వ్యాఖ్యానాలు- నా అనుభవాలు!

 

– నిడదవోలు మాలతి

~

 

కొంతకాలంగా రచయితలకీ పాఠకులకీ మధ్యన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది విమర్శలవిషయంలో. వ్యాఖ్యలు సూక్ష్మంగా ఉంటాయి కానీ అవి కూడా విమర్శలే నాకు సంబంధించినంతవరకూ. రెంటిలోనూ జరిగేది రచనమీద చదివినవారు చదవడం అయేక స్పందనలను తెలియజేయడమే జరుగుతుంది కనక.

పండితులు తమ అభిప్రాయాలను పత్రికలలో చర్చించుకోడం వీరేశంలింగం, కొక్కొండ వెంకటరత్నంపంతులు గార్ల కాలంలోనే ఉంది. అంతకుపూర్వం పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ప్రెగడ నరసరాజు వంటి కవులు సభలలో ఒకొరినొకరు ఆక్షేపించుకోడం ఉండేది.

19వ శతాబ్దంలో విద్యావంతులని ప్రొత్సహించే ఆశయంతో పత్రికలు వెలువడ్డాయి. ఈనాడు జాల పత్రికలు “మీరు కూడా రచయితలే,” అని పాఠకులని రాయమంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంప్రదాయానికి నాంది పత్రికలు ప్రారంభించినరోజులలో సంపాదకులు స్త్రీవిద్య ప్రోత్సహించడమే.

పండితులూ సాహతీవేత్తలూ శల్యపరీక్ష చేసి రాసే విమర్శలజోలికి పోబోవడం లేదు నేను ఈ వ్యాసంలో. నా అనుభవాలు అన్నాను కదా. నాఅనుభవంలో అలాటి విశ్లేషణలు జరగలేదు కనక నేనేమీ చెప్పలేను.

నేను కథలు రాయడం మొదలు పెట్టేక, అంటే 50వ దశకంలో అభిప్రాయాలు గమనించడం మొదలు పెట్టేను. ఆ రోజుల్లో వారపత్రికలే ఈ అభిప్రాయప్రటనలకి వేదిక. కథ చదివేక కార్డో ఇన్లాండ్ కవరో తీసుకుని అభిప్రాయం రాసి ఆ పత్రికకి పంపితే అది మళ్ళీ పాఠకుడు చూసుకోడానికి కనీసం మరో రెండు వారాలు పట్టేది. అది కూడా ఆ పత్రిక ఎడిటరు వేసుకోడానికి అంగీకరిస్తేనూ, ఎడిట్ చేయకపోతేనూ మాత్రమే పాఠకుడు తాను రాసింది రాసినట్టు చూసుకునే అవకాశం. అంటే డబ్బు ఖర్చూ, కాలయాపనా కూడా అన్నమాట. నిజానికి చాలామంది పాఠకులు వ్యాఖ్యానాలు రాయడానికి మొహమాటపడేవారు కూడా ఆరోజుల్లో. ఇప్పటికీ మీ అమ్మమ్మనో వాళ్ళమ్మనో అడిగి చూడండి. ఏమో, నాకేం తెలుసులెద్దూ అంటారు. ఈమధ్య ముఖపుస్తకంలో “మీరేం అనుకుంటారో అని friend request పెట్టలేదు” అన్నవారు నాకు కనిపించేరు. రచయితలయందు పాఠకులకు గల గౌరవమర్యాదలనేపథ్యం ఇలాటి సందర్భాలలో అర్థమవుతుంది.

20వ శతాబ్దం ఉత్తరార్థంలో వారపత్రికలలో సాహిత్యపరంగా కూడా మంచి చర్చలు జరిగేయి. మహీధర రామ్మోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మవంటి రచయితలచర్చలు కనిపిస్తాయి 70, 80 దశకాలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలలో. భారతి, కృష్ణాపత్రికలలో కూడా ప్రముఖ రచయితలు అభిప్రాయాలను ప్రచురిస్తూ ఉన్నారనే గుర్తు. పోతే సాధారణ పాఠకులవ్యాఖ్యలు ఒక్కొక కథమీద ఒకటో రెండో నామమాత్రంగా కనిపించేవి. గత 20 ఏళ్లలో అంతర్జాలంలో పత్రికలూ, బ్లాగులూ, మిత్రసంఘాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చేయి. పాఠకులసంఖ్య లెక్కకు మిక్కిలిగా వృద్ధి పొందింది, పొందుతోంది. రచయితల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది.

ఈ నేపథ్యంతో నా అనుభవాలు చెప్తాను. పత్రికలలో నాకథలకి “ఈ కథ ఎందుకు రాసేరో అర్థం కావడంలేదు,” అని ఒక వ్యాఖ్య ఉంటే “చాలా బాగా రాసేరు,” అని మరో వ్యాఖ్య ఉండేది. ఒక కథమీద రెండో మూడో అభిప్రాయాలు కనిపిస్తే ఘనం. అంతర్జాలం ప్రవేశించేక, పాఠకులతో ముఖాముఖీ virtual స్థాయిలోనే జరగడం మొదలయింది. ఇది కొంతవరకూ ఆనందదాయకమే.

ఘనంగా కాకపోయినా నా పుస్తకంమీద జరిగిన ఒక చర్చ ఈవ్యాసానికి పనికొచ్చేది ఉంది. అది 20వ శతాబ్దం ఉత్తరార్థంలో స్త్రీల రచనావ్యాసంగానికీ, వారి సాహిత్యప్రస్థానానికీ దోహదం చేసిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకంమీద వేలూరి వెంకటేశ్వరరావు ఈమాట.కాంలో రాసిన సమీక్ష. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగించిన సమీక్ష. నేనెంత గొప్పదాన్నో అని కాక కేవలం వస్తువుని విశ్లేషిస్తూ రాసిన సమీక్ష అది. ఆ సమీక్షమీద వచ్చిన వ్యాఖ్యలలో ఈ వ్యాసానికి పనికొచ్చే వ్యాఖ్య బుజ్జాయి అన్నపేరు (బహుశా కలంపేరు)తో రాసింది, “ఎందుకిప్పుడు ఇది రాయడం. పాసిబూరె,” అని. ఆ వాక్యం గౌరవప్రదంగా నాకు అనిపించలేదు కానీ అక్కడ సైటులో ఎవరూ దాన్ని తప్పు పట్టలేదు. ఆ బుజ్జాయే అడిగిన రెండు ప్రశ్నలకి నేను మర్యాదగానే జవాబులిచ్చేను అది సీరియస్ గా జరుగుతున్న చర్చ అన్న అభిప్రాయంతో. ఆయనకి ప్రశ్నలడగమే కానీ పుస్తకం చదివే ఉద్దేశం లేదని అర్థం అయేక పుస్తకం చదివితే వారి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పి ముగించేసేను.

ఇప్పుడు ఆలోచిస్తుంటే మరో కోణం తోస్తోంది నాకు. ప్రతి పత్రికకీ తరుచూ వ్యాఖ్యానించేవారు కొందరుంటారు. పాఠకులకి ఈ వ్యాఖ్యాతల ధోరణి తెలిసి ఉంటుంది. అలాటి సందర్భాలలో “పాసిబూరె” లాటి పదాలు హేయంగా కనిపించవు. అతనలాగే మాటాడతాడు కానీ చాలా తెలివైనవాడు అంటూ సమర్థిస్తారు. నేను ఆ వ్యాఖ్యలన్నీ చూడను కనక ఆ పదం నాకు అసమంజసంగానే అనిపించింది. వ్యాఖ్యానాలు రాసేవారు తమగుంపులో వారే కాక ఇతరులు కూడా చదువుతారనీ, అపార్థాలకీ తావు అవుతాయనీ కూడా గ్రహిస్తే ఇలాటి వ్యాఖ్యలు రావు. ఇది కూడా నాకు అనుభవం అయింది :).

పై చర్చ అయినతరవాత నేను రాస్తున్న ఊసుపోక ధారలో ఈ వ్యాఖ్య వాడుకున్నాను. బహుశా మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది ఈ ఊసుపోక కతలలో ప్రధానాంశం హాస్యం, వ్యంగ్యం అని. అనేక సందర్భాలలో నామీదే నేను హాస్యం, వ్యంగ్యం విసురుకున్నాను. ఈ platform అలాటిది కనక సహజంగానే ఆ బుజ్జాయి వ్యాఖ్యని  వ్యంగ్యాత్మకం చేసేను, అమెరికాలో celebrity roastలాగ అనుకోవచ్చు. దానిమీద కొడవళ్ళ హనుమంతరావు వ్యాఖ్యానించేరు. ఆయనకి నారచనలంటే గౌరవమనీ, నేను బుజ్జాయిని అలా హేళన చేయడం మాత్రం బాగులేదనీ వారి వ్యాఖ్య సారాంశం. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించి విషయం నేను తీసుకున్న అంశాన్ని బుజ్జాయి పాసిబూరె అంటే ఆయనకి ఆభ్యంతరకరంగా కనిపించకపోవడం. హాస్యప్రధానమైన ఊసుపోకలో నేను హాస్యంగా రాసింది అభ్యంతరకరంగా కనిపించడం. నేను ఈమాట.కాంలో మర్యాదగానే జవాబిచ్చేను అన్నది ఆయన గమనించేరో లేదో నాకు తెలీదు. నాబ్లాగులో జరిగిన చర్చ అంతా ఇక్కడ పెట్టను. ఈవ్యాసం చివరలో లింకు ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు.

ముఖపుస్తకంలో చేరేక ఈ వ్యాఖ్యానాలధోరణిలో వచ్చిన మార్పులు నాకు మరింత స్పష్టం అయేయి. ఇది మరొక సంప్రదాయంగా రూపొందిందన్నా తప్పు లేదేమో.

Facebook ప్రధానంగా స్నేహితులు తమ స్వంత కబుర్లు చెప్పుకోడానికీ బొమ్మలు పెట్టుకోడానికీ ప్రారంభించినది. అయినా అనతికాలంలోనే సాహిత్యం, సంగీతం, పద్యం, కథ, సినిమా, పుస్తకాలు – ఇలా ఎవరి అభిమానవిషయాలనుబట్టి వారు పేజీలు ప్రారంభించడంతో “ముఖపుస్తకం కేవలం కాలక్షేపం కబుర్లకి మాత్రమే కాదు” అన్న స్థితికి చేరింది. అలాగే పూర్వ పరిచయాలున్న మిత్రులే కాక కొత్తవారు కూడా మిత్రత్వం కోరడం, అంగీకరించమో లేదా నిరాకరించడమో కూడా జరుగుతోంది. వీటివల్ల వచ్చే ఇతర అనర్థాలు ప్రస్తావించను కానీ వ్యాఖ్యలకి సంబంధించినంతవరకూ మాత్రం చెప్తాను.

అన్ని రంగాలలోలాగే ఇక్కడ కూడా మంచీ చెడూ కూడా ఉన్నాయి. బాగున్నవి – నాసందేహాలకి సూటిగా వివరంగా సమాధానాలు రావడం. ఇది నాకు చాలా నచ్చింది. ఇందుకే ముఖపుస్తకంలో నావ్యాసంగం కొనసాగిస్తున్నది. రెండో భాగం నాకు అంతగా నచ్చనిది – సీరియస్గా అడిగిన ప్రశ్నలకి హాస్యధోరణిలో జవాబులివ్వడం. ఉదాహరణ ఇస్తాను.

“కరుణ ఏవ ఏకో రసః” అని భవభూతి  వాక్యం. నాకు ఈ వాక్యం పరిచయమే కానీ పూర్వాపరాలు తెలీవు. అంచేత నా పేజీలో అడిగేను. సంగతి సందర్భాలు తెలిసినవారు చక్కగా వివరించేరు. నేను సంతోషించేను. అదే సమయంలో మరొకతను ప్రవేశించి “ఇంకా చాలా రసాలున్నాయి. నీరసం, నిమ్మరసం …” అంటూ వ్యాఖ్య పెట్టేడు నా టపాదగ్గర. నేను వెంటనే అలాటి వ్యాఖ్యలమూలంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనీ, అంచేత అలా రాయవద్దని చెప్పేను. దానికి అతను, “నాకు హాస్యం ఇష్టం. అష్టావధానంలో అప్రస్తుతప్రసంగంలాగే ఇది,” అని సమర్థించుకున్నాడు. నాకు మాత్రం కాదనే అనిపించింది. అష్టావధానం ఒక సాహిత్యప్రక్రియ. అక్కడ చెల్లింది కదా అని ప్రతి చోటా అప్రస్తుతప్రసంగం చెల్లుతుందనుకోడం సరి కాదు. ముఖ్యంగా  సీరియస్గా ఒక విషయం చర్చిస్తున్నప్పుడు హాస్యం, హేళన, వ్యంగ్యం ప్రయోగిస్తే, నాకే కాదు సీరియస్గా సమాధానాలిస్తున్నవారికి కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. వారిని కూడా కించపరచినట్టే అవుతుంది. ఇంతకుముందు చర్చించిన పాసిబూరె లాటిదే ఇది కూడా.

పూర్వకవులూ, ఆ తరవాత వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులువంటివారు వ్యక్తిగతంగా పత్రికలలోనే ఒకరినొకరు హేళన చేసుకున్న సందర్భాలు ఉన్నా వారందరూ వ్యక్తిగతపరిచయాలు గలవారు. ఏమాట ఎక్కడ నప్పుతుందో తెలిసినవారు. అంతర్జాలంలో అలా కాదు. అంతా తెరవెనక భాగోతమే. నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఎవరు ఎవరో తెలీదు. ఏ ఉద్దేశంతో ఏమాట అంటున్నారో తెలీదు. తరుచూ కనిపించే పేర్లమూలంగా తెలిసినట్టు అనిపించినా అది నిజంగా తెలియడం కాదు.

ఈ రోజుల్లో మామూలయిపోయిన రెండో రకం వ్యాఖ్యలు – రచయిత రాసిన వాక్యం సంపూర్ణంగా కాక ఏదో ఒకమాట తీసుకుని పక్కదారి పట్టించడం. అంటే సూటిగా నావాక్యానికి వ్యాఖ్యానం కాక అందులో ఒక మాట తీసుకుని మరో కోణం చెప్పడం. ఒకొకప్పుడు ఆ కోణానికి సందర్భశుద్ధి ఉండదు. కిందటేడు ముఖపుస్తకం నాపేజీలో నేను ఇది పోస్టు చేసేను –

రచయితకి మరణం రెండు మార్లు.

ప్రాణం పోయినప్పుడు

ప్రజలు మరిచినప్పుడు.

రెండోమరణం రెండు రెట్లు దారుణం.

దీనిమీద వచ్చిన ఒక వ్యాఖ్య “ఆ రచయిత చావడమే మేలు” అని. ఈ వ్యాఖ్య ఇంగ్లీషులో ఉంది, “he better die.” నేను రాసింది రచయిత రచయితగా  పాఠకులదృష్టిలో ఎంతకాలం అన్నది. పాఠకులు మరిచిపోతే ఎంత మంచి రచయిత అయినా ఎన్ని రచనలు చేసినా మృతుడితో సమానం అన్న భావానికి గురి అవుతాడు అని. ఆ రచయిత చచ్చిపోవడమే మంచిది అన్న వ్యాఖ్యలో ఆ భావం లేదు. నేను వివరణ అడిగితే, “విశ్వనాథ సత్యనారాయణలా ఎవరూ రాయడంలేదు, ఈరోజుల్లో మంచి సాహిత్యం రావడం లేదు” అన్నారు ఆయన. నావాక్యంలో మరణం మాట ఉంది కనక తానలా వ్యాఖ్యానించేనని కూడా చెప్పేరు. నా రెండో వాక్యంలో మరణం అంటే మానసికంగా రచయిత అనుభవించే మరణం అని. ఎ.వి. రమణమూర్తిగారు ఈ వివరణ ఇవ్వడంతో నాపని తేలిక అయింది.

నాపోస్టుకీ వ్యాఖ్యాత కొంపెల్ల శర్మ వెలిబుచ్చిన అభిప్రాయానికీ మధ్య గల తేడా గమనించండి. విశ్వనాథవారిలా రాసేవారు మళ్ళీ పుట్టకపోవచ్చు. కానీ ఆ కారణంగా తెలుగు సాహిత్యం అక్కడితో ఆగిపోయిందనో ఆగిపోవాలనో అనడం సబబేనా? అన్నది ఒక ప్రశ్న. మిగతా రచయితలందరూ నిజంగా రచయితలు కాకుండా పోతారా అన్నది మరో ప్రశ్న. మరి కొంపెల్ల శర్మ కూడా సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు గదా, వారు కొనసాగించడాన్ని ఎలా సమర్థించుకుంటారు అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నలు ఇక్కడితో ఆపుతాను. నా మొదటి వాదన- ఒక రచనకీ దానిమీద వచ్చిన వ్యాఖ్యలకీ ఎడం ఎంతగా పెరిగిపోతోందో, ఎంత అర్థరహితం అయిపోతోందో తరిచి చూసుకుందాం అంటున్నాను.

మూడోరకం వ్యాఖ్యలు రచనలో అంశాలను రచయితకు ఆపాదించి వ్యాఖ్యానించేవి. నేను రాసే కథల్లోనూ వ్యాసాల్లోనూ నా అనుభవాలు ఉన్నా అవి సార్వజనీనం అనుకున్నప్పుడే వాటిని కథల్లో వ్యాసాల్లో చొప్పిస్తాను. అంటే అది ఒక్క నా అనుభవమే కాదు, చాలామందికి వర్తిస్తుంది అని. అలాటప్పుడు అది నా ఆత్మకథ అయిన్నట్టుగా నాజీవితంలో ఇతర విషయాలు ప్రస్తావించడం, నాకు “సముచిత” సలహాలివ్వడం, సానుభూతి చూపడం వంటివి చేస్తున్నారు. అపార్థం చేసుకోకండి. నేను ఈ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఇది నా ఒక్క అనుభవమే కాదు అని చెప్పడానికే. చాలామంది రచయితలు నాతోనే ప్రత్యక్షంగా చెప్పేరు వారికి కూడా ఇలాటి  అనుభవాలు ఎదురవుతున్నాయని.

ఈ విషయంలో చిన్న ప్రయోగం చెయ్యదలుచుకుని నేను ముఖపుస్తకంలో రెండు పోస్టులు పెట్టేను. ఒకటి నాపేరుతోనే.

చిన్న చిన్న నొప్పులు చీమల్లా గులాబీముళ్ళలా

ప్రాణాంతకాలు కావు కానీ పనులు చేసుకోనివ్వవు.

ఇది నా స్వంత అనుభవమని చెప్పలేదు. ఏం చెయ్యమంటారని సలహాలు అడగలేదు. అయినా సలహాలు వచ్చేయి. సుప్రసిద్ధులయిన కవులూ, వేదాంతవిదులూ చెప్పిన వాక్యాలు ప్రతిరోజూ కనీసం 5, 6 కనిపిస్తాయి ముఖపుస్తకంలో. ఆ ప్రవచనాలదగ్గర ఏ సలహాలూ ఉండవు.

అది ఋజువు చేసుకోడానికి నాపేరు చెప్పకుండా కొన్ని వాక్యాలు రాసేను.

“కవులు ఉపాధ్యాయులు సుభాషితములు చెప్పుదురు.

నటులు, నాయకులు నటింతురు”

– అజ్ఞాతకవి.

“కవులు స్వీయ అనుభవము వ్రాసినను అది లోకసామాన్యముగ మాత్రమే ఆవిష్కరింతురు. కొందరు అమాయకులు దానిని కవిజీవితమునకు అన్వయించి స్పందించవచ్చును. నేను గాడిదగురించి వ్రాసిన నన్ను గాడిదగా గుర్తించవచ్చును. స్వర్గమునుగూర్చి వ్రాసిన నేను స్వర్గవాసినయితినని తలపవచ్చు.”

– అజ్ఞాత కవి.

ఈ పోస్టులమీద చర్చ వస్తువుమీదే జరిగింది. నేనే రచయితని అని కొందరు గ్రహించేరని తరవాత తెలిసింది కానీ వ్యాఖ్యానాలలో వ్యత్యాసం సుస్పష్టం.

స్థూలంగా చెప్పాలంటే పూర్వం రచయితలు, స్థానికులూ, వ్యక్తిగతస్థాయిలో పరిచయాలు ఉన్నవారూ విమర్శలూ, వ్యాఖ్యానాలూ వైయక్తికస్థాయిలో నడుపుకున్నారు. ఇప్పుడు సాహిత్యవేదిక virtual వేదికగా రూపాంతరం పొందింది. వ్యాఖ్యాతలు తదనుగుణంగా తమపద్ధతులని దిద్దుకోవాలి. జాలపరిచయాలు ఇతరత్రా వ్యక్తిగత పరిచయాలుగా మారే అవకాశం ఉంది కానీ ఒక రచయితపేరు తరుచూ అంతర్జాలంలో చూసినంతమాత్రాన ఆ రచయితతో హాస్యాలాడే పరిచయం ఏర్పడిపోయినట్టూ కాదు. అది సమంజసమూ కాదు. వస్తువుమీద దృష్టి ఉంచి చేసిన వ్యాఖ్యలకి ఉన్న గౌరవం హేళనకీ, ప్రధానాంశాన్ని వదిలేసి తమకి తోచినట్టు రాసే వ్యాఖ్యలకీ ఉండదు. రచయితలు విమర్శలను ఆదరించడంలేదు అని రచయితలని తప్పు పట్టేముందు విమర్శలూ, వ్యాఖ్యలూ ఆమోదించదగ్గవిగా ఉన్నాయో లేదో కూడా చూడాలి.

రచయితలూ వ్యాఖ్యాతలూ – ఇరు పక్షాలవారూ వస్తునిష్ఠతో తమ ఆలోచనలు వ్యక్తం చేస్తేనే వీరికీ వీరికీ కూడా గౌరవమూ, సాహిత్యానికీ గౌరవమూను క్షీరనీరన్యాయంగా. లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అయి అర్థరహితం అయిపోతుంది చర్చ.

 

000

నా ఊసుపోక టపాకి లింకు ఇక్కడ

(జులై 12, 2016)

వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !

Neelambari Cover

నాకు ముందుమాటలు రాసే అలవాటు లేదు. ఇదివరకోసారి రాసేను కానీ ప్రచురణకర్తలు అంగీకరించ లేదు  దాన్ని (చిత్రంగా ఉంది కానీ ఇలా కూడా జరగగలదని నాక్కూడా అప్పుడే తెలిసింది!). అంచేత, శారద నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు నేను సంకోచించాల్సివచ్చింది. కానీ శారద తప్పకుండా రాయమని మరీ మరీ అడగడంతో ఒప్పుకోక తప్పలేదు.

శారదతో నాపరిచయం నాసైటు www.thulika.net ద్వారానే. గత ఐదారేళ్ళలో దాదాపు పదికథలవరకూ అనువాదం చేసి ఇచ్చేరు. ఆమె నా సైటుధ్యేయం శ్రద్ధగా పరిశీలించి తదనుగుణంగా కథలు ఎంపిక చేసి. అనువాదం చెయ్యడం, అవి కూడా అనువాదాలవిషయంలో నా అభిప్రాయాలకి సానుకూలంగా ఉండడంచేత నాకు శారదయందు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అంచేత ఈ ముందుమాట రాయడానికి అంగీకరించేను.

ఆ తరవాత ఈ ముందుమాట రాయడానికి కూర్చుంటే, సంకలనాలపుట్టుక గురించిన ఆలోచనలు కలిగేయి. అసలు సంకలనాలు ఎందుకు వేస్తారు, అవి ప్రత్యేకంగా సాధించే ప్రయోజనం ఏమిటి అని.

మన దేశంలో ముద్రణాలయాలు 1675లో వచ్చినా, దక్షిణానికి ఆ యంత్రాలు 1711లో వచ్చేయి. మొదట్లో ప్రచురించినవి ఎక్కువగా క్రైస్తవ మతప్రచారానికే. రెండవదశలో తెలుగు సాహిత్యాభిలాషులు తెలుగుసాహిత్యానికి ప్రాధాన్యతని ఇస్తూ పత్రికలు ప్రచురించడం మొదలు పెట్టేరు. గోదావరి విద్యాప్రబోధిని (1800కి పూర్వం), మితవాది 1818లో వచ్చాయి. సుజనరంజని (1862-1867), పురుషార్థప్రదాయిని (1872-1878) లాటి పత్రికలతో పాటు  వీరేశలింగంగారి వివేకవర్ధిని (1874-1885), కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి ఆంధ్రభాషా సంజీవని (1871-1892; 1892-1900) లాటి పత్రికలు పుట్టేయి. (సమగ్రాంధ్ర సాహిత్యం. సం. 2. పు. 620-621, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఆరుద్ర సమకూర్చిన పట్టికలో 102 పత్రికలపేర్లు ఉన్నాయి. వాటిలో భారతి, గృహలక్ష్మి, ఆంధ్రపత్రికలాటి ఏ నాలుగయిదు పత్రికలో తప్పిస్తే, పైన ఇచ్చినతేదీలు కాక, మిగతాని పదేళ్ళపాటైనా మనలేదు. ఈ పత్రికలలో సమకాలీన సామాజికసమస్యలూ, సాహిత్యచర్చలూ విరివిగా జరిగేయి. వాటితోపాటు ప్రతి సంచికలోనూ ఒకటో రెండో కథలు కూడా ప్రచురించేరు. కానీ ఈ పత్రికలేవీ అట్టే కాలం నిలవకపోవడంతో, బహుశా ఆ యా రచయితలో సాహిత్య శ్రేయోభిలాషులో ఆ కథలని సంకలనాలుగా ప్రచురిస్తే, భావితరాలకి అందుబాటులో ఉంటాయన్న అభిప్రాయంతో సంకలనాలు ప్రచురించడం మొదలు పెట్టినట్టు నాకు తోస్తోంది. నేనిలా అనుకోడానికి ప్రమాణాలేమీ లేవు. నాకు చూడడానికి అట్టే పుస్తకాలు దొరికే అవకాశం లేదు కనక నేను ఈవిషయం ఇతర పరిశోధకులకి వదిలేస్తున్నాను.

ఈరోజుల్లో ఆధునికకథలు అనిపించుకుంటున్న కథలు సంకలనాలుగా 20వ శతాబ్దం ప్రథమపాదంలోనే వచ్చేయి. అప్పట్లో పత్రికలప్రచురణ బాగానే అభివృద్ధి చెందినా, చాలా పత్రికలు పుబ్బలో పుట్టి మఖలో మాడిపోడంతో రచయితలు తమ కథలని సంకలనాలుగా ప్రచురించడం మొదలెట్టి ఉండొచ్చు. ఆ తరవాత వేరు వేరు రచయితలకథలతో సంకలనాలు వచ్చేయి.

మనం స్మరించుకోవలసిన మరొక విభాగం జానపదసాహిత్యం. మనకి ఆనోటా ఆనోటా చెప్పుకుంటున్న జానపదసాహిత్యం చాలా ఉంది. అయితే ఈ చెప్పుకోడంలో పరిధి చాలా తక్కువ. ఇంట్లోవాళ్లూ, ఇరుగూ పొరుగూ, ఇంటికొచ్చినవాళ్ళూ – వీళ్లే ఆ చెప్పుకునే కథలకి శ్రోతలు. ఇది గమనించిన సాహిత్యాభిమానులు ముద్రణాలయాలొచ్చేక కథలని అచ్చొత్తించి భావితరాలకి అందించాలనే కోరికతో ఆ కథలని సేకరించి ప్రచురించడం ప్రారంభించేరు.  “కుంఫిణీయుగంలో పాతకథలకి కొత్త గిరాకీ వచ్చిందం”న్నారు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం 2. 47). 1819లో రావిపాటి గురుమూర్తి విక్రమార్కునికథలు సంకనలంగా ప్రచురించేరని ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంలో రాసేరు. (2. 268). 1830 మేలో ఏనుగు వీరాస్వామి కాశీయాత్రకి బయల్దేరి, దారిలో తాను చూసిన వింతలూ, విశేషాలూ …కి ఉత్తరాలలో రాసేరుట. … గారు వాటిని ఆ తరవాత ప్రచురించేరు. ఇది కథ కాదు కానీ కేవలం పుస్తకాలు అచ్చేయడంలో మనవారికి గల ఆసక్తి తెలియజేయడానికి చెప్పేను. కథలమాటకొస్తే, పంచతంత్రం 1834లో, పాటూరి రామస్వామి శాస్త్రులుగారి శుకసప్తతికథలు 1840లో ప్రచురించేరు (కె.కె. రంగనాథాచార్యులు. తొలినాటి తెలుగు కథానికలు. 1840 చాలా ప్రాముఖ్యత గల సంవత్సరం అంటారు ఆరుద్ర (స.సా. 2. 55). తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ప్రచురణ మొదలయిందప్పుడే కాబోలు. ఈ సంకలనాల్లో మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏకసూత్రత. అన్నీ జానపదసాహిత్యంలో అంటే నోటిమాటగా చెప్పుకుంటున్న కథలే అయినా, సంకలనాలుగా ప్రచురించినప్పుడు “మాకిష్టం అయినకథలు” అని గాక, ఒక నిబద్ధత పాటించేరు. భట్టి విక్రమార్కుడి కథలలో చిక్కు ప్రశ్నలు, శుకసప్తతికథల్లో శృంగారం, నీతి, తెనాలి రామలింగడికథల్లో హాస్యం, చమత్కారం, కాశీమజిలీకథల్లో దారిపొడునా ఊరూరా ఆ గురుశిష్యులు గమనించిన వింతలు, విశేషాలు – ఇలా ఏకసూత్రత కనిపిస్తుంది.

ఆతరవాత అంటే 1910 దాటేక, ఒక రచయిత తాను ఎంచుకున్న కథలు, కానీ ఒకే రచయిత కథలు గానీ ప్రచురించడం మొదలయింది. కె.కె. రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు పుస్తకంలో మొత్తం 15 సంకలనాలు 1917 నించి 1928మధ్య ప్రచురించినట్టు ఉంది. వీరిలో మనకి ఇప్పుడు తెలిసినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావు – సువర్ణలేఖా కథావళి (తేదీ లేదు), మాడపాటి హనుమంతరావు – మల్లికాగుచ్ఛము (1915), పానుగంటి లక్ష్మీనరసింహారావు – కథాలహరి (1917), గుడిపాటి వెంకట చలం – కన్నీటికాలువ, మునిమాణిక్యం నరసింహారావు – కాంతం కథలు, గురజాడ అప్పారావు – ముత్యాలసరాలు చిన్నకథలు, వీటితోపాటు మరుగున పడిపోయిన రచయితలు – వెదురుమూడి శేషగిరిరావు – మదరాసు కథలు (1911?), రాయసం వెంకటశివుడు – చిత్రకథామంజరి (1924), పోదూరు రామచంద్రరావు – కథావళి (1928) లాటి పేర్లు కూడా కనిపించేయి. (పు. 28-29). ఈ సంకలనాలలో ఏవి ఒకే రచయిత కథలు, ఏవి వివిధరచయితలో కథలు అన్నది రచయిత స్పష్టం చేయలేదు. నామటుకు నాకు రెండు రకాలూ అయి ఉండవచ్చని తోస్తోంది.

నలభై, యాబై దశకాలలో సంకలనాలు విరివిగా వచ్చేయి. మొదట్లో ఏదో ఒక సంస్థ పూనుకుని ప్రచురించడం జరుగుతూ వచ్చింది. సంకలనకర్తని ఆ సంస్థే ఎంచుకోవచ్చు. లేదా ఎవరో ఒకరు సంకలించడానికి పూనుకుని సంకలనం తయారు చేసి ప్రచురణసంస్థలని ప్రచురించమని అర్థించవచ్చు. ఈ సంకలనాలకి ఆదరణ కూడా బాగానే లభించింది. అందుకు కారణం ప్రధానంగా రచయితలపేర్లు పత్రికలద్వారా ప్రచారం కావడం. ఆ తరవాతి దశలో ప్రచురణకర్తలు నవలలకి ప్రాధాన్యం ఇచ్చి చిన్నకథలని చిన్నచూపు చూడడంతో రచయితలు తమకథలు తామే సంకలనాలుగా వేసుకోడం ప్రారంభించేరు. కాలక్రమంలో ఇది 90వదశకంలో వచ్చిందనుకుంటున్నాను.

ఇప్పడు, అంటే గత 40 ఏళ్ళగా డయాస్పొరా కథలు రావడం మొదలయింది. సంకలనాలు ఇంకా ఆలస్యంగా అంటే గత ఇరవై ఏళ్ళలో వస్తున్నట్టుంది. ఈ సంకలనాలు ఎక్కువభాగం అమెరికాలో ఉన్న తెలుగువారికలంనుండి వస్తున్నవే. శారదలా ఆంధ్రదేశానికీ, అమెరికాకీ దూరంగా ఉండి రచనలు సాగిస్తున్నవారు తక్కువే నాకు తెలిసి. ఇంతకీ ఏ కథలు డయాస్ఫొరా కథలు అంటే నేను సమాధానం చెప్పలేను. ప్రధానంగా డయాస్ఫొరా కథలు ఎలా ఉంటాయి అన్నవిషయంలో నాకు అవగాహన లేదు. వేలూరి వెంకటేశ్వరరావు వ్యాసం(http://www.eemaata.com/em/issues/201003/1547.html) చూసేక నాకు అర్థమయిన విషయం – ఈనాడు డయాస్ఫొరా కథ అంటే అటు పుట్టినదేశానికి దూరమై అక్కడిజీవితాన్ని మళ్ళీ మళ్ళీ తలబోసుకోడమో (నోస్టాల్జియా), ఇటు మెట్టినదేశంలో సాంస్కృతికసంఘర్షణలలో ఈతిబాధలు కలబోసుకోడమో అనిపిస్తోంది. ఆవిధంగా ఆలోచిస్తే శారదగారి సంకలనాన్ని డయాస్ఫొరా అనడానికి నాకు మనసొప్పడం లేదు. ఈకథల్లో ఇతివృత్తాలు ఈ డయాస్ఫొరా నిర్వచనంలో ఇమడవు అనిపించింది నాకు. ఈవిషయానికి మళ్లీ వస్తాను.

ప్రస్తుతం ఆధునిక, సమకాలీన, సామాజిక కేంద్రంగల కథలు అంటే ఒక సందేశమో ఇతివృత్తమో ఏకసూత్రంగా ఉన్నవి అనుకోవాలి. అంటే స్త్రీలకథలు, దళితకథలు, ఆకలి కథలు, ఏదో ఒక ఊరి కథలు … ఇలా ఆ సంకనలకర్త అభిరుచులని బట్టి, ఇష్టాయిష్టాలని బట్టి సంకలనాలు వస్తున్నాయి. ఎనభై దశకంలో స్త్రీవాదం, దళితవాదంలాటి వాదాలు ప్రబలడంతో, ఏదో “వాద“ కథలనే అంటున్నా, వీటన్నిటికీ సాంఘికప్రయోజనం అన్న మరో ధర్మసూత్రం కూడా గొడుగు పట్టడంతో సంకలనాలలో వైవిధ్యం అదృశ్యమయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా ప్రచురిస్తున్న కథ ????(ఏదో సంవత్సరం) తీసుకోండి మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఇదే.

ఒకే రచయిత రాసినకథల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈకథల్లో హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే అకృత్యాలమీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వచిత్రణ ఉంది. ఈ సంకలనంలో ప్రతికథమీద నేను వ్యాఖ్యానించను కానీ ఉదాహరణకి కొన్ని కథలు పరిశీలిస్తాను.

మొదటి కథ రాగసుధారసపానము ఎత్తుగడలో హాస్యరసస్పోరకంగా ఆషామాషీగా ఉన్నా, ముగింపులో మన శాస్త్రీయసంగీతం భవిష్యత్తుగురించిన తపన కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఈరచయిత్రే రాసిన మాయింట్లో మర్డర్లు చదివినప్పుడు, రచయిత్రి ఒకే అంశానికి భిన్నకోణాలు ఆవిష్కరించడం కనిపిస్తుంది. (చూ. నీలంబరి బ్లాగు, http://sbmurali2007.wordpress.com/).

యుద్ధసమయంలో బతికుంటే బలుసాకు తినొచ్చు అనుకుని పడవెక్కి  మరో దేశానికి పారిపోతే, అక్కడ ఎదుర్కొనే దుస్థితిగురించి చెబుతుంది పడవ మునుగుతోంది కథ. ఇది దేశం వదిలి పోయినవారి కథ కనక ప్రవాసాంధ్రులకథ అనుకోవచ్చేమో కానీ రచయిత్రి కథ మలిచినతీరులో డయాస్ఫొరా ఎల్లలు దాటి, మానవీయకోణం ఆవిష్కరించడం చూస్తాం. ఒక మనిషి పరిచయమయిన తరవాత ఆ మనిషితత్వాన్నిగురించి, వ్యక్తిత్వాన్నిగురించి ఊహలు కలగడం సహజం. నిజానికి మనఊహలకీ ఆశలకీ ఒక అవినాభావసంబంధం ఉంది. ఆ రెంటినీ సమన్యపరుచుకుని సమాధానపడడం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఊహాచిత్రం. ఇందులో వాచ్యం కాని మరొక అంశం ఎవరి ఊహలు ఎంతవరకూ నిజం అన్నది. అది పాఠకులఊహలకి వదిలిపెట్టడం రచయిత్రి నేర్పుకి ఉదాహరణ.

అతిథి కథలో విశేషం అతిథిసత్కారాలు మన జీవితంలో ఒక భాగం. ఆ ఆగంతుకుడు ఒక చిలుక అయినప్పుడు ఆ చిలుక పొందిన అతిథిసేవ హృద్యంగమంగా చిత్రించిన కథ. ఈ కథలో చిలుక ప్రసక్తి రాగానే నాకు గుర్తొచ్చిన రెండు కథలు భద్రాచల రామదాసుకథ, ఆచంట శారదాదేవిగారి పారిపోయిన చిలుక. ఈ రెండు కథలకీ భిన్నంగా శారద తనకథలో మానవుడికీ మానవేతర జీవులకీ మధ్య ఉండగల సౌమనస్యం, సౌజన్యం చిత్రించేరు. నాకు ఈ అభిప్రాయం ఏర్పడడానికి కారణం కథలో ప్రధానపాత్ర చిలుకే అయినా కథ కుక్కపిల్ల, పిల్లిపిల్లతో మొదలవడం. సాధారణంగా ఆధునికకథల్లో కథాంశం ఎత్తుగడలోనే చెప్పాలంటారు విజ్ఞులు. అలా అనుకుంటే ఈ కథ చిలుకతోనో, ప్రధానపాత్ర అయిన గృహిణితోనో మొదలవాలి. కానీ మరో రెండు జీవాలని పరిచయం చేయడంతో, కథకురాలు కథని విస్తృతం చేసేరు.

నేనెవర్ని కథలో వస్తువు సర్వసాధారణమే అనిపించినా, ఈకథకి నేనెవర్ని అని శీర్షిక ఇవ్వడం పెట్టడం రచయిత్రి సూక్ష్మదృష్టికి తార్కాణం. పాఠకులదృష్టిని ఆకట్టుకోగల శీర్షిక అది. ఎందుకంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఆ ప్రశ్న, నేనెవర్ని, అనిపించకమానదు. కథమాటకి వస్తే, “స్త్రీ ఎవరు?” అంటే మనకి అనూచానంగా వస్తున్న నిర్వచనం “కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, అని. కానీ ఈ శాస్త్రాలు పుట్టినకాలంలో పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఈనాటి స్త్రీ వ్యక్తిత్వం వేరు. ఈనాటి ధర్మపత్ని బయటికి వెళ్ళి బయటిపనులు కూడా చేస్తోంది. పైగా తన అస్తిత్వాన్ని గురించిన స్పృహ కొత్తగా వచ్చింది. ఆ దృష్టితో చూస్తే ఇది స్త్రీవాదకథ అనుకోవచ్చు. కానీ తరిచి చూసే పాఠకులకి మరికొన్ని ఆలోచనలు స్ఫురించగలవు. ఉదాహరణకి ఈకథలో ప్రధానపాత్ర మగవాడయితే, ఆఫీసులో అధికారికి సలాములు చేసినా, ఇంటికొచ్చేక, ఇంట్లో యజమాని, పిల్లలకి తండ్రి, భార్యకి భర్త, తల్లిదండ్రులకి సుపుత్రుడు – ఇలా అనేక పాత్రలు పోషిస్తాడు. మనిషి సంఘజీవి, కుటుంబజీవి కనక వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాత్రలు నిర్వహించడం సహజమూ, అవసరమూను. ఈ రెండు కోణాలూ పక్క పక్కన పెట్టి చూసినప్పుడు, సమాజంలోనూ, కుటుంబంలోనూ వ్యక్తికి గల బాధ్యత ప్రస్ఫుటమవుతుంది. తద్వారా సాటి మనిషిని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. రచయిత్రి ధ్యేయం ఇదీ అని నేను చెప్పడంలేదు. కానీ పాఠకుడు ఇలా కథని విస్తరించి చదువుకున్నప్పుడు కథకి మరింత బలం చేకూరగలదు అని నా నమ్మకం. కథకులకీ, పాఠకులకీ కూడా దీనివల్ల లాభమే.

అలాగే పడగనీడ కూడా పాఠకులని ఆలోచింపజేయగలకథ. లోకంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లలకి రక్షణ లేకుండా పోతోంది. పాము పడగనీడ వసించు కప్పల్లా పిల్లలబతుకులు దినదినగండం అయిపోతున్నాయి. ఇది అందరికీ తెలిసినవిషయమే. అయితే, అలా జరగడానికి కారణం ఏమిటి? ఒక కారణమేనా, అనేక కారణాలున్నాయా? ఉంటే అవేమిటి? ఇలా ఆ దౌర్జన్యానికి వెనక కారణాలు వెతకడం ఒక దారి. మరి రేపటిమాట ఏమిటి? ఆ హింస, దౌర్జన్యం జరగకుండా చెయ్యాలంటే, ఎక్కడెక్కడ మనం ఏ ఏ మార్పులు చెయ్యాలి, చెయ్యడానికి పాటు పడాలి అని ఆలోచించుకోడం మరో దారి. ఇన్ని కోణాలు చిత్రించడంలో రచయిత్రి విజయం సాధించేరు. కథలు పాఠకులని ఆలోచింపజేయాలి. అనేక కోణాలు స్పశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలి. ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ అదే వ్యత్యాసం.

స్థూలంగా, కథ నడపడంలో మంచి నేర్పు ఉంది రచయిత్రికి. ఎక్కడా అధిక ప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలివి. అలాగే కథలకి శీర్షికలు పెట్టడంలో, వస్తువు ఎంచుకోడంలో, ఆ అంశాల్లో తనకి గల అవగాహన స్పష్టం చేయడంలో, కథ నడపడంలో శారద కృతకృత్యులయేరని చెప్పడానికి నేను సందేహించను. అది మంచి రచయిత లక్షణం. ఎక్కడా విసుగు పుట్టకుండా చకచక చదువుకుంటూ పోవడానికి కావలిసిన పటుత్వం ఉంది శైలిలో.

భాషవిషయం నాకు ప్రత్యేకించి అభిమానవిషయం. అంచేత ప్రత్యేకించి ఈ సంకలనానికి ఇది వర్తించకపోయినా, ఈ విషయం కాస్త వివరంగా రాస్తున్నాను (అందుకు శారద, సురేష్ కొలిచాల అనుమతిస్తారని ఆశిస్తూ). గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి ప్రతిష్ఠాత్మకరచయితలు వందేళ్ళకి ముందే వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించేరు. ఇప్పుడు మనం అందరం వ్యావహారికభాషలోనే రాస్తున్నాం. అయితే, ఇది అప్పారావు గారూ, రామ్మూర్తిపంతులు గారూ చూసి ఆనందించి, అభినందించే వ్యావహారికమేనా? అంటే నాకు అనుమానమే. ఆనాడు మనతెలుగుకథలు సంస్కృతంలో రాస్తే, ఇప్పుడు ఇంగ్లీషులో రాస్తున్నట్టుంది. కొన్ని కథలు చూస్తే ఇది తెలుగుకథ అని నాకు అనిపించడం లేదు. ఇంగ్లీషుమాటలు కూడబలుక్కుని చదువుకుని, మనసులో మళ్ళీ నాతెలుగులోకి తర్జుమా చేసుకుని చదవాల్సివస్తోంది. ఈవిషయంలో బెంగాలీ రచయితలు కృషి చేస్తున్నట్టు గురజాడకి జ్ఞానేంద్రమోహన్ దాసు 1914లో రాసిన జాబువల్ల తెలుస్తోంది. (గురజాడ అప్పారావు. గురజాడ జాబులు, దినచర్యలు. సం. సెట్టి ఈశ్వరరావు. పిడియఫ్ లో పు. 58.). ఆయన ఇలా రాసేరుః

“విజయనగరం, విశాఖపట్టణాలలో నేను వున్న ఆ స్వల్పకాలంలో, నేనొక విషయాన్ని గ్రహించగలిగాను. అక్కడి పండితులు రెండు వర్గాలు. మొదటివర్గంవారి పద్ధతి అతి ప్రాచీనం. సాహిత్యరచనలో ఏ మాత్రపు ప్రాచీన పద్ధతులు సడలినా వారు సహించరు. మార్పుకు వారు విముఖులు. రెండవర్గంవారు సుముఖులు. కనక ఈ ఇరు తెగలవారికి అన్నిటా చుక్కెదురు.

ఒకొప్పుడు బెంగాలీభాష పరిస్థితి ఇలాగే వుండేది. పదాడంబరంతో పడికట్టు రాళ్ళవంటి శబ్దాలతో సమాసపు బిగింపులతో వచనరచన అధ్వాన్నంగా తయారయింది. విభక్తిప్రయ్యాలను మాత్రం మార్చి అనుస్వార విసర్గ క్రియారూపాలను సర్దుబాటు చేసుకుని, సంస్కృత శబ్దాలను ఠస్సాకు ఠస్సాయించి పండితులు భాషను కృతకం కావించారు. ఈ క్రియాపదాలు సైతం సంస్కృతవ్యాకరణసూత్రాలకు విరుద్ధంగా కటువుగా సృష్టి అయేవి. పండితులు వ్రాసే కృతకవచన శైలి ఇటు ప్రజలకు అటు విద్యావంతులకు అర్థం కాక కొరకరాని కొయ్యగా రూపొందింది. కాగా ఎవరి ఆదరణ లభించక, గ్రంథాలలో మేట వేసుకుపోయింది. ఇలాటి పరిస్థితులలో రాజా రామమోహన్‌రాయ్ చదవతగ్గ వచనాన్ని సృష్టించాడు. దానిని విద్యాసాగరుడు అనుసరించి, వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఈయన స్వతంత్రకల్పనలకు యోచనకు ఆస్కారం లేక అనువాదాలతోనే గడిచిపోయింది. … …

టేక్ చంద్ సర్వస్వతంత్రుడు, అత్యంత సాహసి. … ఆయన భాషాప్రవాహాన్ని తనకభిముఖంగా తిప్పుకుని, దానిని పండితులపై తిప్పికొట్టేడు. … ఈనాడు మీరు ఆంధ్రసాహిత్యంలో బహుశా ఏయే పరిణామాలను కోరుతున్నారో వాటిని ఆయన వంగసాహిత్యంలో సాధించాడు.

… … వ్రాసే, మాటలాడే, గ్రంథములలో పత్రికలలో వాడే భాషలనుగురించి వివాదం జరుగుతూనే వుంది. వాదప్రతివాదాలు, ఖండనమండనలు సాగుతూనే వున్నాయి. వాడుకభాషను గ్రామ్యమని, నింద్యమను పండితులు నేటికీ అంటూనే ఉన్నారు. ఇంతవరకూ ఏ నిర్ణయమూ జరగలేదు.

మీరూ, నేనూ, మనమంతా జవమూ, జీవమూ గల భాషను కావాలని వాంఛిస్తున్నాము. అంటే ఆ భాష పరిపూర్ణమైనదిగా వుండాలని మన ఆశయం. (అ) ప్రజలకు సాధారణజ్ఞానాన్ని కలిగించే, (ఆ) పారిశ్రామిక, వైజ్ఞానిక, కళారంగాలలో కృషి చేస్కున్న విద్యార్థులకు సాంకేతికజ్ఞానాన్ని ప్రబోధించే, (ఇ) పండితులకు ఉదాత్తభావాలను, ఆదర్శాలను జ్ఞానాన్ని ప్రబోధించే, (ఈ) ప్రసన్న గంభీర మధుర కావ్యసృష్టికి దోహదపడే అన్నివిధాలా అర్హమైన భాషను, భాషాశైలిని సృష్టించుకోవాలని మనం కృషి చేస్తున్నాము. … … దైనందిన జీవితంలో నిత్యమూ చెవిని పడుతున్న మాటలను, సులభంగా అర్థమయే సరళపదాలను, నుడికారాన్ని సాహితీపరులు స్వీకరిస్తున్నారు. … ఇప్పుడు బెంగాలులో రచయితలు సరళ సుబోధకశైలిని అనుసరిస్తున్నారు. మామూలు మాటలలో అర్థగాంభీర్యాన్ని సాధిస్తున్నారు. … సొగసయిన పదాలను ఎంచుకోడంలో, వాటిని అర్థవంతంగా ప్రయోగించడంలో రచయితకున్న నేర్పునుబట్టి అతనిశైలికి అందం అమరుతుంది. ఆఖరికి నింద్యమని అపభ్రంశమని పండితులు ఈసడించే శబ్దాలను సైతం, అశ్లీలతాదోషం అంటనీయకుండా, సమర్థుడైన రచయిత ప్రయోగించవచ్చు.

భాష నాజూకుగా, ఠీవిగా వుండాలి. ఆడంబరం అందమీయదు. జటిలపద ప్రయోగంవల్ల భాషాసౌకుమార్యం కలగదు. తేటమాటలతో నాగరికమైన అనుభవాలను, ఉదాత్తభావాలను వ్యక్తపరచాలి. శైలి సహజప్రవాహంవలె ఉరకలెత్తుతూ, అనుభూతులను కలిగిస్తూ హృదయంపై చెరగని ముద్రలను వేయాలి. శైలి అందం ఇలా ఇలా వుండాలని సిద్ధాంతీకరించి చెప్పడం సులభమే. కానీ ఈ అందాన్ని అలరించడం కష్టం. అక్కడే వస్తుంది అడ్డు.

నిఘంటువుల, పండితుల, వైయాకరణులసహాయం, అవసరం లేకుండా, చదవగానే అందరికీ అర్థమయే విధంగా భాషను సంస్కరించవలెనని మీఆశయం. అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము. అంటే దాని అర్థం భాషాగాంభీర్యాన్ని, స్నిగ్ధసౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామని కాదు. పైగా దాని సౌకుమార్యాన్ని ఇనుమారు తెచ్చుకుంటున్నాము (పు. 58-59).

నేను ఈ ఉత్తరంలో భాగాలను ఇంత విస్తృతంగా ఉదహరించడానికి కారణం – ఈ వ్యావహారికభాషావాదం ఎప్పటినించి ఎంత ప్రబలంగా ఉందో ఎత్తి చూపడానికి. ఈ అనువాదంలో సంస్కృతం బాగానే ఉండడం గమనార్హం. బహుశా జ్ఞానేంద్రమోహన్ దాసు ఇంగ్లీషులో అదే స్థాయి శైలిలో రాసేరేమో. అప్పారావుగారు వ్యావహారికంలో రాయాలని ఉద్యమం మొదలు పెట్టినా, ఆయన రాసిన భాష ఈనాడు మనకి వ్యావహారికంలా అనిపించదు. తిరగరాసిన దిద్దుబాటు కథలో కూడా నాకు పాతవాసనలే కనిపించేయి. కానీ ఇప్పుడు ఆస్థాయి అధిగమించి, నిజంగా మనం రోజూ మాటాడుకునే మాటల్లో కథలు రాయడం వచ్చింది. అయితే దానిలో తెలుగు తగ్గిపోతోంది. నేను కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో పేజీకి రెండో మూడో ఇంగ్లీషు మాటలు కనిపించేయి (నాకథల్లో కూడా). ఇప్పుడు వాక్యాలకి వాక్యాలే ఇంగ్లీషులో ఉంటున్నాయి. సరే అనడానికి ఓకే అంటున్నాం. ఆదివారం, సోమవారం అనడానికి బదులు సండే, మండే అంటున్నాం. నేను నాస్నేహితురాలితో మాటాడుతున్నప్పుడు, “ఆదివారం వస్తాను” అంటే “ఓకే, సండే రా,” అంటుంది. అంటే అలా తెలుగుమాటని ఇంగ్లీషులోకి మార్చుకుంటే తప్ప తలకెక్కని పరిస్థితికి వచ్చేం. ఇది దారుణం.

శారదగారి కథలలో చాలావరకు మంచి తెలుగు నుడికారం ఉంది. కానీ కొన్ని కథల్లో మాత్రం ఇంగ్లీషు కొంచెం ఎక్కువే అనిపించింది. ఈభాషకే అలవాటు పడినవారు “ఇప్పుడు ఇలాగే మాటాడుతున్నాం, ఆ వాక్యాలు వాస్తవంగా ఉన్నాయి” అని వాదించవచ్చు. కాదనను కానీ, సాంఘికప్రయోజనంలాగే తెలుగుభాషనీ, నుడికారాన్నీ నిలబెట్టి పటిష్టం చేసే బాధ్యత కూడాఈనాటి రచయితలకి ఉందనీ, లేదనుకుంటే, మనసు మార్చుకుని ఆ బాధ్యత చేపట్టాలనీ నేను గాఢంగా నమ్ముతున్నాను. నాకథలని అభిమానించేవారు నాకథలద్వారా మరచిపోతున్న మాటలు మళ్ళీ గుర్తుకి తెచ్చుకోడం, కొత్తగా తెలుసుకోడం కూడా జరుగుతోందన్నారు. అంటే మంచి తెలుగు నుడికారం గల కథలని పాఠకులు ఆదరిస్తున్నారు.

ఈ ముందుమాట రాయడానికి నాకు అవకాశం కల్పించిన శారదకీ, నేను రాసింది వంకలు పెట్టకుండా ప్రచురించుకుంటామంటూ ప్రోత్సహించిన సురేష్ కొలిచాలకీ ధన్యవాదాలు.

వర్ధమానరచయిత్రి శారద  ముందు ముందు ఇలాగే మంచి కథలు అందించగలరని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ,

నిడదవోలు మాలతినిడదవోలు మాలతి

సెప్టెంబరు 2, 2012.

తెలుగు కథ నాడి ‘తూలిక’

rsz_1dsc00491నిడదవోలు మాలతి పేరు చెప్పగానే ఒక అందమైన నెమలీక లాంటి “తూలిక” గుర్తుకు వస్తుంది. కథకురాలిగా, అనువాదకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా ,మంచి తెలుగు టీచర్ గా తెలుగు సాహిత్యం లో ఆమె బహుముఖీన ప్రజ్న మన మది లో మెదులుతుంది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అమెరికా లో నివాసం ఉంటున్నప్పటికీ తెలుగు నేల ను, తెలుగు కథ ను మర్చిపోకుండా , కేవలం మాటలతో   కాలక్షేపం చేయకుండా, తనకు చేతనైనంత తో తెలుగు భాషా, సంస్కృతి, సాహిత్యాల గురించి తెలుగేతరులకు తెలిసేలా ” తూలిక” (తెలుగు కథల ఇంగ్లీష్ అనువాదాల సైట్ ) ను దాదాపు 12 ఏళ్ళుగా ఒంటి చేత్తో నడుపుకుంటూ వస్తున్నారు. ఎవరి నుంచి ఒక డాలర్ సహాయం పొందకుండా, ఎవరి ప్రోత్సాహం, తోడ్పాటు లేకుండా, తాను నమ్మిన దాన్ని ఆచరణ లో చూపిస్తూ అందరికీ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సాహిత్యానికి నిస్వార్థంగా తూలిక చేస్తున్న కృషి పట్ల తోటి సాహిత్యాకారుల,  తెలుగు సంఘాల  ద్వంద్వ వైఖరిని గురించి ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో తన ఆవేదన ను, ఆక్రోశాన్ని వెలిబుచ్చిన నిడదవోలు మాలతి ” సారంగ ” కు ఇచ్చిన ప్రత్యేక  ఇంటర్వ్యూలో మరో సారి తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టం గా, నిష్కర్ష గా, నిర్భయంగా వెల్లడించారు.

Qమొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తూలిక ప్రయాణం ఎలా జరిగింది?

తూలిక మొదలు పెట్టినప్పుడు నాకేమీ పెద్ద ఆశలూ, ఆశయాలూ లేవు. అది కాకతాళీయంగా జరిగిందనే చెప్పాలి. 80వ దశకంలో యూనివర్సిటీలో ఉద్యోగం మొదలు పెట్టేక, South Asian conference లో పాల్గొనడం,  Journal of South Asian studies వారు వ్యాసాలో అనువాదాలో ఇవ్వమని అడగడంతో రెండు, మూడు కథలు అనువాదం చేసేను. తూలిక మొదలు పెట్టింది జూన్ 2001లో. దానికి కారణం కేవలం కొత్తగా వెబ్ సైటు చెయ్యడం నేర్చుకోడంవల్ల వచ్చిన ఉత్సాహం. అంతకుముందు, యూనివర్సిటీలో పని చేస్తున్నప్పుడు, అమెరికనులు మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల ఆసక్తితో అడిగే ప్రశ్నలు రెండో కారణం.  అనువాదాలూ, వ్యాసాలూ తూలిక.నెట్‌లో పెట్టడం ప్రారంభించేక, నా వ్యాసాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలలో తెలుగు పరిశోధకులు, తెలుగులు కానివారు చూడడం, వాటిని తమసైటుల్లో పెట్టుకోడం, రిఫరెన్సులివ్వడం చూసేక, క్రమేణా ఒక నిర్దుష్టమైన ధ్యేయం రూపు దిద్దుకుంది. అదేమిటంటే, మన కథలద్వారా విదేశీయులకి మనసంస్కృతిగురించి తెలియజేయడం అని.
తెలుగుకథకి పద్మరాజుగారు అంతర్జాతీయఖ్యాతి ఆర్జించేరని చెప్పుకోడమే కానీ నిజానికి తెలుగు అనే భాష ఒకటి ఉందని తెలీనివాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రా అంటే మద్రాసీ అంటారంటే మనం ఏమనుకోవాలి? ఇంతకీ నేను చెప్పేది ఈ సైటువల్ల ఏదో సాధించేస్తాను అనుకుంటూ మొదలు పెట్టలేదు. అంచేత నాకు నేనై చేసిన ప్రచారం కూడా ఏమీ లేదు. నాసైటులో గెస్ట్ బుక్ పెడితే, మనవాళ్ళే మొదలు పెట్టేరు నేనేదో ఘనకార్యం చేస్తున్నానంటూ. అప్పుడు కూడా నేనెవర్నీ మీరు దీనికి లింకులివ్వండి, దీన్నిగురించి నలుగురికీ చెప్పండి అంటూ అడగలేదు. కానీ ఈమధ్య దాదాపు ఏడాదిగా అనుకుంటాను నాకు తూలిక ప్రయాణం నిరర్థకం అనిపిస్తోంది. దానికి కారణం నీ రెండో ప్రశ్నకి సమాధానంలో ఉంది.
Qపాఠకులు లేదా సాహిత్యకారులు తూలిక ను ఎలా స్వీకరించారు?
పాఠకులకి సంబంధించినంతవరకూ, నేను మొదలు పెట్టింది అమెరికనులకోసమే అయినా, ఇంగ్లీషుబళ్ళో చదువుకున్న తెలుగు యువతీయువకులూ, విదేశాల్లో ఉన్న తెలుగువారూ కూడా చదువుతున్నారు ఈ అనువాదాలు. సుమారుగా 300-350 హిట్లు ఏ రోజు చూసినా కనిపిస్తాయి. కదాచితుగా 600 దాటుతాయి.

పోతే, తెలుగు సాహిత్యాభిమానులూ, తెలుగు సాహిత్యోత్తములూ, తెలుగు సాహిత్యకారులూ – వీరిమాటకొస్తే, పైన చెప్పినట్టు నాతో చాలామందే నేనేదో ఘనకార్యం చేస్తున్నానని చెప్తున్నారు కానీ దానికి అనుగుణంగా వారి ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో, అనువాదాలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభావేదికల్లో తత్తుల్యమైన ఇతర రూపాల్లో ఎక్కడా తూలిక ప్రస్తావన కనిపించడంలేదు. అది చూసేక, ఈ ప్రముఖులు నాతో అన్న మాటలన్నీ సొల్లు కబుర్లుగానే కనిపిస్తున్నాయి నాకు.

గత పన్నెండేళ్ళలో నేను ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా, ఒక్కరు కూడా తూలికకోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి ఇవ్వలేదు. అట్టే కాదు కానీ 2, 3 సార్లు ఇండియాలో ఉన్నవారిని గౌరవసంపాదకులుగా పేరయితే పెట్టేను కానీ వారివల్ల కూడా సహకారం ఏమీ లేదనే చెప్పాలి. అంచేత ఈ సాహిత్యకారులెవరూ తూలికని సీరియస్‌గా తీసుకోలేదని గట్టిగానే చెప్పగలను. కానీ, మళ్లీ ఈ రచయితల్లో కొందరికి తమకథ తూలికలో పడాలన్న కోరిక ఉండడం కూడా చూస్తున్నాను. వీళ్ళలో కొందరు అవే కథలూ, వ్యాసాలూ మళ్ళీ మళ్ళీ పంపడం చూస్తే, తూలిక.నెట్ పట్ల వీరికున్న అభిప్రాయం ఏమిటో నాకర్థం కావడంలేదు.

విదేశీయులు నా అభిప్రాయం అడిగినప్పుడో, నా వ్యాసం తమసైటులో పెట్టుకున్నప్పుడో మాత్రం నాకు తృప్తిగానే ఉంది.

ఇక్కడే మరొక మాట – వీరినుండి నేనేమిటి ఆశిస్తున్నానో – కూడా చెప్తాను. శాలువాలూ, సత్కారాలూ, జీవితసాఫల్య పురస్కారాలూ నేను కోరడం లేదు. నా పేరు చెప్పడం సిగ్గుచేటు అనుకుంటే నాపేరు కూడా చెప్పవద్దు. కానీ ఈ సైటుమూలంగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్న మేలు ఇదీ, కీడు ఇదీ, ఈ సైటులో వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలకి ఆధారాలు లేవు – లాటి చర్చ ధైర్యంగా చెయ్యమని అడుగుతున్నాను. నాకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. మీక్కూడా ఉంటే ఇక్కడ చెప్పమని అడుగుతున్నాను. అంతేగానీ కేవలం నామొహంమీద “గొప్ప సేవ చేస్తున్నారు” అనేసి ఊరుకుంటే, అది నాకు ఆనందించవలసినవిషయంగా తోచదు. నల్లమేక-నలుగురు దొంగలు కథలో చెప్పినట్టు, ఇంతమంది ఇలా తూలికని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఈ సైటుకి నిజంగా విలువేమీ లేదనిపించడం సహజమే కదా.
Qతూలిక మిగతా అనువాద సైట్‌ల కన్నా ఏ రకం గా భిన్నమైనది?

మిగతా సైటులకీ నా సైటులకీ ఆశయంలోనూ, కథలఎంపికలోనూ చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది. ఎలా భిన్నం అంటే,

1. తూలిక.నెట్ కేవలం తెలుగుకథలకే అంకితమై, తెలుగు కథలనీ, కథకులనీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రారంభించిన సైటు. ఆ నియమానికి కట్టుబడి ఉన్న సైటు. ఇతర సైటులన్నీ- తెలుగువారు మొదలు పెట్టినవి కూడా – తెలుగుసాహిత్యం కోసమే అని ప్రారంభించినా రెండోసంచికకే ఇతర భాషల రచయితలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి అది ఒకరకంగా తెలుగుకథకి అన్యాయమే అంటాను. తెలుగుకథ ప్రాచుర్యం పొందకపోవడానికి కూడా అది ఒక కారణం కావచ్చు. కేవలం తెలుగురచయితలకే పరిమితమయిన సైటు తూలిక తప్ప మరొకటి లేదు, నేను చూసినంతవరకూ.

2, కథలఎంపికలో కూడా చెప్పుకోదగ్గ భిన్నత్వం ఉంది. దాదాపు అన్ని సైటులూ దేశంలో ప్రతి విమర్శకుడూ, ప్రతి రచయితా మెచ్చుకున్న కథలే మళ్లీ మళ్లీ ప్రచురిస్తున్నారు. ఈనాడు అతిగా ప్రాచుర్యం పొందిన కథలు అంటే “సామాజికస్పృహ” గల కథలు. అంటే సమకాలీనసమాజంలో లోపాలూ, వాటివల్ల హింసకి గురవుతున్నవారి కథలు. ఈ కథలు ఆశించే ప్రయోజనం మనసమాజంలో లోపాలను పాఠకులు గుర్తించి ఆ దురాగతాలని అరికట్టాలని. ఇది మంచిదే.

విదేశీయులకోసం చేసే అనువాదాలధ్యేయం అది కాదు, కాకూడదు. మనయిల్లు మనం చక్కబెట్టుకోవాలంటే మన కష్టసుఖాలు మనవాళ్లతో చెప్పుకుని, మనలో మనం పరిష్కరించుకుంటాం. ఇతరజాతులతో మాటాడుతున్నప్పుడు ఆ పాఠకులు ఆశించేది అది కాదు. నువ్వు అమెరికాలో ఉన్నావు. నిన్ను ఏ అమెరికనో, మరోదేశం మనిషో అడిగే ప్రశ్నలకి పైన చెప్పిన “సామాజికస్పృహ” కథల్లో సమాధానాలు దొరుకుతాయా? వారికి మనం చెప్పవలసిందేమిటి? అలాటి కథలవల్ల వారు గ్రహించేది ఏమిటి? నా అభిప్రాయం అవి కాదనే. నేను ఎంచుకునే కథలు తెలుగుజాతిని విడిగా నిలబెట్టేవి, తనదైన, మనకే  ప్రత్యేకమయిన విలువలూ, సంస్కృతి, ఆచారాలూ, సంప్రదాయాలు – ఇవి ఆవిష్కరించే కథలు.
కష్టాలూ, కన్నీళ్ళూ, ఈతిబాధలూ అందరికీ ఒక్కలాగే ఉంటాయి.

ఏదేశంలో ఏ మనిషికైనా కూడూ, గుడ్డా, కొన్ని సాధారణసౌకర్యాలూ , ఏమాత్రమో తానూ ఒక మనిషినన్న గుర్తింపూ,– ఇవే కదా కావలసినవి. కుటుంబం, స్నేహితులు, తోటిమనిషి ఆలంబనా ప్రతి మనిషికీ కావాలి. అలాగే వీటిమూలంగా వచ్చే చిక్కులు కూడా అన్ని దేశాల్లోనూ అందరికీ ఒక్కలాగే ఉండొచ్చు. కానీ, వాటిని ఎదుర్కొనే విధానంలో, అనుభవించేతీరులో, పరిష్కరించుకునే పద్ధితిలో వ్యత్యాసాలున్నాయి. ఆ వ్యత్యాసాలే ఒకజాతిని మరొకజాతినించి వేరు చేసి విడిగా నిలబెడతాయి. లేకపోతే, నేను తెలుగువాణ్ణి, నేను తెల్లవాణ్ణి అని వేరుగా చెప్పుకోవలసిన అగత్యం లేదు.

ఒక ఉదాహరణ కావాలంటే, మనదేశంలో ఇద్దరు అమ్మాయిలు గానీ ఇద్దరు అబ్బాయిలు గానీ ఒకరిభుజంమీద ఒకరు చేతులేసుకు తిరగడం సర్వసాధారణం. మనకి అది ఎబ్బెట్టు కాదు. అది కేవలం ఆత్మీయమైన మైత్రికి చిహ్నం, అంతే. అదే అమెరికాలో అయితే, ఆ ప్రవర్తన గే, లెస్బియన్లమధ్య మాత్రమే ఉంది. ఇండియా వెళ్ళి వచ్చిన ఒక అమెరికనమ్మాయి ఒకసారి నాతో అంది “ఇండియాలో చాలామంది గే” అని. ఇలాటి భిన్నత్వం మనం కథలద్వారా విశదమవుతుంది. అలాగే మనసంస్కృతి, సంప్రదాయాల్లో మనజాతికి ప్రత్యేకమయినవి అష్టావధానాలూ, తోలుబొమ్మలాటలూ, కలంకారీ, బిళ్లంగోడూ, గోరింటాకు, జడకోలాటం లాటివి ఎన్నో ఉన్నాయి. వీటిగురించి చెప్పే కథలు ఒకరకం.
రెండోరకం, సార్వజనీనమయిన కథాంశాలు. ఆరుద్రగారి ముఫ్ఫైలక్షలు పందెం  కథ (యస్. నారాయణస్వామి అనువాదం) తీసుకో. సిగరెట్టు పెట్టె అట్టముక్కలు కత్తిరించి, వాటికి ఆర్థికవిలువ ఆపాదించి, పిల్లలు ఆడే ఆట ఆకథ. చిన్నతనంలోనే పిల్లలకి ఆర్థికసూత్రాలు ఎలా పట్టుబడతాయో అద్భుతంగా ఆవిష్కరించేరు ఆరుద్రగారు ఆ కథలో. అంతే కాదు, అది ఏ మాత్రం ఖర్చు లేని ఆట. ఇలాటి ఆటల్లో పిల్లల సృజనాత్మకత, ఊహాశక్తి ఎంతగానో వ్యక్తం అవుతాయి.

మరో ఉదాహరణ – వాళ్లు పాడిన భూపాలరాగం  కథ. అందులో పదహారేళ్ళ అబ్బాయిద్వారా మధ్యతరగతి బతుకుల్లో అవకతవకలు ఆవిష్కరిస్తారు శ్రీదేవి. ఇందులో మన సంస్కృతిగురించి గర్వపడదగిన విశేషాలు లేవు. కానీ రచయిత్రి కథ ఆవిష్కరించినతీరు నన్ను ఆకట్టుకుంది. ఈకథలో నాకు నచ్చిన మరో అంశం ఒక అబ్బాయి ప్రధానపాత్ర కావడం. ఆడపిల్లలకి పెద్దలు పెట్టే ఆంక్షలగురించి కొన్ని వేల కథలు వచ్చేయి. స్త్రీవాదం పేరుతో వచ్చే కథలన్నీ అవే. వాటికి భిన్నంగా, మనసంస్కృతిలో అబ్బాయిలకి కూడా ఆంక్షలు ఉన్నాయి కనీసం కొన్ని కుటుంబాల్లో. అంటే ఇక్కడ అబ్బాయా, అమ్మాయా అని కాక, పిల్లలబతుకులలో పెద్దవాళ్ళ జోక్యం చాలా ఉండేది అన్నవిషయం ఎత్తి చూపుతుంది. అంచేత అది విలక్షణమైన కథ అయింది. అంటే నేను ప్రత్యేకించి చూస్తున్నది కొత్త కోణం ఆవిష్కరించినకథలు. ఇలా అందరూ రాస్తున్న విషయాలే అయినా మరొక కోణం, సాధారణంగా ఎవరూ గమనించని, లేదా పట్టించుకోని కోణం ఎత్తి చూపే కథలద్వారా, కథాచరిత్రకి పరిపూర్ణత ఏర్పడుతుంది.
నిజానికి నేనెక్కడా చెప్పలేదు కానీ ఈ కథగురించి మరో రెండు విషయాలు కూడా చెప్పొచ్చు. మొదటిది, కథ పేరు వాళ్ళు పాడిన భూపాలరాగం అని. మామూలుగా భూపాలరాగం హృద్యంగమంగా ఉంటుంది. చల్లగా, ప్రేమగా పాడే మేలుకొలుపు. ఆపాట పాడినప్పుడు పిల్లలు ఉలికిపడి లేవరు. అందులో ఉన్న ఆప్యాయత రామం బంధువులు రామానికి వినిపించిన రాగంలో లేదు. అది శ్రవణానందకరమైనది కాదు. రెండోది, రామం చదువుగురించి చెప్పినమాట. అతనికి కాలేజీచదువు గొప్ప ఉద్యోగం సంపాదించుకోడానికి కాదు. కాలేజీపేరున ఆలోచించుకోడానికి కొంత వ్యవధి తీసుకోడమే అతనిఉద్దేశం అని అనిపించింది నాకు చివరి పేరా చదువుతుంటే.

నేను ఉదహరించదలుచుకున్న మూడో కథ రాజారాం గారి జీవనప్రహసనం. ఈకథలో చిత్తూరుదగ్గర ఒక కుగ్రామం, అక్కడ జరిగే ఒక పండుగ, “భారతయజ్ఞం” ఎన్నో సూక్ష్మవిషయాలు చక్కగా కళ్ళకి కట్టినట్టు వివరించడం జరిగింది. అలాటి వివరాలు మనకి మాత్రమే ప్రత్యేకమైన జీవనసరళిని విదేశీయులకి విశదం చేస్తాయి. ఇలా ప్రతికథలోనూ ఏదో ఒక ప్రత్యేకత  – విదేశీయులకి మనజాతిగురించి ప్రత్యేకించి చెప్పగల విషయం – ఉన్నకథలు ఎంచుకోడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇదంతా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి, నా ఎంపిక అర్థమయినట్టు లేదు. పదిమంది “మంచి కథ” అంటూ మెచ్చినకథ, ఫలానావారి పోటీలో “బహుమతి పొందిన కథ” అయితే చాలదు నాకు. ఏకథ కానీ, దానివల్ల విదేశీయులకి మనజాతిగురించి మనం ఏం చెప్తున్నాం అన్నది కూడా ముఖ్యం. బహుశా చాలామంది తెలుగువాళ్ళకి నాసైటు అట్టే ఆకర్షణీయం కాకపోవడానికి ఇది కూడా కారణమేనేమో.  మన తెలుగువాళ్ళకి మాత్రమే పనికొచ్చే కథలు – సామాజిక స్పృహ గల కథలు – అనువాదానికి పనికిరాకపోవచ్చు అన్నది చాలామందికి తెలీడంలేదు.
Qతూలిక మీకు సంతృప్తి నిచ్చిందా?
తూలిక నాకు సంతృప్తి ఇచ్చిందా అంటే వ్యక్తిగతంగా ఇచ్చింది. నాకు ఏది చేయడం తృప్తిగా ఉంటుందో అది చేస్తున్నాను. ఆ తృప్తి నాకుంది. కానీ సాహిత్యపరంగా చూస్తే, నిరాశ కలుగుతోంది. పైన చెప్పేను. తమకథలు తూలికలో అనువదించి ప్రచురించమని కోరేవారెవరూ తూలిక చదవరు. తమ కథ తూలికలో (లేదా మరో పత్రికలో) కనబడితే చాలనే కానీ, తూలికద్వారా ఏమిటి సాధించగలం, ఆ ఆశయానికి – తెలుగుకథని ప్రపంచవ్యాప్తం చెయ్యడానికి – మనం ఎలా తోడ్పడగలం అన్న ఆలోచన ఉన్నవారెవరూ నాకు కనిపించలేదు. పంపినకథలే పంపడం, అనువాదం చేసినకథలే అనువాదం చెయ్యమని అడగడం, నేను వేసుకోనని చెప్పిన కథలూ, వ్యాసాలు తిరిగి పంపడం – ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం ఉత్సాహంగా ఉంటుంది? వీరికి నిజంగా తూలికమీద, తూలిక ఆశయాలమీద నమ్మకం ఉందా అనిపించదా?

అసలు తూలికవిషయమే కాదు. ఈమధ్య చాలామంది విమర్శలూ, సాహిత్యచర్చలూ distorted, biased, అంటూనే, వాటినే ఆదరిస్తున్నారు సాహిత్యవేత్తలూ, సామాన్యపాఠకులూ కూడా. ఈనాటి చరిత్ర పాక్షికం అంటున్నారే కానీ ఈ సాహిత్యనేత్తలు తూలికలో మరుగున పడిపోతున్న రచయితలని వెలుగులోకి తేవాలన్న నాప్రయత్నానికి ఇచ్చిన మద్దతు ఏమీ లేదు.
Qతూలిక భవిష్యత్తు ఏమిటి?
తూలిక భవిష్యత్తు ఏమిటో నాకూ తెలీదు. అయితే తూలికని అభిమానించేవారు కొందరైనా ఉన్నారని మాత్రం ఋజువైంది ఈమధ్యనే. నెలరోజులక్రితం నేను తూలిక.నెట్ ఎకౌంటు రద్దు చేసేను. దానికి పైన చెప్పిన కారణాలన్నిటితోపాటు, సాంకేతికాభివృద్ధి మూలంగా వచ్చిన కొత్త కష్టాలు కూడా ఉన్నాయి. నాకు విసుగేసి సైటు రద్దు చేసేను. వెంటనే, తూలిక.నెట్ కొనసాగాలని కాంక్షించిన ఒకరు వేరే సర్వరులో కావలిసిన ఏర్పాటు చేసి, దానికి తగిన సాంకేతికసహాయం కూడా అందించి, తూలిక ఫైల్స్ అన్నిటినీ అక్కడికి తరలించమన్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నాను.
ఇలా కొత్త సర్వరులో పునః ప్రారంభించడంవల్ల జరిగిన ఒక లాభం ఏమిటంటే ప్రతిరచనా మరోసారి చూసుకోడం, మొహమాటానికనో మాట ఇచ్చేననో ప్రచురించినవాటిని మరోసారి పరీక్షించి చూసుకోడానికి, నిజంగా తూలిక ఆశయాలకి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకోడానికి అవకాశం ఏర్పడింది. ఇలా మరొకరు పూనుకుని ఈసైటు ప్రత్యేకతని మరోసారి నాకు ఎత్తి చూపడం మూలంగా నాకు నేనే గుర్తు చేసుకున్నది ఏమిటంటే, తూలికలో నేను ప్రచురించిన నావ్యాసాలు ఇతరదేశాల్లో ఆసియా పండితుల, తెలుగు పరిశోధకులఆదరణ పొందేయన్న సంగతి. అలాగే కొందరు లింకులిచ్చేరు. కొందరు మొత్తం వ్యాసాలు తమసైటుల్లో పెట్టుకున్నారు. ఆవిధంగా నావ్యాసాలకి ఆదరణ ఉంది కనక ఈ సైటు ఇలాగే కొనసాగుతుందనీ, నాకు చేతనయినంతకాలం సాగించాలనీ అనుకుంటున్నాను.
చివరిమాటగా, పైకారణాలన్నిటిమూలంగా నేను వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు కూడా చేసుకున్నాను. ఇంటర్వ్యూలివ్వడం, సభలకి హాజరవడం లాటివి మానుకున్నాను. అయితే, నీకు ఈ జవాబులు ఇవ్వడం ఎలా జరిగిందంటే, దానికి కారణాలు రెండు.

1. ఎప్పుడో పదినెలలక్రితం మొదలు పెట్టింది పూర్తి చె్యాలి కనక,

2. తూలిక సైటు మాయమయిందని తెలియగానే, క్షణాలమీద మరొకరు పూనుకుని దాన్ని పునరుద్ధరించడానికి ఉత్సాహం చూపేరు కనక. నేను మరోసారి తూలిక ధ్యేయం పాఠకులకి స్పష్టం చేయడం న్యాయం మరియు నాధర్మం అనుకుని ఇక్కడ ఇంత వివరంగా చెప్పేను.
నువ్వు అడిగినప్రశ్నలు ఐదే అయినా మౌలికమైన ప్రశ్నలు కనకనూ, తూలిక.నెట్ సైటుని మరొకసారి పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో ఉన్నాను కనకనూ ఇంతగా రాసేను.

తూలిక  ప్రస్థానం :
– తూలిక.నెట్ ప్రారంభించింది జూన్ 2001లో
– అనువదించిన కథలు ఇప్పటివరకుః 150. ఇందులో శారద (ఆస్ట్రేలియా) అనువదించినవి 10,
– ఇతర అనువాదకులు చేసినవి 10.
– నేను రాసిన పరిశీలనాత్మక, విశ్లేణాత్మక వ్యాసాలుః 25.
– ఇతరుల రచయితలవ్యాసాలు (వేరే సైటుల్లో ప్రచురించినవి తూలికలో పునర్ముద్రించినవి 3.
– నేను తూలికకోసం అనువదించినవి. 3.
– సంకలనాలు: 52 అనువాదాలు 3 సంకలనాల్లో వచ్చేయి. ప్రచురణకర్తలు జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ (బెంగుళూరు విభాగం), లేఖిని సాహిత్య సాంస్కృతిక సంస్థ (హైదరాబాదు.).

నిడదవోలు మాలతి సాహిత్య ప్రస్థానం గురించి పొద్దు వెబ్ మాగజైన్ లో విపులంగా వచ్చిన ఇంటర్వ్యూ ల ద్వారా మరింత తెలుసుకోవచ్చు.

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-1/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-2/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-3/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-4/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-5/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-6/

 Kalpana profile2ఇంటర్వ్యూ : కల్పనారెంటాల