ఇల్లంతా..

 

 

-పాలపర్తి జ్యోతిష్మతి
~

ఇల్లంతా గందరగోళంగా ఉంది
నిద్ర కుపక్రమించినప్పుడు వెలిగించుకున్న చిన్న దీపాలు
పగలంతా వెలుగుతూనే ఉన్నాయి
రాత్రంతా కప్పుకున్న దుప్పట్లు
మడతలకు నోచుకోక గుట్టలుగా పడి ఉన్నాయి
ఎవరూ లేకపోయినా
గదుల్లో ఫాన్లు తిరుగుతూనే ఉన్నాయి
ఖాళీ కాఫీగ్లాసులు
ఎక్కడివక్కడే దొర్లుతున్నాయి
విడిచిన బట్టలు అస్తవ్యస్తంగా
దండాలమీద వేళ్ళాడుతున్నాయి
తడితువ్వాళ్ళు ఆరేసే నాథుడికోసం
కుప్పలు కుప్పలుగా ఎదురుచూస్తున్నాయి
వార్తాపత్రికల కాగితాలు
చిందరవందరగా నేలమీద పొర్లుతున్నాయి
భోజనాల బల్లమీది ఎంగిలి మెతుకులు
తీసి అవతల పారేసేవాళ్ళు లేక ఎండిపోతున్నాయి
స్నానాలగదిలో పూర్తిగా కట్టకుండా వదిలేసిన కుళాయిలోంచి
నీళ్ళు రోజంతా కారిపోతూనే ఉన్నాయి
ఇల్లాంతా గందరగోళంగా ఉంది
జ్వరమొచ్చి అమ్మ పడకేసినవేళ
ఇల్లంతా ఎట్లా ఉంటే మాత్రం ఏం?

*

వారిజాక్షులందు…

 

పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి ప్రవేశించేటప్పటికి అమ్మ సింకు దగ్గర నిలబడి అంట్లు తోముతూ “అబద్ధాలు… అన్నీ అబద్ధాలే… అన్ని అబద్ధాలు చెప్పడానికి అసలు నోరెట్లా వస్తుందో…” అని గొణుక్కుంటోంది.

“అబ్బ! నాకావలసిన విషయం నీ కెట్లా తెలిసిందమ్మా?” అడిగాను ఆశ్చర్యంగా.

“ఎంతసేపైంది వచ్చి? నాన్న స్టేషన్ కి వచ్చారు. కనిపించారా, చూసుకోకుండా నీ అంతట నువ్వే వచ్చేశావా?” విసుగ్గా అడిగింది అమ్మ నా మాటలు పట్టించుకోకుండా.

“నేను తోముతాలేమ్మా” అంటూ రంగి గొంతు వినిపించడంతో అమ్మ వెనక్కి తిరిగి రంగివైపు కోపంగా ఒక చూపు చూసి విసురుగా చేతిలో ఉన్న గిన్నెని సింకులోకి విసిరేసి చేతులుకూడా కడుక్కోకుండానే వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. రంగి తలవంచుకుని సింకుదగ్గరికి వచ్చి అంట్లు దొడ్లో వేసుకుని తోమడానికి కూర్చుంది. రంగి దొడ్లోకి వెళ్ళగానే అమ్మ వంటింట్లోకి వచ్చింది. స్థాణువులా నిలబడిపోయిన నేను తేరుకుని “నాన్నే తీసుకొచ్చారు. బయట వరండాలో కూర్చుని పేపరు చూస్తున్నారు” అన్నాను ఇందాకెప్పుడో అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.

“మొహం కడుక్కురా, కాఫీ కలుపుతాను” అంది అమ్మ సీరియస్ గా.

నేను మొహం కడుక్కుని వచ్చేటప్పటికి అమ్మ కాఫీ కలిపి నాలుగు గ్లాసుల్లో పోసింది. నన్ను చూడగానే ఒక గ్లాసు ఎత్తి ఠప్ మని గట్టుమీద పెట్టి “అది తీసుకెళ్ళి రంగికిచ్చి నువ్వొకటి తీసుకో” అని చెప్పి మిగతా రెండు గ్లాసులు తీసుకుని వంటింట్లోంచి బయటికి వెళ్ళింది.

నేను దొడ్లో కెళ్ళి “ఇదుగో రంగీ కాఫీ” అన్నాను.

రంగి తలెత్తి నావైపు చూసి, నా చేతిలోంచి కాఫీ గ్లాసు తీసుకుని ఠక్కున తల వంచేసుకుంది.

నేను నా కాఫీగ్లాసు తీసుకుని వెళ్ళేటప్పటికి అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చి వచ్చి హాల్లో కూర్చుంది.

“ఏంటమ్మా, ఎవరిమీద అంత కోపం?” అడిగాను అమ్మ పక్కనే కూర్చుంటూ.

“ఆ రంగి… చెప్పేవన్నీ అబద్ధాలే…” ఉక్రోషంగా అని ఆయాసపడుతూ ఆగింది అమ్మ.

“అంత ఆవేశ పడకమ్మా! అసలేం జరిగిందో చెప్పు” అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అడిగాను.

chinnakatha

“నిన్నా మొన్నా రాలేదు. అంతకు ముందురోజు మధ్యాహ్నం తొందరగా వచ్చి గబగబా పని చేస్తుంటే ‘ఏంటే అంత తొందర ‘ అని అడిగాను. ‘పిల్లాడికి జ్వరమొచ్చింది, ఒళ్ళు పేలిపోతోంది. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి ‘ అని హడావిడి పడింది. అప్పటికీ నా కనుమానమొచ్చి అడగనే అడిగాను ‘రేప్పొద్దున్న వస్తావా, ఎగర గొడతావా?’ అని. ‘ఎందుకు రానమ్మా! డాక్టరుకు చూపించి బిళ్ళలేస్తే పొద్దుటికి జ్వరం తగ్గదా ఏంటి?’ అంటూ నమ్మబలికింది. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరి వెళ్ళు ‘ అంటే ‘డాక్టరు వెళ్ళిపోతే కష్టమమ్మా, పొద్దున్నే చీకటితోటే వచ్చేస్తాగా’ అంటూ నన్నింకో మాట మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయింది. గవర్నమెంటు హాస్పిటలుకు వెళ్తారు కాబోలు” చివరి మాటలో వెటకారం రంగరించి అంది అమ్మ.

ఇందాక రంగి కళ్ళలో కనిపించిన సన్నటి నీటిపొర గుర్తుకొచ్చి “పాపం, పిల్లాడి కెట్లా ఉందో. ఆ మాటైనా అడక్కుండా నువ్వు దానిమీద చిరాకు పడ్డావు” సానుభూతిగా అన్నాను.

“జ్వరమూ కాదు పాడూ కాదు. అన్నీ అబద్ధాలే. ఎప్పుడూ ఇట్లాంటి అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. తెలిసీ నేనే పిచ్చిమొహంలా ప్రతిసారీ నమ్మి మోసపోతుంటాను” అక్కసుగా అంది అమ్మ.

‘ఊ! అబద్ధం దగ్గరి కొచ్చింది అమ్మ. ఇంక నేను మొదలుపెట్టాలి ‘ అనుకుంటుండగానే అమ్మే అడిగింది “ఇందాక ‘నా క్కావలసిన విషయం నీ కెట్లా తెలిసింది ‘ అన్నావు, ఏంటది?” అని.

“నేను యూనివర్సిటీలో ‘మానవ జీవితంలో అబద్ధం పా త్ర ‘ అన్న విషయం మీద పత్రం సమర్పించాలి. రంగి చెప్పేవన్నీ అబద్ధాలే అని నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా! అందుకే నిన్ను, రంగిని ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చాను.”

“నన్నేం ఇంటర్వ్యూ చేస్తావులే! నాకేం చేతనవుతుంది దానిలా గోడకట్టినట్టు అబద్ధాలు చెప్పడం. దాన్ని చెయ్యి ఇంటర్వ్యూ… ఇప్పుడే పలకరించకు. పని మానేసి నీతో కబుర్లు పెట్టుక్కూచుంటుంది. ఇంటికెళ్ళేముందు మాట్లాడు” అంది అమ్మ.

రంగి పని పూర్తిచేసుకుని వెళ్ళే సమయానికి గేటుదగ్గర కాపలాకాసి పలకరించాను “ఏం రంగీ! పిల్లాడి కెట్లా ఉంది?” అంటూ.

“సుమారుగా ఉందమ్మా. ఇప్పుడెల్లి గంజి కాచి పొయ్యాలి” అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

“అదంతే, దొరకదు” అంది అమ్మ నా వెనక నిలబడి.

