“ఈ భూమి అమ్మకానికి లేదు”

mamata%e0%b1%a9

మెక్సికో నుంచి వచ్చిన ఉద్యమకారుల ఆజ్టెక్ నృత్య ప్రదర్శన.

 

పడమటికి వాలిపోతున్న వెలుగులో నా కారుతో పోటీ పడుతూ గుట్టలమీద జరజర పాకుతున్న కారు నీడ తప్ప మరే కదలికా లేదు.  తెల్ల సున్నం రాయి గుట్టలూ, కొండల మధ్య చిన్న చిన్న ఊర్లు దూర దూరంగా ఉన్నాయి. పేరుకు పట్టణాలు అనేవి రెండు మూడు వందల మైళ్లకు ఒకటి తగుల్తోంది. మైళ్ల కొద్దీ నా కారు తప్ప ఇంకొక కారు ఆరోడ్డు మీద కనిపించడం లేదు.

ఎంతో సేపు ప్రయాణం చేసిన తరువాత, తప్పు దారిలో వచ్చానేమో అన్న అనుమానం, ఇంకో  రెండు గంటల్లో చీకటి పడ్డాక కొండల మధ్య చీకట్లో కారు పాడయితే ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు. సెల్ ఫోన్ కూడా సరిగ్గా పని చెయ్యట్లేదు. ఒక్కోసారి దగ్గరగా, ఒక్కోసారి ఉన్నదో లేదో అన్నట్లూ దూరంనుంచే మురిపిస్తూ మిస్సౌరి నది. గుట్టలు ఎక్కినప్పుడు నీలాకాశంలో సగం చందమామ నేను ఉన్నాన్లే అంటున్నాడు. ఇంత అందంలో తప్పిపోతేనేం అనికూడా అనిపిస్తోంది. హఠాత్తుగా రోడ్డు పక్కన పొలాల్లో, రోడ్డుకు సమాంతరంగా  ఒక మీటరు వెడల్పున చదును చేసిన నేల మీద నీలి రంగు పైపులు కనిపించడం మొదలయ్యింది. నిజానికి ఇవాళ్టికి అవి భూమిలో ఉండాల్సినవి. వాటిగుండా చమురు పారుతూ ఉండాల్సింది.

కాసేపటికి  రోడ్డు పక్కన ఒక చోట మూడు పోలీసు కార్లు కనిపించాయి. చెక్ పోస్టులా ఉంది. ఆ కార్లకు ఎదురుగ్గా ఉన్న రోడ్డు మీదకు కారు పోనిచ్చాను. దూరంగా విసిరేసినట్లున్న ఇళ్లను చూస్తూ ఓ పది నిమిషాలు బీటలువారిన రోడ్ల మీద తిరిగాను. నేను వెతుకుతున్న ప్రదేశం ఈ చుట్టుపక్కల లేదని అర్థమయ్యింది. ఇందాక చూసిన చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లి మళ్లీ మెయిన్ రోడ్డు ఎక్కాను. ఈరోజుకి నేను వెళ్లాల్సిన చోటు దొరకదేమో అని నిరాశ.

నార్త్ డకోట రాష్ట్రంలో, కానన్ బాల్ అనేది ఒక చిన్న ఊరు. లకోట,  డకోట తెగలకు చెందిన స్టాండిగ్ రాక్ రిజర్వేషన్ భూభాగం చిట్టచివర, ఆకాశమే దిగివచ్చినట్లుండే నీలాల మిస్సౌరి నది పక్కన, కొండల మాటున ముడుచుకుని ఉంటుంది ఈ ఊరు. ఈ ఊరికి కొంచెం ఎగువన మిస్సౌరీ నది అడుగునుంచి డకోట ఆక్సెస్ ఆయిల్  పైప్ లైన్ వేద్దామని సంకల్పించింది  ఎన్ ట్రాన్ పార్ట్నర్స్ (Energy Transfer Partners) అనే కంపెనీ.

నార్త్ డకోట ఉత్తర ప్రాంతంలో వెలికి తీసిన చమురును, రిఫైన్ చేయడానికి సౌత్ డకోట, అయోవా రాష్ట్రాల గుండా  ఇల్లినాయ్ రాష్ట్రానికి తరలించాలని ఈ పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నదుల కిందనుంచి గ్యాస్ లేక చమురు సరఫరా అవుతున్నప్పుడు, ప్రమాదం జరిగి నదుల్లో నీళ్లు కలుషితమయ్యాయి. ఈ పైప్ లైన్ లో కూడా అదే జరిగితే రిజర్వేషన్లోని ప్రజలకే కాక నదీ జలాల మీద ఆధారపడిన మరో పదిలక్షలమందికి తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టం జరిగుతుంది. అందుకే పైప్ లైన్ మిస్సౌరి నది దాటే చోట కొన్ని వందలమంది నేటివ్ అమెరికన్లు కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు.

ఈ మధ్యే ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ఉద్యమ వార్తలు తెలుస్తున్నా. ఉద్యమకారుల దగ్గరికే వెళ్లి, ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకుందామని, వాళ్లతో ఒకపూట గడుపుదామని బయలు దేరాను.

నార్త్ డకోట రాష్టం లోని క్యానన్ బాల్ దగ్గర ఉద్యమకారుల క్యాంప్ ఉందని మాత్రమే తెలుసుకున్నాను. క్యానన్ బాల్ కు వెళ్లగానే క్యాంప్ కనిపిస్తుందని సౌత్ డకోటలో కొంత మంది చెప్పారు.  క్యానన్ బాల్ నది ఇందాకే దాటేశాను. అంటే ఊరు దగ్గరున్నట్లే. కానీ క్యాంప్ ఎంతకీ కనిపించదే!

ఒక గుట్ట దిగీదిగకముందే, మలుపులో హఠాత్తుగా రోడ్డు పక్కన చిన్న లోయలో డేరాలు, కంచెకు కట్టిన జెండాలు ఎగురుతూ కనిపించాయి.  నా గుండె వేగంగా కొట్టుకుంది. అదే! ఒచేడి షాకోవీ (Oceti Sakowin – Seven Council Fires) క్యాంప్! రోడ్డు దిగి, చిన్న గేటు దగ్గరకి కారు పోనిచ్చాను. తలకు రుమాలు కట్టుకున్న ఒక యువకుడు నా కారు దగ్గరికి వచ్చాడు. నుదుటి మీదకు వచ్చేలా కట్టిన ఆ రుమాలు మీద నన్ను ఇక్కడికి రప్పించిన నినాదం, Water is Life (నీళ్లే ప్రాణం) అని రాసి ఉంది. కారు ఎక్కడ పార్కు చేసుకోవచ్చో చూపించాడు.

కారు పార్కు చేసి, పక్కనే ఉన్న గుట్ట ఎక్కి కాసేపు నిలబడ్డాను. నాకు దగ్గర్లో ఇంకొంత మంది నిలబడ్డారు. అందరూ పలకరింపుగా నవ్వారు, ఎప్పట్నుంచో తెలిసిన స్నేహితుల్లా అనిపించింది. నా చేతిలో కెమెరా చూసి, ‘మీరు జర్నలిస్టా’ అని ఒక యువకుడు అడిగాడు, నల్లగా మెరుస్తున్న పొడవాటి జుట్టును ముఖంమీద పడకుండా ఒకచేత్తో పట్టుకుని.

“లేదు. మీ ఉద్యమానికి మా ఇండియన్ పర్యావరణ ఉద్యమకారుల తరుపున  మద్దతు తెలపడానికి వచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడ ఎప్పట్నుంచి ఉంటున్నారు?” అని అడిగాను.

“నేనైతే ఈమధ్యే వచ్చాను. నా స్నేహితులు చాలామంది దాదాపు ఉద్యమం మొదలైనప్పటి నుంచి, అంటే ఏప్రిల్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. చలికాలం మొదలయ్యేలోగా పోరాటం విజయవంతం కావాలని చాలా మందిమి వచ్చాం.”

“ఏ రాష్ట్రం మీది?”

“ఏ రాష్ట్రం  కాదు. ఏ దేశం అని అడగండి. గ్రేట్ సూ నేషన్ మాది. ఓగ్లాల లకోట తెగ.” గర్వంగా అన్నాడతను. ఓగ్లాల లకోట అనేది లకోట తెగలో ఏడు ఉపతెగల్లో ఒకటి. ఇక్కడికి దాదాపు నాలుగు వందల మైళ్ల దూరంలో ఈ ఉపతెగకు కేటాయించిన రిజర్వేషన్ ఉంటుంది.

“అంత దూరం నుంచి వచ్చారా?”

“అదేమంత దూరం? కొంతమంది దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ నుంచి  వచ్చారు. కొంతమంది న్యూజీలాండ్  నుంచి కూడా వచ్చారు. మీరు…? ఇండియా నుంచి కదా?”

“ఇండియా నుంచి ఈ దేశానికి వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఇక్కడికి న్యూ జెర్సీ నుంచి వచ్చాను.”

“మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మా గురించి ఇండియా ప్రజలకు చెప్తారు కదా?”

“నేనైతే చెప్తాను. వింటారా లేదా అన్నది వాళ్ల ఇష్టం కదా?”

అప్పటి దాకా నవ్వుతూ మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. “వాళ్లు వినాలి. ప్రపంచంలో అందరూ వినాలి. ఎందుకంటే ఇది ఇక్కడున్న వాళ్ల సమస్యనో, నాలుగు వందల మైళ్ల దూరంలో ఉన్న మా సమస్యనో కాదు. పర్యావరణ సంరక్షణ అన్నది భవిష్యత్తు తరాల పట్ల కొంచెమన్నా బాధ్యత ఉందనుకునే వారందరి సమస్య. ”అన్నాడు.

వివరంగా చెప్పమని అడుగుదామని అనుకునేలోగా అతన్నెవరో పిలిచారు. “ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.” అంటూ వెళ్లిపోయాడతను.

కొద్దిసేపు అక్కడే నిలబడి కొన్ని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించాను. నా ముందు పరుచుకున్న అద్భుత దృశ్యం నా కెమెరా లెన్సుకు పూర్తిగా చిక్కడం లేదు. దూరాన కొండల ముందు రిబ్బనులా వంపులు తిరిగి మిస్సౌరి నదిలో కలవబోయే ఒయాహే సరోవరం(Lake Oahe) చాలా దూరానికీ నీలంగా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ సరోవరానికీ నాకూ మధ్య  వందల కొద్దీ గుడారాలు, టీపీలు (త్రిభుజాకారంలో జంతు చర్మంతో సూ తెగ ప్రజలు వేసుకునే గుడారాలు). వాటిమధ్య ఒక మట్టి బాట, బాటకు అటూ ఇటూ వివిధ తెగల జెండాలు ఎగురుతున్నాయి. గుట్ట దిగువన గుర్రాల కోసం కట్టిన కంచె.

గుట్ట దిగి గుడారాల మధ్య నడిచాను. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఒక గుడారం ముందు ఇద్దరు మహిళలు కూర్చుని సూప్ తింటూ కనిపించారు.

“మీతో కూర్చోవచ్చా” మొహమాటం లేకుండా అడిగేశాను.

“తప్పకుండా.”

వాళ్ల పక్కనే నేలమీద కూర్చున్నాను.

“నా పేరు మమత. న్యూ జెర్సీ నుంచి వచ్చాను. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?”

“నా పేరు సూసన్. నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి, నా స్నేహితురాలు బార్బర,  సౌత్ డకోట నుంచి.” (ఈ పేర్లు వాళ్ల నిజం పేర్లు కాదు.)

“ఎప్పటిదాక ఉంటారు?”

“పైప్ లైన్ నిర్మాణం ఆగిపోయేదాక. ఎంతకాలమైనా సరే. బార్బర రిటైర్డ్ టీచర్. నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చాను.” సూసన్ అన్నది.

“అదేంటి. వెనక్కి వెళ్లినప్పుడు కష్టం కాదూ? అట్లాంటి కష్టమైన నిర్ణయం తీసుకునేంత ముఖ్యమా ఈ ఉద్యమం?”

“ఒక్కోసారి  తప్పదు. దాదాపు 300 నేటివ్ అమెరికన్ తెగలు ఒక సమస్య గురించి పోరాడడానికి కలిసిరావడం సామాన్య విషయం కాదు. ఈ సమస్య కూడా సామాన్యమైనది కాదు కదా? మనుషులు, చెట్లు, జంతువులు, ప్రకృతిలో భాగమని నమ్ముతాం.  పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి  ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మేం నిరసన కారులం కాము, ప్రకృతి సంరక్షకులం. మా కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా ఫ్రాకింగ్ జరుగుతోంది. అక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్నాను. మా గొడవ ఎవరూ పట్టించుకోకుండానే నేను పాల్గొన్న ఉద్యమం సమిసిపోయింది. ఇక్కడ ఉద్యమం కూడా ఈ రిజర్వేషన్లోనే ఒక చిన్న గుంపు మొదలుపెట్టింది. తమతో ఎవరు కలిసినా కలవకపోయినా పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదని అనుకున్నారేమో.”

“ఆ చిన్ని బృందానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది?”

mamata1

అప్పటిదాక ఏమీ మాట్లాడని బార్బరా బదులిచ్చింది, “మీకు కొంచెం మా చరిత్ర చెప్తాను. ఒక నూటాయాభై ఏళ్ల క్రితం నుంచి జరిగిన చరిత్ర చెప్తాను. 1860ల్లో అమెరికా పడమరవైపు ఉన్న మా భూముల్లోకి చొచ్చుకుని వస్తున్న కాలం. అమెరికా సైన్యం చాలా బలమైంది. అయినా చాలా తెగలు ఆ దురాక్రమణను వీరోచితంగా ప్రతిఘటించాయి. నేటివ్ అమెరికన్ తెగలను అణిచివేయాలని ఎన్నో సైనిక దళాలు దేశమంతా దండయాత్రలు మొదలుపెట్టాయి.

1863 వేసవి చివర లకోట, ఇంకొన్ని మిత్ర తెగలు కలిసి మిస్సౌరి నదికి అవతలి వైపున విడిది చేసి చలికాలం కోసం తయారవుతున్నారు. అడవి బర్రెల వేటలు ముగించి, మాంసం ఎండబెట్టడం, టిపిలు వేసుకోవడం, బర్రె చర్మం దుప్పట్లు తయారు చేసి అమ్ముకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మొత్తం విడిదిలో 3000 మంది దాకా ఉన్నారు. అట్లాంటి విడిది దగ్గరకు సైనిక దళాలు వచ్చాయి. ఆ దళాలు యుద్ధానికే వచ్చాయని భావించి, తాము యుద్ధం చేయడానికి గుమిగూడ లేదని, శాంతియుతంగా తమ పని తాము చేసుకుంటున్నామని తెలియజేయడానికి కొంతమంది నాయకులు తెల్లజెండాలు పట్టుకుని సైనిక నాయకుడి దగ్గరకు వెళ్లారు. అట్లా వెళ్లిన నాయకులను సైన్యం బంధించడం దూరన్నుంచి గమనించిన యువకులు  విడిదిలోని ప్రజలను వెంటనే అక్కడ్నుంచి పారిపొమ్మని హెచ్చరించారు.

కానీ సైన్యం విడిదిని చుట్టుముట్టి దాదాపు 400 మందిని ఆరోజు హతమార్చింది. విడిదిలో ఉన్న మగవాళ్లు హఠాత్తుగా వచ్చి పడిన సైన్యాన్ని ఎదిరించకపోయివుంటే, అక్కడ్నుంచి పారిపోలేక ఇంకా ఎన్ని వందలమంది చనిపోయేవారో. ఖాళీ అయిన విడిదిలో చలికాలం కోసం పోగేసిన మాంసాన్ని, రోజువారి సామాగ్రిని, టిపీలను గుట్టలుగా పోగేసి తగలబెట్టింది సైన్యం. అక్కడ్నుంచి పారిపోయి మిస్సౌరి నది దాటి వచ్చిన జనం ఈ ప్రాంతంలో మెల్లగా నిలదొక్కుకున్నారు. సైన్యం నేటివ్ అమెరికన్ తెగలను పూర్తిగా హతమార్చలేకపోయింది. మా వీరులు అడపాదడపా సైన్యంతో తలపడేవారు. చివరికి ఎవరికీ శాంతి లేదని, 1868లో అమెరికా ప్రభుత్వం మా తెగలతో  ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం లకోట, డకోట తెగలకు, ఇంకొన్ని మిత్ర తెగలకు చెందిన ప్రజలకు ఇప్పటి డకోటా రాష్ట్రాల్లో, మిస్సౌరి నదికి పడమర ఉన్న భూభాగాన్ని, మిస్సౌరి నదిని, పవిత్రమైన బ్లాక్ హిల్స్ ను  కేటాయించి “గ్రేట్ సూ నేషన్” అని రిజర్వేషన్ కు పేరు పెట్టింది.

ఈ ప్రాంతమంతా స్వేచ్ఛగా తిరగాడిన ప్రజలకు సరిహద్దులు ఏర్పాటు చేసింది. అయితే  తెగలతో చేసుకున్న ఒప్పందాల మీద అమెరికా ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవంలేదని మాకు రెండేళ్లలోనే తెలిసివచ్చింది. 1870ల్లో బ్లాక్ హిల్స్ పర్వతాల్లో బంగారం బయటపడింది. మాకు కేటాయించిన భూభాగాన్ని ముక్కలు చేసి ఆ పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అమెరికా ప్రభుత్వం. ఎదురు చెప్పిన తెగలకు బ్లాక్ హిల్స్ కొంటామని బేరం పెట్టింది. “మనుషులు నడయాడే భూమిని ఎవరూ అమ్మలేరు.” అంటూ ఓగ్లాల లకోట వీరుడు తాషుంక వీట్కొ (Crazy Horse)  అమెరికా ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన, మరో నాయకుడు  తతంక యియోతక (Sitting Bull) కలిసి కొన్ని యుద్ధాలు చేశారు. తతంక యియోతక ఇందాక చెప్పిన హత్యాకాండలో సైన్యంతో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడిన హుంక్పప లకోట తెగ వీరుడు. అయితే, కొన్ని నెలల్లోనే తాషుంక వీట్కోను హత్య చేశారు. తతంక యియోతక అప్పటికే పెద్దవాడు. తాషుంక వీట్కో హత్య తరువాత ఒంటరివాడై, అలసిపోయిన తన అనుచర బృందంతో సహా సైన్యానికి లొంగిపోయాడు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే బ్లాక్ హిల్స్ అమెరికా పరమయ్యాయి. 1980లో మాకు క్షమాపణలు చెప్పి, 102 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది కానీ, మేం ఒప్పుకోలేదు. ఆ డబ్బును అమెరికా ప్రభుత్వం ఒక ట్రస్టులో పెట్టింది. ఈనాటికి అది $1.3 బిలియన్ డాలర్లయింది. ఆ డబ్బు మాకు వద్దు. మా నాయకుడు తాషుంక వీట్కొ అన్న మాట ఎప్పటికీ మరిచిపోం. ఆయన మాటే మా మాట. ఈ భూమి…” కోపంతో, దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో ఆగిపోయింది బార్బర.

“ఈ భూమి అమ్మకానికి లేదు.” మెల్లగా అన్నాను. నాకూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కళ్లల్లో నీళ్లతో, చిర్నవ్వుతో చూసింది బార్బర. “ఏ దేశంలో చూసినా, ఏ మూల చూసినా అవే అన్యాయాలు, దుఃఖాలు కదూ?” నిర్లిప్తంగా అన్నది సూసన్.

“అంతే ధైర్యంతో పోరాటాలు… “ అన్నాను.

ఊపిరి పీల్చుకుని మళ్లీ అందుకుంది బార్బర, “అప్పట్లోనే మా ఒక్క గ్రేట్ సూ నేషన్ ను ఆరు రిజర్వేషన్ భూభాగాలలో కుదించారు. ఇప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ కొంచెం కొంచెంగా మా భూమిని ఆక్రమిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ పక్కన కనిపిస్తొందే ఒహాయే సరస్సు. అది నిజానికి ఒక రిజర్వాయర్.  మిస్సౌరి నదిని దాటి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. మెల్లగా వ్యవసాయం, వ్యాపారాలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల కొన్ని టౌన్లు ఏర్పడ్డాయి. అయితే 1944లో ఇక్కడ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1948లో నిర్మాణం ప్రారంభమయ్యింది, 1968లో కెన్నెడీ డ్యాము ప్రారంభోత్సవం చేశాడు. తెగ ప్రజలు ఎంత ప్రతిఘటించినా  ఫలితం లేకపోయింది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కృత్రిమ సరస్సు ఒయాహే కింద కొన్ని టౌన్లు, పంట భూములు, విలువైన మూలికలు దొరికే స్థలాలు మునిగిపోయాయి. ఇప్పుడు మిగిలిన భూమిలో సున్నం ఎక్కువ కలిసి వుంది. పంటలు మునుపటిలా పండవు. అరుదైన మూలికలను పోగొట్టుకున్నారు ప్రజలు.  ‘ఈ రిజర్వేషన్లో ముసలి వాళ్లు ఎక్కువ కనిపించరేమి’ అని అడిగితే.‘పెద్దవాళ్లు గుండెపగిలి చనిపోయారు’ అని అంటారు. నిజంగానే ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఈ రిజర్వేషన్ ప్రజలు. ఇప్పుడు ఈ పైప్ లైన్ మరో పెద్ద దెబ్బ.”

“పైప్ లైన్ వేసేముందు ఈ రిజర్వేషన్ ప్రజల అభిప్రాయం కోసం మీటింగులేవీ పెట్టలేదా? ఇంతకీ ఇప్పటి టెక్నాలజీ తయారైన పైపులు సురక్షితమైనవని అంటున్నారు?” నా ప్రశ్నకు నాకే విరక్తితో నవ్వొచ్చింది.

“నిజానికి ఈ పైప్ లైన్ ఇక్కడికి ఎంతో ఎగువన మిస్సౌరి నదిని దాటాలన్నది మొదటి ప్రణాళిక. అప్పుడు వీళ్లను పిలువలేదు. ప్రపంచానికైతే పైపులు సురక్షితమని చెప్తున్నారు కానీ,అవే పైపులు పగిలితే బిస్మార్క్ నగరానికి ప్రమాదమని దారి మళ్లించారు. అంటే వాళ్లకూ వాళ్ల పైపుల మీద నమ్మకాలు లేవు. దారి మళ్లించినప్పుడు తెగ నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, ఈ రిజర్వేషన్ చైర్మెన్ డేవ్ ఆర్చెమ్ బాల్ట్ తెగ ప్రజలు ఈ పైప్ లైన్ కు విరుద్ధమని ఖచ్చితంగా చెప్పాడు. అయినా ఈ స్థలాన్ని పైప్ లైన్ కు కేటాయించింది ఆర్మీ కార్ప్స్ ప్రభుత్వ విభాగం. ఒకరోజు పవిత్ర స్థలాలనేమీ పట్టించుకోకుండా బుల్ డోజర్లతో ఆ ప్రదేశాన్నంతా చదును చేసేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఉద్యమకారుల మీద వేటకుక్కలతో దాడిచేశారు.”

 

సూసన్ మధ్యలో అందుకుని చెప్పింది,  “ఇంతకీ ఆ దాడి ఎప్పుడు జరిగిందో తెలుసా? సెప్టెంబరు 3న! నూటాయభై మూడు సంవత్సరాల క్రితం అదే రోజున వీళ్ల పూర్వీకుల విడిది మీద దాడి చేసి, పిల్లలని కూడా చూడకుండా, దొరికిన వాళ్లను దొరికినట్లు అతిదగ్గరగా తుపాకులతో కాల్చి దారుణంగా హత్య చేసిన రోజు.”

అవునన్నట్లు తలాడించింది బార్బరా, “నేటివ్ అమెరికన్లను ప్రాణమున్న మనుషులు అనుకోరు, ఇక పవిత్ర స్థలాల గురించి ఏం పట్టించుకుంటారు? ఇంతలా తెగించి పోరాడడానికి అసలు కారణం మిస్సౌరి నది. మంచినీళ్లు తాగడానికి కూడా భయపడే పరిస్థితి. చమురు తాగి బతకలేం కదా? నీళ్లే ప్రాణం కదూ? ఇక తెగించి పోరాడాల్సిందే.”

ఇంతలో కొంత మంది పిల్లలు ఒకరినొకరు తరుముకుంటూ పరిగెత్తుతున్నారు.

“ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. బడి ఎట్లా వీళ్లకు? శని ఆదివారాలు వచ్చి వెళ్తుంటారా?”

సూసన్ సమాధానమిచ్చింది, “లేదు, కొంత మంది చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఒక బడి కూడా ఏర్పాటైంది. ఒక ఊరిలో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చలికాలంలో మంచు తుపాన్లు పెద్ద ఎత్తున చెలరేగుతాయి. ఒక పెద్ద లాడ్జి ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కాకుండా వంతులవారిగా వచ్చి వెళ్లాలని అనుకుంటున్నాం. పరమ క్రూరంగా ప్రవర్తిస్తున్న నార్త్ డకోట పోలీసులకంటే, ప్రభుత్వం కంటే క్రూరమైనవి కావు మంచు తుపాన్లు.”

పకపక నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాసేపు కూర్చున్నాం.

“ఇంత మంది ఎలా కలిసి కట్టుగా పని చేస్తున్నారు?  ఈ ఉద్యమంలో ఇన్ని నేటివ్ అమెరికన్ తెగలు కలిసిరావడం చూస్తే  ఇంత మంది మద్దతు ఎలా సంపాదించుకోగలిగారు?” అని నా ఆశ్చర్యాన్ని ప్రకటించాను.

“మొదటిది, మేం నిజానికి కలిసికట్టుగా లేం. ఈ చుట్టుపక్కల ఐదు క్యాంపులున్నాయి. ఇక్కడ కూడా సైద్ధాంతికపరమైన అభిప్రాయ భేదాలు వున్నాయి. అయితే, పోలీసులతోనో, సెక్యూరిటీ గార్డులతోనో గొడవలైనప్పుడు, ర్యాలీలో పాల్గొనేటప్పుడు మా నాయకులు ఒకరినొకరు సంప్రదించుకుంటారు. అందరం కలిసే పోరాడుతాం. ఏదో ఒకలా చిన్న చిన్న ఉద్యమాల్లోనో, ర్యాలీలోనో పాల్గొని ఓడిపోయి, ఇక ఏం చెయ్యలేం అనుకున్నప్పుడు ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని, ఒక మెగా కార్పొరేషన్ను ఎదుర్కుంటోందని తెలిసినప్పుడు మళ్లీ ఆశ పుడుతుంది. ఒక్క చోటైనా ఉద్యమం గెలవదా అని. వేరే ఎన్ని కారణాలున్నా, ఇప్పుడు మన అందరి ముందు ఉన్నది పర్యావరణ సమస్య. కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి, ఎక్కువౌతున్న టొర్నడోలు, హరికేన్లు, మంచు తుపాన్లు, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు. ఈ ప్రకృతి వైపరిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో, ఇంత విధ్వంస పూరితంగా లేవు. భూకంపాలు కూడా ఫ్రాకింగ్, షేల్ గ్యాస్ కోసం తవ్వకాల్లో ఉపయోగించిన కలుషిత నీటిని భూగర్భంలో భద్రపరచడం వల్ల కూడా ఎక్కువయ్యాయి. భూతాపాన్ని అపాలంటే భూగర్భ వనరులను ఇక ఏమాత్రం వెలికి తీయకూడదని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నా ఇంకా చమురు, బొగ్గు, షేల్ గ్యాస్ వంటి భూగర్భ వనరులను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఖర్చవుతున్న 3.5 బిలియన్ డాలర్లు వాయు, సౌర శక్తి లాంటి ప్రాజెక్టులకు పెట్టరు. అందులో ఎక్కువ లాభాలు ఉండవని. భూమే మిగలనప్పుడు లాభాలతో ఏం చేసుకుంటారో. డోనాల్డ్ ట్రంప్ పర్యావరణ విపత్తు మీద నమ్మకంలేదని అంటాడు. ట్రంప్ కు ఐర్లాండ్ దేశంలో, సముద్రం పక్కన ఒక  గోల్ఫ్ కోర్స్ వుంది. ఎలక్షన్ కు కొన్ని రోజుల ముందే, ఆ గోల్ఫ్ కోర్సు చుట్టూ ఎత్తైన గోడ నిర్మించేందుకు ఆ ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. భూతాపం వల్ల సముద్రమట్టం పెరిగి మునిగిపోతుందని కారణం చెప్పాడు. ఎంత ఎత్తు గోడ కట్టాలనుకుంటున్నాడో, భూమి కుంగి పోతే ఏం చేస్తాడో?”

కాసేపు మౌనంగా కూర్చున్నాం. నాకు అక్కడనుంచి కదలాలనిపించలేదు. కానీ, మాముందు నీడలు పొడుగవుతున్నాయి. “ఇక బయల్దేరుతాను. ముందు దారి ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ లేచి  నిలబడ్డాను.

%e0%b0%ae%e0%b0%ae%e0%b0%a4%e0%b1%a8

ఇద్దరూ లేచి నిలబడ్డారు. “అభివృధ్ధి పేరిట ఇంకా ఎంత మందిమి చనిపోవాలి? ఎంతమంది నిర్వాసితులు కావాలి? చావో బతుకో, ఇక పోరాడాల్సిందే. ఇంతవరకూ మనకు ప్రాణ మిచ్చిన భూమి కోసం, నీటి కోసం  పోరాడాలి.”

అక్టోబరు మొదటి వారాంతాన, బార్బరా, సూసన్లతో నేను మాట్లాడిన రోజు వాళ్లకు ప్రశాంతంగా గడిచిన ఆఖరి రోజు. మరుసటి రోజునుంచే ఆందోళనకరమైన వార్తలు వినవస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని ఏ ప్రముఖ న్యూస్ మీడియా పట్టించుకోకపోయినప్పుడు, “డెమాక్రసీ నౌ” అనే వార్తా సంస్థ అధిపతి అయిన ఏమీ గుడ్ మన్ ఉద్యమకారుల మీద దాడిని మొదటిసారి రికార్డు చేసి ప్రపంచం ముందు పెట్టింది. ఏమీ మీద ట్రెస్ పాసింగ్ కేసు పై అరెస్టు వారంట్ ఇచ్చారు. జర్నలిస్టుగా తన విధి నిర్వహణ ప్రకారం వీడియోలు తీశానని కోర్టులో చెప్పుకున్న తరువాతే ఆమెపై కేసు ఎత్తివేశారు. పైపులైను నిర్మాణాన్ని శాంతియుతంగానే అడ్దుకునేందుకు వెళ్లిన వాళ్లమీద పెప్పర్ స్ప్రే, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. ఎన్నో వందలమందిని అరెస్టు చేశారు. రిజర్వేషన్ చైర్మెన్ అయిన డేవ్ ఆర్చెంబల్ట్ ను కూడా అరెస్టు చేశారు.

ఇటీవల, నవంబరు 24 (అమెరికన్ హాలిడే అయిన థాంక్స్ గివింగ్ రోజు) రాత్రి జరిగిన పోరాటంలో ఉద్యమకారుల మీద రబ్బరు బుల్లెట్లతో పాటు, పెప్పర్ స్ప్రే కలిపిన వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలు. ఒక పెద్దాయనకు గుండెపోటు వచ్చింది. కొంతమంది అల్పోష్ణస్థితికి గురయ్యారు. ఉద్యమకారులకు వైద్యులూ మద్ధతు ఇస్తూ అక్కడ ఉన్నారు కనుక వెంటనే వైద్య సహాయం అందబట్టి బతికిపోయారు లేకపోతే కొందరు గుండె ఆగి పోయో, శ్వాస ఆడకో మరణించి వుండేవారు. ఒక పోలీసు విసిరిన క్యానిస్టర్ తగిలి ఒక యువతి చెయ్యి ఎముక చిట్లిపోయింది. ఇంత జరిగినా ఉద్యమకారులు తమ పోరాటం ఆపేదిలేదని చెబుతున్నారు.

*

 

 

ఎల్దమొస్తవా…

 

 

ananya“ఇండియా వెళ్లావట కదా? పదిరోజుల్లో ఏం చేద్దామని వెళ్లావు? ఏం చేశావు? పోనీ చివరి రోజు ఏం చేశావు?” షాపులో కనిపించిన ఒక స్నేహితురాలు గుక్కతిప్పుకోకుండా అడిగేసింది.

సంతోషంగా లిస్ట్ చదవబోయాను, “కన్హయ్య కుమార్ ను కలిసి మా పాప తనకోసం గీసిన బొమ్మ ఇచ్చాను,  ….”

“కన్హయ్య కుమార్ ఎవరు?”

“జె ఎన్ యు లో స్టూడెంట్ లీడర్… పోనీ… రోహిత్ వేముల…”

“….”

“దళిత్…”

“అతనెవరు? ఎవరు వీళ్లంతా?”

ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవడమంటే ….

*

విశాఖ పొలిమేరలు దాటింది కారు. రామకృష్ణ బీచికి వెళ్లకుండా ఈ ముగ్గురు తమిళులతో రావడం సరైందేనా అనుకుంటూనే ఉన్నాను. నాకు తమిళం రాదని, ఇంగ్లీషు వచ్చని తెలిసినా తమిళంలోనే మాట్లాడుకుంటున్న వాళ్లపట్ల కాసింత కోపం కూడా వచ్చేసింది.

నేను పెద్ద మాటకారిని కాదు. అయినా డ్రైవర్ భాస్కర్ ను ఏవో చిన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండిపోయాను. వాళ్ళేనా తెలీని భాష మాట్లాడుకునేది? భాస్కర్ కు ఇంగ్లీషు, తమిళం రెండూ రావు. నా తెలుగు అతనికి, తన తెలుగు నాకు అర్థమవడం కష్టంగా ఉంది. అయినా సరే, తెలుగు తెలుగే. చుట్టుపక్కల ఊర్ల గురించి, కొండల గురించి అతను చెప్పే విశేషాల గురించి నేను వాళ్లకు చెప్పను గాక చెప్పను. వాటి గురించి అతనికే సరిగ్గా తెలీదని నాకు అర్థమయిందన్న విషయం కూడా చెప్పను. ఒక కొండను ఒకసారి ఎర్రకొండ అంటాడు, అహా అది కాదు వేరేది అంటాడు. హోర్నీ. నా కలల విశాఖ ప్రయాణం ఇట్లా ముగియబోతోందా?  కృష్ణ నన్ను వీళ్లతో ఇరికించేశారే. వీళ్లు వెళ్లేచోట రామకృష్ణ బీచి కంటే చూడాల్సిన బీచి మరొకటి ఉందని అన్నారు. అది ఏదో సముద్రం ఒడ్డున ఊరు. న్యూక్లియర్ ప్లాంటు కట్టబోయే చోటు. వీళ్లకు అక్కడేం పనో ఇంకా సరిగ్గా అర్థం కావడం లేదు. ఆ ఊర్లో మమ్మల్ని కలుసుకోబోయే వాళ్లకు ఇంగ్లీషు సరిగ్గా రాకపోవచ్చని, అవసరమైతే సహాయం చెయ్యమని చెప్పారు.

విజయనగరం బోర్డు కనిపించేసరికి “విజయనగరం అంటే శ్రీకృష్ణదేవరాయలి రాజధానే కదూ?” వెనక నుంచి సుందర రాజన్ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్నకు తత్తరపడ్డాను. ఒకింత కలవరపాటు కూడా. చరిత్ర పాఠాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అవుననీ, కాదనీ, హంపి కాదూ అనీ మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఉండబట్టలేక భాస్కర్ ను అడిగాను. ఔనన్నాడు, వెంటనే కాదన్నాడు. ఆఖరికి ఔననేశాడు. ఒకసారి అతని ముఖంలో చూసి ఇక మాటమార్చడని తేల్చుకుని, నిట్టూర్చి “ఔనట” అని వెనక్కి తిరిగి అన్నాను.

భాస్కర్ వెనక ఉన్న సీట్లో కూర్చున్న అమర్తరాజ్ కొంటె నవ్వు అప్పుడప్పుడే అలవాటౌతోంది. నా వెనక ఉన్న సీట్లో కూర్చున్న సుందర రాజన్ నవ్వుతున్నాడో లేదో కనిపించలేదు. వాళ్లిద్దరి మధ్య కూర్చున్న ఉదయకుమార్ నవ్వుతున్నాడో లేదో అర్థమవడం కష్టం. ఎప్పుడూ ఒక చిర్నవ్వు ప్రశాంతమైన ఆ ముఖంలో వెలుగుతుండడం గమనించాను.

కాసేపాగి, “ఇంతకీ మీరు నిజనిర్ధారణ కమిటీకి చెందిన వాళ్లా?” అని అడిగాను. నవ్వేసి, కాదన్నాడు అమర్తరాజ్.

mamata1

అమ్మన్నాయుడు (CITU – Centre of Indian Trade Unions, a CPI(M)-affiliate), సుందర్ రాజన్, గోవింద రావు (CITU), మమత, కె. రాము (మానవహక్కుల వేదిక), ఉదయకుమార్, థవుడు (ప్రజాశక్తి జర్నలిస్టు), కె.వి. జగనాథ రావు (మానవహక్కుల వేదిక), తేజేశ్వర రావు (CITU).

 

మధ్యలో తెలుగు మిత్రులు కలుసుకున్నారు. పేర్లు చెప్పుకున్నాం. అందరి ముఖాల్లో చిర్నవ్వు. ఎప్పట్నుంచో తెలిసున్నవాళ్లలా పలకరింపులు. ఏ ఊరివాళ్లైతేనేం, ఏ రాష్ట్రం వాళ్లైతేనేం, ఏ దేశం వాళ్లైతేనేం – కలిసి పనిచెయ్యబోతున్నామని తెలిసినప్పుడు అన్ని ఎళ్లలూ చెరిగిపోతాయి.

వెళ్లాల్సిన ఊరు చేరుకోవడానికి వేరే రోడ్డు ఎక్కాలని, వాళ్ల కారు ఫాలో అవమని చెప్పారు. పొదలతో, చెట్లతో, వాటిని కలుపుతూ అల్లుకుపోయిన తీగెలతో పచ్చగా ఉంది అక్కడంతా. మధ్యలో చిన్న చిన్న పంట పొలాలు. వరి నాటుతున్న మహిళలు కనిపించారు. అక్కడక్కడ రెల్లుదబ్బులతో వేసిన గుడిసెలు, ఒక చర్చి కనిపించాయి.

చర్చి గోడమీద ఊరిపేరు, “పాతర్ల పల్లి“.

ఆ ఊరు దాటాక మళ్లీ పచ్చని చెట్లు, చిన్ని చెలకల పొలాలు. ఇంకొక ఊరు కనిపించింది. గుడిసెలు లేవు. అన్నీ పక్కా ఇళ్లే.

బడి గేటు మీద పేరు చదివాను, “పాతర్ల పల్లి“

అరే, ఈ రెండు ఊర్లకు ఒకటే పేరా?

కాదు. ఇవి రెండు ఊర్లు కాదు. ఒకటే ఊరు. ఇందాక చూసింది వెలివాడ.

నేను ఆశ్చర్యపోతుంటే, “అన్ని ఊర్లు ఇట్లనే ఉంటయ్ కద మేడమ్” అన్నాడు భాస్కర్.

“మా వైపు కూడా ఇట్లాగే ఉంటాయి.” అదేం కొత్త విషయం కాదన్నట్లు చెప్పాడు ఉదయకుమార్.

“మా కర్నూల్ వైపు ఇట్లా ఉండవు. అన్ని కులాలు, మతాలు కలగలిసిపోయి ఉండవు కానీ, ఒక వాడ తరువాత ఒకటి, ఆనుకునే ఉంటాయి. మాలమాదిగ వాళ్ల వాడలు కూడా” అనేసి చిన్నప్పుడు, పదేళ్లు, పెరిగిన మా ఊరిని గుర్తు చేసుకున్నాను.

హఠాత్తుగా, రెడ్ల ఇళ్లకు మాల వాడకు మధ్య కల్లాలు గుర్తొచ్చాయి. ఊరిమధ్యలో అవెందుకు అని ఎప్పుడూ అనిపించలేదు. ఎంత దారుణం!! చిన్ననాటి స్నేహితురాలు రంగమ్మ గుర్తొచ్చింది. ఆ కల్లాల్లో తెగ ఆడుకునేవాళ్లం. చీకటవగానే తనొక వైపు, నేనొక వైపు వెళ్లిపోవడం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం ఇంతవరకు ఎందుకు తట్టలేదు? తట్టినా ఏం చేసేదాన్ని? నా చేతులతో మంచినీళ్ల గ్లాసెత్తి దోసిట్లోకి నీళ్లు వంపినదాన్నే కాదూ? అదెప్పుడో చిన్నతనంలో ఐతేనేం? ప్రశ్నించలేని అధైర్యాన్ని పక్కన పెడితే, అసలు ప్రశ్నే ఎప్పుడో గాని రాలేదు. ఆ గిల్ట్ ఎప్పటికీ పోనిది.

