తోటివారిని

 

మన తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా

గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా
అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా మనం తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయ స్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

-బివివి ప్రసాద్

bvv

అదేంకాదు కానీ..

bvv prasad

 

 

 

 

 

అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

 

 -బివివి ప్రసాద్

తాకినపుడు

bvv

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు
నీ నవ్వు కొండల్లో పరుగులు తీసే పలుచని గాలిలా వుంటుందని
పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి
చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి

కవీ, ఏం మనిషివి నువ్వు
ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని
రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం
ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు

తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని
నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించాననిపించదు నీకు

నిజానికి, వాటిని తాకకముందటి
వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు
తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు

పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా
జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం
నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు
లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ
జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు

ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా

-బివివి ప్రసాద్

నిద్ర నుండి నిద్రకి

bvv
నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది
వినిపించని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు
కనిపించని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది

ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి
నీ లోపలి శూన్యంలో జ్ఞాపకాలు తేలుతుంటాయి
తేలుతున్న జ్ఞాపకాలు, తేలుతున్న ఇంద్రియాలతో
తేలుతున్న దృశ్యాలలో ఆట మొదలుపెడతాయి

404138

ఇక బయలుదేరుతావు
కాంతినో, చీకటినో నీలో నింపుకొనేందుకూ
నీ చుట్టూ నింపేందుకూ

రోజు ఒక ఆకులా రాలిపోయే వేళ అవుతుంది
పండిన ఆకులాంటి మలిసంధ్య రాలిపోయాక
మోడువారిన చీకట్లో
నిన్ను నువ్వు వెదుక్కోవటం మొదలుపెడతావు

దిగులు నగారా ఎడతెగక మోగుతుంది
జవాబుకోసం మేలుకొన్న నువ్వు
నిన్నటి ప్రశ్ననే మళ్ళీ పక్కలోని పసిబిడ్డలా తడుముకొంటావు

ప్రశ్నరాలిన చప్పుడు వినకుండానే
నువ్వు ఎప్పటిలాగే ఎక్కడికో వెళ్ళిపొతావు

బివివి ప్రసాద్