తొలి ప్రేమ జ్ఞాపకాల సహారా ఈ కథ!

 

ప్రియ కారుమంచి

ప్రియ కారుమంచి

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

– చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, నరేష్ ఎదురుగా ఉంటే (లేదా ఉన్నట్టు అనుకొని) ఇలా చెప్పాలనిపిస్తుంది:

నరేష్ … నువ్వొక ప్రేమ పిపాసివి!

నీకు ప్రేమించటం అనే చిత్కళ తెలుసు.

‘నిరంతరమూ వసంతములే…. ‘ అని నమ్ముతావు, లేదా ‘హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం.. తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం’ అని నమ్మబలుకుతావు.

నువ్వు చాలా సులువుగా కనిపించే గడ్డిపువ్వు, లేదా బహు అరుదని అనిపించే గగనకుసుమం, పోనీ పారిజాతం; ఈ లోకాలకి చిక్కని, దొరకని ప్రేమ పరిమళాలు చిమ్మే దేవ పారిజాతం.

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

viewer

చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, ఒక ఎమోషనల్ స్థితిలో పైవిధంగా చెప్పాలని అనిపించడం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు.

ఒకటి- స్టేజ్ మీద నాటకానికి తెర పడ్డాకో, తెరమీద బొమ్మల కథ ముగిశాకో ఒక ఈలవేసి బరువు దించుకోవడం, లేదా ఆ ప్రదర్శనతో మమేకం కావడం వల్ల ఆ మూలాన్ని తలకెత్తుకోవడం-

….. ఈ రెంటిలో నాది ఏ స్థితి అని తరిచి చూసుకోవడానికి మళ్లీ పుస్తకంలోకి వెళ్లాలి.

ఇప్పటికే ఈ పుస్తకం మీద చాలా మంది రివ్యూలు రాసారు (ఏం రాశారో చదవడం పడలేదు).

అసలు ఇది పుస్తకం అని ఎలా అనగలం.. కాదు ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు ఇదీ ప్రేమతో మనల్ని తడిపేయడానికి వచ్చిన శ్రావణ మేఘం. చేయిపట్టుకుని తన కలల ప్రపంచంలోకి నడిపించుకెళ్ళే జ్ఞాపకాల శరచ్చంద్రిక. రచయిత తనదైన ఒక nutshellలో భద్రంగా దాచుకున్న తన జ్ఞాపకాల దొంతరను మనముందు పరిచి, ఆ దిగుడుబావి మెట్ల మీదుగా తన మనసు అగాధాల్లోకి నడిపించిన ఒక మెత్తని, కల్పన అనిపించని ప్రేమ కథ. శ్రావణమే గానీ, ఒక దిగులు మేఘం కరిగి రాల్చిన వలపువియోగాల వాన చినుకు.

– ఇలా రాసేసి చూసుకున్నాక, కనిపించని నిట్టూర్పు, వినిపించని ఈల వేసిన ఒక రిలీఫ్ అనిపించింది. ఇది చదివిన ఎవరైనా ‘MY AUTOGRAPH- Sweet Memories’ అంటూ, అంత బాహాటంగా కనిపించని పోపు డబ్బాల్లో రహస్యంగా, అపురూపంగా దాచుకున్న మారుతాళం చెవులతో స్మృతుల పేటికల్ని తెరుచుకుంటూ పోతారు. కానీ, నన్ను నేను కొత్తగా కనుక్కున్నట్టు, నేను కొత్తగా పుట్టి, పుట్టిన వెంటనే దేనికోసమో వెదుక్కున్నట్టు చేసిన పుస్తకం తర్వాత ‘రిలీఫ్’, ‘రిలీవ్’అయిపోవడం నాకు ఎంతమాత్రం నచ్చలేదు; లేదా సరిపోలేదు.

ఈ కధలో రచయితే Protagonist. ఆమె నమ్మకానికి, అతని ప్రేమకి మధ్య సంఘర్షణ. చివరిలో, తన ప్రేమ మీద దాటవేసిన పరీక్షకి ఎవరో సంబంధం లేని మూడోవ్యక్తి జారీచేసిన రిజల్ట్ ని భారంగా మోసుకొచ్చిన తన ప్రేయసి చెప్పిన చివరిమాట- “వద్దన్నారు , నీకూ నాకూ అస్సలు కుదరదన్నారు , ఇక ముందెప్పుడూ నిన్ను కలవకూడదన్నారు”. తన నిస్సహాయతకు క్షమాపణ చెపుతూ చివరిగా తన చేతిని చాచిన ఆమె చేయి అందుకోకుండా రెండడుగులు వెనక్కు వేస్తాడు;ఎందుకంటే అలిగి కాదు ..తన తొలి స్పర్శే చివరిదై ఎడబాటు కరచాలనంగా మిగలడం ఇష్టం లేక-

పైన చూచాయగా చెప్పుకున్నట్టు ఈ ప్రేమకతలతో పెద్ద గొడవ ఉంది. ‘ప్రేమకు లేదు వేరే అర్ధం ప్రేమకు ప్రేమే పరమార్ధం ప్రేమించు, ఆ ప్రేమకై …….జీవించు’ అనే ప్రతిపాదన లాంటి, ప్రేమ పాటలతో ఉన్న గొడవ లాంటిది. వీటిని ‘బాగున్నాయి’, లేదా ‘బాగోలేదు’ అని అనుకోవడానికి ముందే చదువరుల (శ్రోతల) అనుభవాలూ,జ్ఞాపకాలు తగుదునమ్మా అని ముందుకు తోసుకొచ్చి, వాటి బాగోగుల్ని తరిచి చూడనివ్వక్కుండా తగు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుకి దిగుతాయి. పాఠకుల సదరు బలహీనత మీద దెబ్బకొట్టి పబ్బం గడుపుకుందామని అనుకోకపోవడమే- నరేష్ నిజాయితి. అలాగే, ఇది విఫల ప్రేమ అంటే నేను ఒప్పుకోను; ఎందుకంటే రచయిత నరేష్ గుండెల్లో ఈ ప్రణయ గురుతులు ఇంకా పదిలంగా, సజీవంగా ఉన్నాయి కాబట్టి.

నున్నా నరేష్

నున్నా నరేష్

ఒకచోట సత్యసాయి గురించి చెప్తూ “సత్య సాయి ఒక రూపం కాదు, సారం- అనుకుంటే పాత్రని బట్టి ద్రవం రూపం తీసుకుంటే ప్రేమ మూర్తి అయిన అనిల్ అంకుల్ దృష్టిలో సాయికి పర్యాయ పదం ప్రేమ ….అదే శాస్త్రీయ సాక్ష్యాల మీద బ్రతుకు భవనం కట్టుకునే అచ్యుతుల వారికి సాయి ఒక మహత్తు.. అష్టైశ్వర్యాలూ కట్టబెట్టే ఒక మహత్తు ….శల్య పరీక్షలతో నిగ్గుతేల్చి అసలు రంగు బయట పెట్టాలనుకునే చార్వాకులకు బాబా వట్టి బురిడి …సంరక్షణ సాకుతో ఆయన బోను చుట్టూ నిఘా నీడలుగా మోహరించిన అంతరంగికులకు సాయి ఒక తరగని గని”, అంటాడు రచయిత.

“ఒక నమ్మకాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళ ఇళ్ళల్లో వధువుల పరిస్థితి హోమగుండంలో కాలీకాలని పచ్చికట్టేల పొగకి కళ్ళు మండి, పక్కనున్న వరుడే కాదు, ముందు పొంచిఉన్న జీవితం కూడా ఆనని, అర్థంకాని అయమయమే కొత్తపెళ్లి కూతురిది” అన్నప్పుడు చలం ముద్రలు కనిపించాయి.

ఇక పోతే కధలోని ఒక పాత్ర ‘సౌభాగ్యమ్మ’ మీద వేసిన సెటైర్లు చదువుతున్నంత సేపూ నాకైతే సౌభాగ్యమ్మ విసావిసా విదిలించుకుని వెళ్ళిపోతున్న దృశ్యం కళ్ళముందు కదలాడి ‘ఇలాంటి వాళ్ళతో సరిగ్గా ఇలాగే మాట్లాడాలి , భలే అన్నాడు’ అనిపించిది.

ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ జీవాన్ని పొదిగి, తన భావాలతో జోడించి ఒక వాస్తవ ప్రేమకథని మన కళ్ళకు కట్టిన నరేష్ – ఒక కార్మేఘమై మనల్ని కమ్మేసి, చదివిన ప్రతి ఒక్కరూ అందమైన తమ తొలి ప్రేమ జ్ఞాపకాల్ని తవ్వుకొని, తమని, ప్రేమ రూప- భావాల్ని తరిచి చూసుకోవడానికి మళ్లీ మళ్లి చదివేలా చేశారు. గొప్ప రచనల ఉద్దేశం ఇదేగనక అయితే,  ‘తేరా నామ్ ఏక్ సహారా?!’ మంచి పుస్తకం అనడానికి ఇంతకు మించి రుజువు లేదు నా దగ్గర.

– ప్రియ కారుమంచి