“న్యూక్లియర్ ప్లాంట్ వస్తే చానా ఉద్యోగాలొస్తయంట కద మేడమ్?” భాస్కర్ అడిగిన ప్రశ్నతో కొంచెం సర్దుకున్నాను.

“వస్తాయి కానీ ఊరివాళ్లకు కూలి పనుల లాంటివే ఉంటాయి. స్వంతంగా వాళ్లు చేసుకుంటున్న పనులు మానుకుని కూలీ పని ఎందుకు చెయ్యాలి? ఆ పనీ అయిపోయాక సిటీలకు వలసపోవాల్సిందే.” అతనికి అర్థమయ్యే విషయాలు చెప్పాను.

మధ్యలో ఒకచోట కార్లు ఆపి న్యూక్లియర్ పవర్ పార్క్ ప్రపోజ్డ్ సైట్ అంటూ చూపించారు శ్రీకాకుళం మిత్రులు. అంత పచ్చదనం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండదేమో అన్నట్లుంది ఆ ప్రదేశం. అట్లాంటి చోట పొగలు కక్కే బ్రహ్మాండమైన రియాక్టర్లను ఊహించలేకపోతున్నాను.

“ఈ ప్రదేశం ఏ ఎర్త్ క్వేక్ జోన్ కిందకి వస్తుంది?” తెలుగు మిత్రులను అడిగాడు సుందర రాజన్.

అనుకోని ప్రశ్న ఎదురైనట్లుంది వాళ్లకు. కాసేపు ఆలోచించి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి, “నాలుగు అనుకుంటా” ఒకరు అన్నారు. కాదనిపిస్తోంది. ఉన్నదే ఐదు జోన్లు. ఎంత దురాశపరులైనా, అలక్ష్యంగా ఉన్నా మరీ నాలుగో జోన్లో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోరనిపిస్తోంది. ఏమో ఎవరు చెప్పోచ్చారు. రాజధాని, అమరావతి, వెట్ ల్యాండ్స్ మీద కడుతున్నప్పుడు.

కొన్ని నిమిషాలు అక్కడ గడిపి కొవ్వాడలో జనాలతో మాట్లాడదామని బయల్దేరాం. అప్పటిదాకా ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న ముగ్గురు తమిళులు సీరియస్ అయ్యారు.

దార్లో, “ఇక్కడ భూకంపాలు వస్తాయా?” అని భాస్కర్ ను అడిగాను.

“2014 లో భూమి కొంచెం కదిలింది మేడమ్. పెద్దది కాదు. ఏం నష్టం జరగలేదు.” భాస్కర్ చెప్పిన విషయాన్ని వాళ్లకు చెప్పాను.

కొవ్వాడ చేరుకునే ముందే సముద్రం కనిపించింది. బీచ్ ని ఆనుకుని ఊరు. చేపలు పట్టడం వాళ్ల వృత్తి అని విన్నాను. కానీ పడవలేవీ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్లు బీచిలో వలలాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఊరికి, బీచికి మధ్య ఒక అరుగు మీద కొంతమంది యువకులు పేకాట ఆడుకుంటున్నారు.

“పనులేం లేవు. ఇంకేం చేస్తారు?” ఎవరో అన్నారు. పనులు లేకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు.

నా సందేహం నా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించినట్లుంది. “వీళ్లు మత్స్యకారులు మేడమ్. ఇప్పుడు చేపలు లేక సముద్రం లోకి వెళ్లటం లేదు.”

“చేపలు లేకపోవడం ఏమిటీ?” చాలా విచిత్రంగా అనిపించింది నాకు.

“చుట్టుపక్కల ఉన్న ఫార్మాసూటికల్ ప్లాంట్ల నుంచి వచ్చే టాక్సిక్ వేస్ట్ అంతా ఇక్కడికే వస్తుంది మేడమ్. కొన్నేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు చేపలు లేవు. ఇంతకుముందు చేపలు పట్టలేనోళ్లు, వలలు తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు హ్యామక్లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. అవన్నీ గుజరాత్, మహారాష్టృ లాంటి చోట్ల అమ్ముకుంటారు.”

గొంతులో ఏదో అడ్డంపడ్డట్లైంది. ఇస్మత్ చుగ్తాయ్ ప్రస్తావించే ముళ్ల బంతి!

ఇంతలో అక్కడ కొంతమంది కుర్రవాళ్లు గుమిగూడారు.

“ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని రానిస్తారా?” అని అడగమన్నాడు సుందర రాజన్.

అందరికంటే ముందు నిలబడ్డ ఒక అబ్బాయి, “రానివ్వం!” ధీమాగా, కోపంగా అన్నాడు. ఆ అబ్బాయికి పదహారు, పదిహేడేళ్లు ఉంటాయేమో. తీక్షణమైన ఆ అబ్బాయి చూపు ఇక జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది.

మెట్లెక్కి ఆ అరుగుమీద కూర్చున్నాం. మాముందు ఊరి యువకులు. అమర్తరాజ్ మాతో కూర్చోలేదు. కాసేపు అందరి ఫోటోలు తీసి వెళ్లిపోయాడు. భాష రాని చోట ఒక్కడు అట్లా వెళ్లిపోతే ఎట్లా? పోనీ, చిన్నపిల్లవాడా ఏమన్న. సముద్రం ఫోటోలు తీస్తున్నాడేమో.

ఊరి వాళ్లు మాట్లాడేముందు సుందర్ రాజన్ను, ఉదయకుమారన్ను పరిచయం చేసుకోమన్నారు తెలుగు మిత్రుల్లో ఒకరు. ఇంగ్లీషులో అతను చెప్పేది నన్ను తెలుగులో చెప్పమన్నారు. అప్పటికప్పుడు చెప్పే మాటలను తర్జుమా ఎప్పుడూ చెయ్యలేదు. అయినా, ‘సరే’ అనేశాను.

సుందర్ రాజన్, ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ అనే సంస్థ నుంచి వచ్చాడని, అంటే భూమి మిత్రులు అని అర్థమని వివరించాను. న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. తమిళనాడులోని కూడంకుళం అనే ఊర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ మధ్యే ఫుకొషిమా వెళ్లొచ్చాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల ఒరిగే లాభాల కన్నా, జరిగే నష్టలే ఎక్కువ అని, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడతారని చెప్పాడు. ప్రభుత్వం ప్రజల తరుపున ఆలోచించడం లేదని చెప్పాడు.

కూడంకుళం అన్న పేరు నోరు తిరగలేదు. కూడబలుక్కుంటూ ఆ ఊరి పేరుని పలికినప్పుడు, సుందర రాజన్ శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని వేరేవాళ్లకు తెలియకపోయినా పక్కనే కూర్చున్న నాకు తెలిసిపోయింది. నేను ఎప్పుడూ వినివుండని ఆ ఊరు అతనకి చాలా ముఖ్యమైందని అర్థమయింది.

ఫుకొషిమాలో, పవర్ ప్లాంటుకు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్లందరినీ వేరే చోట్లకు వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఒక పాల వ్యాపారి గురించి చెప్పాడు. ఆ వ్యాపారికి సోకిన రేడియేషన్ ను ట్రీట్ చెయ్యగలరు కానీ అతని ఆవులను రక్షించలేమని చెప్పారట. వాటికి రేడియేషన్ సోకడం వలన, అవి ఇచ్చే పాలు ఎవరూ తాగకూడదు. వాటి మాంసం కూడా ఎవరూ తినకూడదు. 75 ఆవులను చంపేసి, ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చిందని చెప్పాడు. భోపాల్ దుర్ఘటను గుర్తు చేసి, కొన్ని వేల మంది మరణించినా, గాయాలపాలైనా సి.యి.వో వారెన్ ఆండెర్సన్ కు ఎలాంటి శిక్ష పడకుండా భారత, అమెరికా ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, కొవ్వాడలో ప్రమాదం జరిగితే సామాన్య జనం తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనే నమ్మకం పెట్టుకోకూడదని చెప్పాడు.

తరువాత ఉదయకుమార్ మాట్లాడాడు. తాము అభివృధికి ఆటంకం కాదని, ఏ విదేశీ సంస్థకు పని చెయ్యటం లేదని, శాంతియుతమార్గాల ద్వారానే పోరాటం చెయ్యాలనుకుంటున్నామని చెప్పాడు. కొవ్వాడ, చుట్టుపక్కల ఊర్లలోని ప్రజలు చేస్తున్న, చెయ్యబోయే పోరాటాలకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని చెప్పాడు. టెస్టు చెయ్యని రియాక్టర్లను కొవ్వాడలో వాడబోతున్నారని, ప్రమాదం జరగడానికి చాల ఎక్కువ అవకాశం ఉందని చెప్పాడు. ఫుకోషిమా ప్రమాదం తరువాత ఎన్నో దేశాలు అణురియాక్టర్లు నిలిపివేయడమో, చాలావాటిని మూసివేయడమో చేశాయని, మరి భారత ప్రభుత్వం కొవ్వాడలో ఎందుకు కొత్తగా అణురియాక్టర్లను నిర్మించాలనుకుంటున్నాయో ప్రశ్నించాలని అన్నాడు. ప్రభుత్వాన్ని గాని, ఏ రాజకీయ పార్టీని గాని నమ్మకుండా ప్రజలు తమ పోరాటం తాము చెయ్యాల్సి ఉంటుందని చెప్పాడు.

పక్కన కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ఒకతను తను స్పెషల్ బ్రాంచ్ నుంచి అని అన్నాడు. ఉదయకుమార్ కొంచెం ఆశ్చర్యపోయాడు, “ఓ స్పెషల్ బ్రాంచి నుంచా?” అని చిర్నవ్వు నవ్వాడు. అతనూ నవ్వాడు.

వాళ్లు చెప్పినమాటలైతే ఇంగ్లీషులోంచి తెలుగులో చాలావరకు తర్జుమా చేస్తున్నాను. వాళ్లు చెప్పేవి జీర్ణించుకోలేకపోతున్నాను. ఆలోచనల్లో పడి, అన్ని విషయాలు తిరిగి చెప్పలేకపోతున్నాను. తెలుగు మిత్రులు అందుకుని తర్జుమా చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ మా చుట్టూ ఉన్న జనం మారుతున్నారు. ముందు కూర్చున్న యువకులు మాత్రం కదలటం లేదు. శ్రద్ధగా వింటున్నారు. మధ్య మధ్యలో “మీరేం చేస్తారు?” అని ప్రశ్నిస్తే “ఈ ఊరు నుంచి వెళ్లం. ఇది మా ఊరు. కొట్లాడ్తాం” అని గట్టిగా చెప్తున్నారు.

ఇంతలో పక్కనుంచి ఒక యువకుడు అరిచాడు, “ఎవరెవరో వస్తారు, ఏదో చెప్పి పోతారు. మా నాయకులే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకే పోరాడుతాం? మా భూమిని ఇచ్చెయ్యక ఏం చేస్తాం?” అతని మాటలను ఇంగ్లీషులోకి తర్జుమా చేశాను.

ఒక పెద్దాయన ప్లాస్టిక్ తాళ్లతో బుట్టల్లాంటివి చేస్తున్నాడు. పళ్లు, కూరగాయలు పెట్టుకోవడానికి అని చెప్పాడు. వలలు చెయ్యడం కాకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పారు గుంపులో ఒకరు. తిండికోసం ఏ తిప్పలైనా పడాలి కదా అని అన్నాడు ఆ పెద్దాయన.

“సరే పవర్ ప్లాంటు వస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే మాకేం, రేపో మాపో పోయే ముసలోళ్లకు” అని అనేశాడు.

ఆయన పక్కన ఇంకో పెద్దాయన వళ్లో కూర్చున్న పసిపిల్లవాడు నావైపు అమాయకంగా చూస్తున్నాడు.

“మీ సంగతి సరే, మరి మీ పిల్లల సంగతి? వాళ్ల పిల్లల సంగతి మీకు అఖర్లేదా? ఆ పిల్లాడి సంగతి?” అని అడిగాను. ఆయన క్షణకాలం నా ముఖంలోకి చూశాడు.

ఇక ఒకరి మాటలను ఒకరు మింగేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు ఊరి వాళ్లు. గొడవగా తయారయ్యింది అక్కడంతా. అంత గడబిడలోనూ ఎవరూ ఇదొక ఆట అన్నట్లో, కాలక్షేపం కోసం అన్నట్లో మాట్లాడటం లేదు. అయినా, ఇట్లా కాదు. ఎవరన్నా మధ్యవర్తిత్వం చేస్తే బాగుండుననిపించింది.

“ఊరి సర్పంచ్ తో మాట్లాడడం కుదరదా?” అని అక్కడున్నవాళ్లను అడిగాను.

“ఊర్లో లేడు. ఉన్నా ఏం లాభం. ఆయన ప్రభుత్వం వైపే ఉన్నాడు. వీళ్లు వస్తున్నారని తెలిసి పక్క ఊరికి వెళ్లిపోయాడు.” నాకు ఆశ్చర్యమేసింది. వీళ్లను చూడగానే తెలుగు కార్యకర్తల ముఖాలు వెలిగిపోవడం హఠాత్తుగా గుర్తొచ్చింది. వాళ్లవైపు చూశాను. ముఖంలో ఏ భావమూ లేకపోయినా ఈ విషయం పట్ల దృఢమైన నిబద్ధతో ఉన్నట్లు తెలిసిపోతోంది. ఈ తమిళులు సామాన్యులు కాదని ఒక్కసారిగా అనిపించింది.

