ఎవరామె…?

Artwork: Rafi Haque

Artwork: Rafi Haque

~

వేకువ…
పత్తి పువ్వై విచ్చకోకమునుపే
నిన్న ఆకాశదండెంపై…ఆరేసిన
చీకటి వస్త్రాలను చుట్టుకొని
ఆదరా బాదరాగా
బస్సెనక పరిగెడుతోంది
ఎవరామె?

నిద్ర గూటిలోని పిల్లలపై
మనసు దుప్పటిని కప్పి
ఖాళీ దారపు ఉండై
కంగారుగా కదులుతూ
ఫుట్ బోర్డ్ పై తూలి
లంచ్ బాక్సై జారిపడుతోంది
ఎవరామె?

అరక్షణపు ఆలస్యం
సూటిపోటు మాటల
సూదై గుచ్చుకుంటుంటే
చిందిన దుఃఖపు బిందువులను
పంటిబిగువున భరిస్తూ
ఆగని కుట్టు మిషనై…సాగుతోంది
ఎవరామె?

చిరిగిన బతుకు బట్ట..కుట్టుకై
చాలని దారంలా… జీతం
పనిలో ప్రక్రృతావసరాలకు సైతం
కాలు మడుచుకొనే తీరికలేనితనం
నీరసమై ఆవహిస్తుంటే
టార్గెట్లను పూర్తిచేస్తోంది
ఎవరామె?

ఆపత్కాలపు పి.ఎఫ్ ఆ’దారాన్ని’
పెట్టుబడికి పోగుకై
ఓ కత్తెర…ఉత్తరిస్తుంటే
అసహనమై రగిలి
సామూహికమై కదిలి
సమ్మై  జండాయై ఎగురుతోంది
ఎవరామె?

            * * *

(‘బ్రాండెక్స్’ మహిళా కార్మికుల సమ్మెకు సంఘీభావంగా…)

మార్కెట్…..ఓ మహాసర్పం

 

 

-మొయిద శ్రీనివాస రావు
~

ఓ కవిమిత్రుడన్నాడు

మడిగట్టు నా సింహాసనమని

అవును నిజమే…మడిగట్టు నా సింహాసనమే

నేను రాజునే

పొలం నా రాజ్యమే

ఆరుగాలం సాగు సాగనప్పుడు

బారెడు భూమిలో

మూరడు పంట పండే కాలంలో

ఊరులోని మిగులు చేతులన్నీ

నాకు వ్యవ ‘సాయం’ చేసాయి

కుండ, బండ

బట్ట, బుట్ట

కత్తి, కత్తెర

తలో చెయ్యి వేసాయి

నా ముంగిట చేతులు చాచి

నన్ను మారాజును చేసాయి

పట్నంకు… పల్లెకు బంధం బలపడినాక

ఊరిలో మార్కెట్ మహాసర్పం బుసలుకొట్టింది

మిగులు చేతులను బయటికి పంపి

వలస చీమలగా మార్చేసింది

నా క్షేత్రంలో ఏమి పండాలో శాసించింది

‘మదుపు ‘ మోటరు పంపులోని నీరై

నిత్యం పొలంలోనికి పారింది

చివరకి….నా బతుకే ‘ఎరువు’ అయినాక

మూరడు నేలలో పండిన

బారెడు పంటను

చిరు ‘ధర ‘హాసంతో మింగేసింది

నన్ను మడిసెక్కకు బానిసను చేసింది

మహాసర్పపు ఆకలి కేకలకి

అరిచేతులను అరగదీసుకున్నాను

కడుపును కుదించుకున్నాను

మిగులు సమయాలలో నేతొడుక్కున్న

అదనపుచేతులను సైతం అర్పించుకున్నాను

మూరడు మడిసెక్క వ్యాపారక్షేత్రమైన చోట

మార్కెట్ మహాసర్పంతో యుద్దమంటే మాటలా!

కడవరకు బానిసగానైన బతకాలి!

లేదా మారాజుగానైనా చావాలి!!

చివరికి మిగిలిన మడిసెక్కను

అది మింగినాక

మహాసర్పాన్ని మట్టుపెట్టగల

పట్నపు శ్రమచీమల సైన్యంలోనైనా చేరాలి! !!

