అతడు ఈ తరం

painting: Rafi Haque

painting: Rafi Haque

నా సెల్ మోగుతోంది.  కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవరికో కామెంట్ రాస్తున్న నేను లేచి వెళ్ళి మాట్లాడాలనీ,  కనీసం వంటింట్లో పని చేసుకుంటున్న మా పని అమ్మాయి హేమని ఫోన్ తియ్యమని అందామనీ లోలోపల అనుకుంటున్నాను కాని నోట్లోంచి మాట రావడం లేదు.  మెదడు పూర్తిగా ఫ్రెండ్ టైమ్ లైన్ మీద రాస్తున్న కామెంట్ మీద ఉంది.

హేమ ఫోన్ తీసుకున్నట్లుంది “హల్లో వినతక్కా బావుంటివా?”  అంటోంది.

‘ఓ,  అక్కా!?’  అనుకున్నాను.  ఫోన్ తీసుకురా హేమా అని అందామనుకునే లోపు నా కామెంట్ కి సమాధానం వచ్చింది.  మళ్ళీ ఇక దానికి సమాధానం రాయడం లో పడిపోయాను.

“ఆఁ ఉంది”  అంటోంది హేమ.   అక్క ఆ వైపునుండి  ‘ఏం చేస్తుంది?’  అని అడిగినట్లుంది “ఇంకేముందీ!!?  ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్ ముందే కూర్చుని ఏందేందో రాసుకోవడమేగా!  ఉండు లైన్లో.  ఫోన్ తీసుకెళ్ళి ఇస్తా”  అంటూ నా రూమ్ లోకి వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టింది మా హేమ.

‘వాస్నీ,  అందరికీ నేనంటే తమాషా అయిపోయింది.  అసలు ఇదిగో ఈ ఫేస్ బుక్కే నా పరువు తీస్తోంది”  అనుకుని నవ్వుకుంటూ ఆ పిల్ల చేతిలోంచి ఫోన్ తీసుకున్నాను.

“చెప్పక్కాయ్,  ఎప్పుడు బయలుదేరుతున్నారు?”  చెవిలో ఫోన్ ఉంది కాని కళ్ళు మాత్రం కంప్యూటర్ స్కీ్రన్ మీదే ఉన్నాయి.

“రేపే కదా!?,   మేము పొద్దునే్న బయలుదేరతాం.  నువ్వు మూడుకి బయలుదేరితే సరిపోదా?  నేరుగా దిగువ తిరుపతిలోని  శ్రీనివాసం కి రా.   సాయంత్రం ఆరుకి అక్కడకి చేరేట్లు వస్తే మంచిది, చీకటి పడకముందే.   రాత్రికి శ్రీనివాసం లో ఉండి ఎల్లుండి వేకువఝామున్నే తిరుమలకి బయలుదేరదాం.   దర్శనం అయ్యాక పిల్లలు బెంగుళూరికి వెళ్ళిపోతారు,  నేను బావ తిరిగొస్తాం”  అంది.

అక్క మనవరాలికి తిరుమలలో పుట్టెంటు్రకలు తీయిస్తున్నారు.  మదనపల్లి నుండి తిరుపతికి మూడు గంటల ప్రయాణమే.  వెళ్ళొచ్చు కాని ‘దాని కోసం వెళ్ళాలా,  అబ్బా!’  అనిపించింది.   దాని కోసం అని కాదు కాని నాకెందుకో ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు ఈమధ్య.  నాకు మొదటి నుండీ కూడా ఫేస్ బుక్ లో గడపడం ఇష్టం.   మా అబ్బాయి రాహుల్ ఢిల్లీ యూనివర్సిటీలో చేరినప్పటి నుండీ  ఒంటరితనంగా ఉన్నట్లనిపించి ఫేస్ బుక్ లోకి మరీ ఎక్కువగా వెళ్ళడం అలవాటయింది.  ఇక అది అలవాటయ్యాక ఏమిటో మరి ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు.  ఇంత పిచ్చి మంచిది కాదని తెలుస్తోంది కాని కంప్యూటర్ ని వదలలేకపోతున్నాను.

“వద్దులేక్కాయ్  నేను రాలేను,  నాకు ఓపిక లేదు.  పెద్దోడి సెల్ కి ఫోన్ చేసి ‘నేను రావడం లేదురా’ అని చెప్తాలే”  అన్నాను.   మా పెద్దోడు అంటే మా అక్క కొడుకు. చిన్నోడు అంటే నా కొడుకు రాహుల్.

“సరేలే  అయితే,  కోడలు ఏమన్నా అనుకుంటుందేమో..   వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి చెప్పు”  అంది.

“సరే”  అని  “తిరుపతి నుండి నువ్వు ఇక్కడకి వచ్చి పోరాదా?”  అన్నాను.

“వద్దమ్మాయ్,  బావకి జ్వరం బాగా తగ్గలేదు.  బర్రెలకి మేతా నీళ్ళూ….   చాలా పని ఉంటుళ్ళా”  అంది.

“ఊ,  సరే,  బై”  అన్నాను.

2.

తిరుపతిలో అక్కకి జ్వరం వచ్చిందిట.  బావది తనకి అంటుకోని ఉంటుంది.  వెనక్కి అంతదూరం ప్రయాణం చేయలేదని  బావని ఊరికి పంపి అక్కని వాడి కార్లో నా దగ్గరకి తీసుకు వచ్చాడు పెద్దోడు.    పెద్దోడు,  కోడలు,  మనవరాలు ఆ పూట ఉండి సాయంత్రానికి బెంగుళూరు వెళ్ళిపోయారు.

అక్కకి నా దగ్గరకి వస్తే విశా్రంతి.  హేమ అన్నీ చేసిపెడుతుంది చక్కగా.  రెండు రోజుల్లోనే అక్కకి జ్వరం తగ్గింది.  జ్వరం తగ్గగానే వద్దంటున్నా వినకుండా ఇల్లు సర్దుతానని కూర్చుంది.  నా దగ్గరకి ఎప్పుడొచ్చినా ఇల్లంతా శుభ్రం చేసి పెడుతుంది.  నాకు సుఖం ఆమె వస్తే.  నేను మరింత సేపు నేను నా సాహిత్య సేవలో అంటే ఫేస్ బుక్ లో,  వాట్సప్ లో పడిపోవచ్చు.

నాకు కబుర్లు చెప్తూ హాలంతా శుభ్రం చేసి,  మా అబ్బాయి రాహుల్  రూమ్ శుభ్రం చేయడానికి వెళ్ళింది.  దాదాపు పది అవుతుండగా “అమ్మాయ్, ఇటు రా”  అని పెద్దగా కేకేసింది.  ఆమె గొంతులో కంగారు.  ‘ఏదో తేలునో పామునో చూసినట్లుగా ఏంటి అలా అరిచింది?’  అనుకుంటూ పరిగెత్తాను.

అక్క చేతిలో ఏవో కాగితాలు!!

“చూడు,  నీకు తెలుసా ఈ సంగతి?”  అంది కాగితాలు నాకు అందిస్తూ.  నేను నిలబడే “ఏమిటివీ” అంటూ తీసుకుని చూశాను.

రాహుల్ క్లాస్ మేట్ మధుర అనే అమ్మాయి వీడికి రాసిన లవ్ లెటర్స్!!!

ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు కాని ఇలా వాళ్ళ మధ్య లవ్ అని నాకు తెలియదు.   ఎన్నోసార్లు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో కలిసి మా ఇంటికి వచ్చింది కూడానూ.  నాకసలు అనుమానమే కలగలేదు.  ఆ ఉత్తరాలు చూసిన నా ముఖం మాడిపోయింది.  నా ముఖాన్ని,  దానిలో కదలాడుతున్నా భావాల్ని చూస్తున్న మా అక్క ఇక నస మొదలుపెట్టింది.

“పిల్లాడు ఏం చేస్తున్నాడు,  ఏం రాస్తున్నాడు అని కూడా చూసుకోకుండా ఎప్పుడూ ఆ ఫేస్ బుక్కు లో పడిపోతే ఎట్లా?  కాలేజీకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి రావడం,  వచ్చాక  ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా  కంప్యూటర్ ముందు కూర్చోవడం – పనులన్నీ ఆ హేమ మీదేసి.  తెలియనోళ్ళకైతే చెప్పొచ్చు పెద్ద చదువులు చదువుకున్నదానివి నీకు మేము ఏం చెప్పగలం”  గొణుక్కుంటూ సర్దుడాపి గోడ వైపుకి జరిగి జారగిలబడి తల పట్టుకుంది.

నేను కూడా అక్క ఎదురుగ్గా కింద కూలబడి ఉత్తరాలు చదవసాగాను.

అవి ఆ పిల్ల రెండేళ్ళక్రితం పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు వీడికి రాసిన ఉత్తరాలు.  వీడు ఆ అమ్మాయికి రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి.  ఇక్కడే దాచమని మళ్ళీ వీడికే ఇచ్చినట్లుంది.

యూనివర్సిటీకి వెళ్ళేముందు వాటినన్నింటినీ ఈ అట్టపెట్టెలో పెట్టేసి వెళ్ళాడనమాట.  నేను వాడి అలమరా చూడను కాబట్టి అవి నా కంటపడలేదు.

“ఏం చేద్దామే,  వాళ్ళ నాన్నకి చెప్తావా?”  అంది అక్క.

చందుకి చెప్తే నన్ను ఎన్ని మాటలంటాడో!  అక్క కాబట్టి నాలుగు తిట్టి ఊరుకుంది.  వాడు అలా ఉత్తరాలు రాయడానికీ,  నేను ఎక్కువసేపు ఫేస్ బుక్ లో గడపడానికీ సంబంధం లేకపోవచ్చు – పోనీ ఉందా!?  ఏమో!! –  ఏది ఏమైనా ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

Kadha-Saranga-2-300x268

అక్క వైపు బ్లాంక్ గా చూసి ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ ఉత్తరాలు చూడసాగాను.  రాహుల్ ఆ అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేస్తున్నాడులా ఉంది.  కొన్ని ఉత్తరాల్లో కవితలు కూడా రాశాడు.  వాటిని చూస్తుంటే నవ్వు రావలసింది పోయి నిస్తా్రణ వచ్చేసింది.

అదే నా స్టూడెంట్స్ రాసిన ఉత్తరాలైనట్లైతే పగలబడి నవ్వి ఉండేదాన్ని ఆ రాతలకి.  మరి అదే సమస్య నాకొస్తే పిల్ల చేష్టలులే అని నేనెందుకు తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను!?  –  ఇలా ఆలోచిస్తే బాధ తగ్గుతుందేమో అనుకుంటే,  అబ్బే,  ఏ మాత్రమూ తగ్గకపోగా ఎక్కువయింది.  ఎంత విచిత్రం!!

ఫేస్ బుక్ నిండా రమణుడు, జిడ్డు కృష్ణమూర్తి,  తత్త్వం,  నిన్ను నువ్వు తెలుసుకో,  ఏమీ అంటకుండా ఉండాలి అంటూ పోస్టులు పెట్టే నేను,  చాలా ఎదిగాను అనుకున్న నేను –  సమస్య నాకు వచ్చేప్పటికి ఏమిటి ఇలా కృంగిపోతున్నాను!?  చెప్పడం అంత ఈజీ కాదు ‘నిజ్జంగా తెలుసుకోవడం’  అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది.

అక్క లేచెళ్ళి కాఫీ కలుపుకోని తెచ్చింది.  అక్క వైపు చూస్తే మళ్ళీ ఏం ప్రశ్నలు అడుగుతుందో అనుకుని కాఫీ తాగుతూ ఉత్తరాలు చదువుతున్నట్లుగా తల వాటిల్లోకి దూర్చాను.  ఆలోచనలు తల నిండా…

వాడిని ఎంత పద్ధతిగా పెంచుకున్నాను?  వాడికి ఊహ వచ్చినప్పటి నుండే ఎన్ని కథలు చెప్పానో.  నాలుగేళ్ళకే కూడపలుక్కుంటూ తెలుగు ఇంగ్లీష్ రెండూ చదివేవాడు.  అదేమంటే పెన్ తీసుకుని రాసేవాడు.  ఎంత ఇష్టంగా రాస్తాడో ఇప్పటికీ…  ‘ఈ రాయడం ఎట్లా నేర్పించావు తల్లీ మా పిల్లల చేత చదివించగలుగుతున్నాం కాని రాయించడమంటే తల ప్రాణం తోకకి వస్తోంది’  అనేవారు నా ఫ్రెండ్స్.

కొత్త డైరీలు వస్తే  ముందు పేజీలో ఓ మంచి కవిత రాస్తాడు.  అసలు వాడికి  తెల్ల పేపర్ కనిపిస్తే చాలు పెన్నో పెని్సలో తీసుకుని ఏదో ఓ విషయం రాయకపోతే నిద్రపట్టదు.

“ఎంత సేపు చూస్తావమ్మాయ్,  ఇంక లే,  అన్నీ సర్దుతాను”  అంది అక్క.

“అదేమంటే పెన్ను తీసుకుని రాసే అలవాటు వల్ల ఇలా రాసి ఉంటాడా!?  కాని చూస్తుంటే సీరియస్ గానే ఉందక్కా వ్యవహారం”  నాలో నేనే అనుకున్నట్లుగా అన్నాను.

“రాసేదేమిటే ప్రేమించానంటుంటే!!”  అని “ఇంతకీ ఆ పిల్ల నీకు తెలుసా?  మీ కాలేజీలోనే చదివినట్లుందిగా?”  అంది అక్క.

“ఆఁ”  అన్నాను క్లుప్తంగా.

“ఇప్పుడెక్కడ చదువుకుంటందీ,  అక్కడ కూడా మనబ్బాయి చదువుతున్న యూనివర్సిటీలోనేనా?”

“లేదు హైదరాబాద్ లో ఏదో కాలేజీలో”  అన్నాను.

“ఊఁ సరేలే అయితే బతికించింది.  ఒకే కాలేజీ అయి ఉన్నట్లైతే  చదువూ సంధ్యా లేకుండా తిరుగుతా ఉండి ఉంటారు,  విషయం చందూకి చెప్తావా?”  అంది.

“చెప్తే ఈయన ఏమంటాడో అక్కాయ్,  ఫస్ట్  రాహుల్ కి సాయంత్రం ఫోన్ చేసి అడిగేదా?”  అన్నాను.

“భలేదానివే తల్లా,  అసలే పిల్లలు ఉబిద్రంగా ఉన్నారు.  ఏం అడిగితే ఏం చేసుకుంటారో అని భయంగా ఉంటే.  ఈ సంగతి మనకి తెలిసిందని తెలిస్తే పరీక్షలు కూడా సరిగ్గా రాయడు ఊరుకో”  అంది.

“ఊఁ”  అన్నాను.  అక్క మాటలకి నాకు మరింత దిగులేసింది.

అలమరలో నుండి తీసిన వస్తువులు పైపైన సర్దేసి అక్క వంటింట్లోకి వెళ్ళిపోయింది.  అక్క కళ్ళ నిండా నిస్సహాయతతో కూడిన దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.  నేను మాత్రం గంభీరంగా ఉన్నాను – దిగులు కనపడనివ్వకుండా.   మధ్యాహ్నం ఇద్దరం ఏదో తినాలి కాబట్టి అన్నట్లు భోంచేశాం.   గదిలోకి వచ్చి పడుకున్నాక ఆ పిల్ల గురించీ,  వాళ్ళ తల్లిదండ్రుల గురించీ విషయాలన్నీ అడిగి చెప్పించుకుంది అక్క.

ఇక ఆ పిల్లనే పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని అక్క ఆత్రం.  ఆ పిల్ల మా కులం కాదు అని తెలిసేటప్పటికి నోటికొచ్చినట్లు నన్నూ నా ఫేస్ బుక్ నీ కాసేపు ఆడిపోసుకుంది.  నేనేమీ మాట్లాడలేదు.  అలసి పోయిన అక్క మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోయింది.

కులం గురించి నాకేమీ పట్టింపులేదు కాని ఇదెక్కడికి దారి తీస్తుందో అనిపించింది.   ఆలోచించుకుంటూ నేను కూడా కళ్ళు మూసుకున్నాను కాని కళ్ళు,  కనుబొమలు ముడుచుకుపోతున్నాయి ప్రశాంతత లేకుండా.   ఎందుకు నాకింత ఆందోళన?  ఈరోజుల్లో ప్రతి వాళ్ళూ ప్రేమించే కదా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు?  ‘నాకే కులమైనా ఒకటే’ అని పైకి అనుకుంటున్నాను కాని లోలోపల నాకు కూడా మన కులం పిల్లైతే బావుండేది అన్న కోరిక ఉందా?   ఏమీ అర్థం కాలేదు.  ముందు అసలు ఈ విషయం చందూకి చెప్పాలా వద్దా అని కూడా నిర్ణయించుకోలేకపోతున్నాను.  ఇదీ అని చెప్పలేని ఉద్వేగంతో కూడిన బాధ నన్ను ఓ చోట నిలవనివ్వడం లేదు.  లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను –  మధ్యాహ్నం మూడుకి హేమ వచ్చిందాకా.

సాయంత్రం ఆరుకి చందూ ఆఫీస్ నుండి రాగానే అక్క వంటింట్లోకి దూరిపోయింది.  ఆయనకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాను.  కాఫీ తాగేసి ప్రతిరోజూ తను వెళ్ళే ఆధ్యాత్మిక చర్చకి వెళ్ళిపోయాడు.  ఆయన అటు పోగానే అక్క గభాల్న బయటికొచ్చి “చెప్పావా? ,  ఏమన్నాడు?”  అంది.

“లేదక్కాయ్,  చెప్పలేదు.  భయంగా ఉంది”  అన్నాను.

భయం అని అంటే అక్క ఊరుకుంటుంది రొక్కించకుండా.  కాని నాకు అసలు ఆయనతో ఎలా చెప్పాలో తెలియడం లేదు.  చెప్తే ఆయన ఈ విషయాన్ని నాకంటే కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయగలడు.   వాళ్ళ నాన్నతో చాలా స్నేహంగా, గౌరవంగా ఉండే రాహుల్ ఈయన అడిగితే ఇబ్బంది పడొచ్చు.    ‘ముందు నువ్వు నన్ను అడగకుండా నాన్నకి ఎందుకు చెప్పావు?’  అని నన్ను అనొచ్చు.  పైగా నా అలమరా అసలెందుకు చూశావు అని నా మీద ఎగిరి ఏడ్చి గోల చేస్తాడేమో కూడా…

ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్న అక్కతో “ఓ వారంలో సెలవలకి వస్తాడుగా  అప్పుడు వాడిని అడుగుదాం,  వాడినే వాళ్ళ నాన్నకి చెప్పమని చెబ్దాంలే అక్కాయ్”  అన్నాను.

“సరేలే అదే మంచిది”  అంది అక్క.

3.

రాహుల్ చాలా తెలివైనవాడు.  అన్నీ తెలిసినవాడు.  వాడికి ఏ బాధ వచ్చినా, సంతోషమొచ్చినా నాకు చెప్తాడు.  నాకేదైనా సమస్య వచ్చినా కూడా  నా పక్కనే కూర్చుని విని నెమ్మదిగా పరిష్కారం గురించి మాట్లాడతాడు.  నాదే తప్పైతే ఎంత నిదానంగా చెప్పి ఒప్పిస్తాడో!  అలాంటి వాడు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడో మరి.  తల్చుకుంటున్న కొద్దీ బాధ ఎక్కువవుతోంది కాని తగ్గడం లేదు.

ఈ ఆలోచనలతో కొట్టుకుంటున్న నాకు ఫేస్ బుక్కే గుర్తుకు రాలేదు.  వారం రోజులు భారంగా గడిచిపోయాయి.  నా కాలేజీకి కూడా సెలవలు కాబట్టి సరిపోయింది కాని ఉన్నట్లైతే పిల్లలకి పాఠాలు చెప్పగలిగి ఉండేదాన్ని కాదేమో!  అనిపించింది.

ఆరోజే అబ్బాయి వచ్చే రోజు.  బెంగుళూర్ ఏర్ పోర్ట్ కి డ్రైవర్ ని పంపాడు చందు.   రాహుల్  రాత్రి ఫోన్ చేసి ‘రెండు రోజులు అన్నాయ్ దగ్గర ఉండి రానా?’  అని మమ్మల్ని అడిగాడు కాని నేను ‘వద్దంటే వద్దనీ,  నాకు వాడిని చూడాలని ఉందనీ’  చెప్పాను.  ‘ఏమిటీ మొండిపట్టు?’  అన్నాడు చందు – నన్ను ఆశ్చర్యంగా చూస్తూ…  ఫోన్ లో మాట్లాడుతున్న రాహుల్ కూడా ‘ఏంటి మమ్ ఇలా మాట్లాడుతోంది?’ అని అనుకుని ఉంటాడు.

‘పోనీలే నాన్నా,  అమ్మ దిగులు పెట్టుకుందేమో,  నేరుగా ఇంటికే వస్తాలే’  అన్నాడుట.

ఎండాకాలం సూర్యుడు ఉదయం తొమ్మిది కాకుండానే చిటపటలాడిపోతున్నాడు.   హేమ కిటికీలకి కట్టిన వట్టి వేళ్ళ కర్టెన్స్ ని కిందికి దించి నీళ్ళతో తడుపుతోంది.   వాటి మీద నుండి చల్లని గాలి కిటికీలో నుండి లోపలకి వస్తోంది.  అక్క వంటింట్లో అబ్బాయికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేస్తోంది.  ఇల్లంతా కమ్మని వాసన అలుముకుని ఉంది.

దాదాపు పదకొండు అవుతుండగా కార్ వచ్చింది.  రాహుల్ నవ్వుకుంటూ లోపలకి వచ్చాడు.  లగేజీనీ డ్రైవర్ కి అస్సలు ఇవ్వడు,  ఎప్పుడూ తనే మోసుకొచ్చుకుంటాడు.  బ్యాగ్స్ కింద పెట్టి “మమ్,  హౌ ఆర్ యు?”  అని వాటేసుకున్నాడు.  నా వెనుక గబగబా వస్తున్న అక్కాయ్ ని చూసి నన్ను వదిలేసి “అరె!  ఆమ్మా,  నువ్వెప్పుడొచ్చా!!?”  అని అక్క దగ్గరకి పరిగెత్తి చేతులు పట్టుకుని ఊపేశాడు.

“పది రోజులైందబ్బాయ్ వచ్చీ,  నన్ను చూసి నువ్వు థ్రిల్లవ్వాలని నేనొచ్చినట్లు నీకు చెప్పొద్దన్నా.  సరేగాని ఏందిట్లా నల్లబడ్డా?  సరిగ్గా తినడం లా?”  అంది అక్క నోరంతా తెరిచి నవ్వుతూ.

“హహహ,  ఇంత లావుంటే.  నువ్వూ, అమ్మమ్మా ఎప్పుడూ ఇదే వాక్యం మాట్లాడతారు – తేడా లేకుండా.  ఎట్లుంది అమ్మమ్మ?”  అన్నాడు.

“బాగుంది” అని అక్క అంటుండగానే “భలే వాసనొస్తుందే వంకాయ కూర చేశావా?”  అన్నాడు.

“అవును,  స్నానం చేసిరా.  వేడివేడిగా అన్నం తిందువుగాని” అంది.

ఆ సంభాషణ అంతా విననట్లుగా నేను సూట్ కేసులు గదిలోకి చేరేస్తున్నాను.   నా వైపు చూసిన వాడు “మమ్,  ఆర్ యు ఆల్ రైట్?  ఏమిటి అలా ఉన్నావు?”  అన్నాడు.

వాడు పరీక్షలెలా రాశాడైనా అడగాలనిపించలేదు నాకు,  ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ “నువ్వు చేసిన పనికి ఇలాగాక ఎలా ఉంటాను?”  అన్నాను.

వాడు అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూస్తూ “ఏంటి ఆమ్మా?”  అని అక్కాయ్ కి చేత్తో సైగ చేసి అడుగుతూ నా వెనకే గదిలోకి వచ్చాడు.

అక్కాయ్ కూడా వాడి వెనకే లోపలకి వచ్చి “వాడు వచ్చీ రాగానే అడగాలా?  అన్నం తిన్నాక అడగ్గూడదా?  ఇంతలోనే ఏం పోయిందని తొందరా?”  అంది.

“ఏంటి మమ్?  ఏమైంది?”  అన్నాడు వాడు.  వాడి కళ్ళు ఏం జరిగిందా అన్నట్లుగా కంగారుగా కదులుతున్నాయి.  కంప్యూటర్ టేబుల్ డెస్క్ లాగి లోపల పెట్టిన లెటర్స్ ని తీసి “ఏంటివి?”  అన్నాను.   వాడు నా చేతిలోని ఉత్తరాలు తీసుకుని చూస్తున్నాడు.

నా గొంతులోని తీవ్రతకి నాకే అసహ్యం పుట్టింది.  ‘ఏమిటిది?’ –  అనుకుని గొంతుని సర్దుకుని “నాకు ఎందుకు చెప్పలేదు రాహుల్?  ఆమ్మ నీ అలమరా సర్దుతుంటే బయటపడ్డాయి”  అన్నాను.

ఒక్కసారిగా తీవ్రస్థాయి నుండి కిందికి దిగిన నా స్వరం వినేప్పటికో,  ‘ఇదీ’ అన్న విషయం వాడికి తెలిసేప్పటికో మరి వాడు తేలిగ్గా నవ్వేస్తూ “వీటిని చూసేనా ఇంత బాధపడ్డావూ?”  అన్నాడు.

“బాధపడరా మరి?”  అన్నాను.

నా మాట వినిపించుకోకుండా “ఊరికే రాశావా అబ్బాయ్!  అయితే ప్రేమా గీమా ఏమీ లేదా?”  అంది అక్కాయ్.  ఆమె ముఖం ‘హమ్మయ్య’  అనుకున్నట్లు సంతోషంగా వెలిగిపోతోంది.

“ప్రేమ లేదని కాదు ఆమ్మా,  మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.  ఒకళ్ళంటే ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి”  అన్నాడు కాస్త చిరాకుగా.

“ఆఁ  అదేందిరా?  అయితే మీ అమ్మకెందుకు చెప్పలా?”  అంది.

ఏం చెప్తావు సమాధానం అన్నట్లుగా వాడి వైపు చూశాను.  “ఆఁ  ఎందుకు చెప్పడం?  చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాం”  అన్నాడు.

“అంటే?  వాట్ డు యు మీన్ బై దట్?”  అన్నాను అసహనంగా.

“అది కాదు మమ్,  ఇప్పుడే ఎందుకు చెప్పడం – సెటిల్ అయ్యే విషయమైతే చెప్పాలి కాని”  అన్నాడు.

“నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు రాహుల్,  మీ ఇద్దరి మధ్యా ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నావు,  ప్రేమించుకుంటున్నాము అంటున్నావూ…  కదా!?”

“అవును మమ్,  నిజమని చెప్తున్నా కదా!?”  అన్నాడు.

ఇంతలో అక్క కలుగచేసుకోని “ఏందబ్బాయ్,  మీ మాటలు నాకు అర్థం కావడం లేదు.  తక్కువ కులపు పిల్లని పెళ్ళి చేసుకుంటావా?”  అనగానే రాహుల్ ఆమెని కోపంగా చూశాడు.  వాడి చూపుకి భయపడ్డ అక్కాయ్ “సరే నీకిష్టమైంది,  చేసుకుంటావనుకో,  అయితే మీ అమ్మకి చెప్పబన్లే,  వారం నుండి తిండి కూడా తినకుండా మనసులో ఏడ్చుకుంటంది”  అంది తత్తరతత్తరగా ఇప్పుడే ఏదో పెళ్ళయిపోతున్నట్లు.

నేను అక్కని  “అక్కాయ్,  ఊరుకో,  చెప్పనీయ్ వాడిని”  అన్నాను.   కోపంగా ఉంది నాకు.  ఈ చర్చంతా చీదర కూడా పుట్టిస్తోంది.

“మమ్,  ఇప్పుడు ఫీలింగ్్స ఉన్నంత మాత్రాన తర్వాత పెళ్ళి చేసేసుకుంటారు అని అనుకుంటే ఎలా?”  అన్నాడు.

అక్క వైపు చూస్తున్న నేను వాడి మాటలకి అమితాశ్చర్యపోయాను.   గభాల్న తల తిప్పి వాడి వైపు చూస్తూ “వ్వాట్,  అయితే పెళ్ళి చేసుకోరా!?”  అన్నాను.

“అది కాదు,  దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నాను”

“ప్రేమించానంటూ లెటర్స్ రాశావు కదా?  కవితలని గుప్పిస్తూ…   ప్రేమించుకునేది పెళ్ళి చేసుకోవడానికి కాదా?”  అరిచాను.   ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకుని మోసం చేసి వెళ్ళిపోయిన కొంతమంది నాకు తెలిసినవాళ్ళు  ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలారు.    ‘వీడు కూడా అంతేనా?  నా బిడ్డని నేను అలా పెంచానా?’ అన్న ఆలోచనతో బిపి వచ్చినట్లుగా వణికిపోయాను.

వాడు నాకెలా చెప్పాలా అన్నట్లు తల అటూ ఇటూ ఊపుతున్నాడు.

నేనే మళ్ళీ “అయితే ఇవన్నీ కాలక్షేపం కోసం రాసుకున్న ఉత్తరాలని అనుకోమంటావా?”  అన్నాను లెటర్స్ వైపు చూపిస్తూ.

“ఊఁ  నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మమ్,  ప్రస్తుతం మేమిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టపడుతున్నాం.  పెళ్ళి చేసుకుంటామేమో కూడా.  కాని పెళ్ళి గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకూడదని అనుకున్నాం”  అన్నాడు.

నన్ను అనునయిస్తున్నట్లుగా చెప్తున్న వాడి ఆంతర్యం నాకంతు పట్టకపోయినా ఆ మాటల్లో సత్యం దాగి ఉందని అర్థమైంది.  మౌనంగా వాడి వైపే చూస్తున్నాను.  అక్క అయితే దిమ్మెరపోయినట్లుగా చూస్తూ వింటోంది.

“ఇప్పుడు మధురకి నేనంటే ఇష్టం,  నాకు మధుర అన్నా ఇష్టమే.  అయితే మేము ఇంకా చాలా చదువుకోవాలి.   ఎంతో మందిని కలుసుకోవాలి.  ఈ ప్రయాణంలో మాకు వేరెవరైనా దగ్గరవొచ్చు.  పోనీ మా ఇద్దరిలో ఎవరికైనా ఇప్పుడున్న ఇష్టం ఉండకపోవచ్చు.  పోనీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏదైనా ప్రమాదం జరగొచ్చు – ఏ జబ్బో,  యాక్సిడెంటో”

“ఊరుకోబ్బాయ్,  తంతా!  ఏమిటా మాటలు?”  అక్క పెద్దగా అరిచింది.

నేను రాహుల్ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం.   వాడు చెప్తున్నది అర్థం అవగానే నాలో నిస్సత్తువ.   వెళ్ళి మంచం మీద కూర్చున్నాను.

రాహుల్ నా పక్కకి వచ్చి కూర్చుని నా భుజం మీద చెయ్యేసి నన్ను ఆనుకుని “ముందున్న జీవితంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిదా మమ్?  ఆ నిర్ణయానికి అసలు అర్థం ఉంటుందా? అందుకే నేను నీకు చెప్పలేదు,  అంతే”  అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

సమాజంలో నిరంతరం చొచ్చుకుని వస్తున్న  మార్పుల వల్ల  ఈ కొత్త తరం పిల్లల జీవితాల్లో  పెరామీటర్స్ ఎక్కువై  వాళ్ళ ఆలోచనా విధానాలూ,  వాటిని ప్రేరేపించే కారణాలు రెండూ కూడా డైనమిక్ గా ఉంటున్నాయి.  కాని రాహుల్,  నా కోడలు అవుతుందో లేదో తెలియదు గాని మధుర –  ఇద్దరూ ఇంత క్లారిటీగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది.  నా శిష్యురాలిగా ఆమె,  ఆమెతో పాటు ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నా బిడ్డ ఇద్దరూ నాకు గర్వాన్నే కలిగించారు.

రాహుల్ ని తలని దగ్గరకి తీసుకుని హత్తుకున్నాను.   నా కళ్ళల్లోంచి రెండు వెచ్చని కన్నీటి బిందువులు జారి వాడి గుబురు తలలో ఇంకిపోయాయి.

*****

 

మూడు కావ్యాల ముచ్చట!

mani-92మనకి తెలుగులో ఐదు పంచకావ్యాలు (మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవపాండవీయము, పాండురంగ మహాత్మ్యము, శృంగార నైషధము)  ఉన్నట్లే తమిళంలో కూడా ఐదు పంచకావ్యాలు ఉన్నాయి.  అవి శిలప్పదిగారం, మణిమేఖల, జీవక చింతామణి, వళయాపతి, కుండలకేశి.

వీటిలో అత్యుత్తమ రచనలు, జంట కావ్యాలు అయిన శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలను  ఎమ్.ఎ తెలుగు పాఠ్యపుస్తకాలు చదివీ,   నెట్ లోని సమాచారం సేకరించీ,  అన్నిటికంటే ముఖ్యంగా నా కొలీగ్స్,  తమిళ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునీ గతంలో సారంగ పాఠకులకు సంక్షిప్తంగా పరిచయం చేశాను.  అదే విధంగా ఇప్పుడు మిగిలిన మూడు కావ్యాలను పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.  ఇవి నేను విన్న,  తెలుసుకున్న కథలు మాత్రమే గమనించగలరు.  తప్పులు ఉంటే మన్నించి మీకు ఇంకా ఈ కావ్య విశేషాలు తెలిసి ఉంటే ఇక్కడ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

 1. శిలప్పదిగారం లింక్
 1. మణిమేఖల  లింక్

మిగిలిన మూడు కావ్యాలను ఈ క్రింది వ్యాసంలో చదవండి –

 1. జీవకచింతామణి

తమిళ పంచకావ్యాలలోని మూడవది “జీవక చింతామణి”.  కావ్య నాయకుడు జీవకుడు పుట్టినప్పుడు ఆకాశవాణి “జీవ”  అని పలికిందనీ,  అతని తల్లి “చింతామణీ,  నువ్వు నాకు లభించావా?”  అన్నదనీ ఈ కావ్యానికి జీవక చింతామణి అనే పేరు వచ్చిందంటారు.

శృంగార కావ్యమైన ఈ జీవక చింతామణి కావ్యాన్ని తిరుత్తక్కదేవర్ రచించారు.  ఈ కావ్యం 3145 వృత్త పద్యాలతో రచింపబడినది.    తమిళంలో వృత్తపద్యాలతో కావ్యరచనకి నాంది పలికినవాడు తిరుత్తక్కదేవర్.    ఈయన జైన మత సంప్రదాయానికి చెందినవాడు.

ఒకసారి తిరుత్తక్కదేవర్ మధుర పండిత పరిషత్తుకు వెళ్ళినప్పుడు అక్కడి పండితులు ‘మీరు – జైన సంప్రదాయవాదులు – ఎంత సేపటికీ సన్యాస దీక్ష గురించి రాయమంటే రాయగలరు గాని ప్రణయానికి సంబంధించిన రచనలు చేయలేరు”  అని అన్నారుట.  తిరుత్తక్కదేవర్  దానిని సవాలుగా తీసుకుని ఈ జీవక చింతామణి కావ్యాన్ని ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేశారుట.

ఇది చక్కని కావ్యంగా పండితుల ప్రశంసలను అందుకొన్నది.

కథా సంగ్రహం :

హామాంగద రాజ్యానికి రాజు సత్యంధరుడు.  ఇతడు దయార్ద్ర హృదయుడు.  ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు.  అతని మేనమామ కూతురైన విజయను వివాహం చేసుకున్నాక అతిలోక సౌందర్యవతి, అపురూప లావణ్యవతి అయిన ఆమెని వదలకుండా ఆమెతోనే కాలం గడపసాగాడు.  రాజ్యవ్యవహారాలన్నీ మంత్రులు చేజిక్కించుకున్నారు.

కాష్టాంగాకారుడు అనే మంత్రి రాజుని మట్టుపెట్టి తాను రాజవ్వాలనే దురుద్దేశంతో సైన్యాన్ని సమీకరించుకుని  సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా విజయ గర్భవతి అయింది.  నెలలు నిండాయి.  రేపో మాపో బిడ్డ పుట్టబోతాడని రాజు సత్యంధరుడు భార్యని విడవకుండా రేయింబవళ్ళు ఆమె చెంతనే ఉండసాగాడు.  అది అదనుగా భావించిన కాష్టాంగాకారుడు తన సైన్యంతో అంతఃపురాన్ని ముట్టడించాడు.  సత్యంధరుడు తన ఎగిరే యంత్ర విమానంలో భార్యను కూర్చుండబెట్టి ఆమెని పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు.   అక్కడున్న కొద్దిపాటి సైన్యంతో కాష్టాంగాకారుడిని ఎదుర్కొన్నాడు కాని యుద్ధంలో వీరమరణం పొందాడు.

విజయను తీసుకెళ్ళిన విమానం ఓ స్మశానంలో ఆగిపోయింది.  అక్కడ ఆమె ప్రసవించింది.  నిస్సహాయతతో హృదయవిదారకంగా ఏడుస్తున్న విజయని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ దేవత మనిషి రూపంతో వచ్చి ఆమెని ఓదార్చింది.

ఆ సమయంలో రాజ్యంలోని ఓ ప్రముఖ వాణిజ్యశ్రేష్టి తన బిడ్డ చనిపోవడంతో కుమారుని ఖననం చేసిన చోటు కొచ్చి ఏడ్చుకుని  తిరిగి ఇంటికి వెళుతున్నాడు.  బిడ్డను ఎలా పెంచాలో ఏం చేయాలో తెలియక దుఃఖిస్తున్న విజయకు దేవత ఉపాయం చెప్పింది.  దానికి ఒప్పుకున్న విజయ బిడ్ద వేలికి రాజముద్రికను తొడిగి ఆ శ్రేష్టి వచ్చే దారిలో పరుండబెట్టి చెట్టు చాటుకి తప్పుకుంది.  బిడ్డను చూసిన శ్రేష్టి తన బిడ్డ చనిపోయినా భగవంతుడు మళ్ళీ ఈ బిడ్డను ప్రసాదించాడని భావించి చేతుల్లోకి తీసుకున్నాడు.  అప్పుడు చాటునుండి చూస్తున్న దేవత “జీవ”  అంది.  అది విన్న శ్రేష్టి ఆకాశవాణి ఆ మాటలు పలికిందని భావించి బిడ్డకు ‘జీవకుడు’  అని నామకరణం చేసి బిడ్డను తీసుకెళ్ళి భార్యకి ఒప్పచెప్పాడు.  బిడ్డ చేతికున్న రాజముద్రికను చూసిన వారు అతను రాజకుమారుడని తెలుసుకున్నారు.  రాజముద్రికను తీసి దాచిపెట్టి అతడు తనకి దొరికిన బిడ్డ అని అందరికీ చెప్పి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.

విజయ స్మశానం నుండి బయటపడి అడవిని దాటి వెళ్ళి అడవికి ఆవలనున్న ఓ జైన ఆశ్రమంలో చేరిపోయింది.

***

జీవకుడు ఆర్యనంది అనే ఓ రాజగురువు దగ్గర విద్యను అభ్యసించసాగాడు.   సకల విద్యలను నేర్చుకున్నాడు.  మనోహరాకారుడైన అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరచసాగింది.  అతని విద్య పూర్తయ్యాక ఆర్యనంది జీవకుడికి అతని పుట్టుక రహస్యాన్ని తెలియచేశాడు.  కోపోద్రేకుడైన జీవకుడిని ఆర్యనంది శాంతపరచి కాష్టాంగాకారుని చంపడానికి ఇది తరుణం కాదు.  ఓ ఏడాది తర్వాతనే నీకది సాధ్యమవుతుంది.  అప్పటివరకూ దేశాటన చేయమని ఆజ్ఞాపించాడు.  గురువుకి మాట ఇచ్చి ఇంటికి చేరాడు జీవకుడు.

ఆ సమయంలో రాజ నగరానికి సమీపంలోని అడవిలో వేటగాళ్ళ గుంపు తయారై పశువులని ఎత్తుకుపోసాగారు.  రాజు కాష్టాంగాకారుడు వాళ్ళ మీదికి సైన్యాన్ని పంపాడు కాని ఆ అడవి ఆనుపానులు తెలియక చిత్తుగా ఓడిపోయాడు.  జీవకుడికి అది తెలిసి తన స్నేహితులైన కొంతమంది వీరులని వెంటబెట్టుకు వెళ్ళి వేటగాండ్రను పారద్రోలాడు.  ప్రజలు అతన్ని కొనియాడారు.  అది కాష్టాంగాకారునికి నచ్చలేదు.  జీవకుడి ధైర్యసాహసాలని చూసి అసూయాద్వేషాలతో రగిలిపోసాగాడు.  జీవకుని చర్యల మీద కన్నేసి ఉంచాడు.

నగరంలో శ్రీదత్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఓ కుమార్తె ఉంది.  నిజానికి ఆమె ఒక గంధర్వుడి కుమార్తె.  ఈ నగరంలోనే ఆమె వివాహం అవాలని ఉందని ఆమె జాతకంలో ఉండటం వల్ల ఒకప్పుడు శ్రీదత్తుడిని కాపాడిన ఆ గంధర్వుడు కుమార్తెని శ్రీదత్తుని ఇంట్లో ఉంచాడు.  ఆమె పేరు గంధర్వదత్త.  గంధర్వదత్తను వీణావాదనలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి ఆమె భార్య అవుతుందని శ్రీదత్తుడు ప్రకటన చేస్తాడు.  ఎంతోమంది యువకులు ప్రయత్నించి విఫలులవుతారు.  జీవకుడికి సంగతి తెలిసి ఆ పోటీలో పాల్గొని గంధర్వదత్తని ఓడించి ఆమెని వివాహమాడతాడు.

ఇద్దరూ సంతోషంగా కాలం గడపసాగారు.  ఒకరోజు ఓ ఏనుగు సంకెళ్ళని తెంచుకుని కోమటి వీధుల్లో పరిగెడుతూ గుణమాల అనే యువతిని తరుముకు రాసాగింది.  ఆమె కూడా నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కుమార్తె.   ఆ సమయంలో ఆ వీధిలోనే వెళుతున్న జీవకుడు ఏనుగును అదుపులో పెట్టి గుణమాలని రక్షించాడు.   అతని చేతిలో వాలిన ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన జీవకుడు ఆమెపై మరులుగొన్నాడు.  ఆమె కూడా జీవకుడిని మొదటి చూపులోనే ప్రేమించింది.  తన చిలుక ద్వారా అతనికి ప్రణయసందేశాన్ని పంపింది.  జీవకుడు సంతోషపడి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి గుణమాలని వివాహమాడాడు.

తన కుమారుడైన మదనునికి గుణమాలనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్న కాష్టాంగాకారుడు ఇది సహించలేకపోయాడు.  మదనుడిని పిలిచి జీవకుడి మీద ఏదో ఒక రాజద్రోహం మోపి సంహరించి రమ్మని పంపాడు.  పెద్ద సైన్యంతో జీవకుడి ఇంటి మీదకు వచ్చాడు మదనుడు.  సంవత్సరం పాటు కాష్టాంగాకారునిపై యుద్ధం చేయనని గురువుకిచ్చిన మాట నిలబెట్టడం కోసం తన భార్య గంధర్వదత్త మంత్రమహిమతో ఎవరికీ కనపడకుండా అక్కడ నుండి తప్పించుకుని మాయమైపోతాడు.

దేశ సంచారం చేస్తూ వివిధ దేశాలల్లోని ప్రముఖుల కుమార్తెలని ఐదుగురిని వివాహమాడతాడు.

పాము కాటు నుండి కాపాడి ఓ దేశ రాజకుమారి అయిన పద్మను మూడవభార్యగా స్వీకరిస్తాడు.   యుక్తవయస్తు వచ్చినా ఎవర్ని చూసినా సిగ్గుపడని ప్రముఖ వ్యాపారి కుమార్తె ఖేమచరి జీవకుడిని చూసి సిగ్గుపడటంతో అతనే ఆమె భర్త అని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమెని వివాహమాడతాడు.  ఆ తర్వాత మరో రాజకుమార్తె కనకమాలను వివాహమాడాడు.

జీవకుడు కనకమాల దగ్గర ఉన్నప్పుడు,  జీవకుడు ఎక్కడున్నాడో అని గంధర్వదత్త తనకున్న మంత్ర ప్రభావంతో చూసి “దారిలో కనపడుతున్న యువతులందరినీ పెళ్ళి చేసుకుని సాగిపోతున్నారు బాగానే ఉంది.  కాని ఇక మీరు వెంటనే తిరిగి వచ్చి కాష్టాంగాకారుడిని సంహరించి రాజ్యాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైంది” అని  ఉత్తరం రాసి రాజమిత్రుడికి ఇచ్చి పంపింది.

ఉత్తరం చదువుకున్న జీవకుడు కనకమాలకి చెప్పి రాజమిత్రుడితో పర్వతాలను నగరాలను దాటుకుంటూ తన తల్లి ఉన్న జైన ఆశ్రమానికి చేరుకుంటాడు.  అక్కడ విజయను చూసి గుర్తుపట్టిన ఆ రాజమిత్రుడు జీవకుడే ఆమె బిడ్డ అని చెప్తాడు.   తల్లీ బిడ్డలిద్దరూ ఆనందంతో ఆలింగనం చేసుకుంటారు.

అమ్మని మేనమామ ఇంటికి పంపి తన రాజ్యానికి చేరుకుంటాడు జీవకుడు.   అక్కడ ఉద్యానవనంలో స్నేహితులతో కలిసి విశ్రమిస్తాడు.  ఆ సమయంలో బంతి ఆడుకుంటూన్న  విమల అన్న ఓ యువతిని చూసి మోహిస్తాడు.  ఆమె కూడా జీవకుడినే పరిణయం చేసుకోవాలని ఉబలాటపడుతుంది.  ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెని వివాహమాడతాడు.

నగరంలో సకలైశ్వర్యాలతో తులతూగే మరో ప్రముఖ శ్రేష్టి కుమార్తె సురమంజరి.  అహంకారి.  పురుషద్వేషి.  విమలని వివాహమాడానని  జీవకుడు తన స్నేహితులతో చెప్తున్నప్పుడు  “వివాహేచ్ఛ ఉన్న యువతులని వివాహమాడటం గొప్ప కాదు ఈ పురుషద్వేషిని వివాహమాడు చూద్దాం”  అని సవాలు చేశారు.

జీవకుడు ముసలివేషంతో సురమంజరి ఇంటికి చేరి స్పృహ తప్పినట్లు నటించి ఆ రాత్రికి ఆమె ఇంట్లోనే ఉంటాడు.  ఆ రాత్రి మైమరిపించే సంగీతంతో ఆమెను తన గదికి రప్పించుకుని ముసలి వేషాన్ని తీసివేస్తాడు.  మన్మధాకారుడైన జీవకుడిని చూసిన ఆమె తాను పురుషద్వేషినన్న సంగతి కూడా మరిచి అతన్ని వివాహమాడుతుంది.

ఈ విధంగా జీవకుడు తన దేశాటనలో  ఐదుగురు కన్యలను వివాహమాడతాడు.

***

download

ఆ తర్వాత జీవకుడు మేనమామ ఇంటికి వెళతాడు.  మామ సహాయంతో కాష్టాంగాకారుడిపై దండెత్తి అతడిని సంహరిస్తాడు.  రాజ్యలక్ష్మిని వరించిన జీవకుడికి మేనమామ తన కుమార్తె అయిన లక్షణను ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

రాజైన జీవకుడు తన అష్టభార్యలతో సుఖంగా కాలం గడుపుతున్నాడు.  కొన్నాళ్ళయ్యాక అతని తల్లి విజయ తిరిగి జైన ఆశ్రమంలో చేరిపోయింది.   ఒక్కో భార్యకూ ఒక్కో కుమారుడు కలిగారు.

ఒకరోజు జీవకుడు భార్యలూ బిడ్డలతో ఉద్యానవనంలో కూర్చుని ఉన్నాడు.  ఎక్కడ నుండో పనసపండుని తెచ్చిన ఓ మగ కోతి దానిని సగంగా చీల్చి తన పక్కనే ఉన్న ఆడకోతికి ఇచ్చింది.  అదే సమయంలో తోటమాలి వాటిని తరిమి అవి కిందపడేసిన పనసపండుని తీసుకున్నాడు.  క్షణం ముందు ఆ పండుని కోతులు తింటాయని ఊహించుకుంటూ వాటిని తిలకించాలనుకున్న జీవకుడు క్షణంలో మారిపోయిన విధిని చూసి ఆశ్చర్యపోయాడు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలలోనే తానూ ఓలలాడుతున్నానని గ్రహించుకున్నాడు.  ఒక్కసారిగా అతనిలో ఏదో మార్పు.  అప్పటికప్పుడే తన పరివారాన్ని అందరినీ పిలిచి సన్యాసాశ్రమం తీసుకుంటున్నానని చెప్పాడు.  పెద్దకుమారుడైన సత్యంధరుడికి రాజ్యాన్ని ఒప్పగించాడు.   ఆ రాత్రి హాయైన స్నానం చేసి తృప్తిగా భోంచేసి సన్యాస దీక్షని స్వీకరించాడు.

మహావీరుడు బోధించిన మార్గంలో ప్రవర్తిల్లుతూ తపస్సు చేసి కర్మబంధాలను వదిలించుకుని జ్ఞాని అయ్యాడు.  దివ్యలోకాలు చేరాడు.   ‘నీ యీ కథను విన్న వారందరికీ శుభాలు కలుగుతాయ’ని దేవతలందరూ ఆయన్ని ఆశీర్వదించారు.

***

 1. వళయాపతి

వళయాపతి కావ్యం సంపూర్ణంగా లభించడం లేదు.  కేవలం డెబ్భై పద్యాలు మాత్రమే దొరికాయిట.  ఈ కథ అచ్చం ధృవుడి కథలా అనిపిస్తోంది.  ఈ కావ్య రచయిత ఎవరో కూడా తెలియదుట.

కథా సంగ్రహం

పుహార్ పట్టణంలో నారాయణుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు.  అంతులేని సంపద ఉన్న ఇతన్ని నవకోటి నారాయణుడు అని పిలుస్తారు.  అతనికి పెళ్ళయి భార్య ఉన్నా కూడా వేరే కులం ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.  తక్కువ కులపు స్త్రీతో సంసారం చేస్తున్నాడని అతన్ని అతని బంధువులు, అతని కులపెద్దలు నిందిస్తారు.  ఆవిడని వదిలెయ్యకపోతే కులాన్నించి వెలివేస్తామని అనడంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా రెండవ భార్యని వదిలేస్తాడు.

ఆమె కాళికాలయానికి చేరి అక్కడ బిడ్డను ప్రసవిస్తుంది.  భక్తులు ఇచ్చిన దక్షిణలతో ప్రసాదాలతో కడుపునింపుకుంటూ ఉంటుంది.  తన భర్తతో తనని చేర్చమని నిత్యమూ ఆ కాళికాదేవిని ప్రార్థిస్తూ ఉండేది.

బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు.   ఓరోజు ఆ పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వాళ్ళ మధ్య ఏదో తగాదా వస్తుంది.  “పోరా నీకు తండ్రే లేడు,  తండ్రి పేరు కూడా తెలియని వాడవు”  అని వాళ్ళల్లో ఒకడు ఎగతాళి చేస్తాడు.  ఆ బాబు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు.  ఆమె తండ్రి పేరు చెప్పగానే నేరుగా నవకోటి నారాయణుడి ఇంటికి వెళతాడు.   బిడ్దని వెంబడిస్తూ తల్లి కూడా వస్తుంది.

నిలదీస్తున్న కొడుకుకి సమాధానం చెప్పలేక తలవంచుకుని నిలబడి ఉంటాడు నవకోటి నారాయణుడు.  చోద్యం చూడను గుంపుగా చేరిన ప్రజలు ఆమెని నిందిస్తుంటారు.  ఆమె మౌనంగా కళ్ళు మూసుకుని కాళికాదేవిని ప్రార్థిస్తుంది.  దేవి ప్రత్యక్షమై అందరూ వినేట్లుగా ఈమె శీలవంతురాలు.  ఆమెని భార్యగా స్వీకరించు అని నారాయణుడికి చెప్తుంది.

నారాయణుడు సంతోషంగా రెండవ భార్యని తన ఇంట్లోకి పిలుచుకుంటాడు.  కొడుకుని ప్రయోజకునిగా చేసి తనంత గొప్ప వ్యాపారిని చేస్తాడు.

***

 1. కుండలకేశి

తమిళ పంచకావ్యాలలో ఐదవది కుండలకేశి. ఈ కావ్యం కూడా సంపూర్ణంగా లభించడం లేదు.  కుండలకేశి అనే యువతి బాధాకరమైన కథ ఇది.  ఈమె సన్యాసినియై  జైన మత గురువైన నాదగుత్తాచార్యులతో వాదించి గెలవడం ఈ కథలోని విశేషంగా చెప్పుకుంటారు.

కథా సంగ్రహం

రాజుగారికి చాలా దగ్గరివాడైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘కుండలకేశి’.  అసమాన సౌందర్యవతి.  ఒకసారి ఆమె తన భవనం పైభాగానికి చల్లగాలి కోసం వచ్చింది.   ఆ సమయంలో రాజభటులు ఓ యువకుడిన సంకెళ్ళు వేసి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళుతున్నారు.    వాళ్ళని అనుసరించి ఏవేవో మాట్లాడుకుంటూ ఓ గుంపు అనుసరిస్తోంది.  ఆ కలకలం విన్న ఆమె కిందికి చూసింది.  సంకెళ్ళు వేసి తీసుకెళుతున్న యువకుడిని చూడగానే ఆమె అతని పట్ల ఆకర్షణకి లోనయ్యింది.

ఆ యువకుడి పేరు కాలుడు.  అతను గజదొంగ.  దొంగతనం చేస్తూ పట్టుబడిన అతనికి మరణదండన విధించి ఉరి తీయడానికి తీసుకువెళుతున్నారు.   చెలికత్తెని కిందికి పంపి అతని గురించి ఈ వివరాలు తెలుసుకున్న కుండలకేశి హృదయం ద్రవించిపోయింది.  తొలిచూపులోనే అతనిపై మరులుగొన్న ఆమె అతన్ని ఎలాగైనా విడిపించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పటికప్పుడే తండ్రికి తన కోరికను చెప్పింది.  కూతురు ఏది అడిగినా కాదనలేని బలహీనత కలిగిన ఆ తండ్రి ఎంతో ధనం పోసి (లంచాలు ఇచ్చి) కాలుడిని విడిపించాడు.  అంగరంగ వైభవంగా ఇద్దరికీ వివాహం జరిగింది.  ఇరువురూ ఆనందంగా కాలం గడపసాగారు.

కొన్నాళ్ళయ్యాక ఇద్దరి మధ్యా తీవ్ర విభేదాలు మొదలయ్యాయి.  ఒకరోజు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటున్నప్పుడు కుండలకేశి “నువ్వు గజదొంగవు.  ఆ పాత బుద్ధులు ఎక్కడకి పోతాయి?  ఆరోజు నేను నిన్ను కాపాడకపోయినట్లైతే ఏమై ఉండేవాడివో ఆలోచించుకో”  అని అవమానించింది.

ఆ మాటలకి కాలుడు విపరీతోద్రేకానికి లోనయ్యాడు.  అప్పటికప్పుడే ఆమెని చంపేయాలన్నంత కోపం కలిగిందతనికి.    అది సమయం కాదు అని ఆవేశాన్ని అణచుకున్నాడు కాని  సమయం చూసి ఎవరికీ అనుమానం రాకుండా ఆమెని కొండ మీద నుండి తోసి చంపేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

ఆ రోజునుండీ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించసాగాడు.  కుండలకేశి కూడా తన భర్తకి మంచి బుద్ధి కలిగిందని సంతోషపడింది.  ఒకరోజు భార్యని పిలిచి “మనిద్దరి మధ్యా ఏ కలతలూ రాకుండా ఉంటే కొండమీది దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను.  మొక్కు తీర్చుకుని వద్దాం, బయలుదేరు”  అన్నాడు.

ఆమె నిజమేననుకుని చక్కగా అలంకరించుకుని భర్త వెంట బయలుదేరింది.   కొండ ఎక్కుతున్నప్పుడు  అతను మాట్లాడుతున్న విషపు మాటలు, వ్యంగ్యపు మాటల ద్వారా అతని పన్నాగాన్ని కనిపెట్టింది.  వంచనని వంచనతోనే గెలవాలని మనసులో తలపోసిన కుండలకేశి ఏమీ బయటపడలేదు.  పరిస్థితి అంతవరకూ వస్తే ఏం చేయాలో పథకం వేసుకుంది.

కొండ శిఖరం చేరాక “ఇప్పుడు నిన్ను కిందకు తోసి చంపబోతున్నాను”  అన్నాడు.  నిర్ఘాంతపోయి ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడుతుందనుకున్నాడేమో పాపం – ఆ మాట చెప్పి వికటంగా నవ్వుతున్న అతన్ని గభాల్న కిందకి తోసేసింది.  అతడు శిఖరం మీద నుండి కింద పడి ప్రాణాలు వదిలాడు.

ఇక ఆమెకి జీవితం పట్ల రోత కలిగింది.  సన్యాసినియై బౌద్ధమతాన్ని స్వీకరించి వివిధ ప్రదేశాలు తిరుగుతూ మహనీయులని కలుసుకుని బౌద్ధమత సారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.  బౌద్ధమత ప్రచారం చేస్తూ బౌద్ధమత ప్రచారకురాలిగా పేరు పొందింది.

******

 గోడకో కిటికీ!

 

 

– రాధ మండువ

~

 

1.

సూర్యోదయం అయి చాలా సేపయింది.  పిల్లలంతా మామిడి చెట్ల మీదకి చేరి గోల చేస్తున్నారు.

ఈ రోజు మా ఆవిడ – కొత్త వధువు, నెల రోజుల క్రితమే నా భార్య అయిన శ్రావణి వస్తోంది.  ఆమెని గురించిన ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్రపట్టకనో,  ఈరోజు ఎలాగూ సెలవు పెట్టాను కదా అనో ఆలస్యంగా నిద్ర లేచాను.

లేచి నిలబడ్డానో లేదో మామిడి చెట్టు మీద నుండి కిటికీ వైపుకి చూస్తూ “గోవిందన్నా,  ఇన్నికి ఆఫీసుకు పోలియా?”  అని అరిచాడొకడు.  నేను నవ్వి చెయ్యి ఊపి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

ఈ పిల్లలు తెల్లవారనివ్వరు కదా!  శని ఆదివారాలైతే మరీ గోల.  కాస్త పొద్దెక్కేటప్పటికే  చెట్ల మీదకి చేరి ఆటలు ఆడుతుంటారు.  చేరితే చేరారు కిటికీలో గుండా తొంగి తొంగి చూస్తూ మధ్య మధ్యలో నన్ను వెక్కిరిస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు.  ఏం మాట్లాడుకుంటారో!?  ఆ కబుర్లకి ఓ అంతూ దరీ ఉండదు.

నేనుండే ఆ రేకుల ఇంటికి ఆ కిటికీ ఒక్కటే ఉంది.  అదంటే నాకు చాలా ఇష్టం.  రాత్రింబవళ్లు అది తెరిచే ఉంచుతాను.  దాన్ని ఈరోజు సాయంత్రం మూసేయాలి,  పూర్తిగా కాదులే అప్పుడప్పుడూ మూసేయాల్సిందే ఇక…   ఆవిడ వస్తుంది కదా?  ఇంట్లో ఆవిడతో కబుర్లు చెప్తూ పక్కన నిలబడితేనో,  ఆమె పక్కన కూర్చుంటేనో – ఈ పిల్లలు చూస్తే ఇంకేముందీ!  ఇక పగలబడి నవ్వుతారు ఎగతాళిగా చూస్తూ.  నాలుక బయటపెట్టి వెక్కిరిస్తారు కూడా!

నేను ఆంధ్రానుండి చెన్నైలో తాంబరంలో ఉండే ఈ ఇంటికొచ్చి దాదాపు నాలుగేళ్ళవుతోంది.  ఇంటి ఓనర్స్ ముందు భాగంలో ఉన్న పెద్ద ఇంట్లో ఉంటారు.  వెనుక ఉన్న రెండు ఇళ్ళల్లో రేకుల ఇల్లు నాది.  మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫెన్సింగ్ కి ఆనుకుని ఉంటుంది.  రెండో వైపు ఖాళీ స్థలం.  ఎవరో ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొనుక్కున్నారు.   దాన్లో రెండు మామిడి చెట్లు వేశారో పడి మొలిచాయో మరి – ఉన్నాయి.   స్థలం ఓనర్లు ఎవరో తెలియదు.  చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఎవరూ లోపలకు రాకుండా జాగ్రత్త మాత్రం చేసుకున్నారు.   లోపలున్న చెట్లకి కాసిన్ని నీళ్ళు పోయడం, కాయలు కాస్తే కోసుకుని తినడం,  వాళ్ళకిష్టమైన వాళ్ళకి కాయలు ఇవ్వడం అన్నిటికీ హక్కుదార్లు ఈ చుట్టుప్రక్కల ఉండే ఇళ్ళల్లోని పిల్లలే.  వీళ్ళు నాకు సంతోషాన్ని కలిగించే పిల్ల స్నేహితులు.

మా ఆఫీసు ఉండేది మరైమలైనగర్లో.  తాంబరం నుండి రోజూ ఉదయాన్నే లోకల్  ట్రైన్   పట్టుకుని ఆఫీస్ కి వెళతాను.  బావుంటుంది ఆ ప్రయాణం.   ఉదయం రైల్లో వచ్చే జనమంతా ఫ్రెష్ గా ఉంటారు.  పూలోళ్లు, కూరలోళ్ళు, పాలోళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళతో రైలు బండి కళకళలాడుతుంటుంది.  ప్రతి ఆడామె తల్లో పూలు ఉండాల్సిందే.  ముఖాన ముచ్చటగా కుంకుమ బొట్టు,  పైన అడ్డంగా విభూది.  మగాళ్ళ నుదుటన అడ్డంగానో, చుక్కగానో విభూది ఉంటుంది.   అన్నం, సాంబార్ వారి భోజనంలో నిత్యం ఉండాల్సిందే –  కనుకనేనేమో దాదాపు అందరూ లావుగా ఉంటారు.  అయితేనేం లావుగా ఉన్నా హుషారుగా…  తమిళంలో చెప్పాలంటే సురుసురుపుగా ఉంటారు.

ఎందుకో ఇవాళ పొద్దున్నే వీళ్ళని తల్చుకుంటున్నాను.  ఇవన్నీ నా భార్యకి చెప్పాలనే ఆలోచన వల్ల కలుగుతున్న తలపులేమో!  ఆలోచనల్లోంచి బయటపడి లేచి ఇల్లంతా సర్దాను.  టేబుల్ మీదున్న పుస్తకాల వెనక్కి చేరిన పెళ్ళి ఫోటో గాజు ఫ్రేమ్ నిండా దుమ్ము చేరింది.  నాలుక్కరుచుకుని గబగబా తుడిచి కనపడేట్లు ముందుకి పెట్టాను.

కిటికీ లో నుండి ఓ తల లోపలకొచ్చింది.  “హే గోవిందన్నా ఆఫీసుకి పోలా?”  అంది ప్రక్క పోర్షన్ లో ఉండే వాళ్ళ పిల్ల.  ఏం పేరబ్బా…  ఈ పిల్ల పేరు!?  ఎప్పుడూ మర్చిపోతుంటాను.  “ఇల్లె. పోలా.  ఆంటీ వరాంగో”  అన్నాను.

“ఆంటీ యారూ?”

“ఆంటీ”.

“ఆంటీ అన్నా యారు?”  చిరాకు ఆ పిల్ల గొంతులో.  నాకేం చెప్పాలో అర్థం కాలేదు.  చెప్పినా ఎనిమిదేళ్ళ పిల్లకేం అర్థం అవుతుంది?  గభాల్న ఫోటో తీసి చెయ్యి పైకెత్తి కిటికీలో నుంచి చూపిస్తూ “ఈ ఆంటీ”  అన్నాను.

“ఓ ఉంగళ పొండాటీయా?”  అంది నోరు అంతా తెరిచి నవ్వుతూ.

‘ఓయమ్మ ఈ పిల్ల భలేదే!’  అనుకుని నేను సిగ్గుపడేలోపు ఆ పిల్ల అక్కడనుండి తుర్రుమంది.

హమ్మయ్య ప్రశ్నలతో చంపకుండా వెళ్ళిపోయింది అనుకుని ఫోటో టేబుల్ మీద పెట్టి కిటికీ రెక్కలు వేసేశాను.  అలా వేశానో లేదో “గోవిందూ,  గోవిందూ”  అంటూ కిటికీ మీద కొట్టారు – ప్రక్కింటి బామ్మ…  ఆ పిల్ల నాయనమ్మ.  అబ్బ!  ఆ పిల్ల పేరేంటో గుర్తే రాదు అనుకుంటూ “ఆఁ ఆఁ”  అంటూ కిటికీ రెక్కలు తీశాను.  ఎవరూ లేరు.  ఈలోపే చుట్టుతిరిగి వచ్చి గది తలుపు మీద బాదుతూ ఆమె పిలుస్తోంది.  తెరిచిన కిటికీ రెక్కలని అలాగే వదిలేసి ముందు గదిలోకి ఒక్క గెంతేసి వాకిలి తలుపు తీశాను.

“మనోజ్ఞ సొల్లరా…  ఉంగ పొండాటి ఇన్నికి వరాంగ్లామే!?”  అంది.

ఆఁ…  ఆ పిల్ల పేరు మనోజ్ఞ.  “అవును మామీ!”  అన్నాను.

“సరి సరి నాకు చెప్పొద్దా?  ఎన్ని గంటలకి వస్తున్నారు?”  అంది తమిళంలో.

“సాయంకాలం ఆరుకి రైలొస్తుంది,  ఇంటికి వచ్చేప్పటికి ఏడు అవుతుందేమో”

“పర్వాలేదు,  ఎంత సమయమైనా కానీయ్ లే.  నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు.  గేటు దగ్గర ఆపి నాకొచ్చి చెప్పు.    దిష్టి తీసి,  హారతిచ్చి లోపలకి తీసుకురావాలి, బ్రాహ్మణుల పిల్లాడివి అయినా ఏమీ తెలియదు ఏమిటో!?”  అంది.  నేను నవ్వుకున్నాను.  ఈ తమిళియన్స్  ఆచార వ్యవహారాలు పాటించడానికి ఎంత శ్రమకైనా ఓరుస్తారు, సహాయం చేస్తారు

“సరే మామీ”  అని నేనంటుండగానే ఆవిడ గబగబా గుమ్మం దాటి గది మలుపు తిరిగింది.  తలుపేసుకుంటుండగా కిటికీలోకి తలపెట్టి చూస్తా “గోవిందూ మీ మామగారు కూడా వస్తున్నారా?” అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి.

“లేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు మామీ.  ఈవిడ ఒక్కత్తే వస్తోంది”

“అయ్యో,  భద్రంగా వస్తుంది కదా?”  అంది.

“ఆఁ రాగలదులెండి,  అక్కడ రైలెక్కిస్తే ఇక్కడ నేను దించుకుంటాను,  భయమేమీ లేదు”  అన్నాను.

“సరీ…  వరుంబోదు పూలు పళం వాంగికోంగో”  అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తనింటికే చుట్టం వస్తుందన్నంత హడావుడిగా.

 

2.

 

గడియారం పది గంటలు కొట్టింది.  గంటల శబ్దానికి పిల్లలంతా చెట్ల కొమ్మల మీద నుండే కిటికీ వైపుకి చూశారు.  ఆ పురాతన గడియారం అంటే పిల్లలకి చాలా మక్కువ.   అది గంటలు కొట్టినప్పుడంతా దాన్ని చూడటానికీ,  తమ ఇంటికొచ్చిన కొత్త పిల్లలకి దాన్ని చూపించడానికీ ఆ చువ్వలు లేని కిటికీ లోంచి తలలు లోపలకొస్తూనే ఉంటాయి.  దాన్ని ఈరోజు సాయంత్రం అర్జంటుగా మూసేయాలి అనుకోగానే నవ్వు వచ్చింది.

బజారుకెళ్ళి ఇంట్లోకి కావలసినవి కొనుక్కుని వస్తుంటే మా వీధి వాళ్ళంతా పలకరించారు.  అప్పటికే న్యూస్ వీధి చివరి వరకూ చేరింది.  ఇంట్లోకి వచ్చానో లేదో మూసిపెట్టిన కిటికీ రెక్కల మీద పిల్లలు బాదుతూనే ఉన్నారు.   నేను పట్టించుకోకుండా వంట పనిలో పడిపోయాను – వాళ్ళే కొట్టి కొట్టి పోతార్లే అనుకుంటూ…  నవ్వుకుంటూ…

సమయం నిదానంగా గడుస్తున్నట్లనిపించింది.  మధ్యాహ్నం అన్నం తిని ఎన్నో గంటలయినట్లుంది.  టైమ్ చూస్తే ఇంకా రెండు కూడా కాలేదు.

“గోవిందన్నా,  ఓ గోవిందన్నా”  కిటికీ బాదుతోంది గట్టిగా.  వదలకుండా అరుస్తూనే ఉంది.  ఏం పేరు ఈ పిల్ల పేరూ!!?  ఆఁ మనోజ్ఞ – మనసుకి ఉల్లాసం కలిగించేదా?  ఉత్తేజం కలిగించేదా!?  ఏమోగాని ఇప్పుడు మాత్రం ‘తలుపు తీస్తావా తీయవా’ అని నా గుండెల్ని అదరగొడుతోంది.  లేచి కిటికీ రెక్కలు తీశాను.  గభాల్న ఇద్దరు పిల్లలు లోపలకి తల పెట్టగానే వెనక్కి గంతు వేశాను – నా తల వాళ్ళకి ఢీ కొట్టుకోకుండా…

ఎదురింటి నాడార్ గారి అబ్బాయి కృష్ణని తీసుకోనొచ్చింది.   నాడార్ గారు మా ఫ్యాక్టరీలోనే అకౌంట్స్ క్లర్క్.  ఈ ఇల్లు ఆయన వల్లే దొరికింది నాకు.   “హహహ గోవిందన్నా!  ఎనక్కూ ఉంగ పొండాటి ఫోటో కామింగో” అన్నాడు.

“ఏంటిరా గోల?”  అన్నాను విసుక్కుంటూ…

“నాకు తెలియదు,  నేను కూడా మీ పెళ్ళాం ఫోటో చూడాలి.  మనోజ్ఞ అందరి దగ్గరా ఎచ్చులు కొడుతోంది – ‘నేను గోవిందన్న పెళ్ళాం ఫోటో చూశా’  అని.  నాక్కూడా చూపించు”  అన్నాడు.  వాడు మాట్లాడుతుంటే డబ్బాలో గులకరాళ్ళు పోసి ఊపినట్లుంటుంది.

“అబ్బబ్బ!  ఇరుప్పా,  చెవులు నొప్పి పుడుతున్నాయి, అరవొద్దుండు చూపిస్తా”  అంటూ ఫోటోని తీసి చూపించాను.  చూస్తున్న వాడు కాస్తా గభాల్న నా చేతుల్లోంచి ఫోటో లాక్కుని పరిగెత్తాడు.

“అరేయ్,  ఆగు ఆగు!  ఆగు కృష్ణా!”  అంటూ ముందు గదిలోకి దూకి తలుపు తీసుకుని తిరిగి వెళ్ళే లోపు మామిడి చెట్టు మీదికి చేరారు.   శనివారం కదా,  పెద్దపిల్లకోతి మూకంతా కూడా చెట్ల మీద ఉంది.  ఫోటో ఒకళ్ళ చేతిలోంచి మరొకళ్ళ చేతుల్లోకి మారుతోంది.

‘ఫోటోని ఇవ్వమనీ,  జాగ్రత్తనీ, చిన్నగా – చిన్నగా అనీ’   చెట్ల కింద నిలబడి అరుస్తున్నాను.  ఉన్నట్లుండి ఫోటో అంతెత్తునుండి కింద పడింది.  “అయ్యో!”  అని నేనూ పిల్లలు అందరం ఒక్కసారిగా అరిచాం.  పరిగెత్తి ఫోటోను చేతిలోకి తీసుకున్నాను.  గాజు ఫ్రేము ముక్కలైంది.  అప్పటికే పిల్లలు నా చుట్టూ గుమిగూడారు.  అప్పటి దాకా నవ్వులతో అరుపులతో హోరెత్తిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.   బిక్క ముఖాలేసుకుని నిలబడి ఉన్న పిల్లల్ని చూస్తూ చిన్నగా నవ్వాను.  నేను నవ్వగానే ‘హిహిహి’ అంటూ ఇబ్బందిగా ఇకిలించారు.

“ఫరవాలేదులే,  బజారుకి తీసుకెళ్ళి కొత్త గ్లాస్ వేపించేస్తాను”  అన్నాను.

“కృష్ణా నీదే తప్పు.  వద్దు వద్దు అంటే వినకుండా గోవిందన్న చేతిలోంచి ఫోటో లాక్కొచ్చావు”  అంది మనోజ్ఞ నిష్టూరంగా.

కృష్ణ నా దగ్గరికి వచ్చి “సారీ గోవిందన్నా!”  అన్నాడు.

“సరేలే,  ఈ విషయం ఎవ్వరకీ పెద్దవాళ్ళకి చెప్పొద్దు, సరేనా!?”  అన్నాను వేలు చూపిస్తూ.

ఈ సంగతి మామీకి తెలిస్తే ఇక ‘నేను కాదు గోవిందు నా పని గోవిందు’ అవుతుంది.  పెళ్ళి ఫోటో పెళ్ళికూతురు వచ్చే రోజు పగిలిందని తెలిస్తే ఇక జాతకాలనీ, గుడులనీ, శనిగ్రహపూజలనీ తిప్పుతుంది…  అమ్మో!

పిల్లల ముఖాలు విప్పారాయి.   ‘పిచ్చోడా,  నువ్వెక్కడ మా పెద్దోళ్ళకి చెబుతావోనని మేము భయపడుతుంటే నువ్వే మమ్మల్నిచెప్పొద్దంటున్నావే!?’  అని అనుకుంటున్నట్లు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

గోవిందన్నా “ఇందా మాంపళం,  ఉంగ పొండాటికి కుడుంగో”  అని ఓ పిల్లోడు నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు.  దూరంగా కంచె దగ్గరికి వెళ్ళి గాజుపెంకులు పారేసిన తర్వాత ఆ మామిడికాయలు తీసుకుని లోపలకి వచ్చాను.

అప్పటికి టైమ్ నాలుగయింది.    గబగబానే నీట్ గా తయారై  ఆమెని సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకురావడానికి తాంబరం స్టేషన్ కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాను.

radha

3.

 

 

ఆమె వచ్చాక ఆ కిటికీ పూర్తిగా మూతబడిపోయింది.  నేనెప్పుడైనా తీసినా ఆవిడ ఒప్పుకోదు.  వెంటనే మూసేస్తుంది.

“అబ్బ,  ఏమిటండీ ఈ పిల్లరాక్షసులు పడుకోనివ్వకుండా ఒకటే గోల.  పిల్లల్నంటే బెదిరించి పంపించెయ్యొచ్చు,  ఈ మామీకి ఎక్కడనుంచొస్తుందో ఇంత ఓపిక పొద్దస్తమానం ‘ఎన్నాడీ శ్రావణీ,  ఎన్నా పణ్ణరే!?’ అంటా వస్తుంటుంది.  ఇక వీధిలో వాళ్ళు సాయంత్రమైతే చాలు వచ్చే కూరలోళ్ళనీ, పాలోళ్ళనీ,  పూలోళ్ళనీ, పండ్లబళ్ళనీ – ఒక్కట్ని పోనివ్వరు.  అన్నీ కొనాల్సిందే…  కొన్నా కొనకపోయినా ఆపి బేరాలు చేయాల్సిందే.  పైగా రోడ్డంతా రొచ్చురొచ్చుగా నీళ్ళు చల్లి ముగ్గులేయడం,  ఏం పొద్దునేసిన ముగ్గు చాలదా!?  నేను ఏ పుస్తకమో చదువుకుంటా లోపలుంటానా ‘ఎన్నా శ్రావణీ,  పువ్వు వేణుమా,  కొత్త పెళ్ళికూతురివి పూలు కావొద్దా!?’  అని పిలుస్తానే ఉంటారు”  అని అందరినీ వీధిలో వాళ్ళని ఒక్కళ్ళని వదలకుండా విసుక్కుంటోంది.

సరే, చుట్టుప్రక్కలోళ్ళ  రామాయణం ఇదైతే,  బయటికి ఎక్కడికి తీసుకుపోయినా జనాన్ని తిడుతుంటుంది.  పసుపుకుంకుమలూ, విభూదీ గుళ్ళో స్తంభాల మీద,  అరుగుల మీద, వీధుల్లో ఎక్కడంటే అక్కడ పోయడం,  ప్రదక్షిణాలంటూ మురికిలోనే పొర్లు దండాలు పెట్టడం,   పెళ్ళి ఊరేగింపునుండి,  శవాల ఊరేగింపు దాకా ఏ ఊరేగింపు జరిగినా బజార్లు నిండేట్లు పూలు చల్లడం,  ఏ పని మొదలు పెట్టాలన్నా వారం, వర్జ్యం అనడం,  మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు,  ఆ ఆచారల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడాలూ – అబ్బా!  ఒకటని కాదు అన్నీ ఈమె కళ్ళకే కనిపిస్తున్నాయి.

రోజులు యాంత్రికంగా – ఇదీ నాకు తక్కువ అని చెప్పలేను కాని – ఏదో చప్పగా గడిచిపోతున్నాయి.  నేను వీధిలో కనపడితే చాలు “విశేషం ఒన్నూ ఇల్లియా గోవిందూ,  కల్యాణం ఆయి ఇవళా నాల్ ఆయెచ్చి!” అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆరోజు…  మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది.  ఓ నెల్లాళ్ళు ఉండి ఆయనకి బాగయ్యాకే రమ్మని చెప్పి శ్రావణిని  రైలెక్కించి వచ్చాను.

ఇంట్లోకి రాగానే  ఆ కిటికీ దగ్గరకి దూకినట్లుగా వెళ్ళి రెక్కలు తీశాను.  యుగాల క్రితం దేన్నో కోల్పోయినంత ఆత్రం నా చేతులకి.  కిటికీ అవతల నా కోసం ఎవరో ఉంటారన్న నా భావాన్ని లాగిపడేస్తూ కిటికీ బోసిగా చూసింది నా వైపు.  నిస్సత్తువగా మంచం మీదకి చేరి అలాగే కిటికీ వైపే చూస్తూ పడుకుండిపోయాను.

తమలాగా ఇతరులు బ్రతకడం లేదని ఎందుకీ ఆగ్రహం?  అలవాట్లలో,  ఆచార వ్యవహారాల్లో తేడాలుంటాయేమో కాని సుఖదుఃఖాల భావనల్లో మనిషికీ మనిషికీ ఏమీ తేడా ఉండదని ఈమె ఎప్పటికైనా గ్రహిస్తుందా?  తనలోని రెక్కలని విశాలత్వం పేరుతో మూసుకుంటూ ఉండకుండా తెరిచి వెలుపలకి చూడగలుగుతుందా!?  – నిట్టూరుస్తూ ప్రక్కకి బాగా ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను.

“గోవిందన్నా,  హాయ్ గోవిందన్నా,  కిటికీ తీశావే,  భలే”  కృష్ణ గొంతు విని లేచాను.  “ఇంగ వాయే,  వెలియవాయే”  అరుస్తున్నాడు హడావుడిగా.  వాడిని చూడగానే భలే ఆనందం.  నేనంతకంటే వేగంగా కిటికీ దగ్గరకి వెళ్ళి  “ఎన్నా ఆయిచ్చి!?” అన్నాను.

“మా చెల్లి కిటికీలో గుండా లోపలకి చూడాలంట,  నీ గడియారం కూడా చూడాలంట,  చైర్ తెచ్చి ఇక్కడెయ్యవా?  ఎక్కి చూస్తుందంట,  తొందరగా వెయ్యి,  ఏడుస్తుంది వెయ్యి”

“అబ్బబ్బ!  ఉండురా,  నీ అరుపులకి చెవి నొప్పి పుడుతోంది”  అన్నాను కాని వాడి మాటలు నా చెవుల్లో అమృతం ఒలికినట్లుగా ఒదిగిపోతున్నాయి.   కృష్ణ చెల్లి  రోజాకి చైర్ వేయగానే ఆ పిల్ల పైకెక్కి కిటికీలో నుండి తొంగి చూసి “గోవిందన్న ఎంగా!? కానమే”  అంది.  పక్కనున్నా ఎక్కడున్నాడని అడుగుతుందే ఈ పిల్ల?…   లోపల నేనుంటే ఈ పిల్ల బయటనుండి నన్ను చూడాలనమాట.   ఇంకాసేపాగితే ఏడ్చేసిద్దేమో కనపడలేదని –  నేను పరిగెత్తి లోపలకి వెళ్ళాను.  నన్ను చూసి ఆ పిల్ల నోరు పెద్దది చేసి నవ్వింది – అప్పుడే వస్తున్న ఆమె పాల పళ్ళు రెండు తళతళగా మెరిశాయి.

రోజా ఇప్పుడు పిల్లలందరికీ పెద్ద హీరోయిన్ అయిపోయింది.  అంతా తమకే తెలుసన్నట్లు పిల్లలు ఆ పిల్లని చెట్టూ పుట్టా ఎక్కిస్తున్నారు.  ఎక్కడున్నా గడియారం గంటలు మోగితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ పిల్ల.

మామగారికి ఆరోగ్యం బాగానే ఉండటంతో శ్రావణి వచ్చేసింది.

మళ్ళీ ఆ కిటికీ మూతపడింది.    రెండు మూడు సార్లు కిటికీని బాదింది రోజాపిల్ల నేనున్నప్పుడు.  ఇక నేను ఆఫీస్ కి వెళ్ళనప్పుడు ఎన్ని సార్లు బాదిందో మరి,  ఆ పిల్లని మా ఆవిడ తిట్టుకుంటూనే ఉంది.

ఈసారి ఎందుకో నాకు ఆ కిటికీ మూసేయడం గురించి అస్సలు ఇష్టంగా ఉండటం లేదు.  ఆఫీస్ నుండి రాగానే వచ్చి తెరవాలని ప్రయత్నించాను రెండు మూడు సార్లు.  తెరుస్తుంటేనే శ్రావణి పెద్దగా ‘వద్దు వద్దు’ అని అరుస్తుంది.  ఏమైనా అంటే అలగడం వాదనలు.   ఇంట్లో శాంతి ఉండదు.  నేను కిటికీ కోసం ఎందుకులే తగాదాలు అని ఊరుకుంటున్నాను.   జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంటుంది నాకు.   రోజూ సాయంకాలాలు పిల్లలతో బయటే కాసేపు ఆడుకుని అందర్నీ పలకరించుకుని వస్తున్నాను కాని ఆ కిటికీ వైపు చూస్తే అసంతృప్తి కలుగుతూనే ఉంది.

 

 

4.

 

రెండేళ్ళు గడిచినా మాకు పిల్లలు కలగలేదు.   ఇద్దరిలోనూ అనాసక్తి.  ఆరోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కృష్ణ ఇంటి ముందు పెద్ద గుంపు.  లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.  కృష్ణ అమ్మకి మూడోబిడ్డ ప్రసవం కోసం నిన్ననే హాస్పిటల్ లో చేర్పించారని తెలుసు.  ఏమయిందో ఏమో అనుకుంటూ వాళ్ళింటి లోపలకి పరిగెత్తాను.  ఆవిడా, పుట్టిన బిడ్దా ఇద్దరూ చనిపోయారు.

“ఇద్దరు బిడ్డలు చాలదా?  మూడో బిడ్డ ఎందుకు దేశానికి భారం తప్ప”  అన్న శ్రావణి మాటలు గుర్తొచ్చాయి.  ఆమె వచ్చిందేమోనని చూశాను.  బజారు బజారంతా అక్కడున్నారు కాని ఆమె మాత్రం లేదు.  ఈ దుఃఖం ఓ ప్రక్క నన్ను కృంగదీస్తుంటే ఇంత జరిగినా ఆమె రాలేదు అన్న ఆలోచనతో జీవితమంటేనే అసహ్యం వేసింది.

కాళ్ళీడ్చుకుంటూ  గేట్ తీసుకుని మా ఇంటి వైపు నడిచాను.  లోపల నుండి మాటలు వినపడుతున్నాయి.  ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ తలుపు కొట్టాను.  రోజాని ఎత్తుకోని శ్రావణి తలుపు తీసింది.

నన్ను చూడగానే ఆ పిల్ల “గోవిందన్నా”  అంటూ నా మీదకి దూకింది.

పిల్ల ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండీ.  తీసుకోని వచ్చి స్నానం చేయించి అన్నం పెడితే గబగబా తినేసింది.  పాపం ఎంత ఆకలయిందో ఏమో!”  అంది దిగులుగా.  మానవత్వం లేదని ఆమెని అసహ్యించుకున్నందుకు బాధపడుతూ నా మీదకి దూకిన రోజాని ముద్దుపెట్టుకుని మా ఆవిడని కూడా దగ్గరకి తీసుకున్నాను.

రోజాని తీసుకోని నాడార్ గారి ఇంటికి వెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తయిందాకా అక్కడే ఉన్నాం.

రోజులు ఎవరి కోసమూ ఆగవన్నట్లు గడుస్తున్నాయి.   నాడార్ గారిని నేనే పెద్దవాడినై సముదాయించి ఆఫీసుకు తీసుకెళుతున్నాను.  కృష్ణని,  రోజాని వాళ్ళ పాటీ (నాయనమ్మ) నే చూసుకుంటుంది.   మా ఆవిడకి రోజా బాగా చేరికయింది.  ఈ పిల్ల అల్లరిని ఎంతైనా భరిస్తుంది కాని మిగతా పిల్లల్ని మాత్రం దగ్గరకి చేరనివ్వడం లేదు.  పిల్లలు మాత్రం పాపం రోజాని పిలవాలనో,  రోజా లోపల ఏం చేస్తుందో చూడాలనో వచ్చి కిటికీ తలుపుని,  ఒక్కోసారి తిరిగొచ్చి ఇంటి తలుపుని  కొడుతున్నారు.   వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈమె వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోలేదు.  కిటికీ తలుపు తియ్యనే లేదు.

ఆ వారం శనివారం నాడు రోజాకి జ్వరం వచ్చింది.  ఆదివారం శా్రవణి, కృష్ణ నాన్నమ్మ ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళి పిల్లని చూపించుకొచ్చారు.   ఆ రాత్రి రోజా ఇంటికి వెళ్ళనని మారాం చేసి మా ఇంట్లోనే పడుకుంది.  సోమవారం సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేప్పటికి  పిల్ల స్పృహలో లేనట్లుగా ఒకటే కలవరిస్తోంది.  మా ఆవిడ,  మామి,  పాటీ, నాడార్ గారు, కృష్ణ మంచం చుట్టూ కూర్చుని ఉన్నారు.

