సమూహాల్ని ఛేదించుకుంటూ…

 

painting: Rafi Haque

painting: Rafi Haque

ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ

సమూహాల్ని ఛేదించుకుంటూ

నీకోసం నువ్వో ఒంటరి రాగం ఆలపించుకోవాలి.

ఏ చుక్కలూ లేని  ఒంటరి ఆకాశంలా మారిపోవాలి 

ఆకులు రాలిన చెట్టు మీద వాలిన ఒంటరి పిట్ట అయిపోవాలి 

సముద్రాన్ని వదిలిన ఒకే ఒక్క ఏకాంతపు నీటిబొట్టువి కావాలి

నువ్వంటే నువ్వేనని, 

నీలోవున్న నువ్వేనని

నీకోసం పుట్టిన నువ్వేనని అర్థమవ్వాలి

మంచుబిందువుల దుప్పటి కప్పుకున్న ఒంటరి గడ్డిపువ్వు లా నీకు నువ్వు నచ్చాలి 

తప్పదు,

నీ మనసుని నీ ఎదురుగా దిశమొలతో నిలబెట్టడం జరగాలి.

అనేకానేక సంకోచాలూ వ్యాకోచాల నడుమ సుదూర తీరాలకి వలస వెళ్ళిపోయిన

నిన్ను నువ్వు పట్టి తెచ్చుకోవాలి 

అందుకోసమైనా సమూహాల సంకెళ్ళనుంచి నీకు నువ్వే విముక్తుడివి కావాలి

వెలుతురు పొట్లమేదో విప్పినట్టు  స్వచ్ఛంగా నవ్వుకోగలగాలి 

నిజం చెప్పు ,

నీలోకి నువ్వు తొంగి చూసుకొని 

నీతో నువ్వు తనివితీరా మాట్లాడుకొని

నిన్ను నువ్వుప్రేమగా  ఆలింగనం చేసుకొని ఎన్నాళ్ళైందో గుర్తుందా.!?

సమూహం నువ్వెలా వుండాలో చెబుతుందే గానీ

నువ్వెలా వుంటే అలా స్వీకరించడానికి ఎప్పుడూ వెనకడుగే వేస్తుంది.

అది ఒట్టి పిరికిది. ..నీ తెగింపు దానికి నచ్చదు.

దానిది కడుపు నిండిన బేరం. ..నీ ఆకలి తనకి పట్టదు.

నిన్నో బండరాయినో, మట్టిముద్దనో చేసి

తనికి కావల్సిన ఆకృతిని నీనుంచే పొందాలని తెగ ఆరాటపడుతుంటుంది.

ఈ సందిగ్ధావస్థలోనే నీలోంచి నువ్వు మాయమైపోతుంటావు 

నీకు నువ్వే ఎదురు పడినా అదినువ్వో కాదో పోల్చుకోలేనంత

అయోమయంలో పడిపోతుంటావు 

మనిషి సంఘజీవే.. కాదని ఎవరూ అనరు.

నువ్వో జీవివని

నీకో జీవం వుందని తెలుసుకోవలసింది ఎప్పటికైనా నువ్వే.

లేనప్పుడు నువ్వు సమూహంలోనే  వుంటావు !

నీలో మాత్రం వుండవు !!