మంచు తడి ఆరని పారిజాతాలు!!

 Naa_Smruti_Pathamlo._1024x1024

ఆ మధ్య  అఫ్సర్ గారు  ఒక  సందర్భంలో   ఆచంట జానకిరాం గారి “నా స్మృతి పథంలో…సాగుతున్న యాత్ర”  పుస్తకాన్ని  గురించి  విశేషంగా ప్రస్తావించారు,  వెంటనే ఆ  పుస్తకం  చదివి  తీరాలని   అనిపించేంతగా!

ఒక వ్యక్తి స్వతహాగా కవీ, రచయితా అయి, సున్నిత మనస్కుడై, భావుకుడై తన ఆత్మకథను వ్రాయాలని అనుకుంటే, అందుకు తోడుగా అతనికి తన కాలంలోని దాదాపు ప్రతీ సాహితీవేత్తతోనూ దగ్గరి పరిచయం ఉండి, ఆ అనుభవాలన్నీ గుర్తుంచుకోగల జ్ఞాపకశక్తీ, ఆ అపురూపమైన సంగతులన్నీ శ్రద్ధగా గుది గుచ్చి చెప్పగల నేర్పూ ఉంటే, అది నిజానికి పాఠకుల పాలిట వరం. ఈ పుస్తకం అలాంటిది.

“ఇవిగో! ఇంకా నిద్ర లేవని

మంచు తడి ఆరని, పారిజాతాలు!!

ఈ ధవళిమ నా భావాల స్వచ్ఛత;

ఈ ఎరుపు నా అనురాగపు రక్తిమ

ఈ పరిమళము మన స్నేహసౌరభము!

అందుకోవూ..”

అంటూ మొదలయ్యే పుస్తకమిది. ఈ పుస్తకంలోని పదాలెంత సుకుమారమైనవో, ఇందులోని భావాలెంత సున్నితమైనవో, అభివ్యక్తి ఎంతలా మనను కట్టి పడేయగలదో, ఈ మొదటి పేజీలోనే మనకు చూచాయగా తెలుస్తుంది.

ఇక అది మొదలు, సంగీత సాహిత్యాలను ఇరు ఒడ్డులుగా చేసుకుని ప్రవహించే నిండైన నది లాంటి ఆచంట వారి జీవితం మన కళ్ళ ముందుకొస్తుంది. మహావృక్షాల్లాంటి మహనీయుల జ్ఞాపకాల నీడల్లో ఆగి కొంత విశ్రాంతిని పొందడం, ఆ నదిలోని చల్లని నీరు దోసిళ్ళ నిండా తీసుకుని ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకుని ఆ తీరం వెంబడి నింపాదిగా నడవడం – పాఠకులుగా ఇక మన పని.

భౌతికమైన వస్తువుల ఆత్మను దర్శించి, వాస్తవానికీ కల్పనకూ మధ్య అపురూపమైన సంధినొకదాన్ని నిర్మించి, మరొకరిని ఆ దోవలో నడిపించి ఊయలూగించడానికి మాంసనేత్రం సరిపోదు. రసదృష్టి లాంటిదేదో కావాలి. తనలో లేని సౌందర్యమేదీ ఈ ప్రపంచంలో కనపడదన్న ఓ పాశ్చ్యాత్యుని మాటలు నమ్మి చెప్పాలంటే, ఆచంట వారి మనసంతా సౌందర్యమయం.

ఆచంట స్వతహాగా కవి. లోకం పట్ల ప్రేమ, దయ ఆయన కవితల్లోనూ, నాటకాల్లోనూ కనపడుతూంటాయి. మునిమాపువేళ మిణుకుమిణుకుమనే ఒంటరి నక్షత్రమొకటి, ఆయనలో ఒకేసారి ఆశనూ, దిగులునూ కలిగిస్తుంది కాబోలు. ఆ తార ప్రస్తావన కనపడ్డ కవితలు రెండు:

 

” నేను నిదురించు శయ్యాగృహంపు టాకాశ

గవాక్షమందుండి యొక్క తారకామణి

మిణుకు మిణుకంచు తన సందేశాల బరపజూచు..”

 

“నీ నిరంతర స్మరణ నా యెద వ్రేగునపుడు

మమతతో కూయుచు మునిమాపువేళ

గువ్వతల్లియు తన గూడు చేరునపుడు

సొమ్మసిల్లిన సృష్టియు సుషుప్తి పొందినపుడు

నిలువ నీడేలేని నిరుపేద భిక్షుకుడ నేను

బాధతో రాల్చిన మౌనభాష్పకణమ్మునందు

దూరమున దీపించు నా దివ్యతార

ప్రేమకాంతుల బరుపుచు ప్రజ్వరిల్లు”

 

” ” I, a homeless beggar. drop a silent, painful tear in which gleams the distant star of love..””  – ఎంత అపురూపమైన భావన!

కవిత్వం ఎలా ఉండాలి అన్నది, ఏనాటికీ చిక్కు ముడి వీడని ప్రశ్నే! రూపప్రథానమా, భావప్రథానమా? దేని పాళ్ళు ఎంతైతే మంచి కవిత్వమవుతుందంటే, ఎవ్వరు చెప్పగలరు? జిహ్వకో రుచి. అంతే. ఆచంట వారొకసారి రైలు ప్రయాణంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని కలిసినప్పుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాట వచ్చి, “మీరంతా ఆయన్ను భావకవి అంటారు కదా, భావకవిత్వం అంటే ఏమిటి? భావము లేని కవిత్వమంటూ ఉంటుందా?” అని అడిగారట శర్మ గారు.

“అది నిజమే; భావం లేనిది కవిత్వం కాదు. పూర్వపు ధోరణిలో ఉన్న కవిత్వం రూప ప్రథానమైనదనుకుంటా. కృష్ణశాస్త్రి వంటివారి రచన భావప్రథానమైనది.” అన్నారు ఆచంట.

“అల్లాగా ? ఈ పద్యం విన్నారా?” అంటూ భావయుక్తంగా, ఆయనీ పద్యం చదివారట అప్పుడు:

“కలుగవు కమలంబులు, హంసలు కదులవు, చూడవమ్మ చక్కగ నెవరో, తలక్రిందుగ నాకాశము నిలిపిన వార్త, చెరువు నీళులలోన్”

ఇది భావప్రథానమైనదేనని ఆచంట ఒప్పుకున్నాక, ఇది శకకర్త, శాలివాహనునికి ముందు, అంటే రెండువేల ఏళ్ళకు పూర్వం వ్రాసినవనీ, ప్రాకృతములో వందలకొద్దీ ఇటువంటివి ఉన్నాయనీ చెప్పారట.

కాలానికొక రకం కవిత్వం అని గిరి గీయడమెవ్వరి తరం?

ప్రబంధ సాహిత్యం గురించి మాట్లడుతూ, విజయ విలాసములో ఉలూచి  తనని అమితంగా ఆకర్షించింది అంటారీయన. ఉలూచి ఆయనకు సత్యాదేవంత ప్రియమైన ప్రబంధ నాయికట. అందులోనూ నాగ కన్యక కూడానాయో!

“హేమంత ఋతువు కాబట్టి నా ఎదుట యమున అతి సన్నగా ప్రవహిస్తోంది. ఎప్పుడో ఒకనాడు ఇటువంటి నీటనే జలకమాడుతున్నాడు అర్జునుడు. అప్పుడే ఉలూచి అతన్ని తన కౌగిలిలో హత్తుకుని ఎత్తుకుపోయింది. ఆమె వచనాచమత్కృతికీ, ఆమె అసమానరూప లావణ్యానికీ, అన్నింటికంటే ఎక్కువగా ఆమె ప్రకటించే అనురాగానికీ లొంగిపోయి అర్జునుడు, మొదట కాదన్నా, చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.” అని గుర్తు చేసుకుంటారు ఆచంట.

“చక్కెర బొమ్మ నా వ్రతముచందము దెల్పితి నంతెగాక…” అంటూ మొదలయ్యే మరో పద్యంలో, “ఎక్కడ నుండి వచ్చె తరళేక్షణకున్ నును సిగ్గు దొంతరల్” అంటాడు కవి.  ఇందులో మొదట చక్కెర బొమ్మ వినగానే, మగధీర చిత్రంలో, “పంచదారా బొమ్మా బొమ్మా” అంటూ మొదలైన పాట వింటూ, ఈ పాట ఎత్తుగడ ఎంత బాగుందో అని పదే పదే అనుకోవడం గుర్తొచ్చింది. విజయవిలాసం చదువుతోన్న ఆచంట వారూ, ఆ చక్కెర బొమ్మ దగ్గరే ఆగిపోయారట. ముగ్ధకు అతి స్వాభావికమైన సిగ్గు, ఆ ఉలూచి కన్నుల్లో కనపడి పరవశింపజేసిన తీరూ, ఆయన అక్షరాల్లో అందంగా కనపడుతుంది.

అలాగే, తెలుగునాట తొలి చైతన్య స్రవంతి నవల వ్రాసిన వారుగా వినుతికెక్కిన బుచ్చిబాబు ప్రస్తావన కూడా, ఈ పుస్తకంలో కనపడుతుంది. అదీ, చాలా ఆశ్చర్యాన్నిచ్చే ఘటనగా:

“ఒకనాడు బుచ్చిబాబు తాను రచిస్తోన్న ఒక క్రొత్త నవలను గురించి నాతో చెబుతూ కథావిషయము చెప్పి, ఈ రచనకు ఏకాంతము అనే పెడదామనుకుంటున్నాను, మీరేమంటారు? అన్నాడు.

నేనన్నాను : ” మీరు మీ రచనలో జీవితపు విలువలను కొన్నిటిని వివరంగా పరిశీలిస్తున్నారు. ఈ కాలపు ఒకానొక యువకుని జీవితంలో కలిగే సమస్యలను వర్ణిస్తూ, కేవలమూ ఆదర్శజీవి అయిన అతని ఆశలూ, యత్నాలూ ఒక్కటీ ఫలింపపోవడం చూపిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వానిలో వచ్చే ప్రశ్న ఏమిటంటే : ఇట్టి విపరీతపు అన్వేషణలో, ఈ మహాయత్నములో చివరకు మిగిలేది అనే పేరు పెడితే బాగుంటుందేమో.”

ఆ సూచనను వెంటనే అంగీకరించారట బుచ్చిబాబు. ఎంత ఆశ్చర్యం! తెలుగు నాట విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన ఈ నవల పేరు, ఇంతకీ ఆచంట వారి ఆలోచనా!, అన్న ఆశ్చర్యం ముంచెత్తక మానదు ఈ సంఘటన చదివినప్పుడు.

