సాహసానికి ఇంకో పేరు: రంగవల్లి!

3

(విప్లవోద్యమ నాయకురాలిగా తెలుగు నేలకు సుపరిచితమైన రంగవల్లి 1999 నవంబర్ 11 న ములుగు అడవుల్లో బూటకపు ఎంకౌంటర్ లో పోలీసుల చేత హత్య చేయబడింది. హత్యచేయబడ్డప్పుడు ఆమె పేరు జ్యోతక్క. అంతకు ముందు ఉమక్క గా కూడా చాలా మందికి చిరపరిచితురాలే! PDSU (ప్రగతిశీల విద్యార్థి సంఘం) మాస పత్రిక విజృంభణ సంపాదక కమిటీ నాయకురాలిగా, మహిళా ఉద్యమ నాయకురాలిగా, పల్నాడు భూపోరాటాల నాయకురాలిగా, గోదావరీ లోయ విప్లవోద్యమ నాయకురాలిగా రంగవల్లి జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన మహోన్నత మానవతామూర్తి  రంగవల్లి. ఆమెతో ఉద్యమంలో కలిసి పనిచేసిన పరిచయాన్నీ , నా అనుభవాల్నీ , మర్చిపోలేని జ్ఞాపకాల్లా  చెప్పే ప్రయత్నం ఇది).

 

1987 ఆగస్టు నెలలో ఒక రోజు… వర్షా కాలం.. సాయంత్రం 8:55… బయట భోరుమని వర్షం – భీకరమైన ఈదురు గాలులు – ముసురుకున్న  చీకట్లు – మధ్య మధ్యలో ఆకాశం కసిగా నవ్వినట్టు మెరుపులు ….

కిటికీ రెక్కలు విరిగి పోయేటంతగా కొట్టుకుంటుంటే ఒకటొకటే అతి కష్టం మీద మూస్తూ ‘ఈ తుఫాను వానలో ఈ రాత్రి తను ఇంక రాదు ఈ పూటకు మన సమావేశం లేనట్టే ‘ అన్నాన్నేను చారి తో. ‘అవును నిజమే ఈ వానకు  ఆటోలు కూడా నడవడం కష్టం.. తనెట్లా వస్తుంది? సమావేశం మరో రోజు పెట్టుకోవాల్సిందే! కనీసం మనం యేదైనా వండుకునైనా తిందాం’ అని చారి వంటగది వైపు నడిచాడు. ఈ లోపల ఠపీ మని లైటు కూడా పోయింది. గాలివానకు యెక్కడో కరంటు తీగ తెగిపోయి ఉంటుంది. మెల్లగా వెతికి దీపం వెలిగించాం. రూం లోపలికి గాలివాన తోసుకొస్తోందా అన్నట్టు దీపం వణికిపోతోంది.

హైదరాబాదులో మెహ్దీ పట్నం దాటాక కాకతీయ నగర్ నుండి ఒక మూడు  కిలోమీటర్ల దూరంలో గుడిమల్కాపూర్ కి పోయే దారిలో,  అప్పటికింకా యిళ్ళూ కాలనీలూ యేమీ లేని చోట విసిరేసినట్టుగా ఉండేది నా రూం. అపుడప్పుడే కాలేజీ లో లెక్చరర్ గా చేరాక దగ్గరగా ఉంటుందని అక్కడ కిరాయకు తీసుకున్నా! 118టి అని కోటి నుండి ఒకే ఒక బస్సు ఉండేది – అదీ యెప్పుడు వస్తుందో తెలియదు – ప్రతిసారీ కాకతీయ నగర్ దగ్గర బేర్బన్ బస్టాప్ లో దిగి నడిచేది రూం కి. వచ్చే వాళ్లంతా విసుక్కునే వాళ్లు సెంటర్కి యింత దూరం తీసుకున్నావేమిటంటూ – అయితే సెంటర్ కి దూరంగా ఉండడం వల్లనూ జనసంచారం పెద్దగా లేకపోవడం వల్లనూ నా రూం అనేక సమావేశాలకు అనువైన ప్రదేశంగా ఉండేది. యెప్పుడు పడితే అప్పుడు, నేనున్నా లేక పోయినా రూం లో సమావేశాలు నడుస్తూనే ఉండేవి. ఇంటికి పార్టీ ప్రదాన నాయకత్వం అంతా నిరభ్యంతరంగా వస్తూ పోతూ ఉండే వారు.  అప్పుడు నేను యితర అనేకానేక సాహిత్య సాంస్కృతిక బాధ్యత ల్లో భాగంగా విజృంభణ పత్రిక ప్రచురణ కూడా చూస్తూ ఉండేది.

