మూగవాడి పిల్లనగ్రోవి

drushya drushyam-12

అజంతా గుర్తొస్తాడు చాలాసార్లు.
చెట్లు కూలుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు.
కూలకుండా చెట్టు అలా నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా.

+++

ఇతడు కూడా అలాంటివాడే.
రిక్షా లాగి పొట్టపోసుకుంటాడు.
నిజానికి “రిక్షా తొక్కి’ అని రాయాలి. కానీ, తనకి రిక్షా తొక్కే పరిస్థితి లేదు. బోదకాలు మరి!
దాంతో రిక్షా లాగి తన జీవికను తాను వెళ్లదీస్తున్నాడు.

ఒకానొక ఉదయం.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ సమీపంలోని మేకలమండి. అక్కడ అతడ్ని చూశాను.
ఆ వీధిలోకి వెళ్లే ముందే ఒక గుడి వస్తుంది. ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకో నాకు తనను ఫొటో తీయబుద్ధి అయింది.
ఆ టైమ్ కి అక్కడ గుడి ఉందని కూడా నాకు తెలియదు. అతడు అలా రిక్షా లాక్కుంటూ వస్తున్నాడు. చూశాను. ఒకట్రెండు చిత్రాలు తీసుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, వెనకాల నర్సింహస్వామి ఉన్నాడని.
దాంతో మరొక మెరుగైన ఫొటోకోసం వ్యూ ఫైండర్లోంచి చూస్తున్నాను. అప్పుడు తెలిసింది, నర్సింహస్వామి ఏమోగానీ అతడికి బోదకాలు ఉందని!
ఆ కాలుతో రిక్షాను లాగుతున్న తీరు చూశాక ఇక చాలనుకున్నాను.

నిజానికి ఆ ఒక్క చిత్రం ఇక చాలనే అనుకున్నాను. కానీ మనసూరుకోలేదు.
అతడు చెట్లు కూలుతున్న దృశ్యమే. కానీ కూలకుండా నడుస్తున్న చెట్టు కూడా అని అర్థమైంది.
తీస్తూనే పోయాను. అతడితో పాటు నేను పోతూనే ఉన్నాను. పోతూ ఉండగా అర్థమైంది!
అతనొక వృక్షమని. తాను నలుగురికీ నీడనిచ్చే వృక్షమేగానీ పిల్లలో మరొకరో తనను పట్టించుకోవడం లేదంటూ విచారంతో కృంగిపోయే మనిషి కాదని!

ఏవో వేళ్లను నాలో నాటాడు.
కొత్త లిపినేదో నేర్పాడు. ఇక ఆ వృక్షం శాఖోపశాఖలై నాలో కుదురుకున్నది.
సరికొత్త పద చిత్ర దృశ్యాలు వాటంతటవే పేనుకొని నేనే ఒక చిత్రమై పోయి కొత్త కొత్త పాటలు పాడుతున్నాను.
ఏవోవో కవితలు అల్లుతున్నాను.

+++

తీరుబడిగా చూస్తూ ఉంటాను నన్ను నేను.
ఒకానొక రోజు మళ్లీ ఆ చిత్రాలన్నీ చూశాను.
వాటిల్లో అతను మరింత ఉత్సాహంగా కనిపించాడు. నోట్లో వేపపుల్లతో అతడు…ఏమీ ఆలోచించకుండా కులాసాగా నడుస్తూ రిక్షాను లాక్కెళుతున్న వయో వృద్ధుడు!
వెనకాల నర్సింహస్వామి! గాఢమైన రంగుల లిపితో కూడిన ఈ ఛాయాచిత్రాన్ని ఎంపిక చేసుకున్నాను.
అతడి వెనకాల ఉన్న కారు కూడా అతడు బతుకుతున్న స్థితిపట్ల కొన్ని భావ ప్రకటనలు చేస్తూ ఉన్నది.
అదీ మంచిదే అనుకున్నాను.

+++

ఈ ఫొటోను తర్వాత కాలంలో పెద్దది చేసి ప్రదర్శనకు పెట్టినప్పుడు, ఆ ఫొటో ప్రింట్ చేసిన శేఖర్ తన భార్యతో సహా ఎగ్జిబిషన్ కు వచ్చాడు.
అప్పుడు అతడి భార్య పవిత్ర ఈ చిత్రం వద్ద ఆగి ఆ ముసలాయన్ని గుర్తు పట్టి ఆశ్చర్య పోయింది.
“ఈ తాత నాకు తెలుసు. నీకెలా తెలుసు?” అని అడిగింది.
ఏకవచనం! ఎంత బాగుందో’ అనుకుంటూ, “నేను ఆ తాతను చూశాను’ అని మెల్లగా చెప్పాను.
“మేకలమండిలోనేనా?’ అందామె.
అవునన్నాను.
“ఇతడు మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు. చాలా మంచివాడు. ప్రేమగా మాట్లాడుతాడు’ అంది.
“పిల్లలు పట్టించుకోరు. దాంతో ఇప్పటికీ కష్టపడుతుంటాడు” అని కూడా వివరించింది.
“అవును. పాపం…బోదకాలు’ కదా!” అన్నాను నేను.
ఆమె నా వైపు సాలోచనగా చూసి, “ఇతడికే కాదు, ఈయన భార్యకు కూడా’ అని ఆగింది.

+++

నాకు నోట మాట రాలేదు.
“ఇద్దరికా?” అన్నానో లేదో గుర్తులేదు గానీ, ఒక్కపరి నా జీవగ్రంథం రెపరెపలు పోయింది.
ఒక తల్లివేరు నిస్సత్తువగా తలవాల్చినట్టయింది.
నేను మెల్లగా మామూలు స్థితికి రావడానికి కొంత టైం పట్టింది.
ఇంకా ఆమె చెప్పింది, “ఇతడు రిక్షా లాగి కాసిన్ని డబ్బులు తెస్తే, తాను కూరగాయలు అమ్మి మరికొంత సంపాదిస్తుంది, కూచున్న చోటే!’ అని వివరించింది.
ఇప్పుడు నాకు మళ్లీ ఆశ్చర్యం కలిగింది.
“నయమే!” అన్నాను నేను.

“ఏం నయమో ఏమో! ఈ వయసులో కూడా వాళ్లు కష్టపడాలా?’ అంది తాను.
ఈ మాటకు మళ్లీ డోలాయమానం. ద్వైతం.

“తప్పదు. అనివార్య జీవన ప్రస్థానం” అనుకున్నాను నేను, మనసులో!

+++

ఏమైనా ఇదంతా జరిగింది.
ఇంకా చాలా జరిగింది, ఈ ఫోటో వల్ల.
తాత గురించి, తాత అవస్థ గురించి, తాత భార్య దుస్థితి గురించి…
వీటన్నిటీనీ మించి ఉల్లాసంగా వేపపుల్లతో నడుస్తున్న ఒక యువకుడి గురించి కూడా.
మస్తు మాట్లాడుకున్నాం.

విశేషం ఏమిటంటే, ఇదంతా మాట్లాడుకునే వీలు కల్పించిందీ చిత్రం.
అందుకే అంటాను, ఒక దృశ్యం చెట్లు కూలుతున్న వైనాన్ని చెబితే,
మరో చిత్రం కూలకూడదని చెబుతుంది.  ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది.
ఉన్నదానికీ ఉండాల్సిన దానికీ మధ్య ఒక ఊహ, ఒక ఆశ, మరి ఆదర్శం….
ఇవన్నీ ఉంటేనే…ఒకానొక స్వప్నలిపి గురించిన ప్రేమపూర్వక ఆకాంక్షలు ఇలాగే ఉనికిలోనికి వచ్చినయి.

కళ ఆదర్శం బహుశా ఇదేనేమో!

అందుకనే దృశ్యాదృశ్యంగా జీవితం – కళ పెనవేసుకుని జీవించాలని నాకు మహా ఇది!
అటువంటి దార్శనికతను పంచిన ఎందరికో…
కేశవరెడ్డికి, అజంతాలకి కృతజ్ఞతలు.
ఆ తాతకు, తాతమ్మకు వందనం!!

~ కందుకూరి రమేష్ బాబు