అలుపెరుగని పోరాటం – దంగల్ 

నం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. సక్సెస్ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ‘చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే’ అని ట్రైలర్ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, ‘ఒక శిల్పకారుడు అతి నేర్పుగా చెక్కిన శిల్పంలా ఉంది సుమా’ అనే ఆలోచన మాత్రం రాక మానలేదు. సినిమా ఒక కథ, సినిమా ఒక కవిత, సినిమా ఒక క్షణికానందం, సినిమా ఒక జీవితకాల సత్యం, సినిమా ఒక వినోదం, సినిమా ఒక దుఃఖం, సినిమా ఒక వెతుకులాట నిజానికి సినిమా ఒక ఆట కూడా. పట్టూ విడుపూ తెలిసి ఉండటం, దాడి చేయడమెప్పుడో దెబ్బకు కాచుకోవడమెప్పుడో అర్థం చేసుకునే తెలివితో మెలగడం, ప్రత్యర్థి ఏమాత్రం ఊహించలేని ఎత్తులను సమయానుకూలంగా వేయగల నేర్పరితనాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలు ఒక ఆటకు ఎంతో అవసరం. అదే విధంగా ఎక్కడ ఏ విధమైన ఎమోషన్ ని పండించాలో, ఏ భావ తీవ్రతను ఎక్కడి వరకూ తీసుకెళ్లి ఆపేయాలో, కథను ఎప్పుడు ఎటువంటి ఊహకు అందని విధంగా మలుపు తిప్పాలో తెలుసుకున్న దర్శకుడు ఏ కథాంశాన్ని తీసుకున్నా, దాన్ని సినిమాగా మలచడంలో విజయం సాధిస్తాడని దంగల్ సినిమా నిరూపించింది. ‘దంగల్’ అంటే రెజ్లింగ్ అని అర్థం.

నిజ జీవితానికి చెందిన కథను ఆసక్తికరమైన చిత్రంగా తీర్చిదిద్దడం అంత సులువైన విషయం కాదు. అందులోనూ అమ్మాయిల రెజ్లింగ్ పోటీలకు చెందిన కథాంశంతో ఇంత చక్కని సినిమాను మన వెండితెర వెనుకనుంచి ఇంతద్భుతంగా ప్రజంట్ చేసినందుకు దర్శకుడు నితేష్ తివారీని ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ‘మహావీర్ సింగ్ పొఘాట్’ అనే ధీశాలి కథను దేశం మొత్తం తెలుసుకునేలా చేసి, ఎందరో అమ్మాయిల లక్ష్యాల నిండుగా ధైర్యాన్ని నింపిన అమీర్ ఖాన్ ని కూడా అభినందించాల్సిందే.

దేశానికి స్వర్ణపతకాన్ని తేవాలని కలలు గన్న మహావీర్, పేరు ప్రతిష్టలను తప్ప ధనాన్ని సంపాదించుకోలేకపోయిన కారణంగా రెజ్లింగ్ ని వదిలి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. తను కన్న కల, తనకు పుట్టబోయే కొడుకు ద్వారా నిజం చేసుకోవాలని బలంగా కోరుకున్న అతడు, వరసగా నలుగు ఆడపిల్లలకి తండ్రవుతాడు. కలలన్నీ కల్లలు చేసిన విధిరాత కారణంగా విరక్తి చెందిన ఈ రెజ్లింగ్ ప్రేమికుడు, రెజ్లింగ్ ఆటపైనే ఆసక్తిని కోల్పోయి వాస్తవంతో రాజీపడిపోయి జీవించడం మొదలుపెడతాడు. అలా వాడిపోయి మరణించిపోతున్న అతనిలోని ఆశల వృక్షానికి అతని పెద్ద కూతుళ్లిద్దరూ వాళ్లలో దాగున్న పౌరుషాన్ని ప్రదర్శించడం ద్వారా తిరిగి మళ్లీ చిగురులేయిస్తారు.

అవును, కావాల్సింది, తేవాల్సింది స్వర్ణం. తెచ్చేది అమ్మాయైతేనేం? అబ్బాయైతేనేం? అన్న ఆలోచన అతనిలో తిరిగి జీవాన్ని నింపుతుంది. ఒక పల్లెటూళ్లో, అమ్మాయిలు కేవలం ఇంటి పనులు చేయడానికీ, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికీ మాత్రమే పుడతారని బలంగా నమ్మే రోజుల్లో అతను తన ఇద్దరు ఆడపిల్లలకీ నిక్కర్లు తొడిగించి పొలాల వెంట పరుగులు తీయిస్తాడు. నీళ్లలోకి దూకించి ఈతలు కొట్టిస్తాడు. సుకుమారమైన మొగ్గల్లాంటి ఆ పసికందుల చేత ఎంతో కఠినమైన సాధన చేయిస్తాడు. ఎప్పుడూ ఎందుకూ నోరెత్తి ఎరగని అతని భార్య  కూడా ఎదురు తిరిగి గట్టిగా అరిచి గోల చేసినా వినకుండా పిల్లల చేత మాంసం తినిపిస్తాడు. వాళ్ల కోసమే ప్రత్యేకంగా రెజ్లింగ్ సాధన చేసే ప్రదేశాన్నిఏర్పాటుచేసి తానే స్వయంగా శిక్షణనిస్తాడు. అబ్బాయిలతో కుస్తీ పట్లు పట్టిస్తాడు. ఎన్నో అవమానాలను భరిస్తాడు. ఆర్ధికపరమైన అనేకమైన ఇబ్బందులని అనుభవిస్తాడు. ఎన్నెన్నో ఆటుపోట్లని తట్టుకుని, నిర్భయంగా నిలబడి, నవ్విన నాప చేనే పండేలా చేసుకుంటాడు. తన కూతుళ్ళని గ్రామమే కాదు, మొత్తం దేశమే చూసి గర్వపడేలా తీర్చిదిద్దుతాడు.

ఇటువంటి కష్టాలతో నిండిన కథను, హుషారుగా సాగిపోతున్న ప్రవాహమంత సులువుగా కళ్లముందు కదిలేలా చేసి కనికట్టు చేసాడు దర్శకుడు నితేష్. ముఖ్యంగా మహావీర్ పాత్రను ధరించిన అమీర్ ఖాన్ ఎక్కడా తనని తాను ప్రదర్శించుకోలేదు. ఎక్కడ ఆ పాత్ర ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే కనిపించి, కథను ఎంతో మెళకువతో ముందుకు నడిపించాడు. హుందాతనం, గాంభీర్యత నిండిన ఒక హర్యానా వాసి పాత్రలో అతడు ఒద్దికగా ఒదిగిపోయాడు. అరవై ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిగా తనని తాను సహజంగా చూపించుకోవడం కోసం, 30 కేజీల బరువు పెరిగి 98 కేజీల వరకూ చేరుకున్నాడట అమీర్. ఈ అంకిత భావానికి తగ్గ ఫలితాన్ని కూడా దక్కించుకున్నాడు. అతి సాధారణమైన గంగి గోవులాంటి గ్రామీణ స్త్రీ పాత్రలో, అతని భార్యగా నటించిన సాక్షి తన్వార్ కూడా అంతే నెమ్మదిగా కుదురుకుపోయింది. ఇక కడిగిన ముత్యాల్లాంటి గీతా, బబితాలు బాల్యంలోనూ, యవ్వనంలోనూ కూడా ఎంతో

అందంగా కనిపించి అద్భుతంగా అమరిపోయారు. మిక్కిలి శ్రద్ధగా ఏర్పాటు చేసిన ప్రతి రెజ్లింగ్ పోటీ అతి సహజంగా అనిపించి, నిజమైన పోటీలను చూస్తున్న అనుభూతిని కలుగజేసింది.

కథతో పెద్దగా సంబంధం లేని వ్యక్తి అయిన మహావీర్ సింగ్ తమ్ముడి కొడుకుతో కథ చెప్పించడం వలన, అతని ద్వారా హాస్యాన్ని జోడించడానికి సినిమాకు అవకాశం ఏర్పడి, కథలో ఒక విధమైన సరళత్వం మిళితమైంది. ఇక మరింత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు గురించి. ప్రీతమ్ అందించిన మంచి ఊపున్న సంగీతానికి అమితాబ్ భట్టాచార్య  రచించిన సాహిత్యం భలే అందంగా జతకూడింది. ‘బాపూ సేహత్ కేలియే తూతో హానీకారక్ హై’ పాటైతే తప్పనిసరిగా విని తీరాల్సిందే. తెలుగు భాష తీయదనం గురించి ఎప్పుడూ తెలిసిందే గానీ హిందీ భాషలో ఎంతటి సౌందర్యం దాగుందో కదా అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని పాటల్ని వింటుంటే.

అతి కష్టమైన, శారీరకమైన శ్రమతో కూడిన ఈ రెజ్లింగ్ సైతం ఆడపిల్లల్ని అడ్డుకోలేదని మహావీర్ సింగ్ నిరూపించి చూపాడు. తన కూతుళ్ల తలరాతల్నీ, గీతల్నీ తనే గీసినా మరెందరో అమ్మాయిలకి కలలు కనేందుకు బంగారు దారుల్ని బహూకరించాడు అతడు. గీతా, బబితాలు కూడా తండ్రి శ్రమను వృధాగా పోనివ్వకుండా కష్టానికీ, శ్రమకూ, అంతులేని త్యాగాలకూ వెరవక, విజయపథంలోని తొలి బాటలుగా మారారు. ఈ ముగ్గురి జీవితాలనీ మరింత ఆసక్తికరంగా, ఆదర్శప్రాయంగా కనిపించే విధంగా తిరగరాసి, కదిలే చిత్రంగా మార్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు అమీర్, నితేష్ లు.

*

 

ఆద్యంతాలు లేని ‘ఆగమనం’

arrival1

ప్పట్లాగే ఈ సంవత్సరం(2016)  కూడా హాలీవుడ్ లో ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చేసింది. ‘టెడ్ చియాంగ్’ రాసిన ‘స్టోరీ అఫ్ యువర్ లైఫ్’ అనే కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఎరైవల్(Arrival)’ అనే పేరుగల ఈ సినిమా కథాంశం ఏలియన్ సంబంధితమైనది అయినప్పటికీ, ఈ దృశ్య ప్రవాహపు ప్రతీ కదలికా, మెలకువతో మెళకువగా చూస్తున్న జీవిత ఘట్టాల బిందు సమూహంలానే కనిపిస్తుంది.

ఒక ప్రాణాంతకవ్యాధి కారణంగా యుక్త వయసులోకి అడుగుపెడుతూనే మరణించిన కుమార్తెతో పాటుగా ఆశలనన్నిటినీ అంతం చేసుకున్నట్టుగా కనిపించే ‘లూయిస్’ కథతో సినిమా ఆరంభమవుతుంది. కానీ అప్పుడు కూడా ఆమె, తనకి ఆరంభాల మీదా అంతాల మీదా నమ్మకమనేది ఉందో లేదో చెప్పలేకపోతున్నానంటుంది. ఇంతకూ లూయిస్ ఒక  బహుభాషా ప్రవీణురాలు. అనేక భాషలపైన మంచి పట్టును కలిగి ఉన్న లూయిస్, యూనివర్సిటీలోని విద్యార్థులకి బోధన చేస్తుంటుంది. ఇంతలో అనుకోకుండా భూమి మీద ఏలియన్ షిప్ లు ల్యాండ్ అయ్యాయని తెలియడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతారు. అవి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు చోట్లకి వచ్చి ఆగుతాయి. .కానీ ఆ ఏలియన్స్ మనుషులకు హాని చేయడానికి రాలేదనీ, వారు తమతో మాట్లాడే  ప్రయత్నం చేస్తున్నారనీ భావించిన అమెరికన్ ఆర్మీ చీఫ్, వారి భాషను అర్థం చేసుకుని వివరించమని లూయిస్ ని కోరతాడు. ఆమెతో పాటుగా  ఫిజిసిస్ట్ అయిన అయాన్ అనే వ్యక్తిని కూడా ఆర్మీ ఈ పని నిమిత్తం నియమిస్తుంది. వారిద్దరూ కలిసి ఆ ఏలియన్ల భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏలియన్ల భాష శబ్ద ప్రధానమైనది కాదనీ దృశ్యరూపమైనదనీ గ్రహించి, ఆమె ఆ భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు కొంచెం సమయం అవసరమవడంతో, ఆ లోపుగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయి.

ఏలియన్స్ భాషను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన, వారు యుద్ధానికి సిద్ధమై వచ్చినట్టుగా భావించి  చైనా ఆర్మీ జెనెరల్ షాంగ్, వారిపై యుద్ధానికి పిలుపునిస్తాడు. అతనికి మరికొన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతాయి. కానీ లూయిస్ కి మాత్రం ఏలియన్లు తమకి సహాయపడే ప్రయత్నం చేస్తున్నారనే నమ్మకముంటుంది. ఈ మధ్యలో ఆమెకు, తన కుమార్తెకి చెందిన కలలూ, జ్ఞాపకాలూ ఏర్పడటం ఎక్కువైపోతుంటుంది. ఆ ఏలియన్స్ కీ, తన కుమార్తెకీ మధ్య గల సంబంధమేమిటో ఆమెకి అర్థం కాదు. చివరికి అసలు విషయాన్ని అర్థం చేసుకుని, ఏలియన్ల సందేశాన్ని ప్రపంచానికి చేరవేసి యుద్ధాన్ని ఆపడంలో ఆమె సఫలీకృతురాలవుతుంది. ఈ క్రమంలోనే ఆమెకి అనుకోని ఓ రహస్యం కూడా తెలుస్తుంది. ఆ రహస్యమేమిటో సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయాలు మూడు. మొదటిది, కథని ముందుకూ వెనకకూ జరపడంలోనూ, మానవీయ కోణానికీ, సెన్సిబిలిటీకీ పెద్ద పీట వెయ్యడంలోనూ దర్శకుడు చూపిన ప్రతిభ, సినిమా విజయానికి మూల కారణమైతే, అందుకు తగ్గ దృశ్య రూపావిష్కరణ చేసిన సినిమాటోగ్రాఫర్ ‘బ్రాడ్ ఫోర్డ్ యంగ్’  కృషి కూడా అభినందనీయం. ముఖ్య పాత్రధారిణి లూయిస్ గా నటించిన ‘అమీ ఏడమ్స్’ నటన అత్యంత సహజసిద్ధంగా ఉండి మనసును కట్టి పడేస్తుంది. ఇక సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన జోహాన్ జోహన్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. ఇక కీలకమైన ప్రాముఖ్యత కలిగిన ఏలియన్ల భాషను ‘మార్టిన్ బెర్ట్రాండ్’ అనే ఆర్టిస్ట్ డిజైన్ చేసిందట.

arrival2

‘సికారియో, ప్రిజనర్స్, ఇన్సెన్డైస్’ వంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు ‘డెనిస్ విలెనెవ్’ ఈ సినిమా ద్వారా తన సమర్థతని మరోసారి నిరూపించుకున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతని సినిమాలలో, నాటకీయత – సహజత్వం విడదీయలేనంతగా కలిసిపోయి ఉండటం గమనించవచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే, అసలు  సై.ఫి. సినిమాలంటేనే ముఖ్యంగా ఊహా ప్రధానమైనవి. అతికినట్టుగా అనిపించకుండా వాటిలో జీవాన్ని నింపాలంటే చాలా నేర్పు అవసరం. ఈ సినిమా ఇంత అద్భుతంగా అమరడానికి అటువంటి నేర్పే కారణమని చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప మలుపులూ, ‘ఇంటర్ స్టెల్లార్’ లా విపరీతమైన సైన్స్ పరిజ్ఞానమూ ఉపయోగించకుండానే ఒక పటిష్టమైన, ఆసక్తికరమైన సినిమాని తయారు చేయడం హర్షించదగిన విషయం.

లూయిస్ వ్యక్తిగత జీవితం, ఏలియన్స్ తో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉందన్న సందేహమే సినిమాను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతుంది. ఆమె కుమార్తె ఏలియన్ నా? లేక చనిపోయి ఆ రూపంలో తిరిగి వస్తుందా? ఆమె మరణానికీ, ఏలియన్స్ కీ ఏమైనా సంబంధం ఉందా?…. వంటి సందేహాలు మన మనసుని ఎంగేజ్ చేసి దృష్టి మరల్చనివ్వకుండా చేస్తాయి. ఇక అయోమయానికి గురి చేయని కథనం కూడా సినిమాకు గొప్ప ఆకర్షణ.

సినిమాకి ప్రాణమైన అతి ముఖ్యమైన ఒక ట్విస్ట్ మాత్రం సగం దారి నించీ ఊహకు అందుతూ ఉంటుంది. తెలిసిపోయినా మళ్లీ తెలుసుకోవాలనిపించే వింత రహస్యమది. ముగింపులో మాత్రం సైన్స్ పరంగా కొద్దిపాటి క్లిష్టతరమైన అంశాలను జోడించినప్పటికీ, సై. ఫి. చిత్రం కనుక ఆ మాత్రం క్లిష్టత తప్పనిసరి. (ఇంతకు మించి వివరిస్తే, సినిమా చూడాలనుకునేవారికి స్పాయిలర్ అవుతుందన్న ఉద్దేశ్యంతో చెప్పడం లేదు). మొత్తానికి ఏదెలా ఉన్నా, కళ్లు తిప్పుకోనివ్వని విజువల్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఈ సినిమా అసంతృప్తిని మిగిల్చే అవకాశమైతే మాత్రం అణువంతైనా ఉండనే ఉండదు.  కాలాలూ, పరిస్థితులూ ఎంతగా మారినా, మన ఊహలనేస్థాయిలో విశ్వపు అంచుల వరకూ విహరించేందుకు పంపినా, విలువలనూ, మానవ సహజమైన ప్రేమాభిమానాలనూ పోగొట్టుకోనంతవరకూ మనం మనంగానే ఉంటామన్న నిజాన్ని ఈ సినిమాకి లభించిన ఘన విజయం నిరూపిస్తుంది.

 

***

విరుగుతున్న రెక్కల చప్పుడు – ఉడ్తా పంజాబ్

alia-bhatt-udta-punjab-trans

 

‘ఫ్లైయింగ్ హై’ అనేది ఒక మెటాఫర్.  ఇది ఒక విజయవంతమైన ఆనందమనే కాదు, ‘ఒక మత్తు మందు ప్రభావంతో ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని పొందడం’ అనే అర్థాన్ని కూడా కలిగి ఉంది. మన దేశంలో సాధారణంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ‘తాగున్నావా?’ అనడుగుతారు. అదే డ్రగ్స్  వాడకం అధికంగా ఉన్న దేశాల్లో అయితే ‘ఆర్ యు హై?’ అని అడగటం పరిపాటి. దానికి అర్థం, ‘నువ్వు డ్రగ్స్  గానీ తీసుకుని ఉన్నావా?’ అని అడగటం. ‘ఉడ్తా పంజాబ్’ అంటే ఇక్కడ, పంజాబ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందనీ, ఉన్నతమైన స్థితికి చేరుకుంటోందనీ అర్థం కాదు. డ్రగ్స్  మత్తులో మునిగి తేలుతోందని చెప్పడం. పేరుతో సహా అన్ని రకాలుగా ఈ సినిమా, పంజాబ్ లోని డ్రగ్ మాఫియా గురించి మాట్లాడబోతున్నట్టుగా

ముందుగానే ప్రచారం పొందింది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ డ్రగ్స్  వాడకం కథాంశంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో ఈ సమస్య  గురించి చర్చించలేదు.

ఈ సినిమా ఒక రాక్ స్టార్ (షాహిద్ కపూర్), ఒక బీహారీ అమ్మాయి (ఆలియా భట్), ఒక సబ్ ఇన్స్పెక్టర్(దిల్జీత్ దోషన్జ్), ఒక డాక్టర్(కరీనా కపూర్) లు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సినిమా మొదలవడమే రాక్ స్టార్ ‘గబ్రూ’ హోరెత్తించే పాటతో మొదలవుతుంది. పంజాబ్ లో చాలా మంచి రంగు కలిగిన అమ్మాయిలని ‘గోరీ చిట్టీ’ అని పిలుస్తారు. చిట్టా అంటే తెలుపు రంగని అర్థం. “ఓ చిట్టా వే” అంటూ మొదలయ్యే ఈ పాట తెల్లని డ్రగ్ పౌడర్ గురించి మాట్లాడుతుంది. మొత్తం పాటంతా ఒక తెల్లని అందమైన అమ్మాయికో లేక డ్రగ్ పౌడర్ కో, ఎలా అన్వయించుకున్నా సరిపోలే విధంగానే ఉంటుంది. డ్రగ్స్, వాటిని వాడినవారి నరాల్లో రేపేటంతటి హుషారూ, ఈ పాటకున్న సంగీతం కూడా రేపుతుంది.

లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి రాక్ స్టార్ గా మారిన ఒక గ్రామీణ పంజాబీ యువకుడు టామీ సింగ్. అప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిన ఇతడు, డ్రగ్స్ తీసుకునేందుకు యువత ఉత్ప్రేరితమయ్యే  విధంగా పాటల్ని రాసి పాడుతుంటాడు. బాగా ప్రాచుర్యాన్ని కూడా పొందుతాడు. అలాగే అక్కడికి దగ్గరలో మరోచోట ఒక బీహారీ అమ్మాయి(ఆలియా భట్)కి దొరికిన 3 కిలోల హెరాయిన్ ఆమెకి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెట్టి, డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయేలా చేస్తుంది. వీరిద్దరూ ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడటం, టామీ సింగ్, బీహారీ అమ్మాయి ప్రేమలో పడటం, అప్పటికే తను చేస్తున్నది తప్పన్న ఆలోచనలో ఉన్న అతడు, ప్రేమ డ్రగ్స్  కంటే ఎక్కువ మత్తుని కలిగిస్తుందని భావించడం, ఆమెని డ్రగ్ మాఫియా బారి నుండి కాపాడి పోలీసులకి లొంగిపోవడం ఒక స్టోరీ.

ఇక అదే గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సర్తాజ్ సింగ్, తన తమ్ముడు డ్రగ్ ఎడిక్ట్ గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల జ్ఞానోదయం పొంది, అప్పటికే యాక్టివిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రీత్ సాహ్నీతో కలిసి ఆ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. కథ ఏవేవో మలుపులు తిరిగి చివరికి ఆ డాక్టరమ్మాయీ, ఇంకా కొందరి డ్రగ్ మాఫియా సభ్యుల మరణాలకి దారి తీస్తుంది. మొత్తానికి వీరి ప్రయత్నాల కారణంగా ప్రభుత్వంలో, ప్రజలలో కొంత ఉత్తేజంగా కలిగినట్టుగా భావించమనే విధంగా సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీహారీ అమ్మాయిగా నటించిన ఆలియా భట్ గురించి. పూర్తిగా డీ గ్లామరైజ్ చేయబడిన పాత్రలో ఆమె నిజంగా చక్కని నటనను ప్రదర్శించింది. బీహార్ లో పనులు దొరకని కారణంగా చాలామంది అక్కడినుండి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జమ్మూ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ‘జుగ్గీ’లనబడే తాత్కాలికమైన గుడారాల్లో కాలాన్నివెళ్లదీస్తుంటారు. అటువంటి ఒక పదిహేను, పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి పాత్రలో ఆలియా భట్ చక్కగా ఇమిడిపోయింది. వేషభాషలు, మాట్లాడే యాసా, బాడీ లాంగ్వేజ్ ఆమెకు సరిగ్గా సరిపోయాయి. (నాకైతే మేం జమ్మూలో ఉన్నప్పుడు, వీధి చివరి జుగ్గీలో ఉండే ఉషా అనే బీహారీ అమ్మాయే గుర్తొచ్చింది). అంతే కాక అధికమైన విల్ పవర్, ధైర్యం కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. మాఫియా ముఠా సభ్యులు ఆమెని డ్రగ్ ఎడిక్ట్ గా మార్చినప్పటికీ, తన నోట్లో తనే గుడ్డలు కుక్కుకుని ఆ కోరికని అణుచుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఆమె పాత్రకు చెందిన కొన్ని ఇతర సన్నివేశాలూ  చాలా సహజంగా, మనసుని కదిలించేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించి హిప్ హప్ సంగీతం కూడా సినిమాకు చెందిన బలమైన విషయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా డ్రగ్స్  ప్రపంచానికి చెందిన ఆ చీకటి వాతావరణాన్ని సృష్టించడంలో సినెమాటోగ్రాఫర్ రాజీవ్ రవి సఫలమయ్యాడు

అయితే, మొదలవడం బాగానే మొదలైనప్పటికీ, ఎక్కడ తప్పిందో తెలీకుండానే కథ దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది. ఒక జటిలమైన సమస్యకి కొంత కామెడీని కూడా కలిపి సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేద్దామనుకున్న దర్శకుడి ఆలోచన ఎక్కువై, అసలు విషయం పక్కకి తప్పుకుంది. ఈ సినిమా ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో చాలా సులువుగా డ్రగ్స్  లభ్యమవుతున్నాయి. అవి కూడా ప్రాంతీయంగా తయారుచేయబడి

చాలా తక్కువ ధరలకే అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతున్నాయి. ఇందుకు రాజకీయ నాయకుల, పోలీసుల అండాదండా పుష్కలంగా లభిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం దర్శకుడు ‘అభిషేక్ చౌబే’ ఎంచుకున్న కథలోనే కొంత తడబాటు ఉంది.

ఒక సమస్య  ఉందని చెప్పినప్పుడు, అది ఎందుకు ఎలా మొదలైందో మూల కారణాలను వెదకడం, అది ఇంకా ఏ విధంగా విస్తరిస్తోందో గమనించేలా చేయడం, అవకాశం ఉంటే ఆ సమస్యకు తోచిన పరిష్కారాన్ని సూచించడం ఒక పధ్ధతి. లేదూ, ఆ సమస్యని కథలో భాగంగా తీసుకున్నప్పుడు, కథను ప్రధానంగా నడిపించి సమస్యను అందులో సహజంగా లీనం చెయ్యడం రెండో పధ్ధతి. కానీ ఈ సినిమా రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెన్సార్ సమస్యని తీవ్రంగా ఎదుర్కొన్న చిత్రంగా కూడా ఈ సినిమా వార్తలకెక్కింది. నిజానికి కథకు అంతగా అవసరం లేని అశ్లీల పద ప్రయోగాలు సినిమాలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పటికే ధూమపానం, మద్యపానం కారణంగా అన్ని విధాలుగా నాశనమయిపోతున్న మన దేశం, సరైన పద్ధతిలో ఆలోచన చేసి ఈ సమస్య  మరింతగా విస్తరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది.  అలా చెయ్యని పక్షంలో, ఈ సినిమాలోనే చెప్పినట్టుగా మన దేశం డ్రగ్స్ విషయంలో మరో మెక్సికోగా మార్పు చెందే సమయం పెద్ద దూరంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. పాబ్లో ఎస్కబార్ అనే డ్రగ్ మాఫియా డాన్, 1970,80 లలో అమెరికన్ రాష్ట్రాలకి డ్రగ్స్  అక్రమంగా రవాణా చేసి, అక్కడి యువతను మత్తుపదార్ధాలకి బానిసలుగా చేసాడు. ఒకవేళ అవే మత్తు పదార్ధాలు ప్రాంతీయంగా తయారుచేయబడితే, తక్కువ ధరకే లభ్యం కావడంతో పాటుగా మన దేశంలోని అవినీతి కూడా తోడై అతి సులువుగా వ్యాపించిపోతాయి. ఒక్క సారి గనక జనం, ముఖ్యంగా యువతరం వాటికి అలవాటు పడితే, మానడమనే విషయం చాలా కష్ట సాధ్యమైపోతుంది. అందువల్ల ఇటువంటి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కి చెందిన అసలైన చీకటి కోణాల గురించీ, వీడ్ అనీ పాట్ అనీ పిలవబడే మార్జువానా గురించీ, మెథ్, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల తయారీ, వాటి అక్రమ రవాణాల గురించీ, అవి కలిగించే దుష్ఫలితాల గురించీ, ఆ మాఫియా గ్రూప్ ల గురించీ సవివరంగా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్  ఒరిజినల్ సీరిస్ అయిన “నార్కోస్” చూస్తే సరిపోతుంది. ఇది యథార్థ గాథ. అదికాక డ్రగ్స్ ప్రపంచానికి చెందిన కల్పిత గాథ ‘బ్రేకింగ్ బాడ్”. బాగా ప్రాచుర్యం పొందిన ఈ టీవీ సీరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది.

మనిషికి వెన్నెముకా, పక్షికి రెక్కల వంటి వారు దేశానికి యువత. ఇప్పుడవి డ్రగ్స్ మూలంగా పటపటా విరుగుతున్న చప్పుడు పంజాబ్ అంతా వినిపిస్తోందని ఈ సినిమా చెప్తోంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి చూస్తే,  ‘డ్రగ్స్  విషయంలో పూర్తిగా ఆలస్యమైపోక ముందే మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ’ దేశానికీ, సమాజానికీ ఈ సినిమా ఒక హెచ్చరికని జారీ చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి.

***

 

ఆకాశానికి అంకెల నిచ్చెన!

ramanujan1

గణితమంటే అతనికి అంకెలతో ఉప్పొంగే అనంత ప్రవాహం . అందరూ చూడలేని  విచిత్రమైన రంగుల్ని నింపుకున్న వింత వర్ణచిత్రం, ఇసుక రేణువులన్ని రహస్యాల్ని గర్భాన దాచుకున్న సాగర తీరం. గణితం అతనికి జీవం, జీవన వేదం. గణితం అతని దైవం. అసలతనికి గణితమే జీవితం. ఇంతకీ అతని పేరు శ్రీనివాస రామానుజన్. అంకెల్తో ఎటువంటి ఆటైనా  అడగలిగేటంతటి మేధస్సును కలిగి ఉన్నప్పటికీ వాటిని దైవ సమానంగా పూజించగలిగేటంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన  గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్.

రాబర్ట్ కనిగల్ రచించిన రామానుజన్ జీవిత చరిత్ర  ఆధారంగా, అదే పేరుతో 2015లో నిర్మింపబడిన చలన చిత్రం The Man Who Knew Infinity.

భారతీయ గణిత శాస్త్రవేత్తగా, అత్యున్నతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తిగా శ్రీనివాస రామానుజన్ పేరు వినని వారెవరూ ఉండరు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1887 నవంబర్ 22న జన్మించిన రామానుజన్ ని ముఖ్యంగా గణిత శాస్త్రం రంగంలో అత్యంత మేధావిగా పేర్కొనవచ్చు. కానీ అతని జీవితం నల్లేరు మీద నడకేమీ కాదు.

ఈ సినిమా అతని చిన్నతనాన్నీ, చదువుకున్న రోజుల్నీ ప్రస్తావించకుండా యవ్వన దశలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న పరిస్థితులతో మొదలవుతుంది. మెల్లగా చిన్న ఉద్యోగం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి వెళ్లే అవకాశం అతనికి లభిస్తుంది. ఆ రోజుల్లో సముద్రయానం నిషిద్ధం కావడం వల్ల కొన్ని సందేహాలతో, మరి కొన్ని సంశయాలతోనే అతను కేంబ్రిడ్జికి వెళ్తాడు.

అతను ఇంగ్లాండ్ రావడానికి కారకుడైన సీనియర్ గణిత శాస్త్రవేత్త సి.హెచ్. హార్డీతో కలిసి ఐదు సంవత్సరాల పాటు తాను రాసిన గణిత సిద్ధాంతాలపై సాధన చేస్తాడు. పరస్పర వ్యతిరేక వైఖరులు కలిగిన ఆ ఇద్దరు మేధావుల మధ్య  ఏర్పడే ఘర్షణ, అనుబంధం, అక్కడ రామానుజన్ గడిపిన జీవితం ఈ చలనచిత్రంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఆ రోజులే రామానుజన్ కి అత్యంత ఆనందాన్నీ, కష్టాన్నీ కూడా కలిగించిన రోజులు.

ramanujan2

అంకెల్ని అక్షరాలుగా భావిస్తే, రామానుజన్ ని అతి విశిష్టమైన కవిగా పేర్కొనవచ్చు. కవికి హఠాత్తుగా కలిగే సృజనాత్మకమైన ఊహల్లా ఇతని ఆలోచనల్లోకి ఉన్నట్టుండి సరికొత్త సమీకరణాలు ప్రవేశించేవి. కవి వాస్తవాన్నీ, కల్పననీ పద చిత్రాలతో పెనవేసినట్టు, అసంకల్పితంగా ఇతను రాసిన సిద్ధాంతాలన్నీ నిదర్శనాలతో సహా నిజాలుగా నిరూపితమయ్యాయి. ఇసుక రేణువుల్లోనూ, నీటి ప్రతిబింబంలోనూ, కాంతి రంగుల్లోనూ ఇలా ప్రకృతికి చెందిన ప్రతీ చిత్రంలోనూ విచిత్రమైన అంకెల క్రమాన్నీ, అందాన్నీ చూడగలిగిన సౌందర్య పిపాసి రామానుజన్.

ఆటోడిడక్ట్ అయిన రామానుజన్ గణిత శాస్త్రంలో అప్పటివరకూ సాంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తున్న పద్ధతులేవీ తెలుసుకోకుండానే ఆ శాస్త్రానికి చెందిన ఎన్నో కొత్త విషయాల్ని వెలికి తీసి తనకో ప్రత్యేకమైన శైలినీ, మార్గాన్నీ ఏర్పరుచుకున్నాడు. తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ మేధావి, తన ప్రతిభను తమ ఆరాధ్య దేవత నామగిరి అమ్మవారి అనుగ్రహంగా అభివర్ణించాడు. ‘దేవుడి ఆలోచనను ప్రతిబింబించనప్పుడు ఏ సమీకరణమైనా తనకి  అర్థవంతం కాదన్న’ అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. మేథమెటికల్ ఎనాలసిస్, నెంబర్ థియరీ వంటి గణిత శాస్త్ర రంగాల అభివృద్ధిలో ఇతని పాత్ర అమూల్యమైనది. రామానుజన్ వ్యక్తిత్వంలోని ఈ విభిన్నమైన

కోణాలన్నిటినీ నటుడు దేవ్ పటేల్ అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. హార్డీగా నటించిన జెర్మీ ఐరన్స్  నటన కూడా చెప్పుకోదగ్గది.

అతని జీవితాల్లోని కొంత భాగానికే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చి, నటీనటుల నటనా చాతుర్యంపై ఎక్కువగా ఆధారపడిపోవటం వల్ల ఈ చలన చిత్రం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ రామానుజన్ వ్యక్తిత్వాన్నీ, మేధా శక్తినీ ప్రతిఫలించడంలో  మాత్రం సంపూర్ణంగానే  సఫలమైంది. పరిసరాలపై తక్కువా, వ్యక్తుల భావాలపై ఎక్కువా శ్రద్ధ పెట్టడం వలన కెమెరా కన్ను వంద శాంతం పనితీరును ప్రదర్శించలేకపోయినప్పటికీ అసంతృప్తిని మాత్రం మిగల్చలేదు. పూర్తి సాంప్రదాయ పద్ధతిలో చలన చిత్రాన్ని నడిపించినా  దర్శకుడు మాథ్యూ బ్రౌన్ కృషి, ప్రయత్నం అభినందనీయమైనవి.

‘మనుషులకంటే మీరు అంకెలనే అధికంగా ప్రేమిస్తారటగా’ అని అతని భార్య  జానకి దెప్పి పొడిచినప్పుడు అతను సంతోషంగా అంగీకరిస్తాడు గానీ భార్యనీ, బాధ్యతనీ కూడా అతను అమితంగానే ప్రేమిస్తాడు, ఇంగ్లాండ్ లో ఉన్న రోజుల్లో ఆమె కోసం తీవ్రంగా పరితపిస్తాడు. సనాతన వాది కావడం వలన అక్కడి ఆహారానికి అలవాటుపడలేక, పర దేశపు వాతావరణంలోని మార్పులకి సర్దుబాటు చేసుకోలేక అనారోగ్యం పాలవుతాడు. టీబీ వ్యాధి బారిన పడి శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నా తన పనికి మాత్రం ఆటంకం కలగనివ్వడు. ఒక భారతీయుడిగా వివక్షకి గురికావడం వలన కొంత  ఆలస్యమైనప్పటికీ చివరికి హార్డీ కృషి ఫలితంగా తన సిద్ధాంతాలని ప్రచురించుకుని, అరుదైన పురస్కారమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ ని పొందుతాడు. ఇక ఇంటికి వెళ్లాలన్న కోరికతో ఇండియాకి తిరిగొచ్చి దారిలో మళ్ళీ  తిరగబెట్టిన అనారోగ్యం కారణంగా, జన్మభూమిని చేరుకున్న సంవత్సరానికే 1920 లో తన 32 వ ఏట తుది శ్వాసని విడుస్తాడు ఈ అపర బ్రహ్మ.

మరణం కంటే బాధాకరమైన విషయం మరింకేముంటుంది. మరణమంటే నాశనం కావడమేగా. మరణించిన వారు, జీవించి ఉన్న కాలంలో చేసిన గొప్ప పనులు, లోకం వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా  చెయ్యవచ్చు . కానీ వారి అనుభూతులు, అనుభవాలు ముఖ్యంగా వారి  విజ్ఞానం వారితో పాటుగా అంతం కావాల్సిందేగా. అటువంటిది, ఒక మేధావి అంత చిన్న వయసులో మరణించడం జాతికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందన్న భావన మనల్ని దుఃఖానికి గురిచెయ్యకమానదు.

అయితేనేం? అతనికి అనంతమైన అంకెల గమనం తెలుసు. అత్యల్పమైన జీవితకాలంలోనే అంతులేనన్ని అద్భుతాలని సృష్టించడమూ తెలుసు. అందుకే అతను విశ్వమంత విశాలమైన ప్రపంచ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మిగిలిపోయాడు.

                              ***

 

ఆరు ముత్యాలున్న అడవి!

 

-భవాని ఫణి

~

wild tales1

రోడ్డు మీద మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తెలీని వ్యక్తి వచ్చి మనల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తేనో లేక అవమానిస్తేనో మనమేం చేస్తాం?. ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం ఉండదు. ఎవరికి వారు, వారి వారి పరిణితిని బట్టీ, విజ్ఞతని బట్టీ, ధైర్యాన్ని బట్టీ, అవకాశాన్ని బట్టీ,పరిస్థితుల్ని బట్టీ విభిన్నంగా స్పందిస్తారు. మనుషులందరిలో ఉండే భావోద్వేగాలు ఒకే విధమైనవి అయినప్పటికీ, వారవి ప్రదర్శించే స్థాయిలో మాత్రం హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. నిజానికి కాస్తంత వివేకమో, భయమో ఆపలేనప్పుడు, పగా ప్రతీకారాలు మనిషిచేత ఎటువంటి నీచ కార్యాలనైనా చేయించగలవు. ఎంతటి అధమ స్థాయికైనా దిగజార్చగలవు. విచక్షణని కోల్పోయేలా చేసి, అతని స్వంత గౌరవాన్నీ, మర్యాదనీ, ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పణంగా పెట్టించగలవు. చివరికి అతడిలోని పశు ప్రవృత్తిని వెలికి తీయగలవు.
అటువంటి పగనీ, ప్రతీకారాన్నీ కథా వస్తువుగా తీసుకుని మనిషిలోని సహనపు స్థాయిని ఒక విభిన్నమైన కోణంలోనుండి సమీక్షించి నిర్మించిన బ్లాక్ కామెడీ చలన చిత్రం “వైల్డ్ టేల్స్” (Spanish: Relatos salvajes). 2014 లో విడుదలైన ఈ ‘అర్జంటైన్ – స్పానిష్’ సినిమా, అర్జెంటీనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  2015 ఫారిన్ లాగ్వేజ్ ఆస్కార్ కి నామినేట్ చేయబడింది కూడా . పోలిష్ సినిమా “ఇదా”తో పోటీపడి గెలవలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్నీ చూరగొంది.
wild-tales-2
ఆరు భాగాలు గల ఈ యాంథాలజీ చలన చిత్రపు మొట్టమొదటి కథ “Pasternak”. ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులంతా, తామందరూ ఒక సారూప్యతని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. వీరంతా ఏదో ఒక సమయంలోనో, సందర్భంలోనో Pasternak అనే వ్యక్తిని మోసంచెయ్యడమో, ఇబ్బందికి గురి చెయ్యడమో చేసిన వారే. Pasternak ఆ విమానానికి కేబిన్ చీఫ్ అనీ, వారంతా ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం కాదని వారు గుర్తించేలోపుగానే ఆ విమానం నేలకూలిపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎంత చిన్న విషయంలోనైనా అన్యాయానికి గురికావడమనేది మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదలిస్తే, మరి కొందరు తిరుగుబాటు బాట పడతారు. రెండూ చెయ్యలేక పదే పదే అన్యాయానికి, అసమానత్వానికీ బలవుతున్నానని ఒక వ్యక్తి భావించినప్పుడు, అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనకి తోచిన రీతిలో న్యాయాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.  “Pasternak”,అందుకు సరైన ఉదాహరణ.
 రెండో కథలో, లేట్ నైట్ కావడం వల్ల నిర్మానుష్యంగా ఉన్న ఒక హోటల్ కి ఒక వ్యక్తి రావడం, అక్కడ పని చేసే ఒకమ్మాయి అతన్ని, తన తండ్రి చావుకు కారకుడిగా గుర్తించడం, తన బాధని తనతో పాటుగా పని చేసే ఒక ముసలి వంటామెతో పంచుకోవడం, ఆ  ముసలామె ఈ  అమ్మాయి అడ్డు చెబుతున్నా వినకుండా  ఆ వ్యక్తిని చంపెయ్యడం జరుగుతుంది. ఇక్కడ ముసలామె, అమ్మాయి ప్రతీకారాన్ని తనదిగా భావించి ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. ఇందుకు కారణమేమిటా అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న అన్యాయానికి  ఈ విధంగా న్యాయం పొందినట్టుగా భావించి ఉండవచ్చని అనుకోవచ్చు. లేదా తన సహోద్యోగిని బాధ ఆమెని అంతగా కదిలించి అయినా  ఉండవచ్చు. లేదంటే ఆమెలోని హింసాత్మక ప్రవృత్తి అటువంటి సందర్భం కోసం వెతుక్కుంటూ ఉండి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ కథ వేరొకరి పగకి ప్రతీకారం తీర్చుకోవడమనే అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఈ కథ పేరు “The Rats”.
ఇక మూడవ కథ “The Strongest” తాత్కాలికమైన చిన్నపాటి రోడ్ రేజ్ సంఘటన కలిగించే కసీ, ద్వేషానికి సంబంధించినది.  కారుకి దారివ్వని కారణంగా రోడ్డు మీద మొదలైన చిన్న గొడవ ఇద్దరు వ్యక్తుల్ని ద్వేషంతో రగిలిపోయేలా చేసి, చివరికి ఇద్దర్నీ కాల్చి బూడిద చేస్తుంది. తాత్కాలికమైన ఆవేశం, తర్వాత కలిగే కష్టనష్టాల గురించి కూడా ఆలోచించనివ్వనంతగా విచక్షణని పోగొడితే ఏం జరుగుతుందో తెలియజేస్తుందీ కథ.
పాలక వ్యవస్థలో గల లోటుపాట్లూ, అది చూపే నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజానీకంలో ఏర్పడే అసహనం, అసంతృప్తుల యొక్క  తీవ్ర రూపాన్ని అతిశయంగా చూపిస్తుంది నాలుగో కథ “Little Bomb”. పార్క్ చెయ్యకూడని స్థలమని స్పష్టమైన సూచనల్లేని ప్రదేశాలనించి, తన కార్ ని మాటి మాటికీ తీసుకెళ్లి జరిమానా వేస్తున్న నిర్లక్ష్యపు వ్యవస్థపై కోపంతో,
అసంతృప్తితో Simón Fischer అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని బాంబ్ తో పేల్చేస్తాడు. ఈ కథలో మాత్రం సమాజంలో కదలిక ఏర్పడినట్టుగా, Simón న్యాయాన్ని పొందే దిశగా అడుగు వేస్తున్నట్టుగా  అనిపించే విధంగా ఉంటుంది ముగింపు. మొదటి మూడూ పూర్తి స్థాయి హింసాత్మక ప్రతీకారానికి చెందిన కథలైతే, ఇది మాత్రం చైతన్యంతో కూడిన హింసగా దర్శకుడు అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి మన వల్ల ఎదుటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా, అది మనకి జరుగుతున్న అన్యాయంగా ఊహించుకుని, ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించగలిగితే ఎలా ఉంటుందన్నది ఐదో కథ “The Proposal”. తన కుమారుడు చేసిన ఒక కార్ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకునేందుకు తోటమాలిని ఒప్పిస్తాడు ధనికుడైన ఒక వ్యక్తి. కానీ ఒప్పందం సమయంలో లాయరు, ప్రాసిక్యూటరు, తోటమాలీ డబ్బు విషయంలో తనని మోసం చేస్తున్నారని భావించి, వారికి కూడా అదే అభిప్రాయాన్ని కలిగించి చివరికి
తనకి కావలసిన విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడతను. అంతా అతనికి అనుకూలంగా జరిగిపోబట్టి సరిపోయింది కానీ ఆ ఒప్పందం కుదరకపోతే తన కన్నబిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని, అతను తన కోపానికి పణంగా పెడతాడు.
కొత్తగా పెళ్లైన ఒకమ్మాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో, ఆవేశంలో ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై, తన సహజమైన మృదుత్వాన్నీ, సామాజిక లక్షణాన్నీ కోల్పోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన విశృంఖలత్వాన్నీ, హింసాత్మక ధోరణినీ ప్రదర్శించి తన పెళ్లి పార్టీలోనే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. చివరికి భర్త చొరవతో స్పృహలోకి వచ్చి సర్దుబాటు చేసుకుంటుంది. ఈ కథ బ్లాక్ కామెడీ అన్న పదానికి పూర్తి న్యాయాన్ని చేకూరుస్తుంది. అమ్మాయి రోమినా ప్రదర్శించే ‘గాలొస్ హ్యూమర్’ చాలా అసహజమైందే అయినప్పటికీ,  నవ్వడానికి కూడా మనస్కరించనంతగా మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇది ఈ యాంథాలాజీ సినిమా కథల్లోని ఆఖరి కథ “Till Death Do Us Part”. రోమినాగా నటించిన ‘ఎరికా రివాస్’ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది.
ఈ కథలన్నిటినీ కలిపే చక్కని సంగీతం, ‘ఇది ఒక కామెడీ సినిమా సుమా’ అని చెప్పే ప్రయత్నం చేసినా, ఆలోచింపచేసే థ్రిల్లర్స్ గానే మనం వీటిని స్వీకరిస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే “అన్యాయాన్ని ఎదిరించగలిగినప్పుడు కలిగే ఆనందానికి చిరునామా”గా ఈ చలన చిత్రాన్ని అభివర్ణిసాడు దర్శకుడు Damián Szifron.
*

చూడదగ్గ వి’చిత్రం’ 24

 

 భవాని ఫణి
~

కనీస అవసరాలన్నీ అలవోకగా తీరిపోతుంటే అప్పుడు మనిషికి కలిగే తరవాతి ఆశ ఏమిటి? ఆరోగ్యంగా ఎక్కువకాలం, కుదిరితే కలకాలం జీవించి ఉండాలనేగా. ఈ ఆశని తీర్చగల అతి సులువైన ఊహల్లో  కాలంలోకి ప్రయాణించడం కూడా ఒకటి. అంతేకాక కాలంలో ప్రయాణించగలిగితే పొందగల మిగతా లాభాలు అంకెలతో లెక్కించలేనన్ని. అటువంటప్పుడు అలా కాలం గుండా మనల్ని విహరింపచేయగల యంత్రమేదైనా మనకే, మనకి మాత్రమే దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఎన్ని అద్భుతాలు చెయ్యచ్చు! ఎంత గొప్పవాళ్ళం అయిపోవచ్చు! ఒక వేళ అదే యంత్రం ఒక దురాశాపరుడి లేదా దుర్మార్గుడి చేతిలో పడినట్లయితే జరిగే అనర్థాల్ని కూడా మనం సులభంగానే ఊహించగలం. ఇటువంటి ఆలోచనకే దృశ్యరూపం “24” చలన చిత్రం.

మన దక్షిణాదిన నిర్మితమయ్యే  చలన చిత్ర కళా ప్రక్రియ( జెనెరె)ల్లో సైన్స్ ఫిక్షన్ చాలా అరుదు. విచిత్రంగా మన తెలుగులో అయితే ఆదిత్య 369 ఒక్కటి మాత్రమే అటువంటి చలనచిత్రంగా కనిపిస్తోంది. ( డబ్బింగ్ చిత్రాలని మినహాయిస్తే). నిజానికి ఈ అంశంపై హాలీవుడ్ లో లెక్కలేనన్ని కథలూ, సినిమాలూ సృష్టించబడ్డాయి. మన దేశంలో కూడా హిందీ, బెంగాలీ,తమిళ భాషల్లో ఇటువంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆలోచనలు పాతవే అయినా వాటి వ్యక్తీకరణ జరిగిన విధానాన్ని బట్టి చలన చిత్రపు విజయం ఆధారపడి ఉంటుంది . అటువంటి చెప్పుకోదగ్గ సై. ఫి. చిత్రంగా 24 మిగిలిపోతుందని చెప్పచ్చు.
సైన్స్ పరంగా పెద్దగా తర్కానికి అందని కథైనప్పటికీ ఈ సినిమాలో మనం గమనించాల్సింది దర్శకుడు కథని ప్రజెంట్ చేసిన విధానాన్ని . జరిగిన ప్రతి సన్నివేశానికీ, సంభాషణకీ ఒక అంతరార్థాన్ని కల్పిస్తూ అల్లబడిన బిగువైన దృశ్య ప్రదర్శనగా ’24’ని పేర్కొనవచ్చు. మధ్యలో కమర్షియల్ అంశాలనీ, హాస్యాన్నీ, ప్రాంతీయతనీ చొప్పించినప్పటికీ అవి ఎబ్బెట్టుగా అనిపించని విధంగా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు విక్రం కుమార్.
కథ టూకీగా చెప్పాలంటే సైంటిస్ట్ అయిన డాక్టర్ సీతారాం, కాలం గుండా ప్రయాణించగలిగే ఒక చేతి గడియారాన్ని తయారుచేస్తాడు. ఇక్కడ కాలం గుండా ప్రయాణం అంటే భౌతికంగా కాదు. కేవలం మానసికంగా మాత్రమే. అంటే ఈ వాచ్ ని ఉపయోగించి మన ఆలోచనల్నీ అనుభవాల్నీ వెనక్కి గానీ ముందుకు గానీ పంపవచ్చు. ఉదాహరణకి మనం ఈ వాచ్ సహాయంతో పది సంవత్సరాలు కాలంలో  వెనక్కి ప్రయాణం చేసామనుకోండి. గతంలో  ఉన్న మనకి, తర్వాతి పది సంవత్సరాల కాలానికి చెందిన జ్ఞాపకాలూ, అనుభూతులూ కలుగుతాయి. అక్కడినించి ఆ జ్ఞానాన్నిఉపయోగించి మనం చేసే చర్యల ఫలితంగా మరో కొత్త భవిష్యత్తు సృష్టింపబడుతుంది. అలాగే కాలాన్ని కొంతసేపు నిలిపి వేయవచ్చు కూడా .
సీతారాం, ఇటువంటి ఒక గొప్ప కాల గడియారాన్ని సృష్టించిన ఆనందంలో ఉండగానే దుర్మార్గుడైన అతని కవల సోదరుడు ఆత్రేయ,  ఆ వాచ్ ని చేజిక్కుంచుకుని, కాలాన్ని జయించాలన్న కోరికతో చేసిన కొన్ని దుష్ట కార్యాల కారణంగా ఆ అన్నదమ్ముల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
అటుపైన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత సీతారాం కుమారుడైన మణి, ఆత్రేయ ఆట కట్టించి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనేది కథాంశం. కథ గురించి ఇంతకుమించిన వివరాలూ, సినిమాకి 24 అనే పేరు ఎందుకు పెట్టారన్న విషయానికి చెందిన సమాచారమూ సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కథలో, ఏడాది లోపు వయసున్న పసి పిల్లవాడు, ఇరవై ఆరేళ్ళ మానసికమైన వయసుతో,  అనుభవాలతో, ఆలోచనలతో ఉండిపోవడమనే ఊహ చాలా కొత్తగా అనిపించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి. దాన్ని ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటుగా, అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తయారుచేసేందుకు
దర్శకుడు చాలా కృషి చేసాడు. ముందు కనిపించే ఒక దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని తర్వాతెప్పుడో జస్టిఫై చేసి జతకూర్చిన తీరు చాలా బావుంది. లాజిక్ చెడకుండా ఉండేందుకు దర్శకుడు తీసుకున్న శ్రద్ధ సినిమా ఆద్యంతమూ కనిపిస్తుంది.
సాధారణంగా సై.ఫి చిత్రాలలో మానవ సంబంధిత భావోద్వేగాలకి చెందిన అంశాల లోపం స్పష్టంగా కనిపిస్తుంటుంది. కొన్ని కథల్లో అయితే కనీసం స్త్రీ పాత్ర ఉండను కూడా ఉండదు. కానీ 24 లో ఉన్న మెచ్చుకోదగ్గ అంశం ఏమిటంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలని, ప్రేమాభిమానాల్ని ఈ సినిమా చాలా సహజంగా ఆవిష్కరిస్తుంది. మణికీ, అతన్ని పెంచిన తల్లి సత్య భామకీ మధ్య నడిచిన కథ, సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది.  సినిమాలో అరవై శాతం వరకు ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సహజంగా ఇమిడిపోయాయి. సూర్య నటన గురించి ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి. అతను ధరించిన మూడు పాత్రల్లో నటనకి అవకాశం ఉన్న మణి, ఆత్రేయ పాత్రలకి అతను పూర్తి న్యాయం చేకూర్చాడు. హీరోయిన్స్ నిత్యా మీనన్, సమంతాలు  సాంప్రదాయబద్ధమైన తీరులో అందంగా కనిపించారు. విభిన్నమైన కోణాల్లో కెమెరాని ఉపయోగించి సినిమాటోగ్రాఫర్ “తిరు” సినిమాకి తన వంతు సహాయాన్ని అందించారు  రెహమాన్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మాత్రం తీసికట్టుగా ఉన్నా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించదు.
మామూలు వాచ్ మేకర్ అయిన మణి, అతని సైంటిస్ట్ తండ్రి సీతారామ్ తయారుచేసిన కాల గడియారంలో సులభంగా మార్పులు చెయ్యగలగడం వంటి చిన్న చిన్న లోపాలూ, వాన చినుకుల్ని ఫ్రీజ్ చేసి చెదరగొట్టడం వంటి  అసంభవమైన అతిశయోక్తులూ కొన్ని కొన్ని ఉన్నప్పటికీ  24 ని ఒక  తెలివైన ప్రయోగంగా పేర్కొనవచ్చు.
*

ఈ ఇరానీ సినిమా ఒక కొత్త రుతువు!

 

-భవాని ఫణి

~

 

సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది  అదే ఒకవేళ  సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు.  నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .

అన్నీ మనం రోజూ చేసే పనులే, చూసే విషయాలే కదా అనిపిస్తాయి. కానీ కథలో అతను ఎక్కడ ఎలా ఎప్పుడు మెలిక పెడతాడో మాత్రం అర్థం కాదు. కథ అల్లడంలోని ఆ నేర్పరితనం మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది. ఏ సైన్స్ ఫిక్షన్లు గానీ , సైకలాజికల్ థ్రిల్లర్స్ గానీ , మర్డర్ మిస్టరీలు గానీ కలిగించనంతటి ఆసక్తిని అతని సినిమాలు కలిగిస్తాయి. అంతే సహజమైన ముగింపుతో సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా ఏ సందర్భంలోను విసుగు కలగనివ్వనంత బిగువుగా కథ అల్లబడి ఉంటుంది.  ఆ కథనాన్ని ఆస్వాదించడం తెలిస్తే దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం .
అంతేకాక ఫర్హాదీ చిత్రాలలో పాత్రల్ని మంచి చెడుల ఆధారంగా విడగొట్టడం వీలు కాదు. , పెరిగిన సమాజం, పరిస్థితుల ప్రభావం వంటివి మనిషి స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అవగతం చేసే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ విధమైన పధ్ధతి వల్ల ప్రేక్షకుడు కేవలం ఏదో ఒక పాత్రకే ఆకర్షితుడు కాకుండా, అందరి వైపునుండీ అలోచించి వారి వారి ప్రవర్తనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అతని చలన చిత్రాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు చిత్రాలు. మొదటి స్థానంలో ఇరాన్ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి ఆస్కార్ ని సంపాదించి పెట్టిన  ” ఎ సెపరేషన్(A Separation) ఉంటుంది. చిక్కగా గుచ్చబడిన దండలో దారం ఎక్కడుందో తెలీనట్టుగానే అసలు విషయాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో చాలా సేపటి వరకు తెలీదు. దాంతోపాటుగా ప్రేమ, జాలి, అహంకారం, అపరాధ భావం వంటి మనిషిలోని సహజలక్షణాలు అంతర్లీనంగా అవసరమైనంత మేరకు తమ తమ పాత్రల్ని పోషిస్తూ ఒక నిండైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఈ సినిమా చూసిన తర్వాత కథ ఎవరికీ చెప్పాలనిపించదు. ఎవరికి వారే చూసి ఆ ఆనందాన్ని అనుభవిస్తే బాగుండునని అనిపిస్తుంది . అయినా చెప్పక తప్పదనుకుంటే ఇలా చెప్పడం మంచిది .
నాడెర్ , సిమిన్ భార్యా భర్తలు . వాళ్లిద్దరూ విడిపోవడం కోసం కోర్ట్ లో వాదించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది . భార్య ఇరాన్ లోని కఠిన పరిస్థితుల మధ్య తమ పాప పెరగడం ఇష్టం లేక విదేశాలకి వెళ్లడం కోసం పట్టుపడితే, నాడెర్ మాత్రం, అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో పంతం మొదలై ఇద్దరూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకపోవడంతో సిమిన్ పంతం కొద్దీ విడిగా వెళ్లిపోతుంది.  వారి కుమార్తె పదకొండేళ్ల తెర్మెహ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోతుంది. ముసలివాడైపోయి, ఆల్జీమర్ కారణంగా ఏదీ గుర్తుడని స్థితిలో ఉన్న తన తండ్రి కోసం నాడెర్ ఒక స్త్రీని నియమిస్తాడు. ఆమె పేరు రజియా. ఐదారేళ్ల వయసున్న పాపని వెంట బెట్టుకుని రెండు ట్రైన్లు మారి నాడెర్ ఇంటికి వస్తూ ఉంటుంది రజియా. పైగా ఆమె గర్భవతి కూడా. ఇంట్లో పనీ, ముసలాయన్ని సంబాళించడం ఆమెకి చాలా కష్టమైపోతుంది.
నాడెర్ ఆఫీసు నించి వచ్చేవరకు ముసలాయన్ని కనిపెట్టుకుని ఉండటం రజియా చెయ్యవలసిన ముఖ్యమైన పని . కానీ ఒకసారి తొందరగా ఇంటికి వచ్చిన నాడెర్ కి ఇల్లు తాళం వేసి కనబడుతుంది . డూప్లికేట్ కీ తో లోపలి వెళ్లి చూస్తే కింద పడిపోయి ఉన్న తండ్రి కనిపిస్తాడు. పైగా అతను మంచానికి కట్టేసి ఉంటాడు. తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో అర్థం కానంత ఉద్వేగంలో నాడెర్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ కోపంలో, అప్పుడే బయటి నించి వచ్చిన రజియాని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయిందని తెలుస్తుంది . అందుకు నాడెర్ కారణమని రజియా భర్త కోర్ట్ లో కేస్ వేస్తాడు . ఇంతకీ అసలు జరిగింది ఏమిటి? భార్యా భర్తలు మళ్ళీ కలుసుకున్నారా అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా మలవబడిన కథ ఇది. నటీనటుల నటన కథకి జీవాన్ని సమకూర్చింది.  సమాజపు స్థితిగతులనే ఈ చలన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలబెట్టగలగడం కూడా పెద్ద విశేషం.
ఇక రెండోది ‘ఎబౌట్ ఎలీ (About Elly)’.  చిత్రం పేరు సూచిస్తునట్టుగానే కథ ‘ఎలీ’ అనే అమ్మాయి గురించి. ఆమె ఒక కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్. ఆమె స్కూల్ లో చదివే ఒక విద్యార్థిని తల్లి సెపిదే, ఆమెని తమ స్నేహితుల కుటుంబాలతో పాటుగా పిక్నిక్ కి తీసుకుని వెళ్తుంది. జర్మనీ నించి వచ్చిన ఒక స్నేహితుడికి ఎలీని చూపించి , అతనికి నచ్చితే వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నది సెపిదే ఆలోచన . కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం, ఎలీ గురించి వారిలో ఎన్నో సందేహలని రేకెత్తిస్తుంది. ఒక్కో పాత్రా దాచిపెట్టిన చిన్న చిన్న విషయాల్ని మెల్లగా అన్ ఫోల్డ్ చేస్తూ చూపడం వల్ల ఆద్యంతం ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ సినిమా కూడా కథ తెలుసుకోకుండా చూస్తేనే బాగుంటుంది.  .
ఇక మూడోది ‘ది పాస్ట్ (The Past)’. ఈ కథ ఫ్రాన్స్ లో జరుగుతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు పిల్లల తల్లి మేరీ కథ ఇది. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి భార్య కోమాలో ఉంటుంది . మేరీ కుమార్తెకి వారి వివాహం ఇష్టం ఉండదు. అతి సాధారణమైన కథాంశంలా అనిపించినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి . కథని పొరలు పొరలుగా తవ్వుకుంటూ వెళ్తూ, ఎక్కడో ఓ ఊహకందని మలుపు దగ్గర నిలబెట్టగల దర్శకుడి నైపుణ్యత ఈ సినిమాకి కూడా మనల్ని కట్టి పడేస్తుంది.
కానీ A Separation , About Elly లతో పోలిస్తే The Past కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చలన చిత్రంలో  ఫర్హాదీ, సస్పెన్స్ కంటే మానవ సంబంధాల స్వరూప స్వభావాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. సహజమైన ఆవేశకావేశాలు, అపార్థాలు మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి. ఆ సమయంలో అవి మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి . ఆ ఒక్క క్షణం కొద్దిపాటి సంయమనాన్ని పాటించే ప్రయత్నం చెయ్యగలిగితే ఏమానవ సంబంధమైనా అంత తొందరగా ఒడిదుడుకులకి లోనుకాదు అన్నది ఈ చిత్రం చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాలలో ఒకటి. అయినా ఫర్హాదీ చిత్రాలు మనిషి స్వభావాన్ని నిర్దేశించవు. కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాయి. చేయిస్తాయి .
కథ చెప్పే విధానం ఒక్కటే కాదు. చిత్రీకరణలోనూ, సినిమాటోగ్రఫీలోనూ, నటీనటుల ఎంపికలోనూ కనిపించే వైవిధ్యతలు అతని చలన చిత్రాల్ని అరుదైన వజ్రాల మాదిరిగా మెరిపిస్తాయి .ఎక్కడా  నేపధ్య సంగీతమే  వినిపించదు. కేవలం మాటలూ, అవసరమైన శబ్దాలూ మాత్రమే వాడి, అతను సహజత్వాన్ని కనబరచడమే కాదు వినిపించేలా కూడా చేస్తాడు.
చివరగా చెప్పేదేమిటంటే అస్ఘర్ ఫర్హాదీ సినిమాలు చూడని సినీప్రియులు, కొన్ని ఋతువుల్ని అనుభవించనట్టే.  కొన్ని దారుల్ని కనుగొననట్టే. కొంత ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే.
*

కొన్ని యువ హృదయాలూ – వాటి కలలూ!

testament-of-youth

-భవాని ఫణి
~

bhavaniphaniఅనగనగా అవి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజులు .

చదువే ప్రాణమైన ఓ బ్రిటిష్ అమ్మాయి .
రహస్యంగా వర్డ్స్ వర్త్ నీ,షెల్లీనీ,బైరన్ నీ చదువుకుంటూ, ఆ ప్రేరణతో తను రాసుకున్న కొద్దిపాటి రాతల్ని ఎవరికైనా చూపించడానికి కూడా మొహమాటపడి దాచుకునే ముత్యంలాంటి అమ్మాయి.
ఆత్మ విశ్వాసమే అలంకారంగా కలిగిన దృఢ మనస్విని.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం  ఆమె ఆశయం . స్వప్నం.
ఎంతో కృషితో, పట్టుదలతో అక్కడ అడ్మిషన్ సంపాదించుకున్న ఆనందం,సంబరాలని అంబరానికి తాకిస్తున్న ఓ మంచి తరుణంలో అనుకోకుండా యుద్ధమొచ్చింది. అంతా తలక్రిందులైంది.
అన్న,స్నేహితుడు, ప్రేమికుడు అందరూ సైనికులుగా మారి , యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటుంటే తనకి చేతనైనది తను కూడా చెయ్యాలన్న ఆశతో, కోరికతో, కలల సౌధమైన ఆక్స్ఫర్డ్ నీ, ఎంతో ఇష్టమైన చదువునీ కూడా వదిలిపెట్టి వార్ నర్స్ గా మారుతుంది ఆ ధైర్యశాలి.
పట్టుబడ్డ జర్మన్ సైనికులని ఉంచిన టెంట్ లో విధులు నిర్వహించే బాధ్యత ఆమెకి అప్పగించబడుతుంది.
అలా అక్కడ తీవ్రంగా కలిచివేసే పరిస్థితుల మధ్య,  గాయపడిన శత్రు సైనికులకి సేవలందిస్తుండగా అంతులేని శోకం వెతుక్కుంటూ వచ్చి ఆమె జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుంది .
ముందుగా ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమికుడు , తర్వాత ప్రాణప్రదమైన నేస్తం , ఆ తర్వాత ఆరో ప్రాణం వంటి సోదరుడు ఇలా ఎంతో ప్రియమైన వారంతా ఒకరి తర్వాత ఒకరు రక్కసి యుద్ధపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే ఆ లేత మొగ్గ ఏమైపోవాలి? ఆ మారణ హోమానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి?
 ఈ యుద్ధాలూ , ఈ పోరాటాలూ  ఇవన్నీ ఎందుకని ,ఎవరికోసమని లోలోపల బాకుల్లా పొడిచే సందేహాల గాయాలకి ఎటువంటి సమాధానాల్ని లేపనంగా పూయాలి?
ప్రాణాలు శరీరాలని విడిచి గాల్లో కలిసిపోతున్నప్పుడు ఏ మనిషి బాధైనా ఒకటి కాదా ? మనమంతా మనుషులమైనప్పుడు , మనుషులంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి? చంపుకుని ఏం సాధించాలి?
ఇటువంటి ప్రశ్నలు మాత్రమే చివరికి ఆ అమ్మాయి దగ్గర మిగిలినవి.
ఆప్తుల మరణం వల్లనా, ఎంతో క్షోభకి గురిచేసే యుద్ధ వాతావరణంలో పని చేసి ఉండటం వల్లనా ఆమె తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతుంది . ఒక స్నేహితురాలు అందించిన సహాయంతో ఆ క్రుంగుబాటు నుండి బయటపడి తన జీవితాన్ని ముందుకు నడుపుకున్నా తన వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని బలమైన నిర్ణయం తీసుకుని , చివరి రోజుల వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది.
ఇదంతా వీరా మారీ బ్రిట్టైన్ అనే ఒక స్త్రీ వాది అయిన రచయిత్రి కథ . ఒక్కోసారి నిజ జీవితపు కథలు, కల్పన కంటే ఆసక్తికరంగా ఉండి హృదయానికి పట్టుకుంటాయి . ఎందుకంటే ఆ కథలోని పాత్రలు , మలుపులు ఎవరో ఏర్పరిస్తే ఏర్పడినవి కాదు .. అవి అలా జరిగిపోయినవి అంతే . అందుకే అవి ఎందుకు అలాగే జరిగాయని ఆలోచించి వాదించే  అవకాశం మనకి ఉండదు. వీరా కథలో అటువంటి ఆసక్తికరమైన మలుపులేవీ లేవు గానీ విధి ఆమెతో ఆడుకున్న విషాదకరమైన ఆట ఉంది .జీవిత కాలానికి సరిపడే దుఃఖమూ ఉంది . అవే ఆమెని యుద్ధ వ్యతిరేకిగా మారుస్తాయి. తర్వాతి  కాలంలో పాసిఫిస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమెని ప్రేరేపిస్తాయి.
వీరా బ్రిట్టైన్, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని వివరిస్తూ రాసుకున్న “టెస్టమెంట్ అఫ్ యూత్” అనే పేరుగల ఆత్మకథ ఆధారంగా ఈ చలన చిత్రాన్ని నిర్మించారు. సరళంగా ఉన్న స్క్రీన్ ప్లే, కథ అర్థం చేసుకోవడంలో మనకి ఇబ్బంది కలిగించదు . ఏదో నిజంగా అక్కడే జరుగుతున్నట్టే ఈ దృశ్య ప్రవాహం కళ్ల ముందు నుండి అతి సాధారణంగా సాగిపోతుంది .ఈ ఆత్మకథలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ లోని సామాజిక పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపడం జరిగింది . అంతే కాక ఆత్మ విశ్వాసం , ధైర్యం మెండుగా కలిగిన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్త్రీ అయిన కారణంగా, వీరా తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంచుకోవడం కోసం ఎంత ఘర్షణ పడాల్సి వచ్చిందో కూడా మనకి ఈ కథ వివరిస్తుంది.
ముఖ్య పాత్రధారిణి అయిన “అలీసియా వికండెర్” అత్యున్నతమైన నటనని కనబరిచి తన పాత్రకి సరైన న్యాయాన్ని చేకూర్చింది. ఉత్తమమైన ఆత్మకథల్లో ఒకటిగా పేరు సంపాదించిన ఈ వార్ టైం మెమోయిర్ ని అంతే ఉత్తమంగా తెరకెక్కించడంలో దర్శకుడు జేమ్స్ కెంట్ విజయం సాధించారు. కథలోని ఆత్మని పట్టుకుని దృశ్యంగా మలిచి మన కళ్ల ముందు నిలపగలిగారు.
*

అతను సాహిత్య లోకపు ధృవతార  

 

-భవాని ఫణి

~

bhavani phani.

పందొమ్మిదవ శతాబ్దపు గొప్ప కవి అయిన జాన్ కీట్స్ ప్రేమ (జీవిత) చరిత్ర ఆధారంగా 2009 లో రూపొందింపబడిన చలన చిత్రం “బ్రైట్ స్టార్(Bright Star )”. చాలా మందికి అతని జీవితంలోని విషాదం గురించి తెలిసే ఉంటుంది . పాతికేళ్ల వయసుకే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన ఆ మహా కవి, తను జీవించి ఉన్న కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు . అతని దృష్టిలో అతనో విఫల కవి. సమాజం ఎప్పట్లానే అతని గొప్పతనాన్ని జీవితకాలం ఆలస్యంగా గుర్తించింది . ఇదంతా పక్కన పెడితే అతని అతి చిన్న జీవితంలోకి వలపుల వసంతాన్ని మోసుకొచ్చిన అమ్మాయి ఫానీ బ్రాన్. వాళ్ల ప్రణయగాథకి దృశ్య రూపమే ఈ బ్రైట్ స్టార్ చలన చిత్రం .

కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పద్దెనిమిదేళ్ల  అమ్మాయి, కళ్లలోంచి కవిత్వాల్ని వొలికించగల జాణ.  యువకుల హృదయాల్ని ఉర్రూతలూపగల అందం , ఆధునికత ఆమె సొంతం . కథానాయిక ‘ఫానీ బ్రాన్’ పాత్ర ధారిణి అయిన ‘అబ్బే కోర్నిష్’  కళ్లకి ఇదీ అని చెప్పలేని వింత ఆకర్షణ ఉంది . ఆ కళ్లలో చంచలత్వం లేదు . ఒక పరిణితి, ఉదాత్తత , హుందాతనం వాటి నిండా కొలువు తీరి ఉన్నాయి . నటిస్తున్నది ఆ అమ్మాయా లేకపోతే ఆమె కళ్లా అనిపించింది ఒక్కోసారి .

ఆ కన్నుల లోతులు కొలవడమంటే
గుండె గర్భానికి బాటలు వెయ్యడమే
ఆ కన్నులతో చూపు కలపడమంటే
మబ్బుల చిక్కదనంలోనికి మరలి రాని పయనమే

అన్న భావం  ఆ అమ్మాయి కళ్లని చూస్తే కలిగింది  . చూసే కొద్దీ ఆ భావం మరింతగా బలపడింది . ఆ కళ్లలో ఏదో ఉంది . అనంతమైన సాగరాల అలజడి , అగ్ని పర్వతాల అలికిడి , సెలయేటి పరవళ్ల ఉరవడి , చిరు అల్లరిని రేగించే సౌకుమార్యపు సడి….. ఇక అవి ఏ కవి కళ్లలో పడినా కవితల సందడే సందడి .ఎందఱో యువకుల ఆరాధ్య దేవత అయినా ఫానీ మాత్రం జాన్ కీట్స్ ని ఇష్టపడింది . మొదట్లో ఆమెని పెద్దగా పట్టించుకోకపోయినా అతని తమ్ముడు క్షయ వ్యాధితో చనిపోయినప్పుడు ఆమె ప్రదర్శించిన దుఃఖాన్ని గమనించాకా  కీట్స్ కి కూడా  ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. కవిత్వ పాఠాలు నేర్చుకునే వంకతో ఫానీ , కీట్స్ తో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ  సమయంలో జాన్ కీట్స్ కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్తాడు . “చెరువులోకి దూకడం, వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కోసం కాదట . అక్కడే కొంతసేపు ఉండి , ఆ నీటి తాకిడిలోని లాలిత్యాన్ని అనుభవించడం కోసమట! అది ఆలోచనకి అందని ఒక అపురూపమైన అనుభవమట . అతను ఆ సందర్భాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకోవడంతో పోలుస్తాడు . చెట్టుకి ఆకులు చిగురించినంత సహజంగా రానప్పుడు , కవిత్వం అసలు రాకపోవడమే మంచిదట. ”

అలా కవిత్వ పాఠాల ద్వారా ఆ ఇద్దరి మధ్య తగ్గిన దూరం , వారి మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది. అలౌకికమైన ఓ ప్రేమ భావన , ఇద్దర్నీ పెనవేసుకుని చిగురిస్తుంది. ఇంతలో ఫానీ , కీట్స్ లకి ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో నివసించే అవకాశం లభించడంతో వారి ప్రేమ బంధం మరింత గట్టిపడుతుంది . మధ్యలో కొంతకాలం కలిగిన తాత్కాలికమైన ఎడబాటు సమయంలో కీట్స్ ఆమెకి ఎన్నో అందమైన లేఖలు రాస్తాడు.  అతని కోసం ఏమైనా చెయ్యగలిగేంత ప్రేమ ఆమెది.  ఆమె గురించి పేజీల కొద్దీ సోనెట్లు రాయకుండా ఉండలేనంత అనురాగం అతనిది .

ఆ సమయంలో  కీట్స్ రాసిన కవిత “బ్రైట్ స్టార్” ఇదే .
Bright star, would I were stedfast as thou art—
Not in lone splendour hung aloft the night
And watching, with eternal lids apart,
Like nature’s patient, sleepless Eremite,
The moving waters at their priestlike task
Of pure ablution round earth’s human shores,
Or gazing on the new soft-fallen mask
Of snow upon the mountains and the moors—
No—yet still stedfast, still unchangeable,
Pillow’d upon my fair love’s ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death.ఈ కవితలో కీట్స్ ఒక కదలని నక్షత్రంతో మాట్లాడుతున్నాడు .
అతనికి కూడా ఆ నక్షత్రంలా మార్పు లేకుండా , స్థిరంగా ఉండాలని ఉందట .
కానీ, ఆ నక్షత్రపు ఒంటరితనం ఎంత అద్బుతమైనదైనా అటువంటి స్థిరత్వాన్ని కాదట అతను కోరుకునేది .
ఆ నక్షత్రంలా ఎంతో ఎత్తున నిలబడి ఎప్పటికీ మూతపడని కనురెప్పల మధ్య లోంచి ప్రకృతి చూపించే ఓర్పునీ, మార్పు చెందని ఆధ్యాత్మికతనీ చూడాలని కాదట అతని కోరిక .
గుండ్రని భూమి యొక్క మానవత్వపు తీరాల్ని ఒక పూజారిలా శుధ్ధి చేస్తున నీటి కదలికల్ని గమనించాలని కూడా కాదట అతను స్థిరంగా ఉండాలని అనుకుంటున్నది .
పర్వతాల మీదా, బంజరు భూముల మీదా ముసుగులా పరుచుకుంటున్న మెత్తని మంచుని తదేకంగా చూడటమూ అతని ఉద్దేశ్యం కాదట .
కానీ అతని స్థిరంగా ఉండాలని ఉందట .
పరిపూర్ణమవుతున్న అతని ప్రేమభావం(ప్రేయసి?) యొక్క పయ్యెదని దిండుగా చేసుకుని మార్పు లేని స్థితిలో ఉండాలని ఉందట
ఆ పడి లేస్తున్న మెత్తదనాన్ని అనుభవిస్తూ
ఒక తియ్యని అవిశ్రాంత స్థితిలో ఎప్పటికీ మేలుకుని ఉండాలని ఉందట
ఎప్పటికీ కదలకుండా ఉండి, ఆ శ్వాస తాలుకూ పలుచదనాన్ని వింటూ
ఎప్పటికీ జీవించి ఉండాలని ఉందట, లేకపోతే మరణంలోకి మూర్ఛిల్లాలని ఉందట!!!ఎంత గొప్ప భావం! ఒక్కొక్క పదానికీ ఎన్నెని అర్థాలో!  ప్రతి వాక్యంలోనూ ఎంతటి భావ సంఘర్షణో! ఓ పక్క ఉత్తేజభరితమైన జీవితాన్నీ , మరో పక్క అమానవీయమైన నిశ్చలతనీ కోరుకుంటూ , ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్లాడుతున్నట్టుగా అనిపించే ఈ గొప్ప కవిత రాయడానికి కీట్స్ దగ్గర ఒక బలమైన కారణముంది .
అదేమిటంటే అనారోగ్యం! అప్పటికే అది కీట్స్ శరీరాన్నిఆత్రంగా ఆక్రమించుకుంటోంది. అతని తమ్ముడిని పొట్టన పెట్టుకున్న అదే క్షయ వ్యాధి అతన్ని కూడా తన కబంధహస్తాల మధ్య ఇరికించుకునే ప్రయత్నం చేస్తోంది . పైగా బీదరికం.  అతను అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఫానీ అతనితో వివాహానికి సిద్ధపడి , అతన్ని తన ఇంట్లో ఉంచుకుని సపర్యలు చేస్తుంది . కానీ అక్కడ లండన్ లో ఉన్న తీవ్రమైన చలితో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా , క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,  మిత్రులంతా ధనాన్ని ప్రోగు చేసి, చలి కొంచెం తక్కువగా ఉండే ప్రాంతమైన ఇటలీకి అతడిని పంపుతారు . అతను అక్కడే తన ఇరవయ్యైదవ ఏట వ్యాధి ముదిరి మరణిస్తాడు .కీట్స్ కొన్ని రోజులు కనిపించకపోతేనే విలవిల్లాడిపోయే ఫానీ , ఈ దుర్వార్త విని తీవ్ర వేదనకి గురవుతుంది . ఆ సన్నివేశంలో విషాదమూర్తిగా మారిన ‘ఫానీ’గా, అబ్బే కార్నిష్ చూపిన నటన గురించి వివరించాలంటే అద్భుతం అన్నమాట అనక తప్పదు . ఎందుకంటే అంతకంటే ఉన్నతంగా ఆమె నటనని వర్ణించగల పదమేదీ లేదు కనుక . జుట్టు కత్తిరించుకుని , నల్లని దుస్తులు ధరించి , అతను రాసిన బ్రైట్ స్టార్ సోనెట్ ని వల్లె వేసుకుంటూ రాత్రి పూట ఆ ప్రదేశమంతా సంచరిస్తూ చాలా ఏళ్ల పాటు అతని వియోగ దుఃఖాన్ని ఆమె అనుభవిస్తుంది .  అలా అక్కడితో కథని ముగిస్తాడు దర్శకుడు జేన్ కాంపియన్ .

ఈ చలన చిత్రంలోని ప్రతి సన్నివేశం ఓ అపురూపమైన కళాఖండంలా ఉంటుంది . అతి పెద్ద కేన్వాస్ మీద ఓ గొప్ప కవి జీవితంలోని కొంత భాగాన్ని చిత్రించి చూపడంలో  దర్శకుడు ఎంతగా తన ప్రతిభని కనబరిచాడో , నటీనటులంతా అంతే సహజత్వాన్ని తమ తమ నటనలో ప్రదర్శించారు. జాన్ కీట్స్ పాత్రధారి ‘బెన్ విషా’ , ఫానీ పాత్రధారిణి ‘అబ్బే కార్నిష్’ ల నటన అత్యుత్తమం .  ముఖ్యంగా అబ్బే కార్నిష్, చలన చిత్రాన్నీ, ప్రేక్షకుల్నీకూడా  తన చుట్టూ రంగుల రాట్నంలా తిప్పుకోగలిగేంత అద్వితీయమైన చార్మ్ ని ప్రదర్శించింది . అలాగే ఒక సన్నివేశం తాలుకూ ఆడియో మరో సన్నివేశానికి కొనసాగింపబడటం, చలన చిత్రానికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది . ఆ విధమైన ఎడిటింగ్ కారణంగా  కాలం  ఏక ప్రవాహమై తన గమనాన్ని గమనించనివ్వకపోయినా, చలన చిత్రమంతా ఓ కొత్త అందమే పరవళ్లు తొక్కింది .

మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకాశవంతమైన ఈ ‘తళుకుల తార’ , తీవ్రమైన ప్రేమభావాన్ని తనలో తను అనంతంగా జ్వలించుకుని, మన మనసుల్లోపల అపూర్వమైన జ్ఞాపకాల్ని వెలిగిస్తుంది . కానీ అన్ని గొప్ప ప్రేమ కథల్లోలాగే ఇక్కడ కూడా వియోగమే గెలుస్తుంది . విషాదాన్నే మిగులుస్తుంది.

అక్షరాల పడవ మీద ఊరేగే ఆకాశం ఈ ‘కవిత్వం’ గ్రూప్!

