ప్రధానమంత్రికి ప్రేమలేఖ!

 

images

ప్రధాన మంత్రి మోడీగారికి-

అయ్యా.. మీరు తీసుకున్న చర్య బహు బాగున్నది. మీ లాంటి ఉత్తములు ప్రధాన మంత్రి కావడం మాలాంటి నిజాయితీ పరులకు ఊతమిస్తోంది. ఊపిరి పోస్తోంది. సరిగ్గా ఆలోచించేవాళ్ళు వున్నారు సార్.. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్ళు వున్నారు సార్.. అందుకే మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, (మన వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ తెలీకుండా మాట్లాడుతున్నారు) అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చెయ్యండి.. ఏం ఫరవాలేదు. ఇలాగే నాల్రోజులు గోలగోల చేసి అలిసిపోయి ఆగిపోతారు. అలవాటైపోతారు. కాని సార్.. ముందుగా ముఖ్యంగా చెప్పేది.. ఆ కోర్టుల నోళ్ళు మూయించండి సార్.. ఏ దేశంలోనయినా న్యాయం ఆరాజ్య ఆకాంక్షలకు లోబడి కట్టుబడి వుండాలి కదా

సార్.. మన సుప్రీం కోర్టును చూడండి యెలాంటి వ్యాఖ్యలు చేస్తోందో.. ఇది చాలా తీవ్రమైన విషయమట! ప్రజలు క్యూల్లో నిలబడడం తీవ్ర సమస్యట! ప్రజలు ఉపశమనం కోసం కోర్టులకు వెళతారట! కేంద్ర నిర్ణయంతో ప్రజలు ప్రభావితం అయ్యారట! ప్రజలు ఆవేశంలో వున్నారట! దాడులు కూడా జరగొచ్చట! అల్లర్లు జరగొచ్చట! అవకాశాలు వున్నాయట! అంచేత కోర్టులకు యెక్కే అవకాశం యిస్తే ఉపశమనమట! సరే, ఒకవేళ ప్రజలు అలా వున్నా- వున్నారని అనొచ్చునా? రెచ్చగొట్టినట్టు అవదూ? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందా? ప్రజలకు లేనిపోని ఆలోచనలు అందిస్తోందా? ప్రజలను అల్లర్లకూ అలజడులకూ పురికొల్పుతోందా?

జీ.. మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, అవసరమయితే వందా యాభై యిరవై కాదు, పది నోట్లనీ రద్దు చెయ్యండి. నోట్లనేవే లేకుండా రద్దు చేయండి. దెబ్బకి దేశం లైన్లోకి వస్తుంది.. ఇప్పటికే వచ్చేసింది.. లైన్లోకి వచ్చి నిలబడింది.. ఎటియంల ముందు! ఫేస్ బుక్కుల్లో ఈ విషయాన్ని గర్వంగా పెడుతూవున్నారు. మనకు మద్దతునిస్తూవున్నారు. ఏటియంల ముందు నిల్చుంటే యేo? సినిమా టిక్కెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి చచ్చిన వాళ్ళు లేరా? రేషన్ కోసం క్యూ లైన్లలో కొట్టుకు చచ్చినవాళ్ళు లేరా? దేవుడి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడినవాళ్ళు లేరా? కరెంటు బిల్లులూ వాటరు బిల్లులూ కట్టడానికి క్యూ లైన్లలో అఘోరించినవాళ్ళు లేరా? రైలు రిజర్వేషన్లకి క్యూ లైన్లలో రేయింబవళ్ళూ కాచినవాళ్ళు లేరా? పిల్లలకి చదువుకోసం సీట్లకోసం క్యూ లైన్లలో కునుకుపాట్లు పడుతున్నవాళ్ళు లేరా? ఈసేవా మీసేవా అని సేవలు అందుకోవడానికి క్యూ లైన్లలో కుదురుగా వున్నవాళ్ళు లేరా? ఫోను చేస్తే కూడా యూ ఆర్ యిన్ క్యూ- అంటారే.. జీవితమంతా క్యూ లైన్లలోనే బతికి చచ్చిన వాళ్ళకి క్యూలోనే వుండడం కొత్తా కాదు. కష్టమూ కాదు. అందరూ లైన్లలోనే వున్నారు. దేశమొక్కటే లైన్లో లేదు. మీరు లైన్లో పెడుతున్నారు. పెట్టండి. మేమంతా అచ్చాదిన్ కోసం యెదురు చూస్తున్నాము. అచ్చాదిన్ రావాలంటే కొందరికి చచ్చేదిన్ తప్పదు. చచ్చాదిన్ రుచి చూసినప్పుడే అచ్చాదిన్ కు విలువ. మీ విలువ మాకు తెలుసు!

మీరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లోకం ఆ శ్రీరామచంద్రుడినే- భార్యని అడవిలో నిండు చూలాలిగా వదిలిపెట్టాడని, వాలిని చెట్టుచాటు నుండి యెన్కౌంటరు చేసాడని- యెన్నో విధాల నిందించింది. ఆ రాముణ్ణి నమ్ముకున్న పార్టీ మీది. ఆ పార్టీకి సారధి మీరు. మీకు నిందలు రాకపోతే ఆశ్చర్యపోవాలి గాని వస్తే ఆశ్చర్యపోయేది యేమీ లేదు. అయినా మీకు నిందలు కొత్తా? గుజరాత్ అల్లర్లలో వేలాది మందిని హింసించి చంపించడంలో మీదే అసలు పాత్రని ఆనాడు లోకం కోడై కుయ్యలేదా? ఈనాడు మీకు బ్రహ్మరథం పట్టలేదా? అప్పుడు ప్రపంచానికి పెద్దన్న మీ వీసాని కూడా రద్దు చెయ్యలేదా? అమెరికా రావడానికి లేదని వీల్లేదని నిషేధం కూడా విధించలేదా? మళ్ళీ మిమ్మల్ని పిలిచి పీట వేయలేదా? అంతెందుకు వైట్ హౌస్ లోకి రానున్న ట్రంప్ నిన్నటికి నిన్న మీ పాలన బాగుందని కితాబు యివ్వలేదా? అమెరికా ప్రెసిడెంటే యిచ్చినప్పుడు యింకా మన దేశ ప్రజలు యిస్తే యెంత? యివ్వకపోతే యెంత? వీళ్ళ మాటలెంత? వీళ్ళివాళ నొచ్చుకున్నా రేపు మళ్ళీ మిమ్మల్ని చచ్చినట్టు మెచ్చుకుంటారు. అంచేత యెప్పుడూ ఈ పరిస్థితే వుండదు! మీరు క్షిపణిలా ప్రజల మీదకి దూసుకుపొండి! క్షిపణి అంటే గుర్తుకువచ్చింది.. మీరు చేసింది ప్రజల మీద ‘సర్జికల్ దాడి’ కాదట, ‘కార్పెట్ బాంబింగ్’అట.. సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్య.. ముందుగా ముఖ్యంగా చెప్పేది ఆ సుప్రీమ్ కోర్టు నోరు ముయ్యించండి సార్.. ప్రజలనోళ్ళు ఆటోమేటిగ్గా మూతబడిపోతాయి. సోషల్ మీడియాలో మిమ్మల్ని తప్పుపడుతూ పోస్టు పెట్టిన యిద్దరు వుద్యోగులని విధులనుంచి తప్పించారని వార్తలు చూస్తున్నాం. ఆ సంఖ్యను యింకాస్త పెంచితే అందరూ ఆఘమేఘాల మీద మీ చర్య వుత్తమోత్తమైనది అంటూ బుద్దిగా వుద్యోగాలు చేసుకుంటూ బతికేస్తారు.

అప్పుడే ఎనభై మంది ప్రజలు నోట్ల రద్దువల్ల చనిపోయారని లెక్కలు చూపిస్తున్నారు. ఎనభై కాకపోతే నూటాయెనభై మంది ప్రజలను చావనివ్వండి. బ్యాంకు వుద్యోగులు యిరవైమంది వొత్తిడితో చనిపోయారని చెపుతున్నారు. ఇరవై కాకపోతే నూటాయిరవై మంది వుద్యోగులను చావనివ్వండి. రథాన్ని లాగినప్పుడు తలలు రాలిపడతాయి. అయినా రథయాత్రలు చేసి రణరంగం వీరంగం చేసిన పార్టీవారు మీరు. మీకు చెప్పాలా? అయినా ప్లేగు వస్తే చావలేదా? కలరా వస్తే చావలేదా? డెంగ్యూ వస్తే చావడం లేదా? చికెన్ గున్యా వస్తే చావడం లేదా? ఎలకలకి నీటి కలకలకి దోమలకి అంతమందిని అప్పజెప్పినప్పుడు దేశ ప్రధానిగా మీకు వెయ్యీ పయీ అప్పజెప్పొద్దా? ఆమాత్రం మీపట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే మండుతోంది.

ఏమయినా ఒకమంచిపని చేసేటప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటారు. బురద జల్లుతారు. తిట్టిపోస్తారు. శాపనార్థాలు పెడతారు. అసలు ప్రభుత్వం యేది చేసినా ప్రజలను మోసం చేసి పార్టీకి మేలు చేయడానికేనని పెడార్ధాలు తీసే మేథావులు మందలకొద్దీ మనకున్నారు. వాళ్ళు యూపీ ఎలక్షన్ల కోసమే మీరు యిదంతా చేసారని అంటున్నారు. అనుకోనివ్వండి. అలా అన్నా నోట్లతో వోట్లని కొనడానికి వీలు లేకుండా చేసిన మిమ్మల్ని అభినందించాలి కదా? మీ పార్టీ వాళ్ళు ముందే జాగ్రత్తపడ్డారని, సాక్ష్యంగా మీ ప్రకటనకు ముందే రెండువేల నోటుని సాంఘిక మాధ్యమాల్లో మీ నాయకుడు ట్వీట్ చేసాడని అంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరు అనిల్ అంబాని మరదలికి మొగుడు అంటున్నారు. అన్నీ అందరికి తెలుసు అంటున్నారు. ఒకటా రెండా గవర్నరు సంతకాల దాక.. యెన్నో ఆధారాలంటూ ముందుకు తెస్తున్నారు. తేనివ్వండి. ఏనుగు వెళిపోతుంటే వెయ్యి కుక్కలు మొరుగుతాయి. మొరగనివ్వండి. అధికారం మంత్రదండం. ఆ మంత్రదండమే మీ చేతిలో వుంది. అంతకు మించిన ఆయుధం లేదు. అణచివేత మీ సాధనం. అదే యింధనం. మీదే విజయం!

అవకాశం కోసం కాచుకూర్చున్న ప్రతిపక్షాలు మీ మీద యుద్ధం చేస్తున్నాయి. చెయ్యనివ్వండి. పాకిస్తాన్ యుద్ధమే నోట్ల రద్దు దెబ్బకి ఆగిపోయింది. ఆ వార్తలే పత్రికల్లో లేకుండా పోయాయి. నోట్లు రద్దవడం కాదుగాని అన్ని సమస్యలూ దెబ్బకి రద్దయిపోయాయి. ప్రజలకీ పార్లమెంటుకీ వొక్కటే ఎజెండా. నోట్లే జెండా. నోట్ల రద్దుతో మీరు అనేక సమస్యల్ని అవలీలగా రద్దు చేసేసారు. మీ తెలివి చూస్తే నాకు ముచ్చటేస్తోంది! మీరు అధికారంలోకి వచ్చాక అన్నిటా అంతటా హిందూత్వం పెరిగిపోయిందని, గోరక్షణ పేరుతో దళితుల మీదా మైనారిటీల మీదా-  దాడులూ హత్యలూ దేశంలో యెక్కడో వొక చోట ఆగకుండా జరుగుతూ మీకు మచ్చతెచ్చాయి. ఆమచ్చ చెరుపుకోవడానికి ఆలస్యంగానైనా మీరు ‘దళితులు నాసోదరులు, నన్ను చంపాకే దళితుల్ని చంపండి’ అని ప్రకటించాల్సి వచ్చింది. ఆమొత్తాన్ని మీరిప్పుడు చెరిపేశారు.

మీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం మధ్యతరగతి జీవుల్లో మీకు మంచి మార్కులే వేసింది. మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళనే తప్పు పట్టే దేశభక్తుల్ని తయారు చేసింది. పైగా ‘నా నిర్ణయంలో దురుద్దేశం వుందని తేలితే నన్ను నడిబజార్లో వురి తీయండి’ అని మీరు భావోద్వేగాలకు గురి కావడం- ‘నన్ను ప్రాణాలతో వుండనివ్వరేమో? ఐనా జంకను, సజీవ దహనం చేసినా నల్లధనం పై పోరు ఆపను’ అని మీరు కళ్ళనీళ్ళపర్యంతం కావడం- మమ్మల్ని చాలా దుఃఖానికి గురి చేసింది. మీరు మాటి మాటికి ‘నన్ను చంపండి.. నన్ను కాల్చండి.. నన్ను వురి తియ్యండి.. నన్ను సజీవ దహనం చేసినా..’ అని అస్తమానూ అనకండి సార్.. పైన తధాస్తు దేవతలు వుంటారు! మీరు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నాను! దేశాన్ని అనాధను చెయ్యొద్దు! మీ పాలనలో ప్రజలు యెంత సుఖ సంతోషాలతో వున్నారో మీరెరుగరా?!

జీ.. రేపటి యేడాదికి డబ్బై యేళ్ళుగా పట్టిన మురికిని మంత్రం వేసినట్టు మాయం చెయ్యడం వశమయ్యే పనేనా? చురుక్కు మనకుండా యింజక్షనే వెయ్యలేరే. నొప్పి లేకుండా పుప్పన్నే తీయలేరే. మన గడ్డం మనం గీసుకున్నా- అది మన బ్లేడే అయినా- మన చెయ్యే అయినా- తెగకుండా వుంటుందా? అంతెందుకు నొప్పులు లేకుండా ప్రసవం అవుతుందా? ప్రసవ నొప్పులు ప్రజలకూ వుంటాయని తెలుసుకోవాలని యీ సందర్భంగా ప్రజలకు మీ విధేయునిగా విజ్ఞప్తి చేస్తున్నాను!

యధ్బావం తద్భవతీ.. అన్నారు. ప్రతిదాంట్లోనూ మంచి చూస్తే మంచి- చెడు చూస్తే చెడు కనిపిస్తాయి. మీ నిర్ణయంలో మంచిని చూశాను. ఇంత మంచిని చేసిన మీముందు ఆ మంచి మంచి విషయాలూ ఫలితాలూ రాశి పోసి పంచుకోకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది.

ఎన్నడూ లేనిది ప్రజలకు డబ్బులు లేకుండా జీవించడం వచ్చేసింది. ఉన్నదాంట్లో వొద్దికగా బతికే నేర్పు వచ్చేసింది. ఆర్భాటాలు లేవు. అనవసర ఖర్చులు లేవు. షాపింగులు లేవు. సరదాలు లేవు. సందళ్ళు లేవు. సినిమాలు లేవు. షికారులు లేవు. పనుల్లేవ్. పాకుల్లేవ్. ఉన్నదాంట్లో తిన్నామా.. ఏటియం క్యూ లైన్లో నిల్చున్నామా.. వచ్చి గూట్లో గుట్టుచప్పుడుగా పడుకున్నామా.. అంతే. పొదుపుగా పొద్దు పుచ్చడం వచ్చింది. (చెప్పకేం దుబారా చేసే మాఆవిడ కూడా యెంత చిక్కిడి అయిపోయిందో..?) రేపు డబ్బులు చేతికి వచ్చినా ఏం చేసుకోవాలో తెలీక జనాలు తికమకపడతారంటే అతిశయోక్తి కాదు. కాదంటే మీ మీదొట్టు..

మరొక్క విషయమూ యిందులో వుంది. మనిషి తన మూలాలను గుర్తిస్తున్నాడు. వస్తుమార్పిడి విధానం మళ్ళీ మొదలైంది. మాదగ్గర బియ్యం తీసుకు వెళ్ళే మా పక్కింటివాళ్ళు మాకు అందుకు ప్రతిగా పప్పులూ ఉప్పులూ యిస్తున్నారు. మేం చింతపండు యిస్తే వాళ్ళు ప్రతిగా పసుపూ కారం యిస్తున్నారు. మనదగ్గర వున్నది యివ్వడం.. వాళ్ళదగ్గరున్నది పుచ్చుకోవడం.. యిలా యిచ్చిపుచ్చుకోవడంలో దేశ ప్రజల సహనమూ సౌశీల్యమూ స్నేహమూ సౌభ్రాతృత్వమూ యింకా చాలా చాలా వగైరాలు చూడగలిగాను!

మీ నిర్ణయం తర్వాత తాగుబోతులు తాగడం తగ్గించేసారు. జేబులు ఖాళీ అయి బుద్దిగా యింటికి వెళ్ళిపోతున్నారు. తంతే మరి నాలుగు పెళ్ళాలని తంతున్నారే తప్ప-  తప్పతాగి యెక్కడికక్కడ పడిపోవడం లేదు. చిల్లర సమస్య తాగుబోతులకు వుండరాదని రౌండ్ ఫిగరు చేసినప్పటికిన్నీ నలభై నుండి యాభై శాతం తాగడం తగ్గింది అంటే ముందు ముందు ఆశాతం మరింత పెరగొచ్చు అని రూడీగా చెప్పొచ్చు. చచ్చినట్టు మద్యపాన ప్రియులు కుటుంబప్రియులు అవుతారు. దేశంలోని మహిళలంతా యెప్పటికీ మీ ఋణం తీర్చుకోలేరు గాక తీర్చుకోలేరు!

కొందరు పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయని ఓ గగ్గోలు పెడుతున్నారు తప్పితే, సింపుల్ గా పెళ్లి చేసుకోవడం నేర్చుకు చావరే. అయినా పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల దేశానికి యెంతో మేలూ లాభమూ వున్నదన్న సంగతి మర్చిపోతున్నారే. పెళ్ళయితే యేముంది? మాహా అయితే పిల్లల్ని కంటారు. కోట్లలో జనాభాను పెంచుకుపోతారు. అదే పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల సంతతి ఆగిపోతోంది.. జనాభా తగ్గిపోతోంది. ప్రతి దానిలో పాజిటీవు కోణం చూడగలిగిన వాడే నిజమైన భారతీయుడు కాగలుగుతాడు!

పెద్దనోట్ల రద్దువల్ల యిచ్చిన లంచం తిరిగి వెనక్కి యిచ్చేస్తున్నారు ప్రభుత్వోద్యోగులు. లంచం లేకుండానే పనులు చేసేస్తున్నారు. ‘ఇప్పుడు కాదు, పని అయ్యాక ఆరుమాసాలు పోయాక యివ్వండి’ అని అంటున్నారు. డబ్బులు యిస్తేగాని పనిచెయ్యమని యిన్నాళ్ళలా పీక మీద కత్తి పెట్టుకు కూర్చోవడం లేదు. ఇంతటి పెను మార్పును మా జీవితాల్లో మేము చూస్తామని యెన్నడూ కలలో గాని అనుకోలేదు. ఈ శుభపరిణామానికి దేశంలోని పరిణామాలే కారణమని చెప్పకతప్పదు. అందుకు కారణమైన మిమ్మల్ని అభినంధించకా తప్పదు!

పేకాట రాయుళ్ళు పేకాట మానేశారు. డబ్బులు లేకుండా వొత్తి పుణ్యానికి ఆడడంలో వాళ్లకి మజా లేదు. అంతెందుకు కుర్రాళ్ళంతా వారం వారం అడ్డమైన సినిమాలను చూసేవాళ్ళు. వారానికి వో అరడజను సినిమాలు రిలీజు అయ్యేవి. యేవి.. యిప్పుడు వొకట్రెండు సినిమాలే ట్రెండు. బెండు తీసారు. ఇప్పుడు పిల్లలు గమ్మున యింటిపట్టున వుండి ఫేస్ బుక్కులు చక్కగా చదువుకుంటూ యూ ట్యూబులు చూసుకుంటూ వున్నారు.  టీవీల్లో వచ్చే సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ వున్నారు. యువత మీ మేలు మరిచిపోదు.. పోలేదు!

మరో ముఖ్యమైన విషయం చెప్పనా? దొంగతనాలు మా బాగా తగ్గాయి. అలవాటులో పొరపాటుగా వచ్చిన దొంగలు వెయ్యీ ఐదు వందల నోట్లు కళ్ళముందు కనిపించినా యెత్తుకు పోవడం లేదు. మా ఆవిడ దాచుకున్న పాతిక వేలు యెలా మార్చడమా అని ఆపసోపాలు పడుతున్న వేళ.. మొన్నటికి మొన్న మా యింట్లో పడ్డ దొంగ అది చూసి నన్ను బుద్దుందా? అని తిట్టాడు. క్లాసు కూడా పీకాడు. కౌటిల్యుడిలాగ బోధించాడు. డబ్బును డబ్బుగా దాస్తే దాని విలువ తగ్గిపోతుందట. కోల్పోతుందట. అందుకని బుర్రన్న వాడెవడైనా డబ్బు దాచుకోడట. భూమ్మీదో బంగారమ్మీదో షేర్లమీదో బినామీల మీదో పెడతాడు తప్ప యింట్లో లిక్విడ్ క్యాష్ దాచుకోర్రా యెర్రి నాగన్నా.. అని హితబోధ చేసాడు. నీదగ్గర కోటిరూపాయలు వుంటే పదిలక్షలైనా జేబులో కాదు కదా యింట్లో పెట్టుకుంటావా?.. అని అడిగాడు. డబ్బు పొదుపు చేసే కన్నా పొదిగితే పెరుగుతుంది.. ఈ సత్యం తెలియని సత్తికాలపు సత్తెయ్యవా నువ్వు?  దాచుకున్నా అది అయిదూ పది శాతమేన్రా నీ యబ్బా.. అని తిట్టి పోశాడు. బుర్రతక్కువ యెదవలు అని కూడా అనేశాడు. ఆ తిట్టు నాకు తగిలినందుకు కాదు, మీకూ తగిలినందుకు నేను చాలా విచారపడి విలవిలలాడిపోయానంటే నమ్మండి. మా ఆవిడ కూడా దొంగకే వంత పాడింది.

పర్లేదు.. మీది మహోన్నత నిర్ణయం. మీ దయవల్ల అందరికీ పని దొరుకుతోంది. బిందెలకు మాట్లేస్తాం.. అన్నంతగా మూల మూలలా వేల వేళలా- మీ పాత బిందెలకు కొత్త బిందెలు యిస్తాం.. అని అన్నంతగా  మీ పాత నోట్లకు కొత్తనోట్లు యిస్తాం.. అని నోట్లు మార్చే పని కుటీర పరిశ్రమలా సాగుతూ వుంది. అన్ని వ్యాపారాలు ఆగిపోయినా ఈ యవ్వారాలు ఆగలేదు. పెద్ద పార్టీలకు థర్టీ పర్సెంట్. డోర్ డెలివరీ సదుపాయం కూడా వుంది. బ్యాంకు మారాజులు మా బాగా చెయ్యి కలుపుతున్నారు. పోస్టుమాస్టర్సూ పోస్టాఫీసుల్లో నగదు మార్పిడిల్లో మాబాగా మార్చారు. ఏమార్చారు. ఏమయితేనేం మనం పాజిటీవుగా చూస్తే చాల మందికి పని దొరికింది. మీపేరు చెప్పుకొని పావలా పరకో యింతో అంతో సంపాదించుకుంటున్నారు.

అసలు సంపాదించుకోనిది యెవరు? ప్రభుత్వ సంస్థలే తీసుకుంటే యింతకు మునుపు కునారిల్లిపోయి వుండేవి. ఇప్పుడు కూటికి లేనివి కోటికి పడగలెత్తాయి. వెయ్యీ ఐదువందల నోట్లతో అన్ని పన్నులూ పాత బకాయిలూ కట్టొచ్చునని చెప్పినతరువాత మా హైదరాబాదు జీహెచ్ఎమ్సీ రెండువందల కోట్ల పైనే రాబట్టింది. గత వసూళ్లతో పోలిస్తే రెండువేల రెండువందల రెట్లు యెక్కువని కూడా వార్తలు వస్తున్నాయి. మొండి బాకాయిలు వసూలవుతున్నాయి. గుడ్డివాళ్ళు యివన్నీ చూడలేరు.

ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రవేటు వ్యక్తులకు అప్పులు వున్నా- బ్యాంకులకు అప్పులు వున్నా కూడా కొందరు ఆపద్భాందవుల్లా ముందుకు వచ్చి మీ అప్పులు తీరుస్తామని కోరి చెపుతున్నారు. మీరు తరువాత మాకు తీర్చండి అని భరోసా యిస్తున్నారు. మనిషిని మనిషి నమ్మని యీ రోజుల్లో యీ విధంగా మానవీయత పరిమళిoచడం మానవత్వం కాదా? ఇంతకుమించిన మానవత్వం వుంటుందా అని అమర్త్యసేన్ని అడుగుతున్నాను..

మనుషులే కాదు దేవుళ్ళ పరిస్థితి కూడా మెరుగయ్యింది. గుళ్ళూ గోపురాలు పుట్టిబుద్దెరిగి యింత కలక్షన్లు కల్లజూసాయా అని అడుగుతున్నాను. కలక్షన్ల కింగ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామివారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతుంది. శ్రీవారికి వొక్క రోజుకే ఆదాయం నాలుగుంపావూ నాలుగున్నర కోట్లు దాకా వస్తోంది. విజయవాడ దుర్గమ్మకూ మునుపెన్నడూ లేని ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నెలాఖరుకల్లా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం ఆదాయం లేని స్థానిక దేవుళ్ళ గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. తీర్థ ప్రసాదాలు అందుతున్నాయి. ఇదంతా మీ చలవే. భక్తులు పాత నోట్లని సగర్వంగా సమర్పించుకుంటున్నారు. అదీ యీ మీడియా వాళ్ళకి తప్పే. పాపంలో వాటా భగవంతుడికీ పంచుతున్నారని గోల పెడుతూ ప్రోగ్రాములమీద ప్రోగ్రాములు చేసేస్తున్నారు. దేవుడి దృష్టిలో చెల్లుబాటు అయేది.. చెల్లుబాటు అవనిది అంటూ వుంటుందా? దేవుడు అన్నిటినీ సమంగా స్వీకరిస్తాడు అన్న సత్యాన్ని మరిచిపోతున్నారు. తుచ్చులు.. సమాజానికి ఉచ్చులు..

అరే హాస్పిటల్స్ లో రోగాలన్నీ నయం చేసుకుంటున్నారు. అనారోగ్యాలను యేమాత్రం వాయిదా వెయ్యడంలేదు. నోట్లని మార్చేసుకోవడానికిది మరో మార్గం అని అంటున్నారే తప్ప యిందులోని పాజిటీవు అవకాశపు కోణం చూడరే అంధులు.. అర్భకులు..

విదేశాల్లోని నల్లధనం మీరు తీసుకురాలేక ఆ చిత్తశుద్ది మీలో లేక స్వదేశంలో డ్రామాలు చేస్తున్నారని అన్నవాళ్లకీ ఆడిపోసుకున్నవాళ్ళకీ వొక్కటే నా సమాధానం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సంస్కృతీ సాంప్రదాయాలూ వీళ్ళకి తెలిసి చావవు. అయినా స్విస్ బ్యాంకు రెండేళ్ళ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా ఖాతాలు తెరిచినవాళ్ళ వివరాలను చెపుతామని చెపితే సంతోషించక- అది మీ కృషి అని అంగీకరించలేక-  పాత ఖాతాదారుల వివరాలు రాబట్టలేరా.. అని తిరిగి అడుగుతారు. మాల్యాని మీరే టిక్కట్టు తీసి దగ్గరుండి పంపించినట్టు మాట్లాడుతారు. వదిలేసారని వాపోతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడువేల పదహారు కోట్లు ‘రద్దు పద్దు’లో వేసి నీళ్ళోదిలేసిందని, అందులో పన్నెండు వందల వొక్క కోటి విజయమాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దని, యిందులో ఆరు సంస్థలు మన తెలుగు రాష్ట్రాలవని కూడా వున్నాయని వాపోతున్నారు. అక్కడితో ఆగక మా బాకీలు కూడా మీ ‘రద్దు పద్దు’లో వేసి ఆదుకోమని వాడెవడో బయలు దేరాడు. ఇంక అందరూ అలా ముందుకు వస్తే బ్యాంకింగు వ్యవస్థ కుప్పకూలిపోదూ? అందుకే గదూ రైతుల్ని చితకతన్ని పాతిక వేలయినా లాక్కోనేది.. జప్తు చేసేది? మన బ్యాంకులను, మన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవద్దూ? ప్రతి దానిలో మంచి చూడడం వీళ్ళకు యెందుకు రాదో నాకర్థమే కాదు!

ఉగ్రవాదం.. తీవ్రవాదం.. నక్సలిజం యివన్నీ అంతరించిపోవాలంటే నల్లదనం అరికట్టాలి. ఆ నల్లదనం పెట్టుబడిదారుల వ్యాపారుల దగ్గర వుంటే వ్యాపారాలు చేస్తారు. వారు అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తారు. మనీని డెడ్ చెయ్యరు. డెత్ కు వాడరు. మరంత మనీ జనరేట్ చెయ్యడానికి వాడుతారు. అంచేత అందర్నీ వొక గాట కట్టలేం!

మీ విజన్ మాకు తెలుసు. మీరు మన కంట్రీని  క్యాష్ లెస్ కంట్రీగా చెయ్యాలని కలలు కంటున్నారు. మీరు మాత్రమే కలలను నిజం చెయ్యగలరు. ఎనభైయ్యారు శాతంగా వున్న పెద్దనోట్లు రద్దయ్యాక- ఎనభైయ్యారు శాతం ఏటీయంలు పనిచెయ్యకుండా వున్నాక- అంతా క్యాష్ లెస్సే! మనది క్యాష్ లెస్ కంట్రీయే! మరో విషయం పాలుకీ పనిమనిషికీ కూరలకీ కోడిగుడ్లకీ స్వైప్ మిషనేనా అని యెద్దులు యెద్దేవా చేస్తున్నారు! కాని చిన్న చిన్న దుకాణాలలో అమ్ముకొనే స్క్రాప్ ని మీరు తీసి పడేసి- అంతా అందంగా హై ఫై చేసి- కార్పోరేట్ వ్యాపారాలవైపుకు మళ్లిస్తున్నారన్న మర్మాన్ని అర్థం చేసుకోరే?! పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టి మనదేశానికి వచ్చిన వాళ్ళని మనం ఆ మాత్రం ఆదరించవద్దా?

చిన్నా పెద్దా తేడాలేకనే లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పుతీసుకున్న ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, రూలియా బ్రదర్స్, అనిల్ అగర్వాల్, గౌతమ్ ఆదాని- వేల కోట్లు అప్పుతీసుకున్న సైరుస్ మిస్త్రీ, మనోజ్ గౌర్, సజ్జన్ జిందాల్, లాంకో మధు, జియం రావ్, వియ్యన్ ధూప్, జీవీకే రెడ్డి- వీళ్ళ గురించి యిప్పుడే కొత్తగా తెలిసినట్టు తెగ యిదై పోతున్నారు. వాళ్ళు చేసిన రుణాలు కక్కించమంటున్నారు. లాగొచ్చు. కాని ఆ డబ్బు యెవరిది? వాళ్ళ వ్యాపారాలలో వున్నది ప్రజల డబ్బే. వాళ్ళు కుదేలయితే ప్రజలకు ఆ దెబ్బతాకుతుంది. అందుకని యిలాంటి పెద్దల్ని గౌరవంగా చూసుకోవాలి. ప్రోత్సహకాలు యివ్వాలి. రైతులకు సబ్సీడీలు తీసేసినా వ్యాపారాలకూ పెట్టుబడిదారులకూ సబ్సిడీలను యిచ్చి ప్రోత్సహించాలి. ఉచితంగా కోరినంత భూమి, కరెంటు, నీళ్ళు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలి. మీ చర్యతో బ్యాంకుల్లో చేరిన అనెకౌంటెడ్ మనీని.. ఎకౌంటెడ్ మనీని- ఈ పెద్దలకు మళ్ళీ మళ్ళీ రుణాలుగా యివ్వాలి. వాళ్ళు వ్యాపారాలు చేసి దేశ ప్రజలకి ఉపాధి కల్పిస్తారు. ఊతమిస్తారు. అంతే కాదు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. వాళ్ళని క్యూల్లో వచ్చి నిలబడాలని కొందరు మూర్ఖంగా ఆలోచనలు చేస్తున్నారు. మన దేశం సంపన్నుల జాబితాలో చేరడానికి కారకులైన వాళ్ళను మనం గౌరవించకపోతే ప్రపంచం గౌరవిస్తుందా? పేద దేశంలో ధనికులుగా రాణించడం అంత ఆషామాషీ యవ్వారం గాదు. అందుకైనా వాళ్ళ కాళ్ళు కడిగి మన నెత్తిన పోసుకోవాలి. ఆపనిచేస్తున్న ఏలికలకు యెంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

బీజేపీ యంపీ హర్షవర్ధన్ గారిని జనం అసహనంతో చితకబాదితే దేశమంతా అసహనం వున్నట్టు చిత్రీకరిస్తున్నారు. పాతిక రోజులుగా జనం కుక్కిన పేనుల్లా పడి లేరా? అవస్థలు పడుతూ ప్రజలు మీకు సహకరిస్తూ వుంటే వీళ్ళకు  కంటగింపుగా వుంది. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళకు తగిన సమాధానం యిచ్చారు. అవినీతి పరులుగా ముద్ర వేసారు. అందుకే ప్రతొక్కరూ’ మోడీగారి నిర్ణయం మంచిదే కాని..’ అనేదాకా వచ్చారు. అది చాలు.. మీరు విజ్రుభించేయడానికి!

ప్రజలకి ఓర్పు లేకపోతే యెలా? భార్యా బిడ్డలా యేమి స్వార్థం మీకు? కాని భార్యా బిడ్డలు వుంటే మీరు యిలా చేసేవారా.. అని తిరిగి అడిగేవారూ వున్నారు. ఇలాంటి ప్రజలకోసమా మీరిన్ని అవస్థలూ పడుతున్నది అని తలచుకుంటే దుఃఖం వస్తుంది.

అప్పుడే రెండువేల నోట్లు నకిలీవి వచ్చేసాయని అంటున్నారు. ఇదీ తప్పేనా? తెలివిగా ఆలోచిస్తే నోట్ల కొరత వున్నప్పుడు నకిలీ నోట్లు కూడా చెలామణీ కావడం కొంత ఊరటే. అవి ఖాళీలను పూరిస్తాయి. అన్నీ నోట్లూ ప్రింట్ అయి వొకేసారి రావాలంటే కష్టం గదా? ఆమాటకు వస్తే మన భారతదేశానికి పాకిస్తానుకు మెటీరియల్ సరఫరా చేసేవాడు వొక్కడే. ఇప్పుడు యేమయ్యింది.. నోట్ల కొరత కొంత తీరుతోంది గదా.. అని పాజిటీవ్ గా చూస్తే నెలకొన్న సమస్య తీరడంలో నకిలీ నోట్లు అవసరం. లోపాలతో వున్న అయిదువందల నోట్లని వొదల్లేదా? రెండువేలతో సహా అన్నీ రేపు భవిష్యత్తులో రద్దయ్యేవేగా?

చెప్పడం మరిచాను. జనధన్ ఖాతాల్లో భారీగా డబ్బు చేరడంవల్ల పేద సాదలకు పైసా పరకో దొరుకుతుంది. మీరు చూసీ చూడనట్టు పోవడం వల్ల రేపు మీరు వొక్కొక్క ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ముందే యిచ్చిన హామీని నిలబెట్టుకోకపోయినా పోయింది పొల్లు వచ్చింది గట్టి.. అని మిమ్మల్ని మన్నిస్తారు.

మీ ధ్యేయం ఫలిస్తోంది. నలుపు తెలుపవుతోంది.. బ్లాక్ మనీ మీరన్నట్టే తీసి పారేశారు. నల్లధనం లేదు. వుండదు. ఈ డిసెంబరు ముప్పైలోగా వున్న నల్లధనం తెల్లధనంగా మారిపోతుంది. స్వయంగా వస్తే ఫిఫ్టీ పర్సెంటు.. మేం పట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటు.. అని బంపరాఫరే యిచ్చారు. నలుపుని తెలుపు చేసుకొనే మహదవకాశం మీరిచ్చారు. కాని మనవాళ్ళు ఈలోపలే మార్చేసారు. ఉన్న అరా కొరా మీరిచ్చిన ఆఫర్లో మార్చేసుకోవచ్చు. నల్లధనమే కాదు, నాలుగు వందలకోట్ల నకిలీ నోట్లు కూడా దెబ్బకి బ్యాంకుల్లో జమయిపోయాయి. చెల్లని నోటుకు మళ్ళీ అది అసలా నకిలీనా అని చూస్తారా? అంత సమయం మన బ్యాంకుల వాళ్ళకి వుందా? లేదు! మన దేశంలో రద్దయిన పెద్దనోట్ల మొత్తం విలువ పదిహేనున్నర లక్షల కోట్లు. నవంబరు ఆఖరి నాటికే పదకుండు లక్షలకోట్లు బ్యాంకుల్లో జమయినాయి. మిగిలిన నాలుగున్నర లక్షలకోట్లు ఈ నెలాఖరులోపల ఈజీగా జమవుతాయి. బ్యాంకులకు రాకుండా నల్లధనం బయట మిగిలిపోయే అవకాశమే లేదని ఆర్ధిక నిపుణులు లెక్కలు కడుతున్నారు. తిరిగి లక్షన్నర కోట్లు మీ చర్య వలన నష్టం వస్తుందని కూడా చెపుతున్నారు. ఎవరెన్ని చెప్పినా యిప్పుడు మీ అడుగు వెనక్కి తీసుకోవడానికి లేదు. దేశం వృద్ధిరేటు తగ్గినా తప్పులేదు. ఎందుకంటే మీరు యెంతో సాహసంతో దేశంలో నల్లధనం లేకుండా చేసారు.  అది చాలు. ఆపేరు చాలు. నల్లధనంతో నానా అవస్థలూ పడుతున్న పెద్దలకు మీరిచ్చిన అవకాశం అమూల్యమైనది. అపురూపమైనది. మీరే మళ్ళీ మళ్ళీ మనదేశ ప్రధానమంత్రిగా వుండాలి. నల్లధనం లేని దేశంగా భారత దేశాన్ని మార్చేసి  చరిత్రలో స్థానం కల్పించిన మీకు ఈ దేశప్రజలు యెప్పటికీ ఋణపడే వుండాలి. వుంటారు!

ఈ దేశప్రజల్లో వొకడినైనందుకు యెంతగానో గర్విస్తున్నాను!

కృతజ్ఞతా పూర్వక నమస్కారాలతో-

మీ

అనామక భక్తుడు.

 

గైనేరా? గడ్డికుప్పా?

 bokeh-1505960_1920

 

ఒరే కొడుకా..

ఏడుకొండలూ.. యెలాగున్నావురా అయ్యా..

ఊరూ యేరూ వొక్కలాటివే. ఒడుపు తెలిసి బతకాల. బతుకు దాటాల. లేదంటే ములిగి చావాల. ఉన్నదే వూరు. పెట్టిందే కన్నతల్లి. నోరు మంచిదయితే వూరు మంచిదవుతాది. నీకసలే మా సెడ్డ నోటి తీట. ఈటిసిరితే యెనక్కి తీసుకోగలం గాని మాటిసిరితే యెనక్కి తీసుకోగలమా? కాలాలు చూస్తే బాగోలేవు!

ఎద్దు ముడ్డి పొడిసి యేదుం పిండి అంబలి తాగినోడు మీయయ్య. మీ అయ్యకేం తెలుసును? అని అనుకోకు. ఇదమూ తెలీదు.. పదమూ తెలీదు అని అనుకోకు. మాయమ్మ పేరు దాక.. మీ యమ్మ పేరు డోకి అనుకోకు. లోకం నన్నెరక్క పోవచ్చు. లోకాన్ని నానెరుగుదును. కనబడుతున్న దానికి గట్టిక్కి యేల సూడాల కొడుకా..!?

రాజుల కాలం పోయింది.. రాజులు సరి.. రాజ్జాలు సరి.. మంత్రులు వొచ్చినారు. మనమే జనమే అదికారంలోకి వొచ్చినామని అనుకున్నాం. జీ హుజూర్.. అని యికన వుండక్కర్లేదనీ అనుకున్నాం. కాలు మొక్కక్కర్లేదనీ- కళ్ళు దించక్కర్లేదనీ అనుకున్నాం. ఎవుడికి ఆడే రాజనకున్నాం. ఎవుడికి ఆడే బంట్రోతనుకున్నాం. ఎవుడు యెవుడికీ లొంగక్కర్లేదనుకున్నాం. ఎవుడు యెవుడికీ వంగక్కర్లేదనుకున్నాం. ఎవుడి బతుకు ఆడు బతకీయొచ్చనుకున్నాం. గాని యిదీ అదే. అంతా కనికట్టు. కాదంటే వొట్టు. మన సూపు మారింది.. మన రూపు మారింది.. గానొరే అసలు మారాల్సింది మారలే. ఇప్పుడు మంత్రులందరూ రాజులే. ఆల రాజ్జిమే నడస్తంది. ఆల కత్తులు తుపాకులయినాయి. ఆల మొల నుండి పక్కోడి మొలకి మారినాయి. ఇప్పుడు ఆల కత్తులు ఆలు పట్టుకోరు. పట్టుకోడానికి పదిమందుంటారు. వందమందుంటారు. ఆల గుర్రాలూ యేనుగులూ- కార్లూ యెలీకాప్టర్లయినాయి. ఆల సైన్యం- పోలీసు, మిలటరీ బలగాలయినాయి. తప్పితే ఆల యంత్రాంగమూ మారలేదు. ఆల మంత్రాంగమూ మారలేదు. మన రాతా మారలేదు. లోకం తిత్తవా మారలేదు.

మన బంట్రోతు బుర్ర మీద కుచ్చీల టోపీ మారలేదు. పై మీద పయ్యాడ బెల్టూ మారలేదు. బిళ్ళా మారలేదు. అంతెందుకు తెల్లోడి దగ్గిర కాలు నేలకు తన్ని.. చెయ్యి నుదిటికి తిరగేసి అతికించి కొట్టిన సెల్యూటూ మారలేదు. వేసుకున్న ఖాకీ బట్టా మారలేదు. పట్టుకున్న లాటీ మారలేదు. పోలీసు తీరూ మారలేదు. ఆడి క్రాపు మారలేదు. కాసిన మన యీపు మారలేదు. మారలేదంతే మారలేదు.

ఆ మాటకొస్తే అప్పుడు కలకటేరు యిప్పుడూ కలకటేరుగున్నాడు. అప్పుడు కప్పమే లాక్కుండోలు. యిప్పుడు పంట మీద కప్పమే కాదు, పంటే కాదు, పంటేసిన బూమి కూడా లాక్కుంతన్నారు. తన్ని మరీ. కేసులు పెట్టి మరీ. కాల్చిచంపి పడీసి మరీ. ఆ అబివుద్ది జోలికి పోను గాని కొడుకా.. యేటీ మారలేదు. కేసులంటే యాదికొచ్చింది.. దర్మల్ పవరు ప్లాంటు కేసులల్ల కోర్టుల చుట్టూ తిరిగినాను గదా.. జడ్జీ గారని తెలీక పెద్దలాయరనుకోని ఆయమ్మగారికి అనుకోకండా మొదట్ల యెదురైపోన్ను. దండవెట్టినాను. దేవుడ్ని చూసినట్టుగా చూసినాను. ఎన్నడూ చూడని దేవుడు యెదురొస్తే యెలాగ చూస్తామో అలాగ చూసినాను. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాను. అలాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూడగూడదని నాకు తెల్దు. దెస్టా.. అని మనోలు నా తల కిందకి వంచీసి గబుక్కున వుపద్రవం ముంచుకొచ్చినట్టు అందరూ వొక్కపాలి యెనక్కి లాగినారు. తెలక పులికి ఆహారం అయిపోతానన్నంత యిదిగా గబుక్కున ముందు నుండి యెనక్కి లాగినారు. యెంత పని చేసినావని మనోలు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టిపోసినారు. నానేటి చేసినానో నాకు తెల్లేదు. నాను యెర్రి మొకం యెట్టుకు చూస్తే చెప్పినారు. ఎన్నడు గాని.. యెప్పుడు గాని.. యేటి.. తెలిసిగాని.. తెలియక గాని.. జడ్జీలకి యెదురెళ్ళ రాదు. ఒకేళ పొరపాట్న యెదురయిపోతే.. దండమెట్టి పక్కకి తప్పుకొని తోవ యివ్వడం గవురవము కాదట?! ఎనక్కి అలాగే నాలుగడుగులు యేసి- అప్పుడు దండమెట్టి- పక్కకి జాగర్తగ- తలవొంచి తప్పుకోవాలట. పొరపాట్న కూడా యెనక్కి తిరిగి పోగూడదు. యెన్నూ యీపూ నడ్డీ ముడ్డీ సూపగూడదు! అలాగని యే రాజ్జాంగంలో వుందని నువ్వు అనొచ్చు. అన్నీ రాజ్జాంగంలోనే రాసుండవు. కొన్ని రూల్సు సెక్సన్లూ పాలో కావాలంతే! ఇలాటివి యెవుడూ చెప్పడు. ఏ పుస్తకాల్లంట వుండవు. గాని తెలుసుకొవాల. తెలుసుకొని మసలు కోవాల. మంచిగ బతుక్కోవాల.

అన్నట్టు చెప్పడం మరసిపోనాను. కలకటేరు ఆపీసుకు ఆమద్దిన యెల్లినాను గదా? అతగాడూ యెనకటి రాజుగోరే. తలమీద కిరీటమొకటే తక్కువ. ముందలే రాజావారి దర్శనానికి మా పేర్లు రాసుకున్నారు. తెల్లారగట్ల యెల్లి దండమెట్టి కూకున్నాం. ఎయిటు సెయ్యండి.. ఎయిటు సెయ్యండి.. అన్నారు ఆపీసర్లు. ఎయిటేటి నైనూ టెన్నూ కూడా అయిపోయింది. పొద్దుటి నుండి అతగోడు వస్తాడు.. యెల్తాడు.. వస్తాడు.. ఆడి పేసీల వున్నాగాని ఆడు మన పేసు సూడ్డు. ఆడు లార్డు కజ్జిన్ లాగ.. మనమేమో గుమ్మంలో వున్న గజ్జి బేపిలాగ.. ఆడు మనొంక సూడ్డానికి కూడా యిష్ట పడ్డు. పెర్మిషను యిస్తే గాని పెదవి యిప్పగూడదు.. అని ముందలే తాకీదు యిచ్చినారు ఆపీసోలు. సచ్చినట్టు నోరు కుట్టుకున్నాం. మూగోల్లాగ వుండిపోనాం. శిలా పతిమల్లాగ వుండిపోనాం. పొద్దోయిందాక. రేపు రా.. మాపు రా.. అని గాని అన్లే. సారూ పులుసూ యెల్లి పోనాడని ఆయెనక చెప్పినారు. చెస్.. ఈ కుక్కల కొడుకు తోటి మనకేటని రైతులందరం యెనక్కి యెలిపోచ్చినాం. నీకొకటి తెలుసునా.. కలకటేరుకే కాదు, యూనివరిసిటీల ఈసీలకీ, మన యిరిగేషను యింజినీరుకీ గొడుగు పడతారు. ఎండా వానా యేటి లేనప్పుడూ పడతారు. దేవుళ్ళకి తల యెనకాల సెక్రం వున్నట్టుగా యీలకి గొడుగుండాల. అదేట్రా అంటే మన యెలమ యెంకడు ‘దటీజ్ వోదా’ అంటాడు. ఇంక రాష్ట్రానికి వోదా వొస్తే యేటవుతాదో యేటో?

సర్లే గాని మన కానిస్టేబులు కనకారావు లేడా? మన యెనక సెగిడీదిల వుంటాడు. ఇంజనీరింగు సదివినాడు గుంటడు. ఐయ్యేయస్ ఐపీయస్సు ఐపోతాననుకున్నాడు. ఆపరీచ్చా ఈపరిచ్చా రాసినోడే. తెలివైనోడే. గాని అడుగు సిల్లి. అసల బొక్క. కూతురు కూటికి యేడిస్తే అవ్వ రంకుమొగుడికి యేడిసిందని అలయ్య గోల. పూట పూటకీ పూట గడవక కష్టంగ వుంటే యెప్పుడో ఆపీసరయ్యి మేం సచ్చినతర్వాత మా సమాదిమీద యీడు గేదిని కడతాడు.. అని రోజూ యింట్ల యేలాలూ గుడిసిలే. ఇంక యేలని పోలీసు పరీచ్చలు రాసి కానిస్టేబులు అయిపోండు. పోనీ అని లాఠీ వూపుకొని సక్కగా వుండొచ్చును కదా.. వుండలే.. ఈడికి ఐయ్యేయస్ ఐపీయస్సు పిచ్చ వుంది కదా? ఆ ఐపీయస్సు బాసుని సూడాలని మాటాడాలని మన బాసేకదా అని యెల్లబోనాడు. ‘వుద్యోగం సెయ్యాలని లేదా లం.. కొడకా’ అని ఆడి తోటోలూ పైయ్యోలూ తిట్టినారట. ఐపీయస్సు ఆపీసర్లతోటి కానిస్టేబుళ్ళు కలవడానికి లేదట. మాట్లాడడానికి లేదట. అసలు యెదురు పడడానికే లేదట. అంత హీనము మరి అని అనుకుంటే కాదు. అదే వోదా. ఆవోదా యెక్కడిది? రాజుల కాలం నాటిది కాదా? ఆలు రాజులు కారా?

చెప్పినాను కానా? ఏటీ మారలేదు. ఎనకటికి బుగత యింటి ముందు చెప్పులు తీసి చేత్తో పట్టుకు నడిసోలమా? అచ్చం అలగే. కావాలంతే కొన్ని ఆపీసులకి యెల్లి నీకళ్ళ తోటి సూడు. అందల పని చేసినోలే, చెప్పులు యిప్పి అయ్యవారి గదిలోకి అడుగు పెడతారు, దేవుడిగారి గర్బ గుడిలోకి అడుగు పెట్టినట్టు. మెడకాయ మీద తలకాయ యేలాడేసుకొని భక్తి మీద యెల్లి దండమెడతారు. మన ముందున్నోళ్ళని చూసి మనమూ జనమూ పాలో కావాలంతే! అడిగిన అన్నిటికీ ఆనసరు వుంది గదా అని చెప్పీగూడదు. మూగోలి లెక్క వుండాల. తల వూపాల గాని అడ్డంగా వూపగూడదు. అన్నిటికీ యస్సే అనాల. వోయస్ అనీసి వుత్సాహపడగూడదు. టెంపరి అనుకుంటారు. ఒళ్ళు బలుపు అనుకుంటారు. కొవ్వి పోనాడని కూడా అనుకుంటారు. అనుకోడానికి అడ్డేటి?

అసలు అనుకున్నా అనుకోకపోయినా ఆదోరంనాడు చేసిన ‘తిర్నాద సాముల కత’లాగ యిదాయికం పాటించాల. ఇవీ యిది యిదానాలని కార్తీక పురాణం పుస్తకంల రాసినట్టు వరసాగ రాసుండదు. గాని అచ్చరం ముక్క రానోడికి కూడా అంతా తెలుస్తాది. అర్దమవుతాది. టీవీలల్ల సూడ్లేదా? మన సినిమావోలు పతొక్కలూ పాదాలకి మొక్కీవోలే. అయిటయిటికీ వొంగి దండాలు పెట్టీవోలే. నడుము నొప్పులు రావో యేటో? అన్నిటికీ డూపులు పెడతారు, అదయినా వొరిజినలుగా సెయ్యనీరా అంటాడు మన సిమాచలం దద్ద. ఆడు అప్పుడ్లో సినిమాల్లో చేసీవోడని కతలు చెపుతాడుగదా. మోకమాటంగా వంగీ వంగక మద్దిల వుంటే- వొద్దు.. వొద్దనీసి మెడమీద సెయ్యపెట్టితే.. మనం లేపుతున్నాడు గావాల అనుకుంటాం. కాదట. పాదాలకు టచ్చు చెయ్యమని మెడమీద సెయ్యి తియ్యకుండా కిందకి వొంచుతారట కొందరు పెద్దలు. రాజుల కాళ్ళమీద.. జెమిందారుల కాళ్ళ మీద.. దేహీ అని పడినట్టు పడాల. అర్థమయ్యింది గదూ..?

రాజులెందుకు సరిపోతార్రా.. రాచరికాలు యెందుకు సరిపోతాయిరా కొడుకా.. మనవూరి కతే తీస్కో. గ్రామ పెసిరెంటు ఆపీసుల మీటింగు పెడితే యెల్లాల. తప్పకుండా యెల్లాల. గాని ఆపీసు యివతలే నిలబడాల. అదీ యిలువ. మరి మన డోక్రా మహిళా సర్పంచులయినా అంతే. ఆలు యింట్ల మీటింగు పెడితే మనం ఆడోళ్ళు యీదిల నిలబడాల. అదీ యిలువ. రెస్పెక్టు యివ్వకపోతే రేపు మన మొకం యెవ్వడూ సూడ్డు. తెలిసిందా? వాటమూ గీటమూ లేని వూరే యింత వయ్యారంగా వుంటే- పట్నమూ.. నగరమూ.. మరెంత వంపులతోటి వయ్యారాలతోటి వుంటాదోనని నా బయ్యిం.

సిటీలల్ల అలగేటి వుండదు. వొకడికి లచ్చిం లేదు.. సల్దికి బత్తిం లేదు.. అన్నట్టుగ బతికీయొచ్చు అని అంటావు. నీకా యీక తెంపితే కడేదో మొదులేదో తెల్దు. పేంటూ సర్టూ యేసీగాన సరికాదు. రంగుల కళ్ళ జోడు పెట్టీగాన సరికాదు. సరిగ్గ సూడు.. టీవీలల్ల సూడ్డం లేదనుకోకు. మినిస్టర్లూ మంత్రులూ వస్తే.. ‘రాజుగారు వొస్తన్నారహో..’ అని దండోరా యేయించినట్టు ‘పోయ్.. పోయ్’ మని అరుపులూ ఆరన్లూ. ‘అడ్డు తప్పుకోండహో..’ అని పోలీసులు దారి క్లియారు చెయ్యడాలు. ట్రాపిక్కు ఆపీడాలు. ఆపదైనా సాపదైనా ఆడికి ముందల దారిచ్చీయాల. నువ్వు ఆగాల. నీ సావు నువ్వు సావాల. రాజుగారు యెల్లీదాక సావయినా రేవయినా అంతే. ఆ తరవాతే బతికి సావాల. బట్ట కట్టి సావాల. రాజుగారికి పత్తింగుంటాది. మనకే మాడి పోతాది. మసయిపోతాది. నువ్వా దర్జా చూసి చెప్పు. ఇప్పుడుకీ మనం రాజులకాలం వున్నామా? లేదా? అది ముందు చెప్పు.

నాయనా! మన వూర్లంట యే మాటన్నా సెల్లుతాది. ఆడేటి ‘గైనేరా? గడ్డికుప్పా?’ అని గైనేరుని తిట్టీసినా దీవించీసినా ఆతు ముక్క కింద తీసీసినా చెల్లుతాది. ‘గైనేరుకు గడ్డు- మేస్త్రీకి మెడ్డు’ అనీసినా ఆడిపోసుకున్నా చెల్లుతాది. ఓట్లు తప్ప మన పాట్లు తెలీని అవుకు గాళ్ళని ఆడి యమ్మా యక్కా యాలి చేసి నానా తిట్లు తిట్టీసినా చెల్లుతాది. ఏలిన నంజి కొడుకుల్ని యెన్నన్నా చెల్లుతాది. ఆల ఆడోలు యేటి చేస్తారు గాని మద్దిన? యింకో తోవ లేదు. తెన్నులేదు. అమ్మనాబూతులు తినని వొక్క నాకొడుకుని చూపించు. రాజకీయాల్లోకి వొచ్చినప్పుడే ఆలూ అన్నిటికీ సిద్దమైపోయి వొస్తారు. సిగ్గూ యెగ్గూ వొదిలేసి వొస్తారు సన్నాసులు! మనము తిడతన్నామని పదవుల్లో వున్న యెదవలకి తెలీదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం సీకటయి పోద్దా?

ఒరే.. చివరాకరుగా నే చెప్పేది యిను. కుట్టినోలుకి కుడిపక్క వుండకూడదు. ఏడిసినోలుకి యెడమపక్క వుండకూడదు. అదికారంలో వున్నోలుకి ఆపక్కా యీపక్కా యేపక్కా వుండకూడదు. నువ్వసలే ‘గుర్రమ్మీదున్నోడు గుడ్డిగాడు.. యేనుగుమీదున్నోడు ఆతుగాడు’ అనే రకం. కానొరే.. అది కుదర్దు. మొన్నటికి మొన్న చూసినావు కావా? అయిదరాబాదులే.. సర్దారు వల్లబాయి పటేలు పోలీసు ట్రైనింగు కేంపులే.. అడీసినల్లు డీజీపీ యిందుకుమారు బూషణు అని రాజస్తాను నుండి వొచ్చినాడు. మన గవర్నరుని అడిగినాడు.. యేటని? మీ రాజబవనం నుండి సమాచారం అడిగిన ఆర్టీఐ కార్యకర్తలని మాపియా అని యెందుకు అన్నారు.. అని. రాజుని ప్రశ్నిస్తే సైన్యాదిపతికైనా తల తెగిపోద్ది. ఆ పోలీసు బాసుని టక్కున ట్రైనింగు ఆపీసి మరీ యెనక్కి పంపించీసినారు గదేటి? అతగాడు గొంతు కోసుకొని పేనాలు తీసుకోబోతే జైపూరు యిమానంల తొస్సి యెనక్కి పంపించీసినారు. ఇదంతా నాకెలాగ తెలుసును అనుకోకు. పేపర్ల వొస్తే మన ఈసుగాడు చదివి యినిపించినాడు. నువ్వు పేపర్ల యెడ్డింగులు చదివీసి.. సినిమా బొమ్మలు చూసీసి.. కిర్కెట్టు పరుగులు లెక్కట్టుకున్నంత కాలం నీకిలాటివి కనబడవు. ఆ పేపరోలు కూడా అదొక వార్త కాదన్నట్టుగ యేసినారు. కానొరే.. యెందులో నుండయినా మనం తెలుసుకోవల్సింది.. నేర్సుకోవల్సింది వొకటుంటాది.. అర్ధమయింది కదా.. కోవిల కెళ్ళి పిత్తకుండా వుంటే దూపమేసినంత పలితము. మనకాడ వాగినట్టు యెక్కడ పడితే అక్కడ యేది పడితే అది వాగీకు. నోరు మనదే. కాని వూరు మనది కాదు కదా?!

యిప్పుడుకే చేట బారతం రాసినాను.. వుంతాన్రా అయ్యా.. జాకర్త!

యిట్లు

మీయయ్య

అప్పలకొండ

స్వాతంత్ర ఫలాలు!

 

Indian Flag 3

ప్రధాన అమాత్యుల వారికి..

ప్రణామములు!

భారత దేశానికి డబ్బైవ స్వాతంత్ర్య దినోత్సవం! ఈ సందర్భంగా “స్వాతంత్ర్య ఫలాలు ప్రతి వొక్కరికి అందాలి..!” అన్న మీ పిలుపు జాతికి మేలు కొలుపు! స్వాతంత్ర్య ఫలాలు అందుకున్న భారతీయ మణి మకుటములైన వారి సందేశాలను సంక్షిప్తంగా మీకు కొన్ని సమర్పించుకొనుచున్నాము!

***

“విదేశాల్లో నల్ల ధనాన్ని మేం దాచుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“విదేశాలలో నుండి నల్ల ధనాన్ని రప్పిస్తాం.. తెప్పిస్తాం..’ అని పదే పదే మీరు ప్రకటించినగాని- ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోవడం, తప్పనిసరి వొత్తిళ్ళలో కొందరిని మొక్కుబడిగా యిబ్బంది పెట్టినగాని- మా యెవ్వరి పేర్లూ ప్రకటించనందుకు.. బయటపెట్టకుండా గోప్యత పాటించినందుకు.. మీకూ మీ మంత్రివర్గానికి పేరు పేరునా కృతజ్ఞతలు..!”

యిట్లు

నల్లకుబేరులు.

***

“మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మా వ్యాపారాలు మేము చేసుకోనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు! మా వృద్ధిని ప్రజల అభివృద్ధిగా మీరు అభివర్ణించిన తీరు మిక్కిలి ఆనంద దాయకము మరియు శుభకరము!

“మీ ప్రజలకు రాయితీల్లో కోతలు విధించుకుంటూ వొచ్చినా గాని- ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’తో మమ్మల్ని ప్రోత్సహించి రాయితీలు కల్పిస్తున్నందుకు మీకు మా ధన్యవాదములు.!”

యిట్లు

విదేశీ బిజినెస్ మేగ్నెట్స్.

***

“ఉల్లి నుండి కందిపప్పు వరకు..

మినప్పప్పు నుండి మిరప వరకు..

అన్నిటా మార్కెట్టును బ్లాక్ చేసి.. అధికరేట్లతో అమ్ముకొని.. మేం వ్యాపారం చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“మా వ్యాపారాలే కాదు, మీ వ్యాపారాలూ బావుండాలని కోరుకుంటున్నాము!”

యిట్లు

స్వదేశీ వ్యాపారస్తులు.

***

“ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్య..

అన్ని విద్యా విభాగాల నుండి మీరు తప్పుకొంటూ మా ప్రవేటు వాళ్ళకి అప్పగించడమే కాక, నచ్చినంత ఫీజులు మేము వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

విద్యాసంస్థల నిర్వాహకులు.

***

 

“ప్రతి పౌరుడిని రోగిగా గుర్తించి అందించే మా వైద్యానికిగాను  మాకు నచ్చినంత ఫీజు వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“ప్రభుత్వ వైద్య రంగాన్ని రోగగ్రస్తము చేసి యేకంగా పడక యెక్కించి.. మీరు సేవా విభాగాలనుండి తప్పుకొని.. ఆ బాధ్యతను మా భుజస్కంధాలపై వుంచడమే కాక వైద్యము లాభసాటి వ్యాపారముగా మించి వొక పరిశ్రమగా అభివృద్ధి చేసుకొనే వెసులుబాటు కల్పించినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు!”

యిట్లు

ప్రవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.

***

“దళితులమీద దాడులు చేసే ఆధిపత్య స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“తోలు కనిపిస్తే దళితుల తోలు తీసే హక్కునూ.. మాంసము కనిపిస్తే దళితులను మాంసము కొట్టే అధికారమునూ మాకు సంక్రమింపజేసిన మీ పాలన పదికాలాలు వుండాలని కోరుకుంటున్నాము!”

“గోవును నువ్వు రక్షించు! గోవు నిన్ను రక్షిస్తుంది!”

“గోరక్షణే మానవ రక్షణ!”

యిట్లు

గో రక్షక దళం మరియు అగ్రకుల హిందూ ధర్మ పరిరక్షకులు.

***

“మానవ వనరులను బహు చవుకగా వినియోగించుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

“చైల్డ్ లేబర్ కారు చవగ్గా దొరకడం బహు ఆనందనీయమూ మరియు అభినందనీయమూ!”

యిట్లు

పారిశ్రామిక వేత్తలు.

***

“మహిళలను అత్యాచారం చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“నిర్భయ లాంటి కేసులనేకం దేశమంతా తలెత్తడం.. అయినా తగు చర్యలు తీసుకోకుండా జరిగినప్పుడు మాత్రము హడావిడి చేసి మమ్ములను విచ్చలవిడిగా వదిలేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము!”

యిట్లు

పురుష పుంగవులు.

***

“విమెన్ ట్రాఫికింగ్ ను కూడా ‘యెగుమతి’ వనరుగా గుర్తించి మా పనులు మేము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

బ్రోకర్ల ముఠా.

***

”మాదక ద్రవ్యాల సరఫరా మరియు అమ్మకము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

మాఫియా ముఠా.

***

“ఓడిన పార్టీలో కొనసాగకుండా-

పోటీచేసిన పార్టీకి రాజీనామా చెయ్యకుండా-

అధికార పార్టీలోకి జంప్ చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

జిలానీ ఎమ్మెల్యేలు.

***

“మీ వోటును మీరే శ్రమపడి వెయ్యకుండా మేము వేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

పార్టీ కార్యకర్తలు!

***

నోట్:

తమ తమ స్వాతంత్ర్యాలను.. తమకు దక్కిన స్వాతంత్ర్య ఫలాలను గుర్తు చేసుకుంటూ యిలా యెన్నో యెన్నెన్నో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలు మన కోటప్రాసాదాలకు లెక్కకు మిక్కిలిగా వచ్చినవి! కొన్ని ఉత్తరాలను మచ్చుకి మీ దృష్టికి తెస్తూ తమ పరిశీలనార్థం జతపరచడమైనది!

మళ్ళీ స్వాతంత్ర్య దినోత్సవానికి చూసుకుందాంలే అని మిగతా వుత్తరాలను సమయ స్థలాభావాల వల్ల పక్కకు పెట్టడం జరిగినది!

కృతజ్ఞతలు!

యిట్లు

తమ వ్యక్తిగత సహాయక కార్యదర్శి

 

ఈ గంట గణగణ మోగాలి..!

 shool

 

 

గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి-

నమస్కారం!

సార్.. మీతో మాట్లాడడానికి మాకు అవకాశం లేదు. అందుకే వుత్తరం రాస్తున్నాము. పేరు లేదని ఏదో ఆకాశ రామన్న వుత్తరమనుకోకండి. ఇది రాసేది ఒక్కరమే అయినా యివి మా బడి పిల్లలందరి అభిప్రాయాలు వరుసగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి, యింకా ప్రాధమిక – మాధ్యమిక –  ఉన్నత – సాంకేతిక – చదువుల మంత్రి మీరు. అంటే.. మీరు మా మంత్రి!

మన ప్రధానమంత్రిగారిలాగే మన ముఖ్యమంత్రిగారిలాగే మీరూ దేశ విదేశాల్లో తిరగడం తప్పు కాదు. కాని అక్కడైనా యెక్కడైనా మన దేశ ప్రతిష్ట జెండా కర్రలా- మనకుండాల్సిన వెన్నెముకలా- నిటారుగా వుండాలి! తలెత్తుకు తిరగాలి! రండి బాబూ రండి.. మా దేశంలో వ్యాపారాలు చేసుకోండి.. యవ్వారాలు చేసుకోండి.. మా దేశంలో తాగడానికి నీళ్ళు లేకపోయినా మీకు నీళ్ళిస్తాం.. మాదేశంలో ప్రజలకు పవర్ కట్లున్నా మీకు పూర్తి కరెంటు యిస్తాం.. మా వాళ్ళు భూముల కోసం సొంత అన్నదమ్ములే తలలు పగలగొట్టుకొంటున్నా, పోలీసుల్ని పెట్టయినా కొట్టయినా కేసుకట్టయినా కాల్పించయినా ప్రజలదగ్గర లాక్కొనయినా పీక్కోనయినా మీకు కావలసినంత భూమి యిస్తాం. మా దేశంలో ప్రజలకి వొక్కో రాయితీ తీసేసి.. రాయితీలు లేకుండా చేసి.. మీకు మాత్రం అడిగినన్ని రాయితీలు యిస్తాం.. అని దండోరా వేసుకు తిరుగుతున్నప్పుడు ‘దేశం పరువు తీసేస్తున్నార్రా’ అని చెప్పకేం ఈ దేశ నాయకులని తిట్టుకున్నాం. తిట్టుకుంటూనే వున్నాం!

మీరనుకోవచ్చు.. యివన్నీ నాకెందుకు రాస్తున్నారని? చెప్పాము కద సార్.. మీరు మా మంత్రి. మా విద్యార్థుల మంత్రి. అంతే కాదు, మీరు కూడా యీ మధ్య పై దేశముకెళ్ళి మా పరువు తీసారు. మా పరువు అంటే మా బడి పరువు. మన బడి పరువు!

మేము పేపర్లో చదివాము. కొలంబస్ నుండి ఆవార్త వొచ్చింది. మీరు యిక్కడికి మన దేశానికి వొచ్చాక కూడా అవే మాటలన్నారు. ఆ వార్తా చదివాము. యాభై లక్షలు విరాళంగా యిస్తే, అలా యిచ్చిన వారి పేర్లను, లేదా వారు సూచించిన వారి పేర్లను స్కూళ్ళకు పెడతాము.. అన్నారు. అలాగే పది లక్షలు యిస్తే తరగతి గదులకు పేర్లు పెడతాము.. అన్నారు. మా బడిలో చదివే ఆడపిల్లలు యేమంటున్నారో తెలుసా సార్.. లక్ష రూపాయలు యిస్తే యేకంగా టాయిలెట్స్ కట్టించి మరీ వారి పేర్లేకాదు, వారి మొత్తం కుటుంబం పేర్లూ పక్కనే శిలా ఫలకం మీద మీ పేర్లూ పెడతామని కూడా మీరు చెప్పివుంటే బాగుణ్ణు అని అనుకున్నారు. మీరు అమెరికాలో పర్యటనలో వున్నప్పుడే ఆ పని సిగ్గులేకుండా చెయ్యాల్సింది అని అన్నారు. ఓహియో తెలుగు సంఘం, టాకో వారు నిర్వహించిన సభలో మీరు పాల్గొన్నప్పుడే టాయిలెట్ల విషయమూ ప్రకటించి వుండాల్సింది..

సార్.. మన దేశంలో చదువుకొనే పిల్లలకి ఉచ్చపోసుకోవడానికి కూడా లేదూ అంటే సిగ్గు చేటు కాదా సార్.. మీ తెల్ల చొక్కాల మీద మురికి మాకందరికీ కనిపిస్తోంది, మీది మీకు కనిపించడం లేదా సార్.. ప్రభుత్వంలో వున్న మీకు ప్రభుత్వమంటే గౌరవం లేదా సార్.. ‘ప్రభుత్వ పాఠశాల’ అంటే బాగోలేదా? ‘సర్కార్ స్కూల్” అంటే బాగోలేదా? మీకీ దృష్టి వుండడం వల్లే కొందరు మా బడులను ‘దుంపల బడి’ అంటున్నారు. మీకు లేని సిగ్గు మాకేల? అని యిన్నాళ్ళూ వూరుకున్నాం. కాని మా బడి యెంత దిక్కుమాలిన పరిస్థితుల్లో వుందో మీరు విదేశాల్లో అడుక్కుంటూ వుంటే మీకు లేదేమో గాని మాకు అవమానంగా వుంది సార్. సార్.. మమ్మల్ని మీరు ముష్టివాళ్ళను చేసేసారు సార్.. ప్రభుత్వంలో వున్న మీరు ముష్టెత్తుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేము ముష్టివాళ్ళం కాక మరేమీ అవుతాం సార్..?

నిజం సార్.. మా బడికి కోట్ని గురుమూర్తి గేటు కొనిచ్చాడు.. గేటు మీద ‘ధర్మదాత కోట్నిగురుమూర్తి గారిచే దానము చేయబడినది’ అని వుంటుంది. ‘గది గచ్చులు పెంట భాస్కరమ్మ జ్ఞాపకార్ధం’ అని వుంటుంది. ‘గోడలకు చెక్క సున్నాలు చేయించినవారు బెహరా జగన్నాథ్’ అని రంగుల అక్షరాలతో రాయించి వుంటుంది. తాగే నీళ్ళ డేక్సా మీద ‘బిస్వజిత్ పాఠక్ గారి పాప సునంద రజస్వల సందర్భంగా యిచ్చిన కానుక’ అని వుంటుంది. డేక్సా సరే, ఆఖరికి చైను కట్టి వుంచిన నీళ్ళు తాగే గ్లాసు మీద కూడా ‘చైన్లు మాస్టారు గృహప్రవేశం సందర్భంగా యిచ్చినది’ అని వుంటుంది. బ్లాకు బోర్డులు, బెంచి బల్లలు, టేబుళ్లు, కుర్చీలు, హెడ్ మాస్టారి చైరు దాక.. అన్నీ దానం చేసినవే! ధర్మం చేసినవే! దయ తలచినవే!

సార్.. ఈ పేర్ల వెనుకన యెవరి పేర్లున్నాయో తెలుసా సార్..? ‘సత్యమేవ జయతే -మహాత్మా గాంధి’, ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -గురజాడ, ‘దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు’, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా- ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా- పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము! -రాయప్రోలు సుబ్బారావు’, ‘ మా తెలుగు తల్లికి మల్లెపూదండ – మాకన్న తల్లికి మంగళారతులు -శంకరంబాడి సుందరాచారి’… యిలా యెంతోమంది గది పెచ్చులు రాలిపడ్డప్పుడే పెచ్చులతో పాటు రాలిపోయారు. గోడలు కూలినప్పుడే గోడలతో పాటే కూలిపోయారు. వెల్ల వేసినప్పుడే వెల్ల కింద వుండి చెరిగి పోయారు! దారి చూపే పేరున్న దీపదారులే కాని దాన ధర్మాల పేర్ల కింద ఆరిపోయారు! అగుపడకుండా పోయారు!

సార్.. మీకు తెలుసా? మాబడిలో యిప్పటికే వొక్కో తరగతి గదికి వొక్కో పేరుంది. ‘చాచా నెహ్రూ తరగతి గది’, ‘కోడి శ్రీరామ మూర్తి తరగతి గది’, ‘ఆదిభట్ల నారాయణ దాసు తరగతి గది’, ‘కవికోకిల సరోజినీ నాయుడు తరగతి గది’, ‘సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గది’, ‘ఐన్ స్టీన్ తరగతి గది’, ‘అబ్దుల్ కలాం తరగతి గది’, ‘కల్పనా చావ్లా ప్రయోగ శాల’, ‘భగత్ సింగ్ ప్లే గ్రౌండ్’.. యిలా చాలా వున్నాయి సార్.. పెట్టుకున్నాం సార్.. కావాలంటే మీరు మా బడికొచ్చి చూడండి సార్.. మదర్ ప్రామిస్ సార్..

మరిప్పుడు యెలాంటి పేర్లు వొస్తాయి సార్? జొన్నలగడ్డ జోగేస్వరరావో.. చౌదరి మురళీ మన్మధరావో.. పూసపాటి నారాయణ రాజో.. వేదుల కాంతమో.. పెంట లక్ష్మీ కాంతమో.. యిలానో మరోలానో దాతల పేర్లు మా బడికీ తరగతి గదికీ పెట్టారే అనుకోండి.. యెవరైనా అడిగితే యేమని చెప్పాలి? మా తమ్ముడో చెల్లో అడిగితే యేమని చెప్పాలి? దేశభక్తులా? కారు!, దేశ నాయకులా? కారు!, కవులూ కళాకారులా? కారు!, శాస్త్రవేత్తలా? కారు, స్వాతంత్ర్య సమర యోధులా? కారు!, సంఘ సేవకులా? కారు!.. మరెవరు? అనంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్లనో.. లేకపోతే మన బడికి బెంచి బల్లలు కొనిపెట్టారనో.. గది కట్టారనో గోడ కట్టారనో.. యిటుకలు యిచ్చారనో.. లేదూ అంటే మన పేద గవర్నమెంటుకు డబ్బులిచ్చి ఆదుకున్నారనో.. చెపితే బావుంటుందా? దేశంపట్ల భక్తిని కలిగి వుండడం కన్నా- ప్రజల కష్టసుఖాలు యెరిగిన నాయకులుగా వుండడం కన్నా – కవిత్వములోనో కళలలోనో రాణించడంకన్నా – తమ జీవితాన్నిచ్చిన శాస్త్రవేత్తలకన్నా – సంఘ సేవకులకన్నా – దేశం కోసం ప్రాణాలిచ్చిన సమర యోధులకన్నా – అన్ని కష్ట నష్టాలు పడేకన్నా డబ్బు సంపాదిస్తే సుఖము. సౌఖ్యము. కీర్తి. కాబట్టి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి.. డబ్బు ముందు అన్నీ దిగదుడుపేనంటే.. యేదో యెక్కడో బాగోలేదు సార్. మంచిది కాదు సార్.. మంచిగా లేదు సార్.. సారీ సార్..

జనం కూడా గుర్తుపెట్టుకోరు సార్.. యిప్పుడు నవీన్ జిందాల్ యెంతమందికి తెలుసు సార్.. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి తెలుసు. తండ్రి ఓం ప్రకాష్ జిందాలే తెలీదు. నవీన్ జిందాల్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ యెట్ డల్లాస్ లో చదువుకొని, ఆర్ధిక సాయం చేసినందుకు అక్కడ అతని పేరుతో ‘నవీన్ జిందాల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంటు’ అని వొకటి పెట్టారు. చెప్పనా సార్.. మనదేశంలో జిందాల్ అంతడబ్బు యెలా సంపాదించాడు అని ఆలోచిస్తారు గాని వేరేలా ఆలోచించరు. డబ్బు లేనివాళ్ళంతా డబ్బు వున్న వాళ్ళదగ్గర యెలా వుందో వచ్చిందో ఆలోచిస్తారు. మీ మంత్రులు కూడా డబ్బు యెలా సంపాదిస్తున్నారో మా తలిదండ్రులూ టీచర్లూ మాట్లాడుకుంటూ వుంటే వింటూనే వుంటాము. అలా తెలిసిన విషయాలే యివి.

మరో విషయం.. ఆమధ్య వొక టీవీ వాళ్ళు.. ఆంధ్రులు.. ప్రవాసాంధ్రులు.. పూర్వ విద్యార్థులు.. వాళ్ళనీ వీళ్ళనీ అందర్నీ పిలిపించి.. ‘నీ బడి పిలుస్తోంది.. సాయం కోరుతోంది’ అని గజల్ శ్రీనివాస్ తో పాట పాడించి.. మరీ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసారు. ప్రభుత్వ పాఠశాలలు దీనంగా హీనాతి హీనంగా వున్నాయని అందరూ చెప్పారు. మేము చాలా సంబరపడ్డాము. అంతా కలిసి ప్రభుత్వాన్ని అడుగుతారనుకున్నాం. నిలదీస్తారని అనుకున్నాం. ప్రభుత్వంలో దానికో శాఖ వుంది.. మంత్రి వున్నాడు.. విద్యకి కూడా బడ్జెట్ వుంది.. మాట్లాడుతారు.. అని ఆశ పడ్డాం. లేదు, అడగలేదు. అవస్థ యిది అని వ్యవస్థని అడగలేదు. అడుక్కున్నారు. తప్పితే హక్కులు మరిచిపోయారు. కలిగిన వాళ్ళని జాలి చూపించమన్నారు. దయ చూపించమన్నారు. మన వూరు.. మన మట్టి.. మన బడి.. అని సెంటిమెంటుల ఆయింట్ మెంటులు రాసారు. లక్షల బడుల్లో వంద బడులు అదీ అప్పటికి బాగుపడితే చాలా? వుమ్ముతడి పనులు తప్ప శాశ్వత పనేనా యిది? ఇచ్చిన వాళ్ళ ఔదార్యం యెంత కాలముంటుంది? ఎందరికి వుంటుంది? అదికూడా బడి నుండి వెళ్లి బాగా చదువుకొని బాగుపడిన వాళ్ళు వున్నప్పుడే. లేనప్పుడు? లేదు! అంతే! మా బడులనుండి బాగా చదివి వెళ్ళిన వాళ్ళు లేరు. మా బడులు అలాగే వున్నాయి. అప్పటికీ వినాయక చవితికీ దసరాకీ చందాలు అడిగినట్టు డబ్బా పట్టుకు వెళ్లి అడుక్కున్నాము. బడిలో ‘బడికి సాయం చేయండి’ అని రాసి హుండీ కూడా పెట్టాము. అది గుడా? హుండీ నిండడానికి!? బడి కదా?!

సార్.. హక్కుగా అడగాల్సిన వాటికి.. అమలు పరచాల్సిన వాటికి.. అడుక్కోవడం బాగోలేదు సార్.. ఒకరి దయా దాక్షిణ్యాలమీద యెల్లకాలము నడవదు సార్.. మా పెద్దలు చెప్పారు సార్.. సార్ మీ మంత్రులంతా ప్రయివేటు బడుల ప్రారంభోత్సవానికి వస్తుంటారు. తప్పితే వొక్క సారి మా బడిలోకి రండి సార్.. స్లాబ్ పడిపోదు. పెంకులు జారి నెత్తి పగలదు. గోడ కూలి గాయం కాదు. పోనీ తలకు హెల్మెట్ పెట్టుకొని, వొంటికి బులెట్ ప్రూఫ్ తొడుక్కొని, సెక్యూరిటీ సిబ్బందిని పిలుచుకొని రండి సార్.. ఒక్క రోజుకి అలా అయితే భయపడితే యెలా సార్.. మేం నిత్యమూ చిన్నపిల్లలతో సహా యిక్కడే చదువుకుంటాము. వుంటాము. మేం మీరు పెట్టిన మీటింగులకి మా హెడ్ మాష్టారు చెపితే యెండలో రోడ్డు పొడుగునా నిలబడి మీకు స్వాగతాలు పలక లేదా సార్.. మానవహారాలు కాట్టాము సార్.. మరిచిపోయారా సార్..?

ప్రయివేటు విద్యాసంస్థలకి వేల యెకరాలు యిస్తున్నారే.. యెంకరేజ్ చేస్తున్నారే.. పెద్ద మాటలు అనుకోవద్దు, మేం రోజూ పేపరు చదువుతాము.. సార్.. ప్రయివేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. మరి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం కాక యెవరు ప్రోత్సహిస్తారు? లేదు సార్.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు సార్.. సార్ యేమిటో సార్.. ప్రభుత్వరంగంలో వున్నవన్నీ నీరసించి నశించి పోతున్నాయి.. అది విద్యయినా.. వైద్యమైనా.. యేదయినా.. ప్రభుత్వ బడులు వెనక బడితే అధికారులూ మంత్రులూ వెనకబడినట్టు కాదా? మాకేనా మార్కులు? మీకుండవా? ప్రభుత్వ బడులు దీటుగా నడపకుండా మూసేస్తే పోతుంటే మీరు ఫెయిల్ అయినట్టా? పాసయినట్టా?

దయచేసి డబ్బుకోసం ధరలు నిర్ణయించి బడిని బద్నాం చేయకండి. చేస్తామంటారా? అంతకన్నా ముందు వొక పని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమో.. భారత ప్రభుత్వమో.. అని కాక యిక్కడ పెట్టుబడులు పెట్టే టాటా ప్రభుత్వమో.. బిర్లా ప్రభుత్వమో.. రిలయన్స్ ప్రభుత్వమో.. విప్రో ప్రభుత్వమో.. హేచ్సీయల్ ప్రభుత్వమో.. హిందూజా ప్రభుత్వమో.. అదాని ప్రభుత్వమో.. అని పేరు మార్చుకోండి అంటే మార్చుకుంటారా? వాళ్ళంతా మన పేద దేశంలో డబ్బుగలవాళ్ళు.. వాళ్ళ వ్యాపారాల వల్ల మనకు ఉపాధి కలుగుతోంది అని అంటే పేర్లు మార్చేస్తారా? అంతెందుకు.. మీ ప్రభుత్వ శాఖల పేర్లు అయినా మార్చేస్తారా? మన చదువుల శాఖే వుంది. ప్రాధమిక విద్యని విజ్ఞాన్ విద్యనో భాష్యం విద్యనో కృష్ణవేణి విద్యనో మార్చమంటే మార్చేస్తారా? అలాగే మాధ్యమిక విద్యని చైతన్యా నారాయణల ‘చై.నా’ విద్యాశాఖ అని మార్చమంటే మార్చేస్తారా? మీకు కోర్టులు కూడా అనుకూలంగా వున్నాయి. ఈమధ్య విద్యా విషయాల మీద కోర్టు స్పందించింది. ప్రభుత్వ బడులను ప్రభుత్వం నడపలేకపోతే ప్రయివేటుకి అప్పగించమంది. అప్పుడే చాలా మంది ప్రయివేటు విద్యా వ్యాపారులు అందుకు సిద్ధంగా వున్నామని అన్నట్టుగా కూడా పేపర్లో చదివాము. అంచేత మీరు సిద్ధమే అయితే యింక మీకు శాఖ వుండదు! మీ అవసరమూ వుండదు!

సరే సార్.. ఆఖరిగా వొక మాట.. మా బడిలో పేద్ద సరస్వతీ దేవి పటం వుంది సార్.. అది కూడా మా బడికి యెవరో బహుమతిగా యిచ్చిందే సార్.. దానమిచ్చిందే సార్, జిల్లా ఫస్టు వొస్తే. సార్.. మా సరస్వతీ దేవి యెలా వుంటుందో తెలుసా సార్.. తెల్ల చీర కట్టుకొని చేతిలో వీణతో హంస మీద కూర్చొని మెరిసిపోతుంటుంది సార్.. ఆ చీర గురించి చాలా సార్లు మా అమ్మకు చెప్పాను సార్, సరస్వతీ దేవి అందమంతా చీరలోనే వుందని! కాని సార్.. యిప్పుడెప్పుడు చూసినా సరస్వతీ దేవి అందంగా కనిపించడం లేదు సార్.. తెల్ల చీర మాసిపోయి చిరిగిపోయి వీణ తీగలు తెగిపోయి ఆముఖంలో నవ్వు మాయమైపోయి దిక్కుమాలిన దానిలా వుంది సార్.. అచ్చం మాలాగే!

పెద్ద వుత్తరం రాస్తే చేట భారతమని చదవరట గదా సార్.. అందుకే రాయాలని వున్నా రాయకుండా ఆపేస్తున్నాము. తప్పులుంటే మన్నించండి. అయినా వొక తప్పు వల్ల వొంద తప్పులు జరుగుతాయి. మా తప్పులు అలాంటివేనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము!

మళ్ళీ నమస్కారాలతో-

మీ

విద్యార్థులు

(ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు)

పువ్వులు జాగ్రత్త!

 

 

     -బమ్మిడి జగదీశ్వరరావు

 

అమ్మా..

ఎలా వున్నావమ్మా.. నువ్వూ అల్లుడుగారూ యిద్దరూ బాగున్నారు కదా? నానిగాడు కూడా పదిలమని భావిస్తాను! మీ యింటి నుండి వచ్చాక మనవడి ముచ్చట్లు చెప్పినవే పదే పదే అడిగి మరీ చెప్పించుకుని మీ అమ్మ మురిసిపోతోంది! రోజూ కొత్త కొత్త విషయాలు విన్నట్టుగా వింటోంది! నా మనవడు చాలా తెలివైన వాడు అంటోంది! ఏ మాటకామాట మీ అమ్మ నిన్ను గురించి తలచుకోవడం తగ్గింది! నీ కొడుకు గురించి తలచుకోవడం పెరిగింది! వాడు పుట్టిన ఈ ఆరేడేళ్ళుగా యిదే వరుస! అదే అలవరుస!

అడిగితే చెప్పడానికి నీకేమిటి నొప్పి? అని తిరిగి మీ అమ్మ అడుగుతుంది! గొడవపడుతుంది! పోట్లాడుతుంది! నువ్వేం మనిషివి అంటుంది! నువ్వేం తాతవి అంటుంది! నిజంగా నానిగాడి గురించి చెప్పాలంటే నాకు నొప్పే! మీ అమ్మతో కాదు, నీతో మీ ఆయనతో గొడవ పడాలనిపిస్తుంది! పోట్లాడాలనిపిస్తుంది! తాతనని మరిచిపోయి తాట తియ్యాలనిపిస్తుంది!

అయినా తప్పు వాడిది కాదులే! వాడొక్కడిదే కాదులే! పిల్లలందరూ యిలానే వున్నారేమో..? తలచుకుంటే భయమేస్తోంది! నేను మీ అమ్మలా సరదాగా తీసుకోలేకపోతున్నా! నానిగాడి ముచ్చట్లు చెప్పినపుడల్లా నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి! మీయమ్మకు యివేవీ పట్టవు! నేను యెక్కువగా ఆలోచిస్తున్నానని అంటుంది! అనవసరంగా భయపడుతున్నానని అంటుంది!

నాది భయమో.. బాధ్యతో తెలీదు! నీ దృష్టికి తేవాలనిపించింది! యివన్నీ ఫోనులో మాట్లాడలేక వుత్తరం రాస్తున్నాను!

మీ యింటికి వొచ్చిన దగ్గరినుండి నానిగాడు నన్ను ప్రశ్నల వర్షంతో ముంచెత్తాడు! ప్రశ్నించడం జీవ లక్షణం! కాని నా మనవడి ప్రశ్నలకు నాకు రాత్రుళ్ళు నిద్దర పట్టేది కాదు! వేడి పాలు తాగినా వుపయోగం వుండేది కాదు! నువ్వేమో కొత్త ప్లేసు కదా అనేదానివి! ఏమి చెప్పాలో నాకూ తెలీలేదు!

మొదటి రోజు రాత్రి నానిగాడ్ని పక్కన వేసుకొని పడుకున్నానా? వాడి తల నిమిరానా? అప్పుడు అడిగాడు.. ‘తాతయ్యా తలలో యేముంటాయ్?’, నాకు సమాధానం యేo చెప్పాలో తెలీక, తిరిగి ‘యేముంటాయ్?’ అన్నా! ‘అది కూడా తెలీదా?’ అని చాలా ఆశ్చర్యపోయాడు! వాడి ఆశ్చర్యం చూసి నేనూ అంతే ఆశ్చర్యపోయా! అయ్యో అదీ తెలీదా అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేసి నా చెవిలో చెప్పాడు! ‘తలలో యినుము వుంటాది, మెటల్.. మెటల్..’ అన్నాడు! విని, ‘మెంటల్..’ అన్నా! ‘మెంటల్ వాడి తలలో కూడా మెటలే వుంటుంది..’ అన్నాడు! ‘నీకెవడురా చెప్పాడు..?’ అన్నా, ‘అన్నీ అందరూ చెప్పరు, కొన్ని మనకి మనమే తెలుసుకోవాలి..!’ అని నాకు జ్ఞానోదయం చేశాడుతల్లీ నీకొడుకు.. అప్పటికీ ‘నీ తల యిందుకేనా యింత గట్టగా వుంది..’ అని నవ్వేశా! వాడు నవ్వకుండా ‘అమ్మని మట్టి బుర్ర అని నాన్న తిడతాడు, కాని అమ్మతలలోనే కాదు, యెవరి తలలో మట్టి వుండదు, మెటలే వుంటుంది.. వూ..!’ సత్యాన్ని కనుగున్నట్టు చెప్పాడు! అప్పటికీ ‘అలా అని మీ పాఠాల్లో వుందా..?’ అడిగాను. ‘పాఠాల్లో అన్నీ వుండవు తాతయ్యా..’ కాస్త విసుక్కున్నాడు కూడా!

ఒప్పుకున్నాను తల్లీ.. నీ కొడుకుతో చాలలేక వొప్పుకున్నాను!

ఆ రాత్రి నా మనవడు నాతల నిమిరాడు. ‘ఏమిటి తాతా..?’ అన్నాను, ‘నీ తలలో కూడా మెటలే వుంటుంది..’ చెప్పాడు. ‘నయం.. సమయానికి మీయమ్మమ్మ లేదు..’ అన్నా. ‘వుంటే..?’ అన్నాడు. ‘నన్ను యినుప సామానుల వాడికి కేజీల్లెక్క అమ్మేసేదిరా..’ నవ్వుతూ అన్నా. ‘నీకే అనుకున్నా, అమ్మమ్మకి కూడా తెలీదా..?’ అడిగాడు. ఏమిటి అన్నట్టు చూసాను. ‘తలలో మెటల్ వుంటుందని..’ అన్నాడు. ‘చాల్లే పడుకో..’ అన్నాను. నన్ను చూసి నా సమాధానం విని నేను వాడి మాటలు నమ్మడం లేదని అనుకున్నట్టున్నాడు. అందుకే ‘నీ తల మీద సుత్తితో.. వూ.. రాడ్ తో కొట్టి చూద్దామా..? టంగ్ టాంగ్..మని శబ్దం వస్తుంది..’ అన్నాడు. నానిగాడి మాటలకు భయంతో చూసాను. ‘తాతయ్యా.. నీకు భయమేస్తే పోనీ నా తలమీద కొట్టు తాతయ్యా..’ అని తల వంచాడు.

ఏమనాలో తెలీక ‘నాకు నిద్దరొస్తోంది..’ అన్నా. కళ్ళు మూసుకున్నా. ‘తాతయ్యా..’ పిలిచాడు. నే పలకలేదు. కొంపతీసి సుత్తో రాడ్దో తీసుకువొచ్చి మెటల్ సౌండ్ కోసం వొక్కటేస్తే..?’ వులిక్కిపడి కళ్ళు తెరిచాను. నన్నే చూస్తూ నవ్వాడు. ‘నీకు నిద్దర్రావడం లేదు కదా తాతయ్యా..’ అన్నాడు. అని లేవబోతే.. లేవనీయకుండా చెయ్యి అడ్డం పెట్టా. దాంతో వెనక్కి వొక్కసారిగా నేలమీద పడ్డాడు. తలకి తగిలిందేమోనని చేత్తో వాడి తలని తడమ బోయా.

‘తలలో మెటల్ వున్నట్టే.. నేలలో రబ్బరువుంటుంది..’ అన్నాడు. వాడివి వెర్రి మాటలన్నట్టు నేను చూస్తే.. వాడు నన్ను వో వెర్రిబాగులవాన్ని చూసినట్టు చూసాడు. ‘బంతి నేలకు కొడితే యేమవుతుంది?’ అడిగాడు నాని. ‘కొట్టినంత వేగంగా పైకి లేస్తుంది..’ అన్నా. ‘బంతే కాదు, బలంగా కొడితే మనిషులయినా యిలా కిందకి కొడితే అలా పైకి లేచి యెగురుతారు..’ అన్నాడు. అక్కడితో ఆగక ‘యేoటో తాతయ్యా.. ముసలయ్యే కొద్దీ అన్నీ మర్చిపోతారట.. నువ్వు కూడా అన్నీ మర్చిపోయినట్టున్నావ్..’ చెప్పక ముందే ‘వొక్కటిచ్చానంటే మీ అమ్మ దగ్గరకు వెళ్లి పడతావ్..’ అన్నా. ‘గుడ్.. నాకు పొద్దున్న వొక్కటివ్వు తాతయ్యా.. స్కూల్లో పడాలి దెబ్బకి.. స్కూల్ బస్సు మిస్సయినప్పుడు అమ్మ తిడుతుంది గాని గట్టిగా యివ్వదు.. షాట్’ అన్నాడు.

అప్పటికీ వాడిది పిచ్చి వాగుడు అనుకున్నా. కాని సరిపెట్టుకోలేకపోయా. ముందు రోజు జర్నీలో తలకింద చెయ్యి పెట్టుకు పడుకున్నానేమో.. మెడ దగ్గర నరం పట్టేసి జండూబామ్ రాసుకుంటుంటే ‘పైప్ కు ప్రాబ్లమా తాతయ్యా..?’ అని అడిగాడు. ఏమంటే ఏమంటాడో అని ‘ఆ’ అన్నా. ‘పైపుల్లో బ్లడ్డు రయ్ మని తిరుగుతుంది కదా..?’ అన్నాడు. ‘పైపులేమిట్రా.. అవి నరాలు..’ ఆగలేక చెప్పా. ‘పైపులు.. అదే నరాలు.. యెత్తుగా బాడీ మీద కనిపిస్తాయి కదా..’ అని అంటే ‘యెప్పుడు..?’ అని అర్థం కానట్టు చూస్తే, ‘కోపం వస్తే.. యెవడ్నన్నా కొట్టే ముందు.. పైపులు.. నరాలు.. బ్లడ్ అంతా పచ్చగా బాడీ అంతా యిలా యిలా..’ చెప్పేవాడే, ‘తాతయ్యని పడుకోనివ్వవా..?’ వాళ్ళ నాన్న కేకతో సైలెంట్ అయ్యాడు. అలాగే నిద్ర పోయాడు. అని అనుకున్నాను. కాని గొంతు తగ్గించి ‘యెవరైనా మనల్ని గన్ తో కాల్చితే చచ్చిపోతామా? చచ్చిపోమా?’ గుసగుసగా అడిగాడు. నిర్ఘాంత పోయా.

నాకు మాత్రం వచ్చిన నిద్ర వదిలి పారిపోయింది. ‘చెప్పు తాతయ్యా..’ గుగుసగా అడిగాడు. గట్టిగా కూడా అడిగాడు. ‘బుల్లెట్ తగిలితే యెవరైనా చచ్చిపోతారు..’ అన్నా. ‘యెవరి గురించి కాదు.. మన గురిచి చెప్పు.. చచ్చిపోతామా లేదా?’ ఖచ్చితంగా అడిగాడు. ‘మనల్ని యెవరు యెందుకు కాలుస్తారు చెప్పు..’ అన్నా. ‘యెందుకో కందుకు..’ అన్నాడు. ‘నన్ను కాలుస్తున్నావు కదరా..’ అన్నా. ‘సరే కాల్చాను.. చచ్చి పోతావా లేదా?’ అడిగాడు. చేసేదిలేక ‘చచ్చి పోతా..’ అన్నా. ‘నువ్వు బ్యాడ్ పర్సన్ వి.. విలన్ వి.. అందుకే చచ్చిపోతావ్..’ అన్నాడు. ‘మరి నువ్వో..?’అన్నా. ‘ ఐయామే గుడ్ పర్సన్.. హీరో.. యెన్ని బుల్లెట్స్ కాల్చినా..’ యింకా చెప్పేవాడే ‘నానీ..’ వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళాడు. వెళ్లి నిద్రపోయాడు.

నాకింక రాత్రి తెల్లవార్లూ నిద్ర పట్టలేదు! నువ్వు అడిగినా చెప్పలేదు! ఎందుకంటే నాకే యేమీ బోధ పడలేదు! ‘నాన్నా నువ్వెందుకలా వున్నావ్.. నేనేమి అన్నానా? మా ఆయనేమి అన్నారా?’ అని నువ్వు అడిగావు. చెప్పేంత పెద్ద విషయమూ కాదు, వదిలేసేంత చిన్న విషయమూ కాదు. కూరగాయలు తరిగినట్టు మనుషుల్ని తరిగే సినిమాలకు దూరంగా వుంచు, వుంచగలిగితే! సుత్తితో నెత్తి బద్దలుగొట్టినా రక్తం దారాలు కడుతుంటే దులిపేసుకొని ఫైట్ చేసే తెలుగు హీరోల సినిమాలకు దూరంగా వుంచు, వీలయితే! ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు యెవరు యెవర్నైనా చంపేసుకోవచ్చనే ముఖ్యంగా పోలీసులకు ఆ హక్కువుందనే తొక్కు తెలుగు సినిమాలకు దూరంగా వుంచు, క్రూర జంతువులకంటే దుర్మార్గంగా చంపుకొనే చెత్త సినిమాలకు దూరంగా వుంచు, వాడికో వ్యక్తిత్వం రూపు కట్టేదాకయినా దూరంగా వుంచు, వాడిలో సున్నితత్వం బండబారిపోకుండా దూరంగా వుంచు, వుంచగలిగితే!

టుపుక్కుమంటే పుటుక్కున పోయే ప్రాణాలు కదా మనవి.. మనుషులవి! ప్రాణం విలువ తెలియకుండా వొక్కోడు వొక్కో సినిమాలో పదిమందివో వందమందివో ప్రాణాలు తీయడం.. మన పిల్లల ప్రాణాలు తీయడమే! ఒక్కటంటే వొక్కటి.. వొక్క ప్రాణం పోసే సినిమా.. వొక్క సినిమా వొచ్చినా బాగున్ను! ప్రాణం పోసినట్టుగా వున్ను! ప్రాణం విలువ తెలిసున్ను!

ఎవరికీ వారే- తమ పిల్లలు పువ్వుల్లా కళకళలాడుతున్నారా? యినుప చువ్వల్లా ఫెళ ఫెళలాడుతున్నారా? తెలుసుకోవాలి తల్లీ.. తల్లివి కదా అదేదో నీనుండి ప్రారంభం అవ్వాలని మనసాగక నీకు యీ వుత్తరం రాస్తున్నా..

నానిగాడికి నాముద్దులు..

వుంటానమ్మా..

మీ

నాన్న

 

 

అబ్ కీ బార్.. అగ్లీ బార్..

 

                       -బమ్మిడి జగదీశ్వరరావు

~

గౌరవనీయులైన ప్రధాని మోడీగారికి!

నమస్కారాలతో-

‘నా దేశం మారుతోంది

ముందుకు పురోగమిస్తుంది’ – అని,

“అబ్ కీ బార్” యువతకు అపారమైన అవకాశాలు’ – అని,

మీరు యిచ్చిన ప్రకటన.. మన భారత ప్రభుత్వం తరుపున మీరు యిచ్చిన ప్రకటన.. చాలా బావుంది. అందుకు మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు!

’20 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం’ అన్నారు. ఢిల్లీ జవహరలాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలను తలదన్నేలా యివాళ మీ పాలనలో దేశమే వొక యూనివర్సిటీగా మారింది అందుకు కూడా మీకు నిజంగా అభినందనలు!

‘ప్రధానమంత్రి “కౌశల్ వికాశ్ యోజన” కింద 20 లక్షలకు పైగా యువకులు శిక్షణ పొందారు’ అన్నారు. యిది నిజం! ముమ్మాటికీ నిజం! అయోధ్యలో నిర్వహించిన, నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రమే అందుకు సాక్ష్యం! స్థానిక యువతకు శిక్షణ యివ్వడం యెంతయినా గొప్ప విషయం! మన ఆరెస్సెస్, విహెచ్పీల పాత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించతగ్గది! శిలాక్షరాలతో నమోదు చేయతగ్గది! భారత దేశ భవిష్యత్తును యిప్పుడే సందర్శించతగ్గది!

అయ్యా.. మన యువత తుపాకులూ కర్రలూ పట్టుకొని సైన్యంగా కవాతులు చేస్తుంటే – పరుగులు తీస్తుంటే – అగ్గిలోంచి దూకుతూ వుంటే – నిప్పు చక్రాల్లోంచి యెగురుతూ వుంటే – ముస్లింలను పోలిన ఆ వుగ్రమూకలపై తిరగబడుతూ వుంటే – తలలుబద్దలు చేస్తూ వుంటే – రక్తాలు పారిస్తూ వుంటే – కాల్పులు జరుపుతూ మందిని మట్టుబెడుతూ వుంటే – వాళ్ళంతా అలా నేలకు వొరిగిపోతూ వుంటే – శాంతి కపోతం ఆకాశంలోకి యెగరడం చూస్తూ వుంటే – నా వొళ్ళు పులకరించిపోయింది అంటే నమ్మండి! అప్పుడే కొందరి గుండెల్లో చెమటలు పడుతున్నాయి! అందుకే అంతలా యేదో అనర్ధం జరిగిపోతున్నట్టు గగ్గోలు చేస్తున్నారు! మాక్ ప్రదర్శనలా కావవి.. భారత సైన్యం యెక్కడో సరిహద్దుల్లో లేదని.. మన పక్కలో భల్లెంలా దుర్గామాత భల్లెంలా వుందని.. మన మధ్యనే వుందని.. కళ్ళు పట్టని ఆదృశ్యం చూస్తే.. ఆహా అనిపించింది! ఓహో అనిపించింది!

మరి నోయిడాలో? అభం శుభం తెలియని పిల్లలకు అద్భుతమైన శిక్షణ యివ్వడం కూడా మామూలు విషయం కాదు! మొక్కలే వంగుతాయి! మానులు వంగవు! దేశానికి పిల్లలే గాని దేశ భక్తికి పిల్లలు కారు! వొకరా యిద్దరా.. యెందరో వీర శివాజీలు! వీర సావార్కరులు! భవిష్యత్ భగవతీలు! రేపటి మన తొగాడియాలు! పిల్లలలో యిలాగే స్పూర్తిని నింపాలి! రగిలించాలి! రణరంగంలోకి పంపించాలి! చదువుకున్న పాఠాలలో మార్పులతో పాటు యీ విధమైన శిక్షణ ప్రతి పాఠాశాలలో యివ్వాలి! పాఠాశాలలు లేనిచోట అంగన్వాడి కేంద్రాలలోనే శిక్షణని యివ్వాలి! మొదలవ్వాలి! భారతీయతను దర్శించేలా తరించేలా తయారు చేయాలి! ముక్కుపచ్చలారని ముఖాల్లో వెచ్చటి దేశభక్తి టీవీల్లో చూసి యెలా మరిచిపోగలను? అసలుసిసలు “మేక్ యిన్ యిండియా” అంటే యిదే! అర్థం చేసుకోలేని కుహనా లౌకికవాదులు చేస్తున్న పర్ధం లేని ఆరోపణలు అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు! ప్రతిపక్షాలన్నాక ఆ మాత్రం విమర్శించకపోతే వాటికి వునికి వుండదు! డోంట్ కేర్! కేర్ వోన్లీ కేర్ కేర్ పిల్లలు! కేరింతల పిల్లలు! కరసేవకు పిల్లలు!

యింకా వారణాసిలో? మన వీహెచ్‌పీకి అనుబంధ సంస్థ.. దుర్గావాహిని సంస్థ యిచ్చిన శిక్షణ భారతీయ మహిళా చరిత్రలోనే మరువలేనిది! మరువరానిది! మరపురానిది! నిజంగా ఆడవాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది! అది మనం వారి మాటల్లోనే వినొచ్చు! కనొచ్చు! ‘లవ్ జీహాది’ పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకుంటామని పిడికిలి బిగించి ముందుకు వచ్చారు యెందరో గృహిణులు.. విద్యార్ధినులు.. అమ్మాయిలు! పెళ్లి కూడా వాళ్లకు ప్రతిబంధకం కాలేదు! ఒక్కొక్కరూ వొక్కో లేడీ బ్రిగ్రేడ్! వీళ్ళంతా దేశానికి గొప్ప సందేశాన్ని యిచ్చారు! ‘ఆత్మరక్షణకే ఆయుధం’ అంటున్నారు! తుపాకులు యెక్కుపెడుతున్నారు! తూటాలు దట్టిస్తున్నారు! సుకుమారము వొదిలి మారాము చేస్తున్నారు! సున్నితమైన వేలిని ట్రిగ్గర్ మీద పెట్టి టార్గెట్ ని టార్గెట్ చేస్తున్నారు! వారి కన్ను మనకి వెన్ను! కాంతలు కత్తులైనారు! కరవాలాలై తిరుగుతున్నారు! తిప్పుతున్నారు! కరసేవకు సిద్ధమంటున్నారు! ఆత్మవిశ్వాసమే మా అడ్రెస్స్ అంటున్నారు! అంతే కాదు, దేశంలో యితర ప్రాంతాలలో కూడా శిక్షణ యిస్తామని కొనసాగిస్తామని యెంతో నమ్మకంగా చెపుతున్నారు! అబ్ కీ బార్.. ప్రపంచ మహిళల్లోనే భారతీయ మహిళ అందరికన్నా ముందున నిలబడ్డది!

అయోధ్యా.. నోయిడా.. వారణాసి ప్రాంతాల్లో శిక్షణలను యివాళ మీడియా బూచిని చూపించినట్టు చూపించొచ్చు! కాని మా వూళ్ళో.. వూరు విడిచిపెట్టి వచ్చి వున్న ఈ నగరంలో.. చాలా స్కూళ్ళలో పొద్దున్నే తెల తెలవారక ముందే ఖాకీ నిక్కర్లూ తెల్ల చొక్కాలు వేసుకొని- కర్రలు పట్టుకొని- తలకు ఓం గుర్తుగల కాషాయపు జెండాలు కట్టుకొని- కర్రసాములూ కరాటేలూ చేస్తూ వుంటే.. రేపటి యుద్ధానికి యివాళే సిద్ధమవుతూ వుంటే.. చూడాలంటే కళ్ళు చాలవు! యిది నర సైన్యం కాదు, వానర సైన్యం!

“స్టార్టప్ యిండియా’ – దేశంలోని యువతే మన సంపద. వీరిలో కొత్త కొత్త అన్వేషణలు చేసేవారికి ప్రభుత్వం సాంకేతిక సహకారం, మెంటార్ షిప్ ద్వారా సాయం అందిస్తోంది” అంటూ మీరిచ్చిన ప్రకటన.. ప్రకటన మాత్రమే కాదని, ప్రచారం కానే కాదని, ‘ఆచరణ’ అని అక్షరమక్షరమూ నిరూపిస్తోంది! సాక్ష్యంగా నిలుస్తోంది! దేశంలోని అణువణువూ నినదిస్తోంది!

ప్రతిపక్షాలకు పని లేదు! మేథావులకు పని లేదు! ఆలోచనాపరులు అని చెప్పుకొనే వాళ్ళకి అస్సలు బుద్ది లేదు! యూపీ యెన్నికలలో లబ్ది పొందడానికే యిదంతా చేస్తున్నామని ఆరోపిస్తున్నారు! ఆరోపిస్తారు.. అరుస్తారు.. అంతకంటే యేమి చేస్తారు? ఆరెస్సెస్ ఐయస్ వొకటేనా.. రామ రామ.. దుర్మార్గం కాకపోతే?  ఆరెస్సెస్ ని ఐయస్ తో పోల్చడం మేథో దివాళాకోరుతనం తప్ప యింకోటో మరోటో కాదు! మన వాదాన్ని వాళ్ళు వివాదం చేస్తున్నారు! తప్పనిసరి పరిస్థితుల్లో అయోధ్యలో శిక్షణ పొందుతున్న యువకుల్ని కొద్దిమందినైనా అరెస్టు చేయడాన్ని మేము అర్థం చేసుకోగలము! మళ్ళీ మనం రెట్టింపు వుత్సాహంతో పని చేయాలి! నిజం చెప్పనా.. మీరు అధికారంలోకి వచ్చాకే మాకు అనేక అవకాశాలు వచ్చాయి! మనం విస్తరిస్తున్నాం! అందుకు కూడా మీకు నా కృతజ్ఞతలు!

మన ప్రభుత్వ ప్రతినిధులూ నాయకులూ యెవరి వంతు సహకారం వారు అందిస్తూ మాట్లాడుతున్నారు! వారికి నా కృతజ్ఞతలు! అన్నట్టు చెప్పడం మరిచాను, మన సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలో ఆలయ నిర్మాణం యీ యేడాదే చేస్తామనడం.. దానికి వుమా భారతి గారు ‘సుబ్రహ్మణ్య స్వామే నా హీరో’ అనడం యివన్నీ కూడా మాలో నిద్రాణమై వున్నా ఆత్మా’రాముణ్ణి’ లేపుతున్నాయి! మేల్కొలుపుతున్నాయి!

మనది లౌకిక రాజ్యం! లౌకిక రాజ్యానికి యెప్పుడూ శ్రీరాముడే రక్ష! నాకు తెలుసు మీరు రామ రాజ్యం తెస్తారు! తెచ్చి తీరుతారు!

‘అబ్ కీ బార్’ ప్రకటనలోనే- మీతో మాట్లాడడానికి ఫోను నెంబరు యిచ్చి మిస్సుడు కాల్ యివ్వమన్నారు.. యిచ్చినా యివన్నీ మాట్లాడే అవకాశం వుండదని మీకు యిలా వుత్తరం రాయాల్సి వొచ్చింది!

‘యధారాజా తదా ప్రజ’ తప్పక అవుతారని ఆశిద్దాం..!

మీకు మరోసారి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తూ..

జై హింద్!

మీ

దేశభక్త అభిమాని

 

 

లడ్డూ కావాలా నాయనా..!?!

A_Tirupathi_laddu

 

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ప్రియమైన భక్తులకి..

భగవంతుడు పంచుకోవాల్సింది వొకటుంది.. అది లడ్డు.. మహా ప్రసాదం!

నాకు తెలుసు, నాకులాగే మీకూ ‘తిరుపతి’ లడ్దంటే మహా యిష్టం కదూ.. లడ్డూ ప్రసాదం కళ్ళకి అద్దుకోనే లోపలే నోట్లో నీళ్లూరుతాయి.. తప్పు కాదు.. ఆ రుచి అటువంటిది.. మీరే కాదు.. నేనయినా అంతే!

నన్ను చెయ్యెత్తి మొక్కనివాళ్ళు కూడా నాలడ్డూని యిష్టంగా అపురూపంగా తింటారు.. అంత కమ్మగా వుంటుంది. యెంతో జిమ్మగా వుంటుంది. అమృతమంత రుచిగా వుంటుంది. ఆమాటకొస్తే అమృతానిది యేమి రుచి? అమృతాన్ని తలదన్నే రుచి కదూ లడ్దూది..?

అందుకే సుప్రభాతం సమయాన వెన్నతో మొదలుపెట్టి యేకాంతసేవ లోపు లడ్డూ వడా చెక్కెర పొంగలీ బెల్లం పొంగలీ పులిహోరా దద్దోజనమూ వడపప్పూ చిన్నలడ్డూ మిరియాల అన్నమూ కలకండా యింకా నేతి మురుకూ జిలేబీ ఫోళీ సమోసా పాయసమూ పెద్దవడా సిరా బెల్లం దోశా మురుగన్నమూ అప్పమూ.. అన్నీ అర్పించినా సమర్పించినా.. నాకు ఆ లడ్డూయే వేరప్పా.. దాని రుచి దేనికీ రాదు గాక రాదు!

అంతెందుకు?, నాదర్శనం కానప్పుడు కూడా లేని నిరాశ లడ్డూ దొరకనప్పుడు వొస్తుంది.. ఔనా..?

లడ్డూ పదార్థమే కాదు పదం విన్నా నోట్లో నాలుక మునిగిపోతుంది! ఎంత కమ్మటి వాసన. అమ్మ దగ్గర వొచ్చే వాసన. ఆలి దగ్గర వచ్చే వాసనకు పోటీ పడదూ సువాసన..? ఆస్థానం లడ్డూ.. కల్యాణం లడ్డూ.. ప్రోక్తం లడ్డూ.. దేనికదే సాటి గదూ..?

మా యిద్దరు దేవేరులూ కలిసి యింత శనగపిండి తెచ్చి నలుగు పెడతారా? నాకు వొళ్ళు మంటగా వుంటుంది! అర్ధాంగీలే గాని అర్థం చేసుకోరూ?! ‘వొంటికి గట్టిగా గంపలకొద్దీ శనగపిండి పెట్టకపోతే రంగు యేడ నుంచి వచ్చుద్ది’ అంటారేగాని ‘అయ్యో శనగపిండి.. లడ్ల లోకి పనికొస్తాదే..’ అంటే వింటారా.. వినరు! క పోగా ‘యింత లడ్డులపిచ్చి యేమయ్యా నీకు’ అని మురిపెంగా తిట్టిపోసి తినబెడతారు!

లడ్డూలో వుండేది శనగపిండేనా? బూందీతోటి పటికబెల్లముతోటి పచ్చకర్పూరముతోటి.. నెయ్యేసి ముంతమామిడి పువ్వేసి కుంకుమపువ్వేసి.. కలకండా జీడిపప్పూ యాలకులూ యెoడుద్రాక్షా చెక్కెరా.. యెన్నెన్నో యేసి.. అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..

‘తేనెని మించిన తీయందనము.. మధువును మించిన మధురసము.. ఆహా.. ఆహాహా.. వోహో.. వోహోహో..’ యీ తిరుమల శ్రీవారు లడ్డూ కోసం తపిస్తూ పరితపిస్తూ అమ్మ వెంట పడ్డ పిల్లాడిలా గుమ్మలవెంటపడి పరిగెత్తుతూ రెండు చేతులూ చాస్తే- నాసామిరంగా.. కౌగిలికంటే తీయగుండదూ..?! ఆమాటే అంటే యిక ఆడంగులతో అగ్నిగుండం తొక్కడమే! యెందుకని.. ఆ పెదవులు అందుకొని.. లడ్డూలా వున్నాయి.. అంటే మురిసిపోయారే గాని లడ్డూ ‘అగ్రస్థానం’ అందనేలేదు!

‘లడ్డూ కావాలా నాయనా..’ అని అటు అలమేలు మంగమ్మా యిటు పద్మావతమ్మా యిద్దరూ చెరో లడ్డూ చేత పట్టుకు తెచ్చారు.. ఆవురావురు మన్నాను. ఆబగా అందుకున్నాను. ఆత్రంగా తినబోయి ప్రయత్నించి ఆగి.. నిమిరి ఆఘ్రాణిస్తూ వుండగా ‘యీ పతి.. మన శ్రీపతి.. యేనాడైనా మనల నిమిరి యింత పరవశించినాడా..?’ అలిగినారు భామలు. మూతులు మూడొంకర్లు పెట్టినారు. ‘వశమయ్యాక.. పరవశము యేడ నుండి వస్తుందే..!’ అని గొణిగినాను. అంతకన్న సణిగిన సమరమని నాకు అనుభవపూర్వకముగా తెలుసును! ముందు తిన్నాక ఆపైన అలక తీర్చవచ్చుననుకున్నాను!

‘అబ్బా యేమి సేస్తిరి యేమి సేస్తిరి..’ అనుకొనగా ‘నీ నామమెంతో రుచిరా..’ భక్తుల పాటలు నన్ను తాకాయి. ‘ఈ లడ్డూ యెంతో రుచి యెంతోరుచిరా’ సందర్భోచితంగా నా పలుకులు పల్లవించాయి. గొల్లపిల్లవాడిని అమ్మ నోరు తెరవరా అంటే తెరిచినట్టు ‘ఆ..’ అని తెరిచాను. ఔను మరి.. నోరు పట్టని లడ్డూ ఆయే! లాలాజలము యేడు సముద్రాల తీరున యెగసి పడుతోంది! లడ్డూ కొరకబోతే నా పన్నూడింది. నాది కాదు. భూలోకంలో భక్తుడిది. భక్తుని భక్తిని స్వీకరించినట్టే నొప్పినీ స్వీకరించినాను.

గుమ్మలిద్దరూ గమ్మున అలకని అవతలికి విసిరికొట్టి నన్ను వొక్క వురుకున చేరినారు. అర్ధ భాగాలు కదా? రెండు అర్ధ భాగాలు.. సగమూ సగమూ కలిపి నా జగము మొత్తం వాళ్ళే! ఏదీ నాకేదీ చోటు? నేను లేను! మొత్తం వాళ్ళే. వాళ్ళకే నొప్పి. వాళ్ళదే బాధ. వాళ్ళకి నేను బందీ!

నేను నవ్వాను. వాళ్ళు యేడ్చారు. యెద పోసుకున్నారు. నా విరిగిన పన్ను చూసి వొరిగిపోయారు. వలవల కన్నీరుగ కరిగారు. ‘గుమ్మలే కాదు అమ్మలు మీరు’ అనుకున్నాను. కన్నీటి పొరలు కమ్మగ మసక కళ్ళతో ‘యేమయింది..?’ అడిగారు. ‘శనగ గింజ’ అన్నాను. కమ్మిన మసక కరిగింది. ‘కాదు’ అన్నారు. ‘పచ్చ కర్పూరం.. పంటికి తగిలింది’ అన్నాను. ‘పటిక బెల్లం..’ అన్నాను. ‘కుంకుమ పువ్వు కొమ్మ’ అన్నాను. యేదన్నా నమ్మలేదు. యెనక్కి పెట్టిన చెయ్యిని ముందుకు లాగారు. మూసిన గుప్పిట దాచాను. గుమ్మలిద్దరూ వొక్కటైనా సుమబాలల సుకుమారిలు కదా.. పిడికిటిని తెరవలేకపోయారు. చెరో పక్క చేరి చక్కిలిగిలి పెట్టారు. నా పిడికిలి దానికదే తెరచుకుంది!

బోల్టు.. యినుప బోల్టు..!

‘మునుపు దొరికిన నట్టు తీసుకురా’ అన్నాను. ‘యెందుకు యెంకటేశా?’ అన్నట్టు చూసారు. ‘దీందో కాదో..?’ అన్నాను. తెచ్చిస్తే అమిర్చి చూసి ‘దీందే’ అన్నాను. ‘సిగ్గులేదూ..?’ అన్నారు. నా సిగ్గుకు సమతూకంగా.. లడ్డూల్లో రోజూ దొరికిన యినుప మేకులూ బొందులూ తాళాలూ నాణేలూ చాలక రాళ్ళూ రప్పలూ పిన్నులూ పెన్నులూ గుండు సూదులూ గుండీలూ.. వొకటి కాదు..!

‘యిందు దొరకనిదేదీ లేదు దేవీ..’ అన్నాను. ‘అవన్నీ యెందుకు..?’ దేవేరులు యేరులెత్తారు. ‘నా భక్తుల గాయాల గురుతులు’గా దాచుకున్నాను. కొట్టుగది నిండిపోయింది. ‘అవేమన్నా తులసీదళాలు అనుకున్నారా..?’ మంగమ్మ మండిపడింది. పద్మావతమ్మ కోపం పట్టనట్టే వుంది!

పంటి నొప్పికి నాకంట తిరిగిన నీరు సతులకంట జారింది!

కళ్ళు వొత్తుకొని మా ఆవిళ్ళిద్దరూ మళ్ళీ చెరో లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టారు. ఆబగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని యెప్పటిలా లడ్డూ కొరకలేకపోయాను. ‘భగవంతుణ్ణి కూడా భయపెట్టేసారు కదరా’ అనుకుంటూ వొక లడ్డూ విప్పాను. అందులో నల్లజెర్రి. మరో లడ్డూ రెండు భాగాలు చేసాను. మధ్యలో తెల్ల తేలు. నా చూపు ప్రాణవాయువుగా సోకిందేమో.. యెండిన నల్లజెర్రీ.. వెల్లకిలా తిరగబడింది.. తెల్లతేలూ.. బొమ్మాల్లా పడింది.. ప్రాణం పోసుకున్నందుకు సాక్ష్యంగా! అవి రెండూ అరచేతుల్లోంచి నేలమీదపడి.. పోయిన ప్రాణం వొచ్చిందని తెలీక ప్రాణభయంతో లడ్డూల్లో దొరికిన యినుప సామాన్ల కొట్టుగదిలోకి దూరిపోయినాయి!

అలమేలు మేలు కోలేదు. పద్మావతి కోలుకోలేదు. బుంగమూతి బుజ్జాయిల్ని చెరో చెంక కిందికి తీసుకొని ఆలనగా పాలనగా అక్కున చేర్చుకున్నాను. నా చూపులయితే నేలమీద వాలాయి. నా సహచరులవి కూడా!

అదే లడ్డూలు.. యిద్దరు భక్తుల చేతుల్లో.. వొక లడ్డూలో నల్లజెర్రి దేహం.. మరో లడ్డూలో తెల్లతేలు దేహం.. భక్తులు కొయ్యబారి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు విస్తుపోయి వింతగా చూస్తూ ‘లాడ్దూల్లో తేలూ జెర్రీ వున్నాయి కదా.. పాములు కూడా వుంటాయా..?’ అమాయకంగా అడుగుతున్నారు. ‘వుండవమ్మా.. పాములు వుండవు..’ తల్లులు నచ్చజెప్పుతున్నారు. ‘యెందుకు..?’ పిల్లలు అడగడం ఆపలేదు. ‘యెందుకంటే.. పాములు పెద్దగా పొడావుగా వుంటాయి కదా.. లడ్డూలో పట్టవు కదా..?!’ తర్కం బోధపడేలా తత్వం బోధపడేలా చెప్పాడో పెద్ద మనిషి! అంతా నవ్వారు!

నేను కూడా నవ్వుకున్నాను. గుమ్మలు నవ్వలేదు. ‘అపకీర్తి కాదా మీకు..?’ అన్నారు వుమ్మడిగా. ‘పాపభీతి లేదా..?’ నేనేదో చేసినట్టు నన్ను నిలదీశారు. ‘ఫలమూ పుష్పమూ తోయమూ మాత్రమేనా? యినుమూ ఘనమూ స్టిక్కూ ప్లాస్టిక్కూ జీవీ నిర్జీవీ.. అన్నిటినీ సమంగా చూడాలి కదా..?’ అన్నాను. యెంతయినా చేసినవారి చేతి రుచిని నిదించ నా తిన్న నోటికి మాట రాలేదు!

‘మీరు మాత్రం యేమి చేస్తారు.. బాగానే సరిపెట్టుకుంటున్నారు.. భక్తిని యుక్తిగా..’ అర్ధాంగులిద్దరూ నిందిస్తూనే నిట్టూర్చారు!

‘నాకు భక్తుల పోటు కన్నా- అధికారులకూ సిబ్బందికీ వీఐపీల పోటు యెక్కువైంది.. వారి సేవలు అటు మళ్ళించారు.. వారు నిమిత్తమాత్రులు..’ అన్నాను. ‘లడ్డూ..’ అని చెయ్యి చాపాను. లడ్డూ అందుకొని చేతిలో పెట్టింది మా పద్దూ అదే పద్మ. నోటికి అందించింది మా మంగ. తిన్నాను. కాని నా ముఖంలో మునుపటి అనుభూతిలేకపోవడం యిద్దరూ కనిపెట్టారు. అర్థమయ్యింది. నవ్వాను. ‘నకిలీ లడ్డు..’ అన్నాను. ‘భక్తుడు యిచ్చిందల్లా స్వీకరించాలిగా.. నోరు చూసుకుంటే అవుతుందా?, భగవంతుడి పాట్లు భగవంతుడివి..!’ అన్నాను. సతులు నకిలీ లడ్డూ లాక్కోబోతే వారికి అవకాశం యివ్వకుండా బాధ్యతగా మింగేసాను! నైవేద్యం వద్దనరాదు కదా..?

‘దళారుల్ని పెంచి పోషిస్తున్నారు కదా..?’ మంగమ్మ గంగవెర్రులెత్తి చూసింది!

‘వాళ్ళు అడుపు లేదు, వీళ్ళు తుడుపు లేదు, అందరి పోషణ భారము నాదే కదా..?’ అన్నాను.

‘మరి.. లడ్డూ.. ప్రత్యేక లడ్డూ.. విశిష్ట లడ్డూ.. యిన్ని తేడా లెందుకు..?’ పద్మమ్మ పరాకున అడగలేదు, పట్టించే అడిగింది!

‘భక్తీ వ్యాపారమయ్యే కొద్దే.. భగవంతుడికి విలువ!’ అని నవ్వాను. నవ్వడం మరచినట్టు నా సతులు. ‘నన్ను ధనిక దేవుణ్ణి చేసారు’ దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాను!

‘మనకొచ్చే ఆదాయం వల్లే మిగాతా దేవుళ్ళ గుడుల్లో గూట్లో దీపాలు వెలుగుతున్నాయి!’ అన్నారు మంగావతీ పద్మావతీ!

నా మౌనం చూసి యేమనుకున్నారో సతులిద్దరూ లడ్డూ నా చేతిలో పెడదామని చూస్తే వొక్క లడ్డూ కూడా లేదు! బిడ్డికిలు, అట్టికలు, దాకలు, దోకిలు, కడవలు, గూనలు, అండీలు సరి.. అండాలూ డేక్సాలూ బోనుపెట్టే కాదు, గదులన్నీ గాలించారు! వుట్టిమీది సట్టిలన్నీ వెతికారు! పళ్ళేలన్నీ బోర్లించారు! రుచి మరిగిన పెద్దలు వెనక ద్వారం ద్వారా లడ్డూలు సంచులకి సంచులు మోసుకు వెళ్తుంటే ముగ్గురం మూగవాళ్ళలా చూసాం! చూస్తే అనామక భక్తులకి లడ్డూలు లేవు! అదీసంగతి.. అందుకే నాకూ లడ్డూలు లేవు! భక్తుడికి లేనిదేదీ భగవంతుడికీ వుండదని భాగస్వామినులు యిద్దరూ అర్థం చేసుకున్నట్టే వున్నారు!

‘రోజుకు లక్షన్నర లడ్లు చేసినా దొరక్కపోవడమేమిటి?’ భక్తులు మనసులో అనుకున్నమాటలు మా చెవుల్లో పడ్డాయి! మా చూపులు భక్త జనంలోకి వారి యిల్లలోకి చొరబడ్డాయి!

సంచులకొద్దీ లడ్డూలు పట్టుకుపోయిన వాళ్ళు నాలుగేసి లడ్డూలు పంచుతున్నారు. వొక్క లడ్డూ దొరికిన వాళ్ళు అదే చిదిపి ముక్కలు చేసి పంచుతున్నారు. కొద్దిమంది నాలుగేసి లడ్డూలు వొక్కడే తింటూ వుంటే.. మరికొద్దిమంది నాలుగు రవ్వలూ పిసర్లూ నలుగురూ పంచుకు తింటూ వున్నారు!

మర్మమేమిటి అన్నట్టు చూసారు మా మగువలు!

అడక్క పోయినా అర్థం చేసుకున్న వాణ్ని! అందుకే అడగకనే చెప్పాను!

‘లడ్డూ మహా ప్రసాదం! ప్రసాదమేదయినా మహా ప్రసాదమే! ప్రసాదం ప్రజలందరికీ సమానమే! అందుకే అందరూ సమంగా పంచుకు తినేది! వొకరికి యెక్కువ మరొకరికి తక్కువ లేకుండా వుండేది! పెద్దవాళ్ళకి యెక్కువ చిన్నవాళ్ళకి తక్కువ అనేదే లేదు! లింగ భేదం లేదు! జాతి భేదమూ లేదు! అలా చేస్తే.. అది గుడి కాదు! ఆ గుడిలో దేవుడు వుండడు!’

మగువలిద్దరూ మౌనం వీడ లేదు!

‘నేనప్పుడూ యిప్పుడూ యెప్పుడూ రాయినే!’

నా మాటకు నా అమ్మలిద్దరూ కళ్ళలో కడివెడేసి నీళ్ళు నింపుకున్నారు.. నన్ను గట్టిగా పట్టుకున్నారు..!

‘ప్రసాదం అందరిదీ. ప్రసాదం అంటే లడ్డూ కాదు. ప్రసాదం అంటే గాలీ నీరూ నేలా. గింజా గంజీ. అన్నమూ వస్త్రమూ. పండూ కాయా. వసతీ వనరూ. సంపదా సకలమూ. సమస్తమూ. అన్నీ అంతా. సమంగా సమ సమంగా పంచుకోవాలి. అప్పుడే ప్రసాదం రుచి! ప్రసాదం తిన్న బతుకూ మెతుకూ రుచి! లేదంటే కాదంటే అదెప్పటికైనా అరుచే!’

‘మరి లడ్డూ అందరిదీ అవుతుందా..?’ పద్మావతి అంటే, ‘లడ్డూ అందరూ అందుకుంటారా..?’ మంగావతి అంది.

‘లడ్డూ మీద హక్కు అందరిదీ. దక్కని వాళ్ళు మొదట బతిమాలుతారు. దక్కకపోతే కొన్నాళ్ళకి తిరగబడి బలవంతంగా లాక్కుంటారు. లడ్డూ లేకుండా అయితే వుండనే వుండరు..!’

నా మాటలకు మా ముద్దుగుమ్మలిద్దరూ ముచ్చట పడ్డారు! అందరికీ లడ్డూలు దొరకాలని ఆశ పడ్డారు! అలాగని దీవించేసారు కూడా! యిక మీదే ఆలశ్యం! చేరుకోండి మీ లక్ష్యం!

మా యింట్లో జరిగిన యీ లడ్డూల కథ మీకు చెపితే – మీరు మీ యింటింటా కథలు కథలుగా చెప్పుకుంటే – చెయ్యాల్సిందేదో చేస్తే – మీ కథ మారుతుందని చెప్పాను! అయ్యో లేదుకదా అని దయతో జాలితో యెవరూ లడ్డూ యివ్వరు. ఎవరి లడ్డూ వాళ్ళే సంపాదించుకోవాలి!

భక్తులారా.. మీకు లడ్డూలు పంచలేకపోతున్నందుకు ఈ భగవంతుణ్ణి క్షమించండి!

యిట్లు

మీ

ఏడుకొండల వెంకటేశ్వరస్వామి

ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..!

 Abstract-creative-lamp-concept

                                                      -బమ్మిడి జగదీశ్వరరావు

పూజ్యులైన అత్తమామలకు

నమస్కారం!

ఆగండి! చదవకుండా చించేస్తే నాగురించి మీరు తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు! అందువల్ల మీ అమ్మాయికి మంచి మొగుణ్ణి కూడా కోల్పోతారు! అంతకన్నా వొక గొప్ప ఆవిష్కరణలో మీరు భాగం కాకుండా పోతారు! మనీ లేనప్పుడు మెనూ చూడడమెందుకు అనుకోవద్దు! మనీ అనేది యెప్పుడూ జేబులు మారుతుంది! నిండుగా వున్న జేబు ఖాళీ కావచ్చు! ఖాళీగా వున్న జేబు నిండవచ్చు! అంచేత మీ ఐశ్వర్యం అలాగే వుండిపోదు! నిన్న లేదు, యివాళ వుంది, రేపు?

నేను కోట్లు సంపాదిస్తానని అంటే “ఏం.. మీవాడు ‘మీలో యెవరు కోటీశ్వరుడు?’ నాగార్జున షోకి గాని వెళుతున్నాడా?” అని మా అమ్మా నాన్నతో అన్నారట! మీ వెటకారం నాకు నచ్చింది! కారం రాసినట్టయింది! పట్టుదల పెరిగింది! నేను కోటీశ్వరుడు అవ్వడమే కాదు.. మీకు కోటీశ్వరుడు అయ్యే అవకాశం యివ్వాలనిపించింది!

యస్.. రేపు నాదే! మీ దగ్గర ఐశ్వర్యం వుండొచ్చు! మరి నా దగ్గర? ఆ ఐశ్వర్యాన్ని సృష్టించే ఐడియాస్ వున్నాయ్! ఔను.. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! ఎగ్జాంపుల్ గా వొక ఐడియా వొదులుతాను! కాసుకోండి! మీలాంటివాళ్ళు పెట్టుబడి పెట్టడానికి పోటీ పడతారు! కాని నాకు పెట్టుబడి పెట్టే ఛాన్సు మొదట మీకే యిస్తాను! మీరు కాదంటేనే వేరే వాళ్ళకి అదృష్టవంతులయ్యే అవకాశం వస్తుంది!

సొసైటీకి యేది రిక్వైర్మెంటో అది మనం కనిపెట్టాలి! యిన్నోవేట్ చేయాలి! యిదీ మీ రిక్వైర్మెంటు అని మనం పీపుల్ కి చూపించాలి! అంటే.. రిక్వైర్మెంటూ మనమే సృష్టించాలి.. సొల్యూషనూ మనమే చూపించాలి! దానికి సేవాభావం అనే కలరివ్వాలి! అప్పుడది సేవారంగం కేటగిరీ కిందికి వచ్చి సర్వీస్ వోరియంటేషన్ గా అనిపించాలి! సర్వీసు ప్రొవైడ్ చేయడంలో అంతవరకూ లేని మార్కెట్ స్పేస్ ని క్రియేట్ చేయాలి! అంటే.. అసలు మార్కెట్టే లేదని అనుకుంటే మార్కెట్టుని మనమే సృష్టించాలి! దానికదో మార్కెట్ గా ఆక్యుపై చేయాలి! మార్కెట్ కు డిమాండ్ క్రియేట్ చేయాలి! క్రియేట్ చేశాక అది బేసిక్ నీడ్ అవ్వాలి! నీడ్ ఈజ్ డీడ్!

అర్థమయ్యిందా? అర్థం కాకపోతే మరోసారి కేర్ ఫుల్ గా చదువుకోండి.. అర్ధం చేసుకోండి.. యింతకంటే బేసిక్ లెవెల్లో యెవడూ చెప్పలేడు.. మార్కెట్ మర్మం అర్థమయితేనే మార్కెట్లో రాణిస్తాం! మార్కెట్ మహారాజాలమవుతాం! మాయాజాల యింద్రజాలాలను మించిందీ మార్కెట్ మాయాజాలం! అర్థం చేసుకొనుటయే అర్థం! ‘అర్థం’ అంటే తెలుసుగా ధనం!

మీరు నా ఐడియా కోసం ఆవురావురు మంటున్నారని అర్థమయ్యింది.. యింక వూరించను.. పూరిస్తాను!

ప్రతిమనిషికి విద్య వైద్యం మస్ట్! మస్ట్ అండ్ షుడ్! విద్య వైద్యం ఆల్రెడీ ఆక్యుపైడ్ అని మీరంటారు! నిజమే! ఛాన్సు లేదు అంటారు! అదీ నిజమే! ఫుల్లీ ఫిల్లుడ్! బట్ స్పేస్ ఈజ్ దేర్! ఎందరు యెక్కినా చూసేవాడికి యింకా స్పేస్ వుంటుంది.. పుష్పకవిమానంలోనే కాదు, యిన్నోవేషన్లో కూడా! సో ఆ స్పేస్ మనం క్రియేట్ చెయ్యాలి! చేస్తే స్పేస్ యెప్పుడూ వుంటుంది! ఎడ్యుకేషన్ సిస్టంలో యెక్కడ వుంది?

యస్.. అన్ని యూనివర్సిటీల్లో గొడవలు అవుతున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఢిల్లీ జేయెన్యూ.. కాశ్మీర్లో.. అంతకు ముందు పూణే ఫిలిం యినిస్ట్యూట్ లో.. యిక్కడా అక్కడా అని కాదు, దేశ వ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వున్నాయా? పోలీసులు లాఠీఛార్జీలు చేస్తూనే వున్నారా? స్టూడెంట్స్ ని చితక్కొడుతూనే వున్నారా? యస్.. యస్.. యస్స్ .. యిక్కడ స్పేస్ వుంది.. మన మార్కెట్ కి కావలసినంత స్పేస్ వుంది..

పరీక్షలకి ప్రిపేర్ అవడం అందరికీ వస్తుంది! మరి దెబ్బలకి ప్రిపేర్ అవడం అందరికీ రాదు! పరీక్షలకి వో సిలబస్ యేడ్చి చస్తుంది! లాఠీఛార్జీలకి వో సిలబస్ యేడ్చి చావదు! ఏ క్వశ్చన్ కైనా యెవడైనా ఆన్సర్ చేస్తాడు.. కాని యే దెబ్బకైనా యెవడైనా బేర్ చేస్తాడా? చెయ్యలేడు! అంచేత దెబ్బలని తప్పించుకోవడానికో తట్టుకోవడానికో శిక్షణ తప్పనిసరి అవసరం! దటీజ్ యెసన్షియల్! దటీజ్ స్పేస్!

అలాగే టియర్ గ్యాస్.. రబ్బర్ బుల్లెట్స్.. వాటర్ ఫైరింగ్.. ఫైరింగ్.. యే క్షణాన యేదన్నా జరగొచ్చు.. జరిగినప్పుడు జడిసి పోకుండా జంప్ అవాలి! దేశ సరిహద్దుల్లో శత్రు శిబిరం నుండి కాల్పులు జరిగినప్పుడు మన త్రివిధ దళాలు అన్ని ఆయుధాలు వున్నప్పటికీ ముందు వొడుపుగా తప్పించుకుంటాయి.. తరువాతే తిప్పికొడతాయి! త్రివిధ దళాలకి ప్రభుత్వం కోట్లు వెచ్చించి అను నిత్యం శిక్షణని యిస్తోందే.. అలాంటిది భావి విధాతలైన విద్యార్ధులకి వద్దా? సో.. ‘మీ పిల్లల ప్రాణ రక్షణ కోసం మా ప్రాణ సమాన ప్రయత్నం..’ అని మనం పిలుపు యివ్వాలి.. జనం పొలో మని వొచ్చి మన ట్రైనింగ్ సెంటర్లో చేరిపోవాలి!

హై జంప్.. లాంగ్ జంప్.. చిన్నప్పటి నుండి నేర్చుకున్నవే! బట్.. బార్బడు వైర్ మీది నుండి జంప్ చేయడం రావాలి! గేట్లు మూసేస్తే దూకడం రావాలి! అబ్బో వో మిలటరీ శిక్షణా సంస్థ యిచ్చినన్ని శిక్షణలు యివ్వడానికి మనకి స్పేస్ వుంది!

అయిదు నిముషాలు అన్నం లేటయితే ఆకలి అంటారు మన పిల్లలు. అరగంట లేటయితే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి వాళ్లకి ఆకలికి తట్టుకోవడం నేర్పాలి! పస్తులు వుండడానికి వీలుగా వుపవాసాలు నేర్పాలి! మెస్సులు మూసేసినా అప్పడే మేనేజ్ అవుతారు! సో.. యోగా గీగా చేసి గాలిపీల్చి గాలితాగి గాలితిని గాలికి బతికెయ్యాలి! ఆక్సిజనూ ఆహారమే అనే నినాదాన్ని హెల్త్ కాన్సియస్ తో విద్యార్థులలోకి వారి తలిదండ్రులలోకి తీసుకువెళ్ళాలి! పెట్టుబడిలేని బడి!

చిన్న మాటకే చివుక్కుమనిపోయే తరం! అందునా ఆడపిల్లలు వో మాటంటే వురిపోసుకుంటున్నారు! అలాంటిది యూనివర్సిటీల్లో పోలీసులూ సెక్యూరిటీ సిబ్బంది అమ్మాయిల్ని అమ్మనా బూతులు తిడితే తట్టుకోవాలి గదా? మిమ్మల్ని చెరిచేస్తాం.. రేప్ చేసి పడేస్తాం.. లంజా లమ్డీ అని అన్నాసరే.. యేమీ అననట్టు.. యేమీ విననట్టు.. నిమ్మకు నీరెత్తినట్టు వుండాలి కదా? ఈ చెవిన విని ఆ చెవిన వొదిలేయడం కాదు, అసలు చెవికి యెక్కకుండా వుండేలా శిక్షణని యివ్వడానికి కూడా చాలా స్కోప్ వుంది!

వీసీల నుండి ప్రొఫెసర్ల దాక కులం పేరు పెట్టి తిట్టినా దీవించినా- అనుమానించినా అవమానించినా- ఆటపట్టించినా ఆర్డర్లీలుగా మార్చినా.. వివక్షత చూపించినా విచక్షణ మరిచినా- మనిషిగా చూడకపోయినా- మొద్దులా.. యెద్దులా.. తుమ్మ మొద్దులా.. బుద్దిగా నాలుకని మడిచి పెట్టుకొనేలా మనం ట్రైనింగ్ యిస్తాం! సూదీ దారంతో నోళ్ళు కుట్టుకోవడమెలాగో నేర్పిస్తాం.. శాంతి భద్రతల్ని కాపాడుకుందాం!

పక్కనే పిడుగు పడినా పట్టించుకోనట్టు పిల్లలుండాలి! ప్రతీ పేరెంటూ కోరుకొనేదదే! సో.. పిల్లలతో శవాసనం వేయించెయ్యాలి! ప్రాక్టీస్ చేయించెయ్యాలి! పీస్ ఆఫ్ మైండ్! ఓం శాంతి శాంతి శాంతి హి! ప్రభుత్వం కూడా భారతీయమని.. మన సంస్కృతీ చచ్చుబండని.. మనకి యెంతో సపోర్టు చేస్తుంది! రాయితీలు యిస్తుంది! మనకి అవార్డులు యిచ్చినా యివ్వొచ్చు! వాళ్ళకి హెల్తూ.. మనకి వెల్తూ!

అలాగే పోలీసులు కేసులు పెడితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడితే.. యెలా బయటకు రావాలో.. బెయిల్లూ జెయిల్లూ యెలా దాటాలో.. యెలా లాయర్లని పెట్టుకోవాలో.. కింది కోర్టులో వీగితే పై కోర్టుకు యెలా పోవాలో.. లా యేమిటో.. సెక్షన్లు యేమిటో.. ఫనిష్మెంట్లు యేమిటో.. ప్రాధమిక హక్కులు యేమిటో.. సివిలేదో.. క్రిమినల్ యేదో.. ద్రోహానికి దేశ ద్రోహానికి వున్న తేడా యేమిటో.. దేశ ద్రోహిగా యెప్పుడు యెవరు ముద్ర వేస్తారో.. తెలీదు! అంచేత విద్యార్థులు వాళ్ళని వాళ్ళు కాపాడుకొనే లా’ని.. అవేర్నెస్ ని అందివ్వాలి! అవన్నీ మనం యిస్తాం! అదే స్పేస్!

యింకా స్టూడెంట్స్ కు రావలసిన స్కాలర్ షిప్పులని ఆపితే.. స్టయిఫండులని ఆపితే.. యెలా అప్పు చెయ్యాలో.. అప్పు  చేసుకు పప్పుకూడు వొండి యెలా బతకాలో.. మనం తర్ఫీదు యిస్తాం!

అన్నీ యూనివర్సిటీలో చదివే పెద్ద వాళ్ళకే అనుకోవద్దు! ఆ మాటకొస్తే యల్కేజీ నుండి పిల్లలు పుస్తకాల బస్తాలూ బరువులూ మొయ్యడంలోనూ మనం తర్ఫీదు యిద్దాం!

అన్నీ వేదాల్లో వుండొచ్చు! కాని అన్నీ పాఠాల్లో వుండవ్! వున్నా బోధ పడవ్! కొత్త సందర్భాలకి కొత్త స్కిల్స్ తాలూకా అవసరం యెంతో వుంది! వుంటుంది! ఈ స్పేస్ ని మనం ఫుల్ ఫిల్ చేద్దాం! బిజినెస్ గా చూద్దాం!

బిజినెస్ మెన్ మొదట నమ్మేది థాట్ ని! థాట్ కింగ్ లా ప్రవోకింగ్ లా వుండి కాన్ఫిడెన్సుని యివ్వాలి! ఆ పై సొసైటి అందుకు అనుకూలంగా వుండాలి! పదునుగా యెలా వుండాలో యిప్పుడు అచ్చం అలానే వుంది!

యిది పక్కా బిజినెస్ ప్లాన్! పక్కవాళ్ళకి చెప్పకండి! చర్చించకండి! మాట జారితే మార్కెట్ జారుతుంది! కాచుకొని వున్న కార్పోరేట్ శక్తులు యీ స్పేస్ లోకి కూడా వచ్చేస్తాయని నా సిక్స్త్ సెన్సు చెబుతోంది!

ఇప్పటికైనా నా తెలివిని నమ్మి మీ అమ్మాయిని నాకు యిస్తారని నమ్ముతున్నాను! రేపటి యీ కోటీశ్వరున్ని యివాలే దీవించండి! కోటీశ్వరులు కండి! ఆలసించిన ఆశా భంగము.. తక్షణం నన్నూ నా ఐడియాని మీదిగా చేసుకోండి!

ఆల్ ది బెస్ట్.. మై పార్టనర్స్ ..

ఆలోచించండి.. ఆచరించండి.. ఆనందించండి!

అభిమానంతో-

మీ

అల్లుడు!

రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్!

 

-బమ్మిడి జగదీశ్వర రావు 

~

 

bammidi ఒరే తమ్ముడూ..

నాకో సమస్య వచ్చింది! సమస్య అంటే పెద్ద సమస్య కాదనుకో! అలాగని చిన్న సమస్య కూడా కాదు! పోనీ అని వదిలేద్దామన్నా అది నన్ను వదలడం లేదు! ఇలా యెన్నాళ్ళు అవస్థలు పడాలో అర్థం కావడం లేదు! నీకు కాకపొతే యెవరికి చెప్పుకోను చెప్పు? ఎవరికి చెప్పినా యెవరికి వారే అదో సమస్య కాదన్నట్టు చూస్తున్నారు! ఆ సమస్య తమకీ వుందన్నట్టు మాట్లాడుతున్నారు!

నువ్వు నవ్వకు! ఎందుకంటే నేను యేడుస్తుంటే అందరూ నవ్వుతూ వున్నారు! సమస్యను తీర్చలేనప్పుడు పోనీ దానికి అలవాటు పడాలి కదా? అలా పడిపోదామన్నా అవడం లేదు! పైగా నన్ను చూసి యింటా బయిటా అంతా నవ్వుతున్నారు! నువ్వు హైదరాబాదుకూ ముంబాయికీ తిరుగుతుంటావు కదా?, నీకయితే మంచి డాక్టర్లు తెలుస్తారని! యిదిగో.. నీకిలా మెయిల్ పెడుతున్నప్పుడూ అదే.. ఫోన్ రింగయినట్టు.. రింగు కాకుండానే రింగయినట్టు.. యిదే సమస్య!

అదేమిటోరా.. ఫోన్ రింగవుతుంది! వెళ్లి తీస్తే- యే రింగూ లేదూ బొంగూ లేదు! అంతా బ్రాంతి! భ్రమ! మోగకుండా మోగినట్టు! యెవరూ చెయ్యకుండా చేసినట్టు! చచ్చిపోతున్నాననుకో! అంతా భ్రమని బ్రాంతని ఆగిపోతే, ‘మీ నాన్నకీమధ్య చెముడు వొచ్చినట్టు వుంది..’ అని పిల్లలతో అంటోంది మీ వొదిన! ‘ఫోన్ రింగయినా తియ్యరా? మీకొకరు ఫోన్ వొచ్చిందని చెప్పాలా? ఫోన్ కూడా తెచ్చి అందివ్వాలా? మగ పొగరు!’ అని వున్న గొడవలకి తోడు కొత్త గొడవలు! పోనీ అని ఫోను పట్టుకొనివుంటే – ‘వొచ్చిన ఫోను చూడకపోతే రాదా?’ అంటుంది! మాటిమాటికి ఫోన్ చెక్ చెయ్యక తప్పడం లేదు! చేస్తే నాకేదో కొత్త నెంబర్లు కనెక్ట్ అవుతున్నట్టు.. కొత్త ఎఫైర్లు వున్నట్టు అనుమానిస్తోంది మీ వొదిన!

తమ్మూ.. వూళ్ళో మనింట్లో జరిగింది నీకు గుర్తుంది కదా.. రోజూ లాగే ఆరోజూ అమ్మ సీరియల్ చూస్తూ వంట చేస్తోంది కదా.. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది! మోగుతూనే వుంది! అమ్మ వంట గదిలోంచి అరుస్తోంది.. ‘ఫోన్ యెత్తండ్రా’ అని! మోగిన ఫోన్ ఆగింది! ‘యెవరు చేసారో యేమో.. యీ ముష్టి మంద ఫోను యెత్తరు కదా..’ అమ్మ తిడుతోంది! ఆగిన ఫోన్ మళ్ళీ మోగింది! మోగుతూనే వుంది! ‘యెత్తండ్రా ఫోను..’ అమ్మ అరుస్తోంది! ఫోన్ మోగుతోంది! ఆఖరికి అమ్మే వొచ్చి ‘ఫోను యెత్తరేమర్రా..’ నోట్లో మాట నోట్లోనే వుండిపోయింది! ‘రింగయిందని టీవీ సీరియల్లో ఫోను యెలా యెత్తేది?’ నాన్న మాటలకు అందరం పడిపడి నవ్వలేదూ?..

ఆరోజు అలాగ నవ్వాననే యిలాగ యీరోజు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారా? మెలకువలోనే కాదురా, నిద్రలోనూ ఫోన్ రింగయినట్టే గబుక్కున లేచి కూర్చుంటాను! ఫోను చూస్తాను! అర్ధరాత్రీ ఆపరాత్రీ లేదా అని ఆవిడ అపర కాళీ అయిపోతుంది! నా వాలకం చూసి లేనిపోనివి అన్నీ వూహిస్తోంది! పోయేకాలం వొస్తే.. అన్నీ పాడుబుద్దులే పుడతాయట! మగనాకొడుకులంతా చిత్తకార్తె కుక్కలట! ఇన్నాళ్ళూ నోట్లో వేలు పెడితే కొరకలేని వాణ్నని అనుకుందట! నేను వాళ్ళ మాంగారి వారసత్వం నిలిపేస్తానట! డౌటూ అనుమానమూ రెండూ లేవట! అగ్గి ఫైరయిపోతోంది! అప్పటికీ యెందుకు పెంట అని- ఆవాళ రాత్రి ఫోను మోగితే మోగనీ అని వొదిలేశా! వొకటికి నాలుగు సార్లు రింగవుతూనే వుంది! అప్పటికీ అడిగా! ‘మీ ధ్యాస వల్ల మీకు అలా అనిపిస్తోంది గాని మోగలేదు.. చెయ్యాలనుకుంటే వెళ్లి ఫోను చేసుకోండి.. నేనేమనుకోను..’ అంది మీ వొదిన! తెల్లవారి ఆఫీసులో బాసు యెక్కి తొక్కి నామీద డాన్సు చేసాడు! నాలుగుసార్లు ఫోను చేసినా యెత్తవా? అని! బాధ్యత లేదని!

మా ఫ్రెండ్ కు చెప్పాను! వాడు నాకు టెస్టు పెట్టాడు! నా సెల్ కు రింగిచ్చాడు! రింగయింది అన్నాను! కాసేపు ఆగి యిప్పుడో? అడిగాడు! లేదన్నాను! ప్రాబ్లం లేదన్నాడు! కాసేపటికే రింగు వొచ్చినట్టు అయ్యి కంగారుగా తడుముకున్నాను! చూసి- ‘అర్జెంటుగా రింగ్ టోన్ మార్చు’ అన్నాడు! నా కిష్టమయిన రింగ్ టోన్.. ‘సడిచేయకే గాలి.. సడిచేయబోకే..’ అన్నాను! అలవాటు కూడా పోరపాటే అన్నాడు! గ్రహపాటు అనుకున్నా! మన పెద్దోడు ‘రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్’ పాటని నా సెల్లో రింగ్ టోన్ గా పెట్టాడు! అదిమొదలు మాబాస్ తో అందరితో తిట్లే తిట్లు! నేనెవరి ఫోనూ యెత్తడం లేదని కంప్లైంట్! నిజమే! రింగయినా యెత్తలేదు! యెవరిదో ఫోను మోగుతోంది అని అనుకొనేవాడిని! నాది కాదనుకొనేవాడిని! యెక్కడ ‘సడిచేయకే గాలి..’ అన్నా నేను నా ఫోను యెత్తేవాణ్ని! కొన్నాళ్ళకి గాని రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్ – రింగు టోన్ కు అలవాటు పడలేదు! యిప్పుడు యెక్కడ ‘రింగ రింగా’ అన్నా నాఫోనే రింగయినట్టు వుంటోందిరా! ఒకటి చెప్పనా.. నాకులాగే ఒక్క ఫోను మోగితే పదిమంది తమ సెల్లులు తీసి చూసుకుంటున్నారు తెలుసా? నిజంరా!

ఎప్పటికప్పుడు.. కనీసం మూడు నెలలకి వొకసారి రింగు టోను మార్చుకోవాలని సైక్రియాట్రిస్ట్ చెప్పాడు! నాకు ముచ్చెమటలు పోశాయి! రింగు టోన్ మార్చినపుడల్లా యింట్లో ఆఫీసులో గొడవలే గొడవలు! పిర్యాదులే పిర్యాదులు! అలవాటు పడడానికి అష్ట కష్టాలు! ఆ అలవాటు లోంచి మళ్ళీ బయిట పడడానికి తిప్పలే తిప్పలు! కొత్త టోన్ కు అలవాటు పడడానికి పాట్లే పాట్లు!

ఫోను కొన్నాళ్ళు మానేయమన్నాడు డాక్టరు! ఒక్క రోజు మరిచిపోయి వెళ్తేనే వెలితి! మనసులో మనసుండదు! తలకాయ తీసి యింట్లో వొదిలి వొచ్చినట్టే! నిలవ నియ్యదు! కొంపలు మునిగినట్టుగా వుంటుంది! యింటికొచ్చి ఫోను తీసికెళితే- మీ వొదిన ‘వోడల వర్తకం గాని ఆగిపోతోందా..?’ అని ఆడుకుంటుంది! పగ పెట్టేసుకొని బాతురూములో వున్నా తలుపు కొట్టి మరీ ఫోను తెచ్చి యిచ్చేస్తుంది! అడగకముందే ‘అదెంత అర్జెంటో’ అంటుంది! ఆగక ‘ఆ అన్నయ్య ఫోను చేసినప్పుడు యెత్తేస్తే వొక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాడు.. లేదూ అని మనం చేసామో- సరిగ్గా రొండు గంటలు మాట్లాడుతాడు..’ అంటుంది! రీజనింగులో మా యింటావిడకి వందకి వంద మార్కులు.. నీకు తెలియందా?

మొత్తానికి ఫోను రింగవకుండా అయినట్టు అనిపిస్తుంది! రింగయినాసరే కాదు నా భ్రమ అనిపిస్తుంది! చెప్పుకుంటే చాలా చిన్న సమస్యలా అనిపిస్తుంది! అనుభవిస్తే చాలా పెద్ద సమస్యలా తోస్తుంది! వైబ్రేషన్లో కూడా పెట్టి చూసా.. శరీరమంతా చెవులవడమూ కష్టమేరా..!? సేం టు సేం ప్రాబ్లం..!!

ఏదయితే అదే కానివ్వమని ఫోను వాడడం మానేసా! ‘పోన్లెండి.. రేడియేషన్ బారి నుండి మీరయినా తప్పించుకున్నారు..’ మీ వొదిన మెచ్చుకుంది! ‘వెనకటికి నీలాంటివాడే సిగరెట్లు తాగడంలేదని సంబరపడ్డాడట.. యాక్టివ్ స్మోకర్ వొక సిగరెట్ కాలిస్తే.. పాసీవ్ స్మోకర్ పద్దెనిమిది సిగరెట్లు కాల్చినట్లు.. యింటి చుట్టూ ఆఫీసుల చుట్టూ నీ చుట్టూ టవర్లే టవర్లు పెట్టుకొని.. రేడియేషన్లోనే రేయింబవళ్ళు రొస్టవుతూ రోస్టు అవుతూ.. చాల్లేరా.. ఫోను వాడకపోయినా రేడియేషన్ నిన్ను ఫుల్లుగా వాడుకుంటుంది..’ అని బావగాడి వెర్షన్! ఎవడి వెర్షన్ యెలా వున్నా నేనయితే ఫోను వాడడం మానేసా! జేబులో ఫోను లేదు! లేదని తెలిసినా రింగు వినిపించేది?! లేని ఫోను తడుముకొనే వాణ్ని! అలవాటుగా పక్కవాడి ఫోను రింగయితే నాఫోనే అని నేనే యెత్తేసా! ఇంతకన్నా నా ఫోను నేను యెత్తుకోవడం బెటరనిపించింది! ‘రావుగారూ.. ఫోనేం వాడడం లేదూ?’ అని ప్రతొక్కడూ అడిగేవాడే! నేనొక కథ చెపితే- జనంలో పది రకాలు కాదు, వంద రకాల కథలు వినిపించాయి! నాకే తెలియని నా ఫోను గురించి కథలు కథలుగా విని యింతకన్నా ఫోనుతో యెన్నెన్ని తిప్పలు పడుతూ నయినా ఫోను వాడడమే బెటరున్నర బెటరనిపించింది!

సో.. నేనిప్పుడు ఫోను వాడుతున్నాను! అష్టకష్టాలు పడుతున్నాను! మర్చిపోకు.. నాసమస్యకు పరిష్కారం చూపించే మంచి డాక్టర్ని చూడు! చచ్చి నీ కడుపున పుడతాను!

ఫోను రింగవుతున్నట్టుంది.. వుంటానురా..

ఫోనుతో- సారీ ప్రేమతో-

మీ

అన్నయ్య

       రన్ రాజా రన్!

 

                                                  -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఓయ్ హైదరాబాదీ..

నువ్వు అస్కాలో వున్నా బాధలేదు గానీ.. హైదరాబాదులో వున్నావు.. కురుక్షేత్రంలో వున్నట్టే! ఆమాటకొస్తే కురుక్షేత్రం జరిగింది పద్దెనిమిది రోజులే! హైదరాబాదులో వున్నోళ్ళకి నిత్యమూ నిరంతరమూ  కురుక్షేత్ర రణరంగమే! యమగండమే!

ఇక్కడ ‘నా దారి రహదారి’ అని రజనీకాంత్ కూడా అనలేడు! పవన్ కళ్యాణ్ కూడా ట్రెండ్ సెట్ చెయ్యగలడేమో గాని ట్రాఫిక్ సెట్ చెయ్యలేడు!

ఓరే.. నిన్నుగన్న తల్లికి వేయి దండాలు.. ఆ హైదరాబాదు రోడ్లమీద యెప్పుడూ రొండు కాళ్ళు యెడంగా పెట్టి నిలబడకు నాయనా.. నీకాళ్ళ సందున సందు చిక్కిందని ఆటోవాళ్ళు దూరిపోయి వెళ్ళిపోతారు! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

ఫుట్‌పాత్ మీద నడుస్తాను, నాకేంటి? అనుకోకు.. మన వూళ్ళోలాగ కాదు, ఫుట్‌పాత్ మీద టూ వీలర్లు నడుపుతారు! ఏమాటకామాట చెప్పుకోవాలి భలే ఫీట్స్ చేస్తారులే! జెమునాస్టిక్స్ టిక్కెట్టు లేకుండా చూడొచ్చు! వాళ్ళయినా యేo చేస్తారు? రోడ్లు ఖాళీ లేవు! వాళ్ళకి మరో దారిలేదు! టైము అంతకన్నాలేదు! ఫుట్‌పాత్‌ల మీద ఖాళీ యెక్కడుందీ అంటావా? ఉన్నంత వరకూ వున్నమాట చెపుతున్నా! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

రోడ్డు దాటేటప్పుడు వన్ వే కదా అని వొక వైపే చూస్తూ దాటేవు.. ‘చూడు.. వొక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు’ అని నందమూరి బాలకృష్ణ చెప్పాడు కదా అని రెండోవైపు చూడకుండా వుండేవు.. ఎట్నుంచి యెవడొస్తాడో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు! అంచేత అటూ యిటూ చూసి వాయువేగంతో రోడ్డు దాటాలి! ఆయువుంటే అవతలికి చేరిపోతావు! లేదంటే నీ పూర్వీకులని చేరిపోతావు!

బస్సు యెక్కడం చేతకావడం లేదని అన్నావు. అదేమీ బ్రహ్మవిద్య కాదు. జనం మధ్యలోకి దూరితే వాళ్ళే నిన్ను బస్సులోకి తోసేస్తారు! దిగాలనుకుంటే కూడా అంతే.. డోరు దగ్గరకు రావడం నీవంతు! మిగతా తంతు మిగతా ప్రయాణీకులు చూసుకుంటారు! కొద్దిగ ఆసుకొని కాసుకోగలిగితే వాళ్ళే తోసేస్తారు! కాకపోతే మధ్యలో సన్నికల్లు తొక్కినట్టు కాళ్ళు తొక్కుతారు! నొప్పి పడకుండా వుండాలంటే పెళ్లి రోజుల్ని తలచుకో! తీయగా అనిపిస్తాది.. తరువాత యింటికెళ్ళి తైలం రాసుకోవచ్చు! కాళ్ళు తొక్కుతున్నావేమి? అని పొరపాటున కూడా అడక్కు నాయినా.. సిటీకి కొత్తనుకుంటారు! అలాగే చెప్పడం మర్చిపోయాను.. సీటు కోసం ఫిల్టీలు పట్టి కుస్తీపట్టులు పట్టకు.. యెంతో అదృష్టముంటే తప్ప అది అందరికీ దొరికేది కాదు! అదేమీ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల సీటు కాదు! నీ నుదిటన రాస్తే దొరుకుతుంది.. లేదంటే లేదు! ఒళ్ళు హూనమైతే రాత్రికి నిద్ర బాగా పడుతుందని సరిపెట్టుకో!

లేదూ నేనూ మార్గదర్శిలో చేరాను.. అని మోపెడ్ కొనుక్కున్నావనుకో- మోపెడు కష్టాలు.. తడిపి మోపెడు అనుభవాలు! ఇన్సూరెన్సూ ఆర్సీ లైసెన్సూ పొల్యూషనూ అన్నీ వున్నా హెల్మెట్ యేది అంటాడు, వెయ్యి బాత్తాడు! అది నిన్నటి మాట. ఇప్పుడు ఫస్ట్ టైం వంద, సెకండ్ టైం మూడొందలు చలానా ప్లస్ చార్జిషీట్.. ఆపైన వొక్క చాన్సు యిచ్చి జైలు.. వెహికల్ సీజ్.. చాలదని టూవీలర్ వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట గదా? నయం.. రోడ్డుమీద నడిచేవాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టుకోమనలేదు.. అని అనుకోకు! ఔనుమరి.. నడిపేవాళ్ళకీ వెనక కూర్చొనేవాళ్ళకేనా తలలుండేది? నడిచే పాదచారులకి తలలుండవా? తలసరి లెక్కల్లో ప్రతి తలా కౌంటబులే కదా? ఆ లెక్కన హెల్మెట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది.. రావల్సినోళ్ళకి కావలసినంత పర్సెంటేజీ.. యిప్పటికే హెల్మెట్ల షార్టేజీ.. రెట్టింపు ధరలకి కొనాల్సిందే.. కాదంటే ట్రాఫిక్ పోలీసులకి అమ్యామ్యాలు యివ్వాల్సిందే.. దొరికినోళ్ళకి దొరికినట్టు చలానాలు రాయడంలో ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకోవడం మాత్రం అభినందించాల్సిందే! దారుల్లో వాహనదారుల్ని ఆపడం చూసి దోపిడీ దొంగల్ని చూసి హడలిపోయినట్టు హడాలిపోతున్నారట గదా? ఏమైనా నాలుగేళ్ళలో నూటరవై కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయమట! జేబుల్లో చేరిన డబ్బుల లెక్కలు ఏ పేపరోళ్ళూ యివ్వలేదు!?

అయినా అన్నిటికీ యిక మీ ఆవిడ్నో పిల్లల్నో బండిమీద తిప్పాల్సిన పనిలేదు. ఇంకో హెల్మెట్ లేదని చెప్పి యెంచక్కా నువ్వొక్కడివే టింగురంగా అంటూ తప్పించుకు తిరగొచ్చు! ఇవన్నీ సరేనని హెల్మెట్ పెట్టుకున్నావే అనుకో జట్కా గుర్రానికి గంతలు కట్టినట్టే, ముందున్నదే కనిపిస్తుంది తప్ప పక్కనున్నదేదీ కనిపించదు! అసలు యాక్సిడెంట్లు అప్పుడే అవుతాయి! జుట్టు రాలిపోయి నెత్తిమీద చంద్రుడు వొస్తే వొచ్చాడు, పక్కనుంచు! హెల్మెట్ పెట్టుకుంటే ముఖానికి రాసుకున్న పౌడర్ చెక్కు చెదరదు గానీ కాళ్ళూ చేతులే మనవి కావనుకోవాల!

అర్రన్నా బుర్రన్నా ఆపలేం.. హైదరాబాదు రోడ్లు అలాంటివి! రోడ్ల మీద యెక్కడ గొయ్యుoటాదో.. యెక్కడ నుయ్యే వుoటాదో నీకు తెలీదు.. నీకు తెలిసిందల్లా నీకు స్పాండిలైటీసా లేకపోతే వెన్నులో పూసలేమైనా రాలిపోయాయో కదిలిపోయాయో తెలుస్తుంది! రోడ్ల దయవల్ల డాక్టర్లకి మరింత ఆదాయం కలిసొస్తోంది! అన్ని సినిమాలు ఒకేలా వుండవు!’ అన్నట్టు రోడ్లన్నీ ఒకేలా వుండవు! పెద్దలున్న రోడ్లు ఒకలా వుంటాయి! తార్రోడ్డులు తల తలా కొత్తగచ్చులా మెరుస్తాయి! వొడ్డించిన వాళ్ళకే వొడ్డించినట్టు.. పోసిన రోడ్లమీదే రోడ్లు పోస్తారు! అయినా జూబ్లీహిల్స్ రోడ్లూ బంజారాహిల్స్ రోడ్లూ వున్నట్టు- కృష్ణానగర్ రోడ్లూ అమీర్ పేట రోడ్లూ యెందుకుంటాయి? రోడ్లకి కూడా వర్గముందని కమ్యూనిస్టులే చెప్పాలా?, మనకి తెలీదా?! రోడ్లు బాగుచెయ్యకుండా హెల్మెట్లతో పాటు బులెట్ ప్రూఫ్ తొడుక్కున్నా సేఫ్ గా నువ్వు యింటికి తిరిగి చేరుతావన్న గ్యారంటీ లేదు! అందుకే దానికి కూడా యిన్సూరెన్స్ సదుపాయముందని సంబరపడి సరిపెట్టుకోవాల!

సరే, లోను పెట్టి కారే కొన్నా.. గంటకు పదమూడు కిలోమీటర్లు కన్నా వేగంగా వెళ్ళమను.. నిన్ను గిన్నీసు బుక్ యెక్కించకపొతే అడుగు? పెట్రోలు పదహారు కాదు, పదకుండు కూడా రాదు! ఆటో యెక్కితే నగర సంకీర్తనమే! రోడ్డు మరమ్మత్తులని మూడు కిలోమీటర్లకి తొమ్మిది కిలోమీటర్లు చుట్టిరావలసిన పరిస్థితి! ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గరే సగం జీవితం సంకనాకిపోయే పరిస్థితి! అయితే వొక్కటి నిజం.. మనం ట్రాఫిక్ లో అలవాటు పడితే యెక్కడాలేని వోపికా సహనమూ సొంతమవుతుంది! దాంతో ఆఫీసులో బాసు తిట్టినా రుషి మాదిరి నీక్కాదని దులిపేసుకొని యెంచక్కా వుండిపోతావు! మీయావిడతో కూడా గొడవలు తగ్గిపోతాయి!

ఈ ట్రాఫిక్ లో పడి ఆఫీసుకు రావడమే పెద్ద డ్యూటీ! విడిగా డ్యూటీ చెయ్యక్కర్లేదు! సీటుల్లో కూర్చొని నిద్రపోవడాన్ని ట్రాఫిక్ని అర్థం చేసుకున్న యెవరన్నా అర్థం చేసుకొనే తీరుతారు!

కిరోసిన్ తో ప్రయోగాత్మకంగా బళ్ళు నడిపే ఆటో సైంటిస్టులూ.. పదకుండో శతాబ్దంనాటి ప్రభుత్వవాహనాలూ.. పగలే నల్ల మేఘాలు వొదిలే వాళ్ళను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు! జలుబూ జ్వరాల్లా కేన్సర్లూ ట్రీట్మెంట్లూ.. కార్పోరేట్ హాస్పిటల్లకి- రెండు చేతులా ఆదాయం వొస్తుందనుకో! ట్రాఫిక్ యిన్‌స్పెక్టర్లు తమ కండిషనేగాని బండి కండిషన్ చూడరు! లంబుగాడికి జంబుగాడు తోడన్నట్టు మెట్రో వర్క్స్.. మున్సిపల్ వర్క్స్.. పోటీపడి పురావస్తు శాఖలోళ్ళు తవ్విపారేసినట్టు తవ్విపారేస్తున్నారు!

దారీతెన్నూ తెలీని అడవిలో వొదిలేసినా హాయిగా యింటికి వొచ్చేయొచ్చు.. కానీ రోడ్లో వొదిలేస్తే యెలా వొస్తావు తమ్మీ? రాలేవు! తుఫాను భాదితుల్ని పట్టించుకుంటారు గాని ట్రాఫిక్ భాదితుల్ని పట్టించుకుంటారా? కోరు! అలవాటు పడకపోతే- ట్రాఫిక్ లోంచి వొచ్చినవాడు టెర్రరిస్టులా వుండక సౌమ్యంగా సున్నితంగా పెళ్ళాం బిడ్డలతో యెలా వుంటాడు? మన ఆడవాళ్లకే కాదు, మనకయినా సంసారం చెయ్యబుద్దవుతుందా? మా ఆయన కాపురం చెయ్యడం లేదని కోర్టుల కెక్కితే జడ్జిగారికి యేo చెప్పేది? విడాకుల కారణాల్లో ట్రాఫిక్ ని కూడా చేర్చాలి!

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో చెకింగ్ లు యెక్కువయ్యాయి! తాగినందుకే ఖర్చు! మళ్ళీ తాగినడుపుతున్నావని ఫెనాల్టీ! రెండువిధాలా చిక్కే! బొక్కే! అయితే అదో కిక్కే! తాగకుండా ట్రాఫిక్ లో నడపడం ఆషామాషీ కాదు అని యీ ప్రభుత్వాలు యెప్పుడు గుర్తిస్తాయో యేమో? ఓ విషయం చెప్పనా.. యీ రోడ్లకి యీ ట్రాఫిక్‌కి తాగి నడుపుతున్నాడా?, తాగకుండా నడుపుతున్నాడా? తేడా యెవడూ కనిపెట్టలేడు!, బ్రీత్ అనలైజెర్ తో టెస్టు చేస్తే తప్ప! ఇవన్నీ సరే.. టీవీల్లో చూపించడం వల్ల యిలా కూడా కొన్నాళ్ళకి నువ్వు పాపులర్ కాగలవు!

ప్రతిదాన్లోనూ పాజటీవ్ యాటిట్యూడ్ అవసరం! ట్రాఫిక్ ని కూడా పాజిటీవ్ గా చూడడం వల్ల మాత్రమే నువ్వు ట్రాఫిక్ ని అధిగమించగలుగుతావు!

విష్ యూ హ్యాపీ జర్నీ!

మీ

పూర్వ హైదరాబాదీ

పర్సనల్ లెటర్ టు…  

                                                                                            -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

కమలనాథులారా! కలవర పడకండి..!

రాముడున్నాడు! రాజ్యమున్నాది! తొమ్మిది తలలు రాలాయి! యిప్పుడు పదో తల! యిది వొక్క హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయపు లెక్క! రాజ్యానికి యెదురు తిరిగితే తలలు తెగక తప్పదు పక్కా! హిందూత్వమే మన హుక్కా! తాగండి గుక్కా గుక్కా!

అయ్యో రామ.. అదరవద్దు.. బెదరవద్దు.. ఈ మాత్రము దానికే రాజ్యాన్ని కోల్పోతామా? రాజ్యం వీరభోజ్యమే కాదు.. రక్తభోజ్యం కూడా! మసీదుని కూలగొట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళం.. స్టూడెంట్స్ యెంత? వారి బలమెంత? బలగమెంత? మన సైన్యమెంత? పోలీసులూ.. పారామిలటరీ బలగాలూ.. స్మోక్ ఫైర్లూ.. వాటర్ ఫైర్లూ.. గన్ ఫైర్లూ.. రబ్బర్ బుల్లెట్ ఫైర్లూ.. బార్బుడ్ వైర్లూ.. లాఠీచార్జీలూ.. హౌస్ అరెస్టులూ.. వన్‌ఫార్టీఫోర్ సెక్షన్లూ.. నిబంధనలూ.. నిషేధాజ్నలూ.. అత్యవసర పరిస్థితులూ.. అదుపు చేయుట అదెంత స్వల్ప పని? అల్ప పని? అణచివేతలతోనైనా రాజ్యాన్ని అదుపులో వుంచుకోవాలని మహానుభావుడు మాకీయవెల్లి చెప్పనే చెప్పాడు! అంచేత అదుపే మదుపు! మనశాంతీ మన భద్రతే.. దేశానికి శాంతి భద్రతలని యిచ్చును!

రాజ్యాంగము రాసిన అంబేద్కర్ దివంగతుడు గనుక మనము గౌరవించగలం గాని అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి‘వున్న’ వాళ్ళను గౌరవించలేము. అటువంటి విద్యార్థులతో ఘర్షణ తప్పదు! ఘర్షణ కూడా అనేకవిధములు! అయితే సిద్ధాంత సంఘర్షణ ప్రజాస్వామికమైనదిగా గుర్తించాలి!

రోహిత్ వేముల ఆత్మహత్య అత్యంత విచారకరమే! కాని.. నిన్న పొతే రేపటికి మూడు రోజులు! మర్నాటికి.. నాలుగు రోజులకి జనం అంతా మర్చిపోతారు! ప్రజల జ్ఞాపకశక్తి మీద నాకు అపార నమ్మకమూ.. అపురూప విస్వాశామూనూ..

చచ్చిన వాడు వొచ్చి సాక్ష్యం చెపుతాడా? చెప్పినా యెవరికి చెప్పాలి? మనకే చెప్పాలి! వేదనలూ నివేదనలూ యెవరికి నివేదించాలి? మనకే నివేదించాలి! ఎంక్వయిరీలు చేసినా రిపోర్టులు యిచ్చినా యెవరికి యివ్వాలి? మనకే యివ్వాలి! ద్వి సభ్య కమిటీలయినా.. ఏక సభ్య కమిటీలయినా.. దాని సమగ్ర పరిశోధనలయినా యెవరికి సమర్పించాలి? మనకే సమర్పించాలి! విచారం వ్యక్తం చేసేదీ మనమే! విచారణ జరిపేదీ మనమే!

గీత యేమి చెప్పింది? ‘చేసేది నేనే.. చేయించేదీ నేనే.. అంతా నేనే!’ అని చెప్పిందా లేదా? నేనుకు బహువచనమే మనం! ఆవిధంగా హత్య చేసేది మనమే! శిక్షలు వేసేదీ మనమే! నేరము చేసేది మనమే! తీర్పులిచ్చేదీ మనమే! అన్యాయము చేసేది మనమే! న్యాయం చెప్పేదీ మనమే! సమస్య సృష్టించేది మనమే! సమస్య పరిష్కరించేదీ మనమే! పనీష్మెంట్ యిచ్చేది మనమే! కాంపన్సేషన్ యిచ్చేదీ మనమే!

మరి మేథావుల మాటంటారా? మనం గుర్తించిన వాళ్ళే మేథావులు! అందరినీ మేథావులుగా గుర్తించవలసిన పని యెంత మాత్రమూ లేదు! మన మేథావులను మనమే తయారు చేసుకొనవలెను! తర్ఫీదు యివ్వవలెను! మనమే సర్టిఫికేట్లు యిచ్చి గుర్తించవలెను! కొంత మందిని లోకం గుర్తిస్తుంది! వారికి కుడి చేతికి యెడమ చేతికి తేడా తెలియదు! అనివార్యమై మేథావులుగా గుర్తించిన వారి గురించి చింతించి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు! అటువంటివారి చిన్న మెదడు యేనాడో చిదిగిపోయినది! మీడియాకు వారి మెదళ్ళు అనుసంధించబడినవి! వారి సంధింపులూ స్పందనలూ అన్నీ కూడా మీడియా ఆన్ చేస్తే ఆన్ అయి- ఆఫ్ చేస్తే ఆఫ్ అగును! మనము మీడియాను మేనేజు చేసిన చాలును.. నిప్పు కూడా నీరగును! నీరు గూడా ప్రవహింపక గడ్డకట్టును!

అసలు ఆంగ్ల మీడియా ఆగమాగమవబట్టి మన తెలుగు మీడియా తేరిపార వొకసారి చూసింది గాని లేకపోతే యెక్కడ యెలా ప్రవర్తించాలో దానికి మా బాగా తెలుసును!

మీడియాను పెట్టుబడిగా చూడుము. పెట్టుబడిని మార్కెట్ గా చూడుము. మార్కెట్టూ మతమూ వేరు వేరు కావు! వాటికి పేచీ లేదు. సర్దుబాటూ ప్రోత్సాహమూ తప్ప! నిజానికి మతమూ మార్కెట్టూ కవల పిల్లలవంటివి! ఒకదానినొకటి యిబ్బంది పెట్టుకోవు. మార్కెట్ మతాన్ని గౌరవిస్తుంది! మతం మార్కెట్టుని గౌరవిస్తుంది! మనము మతము పట్ల భక్తీ మార్కెట్ పట్ల గౌరవమూ కలిగి వుండాలి!

అందుకనే న్యూ ఎకనామిక్ ఎరలో తొంభైల తర్వాత అన్ని విద్యార్ధి సంఘాలూ తోకలు ముడిచి పారిపోయినవి! మతమూ మార్కెట్టూ కలిసివుండడం వల్ల అన్ని విద్యార్ధి సంఘాలూ దాదాపు అంతరార్ధమైనప్పటికీ ఏబీవీపీ వొక్కటే నిలిచి వెలుగుతోంది.. భారత ఖండం వెలిగినట్టు! ఇంతకు మునుపు మన అగ్రవర్ణ కులాలే మనల్ని యిబ్బంది పెట్టేవారు, విద్యార్థి సంఘాల్లో చేరి. ఎప్పుడైతే కెరియర్ వోరియంటేషన్ పెరిగిందో ఈ రాజకీయాల వైపు చూడడం మానేసి యెంచక్కా అమెరికా వైపు చూడడం మొదలుపెట్టారు! అలా వొచ్చిందే అమీర్ పేట టు అమెరికా థియరీ. సో యిప్పుడు ప్లెయిన్ గా వొపెన్ గా శత్రువు కనిపిస్తున్నాడు. మిలట్రీ థియరీ ప్రకారం పొదలు కొట్టేస్తే శత్రువు విజిబుల్ గా కనిపిస్తాడు.. కనిపిస్తున్నాడు! ఆలయాల్లోకి వొచ్చినట్టుగానే.. అంబేద్కర్ పేరు చెప్పి విశ్వవిద్యాలయాల్లోకి వొచ్చేసారు అలగా జనం. ఈ అలగా జనం తిరగబడతారు.  కాని వాళ్లకి శక్తి చాలదు! నిలబడడానికి నీడ లేదు! వెన్ను లేదు! దన్ను లేదు! సో.. వాళ్ళే యిలా వురిపోసుకుంటారు!

రోహిత్ వురి ఆది కాదు,  అంతమూ కాదు! మన పాలనకు ఆటంకమూ కాదు! అదొక సహజ అనివార్య పరిణామమే, కాని అందులోనూ మన హిందూ మతమ్మీద కుట్ర దాక్కొనివుంది! కుట్రలు వేయి విధములుగా యెటుల పనిచేయు చున్నవో రోహిత్ సంఘటన బయటపెట్టినది! జాగృతిగ మెలగమని మనకొక అవకాశం యిచ్చు చున్నది!

రాముడికే తప్పలేదు కష్టాలు! రామ రాజ్య స్థాపనలో కొన్ని కష్టాలు తప్పవు! నష్టమేమీ లేదు.. వున్నా పూడ్చుకుందాం! ఆపైన రాముడున్నాడు! రాజ్యమున్నాది!

యూనివర్సిటీలు మనకు పట్టు కొమ్మలు. ఆలోచనలకు ఆయువు పట్టులు. పాగా వెయ్యగలిగితేనే ప్రజల్లో వారి ఆలోచనల్లో భాగం కాగలం. భావాలు బహు ముఖ్యమైనవి! హిందూ మనో భావాలు మరీ ముఖ్యమైనవి! ఈ దేశమ్మీద.. దేవుడి మీద మనదే పేటెంటు! మనమే దేశ భక్తులం! ఇంకెవరునూ యెట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తులు కాజాలరు గాక కాజాలరు!

ఏబీవీపీ మనది. మన యువతరానిది. మన విద్యార్థి నాయకుడు సుశీల్ మన బీజేవైఎం సభ్యుడైన విష్ణుదత్తు తమ్ముడు.  మన కేడరును మనం కాపాడుకొననిచో దేశాన్ని యెటుల కాపాడుకొనగలము? అందుకు మన ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోలీసులకు రిపోర్టు చేసినా- యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం మీద వొత్తిడి తెచ్చినా యూనివర్సిటీలో బలప్రదర్శన చేసినా- కోర్టులకు తెలిపినా- ఫలితం వెంటనే లేకపోయింది. యూనివర్సిటీలో మన విద్యార్థి సంఘం గెలవక అధికారం కోల్పోయింది. ఏయస్ఏ వాళ్ళని అదుపుచేయుటకు తప్పలేదు. పైగా వారు తీవ్రవాదులు. ఉగ్రవాదులు. యాకూబ్ మెమన్‌ని వురి తీస్తే ఖండించారు. మెమన్ కు అనుకూలంగా మాట్లాడారు. అంచేత మన మంత్రి  మన దత్తాత్రేయగారు.. మన మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానికి లేఖల మీద లేఖలు దంచినారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వము వుంటుంది గనుక ఒకటికి మరి నాలుగు రాయవలసి వొచ్చింది! మన స్మృతి ఇరానిగారు మన హెచ్సియ్యూ వీసీగారికి లేఖల మీద లేఖలు దంచినారు! మన వీసీ పొదిలి అప్పారావుగారు దళిత విద్యార్థుల్ని దబాయించి దంచినారు. వొక్క సెమిస్టరు కాలమే వేటు వేసి రూల్స్ కు అనుగుణంగానే సంఘ బహిష్కారము చేసినారు! తప్పంటూ వుంటే రూల్స్ పెట్టిన బ్రిటీష్ వాళ్ళది తప్పు కాని, ఎప్పటిలాగే అమలు చేసిన వారిది తప్పెలా అవుతుంది?

మన విద్యార్థి నాయకుడు సకాలంలో ఆస్పెట్లైజ్ కావడం బావుంది, మనం ఆరెస్సెస్ వీహెచ్‌పీ బీజేపీలుగా మనం బల ప్రదర్శన జరపడం బావుంది కాని పోలీసు అధికారి ఆనంద్ అందుకు విరుద్ధంగా దాడి జరగలేదనడం బాలేదు. తగు ముందు జాగ్రత్తలు తీసుకొనవలసింది. అయినప్పటికీ మన విద్యార్థి సంఘ మిత్రులు కోర్టులో వేయడం, సోషల్ మీడియాలో వీడియోను సగం రిలీజ్ చేయడం, అలాగే వురిశిక్షల్ని వ్యతిరేకిస్తే- మెమన్ ని సపోర్ట్ చేస్తున్నారని, వొక టెర్రరిస్టు మరణిస్తే వేయిమంది టెర్రరిస్టులు పుట్టుకు వస్తారని బహుబాగా ప్రచారం చేసి ఏయస్ఏ వాళ్ళని డైలమాలో పడేయడం మన విద్యార్థుల విజయంగా గుర్తించి అభినందించవలసి వున్నది!

రోహిత్ మృతదేహంతో బంద్ చెయ్యొచ్చు గాక.. పదమూడు విద్యార్థి సంఘాలు కలిసి జాక్ గా యేర్పడి బాధ్యులని శిక్షించమని డిమాండ్ చెయ్యొచ్చు గాక.. హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. మన పోలీసులు భారీగా మొహరించి బలవంతంగా భగ్నం చేస్తే- మళ్ళీ మళ్ళీ హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. అంతకుమించి యేo చేస్తారు? ఇలానే నాలుగు నెలలు పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ విద్యార్థులు గోల చేసి ధర్మరాజు ఈటె పీక్కోగలిగారా? మనం అనుకుంటే గిరీష్కర్నాడ్, ఆదూరి గోపాలక్రిష్ణన్, యూఆర్ అనంతమూర్తి, శ్యామ్ బెనగల్ పక్కన మన మేథావి గజేంద్ర చౌహాన్ని కూర్చోపెట్టగలం.. వాళ్ళు పీట లాగలేరు, పీఠం కదల్చలేరు! మద్రాస్ ఐఐటి డైరెక్టర్ని మర్చిపోయారా? ఢిల్లీ యూనివర్సిటీ మనకాదర్శం! రామ మందిర నిర్మాణానికి అరుంధతీ వాశిష్ట అనుసంధాన పీఠంతో రెండ్రోజుల సదస్సు జరిపారు మన విద్యార్థులు! అప్పుడూ గగ్గోలు పెట్టారు గాని ఆపగలిగారా? ఈ సమయంలో మన బలం గుర్తుచేసుకోవడం మరింత బలాన్ని యిస్తుంది..!

‘నేను రాజీనామా చేయను’ అని వీసి పొదిలి అప్పారావుగారు నిలబడ్డా తప్పని స్థితిలో తప్పించి ఆయనకు అసలు వారసుడు శ్రీవాస్తవని నియమించడంలో అప్పారావుగారిని అభినందించడం కనిపిస్తోంది. అయితే సమస్య తీవ్రత తగ్గించడానికి పెరియసామిని నియమించడాన్ని అర్థం చేసుకోవాలి! అలాగే ‘నేను లెటర్ రాయలేదు’ అని, ‘ఫార్వర్డ్ చేశా’నని, దత్తాత్రేయ మాట్లాడిన సందర్భంలో కాంగ్రేసు హనుమంతరావుగారు కూడా ముందే లెటర్లు రాసిన విషయం తగు సమయంలో బయటపెట్టి ‘యివన్నీ కామను’ అనుకొనేలా చేసిన పార్టీ శ్రేణులకు అభినందనాలు! ప్రతీ పదిహేను రోజులకు లెటర్లు రాయడం పనిలో భాగమని చెప్పి మన స్మృతి ఇరాని పనిమంతురాలని నిరూపించుకున్నారు! ఆమెకు ప్రత్యేక అభినందనాలు! రోహిత్ తల్లితో మాట్లాడడం ఇరానిగారి మాతృత్వపు మానవీయతకు పరాకాష్ట!

దేశంలో అసహనం పెచ్చరిల్లిపోతోంది. శవ రాజకీయాలకు మన ప్రధాని మోడీగారు స్పందించక పొతే కావాలని మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగక వారణాసి లఖ్ నవ్ లో ‘మోడీ ముర్దాబాద్.. మోడీ గోబ్యాక్..’ అని స్నాతకోత్సవాన్ని అడ్డుకున్నారు. సహనశీలి మోడీగారు యెంతో సహనంతో ‘కారణాలు వుండొచ్చు.. రాజకీయాలు వుండొచ్చు.. కాని భారతమాత బిడ్డను కోల్పోయింది.. తల్లి కడుపుకోతను అర్థం చేసుకోగలను..’ అన్నారు! ‘అంబేద్కర్ యెవరి మీదా ఆరోపణలు, పిర్యాదులు చెయ్యలేదు’ అని కూడా దేశానికి గుర్తు చేసారు. అంబేద్కర్‌ని మన మోడీగారు అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేదు! అంబేడ్కర్‌ని మన మోడీగారు సొంతం చేసుకున్నట్టు మరెవరూ సొంతం చేసుకోలేదు!

సంతాపము తెలిపి సహనం వహించవలసిన యీ సమయంలో యింత అసహనం వహించడం వెనుక రాజకీయ కుట్ర కలదు, ప్రతిపక్ష కాంగ్రేసు వామపక్ష నాయకులందరూ హెచ్సియ్యూ క్యూ కట్టుటలో వింత లేదు, విశేషము లేదు! అలా అయితే మునుపు తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నప్పుడు యెందుకు రాలేదు? అని తిరిగి ప్రశ్నిచడంలో మనం కృతకృత్యులమయ్యాం! ‘రాహుల్ గో బ్యాక్’ ‘సేవ్ హెచ్సియ్యూ’ నినాదాలతో ప్రతిమండలంలో రాస్తారోకో జరపడం, దిష్టి బొమ్మలు దగ్ధం చెయ్యడం బహు ప్రశంసనీయం! ‘మీ ఎంపీ రాజయ్య దళితుడే, వాళ్ళింట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాలేదేమి?’ లాజిక్కుల మేజిక్కులు అత్యంత ఆకర్షణీయం! మరోవేపు మన వెంకయ్య, నితిన్ గడ్కరీ, మహేశ్‌శర్మ, వీరేందర్ సింగ్ నోటికి వొచ్చింది మాట్లాడడం మరింత వుత్సాహాన్ని నింపుతున్నది!

దళితుల మీద దాడుల్ని తిప్పి కొట్టాం! ఎందుకంటే రోహిత్ దళితుడు కాదు! బీసీ వడ్డెర కులానికి చెందినవాడని నిరూపించాం! వాళ్ళ తండ్రి మణికుమార్ తో కూడా చెప్పించాం! తండ్రిని కన్న తల్లే చెప్పింది వడ్డెరని! తల్లి తను మాల కులస్తురాలినని చెప్తోంది, చెల్లదు. భర్త యింటి పేరే భార్య తన యింటి పేరుగా మార్చుకుంటుంది భారతీయ స్త్రీ! మరి తన కులాన్ని వొదిలి భర్త కులాన్ని స్వీకరించలేదా? విడిపోతే మాత్రం ఆమె బిడ్డలకి తండ్రి కాకుండా పోతాడా? రోహిత్ కులం గురించి జనంలోకి బాగానే తీసుకెళ్ళాం! భేష్!

రోహిత్ రెండుసార్లు జేఆర్ఎఫ్ పాసు అయ్యి ఫెలోషిప్ తెచ్చుకుంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లే నమ్మలే. ‘పేపర్ అంత యీజీగా వుందా?’ అని అడిగారు. రోహిత్ యిచ్చిన స్వీట్స్ కూడా తీసుకోలేదు. రాంక్ తెచ్చుకొని పీహెచ్డీ జాయినయినా అతను దళితుడను అని అంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ మీద జాయిన్ అయ్యాడని జనం కూడా నమ్ముతున్నారు. అంచేత- తిన్నది అరక్క వొళ్ళు కొవ్వెక్కి సూసైడ్ చేసుకున్నాడని- సులువుగానే ప్రజలు అర్థం చేసుకోవడం మనకు కలిసొచ్చే విషయం! ప్రజలు చాలా గొప్పవాళ్ళు! మనం యెలా నేర్పితే అలానే ఆలోచిస్తారు!

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌లో గొడవలవల్లే రోహిత్ చనిపోయాడని మన విద్యార్థులు మాట్లాడడం చూస్తుంటే భావి నాయకత్వ పటిమ అపురూపంగానూ అపూర్వంగానూ కనిపిస్తోంది! అలాగే పఠాన్ కోట్ ను ప్రస్తావించడం వల్ల ఏకకాలంలో మన దేశభక్తిని చెప్పడమేకాక మన ప్రత్యర్థుల నోళ్ళు మూయించగలిగాం!

సమయానికి మున్సిపల్ ఎన్నికలు తెరమీదికి రావడం.. ఫలితాలూ పట్టాభిషేకాలూ.. జంపు జిలానీలూ.. తెలంగాణలో తుడుచుపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.. పిడకలవేటలా తుని బల ప్రదర్శనా.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షా.. రైలుకు పెట్టిన నిప్పూ.. నీరుగార్చి- పాత వార్తా పచ్చళ్ళు పక్కనపెట్టి – తాజావార్తలకు మీడియా తల తిప్పడంతో ‘రోహిత్ యెవరు?’ అనే పరిస్థితి రాముని దయవల్ల రానున్నది.. అందుకే అన్నది.. రాముడున్నాడు.. రాజ్యమున్నాది..!

విద్యార్థుల సస్పెన్షన్ భేషరతుగా కాకపోయినా కండిషనల్ గా యెత్తేసాం! యెనిమిది లక్షల ఎక్సుగ్రేషియా వద్దన్నా ప్రకటించేసాం! హాయిగా తిరిగి రమ్మని వీసీని సెలవులో పంపేసాం! కేంద్ర మంత్రుల ప్రమేయం లేదని తేల్చి చెప్పేసాం! రేపు ప్రభుత్వం వేసిన కమిటీలతో యివే రిపోర్టులు అధికారికంగా యిప్పించేస్తాం! ఫెలోషిప్ పెండింగ్ తో కలిపి మరీ యిచ్చేద్దాం! పుష్పగుచ్చాలు పంచేద్దాం! పావురాలను పట్టి యెగరేద్దాం! ఓం శాంతి శాంతి హి!

అంతే! ఖేల్ ఖతం! దుకాణం బంద్!

రాముడున్నాడు! రాజ్యమున్నాది!

వీర కమలనాథులకు

ప్రేమతో-

మీ

శూర కమలనాథుడు!

   నీలి రంగు నీడలో… 

 

                                                                              -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఒరే రోహితూ.. వీలేoట్రా.. నువ్వేదో యిప్పుడే కొత్తగా వురితాడు మెడకేసుకొని వూయలేదో వూగుతున్నట్టు చెపుతున్నారు? నీ మెడలో నా మెడలో మనవాళ్ళందరి మెడలో వురితాడు లేనిదెప్పుడు చెప్పు? నువ్వు మీ అమ్మ కడుపులో పడినప్పుడు నీకు పేగుతాడు పడకముందే వురితాడు పడిందని వీళ్ళకు తెలీదు! పుట్టినప్పుడు బొడ్డుతాడు కోస్తారుగాని మెడలో వురితాడు కొయ్యరని కొయ్యలేరని వీళ్ళకు తెలీదు! తాడు లేకుండా మనకి తనువుండదని కూడా వీళ్ళకు తెలీదు!

ఒరే గుర్తుందిరా.. నువ్వు చిన్నప్పుడు నా మెడలో ఈ తాడేమిటీ అని అడిగేవాడివి! అమ్మ యేమంది? బ్రామ్మర్లకి జంద్యమెలాగో మనకి యీ వురితాడు అలాగ అనేది! మూతికి ముంత – ముడ్డికి తాటాకు కట్టుకోడం కన్నా మెడలో తాడుంటే తప్పు కాదంది! తప్పు చేసినప్పుడు తప్ప దానితో ప్రమాదం లేదంది!

ఏదయినొరే.. నువ్వు తప్పు చేసావురా.. ఆల్లు యిదము అంటే అదే యిదము.. పదము అంటే అదే పదము.. అలా అని వుంటే యిప్పటికి బతికిపోదువు కదరా.. లోకమెలా చచ్చి బతికిపోతోందో చూస్తున్నావు కదరా.. నువ్వెందుకురా బతికి చచ్చిపోదామనుకున్నావ్?

కొత్తేట్రా నీకు.. నువ్వు అద్దంలో చూసుకుంటే మసిబొగ్గు అని నవ్వినోల్లని యేమన్నావ్? నలుపు కూడా వొక రంగే అన్నావ్! నువ్వు చదివితే కలక్టర్ దిగాడండీ అని బడిలో నవ్వినట్టే యూనివర్సిటీలోనూ ఆమాట అనకుండా నవ్వినోల్లని యేమన్నావ్? నానవ్వు నాదన్నావ్! నిజమేరా.. నీ నవ్వు యెవరూ కాపీ కొట్టలేరు! నువ్వు వాళ్ళలాగ నవ్వనందుకు వాళ్ళు యెంతో యేడ్చారు!

నువ్వు ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే వాళ్ళు నీ పాదాల బురదని చూసారు! నీ నీలిరంగు జుబ్బా వాళ్ళకి నచ్చలేదు! వాళ్ళు కాషాయపు గోచీ కట్టమన్నారు! కట్టనన్నావు! కట్టిందే కట్టడం నాకు నచ్చదన్నావ్! పైగా గోచీ కనపడితే చింపుతానన్నావ్! కాషాయానికి అంటిన రక్తపు మరకలు నీకు నచ్చలేదు! దాని మాంసపు వాసన వొంట్లో తిప్పుతోందన్నావ్! తోడేలుగా మారలేనన్నావ్! వాళ్ళoతా విడిచిన బట్టలే తొడుక్కున్నారు.. వాడిన చెప్పులే వేసుకున్నారు.. వాడేసిన కళ్ళజోడే వాడుతున్నారు.. నాకళ్ళజోడు నాదన్నావ్! మీ కళ్ళజోడుతో చూడనన్నావ్.. చూడలేనన్నావ్! వాళ్ళు తాగి వదిలిన తీర్థమే తాగుతున్నారు.. యెంగిలి తింటూ ప్రసాదమన్నారు.. పెట్టినబొట్టే పెట్టుకున్నారు.. నెత్తికి కాషాయం చుట్టుకున్నారు.. నంది అంటే నంది అన్నారు.. పంది అంటే పంది అన్నారు.. ఆ పాఠాలే ప్రొఫెసర్ల నుండి వీసీ దాక పాడుతుంటే అరిగిన రాగం అందుకోనన్నావ్! ఆ రాగంలో ఆర్తనాదాలు వున్నాయన్నావ్! వాళ్ళ పలుకు పలకలేక పోయావ్!

ఊపిరి సలపడం లేదన్నావ్! ఉరితాడు తడుముకున్నావ్! యూనివర్సిటీలో చేరినరోజు మెడలోని వురితాడు తీసి నాకింక దీనితో పనిలేదని తీసి విసిరి పారేసావ్! వీసీతీసి దాచాడు!

నువ్వేమి తినాలో.. నువ్వేమి తాగాలో.. నువ్వేమి ఆలోచించాలో నీబాగుకోరి చెపుతామంటే కాదనేసావ్! వాళ్లకు నచ్చినట్టు తుమ్మడం రాదన్నావ్.. వాళ్లకు నచ్చినట్టు దగ్గడం రాదన్నావ్.. వాళ్ళలా పోతపోసినట్టు వుండరా అంటే వుండలేనూ రాత మార్చుకుంటానూ అన్నావ్.. నారాత నేనే రాసు కుంటానూ అన్నావ్.. అందరూ ఎద్దుకి మొక్కితే నువ్వు పొద్దుకి మొక్కావ్..

నా అభిమతం నాదన్నావ్.. వాడి మతం కాదన్నావ్.. వెక్కిరించాడు.. నువ్వు యెర్రగా చూస్తే తప్పయిపోయిందని అన్నాడు.. ఈ చేత్తో క్షమాపణ పత్రం రాసిచ్చాడు.. ఆచేత్తో పిటీషనూ యిచ్చాడు.. పోలీసులకి బెదరలేదు.. ఆస్పెటిల్ సాక్షం చెల్లలేదు.. కమిటీ కథ ముగిసింది అంది.. వాడు భయపడ్డాడు.. భంగపడ్డాడు.. వొకపక్క కోర్టుకెక్కాడు.. మరోపక్క కుర్చీకి బావురుమన్నాడు.. మేమంతా మీ వానరసైన్యం అని, యిలా అయితే రామరాజ్యాన్ని నిలబెట్టలేమన్నాడు.. ముగిసిన కథ మళ్ళీ మొదలయి మొదటికొచ్చింది.. కోర్టులు తీర్పివ్వకముందే కొరడాదెబ్బలకి మంత్రిగారి అర్జీల మీద అర్జీలు.. శాంతిభద్రతల సమస్య.. సంఘవిద్రోహుల సమస్య.. తీవ్రవాద సమస్య.. కులోన్మాద సమస్య.. సమస్యల తీవ్రతని గుర్తించిన రాణీగారు ఆదేశాలు.. ఆజ్ఞలు.. వీసీ తలారయ్యాడు.. మూటాముల్లె తీసి పడేసాడు.. నిన్నూ నీ నలుగురు నేస్తాలని బహిష్కరించాడు!

మీరంతా గుంపుగా తిరగకూడదన్నాడు! బహిరంగాప్రదేశాల్లో తిరగకూడదన్నాడు! ఒంటరిగా మీకు మీరే వొక జైలు కావాలన్నాడు! వర్సిటీలో నివాసం వుండరాదన్నాడు! చెట్టుకింద పిట్టలయ్యారు! ఎండనక వాననక పగలనక రాత్రనక వెలిలో చలిలో వున్నారు! ఆగక, ఆందోళన చెయ్యకూడదన్నాడు! ఆకలికి అరవకూడదన్నాడు! యిదే కాప్ తీర్పన్నాడు! అదే సాంఘీక బహిష్కారం అన్నాడు! సరే అని సిద్దమైపోయారు.. మనకి వెలి కొత్త కాదుగా? వూరిలో వెలి! బడిలో వెలి! గుడిలో వెలి! పేరుపెద్ద వూరుదిబ్బ అయిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నట్ట నడుమన వెలి! వెలి వాడ! మనమున్నచోటల్లా వెలివాడే! చలికీ పులికీ దొరకని వాడు మనలో యెవడు అన్నావ్! నేస్తం జ్వరంతో వుంటే మనము యిలాగే చచ్చిపోవాలా అని బెంగ పడ్డావ్! అమ్మవాళ్ళకి డబ్బులు పంపలేదని బాధపడ్డావ్! ఫెలోషిప్ రాని ఫెలోష్ అయిపోయారు మీరు! ఏడు నెలలు ఎండబెట్టారు! యిప్పుడుమీడియాకి మంచి ఫుటేజి.. గొప్ప రేటింగ్.. యాడ్స్ తో యిన్కం పెరిగింది.. ఒక్క నా కొడుకూ మంచు ముద్దలైనప్పుడు రాలే.. నువ్వు మాంసపు ముద్దవైతే తప్ప! అంత గుట్టుగా అంచెలంచెలుగా చెండుకు తిన్నారని ఆగేవా?

వాడొక బంటు.. వాడొక బానిస.. వాడొక కీ యిస్తే తిరిగే మరబొమ్మ.. కుర్చీకి కాళ్ళోత్తే వాడెవడయినా వాడొక తలారి.. తలారి పనేంటి? తలలు తియ్యడమే! పది తలలు రాలినట్టే పదకుండో తల! వాడి లెక్కలు వాడివి! తల నువ్వు తీసేది యేమిటి? నా తల నేనే తీసుకుంటానన్నావ్! యింత విషమిమ్మన్నావ్! లేదంటే నా వురితాడు నాకివ్వు అన్నావ్! ఎప్పటిలాగే మళ్ళీ మెడలో ఉరితాడు వేసుకున్నావ్.. ఉసురు తీసుకుంటావని అనుకోలేదని నీ నేస్తగాళ్ళు దొంత ప్రసాదు, చెముడుగుంట శేషయ్య, పెద్ద పూడి విజయ్, వేల్పుల సుంకన్న వెక్కి వెక్కి యేడుస్తున్నార్రా.. నువ్వు చుక్కల్లో కలిస్తే చూడరా..

ఉరికి ఉమన్న గది వాడుకున్నానని క్షమాపణలు అడిగావు, చావడానికి చోటుకూడాలేని నీ లోలోపలి ఖాళీతనమేమిటో.. నిన్ను కమ్మేసిన శూన్యమేమిటో బోధపడినట్టు వుమన్న శూన్యంలోకి చూస్తున్నాడు చూడు.. ఏయస్ఏ ని నీ కుటుంబమన్నావ్.. క్షమిస్తారని యెంత నమ్మకంరా నీకు? రోజుకూలి చేసి రోజూ నీకు అన్నం పెట్టి చదివించిన అమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసారని అర్థం చేసుకుంది, కడుపు తీపికి పేగులు తెగేలా యేడుస్తోందిరా.. తమ్ముడూ చెల్లీ నమ్మకమిచ్చే నువ్వు లేక బితుకుబితుకుమంటున్నార్రా..

నువ్వన్నట్టు ‘గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది’రా..

‘నన్ను నేను చంపుకోవడానికి యెవరూ బాధ్యులు కారు’ అని భలే మర్యాదలు పాటించావులే! విష సర్పాలకు పాలు పోసినట్టు లేదూ నీ మంచితనం? నీ హత్యకు నువ్వే కారణం అని యెంత అబద్దం ఆడావురా?! నిజం తెలిసిన నేనే కాదు, లోకం మొత్తం నిన్ను క్షమిస్తుంది లే! నిన్ను వురితీసిన చోట నీ స్థూపం రాబోయే తరాలకు చెప్పాల్సిన పాఠమేదో చెపుతుందిలే! సైన్సు రచయితగా నీ రచనలు చదివే అదృష్టం మాకు లేకపోయినా- నీవు నడిచిన తోవ యెరుకనిచ్చి రేపటి చరిత్ర చెద పట్టకుండా కొత్తతరానికి యివ్వాల్సిన ఆయుధమేదో యిస్తుందిలే!

చివరిగా నీవన్న నీ మాటతో గొంతులో గొంతు కలిపి..

జై భీమ్!

నీ

సావాసగాడు

 

సినిమా కథ కాదు!

 

  -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఒరే బాబూ.. బాబూరావూ..

మీరందరూ నవ్వొచ్చు గాక.. నేనేమి సిగ్గుపడ్డం లేదు.. గర్వంగా ఫీలవుతున్నా..! ఔను, మొన్న రిలీజయిన సిన్మాలో వెంకటేశ్వర స్వామికున్న రెండు చేతులకి వెనకన వున్న రెండు చేతులు నావే! ఈ అవకాశం రావడం వెనుక యెంత కథ వుందో కష్టముందో మీకు తెలీదు! పదేళ్లుగా వున్న ఫ్రెండొకడు ప్రొడక్షన్ మేనేజరు అవబట్టి.. వాడితో స్నేహం నిలుపుకోబట్టి.. వాడికి నాలుగేళ్ళుగా తాగబెట్టి.. వాడికి యివ్వాల్సిన గౌరవము యివ్వబట్టి.. వాడికి చేయాల్సిన సర్వీసు చేయబట్టి.. కొట్టిన గోల్డెన్ ఛాన్సు యిది! ఫస్ట్ టైము తెర మీద భగవంతుడిగా, ..కాకపోయినా భగవంతుడి చేతులుగానైనా కనిపించడం.. మిమ్మల్ని అదే చేతులతో దీవించడం.. మీ నా పూర్వజన్మల పుణ్యమే తప్పితే అలాటప్పా విషయమేమీ కాదు! ఏ బ్యాకప్పూ లేకుండా సినిమాల్లో అవకాశము దొరకడం అంత వీజీ విషయమేమీ కాదు గాక కాదు!

ఇప్పుడు యిక్కడ యింటికి యిరవై మంది హీరోలు వున్నారు! ఈ పరిస్థితుల్లో నువ్వు నిజంగా హీరోవి అయినా హీరోవి కాలేవ్! అంత సీనూ లేదు.. అంత స్క్రీనూ లేదు..! నువ్వూ నేనూ కాదు, కొత్తగా బయటినుండి వొచ్చి సినిమాల్లో చెయ్యమను, చూస్తాను? అరగని తిండీ జరగని మాటలూ యెందుకు గానీ.. భవిష్యత్తులో మనకి జూనియర్ ఆర్టిస్టు వేషాలు కూడా దొరకవు! నిజం.. వొట్టూ.. యింటికి యిరవై మంది పోటీ పడితే జూనియర్ ఆర్టిస్టుల వేషాలు మనదాకా వస్తాయా? నువ్వు యిండస్ట్రీకి రావడం యిష్టం లేక కాదు! నాకేదో పోటీ అయిపోతావనీ కాదు! నీకు పోటీ దారులు యెంతమంది వున్నారో కళ్ళు తెరుచుకు చూడు!

మన టాలీవుడ్లో వున్నదంతా వంశాల చరిత్రే! వారసత్వ సంపదే! నందమూరి వంశంలో- అలనాటి హీరో యన్టీ రామారావు. కొడుకు హరిక్రిష్ణ హీరో. మరో కొడుకు మోహన క్రిష్ణ కెమెరా మెన్.  చిన్న కొడుకు బాలకృష్ణ హీరో. తరువాత తరంలో మనవలూ హీరో హరిక్రిష్ణ కొడుకులూ కళ్యాణ్ రామ్, జూనియర్ యన్టీఆరూ.. మోహన క్రిష్ణ కొడుకు తారక రత్న అందరూ హీరోలే! అభిమానులు ఎదురు చూస్తున్న మరో మనవడు హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వుడ్ బీ హీరో! మునిమనవడూ జూ ఎన్టీర్ కొడుకూ అభయ్ రామ్ మన రేపటి హీరో! కూతురు పురందరేశ్వరి రాజకీయ రంగంలో వారసురాలిగా వుండిపోయారు!

మరి హీరో అక్కినేని వంశంలో- హీరో నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ ప్రొడ్యూసర్, చిన్న కొడుకు నాగార్జున హీరో. మనవడు సుమంత్ హీరో. మనవరాలు సుప్రియ హీరోయిన్. మరో మనవడు సుశాంత్ హీరో. మనవలూ నాగార్జున కొడుకులూ నాగాచైతన్యా అఖిల్ యిద్దరూ హీరోలే!

ఇంకా ఘట్టమనేని వంశంలో- హీరో క్రిష్ణ వాళ్ళన్నయ్య ఆదిశేషగిరిరావు ప్రొడ్యూసర్. పెద్దకొడుకు రమేష్ బాబు వొకప్పుడు హీరో, తర్వాత నిర్మాత కూడా! కూతురు మంజుల హీరొయిన్. కొడుకు మహేష్ బాబు చెప్పక్కర్లేదు హీరోలకి హీరో. పెద్దల్లుడు సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. చిన్నల్లుడు సుధీర్ బాబు హీరో. మనవడు గౌతం కృష్ణ రేపటి హీరో, అప్పుడే ‘వన్ నేనోక్కడినే’ లో చేసాడు కదా? ఇక హీరోయిన్ విజయనిర్మలగారి అబ్బాయి నరేష్ హీరో. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరో!

విలనూ కం హీరో కృష్ణంరాజు! అన్న యువీ సూర్యనారాయణరాజు ప్రొడ్యూసర్. వారి పెద్ద కొడుకు బాహుబలి హీరో ప్రభాష్!

చిరంజీవి మెగా హీరో. పెద్దతమ్ముడు నాగబాబు హీరో తప్ప అన్నీ. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ హీరో. బావమర్దీ.. అల్లూ రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ నిర్మాతా నటుడు. అల్లుడు అల్లూ అర్జున్ స్టైలిష్ హీరో. చిన్న అల్లుడు అల్లూ శిరీష్ అప్ కమింగ్ హీరో. కొడుకు రామ్ చరణ్ హీరో. మేనల్లుడు సాయి ధర్మతేజ కూడా హీరో. పెద తమ్ముడు వరుణ్ తేజ్ హీరో. కూతురు నిహారిక త్వరలో హీరోయిన్!?

మరి మంచు వారి కుటుంబంలో మోహన్ బాబుగారి అబ్బాయిలు యిద్దరూ మంచు విష్ణు వర్ధన్ బాబూ మంచ్ మనోజ్ బాబూ హీరోలే! హీరోయిన్ మంచు లక్ష్మిదీ కీరోలే! తోడు సోదరుడు ఎం. కృష్ణగారు ప్రొడ్యూసరే!

నిర్మాతా నటుడూ రామానాయ్డు పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతా డిస్ట్రిబ్యూటర్. చిన్న కొడుకు హీరో వెంకటేష్. మనవడు దగ్గుబాటి రానా హీరో కం విలనూ!

పీజే శర్మ నటులైతే, వారి శ్రీమతి కృష్ణజ్యోతి శర్మ డబ్బింగ్ ఆర్టిస్టు. పెద్ద కొడుకు సాయి కుమార్ హీరో విలనూ అన్నీ. నడిపి కొడుకు రవిశంకర్ నటుడూ అనువాద రచయిత. చిన్న కొడుకు అయ్యప్ప పి శర్మ నటుడూ దర్శకుడూ. మనవడు ఆది హీరో!

శివ శక్తి దత్తా విజయేంద్ర ప్రసాదు వరుసకు అన్నదమ్ములు. కథా రచయితా దర్శకులు విజయేంద్ర ప్రసాదు గారి అబ్బాయి రాజమౌళి. రామా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. మరి శివశక్తి దత్త కొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. కీరవాణి తమ్ముడు కాంచీ నటుడూ రచయిత. చిన్నతమ్ముడు కళ్యాణ్ మాలిక్ మరో మ్యూజిక్ డైరెక్టర్. చిన్నాన్న కూతురు ఎం.ఎం. శ్రీలేఖ యింకో మ్యూజిక్ డైరెక్టర్!

నటులు కమలహాసన్ వారసురాళ్ళు శృతిహాసన్, అక్షరహాసన్ యిద్దరూ హీరోయిన్లే! జయసుధ కొడుకు శ్రియాన్ హీరో! జయప్రద (అక్క) కొడుకు సిద్దార్థ హీరో! రావుగోపాలరావు కొడుకే రావు రమేషు, హీరో లాంటి విలన్! బ్రహ్మానందం కొడుకు హీరో! ఎమ్మెస్ నారాయణ కొడుకు హీరో, కూతురు డైరెక్టర్! హీరో శ్రీకాంత్ హీరొయిన్ ఊహల కూతురు ఆల్రెడీ రుద్రమదేవిలో నటించింది, కొడుకు కాబోయే హీరో! హీరో రాజశేఖర్ హీరోయిన్ జీవితల పెద్ద పాప హీరోయిన్ గా వస్తుందిట?!

దర్శకులు దాసరి నారాయణరావు కొడుకు దాసరి అరుణ్ కుమార్ హీరో. ఈవీవీ సత్యన్నారాయణ కొడుకులు పెద్దాడు ఆర్యన్ రాజేష్ హీరో, చిన్నాడు అల్లరి నరేష్ హీరో. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్ హీరో. కొడుకు ఆకాష్ పూరీ హీరోయే! టి. కృష్ణ కొడుకు గోపీచంద్ విలన్‌ను దాటి హీరో. సుకుమార్ అన్న కొడుకు హీరోగా రాబోతున్నాడట?!

నిర్మాతలు వీబీ రాజేంద్రప్రసాద్ కొడుకే కదా హీరో జగపతి బాబు. ఎమ్మెస్ రెడ్డి కొడుకు శ్యాం ప్రసాదరెడ్డి నిర్మాత. మనవరాలు కూడా నిర్మాతే! అశ్వినీదత్తు కూతుళ్ళూ నిర్మాతలే! ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ హీరో. స్రవంతి రవికిశోర్ (అన్న) కొడుకు రామ్ హీరో! కేఎస్ రామారావు కొడుకు వల్లభ హీరో, ప్రొడ్యూసర్! ప్రొడ్యూసరూ డిస్ట్రిబ్యూటరూ యెన్ సుధాకరరెడ్డి కొడుకు హీరో నితిన్! బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో, పక్కన ఫస్ట్ సినిమాకే సమంతా హీరోయిన్. ఐటమ్ సాంగ్ కు హీరోయిన్ తమన్నానే దించేసారు!

సంగీత దర్శకులు టీవీ రాజు కొడుకు రాజ్. సాలూరి రాజేశ్వరరావు కొడుకు కోటి. కోటి కొడుకూ హీరోయే! రైటర్ సత్యమూర్తి కొడుకు మన దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకో కొడుకు గాయకుడు. బాలూ గారి చెల్లలే శైలజ. కొడుకే సింగర్ చరణ్. పాటల రచయిత సీతారామ శాస్త్రి వొక కొడుకు హీరో. యింకో కొడుకు డైరెక్టర్. కెమెరామెన్ ఛోటా కే నాయ్డు మేనల్లుడే హీరో సందీప్ కిషన్!

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పే రాం గోపాల్ వర్మ వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టుడియోలో సౌండ్ యింజనీర్! మీనాన్న కనీసం ప్యూను కూడా కాదుగదా, నీకు గేటులోపలకి రానిస్తారా చెప్పు? ఈ సాక్ష్యాలు చాలవా చెప్పు?

సో.. ఈ సొదంతా.. సోదంతా నీకు ఎందుకు చెపుతున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ దగ్గరుండి ఈ రిలేషన్లు తెలిసినంతవరకు యెందుకు చెప్పాడో తెలుసా? రియలైజ్ అవుతావని! నువ్వు పేరుకి బాబువే గాని.. మీ బాబువల్ల నువ్వయితే బాబువి కావు, కాలేవు. ఇండస్ట్రీని యేలలేవు. వొద్దురా.. నాలాంటి వాడిని తెలియక సినిమా యిండస్ట్రీ కొచ్చేసాను. చాలా దూరం వచ్చేసానని తెలుసు. ఇంకెంత దూరముందో తెలీదు. ఇక్కడ అందరూ అంటే యెక్కువ మంది నాలా థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాళ్ళే!

లేదూ పెట్టేబేడా సర్దుకొని ఎవరి మాటా వినకుండా వస్తానంటే రా.. సంకనాకి పోదువు. పెళ్లి కాకుండా వచ్చావో నీకు భవిష్యత్తులో కాదు, యీ జన్మలోనే పెళ్లికాదు! అందుకని పెళ్లి చేసుకొని వచ్చావో మీయావిడ డైవోర్సు తీసుకున్నా ఆశ్చర్యపోకు! మీసాలు వచ్చినప్పుడు వచ్చాను, యిప్పుడు నెత్తిమీద వెంట్రుకలూ మిగల్లేదు!

నీ మీద నీకు నమ్మకం వుండడం మంచిదే. కానీ యితరుల అందాలతో పోల్చుకోవడం ప్రమాదం. ఎందుకంటే నీ వుత్తరం చదివితే వూపిరి ఆగిపోయింది. “నాగార్జున బిగినింగ్ లో విక్రం, అరణ్య కాండ సినిమాల అప్పుడు ఎలా వున్నాడు? యిప్పుడు యిండస్ట్రీకే ‘మన్మధుడు’ కాలేదా? జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ఫస్ట్ సినిమాలకి యెలావున్నారు? యిప్పుడు యెలావున్నారు? మహేష్ బాబులో యెంత మార్పు వచ్చింది? మరి రాం చరణ్ మాటేమిటి?” అని రాశావ్. నటిస్తూ నేర్చుకుంటాననీ రాశావ్. ఈ లోగా ప్రేక్షకులు అలవాటు పడతారనీ అన్నావ్. నీకు యేమి చూసి యీ మెడపోత్రమో నాకేమీ అర్థం కావడం లేదు!?

ఓరే.. పిచ్చనాకొడకా.. నీ నుండి మీ అమ్మానాన్నా ఆరోగ్యం పాడై పోయిందని మీ అక్క ఫోన్ చేసింది. నీ యెర్రికి మందు లేదంది. సిన్మా వోళ్ళంతా చదువు సరిగ్గా అబ్బక.. యిల్లోదిలి మద్రాసు బండి యెక్కిన వాళ్ళేనని గర్వంగా చెపుతున్నావట. ఏ అపరాత్రి అర్ధరాత్రి నువ్వు రైలు యెక్కేస్తావేమోనని అందరూ నువ్వు వుచ్చకి లెగిసినా దొడ్డికి లెగిసినా భయపడి చస్తున్నారట! చాలక భూమి అమ్మేయమని, ఆస్తి రాసి యిమ్మని నువ్వూ నీ ఫ్రెండు కలిసి ముందు సీరియల్ తరువాత సినిమా తీస్తారట. ఒరే పద్దుకుమాలినోడా.. యిక్కడ టీవీల్లో కూడా వీజీ కాదురా. ఆల్రెడీ- ఆర్కే డైరెక్టర్ రాఘవేంద్రరావు వాళ్ళదీ.. అర్కా వాళ్ళ అల్లుడిదీ.. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళదీ.. జయసుధ వాళ్ళదీ.. రాధిక వాళ్ళదీ.. మల్లె మాల మనవరాళ్ళదీ.. దత్తు కూతుళ్ళదీ.. మంచు లక్ష్మి వాళ్ళదీ.. క్రిష్ వాళ్ళ నాన్నగారిదీ.. తాజాలూ మాజీలూ అందరూ మఠం దిద్ది కూర్చున్నారురా.. ఒక్కో సీరియల్ వెయ్యీ రెండు వేల ఎపిసోడ్లు.. ఒకసారి వస్తే స్లాటు వదులుకోరు. నీవంతు వచ్చేసరికి నీకు సష్టి పూర్తి వయసు వొచ్చేస్తుంది. అంచేత చెప్పిన మాట విను.. భూమిని అమ్మి ఆస్తి లాక్కొని పీక్కొని వొచ్చి యిక్కడ వూడబోడిచింది యేమీలేదు!