ఆచంట వారి అదృష్టం సాహిత్య రంగానికి చెందిన విశ్వనాథ, చలం, దేవులపల్లి, బుచ్చిబాబు, రవీంద్రులు..ఇలా వీరికే పరిమితం కాలేదు. సంగీత రంగంలోని ఎందరో ప్రముఖులతోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆకాలంలోని వారందరి సంగీత విభావరులూ ప్రత్యక్షంగా అనుభవించగల సదవకాశమూ దక్కింది. బెంగళూరు నాగరత్నమ్మ మొదలు, వెంకటనాయుడు గారి వయొలిన్ వరకూ, ఆయన చెవుల్లో అమృతం నింపిపోయిన వారే అందరూ. నాయుడుగారు సావేరి రాగంలో వినిపించిన ఆర్ద్ర సంగీతం వినే, ఆచంట వారు రిల్కే మాటలనిలా గుర్తు చేసుకుంటారు :

“రెండు రాగచ్ఛాయల మధ్య ఉండే విశ్రాంతిని నేను. ఆ క్షణిక విరామంలో  వణికిపోతూ, కలియవచ్చిన ఆ రెండు రాగచ్ఛాయలూ మేళవించి, ద్విగుణితమైన మాధుర్యంతో గానం సాగిపోతుంది” అని.

చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా, అవతలి వారి పేరు ప్రఖ్యాతులతో సంబంధమే లేకుండా, ప్రజ్ఞను బట్టి వారిని పొదువుకున్న అపురూపమైన వ్యక్తిత్వం ఆచంట వారిది. మనస్ఫూర్తిగా వారిలోని కళకు కైమోడ్చిన సాహిత్యాభిమానులు వీరు. అంత నిర్మల హృదయులు కనుకనే, ఎందరెందరో సాహితీవేత్తల ఆంతరంగిక క్షణాల్లోకి ఆయన అలవోకగా ప్రవేశించగలిగారు. సృజనశీలుల్లో కవితాగంగ ఉప్పొంగుతోన్న వేళ, దగ్గరగా కూర్చుని దోసిళ్ళతో తాగి తన తృష్ణను తీర్చుకున్నారు.

” నువ్వూ నేనూ కలి/వెన్నెల వెలుగులా/వెలుగులో వాంఛలా

నువ్వూ నేనూ కలిసి గగన నీలానిలా/ నీలాన శాంతిలా” అన్న బాపిరాజు కవిత్వాన్నైనా, “మురళి పాటకు రగిలి/మరుగు నీ వెన్నెలలు/సొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల” అన్న దేవులపల్లి గీతాలనైనా, “కంటికంతా జలమయంబై, మింటివరకు నేకరాశై జంట దొరుకని మహాప్రళయపుటింటిలో వటపత్ర డోలిక నొంటిగా నుయ్యాల లూగితివా నా ముద్దు కృష్ణా జంటగా నను బిల్వదగదోయీ?” అన్న బసవరాజు గేయాన్నైనా,  “వలపు నిండార విరిసిన పారిజాత కుసుమములు నేలరాలు వేకువలయందు ప్రసవ శయ్యాపదముల నీపాదయుగళి కదలెనో, నాదు హృదయమే కలతపడెను” అన్న అబ్బూరి రామకృష్ణారావుగారినీ, ” గడ్డి పూవుని! రేకుల రెప్పల కలలు కంటూ కలవరిస్తూ కలతనిద్దురలోనె ఎప్పుడొ కళ్ళు మూస్తాను!” అన్న ఆచంట మేనత్త కొడుకు మల్లవరపు విశ్వేశ్వరరావైనా,విశ్వనాథ కిన్నెరసానినైనా, నూతిచుట్టూ ఉన్న పాలగచ్చు పళ్ళెం మీద ముక్కాలి పీట మీద కూర్చుని, గుమ్మడివడియాల వాసన పీలుస్తూ విన్న “చేతులార శృంగారము చేసి చూతు” నన్న సన్నిహితుల గానాన్నైనా, ఆఖరకు విజయనగరంలో జట్కా వాడి పాటలనైనా, అదే తన్మయత్వంతో, ఆ కవిత్వంలో, సంగీతంలో, గానంలో లీనమైపోతూ అనుభవించారు.

అప్పటి తనలోని ఆవేశాన్ని, ఉత్సాహాన్ని, ఆయన మిత్రులు కొండేపూడి సుబ్బారావు కవితాఖండికలో ఇలా చెప్పవచ్చునేమో!

 

“ఉదయకాంతుల పసిడితీగొకటి మెరిసినది

మృదుపుష్ప గర్భమున రేకొకటి విరిసినది

లలితసుందర దివ్య లావణ్య నవజీవ

మధుమాస సుధలలో  హృదయమే పొంగినది”

సామాజిక జీవన చిత్రణ ఈ పుస్తకంలో ఉందని అనలేను కానీ, ప్రముఖ రాజకీయ నాయకుల ప్రస్తావన మాత్రం కనపడుతుంది. ఈ సరికే మన ఆలోచనల్లో ఒకింత ఎత్తులో సుఖాసీనులైన వాళ్ళందరి గురించీ, ఆచంట వారి మాటల్లో చదవడం బాగుంది. వాళ్ళెందుకంత గొప్పవాళ్ళయారో, మరొక్కసారి తెలుసుకున్నట్టైంది. పుదుచ్చేరిలో అరవిందులతో జరిగిన సంభాషణా, గాంధీ మదనపల్లె ఆశ్రమానికి వస్తూనే ఇచ్చిన ఉపన్యాసం, ఓ బహిరంగ సభలో సుభాష్ చంద్రబోస్ వందల మందిని రెండే మాటలతో నిలువరించి నిలబెట్టిన తీరూ, చకితులను చేస్తుంది. ఆచంట వారు వారందరికీ విధేయులుగా ఉండడమూ, అవసరమైనప్పుడల్లా, ఈ ఉద్యమాల వల్ల జైళ్ళకు వెళ్ళిన వారికి తన పరిథిని దాటుకుంటూ వెళ్ళి సాయపడడమూ కనపడుతుంది కానీ, అదంతా స్వభావసిద్ధమైన సున్నితత్వం వల్లే తప్ప, ప్రత్యేకించి రాజకీయాలంటే బలమైన ఆసక్తి ఉన్నట్టు అనిపించదు.

బహుశా ఇది కూడా, రాజకీయాల్లో సహజంగా ఉండవలసిన మొండి పట్టుదల వంటిదేదో వారికి స్వాభావికముగా లేకపోవడం వల్ల అయి ఉండవచ్చు. జీవితం మొత్తం మీద ఒకేసారి ఒక వ్యక్తిపై చేయి చేసుకొనవలసి వచ్చిన సందర్భాన్ని గురించి ఎంతో మధనపడుతూ, పశ్చాత్తాపపడుతూ, తన తప్పు పూర్తిగా లేకున్నా కన్నీళ్ళ ప్రాయమైన వైనాన్ని చెప్పడం చదివితే, ఆయన మనసు  మరింత స్పష్టంగా కనపడుతుంది. ఐతే, సాహిత్యవిమర్శలో మాత్రం, ఎక్కడా వెనుదీయలేదీయన. విశ్వనాథ ఏకవీర మొదలు, “ఎముకలు కుళ్ళిన” అన్న శ్రీశ్రీ కవిత్వం వరకూ, విభేదించవలసిన ప్రతీ సందర్భంలోనూ గట్టిగా నిలబడి సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాసారు. కొన్ని సందర్భాల్లో కాలం తన అభిప్రాయాలను తప్పని తేల్చినా, తానా భిన్నమైన అభిప్రాయంతోనే ఈనాటికీ నిలబడి ఉన్నానని చెప్పుకోవడానికి మొహమాటపడలేదు. అది, ఆయనలోని నిబద్ధతకు నిరూపణం.

ఇలా ఈ పుస్తకాన్ని గురించి చెప్పుకుంటూ పోతే, ఎక్కడ అపాలన్నది ఎప్పటికీ తేలదు. కనుక, రవీంద్రుల కవితొక్కదానితో, ఈ పుస్తకాన్నీ, ఆయన జీవితాన్ని కూడా-  పొదుపుగా మరొక్కసారి మననం చేసుకుంటూ, ముగిస్తాను.

“అపురూపమైన ఈ లోకపు మహోత్సవములో

పాల్గొనమని నన్ను ఆహ్వానించావు

నా జన్మ తరించింది. ఉత్సవాన్ని కళ్ళారా చూశాను!

ఆనంద గీతము చెవులారా విన్నాను.

ఈ మహోత్సవములో నా వాద్యమును

నా చేతనైనంత అందంగా వినిపించాను..”

*

 

ఓ దిగులు గువ్వ

 1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్న గుర్తు
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోవడమూ గుర్తు.

3

చుక్కలు నవ్వితే మెచ్చనిదెవరు కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి గుర్తొచ్చేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..

               -మానస చామర్తి

శివం-సుందరం : గోకర్ణం

Murudeswar

శ్రావణమాసం!

        గోకర్ణం అని బస్ వాడు పిలిచిన పిలుపుకు ఉలిక్కిపడి లేచి క్రిందకు దిగగానే పన్నీటి చిలకరింపుల ఆహ్వానంలా కురిశాయి తొలకరి జల్లులు. ‘చంద్రుణ్ణి చూపించే వేలు’లా, మట్టి రోడ్డు ఊరిలోకి దారిని చూపిస్తోంది. మనసును పట్టిలాగే మట్టి పరిమళం వెంటే వస్తోంది. పచ్చటి పల్లెటూరు గోకర్ణం. భుజాల మీదకు బ్యాగులు లాక్కుంటూ మేం వెళ్ళవలసిన హోటల్‌కు నడక మొదలెట్టాము. ఆదిలోనే హంసపాదు. ముందురోజు గోకర్ణం వచ్చాకే రూం తీసుకోవచ్చునన్న హోటల్ వాళ్ళు, తీరా వెళ్ళాక, రూములేవీ ఖాళీల్లేవన్నారు. చేసేదేమీ లేక, ఒక హోం స్టేలో అద్దెకు దిగాం.

ఇక్కడ ఇళ్ళన్నింటికీ చిత్రంగా రెండేసి తలుపులు. ఒకటి గుమ్మం బయట మోకాళ్ళ వరకూ. రెండవది మామూలుగా- గుమ్మానికి లోపలివైపు. దాదాపు పగలంతా, ఎవరూ లోపలి తలుపు వేసుకున్నట్టే కనపడలేదు. బహుశా, దొంగల భయం ఉండి ఉండదు. రూం ఏమంత సంతృప్తికరంగా లేకపోయినా త్వరత్వరగా స్నానాలవీ ముగించి మహాబలేశ్వరుడి గుడికి బయలుదేరాం. చిన్న ఊరే కావడంతో అన్నీ నడచి వెళ్ళగల్గిన దూరాలే. గుడికి నాలుగడుగుల ముందు, రవికల్లేకుండా, కుడిపవిటతో, నడినెత్తిన కొప్పులతో ఉన్న కొందరు యువతులు మమ్మల్ని అటకాయించి, అధికారంగా చేతుల్లో తామరాకు పొట్లమొకటి ఉంచి, “ముందు ఇటు” అంటూ దారి మళ్ళించారు.

