మూడవ దారే శరణ్యమా?

karalogo

నిర్వహణ: రమా సుందరి బత్తుల

కథాకాలానికి డెభై అయిదేళ్ళున్న సుభద్రమ్మకి ఆమె భర్త రామభద్రయ్యతో అరవై ఏళ్ళ సాహచర్యం. పథ్నాలుగేళ్ళ ప్రాయంలో అతనింట్లో మెట్టి అతని కోపపు కేకలకు తడబడి గుమ్మాలకు కొట్టుకుని పడబోయి అత్తగారి ఆదరణతో నిలదొక్కుకుని, ఆవిడ ప్రేమలోనూ భర్త కనుసన్నలలోనూ మెలిగి వాళ్ళ అభిప్రాయాలే తనవిగా చేసుకుని ఏడుగురు బిడ్డల్ని కని పెంచింది. ఆ అరవై ఏళ్ళలోనూ ఎవరింట్లో నైనా చుట్టపు చూపుగానో పని గడుపుగోడానికో కొద్ది రోజులు మాత్రమే వుండేది కానీ, శాశ్వత నివాసం ఆ పల్లెలోనే. తను మెట్టిన ఇంట్లోనే. అటువంటి సుభద్రమ్మకు ఆమె భర్త పోయిన పదిహేను రోజులకే తను ఎక్కడుండాలనే ప్రశ్న ఎదురైంది. ఎక్కడుంటే ఆమెకు సౌకర్యం, ఎక్కడుంటే ఆమెకు కాస్త ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ అని కాక ఆమె ఎక్కడుండడం ధర్మం అనే చర్చ వచ్చింది. ఎక్కడుండడం అని కూడా కాక ఎవరి దగ్గర వుండడం అని.

“ఇన్నాళ్ళూ నాన్నగారి బాధ్యత నీ మీదుంది. ఆయన ఇల్లు విడిచి రానన్నారు. ఏమీ చెయ్యలేక ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు నాదగ్గరుండడం ధర్మం” అన్నాడు పెద్దకొడుకు. “తమ్ముడిని కూడా అడగాలి కదా!” అందావిడ అప్పుడు. ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారిళ్ళకు పోగా, తక్కిన కొడుకులు ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళలో ఉండగా మూడో కొడుకు మాత్రం వున్న వూళ్ళోనే పొలం చూసుకుంటూ వుండిపోయాడు. వుంటే తనిప్పుడు మూడో కొడుకు దగ్గర వుండాలి. లేదా పెద్ద కొడుకుతో వుండాలి. ఒక చోటు ఎంచుకుని వెళ్ళి తరువాత ఇంకోచోటుకి వెడితే బాగుంటుందా? గౌరవంగా వుంటుందా?

ఆమె భర్త రామభద్రయ్యకు కాశీ యాత్ర చెయ్యాలనే సంకల్పం ఆయన జీవితంలో నెరవేరలేదు. మూడుసార్లు బయలుదేరి ఏదో ఒక అడ్డంకితో ఆగిపోయాడు. నాలుగోసారి ఆవిడే అడ్డం కొట్టింది. ఎందుకంటే తాము కాశీ వెళ్ళడం భగవంతుడికి ఇష్టం లేదనీ ఈసారి కూడా ఏదో అడ్దంకి వస్తుంది కనుక అసలు బయలుదేరవద్దనీ… ఆపైన వయసు మీదపడిన రామభద్రయ్య తనంతట తనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆయన పోయాక ఆయన అస్థికలనైనా గంగలో నిమజ్జనం చెయ్యాలని ఆయన పిల్లలు నిర్ణయించారు. ఆమె కూడా వెళ్ళాలని అర్థించారు. ఆయన పక్కన లేకుండా ఈ విధంగా వెళ్లవలసి రావడం ఆమెకి కష్టంగానే వున్నది. కాశీవచ్చాక కూడా ఆమె మనసు స్థిమితంగా లేదు. అనంతమైన రైలు ప్రయాణం చేసి వచ్చిందిక్కడికి. తను తిరిగి ఇంటికి వెడుతుందా? భగవంతుడి సంకల్పం ఎట్లా వుందో?

ఈ ఆలోచన ఆమెకి ఇప్పుడు వచ్చింది కాదు. రామభద్రయ్య మంచాన పడ్డప్పుడు పిల్లల ప్రవర్తనల్లో ఆమె కనిపెట్టిన మార్పు ఇటువంటి ఆలోచనకు బీజం వేసింది. ఆయనను వాళ్ళు గౌరవించాల్సినంతగా గౌరవించడం లేదనిపించింది. చెయ్యీ కాలూ సరిగా వున్నంతవరకూ వుండే గౌరవం తరువాత వుండదు. అందుకే ఆయన పోయాక ఇంక తను బ్రతకవద్దు అనుకుంది. ఊళ్ళో ఎన్ని నూతులు లేవు కనుక అనుకుంది. కానీ ఆయన పోయాక ఆ పన్నెండు రోజుల్లో పిల్లలు ఆమె మీద చూపించిన ప్రేమాదరాలు మళ్ళీ ఆమెని ఆ ఆలోచనను కాస్త దూరం పెట్టేలా చేశాయి కానీ కాశీ లో అట్లా కాదు. మళ్ళీ అవే ఆలోచనలొస్తున్నాయి. అచ్చమైన సంప్రదాయ మధ్య తరగతి గ్రామీణ కుటుంబంలో పుట్టి, ప్రేమా గౌరవమూ అంటే భయభక్తులేననే నమ్మకంతో జీవించిన సుభద్రమ్మకి, తను తన అత్తగారి పట్ల చూపించిన భయభక్తులు తన కోడళ్ళు తనపట్ల చూపడం లేదని దుగ్ధ. వాళ్ల పద్ధతులు ఆమెకి నచ్చవు. తనకీ తన అత్తగారికీ మధ్య వున్న సామీప్యం తన కోడళ్ళకు తనతో లేదని అసంతృప్తి. రామభద్రయ్య జీవించి వుండగా అతనిపట్ల అందరూ గౌరవం చూపించాలని ఆరాటపడి అట్లా అందరి వెంట పడేది ఆవిడ. ఆయన మంచాన పడ్దాక చూపేవారు చూపేవాళ్ళు. లేనివాళ్ళు లేదు. అంతవరకూ తండ్రి కనుసన్నలలో నడిచిన మూడవ కొడుకు కూడా ఆయన్ని అడక్కుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదంతా గమనించింది ఆవిడ.

కాశీలో పెద్దకొడుకు ఆమెతో అనేక విషయాలు మాట్లాడాడు. తన కుటుంబం సంగతి, తన కొడుకూ కోడళ్ల సంగతి. తన భార్య సంగతి. ఒక కుటుంబంలో భిన్నాభిప్రాయాలుంటాయని వినడం సుభద్రమ్మకి ఇదే మొదలు. తన కొడుక్కీ కోడలికీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఏమిటో ఆమెకి అర్థంకాదు. ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లు ఆమె గుండెలు దడదడలాడాయి.

కొడుకు చాలా చెప్పాడు. కొడుకు గొంతుతో రచయిత చెప్పిన మాటలు ఇవి.

ఇటువంటి ఘర్షణలు ….. నాయకత్వం యాజమాన్యం, పెద్దరికం వంటివి ఏర్పరుచుకున్నాక .. తరం మారి కొత్త తరం తలెత్తినప్పుడల్లా – వస్తూనేవున్నాయి. పెద్దరికం కోసం, నాయకత్వం కోసం పడుచుదనం పెద్దతరాన్ని సవాలు చేస్తూనే వుంది……. అనాదిగా జరుగుతున్న ఈ తరాల సంఘర్షణ గురించి, అందులో మనిషి పడే హింస గురించీ సుదర్శనం (పెద్ద కొడుకు) ముందే కొంత విన్నాడు. తన చుట్టూ సాగుతున్న ఘర్షణని గుర్తించడానికి, దాని పోకడ అర్థం చేసుకోడానికీ. ఆ వినికిడి కొంత ఉపయోగించింది….పోకడ అర్థం అయింది కానీ నివారణోపాయమే అర్థం కాలేదు. అట్టే ఆలోచిస్తే ఇది తప్పనిసరే కాదు, అనవసరమేమో కూడా! అధికారాలకీ అదిచ్చే సౌకర్యాలకీ అలవాటుపడ్ద ముందు తరం తనకు తానుగా వాటిని వొదులుకోలేదు. ఆ తరంలో లుప్తమైపోతున్న ఉత్సాహం, సామర్థ్యం తమలో ఉరకలు వేస్తుంటే కళ్ళాలు తమ చేతిలోకి తీసుకోడానికి కొత్త తరం ఉద్రేక పడక తప్పదు. ఈ విధంగా ప్రగతి కోసం ఘర్షణ అనివార్యం. ఇవ్వన్నీ తల్లికీ, భార్యకీ అర్థమయేలా చెప్పాడతను. అందుచేత రెండేళ్ళల్లో రిటైరవబోయే అతను తల్లితో పల్లెటూరిలో ఉండడానికి నిర్ణయం   తీసుకున్నాడు. డబ్బు ఖర్చుపెట్టడం విషయంలోనూ, సంపాదించడం విషయంలోనూ తరానికీ తరానికీ భిన్నమైన అభిప్రాయాలుంటాయి. ఆ విషయాన్ని పూర్తిగా ఆమోదించలేని అతని భార్య శకుంతల, డబ్బు దూబరా చేసే కోడలికి సంసారం అప్పజెప్పి అతనితో రాలేనంటుంది. అందుగురించి ఇద్దరూ వాదించుకుంటారు. కొడుకు చెప్పింది అర్థంచేసుకోడానికి ప్రయత్నించింది సుభద్రమ్మ. పదే పదే ఆమె ముందు రామభద్రయ్య మూర్తి ప్రత్యక్షం అవుతోంది. తనముందు మూడు దారులున్నాయి. ఒకటి పెద్దకొడుకుతో వెళ్ళి వుండడం. అక్కడ వాళ్ళింట్లో ఎవర్నీ పూర్తిగా ఎరగదు. వాళ్లల్లో వాళ్లకే అభిప్రాయ భేదాలున్నాయి. రెండవది మూడో కొడుకు దగ్గరుండడం. మొదట్నించీ తను ఆ కుటుంబంలో భాగం, ఆ ఊళ్ళోనూ భాగం. కానీ ఎవరిని కాదని ఎవరితో వుంటే ముందుముందు ఏ చిక్కుల్లో పడుతుందో తెలియదు. ఒకసారి మూసుకున్న తలుపులు మరొకసారి తడితే తెరుచుకుంటాయా? ఎటూ తేల్చుకోలేకపోయింది. ఆమెకి అన్నిటికీ పరిష్కారంగా మూడో దారివుంది. కానీ అది గౌరవంగా బ్రతుకుతున్న పిల్లల్నిఏ చిక్కుల్లో పడేస్తుందో అనే భయం ఎటూ తోచని స్థితి. ఇక అంతా సర్వేశ్వరుడిదే భారం అనుకుంది.

అస్థి నిమజ్జనం సమయంలో ఆమెకి మళ్ళీ రామభద్రయ్య మూర్తి కనిపించింది. నడివయస్సులో వుండే రామభద్రయ్య మూర్తి. చెంగులు ముడి వేసుకుని చెయ్యవలసిన సరిగంగ స్నానం ఇలా అస్థికలతో చెయ్యవలసి వచ్చింది అనుకుంది. అస్థి నిమజ్జనం తరువాత మూడు సార్లు గంగలో మునగమన్నారు. ఆమె సూర్యభగవానునికి నమస్కారం చేసి చివరిగా మరో మునక వేసింది. ఆ మునక తరువాత పెద్దగా అలలు లేచాయి. మునిగిన ఆమె లేవలేదు. మనుషులొచ్చి బయటికి తీశారు. ఎక్కువ నీళ్ళు తాగలేదు కనుక బ్రతికింది. మూడోదారి మూసుకుపోయినట్లే. మరి సుభద్రమ్మ ఇప్పుడెక్కడెక్కడుండాలి? అరవై ఏళ్ళు అలవాటుపడిన ఇల్లు ఆమె స్వంతం కాదా? కొడుకు తప్ప కోడలూ ఆమె పిల్లలతో ఏ మాత్రం సామీప్యం లేని ఇంట్లోనా? నేనిక్కడే వుంటాను ఎక్కడికీ రాను అని రామభద్రయ్యలా ఆమె అనలేక పోతోంది, ఎందుకు? స్త్రీ కావడం వల్లనా? ఇట్లా ఎన్నో ఆలోచనలు వస్తాయి పాఠకులకు.

ఆర్జనాశక్తీ ఉత్సాహం తగ్గిపోయాక హుందాగా పెత్తనాన్ని బదలాయించే బాధ్యత ఎరిగిన సుదర్శనం కథా? మొదటినించీ భయభక్తులతో మెలిగి చివరికి ఎక్కడుండాలో తేల్చుకోలేని సుభద్రమ్మ కథా? అధికారం కోసం రాజకీయాలలో జరిగే రక్తపాతం లాగే కుటుంబాలలో కొనసాగే మౌన హింస కథా? అన్నిటినీ స్పృశించిన ఈ కథ చాలా పెద్దది. తరాల అంతరాలు, గ్రామీణ జీవనం, స్త్రీల అధీనత. అందులోనే తోటి స్త్రీలపై ఆధిక్యం కోసం ఆరాటం. సంప్రదాయ క్రతువుల వర్ణనా అన్నీ కలిసి ఒక గ్రామీణ అగ్రకుల మధ్యతరగతి జీవితాన్నీ, అందులో స్త్రీల నిస్సహాయతనూ బాగా పట్టుకుని వ్రాసిన కథ. చాలాకాలం విరామం తరువాత మేస్టారు వ్రాసిన పెద్ద కథ.

-పి. సత్యవతి

image

పి. సత్యవతిగారు సాహిత్య లోకానికి నలభై ఏళ్ళనుండి చిరపరిచితులు. సత్యవతి కధలు, ఇల్లలుకగానే, మంత్ర నగరి, మెలుకువ అనే నాలుగు కధల పుస్తకాలను ప్రచురించారు. మొదటి, రెండవ తరాల ఫెమినిష్టుల గురించి రాసిన  ‘రాగం – భూపాలం’ అనే వ్యాస సంపుటి సత్యవతిగారి కలం నుండే వచ్చింది. ‘మా నాన్న బాలయ్య’, ‘ఇస్మత్ చుగ్తాయ్ కధలు’ ‘ఒక హిజ్రా ఆత్మ కధ’ లాంటి మంచి పుస్తకాలను ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు పాఠకులకు అందించారు. సమకాలీన సాహిత్యాన్ని నిత్యం చదువుతూ తన ఆలోచనలను, రాతలను సజీవంగా నిలుపుకొంటున్న సత్యవతిగారు నేటి యువ సాహితీకారులకు ఎందరికో ఇష్టులు.

వెంకటకృష్ణ  “వీరుడూ – మహా వీరుడు” కధను గురించిన  పరిచయం

 

 

‘సంకల్పం” కథ ఇక్కడ:

తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.

ఆ నవల చదివిన అనుభవం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ నిరాశలు అనుభవాలు ఆనందాలు దుఃఖాలు కళ్ళముందు పరిచే అచ్చమైన  స్త్రీల నవల ఇది . సల్మా ఎక్కువగా కవిత్వమే వ్రాసింది. స్త్రీల లైంగికత్వం గురించీ వారి శరీరాల గురించీ నిస్సంకోచంగా వ్రాసింది.ఆమెవి అశ్లీల రచనలన్న ఆరోపణలనీ బెదిరింపుల్నీధైర్యంగా ఎదుర్కుంది  .  “అర్థరాత్రి కథలు” అని అర్థం వచ్చే ఈ తమిళ నవల ను “అవర్ పాస్ట్ మిడ్ నైట్” పేరుతో లక్ష్మీ హామ్ స్ట్రామ్ ఇంగ్లిష్  లోకి అనువదించగా జుబాన్  సంస్థ ప్రచురించింది. 478 పేజీల పెద్ద నవల ..

salma-hindu

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ నవలా వ్రాయకపోయినా ఆమె రచనల్లో తప్పనిసరిగా స్త్రీవాదమే వుంటుంది.

ఒక తమిళ గ్రామంలో కొన్ని ముస్లిమ్ కుటుంబాలలోని స్త్రీల కథ ఇది..ఇందులోని అయిదారు కుటుంబాలకూ దగ్గర బంధుత్వం వుంది.స్త్రీల మధ్య స్నేహం వుంది.ఒకరి జీవితాలనుగురించి వారి వ్యక్తిగత వివరాల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం మరొకరికి వుంది .ఒకరిపట్ల ఒకరికి ప్రేమ వుంది ,అసూయ వుంది. సానుభూతికూడా వుంది.

ఏడో తరగతి చదివే రబియా పాత్రతో ఈ నవల  ప్రారంభం అవుతుంది.ప్రపంచంపట్ల ప్రేమతో రెక్కలు విప్పుకుంటున్న ఊహలతో,సున్నిత మనస్కురాలైన చిన్నారి రబియా!!  .ఆమె స్నేహితురాలు.మదీనా!.ఇద్దరిమద్యా రహస్యాలు లేవు .ఒకరికోసం ఒకరు అన్నట్లుంటారు.అహమ్మద్ కూడా వాళ్ళ జట్టే. ఒకరోజు స్నేహితులతో కలిసి సినిమా చూసొచ్చి తల్లి చేతిలో బాగా దెబ్బలు తింటుంది రబియా. తల్లి జోహ్రా రబియాను మంచి ఆడపిల్లగా తీర్చిదిద్దే క్రమంలో వుంటుంది. రబియా తండ్రి కరీం, పెత్తండ్రి ఖాదర్ లది ఉమ్మడి కుటుంబం .అన్నతమ్ములు తోడికోడళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా వుంటారు.రబియా పెద్దమ్మ రహీమా సంప్రదాయాలపట్ల కాస్త సడలింపు చూపించి తన కూతుర్ని పట్నంలోతన తండ్రి దగ్గర వుంచి హైస్కూల్ చదువు పూర్తి చేయిస్తుంది గ్రామంలో అది సాధ్యం కాదు.ఎందుకంటే ఈడొచ్చిన ఆడపిల్లలు ఇల్లుదాటరాదు.పరాయి పురుషుల కళ్ళపడరాదు.స్నానం చేసేటప్పుడు కూడా తమశరీరాలను తాము నగ్నంగా చూసుకోరాదు.సెక్స్ గురించి మాట్లాడరాదుఇటువంటి ఆంక్షలన్నీ ఆ గ్రామంలో వున్నాయి.

హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన వహీదాకు వివాహం తలపెట్టాడు తండ్రి.ఆమె ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్ళి వద్దని తల్లి చెప్పినా వినడు.వహీదాకు తనకు కాబోయే భర్త గురించి కొన్ని కోరికలున్నాయి.అతను సినిమాల్లో హీరోలా తన మీద ప్రేమ చూపించాలని తనను అభిమానించాలని అట్లా చిన్న చిన్న కోరికలున్నాయి. ఎప్పుడూ సినిమాపాటలు కూనిరాగాలు తీస్తూ వుంటుంది. వహీదా  హైస్కూల్ల్లో చదివినా మంచి కట్టడిలో పెరిగింది మతాచారాలు సంప్రదాయాలు శుచీ శుభ్రాలు అన్నీ తల్లి ఆమెకు తెలియచెప్పింది . రబియా తండ్రి కరీంకి భార్య జోహ్రా అంటే లెక్కలేదు. భోజనం చేసేటప్పుడు కూడా అతను ఏం లోపం వచ్చినా గట్టిగా అరుస్తాడు ఆమెను గడగడలాడిస్తాడు. అతనికి  వాళ్ల ఎస్టేట్ లో పనిచేసే మరుయాయి అనే ఆవిడతో సంబంధంవుంది.ఆ విషయం ఇంట్లోవాళ్ళకే కాక వూరందరికీ కూడా తెలుసు.మగవాళ్లకి అట్లా సంబంధాలుండడం సహజం అనుకుంటారు. మరుయాయి ఇంట్లోనూ తోటలోనూ కష్టపడి పనిచేస్తూ కరీం నే తన భర్తగా భావిస్తూ విశ్వాసంగా వుంటుంది.తను హిందూ అయినా బొట్టు పెట్టుకోదు.ముస్లిమ్ లా వుంటుంది. ఆమెకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేయిస్తాడు కరీం. కరీంభార్య జోహ్రా ఆమెను పనిమనిషిగా సహిస్తూ వుంటుంది. కరీం అన్న ఖాదర్ కి భార్య రహీమా అంటే అభిమానం .ఆమె మాటకు విలువ ఇస్తాడు.కానీ కూతురు పెళ్ళి విషయంలో మాత్రం ఏకపక్షనిర్ణయం తీసుకుంటాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం తన సోదరి కొడుకు సికందర్ తో వివాహం ఖాయం చేస్తాడు.అతడు వహీదా కన్న పదిహేనేళ్ళు పెడ్దవాడు. ఖాదర్ కరీం సోదరులకు పచారీ కొట్టు వుంది.భూములూ తోటలూ వున్నాయి. కారుకూడావుంది.

వీళ్ళుకాక వీళ్ళ బంధువుల కుటుంబాలు మరి మూడు వున్నాయి ఆ వూళ్ళో. రబియా స్నేహితురాలు మదీనా కుటుంబం.మదీనా తండ్రి సింగపూర్ లో  వ్యాపారం చేస్తూ చనిపోయాడు. ఆమె తల్లి  సైనా, ,అక్క ఫరీదాకాక మరొ ఇద్దరు మానసిక వైకల్యంతోపుట్టిన అక్కలు వుంటారు అన్న సులేమాన్ సింగపూర్ లో వుంటాడు.వదిన ముంతాజ్ ఇక్కడే వుంటుంది.

మరోకుటుంబం సారా ది.ఆవిడ  భర్త కూడా సింగపూర్ లో వుంటాడు. వృద్ధుడైనా,జబ్బు చేసినా స్వదేశానికి రమ్మంటే తిరిగిరాడు.ఆమె కూతురు షరీఫా భర్త పెళ్లయిన కొత్తలోనే దుబాయ్ లో ప్రమాదంలో చనిపోయాడు,అప్పుడు గర్భవతిగా వున్న షరీఫా భర్త తమ్ముడిని పెళ్ళి చేసుకోడానికి నిరాకరిస్తుంది.కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతానంటుంది.ఆమెకొక అక్క వుంటుంది.ఆమెకు శారీరక పెరుగుదల లేదు,పెద్దమనిషి కాలేదు.మరో తమ్ముడు కూడా వుంటాడు చిన్నవాడు.

మరొక కుటుంబం నఫీజాది.ఆమెకు ఇద్దరు మగపిల్లలు.అందులో అహమ్మద్ అనే పిల్లవాడు రబియాకు స్నేహితుడు.అతనంటే రబియాకు ప్రేమ .పెద్దైనాక అతన్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. నఫీజాకూ ఆమె భర్తకూ వయస్సులో చాలా తేడావుంది. తమ సమవయస్కుడైనా అజీజ్ తో ఆమెకు స్నేహం వుంది.అది చాలామందికి తెలుసు.

ఈ కుటుంబాలలో మగవాళ్ళు డబ్బు సంపాదనకోసం విదేశాలు వెళ్ళారు.కుటుంబాలు మాత్రం ఇక్కడే వున్నాయి.వివాహం చేసుకున్న యువకులు కూడా ఒంటరిగానే దుబాయ్ సింగపూర్ సిలోన్ వెడతారు .ఏడాదికో రెండేళ్ళకో ఇంటికి వస్తారు. అప్పుడు భార్యలు గర్భం దాల్చి వంశాన్ని వృద్ధిచెయ్యాలని ఆ కుటుంభాలు ఆశిస్తాయి.అంతవరకూ వాళ్ళ భార్యలు అత్తింట్లో వుంటారు. అత్త మామల అదుపాజ్ఞలలో వుంటారు.

ఈ కుటుంబాల మధ్య చుట్టరికం వుంది. ఒకరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకొకకరికి వుంది.జోహ్రా రహీమాలకు తప్ప మిగతా స్త్రీలందరికీ  ఊసుపోక కబుర్లెక్కువ.ఇందులో ఎవరి బాధలు వారికున్నాయి.అయినా ఇతరుల  వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ.  అందులో నఫీజా ,ముంతాజ్ లకు మరీ ఎక్కువ. వాళ్ళిద్దరూ అన్ని విషయాల గురించి సంకోచమనేది లేకుండా మాట్లాడతారు.బార్యా భర్తల అంతరంగిక విషయాలను గురించి కూడా బాహాటంగా చర్చిస్తారు.

hourpastmidnight

తన ఆడబడుచు సబియా సంగతి రహీమాకు తెలుసు.కూతురు అక్కడ సుఖపడదని కూడా తెలుసు.కానీ భర్త ఆమె ను సంప్రదించకుండానే నిఖా నిర్ణయించేశాడు.. రహీమా ముందు బాధ పడినా సర్దుకుంటుంది. సింగపూర్ లో సికందర్ కి ఆడవాళ్లతో సంబంధాలున్నాయని కూడా కొందరు చెప్పారు. “అయినా మగవాడన్నాక ఇన్నేళ్ళు పెళ్ళికాకుండా వుంటే సంబంధాలుండడం ఒక వింతా ఏం?” అంటాడు కరీం. ఒక పక్క రంజాన్ పండగ సన్నాహాలు మరొక పక్క వహీదా పెళ్ళి సన్నాహాలు జరుగుతూ వుంటాయి. వహీదాకి సికిందర్ మేనత్త కొడుకే అయినప్పటికీ అతనినెప్పుడూ ఆమె చూడలేదు ,మాట్లాడలేదు. ఎటువంటి మనస్తత్వమో తెలియదు. పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది. సబియా.నోరు మంచిది కాదు.కొడుకు పెళ్ళికి తమ్ముళ్ళు ఎంత ముట్టచెప్పినా అసంతృప్తే .ఇంకా ఇంకా లాంఛనాలు తేలేదని కోడల్ని దెప్పుతూ వుంటుంది.వహీదా మామ సయ్యద్ కొడుకు పెళ్లికోసం సిలోన్ నించీ వచ్చాడు.అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి రేడియోలో విని మళ్ళీ వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తున్నాడు.

వహీదా అత్త సబియా వుండే వూళ్ళోనే జోహ్రా తల్లి అమీనా వుంటుంది. జోహ్రా చెల్లెలు ఫిర్ దౌస్ పెళ్ళయిన వెంటనే భర్తని వదిలేసి వచ్చింది. ఆ పిన్ని అంటే రబియాకు చాలా ఇష్టం కానీ ఆమె సంగతి ఇంట్లో ఎత్తవద్దంటుంది జోహ్రా.ఫిర్ దౌస్ కి వయసులో పెద్దవాడైన ,డబ్బున్న  ఒక అనాకారితో   పెళ్ళి కుదిర్చినది కరీం. ఎందుకంటే మామ చనిపోయాక అత్త అమీనా దగ్గర కట్నకానుకలు భారీగా ఇచ్చే టంత డబ్బులేదు. ఆ కుటుంబానికి మగదిక్కు తనాన్ని భుజాన వేసుకుని తన మీద భారం పడకుండా ఆ సంబంధం కుదిర్చాడు. భర్త ఎట్లా వున్నా సర్దుకుని కాపురం చేసుకోవలసిన ధర్మం స్త్రీలది అని అతనే కాదు మొత్తం సమాజం అంతా అంటుంది.ఆఖరికి అక్క జోహ్రా తల్లి అమీనా కూడా!!..కానీ ఫీర్దౌస్ అతన్ని మొదటి సారి చూసిన క్షణాన్నే అసహ్యించుకుంటుంది .అతనితో కాపురం తన వల్ల కాదని పుట్టింటికి తిరిగి వచ్చింది.అదొక మచ్చ ఆ కుటుంబానికి.ఎప్పుడైతే అత్తవారింటినుంచీ వచ్చిందో ఇంక ఆమె గుమ్మం దాటకూడదు.అలంకరించుకోకూడదు. ఆ పిల్ల ఏతప్పూ చెయ్యకుండా చూడాల్సిన గురుతరభాధ్యత తల్లి మీద వుంటుంది. అయితే ఆ సమాజంలో స్త్రీలకు మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వున్నది కనుక ఏదోఒక సంబంధం తెచ్చి పెళ్ళిచేసి భారం తీర్చుకోవాలని చూస్తూవుంటుంది అమీనా.రెండో పెళ్ళివాళ్లని పిల్లలున్న వాళ్లని ఫిర్దౌస్ తిరస్కరిస్తూ వుంటుంది.ఆమె అందగత్తె.వయస్సు తెచ్చే కోరికలున్నాయి.కానీ సమాజందృష్టిలో కుటుంబానికి మచ్చ తెచ్చింది. చెల్లెలికి ఇలాంటి స్థితి రావడానికి తన భర్తే కారణం అని తెలిసీ ఏమీ అనలేని అశక్తురాలు జోహ్రా. అమీనా వుంటున్న ఇల్లు పెద్దది.ఆ ఇల్లు ఆమె భర్త ఇస్మాయిల్ మనసు పడి కట్టుకున్నది.ఊళ్ళో ఎవరిల్లూ లేనంత అందంగా కట్టుకున్నది.ఇప్పుడతను చనిపోయాక రెండో కూతురు తిరిగి వచ్చాక అమీనా ఇంట్లో ఒక భాగం శివ అనే టీచర్ కి అద్దెకిచ్చింది.అతను ఫిర్ దౌస్ కి రోజూ కనపడుతూ వుంటాడు. ఆమె అతని మీద మనసు పడుతుంది. ఇద్దరూ దగ్గరౌతారు. అది తప్పని ఫిర్ దౌస్ కి తెలుసు.కానీ ఆమె ఆ అనుభవాన్ని ప్రేమించింది.ఆనందించింది. అమీనా ఇల్లు సబియా ఇంటికి ఎదురే ..

వహీదా పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చింది. మొదటిరాత్రే అతని స్వభావం అర్థమైంది ఆమెకి. పెళ్ళయే వరకూ సెక్స్ గురించి మాట్లాడనివ్వకుండా . తమశరీరాలను గురించి తెలుసుకోనివ్వకుండా నాలుగు గోడలమధ్య బందీలుగా వున్న ఆడపిల్లలకు, పెళ్ళయిన మొదటి రాత్రే బంధువులంతా చేరి భర్తకి సహకరించమని హితబోధ చేస్తారు. పదిహేను పదహారేళ్లకే పెళ్ళళ్ళవుతాయి.చిన్న పిల్ల అనికూడా చూడకుండా సికందర్ జరిపిన మోటు శృంగారానికి .పొత్తికడుపులో నొప్పితో లుంగలు చుట్టుకు పోతుంది వహీదా.. మొదట్లో అంతే అని ఆమె మామగారు వెకిలిగా మట్లాడతాడు.అత్త పెడసరం మాటలు, మామగారి ఆకలిచూపులు వెకిలి మాటలు భార్యంటే సెక్స్ అని తప్ప ఇంకే మృదువైన భావమూ లేని సికందర్  వహీదా కి నాలుగురోజుల్లోనే నరకం చూపిస్తారు.అసలు సికందర్  కి కూడా వహీదాని చేసుకోడం ఇష్టంలేదు.చిన్నపిల్ల అని.అతనికి ఎదురింటి ఫిర్ దౌస్ మీద ఇష్టం.కానీ అమీనాదగ్గర డబ్బు లేదని అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇవ్వలేదనీ సబియా ఒప్పుకోదు. మళ్ళి ఇప్పుడు ఫిర్దౌస్ భర్తని వదిలి వచ్చాక కూడా ఆమెని పెళ్లిచేసుకుంటానంటాడు.కానీ తల్లి అసలు ఒప్పుకోదు. అతనికి కూడా ఇది బలవంతపు పెళ్ళే!

ఒక రోజు రాత్రి ఎంతకీ నిద్ర పట్టక బాల్కనీలో నిలబడుతుంది వహీదా. ఆ అమ్మాయి చిన్నప్పటినించీ సమాజం చెప్పే  మంచిచెడులను వింటూ పెరిగింది.తప్పొప్పులను గురించీ సమాజం చేసే వ్యాఖ్యానాలు వింటూ పెరిగింది. బాల్కనీలో నిలబడ్డ వహీదాకి అప్పుడే ఎదురింట్లో నుంచీ ఫిర్ దౌస్ శివ ఇంటి వైపు వెడుతూ కనపడుతుంది. కోపంతో మండిపడుతూ మెట్లుదిగి ఎదురింటికి వెళ్ళి ఫిర్ దౌస్ నీ శివనీ “తప్పుచేస్తూండ”గా పట్టుకుని దులిపేస్తుంది,.అపుడే ఫిర్ దౌస్ సహనం కోల్పోయి వహీదా  తల్లి నీ పిన తండ్రినీ గురించీ ఒక మాట అంటుంది. వహీదా వెనక్కి వచ్చేస్తుంది.కానీ ఆమె చేసిన తొందరపాటు పని ఎంతకి దారితీస్తుందో ఊహించలేదు. వహీదాకీ ఫిర్ దౌస్ కీ జరిగిన సంభాషణంతా విన్న అమీనా కూతురు చేసిన పనిని క్షమించదు.ఎలుకలమందు తెచ్చి “మనిద్దర్లో ఎవరో ఒకరం చనిపోవాలి.చెప్పు,నువ్వా ,నేనా?” అంటుంది. జీవన కాంక్ష తో తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటుంది ఫిర్దౌస్ తనకు బ్రతకాలని వుందని. కానీ ఆమే చనిపోక తప్పలేదు.

ఆచారం ప్రకారం అత్తవారింటికి వచ్చిన నలభై రోజుల తరువాత పుట్టింటికి వెళ్ళి ఒడినింపుకు రావాలి.ఆడపిల్లలు పుట్టింటికి బయలు దేరిన వహీదా తన నగలన్నీ సర్దుకుని ఇంక జన్మలో అత్తగారింటికి రావొద్దనుకుంటుంది. సబియా శుభ్రంలేనితనం .మామగారు సయ్యద్ వెకిలి మాటలు ఆకలి చూపులు సికందర్ నిర్లక్ష్యం ఆమెకక్కడ నరకాన్ని చూపించాయి. ఫిర్దౌస్ మరణం అమీనాని అపరాధభావంతో కృంగదీసి ఆరోగ్యం మీద దెబ్బతీసింది,తల్లిని చూసుకోడానికి వచ్చిన జోహ్రాకు ఫిర్దౌస్ మరణానికి కారణాలు ,వహీదా మాటలు అన్నీ తెలిసాయి. గతంలో ఎప్పుడో తన భర్త రహీమాతో చేసిన తప్పు గురించి తెలిసింది.ఆమె రహీమాని ద్వేషించడం ప్రారంభించింది.ఉమ్మడి కుటుంబం వేరుపడాల్సిందే నని పట్టుపట్టింది.అ ఇంటిని విభజిస్తూ గోడ కట్టడం మొదలౌతుంది.

మదీనా అన్న సులేమాన్ సింగపూర్ నుంచీ వచ్చాడు.చెల్లెలు ఫరీదాకు పెళ్ళి చెయ్యాలి. భార్య ముంతాజ్ ను గర్భవతిని చెయ్యాలి అని రెండు ముఖ్యమైన పనులు పెట్ట్టుకుని వచ్చాడు. మదీనా ఇల్లు రబియా ఇంటికి ఎదురే .వాళ్ళ వాకిట్లో కారు ఆగినపుడల్లా డ్రయివర్ ముత్తు ను చూసి నవ్వుతూ వుంటుంది ఫరీదా. ఆ సంగతి ఆమె వదిన ముంతాజ్ కి తెలుసు.సులేమాన్ స్వభావం ఎరిగిన ముంతాజ్ అతనికి చెప్పదు.తప్పొప్పుల విషయంలో మతాచారాల విషయంలో చాలా కఠినంగా వుంటాడు సులేమాన్. కరీం ఇంట్లో పని చేసే ఫాతిమా ఒక హిందువుతో వెళ్ళిపోయిందని మసీదులో పెద్ద చర్చ లేవదీసి ఫాతిమా తల్లిని వెలివేయిస్తాడు. ఆ వూళ్ళో ముస్లిమ్ స్తీలెవరూ సినిమాకి వెళ్ళకూడదని ఆంక్ష పెట్టిస్తాడు. ఇంకా పెద్ద మనిషి కాకపోయిన మదీనాని బయట తిరగనివ్వడు. కరీం డ్రయివర్ ముత్తును ఉద్యోగంలోనుంచీ తీయించేస్తాడు..అతని స్నేహితుడు అరవై ఏళ్ళ అబ్దుల్ల స్వదేశానికొచ్చినప్పుడల్లా ఒక చిన్న పిల్లని పెళ్ళి చేసుకోడాన్ని ఊరంతా తప్పు పడితే అతను మాత్రం షారియత్ ప్రకారం మగవాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని సమర్థిస్తాడు. ఒక “కాఫిర్” తో వెళ్ళిపోయిన ఫాతిమా లారీ కిందపడి చనిపోయిందని వార్త తెలిసి అందరికీ చాలా సంతోషంగా చెబుతాడు.తగిన శిక్ష పడిందని ఆనందిస్తాడు.తనకి గర్బం రాకపోతే అతను మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడని ముంతాజ్ దిగులు పడుతుంది.ఆమె అనుకున్నది నిజంఅవుతుంది. డాక్టర్ ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పడంతో ఆమె పట్ల సులేమాన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.ముంతాజ్ ప్రవర్తన కూడా   వింతగా మారుతుంది.ఆమెను ఫిర్దౌస్ దెయ్యమై ఆవహించిందని చెప్పి పుట్టింటికి పంపేస్తారు.సారా కూతురు షరీఫాతో సులేమాన్ కి పెళ్ళి నిశ్చయం చేస్తుంది సైనా. షరీఫాకి పెళ్ళి ఇష్టంలేదు,చనిపోయిన భర్త ని తలుచుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ వుండాలని అనుకుంటూంది కానీ తల్లి షరీఫా పెళ్ళికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించి ఒప్పిస్తుంది.ఫాతిమా లారీకింద పడిందని సంతోషంగా చెప్పిన సులేమాన్ ని ఎలా పెళ్ళి చేసుకోవాలి? కానీ తప్పదు.పనిలో పనిగా తన చెల్లెలు ఫరీదా పెళ్ళి అజీజ్ తో నిశ్చయిస్తాడు. బీదవాడైన అజీజ్ ను తనతో వెంట సింగపూర్ తీసుకుపోయి అక్కడ కుదురకునేల చేస్తాడు.ఫరీదాకూ గానీ షరీఫాకు గానీ పెళ్ళయినా ఒకటే! కాకపోయినా ఒకటే .కానీ భర్త వున్న స్త్రీలకుండే గౌరవం వేరు. అజీజ్ వెళ్ళిపోతున్నందుకు నఫీజా బాధపడుతుంది

వహీదా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ఆమెకి నెలసరి వచ్చిందా లేదా అనేదే అక్కడిఆడవాళ్ల చర్చ. వహీదాకి పెళ్ళికాగానే గర్భం వస్తే ఇంక సికందర్ ని నిశ్చింతగా సింగపూర్ పంపేస్తుంది సబియా. ఇంటివాళ్లకీ బయటివాళ్లకీ అందరికీ వహీదా నెలసరి పైనే ఆసక్తి.కానీ వహీదాకి మాత్రం గర్భం రాకూడదని గట్టి కోరిక.తను ఇంక అత్తవారింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక సికందర్ గర్భాన్ని ఎందుకు మొయ్యాలి?అనుకుంటుంది.

మదీనా పెద్దమనిషి అయింది.ఆపిల్ల రబియా అంత అమాయకురాలు కాదు. లోకంపోకడ తెలుసు.తల్లి ఆమెను స్కూల్ మాన్పించినా బాధ పడదు. అదంతా సహజం అనుకుంటుంది. మదీనా తో పాటే రబియానుకూడా స్కూల్ మాన్పిస్తుంది జోహ్రా.ఇంకా పెద్దది కాకపోయినా! .ఆమెతోపాటు స్కూల్ కు జతగా నడిచి వెళ్ళే ముస్లిమ్ పిల్లలు లేరనీ ఒంటరిగా పంపననీ చెప్పేస్తుంది. రబియా స్నేహితుడు అహమ్మద్ మేనమామ దగ్గరుండి చదువుకోడానికి వేరే వూరు వెళ్ళిపోతాడు. అక్క వహీదా దగ్గరకు కూడా ఎక్కువ పోనివ్వదు తల్లి రబియాని. ఒంటరిగా గదిలో ముడుచుకుని పడుకుంటుంది రబియా.. అన్నతమ్ముల ఇళ్ళ మధ్య గోడ పూర్తవుతుంది.  వహీదా నెల తప్పానని తెలుసుకుని కుప్పకూలిపోతుంది.తనింక అత్తవారింటికి పోక తప్పదు.ఆమెభవిష్యత్తు తేలిపోయింది.

రంజాన్ నెలలోఅరిసెల పిండి కొట్టుకోడం, గోరింటాకు పెట్టుకోడం, ఉపవాసాలుండడం, వహీదా పెళ్ళికి నగలూ బట్టలూ కొనడం వంటి వేడుకలతో మొదలైన ఈ నవల ముగిసేసరికి పాఠకుల మనసు నిండా విషాదం ముసురుకుంటుంది.

ఇందులో నలుగురు యువతులు; .తనను ఎంతో ప్రేమించిన భర్తతో కొద్దిరోజులే కలిసి వున్న షరీఫా భర్త దుబాయ లో ప్రమాదంలో మరణించడంతో. అతని గుర్తుగా వున్న కూతురికోసం మళ్ళీ  పెళ్ళి వద్దనుకుంటే తల్లి ఆమెను బెదిరించి బలవంతంగా ఇష్టంలేని వ్యక్తితో పెళ్ళికి వొప్పిస్తుంది .భర్త విదేశాలలో వుంటే ఒంటరిగా సంసారం ఈదుకొస్తోంది ఆ తల్లి. ఆమెకు శారీరక పెరుగుదల లేని మరొక కూతురు.చిన్నవాడైన కొడుకు.  ఒకవేళ విదేశంలోనే భర్త మరణిస్తే ఇంటిని ఆదుకునే మగదిక్కు కావాలి..సులేమాన్ ఎవరో కాదు తన అన్నకొడుకే! అందుకే షరీఫాను బలవంత పెట్టి సులేమాన్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది.మొన్నటివరకూ తమతో కలిసి మెలిసి వుండిన ముంతాజ్ కి అది ద్రోహం అయినా కూడా.

మరొక యువతి ఫరీదా.మదీనా అక్క…సులేమాన్ చెల్లెలు. వయస్సొచ్చిన పిల్ల తల్లి గుండెలమీద కుంపటే కాక. అన్. ఆమెకి సరయిన సంబంధాలు రావడం లేదు .అందుకే  ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న అజీజ్ తో పెళ్ళి కుదిర్చేసి తనతో సింగపూర్ తీసుకెళ్లడానికి నిర్ణయించాడు. పెళ్ళి ఒకమొక్కుబడి. ఒక భద్రత తరువాత మళ్ళీ ఎప్పుడో అతనొచ్చేదాకా ఒంటరి జీవితమే, ఫరీదాకైనా, షరీఫాకైనా ,వహీదాకైనా.. !

సులేమాన్ భార్య ముంతాజ్.పిల్లలు పుట్టని నేరానికి,దయ్యం పట్టిందదన్న ఆరోపణమీద  పుట్టింటికి తరిమివేయబడింది.పుట్టింట్లో మళ్ళీ ఆమెకు నాలుగుగోడలే..మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్ప!

వహీదా ధనవంతుడైన తండ్రికి .చదువూ తెలివీ అందం పొందికా అన్నీ వున్న ఒక్కగానొక్క కూతురు.అయినా ఆమె జీవితంపై ఆమెకెలాంటి హక్కూ లేదు. ఆమె శరీరంపైనా ఆమె ఆకాంక్షలపైన ..హక్కులేదు.

కరీం ఇంట్లో పనిచేసే ఫాతిమా! పెళ్లయిన కొద్దిరోజులే ఆమె భర్త ఆమె దగ్గర వున్నాడు.తరువాత మాయమైపోయాడు.ఎక్కడో ఎవరితోనో వుంటున్నాడని ఫాతిమాకు తెలిసింది.ఆమె అతనికోసం వెళ్లలేదు .కొడుకుని పెంచుకుంటూ తల్లి దగ్గరే వుండిపోయింది. ఒకరోజు కొడుకుని కూడా వదిలేసి తను కావాలునుకున్న వాడితో వెళ్ళిపోయింది.ఆమె చేసిన పనిని సమాజమంతా గర్హించింది.  ఆమె చేసిన పని వల్ల ఊళ్ళో స్త్రీలెవరూ సినిమాకు పోగూడదని శాసించింది మసీదు. ఆమె తల్లిని వెలిపెట్టింది.ఆ తల్లి మంచం పట్టింది ఫాతిమా.కొడుకుని రహీమా చేరదీసింది.ఫాతిమా లారీ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఒక కాఫిర్ తో వెళ్ళిపోయినందుకు తగిన శాస్తి అయిందని సులేమాన్ లాంటివాళ్ళు సంతోషించారు.కానీ ఊరి స్త్రీలే ఆమె కోసం ప్రార్థించారు .

పెళ్ళిళ్లు కుదర్చడంలో బంధుత్వాలు ఆస్తిపాస్తులు,కుటుంబ పరువు మర్యాదలు. లెక్కలోకి వస్తాయి.కానీ ఈడూ జోడూ ఆడపిల్ల మనసూ శరీరం లెక్కలోకి రావు మూగ జీవుల  నిశ్శబ్ద రోదన లోలోపల అణగారిపోతూనే వుంటుంది.  పదమూడేళ్ళకే నాలుగుగోడల మధ్య బందీ అయిన రబియా జీవితం ఎట్లా వుండబోతుందో? ఆ పిల్లనలా ఇంటికి పరిమితం చేసి బుద్ధిమంతురాలైన ఆడపిల్లగా తయారుచేయడానికి జోహ్రా కారణాలు జోహ్రాకున్నాయి. జోహ్రాపిన్ని మైమూన్ పెళ్ళి అయిన కొద్దిరోజులకే భర్తని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలనుకుంటూ వుండగానే ఆమె గర్బవతి అని తెలిసింది.తల్లీ అక్కా కలిసి ఒక నాటుమంత్రసానిచేత గర్భంతీయించగా ,మైమూన్ చనిపోయింది.భర్తని విడిచిపెట్టి వచ్చి కుటుంబానికి మచ్చతెచ్చినజోహ్రా చెల్లెలు ఫిర్దౌస్  బలవంతంగా చనిపోయింది.జనాలు తమ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు.మరి రబియా ఎలా తయారవుతుందో అని జోహ్రాభయం .అందుకని అంతులేని కట్టడి ఆ పిల్లకి.

ముక్కుపచ్చలారని పిల్లలకి పెద్దమనుషులు అయీ కాగానే వయో బేధాలు అందచందాలు మనస్తత్వాలు ఏమీ చూడకుందా పెళ్ళిళ్ళు కుదురుస్తారు. మొగుడు ఎలాటివాడైనా తట్టుకుని బ్రతకమని శాసిస్తారు. భర్తని వదిలి వచ్చిన స్త్రీ కానీ ,వితంతువైన స్త్రీ కానీ ఎన్నో ఆంక్షలకు లోబడి బ్రతుకు సాగించాలి.గుమ్మందాటి బయటకు రాకూడదు.అలంకరించుకోకూడదు.వాళ్లమీద నిత్యమూ కాపలాయే. .మతాచారాలూ ఆ పేరుమీద పురుషుల అదుపాజ్ఞలూ భరిస్తూ బ్రతుకుతున్న  స్త్రీలు కూడా మళ్ళీ తాము ఆ అవధులు మీరకుండా బ్రతుకున్నామా లేదా అని వార్ని వాళ్ళు సరిచూసుకుంటూ కాపలా కాచుకుంటూ వుంటారు. స్త్రీల జీవన పరమావధి వివాహం. ఆ వివాహ నిర్ణయంలో వాళ్ల ప్రమేయం ఏమీ లేదు.వాళ్ల శరీరాల మీద కోరికలమీద వాళ్లకి అధికారం లేదు .ఇది ఏ ఒక్క సమాజపు స్త్రీల కథ మాత్రమే కాదు,అన్ని సమాజాలలోనూ జరుగుతూన్న కథే కొంత ప్రత్యక్షంగా,కొంత కనిపించకుండా.

ఈ నవలలో ఆ సమాజంలో పండగలు ఆచారాలు చావులూ పెళ్ళీళ్ళు అన్నీ ఎంతో విశదంగా వర్ణించింది సల్మా.తానొక ప్రేక్షకురాలిగా వుంటుందేకానీ వ్యాఖ్యానాలు చెయ్యదు .

ఈ రోజు సల్మా ఒక ప్రఖ్యాత రచయిత్రి కావడం,  అంతర్జాతీయ కీర్తి పొందడం, విదేశాల్లో సెమినార్లకి హాజరవడం, ఆమెపై ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ నిర్మాత సినిమా తియ్యడం ఇవన్నీ చాలా సులభంగా జరిగిన విషయాలేమీ కావు.

“నా కప్పుడు పన్నెండేళ్ళు.తొమ్మిదో క్లాసు చదువుతున్నాను.ఆరోజు శనివారం మాకు స్కూల్ లేదు.మేం నలుగురు స్నేహితురాళ్లం లైబ్రరీలో కూచుని చదువుకుంటున్నాం.దగ్గర్లోనే వున్న ఒక సినిమాహాల్లో మాటినీ ఆడుతోండి.ఇంట్లో అడిగితే సినిమాకి పంపించడం జరిగేపని కాదు.పైగా మా గ్రామంలో ఎప్పుడో కానీ మాటనీలు వెయ్యరు .రాత్రిపూట సినిమాకి వెళ్లడం అసంభవం. చీకటిపడ్డాక ఆడపిల్లలు బయటికి పోకూడదు.మేం ఇంట్లో చెప్పకుండా సినిమాకి పోవాలనుకున్నాం…మేంలైబ్రరీలో వున్నాం అని ఇంట్లో అనుకుంటారు అని బయల్దేరాం అసలు ఆ హాల్లో ఆడే సినిమా ఏమిటో కూడా మాకుతెలియదు.ఆత్రంకొద్దీ వెళ్ళి హాల్లో కూచున్నాక అది శృంగార భరితమైన మలయాళీ సినిమా అని తేలింది.బయటికి వచ్చేద్దామా అంటే తలుపులు మూసేసారు.కొన్ని దృశ్యాలు వచ్చినప్పుడల్లా మేం చేతుల్లో మొహం దాచుకుని ఎట్లాగో బయటపడ్డాం.ఇంటికి వెళ్ళేసరికి అదే హాల్లో సినిమాకి వచ్చిన మా అన్న మా అమ్మకి చెప్పేశాడు. ఆవిడ నన్ను బాగా కొట్టి స్కూల్ మాన్పించేసింది.అప్పటినించీ  పెళ్ళయేవరకూ తొమ్మిదేళ్ళు నాలుగుగోడల మధ్య బందీ అయిపోయాను.జీవితంలో అతి ముఖ్యమైన ఆ వయసులో ఒంటరిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా స్నేహితులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో కదా?” ఇది సల్మా స్వీయానుభవం.

ఆ తరువాత చాలా ఏళ్ళు ఇటు పుట్టింట్లో అటు భర్త ఇంట్లో ఆమె నాలుగుగోడలమధ్య బందీ . స్త్రీలకి తెలివి తేటలుండకూడదు.వాళ్ళు ప్రశ్నించరాదు.కానీ వీటన్నిటినీ సల్మా ప్రశ్నించింది.అమ్మ ఇంట్లో బంధిస్తే స్కూల్ మాన్పిస్తే ఆమె ఊర్కే కూర్చోలేదు. బాగా పుస్తకాలు చదివింది.కవితలు వ్రాసి రహస్యంగా పత్రికలకు పంపించింది. తనలోని కోపాన్నీ ఆవేశాన్నీ బహిర్గతం చెయ్యడానికి ఒక వాహిక దొరికింది. ఆమె చదువుకోవాలనుకున్నది, బుర్ఖా వేసుకోవద్దనుకున్నది .తన అసలు పేరు రుఖయ్యా.సల్మా కలం పేరు.రజతి అనే పేరుతో కూడా వ్రాసింది.తను వ్రాస్తున్నట్లు తెలియకూడదు, నిశితమైన పదునైన ఆమె కవితలు పత్రికలలో వచ్చాయి.వివాహమయ్యాక ఆమె రచనల్ని భర్త ఏమాత్రమూ ప్రోత్సహించలేదు.అయితే సల్మా తల్లే సల్మా రచనల్ని పత్రికలకి పంపేది.రహస్యంగా పుస్తకావిష్కరణకూడా ఏర్పాటు చేసింది, తరువాత ఆమె తమ ఊరి పంచాయతీ బోర్డు అధ్యక్షురాలైంది స్త్రీలకు రిజర్వ్ అయిన ఆ వూరి పంచాయితీకి ఈమెను నిలబెట్టింది ఆమె భర్తే .2006 లో డిఎంకె తరఫున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయింది.తరువాతి సంవత్సరం తమిళనాడు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కి అధ్యక్షురాలైంది.

ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను.

                 sathyavati   -పి.సత్యవతి

 

 

ఒక తెలుగమ్మాయి ఇంగ్లీష్ నవల

sathyavati

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థితప్రజ్ఞత(జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతోపాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం . అయితే మరొక వార్త  దాని పక్కనే ఉంటుంది. రైతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిందని!,. ప్రకటించడానికీ .ఇవ్వడానికీ మధ్య ఉన్న అంతరం తెలీని సామాన్యులం, “గుడ్డిలో మెల్ల” అనుకుంటాం.

ఈ అంతరాన్ని గురించే కోట నీలిమ “షూజ్ ఆఫ్ ది డెడ్” అనే ఒక ఆలోచనాత్మకమైన నవల వ్రాసింది. ఇక ఇప్పుడు “మెల్ల” ఏంలేదు అంతా అంధకారమే అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే .అయితే కోట నీలిమ ఈ నవలని ఒక ఆశావహ దృక్పథంతో ముగించింది. దాన్ని మనం “విష్ ఫుల్ థింకింగ్” అనుకున్నాకూడా!! విదర్భలోని పత్తి రైతుల ఆత్మహత్యలు ఈ నవలకి మూలం అని ఆమే చెప్పుకున్నది.విదర్భలో విస్తృతంగా పర్యటించి అనేకమందితో సంభాషించి వ్రాసానని చెప్పింది. రైతుల ఆత్మహత్యలు,డిల్లీ రాజకీయాలు, జర్నలిజంలో నిబద్ధత ముప్పేట అల్లికగా సాగిన ఈ నవల , కథ క్లుప్తంగా…

అసలు రైతుల ఆత్మ హత్యలకి నిజమైన కారణాలు శోధించడం ఎక్కడ నుంచీ మొదలు పెట్టాలి? ఆహార పంటలకి అనువైన పొలాల్లో వ్యాపార పంటలు వెయ్యడం మొదలుపెట్టినప్పటినించా? రైతులు తమ విత్తనాలు తాము తయారుచేసుకోకుండా మేలిమి విత్తనాలని నమ్మచెప్పే కంపెనీల విత్తనాలు కొనుక్కోడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి ఇస్తాయని చెప్పి కృత్రిమ ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలూ వాటికి అనువుకాని నేలల్లో వెయ్యడాన్ని ఎవరూ నిరుత్సాహపరచకపోవడం మొదలు పెట్టినప్పటినుంచా? తమ ఆరోగ్యాలనుకూడా లెక్కచెయ్యకుండా సంప్రదాయ కీటక నాశనుల బదులు ఘాటైన పురుగుమందులు చల్లడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి మీద రైతుకు  ఆశ కలుగచేసిన మార్కెట్ సంస్కృతా? చాపకిందనీరులా పాక్కుంటూ వచ్చిన ఈ క్రమాన్నిఇప్పటికైనా గుర్తిస్తున్నామా? మరి ఇప్పటికిప్పుడు వాటినిఆపడం ఎట్లా? రైతుల్ని బ్రతికించుకోడం ఎట్లా? అని సామాన్యులం ఆలోచిస్తాం. .కానీ “మాన్యుల” ఆలోచనలు మరొక విధంగా కూడా వుంటాయి..అంటే ఇలా:

రైతుల ఆకస్మిక మరణాలన్నీనిజంగా ఆత్మహత్యలేనా? పోనీ ఆత్మహత్యలే అనుకుందాం, అవి వానలు కురవక పంటలు పండక, విత్తనాలకీ ఎరువులకీ పురుగుమందులకి చేసిన అప్పులు తీర్చలేక అప్పిచ్చిన వారి వత్తిడి భరించలేక చేసుకున్న ఆత్మహత్యలా? విలాసాలకీ  తాగుడికీ అలవాటుపడి అప్పులుచేసి తీర్చలేక చేసుకున్న ఆత్మహత్యలా?  టీ వీ, సినిమాల ద్వారా పల్లెటూళ్ళకి పాకిన వినిమయ సంస్కృతా? లేక చావుద్వారా తమ కుటుంబానికి నష్టపరిహారం రూపంలో డబ్బు రావాలని చేసుకున్నవా? ఒకే ప్రదేశంలో కొద్దిరోజుల్లోనే ఇన్ని ఆత్మ హత్యలు ఎందుకు సంభవిస్తున్నాయి?అందుమూలంగా ఆ ప్రదేశానికి చెందిన ప్రజాప్రతినిధికి తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని పట్టించుకోడంలేదని  చెడ్డపేరు రాదా?!!  పార్టీలో అతనికున్న పలుకుబడికి  ఎంత విఘాతం? పార్టీకి కంచుకోటలా వున్న ఆ నియోజకవర్గంలో రైతులు నిస్సహాయులైపోయి, ఆత్మహత్యలనే తుది పరిష్కారాలనుకోడం , ఎంత అపఖ్యాతి? ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లొ మళ్ళీ ఆ పార్టీని. ఆ ప్రతినిధిని ప్రజలు ఎన్నుకుంటారా? కాబట్టి ఈ సమస్యను ఎట్లాపరిష్కరించాలి.?  వాటి సంఖ్యని తగ్గించి చూపించా? ప్రమాదాల స్థాయిని తగ్గించి చూపడం ప్రభుత్వాలకి అలవాటే కదా!!

వారసత్వ రాజకీయ పదవీ సంపద అనే వెండి చెంచాతో పుట్టిన ఒక యువప్రజాప్రతినిథికి  వచ్చిపడిన సమస్య ఇది అతడు“రాజకీయాలలోకి వచ్చాక మొహానికి  మాస్క్ వేసుకోనవసరం లేకుండా మాస్క్ తోనే పుట్టాడ”ట .పదవీ, అధికారం తనకు పుట్టుకతోనే వచ్చాయనీ ,తను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననీ అతని నమ్మకం,అభిజాత్యం  కూడా ఎందుకంటే,అతని తండ్రి ప్రస్తుతం అధికారంలో వున్న మిశ్రమ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ ముఖ్య కార్యదర్శుల్లో ఒకరు .ఆయన మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో కలిగిన జన నష్టానికి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామాచేసి పార్టీకే అంకితమైన నిజాయతీపరుడుగా ప్రఖ్యాతిపొందాడు. అటువంటి మహనీయునికి  కొడుకుని పార్లమెంట్ కి గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు కదా! పైగా అనేక మంది వృద్ధ నేతల్లాగే దీపం వుండగానే రాజకీయాల్లోకి వారసులను ప్రవేశపెట్టాలనే కోరికకు అతీతుడేమీ కాదు !అందుకని  కొడుకుని జాగ్రత్తగా తీర్చి దిద్దుకుంటూ వస్తున్నాడాయన. అట్లా ఆరునెలలక్రిందట పార్లమెంట్ లో అడుగుపెట్టిన  ఈ యువ ప్రతినిథి పేరు కేయూర్ కాశీనాథ్ ,ఆ తండ్రిపేరు వైష్ణవ్ కాశీనాథ్.. అతని నియోజకవర్గం అయిన మిత్యాలలో , గడచిన నలభై రోజుల్లో ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కేయూర్ ను  కలవర పెడుతున్న సందర్భంలో :

shoes

ఈ సమస్యను చర్చించడానికి కొంతమంది ప్రముఖులతో ఒక నాటి సాయంత్రం  ఒక అంతరంగిక సమావేశాన్ని కొత్త డిల్లీ లోని తన బంగళా వెనక తోటలో  ఏర్పాటుచేశాడు. ఈ అంతరంగిక సమావేశానికి కొంతమంది పత్రికా ప్రతినిథులు, ఒక పరిశోధన సంస్థ దైరెక్టర్,అసిస్టెంట్ డైరెక్టర్  ,ఒక మహా సర్పంఛ్ హాజరయ్యారు..మహా సర్పంచ్ అంటే  జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు కలిసి  ఇద్దరు మహా సర్పంచుల్ని ఎన్నుకుంటారు అలా ఎన్నుకున్న ఈ పెద్దమనిషి, డబ్బూ పలుకుబడీ, ప్రాబల్యం కలవాడు.ఇటువంటి మహాసర్పంచ్ లు జిల్లాకి ఇద్దరుంటారు. ఈ సమావేశానికి వచ్చిన మహాసర్పంచ్ పేరు లంబోదర్. అతన్ని వాళ్ళ జిల్లాలో “అపాత్ర”లంబోదర్ అంటారు. “అపాత్ర” అతని ఇంటిపేరేంకాదు . ఆత్మ హత్యలు చేసుకున్న రైతులు పరిహారానికి పాత్రులా, అపాత్రులా అని నిర్ణయించడానికి  జిల్లా కమిటీ ఒకటి వుంటుంది.ఆ కమిటీ వేసే ఓటు ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి  నష్ట పరిహారం,మంజూరు చేస్తారు.ఆ కమిటీ సభ్యుడైన లంబోదర్ ఎప్పుడూ ఎవరికీ “పాత్రత” ఓటు వెయ్యడు.అందరూ ఆయన ఉద్దేశంలో అపాత్రులే .అంచేత ఆయన్ని “అపాత్ర లంబోదర్” అని పిలుస్తారు.  ఆత్మహత్యలు చేసుకోడం ప్రభుత్వాన్ని అవమానించడమని ఆయన ఉద్దేశం .

ప్రజాప్రతినిథి అయిన కేయూర్ తన నియోజక వర్గంలొ ఆత్మహత్యల్ని అరికట్టడానికి ఏం చెయ్యాలో సూచించమని  ఈ సమావేశానికి హాజరయిన వారిని అడిగాడు. ఈ అంశం మీద పరిశోధన చేసి నివేదిక తయారుచేసుకొచ్చిన పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దయ, తమ సిఫార్సులను చదివి వినిపించమని అతని అసిస్టెంట్ వైదేహికి చెబుతాడు. ఆ నివేదిక ప్రకారం రైతులు అధిక పంటలకోసం ఎక్కువ ఎరువులు ఎక్కువ పురుగుమందులు వాడుతున్నారు. నేలలో ఎక్కువ బోర్ లు వేసి నీటి సారాన్ని పీల్చేస్తున్నారు. వీటికోసం అప్పులు చేస్తున్నారు అవితీర్చలేకపోతున్నారు .అంతే కాదు ఇప్పుడు పెరిగిన రవాణా సౌకర్యాలు పట్నాలనీ పల్లెల్నీ దగ్గర చేసి గ్రామాలలోకూడా వినిమయ సంస్కృతి పెరిగింది..టీవీలూ సినిమాలూ ఆ సంస్కృతిని పెంచిపోషిస్తున్నాయి. భూమి చిన్న చిన్న శకలాలుగా విడిపోయినందువల్ల అందులో ఎక్కువ బోర్లు వేసినందువల్ల భూమిలోని నీరంతా పీల్చేస్తున్నారు.ఊట తగ్గిపోతోంది.కనుక రైతులకి ఎరువుల మీదా విద్యుత్తుమీదా ఇచ్చే రాయితీలు రద్దు చేస్తే వాళ్ళు వ్యవసాయం మానుకుని ఇతర పనుల్లోకి పోతారు ఆ భూమి ఇతరత్రా ఉపయోగపడుతుంది. రైతులు ఆత్మ హత్యలకు పూనుకోకుండా వాళ్లకి ఆధ్యాత్మికమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతేకాక పట్నవాసపు పోకడలను గ్రామీణ యువకులు అనుకరిస్తున్నారు కనుక కొంతమంది పట్నవాసపు యువకులను గ్రామాలకు రప్పించి పట్నవాసాన్ని గురించిన మిధ్యాభావాలను తొలిగించాలి” ఆ నివేదికలోని సిఫార్సులలో కొన్ని ఇవి.

ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో  ఆ నియోజక వర్గంలో ఆత్మ హత్యల సంఖ్య పెరగడానికి గల కారణాన్ని లంబోదర్ ఇట్లా చెప్పాడు. అతనుండే గోపూర్ గ్రామంలో వ్యవసాయానికి చేసిన అప్పుతీర్చలేక సుధాకర్ భద్ర అనే యువకుడు కొంతకాలం కిందట ఆత్మ హత్య చేసుకున్నాడు.అతనికి వివాహం అయింది ఇద్దరు పిల్లలు కూడా. చదువుకుని పట్నంలో టీచర్ ఉద్యోగం చేస్తున్న అతని తమ్ముడు గంగిరి భద్ర, అన్న మరణ వార్త వినగానే వచ్చాడు. అన్న ఆత్మ హత్య కు ఇచ్చే నష్టపరిహారంతో అప్పులుతీర్చి వదినెనూ పిల్లల్నీ తనతో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు.కానీ సుధాకర్ భద్రది వ్యవసాయానికి సంబంధించిన అప్పులు తీర్చలేక చేసుకున్న ఆత్మహత్య కానే కాదనీ అతను తాగుడు అలవాటుచేసుకుని అప్పులు చేశాడనీ, అతనికి వ్యవసాయం మీద అసలు శ్రద్ధ లేదనీ కమిటీ అతనికి నష్ట పరిహారం తిరస్కరించింది.. తన అన్నకుటుంబానికి నష్టపరిహారం ఇవ్వలేదనే కసితో, గంగిరిభద్ర తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామంలో స్థిరపడ్డాడు. అతను జిల్లా కలెక్టర్ ను ఒప్పించి  ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో సభ్యుడయ్యాడు . అప్పటినుంచీ  అతను తక్కిన సభ్యుల్ని కూడా ఏదో విధంగా ప్రభావితంచేసి .అన్ని రకాల మరణాలనీ ఆత్మహత్యలుగా నిరూపిస్తున్నాడు.అన్నీ వ్యవసాయ సంక్షోభ సంబంధిత ఆత్మహత్యలు గా తేలుతున్నాయి.అతన్ని కమిటీ లోనుంచీ తప్పిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అతన్ని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు కలెక్టరు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు” అని చెప్పాడు.ఈ సమావేశం కోసం దక్షిణ మధ్య భారతం నించీ వందల మైళ్ళు ప్రయాణం చేసి రాజధానికి వచ్చిన లంబోదర్ మహాసర్పంచ్.

“మరి  ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?” అని చర్చ జరిగింది

“పరిష్కారం గంగిరి భద్రే ..మహా సర్పంచ్ బదులు అతన్నే ఈ సమావేశానికి పిలువవలసింది” అంటాడు  ఒక పత్రికా ప్రతినిధిగా వచ్చిన నాజర్ ప్రభాకర్.

“పరిశోధన కేంద్రం వారి సిఫార్సులు ఒట్టి కంటితుడుపు” అనే అతని వ్యాఖ్యలు, అతను గంగిరిని సమర్థించడం అక్కడ చాలామందికి నచ్చవు’ ఆసమావేశాన్ని గురించీ అక్కడ మాట్లాడిన మాటల గురించీ ఎవరూ పత్రికల్లో వ్రాయవద్దని కేయూర్ అభ్యర్థించాడు.కానీ నాజర్ ప్రభాకర్ అప్పటికప్పుడే  కేయూర్ నియోజకవర్గమైన మిత్యాలలో లెక్కకు మిక్కిలిగా సంభవిస్తున్న ఆత్మహత్యల్ని గురించి తన పత్రికలో వ్రాశాడు. నాజర్ పత్రికా రచనను సీరియస్ గా తీసుకునే వ్యక్తి.తన అభిప్రాయాలను మార్చుకోవలసిన వత్తిడి వచ్చినప్పుడు ఉగ్యోగానికి రాజీనామా చేస్తాడేగానీ ఎవరికీ తలవంచడు.రైతుల ఆత్మహత్యలు అతన్ని నిజంగానే కలవరపెట్టాయి.తను వ్రాసే వార్తలవలన ఏదైనా ఒక క్రియ జరగాలని ఆశపడతాడు.మిత్యాల దరిదాపుల్లోని మూడు జిల్లాల్లో 99 శాతం పొలాల్లో పత్తి పండిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఒక అన్ననో తండ్రినో  భర్తనో పోగొట్టుకోని స్త్రీలు లేరు.

“పూర్వం అక్కడ ఇళ్ళకి తలుపులు వుండేవి కాదు.ఎందుకంటే అక్కడందరి ఇళ్ళూ సమృద్ధిగావుండి ఎవరికీ దొంగతనం చేయాల్సిన అవసరం వుండేది కాదు.ఇప్పుడూ తలుపులు లేవు.ఎందుకంటే దోచుకోడానికి ఏ ఇంట్లోనూ ఏమీలేదు” అని ముగిసింది అతని రిపోర్ట్.

మిత్యాల జిల్లా ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో కలెక్టర్ తో సహా పదిమంది సభ్యులున్నారు. అందులో ముఖ్యులు మహా సర్పంచ్ లంబోదర్ ,వడ్డీవ్యాపారి దుర్గాదాస్ మహాజన్ .మిగతా అందరూ వీళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. లంబోదర్ కి రాజకీయ ప్రయోజనాలున్నాయి.తన కొడుకుని తనతరువాత అక్కడ ప్రతిష్టించాలనే గాఢమైన కోరిక వుంది వచ్చే ఎన్నికల్లో కేయూర్ స్థానంలో పార్లమెంట్ కి నిలబట్టాలని కూడా వుంది. అతను పోయిన ఎన్నికల్లో కేయూర్ గెలవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు.అందుకు బదులుగా ఒక వందఎకరాల స్థలంలో తన కొడుకు చేత ఏదో పరిశ్రమ పెట్టించాలని అందుకు కేయూర్ తండ్రి సాయంచేయాలనీ ఆశిస్తున్నాడు. ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమ ప్రణాళిక కేయూర్  కి నచ్చక  పోయినా అతను తండ్రిని ఎదిరించలేడు. అందుచేత కేయూర్ లంబోదర్ కి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడు.

ఇక మరొక ముఖ్య  సభ్యుడు .దుర్గాదాస్ మహాజన్  వడ్డీ వ్యాపారి. ఇతను కూడా కేయూర్ గెలవడానికి ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టాడు .అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న ప్రతిరైతుకీ అతని దగ్గర అప్పుంది. వాళ్ళ పొలాలు తాకట్లున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల తన కెంత లాభమో ఆలోచిస్తాడు. నష్టపరిహారం రాకపోతే ఆ పొలం అతను చవుకగా కొనేసుకుంటాడు. అప్పు తక్కువున్నప్పుడు ఒక వేళ పరిహారం అంటూ వస్తే దాన్ని అప్పుకింద తనే జమ కట్టుకుంటాడు .కానీ పరిహారం రాకపోతేనే అతనికి లాభం. గంగిరి అన్న సుధాకర్ పొలంకూడా అట్లాగే కొనుక్కోవాలని అతను ఆశపడ్డాడు. అంతకు ముందు గంగిరి తండ్రి సగం  పొలం అప్పు కింద దుర్గా దాస్ కే అమ్మి వున్నాడు .గంగిరి చదువుకున్నవాడు.ఇంగ్లిష్ మాట్లాడగలడు.దేనిగురించి మాట్లాడాలన్నా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని వస్తాడు. ఆత్మహత్యలు అంతకుముందూ వున్నాయి ఆ జిల్లాలో….అయితే అవన్నీ సహజ మరణాలుగా చిత్రింపబడి ఆ సంఖ్య ఇంతగా పత్రికలకెక్కలేదు.

గంగిరి  కమిటిలో సభ్యుడైనాక మిగతా సభ్యులందర్నీ కలిసి  మృతులకుటుంబాలకు న్యాయంజరిగేలా వోటు వెయ్యమని నయానో భయానో చాకచక్యంగా ఒప్పించాడు .అంచేత మెజారిటీ ఓట్లతో చాలా కేసుల్లో న్యాయం జరుగుతోంది  అందుకే ఆత్మహత్యల సంఖ్య అంత ప్రస్పుటంగా కనిపిస్తోంది.ఇది కంటకప్రాయం అయింది లంబోదర్ , దుర్గాదాస్ లకి .ఈ సంగతులన్నీ ఆ సమావేశంలో లంబోదర్ కేయూర్ కి చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా అయినా గంగిరిని దెబ్బకొట్టాలని నిశ్చయించారు. అప్పుడక్కడికి వేరే పనిమీద వచ్చిన పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్  వైదేహి కి ఆమాటలు వినపడ్డాయి.ఆమె ఆ సంగతి నాజర్ కి చెప్పి గంగిరి ప్రమాదంలో పడ్డాడనీ ఒక ఫోన్ చేసి అతన్ని హెచ్చరించమనీ కోరుతుంది.గోపూర్ దగ్గర ఉన్న తమ సిమెంట్ ఫాక్టరీ ఉద్యోగి ద్వారా గంగిరికి ఒక సెల్ ఫోన్ పంపిస్తుంది. తనమీద దాడి జరగబోతోందనె విషయాన్ని మొదట గంగిరి నమ్మడు తరువాత నమ్మక తప్పలేదు అయినా.అతని మీద దాడి జరిగింది గూండాలు అతన్ని కొట్టారు బలవంతంగా ఆత్మహత్యల నిర్థారణ కమిటీనుంచీ రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెట్టించారు ఇల్లూ వూరూ వదిలి పొమ్మన్నారు.కానీ గంగిరి అట్లా చెయ్యలేదు.   “వ్యూహం లేని నిజాయతీ వ్యర్థం”అన్న నాజర్ మాటలు అతనికి నచ్చాయి . అతను ఆవిషయాన్ని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు.మళ్ళీ మామూలుగానే కమిటీ సమావేశాలకి హాజరయ్యాడు.కలెక్టర్ అతని రక్షణ భారాన్ని లంబోదర్ దుర్గాదాస్ లకే అప్పచెప్పి గంగిరికి ఏం జరిగినా వాళ్లదే బాధ్యత అన్నాడు.తన మీద దాడిచేయించింది కేయూరేనని గంగిరికి కలెక్టర్ కీ కూడా అర్థం అయింది.

కేవలం తన అన్న కుటుంబానికి పరిహారం ఇవ్వలేదనే కోపంతో కాదు గంగిరి గ్రామంలో స్థిరపడింది. సుధాకర్ విషయంలో కమిటీ సభ్యుల ప్రవర్తన అతన్ని చాలా నొప్పించింది. సుధాకర్  తాగుడుకి అప్పచేసాడని దుర్గాదాస్,లంబోదర్ వాదించారు.” నా భర్తకి తాగుడు అలవాటులేదు.తినడానికే డబ్బు లేకపోతే తాగుడికి ఎక్కడ్నించీ వస్తుంది? అని సుధాకర్ భార్య పద్మా, గంగిరీ వాదిస్తే వాళ్ళవన్నీ అబద్ధాలని కొట్టిపడేశారు. మిగిలిన పొలం కొనుక్కోడానికే దుర్గాదాస్ ఇట్లా మాట్లాడుతున్నాడని అర్థం అయింది గంగిరికి. అప్పుడే అతనొక నిశ్చయానికి వచ్చాడు . ఇంక ఎవరూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకూడదు .ఒక వేళ అలాజరిగినా  ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం చేయ్యాలి.ఈ సంకల్పంతో.  పట్నంలో సుఖమైన జీవితాన్నీ,మంచి జీతాన్నీ వదులుకుని వచ్చాడు గంగిరి. పట్నంలో అతను గుంపులో ఒకడు…కానీ ఇక్కడ తను చెయ్యవలసిన పని ఉన్నది.అతనికి  ఊళ్ళో రాజకీయాలు అర్థం అవుతున్నాయి . అతని దగ్గరవున్న డబ్బు ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చిన పాత బకాయి మాత్రమే .దాన్ని అన్ని ఖర్చులకీ జాగ్రత్తగా వాడాలి. అది ఇంట్లో అందరికీ రెండు పూటలా భోజనానికి చాలదు. పిల్లలు దేవాలయంలో రోజూ సాయంత్రం పెట్టే ప్రసాదంతో ఒకపూట పొట్టనింపుకోవాల్సి వస్తోంది. అతని ఎదుట రెండు ఎంపికలున్నాయి.ఒకటి ,ఇల్లూ పొలమూ వచ్చిన కాడికి అమ్మేసి పట్నంలో ఉద్యోగంచూసుకుని వదినెనూ పిల్లల్నూ తీసుకుని వెళ్ళిపోవడం,.లేదా ఇట్లా వాళ్లని పస్తులు పడుకోబెట్టి ఊరికోసం పనిచెయ్యడం.గంగిరి రెండవ దాన్నే ఎంచుకున్నాడు. తన ఆదర్శంకోసం వాళ్ళను బలిచేస్తున్నానని తెలుసు!

గంగిరిమీద త్వరపడి అట్లా దాడి చేయించి వుందకూడదని  కేయూర్ ని అతని తండ్రి  మందలిస్తాడు,ఈ లోగా మిత్యాల నియోజక వర్గపు రైతుల ఆత్మహత్యల్ని గురించి నాజర్ ప్రభాకర్ వ్రాసే రిపోర్ట్ లు వరుసగా పత్రికలో  వస్తున్నాయి. గంగిరి మీద జరిగిన దాడి గురించీ ,అతన్ని కమిటీ నుంచీ తప్పుకుని ఊరువిడిచి పొమ్మని బెదిరించడం గురించీ కూడా వ్రాసాడు. పార్టీ కేయూర్ ని  ప్రెస్ మీట్ పెట్టమని ఆదేశించింది.  ప్రెస్ మీట్ లో సంయమనం కోల్ఫోయాడు కేయూర్.  ఆ ప్రెస్ మీట్ ఘోరంగా విఫలమయినాక కేయూర్ స్వయంగా నియోజకవర్గంలో పర్యటనకి బయలు దేరాడు. అప్పుడుకూడా అతను గంగిరికి ఆ వూరి విడిచిపొమ్మని మర్యాదగానే చెప్పాడు, కానీ గంగిరి వెళ్లనంటాడు.అపాత్ర మని కొట్టిపడేసిన ఆత్మహత్యల కేసుల్ని తిరగదోడి చాలామందికి పరిహారం వచ్చేలా చేస్తాడు కేయూర్..దాన్ని మెచ్చుకుంటాడేగానీ తను వెళ్లనంటాడు గంగిరి ఈ లోగా లంబోదర్ ప్రణాలికలను అర్థం చేసుకుంటాడు కేయూర్.

గంగిరికి సంకల్పబలం వుంది.ఆదర్శం వుంది.ఆత్మగౌరవం వుంది.కానీ దానితోపాటే పేదరికం వుంది. అన్న చేసిన అప్పువుంది .తను పొలంలో పంట వేయడానికి చేసిన అప్పు వుంది. అతనిమీద గౌరవంతో నాజర్ ప్రభాకర్ గానీ డాక్టర్ గానీ డబ్బు అప్పు ఇస్తామంటే తీసుకోడు.అది అభిజాత్యం కాదు. తనలాగా పరిచయాలు లేని సామాన్యులకు దక్కని సహాయం తనకొక్కడికే ఎందుకు? అనుకుంటాడు.దానిఫలితం తిండిలోపంవల్ల అన్న కొడుకు ఆరేళ్ళ బాలు క్షయవ్యాధి బారిన పడతాడు. వాడి వైద్యం కోసం గంగిరి,అందరు రైతుల్లాగే  దుర్గా దాస్ దగ్గరికే వెళ్ళి అప్పు అడుగుతాడు. దుర్గాదాస్ అతన్ని హీనాతిహీనమైన మాటలతో అవమానిస్తాడు.కోపంతో అతని గొంతు పట్టుకుంటాడు గంగిరి.దుర్గాదాస్ అనుచరులు గంగిరిని కింద పడేసి కొడతారు.కలెక్టర్ కి ఆవిషయం తెలిసి దుర్గాదాస్ ని పిలిపించి అతని వ్యాపారానికి లైసెన్స్ రద్దు చేస్తానంటాడు కానీ గంగిరి తనమీద దుర్గాదాస్ అనుచరులు దాడి చెయ్యలేదని ఆ దెబ్బలు మరెక్కడో తగిలాయనీ చెప్పి దుర్గాదాస్ లో పరివర్తన తెస్తాడు.ఈ లోగా ఆరేళ్ళ బాలు మరణిస్తాడు.

ఆ పిల్ల వాడి మృతికి తనే కారణం అన్న అపరాథబావం తట్టుకోలేని  గంగిరి ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చేస్తున్న పనినీ అతని సభ్యత్వాన్నీ తన మిత్రుడు వడ్రంగికి అప్పజెబుతాడు.వడ్రంగి తండ్రి కూడా అప్పులు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డవాడే.అతనికి కూడా పరిహారం నిరాకరించబడింది.చివరికి గంగిరి ఆత్మహత్యకు పరిహారం అతని వదినెకు ఇస్తారు.కేయూర్ కాశీనాథ్ పదవికి రాజీనామా చేసి నియోజకవర్గంలో పని చెయ్యడానికి డిల్లీ వదిలిపెట్టి వస్తాడు .ఈ నవలలో  నిబద్ధత కల రాజకీయ నాయకుడు శ్రీనివాస మూర్తి, జర్నలిస్ట్ నాజర్ ప్రభాకర్ మనకి భవిషత్తుమీద ఆశ కలిగించే వ్యక్తులు.

అప్పులు తీర్చలేకపోవడం ఒకటైతే అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు రైతుల్ని చేసే అవమానాలు చాలా ఘోరంగా వుంటాయి. రైతుల్ని బంధించడం ,స్త్రీలని బజార్లో అవమానించడం, పిల్లల్ని పాఠశాలలకు వెళ్ళనీయకపోవడం వంటివి.ఒకరైతుని కాలువలోకి నెట్టి  చాలాసేపు బయటకు రానివ్వకుండా చేస్తే అతను చనిపోతాడు. కనుక ఆత్మహత్యలకు అవమానాలు చాలావరకూ కారణం.అందుకే ఆత్మహత్యల నివారణకు గంగిరి కొన్ని మార్గాలు సూచించాడు.పదెకరాల లోపు వున్న రైతులకి అప్పు తీర్చడానికి ఒక సంవత్సరం గడువువ్వాలి.అందువల్ల తాజా అప్పులు తీసుకునేందుకు అభ్యంతర పెట్టకూడదు..బ్యాంకుల నుంచీ గాని వడ్డ వ్యాపారుల నుంచీ గానీ అప్పుతీసుకుని తీర్చలేకపోయిన వారి జాబితా తయారు చెయ్యాలి.ఈ జాబితాలో రెండేళ్ళపాటు కానీ అంతకన్న ఎక్కువ గానీ ఉన్న వారకి ఏవైనా సంక్షేమ పథకాల ద్వారా సాయం చెయ్యాలి. విత్తనాలు గానీ ఎరువులుగానీ పురుగులు మందులు గానీ అమ్మే వారి రైతులకి అవి నకిలీవి కాదని భరోసా ఇవ్వాలి. తరువాత అప్పులు వసూలు చేసేటప్పుడు బ్యాంక్ లుగానీ వడ్డీ వ్యాపారులు గానీ. పంచాయితీనుంచీ అనుమతి తీసుకోవాలి. వసూలుకు వచ్చేవారితోపాటు కొందరు సాక్షులు వుండాలి.

నవలంతా చదివాక పాఠకులకు వచ్చేసందేహాలు కొన్ని: తన కెంత ఆత్మగౌరవం వుండనీపో ,అన్నకొడుకు కళ్ళ ఎదుట చనిపోతుంటే చూస్తూ వుండడ మేమిటి? ఎవరైనా అప్పు ఇస్తానన్నప్పుడు  తీసుకుని తరవాత ఎందుకు తీర్చరాదు? దుర్గాదాస్.వంటి కరడుగట్టిన వడ్డీ వ్యాపారులు ,కేయూర్ వంటి రాజకీయనాయకులు అంత త్వరగా పరివర్తన చెందుతారా?   తను చేసేయుద్ధం తన సమ ఉజ్జీలతో కాదనీ తనకన్న అధికులతో ననీ తెలిసిన అతనికి  కేవలం ముక్కు సూటిగా పోవడం కాక దానికో వ్యూహం (strategy) వుండాలని  తెలియదా? ఇట్లాంటి ప్రశ్నలు పక్కన పెడితే ఈ నవలలో కోట నీలిమ చిన్న రైతులు చేసే వ్యవసాయం కత్తిమీద సాములాంటిదని చాలా వివరంగా చెప్పింది. ఒక గంగిరిభద్ర ఆత్మ త్యాగం చెయ్యకపోతే  తప్ప రాజకీయ నాయకులు కళ్ళకు కట్టుకున్న గంతలు కాసేపైనా విప్పరు. ఒక నాజర్ ప్రభాకర్  రిపోర్ట్ ల మీద రిపోర్ట్ లు వ్రాస్తే తప్ప తమ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోరు. కనీసం ఎవరి ఓట్లతో అయితే గెలిచారో ఆ జనాన్ని గెలిచిన తరువాత ఒక్కసారైనా కలవరు. ఇంకా గ్రామాల్లో భూస్వాములూ వడ్డీ వ్యాపారులూ రాజ్యమేలడం, బ్యాంక్ అధికారులూ ప్రభుత్వ డాక్టర్లూ కూడా వాళ్ళకు దాసోహమనడం జరుగుతూనే వుంది. రాజకీయ నాయకులకూ   భూస్వాములకూ మధ్య “క్విడ్ ప్రో కో” లు నడుస్తూనే వున్నాయి. ఎకరాల భూమి చేతులు మారుతూ వందలాది మంది పేదలు నిర్వాసితులౌతునేవున్నారు. ఇదంతా ఎలా జరుగుతుందీ నీలిమ కళ్ళకు కట్టిస్తుంది. నీలిమ శైలి నవలను ఒక్క బిగిని చదివిస్తుంది,వాక్యాలు పదునైన కత్తుల్లా వుంటాయి. వ్యంగ్యం ఆమె కు సహజం.

కోటనీలిమ  ఢిల్లీ నుంచీ వెలువడే “సండే గార్డియన్” పత్రికలో పొలిటికల్ ఎడిటర్ గా పనిచేస్తారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని ద పాల్ హెచ్ నీచే స్కూల్ ఆఫ్ అడ్వాన్సుడ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో సౌత్ ఏషియన్ స్టడీస్ లో రీసెర్చ్ ఫెలో గా వున్నారు. ఆమె ఢిల్లీలోనూ వాషింగ్టన్ లోనూ వుంటూ వుంటారు, ఈ నవలకు ముందు “రివర్ స్టోన్స్” “దడెత్ ఆఫ్ అ మనీలెండర్”అనే నవలలు వ్రాసారు.ఈ నవలను రూపా ప్రచురించింది( 2013).ఈ నవల మీద నాకు ఆసక్తి కల్గడానికి పాలగుమ్మి సాయినాథ్ హిందూ లో వ్రాసిన వ్యాసాలూ ఆయన పుస్తకం “ఎవిరిబడీ లవ్స్  ఎ గుడ్ డ్రాట్” కారణం.

 – పి. సత్యవతి

 

 

దైవాన్ని కొలవడానికి దేహాన్ని శిక్షించాలా?

sathyavati“ప్రతి కాథలిక్ బాలకలోనూ చిన్నప్పుడు తనొక సన్యాసిని(నన్) కావాలనే కోరిక వుంటుంది. యౌవనం వచ్చేవరకూ ఆకోరిక ఆమెలో నిలిచేవుంటుంది.నాకూ అలాగే వుండేది.నేను ఒంటరిగా చర్చ్ కు వెళ్ళినప్పుడంతా “నేనూ ఒకప్పుడు నన్ అవుతాను” అనుకునేదాన్ని.కానీ నాకు ప్రభువునుంచీ పిలుపు రాలేదు. యౌవ్వనం నాలో ఒక తుఫాను రేపింది. నాశరీరపు కోరికలను నేను తలుపు వెనక్కి నెట్టలేదు.అందుకు విరుద్ధంగా నా పరువాన్ని ఆస్వాదించాలనుకున్నాను …జీవితం దాని దారిన అది సాగింది నాకు పదహారేళ్ళకే వివాహం అయింది..” అంటుంది సారాజోసెఫ్  ఆమె వ్రాసిన  “ఒథప్పు”అనే నవల ముందుమాటలో.వివాహం అయినా ఆమె క్రీస్తు గురించి ఆలోచిస్తూనే వుంది..ఆర్థిక ,సామాజిక,జెండర్ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ ,వ్యవస్థీకృతమైన మతానికి భిన్నంగా ఒక కొత్త ఆధ్యాత్మికత గురించిన అన్వేషణే  “ఒథప్పు” నవల. మత రాజకీయాలను తీవ్రమైన విమర్శకు పెట్టిన నవల.స్త్రీల ఆధ్యాత్మికతకు కొత్త నిర్వచనాన్ని సూచించిన నవల కూడా.

