మొలకలు

 

–      ముకుంద రామారావు

~

 

నా భుజాలమీద

సూర్యుడి చేతులు

పగలంతా

నన్ను ముందుకు తోస్తూనే ఉన్నాయి

***

నా లోలోతుల్లోకి పోయే ప్రయత్నంలో

నాకు తెలియకుండా

నాలోకి ఎందరిని తీసుకుపోతుంటానో

నా సాయం లేకుండా వాళ్లకు వాళ్లే

బయటకు రాగలరో లేదో

ముణిగిపోతున్న నావలోలా వాళ్లుంటారు

బయటకు లాగే ప్రయాసలో నేనుంటాను

****

నీ దుఃఖం లానే బహుశా

అక్కడ కుండపోతగా వర్షం

ఇక్కడ దానికి నేను తడిసి ముద్దవుతున్నాను

ఎంత ఎండగా ఉందో ఇక్కడ

వచ్చేయకూడదూ

నీ కన్నీరంతా ఆరిపోయి

ఆవరైపోతుందేమో

***

రహస్యాల స్థావరం చీకటి

చీకట్ల నిధి రాత్రి

కనిపించని ఎవరి ఆలింగనమో

చీకటి గాలి

***

ఏదో స్పర్శ

ఎవరిదో తెలిసినట్టే ఉంటుంది

పేరు గుర్తు రాదు

అర్ధరాత్రెప్పుడో చటుక్కున గుర్తొస్తుంది

లేచి చూస్తే

స్పర్శ పేరు ఏదీ గుర్తురాదు

***

రాత్రంతా

కొమ్మకొమ్మల్నీ దాటుకుంటూ

ఎన్ని కొమ్మలమీద వేలాడుతూ

కనుమరుగవుతాడో చంద్రుడు

*

 

చీకటి-రాత్రి-ఆకాశం

  ముకుంద రామారావు

 

 

అగ్గిలా అలుముకుంది చీకటి

చూస్తూ చూస్తూనే

అందరినీ అన్నింటినీ అందులో ఇముడ్చుకుంది

బయటపడడానికి

వెలుగు సాయంకోసం వెతికాయి కళ్లు

***

ఇంటా బయటా

చీకటిలో దీపాలంకరణకు

లెక్కలేనన్ని మార్గాలు

 

పైనుండి

రాత్రుల నగరాలు

నక్షత్రమండలాలు

***

రాత్రి శ్వాస ఆగిపోలేదు

నిద్రిస్తున్న కొమ్మల్ని ఒరుసుకుంటూ

చంద్రకాంతి జారుతోంది

ఒడ్డునంతా కడిగి శుబ్రపరుస్తోంది

సముద్రం

***

రాత్రంతా

తన అద్భుతమైన అందాన్ని

ఆరేసుకున్న ఆకాశం

అన్నింటా చొచ్చుకుపోయే సూర్యకాంతికి

అలసిపోయి పాలిపోయి వెలవెలాపోతోంది 

అవును ఆకాశం అందాన్ని రాత్రులే చూడాలి

వగలుపోయే నక్షత్రాల నగలైనా కనిపించవు పగలు

రోజుకో రకం బొట్టులా మారే చంద్రుడు

ఆకాశం గోడకు ఎక్కడ వేలాడుతుంటాడో

అనువాదం ఒక బిందువు…అంతే!

mukunda cover final

సాలెగూడుని ఒకచోట నుండి తీసి, మరొకచోట వేలాడ దీయడం, అనువాదం. ఎంత జాగ్రత్త పడ్డా అది మొదటి సాలిగూడు కానే కాదు. దాని అందం ఆకారం ఎంత పోతుందో, చూస్తే చాలు ఏవరికైనా తెలుస్తుంది. పైపైన ఎంత నష్టం జరుగుతున్నా, కేంద్రం చెడనంతవరకూ అది జీవంతో ఉన్నట్టే.  కవిత్వానువాదమూ అంతే. సాలెపురుగు తన గూడుని అవసరంకొద్దీ మళ్లీ సరిచేసుకున్నట్టు, ఫలితం ఎప్పుడూ సమగ్రంగా ఉండకపోయినా, శతాబ్దాల తరబడి, అనువాదకుడు అనువాదాలు చేస్తూనే ఉన్నాడు. 

 

ప్రేమ, విశ్వాసం, దుఃఖం, అహంకారం లాంటి భావావేశాలు చాలా వరకూ అన్ని భాషల్లోనూ ఒకటే కావడంతో అవి అనువాదానికి సులువు. దేశభక్తి మూల్యాలు, రాజభక్తి అనుసరణలు లాంటివి ఆయా సంస్కృతుల్లోనే అర్ధం చేసులోగలం. అంత లోతుగా వాటిని అర్ధం చేసులోలేకపోయినా, అనుభూతులు స్థలాలు ఊహించుకుని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.  ఎక్కడివైనా, ఎలా ఉన్నా, ఏ భాషలోనైనా, రంగు వాసన ఆకరాలు వేరైనా,  పూలు పూలే.  కవిత్వమూ అంతే! నాకు నచ్చినవి , అనువాదం చేయగలను అనుకున్నవి , విశ్వజనీనమైనవి, నాకు తెలిసి అంతకుముందు తెలుగులో అనువాదం కానివి, ప్రాముఖ్యం పొందినవి మాత్రమే నేను అనువాదానికి తీసుకున్నాను. అనువాదం చేసిన కవితలన్నీ ఆంగ్లానువాదాలనుండి తీసుకున్నవే. ఎవరో ఒకరు ఏదో ఒక కవిత ఇచ్చి నన్ను అనువాదం చేయమంటే నేనది నా సంతృప్త్తి మేర బహుశా నేను చేయలేక పోవచ్చు. ఆ కారణంగానే నా ప్రణళికలో దొరికిన కవితల్ని మాత్రమే చేస్తున్నాను. అవి చాలావరకు నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తున్నాయి.

