ఇంకేమీ ల్యే ….. రివేరా సంతకం!

riveraa

 

మనుషుల్ని దూరం చేయడం ఈ యుగ లక్షణం. ఒకర్నొకరు కలవకుండా, మాట్లాడకుండా, ఆలింగనం చేసుకోకుండా,  ఒకరి కండ్లలో తడి మరొకరు అనుభూతి చెందకుండా చేయడం ఈ కాలం లక్షణం. ఒకర్నుండి ఒకర్ని యెప్పటికప్పుడు ఖాళీ చేస్తుండడం, చేయిస్తుండడం ఈ నాటి క్రూరత్వం. ఒకప్పుడు ఇల్లు ఖాళీ చేసేటోళ్లం. తర్వాత ఊర్లు ఖాళీ చేసినం. ఆ తర్వాత దేశాల్ని ఖాళీ చేసినం. ఇప్పుడింక మనుషుల్నే ఖాళీ చేయాల్సివస్తున్నది. మనుషుల్ని అలవోకగా,  యేమీ పట్టనట్టుగా వదిలేసి,  ఖాళీ చేసి,  గొరగొరా మనల్ని మనం ఈడ్చుకుపోవల్సి వస్తున్నది. మనుషులు మనల్ని భౌతికంగా వదిలి పోవుడు ,  సుదూరమై పోవుడు  అందనంత దూరంలో ఉండుడు  చివరికి ఈ లోకంలోంచే నిష్క్రమించుడు  మనకు రోజూవారీ చర్యై పోయింది. తీరా వదిలిపోయినంక కానీ తెలుస్త  లేదు ఆ నొప్పి – తీరా దూరమైనంక కానీ ఆ గాయాలు సలపడం లేదు – ఇంక మళ్ల కలవరు,  ఇంక మళ్ల చూడలేము , మళ్ళెప్పుడూ కరస్పర్శ ఐనా వీలుకాదు అని తెలిసినంక  కానీ వెచ్చని నెత్తుటి తడి అంటదు.

అనాదిగా కవులు,  కలయికల గురించీ, వియోగాల గురించీ,  విరహాల గురించీ పాడుతూనే ఉన్నరు. కలయికల తియ్యదనం గురించి పాడినట్లుగా,  వియోగపు చేదునూ మధురంగానే పాడుతున్నరు. ఐతే అన్ని కాలాల్లో కలయికలు వియోగాలు విరహాలు ఒకటికావు. మనుషులందరికీ కూడా కలవడాలూ విడిపోవడాలూ వేరు వేరుగానే అనుభూతిలోకి వస్తయి. ప్రేమికులకు ఒక రకంగా, స్నేహితులకు ఒక రకంగా, సన్నిహితులకు ఆప్తులకు మరో రకంగా అవి గోచరిస్తయి, అనుభూతినిస్తయి. అన్నింటికంటే సామూహిక కార్యాచరణలో ఉన్నవారికి, ప్రజాఉద్యమాల్లో ఉన్నవారికి కలయికలు అపురూపాలు – వియోగాలు అత్యంత విషాదాలు. వియోగం వేరొకచోటికి బదిలీల వల్ల కావచ్చు, బలవంతంగా పరిస్థితుల వల్ల విడిపోవడం కావచ్చు చివరికి దుర్మార్గపు వ్యవస్థ బలికోరే బలవన్మరణాలవల్ల కావచ్చు. యేది యేమైనా యీ వ్యవస్థ చేస్తున్నది మనుషుల్నుండి మనుషుల్ని ఖాళీ చెయ్యడమే – ఖాళీ చేసి దూరంగా సుదూరంగా అందరానంత దూరంగా,  మళ్ళెప్పుడూ కలవనంత దూరంగా విసిరెయ్యడమే – ఒక పూడ్చలేని శూన్యాన్ని మిగల్చడమే.

ఇక ఇప్పుడు కవులు ఖాళీ చెయ్యడం గురించి పాడతరు. ఖాళీ ఐన చోట మిగిలిన శూన్యం గురించి పాడతరు. ఖాళీ చేసేటప్పుడు గొరగొరా ఈడ్చుకుపోయిన మనుషుల చప్పుడు గురించి పాడతరు. ఐతే ఖాళీ గురించి పాడడమంటే, ఖాళీ గురించి చెప్పడమంటే  ఉన్నప్పటి ఉనికి  గురించి చెప్పడమే కదా – ఉన్నప్పటి అనుభూతుల్నీ అనుభవాల్నీ ఆకాశాల్నీ నేల చెలిమల్నీ తడమడమే కదా!

ఇంక ఈ లోకంనుండే ఖాళీ చేసి పోయినవాళ్ల గురించి పాడెటప్పుడు యెంత విషాదం గడ్డకట్టుకు పోతుందో చెప్పడం యెవరికి సాధ్యం?   అందరానంత దూరాల్లో ఉండీ కలవలేకపోవడం  అర్థం చేసుకోవచ్చేమో – పక్క పక్కనే ఉండి ఒకర్నుండి ఒకరు ఖాళీ ఐన పరిస్థితి మరీ దారుణం కదా – మరి దాన్ని పాడడం యింకెంత విషాదం?

 

“వాళ్లు స‌జీవంగా ఉంటారు

మ‌న‌తో క‌ల‌వ‌రు

మ‌న‌ల్ని స‌జీవంగా ఉంచుతారు

అయినా, మ‌న‌తో ఉండ‌రు.”

అని మొదలవుతుంది రివేరా కవిత ‘ఇంక ల్యే… ‘ .

సజీవంగా ఉండీ, మనల్ని సజీవంగా ఉంచీ మనతో కలవని వారూ మనతో ఉండని వారి గురించి, వారు వదిలిన ఖాళీ గురించి పాడుతున్నడు కవి. వెంటనే ..

“కిత్నేబీ క‌హో… వాళ్లంతే

వాట్ మేబీ వుయ్ ఆర్‌.. వాళ్లంతే.”

అంటూ హింగ్లీషు లోనూ తెలుగులోనూ లయబద్దంగా చలిస్తడు.

“ పొయ్యి మీద కూర్చోబెట్టేసి

పొద్దున్నే చాయ్ కాసేస్తారు

చెవి మెలిపెట్టేసి రాగం తీయిస్తారు

పుట‌ల్లో చొర‌బ‌డి ప‌క్కున న‌వ్వేస్తారు

మ‌న జేబులు దోసేసి

దొంగ‌ల్లా బోనులో నిల‌బెట్టేస్తారు.”

కొంగ్రొత్త వ్యక్తీకరణతో , వాళ్ళేమి చేసినరో చెప్తున్నడు కవి. వాళ్ళు మనకెంత సన్నిహితులో, మనకెంత యేమి నేర్పించినరో యెట్లా నేర్పించినరో చెప్పి ముక్తాయింపుగ మన జేబులే దోసి మనల్నే దొంగల్ని  చేసిన వైనం చెప్తడు ఒకింత చమత్కారంగా – వాళ్ళు మన జేబుల్ని దోచింది మన పైసలు కాదని మనకి వేరేగా  చెప్పనవసరం లేదు కవి.

హాత్ మిలే, బాత్ ఖిలే.. వాళ్లంతే

సాత్ చ‌లే, రాత్ హిలే.. వాళ్లంతే.

మళ్ళీ లయబద్దమైన హింగ్లీషు. ఐతే యేదో చమత్కారం కోసం వాడడం లేదా సంగీతం కోసం లయకోసం మాత్రమే కాదు – మిలే ఖిలే చలే హిలే చాలా లోతైన పదాలు – మిలే చలే మనుషులకు వర్తిస్తే ఖిలే హిలే ప్రకృతి కి సంబంధించినవి. ఐతే మనుషులకీ  వికసించడం కదిలిపోవడం వణికిపోవడం సహజమే కదా – అందుకే కవి అమాయకంగా సంగీతం కోసం లయకోసం వాడినట్టున్నా , కొంచెం గడుసుతనం కూడ ప్రదర్శించిండు.

 

“ సూరీడికి అర‌చేతులు అడ్డుపెట్టి

మ‌న క‌న్నుల‌కు కాపు కాసిందెవ‌రో..

ఆ క‌న్నుల‌ను వొళ్లోకి తీసుకొని

ఊపిందెవ‌రో, ఊకోబెట్టిందెవ‌రో..

క‌న్నులు మూసినా, తెరిచినా

దృశ్యాన్నంతా దురాక్రమించిందెవ‌రో..”

 

‘అరచేతికి అడ్డుపెట్టీ సూర్యకాంతినాపలేరు’   అన్న నినాద ఉద్యమ సంప్రదాయం నుండి వచ్చిన కవే రివేరా – ఐతే ఆ స్ఫూర్తి యెంతమాత్రమూ పోకుండానే, మనకు బాగా తెలిసిన భావాన్ని మనకు అపరిచితం చేస్తున్నడు. యెండవేడిమి నుండి లేలేత కనుపాపలని కాపాడినరు, వొళ్ళోకి తీసుకోని ఊపినరు ఊకోబెట్టీనరు – మనల్ని పసిపాపలుగానూ,  పసిపాపలు చేసీ పెంచి పెద్ద చేసిన వాళ్ళ గురించి చెప్తూ కవి,  మన కళ్ళ లో దృశ్యాల్ని దురాక్రమించుకున్నరు అని ఒక విరోధాభాస ప్రయోగిస్తున్నడు. ఇది మంచి దురాక్రమణ అని వేరే చెప్పాలా కవి?

“ తిరిగే లోకంలో తిక‌మ‌క‌ప‌డిన‌ప్పుడ‌ల్లా

తిమ్మిరి తీసి తిన్నగా దారికి తెచ్చిందెవ‌రో..

మ‌నిద్దరినీ అంబాడే అడుగులు చేసిందెవ‌రో..”

మొదటి రెండు వాక్యాల్లో మనకి నడక నేర్పినరు అని చెప్పడానికి కవి వాడిన పదాలను వాటి సొగసునూ అనుప్రాసనూ గమనించండి. యెక్కడా తేలిపోకుండా, కవిత్వమవుతూనే అద్భుతంగా పదాలను కూర్చినడు కవి.

“ఎంత వెతుకూ… దొర‌క‌రు

ఎంత పిలువూ.. ప‌ల‌క‌రు

నీడ‌ల‌ను మ‌న‌కి మిగిల్చి

నిజ దేహాల‌తో ఎంచ‌క్కా లేచిపోతారంతా..”

ఇక్కడ ఇక కవితలో మొదటి రెండు చరణాల  తర్వాత ప్రయోగించిన హింగ్లీషు ప్రయోగం కాకుండా తన మాతృభాష లోనే శోకిస్తున్నడు కవి. నీడలను మనకు మిగిల్చి వెళ్ళిపోయే వారిని ‘యెంచక్కా లేచిపోతారంతా’ అనడం లో అట్లా హాయిగా వెళ్ళిపోయినరనే అర్థం స్ఫురించినా వెతికా దొరకని,  పిలిచినా పలకని, ఖాళీలు మిగిల్చి,  పుట్టెడు  శోకాన్నీ మిగిల్చి,  పూడ్చలేని ఖాళీలు మిగిల్చి , వెళ్ళిపోయారనే దుఃఖ భారమూ ఉన్నది. మనకు తేలిక అనిపించే పదాలతో మనం యెంతో బరువును అనుభూతి చెందేటట్టు చేయడం కవి గొప్పదనమిక్కడ.

“ ఇంకేమి ల్యే… గుర‌..గుర‌.. గ‌ర‌..గ‌ర‌.. బ‌ర‌..బ‌ర‌లే..”

అని ముగిస్తడు కవితను.  ఇది సందర్భం తెలవక పోతే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించే అవకాశం ఉన్నది. సాధారణంగా మనమేదేనా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు,  చివరి సారి లోపలికి పోయి,  అంతా కలియ చూసి చివరి సందూక నో సూట్కేసునో గొరగొరా బరబరా ఈడ్చుకొచ్చి ‘ఇంకేమీ ల్యే.. ‘  అని అలసటతోనూ, నిస్పృహతోనూ, అన్నీ వదిలి వెళ్తున్నం కదా అనే దుఃఖంతోనూ అంటాం కదా – అ దీ కవి తన ముగింపు వాక్యంగా యెంచుకొన్నడు. నిజానికి ఇది కవితకు ప్రారంభవాక్యం . కవి ఇంకా చెప్పదల్చుకున్నదానికీ, చెప్పకుండా మనల్ని ఊహించుకోవడానికి వదిలేసిన దానికీ ప్రారంభ వాక్యాలు. నిజానికి ముందు చెప్పిందంతా ఒక ఉపోద్ఘాతం మాత్రమే – ఇక్కడ్నుండీ కవిత మొదలవుతుంది. అది మనమే ఊహించుకోవాలె  రాసుకోవాలె.  ఇట్లాంటి అనేక సందర్భాల్లో మనలో మిగిలిన ఖాళీలను చెప్పకుండా , అవి మన ఊహలకే వదిలేసి,  జీవితంలోని ఒక ప్రాక్టికల్ సందర్భానికి కవితాశక్తి ని తెచ్చి,  మనకియ్యడం  కవి అసమాన ప్రతిభకు నిదర్శనం.

