బూతు కన్నా యమ డేంజర్… ఎస్కేపిజం!

 ‘‘బృహస్పతి’’

 

(తెలుగు సినీరంగంలో పాత ఒరవడి ఒకటి ఇప్పుడు కొత్తగా మొదలైంది. వందల కోట్లపెట్టుబడులకు తోడు అందివచ్చిన అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో భారీ చిత్రాలను హాలీవుడ్ చిత్రాలకు దీటుగా నిర్మిస్తున్నారు. దీనికి మనం గర్వించాలి. ఈ చిత్రాల కథలు, తీరుతెన్నులను చూసి అప్రమత్తం కూడా కావాలి. 65 ఏళ్ల కిందటే ఈ సమస్యపై ‘‘బృహస్పతి’’ కలంపేరుతో ఒకరు తెలుగు స్వతంత్ర వారపత్రిక(1949 సెప్టెంబర్ 16 సంచిక)లో  కళాక్షేత్రం శీర్షిక కింద రాసిన వ్యాసం ఇది. సేకరణ: వికాస్)

 

చాలా ఏళ్ల క్రితం కొత్తగా మార్క్సిజం అవగాహన చేసుకుంటున్న నా మిత్రుడొకడికి ధర్మసందేహం కలిగింది: ‘‘జన సామాన్యం(అప్పట్లో) నాదియా స్టంటు చిత్రాలు ఎగబడి చూస్తున్నారు గదా, అదే నిజమైన  ప్రజాకళ అనుకోవద్దా? వాటిని అల్పసంఖ్యాకులైన మనవంటి మేధావులు తిట్టటం ప్రజాసామాన్యానికీ వారి అభిరుచులకూ ద్రోహం కాదా?’’

ఈ ప్రశ్నకు నాకు అప్పట్లో తోచిన సమాధానం: ‘‘మేధావులు ప్రజాస్వామ్యాన్ని అభిమానించవచ్చు గాని వారి దారిద్ర్యాన్నీ తక్కువ అభిరుచులనూ అభిమానించనవసరం లేదు. ప్రజాసామాన్యం జీవితంలో అవసరమైన మార్పులు తెచ్చేదెవరు? వారిని అభిమానించే మేధావులే’’

ఇవాళ కూడా ప్రజాసామాన్యం ప్రకటించే తక్కువ తరగతి అభిరుచులు సమస్యగానే ఉన్నాయి. వాళ్లిప్పుడు ‘నాదియా’ స్టంటు చిత్రాలు చూడడం లేదుగాని ‘జానపద’ కుంటి చిత్రాలు చూస్తున్నారు. ప్రజల అభిరుచి అంతేననే సమాధానంతో తృప్తిపడనవసరం లేదు.

కళాభిరుచిలో కూడా ఇతర విషయాలలోలాగే, వ్యక్తి వైఖరీ, సముదాయ వైఖరీ ఉన్నాయి. ఈ తారతమ్యం అర్థం చేసుకోకపోతే, వెనక నా మిత్రుడికి వచ్చినట్లే అనేకమందికి అనేక ధర్మసందేహాలు కలిగి, తప్పుడు సిద్ధాంతాలు ప్రచారంలోకి వస్తాయి- ఇప్పుడు వస్తున్నాయి కూడానూ. ఇటువంటి సిద్ధాంతాలు మచ్చుకు ఒకటి, రెండు మనవి చేస్తాను.

ప్రజలకు నచ్చటమే అభ్యుదయ కళకు గీటురాయిగా పెట్టుకోవడం గురించి ఇంతకుముందే చెప్పాను. ఇంకో సిద్ధాంతమేమిటంటే, మధ్యతరగతి వాళ్ల అభిరుచులు మంచివి కనక, ఆ అభిరుచులను ఏదో విధంగా ప్రజాసామాన్యానికి అంటగట్టి అదే ప్రజాభిరుచి చేయాలని. మరో అభిప్రాయమేమిటంటే ప్రజాసామాన్యానికి కూడా కళలా అని!

ఇటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించేవాళ్లు గ్రహించని విషయమేమిటంటే, ప్రజాసామాన్యానికి కళలతో అవసరం ఉండటమే కాక, కళలను ఆస్వాదించే శక్తి కూడా ఉన్నదని. వారికి లేని శక్తి ఏమిటంటే, ‘‘శిల్పం కోసం శిల్పాన్నీ’’, ‘‘పాండిత్యం కోసం పాండిత్యాన్నీ’’ ఆరాధించటం. మధ్యతరగతి వాళ్ల అభిరుచులలో ఈ రెండు అంశాలూ తప్పిస్తే అవే ప్రజాసామాన్యం యొక్క అభిరుచులు కూడానూ. ఈ వ్యత్యాసం ఉన్నంతమాత్రం చేత ప్రజలకు కళలవసరం లేదని గాని, అవగాహన కావనిగాని భావించనవసరం లేదు. శిల్పనైపుణ్యాన్నీ, పాండితీ ప్రకర్షనూ చూసి ఆనందించటమే కళల యొక్క పరమార్థాన్ని గుర్తించటమని మధ్యతరగతివారు సంతృప్తి చెందనవసరం అంతకన్నా లేదు.

maya mahal

అయితే ఈ  మాట అనుకున్నంత మాత్రం చేత ‘నాదియా’, ‘జానపద’ చిత్రాల సమస్య తేలదు. ఈ చిత్రాలను జనసామాన్యం ఎందుకు ఎగబడి చూస్తున్నారు? శిల్పం గాని, పాండిత్యం గాని లేకపోవటం మించి వీటిలో ఇంకేమైనా ఉందా? లేదు! వీటిని కళాపిసాసతో ప్రజలు చూడడం కూడా లేదు. నిత్యజీవితం దుర్భరమైన ప్రజ తన చుట్టూ ఉన్న సాంఘిక వాతావరణాన్ని మరవడానికి ఈ అభూతకల్పనల శరణుజొచ్చుతున్నది. దీన్ని ‘‘ఎస్కేపిజం’’ అంటున్నాం. కానీ ఇందులో ‘‘ఎస్కేపిజం’’ కన్న కూడా విశేషమైన అంశం ఒకటుంది. అదేమింటంటే వ్యక్తి ప్రేరణలను తృప్తిపరచుకోవటం. ఇది అచ్చంగా ప్రజాసామాన్యం సొత్తు కాదు. ప్రబంధాలలోని పచ్చి శృంగారం ఆప్యాయంగా పఠించేవారంతా కవితా ప్రియత్వంతో ప్రేరేపించబడ్డవాళ్లే ననుకోనవసరం లేదు. అనేకమంది మేధావులు ఈ విధంగా వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతారు కనక వాళ్లలో నిజమైన కళాపిపాస లేదనటం కూడా తప్పే.

‘‘ఎస్కేపిజం’’ కూడా వ్యక్తిగత ప్రేరణే. దాన్ని మధ్యతరగతివాళ్లు కూడా అలవంబిస్తారు. అయితే కళల ద్వారా ‘‘ఎస్కేపిజం’’ వాంఛించినప్పుడు మధ్యతరగతివాళ్లు శిల్పానికి భంగం రాకుండా చూస్తారు. సామాన్య ప్రజలకు అది అవసరం లేదు.

యుద్ధం జరుగుతున్న కాలంలో ‘‘ఆర్సినిక్ అండ్ ఓల్డులేస్’’ అనే నాటకం అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ కూడా అతి విజయవంతంగా నడిచింది. ఆ నాటకంలో ఒక పిచ్చివాళ్ల కుటుంబం ఉంటుంది. వాళ్లలో ఇద్దరు వయసుమళ్లిన స్త్రీలు ఎంతో సద్బుద్ధితో జీవితంలో ఆనందం కోల్పోయిన ముసలి వాళ్లను చేరదీసి హత్యచేసి ఎంతో భక్తిశ్రద్ధలతో వారికి రహస్యంగా ఉత్తరక్రియలు చేస్తూ ఉంటారు. ఈ నాటకంలో శిల్పసమృద్ధికేమీ లోటు లేదుగానీ కళాప్రయోజనం మృగ్యం. అయినా ప్రజలు- అన్ని తరగతుల వాళ్లూ- ఈ నాటకం చూడటానికి వేలం వెర్రిగా ఎగబడ్డారు. యుద్ధకాల జీవితం గురించి మరచిపోవటానికీ, హత్యలు చేసేవాళ్లను చూసి నవ్వుకోవటానికీ ఈ నాటకం మంచి అవకాశం ఇచ్చింది.

ఈ పనినే ప్రస్తుతం ‘జానపద’ చిత్రాలు కూడా చేస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్యతరగతి మేధావులు సహించలేకుండా ఉన్నారంటే వారందరూ ‘ఎస్కేపిజం’ కోరనివాళ్లని భావించరాదు. అందులో చాలా మంది ఈ చిత్రాలతో శిల్పసౌష్ఠవం ఉంటే తప్పక ఆనందించగలరు. అందువల్ల, ఏతావాతా, తేలేదేమంటే, కొందరు ప్రాజ్ఞులు ‘జానపద’ చిత్రాలనూ, వాటిని చూసే అల్పసంఖ్యాక ప్రజలనూ తిట్టటానికి నిజమైన కారణం కళాభిమానం కాదు, ప్రజాభిమానమూ కాదు.

కాని ఈ ‘జానపద’ చిత్రాలకు విరుద్ధంగా తీవ్రమైన ప్రచారం జరిగి వీటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసే యుద్ధకాలం కాదు, ప్రజాజీవితం నిర్మాణం కావలసిన కాలం;  ప్రజలు తమ జీవిత సమస్యల నుంచి పరారీ కావలసిన కాలం కాదు, వాటిని దృఢంగా ఎదుర్కోవలసిన కాలం. నైతికంగా తాగుడు ఎటువంటిదో ఈ తుచ్ఛమైన ‘జానపద’ చిత్రాలూ అటువంటివే. వీటి ద్వారా సాంఘిక ప్రయోజనం సాధ్యమవుతుందని ఎంత మతిమాలిన ప్రభుత్వం కూడా అనలేదు. అయినా అసంఖ్యాక ప్రజలు తాత్కాలిక ఆనందం కోసరం ఈ చిత్రాల మీద అంతులేని డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాని ప్రభుత్వాన్ని నిషేధించమంటే ఈ చిత్రాలను నిషేధించదు. చిత్రనిర్మాణం ఒక పరిశ్రమ. పరిశ్రమలంటే మన ప్రభుత్వానికి భక్తివిశ్వాసాలు జాస్తి.  పెట్టుబడిదార్ల లాభాలు అతి పవిత్రమైనవి. ప్రజాక్షేమం కన్న పెట్టుబడిదార్ల లాభాలు అత్యంత పవిత్రమైనవి. ప్రభుత్వం గీసిన నీతినియమాల గిరిలో ఉండి చిత్రనిర్మాతలు ఎంత పనికిమాలిన చిత్రాలైనా తీయవచ్చు.

నన్నడిగితే చిత్రాలలో ‘‘బూతు’’ కన్నా ‘‘ఎస్కేపిజం’’ చాలా ప్రమాదకరమైనది. ‘‘ఎస్కేపిజం’’ కాకబోతే ‘‘బూతు’’లో తప్పేమీ లేదు. సినిమా చిత్రాలు చూసే వాళ్లంతా నిన్ననే కళ్లు తెరచిన పసిపాపలు కారు.

చిత్రనిర్మాతల లాభకాంక్షకూ కళాప్రయోజనానికీ ఉన్నది కేవలం బాదనారాయణ సంబంధం. ప్రజలలో ఉండే చైతన్యాన్ని అణచిపెట్టి, వారి మౌఢ్యాన్ని బలపరచే కళలను కళాభిమానులైన మేధావులు తీవ్రంగా నిరసించవలసి ఉన్నది. ఈ పనిని పత్రికలు కూడా దీక్షగా సాగించాలి.

*