 

మూలానికి విధేయుడిగా ఉండే ప్రయత్నమే ఎక్కువ చేసాను. భావాన్ని అనుసరించి స్వేచ్ఛ తీసుకున్నవి చాలా తక్కువ. అనువాదమే అయినా దాదాపు మన కవిత్వమే అనిపించే ప్రయత్నం మాత్రం ఉద్దేశపూర్వకంగానే చేసాను. అలాగే అందరికీ అర్ధమయే రీతిలో  ఉండాలనుకున్నది మరొకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనువాదం అనువాదమే. అందులోనూ కవిత్వ అనువాదం, కవి తన కవిత్వాన్ని తానే చేసుకున్నా, స్వయానా ఆ కవికే అంత సంతృప్తి నివ్వక పోవచ్చు. అలా అని అనువాదాలు చేసుకోకపోతే, ఇతర భాషల్లోని గొప్పతనాలు ఆ కాసింతైనా మనకు తెలియకుండా పోతాయి.

 

అయితే ఏ అనువాదమూ సర్వ సమగ్రం కాదు. ఏ అనువాదమూ అందరినీ సంతృప్తి పరచలేవు. మూల భాషనుండి వచ్చిన అనువాదాల్లో కూడా అనేక భాషాంతరాలున్నాయి. ఒకే కవిత అనువాదం వివిధ అనువాదకులు చేసింది, ఆశ్చర్యంగా వేటికవే భిన్నంగా ఉన్నాయి. చేసిన వారందరూ ప్రసిద్ధ కవులూ, అనువాదకులే అయినా, ఎవరి అనువాదం సరైనది, ఎవరిది కాదు అన్న సందిగ్ధం నన్ను ఒక్కోమారు ఇబ్బందుల్లోకి నెట్టేది. వాటన్నింటిలో ఉన్న భావార్ధం చాలా వరకూ ఒకటే ఉండటంతో ఆ కవిత ఆత్మని అవి పట్టిచ్చేవి. అది ఆధారంగా చేసుకుని అనువాదం చేసినవీ ఉన్నాయి. చెప్పొచ్చేదేమిటంటే భావార్ధం చెడనంతవరకూ ఏ అనువాదమయినా భరించగలమన్నదే. మూల భాషనుండి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుండి తెలుగులోకి వచ్చిన అనువాదాలు రెండు వంతెనల్ని దాటొచ్చినవి.మొదటి వంతెనలో లోపాలతో బాటు (ఏమన్నా ఉంటే) రెండవ వంతెనలో లోపాలు కాడా తోడయితే, ఆ అనువాదం ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు.   మూలంలో లేనిది అనువాదంలో కనిపించినపుడు అది మూల రచయితకే కాదు, ఆ మూలం తెలిసిన ఎవరినైనా ఇబ్బందిపెడుతుంది.

 

ఎవరెంత అద్భుతంగా చేసినా, మూల భాషలోని సౌందర్యాన్ని సంగీతాన్ని అనువాదంలో తేలేకపోవడమే అనువాద ప్రక్రియలోని అతి పెద్ద విషాదం.

 

చేయాలనుకుంటే సముద్రమంత సాహిత్యం అనువాదకుడి ముందుంటుంది. ఎంత చేసినా అందులో కొన్ని బింధువుల్ని మాత్రమే స్పృశించగలుగుతాడు. వాటిల్లో నచ్చినవి కొన్నయితే, నచ్చనివి ఇంకొన్ని. నచ్చనంత మాత్రాన అవి మంచి కవితలు కావని చెప్పలేము. అలాగే అనువాదం చేయగలిగినవి కొన్నయితే, అనువాదం చెయలేనివి ఇంకొన్ని. కవుల, ఆంగ్ల కవిత్వానువాదాలు సంపాదించగలగడం ఒక కష్టమయితే, చదివిన వాటిల్లో కవితల్ని ఏరుకోవటం మరొకటి. అనువాద కష్టాలు ఎలాగూ తప్పనివి. తీరా ఇంతా చేసాక సంతృప్తి నిచ్చిన వాటినే నలుగురితో పంచుకోగలం కదా! అనువాదం చేసినా అలా ఏదో కొంత అసంతృప్తి మూలాన వదిలేసిన కవితల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

 

మంచి సాహిత్యం ఎక్కడైనా అర్ధవంతమైనదే. అలా కాని పక్షంలో రూమీ, హఫీజ్, లీపో, వాంగ్ వెయి, హూ షీ, పాబ్లో నెరూడా, యెహూదా అమీహాయి, షేక్స్ పియర్, చెస్వ మిలోజ్, ఎమిలీ డికిన్సన్, ఖలీల్ జీబ్రాన్ లాంటి వారి కవిత్వాల్ని ప్రపంచవ్యాప్తంగా అనువాదంలోనైనా ఎందుకు చదువుతారు. గొప్ప సాహిత్యానికున్న విశ్వజనీనత మూలంగా, అవి సమయానికి, స్థానికతకు, భాషకు, సిద్ధాంతాలకు అధిగమించి మొదట ప్రచురించబడ్డ దగరనుంచి శతాబ్దాలతరబడి నిలబడగలుగుతాయి. అస్పష్టతగా ఉన్న కవితలే అనువాదాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. నైఘంటుక నిర్మాణాత్మక విషయాల్లోను ఒక సందిగ్ధ స్థితి ఎదుర్కోవల్సి వచ్చేది. జాతీయాలు, సహసంబంధమున్న పదాల అనువాదంలోను సరైన సమజోడీలు దొరకనపుడు, తట్టనపుడు పడ్డ ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు.

 

ఏ కవితైనా మనసులో ఇంకేవరకూ అనువాదానికి లొంగేది కాదు. సాంస్కృతిక, భాషాపరమైన, రసజ్ఞాన సంబంధమైన విషయాలపట్ల ఇబ్బందులతో బాటు, భాషా పరిజ్ఞానం లాంటి పరిమితుల మూలంగా కూడా కొన్ని కవితలు నెలలతరబడి తీసుకున్నవీ ఉన్నాయి. అనువాదమైనాక ఆ కవితలోని అందం కవిత్వం మరింత ఆనంద పరిచిన సన్నివేశాలూ ఎక్కువే. అనువాదం ఒకవిధంగా లోతుగా అతి సన్నిహితంగా చదవడం లేదా ఆ మూలానికి లొంగిపోవడం లాంటిది. అందుకే బహుశా మామూలుగా చదివినప్పటికంటే అనువాదం చేసినపుడు ఆ కవిత అర్ధమైన విధానం ఆశ్చర్యపరుస్తుంది.