ఆ రాత్రి పన్నెండు దాకా పిల్ల నుదురు మీద తడిబట్ట వేస్తూ ఒకరం,  అరికాళ్ళకి పసుపు రాస్తూ ఒకరం అందరం మేలుకునే ఉన్నాం.  మామీ అప్పటి దాకా ఉండి ఇంటికెళ్ళిపోయింది.  కృష్ణని తీసుకోని నాడార్ గారు కూడా వెళ్ళిపోయారు.  గోడకి చేరగిలబడి అలిసిపోయిన  పాటీ అక్కడే పడుకుంది.

పన్నెండవుతుండగా  “శ్రావొదినా”  అని అరిచింది రోజా.  శ్రావణి గభాల్న లేచి రోజా మీదకి వంగి “ఏంటమ్మా?  ఏం కావాలి?  తన్నీ వేణుమా?”  అని అడిగింది.

పాప కళ్ళు తెరిచి కిటికీ వైపు చూపిస్తూ “కిటికీ తియ్యవా?  ఫ్రెండ్స్ ని చూస్తాను”  అంది.  నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఇప్పుడు చీకటిగా ఉందమ్మా,  రేపు తీస్తాను,  పొద్దున్నే అందరూ కనపడతారు”  అన్నాను.

“తీసి చూపించు చీకటిని”  అంది.

కిటికీ రెక్కలు తెరిచాను.  చల్లని గాలి లోపలకి తోసుకొచ్చింది.  పుచ్చపువ్వులా వెన్నెల కురుస్తోంది.  మామిడి చెట్లు  రెండూ మరింత పచ్చబడినట్లుగా కనిపిస్తున్నాయి.  రోజా కొంచెంగా నవ్వింది.  నేనూ నవ్వి “పడుకో”  అన్నాను.  కళ్ళు మూసుకుంది కాని ఏవేవో కలవరింతలు.  “గోవిందన్నా నన్ను చెట్టెక్కిస్తావా?  కి్రష్నన్నా నాకు మామిడి కాయలు కావాలి,  నేనేరుకుంటా,  నేనేరుకుంటా.  గోవిందన్నా,  శ్రావొదినకి పిల్లలంటే ఇష్టం లేదా?  కిటికీ ఎందుకు తెరవదు? మేమంటే అస్సలు ఇష్టం లేదా?  పాటీ చెప్పింది – మేము వేరే కులమని రానివ్వదంటగా!?   మా అమ్మేమో  ‘అన్ని కులాలూ ఒకటే’  అనీ, పాపం శ్రావొదినకి తెలియదనీ’ చెప్పింది,  కి్రష్నన్నని మామిడి కాయలు తెమ్మనవా గోవిందన్నా?” –  రోజా కలవరింతలకి శ్రావణి ముఖంలో నెత్తురు చుక్క లేదు.  దిగులుగా చూస్తున్న ఆమె చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను.

ఏ తెల్లవారు ఝాముకో  ఆ పిల్ల గాఢంగా నిద్రపోయింది.

 

 

5.

 

తెల్లవారింది.  పాటీ లేచి “అబ్బాయిని తీసుకోని వస్తా”  అంటూ  ఇంటికి వెళ్ళింది.  మేము యాంత్రికంగా పనులు చేసుకున్నాం.  నాడార్ గారు  కృష్ణని తీసుకుని వచ్చారు.   “ఈరోజు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళితే మంచిదా గోవింద్?”  అన్నాడు.

“ఈరోజు జ్వరం దిగిపోతుందిలే అన్నయ్య గారూ,  తగ్గకపోతే సాయంత్రం తీసుకెళతాం”  అంది శ్రావణి.

మా మాటలకి లేచిన రోజా వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాపింది.  ఆయన పాపని ఎత్తుకున్నాడు.  “నాన్నా,  నాకు మామిడి కాయలు కావాలి,  కి్రష్నన్నని కోసుకురమ్మను”  అంటోంది కిటికీ వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ.

“మామిడికాయలు ఇప్పుడుండవు”  అన్నాడు కృష్ణ.

“మామిడి కాయలు ఇప్పుడు ఉండవమ్మా” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఆఁ ఉండవా?  నాకు కావాలి,  నాకు కావాలి”  అని పెద్దగా హిస్టీరియా వచ్చిన దాన్లా ఏడవడం మొదలుపెట్టింది.   వాళ్ళ నాన్న ఎంత నచ్చచెప్పినా వినకుండా అతని భుజం మీద నుండి జారి క్రిందపడి కాళ్ళూచేతులూ నేలకేసి కొడుతూ ఏడుస్తోంది.  ఆ ఏడుపు హృదయవిదారకంగా ఉంది.

నేను గభాల్న రోజాని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి “నాన్నకి తెలియదులేమ్మా…  ఎందుకుండవు?  ఉంటాయి,  కాని నీకు జ్వరం కదా?  నువ్వు తినకూడదు”  అన్నాను.

ఒక్కసారిగా ఏడుపాపేసి నన్నే చూస్తూ “పోన్లే తిననులే ఊరికే చూపించు.  పళ్ళు చూపించు గోవిందన్నా”  అంది.  ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి.  మంచినీళ్ళు తెమ్మన్నట్లుగా శ్రావణికి సైగచేసి “అవి నీ దగ్గరకి రాకూడదమ్మా ఆ వాసనకే జ్వరం ఎక్కువవుతుంది”  అన్నాను.

“అయితే దూరం నుండి చూపించు”  అంది.

“సరే,  చూపిస్తాలే,  చెట్టెక్కి కోసుకొచ్చి చూపిస్తా”  అన్నాను.

వెక్కిళ్ళు ఆపుకుంటూ “ఆరు కాయలు కోసుకురా గోవిందన్నా,  కి్రష్నన్నకి చెప్పు కోసిస్తాడు”  అంది.

“సరే సరే,  కాసిన్ని నీళ్ళు తాగు”  అని నీళ్ళు తాగించాను.  తాగేసి  పడుకుని నీరసంగా కిటికీ వైపే చూస్తోంది.    పిల్లకి పాలు తీసుకోనొస్తానని మా ఆవిడ లోపలకెళ్ళింది.

“క్రిష్నన్నా,  పో,  కాయలు కోసుకురా పో”  అని కృష్ణకి చెప్తోంది రోజా.  నేను, నాడార్ గారు ముఖముఖాలు చూసుకున్నాం.  ఏం చేయాలో మాకు అర్థం కాలేదు.  కృష్ణ బయటికి పరిగెత్తాడు.  పాలు తాగి కాస్త నిద్రపోతే మర్చిపోతుందిలెండి అన్నాను నేను గుసగుసగా ఆయనతో.   కాసేపు కూర్చుని “అమ్మని పంపిస్తా”  అంటూ ఆయన వెళ్ళిపోయారు.

రోజా పాలు తాగి నిద్రపోయింది.  కిటికీలో గుండా ఎండ రోజా ముఖం మీద పడుతోందని రెక్కలు దగ్గరగా వేశాను.

ఎనిమిదవుతుండగా పిల్లలు కిటికీ దగ్గర తచ్చట్లాడుతుంటే ఏమయిందో చూద్దామని బయటికి వెళ్ళాను.  పిల్లలందరూ గోడకానుకుని నిలబడి ఉన్నారు నిశ్శబ్దంగా.  కిటికీకి కింద నేలమీద  ఆరు మామిడికాయలు కనిపించాయి!  ఆశ్చర్యపడుతూ దగ్గరకి వెళ్ళి చూశాను.  మామిడికాయల్లాగా అట్టముక్కలని అతికించి రంగు వేసి తెచ్చారు.  కొన్ని పూర్తి పసుపు రంగుతో,  కొన్ని అక్కడక్కడా ఆకుపచ్చ రంగుతో!  అచ్చం మామిడికాయల్లాగే!!

“గోవిందన్నా!  వెళ్ళి చెల్లిని లేపి కూర్చోపెట్టు కిటికీలో గుండా వీటిని చూపిస్తాం”  అన్నాడు కృష్ణ.

నాకు కడుపులోంచి ఏమిటో ఇదీ అని చెప్పలేని ఓ ఉద్యేగం కదిలిపోతోంది.  మాట రాని మౌనంతో కళ్ళల్లో తడి వచ్చి చేరింది.   అలాగే నిశ్చేష్టుడినై నిలబడిపోయాను.

మనోజ్ఞ “ఫో, ఫో త్వరగా ఫో,  చూపించి మళ్ళీ బడికి పోవాల”  అంది నా చెయ్యి పట్టి గుంజుతూ.

తెప్పరిల్లి,  మనోజ్ఞని, కృష్ణని పొదువుకుని పిల్లలందరినీ రమ్మన్నట్లుగా చేతులు రెండూ పెద్దగా చాపాను.  అందర్నీ నా కౌగిలిలోకి చేర్చుకున్నాను.    కిటికీ దగ్గరకి వచ్చి రెక్కలు తీసి మా వైపు తొంగి చూస్తున్న శ్రావణి  కళ్ళ నిండా కన్నీళ్ళు.

 

 

6.

 

ఆ తర్వాత ఆ కిటికీ ఎప్పుడూ మూతపడలేదు.  రాత్రుళ్ళు కాదండీ…  పగలు!

*****

 

 

 

 

 

 

 

 

 

నిర్ముక్తం

 

 

– రాధ మండువ

చిత్రం: నివాస్ 

~

radhaనేను రమణమహర్షి ఆశ్రమంలో లైబ్రరీలో సేవ చేస్తుంటాను. ఆశ్రమానికి దగ్గర్లోనే ఇల్లు కొనుక్కుని తిరువణ్ణామలైలో సెటిలైపోయి పదేళ్ళు కావస్తోంది.

ఆరోజు రమణుడికి మెడిటేషన్ హాల్లో నమస్కరించుకుని మాతృభూతేశ్వరాలయంలో నవగ్రహాల దగ్గర ఊదొత్తులు వెలిగించాలని వెళ్ళాను. వెళుతుండగా ఆలయం ముందున్న హాలులో కిటికీకి దగ్గరగా ఒక విదేశీ జంట ఒకర్నొకరు హత్తుకుని నిలబడి ఉండటం కనిపించింది. ఆమె ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. పొడవుగా సన్నగా ఉన్న అతను ఆమె వీపుని తన అర చేతులతో తడుముతూ ఓదారుస్తున్నాడు. ‘నలుగురూ తిరిగే ప్రదేశాలలో, అందునా గుడిలో ఏమిటీ చర్యలూ, మరీ ఈ మధ్య చీదర పుట్టేట్లు ప్రవర్తిస్తున్నారు’ అని నేను మొదట చూడగానే అనుకున్న మాట వాస్తవం. అయితే వెంటనే అనిపించింది పాపం వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు వెళుతూ దు:ఖిస్తున్నారేమో అని.

నేను ప్రక్కనే ఉన్న రమణుడి విగ్రహానికి నమస్కరించి మళ్ళీ వాళ్ళని చూశాను. ఆమె అతన్నించి విడివడి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆమె చాలా పెద్దావిడ! అరె, అతను జాన్ కదూ! అతను దాదాపు సంవత్సరమున్నర నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారేమో!?

అతడు వెళుతున్న ఆమెకి చెయ్యి ఊపుతూ “బై మమ్” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్ళని తన చేతిలో ఉన్న చిన్న టవల్ తో తుడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది. అతను కిటికీ చువ్వలను పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు. ఏడుస్తున్నాడా? తెలియట్లేదు. అతని వెనుకగా నాలుగడుగుల దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు మాత్రం కన్నీళ్ళు తిరిగాయి.

ఏమయిందో తెలుసుకోవాలని నేను ఆఫీసు దగ్గరకి వెళ్ళాను. ఆమె ఆఫీసులో వాళ్ళకి చెప్పి బయటకి రాగానే ఆమె నాకు పరిచయమే అన్నట్లుగా “హలో హౌ ఆర్ యు?” అన్నాను.

“ఓకే – మీరూ….” అంది.

“నా పేరు జానకి. ఆశ్రమం లైబ్రరీలో ఇంకా ఇక్కడ అఫారెస్టే్రషన్ సర్వీస్ ఎన్ జి వో సంస్థ లో వాలంటీర్ గా పని చేస్తుంటాను” అన్నాను.

“హలో, హాయ్, నా పేరు మేరీ” అంది మెహమాటంగా.

“ఇప్పుడే చూశాను మిమ్మల్ని. జాన్ మీ అబ్బాయే కదా!?” అన్నాను.

“ఔను” అంది – దు:ఖపు జీర ఆమె గొంతులో.

“మిమ్మల్ని చూస్తూ నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆ మధ్య చదివిన ఓ జానపద కథ గుర్తొచ్చింది నాకు” అన్నాను.

“ఫోక్ స్టోరీ!? ఏమిటది? మీకేమీ అభ్యంతరం లేకపోతే చెప్తారా?” అంది.

 

ఇంగ్లీషులో జరుగుతున్న మా సంభాషణ అర్థం అవుతుందో లేదో కాని వరండాలో కూర్చుని ఉన్న ఐదారుగురు భక్తులు మమ్మల్నే చూస్తున్నారు. “ఇక్కడ కూర్చుందాం రండి” అంటూ బుక్ స్టోర్ కి పక్కగా ఉన్న సన్నని వరండా లోకి తీసుకెళ్ళాను. ఇద్దరం గోడకి ఆనుకుని కూర్చున్నాక “కథ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ విన్నాక మీ పట్ల నేను ఊహించింది కరెక్ట్ కాకపోతే మీరేమీ అనుకోవద్దు సుమా! అయినా ప్రయాణమైనట్లున్నారు, సమయముందా” అన్నాను.

ఆమె నవ్వుతూ “చాలా సమయముంది. ఏమీ అనుకోను చెప్పండి, వినాలని ఆసక్తిగా ఉంది” అంది.

Kadha-Saranga-2-300x268

“మాగ్దానా అనే రాణి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. కుమారుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని పెంచి పెద్ద చేసుకుంది. కాని ఆమె కొడుకు యుక్తవయస్కుడయ్యాక అమరత్వాన్ని సాధించాలని తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కాలదేవత దగ్గర కాలమనేదే తెలియకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవించాక తల్లిని చూడాలనిపించి వాళ్ళ రాజ్యానికి వస్తాడు. వచ్చాక తెలిసింది – తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన కొడుకుగా అతని పేరు చరిత్ర పుటల్లో లిఖించబడిందని. ‘నేను సాధించింది ఇదా?’ అని ఖిన్నుడయిపోతాడు”

కథని వింటున్న ఆమె నిట్టూరుస్తూ “సో శాడ్” అంది.

“మీ అబ్బాయి కూడా మిమ్మల్ని వదిలేసి ఆశ్రమానికి వచ్చాడా అనిపించింది మీరు అతన్ని హత్తుకుని దు:ఖిస్తుంటే” అన్నాను.

“మీరు మా గురించి ఊహించింది కరెక్టే – అయితే నేనే స్వయంగా నా చేతులతో నా బిడ్డ జాన్ ను మహర్షి దగ్గరకి పంపాను. అతనిక్కడకి వచ్చి సంవత్సరం దాటింది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నాడా? లేడా? అనేది అర్థం కావడం లేదు” అంది.

“నాకర్థం కాలేదు. మీ అబ్బాయి ఆవేశపరుడా? అది తగ్గించుకోమని చెప్పి పంపారా ఇక్కడకి?”

“చాలా ఆవేశం, తన గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయినంత పని చేశాడు”

“ఏమిటీ? గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయాడా? ఎందుకు? ఆమె ఇతన్ని మోసం చేసిందా?”

“మోసం – ఈ మాటకి అర్థం ఏమిటి జానకీ – మీ పేరు జానకీయే కదా?” అని నేను తలూపాక “నీకు మోసమైంది నాకు న్యాయం అవొచ్చు కదా? మా దేశంలో నచ్చితే కలిసి ఉంటారు నచ్చకపోతే ‘నువ్వు నాకు నచ్చలేదు’ అని చెప్పేసే విడిపోతారు. ఆమె వీడిని వదిలి వేరే అతనితో వెళ్ళిపోయిందని కోపం” అంది.

“మరి ఆ అమ్మాయి ‘నేను నీతో కలిసి ఉండలేన’ని మీ అబ్బాయితో చెప్పింది కదా!?” అన్నాను.

“చెప్పింది. ఏం జరిగిందో చెప్తాను మీకు – నేను కమ్యూనిటీ కాలేజ్ లో లెక్చరర్ ని. మాగ్దానా రాణికి లాగే నా భర్త కూడా జాన్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయన బ్రతికున్నప్పుడు జాన్ ని బాగా చదివించాలని నాతో అనేవాడు. వాడి కాలేజ్ చదువు కోసం బాగా సేవ్ చేసేదాన్ని. మీకు తెలుసు కదా మాకు యూనివర్సిటీ చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. జాన్ యూనివర్సిటీలో చేరాక అతని పుస్తకాలకైనా డబ్బులు వస్తాయని సాయంత్రం ఓ నాలుగు గంటలు బర్గర్ కింగ్ లో పని చేయమని చెప్పాను. అదీ నేను చేసిన తప్పు. పనికి చేర్చకుండా ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో! అక్కడ జాన్ తో పాటు అదే షిఫ్ట్ లో పని చేసే టీనాని ఇష్టపడ్డాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా రాయకుండా ఆమెతో తిరుగుతున్నాడని తెలిసి మందలించాను. దానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

అపార్ట్ మెంట్ తీసుకుని ఆమెతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ‘వేరేగా ఉంటే ఉన్నావు, చదువు మాత్రం మానొద్ద’ని నచ్చ చెప్పాను. టీనా చేత కూడా చెప్పించాను. వినలేదు.

ఏడెనిమిది నెలల తర్వాత హఠాత్తుగా ఒకరోజు రాత్రి పది గంటలప్పుడు ఇంటికొచ్చాడు. తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వస్తూనే ‘మమ్, ఈరోజు టీనాని చంపేస్తాను, నిన్నొకసారి చూసి నీతో చెప్పి పోదామని వచ్చాను’ అంటూ తన గదిలోకి వెళ్ళాడు.

నిశ్చేష్టురాలినైన నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు కాని నా మెదడు మాత్రం చురుగ్గా పని చేసింది. జాన్ గది తలుపులు మూసేసి బయట గడి పెట్టేశాను. తలుపులు బాదుతూ ‘మమ్, తలుపులు తియ్’ అని అరవసాగాడు. ‘జాన్ కూర్చో, అక్కడే కూర్చో, తలుపులు తీస్తాను. ముందు నాతో మాట్లాడు. పెద్దగా అరిస్తే అందరికీ వినపడుతుంది. ఇక్కడేదో జరుగుతుందని పక్కింటి వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు, కామ్ డవున్’ అన్నాను. లోపల నుండి ఏమీ సమాధానం లేదు.

నా సెల్ తో జాన్ సెల్ కి ఫోన్ చేశాను. లోపల ఫోన్ ఎత్తి ‘హలో మమ్, తలుపు తియ్’ అన్నాడు.

‘తీస్తాను బిడ్డా, ఏం జరిగిందో నేను వినాలి కదా! వేరొకరిని చంపేస్తాను – అనే బిడ్డకి నేను జన్మనిచ్చానా!? అని సిగ్గుపడుతున్నాను’ అని భోరున ఏడ్చాను. వాడూ ఏడ్చాడు. ‘పడుకో జాన్, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాను.

ఆవేశంతో జాన్ తనని తాను శిక్షించుకుంటాడేమోనన్న భయంతో మెయిన్ డోర్ లాక్ చేసి బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. రాత్రంతా అతని గది కిటికీ లోంచి అతన్నే చూస్తూ వాకింగ్ చేశాను. తలుపు దగ్గరే కార్పెట్ మీద పడి నిద్రపోయాడు జాన్. అప్పటికప్పుడే నా ఫ్రెండ్ శైలజాకి ఫోన్ చేశాను”

“శైలజ!?” అన్నాను.

“అవును మా కాలేజీలో నా తోటి లెక్చరర్, ఇండియనే. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఉదయం ఆరుకంతా మా ఇంటికి వచ్చింది. రాగానే గబగబా బ్లాక్ టీ చేసింది. ఇద్దరం టీ తాగుతూ హాలులో కూర్చుని ఉన్నాం. ఎనిమిదవుతుండగా జాన్ లేచి “మమ్!” అని పిలిచాడు తలుపు తడుతూ…

తలుపు తీసి ‘దా జాన్, శైలజ వచ్చింది’ అన్నాను. ఫ్రెషప్ అయి హాల్లోకి వచ్చాడు. శైలజని చూసి చిన్నగా నవ్వాడు. ఆ మాత్రానికే నేను చాలా సంతోషపడ్డాను. భయం పోయింది. మెల్లగా వచ్చి సోఫాలో నన్ను ఆనుకుని కూర్చున్నాడు. శైలజ లేచి జాన్ కి టీ తెచ్చి ఇచ్చింది. అతను టీ తాగిన ఐదు నిమిషాల పాటు శైలజ తన బ్యాగ్ లో నుండి మహర్షి ఫోటో తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది.

 

జాన్ టీ తాగి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని శైలజనే చూడసాగాడు. నేను కూడా శైలజనే చూస్తూ జాన్ తల నిమురుతూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాసేపాగాక శైలజ కళ్ళు తెరిచి జాన్ నే నిశితంగా చూస్తూ నిదానంగా ‘జాన్, ఏం జరిగింది?’ అంది.

శైలజ వేసిన ప్రశ్నకి జాన్ చేతులు ఆవేశంతో వణకడం గమనించాను. శైలజ కూడా గమనించి లేచి తన కుర్చీని మా సోఫాకి దగ్గరగా లాక్కుని జాన్ చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళు….” అంటూ మేరీ చెప్పడం ఆపి నా కళ్ళల్లోకి చూసింది. “మీ కళ్ళలాగే శైలజ కళ్ళు కూడా దయని కురిపిస్తుంటాయి” అంది.

నేను మెల్లగా నవ్వి ఆమె తడి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకున్నాను. దు:ఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా ఆమె గుటకలు మింగింది.

“శైలజగారికి సమాధానం చెప్పాడా?” అన్నాను.

మేరీ చెప్పాడన్నట్లుగా తల ఊపి ‘ఆ బిచ్ నన్ను మోసం చేసింది శైలజా, ఇప్పుడు టీనా బర్గర్ కింగ్ లో పని చేయడం లేదు. రెండు నెలల క్రితం విలేజ్ పాయింట్ అపార్ట్ మెంట్స్ రెంటల్ ఆఫీసులో చేరింది. అక్కడ వాళ్ళ ఆఫీసులోని తన కొలీగ్ తో రిలేషన్ షిప్ పెట్టుకుంది’ అన్నాడు జాన్. అతని గొంతు నిండా కోపం. ఆ కోపం వల్ల మాట తడబడింది.

‘నీకు చెప్పి నిన్ను వద్దన్నాకే అతనితో కలిసి ఉంటోంది కదా, అది మోసం ఎలా అవుతుంది?’ అంది శైలజ.

శైలజకి ఎలా తెలుసా? అన్నట్లుగా గభాల్న లేచి కూర్చుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

‘రాత్రి మీ అమ్మ నాకు ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పాక నేను టీనాకి ఫోన్ చేసి అన్ని విషయాలూ కనుక్కున్నాను. ఆమె తప్పేమీ లేదు, నీతో రిలేషన్ షిప్ కుదరదని చెప్పే అతని అపార్ట్ మెంట్ కి వెళ్ళిపోయింది కదా!? వెళ్ళి కూడా పది రోజులవుతోంది. ఇప్పుడేంటి నీకింత ఆవేశం – అదీ మర్డర్ చేయాలనేంతగా!? అయినా నీ వయసు ఎంతని? నీ వయసుకి తగ్గ పనులు చేస్తున్నావా నువ్వు? ఆలోచించు’ అంది.

జాన్ ఏమీ మాట్లాడలేదు. చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే శైలజని ఏమీ అనలేక ‘సారీ’ అని గొణిగాడు.

radha (1)ఇక ఆమె జాన్ ని రొక్కించకుండా అసలేమీ జరగనట్లూ, అంతా మామూలుగానే ఉందన్నట్లూ ‘గెట్ రెడీ మేరీ, కాలేజ్ కి టైమవుతుంది’ అని వంటింట్లోకి వెళ్ళి గబగబా ప్యాన్ కేక్స్ తయారు చేసింది. నేను ఫ్రెషప్ అయి వచ్చేలోపు కొత్తగా రిలీజైన సినిమాల గురించి మాట్లాడుతూ జాన్ కి ప్యాన్ కేక్స్ పెట్టింది. మేమిద్దరం కూడా తినేసి కాలేజీకి వెళ్ళిపోయాము. సాయంత్రం ఆఫీస్ అయ్యాక కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలని, కౌన్సిలర్ దగ్గరకి జాన్ ని తీసుకెళితే మంచిదని అనుకున్నాం.

మధ్యాహ్నం రెండవుతుండగా టీనా నుండి ఫోన్ వచ్చింది.

జాన్ టీనా ఆఫీస్ కి వెళ్ళి ఆమెని కత్తితో పొడవబోయాడట. ఆమె బాయ్ ఫ్రెండ్, జాన్ ని పట్టుకుని లోపల గదిలో కూర్చోపెట్టి కదలకుండా కాపలా కాస్తున్నాడట. అతను పోలీసులకి ఫోన్ చేస్తానంటే టీనా వద్దని ఆపి నాకు ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. నేను, శైలజ ఇద్దరం హడావుడిగా అక్కడికెళ్ళాం. అదృష్టవశాత్తూ జాన్ టీనా మీదికి దూకినప్పుడు ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ తప్ప ఆఫీసులో ఎవ్వరూ లేరు. నేను అక్కడికి వెళ్ళగానే టీనాని హత్తుకుని ఏడ్చాను. అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

శైలజ జాన్ ఉన్న లోపలి గదిలోకి వెళ్ళి అతని చేయి పట్టుకుని బయటకి తీసుకు వచ్చింది. జాన్ వంచిన తల పైకెత్త లేదు. నేను ఏడుస్తూ జాన్ ని వాటేసుకుని బయటకి నడిపించాను. శైలజ వెనుకనుండి మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మాతో పాటు నడుస్తూ వెనక్కి తిరిగి ‘టీనా, నువ్వు ఈరోజు చేసిన సహాయానికి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కృతజ్ఞతలు’ అని ‘మీ పేరేమిటో నాకు తెలియదు టీనా మాట విని పోలీసులకి ఫోన్ చేయకుండా ఆగినందుకు మీకు కూడా వందనాలు’ అంది. టీనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో శైలజ ఆ మాటలు అంటున్నదని నాకర్థం అయింది. మమ్మల్నిద్దరినీ తన కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది.

ఆ తర్వాత రోజు నుండి నెల రోజులు లాంగ్ లీవ్ తీసుకుని జాన్ కి కౌని్సలింగ్ ఇప్పించాను. ఆ రోజుల్లో శైలజ మాకు చాలా సహాయం చేసింది. రమణ మహర్షి గురించి ఇంగ్లీషులో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలూ శైలజ నాకు తెచ్చి పెడితే, నేను జాన్ కి చదివి వినిపించాను.

ఆరోజు…. శైలజే అడిగింది జాన్ ని – ‘జాన్ రమణాశ్రమానికి ఇండియాకి వెళతావా?’ అని.

వెళతాను అన్నట్లుగా జాన్ తల ఊపాడు. నేను, శైలజా ఇద్దరం చాలా సంతోషపడ్డాం. శైలజ అప్పటికప్పుడే తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లూ చేసింది. జాన్ కి ఆశ్రమంలో భోజన సదుపాయం మాత్రమే ఇచ్చారు. అదే చాలు అని ఆశ్రమానికి దగ్గర్లో అద్దె ఇంట్లో జాన్ ఉండేట్లు ఏర్పాట్లు చేసింది.

జాన్ ఇక్కడకి వచ్చి కూడా రెండేళ్ళవుతోంది జానకీ! నేను పోయిన సంవత్సరం వచ్చాను. ఇది రెండో విజిట్. అతనిలో మాత్రం ఏమీ మార్పు లేదు. ఆ ఆవేశం తగ్గించుకుని నా దగ్గరకి వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదువు పూర్తి చేసుకోవాలనీ, ఉద్యోగంలో చేరి పెళ్ళి చేసుకుని హాయిగా జీవిస్తే చాలుననీ ఉంది. మహర్షి…. ఆయన బ్లెస్సింగ్స్ నా బిడ్డకి ఎప్పుడిస్తాడో!?” అంది. ఆ మాటలంటున్నప్పుడు కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదుగా జారిపోయాయి.

నేను జాన్ తో మాట్లాడుతుంటాననీ, అతని క్షేమ సమాచారాలు వివరంగా మెయిల్ రాస్తానని చెప్పాను. నా మాటలకి ముఖం విప్పార్చుకుని అప్పటికప్పుడే బ్యాగ్ లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చింది మేరీ.

 

***

 

ఆ తర్వాత సంవత్సరం పాటు జాన్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజూ జాన్ తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాన్ క్షేమ సమాచారాలని మేరీకి తెలియచేస్తున్నాను. శైలజగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.

జాన్ లో ఆధ్యాత్మికంగా ఏ మాత్రమూ ఎదుగుదల కనపడటం లేదు. ఉదయం 6.30 కి లేచి ఏడు గంటల బ్రేక్ ఫాస్ట్ కి వస్తాడు. తిన్నాక నేరుగా గదికి వెళ్ళి కాసేపు పడుకుంటాడు. అపార్ట్ మెంట్ సర్వీస్ బాయ్ శీనా వచ్చినప్పుడు లేస్తాడు. ఆ అబ్బాయి రూమ్ ఊడ్చి, బట్టలుతికి వెళ్ళాక స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి సమాధి హాల్లో కూర్చుని పూజా కార్యక్రమం చూస్తాడు. 11.30 కి భోజనం చేసి వెళ్ళి మూడు వరకూ నిద్రపోతాడు. మూడుకి లేచి చిన్నగా ఆశ్రమానికి చేరి నాలుగు గంటలకి టీ తాగి బయట కూర్చుని కోతులని, నెమళ్ళని చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఎవరైనా పలకరిస్తే కబుర్లు చెప్తాడు లేకపోతే లేదు. మళ్ళీ హాల్లో కూర్చుని పారాయణం చేస్తుంటే విని ఏడున్నరకి డిన్నర్ చేసి గదికి వెళ్ళిపోతాడు. ఎనిమిది గంటలకి పడుకున్న అతను మళ్ళీ ఉదయం ఆరూ, ఆరున్నరకే లేచేది – ఇదే రోజూ అతని కార్యక్రమం.

ఎప్పుడైనా సాయంకాలం రమణాశ్రమం ఎదురుగ్గా ఉన్న షాపులో టీ తాగుతాడు. కావలసిన వస్తువులు సబ్బులు, పేస్ట్ లాంటివి కొనుక్కుంటాడు – అంతే. ఒక పుస్తకం చదవడమో, ధ్యానం చేసుకోవడమో ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే అతనెందుకు ఇక్కడ ఇలా సమయాన్ని వృథాగా గడుపుతున్నాడో అర్థం కాక బాధ కలుగుతోంది. ఈ విషయాన్ని మేరీకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు.

అతన్ని అతని దేశానికి ఎలా పంపాలా అని ఆలోచిస్తున్న నాకు రమణుడే దారి చూపించాడు. ఇలా నేను అనుకున్న తర్వాత రోజు నుంచే కుంభవర్షం. మా ఆర్గనైజేషన్ వాళ్ళు పనిలోకి దిగారు. జాన్ ని వెంటబెట్టుకుని వెళ్ళాను నేను కూడా కొండ మీదికి. పైనుంచి ఎవరో నీళ్ళని బిందెలతో పోస్తున్నట్లుగా వర్షం. ఆ వర్షంలో తడుస్తూనే చెట్లకి పాదులు తీస్తూ, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా కాలువలను మళ్ళిస్తూ పనులు చేస్తున్న వాళ్ళని జాన్ ఆశ్చర్యంగా చూడసాగాడు.

తర్వాత రోజు కొంతమంది కొండ మీద పని చేస్తారనీ, మరి కొంతమంది ఊళ్ళో లోతట్టు ప్రాంతంలో ఉన్న దినసరి కూలీలకి, వృద్ధులకి భోజన పొట్లాలను పంచడానికి వెళుతున్నారని తెలిసి, జాన్ ని తీసుకుని కావాలనే ఊళ్ళోకి వెళ్ళాను. పొట్లాలను పంచుతున్న జాన్ తో అన్నాను – “చూశావా జాన్ ఎంతో చక్కగా చదువుకునీ, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ, కడుపు నిండిన వీళ్ళు ఒక వర్గం – తాము ప్రశాంతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు – సంతోషం.

ఇక ఈ అభాగ్యులని చూడు. ప్రతి రోజూ కూలి చేస్తే గాని పొట్ట నిండదు వీళ్ళకి పాపం. వీళ్ళొక వర్గం – వాళ్ళూ పని చేసుకుని వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇంకో వర్గం కూడా ఉంది పనీ పాటా లేకుండా పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే తిని కూర్చునే వాళ్ళు. వాళ్ళ వల్ల సమాజానికి కీడేగాని ఉపయోగం ఏముంది?” అన్నాను.

జాన్ ఔనన్నట్లుగా తల ఊపుతూ ‘యస్ జానకీ’ అన్నాడు.

వారం రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అందరం పనులు చేస్తూనే ఉన్నాం. జాన్ లో కూడా హుషారు కనిపించింది. ఎనిమిదో రోజు జాన్ నా గదికి పరిగెత్తుకుంటూ వచ్చి “జానకీ, అమ్మ వస్తోంది ఎల్లుండి” అన్నాడు.

“తెలుసు జాన్, నాక్కూడా ఫోన్ చేసింది” అన్నాను.

 

***

మేరీ వచ్చింది. ఆశ్రమం ఆఫీసు ఎదురుగ్గా పందిరి క్రింద నన్ను హత్తుకుని బోలెడు కృతజ్ఞతలు చెప్పింది. జాన్ మా ప్రక్కనే నిలబడి మమ్మల్నే చూస్తున్నాడు. మేరీ నుండి విడివడి “జాన్, అమ్మని తీసుకుని సాయంత్రం అన్నామలై స్వామి మందిరానికి సాయంత్రం ఐదు గంటలకి రాగలవా? మీతో మాట్లాడాలి” అన్నాను.

“అన్నామలై స్వామి మందిరమా! అదెక్కడ?” అన్నాడు.

“దాదాపు రెండున్నరేళ్ళు అవుతుంది కదా నువ్వు ఇక్కడకి వచ్చి? ఆశ్రమం క్యాంపస్ లోనే ఉన్న ఆ మందిరం ఎక్కడుందో నువ్వే కనుక్కొని, వీలైతే అన్నామలైస్వామి గురించిన పుస్తకం కొనుక్కుని చదువుకుని రా” అన్నాను నవ్వుతూ. నా పెదవులు నవ్వుతున్నాయి కాని నా కళ్ళల్లోని తీక్షణతని గమనించినట్లున్నాడు – అతని ముఖం అప్రసన్నంగా మారింది. నేను పట్టించుకోకుండా మేరీకి పని ఉందని చెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయాను.

 

***

radha (1)సాయంత్రం ఐదయింది. నేను వెళ్ళేప్పటికి జాన్, మేరీ అన్నామలైస్వామి మందిరం ముందున్న వరండాలో కూర్చుని ఉన్నారు. నేను అన్నామలైస్వామి మందిరం తలుపు తీస్తూ “నిత్యకృషీవలుడు అన్నామలైస్వామి రమణుడిని సేవించి రమణుడంతటి వాడయ్యాడు మేరీ” అన్నాను. మేరీ ఆయన ఫోటోను చూస్తూ నమస్కరించింది. ఆయన సమాధి మీదున్న శివలింగానికి కూడా నమస్కరించుకున్నాక డాబా మీదకి తీసుకు వెళ్ళాను. అక్కడకి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న కొండని చూపిస్తూ “చూశారా మేరీ, పనే దైవం అని నమ్ముకున్న అన్నామలై స్వామిని రమణుడే కాదు సాక్షాత్తూ ఆ శివుడే దగ్గరగా వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా లేదూ!?” అన్నాను.

మేరీ అవునన్నట్లుగా తల ఊపుతూ ఆ కొండని నిశ్శబ్దంగా చూడసాగింది.

నేను జాన్ వైపుకి తిరిగి “జాన్, అన్నామలైస్వామి గురించి చదివావా?” అన్నాను.

లేదన్నట్లు తలూపాడు. అతని ముఖంలో ఏమిటీవిడ టీచర్ లాగా ప్రశ్నలు అనుకుంటున్నట్లు అనిపించింది.

నేనదేమీ గమనించనట్లుగా “జాన్, నువ్వేమీ అనుకోనంటే నేను నీకు నీ గురించి చెప్పాలనుకుంటున్నాను” అన్నాను. నా నుండి ఊహించని ఆ సంభాషణకి విస్తుపోయినట్లుగా చూశాడు. మేరీ కూడా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.

“నేను నిన్ను పరిశీలించి తెలుసుకున్నదే కాకుండా నీ గురించి ఇక్కడి వాళ్ళు – ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్తున్నాను. అలా అని ఇతరులు చెప్పేదే కరెక్ట్ అని కాదు” అన్నాను.

 

“చెప్పండి” అన్నాడు. ఆసక్తి కనిపించింది అతని గొంతులో.

“నేను చెప్పడం ఎందుకులే జాన్, నాలుగు రోజుల క్రితం నువ్వు అభాగ్యులకి అన్నం పొట్లాలను పంచుతున్నప్పుడు నేను చెప్పిన మూడు వర్గాలలో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివో నువ్వే తెలుసుకోలేదా?” అన్నాను.

అతను గభాల్న నా వైపు చూసి వెంటనే తల వంచుకున్నాడు. మేరీ ఏదో మాట్లాడబోయింది కాని నా కనుసైగతో ఆపేసింది.

“నువ్వు ఒట్టి సోమరివి” అని అతని రెస్పాన్స్ కోసం ఆగాను.

జాన్ వంచిన తల ఎత్తలేదు. మేరీ ఆందోళనగా నన్నే చూస్తోంది. నేను అదేమీ పట్టించుకోకుండా “కాబట్టే మీ అమ్మ చదువుకోమని బ్రతిమలాడుతున్నా చదువుకోకుండా ఏదో చిన్న పనిలో ఇరుక్కున్నావు. నీలో ఏ మాత్రమూ ఎదుగుదల ఉండదని గమనించింది కనుకనే టీనా నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటావనీ, మరిన్ని పుస్తకాలు చదువుకుని ‘నిన్ను నీవు’ తెలుసుకుని మీ దేశానికి తిరిగి వెళ్తావని శైలజ గారు నిన్ను ఇక్కడకి పంపారు. కాని నువ్వు ఇక్కడ మరింత సోమరివిగా మారుతున్నావు” అన్నాను.

అతనేమీ మాట్లాడలేదు. అలాగే పిట్టగోడకి ఆనుకుని కూర్చున్నాడు. మేరీ కూడా గబగబా వెళ్ళి అతన్ని ఆనుకుని పక్కనే కూర్చుంది.

“వెళ్ళిపో జాన్, ఇక్కడ నుండి మీ దేశానికి వెళ్ళిపో. మీ అమ్మని ఇంకా బాధపెట్టకు. యూనివర్సిటీలో చేరి చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ మొదటి జీతంలో కొంత భాగం మహర్షికి ఇవ్వడానికి ఇక్కడకి రా, సరేనా?” అన్నాను.

కళ్ళెత్తి నన్ను చూస్తున్న అతని కళ్ళు చెమ్మగిల్లడం చూశాను.

అతనికి దగ్గరగా నడిచి “జాన్, ఇలా ఏమీ మొహమాటం లేకుండా ఈ కష్టజీవి అన్నామలై స్వామి మందిరంలో మాత్రమే నీకు చెప్పగలననిపించింది. అందుకే ఇక్కడకి రమ్మన్నాను. చెప్పగలిగాను. ఏమీ అనుకోలేదు కదా!?” అన్నాను.

అతను ఏమీ అనుకోలేదు అన్నట్లుగా తల ఊపాడు.

నేను మేరీ వైపు చూసి “మేరీ, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? మీ బాధ మీ బిడ్డకి కాక మాలాంటి వాళ్ళకి చెప్పుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి?” అన్నాను.

మేరీ కూడా నిజమేనన్నట్లు తల ఊపింది. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉన్నాక నేనిక అక్కడ ఉండనవసరం లేదనిపించి “బై మేరీ, తర్వాత కలుద్దాం” అంటూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మెట్లు దిగి వచ్చేశాను.

 

***

 

 

ఆరోజు మేరీ, జాన్ లు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేరోజు. మాతృభూతేశ్వరాలయంలో కిటికీకి దగ్గరగా మొదటిసారి జాన్ మేరీని హత్తుకుంటుండగా నేను చూసిన ప్రదేశంలో కూర్చుని ఉన్నాను.

సాయంత్రం నాలుగవుతోంది. సమాధి హాలులో వేదపఠనం కోసం సన్నాహాలు చేస్తున్నారు. చల్లని గాలి పైన తిరుగుతున్న ఫాన్ గాలితో చేరి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఎదురుగ్గా నిలువెత్తు గోడ మీద రమణుడు పులి చర్మం పైన ఆశీనుడై దయామృతం కురిపిస్తున్నాడు. వాకిలికి కుడి వైపు కొంతమంది భక్తులు – అక్కడే ఆశ్రమంలో ఉండేవారు కూర్చుని కుంకుమ, విభూతి పొట్లాలు కడుతున్నారు.

జాన్, మేరీ నన్ను వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. లేచి నిలబడ్డాను. జాన్ “బై జానకీ” అంటూ నాకు షేక్ హాండిచ్చాడు. అతని కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతోంది. లోలోపలి అతని ఉత్సాహపు మెరుపు అతని చేతి ద్వారా నన్ను తాకి అతను ఆనందామృత హృదయుడై ఉన్నాడని కనుగొనగలిగాను.

మేరీ నన్ను ఆప్యాయంగా హత్తుకుంది. కృతజ్ఞతతో ఆమె ఏడుస్తోంది. అప్పుడు జాన్ ఆమెని ఓదార్చినట్లుగా నేను ఆమె వీపుని నిమురుతూనే ఉన్నాను – టాక్సీ డ్రైవర్ వచ్చి “మేడమ్, టైమవుతోంది వెళ్ళాలి” అన్నాడు.

మేరీ విడివడి నాకు నమస్కరించి జాన్ చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఇద్దరినీ కిటికీ చువ్వలు పట్టుకుని చూస్తూ నిలబడ్డాను. గేట్ దగ్గరకి వెళ్ళిన జాన్ టాక్సీ స్టాండ్ వైపుకి మలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపాడు.

నా పెదవులు ఆనందంతో విచ్చుకోగా నేను కూడా చెయ్యి ఊపాను.

 

 

******

 

తమిళతల్లి మేఖలాభరణం ‘మణిమేఖల’

 

 

– రాధ మండువ

~

photoతమిళ పంచకావ్యాలలో రెండవది ‘మణిమేఖల’. ఈ కావ్యాన్ని చేరదేశరాజైన చేరన్ చెంగట్టువన్ ఆస్థానకవి శీతలైశాత్తనార్ రచించాడు. ఈ కావ్యం క్రీ.శ రెండో శతాబ్దంలో రచింపబడినది. తమిళ పంచకావ్యాలలో మొదటిదైన ‘శిలప్పదిగారం’ కి ఈ మణిమేఖల కావ్యం పొడిగింపుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజుల్లోనే సంఘసంస్కరణని ప్రోత్సహించే దిశగా సాగిందనీ, సర్వమతాలూ ఒకటే అని చాటి చెప్పిందనీ అంటారు. అందుకే తమిళ పండితులు ఈ కావ్యాన్ని తమిళతల్లి నడుమున ధరించే మేఖలాభరణం (ఒడ్డాణం) గా అభివర్ణిస్తారుట.