“మనశ్శరీరాలు మమేకమైనప్పుడు స్వతస్సిద్ధంగా పొంగి వచ్చే సంగీత ఝరి వంటి ప్రేమ, స్త్రీలకు ఆనందాన్నిస్తుందే తప్ప, కేవల శారీరవాంఛా పరిపూర్తి  కాదు. వాళ్లకు లైంగికత అనేది కేవలం భౌతికపరమైన  విషయంకాదు. స్త్రీల విషయంలో వాళ్ల ఆధ్యాత్మికనూ లైంగికతనూ విడదీసి చూడకూడదు.బ్రహ్మచర్యం లేదా కన్యాత్వం అనేది ప్రకృతి తోనూ శరీరంతోనూ చేసే యుద్ధంలాంటిది. చర్చిలలోనూ మఠాలలోనూ అనేక పవిత్ర వస్త్రాలు కప్పుకుని చాలామంది  తమ శరీరాలతో పోరాడుతూ ఊపిరాడకుండా సతమతమౌతూ వుంటారు.ఆ పవిత్ర స్థలాలలో అత్యాచారాలూ ఆత్మహత్యలూ హత్యలూ కూడా జరుగుతూవుంటాయి….. ఒక స్త్రీ ఆధ్యాత్మికత ఆమె తన పురుషుడితో పంచుకునే ప్రేమ పూరిత శృగారంలోనూ  ,ప్రసవ వేదనలోనూ వుంటుంది,”  అంటుంది  ప్రముఖ మళయాళ స్త్రీవాద రచయిత్రి , ఉద్యమ కార్యకర్త కూడా అయిన సారా జోసెఫ్.

ఆడపిల్లలకు శరీర జ్ఞానంలేకుండా పెంచుతారు.అద్దంలో తమ నగ్న శరీరాన్ని చూసుకోడం కూడా ఒక తప్పుగా సిగ్గులేని చర్యగా భావించేలా నియంత్రిస్తారు.ఇంక సన్యాసినులు (నన్స్) అనేక పొరల బట్టల కింద తమశరీరాన్ని కప్పిపెట్టి ,దాన్ని అభావం చేసుకుంటారు.తమ శరీరాలకు తాము పరాయివాళ్ళైపోతారు.

గొప్ప సేవాభావంతో క్రీస్తు పట్ల ఆరాధనతో కాన్వెంట్ కు వెళ్ళి, కొన్నాళ్లకి అక్కడ ఇమడలేక బయటికివచ్చి, అనేక కష్టాలకూ అవమానాలకూ అపనిందలకూ గురై తన అంతరాత్మను తప్ప మరి దేనినీ లక్ష్యపెట్టక  జీవితాన్ని ఎదుర్కున్న ఒక మేరునగధీర కథ  ఈ నవల. “ఒథప్పు” అనే పదానికి చాలా అర్థాలున్నాయట. “అపవాదు” అనీ,  ” దారి మళ్ళించడం”  అనీ  “కళంకం” అని….ఈ నవలను ఆంగ్లంలో అనువాదం చేసి, ఉత్తమ అనువాదానికి క్రాస్ వర్డ్ బహుమతి అందుకున్న వాల్సన్ థంపు దీనికి ఆంగ్లంలో “ ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్” అని పేరు పెట్టాడు.

సన్యాసిని కావాలనే కోర్కె కలగడాన్ని “ప్రభువు పిలుపు”గా భావిస్తారు క్యాథలిక్కులు. తమ ఇంట్లో ఒక ఆడపిల్ల అట్లా ప్రభువు సేవకు జీవితాన్ని అంకితం చెయ్యడాన్ని ఒక ఖ్యాతిగానూ , అక్కడనించీ తిరిగిరావడాన్ని అపఖ్యాతిగానూ భావిస్తుంది ఆ కుటుంబం.  సమాజమూ,చర్చీ కూడా అట్లాగే భావిస్తాయి .నచ్చని చదువు మానవచ్చు,నచ్చని ఉద్యోగం మానవచ్చు,నచ్చని భార్యకో భర్తకో విడాకులిచ్చి రావచ్చు కానీ ఒక సారి సన్యాసం పుచ్చుకున్నాక సామాన్య జనుల్లోకి రావడాన్ని దారితప్పడంకిందా ,అది కుటుంబానికీ, ఆమె జీవితానికీ తెచ్చుకున్న ఒక మచ్చక్రిందా పరిగణిస్తారు. ఎవరూ అక్కున చేర్చుకోరు.

సంఘమూ మతమూ కొందరికి అంటగట్టే అలివిమాలిన త్యాగాలలో సన్యాసం కూడా ఒకటి. కొంతమంది ఆడపిల్లల్ని పెంచిపెద్ద చేసి,  పెళ్ళిళ్ళు చెయ్యలేక కూడా కాన్వెంట్ కి పంపిస్తారు. వాళ్ల వలన కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం అందుతుంది . వీళ్ళు ఇష్టమైనా కష్టమైనా అక్కడ బందీలే! ఈ నవలలొ ఆబులమ్మ ,ఆమె చెల్లెళ్ళ పరిస్థితి అదే!!

ఈ నవలలో ముఖ్యపాత్ర మార్గలిత సంపన్నుడైన చెన్నెరె వర్కె మాస్టర్ గారాబు బిడ్డ. ఇద్దరు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల. ఆమె నన్ గా మారతానంటే, మానవసేవచెయ్యడానికి సన్యాసమే పుచ్చుకోనక్కర్లేదనీ ఇంట్లోవుండికూడా చెయ్యొచ్చనీ  నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు తండ్రి. కానీ ఆమె పట్టు విడవదు. తల్లికి తన కూతురు నన్ అయిందంటే చాలా సంతోషం. అంత పట్టుదలతో విశ్వాసంతో కాన్వెంట్ కి వెళ్ళిన మార్గలిత అక్కడ ఎక్కువ కాలం వుండలేకపోతుంది.అక్కడి ద్వంద్వ విలువలు,నిర్బంధాలూ,వేధింపులూ ఆమెకు నచ్చవు. ఎంతో సంఘర్షణ పడి చివరికి కాన్వెంట్ వదిలి, వర్షంలో తడిసి  ముద్దై ఇంటికి వస్తుంది.

అప్పటికి ఆమె తండ్రి చనిపోయాడు.నిరంకుశుడైన పెద్దన్న జాన్  ఇంటిపెత్తనం తీసుకున్నాడు. సన్యాసిని వస్త్రాలలో కాకుండా .చీరె కట్టుకుని వచ్చిన కూతుర్ని చూసి తల్లి స్పృహతప్పి పడిపోతుంది.ఎవరో ఆమె వీపుమీద బలంగా తన్ని చీకటిగదిలో పడేసి తలుపులు మూశారు. (అది  త్వరగా పండడం కోసం అరటి కాయలు మగ్గేసే గది) .మూడు రోజులపాటు ఆకలితో దాహంతో కాలకృత్యాలు తీర్చుకునే వీలుకూడా లేకుండా ఆ చీకటిలో చెమటలో పడివుంది మార్గలిత. ఇంటికి మచ్చతెచ్చిన పిల్ల. వివేకవంతుడూ ప్రేమ మూర్తీ అయిన ఆమె తండ్రి బ్రతికి వుంటే అట్లా జరిగివుండేది కాదేమో!

మార్గలితకి కాన్వెంట్ లో వున్నప్పుడే రాయ్ ఫ్రాన్సిస్ కరిక్కన్ అనే అసిస్టెంట్ వికార్ తో పరిచయం అతను  పాటలు నేర్పడానికి కాన్వెంట్ కి వచ్చేవాడు..అతనికి కూడా తన పై స్థాయి ఫాదర్ డేనియల్ పద్ధతులు నచ్చవు.ఫాదర్ డేనియల్ శుద్ధ ఛాందసుడు. శాంతి గురించీ, సేవ గురించీ ప్రేమ గురించీ బోధించడం కాదు, ఆచరించాలంటాడు కరిక్కన్ .అతనివీ ఫాదర్ డెనియల్ వీ పొసగని అభిప్రాయాలు.కానీ తన అధికారంతో కరిక్కన్ నోరు మూయిస్తూ వుంటాడు ఫాదర్ డేనియల్.

కాన్వెంట్ జీవితంపైతన మనసులో  కలిగే భావాలన్నీ ఎప్పటికప్పుడు కరిక్కన్ కు ఉత్తరాలు వ్రాస్తూ వుంటుంది మార్గలిత.ఆమె అభిప్రాయాలకు అచ్చెరపడుతూ ఒకటికి రెండు సార్లు చదువుకుని వాటిని దాచుకుంటూ వుంటాడు కరిక్కన్. అతను కడుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడు. అతని తండ్రి పచారీ కొట్టుకి మూటలుమోసే కూలీ. తను కాన్వెంట్ వదిలిపోతున్నాననీ తనకు వెంటనే ఒక జత బట్టలూ కొంతడబ్బూ అందజెయ్యమనీ ఉత్తరం వ్రాసింది మార్గలిత. ఆ బట్టలు కొనడానికి అతను చాలాసందేహించాడు. ” ఒక ఫాదర్  చీరె కొంటే చూసేవాళ్ళేమనుకుంటారు?” అనుకుంటాడు, భయంభయంగా కొని ,దాన్ని చాలా సౌకర్యంగా అక్కడే మర్చిపోయివస్తాడు.

మూడు రోజుల చీకటి గది లో జ్వరంతో వుండి ఆమె మేనత్తకూతురు రెబెక్కా దయతో బయటపడ్డ మార్గలితకు ఆ ఇంట్లో ఎవరూ మందూ మాకూ చూడరు.ఆమె కాన్వెంట్ నుంచీ వచ్చేసిందని డాక్టర్ కి కూడా తెలియకూడదు.ఆమె పెద్దన్న జాన్,నగర మేయర్ కావడానికని చాలా కష్టపడి ప్రచారం చేసుకుంటున్నాడు.ఈ మచ్చ అతని ఎన్నికలమీద పడుతుంది.

ఆమె ఆ యింట్లో తిండీ నీళ్ళూ మందూ లేకుండా కృశించి చనిపోయినా వాళ్లకేం బాధలేదని అర్థం చేసుకుని అక్కడనుంచీ బయటపడి  తిరిగి తిరిగి చివరికి కరిక్కన్ దగ్గరికి చేరింది .కానీ కరిక్కన్ మార్గలిత అంత ధైర్యవంతుడుకాదు.అతనికి చర్చి  భయం, సమాజం భయం, దైవభీతి, కుటుంబం భయం, ఇట్లా చాలా  భయాలున్నాయి.ఆమెకు యొహానన్ కస్సీస్సా అనే సిరియన్ క్రిష్టియన్ ఫాదర్ ఇంట్లో ఆశ్రయం ఇప్పిస్తాడు. ఆమెపట్ల తనకున్న ఆకర్షణని సానుభూతినీ బయటపడనివ్వడు కస్సీస్సా . అతని భార్య సారా కోచమ్మా అతని తల్లి అన్నమ్మకుట్టీ మార్గలితను ఆదరిస్తారు.

ఆమె ఎన్నాళ్లని అక్కడుండాలి?ఆమెకో జీవనాధారం కావాలికదా?అందుకోసం ఆమె తండ్రి స్థాపించిన స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేర్చుకోమని జాన్ ని అడుగుతాడు కస్సీస్సా. మార్గలితతో తమకేం సంబంధం లేదనీ తమ ఇంటివ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మర్యాదగా వుండదనీ అతన్ని అవమానిస్తాడు జాన్. తండ్రి ఆస్తిలో తన వాటాకోసం కోర్టుకు వెళ్ళమంటాడు కస్సీస్సా. ఈలోగా ఊళ్ళో కొందరు కస్సీస్సా ఇంటిమీదకొచ్చి అతనికీ మార్గలితకూ సంబంధాలు అంటగడుతూ దుర్భాషలాడి గలాటా చేస్తారు. మార్గలిత ఎటువంటిదో ,తన భర్త ఎటువంటివాడో తెలిసినా అతనికి చెడ్దపేరురావడం సహంచలేని కస్సీస్సా భార్య ఆమెను ఇంటినుంచీ పంపెయ్యమంటుంది. అప్పడుకూడా కరిక్కన్ ఆమెకు సహాయం రాడు.

ఎవరూ పంపించనవసరం లేకుండా తనే ఆయింటినుంచీ బయటపడి రెబెక్కా సాయంతో ఫాదర్ ఆగస్టీన్ దగ్గరకు వెడుతుంది. ఫాదర్ ఆగస్టీన్ ఏ చర్చి అధికారానికీ తలవొంచని స్వతంత్రుడు,నిరాడంబరుడు, ఆచరణ శీలి. అడవిలో వుంటూ. దొరికింది తింటూ అక్కడుండే పేదలకు సాయం చేస్తూ వుంటాడు. రోడ్డుమీద నిరాధారంగా పడివున్న ఒక రోగిష్టి స్త్రీని తీసుకొచ్చి ఆమె మలమూత్రాలను కూడా అసహ్యం లేకుండా శుభ్రం చేసి ఆమె చనిపోయే క్షణాలలో అమెకు సాంత్వన ఇచ్చిన ప్రేమ మూర్తి.  చనిపోయిన స్త్రీ తాలూకు బిడ్ద కూడా చావుబ్రతుకుల్లోనే  వున్నట్టుంటాడు .వాణ్ణి దగ్గరకు తీస్తుంది మార్గలిత. వాడికి “నాను” అని ముద్దుపేరు పెట్టింది. తన ఉపచారాలతో వాడికి ప్రాణంపోస్తుంది. ఆ పిల్లవాడు ఆమెకు దగ్గరౌతాడు.

ఫాదర్ డేనియల్ బదిలీ కావడంతో కరిక్కన్ ఆస్థానంలో వికార్ గా నియమించబడతాడు. వికార్ అయినప్పుడు వచ్చే అదనపు అధికారాలూ వసతులూ ఆదాయమూ అతని మనసును మార్గలిత మీదనుంచీ మళ్ళిస్తాయని అంతా ఆశిస్తారు.  తన కొడుకు వికార్ అయితే తన హోదా పెరుగుతుంది కనుక, అతని తండ్రి పదివేలు అధిక వడ్డీకి అప్పచేసి ఇల్లు మరమ్మతు చేయిస్తాడు.తల్లీ చెల్లెళ్ళూ ఇల్లు అలికి అలంకరించి అతనికోసం ఎదురుచూస్తుంటారు.కానీ అతను  మార్గలిత ను వెతుక్కుంటూ వెళ్ళి . తనని క్షమించమంటాడు.మార్గలిత కరిగిపోతుంది. ఫాదర్ ఆగస్టీన్ గదిలో మొదటిసారి వాళ్లిద్దరూ దగ్గరౌతారు.

“నేను నా శరరంతోనే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను. నేను అశాశ్వతమైన శరీరాన్నీ శాశ్వతమైన ఆత్మనూ విడదియ్యలేను..ప్రేమలో నా ఆత్మ శరీరాన్నీ,నాశరీరం ఆత్మనూ అధిగమిస్తాయి ఇంత అపరూపమైన  ఆనందాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు .ఇది కేవలం ఆత్మకో శరీరానికో ప్రత్యేకమైన ఆనంద పారవశ్యం కాదు.ఇది ఆరెండింటి సమ్మేళనం. నేను మొత్తంగా ఒక ఆనందాంబుధిలో ఈదుతున్నాను. నాలోనించీ ప్రవహించే ఆనందం ఈ భూమికి  శాంతిని ప్రసాదించే నదిలాంటిది .నేనెంతో ప్రశాంతంగా ఆనందంగా వుంటాను,” అనుకుంటుంది మార్గలిత.

అతను మార్గలితను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు.వికార్ గా ఫాదర్ దుస్తుల్లో రావలసిన కొడుకు సాధారణ దుస్తుల్లో ఒక స్త్రీని వెంటపెట్టుకు రావడం చూసి అతను తెచ్చిన కళంకాన్ని తట్టుకోలేక ఆ క్షణమే అతని తండ్రి ఉరి వేసుకుంటాడు. కరిక్కన్ ని అందరూ ఏవగించుకుంటారు. తండ్రి అంత్యక్రియలకు కూడా అతన్ని అనుమతించరు, అట్లా నడివీధిలో నిలబడిన ఆ ఇద్దర్నీ తన ఇంటికి తీసుకుపోతాడు నాస్తికన్ జార్జి. ఒకటిరెండు రోజులు తను ఆదుకోగలడు కానీ తరువాత పనిచేసుకుని సంపాదించుకోమంటాడు. తన ప్రేమతో అతన్ని సాంత్వన పరచడానికి చాలా ప్రయత్నిస్తుంది మార్గలిత.అంత నిరాదరణలోనూ అవమానం లోనూకూడా ఆమె అధైర్య పడదు, ఆమెకు కరిక్కన్ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది.

ఉచిత సహాయాలు అందుకోడం ఇష్టపడని మార్గలిత  రేషన్ షాపు ఊడ్చి రోజూ పదిరూపాయలూ కాసిని బియ్యం సంపాదించి  ఇల్లు నడుపుతుంది . కానీ  తండ్రి మరణంతో ఒక అపరాధభావంతో కృంగిపోతాడు కరిక్కన్ .అతన్ని మార్గలిత ప్రేమకూడా శాంతపర్చలేకపోతుంది. ఆమెతో కలిసివున్నా ఆమెలా అతను ఆమెకు అంకితం కాలేకపోతాడు.. ఈ లోగా ఇద్దరూ ఉద్యోగాలకోసం ఎన్నో సేవాసంస్థలకు అర్జీలు పెడతారు.యొహానన్ కస్సీస్సా కూడా ప్రయత్నిస్తూ వుంటాడు. అప్పుడు కరిక్కన్ ఉలిక్కిపడ్డాడు. మార్గలిత కడుపులో తన శిశువు మొలకెత్తుతోందని తెలిసి. కరిక్కన్ కు దూరంగా వుంటూన్న అతని తల్లి కూడా ఉలిక్కి పడింది.

వాళ్ళు ఆ వూరు విడిచిపోకపోతే తను కూడా ఉరిపెట్టుకుంటానని అతడిని హచ్చరించింది.  కరిక్కన్  చెప్పకుండా అదృశ్యమైపోయాడు. తను పాపం చేశాడు.దానికి ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అతను తనను ఎంతో ప్రేమించిన మార్గలితను వదిలివెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకం మరో సారి నోరు తెరిచింది. “మార్గలిత దారితప్పిన మనిషి. ఆమె కడుపులో శిశువు కరిక్కన్ ది కాకపోవచ్చు. కరిక్కన్  చాలా మంచివాడు. ఈ ఘోరం భరించలేక వెళ్ళిపోయాడు  కాన్వెంట్ వదలి ఎక్కడెక్కడ తిరిగిందో ఏమో!”  అని వదంతులు పుట్టాయి.

ఉన్నట్టుండి ఒకరోజు ఆగస్టీన్  వచ్చి ” నాను”  ను  ఆమెకు అప్పగించి వెళ్ళిపోతాడు.  మార్గలిత తల్లి ఆమెకు తన భాగం ఆస్తి వ్రాసి ఇస్తుంది. ఆ పత్రాలు తీసుకొచ్చిన  అడ్వొకేట్ చిరమెల్ ఆమె పరిస్థితి తెలిసికూడా, (కరిక్కన్ బిడ్దను మోస్తున్నదని తెలిసికూడా) ఆమెను చర్చి ఆశీస్సులతో  పెళ్ళిచేసుకుంటానని,ప్రతిపాదిస్తాడు.తన భార్య పోయి పదకొండేళ్ళయిందనీ తన కూతురు  వైద్యం చదువుతున్నదని, ఒంటరిగా ఉండలేకపోతున్నాననీ అంటాడు.ఆమె ఒకప్పుడు నన్ కనుక ఆమెలో ఇంకా వినయం. పవిత్రత దైవభీతి ఉంటాయని తనకి నమ్మకం అంటాడు . తనది పరువుకల కుటుంబం అని చెన్నెరి కుటుంబంతో సరితూగే ఆర్థిక స్థితి అనికూడా చెప్పాడు.మార్గలిత చేసిన తప్పులనుకూడా మన్నిస్తానంటాడు.అదంతా వింటూ ఒక రాయివలె నిలబడిన ఆమెతో ఇంక మాట్లాడ్డానికి ఏమీలేక అతను వెళ్ళిపోతాడు. తనొక నిరాడంబరమైన జీవితాన్ని నిగడపాలని నిర్ణయంచుకున్నానని తల్లికి చెప్పి ఆ పత్రాలు ఆమెకు తిరిగి ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన మార్గలితను చిన్నన్న గుమ్మం తొక్కనివ్వడు . ఆ పత్రాలను మెట్లమీద పెట్టి వచ్చేస్తుంది.కడుపులో బిడ్డతోనూ పెంపడుబిడ్డతోనూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి  సంసిద్ధంగా…అది కథ.

“ నేను కాన్వెంట్ లంటే  సర్వ స్వతంత్రమైన స్త్రీ సంస్థలనుకునేవాడిని.వాటికి పూర్తి ఆర్థిక స్వాతంత్ర్యం వుంటుంది.వాటిమీద చర్చి  కి ఎలాంటి అధికారం వుండదు. వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ల ధ్యేయాలనూ సన్యాసినులే(నన్స్) ఎంచుకుంటారు వాళ్ల సంస్థల్లో వాళ్ళు సర్వస్వతంత్రులు. ఇళ్ళల్లో వుండే స్త్రీలకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులు తప్పవు. కానీ వీళ్ళకి అటువంటి బానిసత్వంలేదు. పురుషుల ఆధిపత్యమూ ,సహాయమూ లేకుండా సంస్థల్ని నడపడం,నిజంగా ఒక  విప్లవంలాంటది అనుకునేవాడిని.కానీ  అక్కడ ఉండే నిర్బంధాలను గురించీ హింస గురించీ  వేధింపుల గురించీ మాకు తెలియదు.కాన్వెంట్ లో చేరిన పదహారు పదిహేడేళ్ళ అమ్మాయిల మానసిక అవస్థలను గురించి తెలియదు,” అని పాల్ జకారియా అనుకున్నట్లు మనం కూడా అనుకుంటాం.

కానీ కొన్ని కాన్వెంట్స్ లో చర్చిల్లో ,కొందరు ఫాదర్లు మదర్ సుపీయర్లు ఎట్లా ప్రవర్తిస్తారో ,మతం అనేది మనుషులకు  దారిచూపే దీపంలా కాకుండా ఒక వ్యాపార సంస్థలా ఎట్లా తయారౌతోందో,ఒకప్పుడు సమాజంలో పాదుకోడానికి ప్రయత్నించిన హేతువాద భావాలూ, నాస్తికత్వమూ  వెనక్కి తగ్గి మళ్ళీ మహిమలకూ, మంత్రాలకూ, క్రతువులకూ ఎట్లా జనం బానిసలౌతున్నారో , చర్చిలో ,కుటుంబంలో సమాజంలో మతంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎట్లా కాపాడ బడుతుందో..వంటి ఎన్నో విషయాలను ఈ నవలలో చర్చకు పెడుతుంది సారాజోసెఫ్.

ఇంత ధైర్యంగా చర్చిని విమర్శిస్తూ వ్రాసిన నవల మళయాళంలో ఇటీవల ఇదేనేమో ! చర్చి  లో వుండే ఫాదర్లకు బ్రదర్లకు నిర్బంధ బ్రహ్మచర్యం విధించకూడదంటాడు యొహానన్ కస్సీస్సా. ఈ విషయంలో క్యాథలిక్ చర్చి పునరాలోచన చెయ్యాలంటాడు .సిరియన్ క్రిష్టియన్స్ లో ఈ నిబంధన లేదు. అందుకు కస్సీస్సా ఇల్లే ఉదాహరణ. కస్సీస్సా చాలా హేతుబద్ధంగా ఆచరణత్మకంగా ఆలోచిస్తాడు.

“చర్చి ఒక వ్యవస్థగా మారడం అందులోకి భౌతిక సౌఖ్యాలు ప్రవేశించడం సమాజంలో మారుతున్న విలువలు చర్చిలోకి కూడా ప్రవేశించడం క్రిష్టియానిటీ లో వుండవలసిన ఆధ్యాత్మికతను నిరాడంబరతనూ వెనక్కి నెడుతున్నాయి” అంటుంది ఈ నవలకు పరిచయవ్యాసం వ్రాసిన జాన్సీ జేమ్స్ .

ఎక్కడికక్కడ మళయాళీ సుగంధాన్ని కాపాడుతూ అనువదించిన వాల్సన్ థంఫు  “ఏవిశ్వాసంలో నైనా అసలు సత్యం  ఏమిటో తెలుసుకోడానికి  వ్యక్తి చేసే  అన్వేషణ కు ఈ నవల ఒక ఉదాహరణ.సారా జోసెఫ్ సంధించిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు వ్యవస్థీకృతమైన  కైస్తవ మతం సిద్ధంగా లేదు.మనకి కావలసినది బైబిల్ లో చెప్పిన క్రైస్తవం కానీ చర్చి క్రైస్తవం కాదు” అంటాడు. మతం ఒక శిల కాదు.అదొక ప్రవాహం అంటుంది సారా జోసెఫ్.అది ఒక్క క్రైస్తవానికే కాదు అన్ని మతాలకూ అన్ని విశ్వాసాలకూ వర్తిస్తుంది.

సారా జోసెఫ్ వ్రాసిన “అలహాయుదె పెన్మక్కల్” ( అలహా బిడ్దలు –అంటే దేవుని బిడ్డలు) నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.  “అలహాయుదె పెన్మక్కల్,” “మాటతి,” “ఒథప్పు” మూడు నవలలు కలసి ఒక ట్రయాలజీ లా వుంటాయి. సారా జోసెఫ్ మళయాళం ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు.అనేక సామాజిక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు రామాయణంలో శూర్పణఖ మంధర ,సీత పాత్రలను ఒక  కొత్త దృష్టికోణంతో విశ్లేషించారు. అనేక కథలు వ్రాసారు .కేరళలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు  “నేను స్త్రీగా పుట్టినందుకు గర్విస్తాను. స్త్రీల పై వివక్ష ,వారినికేవలం శరీరాలుగా మాత్రమే చూడడం ,వారికిచ్చే పరిమితమైన ప్రాధాన్యత ల గురించి  వ్రాయడం నా ముఖ్య కర్తవ్యం. అది నిర్వహించగలుగుతున్నందుకు కూడా నేను గర్విస్తాను,” అంటుంది  ,కేరళలో స్త్రీవాదోద్యమానికి నాందిపలికిన ఈ రచయిత్రి.

“ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్ ” గా ఈ నవలను అనువదించిన వాల్సన్ థంపు , డిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ .ధర్మశాస్త్రవేత్త ,శాంతి ఉద్యమ కారుడు.రచయిత. మతం గురించీ, అనేక సామాజిక సాంస్కృతిక అంశాల గురించీ విస్తృతంగా వ్రాసారు. సారా జోసెఫ్ కథలు అనేకం ఆంగ్లంలో అనువదించారు. ఈ నవల ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.

యుద్ధ భూమిలో శాంతి కోసం ఓ కల!

sathyavati“యుద్ధం పురుషులది. యుద్ధ నిర్ణయాలు స్త్రీలకి వదిలిపెడితే వాళ్ళు పరస్పరం చర్చించుకుని ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి వుండేవాళ్ళు. అసలు యుద్ధ పర్యవసానాలను భరించేది స్త్రీలే! భర్తల, సోదరుల, ప్రేమికుల, బిడ్డల, మరణ శోకాన్ని భరించేది ఇరువైపులా కూడా స్త్రీలే. అయినా స్త్రీలు యుద్ధాలకి పరష్కారాలు చూపించడం ఎక్కడా వినలేదు.ఆత్మీయుల మరణ శోకపు కంటితడి తుడుచుకునే విరామంకూడా లేకుండానే వాళ్ళు కుటుంబాలకి ఆహారం సమకూర్చాలి. పురుషుల వీరోచిత కార్యాలతో దీన్ని పోల్చడం లేదు నేను. కుటుంబాన్ని చూసుకోడం ఒక గొప్ప విషయంగా స్త్రీలెప్పుడూ భావించలేదు.

తుపాకి పట్టుకుని ఉద్యమంలో పనిచెయ్యని స్త్రీల సేవలు తక్కువవేమీ కావు. తమ దుస్తుల మడతల్లో చీటీలు దాచుకుని చెక్ పోస్టుల మధ్యనుంచీ ధైర్యంగా వెళ్ళి అజ్ఞాతంలో వున్న ఉద్యమకారులకి సందేశాలు చేరవేశారు భోజనాలు అందించారు. పురుషులు ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు, ఒంటరిగా వ్యవసాయం చేసి పంటపండించారు ఇంట్లో పురుషులు చేసే పనులన్నీ చేశారు. ఆ చీకటి దినాలలో కుటుంబం గడవడానికి స్త్రీలు పడ్డ కష్టాన్ని ఎవరూ ఎక్కువ కాలం జ్ఞాపకం వుంచుకోరు. ఎందుకంటే యుద్ధం పురుషులకు సంబంధించినది స్త్రీలది కాదు.”

“యుద్ధంకోసం ఎంత ఉత్సాహంతో పనిచేశారో అంతే ఉత్సాహంతో శాంతికోసం పనిచేస్తే ఎంత బాగుండేది? యుద్ధం స్వల్పకాలంలో ముగియాలి. ఎక్కువకాలం కొనసాగితే అది మనలో శక్తిని చంపేస్తుంది. ఈ యుద్ధం గ్రామాల మధ్య జరిగే యుద్ధం లాంటిది కాదు. ఇదొక పెను యుద్ధం. మనకన్న అతి పెద్దదైన భారత దేశం మనతో వంద సంవత్సరాలైనా యుద్ధం చెయ్యగలదు. మనకి కావలసింది శాంతి. ప్రజల జీవితానికి భద్రత.”

ఈస్టరీన్ కైర్ ఇరలు (Easterine Kire Iralu) వ్రాసిన “బిట్టర్ వర్మ్ వుడ్” అనే నవలలో తుపాకి పట్టుకుని స్వయంగా నాగా విముక్తి ఉద్యమంలో పాల్గొని, తరువాత ఉద్యమపు కలల నుంచీ బయట పడిన ఒక స్త్రీ అనేమాటలు ఇవి. ఇటీవల హిందూ లిట్ ఫర్ లైఫ్ పోటీలో షార్ట్ లిస్ట్ లో వచ్చిన అయిదు నవలల్లో ఒకటి. ఒక శక్తిమంతమైన నాగా సాహిత్యకారిణి సంయమనంతో వ్రాసిన నవల ఇది.

09TH_EASTERNINE_KI_1359464e

1937 లో జన్మించి 2007 లో హత్యకు గురైన మోసె జీవిత కథగా సాగే ఈ నవలలో నాగా విముక్తి ఉద్యమ చరిత్ర కూడా సమానాంతరంగా సాగుతుంది.

నాగా తెగల జీవితం వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ల శాంతియుత జీవనం, తెగల మధ్య సమానత్వం పరస్పర ప్రేమాభిమానాలు వర్ణిస్తూ మొదలై ఆ జీవితాల్లోకి వచ్చిపడిన మార్పుల మీదుగా సాగుతూ కళ్ళఎదుట జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేక ఎంతోమంది యువకులు ఉద్యమంలో చేరడం ఉద్యమం నుంచీ బయటికి రావడం, తరువాత ఉద్యమంలో చీలికలు, ఒకర్నకరు చంపుకోడం అదొక కల్లోల భూమిగా మారి సామాన్య ప్రజలకి ఇంటా బయటా భద్రతలేకుండా పోయిన కాలం దాపరించి మోసే. అతని వంటి అనేక మంది హత్యకు గురవడం స్థూలంగా కథ.

1832 లో ఈశాన్యప్రదేశాలను ఆక్రమించిన బ్రిటన్ ని, భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, తమనూ విముక్తం చెయ్యమనీ తమకుభారతదేశంలో చేరే ఉద్దేశం లేదనీ నాగా ప్రజలు కోరుతూనే వున్నారు.కానీ బ్రిటన్ తను ఆక్రమించిన భూభాగం మొత్తంఇండియాకు ధారా దత్తం చేసింది. తామెప్పుడూ భారతదేశంలో ఒక భాగం కారు కనుక తమది వేర్పాటు ఉద్యమం కాదని అంటారు వాళ్ళు.నాగా ప్రజలు నివసించే భూభాగాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి భారత ఆక్రమణ నించీ తమకి విముక్తి కలిగించాలనేదే వాళ్ల ఉద్యమం.

కానీ స్వతంత్రం సాధించిన ఇండియా నాగా ల్యాండ్ ను అస్సాం లో ఒక భాగం చేసింది. అయితే భారత దేశ స్వాతంత్రానికి ఒకరోజు ముందే వాళ్ళు అనధికారికంగా నాగా స్వతంత్ర దినం జరుపుకున్నారు బ్రిటన్ ఆక్రమణకు ముందు నాగా తెగలలో కుల వ్యవస్థ, కులాల ఎక్కువ తక్కువలూ లేవు.తెగలన్నీ సమానమే. ఎవరితెగ ఆచారాలు వాళ్ళు పాటించుకునేవారు నాగా తెగలన్నీ దాదాపు తొమ్మిది పది దాకా వున్నాయి. తరువాత మిషనరీ లొచ్చి చాలమందికి క్రైస్తవం ఇచ్చారు ఇంగ్లీష్ నేర్పారు. క్రైస్తవం తీసుకున్నా పాత ఆచారాలను వదిలిపెట్టలేదు చాలామంది.

అట్లా క్రైస్తవం తీసుకున్నవారిలో మోసే కుటుంబంకూడా ఒకటి. మోసె తల్లి విలా (vilau) పొలంలో పనిచేసుకుంటూ వుండగా నొప్పులొచ్చి( 1937 లో) అక్కడే బిడ్దను ప్రసవిస్తుంది. అక్కడి చాలా మంది స్త్రీలకి అది మామూలే. ఆమె అత్తగారు ఖ్రియెన్యో ( khrienuo) ఆమె పక్క ఇంట్లో వుంటూ. విలా ని కూతుర్లా చూసుకుంటుంది ఒకే వంటిల్లుంటే స్నేహ బంధాలు నిలవవంటుంది ఆవిడ. విలా భర్త లూ ( Luo-o) బిడ్దను చూసి మురిసిపోతాడు. కానీ తరువాత కొద్దిరోజులకే అడవిలో ఒక చెట్టుకొట్టుకురావడానికి వెళ్ళి దానికిందపడి మరణిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ పొలంలో పనిచేసుకుంటూ మోసె ని ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.
మోసే ఆరేళ్ళొచ్చి స్కూల్ కి పోదామనుకునే వేళకి జపాన్ యుద్ధం వల్ల స్కూళ్ళన్నీ మూతపడ్డాయి వాళ్ళ తెగలో అనేకమందిలాగానే బాంబుల భయానికి మోసే కుటుంబం కూడా కోహిమా నుంచీ వెళ్ళిపోయి వేరే వూళ్ళోతలదాల్చుకోవలసి వచ్చింది. అప్పుడే అతను ఆకాశంలో ఒక విమానం మంటలు చిమ్ముతూ కూలిపోవడం చూశాడు. యుద్ధం ముగిసి స్కూళ్ళు తెరిచేసరికి మోసేకి ఏడేళ్ళొచ్చాయి.

ఒక మిషన్ స్కూల్లో చేరిన మోసేకి నీట్యూ ( nietuo) తో స్నేహమైంది, నీట్యూ కన్న మోసే కి గ్రహణ శక్తి ఎక్కువగా వుండేది. అతను స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీష్ తల్లికీ నానమ్మకీ చెబుతూ వుండేవాడు. తల్లికి ఇంటిపనిలో సాయం చేసేవాడు పొలం పనిలోనూ సాయం చేసేవాడు. వేరు వేరు ఇళ్ళల్లో వున్నా ఆ ముగ్గురిదీ ఒక ప్రేమ మయమైన కుటుంబం. అప్పుడు వాళ్ళొక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నారు అది వాళ్ళ చిన్న ఇంటిని ప్రపంచంతో కలిపింది.అందులో రోజూ ఇంగ్లిష్ వార్తలు విని తల్లికీ నానమ్మకీ చెప్పేవాడు మోసె. నానమ్మ కి అవి విని మనమడి చేత చెప్పించుకోడం ఎంతిష్టమో! గబగబ పన్లు చక్కబెట్టుకుని వచ్చి కూర్చునేది.

1947 నాటికి మోసె మూడో తరగతిలోకొచ్చాడు.

ఆసంవత్సరం చాలా విశేషాలు చెప్పింది రేడియో! బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు దేశ విభజన గురించిన వార్తలే వార్తలు! ఇండియాలో ముస్లిమ్ ల హత్యలు,పాకిస్తాన్ లో హిందువుల హత్యలు!! తమ పొరుగువారిని చంపుకోడం నిజంగా ఎంత పిచ్చితనం అనుకున్నారు ఆ అత్తాకోడళ్ళు. రోడ్డుమీద నడిచిపోయే వాళ్ళు, స్కూల్లో పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటల్లో మోసె కి “నాగా విముక్తి” అనేమాటకుడా ఎక్కువ వినబడింది. నాగా ప్రజలు చాలా మంది ఇండియానుంచీ స్వతంత్రం కోరుకుంటున్నారని. అతని స్నేహితుడు నీట్యూ తండ్రి చెప్పాడు కొంతమంది గాంధీజీ దగ్గరకు వెళ్ళి తమకు స్వతంత్ర నాగా దేశం కావాలని అడిగారనీ దానికి గాంధీజీ మద్దతు ఇస్తానన్నారనీ చెప్పాడు.

ఒక రోజు రేడియో గాంధీ హత్య వార్త చెప్పింది. గాంధీ ఎవరు ఏమిటీ అని ఆముగ్గురూ మాట్లాడుకున్నారు.తను స్కూల్లో విన్నవీ పాఠాల్లో తెలుకున్నవీ చెప్పాడు మోసే ఆడవాళ్ళిద్దరికీ. గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాదు ప్రధాన మంత్రి వేరే వున్నాడు ఆయన పేరు నెహ్రూ ఆ ఇద్దరిపేర్లూ ఎప్పుడూ కలిసి వినిపించినా వాళ్ళూ అన్నతమ్ములు కారు. ఒక రోజు చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది,నాగాలకు స్వతంత్రం కావాలని వారిని ఇండియాలో విలీనం చెయ్యొద్దని వ్రాసినందుకు ఫిజో అనే ఆయన్ని ఇండియా ప్రభుత్వం అరస్ట్ చేసిందని. అప్పుడు నానమ్మ అంది “అవును నాగాలు ఇండియాలో ఎందుకు చేరాలి? వాళ్ళెప్పుడూ ఇండియాలో భాగం కారు” అని. “మనం జీసస్ ని ప్రార్థించాలి ఆయన్ని త్వరగా విడుదల చేయించమని. పాపం ఆయన పిల్లలు ఆయన కోసం ఎంత తపిస్తున్నారో కదా?” అంది.

1950 నాటికి మోసే ఆరో తరగతిలోకి వచ్చాడు. ఒకరోజు వాళ్ళు సాయంత్రం చలిమంట దగ్గర కూచున్నప్పుడు విలా చెప్పింది “నేనివాళ పొలం నుంచీ త్వరగా వచ్చాను. రోడ్డు మీద చాలా సైనిక వాహనాలు వున్నాయి.చాలా సేపు అవి అక్కడే ఆగి వున్నాయి మాకు చాలా భయం వేసింది వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు.”

“అవును జపాన్ యుద్ధం అప్పుడు ఒకామెని సైనికులు ఎత్తుకెళ్ళారు.తిరిగొచ్చాక చాలా కాలం ఆమె ఏడుస్తూనే వుండేది,” అన్నది నానమ్మ. స్కూల్లో కూడా పిల్లల్ని బయట తిరగవద్దని చెప్పారు. ఇప్పుడు జపాన్ యుధ్ధమప్పుడు ఎంతమంది సిపాయిలున్నారో అంతమందికన్న ఎక్కువ వున్నారు. మోహరించిన భారత సైన్యం అది.

అప్పుడు డిసెంబర్ లో ప్లెబిసైట్ జరిగింది. అందరూ వెళ్ళి మాకు స్వతంత్రం కావాలనే అర్జీ మీద వేలుముద్రలు వేసొచ్చారు. కానీ ఇండియా ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టలేదు ఒకరోజు కోహిమాలో ప్రొటెస్ట్ మార్చ్ జరిగింది. వాళ్లమీద పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. గుంపు చెల్లాచెదరైనా ఒకతను గుండుతగిలి చనిపోయాడు పట్నంలో కర్ఫ్యూ విధించారు.

1952 లో ఇండియాలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. నాగాల్యాండ్ లోనూ వచ్చాయి,కానీ అక్కడంతా ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు చాలామందిని తీసుకుపోయి బలవంతంగా బ్యాలెట్ పేపర్లమీద వేలిముద్రలు వేయించారు అట్లా మోసే తల్లీ నానమ్మ కూడా వేసొచ్చారు. ఇండియా కి ఎవరు ప్రధాన మంత్రి అయితే మనకేమిటి? మనం ఎందుకు వోట్లు వెయ్యాలి? వాళ్ళు చేస్తున్నది చాలా తప్పు అన్నది నానమ్మ. సైన్యం ధాన్యపు కుప్పల్ని తగలబెడుతోదనీ విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి అమాయక పౌరులను పొట్టన పెట్టకుంటోందనీ మోసే వింటున్నాడు. కానీ ఈ వార్తలేవీ వాళ్ళు వినే రేడీయోలో రావు. చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళి నాగా విముక్తి ఉద్యమంలో చేరిపోతున్నారు. పెళ్ళయిన వాళ్లు మాత్రమే ఊళ్ళల్లో మిగిలివుంటున్నారు తమ మీద జరుగతున్న దౌర్జన్యానికి నాగాప్రజలు కోపోద్రిక్తులౌతున్నారు. చాలా చోట్ల సైనకుల చేతిలో స్తీలు అత్యాచారాలకు గురౌతున్నారు. ఎవరికీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఒక సైనికుడు పేల్చిన తూటా పొలంనుంచీ వస్తున్న నానమ్మను బలితీసుకుంది.

ఆమె మరణం మోసే ను బాగా కదిలించింది. 1959 నాటికి మోసేకి 19 ఏళ్ళొచ్చాయి.

అతని తల్లి విలా కి అత్తగారి మరణం తరువాత ఏళ్ళకిమించిన వృద్ధాప్యం వచ్చినట్లయింది. స్కూల్ ఫైనల్ అవకుండానే మోసే చదువు మానేశాడు. సైనికుల ఆగడాలు చూస్తున్నకొద్దీ ఆగ్రహావేశాలు అదుపులోకి రావడం లేదతనికి. ఒకరోజూ అతనూ అతని స్నేహితుడు నీట్యూ అజ్ఞాత నాగా సైనికుల్లోచేరిపోయి అడవులకు వెళ్ళిపోయారు. తల్లి తన కొడుక్కి హృదయపూర్వకంగా అనుమతి ఇచ్చింది. ఏడు సంవత్సరాల కాలం అతను అడవులలోనే వుండిపోయాడు గెరిల్లా శిక్షణ తీసుకున్నాడు అక్కడ అతనికి తనతో పాటు గెరిల్లా శిక్షణ పొందుతున్న నీల్హౌనో (nielhounuo) పరిచయమౌతుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. అంతా ఆమెని రైఫిల్ గర్ల్ అంటారు.

మోసె ప్రాణానికి తెగించి ఒకరోజు కోహిమా వచ్చి రహస్యంగా నాగా పతాకం ఎగరేసి పోతాడు. ప్రభుత్వ సైన్యాలకూ ఉద్యమకారులకూ మధ్య కాల్పులూ ఎదురుకాల్పులూ మొదలౌతాయి. వీరిద్దరిమధ్య సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకూంటూ వుంటారు. ఆపరిస్థితుల్లో అప్పటివరకూ అస్సాంలో ఒక భాగంగా వున్న నాగా ప్రాంతం 1963 లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. ఈ పరిణామం ఉద్యమకారులలో క్రోధాగ్ని రగిలిస్తుంది కొందరు కోహిమాకు వెళ్ళి రాష్ట్రావతరణ ఆపాలంటారు. కొందరు అప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగంది కనుక అట్లా చెయ్యడం మంచిది కాదంటారు. తీవ్రమైన చర్చలు జరగుతాయి. సీనియర్ నాయకులు హింస తగ్గించమంటారు. చివరికి వీరిమాట నెగ్గింది. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు ప్రారంభించింది.

అందులో భాగంగా ఉద్యమాన్ని వదిలి జన జీవనంలో కలిసే వారికి కొంత డబ్బో భూమో ఇస్తానని ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యమ కారులు ఇందుకు ఇష్టపడలేదు. చాలా కొద్దిమంది మాత్రమే బయటికొచ్చారు. ప్రభుత్వ సైనికులకీ ఉద్యమ కారులకీ మధ్య కాల్పులు ఉధృతమైన సమయంలో ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. అప్పుడే మోసే తల్లి విలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోదని తెలసి అతను తన స్నేహితుడు నీట్యూ తో కలిసి ఇంటికి వస్తాడు. “నేను రమ్మనలేదు కదా,” అంటుంది తల్లి. ఆమె క్యాన్సర్ చివరి దశలో వుంది. మోసే తల్లిదగ్గరే వుండిపోతాడు. తనకి అజ్ఞాత జీవితంలో పరిచయమైన నీల్హౌనో కూడా బయటికి వచ్చేసింది ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. అతనికి ప్రభుత్వం ఉద్యోగమేదో ఇస్తానంటే ఇష్టం లేక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు. అతని ఉద్యమ జీవితం ముగిసింది. అతనికొక కూతురూ అతని స్నేహితుడు నీట్యూకి కొడుకూ జన్మిస్తారు.

ఇంక అక్కడనంచీ రాష్ట్రంలో జరిగే సంఘటనలన్నీ ఆ స్నేహితుల సంభాషణల ద్వారా చర్చల ద్వారా మనకి అర్థం అవుతాయి. మోసే కూతురుకి గానీ నీట్యూ కొడుక్కిగానీ ఉద్యమం మీద ఆసక్తిలేదు. అతను చదువుకుని స్కూల్లో టీచరౌతాడు ఆమె స్వంతంగా నేత పని ప్రారంభిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లిచేసుకుంటారు. మోసే మనమడు నీబో(niebou) డిల్లో శ్రీరామ్ కాలేజీలో చదువుకోడానికి వెడతాడు. అక్కద ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపట్ల, విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులూ పౌరసమాజం చూపుతన్న వివక్ష వారిపై జరిగే దాడులూ దేశంలోని వివిథ ప్రాంతాలలో వారిపై చూపుతున్న జాతివివక్ష గమనిస్తాడు. అవడానికి తామందరూ భారత పౌరులే మరి!

ఒక దశలో చదువుమానుకుని వెళ్లిపోదాం అనుకుంటుండగా అతనికి రాకేశ్ అనే సహవిద్యార్థితో పరిచయం అవుతుంది. అతను అరవైల్లో నాగాల్యాండ్ లో పనిచేసిన హిమ్మత్ అనే ఆర్మీ కమాండెంట్ మనుమడు. ఆయన్ని కలుస్తాడునీబో. రిటైరైన హిమ్మత్ కి నాగాల్యాండ్ అంటే ఇష్టం ఆయన ద్వారా ఆర్మీ దృష్టి నుంచీ నాగా ఉద్యమాన్నీ ప్రభుత్వ వైఖరినీ చూస్తాం మనం. చాలాకాలం ఇంటికి దూరంగావుండడం కొత్త ప్రదేశం కొత్త భాష, తమలో ఎవరికి ఏం జరిగినా రెచ్చిపోయి కాల్పుల జరపడం వంటి సైనికుల మానసికావస్థలను గురించి చెప్పి అప్పటి సైనికుల చర్యల గురించి, “నేను ప్రభుత్వ ఆజ్ఞాబద్ధుడను.” అంటాడు. కానీ నాగాఉద్యమాన్ని సమర్థిస్తాడు. అజ్ఞాత సైనికుడైన మోసేని చూడాలనుకుంటాడు. మోసే 2007 లో హత్య కి గురౌతాడు. నాగా ఉద్యమ చరిత్రే కాదు, మొత్తం కుటుంబసభ్యుల మధ్య స్నేహితుల మధ్య భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ల మధ్య పిల్లల తల్లితండ్రుల మధ్య ప్రేమానురాగాలు ఎట్లా వుండాలో చెబుతుందీ నవల. అందరూ ఆలోచనాపరులే. అందరూ మనుషుల్ని ప్రేమించేవారే. చివరికి తన తాత మోసే ని చంపిన వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదు నీబో.

ఫాక్షనిష్టులేం చేశారు?

దుకాణాలపెట్టుకునో మరో విధంగానో బ్రతుకుతున్న సీనియర్ ఉద్యమకారులపై దాడులు చేశారు అవమానించారు. కొంతమందిని చంపారు. బాగా చదువుకుని అందమూ ఆస్తీ వుండికూడా ఉద్యమంలో చేరి ఫాక్షన్ల మధ్య ఐక్యతకోసం ప్రయత్నించిన మాయంగర్ అనే యువకుణ్ణి హత్య చేసారు. అటు ప్రభుత్వమూ ఇటు ఫాక్షనిష్టులూ కూడా మోసే వంటి పాత ఉద్యమకారులపై నిఘా పెట్టారు. బలవంతపు వసూళ్ళకి దిగారు. దీనివలన నాగాప్రజలుకూడా ఇన్సర్జెన్సీని సమర్థిస్తున్నారని ఇండియన్ ప్రెస్ లో వార్తలొచ్చాయి. కిల్లీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్న బీహారీ యువకుడిని డబ్బు కోసం కాల్చబోతే అడ్డుపడబోయిన మోసేని కాల్చేశారు. జనం మధ్యలో నిర్భీతిగా కాల్పులు జరిపి తుపాకి భుజానికి ఆనించుకుని వెళ్ళిపోయారు.

ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నింటినీ ఒక చోటికి తెచ్చి వాళ్లమధ్య అవగాహన కల్పించే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యల కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఈ కన్నీటి కల్లోల ప్రాంతంలో శాంతి ప్రసరించే ఛాయలు కనపడుతున్నాయని ముందుమాటలో అంటుంది ఈస్టరీన్. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన మోసే తన బంధువు దే దేననీ సంఘటనలన్నీ యదార్థాలనీ చెప్పింది. ఇందులో హిమ్మత్ కూడా నాగాల్యాండ్ లో పనిచేసి వెళ్ళిన ఒక కమాండెంట్ కు పేరు మార్పేననీ అన్నది. ఈ పుస్తకం చివర పొందుపరిచిన నికేతు ఇరాలు ప్రసంగంలో ఇట్లా అంటాడు, “సార్వభౌమత్వం కాకుండా మరేదైనా అంగీకరించడానికి నాగాలు సిద్ధంగా వుంటే డిల్లీతో ఒక గౌరవనయమైన అంగీకారయోగ్యమైన అవగాహనకు రావడం కష్టం కాదు.అది ఇరువైపులకు మంచిది….ఇప్పుడు చీలిపోయిన ఉద్యమ గ్రూపులన్నీ ఒక అవగాహనకు వచ్చి డిల్లీతో ఒక ఒప్పందానికి రావడం మంచిది తరవాతేం చెయ్యాలో భవిష్యత్తు తరాలు నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు కావాల్సింది శాంతి, అభివృద్ధి.”

యుద్ధాలు నిర్ణయించేది సైనికులూ కాదు ప్రజలూ కాదు రాజకీయ నాయకులు, అని అర్థం అయింది వాళ్లకి.

“బిట్టర్ వర్మ్ వుడ్” అనేది ఘాటైన వాసన కల ఆకులున్నఒక మొక్క మనకు దొరికే దవనం, మాచిపత్రి జాతికి చెందినది. దీని పసరు గాయాలను మాన్పుతుంది. అంతేకాదు ఒక రెమ్మ జేబులో పెట్టుకున్నా దుష్ట శక్తులని అడ్దగించే రక్షరేకులా పనిచేస్తుంది. మనం కూడా దుశ్చర్యలకు పాల్పకుండా చేస్తుందని నమ్ముతారు నాగాలు. “ఇపుడదే కావాలి మనకి,” అంటుంది రచయిత్రి. ఈ శీర్షిక ఒక మెటఫర్. ఉత్సుకతతో చదివించే నవల.