వేరుపురుగు

Painting: Rafi Haque

Painting: Rafi Haque

 

“ఈలోకంలో ఎంత మంచోడైనా, ఎంత ఎదవైనా కూడ, అప్పుడప్పుడు నోరు మూసుకొని ఏమీ చేతకాని వాడిలాగ కూచోటం తప్పదు. యీ సినీ ఫీల్డ్ లో మరీ తప్పదు”  సుదీర్ఘంగా ఓ పెద్దగుక్క లాగించాక స్థిమితంగా అన్నాడు సీమనాయుడు. సీమనాయుడు అంటే కోనసీమ నాయుడు కాదు, రాయలసీమ నాయుడు. తేడా ఏమంటే యీ నాయుడు రాయలసీమ నాయుడైనా మాట్లాడేది కృష్ణా గుంటూరు జిల్లాల భాషే.  అదేమంటే, అతను పెరిగింది అక్కడే! డిగ్రీ దాకా చదివాడు గానీ, డిగ్రీ పూర్తి చెయ్యలేదు.  సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ‘బాయ్’ గా చేరి, సొంత డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టి తరవాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ‘లాభం’ వచ్చే సినిమాలే తీశాడు.  సొంతంగా కొన్ని, పార్ట్‌నర్‌షిప్ తో కొన్ని.

“అదేం?” అని అడిగాడు దాలినాయుడు.

దాలినాయుడుది శ్రీకాకుళం.  నిఖార్సైన మనిషి. మందు కూడా నిఖార్సైనదే తాగుతాడు, తాగిస్తాడు. సినిమాలంటే పిచ్చి. పేకాటంటే ప్రాణమే! బాగా వున్నవాడు గనక ఇస్త్రీ మడత ఏనాడు నలగలేదు.

“ఏం అంటే ఏం జెబుతాం?”  సిగరెట్టు వెలిగించాడు సీమనాయుడు.

“ఆస్కా.. అంటే ఆంధ్రా సోషల్ & కల్చరల్ అసోషియేషన్ . పేరుకి ఆస్కా అయినా అందరూ ఆంధ్రా  క్లబ్ అనే అంటారు, విజయ రాఘవ రోడ్, ఆంధ్రా క్లబ్ టి. నగర్ అంటే తెలీనోడు మద్రాసులోనే వుండడు. అక్కడ ఎలక్షన్లు జరిగితే జాతీయ ఎన్నికల్లానే జరుగుతాయి.

నేను మెంబర్ని కాదు, మెంబర్ని అయ్యేంత స్తోమత  నాకు లేదు. ఒక వేళ మెంబర్ షిప్పు ఇచ్చినా నేను చెయ్యగల పనేమీ లేదు. ఆ ‘వెజ్ ‘ ఫుడ్డు సూపర్ గా వుంటుంది. నాన్ వెజ్ సంగతి నాకు తెలీదు. చిట్టిగారెలు తినాలంటే అక్కడే తినాలి.  పుల్కాలు కూడా సూపర్ గా వుంటాయి. అప్పుడప్పుడు మిత్రులతో కలిసి అక్కడకి వెళ్తుంటాను.  ఆ మిత్రులు మెంబర్స్ గనక, ఓ గంటో,  రెండు గంటలో సరదాగా గడిపి వస్తుంటాను.

 

“మీరేంటి? ఒక గ్లాసుతోటే జన్మంతా గడిపేస్తారా?” చనువుగా అన్నాడు తిరగలినాయుడు. తిరగలినాయుడుది చిత్తూరు. ఇంతకు ముందు కూడా అతని గురించి చెప్పాను.

అటు నెల్లూరు ఇటు చిత్తూరు, ఆ పక్క హోసూరు వరకు తిరగలినాయుడి ఆవకాయ ‘సామగ్రి ‘ కి మంచి పేరుంది. ఫుల్ డిమాండ్. నన్ను క్లబుకి లాక్కొచ్చింది తిరగలినాయుడే.

“వింటున్నాగా… వింటూ.. వింటూ…” నవ్వేశాడు తిరగలినాయుడు.

“రచయితలుగా ఆ మాత్రం జాగ్రత్త వుండాల్లెండి” నవ్వాడు సీమనాయుడు.

“సరే అసలు సంగతి చెప్పనీవయ్యా ప్రొడ్యూసర్ నాయుడు” ఓ గ్లాసు ఎత్తి గటగటా తాగేసి అన్నాడు దాలినాయుడు.

“కుమార్ రాజాగాడి గురించే చెప్పేది. ఆడు ‘వేరు పురుగ ‘ ని మీకు తెల్సు.. నాకూ తెల్సు. కానీ తెలీంది ఆ వెర్రి అఖిలకి. అందుకే ఆడికి ‘చోటు ‘ ఇచ్చింది. బతుక్కే ‘చేటు ‘ తెచ్చుకుంది” మరో పెగ్గు తెప్పించుకుంటూ అన్నాడు సీమనాయుడు.

“అఖిల అంటే వదిన వేషాలు వేసేదీ. ఆవిడేనా? చాలా మంచిదనీ, ఎవరికీ లొంగదని విన్నానే?” ఆశ్చర్యంగా అన్నాడు దాలినాయుడు.

దాలినాయుడికి ‘ఆ పిచ్చి ‘ కాస్త జాస్తి.  సినిమాదైతే చాలు… మహదానందంగా ఖర్చు పెడతాడు.

“విన్న మాటే కాదు… ఉన్న మాటే! నేను తీసిన మూడు సినిమాల్లో అక్క, వదిన వేషాలు వేసినా ఏనాడు ‘లూజ్’ గా ప్రవర్తించలా. నిజం చెబితే నేను కాస్త ‘ఉబలాట’ పడ్డ మాట వాస్తవం. ఉహూ…ఎన్ని ఆశలు చూపినా నవ్వేసి,” మీరు పెద్దవారు, వృక్షం వంటివారు! మేము ఆ కొమ్మల మీద బతికే పిచ్చుకలం… మీరు చల్లగా వుండాలి” అని నా నోరు కట్టేసేది. నిట్టూర్చాడు సీమనాయుడు.

“మరి ఆ కుమార్ రాజాగాడికి ఎలా పడింది?” వెలిగించబోయే సిగరెట్టుని పక్కన పెట్టి అన్నాడు దాలినాయుడు.

“ఖర్మ ‘ అని దాన్నే అంటారు. ఎట్టా పరిచయం అయ్యాడో నాకు తెలీదు. గానీ పరిచయం అయ్యాడు. కేరాఫ్ అడ్రస్ లేని వాడికి అఖిల వుండే ఇల్లే కేరాఫ్ అయ్యింది. అఖిల కూతుర్ని యీడు బాగా పేంపర్ చేశాడని విన్నాను. తండ్రెవరో తెలీని పిల్లాయే. కుమార్ రాజుగాడు ‘నేనే నీ డాడీలాంటోడ్ని” అనేసరికి ఆ పిల్ల మురిసిపోయుండాలి. కూతుర్ని మంచి చేసుకొని అక్కడి నుంచి తల్లిని పట్టాడు. వయస్సులో కూడా యీడు ఐదారేళ్ళు  అఖిల కంటే పెద్దోడేగా. వెర్రి మొహంది నమ్మి మంచలోనే కాదు మంచం మీద కూడా చోటిచ్చింది. ఆ తరువాత వాడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూడమని పాపం అందరు ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని ప్రాధేయపడింది” విస్కీలో సోడా పోయిస్తూ అన్నాడు సీమనాయుడు.

“నిన్ను కూడా అడిగిందా?” ఉత్సాహంగా అన్నాడు దాలినాయుడు.

“బావా.. ఆకలి రుచి, నిద్ర సుఖమూ ఎరగనట్టే యీ ప్రేమ కూడా ఉచ్ఛనీచాలు ఎరగదురా! ఎవరి సంగతో ఎందుకూ, నేనూ లం… కొడుకునే. అందుకే అఖిల మానానికీ, కుమార్ రాజాగాడి సినిమా ఛాన్స్ కి ముడి పెట్టాను.” గటగటా తాగేసి అన్నాడు.

“ఏమందీ?” మహా కుతూహలంగా ముందుకు వంగి అన్నాడు దాలినాయుడు.

“ఏటి తిరగలి బావా? నీకేం నచ్చలేదా?” తిరగలినాయుడ్ని అడిగాడు దాలినాయుడు.

సినిమా వాళ్ళకో దురద వుంటుంది. ఏం చెప్పినా కాస్త సస్పెన్స్ జోడించి, స్క్రీన్ ప్లే తో చెబుతారు, ఎదుటి వారు గనక ఉత్సాహం చూపించకపోతే, క్షణంలో జావగారిపోతారు. సీమనాయుడేమీ దానికి ఎక్సెప్షన్  కాదు.

“ఎందుకు నచ్చదు? సీమ బావా.. నేనూ మనిషినే! మామూలుగా వున్నప్పటి సంగతి ఎలా వున్నా మందు కొట్టినప్పుడు మహా ఇంట్రష్టు పుట్టుకొస్తుంది… సినిమా కబుర్లంటే! అయితే నేను ఫీల్డ్ సంగతి తెలిసినోడ్ని కనక కథ ఏ ‘కంచి ‘ కి చేరుతుందో చెప్పేగల్ను. అయినా, అఖిల సంగతి నాకు ఇంతకు ముందు తెలీదు. కనక నువ్వు జబర్దస్త్ గా కథ చెప్పేయచ్చు” సిగరెట్టు వెలిగించి అన్నాడు తిరగలి నాయుడు. నాకు తెలిసినంతవరకు అఖిల సంగతి తిరగలినాయుడికి తెలీకుండా వుండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరివీ కొడంబాకం డైరెక్టర్స్ కాలనీ పక్కనున్న సందులో ఎదురుబదురు ఇళ్ళే!

“కథ ఏముందిలే!  పదేళ్ల పిల్ల వున్న ముఫ్పైయేళ్ళ అఖిల ముఫ్పై ఆరేళ్ళ కుమార్ రాజుగాడికి పడింది. మనిషి కొద్దోగొప్పో అందగాడు. దానికి మించి చదూకున్నాడు. ఒకటి మాత్రం నిజం బావా.. అఖిలలాంటి ఆడది దొరికినోడిదే నిజమైన అదృష్టం అంటే!” నిట్టూర్చాడు సీమనాయుడు.

‘ఎట్టా?” మరో పెగ్గు చప్పరించి అన్నాడు దాలినాయుడు.

మనిషి లోపల ఖచ్చితంగా మరో మనిషి వుంటాడు ఆ లోపలి మనిషే అసలైన మనిషి. అఖిల లోపలుండే అఖిల మామూల్ది కాదు. బావా… ఒక్కసారి  ఆ మనిషిలోని మనిషిని చూశాను. అప్పటి నుంచీ మరే మనిషి నా కంటికి ఆనలేదు. నిజం చెప్పొద్దు… నా అంత నికృష్టపు నా కొడుకు ఇంకోడు వుండడు. కానీ బావ అక్కడ మాత్రం నా తల ఎత్తలేను” ఫటాల్న గ్లాసెత్తి మొత్తం లాగించేశాడు సీమనాయుడు.

దాలినాయుడు తిరగలినాయుడు వంక చూశాడు. తిరగలినాయుడు చిన్నగా నవ్వి”బావా! మన బావ మందు మీద వుండి మాటలు కక్కుతున్నాడనుకోకు. సీమనాయుడు ఎంత తాగినా చీమతలంతైనా మాట దొర్లడు  “ అన్నాడు. సీమనాయుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే పార్టీ ముగిసింది. ఒక్కోసారి అంతే! ఎమోషనల్ గా రెచ్చిపోయిన గుండె అగ్నిపర్వతాలు పగిలి నిజం ‘లావా ‘లా ప్రవహించక ముందే ఏ జ్ఞాపకమో ఆ పర్వతాన్ని చల్లబరిచి అది పగలకుండా ఆపుతుంది. మరి ఏ జ్ఞాపకము సీమనాయుడ్ని ఆపిందో అతనికే తెలియాలి.

**********************

 

ఏ పరిశ్రమలోనైనా కొన్ని కామన్ గానే వుంటాయి. అఖిల మీద ఏ ముద్ర పడక ముందు అందరూ గౌరవాన్ని చూపేవారు. సీమనాయుడులాంటి వాళ్ళు ‘బేరాలు’ పెట్టినా అవి బయటకు రావు. ఒక్కసారి ఓ ఆడది ఒకరికి ‘పడింది ‘ అని తెలిస్తే మాత్రం ప్రతీవాడు ఓ ‘పులై ‘ పోతాడు. వలవెయ్యడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ప్రొడక్షన్ కంపెనీల సంగతి వేరు కాదు. ‘పై వాళ్ళ’ కి తెలిసీ తెలీకుండా ‘పైరవీలు ‘ సాగించేవాళ్ళు సాగిస్తూనే వుంటారు.

కొందరికి నగలు ఆభరణాలైతే కొందరికి నవ్వే ఆభరణం. అఖిలకి నవ్వే కాదు నమ్రత కూడా అభరణమే.

“అయ్యా.. మీరన్నది నిజమే నా మనసుకి విలువిచ్చి ఆయనతో జతయ్యాను. ఈ జన్మాంతం మరో జోలికి పోను. మీరు అవకాశం ఇస్తే మహాసంతోషం. లేకపోతే ఎలాగోలా బతకకపోను.” అని వినమ్రంగా చెప్పేది. దాంతో చాలా మంది ఆవిడ మానాన ఆవిడ్ని వొదిలేసిన మాట వాస్తవం.

“అదేంటి గురూగారూ, అదేం ఆడదండీ? ఆ కుమార్ రాజా గాడి కోసం రోజూ ఓ క్వార్టరు రమ్ము తెప్పిస్తుందిట. పెన్నులూ, కాయితాలే కాక సిగరెట్టు పాకెట్లు కూడా తెప్పిస్తుందిట. ఏమైనా చెప్పండి… ఆ నా కొడుకు పెట్టి పుట్టాడు.” ఇదీ ప్రొజక్షన్ రమణ నాతో అన్నమాట.

నాకు కొంచం ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవమే కానీ నిర్ఘాంతపోలేదు. కారణం నాకు కొంత తెలుసు. కొంతమందికి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఆ ఇచ్చాక కూడా ఏనాడు ‘అవాళ నేను నీకు అది ఇచ్చాను.. నువ్వు నాకేం ఇచ్చావు? ‘ అని ఏనాడు సాధించరు.

శ్రీశ్రీ బహుశా ఆలాంటి వారి కోసమే ‘తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ” అన్న పాట రాసి ఉండాలి. అఖిల కూడా అలాంటి మనిషే అని నాకు ఎప్పుడూ అనిపించేది.

చామనఛాయ, అద్భుతమైన, గుండెలోంచి వచ్చే నవ్వు, ఏ మాత్రం కల్మషం లేని చూపు.. మితమైన మాట… ఏ మగాడికైనా స్త్రీలో ఇంతకు మించిన లక్షణాలు ఇంకేం కోరుకోడానికి వుంటాయి?

తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన పార్టీలు కొన్ని వుంటాయి. వెళ్ళకపోవడం వల్ల తలనొప్పిలు తప్పనిసరి. వెళ్ళడం వలన ఉపయోగాలు ఏమీ వుండవు కానీ, మానవ స్వభావాలు మాత్రం బాగా తెలుస్తాయి.  ‘పాత్ర ‘ ల్ని మలిచేందుకు అవి గొప్పగా ఉపయోగపడతాయి.

ఓ ‘హీరో ‘ గారే ఛాలెంజ్ చేశాడు. ఆ అఖిలని బెడ్ మీదకు తెచ్చి చూపిస్తానని. (కథకి ఈ విషయంతో పని లేదు. అయినా ఎందుకు ఓ వాక్యం వ్రాయాల్సి వచ్చిందంటే, ఆశకి అంతస్థులతో పని లేదని చెప్పడానికి). ఓ డైరెక్టరూ సెకండ్ హీరోయిన్  ఛాన్స్ ఇస్తానని కబురెట్టాడుట. కానీ, సెకండ్ హీరోయిన్ కారెక్టర్ కోసం  ‘ తన కారెక్టర్ ‘ వదులుకోవాలిట.

“అయ్యా.. మీరు హీరోయిన్ గా అవకాశమిచ్చినా నాకొద్దు. నా వయసు, నా స్టక్చర్ దానికి పనికి రాదు. చిన్న వేషం చాలు… అదీ నా కారెక్టర్ ని నిలబెట్టేది.” అన్నదిట. నాతో చెప్పింది రమణే.

 

*********************

 

రమణ ఒక వార్త తెచ్చాడు, కుమార్రాజు కథని ఫలానా ‘టాప్ ‘ డైరెక్టర్ ఓ.కె. చేశాడనీ, ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడనీ. అన్నట్టు చెప్పలేదు కదూ, రమణ ఉండేది మా వీధిలోనే. రమణ, మూర్తి, అనంతరాజ్ ఓ రూం తీసుకొని వుంటున్నారు. ఆ బిల్డింగు లోనే ‘భీశెట్టి లక్ష్మణ రావు” గారు వుంటున్నారు. స్ట్రీట్ పేరు ‘చారీ స్ట్రీట్ ‘.

సంవత్సరం తిరకుండానే కుమార్రాజు పెద్ద రైటర్ అయ్యాడు. ఓ సినిమాలో అతనిది కథ అయితే నాది పాటలు. కానీ మేం కలిసే అవకాశం రాలేదు.

అఖిల జీవితంలో మార్పేదీ లేదు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు గనక కుమార్రాజు టి.నగర్ లోనే ఆనందన్ స్ట్రీట్ కి మారాడు అని తెలిసింది. మా వీధి వెనకాల మూడో స్ట్రీట్ అది.

కాలం గడచిపోతోంది. నేను యమా బిజీ. మా అన్నగారి అబ్బాయిని వెస్ట్ మాంబళం  రాజా హాస్పటల్లో చేర్పించాల్సి వచ్చింది. వెళ్ళి చూస్తే అక్కడే కుమార్ రాజు కూడా ఎడ్మిట్ అయ్యి ఉన్నాడు. మా వాడికి నూట ఐదు జ్వరం అయితే అతనికి నూట నాలుగు. జ్వరమే కాదు వాంతులు మోషన్లు కూడా.

నిజమైన ‘సేవ ‘ ఎలా వుంటుందో అఖిలని చూస్తే తెలిసింది. ఆమె చెయ్యని సేవ లేదు. వాంతులు ఎత్తిపోసింది. మిగతా విషయాలు చెప్పక్కర్లేదు.

అయిదు రోజుల తరవాత మా వాడు డిశ్చార్జ్ అయ్యాడు గానీ, కుమార్ రాజు పన్నెండు రోజులు ఆస్పత్రి లోనే వున్నాడుట. అఖిల చేసిన సేవ చూశాక ఆమె అంటే నాకు అమితమైన గౌరవం పెరిగింది.

 

***********

 

మూడేళ్ళ తరవాత సడన్ న్యూస్. కుమార్ రాజుకీ మాజీ నటి మల్లికా నాయర్ కి పెళ్ళయిందని.  నాకు షాక్. ఎన్ని కోట్లైన సంపాయించొచ్చు. కానీ అఖిల లాంటి స్త్రీ ప్రేమ దొరకడం దుర్లభం. అయినా ఇది చిత్ర సీమ. చిత్రాలకి కొదవేముంటుంది? ఇప్పుడతను పేరెన్నిక వున్న రైటరు. జనాలకి కావల్సింది సక్సెస్… కారెక్టర్ కాదు.

సాలిగ్రామంలో ‘ఇల్లు ‘ కొన్నాడని కూడా  తెలిసింది. అంతే కాదూ ఆ ఇంటి గృహప్రవేశానికి నేనూ కూడా వెళ్లాల్సి వచ్చింది. కారణం మేమిద్దరం నాలుగు సినిమాలకి రాస్తున్నాం. పరిచయం మాత్రం మామధ్య అంతంత మాత్రమే. కుమార్ రాజు సంస్కారం లేనివాడు కాదు. మంచీ మర్యాద తెలిసిన వాడే. అఖిలని అతను దూరం పెట్టాడనే ఓ అకారణ కోపం నాలో నాకే తెలియకుండా వుండి, అతనితో పరిచయం పెంచుకోవడానికి అడ్డుపడిందని మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను.

మల్లికా నాయర్ తెలుగులో కూడా ఓ పది సినిమాలు యాక్ట్ చేసింది. కొన్నిటికి నేను పాటలు కూడా రాశాను. మనిషి జోవియల్ గానే వుంటుంది. లోపలి స్వభావం మాత్రం నాకు తెలియదు.

 

*******************

 

అఖిల కూతురు అపర్ణకి ఇప్పుడు పదహారేళ్ళు.

“దాలి బావా.. అఖిల కూతుర్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నా… కో ప్రొడ్యూసర్ గా వస్తావా?” నా ముందే దాలినాయుడితో అన్నాడు సీమనాయుడు.

మధ్యలో చాలా సార్లు కలిశాం గానీ మళ్ళీ అఖిల ప్రసక్తి రాలేదు. మాతో బాటు తిరగలి నాయుడు కూడా వున్నాడు.

“ఒప్పుకుంటుందా?” అడిగాడు దాలినాయుడు.

“దేని గురించి ఒప్పుకోవాలి బావా?” నవ్వి అన్నాడు తిరగలినాయుడు.

“ఆశ చావదు బావా! అప్పుడెప్పుడో ఆవిడ కారెక్టర్ గురించి విన్నప్పటి నుంచీ ‘ఆ కోరిక ‘ అలాగే వుండిపోయింది.” సిగరెట్టు వెలిగించి అన్నాడు దాలినాయుడు.

” ఆ విషయంలో అయితే చచ్చినా ఒప్పుకోదు. అంతేగాదు, అసలు కూతుర్ని సినిమాల్లోకి రానివ్వదని నా నమ్మకం.” ఖచ్చితంగా అన్నాడు శివరామ్ . శివరామ్ డబ్బింగ్ సినిమాల ప్రొడ్యూసరు. బాగా కలిసొచ్చి, ‘ఖరీదైన ‘ వాళ్లతో తిరుగుతున్నాడు.

“ట్రయల్ ఏమైనా వేశావేంటి? “ పకపకా నవ్వి అన్నాడు సీమనాయుడు.

“అడక్కండి. ఆ పిల్లని విక్టరీ వాళ్ళ సినిమాకి అడిగాను. అందులో నాది పావలా వాటా కదా! పిల్లతో మాట్లాడక ముందే తల్లి ‘నో ‘ అంది. ఇంకేం రానిస్తుందీ?”త్రిబుల్ ఫైవ్ వెలిగించి అన్నాడు శివరాం. తెల్లబట్టలూ, తెల్ల షూసూ, త్రిబుల్ ఫై పాకెట్లు, ఎనిమిది వేళ్లకీ వుంగరాలు, మెళ్ళో చైనూ, చేతికి బ్రాస్లెట్టూ.. ఇవన్నీ ప్రొడ్యూసర్ అలంకారాలు. గది మొత్తం పరిమళించే ‘సెంటు ‘ కూడా తప్పనిసరి.

“ఆవిడ కూతుర్ని హీరోయిన్ చెయ్యాలంటే మన అవసరం ఏముంటుందీ? కుమార్ రాజు గారే ( గాడే కాదు నోట్) టాప్ ప్రొడ్యూసర్లకి చెప్పి ఇంట్రడ్యూస్ చెయ్యగలరు.” యాష్ ట్రే లో సిగరెట్టుని గుచ్చుతూ అన్నాడు తిరగల్నాయుడు.

“ఆ మాటా నిజమే.” నిర్లిప్తంగా మరో పెగ్గు పోసిన బేరర్ కి సోడా ఎంత పొయ్యాలో సైగ చేస్తూ అన్నాడు . స్టాఫ్ మారడం వల్ల కొలతలు తేడా వస్తున్నాయ్. పాతవాళ్లకి తెలుసు… ఎవరు ఏ డ్రింక్ లో సోడా కలుపుతారో వాటర్ కలుపుతారో.

 

*******************

 

“మార్పులు మొదలవ్వాలే గానీ, మహాస్పీడుగా జరిగిపోతై. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది. ఆ ‘మార్పు ‘ చాలా సహజంగా జరిగే అవకాశాలున్నా, అత్యంత నాటకీయంగా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. జోడించడం కష్టం. విడదీయడం క్షణం. సదరు నాయకులకి నష్టం ఏమాత్రమూ వుండదు. వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఎస్టేట్లకి వొచ్చిన ముప్పేమీ వుండదు. దెబ్బ తినేది మాత్రం సాంకేతిక నిపుణులు, చిన్నచిన్న నటులు, నటీమణులు, ఎక్ స్టాలు, ఇతర కార్మికులు.

మద్రాసులో తెలుగువాడి విలువ నిట్ట నిలువునా పడిపోయింది. తమిళ వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మనవాళ్ళు తమిళ వాడిని నెత్తి మీద పెట్టుకుంటాడు కానీ, వాళ్ళు మాత్రం మనవాడికి అరచి చచ్చినా ఛాన్స్ ఇవ్వరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవర్ల దగ్గర నుంచి, లైట్ బాయిస్ దగ్గర నుంచీ, ప్రొడక్షన్ బాయిస్ దాకా తరలిపోయారు. కుమార్ రాజు ముందుగానే ‘ఇల్లు ‘ కొని మరీ హైదరాబాద్ తరలిపోయాడు. అఖిలకీ తప్పలేదు. ‘సంగీతం ‘ కొంతకాలం  చెన్నై లోనే ‘చిరునామాని ‘ నిలుపుకొన్నా, అదీ వెళ్ళిపోక తప్పలేదు. నేను మాత్రం వెళ్ళలేదు. కారణాలు రెండు… ఒకటి.. పాలిటిక్స్.. నాకు పడవు. రెండు.. ‘రాత ‘ ని నమ్ముకొన్నవాడ్ని గనక.

****************

‘ఆస్కా ‘ లో ఉత్సవాలు జరుగుతున్నై. ఏకబిగిని మూడురోజులు. కుమార్ రాజు కూడా వి.ఐ.పి. గా వచ్చి వెళ్ళాడు. స్టేజ్ మీద మేము కలిసినా పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకలేదు.

గత ఐదేళ్ళలో చాలా చాలా చాలా సార్లు హైదరాబాద్ వెళ్ళాను… పాటలు వ్రాయడానికి.  వాళ్ళ దృష్టిలో మేము ‘చెన్నై ‘ వాళ్ళం. ‘లోకల్ ‘ కాదు గనక దూరం పెట్టచ్చు. అదో చిత్రం. గోడకు ఇవతల ‘ఈశాన్యం ‘ అయితే గోడకు అవతల ‘ఆగ్నేయం ‘ అయినట్టు, పరిశ్రమ చీలిపోగానే అన్నీ చీలిపోతాయి. అంతకు ముందున్న నాయకులందరూ తూఫానుకి ఎండిన తాటాకులు ఎగిరినట్టు ఎగిరిపోయారు. నిజం చెబితే ఏ స్వార్ధం కోసం పరిశ్రమని విడదీశారో ఆ స్వార్ధం ఫలించలేదు. అంతా కొత్తే. కొత్త గ్రూపులు, కొత్త నినాదాలు, కొత్త మొహాలు, మళ్ళీ మరో మలుపు. తెలంగాణా ఉద్యమం. మరోసారి చిత్ర పరీశ్రమ మానసికంగా చీలిపోయిందన్న మాట వాస్తవం. తెల్ల ఏనుగులాంటి పరిశ్రమకి మసి మరకలు అంటాయి. ఏమో, ‘మార్పు’ లో ఇదీ ఓ సహజ ప్రక్రియేమో !

పెద్దపెద్ద ప్రొడక్షన్ కంపనీలు సినిమాలు తీయడం మానేశాయి. కారణం కొత్తగా ఏర్పడ్డ పరిస్థితులకి అలవాటు పడలేకపోవడమే. అంతకుముందు సినిమా ఓ కళాత్మక వ్యాపారం. ఇప్పుడు కేవలం వ్యాపారం మాత్రమే అన్నంతగా మారింది.

ఓ డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ‘R ‘ హోటల్లో మమ్మల్ని అంటే, నన్ను, డైరెక్టర్ని, హీరోహీరోయిన్లనీ ప్రొడ్యూసర్ దించాడు.

రూం  రెంటు రోజుకి 26 వేలు. పొద్దున్న దిగాం. మద్యాహ్నం భోజనానికి డైనింగ్ హాల్ కి వెళ్ళాను. ఓ మూల కుమార్ రాజు ఒంటరిగా కనపడ్డాడు. దూరం నుంచే నన్ను చూసి చెయ్యి ఊపితే, మర్యాద కోసం అతని దగ్గరకెళ్ళాను. ఫుల్ మందులో వున్నాడు.

“సార్.. డ్రింక్?” అన్నాడు

“నో సార్.. కేవలం నైట్స్ లోనే తీసుకుంటాను. అదీ మా ఇంటిలోనే” మర్యాదగా తిరస్కరించా. డే టైం తాగను. పార్టీలకి వెళ్ళను. డ్రింక్ అన్నది ఓ చిన్న సంతోషం కోసమని ఏయిర్ ఫోర్స్ లో వున్నప్పుడే నాకు తెలుసు. అందుకే ఏనాడు ‘హద్దు ‘ దాటను.

“ఓ.కె.. ఓ.కె.. మీరు లక్కీ సార్. మద్రాసులోనే వుండిపోయారు. యూ.. నో.. అది నిజంగా స్వర్గం… రియల్ హెవెన్” ఏదో పోగొట్టుకున్న వాడిలా అన్నాడు.

“కాసేపు నాతో కూర్చోగలరా?” అఫ్ కోర్స్ మీకు ఇష్టమైతేనే” అన్నాడు.

“అలాగే” అని కూర్చున్నా.

“మాష్టారు.. పోగొట్టుకునేదాకా పొందినదాని విలువ తెలీదు సార్, ఇది నిజం” రెండు చేతుల మధ్యా తలను ఇరికించుకొని అన్నాడు.

‘ఎందుకు” అని నేను అడగలా.

“స్వర్గం నా చేతిలో నుంచి జారిపోయినప్పుడు తెలీలా… పేరు మత్తులో, పైసల మత్తులో మునిగిపోయా. సార్, యీ క్షణం యీ క్షణంలో మొత్తం ప్రపంచాన్ని నాకు రాసి ఇచ్చినా నాకు అక్కర్లేదు సార్. నా దగ్గర వున్న వన్నీ కూడా వదిలేస్తా. కానీ… పోగొట్టుకున్నది దొరుకుతుందా? యీ జన్మకు దొరకదు. దొరకదు సార్ దొరకదు” కళ్ళ వెంట నీరు కారుతుండగా తలని టేబుల్ మీద వాల్చి అన్నాడు.

నాకో విషయం అర్ధమయ్యింది. అతనికిప్పుడు  ఎవరో ఒకరు మాట్లాడటానికి కావాలి.  ఆ వ్యక్తిని నేనే కావక్కర్లా. ఓ కుక్క పిల్ల అయినా సరే. అతను మాట్లాడుతుంటే వినడానికి చాలు.

నిజం చెబితే అతను ఎవరూ వినాలని కూడా మాట్లాడటంలా. తన మాటలన్నీ తానే వినడానికి మాట్లాడుతున్నాడు. తన మనస్సుని తానే తెలుసుకోడానికి చేసే ప్రయత్నం అది. ఏంటన్ చెకోవ్ వ్రాసిన ‘గ్రీఫ్ ( GRIEF ) కథ గుర్తుకొచ్చింది. ఎంత ధైన్యం. మనిషికి మనిషి తోడు ఏదో ఓ క్షణంలో తప్పదు. అయితే ఆ ‘ క్షణం లో ‘ ఎవరేనా తోడు దొరకడమే అదృష్టం. ఆ అదృష్టం  ఎన్నో వెల మందికి లభించదని నాకు తెలుసు. లభిస్తే ‘ ఆత్మహత్యలు ‘ ఎందుకుంటాయి?

 

***********************

 

“అఖిల చచ్చిపోయింది. ఆ విషయం నిన్ననే అతనికి తెలిసింది. అప్పటి నుంచీ యీ హోటల్లోనే గది తీసుకొని వున్నాడు. తెగతాగి పడుకోవడం.. లేచి మళ్ళీ తాగడం” జాలిగా అన్నాడు రమణ. రమణ కొత్తలోనే హైద్రాబాద్ కి మారాడు.

“నిజమా? ఎలా చనిపోయింది?” షాక్ తిని అన్నాను.

“నిజమే.. కుమార్ రాజుని  ‘వేరుపురుగు ‘ అని అందరూ అంటారు. తల్లి వేరుని కొరికేసే పురుగుని వేరుపురుగు అని అంటారు. అఖిల జీవితమనే తల్లివేరుని  కొరికేసి ఆ వృక్షం కూలిపోడానికి కారణమయ్యాడని అందరూ అంటారు. మనమూ అనుకునే వాళ్ళము. కానీ కాదండీ. కుమార్ రాజుకి అవకాశాలు రాగానే అఖిలే అతనికి స్వేచ్ఛనిచ్చింది. అతను మల్లిక వ్యామోహంలో పడ్డాడని తెలిసి కూడా అతన్ని పెళ్ళి చేసుకోమనే చెప్పింది కానీ అడ్డురాలేదండి. చివరి వరకు అఖిల పవిత్రంగానే వుంది. ఆఖరికి ఆమెకి కాన్సర్ వచ్చినా కుమార్ రాజుకి తెలియనివ్వలేదు. నేను చెబుతానన్నా వద్దని వొట్టు వేయించుకుంది. గురూజీ, అఖిల లాంటి వాళ్ళు కోటికి ఒక్కరు కూడా పుడతారంటే అనుమానమే. ఏనాడు అతన్ని నిందించలేదు సరికదా ఎవరేన్నా అతన్ని నిందిస్తే సహించేది కాదు.” కళ్ళల్లో కన్నీరు ఉబుకుతుండగా అన్నాడు రమణ.

“మరి పాప?” బాధగా అన్నాను నేను. అఖిల నవ్వు అమరం.

 

“అపర్ణ మంచి బిడ్డ. ప్రస్తుతానికి నేనే ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశాలు కల్పిస్తున్నా. సార్… ఏ జన్మలో పాపం చేశానో నాకు పిల్లలు లేరు. మూడుసార్లు అబార్షన్లు అయ్యి నా భార్య గర్భసంచీ తీసేశారు. అఖిలని నేను అక్కగానే భావించాను. చెన్నైలో ఆమె గొప్పతనం తెలీలేదు. ఇప్పుడు అపర్ణ మాతో బాటే మా ఇంట్లోనే వుంటోంది… నా బిడ్డే!” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమణ.

మంచితనం ఇంకా బ్రతికే వుంది. కానీ ఒక్కటే విచారం… అఖిలది ఓ అన్ టోల్డ్ స్టోరీ. ఇంకా అన్ టోల్డ్ స్టోరీనే. ఎందుకంటే ఆమె  జీవితంలో నాకు తెలిసింది అణువంతే!

 

*

 

“ఇదీ ఓ కథే”

 

 

-భువనచంద్ర 

~

 

అదో పిచ్చిముండ. చెప్పినా విని చావదయ్యా.. ఏం చెయ్యనూ? “పటపటా తలబాదుకుంటూ అన్నది శేషారత్నం. శేషారత్నంది కృష్ణాజిల్లా. పుట్టింది పల్లెటూళ్ళో అయినా పెరిగింది మాత్రం విజయవాడలో. తల్లిదండ్రీ ఉన్నవాళ్లు గనక 10thవరకు చదివి, ఫస్టుక్లాసులో పాసై, డిగ్రీ 2nd  yearలో ప్రేమలో పడి, వాడికోసం నగానట్రాతో సహా మద్రాసు పారిపోయి వచ్చింది. తోడొచ్చినవాడు తెచ్చినవన్నీ ఊడ్చుకుపోతే, ఎలాగోలా మళ్లీ తల్లిదండ్రుల పంచన చేరి జీవితాన్ని మళ్ళీ సజావుగా మలుచుకునే  ప్రయత్నంలో సక్సెస్ అయింది.”అక్షమాల” శేషారత్నం కూతురు. మహా మొండి. అయితే ఆ పిల్ల అందం చెప్పనలవిగాదు.

ఆడపిల్ల అందగత్తె కావడం అదృష్టమే. కానీ, ఆడపిల్లకి తాను అందగత్తెనని తెలిస్తేనే తలనొప్పులు వచ్చేది. అక్షమాలకి నూటికి నూరుపాళ్ళు తాను అందగత్తెనని తెలుసు. అందుకే పట్టుపట్టింది. విషయం చాలా సింపుల్. హైద్రాబాదులో నూతన నటీనటులకోసం ‘సెలక్షన్’ నిర్వహిస్తున్నారు. అక్షమాల అందులో పాల్గొంటానంటుంది. శేషారత్నానికి ఏమాత్రం ఇష్టం లేదు.

“శేషమ్మా.. ఎట్లాగూ వినదని తెలుసుగదా.. పోనీ ఓసారి పంపిస్తే ఏంబోయిందీ? సెలక్టయితే వెరీగుడ్. కాలేదనుకో.. తిరిగొస్తుందీ! అంతేగా..!” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు తిరగలినాయుడు. తిరగలినాయుడిది ఏలూరు. అసలు పేరు రాజశేఖరనాయుడు. అతనిది చిత్రమైన వ్యాపారం. రోళ్ళూ, రోకళ్ళూ, తిరగళ్ళూ ఉన్నాయి.. ఊరగాయలకి కావలసిన సమస్తం అంటే కారం, ఆవపిండి, మెంతిపిండీ, పసుపూ, అన్నీ మేన్యువల్‌గానే తయారుచేయిస్తాడు. పప్పునూనె, కొబ్బరినూనె, నువ్వుల నూనె, వేరుసెనగనూనె కూడా గానుగ ఆడే సిద్ధం చేస్తాడుగానీ,, మిల్లునూనెలతో వ్యాపారం చెయ్యడు. నిఖార్సయిన సరుకు సప్లై చెయ్యాలంటే నాయుడి తరవాతే ఎవరైనా. ఖరీదు కాస్త ఎక్కువయినా క్వాలిటీలో నంబర్ వన్ గనక వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయల్లా వృద్ధి చెందుతోంది.

నాయుడికీ శేషారత్నానికి పరిచయమైంది మద్రాసులోనే. పారిపోయి వచ్చినప్పుడు టి.నగర్‌లో ఉన్నది శేషారత్నం(తోడు వచ్చినవాడితో).  ఆ పక్కనే మరో గదిలో అద్దెకుండేవాడు నాయుడు. తోడొచ్చినవాడు ఉడాయించినప్పుడు ఆదుకుని, ఆదరించి, మంచీ చెడూ వివరించి, దగ్గరుండి మరీ తల్లిదండ్రులకి అప్పగించిన నాయుడంటే శేషారత్నానికి దేవుడితో సమానం.

దేవతలూ దానవులూ కూడా ఉండేది మనుషుల్లోనే. నాయుడు నిజంగా గొప్పమనిషి. అంతేకాదు కాలంతోపాటు మార్పు సహజం అనుకునే మనస్తత్వం  వున్నవాడు. తప్పని పరిస్థితుల్లో ఏటికి ఎదురీదాలనీ అతనికి తెలుసు.

సినిమాల్లో ‘పాదరసం’లాంటివాళ్ళు చాలామందే వున్నారు. రాకేష్ అలాంటివాళ్లల్లో ఒకడు. పదిహేడో ఏట సినిమా మీది పిచ్చితో మద్రాసు వచ్చాడు. ‘రెండురోజులు మాత్రం వుంటానని రిక్వెస్టు చేసి, ఆ ఇంట్ళోనే నెలరోజులున్నాడు. ఆ నెల రోజుల్లోనే ‘వడపళని’లో ఓ తమిళియన్ ఇంట్లో రూం సంపాదించి, ఓనర్ మనవరాల్ని మెల్లగా ముగ్గులో దించాడు. ఇతనికి పదిహేడూ పద్ధెనిమిది మధ్య.  ఆ పిల్లది 28. పెళ్ళి కాలేదు. ఇతనేమో అందగాడే. ఆ పిల్ల అనాకారి కాదుగానీ అందగత్తె కూడా కాదు. ఇంటద్దె మొత్తం దొంగతనంగా ఆ అమ్మాయే రాకేష్ చేతికిచ్చి, ఆ డబ్బుని వాళ్ల తాతకి ఇప్పించేది. అంతే కాదు పాకెట్ మనీ కూడా ఇచ్చేది. ఆ పిల్లకి తల్లిదండ్రీ చిన్నప్పుడే పోయారు. తాత అమ్మమ్మలే పెంచారు. అమ్మమ్మ కూడా రెండేళ్ల క్రితం కాలం చేసింది. ఆ అమ్మాయి పేరు ‘అఖిల’.

ఇంటి ఓనర్ పేరు తోతాద్రి. వాళ్లు తమిళ బ్రాహ్మళ్లు. తోతాద్రి తహసీల్‌దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. బాగా సంపాయించాడు. టి.నగర్‌లో మూడు ఇళ్లున్నాయి. ఒక్కో ఇంట్లోనూ నాలుగు పోర్షన్లు. పెన్షన్ + ఇంటి అద్దెలు కలుపుకుంటే  బ్రహ్మాండమైన రాబడి. ఒక్కతే కూతురు. ఆ కూతురు, అల్లుడు చనిపోయారు. తోతాద్రికి మిగిలింది అఖిల ఒక్కతే.

“నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నిన్నెవరు చూస్తారూ?”అంటూ ఇంతకాలం పెళ్ళి చేసుకోకుండా వున్న అఖిల అంటే ఆయనకు ప్రాణం.

రాకేష్ అఖిలని ముగ్గులోకి దించడం గమనించినా, గమనించనట్టు వూరుకున్నాడు తోతాద్రి.’చిన్నవాడో, పెద్దవాడో ఎవడైతేనేం. అఖిల ‘సెటిల్’ కావడం ముఖ్యం’ అనుకున్నాడు.

రాకేష్‌కి హాయిగా గడిచిపోతోంది. మొదట్లో ‘మెస్’కి వెళ్ళేవాడు. అదీ అఖిల ఇచ్చే డబ్బులతోనే. ఆ తరవాత అఖిలే ‘పేయింగ్ గెస్ట్’పేరిట అతనికి కూడా వండేది.

అఖిలకి ఆ ‘యావ’ ఎక్కువ. ప్రతి శుక్రవారం మొహం, కాళ్లూ, చేతులకి చక్కగా పసుపు రాసుకుని, తలంటి పోసుకుని  మహాలక్ష్మిలా కనిపించేది. అందగత్తె కాకపోయినా ఆమెకి వున్న తెలివితేటలు అమోఘం.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వెంటబడుతున్న రాకేష్‌ని జాణతనంతో దూరంగా పెడుతూ, మళ్లీ తనే  దగ్గరగా వచ్చినట్టు వస్తూ ఓ బ్రహ్మాండమైన కైపులో ముంచింది.  ఒకసారి ఆ ‘రుచి’ మరిగినవాడెవడూ వదిలి పోలేడని అఖిలకి తెలుసు.

తోతాద్రికి జరుగుతున్నదంతా తెలుసని అఖిలకి తెలుసు. ‘రాకేష్’ మాత్రం ఫ్రీ బోర్డింగ్ , లాడ్జింగ్‌ని సంపాయించుకున్నందుకు మహదానందంగా వున్నాడు.

పొద్దున్నే దిట్టంగా టిఫిన్ పట్టించి పాండీబజారుకి పోవడం. అక్కడ చెట్లకింద వాలే సినీపక్షులతో పరిచయాలు పెంచుకోవడం చేశాడు. రాకేష్ ‘పాదరసం’లాంటివాడని ముందే అనుకున్నాం కదా.. ఆమాటే నిజం చేశాడు. కరెక్టుగా అఖిలతో ‘పరిచయం’ పెరిగిన నెలరోజులకల్లా సూపర్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు. మోహన్  ప్రసాద్ పట్టిందంతా బంగారమే. ఆయన చేసిన సినిమాల్లో 90% నూర్రోజులకి పైగా ఆడినవే. మిగతావీ ఎబౌ ఏవరేజేగానీ, ఒక ఫ్లాప్ కూడా లేదు.

మోహన్ ప్రసాద్ కి ముగ్గురూ ఆడపిల్లలేగానీ మగపిల్లలు లేరు. రాకేష్‌ని చూడగానే ఆయనకి మనసులో మెదిలిన వ్యక్తి తన మూడో కూతురు. పెద్దపిల్లలిద్దరూ బుద్ధిమంతులు. చెప్పినట్టు వింటారు. మూడోపిల్ల మహా పెంకిది.తను పట్టుకున్న కుందేటికి రెండే కాళ్లు అనే రకం. అదీగాక కులం పెర్‌ఫెక్టుగా కలిసింది. మెల్లిగా కుర్రాడ్ని దారిలో పెడితే పైకి రావడమేగాక ‘ఇల్లరికం’ కూడా తెచ్చుకోవచ్చు.

వేలు చూపిస్తే చెయ్యి మింగేసే  రకం రాజేష్. డైరెక్టర్‌గారిదగ్గర సిన్సియర్‌గా పని నేర్చుకుంటూనే ఆయనకి చేతిలో పెన్నూ, తలలో నాలికలాగ మారాడు.

“పూర్ణానందంగారూ, యీ కుర్రోడు చాకూ, కత్తీ లాంటోడు గాదు, పుటుక్కున పొట్టలో దిగే కైజార్‌లాంటోడు. మోహన్‌గారు అమాయకంగా నమ్ముతున్నాడీయన్ని. ఏదో ఓ రోజు యీడు ఆయనకే వెన్నుపోటు పొడవకపోతే నన్ను చెప్పెట్టి కొట్టండి.” అన్నాడు కో డైరెక్టర్,   సీనియర్‌మోస్ట్ రైటర్ పూర్ణాంద్‌తో. చిన్నగా నవ్వాడు పూర్ణానంద్. ఆయన పక్కా మితభాషి మాత్రమే కాదు. ఎక్కడ, ఎవరితో, ఎంతసేపు మాట్లాడాలో ఖచ్చితంగా తెలిసిన మేధావి. “ఇదిగో సురేషూ, విత్తనం ఎక్కడిదీ, ఎవరిచ్చారూ అనేది ముఖ్యం కాదయ్యా. మొక్క ఎలా పెరుగుతోందనేది ముఖ్యం.

వీడు ఎవర్ని ముంచుతాడో, ఎవర్ని వెన్నుపోటు పొడుస్తాడో తరవాత సంగతి. ఒకటి మాత్రం నిజం. వీడు గనక వీడికున్న తెలివితేటల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మరో దిగ్దర్శకుడవుతాడయ్యా…!” అన్నాడు పూర్ణానంద్ 555 సిగరెట్ పీలుస్తూ. ఏడాది గడిచింది.

కొందరి మాటలు ఫలిస్తాయి. కారణం చెప్పలేం. పూర్ణానంద్ మాట ఫలించింది. ఓ పేద్ద హీరో రాకేష్‌కి డైరెక్షన్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, “నేనితని వయసు చూడలా. పరిణితిని మాత్రమే చూశా.!” అని ఓ గొప్ప స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక్కడి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నీ పక్కన వుంటూ,  నీ మీల్స్ టికెట్ మీద భోంచేస్తున్నవాడే, వాడికి లాభం వుందనుకుంటే నీ మీదే విషం చిమ్మగలడు.

తెలివైనవాడు సినిమా సినిమాకీ, పదింతలు ఇరవయ్యింతలు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే, ‘లౌక్యం’ తెలీనివాడు ఎన్ని హిట్లిచ్చినా పేరు తప్ప ‘డబ్బు’ కూడబెట్టుకోలేడు. అందుకే రచయితలు చాలామంది బీదగా మిగిలేది. ఎందరో క్రియేటివ్ డైరెక్టర్స్ పరిస్థితీ అదే.

సినిమా స్క్రిప్ట్ తయారవుతోంది. కథ, మాటలూ పూర్ణానంద్‌గారివే. చిత్రంగా కోడైరెక్టర్ మళ్ళీ  సురేషే. ఈ పరిశ్రమలో ఇదో విచిత్రం. ఇక్కడ సీనియరా, జూనియరా అనేది ఎప్పుడూ నిజంగా కౌంట్ కాదు. సక్సెస్సా కాదా అనేదే ముఖ్యం. ఓ  పెద్ద హీరో కాల్‌షీట్ ఇచ్చాడంటే , పిక్చర్ సంగతెలా వున్నా నూటికి 50 శాతం సక్సెస్ సాధించినట్టే.

అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, మూడో కూతురి కోసం రాకేష్‌ని ట్రెయిన్ చేసిన మోహన్‌ప్రసాద్‌గారే, రాకేష్‌కి ఆఫరొచ్చాక ఆశీర్వదించి పంపడమేకాక తన కోడైరెక్టర్‌ని కూడా రాకేష్ దగ్గర పెట్టాడు. రాకేష్‌కి 10% పని తెలిస్తే, సురేష్‌కి 95% తెలుసు. అలాంటివాడ్ని కోడైరెక్టరుగా పెట్టుకుంటే సినిమా తియ్యడం నల్లేరు మీది నడకే.

మనిషికి ఏది ముఖ్యం? నిజంగా మనుషులు దేన్ని కోరుకుంటారు? కొందరు ధనం అంటే, కొందరు ప్రేమ అంటారు. కొందరు పదవీ పేరూ అంటే, కొందరు మనశ్శాంతి అంటారు. అయితే ఇవన్నీ మామూలుగా చెప్పేవి. పనిలో పడితే తప్ప అసలు సిసలు వ్యవహారం తేలదు.

పని లేనంతకాలం ‘ప్రేమ’ అద్భుతం అనిపిస్తుంది. ఎంతగా మురిపిస్తుందంటే, చిన్న చిన్న అలకలూ, కోపాలూ, బుడిబుడి దీర్ఘాలు, ముక్కు చీదటాలూ కూడా అద్భుతంగా, అత్యంత సుందరంగా కనిపిస్తాయి. యుగమో క్షణంలా గడుస్తుంది.

సరేనయ్యా.. అదృష్టం తలుపుతట్టి బ్రహ్మాండమైన పని చేతిలో పడ్డాక? ??

అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేవాడు మూర్ఖుడు. అవకాశాన్ని సృష్టించుకునేవాడు బుద్ధిమంతుడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకునేవాడు మహాజ్ఞాని. ఎవరికీ  దొరకని అదృష్టం రాకేష్‌కి దొరికింది. “నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి గురూజీ. మీరు ఎంతో అనుభవం కలవారు. దయచేసి నన్ను ‘గైడ్’ చేయ్యండి. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాననిపిస్తే వెంటనే హెచ్చరించండి. అస్సలు సందేహించకండి..” ఈ ఒక్క డైలాగ్‌తొ రాకేష్ సురేష్‌ని పూర్తిగా గెల్చుకున్నాడు. అదీ. పూర్ణానంద్ ముందర.

“ఏదో అనుకున్నాగానీ పూర్ణానందంగారూ,యీ కుర్రోడు పెద్దలతో ఎలా మెలగాలో తెలిసినవాడండీ!” ఉబ్బిపోయి మహాసంతోషంగా అన్నాడు సురేషు.

“అందుకే ఇన్నేళ్ళయినా నువ్వు కోడైరెక్టరుగా వున్నావు. ఉత్తి వెర్రిమాలోకానివి.” లోపల్లోపలే సురేష్ గురించి అనుకున్నాడు పూర్ణానంద్. ఒకటి మాత్రం నిజం. రాకేష్ పగలూ రాత్రీ స్క్రిప్టు మీదే కూర్చొంటున్నాడు. ఎవ్వరూ ‘పిండనంతగా’ పూర్ణానంద్‌ని బెటర్‌మెంట్ కోసం పిండేస్తున్నాడు. సిట్టింగ్స్ సవేరా హోటల్లో జరుగుతున్నాయి. అఖిలని కూడా పక్కకు నెట్టి ‘మేక్జిమం’ టైం అక్కడే గడుపుతున్నాడు రాకేష్.

అఖిల అంతా చూస్తూనే వుందిగానీ ఏ మాత్రం బయటపడలేదు. అల్లరి చేసి లాభం ఏమిటీ? అదీగాక పెళ్లి కూడా కాలేదాయె. అప్పటికే చుట్టుపక్కలవాళ్లు కొంచెం చెవులు కొరుక్కుంటున్నారని  అఖిలకి తెలుసు. కారణం వయసుల్లో వున్న తేడా.

తుఫాను గాలికి చెట్లు పడిపోయినా , గడ్డిపోచలు అలానే ఉంటాయి. ఓ సమస్య వచ్చినప్పుడు గడ్డిపోచలా నిబ్బరంగా ఉండగలిగేవారిదే గెలుపు. తొడలు కొట్టి జబ్బలు చరుచుకుని చాలెంజ్ చేసేవాళ్లది కాదు.

అఖిల అవసరమైతే వృక్షమూ కాగలదు, సమస్య వస్తే గడ్డిపోచలాగానూ మారగలదు. ఇప్పుడామె గడ్డిపోచగా మారి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కొంటోంది.

సినిమాఫీల్డుకి ‘దేవుడు’ అంటే చచ్చేంత సెంటిమెంటు. పూజ అంటే చాలు బోలెడు ఖర్చు చేస్తారు. ముహూర్తం షాట్లు చూడండి. ఎంత వినయంగా, ఎంత భక్తితో వొంగి వొంగి దండాలు పెడుతూ వుంటారో

దర్శకులూ ,నటీనటులూ  నిర్మాతలూ .

రోజూ ,అంటే , రాకేష్ ఇంటికి  రాని రోజుల్లో ఠంచనుగా తొమ్మిదింటికల్లా మహాలక్ష్మిలా, ‘ముప్పత్తమ్మ’ గుడినించి ప్రసాదం తీసుకుని, సవేరాకి వెళ్ళేది అఖిల. అప్పటికే పూర్ణానంద్, సురేషూ, మిగతావాళ్లూ అక్కడ వుంటారని ఆమెకి తెలుసు. భక్తిగా అందరికీ ప్రసాదం పంచి, “మీరందరూ వెయ్యేళ్ళు చల్లగా, సుఖంగా ఉండాలి. ఎప్పుడూ విజయం మీ వెంట నీడలా వుండాలి.. ఇదే నేను రోజూ మొక్కుకునేది. అందరికంటె ‘ఆయన’ చిన్న. అయినా మీరంతా వున్నారుగా..!” అని వినయంగా నమస్కరించి బయటికొచ్చి ఇంటికెళ్ళే బస్సెక్కేది. అఖిలగురించి మొదట్లో కొంత ‘వింత’గా వాళ్ళనుకున్నా, తరవాత్తరవాత ఆమె ‘చూపించే’ వినయానికి ఫిదా అయిపోయారు.

“ఏజ్ ది ఏవుందోయ్! కృష్ణుడికన్నా రాధ పెద్దదికాదూ, ఉండాల్సింది స్వచ్చమైన ప్రేమ!” అంతటి పూర్ణానందే అఖిలని చూసి ముచ్చటపడి అనేవాడు.

సినిమా మొదలైంది. ఓ రోజున మోహన్‌ప్రసాద్‌గారు రాకేష్ వర్క్ ప్రోగ్రెస్ చూద్దామని సవేరాకి వచ్చారు.. అదే సమయానికి అఖిల ప్రసాదం తీసుకొచ్చింది. మామూలుగానే వినయంగా ప్రసాదం పంచి, నాలుగు మంచి శుభాకాంక్షల్ని అందించింది.

“ఎవరీవిడా?” కుతూహలం బయటికి కనపడకుండా మామూలుగా అడిగినట్టు అడిగాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లింట్లోనేనండి రాకేష్ వుండేది!” ఉత్సాహంగా చెప్పాడు కో.డై.సురేష్.

“మరి యీ ప్రసాదాలేంటి?” నవ్వి అన్నాడు కానీ లోపలలోపల ఓ అనుమానం సుడి తిరుగుతోంది.

“సినిమా సూపర్  హిట్టు కావాలనిట. అబ్బ… ఆ అమ్మాయికి ఎంత వినయమో!” అద్దంలాగా మనసుని బయటపెట్టాడు సురేష్. “అలాగా!” అని బయలుదేరాడాయన. ఆయనతోబాటు పూర్ణానంద్ బయటికొచ్చాడు.

“ఏమిటి పూర్ణా యీ పిల్ల వ్యవహారం…!” నెమ్మదిగా అన్నాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లిద్దరి మధ్యా ఎఫైర్ ఉందనుకుంటాను. ఆ పిల్ల సిన్సియరే. రాకేష్ మహాతెలివైనవాడు.”క్లుప్తంగా చెప్పాడు పూర్ణానంద్.

ఆ మాత్రం హింట్ చాలు. ఆ అమ్మాయి సిన్సియర్. రాకేష్ తెలివైనవాడంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టగలిగే నేర్పు వుందనేగా… ,  నిశ్చింతగా ఇంటికెళ్లాడాయన. ఎఫైర్స్ ఎన్నున్నా ఫరవాలేదు. పెళ్ళి మాత్రం ఒకటే వుండాలి. భార్యా ఒక్కతే వుండాలి. చిన్న యిళ్ళు  ఎన్నున్నా , పెద్దిల్లు పెద్దిల్లేగా! మోహన్‌ప్రసాదూ ఒకప్పుడు గ్రంధసాంగుడే. ఏ హీరోయిన్నీ వదల్లేదని పెద్దపేరుఆయనకి .

స్క్రిప్టు రెడీ. ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ మొదలు కాబోతుంది..’విజయా డీల క్స్   లో సాంగ్ రికార్డింగ్.  ‘విజయ’లో రికార్డింగ్ అంటే’విజయం తథ్యం’ అని అందరికీ నమ్మకం.

(నా పాట  మాత్రం ప్రసాద్ old, థియేటర్లో రికార్డయింది. సినిమా పేరు: నాకూ పెళ్లాం కావాలి‘. నటీనటులు, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, కల్పన, నిరోషా). దర్శకత్వం శ్రీ విజయాబాపినీడు. నిర్మాతలు: ఆలపాటి రంగారావు, శ్రీ శివలింగేశ్వరరావు. సంగీతం వాసూరావుగారు. గానం: SPB, పల్లవి ” వినోదాల విందురా, బాధలన్నీ బంద్‌రా.. సినిమా సాటి లేదురా.. డాన్సూ ఫైటూ మిక్స్రా.. మళ్లీ మళ్లీ మళ్లీ చూడరా” Date of Recording 1-1-1987)

 

అతిరధమహారధులందరూ విజయా గార్డెన్స్   కి వచ్చారు. ఓ కుర్రాడ్ని డైరెక్టర్‌గా చూడ్డం అందరికీ ఆశ్చర్యమే.

******                                     *******                           **********

సినిమా సూపర్‌హిట్. అఖిల ఆ రోజున ముప్పత్తమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టింది.. రాకేష్‌తో కలిసి వచ్చి.

వారం రోజుల్లో రెండో సినిమా మొదలు. ఈసారి ‘స్క్రి ప్ట్  వర్క్’ పెద్దగా జరగలేదు. కారణం ఆ సినిమా ‘తమిళం’నించి తెలుగులోకి రీమేక్. స్క్రిప్టుని పూర్ణానంద్‌గారే సవరించి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చారు.