* * *

(karl kautsky పుస్తకం ‘on agraarian question’ చదివిన స్పూర్తితో)

కొనాలి

మొయిద శ్రీనివాస రావు

 

పొద్దున్నే… పదిగంటలకే

పండు మిరపకాయలా

ఎండమండిపోతుంటే

అంతవరకూ … ఆ ఊరిలో

కాకిలా తిరిగిన నేను

తాటికమ్మల కింద

తాబేలులా వున్న

ఓ బడ్డీ కాడ

కాసేపు కూర్చున్నాను

ఎండిన రిట్టకాయ రంగున్న

ఓ పిల్లాడు

ఒత్తైన జుత్తు బొమ్మలున్న

రెండు ‘చిక్’ షాంపూలు పట్టుకెళ్ళాడు

పలచగా పలకర్రలా వున్న

ఓ పిల్ల… డొర్రి పల్లెల్లబెట్టి నవ్వుతూ

‘క్లోజప్’ లా కదిలిపోయింది

శొంటి కొమ్ములాంటి

ఓ ముసలాయిన

‘నవరత్న’ ప్యాకెట్ లా నడిచిపోయాడు

సగముడికిన కూరలాంటి

ఓ ముసాలామె

‘ప్రియా’ పచ్చడి ప్యాకెట్టై

వడివడిగా ముందుకు సాగిపోయింది

లేగదూడకు సైతం పాలివ్వలేని

గోమాతలాంటి ఒకామె  ‘విశాఖ డైరీ’

పాల ప్యాకెట్టై పరుగులు తీసింది

నోట్లోంచి నువ్వుగింజే నాననట్టున్న

ఒకాయిన

‘రిలయన్స్’ రీచార్జ్ కార్డై

రింగుటోనులా రివ్వున పోయాడు

పల్లె కొట్లలో… చిన్న ప్యాకెట్లలో దాగిన

వ్యాపార సూత్రం వడగాలై తాకి

నా గొంతెండిపోతుంటే

‘ఇప్పుడన్నీ చిన్నవేలాగున్నాయ’న్న  నా ప్రశ్నకు

‘అందరూ కొనాలి కద సార్’ అన్న సమాదానం

ఓ స్మాల్ ‘కోలా’ డ్రింకై

కూలుగా నా చేతిలో వాలింది

       * * *

Moida

నన్ను నేను సమాధానపరుచుకోవడానికేనేమో…!

     సాయంత్రమయ్యేసరికి నలుగురు పిల్లలను తన చుట్టూ పోగేసుకొని అమ్మమ్మ కథలు చెప్పిన తీరు నాకు కథలపై మొదటిగా ఆసక్తిని కలిగిస్తే, కాలేజీ రోజుల్లో అంత్యప్రాసలతో కూడిన నాలుగు వాక్యాలు కవిత్వమని భ్రమించేలా చేశాయి. కామ్రేడ్ పి.ప్రసాద్ గారి పరిచయం నన్ను సాహిత్యానికి చేరువ చేస్తే,  చిన్నతనంలో  నా చుట్టూ వున్న పరిస్థితులు చోటుచేసుకున్న సంఘటనలే  నేటి నా కవిత్వానికి ప్రధాన భూమికగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
     నిత్యం సాహితీ  సువాసనలు గుభాళించే విజయనగరానికి కొద్దిపాటి దూరంలో కొండలనానుకొని, ప్రపంచపటంలో చీలీ దేశంలా సాగినట్టుండే నెల్లిమర్ల గ్రామానికి, పశ్చిమాన వెలగాడ కొండ.  దానిపై శిధిలమైన రాజముద్రికలా ఓ కోట.  ఊరు పక్కనుండి జలతారు చీరంచులా సాగే ఏరు. ఆ ఎటినానుకొని నిత్యం తన సైరన్ మోతతో మమ్మల్ని మేల్కొలిపే బ్రిటీష్ కాలంనాటి ఓ నారమిల్లు.
front cover
     సొంత ఊరిలో నాలుగు చినుకులు పడితేనే గాని పనికిరాని కాసింత మెట్టు భూమిని పక్కన బెట్టి, మిల్లులో పనికి కుదిరిన మా నాన్న, నాకు ఏడేళ్ళ ప్రాయంలో మా అమ్మ మాటపై మా చదువుల కోసమని కొండగుంపాం గ్రామం నుండి కుటుంబం మొత్తాన్ని నెల్లిమర్లకు తీసుకువచ్చాడు. మిల్లులో యంత్రాల మధ్య తానో యంత్రమైనప్పటికీ… మనసు మాత్రం నిత్యం మట్టిపై మెసిలాడేది. అటు మిల్లుకు ఇటు పొలానికి నిత్యం పరుగులెత్తేవాడు.  మా అమ్మ వద్దంటున్నా వినకుండా పొలానికి మదుపులేట్టేవాడు. ‘పనికిరాని చారెడు నేలపై పడి ఎందుకలా చచ్చిపోతావ్’ అని మా అమ్మ అంటే ‘భూమాతను నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోడు’ అని బదులిచ్చేవాడు. మా చదువుల కోసం, పొలం పనుల కోసం అవసరమైన డబ్బులకు మా అమ్మ ఎక్కని గడప వుండేది కాదు. తెచ్చిన అప్పుల కంటే పెరిగిన వడ్డీలకే మా నాన్న కష్టం సరిపోయేది. అందుకనేనేమో ఇప్పటకీ ‘వడ్డీలకు వడి గుర్రాలు చాలవ’ నే మాట మా అమ్మ నోటిలో నలుగుతునే వుంటుంది.  ‘ఆ కాసింత పొలం అమ్మేసి అప్పులు తీర్చెద్దామ్’ అని మా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేవాడు కాడు.  ఆ విషయంపై వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేవారు.  అసహనానికి గురైన మా నాన్న చేతిలో మా అమ్మ చితికిన చేతి గాజయ్యేది, చివరికి ఉబికే కన్నీరై ఊరుకునేది. ఆ ఘర్షణలకు ప్రత్యక్ష సాక్షులుగా బెదిరిన పిట్టల్లా మా తమ్ముడు, చెల్లి నేను.
      కాలం పరిగెడుతున్న క్రమంలో ప్రపంచీకరణ ప్రభావం మా మిల్లుపైనా పడింది.  అంతవరకూ సక్రమంగా నడిచిందని చెప్పలేము కాని అప్పట్నుంచి మిల్లు  సైరన్ పదే పదే మూగబోవడం మొదలపెట్టింది.  స్థానిక రాజకీయ హస్తాల పెత్తనం కూడా ఎక్కువయ్యింది.  ఇంకేముంది ఒకసారి ఏకంగా పదహారు నెలలు మిల్లు గొంతు మూగబోయింది.
srinu pport
     అటు మా నోటికి మెతుకునివ్వని మెట్టు భూమి, ఇటు నడవక మొండికేసి కూర్చున్న మిల్లు మధ్య మేము విల విలలాడిపోతుంటే,  అది చూడలేని మా నాన్న విజయనగరం కూలి పనికి వెళ్ళేవాడు. ఒకరోజు బోరున వర్షం మినుకు మినుకుమంటూ వెలుగుతున్న కిరోసిన్ దీపం చుట్టూ మా నాన్న రాకకై ఎదురుచూస్తూ మేము. మెరిసే మెరుపుల మధ్య మా నాన్న వచ్చిన చప్పుడయ్యింది. వస్తూనే తడిసిన రెండు  పదిరూపాయిల నోట్లను మా అమ్మ చేతికందించాడు ఆ నోట్లను కిరోసిన్ బుడ్డి దగ్గర వెచ్చబెట్టిన సంఘటన తలుచుకుంటే ఇప్పటకీ నా గుండె తడసి ముద్దవుతుంటుంది.
     ఈ సమయంలోనే ‘ఇఫ్టూ’ నాయకత్వంలో లాకౌట్ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. దానిలో భాగంగానే ‘ఆకలియాత్రలు’ ‘రాస్తారోకోలు’ జరిగాయి. సమస్య పరిష్కారం కాలేదు. చివరికి కార్మిక కుటుంబాలు ‘రైలురోకోకు’ సిద్దపడ్డాయి. తమ కడుపుమంటకు పరిష్కారం చూపమని అడిగినందుకు అయిదు ఆకలిగిన్నెలు తూటాలకు బలైయినాయి.
     ఈ సంఘటనలన్నీ ఆనాడే నా మనసుపై బలమైన ముద్రను వేసాయి, ఎందుకు పదే పదే మిల్లు సైరన్ మూగబోయేది? మా నాన్న చేతిలో మా అమ్మ ఎందుకు చితికిన చేతి గాజయ్యేది? అయిదుగురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నదెవరు? అన్న ప్రశ్నలు ఇప్పటికీ నన్ను వేదిస్తుంటే నా ఈ కవిత్వంతోనే నన్ను నేను సమాదానపరుచుకుంటున్నానేమో!?