తమిళ పంచకావ్యాల్లో మొదటిది సారంగ పాఠకులకి పరిచయం చేశాను. దానికి కొనసాగింపుగా ఉన్న ఈ కథని కూడా పరిచయం చేయాలనే అభిలాషతో దీన్ని క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. ఎమ్ ఎ తెలుగులో మా పాఠ్యాంశంగా ఉన్నదీ, నాకున్న తమిళ ఫ్రెండ్స్ ను అడిగీ, కొంత ఇంటర్నెట్ సాయంతోనూ ఈ కథని రాశాను. ఈ కథని తెలిసిన వారు వారి వారి అభిప్రాయాలనీ, ఇంకా ఇక్కడ తెలియచేయని విషయాలనూ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

కథాసంగ్రహం

1.

చోళ రాజ్యంలోని పూంపుహార్ పట్టణంలో కోవలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య కణ్ణగి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. చోళరాజు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంద్రోత్సవాలలో మాధవి అనే వేశ్య నాట్యం చేసింది. అప్పుడు మాధవిని చూసిన కోవలుడు భార్యను పూర్తిగా విస్మరించి మాధవితో జీవించసాగాడు. మాధవి కూడా కోవలుడు అంటే ఎంతో ప్రేమగా ఉండేది. వారిద్దరికీ పుట్టిన పాపే మణిమేఖల. మాధవే లోకంగా జీవిస్తుండటంతో కోవలుడి వ్యాపారం పూర్తిగా నాశనమైంది. తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలతో సహా మాధవికి సమర్పించుకుని పేదవాడయ్యాడు. మాధవి అమ్మ చిత్రావతి కోవలుడిని వదిలించుకోవాలని అతన్ని నిందించడం, మాధవికి అతని మీద చెడు మాటలు చెప్పడం చేయసాగింది. ఫలితంగా – ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగింది.

భార్యని మోసం చేశాననే బాధతో, పాశ్చాత్తాప హృదయంతో మాధవిని వదిలి ఇంటికి చేరాడు కోవలుడు. పూలమ్ముకున్న చోట కట్టెలు కొట్టుకునే స్థితిలో ఉండలేక ధనం సంపాదించి తిరిగి తన ఊరికి రావాలని భార్యని తీసుకుని మధురైకి వెళ్ళాడు. అక్కడ దొంగతనం ఆరోపింపబడి హతుడయ్యాడు.

(చూడండి ఈ లింక్ )

కోవలుడు మరణించాడన్న వార్త విని మాధవి విపరీతమైన దు:ఖానికి లోనయింది. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తియై బౌద్ధ సన్యాసినిగా మారి తన బిడ్డ మణిమేఖలతో సహా ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

ఆ ఏడు చోళ రాజ్యంలో జరుగుతున్న ఇంద్రోత్సవంలో మాధవి పాల్గొనలేదని ఆమె తల్లి చిత్రావతికి అసంతృప్తిగా ఉంది. మాధవిని ఎలాగైనా మళ్ళీ వృత్తిలోనికి దించాలనే పన్నాగంతో “మాధవి నాట్యం చేయకపోవడం వలన పూహార్ పట్టణ ప్రజలంతా అసంతృప్తులై ఉన్నారని, దూషిస్తున్నారని తెలియచేసి మాధవిని పిలుచుకురా” అని మాధవి చెలికత్తె అయిన వసంతమాలని ఆశ్రమానికి పంపింది చిత్రావతి.

వసంతమాల ఆశ్రమానికి చేరి చిత్రావతి చెప్పమన్న మాటలు మాధవికి చెప్పింది. “కోవలుడు చనిపోయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మహాపతివ్రత అయిన మా అక్క కణ్ణగికి నేను చేసిన అన్యాయానికి ప్రతిఫలం ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఈ మణిమేఖలని నా కూతురుగా కాదు. కణ్ణగి కూతురుగా పెంచదలచుకున్నాను. ఈ ఆశ్రమంలో ఉంటేనే అది సాధ్యం. ఇక్కడే బుద్దుడి పాదాలను ఆశ్రయించుకుని ఉంటామని, ఈ దు:ఖజలధిని దాటడానికి నాకిదే మార్గమని నా తల్లితో చెప్పు” అంది మాధవి ఏడుస్తూ.

అక్కడే కూర్చుని పూలమాలని కట్టుకుంటున్న మణిమేఖల తన తల్లి ఏడుస్తుంటే తనూ ఏడ్చింది. మాధవి మణిమేఖలని ఓదార్చింది. దు:ఖాన్నించి తేరుకున్న తర్వాత మాధవి మణిమేఖలను చూస్తూ “మన కన్నీటితో తడిచిన ఈ మాలని ఆ భగవంతుడికి సమర్పించరాదు. నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసుకుని వచ్చి మరో మాల అల్లు” అంది.

మణిమేఖల ‘సరే’నని వెళుతుండగా ఆశ్రమంలో ఉండే సుతమతి అనే ఆవిడ “ఈ ఉత్సవాల సమయంలో యుక్తవయస్సుకి వచ్చినవారు ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్ళడం వల్ల నేను పూర్వ జీవితంలో చాలా దు:ఖానికి లోనయ్యాను. శీలాన్ని పోగొట్టుకున్నాను. నేను మణిమేఖలకి తోడుగా వెళతాను” అంది. మాధవి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంది.

మణిమేఖల, సుతమతులిద్దరూ ‘బుద్ధుడి విగ్రహం ఉన్న ఉద్యానవనంలోకి వెళ్దామనీ, అదైతే సదా పుష్పాలతో అలరారుతుంటుంది కనుక త్వరగా పువ్వులు కోసుకుని రావొచ్చుననీ’ అనుకున్నారు.

వసంతోత్సవాల సందర్భంగా పట్టణంలో చేసిన ఏర్పాట్లను, ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలను, గారడీ వాళ్ళు చేస్తున్న వివిధ విన్యాసాలను, వింతలను చూస్తూ ఇద్దరూ వీధిలో నడుస్తున్నారు. మణిమేఖలని గమనించిన ప్రజలు ఆమె అందానికి విస్తుపోయి నిలబడ్డారు. ఆమె ఎవరో తెలిసిన వారు ‘అయ్యో! ఇంత అందమైనదాన్ని, కోమలాంగిని తల్లి సన్యాసినిగా మార్చిందే’ అనుకోసాగారు. ఆ సమయంలో వీణని వాయించుకుంటున్న ఒకడు – కోవలుడుకి అతి సన్నిహితుడు మాధవిని చూసి “అయ్యో, కోవలా నీకు, నీ కూతురుకి ఎంత అన్యాయం జరిగిపోయింది?” అని ఏడవసాగాడు. ప్రజల మాటలని, ఆ ఏడుస్తున్న వాని బాధనీ విని తల మరింతగా భూమిలోకి దించుకుని నడిచి వెళ్ళసాగింది మణిమేఖల.

manimekalai-film

 

2.

ఉద్యానవనంలోని అందమైన పువ్వులను, పొదరిళ్ళను, మండపాలనూ చూస్తూ మణిమేఖల తన దు:ఖాన్ని మర్చిపోయింది. ప్రతి మొక్కనీ, పువ్వునీ పలకరిస్తూ సున్నితంగా కొన్ని పువ్వులని కోసుకుంది. వీళ్ళు ఉద్యానవనంలో ఉండగా బయట వీధిలో ఒక ఏనుగు – మావటి వాడికి కాని, సైనికులకి కాని లొంగకుండా – వీధుల్లో పరిగెత్తసాగింది. ప్రజలు భయకంపితులై అరుస్తూ పరిగెత్తుతున్నారు. విషయం తెలిసిన చోళరాజ కుమారుడైన ఉదయకుమారుడు తన రథంలో వేగంగా అక్కడకి వచ్చి ఏనుగుని అదుపులోకి తెచ్చాడు. ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తూ అతన్ని వీధుల్లో ఊరేగించారు. ఆ సమయంలో అక్కడ వీణని చేతిలో పట్టుకుని ఏడుస్తున్న కోవలుడి సన్నిహితుడిని చూసిన ఉదయుడు అతడిని దగ్గరకి పిలిచి అతని దు:ఖానికి కారణమేమిటని అడిగాడు.

“ఇప్పుడే ఈ వీధిలో నడిచి ఉద్యానవనానికి వెళుతున్న మణిమేఖలని చూశాను. ఆమె పరిస్థితిని చూసీ, నా స్నేహితుడు కోవలుడు గుర్తుకు వచ్చీ బాధతో ఏడుస్తున్నాను” అన్నాడు.

అది విన్న ఉదయకుమారుడు “మణిమేఖల ఆశ్రమం నుండి బయటకి వచ్చి ఈ దారిలో వెళ్ళిందా?” అని అత్రంగా అడిగాడు. ఇంతకు పూర్వమే ఉదయకుమారుడు ఆమెని చూశాడు. ఆమె సౌందర్యానికి దాసోహుడై ఆమెనే వివాహమాడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ‘ఔనంటూ’ వీణాధరుడు చెప్పింది విన్న ఉదయుడు ఆమెని ఇప్పుడు తనతో రాజమందిరానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం కలిగిందన్న సంతోషంతో తన రథాన్నెక్కి వాయువేగంతో ఉద్యానవనం వైపుకి సాగిపోయాడు.

అతడిని దూరం నుంచే గమనించిన మణిమేఖల సుతమతితో “ఉదయకుమారుడు నాపై ఆశలు పెట్టుకున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా! ఆశ్రమంలో ఉన్న నన్ను అతను చేరలేడు కాని ఇప్పుడు ఇక్కడ అతను నన్నేమైనా చేయగలడు. నేనిప్పుడు అతన్నించి తప్పించుకునే మార్గమేమిటో చెప్పి పుణ్యం కట్టుకో” అంది ఆందోళన పడుతూ.

వెంటనే సుతమతి ఆమెని ఉద్యానవనంలో ఉన్న బలిమండపం లోపల ఉంచి బయట తాళం వేసి ఏమీ తెలియనట్లు పువ్వులు కోయసాగింది. రథాన్ని బయట నిలిపి లోపలికొచ్చిన ఉదయుడు సుతమతితో “ఇక్కడకి మణిమేఖల వచ్చిందని విన్నాను, ఆమె ఎక్కడ ఉందో దయచేసి చెప్పు. ఆమెని వివాహమాడాలని తపించిపోతున్నాను. దయతో ఆమెని నాకు చూపించు” అని వేడుకున్నాడు.

“రాజకుమారా, ఆశ్రమవాసియైన మణిమేఖల నిన్ను చూడదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో” అంది.

అతను ఆమె మాటలను పట్టించుకోకుండా ఉద్యానవనం అంతా వెతుకుతూనే ఉన్నాడు. బలిమండపంలో ఉందేమోనన్న అనుమానంతో లోపల ప్రవేశించాలని ప్రయత్నించాడు కాని వెళ్ళే మార్గం తోచక మండపం చుట్టూ తిరగసాగాడు. ఇదంతా గమనిస్తున్న మణిమేఖల భయంతో మండపం లోపల స్పృహ తప్పి పడిపోయింది.

సుతమతి అతన్ని చేరి “ఉదయకుమారా, నీకు చెప్పేంతటి దాన్ని కాదు. మణిమేఖల తపశ్శక్తి సంపన్నురాలు. నిన్ను శపించగల సమర్థురాలు కూడా… ఆడదానికి ఇష్టం లేకుండా బలాత్కరించరాదు. ఆ సాహసం చేయడం కరికాళచోళుని వంశస్థుడివైన నీకు తగదు. దయచేసి నీ మనసు మార్చుకుని ఇక్కడ నుండి తక్షణమే బయటకి వెళ్ళు” అంది.

ఉదయకుమారుడికి ఆమె చెప్పిందేమీ తలకెక్కలేదు.

మణిమేఖలని ఎలాగైనా చూడాలనే మోహంతో ఉన్న ఉదయకుమారుడు సుతమతిని మాటల్లో పెట్టి మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలనుకుని “నువ్వు ఇంతకు ముందు జైన ఆశ్రమంలో ఉండేదానివి కదా! ఇప్పుడు బౌద్ధ ఆశ్రమానికి చేరావా? నీవెవరు? నీ వృత్తాంతమేమిటి?” అని అడిగాడు.

 

“ఉదయకుమారా, నా తల్లి చనిపోగానే నా తండ్రి నిత్యమూ వ్రతాలు చేస్తూ ఆశ్రమజీవితం గడిపేవాడు. ఒకసారి ఆయన పువ్వులు తెమ్మని నన్ను ఉద్యానవనానికి పంపాడు. విద్యాధరుడు అనేవాడు నన్ను చూసి మోహించి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు నన్ను అతని వద్ద ఉంచుకుని తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియని మా నాన్న నన్ను వెతుకుతూ దేశాలు తిరగసాగాడు. చివరికి ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి నా వద్దకు పరుగున వచ్చాడు. ఇద్దరం జైన సంఘంలో ఉండసాగాం. అయితే ఒకరోజు ఒక ఎద్దు మా నాన్నని కడుపులో కుమ్మింది. స్పృహ కోల్పోయిన మా నాన్నని కాపాడమని జైన సంఘంలో ఉన్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమీ సహాయం చేయలేకపోయారు. అప్పుడు అదే దారిలో వెళుతూ మా దీనస్థితిని చూసిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మల్ని తన ఆశ్రమానికి చేర్చాడు. నాన్న ప్రాణాలని కాపాడాడు. ఆ విధంగా బౌద్ధ ఆశ్రమానికి చేరుకున్నాం” అంది.

తన మాటలు అన్యచిత్తుడై వింటూ బలిమండపం వైపే చూస్తున్న ఉదయునితో సుతమతి “దయచేసి నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో యువరాజా!” అంది. చెప్పిందే చెప్తూ అక్కడ నుండి తరుముతున్న సుతమతిని విసుగ్గా చూస్తూ “చిత్రావతి సహాయంతో మణిమేఖలని నా మందిరానికి రప్పించుకోనిదే నేను నిద్రపోను” అంటూ శపధం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఉదయుడు.

అప్పటికి బాగా చీకట్లు అలుముకున్నాయి. ఆ రాత్రికి అక్కడే నిద్రించి ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్ళాలనుకుని ఇద్దరూ బలిమండపంలోని బుద్ధుని విగ్రహానికి దగ్గరగా కూర్చున్నారు. “నాకు కూడా ఉదయకుమారునిపై మనస్సు పోతోంది. అతను ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్నా నాకు అతనిపై కోపం రావడం లేదు. నా హృదయంలో ఈ కోరిక నశించిపోవుగాక” అని మణిమేఖల బుద్ధునికి నమస్కరిస్తూ వేడుకుంది.

ఆ సమయంలో ఇంద్రోత్సవాలు చూడటానికని వచ్చిన ‘మణిమేఖలాదైవం’ (మాధవి, కోవలులు ఈ దేవత పేరే పెట్టుకున్నారు మణిమేఖలకి) తాపసి రూపంలో బలిమండపంలోకి వచ్చింది. బుద్ధునికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న సుతమతిని, మణిమేఖలని చూస్తూ “ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు?” అని అడిగింది. జరిగింది తెలుసుకుని “ఉదయకుమారుడు పోయిన జన్మలో నీకు భర్త. అప్పుడతని పేరు రాహులుడు. ఒకసారి మీ ఇద్దరూ ఉద్యానవనంలో ఉన్నారు. అతని పట్ల నువ్వు కోపంగా ఉన్నావు. రాహులుడు నిన్ను సముదాయిస్తూ నిన్ను కోపాన్ని వీడమని బ్రతిమాలుతున్నాడు. ఆ సమయంలో సాధుచక్రి అనే బౌద్ధబిక్షువు అక్కడకి వచ్చాడు. అతన్ని చూసి నువ్వు లేచి నమస్కరించావు కాని రాహులుడు అతన్ని విసుక్కున్నాడు.

ఆ తర్వాత నువ్వు ‘అలా కోప్పడకూడదు, పూజ్యులకి నమస్కరించాలి’ అని రాహులుడికి చెప్పావు అతను ఇష్టం లేకుండా, తప్పదన్నట్లు అతనికి అతిథి సత్కారం చేశాడు. ఆ రోజు ఆ బౌద్ధ బిక్షువుకి ఇచ్చిన ఆతిథ్యపుణ్యమే ఈ జన్మలో నువ్వు ఇలా బౌద్ధ ఆశ్రమవాసినిగా మారడానికి కారణం. లోకంలో ఉన్న దీనులకి నువ్వు ఆకలి బాధ తీర్చాల్సి ఉంది. నిన్ను మణిపల్లవంలోని బౌద్ధపీఠానికి చేరుస్తాను. అక్కడ నీకు అక్షయపాత్ర లభిస్తుంది. దానితో ప్రజల ఆకలి బాధను పోగొడుదువుగాని. నీకు పూర్వజన్మలో అక్కచెల్లెళ్ళు తారై, వీరై అని పేర్లు గల వారు – వాళ్ళే ఇప్పుడు మాధవి, సుతమతులు. వాళ్ళు ఈ జన్మలో కూడా నీ వెన్నంటే ఉండి ప్రజలకి సేవ చేసి తరిస్తారు” అంది.

 

తర్వాత సుతమతితో “మణిమేఖలని నేను మణిపల్లవం దీవిలో ఉన్న బౌద్ధపీఠానికి తీసుకువెళుతున్నాను. నువ్వెళ్ళి మాధవికి విషయం తెలియచేయి” అని ఆ దైవం సుతమతికి చెప్పి మణిమేఖలని తీసుకుని వెళ్ళిపోయింది.

మణిమేఖలని అక్కడ వదిలి “మణిమేఖలా, ఉదయకుమారుడు పోయిన జన్మలో నీ భర్త కనుక ఈ జన్మలో కూడా వ్యామోహాన్ని పెంచుకున్నాడు. నీ మనసు కూడా అతని పట్ల ఆకర్షణకి లోనవ్వడానికి కారణం అదే. నీలోని ఆ మోహం నశించడానికే నిన్ను ఇక్కడకి తీసుకువచ్చి బుద్ధభగవానుని పాదపీఠికను చూపించాను. నీ చేతికి అక్షయపాత్ర రాగానే నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. ఆశ్రమంలో ఉన్న అరవణముని నువ్వు తర్వాత చేయవలసిన విధులని తెలియచేస్తాడు” అని చెప్పి “అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడకి కావాలంటే అక్కడకి ఆకాశమార్గాన వెళ్ళవచ్చు, ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించవచ్చు” అంటూ మణిమేఖలకు ఆ శక్తులని ప్రసాదించింది.

ఆ తర్వాత మణిమేఖలాదైవం నేరుగా ఉదయకుమారుని దగ్గరకి వచ్చి “రాజకుమారా, రాజులు ధర్మమార్గాన ప్రవర్తించాలి. తపోదీక్షని స్వీకరించిన మణిమేఖల పట్ల వ్యామోహం పెంచుకుని ఆమెని బలవంతపెట్టడం నీకు మంచిది కాదు. ఆమె మీదున్న మోహాన్ని విడనాడు” అని చెప్పింది.

 

3.

 

మణిపల్లవంలో మణిమేఖల బుద్ధుని పాదపీఠానికి ప్రదక్షిణం చేస్తుండగానే ఆమె చేతికి అక్షయపాత్ర వచ్చింది. అది తీసుకుని ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెని చూసి మాధవి, సుతమతులు సంతోషించారు. అందరూ కలిసి ఆ పాత్రని తీసుకుని అరవణమునీశ్వరుల దగ్గరకి వెళ్ళారు. మణిమేఖల జరిగినదంతా మునీశ్వరునికి చెప్పింది.

ఆయన “మణిమేఖలా! దేశంలోని అనాథలకు, వృద్ధులకి – ఆకలిగొన్న ప్రతివారికీ ఈ అక్షయపాత్ర ద్వారా ఆకలి తీర్చగలవు. ఈ అక్షయపాత్ర నీకు అందించిన అపుత్రుడు అనే వాని గురించి చెప్తాను విను……

కాశీ నగరంలో అభంజికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాలి. భర్తకు తెలియకుండా తన ప్రియునితో కలవడం వల్ల గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక ఆమెలో పాశ్చాత్తాపం కలిగింది. భర్తకి ద్రోహం చేశాననే బాధతో ఇక అతని ముఖం చూడలేక, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక కన్యాకుమారి వైపు సాగిపోయింది. సముద్రతీరాన మగబిడ్డను ప్రసవించి ఆ బిడ్డని కనికరం అన్నా లేకుండా అక్కడే వదిలి ఎటో వెళ్ళిపోయింది.

ఏడుస్తున్న ఆ బిడ్డని చూసి ఓ ఆవు తన పొదుగునుండి పాలని స్రవించి ఆ బిడ్డడికి తాపించింది. అలా ఏడు రోజులపాటు ఆ బిడ్డని కాపాడింది. ఏడో రోజు అటు వైపుగా వెళుతున్న ఓ బ్రాహ్మణుడు ఏడుస్తున్న శిశువునీ, ఆ శిశువుకి పాలిస్తున్న ఆవును చూశాడు. ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి ‘అపుత్రుడు’ అని పిలిచి, పెంచుకుని అన్ని వేదశాస్త్రాలలోనూ శిక్షణ ఇప్పించాడు.

ఒకరోజు అపుత్రుడు ఒక యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞానికి బలి ఇవ్వాలని వథశాలలో ఒక ఆవుని కట్టేసి ఉంచారు. ఆ ఆవు దయనీయంగా జాలికొలిపేట్లు అరుస్తోంది. అపుత్రుడు ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా వచ్చి ఆవుని విప్పి బయటకి తోలాడు. యజ్ఞశాల కాపలాదారులది చూసి అపుత్రుడిని పట్టుకుని బంధించారు. ‘నోరులేని పశువులను, అందునా కమ్మని పాలిచ్చే ఆవుని వధించడం ఎందుకు? దేవుడు తను పుట్టించిన బిడ్డలని తనకి బలివ్వమని ఎప్పటికీ కోరడు’ అన్నాడు అపుత్రుడు.

అందరూ అతని మాటలని గేలి చేశారు. ఇంతలో గుంపులో ఉన్న ఒకడు ‘ఈ అపుత్రుడు ఎవరో నాకు తెలుసు. శీలాన్ని కోల్పోయిన శాలి కొడుకు. ఇతను హీనుడు. హీనజాతికి చెందినవాడు. ఇతన్ని ఊళ్ళోంచే గెంటి వేయండి’ అన్నాడు.

ఆ మాటలు విన్న అపుత్రుడు ‘మీ కులం ఏమిటో, మీ కులాల పుట్టుక ఏమిటో మీకు తెలుసా? మూలాలు తోడితే అందరూ హీనజాతికి చెందినవారే, అందరూ ఉన్నతజాతికి చెందినవారే’ అన్నాడు. అక్కడున్న అందరికీ – ఆఖరికి అతన్ని పెంచుకున్నబ్రాహ్మణుడికి కూడా అపుత్రుడి వైఖరికి కోపం వచ్చింది.

అపుత్రుడు ఇక ఆ దేశాన్ని వదిలి మధురైకి చేరుకున్నాడు. అక్కడ బిక్షమెత్తుకుని తను తిని మిగిలినది చింతాదేవి ఆలయప్రాంతాల్లో ఉన్న గుడ్డివారికీ, నడవలేని వారికీ, వృద్ధులకి పంచేవాడు. ఆ ఆలయంలోనే నిద్రించేవాడు.

ఆ సమయంలో దేశం అంతా క్షామం వచ్చింది. తిండిలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఒకరోజు కొందరు బిక్షకుల గుంపు ఆకలికి తాళలేక అపుత్రుడున్న చింతాదేవి ఆలయానికి వచ్చి తమ ఆకలి తీర్చమని అడిగారు. ఏమీ చేయలేక ఆవేదనతో చింతాదేవి ముందుకి వెళ్ళి ఆపద గట్టెక్కించమని ఆమెని వేడుకున్నాడు. చింతాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక బిక్షాపాత్రని ఇచ్చి ‘దీనితో అందరి ఆకలీ తీర్చు. ఇది ఎంతమంది ఆకలినైనా తీరుస్తుంది. ఎప్పటికీ వట్టిపోదు. క్షామం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించు’ అంది.

అప్పటి నుండి క్షామం పోయేంతవరకూ అపుత్రుడు ఎంతో మంది ఆకలి తీర్చాడు. తర్వాత దాన్ని మణిపల్లవంలో ఉంచాడు. అదే ఈ అక్షయపాత్ర” అని చెప్పి “మణిమేఖలా! నీ పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఇది నీ చేతికి వచ్చింది. నువ్వు కూడా ఈ పాత్ర సహాయంతో అన్నార్తులకి సహాయం చెయ్యి. ముందుగా ఎవరైనా సాధుగుణం కలిగిన స్తీ్ర చేతితో ఈ అక్షయపాత్రలో బిక్షని స్వీకరించు. తర్వాత దానిలోకి బిక్ష వస్తూనే ఉంటుంది” అన్నాడు అరవణుడు.

అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న కాయచండిక అనే ఆమె తనకి అలాంటి సాధుగుణం కలిగిన స్తీ్ర తెలుసని ఆమె పేరు అదిరై అని చెప్పింది.

ఈ కాయచండిక కంచి నగరానికి చెందినది. ఆమె భర్త పేరు కాంచనుడు. కాయచండిక ఒకసారి పొదిగై పర్వతప్రాంతాల్లో ఉన్న మునిపుంగవులని గేలి చేసి ‘ఎల్లప్పుడూ ఆకలితో బాధపడాలన్న’ శాపానికి గురై దేశాల వెంట తిరుగుతున్నది. అదిరై దగ్గర బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ పూంపుహార్ పట్టణంలో నివసిస్తోంది.

కాయచండికతో కలిసి మణిమేఖల అదిరై దగ్గరకి వెళ్ళి మొదటి బిక్ష స్వీకరించింది. అప్పటి నుండీ కాయచండిక మణిమేఖల వెన్నంటే ఉంటూ బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకున్నది. కొన్నాళ్ళు మణిమేఖల వెన్నంటే ఉండి ప్రజలందరికీ మణిమేఖల దగ్గరున్న మహాన్వితమైన అక్షయపాత్ర గురించి చెప్పింది. తర్వాత తపోధారియై వింధ్యపర్వతాలకి ప్రయాణమై వెళ్ళిపోయింది కాయచండిక.

Manimekalai_Indian_epic

4.

మాధవి, మణిమేఖలలు పూర్తి సాధువులుగా మారి చింతాదేవి ఆలయ ప్రాంతంలో ఉన్నారని, అక్షయపాత్రతో అందరికీ భోజనం పెడుతున్నారని తెలుసుకున్న చిత్రావతి దిగులు చెందింది. ఎలాగైనా వారిద్దరినీ ఇంటికి రప్పించి తమ పూర్వ వైభవాన్ని పొందాలనే తపనతో ఉదయకుమారుడిని కలుసుకుని విషయం చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉదయకుమారుడు చిత్రావతికి అనేక బహుమతులు ఇచ్చి మండపానికి వెళ్ళాడు. మణిమేఖలని కలుసుకుని ఆమెని అనేక విధాలుగా బలవంతపెట్టాడు. ఆమె అతనికి ఎంత చెప్పినా వినకుండా లాక్కుపోవడానికి యత్నించసాగాడు. ఆమె అతన్నించి తప్పించుకుని ఆలయంలోకి పరిగెత్తింది. సాయంత్రం వరకూ ఆమె కోసం ఆలయం బయటే వేచి ఉండి ఇక ఏమీ చేయలేక ‘తర్వాత రోజు వస్తాననీ, మనసు మార్చుకోమనీ’ చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు నగరంలో చెరసాలలో ఉన్న వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి మణిమేఖల చెరసాలకి ప్రయాణమైంది. అయితే ఉదయకుమారుడు ఆమెని చూస్తే వెంబడిస్తాడని తెలుసు కనుక కాయచండికలాగా రూపం మార్చుకుని నగరంలోకి వెళ్ళింది. చెరసాలలో ఉన్న వారితో మాట్లాడుతూ వాళ్ళ బాధలని వింటూ వాళ్ళకి అన్నం పెట్టింది. రాజు దగ్గరకి వెళ్ళి చెరసాలని ధర్మశాలగా మార్చమని కోరింది. ఆమె మృదుమధురమైన మాటలకి రాజుగారు ఎదురు చెప్పలేక ఆమె కోరిక ప్రకారం చెరసాలని ధర్మశాలగా మార్చారు.

ప్రతిరోజూ ఇలా ఏదో ఒక సమయంలో ఆమె కాయచండిక రూపంతో చెరసాలకి వెళ్ళి అక్కడున్న వారికి భోజనం వడ్డించసాగింది. మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలని కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల దగ్గరకి వచ్చి మాట్లాడుతున్నాడు ఉదయకుమారుడు. ఆమె అతనికి మంచి మాటలు బోధిస్తున్నది. ఆ సమయంలో కాయచండిక భర్త కాంచనుడు భార్యని వెతుక్కుంటూ అక్కడకి వచ్చి వారిని చూశాడు.

ఉదయకుమారుడితో ప్రేమగా మాట్లాడుతున్న మణిమేఖలని కాయచండికే అనుకున్నాడు. ‘ఆమెకి ఉదయకుమారుడితో మాటలేల? ఈతనితో ఏదో సంబంధం పెట్టుకున్నట్లుంది. అందువల్లనే శాపం తీరినా నా వద్దకు రాలేదు’ అనుకుని ఆమెని నిందించసాగాడు. కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల కాంచనుడితో “నువ్వు చింతాదేవి ఆలయానికి వెళ్ళు అక్కడ నీకు అన్ని విషయాలూ అవగతమవుతాయి, ఇప్పుడేమీ మాట్లాడవద్దు” అని చెప్పి పంపింది. మళ్ళీ ఉదయకుమారుని దగ్గరకి వెళ్ళి ‘ఈ భవబంధాలు అశాశ్వతమైనవనీ, మణిమేఖల పట్ల మోహాన్ని వదులుకోమనీ’ చెప్పింది.

ఆమె మాట్లాడుతుందేమిటో వినపడక అతనితో ఏదో గుసగుసలాడుతుందని భావించి కోపంగా చూస్తూ కాంచనుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి మణిమేఖల కూడా మండపానికి చేరింది. ఆమె వెనుకనే దూరంగా వస్తున్న ఉదయకుమారుడిని గమనించి ఏం జరగబోతుందో చూడాలని కాంచనుడు ఆలయం బయట స్తంభం ప్రక్కన దాక్కున్నాడు. మోహోద్రిక్తుడైన ఉదయుడు మణిమేఖల కోసం కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖలని ఆమెకి తెలియకుండా దూరంగా అనుసరిస్తూ మండపానికి వచ్చాడు. చాటునుండి అంతా గమనిస్తున్న కాంచనుడు తన భార్య కోసమే ఈ చీకట్లో కూడా వచ్చాడని ఉదయకుమారుడి మీదకి దూకి తన కరవాలంతో అతని తలని నరికివేశాడు.

కాయచండిక రూపాన్ని వదిలేసి బయటకి వచ్చిన మణిమేఖల ఉదయుడి మృతదేహాన్ని చూసి ఏడుస్తూ ‘కాయచండిక రూపంలో ఉన్నది తనేనని, తొందరపాటుతో ఉదయకుమారుడిని చంపి మహాపాపం చేసావని’ కాంచనుడితో అంది. కొన్ని నెలల క్రితమే కాయచండిక వింధ్యపర్వతాలకి వెళ్ళిందని చెప్పింది. చేసిన పనికి కుమిలిపోతూ కాంచనుడు అక్కడ నుండి వింధ్యపర్వతాల వైపు సాగిపోయాడు.

తన బిడ్డ ఉదయకుమారుడిని చంపేసింది మణిమేఖలేనని తలచి రాజుగారు మణిమేఖలని బంధించి చెరసాలలో వేశారు. అరవణస్వామిని, సుతమతిని వెంటబెట్టుకుని మాధవి అంత:పురానికి వెళ్ళి రాణికి జరిగినదంతా చెప్పింది. అరవణులకి నమస్కరించిన మహారాణి మణిమేఖల తప్పేమీ లేదని తెలుసుకుని ఆమెని బంధవిముక్తురాలిని చేసింది.

ఆశ్రమానికి చేరిన మణిమేఖల “రాకుమారుని చంపిన స్తీ్ర’ అని నన్ను ఇక్కడ జనులు నిందిస్తూనే ఉంటారు. నేను వంజి నగరానికి వెళ్ళి కణ్ణగి అమ్మకి సేవ చేసుకుంటాను, వెళ్ళడానికి అనుమతినివ్వండి” అంది. వారు ముగ్గురూ ఆమెకి దు:ఖంతో వీడ్కోలు పలికారు.

వంజి నగరానికి చేరిన మణిమేఖల కణ్ణగి దేవాలయంలోనే ఉంటూ ఆ నగరంలోని వివిధ మతాచార్యులని కలుసుకుని అన్ని మతాలలోని సారాన్ని గ్రహించింది. అన్ని మతాలూ ఒకటే అని తెలుసుకుంది. అదే అందరికీ బోధిస్తూ తన అక్షయ పాత్రతో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తూ గడపసాగింది.

మణిపల్లవంలో ఉన్నట్లుగానే వంజి నగరంలో కూడా బుద్ధభగవానుని పాదపీఠికను, చుట్టూ దేవాలయాన్నీ నిర్మించింది. బుద్ధభగవానుని దయ వల్ల మణిమేఖల జనన మరణాల రహస్యాన్ని గ్రహించుకుని తపోదీక్షలో లీనమైంది.

కొన్నాళ్ళకి మాధవి, సుతమతులు, అరవణమునులు – ముగ్గురూ మణిమేఖల దగ్గరకి చేరుకున్నారు. ఆమె వారిని సంతోషంగా స్వాగతించి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చింది. ఆ తర్వాత ఆమె తన జీవితమంతా బౌద్ధధర్మాలను బోధిస్తూ జీవితాన్ని ధన్యతగావించుకుని ముక్తినొందింది.

 

*****

 

 

 

 

 

అనుభవాల మధ్య బంధుత్వమే మంచి కథ!

 రాధ మండువ

నేను చాలా చిన్నప్పటి నుంచే – ఐదవ తరగతి నుంచే పిల్లల కథలు చదివేదాన్ని. ఆ తర్వాత మా ఊళ్ళో నాగేశ్వరమ్మక్క, శేషమ్మక్క, విశాలక్క అందరూ మా వీధి వాళ్ళు ఒక్కొక్కరూ ఓ పత్రికని, నవలలని (అద్దెకి) ఒంగోల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న నా చేత తెప్పించుకునే వారు. వాటిని వస్తూ వస్తూ బస్ లోనే చదివేసే దాన్ని.

ప్రభ, పత్రిక, భూమి, జ్యోతి, చందమామ, బాలమిత్ర ఒకటేమిటి ఏది దొరికితే అది…. అయితే అన్ని కథలు, నవలలు చదివినా ఏ రచయితనీ చూడలేదు. వాళ్ళంటే ఏదో చాలా గొప్పవాళ్ళని ఊహించుకునే వయసు అది.

నా పెళ్ళయ్యాక మద్రాసులో ఉన్నప్పుడు మా ప్రక్కింటి తమిళావిడ కథలు రాస్తుందని తెలిసింది. ఆ తమిళ రచయిత్రిని చూడగానే నాకేమీ కొత్త అనిపించలేదు. ఆమెని చూడగానే నాకూ కథలు రాయాలనిపించి నాలుగైదు కథలు రాసి పత్రికలకి పంపాను.

ఆంధ్రభూమి వాళ్ళు నా కథ “కాగితపు ముక్కలు” వేసుకున్నారు. డబ్బుల చెక్ వచ్చినపుడు తెలిసింది నా కథ పడిందని. టి. నగర్ లోని పాత పుస్తకాల షాపులకెళ్ళి వెతుక్కుని, పత్రికని పట్టేసి కథని చూసుకున్నాను. మిగిలిన కథలు తిరిగొచ్చాయో, ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో తెలియదు.

తర్వాత ఇరవై ఏళ్ళ పాటు నేను కథారచన జోలికి పోలేదు. రిషీవ్యాలీ వచ్చాక ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, అద్భుతమైన సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు, సాయంకాలాల్లో వచ్చే లేత వంకాయ రంగుతో కలగలిసిన బంగారు కాంతి కిరణాలు, పచ్చని చెట్లు, వాటి గుబురుల్లో ఎక్కడో దాక్కుని వినిపించే పక్షుల కిలకిలారావాలు, వెన్నెల్లో స్వచ్ఛమైన తెల్లని కాంతినిచ్చే చంద్రుడు, ఏ పొరలూ లేకుండా మిలమిలా మెరిసే నక్షత్రాలు, విశాలమైన పచ్చిక మైదానాలు చూస్తుంటే ఇంత అద్భుతాన్ని లోపల ఇముడ్చుకోలేని అలజడితో రాసిన కథ “సమ్మోహనామృతం”. దాన్ని ఈమాట వాళ్ళు ప్రచురించారు.

అయితే ప్రకృతి వర్ణన రాసినంత మాత్రాన అది కథ కాదు కదా అనిపించి ఇతివృత్తాలని తీసుకుని వరసగా కథలు రాయడం మొదలు పెట్టాను. నా కథని (సాహచర్యం) మొట్ట మొదటగా ( ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత) ప్రచురించిన పత్రిక సారంగ. ఇక నా జీవితం లో కథలు రాయడం అనే ప్రస్థానం మొదలయింది. ఈ రెండున్నరేళ్ళలో ఇప్పటికి దాదాపు ముప్ఫై కథలు, నలభై దాకా పిల్లల కథలు, ఐదు సమీక్షలు, ఆరేడు మ్యూజింగ్స్, ఇరవై గుజ్జెనగూళ్ళ పేరుతో మా అక్క మనవరాలి మాటలు, కాసిన్ని కవితలు రాశాను. ముప్ఫై జానపద కథలని అనుసృజన చేశాను.

అయితే కథలు ఎందుకు రాయాలి?

ఈ లోకానికి మనం ప్రయాణీకులుగా వచ్చాం. సహ ప్రయాణీకులలోని వివిధ భావాలనీ, వైరుధ్య భంగిమలనీ పట్టుకోగలుగుతున్నాం. మంచి చెడుల రూపాలనీ వాటి ప్రభావాల్నీ చూడగలుగుతున్నాం. వాటిని అక్షరాలుగా తీర్చి దిద్దగలిగే సామర్థా్యన్ని పెంపొదించుకున్నాం. ఇక రాయకపోవడానికి అడ్డేమిటి అనుకోగానే కలం కదిలింది. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత నిశితంగా పరిశీలించడం మొదలయింది.

radhaస్త్రీ పురుషుల భావోద్యేగాలలో, ఆలోచనల్లో చాలా తేడాలుంటాయి. వాటిని అనుభవించే తీవ్రత – ముఖ్యంగా మాతృత్వం – స్త్రీకి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను “ఆకాశమల్లి” అనే కథలో చూపగలిగాను. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కోల్పోకూడనిది – ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అని కూడా ఆ కథ ద్వారా చెప్పాను.

చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు అభినందనలు తెల్పుతూ. ఆ ఫోన్ కాల్స్ అటెండ్ అవుతుంటే, పాఠకులతో మాట్లాడుతుంటే – రచనలు చేసేటప్పుడు రచయితకి ముఖ్యంగా కావలసినది ‘నిబద్ధత’ అని తెలిసింది. మనం రాసే ప్రతి వాక్యానికీ మనది కాని మరో దృష్టికోణం ఉంటుందని దాన్ని రచయితలు తమ తలలు వంచి మరీ చూడాలని అర్థమైంది.

జీవితమంటేనే అనుభవం. మన అనుభవాలకే కాకుండా ఇతరుల అనుభవాలకి స్పందించగలిగినపుడు, ఆ స్పందన తీవ్రతని అక్షర రూపంగా మార్చగలిగినపుడు కథ పుట్టడమే కాదు ఆ కళ మనలోని చైతన్య స్థాయినీ పెంచుతుంది. అనుభవాలని ఆవిష్కరించడానికి, సృజించడానికి రచయితలు పిల్లల్లా మారి తమ చుట్టూ గమనించాలంటాను నేను. వాళ్ళు దేన్నైనా ఎంత ఆసక్తిగా, ఏకాగ్రతగా గమనిస్తారో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. అంత దీక్షగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే, వారితో సహానుభూతి చెందితే మనలోని అంతర్ దృష్టి తనంతట తనే కథలను సృష్టించుకుంటుంది.

ఇలాంటి అనుభవంతో రాసిన కథ “చివరి చూపు” ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణ.

అలాగే నాకున్న మరో అదృష్టం ఎప్పుడూ పిల్లలతో గడపగలిగే అవకాశం ఉండటం. ఈ పిల్లల సహాయంతోనే రాసిన మరో కథ “మనసుకు తొడుగేది” – ఇది కూడా ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రచురణే. స్కూల్లో కొత్తగా చేరిన పిల్లలని ఒకసారి ఈ చుట్టు ప్రక్కల ఉన్న కొండల మీదకి హైకింగ్ కి తీసుకు వెళ్ళి అక్కడున్న మూడు కొండలని చూపిస్తూ వాటి పేరు “త్రీ సిస్టర్స్” అన్నాను. అందరూ ఒక్కసారిగా నా మీదకు దూకి “ఎందుకా పేరు వచ్చింది? వాటికేమైనా కథ ఉందా?” అని అడిగిన వారి తీవ్రమైన ఆసక్తి వల్ల పుట్టినదే ఈ “మనసుకు తొడుగేది” కథ.

ఇక్కడ స్కూల్లో పిల్లలకి చెప్పులు రిపేరు చేసి పెట్టే కొండప్ప మౌనంగా ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవడం చూసి ఇన్ స్పైర్ అయి రాసిన కథ “చెప్పుల తాత” (కినిగె).

నాకు తాత్తి్వక కథలంటే ఇష్టం. అలాంటి కథలు రాసే ఆర్.ఎస్. సుదర్శనం, వసుంధరాదేవి, జలంధర, శ్రీవల్లీ రాధికలు రాసిన కథలు చదివీ, హై సొసైటీ వాళ్ళని దగ్గరగా చూస్తుంటాను కనుక వాళ్ళని గమనించీ రాసిన కథలు “విముక్తం” (ఈమాట) “నిర్వేదం” (ఆంధ్రభూమి వారపత్రిక), అంతర్మధనం (పాలపిట్ట).

పల్లెలో పెరిగాను, చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయి కాబట్టి ఆ ఆనుభవాలతో రాసిన కథలు “మాన్యత” (విపుల), “చందమామోళ్ళవ్వ” (ఆటా బహుమతి లభించిన కథ), “చందమామ బిస్కత్తు” (ఫేస్ బుక్ కథ గ్రూప్ బహుమతి లభించిన కథ).

చుట్ఙు ప్రక్కల ఊళ్ళల్లోని యువకులని, యువతులని గమనించి రాసిన కథలు నాలుగైదు ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి నచ్చిన కథ “గౌతమి” (ఈమాట). ఒక స్త్రీ గా తోటి స్త్రీల అనుభవాలతో, వారి భావాలతో సహానుభూతి (ఎంపతీ) చెంది రాసిన కథలు “ప్రేమ జీవనం” (వాకిలి), “కృతి” (ఇంకా ప్రచురింపబడలేదు). నిరర్థకమైన విషయాల కోసం కొంతమంది తమ జీవితాలను వృథా చేసుకుంటారెందుకో అనిపించి రాసిన కథలివి.

ప్రజల సమస్యల కోసం బంద్ లు చేయాలి. కాదనను. కాని వాటిల్లో నోరు లేని, అమాయకులైన పిల్లలని భాగస్వాములని చేయడం, స్కూళ్ళు మూసేయడం ఎంత అమానుషం? సీమాంధ్ర – తెలంగాణా బంద్ అప్పుడు స్కూళ్ళు మూసేయడం వల్ల ఇక్కడ ఉన్న పల్లె పిల్లల దుస్తితి చూసి రాసిన కథలు “సానుభూతి” (సారంగ), “ఎర్రసున్నా” (సాక్షి) – “ఎర్రసున్నా” నాకు చాలా నచ్చిన నా కథ.

ఉన్నదున్నట్లుగా, వాస్తవికంగా రాయడానికి ప్రయత్నించాలి అనే మాట నిజమే కాని కథకి చదివించే గుణం కావాలి కాబట్టి మనం కథకి కావలసిన టెక్నిక్ ని తెలుసుకుని రాయాలి. దాని కోసం మనం మన పాత రచయితలు వేసిన నిచ్చెనలు ఎక్కాలి. ఆ పఠనం వల్ల రచయితలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడే మనలో ఉన్న ముడిరూపానికి మెరుగులు దిద్దుకోగలిగే పరిజ్ఞానం కలుగుతుంది.

కథలు రాసి సామాజిక పరిస్థితుల్ని మార్చడం అనేది భ్రమ అంటారు కొంతమంది. కావొచ్చు కాని “రాయడమంటే సామాజిక బాధ్యత” అని రచయిత తెలుసుకోవాలి. మనం రాసిన రాతలకి మనమే జవాబుదారీ అని గ్రహించిన రచయిత వ్యక్తిగా ఎదుగుతాడు. కథ అనేది ముసుగులని తొలగించాలి తప్ప ముసుగులని తొడుక్కోకూడదని గ్రహిస్తాడు.

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

  375px-Statue_of_Kannagi

తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన సోదరుడైన చేర రాజ్యపు రాజు చేరన్ సెంగట్టువన్, వారి ఆస్థాన కవి శీతలై శాత్తనార్ లతో కలిసి కొండ ప్రాంతానికి వాహ్యాళికి రాగా ఆ ప్రాంతపు గిరిజనులు ‘ఒక యువతి తన భర్తతో కలిసి విమానంలో ఆకాశమార్గాన వెళ్ళడం చూశామనీ, ఆ వింత వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలగజేసిందనీ, ఆమె ఎవరో మీకు తెలిస్తే చెప్పండనీ’ ఆసక్తిగా అడిగారు.  

మధురానగరంలో కణ్ణగికి జరిగిన అన్యాయాన్ని అప్పటికే చారులు ద్వారా విన్నాడేమో మహాకవి శీతలై శాత్తనార్ ఆ యువతి పేరు కణ్ణగి అనీ, ఆమె భర్త పేరు కోవలుడనీ తెలిపి వారి వృత్తాంతాన్ని అందరికీ వివరంగా చెప్పాడు. అది విన్న ఇళంగో వడిగళ్ కణ్ణగీకోవలుల చరిత్రని శిలప్పదిగారం పేరుతో కావ్యంగా రచించాడు.

ఇళంగో జైనుడు అయినప్పటికీ ఈ కావ్యంలో శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన వర్ణనలు ఆళ్వారుల భక్తి గీతాలని పోలి ఉన్నాయనీ, కొన్ని గీతాలలో నిసర్గ భక్తి భావం కనిపిస్తుందనీ అంటారు.   ఈ కావ్యంలో చాలా వరకు జానపద గేయ ధర్మాలు కనిపిస్తాయట. అన్ని మతాలను గౌరవించిన వాడిగా ఈ కావ్యకర్తని గౌరవిస్తారు తమిళులు.

శిలంబు అంటే గజ్జె. (అందియ, మంజీరం). అదిగారం అంటే అధ్యాయం. కాలి అందియ వలననే ప్రాణాలు కోల్పోయిన ఆ భార్యాభర్తల జీవితం గురించిన కథ కనుక ఈ శీర్షిక ఎంతో సముచితమైనదని అందరూ భావిస్తారు. ఈ కావ్యం పుహార్ కాండం, మధురై కాండం, వంజి కాండం అని మూడు కాండాలుగా విభజింపబడి ఉందిట. ఈ కావ్యం క్రీ.శ రెండవ శతాబ్దానికి చెందినది. ఈ కథ చోళ, పాండ్య, చేర రాజ్యాలకి సంబంధించినది. చోళ రాజ్యంలో పుట్టి, పాండ్య రాజ్యంలో తన భర్త ప్రాణాలు కోల్పోగా చేర రాజ్యానికి చేరి అక్కడ తన భౌతిక కాయాన్ని త్యజించిన ఈ కావ్య నాయకి కణ్ణగి చరిత్ర పవిత్రమైనదిగా పేరొందింది.

ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎమ్ ఎ – తెలుగులో ఈ కావ్య చరిత్ర ని పాఠ్యాంశంగా చదువుకున్నప్పటినుండీ ఈ కథని చాలా మందికి చెప్పాను. ఈ కథని వినని సారంగ పాఠకులకు కూడా పరిచయం చేయాలనిపించి ఆ కథని సంగ్రహంగా రాశాను.   ఇప్పటికే చాలా మందికి ఈ కావ్య విశేషం, విశిష్టతల గురించి తెలిసి ఉండవచ్చు. వారు వారి అభిప్రాయాలని పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను.

                                                        కథాసంగ్రహం

1.

చోళ చక్రవర్తులలో గొప్పవాడైన కరికాలచోళుని రాజధాని పుహార్ పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రముఖ వ్యాపారి కుమార్తె కణ్ణగి. రూపంలో, గుణంలో ఈమెకి ఈమే సాటి. ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు ఆమెకి తగిన వరుణ్ణి వెతకసాగారు. ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు. ఓ శుభ ముహుర్తాన కన్నుల పండుగగా కణ్ణగిని కోవలునకిచ్చి వివాహం జరిపించారు. కణ్ణగీకోవలులు అన్యోన్యంగా జీవించసాగారు.

చోళ చక్రవర్తి అయిన కరికాలచోళునికి కళలంటే అత్యంతాసక్తి. ప్రతి ఏడాదీ చేసే ఇంద్రోత్సవాల్లో భాగంగా ఆ ఏడు ఆస్థాన నర్తకి మాధవి అనే అతిలోక సౌందర్యవతి నాట్య ప్రదర్శన ఇచ్చింది.

కరికాలచోళుడు ఆమె నాట్యానికి మెచ్చి ఆకుల హారాన్ని, బంగారు నాణాలని బహుకరించి సత్కరించాడు. ముందు వరుసలో కూర్చుని ఆమె నృత్యాన్ని తిలకిస్తున్న కోవలుడు ఆమె రూపానికి పరవశుడైనాడు. అతని మనసు పూర్తిగా ఆమె సౌందర్యానికి దాసోహమయిపోయింది. అతని మనసులో కణ్ణగిపై ఉన్న ప్రేమానురాగాలు మాయమై మాధవి పట్ల మోహంగా అవతరించాయి.   నాట్య ప్రదర్శనయ్యాక ఇంటికి బయలుదేరిన కోవలునకి ఒక ప్రకటన వినిపించింది.

“చక్రవర్తి గారు మాధవికిచ్చిన హారాన్ని వేలం వేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారో వారికి మాధవి ప్రియురాలవుతుంది” అన్నదే ఆ ప్రకటన. కామ పరవశత్వంతో ఒళ్ళెరగని కోవలుడు ఆ హారాన్ని కొని మాధవి ఇంటికి వెళతాడు. కణ్ణగిని మర్చిపోయి పూర్తిగా మాధవికి వశుడవుతాడు.

తన భర్త వేశ్య వలలో చిక్కుకున్నాడని తెలిసిన కణ్ణగి శోక మూర్తియై రోదించసాగింది.

imgNdKannagi_01

మాధవిని కోవలుడు, కోవలుడిని మాధవి ఒక్క నిమిషమైనా ఎడబాయకుండా ఉన్నారు. మాధవి వేశ్య అయినా కోవలుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వారి ప్రేమానురాగాల ఫలితంగా వారికి ఒక అమ్మాయి జన్మించింది. కూతురికి మణిమేఖల అని పేరు పెట్టుకున్నారు. కోవలుడు వ్యాపారాన్ని విస్మరించి మాధవితోనే కాలం గడపడం వలన అతని వ్యాపారం దెబ్బతింది. కుమార్తె పుట్టేనాటికే అతనికి ఉన్నదంతా, ఆఖరికి తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వారిచ్చిన నగలతో సహా ఊడ్చిపెట్టుకుపోయింది.

కోవలుడి సంపదంతా ఎప్పుడైతే కరిగిపోయిందో అప్పుడు మాధవి తల్లి చిత్రావతి కోవలుడిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కూతురికి చెప్పుడు మాటలు చెప్పడం, కోవలుడిని నిందావాక్యాలతో బాధ పెట్టడం పనిగా పెట్టుకుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండటం వలన ఆమె మాటలు పట్టించుకునే వారు కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ ఏడు చోళ రాజ్యంలో జరుపుకునే ఇంద్రోత్సవం పండుగనాడు మాధవీ కోవలులు సముద్రస్నానానికి వెళ్ళారు. స్నానమయ్యాక ఇసుకతిన్నెల మీద సేద తీరుతూ విశ్రమించారు. చల్లని సముద్రపు గాలి వారి మేనులను సృశిస్తోంది. ఆ వెన్నెలలో మాధవి మనోహర రూపం కాంతులీనుతోంది. కోవలునకి ఆమెని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఆ సమయంలో మాధవి అతన్ని ఓ పాట పాడమని కోరింది.

“ప్రేయసీ! నీ రూపం నన్ను దహించి వేస్తుంది. నువ్వు నన్ను వరించకపోతే నేను ఈ విరహాగ్నికి ఆహుతినై పోవడం నిజం” అనే అర్థం వచ్చేట్లు ఓ విరహగీతాన్ని ఆలపించాడు.

‘అతను ఎవరి కోసం ఈ పాట పాడుతున్నాడు? ఎవరా ప్రేయసి?’ అన్న అనుమానం ఆమెని పట్టి పీడించసాగింది. అయితే ఆమె తన అనుమానాన్ని వ్యక్తపరచలేదు. కొంచెం సేపయాక కోవలుడు మాధవిని పాడమన్నాడు. అనుమానం తద్వారా అసూయాద్వేషం తో మండుతున్న ఆమె మనసుకి అతన్ని రెచ్చగొట్టాలనిపించింది. అతను పాడిన దానికంటే ఎన్నో రెట్లు ప్రేమని కురిపిస్తూ ‘తను పాత ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లూ, పూర్వం ఈ సైకత శ్రేణుల్లో ప్రియునితో కలిసిన రోజులను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ ఆ మధురమైన క్షణాలు రావేమోనని దిగులు పడుతున్నట్లూ’ పాడింది.

ఆ పాటని విన్న కోవలుని హృదయం ఒక్కసారిగా బద్దలైనట్లనిపించింది. మాధవి తల్లి చిత్రావతి మాటలకి వేదనాభరితుడై ఉన్న కోవలుడు మాధవి పాడిన పాటతో తల్లడిల్లాడు. ‘ఈమెని నా దేవతగా ఆరాధించాను. ఈమె కోసం నన్నే నమ్ముకున్న నా భార్యని, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని మరిచాను. వ్యాపారాన్ని నాశనం చేసుకుని బికారినైనాను’ అని అనుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనిపై అతనికి అసహ్యం కలగసాగింది.

ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి మాధవిని చీదరగా చూస్తూ అక్కడ నుండి నిష్క్రమించాడు. అతని కోపాన్ని, ఆవేశాన్ని, అసహ్యాన్ని కనిపెట్టిన మాధవి తను చేసిన పనికి పశ్చాత్తాప పడసాగింది. శోకతప్తహృదయినిగా మారింది.

3.

 

సౌందర్య దేవతగా ఉండే కణ్ణగిని శోకదేవతగా చూసిన కోవలుని హృదయం ద్రవించింది. ఆమెని పట్టుకుని విలపిస్తూ తన దైన్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. మాధవికి ఇవ్వడానికి ఏమీ లేదని విచారిస్తున్నాడనుకున్న కణ్ణగి “దిగులు పడకండి నా దగ్గరున్న ఈ మంజీరాలను తీసుకెళ్ళి ఆమెకివ్వండి” అంటూ తన కాలికున్న విలువైన అందెలను తీసి ఇవ్వబోయింది.

భార్య అన్న ఆ మాటలతో అతను మరింత సిగ్గుతో చితికిపోయాడు. భార్యకి క్షమాపణలు చెప్పుకుని “ధనవంతుడిగా బ్రతికిన ఈ రాజ్యంలో పేదవాడిగా ఉండలేను. మధురానగరానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదించి తల్లితండ్రులను, అత్తమామలను కలుసుకుంటాను. పద బయలుదేరు” అన్నాడు. భర్త మాటకు ఏనాడూ జవదాటని కణ్ణగి అతని మాటలకి ఆనందభరితురాలై ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. దారి మధ్యలో సత్రాల దగ్గర, ఆరామాల దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ మధురానగరం వైపుకి నడవసాగారు.

ఇక్కడ మాధవి కోవలుని కోసం రేయంబవళ్ళు విలపిస్తోంది.   రోజులు గడుస్తున్నా అతను రాకపోవడంతో తనని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి నమ్మకమైన బ్రాహ్మణునకిచ్చి కోవలునకి అందజేయమని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు కోవలుడు మధురానగరానికి బయలుదేరాడని తెలుసుకుని వేగంగా ప్రయాణించి మార్గమధ్యంలో కలుసుకుని ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని చదువుకున్న కోవలుడు “బ్రాహ్మణోత్తమా! నా అవివేకంతో మాధవిని అనుమానించి బాధపెట్టాను. త్వరలో వస్తానని చెప్పండి. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాన్ని చెప్పండి” అని ముందుకు సాగాడు.

దారిలో కౌంతి అనే జైన యోగిని ఆశ్రమంలో విశ్రాంతి కోసం ఆగారు. కౌంతి యోగిని వారి గురించి తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని ఆమెకెందుకనిపించిందో మరి ‘ముందంతా దుర్గమమైన అరణ్యమనీ, మంచి మార్గం తనకి తెలుసనీ, తాను కూడా మధురానగరానికి తోడుగా వస్తాననీ’ అంది.   అడక్కుండానే ఆమె చేస్తున్న ఆ సహాయానికి కణ్ణగీకోవలులు అనేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రాత్రికి ఆమె ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు.

అందమైన ప్రదేశాలను, ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలారావాలను, దారిలో కానవచ్చే పల్లెపడుచుల ఆదరాభిమానాలను, వారు పాడుతున్న పల్లెపదాలను చూస్తూ, వింటూ కౌంతి యోగిని దారి చూపుతుండగా ఆమెని అనుసరించసాగారు కణ్ణగీకోవలులు.

వైఘనదిని దాటుకుని కొన్నాళ్ళకి క్షేమంగా మధుర మీనాక్షి కొలువై ఉన్న మధురానగరానికి చేరుకున్నారు. కౌంతి యోగిని శిష్యురాలైన మాధురి ఇంట్లో బస చేశారు. మాధురి వీళ్ళను ఆదరంగా ఆహ్వానించి భార్యాభర్తలు ఉండటానికి తగిన ఇంటిని, కావలసిన సామగ్రిని ఇచ్చింది.

ఆరోజు చాన్నాళ్ళ తర్వాత తన భర్తకి తన చేతులతో వంట చేసి వడ్డించింది కణ్ణగి. కోవలుడు తృప్తిగా భోంచేశాడు. కోవలుడు మాధవికిచ్చి కాజేయగా మిగిలి ఉన్న కణ్ణగి కాలి అందెల్లో ఒక దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలని వారిద్దరూ సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రించారు.

మర్నాడు కౌంతి యోగినికి అనేక వందనాలు సమర్పించుకున్నాడు కోవలుడు. కణ్ణగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని ఆమెకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.   భార్య దగ్గర సెలవు తీసుకునేప్పుడు ఎందుకో తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి.   కణ్ణగి కూడా వీడ్కోలు పలుకుతూ దు:ఖానికి లోనయింది.   కోవలుడు తన వేదనని అణచుకుని భార్యని ఓదార్చాడు, ఆమెని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు.

పాపం ఆ రోజు అతను వెళ్ళకుండా ఉన్నట్లయితే అతని ప్రాణాలు నిలిచేవేమో!! కాని విధిని మార్చడం ఎవరి తరం!!?

temple

4.

పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలమది. పాండ్య రాజులు రాజ్యంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజుగారికి విన్నవించుకోవడానికి రాజస్థాన ప్రాంగణంలో ఒక గంటను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గంటను మ్రోగిస్తే మహారాజే స్వయంగా వారికి జరిగిన అన్యాయాన్ని గురించి విచారించేవారు. దానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించేవారు.

ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ మహారాజు నెడుంజెళియన్ కే ఇప్పుడొక సమస్య వచ్చింది. రాణిగారి అంత:పుర మందిరంలోనే దొంగతనం జరిగింది. రాణి కొప్పెరుందేవి తన నగలని మెరుగు పెట్టించడానికి నగల పెట్టెను కొన్ని మాసాల క్రితం ఆస్థాన స్వర్ణకారుడికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు నగలకి మెరుగు పెట్టి వెంటనే పెట్టెను తిరిగి ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని పరిశీలించకుండా అలా ఉంచేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె కాళ్ళకి అందెలు ధరించాలని నగల పెట్టె తెరిచి చూడగా ఒక మంజీరం కనిపించలేదు. రాణిగారికి కంసాలి మీదే అనుమానంగా ఉంది. నిజంగానే ఆ మంజీరాన్ని స్వర్ణకారుడు కాజేసి వెంటనే అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. నెడుంజెళియన్ స్వర్ణకారుడిని పిలిపించి “వారం రోజులలో అందియని దొంగిలించిన దొంగ ఎవరో తెలియాలి లేకపోతే నిన్ను శిక్షించి నిజాన్ని బయటికి రాబట్టక తప్పదు” అంటూ హెచ్చరించాడు.

ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో కోవలుడు మధురానగరంలో స్వర్ణకారులుండే వీధికి వచ్చాడు. విధి వైపరీత్యం చూడండి ఎలా నడుస్తున్నదో!!! అదే సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారుడు తన అనుచరులతో కలిసి నడుస్తూ కోవలుడికి ఎదురు వచ్చాడు.

కోవలుడు ఆ కంసాలికి నమస్కరించి “నేను ఈ దేశానికి కొత్తవాడను. వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఈ నగరానికి వచ్చాను. నా దగ్గరొక విలువైన మంజీరమున్నది. దానికి వెలకట్టగలరా?” అని అడిగాడు. స్వర్ణకారుడు సరేననగానే కోవలుడు తన అంగీలోని మంజీరాన్ని తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే స్వర్ణకారుడి కళ్ళు మెరిసిపోయాయి. తన అదృష్టానికి అతని మనశ్శరీరాలు ఉప్పొంగిపోయాయి – కారణం – ఆ మంజీరం అచ్చంగా రాణి గారి మంజూషం లో నుండి తాను కాజేసిన మంజీరం లాగా ఉండటమే….

కోవలుడిని దోషిగా నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్న కంసాలి కోవలుడిని తన ఇంట్లో కూర్చుండబెట్టి తన అనుచరులతో వెళ్ళి రాజుని కలుసుకున్నాడు. “ప్రభూ! దొంగ దొరికాడు. అతడు అంత:పురంలో చొరబడి మంజీరాన్ని కాజేశాడు. నాకే అమ్మజూపాడు. వీళ్ళంతా సాక్ష్యం” అన్నాడు అతని అనుచరులను చూపుతూ.

కోపోద్రేకుడైన రాజు సైనికులని పిలిపించి “అతనెవరో… అతని దగ్గరున్న మంజీరం రాణి గారిదేనా అని నిర్థరించుకుని, రాణి గారిదే అయితే ఆ దుర్మార్గుడిని వధించండి” అని ఆజ్ఞాపించాడు. సైనికులు కంసాలి ఇంటి వరండాలో కూర్చుని ఉన్న కోవలుని దగ్గరున్న మంజీరాన్ని తీసుకుని పరీక్షించారు. అది రాణిగారి మంజీరాన్ని పోలి ఉండటంతో అతన్నే దొంగగా నిర్ణయించి ఒక్క వేటుతో అతని తలని నరికారు. రక్తసిక్తమైన అతని శరీరం వీధిలో పడి ఉంది.

ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆలయంలో పూజ చేసుకుని తిరిగి వస్తున్న మాధురికి సంగతి తెలిసింది.   చూసిన జనం వర్ణిస్తున్న దాన్ని బట్టి అతను కోవలుడేమోనన్న అనుమానంతో ఆ స్వర్ణకారులున్న వీధిలోకి వెళ్ళి చూసింది. విగతజీవుడై పడి ఉన్న కోవలుడుని చూడగానే దిగ్భా్రంతి చెంది పరుగు పరుగున ఇంటికి చేరి విషయాన్ని కణ్ణగికి తెలిపింది. “కోవలుడిని వధించారు” అన్న వార్త వినగానే కణ్ణగి స్పృహ కోల్పోయినట్లుగా కూలబడిపోయింది. కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. భర్తను తల్చుకుని దు:ఖిస్తున్న ఆమె తన భర్తపై అన్యాయంగా దొంగతనం మోపి వధించారన్న విషయం గుర్తొచ్చి కోపావేశంతో లేచింది. కళ్ళ నుండి అగ్ని కణాలను కురిపిస్తూ ఇంటి లోపలకి వెళ్ళి రెండవ మంజీరాన్ని చేతిలో ఉంచుకుని భూమి కదిలిపోయేట్లుగా నడుస్తూ నగరం వైపుకి సాగింది.   జనం గుంపులు గుంపులుగా ఆమెని అనుసరించసాగారు.

వీధిలో పడి ఉన్న భర్త శవాన్ని కౌగలించుకుని కణ్ణగి హృదయవిదారకంగా ఏడవసాగింది. అక్కడున్న జనం నిజమా, భ్రమా అని విభ్రమంతో చూస్తుండగా నిర్జీవుడై పడి ఉన్న కోవలుడు లేచి కూర్చుని భార్యని ఓదార్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భర్త భౌతికకాయాన్ని అక్కడే విడిచి కణ్ణగి ఆవేశంతో ఊగిపోతూ రాజస్థానానికి బయలుదేరింది. అక్కడ జరిగిన మహిమని గమనించిన జనం ఆమెని వదలకుండా వెంబడించారు.

5.

కణ్ణగి నేరుగా వెళ్ళి సభామంటపం లోని గంటను మో్రగించింది. ఆ గంటను విన్న రాణి కొప్పెరుందేవి భయభ్రాంతురాలై పరుగున రాజు దగ్గరికి వచ్చి “స్వామీ! నిన్న ఆ మంజీరం నా మందిరం చేరినప్పటినుండీ నా మనస్సు కీడు శంకిస్తోంది. మన రాజ్యం నశించిపోయినట్లుగా రాత్రంతా పీడకలలు. ఇప్పుడే నా చెలికత్తెలు వార్తని మోసుకొచ్చారు. ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది” అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే సైనికుడొకడు వచ్చి “ప్రభూ! ఎవరో స్త్రీ. చేతిలో కాలి అందెను పట్టుకుని రౌద్ర రూపంతో ఉంది. ఆమె భర్తని అన్యాయంగా హత మార్చారని ఆరోపణ” అన్నాడు. ఆశ్చర్యపోయిన నెడుంజెళియన్ “ఆమెని ప్రవేశపెట్టండి!” అన్నాడు.

కణ్ణగి సభలోకి వచ్చింది. జుట్టు ముడి వీడి శిరోజాలు చిందరవందరగా భుజాల మీద పరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీర మట్టిగొట్టుకుని ఉంది. ముఖమంతా కన్నీటి చారికలతో తడిసి ఉంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టులా కళ్ళు ఎర్రగా మారి నిప్పుకణాలను వెదజల్లుతున్నాయి. దయార్థ్రహృదయుడైన నెడుంజెళియన్ ఆమెని చూసి ఆవేదన చెందాడు. “తల్లీ! నీవెవరు? నీకు జరిగిన అన్యాయమేమిటి?” అన్నాడు.

“నా పేరు కణ్ణగి. మాది చోళ దేశం లోని పుహార్ పట్టణం. వ్యాపారం చేసుకోవాలని ఈ దేశానికి వచ్చాం. పెట్టుబడికి డబ్బు కోసం నా పెళ్ళిలో నా తల్లిదండ్రులు నాకిచ్చిన మంజీరాలలోనొకదానిని నేను స్వయంగా నా భర్తకిచ్చాను. అన్యాయంగా దొంగ అని నింద వేసి నా భర్తని హత్యగావించిన నువ్వు దోషివి” అంది వేలెత్తి చూపుతూ. “సాక్ష్యాధారాలు దొరికాయి కనుకనే నీ భర్తకి దండన విధించాము” అన్నాడు రాజు.

“కాదు నా భర్త నిర్దోషి. నిరూపించడానికే వచ్చాను. ఇదిగో ఇది నా రెండవ కాలి మంజీరం. ఇప్పుడు చెప్పండి, మీ మంజీరం లోపల ఏమున్నాయి?” అంది కణ్ణగి ఆవేశంగా తన కుడి చేతిలో ఉన్న మంజీరాన్ని ఎత్తి చూపిస్తూ.

“మా మంజీరంలో ముత్యాలున్నాయి” అన్నాడు నెడుంజెళియన్.

“అయితే తెప్పించండి, నా భర్త నుంచి మీరు తీసుకున్న మంజీరాన్ని పరీక్షించండి. నా మంజీరంలో రత్నాలున్నాయి” అంది. రాజు అజ్ఞ మేరకు సేవకుడు మంజీరాన్ని తెచ్చాడు. దాన్ని చూడగానే అది తనదే అని గుర్తించిన కణ్ణగి మంటలా ప్రజ్వరిల్లుతూ “ఓ రాజా! ఇది నా మంజీరం.   కావాలంటే చూడండి, ప్రజలారా చూడండి” అంటూ మంజీరాన్ని లాక్కున్నట్లుగా తీసుకుని నేల మీదకి విసిరి బద్దలు కొట్టింది. మంజీరం పగిలి లోపల ఉన్న రత్నాలు చెల్లాచెదురుగా సభామంటపం అంతా పడ్డాయి. కొన్ని రత్నాలు నెడుంజెళియన్ ముఖాన, సభాసదుల ముఖాన పడ్డాయి.

పాండ్య చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. భీతి శరీరంలో చేరి కడుపును దోసిళ్ళతో దేవినట్లయింది. అతనికి భరించలేని వేదన మూలుగు రూపంలో హృదయం నుండి మెదడుకి ప్రాకి మతి చలించింది. “అయ్యో! పాండ్య వంశానికే కళంకం కలిగింది. అపరాధిని నేనపరాధిని” అని పలవరిస్తూ సింహాసనం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు. కాళికలాగా ఉన్న కణ్ణగి స్వరూపాన్ని చూస్తూ నిశ్శేష్టురాలైన కొప్పెరుందేవి తన భర్త ప్రాణాలు కోల్పోగానే కణ్ణగి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. భర్త శవం పై పడి రోదించి రోదించి కొంత సేపటికి తన ప్రాణాలను కూడా వదిలివేసింది. రాజు, రాణి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలందరూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కణ్ణగికి మాత్రం తన ఆవేశం చల్లారలేదు. తనను తాను శిక్షించుకోవడానికేమో తన ఎడమరొమ్ముని నరుక్కుని   మీదికి విసిరి “నేను పతివ్రతనే అయితే దుష్టరాజు పరిపాలించిన ఈ మధురానగరం తగులపడిపోవాలి” అని శపించింది.

మరుక్షణం రాజభవనంలో మంటలు వ్యాపించాయి. నగరం తగలపడసాగింది. ప్రజలు భయంతో మీనాక్షి అమ్మవారి ఆలయానికి పరుగులు తీశారు. మధురకి తల్లి అయిన మీనాక్షీదేవి కణ్ణగి ఎదుట ప్రత్యక్షమై “కణ్ణగీ! పాండ్యరాజులు ధర్మస్వరూపులు. నెడుంజెళియన్ ఉత్తముడు. నీ భర్తకి ఈ గతి పట్టడానికి కారణం పూర్వజన్మఫలం. శాంతించు. అగ్నిని ఉపసంహరించుకో. ఇప్పటినుండి సరిగ్గా పదునాలుగు దినాల్లో నువ్వు నీ భర్తని దివ్యలోకాల్లో కలుసుకుంటావు” అని పలికింది. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం కణ్ణగి అగ్నిదేవుడిని ప్రార్థంచి అగ్నిని ఉపసంహరించుకోమని కోరింది కాని ఆమెకి మనశ్శాంతి కలగలేదు. ఆవేదన తీరలేదు.

వేశ్యావలలో చిక్కుకున్న భర్త కోసం ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తన దగ్గరకి చేరుకున్న భర్తతో సుఖంగా ఉందామనుకుని ఎంతో ఆశ పడ్డ ఆమె భాధని వర్ణించడం ఎవరి తరం?

6.

ఇక ఆ నగరంలో ఉండలేక వైఘనదీ తీరాన్ని వెంబడిస్తూ పడమరగా ప్రయాణించింది కణ్ణగి. ఆమెకి ఆకలిదప్పులు లేవు. పగలేదో రాత్రేదో తెలియలేదు. అవిశ్రాంతంగా అలా ప్రయాణించిన ఆమె పద్నాలుగో రోజుకి చేర దేశానికి చేరింది.   పర్వతప్రాంతాలలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో కూలబడింది.

ఆ ప్రాంతపు గిరిజనులు పొలం పనులకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆకాశంలో నుండి మిరుమిట్లు గొలుపుతూ దేవ విమానం కిందికి దిగింది. ఆ విమానంలో నుండి సుందరాకారుడైన యువకుడు చేయినందివ్వగా నేరేడు చెట్టు కింద నిలబడిన యువతి అతనే చేయందుకుని విమానమెక్కింది. విమానం గాలిలోకి లేచి మెల్లమెల్లగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ గిరిజనులు అబ్బురపడ్డారు. ఆ దృశ్యాన్ని వర్ణించి వర్ణించి చెప్పుకోసాగారు. ఆ సమయంలోనే చేర రాజు అక్కడకి రావడంతో గిరిజనులు రాజుని దర్శించుకుని జరిగిన వింతని తెలియపరిచారు. మహాకవి శాత్తనార్ కణ్ణగీకోవలుల చరిత్రని చేర రాజుకి, ఆ గిరిజనులకి చెప్పి, ఇళంగో వడిగళ్ ని ఆ కథని కావ్యంగా రచించమని అడిగాడు.

ఆ పతివ్రతా శిరోమణి కథను విన్న సెంగట్టువన్ ఆమెకి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా హిమాలయాలనుండి శిలను తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయించాడు. వంజి నగరంలో దేవాలయాన్ని నిర్మించి మంత్రి సామంతులు, బంధుమిత్రులతో కూడి పురోహితులు మంత్రోచ్ఛారణ జరుపుతుండగా శాస్త్రోస్తకంగా ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. చోళ, పాండ్య, చేర రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. దివ్యభూషణమనోహరాకారంతో కణ్ణగి అక్కడున్న వారి ముందు సాక్షాత్కరించి అందరినీ దీవించింది.

ఆమెను దర్శించుకున్న వాళ్ళకి, ఆమె కథని విన్న వాళ్ళకి సుఖ సంతోష ఆయరారోగ్యాలు కలుగుతాయని పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

 

-రాధ మండువ

12513_1465986130323886_882400752089238785_n

 

 

 

 

 

Tamil Arts. Silapathikaram – Beautiful sculptures of Poombukar Art Gallery, Tamil Nadu, India. కింద లింక్ లో చూడండి. మొత్తం కథని చదివినట్లే ఉంటుంది.

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని కొకు వ్యంగ్యంగా సమర్థిస్తున్నట్టూ కనిపించినా (ఏ మాత్రం శృతి కుదరని హస్తిమశకాంతరమున్న జంటల విషయంలో కనీసం) – ఆయన చెప్పదల్చుకున్నది ‘సమస్య యొక్క అసలు మూలాల దగ్గరకి వెళ్ళకుండా పైపైన పాయింట్లతో చెలరేగిపోయే సంఘసంస్కరణాభిలాషుల వల్ల కలిగే ప్రయోజనం సున్నా అనే.

ఈ కథ లోని ‘శివానందం’ పాత్ర సంస్కరణ పేరు చెప్పి పోజు కొట్టే అనేక మందికి ప్రతినిధి.
ఆనాటి నవీన విద్యావిధానంలో ఏదో అరకొరగా ఇంగ్లీషు నాగరికతా ముక్కల్ని మైండ్ లో పోగు చేసుకుని వాటన్నిటి నుంచే జీవిత సమస్యలకి పరిష్కారం దొరుకుతాయనుకునే అమాయకత్వం/మూర్ఖత్వం కలబోసిన మనిషి శివానందం.

ఇలాంటి వాళ్ళని మోసగాళ్ళు, స్వార్థపరులు అనడం సబబు కాదు. తమకే పరిష్కారాలు తెలుసునన్న దృక్పధం ఇలాంటి నవీన బుద్ధిశాలులలో చాలా ఎక్కువగా కనపడటం ఈనాడూ మనం గమనించవచ్చు.

ప్రేమ లేని శాపపు పెళ్ళిళ్ళలో వచ్చే సమస్యలన్నింటికీ (మానసిక శారీరక హింసలు, నస, అక్రమ సంబంధాలు వగైరా) అసలు పరిష్కారం వాటిని అర్థం చేసుకుని పరిష్కరించగల వివేకాన్ని తెచ్చుకోవడంలోనే ఉంటుందని వాచ్యంగా చెప్పకపోయినా సూచ్యంగా చెప్పినట్లున్నారు కొకు.

సంఘోద్ధరణకి బయల్దేరే లోతులు లేని సంస్కర్తల వైఫల్యాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపించడం లోనే ఈ సూచన ఉందనిపిస్తోంది.

లాలిత్యం – ప్రేమ మాట దేవుడెరుగు – చూడగానే కంపరం పుట్టించే రూపాలూ, అవిద్య, మూర్ఖత్వం వల్ల ముఖంలో ముద్ర పడిపోయిన కోపమూ, అసూయా, కుళ్ళుమోత్తనమూ – ఇటువంటి ‘విపరీత’ దాంపత్యాన్ని సంస్కర్తల అమాయకత్వాన్ని ఫోకస్ చేసేందుకే కథలో పెట్టాడేమో అనిపిస్తుంది.

KODAVATIGANTI-KUTUMBARAO

భారతదేశంలోని స్త్రీలందరూ పురాణాలలోని పతివ్రతలని ఫాలో అయ్యే వాళ్ళనీ, ‘సంస్కరణ యావత్తూ మగవాడికే చెయ్యవలసి ఉంది’ అనీ శివానందం నమ్మడం లోనే అతని అవివేకాన్ని, ముందు జరగబోయే కథని సూచిస్తాడు కొకు.

పెళ్ళాలని కొట్టకుండా మగవాళ్ళని ఆపడం కోసం శివానందం వేసిన ‘ప్లాన్ ఆఫ్ కాంపేన్’ (ఒపీనియన్ ఒకటి క్రియేట్ చెయ్యడం, ఉద్రేకిస్తూ ఓ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం వగైరా) పెద్దగా ఫలించక చివరికి శ్రీరాములు గారనే పెద్దమనిషిని సంస్కరించబూనుకుంటాడు.

శ్రీరాములు గారు ఈ కుహనా సంస్కర్తకన్నా వెయ్యిరెట్లు తెలిసినవాడు. అయినా శివానందం తన ఉపన్యాసాయుధాన్ని శ్రీరాములు గారి మీద ప్రయోగించడం మొదలుపెట్టగానే ఆయన ‘పడిపోయినట్లు’ నటించి శివానందాన్ని అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి తనలో కలిగిన పరివర్తనని చూసి తన కాపరాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండమంటాడు.

శివానందం తన స్నేహితుడితో (కథకుడు) కలిసి శ్రీరాములు గారి ఇంటికి వెళతాడు.

అక్కడ శ్రీరాములు గారి భార్య తన గయ్యాళితనాన్ని శివానందానికి రుచి చూపిస్తుంది. ఆడవాళ్ళని కొట్టే మగవాళ్ళని సంస్కరించబూనుకున్న శివానందం తనే ఆమెని కొట్టబోవడం, అతనికి శృంగభంగం కావడంతో కథ ముగుస్తుంది.

ఇంత జరిగినా శివానందంలో ఏమీ మార్పు రాలేదన్న విషయాన్ని చివర్లో శివానందం కథకుడితో అన్న మాటల ద్వారా సూచిస్తాడు కొకు. కొకు తను చెప్పదలుచుకున్నది ఏ ఆవేశమూ లేకుండా నింపాదిగా ఎంత బాగా చెప్పగలడు అన్న దానికి ఈ కథ ఒక ఉదాహరణ. క్రింది లింక్ లో చదవండి……

http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=14745

– రాధ మండువ

సాయం

radhamanduva1

 

ఫెళ ఫెళ ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం. ఆకాశం అంతా నల్లని కాటుకగా మారి నా చుట్టూ ఉన్న చెట్లనీ, నా ఒడ్డున ఉన్న ఇళ్ళనీ అంధకారం లోకి నెట్టేసింది. రివ్వున వీస్తున్న చలిగాలికో మరి అక్కడ నుండి కదలడం ఇష్టం లేకో నాలోని ప్రతి నీటి అణువూ వణికిపోతూ ముడుక్కుని కూర్చున్నట్లు నిశ్చలంగా ఉంది.

 

‘రత్తో! అన్నం తింటివా?’ అనో, ‘నరిసీ పనిలోకి బోలా?’ అనో, ‘ఒరేయ్! ఆడకూతురికి సాయం చెయ్యకుండా అట్లా చూస్తా నిలబడినావేందిరా – ఇట్ల పట్టియ్ ఆ కోడిని!?’ అనో గోలగోలగా ఏవేవో మాట్లాడుకునే జనం నా గట్టు మీద ఒక్కళ్ళు లేరు. వానకి దడిసి అందరూ ఇళ్ళల్లో దూరి కూర్చున్నారు. చెట్లల్లో నుండి నా అంచుల్లోకి దుమికి దుమికి ఆడుకునే జీవాలు కూడా ఎక్కడివక్కడ దాక్కున్నాయి.

రంగమ్మవ్వ రాత్రి ఆమెని సముదాయించి ఆమెనీ, ఆమె కూతురునీ తనింట్లోకి తీసికెళ్ళినప్పుడు విముక్తమైనట్లుగా ఉరిమిన ఆకాశం సన్నని తుంపర్లను విదిలించింది. నాలుగో ఝాము నుంచీ మరీ క్షణం తీరిక లేకుండా బిందెలతో పోసినట్లుగా కుమ్మరిస్తూ నా ప్రయాణానికి సన్నాహాలు చేస్తుంది. చెట్లు, పుట్టలు, దార్లు అన్నీ నీళ్ళమయమై నాలోకి చేరుతున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా నీటి బిందువులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.

ఎన్నో చోట్లలో నాకు ఆనుకుని ఉన్న చెట్లనీ, దుబ్బులనీ, రాళ్ళనీ, రప్పలనీ తాకుతూ చెంగుచెంగున పరిగెత్తాలనే నా కోరిక ఇంకాసేపట్లో తీరబోతోంది. దీని కోసం నాలుగేళ్ళ నుండీ ఎదురు చూస్తున్నాను. నిజమే – కాని నాకు ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు.

పుట్టినప్పటి నుండీ సంతోషంగా పరుగులు తీస్తూ ఆడుకున్నాను. ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉండేదాన్ని. నా ప్రక్కనున్న చెట్లనీ చేమలనీ అడిగి వాటి రంగురంగుల ఆకులతో, పువ్వులతో రోజుకో రకంగా అలంకరించుకునేదాన్ని.   ఒడ్డునున్న రాళ్ళని కావాలని తాకి నవ్వేదాన్ని. అవి నేను పెట్టే గిలిగింతలకి నాతో పాటు నవ్వి నవ్వి అలిసి అరిగిపోయేవి.

ఎంత బావుండేవి ఆ రోజులు!? వర్షం ఎక్కడికెళ్ళిందో మరి ఐదేళ్ళనుండీ…. నాకు కనపడకుండా పోయింది. నాలోకి చేరవలసిన నీరు సంగతి అలా ఉంచి, ఉన్న నీరే సూర్యుని దాహానికి సరిపోవడం లేదు. అందరినీ, అన్నింటినీ పలకరిస్తూ పారుతూ పోవలసిన నేను నాలుగేళ్ళుగా ఇక్కడే ఆగిపోయాను. శుష్కించిన శరీరంతో మడుగులాగా పడి ఉన్నాను.

ఆశాదృక్పథంతో జీవితాన్ని సాగించాలనుకునే నేను ఇక్కడ కొచ్చిన కొత్తల్లో పెద్దగా బాధ పడేదాన్ని కాదు. నిజానికి ఈ కొత్త రకమైన నిశ్చలతకి సంతోషంగా ఉండేది.   నా చుట్టూ ఉన్న వాటిని పరిశీలించడం మంచి అలవాటుగా అలవడింది.

నేను ఇక్కడ ఆగాకే నా ఎదురుగ్గా ఇందిరమ్మ ఇళ్ళు లేచాయి. నా ఒడ్డు పై నుంచి మెట్లు ఏర్పరచుకోని ఆడవాళ్ళు బిందెలతో నా దగ్గర కొచ్చి నవ్వుతూ, తుళ్ళుతూ నా నీళ్ళని తీసికెళుతుంటే భలే ఆనందపడేదాన్ని.

తరవాత్తర్వాతే నాలో ఓ రకమైన నిర్లిప్తత ఏర్పడింది. ఏమీ చేయలేని నిస్సహాయత, నిస్పృహలతో బాధపడేదాన్ని.

రెండేళ్ల క్రితం – ఆ రోజు …. నాకు బాగా గుర్తుంది. పడమటింట్లో విశ్రాంతి కోసం సూర్యుడు వేగిరపడుతున్నాడు. ఆర్ర్తత లేశమాత్రమైనా లేని నన్ను గమనిస్తున్న నింగి మందంగా మేఘాలను కదిలిస్తుంది. నేను దిగులుగా ఆకాశాన్ని చూస్తున్నాను. బహుశా ప్రార్థిస్తున్నానేమో!

ఆ సమయంలో నా ఒడ్డు పైన మెత్తని పాదాల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాను.

అడుగులో అడుగేస్తూ నడుస్తున్న ఆమెకి 24 ఏళ్ళుంటాయి – పుష్టిగా, బొద్దుగా ఉంది. నల్లని నీల మేఘ ఛాయ మేని. పసుపులో అద్దిన తెల్లని పెళ్ళి చీర, మెడలో పసుపుతాడు. దానికి వేళ్ళాడుతూ ఆమె గుండెలని తడుముతున్న మంగళ సూత్రాలు. గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు. కుడి చేతి చిటికెన వ్రేలిని భర్త ఎడమ చేతిలో ఉంచి పారాణి ఆరని పాదాలతో సన్నని అడుగులు వేస్తూ దించిన కళ్ళని మరింత దించి నా వైపు చూసింది.   నా కళ్ళు ఆమె కళ్ళతో కలిసి ఒక్కసారిగా జిగేలుమన్నాయి. చిత్రమైన అనుభూతి నాలో గాఢంగా.

సాయంకాలపు ఎండ కెంజాయ రంగు ఆమె బుగ్గలను తాకి నా నీళ్ళల్లో ప్రతిఫలించింది. చల్లని మలయ మారుతం ఆమె తలలోని మలె్లల పరిమళాన్ని నింపుకొని నా మీదకి వాలింది.   నా వైపు అలాగే చూస్తూ నడిచి తూర్పు దిక్కున నేను ఆగిన చోట ఆగి ఎదురుగ్గా ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.

సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. పనుల నుండి జనం ఇళ్ళకి చేరారు. “మ్మే సుజాతా! మన సూరి గాడు పెళ్ళాన్ని పిలచకొచ్చినాడంట సూసేసొద్దాం దా” అంది రత్తి.

“అవునంట. మూడు నిద్దర్లన్నా చేయించకుండా అట్లెట్లా పంపిచ్చేసినారక్కా! సవితి తల్లి వదిలిచ్చేసుకుందనుకో కన్నతండ్రి అన్నా చెప్పగూడదా?” అంది సుజాత కోపంగా.

“ఆఁ! సరేలే పా! వాడొక తండ్రా? తల్లి చచ్చిపోతే సాకాల్సొస్తుందని చిన్నప్పుడే హాస్టల్లో చేర్పించినాడు. పది గూడా చదువుకోనీకుండా ఆ పాప తావున సంపాదిచ్చల్లని మిల్లులోకి కుట్టు పనికి అంపించినాడు. కూతురికి పెండ్లి చేయకపోతే నలుగురూ మొకానూస్తారని చేసినాడు…. ఆ పాప సంపాదించిండే డబ్బుతో తాళిబొట్లు కొని. – తల్లిలేని పిల్ల పాపం, ఈ తాగుబోతు సూరెదవేం బాదలు పెడతాడో? – తొందరగా పోయొద్దాం పద. తెల్లవారి చేసిండే కూర రొంతే ఉంది. ఈ పూట రసం పెట్టాల్ల” అంది రత్తి.

వింటున్న నాకు నా గుండె గొంతుకలో కొట్టాడినట్లయింది.   కళ్ళ నిండా కలలు నింపుకుని సిగ్గుపడుతూ అతని ప్రక్కన సున్నితంగా నడిచి వెళ్ళిన ఆ అమ్మాయిని తల్చుకుని ‘పాపం’ అనుకున్నాను.

అప్పటినుండీ ఆమెనే గమనిస్తున్న నాకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఆమె నవ్వినప్పుడు నేను నవ్వుతూ, ఆమె దిగులుగా ఉన్నప్పుడు ఏమయిందో అని ఆశ్చర్యపోతూ ఆమెలో ఒక భాగమయ్యాను.

నీళ్ళకి అమ్మలక్కలతో వస్తే ఆమె గురించిన విషయాలు తెలుస్తాయనుకుంటే ఎప్పుడూ ఒక్కతే అందరూ పనులకి పోయాక ఏ మధ్యాహ్నమో వస్తుంది. అది నాకు విశ్రాంతి సమయం. నేను పడుకుని ఉంటే నా ప్రక్కనే కూర్చుని నా వైపే కన్నార్పకుండా చూసేది. అప్పుడప్పుడూ సన్నగా నవ్వేది.

2010-10-18

ఆమెని అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. మరీ ఆమె పక్కింట్లో ఉండే రంగమ్మవ్వ ఆమెని తన సొంత కూతురు లాగా చూసుకుంటుంది. కొడుకు కోడలు పనికి పోయాక రంగమ్మవ్వకి ఆమెతోనే కాలక్షేపం.

ఒకరోజు రంగమ్మవ్వ ఆమె పొట్ట వైపు చూస్తూ “పాపా! ఎన్నో నెల?” అంటుంటే నాకు చాలా సంతోషం కలిగింది.

రోజులు గడిచేకొద్దీ నిండుగా మారుతున్న ఆమెని చూస్తూ ఆందోళన పడ్డాను. పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుడుతున్నపుడు ఆమె పెట్టిన కేకలకి నేను ఎంతగా వణికిపోయానో!   ఇక ఆ రోజు నుంచీ ఆమె తప్పేమీ లేకుండానే ఆమె జీవితంలోకి చీకటి, దు:ఖం నిర్దాక్షిణ్యంగా అడుగుపెట్టాయి.

“ఆడపిల్లని కనడం నేరమా అవ్వా!” అని బిడ్డని ఒళ్ళో పెట్టుకొని ఆమె అవ్వని అడుగుతుంటే ఇటు నేను అటు రంగమ్మవ్వ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం.

“నీ కర్మ పాపా! ఈ తాగుబోతోడి సంగతి మాకు ముందే తెలుసు. ఆడపిల్లని కాదు పాడు కాదు, ఏదో ఒకటి వంక పైకి దూకి కొట్టడానికి. లోపలికి పద – తుంపర్లు పడతాండాయి – బిడ్డ తడిసిపోతంది” అంది అవ్వ.

నేను గలగలలు మర్చిపోయి ఇక్కడ ఆగిపోయినప్పుడు నాకు కలిగిన దు:ఖం ఆమెలో చూశాను. చీకటి పడుతుందంటే ఇప్పుడు భయంగా ఉంటోంది . మత్తుని తాగి తూలిపోతూ వచ్చే అతను ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే దబదబ ఆమెని కొడుతున్న చప్పుడు, పసిపాప రోదన హృదయ విదారకంగా. ఆ ఏడుపుని వినీ వినీ నా గుండెలు ఎండిపోతున్నాయి. రోజు రోజుకీ క్షీణించిపోతున్నాను. తూర్పు వైపు నుండి పడమర వైపుకి – ఆమె ఇంటి నుంచి దూరంగా – ఇవతలకి జరిగిపోతున్నాను.

ఈమధ్య అతను ఇంటికి సరిగ్గా రావడం లేదు. అతను రాని రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అతను ఇంటికి కావలసినవి కూడా ఏమీ తేవడం లేదులా ఉంది. రోజు రోజుకీ ఆమె నాలాగే కృశించి పోతోంది. మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని బరువెక్కిన ముఖంతో నా ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చునేది. నాతో ఆమె బాధలన్నీ చెప్పుకొని సాంత్వన పొందేదేమో లేచి లోపలకి వెళ్ళేప్పుడు నన్ను చూసి మెల్లిగా నిర్లిప్తంగా నవ్వేది.   నాకు ఆమె ఏమైపోతుందోనన్న ఆందోళన కలగసాగింది.

నింగిని వేడుకొని వేడుకొని వేసారి పోయి నేను నిష్టూరాలకి దిగిన ఆ రోజుల్లో ఆమె ముఖంలో ఏదో నిర్ణయం తాలూకు ఆలోచనలు కదలాడటం గమనించాను. నాలోని విచారం మాయమై ఆసక్తి చోటు చేసుకుంది.   ఆమెకి మంచి రోజులొచ్చాయన్న భావం నాలో కలిగి ఉప్పొంగిపోయాను.

ఆరు నెలల క్రితం అనుకుంటా పొద్దున్నే ఆమె పాపని రంగమ్మవ్వకి ఒప్పచెప్పి ఎక్కడికో వెళ్ళింది. సాయంకాలం వచ్చేప్పుడు చేతిలో సంచులు. “అవ్వా! పని దొరికింది. ఇంతకు ముందు నా చేత చీరలు కుట్టించుకున్నోళ్ళంతా తలా ఒక చీరిచ్చినారు కుట్టమని” అంది. ఆమెలో, ఆమె మాటల్లో మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసం నాకు కనపడింది. గర్వపడ్డాను. ఆరోజు ఆకాశం నన్ను సన్నని జల్లులతో తడిపింది. పోయిన ప్రాణం వచ్చినట్లయింది.

ఆమె ముఖంలో ఈ మధ్య ఓ తృప్తిని చూస్తున్నాను.   రెండు నెలల క్రితం పెద్ద బంకు తెచ్చి ఆమె ఇంటికి ఆన్చి షాపులాగా పెట్టుకుంది. కారుల్లో పెద్ద పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఆమెకి చీరలు ఇచ్చి పోతున్నారు. రకరకాల పూసలతో, ముత్యాలతో, దారాలతో ఆమె ఆ చీరలని అందంగా అలంకరిస్తుంటే నేను చెట్ల ఆకులతో, పువ్వులతో అలంకరించుకునే రోజులు గుర్తొచ్చి ఆనందం కలుగుతోంది.

పగలంతా అంత పని చేస్తూ కూడా వెలిగి పోయే ఆమె ముఖం చీకటి పడుతుందంటే చాలు నల్లబడిపోయేది. ప్రతిరోజూ అతని చేతిలో ఆమె తన్నులు తినవలసిందే. ఎప్పుడూ వర్షం కురవాలని ప్రార్థించే నేను ఇప్పుడు ఆ సంగతే మర్చిపోయి ఆమె ఏడవకుండా ఉండాలని ప్రార్థించసాగాను.

రోజులు గడుస్తున్నాయి. నాకేదో సంతోషం కలిగించాలని అప్పుడప్పుడూ చిన్న చిన్న జల్లులు తప్ప ఆకాశం నా ఏ కోరికా తీర్చడం లేదు.

ఆ రోజు మొదటి ఝాము వరకూ వెన్నెలని కురిపించిన పౌర్ణమి చంద్రుడు క్రమంగా మందగిస్తున్నాడు. నీడలు పొడుగ్గా పడుకుని విశ్రమిస్తున్నాయి. ఆ సమయంలో అతను తూలుతూ వచ్చాడు. రోజూ అతన్ని చూసి అసహ్యంతో కనులు ముడుచుకునే నేను ఆ రోజు ఏదో అగాధమైన మానసిక స్థితిలోకి నెట్టబడినట్లుగా అభావంతో చూస్తుండిపోయాను.

ఆమె వాకిట్లో కూర్చుని దీపపు వెలుగులో చీర కుట్టుకుంటోంది. ఆమెని అలా చూస్తున్న నాలో ఏదో చైతన్యం లోపల లోలోపల అంతరాంతరాలలో మొదలై మెల్లమెల్లగా నా హృదయాన్ని శాంతిమయం చేస్తోంది. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఏం జరగబోతుందో వినడానికి ఆయత్తపడుతున్నాను.

ఒక్కసారిగా భగ్గుమంటూ వెలుగు, వెనువెంటనే ఆమె ఆక్రందన. అతనంతగా ఆమెని హింసిస్తున్నా ఎప్పుడూ కూడా అలాంటి అరుపు ఆమె నోటి వెంట రాలేదు.   దిగ్భ్రాంతితో కూడిన అదురుతో అదాటున కళ్ళు తెరిచి చూశాను. ఆమె అరుస్తూ తన కాళ్ళ దగ్గర మండుతున్న చీరని వంగి చేతులతో ఆర్పుతుంది.

అప్పటికే ఆమె కేక విన్న ప్రక్క ఇళ్ళ వాళ్ళూ, నా ఒడ్డున ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న వాళ్ళూ లేచి పరిగెత్తుతున్నారు.   ఏం జరిగిందో అర్థం కాక ఉద్వేగంతో నా ప్రాణం పోతున్నట్లయింది. ఉన్నట్లుండి హోరుగా చలిగాలి వీచసాగింది – చెట్ల వేళ్ళని కదిలించేంత బలంగా. నేను ఆమెకేమయ్యిందో తెలుసుకోవాలని గాలి సాయంతో ఊపు తెచ్చుకొని ఆమె ఇంటి వైపుకి జరిగాను.

ఆమె ఇంటి ముందు జనం గుంపుగా చేరి గందరగోళంగా అరుచుకుంటున్నారు. గుంపులోంచి దారి చేసుకోని రంగమ్మవ్వ, ఒక చేతిలో లాంతరు మరో చేతిలో ఆమె రెక్కా పట్టుకొని నడిపించుకుంటూ నా దగ్గర కొచ్చింది. వాళ్ళ వెనకే నలుగురైదుగు ఆడవాళ్ళు. అవ్వ లాంతర్నికింద పెట్టింది. గాలికి లాంతరు రెపరెపలాడుతోంది. రంగమ్మవ్వ నా మీదకి వంగి నా అంచునున్న బురద మట్టిని తీసి ఆమె అరచేతులకి పూసింది. కాలి బొబ్బలెక్కిపోయి ఉన్నాయి ఆమె చేతులు.

“అవ్వా! చీర కాలిపోయింది.   మేడమ్ కి ఏం సమాదానం చెప్పాల్ల? ఇట్లని తెలిస్తే ఇంకెవురూ పనియ్యరవ్వా!” ఆమె కదిలి కదిలి ఏడుస్తోంది పేగులు కదిలిపోయేట్లుగా.

“ఏం జరిగింది పాపా అసలు?” అంది రంగమ్మవ్వ.

“కరెంటు పోయిందిగా అవ్వా. రేపు మద్దేనానికంతా చీర ఇచ్చెయ్యాల్లని చెప్పింది మేడమ్. గుడ్డి దీపంలో కనిపిచ్చకపోతే ఎన్నెల ఎలుతురుండాదని వాకిలి తీసి చీర కుట్టుకుంటున్నా. ‘వాకిలి తీసి పెట్టి ఎవుడికి గేలమేస్తన్నావే’ అంటా నా మీద కొచ్చాడు కొట్టడానికి. తూలి దీపం బుడ్డి మీద పడ్డాడు. దీపం చీర మీద పడి మంటలు లేచినాయి. ఆర్పినాను గాని ఆపాటికే చీర పైట కొంగంతా కాలిపోయింది. బయమేస్తాందవ్వా! ఆ మేడమ్ కేం చేప్పేది? ఏమంటాదో?” అంది. ఆమె గొంతులో నిస్సహాయతని విన్న నా హృదయం ద్రవించిపోయింది.

వెనగ్గా వస్తున్నోళ్ళు కూడా గబగబా ఆమె చుట్టూ చేరారు.

“అందురూ మొకానూసినా సిగ్గులేకుండా ఎద్దులాగా పడి నిద్రపోతాన్నాడు ఎదవ సచ్చినోడు” అంది రత్తి.   రత్తి చేతిలో ఆమె బిడ్డ ఉంది.

“నీకేం కర్మమొచ్చిందే ఈ మొగుడితో పడి ఏడవడానికి. చీరలు కుట్టుకోని సంపాదిచ్చుకుంటాండావు. వాడికి నువ్వు కూడేస్తండావు గాని నీకు వాడు కూడేస్తాండాడా? నేనైతే లెయ్యరా నా బట్టా! నీతో నాకేం పని? అని అనుండేదాన్ని. నువ్వు గాబట్టి వానితో యాగతావుండావు” అంది నరిసి.

“తాగినోడి తావున తన్నులు తినే దాన్ని నిన్నే చూసినా. వాన్నీడ్చి పాడేయలేనిదానివి నువ్వేమి ఆడదానివమ్మే? చేతిలో కట్టె పట్టుకో రేపటినిండి – పైకి దూకితే ఎయ్యి సచ్చినోడిని కాళ్ళిరిగేట్టు” అంది రత్తి కసిగా.

“ఊరుకోండమ్మే కొట్టుకుంటా ఉంటే సంసారాలేం బాగుపడతాయి? రేపు వాడిని పంచాయితీకి లాగి బయం పెట్టిచ్చాల్ల ఇంకోసారి పాప ఒంటి మీద సెయ్యి ఎయ్యకుండా వార్నింగిప్పిచ్చాల్ల” అంది రంగమ్మవ్వ.

ఆ మాటలు విన్న ఆమె ఏడవడం ఒక్కసారిగా మర్చిపోయి తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. వేదనతో కమిలిన ఆమె బుగ్గల మీద నుండి అప్పటి వరకూ ధారాపాతంగా కారిన కన్నీళ్ళు ఆగిపోయాయి.

“మీరందురూ నా తావున నిలబడుంటే నాకు బయం పోయిందవ్వా! మా అమ్మకి గూడా అప్పుడు పక్కిళ్ళోళ్ళు ఇట్లా దైర్యం చెప్పిండింటే మందు తాగి చచ్చిపోయుండేది కాదేమో అవ్వా! ” అంటూ భుజంతో కన్నీళ్ళని తుడుచుకుంది.   తల్లిని తలుచుకోవడం వల్ల అయుంటుంది ఆమె తుడుచుకుంటున్నా కూడా ఆగకుండా కన్నీళ్ళు కారిపోతున్నాయి.

“ఏడవగాకమ్మే మేమంతా ఉళ్ళా” అంది రత్తి ఆమెకి దగ్గరగా వచ్చి.

“రత్తక్కా! చీర నువ్వు పని చేసి పెట్టే మేడమ్ దే” అంది ఆమె.

“చీరని గూర్చి గూడా దిగులొద్దులే పాపా! రేపు పంచాయితీ అయినాక బజారుకి పోయి అలాంటి చీరే ఒకటి కొని కుట్టిద్దువుగాన్లే. దొరక్కపోతే దాని కరీదు కడుదువుగాని” అంది రంగమ్మవ్వ.

“చాలా కరీదుంటదవ్వా! అంతేడదెచ్చేది?” రత్తి దగ్గరున్న బిడ్డని తీసుకొని భుజాన వేసుకొంటూ అంది ఆమె.

“ఎట్లోకొట్లా చేద్దాం లేమ్మే!” అంది సుజాత. ఆ ఏరియాలో సుజాతే కాస్త కలిగినది.

“నేను గూడా చెబుతాలే మేడమ్ కి, ఆయమ్మ మంచిది” అంది రత్తి

‘ఇవుళ్ళా’ అన్నట్లు బిడ్డ ఆమె మెళ్ళో ఉన్న పసుపుతాడుని పట్టుకుంది నిద్రలో. మంగళ సూత్రాలు తన అరచేతిలోకి తీసుకుని వాటి వైపే తదేకంగా చూసి తల ఎత్తి రంగమ్మవ్వ వైపు చూసింది. ఆ చూపుని, ఆ చూపులోని నిశ్చయాన్ని గుర్తించిన ఆ ఆడవాళ్ళ ముఖాలు తెరిపిన పడ్డట్లయ్యాయి.

నేను గిర్రున సుళ్ళు తిరుగుతూ ఆనందబాష్పాలతో ఆకాశాన్ని చూశాను.

ఫెళ ఫెళ మంటూ ఆకాశం ఉరిమింది. ‘వర్షం వచ్చేట్లుంది పదండి పదండం’టూ జనం గబగబా అక్కడ నుండి కదిలారు. రంగమ్మవ్వ ఆమెని ఆమె బిడ్డతో సహా తనింట్లోకి నడిపించుకు వెళ్ళింది.   సన్నని జల్లుగా మొదలైన ఆ వర్షం తెల్లవారేప్పటికి బలపడి ఏకధారగా కురుస్తోంది.

సంతోషంగా ప్రయాణించవలసిన నేను ఆమె జీవిత పయనాన్ని కళ్ళారా చూడాలని కదలకుండా ముడుక్కున్నట్లుగా కూర్చుని ఉన్నాను. అంతా అర్థం అయ్యి కూడా అర్థం లేకుండా ఆతృత పడుతున్న నన్ను చూసి ఆకాశం మెరుపు ముఖమేసుకుని ఆప్యాయంగా నవ్వుతోంది.

ఆ నవ్వు చూసిన నా మనసు నెమ్మదించి నిండుగా మారింది.   ఆమెని, ఆమె చుట్టూ ఆమెకి రక్షణగా ఉన్న స్రీ్తలని తల్చుకుంటూ నేను నిదానంగా, గంభీరంగా అక్కడ నుండి సాగిపోయాను.

అపరాధం

ఆ సంఘటన గురించి ఇప్పుడు తల్చుకున్నా కూడా నాకు అపరాథభావనతో కన్నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో కలవరం వచ్చి చేరుతుంది. అయితే దాన్ని నేను తల్చుకుని అప్పుడు జరిగిన పొరపాటు లాంటిదే మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి ఈరోజు అది నాకు ఉపయోగపడింది. ఈరోజు జరిగిన పొరపాటుని గురించి శ్యామలకి చెప్పి క్షమాపణ చెప్పగలిగిన దానిని ఆ రోజు ఆ పొరపాటుని రాకేష్ కి చెప్పి క్షమాపణ అడగకపోవడానికి కారణం ఏమిటి?

భయం – ఔను.

ఆ రోజు నేను ఇంట్లో అబద్దాలు చెప్పి పెళ్ళి కాకుండానే రవిని హోటల్ రూమ్ లో కలవడం అందరికీ తెలుస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాను.

మనకి బాధ కలిగించిన విషయాలని చెప్పుకుంటే ఆ బాధ తొలుగుతుంది నిజమే కావొచ్చు కాని కొన్ని కొన్ని మనం బయటకి చెప్పుకోలేని అనుభవాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ అనుభవాలు మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా మనకి ఉపయోగపడితే మన బాధ తొలగిపోతుందనే విషయం నాకు ఈరోజు తెలిసింది……

నిన్న రాత్రి మా అబ్బాయి “అమ్మా! నా నైకీ టీ షర్ట్ కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?” అని అడిగాడు.

“నీ అల్మైరాలోనే పెట్టి ఉంటుంది శ్యామల సరిగా్గ చూడు” అన్నాను.

వాడు వెతుక్కుని వెతుక్కుని ఏడుపు ముఖం పెట్టుకోని “కనపడటం లేదమ్మా!” అన్నాడు. నేను వాడి బట్టల అల్మైరాతో పాటు ఇల్లంతా వెతికాను.

“సరే రేపొద్దున శ్యామల రాగానే అడుగుదాములే పడుకో” అని వాడిని సముదాయించాను కాని నా ఆలోచనలన్నీ ఆ షర్ట్ మీదే ఉన్నాయి.

శ్యామల కాజేసి ఉంటుందా? స్కూల్లో పనులు, పరీక్షల హడావుడి లో ఇంటిని అసలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమి పోయాయో, ఏమున్నాయో కూడా చెప్పలేనేమో ఇప్పుడు. పని వాళ్ళ మీద పూర్తి బాధ్యత వదిలేస్తే ఇలాగే జరుగుతుంది అనుకుంటూ బాధపడసాగాను.

తెల్లవారింది. ఎవరి పనులకి వాళ్ళు తయారవుతూ హడావుడిగా ఉన్నాం. శ్యామల రాగానే వాకిట్లోనే నిలేసి షర్ట్ గురించి అడిగాను.

“నాకు తెలియదమ్మా!” అంది.

“నీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? ఇల్లంతా వెతికాం రాత్రి. ఎక్కడా లేదు. నువ్వు తీయకపోతే ఇంట్లో ఉండాలిగా” అన్నాను.

“లేదమ్మా! నేను తీసుకోలేదు” అంది.

“నువ్వు తీశావని నేను అన్నానా? తీయకపోతే ఇంట్లోనే ఎక్కడో ఉంటుందిగా సాయంత్రం నేను వచ్చేలోపు ఇల్లంతా వెతుకు” అన్నాను కఠినంగా.

“సరేనమ్మా” అంది శ్యామల.

సాయంత్రం నాలిగింటికి వచ్చి కాఫీ పెట్టుకుంటుండగా “అమ్మా! షర్ట్ ఇదిగో – మొన్న స్పెషల్ పంక్షన్ కి అభినవ్ అడిగితే ఇచ్చా. ఈరోజు స్కూల్లో వాడిని చూడగానే గుర్తొచ్చింది. స్కూలు నుంచి నేరుగా వాళ్ళింటికి వెళ్ళి తీసుకొస్తున్నా” అన్నాడు – నా కోసం ఏదో ఘనకార్యం చేసిన వాడిలా.

“అలా ఎలా మర్చిపోయావురా? రాత్రంతా వెతుకుతూనే ఉన్నాను నువ్వు నిద్రపోయాక కూడా” అన్నాను కోపంగా.

వాడు నన్ను పట్టించుకోకుండా “అఁ మర్చిపోయాను – ఏమయింది? ఇప్పుడు తెచ్చానుగా” అంటూ దాన్ని నా ముఖాన విసిరేసినట్లుగా కిచెన్ కౌంటర్ మీద పడేసి వాడి గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు ఒక్కసారిగా – మళ్ళీ చాలా రోజుల తర్వాత – రాకేష్ గుర్తొచ్చాడు.

ఇరవయ్యేళ్ళ క్రితం……

నేను హోటల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ “ఎక్కడికెళ్ళావే? నీ కోసం మీ హెడ్ మిసెస్ వచ్చారు మనింటికి. ఏదో ఫైలు అర్జంటుగా కావాలని వెతికితే ఎక్కడా కనపడలేదంట. నువ్వు ఎక్కడ పెట్టావో అడగాలని వచ్చిందిట” అంది.

మీ మేడమ్ వచ్చింది అని చెప్పగానే నా గుండెలు గుబుక్కుమన్నాయి. ఈ రోజు ఉదయం రవిని కలుసుకోవడానికి హోటల్ కి వెళుతున్నప్పుడు మా స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని అమ్మకి చెప్పాను. దాన్నే మళ్ళీ చెప్తూ ఆ టీచర్ కీ, మా హెడ్ మిసెస్ కీ పడదులేమ్మా అందుకే ఆమె ఫ్రెండ్స్ ని మాత్రమే పిలిచింది. కొంపదీసి ఆమెకి ఈ సంగతి చెప్పలేదు గదా!” అన్నాను – నేను చెప్పిన అబద్దానికి నిజం రంగు పులుముతూ.

“నాకేం తెలుసే మీరు ఆవిడకి చెప్పకుండా పార్టీ చేసుకుంటున్నారనీ…. ఎవరో టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని వెళ్ళిందని చెప్పా” అంది.

రవితో గడిపిన మధురక్షణాల తాలూకు మైకం నాలో మాయమైపోయి ఆందోళన ప్రవేశించింది. హోటల్ రూమ్ నుండి మా హెడ్ మిసెస్ కి ఫోన్ చేసినపుడు అదృష్టవశాత్తూ ఆవిడ ఫోన్ ఎత్తలేదు, నా అసిస్టెంట్ రాకేష్ ఎత్తాడు. చాలా పేదబ్బాయ్. పదవ తరగతి వరకూ చదివి కాలేజీకి ఫీజు కట్టలేక మేడమ్ ని బ్రతిమాలుకుని ఇక్కడ అసిస్టెంట్ కమ్ అటెండర్ గా చేరాడు.

“రాకేష్ నాకు జ్వరంగా ఉంది, చూపించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చాను. మేడమ్ కి చెప్పు ఈరోజు ఆఫీసుకి రావడం లేదని” అన్నాను.

“ఆఁ ఆఁ” అంటున్నాడు.

“రాకేష్” అన్నాను.

“మీకేం నంబరు కావాలి?” అన్నాడు.

“ఇది 26…..9 కదా!”

“ఆఁ చెప్పండి… ఎవరూ?”

“ఏంటి రాకేష్ నేను స్వప్నని వినపడుతోందా…. నాకు బాగాలేక హాస్పిటల్ కి వచ్చాను. డాక్టర్ కి చూపించుకోని త్వరగా రావడానికి ట్రై చేస్తాను కాని వీలయ్యేట్లు లేదు. ఇక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు. ఈ విషయం కూడా మేడమ్ కి చెప్పు – సరేనా, చెప్తావా” అన్నాను.

“ఆఁ చెప్తా చెప్తా” అంటున్నాడు.

నాకు భలే ఆశ్చర్యమేసింది అతని ముభావతకి. ఆఫీసు ఇన్ ఛార్జినైన నన్నుగౌరవంగా ఎప్పుడూ ‘మేడమ్’ అని పిలుస్తాడు. ‘ఈరోజేంటి ఇతను ‘చెప్తా చెప్తా’ అంటున్నాడు కాని ‘మేడమ్’ అని పిలవడం లేదు పైగా గొంతులో గౌరవం కూడా లేదు? నేను చెప్పింది నమ్మడం లేదా లేక నేను ఈ లాడ్జిలోకి రావడం చూశాడా? – ఇక్కడెక్కడో దగ్గర్లోనే అతనిల్లు అని చెప్పడం గుర్తు. చూసి ఉండడులే ఒట్టి అనుమానం నాది, పనిలో ఉండి ఉంటాడు’ అనుకున్నాను.

అమ్మతో ఏదో చెప్పి నా గదిలోకి రాగానే ఆ సంభాషణంతా రీలు లాగా నా కళ్ళ ముందు కదలాడింది. ‘రాకేష్ మేడమ్ కి చెప్పి ఉంటాడు. రేపు స్కూలుకెళ్ళగానే మేడమ్ అడిగితే ఏం చెప్పాలి? ఆఁ ఏముందీ… నా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి బయలుదేరాను కాని బాగా తలనొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళానని చెప్తే సరి’ అనుకున్నాను.

ఒక అబద్దానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో కదా అనుకుంటూ కాసేపూ, రవి గురించి కాసేపూ ఆ రాత్రంతా ఆలోచనలే… రవి నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎక్కడో చోట కలుసుకునేవాళ్ళం. నాన్నకి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యాక నేను కూడా ఇంటికి దగ్గరగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చేరాను. రవి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు. అతనికి ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాము.

హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి లాడ్జిలో దిగిన రవి నన్ను కలుసుకోమని ఫోన్ చేస్తే వెళ్ళాను.

‘ప్చ్! చాలా తప్పు చేశాను, అసలు అలా వెళ్ళకూడదు, అతన్ని ఏ పార్కులోనో కలుసుకుని ఉండాల్సింది’

తర్వాత జీవితంలో ఈమాటలు ఎన్ని సార్లు అనుకున్నానో…..

మేడమ్ రాకముందే రాకేష్ తో మాట్లాడాలి, మేడమ్ ఏమందో కనుక్కోవాలి అనుకుంటూ పది కాకముందే స్కూలుకి వెళ్ళాను. ఏవో జెరాక్స్ కాపీలు తీసుకుంటున్న రాకేష్ నన్ను చూడగానే “గుడ్ మార్నింగ్ మేడమ్. హెడ్ మిసెస్ మేడమ్ మీ కోసం మీ ఇంటికి వెళ్ళారు అప్లికేషన్స్ ఫైల్ కోసం – ఎక్కడ పెట్టారు?” అన్నాడు ఆందోళనగా.

“అదేంటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా హాస్పిటల్ కి వెళ్ళానని!” అన్నాను.

“నాకు ఎప్పుడు ఫోన్ చేశారు?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అదేమిటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా – మేడమ్ కి చెప్పు అంటే సరేనన్నావ్” అన్నాను కోపంగా.

“నేనెప్పుడన్నాను? లేదు లేదు మీరు ఫోన్ చేయలేదు” అన్నాడు – అతని కళ్ళనిండా అంతులేని విస్మయం.

“నీకేమైనా పిచ్చా! మతిమరుపు ఎక్కువవుతుంది నీకీమధ్య. నేను మాట్లాడుతుంటే ‘ఆఁ ఆఁ’ అంటున్నప్పుడే అర్థమైంది మన మైండ్ లో లేవని” అన్నాను పెద్దగా అరుస్తూ. అక్కడే నిలబడి మా మాటలు వింటున్న ప్యూను వెంకటప్పయ్య “ఔనమ్మా! నేను కూడా విన్నాను ఎవరితోనో ఫోనులో ‘ఆఁ ఆఁ చెప్తాను చెప్తాను’ అని రెండు సార్లు అనడం” అన్నాడు నాకు సపోర్టు వస్తూ.

“మేడమ్ రాగానే చెప్పు నేను ఫోన్ చేసిన సంగతి ‘చెప్పడం మర్చిపోయాన’ని స్పష్టంగా చెప్పు లేకపోతే బాగుండదు చెప్తున్నా” అన్నాను కోపంగా – చూపుడువేలు విదిలిస్తూ.

అతను నేను ఫోన్ చేసిన సంగతి చెప్పడం మర్చిపోయి ఇప్పుడు మేడమ్ తిడుతుందని బొంకుతున్నాడనే అనుకున్నాను. మేడమ్ రావడం, ‘నేను చెప్పడం మర్చిపోయాను’ అని రాకేష్ ఆవిడతో చెప్పడం జరిగిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు మేడమ్ నన్ను పిలిచి “నువ్వు రాకేష్ ని బెదిరించి చెప్పించినట్లుగా ఉంది అతని ముఖం చూస్తుంటే – నిజంగా నువ్వు ఫోన్ చేశావా స్వప్నా?” అంది.

“నిజంగా చేశాను మేడమ్” అన్నాను ఆవేదనగా. నా ముఖంలో కూడా నిజాయితీని చూసిన మేడమ్ “సరేలే పో” అంది.

తర్వాత రోజు 10-11 గంటల మధ్యలో రాకేష్ వచ్చి “మేడమ్ మీకు ఫోన్” అన్నాడు. నేను ఫోన్ దగ్గరకి వెళ్ళి “హలో” అన్నాను.

“హల్లో…. ఏమంది మీ మేడమ్? మీరు నిన్న నాకూ చేసింది ఫోన్…. రాకేష్ కి కాదు. మీ పక్కన ఎవరో ఉన్నట్లుంది ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు….. నిజంగా మీరెళ్ళింది హాస్పిటల్ కా లేక…… ఇహిహి…”

టప్ న ఫోన్ పెట్టేశాను. కాళ్ళు వణకసాగాయి భయంతో. మళ్ళీ చేశాడు. ఫోన్ ఎత్తి “రాంగ్ నంబర్” అన్నాను.

“రాంగ్ నంబరా – హ!హ!హ!” అంటూ నవ్వుతున్నాడు.

వాడు నవ్వుతున్నందుకో లేక వాడు నేను వెళ్ళింది లాడ్జికన్న సంగతి కనిపెట్టినందుకో నాకు బాధ కలగలేదు కాని రాకేష్ ని అనుమానించి, బాధపెట్టి, భయపెట్టి మేడమ్ కి అబద్దం చెప్పించినందుకు నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి.

ఏడుస్తున్న నన్ను గమనించిన మేడమ్ “ఎవరు స్వప్నా?” అంది నాకు దగ్గరగా వచ్చి.

“ఎవరో మేడమ్ ఏదేదో చెత్తగా మాట్లాడుతున్నాడు” అన్నాను.

ఫోన్ మళ్ళీ మోగుతోంది. ఈసారి మేడమ్ ఫోన్ ఎత్తి “ఎవర్రా నువ్వు? స్వప్న భర్తని పిలిపించి మాట్లాడిపించనా?” అంది బెదిరింపుగా – నాకు పెళ్ళయి్య భర్త ఉన్నట్లుగా. ఆవిడ ఉద్దేశం పెళ్ళిగాని పిల్లలని ఇలా ఫోన్లు చేసి ఏడిపిస్తారని అనుకుని అలా చెప్పిందని అనుకుంటా.

అవతల వాడు ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఆ స్కూల్లో నాలుగేళ్ళు పని చేశాను. ఇక నాకు వాడి దగ్గరనుండి ఫోన్ రాలేదు కాని రాకేష్ ని చూస్తుంటే బాధ కలగసాగింది. ఆ రోజు నుంచీ రాకేష్ ని నా తమ్మడిలాగే చూసుకున్నాను. అతనికి ఫీజు కట్టి చదివించాను. ఇప్పుడతను గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఆఫీసర్. అతనికి సహాయం చేసి నా అపరాధాన్ని పోగొట్టుకున్నాను కాని నాలోని బాధ మాత్రం ఇన్నాళ్ళుగా తొలగిపోలేదు.

పెళ్ళి కాకుండానే లాడ్జిలకెళ్ళడం, ప్రమాదాల్లో ఇరుక్కోవడం ఎంత అసహ్యమైన విషయమో తద్వారా నా జీవితంలో జరిగిన ఈ అనుభవం ఇంకా అసహ్యం. ఆతొందరపాటుతనంతో మరో తప్పు చేయబోయేదాన్నే ఈరోజు.

“స్వప్నా వస్తున్నావా?” నా పక్కింటి వాకింగ్ ఫ్రెండ్ ప్రమీల కేకతో ఆలోచనల్లోనుండి బయట పడి వాకింగ్ షూస్ వేసుకుని బయటకొచ్చాను.

వాక్ చేస్తున్నప్పుడు చొక్కా విషయం ప్రమీలకి చెప్పాను దిగులుగా. “దొరికితే దొరికిందిలే – దొరికిందని మీ పనిమనిషికి చెప్పకు. నీకు భలే తొందరపాటని కాలనీ అంతా టాం టాం వేస్తారు ఈ పనోళ్ళు” అంది ప్రమీల.

“వద్దు వద్దు. వాళ్ళేమైనా అనుకోనీ నేను మాత్రం చొక్కా దొరికిన విషయాన్ని చెప్పేస్తాను. చెప్పకపోతే ఆ పిల్ల ముఖం చూసినప్పుడంతా వచ్చే అపరాధభావన అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది” అన్నాను.

వాక్ నుంచి ఇంటికి రాగానే “శ్యామలా షర్ట్ దొరికింది. వీడు వాళ్ళ ఫ్రెండ్ కిచ్చి మర్చిపోయాడు. ఇదిగో ఈ రోజు తెచ్చాడు” అన్నాను పని చేసుకుంటున్న శ్యామలకి షర్ట్ చూపిస్తూ.

“దొరికిందా – నేనే తీశానని నన్ను పనిలోంచి తీసేస్తారని భయమేసిందమ్మా” అంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు.

పొద్దునైనా నిన్ను నేను ఏమీ అనలేదుగా శ్యామలా… ఇంట్లో ఎక్కడో పడేసి ఉంటావు, వెతుకు అనే కదా అన్నాను, ఎందుకు భయం?” అన్నాను.

పైకి అలా అన్నానే కాని చొక్కా దొరక్కపోయినట్లైతే మరో తప్పు చేసి ఉండేదాన్నేమో!

ఆ ఆలోచన రాగానే ఏమాత్రమూ సంకోచించకుండా శ్యామల చేతులు పట్టుకుని “ఏది ఏమైనా నిన్ను బాధ పెట్టినందుకు, నా తొందరపాటుకు నన్ను క్షమించు తల్లీ” అన్నాను.

“అయ్యో అమ్మా!- ఏం ఫరవాలేదు ఊరుకోండి” అంది శ్యామల. మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు. రాకేష్ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది అయితే చిత్రంగా నాకు ఈసారి బాధ కలగకపోగా దాని నుంచి ఏదో నేర్చుకున్నట్లుగా అనిపించింది.

**********

మేకతోలు నక్కలు

నువ్వెవరో మరి డిసెంబరు 31 అర్థరాత్రి ఫోన్ చేశావు. “మీరు రాసిన కథ చదివాను బావుంది. నేను…..” ఇంకా ఏదో చెప్పబోయావు. గొంతులో మత్తు, మాటలో ముద్దతో కూడిన తడబాటు నాకర్థమయింది. ‘ఎవడో తాగి మాట్లాడుతున్నాడని.

సారీ! రేపు మాట్లాడదాంఅని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేశావు. నేను ఫోన్ సైలెంట్ లో పెట్టాను. నాలుగు మిస్డ్ కాల్స్.

తర్వాత రోజు చేశావు అయితే అప్పుడు టైమ్ రాత్రి ఏడే. ‘పర్లేదు రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికే చేసుంటాడేమోలేఅనుకుని ఫోన్ ఎత్తాను.

సారీ అండీ మిమ్మల్ని అందరికంటే ముందుగా విష్ చేసి మీతో ఫ్రెండ్ షిప్ చేద్దామని రాత్రంతా మేలుకొని సమయంలో చేశానుఅన్నావు.

పాపం రాత్రంతా మేలుకున్నాడంటఅని నేననుకోవాలి కాబోలు నీ సంగతి అర్థం అయింది అయినా పర్లేదు చెప్పండిఅన్నాను.

మీ కథ బావుంది

మంచిది మీ పేరు?”

వర్మరాజా రవి వర్మ

వారం కూడా ఒక కథ వచ్చింది చదవండి వర్మ గారూ. మీరేమైనా రాస్తుంటారా?”

రాత్రి ఫోన్ చేశానని మీరు నన్ను గురించి చెడ్డగా అనుకుంటున్నారట్లుంది పైపైన మాట్లాడుతున్నారు

అనుకునేదేముంది. రాత్రి పూట తొమ్మిది దాటితే నేను బయటవారెవరితోనూ మాట్లాడను

నేను ఉమనైజర్ ని కాదు నాకు మీ దగ్గర నుండి ఏమీ అక్కర్లేదు. నాకు అన్నీ ఉన్నాయి నేను కోటీశ్వరుడిని మీకు విషెస్ చెబ్దామని చేశా అంతే

మైగాడ్! ఇదేమిటండీ మీరు అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు సరే ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

మళ్ళీ చేశావు. “ఏమిటండీ ఫోన్ పెట్టేస్తున్నారు? మాట్లాడుతున్నాను కదా! వినండి ప్లీజ్!”

సరే చెప్పండి మీరు నా కథలు ఇంకా ఏమైనా చదివారా?”

లేదు నేను బిజినెస్ మాగ్నెట్ ని బాగా బిజీగా ఉంటాను. ఇంతకీ మీరు చెప్పలేదు నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశారా?”

చూడండి ఇక్కడ ఫ్రెండ్ షిప్ ప్రసక్తి లేదు. మీరు నా కథ చదివి నచ్చిందని చెప్పడానికి చేశారు. నేను థాంక్స్ చెప్పాను. అంతే మీకు సాహిత్యాభిలాష కంటే ఫ్రెండ్ షిప్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది. ఉంటానండీఅని ఫోన్ పెట్టేశాను.

అప్పటికి ఊరుకున్నావు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకి చేశావు, కట్ చేశాను. మళ్ళీ చేశావు, కట్ చేశాను. మూడోసారి మళ్ళీ చేశావు. ఫోన్ తీశాను నీ సంగతేందో తేల్చుకుందామని.

ఎందుకు చేశారు? రాత్రి 9 తర్వాత నేను ఫోన్ లో మాట్లాడనని చెప్పానుగా మీకుఅన్నాను

మీ కథ బావుందని చెప్దామని చేస్తున్నాను. మీరు నాకు థాంక్స్ చెప్పనే లేదు. ఇందాక థాంక్స్ చెప్పానని అన్నారు కాని థాంక్స్ చెప్పలేదు మీరు నాకుఅన్నావు.

ఓకే థాంక్స్

మీ కథ గురించి మాట్లాడాలి రెండో పేరాలో మీరు రాసిన వాక్యం …….”

వర్మ గారూ కథ గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు. నేను మీకు ముందే చెప్పాను 9 తర్వాత మాట్లాడనని ఇది నేను నిద్రపోయే సమయం కాబట్టి రేపు ఉదయం 10 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత 9 లోపు చేయండి సరేనా బైఅని నేను ఫోన్ కట్ చేశాను.

మళ్ళీ ఫోన్ చేశావు ఏమనుకుంటున్నారు మీరు నన్ను నేను ఆడవాళ్ళ వెంట పడే వాడిననుకుంటున్నారా? సాయంత్రమైతే నా చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా! మాకు త్రీ స్టార్ హోటల్ ఉంది. గంటలు గంటలు మాట్లాడుకుంటాం మేము హోటల్ లో కూర్చుని ……..”

ఛీ! వెధవఅనుకుని ఫోన్ కట్ చేసి సైలెంట్ లో పెట్టుకున్నాను. నాలుగు మిస్డ్ కాల్స్.

అప్పడు ఎనలైజ్ చేశాను నీ గురించి ఖచ్చితంగా వీడెవరో మనకి తెలిసిన వాడే నా కథలు చదివి ఫోన్ చేసే వాళ్ళకైతే నేనెవరో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ‘మీరెక్కడ ఉంటారు? ఏం చేస్తారు?’ అని అడిగి తెలుసుకుంటారు.

కొంత మందికి నా వయసెంతో తెలుసుకోవాలని ఉంటుంది మరికొంత మందిలో నేను రాసిన కథలు నా స్వానుభవమా అనే ఉత్సుకత ఉంటుంది. ఆఫ్ కోర్సు అన్నీ తెలుసుకున్నాక కొంతమంది వెధవల గొంతులు నా మాటలకి గౌరవం గా మారడం, నిరుత్సాహంగా మారడం కూడా ఉంటుంది. కాని నువ్వు నా గురించి అడగడం లేదు నేనెక్కడ ఉంటానో ఆసక్తి లేదు. పోనీ సాహిత్య విమర్శకుడవీ లేదా అభిమానివి మాత్రమే అయితే కథ గురించీ మాట్లాడటం లేదు సంగతి నాకెప్పుడో తెలిసిందనుకో నీకు కథల గురించి ఏమీ తెలియదనిసో నేనెవరో నీకు తెలుసు. నువ్వు నన్ను చూసి కూడా ఉంటావు. బహుశా నేను కూడా నిన్ను చూసే ఉంటానేమో! నువ్వు ఖచ్చితంగా మాకు తెలిసినవాడివో లేకపోతే నాకు తెలిసిన స్నేహితురాళ్ళకి తెలిసినవాడివో అయి ఉంటావు.

ఈసారి ఫోన్ చేయాలి చెప్తా వీడి పనిఅనుకున్నాను.

తర్వాత రోజు సాయంత్రం 4 కి ఫోన్. నడుస్తూ మాట్లాడుతున్నావు. ఎక్కడో బస్టాండ్ లో ఉన్నట్లున్నావు చుట్టూ రణగొణ ధ్వనులు.

ఆఫీస్ నుండి ఇంటికి వెళుతున్నా సరిగ్గా వినపడటం లేదు మళ్ళీ చేస్తాఅని ఫోన్ కట్ చేశావు. ఇదొక డ్రామా నాలుగుకి చేయమన్నాను కదా పాపం చేశాడు అని నేననుకోవాలనమాట. ‘సరే .. కానీఇంకా ఎన్ని నాటకాలు ఆడతావనుకున్నాను. ‘

8 కి ఫోన్ చేసి సారీ మీతో కథ గురించి మాట్లాడదామంటే నాలుగుకి చేయమంటున్నారు. అప్పడు చేద్దామంటే నేను బిజీ. ఇప్పుడు మాట్లాడతాను ఇంకా తొమ్మిది అవలేదుగాఅన్నావు. ‘ఆహా! గొంతులో ఏమి నక్క వినయాలు!?’

ఆఁ మాట్లాడండి

మీరు నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా మాట్లాడతాను

మధ్య ఒక కథ చదివాను….”

ఏం కథ?”

కథలో ఒకావిడని ఫోన్లు చేసి విసిగిస్తుంటుంటాడొకడు. ఆమె ఎంతగా విసిగిపోతుందంటే బాధ తట్టుకోలేక చేతిలో ఉండే సెల్ ఫోన్ బద్దలు చేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే కథ గుర్తొస్తుంది. కథలోలా నేను…..”

నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా అయితే ఇక మీతో మాట్లాడనులెండి. ఇక మీకు ఫోన్ కూడా చేయనుఅని కట్ చేశావు.

ఇదింకో ట్రిక్. అలిగినట్లుగా పెట్టేస్తే ఎదుటి వాళ్ళు చేస్తారని. ఇంకాసేపు బహుశా 10 నిమిషాలు చేయవు అనుకుని హాయిగా నైట్ కాఫీ తాగుతూ కూర్చున్నాను. 5 నిమిషాల్లోనే చేశావు పాపం నా టైమ్ వృథా చేయడం ఎందుకని!

మండిపోయింది నాకు నిన్ను మాట్లాడనివ్వకుండా వినండి నేను చెప్పేది కథలోలా నేను చేతిలో ఫోన్ విసిరికొట్టను ఎందుకంటే మీ నంబరు ద్వారా మీ పేరు, అడ్రస్ కనుక్కోవడం నాకు నిమిషం కూడా పట్టదు. మర్యాదగా మీరు మీరుఅని నన్ను గౌరవించి మాట్లాడారు కాబట్టి వదిలిపెడుతున్నా…..”

ఫోన్ కట్ చేశావు అంతే ఇక నీనుంచి నాకు ఫోన్లు లేవు. ఇప్పుడు నువ్వు విసిరికొట్టావా ఫోను? లేకపోతే సిమ్ విరక్కొట్టావా? ఎందుకైనా మంచిది సిమ్ పోయిందని పోలీస్ కంపైట్ ఇవ్వు లేకపోతే హెర్రాస్మెంట్ కింద జైల్లో పడతావు.

డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా వెకిలిగా మాట్లాడే మగవాళ్ళని చూస్తే భయం అక్కర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కాబట్టి వాళ్ళని తప్పుకోని పోతాం. కాని లోపల ఏదో పెట్టుకుని పైకి మర్యాదగా మాట్లాడుతుంటారే నీ లాంటి మేకతోలు కప్పుకున్న నక్కలు వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం.

అమ్మాయిలందరికీ చెప్తా నీలాంటి వాళ్ళ గురించి

అమ్మాయిలూ చూశారుగా ఇది నిజంగా జరిగింది కథ అనుకునేరు. ఇదొక రకం మేకతోలు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకా చాలా రకాల మేకతోళ్ళుంటాయి. అయినా మనకి తెలుసుగా ఎవరో గొప్ప రచయిత అన్నట్లు మనం మానసికంగా దృఢంగా ఉంటే వెధవలైన మగవాళ్ళు పిరికివాళ్ళవుతారనీ, మనల్నేమీ చేయలేరని!!? –

నువ్వూ విన్నావా?……

***

 

radhamanduva1మండువరాధ

 

కురూపి భార్య: చిన్న కథలో ఎన్ని కోణాలు!?


KODAVATIGANTI-KUTUMBARAO
కురూపి భార్యలో కథకుడి (అంటే తన కథ చెప్పుకున్నతనే) టోన్ నీ, నాటి సాంఘిక వాస్తవికతని వాచ్యంగా చెప్పిన దాని వెనక ఉన్న వ్యంగ్యాన్నీ అర్థం చేసుకోకపోతే కథ ప్రయోజనం నెరవేరలేదన్నమాటే. మామూలు మనుషుల మనసుల్లో సంఘం చేత ప్రోది చెయ్యబడ్డ (implant చేసి పెంచబడ్డ) కుహనా విలువలూ, మానవ సంబంధాలలో (ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య) ప్రేమరాహిత్యం, డొల్లతనమూవాటి పరిణామంగా హృదయాలు పూర్తిగాఎండిపోయిఅసూయా క్రౌర్యాలతో విరుచుకుపడటమూ (సంఘం ఏర్పాటు చేసినకట్లని ఎవరెపుడు కొంచెం వదులు చేసుకోవాలని ప్రయత్నించినా) – ఇవన్నీ చిన్న కథలో ఇమడ్చగలిగాడు కొ.కు.

నాటి పెళ్ళిళ్ళన్నీరాసిపెట్టినవేస్నేహం, ప్రేమ అనేదాని అర్థంతో కానీ అవగాహనతో కాని సంబంధం లేకుండా (బహుశా నాటికీనేమో!). అలా వచ్చి పడ్డ సంబంధాలలోనే ప్రకృతి సహజమైన సుఖం వెతుక్కునేఅల్పసంతోషిఅయిన కథకుడి మెదడులో అందచందాలకున్న ప్రాముఖ్యాన్ని చొప్పించింది సంఘం. ఆమెతో కాపురం చెయ్యడానికి అతనికి ఉన్న అభ్యంతరంఅతనిలోని సహజ ప్రకృతికీ, సంఘం తయారు చేసిన అతనిఅభిప్రాయానికీజరిగిన సంఘర్షణలోంచి వచ్చిందే. కథకుడు కూడా (మనందరిలాగే) సంఘంలోని మామూలు మనిషి. కురూపి భార్య చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే వీలు గురించి ఆలోచించడమూ, కురూపి భార్యతో ఎటువంటి స్నేహభావం పనికి రాదన్న తీర్మానమూ, కాటుక రంగుని చర్మం రంగుతో సమానం చేసినోరుజారడమూ” – ఇవన్నీ దీన్నే సూచిస్తాయి. కానీ అతనికి కూడా ఎక్కడో (మనలాగే) చటా్రల నించి బయట పడాలనే జిజ్ఞాసా, స్పందించే హృదయమూ (ఒక్కసారిగా అన్నీ మర్చిపోయిఎందుకు ఏడుస్తున్నావు?” అని అడగడం) ఉన్నాయి. అందువల్లనే అతనిలోని ప్రేమని వెలికి తెచ్చుకోగలిగాడు. “కురూపి అయిన భార్య మీద ప్రేమ చూపించరాదుఅన్న అభ్యంతరాన్ని దాటినాక (ఇక్కడ కూడా కొ.కు అతనిని idealise చేయకుండాకోకిల కంఠస్వరాన్నీ, అందమైన జుట్టునీ ఇంకా అంతకన్నా ముఖ్యం ఆమెలో ఉన్న స్నేహాన్ని, ప్రేమని చిత్రించారు balance tilt అవడానికి) కూడా సంఘం అతన్ని వదల్లేదు. ఇంకో రకం గా చెప్పాలంటే సంఘం చేత ప్రభావితమయ్యే లేత, బలహీనమైన మనసు అతన్ని పట్టుకొని పీడిస్తూనే ఉంది.

దీన్నించి బయట పడటానకి కొంత గడుసుగా ప్రయత్నించినట్లున్నాడు ( నాలుగు రోజులూ ఏదో విధంగా గడిచిపోనివ్వమనికోప్పడటమూ“, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకో అందగత్తె దొరక్కపోతుందా అని భార్యని ఏడిపించడమూ వగైరా) కానీ ఫలితం లేకపోగా చుట్టూ ఉన్న వాళ్ళు భార్య పట్ల స్నేహాన్నీ, ప్రేమనీపశుకామంగా పరిగణించి హేళన చెయ్యడం మొదలుపెట్టారు.

 

సంఘం ఏర్పాటు చేసిన ప్రమాణాలు లేని రూపం ఉన్నవాళ్ళతో (అందునా భార్యతో) స్నేహంగా, ప్రేమగా ఉండటం అనేవి ఆనాటి సాంఘిక పరిస్థితులలో ఊహించడానికి కూడా కష్టమేనేమో చాలా మందికి!

 

ప్రపంచం లోని విషయాలన్నీ తమ అవగాహనకే లోబడి ప్రవర్తించాలనుకునే కుహనా శాస్త్రవాదులు (మేనమామ కొడుకు) చెప్పినది (మరొక స్తీ్రని ఎరుగని కారణం చేతనే పశుకామం కొనసాగుతుందనడం) కథకుడికి సహించరానిదయింది.

 

తన జీవితాన్ని వెలిగిస్తున్న భార్య సాహచర్యమూ, తాము ఎంతో తమకంగా అనుభవిస్తున్న ప్రేమానుభవాలూ (కళ్ళతో మాట్లాడటం, భార్య తన కంటి భాష కోసం వెతకడం, ఒళ్ళు జిల్లుమనడం, ముక్కుతో చక్కిలిగింతలూ); ఇవన్నీ కాక తన అనాకారితనం వల్ల భర్తకు కలుగుతున్న తక్కువతనాన్ని తల్చుకొని ఆమె పడే బాధవీటి వల్ల కథకుడికి తన భార్య మీద ఉన్న ప్రేమ ద్విగుణీకృతం అవుతున్నది ఒక పక్క.

ఇంకో పక్క సంఘం ఇదికేవలం పశుకామమేఅని నిర్థరిస్తున్నది. సమస్యని తెగ్గొట్టడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇంకో ఆడదాని పొందుని రుచి చూసి తేల్చుకోవడంఅప్పటికీ తన భార్య పట్ల తనకున్న సంబంధం లో మార్పు రాకపోతే అదికేవలం కామంకానట్లే.


కథకుడు ఇంకొక స్త్రీతో  సంబంధం పెట్టుకోకుండా, తనకు భార్యకు మధ్యలో ఉన్న అనురాగం (కథకుడి మాటల్లోనువ్వు కూడా చక్కని దానివేనని“) నిజమేనని తేల్చుకోలేడు. అందుకనే అలా చెయ్యాల్సొచ్చింది.

 

కథకుడిని నవమన్మధుడిగా వర్ణించడం కొ.కు శిల్పం లోని నేర్పు. సంఘటన (ఇంకో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం అనేది) సులువుగా జరగడానికి వీలుగానే ఇలా కథకుడిని నవమన్మధుడిగా చిత్రించారనిపిస్తుంది.

 – రాధ మండువ

కథకి లింక్  http://ramojifoundation.org/flipbook/201402/magazine.html#/54

నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత

chaso

సాహిత్య రచన ఏ ఆశయంతో జరగాలి అని ప్రశ్నించుకుంటే ఒక్కొకరూ ఒక్కో విధంగా వారి వారి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది కాని సాహిత్య శిల్పం మాత్రం కాలపరిస్థితులని బట్టి మారుతుండాలి అనే విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు.  ఏ రచనైనా చదివి ప్రక్కన పడేసేదిగా కాక  కొంత సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలంటే రచయిత తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న, జరగబోయే మార్పుల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలి – అంతే గాక మానవ జీవిత క్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే శక్తి, నిశితంగా గమనించే నేర్పూ ఓర్పూ రచయితకి ఉండాలి – అలాంటి కోవకి చెందిన వారిలో ప్రముఖుడు శ్రీ చాగంటి సోమయాజులు గారు.

ఈయన రచనలకి ఆనాటి ఆయన సమకాలీన రచయితలు, ఆ తరం పాఠకులు ఎంత మందో ప్రభావితులైనారట.  ఇప్పటి రచయితలకి ఆయన రచనలు ఉత్తేజాన్ని కలిగించి కథంటే ఎలా ఉండాలో పాఠాలు చెప్తాయి.  ఆయన కథల్లోని వైవిధ్యం, క్లుప్తత, వేగం మనల్ని చకితుల్ని చేస్తాయి.

సాధారణ జీవితాల నుండి అంత గొప్ప కథలు రాయగలగడం అందునా సరళంగా రాయగలగడం ఎలా సాధ్యం అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాసిన ఏ కథ చదివినా ఆ కథ మరోలా రాయొచ్చునేమో ఇలా రాసుంటే బాగుండేదేమోననే ఆలోచన మనకి కలగదు.  విపరీతమైన ద్వేషాన్ని గురిచి కాని అనవసరమైన సానుభూతిని చూపిస్తూ కాని కాకుండా మామూలుగా కథని చెప్పే తీరు అనిర్విచనీయమైనది.  ఈనాటి ప్రతి రచయితా గ్రహించదగినది.  అందుకే ఆయనని  కథకుల కథకుడు అంటారు – ఈ విషయాలన్నీ నేను చెప్తున్నవి కాదు ఆయన గురించి మహామహులు చెప్పినవి, ఇప్పటికీ చెప్తున్నవి.

ఆయన రాసిన 40 కథలని విశాలాంధ్ర వారు వేసిన సంపుటిలో చదివాను.  వాటన్నిటి కంటే కూడా నాకు ఫేస్ బుక్ లో వేంపల్లి షరీఫ్ గారి ‘కథ’ గ్రూప్ ద్వారా పరిచయమైన రమణమూర్తి గారు పంపిన ఆఁవెఁత”  కథ ఎంతో నచ్చింది.

ఈ కథ నాకెలా దొరికిందంటే ….

వేంపల్లి షరీఫ్ గారు విశాలాంధ్ర వారు వేసిన చాసో కథల సంపుటిలోని అన్ని కథలూ చదివి  ‘చెప్పకు చెప్పకు’  అనే కథ పేరు నచ్చక – “ఆ పేరు నన్ను ఆకట్టుకోలేదు అందుకే చదవలేదు కాని ఇదొక్కటి ఎందుకు వదలాలిలే అని చదివాను చదివాక అర్థమైంది అది ఎంత మంచి కథో”  అని రాశారు కథ గ్రూప్ లో.

అప్పుడు గొరుసుగారు “ఆవెత కథని చదివితే చాసో విశ్వరూప దర్శనం లభిస్తుంది” అన్నారు.

రమణమూర్తి గారు “విశాలాంధ్ర వాళ్ళు వేసిన పుస్తకంలో లేని కథని షరీఫ్ ఎలా చదువుతాడు?  నా దగ్గర ఉంది  కావాల్సిన వాళ్ళు అడిగితే ఇస్తా”  అని ఊరించారు.  తాయిలం ఇస్తానంటే ఎవరు అడగరు చెప్పండి ఆయన ఆశ పెట్టడం కాకపోతే! రమణమూర్తి గారూ,  ఆ కథ  నాకు పంపగలరా?  నా ఇ మెయిల్ … అని టైప్ చేయగానే  ‘వామ్మో! ఇది ఫేస్ బుక్ కదా ఇ మెయిల్ అడ్రస్ ఇస్తే కొంప కొల్లేరు అవదూ’  అనుకుని ఆయన టైమ్ లైన్ కి వెళ్ళి మెసేజ్ పెట్టా.  వెంటనే రమణమూర్తి గారు “ఆఁవెఁత”  కథని పంపారు.  ఆ కథ చదవగానే గొరుసు గారు అన్నట్లు నాకు చాసో గారి సారస్వత  విశ్వరూప దర్శనం అయింది.  స్త్రీ స్వేచ్ఛపై సంపూర్ణ అవగాహన కలిగింది.

స్వేచ్ఛ ఉండాలిట స్త్రీకి సమస్త స్త్రీ జాతితో కలిసి మగవాళ్ళు కూడా (వ్యంగ్యంగా) అరుస్తున్నారు.  ఏ విధంగా ఉంటుంది? స్వేచ్ఛ ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు.  అది లేనపుడు స్త్రీని బానిసని చేయడానికి సంఘం, కట్టుకున్న భర్త ఆఖరికి కన్న తల్లి దండ్రులు కూడా వెనుకాడటం లేదు.  అవినీతికీ, అధికారానికీ, డబ్బుసంపాదనకీ స్త్రీని ఎరగా మారుస్తున్నారు – ఈ నిజాన్ని గుండెల్లో గుచ్చుకునేట్లు అలవోకగా చెప్పి తప్పుకుంటాడు చాసో ఈ కథలో మనల్ని వదిలేసి.  గుండెల్లో ఆ మంట ఆరడానికి మనకి చాలా రోజులు పడుతుంది.

‘ఆఁవెఁత’  అంటే ‘విందు’ అట.  గతిలేని ఓ స్త్రీ, భర్త చేసిన అప్పు – తమ పెళ్ళి కోసం చేసిన అప్పుని కట్టడానికి ఓ డబ్బున్న మగవాడికి విందుగా మారడమే ఈ కథ.

పెళ్ళయ్యాక ఆమె పారాణి కూడా ఆరిందో లేదో పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి రంగూన్ వెళ్ళిపోతాడు చాకలి దాలిగాడు.  వాడటు వెళ్ళగానే ‘భర్త లేకుండా పాపం దానికి ఎట్లా నిద్రపట్టేది’ అని ప్రతి వాడూ “ఏమంటావు ఏమంటావు” అని ఆమె వెంట పడుతుంటారు.

ఆ ఊళ్ళో వాళ్ళు ఆమెని దక్కించుకోవాలని,  దాలిగాడు రంగూన్ లో ఒకదాన్ని మరిగాడనీ ఇక రాడనీ కథలు పుట్టిస్తారు.  ఆ ఊరివాడే పెళ్ళి కాని చిన్నవాడు శాస్త్రి ఆమె అమ్మకి డబ్బు ఆశ చూపించి కూతురిని తన దగ్గరకి పంపమంటాడు. దాలిగాడు నిజంగానే రావడం లేదు ఎన్నాళ్ళయినా ఇక డబ్బున్న శాస్త్రే గతి అని నిర్ణయించుకున్న ఆమె అమ్మ కూతురిని శాస్త్రి దగ్గరకి పంపుతుంది.  అట్లా ఆమెని లోబరుచుకుంటాడు శాస్త్రి.  పొలంలో మంచి గదీ, మంచం, పుస్తకాలు, టీకి సరంజామా వాటితో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు ఇచ్చి ఆమె  “విందు” తెప్పించుకుంటుంటాడు.  అతనికి లోబడుతున్న ప్రతిసారీ మనసుకీ, తనువుకీ సుఖమిచ్చిన భర్తకి అన్యాయం చేస్తున్నానని ఆమె పడే బాధ – అమాయకమైన ఆమె మాటలతో మన గుండె లోతులని స్పృశిస్తాడు చాసో.

ఇంతకు ముందు ఎవరూ చెప్పని సందేశాన్ని సున్నితంగా చెప్పడమే చాసో కథల ప్రత్యేకతట.  ఆ  నాడు (1950-51) ఆయన చెప్దామనుకున్నదేమిటో అందరికీ స్పష్టమే కాని ఇప్పుడు చదివే వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఎదిగిన ఇప్పటి స్త్రీకి ఈ కథ వల్ల తగిన నూతన సందేశం తప్పకుండా అందుతుంది.

ఈనాటి స్త్రీ (ఎక్కువ శాతం)  ఆర్థికంగా నిలదొక్కుకుంది నిజమే కాని దానితో పాటు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వివేక విచక్షణా జ్ఞానాన్ని అలవరచుకోవాలి.  లోపల –  లోలోపల నిజమైన స్వేచ్ఛని పొందాలి.  అలా లేని నాడు పురాతన స్త్రీకి భిన్నంగా మగవాడి పెత్తనాన్ని తప్పించుకోగలదేమో కాని అధికార వ్యామోహానికీ, అహంకారానికీ, అసూయాద్వేషాలకీ,  ధనకాంక్ష కీ బానిస అవుతుంది  అన్న విషయం నాకు గ్రహింపుకి తెచ్చిన కథకుల కథకుడు చాసోకి వందనాలు.

 

    ***

radhamanduva1–రాధ మండువ

  —    రాధ మండువ

అమ్మాయిలూ ఆలోచించండి !

శైలా! శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది”  ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను  పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు?  పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని”  అంది మా అమ్మ ఈసడింపుగా.

 “నాకెందుకులే తల్లా మీ మద్దెన.  ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా!  అట్టా మా శైలజని  రమ్మని చెప్పు నాగరత్తమ్మా’  అంటే వచ్చా.  ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా?  చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ”  అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం.  లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం  పుట్టింటి పైనే కేసు వేసింది.  మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది.  అయినా దరిద్రం వదల్లా.  కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి.  ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది.  తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక”  అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.

 అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది.  అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది.  మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న.  తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు.  అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి.  ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని  అనుకున్నాను. 

అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా

                 Kadha-Saranga-2-300x268                         

  ***

మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త.  అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు.  ‘ఎంకమ్మత్త కోడలిని’  అనేదాన్ని.  ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి అనేది అత్త.

 అత్త భలే బాగుండేది.  సినిమాల్లోని భానుమతి లాగామోచేతి దాకా ఉండే జాకెట్టూ జాకెట్టుకి మెడ చుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది.  ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది.  అంత అందమైన అత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు.  అత్తేమో రాణి లాగా పొడవుపొడవుకి తగ్గ అందమూమామేమో పొట్టి.  బుడ్డోడులాగా ఉండేవాడు.  అయినా నాయనమ్మకి మనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికితన పుట్టింటి ఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది.  రోజుకో రకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త.  అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది.  నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారుకొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తన నగలన్నీ తీసుకుని పొగాకు బయ్యర్ తో లేచి పోయింది. 

 అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు.  అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు.  ఊళ్ళో అందరూ తాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు.  నాన్న అయితే చాలా రోజులు బయటికి రాలేకపోయాడు.  మామకివేమీ పట్టలేదు.  ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లే బిడ్డలు. 

 చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కింద కలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందేదానికి నిన్ను చూడాలని ఉందంట దా”  అని నన్ను చెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది.  అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందోఅచ్చం పట్నం దొరసాని లాగా ఉంది.  మిన్నాగు చర్మం లా ఆమె చర్మం   సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది.  అత్తని చూస్తే అప్పుడు నాకు భలే గర్వం కలిగింది.  అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టిన హల్వా, చేగోడీలు ఇచ్చింది.  నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది.  ఇంటికి వచ్చేప్పుడు నాయనమ్మఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది”  అంది.  చెప్పనని అడ్డంగా తలూపాను.

 నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనే ఉన్నాను.  అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది.  నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతా చక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని  తెచ్చి కూతురికి పెట్టేది.  అమ్మకి నాన్నకి తెలిసినా తెలియనట్లు ఉండేవారు.  తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు.  రోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి,  నాయనమ్మకి ఏదో చెప్పి అత్త  ఏడుస్తూ ఉండేది.  ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది.  అతని కూతురట. పది పన్నెండేళ్ళుంటాయేమోఎంత బాగుందో పిల్ల.  మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న పిల్ల చాలా తెలివైనదని అనిపించింది నాకు.  అక్కడ ఉన్న కొద్దిసేపులో అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ‘రోజా! వదినతో ఆడుకోఅంది అత్త నావైపు చూపిస్తూ. పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డ చింతకాయలను ఏరుతుంది.  వెళ్ళేటప్పుడు మాత్రం అత్తటాటా చెప్పుఅంటే యాంత్రికంగా చెయ్యి ఊపిందిఅంతే తర్వాత నేను అత్తని చూడలేదు.  

 నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు.  నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది. పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలో చూశామని చెప్పేవారు.  చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరి నిమిషంలో కూడా ఎదురు చూసింది.

 కాలప్రవాహం  అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది.  నేను ఎం. ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండి లాయర్ నోటీసు వచ్చింది.  ఇంట్లో రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయిపుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం.   భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుటకోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది  

 నాకు పెళ్ళి సంబంధం వచ్చిందిఅత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక  తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడుపెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయానురెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు అత్త మనూరికి వచ్చిందమ్మా! అని చెప్పాడు.  నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన కంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను.  “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుందిఅత్త పరిస్తితి ఏమీ బాగా లేదువ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేదిపొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా!  దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదుతినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నా”  అన్నాడుకళ్ళ నీళ్ళు తిరిగాయివెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపానుచాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా.  ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయిందిసరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయిన ఆమె తేరుకుంది

 ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను  అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీఅత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు.   తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంటమామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.

     ***                 

  పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత,  నేను అత్త దగ్గరకి వెళ్ళాం.  అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది.  నాకు ఆమె ఎవరో అనిపించింది.  ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది.  నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది.  కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం.  తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది.  ఏమయింది ఆ భానుమతి అంత అందం?  అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను.  అత్త నిర్లిప్తంగా నవ్వింది. 

డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా”  అన్నాను. 

రాకపోతే నేనేం చేసేదిఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటా బయటికి వెళ్ళిపోయాడు తాత.  నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా”  అన్నాను. 

అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు.  “ఊరుకో అత్తా! అన్నాను.

ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూమీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచి వాడంటగా అమ్మాతాత చెప్పాడు  అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను.  చాలా బిజీఅమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని  ఒక్కదాన్నే వచ్చానత్తా”  అన్నాను.  నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది.  తనకంటూ ఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లోతన కోసం ఒకరున్నారని తెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది.  ఏమో!?  అత్త గురించి నాకు  తెలిస్తే నా మాటలకి ఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? అంది.

పెళ్ళయి మూడేళ్ళేగా అత్తావచ్చే సంవత్సరం చూద్దాంలేనాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకు కుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

నేను నిన్ను మర్చిపోయానురా బంగారూకాని నువ్వు నన్ను మర్చిపోలేదు.  నీ మీద ఉండే ప్రేమ నంతా రోజా మీద చూపించాలనుకున్నాను.  ‘నువ్వొద్దునీ ప్రేమా వద్దూ‘  అంటూ అది నన్ను అసహ్యంచుకునేది.  అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది.  ఆఖరికి అది నన్ను బానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను.  బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధ దానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!

 అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని రోజా ఎవరాఅని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చిఇప్పుడెక్కడుందత్తా అమ్మాయి?  అన్నాను ఆతృతగాఅరె! ఇన్ని రోజులూ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూవేటగాడి బాణం గుండెల్లో గుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదనకాదు నిస్సహాయత కాదు కాదు నేను వర్ణించలేను నాకు మాటలు రావుఅలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది.  నేను గొంతు పెగుల్చుకుని మాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది.  లోపల జిప్ లో నుండి ఒక కవర్ తీసి  “చదువునీకు అన్ని విషయాలూ తెలుస్తాయి”  అంది ఏడుస్తూ ఏడుపు హృదయ విదారకంగా ఉంది.  ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.

 

                                   ***

 ఎంకీ

ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు.  నువ్వు అంటే నాకు అసహ్యంఇన్నాళ్ళ తర్వాత కూడానా జీవితం  నాశనం అవడానికి కారణం నువ్వు కాదునేనేకేవలం నేనేఅని తెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది.  మా నాన్న నన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు.  నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది.  ఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావాదానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్న నన్ను తీసుకొచ్చాడు.  నిన్నుఅమ్మా! అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడి చేశాడు.  నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా? ప్రేమించడమా? ఛీ! ఛీ –  నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు.  మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని  నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది.  బయటికి వెళ్ళలేని వయసుఏం చేయాలో తెలియని  నిస్సహాయత.   కసి నాన్న లేనప్పుడు నీ మీద చూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా  ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని.  నా కోరిక తీరింది ఎంకీచాలా పెద్ద దాన్నయిపోయాను.  త్వరలో లోకం నుండే శాశ్వతంగా వదిలి పోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ  భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు. వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక.  ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడునమ్మాను ఎంకీ.  జంతువులు అమ్మే అంగడి నుండి ఒక పిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకుపక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

 నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ.  వీడికి పెళ్ళాం లేదునా లాంటి కూతురూ లేదునన్నే మోసం చేశాడునా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదుదానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

 ఎంకీ నా ఒళ్ళు హూనం అయిందిజబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతానుఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదునువ్వు నాకేమీ చేయక్కర్లేదుమనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యిపెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం  సబబా అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పుమీరు ఇప్పుడు చేసే పనుల  వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమని‘  నువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు

 అంతే ఎంకీ,  నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా.  నిన్ను క్షమించి మాత్రం కాదునిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.

 మరణించాక కూడా నిన్ను క్షమించలేని

నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా.  ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలుప్రేమిస్తున్నాను,  పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు.  ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువ శాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారుసమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది?  అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

 ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతిదొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నానుదొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు.  “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా.  అత్తకి ఏడ్చీ ఏడ్చీ  మాట పెగలడంలేదువీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా!  తలనొప్పిగా ఉందిఅమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా.  కంగారేం లేదు”  అన్నాను.  వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడుశుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం.  ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని  రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం.  చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందిఅది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని  గురించిన ఆలోచనలతో.  దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశానుఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశానుసమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసిందిఅది చేయకుండా ఆవేశంతో –  అది చచ్చిపోతుందన్న భయంతో –  లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపానుమళ్ళీ మరో తప్పు చేశానునా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు.  ‘ఎంకీ!  నాకు బ్రతకాలనుంది‘  అని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చానువాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అదినన్ను ఎక్కువ బాధించకుండానే – రోజా చనిపోయింది.

 బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేనునాకు ఆ శక్తి లేదునువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయిమరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!”  అంది అత్త.

అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి.  “తప్పకుండా తెలియచేస్తానత్తా.  కాని అదేంటో మరి  కథలు చదివీ,  ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉందివంచింపబడుతూనే ఉందితెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా.  నీ పొలానికి చాలా విలువ వచ్చిందిపొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకత చేసుకుందువుగాని”  అన్నాను.

 మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది.  “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదు”  అంటూ అత్తని లేవదీశాను.

  మా అమ్మకీ,  మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పానుఅత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లిఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందటఅత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

 మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలినాకు గర్వాన్ని కలిగించాలి –   ఇది నా కోరిక.

 

              ***

 

radhamanduva1—-మండువ రాధ

గతం

అక్కా! అక్కా!అని అరుచుకుంటూ వచ్చాడు అభినవ్ నా గదిలోకి.

 అప్పుడు సాయంత్రం 5 అయిందినా స్నేహితురాలు  విజయలక్ష్మి  తో ఫోనులో మాట్లాడుతున్నాను.

 ఫోనులో మాట్లాడుతుంటేనేమి? నిద్రపోతుంటేనేమి? నేను పలికిందాకా అక్కా! అక్కా!అని చెవి కోసిన పిట్టల్లాగా అరుస్తూనే ఉంటారు పిల్లలు.

 మాది పెద్ద బోర్డింగ్ స్కూల్మా స్కూల్ లో మూడు వందల యాభై మంది పిల్లలు ఉంటారునేను ఇక్కడ తెలుగు టీచర్ని.  మా స్కూల్లో లేడీ టీచర్స్ ని పిల్లలు అక్కాఅని పిలుస్తారుస్కూల్లో ఇరవై హాస్టల్స్ ఉన్నాయిఒక్కో హాస్టలికీ అనుబంధంగా ఉండే ఇంట్లో ఒక టీచర్ ఉంటారుమా హాస్టల్ లో ఐదు,ఆరు తరగతుల పిల్లలు 18 మంది ఉన్నారు

 ఫోన్లో మాట్లాడుతున్న నేను ఉండమ్మా విజ్జీ లైన్లోఅని విజయలక్ష్మికి  చెప్పి ఏంటి చెప్పు అభీఅన్నాను.

అక్కో! నిన్న మనం హైక్ కి వెళ్ళాం గదా! అప్పుడు పొద్దున్నే డైనింగ్ హాల్ వాళ్ళు దోశలు పొట్లం కట్టిచ్చారు కదా! దోశ తినేదా? భలే ఆకలేస్తుందిఅని అన్నాడు.

 ఫోనులో విజ్జితో సంభాషణ  – లోకంలోని మనుషులు, వారి కోపాలూ, అసూయలూ దగ్గర  మొదలై  రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఆత్మ, ధ్యానం దగ్గర ఆగిపోవడంతో రకమైన తాదాత్మ్యంతో ఉన్న నాకు వాడు చెప్పింది సరిగ్గా అర్థం కాక   ” నిన్న తిన్నట్లు దోశ  తినాలని అనిపిస్తుందా? రోజు డిన్నర్ లో ఇవ్వరు కదా! గురువారం బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తారులే. తిందువుగానిఅని అన్నాను. రోజు భోజనం పెడతారో మాకు ముందుగానే మెను చార్ట్ ద్వారా తెలుస్తుంది. ( ఇలా తెలియడం వల్ల  జీవితంలో నూతనత్వాని కోల్పోతున్నాం కదా! అనిపిస్తుంటుంది నాకు.)

 ” అది కాదక్కా! నిన్న ప్యాకెట్టు మొత్తం తినలేదుమిగిలినది బ్యాక్ పాక్ లో పెట్టుకున్నా. అది ఇప్పుడు తినేదా! అన్నాడు.

ఓరోయ్! నాయనోయ్! ఛీ! ఛీ! – నువ్వు ఫోను పెట్టెసెయ్ విజ్జీ! – ఫోరా ఫో. పోయి తీసుకురా ప్యాకెట్టుని”  అని అరిచాను.

 వాడు చాలా ముద్దుగా ఉంటాడువాడి తరగతిలో అందరికంటే వాడే పొట్టిఇంతలేసి కళ్ళునేనన్న మాటలకి మూతి ముడుచుకుని ఎందుకు అక్క  అరుస్తోంది ‘  అన్నట్లుగా ముఖం  పెట్టి గునగునా పరిగెత్తాడు హాస్టల్ లోకి.

 మిగిలిన నిన్నటి దోశ ఇప్పుడు తినేదా అన్నప్పుడు కోపం వచ్చినా, వాడు పెట్టిన ఆశ్చర్యకరమైన  ముఖాన్ని చూడగానే నాకు నవ్వు ఆగలేదు.  పెద్దగా నవ్వుతూ నా గదిలోనుండి  హాస్టల్  లోపలకి వెళ్ళాను.  నా నవ్వు విని ఎదురుగా ఉన్న గదిలో నుండి వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చింది.  జరిగింది చెప్పగానే  ” అబ్బేఅని ముఖం జుగుప్సగా పెట్టింది.  నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు.    లోపు అభి ప్యాకెట్ ని పట్టుకుని వచ్చాడు.    వాడి ముఖం లో ప్రశ్నార్థకం కనిపిస్తూనే ఉంది. 

 “పారేసెయ్! పారేసెయ్! అన్నాను దగ్గరకు రాకుండానే.

ఎక్కడ పారేసేది? అన్నాడు అమాయకంగా.

ఎక్కడ పారేసేదేందబ్బాయ్? చెత్తబుట్టలో వెయ్! అంటూ ముక్కుకి పైట చెంగు అడ్డం పెట్టుకుని తనే వాడి చేతిలోనుంచి ప్యాకెట్ లాక్కున్నట్టు తీసుకుని బయట పారేయడానికి వెళ్ళింది వార్డెన్.

నిన్నటిది రోజు తినొచ్చా? పాడయిపోయింది తింటే జబ్బులు వస్తాయి”  అని అన్నాను నేను.

నాకు సంగతి తెలియదు అక్కా! అన్నాడు.

సరేలే! ఇంకెప్పుడూ అలా మిగిలిన తిండిని బ్యాక్ పాక్ లో దాచుకోకు. వెళ్ళు. వెళ్ళి చేతులు కడుక్కుని లాకర్లో నుంచి రెండు బిస్కెట్ లూ, ఒక చాక్లెట్ తీసుకుని తిను” అని అన్నాను.

వాడికి ఆకలేస్తుందట. చూసుకోమ్మా” అని వార్డెన్ తో చెప్పి నా గదికి వచ్చాను.

 విజయలక్ష్మికి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో మళ్ళీఅక్కా!” అని పిలుచుకుంటూ వచ్చాడు అభి.

ఏమిటిఅన్నట్టుగా చూశా వాడి వైపు.  ” మరీ, చాక్లెట్లూ, బిస్కెట్లూ కూడా నిన్నటివే కదా! అవి పాడైపోలేదా” అని అడిగాడు.  వాడు అడిగే ప్రశ్నకి, వాడు అడిగిన తీరుకీ భలే ముచ్చటేసింది.  అభిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాను.  పక్కనే కూర్చోబెట్టుకునికొన్ని రోజులకి పాడవకుండా ఉండటానికి వీటిల్లో కెమికల్స్ కలుపుతారు. ఇవి కూడా మంచివి కావు కాబట్టే ఎక్కువ తినొద్దు అని చెప్పేది.  రేపు సైన్స్ క్లాస్ లో టాపిక్ నే డిస్కస్ చేయండి. ఆమె చక్కగా అర్థం అయ్యేట్లు చెప్తుంది.  నేను కూడా సుమతి అక్కకి (సైన్స్ టీచర్) చెప్తాలేవెళ్ళు. వెళ్ళి ఆడుకో” అన్నాను.

వాడు సంతోషంగా ముఖం పెట్టి బయటికి పరిగెత్తాడు తను గ్రహించిన విషయాన్ని అందరితో చెప్పడానికి.

 ‘ నిన్నటి ఆహారం శరీరానికి విషం. అది అందరూ ఒప్పుకుంటారు.  కాని నిన్నటి గతం మనసుకి విషం అని ఎందుకో తెలుసుకోలేకపోతున్నారు.  నిన్నటి నిందను ఈరోజు తలుచుకొని ద్వేషాన్ని లేదా బాధని పెంచుకుంటారు. అలాగే నిన్నటి చాక్లెట్ లాంటి పొగడ్తని తలుచుకొని ఆనందపడతారురెండూ ప్రమాదమేఅసలు గతమే మనసుకి విషం, మాయ అని గ్రహిస్తే ఆత్మ ప్రకాశిస్తుందిశాశ్వతమైన  ఆనందం లభిస్తుంది. ‘


        ***

radhamanduva1-రాధ మండువ

 

ఒక రోజా కోసం…

 oka roja kosam -2 (2)

సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు.  కాని సెర్దర్ ఓజ్కాన్ ‘ఒక రోజా కోసం’ నవల లోని తల్లి తన కూతురు  అంతరాంతరాల్లో ఉండే ‘నేను’  ని కనుగొనాలని కోరుకుంటుంది.

ఈమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగుట్టుకుంటుంది.   ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎరుకతో బ్రతికే ఈమె ఇతరుల కళ్ళల్లో ఆరాధనని చూడటం కోసం తన కలని కూడా విస్మరిస్తున్న కూతురు డయానాని చూసి బాధపడుతుంది.  ఇతరుల కోసం కాక తనకై తాను స్వేచ్ఛగా   బ్రతకడానికి అడ్డుపడుతున్న అహాన్ని డయానా తొలగించుకోవాలని, తాను ప్రవేశించిన ఆనందపు తోటలోని గులాబీలతో మాట్లాడుతూ తన కూతురూ తిరుగాడాలని, కూతురు తన లోలోపలి పరిమళాన్ని ఇతరుల కోసం కోల్పోకూడదని కోరుకుంటుంది.

డయానాకి రచయిత్రి అవాలనే కల బలంగా ఉంది కాని మంచి రచయిత్రి కాకపోతే సమాజం నుండి నిరసన ఎదురవుతుందేమోనన్న భయంతో,  ,తను సమాజంలో గొప్పగానే ఉండాలన్న అహంతో తన కలను చంపుకుని లాయరు అవాలనుకుంటుంది.   చుట్టూ తిరిగే  స్నేహితుల మెప్పుదల కోసం బ్రతుకుతున్న కూతురు డయానాని  వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది తల్లి.  అయితే తన బిడ్డకి నెమ్మదిగా తెలియచెప్పడానికి ఆమెకి భగవంతుడు సమయం ఇవ్వలేదు.  మరో ఐదు నెలల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు  చెప్పడంతో తను చనిపోయిన తర్వాతైనా సరే డయానాలో మార్పు రావాలని పటిష్టమైన పథకం తయారు చేసుకుంటుంది ఆ తల్లి.  తన బిడ్డను విచార మార్గంలో పయనింప చేయడానికి చనిపోయిన భర్త బ్రతికి ఉన్నాడని అంటుంది.  లేని మరో కూతురిని (మేరీ) సృష్టిస్తుంది.  మేరీ రాసినట్లు ఉత్తరాలు రాసింది.  తన స్నేహితురాలైన జైనప్ హనీమ్ అనే తాత్త్వికురాలిని తన బిడ్డని దివ్యత్వానికి దగ్గరగా వచ్చేట్లు చేయమని కోరింది.  ఆఖరికి బిచ్చగాడి సహాయాన్ని కూడా అర్థిస్తుంది.

చనిపోయేముందు రోజు తనకి మరో కూతురు ఉందని, తన భర్త తన నుంచి విడిపోతూ ఆ కూతురిని తీసుకువెళ్లాడని, ఇప్పుడు మేరీ  ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని డయానాకి చెప్తుంది.  మేరీ రాసినట్లుగా తనే రాసిన ఉత్తరాలను డయానాకిచ్చి ఆ ఉత్తరాల ఆధారంతో మేరీని అన్వేషించమని ఆఖరి కోరికగా కోరుతుంది. ఆ అన్వేషణా మార్గంలో తన స్నేహితురాలు, తాత్త్వికురాలు అయిన జైనప్ హనీమ్ ని కలుసుకునేట్లు చేస్తుంది.

తన కవలసోదరిని వెతుకుతానని తల్లికిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి జైనప్ హనీమ్ ని కలుసుకుంటుంది డయానా.  అక్కడ – జైనప్ హనీమ్ దగ్గర ‘తన గులాబీకి బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలుసుకుంటుంది.  గులాబీలతో మాట్లాడటం, వాటి మాటలను వినడం నేర్చుకుంటుంది.  దేవుడు మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ భాగస్వామి అవుతాడని తెలుసుకుంటుంది.   ప్రగతిని సాధిస్తుంది.  చివరికి నీ వరకు మిగిలిన అన్ని తోటలకంటే నీ తోట వేరేదే అయితే మిగిలిన అన్ని గులాబీలకంటే నీ గులాబి వేరేదే అయితే ఆ తేడా నీకు ఆధిక్య భావనని కాక నిన్ను భూమి మీద నిలిపి ప్రపంచమంతటినీ హత్తుకునేలా చేస్తే నీకు దివ్యత్వం లభించినట్లే బిడ్డా! ఇక నువ్వు నన్ను కోల్పోవునీ జ్ఞాపకాల వెనక ప్రతి ఒక్క దాని ద్వారా నేను నీతో మాట్లాడతానుఅని అమ్మ రాసిపెట్టిన ఉత్తరం డయానాకి దొరుకుతుంది.

అప్పుడు – ఆ క్షణంలో డయానా అంతరంతరాల్లో ఉన్న ‘నేను’ ని కనుగొంటుంది.  ముఖంలో అద్వితీయమైన మెరుపుని పొందుతుంది.

oka roja kosam -2 (1)

క్లుప్తంగా ఇదీ కథ

సెర్దర్ ఓజ్కాన్ కి జీవనయానానికి సంబంధించిన లోతైన అర్థాలు వెలికి తీసే రచనలు చేయడం ఇష్టమట.  ‘The Missing Rose’ – ‘ఒక రోజా కోసం’ ఇతని తొలి నవల.  ఈ పుస్తకం ఇప్పటికి 27 భాషల్లోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.  దీన్ని తెలుగులోకి మంచిపుస్తకం.నెట్ (సురేష్ ) వాళ్లు అనువదించి ప్రచురించారు.

 • ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి మాత్రమే విచారమార్గంలో పయనించేవారికి గర్వం తప్ప ఏమీ మిగలదు.
 • మేథోశక్తితో ఊహించడం ద్వారా అసలైనదేదో తెలుసుకోలేము.
 • హృదయం ద్వారా ప్రకృతిని వినగలిగే శక్తి పుట్టుకతో అందరికీ ఉంది కానీ ఎందుకో కాలం గడిచేకొద్దీ గుండెలు చెవిటివవుతున్నాయి.
 • శిఖరాన్ని చేరుకోవాలని ఉన్నా చేరుకోలేమోనన్న భయంతో ప్రయత్నాన్ని విరమించుకుంటాం.  పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే శిఖరాన్ని చేరుకోగలము.  మనకి శిఖరాన్ని చేరుకోవాలనే ఇచ్ఛ కలిగితే అన్ని వైపులనుండీ సహాయం అందుతుంది.
 • నువ్వు అలవి కావు ఒడ్డుని ఢీ కొని మాయమైపోతానని భయపడటానికి.  నీవు సముద్రానివి.
 • గులాబీగా ఉండటం అంటే ఇతరులు పొగిడినపుడు బ్రతికి వాళ్లు తిరస్కరిస్తే అంతరించిపోవడం కాదు.
 • ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నవారే ఏదో ఒక రోజు నిన్ను త్యజిస్తారు. ఎందుకంటే వాళ్లు ఆరాధిస్తున్నది నిజంగా నిన్ను కాదు.  వాళ్ల కోరికల్ని.  వాళ్ల పొగడ్తలలో నీ ఉనికి ఉన్నప్పుడు వాళ్లు నిన్ను త్యజించగానే నువ్వు లేకుండాపోతావు.
 • నువ్వు మోజుపడే ఆత్మ తియ్యటి మృత్యువుని చవి చూసిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది  –    ఇలాంటి వాక్యాలు ఎన్నో పుస్తకం నిండా.  జీవితం పట్ల ఎంతో పరిణితి ఉంటేనే రాయగలిగిన వాక్యాలు.

మనకి నిజంగా ఇష్టమైన పని ఒకటైతే డబ్బు సంపాదన కోసమో, అధికారం కోసమో, ఎంచుకున్న రంగంలో పరిణితి సాధించలేకపోతే ఎదుర్కొనబోయే పరిస్థితులని ఊహించుకొనో ఇష్టమైన రంగాన్ని వదిలేసి సమాజ ఆమోదయోగ్యమైన రంగాన్ని ఎంచుకుంటాం.  మనల్ని అర్థం చేసుకోలేని ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడతాం.  దాని వలననే మనకి లోలోపల సంఘర్షణ, అసంతృప్తి.  తద్వారా జీవితం పొడవునా అశాంతి.

తమ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలనే కాంక్షతో పిల్లల మనస్సుకి నచ్చినదేమిటో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, ఇతరుల ఆరాధనతో బ్రతుకుతూ, ఇతరుల కళ్లల్లో తమని చూసుకుంటూ మరుగుజ్జులుగా మారుతున్న యువతీయువకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

అప్పుడు కనీసం కొన్నైనా నాట్యం చేయవలసిన చేతులు గరిటను తిప్పుకుంటూ (ఇక్కడ నా ఉద్దేశం ‘వంట చేయడం మంచిది కాదు’  అని కాదు) , సంగీత కచ్చేరీలు ఇవ్వవలసిన నోళ్లు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండవు.

మన కలని అనుసరించకపోవడానికి అడ్డుపడే అహాన్ని చంపుకుని చేరుకోవలసిన శిఖరాన్ని ఎలా చేరుకోవాలో,  శాంతిని పొందుతూ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా హత్తుకోవాలో ఈ నవల ద్వారా విశదపరిచిన సెర్దర్ ఓజ్కాన్ చిరస్మరణీయుడు.

–    రాధ మండువ

 

 

 

 

 

 

 

 

సానుభూతి

“సరోజా!  ఇటు రా! ”  బీరువా ముందు నిలబడి పనమ్మాయి సరోజని పిలిచింది విమల. 

“ఏంటమ్మా?”  అంది సరోజ విమల గదిలోకి వస్తూ.

“రేపు పార్టీకి ఏం చీర కట్టుకోమంటావు?”  అంది నాలుగు చీరలు తీసి మంచం మీద పడేస్తూ.

“మీరు ఏం చీర కట్టుకున్నా  బాగానే ఉంటారమ్మా!” అంది సరోజ.

“ఊ!  నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ.  నేనేది కట్టుకున్నా ఆరాధనగా చూస్తావు” అంటూ చీరలన్నీ కలబెట్టింది విమల.  దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్న చీరల్లో ఒక్కటీ నచ్చలేదు ఆమెకి. 

“అబ్బ!  ఒక్కటన్నా బాగా లేదు.  బజారుకి వెళ్ళి కొత్త చీర తెచ్చుకుంటా.  నువ్వు సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు రంగా కి బ్లవుజ్ ఇచ్చి ఉదయానికి రెడీ చేయమని చెబ్దువుగాని.  నేను వచ్చేప్పటికి పని పూర్తి చేసుకుని ఉండు” అంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది విమల.

 విమల కొత్త చీర కొనుక్కుని వచ్చి వంట చేస్తున్న సరోజకి చూపించింది.  నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలతో ఆ చీర చాలా బాగుంది.  “చాలా బావుందమ్మా! ”  అంది సరోజ. 

“బావుందా!  సరే నువ్వు బ్లవుజ్ కుట్టమని రంగా కి చెప్పి ఇంటికెళ్ళిపో.  రేపు ఉదయం వచ్చేటప్పుడు బ్లవుజ్ తీసుకురా – మర్చిపోకుండా”  అంది విమల. 

కుట్టాల్సిన రవికా, ఆది రవికా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటూ “ఎందుకు మర్చిపోతానమ్మా? రేపే కదా మీ పుట్టినరోజు”  అంది సరోజ.

 

     ***

 

తర్వాత రోజు సరోజ  తన కూతురు చిట్టిని తీసుకొచ్చింది.  చిట్టిని వరండా చివర కూర్చోపెట్టి   రవికల కవరు తీసుకుని లోపలకి వెళ్ళింది.

 

సూర్యుడు గబగబా ఏదో కొంప ముంచుకుపోయినట్లు  పైకి ఎగబాకుతున్నాడు.  వరండాలో కూర్చుని ఉన్న చిట్టికి బాగా ఆకలిగా ఉంది.  అమ్మ కోసం, ఆమె తెచ్చే అన్నం కోసం ఎదురు చూస్తోంది. ఆ ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు,  వెళుతున్నారు.  ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు చిట్టి.  కాని లోపల నుంచి బయటకు ఎవరైనా వస్తున్న చప్పుడైతే మాత్రం ఆత్రంగా తల ఎత్తి చూస్తోంది తన అమ్మేమోనని. 

 

లోపల నుండి నవ్వులూ, మాటలూ వినపడుతున్నాయి.  వంటింట్లో నుండి వచ్చే వాసనల వల్ల చిట్టికి ఆకలి ఇంకా ఎక్కువవుతోంది.  ఇంతలో ఇద్దరు పిల్లలు బుట్టెడు ఆట సామాన్లతో వరండాలోకి వచ్చారు.  బుట్టలో నుండి రకరకాల బొమ్మలు తీసి వరండాలో సర్దుతున్నారు.  చిట్టి ఆకలిని మర్చిపోయి వాళ్ళ వైపే చూస్తోంది ఆసక్తిగా.  చివరగా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బొమ్మలను తీసిన చిన్న పాప “అక్కా! పెళ్ళి ఆట ఆడుకుందామా?”  అంది.

“సరే”  అంది పెద్ద పాప.

పెళ్ళి ఆట అనగానే చిట్టి ఉత్సాహంగా వారి వైపే చూడసాగింది.  పెళ్ళికూతురినీ, పెళ్ళికొడుకునీ ప్రక్క ప్రక్కనే కూర్చోపెట్టారు.  పురోహితుడి బొమ్మని వాటికెదురుగా పీట వేసి దాని పైన పెట్టారు.  ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ, జంతువులనీ, పక్షుల్నీ వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ ఎదురుగ్గా అలంకరించారు.  పెద్ద పాప లోపలకి వెళ్ళి స్టీలు గిన్నెలో ఏవో తెచ్చి ప్రక్కన పెట్టింది.  అవేమైనా తినేవేమో అనుకున్న చిట్టికి నోట్లో నీళ్ళూరాయి.  ఇద్దరూ ఏవేవో మంత్రాలు చదువుతూ బొమ్మలకు పెళ్ళి చేశారు.

“పెళ్ళయింది.  ఇక భోజనాలు పెట్టాలి చుట్టాలకి”  అంది చిన్న పాప.

“ఆ!  అందరూ భోజనాలకు లేవండి” అంది పెద్ద పాప ఎదురుగ్గా అలంకరించిన బొమ్మల వైపు చూస్తూ.

చూస్తున్న చిట్టి అప్రయత్నంగా లేచి వాళ్ళ దగ్గరకి వెళ్ళి భోజనాలా?  అంది.

తలతిప్పి చిట్టి వైపు చూసిన పిల్లలిద్దరూ “ఎవరు నువ్వు?”  అన్నారు ఇద్దరూ ఒకేసారి. 

“మా అమ్మ ఈ ఇంట్లో పని చేస్తుంది” అంది చిట్టి.

“సరోజక్క కూతురివా?” అంది పెద్ద పాప.

తల ఊపింది చిట్టి.

“దా!  నీ పేరేమిటీ?”  అన్న చిన్న పాపను చూస్తూ “చిట్టి” అంది చిట్టి.

“నా పేరు శరణ్య.  ఇది మా అక్క సాహితి” అని అక్కని వేలితో చూపించి “నువ్వు ఎన్నో తరగతి?” అంది మళ్ళీ.

“నాలుగో తరగతి” అంది చిట్టి.

“నేను కూడా నాలుగే..  దా!  కూర్చో!” అంది చిన్న పాప.

చిట్టి కూర్చోలేదు.  అలాగే నిలబడి ఉంది.

“కూర్చో.  ఆడుకుందాం”  అని పెద్ద పాప అనడంతో వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుంది చిట్టి బిడియంగా.

“స్టీలు గిన్నెలో నుండి కేకులు, చిప్స్ తీసి ప్లేట్లల్లో సర్దుతోంది పెద్ద పాప.  చిట్టి వాటి వైపే రెప్ప వాల్చకుండా చూస్తోంది.  దానికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఆగకుండా.  బొమ్మలన్నింటినీ వరసగా కూర్చోపెడుతున్న చిన్న పాప చిట్టి వైపు తిరిగి “నీకు కూడా ఇలాంటి బొమ్మలున్నాయా?”  అని అడిగింది.

చిట్టి తల అడ్డంగా ఊపింది లేవన్నట్లు.

“లేవా?”  అని ఆశ్చర్యంగా చూసి “ఇంకేమైనా బొమ్మలున్నాయా మరి?”   

“అస్సలు నాకు బొమ్మలే లేవు” అంది చిట్టి మామూలుగా.  దాని గొంతులో ఏమీ బాధ లేదు.  కళ్ళు మాత్రం చిప్స్ వైపే చూస్తున్నాయి.

“నేను నీకు కొన్ని బొమ్మలిస్తానుండు.  ఇది ఇవ్వనా?  అంటూ అమ్మాయి బొమ్మ ఇవ్వబోయిందివద్దు అన్నట్లుగా తల ఆడించింది చిట్టి.  “పోనీ ఇది ఇవ్వనా? ఇది ఇవ్వనాఅంటూ రకరకాల బొమ్మలు చూపిస్తోంది.  ఆ పాప ఏది చూపించి అడిగినా వద్దు – వద్దుఅంటున్న చిట్టిని చూసి పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ బొమ్మలు మాత్రం ఇవ్వను.  ఇంకేం కావాలన్నా తీసుకో”  అంది చిన్న పాప విసుగ్గా.

చిట్టి ఏమీ మాట్లాడలేదు

ఏం  కావాలో అడుగు భయపడకుండాఅంది పెద్ద పాప చిట్టికి దగ్గరగా వచ్చి

చిట్టికి ఏదైనా ఇవ్వాలని వాళ్ళిద్దరికీ చాలా కోరికగా ఉంది.

ఆకలేస్తుంది.  ఆ రొట్టె కావాలిఅంది చిట్టి కేకును చూపిస్తూ.

అయ్యో!  ఆకలేస్తుందా?అని  గిన్నె దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళింది పెద్ద పాప.

చిన్న పాప నవ్వుతూ “అది రొట్టె కాదు కేకు” అంది.

కేకు, చిప్స్ ఉన్న ప్లేట్ తీసి చిన్న పాపకిచ్చి “చిట్టికి ఇవ్వు.  అమ్మని పిలుచుకొస్తా” అంటూ లోపలకి పరిగెత్తింది పెద్ద పాప.

పెద్ద పాప ‘అమ్మని పిలుచుకొస్తాన’న్న మాటకి చిట్టికి భయమేసింది. నాలుగు రోజుల క్రితం జరిగినది గుర్తొచ్చింది.

నాలుగు రోజుల క్రితం చిట్టి తన గుడిసె ముందు కోర్చోనుంది.  వాళ్ళ పక్క గుడిసెలో ఉండే గౌరి, కిట్టా వాళ్ళ నాన్న అరటి పళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళాడు.  చిట్టి తనకి కూడా నాన్నుంటే ఏదో ఒకటి తెచ్చేవాడు కదా అనుకుంటూ వాళ్ళ గుడిసె వైపే చూస్తూ ఉంది.  గౌరి, కిట్టా అరటి పండు తెచ్చుకుని తింటుంటే వాళ్ళ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళి గౌరిని కాస్త పెట్టమని అడిగింది.  గౌరి సగం తుంచి పెట్టింది.  కిట్టా లోపలకి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పాడు.  వాళ్ళమ్మ పెద్దగా అరుస్తూ బయటకొచ్చి చిట్టి వీపు మీద నాలుగు దెబ్బలేసి రెక్క పట్టుకుని చిట్టి గుడిసె దగ్గరకు లాక్కొచ్చింది.  “అన్నం పెట్టుకోలేక ఊళ్ళో వాళ్ళ మీదకు తోలతన్నావా పిల్లని?  మాకే గతి లేక చస్తా ఉంటే నా పిల్ల దాని చేతిలోది తీసుకుని తింటంది ఇది”  అని చిట్టి అమ్మని తిట్టింది.  చిట్టి అమ్మ ఏమీ చేయలేక చిట్టి వీపు మీద నాలుగు గుద్దులు గుద్ది చిట్టినే వాటేసుకుని ఏడ్చింది.  అది గుర్తొచ్చిన చిట్టి చిన్న పాప ఇస్తున్న కేకుని తీసుకోకుండా వణికిపోసాగింది.

 

పెద్ద పాప లోపల్నించి వాళ్ళమ్మని తీసుకొచ్చింది. నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలున్న చీర కట్టుకున్న ఆమె చాలా అందంగా ఉంది.  చిట్టి ఆమె వైపు భయంగా చూసింది.  ఆ చూపులోని భయాన్ని, వణుకునీ, కలవరాన్నీ చూసిన విమల సముదాయింపుగా “ఎందుకు భయపడుతున్నావు?  తీసుకో – తిను” అంటూ చిన్న పాప చేతిలోని కేకుని తీసుకుని చిట్టికి పెట్టింది.  చిట్టికి భయం తగ్గింది. 

“సరోజా! ఇలా రా”  అంటూ కేకేసింది విమల.

సరోజ పరిగెత్త్తుకుంటూ బయటకు వచ్చింది.  “పాపకి ఆకలేస్తుంటే అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్?”  అంది విమల.

“మీ భోజనాలయ్యాక పెడతాలేమ్మా”  అంది సరోజ.

“అదేంటీ?  ఇంట్లో వండలేదా”  అంది విమల ఆశ్చర్యంగా.  చిన్న పాప, పెద్ద పాప చిట్టి వైపు దిగులుగా చూస్తున్నారు. 

“లేదమ్మా.  నాకు మీరిచ్చింది సరిపోతుంది.  చిట్టికి స్కూల్లో పెడతారు.  బంద్ అని స్కూలు తెరవడం లేదు.  అందుకని వారం రోజుల నుండీ ఇక్కడ తీసికెళ్ళిందే ఇద్దరం తింటున్నాం”  అంది.  మళ్ళీ తనే “బంద్ ఎందుకోసమమ్మా?”  అని అడిగింది.

 

“రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బంద్ చేస్తున్నారు.  నీకర్థం కాదులే – ఇట్లా చెప్తే.  ఇప్పుడూ మీ పేట ఉందనుకో – పెద్దమనుషులు దాన్ని రెండుగా చేసి కొంతమంది అటు ఉండండి కొంతమంది ఇటు ఉండండి అని విడదీశారనుకో.  విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు ‘అందరం కలిసి ఉందాం’  అని గొడవ చేస్తారు కదా!  అలా మన తెలుగు రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారని కలిసి ఉండాలనే వాళ్ళు బంద్ చేస్తున్నారు”  అని విమల సరోజకి వివరంగా చెప్పింది.

“కలిసి ఉన్నవాళ్ళని విడిపొమ్మనడం ఏంటమ్మా?  కలిసి ఉండండి అని చెప్పాలిగాని” అంది సరోజ.

“అటుప్రక్క వాళ్ళు విడిపోవాలంటున్నారుగా” అంది విమల.

“ఇదేదో అత్తా కోడళ్ళ తగాదా లాగా ఉందమ్మా. పెత్తనం తనకే ఉండాలని అత్త కలిసి ఉందాం అంటుంది.  అత్త ఉంటే పెత్తనం రాదు కాబట్టి విడిపోవాలంటది కోడలు.  మా ఇళ్ళల్లో ఎన్ని జరగడం లేదు ఇట్టాంటి తగాదాలు.  అయినా పెద్దోళ్ళు గొడవ పడతా పిల్లలకి బడి లేకుండా చేస్తే ఎట్టమ్మా? మద్యాన్నమన్నం లేకుండా పోయింది”  అంది సరోజ.  సరోజ కళ్ళల్లో సన్నని నీటి పొర.

 

ఈ సమస్య గురించి అవగాహన లేని వాళ్ళకి దీని లోతులు  అంత తేలిగ్గా అర్థం కానుకున్న విమల “సరోజా! నువ్వనుకున్నంత చిన్న సమస్య కాదు ఇది కాని నువ్వన్నట్లు పిల్లలకి బడి లేకుండా చేయడం వల్ల ఎంతమంది చిన్నారులు ఆకలితో బాధపడుతున్నారో పాపంఅంది.

మాటలకి సరోజ కళ్ళల్లోని నీళ్ళు బుగ్గల మీదకి జారాయి.

విమల సరోజ భుజం మీద చేయి వేస్తూ   సరోజా! మీ పిల్లదానికి అన్నం ఇక్కడ పెడితే నేనేమైనా అంటానా?  స్కూలు తెరిచిందాకా రోజూ ఇక్కడే అన్నం పెట్టు”  అంటూ చిట్టిని సరోజతో వంటింట్లోకి పంపించింది. 

 

వాకిట్లో నిలబడి అంతా చూస్తున్న ఆమె స్నేహితులు కొందరు “ఇలా వాళ్ళని ఇంట్లో చేర్చావంటే నెత్తికెక్కుతారు.  ఎక్కడిదీ చాలదు”  అన్నారు. 

“ఫరవాలేదు.  మనం కొనే ఒక చీర ఖరీదు లేదు వాళ్ళు తినేది. ఎక్కడిదీ చాలకపోవడానికి  మనం వాళ్ళకేమైనా చీరలు సారెలూ ఇస్తున్నామా లేక జీవితమంతా పోషిస్తున్నామా?  వాళ్ళ పట్ల సానుభూతితో ‘మీకు కష్టం వచ్చినపుడు మేము ఉన్నాం’  అని అనడమే వాళ్ళకు మనం చేసే గొప్ప సహాయం.  అది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, ఓదార్పుని ఇస్తుంది”  అంది విమల. 

ఇలాంటి తన స్నేహితురాళ్ళని మెప్పించడం కోసం, వారి మెరమెచ్చుల కోసం తను నిన్న అప్పటికప్పుడు కొని కట్టుకున్న చీర  బరువైపోయినట్లుగా అనిపించసాగింది విమలకి.

 

  ***                     

radhaమండువ రాధ

సాహచర్యం

radhamanduva1

 

{రచయిత్రి రాధ మండువ మదనపల్లి కి దగ్గర లోని రిషీవాలీ స్కూల్లో తెలుగు టీచర్ గా పని చేస్తున్నారు. పిల్లల కోసం కొత్తపల్లి మాగజైన్ లో దాదాపు 25 కథలు రాశారు.)

నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటాను.  నాలోకి నేను చూసుకోవడానికి నేను ఏర్పరుచుకున్న ఈ ఒంటరితనం  నన్ను శిఖరానికి చేరుస్తుందా లేక లోయల్లోకి జారవిడుస్తుందా?  ఏదైతే మాత్రమేం?  నన్ను నేను తెలుసుకున్నాక.  అంతా ఒకటే అప్పుడు.  అసలు నాలోనే ఉన్న ‘ నేను ‘  ను వెతుక్కోవడానికి ఎందుకు ఇంత బాధ?  సహజంగా – మామూలుగా, అతి మామూలుగా, మంచి నీళ్ళు తాగినంత సులభంగా నాలోని నేనుని గుర్తించలేనా?  కళ్ళెత్తి చూశాను గర్భగుడిలో ఉన్న ఆ దేవదేవుడి వైపు – నా ప్రశ్నకి సమాధానం ఏమిటి అన్నట్లు.

నవ్వుతున్నాడు చిద్విలాసంగా.  అతని ప్రక్కనించి మెల్లగా నడిచి నా వైపే వస్తున్న ఆమెని చూడగానే సమాధానం కోసం ఆతృత పడబోతున్న నా మనసు నెమ్మదించింది.  సంతృప్తితో కూడిన సౌందర్యంతో వెలుగుతున్న ఆమె ముఖంలోని చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

” హారతి తీసుకోండి,” అంది నాకు దగ్గరగా వచ్చి.  ఆమె ఏమందో ఆమె పెదవుల కదలికల ద్వారా అర్థమైన నేను ఆమె చేతులవైపు చూశాను.  అప్రయత్నంగా హారతిని కళ్ళకద్దుకున్నాను.  కొబ్బరిముక్కను నా చేతిలో పెట్టి మెట్లు దిగి వెళ్ళి నందీశ్వరుడి విగ్రహం ప్రక్కగా వెలుగుతున్న హారతిని వదిలేసింది.  వెలుగుతున్న హారతిని చూస్తూ మళ్ళీ మెట్ల మీదకు వచ్చి కూర్చుంది నాకు కొంచెం ఎడంగా.

గోపురం మీద నుండి సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు.  గూళ్ళలోని పావురాలు మా ప్రక్కగా వాలి కువకువలాడుతున్నాయి.  ఆమెని పలకరించాలని, ఆమె ఎవరో తెలుసుకోవాలని తపనగా ఉంది.

” మీరు – మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు.  ఈ ఊరికి కొత్తవారిలా ఉన్నారు,” అన్నాను.

” అవును.  గుడికి మీరు రోజూ వస్తుంటారా?”

” ఊ ” అన్నాను ఆమె వైపే చూస్తూ – నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నట్లుగా ముఖం పెట్టి.

” నేను ప్రెసిడెంట్ రాఘవరావు గారి చిన్న చెల్లెల్ని ”  అంది.  నిర్లిప్తత ఆమె కంఠంలో స్పష్టంగా తెలుస్తోంది.

” నువ్వా! ” అన్నాను అప్రయత్నంగా.

” మీరు – నువ్వులోకి మారింది చూశారా!  నా గురించి చెప్పగానే ”  అంది ఆవిడ నవ్వుతూ.  ఆమెకేమీ సమాధానం చెప్పలేకపోయాను.

ఆమె ముఖంలో ఏ మాత్రం తొట్రుపాటు కాని, చేసిన పనికి పశ్చాత్తాపం కాని లేవు.  అదే సుందర దరహాసం.  శివుడి కోసం వచ్చిన పవిత్ర గంగలా అంత స్వచ్ఛంగా ఎలా ఉంది?  ఆమె గురించి నేను విన్నవన్నీ నిజమేనా?  ఇంట్లో పని చేసే పాలేరుతో లేచి వెళ్ళిపోయిందనీ,  అతన్ని కూడా వదిలేసి మరెవరితోనో ఉందనీ,  పాపం ఆ పాలేరు ఏ రైలు కిందో పడి చనిపోయాడనీ –  మరి ఆమె ముఖంలో ఆ సంతృప్తి , కళ్ళల్లో కాంతి ఎలా సంభవం?  –  ఏమిటిది?  లేచి పోయినంత మాత్రాన ఆమెలో సంతృప్తి ఉండకూడదా?  –

నా ఆలోచనల్లో నేనుండగానే ఆమె  మెట్లు దిగుతూ ” వెళ్ళొస్తానండీ ”  అంది.

నేను కూడా  ఆమె వెంట నడిచాను.  ముఖద్వారం దాటుతూ ఆమె ప్రక్కనే నడుస్తున్న నన్ను  చూస్తూ ” మీ గురించి ఇప్పుడే పూజారి గారు చెప్తే విన్నాను ”  అంది.

” మీ గురించి నాకూ తెలుసుకోవాలని ఉంది ”  అన్నాను ఆమెకి సమాధానంగా.  ఆమె మౌనంగా ఉంది.  ఏమీ మాట్లాడలేదు.

” మీ ఊళ్ళోని బడిలో ఉపాధ్యాయునిగా చేరి పదేళ్ళు అయింది. వరదల్లో భార్యాబిడ్డని పోగొట్టుకుని  ఒంటరివాడిని అయిందీ ఇక్కడే.  నాకు చేతనైనంతలో అందరికీ సాయం చేస్తున్నాను.  అయినా నాలో సంతృప్తి లేదు.  దాని కోసం నిరంతరాన్వేషణలో ఉన్నాను.  మీలో ఆ సంతృప్తిని చూశాను కనుకనే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ” అన్నాను.

నిదానంగా మాటలు పేర్చుకుంటూ ఏదో అలౌకికంగా మాట్లాడుతున్నాననేమో నన్ను గౌరవంగా చూస్తూ   ” నాక్కూడా నా గురించి మీకు చెప్పాలని ఉంది.  ఒకే అన్వేషణలో ఉన్న బాటసారులే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు ”  అని ఆగి  ” ఇప్పుడు సమయం లేదు.  ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పని ఉంది.  క్షమించండి మిమ్మల్ని మా ఇంటికి పిలవలేను.  పరాయి పురుషుడిని ఇంటికి తీసుకొచ్చిందని లోకం కూసే కూతలు వినే ఓపిక ఇక నాకు లేదు.  అంతేగాని భయం మాత్రం కాదు ”  అంది.

ఏవో జ్ఞాపకాలు ఆమె కళ్ళను తడి చేశాయి.  ఆమె కళ్ళలోని ఆ తడిని నేను చూడకూడదన్నట్లుగా తలవంచుకుని ” రేపు ఇక్కడే మాట్లాడుకుందాం. వస్తానండీ ” అంటూ త్వరత్వరగా నడుస్తూ వెళ్ళిపోయింది.

ఆమె పేరు అపురూప.  నిజంగానే ఆమె అపురూపంగా ఉంది.  స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నా కూడా ఆమె జ్ఞాపకాలు నాలో వేళ్ళాడుతూనే ఉన్నాయి.  చిత్రంగా ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను.  నిద్ర లేవగానే మళ్ళీ నాలో ఆమె జ్ఞాపకాలు.  ఆమె స్నేహభావం, నిస్సంశయంగా ఆమెని ఆమె వ్యక్తీకరించుకున్న విధానం,  ఆమె కళ్ళల్లోని కాంతి తల్చుకుంటూ అలాగే పడుకున్నాను.  స్త్రీ లోని స్నేహభావాన్ని మొట్టమొదటి సారిగా చవి చూడటం వల్లనో లేక హాయిగా నిద్రించినందువల్లనో తెలియదు కాని నా అంతరంగం పురి విప్పిన నెమలిలా ఉంది.

లేచి గబగబా కాలకృత్యాలు , స్నానం ముగించుకుని రోజూ వెళ్ళే సమయం కంటే ముందే గుడికి చేరుకున్నాను.  లోపలకి వెళ్ళాలనిపించలేదు.  నిన్న కూర్చున్న చోటే మెట్ల మీద కూర్చున్నాను.

చల్లని ఉదయపు గాలి, పక్షుల కిలకిలారావాలు స్థిర ప్రశాంతతను కలిగిస్తున్నాయి.  గర్భగుడిలో పూజారి చదువుతున్న లింగాష్టకం లీలగా వినిపిస్తుంది.  కొద్దిసేపటికి అపురూప హారతి పళ్ళెంలో కొబ్బరికాయ, పుష్పాలు, అగరొత్తులతో వచ్చింది.  నేరేడు రంగు పట్టు చీర, బంగారు రంగు జాకెట్టులో మెరిసిపోతుంది.  వదులుగా వేసిన జడలో మందారం తురుముకుంది.  నలభై ఏళ్ళ వయసులో కూడా ఆమె దేహం లావణ్యంతో కాంతులీనుతోంది.  నన్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.

లోపలికి వెళ్ళి పూజ ముగించుకుని వచ్చి నా ప్రక్కనే కూర్చుని ” మీ పూజ అయిందా ” అని అడిగింది.  ఆమెకి సమాధానం చెప్పాలనిపించలేదు.  గోపురం గూళ్ళల్లో ఉన్న పావురాలను చూస్తూ ” ప్రకృతిలో తెలియరాని రహస్యమేదో ఉంది.  విశ్వేశ్వరుని స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఆ రహస్యాన్ని ఛేధించాలి.  ఆ లీలా రహస్యం మీకు అవగతమైనట్లుంది కదూ! ”  అన్నాను.

నా మాటలకు సమాధానం లేదు.  తలతిప్పి ఆమె వైపు చూశాను.  మోకాళ్ళ పైన గడ్డం ఆనించి తలవంచుకుని కూర్చుని ఉంది.  ఆమె ఏడుస్తున్నట్లు నాకు అనుమానం కలిగింది.

” ఏమైనా తప్పుగా మాట్లాడానా అపురూపా! ”  అన్నాను ఆందోళనగా.

ఆమె పేరు నా నోటి నుండి వినడంతోనే తల ఎత్తి నా వైపు చూసింది.  ఆ తడి కళ్ళల్లో కూడా వెలుగే.  సందేహం లేదు.  ఈమె అనుభవించిన జీవితం అమెకీ వెలుగునిచ్చి ఉంటుంది.  నడి సముద్రంలో జరిపిన ఒంటరి యాత్రలో ఆమె దు: ఖాన్ని  జయించగలిగి ఉంటుంది.

తూర్పు దిక్కున బాలభానుడు సింధూరపు రంగును పూసుకుని ఉదయిస్తున్నాడు.  చల్లని ప్రభాతవాయువులు మందబడుతున్నాయి.

” నా గురించి మీరేం విన్నారో నాకు తెలియదు.  అహంకారం, అధికారం, డబ్బు నాకు పుట్టుకతోనే వచ్చాయి.  నా చుట్టూ ఉన్న వాళ్ళూ అంతే.  వాళ్ళ ద్వారా నా అహం తృప్తి పొందేది కాదు.  నేను చెప్పే ప్రతి మాటకూ తల ఊపుతూ నన్ను పొగుడుతూ అందలం ఎక్కించే మా పాలేరు చంద్రం దగ్గర నా అహం అణిగేది.  వాడికి నా పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి నా చుట్టూ తిప్పుకోవాలనో లేక యవ్వనపు పరువాల మైకంతోనో నా జీవితభాండాన్ని పొగరుతో ఒలకబోసుకున్నాను.  ఇంట్లో వాళ్ళకి తెలిసింది.  అర్థరాత్రి నా గది కిటికీలో నుండి నేను చూస్తూనే ఉన్నాను.  అరవకుండా చంద్రం నోట్లో గుడ్డలు కుక్కి గొడ్డుని బాదినట్లు బాది చంద్రాన్ని చంపేశాడు నా అన్న.  అప్పుడు భయంతో నేను వేసిన కేకకి నా మాట పడిపోయింది.  రాత్రికి రాత్రే నన్ను హైదరాబాదులో ఉన్న మామయ్య ఇంటికి పంపాడు.  చంద్రం చచ్చిపోతాడని ఊహించని నా అన్న తన పైన పోలీసు కేసు లేకుండా చేసుకోవడానికి చంద్రంతో చెల్లెలు లేచిపోయిందని పుకారు వేయడానికి కూడా వెనుకాడలేదు.

ఎప్పుడూ బిజీగా ఉండే మా ఎం. పి మామయ్య ఇంట్లో నా గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు.  నాకు నా అంటూ అక్కడ ఎవరూ లేరు.  ఆ నగర జీవితం నన్ను ఒంటరిని చేసింది.  చంద్రం చనిపోయిన సంఘటన వల్ల నాలో అహంకారం తగ్గింది కాని జీవితేచ్ఛ తగ్గలేదు. ఆ ఇచ్ఛే నన్ను ఒకరోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేట్లు చేసింది.  షాపింగ్ కి వెళ్ళొస్తానని మామయ్యతో చెప్పి కారులో బయల్దేరాను.  మామయ్య డ్రైవర్ కి పుస్తకాల పిచ్చి.  నవలలు మార్చి కొత్త నవలలు తెచ్చుకుంటానమ్మా అంటూ కారుని లైబ్రరీ ముందు ఆపి లోపలకి వెళ్ళాడు. గమ్యం లేని నాకు లైబ్రరీకి వెళితేనేం అని అనిపించింది.  నాకు తెలియదు అదే – ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేస్తుందని.

లోపల చల్లగా ఉంది.  చాలా మంది నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు.  డ్రైవర్ నన్ను చూసి ” ఆ గదిలో నారాయణ బాబు గారి ప్రసంగం జరుగుతోందమ్మా, లోపలకి వెళ్ళండి ”  అంటూ ఓ గదిని చూపించాడు.  లోపలకి వెళ్ళి తలుపు ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

” ప్రతి మనిషీ తనకేది సుఖాన్నిస్తుందో దానినే కోరుకోవడం సహజం.  ఈ మనస్సు ఆ కోరిక వైపు పరిగెత్తుతుంది.  అది దొరికాక మరొక దాని కోసం పరిగెత్తుతుంది.  ఈ కోరికలకి అంతూ పొంతూ ఉండదు.  కాబట్టి ఈ కోరికలు ఎక్కడనుండి పుడుతున్నాయో కనుక్కో.  పుట్టే చోటుని వెతికితే చాలు ఆశ్చర్యంగా అన్ని కోరికలూ, సందేహాలూ ఆగిపోతాయి ”  సన్నగా, పొడుగ్గా లాల్చీలో ఉన్న అతని మాటల్లో కొత్తదనం – ఎప్పుడూ ఊహించను కూడా ఊహించని మాటలు.  నాలో ఏదో శాంతి.

ప్రతిరోజూ అదే సమయంలో నారాయణబాబు ప్రసంగం ఉంటుందని తెలిసింది.  ఎవరితో మాటలు లేవు.  నిశ్శబ్దంగా ఆయన ప్రసంగం వినడం,  వాటిని గురించి ఆలోచించడం.  నాకు తెలియకుండానే నాలో మార్పు.  నా తలనిండా సందేహాలు నా మౌనాన్ని విడిచేట్లు చేశాయి.  నారాయణ బాబుతో చర్చలు – గంటలు నిమిషాల్లా గడిచేవి.  ఈ సారి నా తప్పేమీ లేదు.  నారాయణ బాబే నా సందేహాలు తీరుస్తూ నాకు దాసుడయ్యాడు.  స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న నేను,  నా జీవితం నాకుండాలని తపన పడుతున్న నేను –  ధైర్యంగా  అతనితో  నిజంగానే లేచిపోయాను.  నా ఉనికే భరించలేని నా కుటుంబం’ పీడా వదిలింది ‘ అనుకుంది.   పాలేరుని కూడా వదిలేసి మరోడితో లేచిపోయింది.  పాపం వాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అని మరో పుకారు లేపి ఊపిరి పీల్చుకుని ఉంటాడు మా అన్న.

నారాయణబాబు ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు.  పగలంతా ఇంటిపని చేసుకుని ధ్యానం లేదా పుస్తకాలు చదువుకోవడం.  సాయంత్రం లైబ్రరీలో అతని ప్రసంగాలు – నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది.

ఆరోజు – ఆఫీసు నుండి ఇంటికి వస్తూండగా నారాయణ బాబుని లారీ గుద్దింది.  ఎంత మందికో జీవన రహస్యాలని విశదీకరించిన నారాయణ బాబు రహస్యం గానే విశ్వంలో కలిసిపోయాడు.

‘నేను నీకంటే ముందు చనిపోతే నువ్వు మీ ఊరికి వెళ్ళిపో – స్వచ్ఛమైన ఆ పల్లెలో ప్రశాంతంగా బ్రతకొచ్చు.  ఎవరో ఏదో అంటారనే భయం నువ్వు తప్పు చేస్తేనే కలుగుతుంది.  సమాజ నీతిని నిర్లక్ష్యం చేస్తే కలుగుతుంది ‘ అని బ్రతికుండగా నారాయణ బాబు చెప్పిన మాటలే నన్ను మళ్ళీ మా ఊరికి చేర్చాయి  ”   ఏకబిగిన మాట్లాడిన ఆమె ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు క్షణం ఆగింది.

” నా గురించి నా వెనక ఏం మాట్లాడుకుంటున్నారో,  ఇంత కాలం ఎలాంటి కథలు అల్లారో నాకు అనవసరం ప్రసాద్ గారూ!  నా పూర్వజన్మ సుకృతం వల్లనో, నారాయణ బాబు సాహచర్యం వల్లనో’ నేను ‘  ను తెలుసుకుంటున్నాను.  ఈ పెంజీకటి కావల ఏముందో తెలుసుకోవాలని మీలాగే తపన పడుతూ అన్వేషిస్తున్నాను ”  అంది.  ఆమె గొంతులోని ఆర్తి రెపరెపలు నన్ను కదిలించాయి.  నేనేమీ మాట్లాడలేదు.  అసలు నాకు మాట్లాడాలనిపించలేదు.  దాదాపు గంట సేపు మా ఇద్దరి మధ్యా మౌనం భాషను తరంగాల రూపంలో ప్రసారం చేసింది.

” వెళ్ళొస్తానండీ ”  అంటూ నా అనుమతి కోసం చూడకుండా కనీసం నా వైపైనా చూడకుండా మెట్లు దిగింది.  ఎర్రగా కాలినట్లున్న ఆమె జడలోని మందారాన్నే చూస్తున్నాను.  హఠాత్తుగా ఏదో మరిచిపోయిన దాని మల్లే వెనుదిరిగి ఆమె నాకు దగ్గరగా వచ్చింది.  పళ్ళెంలోని కొబ్బరి ముక్కను నా చేతిలో ఉంచి కదిలిపోయింది.

వెనుదిరిగి నా దగ్గరకి వచ్చే ఆమెని చూసి నేనేం ఊహించానో మరి నా మనసు తీవ్ర ఆశాభంగానికి లోనయింది.  ఓ దీర్ఘ నిట్టూర్పు నాలోనుండి వెలువడింది.  నా మనసేమిటో నాకు తెలిసింది.

” అపురూపా!  ఒక్క క్షణం ఆగు ”  ఆమెని పిలుస్తూ మెట్లు దిగి ముఖద్వారం వైపు పరిగెత్తాను.  నా గొంతులోని ఆతృతకి ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది.   నేను పరిగెత్తిన అలికిడికి ఒక్కసారిగా అరిచి పైకి లేచిన పావురాలు నిశ్శబ్దంగా మళ్ళీ మెట్ల మీద వాలాయి.  గుడి గోపురం నీడ మా ఇద్దరినీ కప్పేసింది.

” నీ గురించి ఇన్నేళ్ళూ ఈ జనం ఏం మాట్లాడారో, ఇప్పుడు నీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అపురూపా!  ఈ జనం నోళ్ళు మూతలు పడేట్లుగా అందరి ఎదుటా, వేదమంత్రాల సాక్షిగా నిన్ను స్వీకరిస్తాను.  అప్పుడే నారాయణ బాబు నీకందించిన సంతృప్తి మసి బారకుండా ఉంటుంది.  నీతో పాటు నా జీవితం సఫలమవుతుంది ”  అంటూ ఆమె అనుమతి లేకుండానే అప్రయత్నంగా ఆమె చేతిని అందుకుని నా చెంపకి ఆనించుకుని కళ్ళుమూసుకున్నాను.

ఆమె సున్నితంగా తన చేతిని విడిపించుకుంది.  ” క్షమించండి.  కాలం మించిపోయింది.  చిన్నతనంలో చేసిన తప్పులను, గాయాలను లెక్కచేయం.  యవ్వనంలో జరిగిన భావోద్రేకాలకూ భయపడం.  కాని ఇప్పుడు చిన్న గాయం గాని,  తప్పుడు భావం గాని సహించడం చాలా కష్టం.  నా వల్ల మీరు ఈ సమాజంలో గౌరవం కోల్పోయినప్పుడు – నా సంతృప్తిని మసిబారకుండా చేయాలన్న మీ ప్రయత్నం సంగతి అలా ఉంచండి – ఇద్దరం అశాంతి పాలవుతాం”  అని నా సమాధానం కోసం అన్నట్లుగా ఆగింది.  నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.  నా మనసంతా శూన్యంలో ఉన్నట్లుగా ఉంది.

“నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని నాకు తెలుసు.  వస్తానండీ ”  అంటూ ముఖద్వారం దాటి మలుపు తిరిగి  వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిందన్న స్పృహ కూడా లేకుండా అలాగే నిలబడిపోయాను.  నా మనసు ఆమె మాటల లోతుల్లో ఉన్న గాఢత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఆమె విచక్షణా జ్ఞానం ముందు తలవంచుతోంది.  గుడి గోపురమూ, పావురాల కువకువలూ, ఆమె రూపమూ అన్నీ నాలో ఐక్యమై ఎన్నడూ కలగని శాంతి కలగసాగింది.

అప్పుడు – ఆ క్షణం అర్థమయింది  – నేను ‘  ని  కనుక్కోవడానికి ఎంత గాఢత కావాలో.

 ***