మా టీం లో చారి ప్రధాన సభ్యుడు. అట్లా ఆ సాయంత్రం నా రూం లో యేర్పాటైన సమావేశం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. అంత భయంకరమైన వానలో, తుఫాను హోరుగాలిలో మానవమాత్రులెవరూ రారు రాలేరని నిర్ధారించుకుని ఇంక వంట కార్యక్రమం మొదలుబెడదామనుకున్నాం. యింతలో టక టక ఇంటి తలుపు చప్పుడు. భీకరమైన గాలి పెద్ద చేతులు చాపి తలుపులు బాదుతుందిలే అనుకున్నామిద్దరం. ఈ సారి మరింత పెద్దగా తలుపు చప్పుడు. ఆశ్చర్యపోయాం. ఖచ్చితంగా పోలీసులే సమావేశం వివరాలు తెలిసి దాడిచెయ్యడానికి వచ్చారు అనుకుని కొయ్యబారిపోయాం. వెనక తలుపు నుకంచి పారిపోదామా అంటే బయట పరిస్థితి బీభత్సం. అయినా పోలీసులైనా మనుషులే కదా యింత వానలో రావడం అసంభవం అనుకున్నాం. యేదో మళ్ళీ గాలివానే కావచ్చులే  అనుకుంటుండగానే మళ్ళి తలుపు టక టక … ఇంక ఇద్దరికీ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ధైర్యం చిక్కబట్టుకుని కిటికీ రెక్క కొద్దిగా తెరవబోతే విసురుగా వాన చెళ్ళుమని చరిచింది.

యింక లాభం లేదని ‘యెవరూ ‘ అని అరిచాం … మా గొంతు మాకే వినబడలేదు … తలుపులు తీయాలా వద్దా పెద్ద మీమాంస.. మళ్ళి టక టక … యేమయితే అయింది అనుకుని మెల్లగా తలుపు తీసాం … బయట తను .. గాలి వానకు విరిగిపోయిన చెత్రీ తో పూర్తిగా తడిసి ముద్దై పోయి వణుకుతూ … ‘అక్కా మీరా….’ నిర్ఘాంత పోయాం చారీ నేనూ  –  ఈ రాత్రి ఈ వానలో మీరొక్కరే యెట్లా వచ్చారు అసలెందికింత సాహసం చేసారు మీకేమనా అయితే? యేమిటీ పిచ్చిపని ?”

ప్రశ్నల వర్షం … అసలు లోపలికి రానిస్తారా లేదా అంటూ లోపలికి తలుపు తోసుకుని వచ్చింది ఒక పెద్ద నీళ్లమూటలా … వెంటనే పరిగెత్తుకెళ్ళి తువ్వాల తెచ్చిచ్చా – తను అంతకు ముందు అడపా దడపా సమావేశాలు వస్తూ ఉండేది గనక తనవి మరో జత బట్టలున్నటు గుర్తుకొచ్చి అదే చెప్పా తనకు .. అవును కదూ అంటూ లోపలికి వెళ్ళింది తను…. నేనూ చారీ ముఖాలు చూసుకున్నాం గొప్ప సంభ్రమాశ్చర్యాలతో… అసలు ఊహించలేదు కదా తను వస్తుందని .. ఈ వానలో బస్సు లుండవు ఆటొ వాడు కూడా ఇటువైపు రావడానికి సాహసించడు.. యెట్లా వచ్చి ఉంటుంది? ఈ చీకట్లో ఈ భయంకరమైన ఈదురుగాలిలో ఈ  తుఫాను వానలో ఇంతదూరం యెట్లా వచ్చింది తను?

నేనూ చారి యిట్లా ప్రశ్నించుకుంటుండగా యేమిటీ యేదొ గునుగుతున్నరు? అనుకుంటూ లోపలినుండి పొడి బట్టలు కట్టుకుని తలార బెట్టుకుంటూ బయటికొచ్చింది.