రివేరా విరసం లో చాలా చురుకైన సభ్యుడు. చాలా రోజుల్నుంచి కవిత్వం రాస్తున్నడు. చాలా మంచి కవిత్వం రాస్తున్నడు. విరసం వాళ్ళు రాసేది కవిత్వమేనా అని పెదవి విరిచే వాళ్లకు కనబడకపోయి వుండొచ్చు కానీ ఇప్పటికే కవిత్వసంపుటాల్ని ప్రచురించి కవిత్వాన్ని ప్రేమించే వారందరికీ చిరపరిచితుడు. లబ్దప్రతిష్టుడు. కొత్తగా కొంగ్రొత్త వ్యక్తీకరణలతో రాస్తున్నడు. ఒకసారి చదవగానే మర్చి పోయే కవితలు కావతనివి. కనీసం రెండు మూడు సార్లు చదవాలి మనలో ఇంకడానికి  – మనమూ తనతో అంతే గాఢతతో అనుభూతించడానికి.    ఒక సారి ఇంకిపోతే ఇంకెప్పుడూ మనలోంచి ఆరిపోడు రివేరా. విస్తృతంగా ప్రపంచకవులను చదువుతున్నడని ఆయన కవితలను చదివితే అర్థమవుతున్నది.

యెక్కడా తన నిబద్దతనూ నిజాయితీనీ,  సమాజం పట్ల బాధ్యతనూ యెంత మాత్రం సడలకుండా కవిత్వాన్ని తనదైన సంతకంతో  రాస్తున్న అత్యాదునిక కవి రివేరా.

*

 

 

 

ఆటా సాహిత్య పండగ సందడి

 

 ata2016
-నారాయణ స్వామి వెంకట యోగి
~

జూలై 1  నుండి ౩ వరకు షికాగో లో రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో ఆటా  ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. ఈ రజతోత్సవ వేడుకలు ప్రధానంగా సాంస్కృతిక వేడుకలుగా జరుగనున్నాయని ఆటా నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు సంస్కృతిని అద్భుతంగా విరాజిల్లే విధంగా ఈ మహాసభలు జరుగుతున్నయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించినరు. అదే పద్ధతిలో యేర్పాట్లు ఘనంగా జరుగుతున్నయని కూడా చెప్పినరు. సాహిత్యం సాంస్కృతికమూ సాధారణంగా జమిలిగా కలగలిసి ఉంటయి కాబట్టి ఈ సారి ఈ కన్వెంషన్ సందర్భంగా సాహిత్యానికి కూడా పెద్ద పీట వేసినరు. సాంస్కృతిక కార్యక్రమాలకు సమఉజ్జీగా , సమాంతరరంగా,కలుపుగోలుగా , కాంప్లిమెంటరీ గా సాహిత్య కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు తీర్చిదిద్దినరు.

 

https://www.ataconference.org/Committee-Literary

 

జయదేవ్ మెట్టుపల్లి గారు ప్రదాన సంచాలకులుగా తీర్చి దిద్దిన సాహిత్య కార్యక్రమాలు అద్భుతంగా జరుగనున్నయి. తెలుగు సాహిత్యం లోని అన్నిరంగాలను కూలంకషంగా పరిశీలించే విధంగా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిభావంతంగానూ , ఆలోచనా స్ఫోరకంగానూ తీర్చి దిద్దారు.  జయదేవ్ గారూ వారి సాహితీ బృందం సభ్యులూ , తెలుగు సాహిత్యం లోని అన్ని క్రియలనూ పరిశీలిస్తూ సమకాలీన సాహిత్య రంగం లోని అనేక అంశాలను క్రియాశీలకంగా పరిశీలించేటట్టు కార్యక్రమం రూపొందించినరు. సమకాలీన సాహిత్యం పరిశీలించకుండా తెలుగు సాహిత్యాన్ని అంచనా వేయలేము. అందుకనే సాంప్రదాయ సాహిత్య ప్రక్రియలైన అవధానమూ లాంటి వాటికి పెద్ద పీట వేసినా, సమకాలీన సాహిత్య అంశాలను క్రియలను, పోకడలను, ఉన్న సమయంలో కూలంకషంగా చర్చిస్తూ సాహిత్య కార్యక్రమాలున్నయి. అందుకు ఆటా నిర్వాహకులను, ముఖ్యంగా సాహితీ కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా భినందించాలి.

 

ఆటా కన్వెన్షన్  మొదటి రోజు,  జూలై 2 నాడు, మధ్యాహ్నం వొంటి గంటకు సాహిత్య కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఇవాళ తెలుగు సాహిత్యం లో ఉధృతంగా ముందుకొస్తున్న ప్రాతీయ సాహిత్యం గురించిన చర్చ మొదటి సెషన్ లో జరుగుతుంది.

ప్రముఖ కవి కథకుడు విమర్శకుడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియా లో ప్రొఫెసర్ అఫ్సర్ ఈ సెషన్ ను నిర్వహిస్తున్నారు.

ఇందులో ప్రముఖ కళింగాంధ్ర కథకుడు అప్పలనాయుడు గారు కళింగాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడుతారు. శ్రీకాకుళ పోరాటం కంటే ముందు నుండీ ఎట్లా కళింగాంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యం లో ఒక పాయ గా కొనసాగిందో కళింగాంధ్ర ప్రజల జీవితాన్ని, కలల్నీ, ఆకాంక్షలనీ ఎట్లా సాహిత్యం ప్రతిఫలించిందో అప్పలనాయుడు గారు వివరిస్తారు, అట్లే శ్రీకాకుళ ఉద్యమ లో సాహిత్యం నిర్వహించిన పాత్రనీ ఉద్యమం నిర్బంధానికి లోనై సద్దు మణి గిన తర్వాత సాహిత్యం ఎట్లా శ్రీకాకుళ జనజీవితాన్ని ఫ్రతి బింబించిందో వివరిస్తారు.

స్త్రీ సాహిత్యం గురించి ప్రముఖ కథకులు భూమిక పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి గారు ప్రసంగిస్తారు. స్త్రీవాద ఉద్యమం ప్రారంభం కాకముందునుంచీ స్త్రీ రచయితలు స్త్రీల జీవితాన్ని వారి కష్ట నష్టాలను సాహిత్యం లో ప్రతిఫలించిన విధానాన్ని దాన్ని స్త్రీ వాద ఉద్యమం సుసంపన్నం చేసిన వివరాలనూ సత్యవతి గారు తమ ప్రసంగం లో వివరిస్తారు.

తెలంగాణ సాహిత్యం గురించి ప్రముఖ కవీ గాయకుడు వక్త దేశపతి శ్రీనివాస్ వివరిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో వెలువడ్డ తెలంగాణ సాహిత్యాన్ని గురించి శ్రీనివాస్ తమ ప్రసంగం లో కూలంకషంగా సోదాహరణంగా వివరిస్తారు.

తరతరాలుగా వివక్షకు గురవుతూ పాలకులు ప్రాంతం వారైనా తీవ్రమైన అన్యాయానికి గురైన ప్రాంతంగా, ఫాక్షన్ సీమగా హత్యలు దొమ్మీ లు జరిగే హంతక సీమగా అపఖ్యాతి పాలై ఫాక్షనిస్టుల చెరలో నెత్తురోడింది రాయలసీమ సాహిత్యాన్ని గురించి అప్పిరెడ్డి హర్నాథ రెడ్డి వివరంగా ప్రసంగిస్తారు.

అదే రోజు మధ్యాహ్నం శొంఠి శారద గారి నిర్వహణ లో ‘తరతరాల తెలుగు సాహిత్యం విభిన్న ధోరణులు ‘ అనే అంశం పై సెషన్ జరుగుతుంది.

ఈ సెషన్ లో మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి ప్రభల జానకి గారు , యద్ధనపూడి సులోచన గురించి కొమురవోలు సరోజ గారు, అమెరికన్ షార్ట్ స్టోరీస్ గురించి నారాయణ స్వామి శంకగిరి గారు, తెలుగు నవల గురించి అమరేంద్ర దాసరి గారు, తాము నిర్వహస్తున్న పత్రిక భూమిక గురించి కొండవీటి సత్యవతి గారు , దేవులపల్లి సాహిత్యం అభ్యుదయం గురించి నిడమర్తి నిర్మల గారు ప్రసంగిస్తారు.

తర్వాత శ్వీయ కవితా పఠనం , పుస్తకావిష్కరణ చర్చ లు జరుగుతాయి.

తర్వాత సాయంత్రం ‘పాట వెనుక మాట’ అని తాము రచించిన అనేక గొప్ప పాటల వెనుక ఒదిగి పోయిన సందర్భం గురించి జీవితం గురించి సంఘటన ల గురించి ప్రముఖ కవులు వాగ్గేయ కారులు గోరటి వెంకన్న అందెశ్రీ ప్రముఖ సినీ కవి చంద్రబోస్ గార్లు ప్రముఖ కవి అఫ్సర్ సంచా లకత్వం లో అద్భుతంగా వివరిస్తారు.

సభల రెండో రోజు సాహిత్య కార్యక్రమం లో ఉదయం  అవధాని సార్వభౌమ అవధాని కంఠీరవ శ్రీ నరాల రామిరెడ్డి గారి చే తెలుగు సాహిత్యావధానం జరుగుతుంది. దీనిలో ఆచార్య శ్రీనివాస్ వేదాల గారు, కందాళ  రమానాథ్ గారు,  వడ్డేపల్లి కృష్ణ గారు, కొంక పాక లక్ష్మీ గారు,  ప్రభల జానకి గారు, శొంఠి శారద గారు, యడవల్లి  రమణ మూర్తి గారు పాల్గొంటారు.

మధ్యాహ్నం సాహిత్య కార్యక్రమానికి ప్రముఖ సాహితీ విమర్శకులు కథకులు ఈమాట సంపాదకులు వేలూరి వెంకటేశ్వర రావు గారు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఈ సెషన్ తెలుగు సాహిత్యం కొత్త దారులు అనే అంశం పై జరుగుతుంది. ఇందులో వేలూరి గారు అనువాదాల గురించి ప్రసంగిస్తారు. తెలుగు భాష పరిణామాలు అనే అంశం గురించి మిట్టపల్లి రాజేశ్వర రావు గారు , తెలుగు కవిత్వ సామాజిక ఉద్యమాలు అనే అంశంపై నారాయణ స్వామి వెంకటయోగి గారు, అమెరికన్ తెలుగు సాహిత్యం గురించి ప్రముఖ రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం గారు స్త్రీవాద సాహిత్యం గురించి ప్రముఖ కథకులు కవీ కల్పన రెంటాల గారు, తెలుగు సాహిత్య వాడల గురించి ప్రముఖ కవి విమర్శకులు హెచ్చార్కె గారు భవిషత్తులో తెలుగు భాష గురించి ప్రముఖ భాషా శాస్త్రవేత్త సురేష్ కొలిచాల గారు ప్రసంగిస్తారు

మొత్తం కార్యక్రమాన్ని చూస్తే ఈ ఆట సభలు సాహిత్యానికి సంస్కృతి కి పెద్ద పీట వేసినాయి. నిర్వాహకులు చాలా శ్రద్ద తీసుకొని సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు తీర్చిదిద్దారు.

అమెరికా నలుమూలల నుండీ వేలాదిగా తెలుగు వారు తరలి వచ్ఛే ఈ ఆట సభల్లో తెలుగు సాహిత్య సాంస్కృతిక పరిమళాలు గుబాళించబోతున్నాయి. తెలుగు సాహిత్యప్రియులకు సాంస్కృతిక ప్రియులకు ఈ రెండు రోజులూ పండగే!

