గురి తప్పని ప్రయోగం…ఖాకీవనం!

నీరజ అమరవాది 

 

470086_126563650840971_1578940197_oపతంజలి గారి  ‘ సాహిత్యం’ సమాజాన్ని అద్దంలో చూపించినంత స్పష్టంగా ఉంటుంది. ఆయన ఎంచుకున్న వస్తువు కూడా భేషజాలు లేకుండా ఆలోచింపజేసి, హృదయాన్ని కదిలిస్తుంది.

 వ్యంగ్యాన్ని కొందరు ‘హాస్యాన్ని’  పండించడానికి వాడుకుంటే, మరి కొందరు ‘తమ బాధ, అక్కసును’ వెళ్లగక్కడానికి వాడుకుంటారు. అయితే పతంజలి గారి వ్యంగ్యం  “ సమాజంలో మేక వన్నె పులుల లాగా బయట హుందాగా తిరుగుతూ, లోపల పందికొక్కులలాగా వ్యవస్థలను భ్రష్టుపట్టించిన నాయకరౌడీల” మీద ఎక్కుపెట్టినది. ఆయన నవలలు, కథలు, కవితలు అన్నీ ‘సాహిత్యవిలువలతో’ పాటు, భాషా పరిమళాలని వెదజల్లుతాయి. ఉత్తరాంధ్రమాండలికానికి ‘పేటెంట్‘ లాగా పనికివస్తుంది. ఆయన సాహిత్యం ఎన్నో నూతన పదాలను, పదబంధాలను  పరిచయం చేసింది. ఒక రకంగా భాష, భావం, వ్యక్తీకరణ  ‘ముప్పేటగా’ కలిసి తెలుగు సాహిత్యానికి సొబగులద్దాయి .

“వజ్రానికి సాన పెట్టిన కొద్దీ  దాని విలువ, మెరుపు పెరిగినట్లు” గా   పతంజలిగారి కథ / నవల / కవిత ఏదైనా సరే మొదటిసారి చదివినప్పుడు ఆలోచింపజేస్తాయి. అదే రెండోసారి చదివితే మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. మరొక్కసారి చదివితే నిఘంటువులలో కెక్కని పదాలు, పదబంధాలు కనబడతాయి. అలా ఆయన కలంలోంచి ఎన్నో ఆణిముత్యాలు రాలినా నన్ను బాగా కదిలించినది  “ఖాకీ వనం“.

‘వనం’ అనగానే పూల మొక్కలు, సుకుమారమైన వన్యప్రాణులు స్ఫురణకు వస్తాయి. ఆ పదం ముందు  ‘ఖాకీ’ చేరగానే వనప్రాణులను ( సామాన్య జనం ) రక్షక భటులు ఎలా భక్షిస్తున్నారో అన్నది చెప్పకనే చెప్పినట్లైంది.

పోలీసు వ్యవస్థలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న అధికారులు అమాయక, సామాన్య, బడుగు జీవితాలపై అధికార జులుంని ఎలా చూపుతున్నారో, పవిత్రమైన లాఠీని, గన్ లను తమ స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటున్నారో, దానికి ఖద్దరు వ్యవస్థ మద్దతుగా నిలుస్తున్న నిజాన్ని ‘మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ‘ తో చూపించి నట్లుగా  ‘ఖాకీవనం’ మనకి చూపిస్తుంది. ఈ నవల  వెలువడి సుమారు ముఫ్పై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఆ వ్యవస్థలో మార్పు రాలేదు. ఖాకీ వనం out date కాలేదు.

 

 

నవల ఆరంభంలోనే   ‘ఎస్. పి పార్థసారథి’  పెంచుకుందామని ఇంటికి కుక్కని తీసుకుని వస్తే వాళ్ల అమ్మాయి  “ఇంటికి కాపలాకి మీ జవాన్లింత మందుండగా, మనకీ మళ్లీ ఈ వెధవకుక్కెందుకు డాడీ” అంటుంది. ఈ వాక్యం ఒక్కటే చాలు.  పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల స్థితిగతులను తెలియజేయడానికి.

“మెడకు బెల్టుంటే కుక్కట, నడుముకు బల్టుంటే పోలీసు” అన్న వ్యాఖ్యానం  వ్యంగ్య హాస్యానికి తల మానికంగా చెప్పుకోవచ్చు.

భూగర్భంలో లోతుకు పోయిన కొద్దీ అపురూప ఖనిజసంపద దొరికినట్లుగా ‘ఖాకీవనం’ చదువుతూ ఉంటే కొత్త కొత్త సాహిత్యాంశాలు బయటపడతాయి. ముఖ్యంగ పదచిత్రాలు . . . .

“కాకీ క్రోటన్ మొక్కలాగ నిల్చుని ఉన్న జవాన్లు”

“మూగ రిక్షా మూలగకుండా కదిలింది.”

“రిజర్వు పోలీసులు ఖాకీ కంచె కట్టారు.”

“సగం చచ్చిన వెల్తురు బెడ్ రూం దీపం నుంచి బూడిద లాగా రాల్తోంది.”

ఇలా ఎన్నో_ _ _

ఖాకీవనం లోని స్త్రీ పాత్రలు గౌరి, కమలి. వీరిద్దరు భిన్న నేపథ్యాల నుండి నచ్చారు. గౌరి బీదరికంతో, అవిద్య, తండ్రి అనారోగ్యాలే సంపదగా కలిగింది. దేవుడిచ్చిన అందం, వయసులను  ‘సి.ఐ. కాశీపతి’  సొంతం చేసుకున్నాడు. రక్షకభటులు బీదవాడిని భక్షించే నైజం మరోసారి నిరూపించబడింది. నిస్సహాయురాలైన గౌరికి కూడా ఆత్మాభిమానాన్ని ప్రకటించింది. “నాకు బలం వుంటే నేనే ఆయన్ని కత్తెట్టి పొడిచి సంపేద్దును“ అంటూ కాశీపతిపై  గల అసహ్యాన్ని బయటపెట్టింది.

అవసరం, పరిస్థితులే మనిషి నీతి, నిజాయితీలను నిర్ణయిస్తాయి .

“అన్నం మీద ఆకలితో మేం వున్నాం

ఆడదాని మీద ఆకలితో ఆడున్నడు

ఆడి సేతుల్లో తుపాకీ ఉంది

మా అయ్య గుండెల్నిండా దగ్గు రోగం ఉంది.”

అన్న ‘గౌరి చిన్నాయన’  మాటలు ‘గౌరి’ పై జాలిని చూపించి, పాఠకులను కూడా ఆ కోణంలో ఆలోచించేటట్లు చేశాడు.

కమలి విద్యావంతురాలు. మనసుకి నచ్చిన వ్యక్తి, కాబోయే భర్త భాస్కర్ తో ఏకాంతాన్ని కోరుకుని లాడ్జికి వస్తే, మాటలతో, చేతలతో కాశిపతి  కమలిని  అవమానపరచాడు.  “పెళ్లి చేసుకుంటేగాని మంచ మెక్కకు” అంటూ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడినట్లు హేళనగా మాట్లాడాడు. ఈ సందర్భంలో కమలి కన్నీటి వర్ణన అలతి పదాలతో పాఠకులకు కూడా కన్నీటిని తెప్పించక మానదు .

“ఆమె కనుపాపలలోని చావులూ

భయంగా కదిలే అందలి నీరూ

అక్కడి బాధ

అప్పటి యాతనా

కటిక చీకటి

కమలి కళ్లు”

వాటిని చూసి చలించిన ‘భాస్కర్’   “ద్రౌపదిని చేపట్టాలనుకున్న కీచకుడిని వధించిన వలలుడి” లాగా  దొంగచాటుగా కాశీపతిని పొడిచేశాడు. ఆనాడే కమలి చేత స్త్రీలందరి దగ్గరా  ‘మిషన్ గన్స్’ ఉండాలని చెప్పించారు.

పతంజలి

ఏ యుగంలోనైనా  ఆడదానిని అవమానిస్తే నాశనం తప్పదని, చదువుకున్న వారు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి ఎటువంటి పరిస్థితులలో తీసుకుని, నేరస్తులుగా తయారవుతున్నారో అనే వాస్తవానికి ప్రతిరూపంగా ఈ సంఘటన నిలువుటద్దంలా నిలుస్తుంది. నవలలో నాటకీయతను పండించారు.

నేటికీ పారిశుద్ధ్య పనివారిని అంటరానివారుగానే సమాజంలో చాలామంది పరిగణిస్తుంటారు. వారు రాని రోజు మన బ్రతుకులు కూడా దుర్గంధం పాలే. వారికీ గౌరవమర్యాదలివ్వాలని  “ఒరే గిరే అంటే, పాకీవాడు, పీతోడు  అంటే మర్యాదక్కదు. జాగర్తకుండు మిమ్మల్ని అనావొద్దు, మా చేత తినావొద్దు”  అంటూ మనందరికీ సమతాబోధ చేశారు.

ఒక దృశ్యాన్ని ఫొటోలో చూసినప్పుడు అందంగా కనిపించవచ్చు. అదే వాస్తవంలో అంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాంటిదే పోలీసు ఉద్యోగమంటూ ఎస్. పి నోట పలికించిన మాటలు …….

“తుపాకీ ఇస్తారు

వెన్నెముక లాంటి లాఠీ ఇస్తారు

ఉండటానికి గొడ్ల  పాకలిస్తారు

తింటానికి మాత్రం సరిపడా ఇవ్వరు

గుండెల మీద చెయి వేసుకొని పడుకోనివ్వరు

తిన్నది వంటబట్టే విశ్రాంతి ఇవ్వరు”

ఈ మాటలు  హృదయాన్ని తట్టి, వ్యవస్థ మార్పు కోసం ముందుకు దూకేట్టు చేస్తాయి.

భాషావేత్తలచే కూడా బహు బాగు అనిపించే  “చీకటి సౌఖ్యాలు, వేట కుక్కల దీక్ష, భయం వాసన, రోగిష్టి సిల్వర్ గిన్నెలు” లాంటి నూతన ప్రయోగాలకి కొదవలేదు ఈ ఖాకీ వనంలో.

మొత్తం మీద వ్యవస్థలో అన్యాయం, దుర్మార్గం, వ్యభిచారం, పేదరికం ప్రబలటానికి కారణం “చిన్న చేప పెద్ద చేపను మింగినట్లుగా “ అన్ని వ్యవస్థల అవినీతి హస్తం ఉందని  ‘ఖాకీ వనం’ ద్వారా పతంజలి గారు భాష్యం చెప్పారు.

***

 (ఫోటో సేకరణ : కూర్మనాధ్)