గుప్పెడు గరిక, దోసెడు పూలు. తామరాకు పొట్లాన్ని భద్రంగా పట్టుకుని, వాళ్ళు చెప్పినట్టే గణపతి దర్శనానికి వెళ్ళాము. గోకర్ణ ప్రాముఖ్యత అంతా అక్కడి ప్రాణలింగంలోనే ఉందని అంటూంటారు. ఈ ప్రాణలింగం సామాన్యమైనది కాదు. సృష్టిలోని చరాచర జీవుల సత్వశక్తితో మహాశివుడు మూడు కళ్ళు, మూడు కొమ్ములు ఉన్న ఒక విశిష్ట మృగాన్ని తయారుచేస్తాడొకానొకప్పుడు. రెండు కొమ్ములు బ్రహ్మ, విష్ణు శక్తులుగా మారగా, మూడవది ఈ ప్రాణలింగం. సాక్షాత్తూ రుద్రాంశ. దీని శక్తిని గుర్తెరిగిన రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి, శివానుగ్రహంతో దీనిని సాధించి తీసుకు వెళ్ళిపోజూస్తాడట. భక్తుల యోగ్యత చూసి, భోళాశంకరుడి వరాలను అవసరమైతే పట్టి వెనక్కు లాగే శ్రీహరి, ఈసారీ రంగంలోకి దిగి, రావణాసురుడి నుండి ప్రాణలింగాన్ని దూరం చేయదలచి, తన చక్రాన్ని అడ్డు పెట్టి, సూర్యాస్తమయమైన భ్రమ కలిగిస్తాడట లోకాలకు.

విజయగర్వంతో ప్రాణలింగాన్ని తీసుకుని ప్రయాణిస్తోన్న రావణాసురుడు, కమ్ముకుంటోన్న అరుణవర్ణాన్ని చూసి, సాయంసంధ్య వేళయిందని నమ్మి, సంధ్యావందనం చేయగోరి, భూస్పర్శ సోకితే లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుందన్న శివుని వాక్కు గుర్తొచ్చి, ఇహ ఎక్కడ పెట్టాలో తెలీక, చుట్టూ చూస్తాడట. ఈ లోపు, బొజ్జ గణపయ్య అక్కడికి గోవులకాపరి వేషంలో వచ్చి, గోవులను చూస్తునట్టు నటనమాడుతాడట. రావణాసురుడు ఉన్న కథంతా చెప్పి, తానొచ్చేవరకూ లింగాన్ని భూస్పర్శ సోకకుండా కాపాడమని అర్థిస్తే, లంబోదరుడు తాను చిన్నవాణ్ణి కనుకా, లింగం బాగా బరువుగా ఉంది కనుకా, మోయలేననిపిస్తే ముమ్మార్లు పిలిచి క్రింద పెట్టేస్తానని హెచ్చరించి, ఆ భారాన్ని అందుకుంటాడట. రావణుడు సంధ్య వార్చడమిలా మొదలెట్టీ మొదలెట్టగానే చకచకా మూడుసార్లూ పిలిచేసి, లింగాన్ని నేల మీదకు దించేస్తాడట గౌరీసుతుడు. ఆ ప్రాంతమే ఈ గోకర్ణం.

రావణాసురుడు రాక్షసుడు, గర్వి, కోపిష్టి. ఊరుకుంటాడా మరి? పట్టరాని ఆవేశంతో గణపతి శిరసుపై పిడికిలితో మోదుతాడట. మహాబలేశ్వరుడి దర్శనానికి ముందు, ఆ కొండయువతులు మమ్మల్ని చూడమన్నది, ఈ గణపతినే. శిరసు మీద పిడికిలి గుర్తులు సుస్పష్టంగా కనపడుతోన్న ఇక్కడి “చింతామణి గణపతి”కి మనసారా మొక్కి, మహాబలేశ్వరుడి గుడివైపు నడక సాగించాం.

మహాబలేశ్వరుడి గుడిలో ఉదయం 6-12 వరకూ, సాయంకాలం 6-8 వరకూ భక్తులందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఆత్మలింగాన్ని స్వహస్తాలతో స్పృశించి అభిషేకం చేయగల మహదవకాశమూ లభిస్తుంది. సువర్ణనాగాభరణవిశేష పూజ చేయించదలచిన మా జంటని, పూజారులొకరు వచ్చి వారి తరఫున అంతరాలయంలోకి తీసుకువెళ్ళారు. పంచామృతాలతో పరమశివుడికి అభిషేకం చేయడం కాసేపటికి పూర్తయింది. “త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్” అనుకుంటూ మారేడు దళాలను సమర్పించుకోవడమూ అయింది. అప్పుడు,
“లింగరూప తుంగ, జగమాఘనాశన
భంజితాసురేంద్ర రావణలేపన
వరగోకర్ణఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ
శ్రీమహాబలేశదేవ సార్వభౌమతే”
అని మహాబలేశ్వరుణ్ణి అందరూ కీర్తిస్తూండగా, దాదాపు మూణ్ణాలుగు బిందెల నీళ్ళను, మన ముంజేయి లోతులో ఉన్న బిలంలో ధారగా వదిలారు అర్చకులు. వచ్చినంత నీరు బయటకు రాగా, లోపల మిగిలిన నీరు నిశ్చలమైపోగా, మమ్మల్ని అందులోకి తొంగి చూడమన్నారు. తాకి మొక్కుకోమన్నారు. ఆత్మలింగం!! రుద్రాంశ! దేవతలందరూ కొలిచిన కొమ్ము. సమస్త లోకాలకూ రక్షణైన కొమ్ము. రాముడు నమ్మిన క్షేత్రం. రావణుడోడిన క్షేత్రం. అక్కడ..ఆ క్షణంలో, దానిని తాకి పరవశించగల సౌభాగ్యంతో మేము. ‘ఆత్మనొక దివ్వెగా’ ఈ పరమేశ్వరుని పాదాల చెంత వెలిగించాలనుందన్న ఓ కవిమిత్రుని మాటలు అప్రయత్నంగా గుర్తొచ్చాయి. ఆ శ్రావణమేఘాల తడిజాడలేవో నా కన్నుల్లోనూ మెరిశాయి.

అటుపైన ‘కడల్ బీచ్’కు వెళ్ళి, కడలి ఒడిలో కాసేపు ఆటలాడి, అక్కడి భోజనం వెగటు పుట్టిస్తోన్నా శక్తినంతా సముద్రానికి ధారపోసిన పాపానికి తినకుండా ఉండలేక, ఎలాగో అయిందనిపించి, మురుడేశ్వర్ వెళ్దామని బయలుదేరాం. 2000/-కు మారుమాట లేని బేరమైతే తీసుకువెళ్తామని టాక్సీల వాళ్ళు ముందుకొచ్చారు. బస్‌స్టాండ్ అట్టే దూరం కాకపోవడంతో, బస్సులేమైనా ఉన్నాయేమోనని కనుక్కోవడానికి వెళితే, నేరుగా ఏం లేవనీ, కుంటాలో దిగి మారవలసి ఉంటుందనీ చెప్పారు.

ఇక టాక్సీ తప్పదనుకుంటూండగా మా వద్దకొక ఆటోవాలా వచ్చి వివరమడిగాడు. ఇవన్నీ వద్దనీ, మూడున్నరకు మురుడేశ్వర్‌లో దింపే రైలొకటుందనీ, అది ఎక్కితే గంటలో వెళ్ళిపోతామనీ చెప్పాడు. మాకొక్క గంటే సమయముంది. అతని ఆటోలోనే ఎక్కి స్టేషన్ కు బయలుదేరాం. దారంతా అతను అక్కడి గుడుల గురించీ, అక్కడి మనుష్యుల మంచితనాన్ని గురించీ కథలుకథలుగా చెబుతూనే ఉన్నాడు. పచ్చిక బయళ్ళ దగ్గరా, ఉప్పు నీటి మడుల దగ్గరా మెల్లిగా పోనిస్తూ వాటి విశేషాలన్నీ విప్పి చెప్పాడు.

అనుకున్న వేళకి పది నిముషాల ముందే మమ్మల్ని స్టేషన్లో దించేశాడు. రైలు నిజంగా ఉందో లేదో నన్న అనుమానం నన్ను వదల్లేదు. ఐదువందల రూపాయల నోటు చేతిలో రెపరెపలాడుతోంటే, అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగానతన్ని. అతడేమనుకున్నాడో, ఏమనిపించిందో నాకు తెలీదు కానీ, “నమ్మకం ఉండాలి మేడం! అది లేకుండా ఏ ప్రయాణమూ పూర్తి కాదు” అన్నాడు, చిల్లర లెక్కపెడుతూ. అతడు మామూలుగానే అన్నా, “ప్రయాణం” అన్న పదం, అతను పలికినంత తేలిక అర్థంలో అయితే నాకు స్ఫురించలేదు. చాలా సేపు ఆమాట నా ఆలోచనలను అంటిపెట్టుకునే ఉంది. ఆ ఒక్కమాటా కలిగించిన వేల ఆలోచనలు, గుర్తు చేసిన వేనవేల సందర్భాలూ, మనుష్యులూ, అన్నీ, మురుడేశ్వర్ ఆలయాన్ని చూసీ చూడటంతోనే, అక్కడి గోపురాల్లో నుండి చివాలున రెక్కలు విదుల్చుకుంటూ ఎగిరిపోయి శాంతిని వదిలే పావురాలల్లే చెల్లాచెదురైపోయి, నన్నొక నిశ్శబ్దంలోకి నెట్టేశాయి.

gokarna2

దాదాపు ఇరవై అంతస్తుల మహాఆలయం. నిగర్వులమై తలపూర్తిగా వెనక్కు వాల్చితే తప్ప కనపడని గోపురం. అది దాటి వెనక్కు వెళితే, సముద్ర తీరాన అంతెత్తులో, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద శివుడి విగ్రహం. ఆ శివుడి విగ్రహం దగ్గర నిలబడి చూస్తే అనంత జలరాశితో ఎగసెగసిపడుతూ అరేబియన్ సముద్రం. అస్తంగత సూర్యుడు తన బంగారు కాంతులన్నింటినీ ఆప్తుడని కాబోలు, సముద్రుడికే ధారపోశాడు. వాతావరణం ఉన్నట్టుండి చల్లబడిపోయింది. తలెత్తి చూస్తే పరమేశ్వరుడి శిరసుపై ఠీవిగా కనపడుతోన్న చంద్రవంక. ” చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమాం!”

