కోరిన కొండ మింద వాన

 

 

Namini_Subramanyam_Naiduతిరప్తికి వుత్తరాన తిరమల కొండ. కపిల తీర్తం చుట్టుపక్కల యిండ్లొచ్చేసి యిరైయ్యేండ్లయిపాయ. యింక ఆ తట్టు పెరిగే పన్లా. తిరప్తికి తూరూగా వుండే కరకంబాడి గానీ, రేణిగుంట గానీ తిరప్తిలో కలిసిపాయ. తిరప్తికి పరంటగా యూనోర్సిటీలను దాటుకోని పుదిపట్లేమి, చెర్లోపల్లేమి, ముక్కోటేమి, చెంద్రగిరి దాకా లేఔట్లు పడిపాయ. యింక పెరగబొయ్యేదంతా తిరప్తికి దచ్చినంగా వుండే ఆర్‌సీ రోడ్డే. యిప్పుటికే మజ్జిక్కాలవ దాటి బైపాసు దాకా అపార్టుమెంట్లే వొచ్చేసినాయి. యింత దేనికి? కూచంద్రపేటకీ రామాపరానికీ నడి మద్దెన గుట్ట కింద పది పదైదెకరాల్లో విల్లాలు కట్టేదానికి రోడ్లేస్తా వుండారు, తుడా అప్రూవల్‌ తీస్కోని. తిరప్తిని కార్పొరేషను గూడా చేసేసినారు. మిట్టూరు, గంగిరెడ్డిపల్లి, నడవలూరు, నెన్నూరు గూడా తుడా కిందికి తెచ్చేసి కార్పొరేషన్‌లో కలిపీబోతారు.

యివన్నీ తెలవని ఆడమనిసేం గాదు జమునా. అందుకే అదరకుండా, పదరకుండా నిమ్మళంగా వుండాది. చిక్కి బిక్కిరించే కంటే యెనకాలనుండి యెక్కిరించేదే మేలు. అప్పుడే పన్లు జరుపుకోవచ్చు. నెత్తిన పెట్టుకోని మోస్తా వుండినట్టు కనిపించినామో దెబ్బ పడిపోతాది. యిప్పుడు చూడండేమి! బైరాగి పట్టెడలో యిల్లు కట్టాలనుకో. ముందు జాగా తియ్యాలి గదా. అంకణం రెండు లచ్చిలు బెట్టి అరవై అంకణాలు కొనాలంటే – బైరాగి పట్టెడలో వొక బిట్టొచ్చి అరవై అంకణాలు – కోటీ ఇరై లచ్చిలు బెట్టా. అంత డబ్బు పోసి జాగా కొన్నాక చుట్టూరా పదంకణాలైనా వొదిలి వొక టెంకాయ చెట్టు నాటుకునే దానికుండాదా! మొత్తం కట్టెయ్యాల. వొక డూప్లెక్సు యిల్లే కట్టాలంటే యీనంలో యీనం అదొక కోటి! పాలు పొంగించి యిండ్లల్లో చేరే నాటికి రెండు కోట్లా యిరై లచ్చిలు ! యిదే రెండు కోట్లా యిరై లచ్చిలు మిట్టూరు దాకా వొచ్చి నడవలూరు రోడ్డుకు అంకణానికి నలపై వేలు ఆడ పారేసి మున్నూరంకణాలు కొనుక్కుంటే! యాబై లచ్చిల్తో బెమ్మాళంగా వొకిల్లు గట్టుకోని చుట్టూరా టెంకాయ చెట్లూ, మాడి చెట్లూ, సపోటా చెట్లూ పెట్టుకుంటే! చూసేదానికి దిష్టికుండ పెట్టాల్సిందే. వొక పది లచ్చులు మనవి గాదనుకోని యిన్నోవా కారు కొనుక్కుంటే వుండే మతింపు! యింతా జేసి అర్దరేత్రి పూట గూడా తిరప్తి నుంచి పది నిమిసాలల్లో వనం మాదిరిగా వుండే యింట్లోకొచ్చి పడిపోవచ్చు.

ఈ తెలివితోనే యిప్పుడు తిరప్తోళ్లు వూళ్ల మిందికి దిగబడి పోతుండారు. మ్మరీ, రోడ్డు పక్క జాగాకు తనకలాడి పోతుండారు. తిరప్తిలో బైరాగి పట్టెడ నుంచి అది పొగులు పూటే గానీలే, కపిల తీర్తం పోవాలంటే ఆటో పిలగోడికి నూరియ్యాల. షేరాటోలెక్కితే మూడు మారి ముప్పై యియ్యాల. అదే మిట్టూరుకు రావాలంటే అన్నమయ్య సర్కిలు కాడ నిలబడి పది రూపాయలు యిచ్చి షేరాటో ఎక్కేస్తే గీత గీసినట్టు వొచ్చీయొచ్చు. బస్సయినా, బండయినా, కారయినా, షేరాటో అయినా పది నిమిసాలే. చెట్టూ జేమా నడిమద్దిన సుకంగా బతికిపోవచ్చు గదా. తిరప్తోళ్లకు చేటడు తెలివుంటే వూళ్లల్లో వోళ్లకు గంపడుంటాది గాబట్టే రోడ్డు పక్క జానడు జాగా యిచ్చే వోళ్లు లేరు. జమునా మాత్రం నెలకు ముందర యిచ్చేదానికి సిద్దపడిపొయ్‌ మిట్టూళ్లో వొక బ్రోకరు పనిజేసే వోడుంటే వోడికి చెప్పింది. ఆ బ్రోకరు యిరైనాళ్ల ముందర వొక పార్టీని గూడా పట్టకొచ్చి, ‘‘గన్‌పార్టీ జమునమ్మా. సింగిల్‌ సిట్టింగులో సెటిల్‌ జేసేస్తా.’’ అనేసి వొక డాక్టరును తొడుకోనొచ్చినాడు.

ఆల్రడీ బ్రోకరు ఆ డాక్టరుకు జాగాను గూడా చూపించేసినాడంట. జమూనాకు నడవలూరు రోడ్లో – ఆ రోడ్లో అప్లాయిగుంట మింద పుత్తూరు దాకా బస్సులు గూడా పోతుంటాయి – ముక్కుపుల్ల మాదిరిగా మూడు గుంటల కయ్యుండాది. సెంట్ల లెక్కన యిరై సెంట్లు, అంకణాల్లెక్కన యిన్నూటా నలపై అంకణాలు. దాన్ని, లడ్డుకమ్మ మాదిరిగా వుండే ఆ జాగాని అమ్మేదానికి కూచ్చునింది జమునా. వొచ్చిన ఆ పార్టీతో, నోరు తెరిచిందే తెరిచినట్టుగా, ‘‘అంకణం నలపై వేలు సార్‌. బేరాలు జేసే పనయితే యాపై వేలు. మీకు నీస్తే కుచ్చోండి, నీసక పోతే పోతా వుండండి, అన్ని మంచి నీళ్లు తాగేసి.’’ అని నెట్టుగా మాట్లాడింది. మ్మరి, అటుమంటి వొస్తవను చేతల్లో పెట్టుకోనుండాది జమునా. బ్రోకరు గూడా ఆ వూళ్లో మనిసే గాబట్టీ, జమునా సంగతి బాగా తెలుసు గాబట్టీ, ‘‘పార్టీని పట్టకొచ్చేంత వొరకే నా పని. నేనేమీ మార్జిను బెట్టుకోలేదే! నీ దగ్గిర వొక రేటుకు మాట్లాడుకోని అగ్రిమెంటు జేస్కోని యింగొకరికి అమ్మడం లేదు గదా. మీరూ మీరూ మాట్లాడుకోండి. నాకొక టూ పర్సెంటు యిచ్చీయండి.’’ అని మాత్రమే మాట్లాడి గమ్మనుండి పొయ్‌నాడు. దీనికి జమునా, ‘‘పర్సెంట్లు గిర్సెంట్లు నా దగ్గిర జాంతానై. కొనే వాళ్ల తావన నువ్వేమి తీసుకుంటావో, ఆయనేమిస్తాడో దాంతో నాకు సమందం లా. రామచంద్రాపరం నుంచి నెన్నూరు దాకా నలపై అంకణాలిచ్చే వోళ్లుంటే వోళ్ల దగ్గిరికే తొడుకోని పో. నేను బంగారట్టా జాగాను దారబోసుకుంటా నీకు పర్సెంటేజీలియ్యలేను. అంత్య నిస్టూరం కన్నా ఆది నిస్టూరం మేలు . పైగా నువ్వు వుండూరోడివి’’ అని గూడా అనేసింది. ఈ మాటకు, ‘‘నాకొక పర్సెంటన్నా యియ్యమ్మా’’ అని గానీ అన్లేక పొయ్‌నాడు బ్రోకరు.

మొదట్లోనే ఆ వొచ్చిన డాక్టరుకు ‘యిదయ్యే పని గాదులే’ అని అనిపించి నప్పటికీ, ఆయనకుండే తెలివిని బట్టి, ‘‘ఏందమ్మా నువ్వు చెప్పేది? ఈ వూళ్లో పొయ్‌ అంకణం నలపై వేలా! యిప్పుడు రా, తిరప్తికి. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీలో తుడా ఫైనల్‌ అప్రూవల్‌ అయ్యిందీ, లేఔట్లో నాలుగైదిండ్లూ రెండు అపార్టుమెంట్లూ గూడా పడిన చోటున్నే నీకు అంకణం నలపై వేలకిప్పిస్తా. విచిత్రంగా వుండాదే నువ్వు చెప్పేది. అంకణం నలపై వేలంటే ఎకరా నాలుగు కోట్లా అప్పుటికి?’’ అనేసి ముక్కున వేలేసుకున్నాడు. దీనిగ్గూడా, ‘‘డాక్టర్‌ సార్‌. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకి మీరు అన్నమయ్య సర్కిల్‌ నుంచి పోవాలంటే ఎన్నిసార్లు స్టీరింగు తిప్పాల్నో ఆలోచించు. అది గూడా తొమ్మిది కిలోమీటర్లకు తక్కవేం వుండదు. మొన్న వొడమాలపేటకు పోతా పోతా ఆ లేఔట్‌ గూడా చూసినా. వొట్టి చవుడు నేల. నా నేల అట్టాంటిది గాదు. ఇంగొక పాయింటేమంటే స్కేలు మింద చీమ వొచ్చినట్టు వొచ్చీయొచ్చు నా ప్లాటు కాడికి. నువ్వు రామచంద్రాపరం దాకా నేరుగా వొచ్చి లెఫ్ట్‌కు వొక్క టర్నిచ్చుకుంటే బస్సు రూట్‌ మింద నా ప్లాటు చేరుకుంటావు. ఇది మెయిన్‌ రోడ్డు. ఎస్‌జిఎస్‌ గ్రీన్‌ సిటీకీ నా దానికీ నక్కకీ నాగలోకానికీ వున్నంత వారా వుండాది. అన్ని మాటలేల? లేచి పోవచ్చు.’’ అని మాటకు మాటేసింది. దీనికి రెండూ రెండు చేతల్తో మూస్కోలేక డాక్టరుకు గూడా చిన్నంగా రోషం మొదలై, ‘‘నీతో కొంచేపు మాట్లాడితే నువ్వు నీ జాగాను స్కొయర్‌ ఫీట్‌ యింత అని చెప్పేటట్టుండావు. రియల్‌ ఎస్టేటోళ్లు యాడబోవాల తల్లీ! వూరికే బేరం చేసి పోదామని రాలేదు. నిజంగానే కొనుక్కోవాలనీ, చక్కగా వొక యిల్లేసుకోవాలనీ, ప్రశాంతత కోసరం యింత దూరం వొచ్చినాను. నువ్వు తెగే రేటు చెప్పు. తెంచేద్దాం.’’ అనేసి ఆ రోషాన్ని కాసింత పక్కన పెట్టేసి అణిగినాడు. నిజానికి ముప్పైయ్యేలకు తెంచేద్దామని పై మాటగా నలబై అనింది జమునా.

Kadha-Saranga-2-300x268

నలబై అయితే కోటికి నాలుగు లచ్చిలు తక్కవవతాది. యీన పక్షం ముప్పెయ్యేసుకుంటే డెబ్బయి రెండు లచ్చిలొస్తాది. కానీ, ‘‘నలపైకి పైసా తగ్గను. బొటువుగా రూపాయి యిచ్చియ్‌. రూపాయంటే కోటి.’’ అనే బిగుసుకునింది. డాక్టరు పకపకా నవ్వి, ‘‘బేరానికి కుచ్చుంటే నాలుగు లచ్చిలు ఎక్కువ జేసినావన్నమాట. అసలు రోడ్డు ఎక్స్ టెండవతాదని గూడా అంటుండారు. నూరడుగుల రోడ్డు చెయ్యాలని ప్లానులో వుండాది. రోడ్డుకు పొయ్యే జాగాను పట్టుకోని నువ్వు అంకణం నలబై చెప్తుంటే ఎట్ల తల్లీ! మంచీ చెడ్డా చూసి చెప్పు’’ అనేసి అన్నాడు. ఈ మాటను పట్టుకోని జమూనా యింకా బలం తెచ్చుకోని, ‘‘యిప్పుడొచ్చినారు మీ అంతట మీరై దోవలోకి. నేనూ మీ దోవలోకే వొస్తానుండండి. యిప్పుటికే అది అరై అడుగుల రోడ్డు. నా ప్లాటు వుండేది ఉత్తర మొకం. వాస్తుకెంత మంచిది. కొలత చూసినావా! డెబ్బయి రెండుకి నూటిరవై. లెక్కాచారంగా ఇన్నూటా నలపై అంకణాలు. ఆ పక్కా యీ పక్కా రోడ్డుకెంత పోబోతాది! మహా అయితే యిరై అడుగులు పోతాది నాది. అదీ నూరడుగుల రోడ్డయితే! ఆడ అవబొయ్యేది ఎయిటీ ఫీటే. ప్లానులో వుండేది గూడా ఎయిటీ ఫీటే. రోడ్డుకు పదడుగులు పొయ్‌నా నీకు రోడ్డు పెద్దదయ్యింది గదా. రోడ్డు ఎంత పెద్దదైదే అంత రేటు. నూరడుగుల రోడ్డయితే నాది అంకణం లచ్చయాపై యేలు. ఇప్పుడు కరకంబాడి రోడ్డుకు మెయిన్‌ రోడ్డు రేటు రెండు లచ్చిలు. ఆ రేటే యీడా వొస్తాది. దేనికంటే రేడీస్టేషను నుంచి యాడ కరకంబాడి, యాడ మిట్టూరు! ఆడనే అంత రేటు పలకతా వుంటే`’’ అని వొక్క గుక్కలో మాట్లాడేసి, ఫైనల్‌గా, ‘‘మీరు లేచి పదండి చెప్తా, నా జాగా నాదిగా వుండనీండి, మీ డబ్బు మీదిగా వుండనీండి. పొగులు మాటలు పనికి చేటు, రేత్రి మాటలు నిద్రకు చేటు. డాక్టరుకు చెప్పాల్నా?’’ అని నవ్వేసింది. ‘‘మీరు మొగోడిగా పుట్టుంటే రాజ్యమేలే సుందురమ్మా!’’ అని నెంబరిచ్చీ, నెంబరు తీస్కోనీ ఆ పొద్దు పొయ్‌నోడు, యీ పొద్దు పది నిమిసాల ముందర ఏమిటికి కాల్‌ చేసినట్టు! యిప్పుడు గూడా ఆ మాట మిందనే వుండాది జమునా. ‘‘వొక రూపాయి తెచ్చిచ్చి ఫెన్సింగు రాళ్లు నాటుకో,రిజిస్టరు చేస్కోని. అదీ అగ్రిమెంటు గిగ్రిమెంటు ఏం లా. స్పాట్‌ పేమెంటు’’ అని రెండో మాట మాట్లాడకుండా ఫోను పెట్టేసింది.

యింత కటీనంగా వుండబట్టే ఆ జాగాను యిన్నేండ్లుగా కంటికి రెప్ప మాదిర్తో కాపాడుకుంటా వొస్తుండాది జమునా. యింట్లో ముఠాలెదవలు యిద్దురుంటే యిద్దురికీ చెప్పింది, యీ మాదిర్తో డాక్టరు ఫోను చేసినాడూ అనేసి. దీనికి ఆ మొగుడైనోడూ, కొడుకైనోడూ ఏమని అన్నారో తెలుసునా: ‘‘ముప్పై వేలకు అమ్మి పారెయ్యక నువ్వు నలబైలోనే వుంటే ఎట్ట? పార్టీ నిలబడొద్దా?’’అనేసి అన్నారు. అసలికి, మొగోళ్లంతా యింతే. ఏ మొగోడికైనా అమ్మెయ్యాలంటే ఎంత కుశాలగా వుంటాదో! రైతు యీ మాత్రమన్నా అర్దమో నిర్దమో కయ్యాగామ చేతిలో పెట్టుకోనుండారంటే ఆడోళ్లే కారిణం. అమ్మి పారేసి జరగాల్సిన పనులు చూడాలంట. పదైదేండ్లకు ముందర వూళ్లో ఒక బిడ్డి పెండ్లి చెయ్యాలనేసి వొకాయన ఎకరా లచ్చా యాపైయ్యేలకు తిరప్తిలో కండక్టరు పన్జేసే వోడికి అమ్మేసినాడు, మెయిను రోడ్డుకి. యిప్పుడు ఎకరా ఎంతనేసి! ఆ కుటుంబరానికీ పొద్దు పిచ్చిపట్టి పొయ్యుండాది. నాలుగెకరాలు వుడ్డగా వొక చోట దొరకడమే లేదు, తిరప్తోళ్లు లేఔట్‌ యెయ్యాలంటే! లేఔట్‌ యేసేదానికి బయపడి చస్తుండారు, పార్కుకు జాగా వొదిలి, నలపై అడుగుల రోడ్లేసి తుడా అప్రూవల్‌ చెయ్యాలంటే – పెద్ద పెద్ద యాపారస్తుళ్లు గూడా. ఎకరా రెండు కోట్లు బెట్టి నాలుగెకరాలు కొని, తుడాలో లంచాలిచ్చి, రోడ్లకు పోను, పార్కుకు పోను ఎకరాకు ఏడొందంకణాలు మిగల్తాది. పెట్టుబడి పెట్టాల. దానికి నాలుగున్నర రూపాయ లొడ్డీలు గిట్టుబాటు కావాల. అంకణం యాపై వేలు పెట్టినా గిట్టుబాటు కాక మూస్కోనుండారు. యీ జాగా అట్లగాదే! యీ రోజుకీరోజున యిల్లు కట్టుకోవచ్చు. పైగా ఉత్తర మొకం. దచ్చినం పక్కగా వొక అరై అంకణాల్లో బెమ్మాళంగా మహడీ కట్టుకోని ముందంతా కాళీ జాగా వొదిలేస్తే వాస్తు అదిరి పోతింది. ఎవురబ్బా యీ తోటలో యిల్లు కట్టుకోనుండేది అనేసి కార్లల్లో పొయ్యేవోళ్లు గూడా దిగి చూస్తారు. దచ్చినాన యిల్లు. ఉత్తరాన కాళీ జాగాలో తోట. వాస్తుకెంత మంచిది! పదేండ్ల కింద అయిదు లచ్చిలు కట్నమిచ్చి వొక టీచరు సమందాన్ని తెచ్చి కూతురికి పెండ్లి జేసిందే గాని అప్పుడు గూడా కయ్య అమ్మలా. యిప్పుడు గూడా పది లచ్చిలు అప్పుండినా బయపడడం లా జమునా. అప్పుకు బయపడి ఆ పొద్దు యీ జాగా అమ్మేసుంటే-? యీ పొద్దు నోట్లో యేలేస్కోని గమ్మనుండుండాల. యిది గాక యింగొక ఎకరా వుండాది జమునా వాళ్లకు. అది బాగా లోపలికి. ఎప్పుడో రోడ్డు పక్కంతా లేఔట్లొచ్చినాక దానికీ గిరాకీ వొస్తాది. ఆ ఎకరా చాలు, మొగ పిల్లోడికి. యిప్పుడీ జాగా అమ్మతా వుండేది గూడా దేనికంటే – యీ మొగ పిల్లోడి కోసరమనే! ఏం చేసేది! చదువు తక్కవ కొడుకుని కని పడరాని పాట్లు పడతుండాది జమునా. చెప్పుకుంటే బైసాట్లు. ఇంక సమ్మచ్చరం పెడితే ముప్పైలో పడిపోతాడు కొడుకు. నాలుగేండ్లుగా పెండ్లి చెయ్యాలని పోరకలాడతా వుండాది. పిల్లనిచ్చేవోళ్లు లేరు. యాడ బట్టినా ఆడ పిలకాయలు చదువుకునేసుండారు. వీడేమో పది ఫయిలు. మళ్లా మళ్లా కట్టి రాసినాడు. పాసు గాలా. యింగ వొదిలేసింది. వుజ్జోగాలు జేసే మొగ పిలకాయకే ఆడ పిలకాయలు దొరక్క అల్లాడతా వుండారు. పది ఫయిలైన ఆడబిడ్డిని తెచ్చుకుందామన్నా వోళ్లు గూడా యియ్యాటం లా. ‘‘మీ కొడుక్కి వుజ్జోగం వుండాదా?’’ అనడగతా వుండారు. యింక ఎవుర్ని అడిగినా ఆ ఆడ పిలకాయలు డిగ్రీ దాకా చదివేసే వుండారు. పీలేరు టవునయి పాయ. ఆ చుట్టు పక్కల ఆడ పిలకాయలు యీ కాన్వెంట్ల మింద పడి చదివేసే వుండారు. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, పెనుమూరు అన్ని వూళ్లూ టవున్లయి పొయ్యేసరికి ఆ చుట్టుపక్క వూళ్లల్లో ఆడ పిలకాయలు టవున్లకొచ్చేసి చదివేసుండారు. పైగా, ఎంత పది ఫయిలైన ఆడబిడ్డి అయినా గూడా ఎకరా కయ్య వుండనే వుంటాది. మొన్నటికి మొన్న మనుసు చంపుకోని పెనుమూరు దగ్గిర వొక సమందం వుంటే పొయ్యేసొచ్చింది. ఆ బిడ్డి కంట్లో గూడా పడలా. వీడి మాదిరగానే పది గూడా ఫయిలయ్యింది. ఆ బిడ్డి పేరుతో ఎకరా వుండాదంట. అదీ నీలుగు. పెనుమూరును వాళ్లు జెప్పేది ‘సెకండ్‌ బాంబే’ అంట. ఆడ గూడా రేట్లే. ‘మా బిడ్డికి యాపై లచ్చిలు సొత్తిస్తుండాం గదా. వుజ్జోగస్తుడికైతేనే యిస్తాం.’ అని తేల్చేసే సరికి చెవులు జాడించుకుంటా వొచ్చేసింది. సొంత అందమ్ముడి కూతుర్ని అడిగితే, ‘‘నీకిది న్యాయమే గాదు. నా కూతురు ఎంబిఏ చదివి పూనేలో నెలకు ముప్పై వేల జీతం తీస్తా వుంటే అడిగే దానికి నీకు నోరెట్టా వొచ్చింది!’’ అనేసి చెల్లెలి మొకాన మసి పూసినాడు ఆ అందమ్ముడు. ఆ రోజే గడప దిగేసి, ‘‘చదువు తక్కవ కొడుకును కన్నానని ఎగతాళి జేస్తుండావు. చదువు లేకపోతే మాత్రం నీ కూతుర్నడిగే దానికి నాకు సొంతం లేదా? తనా మనా అని ఎంచినావా నువ్వు? ఎంసిఏ చదివిన బిడ్డిని నా కొడుక్కి సమ్మచ్చరం తిరిగేకంతా తెచ్చి తగలగట్టక పోతే అప్పుడడుగు. ప్రభాస్‌ మాదిరిగా వుంటాడు నా కొడుకు! వోడికేం తక్కవ!’’ అని సవాలేసేసి వొచ్చింది.

కౌసల్య అని తిరప్తిలో వొకామెకు పెండ్లి సమందాలు చూసే పనే. ఆమెకు గూడా కొడుక్కత చెప్తే ఆమె నవ్వింది చూడండీ. జమునాకైతే తలగిల్లి మొలేసినట్లయ్యింది. ‘వుజ్జోగం లేని మొగ పిలకాయల ప్రొఫైళ్లే నేను తీసుకోనకా!’ అని వొక్క మాటలో తేల్చేసింది. అందుకే పంతానికి పొయ్‌ వొక ప్లానేస్కోని, ఆ ప్లాను ప్రకారం పొయ్‌ కొడుకుని ఒక దోవలోకి తెచ్చి మళ్ల మాట్లాడదామని వుండాది ఆ కౌసల్యతో. ప్లాను ప్రకారం పోవాలనే అగో, యిప్పుడీ జాగాను అమ్మాలని చూస్తుండాది జమునా. డాక్టరు ఫోను నంబరు యిచ్చేసి పోయినా, జమునా అయితే చెయ్యనే లా. అయినా, యీ పొద్దే చేసినాడు గదా. డాక్టరుకు తుత్తర పట్టకపోతే అప్పుడడగండి. దేనికంటే అంత వందనంగా డాక్టరింగొక ప్లాటును చూళ్లేడు. యీ వూళ్లో బ్రోకరూ చూపించ లేడు. డాక్టరు ఏమిగా అనుకుంటా వుండాడో వొక మాటగా అడిగి చూద్దామని బ్రోకరుతో మాట వరసకు గూడా ఫోనుజేసి మాట్లాళ్లేదు. జమునాకు కనిపించేటట్టుగా రోజుకు పది తూర్లు ఆ బ్రోకరు తిరుగులాడతా వుండినా బెట్టుకు పోయి పలకరించను గూడా లేదు. ‘ఈ పొద్దు యీ మాదిరిగా డాక్టరు ఫోను చేసినాడు’ అని వొక మాటగా అడగదామా వొద్దా అని సెల్లు చేతిలో బెట్టుకోని కొంచేపు కొట్టుకులాడింది. ఎగీదిలోనే బ్రోకరు యిల్లు. అయినా యింటికి పోకుండా మిస్సుడు కాలిచ్చి చూసింది. నిమిసంలో తిరిగి చేసినాడు బ్రోకరు ఫోను. వాడి ఆత్రం చూసినారా! జమునా ఎట్టాంటిది? ‘ఏమబ్బా ఫోను చేస్తివి?’ అనడిగింది. ‘నీ మిస్సుడు కాల్‌ చూసి చేసినాన’నేసి బ్రోకరన్నాడు. ‘నీ నంబరు ఫీడ్డయ్యుండాది గదా. నేను వొంట జేస్తా సెల్లును అట్టా యిట్టా పెడతా, పడతా వుంటే నీ నంబరు నొక్కుకునుంటాది. నేనెప్పుడూ ఎవురికే గాని మిస్సుడు కాలియ్యను. మాట్లాడితే బిల్లు పడిపోతాదనే యీనపు బుద్ది నాకు లేదబ్బా!’ అనేసి టకిక్కున ఫోను పెట్టేసి నవ్వుకొనింది జమునా. మూడో నిమిసంలో యింటికొచ్చేసినాడు బ్రోకరు. ఇంగా నవ్వుకొనింది. ‘‘జమునమ్మా. అంకణం నలబై చెప్పిందానివి యింగొక నాలుగు లచ్చిలెగేసి కోటి జేసేసి – అక్కణ్ణే కుచ్చుంటే నువ్వు అనుకున్న పన్లు జరగవు. నువ్వు ఓకే జేస్తే ముప్పైకి సింగిల్‌ సెటిల్మెంటులో అవగొట్టేస్తా. స్పాట్టే. నానుడెవ్వారం లేదు. డాక్టరు దగ్గిర్నే టూ పర్సంటు తీస్కుంటా. నువ్వేమీ గూడా యివ్వొద్దులే చెప్పు జమునమ్మా!’’ అని డైరెక్టరుగా పాయింటులో కొచ్చేసినాడు. అడుక్కునే కొందికి ముడుక్కో గూడదని చెప్పి, ‘‘నాది మాటంటే మాటే మునసామీ! అంకణం ముప్పై అయిదు వేలు, స్పాటూ అయితేనే డాక్టర్‌కి ఫోన్‌ చెయ్‌. లేదంటే నా గడప దిగి పూడువు’’ అనేసింది జమునా. బ్రోకరు మునస్వామి మళ్ల వొక్కడుగు తాంచారం చెయ్యకుండా డాక్టరుకు ఫోను చేసేసినాడు. కాలుగెంటలో జమునా యింట్లో డాక్టరు తేలినాడు. ‘యిద్దురూ ముందే మాట్లాడుకున్నారా ఎట్ట? రామచంద్రాపురం కాడ డాక్టర్ను పెట్టేసి వొచ్చినాడా బ్రోకరు’ అని గూడా యోచన జేసి, ‘‘ఏం డాక్టర్‌ సార్‌. మీకు డాక్టరు పనికంటే యీ యాపారమే ఎక్కువగా వుండాదే!’’ అనింది. లోపల్లోపల – యింత తొందర పడి రాకుండా వుండాల్సిందే – అని అనుకున్నాడో ఏం నాశినమో గానీ, నవ్వతా గమ్మనుండి పొయ్‌నాడు డాక్టరు, ‘నాకు పల్లెటూళ్లంటే యిష్టిం’ అనేసి. ‘ఈ రోజు తెగితే తెగినట్టు. లేకుంటే నేను టవున్లోనే చూసుకుంటా’ అని గూడా అన్నాడు. జమునా గూడా లెక్కగా, ‘‘డాక్టర్‌ సార్‌, నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా. మునస్వామీ, నువ్వు అడ్డం రాబాక. డాక్టర్‌ సార్‌, మీరు మాట్లాడాలంటే మాట్లాడండి. నేను అడ్డం రాను. యిందాకా మునస్వామితో చెప్పినట్టే మీతో గూడా చెప్తుండా. నా రేటు ముప్పై అయిదు వేలు. యిప్పుడు చెప్పండి, ఎవురు మాట్లాడాల్నో!’’ అని తుంచినట్టు మాట్లాడింది. ‘‘సొత్తు నీదమ్మా. నువ్వే మాట్లాడు.’’ అన్నాడు డాక్టరు. దీనికి చెప్పాల్సినవన్నీ చెప్పేసింది జమునా. ‘‘నేనీ పొద్దు పోగొట్టుకుంటా వుండా. మీరు సంపాదించుకుంటా వుండారు. ఎవురు గానీ చెడిపోగూడదు. మీకు అరగెంట టయిమిస్తా వుండా. యీ మిట్టూర్లోకి పొయ్‌ చూడండి – అంకణం ఇరై రెండు వేలు లేకుంటే అప్పుడొచ్చి అడగండి. మొన్న వూళ్లో డైవోరుగా పనిజేసేటాయన ఒక ఎకరా వుంటే గీతలు గీసి జాగాలేసినాడు. ముందర పదైదడుగుల రోడ్డు. ఇరై రెండు వేలకు కొనుక్కున్నారు, వూళ్లో వోళ్లు గూడా. నాది మెయిన్‌ రోడ్డు. ముప్పై అయిదు వేలే చెప్తుండా. యింక నేను నోరే తెరవను.’’ అనేసి అనింది. దీనికి బ్రోకర్‌ మునస్వామి గూడా, ‘‘సార్‌ మా జమునమ్మది మాటంటే మాటే. నసుగుడు ఎవ్వారాలు ఆమె దగ్గిర కుదరవు. మొకాన్నే మాట్లాడతాది.’’. – ఆమె వాటం చూసి డాక్టరు గూడా వొకటికి పది మాటలు మాట్లాడాలనుకోలేదు. నోరంతా తెరిచి వొకే మాటన్నాడు, ‘టోకనెంతిమ్మంటావు’ అనేసి. టోకను గీకను కుదరదనేసింది. ‘‘మీరు నెల గావాలంటే టయిం తీసుకోండి. డబ్బిక్కడ తెచ్చి పెట్టండి వొకే తూరి. నేనొచ్చి రాసిస్తా. జాగా నా పేరు మిందనే వుండాది. మీకు నమ్మకం లేకపోతే మా యింటాయనా, నా కొడుకూ, నా కూతురూ గూడా వొచ్చి సంతకాలు పెడతారు’’ అని కడ మాటగా చెప్పేసింది.

namini newడాక్టరూ, బ్రోకరు మునస్వామీ యీదిలోకి పొయ్‌ సిగరెట్లు తాగేసి, ‘‘ఏ పొద్దు అనుకొనింది ఆ పొద్దు అయిపోవాల. నీ మింద నమ్మకం లేక గాదమ్మా, నిన్ను నేను మెచ్చినా. నీ అంత నీతిమంతురాలు మాట మింద నిలబడే మనిసీ నాకు కనబళ్లేదనుకుంటుండా. నేను కర్నూలు మెడికల్‌ కాలేజీలో చదివినాను మెడిసిను. కానీ నేను వేస్టు. ఎంత వేస్టునంటే మొన్నటికి మొన్న మా నాయిన సాంవత్సరీకం జరిగినప్పుడు నేనెంత బాద పడినానో చెప్పలేను. మా నాయిన చచ్చిపోతే ఎక్కడ పూడ్చినామో తెలుసునా! అన్నపూర్ణమ్మ గుడి వుందే అక్కడుండే స్మశానంలో. మా నాయినను వేసిన గుంత మింద కుక్కలు తిరగలాడతా వుంటే ఏడుపొచ్చేసింది. నేనూ నా భార్యా యిద్దరం డాక్టర్లమే. గవర్నమెంటిచ్చిన జీతాల మీద బతికిన వాళ్లమే. మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యేటట్టుగా చదివించుకున్నాం గానీ పరుగులెత్తి సంపాయించు కోలేక పోయినాం. యిప్పుడు మా అమ్మకు ఎనబై అయిదు నడుస్తుండాయి. ఒక మంచి చెట్టూచేమా నడమ మా అమ్మ చచ్చి పోంగానే – అక్కడ పూడ్చి పెట్టి దినామూ దండం పెట్టుకోవాలనే నేను నీ జాగాను చూసినా. నాకు నచ్చింది. నువ్వు చెప్పిన మాటల్ని నేను వినకపోతే నేను చెడిపోతాననిపించింది. మా అమ్మను గూడా ఆ నీచమైన చోటే పూడ్చాల్సొస్తాది. నువ్వు దయదలిచి ఆ జాగా యిస్తే అక్కడే యిల్లు కట్టుకోని, మా అమ్మ చని పోంగానే అక్కడ్నే వొక మూల పూడ్చిపెట్టి చిన్న సమాది కట్టుకోవాలనేది నా కోరిక. యీ పొద్దే రిజిస్టే్రషను పెట్టుకుందాము. నా భార్య అమౌంట్‌ తీస్కోని బయల్దేరింది గూడా’’ అనేసి కండ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేసినాడు డాక్టరు.

ఒక మంచి మనిసికి జాగా యిచ్చిందుకు చానా సంతోసపడింది జమునా. జాగా యిచ్చినందుకు ఎనబై నాలుగు లచ్చలివ్వడమే గాక యిరవై వేలు బెట్టి వుంగరాన్ని గూడా తీసిచ్చినాడు, పాపం. అంతే, ఇంక జమునా వేసుకున్న ప్లాను ప్రకారం పోయింది. ముందు పది లచ్చల రూపాయల అప్పు తీర్చుకొనింది. మిగిలిన దాంట్లో నలపై అయిదు లచ్చిలు బెట్టి త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాటు తీసుకొని గృహ ప్రవేశం కూడా కానిచ్చేసింది. ఇరై లచ్చలు బెట్టి కేశవాయన గుంటలో సూపర్‌మార్కెట్‌ పెట్టించింది కొడుక్కి. అయిదు లచ్చలు బేంకీలో కట్టుకొనింది. అప్పుడిచ్చింది పెండ్లి సమందాలు జూసే కౌసల్య చేతికి కొడుకు ప్రొఫైల్‌, యిచ్చి, ‘‘చూడు కౌసల్యా. నా కొడుకు తిరప్తిలో త్రిబుల్‌ బెడ్‌ రూంలో కాపరం పెట్నాడు. సూపర్‌ మార్కెట్టు పెట్టి బిజినెస్‌ చేస్తుండాడు. వూళ్లో ఎకరా బూముండాది. ఏమి తక్కవ చెప్పు? బిటెక్కు చదివుంటే వొక బీదరాలినయినా చేసుకుంటాడు. ఆ బిడ్డి చదివుంటే చాలు. నా చదువు తక్కవ కొడుక్కి మంచి చదువు చదివుండే వొక పిల్లను చూసి పుణ్యం గట్టుకోనాయమ్మా!’’ అనే అనింది. పద్దినాల్లో కౌసల్య నుంచి, ‘‘జమునక్కా నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దారనీ అంతా ఫైనల్‌ అయినాక చెబ్దామనీ యీ రోజు చెప్తుండా. నువ్వు కోరిన కొండ మింద వాన కురిసింది పో. అమ్మాయి పుత్తూరు వెంకటపెరుమాళ్లులో ఇంజనీరింగు చేసింది మెకానికల్‌. అమర్రాజాలో యిరై అయిదు వేల జీతం తీస్తుండాది. అమెరికా సమందాలొచ్చినా బిడ్డ కండ్ల ముందరుండాలన్జెప్పేసి యియ్యలా,ఫస్టు ఫస్టు నేను మన పిలగాడి సమందం చెప్తే, ‘నువ్వు నోర్ముయ్యి, పది ఫయిలైనోడికి మేమేటికిస్తాము? మా అమ్మాయి వొప్పందం చదువుకోనుండాల, వుజ్జోగం జెయ్యాల’ అని యీడెగిరి ఆడ దూకినారు. నేనుండుకోని, ‘బలే చెప్పినార్లే. మా పిలగోడికేమి? త్రిబుల్‌ బెడ్రూమ్‌ – అదీ సొంతం, దాంట్లో కాపరం వుంటా, సూపర్‌ మార్కెట్‌ పెట్టుకోని బ్రమ్మాండంగా బిజినెస్సు చేస్తుండాడు. పిలగోడు ప్రభాస్‌ మాదిర్తో వుంటాడు. వుజ్జోగం జేస్తే వొచ్చేది జీతమే. అట్ట కేశవాయనగుంటకు బొయ్‌ చూసేసి రాబోండి, సూపర్‌ మార్కెట్టు ఎట్ట జరగతాదో’ అనేసి కన్వీనియన్స్‌ చేసినా. ఆ అమ్మాయి తండ్రి గూడా సూపర్‌ మార్కెట్‌ చూసి ఫలానా ఫలానా అని చెప్పకుండా పిలగోడితో మాట్లాడి దినానికి ముప్పైయ్యేలకు మించి జరగతా వుండాదని తెలుసుకున్నాడు. నాకు తెలవకుండానే వాళ్ల పిల్లను గూడా తీసక పొయ్‌ పిలగోణ్ణి చూపించినారు. ‘అబ్బాయి సూపర్‌గుండాడని’ అమ్మాయి గూడా గ్రీన్‌ సిగ్నలు యిచ్చేసింది. కడాకు నీకు చెప్పకనే ఆ పిల్ల తల్లీదండ్రీ పిలగోడితో మాట్లాడేసినారు గూడా. ‘మీరు పిల్లనిస్తే పైసా కట్నమొద్దు’ అని పిలగోడు గూడా చెప్పేసినాడు. ఇంగేమి? పండగ జేస్కో. పేరు బలాలు గూడా బాగొచ్చినాయంట. నువ్వు ‘వోకే’ అంటే పద్దినాల్లో మూర్తం. నేను అమ్మాయి గల్లోళ్ల దగ్గిర్నే పదివేలు తీసుకుంటాలే. నువ్వేమీ యియ్యొద్దు. నా మాట అపద్దమైతే నీ కొడుకు సెల్లుకు ఫోను చెయ్‌, గెంటసేపు బిజీ రాకపోతే అప్పుడడుగు. పిలగోడు అమర్రాజా పిల్లతో వో అని మాట్లాడతా వుంటాడు. మొన్నెప్పుడో అపార్ట్‌మెంటుగ్గూడా వొచ్చి పొయ్యిందంట. ఇంగ నీదీ, నీ మొగుడిదే ఆలీసం. నీ కొడుకే నాకు ఫోను జేసి నీకు చెయ్యమన్నాడు. ఫోనులో చాల్నా? మిట్టూరొచ్చి పొమ్మంటావా? చదువు తక్కవ కొడుక్కి వుజ్జోగస్తురాల్ని తెచ్చినా నువ్వు కన్వీనియన్స్‌ కాకపోతే అది నీ కరమ్మ. ఏ సంగతీ రేత్రికి ఫోను చేసి చెప్పు’’ అని ఫోను పెట్టేసింది.

రేత్రి దాకా దేనికి, అప్పుటికప్పుడే ఫోను చేసింది జమునా – డబుల్‌ రైట్‌గా కన్వీనియన్స్‌ అయినాము అని చెప్పేదానికి!

 

*****

చిత్రం: భవాని ఫణి 

 

నామిని బహిరంగ ఉత్తరం !

చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.ఐ సంఘానికి నామిని నమస్కరించి విన్నవించేది..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, కార్పొరేట్   పాఠశాలల్లో కానీ చదువుకునే పిల్లల పరిస్థితి నిండా అధ్వాన్నంగా వుంది. మరీ ముఖ్యంగా మన రైతాంగం పిల్లల చదువు చాలా వికారంగా వుంటోంది. పదవ తరగతి చదివే పిల్లలు (a – b)3 సూత్రాన్ని కూడా చెప్పలేక తనకలాడి పోవడమే గాక 331ని 3తో భాగించలేక 11.33 అని, 3+2×4=20 అని వేస్తున్నారు.

తెలుగులో సినిమా పేర్లను కూడా రాయలేకపోతున్నారు. బీదా బిక్కీ పిల్లలు Poverty  అనే పదానికి కూడా అర్ధం చెప్పలేకపోతున్నారు.

నేను 2003 నుంచి 2006 దాకా 10 లక్షల మంది పిల్లల్ని కలిసి మంచీ చెడ్డా చెప్పడానికి ఒక రకమైన యుద్ధమే చేశాను. ఆ యుద్ధంలో అలిసిపోయి నా యింట్లో నేను కాళ్లు చాపేసి కాలం గడుపుకొస్తున్నాను.

ఎక్కడో వున్న అమెరికాలోని మీ సంఘంవారు గానీ, మరో సంఘం వారు గానీ నన్నొకమారు అమెరికాకు దయచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నాకిది కుశాలే. అయితే, నేనున్న యింటి చుట్టుపక్కల వున్న స్కూళ్ల వాళ్లు కూడా నన్ను పిల్లల ముందుకు రానివ్వడం లేదు. ఇది మాత్రం నాకు దుఃఖం.

అందువల్ల్ల అయిదారేళ్లుగా నా యింట్లో నేను చెల్లని కాసునైపోయి విశ్రాంతి తీసుకుని తీసుకుని తీసుకుని ఒళ్లు పులిసిపోయే మాదిరిగా అలిసిపోయినాను.  ఈ అలసట తీరాలంటే, నాకు పనిచేస్తేనే అసలైన విశ్రాంతి దొరుకుతుంది.

మేధావులు మాత్రమే నా పచ్చనాకు సాక్షిగా, సినబ్బకతలు చదువుతారని భ్రమపడిన నాకు పిల్లలింకా యిష్టంగా చదువుతారని పిల్లల్లో పని చేసాక తెలిసింది. అట్లాగే నా ఇస్కూలు  పిలకాయ కత కానీ, పిల్లల భాషలో Algebra కానీ పిల్లలకు చాలా ఉపయోగకరం.

మీ బోటి వారు దయతలిస్తే.. నాకేదైనా పని కొంచం యిప్పించండి. నా అపుస్తకాలను (నాకు రాయల్టీ  ఏమీ కూడా ఇవ్వకుండా) తక్కువ ఖర్చుతో న్యూస్‌ప్రింట్ మీద ప్రచురిస్తే ,  ఆ పుస్తకాలను బీదబిక్కీ చదువుకునే స్కూళ్లకు వెళ్లి పని చేస్తాను. నాతోటి జర్నలిస్టులు ప్రస్తుతం 60,70 వేల దాకా జీతాలు తీస్తున్నారు. నాకు అందులో సగం నెల నెలా 30,40 వేలు ఇచ్చినా నేను రోజుకి 2 వేలమంది పిల్లల్ని కలిసి పని చేస్తాను.

ఆ పని ఎలా వుంటుందో మీరు కంటితో చూడాలనుకుంటే జిల్లాలో వున్న మీ సంఘ బాధ్యులెవరినైనా మీరు నాకు తెలియజేస్తే వారితోపాటు 2,3 పాఠశాలలకెళ్లి నా పని, పిల్లల స్పందన వీడియో తీసుకొని మీరు చూడవచ్చు. నా పని మంచిదని మీకు తోస్తే.. నాకు కొంత పని యిచ్చిన వారవుతారు. వరికోతలకు శ్రమ జీవి వెళ్ళడం ఎంత గౌరవప్రదమో.. పిల్లల్లో యింకా 4,5 సంవత్సరాలు యీ పని చేయగలిగితే నేను అంత గౌరవంగా భావిస్తాను.

ఈ పని కూడా నన్ను ఉద్ధరించడానికి అని గాకుండా సంఘ శ్రేయస్సు అనే వుద్ధేశంతోనే మీరు నాకు పనివ్వాలి. నేను చేయాలి. అప్పుడు మీ సంఘాన్ని  గానీ, నన్ను గానీ దేముడు కూడా మెచ్చుతాడు.

ఇంకొక్క మాట. చిత్తూరు జిల్లాలో మంచి కార్యవాదిని ‘కారివేది ‘ అనంటారు. కారివేదినెప్పుడూ విమానాల మీద అమెరికా రమ్మని గౌరవించకూడదు. పనివెంట పని చెప్పి ఎండల్లో వానల్లో తిప్పి తిప్పి పని చేయించాలి. అప్పుడు నేను వందసార్లు అమెరికాకు వచ్చినట్టు!

సందేశం అడిగారు గాబట్టి మీ సంఘానికైనా, ఇంకో అమెరికా సంఘానికైనా యిదే నా సందేశం.
(మీ సావనీర్‌లో ప్రచురించడానికి నా రెండు కథలను దయతో తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఆ కథలతోపాటే ఈ సందేశాన్ని కూడా వేయండి. )

నమస్కారాలతో…
నామిని