ఆత్మీయత ఆ వాక్యాల అందం!

                              

బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

                 1

‘రక్తస్పర్శ’, ‘ఇవాళ’, ‘వలస’ లాంటి వైవిధ్యభరితమైన కవిత్వం రాసిన కవి- అఫ్సర్ గారి- కొత్త కవితా సంపుటి ‘ఊరిచివర’ ని చదవడం వొక గొప్ప రిలీఫ్. కవిత్వానికి వొక కొత్త పరికరాన్ని, వొక కొత్త చూపుని అందిస్తూ… కవి, కవిత్వం వొక్కటిగా పరిణమిస్తూ సాగడం- వొక గొప్ప జీవలక్షణం. ముందుమాటలో ఎన్.వేణుగోపాల్ గారు అన్నట్లు- ‘జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య’- అఫ్సర్ గారి ‘ఊరి చివర’ కవిత్వం.
‘ఊరి చివర’ కవిత్వాన్ని నేను గత రెండు సంవత్సరాలుగా చదువుకుంటున్నాను. మొత్తం అన్ని కవితలూ నన్ను మళ్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా రెండు కవితలు- నన్ను నిరంతరం వెంటాడుతునే వున్నాయి.ఒకటి: Take me home, country roads!
రెండు: నల్లానల్లని నవ్వుఈ రెండు కవితలు ఇన్ని నెలలుగా, ఇంత గాఢంగా- ఎందుకు వెంటాడుతున్నాయి- అని ఆలోచిస్తే… కవిత్వంలో వున్న స్వచ్చత, నిజాయితే కారణమని రూఢీ అయ్యింది. అవే ఆ కవితలను తాజాగా వుంచాయనీ అర్థమౌతుంది.కవిత్వానికి ‘తాజాదనం’ రెండు రకాలుగా చేకూరుతుందనుకుంటా.
-కవిత్వవస్తువు సర్వకాలాలకు చెందినదై.. కవి దానిని ప్రతిభావంతంగా కవిత్వీకరించినప్పుడు…
-అలాగే కవిలోని, తను ఎన్నుకున్న అంశం పట్ల తనకుండే గాఢమైన ‘ఆప్యాయతా సాంద్రత’ ఉన్నదున్నట్లుగా కవిత్వంలోకి బదిలీ అయినప్పుడు…!అఫ్సర్ గారి పై రెండు కవితల్లోని తాజాదనానికి కారణం అదే. కవిలోని కవిత్వాంశం పట్ల గాఢమైన ప్రేమ కూడా… సర్వకాలాలకు చెందినదేననడం సబబు.uri_civara                                                                        2‘ Take me home, country roads!’ కవిత- అఫ్సర్, తన విద్యార్థి ‘బ్రైస్’తో అతని సొంత ఊరిలో కలిసి గడిపిన క్షణాల కలవరింత.
ఈ కవితలో-‘మెత్తని అరచెయ్యి
నీ కొలరాడొ నది‘  అని అఫ్సర్ కవితను ప్రారంభిస్తారు.’మెత్తని నీ అరచెయ్యి- కొలరాడొ నది’ అని అనొచ్చు కదా- అని కవిత చదివిన మొదటలోనే వొకసారి నాకు అనిపించింది. కానీ ‘నీ కొలరాడొ నది’- అని అనడం మూలాన కొలరాడొ నదికి, బ్రైస్ కి మధ్య అనుబంధాన్ని మరింత తీవ్రం చేసారు అఫ్సర్. సరిగ్గా ఆ అనుబంధంలో వున్న అనుభూతి కొసని అందుకుంటూ.. కవిత్వంలోకి ప్రవేశించినప్పుడు… అక్కడే… ఆ ప్రారంభ వాక్యాలే- పాఠకున్ని కట్టిపడేస్తాయి.వొకరి అనుభవాన్ని, అనుభూతిని own  చేసుకునే వొక గాఢమైన కళని అఫ్సర్ ఒంటబట్టించుకున్నారనిపిస్తుంది. ముఖ్యంగా కవి నిజాయితీపరుడైతే (అవ్వాలి కూడా..) అతను సృజించిన కవిత్వం కవిత్వాభిమానుల హృదయాలలో పరిమళిస్తుంటుంది.

సరిగ్గా ఆ పనే చేసారు అఫ్సర్. తన శిష్యుడు ‘బ్రైస్’ తో- అతని ఊరు ‘బాస్ట్రాప్’లో గడిపిన క్షణాల వెంట- మనల్ని కూడా తీసుకుని వెళ్తారు.

ఆ relation ని నాలాంటి కవిత్వాభిమాని కోరుకుంటాడు.

కవిత్వం విషయానికొస్తే… తర్వాత వాక్యాలలో అఫ్సర్ నెమ్మదిగా జ్ఞాపకంలోకి జారిపోతారు.

దీని నిదానమయిన నడకల్లోంచి
నా వూరి గుండె గూళ్లలోకి
పిచ్చుకలాగా జారిపోయాను సుఖంగా’   అని…..

ఆ జ్ఞాపకం- పుట్టిన ‘తల్లి ఊరి’ నుంచి దూరమైన ఎవరినైనా వెంటాడుతుంటుంది- నాకు లాగే………

వొకటో స్టాంజా చివరలో- నది జీవత్వాన్ని ‘బ్రైస్’ చిరునవ్వుతో పోలుస్తూ… అద్భుతమైన ‘మెరుపు’ను సాధించారు అఫ్సర్.

బ్రైస్, నీలాగే నవ్వుతుంది
మీ వూళ్ళో నీ కొలరాడొ ‘ అంటూ………

తరువాత స్టాంజాల్లో-

‘ఈ పూట నీ వూళ్లో
నీ కొలరాడొ చీరమడతల్లో
కరిగిపోయాను ఆత్మని మడతపెట్టి

అఫ్సర్ కవిగా- యిప్పుడు అసలుసిసలైన కవిత్వపు లోతుల్లోకి ప్రవేశించారు. ‘బ్రైస్’ అనుభూతిని తను స్వంతం చేసుకున్నారు. నదితో తనను ఏకీకరణం చేసుకున్నారు. ఇది నిజాయితీతో కూడిన ప్రతిస్పందన.
అందుకే……

నిన్ను కన్న వూరికి ధన్యవాదాలు, బ్రైస్‘     అని ప్రేమతో అనగలిగారు.

మొత్తానికి కవితలో- ‘బ్రైస్’ అనుభూతిని తన అనుభూతిగా; బ్రైస్ అనుభవ గాఢతను తన అనుభవ గాఢతగా చేసుకుంటూ కవిత్వాన్ని సృజించిన తీరు నాకు విపరీతంగా నచ్చింది.
ఈ కవితను చదివిన నేను- అఫ్సర్ గారిలో వున్న సహజమైన, సున్నితమైన పసిపిల్లల నిర్మలత్వానికి జోహార్లు చెప్పకుండా వుండలేను.

‘బ్రైస్’ ఊరి నుంచి తిరిగి వెనక్కి వచ్చేస్తూ….. ఆ అనుభూతి గాఢత తనలో వుంటూనే వుంటుందని చెప్పడానికి-

నెమ్మదిగా పరిగెట్టే నీ నదిలో
ఇప్పటికీ నా కాళ్లు సగం అలాగే వుండిపోయాయి
తడి ఆరకుండా ‘

కవితకు అసలైన ముగింపు- ఇంతకంటే మరొకటి వుండదనుకుంటా.

                                    3

సరిగ్గా మళ్లీ అలాంటి అనుభూతి గాఢతే వున్న కవిత ‘నల్లానల్లని నవ్వు’. సర్వదేశాల సంస్కృతుల కూడలిలాంటి…. వొక యూనివర్షిటీలో అధ్యాపకుడిగా  పనిచేయడం- అఫ్సర్ గారి ఆలోచనలకు, కవిత్వవస్తువులకు, కవితా వ్యూహాలకు- వొక విస్తృతిని ఇచ్చాయి.
‘నల్లానల్లని నవ్వు’ కవితలో…………..

మెట్రోబస్ వెనకాతల
వొక కితకితల నల్లసముద్రమేదో
అల లలలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది

అని అనడంతోనే కితకితలు పెట్టినప్పుడు మనిషి ఎలా మెలికలు తిరుగుతాడో…. దానిని సముద్రంలో అలల కదలికలతో పోల్చారు. అద్భుతమైన ఈ పోలికను ఎవరైనా నచ్చకుండా వుండలేరు. ‘నల్లసముద్రం’ అని అనడం వొక రూపాన్ని తీసుకురావడమే. దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షింపబడుతుంది.

ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని…..’

ముందు కవితలాగే- ఈ కవితలో కూడా… ఎదురుగా వున్న వొక మనిషి అంతరంగంలోకి చొరబడి… ఆ మనిషిలోని అనుభూతితో మమేకమయ్యారు అఫ్సర్.
కవిత ముగింపులో-

మెట్రోబస్ వెనకాల
వొక కితకితల నల్లసముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్రకళ్లు వాలకుండా! ‘

నిజంగా వెంటాడే కవితే. అనేక రోజులుగా నన్ను వెంటాడుతున్న కవితా ఇదే.

                                                                    4

ఊరి చివర కవితా సంపుటి వచ్చి మూడున్నరేళ్లు దాటినా… నాకు మాత్రం ఎప్పటికీ, ఎన్ని సంవత్సరాలైనా- అపుడే పుట్టిన లేగదూడవంటి నిర్మలమైనదే. సరికొత్త కవితా సంపుటే!

కొత్తదనాన్ని పొదిగివున్నదేదైనా సజీవమైనదే కదా!

– బాల సుధాకర్ మౌళి