వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు! 

 

– రంగనాయకమ్మ

~

 

 

రూధిని గారితో పరిచయం నాకు ఐదారేళ్ళు సాగింది. నిజానికి,  చాలా విషయాల్లో ఆవిడికీ నాకూ సరిపడేది కాదు. ఆవిడ, ‘‘నేను ఎవరితోటీ గొడవలు పెట్టుకోను. నెమ్మదిగా వుంటాను’’ అనేవారు. నిజానికి , కోపం రావలసిన సందర్భాల్లో కూడా అలాగే వుండేవారు. ఆవిడ అలా వున్నప్పుడల్లా నేను నవ్వి, ‘‘మీరు సగం సన్యాసి అయ్యారు. ఇంకా పూర్తి సన్యాసి అవ్వండి! గొడవలు ఎవ్వరూ నిష్కారణంగా పెట్టుకోరండీ. అవసరమైతే, గొడవ పెట్టుకోవలిసిందే’’ అనేదాన్ని. ఆవిడ ఒప్పుకునేవారు కాదు.

ఆవిడికి కళ్ళ వైద్యాలు చాలా సార్లు జరిగాయి. నేను తరుచుగా, ‘‘ఎలా వున్నారు?  కళ్ళల్లో అంతా మందులేనా? అబ్బా, ఎంత వోపిక బాబూ మీకు!’’అని పలకరిస్తూ వుండేదాన్ని. ఆవిడ చెప్పిన కళ్ళ డాక్టరు దగ్గిరికి నేను కూడా వెళ్ళాను. ఆ డాక్టరు ఆవిడికి బాగా నచ్చాడు. ఎందుకంటే, ఆవిణ్ణి డబ్బు ఇవ్వొద్దు అనేవాడు ఆయన. ‘‘డాక్టరు డబ్బే అక్కర లేదంటున్నాడు. ఏ డాక్టరూ నా దగ్గిర డబ్బు తీసుకోరు’’ అనేవారు ఆవిడ.

నేను, ‘‘అయ్యో! అలా చెయ్యకండి. వాళ్ళకీ బోలెడు ఖర్చులు వుంటాయి. మనం వైద్యం చేయించుకుంటే, వాళ్ళు వొద్దన్నా ఎంతో కొంత ఇచ్చెయ్యాలి. మీరు ఇవ్వదల్చుకున్నది, ఆయన ముందు టేబుల్ మీద పెట్టెయ్యండి ’’ అనేదాన్ని. ఆవిడ ఒకసారి అలా ఇచ్చినట్టే చెప్పారు. కళ్ళ వైద్యాలు జరుగుతూనే వున్నాయి. మళ్ళీ డబ్బు మాటలు రాలేదు. మా మధ్య ఎప్పుడూ నిస్సారంగానే, మర్యాద రకంగా మాత్రమే, వుండేది ఇద్దరికీ. కానీ పలకరింపులూ, కబుర్లూ, సాగుతూనే వుండేవి.

నేను, ఆవిడ భర్త గారి ‘దెయ్యాల శాస్త్రం’ మీద మొదటి వ్యాసం రాసినప్పుడు, తను నాస్తికురాలినని చెప్పుకునే ఆవిడ, భర్త గారి కీర్తిని నిలబెట్టే విధంగా వాదించడం చేశారు. అయినా నేను చెప్పవలిసింది నేను చెప్పి, అప్పుడప్పుడూ మాట్లాడుతూనే వున్నాను. నాతో మాటలు ఆపుకోవాలని ఆవిడ అనుకోలేదు. క్రమంగా ఆవిడ ధోరణి నచ్చక నేనే మాటలు ఆపేశాను.

ఆ తర్వాత మూడేళ్ళు నిశ్శబ్దంగానే జరిగాయి. ఈ 2015లోనే, సెప్టెంబరులో, వేణు అనే పాఠకుడు ‘సారంగ’ నెట్ పత్రికలో వచ్చిన వార్త ఒకటి మాకు పంపించాడు.

ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

నెట్ పత్రికలు చూసే ఆసక్తీ, టైమూ, నాకు ఎప్పుడూ లేవు. ఎవరైనా చెపితే వినడం, పంపితే చూడడం.

వేణు పంపిన ‘సారంగ’ వార్త ఏమిటంటేపి. విక్టర్ విజయకుమార్ అనే అతను, వరూధిని గార్ని కలిసి, రంగనాయకమ్మ గురించి చాలా తెలుసుకున్నట్టు, ‘సారంగ’లో రాసిన సమాచారం అది. ‘‘రంగనాయకమ్మ వరూధిని అమ్మ వంటి గొప్ప ఆవిడితో స్నేహం పోగొట్టుకుంది’’ అని తేల్చి, ఆ వార్త రాశాడు అతడు. అతడు రాసింది ఇంకా వుంది. అదంతా వరూధిని గారు అతనికి చెప్పిన విశేషాలే. అవన్నీనిజాలు కాని సంగతులే. ఆ సంగతులన్నీ వింటే విజయకుమార్ కి పండగ అయింది.  అంబేద్కర్ మీద విమర్శ రాశానని ఇతనికి కోపం. (తను విరసం మనిషిని కానని ప్రత్యేకంగా చెప్పుకున్నాడు. అయినా,  రంగనాయకమ్మ మీద కోపం ఎందుకంటే, అంబేద్కర్ వాదిగా ఆ కోపం. ఆ రకం కోపాన్ని నెట్ పత్రికల్లో కొన్ని సార్లు వేరే వాళ్ళు చూసి చెప్పారు.)  నేను, దెయ్యాల తత్వవేత్త మీద రాసిన వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని, అతడు ‘సారంగ’లో ఇలా రాస్తున్నాడు:

‘‘ఒకసారి కొ.కు. గారి మీద, మా రంగనాయకమ్మ గారు యధావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాశారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగనాయకమ్మతో కుటుంబ మిత్రత్వం వున్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. (రంగనాయకమ్మతో అలాంటి ఇబ్బందులే వస్తాయి మరి- అని చెప్పడం! )  రంగనాయకమ్మ ఆ వ్యాసం రాశాక, చాలా రోజుల వరకూ, రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుంచి వరూధిని అమ్మకు ఫోను లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుంచి ఫోను వచ్చింది. (ఇవన్నీ, వరూధిని అమ్మ ఆ ముద్దుల కొడుక్కి చెప్పిన మాటలు!) వరూధిని అమ్మ రంగనాయకమ్మని ఫోనులో యథాలాపంగా పలకరించాక, రంగనాయకమ్మ ఉండపట్టలేక,  ‘‘మీకు చూపు సరిగ్గానే వుందా?’’ అని అడిగింది. అప్పుడు, వరూధిని అమ్మ, ‘‘ఆ(.. ఫర్లేదు…పత్రికలు చదవగలుగుతున్నాను’’ అని సమాధానం ఇచ్చింది,  రంగనాయకమ్మ ఎందుకు వాకబు చేస్తోందో తెలిసి. రంగనాయకమ్మ, ‘‘మరి, నే కుటుంబరావు గారి గురించి వ్యాసం రాశాను, చదవలేదా?’’ అని ప్రశ్నించింది. వరూధిని అమ్మ ఏ మాత్రం హావభావాలు లేకుండా, ‘‘ఆయన పబ్లిక్ పర్సనాలిటీ. ఎందరో ఆయన్ని విమర్శిస్తుంటారు, పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను’’ అన్నది. (వరూధిని గార్ని నేను అడిగానో లేదో , ఆవిడ ఎలా అన్నదో, తెలియాలంటే, నేను ‘దెయ్యాల శాస్త్రం’ మీద ‘చినుకు’ పత్రికలో రాసిన వ్యాసం చూస్తే తెలుస్తుంది. ఆ వ్యాసాలన్నీ నా ‘పల్లవి లేని పాట’ సంపుటంలో దొరుకుతాయి. వరూధిని జవాబుకి నేను నోట మాట రాకుండా అయిపోయానని ఆవిడి ముద్దుల కొడుకు తర్వాత చెపుతున్నాడు చూడండి.) ‘అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్ ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం.’’(నేను మాట్లాడ లేకుండా అయిపోయినట్టు వరూధిని చెప్పిందని అనుకోవాలి.  అసలు, ఆవిడ విజయకుమార్ తో చెప్పినవన్నీ నిజం కాని అబద్దాలే. ఆవిడికీ, నాకూ, నా మొదటి వ్యాసం వచ్చిన వెంటనే మాటలు జరిగాయి. అది చాలా రోజుల తర్వాత కాదు. నేను ఏది రాసినా, ‘‘మీరు చదివారా? మీరు చదివారా?’’ అని ఎవ్వర్నీ అడగను. అలాగే, ఆవిణ్ణీ  అడగలేదు. ఆవిడి కంటి ఆరోగ్యం గురించి అడిగానంటే,  అది ఎప్పుడూ జరిగేదే. ఆవిడ, నా మీద వ్యతిరేకంగా చెప్పడం వల్లే, అతడికి అలాంటి పొగరు మాటలు వచ్చాయి. నా ఎక్స్ ప్రెషన్ అలా అయిపోయిందని వాగాడు! )

విజయకుమార్ రాసినదాన్ని చదివిన కూర్మనాథ్  (ఇతడు విరసం వాది, విరసం పత్రిక ‘అరుణతార’ సంపాదకవర్గ సభ్యుడు) తన కామెంట్ ఇలా రాశాడు :  ‘‘ఐ లైక్డ్ హర్ ఆన్సర్ టు రంగనాయకమ్మ. ’’(వరూధిని, రంగనాయకమ్మకి ఇచ్చిన జవాబుని ఇతడు చాలా ఇష్టపడ్డాడట! అసలు, వరూధిని ఇచ్చిన జవాబు ఏమిటో చూడాలంటే, నా ‘చినుకు’ వ్యాసం చదువుకోవాలి. అందులో తెలుస్తుంది వరూధిని జవాబు. ‘‘ఇప్పుడు లేని ఆయన మీద ఎందుకు రాశారు? ఆయన దెయ్యాల మీద ఎప్పుడో చిన్నప్పుడు రాశారేమో. అసలు, వాటిని వెయ్యడం విరసం తప్పు. మీరు విరసాన్ని విమర్శించండి గానీ, చిన్నప్పుడు రాసిన మనిషిని ఎలా విమర్శిస్తారు? ’’- ఈ పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. ఇదంతా నా ‘చినుకు’ పత్రిక వ్యాసంలో వుంది. విరసం వాదులందరూ చినుకు వ్యాసం చూసే వుంటారు, అది వాళ్ళ సంఘం మనిషి మీద రాసింది కాబట్టి. కానీ,  అసలు  నిజం తెలియనట్టు నాటకాలు! )

కూర్మనాథ్ కామెంటు తర్వాత, విజయకుమార్ ఇలా రాశాడు:  ‘‘రంగనాయకమ్మ ఒకప్పుడు వరూధిని అమ్మ కుటుంబానికి మంచి స్నేహితురాలు (గుడ్ ఫ్రెండ్). దురదృష్టవశాత్తూ, రంగనాయకమ్మ తన కలగజేసుకునే స్వభావం (ఇంటర్ ఫియరింగ్ నేచర్) వల్లా, ఆమె మూఢ వైఖరి (డాగ్మటిక్ అప్రోచ్) వల్లా, వరూధిని అమ్మను తన ఫ్రెండ్ గా పోగొట్టుకుంది.’’ (రంగనాయకమ్మ, దురదృష్టంతో , తన చెడ్డ గుణాలతో, అంత గొప్ప స్నేహితురాల్ని పోగొట్టుకుంది. రంగనాయకమ్మది, కలగజేసుకునే స్వభావం. మూఢ వైఖరి. ఒక తత్వవేత్త రాసిన దాంట్లో ఈవిడ ఎందుకు కలగజేసుకోవాలి? – ఇదీ వీళ్ళ తీర్పు!   వరూధిని గారు నాతో చాలా సందర్భాల్లో,  ‘‘నేను కలగజేసుకోను. అన్నీ నేను పట్టించుకోను’’ అనేది. ఆవిడ, మొగుడి చేష్టల్ని పట్టించుకోకపోవచ్చు. ‘‘తోటి రచయితలు పట్టించుకుంటారు’’ అనే జ్ఞానం లేదు ఆ మనిషికి. విజయకుమార్ వాగిన వాగుడంతా, ఆవిడ ద్వారా అందినదే.)

‘సారంగ’వార్తని నాకు పంపిన వేణు, విజయకుమార్ వాగుడు చూసి, తన ప్రశ్నలు తను అడిగాడు. ‘రంగనాయకమ్మ వ్యాసాన్ని తప్పుల తడక అన్నావు. అసలు ఆ వ్యాసాన్ని నువ్వు చదివావా?’ అనే పద్ధతిలో ఇలా అడిగాడు:  ‘ఆమె చేసిన విమర్శ దేన్ని గురించి? ఆ వ్యాసాన్ని కనీసంగా ప్రస్తావించకుండానే అది తప్పుల తడక అనెయ్యడానికి మాత్రం ఉత్సాహపడిపోయారు మీరు. ఆ వ్యాసం, కొ.కు. తత్వ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతిలో 2012 డిసెంబరు 24న రంగనాయకమ్మ రాసిన వ్యాసం.  దాని శీర్షిక: ‘సోషలిజం తేవడం చాలా తేలికే.’ ఆ వ్యాసం ప్రచురణ తర్వాత, వరూధిని- రంగనాయకమ్మ గార్ల మధ్య ఏం జరిగింది? మీరు వరూధిని గారి వర్షను ఇక్కడ ఇచ్చారు. ఈ విషయంలో, రంగనాయకమ్మ గారి వర్షన్ కూడా చూడాలి కదా? అది, 2013 ఏప్రిల్ ‘చినుకు’లో వచ్చింది. ఆ చినుకు వ్యాసం ప్రకారం చూస్తే, వరూధిని గారు, మీరు రాసిన పద్ధతిలో కాకుండా, వేరే రకంగా స్పందించారు. ….‘ఆయన ఇప్పుడు లేరు. లేని మనిషి మీద విమర్శలెందుకు?’ అనీ, ‘ఆయన మీద మీరు పర్సనల్ గా రాశారు’ అనీ- ఈ పద్ధతిలో ఆవిడ స్పందించారు. ఆ మాటలకు రంగనాయకమ్మ గారి స్పందన కూడా ఆ చినుకు వ్యాసంలోనే వుంది.’’- ఇలా కామెంట్ చేశాడు వేణు.  (నేను అప్పుడు వరూధినికి చెప్పిన జవాబు కావాలంటే, ‘చినుకు’ వ్యాసంలో చూడాలి. చాలా వుంది. అది ఇక్కడ చేర్చడం కుదరదు. నేను చాలా చెప్పి, ఆవిడితో మాటలే ఆపేశాను.)

నేను చెప్పింది అలా వుంటే,  ‘‘అటు పక్క ఎక్స్ ప్రెషన్ ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం’’ అని వరూధిని అమ్మ ముద్దుల కొడుకు తీర్పు!  రంగనాయకమ్మ నోరెత్తలేకపోయింది- అని! (ఇలాంటి అబద్దాల వాళ్ళు, దొంగల ముఠాల్లోనే వుంటారు.)

వేణు, తన కామెంట్ లో  ఇంకా కొంత ఇలా రాశాడు:  ‘‘కొ.కు. దెయ్యాలూ, ప్రేతాత్మల గురించి రాసిన విషయాలను నేను అంగీకరించను. మార్క్సిస్టులు గానీ, నాస్తికులు గానీ, ఆ విషయాలను వ్యతిరేకించాల్సిందే. ఆ పని, తన విమర్శతో చేశారు రంగనాయకమ్మ. ఆమె రాసింది తప్పుల తడక అంటున్నవారు, పర లోకాలనూ, పూనకాలనూ, దెయ్యాలనూ, ప్రేతాత్మలనూ, నమ్ముతున్నట్టే.’’  వేణు, నా ఆంధ్రజ్యోతి వ్యాసాన్నీ, చినుకు వ్యాసాన్నీ కూడా నెట్ లో పెట్టాడు.

 

 

వేణు రాసిన మొత్తం కామెంట్ కి విజయకుమార్ జవాబు ఏమిటంటే:  ‘‘మీరు చెప్పిన వ్యాసాన్ని చదివి, తర్వాత మీతో మాట్లాడతాను. (గెట్ బ్యాక్ టూ యూ.) ఒక కుటుంబాన్ని పరిచయం చేయడమే నా వుద్దేశం. కనక నేను, విషయం లోతుల్లోకి వెళ్ళే అవసరాన్ని చూడలేదు.’’ (విజయకుమార్ అలాంటి జవాబు ఇచ్చాడంటే,  దాని మీద ఎదటి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారనీ, తన జవాబు ఎందుకూ పనికి రాదనీ, కనీసంగా కూడా ఊహించకుండా, ‘గొప్ప జవాబు చెప్పేశాను’ అనుకున్నాడు! )

వేణు మళ్ళీ ఇలా అడిగాడు:

‘‘ఒక కుటుంబాన్ని (వరూధిని గారి కుటుంబాన్ని)  పరిచయం చెయ్యడం మాత్రమే మీ వ్యాసం లక్ష్యమా? అలాగైతే, రంగనాయకమ్మా వరూధిని గార్ల  మధ్య జరిగిన అంశాల్లో , మీరు ఒకరిని ఏక పక్షంగా సమర్థిస్తూ, మరొకరిని హీనపరుస్తూ, రాయకుండా వుండాల్సింది.  రంగనాయకమ్మ గారి స్వభావం, ఇంటర్ ఫియరింగ్ నేచర్ అనీ, డాగ్మటిక్ అప్రోచ్ అనీ,  తీర్పులిచ్చేశారు, మీ కామెంట్లలో. మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి, విషయాల్ని చర్చనీయాంశం చేసేసి, తీరా ఇప్పుడు చర్చ అవసరం లేదంటే ఎలా?’’ అని ముగించాడు వేణు. ( ‘తప్పుల తడక’ అని, విజయకుమార్ మేధావి ఏ వ్యాసం గురించి అన్నాడో, ఆ మేధావి అసలా వ్యాసాన్ని చదవలేదని చెపుతున్నాడు. వరూధిని  అమ్మతో ముచ్చటించినప్పుడు కూడా ఆ వ్యాసం అతనికి తెలీదని అర్థం. విషయాన్ని తెలుసుకునే లోతుల్లోకి వెళ్ళలేదని చెపుతున్నాడు.)

‘సారంగ’లోనే, ఒక పాఠకుడెవరో , ఇంకో కొత్త విషయం తెచ్చాడు. వరూధిని భర్త గారికి, మరణించిన ఒక భార్య వల్ల ఒక కొడుకు వున్నాడు. ఆ సంగతులేవీ వరూధిని, విజయకుమార్ కి చెప్పలేదు. ఆ పాఠకుడు ఏమంటాడంటే: ‘భర్త గారి కొడుకు కూడా ఆ కుటుంబంలో వ్యక్తే కదా? నీ పిల్లల్ని నువ్వు చెప్పుకున్నప్పుడు, ఆ కొడుకు కూడా వున్నాడని చెప్పాలి కదా? ఆ కొడుకు ఇప్పుడు జీవించే వున్నాడు. భర్త గారి మొదటి కొడుకు సంగతి చెప్పడం అనవసరం అనుకుంటే రంగనాయకమ్మ సంగతి ఎందుకు అవసరం?’ అని ప్రశ్నించాడు.

దీని మీద విజయకుమార్ నోరెత్తలేదు.

‘సారంగ’ని చూసిన ప్రసాద్ (జె.యు.బి.వి.) ‘‘ఏమిటీ గొడవ?’’ అని నన్ను అడిగాడు. దెయ్యాల తత్వవేత్త మీద నేను రాసిన 4 వ్యాసాలూ చదివిన వాడే అతను. నేను వరూధిని గారికి రాసిన వుత్తరం సంగతి చెప్పాను. అది తనకి ఇవ్వమని అడిగితే, పంపించాను. దాన్ని కూడా నెట్ పాఠకులు చదవవలసిన అవసరం వుందని ప్రసాద్ దాన్ని నెట్ లో పెడతానంటే, ఒప్పుకున్నాను.

ప్రసాద్, ‘సారంగ’లో ఇలా రాశాడు:

‘‘…. రంగనాయకమ్మకీ, తనకీ, ఒకప్పుడు స్నేహం వుండేదనీ, ఆ స్నేహాన్ని రంగనాయకమ్మ పోగొట్టుకున్నదనీ, వరూధిని గారు చెప్పడం వల్లే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన విజయకుమార్ గారు ఇక్కడ చెప్పారన్నమాట! … రంగనాయకమ్మ గారు రాసిన వ్యాసాలు నేను గతంలోనే చదివాను. ‘పల్లవి లేని పాట’ సంపుటంలో వున్నాయి అవి. …. కుటుంబరావు గారి (తత్వ) వ్యాసాల విషయమై, వరూధిని గారితో జరిగిన సంభాషణ గురించి రంగనాయకమ్మ గార్ని అడిగాను. జవాబుగా, వరూధిని గారికి తను రాసిన ఉత్తరం రంగనాయకమ్మ గారు నాకు పంపారు. ఆ ఉత్తరం లింకు ఇక్కడ ఇస్తున్నాను. https://www.scribd.com/doc/283230141/To-Varudhini-19-1-13

కుటుంబరావు గారు ఎంత అశాస్త్రీయంగా ఆలోచించారో, ఆయన వ్యాసాల్లో నించే సంవత్సరాల వారీగా ఆధారాలు చూపినా అంగీకరించని వరూధిని గారిదే డాగ్మటిక్ ఎప్రోచ్ (మూఢ వైఖరి) అని స్పష్టంగా అర్థమవుతోంది…. ఇంతకీ, విజయకుమార్ గానీ, కూర్మనాథ్ వంటి వారు గానీ, దెయ్యాల తత్వశాస్త్రాన్ని సమర్థిస్తారా? ’’- ఇది ప్రసాద్ ప్రశ్న!

విజయకుమార్,  మొదటి వ్యాసం చదివి వేణుతో ఏదో చెపుతానన్నాడు. వేణు ఆ జవాబు కోసం ఎదురు చూస్తున్నట్టే వున్నాడు.

వేణూ! నమ్ముతున్నావా అతన్ని? చచ్చివుంటారు వాళ్ళందరూ ఈ పాటికి. దెయ్యాలై,  నీ దగ్గిరికి వస్తారేమో!  ఒక కర్ర దగ్గిర పెట్టుకో!  దెబ్బకి దెయ్యం జడుస్తుంది. అందుకే ‘దెయ్యం పట్టింది’ అని నమ్మి ఆ పిచ్చి వాళ్ళని బాదుతారు.

దెయ్యాల్ని నమ్మేవాళ్ళు, దేవుళ్ళనీ నమ్ముతారు. ఆ తత్వవేత్త, ‘భగవంతుడు ఉన్నాడు’ అన్నది కూడా మిడికాడు. అతని భార్యకి, పాప-పుణ్యాల నమ్మకాలు వుంటాయి. ఆమె ఆడిన అబద్దాల ఫలితంగా, ఇప్పటికి, ఆవిడ పాపం పండింది!

చివరికి చెప్పేది ఏమిటంటే- ఆ విజయకుమార్ గానీ, ఆ కూర్మనాథ్ గానీ, మళ్ళీ పత్తా లేరు!  ఉండేలు బద్ద చూసిన కాకుల్లాగ, మళ్ళీ ఈ విషయం ఎత్తకుండా నోళ్ళు మూశారు. రంగనాయకమ్మ రాసిన 4 వ్యాసాల్ని చదివినవాళ్ళూ, అడిగే వాళ్ళూ, చాలామంది వుంటారని, వాళ్ళు మొదట ఊహించలేదు. వరూధిని అమ్మ చెప్పే కబుర్లన్నీ అబద్దాలని తేలతాయనీ వూహించలేదు !  ఇక ఏం చెయ్యగలరు, నోళ్ళు మూసెయ్యడం తప్ప? రంగనాయకమ్మ ఎక్స్ ప్రెషన్ వర్ణించినవాడి ఎక్స్ ప్రెషన్ ఎలా మారిందో ఊహించండి!

                        *  *   *   

రూధిని గారితో నేను అప్పుడప్పుడూ మంచి విషయాలు మాట్లాడడానికే ప్రయత్నించాను. దాని ఫలితం  ఏమీ కనపడలేదు. ఆవిడ మద్రాసు నించి ఇల్లు అమ్ముకుని వచ్చిన తర్వాత, ఆవిణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళు, ‘‘మీ ఇల్లు ఎంతకి అమ్మారు?’’ అని అడిగే వారట. ఎవరైనా తన డబ్బు మాట ఎత్తితే ఆవిడికి నచ్చదు.

నాతో అన్నారు రెండు మూడు సార్లు. ‘‘మీ ఇల్లెంతకి అమ్మారు- అని అడుగుతారేమిటి నన్ను? వీళ్ళకి చెప్పాలా నేను?’’ అన్నారు.

అలాంటప్పుడు నేను, ‘‘అది కాదండీ. మద్రాసులో స్తలం ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటారు. అంత కన్నా ఏముంటుంది? మీ డబ్బు వాళ్ళడుగుతారా?’’ అనే దాన్ని.

‘‘అయితే మాత్రం, ఎందుకు వాళ్ళకి అదంతా?’’ అనే వారు.

చెప్పిన కారణాన్ని వినే పని లేదు.

నేనైతే అలా ఎప్పుడూ డబ్బు మాట అడగలేదు.

కానీ, ఒక సారి ఏమన్నానంటే, ‘‘మీ భర్త గారి పుస్తకాలు వాళ్ళూ వీళ్ళూ వెయ్యడం ఎందుకు? మీ దగ్గిర  డబ్బు వుంది. ఆ పుస్తకాలన్నీ చవక ధరలతో మీరే వేయించవచ్చు. ఆ పని శ్రద్ధగా చూసే వాళ్ళకి అప్పజెప్తే, ఆ పుస్తకాలు రెగ్యులర్ గా వుంటాయి. అలాంటి ఏర్పాటు చెయ్యండి. డబ్బు తీసుకుపోయి పిల్లల కివ్వాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళ ఆదాయాలు వాళ్ళకి వున్నాయి. ఆయన పుస్తకాల ప్రచురణ కోసమే ఏర్పాటు చెయ్యాలి మీరు’’అని చెప్పాను.

‘‘ఆ గొడవంతా నా కెందుకు?’’ అన్నారు.

‘‘మీకేం కష్టం వుండదు. డబ్బు ఇవ్వడమే మీ పని. మీకు నమ్మకం అయిన వాళ్ళతో మాట్లాడండి’’ అన్నాను.

‘‘ఎందుకూ? వేసే వాళ్ళు వేస్తున్నారు. విరసం వాళ్ళకి వూరికే ఇచ్చేశాను. వాళ్ళని రాయల్టీ అడిగానా? ఊరికే ఇచ్చాను’’ అన్నారు.

సరే, ఆవిడ ఆ పని పెట్టుకోడానికి భయపడుతున్నారు- అనుకుని వూరుకున్నాను. కానీ, ఆ డబ్బుని పిల్లలకి ఇవ్వకుండా, ఆవిడ భర్త గారి పుస్తకాలకే పెట్టేలాగ ఇంకా వివరంగా నేను చెప్పవలసింది- అని నాకు కొన్ని సార్లు అనిపించింది.

ఒకసారి చలసాని ప్రసాద్ గార్ని అడిగాను.  ‘‘వరూధిని గారికి మీరేమీ రెమ్యునరేషన్ ఇవ్వరా?’’ అన్నాను.

‘‘ఎందుకివ్వం? కంటి ఆపరేషన్ కి డబ్బు కావాలని అడిగితే ఆ మధ్య ఆపరేషన్ల కోసం 50 వేలు ఇచ్చాను’’ అన్నారు.

‘‘ఆవిడ అలా అన్నారే!’’ అంటే నవ్వారు, ‘‘ఆవిడ అంతే’ అన్నట్టు.

‘‘ఆవిడికి డబ్బు వుంది కదా? ఆవిడి భర్త గారి పుస్తకాలే కదా? ఆ పుస్తకాలకి  ఆవిణ్ణే డబ్బు ఇవ్వమని ఆవిడికి నమ్మకం కలిగేలాగ చెప్పండి. ఆ డబ్బుని ఆయన పుస్తకాలకే ఉపయోగించమని మీరు చెప్తే ఆవిడికి నమ్మకం కలుగుతుందేమో!’’ అన్నాను.

ఆయన మాట్లాడనే లేదు. ఆవిడితో ఆ పని జరగదని ఆయన అభిప్రాయం కావచ్చనిపించింది.

ఆ రకంగా, ఆవిడితో సామరస్యంగా వుంటూ వుండగానే,  ఆ దెయ్యాల పుస్తకం చదివి, ఆ తత్వవేత్త మీద చాలా కోపం వచ్చి 4 వ్యాసాలు రాశాను. ఆయన రాసిన కథలూ, నవలలూ వంటి వాటి సంగతి కాదు ఇది. వాటి మాట నేను ఎత్తలేదు. తను భౌతికవాదిననీ, దెయ్యాల్ని కూడా భౌతికవాదం అనీ, చెప్పిన మనిషిని గురించి ఎలా ఆలోచించాలి? తను నాస్తికురాలినని చెప్పుకునే ఆవిడ, భర్త గారు చేసిందేమిటో తెలిసి కూడా ఆ పనినే సమర్థించింది. నేను రాసిన మొదటి వ్యాసంతోనే, ఆవిడి సంభాషణ నచ్చక, ఇక ఆ పరిచయాన్ని వదిలేశాను.

ఆవిడ, ఆ మొదటి వ్యాసం చదివి, ఆశ్చర్యపడి, బాధపడి,   ‘‘ఇలా రాశారేమిటి ఈయన? మతి పోయిందా ఏమిటి?’’అంటే, ఆయన తప్పుని అలా అర్థం చేసుకుంటే, మా స్నేహం చెడేది కాదు. నా పని, ఆవిడికి నచ్చలేదు; ఆవిడ, ‘‘ఆయన అలా రాయరు’’ అంటూ చేసే పొగడ్త నాకు నచ్చలేదు. అంతా స్పష్టంగా కనపడుతోన్నా, ఆవిడ కళ్ళు మూసుకుంది.

వరూధిని గారికీ, నాకూ, అయిష్టాలు ఎలా ప్రారంభమయ్యాయి- అంటే:

  1. వరూధిని గారు, భర్త గారి పెద్ద కొడుక్కి ఏ మాత్రమూ దక్కనివ్వకుండా సవతి తల్లిలా ప్రవర్తించిందని ఆశ్చర్యపోతూ ఆవిడికి ఉత్తరం రాస్తే, ఆవిడ ఆ ఉత్తరాన్ని గోడకి అంటించుకునే ఉత్తరంగా వర్ణించింది. ఆ ఉత్తరం తర్వాత కూడా మాట్లాడుకుంటూనే వున్నాం. కానీ ఆవిడ ఏ రకం మనిషో నాకు అర్థమైంది.
  1. నేను ‘దెయ్యాల తత్వ శాస్త్రాన్ని’ చదవడం ఆ తర్వాతే జరిగింది. ఆ కోపంతో వెంటనే నేను ఒక వ్యాసం రాస్తే, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆ తర్వాత ఆవిడ, ‘‘ఆయన అలా రాయరు’’ అని వాదిస్తే, ఆ తత్వవేత్త కొటేషన్లన్నీ ఇచ్చి ఆవిడికి రాశాను. అయినా, ఆవిడ ఒప్పుకోలేదు. ఇక నేను ఆవిడితో మానేశాను.

 ఆ తర్వాత, ‘చినుకు’ పత్రిక వారు ఏదైనా ఇవ్వమని అడిగితే, వేరే వ్యాసాలతో పాటు, ‘‘గోడకి అంటించుకునే ఉత్తరం’’ అనే పేరు పెట్టి, వ్యక్తుల పేర్లు లేకుండా, రచయిత భార్యకి కామేశ్వరమ్మ పేరు పెట్టి, రాశాను. – ఇంత వరకూ జరిగాక, అంతా నిశ్శబ్దం అయింది.

కానీ,  వరూధిని గారికి నా మీద కోపం! భర్త గారి పరువు నా వల్ల పాడయిందని. ఆయన రచన మీద నేను కలగజేసుకోకూడదని! రచయితలు, ఏ విషయంలోనైనా కలగజేసుకుంటారని, ఆవిడికి తెలీదు.

కుటుంబరావు రచయిత, తను మార్క్సిస్టునని చెప్పుకుంటాడు. అలాంటి వాడు, పసితనంలో తల్లి పోయిన పిల్లవాడికి, తన ఆస్తిలో నించి నాలుగు పైసలైనా అందాలని ఆలోచించలేదు! అది తప్పని, ఉత్తమురాలిననుకునే భార్యకీ, ఆమె పిల్లలకీ, అర్థం కాలేదు. ఆ విషయాలు నాతో చెప్పకుండా దాచుకుంటే, అది వేరు. ఆవిడ, ఆ సవితి కొడుకు మీద నేరం చెపుతున్నట్టు, ‘‘ఇంటి అమ్మకానికి సంతకం పెట్టమంటే, మర్యాదగా పెట్టి వెళ్ళక, లాయర్ని అడిగి పెడతానన్నాడు చూడండి!’’ అని నాతో అనడం!

ఎవరికీ అలా చెప్పకుండా, ఆ సంగతి దాచివుంచినా ఆవిడ ‘సవతి తల్లి’ గాక, ‘వరూధిని అమ్మ’ అయ్యేదా? మార్క్సిస్టునని చెప్పుకునే మనిషి, తన కొడుకునే అంత దగా చేస్తే, ఇక భూస్వాములూ పెట్టుబడిదారులూ, వాళ్ల చేతుల్లో వున్న ఆస్తులెలా వదిలి పెడతారు?

భర్త గారు రాసిన తప్పుడు రాతలు బట్టబయలుగా కనపడుతోంటే, ‘‘ఆయన అలా రాయరు’’ అని వాదించే మనిషి సంస్కారాన్ని ఏమనాలి?

ఈ తల్లికి, ఒక అడ్డగోలు ముద్దుల కొడుకు దొరికాడు! ఇద్దరూ కలిసి రంగనాయకమ్మ మీద ముచ్చట్లు చెప్పుకున్నారు! ‘‘రంగనాయకమ్మ తన ఇంటర్ ఫియరింగ్ నేచర్ వల్లా, డాగ్మటిక్ అప్రోచ్ వల్లా, వరూధిని అంత ఉత్తమురాలితో స్నేహం పోగొట్టుకుంది’’ అని!

నా గురించి, ఇలాంటి కూతలు కుయ్యకుండా వుంటే, మూడేళ్ళ నించీ సాగుతోన్న నిశ్శబ్దమే కొనసాగుతూ ఉండేది.

చీమ కూడా, దాని పుట్టలో వేలు పెడితే ఊరుకోదు, కుడుతుంది. ‘‘నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?’’ అంటుంది.

చీమకి తెలిసిన పాటి రక్షణ నాకు తెలీదా? నా మూర్ఖ ప్రవర్తనతో, వరూధిని అమ్మ వంటి గొప్ప ఆమెతో స్నేహం పోయిందని, ఆమె చెప్పింది నమ్మి, నా మీద చెత్తగా రాయడమా? వాళ్ళని నేనేమీ చెయ్యలేదు. వాళ్ళ గొయ్యి, వాళ్ళే తవ్వుకున్నారు!

*