“సరే! వాళ్ళింటికే వెళ్ళి మాట్లాడి వస్తాను. నాక్కావలసిన సమాచారం నేను సేకరించుకోవాలి కదా” అన్నాను.

“నాన్న మిల్లు కెళ్ళాక ఇద్దరం వెళదాంలే. ఒక్కదానివే ఏం వెళ్తావు” అంది అమ్మ.

“నువ్వొస్తే చెప్పే విషయాలు కూడా చెప్పదు. ఈ ఊరేం నాకు కొత్తా? ఏం ఫర్వాలేదు. వెళ్తాన్లే” అని అమ్మకి సమాధానం చెప్పి తయారవడం మొదలుపెట్టాను.

పనులన్నీ పూర్తి చేసుకుని, టిఫిను చేసి, రంగివాళ్ళ ఇంటికి దారి అమ్మనడిగి సరిగ్గా తెలుసుకున్నాను.

“చీటికిమాటికి అబద్ధాలు చెప్పకుండా దాన్ని కాస్త సంస్కరించు” నిరసనగా అంది అమ్మ నేను బయలుదేరుతుంటే.

“ప్రయత్నిస్తాను” అన్నాను అమ్మ చెప్పేదాంట్లో ఎంత నిజముందో అని ఆలోచిస్తూ.

నన్నంత దూరంలో చూస్తూనే ఎదురొచ్చింది రంగి “ఏంటమ్మాయిగారూ, ఇటొచ్చారు?” అంటూ.

“నీతో మాట్లాడాలని, మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను” అన్నాను.

రంగి నన్ను వాళ్ళ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోమని తనూ నా ఎదురుగా నేలమీద కూర్చుంది.”వీడేనా నీ కొడుకు?” అన్నాను గుడిసెముందు చిన్న కారుబొమ్మని నెట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లాణ్ణి చూస్తూ.

“అవునమ్మా” అంది రంగి తల దించుకుని.

అంతలో వాడు నా దగ్గరికొచ్చి కారుబొమ్మని నా మొహమ్మీదికి పట్టుకుని “మా అత్త కొనిచ్చింది” అన్నాడు.

“మట్టిలో ఆడుతున్నావేంటి? జ్వరం తగ్గిందా?” అనడిగాను వాణ్ణి.

“నాకు జొరమేంటి? మా అత్తోళ్ళ ఊరెళ్ళొచ్చాం” అన్నాడు వాడు నావైపు, రంగివైపు మార్చి మార్చి చూస్తూ.

“ఫోరా! నువ్వవతలికి ఫో” అంటూ వాణ్ణి కసిరికొట్టింది రంగి. వాడు దూరంగా వెళ్ళి మళ్ళీ తన ఆట మొదలుపెట్టాడు.

‘రంగి అబద్ధం చెప్పింది ‘ అని అమ్మ అన్న మాట మీద నాకు అప్పటిదాకా ఉన్న అనుమానం తొలగిపోయింది.

“అబద్ధం ఎందుకు చెప్పావు?” సూటిగా రంగిని అడిగాను. ఏం మాట్లాడకుండా కూర్చుంది రంగి.

“నిజం చెప్పు రంగీ! నేను నిన్నేమీ అనను. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పడానికి నీకు మనసెట్లా ఒప్పింది?” బాధగా అడిగాను.

“ఏం చెప్పమంటారమ్మా? మా ఆడబిడ్డ కూతురు పెద్దపిల్లైతే పంక్చను కెళ్ళాం…”

“పిల్లాడికి జ్వరమని చెప్పావు. పొద్దున్నే చీకటితో వస్తానని చెప్పావు. అన్ని అబద్ధాలు చెప్పే బదులు ‘ఊరెళ్ళాలి, రెండు రోజులు రాను ‘ అని చెప్తే అమ్మ కాదంటుందా?” రంగి మాట పూర్తి కాకుండానే అడ్డుపడ్డాను.

రంగి నావైపు విచిత్రంగా చూసింది. “ఎందు క్కాదనరమ్మా? మా అక్క కూతురు పెద్దదైనప్పుడు మీ రన్నట్టే అంతా నిజమే సెప్పాను. ‘రెండురోజులెల్లి ఏంసేత్తావు? ఓపూటెల్లి ఎంటనే వచ్చెయ్’ అన్నారమ్మా అమ్మగారు. ‘పంక్చను, పంక్చను అంటూ అందరూ అట్టహాసాలు నేర్సుకున్నారు ‘ అంటూ తీసిపారేసి మాట్టాడారమ్మా. ఏమ్మా! మాకు మాత్రం సరదా లుండవా? ఆళ్ళు రెండురోజు లుండేట్టు రమ్మని పిలిత్తే ఓ పూటుండి దులిపేసుకుని ఎట్టా వచ్చేత్తామమ్మా?”

“రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని.రెండు రోజులు ఎందుకున్నావు అని కాదు.”

“అమ్మగా రేం తక్కువ కాదమ్మా. పసిగట్టేశారు. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరేసి ఎల్లు’ అన్నారు. ఏడేల్లబట్టి సేత్తున్నాను మీ ఇంట్లో పని. పనికి మాట్టాడుకున్నప్పుడు పొట్టుపొయ్యికి పొట్టుకూరేపని సెప్పలేదు అమ్మగారు. అయినా పెతిరోజూ ఆ పనికూడా సేత్తూనే ఉన్నాను. నాకు తెలీకడుగుతాను, ఈ రోజుల్లో పొట్టుపొయ్యి వాడేదెవరమ్మా? మిల్లునించి పొట్టు ఊరికే వస్తుంది, కూరడానికి నేనున్నానని కాకపోతే. అప్పటికీ అమ్మగారు ఇబ్బంది పడతారు, ఒకడుగు ముందొచ్చి పొయ్యిపని సేసేద్దామనే అనుకున్నానమ్మా. నాకు ఇంట్లో పని తెమలకపాయె.”

 

“అబ్బా, రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని. పొట్టుపొయ్యిలో పొట్టెందుకు కూరలేదు అని కాదు” కాస్త విసుగ్గా అన్నాను.

“రేప్పొద్దున్న రాను అని సెప్పాననుకోమ్మా, పొట్టుకూరేసిపో అనడమే కాదు, రేప్పొద్దున్నవార ఇప్పుడే ఇల్లు తడిగుడ్డ పెట్టెల్లు అంటారమ్మా. ఎవరైనా ఒకేరోజు రెండుపూటలా ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటారామ్మా?”

“రంగీ, ఇల్లు తడిగుడ్డ ఎందుకు పెట్టలేదు అని కాదు నేనడిగింది, అబద్ధమెందుకు చెప్పావు?” కాస్త కోపంగా అన్నాను.

“పోనీ అమ్మగారి మాటెందుకు తీసిపారెయ్యాలి, అన్నిపనులూ సేసిపెట్టే ఎల్దామంటే ఆలెస్సమైపోద్ది. రైలెల్లిపోద్ది.”

“పిల్లాడికి జ్వరమని అబద్ధమెందుకు చెప్పావు?” అసహనంగా అరిచాను.

“డాక్టరెల్లిపోతారు, తొరగా ఎల్లాలి అని సెప్పబట్టే రైలందుకున్నామమ్మా. రైలెల్లిపోద్ది, తొరగా ఎల్లాలి అని సెప్తే అమ్మగారు ‘రైలెల్లిపోతే బస్సులో ఎల్లండి ‘ అంటారమ్మా. రైలు చార్జీ లెక్కడ? బస్సు చార్జీ లెక్కడ? రైలు టేసను మాకు దగ్గర. బస్టాండుకు పోవాలంటే ఆటో ఎక్కాల. మా ఆడబిడ్డోల్లూల్లో కూడా టేసనే దగ్గరమ్మా. బస్సులో ఎల్తే మల్లీ అక్కడకూడా ఆటో ఎక్కాల. ఉన్న డబ్బంతా బస్సులకి, ఆటోలకే పోస్తే… పిల్లచేతిలో ఏదేనా పెట్టాల గదమ్మా. మాకు మాత్రం ప్రేమలు, అబిమానాలు ఉండవా?”

‘తనని అబద్ధం చెప్పే పరిస్థితుల్లోకి అమ్మే నెడుతోంది’ అని చాలా తెలివిగా తెలియజేస్తోంది రంగి  అనిపించింది నాకు. ఏది ఏమైనా ‘అబద్ధం చెప్పడం తప్పు ‘ అన్న పాఠం రంగికి నేర్పాలన్న పట్టుదలతో “అబద్ధమెందుకు చెప్పావు అని అడిగినందుకు చాలా చాలా చెప్పావు రంగీ. కానీ అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా? ఇప్పటిదాకా అబద్ధా లాడకూడదు అని ఎవరూ నీకు చెప్పలేదా?” అని అడిగాను.