గుంపులు గుంపులుగా మనుష్యులు. చిన్నా-పెద్దా, పొట్టీ-పొడుగూ, నలుపూ-తెలుపూ..ఏవో భేదాలు. ఏవేవో పోలికలు. ఆ గుడిమెట్ల దగ్గరే కొన్ని జంతువులు మూగగా నిలబడి చూస్తున్నాయి. అశుచిగా ఉన్న చోట్ల ఈగలూ దోమలు ముసురుకుని చెదరిపోతున్నాయి. పక్షులు కొన్ని అక్కడే ఉన్న పొడుగాటి చెట్ల గుబుర్లలో చేరి కిచకిచమంటున్నాయి. కలకలం రేపుతున్నాయి. గట్టిగా ఆరేడు నెలలైనా నిండి వుండని పసివాడొకడు అమ్మ చేతుల్లో నుండే చిన్ముద్రలో ఉన్న మహాదేవుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడు.

ఏం కోరుకోవాలీ పరమేశ్వరుణ్ణి?
ఏమని మొక్కాలి?

“నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ-
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ||”

***

ఆరున్నరకు తిరిగి గోకర్ణం చేర్చే రైలు పట్టుకుని వెనక్కు వచ్చేశాం. వచ్చీ రావడంతోనే మర్నాడు ఉదయమే ఐదు గంటలకు దూద్‌సాగర్ జలపాతాలకు వెళ్ళేలా కార్ మాట్లాడుకున్నాం. అటుపైన ఆ రాత్రి మేం పట్టుమని నాలుగు వీథులైనా కనపడని గోకర్ణమంతా చెట్టాపట్టాలేసుకుని తీరిగ్గా తిరిగాము. కోటి తీర్థం, భద్రకాళి గుడి, శ్రీకృష్ణ మందిరం – – అడుగుకో గుడి, అరుగుకో బ్రాహ్మడు అన్నట్టుందా ఊరు. ఎవరి ముఖంలోనూ ఖంగారు లేదు. ఎత్తరుగుల ఇళ్ళ వాకిళ్ళలో పిల్లలు గుంపులు గుంపులుగా చేరి ఆడుకుంటున్నారు. ఊరు ఊరంతా తొమ్మిది గంటల వేళకే నిద్రించండానికి సమాయత్తమైపోయింది. ఒకానొక కూడలిలో మాకు వేంకటరమణుడి ఆలయమొకటి కనపడింది.

మేం ఎక్కడ నడుస్తూన్నా, ఆ శ్రావణ మాసపు రాత్రి, నిర్జన వీధుల్లో నుండి శ్రీకృష్ణ సంకీర్తనలు తేలివచ్చి మమ్మల్ని తాకిపోతున్నాయి. వాటిని పరిపూర్ణంగా లోలోపలికి ఒంపుకుంటూనే, కనపడ్డ ప్రతి షాపులోకీ తొంగి చూస్తూన్నాన్నేను. స్త్రీసహజమైన బేరాలాడే బుద్ధి ఏనాడూ కలిసొచ్చిన జ్ఞాపకం లేకపోయినా, ఆకుపచ్చని ఆశని గుండెలో దాచుకుని, అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న సూత్రం – సగానికి సగం ధర తగ్గించి అడగడమే బేరం – అని గుర్తు చేసుకుని, నచ్చిన ప్రతి కుర్తాకోసమూ ఓ మాట వదిలి చూశాను. కొట్టు కట్టేసే హడావిడిలో ఉన్న ఓ ఆసామీ నా మాట మన్నించాడు. ఆ విజయగర్వంతో , ఆ మిగిలిన డబ్బులతో – స్వీట్ కోసం ఓ చిన్న షాపు ముందు ఆగాం. అది నిజానికి హోటల్.

gokarna1

అక్కడున్న రెండు నిముషాల్లోనూ నన్ను ఆకర్షించింది – అక్కడ పనిచేస్తోన్న అమ్మాయిలు. లంగాఓణీల్లో పద్ధతిగా, ధైర్యంగా, చిత్రంగా మెరుస్తోన్న కన్నులతో హోటల్ తమదే అన్నట్టు కలియదిరుగుతున్నారు వాళ్ళందరూ. మామూలుగా అమ్మాయిలు ఎక్కడో లోపల నక్కి గిన్నెలు తోమడమో, వంటింట్లో కూరలు తరగడమో చూశాను కానీ, ఇలా ఇదీ-అదీ అన్న భేదం లేకుండా వంట నుండీ-కేష్ కౌంటర్ దాకా, తయారుగా ఉన్న పదార్థాల గురించి ఉత్సాహంగా చెప్పడం మొదలు- వాటిని శ్రద్దగా మననం చేసుకుని అంతే శ్రద్ధగా అందించేదాకా, అన్ని పనులూ గట్టిగా ఇరవయ్యేళ్ళు కూడా నిండి ఉండని అరడజను మంది అమ్మాయిలు నేర్పుగా చేసుకుపోవడం ఇక్కడే చూశాను.

మాటల్లో మన్నన, చేతల్లో చురుకుదనం – అక్కడున్న కాసేపూ నా కళ్ళు వాళ్ళ చేష్టలని వెంటాడుతూనే ఉన్నాయి. నాతో పాటుగా అక్కడి అరడజను బల్లల మీది అంతమందినీ, అన్నిరకాల చూపుల్నీ గడుసుగా తప్పించుకుంటూ తమ పని తాము చేసుకుపోతున్నారు వాళ్ళు. టేబుల్ క్లీన్ చేస్తున్న అమ్మాయిలో కూడా ప్రస్ఫుటంగా కనపడ్డ సంతోషాన్నీ, శ్రద్ధనీ చూస్తే, మార్టిన్ లూథర్‌కింగ్‌ను మాటలను కానీ వీళ్ళు చదివారా అనిపించింది. మనుష్యుల్లోని ఏ లక్షణాలు వాళ్ళని ప్రత్యేకంగా నిలబెడతాయో, అభిమానాన్ని, గౌరవాన్ని కలిగించి గుర్తుండిపోయేలా చేస్తాయో, మరొక్కసారి నేర్చుకున్నట్టైంది. మేమడిగిన స్వీట్‌తో పాటు చిల్లరనూ, చలాకీ నవ్వులతో చుట్టబెట్టి ఇస్తూన్నప్పుడు, తళుక్కుమన్న ఆ అమ్మాయి ముక్కెర మెరుపును ఆ రాత్రి ఆఖరి జ్ఞాపకంగా మార్చుకుని, రూంకొచ్చేశాం.

మా అనుమానం నిజం చేస్తూ, 11 దాటాక, ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేశారు. వాన చాలా ఎక్కువగా పడుతోందనీ, ఈ వాతావరణంలో ప్రయాణం మంచింది కాదనీ, దూద్సాగర్లో కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటే జలపాతాల దగ్గరికి ఎవ్వరికీ అనుమతి ఉండదనీన్నూ. ప్రయాణం రద్దయింది. నిరాశతోనే తెల్లవారింది.

 

***
శ్రావణ బహుళ అష్టమి.

చీకటి ముసుగులా పల్లెనింకా వీడనే లేదు. సన్నగా జల్లు కురుస్తూనే ఉంది. జంధ్యప్పోగులు సరిచేసుకుంటూ బ్రాహ్మలు వడివడిగా మమ్మల్ని దాటుకుపోతున్నారు. మహాబలేశ్వరుడి గుడి ఎదుటి దుకాణాల్లో నుండీ లింగాష్టకం లీలగా వినపడుతోంది. మట్టి రోడ్లే అన్నీనూ. అయినా రాత్రంతా కురిసిన వర్షానికి ఏ వీథిలోనూ నీరు నిల్చిపోయిన దాఖలాల్లేవు. అక్కడి మనుష్యుల శుభ్రతనూ, ఉన్నంతలోనే జాగ్రత్తగా మసలుకోవాలన్న మెలకువనూ అభినందించుకుంటూ నడుస్తూండగానే..అల్లంత దూరాన తరగల నురగలతో నవ్వుతూ పిలుస్తూ సముద్రం. ఆ సాగరఘోషలో అంతులేని ఆకర్షణ ఉంది. అర్థమయీ అవని విషాదమూ దాగుంది.

“సముద్రం సంగతి” అంటూ, దేవిప్రియ ఓ కవితలో ఇలా అంటారు –

“వేయి తలల నాగులా
అలల నాలుకలు చాచుకుని
పైపైకి వస్తోంది సముద్రం
నా పాదాల మంత్రదండాలు తగిలితే
పడగల్ని రాతి గట్టుకేసి కొట్టుకుని
మళ్ళీ నీటిపుట్టలోకి నిష్క్రమించడానికి”

దేవిప్రియ ఏ సముద్రం ముందు నిల్చుకుని ఇంత చమత్కారంగా ఆలోచించారో అనుకుంటూ, చర్చించుకుంటూ, ఆ సాగరతీరంలో మేమిద్దరం నడక మొదలెట్టాం. నిర్మానుష్యంగా, నిర్మలంగా, తడిగా, ఒకింత గట్టిగా ఉన్న ఆ ఒడ్డు వెంట..ఎన్ని మైళ్ళు నడిచినా అలసట రానివ్వని మహత్తేదో ఉంది. ఏ అలల చప్పుళ్ళు విన్నా, ఏవో కథలు వినపడుతూనే ఉంటాయి. వాన పెరుగుతూ తగ్గుతూ ఉంది. అలలు మెదిపిన తీరాల మీద చినుకులేవో అర్థమవని చిత్రాలు గీయడం మొదలెట్టాయి. సుడులుసుడులుగా లోతుగా, స్పష్టంగా – క్షణికాలే కానీ, చూసి తీరాల్సిన బొమ్మలవి. సముద్రంలో వాన చినుకుల చప్పుళ్ళు సంగీతమైతే, తడితడి తీరాల పెదవుల మీద చినుకుల ముద్దు ముద్దరలన్నీ చిత్రలేఖలే.

Crow_onthe_beach

మరికాసేపటికి ఎటు నుండి వచ్చిందో – ఓ కాకి ఆ తీరానికి వచ్చింది. కాకిని, అందులోనూ ఒంటరి కాకిని చూస్తే, నాకు బషో గుర్తొస్తాడు. లోకం చలికాలపు దిగులు సాయంకాలమవుతుంది. కానీ, ఆనాటి కాకి కథ వేరు. అల వచ్చేవరకు నిశ్చలంగా నిలబడి సముద్రం వైపే చూడటం; అల మీదకు రాగానే గంతులతో అడుగులు వెనక్కు వేయడం. ఇసుక మీద పడటం వల్లో, అలల తుంపరల వల్లో – ఆగీ ఆగీ రెక్కలు విదుల్చుకోవడం. మళ్ళీ సముద్రం వైపు నాలుగడుగులు..మళ్ళీ వెనక్కు, మళ్ళీ తపతపా రెక్కల చప్పుడు..మళ్ళీ ముందుకు..!

