బొట్టు గుర్తు

chinnakatha

 

~

“అమ్మా! మనం ఎవరు?”

అప్పుడే బడి నుంచీ వచ్చిన నా కూతురు దివ్య అడిగిన ప్రశ్నకు నేను ఆశ్చర్యపోలేదు. ఎప్పుడోకప్పుడు ఈ ప్రశ్న వేస్తుందని నాకు తెలుసు. కానీ ఇంత త్వరగా అడుగుతుందని అనుకోలేదు.

పదో తరగతిలో నా కాస్ట్ సర్టిఫికేట్ చూసి హతాశురాలినై అనుమానాలతో ప్రశ్నలతో గజిబిజితో మా నాన్నని ఉక్కిరిబిక్కిరి చేశాను. అప్పుడు ఆయన పూర్తిగా చెప్పలేదు. బహుశా చెప్పలేకపోయారు. ఇప్పుడు నేనూ నా కూతురి ముందు నాన్న లాగే నిలబడ్డాను. ఏం సమాధానం చెప్పాలి? దానికి చెప్పుకునే కులమూ లేదు నాలా కులం సర్టిఫికెట్టూ లేదు.

మౌనం.

ఇదే మౌనం నేను క్రిస్టియన్ విమిన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్నో సార్లు పాటించాను…

మా హాస్టల్ రూమ్ లో ఆరుగురం ఉండేవాళ్ళం. ఓ ఆదివారాన స్నేహిత ఏమీ తోచక మంచం మీద పడుకుని కాళ్ళూ చేతులూ గాల్లో ఆడిస్తూ జంధ్యాల సినిమాలో సుత్తి వీరబద్ధర్రావులా మా పేర్లన్నీ రాగాలు తీయడం మొదలు పెట్టింది.

“లక్ష్మీ రెడ్డి…

మాధవీ వర్మ…

విజయా నాయుడు…

స్నేహితా చౌదరి…

పూజితా వెలమ…

మౌనికా మౌ? మౌనికా వెనుక ఏంటే?” అనడిగింది నన్ను చూస్తూ.

అదే మౌనం. అలవాటైన అవమానాల మౌనం.

“నా వెనుక ఏమీ లేదే. ఉన్నదల్లా నా ముందే” అన్నాను.

నేను ఎవర్నో నా నుదురే చెబుతుంది. అదే నా గుర్తు! అయినా ప్రశ్నలు వేయడం నా ముఖాన్ని ప్రశ్నార్ధకంగా చేయడం ఒక తమాషా.

“మాలోళ్ళంటే ఎవరమ్మా?” నా కొంగు లాగుతూ అడిగిన దివ్య వైపు చూశాను.

‘ఏయ్ ఎవరు చెబుతున్నారే నీకివన్నీ’ అనబోయి ఆగాను.

అది చెప్పిందేమీ బూతుమాట కాదే! ఎందుకు నాకింత భయం? మాలోళ్ళు అన్నప్పుడు చప్పున తలుపు వైపు ఎందుకు కంగారుగా చూశాను? కిటికీలు మూసే ఉన్నాయా అని ఎందుకు నిర్ధారించుకున్నాను?

‘నీ బానిసత్వాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. అందుకోసం ఏ దేవుడి మీదా ఏ మహానుభావుడి మీదా నువ్వు ఆధారపడొద్దు- అంబేద్కర్’ అని నా కొత్త పుస్తకం మొదటి పేజీలో రాసుకుంటున్నప్పుడు అడిగింది పూజిత-

“అసలు మాల మాదిగోళ్ళు రెల్లోళ్ళoటే ఎవరే?” అని.

విజయ, మాధవీ ‘ష్!’ అన్నారు ఒకేసారి. నేను విన్నానేమో అని కంగారుపడుతూ.

“కాదే మా నాన్న కోపమొస్తే ‘మాదిగ్గూడెం పో!’ అని తిడుతుంటాడే. అందుకే అడుగుతున్నా” అంది అమాయకంగా.

“ఈ వెలమ కమ్మ కాపు రెడ్డి వీళ్ళందరూ ఎవరు?” అని అడిగాను.

“అవన్నీ మా కులాలు. మేమే” అంది పూజిత హుషారుగా.

“మీరు బ్రామ్మిన్స్ కంటే తక్కువ. మీకంటే మాలమాదిగోళ్ళు తక్కువ” అన్నాను శాంతంగా.

“మేం తక్కువేంటి? ఎవడికీ మేం తక్కువ కాదు” అంది విజయ.

నవ్వొచ్చింది నాకు.

“మేం అనేదీ అదే!” అన్నాను.

“చెప్పమ్మా! మాలోళ్ళంటే ఎవరు? మనం బొట్టెందుకు పెట్టుకోవట్లేదు?”

