శ్రీమంతుడు

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ఎర్ర పూల గౌను

 

 

                     -మన్నె ఏలియా

~

      డ్రెస్సింగ్ టేబుల్ నిలువుటద్దం  ముందు నిల్చొని  తన రెండు జడలను వింతగా చూసుకొంటుంది . తలను కుడి ఎడమలకు తిప్పి  జడలను   చూసుకొంది .  జడలకు కట్టిన తెల్లని రిబ్బన్లు ఫ్యాన్ గాలికి రెపరెప లాడుతున్నాయి . తలను పైకి కిందికి కదిలించినప్పుడు రిబ్బన్ల విన్యాసం చూసి సంబరపడిపోతోంది. రెండు చేతులతో జడలను  పైకెత్తి పట్టుకొని సంతోషంతో గంతులేస్తుంది . తైల సంస్కారం లేక ఎండిపోయిన గడ్డిపోసల్లాంటి వెంట్రుకలు తలమీద నాట్యం చేస్తున్నాయి .  వేళ్ళతో దువ్వుకొంది . అరచేతితో అదిమి పట్టిచూసింది . చేయి తీయగానే ఎప్పటిలాగానే లేచి నిల్చున్నాయి . కొన్ని ఎగిరి నొసటి  మీద పడుతున్నాయి . చింపిరి జుట్టుకు నూనె రాసుకుందామనుకుంది . ఏదో అలోచించి విరమించుకొంది . అద్దం ముందు నుండి కదలాలనిపించడంలేదు. ఇదే మొదటి సారికావడంతో ఎన్నడు పొందని అనుభూతితో  అద్దంలో చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది  .

పాలపిట్ట రంగు గౌను మీదున్న ఎర్రని పువ్వులను, చిన్న చిన్న ఆకులను , లేత మొగ్గలను తడిమి చూసుకుంది .  బర్తడే గౌనది . పుట్టిన రోజు నాడు  కొత్తబట్టలేసుకొనే వాళ్ళను చూసినప్పుడల్లా , తనకు పుట్టిన రోజు లేదేమో అనుకునేది . ఎన్నడు రాని పుట్టినరోజు కోసం  ఇన్ని రోజులుగా  ఎదిరి చూసింది .

రోజు తిట్లతో , అరుపులతో , కేకలతో దద్దరిల్లే ఇల్లు  ఇప్పుడు ప్రశాంతంగా , నిశబ్దంగా  ఉండడంతో…

నిన్న రాత్రి తనే ఉతికి తీగ మీద ఆరేసిన  గౌను దగ్గరికెళ్ళి నిల్చుంది . అటు ఇటు చూసి చేతితితో తాకింది . పూర్తిగా  తడి ఆరలేదు . సబ్బు వాసన వస్తోంది . అక్కడక్కడ కుచ్చుల మడతలు , తేమగా ఉన్నాయి .  అయిన వేసుకోవాలనే కోరిక ఆపుకోలేక , మళ్ళి అవకాశం వస్తుందో లేదోనని  తెచ్చి వేసుకొంది . వొంటికి చల్లగా తగులుతోంది . పండుగనాడు కొత్త బట్టలేసుకొన్నంత ఉత్సాహంగా ఉంది . నడుము తిప్పి వెనుకకు ముందుకు తిరుగుతూ చూసుకొని ముర్సిపోతుంది . రోజు  పొడవైన లూజ్ లూజ్  గౌన్లేసుకోవడం వాళ్ళ , ఈ గౌను పొట్టిగుందనిపించింది . కాని బాగా నచ్చింది .

మధ్యమధ్య  కిటికి గుండా వాకిలిగేటు వైపు చూస్తుంది .    డ్రెస్సింగ్ టేబుల్ డ్రా తెర్చింది . పౌడర్ డబ్బా తీసి పౌడర్ చేతులతో ముఖంకు రుద్దుకుంది . తెల్లగా మెరుస్తుంటే గమ్మతనిపించింది . “ హీ… హీ ”  అని తనను తనే వెక్కిరించుకుంది . ముఖం బోసిపోయినట్టన్పిచ్చి నొసలు తడిమి చూసుకొంది . అటు ఇటు  చూసింది బొట్టు బిళ్ళలు కనిపించలేదు . “ పోనిలే ” అనుకుంది .

ముందుకు  వెనకకు నడచుకుంటూ కన్నార్పకుండా అద్దంలో  చూసుకుంటుంది . ఈ సామ్రాజ్యానికి నేనే వారసురాలినన్నంత ధీమగానిపించింది గౌను వేసుకొన్నందుకు . సాక్సు , బూట్లు కూడా వేసుకోవాలనిపించింది . కాని అప్పటికే సమయ మెక్కువైంది . తొందర తొందరగ విప్పేయడం కష్టమని వేసుకోలేదు . ఇంకెపుడైన వేసుకుందామనుకొంది .  ఇక గౌను విప్పేద్దామనుకుంది కాని మనసొప్పడం లేదు   .  మళ్ళి కిటికి వైపు చూసింది . ఇంకొద్ది సేపాగి విప్పేద్దామనుకొని  మళ్లోసారి అద్దంలో చూసుకుంది .   కాళ్ళను చూసుకుంది. కాళ్ళకు గజ్జెలు పెట్టుకోవాలనే  కోరిక మిగిలిపోయింది .

తలవంచి కిందకి చూసింది .  మైలబట్టి , అక్కడక్కడ చినిగిపోయి రంగు వెలసిన పొడవైన గౌను కుప్పగా పడేసి ఉంది . ‘ నాకు నువ్వద్దు పో ’ అన్నట్టు ! కాళ్ళతో కసపిస తొక్కి , ఎడమ కాలితో  పక్కకు నెట్టెసింది ఎనిమిదేండ్ల లక్ష్మి .                     *****

బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది .  కిటికిలకెళ్ళి చూసింది . గుండె జల్లుమంది . గబగబా  రెండు చేతులతో  రిబ్బన్లను లాగేసింది . జడలను విప్పేసి ఎప్పటిలాగానే వెంట్రుకలని వదిలేసింది . గౌనుతో పౌడర్ తుడ్చేసుకుంది .  హమ్మయ్య ! బతికిపోయాననుకుంది . ఇదంత క్షణాల్లో జరిగిపోయింది. తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది  . “ అమ్మగారు వస్తున్నానండి ”  అంటూ వెళ్లి తలుపు తెరచి పక్కకు  నిల్చుంది .  పట్టు చీరెలో గుడికెల్లోస్తున్న శైలజ చేతిలో  స్టీలు బుట్టలో  సగం పగలగొట్టిన కొబ్బరికాయుంది. “ ఏమిచేస్తున్నవే…జల్ది తలుపు తెరుస్తలేవు? ’’  అని కండ్లు పెద్దవి చేసి ప్రశ్నించింది .  “ ఏమి లేదమ్మగారు ” అంది .  లక్ష్మిని చూసిన శైలజ కండ్లు ఎర్రని నిప్పులై భగ్గున మండిపోయాయి . బుట్ట పక్కన బెట్టింది . లక్ష్మి చెంపలు చెల్లుమన్నాయి . కరెంటు షాక్ తగిలినట్టు గిర్రున తిరిగి కింద పడింది లక్ష్మి .  చెంప ఎర్రగా  బూరేలాగా పొంగిపోయింది . చేతి అచ్చులు స్పష్టంగా  కనిపిస్తున్నాయి . చీర కొంగు విసురుగా బొడ్లో దోపుకొని వంగి లక్ష్మి వెంట్రుకలు పట్టి లేపి , ఇంకో చెంప చెల్లు మనిపించింది .  “ ఏమే దరిద్రపు ముండ ! ఎక్కడి పనులు అక్కడే వదిలేసి , సోకులు పడ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? … నా బిడ్డ గౌనేసుకుంటావా?. ఎవని దగ్గరికి పోయి కులుకుదామనే .. ఈ సోకులు .  బద్మాష్ ముండా ఎవడేసుకోమన్నాడే ? నీ అయ్యేసుకోమ్మన్నాడే ? ….నీ అవ్వ కొన్నదనుకున్నవా ?.. దొంగ ముండా !అది నేనుకొన్న”     గయ్యి మని ఒంటి కాలుమీద లేచింది .  లక్ష్మి ఎండుటాకుల కంపించి గజగజ వణుకుతుంది . నోట మాట లేదు ఏడ్పు తప్ప.  రెండు చేతులు జోడించి,  “ అమ్మగారు తప్పయిపోయింది . గౌనిప్పేస్తాను కొట్టకండి . ఇంకెపుడేసుకోను . నీ కాళ్ళు మొక్కుతా !”  అని కాళ్ళు పట్టుకొంది . “ నువ్వేసుకున్నది మల్ల నా బిడ్డెట్లేసుకుంటదే ” అని   కాలుతో కెక్కున తన్నింది , సోలిపోయి లక్ష్మి  తల గోడకు బలంగా  తాకింది .  “ అమ్మా …!  అమ్మా…! ”    కండ్లు నులుముకుంటూ దీనంగా  ఏడుస్తుంది .  “ నోర్  ముయ్..! అవాజ్ బయటకు రావద్దు . అమ్మట అమ్మా! ఎవ్వతే నీకు అమ్మ! నాకు పుట్టినవా? ’’   పండ్లు పట పట కొరుకుతూ అరుస్తుంది   .   బలవంతంగా రెండు చేతులతో  నోరు మూసుకోని వెక్కి వెక్కి ఏడుస్తోంది  లక్ష్మి .  “  అమ్మ కావాల్నా ? పోవే పో… నీ అమ్మ పోయినకాడికే పో . అది సచ్చి నా గండానికి నిన్ను అంటగట్టి పోయింది . నువ్వు నాకెన్నేండ్ల  శనో …  నువ్వుగూడ దాని దగ్గరికే పో ..  పీడా… బోతది ”  ఆవేశంగా తిడ్తోంది .  ఏడ్పు ఎంత  దూరం వినిపించిన , శైలజ నోటికి భయపడి ఎవరు ఇటువైపు తొంగి  చూడలేదు, చూడరు  కూడా.

************

ఇంటిముందు   కారు పార్క్ చేస్తుంటే కనిపించిన  పక్కింటాయనను పలకరించి , కూతురు ప్రిన్సి చేయి పట్టుకొని లోపలికి వచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !  ”  అలవాటు ప్రకారం అడ్గిండు . “ దాన్నే అడ్గు …నంగ నాచి ఏడ్పులు …. సుట్టుపక్కలొల్లు విని  నేనేదో సచ్చెటట్టు కొడ్తున్నాననుకోవాలని…. ”  అంటూ కండ్లు చిట్లించుకొని   వంటగదిలోకి వెళ్ళింది శైలజ . ఒక్కసారి లక్ష్మిని జాలిగా చూసి బాత్రూమ్ లోకి వెళ్ళిండు . ప్రిన్సి టీవీ ఆన్  చేసుకొని ఛిప్స్ తినుకుంటూ సోఫాలో కూర్చొని కార్టున్ చానల్ చూస్తుంది ఇదేమి కొత్తది కాదు కాబట్టి .

గోడకు ఆనుకోని  కండ్లు మూసుకొన్న విజయ్ కు గతం గుర్తొచ్చి , మూసిన కనురెప్పల సంధుల్లోంచి  నీళ్ళ ధారలు ఉభికివస్తున్నాయి  .

లక్ష్మి ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు .  లక్ష్మి తాత మిలటరిలో  పనిచేసేవాడు . గీత ఏకైక పుత్రిక  .  పెద్ద కండ్లు , సన్నని ముక్కు , గుండ్రని ముఖం , గులాబిరంగు పెదాలు , ఆకర్షనీయమైన నవ్వు  .  తెల్లగా పొడుగ్గా అందంగా ఉండేది . మొఖంలో లక్ష్మికళ ఉట్టిపడేది . మగపిల్లలు లేనికారణంగా  ఉద్యోగం లేని విజయ్ ను ఇల్లరికం తెచ్చుకున్నారు . విజయ్ చామనచాయ ఎత్తుకు తగ్గ బరువు . వీళ్ళ ఈడు జోడు చూడ ముచ్చటగా ఉండేది .

పెళ్ళైన రెండేండ్లకు లక్ష్మి పుట్టింది .  దురదృష్టం వెంటాడడం మొదలు పెట్టింది . లక్ష్మిని ఈ భూమి మీద పడేసి ధనుర్వాతంతో కన్నుమూసింది గీత . అచ్చం గీత నోట్లోంచి ఊడిపడ్డట్టుంది లక్ష్మి . అదే రంగు అదే రూపం  .  కాని  విజయ్ జీవితంలో చీకటి అలుముకుంది . గీత అమ్మనాన్న పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిండ్రు .  గీత పోయిన దుఃఖం నుండి కోలుకోకముందే, కార్గిల్ యుద్ధం కారణంగా అందరి సెలవులు రద్దు చేయబడడంతో  లక్ష్మి తాత యుద్దంలోపాల్గొని , భీకర పోరులో  అమరుడైనాడు .  చిన్నారి లక్ష్మిఆలనా పాలన  అంత అమ్మమ్మే .                            ఏడ్చి ఏడ్చి మంచం పట్టిన లక్ష్మి అమ్మమ్మ గుండే ఒకనాటి దుర్ముహుర్తాన ఆగి పోయింది .  పసిగుడ్డు లక్ష్మి పాలు లేక, తల్లి తోడులేక చూసుకొనే వాళ్ళు లేక, తల్లడిల్లి  గుక్కపట్టి ఏడుస్తోంది . గూడు చెదరిన పక్షయ్యింది .  వొంటరి వాడైన విజయ్ ఎటు చూసిన అయోమయం .

*******

అదే కాలనీలో నివాసముండే శైలజ నల్లగుండడం వల్ల పెళ్లి సంబంధాలు రాకనో ,  వచ్చినవి నచ్చకనో ఇంటి మీదనే ఉండిపోయింది .  శైలజ మేనమామ విజయ్ కు పాత  పరిచయం  , ఒకటే కులం  కావడం వల్ల ఆ చనువుతో లక్ష్మిని చూసుకొంటుందని విజయ్ ను ఒప్పించి శైలజ నిచ్చి పెళ్లి చేసారు . అసలు కారణం విజయ్ మామ మిలటరీ లో చనిపోవడంతో , విజయ్ కు  ఉద్యోగం వచ్చింది .   వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కొన్నాడు .

రెండు సంవత్సరాలకు ప్రిన్సి పుట్టింది . ప్రిన్సి నల్లగా పుట్టడం ,లక్ష్మిలాగ అందంగా లేకపోవడంతో ఎప్పుడు బాధ పడుతుండేది శైలజ . అప్పటి వరకు లక్ష్మిని చూసుకొనే శైలజ లో శాడిజం మొదలైంది . ఈ ఆస్తి అంత నా ప్రిన్సీకే  చెందాలని పోరు పెట్టేది శైలజ .                             ******

కాల చక్రంలో ఎనిమిదేండ్లు గడ్చి పోయాయి .  ఎనిమిదేండ్ల లక్ష్మి జీవితంలో కొత్తబట్టలు వేసుకొందంటే ప్రిన్సి పుట్టనంత వరకే . ఆ తర్వాత శైలజ వాళ్ళ అక్క పిల్లలవి  కలర్ వెలిసిపోయి , చినిగినవి , పొట్టిగైనవే లక్ష్మివేసుకునేది . ప్రేమ , ఆప్యాయత, భద్రతా అన్ని  కరువే . ప్రిన్సిని  స్కూల్లో చేర్చేటప్పుడు  లక్ష్మిని కూడా చేరుద్దామన్నందుకు ,“ ఇంట్లో పని నువ్వు చేస్తవా? నీ తాత చేస్తడా?  అదేమన్నా చదివి కలెక్టరైతదనుకుంటున్నవా ?  ఇంకోసారిగిట అన్నావనుకో దాన్ని నిన్ను  చంపేస్తా ” నని బెదిరించింది  శైలజ . నిస్సహయంగా చూడడం తప్ప నోరెత్తే దైర్యం లేదు . నోరు తెరిస్తే తన పరిస్తితేంటో బాగా తెల్సు విజయ్ కు.

****

అందరి కన్నా ముందే లేచి ఇంటి పని , వంటపని చేయడం , బట్టలుతకడం , గిన్నెలు తోమడం  . లక్ష్మితొ  పుట్టెడు చాకిరి చేయిస్తుంది సవతి తల్లి .  బానిసల కంటే అధ్వాన్నంగా, జీతంలేని పనిపిల్లలాగున్నది లక్ష్మి జీవితం .  ఇంత చేసిన రాత్రిమిగిలిన అన్నం పెట్టేది శైలజ . అలసి పోయి చెప్పిన పని చేయకపోతే  తన్నులతో పాటు ఆ రోజు తిండి కూడా పెట్టేది కాదు .  ప్రిన్సి  , లక్ష్మి ల మద్య రెండేండ్ల వయసు తేడ . కల్సి ఆడుకోవాలని ఉండేది  ,కానీ కలవనిచ్చేది కాదు  శైలజ .

ప్రొద్దుట ఆలస్యంగా లేచే  ప్రిన్సి కి  స్కూల్ కు వెళ్ళేటప్పుడు తొందర తొందరగా  సాక్సులు , బూట్లు తొడగడం . స్కూల్ బ్యాగ్ , లంచ్ బాక్స్ , నీళ్ళ సీస మోసుకెళ్ళి ఆటోలో పెట్టి రావడం , స్కూల్ నుండి వచ్చిన తర్వాత అవన్నీ  సర్దిపెట్టడం  కూడా లక్ష్మి పనే . ఏ కొంచెం తేడా వచ్చిన , కొద్దిగ  ఆలస్యమైనా వీపు చిట్లి పోవడం ఖాయం . ఆటో కనబడకుండా పోయేంతవరకు కండ్లల్ల నీళ్ళతో నిల్చొని చూడడం , ఇంట్లో నుండి కేక వినబడగానే  కండ్లు తుడ్చుకొని పరుగెత్తుకొని రావడం  రోజు జరిగేదే .

నూనె రాసుకొని , శుభ్రంగా తల దువ్వుకొని , యూనిఫాం వేసుకొని స్కూల్ కు వెళ్ళాలనుకొనేది  లక్ష్మి . కాని ఎవరున్నారు చెప్పుకోడానికి . వినే అమ్మే వినబడనంత దూరంగా కనబడకుండా ఈ రాక్షసుల చేతుల కప్పగించి వెళ్లిపోయింది .

ఇదంతా  గుర్తుచేసుకొంటున్న విజయ్ కండ్లల్ల నీళ్ళు  జలజల కారిపోతున్నాయి. తన చేతగాని తనానికి  తనకే సిగ్గనిపిస్తోంది .

****

“ ఏడ  సచ్చిండే దీనయ్యా ! ఒర్రి ఒర్రి నా నోరే  బద్నాం కావట్టే !  ఉలుకడు పలుకడు… దీని పీడా ఎన్నడు విరుగడ చేస్తాడో  రమ్మను ” . ఉగ్ర రూపమెత్తిన శైలజ ఘర్జించింది . ఉలిక్కిపడి  కండ్లు తెర్చాడు . కండ్లు తుడ్చుకొని మెల్లగా బయటకొచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !ఎక్కడో పేగు కాలుతున్న వాసనస్తోంది చూడు ’’.  అమాయకంగా అన్నాడు.  “ కాల్తుంది  పేగుకాదు , నా కడుపు మండుతుంది ”  చేతిలో అగ్గి పెట్టెతో వాకింట్ల నుండి ఇంట్లోకి వస్తూ, మింగేసేల చూస్తూ కోపంతో అన్నది శైలజ .

పొగ వాసన రావడంతో వాకిట్ల  కెళ్ళిండు .  వాకిట్ల  మంటల్లో తగలబడి పోతున్న గౌనును  చూస్తూ శిలాప్రతిమలా గడ్డకట్టి నిల్చుండి  పోయాడు .  కొద్ది  దూరంలో… రెండు చిట్టి  చేతులతో గుండెలను దాచుకొని ,  ఎముకలగూడుల నగ్నంగా ముడ్చుకొని కూర్చోన్న లక్ష్మి , గోడవైపు ముఖం పెట్టి  చప్పుడు వినబడకుండా  వెక్కి వెక్కి  ఏడుస్తున్నది  . తెల్లని   వీపు మీది నల్లగా కమిలిపోయిన వాతలు తండ్రిని   వెక్కిరిస్తూ , మౌనంగా ప్రశ్నిస్తున్నాయి ..

గాలికి మంట ఎక్కువైంది . ఆ మంటల్లో లక్ష్మి జీవితం శిథిలమై , దగ్దమై,  బూడిదైపోతున్నట్టనిపించింది తండ్రి విజయ్ కు .  ఏ కన్నీళ్లు ఆర్పలేని మంటలవి .

*