సురేష్ కో డైరెక్టర్. మిగతా అందరు  టెక్నీషియన్స్ మొదటి సినిమాకి పని చేసినవాళ్ళే కావడంతో చకచక షూటింగ్ నడిచి మూడు నెలల్లో పూర్తయింది.

అదీ సూపర్ హిట్టే.

మూడో సినిమా.. మళ్లీ తమిళ్ టు తెలుగు రీమేక్.

నాల్గో సినిమా హిందీ టు తెలుగు రీమేక్.

నాలుగో సినిమా రిలీజ్ నాటికి అఖిలకి వాంతులయ్యాయి.

సరిగ్గా ఆ రిలీజ్ డేట్ ముందు రోజునే మోహన్‌ప్రసాద్‌గారు తన మూడో కూతుర్ని రాకేష్‌కివ్వడానికి రాకేష్‌తో సంప్రదించాడు.

రాకేష్ వినయంగా అఖిల గురించి చెప్పాడు. “ఆ అఫైర్ నాకు తెలుసు. ఒకవేళ అది బయటపడ్డా అందరూ ఆవిడే నిన్ను చిన్నవాడ్ని చేసి ముగ్గులొకి దించిందని బ్లేమ్ చేస్తారు గానీ, నిన్నెవరూ ఏమీ అనరు బాబూ, నువ్వు నిచ్చెనమెట్లు ఎక్కుతున్నావు. కానీ ఇదో వైకుంఠపాళీ అని నీకు తెలీదు. నిచ్చెనల పక్కనే పాములూ వుంటై. కాటు వెయ్యడానికి సిద్ధంగా…! అన్ని అనుభవాలు కలిగినవాడ్ని.. నువ్వు నా అల్లుడివైతే సంతోషిస్తా. లేదంటే నీ యిష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు”   అని  తన బ్రాండ్ నవ్వుతో నవ్వుతూ చెప్పాడు మోహన్‌ప్రసాద్. ఆ మాటల వెనక హెచ్చరిక రాకేష్‌కి స్పష్టంగా అర్ధమయింది.

********                          ************                             ********

తోతాద్రి చనిపోయి దశాబ్దంన్నర దాటింది. అఖిల ఇప్పుడు ప్రతిరోజూ ముప్పత్తమ్మ గుడికి వస్తూనే వుంటుంది. ఆవిడ కొడుక్కి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. చదువులో ఏవరేజ్ అయినా సినిమా  నాలెడ్జి మాత్రం అద్భుతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైద్రాబాదుకి తరలి వెళ్లిపోవడంతో ఆ పిల్లాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడని అఖిల నాతో అన్నది. అన్నట్టు ఆ పిల్లాడికి తెలుగు రాదు. నేర్పేవాళ్లెవరూ? తల్లికీ, తాతకీ వచ్చిన తమిళాన్నే అతనూ నేర్చుకున్నాడు.

మీకు అనుమానం రావొచ్చు. పిల్లాడి తండ్రి ఎవరా అని.. ఆ విషయంలో ఎవరైనా  ఖచ్చితంగా చెప్పగలరు  తండ్రి రాకేషేనని. కానీ అఖిల మాత్రం కొడుక్కి అబద్ధం చెప్పింది, తండ్రి మిలటరీలో పని చేస్తూ చనిపోయాడని.

ఇహ రాకేష్ సంగతా      ?   మోహన్‌ప్రసాద్‌తో జరిగిన సంభాషణని యథాతథంగా పూర్ణానంద్‌కి  చెప్పి అతని సలహా అడిగాడు….. పూర్ణానంద్ అఖిలకీ,  మోహన్‌ప్రసాద్ కూతురికీ  వున్న ప్లస్‌లూ, మైనస్‌లూ వివరించి, నిర్ణయాన్ని రాకేష్‌కే వదిలేశాడు.

తిరుపతిలో జరిగిన రాకేష్, వింధ్యల పెళ్లికి అతిరథమహారథులందరూ ఎటెండై, మోహన్‌ప్రసాద్‌గారిని అభినందనలతో ముంచెత్తారు. అదో ‘టాక్ ఆఫ్ ద  టౌన్..’! దేవుడు గొప్పవాడు. అందుకే చిట్టచివరిదాకా తోతాద్రిని సంరక్షించడమే గాక, అతను సంతోషంగా ఆడుకోవడానికి ఓ మనవడ్ని కూడా ఇచ్చాడు.

మొగుడు లేకుండా బిడ్డని కన్నదని అయినవాళ్లూ, కానివాళ్లూ ఆడిపొసుకున్నా, అఖిల మాత్రం చలించకుండా నిలబడటం నిజంగా గొప్పవిషయమే. ఆ మాటే నేనంటే..,

“అన్నా… ప్రపంచం ఎప్పటికప్పుడు కోరేది కొత్త వింతల్నేగానీ, పాతవికాదు. అయినా పాట విషయాలు  ఎంతకాలం గుర్తుంచుకుంటుందీ?సంవత్సరమో, రెండేళ్ళో మాట్లాడతారు.. ఆ తరవాత?” అని పకపకా నవ్వింది.

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక ‘కాలపు అల’  రాకేష్‌ని అంతెత్తున నిలబెడితే, మరో ‘అల’ అతన్ని నేలమీదకి విసిరింది.

రోజూ అతను ‘అఖిల’ గురించి కనీసం పదిసార్లయినా ఆలోచిస్తాడు. ‘వింధ్య’ పెంకితనం నానాటికీ పెరుగుతూనే వుందిగానీ తరగలేదు. మోహన్‌ప్రసాద్‌గారు అనారోగ్యంతో బయటికి రావడం లేదు. ఆయనకి ఎనభై రెండేళ్ళు. రాత్రిళ్లు నిద్దర పట్టదు. కానీ,

రాకేష్ వొంటరిగా ‘మందు కొట్టడం’ మాత్రం అతను రోజూ చూస్తూనే వుంటాడు. కూతురు క్లబ్ నించి వొచ్చేసరికి రాత్రి రెండు దాటుతుంది. అప్పుడు కూడా వాళ్లిద్దరూ భార్యాభర్తల్లా వుండరు. ఎవరి పక్క వారిదే, ఎవరి భోజనాలు వాళ్లవే. వాళ్లకి పుట్టిన పిల్లలిద్దరూ కూడా ‘పోష్’ టైపు.

మోహన్‌ప్రసాద్ అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాడు. ‘’లెక్కలేనంత ‘ఆస్తి’ సంపాయించి తప్పు చేశానా? ‘’ అని.

ఒకమాట చెప్పకపోతే అఖిలకి నిజంగా అన్యాయం చేసినట్టు అవుతుంది.

రాకేశ్ పెళ్లి అయ్యాక అఖిల ఎవ్వరినీ దగ్గరకి చేరనివ్వలా , ఆఖరికి రాకేష్ ని  కూడా !  సిన్సియర్ గా చిబితే  ఆమె లాంటి ఆడది మాత్రం సినీ ఫీల్డ్  లో  ఈనాటివరకూ నా కంటబడలా   !

మళ్లీ కలుద్దాం

మరో కథతో

మీ

భువనచంద్ర.

 

“యే భాయ్.. జర దేఖ్ కె చలో”

భువనచంద్ర

 

bhuvanachandra (5)

” యే భాయ్.. జర దేఖ్ కె చలో”

 “అదంతా ఓ కల.. అంతే..” నిర్లిప్తంగా అన్నాడు  ప్రసాదు. ఒకప్పుడు ప్రసాద్ కోసం టాప్ హీరోలు ఎదురుచూసేవాళ్లు . ప్రొడ్యూసర్లు తమని కాల్‌షీట్స్ అడగంగానే,” ప్రసాద్ కాల్‌షీట్లు తీసుకున్నారా?” అనేవాళ్లు. ప్రసాద్ ఉంటే చాలు.. మినిమం గారంటీ. ప్రసాద్‌కి ఓ ప్రత్యేకమైన ‘ఇమేజ్’ ఉండేది. అతని ‘యాక్షన్’లాగా.

సినిమాల్లోకి ప్రవేశించింది హీరోగానే. రెండు సినిమాలు చేశాక అర్ధమయింది. తన పర్సనాలిటీ  హీరో వేషాలకి సరిపోయినా తాను ఆ వేషంలో ఇమడలేనని. డైరెక్టర్ త్రిమూర్తి ఓ రోజున ప్రసాద్‌తో అదే మాట అన్నాడు. “భాయీ, నువ్వు కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నిస్తే పదికాలాల పాటు పరిశ్రమలో పచ్చగా వుంటావు?” అని.

“మొదట నాకు కోపం వచ్చింది. హీరోని కేరక్టర్ ఆర్టిస్ట్ గా వెయ్యమంటాడేంటీ ? అని” నవ్వాడు ప్రసాద్. గంటన్నర నించీ నేను ప్రసాద్‌గారితోనే వున్నాను. అతన్ని ‘ఫ్రీ’గా వొదిలేస్తే హాయిగా మాట్లాడతాడు. ప్రశ్నలు వేస్తే మాత్రం మౌనంలో కూరుకుపోతాడు. అందుకే నేను ‘వినడమే’ బాగుంటుందనుకున్నాను.

“చిత్రం ఏమంటే   హీరోగా వొచ్చి  కేరక్టర్ వేషాలు  వెయ్యడం ‘’’

“అదేం కొత్తగాదుగా ప్రసాద్‌గారూ.  చాలా మంది హీరోలుగానూ, ముఖ్య పాత్రధారులుగానూ,  నటించారుగా!”

“అవును. రాజ్‌కపూర్ ‘మేరా నామ్ జోకర్’ పిక్చర్‌లో ఒక పాట ఉంది. ‘యే భాయ్ జరా దేఖ్ కె చలో’ అనేది. అందులో  ఓ లైన్ వుంది “హీరోసే జోకర్ బన్ జానా పడ్‌తా హై’ అని. నా జీవితంలో జరిగింది అదే. బట్.. కేరక్టర్ నటుడిగా మారడం వల్లే నా పాప్యులారిటీ పెరిగింది. యమా బిజీ అయ్యాను. లెక్కలేనంత సంపాయించాను.” మళ్ళీ మౌనంలోకి మునిగిపోయాడు ప్రసాద్. నేను సైలెంటుగానే వున్నాను. కొంతసేపు కేవలం గోడ గడియారం చప్పుడు మాత్రమే వినిపించింది.

“మీరో ప్రామిస్ చెయ్యాలి. నా కథని యధాతథంగా వ్రాయకండి. జస్ట్ హింట్ వరకే. పేరు కూడా మార్చండి. ఎందుకంటే నేను ఎవరినీ హర్ట్ చెయ్యదలుచుకోలేదు. కానీ,ఆశగా యీ పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్లకి యీ ‘మలుపులు’ తెలియాలి” మళ్లీ మౌనం. మౌనం తాబేలు డిప్పలాంటిది. తాబేలు కాళ్లూ, తల లోపలికి ముడుచుకున్నట్టు మనుషులు మౌనంలోకి ముడుచుకు పోతారు.

“చక్కని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన బాల్యం. కారణం మా నాన్నగారు గొప్ప గెజిటెడ్ ఆఫీసర్. ఆయన అందగాడు. ఆయన పోలికే నాకూ వచ్చింది. మా అమ్మకి నేనంటే చాలా ప్రేమ. సో.. డబ్బులు దండిగా వుండేవి. కాలేజీలో అమ్మాయిలకి నేనంటే హీరో వర్షిప్. నాటకాల్లో ఏనాడూ పాల్గొనలేదుగానీ, మా వూరబ్బాయి సినిమాల్లో హీరో అయ్యేసరికి , నాకూ హీరో అవ్వాలనే ఆశ పుట్టింది. దానికి తోడు నా ఫ్రెండ్సందరూ ఊదరగొటారు.” నవ్వాడు. ఒకప్పుడు ప్రసాద్ తనదైన స్టైల్‌లో నవ్వితే జనాలు పగలబడి నవ్వేవాళ్లు. ఓ ప్రత్యేకమైన పద్ధతిలో  సంభాషణలు పలికేవాడు. ఇప్పుడా నవ్వులో ఒంటరితనం వుంది. వేదనా వుంది.

“చాలా మంది హీరోలు, ఆర్టిస్టులలాగా నేనూ  నటనలో కొంత శిక్షణ తీసుకున్నా.  ఓ చిత్రం తెలుసా.. అప్పటివాళ్ళలో చాలామందికంటే మొదట హీరో వేషం దొరికింది నాకే. చాలా మంది అసూయపడ్డారు. విలేజ్ సబ్జక్టు. అల్లరిచిల్లరగా తిరిగే కథానాయకుడిగా మొదలౌతుంది నా పాత్ర. వొదిగిపోయాను. కారణం నా నిజజీవితంలోనూ నాది కాస్త అల్లరి చేసే స్వభావమే..!”

చాలా ఏళ్ల క్రితం ఓ సారి ‘చిరపుంజి’ లో రెండ్రోజులు వున్నాను. చిటుక్కున వర్షం వచ్చి చిటుక్కున మాయమయ్యేది. ఒకోసారి గంటలకొద్దీ సుదీర్ఘంగా కురిసేది. అయితే అక్కడి ‘వర్షం’ పాత్ర ఇక్కడ ‘మౌనం’ పోషిస్తోంది.

“ఆ హీరోయినూ కొత్తదే.. అయితే తను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. వాళ్లమ్మ మహాముదురు. నేను హీరోగా ఎదిగిపోతాననుకుందో  ఏమో, వాళ్లమ్మాయిని చాలా ఫ్రీగా నాతో వొదిలేసేది. అప్పుడే ‘నరేన్’ నన్ను కంట్రోల్ చేశాడు” ఆగాడు ప్రసాద్. నరేన్ కూడా యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసాద్‌తో పాటు చేరాడు. ప్రసాద్ రెండు సినిమాలు హీరోగా చేసి తరవాత స్టార్ కేరక్టర్ ఆర్టిస్ట్  అయితే, నరేన్ అయిదారు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకుని తరవాత సడన్‌గా ప్రొడక్షన్‌లోకి దిగిపోయాడు. చాలా సక్సెస్‌ఫుల్ నిర్మాతేగాక రెండు మూడు హోటల్స్ కి యజమాని కూడా అయ్యాడు.

“ఫస్ట్ పిక్చర్ హిట్. ఆ వూపులోనే రెండో పిక్చర్‌కి సంతకం పెట్టాను. మొదటిది అల్లరి చిల్లరగా మొదలయ్యే హీరో వేషం అని చెప్పాగా. రెండోది ‘యాక్షన్’తో మొదలౌతుంది. హెవీ యాక్షన్ పేక్‌డ్ సినిమా!”

“అవును ఆ సినిమా నేను చూశాను. హీరోగా మీరు ఎంత బాగా డాన్సులూ, ఫైట్లూ చేసినా ఏదో ‘లోపం’ వుంది అనిపించింది అప్పుడు. బహుశా మీరు హార్ట్ ఫుల్‌గా చెయ్యలేదేమో అనుకున్నాను. అదీగాక హీరోయిన్‌కీ, మీకూ బాడీ లాంగ్వేజ్ కుదర్లేదు. చెప్పాను. నిజంగా ఆ స్టోరీ మంచిది మరో హీరో ఎవరన్నా ట్రై చేస్తే అదే సినిమా అలానే తీస్తే, ఇప్పటికీ సూపర్ హిట్ అవుతుంది.’’ అన్నా . ప్రసాద్ ఎంత బాగా చేసినా అది ఎబౌ ఏవరేజ్ సినిమాగా మాత్రమే నిలిచింది.

“మీరన్నది నిజం. నాకెందుకో ఆ సినిమా అంతా నేను కృత్రిమంగానే చేస్తున్నట్టే అనిపించేది. సినిమా హీరోయిన్ నాకంటే సీనియర్, సక్సెస్ చూసిన మనిషి కావడంతో తనో మెట్టు ‘ఎత్తున’ వున్నట్టు భావించుకుంటూ నన్ను ‘బచ్చా’ గాడిలాగా చూసేది. నేను ఫ్రీగా చెయ్యకపోవడానికి అదీ ఓ కారణమే!” తలపంకించి అన్నాడు ప్రసాద్.

“పోనీ ఆ విషయం మీరు డైరెక్టరుకో,  ప్రొడ్యూసర్‌కో చెబితే బాగుండేదేమో!!” అన్నాను.

“హా..హా..హా.. షీ యీజ్ టూ కాలిక్యులేటివ్. ఎవర్నీ ఎలా ‘అలరించాలో’ ఆమెకి తెలుసు. అందుకే నా కంప్లైంట్లు పనికిరాలేదు”  చాలా సేపటి తర్వాత ఫ్రీగా అదివరకులా నవ్వాడు ప్రసాద్.

నాకూ నవ్వొచ్చింది. ఓ హీరోగారు ప్రేమగా ఓ హీరోయిన్‌కి ‘ప్రొడ్యూసర్‌ డబ్బుల్తో ‘కారు’ బహూకరిస్తే, మరో ప్రొడ్యూసర్ ఓ హీరోయిన్‌కి ఏకంగా కారూ, బంగళా రెండూ సమర్పించాడు. బోంబే నటీమణులు చాలా నాజూగ్గా లాగేస్తారు. దేన్నైనా….! సరే తమిళం  వాళ్లూ తెలివైనవాళ్లే…. ఫీల్డులో పిచ్చివాళ్లు ఎవరంటే మన తెలుగు హీరోయిన్లే.

“ఆ సినిమా తరవాత రెండు మూడు సినిమాల్లో హీరో ఆఫర్ వచ్చినా నేను ఒప్పుకోలేదు. కారణం అవన్నీ మళ్లీ యాక్షన్ పిక్చర్లు. అప్పుడు డైరెక్టర్ త్రిమూర్తి నా దగ్గరికొచ్చి ఓ ‘కేరక్టర్ ‘ రోల్ చెయ్యమని అడిగాడు. అప్పటికే నరేన్, సతీష్, జీవి, కాంతు, అందరూ హీరోలుగా బుక్ అయిపోయారు. నేను చెయ్యాల్సింది కూడా ఓ సీనియర్ హీరోతో  ఫ్రెండ్లీగా ఆల్‌మోస్ట్ అన్ని సీన్లలోనూ వుండే  రోల్ కావటంతో ఒప్పుకున్నాను. రెండు సీన్లు అయ్యాక తెలిసిపోయింది ఏదో కొత్తగా నన్ను నేను మలుచుకోకపోతే ఆ హీరో ముందు నిలబడలేనని. అందుకే నా గెటప్ ని చిత్రంగా మార్చుకున్నా. డైరెక్టరుకీ, హీరోకీ కూడా అది నచ్చి ఆ రెండు సీన్లనీ రీషూట్ చేశారు. పిక్చర్ రిలీజైంది. ఓవర్‌నైట్ నేను స్టార్ ఆర్టిస్ట్ ని అయిపోయా. హీరోలైన నా ఫ్రెండ్స్ అందరూ నా కాల్‌షీట్ల కోసం రిక్వస్టు చెయ్యడం మొదలెట్టారు..!” మళ్లీ చిరపుంజి వర్షం జ్ఞాపకం వచ్చింది.

“సుమిత్రతో మీ రిలేషన్?” కావాలనే అడిగా. ఆ విషయం ఫీల్డులో అందరికీ తెలిసిందే గనక అడిగినా ఫరవాలేదు అనిపించింది.

“అవును. అది ఎఫైర్ స్థితి నించి పెళ్లి దాకా వచ్చింది. బహుశా  పెళ్లికి కూడా సిద్ధపడ్డానేమో. కానీ ఆగిపోయాను. కారణం తను నా మీద ‘హక్కు’ వున్నట్టు ప్రయత్నించడమే!” కొంచెం ఎమోషనల్ అయ్యాడు  ప్రసాదు.

“అంటే?” కుతూహలంగా అడిగాను. ఇక్కడ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. సామాన్యుల జీవితాల్లో ఏం జరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే సెలెబ్రిటీల విషయంలో వేరు. సెలెబ్రిటీలు కూడా మామూలు మనుషులేనని వాళ్లకీ ‘ఉద్వేగాలూ, ఉద్రేకాలూ ఉంటాయనీ జనాలు అనుకోరు. కళాకారులంతా చాలా సెన్సిటివ్ మనుషులు.  ప్రతి చిన్నదానికీ విపరీతంగా స్పందిస్తారు. అందుకే కళాకారుల జీవితాల్లో   చాలా  ఆత్మహత్యలూ, ప్రేమ వైఫల్యాలూ కనబడేది.

“భయ్యా, ప్రేమ అంటే అధికారం కాదు. ప్రేమ అంటే హక్కు కాదు. ప్రేమ అంటే స్వార్ధం కాదు. ప్రేమ అంటే పొసెసివ్‌నెస్ కాదు. ప్రేమ అంటే అహంకారం కాదు. ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునేది అంతకన్నా కాదు. నా దృష్టిలో ప్రేమ ప్రేమే. దానికి సాటి అయినదో, పోల్చదగినదో మరొకటి సృష్టిలో లేదు. సుమీని నేను ప్రేమించిన మాట వాస్తవం. ఎంతగా అంటే ఆమెకి అంతకుముందే కొందరితో శారీరక సంబంధాలు వున్నాయని తెలిసికూడా, నేను సిన్సియర్‌గానే వున్నానని యీ క్షణంలోనూ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలను. మొదట్లో తనూ ప్రేమగానే ఉండేది. నేనెప్పుడైతే సినిమా సినిమాకీ  ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతున్నానో అప్పుడే ఆమెకి ఓ రకమైన ఇన్‌సెక్యూరిటీ మొదలైంది. మరే నటి అయినా నన్ను ముగ్గులోకి దించేస్తుందేమో అన్న సందేహంతో నా మీద ‘నిఘా’ పెట్టింది. తనూ ‘నటి’ అయినా జనాలు గుర్తించేంతగా గుర్తింపు పొందలేదు. తనకి అందం వున్న మాట వాస్తవమే అయినా, నటనలో ఏవరేజ్.. అంతే కాదు, తను చాలా పర్‌ఫెక్ట్ అనుకునే ‘మెంటాలిటీ .” ఆగాడు.

తలుపు తీసుకుని రూంబాయ్ వచ్చాడు. అతనికి హార్లిక్సు, నాకు కాఫీ తెచ్చాడు. టేబుల్ మీద పెట్టి, “నా డ్యూటీ ఇంకో రెండు గంటలే సార్…!!” అని నా వంక చూసి చెప్పాడు. నేను తల పంకించాను.

“ఔట్‌డోర్ షూటింగ్ వెళ్ళి రెండ్రోజులు కాగానే జ్వరం అనో, గుండెనెప్పి అనో అరగంటకోసారి ఫోన్ చేసేది. తీరా కంగారుపడి ప్రొడ్యూసర్ ని నానా రిక్వెస్టులూ చేసి ఆమె ఇంటికెల్తే, ‘నిన్ను మిస్సవుతున్నాను ప్రసాద్. అందుకే ‘ అని నవ్వేది. ఇండస్ట్రీలో వుంటూ, ఇండస్ట్రీ గురించి తెలిసీ ఇట్లాంటి వెధవ్వేషాలు వేస్తుంటే ఏమనాలీ?

మొదట్లో సైలెంటుగా వూరుకున్నాను. ఆ తరవాత అంటే, నా మీద నిఘాలూ, యీ చండాలపు ‘జబ్బు’ కాల్సూ ఎక్కువయ్యాక ఓ రోజున వాళ్లైంటికెళ్లి ‘నిన్ను భరించడం నా వల్ల కాదనీ, మన మధ్య ఇక ఏ సంబంధానికీ తావు లేదనీ నిర్మొహమాటంగా చెప్పేసాను” మెల్లిగా హార్లిక్స్ గ్లాసు పైకెత్తి అన్నాడు. మరో అయిదు నిముషాలు మౌనసముద్రంలో కలిసాయి.

“నేను ఎంత అమాయకుడ్నంటే , లోకం తీరు నాకు తెలీదు. తెలిస్తే వాళ్లింటికి వెళ్లి మరీ ఎందుకు చెబుతానూ? నా అపార్ట్ మెంట్‌కి తిరిగి వచ్చిన గంటన్నర సేపట్లో పోలీసులు వచ్చారు. నన్ను బలవంతంగా జీప్ ఎక్కించారు. కారణం ఏమిటంటే, నా వేధింపులు భరించలేక సుమిత్ర సూయిసైడ్ అటెంప్ట్ చేసిందిట..” పగలబడి నవ్వాడు. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ‘K’ అనే హీరో తన పలుకుబడి వుపయోగించి ప్రసాద్‌ని బెయిల్ మీద బయటకు  తెచ్చాడు. ఆ లోపులో ఎల్లో పత్రికలు ఎంత బురద జల్లాలో అంతా జల్లాయి. చాలా మంది నటీమణులు తాము ప్రేమించినవాడ్ని లొంగదీయడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్‌కి పాల్పడతారు. రెండో మూడో నిద్రమాత్రలు, అదీ ప్రాణహాని కలగదని పూర్తిగా నిర్ధారించుకుని  వేసేసుకోవడం, స్నేహితులకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పడం, వాళ్లు పత్రికలకి విషయం లీక్ చేసి పోలీసులకు ఇన్‌ఫాం చెయ్యడంతో సదరు నటుడు చచ్చినట్టు తలొగ్గడం జరుగుతుంది.

ప్రసాద్ విషయంలో ‘K’  పలుకుబడేగాక దైవబలం తోడైంది. సుమిత్ర వేసుకుంది నిరపయాకరమైన మోతాదులోనని రుజువైంది. అదీగాక ఆమె ప్రేమ పేరుతో ప్రసాద్‌ని హింసించడం కూడా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ల వాంగ్మూలంలో రుజువైంది. అంతవరకూ నాకు తెలుసు.

” ఆ విషయం నాకు తెలుసు. అప్పుడే మీరు మీ పేరెంట్స్ కుదిర్చిన సంబంధం…” ఆగాను.

“అవును. ఫీల్డులో మగవాళ్లకి  పెళ్లి అవడం కూడా ఓ రక్షక కవచంలాంటిదే. కానీ, జీవితంలో నేను చేసిన  తప్పు వెంటనే పెళ్లి చేసుకోవడం. ఓ పక్కన పత్రికలూ, చానల్సూ ఇంత ఘోషించాక ఏ అమ్మాయి మాత్రం నమ్మకంగా వుంటుందీ. సినిమా నటుడ్నని  అందునా స్టార్ ఆర్టిస్ట్  అంటే ఆల్మోస్ట్ హీరోతో సమానమైన వాడ్ననీ నా మీద క్రేజ్ పెంచుకుని రోహిణి, అదే నా భార్య.. పెళ్లికి ఒప్పుకుంది. ఎప్పుడైతే భార్యగా ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే మరో హింస మొదలైంది..” మళ్లీ కాసేపు నిశ్శబ్దం.

“తొలిరాత్రే అడిగింది.. సుమిత్రకీ నాకు ఇంకా రిలేషన్ వుందా అని?” సైలెంటయ్యాడు ప్రసాద్ మళ్లీ. నాకు జాలేసింది. కానీ చెప్పడానికి ఏముందీ? నా మనిషీ, నా మొగుడూ, నాదీ అనే పదాలు వినడానికి బాగుంతాయి. కానీ అవి కంటికి కనపడని భయంకరమైన ‘చెరసాలలు’ అని అనుభవిస్తేగానీ అర్ధం కాదు.

“ఓ పక్క పెద్దవాళ్లయిన నా పేరెంట్స్, మరో పక్క క్షణం తీరిక లేని ప్రొఫెషన్, మరో పక్క అనుమానంతో నా మనసుని తినేసే భార్య.. వీటితో సతమతమైపోయా. మెల్లగా మ౦దుకి అలవాటు పడ్డాను. అయితే ఫుల్ బాటిల్స్ లాగించేంత అలవాటు కాలా. నేను చేసిన తప్పల్లా తాగేసి  ఏమీ తినకుండా మత్తుగా మంచం మీద ఒరిగిపోయేవాడ్ని. తరవాత తెలిసింది. తాగాక ఏదీ తినకుండా వుంటే తాగుడే మనని తినేస్తుందని. అదే జరిగింది. అయితే అందులోంచి బయటపడే ప్రయత్నం చెయ్యకపోలేదు..” ఆగాడు ప్రసాదు.

“కేరళ వెళ్లారుగా!” అన్నాను.

“అవును. రెండు నెలలపాటు చక్కని ట్రీట్‌మెంట్ తీసుకున్నా. ఒంటరిగా ఓ ఆయుర్వేద ఆశ్రమంలో వున్న ఆ రెండు నెలలూ నా జీవితంలో అద్భుతమైనవి..” ప్రసాద్ కళ్లు మెరిశాయి.

” ఓ మాట చెప్పనా భయ్యా… అందరూ మనవాళ్లనే అనుకుంటాం. అదేమీ తప్పు కాదు. కానీ, ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకుంటారని మాత్రం మనం అనుకోము. అదే తప్పు. నేను తిరిగి వచ్చేసరికి నాతో పాటు ఇన్‌స్టిట్యూట్‌లో వుండి హీరోలైన నా ఫ్రెండ్సే నన్ను వాళ్ల సినిమాల్లోంచి తొలగించారు. కారణం వాళ్లకంటే నాకు పేరు ఎక్కువ రావడం”

ఇది ముమ్మాటికి నిజం. ఇలాంటి రాజకీయాలకి చాలా మంది బలి అయిపోతాం. మనతో వుంటూ మనకి ఏ ఏ సినిమాల్లొ అవకాశాలు వచ్చాయో మనని అడిగి తెలుసుకుంటూ,  చాలా తెలివిగా వాటిని తమ వేపుకి తిప్పుకుని (అవసరం అయితే ఫ్రీగా వర్క్ చేసి కూడా) మనని ముంచే మహామహులు ఎందరో. అయితే వాళ్లు నిలబడగలరా అంటే అదీ వుండదు. నిలబడటానికి ‘శక్తి’ ఎక్కడిదీ?

“నేను వూళ్ళోలేని రెండు నెలల  సమయమూ , నా స్థానాన్ని ఎప్పుడు  భర్తీ చేద్దామా అని ఎదురు చూపులు చూస్తున్న మిగతా వాళ్లకి   ఓ గొప్ప వరంగా మారింది. అర్జంటుగా వాళ్లు నా ప్లేస్‌లో బుక్కయ్యారు. తిరిగి వచ్చాక చూస్తే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నాకు లేదు. నా ఫ్రెండ్స్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి కలిశా. కొందరి ‘సారీరా.. అది డైరెక్టర్ నిర్ణయం’ అని ఓపన్‌గా చైబితే  మరికొందరు ఇంట్లో వుండి కూడా ‘లేమని’ మొహం చాటేశారు. అది నాకు తెలుసు. ఈ ఇండస్ట్రీలో కెరీర్ పాలు పొంగినట్టు పొంగుతుంది. అలానే ఠప్పున చల్లారీపోతూంది. ఎందుకూ? అనే ప్రశ్నకి సమాధానం మాత్రం దొరకదు.’’’’

“భయ్యా.. మొదట్నించీ నేను కాస్త ఖర్చు మనిషినే. అంటే నాకోసం నేను ఖర్చుపెట్టుకునే స్వార్ధపరుడ్ని కాదు. కాలేజీలో వుండగా ఫ్రెండ్స్ కోసం తెగ ఖర్చు పెట్టేవాడ్ని. ప్రైమ్ లో వుండగా రోజూ నా ఇన్‌స్టిట్యూట్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద హీరోలైనా, డ్రింక్స్ ఖర్చూ, ఫుడ్ ఖర్చూ నేనే పెట్టేవాడ్ని. ఇప్పుడు తెలుస్తోంది. అసలు వాళ్లు ఏనాడూ చిల్లుపైసా జేబులోంచి తీసే ప్రయత్నమే చెయ్యలేదని. ఓకే. కొండమీద పడ్డ వర్షం నాలుగు వైపులకీ జారిపోయి కొండ మళ్లీ పొడిబారుతుందనే సామెతలాగ, నా జీవితంలోనూ సంపాయించిన లెక్కలేనంత సంపాదన నా  చుట్టాలకీ, పక్కాల పెళ్ళిళ్లకీ, చదువులకీ, నా భార్య కోరిన సెక్యూరిటీలకీ జారిపోయింది. ఇప్పుడు.. ఇక్కడ.. యీ గదిలో  ఇలా వంటరిగా, అయినా హాయిగా కూర్చున్నా.. రేపేమవుతుందో నాకూ తెలీదు.  చాలామంది వొచ్చారు. వెళ్లారు. మరికొందరు కూడా వస్తారూ, వెళ్తారూ,త్వరలో కలుద్దాం అంటారు . ఆ ‘త్వరలో’ అన్నది రోజులు కావొచ్చు. నెలలూ కావొచ్చు.. మిత్రమా.. ఓ ‘జీవితమూ’ కావొచ్చు. ఏమైనా  మరోసారి మళ్లీ నా జీవితంలోకి తొంగి చూసుకున్నాను. మూసిన తలుపులు చాలానే ఉన్నాయి. మళ్లీ మనం కలిస్తే వాటన్నింటినీ కూడా ఓపెన్ చేద్దాం..ప్రస్తుతానికి ఇంతే!” లేచి నిలబడి అన్నాడు ప్రసాదు. అతన్ని అతని గదిలో ఒదిలిపెట్టాను.

నిజమే మళ్లీ కలిస్తే మరెన్నో తలుపులు తెరుచుకుంటాయి. వేచి చూద్దాం.

 

 (కొన్ని సంఘటనల సమాహారమే  ప్రసాద్ కధ . ఒక్క రిక్వస్ట్ …..మందు తాగొచ్చు ,కానీ మందుకి బానిస కావొద్దు .సమస్యలకి పరిష్కారం మందులో  దొరకదు .  జీవితం అన్నిటికన్నా విలువైనది ,  ‘’విజయం’’కన్నా కూడా .)

 

 

రాజకీయమా.. నీకెన్ని రూపులో!

భువనచంద్ర

 

bhuvanachandra (5)“శివమూర్తిగారి పరిస్థితి బాగోలేదట.” ప్రొడక్షన్ బాయ్ నారాయణ మేనేజర్ కృష్ణమూర్తిగారితో అన్నాడు. పేరుకి బాయ్ అంటారుగానీ నారాయణకి ఏభై రెండేళ్లు. ‘మంచితనం’ తప్ప చదువు లేదు. ఏ పని వప్పగించినా పెర్‌ఫెక్టుగా చేస్తాడు. భాగాహారాలు, హెచ్చవేతలూ రావుగానీ ,కూడికలూ తీసివేతలూ ‘మనసు’ కాగితం మీదే ఒక్క తప్పు లేకుండా చెయ్యగలడు. అందుకే ఇండస్ట్రీలో నారాయణ అంటే అందరికీ గౌరవమే.

ఈ మధ్యే పాతనీరు కొట్టుకుపోయి కొత్తనీరు వచ్చింది. ఉచ్చనీచాలు మరచిన యువత ఎంటర్ అయింది. వాళ్లకి తెలిసింది కొద్ది…’తెలుసు’ అనుకున్నది హెచ్చు. దాంతో ఎవరన్నా వాళ్లకి లెక్కలేదు, గౌరవమూ లేదు.

“ఒరేయ్ నారాయణా.. కాఫీ తీసుకురారా..” అని పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రడైరెక్టరు నారాయణని పిలిస్తే ప్రొడక్షన్ కుర్రాళ్లంతా చర్రున లేచారు. వాళ్ల నోట్లోంచి మాట రాకముందే నారాయణ చల్లగా నవ్వి  “పిల్లల్లారా! ఆయన ఏరా అన్నాడని మీరు కోప్పడి అరిస్తే షూటింగ్ ఆగిపోద్ది. అవునా? యీ షూటింగ్ కూడా ఎవరిదీ? మన శివమూర్తిగారిది. శివమూర్తిగారు ఎవరూ? మనకే గాదు. కష్టాల్లో వుండే ఏ సినిమావోడికైనా దేవుడు. పిచ్చోళ్ళారా, చిన్నపిల్లలు గుండెమీద గుప్పిళ్ళతో కొడితే తండ్రి సంతోషిస్తాడుగానీ, ఏడుస్తాడట్రా?” అన్నాడు.

పొంగేపాలమీద నీళ్లు జల్లితే పాలు అణిగినట్టు అణిగారు కుర్రాళ్లు. అదీ నారాయణ వ్యక్తిత్వం.

శివమూర్తి నారాయణకి సాక్షాత్తు దేవుడే. అతను కొలిచే శివుడే. మూడేళ్లు పంట నష్టమై . బ్యాంకు వడ్డీలు పెరిగిపోయి కట్టలేక నారాయణ  పురుగులమందు తాగితే, ఆ పురుగుల మందూ ‘కల్తీ’ దవడం వల్ల తీవ్రమైన డయేరియాతో హాస్పిటల్లో పడుంటే ఆ వూరివాడూ, సినీ నిర్మాతా, ఫైనాన్షియరూ అయిన శివమూర్తి, నారాయణ హాస్పిటల్ ఖర్చులన్నీ తనే కట్టి, అతన్ని  బయటికి తీసుకొచ్చి, కుటుంబం నడపడానికి కొంత డబ్బిచ్చి, “ఒరే నారాయణా, మనిద్దరం చిన్ననాటి స్నేహితులం. నా అదృష్టం బావుండి కోటీశ్వరుడ్నయ్యాను. నీ దురదృష్టం నిన్ను వెంటాడి ఆత్మహత్యకి పురికొల్పింది. వద్దురా. ఇకనించీ నువ్వు నాతోటే వుంటావు.” అని నారాయణనీ, అతని చిన్న ‘ఫేమిలీ’నీ మద్రాసు తీసుకొచ్చి, అతనిదే అయిన ఓ పెద్ద ‘అవుట్ హౌస్’లో ఉంచాడు.ఆ కంపెనీలోనే ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉండే కృష్ణమూర్తిగారికి నారాయణను వప్పగించి, “కృష్ణమూర్తిగారూ, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. కోట్లు కళ్ల ఎదుట ఉన్నా కక్కుర్తి పడని నిఖార్సైన మనిషి. నేలతల్లిని నమ్ముకున్న భూమి బిడ్డ. వీడ్ని మీ చేతుల్లో పెడుతున్నా.వీడికి చదువు లేదుగానీ, అంతులేని సిన్సియారిటీ వుంది.” జీతం ఎంతా? అనేది ఆలోచన వద్దు. వాడి బాధ్యత మొత్తం నాదే!” అని అన్నాడు.

అప్పటినించీ ఇప్పటిదాకా కృష్ణమూర్తిగారు నారాయణని సొంత తమ్ముడ్లా చూసుకున్నాడు. కారణం నారాయణ నిజాయితీ. ఇడ్లీ ప్లేటు 10 రూ, దోశ 15 రూ, పూరీ 20 రూ, ఇలా ఒరిజినల్ రేట్లు వుంటే, ప్రొడక్షన్ వాళ్ళు హోటల్ వాళ్లతో లాలూచీ పడి ఇడ్లీ ప్లేటు 20, దోశ 25, పూరీ 30 ఇలా రసీదులు, అంటే తప్పుడు రసీదులిచ్చి డబ్బు దోచేస్తారు. అందులోనూ భాగాలు పంచుకునేవాళ్లు వుంటారు. వీళ్లు ఇచ్చేవి తప్పుడు లెక్కలని వాళ్లకే తెలుసు. తప్పుడు లెక్కలు వుంటేనేగా తప్పుడు ఖాతాల్లో డబ్బులు ‘జమ’ అయ్యేదీ…!

నిర్మాతలకి తెలిసినా నోరెత్తరు. కారణం ఏమంటే,  ఫుడ్ డిపార్టుమెంటుతో ఏ మాత్రం గొడవపెట్టుకున్నా షూటింగ్ సజావుగా జరగదు. అందుకే చూసీ చూడనట్టు వదిలేస్తారు. ఎక్కడోగానీ, కృష్ణమూర్తీ, నారాయణలాంటివాళ్లు వుండరు. అవినీతికి వాళ్లు దూరంగా ఉండటమేగాక , అవినీతి కళ్లెదురుగుండా జరుగుతున్నా వాళ్లు నోరు మూసుకుని వుండలేరు. వాళ్లు జీతం తప్ప పైన ఒక్క పైసా కూడా ఎరక్కపోవచ్చు, కానీ అంతులేని గౌరవాన్ని ‘డిపార్ట్‌మెంట్’ నించి సంపాదించారు.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టు,  నీతికి కట్టుబడేవాడు (సినిమాల్లో అప్పుడప్పుడూ ,అంటే ఎల్లప్పుడూ కాకపోయినా) గౌరవించబడతాడు. సినిమా ఫీల్డులో ఇప్పుడు జరుగుతున్నది శివమూర్తిగారి షూటింగే. కొన్ని వందల సినిమాలకి ‘భుజం’ అందించిన శివమూర్తిగారు, పదేళ్ల తరవాత అన్నిటికీ తెగించి తీస్తున్న సినిమా ఇది. మనుషుల్ని నమ్మి పని వొప్పగించడం మాత్రమే ఆయనకి తెలుసు గనక, మిగతా నిర్మాతలలాగా షూటింగ్ స్పాట్‌లో ఆయన వుండరు. ఓడలు బండ్లు అవుతాయంటారు. ఇప్పుడు జరిగింది అదే. చాలామంది దొంగలెక్కలు చూపించి ఎగ్గొట్టారు. మరి కొందరు వాళ్ల సినిమాల్ని వాళ్లే మధ్యలో ఆపేసి, అందినంతా తొక్కేసి, పై పై ఏడుపుల్తో ఆయన్ని చీట్ చేశారు. నోటికి మాటగా అప్పు తీసుకున్నవాళ్లు, ఆనాటి మాటని “నీటి మీద రాతగా మార్చి అసలుకే ఎసరు పెట్టారు. శివమూర్తిగారు కోర్టుకు వెళ్లొచ్చు. వీళ్లందర్నీ కోర్టులకీ  ఈడ్వనూ వచ్చు. కానీ వుపయోగం వుండదు. ఎందుకంటే ఇవాళ ‘వాళ్లంతా’ గొప్పవాళ్లు.

ఒకప్పుడు ఆయన ఆఫీసులో ‘బాయ్’గా పని చేసినవాడు ఇవాళ గో…ప్ప నిర్మాత. ఒకనాడు ఆయన కంటిచూపుకై క్యూలో నిలబడి ఆయన ఆశీస్సులతో దర్శకుడై అతి వినయంగా వున్నవాడు నేడు సూపర్‌హిట్ దర్శకుడు. కానీ, ఆయన ఎదురుపడటం వీళ్లకి నచ్చదు. కారణం ఆ హిమాలయం ముందు ఒకప్పుడు వీళ్లు గులకరాళ్లని వాళ్లకీ తెలుసు. సినిమా జీవితం కూడా సినిమా సెట్టింగులాంటిదే. ఒక ఫ్లోర్‌లో ఇవాళ మహారాజా పాలేస్ సెట్టింగ్ వేస్తే, మరోనాడు అదే ఫ్లోర్‌లో గుడిసెల సెట్టింగు వెయ్యాల్సి రావచ్చు. కట్టె పేళ్ళని చకచకా రాజమహల్ చేసినట్టే, గుడిసెల్నీ వేస్తారు.

శివమూర్తిగారి ‘సెట్టింగ్’ మారింది అంతే.. అందుకే పదేళ్ళ క్రితమే కృష్ణమూర్తిగారికీ, నారాయణకీ చెప్పేశారు. “మూర్తిగారూ, నేను ప్రొడక్షనూ, ఫైనాన్సింగూ అన్నీ మానేసే పరిస్థితిలో వున్నాను. నేను ఆ పని చెయ్యకముందే మీరు మరో కంపెనీలోకి మారిపోండి. నేను మూసేశాక వెడితే మిమ్మల్ని ఎవరూ తీసుకోరు. సెంటీ’మెంటల్’ ఫీల్డు కదా ఇదీ!” అని నవ్వారు. ఆ విషయం కృష్ణమూర్తిగారికి తెలుసు. ఇష్టం లేకపోయినా శివమూర్తిగారి బలవంతం వల్ల మారక తప్పలేదు. నారాయణ ‘ససేమిరా’ అంటే, శివమూర్తిగారు కేకలేసి పంపారు.

పదేళ్ళ తరవాత మళ్లీ శివమూర్తిగారే కృష్ణమూర్తికీ, నారాయణకీ కబురెట్టి “సినిమా తియ్యక తప్పని పరిస్తితి. సక్సెస్ అయితే కోలుకుంటా.. లేదా ఎటూ మునగాల్సిందే!” అన్నారు. పాతవాళ్లని, అంటే ఇప్పటి గ్రేట్స్‌ని సంప్రదిస్తే రకరకాల కారణాల్తో తప్పించుకున్నారు. ఒకరయితే “కృష్ణమూర్తిగారూ, శివమూర్తి డైరెక్టుగా నా ముందుకొచ్చి నన్నడిగితే కాదన్ను. కానీ ఆయన ఆ పని చేయ్యడుగా!” అని వంకరగా నవ్వాడు.

కృష్ణమూర్తికి నవ్వొచ్చింది. కారణం యీ మహాదర్శకుడే ఒకప్పుడు శివమూర్తి క్రీగంట చూపుకోసం పాటుబడి డైరెక్టరయింది. “అయ్యా మహాదర్శకుడుగారూ! శివమూర్తిగారు ఏనాడు ఎవర్నీ సంప్రదించరనీ, అప్పుడూ నన్నే డీల్ చెయ్యమనేవారనీ మీకు తెలుసు. సరే మీ ఇష్టం.. ఆయనతో మీ మాట చెప్పి చూస్తా…” అని వచ్చేశాడు. ‘కృతజ్ఞతకి కొన్ని చోట్ల చోటుండదు. చివరికి ఓ చిన్న సినిమా తీసి పెద్ద హిట్ చేసిన ‘నిరంజన్’ని డైరెక్టరుగా ఫిక్స్ చేశారు కృష్ణమూర్తి. అందరూ కొత్త నటీనటులే..

ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. ‘ఉప్పు’ తిన్న కృతజ్ఞత టెక్నీషియన్లలో వుంటుంది. ఎందుకంటే , ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చినా వారి రెమ్యూనరేషన్ నటీనటులకీ, దర్శకులకీ పెరిగినట్టు పెరగదు  గనక. అందుకే శివమూర్తిగారి  సినిమా తీస్తున్నారనగానే, మాటల, పాటల రచయితలూ, కెమెరా, సౌండ్ డిపార్టువాళ్లూ, ప్రొడక్షన్ బాయిస్ అందరూ మహదానందంగా కృష్ణమూర్తిగారు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్‌కే ఒప్పుకున్నారు. కొందరైతే “కృష్ణమూర్తిగారూ, సినిమా పూర్తి కానివ్వండి. అడ్వాసులూ అవీ వొద్దు. హిట్టై శివమూర్తిగారు ఊబిలోనించి బయటపడితే చాలు!!” అని మనస్ఫూర్తిగా అన్నారు.

కృష్ణమూర్తిగారు యీ మాట శివమూర్తిగారికి ఫోన్ చెసి చెబితే ఆయన కళ్లనీళ్లు పెట్టుకుని “చాలు మూర్తిగారూ. అది చాలు. లోకంలో మనిషిని మనిషిని నమ్మొచ్చు అనడానికి” అన్నారు.

సినిమా మూడొంతులు పూర్తయింది. ఇక్కడుండే విచిత్రం ఏమంటే ఎవరి పని వాళ్లు చూసుకోవడం 30% అయితే పక్కోడి పని గమనించడం 70%. అంతేగాదు. మన సినిమా బాగా ఆడాలి.. పక్కోడి సినిమా పోయినా ఫరవాలేదు అనుకోవడం. ఒక పిక్చరు హిట్టయితే, “నా బొంద.. శుక్రవారం రిలీజూ.. కనక ఓపెనింగ్స్ ఉండటం మామూలే.. శనాదివారాలు హాలిడేసు, కనక చచ్చినట్టు ‘కలక్షన్సు’ ఉంటాయి. సోమవారం చూడు.. అప్పుడు చెప్పు.. అది హిట్టో.. ఫట్టో” అని చప్పరిస్తారు. పక్కోడి సినిమా ఫ్లాపైతే ..”అది ఫ్లాపవుద్దని నాకు ముందే తెల్సు. ఆడికి ముందే జెప్పా…’ఒరే… కాస్త జోరు తగ్గించుకో, బడ్జెట్టు అదుపులో పెట్టుకో’ అని.. వింటేగా..!” అని ముక్కూ మూతీ విరుస్తారు. ఇది సినీ నైజం.

మ్యూజిక్ డైరెక్టర్ మంచివాడు. అతనికి మొట్టమొదటి చాన్సు ఇచ్చింది శివమూర్తిగారే. అందుకే “శివమూర్తిగారూ, ఎడిట్ అయిన భాగాన్ని ఎప్పటికప్పుడు నాకు పంపేయండి. ఒకటికి పదిసార్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా.. వీలయినప్పుడల్లా నా స్టూడియోలోనే కీబోర్డు, రిధిమ్ సెక్షనూ మిక్స్  చేస్తా.అందువల్ల ఖర్చూ శ్రమా రెండూ తగ్గుతాయి” అన్నాడు.

ఇక్కడో ప్లస్సు ఉంది. మైనస్సూ వుంది. వాయించిన ‘మ్యుజీషియన్స్’ ఎమోషన్స్‌ని దాచుకోలేరు.

ఎందుకంటే సంగీతం భగవంతుడి భాష. Music is the Language of God. ఆ భాష తెలిసినవారు అబద్ధాలు అంత తొందరగా ఆడలేరు.

ఏమాత్రం ‘సీను’ నచ్చినా అద్భుతం అని పొగిడేస్తారు. నచ్చకపోతే… ‘అదా’ అని చిన్నగా పెదవి విరుస్తారు.

పిక్చర్ ‘సత్తా’ ఏమిటో రీరికార్డింగ్‌లో తెలిసిపోతుంది. కొన్ని రీళ్లు అలా మిక్సయ్యేసరికి పిక్చర్‌కి ‘అద్భుతం’ అన్న టాగ్ ఇచ్చేశారు మ్యూజిషియన్స్. దాంతో పెద్దలకి కలవరం.

డాక్టరు కొడుకు డాక్టరైనప్పుడు యాక్టర్ కొడుకు యాక్టరెందుకు కాకూడదూ? ఖచ్చితంగా కావొచ్చు. కానీ, డాక్టర్ కొడుకు డాక్టరైనా అతని అదృష్టం ‘హస్తవాసి’ మీదే ఆధారపడి వుంటుంది.  యాక్టర్ కొడుక్కి అలా కాదు. ఫస్టు సినిమా ‘ఫేన్స్’ మోసేస్తే, రెండో సినిమాని నిర్మాత ‘మోయిస్తాడు’. ధర్డ్ సినిమా ‘మోయించాలంటే’ రాజకీయాలే గతి. (అప్పటికీ  సదరూ ‘నటకుమారుడు’ సత్తా నిరూపించుకోలేకపోతే)

రాబోయేది సంక్రాంతి సీజను. ఇద్దరు ‘నటకుమారు’ల సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. పెద్ద పెద్ద, కొత్త కొత్త థియేటర్లన్నీ సదరు ‘నటకుమారు’ల కోసం ముందే బుక్ చేసేసి పెట్టేశారు.

శివమూర్తిగారి సినిమా నాలుగో ‘అంకం’లోకి అడుగుపెట్టకముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ‘మరో చరిత్ర’ని మించిన హిట్ అవుతుందని ఒకరూ.’మాయాబజార్’లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మరికొందరూ ‘టాక్’ని బయట పెట్టడంలో సదరు ‘నటతండ్రులు’ గబగబా సంయుక్తంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తమతమ ‘దర్శక ఐరావతా’ల తోటీ, నిర్మాత ‘దిక్పాలకు’లతోటీ మీటింగ్ పెట్టుకున్నారు.

‘ఎదుటి’వాడ్ని నిలబెట్టాలీ అనుకున్నప్పుడు ఎవడూ  తక్షణమే స్పందించడు. ‘ఎలా నిలబెట్టాలి’ అన్న ఆలోచనలు ఓ పట్టాన తేలవు. అదే ‘ఎదుటివాడ్ని పడగొట్టాలీ అన్నప్పుడు మాత్రం క్షణాల మీద అయిడియాలు పుట్టుకొస్తాయి. ఎంత ఫాస్టుగా అంటే అరగంటలో మీటింగ్ పూర్తి చేసేసుకుని, ఆరుగంటలపాటు ఆనందంగా మందుపార్టీ చేసుకునేంత.

రెండు రోజుల్లో రెండు ప్రెస్ మీట్లు జరిగాయి. ‘నిరంజన్’ని అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో డైరెక్టరుగా ఎనౌన్సు చేస్తూ….! అది ‘టాక్ ఆఫ్ ద టౌన్’ అయింది. కారణం దిగ్గజాల్లాంటి ఇద్దరు మహానటులు నిరంజన్‌ని తమ వారసులకి డైరెక్టరుగా పెట్టుకోవడమే..!

అప్పటిదాకా చిన్న సినిమాలు చేస్తున్న కెమేరామెన్‌ని ఓ నిర్మాతగారు ప్రత్యేకంగా పిలిపించి ‘డైరెక్టర్’ ఆఫర్ ఇచ్చారు. (నిర్మాత ఎవరో చెప్పక్కర్లేదుగా..)

నిరంజన్‌ని డైరెక్టరుగా పెట్టుకున్న నటదిగ్గజాలు ఓ కండీషన్ మాత్రం పెట్టారు. ఏమంటే వారిద్దరి చిత్రాలకీ సంక్రాంతి రోజునే లాంచనంగా షూటింగ్ ప్రారంభం చెయ్యాలని.

పరుగుపందెంలో పరిగెత్తేవాడెప్పుడూ పక్కచూపు చూడకూడదు. చూసిన క్షణం తెలియకుండానే వేగం తగ్గుతుంది. చెవులు రిక్కించవచ్చు తప్ప కళ్లు తిప్పకూడదు.

ఇప్పుడు జరిగింది అదే. ఇద్దరు మహానటుల వారసులతో ఒకేరోజు సినిమా ఓపెనింగ్ అనేసరికి నిరంజన్ బుర్రలో ఓ తూఫాను మొదలైంది. చేస్తున్న సినిమా మీద కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గి, అర్జంటుగా అద్భుతమైన 2 సీన్లు రాసుకోవడం మీద కాన్సంట్రేషన్ పెరిగింది.

కెమేరామెన్ గాల్లో తేలుతున్నాడు. మంచి థియేటర్లు అన్నీ ముందే బుక్ చేసేయడంతో ‘చెత్త’వి మాత్రం మిగిలాయి. సంక్రాంతికి రావల్సిన పిక్చర్‌ని  ‘పోస్ట్‌పోన్’ చెయ్యక తప్పని పరిస్థితి. అప్పటిదాకా శివమూర్తిగారిమీది గౌరవంతో ముందుకొచ్చిన బయ్యర్లు సడన్‌గా వెనక్కు తగ్గటంతో డబ్బుకి కటకట. ‘టిఫెన్లు’ కూడా అప్పు మీద తేవాల్సిన పరిస్థితికి కంపెనీ దిగజారింది.’కనీస కృతజ్ఞత’  మీద నమ్మకం పెట్టుకున్న శివమూర్తిగారి గుండెకి హార్ట్ ఎటాక్ వచ్చింది.

“ఆయనది ఎప్పుడూ విశాల హృదయమే.. ఇప్పుడు ఆ విశాల హృదయానికి ‘అటాక్’ తోడయింది” అని ఓ దౌర్భాగ్య రచయిత వెకిలినవ్వు నవ్వుతూ చమత్కరించాడు కూడా. ఆ నికృష్టుడికి ‘రచయిత’ స్థానం ఇప్పించిందీ శివమూర్తిగారే. సదరు రచయితగారి దగ్గర పదిమంది ‘ఘోస్టు’లున్నారిప్పుడు. అందుకే ఆనోటి దూల.

కర్ణుడి చావుకి కోటి కారణాలంటారు. ఇప్పుడా సామెత ‘శివమూర్తి పిక్చరుకి శతగండాలు’గా మారింది. ఒక్కటి మాత్రం చెప్పుకోక తప్పదు.

కృష్ణమూర్తిగారు నటీనటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ, ఆఫీసువాళ్లనీ, ప్రొడక్షన్ బాయిస్‌నీ, కెమేరా వాళ్లని అందర్నీ పిలిపించి ఓ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించినప్పుడు..

“అయ్యా… పిక్చరు ఆగకూడదు. మా టిఫిన్లూ, భోజనాలూ మేమే తెచ్చుకుంటాం. మా రవాణా ఖర్చు మేమే పెట్టుకుంటాం. మీరు మాకు ఇచ్చిన అడ్వాన్సు కూడా వెనక్కి ఇచ్చేస్తాం కానీ పిక్చరు మాత్రం ఆపకండి”

అని అందరూ ఎలుగెత్తి ఘోషించడం మాత్రం చలనచిత్ర పరిశ్రమలో (అది ఎక్కడైనా) ఏనాడూ జరగలేదు. అదో అద్భుతం !అంతే …!

సంక్రాంతి సినిమాల రష్ అయ్యాకే సినిమా విడుదల చేయ్యడానికి నిర్ణయించడమైంది.

 

_________________

 

“నారాయణా.. బయల్దేరు.. శివమూర్తిగారి పరిస్థితి నిజంగా బాగోలేదని సుశీలమ్మగారు ఫోన్ చేశారు” కళ్లు తుడుచుకుంటూ అన్నారు కృష్ణమూర్తి.

విజయవాడలోని ఓ సామన్యమైన హాస్పిటల్లో నిస్తేజంగా పడి వున్నారు శివమూర్తిగారు. ఒకప్పటి ఆయన ‘వైభవం’ తెలీని చీఫ్ డాక్టర్ ‘డబ్బులు’ కట్టగలరా లేరా అని అసహనంగా వున్నాడు. శివమూర్తిగారికి పిల్లలు లేరు.

“పిక్చరు అమ్మేసి అయినా అందరి బాకీలూ తీర్చండి మూర్తిగారూ. ఒక్క పైసా కూడా తగ్గించవద్దు. సుశీలకిక మీరే దారి చూపించాలి. ఒరే నారాయణా.. నువ్వేరా నాకు మిగిలినవాడివి. నేను వెళ్లిపోతే తలకొరివి పెట్టే బాధ్యత నీదే” అన్నారు శివమూర్తిగారు నారాయణ వంక చూసి.

చిత్రం ఏమంటే.. అవే ఆయన చివరి మాటలు. బ్రతికుండగా ‘అమ్మ’కి అన్నం పెట్టని మహానుభావులు చచ్చాక “ఊరి విందు” చేశారన్న సామెత ప్రకారం మహానటులిద్దరూ కడవలతో కన్నీళ్లు కార్చి శివమూర్తిగారు తమకెంత సహాయం చేశారో, వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఏడ్చి ఏడ్చి చెబితే…

దిగ్దర్శకులు పొర్లిపొర్లి ఏడుస్తూ తమ ప్రగాఢ సంతాప సందేశాల్ని  తెలియజేస్తూ ‘శివమూర్తిగారు లేని లోటు’ సినిమా పరిశ్రమని కనీసం శతాబ్దం పాటు పీడిస్తుందని బల్లగుద్ది చెప్పారు.