దివ్య వైపు చూశాను. చిట్టి కళ్ళల్లో బోలెడన్ని సందేహాలు.

“ఎవరడిగారు నిన్ను?” దాని స్కూల్ డ్రెస్ తీస్తూ అడిగాను.

“బొట్టు లేకపోతే మాలోళ్ళని గౌతమ్ వాళ్ళ మమ్మీ అన్నారంట” అంది.

రోజులు మారుతున్నాయనే అనుకున్నాను. ఈ మాట వినేంత వరకూ.

“నువ్వు మాల్దానివి కాకపోతే అమ్మోరు తల్లంత బొట్టు పెట్టుకోవే! నలకంత బొట్టు పెట్టుకోడం కాదు” లక్ష్మీ బాయ్ ఫ్రెండ్ ఫోనులో అంటున్నాడు. ఆమె ఒక మగవాడితో మాట్లాడుతుందని లౌడ్ స్పీకర్ పెడితేనేగా అందరికీ తెలిసేది.

లక్ష్మీ అతని మాటలకి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంది.

“మదిగ్గూడెం తోలుకేల్తానని చెప్పవే” అంటూ మిగతా వాళ్ళు చుట్టూ చేరి ఆటపట్టిస్తున్నారు.

“మమ్మీ! ఎప్పుడూ ఏదోకటి అలోచిస్తున్నావేంటి?” కోపంగా వచ్చిన దివ్య మాటలకి వాళ్ళ కుల చిలిపి కబుర్లలోంచి బయటపడ్డాను.

“ఆలోచిస్తున్నావు కాదు. అలోచిస్తుoటావు” దివ్య గడ్డం పట్టుకుని గారంగా ఊపుతూ అన్నాను.

“పో మా…నీకు తెలుసా! నెక్స్ట్ సాటర్ డే మా స్కూల్లో సైన్స్ డే. ఈ వీక్ అంతా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి”.

“ఈ సంవత్సరం కాలేజ్ డే అంబేద్కర్ జయంతి రోజు చేస్తున్నారు. కల్చరల్ ఇవెంట్స్ లో పాల్గొనాలనుకునే వారు పేర్లివ్వండి” అసెంబ్లీ హాల్లో అనౌన్స్ చేసింది మా కాలేజ్ ప్రెసిడెంట్.

మా కాలేజి వాళ్ళు ఎప్పుడూ అంబేద్కర్ జయంతి జరపలేదు. కొత్తగా వచ్చిన మా ప్రిన్సిపల్ సిస్టర్ కి కాలేజీలో ఏ చిన్న విశేషం జరిగినా స్థానిక పత్రికల్లోనూ జిల్లా పత్రికల్లోనూ పడాల్సిందే. అలా ఈ ఏడాది కాలేజ్ డే ఫంక్షన్ ని అంబేద్కర్ జయంతితో కలిపి చేస్తే అన్ని విధాలుగా పేరొస్తుందని ఆమె ఆశ.

ఇవెంట్స్ లో పాల్గోడానికి నేనూ పేరిచ్చాను. దేశంలోని ప్రతి రాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహ జంటల్ని చూపించే ప్రోగ్రాంలో క్రిస్టియన్ బ్రైడ్ గెటప్ వెయ్యాలని నా ఆలోచన. ఎలాగూ మా అక్క పెళ్లి గౌన్ ఉంది కాబట్టి డ్రెస్ కోసం కష్ట పడక్కరలేదు కూడా.

కానీ ఫంక్షన్ రోజు వచ్చే సరికి అన్నీ తారుమారయ్యాయి. క్రిస్టియన్ బ్రైడ్ గా పూజిత ముస్తాబయింది. మా అక్క గౌన్ లో. నేను బాల అంబేద్కర్ తల్లి పాత్రలో ముతక చీరలో ఉన్నాను.

క్రైస్తవ పెళ్లికూతురంటే తెల్లని వస్త్రాలలో దేవతలా ఉండాలి. నిజజీవితంలో కాదు. మా కాలేజీ వేదిక మీద. పూజిత నాలా నల్లగా ఉండదు. ఆమె ముక్కు నా ముక్కులా చిన్నగా బండగా ఉండదు. పెళ్లి కూతురిలా తయారవడానికి కావాల్సింది గౌన్ కాదు. మరింకేదో అని తెలుస్తూనే ఉంది నాకు. మొత్తానికి నా మతానికి సంబంధించిన వేషం వెయ్యడానికి నేను సరిపోలేదు. కులానికి తగ్గ వేషమే దొరికింది.

పూజిత స్టేజి మీద అందంగా నడిచి కిందకి దిగగానే తన ఫ్రెండ్స్ వెంటనే పర్స్ లోంచి బొట్టు బిళ్ళ తీసి పెట్టారు “మాల మొకం చూడలేకపోతున్నామే బాబు” అని నవ్వుకుంటూ. బొట్టే వాళ్ళ గుర్తు.

“నీది విధవరాలి పాత్రా?” అని అడిగింది మా డ్రామా చేయించే సీనియర్ నా నుదుటని చూస్తూ.

“కాదక్కా! బాబా సాహెబ్ తల్లి పాత్ర” అన్నాను.

“బాబా సాహెబ్ ఏంటి? అంబేద్కర్ అమ్మగా కదా చేయమన్నాను” అంది హైరానా పడుతూ.

‘కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెద పురుగులు కూడా పుస్తకాన్ని నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా?’ మా నాటకంలో అంబేద్కర్ వేషమేసే అమ్మాయి అంబేద్కర్ చెప్పిన మాటల్ని డైలాగుల రూపంలో బట్టీ పడుతోంది.

“చెప్పు మమ్మీ! ఎన్ని సార్లు అడగాలి. స్పీచ్ కి ఒక టాపిక్ ఇవ్వు” విసిగిపోతూ అంది దివ్య.

“నువ్వే ఆలోచించు. సైన్స్ డే అన్నావు కదా. టెక్నాలేజీ గురించి కూడా ఆలోచించు”

“ఆ…నాకు రాకెట్స్ అంటే ఇష్టం కదా! దాని గురించి రాయనా? మా టీచర్ నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధినవే చెప్పమన్నారు”

“అలాగే చేద్దాం. కానీ రాకెట్స్ గురించి మీ స్కూల్ లో అందరికీ తెలిసే ఉంటుంది కదా! కొత్తగా ఆలోచించ రా దివ్యా. మనుషులకు బదులు కంప్యూటర్స్, మేషిన్స్ ని పెట్టి పని తగ్గించవచ్చని  మొన్న మీ టీచర్ చెప్పారన్నావు కదా! దాని గురించి ఆలోచించు. ఆ మధ్యలో ఒకరోజు స్కూల్ బస్సు లోంచి ఏదో చూసి భయపడ్డావ్ గుర్తుందా?”

“ఆ! ఒక ఆయన డ్రైనేజీలో దిగి మొత్తం మునిగిపోయి క్లీన్ చేస్తూ ఒక్కసారిగా పైకి లేచాడు. నల్లగా ఒళ్లంతా డర్టీ” అంది మొహం చీదరించుకుంటూ.

“నిజానికి అతను ఆ రోజు అదే డ్రైనేజీలో పడి చనిపోయాడు తెలుసా? మరి ఆ పని చేయడానికి మెషీన్స్ ఉన్నాయా?”

“చనిపోయాడా! మెషీన్స్ లేవు కదా మమ్మీ. ఉంటే వాడేవాళ్ళు కదా”

“ఆ టాపిక్ మీదే ప్రిపేర్ అవ్వు. ఇంకేం?”

“మరి వాళ్ళకి డబ్బులు? మెషీన్స్ ఉంటే ఇక వాళ్ళకి పనుండదు కదా”

“ఆ పని ఉండదు. ఇంకేదైనా ప్రాణాలు నిలబడే పని చేసుకుంటారు. ఆ పని కంటే న్యాయంగా చేసే ఏ పనైనా ఆత్మ గౌరవంతో చేసే పనే అవుతుంది. అసలు ఆ పని ఎవరు చేస్తారో తెలుసా?”

“తెలుసు మమ్మీ! హోం వర్క్ చేయని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. బాగా చదువుకోకపోతే అలాంటి పనులు చేసే వాళ్ళవుతామని అంటారు కదా అందరు”

“హిహి కాదమ్మా! తక్కువ కులం వాళ్ళే ఇంకా ఆ పనిని కుల వృత్తిగా చేస్తూనే ఉన్నారు. మనం బాగా చదువుకుని ఎవరికీ అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేకుండా మెషీన్స్ తయారు చేయలేకపోతేనే ఫెయిల్ అవుతాం! మన స్వచ్ఛ భారత దేశంలో ఏవేవో కనిపెడుతున్నా ఇంకా డ్రైనేజీ శుభ్రం చేసే మెషీన్స్ రాకపోవడం మన ఫెయిల్యూరేగా!”

“అవును. తక్కువ కులం వాళ్ళంటే ఎవరు? ఒకవేళ అలాంటి టెక్నాలజీ వస్తే  మరి మన దేశం డెవలప్ అయినట్టేనా మమ్మీ?”

“దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు రంగుల గోడలూ కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. అర్ధమయిందా! ఇది ఎవరు చెప్పారో తెలుసా?”

“ఎవరు?”

“డా. బి. ఆర్. అంబేద్కర్!”

“ఆయనెవరు?”

దాని మొదటి ప్రశ్న ముందు నా కులం ఓడిపోయింది. దాని చివరి ప్రశ్న ముందు నేనే ఓడిపోయాను..!