ఆదివాసీల ఉత్తేజిత ఊపిరి – కొమురం భీం

unnamed

ఒక చారిత్రక జీవితం తాలుకూ అన్ని ఛాయలను స్పృశించుకుంటూ ఒక నవల రాయడం లోని కష్టాలు ఎన్నో. వాస్తవాన్ని, కల్పనలను, వక్రీకరణలను నింపుకున్న రాశులలోంచి నిజాలను రాబట్టుకోవడం అంత సులభమైన పనేం కాదు.

1910 తరువాత నిజాం నవాబులు అటవీ చట్టాల తీసుకురావడం, వాటి వల్ల గోండులు, కొలామ్ లు మొదలగు ఆదివాసులు జీవితాలలో వచ్చిన పెను మార్పులలో నుంచి ఉద్భవించినదే కొమురం భీం చరిత్ర.

దీన్ని ఒక కొలిక్కి తెచ్చి  ఒక వాస్తవ ప్రజా పోరాట యోధుడిని మిగతా ప్రాంత ప్రజలకు పరిచయం చేయడం కోసం, నేల కోసం పరితపించే వాళ్లల్లో ఒక స్పూర్తిని నింపడం కోసం అల్లం రాజయ్య గారు, మరియు సాహు గారు, చరిత్రకారులు కాకపోయినప్పటికి  హేమన్ డార్ఫ్ నివేదికలు, ప్రభుత్వ రికార్డులు, గోండులతో కలసి మాట్లాడి తెలుసుకున్న విషయాలు, భీం దగ్గర ముఖ్య అనుచరుడిగా పని చేసిన కొమురం నూరు చెప్పిన విషయాల ఆధారంగా తమ తొలి చారిత్రక నవలను ప్రతిభావంతంగానే తీర్చిదిద్దారు అని చెప్పుకోవచ్చు.

స్థానిక షావుకారులు, అధికారులు, దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధారణమైన గోండు బాలుడు, ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో, హత్యచేసి, పారిపోయి,దేశమంతా తిరిగి, ఎక్కడ చూసిన అదే దుర్మార్గాలతో విసిగిపోయి, మన్నెం పోరాట స్ఫూర్తితో, తిరిగి తన ప్రాంతానికే తిరిగివచ్చి పోరాటం చేసిన క్రమాన్ని తెలుసుకోవాలంటే  ఈ నవల ఒక్కసారైన చదవాల్సిందే. ముందు మాటలో వరవరరావుగారు, ఈ పుస్తకాన్ని చెంఘిజ్ ఖాన్,స్పార్థకస్ లతో పోల్చినా, దీన్ని చదవగానే నాకు గుర్తొచ్చిన పుస్తకం  ఏడుతరాలు. అది నేరు బానిసత్వానికి ప్రతీకగా నిలిస్తే, బానిసల కంటే హీనంగా తోటివాడు ఎలా దోచుకోబడతాడో వివరించిన పుస్తకం ఇది.

అల్లం రాజయ్య

అల్లం రాజయ్య

15సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమయ్యే కొమురం భీమ్ చరిత్రను ప్రధానంగా ఐదు భాగాలుగా చేసి చూడవచ్చు. ( పుస్తకంలో అధ్యాయాలు చేయలేదు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, మార్పులు చేర్పులు ఎవరైన సూచించగలరు)

1915 – 1920 ( భీం వయస్సు 15 – 20ల మధ్య)

ఆదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ ప్రాంతంలో సంకేపల్లి గూడెం లో గోండుల జీవన విధానాన్ని పరిచయం చేస్తూ ఈ నవల మొదలవుతుంది. అడవిలో చెట్టు పుల్లలు విరిచినా వేళ్లు తెగ్గోట్టే జంగ్లాత్తోల్లు(అటవీ అధికారులు) అరాచకాలు, నిత్యం అటవీ జంతువులతో పోరాడుతూ కాపాడుకున్న పంటలను వడ్డి లెక్కలతో మాయ చేసి మోసం చేసే మైదాన షావుకార్లు చేసే వంచనలు సహిస్తూ, పేన్కు (దేవుడు) మీద నమ్మకంతో సాగిపోతున్న గోండుల (భీం) జీవితంలో అతని తండ్రి చిన్ను మరణం ఒక  పెద్ద కుదుపవుతుంది.  సంకేపల్లి లో పంటలు సరిగా పండక పోవడంతో ఆ ప్రాంతాన్ని వదిలి, ధనోరా ప్రాంతంలో నర్దేపూర్ గూడెన్ని నిర్మించుకొంటారు. పోడు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అడవులను నరికి, సాగు చేస్తారు. పంటలు కోతకొచ్చిన సమయంలో ఆ ప్రాంత పట్టేదార్ నంటూ వచ్చిన సిద్దిక్ తో జరిగిన గొడవలో, భీం సిద్దిక్ ను తలపగలగొట్టి చంపేసి, భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. పోలీసులు కోపానికి సర్దేపూర్ గూడెం, పంటలు సర్వనాశనమై, భీం చిన్నాయనలు, అన్నలు, మిగిలిన గోండులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతారు.

1920 – 1925 ( భీం వయస్సు 20 – 25 ల మధ్య)

బలార్షా మీదుగా చంద్రపూర్ చేరుకున్న భీమ్ అక్కడ జాతీయవాదులు రహస్యంగా నడిపే ఓ ప్రెస్ లో పనిచేస్తాడు. అక్కడే కొద్దిగా చదవడం, రాయడం నేర్చుకుంటాడు. కొద్ది రోజులకే పోలీసులు ఆ ప్రెస్ మూసేయడంతో రైల్వే స్టేషన్లో మేస్త్రీల మాటలు విని అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ అత్యంత హేయమైన బతుకుల్ని చూస్తూ, అనుభవిస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకురాబడే కూలీల కథలను వింటూ భారంగా రోజులు దొర్లిస్తాడు. హిందీ, ఉర్దు మాట్లాడటంలో కొంత నేర్పు సంపాదిస్తాడు. అక్కడే ఓ మిత్రుని ద్వారా మన్నెం దొర అల్లూరి గురించి తెలుసుకుని, ఉత్తేజితుడవుతాడు. అక్కడ జరిగిన ఒక తిరుగుబాటులో పాల్గొని, నిర్భంధించబడి, అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి,. కాకాన్ ఘాట్ లోని తన అన్నల దగ్గరికి తిరిగి చేరుకుంటాడు.

1925 – 1935 (భీం వయస్సు 25 – 35 ల మధ్య)

దేవడం లచ్చుపటేల్ దగ్గర పాలేరుగా చేరి అతనికి అత్యంత నమ్మకస్తుడిగా వుంటాడు. సోంబాయి, పైకు బాయి లను వివాహం చేసుకుంటాడు. భీం జీవితంలో ఇదొక ప్రశాంతమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. (అతని సంతానం గురించి వివరాలు పుస్తకంలో ఇవ్వలేదు.) లచ్చుపటేల్కు చెందిన భూ లావాదేవీలలో (తెల్లచొక్కలతో) అధికారులతో మాట్లాడి ఒక కేసును గెలిపిస్తాడు. ఇది గొండులలో భీం ప్రతిష్టను పెంచుతుంది.

1935 – 38 ( భీం వయస్సు 35 – 38 ల మధ్య)

భీం చిన్నాయనలు కుర్దు, యేసులు ప్రజలను కూడదీసి బాబేఝరి ప్రాంతంలో అడవులు నరికి, పన్నెండు గూడెంలను నిర్మించుకొని, ప్రభుత్వంతో పోరాటం సాగిస్తూ,అధికారులతో వ్యవహరించడానికి ఉర్థూ బాగా తెలిసిన భీం ను, రాత పనికి మహదును నియమించుకుంటారు. ఈ పోరాట క్రమంలో భీం నాయకునిగా ఎదగడం, ఆ పన్నెండు గ్రామాలలో ఒక సమాంతరమైన ప్రభుత్వాన్ని జోడెన్ ఘాట్ ప్రధానకేంద్రంగా భీం నడిపించగలుగుతాడు. ఇక్కడే భీం మూడో పెళ్లిని చేసుకుంటాడు.  అధికారులను, పోలీసుల ఆగడాలను ఎదుర్కోవడం, వారిని పారద్రోలడానికి ఒక చిన్న సైన్యాన్ని కూడా సమకూర్చుకోగలుగుతాడు. కొంత మంది సన్నిహితుల సలహా మేరకు నిజాం నవాబుని కలవాలని హైదరాబాద్ వచ్చి, రాజు దర్శనం దొరకకపోవడం తో అవమానంగా భావించి తిరిగి వచ్చే లోగానే పోలీసులు జోడెన్ ఘాట్ ను, అక్కడి పొలాలను నాశనం చేస్తారు. ఇది పూర్తి స్థాయి పోరాటానికి భీం ను ఉసిగొల్పుతుంది.

సాహు

సాహు

1938 – 1940( భీం వయస్సు 38 – 40 ల మధ్య)

బర్మార్లు( ఒక రకమైన తుపాకులు) తయారు చేసుకుని,  పోలీసులకు దీటైన సమాధానం ఇస్తూ గోండు రాజ్యస్థాపన దిశగా భీం పయనిస్తాడు. 50 మంది సైనికుల దాడిని తిప్పికొట్టి విజయం సాధిస్తారు. చర్చలకు వచ్చిన సబ్ కలెక్టర్ 12 గ్రామాల ప్రజాలకు పట్టాలిచ్చి, అప్పులు మాఫీ చేస్తానన్నా భీం రాజ్యాధికారానికే కట్టుబడడంతో అవి విఫలమవుతాయి. ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి,.గోండులకు అత్యంత పవిత్రమైన దినం, 1940 సెప్టంబర్ 1 న మూడు వందల మంది నిజాం సైనికులు జరిపిన దాడిలో, కుర్దుపటేల్ అనే గోండు చేసిన ద్రోహంతో  భీం మరణిస్తాడు. స్వయంపాలనకై కలలు కన్న ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు, రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు అది. ఆ తరువాతి ఘటనలలో ఆ పన్నెండు గ్రామాల ప్రజలు చెల్లచెదురైపోతారు.

ఇది జరిగి ఇప్పటికి దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తుంది. కాని నేటికైనా గోండులు వంటి ఆదివాసీల బతుకుల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, వారి సమస్యలేమన్నా తీరాయా, అనేది ప్రశ్నార్దకం కావడం సిగ్గుపడాల్సిన విషయమే.

అడవిలో వుంటే తిండి కావాలి, తిండి కావలంటే అడవి నరకాలి, పంటలేయాలి, అది చేస్తే పట్టేదార్లో, జంగ్లాతోల్లో వస్తారు, వాళ్లు అడిగిందంతా ఇవ్వాలి., ఇస్తే ఆకలికి చస్తాం,.ఇవ్వకుంటే వాండ్లు చంపుతరు., కొట్లాటకు బోతేనేమో ఇలా పారిపోవాలి అంటూ భీం ఒక చోట చెబుతాడు.

వాళ్లకి ఇప్పటికైన భూములకు పట్టాలిచ్చి, కొత్త వ్యవసాయ పద్దతులు నేర్పి, పాఠశాలల్లో కాస్తంత చదవు నేర్పిస్తే వారి జీవితాలు మారతాయేమో. ప్రస్తుత వారి పరిస్థితి పట్ల నాకు ఎలాంటి అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం కూడా సరికాదు,. కాని భీముడి సంతానంగా చెప్పుకునే గోండుల జీవితాలలో వెలుగులు నిండాలనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఆదివాసీ ప్రచురణలు, జోడెన్ ఘాట్ వారు 83,93 ప్రచురణల తరువాత 2004 లో ఈ పుస్తకాన్ని మళ్లీ ముద్రించారు,. తరువాత మరో ఎడిషన్ వచ్చిందేమో నాకు తెలియదు. తెలుగులో వెలువడ్డ మంచి పుస్తకాలలో ఇది ఒకటి, వీలైతే ఖచ్చితంగా చదవండి. వెల ఇరవైరూపాయలు, 238 పేజీలు.(2004 ఎడిషన్)

– భాస్కర్ కె