‘అక్కా! యేమిటీ పిచ్చి పని – అసలెట్లా వచ్చిండ్రు మీరు? ఈ తుఫానులో ఈ చీకట్లో ఒక్కరే?  యేమైనా అయితే?’ ‘యేం యేమవుతుంది? ఈ ప్రాంతమంతా సేఫేలే’ ‘అట్లా అని కాదు – ఈ పూట బస్సులు కూడా ఉండవు కదా’  …. అవును బస్సులు లేవు ఆటోలూ లేవు –

‘ ‘మరి యేట్లా వచ్చారు?’

‘ నడుచుకుంటూ- ‘ ‘యెక్కడ్నుండి?’  ‘మెహిదీ పట్నం నుండి’ అంటే దాదాపు ఆరు కిలోమీటర్లు .. వానలో చలిలో క్రూరంగా విసిరి కొట్టే ఈదురు గాలిలో – యెందుకక్కా యింత సాహసం?’

‘మరి సమావేశం కదా ముఖ్యం కాదూ? ఈ పూట మనం కలవక పోతే నాకు మళ్ళా వారం దాకా కుదరదు – ఈ సమావేశం జరగక పోతే పత్రిక ఆలస్యం అవుతుంది – ఇప్పుడిప్పుడె పత్రికకు ప్రచారం లబించి యెక్కువ మంది చదువుతున్నారు – ప్రతి నెల మొదటి తారీకున పుస్తకాల షాపుల్లో అడిగి మరీ కొనుక్కుంటున్నారు – పత్రికకు క్వాలిటీ తో పాటు రెగులారిటీ కూడా చాల ముఖ్యం’  అంది తను మిణుకు మిణుకుమంటూ వణుకుతున్న దీపంవెలుగులో మిలమిలా  మెరిసే నిర్మలమైన కళ్లతో..

పదండి కూర్చుందాం!!  వచ్చే నెల పత్రికలో యేమేమి వస్తే   బాగుంటుందో అనుకుందాం – యేమైనా తిని మొదలు పెడదామా అక్కా? ‘ఆకలిగా ఉందా సర్లే యింత అన్నం కుకర్ లో పడేస్తే యేదయినా పచ్చడి తో తినొచ్చు – అన్నమయే లోపల పత్రిక వ్యాసాలు చర్చించుకోవచ్చు – చారీ ఇంత అన్నం కుకర్ లో పెట్టు – స్వామీ పత్రిక మీటింగ్ మినట్స్ బుక్ తీయి’  అంటూ చారిని నన్నూ పురమాయించింది తను.

2

ఆ రోజు అట్లా ప్రకృతికి వ్యతిరేకంగా యుద్ధం చేసి పి డి యెస్ యూ విజృంభణ పత్రిక సకాలంలో రావడానికి అవసరమైన నాయకత్వాన్నిచ్చిన ఆ అక్కే రంగవల్లి.

కల్సినప్పుడల్లా గొప్ప  ఉత్తేజాన్నిచ్చేది. మమ్మల్ని  చాల మంది ‘నాయకులు’ కల్సే వారు. యెన్నెన్నో చర్చించే వారు, తాత్విక, రాజకీయ, సామాజిక సాంస్క్టృతిక అంశాల మీద తమ విశ్లేషణ చేసి , అనేక సూచనలు చేసే వారు. సంస్థ యెట్లా నడవాలో, దాన్ని ఇంకా మేము యెంత సమర్థవంతంగా నడపవచ్చునో, యింకా మేము యెంత కృషి చేయవచ్చునో – తదితర అంశాల గురించి అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే వారు. కానీ సంస్థ లో పనిచేసే కాడర్ కూడా మామూలు మనుషులేనని, వారికి అనేక సాధక బాధకాలుంటాయని పూర్తికాలం పనిచేసే వాళ్లు తమ జీవితాలని మొత్తంగా యేమీ ఆశించకుండా గొప్ప త్యాగనిరతితో సంస్థ కోసం పనిచేస్తున్నారనీ వారిని మానవీయ దృక్పథం తో చూడాలని ఆలోచించే అతి తక్కువ నాయకుల్లో రంగవల్లి ఒకరు.

అట్లే, సంస్థ కోసం part-time పని చేస్తూ తమ చేతనైనంత సహాయ సహకారాలని అందించే సానుభూతి పరుల సాధక బాధకాలని యెంతో ఆత్మీయంగా అడిగి పట్టించుకుని  వీలైనంత సహాయం చేసేది రంగవల్లి. ముందు తనెవరింటికి వెళ్ళీనా యే పని మీద వెళ్ళీనా ముందు అందరి గురించీ, ఇంట్లో పరిస్థితుల గురించీ ముందు అడిగి తెలుసుకుని, బాగోగులు పట్టించుకునేది. యింట్లో వారికి యేమేమి కావాలో అడిగి తెల్సుకుని వీలైనంత సహాయం చేసి కానీ తర్వాత పార్టీ పనుల గురించి సంస్థ పనుల గురించీ మాట్లాడేది కాదు.

తన దగ్గర యేమున్నా అది వెనుకా ముందూ చూడకుండా,   ఆలోచించకుండా అడగ్గానే ఇచ్చేసేది. యెంత డబ్బు ఉంటే అంత, బట్టలేవయినా ఉంటే తనకంటూ చూసుకోకుండా యిచ్చేసేది. ఇది తనది అంటూ యెన్నడూ చెపుకోని అపురూపమైన మానవి రంగవల్లి.  తను యెవరింటికి వెళ్ళినా ముందు వారు కడుపునిండా తిన్నారా లేదో కనుక్కుని అప్పుడు తినడానికి యేమైనా ఉందా అని అడిగేది. యేది ఉంటే అది, యేది పెడితే అది తినేది. యెప్పుడూ మాయని మల్లెపూవు లాంటి చిరునవ్వు తో, యేనాడూ అలసట యెరుగని ఉత్తేజ పూరితమైన ముఖంతో, భేషజాలు, పట్టింపులూ లేని నిష్కల్మషమైన పలకరింపుతో గొప్ప మానవీయతకు ప్రతిరూపంలా ఉండేది రంగవల్లి.

మొదటి సారి తనని చూడడం చాలా చిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను యింజనీరింగ్ రెండవ సంవత్సరంలో అప్పుడప్పుడే PDSU కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో సెక్రటేరియట్  ముందు పెద్ద దర్నాలో పాల్గొన్నాం. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముందువరసలో ఉన్న నాయకులతో ఇద్దరు ముగ్గురు పోలీసు ఇన్స్పెక్టర్లు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, బెదిరిస్తున్నారు, తోసేస్తున్నారు – విద్యార్థి నాయకుల్లో ముందువరసలో ఉన్నవాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. సన్నగా రివటలా బక్క అలచగా ఉన్న ఆ అమ్మాయి గొంతెత్తి సమాధానం చెప్తోంది, నినాదాలిస్తోంది. మొరటుగా క్రూరంగా కర్కశంగా ఉన్న మగ పోలీసు ఆఫీసర్లని యెదిరించి ధైర్యంగా మాట్లాడుతోంది.

నిండా 17 యేండ్లున్న నాకు అది గొప్ప అచ్చెరువునొందించిన సందర్భం. యిప్పటికీ దాదాపు 30 యేండ్ల తర్వాత కూడా చాలా వివరంగా గుర్తుంది. నిన్న గాక మొన్న జరిగినంత తాజా గా ఉంది జ్ఞాపకాల్లో! యింతలో పెద్ద కోలాహలం చెలరేగింది. మేము చూస్తుండగానే పోలీసులు ఆ అమ్మాయిని తోసేసి కొట్టబోయారు. ఆమె వెంటనే ఆడ పులిలా లంఘించి ఆ ఇన్స్పెక్టర్ ని లాగి ఓ చెంపకాయ కొట్టింది. అప్పటిదాకా క్రూరంగా అధికారం ప్రదర్శిస్తూ చెలరేగిన  రాజ్య , పోలీసు అహంకారాల తల మీద మేమెవవరమూ కొట్టలేని దెబ్బ కొట్టింది. ఉద్యమిస్తున్న విద్యార్థులకు పెద్ద ఊపునిచ్చింది. సంభ్రమాశ్చర్యాలతో నాకు  చాలా సేపు నోటమాట రాలేదు. అప్పటిదాకా శ్రీ శ్రీ ని దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ చదివి తీవ్రమైన ఆవేశంతో అన్యాయాల మీద వాటిని సమర్థించే అధికారం మీద దెబ్బ వేయాలని వువ్విళ్ళూరుతున్నా – నా కళ్ళ ముందే యే మాత్రం ఊహించని విధంగా ఆ అమ్మాయి అట్లా పోలీసుని కొట్టే సరికి బిత్తరపోయాను. తర్వాత మా ధర్నా మీద పెద్ద యెత్తున లాఠీ చార్జీ జరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. నేను పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడి (ఇప్పుడక్కడ వెలసి ఉన్న పెద్ద హోటల్ కట్టడానికి తీసిన గోతి) చీకటి పడేదాకా నక్కి తర్వాత కాళ్ళీడ్చుకుంటూ హాస్టల్ కి వెళ్ళిపోయాను.

కానీ ఆమె యెవరో యెక్కడుంటుందో క్ర్రూరమైన అధికారాన్ని అంత నిర్భయంగా యెదిరించే ధైర్య సాహసాలు ఆమెకెట్లా వచ్చాయో తెల్సుకోవాలని చాలా ఉత్సుకతగా ఉండేది. తర్వాత తెలిసింది ఆమె రంగవల్లి అనీ, PDSU నాయకురాలనీ, OU లో విద్యార్థిని అనీ. ఒకసారయినా ఆమెని కలవాలనీ ఆ ధైర్యాన్ని కొంచెమైనా పొందాలనీ అనుకుంటున్న సందర్భం లో PDSU లో మరింత చురుకుగా పాల్గొంటున్న సందర్భంలో ఒక సారి యెవరో దూరం నుండి చూపించారు – అదిగో ఆమే రంగవల్లి అక్క అని. క్రమేణా తాను మరిన్ని సంస్థాగత బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తుందని  తెల్సింది. నేనూ సాహిత్యం, సాంస్కృతికరంగం లో పని చేస్తూ విరసం కార్యక్రమాల్లో తలమునకలైపోయాను. మళ్ళీ యెప్పుడూ బహిరంగంగా తనని చూసే అవకాశం కలగలేదు.

సాహిత్యరంగం లో నాకున్న ఆసక్తి కారణంగా PDSU పత్రిక విజృంభణ పత్రిక బాధ్యతలు చూసుకొమ్మన్నారు. విజృంభణ పత్రిక సంపాదక వర్గంలో మాధవస్వామి (నా ప్రియ మిత్రుడూ, కవీ  – కర్నూల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఈ మధ్యే ఆకస్మికంగా కనుమూసాడు) , చారీ, మధుసూధన్ రెడ్డి, ప్రకాష్  , కిరణ్ , నేనూ ఉండే వాళ్లం. ప్రకాష్ ,  కిరణ్ నాకు జే యెన్ టీ యూ కాలేజీ రోజుల్నుంచీ అత్యంత ప్రియ మిత్రులూ ఉద్యమంలోనూ జీవితం లోనూ చాలా సన్నిహితులూ. మాకు పైనుంచి మార్గదర్శకత్వం వహించడానికి యెవరో ఒకరు వచ్చే వారు. అట్లా మా కమిటీ కి నాయకురాలుగా , ఒక అక్క రాబోతుందని చెప్పారు. యెవరో తెలియదు. ఒకానొక సమావేశానికి తాను రానే వచ్చింది. గుడ్డి వెలుతురు చీకట్లో ఆమెను ముందు పోల్చుకోలేదు. నిజమైన పేరు తెలియదు కాబట్టి ఆమె యెవరో ఊహిస్తూ ఉన్న సందర్భంలో చారి అనుకుంటా చెప్పాడు – ఆమెనే రంగవల్లి అక్క అని.

నోట్లో మాట పెగల్లేదు చాలా సేపు. యెంత సౌమ్యంగా మాట్లాడింది? యెంత అణకువా, యెంతా intellectual humility? యెంత ప్రేమా యెంత అనునయమూ – ఈమె నేనా ఆరోజు సెక్రటేరియట్ ముందు పోలీసు ఇన్స్పెక్టర్ ని చాచి లెంపకాయ కొట్టింది అని పదే పదే అనుకున్నా. తర్వాత తర్వాత రోజుల్లో చాల సన్నిహితంగా కల్సిపోయింది మాతో! తానో నాయకురాలు అని యెప్పుడూ అనుకునేది కాదు. కానీ తన మాటలతో, జ్ఞానంతో, పరిశీలనా విశ్లేషణలతో మమ్మల్ని ఆశ్చర్యపరిచేది. మా నుండి గొప్ప గౌరవాన్ని పొందేది. తనకు తెలిసిన విషయాలపట్ల యెంత command తో మాట్లాడేదో తనకు తెలవని విషయాల పట్ల చిన్న పిల్లల అమాయకత్వంతో ఉత్సుకత ప్రదర్శించేది. యెప్పుడూ తనకు తెలిసింది చెప్పుకుని ప్రదర్శించాలనే దుగ్ధ కన్నా తెలియంది నేర్చుకోవాలనే తపనే యెక్కువ తనకు. అట్లా మా విజృంభణ కమిటీ సమావేశాలకు (మాధవ స్వామి కర్నూల్ కి, మధుసూధన రెడ్డి భోనగిరి దగ్గర తన స్కూల్ కి, కిరణ్ వేరే బాధ్యతలకూ  వెళ్ళిపోయాక మిగిలిన మా యిద్దరితో కలవడానికి) క్రమం తప్పకుండా గొప్ప పట్టుదలతో క్రమశిక్షణతో హాజరయేది. అట్లా తర్వాత కాలంలో మాకు అత్యంత సన్నిహితమైంది.

 

Rangavalli2

1989 తర్వాత నా పెళ్ళయాక విద్యతో పద్మనాభ నగర్ లో మొదటి యిల్లు కిరాయకు తీసుకున్నాం. ఆ యింటికి ఒక మహిళా సమావేశం కోసం యితర మహిళా నాయకురాళ్లతో కలవడానికి వచ్చింది. అదే చెక్కు చెదరని చిరునవ్వు, నిష్కల్మషత్వం, నిర్మలత, సౌమ్యత – ప్రేమగా పలకరించే ఆత్మీయత – విద్య కు వెంటనే నచ్చేసింది. తను యెప్పుడు వచ్చినా విద్య తో ప్రత్యేకంగా యెంతో సేపు యెన్నో విషయాలు మాట్లాడేది. యిద్దరూ మంచి స్నేహితులైపోయారు అతి త్వరలోనే! క్రమ క్రమంగా తాను విభిన్న సంస్థాగత బాధ్యతలవల్లా పనుల వత్తిడి వల్లా రావడం తగ్గింది. మేమూ నానా యిండ్లూ నానా కారణాల వల్ల మారి చివరకు దోమల్ గూడ గగన్ మహల్ వెనుక ఒక బస్తీ లో యిల్లు తీసుకున్నాం. అప్పుడు యింక మా యిల్లు ఒక పార్టి కార్యాలయంలా ఉండేది. పార్టి తో పాటు అనేక సంస్థల కార్యాలయం కూడా! అనేక మంది వస్తూ పోతూ ఉండే వారు. అజ్ఞాతంలో ఉన్న నాయకులు కూడా వచ్చే వాళ్ళు. వాళ్లలో తానూ ఒకరు.

యెంత మంది వచ్చి పోయినా తాను వచ్చిందంటే నాకూ విద్యకూ యెంతో సంబరం. ఒక ఆత్మీయురాలు, ఒక ఆత్మబంధువు, సన్నిహితురాలు యింటికొచ్చినట్టు – మననుండి యేమీ (యేమంటే యేమీ) ఆశించకుండా యెప్పుడూ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి వెళ్ళాలనే తపనతో ఉండేది. మాట్లాడినంత సేపూ ‘మీరెట్లా ఉన్నారు, యేమి ఇబ్బందులున్నాయి మీకు, యేమయినా కావాలా బట్టలు కానీ, వస్తువులు కానీ’  అంటూ ‘యింట్లో అది లేదా ఇది లేదా’  అని అడిగి తీసుకునే అనేక మంది నాయకులకు పూర్తి విరుద్ధంగా భిన్నంగా గొప్ప మానవీయత ప్రదర్శించేది.

బహుశా తను వచ్చినప్పుడల్లా ఒకే ఒక favor అడిగేది – ‘స్వామీ వీధి చివరదాకా వెళ్ళి యెవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో లేక follow అయ్యారో చూసి రావా’ అంటూ పురమాయించేది.  అట్లా చేయడంలో  తనకేమైనా అవుతుందో అనే ఆత్రుత  కన్నా తాను వచ్చినందుకు మాకూ, ఫలితంగా విప్లవోద్యమానికీ యేమైనా నష్టం జరుగుతుందో అనే భయమే యెక్కువ కనబడేది నాకు. అజ్ఞాత జీవితంలో ఉన్న వారికి అది తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అందుకే ఆమె అంటే విద్యా నేనూ అంత యిష్టపడేవాళ్లం. కించిత్తు అహంకారం కానీ, భేషజం కానీ లేకుండా, నిష్కల్మషంగా  ఒక నిర్మలమైన ప్రవాహం లాంటి రంగవల్లిని ప్రేమించకుండా ఉండడం అసాధ్యం!

వాసవీ కాలేజీ లో పనిచేస్తున్న రోజుల్లో ఒక రోజు,  ఒక రెండవ సంవత్సరం చదువుతున్న అజిత అనే ఒక అమ్మాయి నా ఆఫీసుకి వచ్చి మీకు రంగవల్లి ఆంటీ తెలుసట కదా అని అడిగింది. అవునూ యెందుకు అని అడిగాన్నేను. ఆంటీ నాకు బంధువు. నాకు పిన్నమ్మ అవుతుంది అని చెప్పింది. ఆ అమ్మాయి సామాజిక నేపథ్యం తెలిసిన నేను నివ్వెరపోయాను. నోట మాట రాలేదు నాకు. యేమిటీ రంగవల్లి నీకు పిన్నమ్మనా? నిజమా? అంటూ అజిత ను పదేపదే అడిగాను. తర్వాత తెలిసింది రంగవల్లి నాన్న, కుటుంబమూ, బంధువులూ బాగా ఉన్నత వర్గానికి చెందినవాళ్లనీ, తెలుగు నేలని శాసిస్తున్న రాజకీయార్థిక, ధనిక సామాజికవర్గానికి చెందిన వాళ్ళనీ తెలిసాక మరింత ఆశ్చర్య పోయాను.

అటువంటి నేపథ్యం నుండి వచ్చిన వారు విప్లవోద్యమంలోకి వచ్చినాక  కూడా యెట్లా ప్రవర్తించారో, యెంత అహంకారాన్ని, దర్పాన్ని, అధికారాన్ని, భేషజాన్ని ప్రదర్శించారో, ప్రదర్శిస్తున్నారో యెన్నో సార్లు నాకు అనుభవం – అట్లాంటి ప్రవర్తనని బహుశా కలలో కూడా యేనాడూ ప్రదర్శించని రంగవల్లిది ఒక అరుదైన వ్యక్తిత్వం. నిరంతరం విప్లవోద్యమం గురించీ పీడిత ప్రజల విముక్తి గురించీ, అన్యాయాలని వ్యవస్థీకృతం చేసిన అధికారం మెడలు వంచడం గురించి మాత్రమే తీక్షణంగా ఆలోచిస్తూ, విప్లవోద్యమంలో , పార్టీలో, సంస్థల్లో పనిచేసే వాళ్లని మానవీయ కోణంతో ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న గొప్ప నాయకురాలు! పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టికి యేమి పని చేస్తారో, యెట్లా ఉపయోగపడతారో, యేమిస్తారో అని కాకుండా వారిని విప్లవోద్యమంలో సజీవమైన భాగం చేయడానికి పార్టీ నాయకురాలిగా, ఒక మనిషిగా ముందు వారికోసం తానేమి చేయగలనో , వారికి యేమి ఇవ్వగలనో అని నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి రంగవల్లి,  చిరస్మరణీయురాలు!

1997 లో ప్లీనం  సమావేశాల తర్వాత, ఒక్క సారి కలిసింది! ‘యేమిటి స్వామీ అమెరికా వెళ్తున్నావట – శాశ్వతంగా అటేనా మళ్ళా వస్తావా? యెప్పుడొస్తావు మళ్ళీ’ అంటూ కళ్ళల్లో కదిలీ కదలని సన్నని నీటి పొరతో అడిగింది – నాకూ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి – నా ఆత్మీయుడు మారోజు వీరన్నా అదే ప్రశ్న అడిగాడు.

ఆయనకీ, రంగవల్లికీ  యే సమాధానమూ చెప్పే ధైర్యం లేదప్పుడు. తర్వాత 1999 లో యిద్దరూ వెళ్ళిపోయారు. క్రూరమైన రాజ్యం అధికారం కోరలకు  బలైపోయారు.. యిప్పుడు సమాధానం నేను చెప్పాలనుకున్నా, నేను మళ్ళీ తిరిగి వచ్చినా,  యెన్నడూ కలవలేని, తిరిగి రాని లోకాలకు తరలిపోయారిద్దరూ. కానీ వారిద్దరి చిర్నవ్వూ, ఆత్మీయతా, నిష్కల్మషత్వమూ, అన్నింటికన్న మించి అద్భుతమైన మానవత్వమూ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కలల్లోనూ వాస్తవంలోనూ….

 నారాయణస్వామి

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి