పెరుమాళ్ మురుగన్ కి అక్షరాలా పునర్జన్మ!

image of judgement

-రమా సుందరి 

~

“పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

పోయిన  జనవరి 12న పెరుమాళ్ మురగన్, తమిళ నవల మాదోరుబాగన్ రచయిత తీవ్ర మనో వత్తిడితో యిచ్చిన  ప్రకటన.

“తనలో దాగున్న అత్యంత ప్రతిభతో సహా రచయితకు పునర్జన్మ ఇద్దాము. పెరుమాళ్ మురగన్ నువ్విక రాయి.”

ఈ సంవత్సరం జులై 5న రచయిత పెరుమాళ్ మురగన్ కు మద్రాస్ హై కోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ యిచ్చిన గొప్ప హామీ.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  శక్తివంతమైన శబ్దార్ధంతో వ్యక్తీకరించిన తీర్పు యిది. న్యాయస్థానాల అర్ధం కానీ పరిభాషకు భిన్నంగా – హృదయానికి దగ్గరగా, కవితాత్మకమైన భాషలో వెలువడిన ఈ తీర్పు సంవత్సరన్నర కాలంగా రచయితలు, కళాకారులు పడుతున్న మనో వేదనపై చిరుజల్లులు కురిపించి ఊరట కలిగించింది. సాహిత్యాన్ని, చట్టాన్ని  సమతూకంలో తూచి జయహో అనిపించుకొన్నది. “పుస్తకం అరుదుగా గాయం చేస్తుంది. ఎందుకంటే దాన్ని మూసి వేయటం తేలిక” అన్న ఒక రచయిత సల్మాన్ రష్దీ లాగానే “చదవటం యిష్టం లేకపోతే, పుస్తకాన్ని విసిరి కొట్టు” అంటూ మద్రాస్ హైకోర్ట్ జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్, పుష్ప సత్యన్నారాయణలు రచయితల పక్షం వహించారు.

సంజయ్ కిషన్ కౌల్ కళాకారుల పట్ల ప్రేమతో వ్యవహరించటం, కళాత్మక సృజనకు గౌరవం యివ్వటం ఈ రోజు కొత్త కాదు. 2008లో ప్రవాసంలోకి వెళ్ళి పోయిన ఎమ్మెఫ్ హుస్సైన్ కు దన్నుగా ఇదే జడ్జి నిలబడ్డారు. ఆ రోజు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న సంజయ్ కౌల్  ప్రాచీన, నవీన కళలు నగ్నత్వాన్నిఎప్పుడూ ఉపయోగించుకొన్నాయని  ఆ నాటి తీర్పులో పేర్కొన్నారు. స్త్రీ పురుషుల మధ్య కలయిక, లైంగిక పూజ.. ఈ రెండిటినీ ప్రాచీన కళ ఎప్పుడు తోసి పారేయలేదని చెప్పారు. అదే వాక్యాన్ని ఈ రోజు పెరుమాళ్ మురుగన్ కేసులో సంజయ్ మళ్ళీ వాడారు. ఎమ్మెఫ్ హుస్సైన్ తీర్పులో ఆయన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఛాందసవాదం అని చెప్పారు. ఇప్పుడు పెరుమాళ్ మురుగన్ కేసులో ‘మన సహనపు హద్దులు కిందకు పడిపోతున్నాయి. నిజమో అబద్దమో, ఎవరైనా సామాజిక ఆచరణ గురించి రాస్తే అది మనకు ఎంత మాత్రము ప్రమాదకరం కాదు’ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొంది,  కాంపస్ లా కాలేజ్ నుండి ఎల్ ఎల్ బీ డిగ్రీ పొందారు సంజయ్. మద్రాసు హైకోర్టుకు రాక ముందు ఆయన పంజాబ్, హర్యానా హై కోర్టులకు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.

నువ్వొక పుస్తకం రాస్తావు. ఆ పుస్తకం 5000 కాపీల వరకు అమ్ముడు పోతుంది. దాని అనేక అవార్డులు వస్తాయి. ఒక నాలుగు సంవత్సరాలు గడిచాక అది ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది. హటాత్తుగా కొందరు వ్యక్తులు అది మత భావాలను అవమానిస్తుందని బయటకు వస్తారు. అందులో భాష అసభ్యంగా ఉందంటారు. అసభ్యమైన అంశాలు ఉన్నాయని, అవి స్త్రీలను అవమానిస్తున్నాయని మొదలు పెడతారు. కులాన్ని భ్రష్టు పట్టిస్తుందని అంటారు. నడిరోడ్డులో పుస్తకాన్ని తగలబెడతారు. బంద్ కు పిలుపు యిస్తారు. ఊర్లో షాపులు బలవంతంగా మూయిస్తారు. (వ్యాపారస్తులు చాలా మందికి సాహిత్యం అంటే ఏంటో కూడా తెలియదు) కొంతమంది స్త్రీలు కూడా ఈ ఆందోళనకారులతో ఉంటారు. జిల్లా పాలనా యంత్రాంగానికి అది శాంతిభద్రతల సమస్యగా కనిపిస్తుంది. కలక్టరు ఆఫీసులో కట్టా(ఖాప్) పంచాయితీ జరుగుతుంది. రచయిత మెడలు అధికారులు వంచుతారు. ఆయనకు ‘సమ్మన్స్” జారీ చేస్తారు.  జరిగిన విషయాలకు ‘తీవ్ర పశ్చాత్తాపం’ ప్రకటిస్తున్నానని రచయిత అంటే ఆ పదాన్ని ‘షరతులు లేని క్షమాపణ’గా మార్పిస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న డొల్లతనాన్ని మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది. ఒక నవల తన స్వభాషలో నాలుగు సంవత్సరాలు నానింది అంటే అది ప్రజల ఆమోదం  పొందినట్లే. ఇంగ్లీష్ అనువాదం తమిళ మాతృకకు ఆధునిక రూపం మాత్రమే. అందులో తమిళంలోని వాడుక పదాలు కానీ, నుడికారాలు కానీ, జనపదాలు వాడే మొరటు భాష కానీ ఉండవు. సొంత భాషలో లేని అసభ్యత ఇంగ్లీషులో ఎలా కనిపించింది? అని ప్రశ్నించింది. పాలనా యంత్రాంగానికి ఈ పుస్తకం పట్ల ఎలాంటి అభ్యంతరం లేకుండానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి భద్రతల పేరుతో అది ఇప్పుడు ఈ విషయంలో కలగచేసుకొన్నది. కళలు సంస్కృతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ యంత్రాగం ప్రమేయం ఎంతవరకు ఉండాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కళాకారుని వ్యక్తీకరణను చంపటానికి కేవలం ఒక గుంపు ఆవేశాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని చెప్పింది. పాలనా యంత్రాంగంతో కూడిన ఈ చట్టాతీత కోర్టులు తమ సొంత సిద్దాంతాల తోటి సామాజిక, నేర విషయాలను పరిష్కరించబూనుకోవటాన్ని తప్పు పట్టింది. మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’  అనే మాటకు అర్ధం ఉండదని స్పష్టం చేసింది.

ఇంత వివాదానికి కారణమైన మదోరుబాగన్ లో ఉన్న కధాంశం కేవలం పిల్లలు లేని తల్లిదండ్రులకు సమాజం నుండి వచ్చే వత్తిడి గురించిన అంశం మాత్రమే. ఆ వత్తిడి స్త్రీ, పురుషులకు యిద్దరికీ ఉన్నప్పటికీ  స్త్రీల మీద పడే భారం చర్చించటమే ఈ కధలోని  అంశం. పెళ్లయ్యి పన్నెండు సంవత్సరాలు అయిన తరువాత కూడా సంతానం కలగక పోవటం కాళి(పురుషుడు), పొన్న(స్త్రీ)లకు పెద్ద సమస్యగా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో తిరుచెంగొడులో ఉన్నఅర్ధనారీశ్వర ఆలయానికి జరిగే తిరనాళ్ళలో పధ్నాలుగోనాడు జరిగే రధోత్సవ సమయంలో అపరిచితులైన మగవాళ్ళతో సంపర్కించి స్త్రీలు సంతానాన్ని పొందుతూ ఉంటారు. అలా పుట్టిన పిల్లలు దేవుడి పిల్లలుగా చలామణి అవుతుంటారు. ఈ కధలోని పొన్న కూడా అలా సంతానాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది.

Kishan-Kaul_YT

ఒక కధ సమాజం మీదా ఎలాంటి ప్రభావం కలుగచేస్తుందో తెలుసుకోవాలంటే  రచయిత చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు వివిధ స్థాయిల, వయసుల పాఠకుల దృష్టి కోణం నుండి కూడా చూడాలని అభిప్రాయపడింది. హేతుబద్దత, బలమైన వ్యక్తిత్వం, దృఢమైన మనస్తత్వం కల వ్యక్తి దృష్టికోణాన్ని గీటురాయిగా తీసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలను ప్రమాదకరంగా భావించే వారి దృష్టికోణాన్ని స్టాండర్డ్ గా తీసుకోకూడదని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అలా చూస్తే ఈ కధలో తప్పు ఏమీ కనబడలేదని కూడా చెప్పింది. ఈ కధ నవలీకరణ చెందిన చరిత్ర కాదని, జనపదాల్లో ప్రచారంలో ఉన్న సంగతులనే రచయిత కాల్పనికం చేశాడని చెప్పింది. ఇది విజేతల చరిత్ర కాదనీ, సామాన్యప్రజలు రోజూవారి పడుతున్న కష్టాల కధ అని చెప్పింది. కోర్టు స్త్రీల వైపు నిలబడి..   స్త్రీలు పరపురుషుడితో, అందునా అపరిచిత పురుషునితో స్త్రీలు సంపర్కానికి యిష్టపడరనీ, పిల్లల కోసం సమాజం వాళ్ళను ఆ పని పురికొల్పి వుండే అవకాశం ఉందని అన్నది.

ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రచురణకర్తల వైపు నుండి వాదించిన లాయర్ సురేశ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన  సంగతులు ముందుకు తీసుకొని వచ్చారు. ‘రధోత్సవంనాడు పిల్లలు లేని స్త్రీలందరూ పురుషుల కోసం వీధుల్లో సంచరిస్తుంటారు’ అని పెరుమాళ్ రాయటం స్త్రీలకు అవమానకరం అని పెరుమాళ్ మీద దాఖలు చేసిన పిటీషన్ ను ఉద్దేశిస్తూ సురేశ్ వర్ధమాన కాలంలో స్కానింగ్ సెంటర్లను గురించి ప్రస్తావించారు. అక్కడ స్త్రీలు స్కానింగ్ తీయించుకోవటానికి గుంపులు గుంపులుగా పొద్దున తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు వేచి ఉండటం పెరుమాళ్ళు వర్ణించిన రధోత్సవం నాటి స్త్రీల గుంపులను గుర్తుకు తెస్తుందని అన్నారు. ఒక స్త్రీ స్కానింగ్ కోసం మంచం మీద బట్టలు తొలగించి పడుకొని ఉండగా, ఇంకొక స్త్రీకి అదే స్థితిలో స్కానింగ్ తీస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి పురుషులు కూడా అక్కడికి డాక్టర్ తో మాట్లాడటానికి వస్తుంటారనీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీలను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు. ఆ అవమానాన్ని పిల్లల కోసం స్త్రీలు పడుతుంటారని అన్నారు. పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉంటే ఇతర పురుషుల వీర్య కణాలు కూడా స్వీకరించి స్త్రీలు గర్భవతులవుతున్నారనీ, అందుకు పురుషుల ఆమోదం కూడా ఉంటుందని అన్నారు. పెరుమాళ్ళు కధను తప్పు పడుతున్న నైతిక పోలీసులు ఈ విషయంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. వంద సంవత్సరాల క్రితం అమలులో ఉందని చెబుతున్న ఒక ఆచారాన్నికధలో జొప్పిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తూ ఈ నవల ఈ ఆచారాన్ని గ్లామరైజ్ చేసి వాడుకోలేదని చెప్పారు.

పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా  సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

 

సంజయ్ కిషన్ కౌల్ సాహిత్య కారుల పట్ల ప్రదర్శించిన ప్రేమ అభిమానం గొప్పవనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే నవలలోని కధను సమర్ధించటానికి ఆయన ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని అతిగా పొగిడినట్లు అనిపిస్తుంది. స్త్రీలకు సంబంధించి పురాతన సాహిత్యంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు (పాత కాలంలో) శృంగారం గురించి యదేచ్ఛగా చర్చించేవారనీ, బ్రిటీష్ వాళ్ళు వచ్చి అంతా పాడు చేశారన్నట్లు మాట్లాడారు. ఒకానొక చోట దేవదాసీ పద్దతిని కూడా వెనకేసుకొచ్చినట్లు అనిపించింది. మహాభారతంలో అంబిక, అంబాలిక, కుంతి, మాద్రిలను  ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు. భర్తలు లేకుండా వీళ్ళు పిల్లలను కనటం ఉదాహరణగా చూపించారు. ఈ రకమైన ఆచారాలు ప్రాచీన సమాజంలో ఉండేవి, వాటి అవశేషాలు వందేళ్ళ క్రితం సమాజంలో ఉండి ఉండవచ్చు అని చెప్పటంలో అర్ధం ఉంది కానీ, అవన్నీ మనం కోల్పోయామన్నట్లు వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఉన్న  భూస్వామ్య సమాజంలో వ్యక్తిగత ఆస్తి విధానాన్ని కాపాడటానికి స్త్రీలను పరికరాలుగా వాడుకొన్నారనేది వాస్తవం. వాళ్ళ సెక్సువాలిటీ మీదా వారికే హక్కు లేని కాలంలో అది వారి శృంగార స్వేచ్ఛగా భావించటం సరైదేనా? దేవాలయాల మీద బూతు బొమ్మలను కూడా ప్రస్తావించారు. ఆ బొమ్మల్లో కూడా పితృస్వామ్య సమాజపు అసలు స్వరూపం నగ్నంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని ఒక నాటి మన చరిత్రగా చెబుతూ దాన్ని కూడా నిషేదిద్దామా అని ప్రశ్నించారు.

‘మళ్ళీ లేచి నిల్చొంటానని’ పెరుమాళ్ళు మురుగన్ అనటం ఆనందకరం. కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకం గట్టిగా ఊపిరి పీల్చుకోంటోంది. వేల గొంతులతో, సంతోషం నిండిన హృదయాలతో ఈ తీర్పును ఆహ్వానిస్తోంది. అయితే సెక్షన్ 292 పాము పడగ కిందే యింకా సృజనకారులు ఉన్నారు. రచయిత హృదయం ఎరిగిన సంజయ్ కిషన్ లాంటి న్యాయాధీశులు మనకు ఎంత మంది ఉన్నారు? ఎమ్మెఫ్ హుస్సేన్ నుండి పెరుమాళ్ మురుగన్ వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షించడానికి అవిరామంగా కష్టపడిన  జడ్జీలు ఎందరు? తొంభై ఏళ్ల చిత్రకారుడు తన కాన్వాస్ దగ్గర బొమ్మలు వేసుకొంటూ తన యింట్లోనే ఉండాలని వాంఛించిన అత్యున్నత న్యాయ స్థానాలు మనకు ఎన్ని? చట్టాలను దాటి  రచయితల కోసం సౌందర్యాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకొస్తున్న వారు ఎవరు? ‘కళ రెచ్చగొట్టేటట్లే ఉంటుంది. అది అందరి కోసం కాదు. అందరూ తనను వీక్షించాలని కూడా కోరుకోదు. చూసేవాళ్ళ అభిరుచి  మీద అది ఆధారపడి ఉంటుంది.’ అనగల దమ్మున్న జడ్జీలు సంజయ్ కాకుండా మనకెవరు ఉన్నారు?

*

 

 

 

వాటే ఫాల్‌! వాటే పిటీ!

 

రమా సుందరి 

 

ramasundariచలసాని స్మృతిలో వరవరరావుగారు ఒక వ్యాసం రాశారు. అందులో విరసం పుట్టుకను, అందులో చలసాని పాత్రను చర్చించారు. దానిపై రంగనాయకమ్మగారు స్పందించారు. ఆమె అభ్యంతరాలేవో ఆమె చెప్పారు. అవన్నీ రాజకీయ పరమైనవే. అందులో వ్యక్తిగతమైన విమర్శ కించిత్తులేదు. ఆ అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తామా, లేదా అనేది వేరే చర్చ. అక్కడక్కడా ఆమె ఉపయోగించిన టోన్‌తో, లాజిక్‌తో ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చును. మన ఇబ్బందులేవైనా సరే, ఆమె కొన్ని రాజకీయ ప్రమాణాలను ముందు పెట్టుకుని ఆ మేరకు విమర్శించారు. ఇట్స్‌ఎ పొలిటికల్‌పీస్‌.

కానీ వసంతగారి కవిత్వంలో ఏమున్నది. అది కవిత్వమా కాదా అనే చర్చను కాసేపు పక్కనబెడదాం. కవిత్వమే అనుకుందాం. ఏమిటీ ఆమె చెప్పదలుచుకున్నది? రంగనాయకమ్మగారి పుస్తకాల పేర్లకు అటూ ఇటూ తోచిన పదాలేవో అల్లి వెటకారాన్ని వెదజల్లడం తప్ప. రంగనాయకమ్మగారి వెటకారం కంటేనా అనబోదురేమో! ఆమెక్కడా అప్పొలిటికల్‌విమర్శ చేయగా నేను చూడలేదు. ఆమె తర్కంతో టోన్‌తో అన్నివేళలా ఏకీభవించకపోవచ్చు కానీ అప్పొలిటికల్‌ అనైతే ఎవరమూ అనలేము కదా!

కానీ ఇందులో ఏమున్నది? ఆ కవిత్వం చదువుతుంటే తెలీకుండానే మెటికలు విరిచిన చప్పుడు వినిపిస్తే అది పాఠకుడి తప్పవుతుందా! శాపనార్థాలు పెట్టే పెద్దమ్మల ధ్వని తప్ప మరో ధ్వని ఉన్నదా! పైగా ఆమె రాసింది గొప్ప కవిత్వమన్నట్టు కొందరు ఎంఎల్‌పార్టీ వారు కూడా దాన్ని సెలబ్రేట్‌చేసుకోవడం? క్యా చల్‌రహా హై భయ్‌..ఇస్‌దేశ్‌మే! శత్రువుకు శత్రువు మిత్రుడన్న అల్పసంతోషత్వం తప్ప మరోటున్నదా ఇందులో! పాతకక్షలు తీర్చుకోవడం లేదా స్కోర్లు సెటిల్‌చేసుకోవడం లాంటిది కాకుండా మరో రకంగా చూడగలమా! మొన్నమొన్నటిదాకా ‘విప్లవశిబిరాన్ని చీల్చడానికి’ పుట్టినటువంటివారై ఉండిన వసంతకన్నబిరాన్‌గారు సడన్‌గా మరింత దగ్గరైపోయి రంగనాయకమ్మగారు ఎలా దూరమైపోయారో అవేం రాజకీయాలో అర్థం కావడం కష్టం.

నిజమే కావచ్చు. రంగనాయకమ్మ గారి వ్యాసాల్లో తడి లేకపోవచ్చును. మానవీయ స్పర్శ తక్కువని పించవచ్చును. సందర్భశుద్ధి ఉండొద్దా అని కూడా కొందరికి అనిపించవచ్చును. ఇలాంటి అభిప్రాయాలు బోలెడుండవచ్చును. కానీ ఆమేం రాసినా కొన్ని ప్రిన్సిపుల్స్‌ఆధారంగా రాసినవి.

ప్రిన్సిపుల్డ్‌పొలిటికల్‌బీయింగ్‌. ఎందరున్నారు మనలో! ఆ మాటకొస్తే ఈ తడి అనేది కూడా అమూర్తమైనది. కన్నబీరన్‌చివరి చూపు కోసం విప్లవాభిమానులు పరిగెత్తుకుంటూ పోతే బూడిద కనిపించింది. ఏం కొంపలు మునిగిపోయాయని ఇంత హడావుడిగా అనిపించింది. వసంతగారి లాజిక్కేదో ఆమెకుంటుంది. అది మనకు తడిలేకపోవడంగా కనిపించొచ్చు. ఆ విషయం మీద ఆర్కే గారు తన ఆవేదన ఏదో రాశారు కూడా! ఇవన్నీ మనం ఎక్కడ నిలబడి ఏ వాంటేజ్‌పాయింట్‌లో చూస్తున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. రాజకీయంగా ఏవైనా చర్చించొచ్చు. కానీ వసంత అంత పెద్ద మనిషి ఎవరో చిన్న పిల్లలు చేసినట్టుగా నాలుగు అక్షరాలను రాళ్లుగా మార్చి విసిరితే ఎలా!

ఎవరో ఫేస్‌బుక్‌లో కొన్ని ప్రశ్నలు సంధించి రంగనాయకమ్మగారు చలసాని ఇంట్లో ఉన్నారని ఆమె స్వయంగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చాలా సాయం పొందినట్టు ఆమె రాసిన విషయాల్ని గుర్తుచేశారు. ఇవేమి రాజకీయాలో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. వాళ్లు సాయం చేసిన విషయాన్ని రంగనాయకమ్మగారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తుచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయఅభిప్రాయాలకు తేడా చూడలేనంత దూరం ప్రయాణించామా మనం! వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించకూడదా!

వాటే ఫాల్‌! వాటే పిటీ!

*

చేసంచి – కాళ్ళ గజ్జెలు – ఒక ఉద్యమం

రమా సుందరి 

 

రమాసుందరి

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనసుకు నచ్చుతున్న కాలం అది. విశాఖలో పద్మ ఇల్లు వాటికి అడ్డాగా ఉండేది. “శ్రీకాకుళం లోన – చిందిన రక్తము/ కాల్వలై ప్రవహించే – కొండ వాగులలోన/ బండలెరుపెక్కినాయి – పోరాడ కొండలే కదిలినాయి.”  అరుణ గొంతు ఖంగుమని మోగుతుండేది ఆ ఇంట్లో. నేను వీర కళాభిమానినే కానీ కళాకారిణిని కాదు. పాటలు పాడే వాళ్ళమీద వెర్రి ఆరాధనతో ఉండేదాన్ని. పిల్లలకు పాటలు, డాన్సులు నేర్పటానికి కానూరి వెంకటేశ్వరరావు వచ్చి ఉన్నాడు. పాటలు నేర్పిస్తున్న కానూరి తాతకి ఒక చేతి సంచి మాత్రమే ఉండేది. దాంతోనే  ఆయన రాష్ట్రమంతా తిరుగుతాడని చెప్పారు. సాయకాలం నాలుగు నుండి ప్రాక్టీసు. పగలంతా ఖాళీ. మూడు వరుస గదులు ఉన్న ఇంట్లో వరండాలో వుండేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎండకు ఒక దుప్పటి కప్పేవాడు. ఎండకు అనుగుణంగా దుప్పటి దశను కటకటాల మీద మార్చుకొంటూ వుండేవాడు కానీ ఎంత మంది పిలిచినా లోపలకి మాత్రం పోయే వాడు కాదు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా ముఖానికి గుచ్చుకొంటున్న ఆ మధ్యాహ్నాలు నా జీవితంలో అతి ముఖ్యమైనవి. మనసా వాచా ఒక విప్లవ కళాకారుడిగా వందేళ్ళు బ్రతికిన మనిషి అంతరంగంతో ములాఖాతు చేసిన మధ్యాన్నాలు అవి.

అది పద్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, వరంగల్ జిల్లాలోని పల్లెలో ఒక చెట్టుకింద కావచ్చు, గుంటూరు చుట్టుగుంట సెంటర్ లోని మురికిపేటలో కావచ్చు, ప్రజాపంధా ఆఫీసు కావచ్చు, ప్రకాశం జిల్లా మద్దులూరు కావచ్చు, హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు … ఎక్కడ, ఎప్పుడు, ఎంత సేపు మాట్లాడానో గుర్తు లేదు కానీ ఆయన జీవితంలోని పార్శాలు నాకు సుపరిచితం అయ్యాయి. గత సంవత్సరం పీవోడబ్ల్యూ మహాసభల్లో ఆయన వందేళ్ళ పుట్టిన రోజును జరిపారు. వయసుతో బాటు ముడుచుకొని పోయిన ముఖంలో భావప్రకటన కష్టమైపోయి, వృద్దాప్యపు ఇక్కట్ల పూర్తి స్థాయిలో అనుభవిస్తున్న ముసలి ముంపున కూడా నన్ను గుర్తు పట్టి వెంటనే అడిగిన ప్రశ్న “ఎన్వీయస్ ఎలా ఉన్నాడు?” ఎన్వీయస్ కళాకారుడు కాబట్టే ఆ శ్రద్ధ.

ఎనిమిది దశాబ్ధాల రాజకీయ జీవితం. రాష్ట్రాన్నిచైతన్యవంతం చేసిన నాలుగు ఉద్యమాలలో ప్రవేశం. రాజకీయం, కళలు వేరు కాదనే దృక్పధం. “సాంఘీక ఆర్ధిక, రాజకీయాలు సమ్మిళితం చేసి ఆచరించే భౌతిక సమాజ రూపమే సంస్కృతీ”. సంస్కృతికి ఆయన ఇచ్చిన నిర్వచనం .. ఇవన్నీ ఆయన ఏ చెట్టుకు కాసిన కాయో విదితం చేస్తాయి. కళారంగానికి వర్గ దృక్పధాన్ని మేళవించిన మొదటి తరంలోని మనిషి ఆయన. ప్రజల చరిత్ర లేని ప్రజా కళలలను (జానపద కళలు) దేదీప్యమైన దారిలోకి మళ్లించిన వాడు. ‘విప్లవ కళాకారుల్లో తాతలుండరు. అన్నలు మాత్రమే ఉంటారు.” అనే విమర్శలో ‘వాళ్ళు ఎక్కువ కాలం విప్లవంలో కొనసాగలేరు. అనేక ప్రలోభాలు వాళ్ళను పక్కకు లాగుతాయి’ అనే వాస్తవం దాగి ఉంది. ప్రజానాట్యమండలి నుండి సినిమా ఫీల్డ్ కు సాగిన వలసలు ఈ విమర్శకు మొదటి స్టెప్పు. ఆ మిత్ ని బద్దలు కొట్టి చనిపోయేంత వరుకూ విప్లవ ప్రజాగాయకుడిగా, కవిగా, నృత్య శిక్షకుడిగా కొనసాగిన వ్యక్తి కానూరి. అలాగని కళాకారుడిగా తన పరిధులు ఆయన ఎప్పుడు దాటలేదు. కళారంగం రాజకీయ రంగానికి అనుబంధంగా వుండాలి కానీ అదే రాజకీయాలు నడవకూడదనే మాట చివరిదాకా పాటించాడు. చదివింది నాలుగో తరగతి అయినా తెలుగు పట్ల ఆయన మమకారం ఆయన మాటల్లోనే “తెలుగు భాషకు అన్ని ధ్వనులు పలుకగల అక్షర క్రమం వున్నది. తెలుగు సాహిత్యానికి శబ్ధ సౌందర్యం కలిగించే ఛందో రీతి ఉన్నది. తెలుగు సంగీతానికి సప్త ధ్వనులను కంట్రోల్ చేసే గుణమున్నది.”

kanoori 12

ఆయన ఏమి రాసినా అందులో పదునైన రాజకీయ విమర్శ ఉంటుంది. పదాల వాడకం కొద్దిగా మోటుగా కొట్టినట్లు ఉంటుంది. ఆయనను కదిలించిన విషయాలే ఆయన వస్తువులుగా అర్హత సంపాదించుకొంటాయి. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కాటూరు దురంతం గురించి రాసిన బుర్ర కధ కానీ, స్వతంత్ర భారతంలో బ్యూరోక్రసీని విమర్శిస్తూ రాసిన ‘ప్రగతి బాగోతం’ కానీ, శ్రీకాకుళ సాయుధ ప్రజా ప్రతిఘటన నేపధ్యంలో రాసిన ‘జనగానం’ కానీ ఆయన హృదయాంతరంగంలో బుసలు కొట్టి వెలువడ్డ తూరుపు ముక్కలే. అరుణోదయ రామారావు ఎక్కువగా పాడే కానూరి పాట  

“వీరగాధలు పాడరా… విప్లవ ధీర చరితలు పాడరా!

తూర్పు కొండల నడుమా – అరుణ కాంతుల జ్వాల

నగ్జల్ బరీలోన – నవయుగ శివలీల

 శ్రీకాకుళం గిరీ – సింహాల జయహేల

తీర గోదావరి గిరిజన శలభాల”  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొంటాయి. బాబ్రీ మసీదుని కూల్చాక “రాముడో దేవుడో  – నీకేదేమీ ఖర్మరో/ రాజకీయ రొంపులోకి నిన్నే దించారురో” అని ఆయన పెట్టిన గగ్గోలు ఇంకా చెవుల్లో మార్మోగుతుంది.

 

విరసంతో ఆయన అనుబంధం కూడా గొప్పదే. శ్రీశ్రీ , కొడవటిగంటి, రావి శాస్త్రి, కెవియార్ లాంటి ఉద్ధండులతో కలిసి పనిచేశాడు. కేంద్ర ప్రజా నాట్యమండలి బాధ్యుడిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, తెలంగాణా బాధ్యుడిగా వున్న రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ మొదలైన వాళ్ళతో ఆయనకు ఉన్న ఉద్యమ అనుబంధం ఆత్మగతమైనది. జంపాల, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య ఎన్ కౌంటర్లు ఆయనలో ఎంత సంక్షోభాన్ని రేపాయో, పార్టీ చీలిన ప్రతిసారి అవే తుఫాన్లు. ఒకటిన్నర సంవత్సరం ఆయన గడిపిన బళ్ళారి జైలు జీవితం ఆయన్ను అంత కంటే బాధ పెట్టి ఉండదు.

kanoori 9

చేతి సంచితో బయలుదేరి, పార్టీ ఎక్కడకు చెబితే ఆ బస్సు ఎక్కి నెలల తరబడి గ్రామాల్లో అరుణోదయ శిబిరాన్ని నిర్వహిస్తూ యువతీ యువకులతో, పసి పిల్లలతో స్నేహం చేసే ఈ  సంచారజీవి, బక్క పలచని పెద్ద మనిషి సొంత జీవితం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం నాకు ఆయన పరిచయం అయిన చాలా సంవత్సరాల తరువాత దొరికింది. ఆయనకీ ఒక ప్రేమ కధ ఉందనీ అది ఆయన సజీవ చలనానికి ఊతామిస్తూ ఉంటుందని ఆమె మరణించిన తరువాతే నాకు తెలిసింది. ఉత్తరాలు తప్ప ఫోన్లు లేని ఆ కాలంలో ఆమె మరణం పార్టీకి తెలియడానికి నెల రోజులు పట్టింది. ఆమె కోసం ఆయన రాసిన ‘ప్రణయ గీతం’ ప్రజాపంధా’లో అచ్చయింది. ప్రజాపంధాలాంటి పార్టీ అధికార పత్రికలో అచ్చయిన ఆ కవితలో కొంత భాగం.

కమ్యూనిజానికి టీకాటిప్పణి తెలియని

సాధారణ కమ్యూనిష్టు అభిమాని

ఎర్ర జెండాల కోలాహలం

 విప్లవ గీతాల బృందగానం

విని వెర్రెత్తి పోయే దరహాస రేఖ

తను నమ్మిన పార్టీ ముక్కలు చెక్కలై

మహానాయకులు పార్లమెంటరీ భక్తులై

స్వార్ధం తల బరువై స్వాతంత్ర్యం నక్కల పాలై

అమరవీరుల త్యాగాలు అంగడి సరుకై

ఓల్డు కమ్యూనిష్టు లీడర్లు

నయా కాపిటలిష్టు దళారులై

సోషలిజం అందని మ్రాని పండై

కల చెదిరి కలత చెంది

ఉస్సురని నిట్టూర్చిన హ్యూమనిష్టు

 నాటి తెలంగాణా సమర సింహాల చెల్లమ్మ

నేటి నగ్జల్ బరీ నరసింహాల అమ్మమ్మ

అర్ధ శతాభ్ధి సాంసారిక జీవితంలో లేదు విశ్రాంతి

 అలసి సొలసి ప్రకృతి ఒడిలో శాశ్వత శాంతి

ఆశించి వెళ్ళావా! దమయంతి! 

అని శోకించాడు. ఇది ప్రణయ గీతమా? కమ్యూనిష్టు ఆలాపనా? అయినా సంసార బంధనాలు లేని ఋషి అనుకొంటున్న ఈ మహానుభావుడికి ఈ బాధ ఏమిటి? ఆ దుఃఖం ఇంకో స్టాంజాలో

ప్రేమించి మనం పెళ్ళి చేసుకోలేదు

 ప్రేమోపాసన ఎట్లుంటుందో తెలీదు

 అమర ప్రేమకు అర్ధాలే తెలియవు

 ప్రపంచంలో ప్రేమ జంటలు, ఆదర్శ దంపతులు అసంఖ్యాకులు

అనగా వినడమే గాని ఆ గొడవలు అట్టే తెలియవు

అంతో ఇంతో అనురాగ సుధలు సేవించి సేద తీరిన సామాన్య ప్రేమికులం మనం.

ఈ కవిత నన్ను నిలబడనీయలేదు. ప్రేమించి తప్ప పెళ్ళి చేసుకోగూడదని పంతం పట్టిన వయసు అప్పటిది. ఇలాంటి దాంపత్యంలో ఉన్న పరమార్ధం కోసం అన్వేషిస్తూ మళ్ళీ కవిత చదవటం కొనసాగించాను. ఈ సారి దమయంతి  వైపు నుండి గొంతుక ఆయనే ఇచ్చాడు.

kaanuri tata books

అయినా నాకు తెలియక అడుగుతాను

నేనూ బుర్రున్న మనిషినే

నాకు రవ్వంత లోకజ్ఞానం ఎక్కించాలని నీకుంటేనా?

నీ కవిత్వాలు కాకరగాయలు లోకులకేనా?

అక్కడికి నీవో దేశభక్తునివి నేనో దెబ్బమ్మనా?

పెళ్ళాన్కి హోమ్ మినిష్టర్ హోదా యిచ్చేసి

కాళ్ళు కదిలే వీలు లేకుండా వంటింట్లో కుదేసి

జయ పరమేశా అని సంచి భుజాన తగిలించి

చెక్కేస్తాడయ్యా చైతన్య కళాకారుడు!

సాల్సాలు సంబడం!

ఏక్ బజా అయ్యింది

నీ బస్సుకు టయిమ్ అయింది

లేలేమ్మని వంటింట్లోకి నడిపించి

లేత వంకాయ శాకం కొసరి కొసరి తినిపించి

సంచి సాగరం నింపి

టిక్కెట్లు బద్రం

దిగే కాడ పదిలం

నీకసలే మతిమరుపు

ఒక కార్డు ముక్కన్నా రాసి పంపు

మల్లెప్పుడు రాకడ..?    

తడి అయిన కళ్ళతో ఆయన కోసం చూశాను. సర్వం పోగొట్టుకొన్నట్లు బేజారు పడ్డ ముఖంతో తల వేలాడేసుకొని కూర్చొని వున్నాడు ఒక మూల. ఈయన ఇక బ్రతుకగలడా అనిపించింది ఆ క్షణాన. కానీ నిజంగా బ్రతికి చూపించాడు తరువాత 30 సంవత్సరాలు., పార్టీ ఆఫీసుల్లో, ప్రజల మధ్యన. చివరకు పార్టీ ఆఫీసులోనే మరణించాడు. “మా కాలంలో ….” లాంటి అసంతృప్త, నిష్టూరపు వాక్యాలు ఎప్పుడూ ఆయన నోటి నుండి వచ్చేవి కావు. హృదయంలో కళాతపన కూసింత ఉంటే చాలు ఏ వయసు వారితోనైనా ఆయనకు సావాసమే. తరాలు అంటని స్నేహాలు చేసేవాడు. వంటి సుఖం గురించి ఎప్పుడూ కంప్లైంట్ ఉండదు. మజ్జిగన్నం ఉంటే చాలు. వ్యక్తి గత విషయాల ప్రస్తావన ఉండదు. స్థితప్రజ్ఞ విప్లవకారుడు ఆయన.

ఒంగోల్లో ఆయన బహిరంగ కార్యక్రమం ఉందంటే జనం ఎగబడతారు. ఆయన అభిమానులు అన్ని పార్టీలలో, రాష్ట్రమంతా ఉంటారు. తొంబ్బై ఏళ్ల వయసులోకూడా స్టేజ్ మీద  “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! కొయ్యరా కోతలు మొనగాడా!” పాటకు నృత్యం చేసినవాడు. ఆయన అభిమానులు పట్టుపట్టి ఎనభై అయిదేళ్ళ వయసులో ఆయన కళారంగ అనుభవాలు రికార్డ్ చేసి ‘కధ కాని కధ’ పేరుతో పుస్తకం తీసుకొని వచ్చారు. జంపాల ప్రసాదు టైమ్ లో ఉస్మానియా విద్యార్ధునులు కె. లలిత, గీతల నుండి …  అరుణోదయ విమల, వంగ పద్మ, సృజన, సుధ, అరుణ, విశాఖ పద్మ ఆయన శిష్యగణంలో ఆడపిల్లల పట్ల ఆయన శ్రద్ధ వేరుగా ఉండేది. మహిళా ఉద్యమంలో పనిచేసున్న మా పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు.

3315_front_cover

సతీశ్ చందర్ అంటారు “ఉద్యమం అంటే ప్రతిసారి మూడు తుపాకులూ, ఆరు మందు పాతరలే కానక్కరలేదు. ఒక డప్పూ రెండు చిటికెన పుల్లలూ కలిసినా ఉద్యమం అవుతుంది” అని.  అవును. రెండు చిరతలు, చిన్న డోలు, కాళ్ళకు గజ్జెలు కూడా ఉద్యమం అవుతాయి. బుర్రకధలు, హరికధలు, ఒగ్గు కధలు, జనగానాలు, గొంగళి ప్రదర్శనలు కూడా ఉద్యమాలు అవుతాయి. వీటన్నిటిని ఔపాసన పట్టి ప్రజల్లోకి దూకిన కానూరి ఉద్యమ రధసారధి అవుతాడు. 15 ఏళ్ల వయసులో యాంత్రికంగా కళారంగానికి వచ్చి గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి నిట్టాడిగా నిలబడ్డ కానూరి గారిని కేవలం కళాకారుడు అంటే సరిపోతుందా? శాస్త్రీయ సంగీతంలో తామే రచించి, స్వరకల్పన చేసి పాటలు పడే వారిని వాగ్గేయకారుడని అంటారు. తనకు తెలిసిన అనేక కళా రూపాల్లో ఒకదాన్ని ఎంచుకొని, దానికి రచన చేసి, బాణీ కట్టి, దానికి నృత్య రీతిని సమకూర్చి, గజ్జె కట్టి ఆడి, పాడి, తన చుట్టూవున్న వాళ్ళకు నేర్పించిన వారిని ఏమని పిలవాలో కానూరి తాతను అలాగే పిలవాలి. ఆయన పనిచేసి, నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన సాంస్కృతిక, సాహితీ సంస్థలు ప్రజానాట్యమండలి కానీ, అరుణోదయ సాహితీ సమాఖ్య కానీ, విరసం కానీ, ప్రజాస్వామిక రచయితల సంఘం కానీ ఆయన రచనలపై పూర్తి భరోసాతో ఉండేవి. ఎందుకంటే ఆయనది ప్రజల పంధా. అంగుళం కూడా దానిని అతిక్రమించడనే నమ్మకం. పేదప్రజలకు, వారి ప్రతినిధి అయిన విప్లవ పార్టీకి మాత్రమే నిబద్ధుడైనాడు కడ దాకా. ఆయన వందేళ్ళ పరిపూర్ణ  విప్లవ జీవితం ప్రజలకే అంకితం.

 

ఈ మరణం అనివార్యం అని తెలుసు. ఆయన మరణం చెందక ముందుకీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి? ఖమ్మం సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమాక్రసీ ఆఫీసులో కానూరి తాతను ఎప్పుడైనా చూడచ్చు అనే ఆశ ఇక ఇప్పుడు లేదు. నాలుగు తరాల కమ్యూనిష్టు మనస్తత్వాలను అవగతం చేసుకొని ఎప్పుడూ వర్ధమానంలో బ్రతికిన సాహిత్య, సాంస్కృతిక,   సాయుధ వీరుడు భౌతికంగా అదృశ్యమై ఫోటోలోనూ, ఆయన పుస్తకాలలోనూ, ఆయన ఆదర్శాలలోనూ మాత్రమే కనిపిస్తాడు ఇక. రెండు చొక్కాలు, కాళ్ళ గజ్జలు, ఒక చేతి సంచితో ఆయన నిరాడంబర విప్లవ జీవితం తప్పక ఎక్కడో, ఎప్పుడో ఒక గుప్పెడు మందికి దారి దీపం అవుతుంది. కళ్ల నీళ్ళు తుడుచుకొని, నిండు మనసుతో ఆయనకు ప్రణమిల్లడం తప్ప చేయగలిగినది ఏముంది? మహిళా ఉద్యమం ‘కల్చరల్ కలరా’ను పారదోలుతుందన్న ఆయన నమ్మకాన్ని మోసుకొని పోవడం తప్ప.

*

మళ్ళీ మళ్ళీ చదవాలి!

విమల
విమల

మార్చి 29 పతంజలి పుట్టిన రోజు 

మనకున్న అతి కొద్దిమంది అద్భుతమైన రచయితల్లో పతంజలి ఒకరు. ఈ వ్యవస్ధ పరమ నికృష్టంగా, నీచంగా వుందనీ, మానవ సంబంధాలు వంచన, అన్యాయం, కపటత్వం, అసమానతలు, హింస, దోపిడీ, దుర్మార్గాలతోనూ, సకల మానవీయ విలువల పతనంతోనూ భ్రష్టుపట్టి పోయాయని, మనంత హిపోక్రసీతో బతికే ప్రాణి ఈ భూప్రపంచం మీద మరొకటేదీ లేదని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాడు. సమాజ చలన సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే అక్షరం పతంజలి చేతిలో అస్త్రం అయింది. ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు, అధిక్షేపణలు లోనంతా డొల్లే అయినా, డాంబికాలతో, ఆత్మవంచన, పరవంచనలతో బతికే ఆధిపత్య కులాల జీవన విధానాన్నీ, బూటకపు ప్రజాస్వామ్యపు నాటకాన్నీ ఎండగడతాయి.

రావిశాస్త్రిలానే, పతంజలి కూడా రాజ్యం దాని అంగాలైన, న్యాయవ్యవస్ధ, పార్లమెంటరీ వ్యవస్థ, సాయుధబలగాలు, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే పత్రికారంగం ఎవరి కొమ్ముకాస్తాయో ఎలాంటి శషబిషలూ లేకుండా తెగేసి చెప్పాడు. ఆయన సృష్టించిన పాత్రలు, అవి చేసే తర్కము, వెక్కిరింతలు, చమత్కార సంభాషణలు, ఈ వ్యవస్ధను అపహాస్యం చేసి, దాని అసలు స్వరూసాన్ని నగ్నంగా మన ముందుంచుతాయి. గుండెలను బరువెక్కించే, మండించే, పదునైన, ప్రత్యేక శైలి పతంజలిది. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం వుండాలని, వస్తువే కాకుండా మనం చెప్పే విధానం,శిల్పం కూడా చాలా ముఖ్యమని నమ్మినవాడతను. మంచి సమాజంరావాలని, సమాజపు అంచులకి విసిరివేయబడ్డ దళితులు, స్త్రీలు తమదైన సాహిత్యాన్ని శక్తివంతంగా సృష్టిస్తారని, వ్యవస్ధలో వున్న సకల అంతరాలూ పోవాలనీ కోరుకున్న వాడు పతంజలి.

ఆయన ప్రాపంచిక దృక్ఫధం ఆయన రచనలన్నిటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాజ్యం తాలూకు హింసనీ, దుర్మార్గాన్నీ తప్పు పడుతూ రాయటంతో పాటూ, ఆయనకు తెలిసిన ప్రాంతపు జీవితాన్ని, అక్కడి భాషని, నుడికారన్నీ రాయటానికి పూనుకోవడం ఆయనే చెప్పుకున్నట్లు ఆయన సాహిత్యంలోని రెండవ దశ. ఖాకీవనం నవల చివరాఖర, సౌలభ్యం కోసం ఈ నవల తెలుగునాట, తెలుగు పాత్రలతో రాయటం జరిగిందనీ, వాస్తవంలో ఈ కధ తెలుగు దేశానికే పరిమితం కాదనీ, దేశంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగివుండవచ్చనీ చెబుతాడు. ఈ నవలే కాదు. పతంజలి ఇతర నవలలోని పాత్రలకీ, ఇలాంటి సర్వజననీయతే వుందనిపిస్తుంది. మానవ స్వభావాలు, వ్యవస్ధ దుర్మార్గాలు, అవి మారటం కోసం మనుష్యులు చేసే పోరాటాలు, వాళ్ళ ఆశలు, కలలు అన్ని చోట్లా దాదాపు ఒకటిగానే వుంటాయి. యధాతధ స్ధితిని రాసి ఊరుకోవటం మాత్రమే కాకుండా, ఆ స్ధితి మారాలని గాఢంగా కోరుకున్నాడు పతంజలి. ఏ వ్యవస్ధలనైతే ఆయన వెక్కిరించి, వాటి ముసుగులు తీసి అసలు రూపు మనకి చూపాడో, ఆ వ్యవస్థలు మరింత దుర్మార్గంగా ఇవ్వాళ్ళ ప్రజల్ని పీక్కు తింటున్నాయి.

హిందుత్వ శక్తులు అధికార పీఠానెక్కాయి. ప్రపంచీకరణ విషఫలితాలు, సమాజంలోని ఆర్ధిక అంతరాలు, కుల వ్యవస్ధ పురుషాధిపత్యం ఏ అట్టడుగు ప్రజల జీవితాల గురించి పతంజలి రాసాడో, ఆ ప్రజల జీవితాల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. పతంజలి మనకి దూరమైన ఈ ఆరేళ్ళ కాలంలో సమాజంలో హఠాత్తుగా చోటు చేసుకున్న పెద్ద మార్పులేవీ అంతగా లేవు. ఆయన మనకు సుదూరకాలపు రచయితేం కాదు. పతంజలి కానీ, ఆయనలా సమాజంలో మంచి జరగాలనీ, మార్పురావాలనీ రాసే రచయితల రచనలు కానీ అలాంటి మార్పు జరిగేంత వరకూ సమకాలీనతని కోల్పోవు. ఆతరువాత కూడా గత సమాజాల్ని అర్ధం చేసుకునేందుకు మనకు పరికరాల్ని అందిస్తాయి. పతంజలి సాహిత్యం అలాంటిదే.

పతంజలి సాహితీ సృజనంతా ఒకెత్తయితే, జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో ఆయన రాసిన కాలమ్స్‌, సంపాదకీయాలు పతంజలి భాష్యంగా వచ్చివవన్నీ మరొక ఎత్తు. వ్యాసాల్లో రాజకీయ అభిప్రాయాలను మరింత సూటిగా, స్పష్టంగా చెప్పేందుకు వీలుంటుంది. ఆయా పత్రికల యాజమాన్యాల వైఖరులను బట్టి కొన్ని సందర్భాల్లో రాయాల్సి వచ్చినా, కొన్ని అభిప్రాయాలు పంటికింది రాళ్ళలా చికాకు పెడతాయి. దానికన్నా ఆయన తన ఇంటర్వ్యూలలో, ఇతర రచయితల రచనల గురించి రాసిన సాహిత్య వ్యాసాలలోనూ తన ధృక్పధాల్ని, అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాడు. ప్రసిద్ధి చెందిన కొందరు రష్యన్‌ రచయితల్ని ఇప్పటికీ మనం మళ్ళీ చదువుకుంటాం. మనలోనూ, సమాజంలోనూ జరిగే మార్పులు, నూతన పరిణామాలను బట్టి ఆ రచనలు మనలో మళ్ళీ కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.అవి  కొత్త ద్వారాల్ని తెరుస్తాయి. వాటికి కాలదోషం పట్టదు. పతంజలి నవలలు, కధలు కూడా అలాంటివే.

 

వ్యంగ్యానికి చిరునామా పతంజలి                        

అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్

ఆధునిక తెలుగు సాహిత్యం గర్వించదగ్గ రచయితల్లో కె.ఎన్. వై. పతంజలిగారు ఒకరు. నవలాకారుడిగా, వ్యంగ్య రచయితగా, జర్నలిష్టుగా, ఆయుర్వేద వైద్యుడుగా ఆయన తెలుగు సమాజానికి విశిష్టమైన సేవలు అందించారు. ఇది వరకు అనేక మంది గొప్ప రచయితల రచనల్ని సంపుటాలుగా ప్రచురించి తెలుగు పాఠకులకు ఎనలేని సేవలు అందించిన మనసు ఫౌండేషన్ సంస్థవారు, ఇప్పుడు పతంజలి రచనల్ని కూడా వెలువరించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

పతంజలి రచనలు ఈనాటి సమాజానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయన అనేక సామాజిక వాస్తవాలను తన రచనల్లో వ్యంగ్యాత్మకంగా చిత్రించారు. ఆయన వ్యంగ్యం చాలా బలమైంది. పాఠకుల హృదయాల మీద అది బలమైన ముద్రను వేస్తుంది. మన సమాజంలోని అనేక వైరుధ్యాలను పతంజలిగారు చిత్రించినంత బలంగా చాలా తక్కువమంది చిత్రించారు. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది.

 

పుచ్చిపోయిన “నాలుగవ స్తంభం” గుట్టు విప్పిన పతంజలి

రమాసుందరి

రమాసుందరి

పతంజలి … ఇరవై ఒకటో శతాబ్ధపు ఆలోచనలను రగిలించిన అగ్గి. తల్లక్రిందులుగా వేలాడుతున్న సమాజపు పోకడ పట్ల ఆయనకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన గుండె పొరలు చీల్చుకొని, కంఠనాళాలు ఉబ్బి, కంటి జీరలు ఎర్రగా పొంగి … చివరాఖరుకు ఆయన కలంలోని సిరాతో  బులుగు రంగు అద్దుకొన్నాయి. ఆ బులుగు రంగు తీక్షణత వెటకారం అవతారం ఎత్తింది. ఆ వెటకారం ఒకసారి వీరబొబ్బిలిగా మారి మనసు లోగిళ్ళలో స్వేచ్ఛగా విహరిస్తూ మన హిపోక్రాటిక్ ఆలోచనలను మెల్లిగా నాకుతుంది. ఒక్కోసారి అదే వెటకారం గోపాత్రుడు రూపంతో భూమి బల్లపరుపుగా ఉందని వితండ వాదన చేసి గెలుస్తుంది.

సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని ఫోర్త్ ఎస్టేట్ బండారాన్ని మనకు పరిచయం చేసినమిత్రుడు పతంజలి. “వెర్రి వెధవ. నీకు రాజకీయాలేమిటి?” అంటూ ఒక మినిస్టర్ ని ఎకసెక్కం చేసే విలేఖరి ఈ కొత్త లోకాలలో గవర్నరు బంగాళా కాడా, అసెంబ్లీ మెట్ల మీదా ఉంటాడు. నిత్యం టీవీల్లో చూసే పరిసరాలే. పాత్రలే సామాన్య ప్రజానికానికి అపరిచితం. జర్నలిష్టుగా తనకు మాత్రమే తెలిసిన సత్య లోకాలను తెలుగు పాఠక లోకానికి సంశయం లేకుండా విదితం చేశాడు పతంజలి. పడి పోయిన రైల్లో డబ్బు, బంగారం దోచుకొనే రిపోర్టర్లతో మొదలు పెట్టి, ఆ దోపిడికి మూలాలు ప్రధాన మంత్రి  కుర్చీలోనే ఉన్నాయని నిర్భయంగా వెల్లడి చేశాడు. బొగ్గు నుండి, వేవ్ లెంగ్త్ దాకా అమ్ముకొన్న అధికార రాజకీయాలు గుర్తుకు రావటం లేదూ?

పత్రికలనైనా, ప్రపంచాన్నయినా శాసించేది డబ్బు. ఆ డబ్బు ముంగిట్లో తాగి దొర్లే విలేఖరులు కూడా ఈ వ్యవస్థలో భాగమే. తన స్వజనం గురించి నిర్మొహమాటంగా మొదలు పెట్టి పెట్టుబడికి సాగిల పడే పత్రికా యాజమాన్య  వైఖరిని ఆయన బట్టబయలు చేసి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా చెప్పవచ్చేదేమిటంటే ఇప్పుడు రాజకీయాలు, పెట్టుబడి, పత్రికలు మూడూ ఒకే శరీరానికి అంటుకొని ఉన్న మూడు ముఖాలు. ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో ముఖం కనబడుతుంది. పతంజలి! నువ్వు తొట్ట తొలిగా తొలిచిన రంధ్రంలో చూసిన లోకాన్ని  ఈ రోజు ఆమ్ ఆద్మీ 70 ఎం.ఎంలో చూస్తున్నాడు.

అక్షరాల మీద ప్రేమతో రిపోర్టరు వృత్తిలో చేరి, అదే అక్షరాల మీద జుగుప్సతో బతుకీడుస్తున్నవారు ఈ వృత్తిలో కోకల్లలు. కొత్త రాజధాని ప్రాంతంలో భూములిస్తున్న  రైతులు ఆనంద భాష్పాలు రాలుస్తున్నారనీ అబద్ధాలు రాసీ రాసీ అలసి పోవటం లేదా? వీడియోలలో ప్రశ్నిస్తున్న రైతులను కత్తిరించి కత్తిరించి చేతులు నొప్పి పుట్టటం లేదా? పతంజలి చెప్పినట్లు అక్షరాలు ఖాళీ పంజరాల్లాగా, ఓటి కుండల్లాగా, ఎవరినో దగా చేస్తున్నాట్లు, వేళ్ళ సందులో నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు అనిపించటం లేదూ? ఒక రాయి విసరలేక పోవటం, ఒక కత్తి దూయ లేక పోవటం, ఒక చెంపపెట్టు వార్త రాయలేక .. ప్రసారం చేయలేక పోవటం .. అక్షరాలను కడుపు కూటి కోసం, టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంటు కోసం  అమ్ముకొంటున్న అశక్తతని ఎన్నడో పతంజలి అర్ధం చేసుకొన్నాడు. ఆ అక్షర హత్యలనూ, ఆ గాయాలను సహృదయులైన తెలుగు పాఠకులకు చూపించే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ వర్గాల దృక్పధంతోనే జీవితాన్ని విశ్లేషించే మీడియా ప్రపంచపు మోసాన్ని జగద్విదితం చేశాడు.

రిపోర్టరు భార్యగా కాలరెగరేసుకొని తిరిగిన రాధిక అత్యాచారానికి, హత్యకు గురి అయినపుడు, ఆమెను పత్రికా రిపోర్టర్ల పేరంటాలుగా పేర్కొన్న దమ్ము పతంజలిది. “మందు బుడ్డీలకూ, పోసుకోలు కబుర్లకూ, అబద్ధాలకూ, కుట్రలకూ, క్షుద్ర రాజకీయాలకు అలవాటైనా పాపిష్టి ప్రెస్ క్లబ్ ను కూలదోసి మనందరం ఆవిడకు అక్కడ ఒక గుడి కట్టాలి.” అని  రెండు దశాభ్డాల క్రితం ప్రతిపాదించాడు పతంజలి. పేగులు తెగేదాకా  అత్యాచారానికి గురి అయి, చచ్చిపోయి ..  దేశమంతా అలజడికి కారకురాలైనా ‘నిర్భయ’ను కనీసం ‘ఇండియన్ డాటర్’ గా నిరాకరించే స్థితిలో ఇంకా మేము ఉన్నాము అని మీకు మనవి చేసుకొంటున్నాము పతంజలి!

“పాలక వర్గాలు తమ దోపిడీ స్వేచ్ఛకు ప్రమాదం అనిపించినప్పుడల్లా ప్రజాస్వామ్యానికి ముప్పు అని గగ్గోలు పెట్టినట్లే, మీరు మీ వ్యాపార స్వేచ్ఛకు హాని కలిగినప్పుడల్లా పత్రికా స్వేచ్ఛకు ముప్పు అని గోల చేస్తారు. వెర్రి నా ప్రజలు రెండూ నమ్ముతారు.”

ప్రజలు హక్కులను గుర్తు చేసుకోకుండా ఏమార్చి, వారి కలలు నులిమేసి .. పత్రికలు పాలక వర్గాలకు కొమ్ముకాస్తున్న ఈ వర్ధమాన సందర్భం, ‘పత్రికా స్వేచ్చ’ గురించి చేస్తున్న జపం ..  మనం పతంజలిని ఎంత స్మరించాలో కదా!

 

పతంజలిని చదువుతుంటే ఏమవుతుంది?

29-raghava
రాఘవరెడ్డి

పతంజలిని  చదువుతున్నప్పుడు ఏమవుతుంది? చిరునవ్వు మొలుస్తుంది. చురుక్కుమంటుంది. కసి రేగుతుంది. ఎప్పటి నుండో పేరుకు పోయిన కసి తీరుతున్నట్లుగాను తోస్తుంది. పదునైన కత్తి అంచు మీద పరుగు పెడుతున్నట్లు ఉంటుంది. గట్టిగా తొడపాశం పెట్టినట్లు ఉంటుంది. గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. ఆ అక్షరాలు పరమ  ధైర్యంగా, కరుగ్గా పదునెక్కి తోస్తాయి. సూటిగా, ధాటిగా వెంటాడే వాక్యాలై నిలుస్తాయి. కళ్ళు తెరిపిస్తాయి. భ్రమల్ని బద్దలుగొడతాయి. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకొంటూ, పడక్కుర్చిలో అలా ఆరాముగా పడుకొందామనుకొంటే ఎక్కడో తగిలి కసుక్కున గుచ్చుకొంటాయి. అసలు మనుషులంతా సగం మంది జైళ్ళలో, సగం మంది పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్ళు అంటూ అధారిటీ చేస్తాయి.

అయితే ఇంతకీ పతంజలిని ఇప్పుడు కూడా చదవాలా? ఈ పిజ్జా, బర్గర్ తరానికి ఆయనేం చెబుతాడు ఇప్పుడు? పాత వాసన కొట్టడా? కొట్టడు. మేడి పండు పొరలు వలిచి, “ఇదిగో ఇవిరా నాయనా దీని లుకలుకలు.” అని చూపెడతాడు. ఉన్న రంగులన్నీ కడిగేసి “ఇదిగో, ఇదీ అసలైన ముఖం.” అని తెలియ చేస్తాడు. మన సర్వ సత్తాక లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం .. ఎంత సుందరమైనదో, ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నత ఉదాత్త ఉత్కృష్టమైనదో మన కళ్ళకు కడతాడు. ఎంత గొప్ప స్వేచ్చ మనకుందో, అది మనం ఏం చేయనంత వరకూ మనకుంటుందో అర్ధం చేయిస్తాడు.

అయితే ఒక దుర్మార్గపు పనికి కూడా పూనుకొంటాడు. నాలుగు స్థంభాలూ కలిసి నమ్మకంగా నీ కళ్ళకు గట్టిన గంతలు ఉన్నాయే! నీకు చాలా సుఖాన్నిస్తున్న గంతలు. నా యిల్లు, నా పిల్లలు, నా పెళ్ళాం, నా భద్ర జీవితం అనుకొంటూ  వెచ్చగా రగ్గు కప్పుకొని, కమ్మగా నిద్ర పోవటానికి అవకాశం యిస్తున్న గంతలు. వాటికి ఎసరు పెడతాడు. పుస్తకం మూసి, పక్కన పెట్టి పడుకొన్న తరువాత కూడా వెంటపడి, వేధించి, కలల్లోకి దూరి నీ గంతలు దొంగిలిస్తాడు. వ్యవస్థను నగ్నంగా నీ ముందు నిలబెడతాడు. నీ శాంతిని దూరం చేస్తాడు. నిన్నూ నొప్పి పుట్టేటంతగా డిస్టర్బ్ చేస్తాడు. వీలయినంత వొంగి, లేదా నేలకు అంటుకొని సాగుతున్న ఆలోచనలను జుట్టు పట్టుకొని పైకి లేపీ, ‘నువ్వు సకశేరుకానివి రా నాయనా’ అని అనవసరంగా గుర్తు చేస్తాడు. నాలుగు చితుకులేరీ పోగు పెట్టి, మంట రాజేస్తాడు. శివుడాజ్నను ధిక్కరించకుంటే చీమలు నలిగిపోక తప్పవనీ నిరూపిస్తాడు. మనిషన్నాక ఒక పాట ఉండద్దా అంటాడు. పాటన్నాక ఒక చూపు ఉండద్దా అంటాడు.

మరి కొత్త తరం పాఠకులు? మీ గంతలు మీకే ఉండాలనుకొంటే, మీ నిద్రలు మీరు పోవాలనుకొంటే, డిస్టర్బ్ అవద్దనుకొంటే హాయిగా దేశభక్తితో సంచరించండి. ఈ వైపుకు చూడద్దు. ఈ పెద్ద సూటైన రాస ముక్కు పెద్ద మనిషి వైపు రావద్దు.

 *

పెరియార్ నడిచిన నేల మీద పెరుమాళ్ వేదన!

మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ‘మనుషులు’ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సంగతేమో గాని మనుషులుగా ఎదిగిన వాళ్ళు, కాలం గడిచే కొద్దీ మరింతగా మనుషులయ్యే లక్షణమున్నవాళ్ళు .. చనిపోతే అది అది విషాదమే. ఆ మనుషులు కళాకారులో, రచయితలో, శాస్త్రవేత్తలో, సమాజాన్ని కదిలించే .. సరైన వైపుకు నడిపించే చోదక శక్తులో అయినప్పుడు .. ఆ విషాదం మరింత పెద్దదైపోతుంది. సమాజ గతిక్రమానికి తీరని నష్టమవుతుంది. అయినా కళాకారులు, రచయితలు, శాస్త్ర వేత్తలు చనిపోతారా అసలు? చచ్చిపోయినా బతికుండగానే చచ్చిపోతారా? శుభ్రంగా చచ్చిపోతారు. అయితే ఎలా చచ్చిపోతారు?

కొందరేమో కొన్ని నాడీకేంద్రాలను మర్చిపోయి, కొన్ని స్పందనలను కోల్పోయి, తమకు తామే పరాయి వాళ్ళయిపోయి .. గడ్డకట్టి, ఘనీభవించి .. తమకు తామే ఒక ఇరుకైన కరుకైన, కానీ భద్రమైన గూడు కట్టుకొని .. ఆత్మహత్య చేసేసుకొంటారు. కొందరు అమాయకులు, పెద్దవాళ్ళవుతున్న తమలో ఉన్న పసివాడ్ని పోగొట్టుకోని వాళ్ళు, ఘనీభవించని హృదయాన్ని, అందులో ఉన్న చైతన్యాన్ని నిలిపి వుంచుకున్నవాళ్ళు .. పాపం! ఊహానీ, ఊహించే స్వేచ్చని, స్వేచ్చ నిండిన వ్యక్తీకరణనీ వదలని వాళ్ళు, పెరుమాళ్ మురుగన్ లాంటి పిచ్చి పంతుళ్ళు – ఆత్మహత్య చేసుకోలేరు. హత్య చేయబడతారు. “మేము చచ్చిపోయాం” అని బ్రతికుండగానే ప్రకటిస్తారు. మనలో తీరని గుబులు పుట్టిస్తారు. గుండెలింకా మిగిలే ఉన్న వాళ్ళకు కునుకును దూరం చేస్తారు. చూసే కళ్ళు ఉన్నవాళ్ళకు కన్నీళ్ళను తెప్పిస్తారు. చేతులున్నవాళ్లకు, ఆ చేతులకు వేళ్ళు ఉన్న వాళ్ళకు పిడికిళ్ళను మొలిపిస్తారు.

images

కొన్ని రోజులుగా తెల్ల గడ్డం పెంచుకొని తలవేలాడేసుకొన్న పెరుమాళ్ మురగన్ ముఖం దినపత్రికల్లో, జాలా పత్రికల్లో, బ్లాగుల్లో విరివిగా కనిపిస్తుంది. ఆ ముఖం రచనా వ్యాసంగం ఇష్టంగా, ఆహ్లాదంగా, తమలో రగులుతున్న భావోద్వేగాల ఆవిరులు బయటికి పోయే మార్గంగా, మనసులో సహజంగా వచ్చే ఊహలను అల్లుకుంటూ పోయే మానవ ప్రవృత్తిగా, ఆ ఊహలను కాగితం మీద చిత్రించి దర్శించుకోవాలనే కోరిక తీరే దారిగా భావించే వారందరిని వ్యాకుల పరిచింది. ఆ ముఖం దేశం నుండి వెళ్ళగొట్టబడిన హుస్సేన్ తొంభై ఏళ్ళ మైనారిటీ అభద్రతను గుర్తుకు తెస్తుంది. బహిరంగ వేదిక మీదకు ముస్లిం ఛాందసవాదులు మొహంపై రాళ్ళు రువ్వితే అదోలా చూసిన (క్షమించండి. ఆ  భావాన్ని నేను పదాలతో వర్ణించలేను) తస్లీమాకు ఆశ్రయం ఇవ్వలేని ఈ దేశ ఓట్ల రాజకీయం గుర్తుకు వస్తుంది. ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కానీ “మూలింటామె” రాసిన తరువాత నామిని పడిన ఆందోళనా, “ఎవరు ఏమనుకొన్నా ఈ కధ రాసి చచ్చిపోదామనుకొన్నాను” అన్న ప్రకటన కూడా గుర్తుకు వచ్చాయి. అన్నట్లు నామినీ కూడా ఆ నవలను ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు కదా.

సమాజంపై ధిక్కారంతో రాసిన రాత, గీసిన గీత, పాడే గొంతు నిషేదాలకు గురి అవటం ఇక్కడ కొత్త కాదు. అయితే దానికి సమాంతరంగా భావవ్యక్తీకరణ స్వేచ్చను చేతులు అడ్డం పెట్టి కాచుకొన్న ప్రజాస్వామిక హృదయాలకు కొదవ లేదు ఇక్కడ. అయితే ఈ సంఘటన మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నాగరిక ప్రపంచంలో జీవిస్తూ ఒక రచన చేసిన పాపానికి గడగడలాడుతూ ఘోరావ్ లకు, ధర్నాలకు, పుస్తకాల కాల్చివేతకు గురి అయ్యి .. జిల్లా యంత్రాంగం ముందు చేతులు కట్టుకొని నిలబడిన దీన స్థితి ఒక రచయితకు, అందునా పెరియార్ రామస్వామి నడయాడిన భూభాగంపై నివశించే వ్యక్తికి ఎలా దాపురించింది?

మతాన్ని, దేవుడిని, ఆర్య సంస్కృతిని ద్వేషించి, జీవిత కాలమంతా దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి గొప్ప ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి పునాది వేసిన పెరియార్ రామస్వామి నడిచిన నేల మీద ఒక రచయిత చేతులు కట్టుకొని కుల శక్తుల ముందు, మత శక్తుల ముందు తలవొగ్గడం ఎంత విచారకరం! సాంస్కృతిక ఉద్యమం పాదుగా చేసుకొని ఎదిగిన ఇప్పుడున్నఅక్కడి  రాజకీయవ్యవస్థ ఈ సంగతిపై స్పందించక పోవటం (చివర్లో స్టాలిన్ కంటితుడుపు వ్యాఖ్యలు తప్ప) ఇంకో  గొప్ప విషాదం. పెరియార్ ఆలోచనలు జీర్ణించుకొని పరిపుష్ట అయిన మద్రాసీ సమాజం ఈ విషయం పై ప్రదర్శించిన నిర్లిప్తత, నిరాసక్తత … ఆ సమాజం, అది అందించిన సాహిత్యం, కళలు, దృక్కోణాల పట్ల ఆశలు కలిగిన వారికి పెనుఘాతం. రష్యన్ సామ్యవాదం కూలినప్పటి దుఃఖం మళ్ళీ అనుభవమవుతుంది.

ఇంత గొడవకూ, గందరగోళానికి తెర తీసిన ఈ మదో రుబాగన్ నవలలో (One part woman) ఏమి ఉంది? పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు దాటిన పొన్న, కాళీ దంపతులకు పిల్లలు ఉండరు. అన్ని విధాలుగా సంతృప్తికరమైన సంసార జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులు ఈ కధా కాలానికి  (వంద సంవత్సరాల క్రిందటి) భూస్వామ్య సమాజపు వత్తిడులకు గురి అవుతారు. పిల్లలు పుట్టనందుకు స్త్రీగా పొన్న ఎన్ని అవమానాలు పొందుతుందో, పురుషుడుగా కాళీ కూడా అంతే అవమానాల పాలు అవుతాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమాభిమానాలు ఇంకో పెళ్ళికి ప్రేరేపించవు. కాళీ రెండో పెళ్ళి చేసుకొన్నా కూడా పొన్నను ఇంట్లో ఉంచుకొంటే చాలు అనే అంగీకారానికి పొన్న తల్లిదండ్రులు కూడా వస్తారు. అయితే కాళీ వివేకంతో వ్యవహరించి పొన్న పట్ల తన ప్రేమను ప్రదర్శించుకొంటాడు. పిల్లలు లేరనే సమాజపు సతాయింపులకు దూరంగా ఇద్దరు ఇంటికి పరిమితమై అన్యోన్యంగా బతుకుతుంటారు. అయినా ఆ సెగ వాళ్ళకు తగులుతూనే ఉంటుంది.

ఒక రోజు కాళీ తల్లి, పొన్న తల్లి సంప్రదించుకొని ఒక ప్రతిపాదనతో కాళీ తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది. పొన్న పుట్టింటికి దగ్గరలో ఉన్న తిరుచెంగొడే పట్టణంలో ‘పర్వత’ అనే (అర్ధనారీశ్వర రూపం) దేవుడుకి ఏటా తిరునాళ్ళు జరుగుతాయి. పధ్నాలుగు రోజులు జరిగే ఈ తిరునాళ్ళలో నాలుగవ రోజు దేవుళ్ళు కొండ మీద నుండి కిందకు వచ్చి పధ్నాలుగవ రోజు మళ్ళీ పైకి వెళతారని నమ్మకం ప్రజలలో ఉంటుంది. ఆ పధ్నాలుగవ రోజు దగ్గర ప్రాంతాల నుండి పురుషులు అక్కడ రాత్రి సంచరిస్తారు. వాళ్ళను ‘దేవుళ్ళు’ అని అంటారు. ఆ రాత్రి స్త్రీలు ఆ అపరిచిత పురుషులతో సంభోగించవచ్చు. వాళ్ళను దేవుళ్ళగానే చూస్తారు. ఆ నాటి సమాజం దాన్ని తప్పు పట్టదు. దేవుడితో సంభోగించినట్లే భావిస్తుంది. ఎక్కువగా పిల్లలు లేని స్త్రీలు ఈ తంతులో పాల్గొంటారు. పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటారు. పెళ్ళి కానీ అబ్బాయిలు ఒక అనుభవం కోసం ఇక్కడకు వస్తారు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలతో నయినా ఆ రాత్రి గడపవచ్చు. అలాగే స్త్రీలు కూడా.  ఆ ఒక్క రాత్రి అక్కడ ఉన్న దేవదాసీలను ఎవరూ పట్టించుకోరు.

‘ఈ రాత్రి అందరూ దేవదాసీలే’ అని వాళ్ళు నవ్వుకొంటారు. నిజానికి కాళీకి కూడా ఆ అనుభవాలు ఉన్నాయి. పొన్నతో ఆయన బంధం గట్టి పడ్డాక ఆ వ్యవహారాలన్నీ మానుకొన్నాడు. ఆ పధ్నాలుగవ రోజు పొన్నను అక్కడికి పంపితే దేవుళ్ళ వలన గర్భం వస్తుందని తల్లి తెచ్చిన ఆ ప్రతిపాదన అతనిని బాధిస్తుంది. భార్యను వేరే పురుషునితో ఊహించుకోలేకపోతాడు. తల్లిని కూడా అసహ్యించుకొంటాడు. అసలు  ఆ సంవత్సరం భార్యను తిరునాళ్ళకు పంపడు. పొన్నకు ఈ ప్రతిపాదన గురించి  చెప్పడు కూడా. ఈ  సంవత్సరం తరువాత ఒక రాత్రి ఆమెకు ఈ విషయం చెప్పి “వెళతావా?” అని అడుగుతాడు.

‘మావా, నీకు బిడ్డ కావాలంటే వెళతాను.’ అని అమాయకంగా చెబుతుంది పొన్న. కాళీ షాక్ తింటాడు. ఆ సమాధానాన్ని ఊహించలేదు అతను. పొన్న అతని ముఖాకవళికల నుండి తను తప్పు చేశాను అని గ్రహిస్తుంది.  అతన్ని ఆలింగనం చేసుకొని తన ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కాని కాళి ఆమెను ఇదివరకటి లాగా చూడలేక పోతాడు. తనకు తెలియకుండానే ఆమెను హింస పెడతాడు. ఒక సందర్భంలో పొన్న దండం పెట్టి ఇంతకంటే నన్ను చావబాదమని అడుగుతుంది. చివరకు పొన్న అక్కడకు వెళుతుందా, లేదా అనే విషయం అప్రస్తుతం. ఈ మొత్తం వ్యవహారంలో కాళి లోని అంతర్మధనం, అతను పడిన మానసిక సంఘర్షణ , పొన్న పడిన హింస ఈ కధలో ప్రధాన వస్తువు. పురుషాధిక్య సమాజం వలన పురుషుడు కూడా వెంపర్లకు గురి అవుతాడనేది ఈ కధాంశం.

ఆదిమ కమ్యూనిష్టు సమాజం నుండి స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు రకరకాలుగా అభివృద్ధి  చెందాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే  దంపతీ వివాహం అన్నిటికన్నా అభివృద్ధి కరమైనది అనుకొన్న తరువాత కూడా గత సమాజపు బహు సంబంధాలను పురుషుడు ఈ నాటికీ అనుభవిస్తున్నాడు. స్త్రీలకు ప్రాతివత్య ధర్మాలను నిర్దేశించినా అక్కడక్కడా కొంత వెసులుబాటు అరుదుగా కనిపిస్తుంది. అదీ ఈ కధా కాలం వంద సంవత్సరాల క్రితం అయినందున ఈ ఆచారం అసహజంగా అనిపించదు. గుంపు వివాహాల అవశేషాలు ఈ ఆచారాలలో కనిపిస్తాయి. మహాభారతంలాంటి  ఇతిహాసాలలో ఇలాంటి ప్రాచీన కాలం నాటి అవశేషాలు కనిపిస్తాయి.

700x380xImage.jpg.pagespeed.ic._Vue3PwAdP

తమిళనాడు ప్రాంతంలోని కొంగునాడులో ఎక్కువ జీవించే కమ్యూనిటీ కొంగు వెళ్ళాళ గౌండర్లు. ఇది ఒక వ్యవసాయ కులం. పెరియార్ రామస్వామి ఈ కొంగు వెళ్ళాళ గౌండర్లు, వన్నియార్లు, దళితుల సాంస్కృతిక జీవితాలకు పెద్ద పీట వేసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. బ్రాహ్మణ ఆధిపత్యానికి బ్రాహ్మణిజానికి తేడా చెప్పాడు. ‘నేను బ్రాహ్మడిగా పుట్టినందుకు ఎవరినీ ద్వేషించను.’ అని స్పష్టంగా అన్నాడు పెరియారు.

అక్కడి ప్రజలు ఈ సాంస్కృతోద్యమాన్ని ఎంత ఆదరించారంటే ఈ నాటికీ కమ్యూనిష్టులు అక్కడ నిలదొక్కుకోలేక పోయారు. కొంగు వెళ్ళాళ గౌండర్లు స్త్రీలకు ఆస్తి హక్కు వద్దంటే, అటు దక్షిణ ప్రాంతంలో వున్న వన్నియార్లు దళితుల పట్ల తీవ్రమైన అణచివేత ప్రదర్శించారు. ఈ వ్యవసాయ కులాలు  ఎదిగి దళితులకు, స్త్రీలకు వ్యతిరేకంగా తయారు కావడానికి కారణాలు వెదకటం సామాజిక శాస్త్రవేత్తల పని. ద్రవిడిజం అంటే దళితిజమే. మూల వాసుల సాంస్కృతిక పరిరక్షణకు పెద్ద ఉద్యమాలే జరిగాయి. బాలచందర్ మనకు గొప్ప డైరెక్టర్ గా కనిపిస్తాడు. కానీ తమిలియన్స్ కి భారతీ రాజా గొప్ప డైరెక్టర్. బాలచందర్ సినిమాలో లీలగా కనిపించే సాంప్రదాయవాదాన్ని కూడా వాళ్ళు సహించలేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళ సాహిత్యం, కళలు నిరలంకారంగా ఎలాంటి రంగులు అంటుకోకుండా తమ ప్రత్యేకతలో వదిగి ఉంటాయి. అలాంటి చోట వస్తున్నఈ  మార్పులు గర్హనీయం.

ఈ మార్పులు ఎప్పుడు, ఎలా ప్రారంభం అయ్యాయి అంటే ‘ధ్వజస్తంభం, ఉరితాడు’ ఒకటైన చోట అంటాడు తెరేష్ బాబు. అంటే మతం, రాజ్యం ఒకటైతేనే ఈ మార్పులు నిర్ధిష్ట రూపాన్ని పొందుతాయి. తమిళనాడులో  హిందుమున్నని ఈ విషయంతో మాకు సంబందం లేదని ప్రకటించింది. కానీ ఇక్కడి హిందూ పక్షపాత పత్రికలు పెరుమాళ్ బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని అంటున్నాయి. ఆయన రాసిన విషయాలు రుజువు చేయాలని కూడా అంటున్నాయి.  అయితే అందరు అంటున్న మతమౌఢ్యం ఎక్కడ ఉంది? అది ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా మాత్రమే తీసుకొని పెరుమాళ్ ను బోనులో నిలబెట్టిన రాజ్య యంత్రంలో ఉంది. ఆయన చేత బలవంతపు క్షమాపణలు చెప్పించి, ఆయన పుస్తకాలను వెనక్కు తీసుకోమని హెచ్చరించిన  జిల్లా యంత్రాంగం మెదళ్ళలో ఉంది.

కులమౌడ్యానికి,  మతదురహంకారం తోడై నపుడు ప్రమాదకర శక్తులు పుడతాయి. వాటికి రాజ్యం చేయి అందిస్తే వందలమంది   పెరుమాళ్ళ కలాలు ఎండిపోవాల్సిందే. ఇక్కడే ప్రమాద ఘంటికలు మోగాయి. సృజనకారులు ఉలిక్కి పడ్డారు. పెరుమాళ్ కు మద్దతుగా గొంతు విప్పారు. నిజానికి ఈ గొంతుకలు తమ కోసం తాము అరుచుకొన్నవి. భావజాలాలు ఎలా ఉన్న సృజనకారుల ఊహాజనిత శక్తిని నియత్రించే ప్రయత్నాలు దుర్మార్గమైనవి అనే వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.

ఇక ఈ కధలోని  అంశాలను రుజువు చేయాలి అనే వాదనలకొద్దాము. చరిత్రను సాహిత్యంలో..  అదీ కాల్పనిక సాహిత్యంలో వెదకటం తెలివి కల పని కాదని.,  దానికంటే చరిత్ర ప్రతిఫలనాలను సాహిత్యం ఏ మేరకు ప్రతిబింబించిందో చూడాలనీ అట్టాడ అప్పలనాయుడుగారు అన్నారు. ఇలా జరిగిందా లేదా అనే విషయాన్ని సాహిత్యకారులే రుజువు చేయాలనే షరతు ఉంటే భారతీయ సాహిత్యం, ఇంకా ప్రపంచ సాహిత్యం ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. ఈ ఆంక్ష మనిషిలోని సృజనాత్మకతకు గొడ్డలి పెట్టు. మానవ నాగరికత ఊహతోనే అభివృద్ధి చెందింది.

ఇక స్త్రీలను అవమానించారు అనే వాదన. నామిని మూలింటామె వచ్చినపుడు కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేశాయి. కొన్ని సామాజిక, చారిత్రిక పరిస్థితుల్లో స్త్రీలు ఎలా ప్రవర్తించారో, ప్రవర్తించాల్సి వచ్చిందో దాచిపెట్టి స్త్రీని వారిచ్చిన నమూనాలో మాత్రమే సాహిత్యంలో కాని, చిత్రంలో కాని చూపించాలనే వాదన వాస్తవికతను తిరస్కరించటమే. ఇక్కడ అమానవీయమైన వ్యభిచారం ఉంది. స్త్రీలను పల్లెల్లో చెడ్డ మాటలతో పిలుస్తారు. వాటిని ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించిన రచయిత స్త్రీ వ్యతిరేకి అవుతాడా? ఆ రచయిత ఎటు ఉన్నాడో, అతని ఆత్మ ఎటు వైపు మొగ్గుతుందో వివేకవంతుడైన పాఠకుడు, పాఠకురాలు  గ్రహించగలరు. స్త్రీలను వారనుకొన్న నమూనాలో బంధించి, దానికి భిన్నంగా రాసిన రాతలను అవాస్తవాలని అనటం ఒక స్వీయాత్మక ధోరణి మాత్రమే అవుతుంది.

నిజానికి ఈ కధలో కూడా దేవుళ్ళుగా భావించే పురుషులతో సంగమించడం ఆ నాటి సమాజ ఆచారమైనప్పటికీ పురుషుడిలో ఉండే పొసిసివ్ నెస్స్ దానికి అనుమతి ఇవ్వదు. ఆచారాలకు, నమూనాలకు, భౌతిక వాస్తవాలకు వున్న ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో ఇక స్త్రీలు నిర్ణయించుకొంటారు., తామెటు ఉండాలో. నిజాయితీపరుడైన సాహితీవేత్తతోనా, గుప్పిట్లోకి తీసుకోవాలనుకొనే మాయల పకీరుతోనా అనేది.

సాహితీకారులు ఒంటరిగా లేరని రుజువయ్యింది. రచయిత ఏమి చెప్పదలుచుకొన్నాడో స్పష్టంగా చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. యిచ్చిన మాట రాజ్యాంగం తప్పినా నాగరిక సమాజం భిన్నాభిప్రాయాన్ని గౌరవించింది. ఇక్కడ హైకోర్టు కూడా పెరుమాళ్ పక్షానే నిలిచినట్లు కనిపిస్తుంది. జిల్లా యంత్రాంగాన్ని మొట్టాల్సింది మొట్టింది. రచయితను కోర్టుకు ఆహ్వానించింది.

కలం పై దాడి అంటే అక్షరం పై దాడి, అంతిమంగా నాగరిక ప్రపంచం పై దాడి. అక్షర సైనికులుగా మనమే మారదాం. అందరం పెరుమాళ్ళ మవుదాం.

  -రమాసుందరి

ramasundari

ఇస్లాంలోని మంచి కూడా మనకి తెలియాలి: ఫర్హాద్ జమా

“మీ క్లాస్మేట్ ఫర్హాద్ జమా నవలలు రాస్తున్నాడంటా తెలుసా?” దుర్గ ఫోన్ లో చెప్పినపుడు నా స్మృతి పధంలో తెల్లటి పాల బుగ్గల కుర్రాడు చటుక్కున మెరిసాడు. క్లాస్  టాపర్స్ లో ఒకడైన ‘జామ’ పుస్తకాలు పట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీకి, యూనివర్సిటీ లైబ్రరీకి తిరగడం ఒకటే నా కళ్ళ ముందు వెంటనే కదిలిన విషయం. అప్పటికి పాతికేళ్ళ క్రితం వదిలేసిన జ్ఞాపకాలవి. డిగ్రీ పూర్తి కాగానే, క్లాస్ లో ముప్పై ఆరు మందిలోనూ తరువాత కలిసిన వాళ్ళు తక్కువ. ఎవరికి వాళ్ళం ఇంకొకరికి తెలియని జీవిత దారుల్లో నడిచి పోయాం. ఆ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దగా మాట్లాడుకొనే వాళ్ళం కాదు. అబ్బాయిలతో మాట్లాడితే ఏవో అంటగట్టేస్తారని మాకు భయాలు ఉండేవి. వాళ్ళకు ఇవే భయాలు మా కంటే ఎక్కువ మోతాదులో ఉండేవని తరువాత తెలిసింది. అయితే ఫైనల్ ఇయర్ హెచ్.సి.ఎల్  కాంపస్ ఇంటర్యూలో కాలేజ్ అంతటికి జామా ఒక్కడే  సెలెక్ట్ అయ్యాడని, అందులో చేరకుండా ఐఐటి ఖరగ్ పూర్ లో ఎమ్.టెక్ లో చేరాడని విన్నాను. తరువాత నేను అతని గురించి విన్నది ఇదే.  నెట్ లో అతని గురించి వెదికాను.

n270850

అప్పటికే అతని పుస్తకాలు రెండు ప్రచురణ అయ్యాయి. మొదటి పుస్తకం “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్” విశేష పాఠకాదరణ పొందింది. దాదాపు లక్ష కాపీలు అమ్ముడు పోయి, తొమ్మిది ప్రపంచభాషలలో అనువదింపబడి ఉంది. (ఫ్రెంచ్, జర్మన్, డచ్, స్వీడిష్, స్పానిష్, ఇటాలియన్, సెర్బియన్, టర్కిష్, ఇండోనేషియన్). రెండో పుస్తకం  ‘మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్’ అప్పుడే విడుదల అయ్యింది. వెంటనే పుస్తకాలు తెప్పించుకొని చదివాను. ఫేస్ బుక్ పుణ్యమా అని మా పాల బుగ్గల కుర్రాడు మళ్ళీ కలిసాడు. కాకతాళీయంగా అదే సంవత్సరం మా రీయూనియన్ జరగటం, విశాఖలో జమాను కలవటం జరిగింది. లండన్ లో స్థిరపడటం వలనేమో ఇంకా తెల్లగా, సుకుమారంగా మారి దర్శనం ఇచ్చాడు. ఈ ఇంటర్యూ లో సగభాగం అప్పుడు చేసేసిందే.

తరువాత విడుదలయిన అతని రెండు పుస్తకాలు (ఇవన్నీ సీక్వెల్) ‘వెడ్డింగ్ వాలా’, ‘మిసెస్ ఆలీస్ రోడ్ టు హాపీనెస్’ కూడా చదివాను. వెడ్డింగ్ వాలా గురించి చిన్న రివ్యూ కూడ అప్పట్లో  ఫేస్ బుక్ లో రాసుకొన్నాను. లండన్ లోని ఒక ఇన్వెస్ట్ మెంట్ బాంక్ లో ఐ.టి డైరెక్టర్ గా పనిచేస్తూ; ఉద్యోగానికి వెళ్ళే మెట్రో ప్రయాణంలోనూ (దాదాపు గంట), శని ఆదివారాలలోను ఈ నవలలు పూర్తి చేసాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

అందమైన విశాఖ నేపధ్యంగా ఇతని నవలలు రూపొందాయి. మధ్య తరగతి ముస్లిం కుటుంబంలోని వ్యక్తులు మిష్టర్ ఆలీ, మిసెస్ ఆలీ ఈ నవలలలో ప్రధాన పాత్రలు. ఒక ముస్లిం కుటుంబం చుట్టూ హిందూ సమాజాన్నిఅల్లించి, కధలను విజయవంతంగా పండించాడు.  సమకాలీన సమస్యలు, మత రాజకీయాలు, సుందరమైన ప్రేమలు, మధ్యతరగతి కుటుంబ వెతల మధ్య ఇమిడిన గాఢానురాగాలు, మొలక బియ్యం సారం లాంటి వృద్ధ దంపతుల సాహచర్య సహజానుభూతులు, కొద్దిగా శృంగారం, చాలా హాస్యం…..వెరసి ఫర్ హాద్ జామా నవలలు. నా చిన్నప్పటి క్లాస్ మేట్, ఇప్పటి ఎన్నదగ్గ రచయిత ఫర్హాద్ జమా ఇంటర్యూ మీ కోసం……

zama

Q నలబ్భై ఏళ్ళు దాటిన వెంటనే మీ మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ ” మొదలు పెట్టానన్నారు. ‘మిడిల్ ఏజ్ క్రైసిస్ ‘ కాకుండ ఇంకేమైనా ఆ వయసులో,ఆ కాలంలో మిమ్మల్ని సాహిత్యరచనకు ప్రేరేపించిన కారణాలు ఏమైన ఉన్నాయా?

మా నాన్న స్వతహాగా రచయిత. నన్ను రాయమని పోరుతూ ఉండేవారు. రాయగలనని నమ్మకం లేక నేను ఆయన మాట తీసేసాను. ఒక రకంగా చెప్పాలంటే అది మిడిల్ ఏజ్ క్రైసిస్ అనవచ్చు., ఎందుకంటే నేను నా నలబ్భైయవ పుట్టిన రోజు నాడు రాయటం ప్రారంభించాను. కాని కొన్ని ఇతర కారణాలు కూడ ఉన్నాయి. అప్పుడు నా కెరీర్ లో ఒక కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాను. నా మీద వత్తిడి ఊహించనంతగా ఉంది. నేను దాని నుండి బయట పడటానికి దారులు వెతుక్కోవలసి వచ్చింది. సాహిత్యరచన అనే మార్పు నాకు అప్పుడు కావాల్సి వచ్చింది. ఇంకొక విషయం. నా కొడుకులు ఇంగ్లండులోనే పుట్టి, అక్కడే పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను పుట్టి, పెరిగిన భారతదేశం వాళ్ళకు విదేశం అవుతుంది అనే విచారం ఉండేది.  నేనేమైనా చేసి నా దేశాన్ని వాళ్ళకు సజీవం చేయాలి అనుకొన్నాను.

అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.  9/11   దాడులు, మరీ ముఖ్యంగా జులై 7, లండన్ అండర్ గ్రౌండ్ బాంబింగ్స్ తరువాత ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. కొంతమంది మల్టీ కల్చరలిజం ఓడిపోయిందని అన్నారు. నేనేమనుకొంటాను అంటే మల్టీ కల్చరలిజం పాశ్చాత్యానికి కొత్త కావచ్చు. కొన్ని పదుల సంవత్సరాల క్రితం, బహుశ 50,60 లలో ప్రారంభం అయి ఉండొచ్చు. కాని భారత దేశంలో వివిధ సంస్కృతులు, మతాలు కలిసి ఉండే సంప్రదాయం శతాబ్ధాల క్రితమే ప్రారంభం అయ్యింది. అందులోను విశాఖపట్నం, అలాంటి సహనం కలిగిన పట్టణం. పై కారణాలు అన్ని నన్ను రచనా వ్యాసాంగానికి  ప్రేరేపించాయి.

Q మొదటి నవల “మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ “లో సున్నితమైన ప్రేమ కధను  సెజ్ లు, విద్యార్ధి ఉద్యమాలు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో రాసారు. 90 తరువాత కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉన్న మీరు; మారిన భారతదేశ సామాజిక, సాంస్కృతిక  చిత్రాన్ని అంత అర్ధవంతంగా, ఆసక్తికరంగా ఎలా దృశ్యీకరించగలిగారు?

‘మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్’ రాసేటప్పటికి నా జీవితంలో సగ భాగం ఇండియా బయటే గడిపాననేది వాస్తవం.  కాని దాదాపు నా కుటుంబం అంతా ఇక్కడే జీవిస్తుంది. నేను కనీసం ఏడాదికి ఒక సారి ఇక్కడకు వస్తాను. భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికలు, మేగజైన్స్ ఎక్కువ చదువుతాను.  ఇక్కడ ఏమి జరుగుతుంది అనే విషయం గమనిస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇక్కడ నివసించే వాళ్ళు కూడ ఇక్కడి విషయాల పట్ల గుడ్డిగా ఉంటారు. బయటనుండి తరచుగా వచ్చేవాళ్ళు విషయ పరిజ్ఞానంతో చూడ గలుగుతారు. ఆ పరంగా అది నాకు సహాయం చేసింది.

Qఆర్.కె నారాయణ్ ‘పిక్యోరియల్ నేరేషన్’ మీ కధల్లో కనిపిస్తుందని విమర్శకులు అన్నారు. అది మీకు కేవలం పుస్తకాలు చదవటం వలనే అబ్బిందా? మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇతర రచయితలు ఎవరైనా ఉన్నారా?

ఆర్. కె నారాయణ్ నన్ను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసాడు. అతని సరళమైన భాష, ఆమ్ ఆద్మీ చుట్టూ అల్లిన అతని కధావస్తువులు, సున్నితమైన హాస్యంతో కూడిన అతని బరువైన కధలు …. ఇవన్నీ నాకు ఇష్టం. నన్ను ప్రభావితం చేసిన ఇంకొక రచయిత్రి జాన్ ఆస్టన్. ఆమె రాసిన ఇంగ్లండు ఇప్పుడు అదృశ్యమైంది. ఆమె చెప్పిన పెద్దలు చెప్పిన వివాహాలు, కట్నాలు, పెళ్ళిలో డబ్బు ప్రాధాన్యత … ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లండులో లేవు. కాని భారతదేశంలో ఇవన్ని ఇప్పటికీ ప్రాముఖ్యత గల విషయాలు. ఒక రచయిత కాని, రచయిత్రి కాని తను  చదివిన దాని వలనే ప్రభావితం అవుతారని నేను అనుకొంటాను. మనకు తెలిసి కావచ్చు, మనకు తెలియకుండా కూడ కావచ్చు.

 Qనాకిష్టమైన మీ రెండో నవల “మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్” ( మొదటి నవల కొనసాగింపు)లో  ప్రేమ లోని  ప్రాక్టికాలిటీని, షరతులను క్షుణ్ణంగా చర్చించారు. ఘర్షణలకు, కష్టాలకు నిలబడలేని ప్రేమలలోని డొల్లతనాన్ని ఎండగట్టారు. మనలో మాట. ఎంతో బుద్దిగా అమ్మ, నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకొని స్థిరపడిన మీరు,  సున్నితమైన ప్రేమలోని మరింత సున్నితమైన కోణాలను ఎలా తాకగలిగారు?

 అది కొంత కల్పితం, కొంత నిజం. ప్రేమ కోసం అంతా త్యాగాలు చేయాలి అనే కధలు చాలా ఉన్నాయి. మరి అలా చేయలేక పోతే? మెనీ కండీషన్స్ ఆఫ్ లవ్ లో ఒక దృశ్యం ఉంటుంది. చివర్లో ఉష వాళ్ళ నాయనమ్మను “ఎందుకు మా ప్రేమకు అన్ని షరతులు పెట్టావని” అడుగుతుంది. “ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి పెట్టానని” చెబుతుంది. నేను మేరేజ్ బ్యూరో ఫర్ రిచ్ పీపుల్ నవలకు సీక్వెల్ రాయాలని అనుకొన్నపుడు ఈ దృశ్యం ముందు నా స్మృతిపధంలోకి వచ్చింది. నిజానికి మొత్తం పుస్తకమంతా ఈ దృశ్యానికి కొనసాగింపుగానే రాసాను.

Qమీ నవలలలోని ప్రధాన పాత్రలు మిష్టర్ ఆలీ అండ్ మిసెస్ ఆలీ. మధ్యతరగతి ముస్లిం కుటుంబ పాత్రలు. నిజానికి కధానాయకుడు మిష్టర్ ఆలీ అయినా, మీరు ప్రతిభావంతంగా మలిచిన పాత్ర మిసెస్ ఆలీ.  ప్రేరణ?

నాకు ముందే తెలిసిన విషయం, మిష్టర్ ఆలీ నా కధలో ఒక ముఖ్యమైన పాత్ర కాబోతాడని. ఆ పాత్రని కొద్దిగా మా నాన్న లాగే మలిచి, కావాలనే కొద్దిగా భిన్నంగా కూడ రాసాను. కాని కధ మొదలు పెట్టినపుడు మిసెస్ ఆలీ పాత్రను మా అమ్మను కేంద్రంగా చేసుకొని అంత ప్రాముఖ్యం లేని పాత్రగా మొదలు పెట్టాను. కాని నేను రాసే కొలది మిసెస్ ఆలీ పాత్ర ఎదిగి తనంతట తాను జీవం దాల్చింది. అందుకేననుకొంటాను, ఆమె చాలా శక్తివంతంగాను, వాస్తవికంగాను రూపొందింది.

Qమొదటి రెండు నవలలో బిడియస్తుడు, బుద్దిమంతుడు అయిన జామా, మూడో నవల ‘వెడ్డింగ్ వాలా’ లో హఠాత్తుగా హోమో సెక్యువాలిటీ, నక్సలిజం లాంటి కాంట్రావర్సెల్ అంశాలు ధైర్యంగా రాయగలిగాడు?

 నా మొదటి పుస్తకాన్ని నోస్తాలిజియాతో, విభిన్నసంస్కృతుల ప్రజలు భారతదేశంలో ఎలా కలిసి నివసించారో ప్రపంచానికి చెప్పటానికే రాసాను. తరువాత పుస్తకాలు రాసేకొద్ది నేను స్వేచ్చగా మరిన్ని కాంట్రావర్సెల్ విషయాల్ని ఎక్స్ ప్లోర్ చేయగలిగాను. ‘వెడ్డింగ్ వాలా’ సగం రాస్తుండగా ఢిల్లీ కోర్టు హోమోసెక్సువాలిటీ వ్యతిరేకచట్టాన్ని కొట్టి వేసింది. నేను కొద్ది రోజులు అయోమయంలో పడ్డాను. నేను ఆ తీర్పును పట్టించుకోకుండా, హోమోసెక్సువాలిటీ ఇంకా చట్ట విరుద్ధం అని రాయాలా, లేక ఆ నవలను పూర్తిగా వదిలి వేయాలో నిర్ణయించుకోలేక పోయాను. సీరియస్ గా ఆలోచించి తీర్పును కూడ కధలో భాగంగా, నాకు సంతృప్తి కలిగేటట్లు రాయగలిగాను.

నక్సలిజం చాలా సీరియస్ విషయం. నేను దానికి సింపతి ఆపాదించి కొంత పబ్లిసిటీ ఇవ్వగలిగాను. (ఇంగ్లండు, అమెరికా నుండి చాలా మంది నా పాఠకులు,నేను రాసినది చదివేదాక నక్సలిజం గురించి తెలియదని ఈమైల్ చేసారు.) కాని నేను ఆ విషయానికి పూర్తిగా న్యాయం చేయలేక పోయానని అనుకొంటాను.

Qమీకొచ్చిన అవార్డు గురించి చెప్పరా?

 చెప్పటానికి ఏముంది? అదొక గౌరవం. బ్రిటీష్ బుక్ అవార్డ్స్ వారి బెస్ట్ న్యూ నావలెస్ట్ లిస్ట్ తో సహా చాలా వాటిలో ఫైనలిస్టుగా వచ్చాను.  నాకు వచ్చింది మాత్రం మెలిస్సా నాథన్ అవార్డ్ ఫర్ కామెడీ రొమాన్స్. మెలిస్సా నాథన్ ఒక బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి. చిన్న వయస్సులో కాన్సర్ తో చనిపోయారు. ఈ అవార్డ్ ఆమె పేరుతో ఆమె కుటుంబసభ్యులు ఇస్తున్నారు. జో బ్రాండ్ (ఫన్నీ కమేడియన్), సోఫియా కిన్సెల్లా ( మాస్ రచయిత) లాంటి వాళ్ళు ఆ జూరీ లో ఉన్నారు. ఆ అవార్డు పురుషుల్లో నేనే మొదట తీసుకొన్నందుకు సంతోషంగా ఉంది.

Q ఒక ముస్లిం రచయితగా మీ చివరి నవలలో(మిసెస్ ఆలీస్ రోడ్ టూ హేపీనెస్) ముస్లిం మత ఛాందస భావాలను కూడ తూలనాడారు. ఆ మతానికి సంబంధించి మీరు కోరుకొంటున్న సంస్కరణలు ఏమిటి?

 నేను పెరిగిన ఇస్లాం స్ట్రిక్ట్. కాని సున్నితమైన మతం. జీవితంలో క్రమశిక్షణ, మద్యాన్ని తిరస్కరించటం, రంజాన్ రోజుల్లో ఉపవాసాలు ముఖ్యమైనవి మాకు. అలాగే దానధర్మాలు కూడ. ఇస్లాం మతం అంటేనే కుల, మత సమానత్వం. స్త్రీలకు ఆస్తిహక్కు, విడాకుల హక్కు, అనాధల సంరక్షణ ఉన్న ప్రగతిశీల మతం అది. కొంతమంది ముస్లిమ్స్ , విద్వేషం ప్రబలేటట్లు దానిని వక్రీకరించటం బాధాకరంగా ఉంటుంది. మరికొంతమంది దానిని వెనకబడిన మతంగా చెప్పటం కూడ అంతే బాధాకరం.

Qమీ నవలలు ఫిక్షన్ అంటే నమ్మబుద్ది కాదు. చేతన్ భగత్ నవలల లాగా మీ నవలలు కూడ   స్వీయ అనుభవాల నుండి వచ్చాయా, అంత సజీవంగా ఉన్నాయి?

నేను నా నవలలో రాసిన అనేక దృశ్యాలు ఒక్కొక్కటే తీసుకొంటే చాలావరకు నిజాలు. నేను చూసినవి, అనుభవించినవి. కాని మొత్తంగా కధ లైన్ మాత్రం కల్పితం.

 – ఇంటర్వ్యూ: రమా సుందరి

 

కొన్ని నక్షత్రాలు…కాసిని కన్నీళ్ళు

ramasundariకొన్ని నక్షత్రాలు.. కాసిన్ని కన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్ని కన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై  ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు. నలభై ఏళ్ళ గోదావరీ లోయా విప్లవ పోరాటం వెనుక మనసు ఆగక పరుగులు పెట్టినట్లు గుర్తు. నాకు తెలిసిన తెలంగాణ పల్లెలు, గరిడీలు సృతిపధంలో నడచినట్లు గుర్తు. చైతన్య గనులైన పి.డి.ఎస్.యు విధ్యార్దులు గుండె గదుల్లో కవాతు చేసినట్లు గుర్తు. ఈ కధ తెలంగాణ, అందులోను కరీంనగర్ విప్లవోద్యమ నేపధ్యంలో రాసింది. రాసింది ఆ ఉద్యమంలో ఊపిరి పోసుకొని ఎదిగిన విమల గారు. మొదట పాలపిట్ట మాసపత్రిక లో ప్రచురించబడి కధ 2012 లో కనిపిచ్చిన ఈ కధ ఒక ఆణిముత్యం.

కధా స్థలం కరీంజిల్లాలోని ఒక పల్లె. కాలం తొంబ్భైవ దశకం ప్రారంభం. ఆ పల్లెలో ప్రధాన భాధ్యతలు వహిస్తున్నది ఒక మహిళ. ఎన్నికల సందర్భంగా వచ్చిన వెసులుబాటును విప్లవ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవాలను కొంటారు. అప్పుడు ఆమె ముందుకు వస్తారు ఇద్దరు నవ యువకులు. ఒకరు పెళ్ళై చంటి బిడ్డకు తండ్రి అయిన తిరుపతి, ఇంకొకరు అనాధ అయి  ప్రేమ తప్ప ఇంక ఏమి లేని మాధవ. యాధృచ్చికంగా మాధవ ప్రేమ కధని వింటుంది ఆమె. ఒక గంట ప్రేమికుడిని కలవటానికి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తన తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకొంటుంది. అతను తన చేతి మీద వేయించుకొన్న  వెలుగుతున్న దీపం పచ్చబొట్టు చూసి కదిలి పోతుంది.

” నాకు మొక్కలంటే యిష్టం. ఎప్పటికన్నా పొలంగొంటె ఏటివడ్డున ఒక రెడకరాలనా- అందులో చిన్న గుడిసేసుకొని చుట్టూ పూల మొక్కలు పెట్టుకొని ఉండాల. మేమిద్దరం గల్సి చిన్న పిల్లల కోసం ఒక మంచి స్కూల్ బెడ్తం. క్లాసులు చెట్ల క్రింత- అదేంది. ఆ(… శాంతి నికేతన్ లెక్క” అంటూ అతడు చెప్పే కలలను వెన్నెల్లో నులక మంచం మీద పడుకొని వింటుంది. అతనికి తప్పక సాయం చేయాలనుకొంటుంది. “ఆ చల్లటి వెన్నెల రాత్రి, ఆ పిల్లవాడి ముఖంలో ఏదో అవ్యక్తపు ఆనందం. నక్షత్రపు కాంతి.  ప్రేమ, అది ఎంత అధ్బుత అనుభవం!”

తెల్లవారి మసక చీకటిలో, మసక కళ్ళతో వారికి వీడ్కోలు పలికి, మధ్యాహ్నానికి ఇద్దరి ఎన్ కౌంటర్ వార్త వింటుంది. ఒకరు తిరుపతి. ఇంకొకరు? ” కట్టెలు చేర్చిన ఆ చితి మధ్య-విగత జీవిగా ఎవరో పిల్లవాడు. వాడికీ కల ఉందా? ఒక ప్రేమ కధ ఉందా? ఒక వెన్నెల రాత్రి వాడూ వాడి జీవకాంక్షని- ఎవరికైనా చెప్పాడా? ఎవరా పిల్లవాడు…మాధవా నువ్వు బతకాలరా” అని రోదిస్తుంది. ఎవరు మరణించారు? ఎవరు బతికారు? ఆ క్షణం నేను కూడ మరణించానా వాళ్ళతో పాటు? అని ప్రశ్న వేసుకొంటుంది. కాని చనిపోయింది మాధవానే. కూంబింగ్ చేసి వస్తున్న పోలిసులను చూసి భయపడిన పారిపోతుంటే ఇద్దర్ని కాల్చి వేసారు. గాయాలతో తూములో దాక్కొన్న నిరాయుధుడైన మాధవాను  చంపబోమని చెప్పి బయటికి పిల్చి కాల్చేసారు.

కధ మొత్తం ఆమె జ్ఞాపకాల ఉద్విఘ్నతలతో సాగుతుంది. మానేరు ఒడ్డున కూర్చొని “మానేరా, మానేరా! నను వీడని మనియాదా” అని పలవరిస్తుంది. “చీకట్లు ముసురుతున్న అసాయంవేళ, నాల్కలు చాచుతున్న ఆ మంటల్ని నిర్ఘాంతపడి చూస్తూ, పెనుగులాడి, పెనుగులాడి నా లోపల నేనే పొడి పొడిగా రాలుతూ…”  అంటూ ఆ నాటి విషాదాన్ని  ధ్యానించుకొంటుంది . రచయిత్రికి  విప్లవం పట్ల నిబద్దత, అది అందుకోలేని బాధ కధ పొడవునా వ్యక్తం అవుతాయి. “ఏదీ ఆ మరో ప్రపంచం, ఎర్ర బావుటా నిగనిగలు, ప్రళయ ఘోషలు, ఝుంజా మారుతాలు, జనన్నాధ రధ చక్రాలు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా , జాబిల్లు? ఏవి, ఏవి తల్లి నిరుడు కురిసి హిమసమూహలు?”

ఈ కధ ఒక ఎన్ కౌంటర్ దుఃఖాంతాన్ని వర్ణించే కరుణ రస ప్రధానమైన కధగా కనిపిస్తున్నా, కధ వెనుక అప్రకటిత భాష్యం (అన్-టోల్డ్ టెక్స్ట్) చాలా ఉంది. “ఈ కధ నాలో అంతరంతరాలలోఅనేక ఏళ్ళుగా దాగిన దుఃఖం.” అని రచయిత్రి చెప్పుకొన్నారు. ఆ దుఃఖం వైయుక్తమైనది కాదు. అది ఉద్యమాల దుఃఖం.  సమ సమాజం నిజమైన అర్ధంలో స్థాపించటానికి బలై పోయిన వందలాది యువతీ యువకుల మృత్యు కేళి కలిగించిన వగపు.

మాధవా కన్న కలలు భారత దేశంలోని ప్రతి లేబ్రాయపు యువతి యువకుడు కనే ఉంటారు. చిన్న ఇల్లు, చేయటానికి పని; ఇవి ఇచ్చిన భరోసాతో ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన. బహుశ మాధవ లాంటి వాని ఊహలలో ఈ రాజ్యహింస తాలూకూ పీడ కలలు ఉండి ఉండక పోవచ్చు. ఈ ఎన్ కౌంటర్లు అలాంటి  కనీస కోరికలు కోరే, వాటి కోసం పోరాడే వాళ్ళకు ఈ భూభాగంలో చోటు లేదని చెప్పేతీర్పులు. కాలే చితి పై మండుతున్న శవాల తాలూకూ పొగలు అదే సందేశాన్ని మోసుకొని పోయి ఉంటాయి. తన ప్రియుడు మరణం తెలుసుకొని వచ్చి ఏడ్చి వెళ్ళిన జ్యోతి, ఈ మరణాలను ప్రశ్నించలేని, ఎవరినీ తప్పు పట్టలేని అమర వీరుల కుటుంబాల ప్రతినిధి.

ఈ కధలో ఒకప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిన ప్రాంతాలలో మారిన పరిస్థితుల వర్ణన అత్యద్భుతం గా  చేసారు. క్షీణించిన సాంస్కృతిక, ఆర్ధిక జీవనాల గురించి , ముగిసి పోయిన పోయిన జమిందారీ వ్యవస్థ గురించి, కొండెక్కిన ఉద్యమాలు, ప్రపంచీకరణ సునామి ఉధృతిలో పడిపోయిన గ్రామీణ ఉపాధులు ఒక్క వాక్యంలో  దృశ్యీకరించారు.

“శిధిలమైన మట్టి గోడలు, జాజు నీలం రంగులు పూసిన దర్వాజాలు, చెదిరి పోయిన నినాదాలు, రెక్కలు చాచిన రాబందుల్లా యాంటీనాలు, కోకో కోలాలు, బిస్లరీ వాటర్లు, మద్యం సీసాలు, జిల్లెళ్ళు మొలుస్తున్న గరిడీలు, పలకని రాతి దేవుళ్ల గుడులు, చదువు చెప్పని బడులు, విరిగిన మగ్గాలు- ఆకు – తంబాకు చేటలు….”  .

మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులను అందుకొని చేయవలసిన కర్తవ్యాలను మరిచిన ఉద్యమవైఫల్యాలను కూడ ఎత్తి చూపారు. వచ్చిన మార్పులను స్వీకరించి ఉద్యమాలను పునర్నిర్మాణం  చేయని అశక్తతను కూడ పేర్కొన్నారు.  “పెరిగిన మధ్య తరగతి మనుషులు- నీటివసతి- కొత్త వ్యాపారాలు పెరిగి- ఒకప్పటి – కరీంనగర్ కాదది-  జరిగిన మార్పులను అంచనా వేసే వాళ్ళెవరు – ఏ చేయాలో ఎలా చేయాలో – మళ్ళీ కొత్తగా ప్ర్రారంభిచేది ఎవరు?”

ఈ ఘటన జరిగిన పద్దెనిమిదేళ్ళ తరువాత మాధవ ప్రియురాలు జ్యోతిని అనుకోకుండా కలిసిన ఆమె, జ్యోతి చేతిపై మాధవ గుర్తు గా వేయించుకొన్న పచ్చబొట్టును చూస్తుంది. తన రిక్త హస్తాలను చూసుకొంటుంది. ఉద్యమ వైఫల్యాలు, మిగిలిపోయిన కర్యవ్యాలు ఈ చివర వాక్యం ద్వారా మనకు వ్యక్తమౌతాయి. ఎంత ఉదాత్తమైన ముగింపు? కధ నంతటిని ఈ చిన్న వాక్యంలో కుదించి మనకు సందేశమిచ్చినట్లైంది.

***

కొన్ని నక్షత్రాలు –విమల

ఒక సగటు మనిషి అంతరంగ చిత్రం- క్రాంతి శ్రీనివాస్ కవిత్వం

రమాసుందరి

క్రాంతి శ్రీనివాస రావు కవిత్వం నాకు ఫేస్ బుక్ ద్వారానే పరిచయం. ఆయన కవిత సంపుటి “సమాంతర ఛాయలు”  విడుదలకి ముందు వచ్చిన సమీక్షలు పేపర్లలో, వివిధ లింకుల్లో చదివాను. పుస్తకం తెప్పించుకొని, ముందుమాటలు, వెనుక మాటలు చదివేశాను. ఈయన కవితలు ప్రాచుర్యం పొందటానికి కారణాలు ఇంతకు ముందే రాసేసారు. ఈవెంట్, మెమెరీ, మెటాఫర్ ని కలిపి కుట్టాడన్నారు (అఫ్సర్). మట్టిలో కవితా సేద్యం చేసాడన్నారు(అరుణ్ సాగర్). ఈయన కవితలు “పాప్ బీజింగ్స్ స్వరాలకు నినాద రూపాన్నిచ్చిన ట్రేసీ చాపమెన్ లాగ ఉన్నాయన్నారు (కవి యాకోబ్). “శ్రీనివాసరావు గారి ప్రధాన భావప్రవాహం మానవాళిని నడిపించే ప్రయత్నంగా ఉందన్నారు” (బి.వి.వి. ప్రసాద్). “రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులు, బహుజనుల అస్తిత్వ సమస్యలను ఒక పేషన్ (ఫేషన్ కాదు) తో పట్టించుకొన్నాడన్నారు” (ఖాదర్ మొహియుద్దీన్). ఈయన కవిత్వం “చనుబాలుకు బదులు కనుబాలు” కార్చింది అన్నారు (సీతారాం). ప్రసేన్ గారు ఈయన రాతల్లో ట్రెడీషనలిజం , మోడ్రనిజం, పోస్ట్ మోడ్రనిజం మూడు కలిసి ఉన్నాయని అంటారు. (మనలో మాట ఇందులో చాలా పదాలు నాకు తెలియవు)

ఇంతమంది మేధావులు వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా వెచ్చించి ఈయన కవితలను విశ్లేషిస్తే, కవిత్వం గురించి అ ఆ లు తెలియని నేను రాయబోవటం సాహసమే అవుతుంది. అయినా ఒక  పాఠకురాలిగా నాకు కూడ హక్కు ఉందని, ఈ కవితల గురించి నా దృక్కోణం నేనూ రాసి చూద్దాం అనిపించి మొదలెట్టాను.

అసలీయన ఇన్ని కవితలు ఎలా రాయగలిగాడు ఇంత తక్కువ కాలంలో?  ఆలోచనలకు అక్షర రూపం కవులు అంత సుందరం గా ఎలా ఇవ్వగలరు? అనే నా ప్రశ్నకు ఆయన ఏ కవి ఇవ్వనంత సరళంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటి కవులు కవిత్వంలోనే ఆలోచిస్తారు. కవిత్వంలోనే శ్వాసిస్తారు. దానికి కావలిసిన ముడి సరుకు పద సంపద, ఈయన ముందే పుష్కలం గా సముపార్జించుకొని కవితా సేద్యం మొదలు పెట్టాడనిపించింది.

“జ్ఞాపకాల ప్రవాహం లోంచి కొట్టుకొచ్చి/ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్న/ నాలుగు వాక్యాలను ఏరుకొన్నానీపూట. గణుపులున్న చోట/ వంకర్ల వద్ద/ పొయ్యిలోకి వంట చెరుకును విరిచినట్లు/విరిచేశాను మాటల్ని. ఆనందం పంచాల్సినప్పుడో/ అర్ధం చెప్పాల్సిన దగ్గరో/ ప్రశ్నను సంధించాల్సిన చోటనో/ వాక్యాలను జాగ్రత్తగా తుంచిపెట్టాను. ప్రతీకలతో పదిలంగా చుట్టాను.” అంటూ అరటి పండు వలచినట్లు  పాఠం చెప్పేసాడు. (క్షతగాత్రం)

మనసులోని భావాలు పుటలలో అక్షరాలు గా మారాలంటే మా బోటి వాళ్ళు తల క్రిందులుగా తపస్సు చేయాలి. అహర్నిశలు శ్రమించాలి. కాని ఈయన అలవోకగా ఆ పని సాధించటమే కాకుండా, అంతే సులువుగా భోధించేస్తున్నాడు. ” మనసును మాటల్లో పోసి/ అవసరమైనప్పుడు మార్మికత ఇచ్చాను. అవి వంతెనల్లా/ మెట్ల వరుసల్లా/ వీణా తంత్రుల్లా/ బాణా సంచుల్లా/ ఆయుధాల పాదుల్లా మారి భావాలను పండిస్తున్నాయి.” అని గర్వంగా తన సాహిత్య పంటను మనకు ప్రదర్శిస్తాడు.

అంతే కాదు అస్పష్టమైన తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చి, తను నేర్చుకొన్న జీవిత పాఠాలను మనకు వినిపించాలని అతి నిరాడంబరంగా అభిలషిస్తాడు.  “ఆకార నిరాకారాల మధ్య/ సంధి కుదిర్చి/ నిన్నటి రేపును ఈ రోజుతో కట్టి పడేసి/దర్శించిన జీవిత సత్యాలకు అక్షర రూపం సమకూర్చాలనివుంది/కవిసంగమంలో నిత్య కచేరీ చేయాలని వుంది.”   (సౌండ్ షేడ్)

కాని మళ్ళీ తనే, అర్ధవంతమైన మాటలు అందమైన కవితలుగా మారాలంటే అంత సులభం కాదని, చాలా శోధన జరగాలని కూడ చెబుతున్నాడు. ( మీ కవితలు చదువుతుంటే మీరంత కష్టపడ్డట్టు అనిపించటం లేదండి)

“అర్ధాలు మోస్తూ మాటలు/ వేల మైళ్ళూ/ మనసు తీరం వెంబడి నడవకుండా/ భావాల అలల్లో తడవకుండా/ వాక్యమై వొళ్ళు విరుచుకోవు. తెల్లకాగితంపై/ కవిత్వం కళ్ళూ తెరుచుకోదు, తీరిక సమయాలు కవిత్వపు కోరికలు తీర్చలేవు.” అని తీర్మానిస్తాడు. (ఖాళీ పాళీ) .

కవితలలో వ్యక్తీకరించిన అన్ని సంగతులు ఆణిముత్యాలు కాలేవు. మంది, మజ్జిగ చందాన సంఖ్య పెరిగే కొలది గుణ దోషాలు అనివార్యమౌతాయి. అయినా సరే “డోంట్ కేర్ ” అట.

“మనసు చెంబుకు/భావాల అరచేతులడ్డు పెట్టి/ఎంత అక్షర కళ్ళాపీ చల్లినా/అంతగా నా అజ్ఞానం రికార్డ్ చేయబడుతూనే ఉంది./అయినా ఆపాలని లేదు/ఒకప్పటి వాక్యాలుగానన్నా/వ్యాఖ్యానించబడతాయని/ అక్షర కాళ్ళాపీ ఆపకుండా చల్లుతూనే ఉన్నా/మనసును మాటలుగా మార్చి రువ్వుతూనే ఉన్నా.” (ఫైర్ బాక్స్) అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు.

కవి తాత్వికత, అంతర్గత ప్రపంచ దృక్పధం ఆయన కవిత్వానికి వనరులు అంటారు. ఈ విషయలో ఈయనది “అంతా … లెక్కే.”  “కొలవటం రానివాడు/ కొలువుకు పనికి రాడు. లెక్కలు రాని మనిషి, రెక్కలు తెగిన పక్షి ఒకటే. జరగబోయే సంఘటనలు అంచనా వేయటం రావాలి, ప్రకృతి ప్రమాదాలను ముందే కనిపెట్టే పశుపక్షాదుల్లా” అని మనల్ని గంభీరంగా హెచ్చరిస్తాడు. జీవితగమనానికి సంబంధించిన దృఢ నిర్ణయాలు వ్యక్తమవుతాయి ఈ కవితలో.

అంతలోనే మనసుకు, శరీరానికి జత కుదరటం లేదని సగటు మనిషి లాగా తెల్ల ముఖం వేస్తాడు. “సందేహాలతో మనసు/తీరని దాహంతో దేహం/ సమాంతర రేఖలుగా సాగిపోతున్నాయి. ఇప్పుడెందుకో/ దేహానికి సందేహం/ మనసుకి దాహం వేస్తోంది. మనసూ దేహం/ వెలుగు చీకట్లలా/ ఎప్పుడూ విరహాన్నేఅనుభవిస్తున్నాయి.” అంటూ మనసు విప్పుతాడు. (జతలేని జంట)

ఒక కవి పదే పదే తన కవితల మీద అభిప్రాయాలు పలువురి నుండి అడుగుతున్నాడంటే అతను తనను తాను సంపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం చేసుకోవాలి. కళాకారుడు ఎవరికైనా  ఆ నిబద్ధత ఎంతో అవసరం. మన ప్రజా కవి శ్రీనివాసరావు గారికి ఆ ఆదుర్దా మరీ ఎక్కువ.  “గెలుపంతా ఆమెదే” కవిత చదివి నేను అసంతృప్తి వ్యక్తం చేసాను. ఆ కవిత ” కార్యేసు దాసి” శ్లోకానికి ఆధునిక రూపం లాగా ఉంది, మీరు స్త్రీల మీద నైతిక వత్తిడి పెంచుతున్నారని” చెప్పాను. బుద్దిగా విని ఒప్పుకొన్నారు. సహేతుకమైన విమర్శను ఆహ్వానించటమే కాదు, అన్వేషిస్తాడు ఈయన. తన పాఠకులతో ఇంకా అంటాడు “ప్రియ నేస్తమా/ నాతో మాట్లాడు కాసేపు/ మనసంతా ఆలోచనలే/తూర్పారబట్టుకోవాలొకసారి. నేస్తమా/ వాదులాడవా నాతో ఒక్కసారి భావాలను జల్లెడ పట్టుకోవాలి. తిరిగి తర్కించవా నాతో/ అందులో/ పనికొచ్చేవేవో/ లెక్కించుకోవాలి. ప్రియ నేస్తమా/ సాయం నిలబడవా/ హృదయానికి చిల్లు బడి హోరు గాలి వీస్తోంది.” అని తన అంతర్గత ఆవిష్కరణకు సాయం మనల్ని అర్ధిస్తాడు. (అన్వేషణ)

కవి జ్ఞాని. కవి తత్వవేత్త. కవి అనుభవశాలి. ఈ కవి కూడ జీవితాన్ని కాచి వడపోసి మనకందరికి కరతలామలకం చేయ బూనాడు. వదిలించుకోలేని బంధాల్ని,కాలాన్ని వెనక్కి తిప్పలేని అసాధ్యాన్నిలఘువుగా వివరిస్తాడు “జీవితమంటే/కాలం చెట్టుపై/ నీవు చెక్కిన /హృదయపు బొమ్మలోంచి  కారిన/ జిగురు బంక. జీవితమంటే/ కాలప్రవాహ వాలుపై/ ఒకే ఒక్కసారి ఆడే/ జారుడు బండాట.”. (చంద్రుని పై పాదముద్ర)

కవిత్వం వ్యాపారపరం అవటం కవులందరికి శోకావేశమే. అక్షరాలు అమ్ముడు పోవటం అంటే రక్తమాంసాలు కోసి ఇచ్చిన  నొప్పి నిజమైన కవికి ఉంటుంది. ఈయన తన వేదనను ఈ రకంగా అక్షీకరించాడు. ” వ్యాపార ప్రపంచం వీసాలిస్తుంటే/ కవితా కన్యలు అష్టదిక్కులా పాలిస్తున్నాయి. యాడ్ మాడ్ ప్రపంచమే/ కవిత్వకర్మాగారమై వింతవిపణిని నడిపిస్తుంది. మార్కెట్ మురికితో మాసిన కవితలను/ పేదల కన్నీటి తో కడిగి జలశీల ఉద్యమాలే కవితా వస్తువులుగా అక్షరసేనలు కదలాలిప్పుడు” అంటు తన కళాకారుడి గా తను ఎటో  ప్రకటించుకొన్నాడు.

ఈయన ప్రకృతి ప్రేమికుడు. చాలా మంది సూర్యుడు, చంద్రుడు, చుక్కల మీద కవితలల్లినా, ఈయన స్కూలు వేరు. తను చదివిన విజ్ఞాన శాస్త్రాన్ని కవితల్లోకి అనువదిస్తాడు. అందులోనూ సూర్యుడు తన కవితల్లో ప్రియవస్తువు. ఒకసారి “ఎత్తుకు పోయిన నిద్రను/ వెదుకుతూ ఉంటే /రోజు ఎదురయ్యే దూరపు చుట్టం/ రానే వచ్చాడు/దొర్లటం ఆపి/ పరిగెత్తటం మొదలెట్టమన్నాడు,” అని విసుక్కొంటాడు.( పడక.. నడక) “ఒరేయ్/ నాలుగు నిప్పులు పోయండ్రా/ సూర్యుని నెత్తిమీద. వాడికేమొచ్చిందో/పొడ అగ్గి రూపంలో/కొంపలో జొరబడి/ఉన్న కాస్త చాటును/ చెరుకు గడలా మంటల దవడలతో నమిలేస్తున్నాడు” అని శాపనార్ధాలు పెడతాడు. (సూర్యుడ్ని పొయ్యిలో పెడదాం). “ముగించే లోపు/ అనేక / ప్రారంభాలుండే జీవన సర్కసుకు/ కిరణాల గడలేసుకొని/ పోల్ జంప్ చేస్తూ/ నిత్యం/ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు సూర్యుడు.” అని   ప్రశంసించగలడు కూడ.(అనిత్యం)

ఆకలి చావులను జనాభాలెక్కల పట్టికలో మరణాలుగా చూడగలుగుతున్న మన ఉదాశీనతను చెంప దెబ్బ కొట్టి, వాటి వాస్తవిక తీవ్రతను మనకు పదాలతో దృశ్యీకరించి చూపించాడు. ఆకలి చావుల అంతిమ  దశను “ఒక్కో అవయవం కూలి/అణువణువూ చీలి/ తనువంతా తగలడి/ చితిని చేరకముందే/ మా కపాలం పగిలిన శభ్ధం/ మేమే వింటూ/ ఊహల కందని వేదన/ ఊదర పెడుతుంటే ఊపిరి వదులుతుంటాం.” అని వర్ణించాడు. (బాబోయ్) “మిగతా జంతువులకు మల్లే/ సహజాత సంతోషాలు దొరకవు/సహజ మరణాలు ప్రాప్తించవు. ఆకలి చావులు కావట మావి/ అసలవి లేనే లేవట.” ఇక్కడ ఆయన పద, భావ లయలకు మురిసిపోయే సంతోషాన్ని కూడ ఇవ్వకుండా ఏడిపించేసాడు. (ఆకలి…కొలత).

‘దొరసానుడు’ కవితలో “గడీలకు గడియలేస్తే/ గంగలో కలిసిపోయాయనుకొన్నా/ మారు వేషాలేసుకొని మన మధ్యే తిరుగుతున్నాయని/ ఈ మధ్యే తెలిసింది. రంగు మార్చిన గడీ/ రాజకీయ గారడి  రహస్య ఎజెండాతో /రాజదర్బార్లు రోజూ చేస్తూనే ఉంది.” అంటూ భూసామ్య పెత్తందారీ రాజకీయ ప్రస్థానాన్ని భావగర్భంగా బట్ట బయలు చేసాడు.”

అక్షరాలు ఈయన వేసే భావాల ముగ్గుల్లో బుద్దిగా గొబ్బెమ్మల్లా కూర్చుంటాయి. పిలిస్తే వచ్చే చుట్టాల్లా కాకుండా ఇంటి ఆడబడచులంత సహజంగా ఈయన కవితల్లో అమరిపోతాయి.మార్మికత ఈయన కవితల్లో ముగ్ధంగా ముడుచుకొని ఉంటుంది. గాఢత పాఠకుడు శ్వాసించినంతగలిగినంత దొరుకుతుంది. ఈయన పదాలు సజీవ సాహిత్య ఊటలు. వాక్యాలు వొళ్ళు విరుచుకొన్న సత్యాలు. భావాలు తాత్వికత, తార్కికత సమ్మేళనాలు. ఎంచుకొన్న సందర్భాలు పూర్తిగా సమయోచితాలు. వెరసి శ్రీనివాసరావు గారి కవితలు డాంబికాలు పోని హఫ్ చేతుల చొక్క వేసుకొన్న సగటు మనిషి అంతః చిత్రాలు. ఇవి సాధారణ పాఠకుడికి అందుతాయి. సుద్దులు చెబుతాయి, ప్రేరణనిస్తాయి.

 

 

పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ramasundari

అమ్మంటే కన్నతల్లి మటుకే కాదు. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.

-స.వెం.రమేశ్ Quote

ప్రళయ కావేరి కథలు…

ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం. ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి. పదేళ్ళ తరువాత ఆ కధలు ఈ మధ్య నన్ను వేటాడటం మొదలుపెట్టాయి. దానికి కారణం  నాకు పక్షుల మీద పెరిగిన ఆసక్తి  ఒక్కటే కాదు. ఆ కధల సమ్మోహనత్వాన్ని మరింత కావలించుకోగలిగిన మనః పరిణితి పెరగటం కూడా అనుకొంటాను.

ఇటీవల మళ్ళీ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ రమణ ‘మిధునం’ కధ కూడ ఈ పుస్తకాన్ని నాకు గుర్తు చేసింది. ఈ కధలను రాసిన  కాలమాన, భౌగోళిక, చారిత్రక నేపధ్యంలో ఉన్న భిన్నత్వం, ఆయన కధావస్తువుగా ఎన్నుకొన్నసామాజికవర్గం, అన్నిటికి మించి ఆయన కధాస్థలాన్ని, కధలలోని పాత్రలను ప్రేమించి రాసిన వైనం నాకు పలు సార్లు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈ కధలను చదవాలనే కోరిక పెరిగింది. ప్రళయ కావేరి ప్రాంతానికే (ఇప్పటి పులికాట్) పరిమితమైన  ప్రత్యేక మాండలికం, పక్క జిల్లావాసిగా నేను అర్ధం చేసుకోగలటం కూడా నన్నీ కధలలో మమేకం చేయగలిగింది .

ఈ పుస్తకం కోసం నేను ప్రయత్నం చేస్తూనే పులికాట్ కు గత డిశంబర్ లో ప్రయాణం కట్టాను. పక్షులను చూడాలనే వంక పెట్టాను కాని ప్రళయ కావేరి  దీవులను చూడచ్చు అనే కోరిక కూడా ఉండింది. నేను పులికాట్ వెళుతున్నవిషయం విని మా అమ్మ “మీ తాతలు అక్కడ నుండే వలస వచ్చారట” అని చెప్పింది. అయితే పరిమితమయిన సమయం, వనరులు మమ్మల్ని శ్రీహరి కోట వరకు మాత్రమే తీసుకొని వెళ్ళ గలిగాయి. ఊరుకోలేక  రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.

ఈ పుస్తకం నాకు దొరికి, పుస్తక పరిచయం రాయాలని అనుకొన్నప్పుడు; పరిచయం కాదు ఈ కధలు మీద ఒక పరిశోధనే జరగొచ్చని అనిపించింది.  నిజానికి ఈ పుస్తకం ఒక నడిచిన చరిత్ర. ఒక పర్యావరణ శాస్త్రం. పరిణామ క్రమాన్ని, సామాజిక శాస్త్రం తో కలబోసి మనకు అందించిన విజ్ఞానం. ముఖ్యంగా ఈ ప్రాంత మాండలికానికి చెందిన సొగసు చదువరులకు గిలిగింతలు పెడుతుంది.  ‘ఉత్తరపొద్దు’ ప్రచురణ కాగానే మొదటి స్పందన దాశరధి రంగాచార్య నుండి వచ్చిందట. “ఉత్తరపొద్దు  తెలుగు పున్నమి వెన్నెల్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం, కలుపు మొక్క లేని తెలుగు పంట” అని స్పందించారు. కలుపు మొక్కలేదు అనటం లో ఆయన అర్ధం ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ ఈ కధల్లో వాడక పోవటం కూడా  అనుకొంటాను.

అంతరించిపోతున్న చాలా తెలుగు పదాలని ఈయన ఈ కధలలో నిక్షిప్తం చేసారు. ఇక సామెతలు, ఉపమానాలు, నుడికారాలు పుష్కలంగా; తెలుగు సాహిత్యాభిమానులకు మనసు నిండుగా ఉన్నాయి. అక్బర్ గారు, చిదంబరం గార్ల స్కెచ్ లు మనలను కధలలోకి నేరుగా లింక్ చేస్తాయి. ఆ మాండలికంలో మనకు అర్ధం కాని పదాలకు ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు.

kaveriప్రళయ కావేరి దీవుల్లో నడిచే ఈ కధలన్నీ ఒక బాలుడి భాష్యంతో నడుస్తాయి. ఈ దీవుల్లో ఒకటైన ‘జల్లల దొరువు’లో ఉంటున్న తాతా, అవ్వల దగ్గరికి సెలవల్లో గడిపి, అక్కడి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనాన్నిరచయిత  ఆకళింపు చేసుకొని పెద్దయ్యాక తన భాషాపరిజ్ఞానంతోను, సామాజిక సృహ తోనూ రాసిన కధలివి. శంకరంమంచి ‘అమరావతి కధలు’, వంశీ ‘పసలపూడి కధలు’ ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కధలు’, నామిని ‘పచ్చ నీకు సాక్షిగా’.. ఇవన్నీ ఒక ప్రాంతానికీ, రచయితకి ఉన్న అనుబంధానికి చెప్పిన అందమైన భాష్యాలే. కాని ప్రళయ కావేరి కధల్లో అనుబంధంతో పాటు ఆ ప్రాంత భౌసర్గిక స్వరూపం,  ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక జీవనానందాలు ,వాళ్ళ పంటలు, పిల్లల ఆటపాటలు, స్రీల జానపదాలు, పొడుపు కధలు….వీటన్నిటి వర్ణన ఉంటుంది. ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.

రచయిత జీవితాన్ని అన్ని ముఖాల్లోంచి దర్శిస్తాడు . ప్రళయ కావేరి కధల రచయిత స.వెం.రమేశ్ అందులో పూర్తిగా సఫలీకృతం అయినట్లు నాకు అనిపించింది. ఈయన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్త.  చదివిన చదువు మానవ సమాజ పరిణామ క్రమం, తెలుగులలో రెండు ఎమ్మేలు.

రచయితకు తన తాతే బోధకుడు, తాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని   పదాడంబరంతో కాకుండా సహజమైన సహవాసం, సాన్నిహిత్యంతో మనకు అర్ధం చేయిస్తాడు రచయిత. “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.” అని నేర్పిన తాత రుణం ఈ కధలు రాసి తీర్చుకొన్నాడు రచయిత.

ఈ కధల నాయకుడు వెంకయ్య తాత మన రచయితను తన భుజాలమీద ఎక్కుంచుకొని లెక్కలు నేర్పాడు. “అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము.” (పుబ్బ చినుకుల్లో)

” ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ…….” ఇలా పక్షిశాస్త్రాన్ని భోదిస్తాడు. (కొత్త సావాసగాడు)

ఇక చేపల రకాల గురించి చెబుతూ  “ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి.” (సందమామ యింట్లో సుట్టం)

కోస్తా తీరం వెంబట  పెరిగిన నేను ఈ చేపలన్ని రుచి చూసాను.

ఈ కధలలో ప్రధాన పాత్రలను పక్కన బెడితే, కొద్ది సేపున్నా నన్ను అత్యంత ప్రభావితం చేసిన పాత్ర గేణమ్మ. (కత్తిరి గాలి) వెంకన్న తాత అక్క కాశెమ్మవ్వ కూతురు. “గేణమ్మవ్వ మంచిది” అని తనలోని బాలుడి చేత చెప్పించి, గేణమ్మ ఎంత పని చేసేదో రచయత తన ఎదిగిన మెదడుతో చెబుతాడు. “ఇల్లంతా బూజులు గొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్దం చేసింది. పరంటింట్లో, సుట్టింట్లో యాడన్న గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి యిసిరంగా అలికింది. పరంటింటికి సున్నం గొట్టి యెర్రమట్టి వోరు తీసింది. బొట్టల క్రింద కలుకుల్లో పొగపెట్టి యెలికల్ని తరిమింది. మునగ చెట్టుకు పట్టిన కమ్మిటి పురుగుల్ని యెదురు కర్రకు మసేలిక సుట్టి గబ్బుసమురుతో ముంచి మంట కాల్చి చంపింది. మల్లి గుబురుకి పాది చేసి, ఆకు దూసి నీళ్ళు పోసింది. ”

ఇలా రెండు పేరాలు రాసి చివర్లో “ఇరవై కాళ్ళు, ఇరవై చేతుల్తో వొంటి మనిషి వొకటే మాపన కత్తిరి యెండల్ని లెక్కబెట్టకుండా పన్లన్నీ చేసింది గేణత్త” అంటూ ముగిస్తాడు. ఈమెలో మనకు మానవపరిణామక్రమంలో నాగరికత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆదిమకాలంనాటి స్త్రీ మూర్తి ఆవిష్కరిస్తుంది. ఒక్క గేణమ్మే కాదు, మండుటెండలో దాహంతో అల్లాడుతున్న బాలుడికి తన చనుబాలుతో బతికించిన వసంతక్కలో కాని, దిగులుతిప్పలో కూరుకుపోయిన బాలుడ్ని రక్షించటానికి తన ఎనిమిది గజాల కోకను ఇప్పేసి బిత్తలిగా నిలబడిన సుబ్బమ్మవ్వలో కాని; భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.

ఇంకొక ఆసక్తికరమైన పాత్ర వసంతక్క. అడవిలో నల్లబావతో కలిసి రాత్రంతా కాపలాకాసి పట్టిన చెవుల పిల్లులను (కుందేళ్ళు) నల్లబావ భోంచేస్తాడని  “అకా! ఇంత కష్టపడి పట్టుకొనింది సంపేసేదానికా” అని బాలుడు కన్నీళ్ళు పెట్టుకోగానే వాటిని వదిలిపెట్టి నల్లబావకు “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” అని ముసిముసిగా నవ్వుతూ జవాబు చెబుతుంది. (సందమామ యింట్లో సుట్టం)

ఈ కధా కాలం ఎనభైవ దశకం అనుకొంటాను. అప్పటికీ ప్రళయకావేరి దీవుల్లో భాగాతాలు, నాటకాలు, వాటిని చూడటానికి పక్క దీవుల నుండి చుట్టాలు బండ్లెక్కి రావాటాలు ఇవన్నీ ఉండేవి. పల్లెల్లో సాంస్కృతిక కాలుష్యం గురించి రచయిత తన ఆవేదనను కధలో జొప్పించాడు. “మా కడగళ్ళు దేనికి అడగతావులే సోమి! పేటలో సినిమా ఆటంట, పెద్ద కొట్టాం కట్టి , దాంట్లో దినానికి రొండాట్లు ఆడతా వుండారు. పేట చుట్టు పక్కల వూళ్ళల్లో యిప్పుడు భోగాతాలు సూసే వాళ్ళే లేరు. నెమిలాటలు లేవు. పామాటలు లేవు. కీలు గుర్రాలు లేవు. మరగాళ్ళు లేవు. యీరదాళ్ళు లేవు, పంబజోళ్ళు లేవు.యానాది చిందుల్లేవు, యీరబద్ర పూనకాలు లేవు.” (కాశెవ్వభోగోతం) ఇక్కడ ఒక సమాజంగా బ్రతికిన కులాలు పెద్దీటి గొల్లలు, యానాదులు, తూరుపు రెడ్లు, వెలమలు, బేరిశేట్లు, పట్టపు కాపులు, దేశూరి రెడ్లు.

రచయితలోని భావుకుడు కధకొక సారైనా తొంగి చూస్తాడు.

“సలికాలం సాయబోయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ; యీటిల్లోమునిగి, ముదుక్కొని, వొదిగి, వొళ్ళిరుసుకోని బతుకు దేనికి?”

“ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి.” (మిణిగురు పురుగుల వర్ణన).

“నీలమంటే అట్టాంటిట్టాంటి నీలం కాదు, కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్లు, మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”.

“సడీ, సందటి లేకుండా సందకాడ సల్లంగా కురిసి పోయ్యింది వాన. తల్లాకిట అవ్వేసిన సంద ముక్కర్ర, వానతో పాటు వీధి పెత్తనానికి పొయ్యింది. దడి పక్కన ముడుసుకొని కూసున్న మల్లి గుబురు, పుట పుట చినుకులు రాలతోనే వొళ్ళు ఇరుసుకొని, తెల్ల పూల కోక కట్టుకొనింది. మల్లె గుబురు పైనుంచి వొచ్చిన వానగాలి, సల్లటి వాసనతో నాకు సక్కలిగిల్లి పెట్టి, పరమటింట్లో పటాలకు మొక్కను పొయ్యింది.”

ఇలాంటి గిలిగింతలు పెట్టే పదలాలిత్యం పుస్తకమంతా తొణికిసలాడుతూ ఉంటుంది.

అక్షరాలతో నోరూరించగలిగాడు ఈ కధకుడు.

“వొంగొగురు, యిసిక మెత్తాళ్ళు. కలిపి యెగరేసుకొంటే, సట్టిడు కూడు సడీ సప్పుడు లేకుండా లోపలికి ఎల్తాది.”

“అటికి మామిడాకులో పెసల పప్పేసి యెణిపినబయా”

“ పెసర పొప్పులో పుట్ట కూడేసి యిగరేసుకొంటే, ఆ రుసి చెప్పబళ్ళే!”

ఇక అవ్వ చేతి చిరుతిళ్ళు చూడండి. “తంపటేసిన గెణుసు గడ్డలు, యేంచిన చెనక్కాయలు, సద్దనిప్పట్లు, ఉడకేసిన బెండలం గెడ్డలు. నిప్పట్లు, మణుగుబూలు, పులుసన్నం, రవ్వుంటలు, చెనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూపట్లు, దిబ్బట్లు, చీపిరొట్లు, తెదురొట్లు, పాకం పోరలు, కమ్మరట్లు, అలసందొడలు, పులిబంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు”

ప్రళయ కావేరి వాసుల ప్రధాన పంట తమదలు (రాగులు). (ఏడాదికి రెండు వానలు పడితే పండే తమదలను వదిలేసి దండిగా నీరు కావాల్సిన వరిపంటను పండించటం గురించి రచయత బాధ పడ్డాడు.) చిక్కని మజ్జిగ కలిపిన అంబలి చిన్నతపీలుడు తాగటం, నెల్లి చెట్టు కింద కూసోని దోసిట్లో వేసిన సద్ది కూడు కిచ్చరగాయ(నారింజ కాయ) ఊరగాయతో తినటం,,,నా ఊహ తెలిసాక మా అమ్మమ్మ చెబుతుంటే యిలాంటివి విన్నాను.

ఇక అవ్వ “యాడ్నించి తెస్తాదోగానీ, అటిక మావుడాకు, నాసరజంగాకు, పొప్పాకు, యెన్నముద్దాకు, చెంచులాకు, బచ్చలాకు, కోడి జుట్టాకు, ముళ్ళ తోటాకు, చామాకు, బొక్కినాకు, దొగ్గిలాకు, కాశాకు, తుమ్మాకు, మునగాకు, అవిశాకు,….యిట్టా ఎన్నో రకాల ఆకులు తెచ్చి కూరలు చేస్తుంటాదవ్వ. ఆ పొద్దు కూడ చెంచలాకు కూర చేసుండాది.” ప్రళయ కావేరి దీవుల్లో  ఫల సంపద పాలపండ్లు, కలిగి పండ్లు, బీర పండ్లు, బిక్కిపండ్లు, నిమ్మటాయలు, ఊటి పండ్లు, గొంజి పండ్లు, బలిజ పండ్లు, ఎలిక చెవులు, పిల్లొట్టాలు, చిట్టీతకాయలు, అత్తిపొండ్లు, నుంజలు (ముంజలు). ఈ ఆహారాలతో పెరిగిన మన రచయత అంత ఆరోగ్యమైన రచనలను మనకందించాడు.

ఈ పిట్టల పేర్లు మీరెప్పుడైనా విన్నారా! “చిలుకలు, గోరింకలు, బెళవాయిలు, జీని వాయలు, గోరింకలు, చిలవలు, చింతొక్కులు, టకు టకు పిట్టలు, జిట్టి వాయిలు, పాల పిట్టలు, వూరికాకులు, జెముడుకాకులు, పందిట్లో పిచుకలు, యింట్లో కోళ్ళు, గిన్నె కోళ్ళు. యింటి ఆవరణంతా ఒక తూరి తిరిగితే, యెన్ని వన్నెల యీకలు దొరకతాయో చెప్పలేము.”

ప్రళయ కావేరి పిల్లల బాల్యాన్ని పండిచిన ఆటలు: మగపిల్లల ఆటలు కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట. ఆడపిల్లల ఆటలు వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి. (ప్చ్. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులో!)

రచయితకి ప్రాచుర్యం అవార్డుల ద్వారా రాదు. ఆయన సృష్టించిన పాత్రలలో పాఠకులు ఎంత మమేకం అయ్యారో అనే దాని మీదే వస్తుంది . ఆ రకంగా ఈ రచయత ధన్యత చెందినట్లే. ఒక పాఠకుడు కధలోని పాత్రలు నిష్క్రమించటం మీద కోపం  ప్రకటిస్తూ ఉత్తరం రాసారు. ఎప్పుడైనా ‘జల్లల దొరువు ‘ వెళితే ఆ పాత్రలు తమను ఆహ్వనించాలట. ఒక పాఠకుడు “నేను తప్పిపోయిన లోలాకులగాడ్ని” అంటూ ఉత్తరం రాసారు. ఒక పాఠకురాలు “నేను గుండుపద్నను రా” అంటూ.  అంతగా పాఠకులు ఈ కధలలో ఇన్వాల్వు అయ్యారు. పాఠకులందరూ కోరుకొన్నట్లుగా స.వెం.రమేశ్ గారి  నుంచి ఇంకా ఎంతో మంచి సాహిత్యాన్ని నేనూ కోరుకొంటున్నాను.

ప్రతులకు:

http://kinige.com/kbook.php?id=478&name=Pralayakaveri+Kathalu