“ఊర్లోకి వెళ్లొద్దాం పదండి” అన్నారెవరో.

బీచికి ఆనుకుని ఉన్న ఇంటివైపు వెళ్లాం. ఒకరిద్దరు ఆడవాళ్లు మాట్లాడారు. వాళ్లకు మావి కొత్తముఖాలే కానీ మాలాంటి వాళ్లను ఇంతకుముందు చూసి, ఆశపడి, నిరాశపడిన అనుభవాలున్నట్లున్నాయి. ఒకింత నిర్లక్ష్యం, ఒకింత ‘మీరేమైనా చెయ్యగలరా’ అనే మిణుకుమనే ఆశ వాళ్ల ముఖాల్లో. ఆ ఇంట్లోనే ఒకతను కొంచెం ఎక్కువ సమాచారం ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలుగుదేశం తమ పోరాటానికి మద్ధతునిచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తమకు వ్యతిరేకంగా, అణురియాక్టర్లను ఇంకా త్వరగా కట్టాలని ప్రయత్నిస్తోందని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడి వచ్చేశాం. ఇంతవరకు ఒక యువకుడు, ఆ పెద్దాయన తప్ప అందరూ పోరాడుతామనే చెప్తున్నారు.

కొంతమంది విలేఖర్లు ఉదయకుమార్ ను వీడియో స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ నన్ను వీడియోలో వచ్చేట్లో ఉదయకుమార్ పక్కన నిలబడమని చెప్పారు. మధ్యలో నేనేందుకు అనుకుని ‘పర్వాలేదులెండి’ అంటూ దూరంగానే నిలబడ్డాను.

“డోంట్ బి అఫ్రైడ్ మమదా!” అని అన్నాడు ఉదయకుమార్. ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చింది. “హౌ క్యూట్!” మనసులోనే అనుకున్నా.

అవునూ ఇంతకీ భయపడొద్దు అంటున్నారెందుకు? ఇక్కడ భయపడాల్సింది ఏముంది? న్యూస్ వీడియోలోకి రావాలంటే భయపడేదానిలా కనిపిస్తున్నానా?

వీళ్ల స్టేట్మేంట్లు తీసుకోవడం, వీళ్లు వస్తారని సర్పంచ్ ఊర్లో లేకపోవడం, ముగ్గురు నలుగురు విలేఖరులు వీళ్ల మాటలను శ్రద్ధగా నోట్ చేసుకోవడం చూస్తుంటే ఆషామాషీ వ్యవహారంలా కనిపించడం లేదు. ఇంతకీ భయపడొద్దని ఎందుకు అన్నాడు?

ఎప్పుడు వచ్చాడో అమర్తరాజన్ మా గుంపులో చేరాడు. ఇక అందరం బయల్దేరాం. చిన్న ఊర్లు దాటుకుని ఘాట్ రోడ్డు ఎక్కాం. అందరం అక్కడ టీ తాగి, శ్రీకాకుళం మిత్రుల దగ్గర సెలవు తీసుకుని విశాఖ బయల్దేరాం.

సముద్రం పక్కగా భీమునిపట్నం వైపు కారు పోనిచ్చాడు భాస్కర్.

వెనక కూర్చుని ముగ్గురూ మళ్లీ తమిళంలో మాటలు మొదలు పెట్టారు. పెద్దగా నవ్వులు కూడా.

భాస్కర్ తో ఊరికే మాటలు పెట్టుకోవాలనిపించలేదు. ఏదో ఒకలా వాళ్లనే మాట్లాడించాలనిపించింది.

కాసేపు లాటిన్ అమెరికన్ పోయెట్రీ గురించి, బొలీవియా గురించి మాట్లాడుకున్నాం. కొవ్వాడకు రావడం ఇది మూడోసారి అని చెప్పాడు అమర్తరాజ్. హ్మ్! ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారాండీ?

మధ్యలో కూర్చున్న ఉదయకుమార్ ను అడిగాను, “మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను. పోయిన ఏడాది డిసెంబర్లో హంపిలో జరిగిన రెవొల్యూషనరీ కల్చరల్ ఫారమ్ కి వచ్చారా? ప్రొఫెసర్ భగవన్ వచ్చారక్కడికి. మనసయ్య గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ల పక్కన చూసినట్లు అనిపిస్తోంది.”

“కల్చరల్ ఫారమ్ దగ్గర ఉదయకుమారనా?” అని పెద్దగా నవ్వాడు అమర్తరాజ్. ఇతనికి నవ్వడం, నవ్వించడం, ఫోటోలు తియ్యడం మాత్రమే వచ్చినట్లుంది. ఇంతవరకు ఫోన్తోనే ఫోటోలు తియ్యడం చూశాను. ఆ పెద్ద కెమెరా బ్యాగ్ ఎందుకు మోస్తున్నట్లో.

“ప్రొఫెసర్ భగవన్ తో ఒకసారి స్టేజి షేర్ చేసుకున్నా కానీ హంపిలో కాదు.” వివరించాడు ఉదయకుమార్.

“హ్మ్. మరి ఎక్కడ చూసానో?”

“ఈయన చాలా ఫేమస్. ఈయన మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా?” అమర్తరాజ్ నవ్వుతూ అడిగాడు.

కేసులా? ఇంత ఫ్రీగా, హాయిగా తిరుగుతున్నారు ఈయన మీద కేసులా? టీజ్ చేస్తున్నాడు ఈ అమర్తరాజ్.

“30?” తోచిన నంబరు చెప్పాను.

“హా…” పెదవి విరిచాడు అమర్తరాజ్. ఉదయకుమార్ ఒకటే నవ్వు. (మల్లెపువ్వు నవ్వు. నిజ్జం. మల్లెపువ్వులే! అట్లాంటి నవ్వును ఇంతవరకు ఎవరి ముఖంలోనూ చూడలేదు… నా చిట్టితల్లి ముఖంలో తప్ప.)

మరీ పెద్ద నంబరు చెప్పానేమో? “3?”

“380!” అమర్తరాజ్ సీరియస్ గానే అన్నా అతని ముఖంలో దాగని నవ్వు. ఉదయకుమార్ మళ్లీ గట్టిగా నవ్వాడు.

“వాటిలో 20, సెడిషన్ కేసులు” అమర్తరాజ్ మళ్లీ అన్నాడు, “మాకేమో ఈయన అపర గాంధీ. పోలీసులేమో ఈయన వెనకాలే ఉంటారు.”

“ఈరోజు పోలీసులేం రాలేదు కదా?” వీళ్లు జోకులేస్తున్నారో సీరియస్ గా ఉన్నారో అర్థం కావట్లేదు.

“ఒకతను స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చానన్నాడు కదా?” ఆశ్చర్యంగా అన్నాడు అమర్తరాజ్, “అంటే పోలీసు డిపార్ట్మెంట్ అని తెలీదా?”

“ఓహ్. లేదు. భయపడొద్దని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమయింది. నేను డేంజరస్ మనుషుల్తో ఉన్నానన్నమాట.” నవ్వుతూ అన్నాను.

“ఓహ్ మేం చాలా డేంజరస్” ముగ్గురూ నవ్వారు.

మాటల మధ్యలో అమర్తరాజన్,”మేం మాట్లాడే ఇంగ్లీష్ తెలుగులోకి ఇంటర్ ప్రిట్ చెయ్యడానికి మిమ్మల్ని కృష్ణ అరేంజ్ చేశాడనకున్నాం” అని అన్నాడు.

ఒహ్హో, నేను కూడా వీళ్లకు సర్ప్రైజే అన్నమాట. ఉత్సాహంగా చెప్పాను,“లేదు, లేదు. విశాఖకు వేరే పని మీద వచ్చాను. కృష్ణ, న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్పి, సుందర రాజన్ కొవ్వాడ వెళ్తున్నారని చెప్పారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కొంచెం తెలుసుకుందామని మీతో వచ్చాను.”

“గుడ్” అంటూ చిర్నవ్వుతో తలపంకించాడు అమర్తరాజన్.

భీముని పట్టణం బీచి దగ్గర కాసేపు ఆగాం. మిరపకాయ బజ్జీలు అందరి కోసం కొన్నాడు సుందర రాజన్.

ఒక ఊర కుక్క అక్కడే తచ్చాడుతోంది. అందరూ దాన్ని అదిలిస్తూ ఉన్నారు. ఉదయకుమార్ తన వంతు బజ్జీలో కొంత పిండి భాగం మాత్రం చిన్ని చిన్ని ముక్కలు చేసి చిన్న పేపర్లో పెట్టి దాని ముందు పెట్టాడు, “సాపడీ, సాపడీ” అంటూ. ఏమనుకుందో, ఎంత ఆకలి మీద ఉందో ఒక్క క్షణంలో తినేసిందది.

అక్కడ్నుంచి రామకృష్ణ బీచికి బయల్దేరాం. రామకృష్ణ బీచి చూడాలన్నది హెచ్చార్కె(నాన్న) జ్ఞాపకాల్లోంచి జాలువారిన నా చిన్నినాటి కల. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. గుండె నిండా ఏదో వెళితి. హెచ్చార్కె చెప్పినట్లు లేదన్నది ఒకటైతే, గడిచిన ఆ మూడు గంటలు నన్ను నిలవనీయడం లేదు. నాకు నేను అందని దూరాలకు ఎక్కడికో కొట్టుకుపోయానని ఏదో కంగారు. ఇంటికి వెళ్దామని చెప్పాను. వాళ్లేం అనలేదు. వెంటనే బయల్దేరారు.

అప్పటికే కృష్ణ మాకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపు కూర్చున్న తరువాత వేరే చోటికి వెళ్లడానికి వాళ్లదగ్గర సెలవు తీసుకున్నాను.

ఉదయకుమార్ అమెరికాలో చదువుకున్నారని, ప్రొఫెసర్ గా కూడా పని చేశారని మాటల మధ్య చెప్పడం గుర్తొచ్చింది.

“ఎప్పుడైనా న్యూ జెర్సీ వస్తే మా ఇంటికి రండి.” అని అన్నాను.

“ప్రభుత్వం తన పాస్ పోర్ట్ ను తిరిగి ఇచ్చినప్పుడు వస్తాడు.” అమర్త రాజన్ అన్నాడు.

“పీ ఎమ్ అయిపోండి, పాస్పోర్ట్ మాత్రమే ఎందుకు? వీసా ఇచ్చేస్తారు” అన్నాను. నవ్వులతోనే వీడ్కోల్లు చెప్పుకున్నాం.

వీడ్కోలైతే తీసుకున్నాను కానీ, మల్లెపువ్వుల వాన కురుస్తూనే ఉంది – వాళ్లెవరో సరిగ్గా తెలీకపోయిన ఆరోజు నించి, ఎంతో తెలుసుకున్న ఈరోజూ, ఇక ఎప్పటికీ.

mamata2

ఇంతకీ వాళ్లెవరు?

అమర్తరాజ్ స్టీఫెన్ – ఇండిపెండెంట్ ఫొటొగ్రాఫర్. ఫోటొగ్రఫీలో ఎన్నో అవార్డులు గెల్చుకున్నాడు. మచ్చుకి, కూడంకుళం పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తీసిన ఫోటోలకు క్యాచ్ లైట్స్ ఆక్టివిస్ట్ అవార్డ్ (Catchlight’s Activist Award(2014)) వచ్చింది. కూడంకుళంలో పోరాటంలో పాల్గొన్నాడు. సామాజిక కార్యకర్తగా తను రాసిన ఫోటో-వ్యాసాలు దేశ విదేశాల్లోని పత్రికలలో అచ్చవుతుంటాయి.

సుందర రాజన్ – ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ సంస్థ నుంచి. జపాన్ ఫుకొషిమా కి వెళ్లివచ్చినవారిలో ఇతనూ ఉన్నాడు. కూడంకుళంలో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. న్యూక్లియర్ పవర్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న కార్యకర్తల్లో మొదటిశ్రేణిలో ఉంటాడు.

ఎస్ పి ఉదయకుమార్ – 1980 ల్లోనే Group for Peaceful Indian Ocean అనే సంస్థను ప్రారంభించాడు. అమెరికాలో పొలిటికల్ సైన్స్ లో పి. హెచ్ డి చేసి, మాన్ మత్ యూనివర్సిటీలో(Monmouth university) ప్రొఫెసరుగా పని చేసి, 2001 లో భారత దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. South Asian Community Center for Education and Research (SACCER) అనే విద్యాసంస్థను, భార్య మీరాతో కలిసి  స్థాపించాడు. People’s Movement Against Nuclear Energy (PMNAE) అనే సంస్థకు కన్వీనర్. ఈ సంస్థ తరపున, కూడంకుళం లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించాడు. కూడంకుళం పోరాటం గురించి తమిళనాడు బయట ప్రపంచానికి తెలియజేయడమనే ముఖ్య ఉద్దేశంతో, 2014 లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేశాడు. చివరికి ఆ పార్టీ కూడంకుళం పోరాటాన్ని పట్టించుకోకుండా మధ్యతరగతి ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి “పచ్చై తమిళగం” (పచ్చని తమిళనాడు) అనే పార్టీని స్థాపించాడు.  ఏ ఎన్నికలలోనూ గెలవకపోతేనేం – అసలుసిసలు ప్రజల మనిషి. కూడంకుళం పోరాటాన్ని నీరుగార్చేందుకు ఉదయకుమార్ ను ప్రభుత్వం ఎంతో వేధించింది. ఎన్నో కేసులు బనాయించింది. విదేశీ నిధులు ఉన్నాయనే నెపం మీద ఆయన ఇంటిమీద, విద్యాసంస్థ మీద రైడ్ చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆయన తన ఆస్థుల వివరాలన్నీ బయటపెట్టి, శాంతియుతంగా చేసే పోరాటాలకు, హంగర్ స్ట్రైకులు చెయ్యడానికి నిధులు అవసరం లేదని చెప్పాడు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల జరిగే నష్టాలు ఫుకొషిమా దుర్ఘటన తరువాత ప్రపంచానికి తేటతెల్లమయ్యేనాటికే కూడంకుళంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలయ్యింది. దాన్ని ఆపటానికి చేసిన పోరాటం ఆలస్యంగా మొదలయ్యింది. పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతున్నా, ఆ అనుభవాన్ని కొవ్వాడను, శ్రీకాకుళాన్ని కాపాడుకోవడానికి వినియోగించాలని కొవ్వాడకు వచ్చారు అలుపెరుగని యోధులు – మల్లెపువ్వుల నవ్వులు తోడుగా.

