చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు”

పారుపల్లి శ్రీధర్

పారుపల్లి శ్రీధర్

 

పశ్చిమ తీరంలో మనకు తెలిసిందనుకున్న ప్రపంచంలో తెలియని లోకాలను చూపించే యత్నం కూనపరాజు కుమార్ కథా సంపుటం ‘న్యూయార్కు కథలు’.   పన్నెండు కథలతో గుదిగుచ్చిన ముత్యాలహారమిది. అమెరికా కలల సౌధాలను కూల్చిన టెర్రరిస్టుల ఘాతుకానికి  ఎందరో బలయ్యారు. సెప్టెంబర్  తొమ్మిది  కి నివాళే మొదటి కథ ఊదారంగు తులిప్ పూలు.

లవ్ కెమిస్ర్టీ తోటే రంగుల కెమిస్ర్టీని ఆవిష్కరించారు రచయిత. బూడిదైన బతుకుల్లో ఒక పాత్ర జూలీ. ఆమె విషాదాంత గాధను ఒక ప్రత్యేక టెక్నిక్ తో చెప్పటం ఈ కథలోకొసమెరుపు. చంద్రమండలానికి వెళ్లినా మనవాళ్ల ప్రవర్తన మారదంటూ సునిశిత హాస్యంతో జాలువారిన కథనం గెస్ట్ హౌస్. ఉన్నత శిఖరాలను చేరటానికి రెక్కలు కట్టుకుని డాలర్ల దేశంలో వాలిన ఆశాజీవులు పడే పాట్లను, గెస్టు హౌస్ లో వీరి జీవన శైలిని చక్కగా చెప్పారు కుమార్. బ్రాడ్ వే నాటకాలను చూసి  భీమేశ్వర తీర్ధంలో నాటకాల నాటి నాస్టాలజియాలోకి వెళ్లిపోయారు రచయిత. వియత్నాం యుద్ధం రేపిన కలకలం నుంచి బయటపడిన మిత్రులు కొందరు ఎలా తమ జీవితాలను పునరుద్ధరించుకున్నారో వివిరించే మూవ్ ఇన్ నాటకాన్ని పరిచయం చేశారు.కళ కళకోసం కాదని, సామాజిక ప్రయోజనం కోసమేనని జాన్ పాత్ర ద్వారా చెప్పారు. జీవన వైవిధ్యాన్ని వివరించిన తీరు బాగుంది. పరిశోధనలంటే ప్రాణమిస్తూ, కొత్త కొత్త ఆవిష్కారాల కోసం తపించే అమ్మాయి  దీప. టచ్ మి నాట్ మొక్కతో ఆమె కనుగొన్న అద్భుతం వైజ్ఞానిక లోకాన్ని ఆకట్టుకుంది.  ప్రకృతిలోనే మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయన్న సందేశంతో రిసెర్చ్ చేసి, తనఆవిష్కారాలతో  ప్రతిష్ఠాత్మక ఇంటెల్ ప్రైజ్ సాధించింది దీప. రాబోయే కాలంలో కాబోయే యువ సైంటిస్టులకు ఎంతో స్ఫూర్త్తినిచ్చే కథ మిమోసా పుదీకా.

 

న్యూయార్క్ కథల్లో కదిలించే కథ..మంచు కురిసిన ఆదివారం.  ఘనీభవించిన హృదయాలను కరిగించే హృద్య గాధతో కుమార్ అద్భుతంగా రాసిన కథాకథనమిది. ఓ కవి మిత్రుడన్నట్లు.. కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటిందెవరు? ఘనీభవించిన మంచు వెనుక ద్రవీభవించిన ఒకానొక అరవిందు అంతరంగ ఆవిష్కరణ ఇది. ఆ మధ్య ఓ సినామాలో మన్ హాటన్ పై ఓ పాట వినే వుంటారు. నిజానికి ఆ పాటలో మన్ హాటన్ ఆత్మ కనపడదు. మన్ హాటన్ లో మానవతాపరిమళాలను, సేవా సదనాల్లో ప్రేమానురాగాల్లోబందీలైన కొందరి గాధలు ఈ కథలో కదిలించే శైలిలో రాశారు రచయిత కుమార్ కూనపరాజు. బౌరి స్ర్టీట్ లో ప్రవహించిన ఎన్నారై మిత్రుల ప్రేమను కొలవటానికి ఏ పదాలు సరిపోతాయి? గోడవారగా చేగగిలబడి పిచ్చి చూపులు చూస్తున్న అతడిని చూశాక అరవింద్ హృదయ స్పందన తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పేజీలన్నీ తిరగేశాక కళ్లు చెమర్చని వారెవరైనా వుంటే దయచేసి వారి అడ్రస్ చెప్పండి. పరిశోధన సాగిద్దాం కరకు హృదయాల మీద.

కొంచెం ఛీజ్ వేస్తావా అని అడిగిన ఆ వ్యక్తి చరిత్ర ఏమిటి? ఈ  ఆశ్రమాల ఆశ్రయించిన (చేరిన) నేపథ్యమేమిటో చదివి తీరాలి. మానసిక చురుకుదనంతో మతి కోల్పోయిన  నల్లజాతి  పాటల రచయిత మైకేల్ రాబర్ట్ అండర్సన్ ను వీరి సేవలు ఎంతగా కదిలించాయో చెప్పటానికి మాటలక్కరలేదు. అరవిందుకు ఆస్తిని రాసేయటం, మైకేల్ చివరి చూపుదక్కకపోవటం,ఇటువంటి మరికొందరు అభాగ్యులను ఆదుకోవటానికి అరవిందు దంపతులు ముందుకు రావటాన్ని హృద్యంగా చిత్రించారు రచయిత. ఎంత సేపటికీ మనీ కల్చర్ లో, మన ప్రపంచంలో బతికే మనం ఇటువంటి లోకాలను చూసి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పరమార్ధం గ్రహించాలి. ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ప్రేమించే హృదయమే వుండాలి.  ఆ హృదయ స్పందనకు సరిహద్దులతో పనేముంది అంటే మైకేల్ తనవీలునామా లేఖలో రాయటం గొప్ప సందేశం.

NY Book Title 3 copy copy

గడ్డ కట్టిన మంచులో ఎర్ర పిచుకలు ఏమైపోయాయోఅంటూ అరవింద్ స్పందించటం అతడి సున్నితత్వాన్ని, స్వభావానికి నిదర్శనం. మన్ హాటన్ కాంక్రీట్ జంగిల్ సొరచేప కింది దవడలా వుందంటూ రచయిత చెప్పటం ఆయనలో అంతర్లీనంగా అలజడి చేసే వామపక్ష వాదిని మనముందుంచుతాయి. డాలర్ల దేశంలో రెక్కలు కట్టుకుని వాలిన ఆశాజీవుల కష్టాలను ఆవిష్కరించే యత్నం వెంకోజీ ..కథ. ఉద్యోగం కోసం వెంకోజీ పడిన పాట్లు.. చివరికి  ఎలాగో స్థిరపడి ఇంటికి డబ్బు పంపిస్తే..  ఏం మిగిలింది? వెంకోజీ ట్రాజెడీని న్యూయార్క్ బ్యాటరీ పార్క్ లో శిల్పంతో పోల్చటం బాగుంది. మాన్యుమెంట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ తో సాపత్యం చక్కగా వుంది. న్యూయార్క్ కథల సంపుటిలో గుర్తుండిపోయే మరో కథ లిటిల్ బుద్ధాస్. బుద్ధుడి జీవిత క్రమం, జ్ఞానోపదేశాల ఆధారంగా బాలవికాస్ పిల్లలు వేసిన బుద్ధా నాటకం…వారి జీవితాలనెలా మార్చిందన్నది ఈ కథ సారాంశం. నాటకంలో ఒక పాత్ర ధరించిన దీక్షిత, శిష్యుడి రోల్ లో కన్పించిన రాబర్ట్ లు బుద్ధుని బోధనలతో ఎలా మారిపోయారు?  నాటకాన్ని డైరెక్ట్ చేసిన సుధీర్ మనోభావాలేమిటి? తదితర అంశాలను  ఆకట్టుకునే శైలిలో చెప్పారు రచయిత కుమార్.

మసక లాడుకుంటున్నాయి లాంటి పదాలు కొన్ని మనం మరచిపోతున్న తెలుగును గుర్తు చేస్తాయి. స్వేచ్ఛా, సౌభాతృత్వాల ప్రతీక..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ కథ వాల్డ్ ట్రేడ్ సెంటర్.. జంట శిఖరాలను కూల్చకముందు మనసులో వుంచుకుని తర్వాత రాసినది. స్టీమర్ లో స్టాచ్యూ ఉన్న ఐలెండ్ కు వెళుతుంటే మన్హాటన్ అందాలను అభివర్ణించారు. మన్హాటన్  నీళ్లలోంచి వచ్చిన కాంక్రీట్ జంగిల్లా ఉంది. ఆ భవనాల మధ్యలో ఉన్న ఎత్తయిన ట్విన్ టవర్స్ గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతుల్లా ఉన్నాయంటూ వర్ణించారు రచయిత.

న్యూయార్క్ కథల సంపుటిలో మరో విశిష్ట కథ గురు పౌర్ణమి.  గురువు జీవన విషాదానికి చలించిన ఓ శిష్యుడి అంతరంగ ఆవిష్కరణం, మోదం, ఖేదం, సందేశాల సమాహారం కథనం. మేక్ బెత్ నాటకాన్ని విశ్లేషించిన గురువు గారు ఇంత చిన్న పల్లెటూరులో ఎందుకు ఉండిపోయారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. ప్రపంచాన్ని బాగుచేసే గురువులు తమ జీవితాన్ని బాగుచేసుకోలేరు. ఊరంతా ప్రేమించి,అంతటి శిష్యగణం ఉన్నా.. మాస్టారు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగలేదు. అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకమన్న సినీ కవి వాక్కులు గుర్తుకొస్తాయి. ఆషాఢభూతుల్లాంటి శిష్యులు కొందరి నైజం లోకం పోకడకు దర్పణం పడుతోంది. సున్నిత మనస్కుడైన కథానాయకుడు..మనిషి అమెరికాలో ఉన్నా..మనసంతా తను పుట్టి పెరిగిన ఊరిమీదనే ఉంటుంది. మాస్టారి కూతురి ఉత్తరంతో కదిలిపోయి..ఇండియా వచ్చి వారి కుటుంబ దురవస్థకు చలించి పోతాడు. బుద్ధుడి బోధనలనే మాస్టారు ఆదర్శంగా తీసుకున్నారేమో అన్పిస్తుంది.  బుద్ధ భగవానుడి పుట్టిన రోజు, నిర్యాణం చెందిన రోజూ పౌర్ణమే. గురువు గారు ప్రైవేటు పాఠశాలలో శిష్యులకు వీడ్కోలు సందేశం లో బుద్ధుని బోధనలను గుర్తుచేయటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. కథకు గురుపౌర్ణమి అని పేరుపెట్టడం సందర్భోచితంగా ఉంది. పూర్వం పల్లెల్లో  ప్రైవేటు బడులు, బడి ఎగ్గొట్టే పిల్లలను మాస్టారు పంపించిన భటులు (క్లాసులీడర్లు) వచ్చి తీసుకెళ్లటం..లాంటి స్మృతుల్ను రచయిత సునిశిత హాస్యంతో రాశారు. చంద్ర మండలం వెళ్లినా మన వాళ్లకు హూందాగా ప్రవర్తించరేమో! కథా సంపుటిలోని మనమింతేనా..అనే కథ ఇదే అర్ధంలో సాగిన సెటైర్. మువ్వల సవ్వడి వినిపిస్తోంది రచయిత కళాభిరుచికి నిదర్శనం.

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన కథలు. ఒక మధ్యతరగతి మానవుడు అమెరికా వెళ్లి గుండెల నిండా నింపుకొన్న అనుభూతులను, అద్దుకున్న పరిమళాలను హృద్యంగా ఆవిష్కరించారు రచయిత కుమార్. తొలి ప్ర యత్నంలోనే ఇంత మంచి కథా సంపుటి వెలువరించటం అభినందనీయం. ఎక్కడా భాషా భేషజాలు లేకుండా..అందరికీ అర్ధమయ్యే సరళ శైలిలో రాశారు.

-పారుపల్లి శ్రీధర్