పాత ఇల్లు …

రాజశేఖర్ గుదిబండి

రాజశేఖర్ గుదిబండి

ఆ పాత ఇల్లు ఇప్పుడొక జ్ఞాపకం

ఆ పాత ఇల్లు ఒక జీవితం

చరమాంకం కోసం తెరలు దించుకొని

సిద్ధంగా ఉన్న రంగస్థలి

ఒక జడివాన తరువాత

చూరునుండి జారే ఆఖరి చినుకు

ఋతువుల్ని రాల్చుకున్న ఒంటరి చెట్టు

కాలం చెక్కిలిపై ఎన్నో భాష్పాలు జారిపోయిన

ఒక ఆనవాలు.

ఆనందాల్ని దోసిలితో పంచి

దుఃఖం ఇంకించుకొని బావురుమంటున్న బావి

ఎన్నో ఆశల రేవుల్ని దాటించి ఇక ఈ ఒడ్డుకి చేర్చి

తెరచాప దించుకున్న ఒంటరి నావ.

తనను దాటిన గాలివానలు

తను దాటిన వడగాలులు

తనముందు కూలిన కలల చెట్లు

రాలిన నవ్వుల పువ్వులు , కాయలు

ఇక వెంటాడే గతం

 ANNAVARAM SRINIVAS -2 copy

ఆ దారుల నడచిన బాల్యం ,

ఆ నీడన వొదిగిన తరాల వృధాప్యం,

ఆ ఒడిలో పెరిగిన నోరులేని జీవులు,

ఆ ఇంట నిండిన పాడిపంట,

ఇక తిరిగిరాని గతం.

ఎంతైనా ఆ  ఇల్లు ఇప్పుడొక  జ్ఞాపకం

మరో ఇల్లు చేరడం

కరిగిన కాలం తడి జ్ఞాపకాల్ని వొడి పట్టడం

జ్ఞాపకాన్ని ఇంకో జ్ఞాపకం తో ముడివేయడం

గతాన్ని వర్తమానంలోకి వంపుకోవటం

రాలిన జ్ఞాపకాల ఆకుల్ని ఎరువుగా మార్చుకుని

కొత్తగా ఆశల  చిగుర్లు కావడం

చిరుగుల కలల దుప్పటిని

కాలం దారంతో కలిపి కుట్టడం

చితికిన చితుకుల గూడుని వదిలి

మళ్ళీ  పుల్లా పుల్లా సరిచేసుకొని

కొత్త గూడు నిర్మించుకోవడం

ఆ ఇల్లు వదిలి మరో ఇల్లుకి మారటం

అమ్మ గర్భంనుండి పొత్తిళ్ళ కు మారటం

అమ్మ ఒడి నుండి ఊయలకి మారటం.

రాజశేఖర్ గుదిబండి

చిత్రరచన: అన్నవరం శ్రీనివాస్