ప్లీజ్ సేవ్ తెలుగు!

 

“తెలుగు దేశం పార్టీకి ఆ పేరెలా వచ్చింది..?”

“పాఠశాల విద్యలో తెలుగును తొలగించింది, అందుకే ఆపేరు వచ్చింది..!”

*   *   *

“అర్థం పర్థం లేదు.. అనుటకు వొక ఉదాహరణను యిమ్ము..?”

“తెలుగు దేశం పార్టీ’ పాలనలో తెలుగు లేదు, అది వొక దేశమూ కాదు! ‘తెలుగుదేశం’ అనుట అర్థం పర్థం లేనిది!”

*   *   *

“తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని చెప్పి, తెలుగును తొలగించడమేమిటి..?”

“ఒకప్పుడు తెలుగు వుండేది అని చెప్పుకోవడం వల్లనే కదా.. అది ప్రాచీన భాష అవుతుంది..?!”

                                          *   *   *

“తెలుగు బాషను తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వాన్ని యేమని డిమాండ్ చేయాలి..?”

“ముఖ్యమంత్రి మొదలు.. తెలుగుదేశం ప్రభుత్వనేతలూ నాయకులు కూడా యిక తెలుగులో మాట్లాడరాదు..!”

                                      *   *   *

“గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో- ‘తెలుగుజాతి తమ గౌరవం, తెలుగుజాతి పూర్వ వైభవం, నాలుగొందల యేళ్ళు పాలించిన శాతవాహనులు, యిరవై మూడవరాజు శాతకర్ణి’- అని చరిత్ర చెప్పిన చంద్రబాబు తెలుగును చరిత్రలో యెందుకు కలిపేసారో అస్సలు అర్థం కావడంలేదు..!?”

“ఇందులో అర్థం కాకపోవడానికి యేముంది?, బాలక్రిష్ణ తెలుగులో చెప్పిన డైలాగులు వినలేక.. యేకంగా తెలుగు భాషనే రద్దుచేసి అందరికీ రక్షణ కల్పించారు..!”

                                      *   *   *

“పాతనోట్లు చెల్లవంటే భరించాం కదా?, పాత తెలుగుభాష చెల్లదంటే యెందుకు భరించలేరు..?”

“అయితే.. పాతనోట్ల స్థానంలో కొత్త నోట్లు పెట్టినట్టు, పాత తెలుగు స్థానంలో కొత్త భాష ప్రవేశపెడతారా..?”

                                      *   *   *

“తెలుగు భాషని తొలగించడం అన్యాయం..!”

“ఇంగ్లీషు మీడియంలో మీ పిల్లల్ని చదివిస్తూ తెలుగు భాష వుండాలనడం మరీ అన్యాయం..!”

                                      *   *   *

“తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..”

“సాంగ్ యీజ్ వెరీ గుడ్.. బట్ వాటీజ్ ది మీనింగ్ అఫ్ తెలుగూ మమ్మీ..?”

                                         *   *   *

“తెలుగు యీజ్ ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్!”

“చూశారా?, తెలుగుని కూడా యింగ్లీషులో మెచ్చుకున్నారు.. అందుకే తెలుగు గొప్పతనం తెలుసుకోవాలన్నా యింగ్లీషే అవసరం..!”

                                      *   *   *

“అసలుకే లేదు అంటే కొసరు పెట్టమన్నాడట..!”

“తెలుగే తీసేస్తుంటే.. మాండలికం సొగసే వేరు అన్నాడట..!”

                                      *   *   *

“దేశ భాషలందు తెలుగు లెస్స..!”

“తెలుగు రాష్ట్రంలోనూ తెలుగు లెస్సే..!”

                                      *   *   *

“మా అబ్బాయికీ అమ్మాయికీ యిద్దరికీ తెలుగు అస్సలు రాదు..!”

“మా పిల్లలకీ రాదు, అందులో మునిపటిలా మనగొప్పలేదట, ప్రభుత్వమే తెలుగు పీకేసిందని మన మాటకెవరూ వెయిటివ్వడం లేదు..!”

                                        *   *   *

“తెలుగు తొలగింపు మీద రామోజీరావు యేమంటారు..?”

“మండలి బుద్ద ప్రసాద్ యింటర్వ్యూ మళ్ళీ వేస్తారు. ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచిక తీసుకొస్తారు. ఇంకా ఈనాడులో సంపాదకీయమూ రాస్తారనుకుంటా..!”

                                      *   *   *

“తెలుగు భాషలో యాభయ్యారు అక్షరాలు. తెలుగు లిపి గుండ్రంగా వుంటుంది. అందంగా వుంటుంది. మన జాతీయాలూ.. నుడికారాలూ.. సామెతలూ.. పొడుపు కథలూ.. పల్లె పదాలూ.. మాండలిక మందహాసాలూ..”

“అవున్లెండి బతకని బిడ్డ బారెడు.. అనేది కూడా తెలుగు సామెతే!”

                                      *   *   *

“వాడు తెలుగుకు భాషకు వీరాభిమాని. అంతెందుకూ తెలుగే మాట్లాడుతాడు.. తెలుగులోనే రాస్తాడు..!”

“ఏం?, పాపం చదువుకోలేదా..?”

                                      *   *   *

“నోబెల్ తెచ్చిన తెలుగు వారికి వందకోట్లు..!”

“నోబుల్ మాట దేవుడెరుగు.. తెలుగు ఎత్తేయడం వల్ల యింగ్లీషు మీడియం పాఠశాలలకు మరో వందకోట్ల ఆదాయం..!”

                                      *   *   *

 -బమ్మిడి జగదీశ్వరరావు

రూప్యములు!

 

        rupees

“నల్ల ధనం అంటే..?”

“వెయ్యి.. ఐదు వందల నోట్లు అని అర్థం!”

*   *   *

“మోడీ గారి నిర్ణయం వల్ల మీకేమర్థంయ్యింది..?”

“క్యాష్ ను లిక్విడ్ రూపంలో దాచకుండా- భూముల రూపంలోనో.. బంగారం రూపంలోనే దాచుకోవాలి..!”

*   *   *

“చంద్రబాబు అవినీతి పోరాటం ఫలించింది, వెయ్యి-ఐదొందల నోట్లు ప్రభుత్వం నిషేధించాలని పలు మార్లు మోడీని కోరారు..”

“బాబుగారు ముందే జాగ్రత్తపడ్డారన్నమాట..!”

*   *   *

“బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు డోకా లేదుగా..?”

“స్విస్సు బ్యాంకులో దాచుకున్నా డోకా లేదు..!”

*   *   *

పేపర్లో ఒక ప్రకటన:

“మాభూములకూ- వ్యాపార వ్యవహారాలకూ- బినామీలు వున్నట్టే.. మా నగదునకు కూడా బినామీలు కావలెను!”

*   *   *

“భలే మంచి చౌక బేరము.. సమయం మించినన్ దొరుకదు..”

“వందకు ఐదు అదొందల నోట్లట..?!”

*   *   *

“ఇక ఐదొందల నోట్లూ వెయ్యి నోట్లూ చెల్లవు..!”

“మంచి పని చేసారు, ఇక ఎంచక్కా రెండువేల రూపాయల నోట్లు దాచుకోవచ్చు..!”

*   *   *

“మోడీ విదేశీ పర్యటనలు చేసి చేసి విదేశాల మీద తనకున్న మమకారం మరోసారి చూపించుకున్నారు..!”

“అందుకేగా.. విదేశీ నల్లధనం వెనక్కి రప్పించేబదులు.. స్వదేశీ నల్లధనం వెలికి తీయిస్తున్నారు..?!”

*   *   *

“అసలు నోటుని చూసి నకిలీ నోటు నవ్విందట.. యెందుకూ..?”

“ఇప్పటికైనా అర్థమయ్యిందా.. నకిలీ నోట్ల వల్ల నష్టం లేదు, అవి యెలాగూ నకిలీయే! అసలు నోట్లే చెల్లవూ..అని!”

*   *   *

“మన రిజర్వుబ్యాంకు 1946లోనే వెయ్యి, పదివేల రూపాయల నోట్లని రద్దు చేసింది, 1978లో వెయ్యి, ఐదువేలు, పదివేలు రూపాయలు వంటి పెద్దనోట్లని రద్దు చేసింది.. చెలామణిలో వున్న నోట్లని రద్దు చేయడం యిదే ఫస్ట్..!”

“అయినా నల్లధనం పెరిగిందే కాని తరగలేదు..!”

*   *   *

“ఇప్పుడు నీకేమర్థమయ్యింది..?”

“డబ్బుని యెప్పుడూ ఇంట్లో దాచుకోకూడదు! విదేశీ బ్యాంకుల్లోనే దాచుకోవాలి..!”

*   *   *

“అప్పు యిచ్చినా వద్దన్నావా..?”

“అన్నీ పాత వెయ్యీ ఐదొందల నోట్లు యిస్తాడట..!?”

*   *   *

“వెయ్యీ ఐదొందల నోట్లు కేన్సిల్..”

“కాదు.. మా సినిమా కేన్సిల్ అయింది..!”

*   *   *

“దీనివలన భవిష్యత్తులో టెర్రరిజం పోతుందంటారా..?”

“చెప్పలేం, కాని రెండువేల రూపాయలనోటు కూడా వుండదు, పోతుంది..!”

*   *   *

“నరుడా ఏమి నీ కోరిక..?”

“పెట్రోలు బంకులూ రైల్వే స్టేషన్లతో పాటు వైన్ షాపుల్లో ఒక్కరోజుకి ఈ నోట్లు చెల్లుబాటు అయ్యేలా చూడు స్వామీ..!”

*   *   *

“మన బ్యాంకుకు చాలా రిక్విజేషన్స్ వచ్చినట్టున్నాయి.. ఏమిటవి?”

“మనబ్యాంకులో రుణంగా తీసుకున్నప్పుడు మనం అన్నీ వెయ్యీ ఐదొందల నోట్లే యిచ్చామట.. అవి చెల్లవు గనుక యిచ్చిన అప్పు కూడా చెల్లదని గుర్తించమని కోరుతున్నారు సార్..”

*   *   *

 

 

 

‘మాష్టారూ.. పేకేసుకుందామా..?’

images

గౌరవ పూజ్యులైన మాస్టారికి..

నమస్కారాలతో-

బావున్నారా?, గురుపూజోత్సవం రోజు గుర్తుకు వచ్చారు. నేను గురువునైనా నా గురువు మీరు కదా? మీతో ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడేకన్నా నాలుగు ముక్కలు వుత్తరంగా రాద్దామని యెందుకో అనిపించింది. ఇదిగో అదిగో అని మన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ వెళ్ళిపోయి ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ వచ్చేసింది.

మాస్టారూ.. మీరంటే చిన్నప్పటి నుండి నాకు చాలా యిష్టం. ఎంత యిష్టం అంటే పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు. మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు. అప్పటికీ నేను మిమ్మల్ని అడిగాను.. ‘ఆ రోజుల్లో- మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట చదివిన పాఠాలకన్నా యెక్కువ గుర్తుంది. ఈ రోజుల్లో- మా రోజుల్లో ‘బతకడానికి బడిపంతులు’ అని అంటున్నారు!

ఔను.. ఇప్పుడు బతకడానికి బడిపంతులు. జీతాలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళున్నారు. పిల్లలతో పాటు మనమూ యింటికి వచ్చేయొచ్చు. పిల్లలతో పాటు మనకూ సెలవులు వుంటాయి. స్ట్రెస్ లేదు. స్ట్రెయిన్ లేదు. ప్రెజర్ లేదు. బ్లడ్ ప్రెజర్ లేదు. పాఠం చెప్పామా.. మన పని అయిపోయిందా.. అంతే. చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది. అదంతే. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఆపనీ ఈపనీ అని అడ్డమైన పనులూ అప్పజెప్పినా మిగతా ప్రభుత్వ వుద్యోగులతో పోలిస్తే మనమే నయం. మిగతా ప్రభుత్వ శాఖల్లో వుద్యోగులు వుద్యోగుల్లా లేరు. పార్టీ కార్యకర్తల్లా వున్నారు. జెండాలూ చొక్కాలూ వొక్కటే తక్కువ. అలా వుండకపోతే వుద్యోగం చెయ్యలేరు. చెయ్యనివ్వరు. ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అంతే. ఇప్పుడు యింకాస్తా యెక్కువయ్యింది. మన పనిగంటల్లో మనం పనిచేసి రావడానికి లేదు. సాయంత్రం అయిదు తరువాతే అధికారులు వస్తారు. పగలంతా పని వొదిలి, అప్పుడు విధులు చేపడతారు. పని గంటలు దాటాకే వుద్యోగులకి పనికి ఆహార పథకం ప్రారంభమవుతుంది. కింది నుండి పైదాకా ఆమ్యామ్యాలే. పెరసంటేజీలే. కంచం లేని యిల్లు వుండొచ్చు. లంచం లేని ఆఫీసు లేదు. అయ్యయ్యో అనుకోకుండా అసహ్యించుకోకుండా ‘అయ్యో.. మనకి వాళ్ళలా రెండు చేతులా రాబడి లేదే’ అని వాపోయే వుపాధ్యాయులే మాలో యెక్కువ. డిగ్రీలూ పీజీలూ పీహేచ్దీలూ చేసి చాలక- బియ్యీడీ యెంట్రెన్సులూ రాసి- ర్యాంకుల కోసం కోచింగులకూ వెళ్ళి- చచ్చే చెడీ ర్యాంకులూ తెచ్చుకొని- శిక్షణ పూర్తిచేసి- పాసయినా కాదని లేదని మళ్ళీ టెట్ లూ రాసి- దాని కోసం మళ్ళీ కోచింగులకూ వెళ్ళి మార్కులు స్కోరూ చేసి- మళ్ళీ డియ్యస్సీ నోటిఫికేషన్ కోసం చూసి- కోచింగ్ సెంటర్లో చేరి- పరీక్ష రాసి- నెగ్గితే అప్పుడు వుద్యోగం. ఈ వుద్యోగంలో చేరినాక ఆ అలసట తీరేలా రిలాక్స్ అయిపోవడమే. జీవితాంతమూ రిలాక్స్ అయిపోవడమే!

ఉపాధ్యాయ వృత్తి గొప్పది కావచ్చు. కాని వుద్యోగంలో చేరినాక – వుద్యోగంగా గొప్పది అనుకొనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వుపాధ్యాయ వుద్యోగంలో చేరినవాళ్ళు సబ్జెక్ట్ చేతిలో వుంటుంది.. గ్రిప్ వుంటుంది.. అన్నంతవరకే వుండి, ఆపైన పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు గాలికి వదిలి, ‘కాంపిటేటీవ్ కు ప్రేపేరవడం’లో ములిగి, గ్రూప్సో సివిల్సో సాధిస్తామన్న నమ్మకంలో తేలి, తాము అవకాశం లేకనో ఆపద్ధర్మంగానో అందులో వున్నాం తప్పితే, తమ స్థాయి యిది కాదని ప్రెస్టేజ్ ఫీలవడం.. ఆఫీలింగు అందరికీ చూపించడం ద్వారా యెక్కడో వుండాల్సిన వాళ్ళం యిక్కడ యిలా యీసురోమంటూ యేడవాల్సి వొస్తున్నందుకు దేవుణ్ణి నిందించడమో.. పూజలు చెయ్యడమో.. మొక్కులు మొక్కడమో.. యింతే. కాదంటే ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో.. అంతే!

ఒక్క జీతం మీద బతకడం కష్టం. నాతం కూడా వుండాలి. నాతం లేదని నాతోటివాళ్ళు నానా బాధా పడిపోతున్నారు. నానా గడ్డీ కరుస్తున్నారు. ఇప్పుడు మన వుపాధ్యాయుల్లో చాలా వరకు రియలెస్టేట్ బ్రోకర్లే.. తప్పితే డైలీ కట్టుబడి వ్యాపారం చేసేవాళ్ళే.. ఈ బ్రోకర్లకి యే సైటు యెక్కడవుందో తెలిసినట్టుగా యే పాఠం యెక్కడవుందో తెలీదు. ఈ ఫైనాన్షియర్లకి వడ్డీ లెక్కలు తప్ప మరే లెక్కలూ రావు. మొత్తానికి యేదో వొక వ్యాపారం.. యేదో వొక వ్యవహారం.. యేదీ లేకపోతే ప్రవేటు కాన్సెప్ట్ కార్పోరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లల్ని పోటాపోటీగా చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థిని చేర్పించినందుకు అయిదు నుండి పది వేలు ఆదాయం. అక్కడున్న విద్యాసంస్థలను బట్టి.. యేరియాని బట్టి.. ఆ ధరలు అటూ యిటూ అవుతాయి.. అంతే. గవర్నమెంటు కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు అయితే రిజైన్ చేస్తే భద్రత వుండదు గనుక సెలవు పెట్టి ప్రవేటు కాలేజీలలో పనికి కుదిరిపోతున్నారు. ఎన్నడూ లేనిది శ్రద్ధగా నోట్సులు కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం కంటే ప్రవేటు వాడు యెక్కువ యేమీ యివ్వడు. కాని అసలు కంటే కొసరు మీదే యావ. ఇక్కడ చూస్తే సెలవు పెట్టిన కాలేజీకి కొత్త లెక్చరర్లు రారు. పాఠాలు జరగవు. ఆశించిన ఫలితాలు రావు. కాలేజీలు నడవవు. గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్ లో చదువులు బాగోవు అని మాట. ఉన్న క్యారక్టర్ని చెరిచేస్తున్నారు. చేరిపేస్తున్నారు. అధికార్లూ అంతే. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అర్హత లేనివి కావు. ఆదాయ మార్గాలు. అంతే. ఇక, మాటకారితనమూ చనువూ చతురతా వున్నవాళ్ళు యివికాక యల్ఐసి యితరత్రా యిన్సూరెన్సు యేజెంట్లుగా.. అది కూడా పెళ్ళాల పేర్లతో.. తెగ కష్టబడుతున్నారు. చాలా కష్టపడి యీ దశకు వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు.

‘ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం యివ్వాలి’ అని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠాలు చెప్పే మాస్టార్లు తమ పిల్లల్ని మాత్రం తాము పనిచేసే పాఠశాలల్లో చేర్పించరు. తమ పాఠశాల వున్నా చోట కూడా కనీసం వుండరు. ఒకసారి వుద్యోగంలో చేరామా? యిక అంతే. వేసినప్పుడు వేప చెట్టు. తీసినప్పుడు రావి చెట్టు. మన ఈక కూడా యెవడూ తెంపలేడు. అదీ ధీమా. అదీ భీమా. కాదన గలమా? లేదనగలమా?

చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. నేనో బడ్డీ పెట్టుకుంటా.. నేనో దుకాణం తెరచుకుంటా.. అంటే నాకు డబ్బు కట్టు.. నీవు నీ వ్యాపారం చేసుకో అని సెన్సు లేకుండా లైసెన్సులు యిస్తోంది. నచ్చినంత ఫీజు వసూల్ చేయడమే. ఏటికి యేడూ ఫీజుల నియంత్రణ మీద టీవీల్లో చర్చలు. ఎప్పటిలాగే. ఫీజుల నియంత్రణ పోరాట కమిటీలు యేర్పడ్డాయని అంటే పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. కోర్టులు తాఖీదులు యిస్తాయి. కాని యేమి లాభం? ప్రభుత్వమూ అధికారులూ వెచ్చగా ముడ్డి కింద వేసుకు కూర్చుంటున్నారు. చూస్తే స్కూళ్ళకు గ్రౌండ్స్ కూడా లేవు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. చాలక యిన్స్టిట్యూషన్స్ మీద సెల్ టవర్లు. అద్దెలు వస్తాయి కదా? అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!

మాస్టారూ.. నేను మిమ్మల్ని చూసి చెడిపోయాను. అనవసరంగా మాస్టారునయ్యాను. మాస్టారూ.. మా మాస్టారులు యెలా వున్నారో తెలుసా? పాఠం వదిలి యెప్పుడూ యింక్రిమెంట్ల గురించే మాటలు. మీకాలంలో వుపాధ్యాయులు వుద్యమాలు నడిపారు. జనాన్ని నడిపించారు. మీది వొక చరిత్ర. మాది హీన చరిత్ర. దీన చరిత్ర. మాస్టారూ.. మీకు యిక్కడ వొక మాట చెప్పాలి. నిజాయితీగా ప్రభుత్వ పాఠశాల నడిపితే మా వూరి చుట్టూ వున్న మూడు నాలుగు ప్రవేటు స్కూళ్ళు మూతబడ్డాయి. అందుకు బహుమతిగా ప్రవేటు పెద్దల యిన్ఫ్లియన్సుతో నన్ను ట్రాన్స్ ఫర్ చేసారు.

మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము.  అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని, ‘గురూ.. ఆ లం– డబ్బులు తీసుకుంది, రాలేదు..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!

పోనీ ప్రవేటు విద్యాసంస్థల్లో మనకి మర్యాద వుందా అంటే అదీ లేదు. అక్కడ స్టూడెంటు కంటే మనం హీనం. డబ్బులు కట్టేవాడు కస్టమర్. మనం సర్వీసు మాత్రమే యిచ్చే సర్వెంట్స్.. అంతే!

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః అన్నారు. పిల్లలకు రాత నేర్పించే గురువే వారి తలరాతని కూడా మార్చెయ్యగలడని నమ్మాను. కాని మన గురువుల తలరాత అంతకన్నా ముందే చెరిపేసి కొత్తగా రాస్తే కాని యేదీ రాయడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. కానీ రాయడం కన్నా చెరపడం కష్టంనిపిస్తోంది.

యిట్లు

మీ

శిష్య గురువు

ఆవు అంబా అనును!

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అఖ్లాక్.. రోహిత్.. యింకా ఆ‘నలుగురికి’!

అనామకులకి.. అనేకానేకులకి!…

చూసారా? దెయ్యాలు వేదాలు వల్లించడం చూసారా?..

“మీరు తూటాలు పేల్చాలనుకుంటే నన్ను కాల్చండి.. ఇప్పటికైనా ఈ దాడులు ఆపేయండి..”

“నా దళిత సోదరులపై దాడులు ఆపండి. కావాలంటే నాపై దాడి చేయండి.. నాతో యుద్ధం చేయండి..”

ఈ వేద మంత్రాలు విన్నారా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయనేమో? ఆవేశం చూసారా? ఆ-వేషం చూసారా? ఆ వేగమూ వుద్వేగమూ చూసారా? దేశ ప్రజలే నా హైకమాండ్ అంటున్నాడు! నూటా యిరవై అయిదు కోట్లమంది నా అధిష్టానం అంటున్నాడు! వారి ఆశలూ ఆకాంక్షల మేరకే.. మార్గదర్శకత్వం మేరకే ప్రభుత్వం నడుస్తోందంటున్నాడు! ఓటు వేసి అధికారము అందివ్వడంతోనే అయిపోలేదంటున్నాడు! నన్నూ నిలదీయండంటున్నాడు! ప్రధానినీ ప్రశ్నించే వ్యవస్థ రావాలంటున్నాడు!

అందుకైనా ప్రశ్నిద్దాం! ప్రశ్నించమన్నందుకైనా ప్రశ్నిద్దాం! మన చావులు వొక ప్రశ్న కాదా? మన వొంటి మీది గాయాలు ప్రశ్నల గుర్తులుకాక మరేమిటి? ప్రశ్నిస్తే మాత్రం వాడు జవాబుదారి కాగలడా? అయినా కాకపోయినా మనం ఈ దేశ ప్రజలమే కదా? మనల్ని అధిష్టానం అని అన్నందుకైనా.. నిలదీయమన్నందుకైనా.. నిలదీద్దాం! నిగ్గదీద్దాం!

నిన్న నిన్న ఢిల్లీ టౌన్ హాల్లో- భిన్నత్వంలోనే భారతదేశం బలం దాగుందని సెలవిచ్చాడే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో తీవ్ర వివక్ష యెదుర్కొన్నారని, విదేశాల్లో గౌరవం పొందారని, అయినా ఆయన భారతీయుడుగానే వున్నారని, ఆయన స్ఫూర్తి ప్రతివొక్కరిలో వుండాలని విన్నవించాడే?..

మరి ఆ స్పూర్తి చెప్పేవాడిలో చిగురంతయినా వుందా? ఏలేవాడిలో పూచిక పుల్లంతయినా వుందా? ఉంటే దేశమిలా వుంటుందా? అంబేద్కర్ యెదుర్కొన్న తీవ్ర వివక్ష వారి జాతి జనులమైన మనకు యింకా వారసత్వంగా కొనసాగుతూనే వుందే? స్వాతంత్ర్యం వొచ్చి యేడు దశాబ్దాలు గడుస్తున్నా సామాజిక రుగ్మతలు కొనసాగడం, అంటరానితనం వుండడం, దళితులు వివక్షకు గురికావడం సిగ్గుచేటని మళ్ళీ ఆ నోటితోనే అన్నాడు! మొట్ట మొదట దేశ ప్రధానిగా సిగ్గుపడాల్సింది తను కాదూ?!

వివక్ష! కక్ష! కక్ష గట్టి కత్తిగట్టి చంపుతున్నారే?, ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. పంతొమ్మిది శాతం దాడులు యెక్కువయ్యింది? ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. ఈ రెండేళ్లలో నలభైయ్యేడు వేల అరవైనాలుగు దాడులు జరిగింది? లెక్కలకందినవే.. లేనివి లేవే?, యెక్కడికక్కడ యెప్పటికప్పుడు వుసుళ్ళు తీస్తున్నారే? జీవాలార్పేస్తున్నారే? మాది మతం కాదు, జీవన విధానం అంటున్నారే.. మరి యెవరి జీవన విధానాన్ని యెవరు డిజైన్ చేస్తున్నారు? సంస్కృతి మాత్రం అందరికీ వొక్కటే వుంటుందా? ఒకవైపు భిన్న సంస్కృతుల సమాహారం అంటున్నారే.. మరోవైపు సహనం తప్పి సంహారం చేస్తున్నారే..?

జీవమంటే గోవుదీ ఆవుదేనా? మనిషి.. సాటి మనిషి జీవి కాడా? ప్రాణి కాడా? జంతు వధశాలలు దేశంలో పదహారువందల యిరవైమూడేనని వాడనుకుంటున్నాడు! మహారాష్ట్రలో మూడొందల పది, ఉత్తరప్రదేశ్ ల రెండువందల యెనభై అయిదు, ఏపీ తెలంగాణాల కలిపి నూటా యెనభై మూడు.. జంతు వధశాలలు లెక్కలు చూపుతున్నారే! మరి యెక్కడికక్కడ దళితుల్ని చంపుతున్నారే, ఆదివాసీలను చంపుతున్నారే, మైనార్టీలను చంపుతున్నారే.. వధిస్తున్నారే.. మనిషి కూడా జంతువే కదా? వేటాడుతున్నారు కదా? వెంటాడి చంపుతున్నారు కదా? మరి ఈ వధ శాలల లెక్కల మాటేమిటి? అయినా జంతుమాంసం వుత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం కదా, ఆ స్థానం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా? ముప్పై మూడు వేల నూటా యిరవై యెనిమిది కోట్ల రూపాయల ఆదాయం వొస్తోందే? ఒక్క యేడాదికే వొచ్చిన ఆదాయం అది. అందులో పశుమాంసమే యిరవైతొమ్మిది వేల రెండువందల యెనభై రెండు కోట్ల రూపాయలు. ఆడబ్బుతో పరిపాలిస్తున్న వాళ్ళకీ జబ్బేమిటి? జాడ్యమేమిటి?

మరోవైపు నిస్సిగ్గుగా ఆయనగారు లండన్ లో అంబేద్కర్ నివసించిన భవనాన్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని గొప్పగా చెపుతున్నాడు. చివరి రోజుల్లో ముంబైలో అంబేద్కర్ నివసించిన భవనాన్ని స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నట్టు మహగొప్పగా చెపుతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్మారక భవనం యేర్పాటు చేస్తున్నాడట! అయ్యవారు చేస్తున్నదానికి అంబేద్కర్ ఆనందపడతాడా? మన నోట్లో మలమూ మూత్రమూ పోసి దేశాన్ని స్వచ్చభారత్ చేస్తున్నారే? గో మూత్రము తాగించి.. పేడ తినిపించి.. అక్కడితో ఆగక హత్యలు చేస్తున్నారే? ఆనవాళ్ళు కావాలా? హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్.. యెక్కడికి వెళ్ళినా శవాలు సాక్ష్యం చెపుతాయి! గాయాలే కావాలా.. ఆమడదూరం అక్కర్లేదు.. నిన్నటి తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం.. భీమనపల్లి శివారు సుధాపాలెం శ్మశానమే సాక్ష్యం! ఎలీషా, లాజర్ యిద్దరూ చనిపోయిన గోవుల చర్మం వొలిచారు! చేసిన నేరానికి శిక్షగా వాళ్ళిద్దర్నీ చావుబతుకుల్లోకి తోసేసారు! ఊనా లో జరిగిందే ఊళ్ళోనూ జరిగింది! యిప్పుడు ప్రతి వూరు ఊనా నే! ‘ఆ నలుగురినీ’ కారుకి కట్టి తొక్కుతొక్కు పొట్టుపొట్టు కొట్టారే.. అదే విధము.. అదే పథము..

కులవృత్తికి కట్టు బానిసలని చేసారు. కుల వృత్తి చేస్తే నేరం. చెయ్యకుంటే నేరం. పుట్టుకే నేరం చేశారే? పుట్టకముందే నేరస్తులను చేశారే? అరే.. వీళ్ళకు వీళ్ళే న్యాయ మూర్తులు! వీళ్ళకు వీళ్ళే తీర్పరులు! వీళ్ళకు వీళ్ళే పోలీసులు! ఎన్నడూ లేనిది వీళ్ళకు యింత కండకావరం యెలా వొచ్చింది? వీళ్ళకు వీళ్ళే కత్తులు కర్రలు గొడ్డళ్ళు పట్టుకొని వుగ్రమూకల్లా వురికురికి మీద పడుతున్నారే?

గోరక్షకుల ముసుగులో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన పడడానికి అల్లాటప్పావా ప్రధానివా అని అడగాలని వుంది. ఆ మొసలికన్నీరు చూసి నిజంగానే మొసలి కన్నీరు పెట్టుకుంటుంది. గోపరిరక్షక దళాల పేరుతో సంఘవిద్రోహక శక్తులు దుకాణాలు తెరిచారు, వారి చర్యలపట్ల నాకు ఆగ్రహం కలుగుతోంది అంటున్నావే?, వారి చర్యలు యివాల్టికి యివాలే మొదలు కాలేదు, నువ్వు అధికారంలోకి వొచ్చినప్పటి నుండి జరుగుతున్నాయే? రోజు రోజుకీ మితిమీరుతున్నాయే? ఎంత విదేశాలలో తిరిగితే మాత్రం అంత మాత్రము కూడా దేశం గురించి పట్టదా? దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్టు లేదూ?

అడగాలని వుంది! అగ్గితో కడగాలని వుంది! నిలదియ్యాలని వుంది! నిప్పుతో వొడి కట్టుకోకు అని చెప్పాలని వుంది!

అయ్యా దాద్రీ మొదలు ఊనా వరకు దేశం రెండేళ్లుగా దద్దరిల్లిపోతూనే వుందే.. వొక్కనాడు వొక్కమాట మాట్లాడావా? వొక్క భాదితున్ని పలుకరించావా? విషం తాగి దళితులు ఆత్మహత్యలకి పాల్పడబోతే వద్దన్నావా? వారించావా? శవాలు లేచిన వొక్క యింటికయినా వెళ్లి కనీసం సానుభూతి చూపించావా? కన్నీళ్ళయినా తుడిచావా? కనీసం ఖండించావా? హంతకులు రోజుకి రోజూ చెలరేగిపోతుంటే ఆగమన్నావా? ఆపమన్నావా? అరెస్టులు చెయ్యమన్నావా? కఠినంగా వున్నావా? వుండమన్నావా? వాళ్ళని ఆపే శక్తి నీకు లేదా? మీ సంఘ్ పరివారమనే వెసులుబాటు యిచ్చావా? గోరక్షక దళ్ దాని తోక అనో.. తొండం అనో.. చూసి చూడనట్టు వున్నావా? వూరుకున్నావా? అందరం ఆ బళ్ళో చదివినోల్లమే అని మూకల్ని వెనకేసుకు వచ్చావా? ఆనాడే ఆపివుంటే యెన్ని ప్రాణాలు దక్కేవి? రాజ్యాంగ వ్యతిరేక శక్తులపట్ల అంత రాగమూ అనురాగమూ నీకెందుకయ్యా? పిర్ర గిల్లేది నువ్వే.. జోల పాడేది నువ్వే.. నువ్వు మా కానోడివి.. అని ముఖం మీద అడగాలని వుంది!

చేపల కోసం కొంగ జపం చేసినట్టు దళిత జపం! దళితులు యెప్పటికీ కళ్ళు తెరవని చేపపిల్లల్లాగే వుంటారా? నేను చావనైనా చస్తాను గాని నీకు గులాం కాను, ఆహారం అంతకన్నా కాను.. అని బలవంతంగా వెళ్ళిపోయిన రోహితా నువ్వు తిరస్కరించిన గడ్డమీద మాట్లాడాడు. నీ హత్యకు కారకుడైన వీసీ పొదిలి అప్పారావు మీద యింతవరకూ చర్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడి రెండుమూడు రోజుల్లోనే చక్కదిద్దుతానని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన మాట యెన్నడో యాది మరిచిపోయాడు. విద్యార్థులను వెక్కిరించి, రెచ్చగొడుతున్న వాన్నే తెచ్చి తిరిగి పెట్టారు. అడిగిన యిద్దరు ప్రొఫెసర్లని సస్పెండ్ చేసారు. ఇరవయ్యేడు మంది విద్యార్థులను అరెస్టు చేసారు. కేసులు పెట్టినవి పెట్టినట్టే వున్నాయి! బెయిల్లూ జెయిల్లూ యివే విశ్వవిద్యాలయాలు! అటు హంతకులకి అధికారమిచ్చి యిటు దళితులు నా సోదరులు అనడం నోటితో పిలిచి నొసటితో వెక్కిరించడం కాదా అని అడగాలని వుంది. నిజంగా నీకు దళిత సానుభూతి కావాల్సి వస్తే మానవ వనరుల మంత్రిత్వ శాఖ నీ చేతుల్లో లేదా? నిప్పు రాజేయకూడదని నువ్వు అనుకొని వుంటే ఈపాటికే చల్లార్చేవాడివి కాదా? నీ చేతొక తీరు.. నీ మాటొక తీరు.. అని నిలబెట్టి అడగాలని వుంది! అడగనా?

గుండెలు జలదరించే గుజరాత్ అల్లర్లు మేం మర్చిపోలేదు.. నీవు మాదేశం రావటానికి వీల్లేదని అమెరికా కూడా అభ్యంతరం చెప్పడం మేం మరిచిపోలేదు.. ఢిల్లీ బీహార్లో నువ్వు వోడిపోయావని మేం మర్చిపోలేదు.. పంజాబ్ లాభం లేదు.. యూపీ గుజరాత్ లో నీవు వోడిపోతావన్న భయంతోనే యిదంతా నువ్వు మాట్లాడావని మేం మరిచిపోలేదు.. ఎన్నికలు వస్తే యెలా అయినా మాట్లాడతారని మేం మరిచిపోలేదు.. అందుకే నిన్ను నమ్మలేదు.. మాటుగాసిన నీ మాటలు నమ్మలేదు..

అని రాజుకి చెప్పాలా? చెప్పకుండానే గ్రహించాడు! అందుకే అంతలా నటించాడు!

అయ్యగారు అధికారంలోకి వొచ్చింది మొదలు నల్ల రంగు నిషేధించబడింది! నల్లని చర్మాలు ఫెటిల్లున పేలిపోతున్నాయి! ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి! మనం తినే తిండి.. పీల్చే గాలి.. కట్టే బట్ట.. అన్నిటా వాడే! వాడి కాషాయమే! పైగా కాషాయం విప్లవమంటున్నాడు! విద్యుత్ వెలుగులంటున్నాడు! విడ్డూరం గుడ్డెడితే తెల్లుల్లిపాయ పిల్లెట్టినట్టుగా లేదూ?

అఖ్లాక్.. వాళ్ళు మనిషి మాంసాన్ని తప్ప గొడ్డు మాంసాన్ని చూడలేరు! అంతటి దయామయులు!

గురూ.. మీ నలుగురూ చూసారు కదా? కాశారు కదా? మీ వొంటి మీద పడ్డ దెబ్బల్ని లెక్కపెట్టండి! వడ్డీతో సహా రేపోమాపో మన సహ దళితులు తీర్చేస్తారులే! తిరుగులేదులే! తిరగ రాస్తారులే!

మన పక్షం వహించిన మన ప్రధాని మీద వొట్టు!

యిట్లు

‘అధిష్టానం’లో వొకడు!

క్విడ్ ప్రో కో.. యేలుకో!

 

 

 -బమ్మిడి జగదీశ్వరరావు

~

ప్రియమైన అల్లుడు గారికి!

యెంత రాజ్యసభ సీటు రాకపోతే మాత్రం.. ‘బాగున్నారా?’, అని అన్నా తప్పేనా? ‘యింకెక్కడ బాగుంటాను?’ అని ఫోను కట్ చేసారు! మా అమ్మాయిని అడిగితే ‘ఫోను కట్ అవడం కాదు, నా తల కట్టయినట్టు వుంద’ని మీరు అన్నారట! మీ బాధను నాబాధ చేసుకోగలను! మీ ఆవేశం, ఆందోళన అర్థం చేసుకోగలను! కాని మీరు అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి! యిప్పుడు కాకపోయినా తరువాతయినా నిదానంగా చదువుతారని అవగాహన చేసుకుంటారని ఆశతో యీ వుత్తరాన్ని మెయిల్ చేస్తున్నాను!

రాజ్యసభ అంటే పెద్దల సభ అని మీరూ నేనూ చదువుకున్నాం. మనం చదువుకున్నట్టు యేదీ వుండదు. యెంపిక కూడా వుండదు. సంఘ సేవకులు, కళాకారులు, క్రీడాకారులు, లబ్దప్రతిష్టులైన వివిధ రంగాలకు చెందిన వాళ్ళ ప్రాతినిద్యాన్ని కోరి- యెన్నికలలో నిలబడకుండా పోటీలేకుండా గౌరవించి వారి భాగస్వామ్యం కోరి- వారి మేథని, తెలివితేటల్ని, నైపుణ్యాన్ని వుపయోగించగోరి అంటే అవసరమైన సలహాలూ సూచనలూ కోరి- బలపరిచేది నియమించేది గనుక అది పెద్దల సభ అయ్యింది! ఇదంతా రాజ్యాంగం! రాజ్యాంగము కన్నా రాజ్యము గొప్పది! రాజు గొప్పవాడు!

‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చుంటే యేమి?’ అని సామెత.. అంచేత ‘రాజు’ అంటే ‘మంత్రి’ మనవాడు అయ్యుండాల.. రాజ్యం మనదయ్యుండాల.. అప్పుడు మనం పాడిందే పాట.. అంటే మనమే గాయకులం! మనం ఆడిందే ఆట.. అంటే మనమే క్రీడాకారులం! మనం వాయించిందే సంగీతం.. అంటే మనమే సంగీతకారులం! మనం రాసిందే రచన.. అంటే మనమే రచయితలం! మనం నటించేందే నటన.. అంటే మనమే కళాకారులం! మనం చేసిందే సేవ.. అంటే సంఘ సేవకులం! మనకున్న పెట్టుబడి పేరే ప్రతిష్ట.. అంటే లబ్దప్రతిష్టులం! యెప్పుడూ? పైవాడు మనవాడు అయినప్పుడు! అప్పుడు! అప్పుడు మనమే తోపులం! మనమే పుడింగిలం! మనమే లార్డ్ కర్జిన్లం! రాజ్యసభ అభ్యర్దులం! పెద్దలం! పెద్దల సభకు పొద్దులం! యెప్పుడూ? వాడు.. ఆపైవాడు కాదు, ఈ పైవాడు అనుకున్నప్పుడు! అప్పుడు!

అప్పుడు మనం గెలవక్కర్లేదు! గెలిస్తేనే అర్హత అనే రూలేం లేదు! ప్రజాభీష్టంతో సంబంధమూ లేదు! ప్రజలు నువ్వు వొద్దు అని వోడించినా.. నువ్వు వోడినా.. గెలిచినట్టే! డిపాజిట్లు కోల్పోయినా.. గెలిచినట్టే! ప్రజాభీష్టం లేకపోయినా.. వున్నట్టే! గెలిచి యెవడైనా వెళ్తాడు! ఓడి వెళ్ళడం.. అంత మామూలు విషయం కాదు! ప్రజలు కాదన్నాసరే ప్రజా ప్రతినిధిని చేసి అందనాలు యెక్కించడం యిందులో గొప్ప విషయం! అందుకే రాజ్యసభకి వెళ్ళడం అంత గౌరవం! అంత పోటీ! అంత విలువ! అంత అవకాశం! అందరికీ అంత ఆశ! అందరికీ అంత మోజు!

ఎమ్మెల్యే ఎంపీ సీట్లకన్నా రాజ్యసభ సీట్లకు డిమాండ్ యెక్కువ! మామూలుగా అంటే ‘మామూలు’గా.. ధర కూడా యెక్కువ! ఖర్చు తక్కువ! ఓడిపోతామన్న భయం తక్కువ! గెలుపుకు గ్యారంటీ! ఏకగ్రీవానికి వారంటీ!

మన రెండు తెలుగు రాష్ట్రాలే తీసుకో. ఆరుగురు యేకగ్రీవంగా యెన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎంసెట్ సీట్లు లాంటివి అయితే, రాజ్యసభ సీట్లు ఐఐటి ఎఐయంసి సీట్లు లాంటివి అన్నమాట! చాలా పోటీ వుంటుంది. రాకపోతే బాధే! ‘బ్యాడ్ లక్’ అని యిలా బాధపడితే యెలా చెప్పండి.. ‘నెక్స్ట్ టైం బెటర్ లక్’ అనుకోవాలి అల్లుడు గారూ..?!

ఇప్పుడు రాజ్యసభకు యెన్నికయిన ఆరుగురు కంటే నాకు యేమిటి తక్కువ అన్నారు. నిజమే! మీరు యెక్కువే! కాని మన యిద్దరు చంద్రులు వొకేలా ఆలోచిస్తున్నారు! ప్రతిపక్షాల్ని తమ పాలకపక్షంలో కలిపేసుకోవడంలో యిద్దరూ సిద్ధహస్తులే! వేరే పార్టీల నుండి వచ్చిన వారిని తక్కువ చేసి చూడడంలేదని చెప్పడానికి వొక సందేశం పంపడానికి అటు ఆంద్రాలో టీజీ వెంకటేష్ గారికి – యిటు తెలంగాణలో డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ సీట్లు యిచ్చారు. సొంత పార్టీలో మీరు వుండొచ్చు. మీకివ్వొచ్చు. కాని అవతల పార్టీ నుండి వచ్చిన వాళ్లకి యివ్వడంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు అత్యున్నత పురష్కారం యిచ్చినట్లు అవుతుంది! ఇదేమిటి.. అయినవాళ్ళకి ఆకుల్లో.. కాని వాళ్ళకు కంచాల్లోనా? అనో- యింట్లోవాళ్ళకి యీత చాప.. పై వాళ్ళకు పట్టెమంచం? అనో- అనుకోవచ్చు! కాని యిద్దరు చంద్రులకూ ముందు చూపు యెక్కువ! అవతలి పార్టీలో మిగిలిన వాళ్ళకి వెళ్ళ వలసిన సందేశం వెళ్ళిపోతుంది! పాత కండువా పడేసి కొత్త కండువా వేసుకుంటారు! వేసుకుంటూనే వుంటారు!

ఇదేమిటి అంటావా? ఇదే క్విడ్ ప్రో కో! నిన్ను గెలిపించిన ప్రజల్ని వారి అభిప్రాయాల్ని వెక్కిరించినట్టుగా అవతలకు నెట్టి, నువ్వు మా పార్టీలోకి వస్తే.. నీకు యివ్వాల్సింది యిస్తాం అన్నట్టే కదా? ‘నువ్వు వొస్తావు.. ప్రతిగా మేము యిస్తాము’.. యిది క్విడ్ ప్రో కో కాదా?

తెలంగాణ చంద్రుడు కేసీఆర్ కు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంచి స్నేహితుడు. స్నేహితుడయితే వాళ్ళింటికి నువ్వు వెళ్లి తిను. నీ యింటికి వాళ్ళనొచ్చి తినమను. మీరు మీరు యేదన్నా యిచ్చిపుచ్చుకోండి. కాని స్నేహం పంచాడు కాబట్టి రాజ్యసభ సీటు పంచుతాను అంటే అదెలా? అప్పుడది క్విడ్ ప్రో కో కాదా? క్విడ్ ప్రో కో కిందికి రాదా?

ఇక తెలుగు చంద్రుడు సుజనా చౌదరికి రాజ్యసభ సీటు మళ్ళీ యివ్వదలచుకున్నాడు. సుజనా చౌదరి విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడాడని అందుకే మళ్ళీ రాజ్యసభకు పంపుతున్నట్టు తెలుగు చంద్రుడు చెపుతున్నాడు. విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను గౌరవించదలచుకుంటే వైయ్యెస్ జగన్ని కూడా గౌరవించాలి గదా? మరి గౌరవించగలడా..? పైగా విదేశీ బ్యాంకుల ఋణం యెగ్గొట్టినట్టు అనేక అవినీతి ఆరోపణలు యెదుర్కొంటున్న సుజనా చౌదరిని రాజ్యసభకు పంపుతూ వుల్టా ‘పదకుండు చార్జిషీట్లు పదమూడు కేసులూ వున్న ఏ-2 ముద్దాయిని రాజ్యసభకు యెలా పంపిస్తారు? ఏ-1 నిందితుడు సపోర్టు యెలా యిస్తాడు?’ అని చంద్ర బృందం అడుగుతూ వుంటే- యెల్లమ్మని యెంచక్కర్లేదు.. పోలమ్మని పొగడక్కర్లేదు అన్నట్టుగా వుంది.  అవినీతిపరులేనా అభ్యర్ధులు? మరెవరూ యిరు పార్టీలలో లేరా? అంటే అలా యివ్వడంలో క్విడ్ ప్రో కో లేదని చెప్పగలరా?

తెగమాట్లాడే తెలుగు వాడు.. ప్రధాని తరువాత రెండోస్థానంలో వున్నాడంటున్న వెంకయ్య నాయుడుకు కాకుండా మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభుకు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సీటును వాళ్ళు కోరడంలో- వీళ్ళు యివ్వడంలో మతలబు యేమిటి? పోనీ మన నిర్మలా సీతారామన్ను కర్నాటక పంపడంలో మతలబు యేమిటి? తెలుగు తమ్ముళ్ళు కాదన్నారా? లేక రేపెప్పుడో కాదంటారనా? ‘మీకీ హోదా యిచ్చాం.. మాకు ప్రత్యేకహోదా యివ్వలేరా’ అని అంటారనా? సరే అందరికీ అర్థమయ్యే రాజకీయాలు మాట్లాడుకోవడంలో అర్థం లేదు!

సొంత రాష్ట్రం వాళ్ళే చెయ్యలేనిది.. వేరే రాష్ట్రం వాడయిన సురేష్ ప్రభు చేస్తాడనా? బీజేపీ యెందుకడిగింది? టీడీపీ యెందుకిచ్చింది? ఇది కూడా క్విడ్ ప్రో కో అంటే కాదనగలరా?

కేంద్రంతో అవసరాలు వున్నాయి! కేంద్రం అవసరం మనం తీరిస్తే మన అవసరం కేంద్రం తీరుస్తుంది! కేంద్రానికి మనం సహకరిస్తే కేంద్రం మన రాష్ట్రానికి సహకరిస్తుంది! కేంద్రంతో స్నేహంగా వుండి నిధులు తెచ్చుకోవాలి! రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం యివ్వాలి! వారికి వొక అవకాశం యివ్వడం అంటే మనం వారి నుండి వొక అవకాశం తీసుకోవడం! కేంద్రంలో అధికారంలో వున్న వాళ్ళకి మనం మన మద్దతు యిచ్చాం.. వారు అందుకు ప్రతిగా మనవాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు యిచ్చారు! విశాఖపట్నంకు రైల్వే జోన్ యివ్వమని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం.. యిప్పుడు ఆ రైల్వే శాఖా మంత్రిని రాజ్యసభకు మన ఏపీ నుండి పంపిస్తున్నాం.. కాబట్టి రేపు రైల్వే జోన్ ఆశించొచ్చు.. అడగొచ్చు.. సాధించుకోవచ్చు.. మనం రాజ్యసభ సీటిచ్చాం.. వాళ్ళు మనకి రైల్వే జోన్ యిచ్చారు.. యిస్తారు.. ఏం లేదు.. యిచ్చి పుచ్చుకుంటున్నాం.. ‘నీకిది.. నాకది!’

ఇది కూడా క్విడ్ ప్రో కో కాదా? ఆర్ధిక అవినీతి మాత్రమే అవినీతా? రాజకీయ పార్టీలు జట్టులు కట్టి వుమ్మడిగా ‘నీకిది.. నాకది’ అని అంటే అనుకుంటే ముందుకుపోతుంటే అధికారం పంచుకుంటే అది మాత్రం అవినీతి కాదా? దీన్ని ‘క్విడ్ ప్రో కో’గా చూడకూడదా? అలా చూస్తే తప్పా?

కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగములో యేమి రాసుకున్నా.. మద్దతు వున్న రాష్ట్రాల వాళ్ళతోనే ఆ సంబంధాలు సజావుగా కొనసాగుతాయా? లేదంటే శాంతి భద్రతల బూచి చూపించి రాష్ట్రపతి పాలన విదిస్తారా? రాష్ట్ర అవసరాలకు సహకరించకుండా మొండి చెయ్యి చూపిస్తారా? మద్దతు యిచ్చినప్పుడే వున్నప్పుడే రాజ్యాంగము అమలవుతుందా? లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలని అది నిర్వచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతారా? మరి ‘మద్దతు’ అంటే యేమిటి? ‘నాకు నా పాలనకి- నా అధికారానికి- నేను అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నువ్వు సహకరించు.. నీకు నీ పాలనకి- నీ అధికారానికి- నువ్వు అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నేను సహకరిస్తా..’ అనే కదా? నాకిస్తే – నీకిస్తా! మళ్ళీ అది అవ్వదా ‘నీకిది.. నాకది?’

ఏది క్విడ్ ప్రో కో కాదు? సమస్తమూ క్విడ్ ప్రో కో నే! సమస్త సంబంధాలు క్విడ్ ప్రో కో నే! రాజకీయ సంబంధాలే కాదు, అధికార సంబంధాలే కాదు, సమస్త మానవ సంబంధాలూ క్విడ్ ప్రో కో నే! కుటుంబంలోనే తీసుకో.. నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు! ద్వేషించినా ప్రేమిస్తారా? లేదే? నువ్వు నీ కష్టాన్ని యిచ్చావనుకో.. ప్రతిగా నీకు సుఖాన్ని యిస్తారు! నువ్వు వాళ్ళ కోరిక తీర్చావనుకో.. ప్రతిగా వాళ్ళు నీ కోరిక తీరుస్తారు! ఇచ్చిపుచ్చుకోవడం అన్నింటా వున్నదే! యివ్వకుండా పుచ్చుకోలేవ్!

సో.. ఆ ‘క్విడ్ ప్రో కో’లోకి రాకుండా ‘క్విడ్ ప్రో కో’లో లేకుండా రాజ్యమే నిలబడదు! రాజ్యసభ సీటు నిలబడుతుందా? ‘క్విడ్ ప్రో కో’ పాటించకుండా రాజ్యసభ సీటు ఆశించడం నేతి బీరలో నెయ్యిని ఆశించడం లాంటిది! ముందు ‘క్విడ్ ప్రో కో’ని గౌరవించు! ‘క్విడ్ ప్రో కో’ని ఆచరించు! ‘క్విడ్ ప్రో కో’ని అనుభవించు! ‘క్విడ్ ప్రో కో’ నిత్యము! ‘క్విడ్ ప్రో కో’ సత్యము! ‘క్విడ్ ప్రో కో’ శాశ్వతము!

అల్లుడూ.. ‘క్విడ్ ప్రో కో’ యే రూపంలో వున్నా అది అపురూపమైనది! అందులో నువ్వు భాగస్వామి కావలసియున్నది! అది మాత్రమే నీకు భవిష్యత్తులో రాజ్యసభ సీటుని తెచ్చును! యిచ్చును!

వొచ్చే పెద్దల సభ యెన్నికల్లో మీ కోరిక తప్పక నెరవేరుతుంది!

అభిమాన పూర్వక ఆశీస్సులతో..

మీ

మామ

నీళ్ళూ నిప్పులే!

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

ఒరేయ్ రాజుగా..!

యెలాగున్నావురా? వూరొదిలీసావు కదా యెలాగుంటావ్? బాగనే వుండుంటావులే! బాగుపడక పోయినా చెడిపోకుండా మాత్రం వుండుటావ్!

వదిలేసినోడి పెళ్ళాం యెవడితో పోతే యెందుకన్నట్టు.. వూరు వొగ్గేసాక యెలాపోతే అలాపోనీ అని అనుకోక వూర్లోని కబుర్లు రాయమని వుత్తరం రాసావ్! ఫోన్లో మాట్లాడితే చాలదా.. చేదస్తం కాకపోతే అని అనుకున్నాన్రా.. కానోరే- యివి ఫోన్లో మాట్లాడేవి కావురా, వుత్తరం రాయాల్సిందే..! వూరూసులు నీకు చెప్పాల్సిందే..!

వూరికి కరువొచ్చింది! అలాటి యిలాటి కరువు కాదు! కాటకము లాటి కాటకము కాదు! గింజకు కరువైతే పంటకు వుంచిన యిత్తనాలు తిన్నాము! గడ్డికీ గాదాముకీ కరువొస్తే పసులను కబేలాలకి పంపించీసినాము! వూరికి మరిడొస్తే మహంకాలమ్మకు దిష్టితీసి దండవెట్టి ముడుపులుగట్టి మొక్కులుదీర్సి సంబరాలుసేసి సచ్చినోల్లని సాపల్ల జుట్టి వల్లకాడుకు యీడ్సినాము! పూడ్సినాము!

ఏ తల్లి దయ చూపినా గంగమ్మ తల్లి దయ చూపడం లేదురా.. శివయ్య నెత్తిమీద నుండి గంగమ్మని దించడు గావాల.. అతగాడికి సల్లదనం సాలదు గావాల.. అనీసి నలుగురం అనుకోని, ఆడుకోని.. యింటికి పది బిందిలు.. వంద గడప.. వంద యిళ్ళు.. మొత్తానికి యెక్కడెక్కడ్నుంచో నీళ్ళు తోడుకొచ్చినాం.. సేతులు బొబ్బలు కాలు బొబ్బలు.. ‘దేవుడు దిబ్బయిపోయిన దేవుడు’ అని తిట్టకోకుండా వోపిక పట్టినాం.. సుమ్మగుడ్డ నెత్తి మీన  యెట్టుకోని బిందిలికి బిందిలు మోసినాం.. కావిళ్ళు యేసినాం.. బళ్ళు పూసినాం.. పులిసిపోనాం.. పులకించిపోనాం.. పంతుళ్ళ మంత్రాలొకపక్క.. జంగమోడి శంఖమొకపక్క.. దీపాలు దూపాలు.. ఆరతులు ఆబిసేకాలు.. అది కళ్ళు తోటి చూడాల్సిందేరా.. చెప్పనలవయితే గాదు.. వూరందరం గలిసి మనూరి శివాలయంలో శివుడి నెత్తిమీద వెయ్యిన్నొక్క కుండల నీళ్ళు కుమ్మరించినాం.. గర్బగుడిలోంచి నీళ్ళు పోకండా స్నాన మట్టం ముందలే మూసీసినాం.. ద్వార ప్రవేశకాల దగ్గర కన్నాలు కలిపి వొగ్గకుండా బిరడాలు సుట్టి పెట్టి మూసీసినాం.. నీళ్ళు యెట్నుంచి పోకండా చేసీసినాం.. యేటవుద్ది? శివలింగం ములిగిపోయింది..! దేవుడికి వూపిరాడక వుక్కిరి బిక్కిరి అయిపోయి.. ‘ఓళ్తల్లో.. గంగమ్మ తల్లో.. వూపిరి సలపడం లేదు, దిగి బేగి అవతలికి యెల్లే..’ అనీసి శివుడు అంటాడు గావల.. గంగమ్మతల్లి గంగ వెర్రులెత్తుకోని మేగాలంట పరుగులెట్టుకోని బూమ్మీదకి అడ్డగ దిగిపోద్ది గావాల.. వర్షాలు కుండపోతగా కుమ్మరించేస్తాయి గావాల.. దబ దబమని దబాయించి అంచెట్టకుండా బాదికెలిపోద్ది గావాల.. వానలు వరదలై యెత్తి ముంచేస్తాది గావాల.. కరువుదీరా కసిదీరా కురుసేస్తాది గావాల.. కరువు తీరిపోద్ది గావాల..

వానల్లు కురవాలి వానదేవుడా!

వరిసేలు పండాలి వానదేవుడా!

సెర్లన్నీ నిండాలి వానదేవుడా!

మడ్లన్నీ పండాలి వానదేవుడా!

కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా!

గొప్పగా జరగాలి వానదేవుడా!

అనీసి పాడీసి.. ఆడీసి.. గెంతీసి.. కప్పలకి పెళ్ళిళ్ళు చేసీసి.. ముత్తైదువులు పేరంటాళ్ళు మండోదరికి పూజలూ పునస్కారాలూ చేసీసి.. యిలాగ బూమ్మీద యెన్నున్నాయో అన్నీ చేసిసి.. వూరు వూరంతా కిందా మీదా పడిపోయినా గంగమ్మ తల్లి దిగలే! మొగుడు నెత్తినెక్కించుకుంటే దిగుతాది? యే యాడదాయన్నా దిగుతాది? నువ్వయినా సెప్మీ?

యారళ్ళ పోరు పడలేనని పార్వతమ్మ యెదురుతిరిగినా బాగుణ్ను! మొగుడా.. శివుడా.. గంగని యిడిసిపెట్టురా అనీసి అలనాడు సేసినట్టు గోల గోల గొల్లు గొల్లు సేసినా బాగుణ్ను! శివుడికి సిగ్గయినా వచ్చును! యిడిసీ పెట్టును! మనూర్ల ఆడోలు నాలికలు అరిగిపోయినట్టు మాట్లాడుకున్నారు గాని సుక్క పడ్లే! సినుకు కుర్లే! యెప్పటిలాగ యదావిది.. సిద్దిరస్తు..!

కప్పలు అరిస్తే వానలు కురుస్తాయంటారు.. సెర్ల నీళ్ళే లేవు! కప్పలు యెక్కడి నుండొస్తాయి? అప్పుడికీ మనోలు యెక్కడికో యెల్లి కప్పల్ని పట్టుకొచ్చినారు! కొండమీది కోతే మందంటే తేవాల గదా? తెచ్చిన కప్పల్ని అరండే అంటే అరుస్తాయీ? సెప్పితే నీకు అబద్దము, నాకు నిజిము.. ఈలు మనోలు బెక బెక మనడమే గాని కప్పలు అరేలేదు.. అరుపులు నేర్పించినా అరలేదు! మూగి కప్పల్లాగ కియ్ అనలేదు.. కయ్ అనలేదు! ‘యేమే కప్పా అరవూ.. అంటే నానోటి నిండా నీళ్ళున్నాయని..’ సామెత! నీళ్ళూ లేవు! అరుపూ లేదు!

పుర్రాకులు యెన్ని పడినా గుక్కెడు నీళ్ళకి గుటుక్కుమన్నట్టుగుంది బతుకు!

మన వూరి పెద చెరువు యెండిపోయింది! చిన్న చెరువూ యెప్పుడో యెండిపోయింది! తూరుపున వున్న గుండం యింకేపోయింది! పడమరన వున్న బట్టి యెండిపోయి యిటికల బట్టీ అయిపోయింది!

మనూరి బోర్లు యెండిపోయినాయి! బావిలు యెండిపోయినాయి! మంచినీలకు కష్టమంటే కష్టం కాదు! కనా కష్టంగుంది! యమ యాతనగుంది! యిప్పుడు యెలక్షన్లు వున్నా బాగుణ్ను! సర్కారు పట్టించుకున్ను! మనం దిక్కులేని పక్షుల్లా చచ్చినా యిప్పుడు యెవుడుకీ పట్టదు! మీ చావు మీరు చావండి అని వదిలేసినారు! మనూర్లదాక మజ్జిక పేకట్లు రాలే! అయినా మజ్జికతో కడుపు నిండుతాదా? మంచినీళ్ళతో దినమెళ్తాదా? యేమంటే ‘చెట్టూ – నీరు’ పోగ్రాముకి రమ్మంటారు.. మనుషులకే నీళ్ళు లేవు.. మోడులకి నీళ్ళు యెక్కడి నుండి తెచ్చి పోసీది?

ఊళ్ళో ట్యాంకులతో నీళ్ళ అమ్మకం లేదు! మనూరోలికి కొనే తాహత్తు లేదనేమో ట్యాంకులోల్లు పట్నం  పోయినారు! ఎక్కడైనా గిరాకీయే గాని అక్కడైతే వొక రూపాయి యెక్కువకి అమ్ముకోవచ్చు! నాల్డబ్బులు సీజన్ల సంపాదించుకోవచ్చు! ఆల యాపారాలు ఆలవి! కాదని అనగలమా? ఆపగలమా?

గోర్జిల నంద నుయ్యి వుందికదా.. మనం స్నానాలు చేసీవోళ్ళం.. ఆడా మగా పిల్లా పిచ్చుకా అందరం అక్కడే కదూ! కళకళలాడే నుయ్యి! నుయ్యికాడ నీళ్ళుతోటి యెన్నెన్ని కతలు తెండీ వోరని?! నీళ్ళు పట్టుకొని యెల్లగానే యెల్లినమ్మ మీద అమ్మలక్కల వూసులు! వయిసిన గుంటల సూపులు గునపాల్లాగా వుండీవి కావూ?! ఓలి మరదలా బీపి రుద్దిమీ.. బాగా రుద్దినావంతే మీ యప్పకి సెప్పి పెళ్ళాడేస్తాన్లే.. యిద్దరు సక్కన వుందురు.. యికటాలు! ఓరే గండా.. మనవడా.. నన్ను పెళ్ళాడుతావేట్రా అని ముసిలమ్మల ముసిముసి నవ్వులు! వోరి గొల్లిగా నూతిలోని నీలన్నీ తోడేస్తావేటి?, ఆపిల్ల వూరెల్లింది, యిప్పుడప్పిడే రాదు.. సిగ్గుపడి సేద వొదిలీసి పరుగులు.. పరాసికాలు! నుయ్యి నూర్రకాలుగా వుండీది.. నవ నవ లాడీది!

యెలాటి నుయ్యిరా అది.. రెండు బారలకే నీళ్ళందీవి! పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఫంక్షన్లు గింక్షన్లు అన్నీ ఆపీది! అది కూడా వెలవెలబోయింది! తొంగి చూస్తే అడుగు కనిపిస్తోంది! అడుగంటీసింది! మట్టి తీతుమన్నా కళ్ళు తిరిగిన లోతు! ముంత వొలకబోసినట్టు నీళ్ళు! చిన్న పిల్లాడు వుచ్చపోసినట్టు వూట! జల యింకి పోలేదు! తగ్గిపోయింది! పొయ్యి పొక్కల్లలా మూడు పక్కలనుండి మూడు వూటలు! వూరిని.. వందగడపని.. కొంత కాకపోతే కొంతయినా కాపాడుకొస్తోంది ఆ నుయ్యమ్మ తల్లి!

‘పెపంచకంల వున్ని నుయ్యిలన్నీ యెండిపోయినా మన గోర్జి నుయ్యి యెండదురా..’ అనీసి కంచరాన అచ్చమ్మ అనీది.. ఆ ముసిల్ది వంద నిండినదాక వుండి కొండెక్కిపే! పిచ్చికలాటి మనిషి! ముంతడు అంటే ముంతడు నీలు తోటి తాన్నం జేసీసి బట్ట కూడా తడిపీసీది.. ఆ మారాజు కూతుర్ని తలవనోలు లేరనుకో! యెందుకని అడుగు? నీల కరువుకి.. దేవుడికి నీలదార తియ్యడమే మరిసిపోయిన కాలంలో అచ్చేమ్మే ఆదర్శము గదూ? ‘ముంతడు నీలల్ల ములిగి సచ్చిపోడమేటో’ సాస్త్రం యిప్పుడు బోదపడింది!

తడిగుడ్డతోటి వొళ్ళు తుడుసుకోడం తప్ప తాన్నాలు లేవు! ‘పులులూ సింహాలూ రోజూ తానమాడుతాయేట్రా?’ అనీసి నీల్లున్నప్పుడే నెలకీ పదికీ తాన్నం జేసే మన సావాసగోడు కామేసు లేడూ.. ఆడ్ని అందరం యెక్కిరించీవోలిమి గదా..? ఆడిప్పుడు ‘సెయ్యండిరా.. తలారా తాన్నాలు సెయ్యండిడ్రా!” అని యెక్కిరించి నవ్వుతున్నాడు. ‘మనిషి అంటే జంతువే, జంతువుల్లాగా బతకండి..’ ఆడు యెకసెక్కానికి అన్నా గాని.. నీళ్ళు కాదు గాని మనషులు మనషులుగా మిగిలినట్టు లేరు.. ఆ కత కూడా చెపుతాను విను..

ఊరంతటికీ వంద కుటుంబాలకి గోర్జి నుయ్యే దిక్కు! పూటకి యిన్నీ యిన్నీ నీల్లవుతున్నాయి.. లేదనడానికి లేదు! అయితే అవి అందరికీ చాలవు! కొట్టుకు చచ్చినా చాలవు! కత్తులు నూరినా చాలవు! కేసులు పెట్టుకున్నా చాలవు! నాను ముందొచ్చినాను అనంటే నాను ముందొచ్చినాను అని కయ్యాలు! కళ్ళు అగుపడవా.. పిల్లడ్ని పెట్టి యెల్లినానని వొకమ్మ, మీ నయనాలు తీసి గైనాన దోపుకున్నారా.. బింది పెట్టి యెల్లినానని వొకమ్మ! రాత్రి తెల్లవార్లూ నుయ్యి దగ్గరే జాగారం జేసి సచ్చినానని మరకమ్మ, నీకు మొగుడు లేడు.. నువ్వు నుయ్యిదగ్గిరే పడుకుంటే అవుతాది, నాకు మొగుడున్నాడు.. ఆడి పక్కన పడుకోపోతే అవుతాదా.. అని యింకొకమ్మ! నీకంతే సంసారం లేదు, సన్నాసిలాగున్నావు వొంటిగ.. మమ్మల్నీ సన్నాసరకం సెయ్యమంటావా.. సంసారరకం వొద్దంటావా.. చెప్పు మానేస్తాను.. అనంటే- అయితే మానియ్యే, నా మాట మీద యేటి రోటి పోస్తావు.. అని అలగన్నాదోలేదో- మరి నువ్వొచ్చి నామొగుడు పక్కన పడుకోయే.. అనంటే- ఆ గుడిసేటోడు దగ్గిర నీనేల పడుకుంటాను అని.. నా మొగుడు గుడిసేటోడా?.. వొవ్వో గొడవ! ఓసి నువ్వెవులెవులకాడ పడుకున్నావో నాకు తెల్దా? అంతకంటే నా మొగుడు యేటి తక్కువ అనంటే- నువ్వే గాల మా పక్కలు యెత్తినావు అని- నీనేనికి యెత్తుతాను?, లంజలవల్ల.. అనంటే- లంజా లమ్మిడీ.. రామాయణ భారత భాగవతాలెల్ల చదివేసింది చాలక.. జుట్టులు పట్టుకున్నది చాలక.. యేడు తరాలు యెక్కబీక్కున్నది చాలక.. కాంతలందరూ మొగుళ్ళ మీద పడ్డారు. నువ్వు సేత్తక్కువోడివి కాబట్టి ఆ నంజ అన్ని పేలతంది.. నీ నోట్ల యేటున్నాది.. దనిమీద నీకు యేటి లేకపోతే యెందుకడగవు? అని వొక పెళ్ళాం పేచి. నాకు దానిమీద యేటుంది? అని మొగుడు. రోకు అని పెళ్ళాం. మొగుడూ పెళ్ళాల గొడవలు. పిల్లలు మద్దిలో యేడిస్తే పిత్త సిరగ బాదీడిం.. కాదంటే దుడ్డుగర్రలు పుచ్చుకొని యెప్పుడువో పాత పగలు పెట్టుకోని బాగారుల్లాగా యిప్పడు తలలు బద్దలు చేసుకోవడం.. యికనేటుంది? కట్టులూ.. బెండేజీలూ.. ఆస్పెటిల్లూ! పోలీసులూ.. కేసులూ.. కోర్టులూ! సాచ్చికాలు యిస్తే వొక తప్పు! యివ్వకపోతే యింకొక తప్పు! యెటెల్లినా తప్పే! యెల్లక పోయినా తప్పే! నీళ్ళు కాదుగాని వూరు నిప్పుల గుండమయిపే!

యికన యిలగ లాభం లేదని వూరి పెద్దలందరూ కలిసి వుమ్మడిగ యేటి సేద్దాము అనంటే యేటి సేద్దాము అనుకోని వొక తీరుమానం చేసినారు! వూర్ల వున్నవి వంద యిళ్ళు.. వంద కుటమాములు.. కాబట్టి వంద అంకెలు చిట్టీలు రాసి.. చీటీ పాట లాగ యేసి.. వొకటోకటి చిట్టీలు తీసి.. యే నెంబరికి ముందొస్తే ఆలకి ముందు నీలకి అవకాశమిచ్చి.. చీటీల వారీగా వొకరి తరువాత వొకరికి అందరికీ వూరందరికీ వందమందికీ అవకాశము యిచ్చినారు! యింటికి రొండు బిందిలు నీలు! వొక ట్రిప్పు అవడాకి రొండొందలు బిందిలు కావాల! పూటకి నుయ్యిల పది బిందిలు నీల్లూరినా రొండుపూటలా కలిపి యిరవై బిందిలు.. మరీ పెద్ద బిందిలు తెస్తే కాదు, వొక్కలు యెత్తికెల్లగలిగిన బిందే.. పది రోజుల్లల్ల అందరికీ అవకాసమొస్తాది.. రొండో ట్రిప్పు మళ్ళా పదిరోజులకే! వొకేల ముందు ట్రిప్పుల ముందే వొచ్చి యెనక ట్రిప్పుల యెనకే వొస్తే నడుమ దూరానికి నట్టేట్లో మునిగినట్టే! యేటో బతుకు పీనుగుల పెంటయిపోయిందనుకో!

అందరూ వైష్ట్నమయ్యిలే.. గాని దాకలో రెయ్యిలు మాయమయిపోయినాయట.. అలగుంది యవ్వారం! అందరూ మంచోల్లే.. మంచోడి బుద్ది మత్స మాంసాల కాడని సామెత. మంచినీళ్ళ కాడా అంతే! యే రేతిరప్పుడు యెవలు తోడికేలిపోతే? దొంగల్ల దోపల్ల ఆపని చేస్తే? చేస్తే కాదు.. చేసినారు! వూరిల నీటి దొంగలు బయలెల్లినారు! కన్ను సేరేస్తే సేన! సత్య పెమానకాలు చేసేస్తన్నారు, మేం కాదంటే మేం కాదని! తెల్లారితే నుయ్యిల నీలు మాయం! యిలాక్కాదనీసి కొత్త చెప్పులు నాలు జతలు తెచ్చి నూతి మీద యేలాడేనాగ కట్నాం! ‘నీళ్ళు దొంగతనం చేస్తే చెప్పు దెబ్బలు తింటారు’ అని నంద మీద నల్లటి మసిబొగ్గుతో తాటికాయంత అచ్చరాలతో రాయించినాం! అయినా గాని నీళ్ళ దొంగతనం ఆగలే! అరే రేతిరి పూట కాలు మడుద్దుమని లేస్తే తప్పు! వుచ్చకో దొడ్డికో పొతే కూడా నిజంగానే పోతన్నాడా లేదా అని పోసినదాక ఆగి, యెల్లినదాక ఆగి అప్పుడు చూసి గాని వొదిలేది లేదు! నీడలాగ పెతీ వోడికీ యింకోడు కాపలా! నిద్దర్ల నడిసే అలవాటున్న అప్పడినయితే కొట్టేన్రు కూడా! రేతిర్లు కక్కుర్తి పడ్డ ఆడా మగా కయితే అడ్డుకట్ట పడిపే! లాభం లేదని మళ్ళీ ఆలోచన జేసి.. యింటికి యిద్దర్ని నుయ్యికాడ రేతిరిపూట కాపలా వుండీలాగా డూటీలు యేసుకున్నాం! యెవులుకి యే రోజు కావాలో ఆరోజే డూటీ చేసినట్టు సర్దుబాటు చేసుకున్నాం! అందరూ మేముంటాం అంటే మేముంటాం అంటే.. మళ్ళీ అనుమానం.. కాపలా వున్నోలుగాని రేతిరిపూట కుమ్మకైపోయి గాని నీలు మోసికెలిపోతే? అమ్మో.. యింకెవులికి పడతాయి నిద్దర్లు? రోజూ శివరాత్రే! రోజూ జాగారమే!

నీలు లేవు! నిద్దర్లు లేవు! నీలకి కాపు! నూతికి కాపు! మనిసికి కాపు! కాపు వున్నోడికి కాపు! చీమ చిటుక్కుమంటే చాలు.. అబరా గుబరా లేసి నుయ్యికాడికి పరుగే పరుగు! నీలు కాదుగాని యెవులూ యెవల్నీనమ్మడం లేదు! వూర్ల నీల్లారిపోయినట్టు నమ్మకం ఆరిపే! నీలు లేపోతే యెంత ప్రమాదమో.. నమ్మకం లేపోతే అంతే ప్రమాదం గదూ? మనూర్ల అప్పయినా తనకాకయినా ప్ర్రాముసరీ నోట్లు రాసుకొని యెరగం! అంతనమ్మకం! అలాటిది గాచ్చారం కాపోతే నీటి తిత్తవ వూరి తిత్తవని పూరా మార్సీసింది! నిప్పుని ఆర్పడాకి కదా నీలు! నీలే నిప్పయితే? అయితే కాదు, అయ్యింది! వూరంటుకుంది! తగలబడిపోతోంది! నీలు కావాలి! నీలు కురవాలి! నిప్పు ఆరాలి! నీలు తాగాలి! దప్పిక తీరేలా నీలు తాగాలి! మలినం అయిపొయినాము గదూ? ఆ కుళ్ళూ కుతంత్రం కడగడానికి నీలు కావాలి! కన్నీలు కడగడానికి నీలు కావాలి! నీలు కావాలి! స్వచ్చంగా మనిసి మెరవడానికి నీలు కావాలి! నీలు కావాలి! నీలు కురవాలి!

తుఫానట! తీవ్ర వాయుగుండమట! బతుకు గండమట! మూడో నెంబరు ప్రమాద సూచిక యెగరేసారట! వూరికి తుఫాను యెన్నడో వొచ్చింది! అతలాకుతలం చేసింది! యీ తుఫాను వొక లెక్కా? లెక్కే! తుఫానొస్తే వానలు వస్తాయి! అదే తెలిసిన లెక్క! గాలోనయినా అది నీలోనే! నీల వానే! యీదురు గాలులు గంటకి నూటిరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయట! వియ్యనీ! యెలాగోలా వాన కురిస్తే చాలు! ఆకశాన హరివిల్లు మెరిస్తే సేన!

ఉరుము వురికి వస్తే బాగున్ను! మెరుపు మేగాలను చీల్చితే బాగున్ను! దాక్కున్న నీలు దబదబ కింద పడిపోను! పిడుగు పడింది! పడనీ! అర్జునా ఫలుగునా అంటే ఆగుతుందా? పిడుగులతో పాటు యింత వర్షం కురిస్తే బాగున్ను! అల్పపీడనం అటెటో తిరక్కుండా వున్నా బాగున్ను! తిరిగి వొస్తే బాగున్ను! తడిసి ముద్దయితే బాగున్ను!

అరే.. గాలి తేలిపోయింది! మబ్బూ తేలిపోయింది! మసాబు తేలిపోయింది! వానా తేలిపోయింది! ప్రాణం పోయింది! చినుకు కురవాలి! చిగురు తొడగాలి! మొక్కలే కాదు, మోడులైన మనుషులు తిరిగి మొలవడానికి! మొలకెత్తడానికి!

వానోస్తేనే.. తిరిగి నీకు వుత్తరం రాస్తాను!

అంతవరకూ సెలవు!

యిట్లు

నీ

నేస్తం!

తల్లికడుపులోకి తోవ యివ్వండి!

 

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

ఓ నా నగర జీవులారా..!

మీరు మల మలా కాకుల్లా మాడిపోతున్నారు కదూ? పెనం మీద వేసిన నీటి బొట్టులా మీ వొంట్లోని ప్రతి నీటిబొట్టూ చెమటై ఆవిరై యింకిపోతోంది కదూ? గొంతు యెండిపోతోంది కదూ? నాలుక పిడచ కట్టుకు పోతోంది కదూ? దాహం.. దాహం.. అని అల్లల్లాడిపోతున్నారు కదూ? పిల్లలూ పెద్దలూ తేడా లేదు కదూ? వయసుకూ వల్లకాడుకూ సంబంధం లేదు కదూ? అమ్మ చేతి దెబ్బ తిననివారున్నారేమో గాని వడదెబ్బ తిననివారు లేరు కదూ?

ఎండ ఫెళ్ళున ‘పేల్చేస్తోంది’ అంటే.. అదేమన్నా తుపాకీనా- పేల్చేయడానికీ కాల్చేయడానికీ.. అని హాస్యానికి అన్నా.. అంతకన్నా యెక్కువేనని యిప్పుడిప్పుడే అర్థమవడం లేదూ? ఎండలకు కొండలు పగలడం అంటే.. అర్థమవడం లేదూ? రోహిణీ కార్తె యెండలంటే రోళ్ళు పగులుతాయి అంటే.. అర్థమవడం లేదూ? రథసప్తమి రోజున సూర్యుడు రథం మారింది మొదలు.. యెండలు మండిపోవడానికి అదే మొదలు అంటే.. అర్థం అవడం లేదూ?

ఎండాకాలం వచ్చిందంటే.. మామిడిపళ్ళూ మల్లె పూలూ వొస్తాయని మీలో యెదురు చూసిన సంబరం చచ్చిపోయిందని నాకు తెలుసు! మీరు చచ్చిన శవాలైపోయారనీ తెలుసు! పిల్లలు మునిపటిలా వేసవి సెలవులని సరదాగా గడపడమే మర్చిపోయారనీ తెలుసు! అమ్మమ్మా తాతయ్యల యిళ్ళకు వూర్లు పోవడమే మానుకున్నారనీ తెలుసు! ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టలేని బందీలయిపోయారనీ తెలుసు! మీకు ఆకలి మందగించిందనీ తెలుసు! మీరు నిద్రకు దూరమయ్యారనీ తెలుసు!

అరే.. మెత్తని స్పర్శకీ మొత్తబుద్ది అవుతోందే..! మీ దాంపత్యానికి కూడా వేసవి సెలవులు యిచ్చేసినట్టున్నారే..! పిల్లల్నో పెళ్లాన్నో పట్టుకుంటే కాని నిద్రరాని మీకు.. పట్టుకుంటే చాలు నిద్ర వొదిలిపోతోందే..! చిన్న విషయాలకు కూడా చిరాకులూ పరాకులూ పెరుగుతున్నాయే..! అన్ని పనులూ వాయిదా పడుతున్నాయే! అయ్యో పని చెయ్యకుండానే అలసి సొలసిపోతున్నారే..! వేసవి కాలపు నాలుగు నెలల్ని చిన్న పిల్లల్లా కేలండర్లోనుంచి చింపేస్తున్నారే..!?

మా చిన్నప్పుడు శివరాత్రికి ‘శివ.. శివ’ అనుకోనేంత చలి వుండేదని అంటే.. మా చిన్నప్పుడు యెండలు వుండీవి కాని యిలాంటి యెండలు కావు బాబోయ్.. అని ఠారెత్తి పోతున్నారా? బీర్లతో కూల్ డ్రింకులతో వేసవిని చల్లార్చలేక పోతున్నారా? కరెంటుపొతే చాలు ప్రాణం పోతోందా? అప్పు చేసన్నా ఎయిర్ కండిషనరో.. కనీసం ఎయిర్ కూలరో కొనుక్కుంటున్నారా? కరెంటుబిల్లు బెంబేలు యెత్తిస్తోందా?

నీళ్ళు లేవు! నగరం నిప్పులగుండం! ఇల్లు అగ్నిగుండం! బతుకు మృత్యుగండం! అకాలమరణం కాదది హననం! పాప హరణం! వడగాల్పులు కావవి యముని పాశాలు! నరక ద్వారాలు!

నిప్పుల కొలిమిలా భగ భగల భుగ భుగల సూర్యుడు! భూతాపం! ప్రకృతి ప్రకోపం! తార్రోడ్డులు కావవి నిలిచి కాలుతున్న తాటాకు మంట! రాక్షసబొగ్గుతో రాజేసిన చితి! చితీ కాదిది.. చింతా కాదిది.. నిప్పుల పుంత!

గుక్కపెట్టి యేడుస్తున్న పిల్లల్ని చూసి.. దేవుడా తీసుకుపోరా తండ్రీ అన్న పెద్దల్ని చూసి.. బతుకు కాలి బొబ్బలెక్కిన మిమ్మల్ని చూసి.. గడ్డకట్టిన నేను కదిలి కరిగి నీరయ్యాను! తొలకరి చినుకయ్యాను! ఎండాకాలంలో వానయ్యాను! వడగాల్పుల మీద వడగళ్ళ వానయ్యాను! ఎండాకాలంలో వానలు.. వానాకాలంలో యెండలు.. కలికాలం అని వెక్కిరించినా.. కాలం తప్పినా.. కర్మం తప్పకూడదని కురిసాను! మురిసాను!

గాలితో గంతులేసాను! అది చూసి చెలిమి చేయ రమ్మని మెరుపు మేళమయ్యింది! ఉరుము తాళమయ్యింది! చెట్టూ చేమతో చెలిమి చేద్దామనుకున్నాను! కొమ్మ కొమ్మన చేరి ఆకు ఆకున జారి ఆడుదామనుకున్నాను! పిందెలతో పోటీపడి రెమ్మ రెమ్మనా ఆకు ఆకునా వేళ్ళాడదామనుకున్నాను!

నిజమే! కాంక్రీట్ జంగిల్! ఈ జంగిల్లో వొక్క చెట్టూ లేదు! పుట్టా లేదు! పిట్టాలేదు! అరుపూ లేదు! ఆనవాలూ లేదు! చిరునామా లేదు! మీ డ్రాయింగ్ రూముల్లో పచ్చని పెయింటింగ్ గా తప్ప, యే జాడా లేదు! లేదే లేదు.. లేనే లేదు!

మీరు నన్ను వెలేశారు! నేలలో యింక కుండా విడదీసారు! అసలు నేలేది? మట్టేది? మట్టి వాసనేది? తొలకరి పరిమళమేది? మట్టి పరిమళాల మధుర వాసనలు యేవి?

సిమెంట్.. సిమెంట్.. సిమెంట్.. వున్నదంతా సిమెంటే! పచ్చదనం లేని పేవ్ మెంటే! ఇళ్ళు కావివి యినుప గూళ్ళు! రాతి నగరం! రాగం లేని నగరం! అనురాగం లేని నగరం! ఆదరము లేని నగరం! శిలా నగరం! శ్మశాన నగరం! క్షుద్ర నగరం!

ఒరే.. నేను మీకోసమే వచ్చాన్రా.. నాకు తోవ యివ్వండ్రా.. దారివ్వండ్రా.. నన్ను పోనివ్వండ్రా.. నన్ను యిమ్మనివ్వండ్రా.. యింకనివ్వండ్రా.. నేల వొడిని చేరనివ్వండ్రా.. అమ్మనిరా.. చెమ్మనిరా..  నేను జలాన్నిరా.. జీవాన్నిరా.. మీ జీవాన్నిరా.. మీ జీవనాధారాన్నిరా.. యేదీ అమ్మ గర్భంలోకి నన్ను చేరనివ్వండ్రా.. చేరుకోనివ్వండ్రా.. చేదుకుందుర్రా.. దప్పికలు తీర్చుకుందుర్రా.. నాలుకలు తడుపుకుందుర్రా.. వొరే దెష్టల్లారా.. దరిద్రుల్లారా.. భ్రష్టుల్లారా.. ద్రష్టల్లారా.. నాకు దారి వొదలండ్రా.. వదలండి!

అరే.. యెదవల్లారా.. మొదవల్లారా.. పాలు కొనుక్కుంటారు సరే, నీళ్ళు కూడా యెన్నాళ్ళు కొనుక్కుంటారురా? లీటరు బాటిలు యిరవై.. యిరవై లీటర్ల నీళ్ళ కేను యాభై రూపాయలు.. వున్న ఖర్చులకు తోడు నెల నేలా నీళ్ళ ఖర్చు.. డబ్బుల్లేకపోతే మంచి నీళ్ళు కూడా తాగడానికి లేదన్నమాట..! గుక్కెడు నీళ్ళ కోసం రొండు వందలు కాదు.. రెండు వేలు.. రెండు వేల అడుగులు తవ్వుతున్నారే.. డ్రిల్లింగ్ మిషన్లు దించుతున్నారే.. తోడేస్తున్నారే.. అమ్మ దగ్గర పాలుంటే చిమ్ముతూ వుంటే తాగొచ్చు.. తాగే పెరగాలి! కానొరే.. స్తన్యంలో పాలు లేవని రావని నెత్తురు పీలిస్తే యెలారా..? రేపు మీ పిల్లలు యేమి తాగి బతుకుతార్రా..? బతికి చస్తార్రా..?!

నీళ్ళురా.. నీ ముంగిటకి వచ్చాయిరా..! తలుపు మూయకురా..! నేను తీర్థాన్ని రా..! దేవుడు పంపిన తీర్థాన్ని రా..! తీర్థ ప్రసాదాల్ని పారబోయకురా..! మూడొంతుల నీళ్ళు యీ భూమ్మీద వున్నట్టు.. మీ దేహంలో కూడా మూడొంతుల నీళ్ళు వుండాలిరా..!

నీరు పల్లమెరుగు.. పల్లానికిపోదామంటే దారీలేదు.. నిజం దేవుడెరుగు.. అడుగుదామంటే దేవుడి జాడా లేదు! మట్టి జాడా లేదు! నేలని యిలా సిమెంటు పోసి కప్పేస్తే.. తల్లికి వూపిరెలా ఆడుతుందిరా? తల్లి పేగు తెగాక మీకు వూపిరెలా ఆడుతుందిరా? సమాధులు కట్టినట్టు కట్టారు కదరా? బతికుండగానే కప్పెట్టారు కదరా? ఇంచీ వదలకుండా సిమెంటు తాపడం పెట్టారే..! యిళ్ళూ వాకిళ్ళూ సరే..! అరుగులూ మెరుగులేనా..? వీధులూ.. వాడలూ.. దారులూ.. రహదారులూ.. వాటి పక్క ఆ వార యీ వార .. దేన్నీ యెక్కడా వదలర్రా? మట్టి అంత అంటరానిది అయ్యిందా? మీరు వేసిన వేషాలు చాలవని యింకుడు గుంతల కంటి తుడుపుతో కవరు చేస్తున్నార్రా?

చిన్న చినుకుకే చిత్తడి అయ్యే మీ నగరం వొక నగరమా? జల జలమని జల్లు కురిస్తే జడిసిపోయే మీ నగరం వొక నగరమా? వానొస్తే రోడ్లమీద మీ బళ్ళూ మీరూ తేలుతారే.. పడవలేసుకు పరుగులు తీస్తారే.. గట్టిగా గంట వాన కురిస్తే మునిగిపోయి.. నీట్లో తేలే మీ నగరం వొక నగరమా? మురుగు కాల్వలు ముడ్డికింద దాచుకొని ముక్కు మూసుకు బతికేస్తారే నాకేమో కడిగి పారేయ్యాలని వుంటుంది.. కాని దెబ్బ యెప్పుడూ ముందు తగిలేది చిన్నవాళ్ళకే! నిజమే, వాన కూడా అందరికీ వొకటి కాదు.. ప్చ్..!

ఏసీలు మీరు పెడతారు.. మీకు చల్లందనము.. మీ చుట్టూ వున్నవాళ్ళకి వెచ్చందనము.. మొక్కలొద్దు.. చెట్లద్దు.. దొడ్లద్దు.. తోటలొద్దు.. పచ్చదనం మీద యింత పగ పట్టారేమిరా? సిమెంటు రంగుకి సాటిరాదురా?

ఇంకా నాకు వోపిక లేదు! అదంతా నాకు తెలీదు.. నాకు దారి యిస్తారా? చస్తారా? యింకుడు గుంతలకన్నా ముందు.. సిమెంటు కనపడితే తవ్వండిరా.. పలుగూ పారా అందుకోండిరా.. గునపాలు తియ్యండిరా.. యీ సిమెంటుని తవ్వి పారేయండిరా.. గచ్చులు చప్టాలు ప్లాస్టింగులు పగలగొట్టండిరా.. మీ సమాధులు మీరు తవ్వుకొని బయటకు రండిరా.. బయటపడండిరా.. నేలతల్లికి గాలాడితేనే మీకు గాలాడుతుంది! నాకు దారి యిస్తేనే మీకు దారి! వీధులన్నీ తిరిగి కాలనీలన్నీ తిరిగి జనావాసాలలో తిరిగి యింకుడు గుంతలలోనే యిమిడలేక అలసిపోయి మట్టిలో యింకే మార్గం లేక రోడ్డెక్కానురా..! మీరూ మీ బతుకులూ రోడ్డెక్కుతాయిరా..!

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలో చేరి స్తన్యమవుతాను.. మీ దప్పిక తీరుస్తాను.. మీకు ప్రాణం పోస్తాను..

నాకు తోవ యివ్వండిరా.. తల్లి గర్భంలోకి తోవ యివ్వండిరా..

మీ

వాన చినుకులు

 

 

ఓ మై గాడ్!

 

                                                                     -బమ్మిడి జగదీశ్వరరావు

 

దక్షిణాఫ్రికాలో చర్చిలు వున్నట్టే సఫారీ పార్కులు కూడా వున్నాయి! చర్చిలో పాస్టర్లు వున్నట్టే సఫారీ పార్కులో సింహాలు కూడా వున్నాయి! జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్లంతా సింహాలు వుండే క్రూగర్ నేషనల్ సఫారి పార్క్ కు వెళ్ళారు! సింహాల తరుపున పాస్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తారేమోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు!

ఇటు చూస్తే పాస్టర్ల గుంపు! అటు చూస్తే సింహాల గుంపు!

పాస్టర్ అలెక్ ఎండివాన్ ను తోటి పాస్టర్లు ఆపినా ఆగకుండా సింహాలవైపు నడిచాడు! దేవుడు తనయందు వున్నాడన్నాడు! సింహాలయందు కూడా దేవుడు వుంటాడని మిగతా పాస్టర్లు చెప్పిచూసారు! నేను దేవుని ప్రతినిధిని అని ఎండివాన్ యెంతో గర్వంగా చూసాడు! దేవుడు నన్ను సింహాల నుండి రక్షిస్తాడు అనికూడా అంతే నమ్మకంగా చెప్పాడు!

పాస్టర్లంతా దేవుణ్ణి ప్రార్ధించడం మాని ఎండిమాన్ ని ప్రార్ధించారు! అవి సింహాలని.. దేవుడు చెప్పినా వినవని.. మొత్తుకున్నారు! దేవుడు చెపితే యెవరన్నా వినవలసిందే.. సింహాల్లారా! మీరయినా వినవలసిందే.. అని సింహాలకు అరిచి మరీ చెప్పాడు ఎండిమాన్! అరుపులు విన్న సింహాలు- మాంసము తినడం మాని- తోకూపుతూ ఎండిమాన్ ను చూసాయి! దేవుని వాక్యము మీరు కాదనగలరా? అని మరోమారు అరిచాడు ఎండిమాన్! సింహాలు లేచి నిలబడ్డాయి! అదీ గౌరమంటే అని మురిసిపోయాడు ఎండిమాన్! దేవుణ్ణి ప్రార్ధిస్తూ సింహాలకు యెదురెళ్ళాడు!

ఎండిమాన్ ని మిగతా పాస్టర్లు వేన్లోకి రమ్మని ప్రాధేయపడ్డారు! దేవుణ్ణి అవమానించొద్దన్నాడు ఎండిమాన్! దేవుడు గొప్పో సింహాలు గొప్పో తేలిపోతుంది అని గంతులువేసాడు! నాది దేవుని త్రోవ అన్నాడు! సింహాలు త్రోవకు దగ్గరగా వచ్చేస్తున్నాయి! దేవుని త్రోవను అనుసరించలేక తోటి పాస్టర్లు వెంటనే వెనక్కి వచ్చి వేనెక్కారు! ఎండిమాన్ కూ సింహాలకూ వున్న మధ్య దూరం క్షణాల్లో తగ్గుతోంది!

దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక.. అని నినదించాడు ఎండిమాన్! సింహాలు జూలుదులుపుకు పరిగెత్తుకువచ్చాయి! అంతవరకూ వున్న సింహాలు సింహాలుగా కాక, వొక్కసారిగా మీదకోస్తున్న సైతానుల్లా కనిపించాయి! అంతే-

దేవుడా.. అని ఎండిమాన్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు! సింహాలు ఆగిపోలేదు.. పరిగెత్తుతూ వచ్చేసాయి! సింహాలకన్నా వేగంగా పరిగెత్తలేకపోయాడు! సింహాల పంజా దెబ్బలకు రక్తంతో అతని పిరుదులు వరదలు గట్టాయి! సమయానికి సఫారీ పార్క్  సిబ్బంది వచ్చి సింహాల బారినుండి ఎండిమాన్ ను కాపాడారు!

ఎండిమాన్ ని పరామర్శించడానికి చాలా మంది భక్తులూ తోటి పాస్టర్లు వచ్చారు!

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎండిమాన్ ‘బహుశా.. జంతువులపై తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే దేవుడు నన్ను వాడుకొని వుంటాడు’ అని తనని తాను సమర్ధించుకున్నాడు! తోటి పాస్టర్లు ఎండిమాన్ కు తలమీద కూడా దెబ్బ తగిలిందేమోనని కలవరపడి డాక్టర్లని చూడమన్నారు! అలాంటిదేమీ లేదని డాక్టర్లు చెప్పారు!

ఈ ఆందోళనలతో సంబంధం లేకుండా- సింహాల ఆధిపత్యానికి అవకాశం లేదు, వాటిని నిలువరించి తన ఆదిపత్యాన్ని దేవుడు నిరూపించుకున్నాడు, అందుకు నన్ను వాడుకోవడం నాకెంతో గర్వంగా కూడా వుంది- అని నొప్పిగా కూడా వుంది అన్నట్టు మూలిగాడు ఎండిమాన్!

అలా దేవుని నిర్ణయము మీదికి మళ్ళాయి మాటలు!

“దేవుడు వచ్చేవాడు.. కానీ ఎండిమాన్ దేవుడికోసం నిరీక్షించలేదు.. సింహాలను చూసి వెనుతిరిగిపోయారు.. దేవుని తోవన నిలువగలిగి వుంటే దేవుడు తప్పక రక్షించేవాడు..!” వణుకుతున్న స్వరంతో అన్నాడు అందర్లోకీ ముదర పాస్టరు!

ఎండిమాన్ ఆమాట విని అవాక్కయాడు! ఆలోచనలో పడ్డాడు! తనను పరామర్శించడానికి వచ్చారో విమర్శించడానికి వచ్చారో అతనికి అర్థం కాకుండా వుంది!

“అసలు ఆ దేవుడే సింహాల రూపములో వొచ్చాడని యెందుకు భావించకూడదు..?” మరో లేత పాస్టరు ప్రశ్నించాడు! “విశ్వ వ్యాప్తమైన దేవుడు సింహాలలో మాత్రం లేడని యెట్లు భావించగలం..?” అని తన మాటకు తనే మద్దతుగా మాట్లాడాడు ఆ పాస్టరు!

“కాదు.. కాదు! ‘దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక..’ అని ఎండిమాన్ అన్నాడు! ఆమాటను పరీక్షించి పరిశీలించండి! ‘దేవుడా నువ్వే గనుక వుంటే’ అంటే అని ప్రేయర్ చేయడం తప్పు! ‘నువ్వున్నావ్.. నన్ను తప్పక రక్షిస్తావ్..’ అనికదా ప్రార్థించాలి! ‘వుంటే’ అనడంలో ‘లేకుంటే’ అనే ధ్వని వున్నది! నాస్తిక ధ్వని వున్నది! యిది అపచారము! పైగా ‘నన్నేమీ చెయ్యబోవుగాక..!’ అని అనుటలో దైవాన్ని ఆదేశించడము అగుపించు చున్నది! పాపవాక్యం.. పరిశుద్ధమగుగాక..!” ఎండిమాన్ కు పోటీదారుగా వున్న మరో పాస్టరు యింకా మాట్లాడేవాడే-

“దేవుడు గొప్పో – సింహాలు గొప్పో తేలిపోతుంది’ అని దేవుడిని సింహాలను నీవు సమానం చేయడం దేవుడికి నచ్చలేదు..!” అని మరో నడివయసు పాస్టరు అంటే- “సింహాలకు కూడా నచ్చలేదు, అందుకే నీ పిరుదులు చీల్చాయి..!” అని మధ్య వయసు పాస్టరు మధ్యలో అన్నాడు! “దేవుడే సింహాలను ఆదేశించి ఆపని చేయించాడు..!” అన్నాడు యింకో పాస్టరు!

“అయితే సింహాలకు ఆ కార్యముతో సంబంధము లేదు.. అవి నిమిత్తమాత్రమైనవి..!” యింకో పాస్టరు అన్నాడు! ఎండిమాన్ కు శరీరం మీది గాయాల నొప్పి తగ్గింది! అంటే మనసులో నొప్పి తీవ్రమైంది! కంట నీరు పెట్టుకున్నాడు!

“నిన్ను రక్షించే అవకాశం నీవే దేవునికి యివ్వలేదు..! అక్కడే నీవు నిలిచి వున్నచో పరిగెత్తుకు వచ్చిన సింహాలు ప్రభువు చేత నిమరబడిన గొర్రిపిల్లలు అయ్యేవేమో..?! దేవుని ఆజ్ఞ లేకుండా సింహాలు నీ మీద దాడికి వచ్చునా? ఈ నిజవాక్యమును నీవు విస్మరించినావు..!” వణుకు తోనికే స్వరంతో అన్నాడు ముదర పాస్టరు!

“నీవాక్యముపట్ల నీకు నమ్మకము లేదు..! నీ నమ్మకముపై నీకు విశ్వాసము లేదు..!” ఎండిమాన్ కు పోటీదారుడైన పాస్టరు పలికాడు! “యిది మన పాస్టర్లను అవమానపరచడమే..!” అనికూడా అన్నాడు! అతని వాక్యము ఆప్తవాక్యమైనట్టు అందరూ మౌనం పాటించారు!

“అంతకంటే సింహాలకు ఆకలి తీర్చిన వాడవైతే.. నీ జీవితమూ చరితార్ధమయ్యేది..” పోటీ పాస్టరు మౌనాన్ని భగ్నం చేసాడు!

అవమానంతో తల తిప్పుకున్నాడు ఎండిమాన్! దేవుని పట్ల తన ప్రవర్తన అపచారంగా భావించి విచారంగా కన్నీళ్లు కార్చాడు ఎండిమాన్! కుమిలిపోయాడు!

కాసేపటికి తేరుకొని, కళ్ళు తుడుచుకొని “దేవుని శిక్షకు నేను అర్హుడని..!” వొప్పుకుంటున్నట్టుగా తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు. అని, “మరి దేవునికి అవకాశమీయక మీరెందుకు వెనక్కి పరిగెత్తుకు వెళ్ళి వేనెక్కినట్టు..?” తల యిటు తిప్పి అడిగాడు ఎండిమాన్!

అప్పటికే తోటి పాస్టర్లు అక్కడలేరు! అవతలికి నడిచి డాక్టర్లతో మాట్లాడుతున్నారు!

మధనపడ్డ ఎండిమాన్ మధించి మధించి అనుభవాన్ని శోధించాడు! సత్యాన్ని తెలుసుకున్నాడు! వొక సత్యవాక్య తీర్మానమూ చేసుకున్నాడు! “దేవుని విశ్వసించ వలెను! కాని ఆ విశ్వాసము నెగ్గుట కొరకు బరిలోకి దైవాన్ని దింపరాదు.. మనమూ దిగరాదు.. దిగినచో దేవుడు కూడా రక్షించలేడు..!” అని!

“దేవుడు దయామయుడు.. దయామయుడు అయినచో నన్ను యెందులకు రక్షించలేదు..? అలా రక్షించనిచో దేవుని వునికి యెటుల తెలియును..? దేవుని వునికి విస్తరింప జేయుటయే పాస్టర్ల ప్రాధమిక బాధ్యత కదా? ఆ బాధ్యతకు ప్రభువే ప్రతిబంధకంగా నిలుచుటలోని పరిహాసమేమి? అంతరార్దమేమి? నేను దైవం పక్షం వుండినాను, దైవము నాపక్షము యేల లేదు..? నేను రేపు దైవము అస్తిత్వాన్ని అందించిన జనులు అందుకుంటారా? మీ యెడల లేని దైవము మా యెడల యెటుల వుండును.. అని ప్రశ్నించిన యేమి కర్తవ్యము? మీ అస్తిత్వం లేకుండా నా అస్తిత్వం వుండునా? నా అస్తిత్వం లేకుండా మీ అస్తిత్వం వుండునా..?”

లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దేవుని అస్తిత్వం.. తన అస్తిత్వం సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“నా మనసు పాప పంకిలమగుచున్నది.. అయినా పాపులను రక్షించుటకే కదా ప్రభువు పుట్టినాడు.. నన్ను రక్షించలేదు అంటే నేను పాపిని కాను! పరిశుద్దుడను! పరిశుద్దమే దైవము! అటులైన నేనే దైవము! దైవము వేరుగా లేదు! లేదు దైవమే లేదా?..”

మళ్ళీ లెంపలేసుకున్నాడు ఎండిమాన్! దైవాన్ని.. తన్ని సమం చేసి ఆలోచిస్తున్ననా? అని మళ్ళీ భయం వేసింది! ఆలోచనలు ఆగడం లేదు.. తెగడం లేదు..

“డాక్టర్..” పెద్దగా అరిచాడు ఎండిమాన్! భరించలేని తనం గొంతులో కనిపించింది! డాక్టర్లూ సిస్టర్లూ పాస్టర్లూ పరిగెత్తుకు వచ్చారు! ఏమయింది అన్నారు! తనని రక్షించమన్నాడు! ‘దేవుడు నిన్ను రక్షించుగాక’ పాస్టర్లు దీవించి ప్రార్ధించబోయారు! ‘దైవం నుండి రక్షించుగాక..’ అనుకున్నాడు ఎండిమాన్! ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోయాడు! పాప భయంతో మళ్ళీ లెంపలేసుకున్నాడు! భయంతో వణికాడు! ఆ భయం సింహాలు వెంటపడ్డప్పటి భయాన్ని మించిపోయింది!

ఎండిమాన్ చేష్టలన్నీ ప్రాయశ్చిత్తపు వుపసంహారంగా భావించారు పాస్టర్లు! నీవు పరిశుద్దుడవి అన్నారు! కాదన్నట్టు అడ్డంగా తలూపాడు ఎండిమాన్! దేవుడు మన్నించాడు అనుకున్నారు పాస్టర్లు! ఎండిమాన్ లో వొచ్చిన మార్పుకు మురిసిపోయారు!

విలవిలలాడిన ఎండిమాన్ యెటువంటి ఆలోచనలు రాకుండా ప్రశాంతత కోసం మత్తు యింజక్షన్ యివ్వమన్నాడు! డాక్టరు చేతుల్ని పట్టి వదల్లేదు! దైవం కన్నా ప్రశాంతత, వుపశమనం వుంటుందా? తోటి పాస్టర్లు అనేసరికి తలయెత్తి దబా దబా వెనక్కి కొట్టుకున్నాడు! డాక్టర్లూ సిస్టర్లూ ఎండిమాన్ ఆపుతూ అతని తలని గట్టిగా పట్టుకున్నారు!

దైవ ప్రార్ధనలు చేసారు చుట్టూ చేరిన పాస్టర్లు!

 

సినిమా తీయిస్త మావా..!

 

 

                                                       -బమ్మిడి జగదీశ్వరరావు

వుడ్ బీ ప్రొడ్యూసర్ కి!

ఒరే మావా..

వుడ్ బీ అంటే కాబోయే అని మాత్రమే అనుకోనేవు! వుడ్ అంటే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లాగే.. ‘వుడ్’ అంటే చెక్క.. అలాగే ‘బీ’ ఫర్ భజన! టోటల్లీ చెక్క భజన! చెక్క భజన చేస్తూనే వుండాలి.. జీవితాంతమూ.. తల్లివి నీవే-తండ్రివి నీవే- చల్లగ మము కరుణించే దైవము నీవే- అని కీర్తించాలి.. నీ అంతటోడు లేడు.. నువ్వు హీరో కావడం మా పూర్వజన్మ సుకృతం.. బాబుగారు సహకరించడం వల్లే సినిమా పూర్తయింది.. బాబుగారు డేట్స్ యివ్వడం వల్లే జన్మ ధన్యమయ్యింది.. బాబుగారి సలహాల వల్లే సినిమా (ఫట్టయినా) హిట్టయింది.. ఆబాబుకు వంశముంటే ఆ వంశాన్ని కూడా అని నిత్యమూ నిరంతరమూ సోపెయ్యాలి! టిష్యూ పేపరు అవసరం లేకుండా సాంతం నాకెయ్యాలి.. యిదే మొదటి సక్సెస్ మంత్రం! యిదే గాయత్రీ మంత్రం!

ఓం ప్రధమం సినిమాకి కావలసింది కథ కాదు! పేకేజీ కావాలి! విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పేకేజీ యెంత అవసరమో- అంతకన్నా యెక్కువ అవసరమీ పేకేజీ! వొక హీరో.. వొకరో యిద్దరో ముగ్గురో నలుగురో బొంబాయి హీరోయిన్లూ.. హిందీ విలన్లూ.. మార్కెట్లో ఆరోజుకి హిట్టు కొట్టిన డైరెక్టరూ.. సాంకేతిక నిపుణులూ.. కామ్బినేషన్లన్నీ కలిపిన దాన్ని పేకేజీ అందురు! కథ లేకపోయినా- అది కథ కాకపోయినా- కథ ఫారిన్లో మొదలవ్వాలి.. ఇంటికి అంటే ఇండియాకి రావాలి! ఫారిన్ లోకేషన్లతోనే రిచ్ నెస్ తేవాలి! హీరోయిన్ల అందాల ఆరబోతే కావాలి! పాటలు అదిరిపోవాలి! ఫైట్లుకు బెదిరిపోవాలి! సంచులకొద్దీ పంచులు వుండాలి! వ్యాంపు సాంగ్ మస్ట్! కామిడీ కంపలసరీ.. సరేసరి!

ఇక సినిమా తియ్యాలంటే మనజేబులో డబ్బులు ఖర్చుపెట్టుట మహానేరము! పక్కవాడి జేబు పరమ వుపయోగమూ పరమపద సోపానమూ! పక్కవాడి జేబునే ఫైనాన్సు అందురు! సినిమా అనిన జూదము! జూదములో మన ఆస్తులు పోగొట్టుకొనుట తెలివి తక్కువతనము! పక్కవాడి ఆస్తులు పెట్టి మనము తాకట్టువుండుట గుడ్డిలో మెల్ల అగును!

మేకింగ్ కాస్టులో మేజర్ బడ్జెట్ అంటే సగం బడ్జెట్ హీరోకూ- మరో సగం డైరెక్టరూ హీరోయిన్లూ మిగతా ఆర్టిస్టులూ పోనూ.. ప్రొడక్షనూ పోస్ట్ ప్రొడక్షనూ పోనూ.. మన ఖర్చులు పోనూ- మన ఖర్చులు అంటే పార్టీలూ స్పాన్సరింగులూ కామన్.. పీఆర్ పెంచుకోవాలి కదా.. మన యింట్లోకి కాలసిన బియ్యమూ పప్పులూ వుప్పులే కాదు, కుర్చీలూ కంప్యూటర్లూ దాక అటు చూపించి యిటు మల్లించుటన్న మాట- చిన్నా చితకా ఆర్టిస్టులకు టెక్నీషియన్లకూ కాస్తంత ఎగ్గొట్టి- పైకి రావాల్సివుంటుంది!

నా అనుభవాలే నీకు చెప్పగలను.. నేను చూసినవి చెప్పగలను.. చాలామంది సినిమా మా ఫేషన్ అని, అందుకే ఈ రంగానికి వచ్చామని చెపుతుంటారు! సినిమావాళ్ళ మాటలు నమ్మొద్దు అనేది ఇక్కడా వర్తిస్తుంది! ఎందుకంటే యెక్కువమంది అమ్మాయిల కోసం వస్తారు! ఎంజోయ్ చెయ్యాలని వస్తారు! డబ్బు వున్నప్పుడు అన్నీ.. యెన్నోకొన్నీ సాధ్యమే! అయితే అందుకోసమే వస్తే వచ్చిన కంటే వేగంగా వెళ్ళిపోవడమూ నిజమే! రియలెస్టేట్ లాంటి వేరే వ్యాపారాలు వున్నవాళ్ళు సీజనల్ గా వస్తారు.. ఇండస్ట్రీకి బాకీ వున్నట్టు డబ్బు చెల్లించేసి వెళ్ళిపోతారు! ఆల్రెడీ యిండస్ట్రీలో వున్నోళ్ళు కొత్తవాళ్ళని ముంచేస్తారు.. మళ్ళీ తేలడం వుండదు.. అలాగే యిన్నాళ్ళు శాటిలైట్ వుండేది.. వూపిరి ఆడేది.. యిప్పుడు అదీలేదు.. పెద్దహీరోల సినిమాలే టీవీల వాళ్ళు కొనడం లేదు! దానికి కూడా వో హిట్టు సినిమాతో కలిపి అంటగడితే కాని అమ్ముడుపోవడం లేదు.. శాటిలైట్ వున్నప్పుడు తెగ చిన్నా చితకా చెత్తా చెదారం సినిమాలు వొచ్చేవి.. పెరుగుట విరుగుట కొరకే అయిపొయింది.. అయినా సినిమాకి జీవితానికి సంబంధం లేదు.. అలాంటప్పుడు సినిమాలు యెందుకు చూస్తారు చెప్పు..? అన్నీ నెగటివ్ పాయింట్స్ చెపుతున్నానుకోకు.. నెగటివ్ పాయింట్స్ అన్నీ ఫ్యూచర్లో నీకు పాజిటివ్ పాయింట్స్ అవుతాయి! అవ్వాలి!

నువ్వు ప్రొడ్యూసర్ కావడం నాకేదో పోటీ అని నేను నీకివన్నీ చెప్పడం లేదు.. అలా అయితే ఫిలింసిటీ వుండి- ఉషాకిరణ్ బేనర్ మీద సినిమాలు తీసిన రామోజీరావు మునిపటిలా సినిమాలు యెందుకు తీయడంలేదు? సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లకి హీరో వుండి స్టూడియో వుండి మునిపటిలా సినిమాలు యెందుకు తీయడంలేదు? రిలయన్సు లాంటి కార్పొరేట్ సంస్థలు వొచ్చినవి వొచ్చినట్టే యెందుకు వెనక్కి వెళ్ళిపోయాయి?

మాతో హిట్టులు కొట్టిన హీరోలే మాకు డేట్లు యివ్వడం లేదు! ఒక్క ఫ్లాప్ కొడితే మనమెలా డైరెక్టర్ ముఖం చూడమో.. మనమొక ప్లాప్ యిస్తే హీరోలూ మన ముఖం చూడరు.. తరువాత చెప్పలేదని నన్ను నిందిస్తే కుదర్దు.. అందుకే అన్నీ ముందే చెప్పేస్తున్నా..

అప్పటికీ తెలుగు సినిమాని కాపాడుకోవడానికి తెలివైన మేధావులమంతా యెప్పటికప్పుడు వొక్కచోట చేరుతూనే వున్నాం! మీటింగులు పెట్టి మాట్లాడుతూనే వున్నాం! ఆ అనుభవాలు కూడా నీకు తెలియజేస్తున్నాను..

ఏడాదికి నూటరవై స్ట్రెయిట్- డబ్బింగో నలభై- మొత్తం రెండువందల సినిమాలు తీస్తే నాలుగు నుండి ఆరు సినిమాలే ఆడుతున్నాయని, మిగతా నూట తొంభైయ్యారు సినిమాల నిర్మాతలు నెత్తిమీద తడిగుడ్డ వేసుకోవాల్సిందేనని చాలామంది నిర్మాతలు వాపోయారు! చిన్న నిర్మాతల చింతయితే యింతా అంతా కాదు!

నిర్మాతల బాధలు పగవాడికి కూడా రాకూడదు గాక రాకూడదు! మొన్న నిర్మాతల సంఘం మీటింగులో పైరసీ అన్నారొకరు. థియేటర్లు దొరకడం లేదు అన్నారింకొకరు. దొరికినా జనం రావడం లేదన్నారు మరొకరు. టీవీలకి జనం బాగా అలవాటు పడిపోయారన్నారు యింకొకరు. మరేం.. సినిమా రిలీజయినప్పుడు చూడకుండా టీవీలో వొచ్చినప్పుడు తెగ చూసేసి రేటింగ్ పెంచేస్తున్నారు అన్నారు వొకరు. అందుకే డైరెక్ట్ గా టీవీల్లో రిలీజ్ చేయండి.. జనం సినిమాలకు రావడం లేదని, థియేటర్లు దొరకడం లేదని ప్రోబ్లమే వుండదని కమలహాసన్ చెప్పలేదా? గుర్తుచేశారు యింకొకరు!

అందుకే వారానికి వొకట్రెండు సినిమాలే రిలీజు చేసి.. మరో సినిమా చూసే అవకాశం లేకుండా.. ఛాన్సు యివ్వకుండా.. అన్ని థియేటర్లలో ఆడించేస్తే జనం చచ్చినట్టు చూస్తారని.. వారంలో రెవెన్యూ గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వొచ్చేస్తుందని ప్లాన్ చేశాం.. అదీ పూర్తిగా వర్క్అవుట్ కాలేదని ఈసురోమంటుంటే- మీ పెద్ద సినిమాలు ఎంచక్కా వారానికి వొకటే.. ఎటొచ్చీ మా చిన్న సినిమాలే వారానికి ఏడు రోజుల్లాగ ఏడు సినిమాలేసి కలక్షన్లు కాదుకదా కనీసం రివ్యూ కూడా రావడం లేదని- పానకంలో పుడకలా చిన్న సినిమాల నిర్మాతలు లబో దిబో మన్నారు! మాది గానుగే పోయింది.. మీదెంత?, గానుగులోది గిద్దెడు- అని పెద్ద నిర్మాతలు పెడబొబ్బలు పెట్టారు!

ఎండలు కదా అని చల్లార్చబోయాడో మేథోనిర్మాత! కుర్రాళ్ళకి పరీక్షలు కాదా చెప్పాడో మేధావి! ఉపశమనం లేకపోగా వుస్సురు మన్నారు మన నిర్మాతలు! ప్రొడక్టివ్ ఖర్చు.. బడ్జెట్ తగ్గించుకుంటే జెట్ లా సినిమాలు దూసుకుపోతాయి అన్నాడు మరో మేథోనిర్మాత! ఆ  మేథావే స్టార్ హీరోకు మార్కెట్ రేటుకన్నా మరో రెండు కోట్లు యెక్కువిచ్చి డేట్స్ సొంతం చేసుకున్నాడు! తెలంగాణ సర్కార్ ఈమధ్య ఐదు ఆటలకు అవకాశం కల్పించినా అదీ వేస్టేనని యేమంత కలిసోచ్చేది కాదని కూడా మా నిర్మాతలు అనుకున్నారు!

అయినా రిస్కున్నప్పుడే కదా గ్రోతు?

ఎవరి అనుభవాలు వాళ్ళవి! నేను బయటకు వస్తుంటే నువ్వు లోపలకు వెళ్తానంటున్నావ్! వెళ్లి రా..! క్షేమంగా వెళ్ళి లాభంగా రా..! సినిమా యిండస్ట్రీ వొక పుష్పక విమానం.. తలుపులు యెప్పుడూ తెరచియే వుండును! నే వెంట్రుకంతే చెప్పాను.. జడంత మడంత నీకు నువ్వు అనుభవమ్మీద తెలుసుకోవలసి వుంటుంది! ఈతకు దిగేవాడికి లోతు గురించి చెప్పకూడదంటారు.. చెప్పి నేను తప్పు చేసానేమో..!?

నీకిదే స్వాగతం.. రా..

నీ

మావ

(ఆల్రెడీ ప్రొడ్యుసర్)

హింసే పరమో ధర్మః

 

                   -బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi ఉదయ భానూ..!

ఉన్నావా..?

కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ.. నిన్ను నీవు పలుకరించు కోవడం.. నిన్ను నీవు పరిచయం చేసుకోవడం.. నిన్ను నువ్వు పరామర్శించు కోవడం.. నీలోకి నువ్వు తొంగి చూసుకోవడం.. నీలోని ప్రపంచాన్నే కాదు, నీ చుట్టూవున్న ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం.. కవిత్వంలో మాత్రమే సాధ్యం కదూ..

కవిత్వం జీవితం కదూ.. జీవితంలో కూడా సాధ్యమే కదూ..

ఏమో.. అందుకేనేమో.. నాకు నేనే వుత్తరం రాసుకోవడం కోవడం చూస్తే భలే చిత్రంగా వుంది! విచిత్రంగానూ వుంది! నిజానికి యెవరికి వుత్తరం రాయాలో తెలీదు! చుట్టూ అందరూ వుండి వొక్కోసారి మనకు మనమే వొంటరి అవుతాం! వొంటరిగ అనిపిస్తాం! రోహిత్ అలాగే వొంటరయ్యాడు! సమూహం నుండి తాత్కాలికంగానైనా వేరవుతాం! వేరు చేయబడతాం! రాజ్యానికా బలం వుంది! బలగం వుంది!

మనసు నిండా రాయాలని వుండి కూడా రాయలేని వేళ్ళు.. నొప్పి పుడుతున్న వేళ్ళు.. కనీసం పెన్ను పట్టలేని వేళ్ళు.. కంప్యూటర్లో బటన్ వొత్తలేని వేళ్ళు.. నా వేళ్లే.. అందమైన అక్షరాలు అనంతంగా రాసిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసుల యినుప బూట్ల కింద నలిగిన వేళ్లే.. నా వేళ్లే.. పోలీసు వేను మెట్ల మీద నలిగిన నల్లని నా వేళ్లే.. నావి కాకుండా.. నా స్వాధీనంలో లేకుండా..

వేళ్లేనా నొప్పి పడుతున్నది.. ఈ దేహంమొత్తం ఈ దేశంమొత్తంలానే నొప్పి పడుతున్నది.. కాళ్ళు యిద్దరు.. చేతులు యిద్దరు.. పట్టుకున్నారు.. వొకడు.. ఆరున్నర అడుగుల దేహమున్న వాడొకడు.. దున్నపోతులా వున్నాడు.. గుండెలమీద.. పొట్ట మీద.. తొడల మీద.. పిచ్చి పట్టినట్టు గెంతుతున్నాడు.. శరీరాన్ని మట్టి ముద్దను చేసి కుమ్ముతున్నాడు.. వాడూ మనిషే.. వాడిలోని మృగమేదో.. రంకేలేస్తోంది.. దుంకులు దుంకుతోంది..

కళ్ళు మూసినా తెరచినా వాడి ముఖమే! ఆ మృగం ముఖమే! వాడి స్వరమే! ‘లంజా కొడకా.. లంజా కొడకా..’ నా చెవుల్లో యిప్పుడు కూడా ప్రతిధ్వనిస్తోంది!

‘అసలేం జరిగింది?’ యెవరికి వారే అడుగుతున్నారు! ఏం జరుగుతుంది? సెలవుమీద వెళ్ళిన వీసీ పొదిలి అప్పారావు యూనివర్సిటీకి మళ్ళీ వచ్చాడు! తన రాకను పండగ చేసుకొమ్మని రహస్యంగా సర్క్యులర్లు పంపాడు! మెయిల్స్ చేసాడు! రహస్యమెప్పుడూ బహిరంగమని ఆయనకు తెలుసు! రహస్యమే రాజ్యమేలుతుందనీ తెలుసు! రహస్యమే అద్భుతంగా ప్రచారం అవుతుందనీ తెలుసు! తెలిసిందే చేశాడు! తెలిసే చేశాడు! వేడుకగా తనని ఆహ్వానించమని టైంటేబుల్ని తనే యిచ్చాడు! తన అనుయాయులకు కార్యక్రమం తనే రాసిచ్చాడు! తనకు యెలా గ్రీటింగ్స్ తెలపాలో కూడా రాసిచ్చాడు! తనడబ్బా తనే కొట్టుకున్నాడు! టైం టు టైం జరిగే ప్రోగ్రాంషీట్ జిరాక్స్ కాపీలను విద్యార్థులలోకి వెళ్ళేలా చూసాడు! రెచ్చగొట్టాడు! మీరు నా వెంట్రుక పీకలేరని పరోక్షంగా అనిపించేలా ప్రత్యక్షంగానే అల్టిమేటం యిచ్చాడు!

విద్యార్థులు తనని అడ్డుకోవడానికి వస్తారని తెలుసు! విద్యార్థుల మిలిటెన్సీ తెలుసు! తను సేఫ్ గా వుండాలంటే యేo చెయ్యాలో కూడా తెలుసు! మీడియాని తిప్పుకోవడం తెలుసు! కొందరయినా తిరగరని తెలుసు! అందుకే తన అనుయాయులైన సంఘం విద్యార్ధులతో ఫర్నిచర్, అద్దాలు, టీవీలు ధ్వంసం చేయించాడు! కోపంతో వున్న విద్యార్ధులు వొచ్చి జత కలిసారు! అసలు పని చేసిన వాళ్ళు పక్కకు తప్పుకున్నారు! స్క్రీన్ మీదకొచ్చి వీడియోలకూ ఫోటోలకూ చిక్క వలసిన వాళ్ళే చిక్కారు! స్క్రిప్ట్ ప్రకారమే షూట్! దిగవలసిన సమయానికే పోలీసులు దిగారు! పోలీసులంటే క్యాంపస్ పోలీసులు కారు.. తెలంగాణ పోలీసులే!

పోలీసులు మొదట నెమ్మదిగా వొక్కొక్కర్నీ లాక్కు వెళ్ళారు! తరువాత వేగం పెంచారు! వందలమంది పోలీసులు! ఈడ్చి పడేశారు! రాకుండా లొంగకుండా పెనుగులాడుతూ వున్న వాళ్ళని డొక్కలోతన్నారు! విద్యార్ధులు మెలితిరుగుతూనే నినాదాలిచ్చారు! అంతే అమ్మాయిలని చూడకుండా చెంపలు చెల్లుమనిపించారు! బూతులు తిట్టారు! ‘రేప్ అయిపోతారే లంజముండల్లారా’ అని హెచ్చరించారు! అబ్బాయిలకయితే రెండుకాళ్ళ మధ్య యెక్కడ తంతే గింజుకుంటామో అక్కడ తన్నారు! తరిమి కొట్టారు! దొరికిన వాళ్ళని దొరికినట్టు చితక్కొట్టారు! విద్యార్థులు ఆవేశం పట్టలేక రాళ్ళు రువ్వారు! పోలీసులూ రాళ్ళు రువ్వారు! చెట్టుకొకర్నీ పుట్టకొకర్నీ చేశారు! చీమలపుట్టని కదిపినట్టు కదిపారు! ఒక్కొక్కర్నీ చేసి కొట్టారు! వందలమందిని యెత్తుకెళ్ళారు! ఎక్కడకు తీసుకు వెళుతున్నారో తెలీదు! ఏం చేస్తున్నారో తెలీదు! అప్పటికి నేను హ్యుమానిటీస్ బిల్డింగ్ దగ్గర వున్నాను! నీళ్ళు తాగి వచ్చాను! పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టాను! తప్పించుకున్నాను!

ఇరవై ఆరుగురు విద్యార్థులు అరెస్టు! ఇద్దరు ఫేకల్టీలు అరెస్టు! మొత్తం యిరవై యెనిమిది మంది అరెస్టు! చర్లపల్లి జైల్లో పెట్టారు! ఇరవై యిద్దరు అబస్కాండు.. అని చూపించారు!

వీసీ వొస్తున్నాడనగా నెట్ బంద్! వొచ్చాక ఆవాళ మధ్యాన్నం నుండే మెస్సులు బంద్! మంచినీళ్ళు బంద్! కరెంటు బంద్! నాన్ టీచింగ్ స్టాఫ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొన్నాడు! తను తెర వెనక వున్నాడు! తెర ముందు లొల్లి విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూ! అదే అదునుగా ప్రచారం చేశాడు! చివరకు షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపుల్ని సయితం మూయించాడు! పోనీ యూనివర్సిటీ బయటి నుండి ఫుడ్ లోపలకు తెచ్చుకుందామంటే లేదు! సరే యూనివర్సిటీ బయటకు పోదామంటే లేదు! గేట్లు మూయించేశాడు! పిల్లిని తలుపుమూసి కొట్టినట్టుగా పిల్లల్ని కొట్టించాడు! పిల్లి తిరగబడదా? పిల్లలు తిరగబడరా? తిరగబడితే తప్పవుతుంది! నేరమవుతుంది! నేరం చేసి వాళ్ళకో అవకాశం యివ్వకూడదు అని అనుకున్నాం!

అప్పుడు కూడా ఆ సమయంలో కూడా తెలంగాణ వుద్యమమే మాకు ప్రేరణ! వంటా వార్పుకు దిగాం! మూడు రాళ్ళు తెచ్చి పొయ్యి పెట్టాం! రాళ్ళ మధ్యన వంటేమిటి? క్యాంపస్ రోడ్లమీద అనుకున్నాం! అలా అయితే మా ఆకలి లోకానికి తెలుస్తుందని అనుకున్నాం! అన్నం దొరికే మార్గం అదొక్కటే అనుకున్నాం! రోడ్డు మీద మూడు రాళ్ళ పొయ్యి.. కర్రా కంపా యేరి తెచ్చుకున్నాం! వంట చేసుకుంటున్నాం! నా తోటి వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు! యిది చరిత్రలో వొక రోజు అనుకున్నాం! ఎందుకంటే తెలంగాణ ప్రేరణగా వంటా వార్పే కాదు, తెలంగాణ వుద్యమం నా యంఫీల్! తెలంగాణ వుద్యమ కవిత్వం మీద నా పీహెచ్డీ! ఏడేళ్ళుగా తెలంగాణ వుద్యమంలో వున్నాను! విరసంలో వున్నాను! ‘జంగ్’ తెలంగాణ వుద్యమ కవిత్వం ప్రచురించాను! ప్రత్యేక తెలంగాణని నాకళ్ళతో చూసాను! నా ఆలోచనల్లో పప్పు వుడికింది! తాళింపుకు పచ్చిమిరపకాయలూ వుల్లిపాయలు కోసి పెట్టుకున్నాం! రుచిగా తిందాం అనుకున్నాం! ఆకలికి యెలా వండినా రుచిగా వుంటుందని నవ్వుకున్నాం!

తెలంగాణ వుద్యమంలో వంటా వార్పూ పబ్లిక్ రోడ్లమీద చేసి నెగ్గినం గాని.. మా ఆకలి తీరడానికి, అదికూడా పబ్లిక్కు సంబంధం లేని రద్దీలేని క్యాంపస్ రోడ్లో చేయడం నేరమయింది! పోలీసులు వచ్చారు! రోడ్లమీద ఆటలేమిటి అన్నారు! ఆటలు కాదు, ఆకలి అన్నాం! ‘మీకు బాగా కొవ్వు పట్టింది.. తియ్యండి.. వంటా వార్పూ లేదు.. లంజ కొడుకుల్లారా..’ లాఠీలతో అందర్నీ వొక వైపుకి తరిమి నన్ను మరో వైపుకి తరిమారు.. షాపింగ్ కాంప్లెక్స్ యెదురుగా వున్న కచ్చా రోడ్డు మీదికి మెడకింద చెయ్యిపెట్టి.. లాక్కెలుతూ వాడే.. మృగంలాంటి ఆ మనిషే.. లాల్ మథర్ గచ్చిబౌలి క్రైమ్ బ్రాంచి ఇన్స్పెక్టర్.. బలంగా వేన్లోకి తోసాడు! వేన్లో పడ్డానో లేదో.. వేన్ విండోస్ మూసేశారు! వేన్ డోర్స్ కూడా! నా గుండెలమీద తొడలమీద తొక్కుతూనే వున్నాడు! సహకరిస్తూ లోపల పోలీసులు! బయట వేన్ చుట్టూ గుంపుగా పోలీసులు! అమాయకంగా యేమీ జరగనట్టు పోలీసులు!

నా మీద వోరల్ చార్జిషీట్.. రోహిత్ పోస్టుమార్టం అప్పుడు వున్నడు వీడే.. డెడ్ బాడీని గుంటూరు వెళ్ళనివ్వకుండా ఆపింది వీడే.. యూనివర్సిటీల అణచివేతలని కుల వివక్షతలని కొట్లాటలల్ల వున్నది వీడే..

మధ్యలో మా యూనివర్సిటీ సేక్యూరిటీ ఆఫీసర్ టీవీ రావ్ వచ్చాడు, విండో తెరిపించి చూసి ‘ఈ లంజ కొడుక్కి బాగా బలుపు సార్.. తొక్కండి సార్ కొడుకును..’ అన్నాడు. మళ్ళీ ఒళ్ళు నెత్తురు యింకిన మట్టి ముద్దయింది!

వాళ్ళ మాటల నుడుమ కుమ్ముతూనే వున్నారు.. ఎడమ చేత్తో జుత్తు పట్టుకు యెత్తి కుడి చేత్తో దవడల మీద గుద్దు మీద గుద్దు గుద్దుతూనే వున్నారు! నన్ను లేపి కూర్చోబెట్టి నా తల స్టడీగా వొకడు పట్టుకుంటే మరొకడు చేతికి మెత్తటి గుడ్డ చుట్టి పిడిగుద్దులు కురిపిస్తూనే వున్నారు.. కనపడని పోలీసు దెబ్బలంటే తెలిసింది.. అంతలోనే మళ్ళీ కింద పడేసి తొక్కాడు.. వొక క్షణం అయితే ఊపిరి ఆగిపోతుందనిపించింది.. చిన్న పిల్లల కాలో చెయ్యో తగిలితేనే గింజుకు పోతామే.. అలాంటి టెస్టికల్స్ మీద బలంగా తన్నాడు! నా ప్రాణం నన్ను వీడి పోయిందా.. తెలీదు.. తలచుకుంటే యిప్పుడు కూడా వొళ్ళు జలదరిస్తోంది..!

‘ప్లీజ్ సార్.. వద్దు సార్.. ఆపరేషనయ్యింది..’ కళ్ళలో నెత్తురు తిరుగుతుంటే అడిగా. ఎక్కడన్నాడు. అబద్దం ఆడుతున్నానని అనుకుంటాడని చూపించా. పోలీసు అని మరిచిపోయా. నిజాయితీగా చెప్పా. వదిలేస్తాడని ఆశ పడ్డా. ఫాంటు విప్పి చూపించా. మల ద్వారం దగ్గర కుట్లు.. సాక్ష్యంగా వేళ్ళాడుతున్న దారాలు.. సరిగ్గా అక్కడే.. గురి తప్పకుండా తన్నాడు! ప్రాణం తెగింది.. విలవిలలాడాను.. పులులకు దొరికిపోయిన లేడి పిల్లనయాను.. నాది గట్టి ప్రాణమే! వున్నాను.. పుండు.. పచ్చి పుండయిపోయాను.. నెత్తురు చుక్క నేల రాలలేదు.. ప్రాణం పొతే యెలావుంటుందో టెస్టికల్స్ మీద తన్నినప్పుడు తెలిసింది! ప్రాణంతో వున్న గుడ్డు పగిలినట్టయింది! ప్రాణం పోయినా బాగున్నని వొక్క క్షణం అనిపించింది!

నా పొట్టలో పేగులు చిరిగే వుండాలి.. పక్కటెముకలు పగిలే వుండాలి.. ఎడమ చెవిలో కర్ణభేరి చిట్లే వుండాలి.. ఎడమ కంటి రెటీనా చిరిగే వుండాలి.. పొత్తికడుపు పొరలు తెగేవుండాలి..

‘చాలు వదిలేయండి’ అన్నాడు ఓ అధికారి. ఇంకో అధికారిణి చెవి దగ్గరకు వచ్చి ‘నిన్ను చంపేస్తాం..’ అని చెప్పింది. ఎందుకో నేను వినడమే తప్ప చూడని జార్జిరెడ్డి ఆ సమయంలో గుర్తుకు వచ్చాడు!

అక్కడికి యెంతోసేపు తెలివి లేదు, తెలివి వొచ్చేసరికి ఆసుపత్రిలో వున్నాను.. ఎవరెవరో వస్తున్నారు.. పోతున్నారు.. సెల్లో రికార్డు చేస్తున్నారు..

మూడ్రోజులకి అన్నిరకాలుగా ఆరోగ్యంగా వున్నానని డిశ్చార్జ్ చేసారు! రిపోర్టులలో నాకు ఆపరేషన్ అయినట్టే లేదు!? యూనివర్సిటీకి వస్తే యెందుకో యేదో నమ్మకమూ తెగువా వచ్చి వంట్లో చేరింది! సత్తువ వొచ్చింది!

ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ పెడితే.. వెళ్ళా, అందరూ కూర్చోమన్న వాళ్ళే.. కూర్చోలేనే! నొప్పి! ‘లెఫ్ట్ చీక్ మీద చిన్న దెబ్బ తప్ప ఉదయ భానుకి దెబ్బలేమీ తగల్లేదు..’ అని పోలీస్ కమీషనర్ చెప్పాడని ఢిల్లీ నుండి వచ్చిన హక్కుల సంఘం ఆమె చెప్పి నవ్వింది!

కళ్ళముందు సాక్ష్యంగా శవంలా తిరుగుతూ నేను..

మూడురోజులుగా భోజనం లేదు! తింటే వాంతి అయిపోతోంది! నీరసంతో ఎన్నాళ్ళు? అడుగుతున్నారు.. తెలీదు.. రోహిత్ గుర్తుకొస్తున్నాడు.. ఓడిపోవడమంటే యేమిటో తెలుస్తోంది.. తెలిసే కొద్దీ రోహిత్ అర్థమవుతున్నాడు! సూసైడ్ చేసుకున్నాడనే రోహిత్ మీద మునుపు వున్న కంప్లైంట్ యిప్పుడు లేదు..

కేసీఆర్ వివక్ష గురించి అసెంబ్లీల మాట్లాడితే నవ్వొచ్చింది! పోలీసుల మీద జాలి చూపించడం చూస్తే.. అరిటాకుతో పోల్చడం చూస్తే జాలేసింది! వీసీని కొట్టి చంపేస్తే.. సియ్యమ్ము పడ్డ బాధ చూస్తే అతని బాదేందో స్పష్టంగానే అర్థమయ్యింది! ‘వీసీని రీకాల్ చేయిస్తా..’ సభకు హామీ యిచ్చి -‘ఎక్సెస్ ఫ్రం ది పోలీస్ వుంటే ఇమ్మీడియట్ ఎంక్వయిరీ చేయిస్తా’నంటున్నాడు. ‘సోషల్ వెబ్ సైట్లలో కావలసినన్ని సాక్షాధారాలు వున్నాయి..’ కళ్ళున్నా చూపులేదు అని మిత్రులు మాట్లాడుకుంటున్నారు!

‘అమ్మ బాధపడిందా..?’ చూడ్డానికి వచ్చిన ఫ్రెండ్ అడిగాడు. అమ్మ గుర్తొచ్చింది! అమ్మ మాటా గుర్తుకు వచ్చింది! ‘కనీసం మీ సెక్యూరిటీ ఆఫీసర్నన్నా కొట్టి రారా యింటికి..’ అమ్మ ఆగ్రహానికి నవ్వుకున్నాను! అమ్మలోని ఆగ్రహం చాలా మంది మాటల్లో చూసాను! రోహిత్ కోసం అందరూ వున్నట్టే.. నాకోసం యెందరో వున్నారు! ఒకరి కోసం వొకరున్నారు! సమూహంలోంచి నన్ను వేరు చేసినా నేను వొంటరి కాననిపిస్తోంది!

నీకు భయం లేదురా భానూ..

నువ్వేరా నేను!

నీ

ఉదయ భాను

 

 

 

మన వాదమూ.. మనువాదమూ..

 

 

   -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi అన్నా.. కేసీఆరన్నా..

యేమి సెప్పినావే.. దిమాక్ కరాబయిపోయిందనుకో! అసెంబ్లీల నీ మాటలు యిన్నం! చాన మంచిగున్నాయ్! మర్సిపోలేకుంటున్నం! సుద్దులూ సామెతలూ ముద్దు ముద్దు మాటలూ మంచిగ ముచ్చట్లూ మస్తుగ సెప్పి నవ్వించెటోనివి! నువ్వు యెంత సీరియస్సుగ సెప్పినావే?! నువ్వు గింత సీరియస్సుగ సెప్పినావంటే.. డవుట్లేదు.. గిది.. గిది సత్యప్రమానకంగా సీరియస్సు  యిషయమే!

నువ్వు వుస్మానియా యూనివర్సిటీల ఎమ్మే తెలుగు సాహిత్యం సదివొచ్చినోనివి! నువ్వు సామాన్యునివా? యెనభై వేల పుస్తకాలు చదివినోనివి! దేశమెట్టుందో యూనివర్సిటీలు యెట్టున్నాయో నీకు గాకపోతే యెవరికి తెలుస్తుంది? నువ్వు గాపోతే యూనివర్సిటీ పోరగాల్లకి యెవలు సెప్పాలే? సెప్పి సెడ్డయిందేమి లేదు! నువ్వు వున్న మాటే సెప్పినావ్!

ఉన్నమాట సెప్తే వూరినాయుడికి కోపమని సెప్పడం మానేస్తామా? మన సంస్కృతేంది? మన సాంప్రదాయమేంది? కతేంది? కార్ఖానా యేoది? గాచారం కాకపోతే యూనివర్సిటీలల్ల యీ లొల్లేంది? హెచ్సియ్యూ జేయెన్యూ వొకటేమిటి.. దేశంలో యూనివర్సిటీలల్ల యీ అగ్గి రాజుకొనుడేంది?

ఈ సమయంల నీ మాటలే యాదికొస్తున్నాయన్నా..

“రోహిత్ వేముల గురించి మాక్కూడా సానుభూతి వుందధ్యక్షా.. కాని ఇష్యూ చెయ్యదలచుకోలేదు మేము.. దాన్నో పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చెయ్యదలచుకోలేదు.. కారణాలు తెలుసుకున్నాం.. తగిన స్టెప్స్ తీసుకున్నాం.. దాన్ని ఖండించినాం.. అటువంటివి జరక్కూడదు.. అటువంటివి యెందుకు జరుగుతున్నాయధ్యక్షా.. దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీల జేయెన్యూలో జరిగినా.. ఈడ మన దగ్గిర యిక్కడ సెంట్రల్ యూనివర్సిటీల జరిగినా దురదృష్టకరం.. ఐ హేవ్ కండెమ్ముడిట్.. యిటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయ్.. ఫిలాసఫీలూ సిద్ధాంతాలూ గుంచకపోయి యూనివర్సిటీలల్ల పెట్టి లేని జగడాలు పుట్టించి.. బీఫ్ ఫెస్టివల్.. కిస్ ఫెస్టివల్ అట అధ్యక్షా..  భారత దేశంల కిస్ ఫెస్టివల్ని వొప్పుకుంటారా అధ్యక్షా.. వొకడు కిస్ ఫెస్టివల్ అంటాడు.. యెన్నో రకాలు పెట్టి యేందేదో చేసి.. వాటన్నిటిని వొక చిత్ర విచిత్ర సంస్థలుగా తయారు చేసినారు.. ఆ పరిస్థితి పోవాలి.. పోవాల్నంటే దాన్ని పరిపాలన చేసేవాళ్ళు.. దానికి వైస్ ఛాన్సులర్ గా వుండే వాళ్ళు.. పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి.. దానికోసం మేము డిలే చేసినాము అధ్యక్షా.. ఐ థింక్ షార్ట్లీ- సెర్చ్ కమిటీవాళ్ళు రిపోర్ట్ యిస్తే అద్భుతంగా..” అని మీరెంత అద్భుతంగా మాట్లాడిన్రు!?

కవితక్క స్థాపించిన తెలంగాణ జాగృతి తరుపున వొకట్రెండు రోజులు కార్యకర్తలు దత్తాత్రేయ యింటిముందు గొడవకు దిగి సప్పుడు సెయ్యకుండా సక్కగున్నరు! మన యంపీ విశ్వేశ్వరరెడ్డి సారయితే రోహిత్ దళితుడే కాదని, ఆ అబ్బాయి చనిపోవడానికి వేరే కారణాలున్నాయని సెప్పాల్సింది సెప్పి సప్పుడు సెయ్యకుండున్నడు! పార్లమెంటుల మరొక యంపీ జితేంద్ర రెడ్డిసారు “దత్తాత్రేయ గురించి కేర్ తీసుకున్నాము, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు యిస్తే మేము వ్యతిరేకించాము” అని మన సపోర్టు ఫుల్లుగ సూపించారు! హెచ్సియ్యూకు అన్ని రాజకీయ పక్షాలు వొచ్చినా  బీజేపీ తోటి మీరు కూడా యెవరూ వెళ్ళకుండా సక్కగ వున్నరు! అలా కేంద్రంతో అందరూ యెంతో మంచిగున్నరు! కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటివి చానా ముఖ్యం! అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర సంబంధాల్ని బలోపేతం చేసిండ్రు! రాష్ట్రానికి కావలసినవన్నీ తెచ్చుకోవాలె! అడుక్కు తెచ్చుకోవాలె! మద్దతు యిస్తున్నట్టే వుండాలె! ప్రజల మద్దతు ఆలకి పోకూడదు! ఆంధ్రోళ్ళ చంద్రబాబుతో కేంద్రానికి యెంత కవరు చేసినాగాని చెడింది.. మనం కేంద్రాన్ని మంచిగ మచ్చిక చేసుకోవాలె!

మీరు యిన్నిన్ని పాట్లు పడతాంటే యూనివర్సిటీ పోరాగాండ్లకు తలకి యెక్కుత లేదు! ఎకసెక్కం చేస్తాండ్రు! ‘మీ కేసీఆర్ చెండీ యాగం చేసినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! యాదాద్రికి అన్నన్ని నిధులు యిచ్చినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! మిమ్మల్ని మనువాదులని ముద్రవేస్తాండ్రు! ఆమాటకొస్తే దేశంల నాయకులందరూ మనువాదులేనట! వాళ్ళ ప్రతినిధులేనట! హిందూ మతమే అధికార మతంగా ప్రభుత్వాల అభిమతంగా- రాష్ట్రాల దేశాల మంత్రులందరూ ప్రజా ప్రతినిధులందరూ శంకుస్థాపనలకడ ప్రారంభోత్సవాలకడ వొకటేవిటి అన్నీట్లకడ- వేద మంత్రాలతో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టడం లేదా..?’ అని నిలదీస్తుండ్రు! ‘ఎవరి విశ్వాసాలు ఆలకి వుండవా?’ అని అడిగితే- “మల్ల.. మావిశ్వాసాలు మాకుండవా..?” అని వుల్టా అడుగుతాండ్రు! ‘ఎన్నో విశ్వాసాలకి – భిన్న విశ్వాసాలకి వేదికలు యూనివర్సిటీలు..’ అని మనకి తిరిగి పాఠాలు చెపుతాండ్రు! చెడిపోయిండ్రన్నా.. చదువుకున్న పోరగాండ్లు పూర్తిగా చెడిపోయిండ్రు!

తెలంగాణ పోరాటంల ముందుండి నడిసినారు బాగుంది! ఉద్యమాలు చేసినారు బాగుంది! ప్రాణ త్యాగాలు చేసినారు బాగుంది! ప్రత్రేక రాష్ట్రం సాధించినారు అదీ బాగుంది! అక్కడితో ఆగాలి గదే.. రాష్ట్రం సిద్దించింది రాజకీయాలు వొదిలి చదువుకోవాలి గదా.. మళ్ళీ యీ పోరాటాలు యేoదన్నా? ఇలాగుంటే బంగారు తెలంగాణ అస్తదా?

అన్నా.. కుర్రాళ్ళు ముదిరిన్రు అన్నా! మీరు బ్రాహ్మణ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. క్రిస్టియన్ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. భూమిలేని దళితులకు మూడెకరాల పొలం యిస్తామన్నట్టు.. బీసీలకు పెద్ద పీట వేస్తామన్నట్టు.. ఆదివాసీలకు కొమరంభీం బిల్డింగ్ నిర్మించి ఆదుకుంటామన్నట్టు.. ఆంధ్రా సెట్లర్లకు మేమున్నాం అని భరోసా యిచ్చినట్టు.. అన్ని వర్గాల ప్రజలని యెలా మీరు ప్రతినిధులుగా కలుస్తున్నారో- అచ్చంగ అలాగ మేమూ అన్ని వర్గాల ప్రజల ఆలోచనలకు ఆశయాలకు భావజాలాలకు ప్రతినిధులుగా వుంటారట.. మాట్లాడతారట..!

సమాజంలో వున్నన్ని వర్గాలు – యూనివర్సిటీలల్ల కూడా వుంటాయని – మీ ఫిలాసఫీ సిద్ధాంతమూ మీకున్నట్టే మా ఫిలాసఫీ సిద్ధాంతమూ మాకుంటుందని తెగేసి అంటున్నారన్నా.. ఏమైనా స్టూడెంట్లతో ప్రాబ్లం అన్నా.. ప్రత్యేక తెలంగాణ వరకే విద్యార్థులకు రాజకీయాలతో సంబంధం వుండాలిగాని.. యిదేటన్నా యిది..?

మనం కొద్దిగ జాగర్త పడాలన్నా! బీఫ్ తిన్నారని చంపేస్తే- ఫ్రిజ్ ల బీఫ్ వున్నాదని అనుమానించి చంపేస్తే- తినే తిండి మీద మీ పెత్తనమేంటని అడిగిన్రు! మా తిండి మేం తింటాం అని బీఫ్ ఫెస్టివల్ పెట్టిన్రు! అలజడి సృష్టించిన్రు! కాలికట్ ‘డౌన్ టౌన్’ రెస్టారెంట్ల వొక ప్రేమికుల జంట ముద్దులు పెట్టుకుంటే- రెస్టారెంటు మీద దాడి చేసిన్రని మోరల్ పోలీసింగ్ చేసిన్రని.. మీడియాల మాట్లాడుతూ పోరగాల్లు ముద్దులు పెట్టుకొని గిది మా పోరాటం అన్నరు! దేశంల యూనివర్సిటీలల్ల కిస్సు ఫెస్టివల్ జరిపిన్రు! రచయితల్ని ముగ్గుర్ని వరసగ సంపితే అవార్డులను అందరూ వెనక్కిచ్చినట్టు – పదిమంది పోరగాల్లు యూనివర్సిటీల వుసురు తీసుకుంటే వంద వెయ్యీ కాదు లక్షలమంది కదిలిన్రు! మీకివన్నీ తెలియవని కాదు, జర మనం సైలెంటుగ వుంటే అరిచి ఆల్లే నాలుగు రోజులకి కాకపోయినా నాలుగు నెలలకి అలిసిపోయి బతుకాగంల బడిపోతరు! కాంట్రాక్టు వుద్యోగుల్ని రెగ్యులరైజు చేస్తామంటే మరి మా కొలువులో అని నిన్నే కాదన్నరు. ఛలో అసెంబ్లీ అన్నరు. నువ్వు సేయిన్చాల్సింది సేసినావా లేదా? ఆంధ్ర పోలీసులలెక్క భగ్నం చేయించినవ లేదా? ఇయ్యాల యూనివర్సిటీలోకి కన్నయ్య రాక కన్నా ముందు వీసీ పోదిలి అప్పారావుని మళ్ళా దించితే – నీవంతు పోలీసు ఫోర్సు అందించినవ లేదా? పోలీసుల్ని దింపి అద్బుతంగా లాఠీఛార్జీలూ అరెస్టులూ సేయించి అదుపులోకి తెచ్చినవ లేదా? నువ్వు యేదయినా సెయ్యగలవే అన్నా.. నా ఆవుసు పోసుకొని నువ్వు సల్లగ వుండాల.. మరి నాలుగు కాలాలు మమ్ము పాలించాల..

అన్న.. ఆఖరుగ  వొక్క మాటే! రెడ్డిగార్లు అదికారంల వున్నప్పుడు అందరూ రెడ్డిగార్లదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! కమ్మగ చౌదరీలు అదికారంల వున్నప్పుడు అందరూ కమ్మలదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! మరి మన దొరల రాజ్యం వొచ్చింది! దొరాలకి న్యాయం చెయ్యవానే? మళ్ళీ సియ్యమ్ము సీటు దళితులకే అని యెనకటికి అన్నట్టు అనబాకు! ప్రతిపక్షమే లేకండ అందరొచ్చి మనపార్టీల చేరిండ్రు! ప్రతొక్కనికీ పంచాల గదా? పీటెయ్యాల గదా? అలగని మనోళ్ళకు అన్యాయం చెయ్యకు! మన వర్గమోల్లకు! వర్గమంటే కులమే గదనే! అన్నీ తెలిసినోనివి.. నీకేం సెప్పేది? ప్రేమతోటే సెప్పేది! తప్పులుంటే మన్నించు..!

జిందాబాద్.. జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్..!

అన్నా దండమే!

యిట్లు

మీ

వీరాభిమాని!

 

 

 

 

న్యూటన్ సరికొత్త సిద్ధాంతం!

-బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ప్రియమైన సైంటిస్టులారా..  సైన్సు యిష్టులారా..!

నన్ను క్షమించండి!

“భూమికి ఆకర్షణ శక్తి కలదు!” అని నేను కనుగొని రాసుకున్న సిద్ధాంతాన్ని భేషరతుగా నేనే ఖండించు చున్నాను! నేను యింతకాలం భూమ్యాకర్షణ శక్తి గురించి మానవాళిని తప్పుదారి పట్టించానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను! సైన్సులో ముగింపులు వుండవని- కొనసాగింపులూ చేర్పులూ యెల్లప్పుడూ వుంటాయని విజ్ఞులైన మీకు గుర్తుచేసుకుంటున్నాను! చేసిన ప్రతిపాదిత తప్పు వొప్పుకొని- చెవులు నులుముకొని- గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెప్పడానికి ఈ న్యూటన్ సిద్ధంగా వున్నాడు! నేను రాసింది కొట్టేశాను! చేతికి అందినంత వరకు చెరిపేశాను! చరిత్రని తప్పుదారి పట్టించానని తెగ బాధపడి బెంగపడి దుఃఖపడి యేడ్చాను కూడా!

సత్యం యెప్పుడూ వొకేలా వుండదు! అప్పటి పరిశోధనలకు అతీతమైన ఫలితాలు యిప్పుడు రావడాన్ని నేను గమనించాను! ఇందుకు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు తాజా ఉదాహరణలుగా నా ముందు మరోసారి నిలబడ్డాయి! ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రభావాల్ని తోసిపుచ్చలేకపోతున్నాను! తెలివిగల సైంటిస్టుల్లారా తెల్లమొహం వేయకండి! నా ‘న్యూటన్ సిద్ధాంతము’ తప్పే! ముమ్మాటికీ తప్పే!

ఫీల్డ్ రిపోర్టులు పరిశీలించాను! ఆంధ్రప్రదేశ్ లో జనం బతుకుతెరువుకి వూళ్ళు వొదిలి వలస పోతుంటే- కాంగ్రేసూ వైయ్యస్సార్ కాంగ్రేసు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోవడం గుర్తించాను! తెలుగుదేశానికి యింత ఆకర్షణ శక్తి వుంటే- అదే నిజమైతే- మరి తెలంగాణలో ఆ పార్టీ యెందుకు పూర్తిగా ఖాళీ అయిందో.. యెందుకు రేపోమాపో అధికార తెరాసలో విలీనం కానుందో.. యెందుకు ఆకర్షణ కోల్పోయిందో ఆరా తీసాను! అదే సమయంలో తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి గల ఆకర్షణ శక్తులను యేకకాలంలో పరిశోధించాను!

‘మా నియోజక వర్గాల అభివృద్ధి మాకు ముఖ్యం..’, ‘మాకార్యకర్తల డిమాండు మేరకే మేం పార్టీ మారాం..!’, ‘ రాష్ట్రాన్ని బాగుచేసే సత్తా ముఖ్యమంత్రిగారికే వుంది..!’, ‘ఉన్న పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..!’, ‘ పార్టీని వీడడం బాధగా వుంది.. కాని తప్పడం లేదు..!’, ‘రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో వుంచుకొని పార్టీ మారాం..!’, ‘మాపార్టీ నుండి చాలా మంది వొచ్చి చేరబోతున్నారు..!’ – అని పైకి చెప్పిన కారణాలూ…

‘మామీద కేసులు పెడుతున్నారు.. పాతకేసుల్ని తిరగదోడుతున్నారు..!’, ‘మాకు వొక్క కాంట్రాక్టు కూడా రానివ్వడంలా..!’, ‘మళ్ళీ అయిదేళ్ళ తరువాత మా పార్టీ అధికారంలోకి వొస్తుందన్న నమ్మకమూ లేదు..!’, ‘అధికారంలో లేకుండా కార్యకర్తలని పెంచి పోషించడం యెలాగ?’, ‘అధికారంలో లేకపోతే మమ్మల్ని జనం కూడా మరిచిపోతారు!’, ‘అధికారం లేకుండా అర నిముషం బతకడం కష్టమండీ..!’ – అని  పైకి చెప్పుకోలేని కారణాలూ…

ఈ ఆకర్షణ అనేది ఆదినుండీ వుందనీ, లోగడ రాజశేఖరమాత్యులవారు తెరాస నందు గల పదహారు మందిలో ఆరుగురిని లాగేసారని – సదరు తెరాస యిప్పుడు అదేపని చేసిందనీ.. ముగ్గురంటే ముగ్గుర్ని యిప్పటికి మిగిల్చిందని – తెరాసని తిట్టిపోసిన తెలుగుదేశం తెరాస అనుసరించిన దారినే స్పూర్తిగా పూర్తిగా అనుసరించిందని – అంచేత జంప్ జిలానీలతో జగన్ జగడమాడుటకు లేనే లేదని – తండ్రిగారు యిచ్చిన అధ్బుతమైన తర్ఫీదు కొడుక్కి ప్రాణసంకటాన్ని తెచ్చిపెట్టిందని – అనుభవాల అపహరణల సోదాహరణల ఫుట్ నోట్సులూ…

అన్ని అధ్యయన అంశాలనూ గమనించాను!

భూమికి ఆకర్షణ శక్తి వున్నప్పటికీ.. అది వొస్తువులకు మాత్రమే పరిమితం! భూమికంటే ఆకర్షించేవి కూడా వున్నాయి! అధికారపార్టీ ఆయస్కాంతము వంటిది! టోర్నడోలు అంత శక్తిమంతమైనది! అధికారంలేని ప్రజాప్రతినిధులు గాలివాటంగా వుండక తప్పదు! మనగలగక తప్పదు! లేదంటే యేటికి యెదురీదడమే! అమ్ముడుపోవుటకు అందుబాటులో వుండడంవల్ల ‘సంతలో పశువులు’గ  యీ ప్రజా ప్రతినిధులని కీర్తిస్తారు! వీరు అన్ని వేళలా అమ్ముడుపోవుటకు అత్యంత అనుకూలముగా వుందురని అర్థమయినది!

ఎన్నికలు ముగిసిన వెంటనే- ప్రతీ ప్రతిపక్షమూ ప్రతీ అధికారపక్షంలో విలీనము చేయుట యెంతో మంచిది! ఉత్తమం కూడానూ! ఆమాటకొస్తే పాలకపార్టీ సభ్యులందరూ వొకే పార్టీ సభ్యులు కానే కారు! అనేకానేక సమీకరణల వల్ల వేరు వేరు పార్టీలలో పోటీ చేయుట యెంత సహజమో.. గెలుపు గుర్రాలన్నీ వొకే చోట చేరడమూ అంతే సహజము! అధునాతన రసాయన సమ్మేళనము! ఆమాటకొస్తే అధికార పార్టీలో చేరకపోతే గెలిచినా వోడినట్లే! వోడినవాళ్ళు రేపటికో మాపటికో గెలవాలన్నా అధికారపార్టీ అండ వుండాల్సిందే!

ఏ విధముగా  చూసినా భూమికి మించిన ఆకర్షణ శక్తి అగుపించు చున్నది!

అధికారపార్టీ ఆకర్షణకు ప్రతిపక్షపార్టీ దూరంగా వుండి బతికి బట్టకట్టుట అసాధ్యము! అందువల్ల పాలక పక్షము ప్రతిపక్షము కలిసివుంటే కలదు సుఖము! పాలకపక్షమునకు ప్రతిపక్షపు తలనొప్పులు వుండవు! ప్రజల తలనొప్పులు ప్రజలు పడుదురు, అవి అత్యంత సహజమైనవి! అలాగే అధికారం వొచ్చునంతవరకూ ప్రతిపక్షములో వుండుట, ప్రతిపక్షమును నడుపుట బహుకష్టము! పాలకపక్షమూ ప్రతిపక్షమూ యేకపక్షమయినచో తిప్పలు, తలనొప్పులు తప్పును! ఎలక్షన్ల సమయంలో మాత్రమే యెవరి పార్టీ వారిది! ఎలక్షన్ల అనంతరం అన్ని పార్టీలు వొక్కటే! అందరి ద్యాసా భాషా ఘోషా వొక్కటే.. ప్రజాసేవ! ప్రజల అభివృద్ధి!

అధికారపార్టీ ఆకర్షించినంతగా భూమి కూడా ఆకర్షించలేదన్న సత్యాన్ని అనేకానేక ఆధారాలతో కనుగొన్నాను! సైన్సు సైన్సుగా వున్నప్పుడు ఫలితాలు వేరు! సైన్సు సోషల్ తో కలిసినప్పుడు వొచ్చే ఫలితాలు వేరు! అంచేత కొన్ని సవరణలు అవసరమని మీకు అర్థమయిందని నాకు అర్థమైనది!

మన్నింపులు కోరుతున్నాను!

యిట్లు

మీ

న్యూటన్

అన్నగారూ.. వాటీజ్ దిస్?

   

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi అన్నగారూ.. అన్యాయం అన్నగారూ.. యిది పూర్తిగా అసందర్భ సందర్భం అన్నగారూ.. యిప్పుడో- యిందాకో- మీరందించిన మీ చేతి చెమట నా అరచేతులకు అంటుకొని యింకా ఆరనే లేదు?! నాపక్కనున్న మీకు నేను మౌనం పాటించడం.. శ్రద్ధాంజలి ఘటించడం.. వర్తమానాన్ని గతం చేస్తూ జ్ఞాపకం చేసుకోవడం దుర్మార్గాలలోకెల్లా దుర్మార్గం కాదూ?

బుక్ రిలీజుల దగ్గరో- బరెల్ గ్రౌండ్ ల దగ్గరో కలుస్తూనే వున్నాం! అన్నగారూ అంటే అన్నగారూ.. అని పలుకరించుకుంటూనే వున్నాం! నా వురుకుల్లో నేను! మీ పరుగుల్లో మీరు! మాట్లాడుకుందామని మళ్ళీ యెప్పటిలాగే వాయిదాపడినప్పుడు వుపశమనంగా గుండెకు గుండె హత్తుకొని ఆలింగనం చేసుకొని పారిపోయేవాళ్ళం! ఈసారి మీరు మహా ప్రస్థానం దగ్గర ఆలింగనం చేసుకోకుండానే ఆగిపోయారు!

క్షమించు బాసూ.. నేనింకా పరిగెత్తుతూనే వున్నాను!

‘ఆగాలని వుంది.. అన్నగారూ.. ఈ రన్నింగ్ యెక్కువ కాలం చెయ్యలేం.. మానెయ్యాలని వుంది.. బయటికి మీలా వచ్చేయాలని వుంది.. ఫ్రీ అయిపోవాలని వుంది..’ తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చెట్ల కింద మీరు చెపుతునే వున్నారు! ‘ఫ్రీ యెక్కడన్నగారూ.. మీరు బందీ అయి- చీకట్లోంచి వెలుతురులోకి రావాలనుకుంటున్నారు! నేనేమో పరిగెత్తీ పరిగెత్తీ వెలుతురెక్కువై లోపలకి వొచ్చి కూర్చోవాలనుకుంటున్నాను. అతి చీకటిలోనూ అతి వెలుతురులోనూ మన చూపు మనకు చిక్కదు!’ చెప్పాలనుకున్నాను. చెప్పలేదు! అన్నీ వాయిదా వేసినట్టు యెవరెవరివో పలుకరింపుల నడుమ ఆడే మాట కూడా వాయిదా వేసాను! అప్పుడూ అందరిలో వున్నా మన ఒంటరి పరుగులు మనం పరిగెత్తుతూనే వున్నాం.. కూర్చున్నా! నిల్చున్నా! నిద్రపోతున్నా!

రన్నింగ్ అన్ ఎండింగ్ కావచ్చు.. ఎండింగ్ అబ్రెప్ట్ గా వుంది! పోయెమ్ అబ్రెప్ట్ గా వుంటేనే వొప్పుకోరే మీరు! అలాంటిది యిది లైఫ్ కదా? ఎందుకిలా?

కారణాలు వెతికారు! తో’రణాలు’ కట్టారు! ‘నౌ అయామ్ వోకే’ అన్నారు! ‘రెడీ టు ఫైట్’ అన్నారు!…

ఆగండి అన్నగారు.. ప్లీజ్.. మీకే గదా మౌనం పాటిస్తా.. యెందుకిలా డిస్టర్బ్ చేస్తారూ.. వొక్క నిమిషం కూడా వొదలరా?

వొదినేడుస్తోంది.. పాపేడుస్తోంది.. వొదల్లేని మిత్రులూ కొలీగులూ యేడుస్తున్నారు.. యేడవడమూ చేతకాని నాలాంటి వాళ్ళు యెడంగా పోయి యేడుపుగొట్టు ముఖాలేసుకు నవ్వుతున్నారు!

చీమూ నెత్తురూ గడ్డకట్టి యెంచక్కా మీడియా నిన్ను షూట్ చేస్తూనే వుంది! డ్యూటీ చేస్తోంది! లైవ్ యిస్తోంది!

”వాళ్ళు నాకు కావాలి! డెడ్ ఆర్ లైవ్!” నే రాస్తున్న సినిమా డై‘లాగు నన్ను తొడుక్కుంటోంది. డెడ్డూ నువ్వే! లైవూ నువ్వే! నేనే నువ్వు.. నువ్వే నేను.. లేనిచో ఈ జగమే లేదూ..’ సాంగు కనెక్ట్ అయింది.. ఆవహిస్తోంది మీ శైలిలా! మీరే కాదు, నన్ను నేనూ డిస్టర్బ్ చేసుకుంటున్నానా..?

ఆత్మకు శాంతి చేకూరిందా? నీవిచ్చిన నీ మరణ వాగ్మూలం రాముడికి అందిందా? పాపికొండలమీద పడి రోదిస్తున్నావా? రెవెన్యూ రికార్డులనుండి తొలగించడం ఆపే పని కాదని- రెవెన్యూ రికార్డులనే తగలబెట్టాలని చూస్తున్న ఆదివాసీ అంతరాత్మలో నీ ఆత్మ ఐక్యమయ్యిందా? అరే రోహిత్ సరే, జేఎన్ యూ మీద అర్టికల్ రాయాలని వుంది కదూ? లవర్స్ డే కి యెప్పటిలాగే భజరంగ్ దళ్ పోలీసింగ్ చేస్తోంది.. పోయెం యేది గురూ?

సీన్ మారింది! స్క్రీన్ మారింది! లొకేషన్ షిఫ్ట్! ఇంటినుండి మీ tv5 ఆఫీసుకి! పరుగులతోనే చేరాను! మధ్యలో ఫోన్లు! నా కథ బాలేదు, మరో కథ బాగు చేద్దామని బయల్దేరి విజయవాడ వెళ్ళా.. స్టోరీ సిటింగ్.. వొచ్చేసా.. చేరిపోయానని చెప్పా! నిజంగా నిన్ను చేరానా? యిప్పటికిప్పుడు చేరేంత దూరమా నువ్వు వెళ్ళింది?

గాఢ నిద్రలో నువ్వు!

వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి

తథా – శరీరాణి –  విహాయ – జీర్ణాని – అన్యాని – సంయాతి – నవానీ – దేహీ

అన్నగారూ.. మీ బాడీని పెట్టుకొని భగవత్ గీతేంటి అన్నగారూ? అంత యేడుపులోనూ నవ్వొచ్చింది! చెప్తే వొళ్ళు తిమురనుకుంటారు.. అని ఆగ లేదు, అదే అన్నా.. ‘తను వినడం లేదు కదా అని సరిపెట్టుకో’మన్నారు మన మిత్రులు! పోని.. నా మాట వింటున్నారా?

శ్రీశ్రీ మహాప్రస్థానం మాత్రమే తెలుసు నాకు. ఈ మహాప్రస్థానం కూడా వుంటుందని యెరుక లేదు నాకు. ‘వల్లకాడు’లా వుంది బతుకు అని యికమీదట అనలేను! అంత బాగుంది.. రిచ్ గా! కాని యిక్కడ కూడా మతముంది గురూ.. ఘంటశాలగారు పాడిన గీతలోని పద్యాలన్నీ గోడలమీద చెక్కినవి చదువుకున్నా! మార్క్సిజమే కాదు, మతం కూడా బలమైందేననిపించింది! ‘పెట్టుబడి’ బలం పెరిగింది.. సారీ.. పెట్రేగింది బాసూ? వొగ్గలేదు, ఈ బరేల్ గ్రౌండూ లోకి చొచ్చుకొచ్చింది చూడు! ‘థర్టీ పర్సెంటు గవర్నమెంటూ.. ప్రవేటేమో సెవెంటీ పర్సెంటూ’ కోలాబిరేసను.. మిత్రుల మాట! నోరుండదు కదా.. ‘యిదేటి యిలగుంది?’ అంటే- కథ యెలగుందో బోధపడిపోయింది! వల్లకాల్లకీ వర్గముంటుందని మార్క్సే వొచ్చి చెప్పాలా? పంజాగుట్ట శ్మశానం చూసారు గదా? మన జీవితాలంత యిరుకు! ఇరుకులో సర్దుకోకుండా ఎలక్ట్రిక్ బర్నర్ కి యెడ్జెస్టయిపోయారా? బాడీ అంటే ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ అన్నారే! మూలకాల సమ్మేళనం విద్యుత్తుకాంతిలో కరిగి కలిసిపోయిందా?

ప్రెస్ క్లబ్.. మీరు తిరిగిన చోటే- మీ జ్ఞాపకాలతో తిరుగుతున్నారు! మీ రూటే సపరేటు అంటున్నారు..

నాకు తెలుసు మీరు అందరిలా కాదు! అందరూ వొరుసలో నిల్చుంటే మీరు వొరుస తప్పి పక్కకి వెళ్లి నిల్చుంటారు! నిలబడ్డ చోటునే నిల్చుంటే ‘నిలువ’కు విలువలేదని మీకు తెలుసు! అందుకే నలుగురు నడిచిన దారి నాది కాదని వుద్దేశపూర్వకంగానే తప్పిపోతారు! తగువుపడ్డ వారిని తగుమాత్రం పట్టించుకోరు! మనం నిలబడ్డ చోటు మారితే చూసే దృశ్యం మారుతుందని మీకు తెలుసు! అందుకే మీరు మారుతుంటారు! అందరూ అటు వుంటే మీరు యిటు వుంటారు! అందరూ అమ్మ అంటే మీరు నాన్నంటారు! ఫెమినిజం పెల్లుబుకుతున్న రోజుల్లో మేల్ కొలుపులు పాడతారు! వి(మి)యార్ మేల్ అంటారు! మ్యాగ్జిమమ్ రిస్క్ తీసుకుంటారు! మ్యూజిక్ డైస్ అని మరణ మృదంగం వినిపిస్తారు! సామూహిక బృందగానంలో వుంటూనే మీ స్వరం మీరు వినిపిస్తారు! మీరు అపస్వరంగానైనా వుంటారే తప్ప అస్తిత్వావాన్ని కోల్పోరు!

ఇప్పుడు అందరూ మీ ముఖమ్మీది చిరునవ్వు గురించే మాట్లాడుతున్నారు! నేనేమో పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళా.. పంజాగుట్ట పక్కనున్న దుర్గానగర్లో ప్లాట్లో మనంపడ్డ పాట్లో? అప్పటికి ఆంధ్రజ్యోతి రీవోపెన్ కాలేదు! నేను ఆగ్రో నుంచి అప్పటికే రిటైర్ అయ్యాను! మానాన్నకన్నా ముందు నేనే రిటైర్ అయ్యానని గొప్పగా చెపితే- గొప్పల వెనక వున్న తిప్పలు తెలిసి- మీరు నడిపిన ‘వాసంతి’ మాస పత్రికలో ‘ఉడుతా ఉడుతా ఊచ్!’ పిల్లల శీర్షిక నాతో నడిపించారు. రెండుచేతులతో పేజీలు నింపే వాళ్ళం! చాలక జోగీబ్రదర్స్ కృష్ణంరాజు డైరెక్ట్ చేసిన ‘మధురం’ సీరియల్ కు స్క్రీన్ ప్లే మీరు, డైలాగులు నేనూ రాసాం! పచ్చామధు కెమెరా. అడవి శ్రీనివాస్ ఎగ్జిక్యుటీవ్ ప్రొడ్యూసర్. బల్లారివాళ్ళు ప్రొడ్యూసర్లు. అంతలోనే- కష్టమన్నగారూ.. అని అన్నీ నాకే అప్పగించారు. అప్పటికి రవిప్రకాష్ గారు జెమునిలో వుండి మన ఆఫీసుకు వొచ్చి కూర్చొనేవారు..

‘మీరు మాట్లాడండీ’ పక్కనున్న మిత్రుడు కదిపితే ఆలోచనలు చెదిరిపోయాయి! తలడ్డంగా వూపాను!

అన్నగారూ.. మీరు ఎడిటర్, సియ్యీవో యేవేవో అయ్యేక- పరిగెత్తినా పట్టుకోలేనంతగా మీ టైం యిరుకైపోతుందని తెలిసి కలిసేవాన్నే కాదు! మీరు నన్ను పట్టుకెళ్ళి హలీం తినిపించి ‘కారు కొనుక్కున్నానన్నగారూ’ అన్నారు! నేను యెప్పుడు హలీం తిన్నా మీరే గుర్తుకువస్తారు! ఎందుకంటే నేను ఫస్ట్ టైం హలీం తిన్నది మీతోనే! అప్పుడు నాముఖం చూసి నచ్చలేదా? అని అడిగారు.  నేను ఔనూ కాదూ అన్నట్టు అన్ని రకాలుగా తలవూపాను! ‘వేడి మీద తినండి బావుంటుంది.. అలవాటైతే వొదలరు’ అన్నారు! నిజమే!

మీరు ఫోన్ చేస్తూ వుండండన్నగారూ.. అన్నారు. అవసరమయినప్పుడే ఫోన్లు చేసాను. ఎవరో వూరినుండి వొచ్చి యిక్కడ సిటీలో యాక్సిడెంటయి పోతే శవాన్ని వూరు పంపించాలని మిత్రుడు సాయమడిగితే నేను మిమ్మల్ని అడిగాను! క్రైం రిపోర్టరుతో ఆ యేరియా రిపోర్టరుకు ఫోన్ చేయించితే- గుద్దిన ట్రక్ కంపెనీ వాడు.. శవాన్ని పెట్టుకు గేట్లో గొడవ చేసినా వినని వాడు.. దిగొచ్చి నష్టపరిహారం యివ్వకపోయినా యిచ్చిన ఆరువేలుతో శవం యింటికి చేరింది. మీ సాయం యిలాగే వేరే వేరే ప్రొబ్లెమ్స్ లో మళ్ళీ మళ్ళీ అడిగా, మీ పరిమితులు చెప్పారు! స్కూళ్ళ మీదా కాలేజీల మీదా సెల్ టవర్లు.. రేడియేషన్ ప్రొబ్లెమ్స్ దృష్టికి తెస్తే.. ‘కష్టం అన్నగారూ.. మాకు యాడ్స్ వొచ్చేది వాళ్లనుండే.. అప్పటికీ స్టోరీ చేసాం.. బట్..’ ఖాళీలను నేనూ పూరించుకున్నా, చాలా ఖాళీలు మిగిలిపోయాయి! యిలాగే మా వూళ్ళో విత్తనాలు అమ్ముకుంటున్న అగ్రికల్చర్ డిపార్టుమెంటు గురించి చెపితే – ‘మా వాళ్ళకీ.. రిపోర్టర్లకీ.. అందుతాయి.. అంచేత..’ యెప్పటిలా ఖాళీలను నేనూ పూరించుకున్నా.. పూరించినకొద్దీ ఖాళీలు! నేను కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్నట్టు మాట్లాడితే – యిదెంత పాత ప్రపంచమో.. రోత ప్రపంచమో చెప్పి మనమెంత చేతకాని వాళ్ళమో చెవి తిప్పకుండా చెప్పి- ‘యింకేంటి అన్నగారూ కబుర్లు?’ మాట మార్చి అసంతృప్తినంతా అక్షరాల్లోకి యెత్తి పొగలు కక్కుతున్న కొత్త పోయెమ్ చేతిలో పెట్టేవారు మీరు.. అప్పుడు మీరు సారీ చెప్పారు. యిప్పుడు నేను సారీ చెపుతున్నా..

ఆగండి అన్నగారూ.. మీకు  ట్రీట్ మెంట్ యిచ్చి మీ ప్రాబ్లం ఫస్ట్ రికగ్నైజ్ చేసిన డాక్టర్ శాస్త్రిగారు మాట్లాడుతున్నారు..

‘అరుణ్ సాగర్.. రికవర్ అయ్యాడు! సర్జరీ అయ్యాక కేర్ గా వుండాలి! తనకా అవకాశం లేదు. విపరీతమైన వొత్తిడి, బహుశా తనున్న ప్రొఫెషన్ వల్ల కావచ్చు! తను జాగ్రత్తగా లేడు, కొంత స్వయంకృతం కూడా వుంది, సో..’ నేను తెగిపోయాను!

అన్నగారూ.. టీవీ ఛానెల్ రేటింగ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా మీ పల్స్ రేట్ అప్ అండ్ డౌన్ అవడం బాలేదు! తెలుగులో అరవయ్యారు న్యూస్ ఛానెళ్ళు! పార్టీకో ఛానెల్! ఎవడి వెర్షన్ వాడిదే! మధ్యలో టీఆర్పీ పెంట! రోజూ పోటీయే! పూట పూటా పోటీయే! గంట గంటకూ పోటీయే! పోగ్రాము పోగ్రాముకీ పోటీయే! నిమిష నిమిషానికీ పోటీయే! ఎవ్విర్ సెకన్ కౌంటబుల్ యిక్కడ! దీనెమ్మా.. సారీ .. దీనెబ్బా జీవితం! దీనెబ్బా రేటింగ్! దీనెబ్బా టీఆర్పీ! ఛానెల్ వుంటే యెంత? పోతే యెంత? మనం ప్రాణాలతో వుండాలి గదా? మనోళ్ళు మిమ్మల్ని చూసయినా గ్రహించాలిగదా? అన్నగారూ.. ‘నాలాగ చావకండ్రా’ అని మీ మిత్రులకి మీరన్నా చెప్పండన్నగారూ.. దీనెబ్బా కెరీర్? మనల్ని తినేసే కెరీర్ యెందుకన్నగారూ? పులి మీద సవారీ లాగుందే!?

అన్నగారూ.. మీరు పోయిన వార్త- మీరు పనిచేసే ఛానెల్లో మొదట వొచ్చింది! వెంటనే ఓ మిత్రుడు అది చూసి తనూ తను పనిచేసే  ఛానెల్లో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ చేసాడు! మీ ఛానెల్లో మీ మరణ వార్త అంతలోనే ఆగిపోయింది! ఇక్కడ వీడి గుండె ఆగిపోయింది! న్యూస్ అతి వేగం.. రోడ్డు మీద వాహన అతి వేగం కన్నా ప్ర్రమాదమైనది! వార్త నిజమా? కాదా? వేగంలో స్లిప్ అయితే ప్రమాదం మనకే! వుద్యోగం వుంటుందో పోతుందో? హమ్మయ్యా.. నువ్వు నిజంగానే పోయావ్.. తను బతికిపోయాడు!

ఏమిటిది అన్నగారూ.. మీరు టీవీ ఛానెల్లకు లైఫ్ యిచ్చారు! బట్ మీ లైఫ్ వాళ్ళు తీసేసుకున్నారు! చూడండి అన్నగారూ.. మీకు సంతాపం చెప్పేవాళ్ళే.. మీ హత్యలో భాగం పంచుకున్నారు అని నాలాంటివాడు అంటే నేరమవుతుంది! అసహనమవుతుంది! రాజ్య అసహనాన్ని అర్థం చేసుకుంటారు.. ఎటొచ్చీ నా అసహనమే అర్థం కాదు! కానట్టు వుంటారు! మీకుగాక యెవరికి చెప్పుకోను?

బాసూ.. మీరు గొప్పోళ్ళు బాసూ.. మీ వొత్తిడిని ముసుగేసి దాచేసి నవ్వితే- మీ నవ్వు బాగుంది అనుకున్నాం గాని కనిపెట్టలేకపోయాం.. క్షమించు!

ఈ ప్రెస్ క్లబ్ తాగుబోతుల అడ్డా కాదూ? రోజూ తాగి చచ్చేదేగా? ఆఫీసుల్లో బుర్ర పాడుచేసుకొనేది.. యిక్కడికొచ్చి పూటుగా తాగేది! మన కవులూ రచయితలూ తక్కువా? తాగి చచ్చేవాళ్ళే యెక్కువ! అన్నగారూ.. మానేసానన్నారు! మానేయ్యడాన్ని మానేసారా? ‘స్వయంకృతం కొంత’ అని డాక్టరుగారు అన్నారు! మీ మీద కూడా కోపంగా వుంది అన్నగారూ! అన్నగారూ.. యిక నన్నెవరు పిలుస్తారు ‘అన్నగారూ..’ అని?  పొండి అన్నగారూ.. మీతో జట్టు కట్! కట్ పీస్!

నేనింక మీతో మాట్లాడను!

సారీ అన్నగారూ.. ఎక్సుట్రీమ్లీ సారీ..

మీ

అన్నగారు

నేను సైతం…

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi బావా బాగున్నావా?

ఇక్కడ నేనూ చంద్రబాబునాయుడూ బాగున్నాం. మరి అక్కడ నువ్వూ ఒబామా బాగున్నారా? ఇక్కడ అమరావతి రాజధాని పదిలం. మరి అక్కడ రాజధాని వాషింగ్టన్ డీసీ పదిలమని భావిస్తాను.

బావా.. నీ దేశభక్తీ రాష్ట్రభక్తీ అపూర్వం. అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల వుండీ కూడా రాజధాని నిర్మాణం కోసం డాలర్ ఖర్చెట్టి నీవంతు ఆన్ లైన్లో ఆరు యిటుకలు పంపావు. నీ మెయిలు చదివాక నావొల్లూ వొంటి మీది రోమాలూ నిక్కబొడుచుకున్నాయనుకో. ఒక్క డాలరుకు ఆరిటుకలు. చౌకే బావా.. కారు చౌక! పది రూపాయలకు వొక యిటుక. మన లోకల్లో కూడా ఆ రేటుకి దొరకడం లేదు. మనలో మన మాట. తక్కువ పెట్టుబడి. ఎక్కువ లాభం. చరిత్ర నిర్మాణంలో నీదీ వొక యిటుక వుండడం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. రాజధాని నిర్మాణంలో నువ్వు  వుండడం బాగుంది. బహు గొప్పగా గర్వంగా కూడా వుంది. కాని మాకు ఆ అదృష్టం లేదు..

బావా.. నిజమైన దసరా పండుగంటే యిదే. రాజధాని నిర్మాణం ప్రారంభించడానికి ప్రధానమంత్రి వస్తూ వస్తూ యేo తెచ్చారో తెలుసా? ప్రత్యేకహోదా తెచ్చి యిచ్చి రాజకీయం చెయ్యలేదు. రాజకీయ లబ్ది పొందాలనుకోలేదు. భక్తితో పార్లమెంటు ప్రాంగణంలోని మట్టి, యమునానది నీళ్ళూ తెచ్చి యిచ్చారు. ‘దేశమంటే మనుషులు కాదోయ్.. మట్టోయ్! మంచి నీళ్లోయ్..’ కవి వాక్కుని నిజం చేసారు. రుజువు చేసారు.

మరి మన ముఖ్యమంత్రిగారు యేoచేసారని అడుగు.. పవిత్రమైన పుణ్యస్థలాలనుండి నదులనుండి పుట్టమట్టి, నీళ్ళు తెప్పించారు. అటు అమృతసర్  మానససరోవరం నుండి.. యిటు జంజాంబావి ఆజ్మీర్ కడప దర్గా దాక. అంతేనా? పదహారు వేల గ్రామాల నుండి మన్నూ నీళ్ళూ కలశాలలో తెప్పించారు. దుర్గమ్మకి మొక్కారు. పూజలు చేయించారు. యజ్ఞయాగాలకీ వేదమంత్రాలకీ కొదవలేదు. హెలీకాఫ్టర్ యెక్కి నాయుడుగారు ఆకాశంలోంచి మన్నూ నీళ్ళూ ముప్పై మూడున్నర వేల యెకరాల్లో చిలకరిస్తుంటే వొళ్లు పులకరించిపోయింది బావా.. కాని మాకు ఆ అదృష్టం లేదు..

బావా.. పులిహోరా పొట్లాలు.. టీ కాఫీలు.. పచ్చళ్ళు ఫలహారాలు.. కాఫీలు మజ్జికలు.. దద్దోజనం చక్రపొంగలి.. పండగనుకో బావా.. లక్షలాది మంది.. ఆటపాటలు.. అదొక సందడనుకో.. మళ్ళీ మన కళ్ళతో మనం చూడలేమనుకో.. కాని మాకు ఆ అదృష్టం లేదు..

కుర్రోళ్ళు ఆరోజుకి పోలీసు వుద్యోగాలు చేసేసినారు. ముందు డ్యూటీ చేస్తే రేపు రిక్రూట్మెంటు జరిగినప్పుడు వెయిటేజీ యిస్తామంటే.. అందరూ లాఠీలు అందుకున్నారు. కాని మాకు ఆ అదృష్టం లేదు..

అన్నిటికీ అదృష్టం లేదు.. అదృష్టం లేదు.. అంటన్నాననా? ఔను బావా.. మన వూరు తీరు నీకు తెలియంది కాదు. పుట్టమట్టి కాకపోయినా గట్టుమట్టి అయినా కలశంలో పెట్టి పంపిద్దామని అనుకున్నాం. ఏదీ? ఎక్కడిదీ? గట్టూ పుట్టా యేదీ లేదు!? వూరు వూరులాగ లేదు. సెజ్జులకి కొంత.. థర్మల్ పవర్ ప్లాంటులకి కొంత.. కార్పోరేట్ కంపెనీలకి కొంత.. కెమికల్ కంపెనీలకి కొంత.. మందుల కంపెనీలకు కొంత.. కొంతా కొంతా అంతా యివ్వగా యేముంటాది సంత? ఒట్టు.. మన వూర్లో చస్తే కాల్చడానికి జాగా లేదు! పోయిన మనిషిని మట్టిలో కలపడానికి లేదు! మట్టి యెక్కడినుండి పంపేది?

మట్టి లేదు సరే, మంచి నీళ్ళో మరుగు నీళ్ళో పంపిద్దామంటే యేదీ? యెక్కడిదీ? మనకి తాగడానికే మన వూరిలో మంచి నీళ్ళు లేవు. ఉన్నదల్లా ఫ్లోరైడ్ నీళ్ళు.. పవర్ ప్లాంటుల సున్నపు బూడిద నీళ్ళు.. కెమికల్ ఫ్యాక్టరీలు వదిలిన బురద నీళ్ళు.. మందుల ఫ్యాక్టరీలు వదిలిన విషపు నీళ్ళు.. ఆ నీటిల చెయ్యెడితే నిప్పుల చెయ్యిట్టినట్టే.. మంటా దురదా.. బాబుగారికి అవి పంపడం బాగోదు కదా.. ఆయన గోక్కుంటూ కూర్చుంటే మన అమరావతి పరువు పోదా? పండగనాడూ పాత మొగుడే అన్నట్టు.. దసరా రోజూ మనూర్లో- చుట్టుపక్కల వూళ్ళల్లో- కిడ్నీ వ్యాదులతోటి రాలిపోయినోళ్ళు వోక్కరోజుకి ఆగనయినా ఆగకుండా రాలిపోయినారు..

ఈ పరిస్థితుల్లో రాజధానికి వెళ్ళలేకపోయాం గాని టీవీల్లో చూసాం. అప్పటికీ యిటుక పదిరూపాయలె కొందాం అని మన కుర్రాళ్ళతో అన్నాను. పదిరూపాయలకు పెగ్గు వొస్తోందని, మనిషికి నాలుగు పెగ్గులు పోసుకున్నారు. రాజధాని నిర్మాణంలో మనం భాగం కామా అని అడిగేశాను బావా.. ఈ పెగ్గూ గవర్నమెంటుదే.. ఈ పదీ పదీ వందా వెయ్యీ వెళ్ళేది గవర్నమెంటుకే.. రాజధాని నిర్మాణానికి రాల్లెత్తిన కూలీలం మనమే అని అన్నారు బావా.. ‘నా పెగ్గూ నా అమరావతీ’ అని నినాదాలు కూడా యిచ్చారు బావా.. అక్కడితో మనోళ్ళు ఆగలేదు బావా.. ‘మేకిన్ ఇండియా’ కింద రాజధాని నిర్మించాలని నానాగొడవ చేసారు తెలుసా బావా..

అలాక్కాదురా, లక్ష కోట్లతో రాజధాని నేను చెపితే యేమన్నారో తెలుసా బావా.. మనదేశ జనాభా యెంత అని అడిగినారు. నూట పద్దెనిమిది కోట్లు అన్నా. మన రాష్ట్ర జనాభా యెంత అని అడిగినారు. అయిదు కోట్లు అన్నాను. నువ్వు లెక్కేట్టినావా అన్నారు. తాగుబోతు యెదవలు అని తిట్నా. తప్పు దేశ భక్తులం.. రాష్ట్ర భక్తులం అన్నారు. ఈ దేశాన్ని పాలిచింది ఆలు కావచ్చును గాని పోషిస్తున్నది మేమే అన్నారు. ఒప్పుకోక చస్తానా? ఒప్పుకున్నాను. దేశ ప్రజలందరూ మనిషొక లక్ష యిస్తే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతాయి, యెంచక్కా కట్టీయొచ్చాన్నారు. అలాగే మన రాష్ట్రంలో వొక్కో కుటుంబం కాదు, వొక్కొక్కరూ వొక యిరవై లక్షలిస్తే యెంచక్కా లక్ష కోట్లు అవుతాయని, అప్పుడూ ప్రపంచ స్థాయి రాజధాని కట్టీయొచ్చాన్నారు.

యేo బావా.. పిడికెడు మట్టీ గుక్కెడు మంచినీళ్ళు యివ్వలేని వాళ్ళం లక్షలు యివ్వగలమా? అదేమాటని మనోల్లతోటి అన్నాను. ఏమన్నారో తెలుసునా? ‘ప్రపంచానికి రాజధానా? ప్రపంచ స్థాయి రాజధాని కట్టడానికి? మన రాష్ట్రానికి రాజధానా? మన రాజధాని మన స్థాయిలో వుండాలి!’ అన్నారు బావా.. ‘రాజధాని ఆకాశమెత్తు కడితే మాత్రం మనకేటి? కడుపు నిండుతుందా? కాలు నిండుతుందా?’ అని అడిగారు బావా..

నువ్వు ఫీలవకు బావా.. తాగుబోతుల మాటలు అస్సలు పట్టించుకోకు బావా.. నువ్వంటే బాగా చదువుకున్నోడివి బావా.. దేశభక్తీ రాష్ట్రభక్తీ రాజధాని భక్తీ వున్నోడివి.. అందుకే నీ పేరు చిరస్థాయిలో నిలబడిపోతోంది.. నీకు బావనైనందుకు నేను గర్విస్తున్నాను! నీకు బావగానే మరణిస్తాను!

జై బావ! జై జై బావ!

యిట్లు

మీ

 బావ

సూదిగాడికి వేడికోలు!

 P-154

-బమ్మిడి జగదీశ్వరరావు

~

bammidi అయ్యా! సూదిగాడుగారూ.. నమస్కారం!

ఎలావున్నారు? మీరు ఎక్కడవున్నా బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వున్నాను. మీరు ఇలా కనిపించి అలా మాయమైపోవడం గురించి మా పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు! పోలీసులు మిమ్మల్ని పట్టుకోలేరని, వాళ్ళ చేతకానితనాన్ని మీరు చక్కగా బయటపెడుతున్నారని పిరికి జనం భలే ధైర్యంగానే అంటున్నారు.

“నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా? నువ్వేనా.. నువ్వులావున్న యెవరోనా?” అని పల్లవించి “..యింతకీ నువ్వు ఒకడివా? వందవా? ..యెంతకీ నువ్వు యెవరికీ అందవా?” రాగం తీసి నయనతారలై కొందరు నీకు ‘సెల్యూట్’ కూడా చేస్తున్నారు. నిజమే, నువ్వు ఏకవచనం కాదు, బహు వచనం!

మూడొందలు యివ్వందే ముఖం కూడా చూడని డాక్టర్లు వున్న ఈ రోజుల్లో ముఖం చూడకుండా వత్తినే.. వత్తి పుణ్యానికే సూది గుచ్చి సూదిమందు యిస్తున్నావే.. నువ్వు నిజంగా గ్రేట్.. మరి ఆ చేత్తోనే మందులూ మాత్రలూ టానిక్కులూ యిస్తే యింకెంత బాగున్నో అని మా ముసిల్దాయీ మరికొంతమంది ఆశ పడుతున్నారు. నిజంగా నీకు యేవొక్క డాక్టరూ సాటి రాడు. నీలాంటి వాడు యింకెక్కడా లేడు.

వైద్యం అందుబాటులో లేని ఈ రోజుల్లో నువ్వు యెవరికి యెప్పుడు అందుబాటులోకి వస్తావో తెలీక మేము కొద్దిగ సతమవుతున్న మాట నిజం.  అయ్యయ్యో నేను నిన్ను తప్పు పట్టడంలా. నువ్వు మొబైల్.. అదే సంచార వైద్యం అందిస్తున్నోడివి.. నీ సేవా గుణం యెవరికీ రాదు గాక రాదు. అయ్యో రామ.. ఆడోల్లకి నువ్వు ఫస్ట్ ప్రిపరెన్సు యిచ్చినప్పుడే నువ్వు కరక్టు పర్సన్ వి  అని నేను డిసైడైపోయా..

కానీ డాక్టరుగారూ.. నిన్నే.. డాక్టరు కోర్సు చదివి శుభ్రంగా యింజెక్షన్ యివ్వడం రాని డాక్టర్లు మాకున్నారు. అలాంటిది యిన్ని యింజెక్షన్లు మూడోకంటికి తెలియకుండా యిచ్చిన నువ్వు డాక్టరువి కాకుండాపోతావా? నువ్వు డాక్టరువి కాదని అంటే నాకళ్ళు పేలిపోవూ? అంచేత నువ్వు డాక్టరువే!

డాక్టరుగారూ.. సూదిమందు యెవరికి యిస్తారు? రోగం వున్నోల్లకి కదా? లేనోల్లకి యివ్వడం వల్ల వృత్తి వృధా అయిపోదా? సేవ జావగారి పోదా? నీ సేవలు అందరికీ కావాలి. ముందు రోగులకి కావాలి. అర్జెంటుగా కావాలి. ఆఘమేఘాల మీద కావాలి. ఆదిశగా కాన్సంట్రేట్ చెయ్యాలని మా వినయపూర్వక విజ్ఞప్తి!

మన నోటికి యింత అన్నం అందించే రైతులు వొకరు కాదు, యిద్దరు కాదు పదిహేను వందలమంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. యింకా చేసుకుంటూనే వున్నారు. అమ్మానాయినలాగా చూడాల్సిన గవర్నమెంటుకి రోగం వొచ్చింది.. కాలూ చెయ్యి పడిపోయిందేమో యేమీ పట్టించుకోవడం లేదు. రైతులు చనిపోవడం కొత్తా అని తిరిగి బూకరించి నోటికి వొచ్చినట్టు పేలుతోంది. ఈ రోగ లక్షణాలను బట్టి మంచి సూదిమందు యివ్వు.. వ్యవసాయ శాఖా మంత్రులకీ యివ్వు.. మంత్రుల మాగదులైన అధికారులకీ యివ్వు.. ఆ సూది మందేదో యివ్వు.. నాకు తెలుసు నీకు తెలంగాణా ఆంధ్రా భేదం లేదు. అందుకే అటు పశ్చిమ గోదావరిలో ప్రారంభించి యిటు నల్గొండ దాక, హైదరాబాద్ తో కలిపి అన్ని ప్రాంతాలకు నీ సేవలు ఆల్రెడీ అందించావు. రోగులకు ప్రాంతీయ భేదం లేదు. డాక్టర్లకూ ప్రాంతీయ భేదం వుండదు.

లిక్కరు మీదే మన గవర్నమెంటు సత్య ప్రమానకంగా నడుస్తోందని నీకు వేరే చెప్పాలా? కలోల్లు కాస్ట్లీ సరుకు తాగితే లేనోళ్ళు కల్లుతో సరిపెట్టుకోరా? దాంట్లోనూ కల్తీయే. గవర్నమెంటుల వున్నోల్లే.. సపోర్టు వున్నోల్లే.. వాళ్ళ చుట్టాలూ బంధువులూ ఈ కల్తీ సరుకు అమ్మ బెట్టిరి. యిప్పుడు బందు పెట్టిరి. కల్లు దొరక్క దొరా కళ్ళు పేలిపోతున్నాయి. జనాలు రాలిపోతున్నారు. యెవరికి యిస్తే రోగం కుదురుతుందో యింకా నీకు చెప్పాలా డాక్టర్ సాబ్?

ముందు చెప్పాల్సింది మధ్యలో చెపుతున్నాననుకోకు.. రాజధానికోసం భూములు లాక్కున్న రోగులకి నీ సూది మందు పడాల్సిందే! పంట వేస్తే అరెస్టు చేస్తామన్న అగ్రికల్చర్ మినిస్టర్కీ అధికార్లకీ సూది గుచ్చడం మర్చిపోకు. మాటొచ్చింది కాబట్టి చెపుతున్నా, యెవడు యెప్పుడొచ్చి చెక్కా ముక్కా భూమి లాక్కుంటాడో తెలడం లేదు. అధిక దాహానికి మంచి సూది మందు యివ్వు బాబూ..

వ్యాపారాలూ యవ్వారాలూ చేసినన్నాళ్ళూ చేసి, రాష్ట్రం విడిపోగానే అన్నీ హైదరాబాదులో దొబ్బించు కున్నారని ఆల్లే అనేసుకొని, అన్యాయం అయిపొయింది మొర్రో అని- అన్నీ తీసుకువెళ్ళి అమరావతిలో పెట్టి మళ్ళీ అదే పని చేసి సర్కారుజిల్లాలవారికే సర్కారు అందుబాటులో వుండేలా చేసి- రేపటికి మళ్ళీ అసమానపు అగ్గి రాజుకోనేలా చేస్తూన్న  బుర్ర చెడిన ఆంధ్రా నాయకులకి పోలియో సూదిమందులాగా యే వొక్కల్నీ వొదలకుండా సూదిమందు యేస్తావని యెంతగానో ఆశపడుతున్నాను..

ఔనూ.. నువ్వు పల్సర్ బైక్ మీద రైయ్ మని వొచ్చి సూది యిచ్చి పోతున్నావు గదా.. నీకు పోటీ అన్నట్టు చైన్ స్నాచర్లు కూడా నీకు మల్లె పల్సర్ బైక్ మీద రైయ్ మని వొచ్చి చీమూ నెత్తురూ కూడబెట్టి కొనుక్కున్న మెళ్ళో తాళ్ళు తెంపుకు పోతున్నారు. సో.. నువ్వు నీ స్టైల్లో వాళ్లకి సూది మందు యివ్వ రాదా? ఈ మాట రాయమని మా ఆవిడ మరీ మరీ చెప్పింది..

కాలేజీల్లో కులగజ్జి పెరిగిపోయింది. ఒకేరకం గజ్జితో ఒళ్ళూ పయి మర్చిపోయి స్టూడెంట్లతో ప్రిన్సిపాలు డాన్సులు వేయడం చూసుంటావు. మాది మహారాజా గజ్జి అని జెండా యెగరేసి ఆడపిల్లల్ని ర్యాగింగు పేరుతో యేడిపించి యెదపోసుకొని కాటికి పంపిన కన్నింగ్ ఫెలోస్ కి గజ్జీ తామర తగ్గడానికి సూదిమందు యిస్తే యెంత బాగుంటుందో నువ్వే చెప్పు..

చదువంటే నూరుడూ రుబ్బుడూ తాగించుడూ యిదే యిక్కడి పిల్లలకి.. తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరోపక్క గవర్నమెంటు బడులకీ కాలేజీలకీ గైనం యిప్పేసి.. ఆహా ఓహో అంటున్న నారాయణ చైతన్య.. చైనా వాళ్లకి నువ్వు సూదిమందు యెక్కడికక్కడ యిచ్చి పిల్లల బాధ వాళ్ళకీ తెలేసేలా చేస్తే బావుంటుందని మావాడూ వాడి ఫ్రెండ్స్  భాదితులుగా రాయమని వొప్పడంలేదు!

వుల్లిపాయ్ కందిపప్పు కొనడానికి లేదు, తినడానికి లేదు. ధరలు తగ్గిస్తామని మర్చిపోయారు పెద్దలు. వాళ్ళ మతిమరుపు తగ్గడానికి యివ్వరాదా సూదిమందు? మా అమ్మ అడుగుతోంది..

అలాగే తీసిన సినిమాలే సిగ్గులేకుండా తీస్తున్న సినిమా వోళ్లకి లేదా సూదిమందు? అని మాబాబాయి మీ కంట్లో వెయ్యమని చెప్తే రాస్తున్నా..

మరి చేతులకి దూలగొండాకు రాసుకున్నట్టు ఉద్యోగులు అస్తమాను బల్లకింద మానేసి బల్లమీదే గోక్కుంటున్నారు.. వాళ్ళ దురద తగ్గే సూదిమందు యివ్వరాదా చేతనయితే? అని మానాన్న సవాల్ విసురుతున్నారు..

లాకప్పు డెత్తులకు రుచిమరిగి.. అత్యాచారాలు చేసి అంగాలను చితకొట్టి ఎన్కౌంటర్లు చేసి.. మనుషుల్ని చంపడం మహా సరదాగా మారిన ఖాకీలకి మళ్ళీ మనుషుల్ని చేసే సూదిమందు యేదన్నా యివ్వరాదా? అని మా స్నేహితులంటున్నారు..

మా పక్కింటాయన నీకు వుత్తరం రాస్తున్నానని తెలిసి- భూ బకాసురులున్నారు.. కాంట్రాక్టర్లున్నారు.. వాళ్ళ ఆకలి తగ్గడానికి యివ్వరాదా సూదిమందు? అని అడుగుతున్నాడు..

ఏ రేట్లూ అందుబాటులో లేవు గాని కార్పోరేట్లను అందుబాటులోవుంచి, ఆలకి అన్నీ అందుబాటులోవుంచిన గవర్నమెంటుకి చాత్వారం పోయి.. దృష్టి దోషం పోయి.. ప్రజలు కూడా కంటికి కనపడేలా మంచి సూదిమందు మా మంత్రులకీ అధికారులకీ యిస్తే నీకు రుణపడి వుంటాం!

నీకు చాలామంది పేసెంట్లు వున్నారు.. నువ్వు చూడాలేగాని వాళ్ళు క్రానిక్ గా అంటే చాలా కాలంగా రోగాలతో దర్జాగా బతికేస్తున్నారు..

డాక్టరు దేవుడితో సమానమంటారు. కష్టాలు దేవుడికే కదా చెప్పుకుంటాం. అందుకే నీతో చెప్పుకోవడం.. నువ్వు మా పాలిట సూది’గాడ్’వి!

నువ్వు వీళ్ళందరికీ సూదిమందు యిచ్చి రోగాలు తగ్గిస్తే సాయిబాబాలకన్నా నీకే యెక్కువ పేరొస్తుంది.. మీడియాకి విడుదలచేసిన ఊహాచిత్రం లేమినేషను పటం కట్టించి మేమందరం యింట్లో పెట్టుకుంటాము.. మీడియా కూడా యివాళ తిట్టినా ఆ నోటితోనే నిన్ను రేపు హీరో అంటుంది.. జనం కూడా పోలీసులకి దొరక్కుండా నిన్ను తమ గుండెల్లో దాచుకుంటారు.. రేపటికి నువ్వే చరిత్రవుతావు..

నువ్వు నీ సూదిని యెటు తిప్పాలో అర్థమయింది కదా?

యిట్లు

మీ

విధేయుడు

 

Artwork: Srujan Raj

పుష్కర పోస్టుమార్టం 

                

   –బమ్మిడి జగదీశ్వరరావు

 మా యింట్లో అందరూ

పుణ్యాత్ములే!

మేం పుష్కర స్నానాలు చేసాం!

           ***

పాపాల్ని గోదాట్లో

వదిలేసాం!

పాపం చేపలు యేమవుతాయో ఏమో?

          ***

పిండాలు పెట్టేశాం!

పెద్దలకీ

నదికీ

         ***

ఓకే.. లైట్స్ ఆన్..

స్టార్ట్.. కెమేరా.. యాక్షన్..

కట్ చేస్తే- యిరవయ్యేడుగురు!

***

కొందరు మనుషులకీ

కొన్ని యిల్లకీ

శవాలే తీర్థ ప్రసాదాలు!

        ***

మూడే మునకలు

మూడే నిముషాలు

అయినా యింట్లో యీకోలీ సంగీత కచేరీలు!

        ***

గోదారి నీళ్ళు

పరమపదసో’పానం’

సేవిస్తే వైకుంఠవాసం!

        ***

పుణ్యం ప్రజలకి

ప్రచారం ప్రభుత్వానికి

స్వచ్ఛ భారత్ గోదావరికి!

        ***

గోదావరి పొర్లి పొర్లి యేడుస్తోంది!

ఉన్నప్పుడు ఊసే లేదు!

చచ్చాక పిండ ప్రదానం!

***

పాప ప్రక్షాళనకీ నదీ ప్రక్షాళనకీ

                           యెన్ని పుష్కరాలు పడుతుందో?

             ప్రభుత్వ ప్రక్షాలనకి!

***

గౌతమ మహామునికి కూడా తెలీదు

మాయ గోవు మర్మం!

 గోదావరి జలాల పంపకం!

***

త్రయంబకం బంగాళాఖాతాల మధ్య

ప్రవహించేది గోదావరి కాదు!

జన జీవిత రహదారి!

****

                                                          ప్రజలవద్దకు పాలన!

ప్రజలవద్దకు పుష్కరం!

                         గోదావరి జలమిప్పుడు ‘గాడ్ జల్’!

                                    ***

      తాగేనీళ్ళు సరే, తల మీద నీళ్ళూ

                           బాటిల్ పాతిక!

     పోస్టాఫీసులో ప్రవహిస్తోంది గోదావరి!

                    ***

అందరూ సమానులే

దేవునికీ ప్రజాస్వామ్యానికీ!

మంత్రులూ విఐపీలూ కొద్దిగా యెక్కువ సమానం!

                  ***

                  అటు ఆరొందల కోట్లు

            యిటు పదహారొందల కోట్లు

ఆనకట్టల కన్న స్నాన ఘట్టాలే మిన్న!

        ***

కృత్య దేవతల్నితిన్నదో లేదో

అకృత్యమైపోయింది ఆథ్యాత్మికం

నదిని మింగిన మనుషులొచ్చారు!

***

గాయపడ్డ గోదారి

క్రిష్ణమ్మతో పలికింది

యిక నీవంతే జాగ్రత్త సుమీ అని!*

ఉల్లిపాయసం 

 

                             -బమ్మిడి జగదీశ్వరరావు    

bajaraమా యింటి మీద ఒక్కసారిగా ఇన్ కమ్ టాక్స్ దాడులు! మా బంధు మిత్రుల యిళ్ళమీద కూడా దాడులు జరుగుతున్నాయేమో తెలీదు! నేనెప్పుడు కుబేరుల్లో కలిసిపోయానో నాకే తెలీదు! చూస్తూ వుండగానే మీడియా లైవ్ యిచ్చేస్తోంది! మా ఆవిడ లైవ్ లో తనని తాను టీవిలో చూసుకొని తెగ మురిసిపోతోంది! ‘ముందే చెపితే యెoచక్కా ముస్తాబయ్యేదాన్ని కదా?’ అని తెగ ఫీలైపోయి నా వంక నిష్టూరంగా చూస్తోంది! ఆగక, ‘నీ సంగతి తరువాత చూస్తా’నన్నట్టు కనుగుడ్లు యెగరేస్తోంది! చాలక, ఫేషన్ పెరేడ్ జరుగుతున్నట్టు పైటకొంగు నేల మీద ఈడుస్తూ పని వున్నా లేకున్నా అటూ యిటూ తిరుగుతోంది! ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు లాగి పారేసిన చీరల్ని యేరుకొని యెoచక్కా మాటి మాటికి మార్చుకు వస్తోంది.. వెళ్తోంది.. కొంగు అటూ యిటూ తిప్పుతోంది! ఇటు కాలు అటుపక్కకేసి.. అటు కాలు యిటుపక్కకేసి.. తన పాదాలకి కాదు, భూమికే పుండయి పోయినట్టు అడుగులు వేస్తూ- వయ్యారాల హొయలు ఒలికిస్తూ నడుస్తూ ఆగి- అంతలోనే తల అటు తిప్పి యిటు తిప్పి చూసి- మళ్ళీ కదిలి వచ్చిన దారినే పోతోంది.

రెప్ప ఆర్పకుండా నేను మా ఆవిడ్నే చూస్తున్నాను! “మీ ఆవిడే కదా?” అడిగాడో అధికారి. అనుమానంగా చూసాను! “..తరువాత తీరికగా చూసుకుందురు” అని నవ్వాడు. తనతో రమ్మన్నట్టు తలవంచి సైగ చేసాడు. వెంట వెళ్లాను. అడిగిన అన్ని తాళాలు యిచ్చాను. తెరిచి చూపించాను. మీరెళ్ళి రిలాక్స్ కండి అన్నారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అన్నారు. బుద్దిగా నేలమీద మటం దిద్ది పోగేసిన పేపర్లూ ఫైళ్ళూ తిరగేసుకుంటున్నారు. అప్పుడే బడిలోంచి వచ్చిన పిల్లలిద్దర్నీ చేరదీసిన మాఆవిడ “చూడండి అంకుళ్ళు యెంత బుద్దిగా చదువుకుంటున్నారో..” ఆదర్శంగా చూపించింది. ఎప్పుడూ హోంవర్క్ చెయ్యడానికి యేడు చెరువుల నీళ్ళు తాగించే మా పిల్లలు తోటి క్లాసు పిల్లలతో పోటీ పడినట్టు అధికార్ల పక్కన కూర్చొని హోంవర్క్ లు చేసేసారు!

మా ఆవిడ ముఖంలో ఆనందం. “అమ్మా ఈ అంకుల్స్ ని రోజూ మన ఇంటికి రమ్మని చెప్పమ్మా..” యిద్దరు పిల్లలు యేకమై అడుగుతుoటే అధికారులు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకన్నా యెక్కువ అయోమయం నా ముఖంలోనే! నన్ను పట్టించుకోకుండా “వస్తారులే..” వొప్పించేయడానికి అన్నట్టు అధికారుల్ని చూసి నవ్వుతూ అంది. “రాకపోతే మీ నాన్న రప్పిస్తారులే..” భలే నమ్మకంగా బడాయిగా అంది మా ఆవిడ.

ఇంతలో యిరుగూ పొరుగూ చేరారు. అంతా సంతలా వుంది. మా ఆవిడ అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి “మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారొదినా.. పిన్నీ మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారు.. అత్తా..” అని చాలా సంబరంగా అరిచిమరీ చెప్పింది.  అదో స్టేటస్ సింబల్ గా గర్వంగా తల తిప్పుకుంటూ యెగరేసుకుంటూ వచ్చింది. ఫ్రెండ్సుకూ పేరంటాళ్ళకూ ఫోన్లు కూడా చేసేసింది. టీవీలో చూడమని చెప్పేసింది. మధ్యలో యెందుకని యెవరో అడిగితే ‘సస్పెన్సు’ అని ఆట కూడా పట్టిస్తోంది. మరెవరితోనో ఏయే ఛానెళ్ళలో వస్తోందో అడిగి, రాని యేదో ఛానెల్ వాళ్ళ న్యూస్ కవరేజి బాగోదని, అసలు వాళ్లకి రేటింగ్ కూడా లేదని కసిదీరా రిపోర్ట్ యిచ్చేసింది.

“అమ్మా.. అమ్మమ్మా తాతయ్యా వాళ్ళకి చేప్పేవా?” పిల్లలు గుర్తు చేసారు. అందుకు ‘నా బంగారు కొండలు’ అని మెచ్చు కుంది. బంగారు కొండలయితే యెక్కడ యిన్ కమ్ టాక్స్ వాళ్ళు వదలకుండా పట్టుకుంటారోనని కలవరపడిపోయాను. నా బాధలో నేనుండగా మా ఆవిడ వెంటనే వాళ్ళ అమ్మానాయినలకు ఫోన్ చేసి చెప్పింది. అన్నా వదినలకు తను ఫోన్ చేసింది చాలక మళ్ళీ ఫోన్ చేసి చెప్పమంది. ఎవర్నీ మిస్సవవద్దంది. ఫోన్లో మాట్లాడుతూ “కనపడరుగాని దొంగ..” అని నా వంక ఓరగా మెచ్చుకోలు కళ్ళతో చూసింది. “ఇదిగో పక్కనే వున్నారు” అంటూ ఫోన్ నాకు అందించింది.

అవతల అత్తగారూ మాంగారూ స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. “మా యింటా వంటా లేదు అల్లుడుగారూ..” ఆ మాటకు తిడుతున్నారని గతుక్కుమన్నాను. “..మన మొత్తం బంధు మిత్రుల అన్ని ఫేమిలీలలో మీరే ఫస్ట్.. ఫస్ట్ అఫ్ ది ఫస్ట్..” మామగారి మాటకు అత్తగారు అడ్డు తగులుతూ “ముష్టి ముప్పైయ్యారించీల ప్లాస్మా టీవీ మన మొత్తం కుటుంబాలలో అందర్లోకీ మేమే మొదాట కొన్నామని మా చెల్లెలు వచ్చినప్పుడల్లా అందరిదగ్గరా టముకేసుకొని తెగ గొప్పలు చెపుతోంది కదా?, మా అల్లుడుగారి యింటిమీదే యిన్కం టేక్సోల్లు మొదాటపడ్డారని యిప్పుడు మనమూ చెప్పుకుందాము!..” మా అత్తగారు గొప్పలకు పోతున్నారు. అంతకుమించి పట్టుదలకు పోతున్నారు. “ ఏమైనా బాబూ.. మీరింత ప్రయోజకులైనందుకు నాకు యెంతో గర్వంగావుంది..” మామగారి మాట పూర్తి కాలేదు. “రేపు అన్ని పేపర్లలో వస్తుంది కదండీ..” మామగారిని మటల మధ్యలో అత్తగారు అడుగుతున్నారు.

నా బుర్ర గిర్రున బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది. మా ఆవిడ నా చేతిలోని ఫోన్ లాక్కుంది. “నాన్నా.. తెలుసుకదా? మా ఆయనకి గొప్పలు చెప్పుకోవడం అస్సలు యిష్టం వుండదు.. గొప్పలు చెప్పుకుంటే యీ మనిషితో మనకెందుకిన్ని తిప్పలు?” అని మూతి మూడొంకర్లు తిప్పింది. “మన గొప్పలు మనమే కదా చెప్పుకుంటున్నాం.. వూరోల్ల గొప్పలు చెప్పుకోవడం లేదు కదా!?,  అయినా మనకి మనం చెప్పుకుంటే తక్కువయిపోతామా? మన గొప్పలు మనం చెప్పుకోనిదే లోకం దానికది గుర్తిస్తుందా?” నన్నే అడిగిందో వాళ్ళ నాన్నతో అందో అర్థం కాలేదు. “సరి సరే వుంటాను, చాలా ఫోన్లు వస్తుంటాయి.. అవతల వాళ్లకి యేంగేజ్.. ఆ..” మా ఆవిడ ఫోన్ కట్ చేసింది. టీవీ పెట్టింది.

టీవీలో నన్ను చూసి “హే.. నాన్న..” పిల్లలు అరిచారు. చూస్తే- చూపించిందే చూపిస్తున్నారు. చూసిందానికి మాఆవిడ కామెంటరీ కూడా తోడయింది. “అదిగో అటు టాటా యిటు బిర్లా- మధ్యలో..” మా ఆవిడ చెప్పకముందే “మధ్యలో లైలా” అన్నారు పిల్లలు. “తప్పమ్మా నాన్నగారిని అలా అనొచ్చా?” నా గౌరవానికి భంగం కలిగినట్టు నోటిమీద వేలు వేయించింది. ఛానెల్ మార్చిందే కానీ కామెంటరీ ఆపలేదు. “అటు ముఖేష్ అంబానీ యిటు అనిల్ అంబానీ మధ్యలో..” పిల్లలు మాఆవిడకి అవకాశం యివ్వలేదు. “మధ్యలో మన నాన్న..” అన్నారు నోటిమీద వేలు తియ్యకుండానే. మాఆవిడ పిల్లలు ప్రయోజకులైనట్టు గర్వంగా చూసింది. రిమోట్ నొక్కింది. కామెంటరీ ఆగింది. అనుమానంగా చూసింది. అర్థం చేసుకున్న అధికారి వొకరు నివృత్తి చేసేలోగా మధ్యలో “ఆర్ నారాయణమూర్తి నాకెందుకు తెలీదూ..” అంది. “ఆర్ నారాయణమూర్తి కాడమ్మా.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఆపక్క లక్ష్మీమిట్టల్..” అధికారి సరిదిద్దేలోపల “మధ్యలో మన నాన్న..” కోరస్ పాడారు పిల్లలు.

అలా ప్రముఖుల మధ్యలో నన్ను చేర్చి పెట్టడమేకాదు, నన్నో ‘పెద్ద చేప’గా ‘తిమింగలం’గా టీవీ ఛానెల్స్ వాళ్ళు తమ తమ క్రియేటివిటీని చూపిస్తూవున్నారు. “మమ్మీ.. డాడీ పేద్ద చేపా? తిమింగాలమా?” పిల్లల డౌట్లు పిల్లలవి. “మొదట బుల్లి చేప.. తరువాత బిగ్ చేప.. తరువాత తిమింగలం.. తరువాత బకాసురుడు..” మాఆవిడ ఆన్సర్లు మాఆవిడవి. “డాడీ.. డాడీ నువ్వెప్పుడు బకాసురిడివి అవుతావ్?” పిల్లలు నన్నడిగారు. “మీనాన్నకి అంత సీన్ లేదు..” మాఆవిడ నిరసన స్వరం. యేo అన్నట్టుగా చూసారు పిల్లలు. “బకాసురులవ్వాలంటే.. రాజకీయాల్లోనయినా వుండాల.. రాజకీయాలయినా నడపాల..” నన్నో వేస్టుగాణ్ణి చూసింది మాఆవిడ.

చూసి- యిటు పిల్లల డౌట్లు తీరుస్తూ.. అటు లైవ్ ల్లో.. ఫోనుల్లో.. వచ్చీ పోయే వాళ్ళతో.. వీధిలో వాళ్ళతో.. ఫ్రెండ్స్ తో.. పేరంటాళ్ళతో మాఆవిడ అవధానం చేస్తూ “లైవ్ యివ్వడం లేదా?” మా ఆవిడ వుస్సురుమంది. “టీలూ కాపీలూ తాగారు.. టిపిన్లు పెడితే తిన్నారు.. చిన్న కునుకు తీస్తన్నారు.. లెగిసి సూటింగులు చేస్తారులేమ్మా..” సర్ది చెపుతోంది పనిమనిషి. ఓపిక పట్టలేక ఛానెళ్ళు మార్చుతోంది మా ఆవిడ!

“అమ్మా.. యిన్కం టేక్షోల్లు పడ్డారుకదా.. యిప్పుడయినా నా జీతం పెంచడమ్మా..” పనిమనిషి వొద్దికను మించి వుషారుగా అడిగింది. మా ఆవిడ నన్ను అడక్కుండానే సరేననేసింది.

టీవీలో- “ఊ!.. తాలింపు యెయ్యడానికి దాకే లేదు, యిల్లంతా యిత్తడి పెనాలని!.. వుల్లిపాయల రేటు తగ్గించడాకే లేదు, యీలు పత్తేకంగా ఓదా పట్టుకోస్తారంటే నమ్మీయాలా?” మూతి మూడొంకర్లు తిప్పి వెళ్లిపోయింది చిక్కోల్ ముసల్ది. ‘ప్రత్యేక హోదా సంగతీ రాజధాని సంగతీ  తరువాత ఆలోచించ వచ్చని, ముందు వుల్లి ధరలు తగ్గించాలని సామాన్య జనం కోరుకుంటున్నార’ని న్యూస్ యాంకర్ చెపుతున్నాడు.

యాంకర్ గొంతు నొక్కినట్టుగా రిమోట్ నొక్కింది మా ఆవిడ. న్యూస్ రూమ్ డిస్కషన్ నడుస్తోంది. అందరూ వొక్కసారే యెవరి వాదనని వారు బలంగా వినిపించి యెవరికీ యేమీ అర్థం కాకుండా చక్కగా మాట్లాడడంతో కాసేపటికిగాని అర్థం కాలేదు. ప్రతి రైతూ విధిగా తనకున్న భూమిలో పావొంతు వుల్లి పండించాలని ఆదర్శ రైతు వొకరంటే, వుల్లిని పౌడర్ చేసి పేస్టు చేసి దాచుకొని నిలవా పెట్టుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ యిప్పటికే సూచించారని అధికార పార్టీ సభ్యుడు గుర్తు చేసాడు. ఉల్లిని అధికార పార్టీ వాళ్ళూ వాళ్ళని సపోర్ట్ చేసే బడా వ్యాపారులు బాగానే నిలవా చేసారని ప్రతిపక్ష సభ్యుడు దుమ్మెత్తి పోసాడు.  ఉల్లి దొంగల్ని గజదొంగలుగా పరిగణించాలని జర్నలిస్టు మేథావి సూచిస్తే, అసలు వుల్లి లేకుండా వంట చేయడం మీద పరిశోధనలు జరగాలని సామాజిక మేథావుల సంఘం కన్వీనర్ అభిప్రాయపడ్డారు!

“రామాయణంలో ఈ పిడకల వేటేమిటో?..” నాలో నేను అనుకున్నాననుకున్ననేగాని పైకి అనేసాను. మాఆవిడ దగ్గర అన్నిటికీ ఆన్సర్ వున్నట్టే దీనికీ వుంది. “రామాయణంలో పిడకలవేట వుంది.. లంకా ప్రవేశం చేయడానికి సముద్రంలో  వానర సైన్యం వారధి నిర్మించింది. అప్పుడు సముద్రంలో వేసిన రాళ్ళన్నీ పిడకలగా తెలిపోయాయట.. వారదికోసం చేసిన రాళ్ళ వేటే రామాయణంలో పిడకలవేటగా ప్రసిద్దికెక్కింది..” మాఆవిడ వివరణకి నేనూ పిల్లలూ మాత్రమే కాదు ఇన్కమ్ టాక్స్ అధికారులూ నోళ్ళు వెళ్ళబెట్టారు!

‘ఉల్లిపాయలకూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకూ ఏమిటి సంబంధం?’ నా ఆలోచనలను అలవాటుగా స్కాన్ చేసిన మాఆవిడ “చెట్టు మీది కాయకీ సముద్రంలో వుప్పుకీ వున్న సంబంధమే!” అంటూ చెవిలో గుసగుసగా చెప్పి ముసిముసిగా నవ్వింది.

మా రొమాంటిక్ సీన్ ని అధికారులు ఆరాధనగానూ అనుమానంగానూ చూసారు.

మళ్ళీ రిమోట్ నొక్కింది. సెన్సెక్స్ స్థానంలో ‘ఆనియనెక్ష్’ యిస్తున్నారు. షేర్స్ లో తరగడం పెరగడం వుంది. కాని వుల్లికి సంబంధించిన ‘ఆనియనెక్ష్’లో పెరగడమే తప్ప తరగడం లేదు.  సెన్సెక్స్ పడిపోయినప్పుడు వచ్చిన గుండెపోట్లు కంటే  ‘ఆనియనెక్ష్’ పెరిగి పోయినప్పుడు వచ్చిన గుండెపోట్లే యెక్కువ!

ఛానెల్ మారింది. దృశ్యం మారింది. మా పిన్నీ కూతురు పద్మ. “పద్దూ వదిన వచ్చింది” సంబరంగా అంది మాఆవిడ. యింటి మీద యిన్కం టాక్స్ వాళ్ళు పడితే ‘బంధువులతో కూడా మాట్లాడిస్తారా?’ అవాక్కయాను. అందుకు కాదని కొన్ని క్షణాల్లో అర్థమయ్యింది. పద్దూ మొగుడూ లైవ్ లోకి వచ్చేసాడు. ‘యెంతో ప్రేమగా వుండే వాళ్ళు వీళ్ళకేమొచ్చింది?’ జుట్టు పీక్కున్నాను.

“..దుర్మార్గం కాకపొతే యేమిటండీ యిదీ.. అదనపు కట్నం అడిగితే.. మగనాకొడుకులు అంతా యింతే పోన్లే అని సరిపెట్టుకున్నాం, అత్తింటి వారు వుల్లి.. వుల్లిపాయలు అడిగితే పెట్టాలా అండీ.. అది సాధ్యమయ్యే పనేనా అండీ.. గొంతెమ్మ కోరికలు కోరితే యెట్లా అండీ..” మాపద్దూ రెచ్చిపోతోంది. “అదికాదండీ వుల్లిపాయలు నిండా వేసుకొని ఆమ్లెట్ తిని యెన్నాళ్ళయిందో తెలుసా అండీ.. యేమండీ ఆమ్లెట్ కాదండీ, వుల్లిగారెలు తనకీ యిష్టమేనండీ.. తను తింటుందనే అడిగాను..” కళ్ళ నీళ్ళ పెట్టేసుకున్నాడు మాబావ. ఎందుకో నా కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. ఉల్లివల్ల కుటుంబాలు కూలిపోవడమే కాదు, ప్రేమలు యెలా పగలుగా మారుతున్నాయో.. విడాకులకు దారితీస్తున్నాయో న్యూస్ యాంకర్ చెప్పింది. సాక్ష్యంగా మరికొన్ని బైట్స్..

“మా ఆయన యెప్పుడూ నన్నొక మాట అనేవారు కాదు, వుల్లి పాయలు దుబారాగా వాడి సంసారాన్ని నాశనం చేసానని అన్నప్పుడు యింక అతనితో యెంత మాత్రమూ వుండకూడదనుకున్నాను.. డైవోర్స్ తీసుకొని పుట్టింటికి వచ్చేసాను..” కళ్ళు  వొత్తుకుంది ఓ ఆడ పడుచు.

“.. అరే.. నేనేమన్నా బాహుబలి టిక్కెట్లు అడిగానా? లేదే, రూబీ నక్లెస్ అడిగానా? లేదే, ఆధార్ కార్డు పట్టుకొని రైతు బజార్లో యిచ్చే సబ్సిడీ వుల్లి తెమ్మన్నాను, క్యూ అంటాడు, ఎర్రగడ్డ రైతుబజార్ క్యూ ఎల్బీనగర్ దాక వుందంటాడు.. ఎల్బీనగర్ కాదండీ విజయవాడ వరకూ.. విశాఖపట్నం వరకూ క్యూ వుంటుంది.. వుంటే మాత్రం ఫ్యామిలీ అంటే బాధ్యత లేదా? ఆ మాత్రం చెయ్యలేవా? అడిగాను. సంసారమే చెయ్యలేనన్నాడు.. దట్సాల్.. వుయ్ క్లోస్డ్ అవర్ రిలేషన్ షిప్..” డోoట్ బాదర్డ్ అన్నట్టు చెప్పింది ఓ పడుచుపిల్ల.

ఇంతలో నా సెల్లు ఘోల్లుమంది. హలో అన్నాను. పోలో మన్నాడు మిత్రుడు. నువ్వింత నమ్మక ద్రోహివి అనుకోలేదన్నాడు. ఔనౌను అన్నాను. మరి అధికారుల కళ్ళూ చెవులూ నన్నే చూస్తున్నాయి. నవ్వాను. ఏడ్చినట్టుంది అన్నాడు. ఔనౌను అన్నాను. ‘పిల్ల పెళ్ళికి కాస్త సాయం చెయ్యరా, అదీ అప్పుగా అంటే లేదన్నావ్’ అన్నాడు. ఔనౌను అన్నాను. ‘మరి నీ యింటి మీద యిన్కమ్ టేక్సోళ్ళు యెలా పడ్డార్రా?’ అన్నాడు. ఔనౌను అలవాటుగా అనేసి, నాలుక్కరుచుకొని తెలీదన్నాను. “ఇన్నాళ్ళూ డబ్బులు లేవని చాలడం లేదని తెగ దొంగేడుపులు యేడ్చేవా.. యిప్పుడు నిజంగా యేడు.. తధాస్తు దేవతలు వుంటార్రా..” తిట్టి తాటించి మరీ ఫోన్ పెట్టేసాడు.

“ఏంటండీ సుబ్బారావన్నయేనా?, చెప్పలేదని తెగ ఫీల్లవుతున్నారా? అవరూ.. యింటి మీద యిన్కం టేక్సోల్లు పడ్డారని యిప్పుడన్నా ఫ్రెండ్స్ కి మెసేజులు పెట్టండి.. మెయిల్లు చెయ్యండి.. మా ఫ్రెండ్ యింత గొప్పవాడయ్యాడని వాళ్ళూ పదిమందికి గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళకీ గౌరవం.. మనకీ గౌరవం.. నేనయితే నా ఫేస్ బుక్ లో మన ‘స్టేటస్’ పెట్టేసా..” టీవీ వదిలి కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కూ టక్కూ లాడిస్తూ వుంది.

పిల్లల చేతికి రిమోట్ దొరికింది. ఛానెల్స్ ఛేoజ్ చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ దగ్గర ఆగారు. కొత్త సినిమా పాట కాదు. పాతది. మూగనోము లోది.

“ఉల్లివి నీవే.. తల్లివి నీవే.. చల్లగ కరుణించే దైవము నీవే..” పాటకు మా పిల్లలిద్దరూ “ఉల్లివి నీవే.. తల్లివి నీవే..” అంటూ తెరమీది పిల్లలతో కలిసి కోరస్ యిస్తున్నారు.

“ఏవండీ..” పిలుపు విని మా ఆవిడ పక్కన చేరాను. ఫేస్ బుక్ లో తను బుక్కయింది చాలక నన్నూ లాగింది. “.. మీరు వుల్లిపాయలకు వెళ్ళేటప్పుడు.. పోలీస్ స్టేషన్ లో మీ యిన్ఫర్మేషన్ యిచ్చి వెళ్ళండి.. మార్గం మధ్యలో యెవరితో మాట్లాడకండి.. వీలయితే కిందింటి కుర్రాడు సైదుల్ని మీతో తోడు తీసుకువెళ్ళండి.. చైన్ స్నాచర్స్ లాగే ఆనియన్ స్నాచర్స్ తయారయ్యారు జాగ్రత్త.. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు మనీ డ్రా చేసేటప్పుడు యెన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వుల్లిపాయలకి వెళ్ళినప్పుడు- కొని తీసుకోస్తున్నప్పుడు అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి..” చదువుతూ చెప్తోంది. మా ఆవిడ మాటకు గంగిరెద్దులా తలాడించాను. అలా తలాడిస్తే నేనెంతో ముద్దోచ్చేస్తానట!?

ముద్దుముద్దుగా మాఆవిడ “ఉల్లిని కోస్తే కళ్ళు మంట! ఉల్లిని కొంటె గుండె మంట! ఉల్లి ఉంటేనే వంట! ఉల్లి లేకుంటే తంటా! ఎలావుందంటా?” చెప్తే మురిసి? “నువ్వే నా కవితంట” అన్నాను!

ఇన్కమ్ టాక్స్ అధికారులు రిపోర్టులు తయారు చేసి పని పూర్తయినట్టు లేచి నిల్చున్నారు. నాతో కొన్ని సంతకాలు కూడా తీసుకున్నారు. “థాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్..” అధికారి మాటకి “వెల్ కం.. మోస్ట్లీ వెల్ కం..” మాఆవిడ మగపెళ్లివారితో అన్నట్టు యెంతో ప్లీజింగ్ గా ప్లెజర్ గా అంది.

వెళ్ళిపోతున్న అధికారుల వెంట పడి “సార్.. యిప్పుడు యేమవుతుంది?” నా భయం కొద్దీ నేనడిగాను. “మొదటిసారి కదా.. అందుకని..” మాఆవిడ నవ్వింది. నవ్వి “యిన్కం టేక్సు రెయిడ్స్ జరిగినోల్లంతా అలా కోర్ట్ కు వెళ్లి యిలా వచ్చేస్తున్నారు.. సొసైటీ అన్నాక పెద్దవాళ్ళన్నాక పెద్ద సమస్యలు వస్తాయి.. పోతాయి.. కామన్..” చెప్తూ వుంటే మాఆవిడ నాకు ధైర్యం చెపుతోందో అధికార్లని అధైర్యపరుస్తోందో అర్థం కాలేదు!

“సార్.. యింతకీ మా యింటి మీదే మీరు యెందుకు పడ్డారు?” అని నా ప్రశ్న నాకే సబబుగా తోచక “ మీరంటే మీ  యిన్కం టేక్సోల్లు యెందుకు పడ్డారు సార్?” దీనాతిదీనంగా హీనాతిహీనంగా అడిగాను.

నా ముఖం చూసి నిజం చెప్పకుండా వుండలేక పోయారు.

“టెన్ డేస్ బాక్ మీరు ఆనియన్ దోస ఆర్డర్ చేసి తిన్నారు.. గుర్తుందా?” అడిగి, అదే కారణమన్నట్టు ఒక్క క్షణం చూసి, ఆగిన అధికారి సిబ్బందితో ముందుకు అడుగెయ్యబోయాడు.

సరిగ్గా అప్పుడే మాఆవిడ “యేవండీ మీకిష్టమని ముద్దపప్పుచేసాను,  పపూ టమాటా కూడా వండాను, రండి వేడిగా తిందురు..” నన్ను పిలిచింది.

ముందుకు వెళ్ళబోతున్న యిన్కమ్ టాక్స్ వాళ్ళు ఆగి వెనక్కి చూసారు!

*