ఒక్క నీకు మాత్రమే…

Ravi_Verelly

మలుపు మలుపులో మర్లేసుకుంటూ

ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో

ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ

తన కోసం కాని నడక నడుస్తూ

నది.

అట్టడుగు వేరుకొసని

చిట్టచివరి ఆకుఅంచుని

కలుపుతూ పారే

మూగ సెలయేటి పాట వింటూ

తనలోకి తనే వెళ్తూ

చెట్టుమీదొక పిట్ట.

 bird

నడిచి నడిచి

అలసి

ఏ చిట్టడివి వొళ్లోనో

భళ్ళున కురిసే కరిమబ్బులా

కనిపించని నీ దోసిట్లో

ఏ ఆకారమూ లేని

ఏ స్పర్శకూ అందని

ఒక్క నీకు మాత్రమే కనిపించే

ఒకానొక పదార్ధంగా కరిగిపోతూ

నేను.

కరిగి ప్రవహించడం తెలిసాకే-

మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

చుట్టరికం తెలిసింది.

– రవి వీరెల్లి

గ్రావిటీ

 

1

భూమి నుదుట తడిముద్దు పెట్టి

గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు

ఎదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.

 

2

తల్లికొమ్మలోంచి తలపైకెత్తి

కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు

నేల రాలాకే గలగలా మాట్లాడుతుంది.

 

3

తొడిమెపై తపస్సు చేసి

లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్న పువ్వు   

మట్టి పాదాలు తాకడానికి

ఏ గాలివాటానికో లొంగిపోతుంది.

 van_gogh_almond_tree

4

అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి    

చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు

చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి

అలల తలలను దువ్వుతాడు.

 

5

ఎప్పుడూ

కళ్ళనిండా కలల వత్తులేసుకుని  

ఆలోచనకీ అక్షరానికీ మధ్య తచ్చాడే నాకు      

 

ఆకులా  

పువ్వులా

చినుకులా 

అలను తాకే వెన్నెలలా

 

నిన్ను హత్తుకోవడమే ఇష్టం.

చిన్నోడి అమ్మ

RaviVerelly (2)
 
ఖాళీ అయిన కేరింతల మూటలు విప్పుకుంటూ 
బావురుమంటున్న ఇంటి ముందు
 
లోకంలోని ఎదురుచూపునంతా
కుప్పబోసి కూర్చుంటుందామె.  
 
పసుపు పచ్చని సీతాకోక చిలుక
పంచప్రాణాలని మోసుకొచ్చే వేళయింది.
 
పాలపుంతల నిడివి కొలిచొచ్చినంత గర్వంగా
విచ్చుకున్న రెప్పల్లొంచి వ్యోమగామిలా దిగుతాడు వాడు.
  
ఏళ్ళ ఎదురుచూపులు
ఆత్మల ఆలింగనంలో  
చివరి ఘట్టాన్ని పూర్తిచేసుకుని 
పలకరింతల పులకరింతలు ఇచ్చిపుచ్చుకుంటాయి
 
ఊరేగిస్తున్న దేవుని పల్లకి
భక్తుల భుజాలు మారినంత పవిత్రంగా
పుస్తకాల సంచి భుజాలు మారుతుందప్పుడు.
 
నాలుక రంగు చూడకుండానే
 ఐస్క్రీమ్ బార్ తిన్నాడో
పసిగట్టే ఆమె కళ్ళు
లంచ్ బ్యాగు బరువు అంచనా వేసి తృప్తిగా నవ్వుకుంటాయి.
 
వాడు  దార్లో పాదం మోపుతాడో తెలీక
రోడ్డుకీ ఇంటికీ ఉన్న  మాత్రం దూరం
లెక్కలేనన్ని దార్లుగా చీలి ఆహ్వానిస్తుంది.
poem (2)
 
ఆమె వెనకాలే వస్తూ వస్తూ
తలలెత్తి చూస్తున్న గడ్డిని ఓసారి పుణికి
చెట్టుమీని పిట్టగూట్లో గుడ్ల లెక్క సరిచూసుకుని 
ముంగిట్లో కొమ్మకు అప్పుడే పుట్టిన గులాబీకి ముద్దుపేరొకటి పెట్టి
నిట్టాడి లేని దిక్కుల గోడలమీద
ఇంత మబ్బు ఎలా నుంచుందబ్బా అనుకుంటూ
అటు ఇటు చూస్తాడు.  
 
అంతలోనే 
పొద్దున్నే వాణ్ని వెంబడించి ఓడిపోయిన
తుమ్మెదొకటి
కొత్త పూలను పరిచయం చేస్తా రమ్మని
ఝూమ్మని వానిచుట్టూ చక్కర్లు కొడుతుంది.
 
పసిపిల్లల చుట్టే తుమ్మెదలెందుకు తిరుగుతాయోనని 
ఆమె ఎప్పట్లాగే ముక్కున మురిపెంగా వేలేసుకుని
వాణ్ని ఇంట్లోకి పిలుస్తుంది.
 
పొద్దున్న ఆమె అందంగా రిబ్బన్ ముడి వేసి కట్టిన లేసులు
వాడు హడావిడిగా విప్పి 
చెవులు పట్టి సున్నితంగా కుందేళ్ళను తెచ్చినట్టు
అరుగు మీద విప్పిన బూట్లను ఇంట్లోకి తెస్తాడు.
 
దాగుడుమూత లాడుతూ
బీరువాలో దాక్కున్న పిల్లోనిలా
ఇంట్లో ఉన్న ఆటబొమ్మలన్నీ
వాడి పాదాల సడి కోసం
చెవులు రిక్కించి వింటుంటాయి.
 
పువ్వుమీద తుమ్మెద లాండ్ అయినంత సున్నితంగా
వాడు ఆమె వొళ్ళో వాలిపోయి 
కరిగించి కళ్ళ నిండా పట్టి మోసోకోచ్చిన క్షణాల్ని
జాగ్రత్తగా
ఆమె కాళ్ళ ముందు పోసి పూసగుచ్చుతాడు.
 
ఆమె ఎప్పుడో నేర్చుకుని మరిచిపోయిన
కొన్ని బతుకు పాఠాల్ని
మళ్ళీ ఆమెకు నేర్పుతాడు
 
తిరిగి ప్రాణం పోసుకున్న ఇల్లుతో పాటూ
ఆమె అలా వింటూనే ఉంటుంది
తన్మయత్వంగా.
 
 
(స్కూల్ బస్సు కోసం రోజూ ఇంటిముందు కూర్చుని ఎదురుచూసే చిన్నోడి అమ్మకు)
చిత్రం: జావేద్