-భవాని ఫణి

~

 

bhavani-phani.అక్కడ ప్రతీ భావావేశం సెలయేటి నీటిలా గలగలా ప్రవహిస్తుంది . అక్కడ ప్రతీ ఆలోచనా రెక్కలు విప్పార్చుకుని స్వేచ్ఛగా రివ్వు రివ్వున ఎగురుతుంది . అక్కడ సర్రియలిజం  నిజజీవితంలోకి సర్రున దూసుకొస్తుంది. అక్కడ పదాల్లోంచి సజీవ పదార్థం పుట్టుకొస్తుంది . రాశి పోసిన మంచి ముత్యాల వంటి, హేమంత తుషారపు తునకల వంటి విలువైన, స్వచ్ఛమైన కవిత్వం అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుంటుంది . అదే కవిత్వం గ్రూప్.
‘కవిత్వం’ అనే పేరుతో, ‘కవిత..కవిత..కవిత’ అనే సింపుల్ ట్యాగ్ లైన్ తో  ఎటువంటి భేషజాలూ లేని హుందాతనంతో, ఏడాది క్రితం ‘తిలక్ స్వీ’ అనే కవిత్వ ప్రేమికుడి ద్వారా  ఈ గ్రూప్, ఫేస్బుక్ లో ప్రాణం పోసుకుంది . ఆ యువకుడు ఒక మంచి ఆశయంతో అప్పట్లో ఏర్పరిచిన ఈ డొంక దారి, అనుభవజ్ఞులైన, రసజ్ఞులైన అనేకమంది కవుల ప్రోత్సాహంతో, సలహాలతో, సూచనలతో ఇప్పుడు రహదారిగా రూపుదిద్దుకుంది . ఈనాటి నవ యువ కవుల కవిత్వ ప్రయాణానికి అనువైన మార్గమైంది .  రాకెట్లా ఆది నుండీ అత్యంత వేగవంతమైన గమనాన్ని ప్రారంభించిన ఈ గ్రూప్, ఇప్పటికీ అంతే తీవ్రమైన వేగంతో దిగంతాల అంచుల్ని వెతుక్కుంటూ అనంతం వైపుకి సాగిపోతూనే ఉంది . గ్రూప్ లో ఉండే స్నేహపూర్వకమైన ,ఆహ్లాదకరమైన అనుకూల వాతావరణం వల్లనేమో , రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ,హెచ్చార్కె గారు , శ్రీధర్ నామాడి గారు, ఎం ఎస్ నాయుడు గారు,అరణ్య కృష్ణ గారు, కుప్పిలి పద్మ గారు వంటి మహామహులంతా వచ్చి ఇక్కడ తమ తమ కవితల్ని ప్రకటించారు. ప్రకటిస్తున్నారు . ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ యువ కవుల్ని ఉత్సాహపరుస్తున్నారు.
గ్రూప్ అభివృద్ధికి తన భుజాన్ని బోటుగా నిలబెట్టిన గౌతమి (నిశీధి) గారు కూడా అభినందనీయురాలు . ఇంకా గ్రూప్ ని అనుక్షణం గమనిస్తూ , తాము అందివ్వగల సహాయ సహకారాల్ని అందిస్తున్న సహృదయులు మరెందరో ఉన్నారు. వీరందరి నిస్వార్థ సేవకు కారణం, వారికి కవిత్వంపై గల అవ్యాజమైన అనురాగమే. ఇప్పుడు ఈ గ్రూప్, కవిత్వానికి ఒక మెరుగైన వేదికగా మారింది . కొత్తగా రాయడం మొదలుపెట్టిన వారిని ఉత్సాహపరిచే ఉత్ప్రేరకమైంది .కవిత్వం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తీ ఈ గ్రూప్ ని తమదిగా భావించి ఆదరిస్తున్నారు . కవిత్వం గ్రూప్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ మంచి కవిత్వాన్ని అందిస్తున్న  సాయి పద్మ,శారద శివపురపు , మమత కొడిదెల, అన్వీక్ష నీలం, వాణి, ఇండస్ మార్టిన్ , ఛీ ఛీ, సత్య గోపి , మిథిల్, వినీల్ కాంతి కుమార్ , విజయ్ కుమార్ ఎస్వీకె , నరేష్ కుమార్ , సుభాషిణి పోరెడ్డి ,లాస్య ప్రియ , స్వాతి రెడ్డి, సిద్దార్థ కట్టా, నవీన్ కుమార్ , కిరణ్ పాలెపు, రవీందర్ విలాసాగరం….. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందఱో ఇటువంటి యువ కవుల, కవయిత్రుల  కృషి, ప్రతిభ ప్రశంసార్హమైనవి.  .
ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో , కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే దారుల్ని వెతుకుతూ ఎన్నో నవ్య నూతనమైన శీర్షికల్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది ఈ గ్రూప్. అలా మొదలుపెట్టిన “ప్రశ్నలూ-జవాబులూ” శీర్షిక అద్భుతమైన విజయాన్ని సాధించి , పాఠకుల నుండి గొప్ప ఆదరణ పొంది ఎందరికో ఉపయోగకరంగా, మార్గదర్శకంగా నిలిచింది . ఆ శీర్షికని నిర్వహించిన అరణ్య కృష్ణ గారు , హెచ్చార్కె గారు , ఇప్పుడు నిర్వహిస్తున్న నారాయణస్వామి వెంకటయోగి గారు  తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, వారి వారి అపారమైన అనుభవాన్నీ, బోలెడంత ఓర్పునీ చమురుగా చేసి ఈ కవిత్వ మార్గాన కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తున్నారు. ఎన్నో హృదయాల్ని కాంతిభరితం చేస్తున్నారు . మరో కొత్త ప్రయోగం కవితాంత్యాక్షరి కూడా అందరి మనసుల్నీ ఆకట్టుకుంటోంది .అంతేకాక, ఇంచుమించుగా కవిత్వం గ్రూప్ తో పాటుగానే ఊపిరి పోసుకున్న “కవిత్వం పోయెట్రీ పేజ్” కూడా ఇప్పటికే రెండువేలకి పైగా అభిమానుల్ని సంపాదించుకుంది.
మరింతమందికి  కవిత్వ లేఖనంపై ఆసక్తి కలిగించడం , మరికొందరు అనుభవజ్ఞుల సూచనలు ,సలహాలు ఈ కవిత్వ ప్రయాణానికి ఉపయోగపడేలా చెయ్యడం  ద్వారా తెలుగు భాషకీ , కవిత్వానికీ ఎంతో కొంత సేవ చేసే అదృష్టాన్ని పొందాలన్న కోరిక మాత్రమే ఈ ఆర్టికల్ రాయడం వెనకనున్న స్వార్థం.  విజయవంతంగా ఏడాది సమయాన్ని పూర్తి చేసుకుని, మొదటి పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా కవిత్వం గ్రూప్ నీ, గ్రూప్ సభ్యుల్నీ అభినందిస్తూ , కవిత్వానికి మరింత ఆదరణ లభించే విధంగా కృషి చేయమని వారిని సవినయంగా కోరుతూ ఇదిగో కవిత్వం గ్రూప్ లింక్ ఇక్కడ
 
ఆర్టికల్ పూర్తి పాఠం యు ట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ 

 మరణానికి చిరునామా ఈ ‘డెత్ నోట్’    

 

భవాని ఫణి 

 

bhavaniphaniఅనుకోకుండా మీకో పుస్తకం దొరికిందనుకోండి . అందులో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారని కూడా తెలిసిందనుకోండి . అప్పుడు  మీరేం చేస్తారు?  ఏం చెయ్యాలన్న ఆలోచన మాట అటుంచి అసలు అటువంటి పుస్తకం ఒకటుంటుందన్నఊహ కూడా మనకి రావడం కష్టం కదూ! అటువంటి ఒక విచిత్రమైన ఆలోచనకి దృశ్య రూపమే ‘డెత్ నోట్’

ఒటాకూ (Otaku ) అన్న పదం ఎప్పుడైనా విన్నారా ? పోనీ ‘మాంగా’ అన్న పదం? యానిమే అన్న పదం మాత్రం ఖచ్చితంగా విని ఉంటారు . ఇంట్లో ఓ మాదిరి వయసున్న  పిల్లలుంటే ఈ పదాలు వినడం సర్వ సాధారణం  . మరీ చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా డోరేమన్, నోబితాల కబుర్లు  వినిపిస్తూనే ఉంటాయి కూడా .

జపాన్ లో ప్రచురితమయ్యే కామిక్స్ ని ‘మాంగా’ అని పిలుస్తారనీ,  అలాగే అక్కడ నిర్మించబడే యానిమేటెడ్ చిత్రాలని ‘యానిమే’ అంటారనీ  చాలా మందికి తెలిసే ఉంటుంది . ఎక్కువగా ఆదరణ పొందిన మాంగాలు, యానిమేలుగా  కూడా నిర్మితమవుతాయి . ఈ యానిమేలలో చాలా ప్రక్రియలు (జెనెరె )ఉన్నాయి. అన్ని వయసుల  వారికోసం మాంగాలు వ్రాయబడతాయి . యానిమేలు నిర్మింపబడతాయి  .

వాటిలో ముఖ్యంగా యుక్త వయసులో అడుగు పెట్టిన , పెట్టబోతున్న  పిల్లల కోసం వ్రాసినవీ, తీసినవీ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దబడతాయి . అటువంటి ఒక యానిమే గురించే ఇప్పుడు  చెప్పబోతున్నది . దాని పేరు “డెత్ నోట్ “. ఇది ముందు ‘మాంగా’ గా  ప్రచురింపబడింది .   Tsugumi Ohba అనే ఆయన ఈ మాంగా రాసారు . తర్వాత ఇది యానిమేగా కూడా రూపొందించబడి , మంచి ప్రాచుర్యం పొందింది . దీనిలో కొన్ని హింసాత్మకమైన అంశాలున్నాయన్న విషయాన్ని కొంచెం పక్కన పెడితే , ఇంత శక్తివంతమైన, మేధతో కూడిన మైండ్ గేమ్స్ నీ, ఎత్తుల్నీ, పైఎత్తుల్నీ మరెక్కడా చూడలేమంటే అతిశయోక్తి  కాదు . 37 ఎపిసోడ్ లున్న ఈ యానిమే సిరీస్, జపాన్ లోని నిప్పాన్ టీవీలో 2006 లో ప్రసారమైంది .

విజ్ఞానాన్నీ ,తెలివితేటల్నీ మంచికోసం వాడితే ఎంత ఉపయోగకరమో , చెడుకి ఉపయోగిస్తే అంత ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే  . డెత్ నోట్ ఇతివృత్తం అదే .

death note book

లైట్ యాగామీ అనే పదేహేడేళ్ల అబ్బాయి చాలా తెలివైనవాడు. వయసుకి మించిన పరిపక్వత కారణంగా అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది . అదే సమయంలో షినిగామీ (మరణ దేవత) ల లోకం నుండి జారి పడిన ఒక పుస్తకం లైట్ కి దొరుకుంతుంది. ఆ పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారు . ఒకే పేరు ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉండటం వల్ల, ఆ వ్యక్తి ముఖాన్ని  చూసిన తర్వాత అది గుర్తు తెచ్చుకుని పేరు రాస్తేనే అతని మరణం సంభవిస్తుంది . షినిగామీలు ప్రపంచంలోని అందరి మరణాన్నీ నిర్దేశించలేరు . కానీ డెత్ నోట్ ని ఉపయోగించి కొందరి మరణాన్ని ముందుకు జరపడం ద్వారా తమ ఆయుష్షుని పొడిగించుకోగలరు . అటువంటి ఒక పుస్తకాన్ని సరదా కోసం ఒక షినిగామీ భూలోకంలో పడేస్తాడు . అదే లైట్ యాగామీకి దొరుకుతుంది . నిరాసక్తమైన జీవితాన్ని గడుపుతున్న లైట్ , ఆ పుస్తకం నిజంగా శక్తి కలదని తెలుసుకుని ఉత్తేజాన్ని పొందుతాడు . ఆ పుస్తకాన్ని ఉపయోగించి దేశంలో నేరస్తులందరినీ  చంపి , తద్వారా నేర వ్యవస్థని సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు .

టీవీలో కనిపించే నేరగాళ్ల  పేర్లతో ఒక జాబితా సిద్ధం చేసుకుని వాళ్లందరినీ చంపేస్తూ ఉంటాడు . అతని తండ్రి పోలీస్ అధికారి కావడం వల్ల అతనికి  నేరగాళ్లకి చెందిన మరింత సమాచారం లభిస్తూ ఉంటుంది . ఇలా ఎక్కువ రోజులు గడవకుండానే  ఏదో జరుగుతోందని ఇంటర్ పోల్ కి అనుమానం  కలగడంతో,   “ఎల్(L)” అనే ఒక అత్యంత ప్రతిభావంతుడైన  డిటెక్టివ్ ని రంగంలోకి దింపుతుంది . లైట్ మాత్రం , అభిమానులతో ‘కీరా’ అనే మారు పేరుతో పిలవబడుతూ  విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందుతాడు .

లైట్ యాగామీనే ‘కీరా’ అన్న అనుమానం డిటెక్టివ్ ‘ఎల్’ కి మొదట్లోనే కలుగుతుంది . అతన్ని పక్కదోవ పట్టించడం  కోసం  ఇన్వెస్టిగేషన్ లో సహాయపడుతున్నట్టుగా నటిస్తాడు లైట్.

“ఎల్ ” పూర్తి  పేరు తెలియకపోవడం వల్ల అతడ్నిమాత్రం  ఏమీ చెయ్యలేకపోతాడు .ఆ సమయంలో లైట్ , ఎల్ లు ఉపయోగించే తెలివైన యుక్తులు , కుయుక్తులూ, పరస్పరం చేసుకునే మానసికమైన దాడులూ , ప్రతి దాడులూ చాలా మేధోవంతంగా  రచించబడి,రెప్ప వెయ్యనివ్వనంత ఉత్కంఠని రేకెత్తిస్తాయి.

డెత్ నోట్ అసలు యజమాని అయిన, ర్యూక్ అనే పేరుగల షినిగామీ  కూడా లైట్ దగ్గరకి వచ్చి అతని దగ్గరే ఉంటూ ఉంటాడు .  ఆ షినిగామీ,  లైట్ కి తప్ప వేరే వాళ్లకి కనిపించడు . ఇంతలో కీరా వీరాభిమాని అయిన ప్రఖ్యాత మోడల్ మీసా అనే అమ్మాయికి మరో డెత్ నోట్ దొరుకుంతుంది .

లైట్ నే కీరా అని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వస్తుంది . ఆ అమ్మాయికి తన మీదున్న అభిమానాన్ని అవకాశంగా తీసుకుని , ఆమెని కూడా కీలుబోమ్మని చేసి ఆడిస్తూ , తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు లైట్ . డెత్ నోట్ లో ఉన్న వివిధ రకాల నియమాలని తనకి అనుకూలంగా మార్చుకుని  తప్పించుకు తిరుగుతూ,  నేరగాళ్ల హత్యలు కొనసాగిస్తూనే ఉంటాడు . ఆఖరికి ప్రపంచాన్ని ఉద్దరించాలన్న అతని కోరిక, స్వీయ ఆరాధనగా మారి, అమాయకులని  సైతం చంపడంతో పాటుగా స్వంత తండ్రినీ , చెల్లెలినీ కూడా అంతం చెయ్యడానికి  వెనుకాడనంత క్రూరత్వంగా రూపాంతరం చెందుతుంది . ఎన్నో మలుపుల తర్వాత , చివరగా లైట్  మరణంతో కథ ముగుస్తుంది .

ఎటువంటి డిటెక్టివ్ కథ అయినా దీని ముందు దిగదుడుపే అనిపించేంత బిగువుగా అల్లబడిన కథే ఈ డెత్ నోట్ పాపులారిటీకి కారణం . ఇద్దరు మేధావుల మధ్య జరిగే ఈ దోబూచులాట ఊహించలేనన్ని మలుపులతో నిండి  ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది . అన్ని పాత్రల స్వభావం , చిత్రీకరణ వాటి వాటి పరిధులలో ఎటువంటి లోటు పాట్లూ లేకుండా ,అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి . అంతే కాక  డెత్ నోట్ నియమాలు విచిత్రంగా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి . సంగీతం కూడా ఈ యానిమేకి గొప్ప బలం .

death note ryuk yagami light l 1280x800 wallpaper_www.wallpaperhi.com_55

మచ్చుకి కొన్ని డెత్ నోట్ నియమాలు 

  1. ఈ పుస్తకం లో పేరు రాయబడిన వ్యక్తి చనిపోతాడు
  2. చంపాలనుకునే వ్యక్తి ముఖాన్ని మనసులో ఊహించుకుని పేరు రాస్తేగానీ మరణంaug27 సంభవించదు .
  3. పేరు రాసిన నలభై సెకండ్ల లోపు , మరణానికి కారణం కూడా రాయాలి .
  4. మరణానికి కారణంకనుక పేర్కొనకపోతే, అదిహార్ట్ అటాక్ గా  తీసుకోబడుతుంది .
  5. డెత్ నోట్ కలిగి ఉన్నమనిషి, ఆ డెత్ నోట్ అసలు యజమాని అయిన షినిగామీకి చెందుతాడు .
  6. డెత్ నోట్ కలిగి ఉన్న మనిషి లేదా తాకినమాత్రమే ఆషినిగామీని చూడగలుగుతాడు . వినగలుగుతాడు
  7. డెత్ నోట్ ని వేరే మనిషికి పూర్తిగా ఇచ్చివేయడం గానీ , కొన్ని రోజుల పాటు ఇవ్వడం గానీ చెయ్యవచ్చు .
  8. ఒక వ్యక్తి డెత్ నోట్ నివేరే వాళ్లకి ఇచ్చి వేస్తే , దానికి సంబంధించిన విషయాలన్నీ మరచిపోతాడు .

………………………..

ఇటువంటి నియమాలు వంద పైనే ఉంటాయి . అవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ చూడచ్చు .

http://deathnote-club.deviantart.com/art/All-Deathnote-Rules-116939019

 

 

ఇంతకీ “ఒటాకూ” అంటే చెప్పనేలేదు కదూ ,  ఏదైనా ఒక వ్యాపకానికి దాసోహం అయిన వ్యక్తిని జపనీస్ లో “ఒటాకూ” అని పిలుస్తారు . ముఖ్యంగా యానిమేలు చూడటానికి  అలవాటు పడిన వారికోసం ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు . ఒకసారి ఒటాకూగా మారి , వాటికి ఎడిక్ట్ అయితే  పిల్లలైనా పెద్దలైనా బయట పడటం కొంచెం కష్టమే .

అయినా సరే చూడాలనుకునేవారి కోసం డెత్ నోట్ మొదటి ఎపిసోడ్ లింక్ ఇదిగో

http://kissanime.com/Anime/Death-Note/Episode-001-Rebirth?id=93417

 

మన లోపలి మరో ప్రపంచం 

భవాని ఫణి 
bhavani-phani.

మన శరీరంలో అతి క్లిష్టమైన భాగం ఏమిటంటే , మెదడని ఠక్కున చెప్పేస్తాం . సాంకేతికంగా ఇంత అభివృద్ది సాధించినా మెదడు లోపల ఏం జరుగుతుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం మనిషి ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు . ఒక్కోసారి మన ప్రవర్తనా విధానం మనకే అంతు పట్టదు . ఒకేలా ఉండే సందర్భాల్లో వేరు వేరుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం. మనమేం కోరుకుంటున్నామో మనకే అర్థం కాదు. అది అర్థం చేసుకోగలిగిన మనిషి , మనిషెందుకవుతాడు, మహర్షి అయిపోతాడని సర్ది చెప్పుకుంటాం .

అసలు మనిషి కోరుకునేది ఏమిటి? ఆహారమా?  ధనమా? పేరు ప్రతిష్టలా? ఆరోగ్యమా ? సుఖశాంతులా ? లేక అన్నీనా ? అసలు ఎందుకు ఇవన్నీ ? సంతోషంగా ఉండటం కోసమే కదా!  సంతోషమే లేనప్పుడు ఎన్నున్నా వృధానే అనుకుంటాం . అది నిజమేనా? మరి మనిషి లోపల ఉండే మిగిలిన భావనల మాటేమిటి? విషాదం , కోపం, చిరాకు , భయం ….. వంటి లక్షణాలు మన వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి?  అటువంటి భావాలకి రూపం ఇస్తే అవి ఎలా ఉంటాయి? ఇలా మనకి కలిగే అనేక సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది ఈ యానిమేటెడ్ చలన చిత్రం . ప్రతి సన్నివేశంలోనూ అంతర్లీనమైన సందేశాన్ని ఇమిడ్చి రూపొందించిన  పిక్సార్ వారి మరో ఆణిముత్యం  ఇన్ సైడ్ అవుట్ (Inside Out -2015).

తన టీనేజ్ కుమార్తె ప్రవర్తనా విధానంలో కలిగిన మార్పుల్ని గమనించిన పీట్ డాక్టేర్ అనే వ్యక్తి ఈ అత్యద్భుతమైన యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించి దర్శకత్వం వహించాడు .  మన మెదడు ఒక పెద్ద భవంతి అనుకుంటే , లోపల నివసించే భావనలన్నీ మన ఆలోచననీ , నడవడికనీ,  ప్రవర్తననీ నియంత్రిస్తూ ఉంటే వాటి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది ? ఆ ఘర్షణ కారణంగా  మన వ్యక్తిత్వంలో, బాహ్య ప్రవర్తనలో  కలిగే మార్పులు ఎలా ఉంటాయి? అనే అంశాలని ఎంతో నిశితంగా పరిశీలించి, పరిశోధించి ఈ చిత్రానికి ప్రాణం పోసింది చిత్ర నిర్మాణ బృందం  . మెదడు నిర్మాణం , పని తీరు గురించి సమగ్రంగా తెలుసుకోవడం కోసం అనేకమంది మానసికశాస్త్ర నిపుణుల సహాయం తీసుకున్నారు . అలాగే చిత్రంలోని ముఖ్య పాత్ర పదకొండేళ్ల  అమ్మాయి కావడంతో , పదకొండు నుండి  పద్ధెనిమిది సంవత్సరాల వయసుగల ఆడపిల్లలతో మాట్లాడి వాళ్ల భావనల్ని గమనించి సమీక్షించారు.

ఆ అమ్మాయి పేరు రైలీ .  ఆ పాప పుట్టుకతో కథ ప్రారంభమవుతుంది . ఆమె బాహ్య ప్రవర్తననీ , మెదడు లోపలి కార్యకలాపాలనీ మనం  ఏకకాలంలో చూడగలుగుతాం.  .రైలీ పుట్టగానే ఆమె మెదడులోజాయ్(సంతోషం) ఏర్పడుతుంది . జాయ్ రైలీ ప్రవర్తనని నియంత్రిస్తూ ఉంటుంది  ఇంతలో విషాదం కూడా ఆమెకి తోడవుతాడు . వాళ్లిద్దరూ కలిసి ఆ పాపని నవ్విస్తూ ఏడిపిస్తూ ఉంటారు . మొదట్లో ఉన్నవి ఆ రెండు భావనలే . .

