గాంధారంలో అంతరం

Art: Satya Sufi

Art: Satya Sufi

 

*

మన సౌకర్యం కోసం స్టాఫ్ నొటేషన్ ని మ్యూజికల్ నోట్స్ అనుకుందాం. మనకు అర్ధం కాని గుర్తుల పేర్లు క్రోచెట్లు, క్వేవర్లు… వాటికి ఆ పేర్లుంటాయని కూడా మనకు తెలియదు. అసలు రిషభ్ లాగా గిటార్ వాయించేవాళ్ళు నోట్స్ చూసి… నోట్స్ లో గుర్తులు … తెలుగులో చెప్పాలంటే ‘సింబల్స్’ చూసి వాయిస్తారని కూడా మనలో చాలా మందికి తెలియదు.

రిషభ్ వయసు రెండు డజన్లకి దగ్గరగా ఉంటుంది. ఆ వయసు వాడు, అందులోనూ రిషభ్ లా ఉద్యోగం సద్యోగం లేకుండా సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసేవాడు ఇలాగే సాయంత్రాలు తన ఫ్లాట్లో గిటార్ వాయించుకుంటూ కూర్చోడం మనకి వింతగా తోచకపోవచ్చు. కానీ అమృత వర్షిణి లాంటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో సహజీవనం చేసున్నాడని ఎవరైనా మనకి చెప్పారనుకోండి… మనకి వింతగా అనిపించి తీరుతుంది.

కాలింగ్ బెల్ మ్రోగడం మనకి వినిపించింది… ఆ కాలింగ్ బెల్ ట్యూన్ ని అనుకరిస్తూ రిషభ్, తన గిటార్ తీగలు సవరించాలని ఉన్నా, తలుపు తీయడంలో తను చేసిన తాత్సారానికి ఫలశృతిగా పొందిన రసాభినివేశం… అమృతతో ఒక రాత్రి గొడవ పాటి చేస్తుందా అనే తర్కం, తనతో తలుపు తీయించింది. అమృత లోపలికి రాగానే, ఎదురింటి పోర్షన్ గ్రిల్ కి ఆవల ముసలాయన ముఖంపై మూతబడ్డ తలుపు… రిషభ్ పెట్టిన గొళ్ళెంతో మరింత గట్టిగా బిగుసుకుంది. ఆవులింతలు దిగమింగిన గొంతులు కౌగిలింతల పేరుతో ఒక్కటవ్వగా అమృత మెడలో వేలాడుతున్న కంపెనీ ఐడెంటిటీ కార్డ్, ఇరువురి గుండెల మధ్య నలగడంతో మనలోని కొందరు సంస్కారులు తలలు దించుకున్నట్లు నటించారు. నాకు అలాంటి కుసంస్కారాలు లేవు గాక లేవు.

“సాకేత్ దింపాడు” అని అమృత చెప్పే సమాధానాన్ని ఊహించి “ఆఫీస్ నుంచి ఎలా వచ్చావు” అని రిషభ్ అడగలేదు. “రోజూ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎదురింటి ముసలాడితో పడలేకపోతున్నాను” అని మాత్రం చెప్పింది “ఎందుకు విసుగ్గా ఉన్నావు” అని అడిగితే.

“పాపం అతను ఏం చేసాడని… నిన్నేమైనా తిట్టాడా కొట్టాడా… కనీసం నీతో ఒక మాట కూడా మాట్లాడడు” అని రిషభ్ ఏదో చెప్పబోతే “రోజూ గుడ్ల గూబకి బాబులా ఇంతింత కళ్ళేసుకుని చూస్తాడు. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ? మన దేశంలో అమ్మాయిలకి, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతికే హక్కు లేదా ? ” అని అమృత వేసిన ప్రశ్నే రిషభ్ కి సమాధానం అవుతుంది.

ఎదురింటి ముసలాడు అమృత మెట్టెలకోసం, పుస్తెల కోసం వెతుకుతూ అవి కనబడకపోయే సరికి… వయసు తెచ్చిన విచ్చలవిడితనం గురించి విచారించి, విశ్వమానవ విశృంఖల వీచికలతో విసిరివేయబడ్డ విచక్షణారాహిత్యానికి వగచి, అణగారిపోతున్న ఆచారాల గురించి  అగ్గగ్గలాడిపోతున్నాడని నిర్ధారణగా ఆమెకు తెలియకపోయినా గిల్టీనెస్ గిల్లిన సెల్ఫ్ కాన్షియస్నెస్ స్పృహ ఆమెలోని ఫెమినిజాన్ని ఫ్లూటు గానంతో నిద్రలేపింది.

“బ్లడీ బగ్గర్… అక్కడికి మనమేదో దోపిడీలూ దొంగతనాలూ చేస్తున్నట్లు… ఒకరంటే ఒకరికి ప్రేమ… పెళ్ళిచేసుకోకుండా కలిసి ఉంటున్నాం… రేపో మాపో మూడొస్తే పెళ్ళి చేసుకుంటాం. అదేదో పెద్ద నేరమైనట్లు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వీడి విజిలెన్స్ ఏమిటో ! “

“ఇలాంటి వాళ్ళందరూ ఇంటిగ్ర్రేషన్ టెస్ట్ లో మిస్ అయ్యి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లో దొరికిన డిఫెక్ట్స్ లాంటి వాళ్ళు. ఫ్రీకింగ్ *****(ఇక్కడ వ్రాయలేని ఇంగ్లీష్ బూతేదో ఆమె వాడితే.. ప్రహ్లాజుడి పాత్ర పోషించాల్సి వచ్చింది). ఇలాంటి వాళ్ళు, ఎప్పుడెప్పుడు మనలాంటి లవర్స్ గొడవపడతామా అని చూస్తుంటారు. ఒకవేళ గొడవపడి విడిపోతే భారతీయ వివాహ వ్యవస్థలోని దృఢత్వాన్ని అంభుజా సిమెంట్ తో సరిపోల్చి సనాతన సాంప్రదాయాలకి సాగిలపడతారు ” అని అమృత అంది. ఆమె వాడే ఆస్కారంలేదని మనం భావించిన తెలుగు పదాలు రచయిత ఖాతాలో వేసుకుని ముందుకెళ్ళాం.

Kadha-Saranga-2-300x268

“నేను కూడా రెండు మూడు సార్లు పీప్ హోల్ లోనుంచి చూసాను అమ్మూ… రోజూ సాయంత్రాలు మన డోర్ దగ్గరే చెవి పెట్టి వింటున్నాడు”.

“దట్సిట్… నేను చెప్పలే ! మనం గొడవ పడ్డం వాడికి కావాలి… విడిపోవడం కావాలి… ‘ఇవన్నీ మారోజుల్లో ఉండేవా ? ఏటికి ఎదురీదితే ఎవరికైనా ఇదే గతి ‘ అని తన ఏజ్ గ్రూప్ గయ్స్ తో గడిపే మార్నింగ్ వాక్స్ లో సాగదియ్యాలంటే మషాలా కావాలి” అని అమృత అంటే అది మనలో కొంతమందికి సబబుగానే తోచింది.

“అయితే.. వాళ్ళకి కావాల్సిన మషాలా మనమే ఇద్దాం అమ్మూ”

“ఏం మాట్లాడుతున్నావ్ రిషభ్… వాళ్ళకోసం మనం గొడవ పడతామా”

“గొడవ పడం బేబీ… పడినట్లు నటిస్తాం… వాడు అది నిజమని నమ్మి అందరితో చెప్తాడు. అప్పుడు ప్లాట్స్ లో అందరూ మన వైపు జాలిగా చూస్తే ఇంతమందిని ఫూల్స్ చెయ్యగలిగామని మనలో మనమే నవ్వుకోవచ్చు”

“వావ్ డూడూ… ఇలాంటి ప్రాంక్స్ ఫన్నీ గా ఉంటాయి. రోజూ ఆఫీస్ నుంచి వచ్చే సరికి ఇలాంటి గేం ఏదో ఉంటే నేను కూడా రిలాక్స్ అవుతా” అంది అమృత.

“యా… ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ కొత్తగా ఉంటుంది. రోజూ ఫేస్బుక్, ఎక్స్-బాక్స్ బోర్” అని కోరస్ గిటార్ మ్రోగించాడు రిషభ్.

 

  తరువాతి రోజు

 

అమృత ఆఫీస్ నుంచి రాగానే రిషభ్ తలుపు తీసాడు.

“తలుపు తీయడానికి ఇంత సేపు ఏంటి   ?” అంటూ వరండాలో ఉన్న ముసలాయన్ని చూడమన్నట్లు కళ్ళతోనే సైగ చేసేసరికి..వరండాలో వాలు కుర్చీలో కూర్చుని ఏదో చదువుతున్నట్లు నటిస్తున్న ముసలాయన్ని రిషభ్ తో పాటు మనం కూడా గమనించాం. అమృత లోపలకి రాగానే రిషభ్ ఎప్పటిలా తలుపు వేసి గొల్లెం పెట్టాడు.

“వాడు బయిటే ఉన్నాడు… లెట్స్ స్టార్ట్ ” అని గుసగుసమన్నారిద్దరూ. రిషభ్ గిటార్ తీసి వాయించడం మొదలుపెట్టాడు.

“అబ్బా… కాసేపు ఆ గోల ఆపు రిషభ్” అమృత ముఖం నవ్వుతున్నా గొంతు అరుస్తుంది.

“గోలా ? ఇదేంటో తెలుసా ? మ్యూజిక్… ఏ స్కేలో తెలుసా ?” రిషభ్ కూడా కోప్పడ్డట్లు అంటున్నా… ముఖంలో ఆనందపు అవశేషాలు.

“ఏ స్కేల్.. నట్రాజ్ స్కేల్ ఆ( ” వెటకారంగా అని ఎదురింటి ముసలాయనకి వినబడనంత జాగ్రత్తగా నవ్వింది.

“నీకు అంతకన్న ఏం తెలుసు లే… ఇది సీ షార్ప్ స్కేల్” ఉత్తుత్తి గొడవని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాం మనం.

“అబ్బా చా… నీకు ‘సీ షార్ప్ ’ స్కేల్ గురించి తెలిస్తే నాకు సీ షార్ప్ డాట్ నెట్ గురించి తెలుసు. నీ సీ షార్ప్ వల్ల రూపాయి రాలదు. కానీ నా సీ షార్ప్ నెలకు నలభై వేలు తెచ్చిపెడుతుంది. అది మర్చిపోకు” అని అమృత అన్నప్పుడు … ఇంత కేజువల్ గొడవలో కూడా అతను నొచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

అది ఆమె గమనింపులోకి వచ్చి అతడి మూడ్ మార్చే ముద్దేదో ముఖాన విసిరికొట్టాలన్న తలంపుతో అసిమెట్రిక్ గా అతుక్కున్న ఆమె అధరాల ఐక్యతలో లోపించిన ఖాళీలు పూరించే దన్ను కోసం దాపెట్టిన దంతాల సౌజన్యంతో జనియించిన చుంబన సంరంభమారంభమైన కొద్ది క్షణాల్లోనే అహాలను పరస్పరం స్ఖలించుకుని ఇహాలలో గుణుస్తున్నకలహభావ ప్రాప్తికి చేరుకున్నారిద్దరూ.

 

ఇందాకటి “తరువాతి రోజు”కి మరుసటిరోజు

 

“ఎలా వచ్చావ్ అమ్మూ” ఉత్తుత్తి గొడవకి కొబ్బరి కాయ కొట్టిన రిషభ్ కి అది ఉత్తుత్తి గొడవ అన్న స్పృహ లేదు.

“సాకేత్ దింపాడు” తాము పడుతున్నది ఉత్తుత్తి గొడవన్న భ్రమలో నవ్వింది.

“ఇంక ఆఫీస్ బస్ కి ఫీజ్ కట్టడం ఎందుకు దండగ. ఈ సాకేత్ గాడి ఓలా క్యాబ్లో పోతే పోలా !” నిన్నటి సరదా లేదు రిషభ్ లో.

“ఏం అంటున్నావో స్ట్రైట్ గా చెప్పు” అంతవరకు గొంతులో మాత్రం దాగిన కోపం ఆమె ముఖంలో నవ్వుని భర్తీ చేసింది.

“చెప్పేదేముంది.. నెలకో మూడు వేలు కడుతున్నందుకైనా ఆఫీస్ బస్ లో రాలేవా ? రోజూ ఆ సాకేత్ గాడే దింపాలా”

“ఏం… సాకేత్ నన్ను దింపకూడదా ? ”

“ఒక్క రోజో రెండు రోజులో అయితే ఒ.కె. కానీ రోజూ వాడి కార్ లోనే రావాలా ” నాయనా రిషభ్… నువ్వు గేం రూల్స్ మర్చిపోయినట్లున్నావురా… ఇది నిజం గొడవ కాదురా… ఉత్తుత్తి గొడవ.

“సరే.. రేపట్నుంచి వాడి కార్లో రాను. రోజూ నీ బెంజ్ కార్లో నన్ను ఆఫీస్ నుంచి పిక్ అప్ చేసుకో” ఏంటమ్మా అమృత నువ్వు కూడా… ఇది గేం , నిజం గొడవ కాదంటే వినిపించుకోరేం ?

“కొంటాను.. బెంజ్ ఏం ఖర్మ బుగట్టీ కొంటాను… నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ రానీ” రిషభ్ ఎర్రగా మారి కోపంతో ఊగిపోవడం మనం గమనించి ఏమౌతుందా అని ఆతృతపడ్డాం.

“హా హా హా” ఆమె నవ్వింది. అది మామూలు నవ్వు కాదు… కారపు వెటకారపు కలగలుపు. ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్ట హాసమూ..

అమృత ఇంకా నవ్వుతూనే ఉంది…తరతరాల సాగరాల నిక్షిప్త ముత్యాల తరళ పాతరల దొంతరలుగా …”హా హా హా”… రెడీ… ఒన్… టూ… త్రీ… “ఫట్”… అమృత చంప పగిలింది.

థ్రీ.. టూ.. ఒన్.. “ఫట్” మని రిషభ్ చంప కూడా పగిలిందని వ్రాయకపోతే మనలో ఫెమినిస్టులు ఒప్పుకుంటారా ?

“నన్నే కొడతావా ? నువ్వేమైనా నా మొగుడివనుకున్నావా ?” మొగుడైతే కొట్టొచ్చా ? నోట్ దిస్ పాయింట్ యువరానర్.

“…”

“ఇంకొక్క నిమిషం కూడా నీతో ఉండను ” అని విసురుగా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటున్న అమృతని ఆపే ప్రయత్నం నాతో సహా మనలో ఎవ్వరమూ చెయ్యలేదు. తీరం దాటుతున్న తుఫానుని పట్టుకుని ఆపే సాహసం చేసేదెవరు ?

**************

కొన్ని రోజుల ఒంటరితనం నేర్పిన ఏకాకి రాగాలు నెమరేసుకుంటూ రిషభ్.. గిటార్ ముట్టుకోవడం మానేసాడు. వాయించమని మనమూ చెప్పలేదు. ఆ రోజు లిఫ్ట్ దగ్గర ముసలాయన ఎదురయ్యేదాకా…

“ఏమయ్యా.. మీ ఇంట్లో గిటార్ వాయించేది నువ్వా… ఆ పిల్లా ?” అడిగాడు ముసలాయన.

“…”

“ఆ పిల్లే అయ్యుంటుంది.. ఆ అమ్మాయి కనబడ్డం మానేసిన దగ్గర నుంచి గిటార్ మ్యూజిక్ వినబడడం లేదు. సల్వార్ కమీజ్ వేసుకున్న సరస్వతీదేవి అనుకో… ఎక్కడికి వెళ్ళింది ? మళ్ళీ ఎప్పుడొస్తుంది ?”

“…”

“ఆ అమ్మాయిలాగా నీకు కూడా గిటార్ వాయించడం వచ్చా ?”

“…”

ముసలాయన అడిగే ప్రశ్నలకి రిషభ్ కి సమాధానాలు చెప్పాలని ఉన్నా… సమకాలీన కధల క్లైమేక్సుల్లో ముసలాళ్ళని కెలికితే వినవలసివచ్చే నాలుగు పేరాగ్రాఫుల సోది యొక్క సమ్మెట పోటు సలుపు ఎలా ఉంటుందోనన్న ఎరుక తెచ్చిన భయం… రిషభ్ వహించిన మూడు చుక్కల మౌనం.

“నీకు తెలుసో లేదో, నాకు గిటార్ అంటే చాలా ఇష్టం.. శాస్త్రీయ సంగీతంలో కొంత ప్రవేశం కూడా ఉంది. రోజూ గిటార్ వినడానికే మీ ఇంటి ముందు వరండాలో మీకు తెలియకుండా తచ్చాడేవాడ్ని. ఈ మధ్య మీరు వాయించడం మానేసిన దగ్గర నుంచి నా సాయంత్రాల్లో ఏదో వెలితి. మళ్ళీ రేపట్నుంచి వాయించమని ఆ పిల్ల రాగానే చెప్పవా ప్లీజ్” అనేసి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి “అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.. మొన్నామధ్యన ఎప్పుడో పాత ఘర్షణ సినిమాలోని “కురిసేను విరిజల్లులే…ఒకటయ్యేను ఇరుచూపులే” పాట గిటార్ మీద వాయిస్తున్నప్పుడు “అంతర గాంధారం”, రిషభంలా వినిపించింది. ఆ పాట ‘అమృత వర్షిణి ‘ రాగంలో ఉంది. ‘అమృత వర్షిణిలో  రిషభం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి” … మనం గుర్తుపెట్టుకున్నాం…’ అమృత వర్షిణి ‘ లో ‘రిషభం ‘ ఉండదని… మనతో పాటే రిషభ్ కూడా..

***