ఇవాళ ఇంట్లనె ఉన్నా
ఎవరైన హీనతిహీనం ఏ ఒక్కరైన
రాకపోతరా అన్న ఆశ ఇంకా కొంచెం పచ్చగనే
చేరేడుపైన కదులుతుంటె…
పెద్దర్వాజ రెక్కలు రెండు తరతరాల సంస్కారపు చేతులుగ
అలాయ్‌బలాయ్ జేసుకోను బార్లజాపి…
ఒకచోట నిలువనియ్యని కాలుగాలినపిల్లి మనసుకు
పళ్లెంనిండ పోసిన చల్లని పాలతో
దాని నాలుగుదిక్కులు కట్టేసి తెల్లనిచీకటి నిండామూసి ముంచి…
కిటికిఅద్దాల కనుపాపలకు ఆతురతజిగురుతో కనురెప్పలు రెండు అతికించి…
ఇవాళ ఇంట్లనె ఎదురుచూపై కంట్లెనె ఉన్న
* * *
ఇంటిముందర నాతోనె పుట్టి
నాకన్న ఉన్నతోన్నతమై పెరుగుతున్న చెట్టుగ..
దాని చాయల చాయగ తిరుగుతున్న కుక్కగ..
నిశ్శబ్దపు వన్నెవన్నెల నవ్వుల మొక్కగ..
కొంగొత్తరంగుల నద్దుతు పూల ఆనందాల రహస్యాలు శోధిస్తున్న సీతాకోకచిలుకగ..
ఆ మూలఅర్ర నులకమంచం నూతికంటి నీటిచెమ్మ అమ్మమ్మగ నన్న
ఇవాళ ఇంట్లనో.. కంట్లెనో.. అసలు నేనున్నన!?
* * *
ఔను..! ఉంట
నీకొరకు ఎదురుచూపుగ నీవుగ
పచ్చగ తరువుగ పక్షిగ పాటగ నవ్వుగ పువ్వుగ
వన్నెల సీతాకోక రెక్కగ అమ్మమ్మ కంటిచెమ్మగ..
నేన్నేనుగ కానుగని
ఇంకోగ ఉంట
ఇప్పటికైతె ఇట్ల..!
*
– మడిపల్లి రాజ్‌కుమార్
తాజా కామెంట్లు