మెల్లగా పాప నడవటం మొదలు పెట్టేసరికి వాళ్లతో భయం వచ్చి కలుస్తాడు . అతను రైలీని  ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు . పెరిగే కొద్దీ మరో భావన చిరాకు కూడా వస్తుంది . దాని వెనకే కోపం వస్తాడు .  పదకొండేళ్ల వయసు వచ్చేసరికి రైలీలో ఈ ఐదు భావనలూ ఏర్పడి, తమ తమ పనులు చేసుకుంటూ ఉంటాయి(రు) . కానీ ప్రధానంగా పాప ప్రవర్తన మీద పట్టు కలిగి ఉన్నది మాత్రం జాయ్ నే . ఆమెకి పాపలో విషాదం ఎందుకున్నాడో అర్థం కాదు . వాడు పాపని బాధపెడతాడని జాయ్ భయం . అందుకే వాడిని నియంత్రణ యంత్రాలకి , జ్ఞాపికా గోళాలకీ దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది . ప్రతి రోజూ వందలకొద్దీ జ్ఞాపికా గోళాలు తయారై, రోజు పూర్తయ్యే సమయానికి కోర్ మెమొరీకి జతకూడుతూ ఉంటాయి . రోజు వారీ పనులకి అవసరం లేని జ్ఞాపికా గోళాలు, దీర్ఘకాలిక జ్ఞాపికా గదుల్లోకి(long term memory) చేరిపోతూ ఉంటాయి .ఇక ఎందుకూ  పనికి రాని, పాతబడిన  జ్ఞాపకాలు వ్యర్థాలుగా నాశనం చేయబడతాయి.

insideout original

ఇలా అంతా సవ్యంగా నడిచిపోతున్న సమయంలో రైలీ జీవితంలో ఒక మార్పు సంభవిస్తుంది . ఆమె కుటుంబం మరో ప్రాంతంలో నివసించడానికి వెళ్లాల్సివస్తుంది . అక్కడి కొత్త వాతావరణం, కొత్త స్కూల్ ఆమెని , ఆమెలోని ఐదు భావనల్నీ అయోమయానికి గురి చేస్తాయి . అనుకోకుండా విషాదం కొన్ని జ్ఞాపికా గోళాల్ని ముట్టుకోవడంతో రైలీని విషాదం ఆవహించి, స్కూల్లో అందరిముందూ ఏడ్చి అవమానపడుతుంది . జాయ్ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా ఆమె , విషాదంతో  కలిసి లాంగ్ టర్మ్ మెమరీ గదుల్లోకి జారిపడిపోతుంది . ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న భావనలు భయం , చిరాకు, కోపం . అంటే రైలీలో ఆ భావనలు తప్ప  సంతోషం, విషాదం ఉండవు . ఆ స్థితి ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పుని తీసుకొస్తుంది .
ఓ పక్క  జాయ్,విషాదంతో కలిసి హెడ్ క్వార్టర్స్ చేరుకునే ప్రయత్నం చేస్తుంటుంది . కానీ అక్కడ కోపంచేతిలో నియంత్రణ  ఉండటం వల్ల అప్పటివరకు ఆమెలో ఏర్పడి ఉన్న వ్యక్తిత్వ ద్వీపాల్లో (personality islands ) స్నేహితుల ద్వీపం , నిజాయితీ ద్వీపం , తుంటరితనపు(goofy )ద్వీపం , హాకీ(ఆమెకిష్టమైన ఆట) ద్వీపం అన్నీ నాశనమవుతాయి . ఇక మిగిలింది కుటుంబ ద్వీపం ఒక్కటే . ఆ సమయంలోనే కోపం, ఆమెలో ఇల్లు వదిలి వెళ్లిపోవాలనే ఒక ఆలోచన (ఐడియా) ప్రవేశపెడతాడు . ఆ కారణంగా రైలీ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది.
లోపలి గదుల్లో ఉన్న జాయ్ ఎన్నో కష్టాలు పడుతూ చివరికి హెడ్ క్వార్టర్స్ చేరుకుంటుంది . ఆ క్రమంలో విషాదంఉపయోగం ఏమిటో కూడా తెలుసుకుంటుంది . చివరగా అతనికి  నియంత్రణ బాధ్యతని అప్పగిస్తుంది . అప్పుడు రైలీ భావోద్వేగానికి గురై  తిరిగి మానసికంగా సాధారణ స్థితికి  చేరుకుంటుంది .  అప్పటినించీ భావనలన్నీ కలిసికట్టుగా రైలీ వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తూ ఉంటాయి . ఆమె ఎదిగే కొద్దీ మరెన్నో భావనలు కూడా వాటికి జత కలుస్తూ ఉంటాయి . ఇదీ క్లుప్తంగా కథాశం . మన ప్రవర్తననీ, లోపల కలిగే భావాల్నీ ఈ చలన చిత్రంలో చక్కగా సమన్వయపరిచి చూపారు  . ఏ భావనకి ఉండే గొప్పతనం , స్థానం దానికి ఉండాలనీ , వాటి పాళ్లు ఎక్కువా తక్కువా అయితే అప్పటివరకు  మన లోపల నిర్మితమై ఉన్న భావోద్వేగాల ప్రపంచం నాశనం అయిపోతుందనీ తెలియజేసారు .

అంతేకాక లోపలి గదుల్లో జాయ్ కి ఎదురయ్యే, రైలీ ఊహత్మక నేస్తం ‘బింగ్ బాంగ్ ఏనుగు’ , ఆమె ఊహత్మక ప్రపంచం , కలల్ని చిత్రీకరించి ప్రదర్శించే బృందం , ఆమె కోసం ప్రాణాలిచ్చే ఊహత్మక స్నేహితుడూ  అందరూ కలిసి ఎవరి లోపల వాళ్లు నిర్మించుకునే మరో ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తారు.  లోపల జరుగుతున్న విషయాలనీ, బాహ్య ప్రవర్తననీ అలా పోల్చి చూడటం ఒక గమ్మత్తైన అనుభూతిని కలిగిస్తుంది . ఇలా భావనల్ని మనుషుల రూపంలో చూపడం వల్ల, ఆ భావనల భావ వ్యక్తీకరణని నిర్వచించడం కత్తి మీద సామే . ఉదాహరణకి పేరులోనే సంతోషాన్ని కలిగి ఉన్న జాయ్, బాధ కలిగే సన్నివేశాల్లో ఎలా స్పందిస్తుంది? తాకిన ప్రతీ జ్ఞాపకాన్నీ విషాదమయం చేసే విషాదం , ఆనందం కలిగితే ఎలా ప్రవర్తిస్తాడు వంటి విషయాలని మనం  ఆసక్తితో గమనిస్తాం . ఇది పిల్లల కంటే పెద్దలకే అర్థవంతంగా అనిపించే , సంతృప్తి కలిగించే చలన చిత్రం .  ఒక్కసారే కాకుండా చూసే కొద్దీ కొత్త కొత్త విషయాలు అర్థం అవుతున్నట్టు అనిపించడం  దీనిలోని ప్రత్యేకత.  ఈ 3D యానిమేటెడ్ చలన చిత్రం, పిక్సార్ యానిమేటెడ్ స్టూడియోస్ ద్వారా నిర్మితమై వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయబడి విజయవంతంగా ప్రదర్శితమవుతూ విమర్శకుల మన్ననలు పొందుతోంది.

.

శ్రావ్యంగా ‘శబ్దిం’చిన సంగీతం 

భవాని ఫణి 
bhavani phani.The Sound of music! 
చలన చిత్రం(1965) చూసినప్పుడు దృశ్యకావ్యం అనే పదానికి నిజమైన అర్థం తెలుస్తుంది . తరం నించి తరానికి ఆస్తిపాస్తులు ఇచ్చినంత ప్రేమగా ఈ చలన చిత్రంపై ప్రేమని కూడా వారసత్వ సంపదగా ఎందుకు అందిస్తారో  అర్థమవుతుంది . ఒక గొప్ప అనుభూతి గుండెల్లో గూడు కట్టుకుని పది కాలాలు పదిలంగా నిలిచిపోతుంది .. సంగీతం ఎంత సౌందర్యవంతమో మరోసారి అనుభవంలోకి వస్తుంది . భావాలకి పదాల రెక్కలు తొడిగి, సంగీత సామ్రాజ్యంలోకి విడిచిపెట్టినప్పుడు వెలువడే ఓ ఆహ్లాదకరమైన స్వేచ్ఛ అనబడే రెక్కల తాలుకూ చప్పుడు రివ్వుమంటూ గుండెల్లోకి దూసుకొస్తుంది .
ఆత్మకథ ఆధారంగా నిర్మించిన చిత్రమైనప్పటికీ కథలో మార్పులు చేసి నాటకీయత జోడించడం వల్ల దీన్ని ఒక కల్పిత కథగా తీసుకోవడమే మంచిది . ఈ చిత్రానికి ఆయువుపట్టు ఇందులోనే పాటలే . ప్రతి మాటా పాటే అయినా కృత్రిమత్వం కనిపించదు. సంగీతమెంత ప్రకాశవంతమో  ,ఆ ధ్వనిహారంలో కుదురుకున్న అక్షరాలు కూడా కలిసికట్టుగా అంతే కాంతివంతంగా మెరుస్తాయి.
మేరియా ఒక సాధారణమైన స్త్రీ .
సన్యాసినిగా మారాలన్న కోరికతో ఒక క్రైస్తవ మఠంలో శిక్షణ పొందుతూ ఉంటుంది .
కానీ ఆమె మనసు, ఆమెని రోజంతా పర్వతాల్లోనే విహరించమంటుంది .
చీకటి పడిపోయి , నక్షత్రాలు వచ్చేసి ఇక చాల్లే వెళ్లెళ్లమంటున్నా
పచ్చని నీడలేవో ఆమెని తమతోనే ఉండి పొమ్మంటాయి.
ఆమె ఆగుతుంది , వింటుంది.
ఆ పర్వతాలు ఏళ్ల తరబడి వాటిలో దాచుకున్న సంగీతాన్ని ఆమెకి వినిపిస్తాయి .
అలా విన్న ప్రతి పాటనీ పాడమంటూ ఆమె హృదయం  మరీ మరీ మారాం చేస్తుంది .
అంతే కాక ఆమె చిన్ని హృదయం పక్షి రెక్కల్లా కొట్టుకోవాలనుకుంటుంది .
కొలనులోంచి వృక్షాల మీదకి ఉదయిస్తానంటుంది.
చిరుగాలి మోసుకొచ్చే చర్చి గంటల చిరుధ్వనికి మెల్లగా నిట్టూర్చమంటుంది.
రాళ్ల పైకెక్కి జారిపడే సెలయేటి ప్రవాహంలా బిగ్గరగా నవ్వుకోవాలంటుంది. .
ఇంకా ఎన్నెన్నో అల్లరి పనులు చెయ్యమని గొడవ చేస్తుంది .  .
అందుకే ఆమెని ఒంటరితనం ఆవరించినపుడు పర్వతాల్లోకి వెళ్తుంది .
మునుపు విన్నవేవో మళ్లీ మళ్లీ వింటుంది .
ఆ సంగీత ధ్వనుల ఆశీర్వాదాలతో ఆమె పాడుతూనే ఉంటుంది .
నిజానికి ఆమె ఎవరు? ఏమిటి ? అనేది మఠంలోని సన్యాసినుల మాట(పాట)ల్లో అయితే  ఇలా అందంగా ఆవిష్కరింపబడుతుంది .
మేఘాన్ని పట్టుకుని ఎవరైనా నేలకి నొక్కిపెట్టగలరా?
ఎవరైనా చంద్రకిరణాన్ని అరచేతిలో ఆపగలరా?
కెరటాన్ని ఇసుక మీద నిలిపి ఉంచగలరా?
మేరియా కూడా అంతే మరి . మరి మేరియా అనే ఈ సమస్యని  ఎలా పరిష్కరించాలి . అందుకే ఆమెని కొన్ని రోజులు మఠానికి దూరంగా ఉంచాలని నిర్ణయించుకుని ఒక కెప్టెన్ ఇంటికి పంపుతారు సన్యాసినులు  . కెప్టెన్ జార్జ్, భార్యని పోగొట్టుకుని తన ఏడుగురు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు . ఆ పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించేందుకు ఆమె ఆ ఇంటికి వస్తుంది . ఆ అల్లరి పిల్లల్ని ఆకట్టుకుని మచ్చిక చేసుకుంటుంది .
బాధలోనో , భయంలోనో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందో పిల్లలకి ఇలా చెప్తుంది
గులాబీలపై నీటి చుక్కల్నీ, పిల్లిపిల్లల మెత్తదనాన్నీ తలుచుకుంటుందట
ఎప్పుడో కనురెప్పలపైన పడిన మంచు ముత్యాలని మననం చేసుకుంటుందట
వసంత కాలంలోకి కరిగిపోయే తెల్లని శీతలాన్ని స్ఫురణకి తెచ్చుకుంటుందట
తమ రెక్కల మీద చందమామని మోసుకెళ్లే పెద్ద పక్షుల గుంపుని జ్ఞాపకంగా పిలుస్తుందట
…………
అలా ఆమె బాధలో ఉన్నప్పుడు తనకిష్టమైన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుందట.
వాళ్ల భయాల్ని పోగొట్టడంతో సరిపెట్టుకోక, ఆనందంగా జీవించడమెలాగో నేర్పుతుంది . తప్పిపోయిన వారి బాల్యాన్ని తెచ్చి మళ్లీ  వాళ్లకే బహుమానంగా ఇస్తుంది. సంగీతంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తుంది . అప్పుడొచ్చే  డో-రే-మీ పాట గురించి తెలుసుకోవాలంటే వినడమొక్కటే మార్గం .
ఆ క్రమంలోనే ఎప్పుడో ఆ పిల్లల తండ్రి జార్జ్ తో  ప్రేమలో పడుతుంది . తప్పు చేస్తున్నానన్న భావంతో, తిరిగి మఠానికి వెళ్లి తన సమస్యని  ముఖ్య సన్యాసినితో చెప్పుకుంటుంది .అప్పుడామె, మగవాడ్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించనట్టు కాదే! అని నవ్వుతుంది . మేరియాకి ఇలా సలహా ఇస్తుంది .
ప్రతి పర్వతాన్నీ ఎక్కాలాట
ప్రతి ప్రవాహంలోకీ దిగి చూడాలట.
ప్రతి ఇంద్రధనుస్సునీ అనుసరించాలట.
ఇవ్వగలిగినంత ప్రేమని కోరుకునే స్వప్నాన్ని చేరుకునేవరకు
తెలిసిన ప్రతి దారిలోనూ నడవాలట .
ఆ పరిష్కారమార్గానికి తృప్తి చెందిన మేరియా, మళ్లీ జార్జ్ దగ్గరికి వచ్చి అతని ప్రేమని కూడా పొందుతుంది . అందుకు కారణం కూడా ఒక పాటలా ఇలా చెబుతుంది .
ఏమీ లేకపోవడంలోంచి ఏమీ రాదట.
తన చెడ్డ బాల్యంలోనో, దుర్భరమైన యవ్వనంలోనో ఏదో మంచి పని చేసి ఉంటుందట.
అందుకే ఆమె అతని ప్రేమని పొందగలిగిందట.
ఆ ప్రేమ ఫలించి వాళ్లు వివాహం చేసుకోవడం. సన్యాసిని కావాలని కలలు కన్న మేరియా, జార్జ్ భార్యగా , ఏడుగురు పిల్లల తల్లిగా మారి  పరిపూర్ణమైన జీవితాన్ని పొందడం చాలా సాధారణమైన కథే . కానీ ఈ చలన చిత్రాన్ని అసాధారణంగా మార్చినవి మాత్రం సంగీతం , సాహిత్యమే . ఆ సంగీత ప్రవాహంలో మునకలు వేస్తూ, మధ్య మధ్యలో నీటి బిందువుల్లా వేళ్లసందుల్లోంచి జారిపోయే సాహిత్యపు చల్లదనాన్ని అనుభవించడం ఎంత బాగుంటుందో అనుభవించినప్పుడే తెలుస్తుంది. అలాగే ఫేర్వెల్ పాట , సిక్స్ టీన్ గోయింగ్ ఆన్ సెవెంటీన్ పాట … చెప్పాలంటే ఆసలన్ని పాటలూ అద్భుతం అనేకంటే వాటి గురించి చెప్పడానికి మరో పదం లేదు. అందుకే ఈ శ్రావ్యమైన సంగీతధ్వని, తరంగాల తరగలుగా చాలా కాలం పాటు మన జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది . .

మరుపు కోసం

 

bhavani-phani.అతనికి ఒక్కసారిగా కనుపాపల్లోపల మెరుపేదో మెరిసినట్టయింది . ఓ నవోత్తేజం నరనరానా నిండిన అనుభూతి కలిగింది . ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్న కనురెప్పలు ఇక ఆగలేనట్టుగా  తెరుచుకున్నాయి . ఎదురుగా ఏ దేవతా రూపమూ ప్రత్యక్షం కాలేదు . అశరీరవాణేదీ తన సందేశాన్నీ వినిపించలేదు . కానీ అతనికి అర్థం అయింది . తన కోరిక నెరవేరింది . తన తపస్సు ఫలించింది . ఇప్పుడు తన దగ్గర ఒక అసాధారణ శక్తి ఉంది . అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది .

ఇక తపస్సు కొనసాగించే అవసరం లేకపోవడం వల్ల  ఉద్వేగం నిండిన మనసుతో  ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు .  కొంతసేపటికి వచ్చిన ఆ మనిషి యధాలాపంగా స్వామి వంక చూసి ఉలికిపడ్డాడు . ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండే స్వామి, ఈ రోజు తనవైపు చిరునవ్వుతో చూస్తుండడంవల్లనేమో భయంతో ఒక అడుగు వెనక్కి వేసాడు .
“రావయ్యా రా కంగారు పడకు . వచ్చి ఇలా కూర్చో ” అన్నాడు స్వామి నవ్వుతూ .
ఇన్నేళ్ళుగా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడని స్వామి ఆ రోజు అంత నోటి నిండుగా పలకరించేసరికి పులకరించిపోయిన ఆ ముసలి ప్రాణి, నోట మాట రానట్టుగా రెండు చేతులూ జోడించి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు .

” చూడు పెద్దాయనా , నీ పేరేమిటో నాకు తెలీదు . కానీ ఇన్ని సంవత్సరాలూ పళ్ళు ఫలాలు తెచ్చిస్తూ  నా మంచి చెడ్డలు చూసేందుకు నువ్వు పడిన తపన నేను గమనించాను . నా తపస్సు పూర్తయింది . నాకు ఒక అపూర్వ శక్తి లభించింది . నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నా శక్తితో ముందుగా నీకే లాభం చేకూర్చాలని అనుకుంటున్నాను . చెప్పు, నువ్వు మరచిపోవాలనుకునే మనిషి గానీ , విషయం గానీ ఉంటే చెప్పు . ఇక వాళ్ళకి చెందిన ఏ ఆలోచనా నిన్ను బాధపెట్టదు . ”
ఆ ముసలి వ్యక్తి అయోమయంగా చూసి ఓసారి బుర్ర గోక్కున్నాడు .
“స్వామీ , నువ్వనేదేంటో నాకు అర్థం కావట్లేదు . ఎవరైనా విషయాలు ఇంకా బాగా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు గానీ మరచిపోవాలని ఎందుకనుకుంటారు! ”
స్వామి విశాలంగా నవ్వాడు  .
“నీకు తెలీదులే . అలా మరుపుని కోరుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు . వాళ్లకి నా సహాయం అవసరం . నేను వెంటనే బయలుదేరాలి . అవకాశం వచ్చినప్పుడు నీ ఋణం తప్పక తీర్చుకుంటాను “అంటూ అతని వద్ద సెలవు తీసుకున్నాడు . తపస్సు ప్రారంభించే ముందు ఒక చెట్టుతొర్రలో  దాచిన తన పాత దుస్తులు ,కొద్ది పాటు డబ్బు జాగ్రత్త చేసుకుని జన జీవన స్రవంతిలోకి  అడుగు పెట్టాడు .