అశోక్ : తెలంగాణా కవిత్వంలో కొత్త గొంతుక

-నారాయణ స్వామి వెంకట యోగి 

~

swamy1

అదో అందమైన అబద్దాల ఆదివారం సాయంత్రం. అంతర్జాలంలో ఆంధ్రజ్యోతి వివిధ చూద్దామని తెరిచా.
(ఓ పది రోజుల కింద సౌత్ కెరోలైనా లో చార్లెస్టన్ లో ఒక చర్చ్ లో 9 మంది నల్లజాతి వాళ్ళని ఒక తెల్ల జాతీయుడు నిష్కారణంగా (వాడి కారణమొక్కటే – నల్ల జాతి వారి పట్ల కరడు గట్టిన ద్వేషం) , నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసిండు.)
 ‘ఓ ప్రభువా హంతకుడిని క్షమించు’ అనే పద్యం కనబడింది. యెవరో అశోక్ కుంబం రాచెస్టర్ మినెసోటా అని ఉంది.
ఓ ప్రభువా
హంతకుడిని  క్షమించు
వాడు అగ్నాని
అహంకారి
మనిషి రంగు తప్ప
మనిషి తనం యెరుగనోడు
జెండాల మీద ప్రేమే తప్ప
జనంతో కలిసి బ్రతుకనోడు
వాడు నీ బిడ్డడే
కాకపోతే మానవవేటకు మరిగినోడు
మనుషుల కాల్చి కుప్పేయడం నేర్చినోడు
వాడిని దయతో దీవించి
కరుణతో లాలించు
ఓ ప్రభువా
మేము హంతకున్ని క్షమిస్తున్నాము
ప్రపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
మా పిల్లల పోగొట్టుకున్నాము
అలసటొచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో
తలనిమిరి ధైర్యమిచ్చే
అమ్మా నాన్నల పోగొట్టుకున్నాము
గత వర్తమానాల  కష్టసుఖాల తలపోస్తూ
అభద్రమైన భవిష్యత్తుపై సహితం ఆశలు రేపే
తాత అవ్వల పోగొట్టుకున్నాము
తరతరాల వంతెనలన్నీ ధ్వంసమైపోయి
పారుతున్న నెత్తురు
పొంగుతున్న దుఃఖం
కారుతున్న కన్నీళ్ళు
గడ్దకట్టుకుపోయాక
ఇక చివరకు మిగిలింది
హంతకుడిని క్షమించుడే కదా!
విలువ లేని బతుకులు
ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
మృత్యు  రూపాన్ని కనిపెట్టలేని జీవితాలు
ఇవేవీ ముఖ్యం కావు
మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మా మానవత్వ నిరూపణే
వాడు శిక్షించాలి
మేము క్షమించాలి
అదే కదా ధర్మం ప్రభూ!
పద్యం మొత్తం ఒక్క సారే ఊపిరి తీసుకోకుండా చదివా . ఒక ప్రార్థనలా బిగ్గరగా చదివా . ఒక కెరటం ఛెళ్ళున చరిచింది ముఖాన్ని. చివరి మూడు వాక్యాలు కుదిపేసాయి. అవును, మళ్లా ఒక నాలుగు నెలల తర్వాత చదివినా  ఈ వాక్యాలంతే కుదిపేస్తున్నాయి. మరింతగా చరుస్తున్నాయి ముఖమ్మీద.
మొత్తం పద్య నిర్మాణం చూస్తే ఈ పద్యంలో అశోక్,  క్రైస్తవ ప్రార్థనా పద్దతి ఉపయోగించినట్టు తెలుస్తూనే ఉంది. అయితే జాలీ కరుణలతో పద్యాన్ని నడిపి చివరికొచ్చేసరికల్లా ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన చిరు కోపాన్ని అదీ అశక్తతలోంచీ, మరీ ఎక్కువ అసహనపు కోపమనిపించని సహనత్వంలోంచీ తమకు బోధించబడిన ‘ధర్మాన్ని’  గుర్తు చేస్తూ పలికాడా వాక్యాలను. మా మానవత్వాన్ని నిరూపించుకోవాలంటే వాడెన్ని సార్లు శిక్షించినా మేము క్షమించాల్సిందే కదా ప్రభువా అని అడుగుతున్నాడు చంపబడ్డ ఆ నల్ల జాతీయుల్లోకి పరకాయ ప్రవేశం చేసి. పిల్లలనీ, అమ్మానాన్నలనీ పోగొట్టుకున్నామని చెప్తూ  ‘తరతరాల వంతెనలు ధ్వంసమై’ అన్న వాక్యంతో ఆ మొనొటొనాసిటీ కి కళ్ళెం వేసి యెందుకు హంతకులను క్షమించడం మాత్రమే మిగిలిందో చెప్తాడు. అక్కడ పద్యాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు. అగ్నానీ అహంకారీ అయిన హంతకుడిని క్షమించడం తప్ప యేమీ మిగలనోళ్ళం అని పాపులను క్షమించమనే నీతిని అభాసు చేసాడు. నల్ల జాతీయులు  మనుషులుగా గుర్తింపబడాలంటే వారికి  న్యాయం జరగడం కన్నా వారు  క్షమించడమే ముఖ్యం చేస్తున్న జాత్యహంకార వ్యవస్థ మీద పదునైన కత్తుల్లాంటి కవితా వాక్యాలను దూసాడు అశోక్. మొత్తం పద్యం సూటిగా ఉన్నట్టనిపించినా అంతా సులభంగా అర్థమయినట్టనిపించినా మళ్లా మళ్లా చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు పరిస్థితి పట్ల కొత్త క్రోధాల్నీ కలుగజేస్తుందీ పద్యం. మొత్తం పద్యం చాలా సూటిగా ఉత్ప్రేక్షలూ, ఉపమానాలూ లేకుండా సాగుతుంది.  కానీ జాగ్రత్తగా చూస్తే మొత్తం పద్యమే ఒక ఉత్ప్రేక్ష. ఈ సమాజంలో మేము మనుషులుగా గుర్తింపబడాలి అంటే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం అడగడం కాక, హంతకున్ని క్షమించడం తప్ప మరో మార్గం లేని నిస్సహాయతను చాలా బలంగా సూచించే ఉత్ప్రేక్ష (metaphor). అందుకే పద్యం బలంగా చదివిన కొద్దీ కొత్తగా ఉంటుంది.
పద్యం చదివాక అశోక్ తో మాట్లాడాలనిపించింది. మినెసోటా లోని రాచెస్టర్ లో ఒక వైద్య కళాశాల లో బయోయెథిక్స్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు తను. తెలంగాణా లో నల్గొండ జిల్లా ఆజంపూర్ లో పేద రైతాంగ కుటుంబంలో పుట్టి హైదరాబాదు నిజాం కళాశాల లో తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం మానసిక శాస్త్రం లో బీయే చేసి, నెదర్లాండులో పోస్టు గ్రాడుయేషన్, కెనడా లో పీయెఎచ్ డీ, డాక్టొరల్ ఫెలోషిప్  చేసినంక యిప్పుడు మేయో క్లినిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధిస్తున్నాడు. పలకరించగానే యెంతో ఆప్యాయంగా మాట్లాడి తన ఆసక్తుల గురించి వివరంగా చెప్పిండు. తన ఇతర పద్యాలను కూడా ఒక చోట చేర్చి పంపిండు.
అన్ని పద్యాలూ బాగున్నయి. పద్యాలు కావాలని రాసినట్టో, అందంగా రాయాలని ప్రయత్నించి రాసినట్టో కృతకంగా లేవు. అన్నింటి లోనూ ఒక సహజ త్వం ఉన్నది. అదే వాటి సౌందర్యం. అన్నీ సూటిగా డొంక తిరుగుడు లేకుండ ఉన్నయి.   అన్నీ సామాజిక సమస్యల పట్ల స్పందనలే. అశోక్ తాను అన్యాయమని అనుకున్న వాటికి, సమాజంలో అధికారపు ఆజమాయిషీ దుర్మార్గాల ఫలితాలనుకున్నవాటికీ  వెంటనే స్పందిస్తున్నాడు. క్రౌంచపక్షి మరణానికి వెంటనే స్పందించే వాల్మీకి లాగా. బాధా, దుఃఖమూ వేదనా పరిస్థితుల పట్ల ఆగ్రహ ప్రకటనా, పరిస్థితులు మారాలనే బలమైన ఆకాంక్ష వెంటనే పద్యాల రూపంలో బలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా ప్రకటిస్తున్నాడు. నీళ్ళు నమలడం లేని, యెక్కువ ఉపమానాలూ ఉత్ప్రేక్షలూ లేని కవితా పద్దతినెంచుకున్నాడు. భాషనూ, వాక్యాలనూ తన ఉద్వేగంతో నింపి కవితా వాక్యాలు చేసి సంధిస్తున్నాడు. పద్య నిర్మాణం లోనూ చెప్పే పద్దతిలోనూ ఉద్వేగాన్ని నింపి తను చెప్పదల్చుకున్న దానిని బలంగా చెప్తున్నాడు. గుర్తుంచుకునేటట్టు చెప్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ తీసుకురావాలనుకున్నప్పుడు, ‘బంగారు తెలంగాణ బలికోరుతున్నది/  బలవంతమేమీలేదు/  బారులు తీరండి’ అని అంటాడు. ‘బలవంతమేమీ లేదు’  అని పాదం విరిచి ‘బారులు తీరండి’ అనడంలో ప్రతిభ చూపిస్తాడు. అంతకు ముందే “పుష్కరాలను మించిన పుణ్యకార్యమిది/  ప్రతి పూట మరువకుండ/  మత్తుల,  మందుల / మునిగి తేలండి’ అని వ్యంగ్యం ప్రకటిస్తాడు. అట్లే నల్లజాతీయుల అభద్రత గురించి కూడా ‘మై డియర్ బ్లాక్ అమెరికా’  అని ఒక పద్యం. ‘చేతులెప్పుడూ గాలిలోనె ఉంచు / జీసస్ శిలువ మీద ఉన్నట్టు / అల్లాని వేడుకున్నట్టు/ .. నల్లని నీ రూపం సహితం వాడికి మారణాయుధంగానే కనబడుతుంది / అందుకే నీ చావుకి నువ్వా కారణమని ముందే ప్రకటించు … వాడి నిఘంటువు లో నువ్వొక తప్పిదానివి దారి తప్పిన జీవితానివి పొంచిఉన్న ప్రమాదానివి …’ అంటూ రాస్తాడు.
తెలంగాణ రాష్ట్రం యేర్పడి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొని తర్వాత మావోయిస్టులలో చేరి బూటకపు ఎంకౌంటర్ లో కాల్చి చంపబడిన నిండా ఇరవై నిండని వివేక్ కోసం రాసిన పద్యంలో
 ‘నువ్వెవరో నాకు తెలిసింది/
నీ అమరత్వం బ్రేకింక్ న్యూస్ అయినప్పుడే కదా/ అయినా నువ్వొక గ్నాపకమై నన్ను యెందుకు వెంటాడుతున్నవు? /…నువ్వు నడిచిన దారి పొడువున / నీ పాదముద్రలు వెతికే పనికై/ నా మనసు యెందుకు వెంపర్లాడుతున్నది?/ భద్ర జీవితపు సరిహద్దులు చెరిపి/ యాంత్రిక జీవనాన్ని/మాంత్రిక కాలాన్ని / శాసిస్తున్న నీ త్యాగం/ ఒక మరణాన్ని కాదు / ఒక సమన్యాయ విలువను గుర్తు చేస్తుంది ..అని అంటాడు ఉద్వేగంగా. యాంత్రిక జీవనమూ మాంత్రిక కాలమూ – అశోక్ వాడిన ఈ పదచిత్రాలు సమకాలీన సమాజమూ, కాలమూ, జీవితాన్నీ అద్భుతంగా చిత్రిక పడుతున్నయి.
రైతుల ఆత్మహత్యలగురించి రాస్తూ ‘ఇక ఈ తంతు నాపి నాకు స్వేచ్ఛనివ్వండి / సాలు మీద సాలు దున్నే / ఆ బక్క రైతు / బుడ్డగోసినై రుణం తీర్చుకుంట’  అని తన సంఘీభావాన్ని ప్ర కటి స్తడు.
అశోక్ బలమైన కవి. గొప్ప ఉద్వేగం ఉన్న కవి. సమాజం పట్ల దోపిడీ పీడన, అణచివేతలకు కు గురవుతున్నవారి పట్ల సంఘీభావం ఉన్న కవి. ఉన్న పరిస్థ్తి మారాలనీ కోరుకునే కవి. అది యెట్లా మారుతుందో కూడా స్పృహ ఉండి తెలిసిన కవి. అశోక్ ఇంకా రాయాలి. ఇంకా బలంగా రాయాలి. పద్యాన్ని ఒక శిల్పంలా చెక్కడం పట్ల శ్రద్ద పెట్టి యింకా రాయాలి. ఆవసర వాక్యాలూ, పదాలూ పద్యంలో ఉండకూడదన్న స్పృహ ఉన్న అశోక్ అవి లేకుండా ఇంకా శ్రద్ద పెట్టాలి. వాక్య నిర్మాణమూ, పద్య పాదాలని విరవడమూ, పదాల యెంపికా , సూటిదనం అన్ని సార్లూ పని చేయని చోట ఉపమా నాలూ,  ఉత్ప్రేక్షలూ, allusions, సూచనలతో  పద్యాన్ని బలోపేతం చేయవచ్చు అని బాగా తెలిసిన అశోక్  ఆ పని మరింత చైతన్యయుతంగా చేస్తాడని ఆశ!  తనలో ఉన్న ఉద్వేగ తుఫానులకు సరైన పద్య రూపమిచ్చి మరింత విరివిగా రాయాలని కోర్కె.

*

శివారెడ్డి జీవితమంతా కవిసమయమే!

నారాయణ స్వామి వెంకట యోగి 

(శివారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా)

  swamy1“ఏం నాన్నా యెంత సేపైంది వచ్చి?’ అంటూ ఆప్యాయంగా సార్ బుజం తడితే చదువుతున్న పుస్తకం లోంచి ఉలిక్కి పడి తలెత్తి చూసి లేచి నిల్చుని “ఇంతకు ముందే సార్ “ అంటూ నమస్తే పెట్టాను. “నువ్వు చదువుతూ కూర్చో. మరో వరస క్లాస్ ఉంది నేనిప్పుడే వెళ్ళి త్వరగా ముగించుకుని వచ్చేస్తా. తర్వాత వెళ్ళిపోవచ్చు మనం” అంటూ లాకర్ లోంచి మరో టెక్స్ట్ బుక్ తీసుకుని క్లాస్ కు బయలుదేరారు. “సరే సార్ ఈ కవి కవిత్వం చాలా బాగుంది మీరొచ్చే లోపు మరిన్ని పద్యాలు  చదువుతా “ అంటూ పుస్తకం లో తలదూర్చేసా. యిప్పుడే వస్తానన్న సార్ మరో గంట దాకా కాని రాడని తెలుసు. పాఠం చెప్పడం ఆయనకెంత యిష్టమో అదీ ఆధునిక కవిత్వం బి ఏ బి యెస్సీ పిల్లలకు చెప్పడం యింకెంత యిష్టమో నాకు అంతకుముందే  యెరుక. సారు ఆధునిక కవిత్వం పాఠం చెప్తుంటే వినడం ఒక గొప్ప అపురూపమైన అనుభవం.

కాలం – 1983. స్థలం హైదరాబాదులో జాంబాగ్ కోఠిలో వివేక వర్ధిని సాయంకళాశాల.

దాదాపు గంటంబావు  తర్వాత హడావిడిగా తరగతి లోంచి బయటకు వస్తూ గడియారం చూసుకుని “యెనిమిదిన్నర అయిందే!  యివాళ్ళ ఫుల్ వర్క్ లోడ్.  సారీ నాన్నా లేట్ అయిపోయింది. యింక మనం బయలుదేరదాం పద” అంటూ బుజం మీద చెయ్యి వేసి బయటకు నడిపించుకుపోయారు. యింక అక్కడ్నుంచీ హరిద్వార్ హోటల్ దాకా నడక. నేను చదువుతున్న కవి కవిత్వం నుండి (అది సార్ అంతకు ముందు వారం ఇచ్చిన పుస్తకమే) మొదలు పెడితే ప్రపంచం మొత్తం చుట్టేసే వారు సారు. నిండా  పద్దెనిమిదేళ్ళు కూడా సరిగా నిండని నా బుజం మీద చనువుగా చేయి వేసి నాన్నా అని పిలుస్తూ,  తనతో గడిపిన ప్రతిక్షణమూ ప్రపంచ కవులనీ  కవిత్వాన్నీ పలవరిస్తూ విడమరిచి చెప్తూ మధ్య మధ్య లో, గొప్ప నవలల గురించీ, కథల గురించీ,  మంచి సినిమాల గురించీ, మంచి సంగీతం గురించీ ప్రస్తావిస్తూ మళ్ళీ కవిత్వలోకి దూకేవారు.  అప్పుడప్పుడే యీత నేర్చుకుంటున్న నాకు ఆ మహా సముద్రం లో అండగా చుక్కానిగా నిలబడిన సార్ యింకెవరో కాదు కె.శివా రెడ్డి గారు. వివేక వర్ధిని సాయంకళాశాల లో యింగ్లీషు అధ్యాపకునిగా పనిచేస్తూ తనకు దొరికిన ప్రతి క్షణాన్నీ కవిత్వం కోసమే, కవిత్వం తోనే, యిప్పటికీ,  గడపడాని కిష్టపడే మహా  కవి, గొప్ప మనిషీ.

అప్పుడప్పుడే పోతన మందార మకరంద మాధుర్యాలనుండీ,  బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకలనుండి బయటపడి  శ్రీ శ్రీ ని, దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ , రాత్రి కవితా సంకలనాన్ని, వీ వీ చలినెగళ్ళు, జీవనాడులనీ ,  కె, శివారెడ్డి రక్తం సూర్యుడు,చర్య, నేత్రధనుస్సు, ఆసుపత్రి గీతాలని చదివిన గొప్ప విసురూ, ఆవేశమూ ఆకలిలతో,  సమాజం మీద వ్యవస్థ మీద ధిక్కార భావంతో  , ఉన్న పరిస్థితి ని మార్చడానికి కవిత్వం రాయాలని కంకణం కట్టుకున్న కౌమార ప్రాయమది. జే యన్  టీ యూ నాగార్జునసాగర్ యింజనీరింగ్ కళాశాల లో 1981 లో చేరిన నాకు, సిద్దిపేట నుండి వచ్చినా యేచ్ పీ యెస్ లో ఐదేండ్ల చదువు పుణ్యమా అని హైదరాబాద్ కొత్తేమీ కాదు. యేచ్ పీ యెస్ లో యెలీటిస్ట్ ఆధిపత్యమూ అణచివేతలకింద నలిగిపోయిన నాకు సిద్దిపేటలో సాహిత్య వాతావరణం కొత్త ఊపిరులనిచ్చింది.

అట్లా కె. శివారెడ్ది గారు పరిచయమయ్యారు. కొత్తగా రాస్తున్న వారికీ, యువ,  నవ కవులకూ సార్  సాన్నిహిత్యం   అపురూపమైందనీ , కవిత్వ, సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుందని సిద్దిపేటలో నందిని సిధారెడ్డి సారు, యెస్. ప్రవీణ్ చెపితే శివా రెడ్డి గారి తో పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయం యింతింతై అన్నట్టుగా అతి కొద్ది కాలం లోనే చాలా గాఢమైన సాన్నిహిత్యంగా మారడానికి ముఖ్య కారణం సారే! అప్పటికే నాలుగు కవితా సంకలనాలు ప్రచురించి ప్రముఖ కవిగా చలామణీ అవుతున్నా,  అట్లాంటి యావే లేకుండా నాతో పాటు తనూ  18 యేండ్ల వాడై పోయి  బుజం మీద చేయి వేసి అత్యంత ఆప్యాయంగా,  ఆత్మీయంగా దగ్గరైన అత్యంత సన్నిహితులైన వారు శివారెడ్డి సార్. యేనాడూ తాను సీనియర్ కవినని కానీ (యిప్పటికీ కూడా) తనకు చాల తెలుసనీ తాను సాధించింది యెక్కువనీ అనుకోకుండా, నిర్లక్ష్యం గానీ , చిరాకు గానీ కోపం కానీ   దగ్గరకు రానీయకుండా యెంతో స్నేహంగా మసలుతారు. అరమరికల్లేకుండా మాట్లాడ్డం, హిప్పోక్రసీ, ద్వంద్వ విలువలూ, యేదో దాచుకుని మాట్లాడ్డం, రాజకీయంగా మాట్లాడ్డం, పొడిపొడిగా రెండు ముక్కలు కవిత్వం గురించి చెప్పేసి, ‘ ఇప్పుడు సమయం లేదు  తర్వాత కలవ’ మనడం లాంటి యేనాడూ చేయలేదు సారు. ఉన్నదంతా బాహాటంగా చెప్పేసెయ్యడం, యింకా నేర్చుకోవాలి, చదవాలి, ప్రపంచ కవిత్వం లో నిండా మునిగి తడిసిపోవాలి అన్న దాహం తో తపించిపోయే వారు శివారెడ్డి సారు.( యిప్పటికీ యిన్ని యేండ్ల తర్వా త యెప్పుడు కలిసినా యే కొత్త కవిత్వ పుస్తకాన్ని తెచ్చావని అడిగి  , తీసుకుపోయిన పుస్తకా న్ని అపురూపంగా ఆనందంతో మిలమిలలాడే కళ్ళతో అందుకుంటారు. ) అందువల్లే  ప్రతి సాయంత్రమూ కాలేజీ హాస్టల్ నుండి వీ వీ కాలేజి కి రావడం,సార్ తో క్లాసులయ్యాక అయితే హరిద్వార్ కో,  లేకపోతే  ఖైరతాబాద్ లో ద్వారకా కో వెళ్ళిపోయే వాణ్ణి.

siva1

శివారెడ్డి అంటే నిరంతర అధ్యయనమే!

అప్పుడు శివారెడ్డి గారితో మా సంభాషణలకు ప్రదానమైన అడ్డా ద్వారకా హోటల్. దాదాపు ప్రతి సాయంత్రమూ అక్కడ కవులూ, కవిత్వాభిమానులూ  గుమిగూడే వారు శివారెడ్డి  గారి కోసం. యెన్ని ముచ్చట్లు యెన్ని ముచ్చట్లు, ప్రపంచ కవిత్వ వీధుల్లో యెంత నిరంతర నిర్విరామ చంక్రమణం, మహాకవుల కవితా వాక్యాల చుట్టూ పరిభ్రమణం, సార్ తో గడిపిన ప్రతి క్షణమూ అమోఘమూ   అద్భుతమూ, అపురూపమున్నూ. కొన్ని సమయాల్లోనైనా కవిత్వం మాట్లాడక యింక మరే సంగతి మాట్లాడినా –  అది ప్రత్యక్ష పరోక్ష జీవితానుభవం కావచ్చు లేదా యింకేదైనా కావచ్చు –  అందులోనూ  కవిత్వానికి సంబంధించిన ముడిసరుకు తప్పనిసరిగా ఉండేది. తవ్వుకోవాలే కానీ కవిత్వ జల నిరంతరం ఊరే  గొప్ప చెలిమ శివారెడ్డి గారు. కవిత్వ దాహంతో ఉన్నవారందరికీ  అలవోకగా అమృతాన్ని పంచి ఇస్తారు.

సార్ దగ్గర సముద్రమంత గ్రంథాలయం. యింటి నిండా సందు లేకుండా పుస్తకాలు. ఆకలిగా పుస్తకాలను చూస్తుంటే,  తడుముతుంటే “ యిదిగో ఈ ఆఫ్రికన్ కవి కవిత్వం చదువు, యిదిగో ఈయన గ్రీకు దేశపు మహాకవి రిట్సాస్ ఇది తీసికెళ్ళి చదువు,  ఇదిగో ఇది నెరూడా పుస్తకం ఈయన బ్రేటన్ బ్రేటన్ బా దక్షిణాఫ్రికా కవి తీసికెళ్ళి   చదువు”  అంటూ యెంతమాత్రం సంకోచం లేకుండా, ప్రేమగా ఆప్యాయంగా బాగా ఆకలిగొన్న వాడికి అద్భుతమైన భోజనం  యెంతో ఆత్మీయంగా పెట్టినట్టుగా పుస్తకాలనిచ్చేవారు. అయితే జాగ్రత్తగా తీసుకుని రమ్మనే వారే తప్ప యేనాడూ “ యేదా పుస్తకం యేమైందీ”  అంటూ అడిగే వారు కాదు. సెంఘార్, చికాయా యూ టాంసీ, సిల్ చినీ కోకర్ , డేవిడ్ డయోప్ , రిట్సాస్  ఐమీ సెజేర్, సెజార్ వయేహో లాంటి ప్రపంచ మహాకవులెందరినో పరిచయం చేసారు. వాళ్ళలో అప్పటికే చాలా మందిని అనువాదం చేసి ఉన్నారు. శ్రీ శ్రీ తర్వాత, నిజానికి అంతకన్నా యెక్కువగా విస్తారంగా అనేక ప్రపంచ మహాకవులను తెలుగు లోకి అనువాదాలు చేసి పరిచయం చేసిన వారు శివారెడ్డి గారు.

ప్రపంచ వ్యాప్తంగా  మహాకవుల కవిత్వాన్ని యెందుకు చదవాలో కలిసిన ప్రతి సారీ  నొక్కి చెప్పే వారు. ‘యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మూడు గొప్ప ప్రయోజనాలున్నై’  అనే వారు… ఒకటి – ఆ కవి ఒక వస్తువుని యెట్లా  కవిత్వం చేసాడు, యెట్లా ఊహించాడు ,ఒక పద్యాన్ని యెట్ల్లా నిర్మించాడు, యేయే పదచిత్రాలని, యే యే ఉపమానాలని, ఉత్ప్రేక్షలని వాడాడు, యేట్లా పద్యం conceive చేసాడు అనేది తెలుస్తుంది, రెండు – యే యే వస్తువులని యెంచుకున్నాడు, తన అనుభవం లోకి వచ్చిన ఆ వస్తువుని, అనుభూతినీ , యే ప్రాపంచిక దృక్పథంతో,  యెట్లా తన పద్యంలో ప్రతిఫలించాడు అని తెలుస్తుంది,  మూడు – అనేకానేక కవుల తర్వాత రాస్తున్న మనం వారందరికంటే భిన్నంగా పద్యం యెట్లా రాయగలం? యింతకు ముందు యెవరూ చేయనట్లు  యెట్లా ఊహ చెయ్యగలం, వస్తువుని చూడగలం , కొత్తగా  పద్యం చెప్పగలం –  అనేది వాళ్ళందరినీ చదవడం వల్ల నేర్చుకొగలుగుతాం. యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మనం రాసే కవిత్వానికి కొత్త బాట యేర్పడుతుంది, మనకు కవులుగా కొత్త గొంతుక యేర్పడుతుంది. అట్లాంటి కొత్త గొంతుక, మనదైన ముద్ర, వ్యక్తిత్వం , మనదైన పద్యం రాయగలగాలంటే తప్పకుండా అందరి కవుల పద్యాలని చదవాలి వారి పోకడలని పరిశీలించి విశ్లేషించి మనం కొత్త పోకడలు పోవాలి అనే వారు.  దేని గురించైనా రాయి, ముందు కవిత్వం,  మంచి కవిత్వం రాయి,  మనదైన ప్రాపంచిక దృక్పథంతో (worldly outlook) ప్రతి వస్తువును మంచి  కవిత్వం చేయడం అన్నింటికన్నా ముఖ్యం అనేవారు. పీడిత ప్రజల పక్షం వహించే ప్రాపంచిక దృక్పథం లేక పోతే యెంత మంచి కవిత్వం రాసినా దాని వల్ల  ప్రయోజనముండదనీ, మంచి  కవిత్వం కానప్పుడు నువ్వెంత గొప్ప దృక్పథం తో వస్తువుని చెప్పినా  అది కవిత్వంగా నిలబడదనీ గుర్తుపెట్టుకొమ్మనే వారు.

అట్లానే ‘ప్రతీదీ కవిత్వానికి ఉపయోగపడేట్టుగా యెట్లా చూడాలి, ప్రతి క్షణమూ ప్రతి సంఘటనా  మనం కవిత్వం రాయడానికి ఉపయోగపడేలా యెట్లా చేసుకోవాలా అనే ఆలోచించాలి’   అని చెప్పేవారు. ఉదాహరణకు, ఒక మంచి సినిమా చూసినప్పడు మన స్పందన కవిత్వంగా యెట్లా మార్చుకోవాలో ఆలోచించమని చెప్పేవారు. అప్పటికే హైదరాబాదు లో మంచి సినిమాలని యెంపిక చేసి ప్రదర్శించే ఫిల్మ్ క్లబ్ ఒకటి నడుస్తూ ఉండేది. అక్కడా, మాక్స్ ముల్లర్ భవన్, అలైన్స్ ఫ్రాంసై  లో మంచి సినిమాలనెన్నో చూసే అవకాశం దొరికింది. ఒక సినిమాని యెట్లా ‘ కవి దృష్టి’ తో చూడాలి, దాన్ని కవితాత్మకంగా యెట్లా అనుభవించి పలవరించాలి అని శివారెడ్డి గారి దగ్గరే నేర్చుకున్నా నేను. అకిరా కురొసావా ‘దెర్సూ ఉజలా’ సినిమా చూసినంక శివారెడ్డి గారు రాసిన  ‘అడవులు భయపెడతాయి’ అనే కవిత ఒక సినిమా ని కవిత్వంలోయెట్లా ప్రతిబింబించవచ్చో అద్భుతంగా చూయిస్తుంది. సినిమా అనేక కళల సమ్మేళనం కాబట్టి. ఆయా కళల్లో ప్రతి దానిలోనూ కవిత్వం ప్రతిధ్వనించే అవకాశం ఉంది కాబట్టి (నటన కావచ్చు, చాయాగ్రహణం కావచ్చు, సంగీతం కావచ్చు, మాటలు కావచ్చు ) సినిమా ప్రతి క్షణమూ కవితాత్మకంగా ఉండాలి అనే వారు. అప్పుడే మళయాళ దర్శకుడు, గొప్ప సెల్ల్యులాయిడ్ కవీ  అరవిందన్ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శిస్తే ‘ఒరిదతు’, ‘కాంచన సీత’,’ తంపు’,’వాస్తుహార’, ‘ఉత్తరాయణం’ లాంటి అద్భుత కావ్యాలాంటి సినిమాలు సారూ, ప్రకాషూ , నేనూ చూసి తడిసిపోయాం.  ఆ సినిమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక కవితలకు ప్రేరణయ్యాయి కూడా. యూరుగ్వాయి   రాజకీయ ఖైదీలగురించి తీసిన ‘ఐస్ ఆఫ్ బర్డ్స్ ‘ అనే సినిమా చూసాక నేను రాసిన పద్యం విని శివారెడ్డి గారు నీళ్ళు నిండిన కళ్ళతో గాఢంగా కౌగలించుకున్నారు. ఒక మంచి పద్యం గానీ ఒక గొప్ప కవితా వాక్యం గానీ వింటే నిలువెల్లా పులకించి, పరవశించి పోయి కళ్ళనీళ్ళ పర్యంతమై కరిగిపోయే కవితామూర్తి శివారెడ్డి గారు.

1983-84 కాలంలో మా హాస్టల్ గన్ ఫౌండ్రీ లోని ఒక పాడుబడ్డ భవంతిలోకి మార్చారు. కింగ్  కోఠీ నుండి బషీర్ బాగ్ చౌరస్తాకి నడిచి వెళ్తుంటే మధ్యలో భారతీయ విద్యాభవన్ ని ఆనుకుని ఉండేదది. అప్పుడంతా కలినడకే – హైదరాబాద్ వీధి వీధినా కాలినడకతో  రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి మహా నగరం మారుమూలలనీ, జీవితపు చీకటి కోణాలనీ , వెల్తురు  ఛాయల్నీ ప్రతి నెత్తురు బొట్టులో యింకించుకుని రంగరించుకున్నాం. మా సంచారానికి  శివారెడ్డి గారి కవిత్వ కరదీపిక తోడైంది. సారిచ్చిన కవిత్వం టార్చిలైటు తో నగరం మూల మూలలా శోధించాం జీవితానుభవ రహస్యాలకోసం , కవిత్వం ముడిసరుకు కోసం. అట్లే యేదైనా కవి కవిత్వం చదివినా ఒక సారి కాదు,  ఆ కవి మన ఆలోచనల్లో, చైతన్యం లో, చివరికి  నరనరాల్లోపూర్తిగా యింకే దాకా చదవమనే వారు. ఒక పద్యాన్ని చదివాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి,  ప్రతి  కవితా పాదాన్నీ  చదివి మననం చేసుకోవాలి, ఆ కవిలో మనం పరకాయ ప్రవేశం చేయాలి అప్పుడే అనేకానేక కవుల కవిత్వ మెళకువలు మనకు అర్థమౌతాయ్. మన చైతన్యం లో భాగమై మనకి  కొత్తగా  చూడడం ఊహించడం నేర్పి, ఒక  కొత్త గొంతుకనిస్తాయి.  అందుకే యిప్పటికీ యే కొత్త ప్రపంచ కవి కవిత్వం కనబడినా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని   తన స్వంతం చేసుకుంటారు. ఆ కవి కవిత్వాన్ని తనలో  భాగం  చేసుకుంటారు. తనదైన కొత్త గొంతుకని నిత్య నూతనంగా పలికిస్తారు.

యేది చూసినా దీన్ని కవిత్వమెట్లా చేయాలా అనే దృష్టి తోనే చూడాలి అని సార్ చెప్పిన పాఠాన్ని నరనరానా యింకించుకున్నాం. అప్పుడు పీ డీ యెస్ యూ లో చాలా చురుగ్గా పని చేస్తున్న రోజులు. అయితే కవిత్వం లేదా విద్యార్థి ఉద్యమం అన్నట్టు ప్రతి క్షణాన్ని గడిపేవాణ్ణి. నాకు తోడు,  కవిత్వం రాయకపోయినా ప్రకాషూ (ఒకటే కవిత రాసాడీయన – ‘Eyes of the Birds’ చూసి), కవిత్వం రాస్తూ సుధాకిరణ్ ఉండేవారు. మా హాస్టల్ లో పీ డీ యెస్ యూ ప్రభావం చాలా బలంగా ఉండేది. చాలా మంది విద్యార్థులు మా తోడుండే వారు. అవతలి  పక్షం లో యే బీ వీ పీ కూడా ఉండేది. అయితే పీ డీ యెస్ యూ లో ఉన్న విద్యార్థులు చాలా మంది పుస్తకాలకు దూరంగా మరీ ముఖ్యం కవిత్వానికి బహు దూరంగా ఉండే వారు. క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవడమే యెక్కువ యింక వేరే పుస్తకాలా అని పెదవ్విరిచే వారు. ప్రకాషూ నేనూ ఆదివారం రాగానే ఆబిడ్స్ వీధుల్లో ఆకలితో వీర విహారం చేసి కనీసం రెండు మూడు పుస్తకాలు కొనుక్కొస్తే తెగ ఆశ్చర్యపోయే వారంతా. చక్కగా ఉన్న కొద్ది పాకెట్ మనీ తో యేదో సినిమా చూడక వీళ్లకిదేమి పిచ్చి అని మమ్మల్ని చూసేవారు.

వీళ్ళతో యెట్లా అయినా పుస్తకాలు చదివించాలి కనీసం అటువైపు దృష్టి మళ్ళించాలి అనుకుని ఒక సారి శివారెడ్డి గారితో ప్రస్తావించి ‘సార్ మీరొకసారి మా హాస్టల్ కి వచ్చి మాట్లాడాలి – పుస్తకాలూ  సాహిత్యమూ యెందుకు చదవాలో మా వాళ్ళకి చెప్పాలి’ అని అన్నాను. ‘ ‘సరే అట్లాగే ఒక ఆదివారం సాయంత్రం వస్తాన’న్నారు. మా వాళ్లందరినీ ఒక రూం లో జమ చేసాము. సారు వచ్చారు. పరిచయాల తర్వాత దాదాపు గంటన్నర పైగా ఉపన్యాసం – నెమ్మది గా చిన్న నీటి ఊటలాగా మొదలై,  మెల్ల మెల్ల గా పుంజుకుంటూ,  ఒక మహా ప్రవాహమై, వుధృత జలపాతమై అందరినీ తడిపి ముద్ద చేసింది. ఆ పాడుబడ్డ హాస్టభవంతిలో రూం లకు పూర్తిగా గోడలు లేక దాదాపు అన్ని రూముల్లోకీ సార్ మార్దవ గంభీర స్వరంలో ఉపన్యాసం ప్రవహించి ఒక్కొక్కరే విద్యార్థులు రూం లోకి  రావడమూ, లోనా బయటా కిక్కిరిసి పోవడమూ జరిగింది.

ఉపన్యాసం అయిపోగానే ఒక మహా జలపాతం కింద నో ఒక వెచ్చని ఆత్మీయ వర్షం లోనో తడిసి ముద్దయినట్టు విద్యార్థులంతా తన్మయత్వంతో మమేకమయ్యారు. పుస్తకాలూ , సాహిత్యమంటే యేమిటి, వాటిల్లో యేముంటుంది, వాటిని యెందుకు చదవాలి, యెట్లా చదవాలి, మంచి సాహిత్యానికి చెడ్డసాహిత్యానికి తేడా యేమిటి, వ్యాపార సాహిత్య లక్షణాలేమిటి (యండమూరి తదితరులు వ్యాపార సాహిత్య రంగాన్ని  రాజ్యమేలుతున్న కాలమది) , మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల మనకు యేమిటి ప్రయోజనం, అది మనల్ని యెట్లా ప్రభావితం చేస్తుంది, యెట్లా వికాసమిస్తుంది, మన జీవితాలని మార్చేశక్తి మంచి సాహిత్యానికీ కవిత్వానికీ యెట్లా ఉన్నది-  అని అనేక విషయాలని అత్యంత సులువుగా అర్థమయ్యే ప్రపంచసాహిత్యలోంచీ , జీవితానుభవాలనుంచీ ఉదాహరణలతో, దారాళంగా ఆకట్టుకునేలా అద్భుతంగా చెప్పారు. విద్యార్థులంతా ఆలోచనలు ఝుమ్మని  చుట్టుముడుతుంటే  ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అప్పట్నుండీ సార్ కి అభిమానులైపోయారు. మేము కొన్న పుస్తకాలకు ఆ రోజునుండీ డిమాండ్ పెరిగిపోయింది. ఒక చిన్న నోట్ బుక్ లో తీసుకున్న పుస్తం పేరూ తమ పేరూ రాయమని పెడితే అది ఒక నెల రోజుల లోపే నిండి పోయింది కూడా. యిద్దరు ముగ్గురు కవిత్వ రాసే ప్రయత్నాలు చేసారు కూడా. అదీ సార్ ఉపన్యాస శక్తి  ప్రభావం.

siva2

శివారెడ్డి గారిలో మరో గొప్ప లక్షణం కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ ప్రేమించడం – ఇది అందరికీ సాధ్యమయే పని కాదు. జీవితంలో అనేకానేక సందర్భాలుంటై. కొన్ని దుఃఖ సందర్భాలు, చిరాకూ కోపాల తో కూడిన  సందర్భాలు, కష్టనష్టాల్లొ ఉన్నప్పుడూ ‘యిది కవిత్వానికి సమయం కాదనీ ’  ,’ ఇప్పుడు కవిత్వమేమి టీ వేళా పాళా లేకుండా’  అని యెందరో అనడం ప్రత్యక్షంగా  చూసాను నేను. కానీ ఒక్క శివారెడ్డి గారి విషయంలోనే యెప్పుడైనా, యెక్కడైనా యెట్లాంటి పరిస్థితుల్లోనైనా కవిత్వం గురించి సాహిత్యం గురించీ   నిరభ్యంతరంగా నిర్మొహమాటంగా మాట్లా డ వచ్చు, కవిత్వం వినిపించవచ్చు ‘యెట్లుంది సార్ యేమైనా సూచనలివ్వండి’ అని కూడా అడగవచ్చు. అదీ సార్ గొప్ప తనం.

ఓ సారి ఒక పద్యం రాసి దాన్ని యెట్లాగైనా సరే సార్ కి వినిపించాలని కాలేజీ కి వెళ్ళా. అప్పటికే యెనిమిది దాటటం వల్ల సార్ వెళ్ళి పోయారు. అక్కడ్నుంచి నడిచి హరిద్వార్ హోటల్ కి వెళితే అక్కడా లేరు. వనస్తలిపురం బస్సెక్కి సార్ ఇంటికెళ్ళే సరికి రాత్రి పదకొండు దాటింది. యేమనుకుంటారో అనే మొహమాటం లేకుండా తలుపు తడితే ఆంటీ తలుపు తీసి ఆశ్చర్య పోయి, ‘సారు బాగా అలసి పోయి పడుకున్నారు నాన్నారేప్పొద్దున మాట్లాడుదువు  కానీ’  అని ఈ రాత్రి పొద్దు పోయింది కదా ఇక్కడే పడుకో’ మంటూ హాలు లో నాకోసం జాగా చేస్తున్న సమయానికి సారు లేవనే లేచారు.  ‘యేమైంది స్వామీ యింత రాత్రి? ’ అంటూ హాలులోకి వచ్చారు. నేను వచ్చిన సంగతి విని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ‘స్వామి కేదైనా పెట్టు తినడానికి’  అని నా పరిస్థితి నెరిగి ఆంటీ కి చెప్పారు. ముందు పద్యం వినిపించమని పద్యం విన్నాక ‘అద్భుతం స్వామీ’ అని కళ్ళ నిండా  నీటితో కౌగలించుకుని, నేను తినే దాకా ముచ్చట్లెన్నో చెప్పి తిన్నాక కూడా చాలా సేపు గడిపారు నాతో. అదీ సార్ కి కవిత్వం మీదా కవులమీదా ఉన్న అభిమానమూ, ప్రేమా వాత్సల్యమూ.  అట్లాగే యెప్పుడు కలిసినా ‘డబ్బులున్నాయా నాన్నా? పుస్తకాలవీ కొంటున్నావు కదా, ఇదిగో ఇవి ఉంచు’ అంటూ తన దగ్గర సరిపడా ఉన్నా లేకున్నా,తనకి సరిపోతాయా లేవా అనే ఆలోచన లేకుండా డబ్బులు తీసి జేబులో కుక్కే వారు. ‘వద్దు సార్ ‘ నా దగ్గర ఉన్నాయ’న్నా యెక్కడ నీ మొహం అంటూ బలవంతంగా ఇచ్చే వారు. తానిచ్చే డబ్బులు వృధా కావనే గొప్ప నమ్మకం సారుకు. డబ్బుని లెక్క చేయని ఆత్మవిశ్వాసమూ, చిత్తు కాగితాలుగా చూసి దాని మాలిన్యాన్నంటనివ్వని మహోన్నత మానవీయ లక్షణం. మాననీయ కవితా స్వభావం శివారెడ్డి గారిది.

అంతగా  కవిత్వానికి జీవితాన్ని అంకితం చేసారు కాబట్టే యింకెవ్వరికీ రానన్ని కష్టాలొచ్చినా , యెడతెగని దుఃఖ సందర్భాలెదురైనా,  అంతులేని శోక అగాధాలోకి నెట్టి వేయబడ్డా కవిత్వాన్నే నమ్ముకున్నారు, కవిత్వాన్నే  ప్రేమించారు, ఆరాధించారు, తానే కవిత్వం,కవిత్వమే తాను – సర్వస్వం కవిత్వమే అయ్యారు. కాలు విరిగి రెండు సంవత్సరాలు మంచం పాలయినా కించిత్తైనా చెదరని ఆత్మ విశ్వాసంతో, సడలని కవిత్వం మీద ప్రేమతో అధ్బుతమైన కవిత్వం ‘అంతర్జనం’ రాసారు. తాను అప్పటిదాకా రాసిన కవిత్వం కన్నా భిన్నంగా తనదైన కొత్త గొంతుకని పలికించారు. యెందరో మంది కవులకు కరదీపిక, గురువూ, సన్నిహితుడూ, ఆత్మీయుడూ అయ్యారు.  పదిహేను కవితా  సంకలనాలని ప్రచురించి,  యింకా నవనవోన్మేషమైన కవిత్వాన్ని సృష్టిస్తూ   నిరంతర కవితా వ్యవసాయం చేస్తున్న అలుపెరుగని రైతూ,  పసి పిల్లవాడూ శివారెడ్డి గారు. 72 వసంతాలు పూర్తి చేసుకున్న నవ యవ్వనుడు శివారెడ్డి సారు కు  హార్థిక శుభాకాంక్షలు.

*

స్వేచ్ఛగా మాట్లాడుకునే జాగా కోసం….!

 

నారాయణ స్వామి వెంకట యోగి 

 

అన్ని సార్లూ నువ్వు
నేను మాట్లాడిందే మాట్లాడనక్కరలేదు.
అన్ని సార్లూ సరిగ్గా  నేనూ
నువ్వనుకున్నట్టుగానే చెప్పాల్సిన పనీ లేదు.

నువ్వు వూహించినట్టే ,
నిన్ను మెప్పించేట్టుగానే
నేనుంటేనే నీ వాణ్ణనీ,
లేకుంటే నీ పగవాడిననీ నిర్దారించకు.

అడుగులో అడుగు వేయడం,
మాటలు ప్రతిధ్వనించడం
అచ్చం ఒక్క లాగానే ఆలోచించడం
అయితే దానికి ఇద్దరం, ఇందరం  యెందుకు?

నువ్వు చెప్పేది నాకు నచ్చక పోయినా,
నేను మాట్లాడేది నువ్వు అసహ్యించుకున్నా
మనిద్దరం ఒకర్నొకరిని వినడం ముఖ్యం.
పరస్పరం గౌరవంగా విభేదించగలగడం ముఖ్యం.
అన్నింటికన్నా,
యింతమందిమి ఒప్పుకోవడానికో విభేదించడానికో,
నిలబడి స్వేచ్చగా మాట్లాడుకునేటందుకు
వుక్కిరి బిక్కిరి చేసే యిరుకుసందుల అంతర్జాలంలో
యింత జాగా ని కాపాడుకోవడం
మరింత ముఖ్యం.

 

యిటీవల జరిగిన కొన్ని సంఘటనలు,  వాటి మీద కొందరు చెప్పిన అభిప్రాయాలు, అభిప్రాయాల మీద జరిగిన వేడి వాడి చర్చలు,చర్చల్లో విసురుకున్న రాళ్ళూ రప్పలూ, దూసుకున్న కత్తులూ బాణాలూ, వాటన్నింటికీ ఈ యిరుకైన సువిశాల అంతర్జాలం లో మనందరికీ ఒనగూరిన ఈ జాగా –  చాలా అమూల్యమైనది.

సాధారణంగా మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మనం స్పందిస్తాం. కవులు కవిత్వం తోనో ,కథకులు కథల్తోనో , వ్యాస రచయితలు వ్యాసాలతోనో,  యెవరికి చేతనైన విధంగా వారి చైతన్యాన్ని వ్యక్తీకరిస్తారు. స్పందించడం ముఖ్యం. సకాలంలో స్పందించడం ముఖ్యం. యెట్లా స్పందించామన్నదీ ముఖ్యం. మన వ్యక్తీకరణలు మౌలికంగా ఉన్నాయా లేదా, శక్తి వంతంగా  ఉన్నాయా లేదా మన రచన సత్తా యెంత, దాని ప్రభావమెంత అనేది తెలివైన పాఠకులు వారి వారి అభిరుచులమేరకు, అభిప్రాయాల మేరకు నిర్ణయిస్తారు. బేరీజు వేస్తారు.

అందరికీ అన్నీ నచ్చాలనీ యెక్కడా లేదు. అట్లే అభిప్రాయాలు కూడా. ఒకరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో అందరూ పూర్తిగా ఏకీభవించాలనీ లేదు – నిజానికి అభిప్రాయలతో విభేదించకపోతే, చర్చించక పోతే, ఘర్షించకపోతే (యిక్కడ ఘర్షించడం అంటే భౌతికంగా దాడులు చేయడమని కాదు) కొత్త అభిప్రాయాలు జనించవు, ఉన్నవి వృద్ధి చెందవు. భావాలూ, అభిప్రాయాలూ శిలా శాసనాలు కావు, కాకూడదు. ప్రజాస్వామ్యబద్దంగా చర్చించబడాలి. సహనమూ సంయమనమూ కోల్పోకుండా చర్చ జరగాలి. ఇతరులను నొప్పించేలా , యిబ్బంది పెట్టేలా మాటలు తూలకుండా, తమకు నచ్చని వారిని  అవమానించకుండా, అగౌరవపర్చకుండా , తూలనాడకుండా విషయం మీద కేంద్రీకరించి చర్చ కొనసాగిస్తే అది కొత్త అభిప్రాయాలూ, భావాలూ జన్మించడానికీ , వృద్ధి చెందడానికీ ఉపయోగపడతుంది. అట్లే మనం అంగీకరించని అభిప్రాయలతో గౌరవంగా విభేదించడానికీ అంగీకరించవచ్చు.
చర్చలో దుందుడుకుతనం ప్రదర్శిస్తూ , తమ వాదనే గెలవాలనే యేకైక లక్ష్యం తో వీరావేశంతో యితరులమీద బండరాళ్ళు వేస్తూ వితండవాదన చెయ్యడం వలన యెవరికీ,  ముఖ్యంగా విషయానికి ఒరిగిందేమీ ఉండదు. అట్లాంటి వితండ వాదన వల్ల, అప్రజాస్వామ్య చర్చల వల్ల మన మధ్య  మనస్పర్థలూ , వైమనస్యాలూ యేర్పడి అవి బురద జల్లుకునేదాకా పోయే ప్రమాదముంది. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్న వారి మధ్య సహనం కోల్పోతున్న వాతావరణం కనబడుతున్నది.

తమకు నచ్చని అభిప్రాయాల పట్ల ప్రజాస్వామికంగా స్పందించి చర్చించాల్సింది పోయి దూషణలూ , అవమానించడాలూ, బెదిరింపులూ, దాడులూ చెయ్యడం దారుణమైన విషయం. దూషిస్తేనో, అవమానిస్తేనో, బెదిరిస్తేనో, దాడి చేస్తేనో అభిప్రాయాలు మార్చుకుంటారని, తమకు అనుకూలంగా వత్తాసు పలుకుతారనీ, లేదూ భయపడి పూర్తిగా మాట్లాడ్డం మానేస్తారని అనుకోవడం అమాయకత్వమూ, పైపెచ్చు  వెర్రి తనమూ కూడా! తెలుగు నేలమీద విస్తారంగా జరిగిన అనేకానేక ప్రజాస్వామ్య ఉద్యమాల భావజాల వారసత్వమూ, ప్రేరణా పుణికిపుచ్చుకున్నవారు అట్లా బెదిరిపోయి నోరు మూసుకుంటారనుకోవడం మూర్ఖత్వం.

అయితే ఈ అప్రజాస్వామిక సంస్కృతి ఇవాళ యెల్లెడలా వ్యాపించి బలపడడానికి ఒక నేపథ్యమున్నది. ప్రజాస్వ్యామ్య వాదులపైనా ,ప్రగతిశీల భావజాలం మీదా ఈ దాడులు – రాజ్యం చేసేవీ కావచ్చు, రాజ్యేతర శక్తులు చేసేవీ కావచ్చు –  గత అయిదేళ్ల కాలంగా యెక్కువైతున్నవి (అంటే అంతకు ముందు లేవని కాదు). ఇతరుల అభిప్రాయాలని సహనంతో, ప్రజాస్వామ్య దృక్పథం తో స్వీకరించి , చర్చించడానికి సిద్దంగా లేని అప్రజాస్వామ్య నియంతృత్వ శక్తులు ప్రపంచవ్యాప్తంగా బలపడినవి. ఈ శక్తులు తమకి నచ్చని అభిప్రాయాలని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నవి.

దాడి చేసి నోరు మూయించాలనే నిర్ణయించుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా  గ్లోబలైజేషన్ విఫలమై తనను,  తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి శాయశక్తులా అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న సందర్బంలో, దానికి  ఆలంబనగా నిలబడుతూ , దాని అండతో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి   ప్రయత్నిస్తున్న నియో కన్జ ర్వేటివ్ (నూతన సంప్రదాయవాద)  శక్తులివి. ఇవి ప్రపంచవ్యాప్తంగానూ,  తమ తమ దేశాల్లోనూ, గ్లోబలైజేషన్ కొనసాగిస్తున్న నిరాఘాట దోపిడీ పీడనలకు తమ శాయశక్తులా వత్తాసు పలుకుతూనే, అండదండలిస్తూనే, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల ముసుగులో  తమ అప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలుచేస్తున్నాయి.

ప్రజాస్వామిక చర్చలు జరగకుండా అణచివేస్తూ,ప్రశ్నించే గొంతులని నోరు నొక్కుతూ, యెల్లెడలా ప్రకటిత అప్రకటిత , రాజ్య , రాజ్యేతర నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఈ నూతన సంప్రదాయ శక్తులు యేకీకరణమౌతున్నాయి. చర్చలు జరిగే జాగాలన్నింటినీ బలవంతంగా ఆక్రమించుకుని,  అయితే తమకనుకూలంగా మార్చుకోవాలనో లేదా శాశ్వతంగా మూసెయ్యాలనో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే ఈ బెదిరింపులూ దాడులూ అవమానాలూ. చాలా మందికి ఇవి కొత్తకాకపోవచ్చు కానీ, ఇవి వేస్తున్న యెత్తుగడలూ, వస్తున్న మార్గాలూ, అవలంబిస్తున్న పద్దతులూ (కొన్ని సార్లు మనకు తెలీకుండా చాప కింద నీళ్ళలా , రకరకాల ముసుగులు వేసుకుని ) మరింత నవీనంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు .

యిటువంటి పరిస్ఠితుల్లో ప్రజాస్వామిక చర్చా వాతావరణాన్నీ, అభిప్రాయాల ఘర్షణనూ, అందరం కూడి ఒక చోట చర్చించుకునే జాగాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. వినడానికి ఒక పునరుక్తి (cliché ) లాగా ఉండొచ్చేమో కానీ,  ఇది ప్రజాస్వామ్యవాదులందరి భాద్యతా తక్షణ కర్తవ్యమూనూ. సహనమూ, యితరుల అభిప్రాయల పట్ల గౌరవమూ  కోల్పోకుండా, సంయమనంతో  వస్తుగతంగా (objective) చర్చ చేయడం యివాళ్ల యెంతో అవసరం. అట్లాంటి చర్చల్లోంచి యెదిగే అభిప్రాయాలే, భావజాలమే అప్రజాస్వామిక తిరోగమన శక్తులకు సరైన సమాధానం చెప్తాయి.

*

swamy1

కలల దిక్కు

నారాయణ స్వామి వెంకట యోగితొలిపొద్దు కరస్పర్శకు
రెక్కల్ని విచ్చుకున్న
పిట్టల  కొత్త  రాగాల
పాటలు.

యుగాల  యెడబాటులోంచి

గరుకు కొమ్మల చేతులు చాచిన
ఫోర్సీథియా పసుపు పచ్చని పూల
మెత్తని కౌగిళ్ళు.

పచ్చని గడ్డి  వొడిన
వెచ్చగ నిలిచిన
నీటి బిందువుల
ఆత్మీయత.

నింగిన మెరిసే నెమలీకల
వెల్తురు పింఛాల నులివెచ్చని
వింజామరలు.
సుదీర్ఘ శీతల  రాత్రుల
కఠోర తపస్సు లోంచి

డాఫడిల్స్
తొలిపొద్దు గాలులపై వర్షించే
పరాగపు పెదవుల ముద్దులు.

వాకిట్లో
మొండి మంచు కరిగిపోయి,

పూలు విదిల్చిన మాగ్నోలియా
ఆనంద నృత్యం.

యెడతెరిపిలేకుండ  వొణికించిన  చలిలో
ఆపుకున్న యెన్నాళ్ల దుఃఖమో,
జుట్టు విరబోసుకున్న వీపింగ్ చెర్రీ
పూల శోకమై కలబోసుకునే
శతాబ్దాల ముచ్చట్లు.

అస్తి పంజరాల్లా భయపెట్టిన
చెట్ల చేతివేళ్ళకు చిగుర్లతో,
హృదయాల  కాలింగ్ బెల్ మోగిస్తుంది
వసంతకాలం.

పిట్టకూర్పులు వదిలించుకుని
రెక్కలు టపటపలాడించి
కొత్త కలలదిక్కుగా యెగిరిపోతుంది
యిల్లు.

*

swamy1

ఐనా నేను లేస్తాను!

 ang0_007

                  –  మాయా ఏంజిలో

నువ్వు నీ చేదైన అబద్దాలతోటీ

వంకర రాతలతోటీ

చరిత్రలో నన్ను అణిచెయ్యాలని

చూస్తావు –

నన్ను నీ కాలికింద దుమ్ములా తొక్కేయాలని

చూస్తావు –

అయినా నేను

లేస్తాను – ఆ దుమ్ములాగానే !

జీవం తొణికిసలాడే నా ఆత్మవిశ్వాసం చూస్తే

నీ కెందుకంత కినుక?

ఎందుకలా మొఖం మాడ్చుకున్నవ్ ?

నా నట్టింట్లో నిరంతరం ఉప్పొంగే జల వూటలున్నట్లు

నేను ఉరకలేస్తున్నందుకా ?

సూర్యులూ చంద్రుల్లానే

కెరటం ఉవ్వెత్తున ఉప్పొంగినంత ఖచ్చితంగానే

ఆకాశాన్నంటే ఆశల్లానే,

నేనింకా లేస్తూనే ఉంటాను!

నేను కుప్పకూలడం

చూడాలనుకున్నవ్ కదా

వంచిన తలతో – వాలిన కళ్లతో

కన్నీటి చుక్కల్లా రాలిపోయే

భుజాలతో

దయనీయమైన ఏడ్పులతో

సొమ్మసిల్లిపోయి –

ప్రపంచాన్ని ధిక్కరించే నా గర్వం

నిన్ను కించపరుస్తోందా

మా ఇంటి వెనుక బంగారు గనులున్నట్టు

నేను గలగలా నవ్వుతుంటే

నీకు ముళ్ళమీద ఉన్నట్టుందా

నువ్వు నీ మాటలతో నన్ను కాల్చేయవచ్చు

నువ్వు నీ చురకత్తి చూపులతో కోసేయ్యవచ్చు

నీ అంతులేని ద్వేషంతో చంపెయ్యవచ్చు

ఐనా నేను లేస్తాను – గాలిలా !

నేను సెక్సీగా ఉండడం

నీ కిబ్బందిగా ఉందా!

నా తొడలు కలిసిన చోట

వజ్రాలున్నట్టు

నేను నాట్యం చేస్తుంటే

నీకు తెగ ఆశ్చర్యంగా ఉందా!

నిరంతర అవమానాల

చరిత్ర గుడిసెల్లోంచి

లేస్తాన్నేను!

నొప్పిలో వేళ్ళూనుకున్న

గతం లోంచి

లేస్తాన్నేను!

ఉవ్వెత్తున ఉప్పొంగే కెరటాలతో

ఎగిరి దుంకుతున్న

విశాలమైన నల్ల సముద్రాన్ని

 నేను!

భయానకమైన

చీకటి రాత్రులని దాటుకుంటూ

లేస్తాన్నేను!

అద్భుతంగా తళుక్కుమనే

ఒక కొంగ్రొత్త సూర్యోదయం లోకి

లేస్తాన్నేను!

బానిస

ఆశనూ

స్వప్నాన్నీ నేను!

 నా పూర్వీకులిచ్చిన

అపురూపమైన  బహుమతులని

వెంట తెచ్చుకుంటూ

నేను లేస్తాను!

లేస్తాన్నేను!

అనువాదం: నారాయణ స్వామి వెంకట యోగి

వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!

barakaweb1-master675

 

ఏప్రిల్ 16, 2009. మా యింటి దగ్గరి లాబిరింథ్ బుక్స్ నుండి ఈ-మేల్ వచ్చింది. తెరిచి చూడగానే  నా కళ్ళు మెరిసాయి. వావ్ అనుకున్నాను. అమిరి బరాకా తో సమావేశం. ఆ రోజు సాయంత్రమే! యెంత గొప్ప అవకాశం. యెన్నాళ్ళకు చూడబోతున్నాను బరాకా ను!

కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన గొప్ప కవీ, విప్లవకారుడూ బరాకా ను కలిసే  అవకాశం కలుగుతోంది. అమిరి బరాకా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం పై ప్రభావం చాలానే నెరపారు. ఒక రెండేళ్ళ కింద నిఖిలేశ్వర్ ఇక్కడికి వచ్చినప్పుడు ‘ప్రాణహిత’ సాహిత్య పత్రికకు ముఖాముఖి సందర్భంగా చాలా సేపు మాట్లాడుకున్నాం. దిగంబర కవుల పై అలెన్ గింస్ బర్గ్ ప్రభావం గురించి అడిగినప్పుడు ‘ నిజానిక్ గింస్ బర్గ్ కంటే మాపై అమిరి బరాకా ప్రభావం యెక్కువ వుంది’ అన్నారాయన. అంతకు ముందు వినడమే కానీ అమిరి బరాకా గురించి యెక్కువ చదవలేదు.

నిఖిల్ చెప్పాక  అమిరి బరాకా కవిత్వాన్ని జీవితాన్ని చదివి,  యితన్ని యిన్ని రోజులూ యెందుకు కనుక్కోలేదా అని ఆశ్చర్యపోయాను. అట్లా లాబిరింథ్ కు అమిరి బరాకా వస్తున్నాదని తెలియగానే ఎగిరి గంతేసి బయలుదేరా. దాదాపు ఒక 100 మంది దాకా వచ్చారా సమావేశానికి అమెరికా లో అది చాలా పెద్ద సంఖ్యే! అదీ గురువారం సాయంత్రం. సభను ప్రారంభిస్తూ నిర్వాహకులు బరాకాను మాట్లాడమని ఆహ్వానించారు. మాలో ఒకరుగా కూర్చున్న బరాకా (అప్పటి దాకా నేను గమనించనే లేదు) లేచి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టారు.

సాధారణంగా నల్ల వాళ్ళు ఒడ్డూ , పొడుగూ పెద్దగా ఉండి భారీ శరీరాలతో, కొంత ప్రత్యేకంగా వుంటారు. కానీ ఈయన చూస్తే చిన్న శరీరంతో, వయసుతో కొంచెం వంగిన శరీరంతో చాలా సాదా సీదాగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల అలుపు లేని పోరాటం, ఉద్యమాలూ, అకుంఠిత దీక్షా, అసమాన సమాజం పట్ల ఆయన ఆగ్రహమూ – అనీ ఆయన ముఖ వర్ఛస్సు లో స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా మామూలుగా మొదలైన ప్రసంగం మెల్ల మెల్లగా ఒక ప్రవాహంగా మారి అలుపెరుగని ఆవేశపు మాటల జలపాతమై ఒక గంట సేపు సభికుల ని తీవ్ర ఉద్విగ్నతకు గురి చేసింది.

ప్రస్తుత సమాజమూ, సాహిత్యమూ, ప్రపంచవ్యాప్తంగా 9/11 తర్వాత పరిస్థితులూ, పోరాటాలూ, సామ్రాజ్యవాదమూ, వీటన్నింటి నేపథ్యం లో మార్క్సిజం ప్రాసంగికత (అంతకు ముందు సంవత్సరమే ప్రపంచాన్ని సామ్రాజ్యవాద ఆర్థిక సంక్షోభం తీవ్రంగా కుదిపేసి కోట్లాది ప్రజానీకం జీవితాలని అతలాకుతలం చేసింది) – బరాకా ప్రసంగంలో  అనేక అంశాలని తడుముతూ చివరగా “ఈ సంక్షోభాలకూ, అసమానతలకూ, దుర్భరమైన దోపిడీ పీడనలకూ మార్క్సిజమే సరైన మార్గం” అంటూ ముగించారు. ఆయన మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు సభికులనుండి – ఆయన ప్రసంగం గురించీ , ఆయన 9/11 తర్వాత రాసిన పద్యం గురించీ – చాలా ఓపికగా సమధానాలు చెప్పాడు.

ప్రశ్నలన్నీ అయ్యాక నేనాయన దగ్గరికి వెళ్ళాను. ముందు నన్ను నేను పరిచయం చేసుకుని, మన తెలుగు సమాజం గురించీ, సాహిత్యం గురించీ, పోరాటాల గురించీ, కవిత్వం మీద ఆయన ప్రభావం గురించీ చెప్పాను. ఆయన ముఖంలో ఒక గొప్ప వెలుగు, కరచాలనం చేయడానికి చెయ్యి జాపాను. ఆయన ఆనందాన్ని ఉద్వేగాన్ని పట్టలేక నన్ను కౌగలించుకున్నారు. ‘ అద్భుతం. చాలా సంతోషం. ఈ విషయాలు వింటుంటే నాకు ఇంకో నూరేళ్ల జీవితం  జీవించాలనిపిస్తుంది’ అన్నారాయన. ఆయన పుస్తకం ‘బ్లూస్ పీపుల్ ‘ పైన  ‘ For Swami – Unite & Struggle’  అని రాసి సంతకం చేసి ఇచ్చారు. ‘మళ్ళీ కలవాలి మనం’ అనుకుంటూ వెళ్ళిపోయారాయన.

కార్పోరేట్ పని గంటల చక్రాల్లో నిరంతరం నలిగిపోయే అమెరికా జీవితం లో ఆయన్ని మళ్ళీ కలవడం కుదరలేదు. యిప్పుడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. జనవరి 9 న ఆయన కనుమూసారు. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు ఆయన ఆరోగ్యం బాగా లేదని విన్నాను. యిప్పుడనిపిస్తోంది ‘యెట్లా అయినా వీలు చేసుకుని ఒక్క సారి కలిసి వుంటే బాగుండేదని’. ఆయన్ని కలిసి, మాట్లాడి, కౌగలించుకున్న ఆ సాయంత్రమే పదే పదే గుర్తుకొచ్చి కళ్ళల్లో సన్నటి నీటి తెర. కోల్పోతే గానీ విలువ తెలిసిరానివి అనేకం జీవితంలో .

2ea12e92479c089aad5256bcd3207ccf

డిప్రెషన్ తరవాతి తరం

అమిరి బరాకా , 1930 ల తీవ్ర ఆర్థిక మాంద్యం కాలం లో (Great Depression) 1934 లో నూవార్క్ , న్యూ జెర్సీ లో ఎవెరెట్  లీ రాయి జోన్స్ గా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబలో పుట్టారు.  నాన్న కోయెట్ లీ రాయి జోన్స్ పోస్టల్ కార్మికుడు, లిఫ్ట్ ఆపరేటర్ గా చిన్నా చితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ ఆన్నా లోయిస్ ఒక సామాజిక కార్యకర్త. బాల్యం నూవార్క్ లో, బారింగర్ హై స్కూల్ లో చదువు తర్వాత రట్గర్స్ యూనివర్సిటీ లో స్కాలర్ షిప్ తో ప్రవేశం దొరికినా, అక్కడి సామాజిక, సాంస్కృతిక వివక్షల్ని చూసి వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీ లో చేరారు. అక్కడ తత్వ శాస్త్రం, మతం ప్రదాన అంశాలుగా ఉన్నత విద్యను ప్రారంభించినా,  పట్టా తీసుకోలేదు. తర్వాత న్యూ యార్క్ లోని కొలంబియా లో తిరిగి ఉన్నత విద్యను కొనసాగించినా అక్కడా పట్టా తీసుకోలేదు.

కమ్యూనిస్టు అనే నెపం తో

1954 లో అమెరికా వైమానిక దళం లో చేరిన బరాకాను  కమ్యూనిస్టు అనే నెపం తో కమాండింగ్ ఆఫీసర్ బహిష్కరించాడు. (అది అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేక మెక్ – కార్థీ దుష్ట కాలం). US Airforce నుండి బహిష్కరించబడడమే బరాకా కు మంచిదైంది. తర్వాత ఆయన న్యూ యార్క్ గ్రీన్ విచ్ విలేజి కి మకాం మార్చారు. ఆ రోజుల్లో గ్రీన్ విచ్ విలేజి అమెరికాలో అత్యంత ప్రగతిశీలమైన ప్రాంతం. ఉన్న స్థితి  ని ధిక్కరించి, సామాజిక మార్పు కోరే సాహిత్యం, కళలూ, సామాజిక పోరాటాలూ అలలలుగా కెరటాలుగా వెల్లివిరిసిన ప్రాంతం. బరాకాకు అక్కడ బీట్ తరం కవులు, కళాకారులు , బ్లాక్ మౌంటేన్ కవులు, న్యూ యార్క్ స్కూల్ కవులు పరిచయమయ్యారు. జాజ్ సంగీతం పరిచయమైంది.

మార్పు కోరే సాహిత్యమూ, రాజకీయాలూ పరిచయమయ్యాయి. అంతే ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదు. హెట్టీ కోహెన్ తో పెళ్ళీ ఇద్దరు అమ్మాయిలూ … హెట్టీ తో కలిసి ఒక ప్రచురణశాల స్థాపించారు. బీట్ కవులు అలెన్ గింస్ బర్గ్ , జాక్ కెరాక్ ల రచనలు ప్రచురించారు. బీట్ కవులతో ‘యూగెన్’ అనే త్రైమాసిక పత్రిక ప్రారంభించారు. తానూ బీట్ కవుల్లో ఒకడై కవిత్వం రాసారు. ‘కల్చర్ ‘ (kulchur) అనే సాహిత్య, కళ ల పత్రికకు సంపాదకీయం వహించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారి నల్లవారి సంగీతం గురించి, వేర్ల నుండి చరిత్రను వివరిస్తూ, అద్భుతమైన సామాజిక విశ్లేషణ తో బరాకా రాసిన ‘బ్లూస్ పీపుల్ : నీగ్రో మ్యూసిక్ ఇన్ అమెరికా’ అనే పుస్తకం అత్యంత విలువైనది. అది రాసేటప్పటికి ఆయన ఇంకా లీ రాయి జోన్స్ గానే అందరికీ తెలుసు.

లీ రాయి జోన్స్ గా ఆయన రాసిన డచ్ మన్ అనే నాటకం గొప్ప నాటకంగా పేరు తెచ్చుకుంది. అమెరికా అంతటా సుప్రసిద్ధమైంది. న్యూ యార్క్  సబ్ వే లో ఒక తెల్లజాతి స్త్రీ , నల్ల జాతి పురుషుడి మధ్య  దూషణ లతో సాగే సంభాషణ ను,  సందర్భాన్ని, దచ్ మన్ లో  బరాకా అద్భుతంగా నాటకీకరించారు. శ్వేత జాత్యహంకార సమాజం బోను లో చిక్కుకు పోయిన ఆ ఇద్దరి పరిస్థితి ని బరాకా అద్భుతంగా సామాజిక కోణం లో విశ్లేషిస్తూ నాటకీకరించారు. , ఆ కాలంలో ఇతర నాటక రచయితలు ‘సహజవాదం’ తో రాస్తుంటే బరాకా సింబాలిజం వాడుతూ  తన నాటకంలో ఉద్వేగాన్ని పలికించడం కోసం అనేక ప్రయోగాల్ని చేసి తన కాలం కన్నా తాను ముందున్నానని నిరూపించారు.

1959-60 లో క్యూబా ప్రయాణం బరాకా జీవితంలో పెను మార్పు తీసికొచ్చింది. ఆయన సాహిత్య సామాజిక జీవితం లో అదొక మైలు రాయి. క్యూబా లో ఇతర దేశాల రచయితలతో, ముఖ్యంగా పేదరికానికీ, దోపిడీ పీడనల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూడవ ప్రపంచ దేశాల రచయితలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రచయితల రచనలు, వారి దేశాల్లో ఉన్న సామాజిక స్థితిగతులూ తెల్సుకున్నారు. అక్కడ పరిచయమైన జేమ్  షెల్లీ అనే మెక్సికన్ రచయిత బరాకా ను ఒక సూటి ప్రశ్న వేసారు ‘ నీ చుట్టూ సమాజం లో కోట్లాది మంది ప్రజలు ఆకలితో తిండి లేక మాడుతూ ఉంటే నీకు ఇంకా రాయడానిక్ వేరే వస్తువు కావాలా?’ – బరాకా తన సాహిత్యం గురించీ , కవిత్వం గురించీ పునరాలోచనలో పడ్డారు. అక్కడి నుండీ ఆయన మౌలిక దృక్పథం మారింది.

BARAKA

బ్లాక్ పాంథర్స్ ఉద్యమం

సామాజిక స్పృహా రాజకీయ దృక్పథమూ ఆయన సాహిత్యం లో ప్రదానమయ్యాయి. అప్పటిదాకా రూపం మీద విపరీతమైన శ్రద్ద పెట్టి శిల్పం లా చెక్కుతూ రాసిన బరాకా తన రాతలని ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్ని చేసారు. డైనమైట్లు పేల్చారు. డచ్ మన్ నాటకంలో,  అమెరికా తెల్ల సమాజం పట్ల  పెరుగుతున్న తన అసంతృప్తినీ , అవిశ్వాసాన్నీ ప్రకటించిన బరాకా తన తర్వాత సాహిత్యంలో ఆ సమాజం పట్ల తిరుగుబాటు ప్రకటించారు. తనదైన ఒక కొత్త సమాజాన్ని కలలు కని దాన్ని నిర్మించేందుకు తాపత్రయపడ్డారు. అప్పుడు ఉధృతంగా జరుగుతున్న నల్ల జాతీయవాద ఉద్యమమూ, బ్లాక్ పాంథర్స్ ఉద్యమం తో ప్రభావితమై న్యూ యార్క్ లోని హార్లెం కు మకాం మార్చారు.

తనదైన అస్తిత్వం, సమాజ నిర్మాణం కోసం బరాకా,  క్రమేణా బ్లాక్ నేషనలిస్టు (నల్ల జాతీయవాద) ఉద్యమంలో భాగమయ్యారు. నల్ల జాతీయవాద సాహిత్య కళా సాస్కృతిక నిర్మాణం కోసం నడుం కట్టారు. అప్పటికే తీవ్రమైన బ్లాక్ పాంథర్స్ (నల్ల చిరుతల) ఉద్యమం తో మమేకమయ్యారు. మాల్కం ఎక్స్ తో సన్నిహిత సంబంధాలు యేర్పర్చుకున్నారు. నల్ల జాతీయుల ప్రదర్శనలో పాల్గొన్న బరాకాను FBI పోలీసులు తీవ్రంగా హింసించారు. దాదాపు చనిపోతారనే అనుకున్నారంతా! కానీ ఆ సంఘటన తర్వాత కోలుకున్న బరాకాలో పోరాట పటిమ ఇంకా తీవ్రమైంది. మరింత రాటుదేలారాయన.

1965 లో మాల్కం ఎక్స్ తో జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో బరాకా తన కొత్త రాజకీయ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. మాల్కం ఎక్స్ తో బరాకా తో  సమావేశం తర్వాత కొన్ని వారాలకే మాల్కం ఎక్స్ హత్య జరిగింది. మాల్కం అంతిమయాత్రలో ఒక ముస్లిం ప్రీస్ట్ లీ రాయి జోన్స్ కు అమిర్ బరకత్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అరబ్ పేరును ఆఫ్రికనైజ్ చేసి స్వాహిలి భాషలో దాన్ని అమిరి బరాకా కా మార్చుకున్నారు. నల్ల జాతీయవాద సాహిత్య సాంస్కృతిక సైనికుడిగా మారిపోయారు. నల్ల జాతి కళలకు సాహిత్యానికి, సంస్కృతికీ ఒక కొత్త అస్తిత్వాన్ని , తమని బానిసలుగా మార్చిన అమెరికా శ్వేతజాతి సంకెళ్ళ నుండి బయటపడి ఒక నిజమైన ఆఫ్రికన్ నల్ల జాతి అస్తిత్వాన్ని, రాజకీయంగానూ, aesthetical గానూ, నిర్మించేందుకు ఉద్యమించారు.

బీట్ తరం కవుల నుండి తనని తాను వేరు పడేందుకు, నల్ల జాతీయత తన కొత్త అస్తిత్వంగా మలుచుకునేందుకు తీవ్రమైన కృషి చేసారు. బ్లాక్ ఆర్ట్స్ నేషనల్ మూవ్ మెంట్ కు నాయకత్వం వహించారు. కవిత్వమూ, నవలలూ, కథలూ, నాటకాలూ, సంగీత విమర్శా, ఇట్లా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసారు. ఒక సాహిత్య కారుడిగానే కాదు రాజకీయ సాంస్కృతిక ఉద్యమకారుడిగా బరాకా అలుపెరుగని పోరాటం చేసారు. ఈ క్రమంలో FBI బరాకా ను అమెరికా లో ఒక ఎదుగుతున్న నాయకుడిగా, నల్ల జాతి తీవ్ర శక్తిగా అంచనా వేసింది.

అయితే క్రమంగా బరాకా నల్ల జాతీయవాద ఉద్యమానికున్న పరిమితులని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కేవలం నల్ల జాతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా అశేషప్రజానీకం పేదరికంలో మగ్గిపోతూ దుర్భరమైన దోపిడీ పీడనలకు గురవుతున్నదని, వీటన్నింటికీ శ్వేతజాత్యహంకారం కన్న పెద్ద శత్రువేదో ప్రపంచ ప్రజలని వెంటాడి వేటాడుతున్నదని బరాకా గుర్తించారు. ఆ శత్రువు పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదమనీ, దానికి విరుగుడు మార్క్సిజం లో ఉన్నదని గుర్తెరిగారు. 1970 ల నుండీ బరాకా కేవలం నల్ల జాతీయులతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలతో తనను తాను గుర్తించుకున్నారు. మమేకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పీడిత ప్రజల పోరాటాలతో identify అయ్యారు. సంఘీభావం ప్రకటించారు. సాహిత్యాన్ని సృష్టించారు. క్రియాశీలకంగా కూడా తనవంతు పాత్ర నిర్వహించారు. నూవర్క్ నగరంలోనూ , హార్లెం లోనూ, అమెరికా లోని ఇతర నగరాల లోనూ రాజకీయ ఉద్యమాల్లోనూ, హక్కుల ఉద్యమాల్లోనూ,  చివరి ఊపిరి దాకా క్రియాశీలమైన ప్రాత్ర నిర్వహించారు. మార్క్సిజం పట్ల, మూడవ ప్రపంచ దేశాల్లోని పీడిత ప్రజల పోరాటాల పట్లా తన మమేకతను చివరి ఊపిరి దాకా వీడలేదు..

న్యూ జెర్సీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్థాన కవి పదవిని యేర్పాటు చేసి, ఆయనను 2002 లో ఆస్థాన కవిగా నియమించింది. అయితే ఆయన 9/11 దాడుల మీద రాసిన ఒక పద్యం పెద్ద దుమారాన్ని సృష్టించింది. ‘యెవడొ అమెరికా ను పేల్చేసాడు’ అనే శీర్షిక తో ఆయన రాసిన పద్యం ఇలా సాగుతుంది:

 

యెవడో అమెరికాను పేల్చేసాడు

                   ఆఫ్ఘనిస్థాన్ లో యెవడొ అనాగరిక అరబ్
పేల్చేసాడు అన్నారు …

                       …..

                 యెవడు అందరికనా పెద్ద టెరరిస్టు

                యెవడు బైబిల్ ను మార్చాడు

                యెవడు అందరికన్నా యెక్కువమందిని హత్య చేసాడు

                యెవర్నీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం
యెవడు అందరికన్నా దుర్మార్గాలు చెయ్యగలడు

                యెవడికి సామంత రాజ్యాలున్నయి

                యెవడు ప్రపంచం లో అందరికన్నా
యెక్కువ భూమిని దొంగిలించాడు

                యెవడు ప్రపంచాన్ని క్రూరంగా పాలిస్తూ
అంతా మంచే  చేస్తున్నానంటూ పాపాలు మాత్రమే చేస్తాడు

                యెవడు యెవడు యెవడు
ఆ ముష్కరుడెవ్వడు…

 

అయితే ఈ పద్యం లో ఒక చోట ఆయన రాసిన వాక్యాలు ఇజ్రాయీల్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనను ‘anti-semitist’ అని దూషించారు. న్యూ జెర్సీ ప్రభుత్వం ఆయన పదవిని రద్దు చేసింది. అయితే ఆయన తాను రాసిందాన్ని వెనక్కి తీసుకోలేదు. 9/11 అమెరికా దాడుల వెనక కుట్ర ఉన్నదని తాను అనుకుంటున్నాననే అన్నారు. తన మీద ఎన్ని అభాండాలు మోపినా, యెన్ని వివాదాల్లో ఇరికించినా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో , పోరాడడంలో కించిత్తైనా రాజీ పడలేదు. తాను నమ్మిన పీడిత ప్రజల విముక్తినీ , అందుకు మార్గదర్శీ కరదీపికా ఐన మార్క్సిజాన్ని జీవితాంతమూ విడిచిపెట్టలేదు.

ఆయన్ని కలిసింది ఒక్క సారే అయినా, నాకు  ఒక జీవితకాలం జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళారు. తన వెచ్చని కరస్పర్శలో, ఆత్మీయ  ఆలింగనం లో తన జీవితాంతం పడ్డ తపననూ, ఆరాటాన్నీ అందించిపోయారాయన. అమెరికా కూ,  మొత్తంగా ప్రపంచ పీడిత ప్రజలకూ ఒక అపురూపమైన వేదనాభరితమైన సౌందర్య సంపద అమిరి బరాకా! జీవితాంతమూ, చివరి ఊపిరి దాకా  అవిశ్రాంతంగా పోరాడిన ఆయన కనుమూసాక మాత్రం,  ప్రశాంతంగా యెలా వుండగలరు? పీడిత ప్రజలకు నిజమైన విముక్తి కలిగి, అసమాన సమాజం అంతమయ్యేదాక ఆయనకు శాంతి కలుగుతుందనుకోను – జీవితంలోనైనా మృత్యువులోనైనా !

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి