క్యాంపస్

rafi1

Art: Rafi Haque

 

-ప్రసాద మూర్తి

~

 

మా పక్కనే క్యాంపస్ ప్రవహిస్తుంది

దాని పక్కనే మేం శిలల్లా నిద్రిస్తాము

అప్పుడప్పుడూ

కలలు మోయనంతగా రెప్పలు బరువెక్కినప్పుడు

రెక్కల గుర్రాలను చూడాలని

క్యాపంస్ కి వెళతాను

దేహమంతా రంగుల అద్దాలు అతికించుకుని

లోపల రక్తాన్నితిరగమోత పెట్టుకుంటాను

అప్పుడు క్యాంపస్ నా వీపు మీద

గాఢమైన ముద్దు పెడుతుంది

అది ఛాతీ మీద ముద్రగా బయటకొస్తుంది

 

యూనివర్సిటీనీ సముద్రాన్నీ

అటూ ఇటూ రెండు చేతులతో పట్టుకుని

విశాఖ వియత్తలం మీద

విహరించిన విరగబాటు

ఘాటుగా నరాల్లో కమ్ముకున్నాక

కూర్చుంటాను కుదుటపడతాను

క్రిక్కిరిసిన చుక్కలతో పగలూ రేయీ

పాటలు పాడే ఆకాశంలా క్యాంపస్ పక్కనే వుందని కాని

ఈ కాళ్ళకింద ఇన్ని నదులెలా కదులుతాయి మరి

 

ఇప్పుడు క్యాంపస్ లో పక్షులు

పాటలు మానేసి

దేశభక్తి పరీక్షలు రాస్తున్నాయి

చెట్లు కూడా చప్పుడు చేయకుండా

గాలి చెవిలో జాతీయ  గీతాలు పాడుతున్నాయి

జీవన్మరణ పాకుడురాళ్ళ మీద

ఒక చూపుడు వేలు ఆజాదీ గీత రచన చేస్తోంది

చుక్కల్ని వెదుక్కుంటూ ఎటో వెళ్ళిపోయిన యువకుడు

అప్పుడప్పుడూ గాల్లో వేల నీడలుగా పరుగులు పెడుతూ

ఫకాలుమని నవ్వుతున్నాడు

కలం కుత్తుకల మీద కత్తులు నాట్యాలు చేస్తున్నాయి

క్రొన్నెత్తుటి కోనేటిలో మొసళ్ళు మసలుతున్నాయి

 

అక్కడ  నీలి ఆకాశాలూ ఎర్రసముద్రాలూ

అలాయ్ బలాయ్ ఆడుకుంటున్నాయని ఆనందపడతాను

మరిప్పుడు  ఊరి నుండి క్యాంపస్ దాకా

వెలివాడ కారిడార్ పరచిన ఆధునిక మనుహాసం  భయపెడుతుంది

 

పుస్తకాలు పట్టుకోవాల్సిన క్యాంపస్

ఇప్పుడు ఆయుధాలు పట్టుకుంటే

జీవితాన్ని పట్టుకుని ఇలా ఎలా వేలాడగలం?

——————-  ——————

( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే మేం వుండేది)

ఇంకా లాంగ్ డ్రైవ్ లోనే వున్నాం, అరుణ్!

 

-ప్రసాద మూర్తి

~

 

మనసు నిండ లేదురా. నీ స్నేహాన్ని పూర్తిగా..తృప్తిగా కడుపు నిండా నింపుకోనే లేదురా. ఉదయించే సూర్యుణ్ణి మన ధిక్కార అక్షరాలతో ఇంకా ఇంకా కవ్విస్తామని, అస్తమయాలను ఇంకా ఇంకా రెప్పవాల్చని మన యవ్వన స్వప్నాలతో నవ్విస్తామని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆకాశం గోడ మీద నీడలమై మనం ఎన్ని నినాదాలు రాసుకున్నాం. ఏ చెట్టూ నీ కంటే పచ్చగా వుండలేదని మేమంతా ఎంత మురిసిపోయే వాళ్ళం? తనివి తీరలేదురా తమ్ముడూ. నీతో కలిసి వేసిన అడుగుల కడుపులో పూచిన చెలిమి మొగ్గల తొడిమలు ఇంకా తడితడిగా కదులుతున్న చప్పుడే వినిపిస్తోందిరా.

అన్నయ్యా నీ పెళ్ళికి(1985) నిక్కరు వేసుకుని విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం మీటింగ్ హాల్లో కూర్చున్నానని అనేవాడివి. కావాలంటే చూసుకో అని అప్పట్లో నేను ప్రజాశక్తిలో రాసిన కవితల కటింగులు చూపించి నా కళ్ళల్లో చిరుబొట్టువై మెరిసేవాడివి. కాని కవిత్వంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నిక్కరు వేయించి నీ ముందు కూర్చోబెట్టుకునేంత ఎత్తుకు ఎదిగిపోతావని నీ మొదటి వాక్యం దగ్గరే పసిగట్టాను. ఆ మాట చాలాసార్లు నీతో అంటే నువ్వేమనేవాడివి? ఊరుకో అన్నయ్యా మరీ చెప్తావు అని నవ్వేసే వాడివి గుర్తుందా? నిన్నింకా పూర్తిగా స్పష్టంగా తేరిపార చూడనేలేదురా. నిద్దట్లోంచి అదాటున లేచి..నిన్ను చూసి..చాచిన నీ చేతుల్ని చూసి నిన్ను వాటేసుకొని ఇంకా నీ కౌగలి విడిపించుకోనేలేదురా. ఇంతలోనే అంత మాయ చేస్తావా తమ్ముడూ.

ఇంకా నీతో కలసి లాంగ్ డ్రైవ్ లో వున్నట్టే వుంది తమ్మీ. కింద మిత్రులు..పైన పగటి పూట సూర్యుడు, రాత్రి చంద్రుడితో కలిసి రయ్ రయ్ న తుపాకీ గొట్టంలోంచి వచ్చే అక్షరాల్లా దూసుకుపోతున్నట్టే వుంది. అదిగో అలా నువ్వింకా స్టీరింగ్ తప్పుతూ ఎక్సలేటర్ తొక్కుతూ ఇంకెంత దూరం అన్నా వచ్చేసాం. ఇదిగో ఈ పాట విని అంటూ ఏ రాజేష్ ఖన్నా షర్మిలా టాగూర్ ల మధ్య నలిగిన ఏ పూల గుత్తినో రేకులు రేకులుగా తుంపి నా చెవుల్లోనువ్వు పిండుతున్నట్టే వుంది. ఏంటో నీ మాటలు ఆగిపోయాయని..ఈ  చెవులు తుడిచేసుకోవాలని అనిపించడమే లేదు.

నీకు స్క్రీన్ మీద ఫ్రేములు బిగించడం తెలుసు. దృశ్యాలను ఫ్రేముల్లోపెట్టే రహస్యాలు తెలుసు. మాటలను కూడా ఫ్రేముల్లో దృశ్యాలను చేసే మాంత్రికుడివని మరి మాలాంటి వాళ్ళకు తెలుసు. నువ్వు మాగ్జిమమ్ రిస్క్ చేసినప్పుడే అనుకున్నాను వీడు మా తొక్కలో లెక్కల్లో ఒదిగేవాడు కాదని. నీ రెండో కవితా సంపుటి మియర్ మేల్ కి చిన్న ముందు మాట రాయమన్నావు. రాస్తే అన్న వాక్యం అని ఎంతో గౌరవంగా వేసుకున్నావు. అది నాకు దక్కిన గొప్ప గౌరవం అని నేననుకున్నాను. అప్పుడే అన్నాను నీ మీద అసూయగా వుందిరా అని. అప్పుడు కూడా పో అన్నా నువ్వు మరీనూ అని నవ్వేశావు. నువ్వు నవ్వుతావురా. నీ నవ్వు వినడం కాదు చూడాలి. ఒరేయ్ ఇంకా నీ నవ్వు చూడ్డంలో వున్న హాయి తీరలేదురా. నీ నవ్వుల్లో ఏవో కెరటాలు కెరటాలుగా కాంతి గోళాలు కనిపించేవి మరి. రాజేష్ ఖన్నాని వర్ణించేవు చూడు.  అంత కంటె అందగాడిగా కనిపించేవాడివి. అవును మరి అమ్మాయిల్ని ఎలా కళ్ళతో పడేయాలో రాజేష్ ఖన్నాని చూసి తెలుసుకోవాలనేవాడివి. ఆ మర్మ విద్య నీకు తెలిసిందా అంటే చెప్పీ చెప్పక తప్పించుకునేవాడివి. చెవి దగ్గరగా పెడితే చాల్లే అన్నా అని సిగ్గుపడే వాడివి.

నువ్వు చెప్పని రహస్యాలు చాలా వున్నాయిరోయ్. నీ వయసెంతో మాకింకా పజిల్ గానే మిగిల్చావుకదా. అందరినీ అన్నా అనే పిలిచేవాడివి కదా. టీవీ 9 ఆఫీస్ బాయ్ దాసు గుర్తున్నాడా? వాడు నీకంటె పదేళ్ళుపైనే చిన్నోడు. అయినా దాసన్నా అని పిలిచేవాడివి. ఇదేం అన్యాయంరా అంటే ఏంటన్నా నేనింకా పోరగాడినేగా అని కొంటెగా కొట్టిపారేసే వాడివి. లోకంలో అందరిలోనూ నువ్వే చిన్నవాడివనిపించుకోవాలని నీ ఆశచూసి మేం నిన్నెంత ఉడికించేవాళ్ళం? ఎప్పుడో నలభై గీత దాటక ముందే నీ వయసు ఆగిపోయింది. అదేంటంటే సర్టిఫికెట్ దొంగ లెక్క అనేవాడివి. ఫార్టీప్లస్ అనిపించుకోవడమే ఎలర్జీ. మరి ఫిప్టీకి దగ్గరపడ్డాన్ని నువ్వెలా తట్టుకోగలవులే. లోపల్లోపలే అవయవాలు ఎదురు తిరుగుతున్నా శరీరాన్ని మాత్రం నలభై దగ్గరే అట్టిపెట్టి వుంచావు. ఇంకా వుంటే మేమంతా నీ వయసు కనిపెట్టేస్తామని అనుకున్నావో ఏమో నీతోపాటే నీ వయసునూ మాయం చేద్దామనే ఇలా మాయమైపోయి వుంటావు.

bandaru

పూలండోయ్…పూలు!

నువ్వు కులం గురించి నాకు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పనులే తమ్ముడూ. నిన్ను కౌగలించుకుని గట్టిగా హత్తుకున్నచేతుల్లో కూడా కులం ఏ రంగులో ప్రవహిస్తుందో చూడగలిగిని వాడివి. నీ వయసులానే నీ కులం విషయం కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశావు.తెలుసుకోడానికి ఎందరు ఎన్ని రకాల అంజనాలు వేశారో..ఎన్నిరహస్యోద్యమాలు నడిపారో తెలిసి మనం ఎంత గట్టిగా నవ్వుకున్నాం. వాళ్ళకి తెలిస్తే ఆ నవ్వుకి బట్టలూడి  పరుగులు తీసేవారేమో. కమ్యూనిజంలో నిజం వుందని గట్టిగా నమ్మినవాళ్ళం కదా. ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అని కదా నీ లెక్క. అవును నీ అక్షరాక్షరం వామపక్షమే. కానీ కమ్యునిజంలో వున్న నిజం నాయకుల్లో లేదని నువ్వెంత బాధపడేవాడివి?

ఉద్యోగం నిమిత్తం నేను రాష్ట్రాలు పట్టి తిరిగి తిరిగీ 2000లో హైద్రాబాద్ చేరుకున్నది మొదలు ఇప్పటిదాకా మనం కలుసుకోని రోజులు తక్కువే. ఒకరినొకరం తలుచుకోని క్షణాలూ తక్కువే. ఏది రాసినా ముందు నాకే చూపించే వాడివి. దగ్గర లేకుంటే ఫోనులో వినిపించేవాడివి. వయసైపోతోంది. నీలా నేనెప్పటికి రాస్తాన్రా అంటే పో అన్నా నువ్వలా నన్ను పెద్దోణ్ణి చెయ్యకు. ఆయుక్షీణం అనేవాడివి. నిజంరా అంటే నమ్మేవాడివి కాదుకదా. ఇప్పటికీ నేను అదే మాటమీదున్నాను. నువ్వు డిఫెరెంట్. నీ స్టయిల్ డిఫెరెంట్. నీ కలం డిఫెరెంట్. నీ కవిత డిఫెరెంట్. నీ కంటెంట్ విషయంలోనే నేనప్పుడప్పుడూ గొడవపడేవాడిని.

నీకు గుర్తుందో లేదో నీ లంగ్ ఆపరేషన్ చేసినప్పుడు నా ఊపిరితిత్తుల మీద కత్తెర్లు పడినట్టు గిలగిల్లాడాను. లంఘించరా తమ్ముడా ఉల్లంఘించరా ఒక్క ఛలాంగ్ తో ఈ లంగ్ జంగ్ జయించరా అని రాశానే. మరి నువ్వలాగే అన్నావుగా. అదో వేలంవెర్రిగా నిన్ను చుట్టేసుకునే నీ చేలాగాళ్ల ఊపిరి కూడా పోసుకుని పయనించరా తమ్ముడా ప్రస్థానించరా..నిండు నూరేళ్ళూ హాయిగాజీవించరా అని అన్నాను కదా. మాటిచ్చావుగా. ఎందుకిలా ఇంత తొందరగా నీ మాటను కూడా ఉల్లంఘించిపోయావురా?

నువ్వు పదికాలాలు బతికుంటే తెలుగు కవిత్వం పదికాలాలు బతికుండే జవసత్వాలు పుంజుకుంటుందన్న ఆశతోనే నిన్ను చాలా చాలా తొందరపెట్టాను. నువ్వు జేగురు రంగు జ్ఞాపకాలు రాస్తే నీ అక్షరాల్లో అసలు రంగు అదే అన్నాను. నువ్వు యాన్ ఆఫ్టర్ నూన్ యట్ చట్టి అంటే నీలో మండుతున్న మధ్యాహ్నాలు చాలా వున్నాయి. వాటినే బయటకు తీయమన్నాను. భద్రాచలం రాముడి పాదాలు ముద్దాడే పాపికొండలకు నువ్వు తలబాదుకుంటే రానీయ్ రానీయ్ నీలోంచి లక్షల క్యూసెక్కుల ఉధృతిలో అక్షరాలను ఉరకనీయ్ అన్నాను. అన్నీ పక్కన పెట్టి పోలవరం ముంపు గ్రామాల కంటె ముందు వందల సార్లు మునిగి తేలి మునిగి తేలి ఊపిరాడక కొట్టుకుంటున్న నీ కవితల్ని ఒక్కచోట చేర్చి పోగుపెట్టమన్నాను. నా మాట కాదనలేదు. అలాగే అన్నా అన్నావు. అలాగే చేశావు. నా మాటదేముందిలే నీకు మిగిలిన టైం నిన్నలా తొందరపెట్టి వుంటుంది. ఇంక ఈ సాగరానికి అడ్డూ ఆపూ లేదనుకున్నాను. నేనే కాదు.

నీ మరణ వాంగ్మూలం అనబడే మ్యూజిక్ డైస్ చూసిన ప్రతివాడూ ఆ మృత్యు సంగీతం విన్నవారంతా వందల అడుగుల నీటి లోతులో సమాధైన గ్రామాల్లా దు:ఖించడం ప్రారంభించారు. ఎవడూ నాకు ఒక్క అవార్డన్నా ఇవ్వలేదేంటన్నా అనేవాడివి. ఒకటేంట్రా వందలొస్తాయి అనేవాడిని. ఆ రోజులు వచ్చేశాయిక అని అన్నాను కదా. నువ్వే తొందరపడ్డావు. ఆ రోజులు చూడకుండానే తొక్కలో అవార్డులు నాకెందుకు..నేనే మీకో అవార్డు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయావు. కొందరు కాలం కంటె ఎప్పుడూ ముందే వుంటారు. తమ్ముడూ నిన్ని అర్థం చేసుకునే కాలంలోకి మమ్మల్ని నడపకుండానే ఎలా వెళ్ళిపోయావురా?

నేను చెబుతున్నానుకదా నీ డిక్షన్..నీ కవన కుతూహల రాగం తెలుగు కవిత్వ విద్యార్థులకు..విరాట్టులకూ ఒక తప్పనిసరి పాఠం అవుతుందిరా. నీ పదాల్లో మార్మికత లేని మంత్రధ్వని వుంది. నీ ముందు కూర్చోడానికి అందరం పలకాబలపం పట్టుకుని కూర్చునే టైమొచ్చినప్పుడే నువ్విలా అదృశ్యమైపోవాలా? నిన్ను ఎవరు అనుకరించినా ఇట్టే దొరికిపోయేట్టు పోయెం పోయెం మీదా నీ పేరును వాటర్ మార్క్ గా వేసిపోయావు.ఎంతైనా టీవీవోడివి కదా. అసాధ్యంరా నిన్ను చూసి పొంగిపోవలసిందే తప్ప నిన్ను దొంగిలించడం అసాధ్యం. ఇంగ్లీషు చదువుకున్న తెలుగు కవులున్నారు.

కానీ తెలుగు కవిత్వం ఇంగ్లీషు చదుకునే దశ నీతోనే మొదలైందనుకుంటా. ఆంగ్లమా..ఆంధ్రమా లాంగ్వేజి కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా చూడమన్నావు. నువ్వు భలే తుంటరోడివిరోయ్.  నువ్వొక పక్క..మిగిలిందంతా ఒక పక్క రెండు పాయలుగా తెలుగు కవిత్వం అలా వుండిపోతుందేమో అని అనుకునే వాడిని. ఆ స్థాయికి నువ్వు ఎదిగే దశలోకి రాగానే ఉన్నట్టుండి నీ ప్రయాణం దిశ మార్చేశావు. నిన్నింకా చదువుకోవడం పూర్తికానేలేదురా. పొయిట్రీని ప్రోజ్ చేసి పోజుకొట్టే  మనోపాజ్ ఘనాపాటీలున్నారిక్కడ. నువ్వేమో ప్రోజ్ ని కూడా పొయిట్రీగా పొర్లించవచ్చని నిశ్శబ్దంగా నిరూపించావు. అన్నట్టు నిశ్శబ్దమంటే గుర్తొచ్చింది వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించే శబ్దాడంబరులున్నారిక్కడ. నీ నిష్క్రమణతోనైనా నిన్నలముకున్న నిశ్శబ్దం బద్దలవుతుందేమో చూడాలి.

నీ నరనరంలో టీయార్పీ మందుపాతర పేలిన సంగతులు నాకు తెలుసు. చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు. నిన్ను లొంగదీసుకుని..కుంగదీసిన అసలు జబ్బు నీ ఉద్యోగమే అదీ తెలుసు. నీ శరీరంలో మృత్యు కవాతులు నువ్వే చూస్తూ మాకు మాత్రం నిత్యం నవ్వుల కవిత్వపు కబాబులు తినిపించావు. ఈ మిగిలిన లైఫ్ అంతా బోనస్ అన్నా అనేవాడివి. కాని నువ్వే మా బోనస్ కదరా. మా బోనస్ ని మేమింకా పూర్తిగా అనుభవించక ముందే వెనక్కి తీసేసుకున్నావా?  సావాసగాళ్ళతో తిరుగుళ్ళంటే నీకెంత ఇష్టం. కారు నడపడం..కవిత్వం రాయడం..దోస్తులతో సూర్యాస్తమయాలను కోసుకోవడం..అడవినీ గోదావరినీ కొండలనీ ప్రవహించే రాత్రులనీ  స్నేహితుల చేతలన్నీ నీవే చేసుకుని వాటేసుకోవడం నీ నుండి ఇంకా మేం నేర్చుకోలేదురా. అందరూ తాగుతుంటే నువ్వందరినీ తాగేవాడివి. అయినా ఇంటిదగ్గర మల్లెపూదండనీ బంగారు కొండనీ అశ్రధ్ధ చేయలేదుగా. నీ మత్తు మాకింకా దిగకుండానే ప్రయాణాల మత్తులోపడి ఎటో కొట్టుకుపోయావు కదా. పోరా పో.

నీకు నేనంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నీ చివరి మెసేజ్ నాకొక అత్యున్నత అవార్డు సైటేషన్ అనుకుంటాను. ఫిబ్రవరి 1 న ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయిన నా కవిత చూసి నువ్వేం రాశావు? “ poem adbhutam. Maatallo cheppalenanta adbhutam.very touching, very deep, very poetic. And highly dense. You have shown how a poem should be. Congrats for setting high standards.”  మరి నేనేమన్నాను. ఇటీజ్ యువర్ హైనెస్ అన్నాను. నా మీద ప్రేమతో నువ్వెక్కువ చెప్పావేమో. కానీ ఈ మాటలు నీ  ప్రతి వాక్యానికీ  వర్తిస్తాయి.

ఎన్ని వందలమందికో నువ్ జీతాన్ని జీవితాన్నీ ఇచ్చావు. నువ్వు ఒకసారి వెళ్ళొస్తా బాస్ అని అందరి దగ్గారా సెలవు తీసుకున్నప్పుడు..నీ ఇంటి నుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటిక దాకా రోడ్డంతా వందలాది కళ్ళు కురిపించిన కన్నీటి వర్షం మమ్మల్ని ఎప్పటికీ తడుపుతూనే వుంటుంది. నువ్వెంత ధన్య  జీవివో మాకు తెలుపుతూనే వుంటుంది.

అందరూ నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే వాడు టీవీ5 కి వెళ్ళాడు నేను 10టీవీలోనే వున్నానని అనేవాడిని. ఇక ఇప్పుడెవరైనా అడిగితే వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను కిందే వుండిపోయానని చెప్తాను. తమ్ముడూ నీతో అన్నయ్యా అని పిలిపించుకున్న గర్వాతిశయం నా మీదా నా అక్షరాల మీదా ఎప్పుడూ వెలుగు రేఖై వెలుగుతుందిలే. అయినా ఏమోరా  మనసు నిండ లేదురా. అంతా అధూరాగానే మిగిలిపోయినట్టుందిరా. మన మాటలు..మన పాటలు..మన చెలిమి అంతా సగం సగంగానే ముగిసిపోయినట్టుందిరా. కడుపు నిండలేదురా. సాగరా. సాగరా. సోదరా.

 

ఎవరున్నారు వాళ్ళకి?

 

-ప్రసాద మూర్తి

~

prasada

 

 

 

 

 

 

ఎవరున్నారు వాళ్ళకి

పైన ఆకాశమూ లేక

కింద నేల కూడా లేనివాళ్ళకి

 

జేనెడు పొట్ట చుట్టుకొలతల్ని

ఏ కొండలతోనో సముద్రాలతోనో

కొలుచుకునే వాళ్ళకి

ఆకుపచ్చ రాత్రులై భూగోళమంతా అల్లుకున్నా

పేగుల్లో ఆకలి మిన్నాగులు కదులుతున్న అసహాయులకు

ఎవరున్నారు?

 

సిమెంటు తూరల్లో తలదాచుకుని

 వెండి చందమామల్ని కలగనే

నిండు చూలాళ్ళకు ఎవరున్నారు

రోడ్డు పక్క దేహాలను అమ్మకానికి నిలబెట్టి

ఏ చెట్టుచాటుకో పోయి తమనే  తొంగి చూసే

ఆకాశానికి తలబాదుకుంటున్న ఆత్మలకు ఎవరున్నారు?

 

ఎవరున్నారు వాళ్ళకి

ఏ అర్థరాత్రి ఏ కాలువ  వంతెన కిందో

వందేమాతర గీతం అభ్యసించే అనాధ బాలలకు ఎవరున్నారు

ఏ కుప్పతొట్టి ఉయ్యాలలోనో

నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ

 ఏడుస్తూ  నిద్రపోయే అభాగ్య  శిశువులకు ఎవరున్నారు?

 

జీవితాలను యంత్రాలకు తగిలించి

 చిట్లిన ఎముకల్లో జీవన రహస్యాలను అన్వేషించే

  ఖాళీ సాయంత్రాలకు ఎవరున్నారు

మట్టికింద తమను పాతుకుని  

నాగలి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు

ఎవరున్నారు?      

 

పుట్టిన నేలపేగు పుటుక్కుమని తెగుతున్న శబ్దం

నెత్తి మీద మూటల్లో పుట్టెడు దు:ఖం పిగులుతున్న శబ్దం

వెనకెనక్కి తిరిగి చూస్తే తమ నీడలు గోడుగోడున విలపిస్తున్న శబ్దం

ఏ దిక్కూ తోచక ఎటో కదిలిపోతున్న

 కన్నీటి  కాందిశీకులకు ఎవరున్నారు?

 

తగలబడుతున్న అడవుల్లోంచి పారిపోతున్న పిట్టలకు

కారిడార్ వలల్లో చిక్కి విలవిల్లాడుతున్న సముద్రాలకు

ఎవరున్నారు..ఎవరున్నారు

 

 ఇంకెవరున్నారు

కవులుతప్ప?

*

ఓ రైతు  ప్రార్థన

Kadha-Saranga-2-300x268

       అనగనగా ఒక రోజు రెండు రాష్ట్రాల సరిహద్దు దగ్గర అనగనగా ఒక రైతు పురుగుల మందు తాగి చనిపోయాడు.  బతికున్న రైతు కంటె చనిపోయిన రైతే  రెండు రాష్ట్రాలనూ వణికించే వార్తగా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తెల్లారక ముందే ఈ  వార్త  సరిహద్దుకు ఒకవైపు  పాలకపక్ష నాయకుడి చెవిలో పడింది. చాలా తర్జనభర్జనలే జరిగాయి. శవం ఒంటి మీద బట్టల్నిబట్టి.. రెప్పలు తెరిచే వున్న శవం కంటి కొసన వేలాడుతున్న దీనత్వాన్ని బట్టి.. వోవరాల్ గా శవం నుండి కొడుతున్న మట్టివాసన బట్టి అది తప్పనిసరిగా ఒక రైతు శవమే అని  తేల్చుకున్నారు.

కొంపదీసి ఏ గాలికో రైతు శవం మనవైపు కొట్టుకువస్తే చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అనుకుని, వెంటనే సదరు నాయకులవారు తన ఏలుబడిలో ఇలాంటివి జరగితే ఇంకేమైనా వుందా చాలా ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్ అని గొణుక్కుంటూ  పలుకుబడినంతా ఉపయోగించి పక్కా ప్లాన్ వేశాడు.  ఆ శవాన్ని సరిహద్దుకి అవతల వైపు పడేసే ఏర్పాటు చేశాడు. క్షణాల్లో  రైతు శవం సరిహద్దు మార్చుకుంది. అటువైపు కూడా అధికార పక్షం నాయకుడొకరికి ఈ వార్త చెవిని సోకింది. ఆ చెవి నుంచి ఇంకో చెవికి అది ప్రయాణం చేసేంత టైమ్ కూడా ఇవ్వకుండా ఆ లీడర్ సారు ఆర్డర్ పాస్ చేశారు. మళ్ళీ రైతు శవం సరిహద్దు మారింది. అందరినీ వణికించే చలిరాత్రి ఈసారి మాత్రం తానే గజగజలాడిపోతూ  నెత్తీనోరూ బాదుకుంటూ  సరిహద్దు రేఖకి ఆవలా ఈవలా వలవలా ఏడ్చింది. సరే తెల్లారింది కూడా.

    ఎవరెవరో జనం వస్తున్నారు. వాళ్లు పార్టీలు వారీగా చీలిపోయి వున్నారు.  అటూ ఇటూ అందరికీ అది రైతు శవమేనన్నది కర్ణాకర్ఱిగా రూఢి అయిపోయింది.  కొందరు రైతు ఆనవాళ్ళకోసం వెదికారు. కొందరు రైతు కులం కోసం చూశారు. కొందరు రైతు మతం ఏంటో ఆరా తీశారు. కొందరు రైతు అక్కడివాడా ఇక్కడివాడా అన్న మీమాంసలో మీసాలు పీక్కున్నారు. సరిహద్దుకి అవతలా ఇవతలా జనం పోగయ్యారు. మీ వాడంటే మీ వాడని శవాన్ని బంతిలా అటూ ఇటూ చాలా సేపు విసురుకున్నారు. అలసిపోయాక శవాన్ని సరిగ్గా ఇరువైపులా గొడవ లేకుండా సరిహద్దులో వుంచారు.

   ఇదంతా చూసిన  రైతు ఆత్మకు చాలా చికాకు మొదలైంది. జనం మీద జాలికూడా కలిగింది. ఎప్పుడూ ఎవరి మీదా కోపం రాని రైతుకు అప్పుడు కూడా ఆ జనం  మీద కోపం రాకపోవడం విశేషమేం కాదు. కాని జనాన్ని తనివితీరా తిట్టాలని రైతు ఆత్మ విశ్వప్రయత్నమే చేసింది. వీలు కాలేదు. అక్కడి నుంచి గాల్లో ఎటైనా ఎగిరిపోవాలనుకుంది.  అంతలోనే ఒక సందేహం దేహం లేని ఆత్మను చుట్టుముట్టింది.   వీళ్ళంతా కలిసి తనను ఏ రాష్ట్రానికి చెందిన వాడిగా ముద్ర వేస్తారో కదా అన్నదే ఆ సందేహం.  అయితే  వీళ్ళ గొడవ తేలే లోగా ఏం చేయాలబ్బా అని తల గోక్కుంది. వచ్చింది..వచ్చేసిందో ఐడియా. తను చూడాల్సిన కొన్ని ప్రదేశాలు..తను పలకరించాల్సిన కొందరు మనుషులు..తను వినాల్సిన కొందరి మాటలు..తను అర్థం చేసుకోవాల్సిన కొన్ని స్పందనలు వున్నాయి. ఈ లోగా ఆ పని ముగించుకువద్దామని రైతు అనుకున్నాడు. అదేనండి  రైతు ఆత్మ అనుకుంది.

ముందుగా  ఒక వైపు రాష్ట్రం అసెంబ్లీలోకి ప్రవేశించింది. అక్కడ వాడివాడిగా తన మీదే చర్చ జరుగుతోంది.

      “ అధ్యక్షా ఇది మన పొరుగు రాష్ట్రం వారి కుట్ర. అక్కడ రైతు శవాన్ని కావాలనే మన రాష్ట్రంలో పడేయడానికి అన్ని పన్నాగాలు పన్నారు అధ్యక్షా!  ఈ విషయంలో మాకు పక్కా సమాచారం వుంది. అయినా సరే  రైతు పూర్వాపరాలు తేల్చడానికి  ఒక నిజనిర్ధారణ కమిటీని ర్పాటు చేశాము అధ్యక్షా!”

ఈ మాటలు విన్న వెంటనే ప్రతిపక్షాలు తటాలున లేచాయి. ఇది తమ బాధ్యత నుంచి తప్పించుకోడానికి పాలకపక్షం పన్నుతున్న కుట్రే గాని మరొకటి కాదు అధ్యక్షాఅని వివపక్షాలు గగ్గోలు పెట్టాయి.

అధికార పక్షం మాత్రం తక్కువ తిందా. కౌంటర్ హంటర్లు ఝళిపించింది.

అధ్యక్షా రైతు ఇక్కడే చనిపోయాడని అనుకుందాం. కాని అప్పుల బాధతో కదా ఆత్మహత్యకు పాల్పడేది?  కొత్త ప్రభుత్వానికి పాత అప్పులతో సంబంధం ఏంటో గౌరవ ప్రతిపక్ష సభ్యులు తేల్చి చెప్పాలి. ఇదంతా పాత ప్రభుత్వాల పాపఫలితమే కదా అధ్యక్షా!”

అవును! అవును!”అని సర్కారీ పక్షం నుంచి బల్లల మోత మోగింది.

అబద్ధం! అబద్ధం!” అని విపక్షం నుంచి ఇంకా మోత.

అధ్యక్షా వేరే రాష్ట్రాల్లో ఇంత కంటె ఎక్కువ మంది చనిపోతున్నారు.  గౌరవ సభ్యులు గణాంకాలు తెలుసుకోవాలి. మీకు ఓపిక లేకపోతే మా మంత్రివర్యులు సదరు వివరాలు అందిస్తారు విని తరించండి అని పాలకపక్ష ప్రతినిధి సెలవిచ్చారు. మంత్రి గారు లేచి నిలబడి వివరాల చిట్టా తీశారు. విపక్షం రణగొణ ధ్వని మధ్య ఆయనలా చదువుతూనే వున్నారు. ఏ రాష్ట్రంలో ఎందరు రైతులు చనిపోయారు, గతంలో ఏ సంవత్సరంలో ఎంతమంది  ఆత్మహత్య చేసుకున్నారు, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన మరణాలెన్ని?  అసలు ఆత్మహత్యలెన్ని సహజమరణాలెన్ని, ఎన్ని సహజమరణాలను ఆత్మహత్యలుగా విపక్షాలు చిత్రీకరించాయి.. ఇలా సాగిన మంత్రిగారి గణాంకాల చిట్టా ఆంజనేయుడి తోకలా చుట్టుకుంటూ సభా భవనం మిద్దెను గుద్దుకుంది.

రైతు ఆత్మ అదిరిపడి  ఇక్కడిక లాభం లేదని  పొరుగు సోదర రాష్ట్రంలో అసెంబ్లీని సందర్శిద్దామని బయల్దేరింది. వెళుతూ వెళుతూ ఒక్కసారి అసెంబ్లీనంతా కలయజూసింది. ఆకాశంలో నక్షత్రమేదో కుప్పకూలినప్పుడు మనకు కనిపించే వెలగుతో పోలిన సన్నటి పొరలాంటి  వస్త్రం సభ్యుల మొహాలను రాసుకుంటూ పోయింది. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని, అధికార పక్షం విపక్షాలను ఏదో కుట్ర జరిగిందన్నట్టు పరస్పరం అనుమానంగా చూసుకుని అంతలోనే సర్దుకుని రొటీన్ చర్చకు రెడీ అయ్యాయి.

        పొరుగు రాష్ట్రంలోకి వెళుతూ వెళుతూ తనకి అప్పులు పెట్టిన షావుకారుగారు ఎలా వున్నారో చూసిపోదామని అనుకుంది. షావుకారు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ కాగితాల కట్టల  గుట్టలున్నాయి. రోజంతా మనం రెక్కలు ముక్కలు చేసుకుని పొలం పనుల్లో మునిగిపోతాం. మనలాంటివాళ్ళను ఆదుకోడానికి ఆయన ఇంకెంత కష్టపడుతున్నాడో కదా అని రైతు ఆత్మకు జాలేసింది. తనకు అప్పుపెట్టడమే కాదు..తాను అదిగో ఇదిగో అని అప్పు కట్టకుండా గడిపేస్తుంటే ఎందుకూ కొరగాని తన పొలాన్ని ఆయన పేర  రాయించుకోడానికి ఎంత బాధపడ్డాడో కదా షావుకారు అని  రైతు ఆత్మ కన్నీళ్ళు.

అంతెందుకు పెళ్ళాం పుస్తెల తాడు తెచ్చినప్పుడు అది తీసుకోడానికి ఆయన చేతులెంత తడబడ్డాయో ఇంకా రైతుకు గుర్తే వుంది మరి. కొంతైనా వడ్డీ డబ్బులు చెల్లించడానికి మిగిలిన కాడెద్దుల్ని అమ్మేయాలని సంతకు తీసుకు వెళుతంటే షావుకారు వూరి కొసదాకా వచ్చి సాగనంపి జేబులో కొన్ని డబ్బులు కుక్కి ఆకలేస్తే కాఫీ తాగరా అని కండువాతో షావుకారు కన్నీరు తుడుచుకున్న దృశ్యం రైతు ఆత్మ తలచుకుని తలచుకుని కుమిలిపోయింది.

పడుకున్న రైతు చుట్టూ కాసేపు ప్రదక్షిణలు చేసింది. కమ్మర కొలిమి దగ్గర గాలి తిత్తు పైకీ కిందికీ కదులుతున్నట్టు వూగుతున్న షావుకారు పొట్ట మీద కాసేపు కూర్చుంది రైతు ఆత్మ.  ఈయన రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించి ఆలోచించి పుణ్యాత్ముడు తనలాంటి వాళ్లకి ఎందరికో ఇలాగే ఆయన అప్పులు పెట్టి ఆదుకోవాలని..అంతటి ధర్మాత్ముణ్ణి దేవుడా నువ్వే కాపాడాలని  భగవంతుణ్ణి ప్రార్థించింది. వెళుతూ వెళుతూ షావుకారు ఇంట్లో ఒక మూలన పడివున్న ఎరువులను, మందులనూ చూసింది. పంటకు పట్టిన పురుగుల్ని చంపలేని మందు  కనీసం తననైనా చంపి రుణం తీర్చుకుందని ఒక ఎండ్రిన్ డబ్బాను చేతుల్లోకి తీసుకుని వాసన చూసి ఆహా బతుకు వాసన ఎలా వుంటుందో ఇన్నాళ్ళకి తెలిసింది కదా అనుకుని అక్కడి నుండి కదిలింది.

   సమయం మించిపోతోందని అక్కణ్ణించి తటాలున ఎగిరి  పొరుగురాష్ట్రం అసెంబ్లీలో వాలింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీటవుతోంది. తన మీదే చర్చ జరుగుతోందని తెలుసుకుని రైతు ఆత్మ కొంచెం సంబరపడింది. కాని రాష్ట్రాలు వేరైనా డైలాగులు.. కొట్లాటలు..వాదోపవాదాలు..ఎత్తులూ పల్లాలూ  సేమ్ టూ సేమ్ అనిపించి కించిత్తు విచారపడింది.  అయినా తనలాంటి ఒక అనామకుడి కోసం ఇందరు పెద్దలు అటూ ఇటూ ఇంత భీషణంగా యుద్ధానికి దిగడం ఆనందంగానే అనిపించింది. తనలాంటి బీదాబిక్కీ రైతుల కోసం ఇంత బెంగపడిపోతున్న ఇంతమంది బాబుల్ని రాష్ట్రంతో నిమిత్తం లేకుండా చల్లగా ఆదుకోవాలని..తనలాంటి వారికోసం మరింతగా కొట్లాడటానికి వారికి మరింత సత్తువ ప్రసాదించాలని రైతు ఆత్మ దేవుణ్ణి వేడుకుంది.

వెంటనే తన మృతదేహం పడివున్న చోటుకు బయల్దేరింది. ఇరు రాష్ట్రాల ప్రజలు తన గురించి గొడవ పడకుండా లెక్కలు తేల్చుకున్నారో లేదో ఒకసారి చూసొద్దామని అటు ప్రయాణం కట్టింది. వెళుతూ వెళుతూ ఎండిన తన పొలాన్ని పలకరిద్దామని అక్కడ కాసేపు వాలింది. బీటలు వారిన పొలంలో కూర్చుని, తన కోసం శూన్యంగా చూస్తున్న తన భార్య కూడా కనిపించింది. ఒంటికి అంటిన మట్టిని స్నానం చేసి వదిలించుకోవచ్చు. జీవితం చుట్టూ గుండె చుట్టూ అంటిన మట్టి బంధాన్ని ఎలా వదిలించుకోవాలి? అదేమో కాని ఒక్క వేలిముద్రతో పొలం జంజాటం వదిలించుకున్నాడు. కాని ఒక్క పసుపుతాడుతో ఒంట్లోని నరాలనన్నీ తన చుట్టూ చుట్టేసుకున్న పెళ్ళాన్ని ఎలా వదిలి పోవాలో రైతుకు  అర్థం కాక  ఎంత సతమతమయ్యాడో. అయినా తప్పలేదు. తననే నమ్ముకున్న భార్యను  ఒంటరిగానే  వదిలేసి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్యను పొలంలో ఒంటరిగా చూస్తే రైతు ఆత్మకు బోరున ఏడవాలనిపించింది.  భార్య ఖాళీ ఖాళీ కళ్ళలోకి..అక్కడి నుండి ఆమె గుండెల్లోకి..అక్కడి నుండి ఆమె శరీరం లోపలా బయటా అంతటా ఓసారి రైతు ఆత్మ  కలతిరిగింది. ఎక్కడా ఏమీ తగల్లేదు. ఒకటే శూన్యం. వచ్చే జన్మలోనైనా ఒక గొప్ప ధనవంతుడైన రైతుని ఆమెకు భర్తగా ప్రసాదించమని రైతు భగవంతుణ్ణి వేడుకున్నాడు.

O Raithu Pradhana (1)

 

   తిరుగు ప్రయాణం కడుతూ ఒక సారి కలయజూసింది. ఎండిన బోరు కనిపించింది. అందులోకి చొరబడి బోరులో అడుగుకంటా వెళ్ళింది.  అడుగున నీళ్ళు వుండే వుంటాయని, తనకే నీళ్ళందలేదని రైతు నమ్మకం. కనీసం ఆ నీళ్ళను కళ్ళ చూద్దామని రైతు ఆశ. ఆత్మ లోపల్లోపలకి..ఇంకా లోపలికి వెళుతూనే వుంది. భూమి అడుగు పొరల్లో కూడా ఎండమావులుంటాయా అని రైతుఆత్మ ఆశ్చర్యపోయింది. నీళ్ళు కనపడుతూనే వున్నాయి కాని తనకి తడి తగలటం లేదు. అయినా తనిప్పుడు చనిపోయింది కదా..బహుశా నీళ్ళ తడి తనను తాకదేమో అనుకుని పైకి వచ్చేసింది. అటూ ఇటూ దిక్కులు చూస్తే కరెంటు స్తంభం, దాన్నుంచి ఒక వైరు పొడవుగా సాగి పొలం దగ్గరున్న చిన్న కరెంటు మీటర్ దాకా వచ్చింది. మీటర్ దగ్గరకు వెళ్ళింది. మీటరు జోరుగా తిరుగుతోంది. ఆశ్చర్యంగా వుంది. కరెంటు కళ్ళజూడ్డమే గగనమైన రోజులు తాను గడిపాడు.

తాను పోయిన తర్వాతైనా కరెంటుకు తన మీద జాలికలిగిందన్న మాట అనుకుని నీళ్ళకోసం ఏర్పాటు చేసిన మోటరు స్విచ్చి నొక్కింది. కాని పంపునుండి ఒక్క బొట్టు కూడా పడలేదు. ఏందబ్బా అనుకుని కరెంటు తీగ పట్టుకుని వేళ్ళాడింది. అయినా తనకేమీ షాక్ కొట్టలేదు. ఏమో తనిప్పుడు చనిపోయిన వ్యక్తికదా తనకంతా ఇలాగే వుంటుందేమో అనుకుని అక్కడి నుండి రైతు ఆత్మ సర్రున బయల్దేరి గాల్లో ఎగురుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. భార్య కళ్ళలో ఇప్పుడు సుళ్ళు తిరిగిన నీళ్ళు కనిపించి నిట్టూర్చింది.  యథాప్రకారం తన మృతదేహం దగ్గరకు వెళ్ళి అందులోకి దూరి జనం మాటలు వింటోంది. అక్కడ  విషయం ఒక కొలిక్కి రాలేదు. సరిహద్దుకి ఆవలా ఈవలా రాష్ట్రస్థాయి నాయకులు, స్థానిక నాయకులు శవం మాది కాదంటే మాది కాదని కొట్టుకుంటూనే వున్నారు. రైతు ఆత్మ వారి  చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవ్వుకుంటూనే వుంది.  

        జర్నలిస్టుల హడావుడి ఇక అంతా ఇంతా కాదు.  శవం ఎటు పక్కదో తెలిస్తే గబగబా వార్తలు అందించ వచ్చని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. శవం అటుదని తేలితే ఒక వార్త..ఇటుదని తేలితే ఒక వార్త ముందే రాసి వుంచుకున్నారు. ప్రస్తుతానికి శవం మూలాలు ఇంకా తెలియటం లేదన్న బ్రేకింగ్ న్యూస్ మాత్రం అప్ డేట్ చేసి పంపిస్తున్నారు.  కొన్ని ఛానళ్ళయితే స్టూడియోల్లో వైద్య నిపుణుల్ని..డి.ఎన్.ఏ. పరీక్షల నిపుణుల్ని కూర్చోబెట్టి చర్చోపచర్చలు కొనసాగిస్తున్నాయి. మనిషి శవాన్ని బట్టి అతను ఏ ప్రాంతం వాడో తెలియజేసే డి.ఎన్.ఏ. పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదని నిపుణులు వాపోతున్నారు.

ఉత్కంఠను అలాగే కొనసాగించడానికి యాంకర్లు అష్టవంకర్లు తిరుగుతూ నానా యాతనా పడుతున్నారు. హృదయ స్పందనకు కూడా ఒక ప్రాంతం అంటూ వుంటుందా అన్నది పాపం అమాయక రైతు ఆత్మకు అర్థం కాలేదు.  చనిపోయిన రైతు అంటే వార్తాహరులకు ఇంత మమకారమా అని  రైతు ఆత్మ ఎంతగానో మురిసిపోయింది. ఒక రైతు గురించి ఇంతగా తపనపడుతున్న వీరందరినీ చల్లగా చూడమని దేవుణ్ణి ప్రార్థించింది. 

        ఇంతలో రైతు ఆత్మకు ఒక చెట్టు పక్కన ఒక మనిషి కన్నీరు మున్నీరై  ఏడుస్తున్నట్టు కనిపించి అయ్యో తన కోసం ఇంతగా రోదిస్తున్న అమాయకుడు ఎవరా అని పరిశీలించింది. వినగా వినగా అర్థమైంది ఏమంటే అతనో గాయకుడు. ప్రజల ఈతిబాధలే తన పాటలుగా మలిచే ప్రజాకవి. శవం అటు పక్కదని తేలితే  ఎంతో గొప్పగా రాయొచ్చని, కాని ఖర్మకాలి ఇటుపక్కదని తేలితే ఏమీ రాయలేం కదా అని, అటా ఇటా తన పాట ఎటని తేల్చుకోలేక తెగని ఉత్కంఠను తట్టుకోలేక బోరుమని విలపిస్తున్నాడు. 

గడ్డి పువ్వు గాలికి కందినా గాయపడే హృదయం గలవాడు. ఈయనకెందుకింత కష్టం వచ్చిందిరా భగవంతుడా అని రైతు ఆత్మ దీనంగా మూలిగింది. అలాగే రైతుల మీద కథలు రాసేవారు..రైతు మీద బొమ్మలు గీసే వారు..రైతు మీద వ్యాసాలు రాసేవారు..అక్కడే పక్కపక్కన కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ కలాలను..కాగితాలను పట్టుకుని పనిలోకి ఎప్పుడుదిగుదామా అని రైతు శవం దిశగా చూస్తూనే వున్నారు.   ప్రపంచంలో ఎక్కడా ఏ కళాకారుడికీ  ఇంతటి సంకటం రాకుండా చూడమని దేవదేవుడికి నివేదించుకుంది రైతు ఆత్మ.

    ఇంకా అక్కడే వుంటే తన  శవాన్ని ముక్కముక్కలుగా చేసి మూలాలు వెదికే పనిలో వీళ్ళంతా  పడతారని అది తన కళ్ళరా చూసి తట్టుకోలేనని రైతు ఆత్మ భావించి ముందుకు ఎగిరింది. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు..        ఎటో చటుక్కున ఎగిరిపోయింది.

     రైతు ఆత్మ విమానాశ్రయంలో వాలింది. అక్కడ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కొలువుదీరినట్టు కూర్చున్నారు. ఎవరి వందిమాగదులు వారి చెంత నిలబడ్డారు. వాళ్ళిద్దరూ అక్కడకు రాకముందే రెండుమూడు గంటలపాటు వాస్తునిపుణుల రాకతో పెద్ద కోలాహలమే జరిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఏ ప్రదేశంలో కూర్చోవాలి..ఎటు తిరిగి కూర్చోవాలి..వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాలు ఏ దిశగా ల్యాండవ్వాలి.. అన్నీ కూలంకషంగా వాస్తు నిపుణుల బృందాలు పరిశీలించాయి. ఆ తర్వాతే అక్కడకు ముఖ్యమంత్రుల రాక జరిగింది. వాళ్ళిద్దరూ ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేటప్పుడు ఒకరికొకరు ఎదురు పడకుండా..కూర్చొనేటప్పుడు ఒకరికొకరు కనిపించే అవకాశం లేకుండా అన్నీ వాస్తు ప్రకారమే అధికారులు ఏర్పాట్లు చేశారు.   ఇద్దరూ చెరో వైపూ నిండుగా కూర్చున్నారు. ఒకరు సింగపూర్ విమానం కోసం, మరొకరు జపాన్ విమానం కోసం వేచి వున్నారు. వారికి పక్కనే కొందరు మంత్రులు..కొందరు అధికారులు ఏవో కాగితాల కట్టలు పట్టుకుని నిలబడ్డారు.

వున్నట్టుండి వారు  ముఖ్యమంత్రుల చెవుల్లో ఏదో చిలుకుతున్నారు. విషయం చాలా సీరియస్సే మరి. సింగపూర్ లోనూ జపాన్ లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా? చేసుకుంటే ఏ విధానాలు అవలంబిస్తారు? వారి సమస్యను ఆ ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తాయి ? అని పరిశీలించడానికి అత్యున్నత శాసనసభాపక్ష కమితో పాటు ముఖ్యమంత్రులు హుటావుటిన బయల్దేరారు. ఉదయం సభలో గందరగోళం చూసి వెంటవెంటనే నిర్ణయాలు చేసి సాయంత్రం ఫ్లయిట్ కే బయలెల్లారు.

       రైతు ఆత్మ విమానాశ్రయంలోకి ఎంటరయ్యిందో లేదో ఒక గొప్ప మెరుపు మెరిసినట్టు..వెంటనే చీకటి అలముకున్నట్టు..ఆ వెంటనే వాన కురిసినట్టు..వెనువెంటనే భూమి కంపించినట్టు..ఆ వెంటనే మంటల మాదిరి ఎండలు కాచినట్టు అక్కడున్న వారందరికీ అనిపించింది. ఎవరికీ అర్థంకాక ఎవరినీ ఏమీ అడగడానికి రాక అలా వుండి పోయారు. అంతలో విమానాలు రెండూ ఒకేసారి రన్ వే మీద చప్పుడు చేసుకుంటూ దిగినట్టు అనిపించి అంతా కాస్త శాంతించారు. రెండు టీముల వారూ రెండు విమానాల్లో ఆసీనులయ్యారు. రైతు ఆత్మ రెండు విమానాల్లోనూ ఒకేసారి ప్రవేశించింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకసారి చుట్టూ పరికించారు గర్వంగా.

ఉన్నట్టుండి సీట్లన్నీ ఖాళీగా కనిపించి ఉలిక్కిపడ్డారు. తదేకంగా చూశారు. ఖాళీ సీట్లలో ఏదో వెలుగుతో కూడిన నీడలాంటిది మెదలడం కనిపించి చేబుల్లోంచి రుమాళ్లు తీసి చెమటలు పట్టిన ముఖాలు తుడుచుకున్నారు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ డ్రైవర్ సీటువైపు నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పసాగింది. ముఖ్యమంత్రులు చెవులు రిక్కించి విన్నారు. ఎంత విన్నా రైతులు..వారి మరణాలు..ఆత్మహత్యలు..జాగ్రత్తలు ఇవే వినపడుతున్నాయి.

అంతలోనే ఎయిర్ హోస్టెస్ కూడా తెల్లని నీడలా మారిపోయింది. ఇద్దరూ భయపడ్డారు. గట్టిగా అరుద్దామనుకున్నారు. కాని నోళ్ళు పెగల్లేదు. రైతు ఆత్మ ఇక వెళదామని నిర్ణయించుకుంది. తన కోసం విదేశాల ప్రయాణం కట్టినవారినందరినీ పేరుపేరునా ఆశీర్వదించింది. ఒక రైతు కోసం ఇంతగా కష్టపడే ఇలాంటి ప్రభువులనే మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చేట్టు చూడమని దైవానికి మొక్కుకుంది. అప్పుడు విచిత్రంగా రైతు  కళ్ళు చెమర్చాయి.  విమానాలు, వాటిలో ఆసీనులైన ఏలినవారు ఒకేసారి ఊపిరి పీల్చుకున్నారు.

                                                                                               ప్రసాదమూర్తి

1904041_740635095949533_1999613464_n

 

                                                                                               

జస్ట్ ఫర్ యూ..

ప్రసాద మూర్తి

ప్రసాద మూర్తి

అక్షరాల్లేని కవిత కోసం

అర్థాల్లేని పదాల కోసం

పదాల్లేని భావాల కోసం

వర్ణాల్లేని చిత్రాల కోసం

రాగతాళలయరహితమైన

సంగీతం కోసం

పట్టాల్లేని రైలు కోసం

నగరాల్లేని నాగరికత కోసం

ఆఫీసుల్లేని ఉద్యోగాల కోసం

విడివిడి ఇళ్ళు లేని

అందమైన పల్లెకోసం

తుపాకులు సంచరించని  అడవి కోసం

నేను కాని నన్ను పిలిచే

నీవి కాని నీ చూపుల కోసం

నీకూ నాకూ మధ్య

అవసరాలేవీ  అవసరమేపడని

ఒక్క పలకరింత కోసం

ఒక్క కౌగిలింత కోసం..

17/10/2013

Salvador Dali Paintings 23

ప్లీజ్ క్లోజ్ ద డోర్

మూసేయ్

కొన్నిసార్లు కళ్లు మూసేయ్

కొన్నిసార్లు చెవులు మూసేయ్

వీలైతే అన్నిసార్లూ నోరు మూసేయ్

ఎందుకురా

హృదయాన్ని అలా బార్లా తెరిచి కూర్చుంటావ్?

నిశ్చల శూన్యంలోకి

చూపుల్ని బుడుంగ్ బుడుంగుమని విసురుతూ-

ఖాళీ ఇన్ బాక్స్ ని

క్లిక్కు క్లిక్కుమని నొక్కుకుంటూ నొచ్చుకుంటూ-

ఎందుకు చేతుల్ని

అలా చాపిచాపి నిల్చుంటావ్?

నిద్రపోతున్న రోడ్డు మీద

నీకు మాత్రమే వినిపించే

అడుగుల చప్పుడు కోసం ఒళ్ళంతా రిక్కిస్తూ-

మూసేయ్

చాచిన చేతుల్నిచటుక్కున

జ్ఞా పకాల జేబుల్లోకి తోసేయ్

మూసేయ్

గుండెనీ దాని గుర్తుల్నీ.

లేదంటే అదలా సొద పెడుతూనే ఉంటుంది

ప్లీజ్ క్లోజ్ ద డోర్.

-ప్రసాద మూర్తి

జన్మభూమి

1016912_628010210545356_685997217_n

ప్రసాద మూర్తి

 

అమ్మనీ నాన్ననీ చూద్దామని ఊరెళ్ళాను . నేనొచ్చానని ఆనందం వారి కళ్ళల్లో,  తీసుకుపోతాడేమో అని బూచాడిని చూసిన పిల్లల్లా గుబులు వారి గుండెల్లో ఒకేసారి చూశాను. నాన్న తన మోకాలు చూపించి  అటూ ఇటూ ఊగించి ఇప్పుడు బాగుందని కూర్చుని లేచి మరీ నవ్వాడు. అమ్మ తన చేయి చూపించి అతుక్కుపోయింది నానా అంటూ  అటూ ఇటూ తిప్పి నన్ను నమ్మించడానికి తెగతిప్పలుపడింది. ఒంటరిగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నారన్న సంతోషం ఎప్పుడూ ఒక విచారాన్ని వెంటబెట్టుకుని నన్నంటిపెట్టుకుని ఉంటుంది. ఆరోగ్యంగానే ఉన్నామన్న ధీమాతో అతిహుషారులో వాళ్ళు అప్పుడప్పుడూ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటూ ఉంటారు.

అప్పుడే సమస్య అంతా. వాళ్ళు నాతో రారు. నేను వాళ్ళతో ఉండలేను. డబ్బెంత పంపినా..మనుషుల్ని పెట్టినా ఇదో తెగని ఇనపతీగ సమస్య.   నేను అలా వారిని చూస్తూనే ఇల్లంతా కలయతిరిగాను. అమ్మ నా కళ్ళల్లో ఏదో వెదుకుతుంది. నాన్న నా కదలికల్లో ఏదో వెదుకుతాడు. నేను ఇల్లంతా తిరుగుతున్నట్టే వారి చుట్టూ తిరుగుతూ నా ఆరాలేవో నేను తీస్తాను. అమ్మ కళ్ళల్లో నా బాల్యపు ఆకాశాలు కనిపిస్తాయి. నా కళ్ళల్లో అమ్మ తన యవ్వన కాలపు బొమ్మల్ని చూస్తుంది.  

నా కూడా మా ఊరు చూద్దామని నాతో హైద్రాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు రమేష్ లోపలేమనుకుంటున్నాడో కాని అంతా మౌనంగా చూస్తున్నాడు. వాడు ఆర్టిస్ట్. నేను జర్నలిస్టు. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సికిందరాబాద్ లో జన్మభూమి ట్రైన్ పట్టుకోని తాడేపల్లిగూడెంలో దిగి మా ఊరు చేరుకునే సరికి సాయంత్రమైంది. ఊరంతా చీకటి. ఊళ్ళో చీకటి మా ఇంట్లో కూడా తిష్ట వేసింది. పరిచయాలయ్యాయి.  ఎప్పుడో కొనిచ్చిన ఛార్జింగ్ లైటు బాగానే పనిచేస్తున్నట్టుంది. అది పట్టుకోని అమ్మ మా కూడా ఒకటే తిరుగుడు. నాన్న హాల్లో కూర్చుని ఒంటరిగా గోడతో ఏదో మాట్లాడుతున్నట్టుగా పోజు పెట్టాడు. రమేష్ ఎప్పడూ ఆట పట్టిస్తూ ఆంధ్రా దొంగా అని ముద్దుగా పిలుస్తుంటాడు. మేమెక్కిన రైలు తెలంగాణా బోర్డర్ దాటగానే సమయం కోసం ఎదురుచూస్తున్న వాడిలా పచ్చని పొలాలను చూసి ఇక ఒకటే లంకించుకున్నాడు. ప్రపంచంలో పచ్చదనమంతా మీ దగ్గరే పెట్టుకున్నారు కదరా దొంగల్లారా అని దారి పొడవునా తెగ తిట్లు. ఇదంతా మమ్మల్ని దోచుకున్నదే కదా అని ఒకటే శాపనార్థాలు. పక్కనున్న ఆంధ్రావాళ్ళు వింటే వాడితో తగాదా పడతారని నా భయం నాది.

కాని అలా ఏమీ జరగలేదు. వాడు నన్నే ఉడికిస్తూ..ఉడికిపోతూ..రైలుబండిలా దారిపొడవునా మోతే మోత. వాడి మాటలు నాకు అలవాటే కదా నేను నవ్వుతూనే ఉన్నాను. ఎప్పుడూ మా ఇంటికి రాలేదని ఒకసారి కొల్లేరు ట్రిప్ వేద్దామని వచ్చాం. మా ఇంటికి రాగానే దారిలో కానిచ్చిన నసుగుడంతా మర్చిపోయాడు. మా అమ్మానాన్న కూడా నేను, నా కూడా వాళ్ళు, మా కూడా రమేష్.. ఇలా అలిసిపోయేదాకా అటూ ఇటూ ఆ మాటలూ ఈ మాటలూ చెప్పుకుంటూ ఇల్లంతా  తిరిగాం. ఇంట్లో ప్రతీగోడ మీదా నా బాల్యం నీడల్ని తడిమి తడిమి మరీ మరీ చూసుకున్నాను. ఏమిటీ తిరుగుడు అనుకున్నాడో ఏమో ఒక్కసారిగా కుర్చీలో కూర్చుని “ అమ్మా కరెంటు ఎప్పుడొస్తుంది” అని అడిగాడు రమేష్.  అమ్మకి ఏం చెప్పాలో తెలియక “ ఏమయ్యో..కరెంటంట ఎప్పుడొస్తాది?” అని నాన్న వైపు మా మిత్రుడి ప్రశ్నను ఫార్వర్డ్ చేసింది అమ్మ.  ఆ..అంటూ సాగదీస్తూ నాన్న ఓ సారి ఫోనందుకో అన్నాడు. ఎందుకో అని అమ్మ నవ్వుతూ అడిగింది. “ఛీఫ్ మినిస్టర్ ని అడిగి చెప్తాను.” నాన్న వేసిన ఈ జోక్ తో చెలికాడు రమేష్ ఒకటే పగలబడి నవ్వాడు. ఏంట్రా సంపదంతా మీ దగ్గరే పెట్టుకుని మీకెందుకిన్ని కష్టాలు? అమాయకంగా అడిగాడు రమేష్. పగటికీ రాత్రికీ తేడా ఏంటో జనానికి తెలియజెప్పాలన్న తాపత్రయంలో మన నాయకులు ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారు.  ఇందులో మాత్రం ప్రాంతీయభేదం లేదురా బాబూ.

అదోలా చూశాడు వాడు. ఇంతలో అమ్మ అందుకుంది. “కరెంటు మాట మర్చిపోయాం నాయనా. అది వచ్చినప్పుడు దాని అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు అదుండదు.”

‘దొంగలకు కూడా కష్టాలు తప్పవన్నమాట.’  చెవిలో గొణిగాడు రమేష్. ఇంతలో నాన్న బాత్ రూమ్ లో నీళ్ళు పెట్టాడు. డెభ్భయ్యేళ్ళు వచ్చినా తానింకా మిస్టర్ పెర్ ఫెక్ట్ అని  నిరూపించుకోవడానికి నాన్న ఒకటే ప్రదర్శన పెడతాడు. నేను వచ్చినప్పుడల్లా ఇది తప్పదు. అమ్మ కూడా చెంగుచెంగున తిరుగుతూ క్షణాల్లో వంట చేసి పడేసింది. ఎవరూ లేక ఇల్లు బోసిపోయినా వారు మాత్రం కళకళలాడుతూ  అప్పుడే పెళ్ళయిన కొత్త జంటలా ఉత్సాహంగా కనిపించారు మా వాడికి. నేను కూడా వీళ్ళెప్పటికీ ఇంతే ఆరోగ్యంగా ఉంటే ఎంత బావుండు అని ఆశపడుతూ ఉంటాను. అమ్మానాన్న కళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ వారి కలల చుట్టూ ఒరుసుకుంటూ ప్రవహించిన నా బాల్యం తలపులు ఇక్కడికొచ్చినప్పుడల్లా నన్ను చుట్టుముడతాయి. వారు కూడా నాతో పాటే వస్తే అమ్మానాన్న పిల్లలై నా చుట్టూ తిరిగితే ఎంత బావుండు అనుకుంటాను. కాని వారికి పోటీ వచ్చేవారు నా చుట్టూ చాలా మందే ఉన్నారన్న స్పృహ నాకంటె వీళ్ళకే ఎక్కువ. అందుకే రారు.

“అదృష్టంరా మీ అమ్మా నాన్నా ఆరోగ్యంగా ఉన్నారు.” రమేష్ నార్మల్ గానే అన్నాడు.

“అంత లేదు. నేనెక్కడ నాతో తీసుకుపోతానో అని వారి హంగామా అంతే. నాకు పంచిచ్చిన రక్తం కంటె నాతో పంచుకున్న రక్తం మీద వారికి నమ్మకం లేదు.”

రాత్రి భోజనాల దగ్గర అమ్మ కొసరి కొసరి వడ్డించింది. అమ్మలంతా ఒకటే. నేను రమేష్ వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు రమేష్ అమ్మ చేసిన హడావుడి..చూపిన ప్రేమ మర్చిపోలేను. అమ్మ ప్రేమ తట్టుకోలేక పోతున్నాడు  రమేష్.  కొంచెం ఇబ్బందిగానే ఉన్నా చాలా త్వరగా వాళ్ళమ్మకీ మా అమ్మకీ తేడా మర్చిపోయి చనువుగానే మెలగడం మొదలుపెట్టాడు. ఆ చనువుతోనే ఏవేవో అడగడం స్టార్ట్ చేశాడు. అమ్మ, నాన్నా అంతే చనువుగా జవాబులు చెప్తున్నారు.

“ మీరు హాయిగా మాతోనే హైద్రాబాద్ లో ఉండొచ్చుగా అమ్మా. ఇక్కడెందుకు ఇంత ఒంటరిగా ఈ లంకంత కొంపలో?” అడగరాని క్వశ్చన్ అడిగేశాడు. అంతే అమ్మా నాన్నా బిగుసుకుపోయారు. మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు.

“అన్నట్టు పెద్దోడు పచ్చడి తీసుకు వెళతాడు. ఆ జాడీ తీసి కింద పెడతారా? ఎక్కడో అటకమీద పెడతారు. ఈయనగారి పచ్చడికోసమే దొంగలొస్తారు కాబోలు!” టాపిక్ డైవర్ట్ చేయడానికి  అమ్మప్రయత్నం.

‘అవును కదా..తీస్తానుండు!’ అని నాన్న అక్కడ నుండి లేచాడు. అమ్మ కూడా ఆయన్ని అనుసరించింది.

వాడికర్థంకాక నా మొహం చూశాడు.   ఏతల్లిదండ్రులూ రారు. ఉన్న ఊరినీ, పిల్లల్ని కనీ పెంచి పెద్ద చేసిన ఇంటినీ వదిలి అస్సలు రారు. పక్కనున్న పుల్లమ్మో ఎల్లమ్మో వారికి కొడుకుల కంటె కూతుళ్ళ కంటె దగ్గరవుతారు. వాళ్ళే సమస్తం చూసుకుంటారు. వాళ్ళు రాలేరు. బలవంతంగా తీసుకు వెళ్ళినా పోలీసులు ఎత్తుకుపోతున్న ఫీలింగ్.  ఒకవేళ మనతోపాటు వచ్చినా జైల్లో ఉన్నట్టు ఇబ్బంది. ఎవరి పనుల్లో వాళ్ళం పోయి, రాత్రి ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తారో..కొడుకూ కోడలూ మనవలూ ఎవరూ ఎవరితోనూ కనీసం మాట్లాడుకోవడాల్లేని బిజీబిజీ. ఈ లైఫ్ లేమిటో వారికసలు అర్థం కాదు. వద్దురా బాబూ! మన దగ్గర అన్నీ ఉన్నా ఉండాల్సిందే ఏదో లేదని వాళ్ళకు తెలుసు. రెండు రోజులకే సంచులు సర్దేస్తారు. అలాగని మనం ఊళ్ళకు  వచ్చేసి వారితోనే ఉండిపోవాలనీ కోరుకోరు. సంపాదన లేని బిడ్డలంటే వారికీ కొంచెం నలుగురిలో నగుబాటే మరి. ఇరుగుపొరుగుతో మన గురించి గొప్పులు చెప్పుకోవాలిగా. అంతే! అమ్మా నాన్న మనమూ  చిన్నప్పుడు కలిసి ఏం ఉన్నామో ఏం తిన్నమో.. ఏం గడిపామో అదే మనకు చివరికి మిగిలేది. వీలు కాని జీవితంలోంచి కొంత టైమ్ తీసి వారికోసం వీలుచేసుకుని అప్పుడప్పుడూ వెళ్ళడం మినహా మరో గత్యంతరం లేదు. మనం వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం మాత్రం ఏ ప్రపంచ భాషలోనూ ఎవడూ వర్ణించి ఉండడు. కానీ ఈ మధ్య నేనొచ్చినప్పుడల్లా స్కూలుకి రాకుండా మారాం చేసే పిల్లల్ని తన  కూడా తీసుకు వెళ్ళడానికి వచ్చే బడిపంతుల్ని చూసినట్టు  నన్ను అనుమానంగా చూస్తారు. ఈ సారి ఏమైనా రమేష్ తో తీవ్ర ప్రయత్నం చేయించైనా సరే  కూడా తీసుకుపోవాలి. అదీ నా ప్లాన్. లేదంటే చెయ్యి విరిగిందనో..జబ్బు చేసిందనో..మాటిమాటికీ ఎవరెవరో ఫోన్లు చేయడం అస్సలు తట్టుకోలేం.

దొడ్లో  ఆరుబయట ఆకాశం కింద మంచాలు వేసుకున్నాం. అమ్మా నాన్న త్వరగానే పడుకుండిపోయారు.

మేం ఏదేదో మాట్లాడుకుంటూ ఆకాశాన్ని చూస్తూ రాత్రిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ ఎప్పుడో కాని నిద్రలోకి జారుకోలేదు. నగరాల్లో దొరకని అనుభవం కదా. బాల్యంలో పొందిన ఆనందం కదా. ఆ జ్నాపకాలు, ఇప్పటి ఇరుకు బతుకుల చికాకుల అనుభవాలు, ఇద్దరికీ ఒకే గతం కాబట్టి మాటలూ మౌనం కలగలిసిన ముచ్చటైన రాత్రిని బాగానే ఎంజాయ్ చేశాము. నాలుగింటికే నాన్న లేచిపోయాడు. చీపురు పట్టుకుని వాకిలి..ఇల్లూ పరపరా ఊడ్చేశాడు. అమ్మ కూడా లేచి తెల్లారక ముందే స్నానం చేసి పనుల్లో పడింది. వాళ్ళ రొటీన్ అలవాటే కాబట్టి నేనూ లేచి కాసేపు వారి చుట్టూ తిరుగుతూ ఏవేవో కబుర్లు చెప్తూ గడిపాను.

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అమ్మ నన్ను తెల్లవారు జామునే లేపేది. లాంతరు దగ్గర నేను చదువుకుంటుంటే అమ్మ మజ్జిగ కవ్వం తిప్పేది. ఆ శబ్దం భలే ఉంటుంది. బహుశా ఆ సవ్వడి వినే దొడ్లో మందారం..నంది వర్థనం, గన్నేరు పూలు రేకులు విప్పి నవ్వేవి. ఆ శబ్దం తాకిడికే ఎద్దుల మెడల్లో గంటలు ఘల్లున మోగేవి. పనిపాటలకు పోయే రైతుల కూలీల అరుపులు కేకలు మొదలయ్యేవి. అమ్మ కవ్వం చప్పుడు ఆగిందంటే అక్కడొక వెన్నెల ముద్ద నాకోసం తయారైనట్టే. దానికోసమే త్వరగా మొహం కడుక్కోవడం జరిగేది.  ఇప్పుడు నగరంలో బిజీబిజీ జీవితం..ఇద్దరు పిల్లల అల్లరి..అప్పుడప్పుడూ ఏ తెల్లారుజామునో అమ్మ కవ్వం చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ అమ్మే కనిపించదు.

రమేష్ లేచినట్టున్నాడు. అప్పుడే తెల్లగా తెల్లారి వెలుగులు మా ఇంటి పెరటి గుమ్మం ముందు తచ్చాడుతున్నాయి చుట్టం ఎవరో వచ్చారని చూడ్డానికి వచ్చినట్టు. చిన్న బల్లమీద ఉన్న బిందెలో నీళ్ళు ముంచుకుని తాగబోయాడు రమేష్. అమ్మ ఎక్కడ చూసిందో కాని ఒక్కసారిగా అరిచింది.

‘వద్దు నాయనా!ఆ నీళ్ళు కాదు. ఆగు ఇస్తాను’ అని లోపలికి వెళ్ళి చెంబు నిండా మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆశ్చర్యం రమేష్ మొహం మీద మెరుపులా మెరిసింది.

“ఒక్క చుక్క మంచినీరు దొరకడం లేదురా. పొరుగూరి నుంచి వస్తున్న మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు నువ్వు తాగబోయిన నీళ్ళు కూడా స్థానిక ఎమ్మల్యే గారి పుణ్యమా అని టాంకుతో చేస్తున్న సరఫరా. అవి తాగడానికి పనికి రావని వంటకు వాడుతున్నాం. ఈ సరఫరా కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారు. త్వరలో ఎన్నికలొస్తన్నాయ్ కదా. “ అమ్మ వివరణ.

“అరేయ్..వచ్చేప్పుడు పెద్దపెద్ద ట్యాంకులు చూశాం కదా?” రమేష్ ఆశ్చర్యం.

“బోర్డుంది..రోడ్డు లేదన్నట్టు..ట్యాంకులుంటాయి. నీళ్ళే ఉండవు.” నా సవరణ

“అదేంటిరా మా దగ్గర  దొంగిలించిన నీరంతా ఏమైపోయింది? అది  మీ  దాహం తీర్చడం లేదా..? ఆశ్చర్యంగా ఉందే?” నాకు మాత్రమే వినపడే  రమేష్ ప్రశ్న.

“అంత ఆశ్చర్యం వద్దురా.  చుట్టూ నదులు కాల్వలు  నిండుగా ప్రవహిస్తున్నాయి నిజమే. కాని అవి కొందరి ఇళ్ళవైపే పరుగులు తీస్తాయి.  ఇప్పుడిక్కడ బీద బిక్కీ ఇళ్ళల్లో  మాత్రమే కాదు ..మధ్యతరగతి  ఇళ్ళల్లో కూడా   ఎడారి ఇసుక మేటలు  వేసింది. నువ్వు నమ్మలేవులే కాని రా..అలా ఊరవతలకి వెళ్ళొద్దాం పద!”

ఇద్దరం బయటపడ్డాం. మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉండేది. ఇది చిన్న చెరువు. మరొకటి పెద్ద చెరువు.  ఇందులో అసలు నీటి చుక్క జాడలే లేవు. గట్టుతో సమానంగా నేలపూడుకుపోయింది. నెర్రలిచ్చిన నేలలా మారింది. పుట్టి పెరిగిన తర్వాత ఇంత వరకు ఈ చెరువు ఇలా ఎండిపోవడం చూడలేదు.  ఒక్క పరుగులో ఇంట్లోకి వెళ్ళి అమ్మ అమ్మా అని కేకలు పెట్టాను. అమ్మ కంగారు పడి వంట గదినుంచి బయటకొచ్చింది.

“అమ్మా చెరువేంటే అలా ఎండిపోయింది?”

“అదా నాయనా..పూడిక తీయిస్తామని ఎండబెట్టారు. తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఏంటో  చెరువెవరిక్కావాలి.. చెరువులో నీళ్ళెవరిక్కావాలి..జనమెవరిక్కావాలి..జనం పడే బాధలెవరిక్కావాలి!” ఇలా గొణుక్కుంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది.

‘త్వరగా వచ్చేయండిరా..వేడివేడిగా దోసెలు వేస్తాను. చల్లారితే తినవుగా.’ అంటూ అరుస్తూ తన పనిలో తాను పడిపోయింది అమ్మ.

మా ఇంటి పక్క చెరువుతో నాకు చాలా జ్నాపకాలే ఉన్నాయి. చెరువు గట్టుమీదున్న రైలుచెట్టు  పైనుంచి అందులోకి దూకే వాళ్ళం. నన్ను తరుముకుంటూ వచ్చే నాన్నమ్మని ఏడిపించడానికి అందులో దూకి తామరాకుల కింద నక్కేవాడిని.  అప్పట్లో చెరువు తాటిచెట్టంత లోతుగా ఉండేది. నేనెక్కడ మునిగిపోతానో అని నానమ్మకు భయం. అందుకే ఆ వేట. నాకదో ఆట.  అంత లోతైన చెరువు ఎందుకు  ఎండిపోయిందో..అందులో  ఉండాల్సిన నీరు మాయమైపోయి మట్టి ఎలా పేరుకు పోయిందో కాని..ఆ పగుళ్ళిచ్చిన చెరువులో నాన్నమ్మ బొమ్మ కదిలినట్టనిపించి త్రుళ్ళిపడ్డాను.  మనుషులకు మట్టిని మాత్రమే మిగిల్చి..నీటిని మాత్రం కొందరి ఇళ్ళల్లో ఉరకేలేసే ఆనంద తరంగాలుగా మార్చుకున్నచిత్రాలు రమేష్ కి తీరుబడిగా ఎప్పుడైనా వివరించి చెప్పాలి.

నా తర్జనభర్జన వాడికి అర్థమైనట్టుంది?

“అరే ఇంతకీ మనలో మన మాట. మీక్కూడా ఈ నీటి కష్టాలేంట్రా?” మళ్ళీ ఉడికించడానికి రమేష్ ప్రయత్నం. చిరునవ్వే నా సమాధానం.

అలా నడుచుకుంటూ మా ఇంటికి అతి సమీపంలో ఆనుకుని ఉన్న పొలాల వైపు  వెళ్ళాం.  ఒకప్పుడు మా ఇంటి చుట్టూ పొలాలే ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు చేపల చెరువులు..రొయ్యల చెరువులు ఎక్కువయ్యాయి. వాటిలోనుంచి విడుదల చేసే మురికి నీరు కాల్వల్లో ప్రవహస్తోంది.  తెలిసిన ఒక మిత్రుడి చెరువు దగ్గరకు రమేష్ ని  తీసుకెళ్ళాను. అందులో చేపల పట్టుబడి జరుగుతోంది. ధాన్యాన్ని గుట్టలుగా వేసినట్టు చేపల్ని రాశులు పోసి ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎక్కించడం వాడికి చూడ ముచ్చటగా అనిపించింది.

02_13_Tribute-Dr-Rao-Painting

అలా ఆ చెరువులు దాటుకుని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్ళాను. రమేష్ సందేహాల శస్త్రాలు సంధించక ముందే వాడికి చెప్పాల్సిన విషయాలు చెప్పాను.

“ ఇక్కడ చుట్టూ చాలా మందికి పొలాలు ఉండేవి. అవి రానురాను కొందరికే సొంతమయ్యాయి. వేల మంది భూములు లేని వారిగా మారిపోతే పదుల సంఖ్యలో పెద్దలు మాత్రమే ఇలా చేపలు..రొయ్యల  గుట్టల మీద నిలబడి మీసాలు మెలేస్తున్నారు. మా చిన్నప్పుడు కొల్లేరు వ్యవసాయం కోసమని ఊళ్ళో కోమటాయన దగ్గర నాన్న చేసిన చిల్లరమల్లర అప్పులకు చెల్లుచీటీగా మా పొలాలు గల్లంతయ్యాయి.  ఇక్కడుండాల్సిన మా పొలాలు  ఏ చెరువులో కలిసిపోయాయో ఇప్పుడు పోల్చుకోలేం. ఊళ్ళో బలిసిన వారు బక్కజనుల  పొలాలను సొంతం చేసుకున్నారు. మా చిన్న తాతకు ఊళ్లో వందెకరాలు ఉండేవట. కానీ ఆయన ముగ్గురు కొడుకులు ఇప్పుడు మూడూళ్లలో ఉన్నారు. ఊళ్లో మాత్రం వారికి సెంటు భూమి మిగల్లేదు.  హైదరాబాదైనా ఆగడాల్లంకైనా సాగుతున్న నీతి ఒక్కటే. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా మార్చేయడం. ఇక్కడే కాదు. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కొల్లేరులో కూడా ఇదే పరిస్థతి. అక్కడకు మనం టిఫిన్ చేసి బయలుదేరదాం. నా చిన్ననాటి చేలాగాడు రాంబాబు వస్తాడు. వాడు మనల్ని కొల్లేరు తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేశాడు. “

ఇలా చెప్తున్నంతలోనే రాంబాబు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.

“ఏరా రాంబాబు! ఏంటి సంగతులు. వీడు నా ఆప్త మిత్రుడు రమేష్. ఆంధ్రా దొంగలు ఏం తింటారో ఎలా ఉంటారో కళ్ళారా తిలకిద్దామని వచ్చాడు.” రాంబాబుకి రమేష్ ని పరిచయం చేశాను.

“ఏం కాదులేరా! కూడా ఇంకో దొంగను పెట్టుకుని వచ్చావు. ఎలాగైనా మీ అమ్మానాన్నని తీసుకుపోదామని. అది జరిగే పని కాదులే.” రాంబాబు ముందే నన్ను బెదరగొట్టాడు.

ఇద్దరూ హలో అంటే హలో అనుకున్నారు. రాంబాబు డిగ్రీ మథ్యలోనే చదువుకు స్వస్తిచెప్పి కుటుంబ పోషణార్థం కూలీగా మారిపోయాడు. అన్న అమెరికా వెళ్లిపోయాక ముసలి తల్లిదండ్రులకు అండగా.. ఉన్న ఊరినే నమ్మకుని ఉండిపోయాడు. రాంబాబు సైకిల్ ని కాల్వ పక్కనే నిలబెట్టి మాతో కొంత దూరం నడుచుకుంటూ వచ్చాడు.

ఊరిని ఆనుకుని ఉన్న పొలాల మధ్య మరుగుదొడ్డిలాంటి దారిని దాటుకుని కొంత దూరం నడిస్తే మాదిగ్గూడెం వస్తుంది. ఊళ్ళో చచ్చిన గొడ్ల అస్థిపంజరాలతో కంపుకొట్టే వాతావరణం మధ్య గూడెం జనాలు కాపురాలుండేవారు. మా నాన్న చేసే కొల్లేటి కమతాల్లో గూడెం జనాలు కొందరు పనిచేసేవారు. పనే కాదు. ఆ కమతాల్లో వారికి వాటా కూడా ఉండేది. అలా చిన్నప్పటి నుంచి దావేదు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళబ్బాయే రాంబాబు. వాడిని రాంబాబు అని పిలిచేది నేను ఒక్కడినే. ఊళ్లో జనమంతా వాణ్ణి రామిగా అనో చిన్ని దావేదుగాడనో  పిలుస్తారు.

“ఒరేయ్ రాంబాబు..ఇక్కడ మీ గూడెం ఆనవాళ్ళేమీ కనిపించడం లేదు. ఏంటి సంగతి?”

“ఇక్కడ గూడేన్ని లేపి ఊరవతల కట్టిచ్చిన ఇందిరమ్మ ఇళ్ళల్లో కూర్చోబెట్టారుగా.. తెలియదా..?” అన్నాడు రాంబాబు. ఈ మధ్య చాలాసార్లు వచ్చినా రాంబాబును కలవడం కుదురలేదు. అందుకే ఈ మార్పు తెలుసుకోలేకపోయాను.

వారసత్వంగా వచ్చిన ఇళ్ళూ ఊరవతలే. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళూ ఊరవతలేనా?  కనీసం ఇప్పుడు కట్టిన ఇళ్ళన్నా ఊరి మధ్య కడితే ఎంత బావుండు. నాలో మెదిలిన ప్రశ్న రాంబాబుకు అర్థమైనట్టుంది.  ఒక చిన్న నవ్వు వదిలి ముందుకు కదిలాడు. రాంబాబు వాళ్ళ గుడిసె ఎక్కడ ఉండేదో ఆ దిబ్బను చూపిస్తేనే కాని నాకు జ్నాపకం రాలేదు. ఇక్కడ ఒకప్పుడు ఒక జన సమూహం ఉండేదని.. దీపాలు లేకపోయినా తెల్లవార్లూ పాటలు పద్యాలతో ఆ పల్లె వెలిగిపోయేదని  అప్పుడు గాని గుర్తుకు రాలేదు.

రాంబాబుతో నా స్నేహం ఆ ఊరవతలి బతుకుల పట్ల  నాలో సానుభూతినే కలిగించింది కాని  అసహ్యాన్ని కాదు. ఊరి చుట్టూ ఎంత పచ్చని అందం అల్లుకుందో ఇక్కడి దళితుల బతుకుల లోపలా బయటా  అంత కారుచీకటి  ఆవహించి ఉండేది. ఆ పచ్చదనం ఈ గుడిసెల గుమ్మాల దాకా ఎందుకు పాకలేదని చిన్నప్పుడు ఎంతగానో బాధపడేవాణ్ణి. పెద్దయ్యే కొద్దీ రాంబాబులో కూడా ఈ బాధ అగ్నిపర్వతమై కూర్చుంది. కొంచెం పెద్దయ్యాక మాకిద్దరికీ అర్థమయ్యింది. ఊళ్ళ చుట్టూ ఉన్న ఆకుపచ్చ సౌందర్యం..పంటకాల్వల గలగలలూ..ఊరిని పలకరించి పోయే ఆరు రుతువుల అందాలూ అన్నీ కొందరికే సొంతమైనట్టు నేనూ రాంబాబు సమానంగానే గమనించాం. ఎందుకో కాని తరవాత్తర్వాత రాంబాబు చదువు మానుకుని కూలీల దండుకట్టే దండనాయకుడయ్యాడు. నేను ఉద్యోగం వేటలో ఊరొదిలి పారిపోయాను. ఇలా కలిసినప్పుడు ఆనాటి బాల్యాన్ని..ఈనాటికీ మారని బడుగుబతుకుల చిత్రాన్ని కలబోసుకుంటాం. వాడు ఉద్రేకపడతాడు. నేను ఊకొడతాను. మా ఇద్దరి బాల్యపు ముచ్చట్ల మథ్య ఇక్కడ ఒకప్పుడుండే గూడెం స్వరూపాన్ని రమేష్  అర్థం చేసుకున్నాడు.   మాటలు..జ్నాపకాలు..ఊళ్ళో సాగుతున్న తతంగాలు అన్నీ రాంబాబు చెప్తూ మేం వింటూ అలా కొంతసేపు తిరిగితిరిగి ఇంటికి చేరుకుని టిఫిన్లు ముగించాం. రాంబాబు మా కొల్లేరు యాత్ర ఏర్పాట్లకోసం ఇంటికెళ్ళాడు. మేం రెడీ అయ్యేసరికి ఒక బైక్ తో ప్రత్యక్షమయ్యాడు. ముగ్గురం బర్రున కొల్లేరు వైపు దారి తీశాం.

కొల్లేరు చేరుకునే సరికి ఎండ బాగానే దంచుతోంది. చిన్నప్పుడు అక్కడన్నీ పొలాలే. వందల ఎకరాలు అక్కడ కమతాలుగా చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలు వ్యవసాయం చేసుకునే వారు. ప్రభుత్వం నుంచి కూడా వారికి అధికారాలు అందేవి. నాన్న వ్యవసాయం చేసే రోజుల్లో ఒక పెద్ద కమతంలో వ్యవసాయం సామూహికంగా సాగేది.  అంతా కలిసి హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ వానల్ని ఎండల్ని తుపానుల్ని చలినీ అనుభవించేవారు. దళితులకు కూడా ఆ కమతాల్లో వాటాలుండేవి. హక్కులుండేవి. అప్పుడప్పుడూ నాన్నతో పాటు నేను కొల్లేరుకి వెళ్ళేవాడిని అంతా వరసలు కలుపుకుని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకే కుటుంబంలా పనులు చేసుకునే వారు. ఇప్పటిలా రోడ్డు ఉండేది కాదు. ఒకరోజంతా నడుచుకుంటూ కొల్లేరు చేరాల్సిందే. వర్షాలు బాగా పడుతున్నప్పుడో..పనులు పోతాయనో..మాటిమాటికీ తిరగలేకో.. కొన్ని వారాల తరబడి ఒక్కోసారి వచ్చేవారు కాదు. మేం ఇంటి దగ్గర భయపడేవాళ్ళం. అప్పట్లో కొల్లేరంటే ఎటు చూసినా నీరు..వింతవింత పక్షులు.. శూన్యంలోకి ఎగిరే చేపల విన్యాసాలు..అంతా అదో ఆనందలోకం. ఒకే పంట పండించే వారు. వానాకాలం అదంతా అభయారణ్యమే. దాళ్వా పంట మాత్రమే వేసేవారు. ఆకుమళ్ళు కట్టే దగ్గర నుంచి..ఊడ్పులు..కోతలు..పంటనూర్పుళ్ళు..ఇంటికి ధాన్యం బళ్ళల్లో తోలుకు రావడాలు అంతా అదో కోలాహలం. అవే అసలైన పండగలుగా ఊరిని సంబరాల్లోకి నెట్టేవి.  మా ఇంటి పెరట్లో  పెద్ద గాదె ఉండేది. అందులో చాలా ధాన్యం నిల్వ ఉంచేవారు. మిగతాది షావుకార్లకు తోలేవారు. పంట కోతకు ఎదిగినప్పుడు కొల్లేటి పెద్దింట్లమ్మకు వేటలు వేసేవారు. వేటల్ని వేసినప్పుడు అటు గూడెంలోనూ ఇటు ఊళ్ళోనూ పగలూ రాత్రి తేడా తెలియని జాతర మత్తు గమ్మత్తుగా ఆవహించేది.

మా కోసం ముందే ఏర్పాటు చేసిన చిన్న పడవ ఎక్కి వెనక్కి వెనక్కి కుంచించుకుపోతున్న కొల్లేరు సరస్సులో విహారానికి బయలుదేరాం. చుట్టుపక్కల ఊళ్ళను ఉధ్ధరించడానికే పుట్టినట్టు  రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ తమ కబ్జా జమాయించిన పెద్దలు పేదల కమతాలను ఆక్రమించుకున్నారు. కొందరికి తాగించి..కొందరికి భూములకు భూములిస్తామని చెప్పి ఊరించి..లొంగని వారిని కొద్దిపాటి డబ్బుతో కొనేసి..ఎవరి మాటా వినని సీతయ్య లాంటివారిని భయపెట్టి కొల్లేటిలో పేదల భూముల్ని పెద్దలు స్వాధీనం చేసుకున్నారు. కొల్లేటి సరస్సును కొల్లగొట్టి దాన్ని చిన్నచిన్న చేపల చెరువులుగా కత్తిరించి తమ ఖాతాలో వేసుకున్నారు.  మా చిన్నప్పుడు మా నాన్న నిర్వహించిన కమతాలు అలా మాయమైపోయినవే. రాంబాబు వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దోగొప్పో భూములుండేవంటే ఈ కొల్లేరులోనే. అవన్నీ ఇప్పుడు పరాధీనమైపోయాయి.

“అంతా సరస్సే అయినప్పుడు మరిన్ని సరస్సులు అవసరమా?” రమేష్ అమాయకంగా అడిగాడు.

వాడికెలా చెప్పాలి. కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన సరస్సు. ఈ చెరువులు ప్రకృతిని కొల్లగొడుతున్న సరస్సులు. ఆ సరస్సు మీద వింత వింత పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి కొంతకాలం విడిది చేసి తిరిగి పోయేవి. ఈ చెరువుల మీద పక్షి వాలిందా..దాని గుండెల్లో బుల్లెట్ దిగుతుంది. ఆ సరస్సుకు ఆకాశం కాపలా. ఈ చెరువులకు తుపాకుల కాపలా.  ఏ ఎరువులూ అవసరం లేకుండా కొల్లేరు సరస్సు నిండు గర్భణిలా నిత్యం రకరకాల జీవరాశుల్ని ప్రసవిస్తూ ఉండేది. ఈ చేపల చెరువుల్లో వాడుతున్న మందులు..ఎరువులు ఆ నాలుగు గట్ల మధ్యనున్న చేపల్ని తప్ప మరే జీవరాశినీ బతికి నీటిబట్ట కట్టనీయవు. ఇవి చేసే వాతావరణ కాలుష్యంతో కొంచెంకొంచెం కుంచించుకుపోతున్న సరస్సు ఏదో ఒకరోజున అమాంతం మనకు కనపడకుండా ఎక్కిడికో పరుగు లంకించుకుంటుంది.

ఇక్కడ ప్రకృతి విధ్యంసమే కాదు..పర్యావరణ వినాశనమే కాదు..బీదాసాదా రైతుల జీవనాధారం కూడా ధ్వంసమైంది. కొల్లేరంటే అందం..ఆనందం..బతుకు పడవ కదా..మరిప్పుడు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కొంప కొల్లేరైందన్న సామెత ఎందుకు వెలిసిందంటే కారణం ఇదేనేమో.

ఊళ్ళో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉన్న మా నాన్నలాంటి పెద్దరైతులే పేదరైతుల్లా బతుకుబండి లాగుతున్నారు. ఇక రాంబాబులాంటి గూడెం జనాలు గోడు ఎవరు పట్టించుకుంటారు ? నా ధోరణిలో నేనేదో చెప్తున్నాను.

ఏందిరా బాయ్ మీరేదో ఆనందాన్ని అనుభవిస్తున్నారని చూడ్డానికి నేనొస్తే అన్నీ కష్టాలే వల్లిస్తున్నారు? అంటూ రమేష్ ఎగిరి మా పడవలో పడిన చేపను పట్టుకుని ముచ్చటగా ముద్దాడాడు. అప్పటికే  మా పడవ నడపుతున్న మనిషి  చిన్నచిన్న చేపల్ని పట్టుకుని మాకోసం కాల్చి పెట్టడానికి పడవలోనే అన్నీ ఏర్పాట్లు చేసిపెట్టాడు. పేరు రాముడు. మా చిన్నప్పుడు రాముడు కాదు భీముడు అనేవారు. ఇప్పుడు కొల్లేరు చిక్కిపోయినట్టే కొంచెం కొంచెం ఎండిపోయి కండ తీసేసిన కొరమేను ముల్లులా తయారయ్యాడు.  చేపల రుచి..ప్రకృతి రుచి..అనుభవిస్తూ కొల్లేటి అంతరంగంలోని విషాదం చేదును మర్చిపోదామని రమేష్ తో పాటు మేం కూడా ప్రయత్నించాం.

ఏం బాబూ అసలు ఊరికి రావడమే మానేశారు? రాముడు కాల్చిన చేపలతోపాటు కొన్ని ప్రశ్నల్ని కూడా మావైపు పంపడం మొదలుపెట్టాడు. వాణ్ణి కదపకూడదనే అనుకున్నాను. కదిపితే కొల్లేరు డొంక కదిపినట్టే. ఏ డొంకలో ఏ పిట్టలుంటాయో..ఏ పిట్ట ఏం తింటుందో ఎలా తింటుందో..ఎంత ఒడుపుగా దాన్ని పట్టుకోవాలో కతలుకతలుగా చెప్తాడు. ఏ కాలంలో ఏపక్షులు వచ్చేవో..ఎంతకాలం ఉండేవో కల్లాకపటంలేని కొల్లేటి కొంగల భాషలో వర్ణించిపాడతాడు. అంతటితో ఆపడు. ఆపితే రమేష్ కి మంచి వినోదమే దొరికేది . కాని వాడి కథ మొదలుపెడతాడు. ఇప్పటికే రమేష్ కి ఇక్కడి వాతావరణం కంటె దాని వెనక సాగుతున్న దోపిడి కాస్త అసహనానికి కారణమవుతోంది. ఎందుకొచ్చానురా బాబూ అని తలపట్టుకుంటాడేమో అని నా సందేహం. కాని వాడూరుకుంటాడా. కదపనే కదిపాడు రాముడి కొల్లేటి డొంకని.   వాడి యవ్వనంలో కొల్లేరు ఎంత గొప్పగా ఉండేదో..ఇక లంకించుకున్నాడు.

“ నా మాలచ్చిని చూసినా కొల్లేటిని చూసినా నాకు రత్తంలో ఒకటే తియ్యని దురద మొదలయ్యేది బాబయ్యా. ఆ రోజులే ఏరు. వర్షాలు తగ్గి నీరు వెనక్కి తీసినప్పుడు ఇక్కడ ఎగసాయం మా జోరుగా సాగేది. నాక్కూడా ఏడెనిమిది ఎకరాల ఎగసాయం ఉండేది. ఇదిగో ఈళ్ళ నాన్నగారు కమతాలనీ..కలిసి ఎగసాయం చేసుకోవాలనీ మొదలెట్టాక అబ్బో అదో పండగలా సాగేదనుకోండి. ఊళ్ళో జనాలు ఎలాగుండేవారో కాని..ఇక్కడ మాత్రం ఊరూ వాడా తేడా లేకుండా అందరం అల్లదిగో ఆ ఎగురుతున్నాదే చేప పిల్ల. మరలా ఎగిరి గంతులేసే వాళ్ళం. కలిసి వండుకునే వాళ్ళం. కలిసి పండుకునే వాళ్ళం. వారాల పాటు ఇళ్లకు పోకుండా ఇక్కడ మేం ఎగసాయం చేస్తా ఉంటే మా ఆడది  అప్పుడప్పుడూ అనుమానంతో ఇక్కడికి లగెత్తుకొచ్చేది. మాలచ్చి వచ్చిందంటే ఇక నాకు పండగే. అందరూ నన్ను వదిలేసే వారు. దాన్ని తీసుకుని అదిగో ఆ దోనెలున్నాయే అలాంటి తాటి దోనెలో ఇక కొల్లేరులో ఒకటే తిరుగుడు. దూరంగా ఎవరికీ కనిపించకుండా దాన్నెటో తీసుకుపోయేవోణ్ణి. ఇప్పడు నేనిస్తన్నట్టే అది నాకు చేపలు కాల్చి పెట్టేది. నేను పాటలు పాడేవోణ్ణి. నాసామిరంగా నేను పాటలు పాడతా వుంటే ఎగిరే పచ్చులు కూడా అల్లాగిపోయేవనుకోండి. అయ్యా..పిట్టల మాటేం కాని ఆకాసంలో సూరీడు కూడా ఆగిపోయేవాడంటే నమ్ముతారా? “

‘నమ్ముతాం నమ్ముతాం.’  రమేష్ ఊతమిచ్చాడు. ఆ ఊతంతో పాటందుకున్నాడు. మేమంతా ఎక్కడన్నా పక్షులు ఎగురుతూ ఆగి వెనక్కి చూస్తాయేమో అని దిక్కులు చూశాం. పక్షులుంటేగా! ఖాళీ డొంకలు వెక్కిరిస్తున్నాయి.  అటు ఆకాశం వైపు చూశాం. నిజంగానే సూర్యుడు నిదానంగా కదులుతున్నాడు.

‘ఇప్పుడేం చేస్తున్నావ్ రాముడు?’ అడిగాడు రమేష్.

ఏం చేస్తాం బాబయ్యా. ఆ ఎగసాయం లేదు. ఆ బూములు లేవు. ఆ పనీ లేదు ఆ పాటా లేదు. ఉన్న కమతాలన్నీ పెద్దోళ్ళ చేపల చెరువుల్లో ఎక్కడ కలిసిపోయాయో తెలీదు.  కాగితాల మీద ఏలి ముద్రలు ఏయించుకున్నగ్నాపకాలు తప్ప ఇంకేం గుర్తులేదు. ఇదిగో ఇప్పుడు ఆ చెరువుల దగ్గర కాపలా కాసే పనోడిగా బతుకుతున్నాను. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఈ కుళ్ళు నీరు తాగి నేనైతే సయించుకున్నాను కాని..నా ఆడది మాత్తరం కుంగి కుశించుకుపోయింది. మాయదారి రోగం కానరాలేదు. కానొచ్చినా బాగుచేసుకునే సత్తా వున్నోణ్ణి కాదు. అలాగే అర్థాంతరంగా మాయమైపోయింది మాలచ్చిమి. బిడ్డలకి రెక్కలొచ్చాక ఇక్కడ రెక్కాడినా డొక్కలాడ్డం కష్టమని నగరాలకి వలస పచ్చుల్లా ఎగిరిపోయారు.”

ఉన్నట్టుండి రాముడు..నేను..రాంబాబు ముగ్గురం సైలెంట్ అయిపోయాం. రమేష్ కూడా మాతో పాటు నిశ్శబ్దంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఎగిరే చేపపిల్లల్లో చిన్నప్పటి జ్నాపకాల తుళ్ళింతల దృశ్యాలేవో దోబూచులాడుతూ నన్నుఉడికిస్తున్నాయి. నాన్న పొలాలు పోగొట్టుకున్న తర్వాత చుట్టం చూపుగా కొల్లేరు రావడమే అవుతుంది కదా అన్న బాధ కొంచెం గుండెల్లో మెలిపెట్టింది. రాంబాబు మనసులో ఏం జరుగుతుందో నేనూహించగలను. గతం వర్తమానం కలిసి అతని మనసులో ఒక ద్రావకంలా మరుగుతున్న విషయం అర్థమవుతోంది. ఇక రాముడు ఫ్లాష్ బ్యాక్ లోకి జారిపోయిన సంగతి తెలిసిపోతోంది. రాముడు పాలేరుగా మారడం..రాంబాబు కూలీగా మిగిలిపోవడం..కాస్త కలిగిన  కుటుంబంలో పుట్టినా చివరికి ఊళ్ళో బలవంతులకే ఆస్తులన్నీ ఫలహారంగా సమర్పించుకుని  ఇప్పుడు మేము ఇల్లు తప్ప ఏమీ మిగుల్చుకోలేకపోవడం .. ఈ విషయాలన్నీ రమేష్ కి కూడా అర్థమైనట్టున్నాయి. వాడూ మా నిశ్శబ్దంలో మరింత నిశ్శబ్దంగా ఒదిగిపోయాడు.

అలా కొల్లేటి కొంగలు సంధ్యరంగుల ఆకాశాన్ని తమ రెక్కల మీద ముద్రించుకుని ఒక గుంపుగా మా కళ్ళను తాకుతూ ఎగిరినప్పుడు ఇళ్ళకు తిరుగుముఖం పట్టాం.

ఇంటికి రాగానే నాన్న కనిపించలేదు.

అమ్మా నాన్నేడి?

“ఈ మథ్య గుడి కట్టిస్తున్నారుగా..శివాలయం. పొద్దస్తమానం అక్కడే గడిపేస్తున్నార్రా బాబూ. అన్నట్టు మీ ప్రయాణానికి అన్నీ రాత్రికే సర్దుకోండి నాన్నా. పొద్దుటే లేచి తాడేపల్లి గూడెం వెళ్లాలిగా. ఇలా ఒకరోజు ప్రయాణాలేంటిరా! పోన్లే కనీసం నెలకోసారైనా రా! మేమెలాగూ ఈ రైళ్ళూ బస్సులూ ఎక్కలేం!”

అమ్మ మాటల్లో నాకెందుకో ఏదో కనిపించని ఆరా..అన్వేషణ.. ఇంకేదో ప్రశ్న గుండెల్ని తాకుతున్నాయి. నేను వచ్చిన వాడిని వచ్చినట్టే తిరిగి వెళ్ళి పోతానని..వాళ్ళను నాకూడా తీసుకు వెళ్ళే ప్రయత్నాలేమీ చేయనని అమ్మ ఇంకా కన్ ఫాం కాలేదు. వారికి ఏ మూలో అనుమానం ఉంది. అందునా ఈసారి ఒంటరిగా రాలేదు. హైద్రాబాద్ మిత్రుణ్ని వెంటేసుకుని  సశస్త్రంగా వచ్చాను.

అమ్మా ఈసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికే వచ్చాను. మీరు కూడా బట్టలు సర్దుకోండి.

“వచ్చే నెల్లో వస్తాంలే నాన్నా.  నా బ్యాగూ నాన్న బ్యాగూ పక్కింటి పార్వతి తీసుకుంది. ఊరికెళ్ళాలంట. పాపం ఎప్పుడూ మమ్మల్నే కనిపెట్టుకుని ఉంటుంది. దానికేమైనా చెయ్యాలిరా!” అమ్మ జవాబు.

అమ్మ మాటలు నాకెందుకో నమ్మబుద్ది కావడంలేదు. “ అయినా బ్యాగులదేముంది. ఇప్పుడే పోయి రెండు కొత్తవి కొనుక్కొస్తానుండు.”  అమ్మ ఏదో గొణుగుతున్నా వినకుండా బయలుదేరాను. రమేష్ స్నానానికి వెళ్ళాడు.

ఎక్కడికిరా?

నాన్నని తీసుకువస్తా.

అప్పుడే వస్తాడా ఆయనగారు. మీరు ముందు స్నానాలు ముగించండి.

అమ్మ మాటలు వినకుండా త్వరగా గుడి దగ్గరకు బయలుదేరాను. పక్కింటి పార్వతి ఎదురుపడింది. బ్యాగులు తీసుకువెళ్ళి  అమ్మే పార్వతి ఇంట్లో దాచిపెట్టిందట. వచ్చే నవ్వు ఆపుకోడానికి పార్వతి చీరకొంగును సాయం తీసుకుంది.

చిన్నప్పుడు స్కూలు ఎగ్గొట్టడానికి నేను కూడా ఇలా ఎన్నిసార్లు పుస్తకాల సంచి అక్కడా ఇక్కడా దాచిపెట్టేవాడినో. ఎక్కడ దాచానో అమ్మకు మాత్రమే తెలుసు. నాన్న వెదికి వెదికి నన్ను ఉతకడానికి రెడీ అయినప్పుడు ‘ పోన్లెండి రేపు వెళతాడులే బడికి’ అని అడ్డం పడేది అమ్మ. చిన్నప్పుడు నేనేసిన ఎత్తులన్నీ ఇప్పుడు నాదగ్గర అమ్మ ప్రదర్శిస్తోందన్నమాట. నవ్వుకుంటూ గుడికి వెళ్ళాను. అక్కడ నాన్న ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి ఏరా పొద్దున్నే వెళ్ళాలన్నారు. త్వరగా తిని రెస్టు తీసుకోండి. ఇదిగో గుడి కడుతున్నాంగా ఇప్పటిదాకా మీటింగే సరిపోయింది. అంతా ఇప్పుడే వెళ్ళారు.

“ఎందుకు నాన్నా! మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళనులే. కనీసం నేను ఉండే ఒక పూటైనా ఇంటిదగ్గర ఉండొచ్చుగా! రాపోదాం”  నాన్న చేయి పట్టుకుని పైకి లేపాను.

“మళ్లీ ఎప్పుడొస్తార్రా? ఈసారి కోడల్ని..పిల్లల్ని తీసుకురావాలి మరి ఆ!”

నేను చిన్నప్పుడు బడికి ఎగనామం పెట్టి పాత శివాలయం దగ్గర గోళీలాడేవాడిని. ఆ విషయం నాన్నకెవరో చెప్పేవారు. దారీపోయేవారెవరో పెద్దమనిషి ఒరే మీ నాన్నొస్తన్నాడని బెదిరిస్తే గుడిదగ్గరే రాత్రి దాకా ఉండిపోయేవాడిని. ఎప్పుడో చీకటి పడ్డాక నాన్న వెదుక్కుంటూ వచ్చేవాడు.

“అమ్మ దొంగా నా దగ్గరే నా చిన్నప్పటి ట్రిక్కులు ప్లే చేస్తున్నావా నాన్నా”  అసలింత అవసరమా?  మనసులోనే అనుకుని నాన్నతో ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి రాగానే స్నానాలు చేసి ఒకసారి రాంబాబు ఉంటున్న ఊరవతల కాలనీకి వెళ్ళాము.

అక్కడ రాంబాబు కాలనీ చూసి మరీ బాధ కలిగింది. చూడ్డానికి దూరంగా ఇళ్ళలానే కనిపిస్తాయి. కాని అవి తలుపులూ కిటికీలూ లేని అగ్గిపెట్టె గుడిసెలంటే తప్పుకాదు. అక్కడ కూడా కాలనీలు ఏర్పడ్డాయి. దళితులు ఒక పక్కకి..వారికి దూరంగా ఇతర కులాల ఇందిరమ్మ ఇళ్ళు మరో మూలకి ఉన్నాయి. అభివృద్ధిని అంకెల్లో చూపించేవారికి ఈ కాలనీలను చూపిస్తే ఏమంటారో మరి.  రాంబాబు నాన్న దావీదుతో కాసేపు మాట్లాడాము. ఆయనా పాత ముచ్చట్ల నడుమ ఊరి గురించి బాధనే నిట్టూర్పుల భాషతో వ్యక్తం చేస్తున్నాడు.

“మీ పెద్దబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్ళారా” అని అడిగాను. సమాధానం రాంబాబు దగ్గర నుండి వచ్చింది.

“అన్నయ్య ఇక్కడకు రాడు. వచ్చినా వీళ్ళని ఇక్కడ నుంచి తరలించడానికే ప్లాన్లు వేస్తాడు. టౌన్ లో ఎక్కడైనా ఇల్లు తీసుకుని ఉండమంటాడు. డబ్బు పంపినా అమ్మానాన్నకి నాతోనే ఉండడం ఇష్టం. అయినా ఈ ఊరిని వదలడానికి ఏమాత్రం వీరికి ఇష్టం లేదు. ఇక్కడేముంది ఒక ఊరి చివరి నుంచి ఇంకో చివరికొచ్చారు. ఎప్పుడైనా ఊళ్ళల్లో చివరి బతుకులేకదా అన్నది అన్నయ్య వాదన. కొడుకుల దగ్గరున్నా మనుమలూ మనవరాళ్ళూ చుట్టూ ఉన్నా ఒంటరితనమే వెంటాడుతుందని అమ్మకీనాన్నకి భయం. పంచిన రక్తంలోనే మమకారాల కంటె పెత్తనాలు ఎక్కువవుతుంటే ఏ బంధాలూ లేకున్నా ఉన్న ఒక్క మట్టి బంధంతోనే హాయిగా గడిపేద్దామని మా పేరెంట్స్ వాదన. వీళ్ళకోసం నేనుంటున్నానో..నాకోసం వీళ్ళుంటున్నారో కాని ఉంటున్నాం. ఊళ్ళోనే ఉంటున్నాం. “  రాంబాబు మాటల్లో, కళ్ళల్లో, మనసులో ఏదో గుబులు కనిపించింది.

ఇక రాంబాబు ఇంటి దగ్గర సెలవు తీసుకుని మా ఇంటికి ముగ్గురం వెళ్ళాం. వేడివేడిగా అమ్మ వడ్డించింది. నాతోపాటు అమ్మనీ నాన్ననీ తీసుకు వెళ్ళే ప్రయత్నంలో మరోమాటు భంగపాటు చవిచూసి గమ్మున ఊరకున్నాను.  రాంబాబు కూడా ఆ రాత్రికి మాతోనే ఉండిపోయాడు. ఊరూ..వాడా..రిజర్వేషన్లు..ఎవరు ఎదిగారు..ఎవరు కుదేలయ్యారు..రాంబాబు ఏదో తన రహస్య రాజకీయ కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మర్నాడు ఉదయమే లేచి స్నానాలు చేసి తాడేపల్లిగూడెం బయలుదేరాం. మళ్ళీ తిరిగి జన్మభూమి ట్రైన్ లోనే  ప్రయాణం.

వెళుతూ వెళుతూ రమేష్ నాన్నతో మళ్ళీ  కొంచెం కదిపి చూశాడు.

“ఏంటంకుల్..ఇక్కడేముంది? తాగడానిక్కూడా నీరు లేదు. మాకెలాగూ తెలంగాణా ఇచ్చేస్తున్నారుగా అక్కడికే వచ్చేయండి.”

ఏం సమాధానం వస్తుందో అని ముగ్గురం ఉత్కంఠగా ఎదురు చూశాం.

“లేదు. ఎక్కడికీ రాము.”

నాన్న నుండి వచ్చిన ఈ ఠపీమన్న సమాధానంతో నేనూ రాంబాబు నవ్వుకున్నాం కాని రమేష్ మాత్రం ఆశ్చర్యంగా అలాగే నోరు తెరిచి ఉండిపోయాడు.

“ఏమీలేదురా బాబూ. మీకు తెలంగాణా వస్తేనన్నా కనీసం ఇక్కడ ఊళ్ళు బాగుపడతాయేమో అని మా ఆశ.”

“అధికార బదలాయింపులతో ఊళ్ళు బాగుపడవు అంకుల్. ఆ అధికారం ఎవరి చేతుల్లోకి పోతుందన్నదే పాయింట్. స్వతంత్ర పోరాటం ఎప్పుడూ సమరోత్సాహంగానే ఉంటుంది. స్వాతంత్ర్య ఫలితాలు ఎవరికి దక్కుతాయన్నదే చూసుకోవాలి.”  ఇక రాంబాబు దొరికిందే తడవుగా అందుకున్నాడు. నాన్న కూడా తీరిగ్గా ఉపన్యాసానికి ఉపక్రమించాడు.

అంతా హైదరాబాద్ కే పరుగులు తీశారు తప్ప పుట్టిన ఊళ్ళు..పెరిగిన ఊళ్లు ఎలా ఉన్నాయో ఎంత ధ్వంసమవుతున్నాయో పట్టించుకునే తీరికా ఓపికా ఎవరికీ లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి. పదవులు కావాలి. పీఠాలు కావాలి. పెట్టుబడిదారులకు వ్యాపారాలు కావాలి. ఏ వూరు ఎలా పోయినా పర్వాలేదు. వారి పెట్టుబడులు పెరగాలి. హైదరాబాదైనా పోతారు..ఆఫ్రికా అయినా పోతారు. వారికి మట్టిబంధాలు..మమతానుబంధాలు ఉండవు. ఉన్నదొక్కటే బంధం అది డబ్బు బంధం. నగరాలేవైనా వారికే ఉంపుడుగత్తెలు.  మనం మన రాష్ట్రంలో ఉన్నా..మన దేశంలో ఉన్నా..ఈ నేల మనది..ఈ గాలి మనది..ఈ నీరు మనది అన్న  ఏదో తెలియని భావంలో ఉప్పొంగిపోతాం. తీరా హక్కులు అనుభవించే సరికి ఎక్కడా నీకు కూర్చోడానికి కూసింత జాగా కూడా దొరకదు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినా డబ్బున్న వాడికి పక్కవేసే నగరంలో నిజానికి నువ్వు అనాథవే. కూలికోసం ఉదయాన్నే నాలుగురోడ్ల కూడలిలో నిలబడే వేలాది జనానికి నగరం ఎప్పటికీ పరాయిదే. వారితో పనిచేయించుకుని వారిని కుక్కలకంటే హీనంగా చూడ్డమే నగర సంస్కృతి వికృత రూపం. అలాంటి నగరం కోసం ఏడవడం కంటె కనీసం ఇప్పటికైనా మన ఊళ్ళను బాగుచేసుకుందాం అన్న స్పహ మా వాళ్ళకి కలిగితే అదే పదినగరాలపెట్టు.”  నాన్న ఉపన్యాస ధోరణికి బ్రేక్ వేస్తూ రాంబాబు అందుకున్నాడు.

“ రమేష్ ! జన్మభూమి అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే.  అది సామాన్యులకే కాని పెట్టుబడుల గుండెకోటల్లో అది మొక్కుబడిగానైనా ఉండదు. జన్మభూమి భావనే అందరినీ సమానంగా ఆదుకుంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అన్నార్తులు, అభాగ్యుల శాతమే ఎందుకు ఎక్కువగా ఉంటుంది చెప్పు? కూలికోసం కూటికోసం నిలువ నీడకోసం నువ్వక్కడా మేమిక్కడా పోరాటాలు చేయాల్సిందే. అధికారాలు..హక్కులూ సామాన్యులకు అందని ద్రాక్షల్లా ఉన్నంతకాలం యుద్ధం ఎక్కడైనా ఒకటే. ప్రాంతీయభేదాలు మామూలు మనుషులకే కాని దొంగలకు ఉండవురా బాబూ. యువకులను బలిపెట్టి మీరు సాధించిన ఈ స్వతంత్రం ఈనగాచి నక్కల కుక్కల పాలు కాకుండా కాపాడుకోండి. అందుకోసం ఒక మహాసంగ్రామానికి సిద్ధం కావాలి మరి. ఇక మీ తిప్పలు మీరు పడాలి. మా తిప్పలు మేం పడతాం. అందరి తిప్పలూ ఒకటేఅని వాటంతటికీ పరిష్కారం కూడా ఒకటేఅని..దానికోసం నువ్వూనేనూ వీడూ వాడూ అంతా కలిసే కత్తుల నదిలో ఈదాలని మాత్రం మర్చిపోవద్దు సుమా!”

నాన్న మాటలు, రాంబాబు మాటలు విన్న తర్వాత హైదరాబాద్ విషయంలో  జన్మభూమి ఫీలింగ్ తో బరువెక్కిన నా హృదయం ఇప్పుడు కాలిపోతున్న నుదిటిమీద అమ్మ చేయి పడినంత హాయిగా ఉంది.

పొద్దుటే తిరుగుప్రయాణం. రాంబాబు వాళ్ళ నాన్న దావీదు కూడా వచ్చాడు. మా వీధిలో ఉండే సోమన్న కూడా వచ్చాడు. మా ఊళ్ళో మొదటి డాబా ఇల్లు కట్టిన మొనగాడు అతడే. ఇరవై ఎకరాల ఆసామి. ఇప్పుడు నిలువ నీడ లేదు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ల దగ్గర వాచ్ మెన్ లుగా పనిచేస్తున్నారు. నేనెప్పుడొచ్చినా వారి దగ్గర నుంచి వర్తమానం కాని..డబ్బులు కాని ఏమైనా వస్తాయేమో అని నన్ను పలకరిస్తాడు. మేం వెళుతుంటే అమ్మా..నాన్న..దావీదు. సోమన్న అలా శూన్యంగా చూస్తూ నిలబడిపోయారు. ఊరు వెనక్కి వెళుతుంది మేం ముందుకు కదిలాం. నిర్వాహకులు ఎవరూ లేని అనాథ వృద్ధశరణాలయంలా కనిపించింది నాకు మా ఊరు.

ట్రైన్ ఎక్కించి రాంబాబు వెళ్లిపోయాడు. అన్నీ కోల్పోయినా, ఉన్న ఊరినే జన్మభూమి అని మా అమ్మానాన్నలాంటి వృద్ధులెందరో ఆ మట్టినే అంటిపెట్టుకుని ఉంటున్నారు. రాంబాబు మాత్రం జన్మభూమి ఒకఫీలింగే అంటాడు. హైదరాబాద్ నా జన్మభూమి కాదంటే నా గుండె తట్టుకోలేకుండా ఉంది. రమేష్ మాత్రం నా జన్మభూమి అని ఎంతో ఉప్పొంగిపోతూ రాగాలు తీస్తున్నాడు. అసలు జన్మభూమి విషయంలో నీ అభిప్రాయం ఏంట్రా అని రమేష్ ని అడిగాను. “ అరేయ్ లైట్ తీసుకో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది జన్మభూమి ట్రైన్ లోనే”  అని పకాలున నవ్వేసాడు.  వాడి మాటలతో తేలికైన మనసు కాసేపు అలా రైలు కిటిలోంచి బయట పచ్చదనం మీదకి మళ్ళింది. ఇంతలో  ఏమనుకున్నాడో రమేష్ “అరేయ్ పాగల్ గా ఏమనుకుంటున్నావో నాకంతా తెలుసు. ఇదిగో చూడు రాష్ట్రం ముక్కలైనా మన స్నేహాన్ని ముక్కలు చేసే శక్తి ఎవరికీ లేదురా బాయ్. మన అసలు జన్మభూమి స్నేహమేరా. దాని  పరిమళం తెలుగు.”

– ప్రసాద మూర్తి

చిత్రం: పెమ్మరాజు వేణుగోపాల రావు