వినాయకచవితి జ్ఞాపకం: మాష్టార్ని చూస్తే దిగులు!

నామాల మురళీధర్

నామాల మురళీధర్

“ఒరేయ్ పిల్ల రాక్షసుల్లారా! వినాయకచవితంటే పిల్లల పండగరా. వినాయకుడు విద్యలకు అధిపతి. ఇళ్ళళ్ళోనే కాదు బడిలో కూడా పూజలు చేయాలి. వినాయకుడ్ని కాదంటే చదువబ్బక మొద్దు వెధవల్లా తయారవుతారు.

ఒరేయ్ పిలక పంతులు, మీ గుడికి కొబ్బరికాయలు, అంటిపళ్ళొచ్చాయంట కదా. ఒకటో,రెండో కొబ్బరికాయలు ఒక అరడజను అంటిపెడ పట్రా. ఒరేయ్ కరణంగారబ్బాయ్ మీ ఇంటికి వెల్ల వేస్తున్నారంట కదా. సాయంత్రం కాస్త పట్టుకొచ్చి మన బడిగోడకి కొట్టెయండ్రా” అని ఇంకా ఏదో చెబుతున్న సూర్నారాయణ మాష్టారి మాటలకు అడ్డుపడుతూ కరణంగారబ్బాయ్ లేచాడు.

“పంతులుగారూ, ఇంటి నుండి వెల్ల తీసుకొచ్చి వేస్తే మా నాన్న తంతాడండి” అని వినయంగా విన్నవించుకున్నాడు.

“ఒరేయ్ సన్నాసి, మా ఇంటికొచ్చి వెల్లవెయ్యమన్నానా? బడికే కదా. రోజూ మీరే కదరా ఈ స్కూల్లో కూర్చుని చదువుకునేది. మీ నాన్న ససేమిరా అంటే ఏ సాయంత్రమో ఎవరూ చూడకుండా పట్టుకొచ్చెయ్యాలి కానీ, ఇవన్నీ నేను చెప్పాలట్రా మీకు?” అని లౌక్యం చెప్పారు మాష్టారు.

“దొంగతనం తప్పు కదండీ” అన్నారెవరో వెనకనుండి. పిల్లలంతా గొల్లుమన్నారు.

“ఆ తప్పండి. ఎవడ్రా ఆ అడ్డగాడిద ఆ కిరాణకొట్టు కిష్టి గాడేనా? ఏరా పక్కింటి పంతులమ్మగారి దొడ్లోకి దూరి జాంకాయలెత్తుకు రావటం మాత్రం తప్పు కాదేం? నువ్వు మీ కొట్లో నుండి బియ్యం, పప్పులు పట్రాపో అప్పుడు చెప్తాను వెధవ” అని వెక్కిరిస్తూనే వాడి వాటా ఏంటో చెప్పేసారు మాష్టారు.  “ఒరేయ్ నామాలవారబ్బాయ్ పసుపులు,కుంకుమలులాంటి పూజసామాన్లు ఇంటి నుండి పొట్లాలు కట్టి నువ్వు పట్రా” అని నా సంగతి తేల్చారు.

“మరి పూలు,పత్రి ఎవరు తెస్తారర్రా?” అని అందరిని చూస్తూ అడిగారు.

“పంతులుగారూ, ఆ ఢిల్లీ బామ్మగారింటి పెరట్లో చాలా రకాల పూలున్నాయండి. సాయంత్రం చేసి చీకట్లో కోసుకొచ్చేస్తాను” అన్నాడు తుంటరి పరమేశంగాడు.

మాష్టారు విలాసంగా నవ్వారు. అంతలోనే ఏదో గుర్తొచ్చి “ఒరేయ్ కోతి వెధవ దొరికిపోతే నా పేరు గానీ చెప్పావ్. తాటతీస్తాను” అని హెచ్చరించారు. ఆ అలవాటేనేమో ఇప్పటికీ ఒక పువ్వో, కొమ్మో ఏదో ఒకటి దొంగతనంగా ఎత్తుకొచ్చి వినాయకుడికి పెట్టకపోతే, ఎంత పూజ చేసినా తృప్తే ఉండదు.

ఇన్నేళ్ళొచ్చి ఇంట్లో ఎంత ఘనంగా చేసుకున్నా వినాయకచవితంటే చప్పున గుర్తొచ్చేది మాత్రం పొడుగ్గా, సన్నగా చెఱుకుగడలా ఉండి, తెల్ల జుబ్బా వేసుకుని, షోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తిట్లతో అందరికీ తలంటు పోస్తూ, తాను నవ్విస్తూ, మా అందరినీ నవ్వించిన సూర్నారయణ మాష్టారే. తుప్పుపట్టిన పాత సైకిల్‌కి ఒక సంచి తగిలించుకుని తిరిగే సూర్నారయణ మాష్టారే.

ఇలా దసరా అనో, వినాయక చవితనో ప్రతి పండగకి పంతులుగారి భత్యాలని ఏదో ఒకటి తెమ్మంటున్నారని మాష్టారంటే చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు బడికొచ్చి మాష్టార్ని నిలదీసేవాళ్ళు కూడా. పాపం మాష్టారు మా దగ్గరే తప్ప ఊర్లో నోరెత్తేవారు కాదు. ఎవరైనా వచ్చి అడిగితే తడబడిపోయి నీళ్ళు నములుతూ నేల చూపులు చూసి వారికి ఏదో సర్దిచెప్పేవారు. అదేంటో గమ్మత్తుగా మాష్టారి మీద అంతవరకూ ఉన్న కోపం పోయి మా మాష్టార్ని ఇలా అందరిముందు నిలదీస్తారా అని ఉక్రోషం వచ్చేసేది. తల్లిడండ్రుల్ని బడికి తీసుకు వచ్చినవాడితో పిల్లలంతా ఒక జట్టుగా కొన్నిరోజులు మాట్లాడకుండా వేలేసేవాళ్ళం.

మాష్టారు అది గమనిస్తే “ఒరేయ్ బడుద్దాయిల్లారా, ఏం పనిరా ఇది? వాడేం చేస్తాడు కుంక. బ్రతకలేక బడిపంతులని, బడిపంతుల మీదకంటే ప్రతివోడు చొక్కా మడతెట్టుకొస్తాడు. సరి సరి వాడినేం అనకండి పాపం” అని వాడిని దగ్గరకి తీసుకునేవారు.

ఆ చిన్న వీధిబడిలో మాష్టారు మాకేం గొప్ప చదువులు చెప్పెయ్యలేదు. కాసిన్ని అక్షరాలు నేర్పారు. అంతకంటే ఎక్కువ చదువు ఆయనకి వచ్చో రాదో నాకిప్పటికీ తెలియదు. కానీ ఆయనకొచ్చినవి, మాకు అక్కరకొచ్చేవి ఆయినా ఆ కాసిన్ని అక్షరాలు, పద్యాలు ఎంతో శ్రద్ధగా చెప్పారు. ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా పలికేంత వరకూ వల్లెవేయించేవారు.

ఆయనకి అప్పటికే పెళ్ళికెదిగిన కూతురు, ఉద్యోగం లేని కొడుకు ఉండేవారు. పాపం మాష్టారికొచ్చే ఆ గొఱ్ఱెతోక జీతంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అది సరిపోక సాయంత్రం ఇంటి దగ్గర మాకు ప్రైవేటు కూడా చెప్పేవారు. పంతులుగారి పెళ్ళప్పుడు కట్నంగా వచ్చాయని చెప్పే ఫ్యాను, రేడియో తప్ప ఇంటిలో పెద్దగా వస్తువులేవీ ఉండేవి కాదు. ఆ పసిప్రాయంలో మా బుర్రలకు తట్టలేదు కానీ ఆ పండగ మామూళ్ళన్నీ ఆ బండెడు కుటుంబాన్ని లాగటానికి ఏమూలకి సరిపోతుంది. “అయ్యవారికి చాలు అయిదువరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” అని ఎంతపాడినా అయ్యవారికి అయిదు వరహాలిచ్చే వెర్రిబాగులాడెవడున్నాడు ఆ ఊరిలో.

13_10

వినాయక చవితిరోజు మాష్టారు చెప్పినవన్నీ తీసుకురాకపోయినా, వీలయినవి తీసుకుని వెళ్ళేవాళ్ళం. మాష్టారు “ఏమిరా ఇలా చేసారు” అని కాసేపు నసిగినా అందరిని బుద్దిగా, శ్రద్ధగా కూర్చోబెట్టి నిదానంగా పూజ చేసేవారు. అందరి పేర్లు, గోత్రాలు చెప్పించేవారు. చివర్లో వినాయక వ్రతకథ చెప్పి, అందరి తలల మీద అక్షింతలు చల్లేవారు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే వెళ్ళి మాష్టారి కాళ్ళు మొక్కేవారు. మాష్టారు మురిసిపోతూ “ఒరేయ్ బడుద్దాయిలు, పెద్దవాళ్ళయి పెద్ద ఆఫీసర్లయిపోయి ఈ పంతుల్ని, బడిని మర్చిపోకండి” అని మనస్పూర్తిగా దీవించేవారు.

ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడయినా ఊరు వెళితే రోడ్డు మీద పాత సైకిల్‌తో కనిపించేవారు మాష్టారు. కొడుకుకి పెళ్ళయితే అయ్యింది కాని ఇంకా ఏ పనిలోనూ కుదురుకోలేదు. ఈ వయసులో కూడా కాస్త చత్వారంతో బాధపడుతూ నలుగురైదుగురు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న మాష్టార్ని చూస్తే దిగులుగా అనిపిస్తుంది. ప్రైవేట్ కాన్వెంట్‌లు ఎక్కువయిపోవటంతో పంతులుగారి దగ్గరకి పిల్లలని ఎవరూ పంపటంలేదు కానీ మాష్టారి హస్తవాసి మంచిదని అక్షరాభ్యాసం చేసాక ఆయన చేత అక్షరాలు దిద్దించటానికి ఆయన పూర్వ విధ్యార్ధులు తమ పిల్లలను తీసుకు వచ్చి తృణమో, పణమో ఇచ్చి వెళ్తున్నారు.

“వీడిని నా దగ్గరకు పంపకూడదురా నాలుగు రోజులు అక్షరాలు నేర్చుకోవటానికి” అని అక్షరాలు దిద్దుంచుకోవటానికి వచ్చిన ఎవరినైనా మాష్టారు చనువుగా అడిగితే, “మాష్టారూ, ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? పద్యాలు పాతబడిపోయాయి. ఇప్పటి నుండే ఇంగ్లీష్ నేర్పించాలి” అని చెప్పి ఇంకాసేపుంటే ఏమడిగేస్తారో అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు.

ఇన్నాళ్ళుగా జీవితమనే యుద్దాన్ని పోరాటానికి వేలమంది దండుని తయారు చేసిన మాష్టారు, యుద్ధమే మారిందో, తన విద్యలే పాతబడిపోయాయో తెలియని వృద్ధ సైనికుడిలా మిగిలిపోయారు. అందమైన అక్షరాల్లో పెట్టలేకో, అమ్ముకోవటం చేతకాకో మరుగునపడిపోయిన ఇలాంటి బీద బడిపంతుల్ల ఆత్మకథలన్నీ మధురకావ్యాలే.

సూర్నారయణ మాష్టారూ, ఆ విద్యలకు అధిపతైన గణపయ్య, విద్యే జీవితంగా గడిపిన మీకు చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నా.

 

ఆ సాయంత్రం గుర్తుందా?

Muralidhar(1)

కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో తెరపరిచినట్టు మంచు పైనుండి మెల్లగా కురుస్తూ ఉంది. ఏ చెట్టుని, గట్టుని ముట్టుకున్నా చేతికి చల్లాగా తగిలి జిల్లుమంటుంది.

నీ కోసం ఆ వీధి చివర స్ట్రీట్ లైట్ క్రింద ఎంతసేపో మరి అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. వళ్ళంతా చల్లబడి చిన్న వణుకు మొదలయ్యింది. గుమ్మాల ముందు కార్తీక దీపాలు మిణుకు మిణుకు మంటు చెప్పే కబుర్లేవో వింటూ కూర్చున్నా.

ఆ పరాకులో నేనుండగా అల్లంత దూరంలో నువ్వు, వెన్నెల దేశపు వేగులా, ఆనందలోకపు అందాల దేవతలా నువ్వు. బేల కళ్ళతో బిత్తర చూపులు చూస్తూ, చలిగాలికి ముడుచుకుని మెల్లగా నడిచొస్తున్న నువ్వు. గాలికి ఎగురుతున్న ఆ ముంగురులను ఒక చేత్తో చెవుల వెనక్కి నెట్టేస్తూ, ఒక్కో అడుగును కొలుస్తున్నట్టుగా నేల వైపే చూస్తూ లయబద్దంగా నడిచొస్తున్న నువ్వు. నీకు తెలుసా ఆ క్షణం ఒక కొత్త స్వర్గానికి కొత్త ఇంద్రుడ్ని నేను. అంతటి ఐశ్వర్యాన్ని నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే, శాశ్వతమైన నీ తోడెంత అపురూపమో కదా.

చీకట్లో ఒంటరి వీధుల వెంబడి నీతో ఆ గమ్యంలేని నడక, గమ్యం ఎంతటి అసంపూర్ణమో నిర్వచించింది. పెదాలను మౌనంతో కట్టిపడేసి, నీ కళ్ళు పలికిన ఊసులు, భాష ఎంత పిచ్చి ఊహో నేర్పించాయి. నా కళ్ళలోకి నువ్వు సూటిగా చూసిన ఆ చూపు నన్నెంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. చూపులు నేలపై పరిచిన ఎంతోసేపటికి కానీ అ కంగారు తగ్గలేదు.

నా తడబాటు గమనించి చెయ్యి అడ్డు పెట్టుకుని నువ్వు నవ్వుకుంటే, ఎంత సిగ్గనిపించిందో. ఆ కదలికలో నీ భుజం నన్ను తాకిన క్షణం, నీ శరీర సుగంధం నను కమ్మేసిన ఆ క్షణం నాలో కలిగిన ప్రకంపనలను ఏమని చెప్పాలి? నేను చెప్పను. అది మోహావేశం మాత్రమే అనుకునే వాళ్ళకి నేను చెప్పనే చెప్పను.

కాస్త కంగారుగా దూరం తొలగి, నన్ను దాటి ముందు నువ్వు నడుస్తుంటే, కనపడనీయక నువు దాచేసిన సిగ్గుని, ఎర్రబడ్డ నీ మోము పైన ఆ అందాల నవ్వుని నా కళ్ళలో దాచేసుకుంటూ నీ వెంట నడిచాను. ఆ అనుభవాలను రికార్డ్ చేస్తున్న జ్ఞాపకాల పుస్తకాన్ని సరిగ్గా అక్కడే మూసేసి, తాడు కట్టేసాను. ఎందుకంటే నువ్వు తిరిగి వెళ్ళిపోవటం జ్ఞాపకాల్లో నిలుపుకోవాల్సిన విషయమేం కాదుగా.

ఆ సాయంత్రం గుర్తుందా?
నువ్వులేని నా వేల సాయంత్రాల్ని వెలిగిస్తున్న ఆ సాయంత్రం నీకింకా గుర్తుందా?