*

వీళ్లను కలిసేదాక కూడంకుళంలో జరిగిన పోరాటం గురించి ఏమాత్రం ఎరుక లేదు. మహా అయితే కొన్నాళ్ల తరువాత కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంటును ఆడంబరంగా విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారని ఏ ఫేస్ బుక్కు ద్వారానో తెలిసేదేమో.

దళిత్ అంటే ఎవరని అమాయకంగా అడిగిన నా స్నేహితురాలికి నాకూ తేడా ఏమీ లేదు. ఇంటి దగ్గరి పోరాటాల గురించి మాకేం తెలీదు. మేం ఇంటినుంచి చాలా దూరం వెళ్లిపోయాం.

నాకు ఇంటికి వెళ్లాలనుంది…

(ఫోటోలు: అమర్తరాజ్ స్టీఫెన్)

*

కవిత్వంలో జేన్ దారి!

మమత కొడిదెల

~

జేన్ హర్ష్ ఫీల్డ్ 1973 లో తన ఇరవైవ ఏట మొదటి కవితను రాసింది. ప్రిన్సెటన్ యునివర్సిటీలో మొట్టమొదటిసారి మహిళలకు ప్రవేశం కలిగించిన బ్యాచిలో  ఉత్తీర్ణురాలయ్యింది.
జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కవిత్వం రాయకూడదని ఎనిమిదేళ్లు కవిత్వానికి విరామమిచ్చింది. ఆ సమయంలో సాన్ ఫ్రాన్సిస్కోలోని జెన్ సెంటర్లో చదువుకుంది. “కవిత్వానికి కేవలం కవిత్వమే ఆధారం కాదు. పరిపూర్ణంగా జీవించిన జీవితంలోంచే మంచి కవిత్వం వస్తుంది. అందుకనే ఎట్లాగైనా సరే కవిత్వం రాయాల్సిందేనని అనుకోలేదు. ముందు జీవితానికి అర్థం తెలుసుకోవాలనుకున్నాను” అని చెబుతుంది జేన్ . తనను ఎవరైన ‘జెన్ కవయిత్రి’ అంటే ఒప్పుకోదు. “జెన్ కవయిత్రిని కానే కాదు. నేను మానవీయ కవయిత్రిని” అని స్పస్టం చేస్తుంది.
“మరీ నిగూఢంగా లేకుండా అదే సమయంలో సంక్లిష్టతను మినహాయించకుండా సాగే ఆలోచనలు, సంభాషణల్లా, ప్రపంచాన్ని ఒకేసారి – హృదయం, బుద్ధి, కంఠధ్వని, దేహము- ఇలా ఎన్నోవిధాలుగా తెలుసుకునే కవిత్వంలా, సరళత లేకుండా స్పస్టతను సాధించే కవిత్వం నాకు ఆసక్తి కలిగిస్తుంది.” అని కవిత్వం పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది జేన్.
ఆమె కవిత్వం సామాజిక న్యాయాన్యాయాలు, పర్యావరణం వంటి నేపధ్యాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి, మానవ ప్రపంచం మధ్య విడగొట్టలేని లంకె ఉందన్న నమ్మిక ఆమె కవిత్వంలోని ప్రధానాంశం. ఆమె కవితలు రాజకీయాంశాలను సూటిగా వ్యాఖ్యానించవు కానీ, తన చుట్టూ సమాజంలోని యదార్థాలను ఎత్తి చూపుతాయి.
నిర్మలంగా, పారదర్శకంగా ఉండే ఆమె భాష, విశేషమైన సవాళ్ళను విసురుతుంది. ఒకేసరి భావగర్భితమూ, సాధారణమూ అయిన భాషతో, ఒక్కొక్క వాక్యంతో, ఒక్కొక్క చిత్రంతో ధ్యానానికీ, మార్పుకు అవకాశాన్నిస్తాయి ఆమె కవితలు.

~

శరణాగత  తేనె

~

ఒక చెక్కడపు బొమ్మ: ఒక కొమ్మ మీద ఖాళీ తేనెతుట్టెతో  ప్రపంచ వృక్షం

 

ఒక అతి సుందర దృశ్యం మనస్సును తిరస్కరిస్తోంది

తెగ వాగే నోరే గాని వినే చెవుల్లేని మనిషి లాంటిదది.

 

బషో నెలల తరబడి సాగిన నడకను పూర్తి చేసినప్పుడు

అరిగిపోయిన చెప్పులు విప్పి

అలా పడేశాడు.

 

ఒకటి వాడిపోయిన చామంతి పరిమళమయ్యింది

ఇంకొకటి కథలోంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది

 

నొప్పిని గమనించిన తరువాతే అదెప్పుడూ వుండిందని నువ్వు తెలుసుకుంటావు

పక్క తెర నుంచి వేదిక మీద అడుగు పెట్టక ముందు కూడా నటుడు వుండినట్లు

 

మరో బషో హైకూ:

శిథిలమైన ఒక పుర్రె, దాని కళ్లలోంచి పెరుగుతుంది పొడుగ్గా గాలికి వూగే గడ్డి

 

వాళ్లిప్పుడు ఒక ఫోటోగ్రాఫులోకి చూస్తున్నారు,

ఫ్రాన్సులో ఒక చదును పొలం, సెప్టెంబరు 1916:

కొందరు మనుషులు వంగి, పొగ తాగుతూ, చిరిగిన సంచుల్లో వెతుకుతున్నారు

ఉత్తరాల కోసం

 

యుద్ధం, నడక, చామంతి, చెప్పులు, గోధుమ పొలం,

కెమరా లెన్సు మీద తేనెటీగ-పొగ, యుద్ధం

 

అవన్నీ గత కాలానికి చెందినవి, మనం ప్రయాణిస్తుంటాం వాటివైపు, వాటికి దూరంగా

మోసుకు తిరుగుతుంటాం మిగిలిపోయిన, మనం కాపాడగల్గిన

 

శరణాగత  తేనెను.

 

స్న్యాప్ అవుట్

-మమత కొడిదెల 

~

Mamata K.మనసంతా అల్లుకుపోయిన సాలేగూళ్ళతో కుస్తీ పడుతూ ఇంటి పనులు చేసుకుంటోంది అమ్మ.

“ఆడుకోడానికి వెళ్తున్నా” అని ఒక అరుపు అమ్మ వైపు విసిరేసి బయటకు ఎగిరిపోయింది పాప. ఇక పనులు తొందరగా తెముల్తాయిలే అని అమ్మ ఊపిరి పీల్చుకునేంతలో తలుపు నెమ్మదిగా తరచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అమ్మ పక్కన నిలుచుంది.

“వచ్చేశావేం? నీ స్నేహితులెవరూ లేరా?” విసుగును దాచేసి పాప వైపు చూసింది అమ్మ.

మొఖంలో ఏ భావమూ లేకపోయినా అమ్మ లోపలికి చూస్తున్నాయి ఆ పసి కళ్ళు, తనేం చెబితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో బేరీజు వేసుకుంటున్నట్లు. అప్పుడే ఇంత కాలెక్యులేటేడ్ గా వుండాల్సొస్తోందే పిల్లలకు.

“ఏరా తల్లీ?”

ఆ నెమ్మది పిలుపుతో పాప ముఖంలోకి దుఃఖం వెల్లువెత్తింది. చేతులు చాపిన అమ్మ వొడిలోకి దూకింది. అమ్మ మెడను కావలించుకుని పూడుకుపోయిన గొంతుతో అంది, “నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ గరాజ్ లో ఏదో పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరో వచ్చారట. కానీ నేను ఇన్వైటెడ్ కాదట. నేను కూడా వాళ్ళను నా పార్టీకి ఇన్వైట్ చెయ్యను.”

పాపను హత్తుకుని కూర్చుంది అమ్మ. పక్కింటి గరాజ్ లోంచి పిల్లల కేరింతలు తేలివచ్చి కొన్ని రోజులుగా అమ్మలో బాధపెడుతున్న ఆలోచనలను తట్టి లేపాయి. శాశ్వతమనుకున్న పాత స్నేహాలు కొన్ని, మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరవళ్లెత్తిన కొత్త స్నేహాలు కొన్ని హఠాత్తుగా మౌనం దాల్చడం వల్ల  బాధగా ఉంది అమ్మకు. ఎవరి జీవితాల్లో వాళ్లు అని ఎంత సర్దిచెప్పుకున్నా కొన్ని రోజులుగా బాధ తగ్గట్లేదు.

పాప కన్నీళ్ళతో అమ్మ భుజం తడిసిపోయింది. “ఎందుకు వాళ్ళు నాతో ఆడట్లేదు? నేను ఏమన్న మిస్టేక్ చేస్తే నాకు చెప్పొచ్చు కదా?”

ఆత్మావలోకనం మంచిదే, కానీ ఆత్మను ముంచెత్తేది కాకూడదు. పాపను ఎలా సముదాయించాలో అర్థం కాలేదు అమ్మకు. అట్లా ఉక్కిరిబిక్కిరైనప్పుడు అమ్మ పాఠాల్లోకి దిగిపోతుంది.

“అమ్మను చూడు తల్లీ.” పాప ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అంది అమ్మ. కన్నీళ్ళతో తడిసిన ఆ మొఖాన్ని చూసి అమ్మ గుండె కలుక్కుమంది. కళ్ళు చికిలిస్తూ అమ్మ వైపు చూసింది పాప.

“ఒక్కదానివే ఆడుకోవడం అలవాటు చేసుకోవాలి నువ్వు. నీతో ఆడకపోవడానికి వాళ్ళకేదో రీజన్ వుండే వుంటుంది. దాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి నువ్వు. నీకు బాధగా వుందని అమ్మకు అర్థం అయింది కన్నా. కానీ, జస్ట్ స్న్యాప్ అవుట్ ఆఫ్ ఇట్. వెళ్లి నీ బొమ్మలతో ఆడుకో. పోనీ, అమ్మను డిస్టర్బ్ చెయ్యకుండా ఇక్కడే ఆడుకో. ఈ పని తొందరగా పూర్తి చేసేస్తా. మనిద్దరం చా..లా… సేపు ఆడుకుందాం. సరేనా తల్లీ?”

కాసేపు ఏం మాట్లాడకుండా అమ్మ వళ్లోనే కూర్చుంది పాప. మెల్లగా ఏడుపు ఆపి, బెక్కుతూ అమ్మ షర్టుతో మొఖం తుడుచుకుంది.

“తాతను ప్లే ఏరియాకు తీసుకెళ్ళమని అడగనా?” ఒక్క క్షణం కూడా ఒక్కతే ఆడుకోవడం ఇష్టం లేదు పాపకు. అంతగా బాధ పడుతున్న పిల్లను ఒంటరిగా ఆడుకొమ్మని పట్టుపట్టడం అమ్మకూ ఇష్టం లేదు.

Mandira Bhaduri

Mandira Bhaduri

 

*

రెండు గంటల తరువాత ఆడుకుని వచ్చింది పాప. స్నానం చేయించి బట్టలేస్తున్న అమ్మకు ఇంకో స్నేహితుల గుంపుతో ఎలా ఆడుకుందో గుక్క తిప్పుకోకుండా చెప్తోంది పాప. ఆ మాటలు వింటూ పాప మొఖంలోకి చూసింది అమ్మ. అలసటతో, అంతకంటే ఎక్కువ సంతోషంతో ఎరుపెక్కిన పాప బుగ్గలను ముద్దు పెట్టుకుంది.

అమ్మ బుగ్గలను తన చిట్టి చేతుల్లోకి తీసుకుని అంది పాప, “అమ్మా, నా ఫ్రెండ్స్ కు ఏదో రీజన్ వుంది. ఐ రెస్పెక్ట్ దైర్ రీజన్. నేను అలా అనుకోగానే హ్యాపీగా అనిపించింది. అందుకే ప్లే ఏరియాలో మిగతా ఫ్రెండ్స్ తో అంత బాగా ఆడుకున్నా.”

తనను బాధ పెట్టిన స్నేహితులను ఆటల్లో పడి మర్చిపొయ్యిందని అనుకుంది అమ్మ. ఒక గుంపు స్నేహితులను మరో గుంపు స్నేహితులతో రిప్లేస్ చేస్తున్నట్లు కాక ఆటల్లో పడకముందే పాప తన మనసును సర్దుకుంది. అప్పుడు ఇంకా సంతోషంగా ఆడుకోగలిగిందని అర్థం అయ్యింది అమ్మకు.

అప్పుడే గరాజ్ నుంచి ఇంటి బయటకు వచ్చినట్లున్నారు పక్కింటి పిల్లలు. ఇంటి ముందు కేకలు ఎక్కువయ్యాయి. నైట్ డ్రెస్ ను సర్దుకుంటూనే కిటికీ దగ్గరికి పరిగెత్తి ‘హాయ్’ అని అరిచింది పాప.

“హాయ్, ఆడుకుందాం రా!!” వాళ్ళూ గోల గోలగా ఆహ్వానించారు పాపను.

“ఇప్పుడే స్నానం చేసేసా. మీరు ఆడుకుంటుంటే చూస్తా.” అంటూ లాన్ చైర్ ను గరాజ్ నుంచి బయటకు లాక్కెళ్లింది పాప.

 

*

ఆరోజు రాత్రి నిద్రలో ఆటల కలలొచ్చి ఉలిక్కిపడుతూ సర్దుకుంటున్న చిన్నారి మొఖంలో చెరగని చిరునవ్వును చూస్తూ గడిపింది అమ్మ. ఎన్నో రోజుల తరువాత ప్రశాంతత అమ్మలో.

*

ఎంతటి వెర్రివాడవు!

       
– మమత కొడిదెల                                   

 

ఎక్కడిదిరా అంత ఆశ నీకు…
మేమంతా…

 

గాలి తెమ్మెరలో మెత్తగా ఊగే పసుపుపచ్చ పూల కాడల్లో
గగనాన తేలిపోతూ క్షణక్షణానికి విచ్చిపోతున్న తడి కలల్లో
చెట్టు చిటారుకొమ్మన పసి ఆకునొకదాన్ని హత్తుకున్న నీటిబిందువుల్లో
పిచ్చుక నల్లరెక్కలమీది ఏడురంగుల మెరుపుల్లో
చిక్కుకున్న ప్రణయగాథల్ని విప్పుకుంటున్న వాళ్లం

 

నకిలీ దర్పాలకు ధగధగలనద్దే రంగు రాళ్లల్లో

తాజా ఎర్ర గులాబీ గుత్తుల మధ్య నలిగిన రేకుల్లో
ఆకాశమంత పరిచిన పందిళ్లలో
ఇద్దరం ఒకటయ్యామని ప్రపంచం వీపున చరిచి మరీ చెప్పుకుంటున్న వాళ్లం

 

మంచుకొండల్ని కరిగించి ఉప్పొంగించిన సముద్రాల్లో
నదీనదాల్నీ మరిగించి పండించిన నిలువెత్తు ఇసుక తిన్నెల్లో
మూలనకా గోడనకా అందంగా నిండిన ఇరుకు బతుకుల్లో
మా దేవుళ్ల రక్షణకు వీరతిలకం దిద్దుకుంటున్నవాళ్లం

 

చేతులెత్తేసిన నీ బిత్తర చూపుల్లోని మురికి కన్నీళ్లలో
అందాన్ని వెతుక్కుంటున్న వాళ్లం

 

గుండె ఘోషను వంటినిండా నింపుకుని అలల్లో అలవై
ఉబ్బిపోయిన నిన్ను పద్యాన్ని చేసుకుంటున్నవాళ్లం

 

ఆకలిదప్పులను మరిపించి
బాంబుల వర్షం దాటి
కత్తిమొనకు నీ నాన్నను అర్పించి
సముద్రాన్నే జయించబోయావు
నిన్నందుకుంటామని ఆశ పడ్డావు కదూ

 

ఆవలితీరాన మేం కాక ఇంకెవరుంటారని చెప్పిందిరా నాన్నా, నీ వెర్రితల్లి?

(అయిలన్ కుర్దీ లాంటి పసిపిల్లలకు, దుఃఖంతో…)

 

బరువు???

 

 

Mamata K.

మమత కొడిదెల 

 

కాళ్ళకు చక్రాలు తొడుక్కున్నట్లు బాల్కనీలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది ప్రీతి. ఆమె నడక చూసి చెప్పొచ్చు తన మనఃస్థితి ఎలా వుందో.

బాల్కనీలో ఒక పక్కగా పేము కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తోంది కరుణ. అరగంట ఓర్చుకుని అంది, “అబ్బబ్బా, ఇక చాల్లే. నీ నడక చూస్తుంటే నాకు తల తిరుగుతోంది. కూర్చో ఇక. లేకపోతే ఒక దగ్గర నిలబడి నీ ఇష్టం వచ్చినంత కోప్పడుకో.”

“అంత కష్టంగా వుంటే నావైపు చిద్విలాసంగా చూస్తూ కూర్చోక ఆ పుస్తకం చదువుకోరాదూ.” గయ్యిమంది ప్రీతి.

“అనుకుంటూనే వున్నా. అత్త మీద కోపం దుత్త మీద పడుతుందని.”నవ్వింది కరుణ, “సరే, ఇంకో ఐదు నిమిషాలు అలాగే నడుస్తుండు. మాంచి మసాలా టీ పట్టుకొస్తా.”

**

ప్రీతి, కరుణ జిగ్రీ దోస్తులు. చదువుకోవడానికి అమెరికా వచ్చిన కొద్దిరోజుల్లోనే పరిచయమయ్యి, భావాలు, మనస్తత్వాలు కలవడం వల్ల ప్రాణ స్నేహితులైపొయ్యారు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే తన ఆఫీసులోనే పరిచయమైన రాహుల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కరుణ. పెళ్లయిన కొత్తజంటను డిస్టర్బ్ చెయ్యొద్దనుకుని కాస్త దూరం జరిగింది ప్రీతి. ప్రీతి వేరే స్టేట్ లో ఉద్యోగం చూసుకోడంతో వారిమధ్య రాకపోకలు కూడా బాగా తగ్గిపొయ్యాయి. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు.

పెళ్లయిన ఏడాదికే కుటుంబ సమస్యలు మొదలై వాటిని స్నేహితురాలికి పంచకూడదనుకుని ఇంకా దూరం జరిగింది కరుణ. కరుణకు పాప పుట్టిన తరువాత  కుటుంబ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి వాటి ప్రభావం పాప మీద పడడం ఇష్టం లేక ఏడాది క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది.

కరుణ విడాకులు తీసుకున్న రెండో నెలలో ప్రీతి నుంచి హఠాత్తుగా ఫోన్. కరుణ వున్న ఊర్లోనే ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ప్రీతికి తన విడాకుల విషయం అప్పుడు చెప్పింది కరుణ. అంత పెద్ద సంగతి తనకు చెప్పలేదన్నదానికంటే స్నేహితురాలు తనలోకి తాను ఎంతలా ముడుచుకుపొయ్యిందో గ్రహించి ఎక్కువ బాధ పడ్డది ప్రీతి. తొందర్లోనే కరుణ వుంటున్న ఇంటి దగ్గరలోనే అపార్ట్మెంట్ కొనుక్కుంది.

తనకు సరైన జోడీ దొరకక ఇంకా పెళ్లి చేసుకోలేదు ప్రీతి.

కరుణ కాస్త కుదుట పడేదాకా తోడు వుందామని, పాప కాస్త పెద్దదయ్యేదాకా సహాయం చేద్దామని వచ్చారు ఆమె తల్లిదండ్రులు. ఆఫీసు పని తరువాత, పాప పనులు పూర్తయిన తరువాత రెండుమూడు రోజులకొకసారి ప్రీతి దగ్గర గడుపుతుంటుంది కరుణ.

 

**

ఈరోజు ప్రీతిలో ఎప్పుడో గాని బయటకు రాని అసహనాన్ని గమనించింది కరుణ. టీ చేస్తూ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది.

కరుణ అందించిన కప్పు అందుకుని, కమ్మని మసాలా టీ వాసన చూస్తూ ”మ్… టీ బాగానే చేసినట్టున్నావోయ్.” అని మెచ్చుకుంది ప్రీతి.

“షుక్రియా, షుక్రియా! వంట గదిలోకి వెళ్లి చాలా రోజులవుతోంది. టీ ఎలా పెట్టాలో గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.”  చిర్నవ్వుతో అంది కరుణ.

“నువ్వు చాలా లక్కీ… అమ్మనాన్న నీతోనే వుండగలుగుతున్నారు.”

“నేను, పాప ఇద్దరం లక్కీనే. వాళ్లు వచ్చినప్పట్నుండి పాపతో ఎక్కువసేపు గడపగలుగుతున్నాను.”

కాసేపు ఏవేవో మాట్లాడుకున్న తరువాత అడిగింది కరుణ, “ఇంతకీ నీ కోపానికి కారణమేంటే తిరుగేశ్వరీ?”

“ఏంటో ఈ మనుషులు. ఎప్పుడు మార్పొస్తుందో వీళ్ళలో.” అంటూ కుర్చీలోంచి లేవబోయింది ప్రీతి.

“అమ్మో, మళ్ళీ నడవబోతున్నావా?”

కరుణ జోక్ పట్టించుకోకుండా చప్టా దగ్గరికి వెళ్లి నిల్చుంది ప్రీతి, “చాలా చిరాగ్గా వుంది కరుణా.”

Kadha-Saranga-2-300x268

“ఓహ్. ఇక అడ్డు రాను. ఏమయిందో చెప్పురా.”

“ఒక పెళ్లి సంబంధం వచ్చిందని డిటైల్స్ చెప్పాడు నాన్న. అతను డివోర్సీ కానీ ఎలాంటి బాధ్యతలూ, బరువులూ లేవని చెప్పారట. అతను అమెరికాలోనే వుంటున్నాడని, ఒకసారి కలవమని ఒకటే గొడవ. అతనితో మాట్లాడినప్పుడు చాలా లిబరల్ మైండెడ్ గా  అనిపించాడట. అతను నా మనస్తత్వానికి సరిపోతాడని అమ్మ కూడా అంది.”

“రెండో పెళ్లి సంబంధమని కోపమా?” తన స్నేహితురాలిని ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు కరుణ.

నవ్వింది ప్రీతి, “నా గురించి నీకు బాగా తెలుసని గప్పాలు కొడుతుంటావు. ఈ విషయంలో నేను ఎట్టా ఆలోచిస్తానో నీకు తెలీదా?”

కరుణ కూడా నవ్వింది, “మరీ, నీ చిరాకుకి కారణమేమిటమ్మా? నువ్వు వద్దన్నా సంబంధాలు చూస్తున్నారనా? నువ్వు పెళ్లి చేసుకోకూడదనేం అనుకోలేదు కదా. నీకిష్టమైన వాళ్ళేవరన్నా వుంటే చెప్పమన్నారు కదా అమ్మ నాన్న. ఏదో సంబంధం వచ్చిందని చెప్పారు. ఒకసారి కలిసి …”

“అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. బరువు, బాధ్యతల్లేవు అంటే ఏంటి?” గొంతు పెంచి కరుణ మాటకు అడ్డొచ్చింది ప్రీతి.

“అమ్మా నాన్నల్లేని ఒంటరివాడేమో. మనోవర్తిలాంటి బాధ్యతల్లేవేమో. అప్పులేం లేవేమో.”

“ఎందుకో నాన్న ఆ మాట చెప్పినప్పుడు అంత సింపుల్గా అనిపించలేదు. ఆ పదాలు నచ్చలేదు నాకు.”

“అతను వివరించిన పరిస్థితులను నాన్న ఇలా కొద్ది మాటల్లో కుదించి నీకు చెప్పి వుండొచ్చు కదా. నీకు వేరే

ఆలోచన వుంటే నీ ఇష్టం. కానీ కేవలం ఆ పదాల ఆధారంతో ఒక నిర్ణయానికి రావొద్దు. ఒకసారి మాట్లాడి చూడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?”

“హ్మ్, ఇంకొంచెం ఆలోచిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే వుండరాదూ?”

“నాకు బాగా పని వున్నప్పుడు పాప అమ్మ దగ్గర పడుకుంటుంది కానీ మధ్య రాత్రి లేచి ఏడిస్తే అమ్మ పట్టుకోలేదు. పాప లేకుండా నాక్కూడా సరిగ్గా నిద్ర రాదు. ఇంకో రెండేళ్ళు పోనీ, అప్పటికీ నీకు పెళ్లి కాకపోతే బయటెక్కడికైనా ఒక రోడ్ ట్రిప్ వేసుకుందాం.. జస్ట్ మనిద్దరమే.”

“అప్పట్లోగా నీ పెళ్ళయిపోతే?” కన్ను గీటి అంది ప్రీతి.

కరుణ ఏమీ మాట్లాడకుండా టీ కప్పు పక్కన పెట్టి చిరునవ్వుతో ప్రీతి వైపు చూసింది. ఆ నవ్వులోని అంతర్యం ప్రీతికి తెలుసు.

“ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నా నీకు. ఇక నేను అనుకున్నది చెప్పాల్సిందే. అటువైపు కాస్త ఆలోచించు కరుణ. ఒక పెళ్లి వీగిపోయిందని సన్యాసిలా బతకక్కర్లేదు.”

“సన్యాసమా? హన్నన్నా! ఎన్ని కోరికలో పాపకూ, నాకూ. అన్నీ తీర్చేసుకుంటాం కూడా. ఇప్పుడు మాకు బోల్డంత ప్రేమ కావాలి. మేమిచ్చె బోల్డంత ప్రేమను తీసుకునే వాళ్లు కావాలి. అందులో నో కాంప్రోమైజ్, నో అడ్జస్ట్ మెంట్స్. మా చిన్ని ప్రపంచాన్ని తన ప్రపంచం అనుకునే వ్యక్తి నాకు తారసపడలేదింతవరకూ. అలాంటి వాడు తారసపడినప్పుడు పో, పోవోయ్ అని అనను సరేనా.” నవ్వుతూ అన్నది కరుణ.

“అవునూ, ఈ మధ్య ఒకరోజు అంకుల్ నాతో మాట్లాడుతూ బంధువెవరో సంబంధం తెచ్చారని అన్నారు. ఏమన్నా తెలిసిందా దాని గురించి?”