నీ వేషాలు మానుకో.. ఇక్కడ హండ్రెడ్ పెర్సెంట్ రిజర్వు అయిపోయింది. నీ సామాజిక వర్గము అనబడు కులమునకు యిక్కడ తత్కాల్ సౌకర్యమూ లేదు. హీరో ఛాన్సు లేదు. రాదు. అందుకే మన సామాజిక వర్గపు హీరో వొక్కడూ లేడు! ఒక్కడూ రాడు! ఆ నలుగురి చేతిలో థియేటర్లు వున్నాయంటారు. నిజానికి అన్ని పాత్రలూ వేషాలూ విద్యలూ ఆ నాలుగు సామాజిక వర్గాల వాళ్ళదే!

ఇక్కడ రాణించాలంటే పట్టుదల, కష్టపడే గుణం, సాధన.. యివి వుంటే చాలవు. కులమూ ధనమూ బలగమనే బలమూ బ్యాకప్  వుండాలి. లేకపోతే ప్యాకప్పే! నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ వున్నప్పుడే సెల్లు పనిచేస్తుంది అవునా?, అప్పుడు కూడా నీకు సిగ్నలింగ్ వ్యవస్థ బాగుండాలి! అన్ని వేళలా సపోర్ట్ చెయ్యాలి! అది కనెక్టింగ్ ది పీఆర్ కావాలి! వర్కౌట్ అవ్వాలి! అదృష్టం పాత మాట, టైమింగ్ కుదరాలి! నెలనెలా మీ యింటి నుండి డబ్బులు పంపుతూ వుండాలి! అప్పులు నాల్రోజులకి నాల్గు నెలలకి పుడతాయి, పోనీ నాలుగు సంవత్సరాల వరకు పుడతాయి! మరి పద్నాలుగు సంవత్సరాలకి పుడతాయా? పుట్టవు! పుట్టగతులు వుండవు!

అంతా అనుకోకుండా జరిగి అవకాశము రావాలి! ఆట ఆడాలి! ఇక్కడ ఆడకుండా ఓడిన వాళ్ళమే యెక్కువ! ఆడి.. బాగా ఆడి.. హిట్టు వస్తే నీ అంత పోటుగాడు లేడు. హిట్టు పక్కనే ఫ్లాప్ కూడా వున్నట్టే.. హిట్టు పక్కనే ఫ్లాప్ వొస్తుంది. వొచ్చిందా గొర్రె చచ్చింది. మళ్ళీ మన ముఖం యెవడూ చూడడు! ఈ లోపల పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి! మూటాముల్లె సర్దుకొని వెనక్కి వెళ్లి పోవడమే!

మరి కాదని మనలాంటి వాళ్ళం బతకడం యెలా అనా? మనకి యిక్కడ కొన్ని ఆల్రెడీ రిజర్వు చేసినవి వున్నాయి. హీరోని ఎలివేటు చెయ్యడానికి చక్రాలకింద టైర్లకింద హీరో చేతులకు బదులు మన చేతులు పెట్టడం, అగ్గిలోనుంచి నడిచే హీరో కాళ్ళకు బదులుగా మన కాళ్ళతో నడవడం, నదిలో సముద్రంలో మునిగిపోతున్న హీరోయిన్ని రక్షించడానికి హీరోకి బదులుగా మనం ఈదడం, ఫ్లైట్లోంచి విలన్ హీరోని తోసేస్తే గాల్లోంచి మనం కింద పడడం, రైల్లోంచి దూకడం, రైలెక్కి రన్నింగ్ చేయడం, పట్టాలపై పరిగెత్తడం వంటి పనులు అడపా దడపా మనకి దొరుకుతాయి. ఇందులో కొన్ని స్టంటు మాస్టార్లే చేసేస్తారు! తక్కువ బడ్జెట్ వున్నప్పుడు మనలాంటి వాళ్లకి అవకాశం వొస్తుంది. ఆ అవకాశం పంచుకుందాం రా..

ఇక్కడ రేపు లేదు! ఇవ్వాలైనా వుందో లేదో తెలీదు!

ఉంటా మరి! ఇండస్ట్రీని మార్చుదాము.. కొత్తనీరు ప్రవాహింప జేద్దాం అని వుంటే రా.. నే నేవడ్ని రావద్దని చెప్పడానికి. లోతు తెలిస్తే ఈత సులువవుతుందని యిదంతా రాసాను! వుంటా రా.. *

యిట్లు

నీ

థర్టీ యియర్స్ యిండస్ట్రీ గాడు.

 

 

ఉరితాడూ ఈ ముడి నువ్వయినా విప్పవూ?

 

 

           -బమ్మిడి జగదీశ్వర రావు

                                     ~

bammidi అయ్యా రంగనాథ్ గారూ..

మీకు నేను తెలీదు, కానీ నాకు మీరు తెలుసు! నాలాంటి చాలా మందికి మీరు తెలుసు! యిప్పుడయితే అందరికీ మీరు తెలుసు! హీరోగా కాదు, విలన్ గా కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అస్సలే కాదు, టీవీ ఆర్టిస్టుగా అంతకన్నా కాదు. కవిగా కాదు. నాటక కర్తగా కాదు. టెన్నీసు క్రీడా కారుడిగా కూడా కాదు. అరవై ఆరేళ్ళ వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్న.. సారీ రంగనాథ్ ని హత్య చేసిన రంగనాథ్ గా మాత్రమే తెలుసు! లోకం మీ మూడొందల సినిమాల్ని మర్చిపోయింది! అందమయిన ఆరడుగుల యెత్తయిన మిమ్మల్ని మర్చిపోయింది! అనుభూతినిచ్చే మీ కవిత్వాన్నీ మర్చిపోయింది! మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంది! పెట్టుకుంటుంది! ఇక మీదట యెప్పుడూ మీ కథ.. జీవితాన్ని మీరు ముగించిన చోట మాత్రమే ఆరంభిస్తుంది!

మీరు యెందుకిలా చేసారు? అడిగేవాళ్ళు లేరనా? ఒంటరిగాన్ని అనా? యేమని? మీ వయసెంత? మీ అనుభవమెంత? మరీ అరవ్యయారో యేట చెయ్యదగ్గ పనేనా? చెంప పండీ పండని వాళ్ళు కూడా చెయ్య తగ్గ పని కాదే?! తల పండిన మీకు యేమిటీ తలపోత? మరి మిమ్మల్ని మీ వయసు ఆపలేదా? వార్ధక్యం ఆపలేదా? గడిపిన గతించిన జీవితాన్ని చూసి మీరు యేమి నేర్చుకున్నారు? యేమని సందేశమిస్తున్నారు? యే ‘డిస్టినీ’ యిది? విధి యిదా? యెవరు రాసారు? యే బ్రహ్మదేవుడు రాసాడు? బ్రహ్మదేవుడు వేషం మీరు వేసారు సరే- అరే విధిని మీరే రాసారే?! దేవుణ్ణి ప్రశ్నించిన మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదేమి?

మీ అమ్మ జానకమ్మగారు మంచి గాయకురాలు. అంతేనా?, మించి తబలా విద్వాంసురాలు. మరి వీణలోనో.. యేకంగా గోల్డు మెడలిస్టు. అన్ని అర్హతలు వుండీ యిల్లాలయ్యాక  యింటి బరువు మోసాక తన కోరిక.. సినిమా నేపథ్యగాయని కావాలన్న తన ఆశని తీసి అటకా యెక్కించేసారు! సంసారమే సంగీతమయ్యాక దారి దొరక్క- గొంతుండీ పాడలేక – పిల్లల పెంపకం వీడలేక – కలని నెరవేర్చుకొనే తోవ లేక – వున్న ఒక్క జీవితాన్ని ముగించలేదు! మీలా వురి పోసుకోలేదు! వూపిరి పోశారు కలకి! కోరితే మీరు నీరు పోశారు! ఆ ఫలమే మీరు!!

మీ సహచరి నిర్మల చైతన్య కుమారి నుంచి మీరు యేమి నేర్చుకున్నారు? మీ ఆవిడ మేడ మీది నుండి కింద పడిపోయారు. నడుం విరిగింది. కాళ్ళు చచ్చు బడిపోయాయి. పద్నాలుగేళ్ళు పడకకే పరిమితమయిపోయారు! జీవితమన్నాక పడడం లేవడం సహజమనుకున్నారు. తప్పితే ఈ జీవచ్చవం లాంటి బతుకెందుకనిగాని, బరువెందుకనిగాని ఆవిడ అనుకోలేదు. అనుకుంటే ఆమెకు మృత్యువు పెద్ద దూరం కాదు. దేవుడు పిలిచినప్పుడే వెళ్లాలని అనుకుంది. తప్పితే మీలా తొందర పడలేదు. పడివుంటే మీకు మీ భార్యపట్ల వున్న బాధ్యత యెంతో నిరూపించుకొనే అవకాశమే లేదు! ఆబాధ్యతలకు మారు రూపు మీరు!!

అలాగే చైతన్య కుమారి జ్ఞాపకాల్ని ఆరేళ్లుగా ఆయువు పోస్తున్నారే.. ఆత్మ అన్నారు.. ఆజ్ఞాపకాల్నీ  మీ ఆత్మనీ మీరు వురితీసారని యెరుగుదురా?

మీ మిత్రుడు నందా ఎయిర్ ఫోర్సుకు వెళ్లిపోయాడని- మీరు వంటరి వాణ్ణి అయిపోయానని- ఆత్మహత్య చేసుకుందామని అనుకొని- రైలు కింద పడదామని పట్టాల ముందు కూర్చుని- తిరుపతి నుండి వచ్చే 156 ఆలస్యమైందని- అప్పుడు అమ్మా అమ్మ కోరికా గుర్తొచ్చి లేచొచ్చేసారని చెప్పుకున్నారే.. మరి రైలు రైట్ టైంకు వస్తే యేమయ్యేది? అమ్మ కోరిక తీరేదా? మళ్ళీ నందా కలిసేవాడా? మీ ఆలోచన ఆలస్యం కాలేదు! మీరు మిగిలారు! మీ కవిత్వమూ సినిమాలు మాకు మిగిలాయి! మీ పెద్ద కుటుంబం మీరు లేకపోతే యేమయ్యేది? మీ పాత్రలో మీరే వుండాలి! మీ పాత్ర మీరే పోషించాలి!

హీరో పాత్రే అనుకుంటే అరవై సినిమాల దగ్గర ఆగిపోయేవారు కాదా? అందరూ హీరోలయితే విలన్లెవరు? మిగతా క్యారెక్టర్లు యెవరు పోషిస్తారు? మిమ్మల్ని మెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆఖరిదాక హీరోగానే వున్నాడా? రేపు మహేష్ బాబు అయినా రాంచరణ్ అయినా అంకుల్ వేషమో తాతయ్య వేషమో వెయ్యక తప్పుతుందా? మనకు విలనుగా వచ్చి హీరోలు అయినవాళ్ళున్నారు. హీరోగా వచ్చి విలన్లు అయినవాళ్ళున్నారు. మీ తొలి విలన్ పాత్ర ‘గువ్వల జంట’ బాగా ఆడలేదని మిమ్మల్ని మళ్ళీ హీరోగా చూసారా? పంతోమ్మిదేళ్ళపాటు విలనుగా మీకు ఆయస్సు యెందుకు పోసారు?

అంచేత యెప్పటికి ఆపాత్రే! పాత్రకు న్యాయం చెయ్యడంలో మీ లోపలి హీరో పాత్రకు పాత్ర వుంది! మీలోపలి హీరో పాత్రని మీరు నిలబెట్టుకుంటూ వచ్చారు! మీలోపలి హీరో పాత్రని మీరు వురితీసి చంపేసి వుంటే మీ మరొక్క పాత్ర బతికే ఛాన్స్ వుoడేది కాదు!

జీవితమంటే జీవించడమంటే హీరోగా మాత్రమే మిగలడం కాదు అని- జీరో దాకా ప్రయాణించడమని- హీరో నువ్వే అనీ- విలనూ నువ్వే అనీ- బాబాయి నువ్వే అనీ- మామయ్యా నువ్వే అనీ- అన్నయ్యా నువ్వే అనీ- తాతయ్యానువ్వే- చివరకు ‘రైల్వే టికెట్ కలెక్టరూ’ నువ్వే- సమస్తమూ సకలమూ నువ్వే అనీ- యిన్నిన్ని పాత్రలు వేసిన నీకు యెవరు చెప్పాలి?!

ఔను! ఒంటరీ నువ్వే! సమూహమూ నువ్వే!

ఒంటరితనాన్ని ఓర్చుకోలేక పోయావా? మనిషి లోపల తనకు తాను ఒంటరి! వెలుపల ఒంటరి కాదే?!

మందసా మహరాజ్ ఎస్టేట్ లో మీతాతగారు వైద్యులుగదా? ఆ మందసా మహారాజు యిప్పుడు యేo చేస్తుస్తున్నాడు? యింకా రాజుగానే వున్నాడా? లేదే.. ఆ ప్రాంతంలో కొందరు రాజులు పాలు అమ్ముకుంటూ బతుకుతూ వున్నారు తెలుసా? మందసా రాజుగారు కూడా వురిపోసుకు చావలేదు!

ఒంటరినని వాదిస్తారా? యెవరు వొంటరి కాదు? మీ పిల్లలే కాదు, మా పిల్లలూ మా దగ్గర లేరే. రేపు వాళ్ళ పిల్లలూ వాళ్ళ దగ్గర వుండరే!? మనకి మనం దొరకనంత వేగంగా పరిగెత్తుతూ వున్నామే!? మీ మిత్రులూ చుట్టాలూ పక్కాలూ అందరూ ఆ పరుగు పందెంలోనే వున్నారే!?

మీ కవిత్వమూ మీ సినిమాలూ నాటకాలూ క్రీడలూ మీ వొంటరితనం నుండి మిమ్మల్ని విడదియ్యలేకపోయాయా?

నిజమే! ఒంటరితనం జైలే! మనుషుల్ని తోటి మనుషులనుండి వేరు చేస్తే అది జైలే! ఆ జైలు నిర్మాణానికి మీ చుట్టూ వున్న వాళ్ళతో పాటు మీరెందుకు పూనుకున్నారు? ఆ శిక్ష మీకు మేరే యెందుకు వేసుకున్నారు? అలా శిక్షించుకున్న ఉదయకిరణ్ ను మీరేమన్నారు? ‘నాదగ్గరకు వస్తే సంపూర్ణంగా మార్చేసేవాడిని’ అన్నారు కదా? మరి మిమ్మల్ని మీరు యెందుకు మార్చుకోలేక పోయారు? మార్పు యెప్పుడూ మననుంచే కదా మొదలవ్వాలి!

మీ సహచరి చైతన్య కుమారితో ప్రేమ కన్నా బాధ్యత గొప్పది అని మీ వుద్దేశాన్ని ఆమెతో విభేదించి మరీ చెప్పారే! మరి మీ బాధ్యత యిదేనా? సమాజంలో యెందరో బతకడానికి చస్తున్నారే?! అమ్మానాన్నాలేని అనాథలుగా యేతోడూ లేక వొంటరిగా బతుకుతున్నారే?! ఆ ఒంటరి వాళ్లను మీరెందుకు తోడు చేసుకోలేకపోయారు? మీ వొoటరితనాన్ని యెందుకు చేరిపేసుకోలేకపోయారు? మీ చుట్టూ మీరు వొంటరితనపు కంచె వేసుకున్నారెందుకు?

సమూహంలో కలవలేని వాళ్ళ కథ యిలానే ముగుస్తుందని చెప్పడానికా యీ మీ కథ?!

నేను నేనుగా వుండిపోతే మనము కాలేకపోతే యింత శిక్షా?!

వొక్క మాట చివరిగా చెప్పాలి.. సమూహంలోనే వొంటరితనానికి విముక్తి!

యేమైనా యింక యెప్పటికీ మిమ్మల్ని చూడలేమని తలచుకుంటే దుఃఖంగా వుంది!

కన్నీళ్ళతో-

వొక ప్రేక్షకుడు

 

   ఓరి బ్రహ్మ దేవుడా..!

 

-బమ్మిడి జగదీశ్వర రావు

~    

bammidi

ఓరి బెమ్మ దేవుడా..!

నీకు రిమ్మ గాని లెగిసిందేట్రా.. యేట్రా.. ఆరాతేట్రా.. యే మొకం పెట్టుకొని రాసినావురా.. సేతికొచ్చింది గాని రాసేనావా యేటి? బెమ్మరాత యెవుడుకీ అర్థం కాదంతారు.. యిదేనేటి? యిలగేనేటి? రాత నీదైనా నుదుల్లు మావి గావేటి? యిష్టం వొచ్చినట్టు యెలాక్కలగ రాసీస్తే పడతామనుకుంతన్నావేటి? నువ్వు యిలాపింటోడివి కాబట్టే పూజకి నోసకుండ అయిపోనావు, సాల్దా? మనిసి పుట్టుక పుట్టు తెలుస్తాది.. కలవపువ్వు మీద సరస్పతీదేవి పక్కన పరాసికాలు ఆడుతూ కూకోడం కాదు, ఈ మట్టీమీదకి రా.. నువ్వు బగమంతుడివైనా బెమ్మదేవుడువైనా నువ్వీ మట్టీల మట్టీ కాకపోతే అడుగు.. నువ్వు యెలాగ అవుతారం సాలిస్తావో నీక్కూడా తెల్దు.. నిన్ను పుట్టించినోడికి కూడా తెల్దు..

అసలు నాకొక అగుమానం.. నీకు గాని పవర్లు పోయినాయేటో? నువ్వు రాసినట్టుగా యేది జరగడం లేదు.. అంతా తలా తోకా లేకండా జరగతంది.. నువ్వు తలకిందులుగా రాస్తావు గాని తలా తోకా లేకండా రాయవు. మరి యిదేటిది?

సావుపుట్టుకలు నీ సేతిలో వుంతాయంతారు. అది అబద్దము కాదేటి? యిప్పుడు నొప్పులొచ్చినప్పుడు యెవులు కంతన్నారు? యెక్కడ కంతన్నారు? మంచిరోజు సూసి.. మూర్తాలు తీసి.. యెలితే మనకు యెప్పుడు కావాలంతే అప్పుడు డాకటేరుకి యీలయినప్పుడు సిజేరియను సేసి పిల్లలని కోసి తీస్తన్నారు. కుట్లేస్తన్నారు. నువ్వేటి సేస్తన్నావు? నువ్వేటి సూస్తన్నావు? నీ నయినాలు తీసి యే గైనాన దోపుకున్నావు సామీ..

పుట్టుక సరే, సావో? నీ రాత సంతకెల్ల.. నువ్విలాటి సావులు మునుపు యెప్పుడైనా సూసినావా రాసినావా? నీకు నాలుగు జతల నయనాలున్నాయి.. యేల? కళ్ళు పెద్దవి.. సూపు మద్దిము అన్నట్టుగుంది నీయవ్వారం.. యిలగ అంతన్నానని యేటి అనుకోకు.. నీ రాత.. అదే మా తలరాత యేమి బాగోలేదు.. తిన్నగ నేదు.. ముప్పైమూడు వొంకర్లు అరవైయ్యారు సిత్రాలు తిరిగున్నాది..

ఆవుసు తక్కవ పుట్టక పుడితే యే పామో  గీమో పొడిసీసిందంటే కరమ్ము కాలిపోయింది అనుకోవచ్చును.. యిదేటిది యెలకలు కరిసీసి ముక్కలుతీసీసి పిల్లడు సచ్చిపోడమేటి? అదీ ఆస్పెట్లిలోట? పురిటికందుకీ గాచ్చారమేటి? యిది నరుడు రాసిన రాతా? నారాయుడు రాసిన రాతా? అసలిది రాతేనా?

అర్రే.. అయిదరాబాదు నీలోపర్రు ఆస్పెట్టిల్ల పంకాలు పడిపోయి పసిపిల్లలు సచ్చీజావులై పొడమేటి? సిమెంటు పెచ్చులు ముక్కముక్కలు వడగళ్ళ వానలాగా రాలడమేటి? ఏటీ యిడ్డూరం? ఆస్పెట్టిల్లు పేనాలు పొయ్యడాకో తియ్యడాకో దేనికో తెల్డంనేదు..!

మా కాలంల అడివిలోకి యెల్తే పులో బుట్రో వొచ్చి దాని బయ్యానికో గియ్యానికో గాండ్రమనుకొని మీద పడిపోయి సట్టలు సీరీసీది.. మరి యిదేటిది? యిచిత్రం కాదా.. యీదిలోకి యెల్తే పిల్లల్ని కుక్కలు సట్టలు సట్టలు సీరీడమేటో సంపీడమేటో యేటి తెల్డం నేదు..!

ఓరే.. యీలమ్మ కడుపు కాల.. యీల అత్తోరింట్ల పీనుగెల్ల.. యెక్కడికక్కడ కాలవలు తవ్వీసి ముయ్యకుండ వదిలిస్తే యేటవుతాది? యెనకటి కుల్లు కాలవల పడ్డ పిల్లాడు దొరకనేదు.. యింతల పిల్ల పడిపే.. వారం పోద్దోయికి దొరికింది.. సక్కన బడికెల్లి వొస్తున్న పిల్ల.. కాలవలన్నీ ములిగీ తేలీ తిరిగెల్లి సంద్రంల కలిసి కడకి పీనుగయి యింటికొచ్చింది..

అదేమి వూరు.. గేపకం నేదు, పేపర్లల్ల యేసినారు.. మా మనవడే సదివినాడు.. పిసరంత వోర్త.. పొటోవు యేసినారు.. ఊష్టమొచ్చి మంచాన పడితే బెల్లంకి సీమలు పట్టినట్టు మనిసికి సీమలు పట్టేనాయి.. ఒళ్ళు వొలుసుకు తినేనాయి.. సచ్చిపే.. ఊరిడి కాదు, వోడ వోర్త కదా.. అందరం మరిసేపోనాం..

సీమలు సరే, మరి దోమలో? కుడితే జొరాలు.. జబ్బులు.. బొంగో డెoగో.. కుడితే చావు.. ముడితే చావు.. అదేమి ప్లూ అనీసి బయపెడతన్నారు గానీ యిస జొరాలకి యేలమంది సప్పుడు సెయ్యకండా సచ్చిపోతన్నారు, తండాల్లో తట్టుకోలేక సచ్చిపోతన్నారు. గూడేల్లో గుట్టు సప్పుడు కాకండా సచ్చిపోతన్నారు. యిల్లిల్లూ పీనుగుల పెంటలే..

కలికాలం కాపోతే.. గురువే.. గురువమ్మే.. తల్లి తరవాత తల్లి.. దైవం తరవాత దైవం.. పెళ్ళంతో సాలలేక పేడకుప్పకి తన్నినట్టు పిల్లలకి తన్నీడిమేటో.. కొట్టి బెత్తంతో బాది సంపీడిమేటో.. పిల్లలు బడికెలతన్నారో కబేలాలకి యెలతన్నారో తెల్డం నేదు.. అదికాదు.. పిచ్చికి పిల్లంత సిన్న పిల్లమీద యెనుబోతు లాగా మేస్టు కన్నెయ్యిడమేటమ్మా.. కవుకులు యెట్టడమేటమ్మా.. కామంకి కల్లు నేవంతారు యిదేగావల్ల..?

యిక్కడ అమ్మా అయ్యిలకి కడుపులోటుoడగాన బడిలేసీయాల. పుట్టగాన బడిలేసీయాల. బొడ్డుతాడు కొయ్యక ముందే బడిలేసీయాల. కూసోడం నిల్సోడం రాకముందే బడిలేసీయాల. అడుగులెయ్యడం రాకముందే ఆడీయాల. మాటలాడడం రాకముందే పాటాలు నేర్సీయాల. యిలాటి అమ్మా అయ్యిలని యే బడిలెయ్యాలో? సదువు యాపారమయ్యాక కనికట్టు సేసినట్టు కనగాన బడిల పడీయాల. ఒడిల పడీసినట్టు కాదు. డబ్బుకు పడుసుకున్నోలు పిల్లల్ని గాలికిదిగో యిలగే వొదిలేసి పొతే.. లిప్టుల యిరకన తలలు రాలిపోవా? ఆల యాపారాలు దిబ్బయిపోను..

ఎక్కడా అలగే వుంది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు అంతారు.. పడ్డాయి కళ్ళు.. వొకరివికావు.. నలుగురివి.. పదమూడేళ్ళ పిల్లని సిటీ రోడ్డుల్లంట తిప్పుకుంటా సెరుసుకుంటా తిరిగినారట.. టీవీలల్ల సూపించినారు గదేటి? పోలీసు గండలు పొట్టలు పెంచుకోని యే మంత్రి యింటికాడ డూటీలు సేత్తన్నారో.. యెవులి ముడ్డి నాకతన్నారో.. అయినా ఆలేటి యిదమూ పదమూ వున్నోలా? లాకప్పుల్లోట వున్నోలిని సేరిసిన గనులేనా? మరేటే?

అందరు అలగే వున్నారు. కత్తి పదునుగుందని పీక కోసుకుంతామా? మన రత్తం.. మన కండ.. కండని కొండ సెయ్యల్సింది పోయి.. బతుకు కష్టముగుందని నూతిల తోసి పిల్లల్ని కాసిన అమ్మానాయినే సంపీడమేటో.. యెన్న ముద్ద లేదని యిసపు ముద్ద యెట్టి సంపీడమేటో.. యీల పిల్లల మీద యీలకి అక్కు వుంతాది నిజిమే, సంపీ అక్కు అక్కేనా? అన్నిం పున్నిం యెరగని యీ పిల్లలకేటమ్మా తల్లీ దండ్రీ ముచ్చు దేవతలైపోడమేటి?

ఏటిది? ఆపమంటే ఆపలేదని పోలీసోడు లాటీ యిసరడమెంత? బండి మీద పిల్లలు బొమ్మల్ల పడడమెంత? బుర్ర నేలకి గుద్దడమెంత? గుండె ఆగిపోవడమెంత?

రొట్టి గొంతుల అడ్డంపడి వొకలు.. యిడ్లీ ముక్క యిరుక్కొని వొకలు.. నీళ్ళ టేంకులపడి మరొకలు.. వుయ్యాట్ల నైలాను సీర సుట్టుకొని యింకొకలు.. ఆకులు రాలినట్టు రాలిపోతన్నారు.. పచ్చాకప్పుడే రాలిపోతన్నారు. నాలాటి పండుటాకుని తీసికేలిపోతే యెవులు వద్దంతన్నారు?

ఆకలికి సచ్చిపోతన్నారు. అన్నానికి సచ్చిపోతన్నారు. రోగాలకి సచ్చిపోతన్నారు. మందులకి సచ్చిపోతన్నారు. వయిద్దిం అందక సచ్చిపోతన్నారు.

సచ్చిందాక సావులు తప్ప బతుకు సూడనా? నా కళ్ళు గుడ్డయిపోయినా బాగున్ను.. నా ఆవుసు తీసుకో.. పిల్లలకి పొయ్యి దేవుడా..

దేవుడా.. నువ్వు అమురుతం తాగు. మాకు నీల్లియ్యి.. అన్నమియ్యి.. ఆవుసియ్యి.. మొగ్గలోన తెమ్పీకు.. మొగ్గలీడిన దాక వుంచు.. పువ్వులు పూసిన దాక వుంచు.. రేకులురాలినట్టు మీము రాలిపోతాము గానీ నీలాగ వుండిపోయి వుట్టిగట్టుకు వూరేగాలని మాకెవరికీ లేదు..

యిది నీ రాత కాదు, నువ్వు రాసింది కాదు, నీకు పెతినిదిగా పెట్టుకున్నాము గాదా.. ఆగండలు సేసిందిది.. మా నీడర్లనంతే వొప్పుతారా? జైల్లెట్టించీరా? దేవుడా.. నీవంతే మూగోడివి! మాగోడిది అని మొరెట్టుకున్నా నీకే! మొట్లెట్టుకున్నా నీకే! నువ్వంతే పడతావు.. అందుకే నీ మీద పడ్డాను.. వొక్క మాట.. పిల్లలకి యీలు కాని రాజ్యం పిశాచాలకి నెలవంతారు.. మమ్మల్ని యేలతున్న పిశాచాల పీక నువ్వయినా నొక్కవా..?

బెమ్మ దేవుడా! నీ రాత బాగుండాల. మాబతుకు బాగుంటాది. రూళ్ళ బుక్కు తెచ్చి వొరవడి రాస్తావో.. యేటి సేస్తావో.. నీ రాత కుదురుండాల. మా జీవితాలు కుదురుండాల. పిల్లల్లోన దాగున్న బగమంతుడూ బాగుండాల..

యింతే సంగతులు.. సిత్తగించవలెను..

యిట్లు

మీ దాసాను దాసురాలు

అసహజమవుతున్న సహజాతాలే ‘ఆర్తి’!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

“మనుషుల్లో ఉన్నన్ని రకాలు కధల్లోనూ ఉన్నాయి. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్టు కధల్లో గొప్ప కధలు వేరు …
… కానీ, ఎవరూ చూడకుండా జరిగిన పనికి అంతరాత్మ సాక్షి అన్నట్టుగా, ఏది గొప్ప కధ అన్నదానికి కధలు చదవడంలో సమర్ధులే సాక్షి. కధలు అందరూ రాయలేనట్టే అందరూ చదవలేరు. ఏ కధనైనా చదవలసిన విధంగా చదివేవారు బహు తక్కువ. అందులోని సారం ఆఖరి బొట్టు దాకా గ్రహించేవారు ఇంకా తక్కువ …”
ఈ మాటలు మా గురువుగారి కధల్ని ఉద్దేశించి వాళ్ళ గురువు గారు అన్నవి. ‘కాళీ పట్నం రామారావు కధలు’కు ఉపోద్ఘాతం రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ మాటలు చెపుతూనే – “… కధా పరిణామం గురించి నాకున్న పరిజ్ఞానం సరి అయినదయితే ‘యజ్ఞం’, ‘ఆర్తి’ లాంటి కధలు ప్రపంచ యుద్ధానికి పూర్వం వచ్చివుండడం సాధ్యం కాదు. ఈ కధలలో విశేషమేమంటే, అట్టడుగు జీవితాల్లోని అంతస్సంఘర్షణ కూడా, దాని భౌతిక కారణాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ‘యజ్ఞం’ శ్రీకాకుళం పోరాటాలకు ముందు నడిచిన కధ అనాలి. ‘ఆర్తి’ వాటికి యింకా కొంచెం ముందుదేమో, అందుచేతనే అందులో అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా ఉన్నది. అంతస్సంఘర్షణలు జరిగిపోయినాక విప్లవం తల ఎత్తాలి. ఈ రెండు కధలకూ ఈ నాటి విప్లవోద్యమాలతో రక్తసంబంధం ఉన్నది-’’ అంటారు (1971)
సాహిత్య లోకం యజ్ఞాన్ని పట్టించుకొన్నంతగా ‘ఆర్తి’ని (పట్టించుకోవలసినంతగా) పట్టించుకోలేదు. ‘ఆర్తి’ కధని పట్టించుకోవలసినంతగా పట్టించుకొని వుంటే – అర్ధం చేసుకోవలసినంతగా అర్ధం చేసుకొనివుండి ఉంటే – ఆ చర్చల సారాంశాల ప్రభావం ‘తెలుగు కధ’ మీద పడి మనిషికి సంబంధించిన మరిన్ని చీకటి కోణాలకు ఇంకెన్నో వెలుతురు దారులు చూపించి వుండేది.

కొ.కు. గారే అన్నట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ లోనే అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా వుంది. మరి ఆ అంతస్సంఘర్షణ మూలమేమిటో కధ ద్వారా కనిపెట్టగలిగితే యిప్పటికైనా ‘ఆర్తి’ తీరుతుంది. అయితే కొ.కు. గారు ప్రస్తావించినట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ రచనాపరంగా ముందుది కాదు. యజ్ఞం 1964లో రాసింది. 1966లో అచ్చులోకి వచ్చింది. ఆర్తి 1969 అచ్చులోకి వచ్చింది. ఆర్తి ముందుదేమో అనడంలో ‘యజ్ఞం’ జరగడానికి ముందు ‘ఆర్తి’ అలముకున్న విస్తరిస్తున్న వొక దశ అని. కధా సందర్భాల రీత్యా ‘ఆర్తి’కి ఒక విధంగా కొనసాగింపే ‘యజ్ఞం’ అని కొ.కు. భావన అయి వుండొచ్చు. యజ్ఞమూ – ఆ కధ మీద జరిగిన చర్చోపచర్చలూ – అది మన ముందు పెట్టిన ప్రశ్నలూ – వ్యవస్థలో వచ్చిన మార్పులూ – దాని మూలాలూ – యివన్నీ చూపిన మీదట ‘ఆర్తి’ రాశారంటే – ఒకడుగు ముందుకేసి మనిషి మూలాల మనుగడ మీద అంటే సహజాతాల మీద కా.రా. దృష్టి పెట్టారని భావించవలసి వుంటుంది. అందుకు ఆర్తి కధ ఆసరానిస్తోంది.

శబ్దార్ధ రత్నాకరములో ఆర్తి అంటే పీడ, దుఃఖం, మనోవ్యధ, రోగము, వింటికొన అనే అర్ధాలు ఉన్నాయి. సామాన్యంగా ఒక కధా శీర్షికకున్న ఒక అర్ధానికి ఏ కధ అయినా ఒదుగుతుంది. కానీ అన్ని అర్ధాలకూ అన్ని విధాలా సరిగా సరిపోయేలా అర్ధం పడుతుంది ఆర్తి కధ.
కధా లక్షణాల్లో ముఖ్యమైన వాటిల్లో ‘క్లుప్తత’ వొకటి. క్లుప్తతని సాధించాలనుకొనే రచయితలు కారా కధల్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం అవసరం. అవకాశం కూడా. క్లుప్తతకు గాఢత జోడించి పదం పదం తూసి అక్షరం అక్షరం రాసినట్టుంటుంది రామారావు గారి రచన. ఒక అక్షరం ఎక్కువ కాకుండా ఒక అక్షరం తక్కువ కాకుండా తూకం వేసినట్టుగా వుంటుంది. అక్షరం దగ్గర పొదుపరితనం పాటిస్తారాయన. ఎంత అవసరమో అంతే. అంతకు ఒక్క రవ్వ రాల్చరు. పాఠకుడి సమయం అంత విలువైనదిగా భావిస్తారు. గుర్తించి గౌరవిస్తారు. అంత పొదుపుగా రాసినా ఆర్తి కధ నిడివి చిన్నదేమి కా(లే)దు. అరవై పేజీలు (‘కాళీపట్నం రామారావు కధలు’ – తొలి ముద్రణ 1986 – పేజీ 467 నుండి 526 వరకు) వుంది.

ఊళ్ళోనే … కాదు కాదు – వాడలోనే బంగారి కొడుకు పైడయ్యకి తన కూతురు సన్నెమ్మనిచ్చింది ఎర్రెమ్మ. ఆవేటికి సంకురాత్రి ఆర్నెల్లు గదా, ఆర్నెల్ల కోపాలి కూతుర్ని తీసికెళ్తానంటుంది. వియ్యపురాలైన బంగారీ కాదనలేదు, పండగ రేపనగా వచ్చి తీసికెళ్ళు. పండగెళ్ళేక కాప్పోతే రెణ్ణెల్లుంచుకో నానడ్డనంటుంది. ఈ తగువు తాటాకుల మంటలా యెత్తురు కుంటుంది. నిట్ట పట్టిలా నిలిచీ కాలుతుంది. మొత్తానికి తగువు ముదిరి ముసిరి యెలాగ ముగిసిందన్నదే కధ. పైకి కనిపించే కధ. దిగితే గాని పాతర గుమ్మి లోతూ పల్లమూ తెలీదన్నట్టు కధలోకి దిగితే గాని అసలు లోతు అందదు. ఆ లోతులు పొరలు పొరలుగా అందటానికి కారా మాష్టారై బోధ చేసి కాదనడానికి లేదనటానికి వీలు లేని విధంగా పాత్రల్ని నప్పి మనల్ని ఒప్పిస్తారు. తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత. ఎంత తెండితే అంత. మనుగడని గడగడలాడించిన మూలాలేవో అవి ఊట బావిలా ఉబికొచ్చి మన ముఖాల్ని, మస్తిష్కాలని ఫెడీల్మని తాకుతాయి. ఎటొచ్చీ చేదుకొనే శక్తి చదువరికి వుండాలి –

‘వెనుకటి రాజ్జాలు కాదు, రాజ్జాలు మారిపోయాయన్నారు. ఈ సారి రావ రాజ్జం వస్తందన్నారు. కొందరు – కాదు! మాలల రాజ్యం వొస్తోందన్నారు. మాలలకి ఉద్యోగాలు; మాలలకి ఇళ్ళు; మాలలకే బంజర్లన్నీ; మీ వాడే ఒకడు శాస్ త్రాలు రాస్తున్నాడ్రా!- అన్నారు కావందులు. అనడం, ఇనడవే తప్ప – యే బంజరు కాడికెళ్తే, ఆ బంజరు కాడే కర్రల్తో నిలబడేవారు కాపు నాయాళ్ళు …’
ఇంక భూమ్మీద … బూమేది? బువ్వేది?
బతుక్కి తోవేది?
‘ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులల్లా, రెండే రెండు.
ఒకటి యిల్లు, రెండు వొళ్ళు.
మాల పేటలో యిల్లు అగ్రవర్ణులు కొనరు. అవర్ణులకు కొనే తాహతూ లేదు. అలానే ఒళ్ళు కొంచం కొంచెం అప్పుడప్పుడు అద్దెకివ్వడాన్ని శాస్త్రమూ శాసనాలూ అంగీకరిస్తాయి కాని దాన విక్రయ సర్వాధికారాలతో పూరా అమ్మడానికి అంగీకరించవు. కాబట్టి వాళ్ళలో చాలామంది కడుపేదలుగానే వుండి పోతున్నారు. లేకపోతే యేనాడో నిరుపేదలవ్వలసింది.’
ఊరుకాని ఊరు … కాలం కానీ కాలం … అవే స్థల కాలాలు! మరి పాత్రలకొస్తే- బంగారికి పెనిమిటి పోనూ వరుసగా నారాయుడూ కోటయ్యా పైడయ్యా ముగ్గురు కొడుకులు – అంటే బంగారింట నలుగురు మగ కూలీలు. ఇద్దరు ఆడకూలీలు –
మరి ఎర్రెమ్మ మొగుడా అవిటోడు. పెళ్ళి చేసి పంపిన సన్ని తోడ ఆరుగురు చెల్లెళ్ళు – అంటే సన్నితో కలుపుకున్నా ఎర్రెమ్మ యింట ఇద్దరే ఆడకూలీలు – అని అసలు లెక్క చెపుతారు లెక్కల మాష్టారు. బంగారి కోడల్ని ఎందుకు వదులుకోలేదో కూడా చెపుతారు. ఆవీటికి ముందు గొప్పులూ, వేరుశనగల వేతా … నెల్లాళ్ళు కూల్లుంటాయి. పండగ ముందు నెల్లాళ్ళు ముమ్మరంగా వరికోతలు. అందుకే పండగ ముందు తీసికెళ్తానంటుంది ఎర్రెమ్మ. పండగెళ్ళాక తీసికెళ్ళమంటుంది బంగారి.
అసలు కధ కంటికి కనిపించదు. అందుకే చూసినవాళ్ళు కూతురిని పుట్టింటికి ఎప్పుడు తీసికెల్తే ఏటని అనుకుంటారు. పంపడానికి ఒప్పుకొన్నాక ముందైతేనేం వెనకైతేనేం అని కూడా అంటారు. ఇలాటి తగువు గుద్దులేసుకుంటే మాత్రం తెగుతాదా? ఆ గుద్దులాట ఒక చోటగాని ఆగుతాదా? ఒళ్ళు కొవ్వెక్కి తెగబలిసి కన్ను మిన్నూ కానక కొట్టుకు చస్తున్నట్టు కనిపిస్తారు. ‘ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో … ఆ విస్తళ్ళలో భోజనం చేసినవారికి అర్ధం కాకపోవచ్చు. ఏడాదిపాటు పేగులు మాడితే యెవరికైనా అందులో నీతి కనబడుతుంది’ అని కధ చూపించే అలవాటున్న మాష్టారు ఇలా ఒక మాట అనకుండా వుండలేక పోతారు.

కాదా… వీరకత్తెలిద్దరూ జుట్లూ జుట్లూ పట్టుకొని, రక్కుకొని, కొరుక్కొని, రాళ్ళతో యుద్ధాలాడి .. దెబ్బలు కాసిన ఎర్రెమ్మ చుట్టూ దాని పిల్లలు మూగి మొర్రోమంటే సన్ని తల్లితో వెళ్లింది. ‘ఇదిగో, యిప్పుడు దానెంట యెల్లినావో, మరీ గడపల అడుగెట్టవ్’ తెగేసి అత్త చెప్పినా అమ్మ వెంట వెల్లింది సన్ని.
ఆ విధంగా పెనిమిటి పెళ్ళాలయిన సన్నెమ్మా పైడయ్యా ఒకరికొకరు పరాయోలయినారు.
ఎందుకూ?
ఆకలి!
ఔను గదా … కూలాడితేగాని కుండాడదు కదా?!

మనిషికున్న సహజాతాల్లో మొదటిది ఆకలి. మొదాట కధ అక్కడే మొదలయ్యింది. ఈ ఆకలే బతుకుని సుట్టబెట్టీసింది. ఎవరాకలి వాళ్ళదే. మాష్టారే చెప్పినట్టు ‘వర్షావసాన వాగులు పుట్టి వరదలై పొంగినట్టు, వ్యక్తులలో పుట్టిన భయం, వెల్లువలై పొంగింది. గడ్డి మొక్కలు ముందు మునిగితే, గాలివానకి వృక్షాలూ, ఆముదపు చెట్లూ ఆ తర్వాత విలవిల్లాడుతున్నాయి అని – నిజమే, మనుషులూ గడ్డిపోచలే. ఉక్కిరి బిక్కిరి కాక తప్పుతారా?

ఒకరికొకరు కావలసిన సన్నెమ్మ పైడయ్య ఒకరికొకరు పరయోళ్ళగా వుండీ, వుండలేక – పైడయ్య మగాడు గనుక దొంగచాటుగా కలిసే చొరవ తీసుకున్నా – ఎవరో చూస్తారన్న భయం ఒక్కటేనా –ముందెల్తే గొయ్యా యనక్కెల్తే నూయ్యా … యిద్దరిదీ అదే పరిస్థితి. మనసులో యిష్టమున్నా పౌరుషాలూ పరాధీనతలదే పై చేయిగా మిగులుతుంది. ఏమీ మిగలకపోయినా ఇద్దరూ కలుసుకున్న కబురు వాడలో తెలిసిపోతుంది.

అమ్మలా అన్నీ అర్ధం చేసుకున్న నరసమ్మ నీ మొగుడు చెప్పినట్టు నడిచి కాపురాన్ని నిలబెట్టుకోమంటుంది. సన్ని ఎద పొయ్యలేక ఏడుస్తుంది. ఆడు రేతిరికి ఎక్కడికి రమ్మన్నాడో చెపుతుంది. తొంగోడానికి చోటు లేదు. వున్న చోట వీలు కాదు. బరితెగించి వెళ్ళి ఒళ్ళెరపెట్టి మొగిడ్ని దారిలోకి తెచ్చుకోవడం చేత కాదు. అందు మార్గం వల్ల అత్త కాదు కదా దాన్ని పుట్టించిన జేజేమ్మని ఎదిరించడం చేత కాదు.
మరి మొగుడు ఎవుల్నయినా మరిగితే, కాపురంలో నీళ్ళు కాదు, నిప్పులు కురుస్తాయన్న భయం.

మనిషి కున్న సహజాతాల్లో భయం కన్నా ముందున్నది కామం. కామం కూడా ఆకలే. దప్పికే. ఆకలిని అర్ధం చేసుకున్నట్టు కామాన్ని ఎవరూ అర్ధం చేసుకోరు. ఆకలికి దేబిరించి నీరసించిన ప్రాణం … ఎన్ని లజ్జుగుజ్జులయినా పడి కొట్లాడి పోట్లాడి ఆకలి తీర్చుకుంటుంది. కామమయినా అంతే. దేబిరించో దౌర్జన్యం చేసో సిగ్గొదిలి .. సెరమొదిలి ఆరాటపడి దప్పిక తీర్చుకుంటుంది.
ఆర్నెల్లయి ఆడమనిషి కోసం ఉపాసం వున్నాడు కాబట్టే పైడయ్యకు పెళ్ళాం సన్నెమ్మ మీద మోజున్నా – రావయ్య కోడలు .. యేపుగా కాసిన కాయాలా, నిండా విడ్డ పువ్వులా వుండి ఆశనిపించింది. ఆశ తీరక ఆ దప్పికతోటే ఊరికీ వాడకీ దూరంగా ఎక్కడో వున్న గంగమ్మని ఎతుక్కుంటూ వెళ్ళాడు. నీ కాడ యేదుంటే అదే యిమ్మన్నాడు. అక్కడితో ఆగక “నానార్నెల్లయి, ఆడమనిషి కోసం ఉపాసవున్నాను. ఇయ్యాల ఇంటికొస్తే మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్న రాత్తిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికి నా బాధ అర్ధవైనట్టు నేదు. సెప్పకేం – కత్తెట్టి ఒక్కొక్కల్నో పోటు పొడిచేసి, ఆ యెంట నానూ సత్తునా అనుకున్నాను. కాని నాకాపాటి తెగువనేదు –’’ పైడయ్య తన అవస్థలను చెప్పాడు.

గంగమ్మ అర్ధం చేసుకుంది. ఒక దప్పికన్నా తీర్చాలన్న ఉద్దేశంతోనే “– ‘నీకు నాటు సారా పడతాదా?’ అంది తల్లిలా –“ అని మాష్టారు అక్కడ అమ్మని చేశారు గంగమ్మని.
పెళ్ళప్పుడో, సన్నీ కాపురానికి రాకముందో – ఇంకోసారి అడగానంటే, అలాగే కానిమ్మంది గంగమ్మ. మళ్ళీ ఇన్నాల్టికి వచ్చిన పైడయ్యను కాదంది. ‘నానిప్పుడు నీకొదెన్నవుతాను’ అని చెప్పింది. అంతకు ముందే గంగమ్మ చెప్పకముందే ఆమె భర్త మంచానుండి ‘నారాయుడూ’ అని పిలవడం సూక్ష్మ దృష్టి గల పాఠకుడు ముందే గ్రహిస్తాడు.
పైడయ్య మాటా మనోగతం మనిషి కప్పుకున్న మరిన్ని లోపలి పొరల్ని చీలుస్తుంది. సహజమైన సహజాతాల్ని బయట పెడుతుంది.
“మాయన్న అందరు పిల్లల మీద, పెళ్ళాడనంటే, మంచోడు – మంచి పనే చేసేడనుకున్నాను. అయితే ఆడు యెలాగా బరిస్తన్నాడా అని దిగులుగుండేది. ఇదిగిలాగన్న మాట: అని – నన్నడిగితే యిదీ మంచి పనేననాల. అత్తలాడూ సుకపడతన్నాడు. ఇత్తల నువ్వూ సుకపడతన్నావు. మనలాటి కస్టపాటు జాతికే వుంది, కడుపు సుకం లేనే లేదు. ఎయ్యి జనమలెత్తినా వస్తాదని నమ్మకవూ లేదు –

సుకాలన్నిట్లోకి సుకం ఆడ మగా ఒక్కాడ అనుబగించిందే – సుకం! ఇప్పుడిదీ (సారా) సుకవే. కానీ దీనికి కరుసున్నాది. ఇదయ్యాక రేపు కొంత దండుగున్నాది. ఆ సుకానికైతే కానీ కరుసునేదు – రేపు దండుగనేదు. పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకవది.-“ అని పైడయ్య తన పరిస్థితికి వాపోతాడు.
పైడయ్యకు వేరే దారి లేదా? ఉంది. అది దారి కాదు. ‘ఇరుగమ్మకో పొరుగమ్మకో పాటుపడితే యిళ్ళిరగతీయాల: కన్నె పిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోర మనుసులున్నారు – ఆలా జోలీ కెళ్తే, ఆసుపత్రికి పోవడం సరే సరి – పన్లోకెళ్ళకండ పది రోజులుంటే కూల్డబ్బుల మాటేటి?’ పైడయ్యకు తోవ లేదు!
‘కడుపుకుండి, మనిషి దొంగతనం సెయ్యరాదు. కట్టుకున్న పెనివిటో, పెల్లవో వుండి కాని పని సెయ్యడం తప్పు. నీకింటి కాడ పెల్లం నేకపోతే సెప్పు. దానికొంట్లో సుకం నేదన్నా నానొప్పుకుంటాను. కానీ తీరి కూకొని కాపరాలు సెడగొట్టకు. అందరు మొగోళ్ళు ఒకటైనట్టే అందరాడోళ్ళం ఒకటే’ అంది రావయ్యకోడలు, పైడయ్య స్నేహితుడు కన్నయ్య తోటి.

వదిన్నవుతానన్న గంగమ్మ – అలా అన్నందుకు ఒగ్గేసిన పైడయ్యలను జాతి తక్కువగా లోకం చూసినా నీతికి తక్కువ కాదు. ఏ తోవా లేక దొంగతోవకొచ్చినా ఎవలతోవ ఆలకి వుండాలి గదా?!
అలాగ లేనపుడు దొంగ తోవయినా వొక తోవుండాలి. నారాయుడూ గంగమ్మ ఆ తోవనే నడుస్తున్నారు. గంగమ్మ మొగుడు అది దొంగ తోవనుకోడు. ఏ తోవా లేనపుడు ఏదో ఒక తోవుండాలని తెలుసుకొని అర్ధం చేసుకున్నాడు గనుకనే ‘నారాయుడూ’ అని కదలిక పసిగట్టి పిలవగలిగేడు.
మానవ సహజాతాల్లోని ఆకలి, కామం గురించే కాదు .. నిద్ర, భయం గురించి కూడా ‘ఆర్తి’ కధ మనకు ఎరుకలోకి తెస్తుంది.
ఆకలి రుచెరగదు. నిద్ర సుఖమెరగదు. నిజమే, కాని శాశ్వత నిద్రకే కాదు, ఒక రాత్రి తెల్లవారాలన్నా ఆరడుగుల నేల కావాలి. ఒక సారికి కాదు, రెప్పలు పడిన ప్రతిసారీ కావాలి. ఒళ్ళు వాల్చడానికి ఆసరా కావాలి. వెన్ను ఆన్చడానికి నేల ఆదరువు కావాలి. మరి ఎర్రెమ్మ యిల్లయితే నరసమ్మ అన్నట్టు పందుల గుడిసే.
‘…తొడుక్కోడానికి చింకి గుడ్డలేనా లేని పిల్లలు – ఈలీకలూ వాలికాలైన కోక ముక్కలు కప్పుకొని, యెముకలు కోరికే చలిలో ఆరు బయట పడుకోలేరు. ఒకళ్ళ మీదోకళ్ళు పడి పెద్దప్ప చుట్టూనో, తల్లి చుట్టో, ఆ గదిలోనే పడుకోవాలి. అంచేత పగలల్లా అత్తవారింట గడిపినా రాత్రికి తాను ఇంటికి తీసుకుపోతాడు పైడయ్య సన్నిని …’ అని పరిస్థితిని వివరిస్తారు మాష్టారు.

రాత్రి నిద్ర పోతూనే, మళ్ళీ తెల్లవారి లేస్తూనే సన్ని కన్నోరింటికి పెనిమిటితో రావడంలో నిద్ర సుఖమేమో గాని, మెలకువ కష్టం మాత్రం మామూలుది కాదు.
పోనీ నరసమ్మ యింట్లో తొంగుంటారంటే – ఏదో మాట కాడ మాటొచ్చి ఏదో అన్నదని సన్ని ఆల అత్తకి గుర్రు.
పైడయ్య పట్నంలో కలాసీ, పడుకోడానికి ‘గది లేదు, కూరల మార్కెట్ లోనే ఓ అరుగు మీద పడుకుంటాడు. చూరునున్న గోనె గుడ్డలూ, చాప ముక్కలూ పీకి వాటినోసారి గట్టిగా దులిపి పక్కలు పరిస్తే – పెద్దమ్మ పేరు చెప్పి చుట్టంగా వచ్చిన రావయ్య.. ముసలాడు నిద్ర పోలేదు. అక్కడ ఊరంతా అంత ఎలుగేటి? – యిక్కడీ సీకటేటి ?- అంటాడు. ఈ అరుగులు యింత గలీజుగా వున్నాయి, ఎప్పుడూ కడగరా – అంటాడు. దోవల్నీ, చీవల్నీ, నల్లుల్ని నలుపుకొంటూ – యిటూ అటూ పరిగెత్తే ఎలుకలూ, పందికొక్కులు యెక్కడ కరుస్తాయో అని భయపడుతూ, యెంతో రాత్రి దాకా నిద్ర పోలేదు.’ ఇవన్నీ చుట్టపు చూపుగా వచ్చిన రావయ్య గుర్తించాడు. పైడయ్య ఏనాడూ గుర్తించలేదు. కాబట్టే బతికేశాడు. అడక్కుండానే రావయ్య ‘నన్నడిగితే, తిండినేక ఏ గడ్డో కరిసి చావడం మెరుగు; పేనాలు ఒకపాలి పోతాయి.’ – అని చెప్పిందాకా పైడయ్య తనేలాంటి చోట వున్నాడో గమనించలేదు. ఆ ఊరి జనంలో అయిదో వంతు అలాగే బతుకుతున్నారని కధకుడు చెప్పి ‘పదిరాళ్ళు జేబులో వున్నప్పుడు పరవాలేదనిపించినా, డబ్బులు తక్కువైనపుడల్లా పైడయ్యకు ఆ మాటలు గుర్తొచ్చేవి.’ అని చెపుతారు. నిత్య రణగొణ ధ్వనుల నడుమ ప్రశాంత మహా నిద్ర అసహజమై పోయిన వొక సహజాతం!

మరో సహజాతం భయం! యిది అంతటా ఆవరించి వుంది. లేని దాని కోసం భయం. ఉన్నది కోల్పోతామేమోనని భయం. బతుకెలా గడుస్తుందో భయం. ఇవాల్టి గురించి భయం. రేపటి గురించి భయం. భయం … భయం .. ప్రతి క్షణం భయం!
కూతురు కాపురం ఏమయిపోతుందోనన్న భయంతో ఎర్రెమ్మ వియ్యపు రాలైన బంగారి యింటి మీద కొచ్చింది. తనకి వెన్నూ దన్నూ లేకపోయినా తెగించింది. తిట్లూ తన్నులూ తిన్న అనుభవం వుండనే వుంది. అల్లుడు సారా బడ్డీ దగ్గర తాగకుండా గంగమ్మ .. లంజ దగ్గరకేల ఎల్లినాడని – భయంతో లేని సంబంధాన్ని ఊహించి ఊరంతా వాడంతా గోల గోల చేసింది. పైడయ్య భయంతో పట్నం బయల్దేరేశాడు. అన్న భయంతో ఆగిపోయాడు.

ఈ తగవు ఎక్కడ తేలుతుందోనన్న భయంతోనే పైడయ్య చిన్నన్న కోటయ్య ఎర్రెమ్మని గత్తురు గత్తిరింది కాక గుఫీ దబీ దుబీమని మూడు గుద్దులు గుద్దేడు. కింద పడ్డ మనిషిని ఎడాపెడా నాలుగు తాపులు తన్నేడు. వెళ్ళవసిన దారి చూపించాడు. వెళ్ళి ఆగి తిట్టి పోసి నోటితో భయపెడదామనుకుంది ఎర్రి. ఎగిరెగిరి పడింది. తిట్టి పోసిందే గాని కోటయ్య సన్నిని తుండగుడ్డ నడుంకేసి లాక్కుపోయాడు.
ఎవరూ ఆపలేక పోయారు భయంతోనే. కోటయ్య ముందు కాకుండా వెనుకన పదిమందీ పది రకాల మాటలన్నారు. అదీ భయంతోనే.
ఊరికి తీర్పులు చెప్పే నాయ్డు పెద్దమనిషి, పెద్దరికం పోకుండా ‘పిలా తొత్తి కొడుకుని, రాకపోతే జుట్టట్టుకు ఈడ్చుకురా’ బారిక పాపయ్యకి ఆజ్ఞ నిచ్చాడు. ‘సిత్తం’ అని బారిక పాపయ్య అన్నాడేగాని కదల్లేదు. నాయ్డుకి అనుమానం వేసి ‘ఏం ఆడు తాగుతాడేట్రా?’ ఈసడించినా భయంతోనే. ‘ఉడుకు తగ్గేక, ఇంకో గంటకి ఆలె తవ పాదాల కాడ కొస్తారు గదా?’ ఉచిత సలహా యివ్వడంలోనూ, తిట్టుకుంటూ నాయ్డు ఆమోదించడంలోనూ భయం ఉంది!

తేలని తగువుని తన బలంతో భయం చూపెట్టి క్షణంలో పరిష్కరించేశాడు కోటయ్య.
ఆ భయం తీరకే ఊరి నాయ్డుని ఆశ్రయించింది ఎర్రెమ్మ. ఆమె వెంట పది పదిహేను మందిని వెంట తీసుకెల్లింది తనకు న్యాయం జరగదేమోనన్న భయంతోనే. బారిక పాపయ్య సలహాననుసరించి కోటయ్యను వాడి అత్తోరి ఊరికి పంపేసినా, పైడయ్యని యింట్లోనే వుంచి పెద్దోడు నారాయుడు నాయ్డు దగ్గరికి బయల్దేరినా ఆ భయంతోనే. నాయ్డు తిట్టినా, ‘చేతిలో కర్ర లేకపోయిందిగాని వుంటే తొత్తికొడుకును ఏకీలుకా కీలిరిసేసి ఆసుపత్రిలో పారేద్దును’ అని అన్నదీ భయంతోనే. నారాయుడు తప్పును అంగీకరించిందీ ఆ భయంతోనే . ఎర్రెమ్మ యెంత రేపెట్టినా, యింటిమీద కొచ్చినా దానింటి మీద పడకూడదని తనతో చెప్పాలని – దురితం కూడదని – దౌర్జన్యం పనికి రాదని – తగువులొస్తే తమలో తాము తన్నుకోడం కాదు, పెద్దల ముందు పెట్టి పరిష్కారం చేయించుకోవాలనడంలో – భయం వలన మాత్రమే అదుపులో వుంటారని నాయ్డుకి తెలుసు. భయపెట్టింనంత కాలమే నాయ్డు అధికారం, పెద్దరికం వుంటుందని మనకి తెలుసు. నాయ్డు మంచి చేసినా చెడు చేసినా.
ముందయితే సన్నెమ్మని దానమ్మ ఎర్రెమ్మకి అప్పగించు అని నాయ్డు తొలి తీర్పు యివ్వడంతో కధ మొదటికొచ్చింది. సమస్య ఉన్న కాడికే వచ్చింది. అయినా ఎర్రెమ్మ పక్షాన వున్న నరసమ్మకూ భయం పోలేదు కాబట్టే ‘బాబో అసలు మనిసినోగ్గేసినావ్..’ అని గుర్తు చేసింది. ‘అన్నట్టు మీయమ్మను కూడా తీసుకురా’ నాయ్డు నారాయుడితో అనడంలో వెలిగిన మొహాల్లో భయం పోలేదు. తమకున్న భయమే ఆలకీ వుండాలన్నదే వాంఛ. నిజానికి అక్కుర్లు బుక్కుర్లేడ్చిఅలసిపోయిన సన్నెమ్మ మొహం కడిగి, కొత్త కోక కట్టుకోమని అత్త బంగారి నయాన బయానా చెప్పడంలో తల్లి ఎర్రెమ్మకు ఏ మాత్రం తీసిపోలేదు.
మొత్తానికి సన్నెమ్మ తిరిగి తల్లి దగ్గరికే చేరింది. యధాతధ స్థితే మిగిలింది.

నాయ్డు లేపోతే, నాయ్డు కాపోతే, కాలం మారిపోతే, పద్దతులు మారిపోతే కూడా నాయ్డు స్థానంలోకి పోలీసులొస్తారు. కేసులవుతాయి. లాయర్లొస్తారు. వాదనలవుతాయి. తీర్పులిస్తారు. ఒకరికి న్యాయం జరిగిందనిపిస్తుంది. మరొకరికి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. వ్యవస్థల తప్పొప్పుల ఫలితంగా వ్యక్తులు తప్పొప్పులు చేస్తారు. నేరస్తులవుతారు. శిక్షలనుభవిస్తారు.
అయితే కధలో అసిర్నాయుడు ఒకప్పుడు గాంధీ గారి శిష్యుడు కావడం వల్ల – యిప్పటి రాజకీయాలు కిట్టక పోవడం వల్ల – ‘బతుకు యీ వేళుండి రేప్పోయేది. ధర్మం కలకాలం నిలిచేది. దాన్ని తప్పితే లోకం తలకిందులు కాదా?’ అని నమ్మడం వల్ల – న్యాయాన్యాయాలు పక్కన పెట్టి మేలు చెయ్యడానికే పూనుకున్నాడని అర్ధమవుతుంది. అయితే కోటయ్య దోతరపుగా తిరగబడి చేసిన పరిష్కారమయినా, నాయ్డు నిదానంగా నిర్ణయాలు చేసిన పరిష్కారమయినా – రెండూ ఏక పక్షమే! రెండూ ఒకటే! రెండూ భయంతో అదుపులో పెట్టేవే!
కోటయ్యకు కులమే కాదు చదువూ లేదు. ఆలోచన లేదు. ఆపద ఎటునుంచి ఎటుపోయి వస్తుందో తెలీదు. రక్తం ఉడుకులెత్తితే ఉరుకులెత్తడం తప్పితే మంచేదో చెడేదో తెలీదు.

మంచీ చెడూ అన్నీ తెలిసిన నాయ్డుకి కులముంది. బలముంది. బలగముంది. ఆలోచన ఉంది. ఆపద ఎటు నుంచి ఎటు పోయి వస్తుందో తెలుసు. ఇహమూ పరమూ మీద నమ్మకమూ ఉంది. అందువల్ల తిండికి లేపోతే అడుక్కు తినండి అంటాడు. బిచ్చం దొరక్క పోతే, చావడమైనా మేలు అంటాడు. అంతే తప్ప ఉన్నవాడికెందుకుందో లేనివాడికి ఎందుకు లేదో – లేనివాడికి ఎప్పటికుంటుందో చెప్పడు. చెప్పలేడు. అందుకే దొంగతనమో దౌర్జన్యమో చేసి లేనిది సాధించుకుందామన్న వాళ్ళని ‘పట్టుదలగా అణుస్తాడు.’ యధాతధస్థితిని కొనసాగిస్తాడు.

‘ … మీ మాల పేట్లో రోజూ యేవారో ఓ వార, యెందుకో ఒకందుకు తిట్టుకుంటూనే వుంటారు గదా! ఎందుకోసవలా తన్నుకు చస్తారు? ఏం మీకు పంచుకుందికి ఆస్తులున్నాయని తన్నుకుంటారా? కలుపుకుందికి బూవులున్నాయని తన్నుకుంటారా? లేపొతే ఒక నీటి కాడ తగువా? ఒక దరికాడ తగువా? దేనికి మీ తగువులు?’ అని నాయ్డు అక్కడితో ఆగలేదు –
‘ఏదో భవంతుడు మీకింత రెక్కలిచ్చేడు. పదిమందీ పస్లోలలు ఒక్క నాడు తెచ్చినా, పది రోజులు గెంజి తాగి గడిపేసుకోగల్రు. అలాటప్పుడు నలుగురూ కలిసి మెలిసుంటే అదెంత హాయి, యిలా తెల్లారి లేస్తే తగవులు పడ్డం – యిదేం సుఖవు? మీకు మతులుండవా? లేకపోతే, అందులో ఏదో పురుగుండి అలా దొలుస్తుంటుందా?!’
ఏం చెప్తారా జనం ? యేం చెపితే నాయుడికి బోధపడుతుంది.!’ కధకుడు ప్రశ్నించడంలో దొరకబుచ్చుకోవలసిన జవాబు ఏదయితే వుందో – అది ఆర్తి కధ ద్వారా అందాల్సిందేదయితే వుందో – అదేనని మనకు అర్ధమవుతుంది.
స్థిరపరిచిన విలువలే చిరాయువుగా ఎందుకు నిలుస్తున్నాయో – కొత్త విలువలు ఎందుకు తలెత్తడం లేదో – తలొంచుకున్న జనం తలెత్తినపుడల్లా అవి నేరాలుగా ఘోరాలుగా ఎందుకు కనిపిస్తున్నాయో – జనం తమకి తామే శత్రువులుగా ఎందుకు నిలుస్తున్నారో – ఒకే కుటుంబమయిన వాళ్ళు వైరి పక్షాలుగా ఎందుకు మిగులుతున్నారో – నెయ్యాలు మాని కయ్యాలాడి కాట్ల కుక్కలెందుకవుతున్నారో ఏలుబడి చేసిన వాళ్ళకు ఏలిన వాళ్ళకి ఎరిక లేదనా?
అదెంత గాంధీ రాజ్యమయినా .. అది ‘రాజ్యమే’ కదా?!

సరే, మరి రెండో విడత పంచాయితీలో తగువుకి మూల కారణమేమిటో నాయ్డు అడిగినా ఎర్రెమ్మ గాని, తరుపున వచ్చిన వాళ్ళు గాని చెప్పలేకపోయారు. నారాయుడే రెండు పక్కల వున్నదేటో చెప్పాడు. అది కూడా చేతనైనంత నిష్పక్షపాతంగా వివరించాడు. నిజానికి నారాయుడు తన తల్లి తమ్ముళ్ళ కుటుంబం పక్క కదా మాట్లాడాలి. మరెందుకు మాట్లాడలేదలగ? భయం! కాదనేస్తారని భయం! తమ్ముడు కోటయ్య చేసిందానికి తప్పని ఒప్పుకోవడం వల్లే కాదు, ఎర్రెప్ప ఒంటరిదని దారీ తెన్నూ లేనిదని అవతల పక్షము వహించి మాట్లాడడంలో నిజమూ వుంది, తగవరితనంలో అంతకు మించిన బతుకు భయమూ వుంది.
అది సరే, చివరాఖరికి ‘ఎళ్ళి నీ అల్లుణ్ని బతిమాలి తీసుకుపో ‘ అని తీర్పిచ్చి నాయ్డు ‘.. ఉసూరు తగలడం జయం కాదు’ అని బంగారిని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

కధ ముగిసి పోయిందా? సమస్య తీరి పోయిందా? అప్పటికి తీరినట్టుగున్నా మళ్ళీ తలెత్తదా? బతుకు భయంతో ఆసరా కోసం ఆదరువు కోసం కూతురు సన్నెమ్మని ఎర్రెమ్మ ఎనక్కి లాగదా? నా బతుకూ నా కోడలూ నా హక్కూ అని బంగారి ముందుకు లాగదా? అటులాగ యిటులాగా – ఎక్కడున్నది అక్కడే వుండదా? చెప్పినట్టుగా నడిచిపోతే, నాయ్డు ఇంతకాలంగా యిస్తున్నతీర్పులకి మాల పేట నిసంకుడయి పోవాల కదా?! అవుద్దా? అవదు! కుక్కల్లా కాట్లాడుకుంటూనే వుంటారు … యిక ముందూ – మనముందూ-
ఎర్రెమ్మకు బుద్ధుంతే బువ్వ తింటాదని నాయ్డు లోపాయికారాన చెప్పినట్టుగే – రాజీ పడి, తగువులు మాని నిగ్రహించుకొని మంచి చేసుకొని మసలుకోగలదా? బంగారో మాటంటే వాగే నోరు మూగయిపోగలదా? ఎన్నాళ్ళు నోరు కుట్టుకుంటాది? అదువు బతుకు కాదా? ఒక్కడే బతకలేక సతమతమై పోయిన పైడయ్యతో కూతుర్నంపి పట్నంలో కాపరమెత్తించగలదా? కడుపు నింపగలదా? కాలం దాటగలదా? ఏమో –

అదొక ఆశ .. ముందటికున్న దారి .. దారి కానీ దారి ..
కోడిగుడ్డు వారిస్తే సట్టిడు! నిజమే గాని, గుడ్డు దానికదే పిల్లయి పోదు కదా. అటుకెక్కించి పొదిగించాలా? అందల కరిగినవెన్నో .. పొదిగినవెన్నో .. ఎన్నో కొన్ని .. అవయినా కాకులకీ గద్దలకీ పిల్లులకీ పీడలకీ దొరక్కండా వుండాల. అంత వార్సాలంటే భూదేవికున్నంత ఓపికా సహనమూ వుండాల… రేపటి మీద నమ్మకముండాల ..
ఆశ కనబడితే శ్వాస ఆడుతుంది…
అవన్నీ కడుపు నిండిన మాటలు … నాయుడే అన్నట్టు ‘కడుపెప్పుడు నిండదో కానీ బుద్దులప్పుడు తప్పవు.’ మరి కడుపు నిండని ఎర్రెమ్మ యివన్నీ కానుకో గలదా? కాసుకో గలదా? ఇయాల దినం తీరడం గురించి తప్పితే, రేపటి దినం గురించి ఆగగలదా? ఆలోచించగలదా?
నాయ్డు మాట మీద నాయురాలు – పులుసొక్కటే కాదు! అన్నం, ఆకులో కూర పెట్టి ఏవేవీ మిగిలితే అవన్నీ యిచ్చినా – ఆ పూటకే. నాయుడి మాట మీద నడవడం ఆ రోజుకే. నెలా పది తిరిగీ సరికి దెబ్బలు మానిపోయినట్టుగే సుద్దులు మరిచిపోయి మళ్ళీ మొదటికే రాదా? ‘ఆర్తి’ .. పీడ, దుఃఖము, మనోవ్యధ, రోగము పోదా? వింటికొన మీద బతుకు కాదా?
అందుకు సాక్ష్యంగా పైడయ్యకు అన్నం తినక పోతే ఆకలి. తినబోతే వెలపరం. నిజమే, ‘మోచేతి కూడు’ అని ఎంచితే – ఎంచడానికి లేనిదేవుందా గుడిసలో?, పెళ్ళాంతో కలిపి. పెళ్ళామే కాదు, తన బతుకులోనయినా ఎంచలేనిదేదయినా వుందా పైడయ్యకి? పైడయ్యకే కాదు, మొత్తం మాల పేటోళ్ళకి? పైడయ్య పని చేసే పట్నంలో అయిదో వంతు జనాభాకి?
ఆకలైనా అప్పటికి పైడయ్య చెయ్యి కడిగేసుకోవచ్చు. కానీ తర్వాతయినా కతక్కా తప్పదు. కక్కకా తప్పదు! కక్కిన కూడు తినకా తప్పదు!! అందుకేనేమో ‘కక్కిన కూడు తినే కూడదు, తింటే కడుపు నిండా తినాల’నీ అంటారు.

సరి సరే .. కడదాకా కధ మారదా అంటే మారాల్సినవేవో మారనంత కాలం మార్సనంత కాలం యింతే. కవుకుల పడిపోడమే.
ఈ కవుకుల్లో అల్లకల్లోలమయి పోయిన బతుకు బతికినోలకి – సహజాతాలైన ఆకలి, కామం, నిద్ర, భయం… ఒకటేవిటి అన్నీ అసహజమయిపోతాయి. అందనివై పోతాయి. తప్పించుకోలేనివయి పోతాయి. ఈ మూలాలు దెబ్బ తినీసినాక మనుషులు మనుషులుగా మనలేరు.

‘ఆర్తి’ కధ ద్వారా కాళీపట్నం రామారావుగారు చెప్పిందీ చూపిందీ యిదే!

 -బమ్మిడి జగదీశ్వర రావు

 

bammidi ఎలాంటి సాహిత్య వారసత్వం లేని కుటుంబం నుండి వచ్చిన బమ్మిడి జగదీశ్వరరావు తన పదమూడో ఏట నుండే కధలు రాయటం మొదలు పెట్టారు. అమ్మ చెప్పే కధలతో ప్రారంభం అయిన ఆయన కధాభిరుచి ఇప్పటికి ఐదు కధా సంపుటిలు, అనేక చిన్నపిల్లల కధల సంపుటిలు, జానపద కధలు వేయటానికి దారులు వేసింది. రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టి తీగలు, హింసపాదు వీరి కధా సంపుటిలు. తధాగత ప్రచురణల క్రింద ‘అమ్మ చెప్పిన కధలు’ ఆరు సార్లు రీ ప్రింట్ అయ్యి ఇప్పుడు ప్రతులు దొరకటం లేదు. ఇవి కాక అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, ఊ కొడదాం, అనగా వినగా చెప్పగా, అల్లిబిల్లి కధలు ఇంకా చాలా జానపద కధలు పుస్తకాలుగా వచ్చాయి. అవార్డ్స్ కి దూరంగా ఉండే బజరా నేటి తరం రచయితలు ‘రాయకుండా ఉండలేక పోవటం’ కాకుండా ‘ప్రచారం లేకుండా ఉండలేక పోవటం’ గురించి అసంతృప్తి వెలిబుచ్చారు. బజరాకు చాలా మంది రచయితలతో పాటు కారా మాష్టారు, పతంజలి అంటే ఇష్టం.       

 వచ్చే వారం ‘మహదాశీర్వచనం’ కధా పరిచయం కాత్యాయని విద్మహే 

 

 ఆర్తి కథ ఇక్కడ: