-నామాడి శ్రీధర్
~
ఎవరేమి చెబుతున్నా
బుద్ధిమంతుడి వలె ఊకొడుతున్నాను
భయమో సంశయమో
అవును కాదనే గురిని మింగేస్తున్నాను
ఎక్కడేమి జరుగుతున్నా
ప్రేక్షకుడి మల్లే తేరిపార చూస్తున్నాను
ఉపేక్షా నిర్లక్ష్యమా
నిజం అబద్ధమనే రుజువుని చప్పరిస్తున్నాను
శతాబ్దాల తరబడి
నెత్తురోడ్చే ఊరుల పేర్లనీ
సాటి మనుషులు హతమారిన చిరునామాల్నీ
ఉచ్చరించకుండానే గమ్మున గుటకలేస్తున్నాను
ఆ చిల్లరదొంగ వెంటబడి
ఓ వీధికుక్క మొరుగుతుంది
ఖూనీకోరుల మధ్య నిలబడిన నేను
ఒక్క పెనుకేకని పుక్కిలించలేకపోతున్నాను
విషగుళికల పలుకుల్ని మింగీ మింగీ
చేదుబారిన గుండెలో జాగా మిగలలేదు
ఇప్పుడిక దాద్రి కలబుర్గి నామధేయాలు
నిప్పు ముద్దలై ఈ గొంతుక దిగడం లేదు
*
తాజా కామెంట్లు