నవ్వింది కరుణ,”నాకు ఇంకా వివరాలు తెలీవు. అహంకారంతో డివోర్స్ తీసుకున్నానని, సర్దుకుపోవాల్సిందని ఆన్నారట ఒక దగ్గరి బంధువు నాన్నతో. ఎన్ని మాటలు పడి, నలుగురి మధ్య ఎంత ఒంటరితనం అనుభవించి, ఎంత క్షోభపడి ఈ నిర్ణయం తీసుకున్నానో వాళ్ళకేం తెలుసు? ఇంకొకరెవరో డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్నారట. అలా ఆలోచించేవాళ్లకు ఎలాంటి సంబంధాలు తెలుస్తాయంటావూ?”

“ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో?” కరుణ మాటను ఆమెకే అప్పగించింది ప్రీతి.

“ఇప్పుడు నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే ఎవరూ లేరు. నా సంగతి ఒదిలెయ్” హ్యాండ్ బ్యాగ్ అందుకుని బయటకు నడుస్తూ అంది కరుణ, “ సరే అమ్మాయ్, నేనిక నా చిట్టితల్లి దగ్గరికి వెళ్లాలి. అతనితో మాట్లాడిన తరువాత నాకు కాల్ చెయ్యి. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. నువ్వసలే వాగుడుకాయవు.”

“సరే, మాతాశ్రీ! గుడ్ నైట్!” నవ్వుతూ కరుణను సాగనంపింది ప్రీతి.

***

 

painting: Mandira Bhaduri

నాలుగు రోజుల తరువాత సాయంత్రం కరుణకు ఫోన్ చేసింది ప్రీతి అర్జంటుగా రమ్మని.

కరుణ వెళ్ళేసరికి వాడిన మొఖంతో, ఆఫీసుకు వేసుకెళ్లిన బట్టల్లోనే ఉంది ప్రీతి.

కరుణను తలుపు దగ్గరే పట్టుకుని, “అతన్ని కలిశాను. నేను చెప్పాను కదా తన మాటలు నచ్చలేదని. ఛ, అతన్ని కలవకపోయుంటే బాగుండేది.” కోపంగా గబగబా అంది ప్రీతి.

“ఆగాగు. ఎవరతను, ఎవరిని కలిసావు? ఏం మాట్లాడుతున్నావు? ఆఫీసులో ఏమైనా ..”

“ఆఫీసులో గొడవ కాదు తల్లీ. ప్రపంచమే భయంకరంగా వుంది.”

“ఒకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్…” ప్రీతిని కుర్చీలో కూర్చోబెడుతూ అంది కరుణ, “ఇప్పుడు మెల్లగా చెప్పు.”

“పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా. అతను ఆఫీస్ పని వుండి కాలిఫోర్నియా నుంచి న్యూ జెర్సీ వచ్చాడట. పొద్దున్నే కాల్ చేసి అడిగాడు కలవడానికి వీలవుతుందా అని. మాల్ లో కలిసాం. చాలా సేపు బాగానే గడిచింది. మొదట్లో వుమెన్ ఇష్యూస్ గురించి మాట్లాడాడు. తరువాత చెప్పాడు, మొదటి పెళ్లి పెద్దవాళ్ళు చేసిన బలవంతపు పెళ్లి అట. ఆ అమ్మాయి చాలా సాంప్రదాయకంగా వుంటుందట. ఆమె పేరు బాగోలేదని రమ్య అని పేరు మార్చాడట. ఇతనే దేవుడని ఫీల్ అయ్యేదట.  సొంత వ్యక్తిత్వం లేని మూర్ఖురాలని అన్నాడు. ఒక పాప పుట్టిన తరువాత ఆమె మరీ పిచ్చిదయ్యిందని, భరించలేక విడాకులిచ్చేశానని చెప్పాడు. ఇది జరిగి ఆర్నెళ్ళవుతోందట. వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని, వాళ్ళతో తనకెలాంటి కాంటాక్ట్ లేదని నాకు భరోసా ఇవ్వబొయ్యాడు. డివోర్సీనే కానీ బరువూ బాధ్యతల్లేవు అని పళ్ళికిలిస్తూ అన్నాడు.”

“అంత లిబరల్ వ్యూస్ ఉన్నవాడు, పెళ్ళికి ముందు ఆ అమ్మాయితో మాట్లాడలేదా అతను?”

“ఆ, ఆ … మాట్లాడాడట. పెళ్లి తరువాత మార్చుకోవచ్చనుకున్నాడట.” పళ్ళు కొరుకుతూ అంది ప్రీతి.

కరుణ ముఖం ఎర్రబడింది, “రాహుల్ తల్లిదండ్రులు నాగురించి సరిగ్గా ఇట్టాగే అనుకున్నారు.  నా గురించి, నా కలల గురించి విడమరచి చెప్పిన తరువాతే రాహుల్ నన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి తరువాత అవన్నీ మార్చుకోవచ్చని వాళ్లు అనుకున్నారట. అదీ ఇప్పుడు రాహుల్ ఉవాచ. వాళ్లు మాతోనే వుండే వాళ్లు కదా, మెల్లగా రాహుల్ కూడా వాళ్లలాగే తయరయ్యాడు. మారాడో అంతకు ముందు నుంచీ అంతేనో. నేను కూడా మారాను,. అన్నేళ్లు ఆ బురదలోనే పడి వుండేంతగా నన్ను నేను మర్చిపొయ్యాను. జీతం తెచ్చే పనిమనిషిలా …” కోపంతో గొంతు వణికి మాట్లాడలేకపొయ్యింది కరుణ.

ప్రీతి కరుణను కౌగిలించుకుని అన్నది, “ఎంత బాధ పడ్డావురా. అదంతా అయిపొయ్యింది. ఇప్పుడు చూడు, నువ్వక్కడ లేవు. నీ పాప కూడా లేదు ఆ బురదలో. అక్కడే దిగబడకుండా ధైర్యంగా బయటపడ్డావు. నువ్వు నా స్నేహితురాలివని చెప్పుకోవడానికే గర్వంగా వుంది.”

కరుణ కాస్త తెప్పరిల్లి అడిగింది, “ఇంతకీ, రమ్యకు కనీసం సరైన అధారమైనా కల్పించాడా ఇతను?”

“ఆ అమ్మాయి తన కిచ్చిన కట్నం తిరిగి ఇచ్చేశాడట. దానితో తన బాధ్యతలు తీరిపొయ్యాయట. ఆమే పాపను కూడా తీసుకెళ్లినందుకు తనకు పాప బరువులేం లేవట … గొప్పగా చెప్పాడు.”

“వీర లిబరల్, కట్నం కూడా తీసుకున్నాడా?” నోరెళ్ళబెట్టింది కరుణ.

“అదే అడిగితే, ఓ వెర్రి నవ్వు విసిరాడు. పెద్దవాళ్ళు తనకు తెలీకుండా జరుపుకున్నారట ఆ తంతులన్నీ.”

“హ్మ్ … ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్. కానీ ఇట్లాంటి విషయాల్లో గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఆదర్వైజ్..”

“నన్ను బాధ పెట్టింది అది కూడా కాదు కరుణా. ఆ బరువు బాధ్యతా అనే పదాలు ఇతను చాలా తేలికగా ఉపయోగించాడు. మరో పెళ్లి కూడా అలోచించలేనంత వెనకబడ్డ మనస్తత్వమండీ వాళ్ళది అని అన్నాడు.  ఆ అమ్మాయి గురించి అంతా తెలిసే చేసుకున్నాడు. పెళ్ళికీ పాప పుట్టడానికీ చాలానే గ్యాప్ వుంది. పాప పుట్టిన తరువాత వెలిగింది వీడికి ఆమె బ్యాక్వర్డ్ అని. ఇప్పుడు ఆ పాపను బరువు అంటున్నాడు, ఆ బరువు తనకిక లేదంటున్నాడు. ఆమెకు ఏమైనా అయితే, ఏమీ కాకపోయినా సరిగా చూసుకోలేకపోతే ఆ పాప జీవితం ఎలా వుంటుంది? పాప పెద్దయి ఇలాంటి ప్రబుద్దుడి చేతిలో పడితే, అదొక విషియస్ సర్కిలే కదా. అతను చేసింది తప్పని చెప్పాను. వెంటనే వాళ్ళెక్కడున్నారో కనుక్కొని పాపను బరువుగా కాదు బాధ్యతగా తీసుకొమ్మని చెప్పాను. నేనలా మాట్లాడేసరికి వేరే పనుందంటూ పారిపొయ్యాడు.”

గుండె బరువెక్కి ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా కూర్చున్నారు.

నుదురు నొక్కుకుంటున్న ప్రీతిని చూసి, “సర్లే, నువ్వు ఫ్రెష్ అవుపో. నేను టీ పెడతాను” అంటూ కిచెన్ లోకి దారి తీసింది కరుణ.

“థ్యాంక్స్ అమ్మాయి. టీ బాగా పెట్టు. తల పేలిపోతోంది.” అంటూ బాత్రూంలోకి వెళ్లింది ప్రీతి.

ప్రీతి వచ్చేలోపు టీ తయారు చేసి కప్పుల్లో పోసి, బాల్కనీలో చైర్లు వేసింది కరుణ.

టీ కప్పు ప్రీతి చేతికి ఇస్తూ అంది కరుణ, “ఇప్పుడు నా టర్న్, నా కథ చెప్పడానికి.”

“అహ్హా! ఎనీథింగ్ ఇంటరెస్టింగ్?” కన్ను గీటి అడిగింది ప్రీతి.

“ఇంటరెస్టింగే. ఒకతను ఈ-మెయిల్ చేశాడు. నాన్న మొన్న చెప్పాడు కాదా? అతను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక్క కండీషన్ అట.” పంటి బిగువున నవ్వు దాస్తూ అంది కరుణ.

“ఓహ్. ఒక్కటేనా? ఏమిటో అది.”

“ఊహించు చూద్దాం.”

“కట్నం కావాలన్నాడా?” కన్నెర్ర జేస్తూ అంది ప్రీతి.

“అహహ, పని చేస్తున్నాను కదా అందుకని కట్నం అక్కర్లేదట. చాలా క్లారిటీతో ఉన్నాడు.”

“వాడి క్లారిటీ తగలెయ్య!”

“దానికే తిట్లదండకం మొదలెట్టావూ…”

“ఓహ్, మరింకేంటో చెప్పు త్వరగా.”

నిట్టూర్పు విడిచి చెప్పింది కరుణ, “పాప నాదగ్గర వుండకూడదట. పాపను పాప నాన్నకు పూర్తిగా ఇచ్చెయ్యాలట. లేకపోతే మా అమ్మనాన్నలకో, అదీ లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చెయ్యాలట. పాపను అమ్మానాన్నలు పెంచితే నేను డబ్బు సర్దుతానా అని ఒక ప్రశ్న కూడా యాడ్ చేశాడు.”

“….” దిగ్బ్రాంతితో చూస్తుండిపొయ్యింది ప్రీతి.

“ఎగ్జాక్ట్లీ. నా మైండ్ బ్లాంక్ అయింది ఆ ఈ-మెయిల్ చదివినప్పుడు. “పిల్లలంటే ప్రాణంలేని వస్తువులు కాదు. పిల్లలను ప్రేమించి చూడండి ఎంత ఆనందంగా వుంటుందో మీకే తెలుస్తుంది. మీరు చాలా ఎదగాల్సి వుంది.”

అని రిప్లై ఇచ్చాను. కానీ….పిల్లలను బరువు అనుకునే ట్రెండ్ నడుస్తున్నట్లుంది. మొన్నామధ్య ఒక అమెరికన్ తెలుగు పత్రిక చూశాను. అందులోని క్లాసిఫైడ్ చూస్తే ఒక డివోర్సీ అమ్మాయి ప్రొఫైల్ లో ‘డివోర్సీ విత్ నొ ఇన్ కంబ్రెన్స్’ అని వుంది.”

“అబ్బా కరుణా, ఏమిటీ మనుషులు? ప్రకృతి చేసిన పెద్ద తప్పు ఇదే. శక్తివంతమైన మెదడుని తను సృష్టించిన ప్రాణులన్నింటిలో అతి హీనమైన ప్రాణికి ప్రసాదించింది. ఎంత మార్పు రావాలి మనుషుల్లో.”

కాసేపు మౌనంగా కూర్చున్న తరువాత, తల విదిల్చి కంప్యూటర్ ఓపెన్ చేసింది ప్రీతి, “రా కరుణ. ఓ రెండు ఈ-మెయిల్స్ చేద్దాం. ఒకటి నా స్నేహితురాలు రాధకు. తను ఒక  మహిళా సంస్థలో లాయరుగా పని చేస్తోంది. రమ్య గురించి చెప్పి, డైవోర్స్ కేసు తిరగదోడి ఆమెకు మనోవర్తి ఇప్పించొచ్చేమో చూడాలి. అలాగే, ఆమె పాపకు కూడా చైల్డ్ సపోర్ట్ వచ్చేట్టు చూడమని చెప్పాలి. ఇంకో ఈ-మెయిల్ మా నాన్నకు. తనకున్న ఫ్రెండ్ సర్కిల్నంతా ఉపయోగించి రమ్య ఎక్కడుందో కనుక్కోమని చెప్పాలి. కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. మనకు తెలీనివెన్నో జరిగిపోతుంటాయి, కనీసం మన ఎరికలోకి వచ్చిన వాటినైనా పట్టించుకోవాలి కదా?”

ప్రీతిని  కౌగిలించుకుని, “నువ్వు భలే పిల్లవి ప్రీతి.” అని అరిచింది కరుణ. “ఎంత దిగులుగా వచ్చాను నీ దగ్గరికి. ఇంతేనా మనుషులు అనుకుంటూ, నా పాప గురించి, తన లాంటి పాపాయి గురించి దిగులు పడుతూ వచ్చాను…. ”

*