కానీ అతని ప్రయాణం మొదలైనంత సజావుగా సాగలేదు . ఎవరికి తన సహాయం అవసరమో , ఎవరు మరుపుని కోరుకుంటున్నారో స్వామికి అర్థం కాలేదు .మనుషుల మనసు చదివే శక్తి కోసం కూడా తపస్సులో కోరుకుని ఉండాల్సింది  అనుకున్నాడు . మళ్ళీ అంతలోనే అటువంటి ఆలోచన వచ్చినందుకు తనని తానే నిందించుకున్నాడు . సామాన్య ప్రజానీకంలా తను కూడా ఉన్నదానితో తృప్తి పడకపోతే ఎలా! కష్టపడనిదే ఏదీ సాధించలేమన్న విషయం తనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది? తన అవసరం ఉన్న వాళ్ళని తనే వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటూ  మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు . అలా ప్రయాణం చేస్తూ చేస్తూ జమ్మూ, అక్కడనించి కట్రా చేరుకున్నాడు .తను సరైన ప్రదేశానికే వచ్చాడు . భగవంతుడి దగ్గరకి కష్టాల్లో ఉన్నవారే ఎక్కువగా వస్తారు . వైష్ణో దేవి దర్శనం జరిగే  లోపుగా తన సహాయం అవసరమైన వాళ్ళు తప్పక తనకి తారసపడతారు అని సంతోషిస్తూ ఉత్సాహంగా కొండ ఎక్కడం ప్రారంభించాడు . పరిశీలనగా అందరి వైపూ చూస్తూ , ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో అంచనా వేస్తూ నడవసాగాడు

అప్పుడు కనిపించాడా యువకుడు ఒంటరిగా. పచ్చని ఛాయతో మెరిసిపోతున్నాడతను.  చెయ్యెత్తు మనిషైనా ముఖంలో  ఉన్న సౌకుమార్యం అతని వయసు లేతదనాన్ని చెప్పకనే చెబుతోంది . భారమైన అడుగులు , భుజాల భంగిమ అతను పెద్ద కష్టంలో ఉన్నాడని సూచిస్తున్నాయి . స్వామి మెల్లగా అతని పక్కగా  వెళ్లి అన్నాడు .
“నీ ఉత్సాహానికి స్నేహితులంతా వెనకబడ్డారా భాయీ ”
ఆ యువకుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసాడు . “లేదు భయ్యా , ఒక్కడినే వచ్చాను . అయినా నన్ను చూస్తే అంత ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తున్నానా  మీకు ?” కొంచెం పంజాబీ యాస కలిసిన హిందీలో అన్నాడా అబ్బాయి .
“ఇంత చిన్న వయసులో ఎందుకంత నైరాశ్యం తమ్ముడూ , ఇష్టమైతే నీ కష్టమేమిటో నాతో చెప్పుకోవచ్చు ” స్వామి రోడ్డు పైనే దృష్టి నిలిపి చెప్పాడు .
ఆ యువకుడు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు . ఏవో పదునైన వాక్యాలు అనేందుకు సిద్ధమై అంతలోనే విరమించుకున్నట్టుగా మళ్ళీ విషాదంలోకి తనని తాను ఒంపుకుంటూ  నడక మొదలుపెట్టాడు .
స్వామి వదిలిపెట్టలేదు
“సరే, నువ్వేమీ చెప్పద్దు , నేనే ముందు నా కథ చెబుతాను . నీకు నా మీద నమ్మకం కలిగితేనే మాట్లాడు “
ఆ యువకుడు అభ్యంతరం లేనట్టుగా భుజాలెగరేసాడు .
స్వామి నడక వేగం తగ్గించి మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు .
afsar-marupu
“ఇంచుమించు  పది సంవత్సరాల క్రితం నేను ప్రేమలో విఫలమయ్యాను . కోరుకున్న అమ్మాయిని దక్కించుకోలేక , అలాగని మరిచిపోనూ లేక ఎంతో విలవిలలాడిపోయాను . పిచ్చి పట్టినట్టుగా అయి దేశాటన ప్రారంభించాను . దక్షిణ భారతానికి చెందిన నేను , అలా తిరుగుతూ తిరుగుతూ ఈ పరిసర ప్రాంతాలకి చేరుకున్నాను . అప్పుడే నాకో ఆలోచన కలిగింది . మనకి  బాధ కలిగించే మనిషినీ, ఆ మనిషి తాలుకూ ఆలోచనల్నీ పూర్తిగా మరచిపోగలిగితే, మరిచిపోయేలా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది . అనుకున్నదే తడువుగా ఓ అనువైన స్థలం చూసుకుని తపస్సు ప్రారంభించాను . తపస్సు అంటే ఏ దేవుడి నామస్మరణో కాదు . కేవలం నా సంకల్పాన్నే పదే పదే మనసులో జపించసాగాను . ఎంతో కఠోర దీక్షతో చేసిన నా తపస్సు ఇప్పటికి ఫలించింది . నేను కోరుకున్న శక్తి నాకు లభించింది .” అంతవరకు చెప్పి ఆగాడు స్వామి .
ఆ యువకుడు స్వామి ముఖంలోకి పరిశీలనగా చూసాడు . “అయితే మీ లవర్ ని మీరు మర్చిపోయారా ?”
స్వామి  చిన్నగా నవ్వాడు . “నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో నేనే మర్చిపోతే ఇతరులకి ఎలా సహాయం చేస్తాను? ఎవరైనా ఎవరి జ్ఞాపకాల్నైనా పోగొట్టుకోవాలని అనుకుంటే నేను వాటిని అంతం చెయ్యగలను ” అన్నాడు. తన శక్తి తన మీద పని చెయ్యలేదనీ, అయినా నిజానికి ఇప్పుడా అవసరం కూడా లేదనీ చెప్పడం ఇష్టం లేక .
ఆ యువకుడికి స్వామి మీద నమ్మకం కలిగినట్టుంది . ఇంకేమీ ప్రశ్నలు వెయ్యకుండా నేరుగా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు .”నేనూ,ప్రకృతీ  చిన్నప్పటి నుండీ క్లాస్మేట్స్ . ఎయిత్ క్లాస్ కి వచ్చేసరికి మా స్నేహం మరింత బలపడింది . అప్పట్లో స్కూల్ ఎంతో సందడిగా ఉండేది . అప్పుడప్పుడే అడుగుపెడుతున్న యవ్వనం వల్ల ఎటు చూసినా జంట కోసం వెతుక్కునే స్నేహితులే. నేనూ , ప్రకృతీ కలిసి అటువంటి జంటల్ని కలిపే పని మొదలుపెట్టాం . ఆ పని మాకెంతో సంతోషం కలిగించేది . ఓ రోజు ఉన్నట్టుండి ప్రకృతి అడిగింది ” మనోజ్ , నీకెవరైనా ఇష్టమైతే చెప్పు . నేను వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడతాను ” అంది .
ఊహించని ఆ ప్రశ్నకి వెంటనే ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు . కొంచెం ధైర్యం చేసి నాకిష్టమైన అమ్మాయివి నువ్వే అనేసాను . తను ఏ మాత్రం ఆలోచించకుండా నాకిష్టమే అంది .

అలా మొదలైంది మా ప్రేమ ప్రయాణం . నా పదమూడో పుట్టిన రోజుకి అమ్మా నాన్నా గిఫ్ట్ గా ఇచ్చిన మొబైల్ లో రోజూ అందరూ నిద్రపోయాక మొదలుపెట్టి తెల్లవార్లూ మాట్లాడుకునేవాళ్ళం . తను కూడా ఇంట్లో ఒకే అమ్మాయి కావడంతో  బోలెడంత గారం, ప్రైవసీ ఉండేవి . ఈ విషయం ఇంట్లో తెలీకుండా మాత్రం జాగ్రత్తపడేవాళ్ళం . ఎప్పుడైనా ఒక రోజో , రెండు రోజులో నాతో మాట్లాడటం కుదరదనుకుంటే గంటల తరబడి ఏడ్చేది . తన బాధ చూస్తే నాక్కూడా  ఏడుపొచ్చేది ” వింటున్నాడా లేదా అన్నట్టు ఆ యువకుడు ఓ సారి ఆగి స్వామి వైపు చూసాడు .స్వామి ముఖంలో ఆసక్తికి సంతృప్తి చెందినట్టుగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు .”టెన్త్ లోకి వచ్చేసరికి నా ఆలోచన మారిపోయింది . నా మనసు కొత్త కొత్త పరిచయాల కోసం తహతహలాడింది . కొందరు అమ్మాయిల్లా ప్రకృతి నాకు స్వేచ్ఛనిచ్చేది కాదు . ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేది . అందరు లవర్స్ లా ఎంజాయ్ చెయ్యడానికి సహకరించేది కాదు . ఎక్కువగా కలిసేది కాదు .ఫోన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది . ఆ అసంతృప్తితో నేను కొత్త స్నేహాలు వెతుక్కునేవాడ్ని . ఆకర్షణీయమైన నా రూపం  వల్ల అమ్మాయిలు సులువుగానే నాకు ఎట్రాక్ట్ అయ్యేవారు . కొందరు వాళ్ళంతట వాళ్ళే వచ్చేవారు . అలా ఒకేసారి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయిన్ టైన్ చేసేవాడ్ని . ప్రకృతికి మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు . కొన్ని రోజుల స్నేహంతోనే చాలామంది అమ్మాయిలంటే నాకు బోర్ కొట్టేది. కానీ ప్రకృతితో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడ్ని .

మెల్లగా మా మధ్య పోట్లాటలు మొదలయ్యాయి . ఎప్పడూ తనతోనే మాట్లాడుతూ కూర్చుంటే నాకు వేరే పని ఉండదా అని నాకు కోపం వచ్చేది . అసలే కోపం ఎక్కువ కావడం వల్ల అలాంటప్పుడు నోటి కొచ్చినట్టు తిట్టేవాడ్ని . కొన్ని రోజులు మాట్లాడటం మానేసినా మళ్ళీ తనే పలకరించేది. బ్రతిమలేది . తనంటే నాకు కూడా  చెప్పలేనంత ఇష్టం . అలా అని తనతో నిజాయితీగా ఉండలేక పోయేవాడిని . వేరే స్నేహాల సంగతి ఎలా ఉన్నా, పెళ్లి మాత్రం తననే చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను . ఎనిమిదేళ్ళు మా ప్రేమ అలా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది . నాకు ఎం బి ఏ కూడా పూర్తి కావచ్చింది. తనని మెల్లగా నిర్లక్ష్యం చెయ్యడం మొదలు పెట్టాను . ఓ రోజు ఆ విషయం తను గట్టిగా అడిగి గొడవ చేసేసరికి కోపం వచ్చి, విడిపోదామని చెప్పి , బాగా తిట్టి ఫోన్ పెట్టేసాను . ” అపరాధ భావం వల్లనేమో అతను ఎటో చూస్తూ చెప్పసాగాడు .”ఒక నెల రోజులు బాగానే ఉన్నాను . అలా ఒక్కోసారి పది పదిహేను రోజులు మాట్లాడుకోకుండా ఉండటం మాకు అలవాటే . ఈసారి తను ఎంతకీ పలకరించకపోయేసరికి నేనే ఫోన్ చేసాను . అంతే, నాకు పెద్ద షాక్ తగిలింది . తను నన్ను మరిచిపోయిందనీ, నన్ను కూడా తనని మరిచిపోయి ముందుకు సాగమనీ చెప్పేసింది . ఇక చూడండి . అప్పుడు మొదలైంది నా బాధ . ఫేస్బుక్ లో , వాట్స్యాప్  లో , ఫోన్లో అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేసేసింది . తన కజిన్స్ తో, మా కామన్ ఫ్రెండ్స్ తో ఎన్నో మెసేజ్ లు పంపాను . చివరికి బాగా జబ్బు పడ్డానని కూడా చెప్పించాను . అయినా తను లొంగలేదు . ఒక్క సారి మాత్రం ఫోన్ లో మాట్లాడింది .
నాతో పోట్లాడి పోట్లాడి అలిసిపోయానంది . నావల్ల తన ఎనిమిది సంవత్సరాలు నాశనం అయిపోయాయని చెప్పింది . నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ , నా నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక చాలా నలిగిపోయాననీ , ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉందనీ చెప్పింది . ఇప్పుడు తనకి నా మీద జాలి మాత్రమే కలుగుతోందనీ , ఏ మాత్రం ప్రేమ భావం లేదనీ , ఇక ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దన్నీ చాలా గట్టిగా చెప్పేసింది . నాలో గిల్టీ ఫీలింగ్ అప్పుడు మొదలయింది . నేను తనతో పాటుగా ఎందఱో అమ్మాయిల్ని ఏడిపించాను . ఈ ఎనిమిదేళ్ళ లో దాదాపు ముప్ఫై మంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాని చెప్పి , కొన్నాళ్ళకి బోర్ కొట్టగానే వదిలేసాను  . ఒక్కో అమ్మాయితో బ్రేక్ అప్ అయినప్పుడల్లా వాళ్ళెంతో ఏడుస్తూ తిడుతూ నాకు దూరమయ్యేవారు . ఆ పాపాలన్నీ నన్నిప్పుడు ఇలా వెంటాడి వేధిస్తున్నాయనిపిస్తోంది . ప్రతి నిమిషం అదే ఆలోచన . తనతో మాట్లాడాలనీ , మునుపటిలా ఉండాలనీ తీవ్రమైన కోరిక . తిండీ , నిద్రా కూడా తగ్గిపోయాయి . మనసు తేలిక పరచుకోవడం కోసం , నా పాపాలకి పరిహారం చేసుకోవడం కోసం ఇలా వచ్చాను . ఇప్పుడు నాకింకేమీ వద్దు . మళ్ళీ తను నా జీవితంలోకి వస్తే చాలు . కానీ ఇక తను రాదని నాకు తెలుసు . ” ఆ యువకుడి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి  .” చూడు భాయీ , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు . మళ్ళీ అటువంటి పొరపాటు చెయ్యకు . ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రాదని తెలిసినప్పుడు ఇంకా బాధ పడటం వల్ల ఏం ప్రయోజనం? మన ఆత్మనైనా సరే హింస పెట్టే హక్కు మనకి లేదు . నువ్వు కూడా ఆ అమ్మాయిని మర్చిపోవడం ఒక్కటే సరైన మార్గం ” అన్నాడు స్వామి అనునయంగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ .
ఆ యువకుడు అదేమీ పట్టించుకోనట్టుగా మళ్ళీ చెప్పసాగాడు .”ఇప్పుడు నన్ను నిలువెల్లా దహించివేస్తున్న సందేహం ఒక్కటే . అసలు ఇన్నేళ్ళ ప్రేమ ఎలా అంతమైపోయింది? తను నన్ను ఎలా మరిచి పోగలిగింది! అసలు అలా మరఛిపోవడం సాధ్యమా? ఒక్కసారి కూడా మా మధ్య జరిగిన మంచి సంఘటనలు తనకి గుర్తు రావా ? నాతో మాట్లాడాలని అనిపించదా ? అసలు అదెలా కుదురుతుంది!! ఈ ఆలోచనలతో నేను సతమతమైపోతున్నాను . దయచేసి సమాధానాలు చెప్పండి భయ్యా ”  అతను కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటే బిక్కమొహం వేసుకుని చిన్నపిల్లాడిలా అడిగాడు  .స్వామి ఒక్క నిమిషం అలోచించి చెప్పాడు.  ” తమ్ముడూ , మనిషి మనసు ఓ మహేంద్రజాలం . ఎప్పుడు ఎవర్ని ఎలా స్వీకరిస్తుందో మనం అంచనా వెయ్యలేం . దానితో పాటుగా సాగిపోవడమే తప్ప ఎదురుతిరిగి ప్రశ్నించే ప్రయత్నం చెయ్యకూడదు . ప్రపంచంలో ప్రేమ విషయంలో ఏ ఇద్దరి అనుభవాలూ ఒకేలా ఉండవు . ఆ సందేహాలన్నీ పక్కన పెట్టు . ఇప్పుడు నేను ఆ అమ్మాయి తాలుకూ ఆలోచనలన్నీ నీ మనసులోంచి తొలగిస్తాను . అప్పుడు నీకీ వేదన ఉండదు . “ఆ అబ్బాయి కొంతసేపు దీర్ఘాలోచనలో పడినట్టుగా ఉండిపోయాడు . తర్వాత అన్నాడు .” వద్దు భయ్యా , నేను తనని మరిచిపోతే నా జీవితానికి అర్థమే లేదు . ఎప్పటికైనా తను వెనక్కి తిరిగి చూస్తుందనే ఆశతో బ్రతికేస్తాను . కనీసం క్షమించినా చాలు . అయినా నేను ఇదంతా మరిచిపోతే మళ్ళీ నా కథ మొదటికే వస్తుంది .  చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యడం నాకిష్టం లేదు. ఈ జీవితానికి నాకీ బాధ చాలు . “ అంటూ ఇక స్వామితో మాట్లాడటం ఇష్టం లేనట్టుగా వడివడిగా అడుగులేస్తూ అతను ముందుకు వెళ్ళిపోయాడు .స్వామికి ఆ అబ్బాయిని వెనక్కి పిలవాలనిపించింది . మరుపు అనేది మనిషికి సహజంగా లభించిన వరమనీ , ఆ అమ్మాయి తిరిగి చూసినా, చూడకపోయినా ఇప్పుడున్నంత బాధ కొద్ది రోజుల తర్వాత ఉండదనీ, అప్పటివరకూ పొరపాటు నిర్ణయాలేవీ తీసుకోకుండా ఓపికపడితే చాలనీ చెప్పాలనిపించింది. కానీ ఆ అర్హత తనకి ఉందా? తపస్సు పేరుతో తను పోగొట్టుకున్న సమయం గురించీ, తద్వారా లభించిన శక్తి వల్ల ఒనగూడే ప్రయోజనం గురించీ, తన భవిష్యత్తు గురించీ ఆలోచిస్తూ స్వామి అక్కడే నిలబడిపోయాడు.

***

యంత్రంలోని మనిషితనం వాల్-ఇ

భవాని ఫణి

bhavani-phani.నడిచే అవసరం లేకుడా జీవితాంతం కేవలం పడక కుర్చీల్లో ప్రయాణించగలిగే అవకాశం కలిగితే ? దంతధావనం కూడా యంత్రాలు చేసిపెట్టే సదుపాయం ఉంటే ? ఒక బటన్ నొక్కగానే శరీరంపైనే దుస్తుల రంగు మారిపోయే సౌకర్యం ఏర్పడితే ? అటువంటప్పుడు మానవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటే వాల్ -ఇ తప్పనిసరిగా చూడాల్సిందే .

సాధారణ చలనచిత్రాలతో పోలిస్తే యానిమేటెడ్ చలనచిత్రాల నిర్మాణానికి అయ్యే ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువే . కానీ ఆ చిత్రాలతో చెయ్యగలిగే చమత్కారాల పరిధి చాలా విస్తృతమైనది . చాలా మటుకు యానిమేటెడ్ చలనచిత్రాల్లో తొణికిసలాడే జీవకళ , సహజత్వం, మానవీయతా విలువలని గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది . అలా  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం వాల్-ఇ (Wall -E ). ఇది కేవలం పిల్లలు చూడదగ్గ చిత్రమని భావిస్తే అది ఖచ్చితంగా పొరపాటే . ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఇంటర్ స్టెల్లార్ చిత్ర దర్శకుడు నోలాన్, 2008లో విడుదలైన ఈ చలన చిత్రాన్ని చూసి ప్రేరణ పొందాడంటే దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు . అవును . వాల్ -ఇ కూడా సైన్స్ ఫిక్షనే. నిజానికి వాల్ -ఇ చిత్రమే ఇంటర్ స్టెల్లార్ కంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుందని చెబితే అతిశయోక్తి కాదు .
ఈ చలన చిత్రం గొప్పతనం ఏమిటంటే మన భూమి ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సమస్యల గురించి , సరళంగా ఆలోచనాత్మకంగా చర్చించడం . వాటిలో ముఖ్యమైనవి రెండు అంశాలు.
1. మనం తయారుచేస్తున్న చెత్త ,మన భూమిపై మనకే స్థానాన్ని మిగల్చదని తెలపడం
2. శరీర భాగాలకి బదులుగా యంత్రాలని వాడితే మానవ జీవ పరిణామక్రమంలో చోటు చేసుకునే మార్పులని ఊహించడం
అంతే కాకుండా ఇది, భూమిపై మనుషులు వదిలి వెళ్ళిన ప్రేమ భావాన్ని ఆకళింపు చేసుకుని వంటబట్టించుకున్న ఒక రోబోట్ కథ కూడా . దర్శకుడు ఆండ్రూ స్టాన్టన్ ,ఈ చలనచిత్ర నేపధ్యాన్ని ‘నిర్హేతుకమైన ప్రేమ, జీవితపు అనుసరణీయతని ఓటమి పాలు చేయగలదని చూపడంగా’ అభివర్ణించాడు.(irrational love defeats life’s programming)
ఇంకా ఈ చలన చిత్రంలో నాస్టాల్జియా(స్వదేశంపై గల వ్యామోహం), మానవ జాతి మనుగడకు వాటిల్లబోయే ముప్పు, కార్పొరేట్ వ్యవస్థ కలిగించే మార్పులు వంటి అంశాలెన్నో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి .

చిత్ర కథ విషయానికి వస్తే  గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా భూమి నివాసానికి అననుకూలంగా మారిపోవడంతో , మనుషులంతా భూమిని వదిలిపెట్టి ఒక అంతరిక్ష నౌక యాగ్జియం(axiom )లో నివసించేందుకు వెళ్ళిపోతారు  . ఇది జరిగిన ఏడువందల సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది . శుభ్రం చేసే పనిలో భాగంగా భూమి మీద మనుషులు వదిలి పెట్టిన మర యంత్రాలు వాల్-ఇ లు(Wall -E : Waste Allocation Load Lifter –Earth-Class)  . కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని శుభ్రపరచడం అసాధ్యంగా భావించి మనుషులు వాటిని కూడా నిలిపివేస్తారు . కానీ ఒకే ఒక వాల్-ఇ మాత్రం ఇన్ని సంవత్సరాల నుండీ భూమిని శుభ్రం చేస్తూ , తనని తానే మరమ్మత్తు చేసుకుంటూ , మానవులు వదిలి వెళ్ళిన చెత్త నుండి తనకి నచ్చిన వస్తువులని భద్ర పరుచుకుంటూ ఒంటరిగా జీవిస్తూ (?) ఉంటుంది . భూమి మొత్తానికి దానికి తోడుగా ఉన్నది అతి మొండి ప్రాణిగా పేరుపడిన ఒక బొద్దింక మాత్రమే.

తన పొట్టలోకి చెత్తని వేసుకుని దీర్ఘ ఘనాలుగా నొక్కి వాటిని ఒక దానిపై ఒకటి పేర్చుకుంటూ పోవడం దాని పని . కేవలం చెత్తని ఒక క్రమంలో అమర్చడం కోసం తయారు చేసిన అతి ప్రాథమికమైన రోబోట్ అది . అలా అది అక్కడా ఇక్కడా తిరుగుతుండగా  దానికి ఒక మొక్క కనిపిస్తుంది . భూమిపై పచ్చదనం అంతరించిపోయి చాలా సంవత్సరాలు కావడంతో ఆ మొక్క వాల్-ఇ దృష్టిని ఆకర్షిస్తుంది . దాన్నికూడా తన సేకరణలతో పాటుగా భద్రపరుస్తుంది  .

అండాకారంలో ఉండే తెల్లని అత్యాధునికమైన మరో రకమైన రోబోట్లు ఈవ్(EVE: Extra-Terrestrial Vegetation Evaluator)లు . వాటి పని భూమిపై పచ్చదనాన్ని వెతకడం. ఒకవేళ ఎప్పటికైనా భూమిపై మళ్ళీ మొక్కలు  మొలవడం మొదలైతే , భూమి మళ్ళీ నివాసయోగ్యంగా మారతుందని , అప్పుడు అంతరిక్షాన్ని వదిలి మనుషులు భూమిపై నివసించవచ్చన్న ఆలోచనతో తయారుచేయబడినవి ఈవ్ లు.  అటువంటి ఒక ఈవ్ రోబోట్, అంతరిక్ష నౌకనుండి భూమి పైకి వచ్చినప్పుడు దానికి వాల్-ఇ తో పరిచయం ఏర్పడుతుంది . వాల్-ఇ ,ఈవ్ ని ఇష్టపడుతుంది (పడతాడు) . కానీ తన కర్తవ్య నిర్వహణ నిమిత్తం మొక్కని తీసుకుని ఈవ్ అంతరిక్ష నౌకకి వెళ్ళిపోతుంది .  ఈవ్ కోసం వాల్-ఇ కూడా యాగ్జియంకి చేరుకుంటాడు . ఈవ్ ని కలుసుకుని  భూమి మీదకి తీసుకురావాలని  ప్రయత్నిస్తాడు . ఆ క్రమంలో అనేక అవాంతరాలని ఎదుర్కొని, ఈవ్ తో పాటుగా మనుషుల్ని కూడా తిరిగి భూమికి ఎలా చేరుస్తాడన్నది కథాంశం .

ఈ చలన చిత్రంలో ఎక్కువగా ఆకర్షించే విషయం అంతరిక్ష నౌకలోని మనుషుల శరీరాకృతి . ఏళ్ళ తరబడి అన్ని పనులకీ  యంత్రాల మీదే ఆధారపడుతూ, శరీరానికి కేవలం విశ్రాంతినే ఇవ్వడం వల్ల అక్కడి మనుషుల చేతులు కాళ్ళు చిన్నవిగా మారిపోతాయి. కేవలం పొట్ట మాత్రమే పెరుగుతుంది. ముఖం , మెడ కలిసిపోయి ఉంటాయి . వాళ్ళకి లేచి నిలబడటం కూడా తెలీదు.  ఒక పడక కుర్చీలో కూర్చుని ప్రయాణించడం తప్ప వారికి పనేమీ ఉండదు . పళ్ళు తోమడం , బట్టలు మార్చడం వంటి పనులు కూడా యంత్రాలే చేస్తాయి. మనం ప్రస్తుత  జీవన విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవని ఈ చిత్రం తెలియజేస్తుంది .

అంతేకాక అంతరిక్ష నౌక కెప్టెన్ తను చెందిన భూమి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో మట్టి , భూమి,సముద్రం, నాట్యం వంటి పదాల్ని వెతుకుతూ, వాటికి చెందిన రికార్డెడ్ వీడియోలు చూస్తూ నాస్టాల్జియాకి గురికావడం మనల్ని కూడా గొప్ప భావోద్వేగానికి గురి చేస్తుంది . “మనుషులు మట్టిలో విత్తనాలు వేసి , నీళ్ళు పోసి పిజ్జాల్లాగా ఆహారాన్ని పండించేవారట!” అని అతను తెగ ఆశ్చర్యపోతాడు . అలాగే వాల్ -ఇ, తను చూసిన ఒక పాత సినిమా పాటలోని హీరో హీరోయిన్ల మాదిరిగా ఈవ్ తో చేతులు కలిపి పట్టుకోవాలని  తాపత్రయపడటం ముచ్చట కలిగిస్తుంది . ఇటువంటి సన్నివేశాల ద్వారా మనం చిన్న చిన్న మానవ సంబంధిత ఉద్వేగాలని, భావాల్నికూడా యంత్రాల నుండి నేర్చుకునే దుస్థితికి త్వరలోనే దిగజారిపోతామని  ఈ చలనచిత్రం సూచిస్తుంది .  .

ప్రమాదవశాత్తూ తమ కుర్చీ వాహనాల్లోంచి జారిపడిన అంతరిక్ష నౌకలోని మనుషులు , లేచి నిలబడలేని అశక్తతలో ఒకరి మీద ఒకరు పడి కొట్టుమిట్లాడటం మన స్వయంకృతాపరాధపు భవితవ్యానికి ప్రతీక అయితే  , వారిలోనుండి ఒకరిద్దరు వ్యక్తులు లేచి నిలబడే ప్రయత్నం చేసి మిగిలిన వారికి స్పూర్తిగా నిలవడం , మనిషిలోని ఆశావహదృక్పధానికీ, పట్టుదలకీ ఉదాహరణ .

మొత్తానికి ఈ చిత్రం భవిష్యత్తుపై భయాన్ని కలిగించి , చేస్తున్న పొరపాట్ల గురించి ఆలోచించుకునే దిశగా మనల్ని నడుపుతుంది. మన జీవితాల్లోని యాంత్రికత మనల్ని ఎటువంటి ప్రమాదంలోకి నెడుతుందో సున్నితంగా తెలియజేస్తుంది . అత్యద్భుతమైన యానిమేషన్ సహజమైన వాతావరణాన్ని సృష్టించి ఒక కొత్త కోణంలోమనం సృష్టించుకుంటున్న  అసహజత్వాన్ని మనకి చూపుతుంది. మానవ తప్పిదాల్ని యంత్రాలు సరిదిద్దే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తుంది .

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సందేశాత్మక చిత్రాన్ని సృజనాత్మక మేధకు అత్యుత్తమ నమూనాగా  అభివర్ణించవచ్చు . ఈ చలనచిత్రంలోని మనుషులకి మళ్ళీ తమ జీవితాల్ని మొదటి దశనుండీ నిర్మించుకునే అవకాశం వాల్-ఇ కారణంగా లభించింది . మరి మనకి లభిస్తుందో లేదో! ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని చాలా మంది చూసే ఉంటారు . ఒకవేళ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. పిల్లలకి కూడా చూపించండి.
~

రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం

ఈ సారి 87 వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్ లలో BIRDMAN (The Unexpected Virtue of Ignorance) ఉత్తమ చిత్రం  అవార్డ్ ని కైవసం చేసుకుంది . దానితో పాటుగా  ఉత్తమ  డైరెక్టర్ ,  స్క్రీన్ ప్లే ,  సినిమాటోగ్రఫీ  అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది .ఇంతకీ  అసలు ఎవరీ బర్డ్ మాన్? ఏమిటితని గొప్పతనం?

కొన్ని దశాబ్దాల క్రితం హాలీవుడ్ లో బర్డ్ మాన్ గా  ఒక వెలుగు వెలిగి మరుగున పడిపోయిన Riggan Thomson అనే ఒక సూపర్  హీరో కథ ఇది .  ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక play  ద్వారా తిరిగి తన ప్రతిభని నిరూపించుకోవాలని అతను  తాపత్రయ పడుతుంటాడు. What We Talk About When We Talk About Love అనే ఒక షార్ట్ స్టోరీని కొద్దిపాటి మార్పులతో  ప్లేగా మలచి, దర్శకత్వం వహించి, నటించే ప్రయత్నంలో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటాడు. మరో పక్క తనకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన బర్డ్ మాన్ పాత్ర వల్ల  ప్రభావితమై, బర్డ్ మాన్ స్వరాన్ని వింటున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాడు  ఆ స్వరం అతన్ని తిరిగి బర్డ్ మాన్ గా మారమనీ, తామిద్దరూ ఒకటేననీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది .ఎక్కువగా మనిషిని వేదనకు గురి చేసే విషయం ఏమిటి?
ఏదైనా ఉండటం, లేకపోవడం కాదు . కావాలనుకున్నది దక్కకపోవడం కాదు . అసలు తనకేం కావాలో తనకే తెలియకపోవడం . ఆలోచనల్లో అటువంటి సందిగ్ధత కలిగిన మనిషి, మానసికంగా తనని తానే ముక్కలు ముక్కలు చేసుకుంటూ తట్టుకోలేనంత ఆవేదనకి గురవుతాడు . అటువంటి ఓ వ్యక్తి కథ బర్డ్ మాన్ . అలాగే కీర్తి, పేరు ప్రతిష్టలు మహా చెడ్డవి . ఓసారి అందలమెక్కించి, మత్తులో ముంచి తమకి బానిసగా చేసుకుంటాయి . అప్పుడు నరం నరం, ఆ మత్తుని బాలన్స్ చేసుకోవాలని తపన పడుతూ, ఎలాగైనా వాటిని తిరిగి పొందాలని శక్తికి మించి పోరాడుతూ చిత్ర హింసకి గురవుతూ ఉంటుంది . ఇది అటువంటి వ్యక్తి కథ కూడా .  కీర్తికాంక్షకీ , సెల్ఫ్ రియలైజేషన్ కీ మధ్య నలిగిపోయిన  ఒక నటుడి కథే బర్డ్ మాన్ . ఈ సినిమాలో మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఈ చిత్రమంతా చాలా మటుకు ఒకే షాట్ లో చిత్రించారు . సినిమాటోగ్రాఫర్ ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా తన కూడా మనల్ని తిప్పుకుంటూ ఆశ్చర్యానికి గురి చేస్తాడు .
220px-Birdman1967
ఒక థియటర్ కి చెందిన గదిలో నేలకి కొంచెం ఎత్తుగా  గాలిలో కూర్చుని మెడిటేషన్ చేస్తున్న ఒక ముసలి శరీరం తాలూకూ వ్యక్తితో  చిత్రం ప్రారంభమవుతుంది. అతనే Riggan. తన అసహనం మీదా, కోపం మీదా, విసిగిస్తున్న బర్డ్ మాన్ స్వరం మీదా విజయం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు . మంచి తండ్రిని కాలేకపోయానన్న బాధ మరో వైపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. .ఒక పక్క తను చాలా గొప్పవాడినన్న అహంభావం , మరో పక్క బర్డ్ మాన్ గా  తప్ప తనకే విధమైన గుర్తింపూ లేదన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ల మధ్య అతను నలిగిపోతూ ఉంటాడు. డ్రగ్ ఎడిక్ట్ గా మారి రికవర్ అవుతూ, Riggan  దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న అతని కుమార్తె Sam గా Yemma stone నటించింది . ఒక సందర్భంలో అతి పెద్ద డైలాగ్ చెబుతూ ఆమె కనబరిచిన నటనా చాతుర్యం మెచ్చుకోవాల్సిన విషయం. పేరు ప్రతిష్టల వల్ల కలిగే మత్తు చేసే నష్టం కూడా తక్కువేమీ కాదని చెప్పడం కోసం సింబాలిక్ గా,Sam ని  డ్రగ్ ఎడిక్ట్ గా చూపారనిపించింది .
గొప్ప నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు కోసం చేసే ఈ ప్రయత్నం లో Rigganకి  మరో విచిత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తి, సహ నటుడు అయిన  Mike(Edward Norton) తో కలిసి పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది . ఆధిపత్యం కోసం వాళ్ళిద్దరి మధ్య పోరు నడుస్తూ ఉంటుంది . Broadway నటిగా పేరు తెచ్చుకోవాలని ఏళ్ళ తరబడి తపన పడి, అడుగడుగునా అవమానాల్నే ఎదుర్కుంటూ తన స్వాభిమానం కోసం వెతుకులాడే నటి Lesley పాత్రలో Naomi Watts కనిపిస్తుంది .
విపరీతమైన మానసిక సంఘర్షణ తట్టుకోలేక , అవమానాల్ని ఎదుర్కోలేక, తనలోని బర్డ్ మాన్ విజయం సాధించడం ఇష్టం లేక, ప్లే చివరిలో వచ్చే ఒక సన్నివేశంలో Riggan నిజంగానే తనని తాను షూట్ చేసుకుంటాడు . దాంతో, అప్పటివరకు ఏ విధమైన టాలెంట్ లేకుండా సెలబ్రిటీ హోదా కారణంగా థియేటర్ని ఆక్రమించావంటూ అతన్ని అసహ్యించుకుని , తన రివ్యూ ద్వారా  అతని ప్లేని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన క్రిటిక్ Tabitha Dickinson, అతని ప్లేని ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూ రాస్తుంది . స్టేజ్ మీద అతని ఆత్మహత్యా ప్రయత్నాన్ని సూపర్ రియలిజంగా అభివర్ణిస్తుంది . ఒక్కసారిగా అతని పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది . కానీ తనని తాను కాల్చుకున్న కారణంగా అతను తన ముక్కుని కోల్పోతాడు.
కొత్తగా పెట్టబడిన ముక్కుతో తన అసలు రూపాన్ని కూడా కోల్పోతాడు . చివరగా అతను హాస్పిటల్ కిటికీ తలుపు తెరుచుకుని బయటకి ఎగిరిపోయే ప్రయత్నం చెయ్యడం, అతని కుమార్తె అతని కోసం క్రిందికి చూసి , కనబడకపోవడంతో ఆకాశంలోకి చూసి నవ్వడంతో చిత్రం ముగుస్తుంది .
చిత్రంలోని చాలా భాగాన్ని ఒకే షాట్ లో చూపగలిగే విధంగా కథనీ ,సన్నివేశాల్నీసృష్టించి చిత్రీకరింపజేసిన దర్శకుడు Alejandro González Iñárritu ప్రతిభ, చిత్రీకరించి చూపిన సినిమాటోగ్రాఫర్ Emmanuel Lubezk గొప్పతనం కూడా ప్రశంసార్హమైనవి . ఏక బిగిన ఆపకుండా నటించాల్సివచ్చినా నటీనటులంతా ఎమోషన్స్ ని చక్కగా పండించారు . ఏమీ కాలేకపోయానన్న ఒక వ్యక్తి ఆవేదనని ఉన్నతంగా చిత్రించి చూపిన ఈ చలన చిత్రం, తన ప్రతిభకి  తగ్గ పురస్కారాన్ని ఆస్కార్ రూపంలో అందుకోనే అందుకుంది.
-భవాని ఫణి
bhavani-phani.

ఆమె చెప్పిన అతని కథ

theory1అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో సులువుగా అందరికీ  అర్థమయ్యే రీతిలో వివరించిన రచయితగా కూడా ఆయన ప్రపంచానికి సుపరిచితుడు . ఆయన రచించిన ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం  ఎన్నో క్లిష్టమైన సైన్స్  సిద్ధాంతాలని,  సైన్స్ గురించి పెద్దగా అవగాహన లేని  వారికి కూడా అర్థమయ్యేలా  సరళంగా విడమర్చి  వివరించడంలో ఘన విజయం సాధించింది .  అటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి , అతనితో గడిపిన తన జీవితం గురించి అతని మాజీ భార్య జేన్ వైల్డ్ హాకింగ్ రాసిన మెమోయిర్ Travelling to Infinity: My Life with Stephen  ఆధారంగా నిర్మించిన చిత్రం The theory of everything . 

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు . ఆ సామెత ఉద్దేశ్యం స్త్రీకి ప్రాధాన్యత నివ్వడమో, లేక అప్పుడు కూడా ఆమెని అతని వెనకనే ఉంచడమో తెలీదు గానీ ప్రతీ విజయం వెనుక మాత్రం ఎన్నో అపజయాలుంటాయి. నిరాశ, నిస్పృహ నిండిన రోజులు , కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి . ఆ సమయంలో వెనక నిలబడి వెన్నుతట్టి ధైర్యం చెప్పే తోడు ఎటువంటి వారికైనా అవసరం . అటువంటి తోడు జీవిత భాగస్వామే అయితే అది నిజంగా అదృష్టమే . పారనోయిడ్ స్క్రిజోఫీనియాతో జీవితమంతా బాధపడిన మేధావి మేథమెటీషియన్ జాన్ నాష్ విషయంలో కూడా అతని భార్య ఎలీసా సహాయం చెప్పుకోదగ్గది .

ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ వంటి జీనియస్ జీవితం కూడా అతి చిన్న వయసులోనే ముళ్ళ బాటల వైపుకి మళ్ళి పోయింది . ఇరవై యేళ్ళయినా నిండకుండానే అతి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో(ఆక్స్ఫర్డ్ ,కేంబ్రిడ్జ్) అతని ప్రతిభ గుర్తింపు పొందుతూ ఉండగానే ఓ మహమ్మారి రోగం అతని శరీరంలోకి చొరబడింది .  ALS లేదా మోటార్ న్యూట్రాన్ డిసీజ్ అని పిలవబడే ఈ వ్యాధి  మెల్ల మెల్లగా శరీరంలోని ప్రతి భాగాన్నీ నిర్వీర్యం చేసి చివరికి ప్రాణాలు తీస్తుంది . మెదడునీ ఆలోచననీ మాత్రం సాధారణంగా వదిలి పెడుతుంది. వస్తూనే ఉగ్ర రూపాన్ని చూపిన ఈ వ్యాధి స్టీఫెన్లో అప్పుడప్పుడే చిగురులు తొడుగుతున్న యవ్వనాన్నీ, అది తెచ్చిన ఉత్సాహాన్నీ సమూలంగా పెకిలించి వేసింది  . మరణానికీ తనకీ ఉన్న దూరం రెండేళ్ళేనని డాక్టర్ చెప్పిన మాటలు  అతన్ని అంతులేని దుఖంలో పాతిపెట్టాయి .

అంతటి లోతైన నిరాశలోంచి  అతన్ని ఒంటి చేత్తో బయటకి లాగి పడేస్తుంది ఆ అమ్మాయి . ఎన్నో రోజుల పరిచయం కాకపోయినా అతని మీద అనంతమైన ప్రేమని పెంచుకున్న జేన్ వైల్డ్ అతనితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతుంది . ప్రేమికురాలి నుండి భార్య స్థానాన్నీ , కాలక్రమంలో అతని పిల్లలకి తల్లి స్థానాన్నీ సంతోషంగా స్వీకరిస్తుంది . కళ్ళముందే అతను రెండు కర్రల ఊతంతో నడవడం నుండి వీల్ చైర్ లోకి మారడాన్నీ, తనకి మాత్రమే అర్థమయ్యేంత అస్పష్టత లోకి మాటని కోల్పోవడాన్నీ ఎంతో ప్రేమతో స్వీకరిస్తుంది . అతను బ్లాక్ హోల్స్ గురించీ , విశ్వం పుట్టుక గురించి థియరీల మీద ధియరీలు ఊహిస్తుంటే ప్రాక్టికల్ గా మొత్తం కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుని తన ముగ్గురి  పిల్లలతో పాటుగా శారీరకంగా పసివాడిలాంటి భర్తని కూడా ఓర్పుతో సాకుతుంది  .

ఓ దశలో స్టీఫెన్ పూర్తిగా మాటని కోల్పోతాడు  చావుని అతి దగ్గరగా చూసి వచ్చినా ధైర్యం కోల్పోని స్టీఫెన్, స్పీచ్ సింథసైజర్ సహాయంతో రాసిన సైన్స్ పుస్తకం ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం పెద్ద సంచలనమవుతుంది . అతని గొప్పతనాన్ని ప్రపంచమంతా మరింతగా గుర్తిస్తుంది. ఇంతలో నర్స్ గా అతని జీవితంలోకి ప్రవేశించిన Elaine Mason వల్ల స్టీఫెన్ ,జేన్ ల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో , చివరికి ముప్పై ఏళ్ళ వాళ్ళ ప్రేమ కథ ఏ రకమైన మలుపు తిరిగిందో  తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

స్టీఫెన్ హాకింగ్ పాత్రధారి Eddie Redmayne నటన అద్భుతం , అతి సహజం అని చెప్పాలి . నిజంగా స్టీఫెన్ హాకింగ్ వచ్చి నటించాడా అని సందేహం కలిగేంత సహజంగా ఉంటుంది అతని నటన.  మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తిగా సందర్భానుసారంగా కళ్ళతోనే  ప్రేమనీ, దుఃఖాన్నీ , అసహాయతనీ , చిలిపితనాన్నీ అతను అలవోకగా పలికించాడు . గొప్ప విల్ పవర్ , ప్రేమ తత్త్వం కలిగిన స్త్రీగా Felicity Jones కూడా ఎంతో సహజంగా నటించింది . చూడ్డానికి కథంతా రెండు గంటల్లో ఇమిడిపోయినా నిజానికి అంతటి సుదీర్ఘమైన సమయం పాటు, అతను అనారోగ్యంతోనూ, ఆమె క్లిష్ట పరిస్థితులతోనూ పోరాడిన వైనం చూసి ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు . అతని ఆత్మస్థయిర్యాన్నీ , ఆమె స్థిత ప్రజ్ఞతనీ మెచ్చుకుని తీరాల్సిందే . ఒక సినిమా చూస్తున్నట్టు కాక నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలిగేలా చెయ్యడంలో దర్శకుడు

James Marsh విజయం సాధించాడు .  జేన్ దృష్టి కోణంలో నుండి చెప్పబడటం వల్ల  సైన్స్ విషయాలకి పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా సున్నితమైన మానవ సంబంధాలని ఎలివేట్ చేస్తూ కథ సాగుతుంది .

కొన్ని నిజాల్ని చూపలేదన్న ఒక వాదన ఉన్నప్పటికీ స్టీఫెన్ వంటి జీనియస్ గురించీ , జేన్ వంటి ప్రేమ మూర్తి గురించీ తెలుసుకోవడం కోసం తప్పక చూడాల్సిన చిత్రం . ఐదు అకాడమీ అవార్డ్ లకి నామినేట్ కావడంతో పాటు , గోల్డెన్ గ్లోబ్ వంటి మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లు గెలుచుకుంది ఈ బయోగ్రఫికల్ మూవీ . ప్రస్తుతం ఈ చలన చిత్రం భారతీయ సినిమా ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది