కొత్త కవిత్వానికి చిరునామా తెలంగాణా: సోమసుందర్

 

sosu1

‘ వజ్రాయుధం ‘ – నేను చదివిన ఆవంత్స సోమసుందర్ గారి కవిత్వం. శ్రీశ్రీ కవిత్వం తర్వాత లయాత్మకతతో నన్ను చదివించిన కవిత్వం అది. వడివడిగా సాగుతూ, గుర్రపు కాలిగిట్టలు చేసే ధ్వనిలా అనిపించింది.

నా కవితా సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ సోమసుందర్ గారికి నేను పంపిన తర్వాత – చదివి – వొక రోజు ఫోన్ చేసారు. ‘ పిఠాపురం ఎప్పుడొస్తావు ‘ అన్నారు. ‘ వస్తాను గురువు గారూ.. మిమ్మల్ని చూడాలని – మీతో దగ్గరగా వుండి మాట్లాడాలని వుంది ‘ అన్నాను. ఫలానా రోజున వస్తాను – అన్నాను. మళ్లీ కొన్ని రోజులు పోయాక ఫోన్ చేసి.. ‘ ఎప్పుడు వస్తావు ? ‘ అని అన్నారు. ఆ ఫలానా వెళ్తానన్న రోజు నేను వెళ్లలేదు. ‘ మళ్లీ సెలవుల్లో వస్తాను గురువు గారూ… ! ‘ అని అన్నాను. కానీ వేసవి సెలవుల్లో గానీ, దసరా సెలవుల్లో గానీ – వెళ్లలేకపోయాను. మళ్లీ ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ‘ ఎప్పుడు వస్తావు ! ‘ అంటూ ఫోన్ చేసారు.

నా కవిత్వం మీద – ప్రేమగా, ఆప్యాయంగా, విశ్లేషనాత్మకంగా – నాకు చాలా ప్రేరణను యిచ్చే వ్యాసం వొకటి రాసారు గురువు గారు. నా కవిత్వం ఎదుగుదలకు విలువైన సూచనలు చేసారందులో. ఎదిగే క్రమంలో సాధించాల్సిన కవిత్వాంశాలను చెప్పారు. లోపాలను – ప్రేమతో ఎత్తి చూపారు.

ఆ వ్యాసం పదేపదే చదువుకుని – నన్ను నేను దిద్దుకోవాల్సిన వ్యాసంగా మారింది.

చిన్నప్పుడు – తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఆయన కవిత్వం చదివి – గొప్పగా భావించిన నాపై, నా కవిత్వం పై ఆయన వ్యాసం రాయడం గొప్ప ఆనందంగా అనిపించింది.

మళ్లొకసారి ‘వజ్రాయుధం’ చదివాను.

ఈ సంవత్సరం జనవరి 9, శనివారం – తెల్లారిజామున – కవిత్వం రాస్తున్న నా పాఠశాల విద్యార్థిని వెంట తీసుకుని – పిఠాపురం బయలుదేరాను.

మాధవస్వామి గుడి వీధిలో వున్న ఆయన ఇంటికి వెళ్లాము.

ఆయన గదిలోకి అడుగుపెట్టాం.

మంచం మీద వెల్లకిలా పడుకుని వున్నారు. మెలకువగానే వున్నారు. వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నారు.

నేను వెళ్లి..

‘ గురువు గారూ…. ! ‘  అని పిలిచి – నా పేరు చెప్పాను. నా రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకున్నాను. ఏదో ఆప్యాయత అసంకల్పితంగా నన్ను అలా చేయించింది. మహా మృదువైన ఆ చేతి అనుభూతికి లోనయ్యాను. పక్కన కూర్చున్నాను. ‘ నువ్వా… ! ‘ అని చాలా ఆనందపడ్డారు. కళ్లు ఆనందానికి లోనయ్యాయి. వస్తున్నానని ముందుగా తెలియజేయలేదు నేను. నన్ను వాళ్ల అబ్బాయికి పరిచయం చేసారు.

సొసు౨

పక్కనే వున్నాను. నా చేతుల్లోనే ఆయన చేయి వుంది. ఆ మృదుత్వం నాకు తెలీకుండానే నా లోపలకి అనుభూతమవుతుంది.

ప్రేమగా మాట్లాడారు.

తర్వాత లేచి – ఆయన మంచానికి ఆనుకుని వున్న కుర్చీలో కూర్చున్నాను.

ఆయన జీవితానుభవాలు, కవిత్వానుభవాలు, జైలు అనుభవాలు, పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేసినప్పుడు.. ఇంటందరూ ఏడ్వవడమూ ; మిగిలిన సాహిత్యజీవులతో అనుబంధాలు.. ఇంకా పాత జ్ఞాపకాలను అనేకం నెమరువేసుకోవటం ; సామ్యవాదం గురించి – కులం గురించి – హైందవభావజాలం గురించి – ఆ నాలుగు గంటలూ చాలా విషయాలను చెప్పారు. మాట్లాడానికి కష్టపడుతూ.. అయినా కవిత్వం – సాహిత్యం యిస్తున్న బలంతో చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. చాలా అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కల్బుర్గి గురించి మాట్లాడారు . ‘కబుర్గి’ని దగ్గర నుంచే చంపారట ! రచయితలని కూడా బతకనివ్వటలేదా.. ‘ అని బాధతో, ఆగ్రహంతో – అన్నారు.

అప్పటికి నేను రాసిన కొత్త కవితలు చదివాను. కళ్లు మూసుకుని చాలా శ్రద్ధగా విన్నారు. నచ్చిన చోట ‘ బాగుంది ‘ అని అంటూ.. నిమగ్నతతో విన్నారు. అంత గొప్ప కవి, గొప్ప జీవితానుభవం వున్న మనిషి ముందు – కవిత్వం చదవటం.. నేను నా జీవితంలో మరిచిపోలేని అనుభవం.

‘ పద్యం గురించి కాస్తా మాట్లాడుతా ‘ కవిత చదివాను. ‘ పద్యాన్ని అరచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరితే అట్టే అంటిపెట్టుకుని వుంటుంది ‘ అన్న స్టాంజాని విని.. ఆగమని చెప్పి నెమ్మదిగా కళ్లు మూసుకున్నారు… ఆరేడు సెకెన్లు తర్వాత కళ్లు తెరిచి ‘ కానీ… ‘ అన్నారు. ‘ వేళ్లు గురించి.. ‘ కవిత చదివాను. ‘ అమ్మ నన్ను చంకలో ఎత్తుకునేటప్పుడు కిందకు జారిపోకుండా ఆ వేళ్లతోనే గట్టిగా దేహానికి అదుముకునేది ‘ అన్న దగ్గర.. ఆగి.. ” మా పెద్దబ్బాయిని నా గుండెల మీద వేసి పెంచాను ” అని అంటూ.. కాసేపు కళ్లు మూసారు.

అప్పుడు తెలిసింది ‘ ఆయన కవిత్వంతో తాదాత్మయం చెందుతున్నారని ‘. అంత పెద్ద వయసులోనూ కవిత్వం కోసం ఆవురావురమనడం నాకు గొప్ప ప్రేరణనిచ్చింది.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అతనితో నేను గడిపిన కాలం అమూల్యమైనది. ‘ మళ్లీ మళ్లీ చూసిరావాలి. మాట్లాడాలి ‘ అని అనిపించే మనిషి. క్రిష్టోఫర్ కాడ్వెల్ ‘ ఇల్యూజన్ అండ్ రియాలిటీ ‘ పుస్తకం ఇస్తూ.. ” మళ్లీ వచ్చినప్పుడు ప్రతీ భాగం గురించి నువ్వు నాకు చెప్పాలి. ఉత్తరాల్లోనూ రాయాలి ” అని అన్నారు. ఆయన ఆత్మకథ రెండో భాగం ‘ పూలు – ముళ్ళు ‘ ఇచ్చారు. ఇంకా ఆయన సాహిత్యం చాలా ఇచ్చారు. ‘ నిద్రపోకు అనుభవాలు జారిపోతాయి.. మేలుకోకు కలలు పారిపోతాయి ‘ పుస్తకం పేరు ప్రత్యేకంగా వుందండి – అని అన్నాను. నవ్వి.. అలాంటివే మరికొన్ని తన పుస్తకాల పేర్లు చెప్పారు. ఆయన తన పుస్తకాలును ఇస్తూ.. వొక మాట అన్నారు : ‘ ఇంత వరకు నా సాహిత్యం మొత్తం చదివిన వాళ్లు వొక్కరూ కనిపించలేదు.. ‘ అని.. కొనసాగిస్తూ…..  ‘ మళ్లా కొత్త పుస్తకం వేస్తున్నాను ‘ అని చెప్పారు. ‘ అందులో వర్తమాన కవుల మీద నేను రాసిన వ్యాసాలు వుంటాయి , నీ కవిత్వం మీద రాసింది కూడా వుంటుంది ‘ అని అంటూ….  ఆ పుస్తకం పేరు చాలా గమ్మత్తుగా వున్నది.. చెప్పారు. ‘ ఎలా వుంది పుస్తకం పేరు ? ‘ అని అన్నారు. ‘ చాలా ప్రత్యేకంగా పెట్టారండీ ‘ అని అన్నాను. ఆ పేరు వైవిధ్యంగా వుంది.. యిప్పుడు గుర్తుకురావటం లేదు.

ఇలా ఆత్మీయసంభాషణ సాగుతున్నప్పుడే మధ్య మధ్యలో నేను వేసిన కొన్ని ప్రశ్నలకు స్పందించారు :

ప్రశ్నలు – జవాబులు

* ఇప్పడు వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ?

ఇప్పటితరం యువకవులు బాగా రాస్తున్నారు. తెలంగాణా నుంచి మంచి కవిత్వం వస్తుంది. స్ట్రగుల్ వుంది. ఆధునికం కవిత్వం మలుపు తిరగాలి.

* ఇంగ్లీష్ కవిత్వం అధ్యయనం అవసరం గురించి చెప్పండి ?

చదవాలి. కచ్చితంగా చదవాలి. ప్రపంచ కవులను చదవడం అవసరం.

* కులం గురించి… ?

కులం పోవాలి. పేర్లులో వున్న కులం అస్తిత్వం కూడా పోవాలి.

* శ్రీశ్రీ తో మీ అనుబంధం ?

1945 లో ఇంటర్ పూర్తి అయ్యాక.. శ్రీశ్రీని కలవటానికి శ్రీశ్రీ కోసమే మద్రాసు వెళ్లాను. ఇంటికి వెళ్లాను. ఇంటిలో ఆ పూట తినడానికి లేదు. బయటకు వెళ్లి.. టీ, బిస్కెట్స్ తిన్నాము.

అప్పుడు నా దగ్గర వున్న డబ్బులతోనే వండుకోవడానికి కావాల్సిన సామాన్లు కొన్నాం.

మొదట శ్రీశ్రీ కవిత్వం పరిచయం లేదు. ఎలా కవిత్వం రాయాలి ? దారి ఏమిటి ? అని సంశయం వుండేది. కానీ కవిత్వం రాయటం అప్పటికే మొదలుపెట్టాను. శ్రీశ్రీ కవిత్వంలో… ‘ కవితా! ఓ కవితా !, జగన్నాథుని రథచక్రాలు ‘ ఎక్కువుగా పదే పది చదివేవాడిని.

* శివారెడ్డి గారితో మీ అనుబంధం ?

శివారెడ్డి నమ్మే రాజకీయాల గురించి మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. శివారెడ్డి నన్ను బాగా ప్రేమిస్తాడు. నేనూ అంతే. బలాఢ్యుడు కాడనిపిస్తుంది కానీ గట్టివాడే. శివారెడ్డి కొడుకుని వొకరోజు వాళ్ల ఇంటి దగ్గర నా రెండు చేతుల్లో పెట్టాడు.. చాణ్ణాళ్ల క్రితం.

* భారతదేశంలో సామ్యవాదం గురించి… ?

సామ్యవాదం ఎప్పుడొస్తుందో చెప్పలేం. స్పాంటేనియస్ గా వస్తుంది – యాక్సిడెంటల్ గా వస్తుంది. సామ్యవాదం వచ్చితీరుతుంది.

ఆ రోజు ఆ సాహిత్యపిపాసిని వదిలి వచ్చేసానే గానీ..  మళ్లీ మళ్లీ వెళతాను… కలుస్తాను… మాట్లాడుతాను… అని అనుకున్నాను. నమ్మాను. పిఠాపురం ఏమాత్రం.. దగ్గరే… ఎప్పుడు పడితే అప్పుడ వెళ్లి వచ్చేయవచ్చు.. అని అనుకున్నాను. నా కొత్త కవిత్వ సంపుటి వచ్చిన వెంటనే పిఠాపురం వెళ్లి.. ప్రత్యక్షంగా యిచ్చి రావాలి – అనీ అనుకున్నాను. నాలుగు రోజుల కిందట హాస్పిటల్లో చేరారు.. అన్న వార్త పేపర్లో చదివి ఫోన్ చేసాను.  ‘ కోలుకుంటున్నారు.. బాగున్నారు – రేపే డిస్చార్జ్ ‘ అని గురువు గారి అబ్బాయి చెప్పారు. ఈ రోజు యిలాంటి వార్త వినాల్సిరావడం పూడ్చుపెట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. మళ్లీ  పిఠాపురంలో నేను ఎవరిని కలవాలి ? నా కవిత్వం మీద మరెన్నో ఎదుగుదలకు తోడ్పడే ఆయన మాత్రమే ఇవ్వగల సూచనలు యింకెవరిస్తారు ?

*

మానవుడితో…

 

 

-బాలసుధాకర్ మౌళి

~

( చ‌ల‌సాని వ‌ర్థంతి స‌భ‌ ఈ 24 ఉదయం  9.30గంట‌ల‌కు  విశాఖ‌ప‌ట్నం పౌర గ్రంథాల‌యం, ద్వార‌కాన‌గ‌ర్‌

అధ్య‌క్ష‌తః వ‌ర‌వ‌ర‌రావు
చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌సం – 1 ఆవిష్క‌ర‌ణ‌
ఆవిష్క‌ర్తః కృష్ణాబాయి)

*

రెండేళ్ల కిందటి సంగతి – విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ‘జనకవనం సభ’ ప్రారంభకులుగా కె. శివారెడ్డి గారు వచ్చారు. పబ్లిక్ లైబ్రరీకి దగ్గర్లోనే ఏదో హోటల్లో రూం.

సాయంత్రం సభ అయింతర్వాత – శివారెడ్డి గారు వున్న హోటల్ రూంకి వెళ్లాను. ఒక అరగంట సేపు కవిత్వం – వర్తమానం ..ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత – ‘ హాఫ్ చేతుల తెల్లని షర్ట్, వొక మామూలు ప్యాంట్ ‘ వేసుకుని ‘చలసాని ప్రసాద్ గారు’ వచ్చారు. అదే మొదట – నేను ఆయనతో మాట్లాడింది. ఆయన గొంతుని, మాటని దగ్గరగా వినడం. చూడడం.. నాకు మిగిలిన అనుభవాలు. అంతకు ముందు విజయనగరంలో, విశాఖలో వొకటి, రెండు సభల్లో చూసాను. శ్రీశ్రీ కి పరమ భక్తుడని, విప్లవానికి నిబద్ధుడని -నేను ఆయన గురించి విన్నవి. చలసాని గారి సాహిత్యంతో పరిచయం వుంది నాకు. ఆయన వ్యాసాలు, కవిత్వం చదివాను. ‘జైలు’ మీద రాసిన అతని కవిత్వం, ఆ కవిత్వ నిర్మాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఆ రోజు శివారెడ్డి గారే నన్ను చలసాని గారికి పరిచయం చేసారు. నా కవిత్వసంపుటి గురించి చెప్పి.. ఆయనకి వొక కాపీ యిమ్మన్నారు. నేను బ్యాగ్ లోంచి తీసి.. ఆయనకు అందించాను – ‘ గురుతుల్యులు… చలసాని ప్రసాద్ గారికి’ అని రాస్తూ –   ఆయన వొక నిమిషం అటు యిటూ తిప్పి చేతిలో వుంచుకున్నారు. నేను చాలా ఆనందపారవశ్యానికి లోనయ్యాను. అదే ఆయనతో తొలుత నేను వుండటం.

మళ్లీ..

2015 ఏప్రిల్లో విశాఖలోనే ‘వైజాగ్ ఫెస్ట్’ లో భాగంగా ‘పుస్తక మహోత్సవం’ లో వొకసారి కలిసాను. వీక్షణం బుక్ స్టాల్ ముందు కూర్చున్న  ఆయన వద్దకు వెళ్లాను. నేను ఆయనకు జ్ఞాపకంలో లేను. ‘ఆనాటి హోటల్లో శివారెడ్డి గారితో వున్నప్పటి సందర్భం’ – గుర్తుచేసాను. గుర్తు తెచ్చుకున్నారు. ‘ఓహో నువ్వా… ‘ అని వొక చిరునవ్వు నవ్వి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మళ్లీ మురిసిపోవడం నా వంతు.

ఆ తర్వాత..

రెండు మూణ్ణెళ్లు పోయాక ఆయన ఇక లేరని వార్త తెలిసింది. జూలై 25, 2015 న విశాఖలో ఆయన ఇంటి వద్ద ఆయన పార్దీవ దేహాన్ని చూడడమే చివరిసారి. ఒక స్వాప్నికుడు – ఒక మానవుడు.. నాకు తెలిసిన కొన్ని నెలలకే భౌతికంగా లేకపోవడం నన్ను చాలా బాధకు లోను చేసింది. వెంటనే ఆయన అంతిమ యాత్రకు వెళ్లటం – నా తీవ్ర కాంక్ష. చాలా ఉద్విగ్నంగా అనిపించింది. మనసులో ఆ ఉద్విగ్నతతోనే విశాఖ బయలుదేరాను. అంతిమ యాత్రకి ముందు – చలసాని ప్రసాద్ గారి ఇంటి వద్దే జరిగిన సభలో వి.వి, కాత్యాయని విద్మహే గారు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు యింకా చాలా మంది చలసాని జ్ఞాపకాలను రుద్ధకంఠంతో పంచుకున్నారు.

సభంతా వొక గంభీర వాతావరణం పరచుకుంది. అలాంటి సభల్లో వుంటేనే నేను వున్నట్టనిపించింది. జీవించినట్టనిపించింది. నిజంగా ప్రాణంతో వున్న మనుషుల మధ్య బతికినట్టనిపించింది. వొక వీరుని మరణం గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ” నా హృదయం దుఃఖించింది – స్పూర్తిని పొందింది. ” వక్తల మాటల్లో చలసాని గారి ‘ఆ గొప్ప ఆకాంక్ష’ గురించి అప్పుడే విన్నాను. అదే : ” తలుపుల్లేని ఇళ్లు, జైళ్లు లేని దేశం, తరగతి గదులు లేని బడులు ” నిజంగా అది అందరి ఆకాంక్ష కూడా. నేను… అప్పుడు అందరి ముఖాల్లోకి చూసాను. ఎవరి ముఖంలోనైనా కురవడానికి సిద్ధంగా వున్న మేఘాలే కనిపించాయి. ముఖాల అడుగున వున్న తేజోవంతమైన కాంతీ కనిపించింది.

chalasani

అంతిమ యాత్ర మొదలయ్యింది.

రాష్ట్రం నలుమూలల నుంచి తెలిసిన, తెలియని అనేక మంది మనుషులతో నడవడం, ప్రయాణించటం – నా జీవితంలో వొక ఉద్విగ్నపూరిత అనుభవం. విశాఖ రోడ్డు మీద యాత్ర సాగి.. A.U medical institute కి దేహాన్ని అప్పగించటం – చలసాని గారితో అనుబంధం వున్న వొక్కొక్కరు వెళ్లి ఆయన దేహం ముందు భోరున విలపించటం – ఇంక నాలో కంపనం మొదలయ్యింది. వరవరరావు, పాణి, కె. వరలక్షి గారు, అరసవిల్లి కృష్ణ గారు , ప్రసాద వర్మ గారు, కెక్యూబ్ వర్మ గారు, రివేరా, అద్దేపల్లి ప్రభు గారు వొకరా ఇద్దరా అనేకులు అనేకులు. నేను వరవరరావు గారి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాను- అంతకు వొకసారి కలిసాను.  నా కవిత్వం చదివానని చెబుతూ..  అనంతమైన ప్రేమ  నిండిన ఆ చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ చేతులు నాకు అలాగే అనిపించాయి.

ఇక.. ఎనభై యేళ్ల పైబడిన నిర్జీవదేహాన్ని అక్కడ అప్పగించాక.. నాకు దేన్నో వెతుక్కోవాలనిపించింది. వెతుక్కుంటూ వెళ్లాలనిపించింది. సముద్రం గుర్తొచ్చింది. తిన్నగా సముద్రానికే నడిచాను.

సముద్రం , జనం – వొక్కటేనేమో.

జనంలో వున్నప్పుడూ, సముద్రం దగ్గర వున్నప్పుడూ – వొకే అనుభూతి. ఈసారి అనుభూతి – దుఃఖం. రెండింటి దగ్గరా దుఃఖమే. అన్ని అనుభూతులకూ, అనుభవాలకూ వాహిక ‘కవిత్వమే’  అవుతుంది.

 

ఈ కవిత : అప్పుడే – సముద్రం దగ్గరే రాసుకున్నాను.

chalasani1

 

 

కొన్ని ఉద్విగ్నక్షణాల మధ్య..

 

 

మౌనంగా పిడికిళ్లెత్తి

జోహార్లు చెబుతున్న దృశ్యమే కళ్ల ముందు –

ఏ స్వప్నాలు

కెరటాల్లా ఎగిసివస్తున్నాయో

ఏ దుఃఖాలు

లావాలా ఉబికి వస్తున్నాయో

ఆత్మీయులు

భుజం భుజం కలిపి కొత్త వారధిని నిర్మిస్తున్నవాళ్లు

ఏం కాకపోయినా

కన్నీళ్లు కార్చినవాళ్లు

ఎక్కడ నుంచో

పిడికెడు స్థైర్యాన్ని పొందినట్టు

అక్కడికక్కడే కాసింత స్ఫూర్తిని పొందినవాళ్లు

అంతా వొక దగ్గరే

అమరుని దేహం చుట్టూ చేరి

రేపటిని వాగ్దానం చేస్తున్నారు

 

2

 

తీరం వెంబడి నడుస్తున్నాను

వొక దిగులును దిగమింగుకుంటూ

గొంతెత్తి

అమరత్వాన్ని గానం చేస్తున్న

వొక సమూహాన్ని

అలల ఘోషలో పోల్చుకుంటున్నాను

ఇసుకపర్రల మీద

పాదాల గమ్యాన్ని వెతుక్కుంటున్నాను

చుట్టూ

జనసమూహం

సముద్రంతో

తమని తాము విభిన్నరూపాల్లో

వ్యక్తం చేసుకుంటూ…

 

3

 

సముద్రానికా శక్తి ఎక్కడినుంచొస్తుందో…

ఊయలలూపుతుంది

లాలిస్తుంది

అట్నుంచి యిటు

ఇట్నుంచి అటు తోస్తూ

ఈనిన దూడని

నిలబెడుతున్న తల్లి ఆవులా

అచ్చం

విప్లవాగ్నిలా…

 

4

 

వెళ్తూ వెళ్తూ

కొన్ని ఉద్విగ్నక్షణాల్ని

రక్తనాళాల్లోకి ఊదుకుంటున్నాను –

 

( చలసాని గారితో అల్పకాల పరిచయాన్ని తలచుకుంటూ… )

 

 

చలసాని గొంతులో …https://www.youtube.com/watch?v=IfqTbEzYAzo

చావు వెల

 

-బాలసుధాకర్ మౌళి

~

 

వానకి
వొరిగిన చేలు లెక్కనే
తలవాల్చి
ప్రశాంతంగా నిద్రిస్తున్న
దేహమెవరిదో..
చావుని
పిలిచి మరీ
కౌగిలించుకున్న ఆ ధీశాలెవరో..
తల్లీ- బిడ్డలను
ఎవరి మానాన వాళ్లనొదిలేసి
వుత్తచేతులతో కదిలిపోడానికి
నమ్మకమెక్కడినుంచొచ్చిందో..
ఎవరో
ఏ ప్రాంతమో
ఏ కన్నీళ్ల కథానాయకుడో –

నెత్తురు
గంగవెర్రులెత్తుతుంది
రైతు
ఆత్మహత్య చేసుకున్నాడంటున్నావా
నిజమేనా
నమ్ముతావా
– రైతు కాదురా
తరాల శోకాన్నీ దిగుళ్లనీ కన్నీళ్లనీ
మోసి మోసి
బరువెక్కి – తేలికయి
ఆనందనేత్రాలతో
పారవశ్యం చెంది
అలసి అలసి – తిరిగి శక్తివంతమయి
నిలబడిన
నేలరా –
బువ్వపెట్టిన నేలరా
నేలరా
ఆత్మహత్య చేసుకుంది
కోటానుకోట్ల
కాంతిపుంజాల చేతులతో
నోటి ముందు ఇంత అన్నం ముద్దనుంచిన
తల్లినేలరా
నేలరా- ఆత్మహత్య చేసుకుంది

పాట పాడే నేల
ఆత్మహత్య చేసుకుంది
పాదం కదిపే నేల
ఆత్మహత్య చేసుకుంది
మనిషి మనిషంతా నేలగా మారి
నేలే మనిషై ఆత్మహత్య చేసుకుంది

నేల చుట్టూ
చేరి
పిచ్చిచూపులు చూస్తున్న
ఆ పసివాళ్ల సంగతో
పసివాళ్ల జీవితాలను ప్రాణంపెట్టి సాకాల్సిన
ఆ తల్లి సంగతో
పోనీ
డేగలా
నెత్తిన కూర్చున్న అప్పుసంగతైనా
చెప్పగలవా –
పోనీ
వాడు కట్టిన
‘చావు వెల’ సంగతి ?

*

భరోసా నింపే వెలుగు రవ్వల “సందుక “

బాలసుధాకర్ మౌళి 

(కవి నారాయణ స్వామి వెంకట యోగి ఒక యాభై చేరుకున్న సందర్భంగా)

   మనిషి లోపల వొక చలనం సంభవిస్తుంది – అలానే బయటకు వ్యక్తమవుతాడు. లోపలి కదలికను బట్టి ఆ మనిషి వ్యక్తం కాబడటంలేదంటే.. ఏఏ సంకోచాలో బయటపడలేనంతంగా కట్టిపడేస్తున్నట్టు భావించాలి – నమ్మాలి.

నారాయణస్వామి గారు ‘సందుక’లో వొక డయాస్పోరా గొంతుకను వినిపించారు – ఎంతగా హృదయాన్ని తడిచేసే కవిత్వముందో – అంతగా వొక్కసారి వెనక్కి తిరిగి.. మళ్లీ ముందుకు చూసి ఆలోచించాల్సిన విధంగానూ వుంది.

‘సందుక’ మొత్తంలోకి – నారాయణస్వామి గారి Voice ని – అంతరంగ కాంక్షని సూటిగా పట్టి యిచ్చిన కవిత ‘చిన్నారి మొక్క’ని నా భావన. కారణాలు ఏవైనా కావొచ్చు – పుట్టిన దేశానికి దూరంగా బతుకుతున్న మనుషులు – దేశంపై ఆనాటి ప్రేమ యధాలాపంగానే మిగుల్చుకున్న మనుషులు..  ఏం ఆలోచన చేస్తారో – ఆ అనేకుల ఆలోచనలు అన్నీ ఈ కవితలో ప్రతిబింబిస్తున్నాయి. ఒక విష్మయకరమైన, విభ్రాంతి కల్గించే.. కవి ఊహాశక్తికి తలవంచి నమస్కరించే కవిత – మన వూళ్లను చూసి మనం తలయెత్తుకునే కవిత – ఇది. వొక్క డయాస్పోరా కవే యిలా రాయగలడు.

swamy

నిర్మాణపరంగా ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకంగా వున్నా.. నన్ను ఎక్కువుగా ఆకట్టుకున్న కవితలు : లోపలా.. బయటా… ; యాడికి పోయిన్రు ? ; ఎదురుచూపు.

గుండెని మెలిపెట్టి ఏడిపించిన కవితలు : అవ్వా ! ; యాడికిపోయిన్రు ? ; నాయనొస్తాడు !

” ఒక అన్వేషణ రూపం – కవిత్వంగా మొలకెత్తడం.
ఆ అన్వేషణ ఏమిటి ? తను వర్తమానంలో బతుకుతున్న నేల మీంచి – పుట్టి పెరిగిన నేల గురించి, అనురాగానుబంధంలో ముంచిన మనుషుల గురించి, ఆ జ్ఞాపకాలను… కొత్తగా అన్వేషించుకోవటం – అందులో ఉన్మీఖం కావటం.. సృజనశీలి అయిన కవి కవిత్వమైపోవటం.  ” నారాయణ స్వామి గారి కవిత్వం – ఇదేనంటాను.

కవితల్లో ఆయా సందర్భాల్లో – సందర్భాల్లాంటి జ్ఞాపకాల్లో మానసిక స్థితి బాగా అభివ్యక్తం అయ్యింది. అభివ్యక్తమయి అలరించింది.

నిరంతరం కవిత్వం చదవగా చదవగా – వొక కవిత ఎలా వుండాలనిపిస్తుందంటే… ‘ లోపలా.. బయటా ‘ లా. గొప్ప అనుభూతిని
మిగులుస్తుంది ఆ కవిత – కాన్వాస్ పెద్దది – లోతైన జీవితానుభవం పునాధుల మీద నుంచి వ్యాపించిన విషయముంది.
కవిత్వం ఆలోచనను కల్గించాలి – వొక ఆసక్తిని మెంటైన్ చెయ్యాలనుకుంటాను. వొక పదం లేదా వొక ప్రతీక లేదా రూపకం… కవి ఎందుకు వాడాడు – అనేది తెలుసుకున్నప్పుడు.. మన అవగాహనలోకి వచ్చినప్పుడు – చాలా ఆనందమేస్తుంది. కవిత్వం ద్వారా కొంత తెలియని విషయం కూడా తెలుసుకోవాలనుకుంటాను. ఇందులో కొన్ని కవితలు అలా వుపయోగపడ్డాయి.

నారాయణస్వామి గారి కవిత్వంలో – వొక దిగులు, వొక చైతన్యం, వొక జ్ఞాపకం, వొక గగుర్బాటు, వొక అమాయకత్వం – పసితనం, వొక నమ్మకం, వొక మంచి ఊహ, కృత్రిమత్వం – సజీవమైన ఆశ…. ఇవన్నీ – జీవితంలో, సమాజంలో వున్నవే.. కవిత్వంలోకి యదార్ధంగా తర్జుమా అయ్యాయి. కొన్ని వాక్యనిర్మాణాలు మరీ మృదువుగా వుండి.. వొక అందంలో మునిగితేలాయి.

వొక దిగులును ఎలా పలకాలో స్వామి గారికి తెలిసినట్టు మరెవరెవరికీ తెలియదేమో ! అనిపిస్తుంది. జీవితంపై వొక నమ్మకాన్ని
కల్గించడంలోనూ స్వామి గారి కవిత్వం వెలుగు రవ్వే.

నారాయణస్వామి గారి కవిత్వం మళ్లీ మళ్లీ చదవాలని మనసులాగుతున్న కవిత్వం – చదవకపోతే.. చదివి అనుభూతించకపోతే వుండలేనితనాన్ని సృష్టించే కవిత్వం.

తొలిసారి నేను అంతా ఇలాంటి కవిత్వమే చదవటం – వొక కవి కవిత్వ వాతావరణం వొక్కోసారి కొంతమేరకైనా ఆ కవికే ప్రత్యేకమైంది అవుతుంది. వొక కవిత్వం ఏర్పరుచుకున్న వాతావరణంలోకి ఎవరినైనా లాక్కుపోవడమే నిజమైన కవిత్వం గుణమైతే ఈ కవిత్వం అలాంటిదే !

బాల సుధాకర్

రెండు సమయాల్లోంచి..

బాలసుధాకర్ మౌళి

 

ఈ మంచు కురుస్తున్న ఉదయప్పూట –
చన్నీళ్ల స్నానం చేసి
టవల్ వొంటికి చుట్టుకుని
ఆ పిల్లాడు చేస్తున్న నాట్యం
ఏ నాట్యాచార్యుని నాట్యం కన్నా
తక్కువ కాదు –

నాట్యం వికసించాలంటే
ఏ గొప్ప వేదికో
వేలాది మంది కొట్టే చప్పట్లో
పొగడ్తలో
అవసరం లేదు
నాట్యంతో తన్మయత్వం చెందాలి –

నాట్యం వికసించడానికి
చిన్న పూరిపాకలోని చిన్న స్థలమే చాలు –

ఆ రైల్వే గేటు పక్కన
ఆ చిన్న పూరిపాకలో
వాళ్లమ్మ
పొయ్యి దగ్గర కూర్చుని టీ కాస్తుంది
నాన్న
మంటని ఎగేస్తాడు
ఆ పిల్లాడు నర్తిస్తూ వుంటాడు
టీ కొట్టుకి
వొచ్చిపోయేవాళ్లంతా
ఉదయం అప్పుడే ఉదయించడాన్ని
కళ్లారా
తన్మయత్వంతో
అక్కడే చూస్తుంటారు –

ఒకానొక వేసవి మధ్యాహ్నం
అక్కడ
ఆ రైల్వేగేటు పక్కన
పూరిపాక ఉండదు
పసిపాదాల పరవళ్లతో పరవశించిన
ఆ టీ ప్రియులూ ఉండరు
రోడ్డుని తవ్వి పోశాక
ఆ టీ కొట్టు బతుకులోంచి
ఉదయం మాయమైపోతుంది

*

కలత కలతగా ఉంది
ఆ పిల్లాడి నృత్యం
తెల్లారి అనుభవం
దూరం దూరం జరిగిపోతున్నట్టే ఉంటుంది
ఈ నేల మీద
మళ్లీ ఉక్కుపాదాల బరువే
మోపబడుతున్నట్టూ
అనిపిస్తూ అనిపిస్తూ ఉంది !

బాలసుధాకర్ మౌళి

*

అవసరమే కథల్ని పుట్టిస్తుంది:గంటేడ గౌరునాయుడు

బాలసుధాకర్ మౌళి

 

ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర కథ ఏం మాట్లాడిందంటే మట్టి భాష మాట్లాడింది – మనుషుల వెతలను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చింది. పోరాట ఆవశ్యకతను చాటిచెప్పింది. సాహిత్యం ఏం చేస్తుంది ? మనుషులను చైతన్యవంతం చేస్తుంది. ఉత్తరాంధ్రా కథ ఆ కర్తవ్యాన్నే నెరవేర్చింది – నెరవేర్చుతుంది. అటు పాటల రచయితగా, కవిగా ; ఇటు కథా రచయితగా – ఏం చేసినా ప్రజా చైతన్యమే పునాధిగా ; అవసరార్థమే కథ రాశాను – రాస్తున్నాను అని చెబుతున్న ‘గంటేడ గౌరునాయుడు’ మాస్టారు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. సూక్ష్మంగా ఆయన అంతరంగ అన్వేషణ.

గంటేడ గౌరునాయుడు మాస్టారు – ‘స్నేహకళాసాహితి’ అనే సాహితీ సంస్థని స్థాపించి చాలా మంది యువకవులకు, కథా రచయితలకు వొక వేదికనందించారు అని అనడం కంటే యువతరంతో కలిసి సాహితీసేద్యం చేస్తున్నారు అంటేనే ఆయనకు ఎంతో ఇష్టమౌతుంది.
‘ప్రియభారతి జననీ.. ‘ పాటలు; ‘నాగేటి చాలుకు నమస్కారం – నాగలి’ దీర్ఘ కవితలు; ‘కళింగోర’ పేరుతో కాలమ్ నిర్వహణ; ‘నదిని దానం చేశాక’ కవిత్వసంపుటి; ‘ఏటిపాట – ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ కథాసంకలనాలు; ఈ మధ్య వచ్చిన ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ కవిత్వం – ఈయన సాహిత్య ఉత్పత్తులు. ‘ఇది నా ఊరేనా ! ‘ పేరుతో పాటల సి.డి వొకటి విడుదల చేశారు. తొలి రోజుల్లో ‘ పోడు మంటలు ‘ అనే నృత్య నాటకం రాసి చాలా ప్రదర్శనలిచ్చారు. ఈ మధ్య ‘ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ తర్వాత వచ్చిన ఆయన ఏడు కథలు చాలా చర్చనీయాంశాలను చెప్పాయి. ‘మాయ, పొద్దు ములిగిపోయింది’ ఈ రెండు కథలు – ముంపు నేపథ్యంలోంచి; ‘ఇండియాగాడి టి.సి, సంధ్య’ కథలు – ట్రైబల్ విద్య నేపథ్యంలోంచిమాట్లాడుతాయి. ‘మూడు దృశ్యాలు’ కథ – ప్రభుత్వపథకాలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో చెబితే, ‘ఒక ఊరి కథ’ – పెట్టుబడిదారి విధానం మీద పూర్తిగా ఆధారపడిన తర్వాత రైతు పరిస్థితి ఏమిటి ? అనే విషయాన్ని చర్చిస్తుంది. గౌరునాయుడు మాస్టారి కొత్త కథ ‘అల్పపీడనం’ లక్ష్మిం పేట నేపథ్యంలోది. అదింకా ప్రచురితం కావాల్సి ఉంది.

1. మీ నేపథ్యం చెప్పండి?
నేను పుట్టిన ఊరు – దళాయి పేట, కొమరాడ మండలం, విజయనగరం జిల్లా. వ్యవసాయ కుటుంబం. నా చదువు పార్వతీపురంలో సాగింది. ఉద్యోగమూ ఈ పరిసరప్రాంతాల్లోనే.

2. కథా సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
నా బాల్యస్నేహితుడు, కథా రచయత ‘అట్టాడ అప్పలనాయుడు’ కథా సంపుటి – ‘పోడు పోరు’ నన్ను కథా సాహిత్యంలోకి లాక్కొచ్చింది. అంతకు ముందూ కథలు రాసేవాణ్ణి కానీ అప్పలనాయుడు కథలు చదివాక కథ రాయడం మీద బాధ్యత పెరిగింది. కారా, భూషణం, చాసో, తిలక్ కథలు ఇష్టంగా చదివాను.

3. మిమ్మల్ని ప్రభావితం చేసిన కథకులు – కథలు ఏవి?
కారా – చావు, చాసో – వాయులీనం, తిలక్ – ఊరి చివర ఇల్లు, రావిశాస్త్రి – తప్పు కథలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.

4. కథ, పాట, కవిత ఈ మూడింటినీ మీరు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు ఈ మూడింటిని ఎలా సమన్వయం చేయగలిగారు ?
పాటతో బయలుదేరాను. కవిత్వాన్ని ఇష్టపడ్డాను. కథ అవసరం కనుక రాస్తున్నాను. కవిత ద్వారా, పాట ద్వారా చెప్పలేని విషయాన్ని కథ ద్వారా విస్తారంగా చెప్పడం సులువు. అందుకే కథనే ప్రధానంగా నా భావప్రసారానికి మాధ్యమంగా ఎన్నుకున్నాను.

IMG_20150428_100723

5. పాట మీ కథల్లోకి ఎలా ప్రవేశించింది?
పాట నాకు ఇష్టం కాబట్టి మొదట నేను పాటతో బయలుదేరాను. పాట కథాగమనానికి దోహదపడుతుందని అనుకున్నప్పుడే అక్కడక్కడ నా కథల్లో ఉపయోగించాను. అయితే శృతి మించిన కవిత్వం కథాగమనాన్ని నాశనం చేస్తుందని నా అభిప్రాయం.

6. మీరు రైతు, వ్యవసాయం ప్రధానంగా కథలు రాస్తారు కదా.. మీ ముందు తరం కథా సాహిత్యంలో రైతు జీవితం ఏమేరకు చిత్రితమయ్యింది ?
నిజానికి కథా సాహిత్యంలోకి రైతు ప్రధాన పాత్రగా ప్రవేశించింది మా తరం కధకులు కథా సాహిత్యంలోకి వచ్చిన తర్వాతే అనిపిస్తుంది. గురజాడ, ఆచంట
సాంఖ్యాయన శర్మ కథలు రాస్తున్న కాలం.. రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్న కాలం. నానా హింసలు పడుతున్న కాలం. అయినా గానీ ఏ కారణం గానో ( బహుశా
సంస్కరణోద్యమ ప్రభావం కావొచ్చు ) రైతు జీవితం కథల్లోకి రాలేదు. అయితే రైతు గురించిన ప్రసక్తి కా.రా మాస్టారు కథ ‘కీర్తి కాముడు’ 1949లో ఉంది.
రైతులు పితృ పితామహార్జితమైన ఆస్తిని దానధర్మాలనీ, పరువు ప్రతిష్టలనీ, పంతాలు పట్టింపులనీ, పౌరుషాలకు పోయి.. హారతి కర్పూరంలా హరాయింప చేసినట్టు
చెప్తారు. 1951 లో అవసరాల సూర్యారావు రాసిన ‘ఊరేగింపు’ కథలో జమిందార్లు వేసే పన్నులు కట్టలేక వారి వేధింపులు తట్టుకోలేక.. రైతులు తిరుగుబాటు
చేసిన వైనాన్ని చిత్రిస్తారు. నాకు తెలిసి ఇవి తప్ప రైతును గురించిన చిత్రణ ఉత్తరాంధ్రా కథా సాహిత్యంలో కనిపించదు. మళ్లీ కా.రా, భూషణం, శ్రీపతి కథల్లో ఉద్యమ చిత్రణ జరిగింది గానీ, రైతు ప్రధాన పాత్ర గాదు. వీరి కథల్లో పాలేర్లపై నాయుళ్ల పెత్తనం ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత మా తరం సాహిత్యరంగంలోకి ప్రవేశించాక మరీ ముఖ్యంగా రైతు కుటుంబాల్లోంచి వచ్చాక.. రైతు జీవితం చిత్రించబడిందని నేననుకుంటాను.
ఇక్కడొకటి గమనించాలి.. రైతు అనగానే అతడొక భూస్వామిలాగ భావిస్తే పొరపాటు. ఏడాదంతా కష్టపడినా.. నేలబుగ్గినెత్తుకున్నా.. అప్పుల ఊబిలోనే కూరుకుపోయే అతి చిన్న, సన్నకారు రైతులూ వున్నారు. వారే మా కథల్లో ప్రధాన పాత్రధారులు. నేను మాట్లాడేది ఆ రైతుల గురించే.
7. మీ కథల్లో ‘నోష్టాల్జియా’ గురించి మాట్లాడుతున్నారని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు ?
   ‘నోష్టాల్జియా’ అంటే గతమంతా వైభవంగా ఉందని.. ఆ వైభవం ఇప్పుడు లేదనీ నేనంటున్నట్టా ? నా కథల్లో ఏ రైతూ ఎప్పుడూ సుఖంగా ఉన్నట్టు గానీ, భోగ
భాగ్యాలు అనుభవిస్తున్నట్టు గానీ రాసానా ? నా కథల్లోని రైతులు పండిన పంట అప్పులూ, పాయిదాలూ తీర్చడానికీ.. కళ్లం గట్టునే అన్నీ కొలిచి ఇంకా తీరని
అప్పులతో, ఖాళీ చేతుల్తో మిగిలిపోయిన వాళ్లే. ఆ జీవితమే బాగుందనీ, అలాగే ఉండిపోవాలనీ నా కథలు చెప్తున్నాయా ? అలా అన్న వాళ్లు నా కథలు
చదివారనుకోవాలా ?
8. ‘నాగలి’ దీర్ఘకావ్యం రాసారు కదా.. యంత్రానికి మీరు వ్యతిరేకమా ?
వ్యతిరేకమని ఎందుకనుకుంటారు ? నాగలి రైతుకు దొరికినంత సులువుగా, సౌకర్యంగా ట్రాక్టరు కూడా అందుబాటులోకొస్తే ఎవరు కాదంటారు ? ట్రాక్టరుని
నమ్మి నాగళ్లని దూరం చేసుకున్నాక ట్రాక్టరు యజమాని కాళ్ల దగ్గర పడిగాపులు పడే రైతుల దుస్థితి చూస్తే అర్ధమవుతుంది… దిగువ మధ్యతరగతి రైతు వేదన.
9. ” మార్క్సీయ భావజాలంతో జీవితాన్ని ఎంత వాస్తవికంగా అర్ధం చేసుకోవచ్చునో మీ కథలు రుజువు చేస్తున్నాయని” వొకరు, ”మార్క్సీయ భావజాలమే’ అంటే నమ్మశక్యం కాదనీ” మరొకరూ అన్నారు. మీరేమంటారు ?
ఎవరు ఏమనడానికైనా కథకుడి కంటే కథే ప్రధానం. అటువంటప్పుడు మార్క్సీయ భావజాలం ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించకపోవడానికి కారణమేమైయుంటుంది ?
కథంతా వదిలేసి.. మధ్యలో ఏదో వొక వాక్యాన్ని పట్టుకుని, అదీ సరిగా అర్ధం చేసుకోకుండా భావజాలాన్ని నిర్ణయించడం సరైంది కాదని నా అభిప్రా

10. పాట, కవిత, కథ రాశారు. నవల?
నవల రాయాలని బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వలన, ఆరోగ్య కారణాల వలన అనుకున్న పని చెయ్యలేకపోతున్నాను. అదీకాక కథ రాయడానికే నేను చాలా సమయాన్ని తీసుకుంటాను. నవల అంటే మరి ఎక్కువ సమయం
పడుతుంది. కానీ రాస్తాను.

11. ఇప్పటి ఉత్తరాంధ్రా కథాసాహిత్యాన్ని మీరెలా నిర్వచిస్తారు?
వర్తమాన కథ అస్తిత్వ మూలాన్ని అన్వే స్తుంది. ఈ విషయాన్ని అట్టాడ అప్పలనాయుడు కథ ‘షా’ బలంగా మాట్లాడింది. క్షతగాత్రగానం, శిలకోల, వరద ఘోష మరికొన్ని. ఇక్కడి కథా రచయితలు ఈ నేలకే ప్రత్యేకమైన కథలు రాస్తున్నారు. స్థానీయత వుంటేనే సార్వజనీనత వుంటుందని నిరూపిస్తున్నారు.

12. రేపటి ఉత్తరాంధ్రా కథ ఎలా ఉండాలనుకుంటున్నారు?
సాగరతీర గంగ పుత్రుల కథలు రాలేదు. మందస జీడితోటల కథలు రావాలి. స్త్రీ, దళితవాద కథలు యిక్కడ రావాల్సినంతంగా రాలేదు. కాబట్టి ఈ అన్ని మూలాల నుంచి కథలు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడయినా, ఏ కాలంలోనైనా కథ వొక సామాజిక
అవసరం. సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది.

13. సమాజపు అన్ని మూలాల నుంచి ఆయా కథలు రాకపోవడానికి కారణమేమంటారు?
ఒకటి కళింగాంధ్రాలో దళిత, స్త్రీవాద కథకులు లేరు. దళితుల నుంచి కథకులు రావాలి. ఎవరి జీవిత అనుభవాల్లోంచి, వాళ్ల వాళ్ల అనుభవసారాన్నుంచి వచ్చేవే అసలైన కథలు అవుతాయని నా నమ్మకం. నేను రాసిన ‘నాణెం కింద చీమ’ దళిత సానుభూతి కథ – కానీ స్వీయానుభవం నుంచి వచ్చిన కథైతే బలంగా వస్తువును ప్రకటిస్తుంది.

14. తెలంగాణాను, ఉత్తరాంధ్రాను సామాజికగా, సాంస్కృతికంగా ఎలా ముడికడతారు?
ముడి పెట్టడం కాదు గానీ అక్కడ జరిగిన ఉద్యమాన్ని యిక్కడ సాహిత్యం ప్రభావితం చేసింది. భూషణం కొండగాలిలో అదే చెప్పారు.
సంస్కృతి విషయానికొస్తే ఎవరి సంస్కృతి వాళ్లదే. ఆయా సంస్కృతుల నుంచి గొప్ప కథలు వచ్చాయి. ఉద్యమ సంబంధమైన కథలొచ్చాయి. కాబట్టే ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని యిక్కడి సాహిత్యకారులు సమర్ధించారు.

15. ఈనాటి సామాజిక నిర్మాణంలో ఉత్తరాంధ్రా కథాసాహిత్యం ఏ మేరకు తన పాత్రని నిర్వహించాలి?
ఏ ప్రాంత సాహిత్యానికయినా సామాజిక పరిణామంలో గొప్ప పాత్ర వుంటుంది. ఉత్తరాంధ్రాకే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా ప్రాంతాల
నిర్ధిష్టతల్లోంచి.. సాహిత్యం సామాజిక వికాసానికి దోహదపడుతుంది.

16. ఉత్తరాంధ్రా కథా రచయితలు కథానిర్మాణంలో కొన్ని కొత్త పోకడలు పోయినా మరీ వినూత్న పోకడలు పోకపోవడానికి కారణమేమిటి ? పోవాల్సిన అవసరం ఉందా ?
ఇక్కడి రచయితలకు ముఖ్యంగా జీవితం, జీవితంలో వ్యధ ముఖ్యం. ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని నమ్మడం ఒక కారణమైతే, ఆంగ్ల సాహిత్యంతో అంత ఎక్కువగా సంబంధం లేకపోవడం కూడా కారణమే. రాయలసీమ నుంచి తెలంగాణా నుంచి సీరియస్ గా సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితలకూ ఇదే వర్తిస్తుందనుకుంటాను. ప్రయోగాలు ప్రతిభని చెప్పడానికే తప్ప చెప్పాల్సిన విధంగా జీవితాన్ని చెప్పవని నేను అనుకుంటున్నాను. అయితే ఏ ప్రయోగాలైనా కథా గమనానికే దోహదపడాలి గానీ ఆటంకం కాకూడదు. స్వానుభవ గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిన ప్రయోగాలు మన సాహిత్యంలో వున్నాయనీ నేను నమ్ముతున్నాను.

17. మేజిక్ రియలిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి?
భారతీయ ప్రాచీన సాహిత్యంలో మ్యాజిక్ రియలిజం ఉంది. ఇది మన సాహిత్యంలోకి కొత్తగా వచ్చింది కాదని నా అభిప్రాయం.

18. ఉత్తమ సాహిత్యానికి నిర్వచనం ఇవ్వండి?
ఒకేసారి – ఒక అర్థాన్నిస్తూ, అనేక అర్థాలను స్ఫురింపజేయాలి.

19. ఉత్తరాంధ్రా యువరచయితల గురించి రెండు విషయాలు చెప్పండి?
వర్తమాన సమస్యల మీద స్పందన, వ్యక్తీకరణ బాగుంది. కానీ సాహిత్య సృజన వొక దగ్గరే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం – ప్రధానంగా అధ్యయన లోపం . పూర్వ రచయితల సాహిత్యం విశృంకలంగా చదవాలి. కవిత్వం రాసేవాళ్లు – కారా, చాసో లాంటి కథకుల కథలని చదవటలేదు – సాహిత్యం మొత్తాన్ని చదవాలి. గొప్ప కవులు, గొప్ప కథకులు అనదగినవారు సాహిత్యప్రక్రియలన్నీ చెయ్యకపోయినా, చదివారు. అదే దోవలో యువరచయితలూ వెళ్లాలి. సాహిత్యతరాలలో ఖాళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది –
ప్రతీ తరానికి. ఇక్కడి రచయితలంతా సార్వజనీనమైన మానవ జీవన వికాసాన్ని చెప్పే ప్రయత్నంలో యింకా చాలా చెయ్యాల్సి ఉంది.

20. ఇప్పుడు తక్షణం ఉత్తరాంధ్రా సామాజిక సాంస్కృతిక నిర్మాణం కోసం.. ఏం చేస్తే బాగుంటుంది?
సంస్కృతిని నిలబెట్టడానికి, సామాజిక పునర్వికాసానికి కవులు, కథకులు వొకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ వొక వేదిక మీద నుంచే వొకే గొంతుకగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు జరిగే చర్చ – సమాజానికి ఎక్కువ లభ్యతని చేకూర్చుతుంది.

21. విమర్శని మీరెలా తీసుకుంటారు?
నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడూ ఉండాలి. రచయతకి విమర్శ సహాయకారి అవ్వాలి – దారి దీపం కావాలి అంతేగానీ ప్రత్యేకంగా పనికట్టుకొని వ్యంగ్యం విమర్శలోకొస్తే విమర్శకుడు కథకుని మీద ఆధిక్యతని ప్రదర్శించినట్టే. విమర్శకుడు స్నేహితుడిలా ఉండాలి. వైరిపక్షం కాకూడదు. జ్ఞానంతో పాటూ విమర్శకునికి సంయమనం ఉండాలి. అనుకోకుండా దుర్విమర్శ  రచయిత మీద చెడు ప్రభావాన్ని చూపిస్తే అది సాహిత్యలోకానికి చాలా నష్టమవుతుంది.

22. నేటి పత్రికలలో ఉత్తరాంధ్ర కథకి ప్రోత్సాహం ఎలా వుందనుకుంటున్నారు?
కొన్ని పత్రికలు – పేజీలు యిన్ని రాయాలి అని ; మాండలికం వుండకూడదు అని పెట్టే కొన్ని నిబంధనలు – నిరుత్సాహకరంగా కనిపిస్తున్నాయి.

23. ఉత్తరాంధ్రా ప్రాంతం నుంచి కొత్తగా వస్తున్న ప్రచురణ సంస్థల (ఉదాహరణకు – ‘సిక్కోలు బుక్ ట్రస్ట్’ ) గురించి మీ అభిప్రాయం?
ప్రచురణ సంస్థలు అవసరమే. ఉండాలి. ఎన్ని వుంటే అంత మంచింది. ఉత్తరాంధ్రా గొంతును బలంగా ప్రకటించడానికి పత్రికల అవసరమూ ఉంది.

ఇదీ గంటేడ గౌరునాయుడు మాస్టారు అంతరంగం. సాహిత్యం – మనిషి వొక్కటైనప్పుడు అంతరంగం సువిశాలమౌతుంది. గౌరునాయుడు మాస్టారు అంటే నాగావళి అలల ఘోష . ఆయన కథల నిండా ఉత్తరాంధ్రా. ఉత్తరాంధ్రా అంటే దానివైన కొన్ని ప్రత్యేక లక్షణాలు వున్నా ఈ ప్రపంచంలో ఎక్కడయినా వుండే వొక ప్రాంతం మాత్రమే. కథలు – అమ్మమ్మ చెప్పేవైనా, యిప్పుడు ముద్రణలోకి వచ్చినవైనా కథల్లో వొక జీవనాడి వుంటుంది. ఉత్తరాంధ్రా జీవనాడిని వ్యక్తం చేసినవే ఉత్తరాంధ్ర కథలు. మా గౌరునాయుడు మాస్టారు కథలు.

పొయెమ్ లాంటి నువ్వు

 

పొయెమ్ లాంటి నిన్ను
నీలాంటి పొయెమ్ ను
ప్రేమిస్తున్నాను

1

రాత్రి
చీకటిని మత్తుగా తాగి
మూగగా రోదిస్తుంటుందేమో
సరిగ్గా నిద్రపట్టనే పట్టదు
కలత నిద్రలో
దిగుల్ దిగులుగా కొలను కనిపిస్తుంది
దిగుల్ దిగులుగానే
వొక పువ్వు విచ్చుకుంటుంది
తెల్లారికి
దిగుల్ పొయెమ్ వొకటి
అరచేతుల్లోకి వచ్చి చేరుతుంది
ఏ అలికిడి లేని
వొంటరి కొమ్మమీద కూర్చొని
రెక్కల్లోకి తలని దూర్చి
దిగుల్ ముఖంతో చూస్తున్న
పావురంలాంటి పోయెమ్
నీలాంటి పొయెమ్
నీలాంటి పొయెమొకటి
తెలతెలవారగానే
కళ్లముందు తేలుతుంది –

2

ఉదయం
రాత్రి చీకటి మత్తుని వొదిలి
కొత్తగా
ఊపిరి పోసుకోవాలనుకుంటుందేమో
కువకువలాడుతున్న పావురం రెక్క
– నీ చూపే
చేతిలో
దిగుల్ దిగులుగా వున్న
దిగుల్ పొయెం కళ్లల్లో
తెల్లగా విప్పుకుంటుంది
దిగులు
ఎటో ఎగిరిపోతుంది
ఆ కాసేపటికే
పొయెమ్
కాంతిని నిండా తాగి
కాంతితో తూగుతుంది
..
యింకా
ఎదిగి ఎదగని
నీలాంటి పొయెమ్ ను
పొయెమ్ లాంటి నిన్ను
నిజంగా
పసిపాపని ప్రేమిస్తున్నట్టే
ప్రేమిస్తున్నాను

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

పొద్దుటి పూట పిల్లలు

పొద్దున్నే
తల్లి వొడిలోంచి పిల్లలు మొలకెత్తుతారు
చీకటి
వెలుతురు చాలు పోస్తున్నట్టు
నాలుక నూగాయలోంచి
మాటల విత్తనాలు రాలుతాయి
తెల్లారుజాము, తల్లి వొడి
పసివాళ్లకు
ఆకాశమంత మాటలను నేర్పుతాయి
మాటలు
నదీపాయల మీద మంచుతుంపరలు రాలుతున్నట్టు
తెల్లని పావురాల్లాంటివవి –
ఎక్కడో కొండల్లో
గుప్పుమని కొండపూలు వికసించినట్టు
రెక్కలు విప్పుకున్న
తాజా మాటల పూలు అవి –
వెలుతురు గర్భకుటీరంలాంటి
తెల్లారిజామునే
పిల్లలు
మంత్రమేసినట్టు
మాటలుగా మారిపోతారు
తల్లి వెచ్చని పొత్తిళ్లకు అంటుకుని
నిద్రించి..
మళ్లీ కొత్తగా సరికొత్తగా ఉదయం ఉదయించినట్టు –
అంతా మాటలే
మాటల వనమే –

మాటలను,
స్వచ్ఛమైన తేనెలాంటి మాటలను
ఏరుకోవాలంటే

ఉదయాల్లోకి
పిల్లలున్న యిల్లల్లోకి వెళ్లాలి
పిల్లలున్న యిల్లు
మాటలు ప్రవహించే జీవనది

పొద్దున్నల్లంట –
పిల్లలే కాదు
తల్లులూ మొలకెత్తుతారు
క్షణక్షణానికీ
జీవించడాన్ని మరచిపోతున్న
పెద్దోళ్లంతా పలవలు పలవలగా
మొలకెత్తుతారు
నిన్నటి జీవనవిషాదాన్నంతా కడిగేసే
మాటల అమృతాన్ని
దోసిలి నిండుగా తీసుకుని
హృదయం నిండుగా
నింపుకుంటారు

-బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి

సముద్రం మోసపోతున్న దృశ్యం!

 

 

3211225569_b8f3b4b541

సముద్రం – ప్రపంచ కవులందరూ సొంతం చేసుకున్న గొప్ప కవితా వస్తువు.

సముద్రం నాకు – పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా నాకు గొప్ప ఉత్సాహం కలుగుతుంది. కవితావేశం కలుగుతుంది. రాళ్లను వొరుసుకుంటూ మహా చైతన్యంతో కెరటాలు ముందుకు వస్తుంటే.. కాసిన్ని గవ్వలు వొడ్డుల వొడిలోకి చేరుతుంటే – ఆ అనుభూతిని సొంతం చేసుకోవటం నాకు మరిచిపోలేనిది.

గవ్వల్లో, శంఖాల్లో కూడా సముద్రమే. సముద్రపు ఘోషే ..

కవులు – సముద్రాన్ని ఆసరాగా చేసుకుని బతుకుతున్న శ్రమజీవులను, శ్రమ సౌంధర్యాత్మకతనూ కవిత్వం చేసారు. సహజ సిద్ధమైన వాళ్ల జీవన విధానం -భయాందోలనకు గురవుతున్నప్పుడు – ఎదురుతిరగడాన్ని ప్రవచించారు.

సముద్రం – ఉత్తరాంధ్రాకు గొప్ప వనరు. సముద్ర తీరప్రాంత ప్రజలు – ముఖ్యంగా మత్స్యకారులు సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వనరైనా ప్రజల ఉమ్మడి ఆస్తి. కానీ యిప్పుడు ఏ వనరును చూసినా వొకే వ్యక్తికి ధారాదత్తమౌతున్న స్థితి.
సముద్రం మీద పెట్టుబడిశక్తులు కన్నేసినప్పుడు.. ఆర్థిక సంస్కరణల మాయా ముసుగు పొర కమ్మేసినప్పుడు..  ప్రజల జీవన స్థితి ధ్వంసమైనప్పుడు – ఒకరిద్దరు వర్తమాన ఉత్తరాంధ్రా కవులెలా స్పందించారన్నది ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

సిరికి స్వామి నాయుడు

సిరికి స్వామి నాయుడు

‘మంటిదివ్వ’ కవితాసంపుటితో ఉత్తరాంధ్రా మట్టిపరిమళపు కవిత్వ సొబగును ప్రపంచానికి తేటపరిచిన  కవి – సిరికి స్వామినాయుడు –

‘ యీ సముద్ర గర్భాన చేపపిల్లలై ఈదులాడుతున్న వాళ్లు
పోటెత్తిన తరంగాల మీద పురుడోసుకున్న వాళ్లు
అలల పయ్యాడ కొంగుపట్టి ఉయ్యాలలూగినవాళ్లు
తీరాన్ని తలకెత్తుకుని……… సాగరగీతమైన వాళ్లు ‘

అని.. వాళ్ల సహజమైన జీవన విధానాన్ని కవితామయం చేస్తారు. సముద్రాన్ని తల్లిగా భావించి, అలలను పయ్యాడ ఉయ్యాలగా చేసుకుని.. నిష్కల్మసంగా బతుకుతూ  బతుకు జీవన పోరాటంలో వాళ్లు తీరాన్ని తలకెత్తుకుని సాగరగీతమవుతుంటారు-
అని అంటారు.

మరో ఉత్తరాంధ్రా కవి-  ఇటీవలనే ‘అస్తిత్వం వైపు’ కవిత్వ సంపుటితో ముందుకొచ్చిన- పాయల మురళీకృష్ణ ‘రేపటి సూర్యోదయానికి ముందు..’ కవితలో… మత్స్యకారులు వేటకి దిగినప్పుడు జరిగే కోలాహలాన్ని కవిత్వం చేస్తూ..

‘ తెప్పల మీదకు చేరిన వలలన్నీ
నడి సముద్రంలో
నడి రాత్రి కూడా చైతన్యాన్ని రెక్కలుగా తగిలించుకుని
ఎంతో విలువైన జల పుష్పాలనందిస్తుంటే
అక్కడెక్కడో అతని హస్త నైపుణ్యం
ఎన్నెన్నో గర్భ గోళాల మీద
పరోక్షంగా తన సంతకాన్ని ముద్రించుకునేది ‘

వొక మత్స్యకార సృజనశీలిని కేంద్రబిందువుని చేస్తారు. యిక్కడ వొక సంఘటనను వొకే దృశ్యశకలంగా కవిత్వం చేయడం గుర్తించొచ్చు.

యీ యిద్దరు ఉత్తరాంధ్రా కవులూ మత్స్యకారుల జీవన పరిశ్రమను వొకింత ప్రేమతో, వొకింత ఆర్తితో కవిత్వం చేసారు.

‘ పుట్టెడు ఆశతో వెళ్లిన తెప్పలన్నీ
కలుషిత జలదేవత విదిల్చిన
అనంతమైన శూన్యాన్ని ఎత్తుకొస్తుంటే
సమస్తాన్నీ కోల్పోయిన
బెస్త బతుకులు పస్తు బతుకులయ్యాయి ‘

– అని ‘మురళీకృష్ణ’ దుఃఖపడితే…..

‘ వాళ్లు కట్టుకున్న గుజ్జన గూళ్ల మీదా
నురగల పరవళ్ల తెల్లని చిరునవ్వుతీరం మీదా
ఓ రాకాసి నీడ కమ్మేసింది
తూరుపు సముద్రపు తరంగాల మీద
తుళ్లిపడే బంగారు బొచ్చెపరిగె సూరీడ్ని
రాహువేదో మింగేసింది’

– అని స్వామినాయుడు కలవరపడతారు.

యిద్దరూ తమ తమ కవితల్లో పోరాట అవసరాన్ని వ్యక్తం చేయడం సున్నితంగా గుర్తించొచ్చు.

‘రేపటి సూర్యోదయం
వాళ్లకు వాళ్ల అస్తిత్వాన్ని ప్రసాదించడమే చూడాల్సి వుంది’
ఇది మురళీకృష్ణ యిచ్చిన ముగింపు.

‘పల్లె వాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి కురిసే కన్నీళ్లు – సముద్రం
చందమామ-
వాళ్ల సామూహిక సమాధి మీద దీపం’
ఒక జీవిత దుఃఖాన్ని ముగింపుగా పలికించారు. లోలోపల అంతర్గతంగా
జ్వలితమౌతున్న కసే – నాకైతే ఈ ముగింపులో కనిపించింది.
దిగులు నుంచే దుఃఖం నుంచే పీడన నుంచే పోరాట పుష్పం విరుస్తుంది.

పైడిరాజు

పైడిరాజు

నేటి ఉత్తరాంధ్రా కవుల వారసత్త్వాన్ని అందుకుంటూ..  పద్నాలగేళ్ల కవి- ఎస్. పైడిరాజు ‘నీళ్లు’ కవితలో ఏమంటున్నాడో చూడండి.

‘విశాలంగా
విన్నూత్నంగా వున్న ఆ నీళ్లలో
జలకాలాడేం వొకప్పుడు..
మరి యిప్పుడో
ఆ నీటి వొడ్డుకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాం
ఆ నీరు అనేక ఫ్యాక్టరీలకు ఆధారమయ్యింది

కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్లు విశ్వాసం మరిచారు’

వొక  స్పృహని కల్గి వుండడమంటే బహుశా యిదే అనొచ్చు. వర్తమాన సామాజిక స్థితిని అర్థం చేసుకొని కవిత్వం చేయడంలో రేపటి మలితరం సిద్ధంగా తయారౌతుందనడానికి యిదొక రుజువు. మొత్తానికి కవిత్వం ప్రజల కోసం- అనే విషయాన్ని ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న కవిత్వంలాగానే ఉత్తరాంధ్రా కవిత్వమూ నిరూపిస్తుంది.

బాలసుధాకర్ మౌళి

మట్టి మీది గట్టి నమ్మకం: మంటిదివ్వ

 

    ఏకాలానికి ఆ కాలం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. కవిత్వమవ్వొచ్చు. కథవ్వొచ్చు. మనిషి జీవితాన్ని  ఉన్నతీకరించడానికి దోహదపడేవి – ముఖ్యంగా తక్షణమే వొక సంఘటనకు లేదా వొక దృశ్యానికి గొప్ప స్పందనగా వెలువడేది కవిత్వం మాత్రమే. కాలాన్ని పట్టి యిచ్చే మేలిమి మెరుపులాంటి అద్దం కవిత్వమని నిరూపించుకుంది. చరిత్రను కళగా ప్రకటించే అత్యద్భుతమైన కర్తవ్యాన్ని కవిత్వం నెరవేరుస్తుంది. ఈనాటి సంక్లిష్ట వర్తమాన ప్రపంచ నేపథ్యంలో నుంచి – కవిత్వం – మనిషి వ్యక్తిత్వాన్ని -తద్వారా – సామాజిక పరిణామశీలతను గొప్ప సాంస్కృతిక దృష్టితో ప్రభావితం చేయడం జరుగుతుంది.

యిప్పుడు కవిత్వాన్ని నిర్వచించడానికి కూడా అద్భుతమైన దశ వచ్చింది. వర్తమాన సామాజిక సాంస్కృతిక స్థితిగతులు – మంచి కవిత్వం రావడానికి ప్రేరణోపకరణాలుగా వున్నాయి. కవిత్వమిపుడు – దుఃఖమవుతుంది. దుఃఖంలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమమవుతుంది. యుద్ధమవుతుంది. సామూహిక ఆగ్రహంలోంచి జనించే కరుణవుతుంది.

సకలం ధ్వంసమవుతున్న వర్తమానం – చీకటి ఊడలు భయంకరంగా అల్లుకున్న భవిష్యత్తు – కళ్ల ముందు యివే తప్ప యింకోటి కనిపించని – ఈ స్థితిలో – కవిత్వం మరింత శక్తిని కూడగట్టుకోవాల్సిన అవసరం వుంది. కవిత్వం అత్యంత అవసరమైన – ప్రాణభూతమైన – వొక సృజనకారుని చూపు.

కవులు ఆ చూపుని పోగొట్టుకోకూడదు.

కవిత్వం – సమస్యను మూలాల నుంచి చర్చించి వదిలేయడమే కాదు. సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన పరమోత్కృష్టమైన బాధ్యత దానిది.

కవికి – సామాజిక చలనాన్ని సరైన దృష్టితో పరీక్షించి… సమీకృతం చేసి – వొక దగ్గరకు చేర్చాల్సిన ఉత్కృష్టమైన ధర్మం వుంది. అలా సామాజిక చలనాన్ని రికార్డ్ చేసిన కవితా సంపుటి – ‘మంటిదివ్వ’. కవి – సిరికి స్వామినాయుడు. నేపథ్యం – ఉత్తరాంధ్రా.

siriki1

స్వామినాయుడుని గానీ, మిగతా ఉత్తరాంధ్రా కవులను గానీ చదివిన వాళ్లకిది అర్థమవుతుందనుకుంటాను – నాలుగైదేళ్లుగా ఉత్తరాంధ్రాలో జరుగుతున్న కల్లోలం సంగతి – దాని రాక్షస రూపం సంగతి – ప్రజల జీవన కాంక్షపై అది మోపిన ఉక్కుపాదాల సంగతి – సరిగ్గా అక్కడే సిరికి స్వామినాయుడు కవిత్వఖడ్గాన్ని చేతబూని యుద్ధవీరుడిలా కనిపిస్తాడు..

‘మంటిదివ్వ’ చదివాక – వొకసారి కాదు – మళ్లీ మళ్లీ చదివాక – ఉత్తరాంధ్రా దుఃఖపు స్థితి కళ్ల ముందు నెత్తుటి చారికలా మిగిలిపోతుంది. దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా యించుమించు యిదే స్థితి. యివే గాయాలు. ఆ గాయాల నెత్తురును తుడిచే మృదుహస్తమే కవిత్వం . గాయపడిన వాళ్ల వెన్నంటి వుండి ధైర్యాన్ని యిచ్చే ఖడ్గమే కవిత్వం. ‘మంటిదివ్వ’ – అలాంటి బరోసాను యిస్తుంది.

స్వామినాయుడు అంటాడు –

ఈ మట్టిపొరల్ని కొల్లగొట్టే
ఒకానొక ఉత్పాతాన్నెవడు కోరుకుంటాడు ?
భూమిని చాపలా చుట్టుకుపోయే
హిరణ్యాక్షుడు తప్ప !
మళ్లీ నేల మీద వాలే చోటు లేక మరణం వేపు సాగే
కష్టజీవుల కన్నీటి విషాదాన్నెవడు కలగంటాడు ?
తునాతునకలైన బతుకు శకలాన్ని
కాసుల కాటాలో తూనిక పట్టేవాడు తప్ప !
( కంచే చేను మేస్తే.. ! )

రహస్యాన్ని శోధించేవాడే కవి. సమస్త అంశాలను మార్కెటైజ్ చేస్తున్న అభివృద్ధి విధానాల ముసుగు వ్యవహారాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు నిలబెట్టేవాడే నిజమైన ప్రజావాది. ఈ కవి – ఆ పనే చేసాడు.

‘మంట’, ‘తూరుపు ఒక నెత్తుటి పొద్దు’ – ఈ రెండూ.. కళింగాంధ్రాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నేపథ్యంలో రాసినవి. ప్రజల అభీష్టమేదైతే వుందో దానినే వ్యక్తం చేసాయి ఈ కవితలు. కాలమే కవిని, కవిత్వాన్ని తయారీచేస్తుంది. అవును. ఈ కవి గానీ, ఈయన రాసిన కవిత్వం గానీ కాలం గర్భకుహరం నుంచి – వేదన నుంచి – తన ప్రజల మీద తనకు గల వొకానొక గొప్ప ప్రేమ నుంచి జనించిన భౌతిక పదార్థాంశాలే. ప్రజల సామూహిక ఆస్తిని వొక్కరే వొచ్చి నొల్లుకుపోతుంటే ఆగ్రహించాడు ( ‘కళ్లం’ కవిత ). ‘పొద్దు’ లాంటి కవితల ద్వారా తిరుగుబాటును ప్రవచించాడు. ఫ్యాక్టరీలు సృష్టిస్తున్న కాలుష్యానికి మత్స్యకారులు నానా అవస్థలు పడుతుంటే వాళ్లతో పాటూ దుఃఖించాడు.
అందుకే..

పల్లెవాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి
కురిసే కన్నీళ్లు – సముద్రం !
చందమామ – వాళ్ల సామూహిక సమాధి మీద దీపం !!
( సముద్రం మీద చందమామ )
అన్నాడు.

siriki
అడవిని గురించి – అడవి ఆసరాగా నూతన సామాజిక ప్రజాతంత్ర వ్యవస్థ కోసం పని చేస్తున్న ‘ఎర్రమందారాల’ త్యాగాల గురించి – సానుభూతితో రాసాడు. భూమి అంగడి సరుకవ్వడాన్ని చింతించాడు. పల్లెల్లో అశ్లీల నృత్యాలనుఒప్పుకోలేదు.

కవి సమాజానికి కన్నులాంటివాడు. కాపలాదారుడు. వెలుగుబావుటా. ‘మంటిదివ్వ’తో ప్రజలకు గొప్ప ప్రామిస్ చేసిన కవి – స్వామినాయుడు మరింత గొప్ప కవిత్వం సృజించాలని కోరతున్నాను.

    ( 09.02.2014 తేదీన – సిరిసిల్లలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ స్వీకరించబోతున్న సందర్భంగా…..  )

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

అలల చేతివేళ్లతో..

sudhakar

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
ఆకాశం చిన్నబోతుంది
ఆకాశాన్ని అల్లి
లోకం మీద పరిచిన సృజనకారుడెవరో..

ఆకాశమొక పిట్టగూడు

ఏ పురాతన ఆదిమజాతి
మానవుడో
శరీరమ్మీద ఆచ్ఛాదన లేని దశలో
ఆకాశాన్ని వస్త్రంగా నేసి ధరించి ఉంటాడు
పచ్చని చెట్లు
శరీరమ్మీద మొలిచిన తర్వాత
ఆకాశాన్ని..
లోకమ్మీదకు విసిరేసుంటాడు

sky2

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
సూరీడు చిన్నబోతాడు
ఆ చేతివేళ్ల కిరణ సముదాయం-
ఎన్నెన్ని పద్మవ్యూహాల చిక్కుదారులను ఛేదించి
బయటపడే మార్గానికై అన్వేషిస్తుందో..

ఆ అలల చేతి చూపుడు వ్రేణి
కొనగోటిపై
ఎక్కడ నుంచో వచ్చి వాలిన
పేరు తెలియని పక్షి
రెక్కలల్లార్చుతూ కనిపిస్తుంటుంది
పక్షి కన్నుల్లో ఏకాగ్రత
అతని సొంతం
కళ్లు ‘చిగుర్ల’ను పొదుగుతాయి
అన్వేషణే పరమావధిగా భావించే
ఆ చేతివేళ్లు
వృక్షాలౌతాయి

ఆ చేతివేళ్ల వృక్ష సముచ్ఛయాలపై చిగుర్చిన
చిగురుకళ్లకు –
ఒక్కో గూడు ఒక్కో దేశంగా
ఒక్కో దేశం ఒక్కో అరణ్యంగా
కనిపిస్తుంది

దేశ దేశాల గూళ్లనూ
గూళ్లలో ఆకాశాలనూ నేసిన
ఆ చేతివేళ్లు
తన గూటిపై పరుచుకున్న చిరుగుల ఆకాశాన్ని
సరిచేసుకోవాలంటే..

ఇంకెన్నెన్ని ఉదయాలను కలగనాలో..

– బాల సుధాకర్ మౌళి

వొక కొండపిల్ల

sudhakar

విజయనగరం జిల్లాలోని ” పోరాం’ గ్రామంలో జూన్ 22, 1986లో పుట్టారు బాలసుధాకర్ మౌళి. ఇప్పటి వరకు నాలుగు కథలు రాశారు. కవిత్వంలోనూ ప్రవేశం ఉంది. మొదటి కథ “థింసా దారిలో’ 2011లో సాహిత్య ప్రస్థానంలో ప్రచురితమైంది. ఈయన కథ “గొంతెండిపోతోంది’  హిందీలోకి అనువాదమైంది. రాశికన్నా వాసి ముఖ్యమనే ఈ రచయిత బడుగు, బలహీన వర్గాల తరపున నిలబడి మాట్లాడతాడు.

వేంపల్లెషరీఫ్

 

 

1

పార్వతి..
కొండకు కొత్తందం వచ్చినట్టుండే నీలికళ్ల కొండ పిల్ల ‘పార్వతి’. పచ్చని చెట్లను ప్రేమతో అల్లుకున్న సన్నటి తీగలా, తీగె  పవిటంచుకు పూసిన ఎర్రటి పువ్వులా.. అడవి అడవినంతా గుండెల్లో నింపుకున్న కోయపిల్ల పార్వతి.

అడవి నెత్తురంతా థింసా రంగే..
అలాంటిది- అడవికే థింసాని నేర్పే వసంతోత్సవ నాట్యకారిణి పార్వతి.

నెత్తి మీద సూర్యున్ని అలంకరించుకుని కిందకు దిగుతున్న వనకన్యలా.. పార్వతి నడుస్తోంది. కాలిమువ్వల సవ్వడి లయాత్మకంగా చుట్టూ ధ్వనిస్తోంది.
ఆమె నడుస్తున్న దారంతా ‘కొండపూల సుగంధం’. మొక్కా మొక్కా, పువ్వూ పువ్వూ-
ఆమె వెళ్లిన వేపే చూస్తూ.. దిగులు పడుతూ.. పార్వతి పునరాగమనానికై రేపటిని కాంక్షిస్తూ……

సంధ్యా కాంతి- చల్లని గాలిని వెంటేసుకుని కొండ దిగువకు ప్రసరిస్తుంది.
పార్వతి నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరిగి.. అడవిని ఆప్యాయంగా చూసుకుంది.

ఇప్పుడిప్పుడే బతుకు రహస్యాలను గ్రహిస్తున్న పార్వతి నడకలో- గొప్ప జీవితేచ్ఛ తొణికిసలాడుతుంది.

2

పార్వతికి పదహారేళ్లు.
అమ్మలేని పార్వతి- కొండ కొంగు పట్టుకుని అడవంతా పిల్లకోడిలా కలియతిరుగుతుంది.

కొండ మీద పుట్టే ప్రతీ ప్రాణి.. పార్వతికి పరిచయమే. గూళ్లల్లో నుంచి గువ్వపిల్లలను చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెడుతుంది.
తుప్పల్లో ముడుచుకు కూచున్న కుందేటి కూనల్ని పట్టుకుని శరీరంపై మృధువుగా నిమురుతుంది. లేళ్లతో పాటూ గంతులేస్తుంది. అడవి మేకల ఆలన తీరుస్తుంది.
పామన్నా.. పురుగన్నా… ఏ మాత్రం భయపడదు పార్వతి.
పార్వతికి- కొండ మీద అమ్మ మీద ఉన్నంత ప్రేమ.
కొండంటే.. పార్వతికి అమ్మే.

కొండ పాదాల చెంత పార్వతి ‘గుడిసె’.
గుడిసె ముందు జామచెట్టు.
చెట్టు నీడలో అమ్మ ‘లచిక’ సమాధి.
సమాధిపైన.. చెట్టు కొమ్మకు వేలాడుతూ ‘ఊయల’.
రోజూ చీకటి పడే వేళ- లచిక వచ్చి ఊయల ఊగుతుందని అమ్మమ్మ ‘మరియమ్మ’ నమ్మిక. ఎప్పుడైనా పార్వతి ఊయలలో ఊగుతుంటే.. అలా ముచ్చటగా కళ్లార్పకుండా చూస్తూనే వుంటుంది ‘మరియమ్మ’.

పార్వతి రావడం- మరియమ్మ చూసింది.

”పారోతి.. ఎలిపొచ్చినవమ్మా.. తల్లీ… కొండకు పొద్దుచ్చినేళ ఎల్లినవు… సీకటి పడ్డంక వొచ్చినవా…. పామూ పురుగూ కరుత్తదన్నా యినవే.. నా సిట్టి తల్లి…….. అడవిల పడ్డ పద్దినాలకే నిన్ను నా సేతిల ఎట్టి
ఎల్లిపోనాది గదే మీ అమ్మ….. దాన్నని యిప్పుడేటిలే.. అదా గూటిలో గంటిజావ.. తాంగి తొంగో… పెటకన జాంకాయ మర్సిపోకు……………..”

పార్వతి- అమ్మమ్మ ఉంచిన గంటిజావ తిని.. ఏరుకొచ్చిన కొండరేగు పళ్లు నంజుకుని… ఆరుబయట అమ్మమ్మ పక్కనే.. చుక్కల్ని లెక్కపెడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

Picture 059

3

తెల్లారింది.
కొండ గుమ్మం- పసుపు రాసినట్టు ధగధగా మెరిసిపోతుంది. ఎక్కడ నుంచి వచ్చిందో.. జామచెట్టు కొమ్మపైన కూర్చున్న ‘ఎర్రముక్కు పిట్ట’ కమ్మగా కూస్తుంది.
అడవిలో- రోజూ పార్వతి వినే కూతే అది. సంబరపడింది.
”యే.. ఎర్రముక్కు పిట్టా! అడవికి రమ్మని పిలుపుకొచ్చినవటే.. పార్వతి రాకపోతే అడవి మాడిపోదూ.. పువ్వూ పిందే రాలిపోవూ… చిలకలు అలకపూనవూ…………!”
పార్వతి మాటలను అర్థం చేసుకున్నట్టుంది- ‘ఎర్రముక్కు పిట్ట’ తుర్రున ఎగిరిపోయింది. అడవంతటికీ పార్వతి మెళకువ గురించి కబురందించాలనుకుందేమో……….

గుడిసె ముందు- అడవి కోళ్లకు ‘గంటిలు’ వేస్తూ… పెంచుకుంటున్న కుందేలు పిల్లని గంప కింద నుంచి చేతుల్లోకి తీసుకుని ముఖానికి ఆనించుకుని గారాము చేసింది.

అమ్మమ్మ ‘మరియమ్మ’- పార్వతిని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుంది.
గతంలో జరిగిన సంఘటలన్నీ- మరియమ్మకు రోజూ జ్ఞాపకానికొస్తూనే ఉంటాయి.

‘పారొతి అమ్మకి పదనాలుగో ఈడుకే లగ్గమయింది. దీనికి పదేడేళొత్తున్నయి.. ఈ మాగమాసానికి.. ఈ ఈడుకొ అయ్య సేతిల ఎట్టాల…. దీనికా బాగ్గిం నేదు. తల్లీ నేదు. తండ్రీ నేడు. నాను సూత్తే ముసిలి ముండని……..’
‘లచికను- పారొతి తండ్రి మోసం సేసాడు. కొండ దిగువూరినించొచ్చి.. కొండోలతో సేయం నటించి.. కొండోల కట్టమంతా దోసుకునీవోడు. ఎదిగిన లచికను సూసి.. పేమించానని.. పేణమని సెప్పి లగ్గమాడాడు. లచికకు కడుపొచ్చాక సల్లగ జారుకుని ఎలిపోనాడు. మళ్లా పికరనేదు…………….’
గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్లు తుడుచుకుంది.

జ్ఞాపకాల దొంతరల నుంచి బయటకొచ్చి…..
”అమ్మా… పారొతి.. పిట్టలకు మేత ఏత్తున్నవటే తల్లీ…. ”
పార్వతి దగ్గరకొచ్చి తలని గుండెలకు ఆనించుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుంది.

అమ్మ గుండెల మీద- బెంగా భీతీ లేకుండా తలవాల్చుకోవాల్సిన పార్వతి.. అమ్మమ్మ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది.

పార్వతికి- తండ్రి గురించిన విషయాలేవీ తెలియకుండా పెంచింది మరియమ్మ. ‘తండ్రి వలనే తల్లి చనిపోయిందని’ మాత్రం పార్వతికి తెలుసు.
కానీ ఊరిలో ఆ నోటా ఈ నోటా విన్న మాటలని బట్టి… యిప్పుడిప్పుడే ‘తల్లి ఎందుకు చనిపోయిందో…’  అర్థమౌతుంది పార్వతికి.

దిగువ ఊర్ల గురించీ.. ఆ మనుషుల గురించీ.. వాళ్ల ‘మాయా-మర్మం’ గురించీ తెలుసుకుంటుంది. అందుకే పార్వతికి దిగువ ఊర్లన్నా.. ఆ మనుషులన్నా భయం.

ఎప్పుడైనా గుడిసెకు ఎవరన్నా కొత్తవాళ్లు వస్తే.. బిగుసుకుని.. గుడిసె లోపలికెలిపోతుంది. ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడదు. బయటకు చెప్పుకోలేని బాధ.. పార్వతిని చుట్టు ముడుతుంది.       ఎలాంటి బాధలోనైనా పార్వతికి ఉపశమనం- ‘థింసా’నే. పార్వతికి ‘థింసా’ అంటే ప్రాణంతో సమానం. తల్లి ‘లచిక’ కూడా ఆ కొండ చుట్టు పక్కల ఊర్లలో మంచి ‘థింసా’ నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ‘కళ’ను కొనసాగించాలని పార్వతి ఆశ.
ఆడా మగా- చేయి చేయి కలుపుకుని.. ఒకరినొకరు అనుసరిస్తూ… తుడుం దరువులకి అనుగుణంగా కాళ్లను లయబద్ధంగా కదపడమంటే…. పార్వతికి ఎక్కడలేని ఉత్సాహం. పార్వతి ‘థింసా’ని చూసిన.. ఆ ‘ఊరి’ స్త్రీలు పార్వతిని- వాళ్ల అమ్మతో పోల్చుతుంటారు. అలాంటప్పుడు పార్వతి గుండె తడవుతుంది. ఇంకా ఇంకా
బాగా నర్తించాలని పట్టుదల పెరుగుతుంది.

4

‘పండగ రోజులు’ దగ్గర పడుతున్నాయి.
కొండ ఊరిలో ‘ఆనందం’ తాండవిస్తుంది.
మగవాళ్లు, నడి వయసు ఆడవాళ్లూ.. దిగువ ఊర్లకెళ్లి… కట్టెలు, బొగ్గులు, చింతపండు, సీతఫలాలు అమ్మి.. పప్పు, నూనె, కొత్తబట్టలు కొనుక్కొని కొండకు తిరిగి వస్తున్నారు.
తుడుంలు, డప్పులు, పినలగర్రలు- సవరించుకుంటున్నారు.

కొండ ఊరికి పండగంటే.. ఇప్పుడు- ‘దిగువ ఊర్ల పండగే’.
కొండోల కందికొత్తల పండగ, విత్తనాల పండగ ఇవన్నీ.. కొత్తతరాలకు అనుభవంలో లేవు. వాళ్లకు పండగంటే సంక్రాంతి, కనుమలే.
కొండ ఊరివాళ్లు.. పండగ పూట- దిగువ ఊర్లకెళ్లి థింసా చేస్తారు. ఐదారు ఊర్ల నుంచి పిండివంటలు, బియ్యంలాంటివి కొండకు తీసుకుని వస్తారు. ప్రతీ ఏటా పండగప్పుడు దిగువకు వెళ్లడం.. కొండవాళ్లకు రివాజుగా మారిపోయింది.
ఎప్పుడూ వెళ్లడం వేరు. పండగ పూట వెళ్లడం వేరు. పండగ రోజుల్లో వాళ్లకు ‘థింసా..’ జీవితాధారంగా కూడా మారిపోయింది.

థింసా- కొండ గుండెల్లో ప్రవహించే ‘జీననది’.
తరతరాలుగా గిరిపుత్రుల సంస్కృతిని మోస్తున్న ‘అడవి తల్లి గుండె లయ’.

dhimsa_dance

పార్వతికి- థింసా అంటే ప్రాణం. కొండ ఒడిలో పుట్టి నడక నేర్చినప్పటి  నుంచి ‘థింసా’నే చూస్తుంది. థింసాలోనే సేదతీరుతుంది. ‘కొండా-థింసా’ పార్వతికి రెండు కళ్లు.
థింసా కోసం- దిగువ ఊర్ల మీద ఉన్న అయిష్టతను పక్కన పెట్టి.. పండగ రోజు- దిగువకు తన వాళ్లతో పాటూ వెళ్లింది.
కనుమకూ, ముక్కనుమకూ రెండు రోజులూ ‘థింసా’ ఆడింది.
తర్వాత- అందరూ తిరిగి కొండకు వచ్చేసారు.

పార్వతికి ఉబుసుపోలేదు. ‘థింసా’ ఇచ్చిన మత్తును మరిచిపోలేకపోతుంది. తుడుంలు, డప్పులు, పినలగర్రలు మధ్య ఆడిన కాళ్లను, చేతులను పదేపది చూసుకుంది. ఆ వాయిద్యపరికరాలన్నీ.. యిప్పుడు మూలకు చేరాయి.

థింసా- కేవలం ‘ఆకలి తీర్చే ఆట’గానే మారిందని పార్వతికి బెంగ.       పండగలోనో, జాతరలోనో మాత్రమే కనిపించే.. ‘థింసా’ స్థితికి- పార్వతికి గుండె కోసేసినంత దుఃఖం.

ఒంటరిగా, నిశబ్దంగా- అడవిలోకి బయలుదేరింది పార్వతి. ఆకూ ఆకూ.. కొమ్మా కొమ్మా- పార్వతి రాకను గమనించి గూళ్లలోకి సందేశాన్ని పంపాయి. పక్షులన్నీ కిలకిలమని అరుస్తూ.. వచ్చి.. పార్వతిని పలకరించాయి.
లేళ్లూ, కుందేల్లూ- పార్వతికి ఎదురొచ్చాయి.
చెవులు రిక్కించి.. పార్వతి మాట కోసం- అలా చూస్తూనే ఉన్నాయి.

పార్వతి ఎవరితోనూ ఏ మాటా ఆడలేదు.
ఓ చెట్టు కింద మౌనంగా కూర్చుంది.
తన ఆలోచనల్లో- ‘అమ్మ, థింసా’ తప్ప ఇంకోటి లేదు.

5

కొన్ని రోజులు ఇలాగే స్తబ్దంగా గడిచాయి.

ఒక రోజు- కొండకు ‘దుర్వార్త’ వచ్చింది.
”కొండను బాంబులతో పేల్సి.. పెద్దపెద్ద బండలను పట్నం తీసికిలిపోతారట!  ఆటితో గొప్పగొప్ప భవంతులు, డేంలు కడతారట! కొండోల గుడిసిలన్నీ కూల్సిత్తారట! యెక్కడో దిగువున వుండడానికి కుసింత జాగవ సూపెడతారట! పని కూడా సూపెడతారట…………….!”
కొండంతా- ఈ వార్త దావానలంలా పాకింది. కొండోల్లంతా ఒకరి ముఖాల్నొకరు చూసుకున్నారు. కొందరు బిక్కచచ్చినట్టు ఊరుకున్నారు. కొందరు గుండెలు బాదుకున్నారు. కొందరు ధైర్యం చేసి.. ఈ వార్త నిజమో! కాదో! తెలుసుకోవడానికి దిగువకు వెళదామనుకున్నారు. వెళ్లారు.
‘అంతా నిజమేనని…. ‘ వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు.

కొండోలు అల్లాడిపోయారు.
‘ఎప్పుడు కొండను పేల్చేస్తారో……’ అని గుండెని రాయి చేసుకుని.. క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆ ‘చెడ్డ రోజు’ రానే వచ్చింది.
కొండోళ్ల ప్రమేయం లేకుండా గుడిసెలన్నింటినీ ప్రొక్లెయినర్లతో దౌర్జన్యంగా తీసేసారు.  పెద్ద పెద్ద లారీలు, లారీలతో రకరకాల మిషన్ల్, ఎక్కడెక్కడి నుంచో.. రోజు రోజుకీ.. ట్రాక్టర్లతో కూలీలు. అంతా గోల గోల.

కొండ ముందు- ‘నాగర్జునా క్వారీ వర్క్స్’ బోర్డు పడింది. క్వారీ పనులు ప్రారంభమయ్యాయి.
రోజూ- ఎ.సి కార్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో నుంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. కూలోళ్ల చెమటతో లేచిన ఎ.సి రూముల్లోకి వెళ్లి సేదతీరుతున్నారు.
బయట ఎండనక, వాననక కూలీలు- ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తున్నారు.

బాంబులతో కొండ దద్దరిల్లిపోతుంది.
మిషన్లతో- చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా పెద్ద పెద్ద బండలను కోసి.. పెద్ద పెద్ద లారీల మీదకెక్కించి పట్నం తీసుకెళిపోతున్నారు.
పనంతా- వాళ్లు అనుకున్న లెక్క ప్రకారం జరుగుతుంది.
కొండోళ్లంతా చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారు. కలివిడిగా వొక చోట బతికిన వాళ్లందరూ ఉన్నట్టుండి అదృశ్యపోయారు.
ఒకటీ, అరా కొండోళ్లు మాత్రం- వాళ్ల దయాదాక్షిణ్యాలతో ఎ.సి. గదులకు దూరంగా పాకలు వేసుకున్నారు. వొకరిద్దర్ని పనిలోకి తీసుకున్నారు. కొండ దిగువ ఊర్ల వాళ్లను కూడా చాలా తక్కువ మందిని.. అదీ చిన్నాచితక పనుల్లోకే తీసుకున్నారు.

‘మరియమ్మ, పార్వతి’ని కూడా అక్కడే పాకల్లో ఉండడానికి అనుమతిచ్చారు.
ఇన్నాళ్లూ అండగా ఉన్న కొండ స్వరూపం ఒక్కసారిగా మారిపోవడంతో.. వాళ్లకిదంతా అయోమయంగా అనిపించింది. చూస్తుండగానే రోజు రోజుకీ కొండ తరిగిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు పుడుతున్నాయి.
బాంబుల శబ్దానికి పక్షులన్నీ- ఎటో ఎగిరిపోయాయి. కుందేళ్లూ, నెమళ్లూ- క్వారీ యజమానుల ఆకలికి  బలైపోతున్నాయి.

మరియమ్మ, పార్వతి కొండ దగ్గరే.. శిథిలమౌతున్న కొండ దగ్గరే… కాలాన్ని ఈడుస్తూ- కొండ ఔన్నత్యాన్ని తలచుకుంటూ.. దుఃఖించి, దుఃఖించి చివరకు వాళ్లు ఏడ్వడమే మరిచిపోయారు.

కొండల్లో- పార్వతి తిరుగాడిన ప్రదేశాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
పార్వతి తల్లి ‘లచిక’ సమాధి- ఎక్కడుందో ఆనవాలు కూడా కనిపించట్లేదు. పలకబారిన పళ్లతో గుమగుమలాడే జామచెట్టూ అదృశ్యమైపోయింది. తెల్లారితే పలకరించే ‘ఎర్రముక్కు పిట్టా’ కనిపించలేదు.

థింసా?!
బాంబుల శబ్దానికి, సుత్తి దెబ్బలకు- కుంటి కాళ్లతో ఎక్కడ.. ఏ రాతిపొరల మధ్యన మరణవేదన పడుతుందో!
థింసా నాట్యకారిణి ‘పార్వతి’- యిప్పుడు ఏ ప్రత్యేకతలు లేని రోజు కూలీ.
మరియమ్మ- గతం జ్ఞాపకాలను వర్తమాన విషాదంతో నెమరువేసుకుంటూ.. భవిష్యత్తుని ఎంత మాత్రం కలగనని వొక పరాజిత. కాలం తనను వెళ్లదీస్తుందో! తనే కాలాన్ని వెళ్లదీస్తుందో!

పార్వతి వొక్కర్తే- యిప్పుడు ఇంటికి ఆదరువు.
చిన్న చిన్న రాళ్లను గమెన్లతో ఎత్తడం, క్వారీ పనోళ్ల వంటకు నీళ్లు పట్టడం- పార్వతి పని.

6

రోజులు గడుస్తున్నాయి.

వొక రోజు చీకటి పడిన వేళ-
ఎప్పటి నుంచి అదును కోసం ఎదురుచూస్తున్నాడో… ‘సూపర్ వైజర్- ప్రసాద్’ పార్వతిని అడ్డగించాడు. పట్నం నుంచి నెల రోజుల కిందటే క్వారీలో జాయిన్ అయ్యాడు. బతిమాలి, బుజ్జగించి, ధైర్యం చెప్పి, మాయ మాట్లాడి, పెళ్లి చేసుకుంటానని….. కోరిక తీర్చుకున్నాడు.
కొండని, థింసాని, అమ్మని కోల్పోయిన పార్వతి- అతనిని నమ్మింది. కొన్నాళ్లు కాపురం చేసాడు. ఫలితంగా గర్భం దాల్చింది.

ఉన్నట్టుండి- ఒంట్లో ఏ జబ్బూ లేకుండానే.. అమ్మమ్మ చనిపోయింది.
పార్వతికి తెలిసినంతలో ‘అమ్మమ్మ’ మరణమే తొలి మరణం.

దిగులు పడింది.
అమ్మమ్మ మరణానికి కారణం- ఆలోచిస్తున్న కొద్దీ పార్వతికి అర్థమవసాగింది.

కొన్ని రోజుల తర్వాత-
పట్నం పని మీద వెళ్తున్నానని చెప్పాడు ప్రసాద్. మళ్లీ తిరిగి రాలేదు.
క్వారీలో- తోటి ఉద్యోగస్తులనడిగితే తెలియదన్నారు. యజమానులు పార్వతిని పట్టించుకోలేదు.
పైగా.. ”నీలాటి ముండ అవసరం తీరింది.. యెల్లి పట్నంలో.. యే ముండ పక్కన తొంగుండో…..”

నోటికొచ్చిన మాటలన్నీ ఆడారు.
పార్వతికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. కానీ ఏమీ చేయలేని చేతకానితనం.

రోజులు గడుస్తున్నాయి.
పార్వతికి- తొమ్మిది నెలలు నిండాయి. కూలీల సాయంతో సంక్రాంతి రోజున- సూర్యుడు ఆకాశంలో పొడుస్తుండగా ‘ఆడబిడ్డ’ని కనింది.
అమ్మ లేదు. అమ్మమ్మా లేదు.
కొండా లేదు. ‘థింసా’ లేదు.
పార్వతి.. పురిటితల్లి పార్వతి.. వొంటరి ఆడది.

తన కన్నా ముందే.. మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ‘అమ్మ’ గుర్తొచ్చింది. ప్రతీసారి మోసపోతున్న తన జాతి గుర్తొచ్చింది. మా వాళ్లలా నేనూ మోసపోయాననుకుంది.

Picture 060

7

ఆ రోజు అర్థరాత్రి-

పార్వతి- వొంటిలో ఉన్న శక్తినంతటినీ కూడదీసుకుంది.
‘థింసా’ ఆడి ఆడి రాటుదేలిన కాళ్లు రెండింటినీ.. దగ్గరకు లాగి నిటారుగా నిలబడింది.
నేల మీద- అమాయకంగా నిద్రిస్తున్న పసికందుని పైకి తీసి, చీరతో వీపు వెనక్కి కట్టుకుని.. అడుగు ముందుకు వేసింది.  బయలుదేరింది.

అడవి లోపలకి లోపలికి ఇంకా లోపలికి.. లోపలి లోపలికి నడుస్తోంది.
నడుస్తోంది.
నడుస్తోంది.
బొడ్డులో వొక కత్తిని రహస్యంగా పెట్టుకుంది. దారిలో- మొదటి వేటుగా వొక ‘సింహాన్ని’ నరికింది. ఈసారి- బక్కాబడుగుజీవాల నెత్తురు తాగుతున్న ‘నరసింహాల్నే’ నరకాలనుకుంటుంది.

‘తన సంస్కృతిని- తన జాతిని రక్షించుకోవడమనే మహా సంకల్పంతో బయలుదేరిన ఓ వీరవనితా.. జయహో…. జయ జయహో………………….’
చీకట్లో- ఏ లోయల్నుంచో.. ఏ రాళ్ల అంతర్భాగాల నుంచో… పురాతనమైన, పరిచయమైన గొంతు వొకటి తెరలు తెరలుగా ప్రతిధ్వనిస్తోంది.

8

ఈ రోజు పార్వతి చూపు ‘అరణ్యం’ వైపు..
రేపు ?

– బాల సుధాకర్ మౌళి

కథాచిత్రాలు: ఎస్. గురుమూర్తి

నగ్నపాదాల కన్నీళ్లదే రంగు?

sudhakar

1

పాదాలను చూశావా
ముఖ్యంగా పసిపిల్లల పాదాలను
అలల్లా
అలల్లా కదులుతున్న లేత ఆకుల్లా
ముట్టుకుంటే రక్తం చిందేట్టు..

2

మరి వాళ్ళ పాదాలెందుకు పగుళ్ళు దేరి
నగ్నంగా
తీరని కలల్ని మోసుకు తిరుగుతూ

ఆకలి రథాన్నెక్కి
సరిహద్దులు దాటి సంచరిస్తున్న ఆ పాదాలను-
ఖండిత శిరస్సులుగా వేళాడుతున్న
ఆ నగ్నపాదాలను-
నువ్వు ఏ లేపనం పూసి ఓదార్చగలవు!

ఆ స్త్రీల పాదాలను చూశావా
సముద్రాల దుఃఖాన్ని తెరలు తెరలుగా
వెంటేసుకుని..
నిశబ్దాన్ని మోస్తున్న నల్లని ఆకాశంలా…

ఎడారి పొడితనాన్ని
నిబ్బరంగా ముద్దాడిన నిన్నటి ‘వజ్రపు పాదాలే’నా అవి!

ఇప్పుడిలా చతికిలబడుతూ
కాసింత దయనూ,జాలినీ కోరుకుంటూ..

మన తల్లుల పాదాలూ ఇంతే కదూ
చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకోరాదూ..

mandira1

3

పిడికెడు కూడు దొరకని ఈ దేశంలో
పరాయివాళ్లెవరో..
సొంతవాళ్లెవరో..
కడుపు నిండిన కుబేరుడే
దేశానికి తలగా వ్యవహరిస్తున్నప్పుడు-
ఆకలి కన్నీళ్ల విలువెంత?
కన్నీటి కెరటాల ముందు
జ్వలించే నేత్రాల్లా నిలబడి
ధైర్యాన్ని పిడికిళ్లలోకి ఎత్తుకుంటున్న వాళ్లెంతమంది?

ఆకలే ఈ దేశాన్ని పీడిస్తున్న
అతి పెద్దజబ్బు..

4

అందుకే..
స్పృశించు
పాదాలను స్పృశించు
సంచార మనుషుల హృదయక్షేత్రాల్లాంటి
తడి జ్ఞాపకాల్లాంటి
పాదముద్రల మీద
నీ తలనాన్చి
అనంతకాల సంవేదనను ఆలకించు

కనిపించే ప్రతీ నగ్నపాదానికి ఉయ్యాల కట్టి
ఊపిరితో జోలపాడు..
లేదూ-
పాదాలకు పోరాటాన్ని నేర్పుతానంటావా..?

(painting: Mandira Bhaduri)