దాని ఈ చేష్టితాలన్నీ చూస్తూ చూస్తూ ఫొటోలు తీస్తూ ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఈ మధ్యే చదివిన రోబర్ట్ ఫ్రోస్ట్ కవిత “డస్ట్ ఆఫ్ స్నో” కూడా గుర్తొచ్చింది. అందులోనూ ఇంతే, గన్నేరు చెట్టు మీద తీరి కూర్చున్న కాకి, తుషార ధూళిని విదుల్చుకున్న తీరే కవి హృదయానికి కొత్త గతినిచ్చిందట. విషాదంలో మగ్గాల్సిన ఓ రోజు నుండి అతనిక్కొంత ఉపశాంతినిచ్చిందట. ఇది అతిశయోక్తి అని ఏ పాఠకులకైనా అనిపించిందీ అంటే, అట్లాంటి ఓ అనుభవం వారికి జీవితంలో ఎదురుపడలేదని అర్థమన్నమాట. చాలా తేలిగ్గా కనిపించే ఇలాంటి కవితల వెనుక ఎంత సున్నితమైన రసస్పందనలు ఉంటాయో, ఎలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలు ఉంటాయో తెలుసుకోగల్గడమే, ఆనాడు గోకర్ణం సముద్రతీరంలో నే నేర్చుకున్న పాఠం. నా ఉనికిని నిర్లక్ష్యం చేస్తూ తీరమంతా కలియదిరిగిన ఆ కాకి, బహుశా నాకు చెప్పాలనుకున్నదీ అదే కావచ్చును.

gokarna4

ఇంకా ఎన్ని గంటలలా గడిచిపోయేవోకానీ, అందాకా ఆహ్లాదంగా కురిసిన వర్షం జడివానగా మారి చలి మొదలవ్వడంతో, వెంట తెచ్చుకున్న గొడుగులో ఒదిగి వెనక్కు మళ్ళాం. ముందు రాత్రీ, ఆ వేళా, వేంకటరమణుడి గుడి నుండి ఆగకుండా భజనలెందుకు వినపడ్డాయో, చిన్నపెద్దా గొంతులు అన్నేసి భాషల్లో కృష్ణగీతాలెందుకు ఆలపించారో, “కృష్ణా నీ బేగనే బారో” అంటూ ఎందుకంతలా తపించారో గుడిలోకి అడుగుపెట్టేదాకా తట్టనేలేదు మాకు. ఆ వేళ కృష్ణాష్టమి. మేం వెళ్ళిన కాసేపటికే అక్కడికొక విశాలమైన వెండి ఉయ్యాలనూ, దాని తోడిదే సందళ్ళనూ మోసుకుంటూ యువకులు కొందరు దూసుకొచ్చారు. మండపం మధ్యలో అందరూ నిలబడి చూసేందుకనువుగా క్షణాల్లో ఊయలను వేలాడదీశారు. చామంతి, మల్లె, మరువం, కనకాంబరాలతో ఒద్దికగా అల్లిన మాలలను ఉయ్యాలకు బయటివైపు అన్ని దిక్కుల్లోనూ వేలాడదీసి దానిని వర్ణరంజితం చేశారు. పట్టుపరుపులు, తలగడలు తరలి వచ్చాయి. మరి చిన్ని కృష్ణుడెక్కడున్నట్టూ? నాలో అంతకంతకూ పెరుగుతోన్న ఉత్సుకతకు తగ్గట్టే, భజన వేగమూ పెరిగింది.

తాళం అంతకంతకూ మారిపోతోంది. శ్రీకృష్ణ స్మరణతో సభామండపం మారుమ్రోగిపోతోంది. నేనిక కుతూహలాన్ని అణచుకోలేక, పాడుతున్న పాటనలా గాలికి వదిలి, ఊయల వద్దకెళ్ళి తొంగి చూశాను. ఆశ్చర్యం! బాలకృష్ణుడక్కడే పడుకుని హాయిగా నిద్దరోతున్నాడు. వేనవేల గోపికలను “బిగియార కౌగిట మనంబలరారగ జేర్చి”న కొంటెకృష్ణుడేమీ కాదు సుమా, యదుకుల క్షీరవారాశి పూర్ణచంద్రుడితడు. యదుసింహ కిశోరుడు. అంగుష్ఠమాత్రమైనా లేని పసిడి విగ్రహమై, పసివాడై వామహస్తాన్ని నెన్నుదిటిపై వాల్చుకుని పట్టుపరుపుల మధ్య పవ్వళిస్తున్నాడు. “లోకములు నిదురవోవగ జోకొట్టూచు నిదురవోని సుభగుడు” మళ్ళీ ఇలా మనబోటి మామూలు మనుష్యుల ఉత్సవసంబరాన్ని చిన్నబుచ్చకుండా ఉండేందుకు నవ్వుతూ నిదుర నటిస్తున్నాడు. “జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజోకృష్ణా!! జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన! జోజో” అంటూ, అలనాడు యశోద, గోపికలు ఏ విశ్వాసంతో, ఏ అనురాగంతో ఆ బాలకృష్ణుని నిదురపుచ్చారో, అదే భావనతో, అదే నమ్మికతో మేమూ వెండి ఉయ్యాల నూపుతూ జోలపాడాము. భజన అలా నిర్విరామంగా సాగుతూనే ఉంది. మేమా గుడి నుండీ, గోకర్ణం నుండీ వెనక్కు రావలసిన వేళ దగ్గరపడుతోంది. తులసిమాలల మధ్య ఒత్తిగిలిన నందనందనుణ్ణి వీడుకోలువేళ మెల్లగా తాకి చూశాను. గోకర్ణం రేపల్లెగా మారింది. హృదయం బృందావనియై నవ్వింది. తృప్తి.

gokarna3

గోకర్ణం నుండీ ఇటు మోకాంబిక, ఉడిపి, అటు వెళ్తే గోవా ఇవన్నీ దగ్గర దగ్గరే. ఏవి చూడాలీ, ఏవి వదలాలన్నది పూర్తిగా మన ఆసక్తులకు సంబంధించిన విషయం. గోకర్ణం నావరకూ ఓ ఆధ్యాత్మిక ప్రదేశం, నాగరిక ఛాయలు పడని స్వచ్ఛ సౌందర్యం. ఓం బీచ్లోనూ, కడల్ బీచ్లోనూ కూడా విచ్చలవిడితనం లేదు. గుడినీ, సముద్రాన్నీ మినహాయిస్తే, ఇక్కడ చూడటానికీ, చేయడానికీ ఏమీ లేదు. అది కొందరికి నిస్తేజాన్ని, కొందరికి ఉత్తేజాన్ని కలిగించవచ్చు. బెంగళూరుకు తిరిగి ఒకే ఒక్క రైలు ఉంది. అదీ నాలుగ్గంటలకే. తిరుగు ప్రయాణంలో “Value Vision consultancy ” స్థాపించిన పూర్ణిమ నా ముందు కూర్చున్నారు.

ఇరవైరెండేళ్ళ తన సుదీర్ఘమైన కెరీర్లో ఆటుపోట్లనీ, ఆవిడ వాటిని దాటుకొచ్చిన తీరునీ ఆసక్తిగా చెబుతోంటే, నాకసలు సమయం తెలీలేదు. బహుశా, చాలా చోట్ల నన్ను నేను చూసుకోవడం వల్ల అయి ఉండవచ్చు. మర్నాడు తెల్లవారు ఐదుగంటలకే లేచి, అందరం ఫ్రెష్ అయిపోయి, రగ్గుల్లో ముడుచుక్కూర్చుని కాఫీలు తాగుతూ “ఆల్టర్నేటివ్ కెరీర్ ప్లాన్స్ ఫర్ విమెన్” చర్చించుకున్నాం. మద్దూర్ రాగానే రైల్లోకి వడలమ్ముకునేందుకు వచ్చిన వాళ్ళని ఆపి, మమ్మల్నీ కొనుక్కోమని సూచించారావిడ. మద్దూర్ వడకంత పేరు ఊరికే రాలేదని మొదటి ముక్కకే అర్థమయిపోయింది.

బెంగళూరు చేరిపోయాం. కొత్త అనుభవాలూ, పాతబడని జ్ఞాపకాలూ, కొందరు మంచి మనుష్యులు, మనసులో ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్వేగపు కెరటాలు – అన్నింటి తాకిడినీ పరిపూర్ణంగా అనుభవిస్తూ, “మండే మార్నింగ్”ని కూడా ప్రేమిస్తూ…’నమ్మ బెంగళూరు’లో – ‘మస్త్ మజా మాడి’ అనుకుంటూ.

“ఏకాంత జీవితంలో లోతు ఎక్కువవుతుంది, సమాజజీవితంలో వెడల్పు ఎక్కువవుతుంది” అన్న సంజీవదేవ్ మాటలెంత సత్యం!

– మానస చామర్తి

సరే, గుర్తుచేయన్లే!

మానస చామర్తి

గుర్తొస్తూంటాయెపుడూ,

వలయాలుగా పరుచుకున్న మనోలోకాల్లో
నువు పొగమంచులా ప్రవేశించి
నా ప్రపంచాన్నంతా ఆవరించిన రోజులు,

లేలేత పరువాల పరవళ్ళలో
లయతప్పే స్పందనలను లాలించి
ఉన్మత్త యౌవన శిఖరాల మీదకు
వలపుసంకెళ్ళతో నడిపించుకెళ్ళిన దారులు ,

లోతు తెలీని లోయల్లోకి మనం
తమకంతో తరలిపోతూ
మలినపడని మంత్రలోకాల్లో ఊగిసలాడిన క్షణాలు-

నీకూ గుర్తొస్తాయా..ఎప్పుడైనా…

1540514_505395279575961_1379096292_o

శబ్దాలు సిగ్గుపడే చీకట్లో
అగణిత నక్షత్ర కాంతుల్ని
నీ చూపులతో నాలో వెలిగించిన రాత్రులు

కలిసి నడచిన రాగాల తోటల్లో
రాలిపడ్డ అనురాగపరాగాన్ని
దోసిళ్ళతో గుండెలపై జల్లి
నను గెల్చుకున్న త్రోవలు

గువ్వల్లా ముడుచుకున్న ఉడుకు తలపులన్నీ
గుండెగూడు తోసుకుని రెక్కలల్లార్చాక
ఆకాశమంత ప్రేమ పండించిన అద్వైతక్షణాలు –

సరే, గుర్తుచేయను. సరదాకైనా,
నీ జ్ఞాపకాల బలమెంతో కొలవను.

పసరు మొగ్గలు పూవులయ్యే వెన్నెల క్షణాలన్నింటి మీద
మనదీ ఓ మెరుపు సంతకముంటుందని మాటివ్వు చాలు.

-మానస చామర్తి

painting: Anupam Pal

అతనిలా ఇంకెవరున్నారు?!

“కాలే గచ్చుపై కుంకుండు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు చురుగ్గా అంటించినప్పుడు
పరిక పొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను సుతారంగా తీసినప్పుడు
ఎర్రటి మధ్యాహ్నం మనం భూతద్దపు చేతులతో
రెండు పచ్చి అగ్గిపుల్లలని వెలిగించ చూసినప్పుడు”

ఈ గుప్పెడు పదాలూ చదివేసరికి, మనం ఎక్కడి వాళ్ళమక్కడి నుండి తప్పుకుని, పసితనపు వీథుల్లోకి పరుగూ తీస్తాం. జ్ఞాపకాన్ని వెన్నెలకిరణమంత సున్నితంగా స్ఫృశిస్తూ , మనకే తప్ప మరొకరికి తెలీదనుకున్న బాల్యాన్ని అక్షరాల్లో గుప్పిస్తూ “నీలాగే ఒకడుండేవాడు” అంటూ పేరుతోనే మనసులకు ఎర వేసి లాగిన వాణ్ణి – ‘ఆ మాట నీకెలా తెలిసిందసలు’ అంటూ ప్రశ్నించేందుకు సిద్ధమవుతాం. నిండా పాతికేళ్ళు నిండని పసివాడు కదా, బహుశా కవిత్వమంటే బాల్యమేనన్న భ్రమలో ఉన్నావాడేమో కదా, లోకాన్ని చూడని అమాయకత్వం పదాల్లో వెల్లువలా పొంగుతోంటే, కవిత్వమంటూ మనకిచ్చాడు కానీ…అని ఊహిస్తూ ఊరికే పేజీలు తిరగేస్తోంటే..

“వెన్నెల స్నేహితా!
నిన్నేమీ అనను. నువ్వు చేస్తున్న దేన్నీ ప్రశ్నించను. నీకు దేహం కావాలి. సత్తువతో నిండిన దేహం. శుభ్రత నిండిన మనసు, స్వచ్ఛత నిండిన ఆత్మ కావాలి. మనం మనమై జీవించడం కావాలి. అనుభూతి సంపదను సృష్టించడం కావాలి. ఏం చేద్దాం?! అవేమీ నా దగ్గర లేవు. ఉన్నదల్లా ఒక అనారోగ్యమైన దేహం, గాయాలు నిండిన మనసూ, వెలుతురు లేని ఆత్మ. నీ అద్భుత హృదయం లాంటిదే నాకూ ఉంటే బాగుండు. ఈ విషాదాలు, నిషాదాలూ అన్నీ ఒకేసారి అంతమైతే బాగుండు. చిందరవందరగా పడి ఉన్న ఊహలకి నిశాంతమేదైనా ఆవహిస్తే బాగుండు. కానీ-

కానీ, ఏదీ జరగదు. ఒక పిచ్చి ఊహలో తప్ప ఏవీ ఎక్కడా అంతమవవు.
దుఃఖిత సహచరీ!
మసకలోనే అడుగులేస్తాను. మసకలోనే తప్పిపోతాను. మసకలోకానికే జీవితం రాసిచ్చి ప్రయోజనం లేకుండా పరుగు తీస్తాను.” అంటూ ఊపిరి వేగం పెరిగేంత ఉద్వేగం కలిగిస్తాడు. ఎవరితను? చలాన్ని గుర్తు చేసేంత తీవ్రతతో జ్వలించిపోతున్న పిల్లవాడు – ఎవరితను?

గుర్తొస్తారు, ఒక్కో కవితా మొదలెట్టగానే, ఎవరెవరో కవులు గుర్తొస్తారు. కానీ కవిత పూర్తయ్యేసరికి మాత్రం, ఈ కవి ఒక్కడే మిగులుతాడు, ఒక అపూర్వ అనుభవాన్ని మనకి విడిచిపెడుతూ. అదే నంద కిశోర్ ప్రత్యేకత. ఇతనికి తనదైన గొంతు ఉంది, తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలి ఉంది. ఇంకా, అతనికి మాత్రమే సొంతమైన కొన్ని అనుభవాలున్నాయ్. అయితే, అవి ఎలాంటివైనా, ఆ బాధనో, సంతోషాన్నో, పాఠకులకు సమర్థవంతంగా చేరవేయగల నేర్పూ, ఆ విద్యలో అందరికీ దొరకని పట్టూ కూడా ఉన్నాయ్. పాఠకులను ఆదమరచనివ్వడు. పరాకుగా చదివే వాళ్ళను కూడా “ఓయ్, నిన్నే!” అని కవ్వింపుగా పిలిచి మరీ ప్రశ్నించే అతని గడుసుదనం, ఈ కవిత్వాన్ని తేలిగ్గా తీసుకోనివ్వదు. అంత తేలిగ్గా మరచిపోనివ్వదు.

“చేపలా తుళ్ళేటి పరువాన్నంతా
దేశాలమీదుగా విసురుకున్నవాళ్ళం.
వానలా కురిసేటి యవ్వనపు కోరికని
సముద్రపు అంచులకు వదులుకున్నవాళ్ళం.
ఒరుసుకున్న రాళ్ళ మీదా ఓడించే నీళ్ళ మీదా
సంతకాలు చేసినవాళ్ళం, సంతోషం పొందిన వాళ్ళం.
చెప్పు! ఏదో ఒకటి..
అంతా అర్థమవుతోందనో
అప్పటిలా ఉండలేననో చెప్పు.
అసలే తెలీదనో
అణువంతైనా గుర్తులేదనో చెప్పు.
నిశ్శబ్దాన్ని వింటూ
రక్తం ఇంకిపోకముందే

నేనేడ్వనుగాని
ఓయ్!నిన్నే…”

“నిశ్శబ్ద్దాన్ని వింటూ, రక్తం ఇంకిపోకముందే” అన్న నాలుగు పదాల్లో ఆశానిరాశల ఊగిసలాటనీ, తానిక మోయలేని బాధనీ సుస్పష్టంగా చూపెడుతూనే, “నేనేడ్వను గానీ” అన్న మరుసటి పాదంలో తనకున్న తలబిరుసునంతా చూపెడతాడు. ఆ “ఓయ్! నిన్నే” అన్న పిలుపుకు ఎంత వేటాడే లక్షణమున్నదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గుండె ఒక్కసారిగా ఝల్లుమని, నన్నేనా అన్న ఉలికిపాటుతో లోకంలోకి, అతని లోకంలోకి, కవిత్వంలోకీ గబగబా వెళ్ళి చక్కర్లు కొడుతూంటామే – అప్పుడనిపిస్తుంది, కవిత్వం ఇతనికి అడక్కుండా దొరికిన వరమని.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలను సమీక్షిస్తే, అనుభూతిని ఆమోదయోగ్యంగా, ఆస్వాదయోగ్యంగా చేయడానికి ఉన్న పద్ధతుల్లో,” స్వాత్మీయీకరణ” ప్రథానమైనది. పఠితకు అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవి వ్యక్తీకరించడం, దానిని పఠిత ఆత్మీకరించుకుని తాదాత్మ్యంతో అనుభవించడం ఈ ప్రక్రియలో కనపడుతుంది. ఈ సంపుటిలో ఎన్నో కవితలు కవికి ఈ ప్రక్రియలో గల పట్టుకి అద్దం పడతాయి. కవితల దాకా కూడా వెళ్ళక్కర్లేదు, “నీలాగే ఒకడుండేవాడు” అన్న శీర్షికలోనే ఎంత కవిత్వం ఉందో , చూసే కళ్ళుంటే!

“నీలాగే ఒకడుండేవాడు..
వాడు నీలాగే-
అచ్చం నీలాగే నవ్వుతూ తుళ్ళుతూ
పొద్దు నెత్తికెక్కుతుంటే గారాలు దులుపుకుంటూ
చేతిలో సంచితో, సంచిలో సద్దితో
సద్దిలో బువ్వతో, బువ్వలో అమ్మతో
పొద్దుగూకేదాక బళ్ళోనే దాగిపోయి
సాయంసంధ్యపైన సూరీడై వెలిగేవాడు”

అని ఈ నందుడు అంటున్నప్పుడు ఎందరు యశోదల మనసులు బరువయ్యాయో ఊహించడం అసాధ్యమేం కాదుగా!

“కవిత అందరిళ్ళకూ వెళ్ళదు, ఎవరి ఇంటి తలుపు తడుతుందో, అతడిక ఉన్మత్తుడు” అంటారు చినవీరభద్రుడో కవితలో. నందకిశోర్ కవిత్వంలో ఆ ఉన్మత్తత ఉంటుంది. అది ఎదుటి వాళ్ళకి వెన్నులో నుండి జలదరింపు తెప్పించేంత గాఢమైనది.లోతైనది.

“తూరుపు దోసిట్లోంచీ సూర్యుడు రాకముందే ఊపిరి నదుల్లో స్నానం చేసి రావాలి. పోనీ- నాలోంచీ నువ్వూ, నీలోచీ నేనూ నడుచుకుంటూ పోతాం, ఏంటట? నా కాళ్ళకి వెన్నెల అంటుకోనీ..నీ కాళ్ళు రెండూ రాళ్ళు తగిలి చిట్లిపోనీ..ఏంటట” అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పేస్తాడో!

“శిశిరాన్నిగెలిచిన పిచ్చిలో వెర్రిలో
చెట్టుకి ఏమీ పట్టకపోవచ్చు.
వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒక్కటే
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.”

– అన్నప్పుడు చేదు జీవిత సత్యాలను అలతి పదాలలో కూర్చిన నేర్పుకి అవాక్కయ్యాను. ఆత్మాశ్రయ పద్థతిని దాని చివరి అంచుల దాకా కొనసాగిస్తే, ఏనాడైనా బాహ్య ప్రపంచాన్ని పునర్దర్శించే పరిణామం తప్పదు. ఉదాహరణగా పై కవితనే తీసుకుందాం. ఇక్కడ చెట్టును జీవితంతోనూ, వాలే పక్షులను అవసరాలుగానూ ఊహించుకోండి. మీకొక భావం చప్పున స్ఫురిస్తుంది. అలా కాకుండా చెట్టును ఒక మనిషి గానూ, వాలే పక్షిని స్త్రీగానూ ఊహించుకోండి – మరొక అద్భుతమైన అర్థం దొరుకుతుంది. ఇహ దాని నుండీ “గూడు కడితే గుండె పగలడం” ఎందుకో, “గాలివాన వస్తే తేలిపోయే నిజ”మేమిటో కవి చెప్పక్కర్లేదు. గొంతుకలో కొట్టాడుతున్న ఆ భావాన్ని నిజానికి పదాల్లో పెట్టక్కర్లేదు. అదే ఈ కవితలోని సౌందర్యం. కవి ఏ ఉద్దేశ్యంతో రచన చేశాడో అంతకంటే భిన్నమైన స్ఫూర్తినివ్వగల శక్తి దానికి ఉన్నప్పుడే, అది కాలం ధాటికి తట్టుకుని నిలబడగలదు. ఈ కవితకు ఆ శక్తి ఉందో లేదో, ప్రతీకలను అర్థవంతమైన వస్తువులతో పూరించగల పాఠకులెవరైనా తీర్మానించగలరు.

1461245_10102664998433657_1684156529_n

ఈ పుస్తకం ఉత్తరార్థం మాత్రం ఒకింత పలాయన లక్షణాలతో ఊహాజనిత దుఃఖ పరిథికి కుదించుకుపోవడం మొదలెట్టింది. ఉదాత్తంగానూ సమస్తాన్నీ ఆత్మీకరించుకోగలిగింత విస్తృతంగానూ కనిపించిన ప్రణయ భావం మెల్లిగా ప్రతికూలమై, జీవితానికే ప్రతికూలమై “ముగింపు” కోసం ప్రాకులాడుతున్న భావన కలిగిస్తుంది.

“ఎవరికీ చెప్పకుండా, ఎవర్నీ అడగకుండా/ఎందుకో తెలీకుండా ఉరి వేసుకుంతారు” అన్న పంక్తుల్లోనూ,

“సముద్రం వాణ్ణి ప్రేమించిందని
ఎవ్వరికీ చెప్పడు
కల్లోలాన్ని వాడు కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు
తెలిసేదల్లా
వాడిక లేడనే!”

అన్నప్పుడూ ఇదే ధోరణి కనపడుతుంది.

రెండవ సమస్య అతని భాషకు సంబంధించినది. చాలా చోట్ల అతను కొత్త పదాలను కూడా సృజించాడు, సందర్భోచితంగా వాడాడు. మచ్చుకు, ఒక కవితలో “నిశిద్దోహలు” అని వాడాడీ కవి. ఆ పదం ఉందా? లేదు. మరెందుకలా వాడాడూ? అతని కవిత చెప్తుంది. కొన్ని చోట్ల భాషాపరంగా, శైలిపరంగా ప్రయోగాలూ చేశాడు. వాటితో కూడా నాకేం పేచీ లేదు. “రాఖీ” కవితలో చక్కటి తెలంగాణా మాండలీకాన్ని వాడాడు. నన్నడిగితే ఆ కవిత ఈ పుస్తకానికే తలమానికమంటాను.

“గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..
తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీ లెక్క నా లెక్క గుచ్చిపెట్టిన..” అంటూ ఆర్ద్రంగా సాగిపోయే ఆ కవిత, ఏమో, మామూలుగా వ్రాసి ఉంటే ఏ మేరకు అలరించేదన్నది ప్రశ్నార్థకమే. కానీ ఇలా వ్రాయడంలో మాత్రం తమ్ముడి చేతికి రాఖీ కట్టేందుకు తపిస్తోన్న అక్క తడికళ్ళత్ మన ముందుకొస్తుంది.

అలాగే “పిచ్చిరాత” కవితలో “దృశ్యాదృశ్య సంకెలలు తెగి/నిస్సందేహ స్వేచ్ఛావాయువులలో/ఏకాంతముగా సంగమించు” అంటూ గ్రాంథికంలోకి ముడుచుకున్నప్పుడు కూడా దానినొక విలక్షణతగానే స్వీకరించగల్గుతాం ( ఈ కవితలో ఒకే ఒక్క పాదంలో మాత్రం శిష్ట వ్యావహారికాన్ని కవి వాడటం కనిపిస్తుంది – అది కవితా ప్రవాహానికి అడ్డు కలిగించకపోగా దాని ప్రత్యేకతను నొక్కి చెప్తుంది). కనుక, ఈ కవికి భాష ఉన్నది ఎందుకో తెలుసు. ఏ మాండలీకంలో లేదా ఏ శైలిలో తన మనసు లోతుల్లో ఉన్న భావం నర్మగర్భంగా పాఠకులకు చేరవేయాలో సుస్పష్టంగా తెలుసు. ఇంత తెలిసినవాడు కూడా మామూలు భాషలో సాగుతోన్న కవితల్లో “వాణ్ణి” అనవలసిన చోట “వాన్ని” అనడమే, బొత్తిగా మింగుడుపడని విషయం. అలాగే “అట్లా” అని దీర్ఘం ఉండవలసిన చోట హ్రస్వంతో రాజీపడటం (ఉదాహరణకు ఆఖరు పేజీలోని – “రాళ్ళెట్ల వికసించేదీ, పువ్వులెట్లా బద్దలయ్యేదీ రహస్యం” అనడం) అకారణమనిపిస్తుంది. ఇవి అచ్చుతప్పులో, కవి ఈ పదాలను పలికే పద్ధతిదేనో పాఠకులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఏదేమైనా, ఈ పలుకురాళ్ళ ఏరివేతలో పాయసపు రుచిని మరచిపోయే ప్రమాదమెంతైనా ఉంది కనుక, మలి ముద్రణల్లో ఈ లోపాలు సవరించబడతాయని ఆశిద్దాం.

ఒక సంవత్సర కాలంలో సృజింపబడ్డ కవిత్వం కనుక, సమకాలీన సమాజపు పోకడలేవో కవిని ప్రభావితం చేయడమన్నది ఊహించదగ్గ విషయమే. స్పందించే లక్షణమూ, దానిని భద్రపరచాలన్న తలంపూ ఉన్నవాడవడం వల్లేమో, “కాంక్ష” అంటూ పాక్, ఆఫ్గన్, సిరియాలను చుట్టేసి వచ్చాడు. కవిలో అకస్మాత్తుగా కనపడ్డ ఈ అభ్యుదయవాదం మాత్రం ఆశ్చర్యపరచింది. భావకవిత్వ లక్షణాలతో ఉప్పొంగిన ఈ కవితా సంపుటిలో, ఈ ఒక్క కవితా తన చుట్టూ తానే ఒక గిరి గీసుకుని పాఠకులను అటు నుండటే వెళ్ళిపొమ్మంది. ఈ సంపుటిలో ఇమడదనిపించిన ఒకే ఒక్క కవిత ఇది.

మొదటి 36 కవితలకు అనుబంధంగా వచ్చిన వచనాన్ని ( అనుకోకుండా, ఒక సంధ్యావస్త కాలంలోంచీ)చదువుతున్న కొద్దీ, ఈ కవికి బలమైన అభివ్యక్తి, శిల్పానికి సంబంధించి గొప్ప అభిరుచీ, ప్రత్యేకతా ఉన్నాయని తెలుస్తుంది. “చిట్టితల్లీ” అనేటప్పుడతడి నిష్కల్మషమైన అనురాగమూ, “దేవీ, దేవీ!” అంటూ తపించే ఇతగాడి వలపూ, “వెన్నెల స్నేహితా!”, “దుఃఖిత సహచరీ!” అంటూ ఆర్తిగా పిలుచుకునే నవనీత హృదయమూ, మనకు తెలీకుండానే కవితో ఓ దగ్గరి సంబంధాన్ని కలుగజేస్తాయి. “తన బాధను లోకం బాధ”గా మలచిన కృష్ణశాస్త్రి అసంకల్పితంగా గుర్తొస్తారు.

” ఆ కొత్త రోజుల్లో, మేలుకున్న కొత్త సమాజంలో తనకు లభించిన ఒకటి రెండు అనుభవాలనో, కష్టసుఖాలనో కవి తన దివ్యకావ్యాల్లో పెట్టాడు. తరువాత అహంకారం వల్లనో, అశ్రద్ధ వల్లనో ఆ అనుభూతుల్నే కౌగిలించుకుని చుట్టూ ఆవరణ కట్టి కూర్చున్నాడు”
– (–పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం, భారతి రజతోత్సవ సంచిక)

కృష్ణశాస్త్రి తన కవిత్వం గురించి తానే చెప్పుకున్న మాటలివి. పునరుక్తి దోషాలకు తన బాధ్యత ఎంతవరకూ ఉందో లోకం ముందు ఒప్పుకుంటూ చెప్పిన సత్యమిది. శైలి, భాష, శిల్పాల పరంగా ఏ పోలికా లేకపోయినా, ప్రస్ఫుటంగా కనపడే సంవేదన ఇద్దరిలోనూ ఒకటే కనుక, పై మాటలు ఈ కవి భవిష్యత్తులో ప్రచురించబోయే మరే కవితా సంపుటికీ అద్దం పట్టే స్థితి రాకూడదని అభిలషిస్తున్నాను. ఆ ఆవరణలు మరీ సంకుచితమై, కరుడు గట్టి, కవికీ పాఠకులకు మధ్య ఏ అఖాతాన్నీ సృష్టించకుండా నందకిశోర్ తగిన జాగ్రత్తలు తీసుకోగలడనే విశ్వసిస్తున్నాను.

నందకిశోర్లోని కవితాదృష్టి విశ్వరహస్యాల్నీ, జీవిత రహస్యాల్నీ వర్తమాన వస్తుప్రపంచంలో చూడటాన్ని నిరాకరించి, లేదా అధిగమించి అనుభూతి వైశిష్ట్యంలో అన్వేషించింది. అందుకే అంత ప్రత్యేకంగా కనపడుతుందది. అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలోనూ, అనుభూతులకు పట్టం కట్టి రూపపరంగా నూతన అభివ్యక్తి మార్గాలను సుసంపన్నం చేయడంలోనూ, అనుభూతిని విస్తరింపజేయడానికి సమర్థంగా కవితాభాషను రూపొందించుకోవడంలోనూ ఈ కవి తనదైన ముద్రను ప్రతి పుటలోనూ చూపెడుతూ వచ్చాడు. ఆనందానికి ఒకింత నిర్లక్ష్యాన్నీ, బాధలకు ఒకింత నిబ్బరాన్నీ జోడించి, మోహంలో మాత్రం ప్రాణాలర్పించే నిజాయితీని ప్రకటిస్తూ సాగిన ఈ సంపుటి, “నీలాగే ఒకడుండేవాడు” అన్న కవి మాటలకు నిజమేనని జవాబివ్వగల అనుభవాన్నైతే ఇచ్చే తీరుతుంది. ఆశ్చర్యానికి పదాలు మరచిన లోకంలో మనను వదలిన ఈ కవి, మరిన్ని సంపుటులతో మళ్ళీ మన ముందుకు రావాలనీ, “నీలా మరెవ్వరూ ఉండరు” అనిపించేంత ప్రత్యేకంగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలనీ మనసారా ఆకాంక్షిద్దాం.

–మానస చామర్తి

మానస చామర్తి

మానస చామర్తి

సూర్యుడి చూపు కోసమే అద్దేపల్లి కల!

 

సాహితీ లోకానికి సుపరిచితులైన అద్దేపల్లి రామమోహన రావు గారు  ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతున్న అనేకానేక పరిణామాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య, విమర్శనాత్మక కవితా బాణాల సంపుటి – “కాలం మీద సంతకం”.

అద్దేపల్లి కవిగా కంటే విమర్శకులుగా, అద్భుతమైన వ్యాసకర్తగానే నాకెక్కువపరిచయం. పత్రికల్లో చదివిన వారి సాహిత్య వ్యాసాలు, “సాహిత్య సమీక్ష” వంటి పుస్తకాలు, “మా నాయిన” లాంటి ఎన్నో కవితా సంపుటాలకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వ్రాసిన ముందు మాటలూ, ఈయన కవిత్వం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయి.

మూఢత్వం మూలంగా నిస్తేజంగా మారిన జనజీవితాల్లోకి వెలుగు రేఖలను ప్రసరింపజేయడమే అభ్యుదయ కవుల లక్షణం. భారతీయ సాహిత్యానికి సంబంధించి, 1935వ సంవత్సరంలో భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అలహాబాదులో ఏర్పాటు చేయబడింది. 1936 ఏప్రిలులో ప్రసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన ప్రథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ లక్నోలో జరిగింది.  అదేసంవత్సరం సెప్టంబరులో ఈ కవి జన్మించాడు. అద్దేపల్లి 1960లలో కవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టారూ అనుకుంటే, అప్పటికి రాష్ట్రంలో అభ్యుదయ కవిత్వోద్యమ తీవ్రత మెల్లిగా సన్నగిల్లి, దిగంబర కవిత్వం ఉద్యమంగా మారుతోంది. (1965 లో దిగంబర కవులు తమ తొలి సంకలనాన్ని విడుదల చేశారు). 70-80 విప్లవ కవిత్వమూ, 80 తరువాత అనుభూతివాదమూ, మినీకవితలూ ఇతరత్రా జోరందుకున్నాయి.

ఇన్ని ఉద్యమాలనూ దగ్గరి నుండీ గమనిస్తూ కూడా, అద్దేపల్లి కవిత్వం తొలినాళ్ళలో వ్రాసిన “అంతర్జ్వాల” మొదలుకుని, ఈనాటి “కాలం మీద సంతకం” వరకూ, శైలి-శిల్పంపరంగా అనివార్యమైన బేధాలు, అభివ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే పరిణతీ మినహాయిస్తే, మొత్తంగా అభ్యుదయ కవిత్వ ధోరణిలోనే సాగడం విశేషం. “సమాజంలో ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు ప్రథానంగా ఉన్నంతకాలం అభ్యుదయ కవిత్వం ప్రథాన కవితా ధోరణిగా ఉండక తప్పదు” అని ఉద్ఘాటించిన ఈ కవి, దశాబ్దాలు దాటినా ఆ మాట మీదే నిలబడి కవిత్వ సృజన చేయడం ఆసక్తికరం.  నమ్మిన కవిత్వోద్యమం పట్ల ఈ కవికున్న నిబద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం.

addepali title

ఇక ఈ సంపుటిలోని కవితల విషయానికి వస్తే – మొత్తం యాభై కవితలు. అత్యధికం సమాజంలోని అసమానతలను ఎండగడుతూ, రోజురోజుకీ హెచ్చరిల్లుతోన్న విష సంస్కృతులను విమర్శిస్తూ, సమసమాజాన్ని స్వప్నిస్తూ సాగేవే.  మన భాష గురించీ, సంస్కృతి గురించీ, పశ్చిమ దేశాల ఎఱలకు లోబడుతున్న ఇరుకు మనస్తత్వాల చిత్రీకరణకు సంబంధించీ కొన్ని చిక్కటి కవితలున్నాయిందులో.

 

“ఉగాదికి తెలుగు దూరంగా పరుగెత్తుకు పోతున్నప్పుడు

గంగిరెద్దు మూపురం మీద నించి

జానపదం జారిపోతుంది

హరిలోరంగ హరీ అని

నెత్తి మీద పాత్రలోని బియ్యం కారిపోతుంది

వసంతుడికీ వనానికీ మధ్య ఉన్న వలపు

కోకిల పాటలోంచి పారిపోతుంది ”                                           (పు:71)

 

అలాగే ఈ సంపుటిలో అనేక కవితలకు, చెట్లూ – మనం మినహాయించుకొంటోన్న ఆకుపచ్చందనం వస్తువుగా నిలబడ్డాయి. ” ఏ గడ్డిపరకను చూసినా/మంచు కన్నీటిబొట్టు/సూర్యుడి చూపుల్ని కలగంటోంది/తోటలోని చెట్లన్నీ/పరిశ్రమల దుమ్ములో మాసిపోతున్నాయ”ని ఆవేదన వ్యక్తం చేస్తూ,

“రాతి మేడల నీడలు

తోటల్ని దూరంగా విసిరేస్తున్నప్పుడు

పంచమ స్వరం వినపడని వారికోసం

నా కవిత్వ బంధంతో కోకిలను పట్టి తెచ్చి

ప్రజల గుండెలపై ప్రతిష్ట చేస్తాను

నాకొక్క కొత్త చిగురు చాలు

అరుణారుణ స్పర్శతో

నూతన వసంతోత్సవంలో

తోటంతటినీ జలకాలాడిస్తాను” అంటారు. ( “నాకొక్క చిగురుటాకు చాలు” )

 

ఈ కవికి పశ్చిమ దేశాలు ప్రాక్దేశాల మీద చూపిస్తోన్న ప్రభావం పట్ల ఖచ్చితమైన దురభిప్రాయం ఉంది. మార్పు అభిలషణీయమని అంగీకరిస్తూనే, మన మూలాలను కదుపుతోన్న భావజాలాలను మాత్రం అడ్డుకుందామంటారు. ఈయన కవిత్వంలో ఆవేశంతో పాటు ఆర్ద్రత కూడా సమపాళ్ళలో మిళితమై ఉండి పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

“వేకువ ఝామున అరుణకాంతి వలయాల మధ్య

నేనొక దృశ్యాన్ని చూస్తాను-

దేశాన్ని తలపాగా చుట్టుకుని

భుజాన ప్రాణశక్తిని నాగలిగా పట్టుకుని

కళ్ళనిండా నీటిపొరలు పేర్చుకుని

కాళ్ళకి బురద కడియాలు పెట్టుకుని

గుప్పిట్లోని విత్తనాలు చల్లుకుంటూ

తూర్పు నుండి ఒక రైతు నడచి వస్తున్నాడు-

పెద్ద పండుగ వచ్చేసిందని

అరిచే పిట్టల ఆహ్వాన గీతల మధ్య

రైతు నడచిన అడుగుజాడల్లో

భారతీయ సుక్షేత్ర నిర్మాణం జరుగుతుంది”           (“ఇది హాలికుని అడుగుజాడ”)

ADDEPALLI (1) [3]

ఈ వర్ణన నిజంగా ఏ ఏటికాయేడు తమ ఆకుపచ్చ కలలను మబ్బుల దాకా పంపే హాలికులను సజీవంగా కళ్ళ ముందు నిలబెట్టడం లేదూ? పైన ఉదహరించిన మొదటి పాదంలోనే, –

ఇతను దేశానికేదో అవ్వడం కాదు – ఈ బక్కపచ్చ కలల హాలికుడే దేశాన్ని తలపాగాగా ధరించాడుట! ఎంతటి బాధ్యత కల్గిన వాడు, ఎంత అభిమానధనుడు ఈ దేశపు రైతు – కవి మాటల్లో నుండి ఎంత హుందాగా చదువరుల గుండెల్లోకి నడిచొస్తున్నాడో గమనించారా?!

కవిత్వం నరనారానా జీర్ణించుకున్న వారు దేని మీదైనా అలవోకగా కవితాత్మకంగా వ్రాసేయగలరు. “బీడీ” నుండి “చకారం” దాకా, గాంధీ మొదలుకుని బిస్మిల్లాదాకా, “కాదేదీ కవిత కనర్హం”. ఎంత అభ్యుదయవాది అయినా, అనుబంధాల గురించి మాట్లాడవలసి వస్తే – ఆవేశం పాలు తగ్గడమూ అనురాగం మరింత శోభాయమానంగా వ్యక్తీకరింపబడటమూ సహజమే కదా! వైయక్తికమే అయినా, మనసును తడిమిన కవితలోని భాగమొకటి :

“అర్థరాత్రి వేళ గంగానది

నీ షెహానాయి స్వరాల్ని నెమరు వేసుకుంటూ

ప్రవహించడం మానేసి

నిశ్శబ్ద వేదనతో

ఆకాశ ప్రతిబింబాన్ని హత్తుకుంటుంది

……

నీ షెహనాయి

ఒక్కసారి మనసు కందితే చాలు

ఈ దేశం సంగీత సంస్కారంతో

సమగ్ర వాయువీథుల్నినిర్మిస్తుంది

దేహాన్ని ఆత్మతో అనుసంధానం చేసే

సజీవ మానవుణ్ణి సృష్టిస్తుంది”

 

ఇవి కాక, కవికి ప్రియాతి ప్రియమనిపించే “బందరు”(మచిలీపట్నం) గురించీ , స్నేహాలూ ఇతరత్రా గురించీ మూణ్ణాలుగు కవితలున్నాయి. వాటిలోని పాదాలు (“గుండె వెనుక సముద్రం పిలిచినట్టుంది ” వంటి శీర్షికలు కూడా) బాగున్నాయనిపించినా, ఈ పుస్తకంలో ఇమడలేదనిపించింది. వాటిని మినహాయించి ఉంటే ఈ సంపుటి మొత్తం ఒకే ఊపులో సాగినట్టై, ఒకేవిధమైన భావజాలాన్ని, తదనుభవాన్నీ చదువరులకు మిగిల్చేదేమో కదా అనిపించింది. అలాగే, “మార్కెట్ మగాడి రెక్కలు”, “నెల్లిమర్లలో నెత్తుటి వేళ్ళు” తొలుత తేలిగ్గా అర్థంకాక, కవిత ఉదయించిన సందర్భమేమై ఉంటుందోనన్న మీమాంసకు గురి చేశాయి.

అనుభూతివాద కవిత్వ ఝరుల్లో ఉల్లాసంగా ఓలలాడేందుకు అభిలషించే నవతరం కవిత్వాభిమానులను, అనేకానేక సామాజిక సమస్యలను స్పృశిస్తూ ఆవేశంగా విమర్శనాత్మకంగా సాగిన ఈ అభ్యుదయ కవిత్వం ఏ మేరకు అలరిస్తుందన్నది ప్రశ్నార్థకం. కానైతే, అనిసెట్టి అన్నట్టు “సాహిత్యం ఉద్వేగ మార్గాన జరిగే సత్యాన్వేషణ” అన్న మాటను నమ్మేవారినీ, వివిధ వైరుధ్యాలతో సతమతమవుతున్న సంఘం నాడిని కవిత్వంలో వాడిగా వేడిగా వినిపించడమొక అవసరమే కాదు, అరుదైన కళ కూడానన్న స్పృహ కలిగిన వారినీ- ఈ సంపుటిలోని వస్తువైవిధ్యమూ, శిల్పమూ, గాఢతా అయస్కాంతాలై ఆకర్షిస్తాయనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

77 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొంటూ, కవిత్వాభిమానులతో ఆత్మీయ చర్చలు జరుపుతూ హుషారుగా కాలం గడుపుతోన్న మన అద్దేపల్లి, మున్ముందు మరిన్ని సంపుటులతో మన ముందుకు రావాలనీ, తెలుగు కవిత్వ చరిత్రలో చెరిగిపోని సంతకమవ్వాలనీ ఆకాంక్షిద్దాం!

– మానస చామర్తి