్ని రూపాయికాసంత అడిగి తీసుకుపోతుంటాడు

అతడు  బండిలో వున్నంతవరకూ  నామనసు

తేనెటీగై  అతనిచుట్టే తిరుగుతుం టుంది

చివరికి

అతడన్నా బండిదిగాలి

లేదా

నేనన్నా బండిదిగాలి

అంతవరకూ

నామనసు తిరిగి నా స్వాధీనం లోనికి రాదు.

                                     రెడ్డి రామకృష్ణ