రాత్రికి రాత్రే ఇద్దరు మహానటులూ కుమ్మక్కై శివమూర్తిగారి పిక్చర్‌ని అర్జంటుగా, అయిన ఖర్చులకి కొంత జత చేసి ఇచ్చి సుశీలమ్మగారి దగ్గర ‘హక్కులు’ కొనేశారు.

అందరి బాకీలూ తీర్చి ఆవిడ నిర్వికారంగా నిలబడితే…

“అమ్మా నాకు తోబుట్టువులు లేరు. నువ్వే నా తోబుట్టువువు. మా శ్వాస ఆడేంతకాలం నీకు కష్టం కలగనివ్వం” అని కృష్ణమూర్తిగారూ, నారాయణా తోడు నిలబడ్డారు.

పిక్చర్ రిలీజైంది. అదీ ‘నటకుమారుల’ కోసం సిద్ధం చేసిన సూపర్ డీలక్సు థియేటర్లలో.

పిక్చర్ సూపర్ డూపర్ హిట్. కోట్లు కురిశాయి. పది రోజులు ఆడితే ‘శభాష్’ అనుకునే రోజుల్లో రెండు వందల రోజులు , రోజుకి నాలుగు షోల వంతున ఆడింది.

చిత్రం ఏమంటే.. సినిమా అయ్యాక ‘నిరంజన్’ని పట్టించుకున్నవాడు లేడు. కెమేరామెన్ పరిస్థితీ అంతే.. ఇప్పుడా ఇద్దరూ తెలుగు పరిశ్రమకి గుమ్మడికాయ కొట్టేసి ‘భోజపురీ’ సినిమా తీసే ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతున్నరని లేటెస్టు వార్త..

రాజకీయమా.. నీకెన్ని రూపులో!

*

బొమ్మా – బొరుసూ

“ఆగవోయ్.. ఇందులో ఎముందీ…!” చిరునవ్వుతో అన్నారు ప్రఫుల్లరావుగారు. ఆయన మాంచి పేరు మోసిన నిర్మాత. ఇప్పటివరకు కనీసం పది సూపర్‌హిట్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. సూపర్‌హిట్ ప్రొడ్యూసరే కాదు. ‘చెక్కులు’ ఇవ్వడంలోనూ ఘనుడే. మాంచి పే మాస్టర్.
‘సునీత్’ ఇండస్ట్రీకి లభించిన ఓ వరం అని చెప్పాలి. బి.ఎ.పాసయ్యాడు. తల్లిదండ్రులు కొడుకుని ‘డాక్టర్’ చెయ్యాలనుకుంటే తను ‘యాక్టర్’ ని మాత్రమే అవుతానని కుండ పగలగొట్టినట్టు చెప్పి, అన్నట్టుగానే యాక్టర్ అయ్యాడు. తండ్రి ఓ చిన్న కంపెనీలో పెద్ద గుమాస్తా. (హెడ్ క్లర్క్). తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచరు. అంతే కాదు మంచి డిజైనర్. ప్లెయిన్ చీరల్ని తీసుకుని రకరకాలుగా వాటి మీద డిజైన్లు కుట్టేది. ఎన్ని రకాల ‘కుట్లు’ వున్నాయో, చీరని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా అలంకరించవచ్చో ఆమెకి తెలిసినట్టు బహుశా బాంబే డిజైనర్లకి కూడా తెలీదని ఘంటాపధంగా చెప్పొచ్చు.
ఒక చీర జాకెట్టుకి కనీసం 5 వేలు డిమాండ్ చేసేది. ఒక్కోసారి పదివేలు అన్నా జనాలు ఇచ్చేవారు. కారణం ఆమె పనితనం. ఆవిడ చేతుల్లో ప్రాణం పోసుకున్న చీర కడితే అందం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని జనాల నమ్మకమే కాదు నిజం కూడా.
సునీత్ బాల్యం ‘రిచ్’గానే గడిచింది. కాలేజీలో మరింత ‘జోష్’గా నడిచింది. కారణం తండ్రికి తెలీకుండా కావల్సినంత డబ్బుని వసుమతి (సునీల్ తల్లి) కొడుక్కి ఇవ్వడమే.
సునీల్ ఫ్రెండ్ నిశ్చల్. నిశ్చల్‌ది విజయవాడ. బై బర్త్ అతను గుజరాతీ. అయినా విజయవాడలో వాళ్ల తాతల కాలం నుంచి స్థిరపడటం వల్ల స్వచ్చమైన తెలుగు మాట్లాడతాడు. ఆటొమొబైల్ పార్టుల షాప్ మాత్రమేగాక ‘సూరత్’ నించి సరుకు తెప్పించి, లాభానికి అమ్మే బట్టల షాపులు మూడున్నాయి. ఇక తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే వడ్డీ షాపులు ఒక్క బెజవాడలోనే కాక గుంటూర్లోనూ, తెనాలిలోనూ కూడా వున్నాయి.
సునీల్, నిశ్చల్ ఇద్దరూ చదివింది ‘N’ కాన్వెంట్‌లో అక్కడ చేరాలంటే డబ్బుతో ‘మదించి’న వాళ్లకి మాత్రమే సాధ్యం. ఇంటర్ అయ్యాక సునీత్ పేరెంట్స్‌తో హైద్రాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. కారణం ఓ పే…ద్ధ సినిమా ప్రొడ్యూసర్ వసుమతిని బ్రతిమాలి, బామాలి తన సినిమాకి కాస్ట్యూమ్ ఇన్‌చార్జిగా పెట్టుకోవడమే… ఆ ప్రొడ్యూసర్ కూతురు తండ్రికి వసుమతిని గురించి చెప్పింది. తీసేది హిస్టారికల్ పిక్చర్ కావడమూ, వసుమతి డిజైన్లని చూడటమూ జరిగి, ప్రొడ్యూసర్‌కి సంపూర్ణ నమ్మకం ఏర్పడి, వసుమతి చేత స్కూలుకి లాంగ్ లీవ్( అదీ లాస్ ఆఫ్ పే మీద పెట్టేట్టూ.

జీతానికి మూడు రెట్లు ప్రతి నెల తాను ఇచ్చేట్టు, సినిమా పూర్తయ్యాక పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేట్టు) పెట్టించి మొత్తం ఫేమిలీని హైద్రాబాద్‌కి షిఫ్ట్ చేయించాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. కథ ప్రకారం అద్భుతమైన డిజైన్లని సృష్టించసాగింది వసుమతి.
శేషారావు ఆ కంపెనీకి ప్రొడక్షన్ మేనేజరు. ‘పని’ బాగా తెలిసిన లౌక్యుడు. కంపెనీవరకూ సిన్సియర్‌గా వుంటూనే తన పద్ధతిలో తను ‘డబ్బు’ సంపాయించుకునేవాడు.
కొందరు ‘కార్లు’ కొని సినిమా కంపెనీలకి అద్దెకిస్తారు. శేషారావుకి అదో సోర్స్. అలాగే కొన్ని బట్టల షాపులు, అలంకరణ సామగ్రి దొరికే చోట్లు, మెస్సులూ ఇవన్నీ కూడా శేషారావు చేతులు తడుపుతూనే వుంటాయి.
ప్రొడ్యూసర్‌కి ఇవన్నీ తెలిసినా పట్టించుకోడు. కారణం కొండమీది కోతినైనా క్షణాల్లో తేగలిగిన సమర్ధుడు శేషారావు. అదీగాక, శేషారావు కంపెనీ వరకు నమ్మకస్తుడూ, నిజాయితీపరుడూ.
వసుమతి అంటే శేషారావుకి గిట్టదు. అసలే హిస్టారికల్ సినిమా. అదీ పెద్ద బడ్జెట్‌తో తీస్తున్నది. కాస్ట్యూమ్స్‌కే కొన్ని కోట్లు కేటాయించారు. అదంతా శేషారావు చేతుల్లోంచే వెళ్లాలి. కాని వసుమతి వ్యవహారం అతనికి మింగుడు పడట్లేదు. ఏదున్నా డైరెక్టుగా ప్రొడ్యూసర్, డైరెక్టర్లతో మాట్లాడుతుంది తప్ప ఎవర్నీ లెక్క చెయ్యదు.
రిబ్బన్ ముక్క కావాల్సి వచ్చినా తనంతట తానే వెళ్లి కొనుక్కొస్తుంది తప్ప ఎవరికీ పని చెప్పదు. తెచ్చిన ప్రతీ వస్తువునీ బేరమాడి తేవడమే కాక ఖచ్చితమైన బిల్లుని కూడా తెస్తుంది. అవన్నీ జెరాక్సు తీసి తనో కాపీ వుంచుకుని రెండోది ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి పంపుతుంది. మరి శేషారావుకి గిట్టకపోవడంలో ఆశ్చర్యమేముంది??
వసుమతి పని చేస్తున్న కంపెనీ ప్రొడ్యూసర్ పేరు దేవనారాయణ. వస్తుతః అతను తమిళియన్. నాడార్ల కుటుంబం నుంచి వచ్చిన కోటీశ్వరుడు. హీరో కాదగిన పర్సనాలిటీ వున్నా, రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ప్రొడ్యూసర్‌గా మారాడు. ఇప్పుడతను నిర్మిస్తున్నది ద్విభాషా చిత్రం.
సునీత్ తండ్రి వెంకట్‌రావు హైద్రాబాద్ ఫేమిలీని షిఫ్ట్ చేశాక ఓ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కౌంటెంట్‌గా చేరాడు. సునీత్ ఎంత అందంగా ఉంటాడో వెంకట్‌రావు సునీత్ వయసులో అంతకన్నా అందంగా వుండేవాడు. అందుకే వసుమతి గవర్నమెంట్ జాబ్ హోల్డరై కూడా ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్న వెంకట్రావుని ఏరికోరి పెళ్లి చేసుకుంది.
సినీ పరిశ్రమలోవాళ్లకి సెంటిమెంట్లు, నమ్మకాలు(మూఢ) కూడా కాస్త ఎక్కువే. హీరో, హీరోయిన్ల దగ్గర్నించీ క్యారెక్టర్ ఆర్టిస్టులవరకూ షూటింగ్ నించి ఇంటికి రాగానే గుమ్మడికాయతోనో, కొబ్బరికాయతోనో దిష్టి తీయించుకుంటారు. ఇహ నిమ్మకాయల సంగతి అడక్కండి. షూటింగ్‌కి బయల్దేరే ముందరే నాలుగు నిమ్మకాయలు నాలుగు టైర్ల కిందా ఉంచబడతాయి. వాటి మీదనించే కారు వెళ్లాలి. ఇహ విభూతులూ, బొట్లూ, చేతులకి దారాలు, మెడలో నలుపు, ఎరుపు, పసుపు రంగుల దారాలకు వేళ్ళాడే లాకెట్లు, జబ్బలకీ, మొలకీ తాయెత్తులూ చెప్పనక్కర్లేదు.
“హేంగోవర్” ఉన్నా సరే, పూజ చెయ్యకుండా ఏ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చోడు. చాలామంది దర్శకులూ వీటికి అతీతులు కారు. కొందరైతే ఎకంగా సినిమా పూర్తయ్యే వరకూ అయ్యప్ప మాలతోనే వుంటారు. ఇంకొందరు స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ పుణ్యక్షేత్రాల్లోనే పెట్టుకుంటారు. ఇహ రీమేక్ సినిమాలు చేసేవాళ్లది ఇంకా చాదస్తం. జె పి చెట్టి పాలయం ఫలానా తోటలో డ్యుయెట్ తీశారు గనకే ఆ పిక్చర్ సూపర్ హిట్టయిందని తెలిస్తే కథకి సంబంధం వున్నా లేకపోయినా అక్కడికే వెళ్లి డ్యుయెట్ తీస్తారు. ‘నల్లమల’ లోనూ, ‘తలకోన’లోనూ అలా షూటింగ్ జరిపిన సినిమాలు కోకొల్లలు. సినిమా ఫస్టు షాట్స్ అదివరకైతే నాగిరెడ్డిగారి విజయా గార్డెన్స్ ‘విజయ గణపతి’ ముందే తీసేవారు. రికార్డింగు విజయా డీలక్స్ థియేటర్లో జరగాల్సిందే. అలా రికార్డైన నా పాటల సంఖ్య వందల్లో వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే…
ఎవరి దిష్టి తగిలిందో గానీ సడన్‌గా హార్ట్ అటాక్‌తో దైవనారాయణగారు దైవసన్నిధికి వెళ్లారు. దండిగా అడ్వాన్సు పుచ్చుకున్న బాపతు గనక హీరో, హీరోయిన్లూ, కాస్త పేరున్న కేరక్టర్ ఆర్టిస్టులూ, మూడొంతులు ముందే గుంజుకున్న ముంబై విలనూ అందరూ బాగానే వున్నారు గానీ, మిగతా చిన్నా చితకా నటీనటులూ, టెక్నీషియన్లు మాత్రం సడన్‌గా రోడ్డున పడ్డారు. వసుమతి అయితే ప్రొడ్యూసర్ ఖచ్చితమైన మనిషి గనక అంతకు వారం రోజుల ముందే స్వంత డబ్బు పెట్టి బోల్డన్ని కాస్ట్యూమ్స్ సిద్ధం చేసింది. ఇప్పుడా డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే… కేవలం నాలుగో వంతు పూర్తయిన పిక్చర్‌ని కంప్లీట్ చేసేదెవరూ? అదీగాక ఆ సినిమా భారీ బడ్జెట్టుది.. ప్రొడ్యూసర్‌కి వున్నది కూతురు మాత్రమే. లక్కీగా ఆ పిల్ల పెళ్ళి విజయవాడలో వున్న ఓ థియేటర్ ఓనర్ కొడుకుతో జరిగింది. ఆ పిల్ల వరకూ సేఫే..
కోట బీటలు వారడం వేరూ, కుప్పకూలి పోవడం వేరూ. దేవనారాయణ కంపెనీ బీటలు వారలేదు. కుప్పకూలి పోయింది.
అడ్వాన్సులిచ్చిన డిస్ట్రిబ్యూటర్లూ, అప్పిచ్చిన ఫైనాన్సరూ మూకుమ్మడిగా ఎగబడి దేవనారాయణ ఇళ్లూ, వాకిళ్లన్నీ వేలం వేయించి జరగాల్సిన తతంగాన్ని శాస్త్రోక్తంగా జరిపేశారు.
పాకలో వుండేవాడు పెంకుటింట్లోకి వెళ్తే అక్కడ ఎడ్జస్టు కావడానికి కొంత సమయం పడుతుంది. పెంకుటింట్లోవాడు మేడలోకి షిఫ్టైనా అదే పరిస్థితి. మేడనించి పేలస్‌లోకి అడుగుపెట్టి అక్కడి సదుపాయాలు అనుభవించేవాడ్ని సడన్‌గా పాకలోకి నెడితే??? వసుమతి పరిస్థితి అదే ప్రస్తుతం.
మళ్లీ స్కూల్లో జాయిన్ అయితే తోటి టీచర్లూ వాళ్లూ హేళన చేస్తారని భయం. పోనీ మరో కంపెనీ చూసుకుందామా ఆంటే శేషారావు పుణ్యమా అని ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వచ్చింది. ఏం చెయ్యాలీ? భర్త జీతం అప్పుడు సరిపోయిందేమో గానీ ఇప్పుడు చాలదు. సునీత్ డిగ్రీ పూర్తి చెయ్యడం ఒక్కటే ఆమెకి వూరట కలిగించిన విషయం. తలదించుకునే పని ఏమీ చెయ్యకపోయినా వసుమతిది ప్రస్తుతం తలెత్తుకోలేని స్థితి.
‘గవ్వల శర్మ’గారు సినీ సిద్ధాంతి. గవ్వలు విసిరి ఆయన జోస్యం చెబితే అది నిజమై తీరాల్సిందే.. ఫిలిం చాంబర్ పక్కనే వున్న ‘దైవ సన్నిధానం’లో గవ్వల సర్మగారు గవ్వలు విసరబోతుండగా నిశ్చల్‌తో పాటు సన్నిధానంలోకి అడుగుపెట్టాడు సునీత్. గవ్వలు గలగలలాడాయి. ఏ మణిరత్నం సినిమాలోనో అయితే వందో, వెయ్యో పావురాలు రెక్కలల్లారుస్తూ గగన వీధిలోకి ఎగిరిపోయిండేవి. ఇక్కడ అటువంటివి జరగలేదు గానీ గవ్వల శర్మగారి చూపులు మాత్రం అప్రయత్నంగా సునీత్ మీద వాలాయి.
“బాబూ.. ఒకసారి ఇటు వస్తావా…?” తియ్యగా పిలిచారు శర్మగారు.
“నన్నాండీ పిలిచిందీ?” అడిగాడు సునీత్.
“నిన్నే.. నీలో ఓ అపూర్వమైన కాంతి తొణికిసలాడుతోంది. నీ గోత్రం ఏమిటి.. నీ తల్లిదండ్రుల పేర్లూ, వృత్తులూ ఏమిటీ?” ఆదరంగా, ఆప్యాయంగా అడిగారు శర్మగారు.
“అయ్యా.. మిమ్మల్ని సగౌరవంగా కార్లో, అదీ A.C. కార్లో పిలిపించింది నేను. మీరేమో ఎవరో కుర్రాళ్లని పిలిచీ ..” అసహనంగా అన్నాడు గవ్వల శర్మగార్ని రావించిన ప్రొడ్యూసర్ నాగరాజు.
“నాగరాజూ.. నీది ఫస్టు క్లాసు బతుకయ్యా… గవ్వలు విసిరిన క్షణమే మీ హీరో దైవసన్నిధికొచ్చాడు. ఈ కుర్రాడి మొహంలో విజయం వెల్లి వెరుస్తోంది. ఇది నేను చెబుతున్న మాట కాదు. గవ్వల ద్వారా అమ్మవారు పలికిస్తున్న మాట..” అర్ధనిమిలిత నేత్రాలతో అన్నారు గవ్వలశర్మ. ఆయన గవ్వల జోస్యంలో ఉద్ధండుడే కాదూ, దేవీ ఉపాసకుడూ, కర్మిష్టీ.
“ఏమిటీ ఇతనా?” వెనక్కి తిరిగి సునీత్ వంక కూసి అన్నాడు నాగరాజు.
“అవును. ఇతనే.. మాంచి యూత్‌ఫుల్ సబ్జెక్టు తియ్యి. అది సక్సెస్ అయ్యాకే నాకు సంభావన ఇవ్వు..” గవ్వల్ని ఏరి బుల్లి చేతిసంచిలో భద్రపరుస్తూ తృప్తిగా అన్నారు శర్మగారు.
సునీత్‌ని చూసిన మరుక్షణం అదే అభిప్రాయం కలిగింది నాగరాజుకి. రుషీకపూర్ ‘బాబీ’ సినిమాలో ఎలా వున్నాడో అంతకంటే వందరెట్లు అందంగా, తీర్చిదిద్దిన సౌష్టవంతో వున్నాడు సునీత్. అంతేకాదు పక్కన వున్న నిశ్చల్ కూడా మాంచి స్టార్ మెటీరియల్‌గా కనిపించాడు. దైవసన్నిధానంలో జరిగిన సంఘటన గనక ఆరు నూరైనా పిక్చర్ తీసి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు నాగరాజు. కొన్ని సినిమాల్ని అంతకుముందు తమిళం, మళయాళం నించి తెలుగులోకి తీసిన అనుభవం అతనికి వుంది. డైరెక్ట్ సినిమా చేస్తే మాత్రం ఇదే మొదటిదౌతుంది.
సునీత్‌కి లక్ష, నిశ్చల్‌కి డెబ్బై అయిదు వేలుగా రెమ్యూనరేషన్ నిర్ణయించి ‘దైవసన్నిధానం’లోనే ఓ మంచిరోజున కాంట్రాక్టు మీద సంతకం చేయించాడు నాగరాజు. సునీత్ ఆనందానికీ, నిశ్చల్ ఆశ్చర్యానికీ అంతులేదు. నిశ్చల్ కలలో కూడా ఊహించలా సినిమా నటుడ్ని అవుతానని. రవికిరణ్ అనే పేరుతో సినిమా ఫీల్డులోకి రచయితగా అడుగు పెడదామని అవిశ్రాంతంగా స్టూడియోల చుట్టూ తిరుగుతున్న రాజారావుకి కథ + మాటల బాధ్యత వొప్పగించాడు నాగరాజు. గత అయిదారేళ్లుగా వాళ్ల దగ్గరా, వీళ్ల దగ్గరా అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తూ తెలివితేటలు ఎన్నున్నా ఎదుగూ బొదుగూ లేని జీవితం గడుపుతున్న ‘సూర్య వంశి’ని డైరెక్టరుగా పెట్టాడు. సినిమా పేరు ‘చిచ్చు’ నిజం చెప్పాలంటే ‘చిచ్చు’ అనేది ఓ టీనేజ్ లవ్ స్టోరీ..
ఏభై యేళ్లు వచ్చినా, మొహం నిండా మేకప్‌తో కాలేజీ కుర్రాడి వేషం వేసి “అమ్మా నేను ఫస్టు క్లాసులో పాసయ్యా” అని సినిమా అమ్మ మక్కెలు విరిగేలా ఎత్తుకు తిప్పే ముసలి హీరోల్ని చూసీ చూసీ విసుగెత్తిన జనాలు ‘చిచ్చు’కి బ్రహ్మరధం పట్టారు. వరదల కురుస్తున్న వసూళ్లతో బాక్సాఫీసు రికార్డులన్నీ ఫెటఫెటా పగిలి, వసూళ్ల వరదకి తుడిచి పెట్టుకుపోయాయి.

‘A Star is born’ అన్న కేప్షన్‌తో పత్రికలు సునీత్‌ని, నిశ్చల్ని ఆకాశానికెత్తాయి..సునీత్ లాంటి అందమైన హీరోగానే గాక, నిశ్చల్‌లాంటి అందమైన ‘విలన్’ని కూడా ఒకేసారి పరిచయం చేసిన ఘనత నాగరాజుకి దక్కింది.

‘సునీత్ మొట్టమొదటిరోజు షూటింగ్ నించీ చివరి రోజు దాకా వసుమతి ఏనాడూ సెట్‌లోకి అడుగుపెట్టలేదు. ‘చిచ్చు’ సూపర్ హిట్ అయ్యాక మాత్రం కొడుక్కి తనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించడం మొదలెట్టడమేగాక, ‘డబ్బు’ విషయాలు కూడా తనే నిర్ణయించడం ప్రారంభించింది. సునీత్ రెండో సినిమా ‘ద్వజం’ చిచ్చు రికార్డుల్ని తిరగరాసి తిరుగులేని యూత్ హీరోగా సునీత్‌ని నిలబెట్టింది. ఆ సినిమాలోనూ విలన్ నిశ్చలే..
మూడో సినిమా ‘తూరుపు ఎరుపెక్కింది’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివనారాయణమూర్తి డైరెక్ట్ చేశారు. అదీ పెద్ద హిట్టే..
చిత్రపరిశ్రమలో వున్న చితం ఏమంటే,, మా పిక్చర్ హిట్టై మీ పిక్చర్ ‘కూడా’ హిట్టయితే ఓకె. మా పిక్చర్ ఫ్లాపై మీ పిక్చర్ హిట్టయితే?? నడివయసు దాటిన హీరోల పరిస్థితి దారుణంగా వుంది. కోట్లు కోట్లు ధారఫోసి తీసిన సినిమాలు పెనాల్టీ కిక్ తగిలిన ఫుట్‌బాల్స్‌లా వెనక్కి తిరిగి వస్తున్నాయి. రెమ్యొనరేషన్ తగ్గించడం అంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే..
ప్రేమ గుడ్డిదని కొందరంటే ప్రేమే దైవం అని ఇంకొందరు అంటారు. Love is Blind, Love is God, Love is Mad. Love is Bad, Love is Dumb.. ఇలా లక్షా తొంబై నిర్వచనాలు ప్రేమకి వున్నా లవ్ అంటే “అవసరం” అని తెలుసుకున్న పిల్ల మధులత. ‘చిచ్చు’ హీరోయిన్. మొక్కకి నీళ్లు ఎంత అవసరమో ‘మనసుకి’ ప్రేమ అంత అవసరం అని ఆ ఇరవై యేళ్ల పిల్ల అభిప్రాయం. అంతేకాదు ప్రేమ ‘అవసరమే’ కాక, అవసరానికి వుపయోగపడే ‘ఆయుధం’ అని కూడా ఆ పిల్లకి తెలుసు. ‘చిచ్చు’ విజయం అంతా హీరోకి అంటగట్టింది పరిశ్రమ. దాంతో సునీత్ రెండు మూడు సినిమాల్లో మధులతకి అవకాశం దొరకలా. ఓ వయసు మళ్ళిన హీరోకి ‘చెల్లెలి’ గా ఓ అవకాశం వచ్చింది గానీ, సినిమా బక్కెట్ తన్నేసాక మరి ఏ చాన్సూ మధులత గుమ్మదాకా రాలేదు.
సునీత్ అమాయకుడైనా అతని వెనకాల ‘కావలసినంత’ అనుభవం వున్న వసుమతి వుంది. నిశ్చల్ తెలివైనవాడు.. డబ్బుకోసం నటించాల్సిన అవసరం లేదు. కానీ, సునీత్ హీరోగా ఎంత పేరు సంపాయించాడో యంగ్ & హాండ్సమ్ విలన్‌గా నిశ్చల్ కూడా అంత పేరూ సంపాయించాడు.
నిశ్చల్‌ని హీరో చేస్తే??
‘చిచ్చు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ‘సూర్యవంశి’ని పెద్ద హీరోలు ఎందుకు వదుల్తారూ? బ్రహ్మాండమైన బడ్జెట్‌తో ఆఫర్స్ ఇచ్చారు. ఒక హీరో అయితే షూటింగ్ మొదటిరోజునే సూర్యవంశికి ఓ ‘ఖరీదైన’ కారు బహూకరించాడు. రవికిరణ్ దశ కూడా తిరిగింది.
పెద్ద హీరోల్ని పెట్టి పిక్చర్ తియ్యడం అంటే కత్తిమీద సాములాంటిది. డైరెక్టర్ మాటలు లెక్కచెయ్యరు సరికదా, డైరెక్టరుకే డైరెక్షన్ ఇస్తారు. కాదంటే ‘డోర్‌మేట్’గా మిగుల్తామనే భయం. దాంతో అప్‌కమింగ్ డైరెక్టర్లు కన్‌ఫ్యూజన్‌కి గురౌతారు. పెద్ద హీరో పిక్చరయ్యేసరికి అప్పటివరకు ‘ఒదిగి’ వున్న రచయిత కూడా డైరెక్టర్‌ని సైడ్‌ట్రాక్‌లో వుంచి హీరోకే తాళం వేస్తాడు. సూర్యవంశి ఖర్మకాలి అదే జరిగింది. రవికిరణ్ హీరోకి పక్కా తాళం వేస్తుండటంతో డైరెక్టర్ వొంటరివాడై కనీసం కన్విన్స్ చేసే చాన్సు కూడా దొరక్క హీరోగారి ‘డైరెక్షన్’లోనే సినిమాకి గుమ్మడికాయ కొట్టాడు.(అంటే పూర్తి చేశాడన్నమాట). సునీత్‌తో తీసిన రెండు పిక్చర్లూ సూర్యవంశిని, రవినీ ఎక్కడో నిలబెడితే పెద్ద హీరోతో తీసిన ‘ఖామోష్’ పిక్చర్ బాక్సాఫీస్ ముందు ఢమాల్న పేలిపోయి సూర్యవంశిని కుదేల్ని చేసింది. రవికిరణ్ మాత్రం అదే హీరోకి కాకా పట్టి ఆ తరవాత సినిమాతోనే డైరెక్టరై సూపర్‌హిట్ డైరెక్టరైపోయాడు.
‘నేటి రాజు రేపటి చప్రాసీ… నిన్నటి చప్రాసీ నేటి మహారాజు’ లాగా యీ ‘చిత్ర’ పరిశ్రమలో పొజిషన్లు మారిపోతాయి. ఎంత ఫ్లాపైనా ‘సూర్యవంశీ’లో స్పార్క్ చాలా వుందని అందరికీ తెలుసు. అయినా ఎవరూ ధైర్యం చెయ్యరు. కానీ ‘మధులత’ మంత్రాంగంతో నాగరాజు మళ్లీ ఆ ధైర్యం చేశాడు. అయితే హీరో సునీత్ కాదు. నిశ్చల్. సునీత్ ఏనాడో నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ రెంజి దాటాడు. పది కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం నాగరాజుకి ఇష్టం ఉండదు. సినిమా కథలో దమ్ముండాలి గానీ ‘స్టార్లెందుకూ?’ అనే మనస్తత్వం నాగరాజుది.
‘స్టార్ మదర్స్’ దో ‘హవా’ ఉంటుంది సినీ ఫీల్డులో. ఒకప్పుడు హేమమాలిని తల్లిగారు జయా చక్రవర్తి, అంబికా, రాధ వారి అమ్మగారూ, ఇల్లా బోలెడంతమంది ‘స్టార్ మదర్స్’ చరిత్ర కెక్కినవారే. పిల్లల భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచిన తల్లులు కొందరైతే, విపరీతమైన గర్వంతో కన్నూమిన్నూ కానకుండా నానా డిమాండ్లు చేసి ‘వీపు వెనక’ నానా బూతులు తిట్టించుకునేవారు కొందరు. కొందరు ‘స్టార్ ఫాదర్స్’ కూడా లేకపోలేరు. కన్నకూతురి సినిమాలకి అటెండ్ అవుతూ ఏక్ దిన్ కా సుల్తాన్ లా ప్రవర్తించి, పిల్లల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసే ఫాదర్సూ నాకు తెలుసు.
వసుమతి వస్తుతః చాలా మంచిది. చాలా సిన్సియర్. కానీ మొట్టమొదటి సినిమా కంప్లీట్ కాకపోవడం కంటే. ‘ఐరన్ లెగ్’ అ ని శేషారావు చేసిన ప్రచారం వల్ల ఆవిడ మనసు ముక్కలైపోయి పాషాణంలా తయారైంది. కొడుకు టాప్ హీరో కావడంతో ఆవిడ ధాష్ట్యానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అంతేగాదు, యీవిడ చికాకునీ, మూడ్స్‌నీ, కోపాన్నీ భరించలేక సునీత్ తండ్రి వెంకట్రావు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే ‘వనజ’ టీచర్‌కి దగ్గర కావడం వసుమతిని మరింత మృగాన్ని చేసింది. సునీత్ ఎంత నచ్చచెప్పినా కొద్దిరోజులపాటు మామూలుగా ఉండి ఆ తరవాత తన ‘పవర్’ చూపించడంతో, అటు సినిమావాళ్లకీ, ఇటు సునీత్‌కీ కూడా మనశ్శాంతి కరువైంది. ఓ రోజున తండ్రి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్ళబోసుకుంటే..

‘సునీత్… మీ అమ్మలోని మార్పు నేను ఏనాడో గుర్తించా. చీరల డిజైన్ చేసే రోజులలోనే నేనంటే చిన్న చూపు. కారణం నాకంటే తన సంపాదన ఎక్కువ అవడం. నన్ను ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఆ తరవాత తన సంపాదన పెరిగాక నన్ను కాళ్ళు తుడుచుకునే ‘డోర్‌మేట్’లా చూడటం నేను భరించలేకపోయాను. అయినా మౌనంగానే అన్నీ భరించా. తన వైఫల్యాన్ని అందరికీ అంటగట్టి ‘గుర్తింపు’ ఇవ్వడం లేదని చిత్రవధ చేస్తున్నా ఆ మాటల్నీ ఓపిగ్గా భరించా. ఇప్పుడంటావా.. వనజ నిజంగా నేను కోల్పోయిన శాంతిని ఇస్తోంది. ఆమె విడో. భర్తని భర్తగా చూడటం తెలిసిన మనిషి. ప్రేమగా ప్రేమకి విలువిచ్చే ‘ఆడది’. అందుకే, మేం పెళ్లి చేసుకొనకపోయినా ప్రేమని పంచుకుంటున్నాం., అందుకే శాంతంగా ఉన్నాం. తండ్రిగా ఏనాడూ నీకు ద్రోహం చెయ్యను. నువ్వు ఎప్పుడు నన్ను రమ్మన్నా తక్షణం వస్తాను. కానీ మీ అమ్మతో కలిసి బతకమని మాత్రం నన్ను అడక్కు.” అని స్పష్టంగా చేప్పాడు.
ఎన్ని సినిమాలు హిట్టయితేనేం. ఎన్ని కోట్లు నగదు రూపంలో ఆభరణాల రూపంలో, ఆస్తుల రూపంలో దాస్తేనేం.. అసలైన మనశ్శాంతి కరువయ్యాక.
‘చిచ్చు’ అంత సూపర్ డూపర్ హిట్టు కాకపోయినా, సూర్యవంశి నిర్మించిన (దర్శకత్వం వహించిన) ‘కావ్యం’ సినిమా వసూళ్లలో బాక్సాఫీసుని కొల్లగొట్టింది. నిన్నటిదాకా విలన్‌గా అలరించిన నిశ్చల్ ఇప్పుడు హీరోగా విశ్వరూపం చూపించాడని పత్రికలు ఆకాశానికెత్తేసాయి. ఇహ చానల్స్ హడావిడి చెప్పనక్కర్లేదు. ‘మధులత’ ‘కావ్యం’తో స్టార్ హీరోయిన్ అయింది. మిగిలింది ఒక్కటే. సునీత్‌తో మళ్లీ జత కట్టడం.
మగవాడికి ‘శాంతి’నివ్వగలిగింది ఆడది ఒక్కతే. ఒక ఆడది మోసం చేసినా, ఇంకో ఆడని సర్వనాశనం చేసినా ఎప్పుడో అప్పుడు మగవాడికి సాంత్వన ఇచ్చేది ఆడదే. ఆడది మాత్రమే.
ప్రశాంతమైన ముఖంతో, అమాయకమైన కళ్లతో ఆరాధనగా తనవంక చూసే ‘కృత్తిక’ సునీత్ కళ్లకి ప్రశాంత సముద్రంలా కనిపించింది. కృత్తిక తండ్రి ప్రఫుల్లరావు. ది గ్రేట్ ప్రొడ్యూసర్. కూతురు సునీత్‌ని ప్రేమిస్తుందని ఆయనకి తెలుసు. కూతురి గదిలొ సునీత్ ఫోటోలు ఎక్కడ బడితే అక్కడ అంటించి వుండటం ఆయన చూశాడు. సునీత్ చాలా మంచి కుర్రాడు. గ్యారంటీగా మరో పదిహేనేళ్ళు సూపర్ హీరోగా వెలిగే స్టామినా వున్నవాడు. ఎటొచ్చీ అభ్యంతరమంతా వసుమతితోనే. ఆవిడ్ని భరించడం ఎవరివల్లా కాదు. తల్లిని ఆమె దారిన వదిలేంత కుసంస్కారి కాడు సునీత్.
‘మందు’ అంటే ‘మత్తు’ పదార్థం చాలా విలువైందీ, తెలివైందీ, సులువైందీ కూడా.
సినిమాల్లో ‘మందు’ షాట్ వచ్చినప్పుడల్లా ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేస్తారు. కానీ సినీ పరిశ్రమలో ఆల్కహాల్ కూడా ఒక స్టేటస్ సింబలే..
‘ఫారిన్’ సరుకుని సగర్వంగా ఆఫర్ చేసే మహానుభావులకి యీ ఫీల్డులో కొదవ లేదు. అడ్వాన్స్ అడిగితే మాత్రం అర్ధణా కూడా విదిలించరు. ‘మచ్చిక’ చెయ్యడానికి ‘మందు’ని మించిన ఔషధం లోకంలో లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఆ ప్రక్రియే.
“అసలు మొహం ఫ్రెష్‌గా వుండాలంటే కొంచెం తీసుకోవాల్సిందే. కాదంటావా.. ఏ డాక్టర్ని అన్నా అడుగు చెప్తాడు. A peg or two a day keeps the doctor away అని ఉదహరించాడు ప్రఫుల్లరావు.
సూర్యవంశి అంటే సహజంగానే సునీత్ కి గౌరవం. మొట్టమొదటి హిట్ ఇచ్చిన దర్శకుడని. ఓ రోజున సూర్యవంశినీ, సరికొత్త రచయిత ‘అమరనాధ్ వర్మ’నీ వెంటబెట్టుకుని మధులత నాగరాజుని కలిసింది. “ఆవో.. ఏమిటీ అకాల ఆగమనం?” అన్నాడు నాగరాజు. “సార్.. అమర్ నాకో కథ చెప్పాడు. దానికి కరెక్ట్ హీరో సునీత్. కరెక్ట్ దర్శకుడు సూర్యవంశి. ఇహ నిర్మాతగా పెర్‌ఫెక్ట్ పర్సన్ మీరే. ముందు ఈ కథ వినండి. ఆ తరవాత మీ ఇష్టం. హీరోయిన్‌గా నాకు ఒక్క పైసా కూడా అడ్వాన్స్ ఇవ్వొద్దు. పిక్చర్ హిట్టయ్యాక మీకు తోచింది ఇవ్వండి. అంతేకాదు.. మొదటి సూపర్ హిట్ ఇచ్చిన మన బేచ్.. మరో పిక్చర్ తీస్తున్నామంటే బయ్యర్లు పోటీపడతారు…” ఊరించింది మధులత. కథ విన్నాక మధులత జడ్జిమెంట్ పెర్‌ఫెక్ట్ అనిపించింది. సునీత్ కూడా ఓకే అన్నాడు. ఇంకేం.. ఓ పక్క ప్రఫుల్లరావుగారి హై బడ్జెట్ సినిమా, మరో పక్క నాగరాజుతో మీడియం బడ్జెట్ బట్ ష్యూర్ షాట్ ఎవార్దు సినిమాలతో సునీత్ యమా బిజీ అయ్యాడు.
మధులత జాణతనంలో ఎంతెత్తుకి ఎగిరిందంటే వసుమతిని పొగడ్తలతో, మాటలతో బుట్టలో వేసింది. ‘ఈగో’ని సంతృప్తి పరిచేవారుంటే … యూ.. గో.. అని ఎవరంటారూ? వసుమతి కూడా మధులత మాటల మత్తులో పడింది. రేపో మాపో మధులత, సునీత్ పెళ్లాడబోతున్నారనే ‘నిఖార్సయిన రూమర్’ని పత్రికలకి లీక్ అయేట్టు చేసింది మధులతే. (మేకప్‌మన్ సౌజన్యంతో)

‘కృత్తిక’ స్వభావం తెలిసిన ప్రఫుల్లరావు ఆ రూమర్‌ని తట్టుకోలేకపోయాడు. కృత్తిక గాజులాంటిది. ఏ చిన్న దెబ్బ తగిలిన భళ్ళున పగులుతుందని ఆయనకి తెలుసు.

లక్ష పేజీల్లో చెప్పలేని ‘నగ్న సత్యాన్ని’ ఒక్క ‘పెగ్గు’తో చెప్పొచ్చు. చెప్పించనూ వచ్చు. అప్పటికే సునీత్ కొంతవరకు మధులత దగ్గర ‘సేద’ తీరుతున్నాడనే విషయం ప్రఫుల్లరావుగారికి రెండో పెగ్గులోనే అర్ధమయింది. సామ, దాన, బేధ దండోపాయాల మీద ఆయనకు అంత నమ్మకం లేవు. అవన్నీ చేతకానివాళ్లకి.. సగం సినిమా (నాగరాజుది) అయ్యాక ఎవరో మదాలస కారుని గుద్దేశారు. అదీ ఫుల్లీ లోడెడ్ ఐరన్ లారీతో. ప్రాణం పోలేదుగానీ ఆల్మోస్ట్ పోయినంత పని జరిగింది.
కనీసం ఆరునెలలు బెడ్ మీదే వుండాలన్నారు డాక్టర్లు. నాగరాజు షాక్ తిన్నాడు. ఊహించని దెబ్బ అది. పిక్చర్ అద్భుతంగా వస్తూ వుండడంతో బడ్జెట్ ఎంత పెరుగుతున్నా ఆయన పట్టించుకోలేదు. ఆరునెలలపాటు సినిమాని మధులత కోసం ఆపాలంటే ఆత్మహత్య చేసుకున్నట్టే..
పోనీ వేరొకర్ని పెట్టి తీద్దామంటే కుదిరే పని కాదు. స్టోరీ ‘అంత’ టైట్‌గా వుంది. NAC (అంటే నాగా ఆర్ట్ క్రియేషన్స్) ఆఫీసులొ యూనిట్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. కొత్త రచయిత అమర్ బుర్రున్నవాడే. వారం రోజులు కిందా మీదా పడి ‘మదాలస’ కేరక్టర్ మధ్యలొ చనిపోయినట్టూ, ఆమె ఆత్మ మరో నటిని ఆవహించినట్టూ, గొప్పగా కథని మార్చాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆనందాన్ని వెలిబుచ్చితే, సైలెంటుగా వుండి తన అసమ్మతిని ప్రకటించింది సునీత్. అతనన్నది ఒకే ఒక మాట. “అయ్యా.. కథని మార్చగలం.. ఎన్నో గమ్మత్తులూ చెయ్యగలం.. కానీ ఇది సరా? కాదా? అన్న అంతరాత్మకి సమాధాన చెప్పగలమా?” అని .
“సునీత్.. అంతరాత్మకంటే అవతల పెరగబోయే వడ్డీ గురించే నేను ఆలోచిస్తాను. నన్ను నమ్ముకున్న నా పెళ్ళాం, పిల్లల్ని రోడ్డు మీదకి వదల్లేను”” సీరియస్‌గా అన్నాడు నాగరాజు.
హీరోయిన్ మార్పిడితో షూటింగ్ మొదలైంది. ‘రాజమహల్’ సెట్ వేశారు. అయిదు కోట్ల ఖర్చుతో. రేపే షూటింగ్ అనగా ఇవ్వాళ షార్ట్ సర్క్యూట్‌తో సెట్ మొత్తం అగ్నికి ఆహుతైంది.
బస్.. ఆ సినిమా ‘టచ్‌వుడ్’ అయిపోయింది. సినిమాని ఇంతెత్తున ఎత్తేదీ సెంటిమెంట్, అధఁపాతాళానికి తొక్కేదీ సెంటిమెంట్.
కొందరు పుట్టుకతోనే అమాయకులు. (పుట్టుకతో అందరూ అమాయకులే.. కానీ చాలామంది మారిపోయి మహా గడసరులూ, జ్ఞానులూ అవుతారు. పుట్టిన దగ్గర్నించి పిడకలవరకూ అమాయకంగా వుండే వాళ్ల సంఖ్య వేళ్లతోనే లెక్కబెట్టగలం.. కాలిక్యులేటర్ల అవసరం వుండదు) అలాంటి అమాయకుల్లో సునీత్ ఒకడు. నాగరాజు బాధనీ, సూర్యవంశి నిస్సహాయతనీ చూసి తనే డబ్బు మదుపు పెడతానని ముందుకొచ్చాడు. అంతే కాదు మధులత కోలుకున్నాకే సినిమా షూటింగ్ మొదలుపెడతానని ఆమెని ‘ఖర్మ’కి వదిలెయ్యకుండా వివాహం కూడా చేసుకుంటానని అనవసరమైన ఓ స్టేట్‌మెంట్‌ని ప్రెస్ ముందూ, చానల్ వాళ్ల ముందూ ఇచ్చాడు.
‘కృత్తిక’ గాజుగుండె భళ్లున పగిలింది. కానీ తను ప్రయత్నిస్తే అతుకు పెట్టగలనని ప్రఫుల్లరావుకి తెలుసు. రాయబారాలు నడిచాయి. సునీత్ లొంగలేదు.
అన్ని దెబ్బలాటలకీ మూలం ఒక్కటే. దాని పేరు అహంకారం. అది రూపాయి నోటులాంటిది. కలపనూ గలదు. విడగొట్టనూ గలదు. ప్రాణం పొయ్యనూ గలదు. ప్రాణాన్ని నిర్ధాక్షిణ్యంగా తియ్యనూ గలదు.
అప్పటికీ ఓ రోజున ప్రఫుల్లరావు దగ్గర చేరిన శేషారావు సునీత్ ఇంటికి వెళ్ళి వసుమతిని సమర్యాదగా పలకరించి సునీత్ ని బుజ్జగిస్తూ చెప్పాడు.. “బాబూ.. నువ్వు సూపర్ స్టారువే.. కాదన్నా. నువ్వు నటించిన ఫ్లాప్ సినిమా అయినా, నిర్మాతకి లక్షల్లో లాభం తెచ్చిపెడుతుందన్న మాట కూడా నిజమే.. కాదన్ను. కానీ నీకు తెలీంది చెబుతున్నా విను. సక్సెస్ ని నిభాయించడం చాలా చాలా కష్టం. ఓ బండరాయిని కొండ అంచుకి మోసుకుంటూ చేర్చడం ఎంత కష్టం, సక్సెస్ ని నిభాయించడం కూడా అంతే కష్టం. ఇంత కష్టపడి నువ్వు మోసుకెళ్లిన బండరాయిని కిందకి అంటే లోయలోకి తోసెయ్యడానికి క్షణం కూడా పట్టదు. ఆ నిజాన్ని నువ్విప్పుడు తెలుసుకోవాలి. కృత్తికా – మధులతా? శిఖరం మీద స్థిరంగా వుండాలంటే నిర్ణయించుకోవాల్సింది నువ్వే..!!” చెప్పాల్సింది చెప్పాడు శేషారావు.
“శేషారావు.. నా కొడుకు ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించాల్సింది నువ్వూ నీ ప్రొడ్యూసరూ కాదు. నేను యీ సూపర్ స్టార్ సునీత్ తల్లి వసుమతిని..! నేనూ నిర్ణయించాల్సింది.” నిప్పులు గక్కుతూ శేషారావు వంక చూసి అన్నది వసుమతి. చిత్రంగా నవ్వి వెళ్లిపోయాడు శేషారావు.
‘విధి’ ఎంత చిత్రవిచిత్రమైందంటే సునీత్ సూర్యవంశితో తీసిన పిక్చర్ పూర్తి కాకుండానే సునీత్ అస్తి కరిగిపోయింది. కారణం దేవుడికే తెలియాలి. ప్రఫుల్లరావు నిశ్చల్‌నీ, మదాలసనీ హీరో, హీరోయిన్లుగా పెట్టి నాగరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సూర్యవంశి డైరెక్టరుగా పిక్చర్ తియ్యబోతున్నాడన్న వార్త సినీవర్గాల్లో హల్‌చల్ చేసింది.
వసుమతికి ఎలా అలవాటైందో గానీ మద్యానికి బానిసైంది. సునీత్ తండ్రి వెంకట్రావు వనజతోనే సుఖంగా వుంటున్నాడు. వాళ్లు గుళ్ళో పెళ్లి చేసుకున్నారనీ, ప్రస్తుతం వనజ కడుపుతో వుందని కూడా పత్రికలు ఘోషించాయి.
ప్రఫుల్లరావు సునీత్‌తో తీసిన పిక్చర్ పూర్తయింది. కానీ అది నాలుగు నెలలయినా రీరికార్డింగుకి పోలేదు.
ఎటు చూసినా సముద్రంలాంటి వంటరితనం. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మధులత నంబర్ నాట్ రీచబుల్‌గానే వుంది.
అవ్వాళ సునీత్ పుట్టినరోజు. తల్లికి ఆ విషయమే గుర్తు లేదు. మస్తుగా తాగి మంచం మీద దొర్లుతోంది. తండ్రికి గుర్తుందో లేదో కూడా తెలీదు. కారులో రోడ్ల మీద తిరిగి తిరిగి వస్తూంటే నిశ్చల్ కారు కనిపించింది. కారుని ఆపి అటువైపు వెళ్ళేలోగానే నిశ్చల్ కారు వెళ్లిపోయింది. కార్లో ఎవరో అమ్మాయి వున్నట్టు మాత్రం సునీత్‌కి కనిపించింది .. ఎవరూ? కృత్తికా? మధులతా?
ఒంటరిగా మందు పెట్టుకున్నాడు సునీత్.
మరుసటిరోజు చిత్రపరిశ్రమ ఘొల్లుమంది. రాత్రికి రాత్రే సునీత్ ఆత్మహత్య చేసుకున్నాడనీ.. ఆత్మహత్యకి ఎవరూ బాధ్యులు కాదని నోట్ పెట్టాడని..
కారణాలు ఎవరికీ తెలీదు. రూమర్లకేం.. బోలెడు..
PS: ఇది ఒక్కరి కథ కాదు. కొన్ని జీవితాల్ని గుదిగుచ్చి కథగా మలచాల్సి వచ్చింది. కొన్ని సంఘటనలు కేవలం కల్పితాలు. అదీ నిజంలాంటి కల్పన. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడు వసుమతి ‘కాస్ట్యూమర్’ కాదు. తరవాతా కాదు. ‘వృత్తి’ని మార్చాను..
శేషారావులూ, వసుమతులూ, ప్రఫుల్లరావులూ ఎలా వున్నారో సునీత్, సూర్యవంశీలూ, కూడా అలానే వున్నారు. మంచీ చెడూ బొమ్మా-బొరుసూ లాంటివే. కలిసి ఉంటాయి.. విడగొట్టడం ఎవరి తరం??

-భువనచంద్ర

bhuvanachandra (5)

మంచివాడు

bhuvanachandra (5)“పిల్లలకి కడుపు నిండా ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోతున్నా, రోజూ ఇలా పీకల్దాక తాగిరావడంలో అర్ధమేంటి?” కోపంగా అరిచింది అనసూయ. ఆమెకి పాతికేళ్లు. ఐదేళ్ల ‘రవీ ఒకడూ, మూడేళ్ల ‘మాధవి ‘ ఒకత్తీ. వయసు పాతికైనా ముప్పైదాటిన దానిలాగా కనపడుతోంది.

ఇంటర్ చదివేటప్పుడు ఆమె ఆ విద్యాలయానికే బ్యూటీ క్వీన్. ఒకప్పటి సినీ నటి ‘ బబిత ‘ లాగా బబ్లీ గా ఉండేది. ప్రస్తుతం పీకల దాకా తాగొచ్చిన ఆది ఆమె భర్త. పూర్తి పేరు ఆదినారాయణరావు. పెళ్ళైనప్పుడు అతను అసిస్టెంటు డైరెక్టర్. చాలా హాండ్సమ్ గా వుండేవాడు. బి.ఏ. చదివాడు. ముత్యాలలాంటి హాండ్ రైటింగ్.

ఇప్పుడు అతను అసోషియేషన్ డైరెక్టర్, అతనితో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ‘ గో….ప్ప.. ‘డైరెక్టర్లు అయ్యిపోయినా అతను మాత్రం అక్కడే ఉండిపోయాడు. కారణం ‘అన్ని పనులు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండట’మే.

ఏదీ రాని వాడైనా ‘షో ‘ చేయడం చేతనైతే చాలు ఇక్కడ ఎవడినో ఒకడిని పట్టుకొనో, బురిడీ కొట్టించో డైరెక్టర్ అయ్యిపోతాడు. ఆ పైన అతని అదృష్టం. వచ్చిన చిక్కంతా అన్నీ పర్ఫెక్ట్ గా తెలిసిన చాదస్తులతోటే. వీళ్ళ కింద పని చేస్తూ ‘ పని ‘ నేర్చుకొంటున్న వాళ్లు కూడా డైరెక్టర్ అవ్వగానే వీళ్ళని దూరం పెడతారు. కారణాలు.. 1. ఇంఫిరియారిటీ కాంప్లెక్స్… 2. తమకి పని రాదని ఇతనికి వచ్చునని ప్రొడ్యూసర్ కి తెలిస్తే తమ ‘కార్డు’ కట్ అవుతుందన్న భయం.

మిగతావాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఆది పద్ధతి వేరు. చాలా మొహమాటస్తుడు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు మెలిగే రకం. అన్నిటికంటే విచిత్రమేమిటంటే తన క్రిందివాళ్ళని కూడా తనతో సమానంగా చూసుకోవడం, గౌరవించడం. మిగతావాళ్ళు 4వ అసిస్టెంటునీ, 3వ అసిస్టెంటునీ ‘ ల ‘ కార ప్రయోగాల్తో పిలుస్తున్నా , ఆది మాత్రం ‘ఇదిగో మోహన్రావు గారు’, ‘హల్లో శ్రీనుగారూ అని సమర్యాదగా సంభోదిస్తాడు.

ప్రస్తుతం అతను పని చేస్తున్నది డైరెక్టర్ దిలీప్ దగ్గర. సదరు దిలీప్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆదరించి రూం లో చోటిచ్చింది ఆదీ నే. అయితే ఆ విషయాన్ని ఆది ఎవరితోనూ చెప్పడు… దిలీప్ అయితే అసలు తలవనే తలవడు సరి కదా తనే ‘ఆది’ ని అసోషియేట్ గా పెట్టుకొని ఎదో ‘మెహర్బానీ ‘ చేస్తునట్టు ప్రవర్తిస్తాడు. తెలిసిన వాళ్లు ఆదిని అడిగితే నవ్వేసి, ” దిలీప్ గారు చాలా ఇంటలిజెంట్ డైరెక్టర్ అండి ” అని సింపుల్ గా తప్పుకుపోతాడు.

అనసూయ మాటలు విని ఒక్క నిమిషం సైలెంటయ్యాడు ఆది. తరవాత “అనూ ! నీ దృష్టిలో నేను పీకల్దాకా తాగి వస్తున్నా.. నిజమే తాగాను. ఈ కంపెనీలో చేరిన దగ్గర నుంచి రోజు ఇలా తాగే వస్తున్నా. పిచ్చిదానా.. యీ ఫీల్డ్ సంగతి నీకు తెలియదు. యీ సినిమా పరిశ్రమ ఒక గొ…ప్ప తెల్ల ఏనుగే! కానీ ఏం చేస్తాం కొందరున్నారు.. యీ తెల్ల ఏనుగుమీద నల్ల రంగు పూయటానికి .. సారీ నువ్వు అమాయకురాలివి. యూ డోంట్ నో ఎనీ థింగ్ మై డియర్ అను!” అని ఆ చి…న్న రెండు గదుల ఇంటి వరండాలో మడతమంచం మీద వాలిపోయాడు. “ఏంటో..” నిస్సహాయతతో నిట్టూర్చింది అనసూయ.

“రెండో షెడ్యూల్ ఎల్లుండి కదా మొదలయ్యేది? అనుకున్నట్టుగా షెడ్యూల్ మొదలయ్యే రోజునే డబ్బు నాకు అంది తీరాలని మీ ప్రొడ్యూసర్ కి చెప్పు ఆదీ! ” విజయా స్టూడియోస్ దగ్గర కారాపి అన్నాడు అన్వేష్…

అన్వేష్ టాప్ 4 హీరోస్ లో ఒకడు. రెమ్యునరేషన్ కోటి మీదే. ఒకప్పుడు అతనూ, ఆదిని వేషం కోసం అప్రోచ్ అయినవాడే. చిన్న చిన్న వేషాలు చేస్తూ అదృష్టవశాత్తు ఓ బడ్జెట్ సినిమాలో హీరోగా అవకాశం సంపాదించుకున్నాడు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయ్యింది. అన్వేష్ దశ కూడా తిరిగింది. ” అలాగే సార్ ” అన్నాడు ఆది వినయంగా

“గుడ్ నైట్ దెన్ ” లగ్జరీ కార్ లో తుర్రుమన్నాడు అన్వేష్…

నడుస్తున్నాడు ఆది.. రాత్రి అనసూయ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ప్రొడ్యూసర్ తో ఏమైనా సరే ఈ రోజు మాట్లాడి తీరాలి అనుకున్నాడు. “స్కూటీ” పొద్దున్నే “పియగ్జీ” ఆటోమొబైల్స్ లో అమ్మేశాడు. ఎంతొస్తుంది..! మూడువేల ఐదొందలు ఇచ్చాడు ఆ అరవ మెకానిక్. రన్నింగ్ కండీషన్ లో ఉన్నది , మైలేజ్ బాగా ఇస్తోంది గనక, ఐదువేలన్నా ఇవ్వచ్చు! కానీ అందరికీ “న్యాయం” కంటే లాభం మీదే మోజు.

“ఏంటి గురూజీ నడచి వెళ్తున్నారు? మీ ఐరావతాన్ని తేలేదా?”నవ్వుతూ అడిగాడు అరుల్ దాస్.

దాస్ తెలుగొచ్చిన తమిళ్ అసిస్టెంట్ కెమెరామాన్. మాంచి నేర్పు ఉన్నవాడు.

“నడక మంచిదంటారుగా అరుళన్న.. అందుకే నడుస్తున్నా” సమాధానం చెప్పి నడక సాగించాడు ఆది. ‘రామ్’ టాకీస్ దగ్గర దాటేటప్పటికి “ఛాలి” వచ్చింది. ఆది వయస్సు ముప్పై అయిదు. అను కంటే పదేళ్లు పెద్ద.

“ఈ ఇండస్ట్రీ మనుషులను నడవనివ్వదు ” తనలో తాను అనుకొన్నాడు ఆది. అవును.. తెలిసిన వాళ్లు ఎవరు కార్లలో వస్తున్నా ఆపి మరీ ఎక్కించుకుంటారు. ప్రొడక్షన్ లో ఉన్నన్నాళ్ళూ కార్లు కను సైగల్లోనే ఉంటాయి. మళ్ళీ నవ్వొచ్చింది. “ఏమంది… పీకల్దాకా తాగి వస్తున్నానని కదూ? “అనుకొన్నాడు ఆది. తాగడం కాదు మెక్కడం కూడా ఇక్కడ సహజమే. కానీ తను తినలేదు.

సినిమా ప్రొడక్షన్ జరిగేటప్పుడు అందరికీ ఇడ్లీ, వడ, గారే, పొంగల్, దోసె, పూరీ రెండు మూడు రకాల చెట్నీలతో, సాంబార్ తో దొరుకుతాయి. తిన్నంత తినొచ్చు ( అంటే కావల్సినంత అన్నమాట). మద్యాహ్నం లంచ్ అయితే ఐదారు కూరలు, పచ్చళ్లు, సాంబార్, రసం, పెరుగు + నాన్ వెజ్ ఐటమ్స్ తో సహా వడ్డించబడతై.

మిగతా ఖర్చులతో చూసుకుంటే ఇంత భారీ తిండికి ఖర్చయ్యేది సముద్రములో నీటి బిందువే.. ఇక హీరో హీరోయిన్లకీ ముఖ్యమైన ఆర్టిష్టులకీ గ్రేడ్ వన్ టిక్నీషియన్లకి వాళ్ళు ‘కోరుకున్న’ చోటి నుంచే టిఫిన్లు వస్తాయి.

ఏవో కొన్ని పద్ధతులని పకడ్బందీగా పాటించే కంపెనీలు తప్ప కొత్తగా పుట్టిన, పుట్టుకొస్తున్న అన్నీ సినిమా కంపెనీలలోనూ సాయంత్రం అయ్యేసరికి మందు గ్లాసుల గలగల వినిపించాల్సిందే.

ఆ గలగలలకి మూల కారణం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవరేనా కావచ్చు.

“కొంచం రిలాక్స్ అవుదామా?”అనంటే చాలు అర్జంటుగా ఏర్పాట్లు జరిగిపోతాయి. ఒక్కో ‘సీసా’ ఖరీదు ఐదువేలకి పైనేగానీ తక్కువుండదు. అన్నీ ఫారెన్ బ్రాండ్సే. ఫారిన్ సిగరెట్ పాకెట్లే.

మొన్నటిదాకా రైల్వేషేషన్లో పంపునీళ్లు పట్టుకు తాగినవాడు కూడా ఇక్కడ కాస్త పేరు తెచ్చుకోగానే “బిస్లరీ’ వాడికో ‘కిన్లే’ వాడికో పరమ భక్తుడైపోతాడు. (అన్నట్లు గొప్పవాళ్లు ‘పోయేటప్పుడు ‘ తులసి తీర్ధం కూడా బిస్లరితోటే కలుపుతారు మరి).

‘నిన్న ఏం జరిగింది?’ ఆలోచిస్తున్నాడు ఆది.

” ఆదీ.. ” దిలీప్ గారు ఇవాళ మా ఆఫీస్ లో కూచుందామన్నారు. మన ప్రొడక్షన్ శ్రీనుకి చెప్పి ఏర్పాటు చేయ్.. ! “చెప్పాడు పైడిమర్రి సుభాష్. సుభాష్ రాకేష్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్. దిలీప్ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్నది పేరు ఇంకా పెట్టని సుభాష్ సినిమానే. ఆది పని చేస్తున్నది అందులోనే.

“అలాగే సార్.. మాలికేష్? ” సందేహిస్తూ అన్నాడు ఆది.

“మూర్తిరాజుగారికి ఫోన్ చేసి చెప్పు ” ఏ.సి. రూం లోకి పోతూ అన్నాడు సుభాష్.

మూర్తిరాజుగారు చాలా సినీయర్ ప్రొడక్షన్ మేనేజర్. లెక్కలంతా ఆయనే చూసుకుంటారు. ఆయనంటే అందరికీ గౌరవమే. కష్టం సుఖం ఎరిగిన వ్యక్తి.

“రాజుగారు! పార్టికి ఏర్పాటు చేయమని సుభాష్ గారు చెప్పారండి. అలాగే గత మూడు నెలలుగా నా జీతం కూడా పెండింగ్ లో ఉందండి. మీరేదైనా సాయం… ” ఇబ్బందిగా అడిగాడు ఆది.

“ఆదీ! గట్టిగా అడగాలయ్యా.. అడగకపోతే అమ్మయినా పెట్టదు. సుభాష్ గురించి నీకు తెలియంది ఏముంది? నేను అక్కడకి వస్తాలే. ఆయన ముందే ఒక్క మాటు నీ జీతం గురించి నాతో చెప్పు. వెంటనే ఏర్పాటు చేస్తా..” హామీ ఇచ్చారు మూర్తిరాజు గారు.

“అలాగేనండి ” నిట్టూర్చాడు ఆది. సుభాష్ ఎంత ఖిలాడీగాడో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

మొదట ఒక ఆఫీస్ లో బాయ్ గా చేరి , మెల్లగా లోకాన్ని అర్ధం చేసుకొని, ఎవర్ని ఎలా పట్టాలో స్పెషలైజ్ చేసి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగెట్టి, కొందర్ని ముంచి, మరి కొందరిని తేల్చి ప్రొడ్యూసర్ అయ్యాడు. ఏ కంపెనీలో బాయ్ గా జేరాడో ప్రస్తుతం ఆ కంపనీ ఉండే చోటే తన ప్రొడక్షన్ కంపెనీ పెట్టి అంచెలంచెలుగా “టాప్” త్రీ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకరిగా ఎదిగాడు. అతను అనేది ఒకటే…

“సిగ్గు శరం, మానం మర్యాదాలాంటి చెత్తని పోగేసుకుంటావో నీ యిష్టం.   కావల్సినంత పోగేసుకో.. కానీ జన్మలో ఎదగలేవని మాత్రం గుర్తుంచుకో. ” (రెండో పెగ్గు దాటాక మాత్రమే ఈ డైలాగు వస్తుందని మనవి.)

  1. ఎగ్గొట్టడం ‘మన’ జన్మ హక్కు. ఎదుటివాడు ఎదవ గనకనే ఎగ్గొట్టించుకుంటున్నాడు. ” (4వ పెగ్గులోనీ సినీ గీతా సారం).

ఈ స్టేజికి రాడానికి అతను ఎన్ని ‘ లంగా ‘ పనులు చేశాడో అందరికీ తెలుసు. అయినా ఏమీ తెలియనట్టే ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ‘సక్సెస్ ‘ మాత్రమే.

మద్రాసులో పోష్ లొకాలిటీలో మూడు బ్రహ్మాండమైన పైవ్ స్టార్ విల్లాలున్నాయి. ప్రస్తుతం పరిశ్రమని శాసించే వాళ్ళల్లో “సుభాష్ ” ఒకడు. చదువుకీ, సంపాదనకి ఏ మాత్రం సంబంధం లేదని నిరూపించదలచుకొన్న వాళ్ళకి సుభాష్ ఒక ఉదాహరణ.

పాతిక లక్షల హీరోకి కోటిరూపాయిలిస్తానని అర్జెంట్ గా కాల్ షీట్లు సంపాదించడం దగ్గర నుంచి, హీరోయిన్ లొసుగులు పట్టి, చెప్పింది చేయించుకోవడం వరకు సుభాష్ సాటి మరొకరు లేరు.

ఏ టెక్నీషియనన్నా “చచ్చినట్టు ‘ పని చేస్తాడు. సుభాష్ తో పెట్టుకుంటే ఇండస్ట్రీలో తిప్పలు తప్పవని అందరికీ తెలుసు. అందుకే ఇచ్చినంత పుచ్చుకొని మౌనంగా వెళ్ళిపోతారు. డిమాండ్ లో ఉన్నవారైతే “మీకంటేనా? అయ్యో.. కాల్షీట్లు మొన్ననే ఇచ్చేశా గురూగారు ” అని మేనేజ్ అయిపోతారు.

అయితే ఒక్క విషయం మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. లోపల ఏదున్నా, ఎలా ఉన్నా గానీ, బైటకి మాత్రం చల్లగా నవ్వుతూ మంచుపర్వతంలాగా ఉంటాడు. చికాకన్నది కనపడదు.

***

చాలా వరకు సినిమా విందులలో జరిగేది ఒక్కటే… ” ఆత్మస్థుతి- పరనింద “. మందు మాకు (ఫుడ్) ప్రవహిస్తుంటే ‘ మాటలు ‘ వేడి వేడి పకోడీల్లా మనసుని అలరిస్తాయి. జంధ్యాలగారు వీరబూతు, మహాబూతు అని బూతుని వర్గీకరించినట్టు ఇక్కడ పొగడ్తల్లో వర్గీకరణ ఎవరేనా చేస్తే బాగుంటుందనిపిస్తుంది.

తాగని వాళ్ళని మందు పార్టీల్లోకి రానివ్వరు. ఎందుకంటే అక్కడి విషయాలు బయటకు రాకూడదు కదా! ఒక వేళ గనక వస్తే ‘ ఎవడు చేరవేశాడో ‘ తెలియడానికి క్షణం పట్టదు. వాడి బతుకు సమాధే.

ఆ రోజున ఆది తాగక తప్పలేదు. వేయిరూపాయిల పెగ్గు ఖరీదైనా కావల్సినంత పోస్తారు కానీ పది రూపాయిలు ఎడ్వాన్స్ ఇమ్మంటే మాత్రం ఆమడ దూరాన ఉంచుతారు. ఆది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంటద్దె కట్టి రెండు నెలలు, మిగితా విషయాలు ఇంకా అధ్వాన్నం.

డబ్బు అడిగి తీసుకోక తప్పదు. అడగాలంటే లక్షాతొంబై సందేహాలు. అదేమి అడ్వాన్స్ కాదు, రావల్సిన జీతమే. అయినా…

రాత్రి ఒంటి గంట వరకు పార్టీ నిరాఘటంగా జరిగింది. దిలీప్ అప్పుడప్పుడు వీర ప్రేమతో ఆదిని కౌగిలించుకుని, కొత్తలో తాను పొందిన సహాయం గురించి కూడా కన్నీళ్లతో వివరించాడు.

‘ ఊర కుక్క విశ్వాసం కక్క ముక్కతో సరి ‘… నల్ల నీళ్ళ వేదాంతం తెల్లారితో సరి ‘ అన్నట్టు క్షణంలో టాపిక్ మార్చి, ” సుభాషా ! యీడు..అదే యీ ఆదీ గాడికి బుర్రలో గుజ్జు తక్కువ. నేను చూడు వచ్చి మూడేళ్లలో అయిదు పిక్చర్లు చేశాను. మరి యీడు సీనియర్ అసోసియేట్ అంట. అసలేమొచ్చనీ.. హి.. హి.. హి.. ” అని అన్నాడు.

ఆది గుండె మండుతున్నా సైలెంటుగా వుండిపోయాడు. ఏవి మాట్లాడినా జరిగే నష్టం తనకే అని తెలుసు. మూర్తిరాజు ఆ విషయాన్ని గమనించి, ” ఆదిగారు! మీతో కాస్త పని వుంది నాతో వస్తారా? ” అని బయటకు తీసుకెళ్ళారు.” ఆది, ఇదిగో ఐదొందలు, యీ సొమ్ము సుభాష్ ది కాదు, రేపు నేనే ఓ సారి సుభాష్ తో మాట్లాడి మీ జీతం ఇప్పించే ప్రయత్నం చేస్తాను. యీ దగుల్బాజీ గాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలిసిందే కదా! ” అని అనూనయించి పంపాడు.

తిండితిప్పలు వదిలేసి అవమాన భారంతో ఇంటికొస్తే ఏమీ తెలియని అనసూయ అన్న మాట మరో శూలంలా గుండెల్లో దిగింది.

***

ఓ.కే, ఓ.కే.. బండిని అమ్మేస్తే ఏమయ్యింది. నేను నడవగల్ను! మళ్ళీ బడ్డి కొట్టు స్టూల్ మీంచి లేచి నడక మొదలెట్టాడు ఆది. ఇప్పుడు వెళ్ళాల్సింది దిలీప్ ఇంటికి. రెండురోజుల్లో రెండో షెడ్యూలవ్వడం వల్ల బోలెడు పనులున్నాయి. బట్, వాడ్ని ఎలా కలవగలను?” ఆది మనసు భగ్గుమంటూనే ఉంది.

ఆది వెళ్ళేసరికి దిలీప్ భార్య చెప్పింది, ” ఆదిగారు, యీ పైల్సన్నీ మిమల్ని చూసుకోమన్నారండి. ఆయన శుభశ్రీ గారి ఆఫీస్ కి వెళ్ళారు. ఏదో న్యూ స్టోరీ డిష్కషన్ ట. ” అని.

నవ్వుకున్నాడు, దిలీప్ కి తెలుసు రాత్రి తాను ఏం వాగాడో. మొహం చూపించలేక పెళ్ళాంతో అబద్ధం ఆడించి తప్పుకున్నాడు. అసలు విషయమేమిటంటే ఆది లేకపోతే ఆ సినిమా పూర్తి కాదు. పూర్తి ఐనా హిట్ అవ్వద్దు. సొమ్మొకరిది సోకొకరిది లాగా. టాలెంట్ ఒకరిది.. పేరు ఇంకొకరిది.

అవన్నీ మోసుకొంటూ కొడంబాకంలోని ‘మహల్ ‘ కి చేరాడు ఆది. ప్రొడక్షన్ కారు అడగొచ్చు. కానీ ఆది అడగదలచుకోలేదు. ఏదో తెలియని ఊగిసలాట.

“ఇదిగో ” మూడువేల ఐదొందలు అనసూయ చేతిలో పోశాడు ఆది.

“ఎక్కడిది? ” అని అడిగింది అనసూయ…

“స్కూటీ అమ్మేశా..”

” ఏం? జీతాలు రావాలిగా? ”

” ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదుగా ఠంచనుగా జీతాలివ్వడానికి? ” ఫైల్స్ మడతమంచం మీద పడేసి అన్నాడు ఆది.

” మీకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడో డైరెక్టర్ లై….”

“కొంచం ఆపుతావా?” మాట్లాడుతున్న అనసూయని మద్యలో ఆపేశాడు ఆది.

“ఇలా నా నోరు మూయించడం మాత్రం తెలుసు..! విసవిసా లోపలకి వెళ్ళింది.

(సోదరుల్లారా.. ఒక అసోసియేట్ కి ఎంత పని ఉంటుందో.. ఎంత గమనించాల్సి ఉంటుందో పూర్తిగా వివరించాలంటే ఒక నవలే రాయాల్సి వస్తుంది. అందుకే దాని జోలికి పోవట్లే…కానీ ‘ఆది’నీ, ఆది లాంటి అసోసియేట్ ని చూస్తుంటే ఎవరి గుండైనా చెరువుగా మారి తీరుతుంది. )

ఆది సీరియస్ గా పనిలో పడ్డాడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. కట్టుకున్న భార్య కూడా ఆ విషయాన్ని గమనించకుండా మాట్లాడటంతో ఆది గుండె మరోసారి పగులిచ్చింది.

” సార్ అన్వేష్ గారు రెమ్యునరేషన్ గురించి గుర్తు చేశారండీ! ” సాయంత్రం సుభాష్ తో అన్నాడు ఆది.

“ఓహ్.. రేపే పంపిద్దాం..! అన్నట్లు ఆది.. నీకూ జీతం ఇవ్వాలిగా, ప్రస్తుతానికి మూడు వేలు నేనిమ్మనానని మూర్తిరాజు గారిని అడిగి తీసుకో.. తక్కువేననుకో… కానీ కొంచం అడ్జస్ట్ కాక తప్పదు. బయ్యర్ల నుంచి రావల్సింది రాలేదు. వచ్చాక రెమ్యునరేషన్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తా! ” ఆది భుజం తట్టి వెళ్ళిపోయాడు సుభాష్.

“అబద్ధం ” మనసులోనే అరిచాడు ఆది. ‘ కోటి రూపాయిలు ఈజీగా ‘సూట్ కేస్ ‘ లో పెట్టి అన్వేష్ కి పళ్ళికిలిస్తూ అందించడానికి ‘రెడి గా’ ఉన్న సుభాష్ కి పదిహేను వేలో లెక్కా? అంతా పచ్చి అబద్ధం..’గట్టిగా అరవాలనిపించినా సైలెంటైపోయాడు ఆది. జనాల దృష్టిలో సినిమా వాళ్ళంటే కోటీశ్వరుల కిందే లెక్క. ఎన్.ఆర్.ఐ. లని సినిమా వాళ్లని అపార్ధం చేసుకొన్నంతగా బహుశా మరెవరినీ అంతగా అపార్ధం చేసుకోరు ప్రజలు.

ఎన్. ఆర్. ఐ. అనగానే అందునా అమెరికాలో ఉంటున్నాడు అనగానే వాడు కోటానుకోటీశ్వరుడి కిందే లెక్క. ఎంత ‘ కడుపు కట్టుకొని ‘ ఇండియా వచ్చేటప్పుడు జనాలు ‘కోరినవి ‘ తీసుకొస్తారో, తిరిగి వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డ్ ని కరిగిస్తూ ఎంత క్షోభ పడతారో ఎవరికి తెలుసు? డాలర్లని రూపాయిల్లోకి తర్జుమా చేసుకొని ఇక్కడ ఊహల్లో తేల్తారే కానీ, అక్కడి పరిస్తితుల్ని ఎవరూ అంచనా వేయరుగా.

సినిమా స్క్రీన్ మీద ఫలానా ‘ఆదినారాయణ ‘ అసోసియేట్ డైరెక్టర్ అన్న పేరు కనపడగానే చుట్టాలు పక్కాలు మరీ పొంగిపోతారు. అయితే అసలు సంగతి తెలిసిందెవరికి?

సినిమా నిర్మాణం భయంకరమైన వేగంతో సాగుతోంది. ఆదికి క్షణం తీరిక లేదు. సుభాష్ ఇచ్చిన మూడు వేలు, బండి అమ్మిన తాలూకా ముడున్నర వేలతో బండి ఓ మాదిరిగా నడుస్తోంది. అనసూయలో అసంతృప్తి కూడా రగులుతూనే ఉంది.

మొత్తం ‘ రష్ ‘ చూసేశారు. దిగుల్లేవు. సినిమా సూపర్ హిట్ కాక తప్పదని ‘ సినీపండితులు ‘ తేల్చారు. ( ఆ చెప్పిన వాళ్ళల్లో చూసిన వాడు ఎవడూ లేడూ).

మళ్ళీ దిలీప్ ఆనందంగా ‘ పార్టీ ‘ కి కాల్ ఫర్ చేశాడు. మూడు నెలలు గడిచాయి… పూర్తి కావడానికి. అంటే గత మూడు నెలలుగా ఆది కి పైసా కూడా ముట్టలేదు. ఆదికే కాదు చాలా మందికి. బొంబై హీరోయిన్ సూట్ కేస్ లో డబ్బుల కట్టలు సర్దుకొని సుభాష్ కి షేక్ హాండ్ ఇస్తే , 100 % టాలెంటున్న తెలుగు సెకండ్ హీరోయిన్ కి ఖాళీ చెయ్యి చూపించాడు సుభాష్. ఆ అమ్మాయి గొప్ప నటే కాదు, చాలా మంచిది కూడా. ఆ అమ్మాయిని అన్యాయం చేయడం ఆదికి అస్సలు నచ్చలా. కానీ మాట్లాడటానికి ఏముంది?

” ఆదీ! ఇది మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ ” నవ్వుతూ ‘ షీవాస్ రీగల్ ‘ ఓపన్ చేస్తూ అన్నాడు సుభాష్.

” అవును సుభాష్.. మై బాయిస్ హాడ్ డన్ ఏ వండర్ ఫుల్ జాబ్. ” సిప్ చేస్తూ అన్నాడు దిలీప్.

9:30 కి రెండో పెగ్గు పూర్తి. 4th అసిస్టెంట్ నందు. కుర్రాడికి మందు కొట్టడం కొత్త. అప్పటికే ఆది చెప్పాడు “నందూ! తాగినట్టు కనపడు. ఒక్క పెగ్గుకి మించద్దు. తాగాక ఒక్క మాట కూడా మాట్లాడకు. కేవలం చూస్తూ కూర్చో. బూతులు తిట్టినా నోరెత్తకు ” అని.

“ఈ సినిమా తరవాత నువ్వే అడిగినా, రేటు పెంచేస్తా, సుభాష్… హి..హి..హి.. ఇప్పుడే నీకు చాన్స్! ” నవ్వి ఇంకో సిగరెట్టు ముట్టించాడు దిలీప్.

“టూ హండ్రెడ్ డేస్ ఆడకపోతే చెవులు కోయించుకుంటా ” లౌక్యం తెలిసిన 1st అసిస్టెంట్ బల్లని చిన్నగా సర్ది అన్నాడు.

“ఇప్పుడు హడ్రెడ్ డేస్ ఎక్కడున్నాయి?   నాలుగు వారాలు హౌస్ ఫుల్ నడిస్తే చాలు. రూపాయికి పది రూపాయిల పంట ” అని మూర్తి రాజు గారు అన్నారు.

మొత్తం 500 థియేటర్లు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నా ” మరో పెగ్గు పోసుకుంటూ అన్నాడు సుభాష్.

“గుడ్ ” దిలీప్ అంటూ వుండగా ‘అన్వేష్ ‘ లోపలకి వచ్చాడు.

“వావ్ ! వాటే సర్ ప్రైజ్ ” లేచి అన్వేష్ ని హగ్ చేసుకుంటూ అన్నాడు దిలీప్.

మరో రౌండ్ దిగ్విజయంగా ముగిసింది. అన్వేష్ లేచాడు.

“థాంక్స్ దిలీప్ .. మంచి పిక్చర్ ఇచ్చావు…

“థాంక్స్ సుభాష్.. మీ కంపెనీలో పని చేయడం ఎప్పుడూ మజానే! ఓ చిన్న సర్ ప్రైజ్.. నేను సొంతంగా పిక్చర్ తీయబోతున్నాను.”

“వావ్.. డైరెక్టర్ ఎవరూ? ” అడిగాడు దిలీప్ ఉత్సాహంగా…

“ఆది ” బయటకు వెళ్తూ అన్నాడు అన్వేష్…

“మై గాడ్… ఓహ్.. కంగ్రాట్స్ ఆది…” దిలీప్, సుభాష్ ఆది చేయ్యి పట్టుకొని ఊపేశారు.

“నీ కోసం మరో రౌండ్.. ” మరో బాటిల్ ఓపెన్ అయ్యింది.

“గురూగారు మీరు గనక డైరెక్టర్ అయితే సినిమా పరిశ్రమకి మంచి రోజులు వచ్చినట్టేనండి..”ఫుల్ మూడ్ లో అన్నాడు నందు…

“అంటే ఇప్పుడు బాడ్ డేస్ నడుస్తున్నాయా? ” సీరియస్ గా అన్నాడు దిలీప్..

“అలా కాదు సార్! ఆది గారి టేస్టే వేరు. గొప్ప రీడర్, గొప్ప థింకరు! ” అడ్మైరింగుగా ఆదిని చూస్తూ అన్నాడు నందు.

“అంటే మిగిలిన వాళ్ళంతా ఎర్రివాళ్ళనా? ” రేయ్ నందు… ఆఫ్ట్రాల్ 4th అసిస్టెంట్ గాడివి. ఇండస్ట్రీ గురించి వాగుతావుట్రా లం… కొడకా… ” సిగరెట్ లైటర్ ని నందు మొహం మీదకి విసిరాడు దిలీప్.

అన్వేష్ “ఆది”ని తన సొంత పిక్చర్ కి డైరెక్టర్ గా చేస్తాననగానే దిలీప్ వళ్ళూ, గుండే సరసరా మండాయి… మండుతూనే ఉన్నాయి.

” బూతులు మాట్లాడతారెందుకండి?.. అసలు ఈ పిక్చర్లో కూడా కట్.. స్టార్ట్ చెప్పడం తప్ప మీరేం చేశారు? అన్నీ చూసుకుంది ఆదిగారే కదా? ” కోపంగా అన్నాడు నందు.

నందువాళ్ళది బాగా కలిగిన కుటుంబం. ఆ కుర్రాడు ఎం. బి.ఏ. చదివాడు.

“నీ యమ్మ.. గెట్ అవుట్.. ” చెయ్యి విసిరాడు దిలీప్.

కరక్ట్ గా ఆ సమయానికి ఆది మద్యకి రావడంతో ఆ దెబ్బ ఆదికి తగిలింది. ఒక్క క్షణం సైలెంట్.

“సుభాష్.. యీ నా కొడుకులిద్దరినీ బయటకు దొబ్బెయ్యమను. నిన్న గాక మొన్న వచ్చిన ఆ నా కొడుక్కి పుర్రెక్కించి మాట్లాడించింది ఆ ఆదిగాడే.. గెట్ అవుట్.. ” . అసలే ఫుల్ మందు, దాంతో అన్వేష్ అనౌన్స్ మెంట్ ఇంకొంత వెర్రెక్కించింది. ఉచ్ఛం నీచం అన్నీ వదిలేసి అరిచాడు దిలీప్.

“రేయ్ నీయబ్బా.. ” లేచాడు నందు. అతన్ని బలవంతంగా రూం బయటకు లాక్కెల్లాడు ఆది. నందూని మరొక ఆఫీస్ కుర్రాడికి అప్పగించి మళ్ళీ లోపలకి వచ్చాడు ఆది.

“ఓ.కే. సార్.. వెళ్ళిపోతాను, ఇప్పటివరకు మీరు నాకు ఇవ్వాల్సిన ముప్పై ఐదు వేలు.. ఇప్పించండి! ” కటువుగా అన్నాడు ఆది.

“నీయయ్యా! పైసా కూడా రాదు.. ఇప్పించను… సుభాషూ.. నువ్వు గనక యీడికి పైసా ఇచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు! ” ఊగిపోతూ అన్నాడు దిలీప్. అంతేకాదు ” ఆ హీరో నా కొడుకు నిన్ను డైరెక్టర్ గా పెట్టుకుంటానన్నాడుగా.. ఫో.. వాడికే కాదు నీ దిక్కున్న చోట చెప్పుకో ” అరిచాడు దిలీప్.

” ఆదిగారు.. ప్లీజ్.. ” అంటూ ఆదిని బయటకు తీసుకొచ్చారు మూర్తిరాజుగారు. జీవితంలో మళ్ళీ పని చేయకూడదని ఆయన ఇందాకే నిర్ణయించుకున్నాడు.

***

“సారీ ఆది!! కంప్లైంట్ ని ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి పంపించాము. వాళ్ళేం చెపుతారో అదీ వినాలిగా. ” అన్నాడు అసోషియేషన్ సెక్రటరీ.

“సారీ ఆది! యీ పరిస్థితిలో నీ పేరు డైరెక్ట్ గా అనౌన్స్ చెయడమంటే సూసైడ్ చేసుకోవడంలాంటిదే. మరోసారి, అంటే కాస్త పరిస్థితులు చక్కబడ్డాక చూద్దాం ! ” కూర్చోమని కూడా అనకుండా నిలబెట్టి మాట్లాడాడు అన్వేష్.

ఆది నవ్వుకున్నాడు. అన్వేష్ దిలీప్ ని డైరెక్టర్ గానూ, నందుని కో- డైరెక్టర్ గానూ త్వరలో అనౌన్స్ చేయబోతున్నాడని ఆదికి నిన్ననే ఒకరు చెప్పారు. నిషా దిగాక నందూ ప్లేట్ మార్చి ఆది చెడతాగి గొడవ పెట్టుకున్నాడని అసోషియేషన్ లో సాక్ష్యం ఇచ్చాడు. ఫలితం రెండో సినిమాకే కో- డైరెక్టర్.

***

“ఎందుకయ్యా మీలాంటి వాళ్లకి పెళ్ళిళ్ళు? తిండి పెట్టలేని వాళ్లకి పెళ్ళాలు, పిల్లలు ఎందుకు? బతుకు చెడా…” పుట్టింటికి పిల్లల్ని తీసుకుపోతూ అనసూయ అన్న మాట చెవుల్లో మోగుతుండగా మొదటిసారి ‘ జిల్ జిల్ వైన్స్ ‘ లో హాఫ్ బాటిల్ కొన్నాడు ఆది…

***

“అయాం సారీ.. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. ఆయనకి మేం 35 వేలు ఇవ్వాలి. అంతకి అంతా కలిపి 70 వేలు ఆయన భార్యకి ఇస్తున్నాము. ఆదిలాంటి సిన్సియర్ ఇండస్ట్రీలో మరొకరు లేరు. ప్రెస్ ముందు స్టేట్ మెంట్ ఇచ్చాడు సుభాష్.

నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఇంత గొప్పగా రాడానికి కారణం ఆదినే. గొప్ప జడ్జ్ మెంట్ ఉన్నవాడు. 24 క్రాఫ్టుల్లోనూ అతనికి మంచి అవగాహన ఉంది. అతను అసోషియేట్ గా ఉంటే డైరెక్టర్ కి నిశ్చింత. నాకు కుడి చెయ్యి కోల్పోయినంత బాధగా ఉంది. ” గద్గదంగా   అన్నాడు దిలీప్.

“నాకూ పని నేర్పిన తండ్రి ఆయన ” అని రుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు నందు.

“ఇండస్ట్రీ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది” ఓ ప్రముఖుడు.

“ఆది నాకు మిత్రుడు. అతనితో నేనో సొంత పిక్చర్ తీద్దామనుకొన్నాను. ఇంతలో …” కన్నీరు కార్చాడు అన్వేష్.

ఓ నాలుగు రోజుల పాటు ఏ పేపర్లో, ఛానల్లో చూసినా ‘ఆది ‘ గురించి వార్తలే. ఆది గురించి ప్రశంసలే.

తెల్లవారుఝామునే ఆదిని గుద్దేసి, మరణం ప్రసాదించిన లోకల్ ట్రైన్ మాత్రం నిశ్చింతగా, నిర్విచారంగా తాంబరం నుంచి ఫోర్ట్ దాకా గంట గంటకీ అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఎప్పుడు కోడంబాకం దగ్గర ఆ ‘ట్రాక్స్ ‘ దాటుతున్నా ‘ ఆది ‘ ముఖమే ఇప్పటికీ నాకు కనిపిస్తుంది.

కాలానికి మనసుతో పనేముంది? అందుకే అది నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.

P.s :

ఇది కనక నా చేతిలోని కథ అయితే, ఆదిని సూపర్ డైరెక్టర్ ని చేసేవాడిని. అవమానాలకి గురై కూడా అద్భుతమైన ఎత్తుకి ఎదిగిన వాళ్లు ఇప్పుడూ ఇండస్ట్రీలో ఉన్నారు. ‘ఆది ‘ బలహీన మనస్కుడు కాదు. అది ప్రమాదమా? ఆత్మహత్యా? అనేది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న ! తెలిసింది ఒక్కడికే.. పై నుండి అన్నీ ఆటలు ఆడుతూ ఆడించే ఆ పరాత్పరుడికే!

 

P.S :

సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పక్కర్లేదుగా!!!

మీ

భువనచంద్ర….

ఇంకేం చెప్పనూ!

bhuvanachandra (5)

షౌలింగర్ .. దాన్నే’ఘటికాచలం’ అని కూడా అంటారు. మద్రాసు నించి కార్లో ఓ మూడుగంటల ప్రయాణం.. ప్రస్తుత రద్దీలో. మధ్యలో ‘తిరువళ్లూరు’లో ఆగి వీరరాఘవస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. వీర రాఘవస్వామిని దర్శించడం ఓ అద్భుతమైన అనుభవం. ఆ ఆనందం అనుభవించాల్సిందే కానీ మాటలలో వివరించేది కాదు. పెళ్లికాని వాళ్లు మొక్కుకుంటే పెళ్లవుతుంది. అందుకే ఇక్కడ చిన్న ‘వరుడు’, ‘వధువు’ బొమ్మలు అమ్ముతారు.

షౌలింగర్ లేక షోలింగర్లో రెండు కొండలున్నై. ఒకటి నరసింహస్వామి గుడి, రెండోది ఆంజనేయస్వామిది. నరసింహస్వామిని దర్శించిన తరవాతే ఆంజనేయస్వామిని దర్శించాలి. కోతులకీ,కొండముచ్చులకీ లెక్కలేదు. ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకుంటే కోతులు ఆ పువ్వుల్ని లాగేస్తాయ్. అందుకే కొండ ఎక్కేప్పుడు ఓ కర్రని కూడా దుకాణదారులు ఇస్తారు.

నరసింహస్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే బ్రాహ్మణులు ఓ పెద్ద ఉద్ధరిణతో మన మొహం మీద తటాల్న నీళ్లు కొడతారు. కొంతమంది భయపడితే కొంతమంది ఉలిక్కిపడతారు. ‘దృష్టిదోషం’ పోతుందిట. ఆ నీరు మన మీద పడితే.

ఇక్కడి ఆంజనేయస్వామికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి.. ఎక్కడా లేని విధంగా యీ ఆంజనేయస్వామికి నాలుగు చేతులు. రెండు అభయహస్తాలతో దీవిస్తుంటారు. ఇంకోటి సాలిగ్రామ మాల ధరించియోగముద్రలో ఉంటారు.

ఈ ఇద్దరు దేవుళ్ల ఫోటోలు ఎక్కడా దొరకవు. కేవలం దర్శించి తరించాల్సిందే . నృసింహస్వామి కొండ దూరం నించి చూస్తే సింహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ 1400 మెట్లు. ఆంజనేయస్వామి గుడికి 400 మెట్లు. మెట్లు ఎక్కలేని వాళ్లకోసం ‘డోలీ’ ఏర్పాట్లు కూడ వున్నాయి. ఓ పాతికేళ్ల క్రితం వెళ్ళినప్పుడు ముందు ‘రిక్వెస్ట్’ చేస్తే గానీ ఉదయం ఇడ్లీ కూడా దొరికేది కాదు. ఇప్పుడు చాలా హోటళ్లు వెలిశాయి ( గుడి, కొండల దగ్గర.. ఊళ్ళో అంతకు ముందు హోటళ్లు వున్నై) ఆ రోజుల్లో ‘బస’ సత్రాల్లోనే. ఇపుడు ఏ.సి సౌకర్యాలతో సహా అన్ని హంగులతోనూ ఉండొచ్చు.

మానసిక జబ్బుల్తో బాధపడేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి మూడు రాత్రులుంచితే ఖచ్చితంగా జబ్బు తగ్గుతుందని ఓ నమ్మకం. చాలా మందికి తగ్గిందని వాళ్ల నోటితోనే విన్నాను.

అక్కడి వాతావరణం చాలా హాయిగా వుంటుంది. శని,ఆదివారాలూ, మంగళవారమూ చాలా రద్దీగా ఉంటూంది. మిగతా రోజులు ప్రశాంతంగా వుంటుందక్కడ. దర్శనం ఉదయం తొమ్మిదింటినించి సాయంత్రం అయిదుగంటలవరకు మాత్రమే..

Image (9) - Copy

కొన్నేళ్ళ క్రితం ఆంజనేయస్వామి కొండ మొదట్లో వున్న ‘ఆర్య వైశ్య సత్రం’ దగ్గర ఓ చిన్న నిట్టాడి పాకలో ‘తాయమ్మ’ కు కనిపించాడంట. తాయి అంటే తమిళంలో ‘అమ్మ’ అని అర్ధం. మన తెలుగులో తాయమ్మ అంటే సుమారుగా అమ్మమ్మ అనుకోవచ్చేమో. మనిషి నలుపేగానీ అద్భుతమైన ‘కళ’. కళ్లు, పలువరుసా మెరుస్తూ మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.. నవ్వు మొహం.

అప్పట్లో టిఫిన్ కావాలన్నా, ‘ఏర్పాటు’ చేసుకుంటే కానీ దొరికేది కాదని విన్నవించా. మేము అంటే నేనూ, శ్రీ గుత్తా రామ్ సురేష్‌గారి కుటుంబం షోలింగర్ చేరేసరికి చీకటి పడింది. ఆంజనేయస్వామి మెట్లదగ్గర వున్న ఓ చిన్న సత్రం (గుడికి సంబంధించిందే)లో రెండు గదులు తీసుకున్నాం. చాపలు వున్నై. దుప్పట్లూ అవీ మేము తీసికెళ్ళినవే. భోజనం కూడా మేం మద్రాసులోనే ‘పేక్’ చేసుకున్నాం. రాత్రిపూటకి.. చేరగానే ‘పెద్దమర్రి’ కింద వున్న ఓ చిన్న షాపులో ఇడ్లీలు రేపటికి ఏర్పాటు చేయగలవా’? అని ఓనర్ని అడిగితే చేస్తానన్నాడు.

పొద్దున్న లేవగానే నేను ఆ షాపుకి వచ్చాను. షాపు ఓనరు చెప్పాడు. “ఆ పాకలో వుండే ‘తాయమ్మ’ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా ఇడ్లీలు, చెట్నీ ఇస్తుంది. వెళ్లి నేను చెప్పానని చెప్పండి” అని.

అక్కడ వున్నది తాయమ్మ పేరు మీద చలామణీ అవుతున్న స్వర్ణకుమారి. నన్ను చూడగానే “రండి! ఇప్పుడు ఇడ్లీ వేసి ఇమ్మంటారా?” అన్నది నవ్వుతూ, అసలు స్వర్ణకుమారిగారు అక్కడుంటుందని నేను ఊహించలేదు. “మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. మీరు నన్ను గుర్తుపట్టారా?” అన్నాను. “మీతో పరిచయం చాలా తక్కువ. నిజం చెబితే ఒక్కసారే మీతో మాట్లాడింది. సురేష్‌గారు పరిచయమే.. వారి కుటుంబం కూడా తెల్సు. రామినీడుగారి సినిమాల్లో వేషం కూడా వేసానుగా!” నవ్వింది. ఆ నవ్వులో అదే ‘వెలుగు’.

“మీరు.”అడగబోయి ఆగిపోయా.

“ముందు కూర్చోండి..! చిన్న ప్లాస్టిక్ స్టూలు వేసింది. కూర్చున్నా. అయిదు నిముషాల్లో వొత్తుల స్టౌ(విక్ స్టౌ) మీద పాలు వేడి చేసి ‘ఫిల్టర్’ కాఫీ ఓ కప్పు నాకిచ్చి తనో కప్పు తీసుకుంది. ఆలోగా చుట్టూ చూశా. చిన్న పాక. పొందిగ్గా, పరిశుభ్రంగా వుంది. కాఫీ చాలా బాగుంది. ‘ఫిల్టర్’ కాఫీ రుచి చూడాలంటే మద్రాసులోనే… అది అలవాటు అయ్యాక మరే కాఫీ తాగలేము.

“నా గురించి మీకేం తెలుసూ?” నవ్వి అన్నది.

“సారంగపాణి స్ట్రీట్‌లో మిమ్మల్ని మీ ఇంటినీ చూడ్డమే తప్ప పెద్దగా ‘తరవాతి’ విషయాలు తెలీవు. మీరొక మంచి నటి అని తెలుసు. చాలా సినిమాలు చూశాను మీవి. తరవాత కృష్ణ గానసభలో మీరు శాస్త్రీయ సంగీతం పాడటం తెలుసు. ఇంతమంచి గాయని అయ్యుండీ సినిమాల్లో ఎందుకు పాడలేదా అని అనుకునే వాడిని” చెప్పాను.

“శాస్త్రీయ సంగీతం మా అమ్మ నేర్పితే, నృత్యం మా మేనత్త రాజరాజేశ్వరి నేర్పింది..!”

“రాజరాజేశ్వరి అంటే అలనాటి…?”

“అవును.. గొప్ప స్టేజ్ ఆర్టిస్టు. సినిమాలు కూడా చేశారు.”

“ఓహ్! యీ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు..”

“అన్ని విషయాలూ అందరికీ తెలీదుగా.. అయినా.. ఎవరి జీవితాల్లో వారు బిజీగా వుంటారు. ఇప్పుడు మరీ వేగం.. మీరందరూ మెట్ల దగ్గర దిగినప్పుడు చూశాను. రాత్రి మీరు టిఫిన్ గురించి అడిగారని షాపు శెట్టి చెప్పారు. సరేనన్నాను.” మళ్లీ నవ్వుల వెలుగు.

“ఇక్కడ మీరు..?”

“ఎందుకో అందరి మీదా అన్నిటి మీదా విరక్తి కలిగింది. నా కోసం “కొన్ని క్షణాలైనా” నేను మిగుల్చు కోవాలనిపించింది. అందుకే ఓ రోజు నా నగలు కొన్ని అమ్మేసి ఎవరికీ చెప్పకుండా మద్రాసు విడిచి పెట్టేశాను. చాలా వూళ్లు తిరిగాను. ఇక్కడ ఎందుకో బాగుందనిపించింది. యీ పాక ఉండే చోటులో ఓ ముసలమ్మ వుండేది. చాలా ఏళ్ళనించి ఇక్కడే ఉంటోంది గనక యీ స్థలాన్ని ఆమెకి ఇచ్చారు. నేను వచ్చినప్పుడు నాకు వండి పెట్టింది ఆవిడే. మిగిలినవాళ్లకి నన్ను చుట్టంగా పరిచయం చేసింది. దానితో ఆమె చనిపోయాక దేవుడి వారసత్వంగా యీ చోటు నాకు దక్కింది. (నవ్వు)..”

“మద్రాస్ టీ నగర్‌లో మీ ఇల్లూ, ఇంటిముందు గార్డెనూ ఇవన్నీ..?”

“వాటన్నిటికంటే ఇదే నాకు బాగుంది. విశాలమైన ఇల్లు అక్కర్లేదండీ. విశాలమైన మనసుండలి. నేనెవరో ఈ ఇంటి ముసలమ్మకి తెలీదు. కానీ, తన దగ్గర వుండమని నన్నడిగింది. సరే అన్నాను. నిజంగా నన్ను ఓ తల్లిలా ప్రేమించింది… చాలా ప్రశాంతంగా నా వొళ్ళోనే కళ్లు మూసింది…!” ఆగింది. ఆమె చూపులు కింద పెట్టిన కాఫీ కప్పు మీదున్నా.. మనసక్కడ లేదని క్షణంలో తెలిసిపోయింది. బహుశా మనోనయనాల్తో ఆ వృద్ధురాల్ని చూస్తూ వుండొచ్చు. ముఖంలో నిర్వికారం వున్నది. కొన్ని క్షణాలు గడిచాయి.

“సారీ! ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాను. సరేలెండి.. ఇంతకీ మీరు టిఫెన్ సంగతి చెప్పలేదు కదూ. వాళ్లు ముగ్గురూ. మీరూ .. ఇంకా డ్రైవరూ.. అంతేగా..!”

“అవును. కానీ వాళ్లని కనుక్కోవాలి. టిఫిన్ దైవదర్శనానికి ముందా, తరవాతా అనే విషయం. ఇంకా టైముందిగా. వాళ్ల స్నానాలవీ కానిచ్చాకే నే స్నానిద్దామనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే మరో కప్పు కాఫీ మీరిస్తే తాగాలని వుంది..” అన్నాను.

సమయం ఆరున్నర అంతే.. కొండమీద గనక కొంచం చలి ఉంది. ఆ చిరుచలిలో వేడివేడి ఫిల్టర్ కాఫీ తాగటం ఎంత హాయిగా ఉంటుందో..

“తప్పకుండా . ఇక్కడ దొరికినంత చిక్కని స్వచ్చమైన పాలు మద్రాసులో దొరకవు తెలుసా.. కారణం ఇక్కడి ఆవులు, గేదెలూ మేసేది సహజమైన కొండగడ్డిని. యీ కొండంతా ఔషధ మొక్కలమయం అంటారు. అందుకేనేమో పాల రుచి అద్భుతం..!” మాట్లాడుతూనే వేడిపాలని మళ్ళీ వేడి చేసింది.

“మద్రాసు యిల్లు?” అడిగాను.. “మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి సుమా..”

“చెప్తానుగానీ యీ విషయాలు మళ్లీ మీరు సురేష్‌గారికీ, వాళ్ల వాళ్లకీ చెప్పకూడదు..”

“టిఫిన్‌కి వచ్చినప్పుడు వాళ్లు వస్తారుగా.. గుర్తుపట్టి మిమ్మల్ని అడిగితే?”

“అసలు మీరు వొస్తారని నేను వూహించలా. ఊహిస్తే ఆ శేటుతో ముందే చెప్పేదాన్ని. అతన్నే వొచ్చి కాఫీ టిఫెన్లు పట్టికెళ్ళమని. మొత్తానికి మీరు వచ్చేసారు. సరే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ కాఫీలు వాళ్ల దగ్గర చేర్చడం ఇప్పుడు మీ బాధ్యత. మీరు తీసికెళ్ళొచ్చు లేదా శేటుతో చెబితే వాళ్ళబ్బాయికిచ్చి సత్రానికే పంపుతాడు..” నవ్వింది.

“సరేసరే.. ఎవరికీ చెప్పను..” కాఫీ కప్పు మళ్లీ అందుకుంటూ అన్నాను.

“మా అమ్మ ఏనాడూ ‘కులం’ గురించి ఎత్తేది కాదు గనక మాది ఏ కులమో నాకు తెలీదు. ఓ జమీందారుగారు తనని గాంధర్వ వివాహం చేసుకున్నారని ఆ ఇల్లు వారిదేనని మాత్రం చెప్పేది. ఆయన పేరు.. నాయుడుగారు. చాలా పెద్ద జమీందార్. ఆయనకి భార్యా పిల్లలూ వున్నారుట. మా తమ్ముడు పుట్టిన రెండేళ్ళకే ఆయన చనిపోయారు. ఆయన మొహం అంటే మా నాన్నగారి మొహం చాలా కొద్దిగా గుర్తుంది. ఆయన పోయిన తరవాత చాలా గొడవలు జరిగాయి. అవన్నీ అప్పుడు వివరంగా తెలీదు గానీ తరవాత తెలిసింది. మా నాన్నగారి మొదటి భార్యా పిల్లలూ మద్రాసులో ఇంటిని స్వాధీనపరుచుకోవడానికి వచ్చారుట. అప్పుడు రాజరాజేశ్వరిగారి భర్త చాలా సహాయం చేసారని మా అమ్మ చెప్పేది. చనిపోకముందే మద్రాసులో ఇల్లు మా నాన్నగారు అమ్మ పేరిట రాయించి రిజిస్టరు చేయించారట. దాంతో తలదాచుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయింది. మా అమ్మ సంగీతం నేర్పుతూ నన్నూ తమ్ముడ్నీ చదివించింది”

“ఎంతవరకు చదివారూ?”

“నేను ఎనిమిదో తరగతిలో వుండగా ‘స్కూలు పిల్ల’లాగా వేయమని ఒక ఆఫరు వచ్చింది. రాజరాజేశ్వరిగారి భర్త మా అమ్మగార్ని ఒప్పించారు. ఆ సినిమాలో నా వేషానికి చాలా పేరొచ్చింది. అది తమిళ సినిమా. ఆ తరవాత వరసగా అలాంటి రోల్సే వచ్చాయి. ‘వద్దు’ అనే పరిస్థితి కాదు మాది. ఇల్లుంది. చాలా పెద్దది. కానీ దాన్ని మెయింటెన్ చెయ్యాలిగా? అదీగాక ఆరోజుల్లో సంగీతం నేర్పినా భోజనం వరకూ ఫరవాలేదుగానీ చదువులకి చాలదుగా..”

“అద్దెకివ్వొచ్చుగా?”

“వచ్చినవాళ్లు ఖాళీ చెయ్యం” అని ఆక్రమిస్తే? రాజరాజేశ్వరిగారి భర్త కుమరేశన్ గారే అద్దెకివ్వొద్దన్నారు. నాకు పద్నాలుగేళ్ళప్పుడు ఆయన రాజరాజేశ్వరిగార్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఒక పోర్షన్‌కి వచ్చేశారు. అప్పట్నించీ ఆవిడ్ని ‘అత్తా’ అనే పిలిచేదాన్ని. మేనత్తగానే భావించాను. కుమరేశన్‌ని దేవుడిచ్చిన అన్నగా అమ్మ అనుకునేది గనక ఆయన్ని ‘మామా’ అని పిల్చేదాన్ని.

“అలాగా! ఓహ్… తరవాత?”

“తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు వంద సినిమాలు నటించా. రాజరాజేశ్వరి అదే అత్త మొదట్లో తెలుగు, తమిళ నాటకాల్లో నటించింది. నేను బిజీ అవడంతో ఆమె సినిమాలు మానేసి నన్ను చూసుకునేది. రోజులు చాలా బాగా నడిచేవి. సడన్‌గా అమ్మ చనిపోయింది. ‘హార్ట్ఎటాక్’ వల్ల అన్నారు. మొత్తం భారం అంతా ఇంటి ఖర్చూ, తమ్ముడి చదువు ఖర్చు నా మీద పడింది. అదృష్టం ఏమంటే నాకు మంచి మంచి వేషాలు.. అంటే ఎక్కువ సిస్టర్ కేరక్టర్లూ, సెకండ్ హీరోయిన్ కేరక్టర్లూ వరసగా వచ్చాయి. దాంతో తమ్ముడి చదువుకి ఇబ్బంది కలగలేదు… నా ఐరవై మూడో ఏట కొంచెం ప్రేమలో కూడా పడ్డాను. అదో మత్తు. అప్పటివరకూ చక్కగా నా పని నేను చూసుకునేదాన్ని కాస్తా ప్రేమలో పడగానే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంట్లోంచి వెళ్లిపోయి ఓనాడు నేను ప్రేమించిన మళయాళ నటుడ్ని పెళ్ళాడేశాను గుళ్ళో…! ” మళ్లీ నవ్వు.. ఆ నవ్వులో ఏ భావమూ లేదు..

అన్ని రోడ్లూ రోముకే అన్నట్టు.. సినిమా హీరోయిన్ల ‘ప్రేమ’లన్నీ గుళ్ళో పెళ్ళిళ్ళకే.. కాంటాక్ట్ (లైసెన్స్డ్) పెళ్లిళ్లకే..

“ఆ తరవాత?”

“మీతో వచ్చినవాళ్లు స్నానాలూ అవీ అయిపోయి వుంటై గనక మీరు సత్రానికి పోవటం మంచిది. ఓ పాతిక ఇడ్లీలూ, చెట్నీ, కారప్పొడీ, నెయ్యి ఆ శేటు కొడుక్కిచ్చి పంపిస్తాను. హాయిగా తినేసి దర్శనాలయ్యి సాయంత్రం వరకూ యీ వూళ్లో వుండేటట్లయితే రండి. అప్పుడు చెప్పుకుందాం…”

“మరి.. టిఫిన్లకి..”

“ఓహ్.. డబ్బు సంగతా? నేను ఎవరైనా టిఫిన్లు కావాలని అడిగితే, వారికోసం తయారు చేసి పెట్టేదాన్నే కానీ.. హోటల్ పెట్టినదాన్ని కాదు.. నా దగ్గర ఇంకా కొంత సొమ్ముంది. అదీ అయిపోతే బహుశా హోటల్ పెట్టాల్సి వస్తుందేమో.. ప్రస్తుతానికి కాఫీ టిఫెన్ల వరకూ ఉచితమే…!” పకపకా నవ్వింది. సన్నటి బంగారు గొలుసు తప్ప వేరే ఆభరణాలు ఏమీ కనిపించలేదు. చీర కూడా ఖరీదైనది కాదు. చక్కగా ఉతికిన కాటన్ చీర. అగరువత్తులు వెలుగుతున్నాయి గనక నేను ఇక్కడికి రాకముందే అంటే.. తెల్లవారు ఝామునే స్నానం చేసి వుండాలి. నేను లేచాను. కానీ కథ మధ్యలో ఆగిందన్న చింత వుంది.

“అన్నట్టు రెండు గుళ్లల్లోనూ ప్రసాదాలు దండిగా వుంటాయి గనక దాన్నే మద్యాహ్న భోజనం అనుకోండి. రెండుసార్లు అడిగినా పెడతారు. లడ్డూలూ, అరిసెలూ కొనుక్కుని ఇంటికి తీసికెళ్లొచ్చు” చెప్పిందామె..

శేటుతో చెప్పి సత్రానికి వెళ్లాను. నిజమే.. వాళ్లంతా సిద్ధం. గబగబా స్నానం చేసి నృసింహస్వామిని చూసి, కిందకి దిగేసరికి ఒంటిగంట. కారణం సురేష్‌గారు ప్రత్యేకంగా ‘పూజలు’ చేయించడం.

ప్రసాదాలు గిన్నెల్లో పెట్టేసాం. కిందకి వచ్చి శేఠ్ దగ్గర ఆగాము. ఇడ్లీలు, చెట్నీ, నెయ్యీ, కారప్పొడి రెండు మూడు గిన్నెల కేరేజీల్లో వున్నాయి. ‘రుబ్బి’న పిండేమో.. టిఫిన్ అద్భుతంగా వుంది. వేడి లేకపోయినా..

“వేడివేడిగా పెట్టారండి ఆవిడ. ఎంత బాగున్నాయో.. పది ఇడ్లీలు తిన్నాను..” మాతో కొండపైకి రాని డ్రైవర్ సంబరంగా చెప్పాడు. మేము తింటూ వుంటే..

పాక తలుపు గొళ్ళెం పెట్టి వుంది. అంటే ఆవిడ లేదన్నమాట. ఆంజనేయస్వామి గుడి దర్శించుకుని కింద కొచ్చేసరికి నాలుగు. “ఇవాళ రాత్రి ఇక్కడే వుండిపోతే బాగుంటుంది కదూ..!” అన్నాను. “ఒక నిద్ర చేస్తే చాలు అండీ…” అయినా ప్రిపేర్డ్‌గా రాలేదుగా. మళ్లీ వచ్చే నెల్లో వద్దాం….!” సామాన్లు, అంటే మా దిళ్లూ, దుప్పట్లూ మడతపెడుతూ అన్నారు సురేష్‌గారు.

వాళ్లతో వచ్చినప్పుడు వారి ఇష్టప్రకారమే మనమూ నడుచుకోవాలి గదా.. కార్లో వచ్చేటప్పుడు చూసినా పాక తలుపు మూసే ఉంది.

మద్రాసు చేరేవరకు నా మనసు మనసులో లేదు. కథ మధ్యలో ఆగింది. ఆమెకి విరక్తి కలిగేంతగా అక్కడ ఏమి జరిగి వుండాలీ? మరుసటి రోజునే ఓ కారు మాట్లాడుకుని షోలింగర్ వెళ్లాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

పొద్దున్నే ‘విజయబాపినీడు’గారింటినించి ఫోను. అర్జంటుగా వచ్చెయ్యమని. నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది శ్రీ విజయబాపినీడుగారే. ‘నాకూ పెళ్ళాం కావాలి” నా మొదటి సినిమా. నన్ను ఆయన దగ్గరకు తీసికెళ్లి పరిచయం చేసింది గుత్తా రామ్ సురేష్‌గారు. గుత్తా రామ్ సురేష్‌గారు నాకు ‘డాక్టరు’గారి దగ్గర పరిచయమయ్యారు. (‘డాక్టరు’గారి ‘కథ’ ఫోటొలతో సహా త్వరలో వ్రాయబోతున్నాను) V.B. దగ్గరకు వెళ్ళాకే తెలిసింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సిట్టింగ్‌లో కూర్చోవాలని.

(పాటల రచయితకి స్టోరీ సిటింగ్స్‌తో పెద్దగా సంబంధం ఉండదు. పాట రాసేటప్పుడు పాట ఏ సందర్భంలో వస్తుందో అంతవరకే చెబుతారు. కానీ విజయబాపినీడుగారు ‘నన్ను స్టోరీ సిటింగ్స్‌లో కూడా కూర్చోబెట్టుకునేవారు. నాకు ఎక్కడ సందేహం వచ్చినా, సీను బాగా లేదని అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేవాడ్ని. ఒకోసారి ఎలా యితే బాగుంటుందో కూడా నా ఆలోచన చెప్పేవాడ్ని. కఠంతా తెలియడం వల్ల పాటలు కథలో కలిసిపోయేట్టు వ్రాయడానికి వీలయ్యేది. మా యింటి మహారాజూ, ఖైదీ 786, గ్యాంగ్ లీడర్, దొంగ కోళ్లు. ఇంకా ‘బిగ్ బాస్’ , కొడుకులు, ఫ్యామిలీ సినిమా వరకూ అన్నీ కథాచర్చల్లో నేనూ పాల్గొన్నా)

ఆ సిటింగ్స్ జరుగుతూ వుండగానే మా అమ్మగారికి ‘సీరియస్’ అని టెలిగ్రాం వచ్చింది. విజయవాడ చేరేసరికి భయంకరమైన తుఫాను. మొత్తానికి ఎలాగోలా రాజమండ్రి (హాస్పిటల్‌కి) చేరడం, మళ్లీ మద్రాస్ వచ్చిన రోజుకే మా అమ్మగారు ‘పరమపదించడం’ జరగడంతో ‘స్వర్ణకుమారిగారి కథ’ మనసులోనే సమాధి అయిపోయింది. అంటే అసలు గుర్తు రాలేదు. దానికి తోడు గ్యాంగ్ లీడర్ తరవాత ‘బిజీయెస్ట్’ రైటర్నయ్యాను.

ఆ తరవాత ‘ఘరానా మొగుడు’తో రోజుకి పద్ధెనిమిది గంటలు పని చెయ్యాల్సి వచ్చేది. సరే అది వేరే కథ.

నాలుగైదేళ్ల తరవాత మళ్లీ షోలింగర్ వెళ్లాం. అప్పుడు గుర్తొచ్చింది స్వర్ణకుమారిగారు. తీరా వెడితే ఆ పాక స్థానంలో ‘రెస్టారెంట్’ కట్టబడి వుంది. శేట్‌ని అడిగితే ‘తాయమ్మ’ని ఖాళీ చేయించడంతో (ఇల్లు) ఆమె వూరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాడు. నా మనసులో ఒక శూన్యం.

చెన్నై తిరిగి వెళ్లాక సారంగపాణి స్ట్రీట్‌కి వెళ్లాను. నాకు బాగా పరిచయమూ, స్నేహమూ వున్న ఓ ప్రొడక్షన్ మేనేజర్‌తో స్వర్ణకుమారిగారి ఇల్లు ‘కుమరేశన్’గారు ఓ కన్నడ ప్రొడ్యూసర్‌గారికి అమ్మేశాడని తెలిసింది. నాకు షాక్. స్వర్ణకుమారి ఆస్థిని పోనీ స్వర్ణకుమారి వాళ్ల తమ్ముడి ఆస్థిని కుమరేశన్ ఎలా అమ్మాడూ?? అతనికి ఏం అధికారం వుందీ?

‘కుమరేశన్’గురించి ఎంక్వైరీ చేస్తే అతను కుంభకోణం దగ్గర వుండే వాళ్ల స్వంత వూరికి వెళ్లిపోయాడని అతి కష్టం మీద తెలిసింది. స్వర్ణకుమారి తమ్ముడేమయ్యాడో తెలీదు. కనీసం అతని పేరు కూడా నాకు తెలీదు. కనుక్కునేదెట్టా? కొన్నేళ్ళు గడిచాయి.

చాలా మార్పులు.. చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలింది. నేను హైద్రాబాదు, చెన్నైల మధ్య తిరుగుతున్నాను. ఇ.వి.వి.గారి ‘కన్యాదానం’ సినిమాకి పాట వ్రాయడానికి హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బేగంపేట ఏర్‌పోర్ట్‌లో దిగాక నన్ను లోకేషన్‌కి తీసికెళ్లారు. అక్కడినించి నా ‘బస’కి చేరాను. అదో గెస్ట్ హౌసు. పాట ఫస్టు వెర్షను పూర్తి చేసి గేప్ ఇవ్వాలనుకుని కాసేపు బైటికొచ్చి తిరుగుతుంటే శ్రీమూర్తి కనిపించాడు. అతను నాకు చెన్నైలో పరిచయం. టి.నగర్‌లో వుండేవాడు.

“గురూగారూ… బాగున్నారా? హైద్రాబాదు షిఫ్ట్ కాకుండా మంచి పని చేశారండి..!” అన్నాడు. ఆ రోజుల్లో మద్రాసు నించి హైద్రాబాద్ పని మీద వెళ్లినవాళ్లలో అక్కడికి ఆల్రెడీ షిఫ్ట్ అయినవాళ్లు అలాగే అనేవాళ్ళూ.

“మీరేం చేస్తున్నారూ? ఎక్కడుంటున్నారూ?” అడిగాను.

“అక్కడయితే బాగా ‘కింగ్’లా వుండేవాడ్నండి. అదేనండి. స్వర్ణకుమారిగారి దగ్గర. ఇక్కడికొచ్చాక రోజుకి ఒకళ్ల దగ్గర..”నిట్టూర్చాడు.

“స్వర్ణకుమారిగారి దగ్గరా?”ఆశ్చర్యంగా అడిగాను. వాళింటి ముందునించి వెళ్తూ వుండటమేగానీ ఆ రోజుల్లో శ్రీమూర్తిని అక్కడ చూడలేదు.

“అవునండీ! ఆవిడ ఫీల్డులోకి వచ్చినప్పట్నించీ ‘టచప్’ (Touch-up)బాయ్‌గా మొదలెట్టి మేకప్‌మేన్‌గా ఆవిడ దగ్గర ఎదిగానండి. భద్రయ్యగారు నేర్పారండి..” గొప్పగా అన్నాడు. భద్రయ్యగారి శిష్యులకి ఆ గర్వం వుండటం అసహజమేమీ కాదు.

“అసలావిడ ఎక్కడికెళ్లారూ? ఎందుకెళ్లిపోయారూ?” అడిగాను. స్వర్ణకుమారిని చూసినట్టు చెప్పలేదు.

“అదో పెద్ద కథండి. కసాయివాడ్ని గొర్రె నమ్మినట్టు ఆ కుమరేశంగాడ్ని స్వర్ణకుమారి అమ్మగారు నమ్మారండి. కుమరేశన్, జమిందారుగారి దగ్గర మేనేజర్‌గా కాదు గానీ పనివాడుగా, అంటే చనువున్న పనివాడుగా వుండేవాడండి. నేనప్పుడు భద్రయ్యగారి ఇంటిదగ్గరే వుండేవాడ్నండి. జమిందారుగారు పోయాక, స్వర్ణమ్మగారి అమ్మగారికి సహాయం చేస్తున్నట్టుగా వుండేవాడండి. ఆవిడ ఉత్త వెర్రిబాగుల్దండి. ఆవిడా, ఆవిడ పిల్లలూ సంగీతమూ తప్ప ఏదీ పట్టించుకునేది గాదండి. ఆ పిల్ల చదువుకునేటప్పుడు తల్లి హార్ట్ ఎటాక్‌తో చచ్చిపోయిందన్నారండి. నాకైతే నమ్మకం లేదండి. కుమరేశన్ అంతకు రెండు మూడేళ్ళ ముందే రాజరాజేశ్వరి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుని, స్వర్ణమ్మగారింట్ళోనే ఓ పోర్షన్‌లోనే దిగాడండి. ఆ రాజమ్మగారూ మంచి మనిషేనండి. స్వర్ణమ్మగారు బిజీ అయ్యాక రాజమ్మగారు సినిమాలు మానేసి ఇంట్ళో వుండేదండి. స్వర్ణమ్మ దగ్గర నన్ను టచ్చప్‌గా పెట్టిందీ, మేకప్ మేన్నీ చేసిందీ భద్రయ్యగారేనండి..!”

“ఆ తరవాత?” అడిగాను.

“తమ్ముడు బియ్యే చదువైతుండగా, ఆ స్వర్ణమ్మగారు ప్రేమలో పడిందండీ. అయితే కుమరేశన్‌గారు చాలా తెలివిగా ‘వెళ్లిపో’ కానీ, నీ ఆస్తి మాత్రం మీ తమ్ముడి పేరు మీద రాసి వెళ్ళు.. ఎందుకంటే ఒకవేళ ఆ మళయాళంగాడు నిన్ను తన్ని తగలేసినా కనీసం మీ అమ్మ ఆస్తి నీకు బతకడానికి ఊపయోగపడుతుందీ అని చెప్పాడండి. ఆ రోజుల్లో మేమందరం కుమరేశన్ దేవుడిలాంటోడు అనుకునేవాళ్ళమండి. ఆయన చెప్పింది సబబుగానే అప్పుడూ అనిపించిందండి. స్వర్ణమ్మకూడ మాట్లాడకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిందండి. స్వర్ణమ్మగారి తమ్ముడి పేరు ‘ధనుంజయ’ అండీ. డిగ్రీ కాగానే పాపం ఆ పిల్లాడికి తన చుట్టాన్నే ఎక్కడ్నించో తీసుకొచ్చి పెళ్లి చేశాడండీ… కుమరేశన్..!” ఆగాడు శ్రీమూర్తి.

ఏవో మబ్బులు విడిపోయి మళ్ళీ ముసురుకుంటున్నట్లనిపించింది..

“స్వర్ణమ్మ వెనక్కి రాలేదా?”

” ఆ విషయం మాత్రం అసలు తెలీదండి. అది కుమరేశన్ గాడికే తెలియాలండి. పిల్లాడి పెళ్లయిన మూడ్నెల్లకే రాజేశ్వరమ్మకి ‘క్షయ’ జబ్బు వచ్చిందండి. ఆవిడ్ని రాయవెల్లూరులో చేర్చారండి…!!”

” ఊ తరవాత?”

“నిజం నాకు తెలీదండి. అబద్ధం చెబితే పాపం వస్తాదంటారు కదండీ…”

“నిజం చెప్పండి మూర్తీ..”

” ఆ కుర్రాడు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదండి. ఆ పిల్లాడికిచ్చి చేసిన అమ్మాయికీ కుమరేశన్‌కీ సంబంధం వుండటం చూసి ఆ పిల్లాడు ఇల్లొదిలి పోయాడని పనిమనిషి ఓ రోజున నాతో అన్నదండీ..”

సైలెంటైపోయాను.

“మరి ఆస్తి?”

“స్వర్ణమ్మ చేతే నీతులు చెబుతూ నమ్మించి సంతకాలు పెట్టించిన వాడికి, ఆ కుర్రోడి చేత సంతకాలు పెట్టించుకోవడం ఎంతసేపండీ? వాడు ఆ యిల్లు ఓ కన్నడపు ఆయనకి అమ్మడం నాకు తెలుసండీ…!” వివరించాడు శ్రీమూర్తి.

” ఆ తరవాత?”

“నాకు ఏమె తెలీదండి. ఆ అమ్మాయి ఏమయిందో, ఆ బాబు ఏమైపోయాడో ఏమీ తెలీదు. కుమరేశన్‌గాడు మాత్రం లక్షలు దండుకున్నాడండీ ఆ ఇల్లు అమ్మి.. నాకు తెల్సింది అంతేనండి..!”

ఓ నిట్టూర్పు ఒకేసారి వెలువడింది. ఇద్దర్ని దగ్గర్నించీ..

డిసెంబరు (2013)లో విజయవాడలో రెండు రోజులు వున్నాను. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు (నాకు 35 సంవత్సరాలనుంచి స్నేహితులు)గార్ని కలిసి, అక్కడే జలదం ప్రభాకర్ (నది .. ఎడిటర్)గార్ని కలిసి చాలా సేపు ఖబుర్లు చెప్పుకుని మళ్లీ నా హోటల్‌కి బయలుదేరుతూ మధ్యలో ఒక చోట ఆగాను… ఓ చిన్న పనుండి..

విజయవాడలో లెక్కకి మించిన స్నేహితులున్నారు. ఒకతనికి వొంట్లో కొంచెం సుస్తీగా వుందని తెలిసి చూడ్డానికి వెళ్ళానన్నమాట. చూసి వస్తుండగా పరిచయమైన ‘గొంతు’ వినిపించింది. ఆ గొంతే.. స్వర్ణకుమారిగారిది.

ఆ పాత పెంకుటింటి ముందు ఆగి.. “తాయమ్మా” అని పిలిచినాను. ఆమె బయటికొచ్చింది. వయసు తెచ్చిన చిన్న చిన్న మార్పులే తప్ప పెద్ద మార్పులేం లేవు. “ఆఖరికి వచ్చారన్నమాట…!” నవ్వింది. అదే నవ్వు… అంతే మధురంగా “గుర్తుపట్టారా?” అన్నాను.

“మిమ్మల్ని ఆ మధ్య లిటిల్ చాంప్స్. అదే జీ తెలుగు చానల్లో ప్రతీవారమూ చూశాను గనక గుర్తుపట్టకేం. అదీగాక మీది మరిచిపోయే పేరా?” మళ్లీ నవ్వింది.

‘నవ్వడం దేవుడు మనిషికి ఇచ్చిన వరం’ అని మరిచిపోయిన వాళ్లకి, స్వర్ణకుమారిని పరిచయం చెయ్యాలనిపించింది. లోకంలో కొందరు ‘నిరాశా అగరుబత్తీలు’ ఉంటారు. ఎప్పుడూ నిట్టూరుస్తూ ప్రపంచంలోని బాధలన్నింటినీ భరిస్తూ భారంగా జీవితాన్ని లాగుతూ వుంటారు. మనిషి కనపడంగానే వాళ్ల బాధని వెళ్లగక్కేస్తారు. చెప్పినవాడు బాగానే వుంటాడు గానీ, విన్నావాడికి ఉత్సాహం చచ్చిపోయి నిరాశలో మునిగిపోతాడు. కొందరు ఎంత బాధలో వున్నా సరే అది బయటపడనివ్వక ‘ఆశ’నీ, సంతోషాన్నీ పంచేవారైతే, కొందరు నిరంతరం నిరాశని మాత్రమే వెళ్లగక్కే జీవులు.

స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’. ఆశల సువాసనని వెదజలుతూ వుండే నిజమైన మనిషి.

“లోపలికి రానివ్వరా?” నవ్వి అడిగాను.

“బాధపడతారు..!”

“పడను..!”

“అయితే రండి..!” పక్కకి తప్పుకుంది. లోపలికి అడుగుపెట్టాను. అంతా శుభ్రంగా వుంది. కానీ మంచం మీద ఒకామె శరీరం తొడిగిన అస్థిపంజరంలా వుంది.

“ఈమె రాజరాజేశ్వరి. నా మేనత్త. కొంచెం సుస్తీగా వుంది. త్వరలోనే కోలుకుంటుందని డాక్టర్సు అన్నారు. చంద్రగారూ, ఈమె నాకు నృత్యం నేర్పిన గురువు,.. మంచి నటి కూడా..!” పరిచయం చేసింది. కళ్లు చెమర్చాయి. ఆవిడ కష్టం మీద రెండు చేతులూ ఎత్తింది. నేనూ చేతులు జోడించాను.

“ఫిల్టర్ కాఫీ ఇద్దునుగానీ .. ఇది సమయం కాదు.. సరే.. కొంచెం బయటకు వెళ్లాల్సిన పని వుంది. కూడా వస్తారా..!! ” అంటూ బయటికొచ్చింది.

నేనూ మరోసారి రాజేశ్వరిగారికి నమస్కారం చేసి బయటికొచ్చాను.

“ఏమీ లేదు.. మీరేమో గతాన్ని గురించి ప్రశ్నిస్తే తను ‘భోరు’మంటుందని బయటికి లాక్కొచ్చాను.” అన్నది.

“ఏం చేస్తున్నారూ?”

“నేను టైలర్నయ్యానండోయ్.. అదీ సూపర్ టైలర్ని. జాకెట్టుకి నూటయాగ్భై తీసుకుంటున్నాను. షాపు కూడా పెట్టాలెండి..” పకపకా నవ్వింది.

“రాజరాజేశ్వరిగార్ని…”

“ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. గతాన్ని నేను మర్చిపోయినా పాపం తను మర్చిపోలేకపోతోంది… సరే.. గతాన్ని భోంచెయ్యడం ఎందుకూ? ప్రస్తుతం ఆమె “షుగర్’తో నీరసించిపోయింది. బతుకుతుందనే నమ్మకం నాకు వుంది. మనిషి ఆశాజీవి కదా…! ఒకవేళ బతకలేదనుకోండి..”సరే ఆమెకి అన్ని బంధాలనించీ ‘విముక్తి’ లభిస్తుంది. ఏదైతేనేం..” నిశ్చలమైన మనస్సుతో అన్నది స్వర్ణకుమారి.

“మీరేమీ అనుకోకపోతే ఒక్క కాఫీ తాగుదామా!” అడిగాను.

“దానికేం భాగ్యం…!”

“రోడ్డుపక్కనే వున్న ఓ ఫాస్టు ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి అక్కడున్న ప్లాస్టిక్ స్టూల్స్ మీద కూర్చుని కాఫీ తాగాము.

ఏ ప్రశ్నా అడగాలనిపించలేదు. ప్రశ్నలు లేవు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది.

“చంద్రగారూ. మీరోసారి లిటిల్ చాంప్స్‌లో అన్నారు. “వై కలెక్ట్ వెన్ యూ కెనాట్ కేరీ” అని! నాకా మాట చాలా నచ్చింది. ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!” నా వంక చూస్తూ నవ్వింది.

ఇంకేం చెప్పనూ!

 

‘స్వర్ణకుమారి’ కథ రాస్తున్నంతసేపూ ఒళ్ళు పులకరిస్తూనే వుంది. లోకంలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేవాళ్లూ ఉంటారని తెలీటం లేదూ…!

 

శుభాకాంక్షలతో

భువనచంద్ర

అవసరం

bhuvanachandra (5)

“అదేమిటే? తల్లోంచి పువ్వులు తీయమనడం ఏమిటి?”

“పెళ్ళాంగా కనిపించటానికట!”

“ఏం పెళ్ళాలు పువ్వులు పెట్టుకోరా … లేక పెట్టుకుంటే పెళ్ళాంలాగా కనిపించరా?”

“ఆ విషయం వాడ్నే అడుగుదామనుకున్నా – అయినా పెళ్ళాల విషయం మనకెలా తెలుస్తుందీ?”

“ఏం? మనం పెళ్ళాలం కామా? మనమూ ఆడవాళ్ళమేగా?”

“ఆడవాళ్ళమైనంత మాత్రాన పెళ్ళాలుగా మారడానికి మనకి ఆస్తులున్నయ్యా అంతస్తులున్నాయా? పెళ్ళి చేయడానికి తల్లీ తండ్రీ అన్నా వదినా ఉన్నారా?”

“సరేలే వీడికిదేం పిచ్చీ! పూలు తీయమనడం ఎందుకూ?”

“రోడ్డు మీద నన్ను చూశాడు…. మెల్లగా పక్కన చేరాడు వస్తావా అన్నాడు… తల ఊపాను. పమిట చెంగు భుజాల మీదుగా కప్పుకుని ‘పక్కా’ పెళ్ళాం లాగా వాడి పక్కన నడిచాను. సినిమాకి వెళ్దామన్నాడు. సరసానికి ఇబ్బంది ఉండని చోటు అదేగా! సరే అన్నాను. టిక్కెట్ల క్యూలో నిలబడ్డప్పుడు అన్నాడా మాట ‘పూలు తీసెయ్’ అని. ఎందుకన్నట్లుగా చూశా.

“భార్యగా సహజంగా కనపడాలంటే పూలు పెట్టుకోకూడదంట అంతేనా సినిమా జరుగుతున్నంత సేపూ ఆబగా వాడి చేష్టలు పైగా ఇలాంటి సోది ….. ఒళ్ళు నెప్పి, తలనొప్పి వచ్చాయనుకో”

“పెళ్ళాలతో సినిమా హాళ్ళల్లో అలా సరసాలాడతారా? దానికి లేని సిగ్గు పూలు పెట్టకుంటే వచ్చిందా?”

“సిగ్గా పాడా – నేనలాంటి దాన్నని జనం అనుకుంటే వాడి హోదాకి భంగం కాదూ”

“ఇంతకీ తీసేశావా?”

“తియ్యనా మరి?”

“నేను రాను నీ దారి నువ్వు చూసుకో అని చెప్పొచ్చుగా?”

“చెప్పొచ్చు కాని అవసరం ఎవరిదీ?”

“వాడు కాకపోతే వాడి అబ్బ …. వాడి తాత…”

“సరే – నేను కాకపోతే వాడికి మరోతి”

“ఊఁ ఆ తరవాత?”

“ఎందుకులే!”

“చెబుదూ..”

“వాడేనాడూ ఇలా ఎవర్నీ పిలిచి ఎరగడట. నన్ను చూడగానే నేను బాగా తెలిసిన దానిలా కనిపించానట. తను మొదటి సారి ప్రేమించిన అమ్మాయి నాలాగే ఉండేదట”

“ఆహా! ఎవతో పుణ్యం చేసుకున్నది?”

“వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలు వీడంటే పడి ఛస్తారట. ఈ నాటి వరకూ ఏ ఆడదానికీ లొంగలేదట”

“ఓరి వీడి ప్రవరాఖ్యతనం తగలెయ్యా”

“అంతేనా ఇంకా చాలా చెప్పాడు. పెళ్ళి కూడా అయిందట పెళ్ళాం లక్షాధికారట వీడి మాట జవదాటదట”

“మరి ఆ ఏడిచేదేదో పెళ్ళాం దగ్గరే ఏడవొచ్చుగా?”

“అదీ అడిగాను – ఆవిడ సంసారానికి పనికి వచ్చేదేకాని సరసారనికి పనికి రాదట. ఎప్పుడూ పూజలు, వ్రతాలు అట”

“పిల్లలు….”

“ఉన్నారట”

“వీడు సరసం చెయ్యకుండానే పిల్లలెలా పుట్టారూ!!?”

 

 

 

 

“అది నేను అడగ్గూడదుగా!”

“ఇంకా…’

“మాటలు తగ్గించి చేతలకి దిగాడు”

“ఏం చేశాడేమిటి?”

“అక్కడా ఇక్కడా తడిమాడు – ఆహా! ఓహో అన్నాడు. మాట్లాడుతూనే సడెన్ గా లేచి ‘ఇక బయటకి పోదాం’ అన్నాడు”

“ఓరినీ! అదేమిటే!”

“నన్ను చూడగానే దగ్గరగా ఉండాలనిపించిదటగానీ దగ్గరకొచ్చాక మనసులో ఏదో పాపం చేస్తున్నట్లు అనిపించిందట. అందుకే ఏ తప్పూ జరగకముందే వెళ్ళిపోదామన్నాడు”

“ఓహో! జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి కాబోలు…”

“జ్ఞానచక్షువులా వాడి బొందా! నాకు అర్థం కావలసింది నాకు అర్థం అయింది”

“హ! హ! నువ్వు భలే చెప్తావే…. ఇంతకీ ఒట్టి బేరమేనా?”

“లేదులే… కొన్ని పచ్చనోట్లు నా చేతిలో కుక్కి ‘నేను ముందు వెళ్ళిపోతా నువ్వు కాసేపయ్యాక వెళ్లు’ అన్నాడు”

“వచ్చేటపుడు కలిసే వచ్చారుగా సినిమానించి వెళ్ళేప్ఫుడు విడిగా ఎందుకూ వెళ్ళడం?”

“అప్పుడు కోరికతో కూడిన వేడి! ఇప్పుడు చల్లబడిన నాడి”

“ఊఁ ఆ తరవాత?”

“ఇంకేముంటుంది …. కాసేపు ఆ చెత్త సినిమా చూసి నా దారిన నేనొచ్చా”

“ఇంతకీ ఏం చేస్తుంటాడో తెలుసా?”

“ ఆ వివరాలు మనకెందుకూ? అతని అవసరం అతనిది….. మన అవసరం మనదీ!”

“అబ్బ ఎన్నాళ్ళే ఇలా?”

“ఏం చేస్తాం? మనకి అందం ఆరోగ్యంతో పాటు చదువూ ఉంది. లేనిదొకటే…. మగతోడు. ఆ తోడు కావాలంటే లక్షల కట్నం పోయాలి. మనకొచ్చే జీతం బెత్తెడే ….. దాన్ని మూరడు చేస్తే గాని మంగళసూత్రం మెడలో పడదు. అది పడిందాకా మనకీ తిప్పలు తప్పవు”

“అదేనే బాధ. మగవాడికి ఆడది అవసరం…. ఆడదానికి మగవాడు అవసరం. సృష్టిలో జంతువులూ పక్షులూ సహజంగా బ్రతుకుతాయి – మనకే – ఈ మనుషులకే….. సహజమైన అవసరం కూడా డబ్బులు చల్లితే గానీ తీరదు. మగవాడికి మగువతో పాటు అది తెచ్చే డబ్బు కూడా కావాలి”

“చూశావా! ఒక్క అవసరం ఎన్ని పనులు చేయిస్తుందో”

“అవును. రేపు మనకొచ్చేవాడు ఎలాంటి వాడో!?”

“ఇప్పుడు నీకు తగిలిన వాడి లాంటోడైతే పువ్వులు తీయమంటాడు… మంచివాడైతే పువ్వులు కొని తీసుకొస్తాడు….. ఇంతవరకు గ్యారంటీగా చెప్పగలను”

“హ్హ! హ్హ! హ్హ! హ్హ!!!

 

 

*********

 

  • ఇది నేను బెంగుళూరులో ఉండగా నా చెవులతో విన్న ఇద్దరు యువతుల సంభాషణ. నేను హిందీ పేపర్ చదువుకోవడం చూసి నాకు తెలుగు రాదని వాళ్ళు యదేచ్ఛగా మాట్లాడుకున్నారు. సంభాషణ విన్నాక నా మనసంతా ఒక వేదనతో మూగబోయింది…. ఆ రాత్రి కూర్చుని వాళ్ళ సంభాషణని యధాతధంగా రాసుకున్నాను.

మళ్ళీ నా డైరీలు తిరగేస్తుంటే ఈ నాలుగు పేజీలు బయటపడ్డాయి. చదివి ఇదీ ఓ చరిత్రకెక్కని కథ కనుక ‘సారంగ’ కి పంపుతున్నాను.

కాలం మారిందని అంటున్నాం గదా……. మారిందా?

 -భువనచంద్ర

 

ఉప్పరి పిచ్చోడు

chinnakatha

“ఒరేయ్ .. ఉప్పరి పిచ్చోడొస్తున్నాడ్రోయ్..!” దివాకర్‌గాడు అరిచాడు.

ఒక్క దెబ్బన అందరం పారిపోయాం.

తాసిల్దారుగారి అమ్మాయి ‘విజయ’ మాత్రం దొరికిపోయింది.

మేం కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి చూస్తే ఏముంది… విజయ నవ్వుతూ వొస్తోంది. దానికి ఏడేళ్లు. అప్పుడు

“నిన్నేం చెయ్యలేదుటే వాడూ?” ఆత్రంగా అడిగాడు గంగాధరం.

“పోండ్రా పిరికిగొడ్డుల్లారా! వాడు నా తల మీద చెయ్యిపెట్టి బే..బే… అని వెళ్లిపోయాడు.” ఎగతాళిగా నవ్వింది విజయ. వాడి పేరు ఎవరికీ తెలీదుగానీ.. ఉప్పరిగూడెంలో ఉంటాడు గనక ఉప్పరి పిచ్చోడనేవాళ్లం.

కూలీనాలీ చేస్తుండేవాడు.

పిల్లలు అల్లరి చేస్తోంటే.. “అదిగో! ఉప్పరి పిచ్చోడొస్తున్నాడు. అల్లరిచేస్తే  ఎత్తుకుపోతాడు.! ” అని భయపెట్టేవాళ్లు.

అందుకే మేము భయపడి పారిపోయింది.

వెన్నెల రాత్రుల్లో నేనూ, రంగడూ, శేషగిరీ, గంగాధరం, శేషగిరి తమ్ముడు కృష్ణమూర్తీ, నాగమణీ, విజయ, అమ్మాజీ అందరం షికార్లు కొట్టేవాళ్లం.

పిండారబోసినట్టుండేది వెన్నెల. మామిడి చెట్ల మీదుగా వీచే గాలి మత్తుగా వుండేది.

అప్పుడప్పుడూ ‘చిట్టిబాబు’గారి తోటలో ‘వేట’కి పోయేవాళ్లం. వేటంటే జంతువుల్ని వేటాడ్డం కాదు. మామిడికాయలు ‘తోటమాలి’ కళ్ళు గప్పి దొంగిలించడానికి.

జేబుల్లో ఉప్పూ, కారం కలిపిన పొట్లాలు రెడీగా ఉండేవి. పాత బ్లేళ్లు కూడా.

‘సరుకు’ దొరకంగానే మామిడికాయని బ్లేడుతో ముక్కలుగా కోసి, ఉప్పూ కారం అద్ది ఆరగించడం ఆ వెన్నెల రాత్రుల్లో అద్భుతంగా ఉండేది. ఆ ఉప్పూ కారం కలిపిన మావిడి ముక్కల్ని ‘కైమా’ అనేవాళ్లం.

ఓసారి కాయలు కోసేసి ‘జోగులు’గారి ‘సా మిల్లు’ ముందున్న రంపంపొట్టు గుట్టలమీద కూర్చుని ‘కైమా’ లాగిస్తుంటే ఉప్పరి పిచ్చోడు వచ్చి నిశ్శబ్దంగా వచ్చి ‘బే..బే’ అని అరిచాడు. పారిపోబోయాం కాని విజయ, “ఆగండ్రా” అని ఆ పిచ్చోడికి నాలుకు మావిడిముక్కలు ఇచ్చింది.

రెండుచేతులూ దోసిలి పట్టి ‘ప్రసాదం’ తీసుకున్నంత భక్తిగా ఆ ముక్కల్ని అందుకున్నాడు.

వెండి వెన్నెల్లో నల్లని ఉప్పరి పిచ్చోడు విచిత్రంగా కనిపించాడు.

“నీ పేరేంటబ్బాయ్?” ఆరిందాలా అడిగింది అమ్మాజీ.

“బే..బే” అన్నాడు ఉప్పరి పిచ్చోడు.

“వాడు మూగవాడు. మాటల్రావు!”అన్నాడు శేషగిరి.

మనిషి ఆరడుగుల ఎత్తు. ఒక్క తువ్వాలు నడుం చుట్టూ కట్టుకున్నాడు. అంతే. మాకు పదేళ్ళుండేటప్పుడు వాడికి పాతికేళ్ళు ఉండేవేమో.

వాడంటే భయం పోయింది గనక మేమందరం కబుర్లు చెప్పుకుంటూ, రంపంపొట్టు గుట్ట మీద ఆటలాడుతూ చాలా సేపు గడిపాం. వాడూ కూర్చుని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడని మాత్రం తెలిసింది. ఎందుకంటే మేం నవ్వుతున్నప్పుడల్లా వాడూ నవ్వాడు.

అప్పట్నించీ, మేం ఎక్కడ కనిపించినా ‘బే..బే’ అని నవ్వేవాడు.

దేవుడు వాడ్ని మూగవాడ్ని చేశాడు గానీ, వాడికెన్ని విద్యలో తెలుసా?

తాటి చెట్లెక్కి ముంజలు కోసేవాడు. కొడవలితో కాయని చెక్కి ‘నీళ్లు’పోకుండా ముంజలు ఆ కొడవలి అంచుతో తియ్యడం వాడి ప్రత్యేకత.

ఎండబెట్టిన కొబ్బరి పీచుతో ‘తాళ్లు’ నేసేవాడు. నాగిరెడ్డి గూడెం ఫారెస్టుకు పోయి ‘కంప’నరుక్కొచ్చేవాడు.

బ్రహ్మాండంగా ఆ కంపతో ‘దళ్ళు’ కట్టేవాడు.

గోడలు ‘మెత్తి’ నున్నగా పేడ పూసి.. ఎండాక రంగులు దిద్దేవాడు. ఇహ పాత పాకల కప్పు ఊడదీసి కొత్త తాటాకు కప్పడంలో వాడు ఎక్స్‌పర్టు.

‘రాజుగారి’ హోటల్లో పప్పు రుబ్బేవాడు. మేవందరం ‘తమ్మిలేరు’ పిక్నిక్ కి పోతే మాతో కూడా వచ్చి, తిరిగొచ్చేటప్పుడు మేం కోసిన ‘వాక్కాయలూ, అడివి కరేపాకు’ గోతాంలో నింపి ఇళ్లదాకా మోసుకొచ్చేవాడు.

వర్షాకాలం ‘యోగి లింగేశ్వర స్వామి’ గుడి పక్కనున్న చెరువు నిండి, నీళ్ళు ‘కళింగ’  దాటి రోడ్డు మీద ఇంతెత్తుకు ప్రవహిస్తుంటే జాగ్రతగా మమ్మల్ని ‘రోడ్డు’ దాటించేవాడు.

ఓ రోజు ‘దివాయ్‌’ గాడు మావిడి చెట్టెక్కి దిగటానికి భయపడితే వాడే చెట్టెక్కి ‘దివాయ్’ని భుజాలకెత్తుకుని కిందకి దింపాడు.

ఓ సారి నిప్పంటుకుని ‘ఇళ్లు’ తగలబడుతుంటే కడివెడు నీళ్లు మీద పోసుకుని మంటల్లోకి దూకి చాలా’మంది’నీ, ‘సొత్తు’నీ బయటికి చేర్చాడు.

ఏ యింటికెళ్లినా వాడికి తింటానికి ఏదో ఒకటి పెట్టేవాళ్లు. వాడూ తిన్నదానికి ప్రతిఫలంగా ఏదో ఒక పని చేసేవాడు. గడ్డి చెక్కడమో, అరుగులు మెత్తడమో, వాకిలంతా ఊడ్చి శుభ్రం చెయ్యడమో, ఏదో ఒకటి..

నానాదేశాలూ తిరిగి, ఇరవై ఒకటో ఏట మా చింతలపూడి వెళ్లి ఫ్రెండ్స్‌తో కబుర్లాడుకుంటూ ‘ఉప్పరి పిచ్చోడి’ గురించి వాకబు చేస్తే వాళ్లన్నారు ‘మర్దిమత్తెన నాగేశ్వర్రావుని పాము కరిస్తే వాడ్ని ఆస్పత్రికి తీసుకుపోయి తిరిగొస్తుండగా ఎద్దు పొడిచి చచ్చిపోయాడు” అని..

“అదేంట్రా?” అని నేను నివ్వెరపోతుంటే…

“పాపం. వాడు మూగే కాదు చెవుడు కూడా ఉంది. అందుకే వెనకాల్నించి జనాలు అరుస్తున్నా పక్కకి తప్పుకోలేకపోయాడు!” అన్నాడు కొనకళ్ల కృష్ణమూర్తి.

“మరి మనం చెప్పేవి వాడికి అర్ధమయ్యేవిగా?” అడిగా.

“పెదాల కదలికని బట్టి అర్ధం చేసుకునేవాడు. అంతేగానీ వాడికి పుట్టుచెముడు !”

“ఒరే..! సమయానికి నన్ను ఆస్పత్రికి చేర్చి నన్ను బతికించాడు కాని వాడు పోయాడ్రా! ఉప్పరాళ్ళే పాపం దహనం చేశారు. అస్పత్రి దగ్గర మా నాన్న నన్ను తీసుకొచ్చినందుకు డబ్బివ్వబోతే ‘బే…బే’ అంటూ వారించాడు. ఒక్క పైసా తీసుకోలా!.” కథ మధ్యలో వచ్చిన మద్ది మంచ్తెనోడు నాతో అన్నాడు. వాడి కళ్లల్లో నీళ్లు.

“వాడు మనందర్నీ స్నేహితులమనుకున్నాడ్రా.  అందుకే మనకి ఎన్ని పనులు చేసిపెట్టినా ఒక్క పైసా పుచ్చుకునేవాడు కాదు…!” విచారంగా అన్నాడు మా హిందీ  మాస్టారి కొడుకు రంగారావు.

అవును స్నేహానికి ‘ఇవ్వటమే’ తెలుసు. చివరికి ప్రాణాన్నైనా..

 

***

 

ఇది జరిగిన చాలా ఏళ్లకి ‘ప్రాణస్నేహితులు’ సినిమాలో ‘స్నేహానికన్న మిన్న’ పాట వ్రాసినప్పుడు గుర్తొచ్చింది మా అప్పరి పిచ్చోడే!

ఇప్పటికీ వూరు వెళితే ‘బే.. బే’ అని అరిచే వాడి గొంతు లీలగా మనసులో మెదుల్తుంది.

వెన్నెల రాత్రుల్లో ఆరుబయట పక్కలేసుకుని ఆకాశంలోని కోటానుకోట్ల నక్షత్రాలు చూస్తుంటే అనిపిస్తుంది.. వాడూ ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో వుంటాడు.

bhuvanachandra (5)–భువన చంద్ర

జ్ఞాపకాల నీడలో వసుంధర

bhuvanachandra (5)“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం కాస్ట్యూమర్. వయసు అరవైకి  పైమాటే.

“అదేంటి మావా అలా అంటావూ? ఆవిడకేం మూడిళ్ళు. లెక్కలేనంత ఆస్థి, మొగుడు, పిల్లలు. ఇంకేం కావాలి?” ఆశ్చర్యంగా అన్నాడు సూరిబాబు.

“అందుకే మరి జనాలు నిన్ను వెర్రివెలక్కాయనేది. ఒరే సూరి! ఏది ఎంతున్నా, మనశ్శాంతి లేని బతుకు బతుకవుతాదిట్రా? గంజినీళ్లు తాగినా మనశ్శాంతి వుంటే ఆరోగ్యం ఉంటాది. ఆరోగ్యం వుంటే ఆనందం వుంటాది. ఏవుందా అమ్మకి? ఒరే! గొప్ప గొప్ప హీరోయిన్ల దగ్గర్ పన్జేశా. అందరి ‘కొలత’లూ నాకు తెల్సురొరే! కొలతలంటే జాకెట్టు కొలతలూ, బాడీ కొలతలు కాదు. ఆళ్ల మనసు లోతులూ అన్నీ తెలుసు. కానీ వసుంధరమ్మంత పిచ్చి ముండ ఇంకోతి వుండదు” చెబుతూ చెబుతూ సైలెంటైపోయాడు శీను.

‘ఫ్లాష్‌బాక్, ఫ్లాష్ ఫార్వార్డ్ ల్ని సినిమాల్లో చూపిస్తారు. ‘అదెలా?’ అని అనుకుంటామేగానీ, ప్రతీ మనిషీ రోజుకి కనీసం వందసార్లయినా ‘గతం’లోకి వెళతాడని గ్రహించలేం. ఏం.. మీగురించే మీరు ఆలోచించుకోండీ. రోజుకి ఎన్నిసార్లు గతంలోకి పయనిస్తున్నామో మీకే తెలుస్తుంది.

శీను కూడా గతంలోకి పోయుండాలి. అతనికా హక్కూ, అవకాశం రెండూ వున్నాయి. ఎందుకంటే సగానికి పైగా అతని జీవితం వసుంధరకి పర్సనల్ కాస్ట్యూమర్‌గానే గడించింది. ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు మొదటిసారి బాబూరావు (ఈ మధ్యే చనిపోయారు.  ఓ రెండేళ్ళవుతుంది) దగ్గర పనిచేసేవాడు. బాబూరావు చాలా పనిమంతుడు. టాప్ హీరోయిన్లు అతన్ని పర్సనల్ కాస్ట్యూమర్‌గా కోరుకునేవారు. ఆయన కింద కనీసం ఓ ఇరవైమంది టైలర్లుండేవారు. పగలూ రాత్రి అదే పని. బాబూరావులో వుండే ఒకే ఒక డిఫెక్టు అతని చిరాకు. నిద్రలేవడం దగ్గర్నించీ, నిద్రపోయేదాకా పచ్చి బూతులే. సాయంత్రం కాగానే ‘మందు’ తప్పనిసరి. ఆ  టైంలో ఎవడ్నో ఓకడిని నానా తిట్లూ తిట్టి హేళన చేస్తే గానీ అతని మనసు శాంతించేది కాదు. అయితే అదృష్టవశాత్తు ఓ రోజున ఓ మహానుభావుడు అతని చేత ‘మందు’ మాన్పించాడు. దాంతో శాడిజమూ తగ్గింది.

సినిమా పరిశ్రమలో ‘గురువు’ ఎప్పుడూ గురువే. ఎంత తిట్టినా, కొట్టినా, నోటికి తొంభైమంది ‘గురువు’ని ఏనాడూ తప్పుబట్టరు. తూలనాడరు. శీనుకీ, బాబూరావంటే గౌరవం అందుకే మిగిలుంది. మనిషి ఎలాంటివాడైనా ‘పని’లో మాత్రం కింగ్. అందుకే బాబూరావు శిష్యులు సరదాగా ఇప్పటికీ అంటారు.. “మా గురువారికి ‘టేపు’ అక్కర్లేదండి.. చూపుల్తోనే కొలతలు తీస్తాడు!” అని.

వసుంధరకి పదహారూ, శీనుకి  ఇరవై రెండూ. వసుంధర తల్లి  బ్రాహ్మణ స్త్రీ. తండ్రి అరవచెట్టియార్. వసుంధరకాక ఇంకో మగపిల్లాడు. సెయింట్ జాన్స్‌లో చదువుతుండగా వసుంధరకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

“నేను స్కూల్ డ్రామాలో యాక్ట్ చేస్తుండగా డైరెక్టర్ బాలకిషన్ అంకుల్ చూసి ‘హీరోయిన్’గా చేస్తావా అమ్మా అనడిగారు” అని వసుంధర తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేది. నిజం మాత్రం అది కాదు. వసుంధర తల్లి ‘బాలకిషన్’ని చాలా నెలలు ‘అలరించాకే’ వసుంధరకి హీరోయిన్ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

“నీకు సినిమాల్లో ‘కేరక్టర్’ కావాలా? అయితే నీ ‘కేరెక్టర్’ నా దగ్గర వొదిలేసెయ్!” అని పరిశ్రమ అంటుందిట. ఇదో జోక్ గాని జోక్.

వసుంధర నిజంగా అందగత్తె. పాలల్లో మంచి పసుపూ, గులాబి రంగూ కలిసిన దేహచ్చాయ. ముత్యాల్లాంటి పలువరుస. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు. చక్కని బిగువైన ఒళ్ళు. చూడగానే పిచ్చెక్కించే చిరునవ్వు. ఇంకేం కావాలి? ‘గ్లామర్ డాల్’ అన్నారు.

“ఏంది మావా ఆలోచనా?” అడిగాడు సూరిబాబు.

“నావల్ల కావటంలేదురా…!” కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శీను.

“పోనీ వెళ్ళి చూసొద్దాం పద!” లేచాడు సూరిబాబు.

“ఊహూ! చూళ్ళేను. చూస్తే గుండె పగిలి పోతుంది…!”

రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు శీను. మళ్లీ ఏవో జ్ఞాపకాలు.

 

***********

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ ‘కొలత’ ఎంత ‘సినిమాటిక్‌’గా కొలవాలో అంత ఘోరంగానూ తీశాడు బాబూరావు.. చూస్తూ ‘గురువు’గారు చెప్పిన కొలతల్ని నోట్ చేస్తున్న శీనుకే కంపరం పుట్టింది. వసుంధర సిగ్గుతో చచ్చిపోతోంది.

“అదేంటమ్మాయ్! సిగ్గుపడితే ఎలా? కెమెరామన్ దగ్గరా, కాస్ట్యూమర్ దగ్గరా ‘వొళ్ళు’ దాచుకోకూడదు. దాచుకుంటే తెరమీద ‘గ్లామర్’ కనిపించదు. ఇంకో రెండు సినిమాలయ్యాక నువ్వే చెబుతావు మాకు. ఎక్కడ ఎత్తులూ, ఎక్కడ వొంపులూ పెట్టి కుట్టాలో…!” ఫకాల్న నవ్వి వసుంధర ‘సీటు’ మీద చరిచి అన్నాడు బాబూరావు.

కళ్ళనీళ్ల పర్యంతమైన  వసుంధరని చూడగానే తన చిన్న చెల్లెలు జ్ఞాపకం వచ్చింది శీనుకి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్టు. అయితే వసుంధర ‘బిడియాన్ని’ చిదిమేసి ‘కసి’ని పెంచింది మాత్రం బాబూరావులాంటి ధీరులే. రెండో సినిమాని వెంటనే వొప్పుకోలేదు వసుంధర తల్లి. టాప్ రెమ్యూనరేషన్ ఆఫరయ్యేదాకా ఆగింది. సినిమా సంతకం చెయ్యగానే వసుంధర  డైరెక్టుగా ప్రొడ్యూసర్‌తో అన్నది. “సార్.. నాకు కాస్ట్యూమర్‌గా బాబూరావు వొద్దు. అతని అసిస్టెంట్ శీను కావాలి. యీ సినిమా నించి అతనే నా పర్సనల్ కాస్ట్యూమర్” అని .. అంతే శీను దశ తిరిగింది.

వసుంధర  బాబూరావుని వొద్దన్న సంగతి జనాలకు తెలిసింది. ఒక్కొక్క సినిమాలో వసుంధర  పైకి వెళ్తున్న కొద్దీ, బాబూరావు కిందకి దిగిపోవాల్సి వచ్చింది. టాప్ హీరోయిన్  ‘వద్దన్న’వాడిని పనిలో  పెట్టుకోవడానికి గుండా చెరువా?

రెండే రెండేళ్ళలో బాబూరావు దగ్గరి అసిస్టెంట్లందరూ శీను దగ్గర చేరిపోయారు. బాబూరావ్ ‘సినీ’ టైలర్స్ కాస్తా బోర్డు తిప్పి కోడంబాకంలో మామూలు టైలర్‌గా మిగిలిపోయాడు. బాబూరావే కాదు, మొదటి సినిమా కెమెరామాన్ వైద్యలింగాన్ని, నానా తాగుడూ తాగి చిత్రహింసలు పెట్టిన  డైరెక్టర్ బాలకిషన్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా ‘తొక్కేసింది’. వసుంధర. ప్రొడ్యూసర్ మంచివాడు గనక బతికిపోయాడు. మేకప్ సుబ్బరామన్ అప్పటికే వయసుమీరినవాడు. అయితే గొప్ప పనిమంతుడు. ఆ సుబ్బరామన్ రిటైరయ్యాక కూడా నెలకి కొంత డబ్బులు పంపి ఆదుకుంది వసుంధర. హాస్పిటల్ ఖర్చులూ ఆమే భరించేది. దాంతో వసుంధరకి ‘గొప్ప మానవతావాది’ అన్నపేరు వొచ్చింది. ‘కరోడా’ అన్న పేరు ఎలాగూ వచ్చిందనుకోండి..

***

 

“శీనూ… నువ్వూ మన మేకప్‌మేన్ నరసింహులూ నా తరఫున సాక్షి సంతకాలు పెట్టాలి” ఇరవై ఆరో ఏట శీనుని తనున్న హోటల్ రూంలోకి పీల్చి చెప్పింది వసుంధర. అప్పటికామె నందకుమార్ (హీరో) ప్రేమలో పూర్తిగా మునిగిపోయిందని పరిశ్రమలో అందరికీ తెల్సు.. “అదికాదమ్మా.. నందకుమార్‌గారికి ఆల్రెడీ పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూదా. ఇప్పుడు…”చెప్పబోయాడు శీను.

“నాకు తెలుసు శీను! ఇప్పటివరకూ సంపాదించింది మొత్తం మా అమ్మా, తమ్ముడు వాళ్ల పేరు మీద దాచేసుకున్నారు. ఇప్పటికైనా ఆ వూబిలోంచి బయటపడకపోతే జన్మలో ఎప్పటికీ బయటపడలేను. నందకుమార్ ఎలాంటివాడైనా నిజంగా నేనంటే ప్రేమ వున్నవాడు. ఇంకొకటి ఏమంటే అతను భార్యని ఒప్పించాడు. ఆమె అనుమతితోటే మా పెళ్ళి జరుగుతోంది. అతన్ని కాదనుకున్నా రేపు ఇంకొకడెవడో  వచ్చి ఏం వొరగబెడతాడూ?” మనసులోని మాట శీనుకి చెప్పింది వసుంధర. అప్పటితో ‘ఆపటం’తనకీ మంచిదని మౌనం వహించాడు శీను.

***

‘ఆరువళ్లూరు’ వీరరాఘవస్వామి గుళ్ళో గుట్టుగా  పెళ్లి జరిగింది. విషయం తెలిసిన వసుంధర తల్లి లబోదిబోమన్నది. శీనునీ, మేకప్‌మేన్ నరసింహుల్నీ నానాబూతులు తిట్టింది. పరిశ్రమలో పెద్దల దగ్గరకు వెళ్లి మొత్తుకుందిగానీ వాళ్ళేం చెయ్యగలరు?

నెలరోజులు ‘హనీమూన్’ ట్రిప్ కానిచ్చాక మళ్ళీ బిజీ అయింది వసుంధర. వసుంధర అదృష్టమేమోగానీ ‘మంచి’ సినిమాలు పడ్డాయి. అన్నీ ‘హీరోయిన్’ ఓరియంటెడ్ సినిమాలే. పెళ్ళయ్యాక గ్లామర్ డాల్ కాస్తా ‘అభినయ సరస్వతి’గా పేరు తెచ్చుకుంది. కుప్పతెప్పలుగా డబ్బు. నందకుమార్ ఎప్పుడూ ఏవరేజ్ హీరోనే. ఈ దెబ్బకి అతను వసుంధర పేరున మూడు బంగళాలూ, తన పేరున మూడు బంగళాలూ కొనడమేగాక చెన్నై చుట్టూపక్కల వందల ఎకరాలు స్థిరాస్థి కొనేశాడు. కాలక్రమేణా వసుంధరకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తం కుటుంబం అంతా కలిసే వుండేవారు. నందకుమార్ భార్యా వసుంధర అడుగులకి మడుగులొత్తేది. వసుంధరా అంతే ప్రేమగా ఆవిడ్ని చూసేది. తను ఏ నగలసెట్టు కొనుక్కున్నా ఆవిడకీ కొనాల్సిందే. తన పిల్లలకి ఏది కొన్నా ఆవిడ పిల్లలకీ కొనాల్సిందే.

కాలగర్భంలో ఓ దశాబ్దం కలిసిపోయింది. కొత్త నీరు వచ్చింది. పాతనీరు కొట్టుకుపోయింది. ఇవ్వాళ వచ్చిన హీరోయిన్ రేపు టాపు. ఎల్లుండి ఫ్లాపు. కేరళ నించీ, ముంబై నించీ, డిల్లీ, గుజరాత్‌ల నించీ హీరోయిన్ల దిగుమతి పెరిగింది. ఆల్ హేపీ. సినిమా రంగానికి కావాల్సిన ‘పట్లు’ పూర్తిగా నేర్చుకుని ముంబై నించి వస్తున్నారు గనక హీరో ఖుష్… డైరెక్టర్ ఖుష్.. ప్రొడ్యూసర్, మేకప్‌మేన్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఖుష్. బయ్యర్లతో సహా. ‘కేరక్టర్’ వదులుకోవడమంటే షేక్‌హాండ్ ఇచ్చినంత తేలిక. ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకో. కమర్షియల్స్ అయినా, అయిటం సాంగ్ అయినా ఏదైనా ఒకటే.. హార్డ్ కేష్.. అంతే!

చప్పట్లకీ, పచ్చనోటు రెపరెపలకీ అలవాటు పడ్డ హీరోయిన్లు రిటైరై ఇంట్లో కూర్చోలేరు. అలాగని తల్లి వేషాలు వెయ్యలేరు. కానీ వసుంధర అన్నింటికీ సిద్ధపడింది. కూతుళ్లు ‘వయసు’కి వచ్చారు. వాళ్లని కథానాయికలుగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఆ మాటే నందకుమార్‌తో అన్నది. నందకుమార్ తన స్వంత కూతురి పెళ్లి చేసేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో. వసుంధర డబ్బుతో కొడుకుని (స్వంత కొడుకుని) హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది బిగ్గెస్టు ఫ్లాపు. సినిమాకి చూపినవన్నీ దొంగలెక్కలే. మూడొంతులు వసుంధర ఆస్థిని నందకుమార్ ‘నొక్కేశాడు’, ఆ విషయం మొదట గ్రహించింది శ్రీను.

“అమ్మా .. జాగ్రత్తపడండి. సినిమాని ‘చుట్టేసారు’ ఖర్చులు మాత్రం చూపించారంట. మీ మధ్య గొడవలు పెడదమన్న ఉద్ధేశ్యంతో కాదు. మీ  ఉప్పు తిన్న విశ్వాసంతో చెబుతున్నా.!” చాలా కష్టం మీద వసుంధరని వొంటరిగా కలిసి చెప్పాడు శీను.

నందకుమార్ హయాంలోనే శీనుకు ఉద్వాసన పలికాడు. శీనుకి అప్పటికే మంచి పేరుంది గనక త్వరలోనే వేరో ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్‌గా వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు కూడా. ఒక విషయం నిజం. వసుంధర శీనుని సొంతమనిషిలానే చూసింది. శీను పెళ్లికి కూడా బోలేడంత డబ్బు ఖర్చు పెట్టింది. “నాకు తెలుసు శీను.. ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆస్థి ఆయన చేతుల్లో ఉంది. కానీసం ‘మల్లిక’ అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే…” నిట్టూర్చింది వసుంధర. అప్పుడు సమయం ఉదయం పది. అప్పటికే వసుంధర ‘తీర్థం’ సేవించి మత్తులో ఉంది.

మాట్లాడకుండా బయటికొచ్చాడు సీను. “అన్నా.. ఆ అరవ ముండాకొడుకు వసుంధరమ్మని తాగుడికి అలవాటు చేశాడు. తెల్లార్లూ మందే…!”శీనుతో గుసగుసగా అన్నది ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి మొదట్నించీ వసుంధరకి ‘టచప్ వుమన్’ వసుంధరతోటే వుంటుంది. నిట్టూర్చాడు శీను.

“అంతేకాదు శీనయ్యా.. హీరో అయ్యుండీ అమ్మాయిల్ని తెచ్చి వ్యాపారం చేయిస్తున్నాడు. నేనూ రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.”చెప్పింది ముత్తులక్ష్మి. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసిందే. ‘మాజీలు’ కొందరు  యీ వ్యాపారం మీదే జీవనం సాగిస్తుంటారు. అదే తప్పుగా అనిపించకపోవటమే విచిత్రం. కుటుంబంలో మగపిల్లలకి కూడా ఇదంతా మామూలుగా అనిపించడం మరో విచిత్రం. అక్కో, చెల్లెలో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డా ఆ మగధీరులు మాత్రం మామూలుగానే తిరగేస్తుంటారు. అక్కచెల్లెళ్ల మీదే బతికేస్తూ వుంటారు.

వసుంధరకీ, నందకుమార్‌కీ జరిగిన ‘డిస్కషన్స్’ చెప్పాలంటే ఓ పెద్ద నవల అవుతంది. ఎందుకంటే నందకుమార్ గోతికాడ నక్క. అతని మొదటి పెళ్ళాం ‘బాగా’ తెలివైంది. ‘కాదు’ అని బయటపడకుండా ‘అవును’ అని అన్నీ దక్కించుకుంది.

ఏ రేంజికంటే తరవాత్తరవాత వసుంధర ‘కూతుళ్ల’ మీద సంపాదించేంత. తన కూతురు, కొడుకూ మాత్రం సేఫ్. సవతి కూతుళ్లనీ బిజినెస్’లోకి దించి, సవతి కొడుకుని ‘వెధవ’ని చేసింది. తనకి పుట్టినవాళ్లనే ‘బిజినెస్’లోకి దించిన ఘనత ది గ్రేట్ కేరక్టర్ ఆర్టిస్ట్ నందకుమార్‌ది.

నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.

వసుంధర పతనమూ అలాగే అయింది. సంస్కారం వున్న వసుంధర జరుగుతున్న దాన్ని చూస్తూ సహించలేకపోయింది. అలాగని పిల్లల్ని తండ్రికి దూరమూ చెయ్యలేకపోయింది. అందరూ చేసే పనే తనూ చేసింది. అన్నీ మర్చిపోవడానికి అది దగ్గరి మార్గం ‘తాగుడు’. ఆ తాగుడికి బానిసైంది. లేవగానే మందు.. ఇంకా ‘కిక్కు’ కోసం మందుతోపాటు గుట్కా. ముత్యాల్లాంటి పలువరస పుచ్చిపోయింది. వొళ్లు ఏభయేళ్ళకే బండగా తయారైంది. కూతుళ్లు సినిమాల్లో  రాణీంచలేకపోయారు. ఒకతి మాత్రం ఓ మళయాళం వాడిని దొంగతనంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండోది ఎప్పుడు ఎవరితో ఉంటుందో దానికే తెలీదు. కొడుక్కి చదువబ్బలా. తండ్రి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తాగి తాగి చివరకు చచ్చిపోయిన వసుంధర. మంచం మీదనించి కిందపడి చనిపోయిందని ఒకరంటే, గుండె ఆగి చచ్చిపోయిందని మరొకరు అన్నారు. ఏమైతేనేం మరో దుఃఖజీవికి ‘విముక్తి’ లభించింది. సర్వాంతర్యామి వున్నది అందుకేగా..

 

***

 

వసుంధర ‘పెద్ద కర్మ’ చాలా అట్టహాసంగా జరిగింది. నిలువెత్తు ఫ్లెక్సీలు, అన్ని పేపర్లలోనూ శ్రద్ధాంజలి. అన్ని చానల్సులోనూ ఆవిడ గురించిన వార్తలూ, కటింగ్సే. నందకుమార్ నటనకి జోహార్లు..  గ్లిజరిన్ లేకుండా టీవీ కెమెరాల ముందు ‘భార్యపోయిన దుఃఖాన్ని’ రక్తి కట్టించాడు. చూస్తున్న ప్రేక్షకులు అతని ప్రేమకి చలించిపోయారు. నందకుమార్ భార్య ఇంకా అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ‘వసుంధర నాకు దేముడిచ్చిన చెల్లి, నా ప్రాణంలో ప్రాణం” అంటూ వలవలా ఏడ్చింది. వసుంధర కూతుళ్లూ, కొడుకు మాత్రం నిర్వికారంగా నిలబడ్డారు.

“నేను బ్రతికుండీ ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను గురువుగారూ.. చెయ్యగలిగిందింతే!” కళ్లనీళ్లతో అన్నాడు శీను. డాబా హోటల్లో ఓ చిన్న సంతాప సభ జరిగింది. మేం మొత్తం పదిమందిమి. ఏర్పాటు చేసింది కాస్ట్యూమర్ శీను. (DATA UDIPI HOTEL). ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాం. (దానివల్ల ఎవరికి ఉపయోగం? అడక్కంది. అదో వెర్రి సంప్రదాయం).

“వసుంధర పిల్లల పరిస్థితి ఏమిటి?” ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. స్వంత తండ్రి వున్నాడు. కానీ ఆ తండ్రే కూతుళ్లని (అంటే వసుంధర కూతుళ్లని మాత్రమే) బిజినెస్‌లోకి దించి ‘కొడుకు’ని డ్రైవరుగా వాడుకుంటున్నాడు. ఆయన అసలు కొడుకూ, కూతురూ చాలా చాలా గొప్ప స్థితిలో వున్నాడు. మరి వీళ్లు పిల్లలు కారా? ఇంత పక్షపాతం ఎందుకూ? అదీ వసుంధర సర్వస్వాన్నీ కొల్లగొట్టాక కూడా”

జావాబు దొరకని ప్రశ్నల్లో ఇదొకటి. వసుంధరని తల్చుకుంటే నాకో పాట గుర్తొస్తుంది.. “తేరి దునియాసే దూర్ చలేఁ హోకె మజ్‌బూర్ హమే యాద్ రఖ్‌నా…” అన్నది

జ్ఞాపకాలు తప్ప వసుంధర గురించి ఇంకేం మిగిలాయి..

 

భువనచంద్ర..

 

 

అపురూపం … ఆ… స్వరసంగమం

bhuvanachandra (5)

“సంగీత సాహిత్య సమలంకృతే…” అని వాగ్దేవిని కీర్తించారు సి.నా.రె.గారు. 29.10.2013న రామోజీ ఫిలిం సిటీలో ఆ ‘పాట’ని గుర్తు తెచ్చుకోనివారు లేరు. ఆ రోజున అక్కడ సాక్షాత్తు ‘సంగీత సాహిత్య సరస్వతి’ కొలువైంది. 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర సంగీత, సాహిత్యకారులకు స్వరాభిషేకం ఆ శారదాదేవి సాక్షిగా జరిగింది. ‘కన్నుల పండువ’ అనే పదానికి అర్ధం ఆనాడు ‘కళ్ల’కి తెలిసింది. ‘వీనులవిందు’ అనే పదంలోని విందుని శ్రవణేంద్రియాలు, ఆస్వాదించాయి. అక్కడ వున్న ప్రతి మనిషీ ‘మానసికోల్లాసం’ అనుభవించారు.
మరోసారి అటువంటి ‘మహాసభ’ జరుగుతుందా? ఏమో! జరిగిన మహోత్సవాల్ని తలుచుకుని ఆనందం. ‘మళ్ళీ ఎప్పుడు?’ అని ప్రశ్నించిన గుండెకు ‘మౌనమే’ సమాధానంగా మిగిలింది.
సృష్టికర్త రామోజీ, రధసారధి ‘బాపినీడు’గారు చిరునవ్వుతో ఆహుతుల్ని ఆహ్వానిస్తుండగా, అతిరధ మహారధులు ఆ ‘స్వరమండపాని’కి విచ్చేశారు.
అరుగో.. ఎనభైలు దాటిన సంగీత చక్రవర్తులూ, సాహిత్య సామ్రాట్‌లూ. దర్శకేంద్రులూ, దర్శకరత్నలూ, గాయక, గాయనీ శ్రేణులు,, అబ్బా.. కెమెరాలు పులకించిపోయాయి.
దక్షిణ భారత చలన చిత్ర సంగీతానికి ఓ చిరునామా ఇచ్చిన శ్రీ ఎం.ఎస్. విశ్వనాధన్‌గారు. అరుగో.. చేతులు జోడించి నమస్కరిస్తూ… ఎన్నెన్ని అద్భుతమైన పాటలాయనవీ.
అరుగో… కర్ణాటక సంగీతాన్ని వినీలాకాశంలో నిలబెట్టిన అచ్చ తెలుగు వాగ్గేయకారుడు శ్రీ బాల మురళీకృష్ణ.. “సాక్షాత్తూ శ్రీ కృష్ణుని వేణువే భువిలో బాలమురళియై అవతరించిందా..! అనిపించేంత మహోన్నత సంగీత విద్వాంసుడూ, నవరాగాల సృష్టికర్తా.. మెల్లగా నడిచి వస్తున్నారు. చిరునవ్వుతో వాహ్.. ‘పంచెకట్టు’ని తన కవిత్వంతో ప్రపంచవేదిక మీద నిలబెట్టిన ‘విశ్వంభరుడు’ జ్ఞానపీట్ అవార్డు అందుకున్న సుజ్ఞాన మూర్తి.. ఆచార్య ‘సి.నా.రే’ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ మహనీయులందరికీ పాద నమస్కారాలు చెయ్యని మనిషి ఆ మహోత్సవంలో లేరు. ఎవరు చెప్పారు? . ఆ మహానుభావులు పాదాల మీద వాలమని?

b2
ఆహా నిలువెత్తు మనిషి! పదహారు భాషల్లో ఏభైవేలకి పైగా పాటలు పాడి ‘గిన్నీస్’ బుక్కులో ధృవతారలా మెరుస్తున్న ఆ బిగ్‌బాస్ డా.కె.జె.ఏసుదాస్ కాక ఇంకెవరూ… పక్కనే విజయ్ యేసుదాస్.. వర్ధమాన్ గాయకుడూ, తండ్రికి తగ్గ తనయుడూ..
తెలుగు సినిమాకి నాలుగున్నర దశాబ్దాల పాటు వారే ‘దిశానిర్దేశకులు’.. నేటికీ ‘పెద్ద దిక్కు’ వారే.. శ్రీ దాసరి నారాయణరావుగారూ. శ్రీ కె.రాఘవేంద్రరావుగారూ, వారే … కృష్ణార్జునుల్లా నడిచొస్తున్నారు. ప్రేక్షకుల జేజేలు అందుకుంటూ..
ఎనభైకి దగ్గరవుతున్న ఆయన గుర్తున్నారా… ‘రాజన్ – నాగేంద్ర’ జంటలో నాగేంద్రగారు. ఎన్ని మధురమైన పాటల్ని ‘స్వరించారు’ నిటారుగా నడుస్తూ ‘కాలపు వీణ’కి స్వరాలందిస్తూ వస్తున్నారు.
అట్నుంచి వాణీ, జయరాంగార్లు.. భార్యభర్తలిద్దరూ ఆకూవక్కల్లాగా వస్తున్నారు. వాణీజయరాంగారి ‘బోలీరే పపీ హరా’ గుర్తున్నదా? ఇప్పటికీ అదే ‘గుడ్డీ’వాయిస్.
బి.వసంతగారు. మనకున్న మంచి గాయనీమణుల్లో ఆమె ఒకరు. ఏ ‘హిందీ’పాటని ‘కూనిరాగం’ తీసినా BGMతో ఆ పాటు పూర్తి లిరిక్స్‌తో పాడగల తెలుగు గాయని. ఇక అరుగో సుశీలమ్మ.. దక్షిణ భారత ‘లతా’ మంగేష్కర్. పాడేటప్పుడు ‘శ్వాస’ శబ్దం రానివ్వని ఏకైక గాయనీమణి. అదెలాగో ఇప్పటికీ సీక్రెట్టే.. దక్షిణ భారత దేశపు భాషలన్నీ సుశీలగారిని ‘ఆసరా’గా చేసుకుని తమ గీతాల్ని పల్లవించాయి.
అమ్మయ్యా.. వస్తున్నది చిత్రగారు. ‘వేణువై వచ్చాను భువనానికీ’ అంటూ శ్రోతల్ని కన్నీళ్లు కార్పించక మానదు. చెరగని ‘నవ్వు’ఆవిడకి దేముడిచ్చిన వరం. అందుకే ఆవిడకి ‘ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్’ అని పేరు పెట్టాను.
చల్లగా నవ్వుతూ వస్తున్నారు ఎస్.పి.శైలజగారు. ఎస్.పి చరణ్ (బాలూగారి అబ్బాయి) ఎస్.పి శైలజ బాలూగారికి చెల్లెలుగా పుట్టకపోతే ‘డ్యూయట్లు’ అన్నిటిమీదా ఆమె పేరే రాయబడి వుండేదేమో.. ‘నాంపల్లీ టేసనుకాడ రాజాలింగో’ ఎవరు మరువగలరు? వాహ్.. ప్రణవి.. టిప్పూ.. టిప్పూగారి భార్య హరిణి.. సందీప్ ఇంకా ‘లిటిల్ చాంప్స్’ లోనూ ‘పాడుతా తీయగా’ లోనూ పాడిన యువ, చిన్నారి గాయకులు.. అదుగో గాయని విజయలక్ష్మి. అరుగో సాంగ్ పహిల్వాన్ ఎస్.పి.బాలూగారు. ఆ పక్కన ‘మనో’.. ఇంకేం కావాలి.. గాలి వాయులీనమైంది. గుండె ‘స్వరస్మృతుల’తో నిండిపోయింది. ఎందుకు నిండదూ? విద్యాసాగర్.. రాజ్.. రమణీ భరద్వాజ్.. ఎస్.ఏ.రాజ్‌కుమార్. గంగై అమరన్, మాధవపెద్ది సురేష్.. చైతన్య ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, మణిశర్మ, సాలూరి వాసూరావు. ఆర్.పి. పట్నాయక్, అనూప్ రూబెన్స్, లాంటి సంగీత దర్శకులు తమ శ్వాసల్నే స్వరాలుగా పేరుస్తూ వుండగా.. అరుగో. సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రాజేశ్వర (ప్రసాదు) భాస్కరభట్ల రవికుమార్, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ, వాచస్పతి సాయికుమార్.. ఓహ్.. మాటలే పాటలై పరవశిస్తున్నాయా..

ph 1
పరస్పర ఆలింగనలు
పాదనమస్కారాలు
ఆటోగ్రాఫులు
ప్రేక్షకులతో ఫోటోలు
అవిశ్రాంతంగా అందర్నీ, అన్నింట్నీ ‘తమలో’ ఇముడ్చుకుంటున్న వీడియో కెమేరాలు. నవ్వులు. అక్కడక్కడా భావోద్రేకంలో కన్నీళ్లు
ముఖాన తగిలించుకున్న ‘ముసుగు’ లన్నీ తొలగిపోయి స్వచ్చమైన మానవత్వం పరిమళించింది.
హృదయాల్లో స్నేహం పెల్లుబికింది.
బాలమురళీకృష్ణగారు, ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అన్న ‘గుప్పెడు మనసు’ చిత్రంలోని పాటని అందుకోగానే అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు, ఎనభై మూడేళ్ల వయసా ఆయనది? మరి, ‘సలలిత రాగ సుధారస సారం’ పాటకి ఎలా పాడగలిగరబ్బా? నేటి బుల్లి గాయని ప్రణవితో..
“ఆకాశదేశానా… ‘ అని జేసుదాసుగారు పాడుతుంటే ఏమిటీ. యీ స్వరమందిరం పులకించిపోతోందేం..
మళ్లీ చిత్రగారు “వేణువై వచ్చాను భువనానికీ’ అని పాడుతుంటే, ‘గాలినైపోతాను గగనానికీ’ అంటూ వేటూరిగారు గాలిలా మారి అందరి గుండెల్ని సృశించారు.
జ్ఞాపకాల కన్నీళ్లు. స్వర వర్షంతో కలిసి పాటల వరదలయ్యాయి. ‘చినుకులా మారి’ అంటూ బాలుగారు వాణీజయరాంగారూ, ఎస్.పి.శైలజ కురిపించిన మధువుల్ని మనసునిండా నింపుకున్నాం.
అయ్యా.. ఇదో మరపురాని, మరువలేని స్వర సంగీత సాహిత్య సంగమం. ఎంత మైమరచిపోయానంటే, చెన్నై చేరుకున్నాక గుర్తొచ్చింది. మనసుతో తప్ప కెమేరాతో ఒక్క ఫోటో కూడా తీయలేకపోయానని.
అన్ని విషయాలూ, చలోక్తులూ, చమక్కులూ, చెప్పను. ఎందుకంటే నా గుండె మారుమూలల్లో ఓ పాట (రాజ్ కపూర్‌ది, ముఖేష్ పాడింది) వినిపిస్తోంది.
“కల్ ఖేల్ మే.. హం హో న హో” లో
గర్దిష్ మే తారే రహేంగే సదా
భూలోగే హమ్ భూలేంగే తుమ్
పర్ హమ్ తుమ్హారే రహెంగే సదా
రహెంగే యహీ.. ఆప్నీ నిశాన్
ఇస్ కె సివా జానా కహా..
జీనా యహా.. మర్‌నా యహా..
అంటూ ‘రేపటి ఆటలో మనముంటా’మో ఉండమో.. కానీ ఆ నీలాకాశంలో నక్షత్రాలు అక్కడే ఉంటాయి. అంతట్నీ చూస్తూ సాక్షులుగా, నువ్వు మర్చిపోవచ్చు, వారూ, మీరు అందరూ మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం సదా మీ మనిషినే! ఇవిగో.. నా జ్ఞాపకాల నీడల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. జీవించడమూ ఇక్కడే.. మరణించడమూ ఇక్కడే. వెళ్ళేది వేరెక్కడికీ..”
ఈ పాట నా గుండెని పిండేస్తోంది. మరోసారి అందరం కలుస్తామా… పోనీ ఏప్పుడో కలిసినా అందరం ఉంటామా? ఎందర్ని తల్చుకుని కన్నీళ్లు కార్చాలో.. ఎందరి జ్ఞాపకాల నీడల్లో నిట్టూర్పులు విడవాలో.. భగవాన్.. ‘కాహెకో దునియా బనాయీ? ఎందుకు సృష్టించావయ్యా యీ లోకాన్ని?

b1(1)
పోనీలే..
“ఇక్ దిన్ హై మిల్‌నా..
ఇక్ దిన్ హై బిఛడ్‌నా,
దునియా హై దో దిన్ కా మేలా…!” అని కదూ ముఖేష్ తన ‘దర్ద్ భరీ’ స్వరంతో పాడింది.. నిజమే రెండు రోజుల పాటు కలిసుండి తర్వాత ఎవరికి వారు విడిపోవలసిన ‘తిరునాళ్లే’గా జీవితమంటే..
‘చల్‌నా జీవన్ కీ కహానీ
రుక్‌నా మోత్ కి నిషానీ
(నడవడమే జీవితం అంటే.. ఆగటం అంటే మరణించడమే)
అందుకే భయ్యా.. చల్.. చల్తే చల్..
“చల్ అకెలా చల్ అకెలా చల్ అకేలా..”
మనుషుల్నీ, మమతల్నీ, మనుషుల్నీ కలుపుకుంటూ, విడిపోతూ జ్ఞాపకాల మూటల్ని మోసుకుంటూ, ప్రకృతి గీతం వింటూ సాగిపోదామా .. పదండి మరి..

ప్రేమతో
మీ భువనచంద్ర

(ఇంతటి మహాకార్యం అద్భుతంగా నిర్వర్తించి అసాధ్యాన్ని ‘సాధ్యం’ చేసిన శ్రీ రామోజీరావుగరికి పాదాభివందనం చేస్తూ..)

సముద్రపు హోరుకి సరిగమల తోడు…మన్నాడే!

Manna-dey

“కడలిలెఒళవుం… కరళిలెమోహవుం.. అడజ్నుకిల్లొమనె అడజ్నుకిల్లా.. మానసమైనవరుం.. మధురం…”  అన్న మళయాళం పాట విన్నాను.

అబ్బ.. సముద్రపు హోరులో మెత్తగా సుతిమెత్తగా కలిసిపోయి ఆ స్వరం ఎవరిది? మన్నాడేది కాక?!

ఇరవై రెండుసార్లు ఆ సినిమా  ‘చెమ్మీన్’ చూశాను. సిల్వర్ స్క్రీన్ మీద చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లాంటిది ఆ సినిమా. దర్శకుడు రామూ కరియత్. సంగీత దర్శకుడు సలీల్ చౌధరి. నటీనటులు సత్యన్ , మధు, షీలా.. ఓహ్.. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఓ బెంగాలీ క్లాసికల్ సింగర్ ఓ మళయాళ చిత్రంలో పాడటమా? అసలెందుకు పాడించాల్సి వచ్చింది? ఎందుకూ? ఆ పాట ‘మన్నాడే’ మాత్రమే పాడగలడు. విన్న ‘చెవులకి’ ఆ సముద్రపు హోరుని తనొక్కడే వినిపించగలడు.

యస్. ఎస్.ఎల్.సి చదివేటప్పుడు మా ఇంట్లో రేడియో లేదు. హోటల్ రామారావు ముందర్నించి నడుస్తూ వుంటే రోజూ ఏదో ఓ సమయంలో ఓ పాట వినిపించేది. అతను హిందీ పాటలే ఎక్కువ వినేవాడు. ‘వివిధ్ భారతి’.. ఆ పాటకి అర్ధం అప్పుడు నాకు తెలీదు. కానీ .. గుండెకి గాయమై ఒక్కో రక్తపు బొట్టు కారుతుంటే, భగ్న హృదయానికి ఎలాంటి ‘తీయని’ బాధ వుంటుందో ఆ బాధ నా మనసుకి అర్ధమయ్యేది. అది నవరంగ్‌లోని పాట.
“తూ చుపీ హై కహా.. మై తడప్తా యహా” అన్న (నువ్వెక్కడ దాక్కున్నావూ.. నేనిక్కడ తపిస్తూ వున్నాను) గీతం అది. ఆలపించేది నేనే అనిపించేది. ఎన్ని పాటలూ? ఎందరో గాయకులున్నారు. గుండెలోతుల్లోంచి ‘విషాదాన్ని’ వెలికి తీసిన ముఖేష్, పాటకే సొబగులు అద్దే రఫీ..

మలయమారుతంలా తాకే తలత్, ఉత్సాహంతో వెర్రిగంతులు వేయించే కిషోర్.. ఎందరో మహానుభావులు… మరి ఆకాశంలోకి ‘స్వరాన్ని’ రాకెట్‌లా పంపే మహేంద్రకపూర్?  అవును. అందరూ మహానుభావులే…. కానీ… మన్నాడే వేరు.. మనిషికి బట్టలు తొడిగినట్టు పాటకి ‘శరీరాన్ని’ తొడుగుతాడు.

‘ధర్తి కహే పుకార్ కే’ (దో భీగా జమీన్)  పాట వింటుంటే మనమూ తుళ్లిపోతాం.
‘మౌసం బీతాజాయ్’ అంటూ.. ‘తూ ప్యార్ కా సగర్  హై.. తెరీ ఇక్ భూంద్ సే ప్యాసే హమ్’ అని మన్నాభాయ్ పాడుతుంటే కళ్లవెంట విషాదమో, ఆవేదనో కాని అశృవుల్ని రాలుస్తూ ‘ధ్యానం’ లో మునిగిపోతాం.. ఏమంటాడూ..?  నీవో ప్రేమసముద్రానివి.. ఒక్క చుక్క ప్రేమ చాలు మా దాహం తీరడానికి..’ అంటాడు. (సినిమా – సీమ, రచన – శైలేంద్ర). ‘ఇధర్ ఝూమ్ కె గాయె జిందగి.. ఉదర్ హై మౌత్ ఖడి ‘ అన్న లైను వినగానే తటాల్న మేలుకుంటాం. అవును.. ‘జీవితం ఇక్కడ చిందులేస్తుంటే, అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని సిద్ధంగా వుంది..’ ఎప్పుడు తనలో మనని కలుపుకుంటుందా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న వేసిందెవరూ?  ‘మనకి మనమేనా?’  అన్నంత మాయలో ముంచుతుంది మన్నాడే స్వరం.

వెన్నెల రాత్రుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ పాడుకునేవాడ్ని. ‘ఏ రాత్ భీగి భీగి..’ అంటూ. ‘చాంద్’ ఉండక్కర్లా… చీకటైనా విరహవేదనే.. ‘ఠండీ హవా!’ గుండెను తాకుతోంది మిత్రమా…!

‘సుర్ నా సజే.. క్యా గావూ మై.. సుర్ కే బినా జీవన్ సూనా..’ (శృతి చేయలేనివాడ్ని.. ఏమని పాడను? శృతి లేని జీవితం.. స్వరం లేని జీవితం శూన్యం కాదా?) దేన్ని సృశించాలి? దేన్ని ‘స్వరిం’చాలి? జీవితాన్నేగా..!

‘కోరి చునరియా ఆత్ మా  మోరీ.. మైల్ హై మాయాజాల్ .. ఓ దునియా మేరే బాబుల్ కా ఘర్.. ఏ దునియా ససురాల్’ తెల్లని వస్త్రం లాంటిది నా ఆత్మ.. యీ మాయాలోకం ‘మైల’ (మరకలతో) నిండి వున్నది. ఆ లోకం నా పుట్టిల్లు.. యీ లోకం అత్తవారిల్లు.. అయ్యో… యీ ‘మరక’ పడ్డ వస్త్రంతో నా ‘తండ్రి’కి మొహం ఎలా చూపించనూ? అని రెండు లోకాల్ని ఒకేసారి చూపించే మన్నా మన మద్యలో లేరా? వెళ్లిపోయారా ఆలోకానికి.. మాయ నిండిన యీలోకాన్ని వొదిలి?

‘లాగా  చునరీ మే దాగ్. చుపావు కైసే’ పాట ‘రానివాడు’ గాయకుడిగా అనర్హుడు. ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా, ‘పాటలపోటీ’ అంటూ జరిగితే మాత్రం యీ పాట ఎవరో ఒకరు పాడాల్సిందే. లేకపోతే అది ‘సంగీత కార్యక్రమం’ ఎందుకవుతుంది? తేనెపట్టులోంచి వరసగా తేనెచుక్కలు రాలినట్లు మన గుండెల మీద వాలుతాయి ఆ స్వరాలు.. అదీ.. మన్నా మేజిక్ అంటే.. అందరూ క్లాసికల్, సెమి క్లసికల్ సాంగ్స్ పాడగలరు. కానీ, మన్నాడే ‘స్టైల్’ వేరు. అత్యంత సహజంగా పాడతారు. గొంతు ‘పాట’ మొదలెట్టినప్పుడు ఎంత ‘ఫ్రెష్’గా వుంటుందో, చిట్టచివరి లైన్ కూడా అంతే ఫ్రెష్‌గా వుంటుంది. అదీ పాటలోని ‘ఎమోషన్స్’ని వెదజల్లుతూ..  బంగారానికి సువాసన అబ్బితే ఎలా ఉంటుందో తెలీదు గానీ, మన్నాడే ‘స్వరం’లో ఆయన పాడిన ప్రతీ పాటకీ ఓ ‘చిరునామా’  దొరుకుతుంది.

‘ఏ కజ్‌రారీ  చంచల్ అఖియా.. హోట్ గులాబీ..’ అని రాజ్‌కుమార్ అభినయిస్తుంటే పరవశించని హృదయం ఉన్నదా?  ‘ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయలియా’ పాటలో.. ఆ ‘పరవశం’ నింపింది మన్నాడే కాక మరెవరూ? నిజంగా మన్నాడే ‘జాదూ’ చేశారు.

‘కస్మే వాదే ప్యార్ వఫా.. సబ్ బాతే హై బాతోన్ కా క్యా?’ ఉప్‌కార్ సినిమాలో కళ్యాణ్‌జీ సంగీత నిర్దేశికత్వంలో ‘ఇందీవర్’ రాసిన యీ పాటని ‘మనసు’లోనే ‘ఆహ్వానించని మనిషి’ ఉండడు.

తేరీ సూరత్ మేరీ ఆంఖే’ సినిమాలో S.D.బర్మన్‌గారు శైలేంద్ర రాసిన ఓ అద్భుతమైన పాటని మన్నాడే చేత పాడించారు.

‘పూచోన కైసే మైనే రైన్ బితాయీ.. ఇక్ పల్ జైసే  ఇక్ యుగ్ బీతా.. యుగ్ బీతే మోహె నీంద్ నా ఆయే..’ శైలేంద్రగారి ‘భోజ్‌పురీ’ మెరుపులు చాలా సహజంగా మన్నాడే గొంతులో ఒదిగిపోయాయి. ముఖ్యంగా .. మోహే.. మోరా .. అనేవి. భాషకి అతీతుడేగా గాయకుడంటే! (స్నేహితులారా.. ఒక్కొక్క పాటనీ పూర్తిగా హిందీలో రాసి, తెలుగులో స్వేచ్చానువాదం  చేసి ‘వినిపించాలని’ వుంది. అంత పిచ్చెక్కుతోంది మన్నాడే పాటల్ని తలుచుకుని).

1965లో టాప్ 2nd  సాంగ్‌గా ‘బినాకా గీత్‌మాలా’లో వచ్చింది మన్నాడే పాడిన ‘ఆవో ట్విస్ట్ కరే’ పాట. మన్నాడే ఆ పాట పాడింది మెహ్‌మూద్ కోసం. సినిమా భూత్ బంగ్లా. సంగీతం ఆర్.డి.బర్మన్. రాసింది హస్రత్ జైపూరీ. పాయింట్లు 277. ఆయన ‘క్లాసికల్’ మాత్రమే కాదు ‘వెస్ట్రన్’ తోటీ ‘మేజిక్’ చెయ్యగలరని నిరూపించిన పాట అది. అదే సంవత్సరం రఫీ & మన్నాడే కలిసి పాడిన ‘ఏ దో దీవానే దిల్ కే చలే హై దేఖో మిల్ కే (జోహార్ మెహ్మూద్ ఇన్ గోవా.. సంగీతం-కళ్యాన్‌జీ- ఆనంద్‌జీ.. రచన కువర్ జలాలా బాదీ) 177 పాయింట్లతో 12వ పాటగా నిలిచింది. (మొత్తం 1965లో టాప్ 15 సాంగ్స్ లిస్ట్)

కాబూలీవాలా సినిమాలో ‘ఏ మేరే ప్యారే వతన్’ పాటని ఏ భారతీయుడైనా మర్చిపోతాడా? (సంగీతం సలీల్ చౌధరీ. రచన ప్రేమ్ ధవన్) అలాగే మరోపాట.. “పాడవోయి భారతీయుడా” అని శ్రీ శ్రీగారు రాసిన చిరస్మరణీయమైన పాట… హిందీలో సినిమా పేరు నాస్తిక్ (మన హైద్రాబాదీ ‘అజిత్’ హీరో. రాసింది ప్రదీప్.. సంగీతం సి.రామచంద్ర. ఆ పాట.. “దేఖ్ తేరే సంసార్‌కి  హాలత్ క్యా హోగయీ భగవాన్… కిత్‌నా బదల్ గయా ఇన్సాన్.” అనే పాట. ‘జానే అంజానే’ సినిమాలో శంకర్ జైకిషన్ స్వరపరచగా SH బిహారీ రాసిన “చమ్.. చమ్.. బాజేరే పాయలియా..!’  అనే పాట. అది గుండె చప్పుడుతో సహచర్యం చేస్తుంది. గుండెలో నాట్యం  చేయిస్తుంది. సీత ఔర్ గీతాలో ( ఆర్.డి. బర్మన్ – ఆనంద్ బక్షీ) ‘అభీ తో హాత్ మే జామ్ హై..’  పాటని ఎన్నిసార్లు ‘విస్కీ’తో ఆస్వాదించానో..

భయ్యా.. “దునియా బనానేవాలే.. క్యా తేరే మన్ మే”(శంకర్ జైకిషన్.. హస్రత్ జైపూరీ. సినిమా జిద్దీ) పాటలు వినకపోతే ‘కాహెకో దునియా బనాయీ? అని ఎలా ప్రశ్నించగలం? ‘బాత్ ఏక్ రాత్ కీ’లో ‘వో కిస్‌నే చిల్‌మన్ సే మారా… నజారా ముఝె.. ‘ (శంకర్ జైకిషన్.  మజ్రూహ్ రచన) అని మన్నాడే పాడుతుంటే పిచ్చెక్కదూ?

సోదరులారా.. సోదరీమణులారా.. క్షమించాలి. నా కళ్లు ‘నీలాల్ని’ వర్షిస్తున్నాయి. ఏడుపు తన్నుకొస్తుంది.

‘ఆజా సనమ్ మధుర్ చాంద్‌నీ మే హమ్..’   (శంకర్ జైకిషన్,  హస్రత్, చోరి చోరి సినిమా) ‘తుఝే సూరజ్ కహూ యా చందా (ఏక్ ఫూల్ దో మాలీ , కవి –  ప్రేమ్ ధవన్ రచన), కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే’ (మదన్‌మోహన్, రాజేంద్ర కృష్ణ. దేఖ్ కబీరా రోయా సినిమా), ‘శ్యామ్  ఢలే జమూన కినారే’ (తెలుగులో యమునా తీరమునా, సంధ్యా సమయమున…. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆనంద్ బక్షీ. పుష్పాంజలి సినిమా),’తుఝ్ బిన్ జీవన్, కైసే జీవన్(బావర్చీ సినిమా, మదన్‌మోహన్, కైఫీ ఆజ్మి), చునరీ సంభాల్ గోరీ.. ఉడీ చలీ జాయిరే (ఆర్.డి, మజ్రూహ్, బహారోన్ కి సప్నే సినిమా), మస్తీ భరా హై సమా…!’  (పర్వరిష్ సినిమా, హస్రత్ రచన, ఎన్.దత్తా) ‘తూ హై మేరా ప్రేమ్ దేవతా’ (ఓ.పి నయ్యర్, కమర్ జలాలాబాదీ, కల్పన సినిమా).

ఎన్ని పాటలు ఉదహరించను? భగవాన్. ఆయన మమ్మల్ని అలరించారు. పాటలతో మురిపించారు. నీలో మళ్లీ కలిసి పోవడానికి పుట్టింటికి అంటే నీ దగ్గరికి చేరిపోయారు. పోన్లే.. ” ఏ భాయ్ .. జరా దేఖ్ కే చలో’ అని మాకు జాగ్రత్తలు చెప్పే వెళ్లారుగా. జీవన వేదాంతం బోధించే వెళ్లారుగా.. ‘ కోయి బాత్ నహీ. ఫిర్ మిలేంగే’..

ఒకమాట చెప్పక తప్పదు. “వాలు జడ – తోలు బెల్టు ” అనే సినిమా జరిగేటప్పుడు ‘విజయబాపినీడు’గారు నన్ను “భువనచంద్రగారూ.. మీకు హిందీ అన్నా, హిందీ సాహిత్యమన్నా,  సినిమాలన్నా పిచ్చి కదా. మీకు నచ్చిన సీను, పాట చెప్పండి!” అంటే శ్రీ 420లోని సీను- దానిలో వచ్చే ‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా హై, ప్యార్ సె ఫిర్ క్యో డర్‌తా హై దిల్’ అనే పాటని పాడి వినిపించా. ఆయన అదే పాటని (తెలుగులో రాస్తే) ఆ సినిమాలో పెడదామన్నారు. నేను ఒప్పుకోలేదు. రాయలేక కాదు. కానీ, అంత గొప్ప పాట గౌరవాన్ని యధాతథంగా నిలుపుదామని) చివరికి విజయబాపినీడుగారు నా మాటని గౌరవించి బాలూ+చిత్రలతో ‘తననా’లలో ఆ పాట పాడించారు. ‘No Lyric’ ఇదే నేను మన్నాడే బ్రతికుండగా ఆయనకిచ్చిన గౌరవం. ఆ గౌరవం భద్రంగా నా గుండెల్లో (మీ గుండెల్లోనూ) జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ‘మన్నా’ మన గాయకుడు. మధురగాయకుడు.  శెలవు దాదా!

ఇందులో మన్నాడే జీవిత విశేషాలు ‘ఒక్కటి’ కూడా రాయలేదు. ఎందుకు రాయాలి? ఎవరికి తెలీదని?

పోనీ వచ్చే ఏడాది ఆయన్ని స్మరించుకుంటూ ఎన్నెన్నో ‘విశేషాలు’ రాస్తాను. సరేనా.. అయ్యా .. యీ వ్యాసంలో ఉదహరించినవి చాలా తక్కువ పాటలు మాత్రమే. అంత సూర్యుడిని అద్దంలో చూపించాను.

అంతే

మీ భువనచంద్ర..

జీవిత నాటక రంగం పై “ఆమె” !

bhuvanachandra

Untold Stories – 7

 

“మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత.

“నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు.

“నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు తీసి ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోయింది. సంఘంలో నేను చిన్ననాటి నుంచి పడ్డ అవమానాలు నన్నో ‘ఇంట్రావర్ట్’ గా మార్చాయి. దేముడూ, పూజలూ అంటూ పవిత్రంగా ఉండే మా నాన్న మా అమ్మ కొట్టిన దెబ్బకు ‘దేవదాసై’ కొంపని పట్టించుకోవడం మానేశాడు. ఇహ మా బామ్మా, మా తాతయ్య అయితే, నేనో దురదృష్టవతురాల్ననీ, నా దురదృష్టమే కొంపని నాశనం చేసిందనీ, నా చదువు పూర్తయ్యేదాకా సాధిస్తూనే ఉన్నారు. అట్లాంటి పరిస్ధితుల్లో పెరిగిన నాకు, అమ్మంటే అసహ్యం కాక అభిమానమూ, అనురాగమూ పుడతయ్యా?” సుచరిత నవ్వుతూనే చెప్పినా కళ్లల్లో మాత్రం ‘కసి’ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తూనే ఉంది.

“అయితే ‘మొదట్లో.  మా ‘అమ్మంటే నాకు అసహ్యం’ అని మీరిచ్చిన ‘స్టేట్మెంట్’ రాంగ్ కదూ. ఎందుకంటే మీ కళ్ళల్లో ఇంకా ‘కసి’ ఉంది” నేను నవ్వుతూనే అన్నాను. ఆ మాత్రం చనువు సుచరితతో నాకు ఉంది. “ఇప్పటికీ అసహ్యం అవునా?” కళ్ళలోకి చూస్తూ అన్నాను.

సుచరిత వాళ్లది తెనాలి. తెనాలి అంటేనే గొప్ప కళాకారులు జన్మించిన ఆంధ్రా పేరిస్. భానుమతిగారూ, రామకృష్ణగారూ, శారదగారూ, ముక్కామలగారూ ఇలా చెప్పుకొస్తే తెనాలి కళాకారులూ, నిర్మాతలూ, దర్శకుల సంఖ్య అనంతం. నాకు డబ్బింగ్ మెళకువలు నేర్పిన అన్నగారు శ్రీ రామకృష్ణగారిదీ తెనాలే.

సుచరిత వాళ్లమ్మ కల్పన.(అసలు పేరు కళ్యాణి) . కల్పనగారు సినిమాల్లో ఎంటరై రెండో సినిమాకే కళాశ్రీ అని పేరు మార్చుకుంది. (ఇది నేను పెట్టిన పేరు. ఆమె కోరికతో అసలు పేరు దాస్తున్నాను). ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల తల్లై కుటుంబాన్ని వదిలేసుకుని మద్రాసు పారిపోయి వచ్చేసింది. పెద్దకొడుకు, చిన్నకొడుకు అమ్మమ్మగారింట్లో  పెరిగితే కూతురు సుచరిత బామ్మగారింట పెరిగింది. కళాశ్రీగా పేరు మార్చుకున్న తరుణంలో పెద్దాడికి ఏడేళ్లూ, రెండో వాడికి ఆరేళ్ళు, సుచరిత నాలుగేళ్ళు. యీ వివరాలు సుచరితని కలవకముందే నాకు తెలుసు. కళాశ్రీ కూడా ‘అంబిక’ అనే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటుంది. అది నాకు తెలుసు.

నిజం చెబితే అంతే కవిగారు. ‘కసి’ ఉందీ…. లేదూ… ఒకటి నిజం. అప్పుడు ఆమె అంటే అంతులేని అసహ్యం. ఇపుడు జాలీ, కసీ ఇంకా ఏదో తెలీని మమకారం కూడా ఉందని అనుకుంటున్నాను. “సూటిగా నా కళ్లలోకి చూస్తూ అంది సుచరిత.

“ఒకే వరలో మూడు కత్తులా?” నవ్వాను.

“జాలీ మమకరం కూడా కత్తులేనా?” కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ అన్నది సుచరిత.

“ఈ  ‘అసహ్యం, కసి’ అనబడే కత్తులకంటే వెయ్యిరెట్లు పదునైన కత్తులు ‘జాలీ, మమకారం’ . ఆ విషయం ఇరవై రెండేళ్ళ వయసులో ఉన్న  నీకు ప్రస్తుతం అర్ధం కాదేమోగానీ, జీవితాన్ని ‘మనసుతో’ గమనించిన వాళ్లకి ఖచ్చితంగా అర్ధమౌతుంది.” నేనూ తన కళ్లలోకి చూస్తూనే అన్నాను.

“ఓహో అవిడా రచయిత్రేగా! అందుకే మీరు కాస్త అటుపక్క మొగ్గు చూపుతున్నారన్నమాట!” మాటల్లో తీవ్రత ఉన్నదని చెప్పక తప్పదు.

“కావచ్చు. కానీ సుచీ, ఒక్క విషయం చెప్పు. అప్పటి ‘కాలా’నికీ, ఇప్పటి ‘కాలా’నికీ, అప్పటి సామాజిక పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకి ఉన్న తేడాని బేరీజు వేశావా ఏనాడైనా? మీ అమ్మ ‘లేచి’పోయిందని జనాలు నీతో నీ చిన్నతనాన అన్న మాటలే నీలో పాతుకుపోయాయిగానీ, ఆమె నిజమైన పరిస్థితినీ, బాధనీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? కనీసం ఊహించావా?” సిన్సియర్‌గా అడిగాను.

“ఊ!” ఏ కాలమైనా ‘తల్లి’ తల్లేనండీ. తను నవమాసాలూ మోసి చావుకి తెగించి కన్న బిడ్డలని, తనే వదిలిపోయిందంటే, ఆమె తల్లి అవుతుందా? సరే.. తన పరిస్థితి భరించలేనంత దుర్భరంగా వుంటే బిడ్డల్ని కూడా తీసుకుపోవచ్చుగా తనతో? పోనీ తను కొద్దో గొప్పో సెటిల్ అయ్యాకైనా తన బిడ్డల్ని తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా?” కచ్చగా అన్నది సుచరిత.

“నీకు క్రికెట్ అంటే ఇష్టం కదూ? ప్రేక్షకురాలిగా బోలేడన్ని కామెంట్స్ ఎవరైనా ఇవ్వొచ్చు. కానీ, పిచ్‌లో నిలబడి ఆడుతున్నవాళ్లకి కదా కష్టం తెలిసేది.? కాదంటావా?”

“ఓహో … మీరు తర్కం వుపయోగిస్తున్నారన్నమాట. అయ్యా… తర్కంలో కూడా నాలుగు విభాగాలున్నాయని నాకూ తెలుసు. ఇక్కడ కావల్సింది గెలుపోటముల వ్యవహారం కాదు. మానవత్వం” సుచరిత గొంతులో కాస్త అవహేళన ఉంది.

“ప్రస్తుతం మీ నాన్నగారు మంచాన పడి వున్నారని నాకు తెలిసింది. మానవత్వం గురించి చర్చించేటప్పుడు మరి ఆయన హాస్పిటల్ ఖర్చులన్నా నువ్వు భరించాలిగా. భరించే స్థోమత నీకుండీ ఎందుకు మీ నాన్నని దూరంగా పెట్టావు?” బిలో ద బెల్ట్ ఏనాడూ దెబ్బ కొట్టకూడదని తెలిసీ కావాలనే దెబ్బ కొట్టాను.

“ఉక్రోషం ఎంత అసహ్యంగానైనా మాట్లాడిస్తుందనటానికి మీరన్న మీ మాటలే ఉదాహరణ మాస్టారూ.. నిజమే స్థోమత ఉంది. కానీ ఆయన చేసిన అన్యాయం? ఎనిమిదేళ్ళ కూతుర్నీ, అదీ తల్లి ప్రేమకి నోచుకోని దాన్ని పట్టించుకోకుండా, ఇంటీ పనిమనిషిని ఉంచుకుని, దాన్నే పెళ్ళి చేసుకుని, దాన్నే అమ్మ అని పిలవమని నా వీపు మీద వాతలు పెట్టాడన్న విషయం మీకు తెలీదు. వదిలెయ్యండి కవిగారూ.. నా గతాన్ని తలుచుకున్న కొద్దీ పగిలేవి అగ్నిపర్వతాలే!” బొటబొటా కన్నీరు కార్చింది సుచరిత.

“గుడ్! నీ కష్టాలు  నువ్వు తల్చుకోగానే పగిలేవి అగ్నిపర్వతాలు. కానీ, మీ అమ్మ కష్టాలు మాత్రం నీ దృష్టికి శీతలపవనాలుగా అనిపించి ‘కసి రేగుతుంది’ కదూ! ఇదేం న్యాయం?” నా గొంతులో మోతాదుకి మించిన వ్యంగ్యాన్ని వొలికించాను.

“అంటే మీరనేది మా అమ్మ చేసింది రైట్ అనా? “కోపంగా అన్నది.

“తల్లిదండ్రుల విషయంలో తప్పొప్పులు  ఎంచే హక్కు పిల్లలకి లేదు. ఎందుకంటే నీ పుట్టుకకు కారకులు వాళ్లు. తల్లి అండాన్ని దానం చేస్తే, తండ్రి బీజాన్ని దానం చేస్తాడు. అండము, బీజము కలిసి పిండమైతేనే నువ్వు లోకానికొచ్చింది. అయినా, నీ తండ్రికి చెయ్యగలిగీ నువ్వెందుకు సహాయం చెయ్యట్లేదో నీ నిర్ణయం. నీ తండ్రి నీకు చేసిన అపకారాన్నీ, నిన్ను పెట్టిన బాధల్నీ నువ్వు క్షమించలేవు . కానీ నీ తల్లి,  నీ తండ్రి పెట్టిన బాధల్ని మాత్రం క్షమించి ఆ నరకంలోనే ఉండుంటే నీకు చాలా తృప్తి కలిగి, మా ‘అమ్మ దేవత’ అనుండేదానివి కదూ?

అయితే అదే ప్రశ్న మళ్లీ అడగక తప్పదు. ‘ నా కూతురు దేవత’ అని ఇప్పుడు మీ నాన్నతో అనిపించుకోగలిగిన స్థితిలో ఉండీ, ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు?” యీసారి నేను నవ్విన నవ్వులోనూ వ్యంగ్యం ఉందని నాకు తెలుసు.

“శబాష్ కవిగారూ! అటు ఆవిడా ఇంకోడ్ని పెళ్ళి చేసుకుంది. ఇటు ఈయనా ఇంకోదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్లు పరిస్ధితులతో ఏనాడూ రాజీపడలేదు? వాళ్ల బుద్ధికీ, వాళ్ళ మనసుకి తోచింది చాల నిర్భయంగా నిస్సిగ్గుగా చెసేయ్యొచ్చు .  కానీ మేం మాత్రం చాలా విశాల హృదయంతో అర్ధం చేసుకుని, వాళ్ల అవసరాల్ని గమనించాలన్నామట! ఎంత ధృతరాష్ట్ర నిర్ణయం మీదీ?” వ్యంగ్యంగా నవ్వుతూ చప్పట్లు చరిచింది సుచరిత.

“ఓకే సుచీ..  నాది ధృతరాష్ట్ర నిర్ణయమే అనుకో. కాదనను. పోనీ నువ్వన్న మాటనే కాస్త వివరిస్తావా?”

“ఏ మాట?”

“మొదట్లో అసహ్యం ఉండేది. ఇప్పుడు జాలీ, కసీ కొంచెం మమకారం కూడా ఉన్నాయి. అన్న మాటని!”

“దీన్నేనా కాలుకేస్తే వేలికీ, వేలికేస్తే తలకి వెయ్యటం అంటే?  సరే.. జాలి ఎందుకంటే, ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల్ని వొదిలేసి, వేటూరిగారన్నట్టు యీ దుర్యోధన దుశ్శాసన దుర్మదాంధ ప్రపంచంలోకి ఒంటరిగా ప్రవేశించి నానా అగచాట్లు  పడినందుకు. కసి ఎందుకంటే, కేవలం స్వసుఖం, స్వార్ధం కోసం కన్నబిడ్డల్నీ, ఇంటి పరువు పతిష్టల్నీ నడిరోడ్డున వొదిలి తనతోవ తాను చూసుకొన్నందుకు. మమకారం ఎందుకంటే, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి గనక. ఆ రాస్కెల్ అదే నా తల్లి గొప్ప నటీమణి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో వొదిగిపోతుంది. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన నటీమణుల్లో ప్రధమురాలని అననుగానీ,  ప్రముఖురాలు. ఆవిడ్ని తెరమీద చూసినప్పుడల్లా ‘యీవిడా నా తల్లి!” అని ఆశ్చర్యంతో మైమరచిపోతా. హాల్లోంచి బయటికి రాగానే… “వాహ్.. అంతా నటనే!” అని జ్వలించిపోతా.  ‘తల్లిమనసు’ చిత్రంలో కూతురికి పోలియో అని తెలిశాక ఏడిస్తూ ఆవిడ నటించిన సీను చూస్తే ‘తల్లంటే అదిరా’ అని ఎవడైనా అనుకుంటాడు. అలాంటి అమ్మ ఉండాలని ప్రతివాడు ఊహించుకుంటాడు…. నేను తప్ప!! ఎందుకంటే ఆ ఏడుపు ఆ ఎక్స్‌ప్రెషన్సూ అన్నీ క్షణికాలే.. అంతా నటనే…!”కసితో పాటు అసహ్యమూ ధ్వనించింది. “అయినా .. ఇంత గొప్ప నటీమణి నా తల్లి అన్న గర్వం, మమకారం మనసులో మెదులుతాయి” అన్నది.

నేను సైలెంటైపోయాను. సుచరిత మనసులో కలిగే భావాలు నాకు తెలీకపోలేదు. కానీ నా ప్రయత్నం నేను చెయ్యక తప్పదు.

“నిజంగా సుచీ. నీ హృదయం చాలా గొప్పది. నిష్పక్షపాతం గా  మీ అమ్మగార్ని మెచ్చుకోవడం నీ నిజాయితీకీ, సంస్కారానికీ నిదర్శనం. బహుశా మీ అమ్మ నీకు ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా నీకు తన రక్తాన్నేగా ‘నటన’నీ వారసత్వంగా  ఇచ్చిందని చెప్పక తప్పదు. ‘రాలిన చివురాకు’ లోనీ నటనకి అవార్డు రావడమే నీలోని నటి ‘ప్రజ్ఞ’కి నిదర్శనం.”నిజంగానే మెచ్చుకున్నాను.

“అవును గురూజీ! ఇంతకీ నన్ను ములగచెట్టు ఎందుకెక్కిస్తున్నారు?” పరిహాసంగా అన్నది సుచరిత.

“ఒక గొప్ప నటికి మరో మహానటి మనసు అర్ధం కాదా? మీ అమ్మ ఏనాడూ గ్లిజరిన్ వాడదని అందరికీ తెలుసు. సన్నివేశంలో దిగ్గానే కన్నీళ్లు వాటంతట అవే వర్షంలా కురుస్తాయని అంటారు. నువ్వూ ‘రాలిన చివురాకు’ సినిమాలో గ్లిజరిన్ వాడలేదని నాకు తెల్సు. ఆనాడు నీ కళ్లలోంచి వచ్చినవి వెచ్చని స్వచ్ఛమైన కల్తీలేని కన్నీళ్ళే. కళ్లలోంచి నీళ్లు కురవాలంటే మనసు కరగాలి. ఆ మనసు కరగాలంటే  అది పాషాణం కాకూడదు.  చిన్న చిరుగాలికైనా స్పందించి, అటూ ఇటూ ఊగే చిగురాకు  కావాలి.  అలా చూస్తే మీరిద్దరిదీ చివురాకులాంటి స్పందించే మనసులే. పాషాణాలు కావు.” మధ్యలో మాటల్ని ఆపేశాను.

“ఎందుకు మళ్లీ  మేము తల్లీకూతుళ్లమని జ్ఞాపకం చేస్తారూ? మా ఏడుపులూ మా నవ్వులూ ఒకలాగే ఉండొచ్చు. కానీ మా అదృష్టాలూ, దురదృష్టాలూ ఒకటి కాదుగా? ఆవిడకేం? మొగుడున్నాడు. ఒకరో ఇద్దరో మాలాగా కాకుండా, ‘ప్రియమైన’  పిల్లలున్నారు.  ఆస్తి వుంది… అంతస్థూ వుంది…’  నటిగా బోలెడు మందాన పేరుంది. ఇంకేం కావాలీ        “మా గోల మాది. నా ఇద్దరు అన్నలూ ఎందుకూ  పనికిరానివాళ్లయిపోయారు. చిన్నతనం నించీ వాళ్లు పడ్డ అవమానాలు వాళ్లని గొంగళి పురుగుల్లా మార్చినై. ఎక్కడా ఉండలేరు. కనీసం ‘ఇది’ కావాలని అడగలేరు. మమ్మల్ని ఒదిలి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఒకడు ఆర్మీలో ఎక్కడో బోర్డర్లో వుంటే ఇంకోడు రైల్వే కేటరింగ్ సర్వీసులో గంటకో వూరి గాలి పీలుస్తున్నాడు. మరి మీరు మాత్రం మా అమ్మగారిని మాకేదో దగ్గర చెయ్యలనే ప్రయత్నం మాత్రం మానటంలేదు. మమ్మల్ని కలిపితే మీకొచ్చే లాభం ఏమీ లేదని నాకు తెలుసు. కానీ ఆవిడ ‘ఈగో’ సాటిస్‌ఫై అవుతుంది. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి,  నన్ను దగ్గరికి తీసుకుని,” నా తప్పేమీ లేదు బుజ్జీ, ఇది కేవలం విధి లిఖితం. లేకపోతే నీ ‘దృష్టిలోపం’ అని తనని తాను విముక్తురాలిగా చేసుకుంటుంది. మాస్టారూ, అది నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ళ తరవాత ఆమె ప్రేమ ఒద్దు. అసలావిడ ప్రసక్తే మళ్ళీ తీసుకురావొద్దు” ఖచ్చితంగా అన్నది సుచరిత.

నేను నవ్వాను.

“మీరు ఇదంతా ఊహించే వచ్చారనీ, మీరు ఊహించిన మాటల్నే నేను మాట్లాడుతున్నాననీ నవ్వొచ్చిందా మాస్టారూ? నవ్వండి. ఎందుకంటే పులి ఆకలి లేడికి నరకం. మీ రచయితలు బహుశా పులులకంటే క్రూరమైన లక్షణాలతో పుడతారేమో! మీ మీద నాకున్న గౌరవాన్ని దయచేసి అలాగే వుండనివ్వండి.  మా అమ్మకారణంగా దాన్ని మట్టిపాలు చెయ్యకండి.మరి…! “ఆగింది సుచరిత.

“సెలవు తీసుకోమంటావు అంతేగా సుచీ! సరే వెళ్ళొస్తాను. కానీ ఒక్కమాట… తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం న్యాయమే. కాదన్ను. కానీ వాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవటానికి ఓ అవకాశం ఇవ్వడం కూడా అన్యాయం కాదేమో?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

“వాళ్లు తప్పు దిద్దుకోవడానికి అవకాశమా? ఇస్తాను. మరి నా బాల్యం వాళ్లు నాకు ఇవ్వగలరా? చెప్పండి… ఇవ్వగలిగితే యీ క్షణమే మా నాన్న కుటుంబాన్ని మద్రాసు తీసుకొచ్చి నేను పోషిస్తా. ఇవ్వగలిగితే యీ క్షణమే మా అమ్మని కల్సి, ఆవిడ పిల్లల్ని నా తోబుట్టువులుగానూ, ‘ఆయన్ని’ తండ్రిగానూ  స్వీకరిస్తా. .. ఏం? నా బాల్యాన్ని మళ్ళీ వాళ్ల చేత నాకు ఇప్పిస్తారా?”

ఇసుకలో ఇంకిన నీటినీ, ‘గతపు’ నీడల్లో ఒదిగిన కాలాన్ని మళ్లీ ఎవరు వెనక్కి తేగలరు?”

“వస్తాను సుచీ.. తప్పో రైటో నాకు తెలీదుగానీ మీ అమ్మ బాధ చూడలేక వచ్చాను. కావాలనే కొన్నిసార్లు నిన్ను బాధపెట్టే మాటలూ, ఇబ్బంది పెట్టే మాటలూ అన్నాను. ఒకటి మాత్రం నిజం…! కొన్ని చెయ్యి జారిపోకముందే జాగ్రత్తపడాలి. కొందరి విషయంలో కాలాతీతం కాకముందే కనికరం చూపించాలి. సారీ.. అది నీ ఇష్టం..” నేను లేచి వచ్చేశాను.

కళాశ్రీ ఇంటికి వెళ్లలేకపోయాను. వెడితే, సుచరిత ఏమన్నదో ఆవిడకి చెప్పాలి. సుచరిత అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా కళాశ్రీ అనబడే కళ్యాణి దగ్గర జవాబులు లేవు. అంతేగాదు, ఇప్పుడు నేను వెళ్లి సుచరిత అడిగిన ప్రశ్నల గురించి చెప్పినా, సుచరిత తల్లిని యీ జన్మలో చూడటానికి ఇష్టపడటం లేదు అని చెప్పినా, కళ్యాణిని ఇంకా బాధపెట్టిన వాడినవుతాను.

‘మౌనం’ చాలా ఇబ్బందుల్ని తొలగిస్తుంది. నేను అదే పాటిస్తున్నా. నెలన్నర గడిచిందేమో. ‘రాఘవ’ కనిపించాడు. రాఘవ అంటే కళ్యాణి రెండో భర్త. తెలుగువాడే అయినా ‘రాఘవన్’ అని పరిచయం చేసుకోవడమేగాక, కావాలని తమిళ యాసలో తెలుగు మాట్లాడతాడు. “హలో సార్.. ఎట్టా వుండారూ?” తమిళ యాసతోనే అడిగాడు రాఘవ.

“బాగున్నానండీ. ఏంటి విశేషాలు.?” మామూలుగా అడిగాను. ఆయన పరిచయం వున్నా లేనట్టే లెక్క. ఒకందుకు మెచ్చుకోవాలి. కళ్యాణి నాతో మాట్లాడేటప్పుడు మధ్యలోకొచ్చేవాడు కాదు. తను నాతో కూడా ఫ్రెండ్లీగానే అన్నట్టు ‘ఉండేవాడు.’

“ఏం చెబుతాం సార్. అంతా బాగానే ఉంది. ఏదో..!” నవ్వాడు.

ఇంతకీ మేం కలిసింది పాండీ బజార్లో ‘వుడ్‌లాండ్స్’ హోటల్లో.

ఒకప్పుడు (నేను మద్రాసుకి వచ్చిన కొత్తలోకూడా) వుడ్‌లాండ్స్ కాఫీకి గొప్ప పేరు. రచయితలూ, హీరోలూ తరచుగా ఆ రోజుల్లో విజిట్ చేసే హోటళ్ళు నారాయణ కేఫూ… వుడ్‌లాండ్సూ.. ‘దాస్‌ప్రకాష్’ మరో గొప్ప హోటల్. మద్రాసు వచ్చినవాళ్లు దాస్‌ప్రకాష్‌లో తినకుండా వెళ్ళేవాళ్లు కారు. అదో ‘సింబల్’ అలాగే  బుహారీ హోటల్. అఫ్‌కోర్స్ అది మాంసాహార  ప్రియులకి.  నాలాంటి గ్రాస్‌యీటర్స్(వెజిటేరియన్స్)కి కాదు.

నేను ‘రవ్వ దోసె’ తింటుంటే ఆయన ‘మసాలా దోసె’ తింటున్నారు. కాఫీ తాగాక బయటికొచ్చాం. ఆయన ‘కారు’ ఎక్కి వెళ్లిపోయేదాకా ఉండి నేను పానగల్ పార్కులో ‘ఘంటసాల’గారి బెంచీ మీద సెటిలయ్యాను.

పాండీ బజార్ పానగల్ పార్కుకీ, తెలుగువారికీ ఎంత అవినాభావ సంబంధమో.. ఘంటసాల, సముద్రాల, మల్లాదిగారు, కృష్ణశాస్త్రిగారు, ఆరుద్ర, ఇంకా పింగళి నాగేంద్రరావుగారు వీరంతా పానగల్ పార్కులో కూర్చొని మాటలకీ, పాటకీ ‘సొబగులు’ దిద్దినవారే. అద్దినవారే.. సరే.. మరోసారి విపులంగా చెప్పుకుందాం.

బెంచి మీద కూర్చొని  ‘పోయిన మంచోళ్ల’ నీ తల్చుకుంటున్నా. “గురూగారు, రాఘవ మీకు బాగా తెలుసా?” కొంచెం అనవసరపు కుతూహలం   ప్రకటిస్తూ  అడిగాడు ‘చతుర్ బాబు’. అతనో ఘోస్టు రైటరు. అంతే కాదు చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడు. ఎక్కువగా ‘డైలాగ్’లేని శివుడి వేషాలకి ఆయన్ని పిల్చేవాళ్లు.

“తెలుసు” ముక్తసరిగా అన్నాను.

“మహాగట్టోడు” పకపకా నవ్వాడు చతుర్‌బాబు. పేరులో ‘బాబు’ అని గానీ, వయసు ఏభై దాటి వుంటూంది. నేను మాట్లాడలా.

“ఎందుకని అడగరేం? ఆయనది మా ప్రకాశం జిల్లానే. ఊళ్ళో పెళ్లాం పిల్లలూ వున్నారు. వాళ్లని పోషించాలంటే అక్కడ బేలన్స్ నిల్లు. మొత్తానికి కళ్యాణిని  పట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. వాళ్లమ్మాయి పెళ్ళి జరిగింది ఆర్నెల్ల క్రితమే కదా..  పైకేమో విడాకులు. మరి పెళ్లిలో ‘కన్యాదానం’ ఎట్టా చేశాడూ?” లాపాయింటు లాగాడు చతుర్.

ఈ చలన చిత్ర పరిశ్రమలో ఎవరైతో ఏం మాట్లాడినా కష్టమే. వచ్చేది మాత్రం మీరు మాట్లాడని విషయమే. నా అదృష్టం బాగుండి ఆ రోజున నా ఫ్రెండ్ శ్రీవిలాస్ నావైపుకి వస్తూ కనిపించారు. ఆయన సూరి భగవంతంగారికి అతి దగ్గరి చుట్టమేగాక మంచి స్నెహితుడు. దాంతో చతుర్‌బాబుగారి ‘సంభాషణకి’ బ్రేక్ పడింది. అయితే రాఘవ కూతురి పెళ్లి  జరగటం, ఆ పిల్లకి రాఘవ కన్యాదానం చెయ్యడం నాకు కొత్తగా తెలిసింది.

ఎందుకో ‘సుచరిత’ గుర్తుకొచ్చి అప్రయత్నంగా (అనొచ్చా) ఓ నిట్టూర్పు వెలువడింది. ప్రస్తుతం సుచరిత అప్‌కమింగ్ నటి. నిజం చెబితే చాలా ‘మంచి’ నటి. మరి ఆమె పెళ్ళికి ఎవరు కన్యాదానానికి కూర్చుంటారు? ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న.

సమాధానం తేలిగ్గానే దొరికింది. రెండు నెలల తర్వాత. ‘సుచరిత’కి కాన్సర్‌ట. డ్రైవర్ కొసం వెయిట్ చెయ్యకుండా ప్రొ.. CMK రెడ్డి FRCS FRST (etc etc etc) గారి  వోల్‌స్టెడ్ సర్జికల్ హాస్పిటల్‌కి డ్రైవ్ చేస్తూ వెళ్లాను. సుచరిత జుట్టు పూర్తిగా ఊడిపోయింది. ఓ.. గాడ్…!!

“ఎంతో కాలం బతకనని నాకు తెలుసు అంకుల్.. అయినా అమ్మని రమ్మని పిలవలేను. ఎందుకంటే నన్నిలా చూస్తే తన గుండె పగులుతుందేమో! వద్దు. ఒక్క విషయం నిజం అంకుల్.. ఐ లవ్ హర్.. ఐ హేట్ హర్ (I love her.. I hate her) ఒక్క రిక్వెస్టు..  నేను చనిపోతే మాత్రం మా ఇద్దరన్నలకి ‘మాత్రమే’ ఇన్ఫామ్  చెయ్యండి. వాళ్లు రాకపోతే…..” సైలెంటైపోయింది.

భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..

 

మీ భువనచంద్ర

 

ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

bhuvanachandra

Untold Stories 

ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో, సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. “సార్.. సిగ్నల్ దాటాక ఓ క్షణం ఆపుతారా?” పేవ్‌మెంట్ మీదనించి తెలుగులో అరిచాడు. ఆయన్ని చూస్తే చాలా వృద్ధుడు. ముఖంలో కొద్దోగొప్పో ‘అలిసిపోయిన వర్ఛస్సు’ మిగిలుంది.

సిగ్నల్స్ క్రాస్ చేశాక ఆపాను.

“థాంక్స్ సార్..” మిమ్మల్నేదీ  యాచించటానికి రాలేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నా వయసులో ఉన్నవాడూ, ఇలా మురికి బట్టలు వేసుకున్నవాడూ ఎవరు కారుని ఆపినా, అడుక్కోవటానికే అనుకుంటారు…” చిన్నగా నవ్వి అన్నాడు.

“చెప్పండి.” అన్నాను.  ఇంకేమనాలో తెలియక.

“మీరు నాకు తెలుసు. చాలా సినిమాల్లో ‘గుంపులో గోవిందం’ వేషాలు వేశాను. అయితే ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఏక్ ఫిలిం హీరోని. ఏక్ దిన్ కా సుల్తాన్‌లాగా..! మళ్లీ మందహాసం.

“చెప్పండి..!” అన్నాను.

మద్రాసు ఎండలకి ప్రసిద్ధి. అయితే ఆ ఎండ మంచిదే. చెమట పడుతుంది. స్నానం చేశాక వొళ్లు హాయిగా తేలిగ్గా వుంటుంది. సాయంత్రం నాలుక్కల్లా సముద్రపు గాలి వీస్తుంది. కొంచెం జిడ్డుగా. కొంచెం చల్లగా. ఏమైనా మద్రాసు ప్రత్యేకత మద్రాసుదే.

“రామకృష్ణగారు (త్వరలో ఆయన ఫోటో, సెల్ నంబర్‌తో సహా పరిచయం చెయ్యబోతున్నాను.) మీ గురించి చెప్పారు. నెలనెలా మీరు రాస్తున్న ‘అన్‌టోల్డ్ స్టోరీస్’ గురించి కూడా చెప్పారు. నాకో చిన్న ఆశ. నా కథ కూడా మీరు రాస్తారని. ఎందుకంటే…” సందేహించాడు.

“సందేహం వద్దు. ఎందుకూ?” అన్నాను.

“అమెరికాలో వున్న నా పిల్లలెవరన్నా చదివి మళ్లీ నన్ను కలిసే ప్రయత్నం చేస్తారని..” కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు”

“రేపు మీరు మా యింటికి రాగలరా?” నా ‘కార్డ్’ ఇస్తూ అన్నాను.

“తప్పకుండా. అంతకంటేనా..” ఆనందంగా అన్నాడూ.

ఓ పది నిమిషాల తరవాత జ్ఞాపకం వచ్చింది. ఆయన తన పేరు చెప్పలేదనీ… నేను అడగలేదనీ..

 

***

 

“నా అసలు పేరు ‘ఫలానా’. అయి తే దయచేసి నా కథని పేరు మార్చి రాయండి. ఆ పేరు కూడా నేనే చెబుతాను.. ‘యాదయ్య’. ” అన్నాడు. “అసలు పేరు రాయకపోతే మీ పిల్లలు ఎలా గుర్తుపడతారూ? అయినా మీ పిల్లలు ‘సారంగ’ పత్రికని చదువుతారని గ్యారంటీ లేదుగా. ఒక పని చెయ్యండి. మీ పిల్లల పేర్లు. వాళ్లు ఏం చేస్తున్నారో  చెబితే అమెరికాలో వున్న నా ఫ్రెండ్స్‌కి చెబుతా. తోటకూర ప్రసాద్‌గారికీ, వంగూరి చిట్టెన్ రాజుగారికీ, కిరణ్ ప్రభ గారికీ, కల్పన, అఫ్సర్‌గార్లకీ చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది..” అన్నాను.

అతను గాఢంగా నిట్టూర్చాడు. “వాళ్లకి నేనంటే అసహ్యం. అలా నన్ను అసహ్యించుకోవడానికి వాళ్ల కారణాలు వాళ్ళకున్నాయి. వాళ్లకి తెలీంది ఒకటే. నా జీవితం గురించి. అది చదివితే కొంత అర్ధం  చేసుకుంటారని నా ఆశ…”

“సరే. మీరన్నట్టుగానే చేద్దాం. చెప్పండి.” అన్నాను.

“మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు. ఆ వూరికంతటికీ సంపన్న కుటుంబం మాదే. నేను చదివింది గుంటూరు AC కాలేజీలో . మా వూల్లో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. మావాళ్లకి నేనంటే ప్రాణం. ఎంత అడిగితే అంతా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో “గోల్డ్ ఫ్లేకు టీన్ను”లు కొని స్టైల్ మెయిన్‌టైన్ చేసినవాన్ని నేనే. ఇంకో విషయం.. కొంగర జగ్గయ్యగారూ, గుమ్మడిగారూ, వాళ్లంతా నాకు అప్పట్నించే  పరిచయం..” నిట్టూర్చాడు.

కష్టపడి పైకొచ్చినవాళ్లకి తన మీద తనకి విపరీతమైన నమ్మకమూ, ధైర్యమూ వుంటాయి. పైనించి కిందకి దిగినవాడికి ‘ఆత్మన్యూనత, తన మీద తనకి జాలి ‘డెవలప్’ అవుతాయి.  “తర్వాత?”

“ఇప్పుడిలా వున్నాగానీ నేను చాలా అందంగా  వుండేవాన్ని. దాంతో సహజంగానే సినిమా ఫీల్డువైపు అడుగులు   పడ్డాయి. “కళ్లు మెరుస్తుండగా” అన్నాడు.

“ఊ !”

“మైలాపూర్‌లో ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాను. మాక్జిమమ్ ఫర్నీచర్, అలంకార సామగ్రి, అంతా స్పెన్సర్స్ నించే. అప్పట్లోనే “బ్యూక్” కారు కొన్నాను. పాండీ బజార్లో కారు పార్కు చేసి అటుపక్కన CSRగారు నిలబడి వుంటే, ఇటు పక్క నా బ్యూక్‌ని పార్క్ చేసి నేను నిలబడి వుండేవాడిని. అయ్యా.. ఆ రోజులు వేరు,  నిర్మాతలూ, దర్శకులూ బాగా చదువుకున్నవారూ, “సినిమా” మీద ప్రేమతో వచ్చినవారు. ప్రొడ్యూసరు  కృష్ణాజిల్లావాడే.  మాకు తెలిసినవాడే.  కాస్త దూరపు బంధువు కూడానూ..” మళ్లీ నిట్టూర్చాడు.

కన్నీళ్లు ఆవిరైనప్పుడు  వచ్చేవే ‘నిట్టూర్పులు’. కళ్లల్లో ఇంకా కన్నీరు మిగల్లేదన్నమాట. గుండెల్లో  ఉండే బాధే..  ‘నిట్టూర్పుల సెగల’ రూపంలో బయటికొస్తుందేమో!

“తర్వాత?” అడిగాను.

“పిక్చర్ మొదలైంది. హీరోయిన్ తమిళమ్మాయి. చాలా అందగత్తె. ఓ వారం షూటింగ్ జరిగాక మా నాన్నగారు సీరియస్ అని నాకు ‘టెలిగ్రాం’ వచ్చింది. రాత్రికి రాత్రే కార్లో బయలుదేరాను. ‘తడ’ దాటాక యాక్సిడెంటైంది. డ్రైవర్‌కి బాగా దెబ్బలు తగిలాయి. నా కాలు విరిగింది. స్పృహ వచ్చి మళ్లీ ఊరికి బయలుదేరడానికి రెండు రోజులు పట్టింది. కాలికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నారు. సిమెంటు కట్టు కట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నాన్న పరిస్థితి క్షీణించింది. “బాబూ .. చచ్చి మళ్ళీ నీ కడుపున పుట్టాలనుంది. పెళ్లి చేసుకోవా?” అని బ్రతిమిలాడాడు. బంధువులు కూడా తండ్రి కోర్కె తీర్చమని పట్టు బట్టారు. మూడు రోజుల్లో ముహూర్తం చూశారు. సిమెంటు కట్టుతోనే పెళ్లి పీటలమీద కూర్చున్నాను. ఆయన కళ్లు ఎటో చూస్తున్నాయి శూన్యంగా. బహుశా ‘మాసిపోయిన’ గతంలోకి చూస్తూ వుండొచ్చు.

“ఆ రోజుల్లో ఫలానా పిల్ల అని చెప్పడానికే కాని, పెళ్లి చూపులూ, ఫోటోలు ఉండేవి కావు. నా విషయంలో నేను అదృష్టవంతుడ్నే. పిల్ల నాకు తెలిసిన పిల్లే. ఆ రోజుల్లోనే సెకెండ్ ఫాం చదివింది. ఆడపిల్లలకది గొప్ప చదువే. అదీ వ్యవసాయదారుల కుటుంబాల్లో…!”

“ఊ..!”

“వాళ్ళు   పెద్దగా ‘వున్నవాళ్లు’ కాదు గానీ, మంచి కుటుంబం. పెళ్లి అయినాక నెలన్నర మా వూళ్ళోనే వుండాల్సొచ్చింది.  మద్రాసు వచ్చి నా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదుగా. యవ్వనం ఎలాంటిదంటే సిమెంటు కట్టు కాపురానికి అంతగా అడ్డురాలేదు. ఆ తర్వాత డాక్టర్‌కి చూపిస్తే మరో నెలన్నర రెస్టు తీసుకుని తీరాలన్నాడు. నా కథని చెబుతూ విసిగిస్తున్నానేమో” అడిగాడు.

నిజమే,  ప్రతీ వ్యక్తికీ తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన చాలా ముఖ్యమైనదిగా, చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఇతరుల జీవితాల్లోనూ అలాంటివే ఉంటాయనీ, వాటిని ‘అంతగా’ వివరించక్కర్లేదని అనుకోరు.

వయసైన వాళ్లైతే మరీనూ, అందుకే ఇంట్లో వున్న వయసైన వాళ్లని పిల్లలు విసుక్కునేది. క్లుప్తంగా, చెప్పాల్సినంత వరకూ చెబితే గొడవుండదుగా.

అయితే నా పాత్ర వేరూ. ‘కొంచెం’ ‘క్లుప్తంగా’ ‘చెప్పండి’ అనడానికి వీల్లేదు. అలా అంటే ఆయన చిన్నబుచ్చుకుని చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్ని చెప్పలేకపోవచ్చు.

“లేదు లేదు.. చాలా ఇంట్రెస్టింగా ఉంది. చెప్పండి..!” అన్నాను.

“ఏతావాతా మూడు నెలలు మావూళ్లోనే వున్నాను. దాంతో నా భార్య సరోజకి నెల కూడా తప్పింది. మళ్లీ మద్రాసొచ్చాను. అందరూ మహదానందంగా ఆహ్వానించారు. షూటింగ్ మొదలైన వారం రోజుల తరవాత మా నాన్న పోయారని ‘తెలిగ్రాం వచ్చింది”

మరో నిట్టూర్పు. ఇది ‘జ్ఞాపకాల సమాధి’ ని తవ్వి తీస్తున్న నిట్టూర్పు.

మళ్ళీ వూరెళ్ళాను. దినకర్మలు పూర్తిచేసి తిరిగి వచ్చేసరికి పదిహేను రోజులైంది. మళ్ళీ షూటింగ్ మొదలైన రెండు రోజులకి నిర్మాత బాత్‌రూంలో కాలుజారి పడ్డాడు. కాలు బెణికిందిగానీ ‘తుంటి’ భాగం బాగా రప్చరైంది. మద్రాసు సెంట్రల్ దగ్గరున్న G.H. (జనరల్ హాస్పిటల్) డాక్టర్లు   కనీసం మూడు నెలల రెస్ట్ ఇవ్వమన్నారు. మళ్లీ షూటింగ్ ఆగింది..!”

“ఊ”

“ఇన్నిసార్లు షూటింగ్ ఆగటంతో నాకు ‘అన్‌లక్కీ’ అన్న పేరొచ్చింది. పేరొచ్చింది అనడం కంటే అలా కొంతమంది నన్ను ప్రొజక్ట్ చేశారనడం సబబు. సంసారం ‘రుచి’ మరిగినవాడ్ని. హీరోయిన్ కూడా క్లోజ్‌గా మూవ్ కావడంతో ‘కాస్త’ దారి తప్పాను. నాకేం తెలుసు, నటీమణుల(కొందరి) కళ్లు మనమీద కన్నా మన పర్సు మీదే వుంటాయనీ. వ్యవసాయం మూలబడటంతో ( మా నాన్న మృతివల్ల) నాకు ఇంటినుంచి వచ్చే రాబడి తగ్గింది. నెలకీ, రెణ్నెల్లకీ ఊరు పోవడం ఎకరమో, రెండెకరాలో అమ్మడం మామూలైంది. నా భార్య అడ్డుపడ్డా లాభం లేకపోయింది. ఆ నటీమణి మత్తులో నేను పూర్తిగా కూరుకుపోయానని అప్పుడు నాకే తెలీదు. నా పిక్చర్ రిలీజైతే నంబర్ వన్ నేనే అవుతాననీ, కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదిస్తానని నా నమ్మకం.: మళ్లీ మరో నిట్టూర్పు.

“మరి…”అడగాల్సింది అడగలేక ఊరుకున్నాను.

“మీరు అడగబోయి ఆగిన ప్రశ్న నాకు అర్ధమైంది.. ఎవరూ’సుద్దులు’ చెప్పలేదా? అని కదూ? చెప్పారు.. జగ్గయ్యగారు చెప్పారు. యీ సినీ పరిశ్రమలో సత్‌ప్రవర్తన ముఖ్యమనీ, దానికి చాలా విలువుందనీ.. వింటేనా? మూడు నెలలు గడిచాక డైరెక్టర్ భార్య చనిపోయింది. దాంతో మళ్లీ కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. నా ఫేట్ ఏమోగానీ మళ్లీ షూటింగ్ మొదలు కాకముందే ప్రొడ్యూసర్ ‘హరీ’ అన్నాడు. దాంతో నాది ‘ఇనపపాదం’ అన్నారు. పిక్చర్ ఆగిపోయింది. ఓ ఆవేశం, పట్టుదలతో నేనే మిగిలిన పరికరాల్నీ కారు చౌకగా అమ్మి సినిమా పూర్తి చేద్దామనుకున్నా. నాకూ, మా అవిడకీ గొడవలు జరిగాయి. అయినా ఆస్తి అమ్మి మద్రాసు వచ్చి షూటింగ్ మొదలెట్టించా. చనిపోయిన ప్రొడ్యూసర్ కొడుక్కి అప్పటిదాకా అయిన ఖర్చుని ముట్టజెప్పి సినిమాకి నేనే ప్రొడ్యూసర్‌నయ్యా.  డైరెక్టర్ నాకు సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలియదని తెలుసుకుని సినిమాని చుట్టేశాడు గానీ, ఖర్చుల చిట్టా మాత్రం భారీగా నాకు చూపించాడు. సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒకరు ‘పైసా’ ఇవ్వకుండా రిలీజ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. మొదటి షో, అంటే మార్నింగ్ ‘షో’లోనే అది ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, నా అందం మాత్రం ప్రజల్ని ఆకర్షించిందనే చెప్పాలి.” మరో నిట్టూర్పు.

మొహంజొదారో, హరప్పాల్ని తవ్వినప్పుడు ఏం బయట పడ్డాయి? కుండపెంకులు, ఇటికలూ, ఎముకలూ, పుర్రెలూ అంతేనా?

అతని నిట్టూర్పుల్లో నాకు కనిపించినవీ అంతే.. జ్ఞాపకాల రూపంలో..

“సినీపరిశ్రమ ఓ గొప్ప ఊబి. ఇందులో దిగకూడదు. దిగాక బయటికి రావడం బ్రహ్మతరం కాదు. నా ఫెయిల్యూర్‌ని జీర్ణించుకోలేకపోయాను. అప్పటివరకు నా గోల్డ్ ఫ్లేక్ టిన్నుల్లోంచి చనువుగా సిగరెట్లు తీసుకుని తాగినవాళ్లు, నేను వాళ్ల ‘స్నేహితుడ’నని గొప్పగా చెప్పుకున్నవాళ్లు మొహం చాటేశారు. ఆస్తి పోయిందని (ఖర్చయిందని) తెలిశాక నా ‘హీరోయిన్’ ఇంట్లో వుండి కూడా ‘లేనని’ చెప్పించింది. తరవాత మరో ‘అప్‌కమింగ్’ హీరోకి ‘భార్య’గా సెటిల్ అయింది”అక్కడి దాకా చెప్పి ఆగాడు.

“నేను మళ్లీ పంతంతో మరో పిక్చర్‌లో నా ‘వర్త్‌’ ని నిరూపించుకోవాలనుకున్నాను. నా భార్యా, వాళ్ల తల్లిదండ్రులకి ఏకైక సంతానం. ఓ ఏడాది అత్తారింట్లోనే ఉండి, వాళ్లకి బాగా ‘నూరి పోసి’ అస్తిని అమ్మించి సినిమా మొదలెట్టాను. నా భార్య మొదటి కాన్పులో మగపిల్లాడ్ని, రెండో కాంపులో ఆడపిల్లని ప్రసవించింది గానీ నేను మాత్రం ‘సక్సెస్’ని సాధించలేకపోయాను. నానా కారణాల వల్ల నేను మొదలెట్టిన సినిమా ఆగిపోయింది. మూడేళ్లు గడిచాయి. నాకు మరో కొడుకు పుట్టాడు. ఓ నిజం చెప్పాలి. నేను నా భార్య దగ్గరికి వెళ్లానే గానీ ఏనాడూ నా భార్యని మద్రాస్‌కి తీసుకురాలేదు. జనందృష్టి లో నేను బ్రహ్మచారినే. పెళ్ళాయినవాడంటే ‘గ్లామర్’ పోతుందని పెళ్ళయిన విషయం ‘లీక్’ కానివ్వలా!” మరో దీర్ఘ  నిట్టూర్పు .

జ్ఞాపకాల శవాలు కాలిన వాసనుంది అందులో.

నేను ఏమీ మాట్లాడలా. గుర్తు తెచ్చుకుంటాడని మౌనంగా ఉండలేదు. మర్చిపోలేరుగా మనుషులు అడగటాన్ని.

“అప్పులు పెరిగినై. ఊళ్ళో ఇల్లూ అమ్మేశా. అప్పుడు నా భార్య ఆన్నది. నీకోసం నీ బిడ్డల్ని నాశనం చెయ్యలేనని”..దాంతో నాకు కోపం వచ్చింది. పొమ్మన్నా. వెళ్ళిపోయింది. చాలాసార్లు కలుద్దామనిపించేది. బిడ్డల్ని చూసుకోవాలనిపించేది. కానీ ఆమె అడ్డువచ్చేది!” ఈ నిట్టూర్పులో మమకారం తప్ప అహంకారం కనపడలేదు.

నా భార్య వాళ్ల మేనమామల దగ్గరకి (బోంబే) వెళ్లిపోయింది. రెండుసార్లు నా పిల్లల గురించి ఎంక్వైర్ చేశా. వాళ్లకి ఏం చెప్పారో ఏమో నా పేరు వినగానే, ‘డోంట్ టాక్ అబౌట్ హిం’ అన్నారుట.” మరో నిట్టూర్పు.

ప్రతి వ్యక్తి తన ‘తప్పుని’ సమర్ధించుకుంటాడు. యీయన ఆ ప్రిన్సిపుల్‌కి అతీతుడు కాడనిపించింది. “కేవలం ఆస్తి పాడు చేసినందువల్లే మీ పిల్లలు మీకు దూరమయ్యారా?” అని అడిగాను.

మా ఇద్దరి మధ్యా ‘నిశ్శబ్దం’ చాలా సేపు రాజ్యమేలింది. “నేను మరో తప్పు చేశా. అది ‘తాగుడు.’ నా పరాజయాన్ని జీర్ణించుకోలేక తాగుడు  మొదలెట్టా.. బానిసనయ్యాను. రెండో సినిమా కోసం బంగళా అమ్మేశా. టి.నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న గుడిసెల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా భార్యతో పోట్లాట జరగటం. ఆ కచ్చలో మరో ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీయడం జరిగింది” తలొంచుకున్నాడు.

“మీరు గ్రాడ్యుయేట్ కదా.. కనీసం ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా?” అడిగాను.

“యీ ఫీల్డు సంగతి మీకు తెలీనిది ఏముందీ? మీరు మెకానికల్ ఇంజనీరని నాకు తెల్సు. ఇపుడు మీరీ ప్రొఫెషన్ని వదిలి మళ్లీ స్పేనర్ పట్టుకోగలరా?” ఆయన మాటల్లో కొంచెం కోపం. నాకు నవ్వొచ్చింది.

“అయ్యా,  అదృష్టవశాత్తు నేను నిలదొక్కుకున్నా గనక యీ ఫీల్డులోనే వున్నాను. మీరనుకున్నట్టు నాకు ఇంకా పేరు రావాలనీ, ఇంకా డబ్బు సంపాదించి అస్తులు కూడబెట్టాలనీ ఏనాడూ లేదు. అందుకే పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినా నేను ఇక్కడే ఉండిపోయా. నాకొచ్చే పాటలు చాలు. తీసికెళ్లలేనివి పోగు చెయ్యటం ఎందుకు?When  you can’t carry .. why should you collect?”  ఇదే నా ప్రిన్స్‌పుల్. మా నాన్నగారు నాకు నేర్పింది ఇదే.. యీ క్షణంలో కూడా ‘రెంచి్’ పట్టుకోవడానికి నేను సిద్ధమే?” అన్నాను.

“అది మీ స్వభావం. చిన్నతనం నించీ స్వేచ్చగా  పెరగటం వల్ల ఎవరి కిందో పని చెయ్యడం నామొషీ అనిపించి ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదు” నిర్లిప్తంగా అన్నాడు.

“సరే.. తరవాత ఏమైంది?”

“ఎక్‌స్ట్రాగా మిగిలా. తాగుడువల్ల అందం పోయింది. ఆరోగ్యం పాడు అయింది. నిజం చెప్పాలంటే ఏ ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీశానో ఆవిడే మూడునెళ్ల క్రితం వరకూ నన్ను పోషించింది. మూణ్నెల్లక్రితం చచ్చిపోయింది..” మరో సుదీర్ఘ నిట్టూర్పు.

“యాదయ్య అనే పేరు పెట్టమన్నారు. ఆ పేరు మీ వాళ్లకి తెలుసా?”

“పిల్లలు చిన్నప్పుడు నన్ను యాదూ, యాదయ్యా, యాదీ అంటూ  పిలిచేవారు. అందుకే ఆ పేరు పెట్టమన్నాను.”

“సరే. నిజం చెబితే ఇది పత్రికకి ఎక్కాల్సిన కథ కానే కాదు. కానీ పంపుతా. దేనికంటే కొందరైనా మీలాగా కాకుండా ‘బాధ్యతల్ని’ తెలుసుకొంటారని. అయ్యా.. మీరేమీ అనుకోకండి. మీలో నాకు కనిపిస్తున్నది పచ్చి స్వార్ధం. దానితో మీ పెద్దల ప్రేమని గానీ, మీ భార్యాపిల్లల బాగోగులు గానీ, వృద్ధులైన మీ అత్తామామల మంచి చెడ్డల్ని గానీ చూడకుండా మీ కీర్తి కండూతి కోసం సర్వాన్ని నాశనం చేశారు.  మిమ్మల్ని విమర్శించే హక్కు నాకు లేదు. కనీసం అంత చదువు చదివి ఓ చిన్న ఉద్యోగం చేసినా ఎంతో బాగుండేది. అల్లా చెయ్యకపోగా మళ్లీ ఓ స్త్రీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా మీ ప్రయత్నం  పిల్లల్ని మంచి చేసుకుని వారి మీద ఆధారపడాలనే గానీ వారి మీద ప్రేమవల్ల కాదు. అవునా?” సూటిగా అడిగాను.

మామూలుగా అయితే అతనెవరో ? నేనెవరో? కానీ అతనడిగింది ఆయన కథ వ్రాయమని. అందువల్లే అలా మాట్లాడాను.

విన్నాక నాకు అనిపించింది ఒకటే. మనిషి ‘ఇంత’ స్వార్ధపరుడుగా కూడా ఉంటాడా అని. కళ్లెదురుగానే ఉన్నాడుగా.

“నే తెలిసి ఏ తప్పూ చేయ్యలేదు. పరిస్థితులవల్లే ఇలా అయ్యాను” రోషంగా అని లేచాడు.

“తప్పుని పక్కవాళ్ల మీద తొయ్యడమో, పరిస్థితులను అడ్డుపెట్టుకోవడమో మీ అంత చదువుకున్నవాళ్లు చెయ్యాల్సిన పని కాదు. నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి. అయితే మీ కథని మాత్రం రాసి పంపుతాను. మీ పిల్లలు దాన్ని చదివి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది మీ అదృష్టం.” నేనూ లేచాను.

అయ్యా.. ఇదీ సంగతి. ఇతని జీవితంలోంచి నేర్చుకోవల్సింది చాలా వుంది. కనీసం మనిషి ‘ఎలా వుండకూడదో’ తెలుస్తుందిగా. ‘బాధ్యతా రాహిత్యానికి’ ఇతనో లైవ్ ఎగ్జాంపుల్. నేను చెప్పగలిగింది ఇంతే..

 

మళ్లీ కలుద్దాం.

నమస్సులతో

భువనచంద్ర

“ సబర్మతి “

 Untold Stories  – 5

నా పై దుష్ప్రచారం చేస్తున్నారు : కనక

దేవదాస్ నా అస్తిని అపహరించాలని చూస్తున్నాడు.

తమిళసినిమా, న్యూస్‌లైన్: నటి కనక గురించి రెండు మూడు రోజులుగా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె కాన్సర్ వ్యాధితో అనాధలా కేరళలోని అలంపుళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఒక ప్రముఖ నిర్మాత ఆమెని గుర్తించి మెరుగైన వైద్యం చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ నటి కనక మంగళవారం చెన్నై ఆళ్వార్‌పెటలోని  తన స్వగృహం లో విలేకరులతో మాట్లాడారు. తాను కేరళ ఆలంపుళలోని ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా వదంతి అని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇలాంటి దుష్ప్రచారాలను తన తండ్రిగా చెప్పుకునే దేవదాస్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తిని అపహరించడానికి అతను కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. తాను అతన్ని ఎట్టి పరిస్థితులలోను తన ఇంటికి రానీయనని స్పష్టం చేసారు. దేవదాస్ తన తల్లికి మంచి భర్తగా ప్రవర్తించలేదని, తనకు ఏనాడూ మంచి తండ్రిగా నడుచుకోలేదని దుయ్యబట్టారు. అతను ధనాశపరుడని పేర్కొన్నారు. అతని ప్రవర్తన కారణంగానే మగాళ్లంటే తనకు ద్వేషం కలిగిందని, అందువలనే వివాహం కూడా చేసుకోకుండా ఒంటరిగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. దేవదాస్ తన తల్లికి చేసిన ద్రోహాన్ని తాను మరచిపోలేనని అన్నారు. కాగా నటి కనక కన్నుమూసినట్లు మంగళవారం కొన్ని టీవీ చానళ్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆమెకు పలువురు ఫోన్ చేసి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారట. వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు కనక పేర్కొన్నారు.

 

bhuvanachandraమొన్నటి పేపర్లో అలనాటి నటీమణి ‘దేవిక’ కుమార్తె ‘కనక’ కేరళలోని ఒక హాస్పిటల్ వరండాలో దిక్కులేకుండా పడి వుంటే ఓ చిత్రప్రముఖుడు చూసి గుర్తించాడనీ, ఆమెకి మెరుగైన ‘వైద్యం’ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనీ వార్త చదివాను. ఆమెకి ‘కేన్సర్’ అని రాసారు. ఆ వార్త చదవగానే మనసంతా మూగబోయింది.

కనకతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా అమె  తెలుగులో మొదటిసారి నటించిన ‘వాలుజడ – తోలుబెల్టు’ సినిమాకి అన్ని పాటలు నేనే రాసాను. చక్కని తెలుగు మాట్లాడుతుంది. హాయిగా నవ్వుతుంది. చిన్నతనంలో ‘దేవిక’ సినిమాలో చూసి వదిన అంటే ఇలా  ఉండాలని తీర్మానించుకున్న వాళ్లల్లో నేనూ ఒకడ్ని. ఆ వార్త చదవగానే అర్జంటుగా కనక గురించిన వివరాలు సేకరించి వెళ్లి చూడాలని అనిపించింది..  చేతనైనది ఎలాగూ చేస్తా గదా.

ఇవ్వాళ మరో వార్త. కనకే ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చింది అవన్నీ వొట్టి పుకార్లనీ, తాను మద్రాసులో క్షేమంగా వున్నాననీ, తన తండ్రి ఆస్థి కోసం ఆడుతున్న డ్రామాలో ఆ పుకార్లు ఒక భాగమనీ చెప్పింది. మనసు కుదుటపడినా బాధ తగ్గలేదు.

అలనాటి అందాలనటి కాంచనా అంతే. కన్నవాళ్ల దురన్యాయానికి బలైంది. చివరికి ఆస్థి దక్కినా, ఆ ఆస్థి మొత్తాన్నీ (కోట్లలోనే) తిరుపతి వేంకటేశ్వరస్వామికి అర్పించి, ఓ  ఆలయంలో నిర్మలంగా, ప్రశాంతంగా ప్రస్తుతం కాలం గడుపుతోంది.

అసలు ‘సినిమా’ వాళ్లకెందుకీ సమస్యలూ? ఇతర్లకి రావా అంటే వస్తాయి. కానీ సినిమా వాళ్లకి ఎక్కువ. శరీరంలో శక్తి ఉన్నంత కాలం, డబ్బు సంపాయించినంత కాలం, జనాలూ, బంధువులూ, స్నేహితులూ చుట్టూ ఉంటారు. అదో ‘రక్షణ’ కవచం అన్నట్టు భావింపజేస్తారు. ఎప్పుడైతే శక్తి ‘ఉడిగి’ పోతుందో ఆ క్షణమే యీ రక్షణ కవచం కాయితం మేడలా కుప్పకూలిపోతుంది. నిజం చెబితే కాయితాలు గాలికి ఎగిరిపోయినట్టు చుట్టాలూ, పక్కాలూ, స్నేహితులూ అందరూ క్షణాల్లో ఎగిరిపోతారు. మిగిలేది మనిషి – మనసూ – ఒంటరితనం.

“లెక్కకు మించి దానం చెయ్యకు. అపాత్ర దానం అసలే చెయ్యకు. అన్ని ధర్మాల కంటే గొప్పదీ ‘స్వధర్మం’.  కలిమిలో నీ తోడుండేవాడు ఎవడూ కష్టాల్లో నీ తోడుండడు …” ఈ మాటలు చెప్పింది సాక్షాత్తు పద్మశ్రీ చిత్తూరు నాగయ్యగారు. అంత ఘోరంగా ఆయన చివరి రోజులు గడిచాయి. మన మహానటులు అయిదువందల రూపాయలు పారితోషికం తీసుకునే రోజుల్లో ఆయన సినిమాకి ‘లక్ష’ తీసుకున్నారు. గజారోహణాలు, కనకాభిషేకాలూ లాంటి సత్కారాలు ఎన్నో అందుకున్నారు. చివరికి ‘గుంపులో గోవింద’లాగా ఒక్క డైలాగ్ కూడా లేని వేషాలు వేయ్యాల్సొచ్చింది. ‘ఇచ్చింది’ మాట్లాడకుండా పుచ్చుకోవాల్సి వచ్చింది. అందుకే దీన్ని ‘చిత్ర పరిశ్రమ’ అంటారేమో! ఓ కస్తూరి శివరావు… మహానటి కన్నాంబ… ఎంత మంది.. ఎంత మంది నటీనటులు ‘విరాళాలతో, చందాలతో’ మహాప్రస్థానానికి పయనం సాగించారు. సావిత్రిని మించిన నటి వున్నదా? గిరిజ.. ఒద్దు మహాప్రభో.. వద్దు. అంతులేని ఆస్థిపాస్తులతో, అభిమానులతో కళకళలాడిన జీవితాలు నూనెలేని దీపంలా కొడిగట్టి పోయినప్పుడు  చూసే దుస్థితి ఎటువంటిదో, అనుభవిస్తేగానీ అర్ధం కాదు.

మొన్న పొద్దున వాకింగ్‌లో “మన ‘సబర్మతి’ హాస్పిటల్లో ఉందిట..!” కబురు తెచ్చాడు సుబ్బారావు. సుబ్బారావు ప్రొడక్షన్ మేనేజరుగా యీ మధ్యే  ప్రమోట్ అయ్యాడు. మరో సుబ్బారావు గారు ఉన్నారు. చాలా సీనియర్ ప్రొడక్షన్ మేనేజరుగారు. చాలా నిజాయితీ వున్నవాడూ. నిక్కచ్చి మనిషి. పిల్లాపాపల్తో  హాయిగా  మా వలసరవాక్కం ‘లోనే రిటర్డ్ లైఫ్‌ని ఆనందంగా అనుభవిస్తున్నారు.

“ఏమైందిట?” అడిగాను.

“ఏముంది గురూగారూ. కొడుకూ, కోడలూ ఆవిడ్ని హాస్పిటల్ వరండాలో పడేసి చాలా తెలివిగా ఏ వూరో చెక్కేసారు. వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి వుంది. అర్జంటుగా ఓ పదివేలు పోగు చేసి ‘సురేష్’ డాక్టరుకి వొప్ప చెప్పి వచ్చాను” అన్నాడు.

మరో ‘సినీజీవి’ అయితే ‘సబర్మతీ’ గురించి ఏ  ఛానల్   మాట్లాడరు. ఏ పేపర్లోనూ వార్తలు రావు. ఎందుకంటే సబర్మతీ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అంట్లు తోమే ఆడది. యూనియన్ కార్డు ఉండి ఉండోచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకునేదెవరూ?

ఆరోజుల్లో ‘భగవతి’ హోటల్ ముందు పొద్దున్నే ఓ పదైనా ప్రొడక్షన్ వేన్‌లు ఆగేవి .. టిఫిన్ల కోసం. అంట్లు తోమడానికీ, సర్దడానికీ తీసుకు వెళ్టారనే ఆశతో చాలామంది ఆడవాళ్లు అక్కడే ఎదురు చూసేవాళ్లు. వాళ్లకో యూనియన్ ఉందనీ, వాళ్లు యూనియన్ మెంబర్సేననీ, కాని వాళ్లకి ఆ చాన్స్ దక్కదనీ తెలీడానికి నాకు చాలా రోజులు పట్టింది.

ప్రతి ప్రొడక్షన్ మేనేజర్‌కీ ఓ ‘బేచ్’ వుంటుంది. సబర్మతి కూడా నారాయణరావు బేచ్‌తో వచ్చేది. చాలా కళగల మొహం. చక్కని మాటతీరు. మనిషి కూడా తీర్చిదిద్దినట్టుండేది.  ఈ మాట ఓసారి నాతోటి రచయితతోటి అంటే “గురూ.. నాతో అన్నారుగానీ ఎవరితో అనకు.. నీ టేస్టు చాలా ‘చవకబారు’దంటారు.” అన్నాడు. నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలీలేదు. ఒక వ్యక్తిని మెచ్చుకోవడానికి కూడా  ‘ఇన్నియాంగిల్స్’ లో ఆలోచించాలని నాకు నిజంగా తెలీదు. అసలు మనిషిని మనిషిగా ఎందుకు గుర్తించం? నిన్నటిదాకా మా కళ్లముందు పాండీబజార్లో తిరిగినవాడు ఓ సినిమాలో హీరో కాగానే అందరూ “హీరోగారొచ్చారు..” అని నానా హంగామా చేస్తారో?, సదరు కుర్రాడు కూడా కంటికి నల్ల కళ్లద్దాలతో చేతిలో ఫైవ్ ఫైవ్ ఫైవ్ సిగరెట్టు పేకెట్టుతో ఆకాశం నుంచి  అప్పుడే  ఊడిపడినట్టు ఎందుకు పోజు కొడతాడో తెలీదు. నాకు అర్ధం కారు. “మంత్రిగారొచ్చారు”… “ప్రొడ్యూసర్ గారొచ్చారు” “డైరెక్టర్ గారొచ్చారు” “హీరోయిన్‌గారు ఆలస్యంగా వస్తారట” “కవిగారికి కడుపు నొప్పిట!” ప్రొద్దున్నే లేవగానే వినపడే మాటలు ఇవే. మనిషి పేరు మరుగయి.. వృత్తి పేరే ప్రముఖమవుతుంది. సరే…!

నేను ‘కారం’ ఎక్కువ ఇష్టపడతాను. కారంగా ఉంటే చెట్నీలని ఇంకొంచెం వేసుకుంటా. ఎలా కనిపెట్టిందో ఏమోగానీ, నేను పని చేసే షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా ‘కారం’గా ఉండేవాటినే పొందిగ్గా వడ్డించేది. ఆ విషయం నేను గమనించడానికి కొంత కాలం పట్టిందనుకోండి. అది వేరే సంగతి.

టి.నగర్‌లో “ముప్పత్తమ్మ గుడి” సినిమా వాళ్లకి బాగా అలవాటైన గుడి. ఆ దేవత చాలా నిఖార్సైన దేవత. నూటికి నూరుపాళ్లు మొక్కుకున్న మొక్కుల్ని తీరుస్తుందని మావాళ్ల నమ్మకమేగాదు నిజం కూడా..

నాలుగేళ్ల క్రితం ఓ డబ్బింగ్ సినిమా ‘స్క్రిప్ట్’ పూజ కోసం మా ప్రొడ్యూసర్ ఆ గుడికి తీసికెళ్లాడు. అంతకుముందు చాలాసార్లు వెళ్లాను. ఆ రోజునే సబర్మతినీ, సబర్మతి ఇరవైయ్యేళ్ల కొడుకునీ చూడటం జరిగింది. పిల్లాడు అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. వాళిద్దరూ పక్కపక్కనే వుంటే అక్కాతమ్ముడిలాగా వున్నారుగానీ తల్లీకొడుకుల్లా లేరు. మాకు నమస్కరించి

కొడుకుని పరిచయం చేసింది. కుర్రాడు స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నాట్ట. మనసులోనే సబర్మతికి సెల్యూట్ కొట్టాను.

నాకు తెలిసి ఒకాయన అనేవాడు. ” మనం లోకానికి వచ్చాం. పోతాం. అది ముఖ్యం కాదు. లోకానికి ఏమిచ్చాం అనేది ముఖ్యం…” అని.

సబర్మతి అంట్లు తోమింది. అది నిజం.. కానీ, లోకానికి ఓ ఇంజనీర్‌ని ఇచ్చింది. అది గ్రేట్.

రెండేళ్ల క్రితం కుర్రాడి పెళ్లి అనీ, వాడు TVSలో పని చేస్తున్నాడనీ, గొప్ప జీతమనీ, పిల్ల కూడా బాగా చదువుకుందనీ, ఉద్యోగం చేస్తానంటోందనీ చెప్పి, అందమైన వెడ్డింగ్ కార్డుని చేతికిచ్చింది. కార్డులో ఆవిడ పేరు లేదు. శ్రీమతి & శ్రీ వీరభద్ర చౌదరి అని వుంది.

“ఎవరు ఆ చౌదరిగారూ?” అనడిగా.

“బాబు చదువుకి సహాయం చేసినవారండి. నాకు తల్లిదండ్రుల్లాంటివారు కాదు.. దైవాలు…!” అన్నది.

చేసిన సహాయాన్ని క్షణంలో మరిచిపోయే యీ రోజుల్లో సబర్మతి తన కృతజ్ఞతని ప్రకటించుకున్న విధానం నా కళ్ళు చెమర్చేట్టు చేసింది.

పెళ్ళికి వెళ్లాను. చాలా చక్కగా పొందిగ్గా ఏ మాత్రం ఆర్భాటం లేకుండా చాలా చాలా ఆత్మీయంగా పెళ్లి జరిపించింది. వివాహ మండపం చిన్నదే. కాని ఆహుతులందరూ హాయిగా స్వంత  ఇంట్లో వున్నట్టు ఫీలయ్యారు. వచ్చిన ‘పరిశ్రమ’ వాళ్లు కూడా ‘ప్లాస్టిక్’ నటనలు మాని హాయిగా సంతోషంగా వివాహాన్ని చూశారు. ‘అఫ్‌కోర్స్ పెద్దవాళ్లు’  ఎవరూ రాలేదనుకోండి. రాకపోవడమే మంచిదైంది. వస్తే వాతావరణం మరోలా ఉండేది. ఆ విషయమే సబర్మతితో అంటే “నేనసలు పెద్దపెద్దవాళ్లని పిలువలేదండి. వారు నాకు తెలిసినా నేను వాళ్లకి తెలీదు కదా. ఒకవేళ వాళ్లు పెద్ద మనసుతో వచ్చినా, వారికి తగ్గట్టు మర్యాద చేసే ‘తాహతు’ నాకు లేదు కదా!” అన్నది.

అంత ఆరోగ్యంగా ఉండే, ఆరోగ్యంగా ఆలోచించే సబర్మతి ఇలా దిక్కులేనిదాని లాగా అవడమేమిటి? కొడుకూ కోడలూ ఆవిడ్ని ‘వదిలించు’ కోవటం ఏమిటి? నాకు తెలిసి సబర్మతి ఎవర్నీ నొప్పించే మనిషి కాదు. అసలు కారణం ఏమిటి?

సుబ్బారావు నేనూ కలిసి సురేష్ హాస్పిటల్‌కి వెళ్లాం. మనిషి బాగా చిక్కింది ఆమెకి శారీరక అనారోగ్యం కంటే మానసిక వ్యధ ఎక్కువగా  ఉన్నదనిపించింది. నన్ను లోపల వదిలి సుబ్బారావు బయటకు వెళ్లాడు.

“ఏం జరిగింది?” అడిగాను అనునయంగా. ఆ పలకరింపుకే సబర్మతి కళ్లలోంచి కన్నీళ్లు వానలా కురిశాయి. సన్నగా రోదించడం మొదలెట్టింది. నేనూ ఆపలా. నవ్వడం ఒక గొప వరం అయితే ‘ఏడవగలగటం’ చాలా చాలా గొప్పవరం. బాధ గుండెల్లో ఘనీభవించిన వాళ్లకి మాత్రమే ఏడుపులోని ‘సుఖం’ అర్ధమౌతుంది.

చివరికి ఆమె మాటల సారాంశం చెప్పి వదిలేస్తాను. కొడుకు ఆఫీసువాళ్లు పార్టీ ఇమ్మని అడిగారంట. కోడలికి కూడా ఉద్యోగం వచ్చిన సందర్భం కావటంతో అట్టహాసంగా ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారట. అదీ సబర్మతి ఊళ్ళో లేని రోజున. రెండు రోజుల తర్వాత రావల్సిన సబర్మతి ఆ మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి అట్టహాసంగా ‘పార్టీ’ జరుగుతోంది. ‘ఎవరు ఆమె’ అని అడిగిన అతిథులకి, ‘మా ఇంట్లో  పనిమనిషి.. ఊరినుండి ఇప్పుడే వచ్చింది.’ అని కొడుకూ, కోడలూ చెప్పడం తన చెవులతో స్వయంగా సబర్మతి విన్నదట. తనే బయటికి వచ్చేసిందట.

ఇంకేం చెప్పక్కర్లేదుగా.. చాలా ఏళ్ల క్రితం ఓ హిందీ హీరో, స్కూలు టీచరైన తన తండ్రిని ఇలాగే ‘మా పొలంలో పని చేసే రైతు’ అని ఇంగ్లీషులో ఎవరితోనో  చెబుతుంటే (తండ్రి ఎలిమెంటరీ స్కూలు టీచరు గనక  అంత ఇంగ్లీషు రాదనుకుని) ఆ తండ్రి ఆ రోజే హార్డ్ ఎటాక్‌తో మరణించాడని విన్నాను.

కన్నతల్లిని హిపోక్రసీతో ‘పనిమనిషి’ అని అంటే ఏం జరిగిందో ఇవ్వాళ  కళ్లారా చూస్తున్నాను. సబర్మతి బతుకుతుంది. బతికి తీరుతుంది కానీ కొడుకు అద్దెకి తీసుకున్న ఆ ‘భవనం’లో కాదు. ఆ విషయం సబర్మతి, ఆత్మాభిమానం గురించి తెలిసిన వారందరికీ తెలుసు.

మళ్లీ ‘భగవతి హోటల్’ ముందు కొన్నాళ్ల తర్వాత నేనామెను చూడగలను. తన కాళ్ల మీద తను నిలబడ్డానన్న ఆత్మాభిమానంతో ‘ నా పనే నాకు దైవం’ అన్న గర్వంతో.

స్వశక్తితో ఓ ‘ఇంజనీర్’ని తయారుచేసిన మనిషి పగిలిపోయిన తన గుండెని మళ్లీ మరమత్తు చేసుకోలేదూ?

 

మళ్లీ కలుద్దాం

—భువనచంద్ర

***

 

 

 

ఆమె

bhuvanachandra

భువనచంద్ర

బెజవాడలో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. మద్రాస్‌క్ వెళ్లాలి. రిజర్వేషన్ దొరికింది. ఇది ఇప్పటి మాట కాదు. అప్పుడు సినిమా వాళ్లెవరో పెద్దగా తెలిసేది కాదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఓ ముప్పై ఏళ్ల ఆయన వచ్చి, “మీరు ఆ చివర వున్న బెర్త్‌లోకి వెళ్ళండి!” అన్నాడు. “ఎందుకు వెళ్ళాలి? నా బెర్త్ ఇదే!” చికాగ్గా అన్నాను. మర్యాదగా అడిగితే వెళ్లి వుండేవాడ్ని.

“నేను ఎవర్నో తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్‌ని.. ఫలానా సినిమాకి” అన్నాడు పొగరుగా. “నేనెవరో తెలుసా? ఇండియన్ ఏర్‌ఫోర్స్ వాడ్ని.. నువ్వు అసిస్టెంట్ డైరెక్టరువైతే నాకేంటి, హీరోవైతే నాకేం, డోంట్ డిస్టర్బ్ మి!” అని అరిచాను. అది అప్పటి కథ. నా వంక కోపంగా చూస్తూ వెళ్లి ఇద్దరు ముగ్గురు మనుష్యుల్ని పెద్ద రౌడీలా తీసుకొచ్చాడు గానీ. యీలోగా టిటి రావడం, టిటికి నేను విషయం వివరించడం జరిగింది. టిటికి సినిమా వాళ్లంటే మంటేమో,  అతన్ని బాగా తిట్టి, మొత్తం గ్యాంగ్‌నే దింపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గుంపులో ఓ పాతికేళ్ళ స్త్రీ కాస్త సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది.

ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నా. ఆ అసిస్టంట్ డైరెక్టరు లైట్లు తీసేశాక ఆ పాతికేళ్ల స్త్రీని వేధించడం, ఆవిడ మింగాలేక కక్కాలేక చాలా ఇబ్బంది పడుతూ “అందరూ మేలుకునే వున్నారయ్యా. దండం పెడతా వొదిలెయ్” అనడం, వీడు నీళ్ల బాటిల్ (సీసా)లో మందు కలిపి తాగటం చూసి లైట్లు వేశాను. మొత్తానికి ఏ గొడవా జరక్కుండా మద్రాసు చేరాం.
చాలా ఏళ్ల తర్వాత ఆ అ.డైరెక్టర్ నేను పాటలు రాస్తున్న చిత్రానికి కో డైరెక్టరుగా వున్నాడు. చూడగానే నేను గుర్తుపట్టా గాని ఆయన గుర్తుపట్టలేదు. కొన్నాళ్ళకి ‘ఆవిడ్నీ’ చూశా. కనీసం ఎనభై సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది.
పాటలు వ్రాయడానికి కొన్నిసార్లు షూటింగ్ స్పాట్స్‌కి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి ఇతర వూర్లకి కూడా. అలా వెళ్లినప్పుడు  ఓ షూటింగ్‌లో “ఆవిడ్ని” చూడటం తటస్థించింది. ” మీ ముఖం మీద మచ్చ చూస్తే ఎక్కడో చూసినట్టు వుంది” అని అన్నది. ట్రెయిన్ ఇన్సిడెంట్ గుర్తు చెయ్యగానే “చీ.. వాడా.. గుంటకాడి నక్క. అందుకే అట్టా మిగిలాడు.” ముఖం అదోలా పెట్టి అన్నది. ఇప్పుడు చెప్పబోయేది ఆవిడ కథే.
నా పని పూర్తి చేసుకున్నాక మద్రాస్ తిరిగి రావడం కోసం రైల్వే స్టేషన్‌కి వెళ్లా. ప్రొడక్షన్ మేనేజర్ బండిలో నా సూట్‌కేస్ దగ్గర్నుండి ఎక్కించి శెలవు తీసుకున్నాడు.

అది జంక్షన్ కావడం వల్ల ట్రైన్ బయలుదేరడానికి ఇంకో ఇరవై నిముషాలుంది. పుస్తకాల షాప్ (హిగ్గిన్‌బాదమ్స్)కి వెళ్లి కొన్ని పుస్తకాలు కొన్నా.

“ఈ ట్రైనుకే వెళ్తున్నారా?” ఆమె గొంతు. పక్కకి తిరిగి చూస్తే ఆవిడే.

“అవును. మీరూ?” మర్యాద కోసం అడిగా.
“నేనూ మద్రాస్‌కే వస్తున్నాను. వేసింది పేరంటాల వేషమేగా..! ఏదో నాలుగు డైలాగులు దొరికినై..” నవ్వింది.

“మంచిది” అన్నాను.

“మీరు ఎక్కువ మాట్లాడరనుకుంటా?” నవ్వి అడిగింది.

“అదేం లేదు. నేను నిజంగా మాట్లాడ్డం మొదలెడితే, వినడానికి ఎవ్వరూ మిగలరు. అందుకే నోరు కట్టేసుకోవడం !”

నేను మెల్లగా నా కంపార్ట్‌మెంట్ వైపు నడవడం మొదలెట్టాను.

“పదిహేనేళ్ల తరువాత కూడా నన్ను గుర్తుపట్టారంటే నాకు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంది..!” నా వెనకాలే వస్తూ అన్నది. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. “మీలో పెద్ద మార్పు లేదు గనక గుర్తుపటాననుకుంటున్నాను.!” ఏదో ఓ జవాబు ఇవ్వాలిగా మరి.

“అందరూ అలాగే అంటుంటారండి.. మీకో విషయం తెలుసా?   నన్ను మొదటిసారి మద్రాసుకి పిలిపించింది ఫలానా స్టార్ ప్రొడ్యూసర్.. రావుగారు.!” ఉత్సాహంగా అన్నది.
“ఊ.!”
“కానీ ఆయన నన్ను ఆఫీసుకి పిలిచాక ఏమన్నారో తెలుసా? సినిమాలో ‘కేరెక్టర్’ కావాలంటే ముందు ‘కేరెక్టర్’  పోగొట్టుకోవాలి. OK అంటే నువ్వే హీరోయిన్ అన్నారు.!”
“ఊ…!”
“అప్పటికప్పుడు లేచి బయటికి వచ్చేశాను.”కొంచెం గర్వం ఆవిడ స్వరంలో నాట్యమాడింది.
“ఊ..!”
“మళ్లీ మా వూరెళ్లి పోయానుకానీ, నా ఫ్రెండ్స్ అందరూ ‘ ఏం నువ్వు సినిమాలకి పనికి రావన్నారా?’ అని ఎగతాళి చేసేసరికి ఇహ అక్కడ ఉండలేక మద్రాసు వొచ్చేశాను. ఏదైతే అదే కానీ అని ఆ ప్రొడ్యూసర్గారి దగ్గరికే వెళ్ళాను గానీ ఆయనెందుకో నన్ను లోపలికి రానీలేదు.”

“అదేం?” అడిగా. కొన్ని నిముషాలు గడిపితే బండి బయల్దేరుతుంది. యీ సొద వినే  బాధ తప్పుతుంది అనుకున్నా.

“అప్పుడే ఆ అసిస్టెంటు డైరెక్టరు నాకు పరిచయమయ్యాడు. ‘మనవాళన్’ స్ట్రీటులో ఓ చిన్న గదిలో నన్ను ఉండమని అడ్వాన్సు ఇచ్చాడు. గుళ్ళో పెళ్ళి అని ఆశ పెట్టాడు. అయితే బైట ఎవరికీ చెప్పొద్దన్నాడు. చిన్న చితకా వేషాలు ఇప్పించేవాడు. దానికితోడు నాకు ఊరగాయలు పెట్టటం బాగా వొచ్చు. దాంతో కాస్త వేన్నీళ్లకి చన్నీళ్లు తోడయ్యాయి..!”
బండికి సిగ్నలిచ్చారు.

“సర్లెండి.. ఇంకోసారి కలిసినప్పుడు మిగతా కథ చెబుతాను..!”
హడావిడిగా ఆవిడ తన కంపార్ట్‌మెంట్ వైపు పరిగెత్తింది. ఇప్పుడామె వయసు నలభై ఉంటుందేమో.

ఈ ‘కథలు’ సినిమావాళ్లకి కొత్తకాదు. పాండీ బజార్లో నిత్యం వినేవే. కొత్తగా మద్రాసు వొచ్చినప్పుడు ఇలాంటి కథలు విని చాలా బాధపడేవాడ్ని. ఏ పేరున్న ప్రొడ్యూసరో, దైరెక్టరో మమ్మల్ని ‘పిలిపించారు’ అని చెప్పుకోవడమే కాక, వాళ్లు మా ఒంటిమీద చెయ్యి వెయ్యబోతే ‘చీ’ కొట్టాం అనో,  ఆ తరవాత తప్పని పరిస్థితుల్లో పరిశ్రమలో వుండాల్సి వచ్చిందనీ చాలా మంది ఆడవాళ్లు చెప్పేవాళ్లు.

అలాగే, “నేను గొప్పగా యాక్ట్ చేస్తుంటే’ అది చూసి ఓర్వలేక ఫలానా నటుడు నా పాత్ర మొత్తం ఎడిటింగ్ రూంలో కట్ చేయించేశాడు… లేకపోతేనా..” అని పాండీబజారుకి కొత్తగా వచ్చిన వాళ్లతో గొప్పలు చెప్పుకుంటూ, “టీ, కాఫీ టిఫిన్‌లకి’, ‘ఎర’ వేసే సినీజీవులూ నాకు సుపరిచితమే. మొదట్లో అన్నీ నమ్మేవాడ్ని. అయ్యో అని బాధా కలిగేది. తర్వాత్తరవాత అర్ధమైంది. ఎందుకు ఇలా కాలాన్ని వెళ్లదీస్తారో.

వీళ్లకీ ఆశలున్నాయి. చాలామందిలో ‘వర్త్’ కూడా వుంది. కానీ కాలం కలిసిరాక ఓ రకమైన నిర్లిప్తతతో నిస్తేజానికి గురై.. తమలో వున్న ‘టాలెంట్’ని తామే ‘గుర్తించు’కుంటూ అదే నిజమని అనుకుంటూ రోజులు గడిపేస్తారు. ఓసారి ఓ సింగరు పరిచయమయ్యాడు. ఘంటసాలగార్ని డైరెక్టుగా గాత్రంలో ‘దించేస్తాడు’. జనాలు ఆహా, ఓహో అనటంతో మద్రాసు వచ్చాడు. గాయకుడిగా స్థిరపడదామని. రెండేళ్ళయినా  చాన్స్ దొరకలా. చివరికి ఓ మ్యూజిక్ డైరెక్టరు దయతలిచి ‘కోరస్’లో పాడటానికి అవకాశమిస్తే కోరస్ సింగర్‌గా మిగిలిపోయాడు. నిజానికి అతని గొంతు బాగానే వుంటుంది. ఘంటసాలగారిని ‘ఇమిటేట్’ చెయ్యడంతో,  పాట ఎత్తుకోగానే ‘ఫాల్స్’ వాయిస్ అనిపిస్తుంది. ఎవరు మాత్రం ఏం చెయ్యగలరూ? అతను మాత్రం తప్పు ‘తనది’ అని గ్రహించకుండా పెద్ద పెద్ద సింగర్లని అసూయతో తిడుతూ వుంటాడు.

ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, చిత్ర పరిశ్రమ నిజంగా గొప్పదే, నిజంగా మంచిదే, అయితే ఇక్కడికి వచ్చే వాళ్లందరూ అర్జంటుగా పేరూ, డబ్బు సంపాయించేద్దాం అని వచ్చేవారే గానీ, తమకున్న ‘ఆర్ట్’కి పదును పెట్టుకుని మరింత నేర్చుకుందాం అని దృష్టితో మాత్రం రారు. ఓ ఆర్నెల్లు గడిచేసరికి ఓపికా, ఓరిమీ రెండూ పోయి, ‘కృష్ణబిలం’ లాంటి నిరాశలో కూరుకుపోతారు.

ట్రైన్ స్పీడుగా మద్రాస్ వైపు పోతోంది. ఆలోచిస్తూ అలా పడుకుండిపోయాను. ఏవేవో శబ్దాలు. మెలకువ వచ్చి చూస్తే విజయవాడ. ఆకలివేసింది. లేచి ప్లాట్ ఫాం  మీదకి దిగబోయేంతలో ఆమె.

“మీరేమో పడుకున్నారు. ఆకలవుతుందేమోనని పూరీలు, రెండు దోశలూ పేక్ చేయించుకుని వచ్చాను.!” నా చేతికి పెద్ద కాయితం పొట్లం ఇస్తూ అన్నది. వాటర్ బాటిల్స్ అమ్మకానికొస్తే రెండు కొని ఒకటి ఆవిడకిచ్చాను. “ఇస్తి వాయనం.. పుచ్చుకుంటి వాయినం” అన్నది నవ్వుతూ.

“మీరు తిన్నారా?” అడిగాను.
“ఉహూ! ఆ పేకెట్లోనే నాకోసం తెచ్చుకున్న పూరీలూ, దోశలు వున్నై !”

“సెపరేట్ చెయ్యడం ఎలాగా? సరే. లోపలికి రండి.. ఏదో ఓ మార్గం చూద్దాం ” మళ్లీ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చా. ఆవిడా వచ్చింది. ఎదుటి సీటు ఖాళీగా వుంది. అయితే ఇది ఫస్టుక్లాసు. కాని అడిగితే మారుస్తారేమో. ఎదుటి సీట్లో కూర్చుంటూ”ఇందాకటిదాకా సెకెండు క్లాసులోనే వున్నాను. ఇప్పుడే ఫస్టుక్లాసుకి మారాను. టి.సి బాగా తెలిసినవాడేకాక బంధువు కూదా. నా సామాను ఇక్కడ పెట్టడానికి వచ్చినప్పుడే మీరు నిద్రపోవడం చూశా..!” నా సందేహాన్ని ‘చదివి’నట్టు అన్నది. “నేను TTని అడిగి మీ టికెట్టు మార్పిద్దామనుకున్నా ఎనీవే.. మీరే వచ్చారు.”అన్నాను.

ట్రైను బయలుదేరింది. బజ్జీలు అమ్మేవాడి దగ్గర్నించి రెండు పేపర్ ప్లేట్లు తీసుకుని టిఫిన్ తినడం ముగించాం.

“ఊరగాయల దగ్గర కథని ఆపారు. ఇప్పుడు మిగతాది చెప్పండి” అన్నా.

“భలే గుర్తుందే మీకు.. ఊ. ఆ తర్వాత మూడు అబార్షన్లు,  ముప్పై సినిమాల్లో ఉలుకూ పలుకూ లేని వేషాలూ..! లాభం లేదని బర్కిట్ రోడ్ బాలానందం స్కూల్ దగ్గర టిఫిన్ బండీ పెట్టాను. పచ్చిమిరపకాయ బజ్జీలూ, పునుకులూ, వడలు, సాయంత్రం దోశలూ, ఇడ్లీలూ ఇలా బతుకు ప్రారంభించాను. టినగర్ అంతా తెలుగువాళ్లేగా. బ్రహ్మాండంగా వ్యాపారం ఊపందుకుంది. నమ్మరుగాని సాయంత్రం నాలుగు నించి రాత్రి ఎనిమిది గంటలలోపులో మూడు నాలుగువేలు పోగయ్యేవి. బజ్జీలకో అసిస్టెంటూ, దోసెలకో అసిస్టెంటూ ఉండేవాళ్ళూ!” ఆగింది.

“తరవాత?” అడిగాను.

“ఏవుందీ.. ఎంతొచ్చినా ఆ చచ్చినాడు పట్టుకుపోయేవాడు. సొమ్మునాదీ, సోకు వాడిదీ…” యీసడింపుగా అన్నది.

“ఏం  చేసేవాడూ?”

“తరవాత తెలిసింది. ఆ ముందా వెధవకి ఆల్రెడీ పెళ్ళాం, పిల్లల్లున్నారని. నా దగ్గర దోచుకెళ్లింది వాళ్లకి వెలగబెడుతున్నాడని. !”
నాకు నిజంగా జాలేసింది. గడవని రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు ‘వేరే’ వృత్తికి పోతారుగానీ, యీమెలాగా ‘బండి’ పెట్టుకుని చెమటోడ్చరు.
“తరవాత?”

“వాడ్ని వదిలేశా. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌తో కొంతకాలం వున్నాను”
“అదేంటీ?”

“పోలీసు ‘దన్ను’ లేకుండా ఎంతోకాలం ‘బడ్డీ కొట్టు’ నడపటం కష్టమని తెలిసొచ్చాక తప్పలేదు. అతను మంచివాడేగానీ, వేరే వూరికి ట్రాన్స్‌ఫరై వెళ్లిపోతూ, అతనికి తెలిసిన వాళ్లింట్లో ఔట్‌హౌస్ ఇప్పించాడు. అక్కడికి మారాను. ఇప్పుడు నాకు  వున్న కొడుకు ఆ పోలీసాయనకి పుట్టినవాడే.”

“అదేంటి? బిడ్డని కూడా వదిలేసి పోయాడా?”ఆశ్చర్యంగా అడిగా.
“అతను వెళ్లినప్పుడు నేను గర్భవతినని నాకే తెలీదు. తెలిశాక నా బిడ్డ నాకోసమే ఉండాలనిపించింది..!”
“మరి తండ్రి ఎవరూ అని మీ అబ్బాయి అడగలేదా?”
“మిలటరీలో వుండేవాడు, ఏక్సిడెంట్‌లో పోయాడు అని చెప్పాను..”
“తరవాత?”

“మాస్టారూ.. నా బిడ్డ పుట్టాక నేను ఏ వెధవ్వేషాలూ వేయ్యలేదు. ఎక్స్‌ట్రాగానే బతికాగానీ ఏనాడూ తప్పుడు పనులు చెయ్యలేదు. చిన్నప్పుడు నేర్చుకున్న ఊరగాయల విద్యే నన్ను ఆర్ధికంగా ఆదుకున్నది. తెలుగువాళ్ల ఇళ్లకి ఊరగాయలు సప్లై చేస్తూ, సినిమాల్లో వేషాలు వేస్తూ, ఇంకా టైముంటే ఓ టైలర్ దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తూ ఆ అవుట్‌హౌస్‌లోనే ఉండి మావాడ్ని పద్మాశేషాద్రి స్కూలులో చేర్చాను.”

నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పద్మాశేషాద్రి స్కూలంటే చాలా కాస్ట్లీ స్కూలు. ఓ విధంగా చెప్పాలంటే చాలా గొప్పవాళ్లు తమ పిల్లల్ని చదివించే స్కూలు అది.

“మీ ఆశ్చర్యం నాకు అర్ధమైంది కవిగారూ.. నా జీవితం ఎలా గడిచినా పరవాలేదు. బాబు పుట్టకముందు ఎలా తిరిగినా, బాబు పుట్టాక ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను చూసి నా బిడ్డ గర్వపడాలేగానీ, నా బతుకుని అసహ్యించుకోకూడదని. అందుకే నిప్పులాగా నిలిచా..”
“గ్రేట్…! నిజంగా మీరంటే కొండంత గౌరవం  కలుగుతోంది. ఇపుడు ఏం చదువుతున్నాడు?” అడిగాను.
“ఇంటర్.. ఆ తరవాత నాకో కోరిక ఉంది. అది నా కొడుక్కీ తెలుసు!” నవ్వింది.
“ఏమిటీ?”
“బాబు తండ్రి సరదాగా నాతో అనేవాడు. నేను IPS ఆఫీసర్ని కానుగానీ నా కొడుకుని IPS చెయ్యాలని… ఇపుడు వాడ్ని ఓ ఆఫీసర్‌గా చూడాలి.”
“IPSగానా?”
“కాదు. తండ్రి మిలటరీ అని చెప్పానుగా వాడికి, అందుకే నా బిడ్డని మిలటరీ ఆఫీసర్‌గా చూడాలి..!” ఆమె కళ్ళల్లో ఓ నమ్మకం. ఓ నిర్ణయం.
నా చాతీ పొంగిపోయింది. నేనూ ఒకప్పుడు I.A.Fలో ఉన్నవాడ్నేగా.
“అమ్మా నేను మిలటరీవాడ్నే. నీ నిర్ణయం అద్భుతం.. నీ బిడ్డ నిజంగా గొప్ప ఆఫీసర్ కావలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నా..” అన్నాను.
ఎక్కడో చదివాను. ఎంత గొప్ప మాట. “నువ్వు పేదవాడిగా పుట్టి వుండొచ్చు. పేదవాడిగా మాత్రం చావకు. నువ్వు బురదలో జీవితాన్ని ప్రారంభించి వుండొచ్చు. కానీ ఓ పద్మంలా వికసించి చూడు..అప్పుడే ఈ ‘మనిషి’ జన్మ సార్ధకం అవుతుంది..” అని.
ఆమె ఎంతటి ఆత్మగౌరవం కలిగినదంటే ఓ ‘చెక్కు’ పిల్లవాడికి చదువు నిమిత్తం ఇవ్వబోయాను. “డబ్బు వద్దు. నా బిడ్డని మామయ్యలా ఆశీర్వదించండి. అన్నది. ఇంకేం చెప్పను.

మళ్ళీ కలుద్దాం
భువనచంద్ర.

ఒక సావిత్రి కథ

“సావిత్రి బతికింది.. ‘గాడ్ ఈజ్ గ్రేట్;..!” అన్నాడు శీను శీను ఒకప్పుడు ఆఫీస్‌బాయ్. ఇప్పుడు ఎక్‌స్ట్రా  సప్లయర్. బాగానే సంపాదించాడనటానికి నిదర్శనం అతను “వ” ఏరియాలో కట్టుకున్న ఇల్లే.

ఆ ఇల్లుని షూటింగ్‌లకి అద్దెకిస్తున్నాడంటే ఎంత ‘పోష్’గా కట్టాడో అర్ధమవుతుంది. రోజుకి అన్నీ కలుపుకుని ఇరవైవేలు అద్దెలు. నెలకి కనీసం ఇరవైరోజులు షూటింగ్‌లు జరుగుతుంటాయిట.. ఈ ‘ట’ లన్నీ ఎవరో చెప్పినవి కాదు. శీను చెప్పినవే. నాతో అబద్ధం ఆడడు.  కారణం సుమారుగా మేమిద్దరం కొంతకాలం ‘మలర్‌కోడి మేన్షన్’లో కలిసి వుండటమే.

“నాకర్ధం కాలేదు శీను, సావిత్రికి ఏమయిందీ?” ఆశ్చర్యంగా అడిగాను.

“దేవుడా! మీరెప్పుడు బాగుపడతారు గురూజీ? ఎప్పుడు చూసినా మీ లోకంలో మీరుండడమే గాని కళ్లు తెరిచి చుట్టూ చూడరు కదా! సావిత్రి సూయిసైడ్ ఎటెంప్ట్ చేసి మూడురోజులయింది .. బతుకుతుందనే ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. చిత్రంగా బతికింది” తల కొట్టుకుని అన్నాడు శీను.

“ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నం చేసిందీ?” అడిగాను.

“తెలిస్తే గొడవే వుండదుగా! బహుశా మీరడిగితే ఏమన్నా చెబుతుందేమో. నేను ఎన్నిసార్లు అడిగినా ‘బ్లాంక్’గా నా వంక చూస్తుంది గానీ పెదవి విప్పట్లేదు.”

నాకు సావిత్రి చాలాకాలం నించి తెలుసు . కుటుంబ వివరాలు తెలీకపోయినా ‘మనిషి’ గురించి తెలుసు. టి.నగర్ కన్నమ్మపేట ప్రాంతంలో వుండేది. ఆకట్టుకునే రూపం, వినయంగా, మృదువుగా మాట్లాడటం ఎవరికైనా ఆమెను గుర్తుండేట్టు చేస్తాయి. మేము చారీ స్ట్రీట్‌లో వుండగా చాలా సార్లు ఆమెని వెజిటబుల్ మార్కెట్లో చూశాను.
“ఇదేంటీ… మీరు కూరలకి రావడం?” అని ఆశ్చర్యంగా నన్ను ఓ నాడు పలకరించింది.

“నేను మీకు తెలుసా?” అనడిగాను.

“ఎందుకు తెలీదు? మీరు ఎక్కువగా డాక్టర్ గోపాలకృష్ణగారి దగ్గరుంటారనీ పాటలు రాస్తారనీ బాగా తెలుసు.అందుకే అడిగాను. రచయితలై కూడా…. ” ఆగింది. “రచయితలు తిండి తినరా? మిగతావాళ్ల సంగతైతే నాకు తెలీదు గానీ, కూరగాయలు నేను ‘ఎంచు’కుంటేనే నాకు తృప్తి.  పల్లెటూరివాడ్ని కదా.. తాజావి ఎంచుకోగలను. ఇంతకీ మీరేం చేస్తారూ?” అడిగాను.

“సినిమాల్లో హీరోయిన్ అవుదామని వచ్చాను. వచ్చాను అనేకంటే అమాయకంగా తీసుకురాబడ్డానని చెప్పాలి. అఫ్‌కోర్స్, ఇక్కడికి వచ్చిన వాళ్లంతా ఇలాగే అంటారనుకోండి. తీరా వచ్చాక హీరోయిన్ కాదు కదా హీరోయిన్ చెలికత్తెగా కూడా వేషాలు దొరకలేదు. కవిగారూ, ఇంకో విషయం తెలుసా.. ఇది ‘పద్మవ్యూహం’లాంటిది.. లోపలికి రావడమే కానీ బైటికి పోవడం కుదరదు. అందుకే ఇక్కడే ఉండిపొవల్సి వచ్చింది. నా పేరు సావిత్రి. మహానటి సావిత్రికీ నాకు పేరులోనే సాపత్యం తప్ప  మిగతా ఏ విషయంలోనూ పోలిక లేదు. ప్రస్తుతం గుంపులో గోవిందం లాగా క్రౌడ్‌లో కనిపించడమో, లక్కు దొరికినప్పుడు ఒకటో అరో డైలాగులు చెప్పే చి…న్ని పాత్రలు వెయ్యడమో చేస్తున్నా !” నవ్వుతూ అంది.

కొంతమంది నవ్వితే ‘హృదయం’తో నవ్వినట్టు వుంటుంది. సావిత్రిదీ హార్టీ స్మైలే… ‘ప్లాస్టిక్’ నవ్వు కాదు.

“మంచిది” అన్నాను. అవాళ నిజంగా నాకు పనుంది. తొందరగా ఇంటికెళ్తే గానీ పాట పూర్తి కాదు.

“మీరు చాలా బిజీ అని తెలుసు. మీరంటే నాకు చాల ఆభిమానం. ఎందుకంటే మాది మీ వూరి దగ్గరి వూరు కనుక. పేరు అడక్కండి. సీక్రెట్.. వస్తా!” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది.

*

శారదా స్టూడియోలో పాటకి ‘సెట్’ వేసారు. మా డైరెక్టరుగారు కారు పంపి మరీ నన్ను సెట్‌కి ఆహ్వానించారు. చిత్రీకరించబోయేది నా పాటే.

లైటింగ్ ఎరేంజ్‌మెంట్ జరుగుతోంది. హీరోయిన్‌గారూ, హీరోగారూ ‘ఆత్మస్థుతి  – పరనిందా’ కార్యక్రమమలో తలమునకలై వున్నారు. హాయిగా సిగరెట్ తాగుదామని బయటికి పోతే.. ఓ చెట్టు కింద దేవకన్యలు కనిపించారు. దెవకన్యలంటే గ్రూప్ డాన్సర్లు. నిజంగా చెబితే  వాళ్ల ప్రతిభ అపారం. కాలం కలిసి రాక హీరో, హీరోయిన్ల వెనక నృత్యం చేస్తూ తెరని నిజంగా అలంకరించేది వీళ్ళే.

వాళ్లలో ఒకామె సైలెంటుగా పుస్తకం చదువుకుంటోంది. ఆ పుస్తకం పేరు చూడగానే నాకు మతిపోయింది. అయాన్ రాండ్ రాసిన “అట్లాస్ ష్రగ్డ్’. మైగాడ్ అయాన్ రాండ్‌ని చదివే డాన్సరా? పరీక్షగా చూస్తే సడన్‌గా జ్ఞాపకం వచ్చింది.  ఆమె సావిత్రి అని.

“సావిత్రిగారూ.. బాగున్నారా?” నేనే పలకరించాను. తలతిప్పి చూసి ఒక్క గెంతులో లేచి, “మీరేనా.. మీరేనా పలకరించిందీ!”

అన్నట్టు ఈ చిత్రసీమలో చాలా  హిపోక్రసీలు వున్నాయి. ఎంత పరిచయస్థులైనా కొన్ని ‘ముసుగులు’ వేసుకునే మాట్లాడతారు. ఓపెన్‌గా ఉండటం అంటే ఏందుకో ఇక్కడి పెద్దలకు గిట్టదు.

“నేనే. నేనే!” నవ్వాను.

“బస్.. రేపటికల్లా  హాట్ హాట్ న్యూస్. ఫలానా రైటర్ ఫలానా ఎక్‌స్ట్రాతో మాట్లాడింది దేనిగురించీ అని! సిద్ధంగా ఉన్నారా?” పకపకా నవ్వి అడిగింది. ఆమె అన్నదాంట్లో ఒక్కటి కూడాఅసత్యం కాదు. రూమర్లు తమట తాము పుట్టవు. పుట్టిస్తారు.

“అయాన్‌రాండ్‌వి ఇంకేమైనా చదివారా?” అడిగా.

“ద ఫౌంటేన్‌హెడ్ చదివాను. అందులో ‘టూహే’గా వెయ్యాలంటే మన గొల్లపూడివారే పర్‌ఫెక్ట్ అనుకుంటాను. అబ్బా.. భలే గుర్తుచేశారండి.” సంబరంగా అన్నది.

“ఇంకెవరి రచనలంటే ఇష్టం?” అడిగా.

“హెరాల్డ్ రాబిన్స్ కార్పెట్ బేరర్స్, వేర్ లవ్ హాస్ గాన్, నెవర్ లవ్ ఏ స్త్రేంజర్.. ఓ .. బోలెడు. అలాగే హాన్‌సు యిన్ ది  ది మౌంటేన్ యీజ్ యంగ్. సొమర్‌సెట్ మాం గారి కేంక్స్ ఎండ్ ఏల్ . ఎన్నని చెప్పనూ..” చెప్పలేనంతా ఉత్సాహగ్నా చెప్పింది.

ఓ అరగంట ఎలా గడిచిందో కూడా తెలీలేదు.

ఆమె అన్నట్టుగానే ఓ కామెడీ నటుడు (అప్పటికి వచ్చి సంవత్సరం కాలేదుగానీ బాగా పైకొస్తున్నవాడు) “ఏంటి గురువుగారూ.. ఇంతసేపు వున్నారూ! పిల్ల బాగానే వుందిగా సెట్ చేశారా?” అని అదేదో పెద్ద జోకు అన్నట్టు వంకరగా నవ్వాడు. సీరియస్‌గా అతనివంక చూసి, “పిల్ల బాగానే వుంది. ఆ పిల్ల చదివే పుస్తకాల్లో వందో వంతుకూడా చాలామంది చదివి వుండరు.. మేము మాట్లాడుకున్నది సాహిత్యం గురించి హాస్యనటులుగారూ!” అన్నా.

“అలాగా! ‘ఆ’ సాహిత్యం గురించేమో అనుకున్నాలెండి!” అన్నాడాయన. నవ్వొచ్చింది. ఎవరితోనైనా మాట్లాడొచ్చు. అతిచనువు తీసుకుని నానా చెత్త మాట్లాడేవాళ్లతో ఎవరైనా ఏం మాట్లాడగలం.

*

ఓ థియేటర్లో హాలీవుడ్ క్లాసిక్స్‌ని వరసగా వారం పాటు ప్రదర్శించారు. అక్కడా సావిత్రి కలిసింది. అప్పుడే చెప్పింది. బి.ఎ. డిస్కంటిన్యూ చేసిందనీ, స్వంతంగా చదువు మొదలెట్టిందనీ.. స్వయంకృషితో ధారాళంగా ఇంగ్లీష్ చదవటం, వ్రాయడం (వ్యాసాలు) మాట్లాడటం నేర్చుకుందనీ..

“డిగ్రీ  పూర్తి చేసి ఏ కాలేజీలోనైనా లెక్చరర్‌గా చేరొచ్చుగా. ” అన్నాను.

“అంత దురాశ లేదులెండి.. ఎందుకో చదువు ఆగింది. లెక్చరర్‌గా పాఠాలు చెప్పడంకంటే నిరంతర విధ్యార్థిగా చదవడంలోనే హాయి వుంటుంది. కాదూ?” అన్నది. ఆ ‘కాదూ’ అని కొద్దిగా దీర్ఘం తియ్యడం నాకు ఎంత మధురంగా వినిపించిందో?

*

మళ్ళీ మేం పెద్దగా కలవలేదుగానీ ఒకటి రెండుసార్లు కలిసినప్పుడు బ్రీఫ్‌గానయినా ‘ద ఫైనల్ డయాగ్నసిస్’ గురించీ, ఖుర్రాతులైన్ హైదర్ వ్రాసిన ‘అగ్నిధార’ గురించీ మాట్లాడినట్టు గుర్తు. సావిత్రి అత్మహత్యా ప్రయత్నం  నిజంగా నన్ను షాక్‌కి గురి చేసింది. ఎందుకిలా?

విజయా హాస్పిటల్లో ఉందని సీను చెప్పాడు. సాయంత్రం అక్కడీకి వెళ్లాను. బెడ్‌మీద నిస్తెజంగా పడుకుని వుంది సావిత్రి. పక్కన ఎవరో ఆడమనిషి సావిత్రి కంటే పెద్దది. నన్ను చూసి లేచి పక్కకి వెళ్లిపోయింది.

” ఏం సావిత్రి, ఎందుకిలా చేశారని అడగను. ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చెయ్యనని మాత్రం మీరు మాట ఇవ్వండి..!” అన్నాను.
బొటబొటా కన్నీళ్లు కార్చింది గానీ ఒక్క మాట మాట్లాడలేదు.

“కనీసం మిమ్మల్ని ఓ చిన్న మాట ఇమ్మని అడగటానికైనా తగనా?”చిన్నబుచ్చుకుని అడిగాను.

“క్షమించాలి. నేను చెప్పలేను. చెబితే నా గుండె పగిలిపోతుంది…!” బావురుమంది. కాస్సేపు ఏడ్చి,” సినిమాల్లోనూ, కథల్లో మా చదువుతాం, చూస్తాం. కవిగారూ.. నా వొళ్లమ్ముకుంటూ నా కన్న కొడుకుని దూరంగా పెట్టి చదివిస్తున్నాను. నా నీడ వాడి మీద పడ్డా వాడికి చెడేగానీ మంచి జరగదని పుట్టిన మూడోనెలలోనే వాడ్ని మా చుట్టాలింట్లో వుండేట్టు, పెరిగేటట్టూ ఏర్పాటు చేశా.. ఇప్పుడు వాడికి పద్ధెనిమిదేళ్లు. నా చుట్టాలుండేది తాంబరంలో. దూరంనుంచి చూడటమేగానీ, ఏనాడూ నేను వాడికి ఏమౌతానో ఎప్పుడూ చెప్పలా..

అయ్యా. నాలుగు రోజుల క్రితం వాడు ‘రమ’ ఇంట్లో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డాడు. పద్ధెనిమిదేళ్ళ వెధవ..! ఆ ‘రమ’ ఇంట్లోనే నేను చాటుమాటుగా డబ్బు సంపాయించి వీడికి పంపేది. ఎలాగోలా కేసు కాకుండా సప్లయర్ సుబ్బరాజు వాడ్నీ, రమని కాపాడగలిగాడు గానీ, నా గుండెని ఎవరు కాపాడగలరూ. ఇంకెందుకూ బతకడం? చచ్చిపోవాలనిపించింది. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను. అటునించి అటే వెళ్ళిపోతే బాగుండేది. కానీ ఇప్పుడు బతికి క్షణక్షణము చచ్చిపోతున్నాను. నిజంగా .. నిజంగా చచ్చిపోతున్నా.. బతుకుతూ…” ఏడుస్తూనే వుంది. వెక్కుతూనే వుంది. ఏడుస్తూనే వుంటుంది కూడా.

ఈ సాలెగూట్లో చిక్కుకున్న శలభాలకి అంతులేదు. మిరుమిట్ళు గొలిపే కాంతితో యీ ‘సాలెగూడు’ సామాన్యుల్ని ఆకర్శిస్తుంది. దగ్గరికి రాగానే ఆశలదారాలతో బంధిస్తుంది. విడుదల ఏదీ?

సావిత్రి ఇప్పుడూ వుంది. మౌనంగా.. వీణలేని సరస్వతిలా. ‘పుస్తకం లేని చేతుల్తో’ కళ్లు తుడుచుకుంటూనే ఉంది.

 

మరో చరిత్ర?

“హలో.. నన్ను గుర్తుపట్టారా?” ఆర్కాట్ రోడ్డుమీద నడుస్తున్న నన్ను ఆపి మరీ అడిగాడు ఆయన. చాలా వరకూ తెల్లగడ్డం. అక్కడక్కడా కొంచెం రంగు మారిన కేశాలు. అస్సలు గుర్తుకు రాలేదు.

“పోనీ ‘బి’ గుర్తుందా?” గుర్తుపడతాననే ఆశతో బేలగా నా వంక చూస్తూ అడిగాడు. “నిజం చెబుతున్నా. మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఇహ మీరు చెప్పిన ‘బి’ అనే పేరు నేను విన్నదే. ఆమె నాకు తెలుసు. ఇంతకీ, మీరు ఆమెకేమవుతారు?” ఇబ్బందిగానే అన్నాను. కొన్ని విషయాలు నిజంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఎవరో ఫోన్ చేసి “ఏమండి నేను గుర్తున్నానా?” అని అడిగితే ఏం చెప్పగలం. కనీసం పేరు కూడా చెప్పరు. “ఎవరో మీరు… మీరు నాకు గుర్తు రావడం లేదు.” అంటే మనమేదో వాళ్లని కించపరిచినట్టు భావిస్తారు. సింపుల్‌గా నా పేరు ఫలానా, ఫలానా చోట కలిశాం గుర్తున్నానా? అని అడిగితే ఎంత బాగుంటుంది…”ఊహూ! అంత సింపుల్‌గా జనాలుంటే ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకొస్తాయి..

“సారీ.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. నా పేరు రంగరాజన్. అసలు పేరు రంగారావు. పక్కా తెలుగువాడ్ని. కాని యీ దిక్కుమాలిన అరవదేశానికొచ్చి ఓ ‘న్’  తగిలిస్తేగాని ‘మదింపు’ వుండదుగా. సరే.. మీరు ఓ సారి మా  యింటికి అదే ‘బి’ ఇంటికి వొచ్చారు. నేను ‘బి’ కి తండ్రిని. అఫ్‌కోర్స్ నిజంగా కన్నతండ్రినే!” తన మీద తనే జోక్ వేసుకున్నట్టు నవ్వాడతను.

‘బి’ అనడం ఇబ్బందిగా ఉంది కనుక ‘విమల’ అనుకుందాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది. విమలా వాళ్లు అప్పుడు టి.నగర్‌లో మా ఇంటికి నాలుగు వీధుల అవతల వుండేవారు. ఆ పిల్ల చాలా అందంగా వుండేది. ముట్టుకుంటే కందిపోయేంత అందంగా వుండింది. సహజంగానే ఓ ప్రొడ్యూసర్ దృష్టిలో పడి ‘హీరోయిన్’ అవకాశం తెచ్చుకుంది. ఆ అమ్మాయికి ఓ తమ్ముడు కూడా వుండాలి. వాళ్ల ఇంటికి నేను వెళ్ళిన మాట నిజమే. ఆ అమ్మాయి స్వయంగా మా ఇంటికొచ్చి “రేపు నా పుట్టినరోజు అంకుల్. తప్పక రావాలి!” అని మరీ మరీ పిలిచింది. అప్పట్లో నేను మహా బిజీ రైటర్ని.

మర్రోజు గుర్తుంచుకుని మరీ వెళ్లాను. అచ్చు వాళ్లమ్మ పోలికే విమల. కొడుకు మాత్రం తండ్రి పోలిక. నాకు బాగా జ్ఞాపకం. లౌంజ్‌లో పార్టీ అరేంజ్ చేశారు. నేనూ ఓ తమిళ డైరెక్టరూ, ఇద్దరు ముగ్గురు అప్‌కమింగ్ హీరోలు, ఓ తెలుగు ప్రొడ్యూసరూ మాత్రం లోపల డ్రాయింగ్ రూంలో కూర్చున్నాం. అప్పుడే  రంగరాజన్ మాకు డ్రింక్స్ ఆఫర్ చేశాడు. నేను ‘మందు’ తీసుకుంటాగాని అది ‘ఇంటి’కే పరిమితం. జనాలలో కూర్చుని కబుర్లు కొడుతూ  ‘తాగటం’ నాకిష్టం ఉండదు. అదే మాట అతనితో చెప్పాను.

“గ్రేట్.. చాలా మంచి అలవాటు.. నేనయితే డ్రింక్స్ జోలికే పోను. అవంటే భయమే కాక నా వొంటికి పడవు కూడానూ!” అంటూ మిగతా వాళ్లకి సర్వ్ చేసాడు. 2 గంటలు ఉండి నేను మళ్లీ మా ఇంటికి వచ్చేశా.

“అవును.. ఇప్పుడు జ్ఞాపకం వచ్చారు. ఐనా ఒక్కసారేగా మిమ్మల్ని చూసిందీ! అప్పుడు చాలా హెల్దీగా ఉండేవారు. ఇదేమిటి ఇలా చిక్కిపోయారు,” అడిగాను. ఆయన్ని చూసి పదేళ్లు దాటింది.

“మీకు  తెలీదా.. విమలనీ, వాళ్లమ్మనీ పోలీసులు అరెస్టు చేశారు. ఇది నాలుగోసారి. నేను.. నేను ఆ యింటినించి బయటి కొచ్చా…!”  తలవొంచుకుని అన్నడు రంగారావు. అతని కళ్ళలో తిరిగిన నీళ్లని నేను గమనించాను.

“ఓహ్.. సారీ! ” ఏమనాలో నాకు తెలీలేదు. ‘బి’ని అరెస్టు చేశారని రెండు మూడు సార్లు విన్నాను గానీ అంతగా ఆ వార్త మీద ధ్యా స పెట్టలా.  అదీగాక మేము టి.నగర్ వదిలేసి ‘వలసరవాక్కం’లోని స్వంత యింటికి వచ్చేశాం.

“మీరేం చెయ్యగలరూ.. అయ్యా .. ఏమీ అనుకోకపోతే నాకో హాఫ్ బాటిల్ విస్కీ ఇప్పించగలరా? సిగ్గులేకుండా అడుగుతున్నాననుకోకండి. సిగ్గూ వుంది. లజ్జా వుంది. కానీ యీ మనసులోని బాధ వుందే… అది దేన్నీ లెక్క చెయ్యనివ్వదు. ఇవాళ నా వొళ్ళు బాగా లేదు మనసూ బాగా లేదు. నేనూ అందర్నీ  అడుక్కునే టైపు వాడ్ని కాదు. ఎందుకో మిమ్మల్ని అడగాలనిపించింది. పైన మీ ఇష్టం.” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అవ్వాళ సూట్‌లో వున్నాడు. ఇవ్వాళ బట్టలు నలిగి, మాసి వున్నాయి. భయంకరమైన బాధని మనసులో నిప్పులా దాచుకున్నట్టు మొహమే చెబుతోంది. ఓ అయిదొందల రూపాయల నోటు తీసి ఇచ్చాను.

“డబ్బులు వొద్దు సార్. మందు కావాలి. మందు ఎక్కడ బడితే అక్కడ ‘టాస్మాక్’ షాపుల్లో దొరుకుతుంది గానీ విశ్రాంతిగా కూచుని విషాన్ని తాగే చోటు యీ తమిళనాడులో దొరకదు. ఫ్రెండ్స్ బార్ అంటూ ఒకటి వుంది కాని లోపలికి వెళ్లాలంటే ‘పటాటోపం’ కావాలి!” నవ్వాడు. ఆ నవ్వులో ఏడ్పుంది. ప్రపంచం మీద ‘కచ్చ’ వుంది.

“సరే పదండి !” నా కార్లో ఎక్కించుకుని ఫ్రెండ్స్ బార్‌కి తీసికెళ్ళా. ఆ బార్ మా యింటికి దగ్గర్లోనే వుంది. ఓనర్ తెలిసినవాడే.

“రండి రండి. ఫస్ట్ టైమ్ కదూ మీరు రావడం!” మొహం ‘ఇంత’ చేసుకుని అన్నాడు నటేశన్ మొదలియార్ నన్ను చూస్తూనే.

“అవును. వీరు నా ఫ్రెండ్ రంగరాజన్‌గారు.” పరిచయం చేశాను. “వణక్కం. అదిగో ఆ స్పెషల్ రూంలో కూచోండి..” దగ్గరుండి ఆ రూంలోకి పంపించాడు మమ్మల్ని.

రెండు నిముషాల్లో విస్కీ రంగరాజన్ చేతుల్లో వుంది అందమైన గ్లాసులో తళుకులీనుతూ. ఆబగా ఒకేసారి ఒక్క గుక్కలో గ్లాసు  పూర్తి చేసాడు.
“చెప్పండి..” అన్నాను.

“సిగ్గూ లజ్జా తలొంచుకుని మీ దగ్గర మందుకి చెయ్యి జాచేలా చేసాయి గానీ, గుండెలోని బాధ బైటపడేలా చెయ్యలా! అది బయటపడాలంటే ఇంకో రెండు మూడు గ్లాసులు లోపల పడాలి. అప్పుడూ, అప్పుడే భూమిని చీల్చుకుని మొక్క బయటికొచ్చినట్టు మనసుని చీల్చుకుని బాధ బయటకొస్తుంది..” నవ్వాడు. బేరర్‌కి సైగ చేసి, “రంగారావుగారూ.. మీ మనసులో ఉన్నదేదో బయటకు తెప్పించాలని నా ప్రయత్నం కాదు.  అంత సమయమూ నాకు లేదు..” అన్నాను. బేరర్  రాగానే రంగారావుగారికి మందూ, భోజనం పెట్టి పంపమని చెప్పాను. “బిల్లుకి మాత్రం ప్రాబ్లం ఉండదు. సాయంకాలం ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా పే చెయ్యగలను” మళ్లీ రంగారావుతో అని లేచాను.

“ప్లీజ్! నాకోసం కాసేపు  ఆగండి. మీ సమయాన్ని ‘తినేస్తున్నా’నని తెలుసు. కానీ జరిగింది ఎవరితో ఒకరితో చెప్పుకోకపోతే నేను బ్రతకను. ఆ ఒక్కరూ మీరైతేనే నాకు బాగుంటుంది.” ఓ నిముషం ఆలోచించి కూర్చున్నాను.

ఇక్కడో  విషయం చెప్పాలి. మానవుడి శరీరంలో అత్యంత గొప్ప అవయవం ఏదీ అని ఓ రాజుగారు సభలో అడిగారట. కళ్ళు అని కొందరూ, కాళ్ళు అని కొందరూ, శిరః ప్రధానం  అని కొందరూ చాలా సమాధానాలు చెప్పారట. చివరికి ఒకడు లేచి, “అయ్యా, ఎవరన్నా బాధలో తపించేటప్పుడు ‘నేనున్నా’ నంటూ ఆ వ్యక్తి తలను తన మీద ఆనించుకునే ‘భుజాలు’, ఎవరన్నా దుఃఖంలో ఏడుస్తుంటే ‘నీకు నేనున్నా’ అంటూ కళ్లు తుడిచే ‘చేతుల’ కంటే విలువైనవి సృష్టిలోనే లేవు” అన్నాడట.

ఈ కథ నాకు ఎప్పుడూ నాకు జ్ఞాపకం వుంటుంది. ఇది మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కథ. ఆ కథ గుర్తుకొచ్చే కూర్చున్నాను. (చాంద్రాయణం కదూ!)  మరో గ్లాసు గబగబా తాగేసి  “అయ్యా, మాది మాంచి సాంప్రదాయమైన కుటుంబం. బెజవాడలో మెకానికల్ ఇంజనీరుగా పని చేసేటప్పుడు విమల తల్లి నాకు పరిచయం అయింది. నాది కుర్ర వయసూ + ఆమె అందగత్తె కావడంతో ప్రేమలో పడ్డాను. మా వాళ్లని ఎదిరించే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. కాలేజీలో ‘విమల’ ని బ్యూటీక్వీన్ అనేవాళ్ళుట. దాంతో విమలకి అందగత్తెనన్న భావం పెరిగింది. మెల్లగా బాయ్ ఫ్రెండ్స్  పెరిగారు.

ఓసారి వాళ్లని గవర్నర్ పేటలో నా కళ్ళతోనే చూశా. ఇక లాభం లేదని మద్రాస్ ‘అశోక్ లేలాండ్’ కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించాను. లక్కీగా వెంటనే దొరికింది. దాంతొ బెజవాడ నించి కుటుంబాన్ని మద్రాసుకు మార్చేసా. కంపెనీకి దగ్గర్లోనే ‘ఎన్నూరు’లో వుండేవాళ్లం. ఏమైనా సరే టి.నగర్‌కి మార్చాలని మా ఆవిడ పట్టుబట్టింది. కూడదన్నాను. ఎవడో వాళ్ల మేనమామట. వాడే మాఆవిడకి పురెక్కించింది. రోజూ కొంపలో గొడవ పడలేక టి.నగర్‌కి మకాం మార్చాను. మా కంపెనీ బస్సు టి.నగర్‌కి కూడా పికప్‌కి వస్తుంది గనక పెద్దగా ఇబ్బంది పడలేదు. 15 రోజులు నైట్ షిఫ్ట్ కూడా ఉండేది,” ఆగాడు రంగారావు. ముఖంలో ఓ బాధ. మూడో పెగ్గు గుటుక్కున  తాగి సిగరెట్లు కావాలన్నాడు. తెప్పించాను.

“ఏమైనా తినకూడదూ!” అడిగాను.

“ఊహూ… తాగేటప్పుడు తినను. మీకో చిత్రం తెలుసా! తాగుడు అన్నా తాగే వాళ్లన్నా నాకు పరమ అసహ్యంగా ఉండేది. మొట్ట మొదటిసారి మీరు మా యింటికి వచ్చినప్పుడు నా కూతురి బలవంతం మీద ‘సర్వ్’ చేయాల్సి వచ్చింది. అఫ్‌కోర్స్. మీరు తాగలేదనుకోండి. అలాంటి వాడ్ని ఇలా తాగితేగానీ బతకలేని స్థితికి వచ్చాను!” నవ్వాడు. ఆ నవ్వులో విషాదం. నేనేమీ మాట్లాడలేదు. మనిషి మందుకి ఎందుకు బానిసవుతాడూ? మగాళ్ళేనా? కాదే? మీనాకుమారి.. సావిత్రి.. ఆ మధ్యే కేన్సర్‌తో చనిపోయిన నటి.. గిరిజ… వీళ్లందరూ ఎందుకు మందుకి దాసోహం అన్నారూ?”

ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే అర్ధమైంది. భరించలేని బాధ, భరించలేని వంటరితనం వాళ్లని మందు మనుష్యులుగా మార్చాయని. సినీ పరిశ్రమలో నమ్మినవాళ్లే, సొంతవాళ్ళే మోసం చేసినప్పుడు.. ఎవరైనా ఏమి చెయ్యగలరు? కాంచనలాంటివాళ్లు మాత్రం భగవంతుని నమ్మి ఆ భగవత్సేవలో మునిగి సర్వాన్ని క్షమించి శాంతంగా ఉండగలరు గానీ, అందరికీ ఆ స్థైర్యం రాదుగా!

“మిగతా కథ మీరే ఊహించవచ్చు సార్..! మొదట్లో మా అమ్మాయి అందం చూసి సినిమా వాళ్లు వేషం ఇచ్చారనుకున్నాను. కానీ కాదు. ఆ అవకాశం అప్రయత్నంగా రాలేదు. మా అవిడ మేనమామ అని పరిచయం చేసినవాడే ఆ ప్రొడ్యూసర్‌కి మా అమ్మాయిని చూపించాడు. అంతేగాదు. సినిమాలో కూతురికి ‘కేరక్టర్’ ఇప్పించడం కోసం మా ఆవిడ తన ‘కేరక్టర్’ని పణంగా పెట్టిందిట. ఆ విషయం నాకు తెలిసేసరికి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఉద్యోగంలో పడి  నేను పట్టించుకోలేదు.

అసలు వాళ్లు నాకు ఏమీ తెలియనివ్వలేదు. సారూ, అసలు మా ఆవిడ సినిమా చాన్సుల కోసం ప్రయత్నించి ఆ సందర్భంగా ఆ ‘మామ’గాడితో రెండేళ్ళూ మద్రాసులొ వుందిట. చిన్న చిన్న వేషాలు కూడా వేసిందంట. చివరికి లాభంలేదని బెజవాడలో మకాం పెట్టిందంట. అక్కడ నేను దొరికాను. “నాలుగో పెగ్గు కూడా గుటుక్కున మిగాడు రంగారావు. దీర్ఘంగా నిట్టూర్చాడు.

“హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేసింది. ఇన్కమ్ ఎంతో నిజంగా నాకు తెలీదు. కారు కొన్నారు. డబ్బెక్కడిది అంటే ‘రెమ్యునరేషన్’ అని చెప్పారు. మా ఫాక్టరీలో కూడా నాకు పరపతి పెరిగింది. హీరోయిన్ తండ్రిగా తోటి ఉద్యోగులు మహా గౌరవం ఇచ్చేవారు. నా కొలీగ్స్‌ని నేను ఇంటికి పిలిస్తే మహాభాగ్యంలా భావించేవారు. దాంతో నేనో ఓ స్టేటస్‌ని అనుభవించాను!” మౌనం…బహుశా జరిగినవన్నీ గుర్తొస్తూ వుండాలి.

“ఒక రోజు ఇదిగో యీ ఎడమచేతి వేలు కట్ అయి పెందలాడే ఇంటికొచ్చేశా. ఏముంది తల్లీ కూతుళ్ళ బెడ్‌రూమ్స్‌లో అపరిచితులు. ఖంగారు పడ్డారు నా వైఫూ, కూతురూ.  ఆ క్షణంలోనే నాకు చావాలనిపించిది. “సారీ. ఇంకెప్పుడూ ఇలా జరగదు. తప్పనిసరి పరిస్థితిలో ‘ప్రొడ్యూసర్’నీ, ‘డైరెక్టర్’ ని ‘తృప్తి’ పరచాల్సి వచ్చిందని నా కాళ్ళు పట్టుకున్నారు.”  అసలేం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు.

అటువంటి సిచ్యుయేషన్‌లో ఎవరైనా ఏం చేస్తారు? చంపుతారు… లేదా చచ్చిపోతారు. నాకు నోట మాట రాలా..

“ఆలోచిస్తున్నారా గురూజీ! వాళ్లని చంపి నేను చచ్చిపోవాల్సింది. కానీ మరో బాధ్యత నన్నాపని చెయ్యనివ్వలా. మా నాన్న చనిపోయాక మా అమ్మ వొంటరిదైంది. ఆమె బాధ్యతలు నేను తీసుకున్నాను. నెల నెలా నా జీతంలో సగం ఇంటికి అంటే మా అమ్మకి పంపి మిగతా సగమూ మా ఆవిడ చేతుల్లో పెట్టేవాడ్ని. ఇప్పుడు నేను చచ్చిపోతే మా అమ్మకు దిక్కెవరు? ఆ ఆలోచనే నన్ను బ్రతికించింది. ఆ ఆలోచనే నన్ను హంతకున్ని కాకుండా కాపాడింది. మౌనంగా నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగి అయిదేళ్ళయింది. ఆ గదిలోనే అలమర్లో ఉన్నది ఏ బ్రాండో తెలీదుగానీ. తాగేశా.. గుక్కపెట్టి తాగేశా… “గ్లాసులో వున్న విస్కీని తాగేశాడు రంగారావు.. ఒక్క గుక్కలో.

“అయిపోయింది కథ… సినిమా చాన్సులు తగ్గినా ‘బిజినెస్’లో పండిపోయారు నా భార్యా కూతురూ.. నాలుగు సార్లు అరెస్టయ్యారు. ఆ ‘మామ’గాడు ఎలాగోలా బయటకు తెస్తాడు.మొదటిసారి వాళ్ళు అరెస్టయినప్పుడు నేను ఉద్యోగం మానేశా. కొలీగ్స్ ముందు ఎలా తలెత్తుకోనూ? ఆ తర్వాత ఇదిగో. యీ ‘ఏరియా’ కొచ్చి ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా చేరాను. అమ్మకి డబ్బు పంపాలిగా. అదృష్టం ఏమంటే ‘విమల’ పేరు మార్చుకుంది సినిమాల్లోకి రాగానే. సరే.. మిమ్మల్ని ఎక్కువ సేపు కూర్చోబెట్టను. నిన్న.. నిన్న.. నిన్ననేనండి… మా అమ్మ చచ్చిపోయింది. శవదహనం మా అక్క కొడుకు చేశాట్ట. నన్ను వెదుక్కుంటూ వచ్చి ఆ ‘మామగాడు’ ఇంఫర్మేషన్ ఇవ్వాళ పొద్దునిచ్చాడు. సారూ.. ఏ అమ్మ కోసం మిగిలి వున్నానో ఆవిడ చచ్చిపోయింది…” ఏడవటం మొదలుపెట్టాడు రంగారావు.

“ప్లీజ్.. ఊరుకోండి. ప్లీజ్..” ఆయన భుజం నొక్కి అనునయించే ప్రయత్నం చేశా. ఓ ముప్పావుగంట తరవాత కళ్ళు తుడుచుకున్నాడు. మరో రెండు పెగ్గులు మౌనంగానే తాగాడు.

“ఏమన్నా తినకూడదా అని కదూ ఇందాక అడిగారు.. నాకు ‘పులిహోర’ తినాలని వుంది. ఇప్పిస్తారా?” అడిగాడు. రంగారావు కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నై.

మా ఆవిడ ఊరెళ్ళింది. ఎవర్ని అడగాలీ. కనకలత గుర్తుకొచ్చింది. ఆవిడా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంది గానీ, చాలా మంచిది. అరవై దాటినై. గవర్నమెంటు పేదవాళ్లకిచ్చే అపార్ట్‌మెంట్స్‌లో ఓ చిన్న గది సంపాయించుకుంది. ఆమెకి ఫోన్ చేశాను. పులిహోర ఏమన్నా ఏర్పాటు చెయ్యగలరా?”అని.

“రా నాయనా.. మీరు వొచ్చేలోగా నేనే చేస్తా.. ఎంతసేపు..” ఆదరంగా అన్నదావిడ. బహుశా నాకోసం అని అనుకుని వుండొచ్చు.

రంగారావుగార్ని కార్లో ఎక్కించుకుని టి.నగర్ తీసికెళ్ళాను. ట్రాఫిక్‌లో నలభై నిముషాలు పట్టింది.

రంగారావుగారికి బాగా మత్తెక్కిపోయింది. తూలిపోతున్నాడు. కనకలతగారు ఉండేది ఫస్టు ఫ్లోర్. రంగారావుని మెట్లు ఎక్కించడం చాలా కష్టమైంది.

“బ్రదర్.. వాడున్నాడే.. అదే నా కొడుకు. వాడు  తల్లీ అక్కా ఇచ్చే యీజీ మనీకి అలవాటైపోయాడు. రేపో ఎల్లుండో వాడూ పెళ్లి చేసుకుని భార్యని తార్చేస్తాడు బ్రదర్… తార్చేస్తాడు…నో డౌట్స్.. అవన్నీ నేను చూడలేను బ్రదర్.. థాంక్స్.. థాంక్స్ ఫర్ద్ ద లాస్ట్ డ్రింక్.. ఆండ్ లాస్ట్ ఫుడ్…”

పైకి వెళ్తూ వుండగా అని పైకి వెళ్లగానే నేల మీద పడిపోయాడు రంగారావు.

***

సినిమాకి ఇష్టం వచ్చిన ముగింపు ఇవ్వొచ్చు. మరి జీవితానికీ? నేను ముగింపు ఇవ్వలేను. ఇవ్వకూడదు కూడా . జరిగింది జరిగినట్టూ.. రంగారావు చెప్పింది చెప్పినట్టూ వ్రాయడం వరకే నా బాధ్యత. అంతేగానీ. వాళ్ల జీవితాల్లో ఇన్వాల్వ్ కావడం లేదు.

రంగారావు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని అతను కథ చెబుతున్నప్పుడే నాకు అనిపించింది. అందుకే అతను కనకలతగారి ఇంటి దగ్గర పడిపోయినప్పుడు డాక్టర్‌ని పిలిపించే బదులు ఆంబులెన్స్‌ని పిలిచి అతన్ని హాస్పిటల్‌కి తరలించాను. జేబులో నిద్రమాత్రల సీసా దొరికింది గనక బహుశా అతను చివరిసారి ‘పులిహోర’  తిని జీవితం సమాప్తి చేసుకోవాలనుకున్న్నాడేమో అనిపించింది.

‘విమల’కి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆమే, రంగారావు భార్య ఇద్దరూ వచ్చారు. ఓ గంట సేపు మాట్లాడి రంగారావు ‘ఆత్మహత్యా’  యత్నం గురించి మాత్రమే చెప్పాను. వాళ్ల కథని రంగారావు నాతో చెప్పినట్టు చెప్పలేదు. అలా దాచటం మంచిదైంది.

“ఏం చేస్తాం అంకుల్. తెగ తాగేస్తున్నాడు డాడీ ! ” అన్నది కంప్లైంటుగా; డాక్టర్ బాగా తెలిసినవాడే.. “లివర్ పూర్తిగా చెడింది బ్రదర్.. ఇలాగే తాగితే ఎప్పుడేమవుతాడో చెప్పలేం” అన్నాడు. మూడు రోజుల తర్వాత  వాళ్లు రంగారావుని ఇంటికి తీసికెళ్ళారని తెలిసింది. అదీ డాక్టర్ ఫోన్ చేస్తేనే.. ఇది జరిగి అయిదేళ్లయింది.

విమల పెళ్ళి చేసుకుంది… ఆమెకిప్పుడో కూతురు. తల్లి అంత అందంగానూ వుంటుంది. ఆ పాపని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దింపుతూ ఉండగా నేను చూశాను. నన్ను చూసి విష్ చేసింది.

“మీ నాన్నగారు ఎలా వున్నారు?” అడిగా..

“విజయవాడలో ఓ వృద్ఢాశ్రమంలో చేర్పించాను అంకుల్. వాళ్ళు చాలా స్ట్రిక్టుగా వుంటారు. ఇక్కడుంటే ఆయన్ని తాగకుండా ఆపలేము… ఇదే మా అమ్మాయి. నాలుగేళ్లు. భలే డాన్స్ చేస్తుంది అంకుల్ !” కళ్లు మెరుస్తుండగా అన్నది. చిత్రపరిశ్రమకి ‘మరో’ హీరోయిన్ లభించబోతోందా?

ఏమో. ఎవరు చెప్పగలరూ?

చీర చెప్పిన కథ!

bhuvanachandra“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?”

“అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న పెంచారు.. గొప్పగానే పెరిగాను. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది కమల.

” ఊ.. తరవాత?” అడిగాను.

“9thలో పెద్దమనిషినయ్యాను. అప్పటిదాకా నా గురించి నేనేం పట్టించుకోలేదనే చెప్పాలి. పెద్దమనిషి అయ్యాకే మొట్టమొదటిసారి నేను ‘అందగత్తె’నని నాకు తెల్సింది… నాకే కాదు మా ఊరందరికీ కూడా తెలిసింది..” నవ్వింది.

ఆ నవ్వులో ఓ నిర్లిప్తత వుంది. నేను మౌనంగా కూర్చున్నా.

” ఓ మాట చెప్పనా.. తను అందగత్తెనని ఆడదానికి ఎప్పుడు తెలుస్తుందో అప్పటినించే మనసు వెర్రితలలు వేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. చదువుమీద నాకు తెలీకుండానే శ్రద్ధ తగ్గింది. అప్పటిదాకా అసలు పేరే తెలియని క్రీములూ, పౌడర్లు, నెయిల్ పాలిష్‌లూ వాడటం మొదలుపెట్టి ఎవరు నా వంక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తున్నా పొంగిపోయేదాన్ని!” మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ‘గతపు’ కమల ప్రతిఫలించింది.

“అలాంటి అలంకార సామగ్రి అందరూ వాడేదేగా.. అలాగే ఏ ఆడపిల్ల ఐనా అందంగా వుంటే జనాలు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడటం ఆ పిల్ల పొంగిపోవటమూ సహజమేగా?” మామూలుగా అన్నాను.

“మీరొకటి మర్చిపోతున్నారు.. అప్పటి నా వయసు గురించీ, ఆ వయసులో కలిగే భావాల గురించి ఆలోచించండి. నేను ఏ స్టేజికి చేరుకున్నానంటే ఏ కుర్రాడైనా నా వంక చూడకపోతే అది ప్రెస్టీజ్‌గా తీసుకుని , ఎలాగైనా వాళ్ల అటెన్షన్ నా మీద పడేట్టు చేసుకునేదాన్ని. అప్పటికిగానీ నా ‘ఈగో’ చల్లారేది గాదు!”

పరీక్షగా ఆమె వంక చూశా. ఆ కన్ను ముక్కు తీరూ, ఆ పెదవుల వొంపూ, శరీరాకృతీ చూస్తే ఇప్పటికీ అంటే యీ వయసుకీ ఆమె అందంగానే వుందని చెప్పుకోవాలి. నలభై దాటాయి గనక శరీరం వొడలటం, అందం అలవటం తెలుస్తోంది. అలిసిపోయినా అందం అందమేగా. “కాలేజీ కొచ్చేసరికి నా శరీరాకృతి ఎంత అందంగా తయారైందో, నా మనసు అంతకన్నా ఎక్కువ అహంభావంతో నిండిపోయింది. డబ్బుకి పెద్దగా లోటు లేదు గనక నన్ను పొగిడే స్నేహితురాళ్ళనే చుట్టూ వుంచుకునేదాన్ని. వాళ్లకీ సరదాలు వుండేవి గనక నేను ఎక్కడికెళ్తే అక్కడికి నాతో వచ్చేవాళ్ళు…!”

“ఊ…”

“అప్పుడు పరిచయమైనవాడే మధు. చదువులో మా కాలేజీలోనే బెస్ట్. చదువుతున్నది డిగ్రీ అయినా అపారమైన తెలివితేటలుండేవి.

మా కాలేజీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలిగినవాడు అతనొక్కడే. అంతే కాదు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనివాడు అతనొక్కడే!”

“తరవాత?”

“కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‌లో ఓ నాటకం వెయ్యాల్సి వచ్చింది. దాన్ని సులభమైన వ్యావహారిక భాష లో రాసిందీ, డైరెక్ట్ చేసిందీ కూడా మధునే.శకుంతలగా నన్ను వెయ్యమన్నారు. మధు దుష్యంతుడుగా వేస్తేనే నేను వేషం వేస్తాననీ లేకపోతే వెయ్యననీ పంతం పట్టాను.!” అన్నది కమల. ఆమె చూపులు ఎక్కడో వున్నాయి. నాకు నవ్వొచ్చింది.

“కమలా.. యీ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం సినిమాటిక్‌గా ఉంది సుమా!” అన్నాను.

“సినిమా జీవితం కాకపోవచ్చుగానీ, జీవితం మాత్రం సినిమాలాంటిదే కవిగారు!” ఆమె గొంతులో కొంచెం కోపం.

” ఆ విషయం ప్రస్తుతానికి వొదిలేద్దాం. సరేనా.. సారీ. ఇప్పుడు చెప్పండి. మధుగారు దుష్యంతుడుగా వేశారా?”

“పంతం పట్టానన్నాగా. వెయ్యకుండా ఎలా ఉంటాడూ? ఆ సందర్భాన్ని ‘చనువు’గా మలుచుకున్నాను. అప్పుడే ఓ సంఘటన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది!” నిట్టూర్చింది.

” ఏ సంఘటన?”

” ‘ము’గారు మీకు తెలుసుగా.. ది గ్రేట్ హీరో. ఆయన మా కాలేజీ పూర్వ విద్యార్థి కావటంతో ఆయన్నీ యానివర్సరీకి ఆహ్వానించారు. మా శకుంతల నాటకం చూసి నా అందమూ, నటనా, ఆ నాటకానికే ఓ ‘వన్నె’ తెచ్చాయనీ, నేను ఫిలిం ఫీల్డులోకి వస్తే చిత్ర పరిశ్రమ నన్ను చేతులు జాచి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆ పొగడ్తలకి నేను పూర్తిగా ‘ఫ్లాట్’ అయిపోయాను. అంతేగాదు మధులో గొప్ప రచయిత వున్నాడనీ, అతను సినిమాల్లోకొస్తే ఆత్రేయగారంత పేరు తెచ్చుకొనగలడనీ కూడా అన్నారు.” ఓ క్షణం మళ్ళీ మౌనం మౌనంగా నర్తించింది.

“తరవాత?”

“మధూది దిగువ మధ్య తరగతి ఫేమిలీ. రెస్పాన్సిబిలిటీసూ ఎక్కువే. కానీ నేను పెంచుకున్న ‘చనువు’తో అతనిలో ఓ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. మావాళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. నేను నాటకంలో వేషం వెయ్యడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కానీ అప్పటికే నేను ‘హీరోయిన్’ కావాలని ఫిక్సైపోయా. బలవంతాన మధూని ఒప్పించి చాలా డబ్బు, నగలతో మద్రాసు పారిపోయా…!”

“ఓహ్..! సామాన్యంగా ఇలాంటి పని మగవాళ్లు చేస్తారు.”

“ఆశకి మగా, ఆడా తేడా లేదు కవిగారూ. టి నగర్. ఆనందన్ స్త్రీట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. మీకు నేను గుర్తుండకపోవచ్చుగానీ, మీ మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’ ప్రొడక్షన్ ఆఫీసూ అదే స్ట్రీట్‌లో ఉండేదిగా? చాలా సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీసులోనూ వేషం కోసం ప్రయత్నించా!” నవ్వింది కమల.

“నిజంగా? గాడ్… నాకు తెలీనే తెలీదే!” ఆశ్చర్యపోయాను.

“ఆశ్చర్యం ఎందుకూ? అందరూ మీలాంటి అదృష్టవంతులు కారుగా. సరే, మాట ఇచ్చాడు గనక మధు వచ్చాడు గానీ, అతనికి ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేకపోయింది. మూడు నెలలు కలిసి ఒకే బెడ్‌రూం ఫ్లాట్‌లో వున్నా అతను నన్ను కనీసం ‘టచ్’ కూడా చెయ్యలేదంటే నమ్ముతారా?”

“నమ్ముతా.. ఎందుకంటే పెళ్ళి చేసుకుని కూడా దశాబ్దాల పాటు ఒకేచోట వున్నా ప్రేమకి తప్ప శరీరాకర్షణకి లోబడని ‘జంట’ నాకు తెలుసు. వారి జీవితం జగద్విదితం..!”

“నాకే జాలేసి అతన్ని వెళ్ళిపొమ్మన్నా.. మరో ‘పైకి రాగలడనుకున్న’ యువకుడ్ని నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. ఓ రోజు రంగరాజపురం రోడ్డులో ‘ము’గారు కనిపిస్తే ‘గతం’ గుర్తు చేసి ఏమన్నా వేషం ఇప్పిస్తారేమోనని అడిగా. చిత్రమేమిటంటే ఆయనకి శకుంతల గుర్తుందేమోగాని ఆ వేషం వేసిన ‘కమల’ గుర్తులేదు. పైగా, “చూడమ్మా..అనేక ఫంక్షన్స్‌కి పిలుస్తారు. కొన్నిటికి వెళ్ళక తప్పదు. నీ విషయమే తీసుకో. ‘స్టేజీ’ మీద నువ్వు బాగా చేసి వుండొచ్చు. ఓ ‘మాదిరి’గా చేసినా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము మెచ్చుకుంటాం. దాన్నే ఓ ‘డిగ్రీ’ గా భావించి ఇలా వచ్చేస్తే ఎలా? హాయిగా ఇంటికెళ్ళి పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో వుండు” అని ఓ సలహా పారేసి తన దారిన తాను పోయారు!” సుదీర్ఘంగా నిట్టూర్చింది

కమల.

“ప్రస్తుతం పరిస్థితి ఏమిటి?”

“నేను ‘లేచిపోయానని’ మావాళ్లు మా వూళ్ళో తలెత్తుకోలేక వున్నవన్నీ అమ్మేసి ఇప్పుడు ‘బళ్ళారి’ దగ్గర ఓ విలేజ్‌లో వుంటున్నారు. నేను వెళ్ళినా నా మొహం చూడరని నాకు తెల్సు. అలాగే ఎవరు ‘పైకి’ వస్తాడని భావించి నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నానో అతను నిజంగా పైకి వచ్చాడు. హీరోగా కూడా చేశాడు. పేరు ‘ర’ తో మొదలవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా విభాగాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

“ఊ.. అతను మిమ్మల్ని ఎంకరేజ్ చేయ్యలేదా?” అడిగాను.

“నా నగలన్నీ అయిపోయేవరకూ ‘ఎంకరేజ్’ చేస్తూనే వున్నాడు. అతనికి మరో ‘నిచ్చెన’ దొరగ్గానే నన్నొదిలేసి అక్కడ చేరాడు. అయితే ‘ఆమె’ చాలా టఫ్. ఇప్పుడు అతని భార్యా, అతని పిల్లలకు తల్లి ఆవిడే!” నవ్వింది . ఆ నవ్వులో సంతోషము లేదు. దుఖము లేదు.

“ఫ్యూచర్ సంగతి ఏమిటి?” అడిగా.

“నిజం చెబితే నా వయసిప్పుడు నలభై ఆరేళ్ళు. అందరికీ నలభై అని చెపుతున్నాననుకోండి…. ! ఒక్క సంవత్సరం ఓపిక పట్టి నా డిగ్రీ పూర్తి చేసి వుంటే నా జీవితం మరోలా వుండేది. ఎక్కడో చదివా.. “ఎంత ముందుకొచ్చావంటే వెనక్కి తిరిగి వెళ్లలేనంత. వెళ్లినా ఎక్కడ్నించి పయనం మొదలైందో అక్కడికి చేరలేనంత!” అని . సో. ఫ్యూచర్ గురించి ఆలోచనే లేదు. ఊ..! చదువు కొద్దో గొప్పో వున్నది గనక నా జీవితాన్ని ఓ పుస్తకంగా అంటే ఓ బుల్లినటి ఆత్మకథగా తీసుకురావాలని వుంది. తేవొచ్చా?” నవ్వింది .

“ఎందుకు తేకూడదు?”

“ఆత్మకథలు గొప్పవాళ్లకేగా!. వాళ్ల జీవితాలైతే అందరూ చదువుతారు. నాలాంటివాళ్ల జీవితకథలు ఎవరు చదువుతారు ?”

“కమలగారూ.. నిజం చెప్పనా… ఆకాశాన్ని ఆక్రమించిన చెట్టుకైనా వేళ్ళు భూమిలోకే ఉంటాయి . ఆకులూ, కొమ్మలూ కాదు ఆత్మకథంటే.. ఆ చెట్టుకి పునాది అయిన వేళ్ళ కథలు. ఆ ‘వేళ్ళ’ కథలు చెట్టు చెబితేనే గానీ తెలీదు. కొమ్మల్ని బట్టి, కాండాన్ని బట్టి చెట్టు వయసునీ, గొప్పతనాన్నీ వూహించవచ్చు. కానీ ఎన్ని పురుగులు తల్లి వేరుని, మిగతా వేళ్లనీ కొరికాయో, కొరికే ప్రయత్నం చేశాయో ఆ చెట్టుకి తప్ప ఎవరికీ తెలీదుగా! తప్పక రాయండి. ఒట్టేసి చెబుతున్నా. మీ ‘స్క్రిప్టు’ మొదట నేను చదువుతా!” సిన్సియర్‌గా అన్నాను.

“వేరు పురుగుల గురించేగా రాయాల్సింది. అదీ తప్పే. నాకు ఇష్టం లేకుండా ఏదీ జరగలేదు. ఏ తప్పు జరిగినా నాకు తెలిసే జరిగింది. అందుకే నేనెవరినీ నిందించాలని అనుకోవట్లా. కానీ, జరిగింది జరిగినట్లు మాత్రం రాస్తాను.”

“గుడ్. నిజాన్ని నిజంగా వ్రాయగలగడం అంత కష్టం మరొకటి ఉండదు. చాలా ధైర్యం కావాలి!”

“అది వుంది లెండి. ఇంతకీ నేను వ్రాయబోయే కథలపేరు తెలుసా?”నవ్వింది. ఆ నవ్వులో చిన్న చిలిపిదనం దోబూచులాడింది.

“చెప్పండి!” ఉత్సాహంగా అన్నాను.

“చీర చెప్పిన కథలు!” పకపకా నవ్వింది.

 

*******************************************

 

అయ్యా… కమల ఇంకా మద్రాసులోనే ఉంది. ‘మధు’ ప్రస్తుతం ఓ గొప్ప కాలేజీలో లెక్చరర్‌గా ఉంటూ ఆ జాబ్ వదిలేసి ఆస్త్రేలియా వెళ్లాడట. ‘ది అన్‌టోల్ద్ స్టోరీస్’లో ఉన్న వ్యక్తులందరూ ప్రస్తుతం మన మధ్య వున్నవాళ్ళే. కొంతమంది ‘పర్మిషన్’ ఇస్తామన్నారు. ఇస్తే వారి ఫోటోల్ని, సెల్ నంబర్స్‌ని కూడా ప్రచురించడం జరుగుతుంది. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చవొచ్చనే అనుకుంటున్నాను. వీలున్నంతవరకూ ‘చీకటి’ వ్యవహారాల్ని ‘రాత’లోనే ‘ఎడిట్’ చేశానని మనవి చేస్తూ (పేర్లు మార్చానని చెప్పక్కర్లేదుగా)…

మీ భువనచంద్ర…