 

అనేకమంది కవుల్ని విస్తృతంగా చదివి ఆనందించడం నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని అందరితో పంచుకోవాలన్న ప్రయత్నమే అనువాదం. నేను లాభ పడిన దానిలో ఏకొద్దిగానైనా అందరితో నేను పంచుకోగలిగితే, అదే నాకు ఆనందాన్ని కలగజేసే అంశం.

 

మనం రాస్తున్న మాటాడుతున్న  ప్రతీదీ అనువాదమే, ఔనన్నా కాదన్నా అన్ని అనువాదాలూ ఒక విధంగా సృజనే. ఎన్ని కష్టాలు పడ్డా, అందరినీ సంతృప్తి పర్చలేకపోయినా,  అనువాదకుడు తన అనువాదాలను చూసి, అందుకే స్వీయ రచన చేసినంత సంబరపడతాడు.

 

ఏది ఏమైనా అనువాదకుడు ఎరువుతెచ్చుకున్న కాంతిని అందరికీ ఆనందంగా పంచుతున్న చంద్రుడని నేను భావిస్తాను.

 

–          ముకుంద రామారావు

“మాటాడలేకపోతున్న నా కన్నీళ్లను కనీసం ప్రేమించు …”

కవులు కవిత్వం రాసి, ఒక కొత్త లోకంలో ఉంటారు, కొత్త కొత్త లోకాల్ని చూపిస్తారు. గొప్ప గొప్ప కవులు ఆ పనిని మరీ గొప్పగా చేస్తారు. తాము చదివిన కవిత్వంలోని తమకు నచ్చిన వాటితో బాటు, తాము కొత్తగా చెప్పాలనుకున్నవీ వారి రాతల్లో కనిపిస్తాయి. తమకు నచ్చనివి, ఎదిరించాలనుకున్న వాటి జాడలూ ఉంటాయి. భారతీయ సంస్కృత కావ్య ప్రభావాలతో నేపాల్ లో కవిత్వం వస్తున్నప్పుడు, అందుకు భిన్నంగా తమదైన భాషతో, భావాలతో కవిత్వం చెప్పి ఒప్పించిన ఆధునికుల్లో లక్ష్మీ ప్రసాద్ దేవ్కోట ముందున్నారు. 25 ఏళ్ల సాహిత్య జీవితంలో 40కి పైగా గ్రంధాలు రచించారు. వాటిల్లో లఘు కవితలనుండి దీర్ఘ కవితల వరకూ ఉన్నాయి, కథలు, నాటకాలు, అనువాదాలు, నాటకాలు, ఒక నవల కూడా ఉంది.. అతి సహజంగా సున్నితంగా సామాన్య జనులు వాడే భాషే వారి రచనల్లో కనిపిస్తుంది.

devkota

12 నవంబరు 1909 న బ్రాహ్మణ కుటుంబంలో దేవ్కోట జన్మించారు. లక్ష్మీ పూజ రోజున జన్మించారు కాబట్టి లక్ష్మీప్రసాద్ పేరు పెట్టారు. 16 ఏళ్లకే వివాహమై సంసారం బాధ్యతలు మీద పడ్డాయి. ఫలితంగా ఆర్ధికపరమైన అనేక ఇబ్బందులు పడ్డారు.  ఉపాధ్యాయుడిగా, చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపినా, ఎంతగానో ప్రేమించిన తన పిల్లల మరణాలు, వారిని మానసికంగా కృంగదీశాయి. దానికి తోడు అప్పటి రాజ వంశం రాణాలతో పడక కొన్నాళ్లు వారణాసిలో తలదాచుకోవల్సొచ్చింది. దేవ్కోటే లేకుండా, కుటుంబం నేపాలులో గడపడం భారమై, భార్య ఒత్తిడికి తలొగ్గి రాణాలకు ఎదురు తిరగనన్న వాగ్ధానంతో తిరిగి రావల్సొచ్చింది.

Laxmi-Prasad-Devkota

1936లో ప్రచురించిన ఈ “మూనా మదన్ ” ఒక విషాదాంత ఖండ కావ్యం. . నేపాల్ సాహిత్యంలో 20వ శతాబ్దంలో వచ్చిన  అత్యుత్తమ కావ్యంగా ఇప్పటికీ కొనియాడబడుతోంది. మొదటి ముద్రణ 200 ప్రతులైతే, 1986 సరికి 18వ ముద్రణకొచ్చి, 25 వేల ప్రతులు అమ్ముడయాయి, 1983 లోనే 7 వేల ప్రతులు అమ్ముడయాయి. ఇప్పటికీ వేలకొద్దీ అముడవుతూనే ఉన్నాయి. 2012 నాటికి 24వ ముద్రణకు నోచుకుంది. ఇప్పటివరకూ పదిలక్షల ప్రతులకంటే ఎక్కువ అమ్ముడయాయని అంచనా. 1959లో మరణశయ్యమీద ఉంటూ కూడా, తన సాహిత్యాన్నంతా తగలెట్టినా, ఈ ఒక్క కావ్యాన్ని మాత్రం తగలెట్టకుండా చూడాలని వేడుకున్నాడు. ఈ కావ్యం మీద అతనికంత మమకారం. నేవార్ భాషలోని బౌద్ధ జానపద  గేయం ఈ కావ్యానికి ఆధారమని విమర్శకులంటారు. ఈ కావ్యం ఆంగ్లం, రష్యన్, కొరియన్, చైనీస్, మైథిలి, అవధి భాషల్లో అనువాదమైంది. ఈ కావ్యం ఆధారంగా అనేక నాటకాలు ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. నేపాలీలో చలనచిత్రంగా కూడా రూపొందింది.

Devkota Stamp

అయిదుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల సంతానంలో, ఒక కుమార్తె ఇద్దరు కుమారులు వారి జీవిత కాలంలోనే మరణించారు.  మరణించే ఏడాది ముందు ఒక మూడునెలలపాటు నేపాల్ ప్రభుత్వంలో విధ్యామంత్రిగా పనిచేసారు. 14 సెప్టెంబరు 1959 న కేన్సర్ మూలంగా లక్ష్మీప్రసాద్ దేవ్కోటే మరణించారు.  లక్ష్మీ ప్రసద్ దేవ్కోటా ని మహకవిగా నేపాల్ కీర్తిస్తుంది.   2009 లో దేవ్కోటా శతాబ్ది ఉత్సవాలు నేపాలులో ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా తపాలాబిళ్లని సైతం విడుదలచేసింది.