“మా ఇళ్ళకాడ గుళ్ళో పురానకాలచ్చేపం సెప్పే పంతులుగారు సెప్తూనే ఉంటారమ్మా ‘అబద్దమాడ్డం తప్పు, పాపం’ అని. ఆ పంతులుగారే ఇత్త… పేన… మాన… ఇంకేందో… అప్పుడంతా అబద్దమాడితే తప్పులేదని కూడా సెప్పారమ్మా.”

‘బాబోయ్! భాగవతాన్ని తీసుకొచ్చేసింది. ఇది సామాన్యురాలు కాదు ‘ అనుకున్నాను. ఏం మాట్లాడాలో అర్థంకాక దిక్కులు చూస్తుంటే తనే చెప్పడం మొదలుపెట్టింది రంగి.

“నేను అబద్దమాడితే అబద్దమెందుకాడావ్, అబద్దమెందుకాడావ్ అని ఇన్ని సార్లు అంటున్నారు గానమ్మా… నేను అంట్లు తోమడం పూర్తిచేసి, తోమినచోటంతా కడిగేసి ‘అమ్మయ్య, పనైపోయింది, ఇంక ఇంటి కెల్లొచ్చు ‘ అనుకుంటుంటే అమ్మగారు ‘ఒక్క గిన్నుంది, అదొక్కటీ తోమిచ్చేసెల్లవే’ అంటారమ్మా. గిన్నె ఒక్కటే గానమ్మా, దాంతోబాటు పళ్ళేలు, గెంటెలు, గలాసులు కూడా ఏత్తారమ్మా. మరప్పుడు అమ్మగారు నిజం సెప్పినట్టా? అబద్దం సెప్పినట్టా?”

కాస్త ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మళ్ళీ ఎత్తుకుంది రంగి. “పనంతా పూర్తి సేసుకుని గేటుదాకా ఎల్లిపోయాక ఎనక్కి పిలుత్తారమ్మా అమ్మగారు. ‘ఉల్లిపాయలు అయిపోయాయి. కాస్త తెచ్చిపెట్టి ఎల్లవే’ అంటారమ్మా. లోపలికెల్లి సంచి, డబ్బులతోబాటు పది సరుకులు రాసిన పట్టీ తెచ్చి చేతిలో పెడతారమ్మా. అప్పు డమ్మగారు అబద్దం ఆడినట్టు కాదామ్మా?”

రంగి లాజిక్ చూసి బిత్తర పోయాన్నేను. ఆ షాక్ లోంచి నేను బయటపడేలోపే చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

“ఏం బంగమైందని అమ్మగారు ఆ అబద్దాలాడతన్నారమ్మా?” సూటిగా నన్నే చూస్తూ ప్రశ్నించింది రంగి.

రంగిని నేను చేసిన ఇంటర్వ్యూతో నా పేపరు ఎటో ఎగిరిపోయింది.

‘ఇప్పుడు నేను సంస్కరించవలసింది ఎవర్ని?’ అన్న ప్రశ్న నా ముందు కొండలా నిలబడింది.

ఈనాటి అవసరం ‘రాగమయి’

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

స్వాతిశయచిత్తుడైన మగాడు పచ్చటి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకో సంకల్పించగా, ఆ సంసారాన్ని చక్కదిద్దడానికి ఒక  స్త్రీమూర్తి పడే ఆరాటమే ఈ ‘రాగమయి’ కథ.

పెళ్ళయిన నెలకే పుట్టింటికి చేరిన జానకిచేత – ఎవరూ, ఏవిధంగానూ జరిగినదేమిటో చెప్పించలేక పోయారు. ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నాలు ఆ ఇంటి మగవారెవరూ చేసిన దాఖలాలు కనపడవు.

ఉమ – తన బహిఃప్రాణాలుగా భావించే పినతల్లి కొడుకు రాజశేఖరానికి, ఆడబడుచు జానకికి వివాహం జరిపించడానికి మధ్యవర్తిత్వం నెరిపి, సంబంధం కుదిర్చిన కారణంగా – జానకి నూరేళ్ళబ్రతుకూ బూడిదపాలు కావడానికి ఆమెనే బాధ్యురాలిని చేశాడు మరిది శేషగిరి. పరస్పర నిందారోపణల క్రమంలో భర్తతో, అత్తగారితో ఘర్షణపడి తాను కూడా తన పుట్టింటికి చేరుకున్న ఉమ, నెలరోజుల తరువాత జానకి నుంచి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం అందుకుని, వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేకుండా తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకుని పిన్నిగారింటికి వెళుతుంది.

ఇంగ్లీషు చదువులు చదవలేదని రాజశేఖరంపట్ల శేషగిరికి ఉన్న చిన్నచూపును హేళన చేస్తూ, కోడలి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆదినారాయణమూర్తిగారు “తెలుగులో అతను చదవని కావ్యం లేదు….. సంస్కృతంలో పంచకావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు” అంటూ అల్లుడి గొప్పతనాన్ని పొగిడితే –

“నీవేదో గొప్ప పండితుడవనుకుంటున్నావ్….. నిజానికి నీవంటి మూర్ఖుడు ఇంకొకడు లేడు….. నువ్వు చదువుకున్నావనే అనుకున్నానుకానీ నీ ఛాందసపు చదువు నిన్నిలా ఛాందసుణ్ణి చేసి విడుస్తుందనుకోలేదు” అంటూ అన్నమీద మండిపడుతుంది ఉమ. ఇదొక శిల్ప విన్యాసం.

ఉమ నోటిద్వారా పలికించిన సంభాషణలు, ఆమె వ్యక్తిత్వ వర్ణనలు ఆ పాత్రని సమున్నత శిఖరం మీద నిలబెడితే, ఆడబడుచును కూతురుగా ఎంచి, న్యాయం, ధర్మం పక్షాన నిలబడి పోరాటం సాగించిన ఉమ చివరికి “తను తన జీవితంలో ఎదురుపడినవారిలో ఎవ్వరితోనైనా ఎప్పుడో ఒకప్పుడు పోట్లాడకుండా విడిచిపెట్టిందా? తను ప్రతివారితోనూ ఇలా పోట్లాడటానికి ఏం హక్కు వుంది? వాళ్ళు సంబంధాలు తెంచుకోలేక పడి వుంటున్నారు కాని వాళ్ళు నిజంగా తనకు బుద్ధి వచ్చేటట్టు చేస్తే తను చేసేదేముంది? చివరకు గయ్యాళిగంపనే బిరుదు ఏనాడో ఒకనాడు తనమీద పడి ఊరుకుంటుంది. తను చేతులారా బంధువులూ, అత్తమామలూ, చివరికి భర్త మనసుకూడా విరుచుకుంటోంది” అనుకుని రోదించడం కథలోని అతి పెద్ద విషాదం.

ఉమ సేవలు లేందే ఆ ఇంట్లో గడవదన్న సంగతి, ఉమ పుట్టింటికి ప్రయాణమయ్యే సందర్భంలో మామగారు చెప్పనే చెప్పారు – “…..మీ అత్త ముసలిది….. ఇంక మీ ఆయన పరమ సోమరి….. వీళ్ళిద్దరూ క్షణం వేగలేరు. అందుచేత వీలైనంత వేగిరం బయలుదేరిరా” అని.

నిజానికి గృహవాతావరణంలో శారీరకంగా, మానసికంగా ఎవరెంత నొప్పించినా, మమకారాల్ని చంపుకోలేక పడి ఉండేది ఆడదే. కానీ, తానేదో అఘాయిత్యం చేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా పడి ఉంటున్నట్లు భావించుకుని, తనను తాను నిందించుకునే మానసికదౌర్బల్యంలోకి ఆడదాన్నినెడుతున్నాడు ప్రతి అవసరానికీ ఆమెపైనే ఆధారపడే మగాడు.

శేషగిరి – ఇద్దరు పిల్లల తల్లైన వదినను ‘ఆడపెత్తనం’ అని ఈసడించడంగానీ, శేఖరం – ‘స్త్రే బుద్ధిః ప్రళయాంతకః’ అంటూ తన భార్యను తృణీకరించిన తమ్ముణ్ణి దండించవలసింది పోయి భార్యపైనే చెయ్యి చేసుకోబోవడంగానీ, రాజశేఖరం – చేసిన తప్పేంటో చెప్పకుండా భార్యను పుట్టింటికి పంపేసి, అత్తవారు పండక్కి పిలిచినా వెళ్ళక, భార్యను మానసిక హింసకు గురిచెయ్యడంగానీ, పురుషాహంకారానికి నిదర్శనాలే.

భర్త పట్ల చెల్లెలి మనసు విరిచేసి ఆమె సంసారాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న శేషగిరిని చిన్నక్క వెనకేసుకు రావడమైనా, కొడుకు దొంగవేషాలను దాచిపెట్టి, తానుగా కొడుకు విషయంలో అబద్ధాలాడి గిరిజమ్మగారు చేజేతులా శేషగిరిని చెడగొట్టడమైనా, కుటుంబవ్యవస్థలో పురుషాధిక్యతను స్థిరీకరించే, పెంచి పోషించే చేష్టితాలే.

జానకి రాజశేఖరంల దాంపత్యజీవనం గాడిన పడటంతో కథ సుఖాంతమైనా, ఉమ పాత్ర మనల్ని కలవరపెడుతూనే ఉంటుంది, గుండెను బరువెక్కిస్తూనే ఉంటుంది.

జానకి పుట్టింటికి రావడానికి కారణమేమిటి? అన్న ప్రశ్న పాఠకులను కథ మొదట్నించి చివరిదాకా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని గొప్ప శైలీనైపుణ్యంతో కథలో హంసబకోపాఖ్యానాన్ని చొప్పించడంద్వారా సూచిస్తారు మాస్టారు. ఈ సందర్భంలో ఉమ, రాజశేఖరంలమధ్య రసవత్తరమైన, అర్థవంతమైన వాదోపవాదాల్ని నడిపించారు. ఒక రోజు కొంత సంభాషణ జరిగాక, మర్నాడు ఉమ ఆ వాదాన్ని కొనసాగించినప్పుడు “అయితే ఈ యుక్తులన్నీ ఆలోచించటానికి ఒక రాత్రీ, ఒక పగలూ పట్టిందా?” అని రాజశేఖరం వ్యంగ్యంగా అడిగితే, “లేదు, లేదు.. నెల్లాళ్ళూ … ఏకాంతంగా మడతకుర్చీలోపడి ఆలోచిస్తేనేగాని స్ఫురించలేదు” అని ఉమ చెప్పిన సమాధానం ద్వారా మగాడికి ఎగతాళిగా కనిపించే విషయాలు స్త్రీలను రోజులతరబడి మనోవేదనకు గురిచేస్తాయన్న కఠోర వాస్తవాన్ని తెలియజేస్తుంది.

ఇటువంటి మార్మిక సంభాషణలు కథంతా పరుచుకుని పాఠకుల ఊహాశక్తికి పదును పెడతాయి. మళ్ళీమళ్ళీ చదివేకొద్దీ కొత్తకొత్త అర్థాలు గోచరిస్తాయి.

తల్లిదండ్రులను, తోడబుట్టినవారిని వదిలి మూడుముళ్ళ బంధంతో అత్తవారింట అడుగుపెట్టిన స్త్రీ ఆ ఇంటివారినుంచి ఎటువంటి ప్రేమాభిమానాలను కోరుకుంటుందో, కోడలితో అత్తింటివారికి ఏవిధమైన అనుబంధం ఉండాలో తెలియజేసే గొప్ప కథ రాగమయి.

కారామాస్టారు ఈ కథ రాసే కాలానికి స్త్రీవాదం అన్న పేరు పుట్టి ఉండకపోవచ్చును గానీ, గృహచ్ఛిద్రాలలో స్త్రీలపై జరిగే మానసిక దాడిని విపులంగా చర్చించిన స్త్రీవాద కథే ఇది. కథ రాసిన కాలంనుండి ‘నేనెందుకు రాసేను?’ రాసేదాకా కూడా తెలుగు సాహిత్యంలో స్త్రేవాద భావజాలం ప్రవేశించకపోవడంవల్ల కారామాస్టారు ఈ కథని ఏ ప్రయోజనం సాధించలేని కథగా పేర్కొని ఉండవచ్చు. అంతమాత్రాన ఎప్పటికీ ఇది ప్రయోజన రహితమైన కథగానే నిలిచిపోతుందనలేం. నాటినుంచి నేటిదాకా కుటుంబ వాతావరణంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే ఉన్నాయి. పరిష్కారమార్గాలు చర్చనీయాంశాలే అవుతున్నాయి. అందువల్లే ‘ఈనాటి అవసరం రాగమయి.’

-పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపాలపర్తి జ్యోతిష్మతి 17 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2001లో వి.ఆర్.ఎస్. తీసుకొన్నారు. కధలంటే ఇష్టంతో చిన్నప్పటినుండి వార, మాస పత్రికల్లో వచ్చే కధలు చదవటం అలవాటు చేసుకొన్నారు. ఇప్పటి వరకు 2006లో ‘కాకి గోల’ కవితా సంకలనం, 2014లో ‘సుబ్బలక్ష్మి కధలు’ కధా సంకలనం వచ్చాయి. ఈ రెండు పుస్తకాలు kingie.com లో దొరుకుతాయి. తన మనోభావాలను పదిమందితో పంచుకోవడానికి రచనా వ్యాసాంగాన్ని మాధ్యమంగా భావిస్తున్నానని అంటున్నారు. జ్యోతిష్మతికి బీనాదేవి అభిమాన రచయిత్రి.

వచ్చేవారం ‘ఇల్లు’ కధ గురించి నల్లూరి రుక్ష్మిణి పరిచయం

“రాగమయి” కథ ఇక్కడ:

గుర్రపుకళ్ళెం

chinnakatha 

అనగనగా ఒక ఊళ్ళో ఒక మనిషి. అతనికొక బండి, బండికొక గుర్రం, గుర్రానికొక కళ్ళెం ఉన్నాయి.

మనిషి పొద్దస్తమానం బండికి గుర్రాన్ని కట్టి, బండిలో జనాన్ని, వస్తువుల్ని ఎక్కించుకుని ఒకచోటినించి మరోచోటికి చేరవేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. సంపాదించిన డబ్బు దాచుకుంటున్నాడు. కానీ గుర్రానికిమాత్రం సరిగా తిండి పెట్టట్లేదు. బలమైన ఆహారం లేక, చాకిరి ఎక్కువై గుర్రం వేగంగా పరుగెత్తలేక పోతోంది. దాంతో కొరడా దెబ్బలు ఎక్కువయ్యాయి. దానికితోడు నోట్లో కళ్ళె మొకటి, ఇబ్బందిగా. గుర్రానికి జీవితం అస్సలు నచ్చలేదు.

ఒకరోజు గుర్రం అతన్ని అడిగిందిబండబ్బాయ్! బండబ్బాయ్! నన్ను ఉపయోగించుకుని నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావే! నాకు కడుపు నిండా తిండి పెట్టరాదా?” అని.

అప్పుడు అతను! ఎన్ని డబ్బులు వచ్చినా నాకు, నా కుటుంబానికి తిండి ఖర్చులకే చాలట్లేదు. ఉన్నదాంట్లోనే నీకూ ఏదో కాస్త పెడుతున్నాను. సరిపెట్టుకోఅన్నాడు.

రోజంతా గుర్రం పరుగెత్తుతూ, పరుగెత్తుతూ ఆలోచించింది, ఆలోచించింది. చాకిరి తప్పించుకుని, సుఖంగా జీవించే మార్గం అన్వేషించింది. చీకటి పడే వేళకి గుర్రం బండిని తిరగేసి, కట్లు తెంచుకుని పారిపోయింది.

బండి లాగే బాధ తప్పించుకున్నాను. ఏదో ఒక ఉపాయంతో కళ్ళేన్ని కూడా వదుల్చుకో గలిగితే నేను చాలాసతోషంగా జీవించ గలుగుతానుఅనుకుంటూ గుర్రం పరుగెత్తుతోంది. అట్లా వెళ్ళివెళ్ళి, తెల్లవారేటప్పటికి అడవికి చేరింది.

అడవిలో జంతువులన్నీ ఒకచోట విచారంగా కూర్చుని ఉన్నాయి. గుర్రాన్ని చూడగానేఎవరు నువ్వు? ఇక్కడి కెందుకు వచ్చావు? ఎక్కడినించి వచ్చావు? నీ నోట్లో అదేంటి? నోట్లో అది పెట్టుకుని గడ్డి ఎట్లా మేస్తావు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి.

నేను పట్నంలో బండి లాగే గుర్రాన్ని. మనుషులు పెట్టే హింస భరించలేక పారిపోయి వచ్చాను. నా నోట్లో ఉన్న దీన్ని కళ్ళెం అంటారు. ఇది ఉన్నా గడ్డిమెయ్యడానికి నాకేం ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని పెట్టుకోవడం నా కిష్టం లేదు. ఎట్లాగైనా దీన్ని వదుల్చుకోవాలిఅని జంతువుల ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పి గుర్రంమీరంతా అందమైన అడవిలో స్వేచ్చగా తిరుగుతూ ఆనందంగా ఉంటారనుకున్నాను. పొద్దున్నే ఇట్లా కూర్చున్నారేంటి?” అని అడిగింది.

అడవికి రాజు ఒక సింహం. రోజుకొక జంతువు దానికి ఆహారంగా వెళ్ళాలి. అట్లా వెళ్ళడం మా కెవరికీ ఇష్టం లేదు. ఎవరికిమాత్రం చచ్చిపోవడం ఇష్టంగా ఉంటుంది? కానీ ఎదురుతిరిగితే విచక్షణ లేకుండా అందరినీ చంపేస్తుందన్న భయంతో అది చెప్పినట్లే నడుచుకుంటున్నాం. సింహం బాధ తప్పించుకునే ఉపాయం ఆలోచిస్తూ ఇట్లా కూర్చున్నాంఅని చెప్పాయి జంతువులన్నీ ఏడుపు గొంతుతో.

ఇంతలో సింహం అక్కడికి వచ్చిఏమే కుందేలూ! ఎండబడిపోతుంటే ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆకలి దంచేస్తోంది. పూర్వం మా ముత్తాతని బావిలో పడేసినట్లు నన్నూ మట్టుబెట్టాలని చూస్తున్నావా?” అని గర్జించింది.

కాదు మహారాజా! అడవిలోకి కొత్త నేస్తం వస్తే మాట్లాడుతున్నాం. దీనికి మన అడవిలో ఆశ్రయం కావాలటఅంటూ గుర్రాన్ని చూపించింది కుందేలు. అంతటితో ఊరుకోకుండాచూశారా మహారాజా! అడవిలోని మిగతా జంతువుల్లా కాకుండా కొత్త జంతువుకు నోట్లో ఏదో ఆభరణం ఉంది. ‘రాజు మీరైతే ఆభరణం వేరే జంతువు పెట్టుకోవడమేంటి?’ అనిపించినువ్వు అడవిలో ఉండాలంటే ఆభరణం తీసి మా రాజుగారికి బహుమతిగా ఇవ్వాలని సంప్రదింపులు జరుపుతున్నాంఅంది.

సంప్రదింపులు జరిపేదేంటి? ఆభరణం నాకే చెందాలి. తక్షణం దాన్ని గుర్రం నోటినించి తొలగించి నాకు తగిలించండిఅని ఆజ్ఞాపించింది మృగరాజు.

గుర్రం సూచనల ననుసరించి జంతువులన్నీ కలిసి గుర్రం నుంచి కళ్ళేన్ని విడదీసి సింహం నోటికి తగిలించాయి.

నేను ఆభరణం అలంకరించుకున్న శుభసందర్భంగా ఇవాళ్టికి నిన్ను వదిలేస్తున్నాను. రేపు తెల్లవారే టప్పటికి నా గుహ ముందుండాలిఅని కుందేలుకి చెప్పి వెళ్ళిపోయింది సింహం.

అమ్మయ్య!” అనుకున్నాయి గుర్రము, కుందేలు ఒకేసారి.

ఆకలి మాట మర్చిపోయి కొత్త ఆభరణాన్ని అలంకరించుకున్న సంతోషంతో అడవంతా సందడి చేస్తూ తిరిగింది సింహం రోజంతా. మర్నాడు తెల్లవారేటప్పటికి సింహానికి ఆకలి నకనకలాడడం మొదలుపెట్టింది. కుందేలు వస్తుందేమోనని ఎదురు చూసిచూసి సింహమే వేటకు బయలుదేరింది.

నిన్న కుందేలుని తినకుండా వదిలేశానని ఇంక నాకు ఆహారంగా ఎవరూ రావక్కర్లేదు అనుకుంటున్నారా? పిచ్చివేషాలు వేశారంటే అందర్నీ ఒకేసారి చంపిపారేస్తానుఅని అరిచింది ఒకచోట చేరిన జంతువుల్ని చూసి.

జంతువులు వినయంగా చేతులు కట్టుకునిమహారాజా! మీరు కొత్త ఆభరణం ధరించి మరింత హుందాగా, ఉన్నతంగా కనిపిస్తున్నారు. మీకు ఆహారమయ్యే అర్హత మాకు ఉందో లేదో అని సందేహిస్తున్నాముఅన్నాయి.

అప్పుడు సింహం నోరు తడుముకుంది. ‘నోట్లో ఇది ఉంచుకుని తినడమెట్లాఅని ఆలోచించింది.

ముందు దీన్ని తొలగించండి. నా భోజనం అయ్యాక మళ్ళీ ధరిస్తానుఅంది.

అది మాటిమాటికి తీసి పెట్టుకునే ఆభరణం కాదు మహారాజా! ఒకసారి తీస్తే మళ్ళీ పెట్టడం కుదరకపోవచ్చు. మీరు మృగరాజు, అడవికి మహారాజు. ఒకసారి ఆభరణం ధరించి తీసెయ్యడం మీ హోదాకి తగదుఅంది గుర్రం.

మరి నేను ఆహారం తీసుకునే దెట్లా?” ప్రశ్నించింది సింహం.

తమ శరీరం కొత్త ఆభరణానికి ఇంకా పూర్తిగా అలవాటు పడకపోవడంవల్ల ఇబ్బందిగా ఉంది. రేపటికి అంతా సర్దుకుంటుంది. కాస్త ఓపిక పట్టండిఅన్నాయి జంతువులన్నీ ముక్తకంఠంతో.

మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా బింకంగా కాసేపు అటూఇటూ తిరిగి , ఇంక తిరిగే ఓపిక లేక గుహలోకెళ్ళి పడుకుంది సింహం.

ఆకలివల్ల రాత్రంతా నిద్ర పట్టలేదు సింహానికి. ‘రెండురోజులుగా ఆహారంలేక చాలా నీరసంగా ఉంది. మూడురోజులవార మూడు జంతువుల్ని చంపి తినాలిఅనుకుంటూ అడవిలోకి బయలుదేరింది పొద్దున్నే. కనుచూపు మేరలోనే జంతువులన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టుకోబోతే అందట్లేదు. వాటి వెంటపడి అలసిపోయిన సింహం ఏమీ చెయ్యలేక గుహలోకెళ్ళి నిరాహారంగా అలా పడుకుండిపోయింది.

ఇంతలో బండివాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. గుర్రాన్ని చూసిఎందుకిట్లా పారిపోయి అడవికి వచ్చావు? ఇంటికెళ్దాం రాఅన్నాడు.

నేను రాను. నా కిక్కడే బాగుందిఅంది గుర్రం.

ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాం. నా కుటుంబాన్ని పోషించేది నువ్వే. నువ్వు లేకపోతే మేమంతా ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతాం.”

నీ దగ్గర నాకు తిండి చాలట్లేదు. అరకొర తిండితో నీకు కావలసినంత చాకిరి నేను చెయ్యలేను.”

ఇకమీదట అటువంటి పొరపాటు జరగనివ్వను. నీ తరువాతే నా కెవరైనా. ముందు నీ కడుపు నిండాకే మా పొట్టల సంగతి చూసుకుంటాము.”

నా కళ్ళెం అడవికి రాజైన సింహం తీసుకుంది. వెళ్ళి తీసుకురా.”

ఇంకా అందమైన కొత్త కళ్ళెం కొంటానుగదా నీకు.”

ఊళ్ళో మనుషులమధ్య జీవితం నాకు నచ్చలేదు.”

ఊళ్ళో మిగిలిన జంతువులు యజమానులపట్ల విధేయతతో మెలుగుతుంటే నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు?”

వాటి గోల నా కనవసరం. నేను నా మిత్రులందరిని వదిలి నీతో రాను.”

బండివాడు కోపంగా చెర్నాకోలా జంతువులవైపు విసిరాడు. జంతువులన్నీ భయపడి చెల్లాచెదురై పోయాయి. బండివాడు బలవంతంగా గుర్రాన్ని తోలుకుని వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు మళ్ళీ సింహం ఆహారంకోసం అడవిలోకి వచ్చింది. జంతువులు పారిపోకుండా సింహం ఎదురుగా ధైర్యంగా తిరుగుతున్నాయి. ఉడుతలు, ఎలుకల్లాంటి ఆకతాయిలు సింహం నోట్లోని కళ్ళెంనుంచి కిందకి వేళ్ళాడుతున్న పగ్గాల్ని పట్టుకుని లాగి సింహాన్ని ఆటపట్టించడం మొదలుపెట్టాయి. మిగతా జంతువులన్నీ వినోదం చూసి ఆనందిస్తున్నాయి.

రేయ్! వచ్చి ఆభణాన్ని తొలగించండిరాఅంటూ గర్జించాననుకుని మూలిగింది సింహం.

గుర్రం సహాయం లేకుండా మేం దాన్ని తియ్యలేం మహారాజా!” అన్నాయి జంతువులు.

ఏదీ, ఎక్కడ గుర్రంఅంటూ మళ్ళీ మూలిగింది సింహం.

బండివాడు వచ్చి ఊళ్ళోకి తీసుకెళ్ళిపోయాడు ప్రభూ!” సమాధాన మిచ్చాయి జంతువులు.

సింహం గుర్రాన్ని వెతుక్కుంటూ ఊళ్ళో కొచ్చింది.

రోడ్డుమీద సంచరిస్తున్న గుర్రాన్ని చూసి జనం భయంతో ఇళ్ళలోకి దూరి తలుపులేసుకున్నారు. గబగబా జూ అధికార్లకు ఫోన్లు చేసారు.

చుట్టూ మెష్ తో పంజరంలా ఉన్న వ్యాన్ లో జూ అధికారులు వచ్చారు. మత్తు ఇంజెక్షన్ ని బాణానికి కట్టి అరఫర్లాంగు దూరంనుంచి సింహంమీదికి వదిలారు. సింహం నెమ్మదిగా మత్తులోకి జారింది.

జనం ఇళ్ళలోంచి బయటికి వచ్చారు. నోట్లో కళ్ళెం కలిగిఉన్న సింహాన్ని చూడడానికి ఎగబడ్డారు. వాళ్ళని అదుపు చెయ్యలేక పోలీసులు బాష్పవాయుగోళాల్ని ప్రయోగించారు. జనాన్ని పక్కకి నెట్టి సింహాన్ని బోనులో కెక్కించి జూకి తరలించారు.

వివిధ టీవీ ఛానెళ్ళవాళ్ళు, నోట్లో కళ్ళెంతో ఊళ్ళోకొచ్చిన సింహాన్ని అందరికంటే ముందు తమ ఛానెల్లోనే చూపించాలన్న ఆరాటంతో జూమీదికి దండయాత్రకి వచ్చారు. పోలీసులు వాళ్ళని జూలోపలికి రాకుండా లాఠీలతో నెట్టేస్తూ, అవసరమైతే ఒక దెబ్బ వేస్తూ శాంతిభద్రతల్ని పరిరక్షిస్తున్నారు. ‘పోలీసుల జులుం నశించాలిఅన్న నినాదాలమధ్య జూ అధికారులు నిపుణుల్ని పిలిపించి సింహం నోటినుండి కళ్ళేన్ని విజయవంతంగా విడదీసి మ్యూజియంకు పంపించారు.

జూలోనోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహంగా మృగరాజుకు విశేషమైన ఖ్యాతి లభించింది. దేశవిదేశాలనుంచి యాత్రికులు తండోపతండాలుగా సింహాన్ని చూడడానికి వస్తున్నారు.

అంతరించిపోతున్న జంతుజాతుల్ని పరిరక్షించడం మన కర్తవ్యంఅన్న నినాదంతో జూ అధికారులు అడవిలోంచి రోజుకో జంతువును పట్టుకొచ్చి ఆహారంగా సమర్పించుకుంటూ సింహాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. ఏమాత్రం ఒళ్ళలవకుండా కడుపునిండా తిండి తింటూ, బోరు కొట్టినప్పుడు సరదాగా గర్జించి జనాన్ని భయపెడుతూ సింహం అనతికాలంలోనే దిట్టంగా తయారయ్యింది.

మ్యూజియంలో ధగధగ మెరిసే ఇత్తడి పళ్ళెంలో మఖమల్ గుడ్డ పరిచి సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళేన్ని ప్రదర్శనకు ఉంచారు. రోజూ దుమ్ము దులుపుతూ, వారానికోసారి షాంపూతో తలంటు పోస్తూ మ్యూజియం అధికారులు దాన్ని కాపాడుతున్నారు. రోజురోజుకూ కొత్త అందాల్ని సంతరించుకుంటూ విశేషంగా సందర్శకులని ఆకర్షిస్తోంది సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళెం.

నోటికి కొత్త కళ్ళేన్ని తగిలించుకుని, చాలీచాలని ఆహారంతో, చర్నాకోలా దెబ్బలు తింటూ, నోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహాన్ని, దాని నోటిలో దొరికిన కళ్ళేన్ని చూడడానికి వచ్చే జనాన్ని అటూఇటూ చేరవేస్తూ భారంగా బతుకీడుస్తోంది బండివాడి గుర్రం.

-పాలపర్తి జ్యోతిష్మతి

 

లెమనేడ్

Kadha-Saranga-2-300x268

పదకొండు గంటలవేళప్పుడు నేను ఇంటిబయట నిమ్మకాయల బండి దగ్గర్నించి లోపలి కెళ్ళబోతుంటే వీధిమలుపు దగ్గర కనిపించింది మా అక్కయ్య.

“అయ్యో, వెళ్ళిపోయాడే! నేను కూడా తీసుకునేదాన్ని నిమ్మకాయలు” అంది దగ్గరికి రాగానే. నేనేం మాట్లాడకుండా అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాను.

“ష్ష్…” అంటూ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చుంది అక్క. “దగ్గర్లోనే ఉంటున్నా వారానికోసారైనా కలవడానికి కుదరట్లేదు. ఇవాళ మీ బావ ఎవరిదో పెళ్ళని వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్నేకదాని ఇట్లా వచ్చాను” అంది.

మంచినీళ్ళు తెచ్చిచ్చి “కాఫీ పెట్టనా?” అని అడిగాను.

“అబ్బ! ఏం ఎండలే తల్లీ! ‘నాలుగు వీధులు దాటడమేకదా! అంతమాత్రమైనా నడవకపోతే ఎట్లా?’ అనుకుని రిక్షా ఎక్కలేదు. నోరెండిపోయి నాలుక పిడచకట్టుకుపోతోంది. కాఫీ వద్దుగానీ చల్లగా కాసిని నిమ్మకాయనీళ్ళు కలిపివ్వు” అంది అక్క.

“ఇంట్లో నిమ్మకాయలు లేవే” ఇబ్బందిగా చెప్పాను.

“అదేమిటే, నేను వచ్చేటప్పటికి నిమ్మకాయలబండి దగ్గరే ఉన్నావు?” ఆశ్చర్యంగా అడిగింది అక్క.

“ఎక్కడ కొన్నాను? బేరం కుదరందే” అన్న నా సమాధానానికి ప్రశ్నార్థకంగా నావైపు చూసింది అక్క.

“ఆకురాపిడి మచ్చల్తో కసుగాయల్లా ఉన్నాయి, ఒక్కోటి మూడురూపాయలు చెప్పాడు. ఎక్కువ తీసుకుంటే రేటు కాస్త తగ్గిస్తాడేమోనని’ డజనెంతకిస్తావు?’ అనడిగాను. ‘ముప్ఫైయారు ‘ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘ముప్ఫై కిస్తావా?’ అన్ననంతే, నావైపు చూడనుకూడా చూడకుండా బండి నెట్టుకుని వెళ్ళిపోయాడు” ఉక్రోషంగా చెప్పాను.

“హ్హు…!”  అంటూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలింది అక్క. “ఎండవేళప్పుడు చల్లగా తాగొచ్చు, ఎవరైనా ఇంటికొస్తే ఇవ్వడానికి కూడా బాగుంటుంది, నిమ్మకాయ షర్బతు చేసి పెట్టుకుందామని బుద్ధి పుట్టింది మొన్న. నిమ్మకాయలు కొనుక్కొద్దామని బజారు కెళ్ళాను. రోడ్డుపక్కన గంపలో పెట్టుకుని అమ్ముతున్నాడు గోళీక్కాయలంత నిమ్మకాయలు. వాణ్ణేదో ఉద్ధరిస్తున్నా ననుకుంటూ ‘యాభైకాయలు తీసుకుంటాను. కరెక్టు రేటు చెప్పు’ అన్నాను. వాడు నన్నో అడవిమృగాన్ని చూసినట్టు చూశాడు. ‘యాభైకాయలు నువ్వు తీసుకుంటే వాళ్ళందరికీ ఏమమ్మాలి?’ అన్నాడు చుట్టూ నిలబడి ఉన్నవాళ్ళను చూపిస్తూ. వాడి మాటలు అర్థంకాక నేను వెర్రి చూపులు చూస్తుంటే ‘మనిషికి పదికాయలు మించి ఇచ్చేది లేదు ‘ అన్నాడు. నేను ఆ షాకులోంచి బయటపడి ‘పోనీ, ఆ పదికాయలే తీసుకుందాం’ అనుకునేటప్పటికీ వాడు గంప ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ‘ఎట్లాంటి రోజులొచ్చాయి?’ అనుకున్నాను. ఇక్కడికి వస్తుంటే ఎదురుగా నిమ్మకాయలబండి కనిపించగానే ప్రాణం లేచొచ్చింది. కానీ… ఏం చేస్తాం? ప్రాప్తం లేదు” అంది అక్క ఇంకా దీక్ఘమైన మరో నిట్టూర్పు వదిలి.

అక్క మాటలకి బిత్తరపోయిన నేను అసంకల్పితంగా టీవీ పెట్టాను.

ఏదో సినిమా పాట వస్తోంది. హీరో, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి పచ్చికబయల్లో కింద పడుకున్నారు. పైనెక్కడో లారీల్తో గుమ్మరించినట్టు నిమ్మపళ్ళు దొర్లుకుంటూ వచ్చి వాళ్ళ చుట్టూ చేరిపోయాయి. లాంగ్షాట్లో అప్పటిదాకా ఆకుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీద ఇద్దరు మనుషుల ఆకారాలున్నట్టు కనిపిస్తున్న సీనల్లా పసుపుపచ్చని బ్యాక్గ్రౌండ్ మీదికి మారిపోయింది.

చిరాగ్గా ఏదో గొణుక్కుంటూ అక్క నా చేతిలోంచి రిమోట్ లాక్కుని ఛానల్ మార్చింది.

అక్కడ వ్యాపార ప్రకటనలు వస్తున్నాయి. నల్లగా నిగనిగలాడుతున్న ఒకమ్మాయి సబ్బంతా అరగదీసి ఒళ్ళు రుద్దీ రుద్దీ స్నానం చేసి మిలమిలా మెరిసిపోతూ బయటికొచ్చి అందాలరాణి కిరీటం గెలుచుకుంది. కిరీటం ఆ అమ్మాయి శిరస్సు నలంకరించగానే నిమ్మకాయల వాన కురిసింది. ‘శ్రేష్ఠమైన నిమ్మకాయల రసంతో మీ చర్మసౌందర్యంకోసం ప్రత్యేకంగా తయారుచేసిన మా సబ్బునే వాడండి’ అనే బ్యాక్గ్రౌండ్ ఎనౌన్స్మెంట్తో ప్రకటన ముగిసింది.

అక్క మొహంలో చిరాకు ఇంకా ఎక్కువైంది. మళ్ళీ ఛానల్ మార్చింది. అక్కడా ప్రకటనలే వస్తున్నాయి.

పనిమనిషి అంట్లు తోముతూ సబ్బుని విసిరికొట్టింది. యజమానురాలు పనిమనిషిమీద చెయ్యెత్తింది. పనిమనిషి యజమానురాలిని దూరంగా నెట్టేసి బొడ్లోంచి ఇంకో సబ్బు తీసి దాంతో అంట్లు తోమి తళతళా మెరిపించింది. యజమానురాలు నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తుంటే పనిమనిషి “ఒక్కో సబ్బులో పది నిమ్మకాయల రసముంటుంది అమ్మగారూ! ఎంత జిడ్డుపట్టిన గిన్నెలైనా, మాడిపోయిన అంట్లైనా దీని దెబ్బకి లొంగాల్సిందే” అంది. ఇద్దరూ కలిసి నిమ్మకాయలు ఎగరేసుకుంటూ డాన్సు చెయ్యడం మొదలుపెట్టారు.

అక్క మొహం చూస్తే రిమోట్ని టీవీమీదికి విసిరేస్తుందేమోనని భయమేసి, రిమోట్ అక్క చేతిలోంచి పీక్కుని, ఛానల్ మార్చి, రిమోట్ దూరంగా పెట్టి వంటింట్లో కెళ్ళాను.

నేను కుక్కరు పెట్టి బయటికి రాగానే “ముందా టీవీ ఆపు” అని అరిచింది అక్క. నేను బెదిరిపోయి గబుక్కున టీవీ ఆపేశాను.

“పళ్ళు తోముకునే పేస్టులో నిమ్మకాయట, లెట్రిన్ కడుక్కునే లిక్విడ్లో నిమ్మకాయట, నాలుగురోజులు పోతే ‘మీరు బూట్లకి వేసుకునే పాలిష్లో నిమ్మకాయ ఉందా? కళ్ళకు పెట్టుకునే కాటుకలో నిమ్మకాయ ఉందా?’ అని కూడా అడుగుతారు. వాళ్ళకి పిచ్చో, మనకి పిచ్చో అర్థం కావట్లేదు” కోపంతో బుసలు కొడుతోంది అక్క.

‘అక్కని చల్లబరచడం ఎట్లాగా’ అని ఆలోచిస్తూ లోపలికెళ్ళి, అట్నించి ఎకాఎకిని బయటికి గెంతి, కాసేపట్లో అదే వేగంతో ఇంటికొచ్చాను.

“ఏమిటే ఆ పరుగులు?” కంగారుగా అడిగింది అక్క.

“ఉండు, ఇప్పుడే వస్తా” అంటూ వంటింట్లోకి దూరాను.

పదినిముషాల తర్వాత వంటింట్లోంచి ఇవతలికి వచ్చిన నన్ను “ఇప్పుడే వస్తానని ఇంతసేపు చేశావేంటి?” అయోమయగా అడిగింది అక్క.

మాట్లాడకుండా నా చేతిలోని గ్లాసు అక్క చేతిలో పెట్టి ఎదురుగా కూర్చున్నాను.

“ఏమిటీ…ఇది?” అంది అక్క గ్లాసు తీసుకుంటూ.

“రస్నా! లెమన్ ఫ్లేవర్” అన్నాను.

“మనకింక ఈ ఆర్టిఫిషియల్లీ ఫ్లేవర్డ్ డ్రింకులే గతి” అంది అక్క ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేసేసి.

Jyothiపాలపర్తి జ్యోతిష్మతి

ధ్యానం

chinnakatha

చిన్నప్పుడు మా పక్కింట్లో బిఎస్సీ విద్యార్థి ఒకతను ఉండేవాడు. ‘అన్నయ్యా, అన్నయ్యా’ అంటూ చుట్టుపక్కల పిల్లలమందరం అతని వెనకాల తిరుగుతుండే వాళ్ళం.

ప్రతి ఆదివారం సాయంత్రం అన్నయ్య మమ్మల్నందర్నీ మా ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న యేటి ఒడ్డుకు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఇసుకలో పిల్లమూకనంతా చుట్టూ కూర్చోపెట్టుకుని సైన్సుపాఠాలు, నోటిలెక్కలు, పొడుపుకథలు, వాళ్ళ కాలేజీ విశేషాలు చెప్తుండేవాడు.

ఉన్నంటుండి ఒకరోజు “అందరూ మాట్లాడకుండా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చెయ్యండి. రోజూ కాసేపు ధ్యానం చేస్తే తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. బాగా చదివుకో గలుగుతారు” అన్నాడు అన్నయ్య.

“ధ్యానం అంటే ఏంటి?” అని అడిగాడొక పిల్లాడు.

“మెడిటేషన్” అన్నాడు అన్నయ్య.

“మెడిటేషనంటే?” అడిగిందింకో పిల్ల.

“ధ్యానం” అన్నాడో కొంటె పిల్లాడు.

అన్నయ్య వాడివైపు ప్రశాంతంగా ఒక చూపు వేసి “నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చోవడం” అని చెప్పాడు. అందరం ఏం మాట్లాడకుండా ‘అన్నయ్య ఎప్పుడు కళ్ళు తెరవమంటాడా’ అని ఎదురుచూస్తూ కళ్ళుమూసుక్కూర్చున్నాం.

మళ్ళీ ఆదివారం అన్నయ్య మమ్మల్ని ఏటి ఒడ్డుకు తీసుకెళ్ళేలోపల మేం ఏ ఇద్దరం ఎప్పుడు కలిసినా ‘ధ్యానం చేసినప్పుడు ఎవరికి ఏం ఆలోచనలు వచ్చాయి?’ అన్న విషయమే మాట్లాడుకున్నాం. ఏతావాతా తేలిందేంటంటే ఒకడు అమ్మ చేసి దాచిపెట్టిన అరిసెలు అమ్మకు తెలీకుండా ఎట్లా తినాలా అని ఆలోచిస్తే, ఇంకొకడు మాయచేసి తన హోంవర్కు అక్కచేత ఎట్లా చేయించాలా అని ఆలోచించాడు. ఒక అమ్మాయి అమ్మ చెప్పే పని ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తే, ఇంకో అమ్మాయి తెల్లవారుజామున లేచి చదువుతున్నట్టుగా నటిస్తూ ఎట్లా నిద్రపోవాలా అని ఆలోచించింది.

అన్నయ్య మా ఊళ్ళో చదివు అయిపోయి పై చదువులకు వెళ్ళిపోయాక మా ఏటి ఒడ్డు సమావేశాలు ఆగిపోయాయి. మిగతావాళ్ళంతా ఏం చేశారో నాకు తెలీదుగానీ నేను మాత్రం ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పించుకున్నాను.

కాలక్రమంలో ‘మెడిటేషన్’, ‘ధ్యానం’ అన్న పదాలు కనిపించిన ప్రతి పుస్తకం చదివేశాను కానీ ధ్యానమగ్నురాలిని కాలేకపోయాను.

ఆమధెప్పుడో మా ఊళ్ళో యోగా తరగతులు పెడుతున్నారనీ, ధ్యానం చెయ్యడం నేర్పిస్తారనీ తెలిసి ఆ తరగతులకి వెళ్ళాలని తెగ ఆరాటపడిపోయి, నన్ను చేర్చుకుంటారో లేదో అని కంగారుపడిపోయి, నానాతిప్పలూపడి సీటు సంపాదించి, అష్టకష్టాలూపడి కోర్సు పూర్తిచేశాక నాకర్థమైందేంటంటే అన్నయ్య ధ్యానం చెయ్యమన్నప్పుడు పిల్లలంతా కళ్ళు మూసుక్కూర్చుని చేసిన వెర్రిమొర్రి ఆలోచనలనే ధ్యానం అంటారని.

‘అయ్యో! అన్నయ్య చెప్పిన ప్రకారం మానకుండా ధ్యానం చేస్తూ ఉండుంటే పాతికేళ్ళనుంచి నేను ధ్యానం చేస్తున్నానని గొప్పగా చెప్పుకునేదాన్ని కదా’ అని కాసేపు బాధపడి, ‘సరే! అయిపోయిందేదో అయిపోయింది. యోగా తరగతుల్లో నేర్చుకున్న ధ్యానాన్ని మాత్రం వదలకూడదు’ అని నిశ్చయించుకున్నాను. అట్లా మనసులో వచ్చే ఆలోచనలని గమనిస్తూ కూర్చుంటే కాసేపటికి ఆలోచనలు ఆగిపోతునాయి. ‘అబ్బో! నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను ‘ అని సంతోషించేలోపల నాకు తెలిసిందేమిటంటే ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ నేను కూర్చుని నిద్ర పోతున్నానని.

‘కూర్చుని నిద్రపోవడమేంటి ఛండాలంగా, హాయిగా పడుకుని నిద్రపోక’ అనుకుని ఆ ధ్యానాన్ని వదిలేశాక ఏ సంస్థ ధ్యానతరగతుల్ని నిర్వహించినా వెళ్ళడం, ‘ఇది నాకు కుదిరేది కాదు’ అనుకుని వదిలెయ్యడం నాకు అలవాటైపోయింది.

ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ‘స్కూల్ ఆఫ్ యోగా’ వాళ్ళ ధ్యానశిక్షణకి వెళ్ళబోతూ ‘ఇదే ఆఖరు, ఎట్లాగైనా దీన్ని సాధించాలి’ అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టుగానే మొదటి రెండు రోజులు చాలా ఆసక్తికరంగా సాగిన శిక్షణ చివరిదైన మూడోరోజుకు చేరుకుంది. ఆరోజు పైనుంచి పెద్దగురువుగారు వచ్చారు ఉపన్యాసం ఇవ్వడానికి.

“ఆధ్యాత్మికత అంటే ఏమిటి?” అన్న ప్రశ్నతో క్లాసు మొదలయింది.

ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మికత అన్న పదానికి చాలా నిర్వచనాలే వచ్చాయి కానీ గురువుగారికి ఏదీ నచ్చినట్టు లేదు. ఎవరేం చెప్పినా గురువుగారు “ఇంకా…ఇంకా…” అని అడుగుతూనే ఉన్నారు. ఇంకేం సమాధానాలు రాని దశ వచ్చాక ఒక పదేళ్ళ అమ్మాయి లేచి నిలబడింది.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని “మీలా మా కాలంలో మేం టీవీ లెరుగుదుమా? కంప్యూట ర్లెరుగుదుమా? సెల్ ఫోన్లెరుగుదుమా?” అంటూ సాధించే లిస్టుకి యోగాక్లాసుల్ని కూడా కలపాలని నిర్ణయించుకున్నా న్నేను ఆ పిల్లని చూశాక.

“మగవాళ్ళయితే కాషాయబట్టలు కట్టుకుని, గడ్డాలూ, మీసాలూ పెంచుకోవడం, ఆడవాళ్ళైతే కాసంత బొట్టు పెట్టుకుని, పట్టుచీరలు కట్టుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు” అని చెప్పిందా అమ్మాయి.

ఆ మాటలకి ఉలిక్కిపడ్డ జనం గట్టిగా నవ్వడానికి భయపడి మూతులకి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళని కళ్ళతోనే వారించి గురువుగారు ఆప్యాయంగా ఆ అమ్మాయి తల నిమురుతూ “అట్లా చెప్పావేంటమ్మా? నీ కెందు కట్లా అనిపించింది?” అని అడిగారు.

దానికా అమ్మాయి “టీవీల్లో అటువంటి వేషాల్తో కనిపించే వాళ్ళని ఆధ్యాత్మిక గురువులు అంటారు కదండీ! అందుకే అట్లా చెప్పాను” అందా అమ్మాయి.

తలకాయ అడ్డంగా ఊపి గురువుగారు అరమోడ్పు కన్నులతో “ఆధిదైన ఆత్మయొక్క కతే ఆధ్యాత్మికత” అంతూ ఎవ్వరికీ అర్థం కాని ఒక విచిత్రమైన నిర్వచనం ఇచ్చారు.

“ఆధి అంటే ఎవరండీ?” అని అడిగిందా అమ్మాయి.

గురువుగారు ఆ అమ్మాయిని కూర్చోమన్నట్టు సైగచేసి “టైం చాలా అయింది. ఇంకా మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

ముందు అందరూ ఒక అరగంట ధ్యానం చెయ్యండి” అన్నారు.

కళ్ళు మూసుకుని ‘ఆధ్యాత్మికత’ అన్న పదానికి నాదైన నిర్వచనం తయారుచెయ్యలనుకున్నాను కానీ నా వల్లకాక ‘గురువుగారు తొందరగా కళ్ళు తెరవమంటే బాగుండు’ అనుకుంటూ కూర్చున్నాను.

ఎట్టకేలకు గురువుగారికి దయకలిగి “అందరూ మెల్లగా కళ్ళు తెరవండి” అన్నారు. ‘అమ్మయ్య’ అనుకుని కళ్ళు తెరిచి, ‘ఇంక ఇంటికెళ్ళండి’ అని ఎప్పుడంటారా అని ఎదురుచూస్తున్నాను.

“ఇప్పుడొక ముఖ్యమైన విషయం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి” అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు. “రాజధాని నగర పొలిమేరల్లో మనం ఒక పెద్ద ధ్యాన కేంద్రాన్ని నిర్మించుకో బోతున్నాం. ధ్యాను లెవరైనా అక్కడ ధ్యానసాధన చేసుకోవచ్చు. పదివేలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు డార్మిటరీలలో ఉండే అవకాశం పొందుతారు. లక్ష రూపాయలు చందా ఇస్తే సంవత్సరానికి పదిరోజులు ప్రత్యేకగది వసతి కల్పిస్తాం. దూరప్రాంతాలనుంచి కానీ, విదేశాలనుంచి కానీ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళకి రోజుకు వెయ్యి రూపాయల చెల్లింపుమీద ఎన్నిరోజులైనా ఉండడానికి వీలుగా అన్ని వసతులతో కాటేజీలు కట్టిస్తున్నాం. ధ్యానకేంద్ర నిర్వాహకులు నడిపే భోజన ఫలహారశాల లుంటాయి. చేతనయినవా ళ్ళెవరైనా హోటళ్ళు పెట్టుకుని నడుపుకోవచ్చు.ధ్యానకేంద్రం పరిసరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ళస్థలాలు దొరుకుతున్నాయి. అవి కొనుక్కుని ఇల్లు కట్టుకో గలిగితే అంతకంటే అదృష్టం మరొకటుండదు. శాశ్వతంగా అక్కడే ఉండిపోయి ధ్యానంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు. ధ్యానంలో ఆసక్తి ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ విషయాలు చెప్పి మన ధ్యానకేంద్రం అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడండి…” గురువుగారి ఉపన్యాసం కొనసాగుతోంది కానీ అక్కడితో నా బుర్ర పనిచెయ్యడం మానేసింది.

‘ఇకమీదట ఏ ధ్యానశిక్షణ తరగతులకి వెళ్ళకూడ’దని గట్టిగా ఒట్టు పెట్టుకుని అక్కడినుంచి బయటపడ్డాను.

Jyothi–పాలపర్తి జ్యోతిష్మతి