ఎవరూ ‘నో’ చెప్పలేని సినిమా!

 

pink1

చిత్రం – ‘పింక్‌’ (హిందీ), తారాగణం – అమితాబ్‌ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తీ కుల్హారీ, ఆండ్రియా తైరాంగ్, అంగద్‌ బేడీ, పీయూష్‌ మిశ్రా, కథ – స్క్రీన్‌ప్లే – రితేశ్‌ షా, కెమేరా – అభిక్‌ ముఖోపాధ్యాయ్, సంగీతం – శాంతను మొయిత్రా, ఎడిటింగ్‌ – బోధాదిత్య బెనర్జీ, నిర్మాతలు – రష్మీ శర్మ, సూజిత్‌ సర్కార్, దర్శకత్వం – అనిరుద్ధ రాయ్‌ చౌధురి, నిడివి – 136 నిమిషాలు, రిలీజ్‌ – సెప్టెంబర్‌ 16

 

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయమని తెలిసేలా టైటిల్‌ పెట్టుకున్న ‘పింక్‌’ సినిమా గురించి హాలులోకి వెళ్ళే దాకా నిజంగా నాకేమీ తెలియదు. అమితాబ్‌ నటిస్తున్న సినిమా అనీ, తాప్సీ కూడా ఉందనీ మాత్రం చదివాను. ఎందుకనో అంతకు మించి తెలుసుకోలేదు. ట్రైలర్‌ కూడా మిస్సయ్యాను. కానీ, పోస్టర్‌ చూసినప్పటి నుంచి సినిమా చూడాలని మైండ్‌ ఫిక్సయిపోయింది. మనసు చెప్పేవాటికి మెదడు వివరణ ఇవ్వలేదు. అది అంతే! సినిమా చూడదలుచుకొంటే అది రిలీజయ్యాక దాని గురించి దూషణ భూషణ తిరస్కారాలేవీ తెలుసుకోకపోవడం, విశ్లేషణలు చదవకపోవడం నాకున్న అలవాటు. అవన్నీ తెలుసుకుంటే ఏమీ రాయని పలకలా స్వచ్ఛంగా సినిమాకు వెళ్ళలేనేమోననీ, ఆ చదివినవాటి ప్రభావంతోనే హాలులో ఆలోచిస్తానేమోననీ ఒక చిన్న భయం. అందుకే, ‘పింక్‌’ వచ్చి మూడు రోజులైనా, దాని గురించి ఏమీ చదవలేదు. తెలుసుకోలేదు. ఇప్పుడే సినిమా చూసొచ్చాను. అర్ధరాత్రి అయ్యిందన్న మాటే కానీ, నిద్ర పట్టని అనుభవం ఈ సినిమా. ఇంటికొచ్చేశాక కూడా దర్శక, రచయితలు సమాజానికి సంధించిన ప్రశ్నలు నా బుర్రలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనసులో అనిపించింది ఏదో రాయాలి… మనసు చెబుతోంది. రాయకుండా పడుకోలేని మనఃస్థితిలో… ఒకానొక రాత్రివేళ రాసుకుంటూ వెళ్ళిన ర్యాంబ్లింగ్స్‌ ఇవి…

అవునూ… కాస్తంత నవ్వుతూ, తుళ్ళుతూ, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ తిరిగే అమ్మాౖయెతే… ఇక ఆ అమ్మాయి తిరుగుబోతు అనేనా? పార్టీకి వచ్చి ఒక దమ్ము బిగించి, బీరు కొట్టినంత మాత్రాన ఆడపిల్లంటే అలుసా? డబ్బుకో, మరొక దానికో చటుక్కున లొంగి, టపుక్కున పక్కలో చేరిపోతుందనే భావనా? వర్కింగ్‌ లేడీ కాస్తంత ఆలస్యంగా రూమ్‌కొచ్చినా, ఆమె కోసం ఇద్దరో ముగ్గురో మగ ఫ్రెండ్స్‌ రూమ్‌కు వచ్చినా ఆ అమ్మాయి బజారుదనే అర్థమా? కాస్తంత అందంగా తయారై ఆఫీసుకు వచ్చినా – క్యారెక్టర్‌ బ్యాడ్‌ అనే తాత్పర్యమా? ఏమిటీ మైండ్‌సెట్‌! తప్పు మనదా? మనల్ని ఇలా తయారుచేసిన చుట్టుపక్కలి సమాజానిదా? మరి, మనం మారమా? ఎప్పటికీ మారమా? మనసుతో బుర్రకు పని చెప్పే ఇలాంటి ప్రశ్నలెన్నో ‘పింక్‌’ మనకి వేస్తుంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

————————-

కథగా ఈ సినిమా చాలా సింపుల్‌. ఢిల్లీ పిల్ల మీనల్‌ అరోరా (తాప్సీ), లక్నో వనిత ఫాలక్‌ అలీ (కీర్తీ కుల్హారీ), మేఘాలయ పిల్ల ఆండ్రియా (ఆండ్రియా తైరాంగ్‌) – ముగ్గురూ వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధుల్లో ఉంటారు. స్వతంత్రంగా గడపాలనుకొనే ఈ ఆధునిక తరం యువతులు ఢిల్లీలో ఒక అపార్ట్‌మెంట్‌ను కలసి అద్దెకు తీసుకొంటారు. స్వేచ్ఛగా బతుకుతుంటారు. సిగరెట్‌ తాగడం, అవసరాన్ని బట్టి ఒకటో రెండో పెగ్గులేయడం, మనసుకు నచ్చితే దైహిక అవసరం తీర్చుకోవడం – ఇవేవీ తప్పు కాదని నమ్మి, అలాగే బతికే కొత్త తరానికి వీళ్ళంతా ప్రతినిధులు. ఒకసారి ఫ్రెండ్స్‌ నైట్‌ పార్టీలో జరిగిన ఒక గొడవలో మంత్రి గారి బంధువైన యువకుడు రాజ్‌ వీర్‌ (అంగద్‌ బేడీ)ని సీసాతో కణత మీద గట్టిగా రక్తమోడేలా కొట్టి, మీనల్‌ తన స్నేహితురాళ్ళతో కలసి పారిపోతుంది. అతగాడికి కంటి పైన తీవ్రగాయమై, ఆస్పత్రిలో కుట్లు కూడా పడతాయి. మీనల్‌ మీద కక్ష తీర్చుకోవాలని విలన్‌ బృందం ప్రయత్నం. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని హీరోయిన్‌ సాహసం. రాజీ కుదర్చాలని మధ్యలో ఫ్రెండ్స్‌ తాపత్రయం.

రాజీ ప్రయత్నం విఫలమైపోతుంది. పోలీసుల దగ్గరకు హీరోయిన్‌ వెళ్ళడంతో ఆమెను ఏకంగా కిడ్నాప్‌ చేసి, వ్యాన్‌లో అఘాయిత్యానికి పాల్పడి మరీ విలన్లు బెదిరిస్తారు. పైగా, అమ్మాయిలపై తామే ఎదురు ఫిర్యాదు చేస్తారు. హీరోయిన్‌ జైలు పాలవుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలకు, ఆ ఇంటి పక్కనే ఉండే ప్రముఖ రిటైర్డ్‌ లాయర్‌ దీపక్‌ సెహ్‌గల్‌ (అమితాబ్‌ బచ్చన్‌) బాసట అవుతాడు. చాలా రోజుల క్రితమే నల్ల కోటు వదిలేసిన ఆయన మళ్ళీ ఈ ఆడపిల్లలకు న్యాయం జరిపించడం కోసం బరిలోకి దిగుతాడు. కానీ, తీరా విలన్లు, వారి లాయర్‌ (పీయూష్‌ మిశ్రా) మాత్రం హీరోయిన్, ఆమె స్నేహితురాళ్ళు పక్కా వ్యభిచారుణులన్నట్లు చిత్రీకరిస్తారు. మరి, అప్పుడు ఏమైంది? ఆ అపవాదును ఆ అమ్మాయిలు ఎలా ఎదుర్కొన్నారు? అసలింతకీ ఆ పార్టీ రోజున జరిగిందేమిటి? మొదలనవన్నీ మిగతా సినిమా.

————————-

ఒక చిన్న సంఘటన, దాని పర్యవసానాలు… అంతే ఈ సినిమా కథ. పాటలు, డ్యాన్సులు, కామెడీల లాంటి ఐటమ్‌లు, కనీసం ఐటమ్‌ సాంగ్‌లు కూడా లేని సినిమా. సినిమాలో ఒకటికి రెండుసార్లు వినిపించే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే కవితాత్మక గీతం మినహా ఇందులో సోకాల్డ్‌ ‘సినిమాటిక్‌ సాంగ్స్‌’ లేవు కాక లేవు. ఆ మాటకొస్తే, సినిమాలో పేరున్న నటీనటులు మాత్రం ఎవరున్నారని? మనందరికీ తెలిసిన అమితాబ్‌ బచ్చన్, మన దగ్గర మాత్రమే కాస్తంత పాపులరైన తాప్సీ. వాళ్ళు కూడా మనకు వాళ్ళలా కనపడరు. కథలో పాత్రలుగానే అనిపిస్తారు.

అమితాబ్‌ను ఎందుకు గొప్ప నటుడంటారో తెలుసుకోవాలంటే, అనారోగ్యం పాలైన భార్యను చూసుకొనే టైమ్‌లో అతని హావభావాలు, అతని డైలాగ్‌ మాడ్యులేషన్, పూడుకుపోయిన గొంతుతో అతను మాట్లాడే డైలాగులు చూడండి, వినండి. ఫెమినిస్టుగా కనిపించే అదే మనిషి – కోర్టులో నిలదీస్తున్నప్పుడూ, నిర్ఘాంతపోయి ఆవేదనాపూరిత మనస్కుడైనప్పుడూ మాట్లాడే తీరు, ప్రవర్తన గుర్తించండి. ఇవాళ్టికీ ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పీకూ’ లాంటి విభిన్న తరహా సినిమాలు, వయసుకు తగ్గ సినిమాలూ చేసే ఆయన మీద మన సినిమా స్టార్స్‌ అందరి కన్నా ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి దాకా తాప్సీని గ్లామర్‌ రోల్స్‌లోనే చూసి, మానసికంగా అలాగే ఫిక్సయిపోయివాళ్ళకు ఈ సినిమా ఒక స్టార్‌ట్లింగ్‌ రివిలీషన్‌. ఈ పాత్ర, కోర్టు బోనులో నిలబడే సీన్లలో ఆమె నటన చూశాక, నటిగా ఆమె మీద గౌరవం కలుగుతుంది.

సినిమాలో ఇక, మిగతా అంతా పెద్ద పేరున్నవాళ్ళు కాదు. కానీ ఎంత బ్రహ్మాండంగా పాత్రల్ని పండించారో! తాప్సీకి స్నేహితురాలుగా వేసిన ఇద్దరమ్మాయిలూ, ముఖ్యంగా ఫాలక్‌ అలీ పాత్రధారిణి, అలాగే కోర్టులో అబ్బాయిల తరఫు లాయర్, జడ్జి (ధ్రుతిమాన్‌ ఛటర్జీ), అమితాబ్‌ భార్య (మమతా శంకర్‌), చివరకు హౌస్‌ ఓనర్‌ సహా ప్రతి పాత్రా సహజంగా అనిపిస్తుంది. తెరపై సజీవంగా కనిపిస్తుంది.

————————-

టెక్నికల్‌గా కూడా ‘పింక్‌’ సౌండే! విడిగా మళ్ళీ డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం లేకుండా సెట్స్‌లో నటిస్తున్నప్పుడే డైలాగులు కూడా రికార్డు చేసే ‘సింక్‌’ సౌండ్‌ విధానం వాడారు. ఇవాళ తెలుగు సినిమాకు కూడా విస్తరిస్తున్న హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల తాలూకు ‘సౌండ్‌ డిజైనింగ్‌’ అనే ప్రత్యేక శాఖతో స్క్రిప్టుకు వచ్చే బలం ఎంతో సినిమా చూస్తే అర్థమవుతుంది. నేపథ్య సంగీతం అంటే, డబ డబ డప్పుల మోత, హీరో గారి ఎంట్రన్స్‌ నుంచి విలన్‌తో ఢీ అన్నప్పుడల్లా హై డెలిబల్స్‌ సౌండ్‌ అలవాటైపోయిన ప్రాంతీయ భాషా సినీ ప్రేక్షకులకు ‘పింక్‌’ ఒక రిఫ్రెషింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. శాంతను మొయిత్రా (గతంలో రాజేశ్‌ టచ్‌రివర్‌ డైరెక్ట్‌ చేసిన అవార్డు చిత్రం ‘నా బంగారు తల్లి’కి నేపథ్య సంగీతం కూడా శాంతనూయే) నేపథ్య సంగీతం, రీ–రికార్డింగ్‌ ఇటీవల వచ్చిన సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అంటే అతిశయోక్తి అనిపిస్తుందేమో! కానీ, అది నిజం!

సినిమా చూస్తుంటే… తెరపై టైట్‌ క్లోజప్‌లు, నేమ్‌బోర్డ్స్‌ మీదుగా ప్యాన్‌ చేస్తూ సిటీలోకి కారులో సాగే ప్రయాణం – ఇలా చాలా చోట్ల కెమేరామన్‌ అభిక్‌ ముఖోపాధ్యాయ్‌ పనిమంతుడని అర్థమైపోతుంటుంది. ఆ సీన్‌లో, ఆ సన్నివేశం తాలూకు అనుభూతిలో ప్రేక్షకుణ్ణి కూడా ఒక భాగం చేసే ఆ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక, సినిమా ఎడిటింగ్, షాట్స్‌ సెలక్షన్, వాటి కూర్పులో తెచ్చిన డ్రామా కూడా చాలా ఉంది. వీటన్నిటినీ సౌండ్‌ డిజైన్, నేపథ్య సంగీతం మరో మెట్టు పైన కూర్చోబెట్టాయి. కథ జరుగుతున్న కొద్దీ, టైమ్‌కు తగ్గట్లుగా విలన్‌ ముఖం మీది గాయం కూడా క్రమంగా మానిన లక్షణాలతో మేకప్‌ చేయడం లాంటివి చూడడానికి చాలా చిన్న విషయాలే. అయితే, అవన్నీ దర్శకుడి శ్రద్ధాసక్తులకు నిస్సందేహంగా నిదర్శనం.

————————-

pink2

సినిమా మొదలైన క్షణాల్లోనే ప్రేక్షకుల్ని కెమేరా కన్ను వెంట కథలోకి లాక్కుపోవడం ఏ ఉత్తమ స్క్రిప్ట్‌కైనా ప్రాథమిక లక్షణం. అది ‘పింక్‌’లో పుష్కలం. న్యూస్‌పేపర్లలో వస్తున్న సమకాలీన సంఘటనల స్ఫూర్తితో రితేశ్‌ షా రచన చేసిన ఈ సినిమా మొదలైన తర్వాత గంటకి ఎప్పుడో ‘ఇంటర్‌మిజన్‌’ అని తెరపై పడితే కానీ, టైమ్‌ తెలీదు. ఇక, పూర్తిగా కోర్టు డ్రామాగా నడిచే సెకండాఫ్‌ అయితే అంతకన్నా రేసీగా, ఆలోచించే తీరిక ఇవ్వకుండా పరుగులు తీస్తుంది. ఆస్పత్రిలో భార్యకు ఈ ముగ్గురు ఆడపిల్లల్నీ అమితాబ్‌ పరిచయం చేస్తుంటే, మంచం మీద నుంచి లేవలేని భార్య బిస్కెట్‌ ప్యాకెట్‌ అందించే సీన్‌ లాంటి సెన్సిబుల్‌ మూమెంట్స్‌ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. అసలు జరిగిన కథేమిటో ఆఖరులో రోలింగ్‌ టైటిల్స్‌లో చూపెట్టే ‘పింక్‌’ స్క్రీన్‌ప్లే పరంగా, కథాకథన శైలి పరంగా ఔత్సాహికులు గమనించాల్సిన సినిమా.

అలాగని ఈ సినిమా స్క్రిప్టులో లోపాలు లేవని కాదు. హీరోయిన్‌ను పోలీసులు జైలులో పెట్టినా, ఆ తరువాత కథ కోర్టు దాకా వెళ్ళినా – అంతకు ముందు కనిపించిన హౌస్‌ ఓనర్‌ ముసలాయన ఎందుకొచ్చి, నోరు విప్పడో తెలియదు. అలాగే, తనను కిడ్నాప్‌ చేసి, ఊరంతా వ్యాన్‌లోనే విలన్లు తిప్పిన సంగతి గురించి కోర్టులో హీరోయిన్‌ చెప్పదు. విలన్ల కన్నా ముందే పోలీసుల్ని ఆశ్రయించి భంగపడిన విషయమూ జడ్జి ఎదుట బయటపెట్టదు. అయితేనేం! ఈ సినిమా ప్రస్తావించిన అనేక మౌలిక అంశాల ముందు ఈ లోటుపాట్లు మర్చిపోదగ్గవే!

చలం ఏనాడో చెప్పినట్లు, స్త్రీకి కూడా ఒక మనసుంటుంది… ఆమెకూ ఇష్టానిష్టాలు ఉంటాయి. అవేవీ గమనించకుండా, గౌరవించకుండా తాళి కట్టిన భార్య అనో, సరదాగా తిరిగిన తోటి ఉద్యోగిని అనో, స్నేహితురాలు అనో… పశువులా మీద పడితే? అచ్చంగా పశువు అనే అనుకోవాల్సి వస్తుంది. తనకు ఇష్టం లేదని తోటి మనిషి ‘నో’ అంటే, ఆ ఒక్క పదంలో కొన్ని కోట్ల భావాలు, వాక్యాలు ఉన్నాయని గుర్తించాలని ‘పింక్‌’ మన పురుషాహంకార జీవుల చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. రూల్‌ నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ కోర్టులో అమితాబ్‌తో దర్శక, రచయితలు చెప్పించే ప్రతి డైలాగూ ఒక పాఠమే. ‘విక్కీ డోనర్‌’, ‘మద్రాస్‌ కేఫ్‌’, ‘పీకూ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఈసారి నిర్మాతగా వెండితెరపై చేసిన కాంటెంపరరీ సోషల్‌ కామెంట్‌ ‘పింక్‌’. రాగల చాలా కాలం పాటు ఈ సినిమా గుర్తుంటుంది.

ఒక సినిమాలో మహా అయితే కథ బాగుండవచ్చు. మరొక సినిమాలో నటీనటుల అభినయం బాగుందనిపించవచ్చు. ఇంకొక సినిమాలో టెక్నికల్‌ బ్రిలియన్స్‌ కొట్టొచ్చినట్లు కనిపించవచ్చు. కానీ, ఒకే సినిమాలో ఈ మూడూ బాగుంటే? ఈ మధ్య కాలంలో అలాంటివేవీ లేవు. కానీ, ఇప్పుడు ఆ కొరత తీరుస్తుంది – ‘పింక్‌’. ఆ మాటకొస్తే – చూసిన కాసేపే కాకుండా, హాలులో నుంచి బయటకు వచ్చేశాక కూడా వెంటాడే ఒక అనుభూతినో, ఆలోచననో మిగల్చడానికి మించి ఏ సినిమాకైనా ప్రయోజనం ఇంకేం ఉంటుంది! రెండుంబావు గంటల ‘పింక్‌’ అచ్చంగా అలాంటి సినిమానే! అందుకే, ఇలాంటి సినిమాలకు యూ కాన్ట్‌ సే… ‘నో’. కావాలంటే, వెళ్ళి చూసి రండి. చూసి వచ్చాక నా అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళూ మీరూ ‘యస్‌’ అనే అంటారు! మే ది ట్రైబ్‌ ఆఫ్‌ థాట్‌ ప్రొవోకింగ్‌ ఫిల్మ్స్‌ గ్రో!

 

తాజా కలం

 ఇంతకీ ‘పింక్‌’ అంటే ఏమిటి? అమ్మాయిలకు సంబంధించిన విషయమనేది వాచ్యార్థం. కానీ, ‘పింక్‌’ అంటే భయపెట్టి, బాధించి, బలవంతాన స్త్రీ జననేంద్రియాన్ని పురుషుడు ఆక్రమించడమనేది కొన్ని దేశాల్లో ఉన్న అర్బన్‌ స్లాంగ్‌ అట! జర్నలిస్ట్‌ మిత్రుడొకడు తాజాగా గుర్తుచేశాడు. అది ఈ టైటిల్‌లోని సూచ్యార్థం. సినిమా చూస్తే, ‘పింక్‌’ అంటే ఏమిటో ఇట్టే అర్థమవుతుందని సూజిత్‌ సర్కార్‌ అన్న మాటల వెనుక ఇంత నిగూఢార్థం ఉందన్న మాట! ఈ సినిమానే కాదు టైటిల్‌ కూడా ప్రేమ ముసుగులో బయటా, పెళ్ళి ముసుగులో ఇంటా జరుగుతున్న కనిపించని లైంగిక హింసకు అర్థవంతమైన అద్దం కదూ!

…………………………………..

 

 

 

 

ఏ పేజీ చూసినా ఆ గతమే గుర్తొస్తుంది: రావూరి భరద్వాజ

jaya with ravuri

రావూరి భరద్వాజ ను ఇంటర్వ్యూ చేస్తున్న రెంటాల జయదేవ

హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోని విజయనగర్‌ కాలనీలోని మధ్యతరగతి నివాసమైన భరద్వాజ ఇల్లంతా పత్రికలు, చానళ్ళ ప్రతినిధులు, కెమేరామన్లు, ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చిన వాహనాలతో ఆ ఇంటి సందంతా సందడిలో మునిగిపోయింది. వృద్ధాప్యం తెచ్చిన బలహీనత బాధిస్తున్నా, ఇంట్లో వాళ్ళ సాయంతో రావూరి భరద్వాజ మీడియా ముందుకు వచ్చారు. తెల్లటి పంచె, లాల్చీ, నెరిసిన గడ్డంతో అతి సామాన్యుడిలా, అత్యంత నిరాడంబరంగా అందరికీ నమస్కరించారు.

1944 ప్రాంతంలో మొదలుపెట్టి గడచిన ఏడు దశాబ్దాలుగా సాగుతున్న తన రచనల్లోని వాక్యాలలాగే అంతే సాఫీగా, సహజంగా తన మనోభావాలు పంచుకున్నారు. ఒకపక్క ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీడియా హడావిడి… మరోపక్క అభినందనలందిస్తూ వరుసగా ఇంట్లో మోగుతున్న ఫోన్లు… ఇంకోపక్క ఇంటికి వస్తున్న సాహితీ మిత్రులు, సన్నిహితుల తాకిడి… వీటన్నిటి మధ్యనే రావూరి భరద్వాజ తీరిక చేసుకుంటూ  ఇంటర్వ్యూ ఇచ్చారు. మనసులోని మాటలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు:

Q భారతీయ సాహిత్యంలోని అత్యున్నత పురస్కారం ‘జ్ఞానపీఠ్‌’ మీకు దక్కినందుకు ముందుగా అభినందనలు. ఈ పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు?

ఈ అరుదైన గౌరవం దక్కడానికి నేను మాత్రమే కారణం అనుకోవడం లేదు. నా జీవితానుభవాలు, ఆ అనుభవాలను ప్రసాదించిన సామాజిక వాతావరణం, ఆ వాతావరణంలోని మనుషులు, దాన్ని మలిచిన పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కారణం. ఈ సమాజం ప్రసాదించిన గొప్ప అనుభవాలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

Q ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది?

ఇవాళ మధ్యాహ్నం 12.30 – ఒంటి గంట సమయంలో విశాఖపట్నం నుంచి ఒకరు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంతలో ఢిల్లీ నుంచి ‘భారతీయ జ్ఞానపీఠ్‌’ వారు కూడా తెలిపారు.

Q ‘జ్ఞానపీఠ్‌’ లభిస్తుందని మీరు ఎన్నడైనా ఊహించారా?

(నవ్వేస్తూ…) లేనే లేదు. ఎన్నడూ కల కూడా కనలేదు. జ్ఞానపీఠం కోసం ప్రయత్నించనూ లేదు.

Q మీరు చాలా ఏళ్ళ క్రితం రాసిన ‘పాకుడు రాళ్ళు’ నవల ద్వారా మీకు ఈ అవార్డు వచ్చింది కదా! ఆ నవలా రచనా నేపథ్యం పాఠకులకు వివరిస్తారా?

నేను దాదాపు మూడున్నరేళ్ళు మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లో రచయిత ధనికొండ హనుమంతరావు సన్నిహితుడైన కొలను బ్రహ్మానందరావు నడిపిన ‘చిత్రసీమ’ అనే సినీ పత్రికలో పనిచేశాను. నేను తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి పోతున్నప్పుడు నా మిత్రుడు ఒకరు నాకు ఓ డైరీ ఇచ్చాడు. ఆ డైరీలో నా దిన చర్య, రోజువారీ అనుభవాలు రాసుకొనేవాణ్ణి. సినిమా ప్రపంచాన్నీ, మను షులనూ దగ్గర నుంచి చూస్తూ, డైరీలో రాసుకున్న అనుభవాలు, జ్ఞాపకాలతో కథ ఎందుకు రాయకూడదని నాకు అనిపించింది. అలా నేను ఓ కథ రాశాను.

Q మరి, అది నవలగా ఎలా మారింది?

ఆ కథను సాహితీ దిగ్గజం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి చూపించాను. ఆయన అంతా చదివాక, ‘బాగుంది. కానీ, పది మందిని కూర్చోబెట్టాల్సిన చోట వంద మందిని కూర్చోబెట్టావేమిటి?’ అన్నారు. నా మట్టిబుర్రకు మొదట వెలగ లేదు. వివరం అడిగితే, ‘ఇది మూడు, నాలుగు వందల పేజీల నవలగా సరిపడే అంశాన్ని ఒక కథగా రాశావు’ అన్నారు. ఆ మాట నా మనస్సులో ఉండిపోయింది.

ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చాక, అప్పటి ‘కృష్ణాపత్రిక’ అధిపతి ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను ఏదైనా రాయమని అడిగారు. నేను ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, సినిమా వాళ్ళ మీద సీరియల్‌ రాస్తాను అన్నాను. వాళ్ళ మీద రాయడానికి ఏముంటుందన్నారాయన. చాలా ఉందని చెప్పి, ముందుగా 12 వారాలకు సరిపడా భాగాలు భాగాలుగా సీరియల్‌ రాసి, తీసుకువెళ్ళాను. అది నచ్చి, ‘కృష్ణాపత్రిక’లో ధారావాహికగా ప్రచురించారు. ముందుగా 30 – 40 పేజీల కథగా అనుకున్నది, చివరకు మూడు నాలుగేళ్ళు పెద్ద సీరియల్‌గా వచ్చింది. ఆ నవలకు విశేష ఆదరణ లభించింది.

Q ఆ నవల వల్ల ఇప్పటికే మీకు రెండోసారి ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు’, తొలిసారిగా ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ వచ్చాయి. ఇప్పుడిలా ‘జ్ఞానపీఠం’! అది ఇంతటి పేరు తెస్తుందని మీరనుకున్నారా?pakuduraallu

లేదు. అసలు ఆ నవలకు ముందు నేను అనుకున్న పేరు ‘మాయ జలతారు’ అని. కానీ, అప్పట్లో ‘కృష్ణా పత్రిక’లో పని చేస్తున్న సాహితీమిత్రుడు, చిత్రకారుడు శీలా వీర్రాజు దానికి ‘పాకుడు రాళ్ళు’ అని నామకరణం చేశారు. పాచిపట్టి, జారిపడతామని తెలిసినా అందరూ సినీ రంగం వైపు ఆకర్షితులవుతుంటారు… జారి పడుతుంటారు… దెబ్బలు తగిలించుకుంటారు… మళ్ళీ మళ్ళీ దాని మీదే వెళుతుంటారు… అనే విశాలమైన అర్థంతో ఆయన పెట్టిన పేరు అది. ఆ నవల తమిళ, కన్నడ భాషల్లోకి కూడా అనువాదమైంది. అక్కడా అందరి ఆదరణ పొందింది. ఆ నవలను ఆకాశవాణి వారు ఓ గంట వ్యవధితో నడిచే శ్రవ్య నాటకంగా మలిచారు. ఆ నవలపై సిద్ధాంత వ్యాసాలూ వచ్చాయి.

Q ఆ నవలను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది?

ఇవాళ్టికీ ఆ నవలలోని ఏ పేజీ చూసినా, అందులోని పాత్రకు నాకు ప్రేరణగా నిలిచిన నిజజీవిత నటీనటులు, వారి స్వభావాలు, ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పడం బాగుండదు.

Q ఆ నవల అంతటి ఆదరణ పొందడానికి కారణం ఏమిటంటారు?

మనం చెబుతున్నది నిజమైనప్పుడు… నిజాన్ని నిజంగా చెబుతున్నప్పుడు… అవతలి వాళ్ళను నొప్పించ కుండానే నిజాయతీగా చెబుతున్నప్పుడు… ఏ రచనకైనా ఎంతో పేరు వస్తుంది. అది అందరి ఆదరణా పొందుతుంది. ‘పాకుడు రాళ్ళు’లో ఉన్నవన్నీ నిజాలు… నిజాయతీగా చెప్పిన నిజాలు. ఇప్పటికే ఆ నవల మూడు, నాలుగు సార్లకు పైగా ముద్రణకు నోచుకోవడమే అందుకు నిదర్శనం.

Q ‘పాకుడురాళ్ళు’ నవలలోని మంజరి పాత్రకూ, మహానటి సావిత్రి జీవితానికీ చాలా పోలికలు ఉన్నాయనీ, అందులోని కొన్ని ఘట్టాలు ఆమె జీవితంలో జరిగినవేననీ సాహితీలోకంలో ఓ మాట ప్రచారంలో ఉంది. దానికి మీరేమంటారు?

ఆ మాట చాలా వరకు నిజమే! నటి సావిత్రి తరచుగా మా ఇంటికి వస్తుండేది. నన్ను ‘బావ’ అనీ, మా ఆవిడను ‘పిన్ని’ అనీ పిలిచేది. ‘అవేమి వరసలే! నన్ను బావ అని పిలిస్తే, మా ఆవిడను అక్కా అని పిలువు! ఆమెను పిన్ని అని పిలిస్తే, నన్ను బాబారు అని పిలువు’ అన్నాను. అందుకు, సావిత్రి సరదాగా ‘సినిమా వాళ్ళకు వరసలేమిటి బావా!’ అని నవ్వేసింది.

Q సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభా వంతంగా బొమ్మ కట్టించారు. ఆ వ్యక్తుల పేర్లు బయటకు వస్తే…

సినీ జగత్తు ఓ చిత్రమైన ప్రపంచం. అక్కడ తండ్రీ కొడుకులిద్దరితో దోస్తీ కట్టిన నటీమణులతో సహా చాలా మంది, చాలా వ్యవహారాలు నాకు తెలుసు. నా డైరీల్లో నా అనుభవాలన్నీ రాసుకున్నాను. అవన్నీ పేర్లతో సహా బయటకు రావాలంటే, నేను చనిపోయాక, నా డైరీలు బయటపెట్టాలి. ‘పాకుడు రాళ్ళ’ లాంటి సినీ రంగంతో సన్నిహితంగా ఉంటూ కూడా జారకుండా జాగ్రత్త పడినవాళ్ళలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, నేను – ఇలా కొంతమంది ఉన్నాం.

 

జర్నలిస్ట్లు లు  రాజేశ్వరి కళ్యాణం, రెంటాల జయదేవ, విశాలాంధ్ర బుక్ హౌస్ కు చెందిన ఈశ్వరరెడ్డి

జర్నలిస్ట్లు లు రాజేశ్వరి కళ్యాణం, రెంటాల జయదేవ, విశాలాంధ్ర బుక్ హౌస్ కు చెందిన ఈశ్వరరెడ్డి

Q మీరు వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యలో నవలలు, నాటకాలు, వ్యాసాలు, పిల్లల కథలు రాశారు. మీ రచనల్లో మీకు బాగా నచ్చినదంటే ఏం చెబుతారు?

మీ కన్నబిడ్డల్లో ఏ బిడ్డ ఇష్టమంటే ఏం చెబుతాం? అయితే, నా రచనల్లో నాకు బాగా నచ్చింది – ‘జీవన సమరం’. సమాజంలోని వివిధ జీవన రంగాల్లోని సామాన్య వ్యక్తులను స్వయంగా కలసి, ఇంటర్వ్యూలు రికార్డు చేసి, వారి మాటలో, వారి యాసలో రాసిన వాక్చిత్రాలు అవి. అందులో కత్తులు సానబట్టేవాడు, చెవిలో గుబిలి తీసేవాడు, సోది చెప్పే అమ్మి, చిలక జోస్యగాడు… ఇలా సమస్త శ్రామిక జీవుల జీవితాలు, వారి జీవన గమనాలు వారి మాటల్లోనే అక్షరబద్ధం చేశాను. ‘ఈనాడు’ దినపత్రిక అధినేత రామోజీరావు ప్రోద్బలంతో, దాదాపు 50 – 60 వారాలు ఆ సిరీస్‌ రాశాను. సామాన్య వ్యక్తులు బతకడం కోసం చేసిన సమరమైన ‘జీవన సమరం’లో బడుగు జీవులు, మధ్యతరగతి వారు… ప్రతి ఒక్కరూ కనపడతారు.

Q అయితే, మీరు జీవితంలో చేసిన పనులు, రాసిన రచనలు అన్నీ ఇలా చిత్తశుద్ధితో నమ్మి, నిజాయతీగా చేసినవేనంటారు! ఇవాళ్టి రచయితలు చిత్తశుద్ధితో రాయాలంటారు!

(సాలోచనగా…) అలా చెప్పలేను. చిత్తశుద్ధిగా నమ్మని పనులు కూడా బతకడం కోసం నేను ఎన్నో చేశాను. ఉద్యోగ రీత్యా నా యజమానులు, నా పై అధికారులు కోరినవి, చెప్పినవి కూడా రాశాను. వృత్తి రీత్యా కానివ్వండి… డబ్బు కోసం కానివ్వండి… బతకడం కోసం అనుకోండి.. నేనూ కొన్ని రాయాల్సి వచ్చింది. రచన ప్రింటులో అనుకున్నంత రాలేదని ప్రచురణకర్త చెప్పినప్పుడు, రూపాయికి పేజీ వంతున రాసిన ఘట్టాలూ ఉన్నాయి. నాకు ఇష్టం లేని పనులు కూడా ఇష్టమున్నట్లు నటిస్తూ చేయడం కూడా అప్పుడప్పుడు తప్పలేదు. కాబట్టి, కాబట్టి, ఆ మాట చెప్పే హక్కు నాకు లేదు.

Q వాస్తవ జీవితంలోని ఘటనలతోనే కాక, సైన్స్‌ ఫిక్షన్‌ లాంటివీ చేసినట్లున్నారు!

అంతరిక్ష ప్రయాణం ఇంకా తెలియని రోజుల్లో 1950 – ’52 ప్రాంతంలో ‘చిత్ర గ్రహణం’ అంటూ స్పేస్‌ ట్రావెల్‌ మీద ‘ఆంధ్రప్రభ’లో సీరియల్‌గా రాశాను. అలాగే, ‘జయప్రళయం’ అంటూ మరో పాపులర్‌ సైన్స్‌ రచన కూడా చేశాను.

Q కథ, నవల, నాటకం, వ్యాసం, బాలసాహిత్యం, శ్రవ్య రూపకం… ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో మీకు అభినివేశం ఉంది. వీటిలో ఏ ప్రక్రియ కష్టమైనదంటారు?

నా అభిమానులు చాలా మందికి నేను రాసిన చిన్న కథలంటే చాలా ఇష్టం. అలా రాయడం చాలా కష్టమని కూడా అంటారు. కానీ, నా దృష్టిలో రేడియోకు రూపకం రాయడం ఎంతో కష్టం. చాలా క్లిష్టమైన రచనా ప్రక్రియ అది. అందులోనూ ఆకాశవాణి వారి నిబంధనలకు తగ్గట్లుగా, వారికి నచ్చేలా రాయడం మరీ కష్టం.

Q ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?

(ఉద్వేగానికి గురవుతూ…) కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!

ఇంటర్య్వూ : రెంటాల జయదేవ

                                                                                                                   ( ప్రజాశక్తి సౌజన్యం తో )

 

తెలుగు సినిమా చరిత్ర పై ఈ తరం వెలుగు రెంటాల జయదేవ !

ఏప్రిల్ 11 న ఉత్తమ సినీ విమర్శకుడి గా  రెంటాల జయదేవ కు నంది పురస్కారం

Nandi-Awards-2011పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డుకు ఎంపిక చేసింది. 2011వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ విమర్శుడి’గా నంది పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది.  ఏప్రిల్ 11 న జరగబోయే అవార్డ్ ప్రదానోత్సవ సభ లో జయదేవ ఈ అవార్డ్ ను అందుకోనున్నారు.

ఇప్పటికి ఇరవయ్యేళ్ళుగా రెంటాల జయదేవ సినీ పత్రికా రచనలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆయన సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు పాఠకులతో పాటు సినీ పరిశ్రమవారినీ ఆకట్టుకుంటున్నాయి.

తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని జయదేవ ఇటీవలే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా జన్మదినోత్సవం విషయంలో కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న తప్పును ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. ప్రముఖ కవి,శతాధిక గ్రంథకర్త, సీనియర్ పాత్రికేయులు, సినీ రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ ఆఖరి కుమారుడైన జయదేవ తండ్రిగారి నుంచి ఇటు పుస్తక రచననూ, అటు పత్రికా రచననూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు.
‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’Dr. Rentala Jayadeva2

‘‘ఇప్పటికి ఇరవై ఏళ్ళకు పైగా పత్రికా రచనలో, ముఖ్యంగా సినీ పరిశ్రమపై చేస్తున్న కృషికి ఇది ఓ గుర్తింపుగా భావిస్తున్నా. గత ఏడాది నేను రాసిన వ్యాసాలను పరిశీలించి, ప్రతిభా వ్యుత్పత్తులను గమనించి, ‘ఉత్తమ తెలుగు సినీ విమర్శకుడి’గా నన్ను ఎంపిక చేసిన అవార్డుల సెలక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు.

చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం, ఆసక్తి. నాన్న గారు రెంటాల గోపాలకృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో సినీ జర్నలిస్ట్ గా కూడా  పనిచేశారు. ఆ సమయంలో నాన్న గారిని కలిసేందుకు వచ్చే గొప్ప గొప్ప నటులు, రచయితలతో పరిచయం, నాన్న గారు రాసే సినిమా వ్యాసాలు చదవడం వంటివి తెలియకుండానే నాకు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. నాన్నగారి ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన తరువాత నేనే సినిమా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.

సినిమా వ్యాసమంటే అందులో చరిత్ర తప్పక చెప్పాలి. దాంతో సినిమా గురించి మరింతగా తెలుసుకోవడం ప్రారంభించాను. ఆ జిజ్ఞాసే తెలుగు సినిమా చరిత్రపై పరిశోధనకు నన్ను పురిగొల్పింది.  పరిశోధన విషయం లో  ఆరుద్ర గారు స్ఫూర్తి. ప్రతి విషయాన్నీ పరిశోధనాత్మకంగా చూడడం ఆయనకు అలవాటు. ఆయన రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ అలా రూపొందిందే.

తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ చరిత్రకారుడిని కలిశాను. ఆయనతో జరిగిన సంభాషణలో ఒకసారి తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’ గురించి చర్చ వచ్చింది. తమిళులు ‘కాళిదాస్’ని తమిళ టాకీగానే భావిస్తారు. ఆ సినిమా విడుదల తేదీని నిర్ధారించే ఆధారాన్ని నాకు చూపిస్తూ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15వ తేదీనే విడుదలైందనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే నేను తెలుగు సినిమా పుట్టుక తేదీపై పరిశోధన చేయడానికి కారణం. తెలుగు సినిమా గురించి పరిశోధన చేస్తున్న నాకు పుట్టుక తేదీకి ఆధారాన్ని కనిపెట్టాలన్న సంకల్పం కలిగింది.

కేవలం ఆధారం కనిపెట్టాలన్న లక్ష్యంతోనే పరిశోధన ప్రారంభించాను. కానీ, సమాచార సేకరణలో అసలు సెప్టెంబర్ 15వ తేదీన తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదన్న విషయం తెలిసింది. సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైంది అని చూపించే ఆధారం ఎవరి దగ్గరా లేదు. దాని కోసం మద్రాసు, విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, పూణే తదితర తెలుగు సినిమా జాడలున్న ప్రాంతాల్లో పర్యటించి, చరిత్రకారులను కలుసుకొని వివరాలు సేకరించాను. ఎన్నో పుస్తకాలు చదివాను.

అదే సమయంలో పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ‘ఫిలిం అప్రిసియేషన్’ కోర్సులో చేరాను. అక్కడికి అతి సమీపంలో ‘నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’ ఉంది. అందులో పాత గ్రంథాలు, సినిమాలు, సెన్సార్ సర్టిఫికెట్లు భద్రపరిచి ఉన్నాయి. వాటిలోనే ‘భక్త ప్రహ్లాద’తో సహా అప్పటి చిత్రాల సెన్సార్ సర్టిఫికెట్ వివరాలున్న గవర్నమెంట్ గెజిట్ కనపడింది. 1932 జనవరి 22న ‘భక్త ప్రహ్లాద’ సెన్సార్ జరిగినట్లు అందులో ఉంది. అప్పటికి దశాబ్దం క్రితమే సెన్సార్ చట్టం అమలులో ఉంది కాబట్టి, సెన్సార్ జరగకుండా సినిమా విడుదలయ్యే ప్రశ్నే లేదు. దీనిని బట్టి 1931 సెప్టెంబర్ 15న ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదని నిర్ధారణైంది. ఆ తరువాత అసలు తేదీని కనిపెట్టేందుకు శ్రమించి, మరింతగా శోధించాను. అప్పటి పత్రికల్లోని ప్రకటనలను బట్టి 1932 ఫిబ్రవరి 6న ముంబయ్ లోని కృష్ణా సినిమా థియేటర్ లో తొలి సంపూర్ణ తెలుగు టాకీ విడుదలైందని తేలింది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.

ఇది పూర్తిగా నా స్వీయ పరిశోధన. దాదాపు నాలుగున్నరేళ్ళు శ్రమించాను. వ్యక్తిగతంగా చేస్తున్న పరిశోధనలకు వ్యవస్థ సహకారం కూడా ఉండాలన్నది నా అభిప్రాయం.  పరిశోధకుడిగా వాస్తవాలను బయటపెట్టాలన్నదే నా ప్రయత్నం. ఫిబ్రవరి 6నే తొలి తెలుగు సినిమా పుట్టిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను.  ఏదో కనిపెట్టాలన్నది నా అభిమతం కాదు. నిరంతర పరిశోధనలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి. ఇప్పటికీ మన దగ్గర మూకీ చిత్రాల గురించి పక్కా సమాచారం లేదు. సాక్ష్యాధారాల సహితంగా తెలుగు సినిమా చరిత్రను నిర్మించాలన్నది నా లక్ష్యం. అందుకే తెలుగు సినిమా నా పరిశోధన సాగుతూనే ఉంటుంది. నా ముందు తరం నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ సాక్ష్యాధార సహిత తెలుగు సినిమా చరిత్ర నిర్మాణానికి నేను సైతం…!