 

మూనా:

అగ్గి

అగ్గి రాజుకుంటోంది నా మనస్సులో

వెళ్లొద్దు, నా జీవితం నుండి వెళ్లొద్దు

నా కళ్ల కాంతి, నా రాత్రి నక్షతం

నీ వెలుగును తీసేయవద్దు

నా గుండె చీల్చి చూడు

బహుశా నా గుండెలో దృశ్యం

నీ మనస్సు మారుస్తుందేమో

బదులుగా తాగడానికి విషం నాకు ఇవ్వు

నా కన్నీళ్లలో బాధ చూడు

కానీ కన్నీళ్లు మాటాడవు

ఆలోచనలు మనసులో ఉండిపోతాయి

మాటాడలేకపోతున్న నా కన్నీళ్లను కనీసం ప్రేమించు

 

మదన్:

మూనా ప్రియా, ఇలా మాటాడొద్దు

నేను తిరిగొచ్చేస్తాను

లాసాలో ఇరవయి రోజులే ఉంటాను

ఇరవయి రోజులు ప్రయాణంలో –

నవ్వు, నువ్వు నవ్వుతే

నేను ఇంద్ర భవనంలో ఉన్నట్టుంటుంది

నా సంకల్పం, సాధించడమో చావడమో

నా దారిలో నీ కన్నీళ్ల అడ్డు వేయొద్దు

సూర్యుడితో కొంగలు తిరిగొస్తాయి

మనం కల్సుకునే రోజు మరో గొప్ప రోజవుతుంది

 

మూనా:

నా రాముడా, నా కృష్ణుడా

రాత్రి సూర్యుడా

నువు ఎగిరిపోయేందుకు తయారవుతుంటే

నా నవ్వుల్ని ఎలా కలపను?

ఇక్కడ నన్ను వదలొద్దు

నీ పక్కనొక చిన్న వెలుగుని

నువు లేకుండా నేనొక రాయిని

నీతో నన్ను తీసుకుపో

నా చేతులు కలుస్తే

మనం అడవుల్ని, కొండల్ని, శిఖరాల్ని

ఖూనీకోర్లను సైతం ఎదుర్కోగలం

 

మదన్:

మూనా, నా మూనా

అమ్మ వైపు చూడు, ఆమె వైపు

దీపాన్ని పోషిస్తున్న నూనెలా ఇంకి పోతోంది

మనిద్దరమూ కలిసి ఆమేను వదిలేయలేం

ఇక్కడే ఉండి, ఆమెను భద్రంగా చూసుకో

దాదాపు అరవయి చలికాలాల్ని ఆమె చూసింది

నీ మెరిసే  మొహంతో ఆమె మురిసిపోవాలి

 

మూనా:

అమ్మ ప్రేమ, ఆమె నెరిసే జుత్తు, బలహీన శరీరం,

ఇవేవీ నీ కాళ్లని కట్టిపడేయటం లేదు

ఆమె వాత్సల్యపు నీడలు పిలుస్తాయి

కానీ అవి నిన్ను ఆపలేవు

అమ్మ ప్రేమంత అమూల్యమైనదా

ఏమి గడిస్తావు ఆ ప్రాంతంలో

బంగారం మూటలు నీ చేతికంటుకునే మురికి

సంపదతో ఏమి చేసుకుంటాం

చారు, కూరగాయలు, మానసిక శాంతి చాలు

ఉండిపో, అలోచనల్ని శాంతపర్చు

 

మదన్:

నేనేమి చేయను?

– మా అమ్మ గొంతులోకి ఒక గుక్కెడు పాలు

– ఆమె విశ్రాంతికోసం ఇంటి కలలు

– తనవారికోసం కుళాయిలు

– నీ సున్నితమైన చేతులకు సుందరమైన గాజులు

– అప్పుల్లో అపాయంలో ఉన్న ఇంటికి గట్టి పునాదులు

ఈ కోరికలు మనస్సులో జోరీగలా పాట పాడుతున్నాయి

మూనా, వాటి సంగీత స్వరాలు నా కాళ్లను ముందుకు తోస్తున్నాయి

పైన దేవుడి దయవలన నాకు దృఢమైన హృదయమే ఉంది

కోపోద్రిక్తమైన వరదల్ని బాగానే దాటగలను

కానీ అనుకోనివి జరుగుతే, నేనీ పాటతోనే మరణిస్తాను

 

మూనా:

నా లోహృదయంలో ముడి బిగించు

తిరిగి రావద్దులే

మరచిపోలేని నీచిత్రాన్ని గుర్తుగా గీసుకుంటాను

లాసా కన్యలు నర్తిస్తారు

బంగారంతో చేసిన బొమ్మల్లా ఉంటారు

బంజరు భూములు, కొండలమీద వారు ఆడుతుంటే

వారి స్వరాలు ప్రవాహంలా నవ్వుతాయి

నా ప్రియా, సరే వెళ్లు

ఇంటిని నగరాన్ని చీకటి చేసి

కన్నీటికీ శక్తి లేదు

చీకటిలో జ్ఞాపకాలు బహుశా తళుక్కుమంటాయి లేదా మెరుపులా మెరుస్తాయి

దుఃఖం నా దుస్తులమీద చిమ్ముతుంది

మదన్ టిబెట్ ప్రయాణాన్ని వివరిస్తూ కథకుడు

నగ్న భూమి, పూర్తీ ఏటవాలుగా కొండలు

వెయ్యి సహస్రాలు నీళ్లలో దిగి నడవాల్సిన నదులు

టిబెట్ రహదారి నిర్మానుష్యం,  రాళ్లు రప్పల మయం

పొగమంచుతో విషపూరిత తుంపర

చల్లటి మంచు వర్షంతో బరువెక్కి తిరుగుతున్న గాలి

 

గుండ్రంగా గుండు గీయించుకున్న బిక్షువులు

మందిరాలు, దహనపు దుంగలు

ఆ తరువాత మంటల ముందు ప్రాణమొచ్చినా

రహదారిలో చచ్చుబడుతున్న కాళ్లు చేతులు

చలికి కొరుక్కుంటున్న పళ్లకు

తడాకు కొమ్మల చక్కని బొంత

ఉడకేసినా తినలేని

పచ్చి ముతక బియ్యం

 

చివరికి  సాయంత్రపు చూపుకి

బంగారం పైకప్పు దర్శనం

లోయల అంచున, పొటాలా పాదాల దగ్గర

లాసా తానే నవ్వుతోంది

పొటాలా కొండలా ఆకాశాన్ని అంటుతోంది

రాగి బంగారంతో అల్లినట్టున్న కొండ

 

యాత్రికులు బంగారం పైకప్పు చూసారు

గంధర్వుడి దుస్తుల్లా సకల రంగుల రాళ్లతో అలంకరించిన

జడల బర్రె జుత్తుతో కప్పి దాచిన, బంగారం బుద్దుడున్న

దలైలామా విశాల భవనం

గుంటలుపడ్డ కళ్లతో గురువులకు

వంగి నమస్కరిస్తున్న బాటసారులు

మంచుతోకప్పిన శిఖరాలు, చల్లటి నీళ్లు

ఆకుపచ్చని ఆకులతో చిగురిస్తున్న చెట్లమీద

తెల్లగా విచ్చుకుంటున్న తుమ్మ పూలు

 

ఇంటివద్ద మూనా పరిస్థితి వివరిస్తూ కథకుడు:

విచ్చుకున్న పద్మంలా, ఏకాంతంలో మూనా

వెండి మేఘాల అంచుల్ని చంద్రకాంతి తాకుతున్నట్టు

ఆమె సున్నితమైన పెదాల నవ్వు, ముత్యాల జల్లు

దగ్గరపడుతున్న చలికాలపు పూవులా ఆమె వాడిపోతోంది

ఆమె కన్నీళ్లు రాలి డుతున్నాయి

విశాల నేత్రాల్ని తుడుచుకుంటూ మదన్ తల్లిని చూసుకుంటోంది

కానీ ఆమె తన ఒంటరి గదిలో నిద్రిస్తున్నపుడు

వేలకొద్దీ వ్యాకులాలతో ఆమె దిండు తడుస్తూనే ఉంది

ఆమె పగలూ పొడవైనవే

రాత్రులూ పొడవైనవే

+

గుండెల్లో గుచ్చుకున్నా

పక్షి తన రెక్కల్లో బాణం దాస్తున్నట్టు

నిశ్శబ్దంలో మరుగుపరుస్తూ

ఆమె దుఃఖాన్ని తన హృదయంలో దాస్తుంది

దినాంతపు దీపం మినుకుమినుకు మంటున్నట్టు

ఆమె ప్రకాశిస్తుంది

 

ఆకురాలు కాలమొస్తున్నపుడు

వాడిపోతున్న పూవందమూ పెరుగుతుంది

నల్ల అంచుల మేఘాలు వెండివవుతున్నపుడు

చంద్రుడూ ప్రకాశిస్తాడు మరింత కాంతిగా

వీడ్కోలు సమయంలో మదన్ మొహం గుర్తుచేసుకుంటే

ఆమె గుండెల్లో దుఃఖం తళుక్కుమంటుంది

చలికాలపు కన్నీరు పూలమీద పడుతుంది,

నక్షత్రకాంతి, రాత్రి కన్నీరై నేలమీద పడుతుంది

 

స్త్రీలు రరకాల కధలతో వస్తారు

పురుషులు ప్రేమను ఒలకబోస్తారు

చూడు –  గులాబీ అందమైనది

కానీ సోదరా దాన్ని ముట్టుకోవద్దు!

కోరికతో దాన్ని పాడుచేయొద్దు

ప్రాణం, అద్భుతమైన దేవుని రత్నం

వికృతపర్చే ప్రయత్నం చేయొద్దు

 

మూనా:

కీటకాల నగరానికి వెళ్లు

నీ మాటలు చెప్పు

చంద్రుడిని కింద పడేయ్

కొండల్ని పైకి లేపు

 

అతని పాదాలకోసం

నా స్వర్గం కోసం ఎదురుచూస్తాను

దేవుడు నాలుగు అందమైన రోజులు సృష్టించాడు

అది జీవితం

వాటిని పాడుచేయడానికి బురద జల్లొద్దు

 

మదన్ తిరుగు ప్రయాణాన్ని వివరిస్తూ కథకుడు:

మృదువైన  స్పటికపు బంగారం, కొత్త దేశం,

కొత్త కాంతి, కస్తూరీ సుగంధం

ఆరునెలలు గడిచిపోయాయి, ఏడవది మొదలవుతుంటే

తన మూనాని, తన  అమ్మని తలుచుకుని

అమాంతం ఉలిక్కిపడ్దాడు మదన్

తన గుండెలో నీళ్లు పరుగెట్టాయి

 

ఒక పావురం నగరం మీద ఎగురుతూ

రేవు దగ్గర నదిని దాటింది

మదన్ మనస్సు ఇంటికి ఎగిరింది

కూర్చుని తిరిగిరావడం ఊహిస్తే

దుఃఖంతో విశాలమైన  నేత్రాలతో

బాదంకాయల్లా మూనా కళ్లు

 

‘ఠంగ్ ‘ మని సంఘారామం గంట మోగింది

మేఘాలన్నీ ఒకచోట కలుసుకున్నాయి

కొండనీడలు సాయంత్రానికి పొడవయాయి

వేదన ధ్యానంలో గాలికి చల్లబడ్డాడు

లేచి చూస్తే చంద్రుడు ఉన్నితో కప్పబడ్డాడు

తన తల్లి, తన మూనా అతని కళ్లల్లో నాట్యం చేస్తున్నారు

ఆ రాత్రి అతనికి స్పష్టమయింది

అతని దిండు కన్నీటితో తడిసింది

 

అతని హృదయాన్ని వేధిస్తూ ఎరుపెక్కుతున్న ఆకాశం

అతను బంగారం మూటల్ని మూట కట్టుకున్నాడు

కస్తూరి సంచుల్ని సర్దుకున్నాడు

దేవుణ్ని తలుచుకుని మరి కొందరు మిత్రులతో

లాసానుండి బయలుదేరాడు

 

మూనా:

ఏమి పీడకల!

ఒక దున్నపోతు నన్ను కిందికి లాగింది

నేను బురదలో పడిపోయానత్తా

నల్లటి దున్నపోతు నన్ను కిందికి తోసేసింది

 

మదన్ తల్లి:

రా తల్లీ!

బయంతో వణికిపోకు

నీకొచ్చే చెడునంతా

నా తలమీదికి నేను తీసుకుంటాను

అలా ఊగిపోకు

 

మూనా:

నా కనురెప్పలు అదురుతున్నాయి

నా గుండె నొప్పెడుతోంది

ఏదో చెడు నీడ ఇంటిలోకి ప్రవేశించింది

బహుశా తొందరలోనే రావాలనుకుంటున్నా

అతనికి సమయం దొరకడం లేదేమో

ఎత్తైన పర్వతాల దారేమో

అందుకే రాలేకపోతున్నాడేమో

 

కథకుడు:

తిరుగుప్రయాణంలో మదన్ కలరా వ్యాధిని పడతాడు

 

మదన్:

కాకులకి, గద్దలకి

నన్ను వదిలేయొద్దు! నన్ను వదిలేయొద్దు

మిత్రులారా! నేనింకా చావలేదు

నేను నిల్చోగలను

నా గొంతు ఎండిపోతొంది

గుండెలో మంటగా ఉంది

నా కన్నీళ్లు తుడవండి

నాకింకా శ్వాస ఉంది.

 

మదన్ సహచరులు:

మా దగ్గర మందులు లేవు

ఉండటానికి ఇక్కడ ఎవరూ లేరు

మనలో ప్రతి ఒక్కరం ఏదో రోజు చావాల్సిన వారమే

ఇక్కడే ఉండు! దేవుడు నీకు మోక్షం ప్రసాదిస్తాడు.

 

కథకుడు:

మదన్ మోచేతులానించి లేస్తాడు

అతని మిత్రులు వెళ్లిపోయారు, దినాంతం ఎరుపులో కొట్టుకుపోతోంది

గాలి నిద్రపోతోంది, పక్షులు నిశ్చలమైనాయి, చలిగా ఉంది, అతను కింద పడిపోతాడు

 

మదన్:

ఏమిటీ మంట?

అడవి కాలుతోందా?

ఈ మంట మరణించినవారిని చంపుతుందా?

ఇది బందిపోటా,  దొంగా?

ఇదేమన్నా రాక్షసా?

 

కథకుడు:

సహాయం కోసం అరుద్దామనుకున్నాడు మదన్ .

 

టిబెట్ వాసి:

ఏవరు ఏడుస్తున్నారు? ..

నిన్నిలా వదిలివెళ్లిన నీ మిత్రులు చెడ్డవాళ్లు

మా ఇల్లు కొన్ని మైళ్ల దూరంలో ఉంది

నిన్ను అక్కడకు తీసుకుపోతాను

నువు చావవు, బాగవుతావు.

 

మదన్:

టిబెట్ సోదరుడా, నువు దేవుడువి,

నీ మాటలు అపురూపంగా ఉన్నాయి

నాది గొప్ప వంశమని, గొప్ప కులానికి చెందినవాడినని చెప్పారు

గౌరవంతో నీ పాదాల్ని ముట్టుకుంటాను సోదరా

నీ పాదాల్ని పట్టుకుంటాను.

మనిషి గొప్పతనం తెలిసేది అతని హృదయాన్ని బట్టి

అతనితో తెచ్చుకున్న వంశాన్ని బట్టి.

కులాన్నిబట్టీ  కాదు

 

కథకుడు:

టిబెట్ వాసి అతన్ని తన ఇంటికి తీసుకుపోతాడు, ఉన్నిమీద పరుండబెడతాడు, నీళ్లిస్తాడు, దయ చూపిస్తాడు, మూళికలకోసం వెదుకుతాడు, వాటిని దంచి రసాన్ని తాగిస్తాడు. శక్తికోసం జడలబర్రె పాలిస్తాడు. మదన్ ఇంటిదగ్గర నారింజ పూలు పూస్తున్నాయి, ఆలోచనలు మెత్తగా అశుభంగా ఉన్నాయి.

 

మూనా:

నువు నన్ను మరచిపోయావు

నువు నన్ను ఎలా మరచిపోగలవు నాకు చెప్పు?

ఏ పాపిష్టి దేవుడు నిన్ను తీసుకువెళ్లాడు

కొండల్ని తెరలు కప్పేసాయి, నేను చూడలేను

నిన్ను నేను చూసే చిత్రం శూన్యంగా ఉంది

నా కలల్లో నీ స్వరం కుశలం కథలు చెబుతాయి

వాటితో ఎగిరిపోడానికి నాకు రెక్కలు లేవు

ప్రియా నిన్ను వెదకలేను

ఈ సంపదనొదిలి ఆ నగరంలో ఎందుకుంటున్నావు?

నువు కుశలమే కదా? నా ఆలోచనలొచ్చినపుడు

నీ కళ్లు కన్నీళ్లతో నిండవా

ధూళి అంటదా, ముళ్లులా బాధించవా?

 

కథకుడు:

టిబెట్ వాసికి ధన్యవాదాలు చెప్పి, కృతజ్ఞతగా కొంత బంగారం ఇవ్వాలనుకుంటాడు మదన్, కానీ టిబెట్ వాసి భౌతిక పారొతోషకాల్ని నిరాకరిస్తాడు.

 

టిబెట్ వాసి:

ఈ పచ్చ బంగారంతో నేనేమి చేసుకోను?

నా పిల్లలు ఈ బంగారాన్ని తిననూ లేరు,

వారికి వెచ్చదనమూ ఇవ్వదు

నా భార్య చనిపోయి స్వర్గంలో ఉంది

మేఘాలే ఆమె అలంకరణలు, ఆమె ఆభరణాలు, బంగరమూనూ.

 

కథకుడు:

మదన్ దుఃఖపడతాడు.

 

టిబెట్ వాసి:

అదృష్టం కలిసొచ్చి నేను సాయపడ్డాను

సాయాన్ని సంపదతో తూచలేను

నా పిల్లకోసం మీ తల్లిని ప్రార్ధించమనండి చాలు

 

కథకుడు:

స్పష్టమైన మొహం చూసి మదన్ తల్లి పిలుస్తుంది

గాలి ప్రత్యుత్తరంగా  మందమారుతమై తాకుతుంది

కళ్లల్లో కన్నీళ్లు లేవు, శాంతం తప్ప

సాయంత్రపు మెత్తదనం కొలనులో ప్రతిఫలిస్తుంది

ఆమే మూనాని దగ్గరకు తీసుకుంటుంది.

 

మదన్ తల్లి:

నా సమయం దగ్గరపడింది, నేను ఈ జీవనదిని దాటిపోవాలి

నా కొడుకు పెళ్లామా ఏడ్చి లాభం లేదు

పిల్లా, ఇది అందరి దారి

పేదలు సంపన్నుల రహదారి

ఈ మన్ను మన్నుగా మారి

దుఃఖ తీరంలో కోల్పోతుంది

విచారపు వరదకు ఎదురొడ్డి నిలవాలి

ఓడిపోవద్దు

నేను ప్రపంచ పుష్పాన్ని చూసాను

వాడిపోవ డమూ చూసాను

నా వేదనలో, కూతురా, దేవుడ్ని గుర్తించగలిగాను

ఇక్కడ నాటిన విత్తనాలు స్వర్గంలో పెరుగుతాయి

నీవీ ప్రాంతాన్ని వదిలినపుడు

ప్రేమతో నువు ఇచ్చినవే నీకు తిరిగొస్తాయి

నా వైపు చూడు, నాకు నేను చేసినవన్నీ తీసుకుపోతాను

నువు కలలో చూసిన బంగారం నేను తీసుకుపోతాను

నేను వెళ్లాలి, కానీ మదన్ వస్తున్నాడా?

ఈ ప్రపంచానికి నా కళ్లు మూతపడకముందే

నాకు వాడిని చూడాలని ఉంది

వాడిని చూడకముందే గనక నేను చనిపోతే

ముసలామె ఏడ్వద్దందని వాడికి చెప్పు

 

మూనా:

అమ్మా! మీ జ్ఞాపకాల్ని కన్నీళ్లతో కడిగి మెరిపిస్తాను

ఏమీ కాలేదు, ఇంకా మీరు కలత చెందొద్దు

 

కథకుడు:

మదన్ తల్లికి వణుకు మొదలవుతుంది,

స్వరం క్షీణిస్తుంది,

మూనా చేతులకోసం వెదుకుతుంది

దొరికినపుడు పట్తుకుని

దూరపు గొంతుతో “నా కొడుకేడి?” అనడగుతుంది

ప్రచండ గాలి కొమ్మల్ని ఊపుతుంది

కాకి అరుస్తుంది, ప్రయాణీకులు శిఖరాల్ని చూస్తారు.

 

మదన్ అరచేతుల్లో మొహం

భుజాలు మోకాళ్లమీద పెట్టుకుని

అరుస్తున్న కాకిని చూస్తాడు

 

మదన్:

మా నగరాన్ని చూసావా?

మా ఇల్లు ఆ లోయలో పరిశుభ్రంగా ఉంటుంది

మా అమ్మ దగ్గరకు వెళ్లు, ఆమెది తెల్ల జుత్తు

మూనా దగ్గరకూ వెళ్లు, ఆమె మెరుస్తుంటుంది

వాళ్లకు చెప్పు నేను బాగున్నానని

నాకోసం ఆందోళన చెందొద్దని

ఇంటిముంగిట చెట్ల ఫలాలు పక్వానికొచ్చుంటాయి

వెళ్లు తిను, వారికి నా కధ చెప్పు

 

కథకుడు:

రాత్రి నగరంలో వింత అరుపులు వినిపిస్తున్నాయి.

తడిసిన కళ్లు, కాంతిహీనంగా దీపాలు, తీవ్రమైన గాలులు,

కుక్కల అరుపులు, కనిపించని చంద్రుడు.

మదన్ మరణించినట్టు పుకారు ఇంటికి చేరుతుంది

ఆకులు కన్నీరు కారుస్తున్నాయి

లేత చెట్టు విరిగి నేల రాలుతుంది

ముసలామె శ్వాస పెనుగులాడుతుంది

మూనా కూలిపోతుంది.

 

మదన్:

నేనెందుకొచ్చానమ్మా?

ఏమి చూడాలనొచ్చాను?

అమ్మా, నువు నా గుండె కోస్తున్నావు

నా మొహం చూడు, అమ్మా, నన్ను చూడు

నేనొచ్చాను. నేను పాపం చేసాను. నన్ను చూడు

నేను దగ్గరగా ఉంటే నువ్వెటో చూస్తున్నావు ఎందుకు

ఏడుస్తున్న నన్ను చూడు. ఓదార్చు నన్ను

వెళ్లొద్దు, వెనక్కొచ్చేయ్

నన్ను పోల్చలేదా?

నిన్ను కనీసం చూసుకోలేకపోయాను

నీ మొహంమీద విస్తరించిన ఈ శాంతి ఏమిటి?

నాతో మాటాడు. నీ సున్నితమైన మనస్సుని

నేను బాధించగలనా

అమ్మా, నేను బంగారం మూటలు తెచ్చాను

నా పాదాల దగ్గరుంచాను

మనం విశ్రాంతి గది కట్టుకుందాం

నువు చెప్పిన దగ్గర. కుళాయిలు

తిరిగొచ్చేయ్, ఆకాశాం వైపే చూపిస్తూ అటు చూడొద్దు

 

కథకుడు

మూనా కనిపించక, సోదరి ఇంటికి వెళతాడు మదన్

 

మదన్:

చెప్పక్కా, చెప్పు, నా మూనా ఎక్కడ?

అమ్మ మరణిస్తున్నా, ఆమె అక్కడ లేదు

 

మదన్ సోదరి:

నువులేకపోవడం భరించలేక,

దుఃఖంతో ఆమె తన తల్లిదండ్రుల దక్కరకు వెళ్లింది

తిరిగి రాలేదు

మదన్:

అమ్మనొక్కర్తినీ వదిలి వెళ్లిందా?

నేను లేనపుడు ఆమెను ఎలా వదిలి వెళ్లగలిగింది?

 

మదన్ సోదరి:

ఆమెకే ఆరోగ్యం బాగులేక,  ఆమె వెళ్లిపోయింది

కోడలుగా వజ్రంలా మెరిసింది

ఆమెకు బాగులేకే వెళ్లింది

 

మదన్:

మూనా ఎలా ఉంది, ఎవరు వెళ్లారు ఆమెను చూసేందుకు?

ఆమె నీళ్లు అడిగుంటుంది

తాగేందుకు ఎవరిచ్చారు ఆమెకు నీళ్లు?

 

మదన్ సోదరి:

ఆమెకు నీళ్లవసరం లేదు, ఆమెకు బాగయింది

నీ మూలికలు ఆమెకు అవసరం లేదు

తమ్ముడా, ఆమెను నేను కలిసేదాన్నే

కానీ ఆమె ఇంటికి దారి నాకు తెలియలేదు

 

మదన్:

ఆమెకు బాగయితే తిరిగి రాలేదెందుకు?

ఎందుకు తిరిగి రాలేదు?

 

మదన్ సోదరి:

తల్లిదండ్రులనుంచి ఇంటికొచ్చేందుకు

ఆమె దారులకోసం వెదికింది, దారులేవీ లేవు

 

మదన్:

ఇదేదో వింతగా ఉంది. నువు చెప్పేదేమిటి?

 

మదన్ సోదరి:

కాంతి నిండిన నగరంలో

ఆమె మేఘాల్లో ఉంది

 

మదన్:

అక్కా, మూనా ఇక్కడే ఉందని చెప్పు

ఈ భూమిమేదనే ఉందని చెప్పు

ఆమె వెనక్కు ఎప్పుడొస్తుందో చెప్పు

 

మదన్ సోదరి:

జీవనది కావల ఆమె ఉంటోంది

కానీ ఆమె పువ్వులతోబాటు నవ్వుతోంది

నీటితోబాటు నర్తిస్తోంది

నక్షత్రాలతోబాటు మిణుక్కుమంటోంది

కోకిలతో మాటాడుతోంది

మెరిసే ఆమె కళ్లు

మంచుతో కన్నీరు కారుస్తున్నాయి

ఆమె విచారంగా ఉన్నప్పుడు

మంచు ముద్దకట్టడం చూస్తావు

తమ్ముడా, మూనా చావలేదు

పక్షులు ఆమె పాటను కట్టాయి

అవి పాడగా నువు విను

 

మదన్:

మూనా చావలేదు, ఆమె బతికే ఉందని చెప్పు

ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉందని చెప్పు

నా ఆశల వ్రేళ్లు,   నా మానసిక రెక్కలు

మూనా ఇక్కడే ఉందని చెప్పండి

ఆమె ఎప్పుడు తిరిగొస్తుందో చెప్పండి

 

మదన్ సోదరి:

ఇక్కడ ఈ బూమికీవల ఆమె లేదు,

దుఃఖం చొరబడనిచోట ఆమె ఉంటోంది

ఊహలకావల స్వర్గం తోటలో

ఆమె ఆనంద పుష్పాలను కోసుకుంటోంది

 

మదన్:

కృరమైన అక్కా, నీ మాటలే మరణం.

ఆశల మొగ్గలు నా కళ్లముందే వికసించి నేలరాలడం

చెవులు విని, గుక్కెడు విషం తాగడం

మూనా, ఓ మూనా, నువు నా ఆరాధ్యానివి

నా జీవిత బంధానివి.

నా జీవితమా ఎందుకు వదిలిపోయావు

 

అక్కా, నేను మూనాని చూడాలి

ఆమెను పిలువు అక్కా , కాస్సేపైనా ఆమెను చూడనివ్వు

ఓ మూనా, నా మూనా, కిందికి దిగిరా నా దగ్గరకు

నా రాణీ, నిన్ను కాస్సేపైనా చూసుకోనీ.

 

మదన్ సోదరి:

నా తమ్ముడా, బంగారం, మనస్సు కుదుటబెట్టుకో

ఈ పాడు జీవితం పోవాలి,

పిడికెడు బూదిదను చివరకు గాలి ఎగరేసుకుపోతుంది

ఈ మాంస పుష్పం వాడి నేలరాలాల్సిందే

 

మదన్:

తెలుసా అక్కా , నా గుండె పగిలిపోతోంది

మనం బంగారంతో ఏమి చేసుకుంటాము అంది మూనా

భగవంతుడా, ఆమెను అలా తయారుచేసి

నువ్వు చేసింది నువ్వే ఎలా ధ్వంసం చేయగలవు

ఈ పుష్పాన్ని నువ్వెలా మలిచావు

ఎలా లాక్కుపోగలిగావు

ఈ పుష్పాన్ని నువు నాకిచ్చావు

ఎలా నాశానం చేయగలిగావు ఇలా?

నేనామెను ముందు చూసినపుడు

మూనా మొహాన్నే ముందు చూసాను అక్కా

మూనా మరణిస్తుందని ఏనాడూ అనుకోలేదు

ఆమె ఎప్పటికీ చావదనుకున్నాను అక్కా

అగ్ని ఎలా ఆహుతి చేసిందామెని?

నా గుండెకు హత్తుకోడానికి

ఆమె నాకు ఎక్కడ దొరుకుతుంది

ఆమె బూడిద నాకు ఇవ్వు అక్కా

ఆ బూడిదను నా గుండెకు పులుముకుంటాను

అమ్మా, మూనా, నేనిక్కడ ఉండను

నేనిక్కడ ఉండను అక్కా

నేనుండను

 

ఈ భూమి వైపు చూడొద్దు మూనా

నేను కూడా వస్తున్నాను

నువు వదిలి వెళ్లిన

కన్నీటి గుర్తులతో

ప్రేమ రత్నాలతో

నేను కూడా వస్తున్నాను

 

–         అనువాదం: ముకుంద రామారావు